శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియేడవ అధ్యాయము
←నలుబదియారవ అధ్యాయము | 'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియేడవ అధ్యాయము) | నలుబదియెనిమిదవ అధ్యాయము→ |
శ్రీ సాయిసచ్చరిత్రము
నలుబదియేడవ అధ్యాయము
బాబా చెప్పిన వీరభద్రప్ప, చెన్నబసప్పల (పాము-కప్ప) కథ
గత అధ్యాయములో రెండుమేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ ఆధ్యాయమున కూడ అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము.
ప్రస్తావన
శ్రీసాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో యెన్నొ గతజన్మల విచారమును నశింపజేసి, యెంతో పుణ్యము ప్రాప్తించునటుల జేయును. వారి దయదృష్టి మనపై బరపినచో, మన కర్మబంధములు వెంటనే విడిపోయి మన మానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాధధూళిచే పోగొట్టెదరాయని యాతురతతో జూచును. యోగుల పవిత్రపాధధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి పావనము చేయు ఈ క్రింది కథను వారునుండి వినుడు.
పాము - కప్ప
సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను.
"ఒకనాడుదయము ఉపాహారమున ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి యొక చిన్న నది యొడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ, బండిత్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగ వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెకబెక లాడుట వింటిని. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొనగోరెను. "ఒక కప్ప తన పూర్వ జన్మపాపఫలము ననుభవించుచున్నద’ ని చెప్పితిని. గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుముని బీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మర్గులేగాన, ఈ జన్మయందు గతజన్మ యొక్క పాపమును యీ దేఃఅముతో ననుభవించుచున్నవనియు చెప్పితిని. అతదు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట జూచెను.
"ఆతడు నావద్దకు వచ్చి 10, 12 నిమిషములలో పాము కప్పను మ్రింగునని చెప్పెను. నేనిట్లంటిని. ’లేదు, అట్లు జరుగనేరదు. నేను దాని తండ్రిని (రక్షకుడను) ! నేనిచటనేయున్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు."
"చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడ దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీదపడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి యిట్లంటిని, " ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించి యున్నావా? ఛీ, సిగ్గులేదా! మీ ద్వేషములను విడచి శాంతింపుడు."
"ఈ మాటలు విని యా సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్పకూడ గంతువేసి చెట్ల పోదలలో దాగెను. బాటసారి అశ్చర్యపడెను. "మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదలి యదృశ్యమయ్యెను? వీరభద్రప్ప యెవరు? చెన్నబసప్ప యెవరు? వారి శత్రుత్వమునకు కారణ మేమి? అని యతడు ప్రశ్నింపగా, నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని.
"మా యూరికి 4,5 మైళ్ళు దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగుచేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజకొరకు తగిన యేర్పటు చేసిరి. మరామతు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కొశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలు చక్కగా వ్రాయు భాధ్యత వానిపై బెట్టిరి. వారు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో నేమి యభివృద్ధి కానరాలేదు. అతడు ధమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రమస్థులు తిరిగి వానివద్దకు బోయి అతడు సొంతముగా తగిన ధనసహాయము చేయనియెడల మందిరము వృద్ధికాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యము వసూలుచేసి యాతని కిచ్చిరి. వాడాధనము పుచ్చుకొని, పూర్వమువలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ళు పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి యిట్లు చెప్పెను. ’నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టినదానికి 100 రెట్లు ఇచ్చెదను’ అమె యీ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో యని భయపడి ఏగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మనవసరము లేదనియు, లేక్కున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి యేల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా యనియు, ఇది దుస్వప్నమువలె గనిపించుచున్నదనియు. భార్యభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే అమె ఊరుకొనవలసి వచ్చెను.
"దాతలను భాధించి చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునకు ఇష్టముండదు. భక్తితోను ప్రేమతోను మననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకయిన దైవ మిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి యిట్లనెను. ’భర్త దగ్గరనున్న చందాలగూర్చి చికాకు చెంద నవసరములేదు. దేవాలయము నిమిత్తమేమైన వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీ కిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను." అమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తన కిచ్చిన బంగారనగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి యీ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడ మోసము చేయ నిశ్చయించుకొనెను. అమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని, నగదునకు బదులు నొక పొలమును దేవదేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము గాదు. అదియొక పేదరాలగు డుబ్కీ యను నామెది. అమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి యుండెను. అమె దానిని తీర్చలేకపోయెను. అ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును - అందరిని మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాల తక్కువ. దానివలన ఆదాయమేమియు లేదు.
"ఈవ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి యధీనములో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి యింటికి పిడుగుపాటు తగిలి వాడు, వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కాలగతి చెందెను.
"తరువాత జన్మలో ఆ లోభి మథురాపట్టణములో నొక బ్రహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయను వేర నుండెను. అతని భార్య పూజారి కొమార్తెగా జన్మించెను. అమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర గొరవనింటిలో మగశిశుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప యని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నావద్దకు తరుచుగా వచ్చుచుండెను. నావద్ద కూర్చుండి మాట్లడుచు చిలుము పీల్చెడివాడు. అతని కొమార్తె గౌరి కూడ నా భక్తురాలు. అమె త్వరగా నెదుగుచుండెను. అమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చికాకుపడ నవసరము లేదనియు, అమె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్ళకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణబాలుడు భిక్షకై పూజారి యింటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరి నిచ్చి పెండ్లి చేసెను. అతడు కూడ నాభక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడ ధనమునకై మిగుల తాపత్రయ పడుచుండెను. నావద్దకు వచ్చి యతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయమని బతిమాలుచుండెను.
"ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హాఠాత్తుగా పెరిగెను. గౌరి యదృష్టము కొలది పొలమునకు ధర పెరెగెను. కానుకగ నిచ్చిన పొలము ఒక లక్షరూపాయల కమ్మిరి. అమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయదాలలో ఒకొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందురు సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహాకొరకు నావద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. అమె సమ్మతి లేనిదే యేమి ఖర్చు చేయవద్దని చెప్పితిని. అమె భర్తకు ఈ పైకముపై నెట్టి యధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. అస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మనించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టను. అందుచే నామె పగటి పూట నావద్దకు వచ్చి యితరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా జూచుకొనవలెననియు వేడుకొనెను. అమె నాయాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్తసముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరి కొక స్వప్నదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నమున గనిపించి యిట్లనెను. ’ధనవంతయు నీదే. ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయుపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చునప్పుడు మసీదులో నున్న బాబా సలహా తీసికొమ్ము’ గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని. అసలు తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహనిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నావద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నాపాదములు పట్టి నన్నే యాశ్రయించెను. కోపిష్టి శత్రువు బారినుండి కాపాడెదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంత కాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను; చెన్నబసప్ప కూడ చనిపోయి కప్పగ జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని, నేను చేసిన వాగ్దనము జ్ఞప్తికి దెచ్చుకొని, ఇక్కడకు వచ్చి వానిని రక్షించి, నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు అపదసమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు బంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల."
నీతి
ఈ కథవల్ల మనము నేర్చుకొనిన నీతి యేమనగా ఎవరు చేసిన దానిని వారే యనుభవించవలెను. ఇతరులతో గల సంబంధము లన్నిటిని, బాధను కూడ అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తన కెవరితోనైన శత్రుత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను. ఎవరికైన ఏమైన బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని శత్రుత్వశేషముగాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవాని నది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును.
శ్రీ సాయినాథాయ నమః నలుబదియేడవ అధ్యాయము సంపూర్ణము
సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు