Jump to content

శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియారవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియారవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదియారవ అధ్యాయము బాబా గయ వెళ్ళుట - రెండు మేకల కథ


ఈ అధ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున నతనికంటె ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా రెండు మేకల పూర్వజన్మవృతాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ చెప్పుకొందము.

తొలిపలుకు

ఓ సాయీ! నీపాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీ రూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతో దూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. అంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీపాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవెర్చెదవు. ఎవరికయితే కోరికలుండనో అట్టివారికి నీవు బ్రహ్మానందము నిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్త్వికగుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనే యనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరణాగతి. దీనికి తప్పనిసరి యొకే గుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతమునగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక నింకొకటి వెన్నంటీ వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని అమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించు చుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని రూపమున నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము.

గయ యాత్ర

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తన పెద్ద కూమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్‍లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కరులిద్దరును శిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు అహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగానే గయలో కలసికొనెద" నని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని నిరూపించును.

బాబా వద్ద సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించెను. అచట నుండి కాశీ, ప్రయాగ, గయ పోవలెననుకొనెను. అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయమునకు బోయిరి. కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను. అచ్చటనుండి గ్వాలియర్‍లో పెండ్లికి బోయిరి. అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువు జఠార్ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్ళెను. అచ్చట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములొ అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జఠారు మేనేజరు శ్రీరామమందిరమున అహ్వానించి మర్యాద చేసెను. వారు ఆయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో రెండు మాసములుండిరి. అక్కడనుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. "యాత్రికులందరు బయలదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు." అచ్చట ప్లేగు గలదా?" యని శ్యామా ప్రశ్నించెను. లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతుష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్దపటము అతనికి అన్నిటికంటె ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది యింటికి ముందు భాగములొ మధ్య నమర్చబడియుండెను. దీనిని చూచి శ్యామా మైమరచెను. "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామకంటె ముందుగనే గయకు బోయెదను" అను బాబా పలుకులు జ్ఞప్తికి దెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి యేడ్వసాగెను. అపట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి యేడ్చుచున్నాడేమోయని పండా యనుకొనెను. పండాను బాబా పటమెక్కడనుండి తెచ్చితివని శ్యామా యడిగెను. పండా తన ప్రతినిధులు రెండు మూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పొయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారివల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 యేండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. శిరిడీలో శ్యామా యింటిలో వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దాని నిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞ పొంది శ్యామా దానిని తన కిచ్చెననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగిన దంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన యింట నతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి యానందించెను. వారిరువురు ప్రేమానురాగము లనుభవించి యమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగత మిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి, శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరెగించెను. అతిధికి తగిన సౌఖ్యము లన్నియు నేర్పరచెను.

ఈ కథవల్ల నేర్చుకొనవలసిన నీతి

బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక వారికి జంతువులయందు కూడ సమానప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును.

రెండు మేకల కథ

ఒకనాడుదయము బాబా లెండితోటనుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకలమందను జూచెను. అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని జూచి భక్తులు అశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్క మేకను 2 గాని, 3 గాని, 4 రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరుకొనెను. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా "నాకు ఇల్లుగాని, కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు."అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్లు శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి యిచ్చి వేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి.

"ఓ శ్యామా! తాత్యా! మీరు బేరములో నేను మోసపోయితినని యనుకొనుచున్నారు. అట్లుకాదు, వాని కథ వినుడు. గతజన్మలో వారు మానవులు. వారి యదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు, మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ యుండెను. రానురాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాని, చిన్నవాడు చురుకైనవాడు. అతదు చాల ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరింప నెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరు కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరు లయిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను, చిన్నవాదు అన్నను గొడ్డలితో నరకెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కనుండి పోవుచుండగా వారిని అనవాలు పట్టితిని. వారి పూర్వవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొంటిని వారియందు కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలెనని యనుకొంటిని. అందుచే నింత ద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుండుటచే నేను వాని యజమానివద్దకు తిరిగి పంపివేసితిని." మేకలపైని కూడ బాబా ప్రేమ యెట్టిదో చూడుడు.


శ్రీ సాయినాథాయ నమః నలుబదియారవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు