శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 25

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 25

           1
రక్కసు లట్టుల అంకెలు వేయుచు
ప్రాణగొడ్డములు పలుక పరుషముగ,
జనకపుత్రి వేసరి పరితాపము .
పట్టలేక, ఒక పెట్టున నేడ్చుచు
          2
పలికె నిట్లు రావణు కావలి క
త్తెల చూచుచు మైథిలి మనోవ్యథల
పొడిచి పొర్లి వచ్చెడి కన్నీళ్ళా
కట్టిన గద్గద కంఠస్వరమున,
          3
మానవకన్యక దానవపురుషుని
భార్య కాతగదు; పాటించను మీ
పాడుమాట లెప్పాటను, తధ్యము
చంపి తినుడు నను చల్లారు వ్యధలు.
          4
దేవకన్యలకు దీటగు జనకజ :
రాకాసుల మారాటములన్ బడి .
సుఖ మెఱుగక నిష్ఠుర దుఃఖార్తిని
పొగులుచుండె దశముఖు తర్జనలకు

సర్గ 25


              5
మందవిడిచి వనమధ్యమందు తో
డేళ్ళ గుంపున బడిన లేడిపగిది
ఒడులంతయు లోనొదుగ ముడుచుకొని
వణకుచుండె నతిభయమున మైథిలి.
              6
పొడుగుసాగి పువ్వుల గుత్తులతో
శోభిలుచున్న అశోకశాఖ అవ
లంబనముగ వల్లభుని స్మరించుచు
మనసు గాయపడ మ్రగ్గుచు నుండెను.
              7
అంతుకనబడని అష్టకష్టముల
నడిసముద్రమునబడి శోకింపగ,
కనుదోయిని పొర్లిన జలములతో
స్నానమాడె జానకి సుస్తనములు.
              8
రక్కసులటు లూరక వేధింపగ
ఛిన్నచిత్తయై విన్నబాటొఱయ,
భీతభీతయై సీత శోభిలెను,
సుడిగాడ్పుల కీడ్వడిన కదళివలె.
              9
కాతరమతియై కంపించిన వై
దేహి వెన్నునన్ దీర్ఘదీర్ఘముగ
వ్రేలుకాడె ముడివిచ్చినజడ; పొద
లాడుచున్న కాలాహిచందమున.
              10
శోకవేగమున సొగయగ చిత్తము,
నిట్టూర్పులు ఘూర్ణిల్ల, నార్తయై
విలపించుచు మైథిలి, వెడదకనుల
వెళ్ళబోసె కన్నీళ్ళు కడవలను.

సుందరకాండ


                  11
హా ! రఘురామాయని వాపోవును,
హా ! లక్ష్మణ యని ఆక్రందించును,
హా ! కౌసల్యా! హా సుమిత్రా ! య
టంచు స్మరించు, తపించును, తహతహ.
                  12
గడవరాదు లోక ప్రవాదమని
పెద్దలు చెప్పిన సుద్ది వాస్తవము,
కాలము రానిది కలుగదు మృత్యువు,
పురుషులకైనను పొలతులకై నను,
                  13
ప్రాణేశ్వరు నెడబాసి క్షణంబును
ఉండరా దటయ్యును నే జీవిం
తును రాఘవునకు దూరనై, నిశా
చరులు క్రూరముగ చెఱలు పెట్ట నిట.
                  14
నోచితి తక్కువ నోములు మును పిసి
నారినగుచు, ఈనా డనాధవలె
అల్లాడుదు; లవణార్ణవమున ఉ
ప్పెన గాడ్పుల బడి మునుగు నావవలె.
                  15
రక్కసి మూకకు దక్కి చిక్కుకొని,
ప్రియునిచూచు వీలయినను తోచక
శోకముతో దరిలేక క్రుంగెదను;
నీటివడికి తెగు ఏటి యొడ్డువలె.
                  16
ధవళ పద్మముల మివులు కనులతో
సింహమువలె ధర్షించి నడచు, నా
ప్రియుని రాఘవుని, నయభాషిని, ద
ర్శింతురు పుణ్యము చేసిన ధన్యులు.

సర్గ 25

            17
మనసెఱిగిన స్వామిని, శ్రీ రాముని,
సహవాస సుఖోత్సవములేక, నా
బ్రతుకు దుస్సహము; పచ్చివిసము తీ
వ్రముగా సోకిన ప్రాణి చందమున.
           18
ఏ పాతకములు ఎఱిగీ యెఱుగక
కావించితినో గత జన్మములను,
ఇంత ఘోరమును ఇంత దారుణము
నగు దుఃఖము నిపు డనుభవించెదను.
           19
రక్కసు లిట్టులు రాత్రిందివములు
కన్నులు మూయక కావలి తిరుగన్,
లభియింపడు నా విభుడిక, కావున.
ప్రాణత్యాగమే పరమార్థంబగు.
          20
ఎంత హీనమో యీ నరజన్మము.
చచ్చుటకైనను సాధ్యముకా ది
ష్టానుసారముగ; అంతయును పరా
ధీనము లోకములోన జీవితము.