Jump to content

శ్రీ రామాయణము - మొదటిసంపుటము/బాలకాండము

వికీసోర్స్ నుండి

శుభమస్తు

శ్రీ రామాయణము

ఇష్టదేవతాస్తుతి

శ్రీ కరభోగీంద్ర - శిఖరవిహారి
లోకరక్షణకళా - లోకప్రచారి
కలశాంబునిధి రాజు - కన్యాకులవినోది
అలఘుసత్త్వవిహంగ - హయవరసాది
వేదవేదాంతార్థ - విద్యానువాది
ఆదిమధ్యాంతక్రి - యాపరిచ్ఛేది
నవరత్నమయభూష - ణవిభావిభాసి
రవికోటిసంకాశ - రమ్యవిభాసి
సకల కల్యాణరా - జద్గుణాకరుఁడు
వికచాబ్జనయనుండు - వేంకటేశ్వరుఁడు 10
ధారుణిపారిజా - తంబు మా కెపుడు
కోరికలెల్లఁ జే - కూరుచుంగాఁత
అలకనిర్జితభృంగ - అతికృపాపాంగ
అలఘుహేమాభాంగ - అలమేలుమంగ
మాయింటిలోన స - మస్తశోభనవి
ధాయినియగుచు ని - త్యమునుండుఁగాఁత.
వీణాంకుశాభయ - వికచారవింద
పాణి ఘనశ్రోణి - భ్రమరికానీల
వేణి కోకిలవాణి - వినుతగీర్వాణి
వాణి మజ్జిహ్వపై - వసియించుఁగాత. 20

ధన్యమానసుఁడు సూ - త్రవతీవిలాసి
సైన్యనాయకుఁడు వి - ష్వక్సేనుఁ డెపుడు
నేనొనరించు భూ - మీష్టకావ్యంబు
పూనిక నెఱవేర్పుఁ - బూటయౌఁగాఁత.
శేముషీకలనావి - శేషుండు శేషుఁ
డామరస్తుతిశాలి - యండజహేళి
వైనతేయుండు మ - ద్వచనసంగతికి
నానందరసదాత - లవుదురుగాఁత.
లోకపరిత్రాణ - లోలయైవాణి
ఆకసమ్ముననుండి - యవనికి దిగఁగ 30
నాదిపాదమ్మున - నవలిద్వితీయ
పాదంబునెడ మొర - పమున రాణించు
మాణిక్యమంజీర - మధురస్వనంబు
నాణెమౌ రామాయ - ణమును భారతము
కావించు వాల్మీకి - కవివర వ్యాస
భావముల్ నాయందు - పనిగొనుఁగాత.
రతిరాజగురుకృపా - రాజితు, వినత
రతిరాజు యతిరాజ - రాజదాకారు
యతిరాజయోగి మ - దాచార్యుచరణ
శతపత్రములు స - హచరములౌఁగాఁత. 40
పుట్టతేనియ యొండు - పులినభాగమునఁ
బుట్టినయమృతంపు - బుగ్గ యొండనఁగఁ
బరగు రామాయణ - భారతంబులకు
సరససారస్వతౌ - షధరసంబులకు
చెవులు జిహ్వలు చాల - సెలలిచ్చి ధన్య

భవులైన నన్నయ - భట్టాదికవుల
నైపుణి నాకబ్బి - నాకబ్బికావ్య
రూపమై వేంకటేం – ద్రు వరించుఁగాత.
తెలియనివెల్ల సు - ధీనిధుల్ దెలుపఁ
దెలిసికొందురుగాని - తెకతెకమీఱ 50
గ్రక్కునం దప్పన - రాదు మీకనుచుఁ
దక్కువారలును కొం - త రచింత్రుగాఁత.
అనుచు నభీష్టదై - వారాధనంబు
చనువున నుభయభా - షాకావ్యనుతియు
నాచార్యభజనంబు - నన్యాపదేశ
వాచాలతయుఁ జూపి - వలయు వైఖరిని

గ్రంథరచనోద్దేశము


నే కథ రచియింప - నిహపరసౌఖ్య
సాకల్యఫలము లి - చ్ఛావిధేయములు
ఏపురాణ మొనర్ప - నెల్లపుణ్యముల
తేపయై భవవార్థి - తీరంబుఁ జేర్చు 60
నే కావ్యము వచింప - నెలమి నాచంద్ర
లోకలోచనకీర్తి - లోకంబునిండు
నేయితిహాస మూ - హించి కావింపఁ
గాయంబు శ్రేయోని - కాయమై వెలయు
నట్టియాదిమకావ్య - మందమైతేట
పుట్టంగ నవరసం - బులు పిచ్చిలంగ
జల్లిమాటలు నప - శబ్దముల్ జజ్జు
టల్లికల్ ప్రాసలం – దదుకుఁబల్కులును

పునరుక్తములు పట్టి - పూదెలు కాకుఁ
దెనుఁగు లీఁచలును సం - దిగ్ధముల్ ప్రాలు70
మాలికల్ కటువులే - మఱువులు కొసరు
లోలంబములు వెఱ్ఱి - యతకడంబులును
చాయలెత్తుట లర్థ - చౌర్యముల్ పెట్టు
జాయలులేక ల - క్షణసమ్మతముఁగ
నందమై సుకవులౌ - రాయన చెవుల
విందుగాఁ గపురంబు - వెదచల్లినట్లు
ధ్వనులు వ్యంగ్యములు విం - తలు వాసనలును
మినుకులు జిగిబిగి - మెరవడుల్ జాతి
వార్తలు నుపమలు - వర్ణనాంశములు
మూర్తిమద్వాక్యముల్ - ముద్దులు చూప80
నొకమాటకన్న వే - ఱొకమాటవింత
యొకపాదమునకన్న - నొకపాదమొఱపు
నొకదళంబునకన్న - నొకదళంబంద
మొకయుత్తరము మించ - నొకయుత్తరంబు
వెలయంగ ద్విపదఁ గా - వింప చిత్తమునఁ
దలఁచి యేనొకశుభో - త్కటదినంబునను

స్వప్నవృత్తాంతము



సుఖనిద్రితుఁడనైన - చో పూర్వపుణ్య
సఖమైన యొకసుఖ - స్వప్నంబునందు
కలకలనవ్వు చ - క్కని నెమ్మొగంబు
గిలగిలమొరయు బ - ల్కెంపుటందియలు90

తళతళ మెఱచు బి - త్తరిఁదాల్చునురము
జలజలచింద్రెంబు - చల్లు వాతెఱయు
మినమినచామన - మిసిమి నెమ్మేను
కనఁగన వెలుఁగు చొ - క్కపుకిరీటంబు
లివలివలాడు మే - లిమికుండలములు
రవరవల్ గనుపూంచు - రత్నహారములు
నిగనిగల్ మను పైఁడి - నిగ్గుచేలంబు
ధగధగలీను సు - దర్శనకరము
చకచకల్గల పాంచ - జన్యంబు నమరు
నొకదివ్యమూర్తి నా - యొద్దఁ జూపట్టి100
జలదగంభీరని - స్వనముతో నపుడు
పలికె నిట్లని శ్రోత్ర - పర్వంబుఁగాఁగ
నిను మెచ్చి వచ్చితి - నీతలం పెఱిఁగి
ననుఁ దిరువేంగళ - నాథుఁగాఁ దెలియు
పద్యకావ్యము చేసి - పరమభాగవత
హృద్యచరిత్రంబు - నిచ్చితి మాకు
మంగళప్రద మసా - మ్యము శతాధ్యాయి
రంగమాహాత్మ్యంబు - రచియించినావు
మాపేరనిపుడు రా - మాయణద్విపద
యేపుమీఱఁగ రచి - యింపు మింపలర110
రాజులు సత్కవి - రాజు లందందు
నీజగతిఁదలంప - నెందఱేఁగలరు
రాజవు సత్కవి - రాజవు నీవె
యీజగతిసమాను - లెవ్వారుగలరు?
కావ్యంబులం దాది - కావ్యంబు సకల

సేవ్యంబు భువనప్ర - సిద్ధంబు సుజన
భాగధేయంబు శో - భనకరం బఖిల
భాగవతానంద - పదవియు నైన
వల్మీకతనయ కా - వ్యసుధారసంబు
కల్మషాపహము భా - గ్యవశంబుచేత120
నీకు లభించె దీ - ని తెలుంగు చేసి
ఆకల్పమైన వి - ఖ్యాతి గైకొనుము.
ద్విపద గావింపుము - తేటతెల్లమిగ
నిపుణత శ్రీరాము - ని కథాక్రమంబు
వాలాయమిది యథా - వాల్మీకముగను
చాలసొఁకోర్చి ర - సస్థితుల్ మెఱయ
నీవుగా కితరులు - నేరరుపూని
యేవంవిధంబుగా - గృతి నిర్వహింప130
నీకవితంబునై - నిర్దోషమగుచు
మాకునంకితము రా - మాయణంబైన
బంగరుపుప్వుల - పరిమళమై పొ
సంగి జాజులును ప్ర - సాదమ్మునట్లు
కరమొప్పు నీవట్ల - కావింపుమనుచు
తిరువెంకటేశుఁ డ - దృశ్యుఁడైనంత.
వేకువ కలగాన - వేడుకయెల్ల
చీకటుల్ విరియింప - చిత్తాంబుజంబు
కడువికసింప మే - ల్కని ప్రభాతమున
దడయక సమయోచి - తక్రియల్ దీర్చి140
రాజులుదొరలుఁ బౌ - రాణికుల్ సుకవి
రాజులు మంత్రులు - రసికులుఁ గొలువ

గొలువుండి వారిఁ బే - ర్కొని యబ్బురముఁగ
కలతెఱంగెల్లను - కలతెఱం గెల్ల
తెలివిడిగాఁగ న - ద్దేవుసూక్తములఁ
దెలుపవారలు ప్రమో - దించి యిట్లనిరి.

-: కవివంశవర్ణనము :-

అవధరింపుము దేవ! అచలితభక్తి
నవనిఁ బెంపొందు నీ - యంతరాజునకు
విహితంబ కాదె శ్రీ - వేంకటేశునకు
సహజంబు స్వప్నసా - క్షాత్కారలీల
నినకులంబున వేంక - టేశుండు మున్ను
జనియించి తనపుణ్య - చారిత్రమెల్ల
బోయకులంబునం - బుట్టు వాల్మీకి
సేయ నందుబ్రమోద - చిత్తుండుగాక
అర్కవంశమున నీ - వై జనియించి
తార్కాణగాఁగ నే - తత్కథావిధము
రచియింపుమనియె - శ్రీరామచంద్రునకు
నచలితప్రీతిగ - దా నిజాన్వయుఁడు
తనచరిత్రంబు కీ - ర్తనసేయ వినుట
తనయులచేఁగాదె - తామున్ను వినియె160
నుచితోపయోగ్య మీ - యుత్తమకావ్య
సుచరిత్ర మీవొన - ర్చుట విహితంబు
సామాన్యమే రామ - చంద్రకీర్తనము
లేమేమి పుణ్యంబు - లీవు చేసితివొ
నీతల్లిదండ్రు లె - న్నిభవంబులందు

భూతలంబున నిట్టి - పుత్రుండు గలుగ
నేమేమి నోచిరో - యింతియకాన
యీమేటిపుణ్యంబు - లేలసిద్ధించు
కలియుగరామ - జగద్విదితంబు
తలఁప నీవంశమెం - తకృతార్థమయ్యె170
శ్రీకరుండై ధరి - త్రీచక్ర మేలె
నాకల్పవిఖ్యాతుఁ - డగుచోళవిభుఁడు
ఆకరికాళచో - ళాధీశుకీర్తి
యాకర్ణనీయ మి - య్యవని నెయ్యెడల
అతఁడు కావేరిక - ల్లన కట్టఁగట్ట
నతిశయించెను తదీ - యాన్వవాయమున
పుట్టిన రవివంశ - భూభుజావళికి
కట్టాన్వయులనంగఁ - గలిత తేజమున
అందులో తెలుఁగుబి - జ్జావనీవిభుఁడు
కుందేందుమందార - గురుకీర్తిశాలి180
వార్తగా హత్తుము - వ్వరగండ బిరుద
కర్త హన్నిబ్బర - గండవిక్రముఁడు
వేఁడికిగండండు - వీరాగ్రయాయి
వాఁడికిగండం డ - వార్యదోర్బలుఁడు
లీల బారామండ - లీకరగండ
నాళీకతాటకీ - నారాయణుండు
దళితారి సవలక్ష - దళవిభాళాంక
కలితుండు మీసర - గండసాహసుఁడు
కీర్తిమంతుఁడు పాట - కీపుత్రబిరుద
కర్త బిజ్జలుమహీ - కాంతుండు వెలసె. 190

ఆ సంతతినిఁబుట్టె - నహితగజేంద్ర
కేసరితాతన - కేసరి యగుచు
కొట్టి చంగఁగఁదోలి - కుటిలారినరుల
మట్టిరంగని దాన - మహిమచే మించె
నిట్టిరంగమటంచు - నెల్లరుఁబొగడ
కట్ట రంగక్షమా - కాంతశేఖరుఁడు
అరాజదేవేంద్రు - నాత్మజుండయ్యె
హారాజభామినీ - హారియశుండు
పరవధూద్రవ్య - చాపల్యదూరుండు
హరిదాసరాజైన - హరిదాసరాజు200
అంగనాభూషణం - బగు పోచిరాజు
సింగరిరాజన్య - శేఖరుసుతను
బాళిమై కృష్ణమాం - బను వరియించె
నా లేమతోఁబుట్టు - వగు నోబమాంబ
అర్థి శ్రీరంగ రా - యలు నాల్గుపూరు
షార్థముల్ గలుగ క - ల్యాణమై మించె
ఆయశోనిధిసుతుం - డై రామదేవ
రాయలు మారట - రాముఁడై వెలసె
హరిదాసరాజు కృ - ష్ణాంబయందులను
హరిసుదర్శనమూర్తి - యగురామరాజు 210
రాజభగీరథు - రవితేజు వరద
రాజును నిను దాత - రాయనిఁగాంచె,
రచియింపు మీవు శ్రీ - రామాయణంబు
ప్రచురంబుగా తొల్లి - ప్రాచేతసుండు
క్షితిమీఁదనుంచుని - క్షిప్తంబు లోక

