శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 21

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 21

                   1
రావణుడటు లనరాని మాటలా
డిన కంపించి, కఠినశోకాహతి
వలవలనేడ్చుచు బదులాడగడగె
జానకి దీనస్వరము రాలుపడ.
                 2
పతిచింతా తాపముతో వెతలన్
విలపించు తపస్విని, పతివ్రత, శు
చిస్మితయై సముచితముగ నిట్లనె,
అడ్డముగా నొక గడ్డిపఱకగొని.
                  3
మఱలించుము నీ మనసును నా యెడ,
ప్రేమించుము నీ ప్రియజనంబులను,
తగదు నీ కిటు లడుగుట నన్ను; పా
తకుడు పుణ్యఫలితమును కోరుగతి.
                 4
పుట్టితి సత్కులమున, పుణ్యముచే
మెట్టితి మఱియొక మేటి యింటి, నే
చేయరాని పని చేయను, కులకాం
తాలోక నిషేధ, మిది అకార్యము.

                5
ఇట్లు పలికి జగదేక యశస్విని,
కోపతాపములు కొఱకొఱలాడగ,
క్రమ్మఱ పలికెను రావణువైపుకు
వీపు త్రిప్పి సాధ్వీధీరంబుగ.
                  6
ఏను నీకు తగు ఇల్లాలిని కా,
నన్యుని పత్నిని, అరయు మింగితము,
సాధుజనుల ఆచారము నెఱుగుము,
ధర్మము సాధుపథంబున నడచుట.
                  7
నీ నిజదారల నీ వెట్టుల ర
క్షింతువొ, ఇతరుల కాంతల నట్టులె
రక్షించుట ధర్మపరాయణము, సు
ఖించుము స్వీయసఖిజనసంగతి.
                  8
తమ భార్యలతో తనివొందక, అతి
చపలేంద్రియులై సంచరించుచున్,
స్త్రీలను వంచించెడి దుర్మదుల, ప
రాభవింతురు పరమ పతివ్రతలు,
                 9
తెలిసినట్టి పెద్దలు లేరేయిట !
లేక వారిని నిరాకరింతువొ ! స
దాచారము లడగారిపోవ, నీ
వృత్తి యిట్లు విపరీతంబాయెను.
               10-11
అనృతాత్ముండయి, అవినీతి పథ ప
రాయణుండయిన రాజు పాలనన్
బడిన రాష్ట్రమును పట్టణంబులును
ఐశ్వర్యంబును అంతరించుసుమి.

                   12
అదియట్లగుటను, అఖిలరత్న కూ
లంకషంబయిన లంకానగరము,
నీయపరాధాపాయము కతమున
సర్వంబును నాశనమగు శీఘ్రమె.
                  13
దూరాలోచన త్రోసిరాజని, వి
శృంఖలముగ చేసిన అకార్యముల
పాపములే నిను భక్షించు, అపుడు
సర్వభూతములు సంతోషించును.
                      14
నీ పాలనమున నిష్ఠురబాధల
కగ్గమైన ప్రజ, ఎగ్గుతీఱెనని
సంతసింత్రు నీ చావును కని విని,
దేవు డరిష్టము తీర్చెనటంచును.
                   15
నీ యైశ్వర్యము నీ ధనకనకము
లించుక ఆకర్షింపలేవు నను,
సూర్యుని ఛాయాసుందరివలె, రా
ముని తప్ప పరుని ముట్టదు జానకి.
                   16
లోకనాథు, సుశ్లోకు, రాఘవుని
దక్షిణహస్తము తలగడగాగొని
పూతయైన యీ సీత వేఱొకని,
తలచిచూడ, దిక , తాకుట యెక్కడ ?
                  17
వసుధా చక్రేశ్వరుడగు రాముని
కర్ధాంగిని, నే నార్యను, రాక్షస !
వ్రతియై శుచియై, స్వాత్మవేత్తయగు
విప్రోత్తమునకు వేదవిద్యవలె.

