శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 13

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 13

                   1
ఎక్కిన పుష్పక మెగిరి దుమికి, ప్రా
కార సమీపము చేరిన మారుతి,
పటువేగ సముత్కటుడాయెను; మే
ఘముల నడుమ క్రొక్కారు మెరుపువలె.
                  2
అసురలోక నాయకుడగు రావణు
దివ్యాంగణముల తిరిగి తిరిగి, జా
నకి జాడలు తెలియక, తనలో నిటు
లాలోచించె గతాగతార్థములు.
                3
రాముని ప్రియకార్యము సాధింపగ
లంకాపురి నలువంకల భూములు
త్రిప్పి త్రిప్పి శోధించితి, కనలే
నయితి, సీత, నఖిలాంగసుందరిని.
               4
చెరువులు, దొరువులు, సరసులు, సరితలు,
కోటలు, కోనలు, కొండలు వెతకితి
ఈ భూములలో ఏ పొంతను జా
నకి అడపొడ కానబడ దేమియును.

                5
ఇచట రావణుని యింటనున్నదని,
గృధ్రవీరకులవృద్ధు, రాజ సం
పాతి చెప్ప విని వచ్చితి, గాలిం
చితి లంకంతయు, సీత లేదిచట.
               6
జనకుడు సాకిన సదమలచరిత, వి
దేహరాజసుత, దిక్కుమాలి; రా
క్షసుని కావరము కక్కసించ బల
వంతపు బలిగా వసమఱిపోవునొ ?
                7
సీత నపహరించిన దశకంఠుడు
రామబాణభయరభసంబున, వడి
వడి నాకసమున పరుగులెత్తగా,
దారినడుమ సతి జాఱిపొకాలెనొ?
               8
అథవా! ఋషులు, మహాత్ములు, సిద్ధులు,
సేవించెడి తారావీధిని బడి,
వచ్చుచు పారావారము నారసి,
గుండెచెదరి పడియుండునొ నీళ్ళను ?
              9
చేతుల రెంటను చిక్కబట్టి, బిగి
తొడలనడుమ నొత్తుచు రావణుడిటు
తెచ్చుచుండగా, తీవ్రపీడ కో
ర్వక ప్రాణంబులు వదలియుండునో ?
              10
అంతకంతకు విహాయస వీధిని
పయికి పైకెగసి పరుగులెత్తగా,
పెనగులాడుచు తపించి, తెగించి, కసి
దూకబోలు పతి తోయధిలోపల.

                 11
చుట్టపక్కములు చూడ దూరమయి,
రావణు ధూర్తరిరింస కొడబడని,
శీలరక్షదీక్షితను, తపస్విని
నాహరించెనో మోహదాహమున.
               12.
లేక రావణుని లేమలు, హింసా
దుష్టశీలలు మృదుస్వభావ శీ
లను సీతనువాలాయము చంపి భు
జించియుందురు కసిమసగి యీసున.
               13
పున్నమచంద్రుని బోలు మొగముతో,
కమలమ్ములవలె క్రాలు కనులతో
అలరు రాఘవుని ధ్యానించుచు మర
ణించియుండు అభినీత సీతయిట.
               14
హా రామా ! ఆహా లక్ష్మణ ! ఆ
హా ! అయోధ్య యని, ఆక్రందించుచు
దిక్కుమాలి, వైదేహి దేహమును
విడిచియుండు దుర్విధివిపాకముగ.
               15
లేక బ్రతికియుండినచో రావణు
సౌధములో, పంజరమున చిక్కిన
గోరువంకవలె, కుములుచు నుండును,
కడగానని యిక్కట్లను స్రుక్కుచు.
                16
జనకరాజఋషితనయ, తపస్విని,
రఘుకులేంద్రు భార్యారత్నము, నీ
లోత్పలలోచన ఓర్వలేక రా
క్షసునివశముకా దుసురు లుండగను.