హితముగా నది దీర - దితరులచేత
అన వారివాక్యంబు - లౌఁగాక యనుచు
తనకేమి యీ యసా - ధ్యప్రయత్నంబు
కడతేర్పనున్నాఁడె - కా వేంకటేశుఁ
డొడబడి యెపుడు నా - యుల్లంబులోన 220
ఆదేవునికె భార - మని యేరచించు
నాది కావ్యారంభ - మది యెట్టులనిన

-: సంక్షేపరామాయణము :-

వసుధనుత్తమతప - స్స్వాధ్యాయనిరతు
నసమవాక్చతుర మ - హామునిశ్రేష్ఠు
నారదముని యా - ననము వీక్షించి
కోరి వాల్మీకి పే - ర్కొని యిట్టులనియె.
మునినాధ ! యీ లోక - మున నెల్లవారి
మనుకులు గరతలా - మలకముల్ మీకు
నెవ్వండు గుణవంతుఁ - డెవ్వండు శూరుఁ
డెవ్వండు ధర్మజ్ఞుఁ - డెవ్వఁ డుత్తముఁడు230
తలఁపనెవ్వాడు కృ - తజ్ఞుండు నిజము
వలయువాఁడును దృఢ - వ్రతుఁడు నెవ్వాఁడు
ఎవ్వాఁడు లోకైక - హితుఁడు విద్వాంసుఁ
డెవ్వాఁడు నేర్పరి - యెవ్వఁ డన్నిటను
కన్నులవిం దన - కనుపట్టు నెవ్వఁ
డెన్న ధైర్యంబుచే - నెసఁగు నెవ్వాఁడు
కోపమెవ్వాఁడు గై - కొనఁడు తేజమునఁ
జూపట్టు నెవ్వం డ - సూయ యెవ్వనికి

పొడమ దెవ్వనికోప - మునకు దేవతలు
గడగడవడఁకుచుఁ - గలన నోడుదురు 240
అట్టివాని వచింపుఁ - డడుగంగ వేడ్క
వుట్టె నాకనఁ బుట్ట - పుట్టు నత్తపసి
యన్న త్రిలోకజ్ఞుఁ - డైన నారదుఁడు
యిన్ని హెచ్చుగుణంబు - లెందైనఁగలవె?
ఇట్టిగుణంబుల - కిరవు దాశరథి
పుట్టె నిక్ష్వాకుభూ - భుజునివంశమున
రాముఁ డందురు మనో - రాముండు రిపువి
రాముండు తేజోభి - రాముండు ధైర్య
విభవంబుగలవాఁడు - విజితేంద్రియుండు
త్రిభువనోన్నతుఁడు బు - ద్ధియు నీతి నేర్పు250
నైశ్వర్యమును నంత - రరిజయస్ఫురణ
శాశ్వతంబులుగ ని - చ్చలునందువాఁడు
ఎగుభుజంబులవాఁ డ - హీనబాహుండు
నగుమోమువాఁడు చిం - దపుమెడవాఁడు
తళుకుఁజెక్కులు వెడం - దయురంబు గలిగి
బలువైనవిల్లు చేఁ - బట్టినవాఁడు
కొమరొప్పుమౌళియు - గూఢజత్రులును
నమరులలాటంబు - నడుగులసొబగు
చామననెమ్మేను - చక్కందనంబు
తామరకన్నులు - తనరు నంగములు260
మంగళాయతన కో - మలముఖాంబుజము
రంగైనవాఁడు ధ - ర్మజ్ఞభావనుఁడు
పరమసత్యాత్ముండు - ప్రజలకు నిహముఁ

బరము లీనేర్చు శో - భనకీర్తిశాలి!
జ్ఞానాధికుఁడు సర్వ - సముఁడు వశ్యుండు
దీనులఁ బోషించు - ధృఢమానసుండు
జగములు నిర్మింప - సంరక్ష సేయ
జగమెల్ల భరియింపఁ - జాలినవాఁడు
రక్షకుం డఖిలధ - రాజీవములు
రక్షుకుం డెపుడు ధ - ర్మవిధానమునకు270
నిజధర్మపాలన - నిపుణుండు మిగుల
స్వజనరక్షణమున - సరిలేనివాఁడు
వేదవేదాంగసం - వేది కోదండ
వేదసారగుఁ డస్త్ర - విద్యావినోది
సర్వశాస్త్రార్థని - శ్చయమానసుండు
సర్వజ్ఞుం డాత్మవ - శంబగువాఁడు
మఱపెఱుంగనివాఁడు - మనుజులు తనదు
పరిణామ మాసింపఁ - బరగెడువాఁడు
వగ పెఱుంగఁడు, సాధు - వర్తనవాఁడు
పగ యెఱుంగఁ డతి ప్ర - భావుఁ డుత్తముఁడు280
సదయాత్మకుఁడు విచ - క్షణుఁడు సజ్జనులు
కదిసి పాయక కొల్వఁ - గర మొప్పువాఁడు
జలరాశి నదులలో - సరివొత్తుగలియుఁ
గలయిక విబుధసం - గతిఁ బేర్చువాఁడు
కలిమిగల్గిననాఁడు - ఘనుఁడు పూజ్యుండు
పలుమారుచూడఁ జూ - పట్టినవాఁడు
చక్కనివాఁడు కౌ - సల్యాకుమారుఁ
డెక్కుడుగుణమున - కిరవైనవాఁడు

కడలేనిగుట్టున - కలశాంబురాశి
తొడరుస్థైర్యంబునం - దుహినాచలంబు290
గరుడకేతనుఁడు వి - క్రమసమున్నతిని
హణాంకుఁ డాలోక - నానందరచన
కదిసి కోపించిన - కాలాగ్నినిభుడు
వదలని తాల్మి - సర్వంసహాదేవి
కలిమి నుదారవై - ఖరి హయవాహుఁ
డలఘుసత్త్వమున రెం - డవధర్మమూర్తి
దశరధాత్మజుఁడు స - త్యపరాక్రముండు
దశరథరాజనం - దనుల శ్రేష్ఠుండు
ఉత్తమసుగుణసం - యుక్తుఁ డా రాము
వృత్తంబు దశరథో - ర్వీజాని యరసి300
ధరణీజనాళి చిత్త - ముల సమ్మతము
పరికించి యువరాజ - పట్టంబు గట్ట
నాలోచనము చేసి - యప్పు డయోధ్య
చాలఁగాంగైసేయు - చందంబు చూచి
వోవక మందర - యుపదేశ మొసఁగ
నావేళ విభుదేవి - యైన కైకేయి
వరము వేఁడిన ధర్మ - వరమహాపాశ
పరివృతుండై కైక -పట్టిని భరతుఁ
బట్టంబు గట్టను - పట్టి శ్రీరాముఁ
గట్టిడితనమునఁ - గానల కనుప 310
వర మిచ్చుటయు తండ్రి - వచనంబు చేసి
విరచితస్నేహాతి - వినయభూషణుఁడు
అనుఁగుఁదమ్ముఁడు సుమి - త్రానందకరుఁడు

ఘనుఁడు లక్ష్మణుడును - కల్యాణి సీత
దేవమాయోపమ - దేవేరి వెంట
రా వనంబున కేఁగ - రామచంద్రుండు
సర్వలక్షణగుణ - సంపన్నశీల
సర్వమంగళపుణ్య - సాధ్వి యా సీత
ప్రాణము ప్రాణమై - హరిణాంకువెంటి
రాణించు రోహిణీ - రమణి చందమున 320
ననుసరింపగ పౌరు - లందఱు వెంటఁ
జనుదేర దశరథ - జనపతి రాఁగ
శృంగిబేరపురంబుఁ - జేరి యెల్లఱను
గంగాతటంబున - కనురామి కదలి
గుహుఁ డోడగడప ము - గ్గురు నేరుఁ దాఁటి
బహుళవనంబునఁ - బాదచారమున
నేరులు నడవు ల - నేకముల్ దాఁటి
వార లచ్చట భర - ద్వాజులంగాంచి
యామౌని యనుమతి - నలచిత్రకూట
భూమీధరమున న - ప్పుడు పర్ణశాల330
తమ్ముఁడు గట్టినం - దరుణి యుండగను
సమ్మతి శ్రీరామ - చంద్రుండు నిలిచె,
తనయులం బెడబాసి - దశరథవిభుఁడు
ఘనమైన పుత్రశో - కమున నీల్గుటయు
భరతుండు తండ్రికి - పరలోకవిధులు
స్థిరభక్తిఁ జేసి వ - సిష్ఠాదులైన
మునులు ప్రార్ధింప రా - మునిఁ దోడితెత్తు
తనతోటి రాజ్య మి - త్తరినని కదలి

చిత్రకూటనగంబు - చేరి రాఘవు ప
విత్రపాదములు భా - వించి సేవించి340
రమ్మని ప్రార్థింప - రఘువీరుఁ డాద
రమ్మున పితృవాక్య - రక్షణశాలి
ఊరడింపుచు పర - మోదారుఁడు కృ
పారూఢిమై తన - పాదుకాద్వయము
పాలించుకొమ్మన - భరతుండు మఱలి
ధీలాలితుండు నం - దిగ్రామమునను
అన్నసేమము పున - రాగమునంబు
మన్నించి యాత్మలో - మఱవకయుండె,
రామలక్ష్మణులు ధ - రాతనూజాత
యామేరనుండక - యవ్వలఁగదలి 350
దండకారణ్యంబు - దరియ విరాధు
డుండి యచ్చట రాము - నుగ్రబాణముల
మృతినొందె శరభంగు - నీక్షించి రాముఁ
డతని వీడ్కొని సుతీ -క్ష్ణాశ్రమంబునకు
జని యగస్త్యముని యా - శ్రమము దర్శించి
జననాయకుం డగ - స్త్యభ్రాతఁ గాంచి
అలయగస్త్యునిచేత - నైంద్రమైనట్టి
యలఘుకోదండంబు - నక్షయాస్త్రముల
కవదొనలు నిశాత - ఖడ్గంబు నందు
ప్రవిమలదండకా - రణ్యవాసులకు 360
మునులకు నభయ మి - మ్ముల నిచ్చి యెల్ల
దనుజులం దునుమ సం - ధారూఢి వూని
అగ్నిసమానమ - హర్షులసాధ్వ

సాగ్నులం జల్లార్చి - యలరుచున్నంత
సాపంబు దలంచి శూ - ర్పనఖ వచ్చుటయు
నాపొలఁతిని బట్టి - యాజ్ఞ సేయింప
నది విరూపంబుతో - నడలుచుఁబోయి
విది తమ్ముపెకలించు - విధమునం దెలుప
ఖరదూషణాదులు - కదనంబుఁజేసి
మఱల కొక్కముహూర్త - మాత్రంబులోన 370
పదునాల్గువేవురుం - బడిరి శ్రీరాము
పదనుటమ్ములచే సు - పర్వులు పొగడ
అది చుప్పనాతిచే - నరసి రావణుఁడు
మదిఁ గొల్చి మారీచు - మాటలు వినక
అతనిఁ దోడ్కొని దండ - కారణ్యమునకు
జతగూడి వచ్చి యా - చాయ మారీచు
మాయమృగంబు గ - మ్మాయన్న యట్ల
సేయ నాతఁడు రఘు - శ్రేష్ఠు బేల్పఱచి
లక్ష్మణు వంచించి - లంకావిభుండు
లక్ష్మీసమాన ని - లాసుత బలిమి380
జెఱవట్టుకొనిపోవ - సీతావరుండు
సరగున తమపర్ణ - శాలకు వచ్చి
తమ్ముఁడు దాను సీ - తనుఁ గానలేక
నుమ్మలికింపుచు - నుల్లంబులోన
వనముల వెంబడి - వచ్చి యచ్చోట
దనుజేంద్రహేతిచే - ధరణి(పై ద్రెళ్లి)
యున్న జటాయువు - సూక్తులచేత
విన్నవారైరి త - ద్వృత్తాంతమెల్ల

కామిని తెఱఁగుఁ భై - కార్యంబు దెలివి
రామకార్యార్థక - ల్యాణముల్ నుడువ390
శోకించి రఘుపతి - శూరుఁ బక్షీంద్రుఁ
జేకొని యుత్తర - శ్రీ లాచరించె (?)
విపినభూముల సీత - వెదకుచువచ్చి
యపు డొకచో వికృ - తాకారుఁడైన
భయదవిగ్రహుని క - బంధునిఁ గాంచి
జయశాలి యొక దివ్య - శరమునం దునిమి
అతని నింద్రునివీటి - కనిచి తదూర్థ్వ
గతములౌ కోనలఁ - గానలయందు
జాయను వెదకుచు - శబరియున్నెడకు
బోయి యా వనితచేఁ - బూజలుగాంచి400
పంపాతటంబునఁ - బవమానతనయు
సంపూర్ణజవసత్త్వ - శాలిఁ జేపట్టి
యతఁడు దెల్సినరీతి - నర్కతనూజు
క్షితిపతి వహ్నిసా - క్షిగఁ జెల్మిసేసి
ధరణిజ తెఱగు ఖే - దమునంది యామె
చెఱఁగున భూషణ - శ్రేణి వైచుటయు
వినియునుఁ గనియు ని - వ్వెఱనొంది రామ
జనపతి వాలిని - సమయింతుననుచు
ప్రతిన చేసిన మహా - బాహుస్తత్వంబు
మతి నమ్మలేక రా - మనృపాలుకునకు
నినసూతి బలుగొండ - కెనయైనయట్టి410
ఘనమైన దుందుభి- కాయంబుజూపఁ
గోమలంబైన యం - గుష్ఠాంచలమునఁ

