శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 14

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందర కాండ

సర్గ 14

                1
అమితవిక్రముడు హనుమంతు, డపుడు
నిముసమంత ధ్యానించి, ఉవ్వునన్
దూకెను చివ్వున ప్రాకారంబును,
ఆవలి సన్నాహము పరికించగ.
                2
తోటగోడపయి పీటబెట్టి, హరి
ఉల్లాసంబున ఒడలు గగుర్కొన,
చూచె, చైత్రమున పూచిన తరువులు
సిగపువ్వుల సోయగముతో మెఱయ.
                3
సుందరమైన అశోకంబులు, పు
ష్పించిన పొద సంపెగలు, పూత ప
ట్టిన మామిళ్ళును, ననిచిన యేపెలు,
చిగిరించిన పలుతెగల వృక్షములు.
                4
లేత తీగెలల్లిన పొదరిండ్లును,
ఎలమావులు వర్ధిలిన తావులును,
పుంజుకొన్న తోపునదూకెను; విలు
త్రాడు దూసుకొని వ్రాలు ములికివలె.

                   5
ఆ పగిదిని అపురూపం బయిన అ
శోకవనంబున దూకిన మారుతి,
తిలకించెను పులుగుల యెలుగులతో
కలకలమను బంగారపు చెట్లను.
                 6
వెండిఱేకు లనుపించు ఆకులును,
పసిడిరూపులన పొసగు చిగుళ్ళును,
చిత్రచిత్రమగు చెట్ల వీధులును
ప్రొద్దుపొడుపు తీరున సొంపారగ.
                  7
చక్కని పువ్వుల చారు తరువులును,
పచ్చని తియ్యని ఫలవృక్షములును,
తుమ్మెద గుంపులతోడి రాగములు,
కోకిలజంటల కోమలరుతములు.
                 8
మానవ శోభాధానకాలమయి,
మృగ విహంగ సంమేళనదినమయి,
నెమిలి కన్నెలకు నృత్తసమయమయి
ద్విజతతికి సమావేశ తరుణమయి.
                 9
తనుపు నా ముహూర్తమున, సుచరితను
జనక రాజఋషితనయను, సీతను,
అన్వేషించుచు, ఆదమఱచి, సుఖ
సుప్తినున్న పక్షుల నెగజోపెను.
                10
లేచిన పులుగులు చాచి ఱెక్కలను
రెపరెపకొట్టుచు రెమ్మల కొమ్మల,
రివ్వున నెగిరి పరిభ్రమింప, పలు
రంగుల పువ్వులు రాలె సాలముల.

                 11
ధారాళముగా జాఱు పూలు కపి
కంఠీరవు నతికాయము కప్పగ,
చూపట్టె నత డశోకవనంబున,
పుట్టి వర్ధిలిన పుష్పగిరి గరిమ.
                    12
గుంపులై గుబురుకొన్న వృక్షముల
వీధుల దాపల వెలపలబడి విహ
రించు వానరవరేణ్యుని చూచి వ
సంతుం డనుకొనె సర్వభూతములు.
                   13
తరువులు తీగెలు కురిసిన పూలు చి
వుళ్లు మెఱయ రాజిల్లె వసుంధర,
ముత్యాల పగడముల సొమ్ముల సా
లంకృతయైన నెలంత చందమున.
                  ?
(చెట్లకొమ్మలను పట్లు సళ్ళి, తెగి
రాలిన వన్నెల పూలతోడ రా
ణించె, అశోకవనీతలి, ఆభర
ణములు పెట్టుకొన్న సుమంగళివలె )
                14
బలిమికొలది కపికులమాతంగము
పట్టి తట్టి అట్టిట్టు నెట్ట, ఉ
ఱ్ఱూతలూగి ఛాయా తరువులు రా
ల్చెను తలపూ లెల్లను దులిపినగతి.
                  15
రాలిన తల చిగురాకులతో, తెగి
క్రిందబడిన పూపిందెలతో, కన
బడె వృక్షంబులు; వస్త్రాభరణము
లాదిగ ఓడిన జూదరు లట్టుల.