                      18.
ఎడమై మందకు అడవిలో నడలు
కన్నె యేనుగును గజపతితో బలె,
విభునిభాసి దురపిల్లు నన్ను భ
ద్రముగా చేర్చుము రఘురామునితో.
                  19
ఘోరమరణమును కోరవేని, నీ
పదవి నిలుపుకోతలతువేని, రా
క్షస! రాముని సఖ్యము నర్థింపుము,
కుశలమగును నీకును నీవారికి.
                  20
శరణాగత వత్సలుడు రాఘవుడు,
ధార్మిక చరితు, డుదారు, డుదాత్తుడు,
ఆతని మైత్రిని యాచింపుము, రా
వణ ! నీవింకను బ్రతుక తలంచిన.
                     21
రక్షణకోరిన ప్రాణుల కభయము
ఇచ్చు దయావ్రతు, లిక్ష్వాకులు, నను
పంపి, రాఘవుని ప్రార్థింపుము, నిను
సుప్రసన్నుడగుచు కటాక్షించును.
                22
మన్ననతోడుత నన్ను విభునకు స
మర్పించిన శుభమగును నీ, కటుల
గాక, వేరుమార్గంబున నడచిన
చావు తప్పదు నిశాచరనాయక !
                  23
పిడుగు రాలియును విడుచుగాక నిను
మఱచుగాక యేమఱి అంతకుడును,
కోపించిన రఘుకులసోముడు, రా
త్రించర ! నిన్ను వధింపక విడువడు.

                   24
దిక్కుల గుండెలు గ్రక్కదల్చు రా
ముని కోదండ ధ్వనులను విందువు,
క్రూరములగు పిడుగులు కురిసెడి ఇం
ద్రుని వజ్రాయుధ రూక్షరావములు.
                  25
రామలక్ష్మణ పరాక్రమాంకములు,
కణుపులు తీర్చిన కఱకు టలుంగులు
కురియును రావణ ! కోరలమంటలు
గ్రక్కు కాలసర్పముల చందమున.
                 26
బంతులుగా రాబందులమంద, లె
డాపెడ దిగి, పట్టణమున తిరుగుచు,
రక్కసిమూకల ఱక్కి ముక్కులన్
పొడిచి పీకి తిను విడక సందిడక.
                 27-28
తన్నుకపోవును దానవవిషస
ర్పములను రామసుపర్ణుడు శీఘ్రమె,
అసురలక్ష్మిగొని అరిగిన హరివలె,
ననుకొని పోవును నాథుడు రాముడు.
                   29
దానవులు జనస్థానమందు దా
శరథి శరంబుల చచ్చి చాళ్ళుపడ,
ఎదిరింపగలే కొదిగి రాక్షసుడ !
నిర్వహించితీ నీచకార్యమును.
                 30
జంట సింహముల వంటి అన్నద
మ్ము లిరువు రాశ్రమమున లేనప్పుడు,
వాలు చూచి, యతిపోలెవచ్చి, వం
చించి నన్ను తెచ్చితి వసురాధమ!

                31
నిలువగజాలవు నీవు రాఘవుల
వాసన పాఱిన వాడలనైనను,
పులియడుగుల చప్పుడు వినవచ్చిన
దిక్కామొగమగు కుక్కపోతువలె.
                 32
కదనములో ఒక్కడవు నీవు, వా
రిరువురు మగలు జయించుటయెక్కడ?
ఏక హస్తుడగు వృత్రుడు, ఇంద్రుని
చేతుల రెంటను చిక్కి కీడ్వడడె.
                   33
సన్నగిల్లు నది నున్న జలములను
ఆదిత్యుడు వడి అపహరించు గతి,
నీ ప్రాణములను నెగయజిమ్ము రా
ఘవుడు తోడ లక్ష్మణుడుండగ, అని.
                  34
గిరిని కుబేరుని గృహమున దాగిన,
వరుణుని రాజ సభన్ చొరబడిన, త
ప్పుకొనలేవు రాముని బాఱికి, కా
లము తీరిన వృక్షము పిడుగునువలె.