శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 30

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 30


                 1
చెట్టుకొమ్మలను గుట్టుమట్టుగా
కూరుచున్న కపికుంజరుండు వినె,
త్రిజటకలయు, వైదేహిమాటలును,
రాకాసుల తర్జనభర్జనలును.
                 2
సుందరంబయిన నందనవనమున
దేవత తీరున తేజరిల్లు సీ
తాదేవిని కని తలకి హనుమ యట
చింతించెను తన చిత్తంబున నిటు.
                 3
ఎవరికోసమయి యెల్లదిగ్దిగం
తములు వెతకుచున్నారొ వానరులు
వేలు లక్ష, లాబాల, రాఘవుని
ప్రేమమాల కనుపించె నా కిచట.
                  4
జాగ్రన్మతినై శత్రుల శక్తిని
వేయికండ్ల కనిపెట్టుచు నంతట,
గూఢముగా తిరుగుటవల్ల నె,ఈ
వాడల నీమెను చూడగల్గితిని.



                   5
లంక గడ్డ నలువంకల త్రిమ్మరి
కనిపెట్టితి రాక్షసుల రహస్యము
పరికించితి రావణుని ప్రభావము,
లక్షించితిని బలపరాక్రమములు.
                   6
సకల జీవులను సమముగ నరయు ద
యాళువు రాఘవు, డప్రమేయు,డా
తని కళత్ర మీమెను, పతిదర్శన
కాంక్షిణి, ననువుగ కనికరింపతగు.
                   7
పూర్ణచంద్రముఖి , పుట్టి యెట్టి క
ష్టము లెఱుగని రాజకుమారిక , విడు
గరతోచని దుఃఖముల నీదు, నీ
సుదతి నూఱడించుట నా ధర్మము.
                   8
శోకతాపమున సోలిన దేవిని
జానకి నోదార్చకపోయిన నా
పోక పాపమగు, రాకయు వ్యర్థం
బగును, మిగులు నాయాసం బొక్కటె.
                   9
ఎట్లు కదలి నే నిచటికి వచ్చితి,
అట్లె వెనుతిరిగి అరిగిన; తన కిక
రక్షణ లేదని రాజపుత్రి, శశి
విశద యశస్విని, విడుచు ప్రాణములు.
                   10
అచట రాముడు, మహాబాహువు, పూ
ర్ణేందుబింబముఖు, డీయమ కోసము
వేగుచున్న వా డాగరానివెత;
న్యాయమగును నా కాతని తేర్చుట.




                  11
ఈ నిశాచరులు మానక కావలి
కాయుచుండ, జనకజతో భాషిం
చుట యుక్తముకా, దెటులీ దుస్సం
కటము గడుచునని కళవళపడె కపి.
                   12
మిగిలియున్న యామిని తుదిగడియలు
గడవక మునుపే కలిసి జానకిని
ఊరడించు టది యుచితము, లేకు
న్నను విడుచును ప్రాణములను తప్పక .
                   13
ఇంతదూర మే నేతెంచియు జా
నకిని పలుకరింపక వెళ్ళిన; అట
'నన్ను తలచి యేమన్న దామె' యన
నేమి చెప్పుదును రామచంద్రునకు.
                 14
జానకి సందేశము గై కొనక
తిరిగి వెళ్ళినన్ తీవ్రముగా కో
పించి చెచ్చెఱ దహింపవచ్చు రఘు
వీరుడు తీక్షణ వీక్షణంబులను.
                 15
రామ కారణార్థముగ నేను సు
గ్రీవుని ప్రభువును ప్రేరేపించిన,
దండు సాగు, నాతండు, సైన్యసం
రంభమెల్ల వ్యర్థంబయి ముగియును.
                 16
ఈ నిశాచరు లొకింత యేమఱిన
సందు చూచి, దుస్తాపజ్వాలల
తెరలుచున్న మైథిలి నల్లల్లన
ఓదార్చెద నిందుండియె కదలక .



                     17
నా రూపము చిన్నది, వానరుడను
పోల్చలేరు నా పొడవును, మఱియును
దానవు లేఱుగని మానవ సంస్కృత
భాపలోన సంభాషించెద, నిట.
                    18
అయినను, నే బ్రాహ్మణజాతునివలె
సంస్కృతంబులో సంభాషించిన,
నను రావణుడని అనుమానించును
సీత భీతయగు, చెడును సర్వమును.
                   19
కిచకిచమని యెలిగించు వానరుడు
మానవభాషను మాటాడుట యెటు
లైన, నర్థ మగునట్టుల మనుజుల
వాక్కున పలుకు టవశ్యము నా కిట.
                   20
ఊఱడించక మఱొకగతి లేదీ
సతి అసురుల తర్జనభర్జనలకు
సొమ్మసిల్లె , ఇక దిమ్మతిరిగి పడు,
నా రూపముగని నా మాటలు విని.
                   21
ఎడనెడలను భ్రమ విడిచినప్పుడు, వి
శాలేక్షణ నా వాలకమును గని,
కామరూపి రాక్షసపతి అనుకొని
భీతిలి అఱచును పెద్దపెట్టునన్ .
                   22
సీతాక్రందము చెవిబడినంతనే
కాలకింకరుల బోలిన క్రూరులు
నానాయుధములు పూని దానవులు,
గచ్చువిచ్చుగా వచ్చి మూగుదురు,