                16
వేగశాలి కపివీరుం డెగసి క
దల్చి కుదిల్చిన ధాత్రీజాతము
విదిలించెను గజిబిజి దులిపిన
విచ్చిన పూలను పచ్చని పండ్లను.
                17
గాలికి ఆకులు నేల రాల ఉ
ల్కిపడి విహగములు లేచిపోవ, చ
ల్లని ఛాయలు కోల్పడి వనస్పతులు
మ్రోడులాయె, మారుతి తాడనలకు.
               18
తలనీలాలు చెదరి చిక్కుపడన్
మెయిపూతల మిసిమితరుగ, వా తెర
దొండపండు తొగ రెండగ, నఖముఖ
దంతపీడనల నలిగిన చెలివలె.
                19
వానరవీరుని వాలపాశబం
ధముల రాపులకు తలకి యులికి, కపి
కరచరణ నఖక్షతుల వికలమై
కనుపించె అశోకవని సోయగము.
               20
పెనగ చుట్టుకొని బిగియగ బలసిన
గండ్ర తీగెలు పెకల్చి విసరె హరి,
వింధ్యాచలమున వీగు వర్ష మే
ఘములను ఉప్పెన గాలి చందమున.
                21
అందునందు కలయన్ తిరుగుచు కపి,
మాణిక్యంబుల మంటపములు, బం
గారు వెండి చెక్కడములుగల సుం
దర కేళీ మందిరములు చూచెను.

                22
నిర్మలోదకము నిండి తొణుకు మణి
సోపానంబుల సౌరుమీఱగా,
తీఱిచి కట్టిన దిగుడు బావులను
వివిధాకృతులను వీక్షించెను హరి.
                 23
మేలిపగడముల మెత్తని యిసుకయు,
ఆణిముత్యముల అచ్చపుసున్నము,
కలిపి సుతారముగా నిర్మించిన
కృతకసాలముల క్రేవల నుండెను.
                24
కలువలు కమలంబులు కొల్లలుగా
విచ్చి విలసిలగ వేడుక కొలకుల ,
చక్రవాక కూజనములు, కలహం
సల కంఠస్వనములు దెస లెలుగిడు.
                 25
దరుల నొత్తుగా పెరిగిన తరువులు,
దోరలుగా నొప్పారగ, ఊర్జ
స్వల లయి మంగళవాహినులంతట
పుణ్యోదకములు పొంగ పెంపెసగు.
               26
వేలకొలది తీవెల పొదరిండ్లును,
అంతట పూచిన సంతానతరులు,
నిబిడములగు గన్నేరుల గుంపులు
బోదెలు లేని అపూర్వసాలములు.
               27
ఎత్తుగ పెరిగిన నెత్తంబులతో
చుట్టును చక్కని గుట్టలు మెఱయగ,
విమల శిలాకూటములతోడ, ఒక
గిరి యుండె పయోధరముచందమున.

               28
ధాతుశిలల నందముగా కట్టిన
గృహపంక్తులతో, రెమ్మలు కొమ్మలు
జంపులయిన పచ్చని గుంపెనలను,
చిత్రముగా భాసిల్లుచునుండెను.
              29
ప్రియుని కవుంగిలి విడిచిపోవు ప్రియు
రాలి పగిది, పర్వతతలంబు నెడ
బాసి, తరలి దిగబాఱుచున్న ఒక
జలపాతంబును తిలకించెను హరి.
                  30
తల కొమ్మలు జలములబడి మునుగుచు
ఓరగిల్లి దరినున్న రసాలము,
కినిసి యేటదూకిన యువతిని ప్రియ
జనము పట్టి ఆపిన యట్లగపడె.
                  31
మలుపు తిరిగి క్రమ్మఱలి, మఱల, గిరి
సందిలి దరిసిన సన్ననిసొన గనె;
కోపము తీఱిన కోమలి వలపున
ప్రియుని కడకు చేరిన చందంబున.
                32
అచటికి దాపున అమృతోదకములు
నిండియున్న కోనేళ్ళలోన క్రి
క్కిరియ పూచే తామరలు, పులుంగులు
పిల పిల మంచును పింపిళ్ళాడగ.
              33
మేల్మిమెట్లు మినమినమని మెఱసెడి
దిగుడు బావులను తీపినీరు, ము
త్తెముల యిసుకపయి తేటలారు, పి
ట్టలు తామర కాడలపై నూగగ.

