శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదిరెండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదిరెండవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదిరెండవ అధ్యాయము పాము విషమునుంచి తప్పించుట: 1.బాలాసాహెబు మిరీకర్ 2. బాపూసాహెబు బూటీ 3. అమీరు శక్కర్ 4. హేమడ్‌పంతు సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయము


బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపముగాని అగాధములు, వేదములుగాని, వెయ్యి నాలుకలు గల అదిశేషుడుగాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుకొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్‌పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడ రాదు. శుక్లపక్షము ప్రారంభమువగనే ప్రజలు చంద్రుని చూచుటకు అతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్యగుండా చూడుమనెదరు. అతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునప్పుడు దూరముగ నున్న చంద్రుని యాకారమొక గీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదము గాక, బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగ నున్నది! వారి కాళ్ళను ఒకదానిపైని ఇంకొకటి వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధానముబట్టి చూడగా బాబా మనకీ దిగువ విషయము చెప్పు నిశ్చయించు కొన్నట్లున్నది. " నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారము విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము."

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన శిరిడీ యొక యాత్రస్థల మాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బాబా యొక్క యనంతప్రేమను, అశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వరెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని యన్నియుగాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కోక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొక్కప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. అనందమున కవతారముగా భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు హస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగామాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడాయని తోచువారు. ఒక్కొక్కపుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెదివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ సందర్బావసరముల బట్టి వారి ప్రబోధము అనేక విధములు అనేకమందికి కలుగుచుండెడిది. వారి జీవిత మగోచరమైనది. అది మన మేధశక్తికి భాషకు అందుబాటులో నుండెడిదికాదు. వారు ముఖారవిందమును జూచుటయందు అసక్తిగాని, వారితో సంభాషించుటయందుగాని, వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిదికాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలుసంచిలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను లెక్కించలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని, భక్తులను వాని బారినుండి సకాలమున బాబా యెట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్

సర్దారు కాకాసహెబు మిరీకర్ కొడుకగు బాలాసాహెబు మిరీకర్ కోపర్‌గాంకు మామలతాదారుగా నుండెను. అతడొకనాడు చితలీ గ్రామపర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు శిరిడీకి వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములు నడిగి, జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. "నీకు మన ద్వారకామాయి తెలియునా?" బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరుకుండెను. "నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే అమె ఒడిలో కూర్చొనెదరో వారిని అమె కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయర్ద్రహృదయురాలు. అమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని అపదలనుండి తప్పించును. అమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నియు సమసిపోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి అనందము కలుగును" అనెను. పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా, "నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే, సర్పము!’ అనెను. బాబా తమ ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాముపడగవలె నుంచి, "అతడు మిక్కిలి భయంకరమైనవాడు. కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా, పాము యేమి చేయగలదు?" అనెను.

అక్కడున్నవారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతుహల పడుచుండిరి. కాని బాబా నీ విషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి, మసీదు విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలిచి, బాలాసాహెబుతో చితలీ వెళ్ళి యానందించుమనెను. బాబా యాజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామా బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండును కాన, వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతీ దెలిపెను. బాబా యిట్లనెను, "సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది జరుగక తప్పదు."

ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామా బాబావద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. అంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆధ్వని నౌకరు వినెను. అతడోక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణకుట ప్రారంభించెను. శ్యామా కూడ అశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందగా హెచ్చరించి బాలాసాహెబు హానినుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.

బాపూసాహెబు బూటీ

నానా డేంగలే యను గొప్ప జ్యోతిష్యుడు, బాపూసాహెబు బూటీ శిరిడీలో నుండునప్పుడు, ఒకనాడిట్లనెను, "ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది." ఇది బాపూసాహెబును అందోళనకు గురిచేసెను. అయన యథాప్రకారము మసీదుకు బోగా, బాబా బాపూసాహెబుతో నిట్లనియెను. "ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణ మున్నదని చెప్పుచున్నాడు గదా? సరే! నీవు యేమి భయపడనక్కరలేదు: ’మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక!’ యని వానికి ధైర్యముతో జవాబిమ్ము!" అనాటి సాయంకాలము బాపూసాహెబు బూటీ మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దాని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబొయెను. బాపూసాహెబు పెద్ద కఱ్ఱను దీసికొని రమ్మనెను. నౌకరు కఱ్ఱను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్య మయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్

కోపర్‌గాం తాలుకాలో కొరాలే గ్రామనివాసి అమీరు శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమీషను వ్యాపారిగ పనిచేసెను. అక్కడతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ళవాతముచో బాధపడుచుండుటచే, భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని, వ్యాపారము విడిచిపెట్టి శిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా అతనినాజ్ఞపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు తేమగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. కాని బాబా పలుకులే తగిన యౌషధము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభాకారి యాయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడిపైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. కొంతకాలము తరువాత అతనికి అ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కొపర్‌గాం పారిపొయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్దముగా నుండెను. ఫకీరు నీళ్ళు కావలెననగ అమీరు పోయి నీరు తెచ్చి యిచ్చెను. అ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలిసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చినవాడగుటచే తనకా ఫకీరు విషయమేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతని కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిది శిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. శిరిడీ పొవ నిశ్చయించుకొని యా రాత్రియే యచటనుండి శిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యొద్యమునకు ముందు శిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడిలోనే యుండి రొగవిముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, "ఓ అబ్దుల్! నా పరుపువైపు ఏదోదుష్టప్రాణి వచ్చుచున్నది" యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకతో కొట్టుచుండెను. అమీరుశక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యము వలన, బాబా యాడుమాటల, చేయు క్రీయల భావమును అమీరు గ్రహించు చుండెను. అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించి, అబ్దుల్‌ను లాంతరు తీసికొని రమ్మనెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందికి పయికి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

తేలు-పాము

1. తేలు: బాబాఅజ్ఞచే కాకాసాహెబు దీక్షీత్ నిత్యము శ్రీఏకనాథ మహరాజ్ రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణకాలక్షేపము జరుగుచుండగా హేమడ్‌పంతు గూడ శ్రోతయయ్యెను. రామాయణములో అంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షీంచు భాగము చదువునప్పుడు వినువారందరు మైమరచియుండిరి. అందులో హేమాడ్‌పంతొకడు. ఇంతలో ఒకపెద్ద తేలు హేమాడ్‌పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపై కూర్చొండెను. మొదట దాని నెవ్వరు గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము జేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్‌పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్సబ్దముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గమనించెను. భగవంతిని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో నున్న నితరులకు భంగము కలుగజేయకుండ, యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను.

2.పాము: ఇంకొక్కప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు కఱ్ఱలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది యేటూకాని స్థలములో సుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు అపదనుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము

ముక్తారామ్ యను నొక భక్తుడు పాము తప్పించుకొని పొవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్‌పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారామ్ సర్పములు మొదలగు క్రూరజంతువులను చంప నవసరము లేదనెను. హేమడ్‌పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి గాకుండెను. అ మరుసటి దిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జావాబిచ్చెను: "భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్వములుగాని, తేళ్ళుగాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళుతో సహ సకల ప్రాణులు భగవదాజ్ఞకు శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు యెవరిని యేమి చేయలేరు. ప్రపంచమంతయు వానిపై నాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుందవలెను. అందరిని రక్షించువాడు దైవమే!"


శ్రీ సాయినాథాయ నమః ఇరువదిరెండవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు మూడవరోజు పారాయణము సమాప్తము