              17
రామచంద్రునకు ప్రాణపదంబగు
జానకి, మార్గములోన జాఱి పో
యినదో ! చనిపోయినదో కనబడ
లేదని యెట్లు నివేదింపతగును ?
              18
చెప్పినదోషము, చెప్పమిదోషము,
రెండు దోషముల గండక త్తెరను
క్రిక్కిరియగ చిక్కితిని, చికీర్షిత
మేమిటి నాకిపు డీ దుస్సంధిని ?
               19
సమకట్టిన కార్యము కొనసాగక
ఇటులయ్యెను నే నీ సమయంబున
ఎదిచేసిన ఒప్పిదమయి సరిపడు
నని విచారమున మునిగెను మారుతి.
               20
సీత జాడలక్షింప కిచట, నే
కిష్కంధకు తిరిగినచో అచ్చట,
అభిజన మేమను ? అథవా నే చే
సిన ఘనకార్యము చెప్పెద నేమని ?
               21
అంతులేని లవణాంబుధి దాటుట,
కష్టమయిన లంక ప్రవేశించుట,
దుష్టులయిన దైత్యులలో తిరుగుట,
అన్నియు వ్యర్థంబయి, అబద్ధమగు.
                22
తడయక కిష్కంధకు నే నేగిన
స్వామి సుగ్రీవుడేమనునొ ! ఎదురు
వచ్చిన వానరవరు లేమందురొ?
రామలక్ష్మణులు నేమి తలంతురొ?

                 23
పోయి, రాఘవుని ముందు నిలువబడి
'కనబడలేదెక్కడను సీత'యని
పలికిన నాతడు ప్రాణము విడుచును,
ప్రాణపదము శ్రీరామున కాయమ.
                 24
సర్వేంద్రియ దుస్తాపన మగు నీ
క్రూర కఠిన దారుణ భాషణమును
సీత విషయమున చెప్పుదునె ట్లిది
విన్నపిదప రఘువీరుడు బ్రతుకడు.
                25
ఖరఖలమగు కర్కశ వేదనబడి
రామచంద్రుడటు ప్రాణము విడిచిన,
అత్యనురక్తుడు, అతిమేధానిధి,
లక్ష్మణుడును నేలబడి శమించును.
                26
అన్నదమ్ములటు లస్తమించినన్ ,
భరతుండును జీవంబులు విడుచును,
సోదరమరణవిషాదము నోర్వక ,
శత్రుఘ్నుడు పంచత్వము నొందును.
                 27
కోడ లట్లుపోన్ , కొడుకు లిట్లుకాన్ ,
కడుపులు చుమ్మలు సుడియ సుమిత్రయు
కౌసల్యయు, సతి కైకేయియు, మర
ణింతురు తల్లులు నిస్సంశయ మిది.
                 28
సూనృతశీలుడు సుగ్రీవుడు, కృ
తజ్ఞుడు, కపిసంతాన పాలకుడు,
రాముండాగతి ప్రాణముల్ విడువ
కాంచి, తానును త్యజించు జీవితము.

                29
మానసిక వ్యధ మరుగుచు, భర్తృవి
రహశోకమున నిరానందినియై
దినములు గడుపు పతివ్రత రుమయును
తడయక ఉసురులు విడుచును, తథ్యము.
                30
వాలిగతింపగ వలవలనేడ్చుచు,
శోకతాపమున సొగసి, మనోవ్యధ
నారాటించెడి తారాదేవియు,
జీవితంబును త్యజించుట నిక్కము.
                31
తల్లిదండ్రు లిద్దరును గతించగ,
ప్రేమించిన సుగ్రీవుడు సమయగ,
బహుళవ్యసనము భరియించి పొగలు
చంగదుడెటు కాయంబును మోయును.
                32
రాజులేని దుర్గతిని వానరులు
అతి దుఃఖమున నిరాశాహతులై
ముష్టిహస్తతలములతో శిరసులు
పగులకొట్టుకొను చగలుదు రార్తిని.
              33
సుగ్రీవుడు దక్షుడు విచక్షణుడు
చెలిమి బలిమి నచ్చికనుచ్చికలను
అరసికొన్న వానరకులీను లిక
బ్రదుకురోసి వీడుదురు ప్రాణములు.
               34
వనభూములలో భవనంబులలో,
కొండకొనలలో గుంపెసలారుచు
వానరులిక ఇష్టానుసారముగ
తిరుగబోరు సంబరముల క్రీడల .