                    23
ఇచ్చట ననుగని రెచ్చిన కచ్చెను,
వికృతముఖులు రక్షిక లువ్వెత్తుగ
గిట్టి నలుగడల చుట్టి చంపగా
బలముకొలది తలపడుదురు దందడి.
                    24
అంత నేనును, మహాశాఖలు, సుప
శాఖలు, శాఖాంచలములు, బోదెలు,
పట్టి యెక్కి దిగి పరుగులెత్తు టను
కని, భయశంకను కలవరపడుదురు.
                    25
అటు లశోకవని నడుమ తిరుగు నా
రూపు చూచి భయమోపలేక , ది
క్కామొగంబుల ఎగాదిగ పఱచును,
ముసురుకొన్న రక్కసుల తండములు.
                    26
పిదప రక్షికలు బెదరి, రావణుని
రాజభవన నిజరక్షకులను, కే
కలు పెట్టుచు బిగ్గరగా పిలితురు,
ఆపన్నులవలె నార్త స్వరముల.
                    27
వారలందఱును క్రూరులు శూరులు
కత్తులు శక్తులు కరముల త్రిప్పుచు,
పట్టి కట్టి నను కొట్టగవత్తురు
ఉద్వేగించిన విద్వేషమ్మున.
                   28
అన్నివైపులను నన్నఱికట్టిన
అసురబలములను కసిమసగ గలను,
కాని; పిదప సాగర మావలి తీ
రము చేరుట శక్యము కాదనిపించును.



                     29
తొందఱపడి, తుందుడుకు రాక్షసులు
వై బడి పట్టిన పట్టవచ్చు నను;
అటుపిమ్మట నిచ్చట సీతకు రఘు
విభునివార్త చెప్పెడి వారుండరు.
                     30
హింసను మరగిన ఈ ఘాతుకు లిట
జనకసుతను చంపినను చంపుదురు;
వ్యర్థమగును తరువాత రామ సు
గ్రీవులు తలచిన కృత్యమంతయును.
                    31
అదియుగాక , జనకాత్మజ యిప్పుడు
ఉన్న ప్రదేశము ఉగ్రరాక్షసులు
రక్షింపగ, వారాశిలోన మా
ర్గంబు లేని నడిగడ్డన నున్నది.
                    32
ఈ మారటలో నేను రాక్షసుల
చేజిక్కినను, నశించినను, పిదప
రఘురాముని కార్యప్రయాసలన్
కాగల సాయము కనబడ దెచటను.
                    33
ఈ కలహంబున నేహతంబయిన,
నూఱామడల పయోరాశిని దా
టగల వానరుం డగపడ డచ్చట,
ఆలోచింప యథార్థము నియ్యదె.
                   34
వేలరక్కసుల తోలి వధింపగ
తగు బల సామర్థ్యములున్నవి, నా
కైనను, మఱల మహార్ణవ మావలి
గట్టుచేర శక్యము కాదనిపించును.



                    35
నమ్మరానివి రణములు, జయాపజ
యంబులు సందేహములు; రుచింపవు
నా కిట్టివి; అయినను ప్రాజ్ఞు డెవడు
సంశయించు నిస్సంశయంబులను !
                   36
సీత తోడ భాషింపక వెళ్ళిన
ఆయమ ప్రాణత్యాగము చేయును ;
అది దోషంబగు, అట్లుకాక భా
షించిన తప్పదు చేటు నా కిచట.
                   37
దూతలు చెన్నటిపోతులైనపుడు
దేశకాలముల తీరు వైరమై,
సిద్ధకార్యమును చెడి, చేటు కలుగు;
ప్రొద్దుపొడుపున విఱుగు చీకటివలె.
                   38
ఇది కార్యం బియ్యది అకార్యమని
నిశ్చితమయిన మనీషయు జడమయి
కార్యసిద్ధిని విఘాతమొనర్తురు
దూతలు పండిత దురభిమానులయి.
                   39
ఎటు మెలగిన విఘటింపక కార్యము
గండముల్ గడచి గట్టెక్కును, సా
హసముచేసి లవణాంభోరాశిని
దాటిన శ్రమ వ్యర్థము కాకుండును ?
                  40
ఈమెతోడ నేనే భాషను మా
టాడ భయపడక ఆలకించునని
మథనలుపడి హనుమంతుడు తుది
నిశ్చయించుకొనె నెమ్మదిలో నిటు.



                      41
అప్రియమగు. కార్యమ్ముల నెఱుగని
రామచంద్రు కీర్తనమును పాడెద,
ఆలకించు చుట్టాల సురభి, రా
మాను రక్తహృదయము సుఖియింపగ.
                     42
ఇక్ష్వాకు నృపుల యింటికి దీపము,
విదితాత్ముడు రఘువీరుడు రాముడు,
అతనికి సర్వశుభార్థకంబులగు
స్వస్తి వాచనము లాలాపించెద.
                    43
మధురములగు రామచరితార్థములు
వీనులవిందుగ వినిపింతును, వి
శ్వాసము కొలిపెడి సర్వమార్గముల
ననుసరింతు శ్రద్ధాసక్తులతో.
                    44
అనుచు హనుమ మహానుభావు డటు
పరిపరివిధముల భావించుచు, లో
కాధిపు ప్రేయసి నరయుచు, తియ్యగ
పలికె నిట్లు కొమ్మలలో నుండియె.