శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 11

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 11

                  1
తాను చూచినది జానకియను భా
వము విడిపోవగ, స్వస్థుడై హనుమ ,
చింతించెను మది సీతార్థముగా
కాగల రాగల కార్య కలాపము,
                2
రామ విరహదుర్దశలో జానకి
తినరా దిష్టమయినది, త్రాగకూ
డదు మధురసము, అలంకరణాదులు
పనికిరావుగద పరమవ్రతలకు.
               3
సీత మహాసతి చేరగబో దా
దివిషత్పతియగు దేవేంద్రునయిన,
రామసములు కనరారెవ్వరు నిల
అనుచు తిరుగసాగెను మధు భూమిని.
                4
పానభూమిలోపల జొఱబడి, అట
కాంచె హనుమ చక్కని జవ్వనులను
ఆడిపాడి వసివాడిన భామల,
త్రాగి తేలగిలి తూగెడి లేమల.

                   ?
బడలిరి కొందఱు పాడిపాడి, వసి
వాడిరి కొందఱు ఆడియాడి, సొగ
సిరి నాట్యము చేసి కొంద, ఱల
సిరి కొందరు మధు సేవనాభిరతి.
                  5
డోళ్ళమీద మద్దెళ్ళమీద, కం
బళ్ళమీద, చాపలమీద, అ
ష్టానుసార మాసీనలయిరి కొం
దఱు చిందరవందఱగా నెడ నెడ.
                6
రూపంబుల సల్లాపశీలముల,
చతురభాషణా సంగీతంబుల
నతిశయించు మదవతు లగపడి, రా
భరణంబుల ప్రభ లగ్గలించగా.
                  7
దేశకాలముల తీరుల కనువుగ
పలికి కులుకు మదవతులు కొందఱు ర
తో పరతులలో నోలలాడి, శయ
నించుచుండ కన్పించిరి హనుమకు.
               8-9
మఱియొకవైపున మరునిబాళి సం
తాపించు వయోరూపవతుల, దర
హాసముతో పరిహాసమాడగల నెఱ
జాణ లగపడిరి రాణివాసమున.
                10
ఆ లావణ్యవతీలలామముల
నట్టనడుమ శయనంబున రాజిలె,
అసురలోకనాయకుడు, గోష్ఠమున
ఆలమందలో అబోతుపగిది.

                11
మసకొని దానవమ త్తకాశినులు
ఆవరించిన దశాస్యుడు కనబడె,
అడవికిలోపల పడుచుటేనుగుల
మధ్యనున్న మదమాతంగమువలె.
                12
సకల కామితములకు నట్టిల్లయి,
నిత్యోత్సవముల నిండిన, మోహన
పానభూమి చూపట్టె మారుతికి
దశకంఠుని సౌధమున నొక్క యెడ.
                  13
దున్న మాంసము, మృదుమృగామిషమును,
పందికూరయును పానభూమిలో
వేఱువేఱుగా తీరుతీరుల న
మర్చియుండ హనుమంతుడు చూచెను.
                   14
సగము భుజించగ సగము మిగిలిన నె
మిళ్ళ మాంసమును కోళ్ళకూరయును
ఓరలనుండగ తేఱిచూచె బం
గారు కంచముల మారుతి అచ్చట.
               15-16
పాకముచేసిన సూకరక్రకచ
మేషమాహిషామిషములు సగపా
లారగించిన ప్రియచకోరములును
పానభూమిలో కానబడె హరికి.
               17
నంజగ మాగిన నవలేహ్యంబులు
త్రాగ తనివితీఱని పానకములు,
ఉప్పుపులుసు పాళ్ళొప్పగ ఎనపిన
షడ్రసమయభక్ష్యములు భోజ్యములు.

                   18
అందెలు గొలుసులు సంది దండలును
ఊడిపడి మెఱయ నొకట, మఱొక్కట
పండ్లుపోసి పుష్పసరంబులు చు
ట్టిన మధురసకుండిక లింపారెను.
                   19
ధగధగమని రత్నాల మంచములు
ప్రజ్జ్వలింపగా పానభూమి దీ
పించెను, భగభగమంచు మండుచు
న్నట్టు లంతట అనగ్నిదగ్ధమయి.
                   20
చతురులయిన పాచకులువండి వా
సనకట్టిన మాంసములను విడివిడి
గా వడ్డించిరి కనకపాత్రలను,
పానభూమి శోభాయమానముగ.
                21
ఇప్పపూలమద, మిక్షుక్షీరము,
పండ్ల రసము, పుష్పముల మరందము
కాచి తేర్చి వడకట్టిన మద్యము
దొంతల బానల తొణుకుచునుండెను.
                22
పండ్ల నుండి, పుష్పములనుండి, ఇ
ప్పపువులనుండియు, పండిన చెఱకుల
నుండియు, చక్కెరనుండియు, ఆయ
త్తముచేసిన మద్యము లాసవములు.
               ?
తగిన సుగంధద్రవ్య చూర్ణములు
కలిపి సువాసన కట్ట మాగిన సు.
రాభాండములను శోభనవీధుల,
వేఱువేఱుగా వీక్షించెను కపి.