దా మీట నదిగూలె - దశయోజనములు
సుగ్రీవు నమ్మమి - చూచి శ్రీరాముఁ
డుగ్రసాయక మేర్చి - యొక్కట వింట
సంధించి యేసిన - సప్తసాలములు
బంధురగతి ద్రుంచె - పర్వతం బొకటి
చొచ్చి యవ్వల దూరి - క్షోణిలో నాఁటి
వచ్చె గ్రమ్మర రఘు - వరుతూణమునకు 420
నదిచూచి యలరొందు - నగచరవిభుని
కదనంబు వాలితో - గావింపుమనుచు
బనిచిన నాతండు - పర్వతగుహలఁ
దనగర్జితము నిండ - దరసి కిష్కింధ
చెంతనిల్చిన వాలి - చీరికిఁ గొనక
యెంతయు నెదురుగా - నేతేరఁ దార
వలదన్న వినక గ - ర్వమున సుగ్రీవుఁ
దలపడి పోరుచో - దశరథాత్మజుఁడు
బలువింట నొకకోలఁ - బడనేయ వాలి
యిల వ్రాలె తారాదు - లెల్ల శోకింప430
నపుడు కిష్కింధకు - నభిషిక్తుఁ జేసి
తపనజుఁ బట్టంబు - తాగట్టఁ బనిచి
వానకాలముగాన - వలనుగాకునికి
మానవేంద్రుఁడు నిల్చె - మాల్యవద్గిరిని
తరువాత సుగ్రీవుఁ - దమ్మునిచేత
నరపతి పిలిపించ - నాల్గుదిక్కులకు
సీతను వెదకఁబం - చిన కపులెల్ల
నాతతభయభక్తి - నందంద సనిన

దక్షిణంబున మారు - తకుమారకుండు
పక్షినాయకుని సం - పాతినింజూచి440
యతఁడు వచ్చినజాడ - నతిజవశక్తి
శతయోజనాయత - జలరాశి దాఁటి
రావణభుజపరా - క్రమపాలితంబు
గావున నమరు లం - కాపట్టణంబు
చొచ్చి నల్దిక్కులు - చూచి తా వెదకి
యచ్చో నశోకవ - నాంతరసీమ
రామునిఁ దలచి వి - రాలిఁ జింతిలుచు
సామైన యాసీత - చందంబు చూచి
మ్రొక్కి తన్నెఱిఁగించి - ముద్రిక యిచ్చి
యక్కన్నె తలమిన్న - యంది మిన్నంది450
వనపాలకులఁ గొట్టి - వనమెల్లఁ బెఱికి
తనివోకతోరణ - స్తంభముల్ విఱిచి
సొరిదిరావణుమంత్రి - సుతుల నేడ్గురను
దొరలనేవుర గొట్టి - తొంపరలాడి
అక్షునిఁ బొరిగొని - యలయింద్రజిత్తు
రాక్షసేంద్రుఁడు పంప - బ్రహ్మాస్త్ర మేయ
తాఁ గట్టువడి ధాత - తనకిచ్చువరము
చేఁగట్టులూడ్చి య - జేయసాహసుఁడు
చిఱుతపగ్గంబుల - చేఁగట్టువడిన
తెఱఁగున లంకభీ - తిదొఱంగి కాల్చి460
సీత సేమము చూచి - సింధువు దాఁటి
యాతఱి జాంబవ - దాదులతోడ
కాకుస్థుకడ కేఁగి - కంటి జానకిని

కై కొమ్ము రమ్మనఁ - గౌఁగిటఁ జేర్చి
హనుమంతు లాలించి - యర్కజముఖులు
వెనుకొని డెబ్బది - వేల్గపుల్ గొలువ
జలధి తీరము చేరి - శరములు వఱసి
జలరాశిగరువంబు - చాయకుందెచ్చి
నలుఁడు సేతువు గట్ట - నలినాప్తకులుఁడు
బలిమితో లంకపై - పాళెంబు డిగ్గి 470
రావణకుంభక - ర్ణప్రముఖులను
కావరంబులు మాన్చి - కలనిలో గెలిచి
శరణుచొచ్చిన విభీ - షణునిఁ గారుణ్య
పరతచే లంకకుఁ - బట్టంబుగట్టి
అనలుచే పరిశుద్ధ - యైనజానకిని
వినువీథి నింద్రాది - విబుధులు పొగడ
వరియించె దేవతా - వరమునఁ గపుల
మఱలంగ బ్రతికించి - మానినితోడ
సైన్యంబుతోడ పు - ష్పకముపై మఱలి
ధన్యాత్ముఁడౌ భర - ద్వాజు నాశ్రమము480
నిలిచి పావనిఁ బిల్చి - నిజవిజయంబుఁ
దెలుపనంపుటయు నం - దిగ్రామమునకు
నతఁ డేఁగి వినిపింప - నలరి యాభరతుఁ
డతిశయప్రీతిమై - యపు డెదుర్కొనఁగఁ
దారు నచ్చటి కేఁగి - తలముళ్లు నార
చీరలు నూడ్చి రం- జిల్లఁ గైసేసి
ఆసత్త్వనిధి యయో - ధ్యాప్రవేశంబు
చేసి సుమంతవ - సిష్ఠాదులైన

పరమాప్తజనులుచేఁ - బట్టాభిషేక
పరమోత్సవమునొంది - ప్రజలఁ బాలించి 490
ధార్మికులై పుష్టిఁ - దనరి సంతుష్టిఁ
బేర్మిగైకొని రోగ - బృందంబునణఁచి
భయములు దుర్భిక్ష - భయములు నగ్ని
భయములుఁ దస్కర - భయములు లేమి
భయములు వాతజ - భయములు జంతు
భయములు లేక శో - భనవైభవముల
ధనధాన్యపశువస్తు - తరుణికుమార
కనకభూషణవాహ - గణములంగలిగి
పతులఁబాసినయట్టి - భామినీమణులు
సుతశోకముల మను - జులు నెందులేక 500
కృతయుగమర్యాద - నెల్లపుణ్యముల
క్షితివెలయంగఁ బో - షింపుచు నతఁడు
హయమేధశతకంబు - నయుతగోదాన
నియమముల్ మిగులఁబూ - ని చరించిమించి
జనముల నేకాద - శసహస్రవర్ష
దినములు పాలించి - దివ్యులు పొగడఁ
గైవల్యమునఁ కేఁగుఁ - గావున నిట్టి
రావణాహితు బాల - రామాయణంబు
ధరణిసురులు విన్న - ధర్మబోధంబు 510
నరపతుల్ వినిన నా - నారాజ్యములును
వణిజులు వినిన స - వస్తులాభంబు
గుణులు శూద్రులు విన్న - గోరుకోరికలు
గలుగునంచును రామ - కథ బాలకాండ

వలనొప్పునాదికా - వ్యముగ నారదుఁడు
వాల్మీకి వేఁడిన - వాక్యరూపముగఁ
దాల్మిసంక్షేపక - కథావిధానంబు
వాకొ ని యమ్ముని - వరుపూజలంది
నాకంబునకు నేఁగె - నారదుఁ డపుడు

---: కథారంభము :---
పరమధార్మికుఁ డైన - ప్రాచేతసుండు
కరముప్పుచున్న గం - గానికేతమునఁ 520
తమసమీపమున ను - త్తమసత్వరాశి
దమితసంసారాంధ్ర - తమనయౌ తమస
నీలంపునిగ్గుల - నిగనిగల్ దేఱి
చాలంగ తేటలై - సరళప్రవాహ
విలసితమౌతీర్థ - విభవంబుఁ జూచి
కెలనశిష్యునితోడఁ - గీర్తించి పలికె
తాపసోత్తమ! భర - ద్వాజ! చూచితివె!
యీపుణ్యవాహిని - నిదియొక్కఱేవు
కలుగనినీట న - కల్మషంబగుచు
నలరె సజ్జనమాన - సాబ్జంబుఁబోలి 530
స్నానంబు సేఁత మి - చ్చటనీదుచేతఁ
బూను కమండలం - బు ధరిత్రినుంచి
నారచీరలు దెమ్ము - నావుడునట్ల
గా రానతండు వ - ల్కలములొసంగ
వలువలందుక తన - వలసినయెడల
మెలఁగుచో నొక్కభూ - మీరుహాగ్రమున
చంచూపుటంబుతోఁ - జంచుపు గూర్చి

క్రౌంచముల్ కవగూడె - కలకలధ్వనుల
వీనుల చొక్కింప - వినితేరిచూచు
మౌనినాయకుని స - మక్షంబునందు540
నొకబోయ కనికరం - బొకయింతలేక
యేకయమ్ముచే క్రౌంచ - ముర్విపైఁ గూల
వేసిన నెత్తురుల్ - వెడలువాతెఱను
మూసినకన్నుల - ముద్దయై పడిన
కరుణసముద్రుఁ డా - క్రౌంచంబునందు
తరుశాఖపై క్రౌంచి - తల్లడమంది
పలవరింపుచు పొక్కి - పడి ఱెక్కలార్చి
కలఁగుచుఁ గాలూఁదఁ - గానక యొడల
తొగరుదేఱెడుజుట్టు - తో మెఱుఁగెక్కు
పొగరునెమ్మేనితోఁ - బొరలు ప్రాణేశుఁ550
జూచి వందురుచున్న - చో పక్షిఁ దేరఁ
జూచి కిరాతుపై - సోఁకోర్వ కతఁడు
ఓరినిషాద! నీ - యొడ లుర్విమీఁద
నేరదు కొన్నాళ్లు - నిలిచి వర్తిలఁగ
నేమి కార్యంబుగా - నేసితి క్రీడ
నేమరియున్నట్టి - యీపక్షిఁబడగఁ
గొంచక నామ్రోలఁ - గొంచఁద్రెళ్లించి
కించవైతివి విలో - కించనోరుతుమె?"
అనియిట్లుశపియింప - నాశాపవాక్య
వినుతాక్షరములొక్క - వృత్తరూపమునఁ560
బరగిననాశ్చర్య - పరవశుండగుచు
మరియునుమరియు నె - మ్మదిఁ జర్చ చేసి

తన శిష్యుఁడగు భర - ద్వాజునితోడ
వినుమని తన శాప - వృత్తంబు దెలిపె

మానిషాద! ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునా దేక మవధీః కామమోహితమ్

ఈ లీలశపియింప - నీ శాపవాక్య
మేలకో శ్లోకమై - యెసఁగె నివ్వేళ 570
జంత్రగాత్రములకు - జతగూడె పాడ
తంత్రీలయసమన్వి - తంబయిమించె
ఛందోనిబద్ధమై - చరణముల్ నాల్గు
నందమై యిదివింత - యయ్యె నెమ్మదికి
శోకంబునఁ గిరాతుఁ - జూచి తిట్టినను
శ్లోకరూపం బయ్యె - చోద్యమై యనిన
ఆమాటవిని మది - నాభరద్వాజుఁ
డామోదమును నొంది -యది పఠియించి
యిరువురు నలరొందు - నెడ భరద్వాజుఁ
డురుభక్తిఁ దత్ప్రవా - హోదకంబులను580
గురునితోఁ గ్రుంకిడి - గురుఁడేఁగ వెంటఁ
గరమున జలపూర్ణ - కలశంబు దాల్చి
తమయాశ్రమము చేరి - తచ్ఛాపవాక్య
విమలార్థ మాత్మ భా - వించునవ్వేళ
లోకేశుఁ డఖిలైక - లోకనిర్మాత
నాకుసంభవుఁ జూడ - నలినసంభవుఁడు
వచ్చిన నెదురుగా - వచ్చి వాల్మీకి
యచ్చపుభక్తితో - నర్ఘ్యపాద్యముల

నొసగి యర్హాసనం - బునిచిన దాన
వసియించి ధాత యా - వాల్మీకిఁ జూచి 590
యుచితస్థలమునఁ గూ - ర్చుండ నేమింప
విచలితాత్మకుఁ డౌచు - విన్నఁబోవుచును
పాపాత్ముని శపింప - బరుషోక్తి శ్లోక
రూపమైయునికి యా - క్రోశించి క్రాంచి
విలపంబులకు బోయ - వ్రేటున క్రౌంచ
మిలఁగూలె నన్యాయ - మిటులని వగచి
వగనున్నమునిఁ జూచి - వనజసంభవుఁడు
నగుమోముతోడ నా - నతి యిచ్చెనపుడు
ఏలయ్య మునినాథ! - యీ శాపవాక్య
మూలమై వాణి నీ - ముఖమున నిల్చె 600
చింతిల్ల నేఁటికి - శ్రీరాముచరిత
మంతయు నీవు కా - వ్యముగా రచింపు
నారదుం డేతీరు - న వచించె నీకు
నారీతిఁ జేయు రా - మాయణరచన
తెలిసియు దెలియని - దేవాదిదేవు
లలితచారిత్రలీ - లాస్వరూపములు
రావణాసురముఖ్య - రాక్షసకృత్య
భావముల్ సీతాప్ర - భావచర్యలును
నెఱుఁగనివెల్ల నీ - హృదయంబులోన
నెఱుఁగంగనగు నీకు - నెద్ది తోఁచినను610
సత్యమై యాగమ - చయముచందమున
నిత్యమై నీవాణి - నిలుచునెల్లపుడు
నమ్మనోహరకావ్య - మద్రులు నదులు