                   34
చిత్ర జంతువులు చెంగనాలిడుచు
తిరిగెడి వీధులు, దివ్య సౌధములు,
వింత వింతగా విశ్వకర్మ ని
ర్మించిన సాలంకృత శుభవన మది.
                  35
పండ్ల గెలలు , పుష్పంబుల గుత్తులు,
పచ్చని ఆకుల పైటల చాటయి,
వృక్షంబులు దీపింప, అశోకవన
మంతయు శోభిలు శాంతిమంతమయి.
                 36
పున్నాగంబులు, కన్నె సంపెగలు,
ఏడాకుల పయ్యెదల అనంటులు,
పసిడి తిన్నె లింపెసగన్ , హేమ
చ్ఛత్రం బొక్కటి సందిట శోభిలు.
                 37
చిక్కగనల్లిన చిగురు తీవియలు,
పచ్చాకుల జొంపములు పెనంగొన,
చెంతనె అపరంజిపసిమి విసరుచు
తరుణ శింశుపాతరువుండె నొకటి.
               38
దానిచుట్టు కుందనపు తిన్నెలును,
పరిశుభ్రములగు ప్రాంగణంబులును,
పల్లపు మడవలు, పాఱుచున్న స
న్నని సెలయేళ్ళను కనుగొనె మారుతి.
              39-40
నిప్పుల కుప్పల చొప్పున వెలిగెడి
కనకవృక్షముల కాంతులన్ హనుమ,
తానును కనకంబై నట్లు తలచె,
మేరుశైలమున మిత్రుని కైవడి.

                41
అపుడా బంగారపు చెట్లనడుమ
విసరెను మందాలసముగ పయ్యెర ,
మొరసెను గజ్జెలు మువ్వలు గలగల,
విస్మయమందగ వీరుడు మారుతి.
                42
మొలకలు పల్లవములు లేతాకులు
పూచిన కొమ్మలు పొలుచు శింశుపా
వృక్షమెక్కి క్రిక్కిరిసిన ఆకుల
వెనుకనుండె కపివీరు డగపడక.
                43
ఆ శింశుపపయి ఆసీనుండయి
యోచించెను కపియోధుం డిట్టుల ,
ఇచ్చటినుండి నిరీక్షించెద రా
ఘవదర్శనరక్తను, దుఃఖార్తను.
                 44
ఈ యశోకవన మిష్టమైనది దు
రాత్మునకు; ప్రియంబారగ పెంచిన
చందన చంపక చారువకుళ వన
రాజి శోభిలు విరాజమానముగ.
               45
ద్విజసంతతులకు దివ్యాశ్రయమయి
రాజీవములకు రాణివాసమయి,
హృదయంగమమగు ఈ కాసారము,
రాకమానదిటు రామకళత్రము.
              46
రాముని ప్రియదర్శన సంస్థానము,
రాఘవ మహిషీరత్నమునకు, వన
సంచార మభీష్టంబగు, కావున
వచ్చి తీరు నీ పచ్చనివాడల.

                47
అటుకాకున్నను హరిణేక్షణ రా
ఘవవియోగమున కాగుచు తోచక,
భ్రమియించుచు ఈ వనవీధులబడి,
రావచ్చు నిటు విరామబుద్ధి మెయి.
               48
రాఘవ విరహనిదాఘతపనలో
వనరు తపస్విని, వనవిచక్షణా
పేక్షాసక్తి మెయిన్ భ్రమియించుచు
దేవి, యిట్టులేతెంచును ధ్రువముగ.
               49
రామచంద్రుని పురంధ్రీరత్నము,
జనకరాజఋషితనయాతిలకము,
అడవిజనుల కభయ ప్రియాశ్రయము
వనచారిణియైవచ్చు నిచ్చటికి.
               50
సందెజాముకోస మెదురు చూచుచు
సాధ్వి, జనకసుత సాయంసంధ్యా
వందనార్థమై వచ్చును తప్పక
మంగళతోయతరంగిణి వద్దకు.
              51
రాజేంద్రుండగు రామచంద్రునకు
అనురూపిణి జాయామణి జానకి,
ఆమె వాసమున కర్హమయినదీ
రక్తాశోకప్రమదావనమును.
               52
పూర్ణచంద్ర సఖముఖ వర్చస్విని,
దేవి జానకి బ్రతికి బాగుండిన
వచ్చును తప్పక పరమ మంగళో
దక నదీమతల్లిక వాటములకు.

                       53
అటు తలపోయుచు హనుమ మహాత్ముడు,
రామ కళత్రము రాకకై ప్రతీ
క్షించుచు పరికించెను సర్వము, సుమ
శాఖల యాకుల చాటునన్‌ సురిగి.