Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 22

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 22

            1
సీతయటు లుదాసించి కటువుగా
ఆడిన మాటల నాలకించి, ప్రియ
దర్శనయగు సీతాదేవిని గని
అప్రియ వచనము లాడె తీవ్రముగ.
             2
ఎంత యిచ్చకము లేను నెఱపితిని
అంత అధీనుడ నయితి నింతులకు,
మెచ్చులాడితిని మెయి మెయి నెంతగ
అంత పరాభవ మందితి నెపుడును.
             3
మనసై నిను తగిలిన నా కామము
అదిమి పెట్టుచున్నది క్రోధంబును,
పెడత్రోవను పరుగిడు గుఱ్ఱములను
బిగ్గలాగి నడిపెడి సారథివలె.
             4
జనుల కెచట అపసవ్యములగు కా
మాపేక్షలు హృదయముల హత్తుకొను,
అచ్చట స్నేహదయారసము లొలసి
బాధించును ప్రతిబంధకంబులయి.


            5
ఆ కారణముననే కమలాక్షిరొ  !
వధ్యవయ్యు చంపక నిను విడిచితి,
బై సిమాలి సన్యాసిని తగిలిన
నిన్నెటు లవమానించినన్ తగును.
            6
దూఱితి నన్నే దురుసు మాటలను
మెథిలి ! ఆ యవమాన భాషలకు,
ఒక్కొకదానికి ముక్కముక్కలుగ
కోయతగును నిను కూరకాడవలె.
            7
అట్లు రావణుడు అనుగతముగ మా
టాడుచు మైథిలితోడ, తొడింబడి
క్రోధసంకుల క్షోభావశుడై
కొఱకొఱలాడుచు మఱల నిట్లనియె.
            8
గడువిచ్చితి నింకను. రెండు నెలలు;
అంతలోన కనకాంగిరొ ! మైకొని ,
సాలంకృతవై అరుగుదెంచి నా ,
పడకటింటిలో పాన్పు నెక్కవలె.
        
            9
రెండు మాసములు నిండక మును నను
భర్తగా గ్రహింపక, శఠించినన్,
నా తొలి భోగమునకు నిన్ను తఱిగి
పాకముచేతురు వంటసాలలో.

           10
రాక్షసేంద్రుడు దురాగ్రహాంధుడై
జానకినటు తర్జన భర్జనలన్
భయపెట్టగ, వలవల నేడ్చిరి గం
ధర్వ దేవకన్యక లందఱు నట.


                 11
రావణు డట్టుల రజ్జులాడ విల
విలలాడెడి మైథిలిని చూచి, ఓ
దార్చిరి మఱికొందఱు నిగూఢముగ
ముఖ నేత్రాధరముల సైగలతో
                   12
సాటి చేడియల సానుభూతి సం
జ్ఞలను తేఱుకొని జానకి అంతట,
చిత్తవృత్త సౌశీల్య గర్వములు .
అలమ, రాక్షసుని అలిగి పలికెనిటు.
                   13
చేయకూడ దిది చేటు కార్యమని
వారించమి నీ వారెవ్వ రిపుడు,
తెల్లమాయె రాత్రించర ! నీ
మేలు కోరువారే లేరని యిట.
                  14
దేవేంద్రునకు శచీవధూటివలె,
రామున కేను పురంధ్రిని రాక్షస !
ఈ త్రిలోకముల నీవు తప్ప న
న్నెవడడిగె మహానిష్టార్థము నిటు.
                 15
అతి తేజోమయు డయిన రామునకు
అర్ధాంగిని నన్నడుగ తెగించితి,
రాక్షసాధమ ! విమోక్షము లేదిక
రాము బాణధారల హతమగుదువు.
                   16
కుందేలును మదకుంజరమును వసి '
యించుగాక యెడ నెడ నొక అడవినె,
రామగజేంద్రము ఱంపిల్లిన కుం
దేలు చందమున నీవు పోయెదవు.



             17
నాడొక బంగరు లేడి నెపంబున
ఇక్ష్వాకు ప్రభు నేమరించియును,
లజ్జించవు పాలసుడ ! అతని కగ
పడతివేని నీ బయసి బయటపడు.
            18
క్రూరములై దుర్మోహంబున, నలు
పెత్తి తిరుగు నీ నెత్తురు కన్నులు,
పరమ పతివ్రతపై తార్చితి, వవి
రాలి నేల పడవేల? అనార్యుడ !
           19
ధర్మాత్ముండగు దాశరథికి నే
గృహిణిని, రఘువుల యింటి కోడలిని,
పలుకరాని పాపము లాడిన నీ
నాలుక నిలువున చీలదేమిటికి ?
            20
పరమ తపస్సత్యము వ్యయమగునని
విభుని అనుమతి లభింపలేదనుచు
నిను బూడిదచేయను దశకంఠుడ !
 భస్మము చేయు ప్రభావంబున్నను.
            21
ధీమంతుడగు రాముని పత్నిని
అలవియగునె న న్నపహరించుటకు,
రావణ ! నీ మారణమునకై యిది
కారణార్థముగ కల్పించెను విధి.
            22
బాహుపరాక్రమ బలధురీణుడవు,
ధనదు కుబేరుని అనుగు తమ్ముడవు,
ఎందు కీవు రఘునందును నటు వం
చించి, అపహరించితి వతని సతిని.