నిమ్మహిగలనాళ్ల - కిమ్మయి వెలయు
నెన్నాళ్లు భువినుండు - నిమ్మహాకావ్య
మన్నాళ్లు నీవు నీ - యవని వర్ధిలుము.
ఆవెన్క యేనుండు - నన్నాళ్లు నాదు
కేవనుండుము జగ - ద్గీతవర్తనల
ననుచు నంతర్థాన - మందె పద్మజుఁడు
మునివరుం డాశ్చర్య - మునఁ దేలుచుండి620
తసశిష్యులను భర - ద్వాజాదు లైన
మునులెల్ల నాశ్లోక - ము పఠింపుచుండ
వినియిట్టి సమవర్ణ - వృత్తముల్ గూర్చి
తనసేయు కావ్యమం - తయుఁ బూనఁదలఁచి
సర్వసంపద్గుణ - సామగ్రి గలుగు
సర్వోన్నతము రామ - చరితమంతయును
వస్తువుగాఁగ భా - వములోన నిల్పి
స్వస్తికాసనమున - స్వస్థుఁడై నిలిచి
వారిపూరమ్ములు - వలకేల నంటి
తూఱుపుఁగొనలపొం - దుగ దర్భ లునిచి630
అంజలితోఁగూడ - నందు వసించి
రంజిల్లుమదిని శ్రీ - రామాయణంబు
గావింపఁదలచి రా - ఘవుల వర్తనము
భావించి దశరథ - పతిచరిత్రంబు
కౌసల్య మున్నగు - కాంతలనడక
లాసన్నమైన రా - మాత్మవర్తనము
నతనితమ్ములజాడ - లాసీతవలని
కతలును వారల - కల లక్షణములు

నగవులు మాటలు - నడుపులుంగ్రియలు
తగవులు హృదయవ - ర్తనము లిచ్చలును640
వనములలో రఘు - వరుని చెయ్దిములు
అనిమిషారాతుల - యాగడంబులును
కరతలామలకంబు - గాఁ జూచినట్లు
వరుస జిత్తరువున - వ్రాసినయట్లు
కన్నులఁగట్టిన - కరణిఁజిత్తమున
నన్నియు నొకకోవ - యై గోచరింప
రత్నంబులన్నియు - రాసిగాఁగూర్చు
రత్నాకరంబన - శ్రవణపర్వముగ
ధర్మార్థదము కామ - దము మోక్షదంబు
శర్మదంబును పుణ్య - సారంబుగాఁగ650
శౌర్యంబు సత్యంబు - సౌమ్యవర్తనము
ధైర్యంబు శాంతియు - దాంతియు వెలయు
రాముని జననంబు - రఘువీరు వేఁడ
కామించి వచ్చిన - కౌశిక స్థితియుఁ
దాటక హరణంబుఁ - దపసిజన్నమున
మేటిరక్కసులఁబో - మీటి గెల్చుటయు
జనకుజన్నము చూడఁ - జనుచోట గౌత
ముని యహల్యకు శాప - మోక్షమిచ్చుటయు
మిథిలా(పురంబున - మేటి రా)ఘవుఁడు
పృథుశక్తి హరువిల్లు - పేర్చి త్రుంచుటయు660
సీతావివాహంబు - సీతతో పురికి
నేతేర భార్గవుం - డెదిరియాఁగుటయు
నతనిభంగము నయో - ధ్యాప్రవేశంబు

క్షితిపతి రామాభి - షేకవార్తయును
కైకవరంబు బొం - కక దశరథుఁడు
మేకొని యునికియు - (మిథిలాతనూజ)
సౌమిత్రియును వెంటఁ - జనుదేర వెడలు
రాముని భీకరా - రణ్యయాత్రయును
గుహునిఁ జూచుటయును - గుహుఁ డోడ గడప
గహనంబులందులఁ - గడచిపోవుటయుఁ 670
జిత్రకూటనగంబు - చేరి రాఘవుఁడు
శత్రవైఖరి పర్ణ - శాల నిల్చుటయుఁ
బురిలోన దశరథ - భూపతి శోక
భరముచే స్వర్గతిఁ - బాటిల్లుటయును
భరతుండు తండ్రికి - బరలోకవిధులు
గరిమఁ జేయుటయు రా - ఘవుఁ దోడి తేర
వనుల కేఁగఁగ భర - ద్వాజుఁ డెల్లరకు
వినయవర్తనముల - విం దొనర్చుటయు
డాసి యాచిత్రకూ - టముమీఁద భరతుఁ
డే సేరఁగని రాము - నీక్షించి (తమదు)680
పురికి రమ్మనుటయుఁ - బోక రాఘవుఁడు
భరతునకును తన - పాదుకాయుగము
నిచ్చిపొమ్మనుటయు - హితమతి మరలి
వచ్చి యాభరతుఁ డు- ర్వరయెల్ల రామ
పాదుకాధీనయై - పరగించి ప్రజల
నేది నందిగ్రామ - మిరవుసేయుటయు
రాముఁడు దండకా - రణ్యంబు చేరి
యామేర మునులకు - నభయమిచ్చుటయు'

శరభంగుని సుతీక్ష్ణ - సంయమిఁజూచి
యరిగి యగస్త్యుని - నాశ్రయించుటయు690
నతఁ డొసంగంగ విల్లు - నమ్ములు నసియు
నతిభక్తి నంది య - య్యనుమతంబునను
పంచవటిస్థలిఁ - బర్ణశాలను వ
సించుచున్నెడ వారి - చేత శూర్పనఖ
ముక్కునుజెవులను - మొదలంటఁబోయి
దుక్కంబుతో ఖర - దూషణాదులకుఁ
దెలుపుటయును వారు - దిక్కయి వచ్చి
చలమున రాఘవా - స్త్రమ్ములచేత
పదునాల్గువేలకా - ల్బలముతో వారు
కదన నీల్గిన దశ - కంధరుం డెఱిఁగి700
మారీచుఁడును తాను - మనుజేశుఁ డున్న
యారామమున కేఁగ - నపుడు రావణుని
యనుమతి నొకమృగ - మై రామచంద్రుఁ
గనుబ్రాముటయు వాఁడు - కడతేఱుటయును
రావణుం డపుడు ధ - రాతనూజాతఁ
గావరంబున చెఱ - గాఁ బట్టుటయును
మరలువేళ జటాయు - మరణంబు వాఁడు
పురికి నేఁగి యశోక - భూజంబుక్రింద
సీత నుంచుటయును - శ్రీరామచంద్రుఁ
డాతని వైదేహి - నరసి కానమియు710
వచ్చి జటాయువు - వచనసంగతిని
చిచ్చఱయమ్మున - చేతులుందునిమి
పఱతెంచునట్టి క - బంధుఁ ద్రుంచుటయు.

హరిణాక్షి శబరిచే - నర్చలందుటయుఁ
బంపాతటంబునఁ - బనమానతనయుఁ
సంపూర్ణజవసత్త్వ - శాలిఁ గాంచుటయు
మారుతతనయునా - మతమునంజేరఁ
జీరి సుగ్రీవుతోఁ - జెలిమిఁ బూనుటయు
వాలిసుగ్రీవుల - వైరవర్తనము
వాలినిగెలుచుస - త్త్వము గనుపింపఁ 720
గడకుఁబో దుందుభి - కాయంబు మీఱి
తడయ కప్పుడు సప్త - తాళము ల్గూల్చి
నమ్మించుటయు భౌమ - నాయకుం డపుడు
సమ్మతి వాలితో - జగడించుటయును
వాలిఁ గూల్పుట రఘు - వరుఁడు కిష్కింధఁ
బాలింప సుగ్రీవుఁ - బతిఁజేయుటయును
వానకాలము మాల్య - వంతంబునందు
తా నిల్చుటయు భాను - తనయు నవ్వెనక
రప్పించుటయును ధ - రాతనూజాత
నెప్పువానరులచే - నెమకఁ బంపుటయు730
బవనందనుఁడు సం - పాతివాక్యముల
జనమున జలరాశి - చౌకళించుటయు
సామీరి లంకలో - జానకివెదకి
యేమేరఁ గానక - యిచ్చఁ గుందుటయు
శోకంబు నొంది య - శోకంబుక్రింద
నాకొమ్మ వసియింప - నరసిచేరుటయు
వ(రలు నుంగ)రమిచ్చి - వన మెల్లఁ బెఱికి
సరగ నక్షాదులఁ - జమరివైచుటయుఁ

జిట్టకంబుల నింద్ర - జిత్తు చేఁజిక్కి
నెట్టుక యాలంక - నీఱు సేయుటయు 740
మరలి యంబుధి దాఁటి - మనుజేశుఁ గాంచి
వరబుద్ధి నేఁ గంటి - వైదేహి ననుట
రాముఁ డేపున వాన - రబలంబుఁ బోవ
నామేర జలరాశి - నాశ్రయించుటయు
శరణుజొచ్చినవిభీ - షణునకు రామ
నరపతి యభయదా - నంబు సేయుటయుఁ
బ్రాయోపవేశంబు - బడబాగ్నివిజయ
సాయకంబుల వార్థిఁ - జాలఁగ్రోల్చుటయుఁ
గడలిపై సేతువు - గట్టి వానరుల
విడియించి యాలంక - వీటిఁబుచ్చుటయు750
రావణకుంభక - ర్ణవధ క్రమంబు
దేవత ల్మెచ్చఁబొం - దిన విభీషణుని
పట్టంబుగట్టించి - పావకశిఖల
ముట్టిన జానకి - ముదము రెట్టింప
విబుధానుమతమున - వేడ్కఁ జేపట్టి
సబలుడై పుష్పక - స్థలి వసించుటయు
మరలివచ్చుచును రా - మవిభుండు మౌని
వరుఁడగు నాభర - ద్వాజుఁ గాంచుటయు
మానవపతి హను - మంతునిఁ బిలిచి
పూని నందిగ్రామ - మునకుఁ బంపుటయు760
భరతుఁ డెదుర్కొన - బార్థివోత్తములు
పొరిఁబొరి వల్కలం - బులు దొలంగుటయు
సకలభూషణసము - జ్జ్వలులై యయోధ్య

వికసింప మతులు ప్ర - వేశించుటయును
శ్రీ ............................భవము
చేరినదొరలఁ గై - సేసి పంచుటయు
జగతి తా నేకాద - శసహస్రవర్ష
మగుదినంబులు ప్రజ - నరసి ప్రోచుటయు
నడవులకును సీత - నంపుట సీత
కడుపున కుశలవుల్ - గలుగుట యనెడి770
కతల మీరుచు నాఱు - కాండముల్ గాఁగ
జతగూర్చి యేనూరు - సర్గముల్ గలుగ
...................... . పదినాల్గు వేలు
సదమల గ్రంథవి - స్తరమై యెసంగ
నొనరించి పైకథ - లుత్తరకాండ
మునఁ జెప్పె వాల్మీకి - మునినాధుఁ డపుడు
కుశలవు లత్యంత - కుశలమానసులు
దశరథపౌత్రు లు - దారశేముషులు
వచ్చిన నిగమముల్ - వారికి నేర్పి
వచ్చినతరవాత - వాల్మీకిమౌని780
......................లు జతగూడియున్న
కరణులు బుద్ధివై - ఖరులుర క్తియును
రాగశిక్షయుఁ జూచి - రామాయణంబు
బాగుగా వారికి - పఠియింపఁజేసె
గాంధర్వ మధుర సం - గతుల వీణియలు
సంధించి గాంధార - షడ్జనిషాద
ధైవత ఋషభ మ - ధ్యమ పంచముముల
తావులు మంత్రమ - ధ్యమతారకముల

వెలయవారలకథ - వినుపింపఁ జూచి
చెలువముల్ నడుపులు - సింగారములును790
పలుకులు నాజాను - బాహువుల్ చెవుల
వెళుపాటియురములు - వెడఁదకన్నులును
చూచి మౌనులు వారి - సొబగు శ్రీరాముఁ
జూచి యచ్చునఁదీర్చు - చోద్యమై యుండ
బింబంబు తత్ప్రతి - బింబంబు లటుల
నంబకంబులకు న - త్యానంద మెసగ
నున్న వారలచంద - ముర్వీజనంబు
విన్నవించిన రామ - విభుండు హర్షించి
చూచు వేడుకనుండు - చో నాశ్రమమున
వాచంయములు వారి - స్వరవి విశేషములు800
విని సభయై కూడి - వికచాననములఁ
గనుదామరల నశ్రు - కణములు రాల
నానందములనొంది - యౌనయ్య! మేలు!
గానమా సరిసాటి - గానమెయ్యెడల
రాగమేళన ననురా - గంబులొంది
బాగయ్యెశ్లోకార్ధ - భావంబులనుచు
మెచ్చియందొకమౌని - మేలిమిఁగొంచు
లిచ్చెదండెపుగోల - యిచ్చెనొక్కరుఁడు
.............యి - చ్చెనొకండుదాత
తానయై గోపిచం - దనమిచ్చెనొకఁడు810
భూషింప వల్కలం - బులొసంగెనొకఁడు
కాషాయవస్త్రముల్ - గప్పెనొక్కరుఁడు
..........ంగ్గనమీద - విూదనమ్మౌను

