శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 24

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 24


           1
తదనంతర, మా దానవ సేవిక,
లతివికారముఖు లందఱొక్క గుమి
గూడి, జానకిని పీడించిరి పరు
షములగు దుర్భాషలతో పొడుచుచు:
           2
పసిడిమంచములు, పట్టు పానుపులు,
అమరియున్న శుద్దాంతఃపుర సుఖ
వాసము లేటికి వాంఛింపవు? నీ
వఖిల భూత మోహన మనోహరివి.
           3
మానవ జన్మము కాన, మానవుని
భార్యవగుట భావ్యమె నీ, కయినను
రాఘవునుండి మఱల్పుము మనసును,
లేదు మీరిక కలిసెడి సుయోగము.
           4
జగములలోపల సాటిలేని ధన .
కనక వస్తు వాహన సంపన్నుడు
రావణు డాతని ప్రాణేశ్వరివై
సుఖముగ విహరించుము వైదేహీ. !


                    5
మానవకాంతవు గాన వరించిన
రాముని, రాజ్యభ్రష్టుండై నను
ధ్యానము మానవు మానవుడగుటను,
నిజము నీ వనిందితవు శోభనీ !
                    6
ఆ రాకాసుల ఆఱడి మాటల
నాలించి మనోవ్యధల కగ్గమయి,
పద్మ పత్రములవంటి కనుల బా
ష్పములు కాల్వలయి పాఱ నిట్టులనె.
                    7
నాకు చెప్పితిరి లోకారిష్టము
లగు మాటలు మీరంద ఱేకమయి,
మనసుకెక్క వే మాత్రము నవి, నే
చేయబోను దుష్కృతము నెన్నడును.
                    8
మానవ కన్యక మానిసి తిండికి
భార్య కాతగదు; పాటించను మీ
పాడుమాట, లెప్పాటను తథ్యము,
చంపి తినుడు మీ చలము చల్లబడ.
                    9
దీనుడు కానీ, దేశ రాజ్య పద
హీనుడుకానీ, ఎవడు భర్త నా
కతడే దేవుడు; అనుసరింతు నే
నతని; సువర్చల ఆదిత్యునివలె.
                    10
హిమకరుతో రోహిణివలె, ఇంద్రుని
తోడ శచీపతి జాడ, వశిష్ఠుని
తోడ అరుంధతి పోడిమి, జీవిం
తును నే రామునితోడ నీడవలె.

సుందరకాండ


                    11
చ్యవనుండు సుకన్యయు, అగస్త్యుడును,
లోపాముద్రయు, లోకారాధ్యులు
సత్యవంతుడును సావిత్రియు, కపి
లుడును శ్రీమతియు, విడువ రొండొరుల,
                     12
సగరుని కేశిని, సౌదాముని మద
యంతి, నలుని దమయంతియు, మును
పెటులనువర్తించిరొ అటులనె నేనును
ఇక్ష్వాకుని త్యజియింపక మెలగుదు.
                     13
ఇట్లు జరుగు నా హింసాకాండను
చూచుచుండెను వనేచరకేసరి,
శింశుప వృక్షము చిగురు జొంపముల
నిశ్శబ్దముగా నిలిచి దాగుకొని.
                     14
సీత యట్లు నిరసించి పలుక విని
వికృతముఖులు రక్షికలు క్రోధమున,
ఒడలెఱుగక, యెగబడి సీతను కా
రించసాగిరి అరిష్టభాషలను.
                     15
వ్రేలు పెదవులును కోల నాల్కలను
ఒత్తుచు, గొడ్డండ్రెత్తి హస్తముల,
భయవేగంబున వణకుచున్న
తను చేరగిలిరి దైత్య దూతికలు.
                     16
రాక్షసేశ్వరుని రాణి కాదగు అ
దృష్టము లేదీ దేబె కటంచును,
పట్టరాని కోపమున రక్షికలు
సీత నొఱసి ఘర్షింపగసాగిరి.

సర్గ 24


                    17
కావలికత్తెలు కాఱులఱచుచున్
చుట్టిన, భయపడి, నిట్టూర్పులతో
శింశుపనీడకు చేరగవచ్చెను,
సీత బాష్పములు చేతుల తుడుచుచు..
                    18
ఆ వృక్షము చాయల రఘునందిని,
అసురు లేకమయి యాతన పెట్టగ,
అగలి దుఃఖమున దిగబడి, బెగ్గిలి
దీనముఖముతో తెర్లుచునుండెను.
                    19
చింతల చిక్కి కృశించిన దానిని ,
దీనయై వనరుదానిని, మాసిన
చేలము కట్టిన సీతను, వేధిం
చిరి నలువైపుల చేరి రక్షికులు.
                    20
చూడ భయంబగు చుఱుకు చూపులను
గాదె కడుపు రాకాసి యొకర్తుక,
వినత పేరిటిది, కినుకను కనకన
లాడుచు మైథిలితోడ పలికె నిటు.
                    21
కట్టుకొన్న వలకాని స్నేహితము
పాలించితి, వికచాలును జానకి!
ఏ ఘనకార్యము నేనియు అతిగా
సాగించిన కష్టాల కంపయగు
                    22
మానవ కులధర్మము జవదాటక
సలిపితిందనుక, సంతోషించితి,
మైథిలి! ఇపుడొకమాట చెప్పెదను
నేనును, వినుమది నీకు శుభంబగు,

