శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 23

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 23



            1
జనకరాజఋషి తనయను సీతను
రావణుడటు లనరాని మాటలని,
వెడలిపోయె, సేవిక లందఱికిని
ఆజ్ఞ లిచ్చి కఠినాతి కఠినముగ.
            2
రాక్షసేశ్వరుడు రాణువతో తన
అంతఃపురమున కరిగిన వెంటనె, .
అతిభయంకరాకృతులగు, రావణు
సేవిక లదవద సీతను మూగిరి,
            3
దయ్యపురూపుల దైత్యచేటికలు
ఒడలెఱుంగని మహోగ్రకోపమున,
చుట్టు ముట్టి నిష్ఠురమగు మాటల,
కారాడిరి కటకట పడ మైథిలి.
            4
జన్మించె పులస్త్య బ్రహ్మకులం
బునను, వరేణ్యుడు, పుణ్యజనాగ్రణి,
ఈ దశకంఠుడు; ఏల నీవతని
కిల్లాలి వగుట కిష్టపడ విటుల.


            5
కురులన్నియు ఒక కోర కొప్పిడిన
ఏకజట యనెడి రాకాసి యొకతె,
రాగికన్ను లెఱ్ఱబడ బిట్టలిగి,
సీతను పిలుచుచు చేరి యిట్లనెను.
            6
చరితార్థులగు ప్రజాపతు లార్వుర
లో నాలవవాడు పులస్త్యు, డతడు
బ్రహ్మ మానసోద్భవుడంచును వి
ఖ్యాతికెక్కె లోకముల నంతటను.
            7
అతని సుతుడు మహర్షి సత్తముడు,
మానసభవుడు సమానుడు బ్రహ్మకు,
విశ్రవసుండని విక్రుతుడాయెను,
సాధుతపస్తేజస్వి, మహాత్ముడు.
            8
రావణు, డరికులరావణు, డావి
శ్రవసుని పుత్రుడు, రాక్షసాధిపతి,
అతని కీవు భార్యవు కాదగుదువు,
వినుము నేను చెప్పిన శుభార్ధమును.
           9
పిమ్మట మఱియొక పిల్లి కనుల రా
క్షసి హరిజట, ఆగ్రహమున, మిడిమిడి
గ్రుడ్లు తిరుగ దారుణముగ ఇట్లనె,
సీతభీతయై చేష్టలు తడబడ.
          10
ఎవ్వ డొక్కడె జయించెను సురపతి
తోడను ముప్పది మూడు కోట్ల దే
వతలను బాహాబల విక్రమున,
అతని కీవు భార్యవు కాతగుదువు.



           11
పిదప ప్రఘసయను పిశితాశని యో
ర్తుక ఒడలెఱుగక ఱొప్పుచు రోజుచు,
దరిసి జానకిని తర్జన భర్జన
లాడె నిట్టుల భయానక భంగిని.
           12
అనిలో వెనుచూపని శూరాగ్రే
సరుడు, పరాక్రమశాలి, రావణుడు,
నిను కోరగ, మన్నించి భర్తగా
చేకొన కేటికి శోకించెద విటు?
          13
రాజు, మహాబలరాజి, రావణుడు
అభిమాన ప్రియురా లగు భార్యను
వదలి, నిను మహాభాగనుగా సే
వించు; వరించి, భజించు, సుఖింపుము.
          14
వేలు వెలదులు వయాళింపగ, నా
నామణి గణరత్న సమృద్ధంబగు,
అంతఃపురి విడనాడి నిను కొలుచు
రావణు డే సువ్రతములు చేసితొ!
         15-16
వికటయనెడి రక్షిక యిట్లనె, వై
దేహీ! యెవ్వడు దేవ నాగ గం
ధర్వుల రణముల తరిమెను పలుమఱు,
అతడు నీ సరస అనువర్తించును.
           17
ఇట్టి ప్రభావసమృద్ధు, డుదాత్తుడు,
దానవ భాగ్యవిధాత, రాజు, రా
వణుడు, నీవతని పట్టపు రాణివి
కావెందుకు రాకాచంద్రముఖీ!


           18
ఆపయి దుర్ముఖి యను సేవికయనె,
ఎవని భీతి రవి యెండలు కాయడు;
పవనుడు విసరడు పడమటిగాడ్పులు,
పల నీ వతని కిష్టపడ విటుల?
          19
ఎవనికి భయపడి జవజవ వణకుచు
పూలు విరులు దిగబోయు వృక్షములు,
ఎప్పుడు వలసిన అప్పుడిచ్చును ప
యోధర భూధర వీధులు జలములు.
          20
అట్టి రావణున కఖిల దైత్య సా
మ్రాజ్యాధిపతికి, రాజరాజునకు
ప్రాణేశ్వరివై రాణించుట కీ
వేల యిష్టపడవో లోలాలక!
          21
నీ సుఖ శోభన నిత్యవృత్తమున
కొప్పగు మాటలు చెప్పితి స్మితముఖి!
భావింపుము నింపాదిగ మనసున,
ఒప్పుకొనుము లేకున్నను బ్రతుకవు.