            23
సీత వాక్యములు చెవిసోకిన రా
క్షసపతి రావణు డెసలారుచు, రూ
క్షము లగు కన్నులు కనకనమన ఘూ
ర్ణిలుచు ఆమెను నిరీక్షించె నలిగి.
            24
కారు మొగులువలె కాయము కొఱలగ,
దీర్ఘ బాహువులు దీర్ఘ కంఠములు,
కన్నులు నాల్కలు కాలుచు మండగ,
సింహసత్త్వగతి చేష్టలు పైకొన.
            25
చలియింపగ ఔదలను కిరీటము,
పూదండలు మెయిపూతలు చెదరగ,
మణికాంచన భూపణములు త్రుళ్ళగ,
తాండవించెను ప్రచండ కోపమున.
            26
నడుముకు కట్టిన నల్లని మొలత్రా
డురియాడ దశాస్యుడు చూపట్టెను,
అమృత మంధనార్థము సర్పముతో
బంధించిన కవ్వపు కొండపగిది.
            27
కండలు తిరిగి నిగారించెడి హ
స్తములు రెంటితో దైత్యుడు కనబడె,
జోడునెత్తములతోడ నొప్పు మం
దర శైలము చందమున నందముగ.
            28
పొడుపుటెండ కెంపులు చిమ్మెడి కుం
డలములతో రంజిలెను రావణుడు,
రక్త పల్లవ ప్రసవాశోక స
మంచితంబయిన అంజనాద్రివలె.


            29
కల్పతరువు చక్కన లొప్పార, వ
సంతుశోభల నెసంగు రాక్షసు, డ
లంకృతుడయ్యు భయంకరుడాయెను,
వల్లకాటి దేవళము చందమున.
            30
కోపవేగమున ఘూర్ణి లి, నెత్తురు
జొత్తిలు కన్నుల చూచుచు సీతను,
పలికె మఱల రావణుడు, దెబ్బతిని
బుసలుకొట్టు రాజస సర్పమువలె.
            31
నిప్పచ్చరమున నిలువ నీడ లే
కనదయైన సన్యాసిని తగిలిన
నిన్ను నేడె ఖండించి ముగించెద;
తన దీప్తిని సందెను సూర్యుడు బలె.
            32
జనకజతో నిట్లనుచు రావణుడు,
ఆగ్రహమ్మున మహోగ్రుండై , ఇటు
లాజ్ఞాపించెను అచ్చట నున్న భ
యంకర దర్శిను లగు రక్షికలకు.
            33
ఒంటి కన్నువా, రొక చెవివారలు,
పూడిన చెవు, లల్లాడు చెవులు, ఆ
వుల యేనుగుల చెవులు కలవారలు,
చెవులు లేని రక్షికలు నుండిరట.
            34
అశ్వపాదములు, హస్తిపాదములు,
గోపాదంబులు, కుటిలపాదములు,
ఒక్కపాదమును, ఒక్కకన్ను గల
వార లుండిరి, అపాద లెందఱొ.


           35
కొలదికి మించిన కుచ, కంఠ, శిరో
ధర; లతిమాత్ర వదన, నేత్ర; లనా
స, లజిహ్వ; లతిరసన లతిజిహ్వలు ;
గోకిరి హరిముఖ భీకర, లెందఱొ.
           36
వారినిగని రావణుడు పలికె నిటు,
ఏయే విధముల ఏయే తంత్రము
లాచరింప తగు నట్లొనర్చి, నా
కలవఱచుడు మైథిలిని శీఘ్రముగ.
           37
ఎప్పటి కెయ్యది యొప్పిద, మటు మె
ప్పించియు, ఇటు లాలించియు సీతను.
దాన సామభేదంబుల వంచుడు,
వంగదేని కడపట తాడించుడు.
           38
అట్లు రావణుడు ఆనబెట్టి ర
క్షికల; చెప్పినదె చెప్పుచు, కామ
క్రోధాతురుడై కొసరి కొసరి, త
ర్జించగ సాగెను సీతను క్రమ్మఱ.
          39
ఆ గతి నతిమోహంబున తమకిం
చెడి పతి నారసి కడపటి పెండ్లము,
ధాన్యమాలిని మదనపీడితయై
దాగిలి రావణు కౌగిలించుకొని.
           40
పలికె నిటు మహాప్రభుచంద్రమ ! ఎం
దుకు నీకీ జానకి, దరిద్ర దే
వత, కృశాంగి, నరసతి ? క్రీడింపుము
నాతో నీకు మనసు తీరి తనియ.


        41
దానవేంద్ర ! నీ దర్పబలార్జిత
భోగభాగ్యములు ముచ్చట తీరగ,
అనుభవింప వ్రాయడు పరమేష్ఠియె
దీని నొసట బాధింపగ నేటికి ?
        42
కామించని అంగనతో కలయిక
మనసును తనువును మలమల కాల్చును,
వలచు వనితతో వలరాచఱికము
ప్రీతినిచ్చి ఈప్సితమును తీర్చును.
        43
తచ్చనలాడుచు ధాన్యమాలినియు
వాటున బిగియగ పట్టె దశాస్యుని,
మెత్తగిల్లె నవమేఘశ్యామల
మసృణాంగుండగు అసురస్వామియు.
       44
దశకంఠుడు అంతట అశోకవని
విడిచి, నేల కంపింపగా నడిచి,
భానువలయ దీప్తంబగు రాజ భ
వనము ప్రవేశించెను సంభ్రమమున.
       45
ఆవరించిరపు డసురేశ్వరు గం
ధర్వ యక్ష సుర నాగ కన్యకలు,
ఉదురుపాటునన్ గుదిగొని అందఱు,
చొచ్చిరి రావణు శోభన సదనము.
       46
ధర్మపథమును వదలని మనస్విని
సీత నటుల తర్జించి, రావణుడు
వేసరిలి విడిచి వెళ్ళి, ప్రవేశిం
చెను భాస్వరమగు స్వీయసౌధమును.