సుందరకాండ

                   23
రావణేశు భర్తగ వరియింపుము,
సర్వరాక్షసేశ్వరు డాతడు, భుజ
విక్రమశాలి, పరాక్రమవంతుడు,
రూపసి, దేవేంద్రునికి సమానుడు.
                     24
దాక్షిణ్యంబున, త్యాగశీలమున,
రూపమున , కృతార్థుండు రావణుడు,
మానవమాత్రుడు మందభాగ్యు, డా
రాఘవుని విడిచి రావణు చేరుము.
                     25
హరిచందనమును అలదు మంగముల,
మెఱుగు సొమ్ములను మెయి కై సేయము,
నేడు మొదలు నీ మూడు లోకముల
కీశ్వరివై హసియింపుము మైథిలి!
                    26
అగ్నితోడ స్వాహా భగవతివలె,
దేవేంద్రునితో దేవి శచి పగిది,
నీవును రావణుతో విహరింపుము,
రామునితో నీకేమి కార్యమిక .
                    27
ఎట్లుచెప్పి తే నట్లు నీవు చే
యక హఠమున చెడనాడితేని, మే
మందఱ మిప్పుడె ఆకలి తీరగ
నీ మాంసముతిని నెత్తు రానుదుము.
                     28
వికట, పేరిటి మఱొక రాత్రించరి,
కినుకమీఱ పిడికిలి చూపించుచు,
పైకిదూకి యిటుపలికె సీతతో,
బలసిన ఱొమ్ములు బరువున వ్రేలగ.

సర్గ 24

                    29-30
పలికితి వప్రియములు పెక్కులయిన,
సై చితిమేమును జాలిని దయతో,
కాని నీ హఠము మానవు, మా చె
ప్పిన హితవాక్కులు విని నడుచుకొనవు.
                    31
ఇతరుల కెవరికి ఈదరాని సా
గరమున కివతలి గట్టిది, ఇక నీ
వున్న అంతిపురి చిన్న చీమ చొఱ
రాని సురక్షిత రాజనిశాంతము.
                    32
రావణుండు తన రాణివాసమున
నిను దాచె మహా నిక్షేపమువలె,
మేము కాపుదల మేల్కొని యుందుము,
ఎత్తుకపోలే డింద్రుం డయినను.
                    33
నీ హితవాదిని నేను మైథిలీ!
చెప్పిన మాటల చొప్పున మెలగుము,
శోక మడచి, అశ్రుల నాపు, మన
ర్థకములు చింతాదైన్యము లెందును.
                     34
త్యజియించుము సంతతదైన్యము, భజి
యింపు, మసురరాజేశ్వరు రావణు
ప్రేయసివై సంప్రీతి సుఖింపుము,
మనసుతీర కామ్యక్రీడల సతి !
                    35
పిఱికిదాన నీ వెఱుగవు, స్త్రీలకు
జవ్వనంబు శాశ్వతము కాదనుచు,
తరుణప్రాయము దాటక మునుపె, య
థాకామసుఖాధానము నెఱపుము,

                    36
మదిరేక్షణ ! యీ మలల లోయలను
పూచిన తోటల పొదరిండ్లను, ప
చ్చని మావుల చల్లని తావులలో
రావణు సహచరివై విహరింపుము.
                     37
రాక్షస గణముల రాజరాజు రా
వణుని వరింపుము భర్తారునిగా,
వేయిమంది అరవింద ముఖులు నీ
యడుగుల కడకువ మడుగులొత్తెదరు.
                     38
ఇపుడే చెప్పిన హితవాక్యములను
అవధరించి మనసార మెలంగుము,
లేదయేని గుండెలు పెకల్చి, నీ
తీయని కండలు తిందుము సీతా !
                     39
చండోదరియను బండరక్కసి యొ
కర్తుక ఒడ లెఱుగని క్రోధముతో,
శూలము త్రిప్పుచు సుడిసి మీదబడ
వచ్చి, సీతతో వదరసాగె నిటు.
                    40
లేడికనుల వాలిక చూపులతో
భయమున ఱొమ్ములు వణకుచుండగా
సీతను కొనివచ్చిన వఱువాతనె
నమిలి మ్రింగవలె నని మనసాయెను.
                    41
గుండెచీల్చి, అడుగున కుడియెడమల
మంచిమాంసము నమలుచు, మెదడు మీ
గడ నంజుకొనుచు, కడుపునిండగా
ఆరగింప మనసాయె నాకపుడె.

                    42
ప్రఘస యనెడి దుర్జని యిటు లఱచెను,.
తాళనేల, ఇది కూళ , కరాళిక,
గొంతుపిసికి దిగ్గురనచంపి, చ
చ్చిన దంచును ప్రభువునకు చెప్పెదను.
                    43
సంతోషించును స్వామియు నందుకు ,
తినివేయుండని తీరుపుచెప్పును,
సందేహములే, దెందు కూరకీ
నసనస లంచును కసమస లాడెను.
                     44-45
అంత అజాముఖి ఆర్భటించెను, స
మముగ మాంసపిండములు పంచుడు, వి
వాదల కే నొప్పను, తెప్పింపుడు
చల్లని కల్లును, చవుల నంజుడును.
                    46
కడపట శూర్పణఖయను ఘోర ర
క్షిక వాయెత్తి వచించె, అజాముఖి
చెప్పిన ముచ్చట ఒప్పుగ నున్నది,
నాకు కూడ ఇది నచ్చిన పథకము.
                    47
కల్లుకడవ వేగమె తెప్పింపుడు,
సకలశోక నాశక పానకమది,
నరమాంసము తిని, సురను త్రాగి,న
ర్తించెద కుంభిల దేవతముంగల.
                  48
దేవజాతి పుత్రికల కీడయిన
సీత నట్లు హింసింప రక్కసులు,
ధైర్యమెడలి దుస్తర తాపంబున .
విలవిలపోవుచు వలవల యేడ్చెను.