శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 12

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ. - 12

                   1
ఎలతీగెల పొదరిండ్లును, చిత్తరు
వులు మెఱసెడి శాలలును, పాన్పులు
న్న నిశాంతములను, తనిసన పరిశో
ధించె; లేదు మైథిలి అందెందును.
                  2
సీత కనబడక వాతాత్మజు డిటు
చింతించెను, నేనెంత వెతికినను
కానరాదు రాఘవుని కళత్రము,
జనకజ మరణించినదనుట ధ్రువము.
                  3
దురితకర్మ నిరతుండగు రావణు
ఇష్టకామితము నీసడించి, ధ
ర్మ ప్రవర్తనము మాననిసతిని, వ
ధించి యుండు వై దేహిని కసిమసి.
                4
వక్రరూపముల బండ మొగంబుల,
తాటిచెట్లవలె తార్కొను రాక్షస
భూతములను గని, సీత రాజసుత
గుండె పగిలి పడియుండు తత్క్షణమె.

                  5
కాలము గడచెను కనిపెట్టగలే
నయితి, రామజాయను, సిద్దింపక
పౌరుషము, హరీశ్వరు నెటు దరిసెద?
చండ శాసనుడు స్వామి! ఏమిగతి ?
                  6
రావణు నంతిపురంబు చొచ్చితిని,
అచటి స్త్రీ జనము నంతయు చూచితి,
కనలేనయితిని గరితను సీతను,
గాలికి పోయెను కష్టమంతయును.
                  7
తిరిగిపోవ వానరవరు లందఱు
గ్రుచ్చి గ్రుచ్చి అడుగుదురు నన్నుగని,
‘వీరుడ ! పనివడి వెళ్ళి, తచట సా
ధించిన దేమన' తెలుపుదు దేనిని.
                  8
కానరాదచట జానకి నాకన,
అభిమానంబును అపకీర్తి భయము
సుడియ వానరు లుసురులు పాయుదురు.
గడువుదాటె, ఎటుగండము గడచును ?
                 9
వారిధి గట్టుకు వచ్చి నా కొఱకు
కూడినవా రే మాడుదురో, వృ
ద్దుండు జాంబవంతుం డేమనునొ ? కు
మారాంగదుడే మాటల నడుగునొ ?
                10
నిర్వేదమె అన్నిట నరిష్ట, మ
నిర్వేదమొక టె సర్వశుభంబులు,
నిఖిలసుఖము లందించును, సకలా
ర్థముల ఆనిర్వేదమె ప్రవర్తిలును.

                 11
మనుజుడు తన కర్మను వేసారక
చేసినపుడె ఫలసిద్ధిని పొందును,
కాన, విసిగి, వెక్కసపడి, విడ కె
క్కుడు పూన్కిని కడగుదు కార్యమునకు.
               12
ఇంతవఱకు అన్వేషింపని, పెడ
వాడలు వంకలు వదలక వెతకెద,
రావణుడేలెడి రాష్ట్ర, దేశ, జన
పదముల నెల్లను పరిశోధించెద.
                 13
పానభూమి సర్వము పరికించితి,
పూలతోటలను పొదలను చూచితి,
చిత్రశాల లీక్షించితి, కేళీ
గృహములను పరీక్షించితి బాగుగ.
                 14
ఇండ్లతోటలను బండ్లబాటలను,
భూరివిమానంబుల సకలంబును,
అరసితి; ఐనను మఱల వెతకెదను,
అనుచు సాగె ముందునకు మహాకపి.
                15
నేలక్రింది నెలఱాల మాడుగుల,
రెండంతస్తుల దండిమేడలను
చైత్యములను వేసారక, యెక్కి ది
గుచు, ఆగుచు, పరుగు లిడుచుండె కపి.
                16
ద్వారబంధముల తలుపుల ఱెక్కల
తెఱచును మూయును తేపతేపకును,
బయటికరుగు, లోపలి కేగును, పయి
కెగురును, క్రిందికి దిగును పొరింబొరి.

             17-18
ప్రాకారము లోపలి త్రోవల, వే
దికల, చైత్యముల, దిగుడుబావులను,
హనుమ తిరుగనిది అంగుళమంతయు
లే దసురుని ప్రాసాదాంగణమున.
               19
వికృతవదనలు, విభీషణ వేషిణు
లయిన రాక్షసకులాంగన లెందఱొ
పొడకట్టిరి కపిపుంగవున కచట,
కనరా దెందును జనకుని నందన.
                20
చక్కదనంబున సాటిలేని వి
ద్యాధర బింబాధరల నెందఱినొ
చూచెనచట కపిశుండాలము, కన
రాదు వారిలో రఘుకుల నందిని.
               21
పున్నమచంద్రుని బోని శుభాస్యలు,
తరుణాంగులు, సుందర నితంబినులు,
నాగకన్య లెందఱొ కనుపించిరి;
చూపట్టదు సీతాపుణ్యాంగన.
               22
బాహుబలంబున పట్టి అపహరిం
చిన నాగవిలాసినుల కొందఱిని
అతినిదానముగ అవలోకించెను,
జనక రాజసుత కనబడ దెందును.
               23
అంత హనుమ ధీమంతుడు, తనలో
ఖిన్నుండై దుఃఖించె మరల యిటు,
సీతను వెతకు చిసీ ! చూచితి పర
దారల నంచును సారెసారెకును.

                  24
వానర వీరుల పరమ యత్నమును
తన సాగరలంఘన ఘనకార్యము,
వ్యర్థమాయెనని పరితపించె చిం
చింతాకుల మానసుడగుచు మహాకవి.
                  25
అంత, విమానము నవల పోవిడిచి
శోకము చిత్తము నాకులపెట్టగ,
పరిపరివిధముల భావమునన్‌ తల
పోయగ సాగెను వాయుతనూజుడు.