లిచ్చు నీవులకు - వారిచ్చలనలరి
ఆయుష్యమును నితి - హాసముఖ్యంబు
శ్రేయస్కరము - కవిజీవనౌషధము
శ్రుతులసారమ్ము తే - జోలాభకరము
నతులంబునైనరా - మాయణంబిట్లు
వినుపింప నిచ్చలు - విని మునిరాజు
తనవెంటసీతనం - దనులఁదోడ్కొనుచుఁ820
దమ్ములుగొలువ ర - త్నమయాసనమున
సమ్మతి రాజులు - సచివులనడుమఁ
గొలువున్న శ్రీరాము - కొలువులోపలికిఁ
గళుకువీణెలు పుస్త - కమ్ములు పూని
మునుకొని వచ్చురా - ముని బాలకులనుఁ
గనుఁగొనిలక్ష్మణ! - కంటివే వీరి
జోడుగూడినయట్టి - శ్రుతులవియ్యంబు
పాడెడుచందంబు - పలుకులందములు
మహనీయరాజకు - మారలక్షణము
లహహ! నామదికిప్పు - డానందమయ్యె830
వినుమనికొలువులో - విభు లెల్లవినఁగ
జనకుఁడు శ్రీరామ - చంద్రుండువలుక
మునియెచ్చరింప రా - మునికథ సుతులు
వినుపించు తత్కథా - విధమెట్టిదనిన
 
-: కథాప్రారంభము :-

మనువంశనృఫులచే - మహనీయ్యమగుచు
ననుపమంబయ్యెరా - మాయణరచన

సగరులచేనైన - సాగరం బనఁగఁ
దగునది లోకైక - ధర్మసాగరము

-: అయోధ్యాపుర వర్ణన :-

సరయువుపొంత కో - సలదేశమునను
ధరణిఁ జెన్నగు నయో - ధ్యాపట్టణంబు840
నొండురెండునునైన - యోజనంబులకు
నిండినవెడలుపు - నిండుపండ్రెండు
యోజనంబుల పొడ - వొప్పుపట్టణము
రాజితంబుగ మను - ప్రభుండు నిర్మించె
రాజమార్గంబులు...................
రాజిల్లుమణిమయ - రంగవల్లికలు
పువ్వుమేల్కట్టు ల - బ్బురపుమేడలును
పువ్వులతోఁటలు - భువనేశ్వరములు
మకరకేతనములు - మణిగవాక్షములు
చకచకల్ వెదచల్లు - చంద్రశాలలును850
కోటలు నట్టళుల్ - కొత్తళంబులును
నీటైనయంగళ్లు - నిబిడయంత్రములు
రం................................లుజబురు
జంగులాళ్వరు లుదం - చనపుఁజేతులును
నరిభీమతేజంబు - లగుసామజంబు
లరయఁబాయు రయంబు - లగుహయంబులును
రత్నసౌధములు కి - రాటయూధములు
రత్నాకరానుకా - రము లగడ్తలును

 
సావళ్లుఁ బసిఁడిహ - జారముల్ కడల
కావళ్లుఁగాచువి - క్రమవీరభటులుఁ860
గేళీవనమ్ములుఁ - గృతకాచలములు
బాలికాలంకార - పణ్యవీధులునుఁ
బరపుచప్పరము లు - ప్పరిగెలు సాము
గరుడులు వైభవా - గతవిమానములుఁ
జెఱకుఁదోఁటలు - మిన్నుచెనకుకోటలును
విరులుఁ గదంబముల్ - నిలుచుఁ బేటలును
దేవాలయములు భూ - దేవవీథులును
బావుకదుందుభి - ప్రణవఘోషములు
వీణాపణవశంఖ - వేణుమృదంగ
రాణాతిమధురధీ - రధ్వానములును 870
నరిమనోదరదంబు - లగునరదములుఁ
బరికింప విక్రమో - ద్భటులైనభటులు
వేదశాస్త్రార్థకో - విదులైనద్విజులు
నాదిరాజనయజ్ఞు - లైనరాజులునుఁ
గలిమిఁ గుబేరునిఁ - గైకోనివణిజు
లలరవిప్రులఁ గొల్చి - యమరుశూద్రులును
మకరతోరణములు - మహనీయకేతు
నికరముల్ నిర్మల - నీరదీర్ఘకలు
గోపురంబును మించు - గోపురంబులును
కోపనానూపుర - కోలాహలంబు880
నలరొందియింద్రుని - యమరావతియును
జలరుహగర్భుని - సత్యలోకంబు
యక్షలోకేశ్వరు - నలకాపురంబు

నక్షీణశమనసం - యమినీపురంబు
గెలుచు నానాగుణ - కీర్తన ల్గాంచి
యలరు నయోధ్యామ - హాపట్టణంబు

-: దశరథుని రాజ్యపాలన :-

పాలించు సకలభూ - పాలశేఖరుఁడు
శీలవివేకదా - క్షిణ్యభూషణుఁడు
వరమతి యిక్ష్వాకు - వంశవర్ధనుఁడు
స్థిరధైర్యనిధి జితేం - ద్రియుఁ డుదారుండు890
ధార్మికాగ్రణి దీర్ఘ - దర్శి యత్యంత
నిర్మలచిత్తుండు - నిపుణమానసుఁడు
బలవంతుఁ డతికృపా - పరుఁడు పుణ్యాత్ముఁ
డలఘుకీ ర్తివినోది - యైశ్వర్యఘనుఁడు
సత్యసంధుఁడు సర్వ - సముఁ డర్థులకును
నిత్యదాతత్రికర్మ - నిరతుఁ డుత్తముఁడు
నతిసాహసుం డస - మాధికవైరి
నతరాజిలోకుఁ డు - న్నతభుజబలుఁడు
దశదిశల యశప్ర - తాపముల్ నించు
దశరథుం డలరు నా - ధన్యు రాజ్యమున
నప్రసిద్ధుఁ డపూజ్యుఁ - డలసమానసుఁడు 900
నప్రయోజకుఁడు న - నాచారపరుఁడు
నపకారి నాస్తికుం - డవివేకి మూర్ఖు
చపలచిత్తుండు దు - ర్జనుఁడు కొండియుఁడు
పాపాత్మకుఁడు మధు - పాని దుర్జనుఁడు
కోపి జాల్ముఁడు కృత - ఘ్నుండు కాముకుఁడు

దారిద్య్రనైరూప - ధరుఁడు కురూపి
జారుండు చోరుఁ డ - జ్ఞాని లోభియును
వెదకినలేక కో - విదులు - ధార్మికులు
సదయాత్మకులు సత్య - సంధు లాఢ్యులును910
బరమపుణ్యులుఁ గీర్తి - పరులు కారుణ్య
నిరతులు నిజకార్య - నిర్వాహకులును
నన్యోన్యహితులు ద - యాళువుల్ సుజన
మాన్యులు సకలస - మ్మతులు ధీరులును
నుపకారులును, వైభ - వోన్నతుల్ వీత
కపటమానసులునై - కడఁగూడఁగలిగి
పితృవాక్యపాలన - ప్రియకుమారకులు
పతియ దైవంబని - పాటించుసతులు
నతిథులం దనియించు - నన్నదాతలును
వ్రతముగా నిజధర్మ - వశులైనజనులు920
మీఱి యవ్విభుఁడు ధా - ర్మికుఁడైనకతనఁ
బౌరులు సకలశో - భనసమృద్ధులును
మణికుండలములు భ - ర్మకిరీటములును
ప్రణుతవిభూషణాం - బరవితానములుఁ
బువ్వులు పూఁతలు - భోగభాగ్యములు
నవ్వుమోము లల - నారత్నములునుఁ
పాడియుఁ బంటయు - బహుపదార్థములఁ
బోఁడిమియునుఁ గల్గి - పొదలుచునుండ
నగరంబు వెలి సత్య - నామయై చాల
నగణితంబైన మ - హాప్రదేశమున930

తగవింధ్యహిమవన్మ - తంగశైలముల
నెగడి దా నంబువుల్ - నిబిడముల్ గాఁగఁ
గట్టుకంబముల ని - గళములు గదియఁ
బట్టు కుముదసార్వ - భౌమాంజనాది
కులములుంగల దంతి - కులము సజ్జార
ముల నడగొండల - మురువున మెఱయ
శక పారశీక భో - జ వనాయు సింధు
కుకురు బాహ్లికహట్ట - ఘోట్టాణజములు
హాళి ద్వియోజనా - యతమైన వాజి
శాలల హయముల - చడితీలు మెఱయ 940

-: మంత్రివర్ణన :-

నింగితజ్ఞులు నతి - హితులు మంత్రజ్ఞు
లంగీకృతాన్యోన్యు - లనురక్తులైన
సిద్ధార్థ విజయదృ - ష్టి జయంత్ర మంత్ర
సిద్ధ సాధక జయ - స్థిర సుమంత్రులును
మఱి యశోకుఁడు నెన - మండ్రుప్రధాను
లరయ నవ్విభునిఁ బా - యకఁ గొల్చియుండ
వరపుణ్యులు వసిష్ఠ - వామదేవాఖ్యు
లిరువురు హితపురో - హితులై వసింప
వెలయుచు ధర్మకో - విదులు జితేంద్రి
యులు ననాగతకార్య - యోజనపరులు950
రాజనుమతులు ప - రస్పరస్నేహ
రాజితుల్ చారవా - ర్తావిలోకనులు
సర్వసమాను లు - త్సాహసమేతు

లుర్వీహితులు చతు - రోపాయమతులు
సంధివిగ్రహముఖ - షడ్గుణోన్నతులు
సంధాప్రతిష్టితుల్ - సామాదిరతులు
నైనమంత్రుల కిర - ణావళిచేత
భానుఁడొప్పెడురీతి - పఙ్తిరథుండు

-: దశరథుఁడు పుత్రకామేష్టిఁ జేయ యత్నించుట :-

తావెలసియును సం - తానంబులేని
యా విచారంబుతో - నశ్వమేధంబు960
గావింపఁదలఁచి యా - గమవేత్తలైన
పావనాత్మకులను - బ్రాహ్మణోత్తముల
వామదేవసుయజ్ఞ - వత్సజాబాలి
జైమినిభరత - కాశ్యపముఖ్యఋషుల
నాత్మపురోహితుం - డైనవసిష్ఠు
నాత్మజహీనతఁ - బ్రాప్తమైనట్టి
ఖేదంబుఁ దెలుప నుం - కింప యమ్మౌను
లాదరంబున విన - నతఁ డిట్టులనియె
అఖిలంబు నెఱుఁగుదు - రాత్మజుల్ లేక
సుఖమెట్లు గల దెందుఁ - జూచిన నాకు970
నేతదర్థంబుగా - నే నశ్వమేధ
మీతరింగావింప - నిచ్చయించెదను
యీకోర్కు లీడేర్పుఁ - డింతటివారు
నాకుఁ గల్గి యుపేక్ష - నాయమే? సేయ
నరువదివేలేండు - లఖిలభోగముల
ధరణియేలితిని రి - త్తకురిత్త చనియెఁ

గాలంబు మీర లీ - కార్యంబుఁ దీర్ప
నాలోచనము సేయుఁ - డనిన వా రెల్ల
మేలు! నృపాలక! - మీహృదయంబు
కీలెఱుంగక మాకుఁ - గిమ్మనరాదు980
ఎఱుఁగకయున్నార - మే భావికార్య
పరిణామ మది కాల - పక్వంబుచేత
నెన్నడు లేనట్టి - యీచింత యింత
సన్నమె పొడము - టీశ్వరునాజ్ఞఁగాక
కడతేర్తు మట్లనే - కావింపు మఘము
విడిపింపు తురగంబు - విధ్యుక్తముగను
యాగోపకరణంబు - లఖిలవస్తువులు
వేగదెప్పింపుఁడు - వేదులమర్చి
సరయూతటోత్తర - స్థలమున శాల
విరచింపఁజేయుఁడు - వివిధవైఖరుల990
నన నట్లకాగ న - య్యశ్వరత్నంబు
ఘనలక్షణంబుల - గలదాని వెదకి
దురితంబు లణఁగ శాం - తులు హోమములును
స్థిరమతిఁ జేసి ఋ - త్విక్కులం జూచి
తప్పులు రాక య - థావిధిగాఁగ
కప్పుక యందఱుఁ - గనుకల్గియొకట
కొదవలు రానీక - కొనసాగ యాగ
మిది నెరవేర్పుఁ డెం - తే యెచ్చరిల్లి
ఛిద్రముల్ వెదకుచుఁ - జేరుదు రపుడు
భద్రకర్మేతరుల్ - బ్రహ్మరాక్షసులు
అందుచే యజమాన - హానియౌగాన1000

నందరునందు ప్ర - యత్నముల్ గలిగి
సకలసామగ్రుల - సమవదానములఁ
బ్రకటింపుఁడన పోరు - పార్థివునాజ్ఞ
నటుల కావింపుదుమని - యిండ్ల కరుగు
నటమీఁద మంత్రులు - నందఱం బనిచి
నగరిలోపలి కేఁగి - నరపతి తనదు
మగువలతోడ కు - మారుల వేఁడి
దాను తురంగమే - ధము సేయు దీక్ష
పూనినచంద మ - ప్పుడు దెల్పుటయును1010
ప్రాభాతికంబులౌ - పద్మినులట్ల
సౌభాగ్యవతుల యా - స్యంబులు వొదలి
యానందములంబొంది - రమ్మఱునాఁడు
మానవేంద్రుఁడు మహా - మహిమ గొల్వుండి
పుత్రులపై యాస - పురికొల్ప వేడ్క
మంత్రాధికముగ సు - మంత్రుఁ డిట్లనియె
దేవ! పూర్వమున ఋ - త్విక్కులచేత
నేవిన్నయర్థంబు - హృద్గతంబగుచు
బొసఁగియున్నది నీ - దుపూనికె కిపుడు
సుసరంబుగాఁగల్గు - సుతలాభ మంచు
నామదిఁ దొంటి స - నత్కుమారుండు1020
సేమంబు నీకురాఁ - జెప్పినమాట
అదియెట్టులనిన కా - శ్యపకుమారకుఁడు
సదమలవిజ్ఞాన - సంపన్నమూర్తి
ఆతని విభాండకుం - డందురుపేరు
సుతుఁ డాతనికి జన - స్తుతచరిత్రుండు