                    23
తీరు తీరు బంగారు పళ్ళెములు
మంచి స్ఫటికములు మలచిన గిన్నెలు
చక్కని మేలిమి జారీచెంబులు
పానభూమి పొలుపార చూచె హరి.
                  24
వెండిబానల, పసిండి బిందెలను
రతనపు కడవల కుతికెల దాకను
నిండారి తొణకుచుండగ చూచెను
పానభూమిలో పవననందనుడు.
                25
కాచి, దించి, వడకట్టిన చిక్కని
చెఱుకుపాలతో చేసిన శీధువు
మణి కలశంబుల, మంచి వెండి భాం
డముల, సువర్ణ ఘటంబులలో గనె.
               26
సగమానిన ఆసవకలశంబులు,
పూర్తిగ త్రాగిన పూజెల ముంతలు,
ఏమియు త్రాగని హేమపాత్రికలు
పానభూమి నడవల పడియుండెను.
                27
తిని వదలిన తీయని భక్ష్యంబులు,
త్రాగ మిగిలిన సురాభాగంబులు,
కొన్ని యెడల భుక్తాన్న శేషములు
పరికించుచునట తిరిగెను మారుతి.
                28
పగులగొట్టి పడవైచిన ముంతలు,
ఉత్తవై దొరలుచున్న కుండికలు;
పండిన పండ్లును పచ్చిదుంపలును
పెట్టి, పూసరులుచుట్టిన పాత్రలు.

                 29-30
అందలి నెలతలు కొంద ఱొండొరుల
కవుగిలించుకొని రవశచిత్తలయి,
ఒకరి చీర నింకొకరు చుట్టుకొని,
కోకలు జాఱగ కూర్కిరి కొందఱు.
                31
వారలు కట్టిన చీరల చెంగులు,
తాల్చిన పువ్వులదండ, లూర్పులకు
అంతగా కదలియాడవు చిత్రము!
పయరగాలి పయిపయి సోకినటుల.
                 32
శ్రీగంధము వెదజిమ్ము చల్లదన,
మిక్షుమద్యమున నెగయు సువాసన,
పూలమాలికల పొదలు పరిమళము,
దివ్యధూపముల తేలు సౌరభము.
                33
అగ్గలించగా అన్ని గంధములు
గుచ్చియెత్తి సుడిగొని విసరెను, నా
నా సుగంధ సాంద్ర సమీరంబులు
పానభూమిలోపలను వెలపలను.
                34
హరిచందనముల, చెఱుకుమద్యముల,
పూలమాలల, అపూర్వధూపముల,
పిక్కటిల్లిన వివిధసువాసనల
దీటుకొనియె నట దివ్యవిమానము,
               35
రావణు నంతిపురంబున నుండిరి,
కృష్ణవర్ణ భోగినులొక కొందఱు,
చామనచాయల చానలు కొందరు,
బంగారు పసిమిభామలు కొందరు.

                 36
నిదుర ముంచుకొన, మదను డలంచగ,
లేవలేక పవళించి కూర్కు పూ
బోణు లగపడిరి; ప్రొద్దుగ్రుంక ని
ద్రించుచున్న పద్మినుల చందమున.
                  37
అట్లు శోభిలెడి అంతఃపురమును
సాంతము వెతకిన సామీరికి జా
నకి జాడలు కానంబడవాయెను;
అంతమంది జవరాండ్ర కూటమున.
               38
ఆ యేకాంత శయన సౌధంబున,
ఒడలెఱుగక పడియున్న పడతుకల
చూచి చూచి ప్రాజ్ఞుడగు పావని,
ధర్మభీతి నాత్మను శంకించెను.
                39
అవరోధంబున అలసి నిద్రలో
ఉన్న కాంతలను కన్నుల చూచుట,
పరమ పాతకము; జరిగిన దిచ్చట
ధర్మ లోపమని తలకెచింతతో.
                40
కాదు కాదు ! నా కనులును చూపులు
పరదారలపయి పొరలలే దిచట,
పరులదారల నపహరించిన ఖలు
రావణుమీదనె రాకనిల్చినవి.
                 41
అట్లు వ్యాకులుండయిన మనస్వి, స
మీరసూతియు సమీక్షించెను భవి
తవ్యము; నేకాంతంబున చింతన
చేసె కార్యనిశ్చిత బుద్ధి నిటుల.

                42
దశముఖు విశ్వస్తలను సాంగముగ
దర్శించితి, నది తథ్యమె; అయినను
వికలము కాలే దొక యింతయు నా
మనసు, విషయకామప్రదీప్తమయి.
                  43
సర్వేంద్రియముల చలన చాలనకు
మానస మొకటె ప్రధాన కారణము,
నా మనసిచట అనాహతమయి, ఇం
చుకయు భ్రమింపదు సువ్యవస్థితిని.
                44
స్త్రీల కూటమున స్త్రీని వెతకు టిల
ప్రాయికంబుగ విధాయక మెపుడును,
మఱియొక తావున మైథిలిని వెతకి
కనిపెట్టు టశక్య, మది కానిపని.
                 45
ఏ జీవకులం బెచట వసించునొ
ఆ సజాతి నరయందగు నచటనె,
కానరాక యెడమైన లేమకయి
లేళ్ల మంద గాలించిన నేమగు ?
                46
పరిశుద్ధంబగు భావముతో ఈ
రావణు నంతిపురంబు సర్వమును,
వెతకితి, పరికించితి, గాలించితి
జాడచిక్క దే చాయను జానకి.
                  47
చూచితి పలువుర సుందరులగు గం
ధర్వకన్యకల, నాగకన్యకల,
దేవకన్యకల; దేవి జనకసుత
అడపొడ కనరాదాయె సుంతయును.

                 48
వెతుకవచ్చి రఘువీరకళత్రము
నామె కనబడక అన్యల చూచుట,
కానికార్యమని, పానభూమి వ
ర్జించి, హనుమ యోచింప మొదలిడెను.
                 49
అటుపిమ్మట సమయజ్ఞు డుపజ్ఞను
గడచినదానికి కళవళమందక,
వదలక దీక్ష, నుపక్రమించె ధృతి,
సీతాన్వేషణ, శ్రీమన్మారుతి.