                 35
ప్రభువుగతింప విపన్న ఖిన్నులయి
గొప్పవానరులు గుట్టలెక్కి పడి,
గోతులన్ దుమికి కూలుదురు, స్తనం
ధయకళత్ర బాంధవ సచివులతో,
                  36
ఉరులుపోసికొని, గరళముత్రాగి, ద
వానలమునబడి, అన్నపానములు
మానివేసి, దెసమాలిపోవుదు, ర
నాధలవలె వానరు లికమీదట.
                 37
కడముట్టును ఇక్ష్వాకులవంశము,
నశియించును వానరకులగోత్రము,
లెందుబోయినను ఏడ్పులు మూల్గులు
వినబడునని భావింతును మనమున.
                 38
కిష్కింధాపురికి తిరిగివెళ్ళను,
ఏమయినను సరె యిపుడు నేను; సీ
తాదేవిని సందర్శింపక, సు
గ్రీవుని ముఖమీక్షింపగజాలను.
                39
వెళ్ళ కిచట నే వేగుచున్నచో
బ్రతికియుందు రిక్ష్వాకులు ధర్మా
త్ములు, మహారథులు తునుగని ఆశను,
కపిపుంగవులు పొకాలక నిలుతురు.
               40
జానకి యెచటను కానరానిచో,
వానప్రస్థుడనై నిలిచెద నీ
చెట్లనీడలను, చేతికి నోటికి
అందిన శాకము లారగించుచును.

                 41
తృణకాష్ఠజల సమృద్ధంబులగుచు
తేమలాఱని ప్రదేశములందున,
కానల దొరకిన కట్టెలు పేరిచి
చితిమంటల కాహుతియై పోదును.
                  42
ఉచితాసనమున ఉపవిష్టుడనయి
సమ్య 'గ్లింగిని' సాధనచేసెద;
జీవి విసర్జించిన దేహంబును
ఆరగించు వాయసములు పులుగులు.
                43
జానకి యెచటను కానబడనిచో,
పాఱుడు నీళ్ళను బడి శమియింతును,
నిర్యాణంబని నిర్దేశించిరి,
ఆదియందున మహర్షులు దీనిని.
                44
మొదట చక్కగా మొలకరించి, ఉ
త్సవముగ సాగి, పొదలిన నా యశో
మాలిక తెగె చిరకాలము క్రిందనె;
జానకి నారయ జాలని కతమున.
               45
నల్లని కనుల మనస్విని, సీతను
కనుగొను సుకృతము కలుగదేని , ఇట
తాపసినై వనతరువుల నీడల
నియమనిష్ఠలను నెట్టుదు దినములు.
                46
భూపుత్రిక అడపొడ లేమాత్రము
తెలిసికొనకనే తిరిగి తిరిగి, అట
బోయిన వానరపుంగవు, డంగద
పుత్రు డాదిగా పొలియుదు రందఱు.

                 47
అది, యటులుండగ, ఆత్మహత్య బహు
పాప హేతువగు; ప్రాణధారణ మ
వశ్యము; బ్రతికి శుభములు పడయనగు;
కాన జీవములతో నుందు, ధ్రువము.
                48
అనుచు హనుమ హృదయాంతరాళమున
పొరి పొరి పొరలెడి భూరి దుఃఖమున
కంతము కానక వ్యాకులుడాయెను,
బహుభంగుల అనవస్థాగతుడయి.
                 49
అంతలోనె, క్షణమంత ధ్యానమున
తత్కాల విషాదము తొలగ, మహో
జ్జ్వలుడై లేచెను 'చంపుదు రావణు,
సీత నపహరించిన పగతీర్తును'.
               50
లేదా ! రాక్షసులేపి, యీడ్చుకొని
పోదు సముద్రము మీదు మీదుగా,
పశుపతి బలికై పశువును వలె; రా
మునకు సమర్పింతును పదిలంబుగ.
             51
అని పలుకుచు, సీతను లక్షింపని
చింతావేదన సెలలెత్త మఱల,
దుఃఖ పరీతాత్ముండయి మారుతి,
ధ్యానమున నిలిచి తలపోసె నిటుల.
              52
రామకళత్రము, రాజయశస్విని,
కనబడునందాకను మఱల మఱలి
గాలించెద లంకను సమస్తమును,
తిరిగి తిరిగి శోధించెద నింకను.

