శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 26

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 26

                    1
ఆ విధమున వాపోవుచు జానకి
కండ్లనీళ్లుబికి కాల్వలు కట్టగ
ముఖము వంచుకొని బోరున ఏడ్చెను
తల్లడిల్లి పసిపిల్ల చందమున.
                   2
పిచ్చిదానివలె, వికలచిత్తవలె,
శివమెత్తిన దానివలె, నేలబడి,
పొర్లాడెను వంపులు తిరుగగ మెయి,
అశ్వబాల చాయను జనకాత్మజ
                   3
ఏమఱి రాఘవు డెడమైనప్పుడు
మాయవేసమున డాయవచ్చి, నను
బలిమిపట్టి రావణుడు తెచ్చె వడి,
పెనగులాడి యేడ్చినను విడువ కిటు.
                   4
ఇచ్చట రక్కసి మచ్చరి కత్తెలు
కోరాడగ చిక్కున బడి. పొక్కుచు
దుస్సహార్తి వందురుచుంటిని; ఇక
బ్రతికి యుండ నోపను క్షణమైనను.

సర్గ26


                  5
రామున కతిదూరంబుగ, క్రూరా
సురుల నడుమబడి క్షోభిల్లెడి నా
కెందుకు సొమ్ములు, ఎందుకు సంపద,
లెందులకీ దురదృష్ట జీవితము ?
                 6
ఇంతటి కష్టము లీడ్చి మొత్తినను ,
పిగిలి బ్రద్దలై పగులకున్న, దిది
నా హృది పాషాణమొ ? జరామరణ
శూన్యమయిన నిష్ఠురలోహార్థమొ ?
                 7
ప్రియునకు దూరంబయి చిరకాలము
బ్రతికితి నెంతటి పాపజీవినో !
కాను కులసతిని, కాబో నార్య, ని
సీ ! యిక నా బ్రతుకెందు కుర్విలో.
                 8-9
ఈ నిశాచరు, నికృష్టు, నిషాదుని,
ఎడమకాలితో నేని స్పృశింపను,
ననుకోరె నృశంసను, డిది, తనకును
తన కులమున కంతకమని యెంచక.
                  10
ముక్కముక్కలుగ చెక్కిన కానీ,
చీల్చినకానీ, కాల్చినకానీ,
రావణు పజ్జకు రానురాను, నిజ
మేమిటి కిక మీరిట్లు వదరెదరు ?
                  11
పేరందిన రఘువీరుడు, ప్రాజ్ఞుడు,
సాధువృత్తనయశాలి, కృతజ్ఞుడు,
రామచంద్రు, డభిరక్తలోచనుడు,
నా దురదృష్టమునన్ శంకించెను.

సుందరకాండ


                  12
తానొకడె జనస్థానంబున పదు
నాల్గువేల దానవులను దునిమెను,
అంత పరాక్రమవంతు డతడు, నను
రక్షింపని కారణ మేమగు నిప్పుడు?
                  13
పరికించిన రావణు డల్పబలుడు,
అపహరించి యిట ఆ కట్టెను నను,
అమిత సమర్థుండగు, నా విభు డీ
ద్రోహి, నసురు, నెందుకు తునుమాడడు?
                   14
దండకాటవిని దానవయోధు వి
రాధు చంపె నా నాథుడు రణమున,
అసురుల నడుమన అగచాట్లు కుడుచు
నన్నేటికి కరుణన్ కాపాడడు?
                   15
కడలినడుమ దుర్గముగ కట్టిన
లంకలో విడిసి లగ్గపట్టు, టది
కష్టమైన నగుగాక, రాము శ
స్త్రాస్త్రముల కిచట అడ్డుకనబడదు.
                    16
దృఢ పరాక్రముడు, దివ్యాయుధ ధౌ
రేయుడు రాముడు ప్రియకళత్రమును
తెచ్చి యిచట బంధింపగ; ఆయమ
చెఱలు మాన్ప విచ్చేయ డెందులకు?
                    17
బందినై యిచట కుందుచుంటినని
తెలియదు విభునకు, తెలిసి యున్న తే
జస్వి రాఘవుడు సైచునే పరా
భవ దురాకృతము, పరపీడనమని.