గుణనిధి ఋశ్యశృం - గుఁ డనంగఁ గలఁడు
గణుతింప నమ్ముని - గణికానురక్తి
తావచ్చి రోమపా - దనృపాలునగర
దేవీయుతముగ వ - ర్తించు నెవ్వేళ1030
నసముతోదశరథుఁ - డశ్వమేధాంగ
మెసగంగఁ బుత్రకా - మేష్టి సేయించి
అమ్మునికృపచేత - నాత్మనందనుల
నమ్మాధనాంశజు - లైనట్టివారి
నలువురఁ గాంచున - న్నతెఱంగు నాదు
తలఁపున కొనఁగూడె - తప్ప దీమాట
అనవిని యెవ్వరా - యన ఋశ్యశృంగుఁ
డనుమౌని యేమిటి - కై యంగరాజు
రప్పించె భోగము - రమణు లేమాయఁ
గప్పితెచ్చిరి యట్టి - కథ యేర్పరింపు
మనిన సుమంత్రుఁ డ - య్యవనీశుఁ జూచి
వినయంబుతోడ న - వ్విధమెల్లఁ బలికె

   -: ఋశ్యశృంగుని కథ :-

నరవరోత్తమ! విభాం - డకకుమారకుఁడు
చిరతపోనిధి ఋశ్య - శృంగుండు రెండు
బ్రహ్మచర్యంబులఁ బదిలుఁడై నడపు
బ్రహ్మరతుండు పూ - ర్వమహాశ్రమమున
నాశ్రమంబునఁ దండ్రి - కగ్నిహోత్రునకు
శుశ్రూష లాచరిం - చు నలంత లేక
అనుదినం బీరీతి - నన్యమేమియును

దనమది నెఱుఁగక - తపముఁ గావింప1050
నతని కెగ్గొనరించు - నట్టిదోషంబు
ప్రతిపన్నమై యంగ - రాజ్యంబునందు
వానలు గురియక - వసుమతి జనులు
దీనులై కుయ్యిడఁ - దెలియంగ లేక
రోమపాదుఁడునుఁ - బురోహితామాత్య
సామంతులకు నీప్ర - సంగంబుఁ దెలిపి
విజ్ఞాననిధులైన - విప్రపుంగవులఁ
బ్రాజ్ఞుల నాగమ - పారంగతులను
వీక్షించి యీ యనా - వృష్టిదోషంబు
దక్షులు మీర లిం - దఱుఁ గలిగియును1060
నా రాజ్యమునఁ గల్గ - నాయమే? దీని
నేరీతి వారింతు? - నెద్ది కారణము?
భావించి మీరలు - ప్రతిచింత సేయ
కీవేళ నురకొందు - రే యనుటయును
విని విప్రులెల్ల నా - విశ్వేశుఁ జెంతఁ
బనివచ్చుటెల్ల వి - భాండకసుతుని
యెడఁజేయు మేవిధి - నేని యమ్మౌనిఁ
దొడుకతెచ్చిన నీతి - దోషము ల్దొలఁగు
నన వారిఁ గాంచి య- య్యవసీశుఁ డనియె
మనయింటి కాతఁడే - మతమున వచ్చు1070
నెద్ది యుపాయ మిం - కెటుల రప్పింత
మెద్దిసాధక మాన - తిండని పలుక
రాజేంద్ర! యమ్మౌని - రాజాత్మజునకుఁ
బూజసేయుచుఁ దాన - ప్రొద్దువోకలను

మెలఁగుటేకాని యే - మియు నన్య మెఱుఁగ
డిల నొక్కపురమైన - నీక్షింపఁబోవ
డంగనాపురుషరూ - పాంతరం బరయఁ
డంగాధివర! యింద్రి - యనిరోధనమున
నున్నవాఁ డటుగాన -నొసపరివయసు
కన్నెలం బనిచినఁ - గనునంతలోన 1080
కమలాక్షుఁ డున్నాఁడె - కామనపాల
కమలాస్త్రుఁ డున్నాఁడె - కాకామినులకు
విషయాతురుండగు - వెలఁదుల చూపు
విషము సోఁకిన నెట్లు - వివశుండుగాఁడు
పనుపుఁ డిప్పుడె - పణ్యభామినీమణుల
ముని యంతరాక కా - మునిలెంకగాక
అనవిని యౌగాక - నాప్రధానులను
బనిచిన వారలు - పడవాళ్లచేత
వీటిలో వెలజాతి - వెలఁదులనెల్లఁ
జాటించి పిలిపించి - సవరణల్ చేసి 1090
వలయుసొమ్ము లొసంగి - వనితలవెంట
నెళవు దెల్పఁగ విప్ర - నికరంబుఁ గూర్చి
పంచిన వారు వి - భాండకాశ్రమము
నంచుల నొకగుమి - యై విలాసినులు
దండెయుఁ గిన్నెర - తంబురా వీణ
యొండొండనుతి గూర్చి - హొయలుమార్గమున
వింతరాగంబుల - వీనులు చొక్క
పంతుమార్గమ్మునఁ - బదము లేర్పఱచి
పాటల నాటల - పంచసాయకుని

వేఁటకు దీములై - వెలపువ్వుఁబోండ్లు
మౌనియాశ్రమమున - మలయుచోఁ దండ్రి
స్నానార్థముగ నేఁగు - సమయంబుగాన
నొక్కండు పర్ణశా - లోపాంతసీమ
దక్కెరా యితఁ డను - తరి గోచరింప
నున్నయమ్మునిం జూచి - యొద్దిక సాని
కన్నియల్ మరుమాయ - గతిఁబడు ననుచు
గిలకిల నవ్వుచు - కిన్నరల్ మొరయఁ
తళుకుఁజూపులను బి - త్తరములు మెఱయు
గణగణ మొలనూలి - గంటలు మొరయ
ఝణఝుణ మంజీర - చయము ఘోషింప1110
కంకణమ్ములు మ్రోయఁ - గమ్మలు గదల
బింకెపుగుబ్బల - బిగువు రెట్టింపఁ
గడులేఁతనడుములు - గడగడ వణఁక
అడుగులఁబోషిత - హ్రాస్వముల్ గదియ
వెలలేనినవ్వుల - వెన్నెలల్ గాయ
పలుకులఁ గపురంపు - పలుకులు రాల
నంగముల్ తళుతళు - క్కని మించులీన
బంగరుకాశలఁ - బసి నిగ్గుమీఱ
జడలనల్లినపువ్వు - సరులు గమ్మనఁగ
విడిగెంపు మోవుల - విన్నాణ మెసఁగ1120
నవయవచాకచ - క్యములు రాణింప
నువిదలందఱు మౌని - యోలంబు చేరఁ
జూచి దిగ్భ్రమనొంది - చోద్యంబు వెనిచి
లేచి దిగ్గన మౌను - లే వీరలనుచు

నందఱపదముల - నందంద వ్రాలి
చిందులాడుచు వారు - చెదరి కేడింప
కరములు మొగిచి చెం - గట వినయమునఁ
బరువడి నర్ఘ్యముల్ - పాద్యంబు లొసఁగి
ఎవ్వాఁడ వెద్దిపే - రెఱిఁగింపుమనుచు
జవ్వను లడుగ - నోసంయములార!1130
నాజనకుఁడు విభాం - డకుఁడు మన్నామ
మీజగతిని ఋష్య - శృంగుఁడటండ్రు
మీ యాశ్రమం బెద్ది - మీరేమి వేఁడి
యేయెడ కేగుచు - నిట చేరినారు
అనిన మహాత్మ! మా - యాశ్రమం బిటకు
ననతిదూరము చేర - నగు నేఁటిలోన
తడవుగాఁ బాడి ప - దక్రమంబునను
గడుమెచ్చ శుద్ధమా - ర్గమున మీఱుదుము
జలజాంబకు కథాప్ర - సంగముల్ నేర్చి
వలవనియాస నెవ్వరిఁ - జేరఁబోము1140
మందులలోఁ జేయు - మతము మాతలంపు
లందు తక్కుమహత్త్వ - మడుగ నేమిటికి
రవణతో శుకవచో - రచనలు చూప
భువి మమ్ముఁబోల స - త్పురుషులు లేరు
ఆప్తమర్మ మెఱుంగ - నగుయోగ్యుఁ బిలిచి
ప్రాప్తసంగతి బట్ట - బయలుసేయుదుము
మౌనినాయక! విను - మా! వనితలము
కాన నెన్నడు విని - కని పుట్టు మొదలు
నావలపులజాడ - లరయవుగాక

నీవు మమ్ములఁ బాసి - నిమిష మోరుతువె1150
చక్కనికొమ్మల - చందంబు చూచి
చొక్కున మరలి రాఁ - జూతువే యిటకు
మామోవిపండ్లకై - మనసూరనట్టి
మీమౌను లున్నారె - మేదినియందు
కలహంసగమనాను - కార చేష్టలును
నెలకొను కీరవాణీ - విలాసములుఁ
గలకలాయితరవ - కంఠరవంబు
తలంపని యీరిత్త - తపమేల? నీకు
కొ మ్మాస్వదింపు కై - కొనుమని చెలులు
కమ్ముక గోదుమ - కజ్జముల్ మేప 1160
మెండుగా మెసవుచు - మీయాశ్రమమునఁ
బండునే యిటు - వంటిపండ్లని మెచ్చి
యలరి యాపాదకే - శాంతంబుగాఁగఁ
గలవాణులను చ - క్కఁగాఁ దేఱిచూచి
పూను మీశివలింగ - ముల కేల లేవు?
పానవట్టములంచు - పాలిండ్లు నివురు
తుమ్మెదగుంపులఁ - దోలెద ననుచు
కొమ్మున నుదుటిముం - గురు లంటి త్రోచు
వేలిమిబోం ట్లెంత - వింతాయె ననుచు
తేలిక కస్తూరి - తిలకముల్ మెచ్చు1170
స్వాదుగా గమగమ - వలచు నెచ్చోటి
బూదియోయని గంద - వొడి కేల నంటు
యీవింత ముంజిత్రా - ళ్ళెక్కడి వనుచు
తా వేఁడు మేఖలా - దామముల్ చూచి

యేసీమపటికంబు - లిట్లుండు ననుచు
గాసిల్ల వజ్రాల - కడియముల్ ద్రిప్పు
నే చెట్టులనుఁ బుట్టు - నీవల్కలంబు
లీచాయనవి వల్వ - లెగనెత్తి చూచు
మంచివె రుద్రాక్ష - మూలిక లనుచు
కాంచి నీలపుసరుల్ - కన్నులనద్దు1180
రేకమించఁగ నుత్త - రీయంబులందు
చేకమండలువు లుం - చితి రంచునవ్వు
చిగురాకులా యివి - చిదుముద మనుచు
తొగరుఁగెమ్మోవు లం - దుకగిల్లఁజూచు
నిటులున్న యమ్మౌని - నింతులలోనఁ
గుటిలకుంతలయోర్తు - గొబ్బునఁ గదిసి
రమ్మని మౌనిక - రమ్ము చేఁబట్టి
సమ్మతి నొకమ్రాని - చాటున నిలిచి
జిగిబిగిచన్నుల - చిఱుతసోఁకులను
గగురుఁదాల్పఁగ మేను - కౌఁగిట చేర్చి1190
కరయుగళంబుపైఁ - గదియించి వచ్చి
చుఱుచుఱుక్కున గోరు - సోఁకు లంటించి
చెవిచెంత నెమ్మౌము - చేర్చి మ్రాన్గన్ను
హవణింపఁ జేసి పం - చాస్త్రమంత్రములు
కలరవకలరావ - గళనాదభేద
కలనలచేత నం - గము మఱపించి
కొనగొమ్మునాఁటునో - కోమలపాణి
యనుచు చేకాచి కా - యజుని మేల్కొల్ప

తజ్జనకునిభీతిఁ - దరుణులఁ గూడి
అజ్జసేసుకపోయి - రవ్వనీవనికి1200
పొయినం గళవళిం - పుచుఁ దెల్వినొంది
మాయలాఁడులమీది - మమతలం దగిలి
పసవువాడెల దిమ్ము - పట్టినమీరి
కసిగాటు పెనకువఁ - గనువేఁదురెత్తి
యెందువోయిరొ మౌను - లిందఱుగూడి
కందునొకో వారి - గనుఁబండువులుగ
మీసలుమొలవని - మెచ్చులవయసు
మోసెత్తు వేడబం - బులబ్రహ్మచారి
యొక్కండునును బాటు - కోరి .. .. ..
...............తని నిండుఁ - జందురువంటి1210
మొగము నామొగముతో - మొలక లేనవ్వు
చిగురొత్త నత్తించి - చేవింత చేర్చి
యొకమనోహరశబ్ద - ముపదేశ మిచ్చె
సకలావయవములు - ఝల్లుమనంగ
నమ్మనోహరశబ్ద - మవ్యక్తమధుర
మమ్మునిబాలు జి - హ్వాంచలసీమ
జనియింప విని జన్మ..... ............
................... మృత - విభవంబుగాఁగ
నాదంబునుండి క - ర్ణరసాయనముగ
నాదుడెందము నిజా - నందకందముగ1220
నందుచే నేఁదన్మ - యావస్థనొంద
నెందువోయెనొ చూడ - కెట్లుండనేర్తు
నెటకుఁబోయిరొ మౌను - లేవారిఁ జేరి