                 53
మాకచ్చట సంపాతి చెప్పిన ప్ర
కార మపుడె రాఘవు నిచటికి కొని
వచ్చియున్న; ఇట భార్యను కానక ,
కాల్చి యుండు మా కపులనందఱిని.
                    54
కావున, నియతగ్రాసముతో, ఇం
ద్రియములను సమాధించి, ఇచటనే
నిలిచిపోదు, నావలన కాగల వి
నాశము తప్పును నరవానరులకు.
                   55
అదె, కనబడుచున్నది, శ్యామలతరు
సుందరంబుగ అశోకవనాంతము,
వీడించగలే దింతకు పూర్వము
పోయిచూతు నిప్పుడెయని సమకొని.
                 56
అసురలోక శోకావహముగ
మొదట దోయిలించెద, వసురుద్రుల,
కశ్విని మరుతుల, కాదిత్యులకు, అ
శోకవనంబును చూడబోవుతఱి.
                  57
రక్కసి మూకల చక్కాడెద, ఇ
క్ష్వాకువంశ సంవర్ధని సీతను
చేర్చి, సమర్పించెద రామునకు; త
పస్వి కిష్టసాఫల్యసిద్ధివలె.
                 58
అనుచు, హనుమ మహాతేజోనిధి
ధ్యాన స్తిమితుండయి, నిమేష, మిం
ద్రియములు కప్పిన తిమిరము విడిపోన్,
మేలుకొని విజృంభించె యథావిధి.

                  59
తొలుత వందనము సలిపి రామ ల
క్ష్మణులకు, పరమసుజాతకు సీతకు,
రుద్రునకు, మహేంద్రునకు, పవన యమ
మరు దినసోముల కెఱగెద వినతిని.
                 60
పతిసుగ్రీవుని, పితను వాయు దే
వుని, స్మరించి, పావని పిమ్మట, అటు
పరికించుచు దిగ్వలయము, చూచె న
శోక వనాంచల శోభన చక్రము.
                 61
చూచి నిశ్చయించుకొనె హనుమ యిటు,
మునుముందుగ వనము ప్రవేశింతును,
కాగల రాగల కార్యకలాపము
నాలోచించెద నటు పిమ్మట నట.
               62
ఈ యశోకవన మేపున నున్నది
బహు వనపాదపబంధురమై, వన
పాలక రాక్షసభటజాలముతో,
కిటకిటమనుచుండుట సునిశ్చితము.
              63
పాలకులును కాపాడుదు రీ ప
చ్చని తోటను నిచ్చలు నిచ్చకమున,
పాదపములు సుడివడగా విసరడు
భగవానుండగు పవమానుండును.
             64
రామచంద్రు కార్యము సాధింపగ,
రావణుని ఉపద్రవ మరికట్టగ,
కాయము కుంచితి; కరుణింతురుగా
కిపుడు, దేవతలు ఋషిగణంబులును.

                  65
ఆత్మభవుడు బ్రహ్మయు, దై వతములు
పవన పావకులు, వజ్రి సురేంద్రుడు,
అనపాయ విధాయకులై అరయగ
కార్యసిద్ధియగుగాక, నా కిచట.
                  66
పాశహస్తుడగు వరుణుడు, హిమకర,
దినకర, మరు దశ్విను, లీశానుడు,
అనుకూలించి, మహాత్ములందఱును
విజయసిద్ధి కావింతురు గావుత !
                67
సకల భూత సంచయమును, వారల
అధిపతి వర్గము, అగపడని యితర
శక్తిగణమును, ప్రసన్నులగుచు, నను
వీక్షించి, జయము నిత్తురుగావుత.
               68
పద్మపత్రములవంటి కనులు, తీ
రైనముక్కు, కుదురైన పల్వరుస
తో నవ్వుచు, చంద్రుని బోలిన సీ
తాదేవి ముఖము దర్శింతు నెపుడు ?
                  69
అల్పుడు, పాపి, నిహంత, తామసుడు,
భీషణ భూషణ వేషధారి, రా
వణుడు బలిమికొని వచ్చిన పూతను
సీతను కన్నుల చూతు నే నెటుల ?