సర్గ 26


                    18
అసురుడట్లు నన్నపహరించి పఱ
తెంచుచున్నపు డెదిర్చిపోరిన జ
టాయు వెపుడొ తెగటారె, నింక నా
వృత్తాంతము పతి కెవరెఱిగింతురు?
                    19
వృద్ధుండైనను వీర కేసరి జ
టాయువు రావణు నడ్డగించి పో
రాడెను నను కాపాడగ ఎక్కటి
కయ్యములో గ్రక్కదలక ఘనముగ.
                    20
నేనీగడ్డను దానవ ఘాతల
పాలయి దురపిలు వార్త సోకినన్, '
రాము డపుడె క్రూరాస్త్ర శస్త్రముల
లోక మరాక్షస లోకము చేయును.
                    21
లంకగడ్డ లవలన కంపింపగ
జలము లింకి వార్ధులు శోషింపగ,
ఊరుపేరు లేకుండ మాసిపోన్,
నీచుని రావణు పీచమడంచును.
                    22
మగలు చావగా మిగిలిన మగువలు
ఇంటింటను- పడియేడ్తురు, నే నిపు
డేడ్చుచున్నటుల , ఏపును ప్రాపును
బూడిదయై పోవును లంకాపురి.
23.
రామలక్ష్మణులు రణ దుర్జయు లీ.
లంక నాల్గ మూలలును వెతకి, రా
త్రించరులను కడ తేర్తురు చావక
బ్రతుకడు శత్రువు వారి కంటబడి

సుందరకాండ


                  24
కాటి పొగలతో కార్కొన త్రోవలు,
గ్రద్దల గుంపులు గగనము కప్పగ,
సంకులమై యీ లంక శీఘ్రమే
వల్లకాడుగా పాడఱు గావుత.
                  25
ఈడేరును నా యిష్టము వేగమె,
మీ దుర్మార్గ నిమిత్తము లరయగ,
పోగాలము దాపున తోచును, విప
రీత కాలమిది యాతుధానులకు.
                  26
అశుభ సూచనము లగపడుచున్నవి
లంక నాల్గు కడలను; భావింపగ
అతి శీఘ్రమె మీ యైశ్వర్య ప్రభ
లాఱి, మాఱి, మాయమగును తథ్యము.
                  27
పాపి రావణుడు పడినంతనె; మును
ముట్టగ, చుట్టగ, పట్టరాని
లంక సర్వము కళా శూన్యమగును;
ధవుడు పోయిన విధవ రూపంబున.
                  28
పుణ్యదినోత్సవములకు దూరమయి,
ధవులు లేని దానవ వధువులతో,
దీపములాఱిన కాపురములతో
ముండమోపివలె నుండు లంకయిక.
                  29
ఇంటింటను భరియింపరాని వెత,
పెద్దపెట్టున తపించి యేడ్చు రా
క్షస కులకన్యల కంఠరోదనము
లాలకింతు తథ్యము శీఘ్రముగనె .

సర్గ 26


                    30
రాముని శస్త్రాస్త్ర దవానలమున
కూలి, కాలి, సంకులమై, వెలుతురు
లేక, చీకటులు ప్రాక ,హతాసుర
వీరులతో వెఱపించు లంకయిక.
                    31
ఈ విధమున నశియించు లంక; నే
నిక్కడ రావణు గృహమున పడు క
ష్టంబులు విని, తక్షణమె రాఘవుడు
అభిసంధించును అస్త్రశస్త్రముల.
                    32-33
అధముడు క్రూరుడు హతక రావణుడు,
పెట్టిన గడువిదె గిట్టినదైనను
నాకు విధించిన నడుమంత్రవు మృతి
పనిమీదనే విఱుచుక పడునొకొ!
                     34
తామసించిన అధర్మ కర్మములు
దాకొలుపు మహోత్పాత ప్రళయము,
మాంసాశన మదమత్తులగు నిశా
చరులీ పర్యవసానము నెఱుగరు.
                     35
చలిది నగుదు రాక్షస రాజునకే,
నయిన నేమి చేయంగల దానను,
రక్తలోచనుడు రాము డగపడక,
అంతులేని శోకార్తిని కుములుచు.
                     36
ఎవరైనను నాకిచ్చట యిప్పుడు
విషదానము కావించిన, శీఘ్రము
పతిని చూడకయె పితృపతి దర్శన
మున కేగుదును విముక్త దుఃఖనయి.

సుందరకాండ


                    37
నేను బ్రతికియుంటినని యెఱిగి యుం
డడు నా నాథుడు లక్ష్మణాగ్రజుడు,
ఎఱిగియున్న సోదరుల గతి ఊ
రకయుండరు వెతుకక జగమంతయు.
                     38
నే నెడబాసిన నిష్ఠుర దుఃఖము
తెరలి పొరలి బాధింప, వీరుడు స
హింపలేక త్యజియించి దేహమును
దేవలోకము నధిష్టించి యుండనగు.
                      39
నా నాథుని, నలినాయతనేత్రుని
దర్శింతురు నిత్యంబును అచ్చట,
సిద్దులు, సురలు, ఋషిప్రవరులు, గం
ధర్వులు; వారలు ధన్యులు పుణ్యులు.
                     40
అట్లుగాక , పరమాత్ముడు రాముడు
ధర్మకాము, డిహ కర్మమోచనము,
కాంక్షించెనొ ? ఇక్ష్వాకురాజఋషి
కెందుకు భార్యాహేతుబంధమిక .
                     41
ఒకరినొకరు చూచుకొనుచున్నపుడె
పెనగొను నరులను ప్రీతిప్రేమలు,
ఎడబాటున నవియెండు కొందఱికి;
రాము డట్టి దుర్జనుడు కాడుగద.
                     42
రామచంద్రునకు రాజమహిషినై
రాణించితి, దూరంబై భర్తకు
బ్రతుకుచుంటినిటు, భాగ్యమె తరిగెనొ ?
లోపించెనొ నాలో సుగుణంబులు?

సర్గ 26


                    43
అప్రియ మెఱుగని సుప్రసన్ను, డరి
కుల మర్దనుడు, రఘుకులవర్థనుడు,
అతనికి దూరంబయి నేనిటు బ్రతు
కుటకన్నను చచ్చుటయె శ్రేయమగు.
                    44
అట్లుగా, కిరువురన్నదమ్ములును
శస్త్రాస్త్రములను సన్యసించి, వ
ల్కలము లూని, ఆకులలములు తినుచు
వానప్రస్థ వ్రతులై సురిగిరొ.
                     45
లేక, రాక్షసకులేశుండు, దురా
త్ముండు, రావణుడు, ద్రోహవ్యూహము
పన్ని, రాఘవుల నన్నదమ్ముల ను
పాయముగా మటుమాయము చేసెనొ!
                     46
కాలమిట్టు లొడిగట్ట కష్టములు
కాలమృత్యు సాంగత్యము కోరితి;
దుఃఖ పీడనల దొరలుచు నున్నను,
మృత్యుదేవత సమీపింపదు నను.
                      47
కిల్బిషములు కడిగిన మహాత్ములు, ము
నీంద్రులు ధన్యులు, ఇష్టానిష్ట స
మానాధానములైన మనసులను
వర్తింత్రు, మహాభాగులు వారలు.
                     48
ప్రియమున దుఃఖము పయికొన దెవరిని,
అప్రియమున భయ మలమట పెట్టును,
రెంటినికూడ పరిహరించి నిలుచు
మహనీయులకు నమస్కరించెదను.

సుందరకాండ


                    49
హృదయం బెఱిగిన ప్రియధాముడు, రఘు
రామున కటుదూరం బైతిని; ఇటు
పాపి రావణుని బందినైతి, నిక
ప్రాణత్యాగమె పరమశరణ్యము.