యెటువోయినను వెంట - నే మెలంగుదును
అని యెంచి.... ........- యక్షిణులందు
వనితలేఁగినజాడ - వచ్చె నచ్చటికి
వచ్చిన నెదురుగా - వచ్చి నెచ్చెలులు
పచ్చవిల్తునిపూజ - బాణంబు లనఁగ
మెలఁగెడుతొలుకారు - మెఱుపులరీతి
మలయుఁచుఁజిక్కె గు - మ్మడటంచు నలరి 1230
వనిత లారత్నకం - బళముపై నునిచి
పనివానిఁ బిలిపించి - బవిరి దిద్దించి
చలువలు గట్టించి - సన్నపునామ
ములు దీర్చి వలచుగం - బురవిడెమిచ్చి
చవుకళలిడి జీని - సరిపెణల్ వైచి
రవణగా కర ముంగ - రంబులు దొడిగి
పరిమళంబులుఁ బూసి - పరువంపువిరులు
కుఱుచకొమ్మున దిండు - కొనసాగఁజుట్టి
బురుసారుమాలు సొం - పుగఁ గట్టి యిల్లు
మఱపించి నడపు నే - మము వీటిఁబుచ్చి1240
యెలయించుకొని యొక్క - యెలనాఁగచేతఁ
దలిరుకెంగేలఁ గై - దండ యొసంగి
గిలుకుపావాలు ద్రొ - క్కించి రాజసము
తులకింప రోమపా - దుపురంబుఁ జేర్ప
నానరపతి మౌను - లాప్తులు సకల
సేనలు గొలువ వ - చ్చి నమస్కరించి
పల్లకీలోన న - ప్పరమమునీంద్రు
నుల్లంబు రంజిల్ల - నునిచి యాచుట్టు

భోగినీరత్నముల్ - బొదివి నానాని
యోగవైఖరులచే - నుడిగముల్ సేయ1250
గాంధర్వమేళంబు - క్రందుగా మొరయ
సింధురహయబలు - శ్రేణి మున్నాడ
పాదచారంబున - భక్తితో రోమ
పాదుండు మౌని వెం - బడి వచ్చి తనదు
నగరిలో నునుప క్ష - ణంబులో నతని
జగతిపై వానలు - జడివట్టికురియఁ
బ్రజలెల్ల నారోగ్య - భాగ్యముల్ గనిరి
రుజలెల్ల మాసె నా - రోమపాదుండు
ఆశాంతరాళస - మంచితకీర్తి
కాశాంతకునకు మ - హోతపోనిధికి1260
నాశాంతకులమణి - యాత్మజయైన
యాశాంత నొసంగి క - ల్యాణంబు చేసి
నమ్మౌనియున్నవాఁ - డతని గేహమున
నిమ్మఘం బతనిచే - నీడేరఁగలదు
కరుణాకరులు వంశ - కరులు శ్రీకరులు
పురుషోత్తములునైన - పుత్రులఁ గనుము
అంగాధిపతిచెల్మి - యాశింపు మాతఁ
డంగీకరింప నీ - వమ్మౌనిఁ దెమ్ము
మారులేదు సనత్కు - మారు పల్కులకు
ప్రారంభ మొనరింపు - మన దశరథుఁడు1270
ఆసందమున వసి - ష్ఠానుమతంబు
తో నమ్మహాత్ముండు - తోడనేతేర
సరణిఁబల్లకుల కౌ - సల్యాదులైన

తరుణులు రా సుమం - త్రసుయజ్ఞముఖులు
ననుచరులును చతు - రంగబలంబు
తనవెంటఁ గొలిచిరా - దశరథేశ్వరుఁడు
పయనరీతుల రోమ - పాదుపురంబు
రయమునఁ జేర నా - రాజన్యుఁ డపుడు
ఎదురుగా వచ్చి య - నేకసత్కృతుల
మది వొదలించి య - మ్మనువంశనిధిని1280
నాతులతోఁ దన - నగరిలోనుంచి
యేతరి నరమర - లించుకలేక
బహుమానమున నుంపఁ - బదియేనునాళ్లు
విహితవైఖరి నుండి - విందులఁ దేలి
భానువంశుఁడు రోమ - పాదునితోడ
తానువచ్చిన ప్రయ - త్నమున కిట్లనియె.
ధారుణినాథ! శాం - తాదేవితోడ
నారూఢభక్తిని - యల్లుని గూర్చి
మాపురంబునకు ని - మ్మనవి యాలించి
ఱేపె నావెంట వా - రినిఁ బంపవలయు1290
కల దిమ్మహత్ముచేఁ - గార్యంబు మాకు
వలదనరాదు వే - వత్తురు మరల
అన నట్లయగుఁగాక - యని ఋశ్యశృంగుఁ
దనపుత్రికనుఁ గూర్చి - దశరథువెంట
ననుపుటయును తాను - నతఁడంప మరలి
అనురాగమున నయో - ధ్యాపురంబునకు
నొక్కయందలమున - నువిదయు మునియు
నెక్కి మున్నుగఁ బోవ -హెగ్గాళెలులియ

కనకతప్పెటలు శం - ఖములును ధార
లును నాగసరము ల - ల్లుకమ్రోల మొరయ1300
కామినుల్ హస్తకం - కణములు గదల
హేమచామరయు - గం బిరుగడవేయ
తనబలంబునుఁ దాను - దశరథనృపతి
వెనుకొనివచ్చి య - వ్విమలాత్ముఁ దెచ్చి
నగరంబులో తన - నగరిలోఁ గొంత
నగ రేర్పరించి శాం - తాసమేతముగ
నింద్రవైభవముతో - నెల్లరుమౌని
చంద్రునియడుగులఁ - జాగిలి మ్రొక్క
నునిచి పూజించి రా - జోపచారముల
ననురాగమొందింప - నంతఃపురమున1310
దశరథసతులు శాం - తనుఁ జూచి పొగడ
దశవారములు మహో - త్సవముననుండె.

-: పుత్రకామేష్టి :-

అంత సుమిత్రనా - నాగమాంతంబు
సంతోషితస్వాంత - జలజకుంతంబు
అతులప్రకాశమా - నాంశుమంతంబు
ప్రతిపన్నవివిధస - ర్వర్తుకాంతంబు
పవనకిశోరశో - భననిశాంతంబు
నవనవవాసనో - న్నతలతాంతంబు
వొసగె మారునిబలం - బునకు పంతంబు
లెనగొని ధరణి - నెల్లెడ వసంతంబు1320

ఆవేళ మఘము సే - యఁగ మదిఁదలఁచి
ధీవిశాలుని దివ్య - తేజోవిలాసు
గుణనిధి ఋశ్యశృం - గునిఁ బూజచేసి
గణుతించి యాచార్యుఁ - గా నొడఁబఱచి
పరికరమ్ములును సం - భారముల్ గూర్చి
తురగంబువలయు కం - దువఁబోవఁబనిచి
యాసుమంత్రునిఁ జూచి - యఖిలఋత్విజుల
వాసోవిభూషణో - జ్జ్వలులఁ గావించి
రప్పింపుమనిన వా - రల నట్లకూర్ప
నప్పుణ్యనిధి వసి - ష్ఠాదులైనట్టి1330
వారలం బూజించి - వారితోధర్మ
సారవాక్యములదీ - క్ష వహించియుండి
సంవత్సరం బిట్లు - చనుటయు శాస్త్ర
సంవేదిమఱల వ - సంతకాలమున
సవనశాలాప్రవే - శ మొనర్చి యందు
నవనీశ్వరుఁడు వసి - ష్ఠాదిమౌనులకు
నాచార్యునకు మ్రొక్కి - యాగంబుకొఱఁత
లేచాయలేకుండ - నీడేర్పుఁ డనిన
నటుల కావింపుదు - మని పురోహితులు
పటుమతి వడ్రంగి - పనులవారలను1340
పారలవారిని - బలిమిమానసుల
గారలు సొదపనుల్ - గావించి వారి
చిత్తరువులవారి - శిల్పిశాస్త్రముల
నుత్తములగువారి - నుప్పరవారి
కరణంబులను నధి - కారులఁబనుల

నెఱవాదులను గ్రహ - నిర్వాహకులను
యిసుమును సున్నంబు - నిటికెలు గడమ
రసవర్గములు దెచ్చు - ప్రజలనుఁ గూర్చి
రాజులకును బంధు - రాజికి దిశల
రాజులకును సుమం - త్రప్రముఖులకు1350
విడుదులు నులుపాలు - వేర్వేఱఁ దగిన
యెడల నేర్పఱపించి - యెల్లరఁ గూర్ప
నా సుమంత్రునిఁ జూచి - యనియె వసిష్ఠుఁ
డోసచివోత్తమ! - యుత్తమశీలుఁ
బావనజ్ఞానసం - పన్నుని జనక
భూవరుఁ దో తెమ్మ - పోరానిసఖుని
కాశీశుమామఁగే - కయు ధారుణీత
లేశునిం దోతెమ్ము - హితబంధులైన
కోసలమగధులం - గొనిరమ్ము నీవె
వాసిగా నీధరా - వరుల సీమలకు1360
పోయి తోడుకతెమ్ము - పొంతలనృపుల
రాయభారుల నంపి - రప్పింపు వేగ
ననుమాటకు సుమంత్రుఁ - డందఱ బిలువఁ
జనువారిఁ బనిచి తాఁ - జని జనకాది
నృపతులు బిలిచిన - నిఖిలభూపతులు
నుపదలతోడ - నయోధ్యలోపలికి
కొన్నిదినంబుల - కునుఁ జేర పతికి
విన్నవించినవారి - విడుదులయందు
తరతరంబ యమర్చి - దశరథవిభుఁడు
గురునాజ్ఞ ఋశ్యశృం - గుని యనుమతిని1370

-: దశరథుం డశ్వమేధయాగము చేయుట :-

నగణితయాగ శా - లావాసుఁడగుచు
తగురీతినశ్వమే - ధ ముపక్రమించె.
సంవత్సరమునిండ - సవనహయంబు
సంవిధానంబుగా - శాల ముందఱికి
జేరినయాఋశ్య - శృంగునియాజ్ఞ
మీరకపరమధా - ర్మికులు యాజ్ఞికులు
అర్పించి పగటసా - యంసమయమున
నేర్పుమీఱఁగహోమ - నియమముల్ దీర్చి
వరుసఁబూర్వాహ్ణప్ర - వర్గ్యంబుచేసి
హరిహయప్రీతిగా - హవియంశమెలమి1380
నాదినంబులలోన - నలసినవారిఁ
బేదల ననదల - బీదల జడుల
రోగుల యతులఁ బౌ - రుల శిశువులను
యోగుల వృద్ధుల - నుపవాసపరుల
నలసినవారిని - నా కొన్న వారి
నలఁగినవారిన - నాథల నెల్ల
యిష్టమృష్టాన్నంబు - లిడిపదార్ధములఁ
దుష్టినొందించి బం - తుల వెంటవారి
నుపచరింపుచు విని - యోగజనంబు
నిపుణులై వడ్డించి - నెవ్వలుదీర్ప1390
నన్న పర్వతములు - నాజ్యవాహినులు
వన్నె మీఱుపసిండి - వన్నెసూపములు
ఫలములుకజ్ఞముల్ - పాయసాన్నములు
కలవంటకములూరుఁ - గాయ లంబళ్లు

పచ్చళ్లపెరుగును - పాలు తేనియలు
నిచ్చలుగా భుజి - యించి యాజకులు
సవనావసరముల - శాస్త్రప్రసంగ
నివహముల్ గెలుచు పూ - నికల వాదింప
నాగమనిధులు ష - డంగపారీణు
లాగమాంతార్థజ్ఞు - లైనబుుత్విజులు
నుచితాసనంబుల - నుండి యఁయ్యాగ
మచలితక్రమముతో - నాచరింపంగ1400
యిరువదియొకమూర - లెనిమిదిమూల
లిరుగేలుసోఁకఁజో - టిచ్చుమందములు
గలిగి బిల్వము లాఱు - ఖదిరంబు లాఱు
ముదురుమోదువు లాఱు - మొదలింటి దొకటి
దేవదారు వొకండు - తీర్చిన విఱుగు
చేవమ్రా నొకటి కై - చేసి యూపములు
నాటించి యూపంబు - నకు నొక్కనూత్న
సాటిగా నన్నింట – సరవిగాఁ జుట్టి
అమరసప్తర్షుల - నాకాశమట్లు
సమయూపముల యాగ - శాల శోభిల్లి 1410
తగుయాగమునకుఁ ద - త్తత్ దైవతాక
ముగ యాగపశువులు - మున్నూ రమర్చి
పక్షులు గ్రూరస - ర్పంబులమీఁద
నీక్షింప నెడమీక - యిటుకలు వఱచి
గారుడచయనంబు - గా నేర్పరించి
వేరుపడగ నశ్వ - విశసనవేళ
జలచరంబుల నెల్ల - సవరించి తెచ్చి

యెలమితో బశువుల - నెల్లఁ బట్టించి
కౌసల్యమును దురం - గమపరిచర్య
చేసిన వెనుక న - సిత్రితయమున1420
చేరి యశ్వముఁ బట్టి - ఛేదించి రాత్రి
యారామతురగంబు - నాలింగనంబు
చేసుక శయనింపఁ - జేసి నాడెల్ల
కౌసల్య యట్లుండ - గా మఱునాఁడు
మేకొని యయ్యశ్వ - మును సుమిత్రయును
కైకయు నట్లన - కావింప చారి
వేకంబులాడుచు - వేగిననంత
అశ్వంబు నుపఋత్వి - గావళి చేసి
శాశ్వతుండగు హుతా - శనుకీలలందు1430
పరిపక్వమగుడు వ - పాసోమపుణ్య
పరిమళంబున రాజు - పాపంబు లణఁగ
అపు డాస్వదింప న - య్యాజికుల్ హయము
విపులశస్త్రముల వే - ర్వేర భాగించి
పదియునాఱంగముల్ - పావకునందు
చెదరక హోమంబు - చేసి రీరీతి
యిమ్మఘం బిటుచెల్లు - నితరముల్ జువ్వి
కొమ్మయైనను ప్రబ్బ - కొమ్మదానైన
యొక్కయూపంబుచే - నొనరుజన్నములు
పెక్కుయూపములిందుఁ - బెనుపొందుఁగాని1440
మునుపు చతుష్టోమ - మును వెన్క వృద్ధ
మును నతిరాత్రంబు - మూఁడునాళ్లకును
దిన మొక్కహోమ మ - ర్ధిని వేల్చి యిట్టి

యనఘ యాగము - నకు నంగంబులైన
నతిరాత్ర మాయువు - నభిజిత్తు విశ్వ
జితియు జ్యోతిష్టోమశి - వనామకంబు
నరయ నప్తోర్యామ - మను షడంగముల
మెఱయుయాగము లశ్వ - మేధంబులందు
నొనరించి యీరీతి - హోతకుం దూర్పు
తనరంగ బ్రహ్మకు - దక్షణోర్వియును1450
నరనాథుఁ డధ్వర్యు - నకుఁ బడమరయుఁ
గరిమ నుదీచి యు - ద్గాతకు నొసంగె
నజపుత్రుఁ డాసము - ద్రాంతమౌ జగతి
యజునికట్టడదక్షి - ణార్థంబుగాఁగ
నపుడు ఋత్విక్కు లా - యవనీశుఁగాంచి
యపరిమితప్రీతి - నంది యిట్లనిరి.
రాజన్య! యేమెల్ల - రాజ్యంబు సేయ
నేజాడ నేర్తుమే - యింతయెకాక
స్యాధ్యాయమో? తీర్థ - యాత్రలో? కాక
యధ్యాత్మచింతయో - యవనియేలుటలు1460
తాపసోత్తము లేడ? - ధరయేలు టేడ?
యోపమీ గొడవల - కొకమాటవినుము
క్రయమిచ్చి మాచేతఁ - గైకొను ముర్వి
రయమున నన దశ - రథమహివిభుఁడు
కోటియావులు పది - గోటుల టంక
వాటంబు లట్టిద్ర - వ్యము నలుమడిగ
వెండి యందుకురెట్టి - వివిధరత్నముల
వెండియు వస్తువుల్ - వెలగా నొసంగి

ధరణిఁ గైకొమ్మన్న - ధారుణీసురలు
గురుఁడును ఋశ్యశృం - గుఁడునున్న యెడకు1470
వచ్చి తెల్పినవారి - వారికింబంచి
యిచ్చి వారలఁ దని - యించిన యపుడు
కోరెడువారికిఁ - గోటిరొక్కంబు
భూరిగా నొసఁగ న - ప్పుడు పేదయొకఁడు
జనపతి చేతిప - చ్చలకడియంబు
గని వేఁడ నవ్వు మొ - గంబుతో నొసఁగె
నందరకపుడు సా - ష్టాంగంబుఁ గాఁగ
వందనం బొనరించు - వసుధేశుఁ జూచి
దీవెన లొసఁగ భ - క్తిని ఋశ్యశుృంగు
భావించి యిట్లని - పలికె నవ్విభుఁడు. 1480
తనయుల వేఁడితి - తాపసవర్య
నినుపుత్రుల నొసంగి - నెగులు వారింప
తాను తురంగమే - ధము సేయుటెల్ల
మౌనీంద్ర నినుఁబిల్వ - మతియించి సుమ్ము
నినుఁ దోడితెచ్చుట - నిజముగాఁ దనకు
తనయుల వేఁడ - చిత్తము గల్గిఁ సూవె
ఆలస్య మేల? య - య్యత్నంబు చేసి
మేలెంచు మనిన న - మ్మేధావి యనియె
ధారుణినాథ! యా - ధర్వణమంత్ర
వారముల్ గలవంచు - వలనఁ జేయింతుఁ1490
బుత్రకామేష్టి యి - ప్పుడ యందువలన
బుత్రులఁ బడయుము - పుణ్యవర్తనుల
ననుచు బుఁత్రేష్టి సే - యఁగ హోమకుండ

మొనరించి వహ్ని నా - హుతు లిచ్చునపుడు
పావనతరహవి - ర్భాగంబులకును
దేవతల్ గగనవీ - థిని వచ్చి నిల్చి
సమయంబుగావున - సకలలోకేశు
కమలసంభవుఁ జూచి - కదిసి యిట్లనిరి.

-: దేవతలు బ్రహ్మతో సంభాషించుట :-

దేవ! నీవరములొం - దిన కావరమున
రావణుం డఖిలవి - ద్రావణుం డిపుడు1500
యక్షులం దోలి వి - ధ్యాధరావళిని
శిక్షించి దివి - జులం జీకాకుచేసి
పన్నగకోటుల - బాధించి గరుడ
కిన్నర శ్రేణులం - గీడ్పడందరిమి
గంధర్వులనుఁ గొట్టి - ఖచరుల నణఁచి
బంధురోన్నతిని ది - క్పాలుర గెలిచి
గర్వాంధుఁడై కన్ను - గానక యెందు
సర్వంకషంబై న - సాహసోద్ధతిని
నందనకాననాం - తరపారిజాత
చందనకల్పక - చ్ఛాయలయందు1510
మేలఁగెడు దేవతా - మీనలోచనలఁ
జలమున జెఱవట్టి - సనియె లంకకును.
అతనియాజ్ఞ చలింప - నంబుధి వెఱుచు
వెతల రాపడి గాలి - విసరంగ వెఱచు
నాళీకమిత్రుఁ డెం - డలుగాయ వెఱచు
కీలి నాలుకలు మి - క్కిలిఁజాఁప వెఱుచు

వెఱతు రందఱు మమ్ము - వెఱవకు మనెడు
దొర లెందు లేరు నీ - దు పదంబులాన
కావు మ మ్మనవిని - కమలాసనుండు
దేవతలకుఁ గృపా - దృష్టి నిట్లనియె.1520
ఏగల్గియును - వెరపేఁటికి నింక?
లోఁగునే మీకుఁ ద్రి - లోకకంటకుఁడు
వరములు నాచేత - వాఁ డొందునపుడు
నరులఁ దలంపఁడు - నాసముఖమున
నందుచే నిలమాన - వావళిచేత
బొందువాఁ డపజయం - బు నిజంబు గాఁగ
మనుజులకునుఁ దర - మా! వాని గెలువ
వనమాలి మనుజుఁడై - వచ్చినఁగాక
శరణుచొత్తము పంక - జవిలోచనునకు
కరుణింప రక్షింప - గర్తయె యొకఁడు1530
ననుచు నందఱు భావ - నాయత్తులగుచు
కనుఁదామరలతోడఁ - గరములు మొగిచి
తలఁచినంత సమస్త - దాసకోటులకు

-: దేవతలప్రార్ధనమున విష్ణువు మనుష్యావతార మెత్తుట :-

సులభుఁడైనట్టి కౌ - స్తుభవిభూషణుఁడు
శ్రీమించురత్నకి - రీటంబుతోడ
చామననెమ్మేని - చందంబుతోడ
వర్ణితదరహాస - వదనంబుతోడ
కర్ణకుండలవిభా - కళికలతోడ

కరములు శంఖ చ - క్రంబులతోడ
నురముమీఁద వసించు - నొయ్యారితోడ1540
గ్రైవేయమణిమయాం - గదములతోడ
సౌవర్ణకటితటి - శాటికతోడ
హారకంకణమేఖ - లావళితోడ
కారుణ్యరసవిలో - కనములతోడ
భువనపావనపదాం - బుజములతోడ
రవికోటిశతభాసు - రద్యుతితోడ
మెఱుఁగుఱెక్కలతోడి - మేరువుమీఁద
మెఱుపులతో నీల - మేఘమో యనఁగ
వైనతేయస్కంధ - వర్ణితపీఠి
దీనకోటులభాగ - ధేయమౌ నతఁడు1550
అరవిందభవముఖ్యు - లగు వేలుపులకు
హరిసర్వమయుఁడు ప్ర - త్యక్షమై నిలచె.
నిలిచిన నింద్రాది - నిర్జరు లజుఁడు
సలలితభక్తితో - సాగిలి మ్రొక్కి
నాళీకనయన! య - నంతశయాన!
నీలనీరదగాత్ర! - నిత్యకల్యాణ!
కరుణాసముద్రశా - ర్ఙ్గగదాసిభరణ!
శరణాగతత్రాణ - శరనిధివాస!
సాధురక్షణ! భక్త - జనపారిజాత
మాధవ! దానవ - మదనిరాకరణ!1560
నారాయణ! యనాథ - నాథవిశ్వాత్మ
ధారుణీభారని - స్తారకదేవ!
శరణుచొచ్చితిమి నీ - చరణాబ్జములకుఁ

గరుణింపు కావుము - కావుము మమ్ము
నభయదాన మొసంగి - యార్తులఁ జూచి
సభయుల రక్షించి - జగతి వాలింపు
రావణకుంభక - ర్ణనిశాటవరుల
లావుచే జగము లె - ల్లను దీలుపడియె
నీచేతఁగాని య - న్నీచులం దునియ
నోచక్రి! యెవ్వరు - నోప రెయ్యెడల1570
మానిమిత్తంబుగా - మానవాకృతిని
మానితపుణ్యుఁడౌ - మనువంశనిధికి
నీదశరథునకు - హ్రీ శ్రీ సుకీర్తు
లీదేవులనమించు - నృపుని కాంతలకుఁ
బుట్టుము నాల్గురూ - పుల మాకు మాట
పట్టిమ్ము సకలభూ - భారమ్ము మాన్పు
యక్షగంధర్వవి - ద్యాధరాదులను
రక్షింపు త్రిభువన - రక్షఁ గావింపు.
నీవె ది క్కనవుడు - నిండినకరుణ
నావేలుపులపై క - టాక్షంబు నిలిపి 1580
యందఱు విన దర - హాసముఖార
విందుఁడై యపుడు గో - విందుఁ డిట్లనియె.
ఇచ్చితి వరము లిం - తేల చింతిల్ల?
వచ్చితి మిముఁ గావ - వలసి యిచ్చటికి
దశరథసుతుఁడనై - ధరణి జన్మించి
దశకంఠుఁ బుత్రమి - త్రయుతంబు గాఁగ
దునుముదు మిమ్ముఁ గా - తును విచారములు
మనముల మాని నె - మ్మదినుండుఁ డనుచు

నంతర్హితుండయ్యె - నపుడు భూపాలుఁ
డెంతయుఁ బుత్రకా - మేష్టి గావింప.1590

-: దశరథునకు ప్రాజాపత్యపురుషుఁడు పాయసము నిచ్చుట :-

వలమానశిఖలతో - వహ్ని తీండ్రింప
నలఘుతేజుండు మ - హాపురుషుండు
నల్లనివాఁడు లే - నవ్వు వెన్నెలలు
చల్లెడువాఁడు వి - శాలనేత్రుండు
బలవంతు డరుణితాం - బరుఁడు కెమ్మోము
గలవాఁ డుదాత్తశం - ఖధ్వనివాఁడు
రుచిరకేసరి తనూ - రుహసటజాలుఁ
డుచితాభరణలక్ష - ణోపేతమూర్తి
పర్వతాకారుఁడు - పావకతపన
సర్వస్వతేజోవి - శాలుఁ డుత్తముఁడు1600
గంభీరయానుఁ డొ - క్కఁడు వచ్చి శాత
కుంభభాజనము గై - కొని దానినిండ
పాయసాన్న మమర్చి - పత్ని జేఁపట్టి
మాయగాపతివచ్చు - మార్గంబుఁదోఁప
చుట్టును వెండియం - చు లమర్చుపసిఁడి
మిట్టపళ్ళెరమున - మెఱయు పాయసము
కొమ్మిది యజుఁడు నీ - కు నొసంగుమనియె
నిమ్ము నీపట్టపు - టింతుల కెల్ల
యిది దేవనిర్మితం - బిదిపుత్రలాభ
మొదవించు నిదియె య - భ్యుదయకారణము1610

సేవింపనిమ్ము నీ - సీమంతినులను
భూవర! కనుము స - త్పుత్రలాభంబు
అనిన దగ్గిన లేచి - యంజలిచేసి
జననాయకుఁడు పాయ - సపుఁబళ్లెరంబు
రెండుచేతుల నంది - ప్రీతిఁ జండాంశు
చండప్రకాశవి - శాలుఁడై నిట్టి
ఘనునకు తావల - గా వచ్చి యతఁడు
కనుచాటునొంద - వేగమున దివ్యాన్న
సంపూర్ణకనకభా - జనము భారమున
వంపూగాతనకర - వారిజయుగము
చంద్రదీధితి నాక - సంబొప్పురీతి
చంద్రాననాముఖ - చంద్రరోచులును
పొలుపగు తన యంతి - పురమున కేఁగి
యలరుఁ గౌసల్య క - య్యన్నంబు సగము
నిచ్చి యున్నసగంబు - నిరువాగు చేసి
యిచ్చె సుమిత్ర కం - దేకభాగంబు
కడమయన్నము రెండు - గాఁ బంచి యొకటి
యిడియెఁ గైకేయి కి - ట్లిచ్చి శేషించు
పాయసాన్నాష్టమ - భాగంబు మఱియుఁ
జేయి చాపంగ ని - చ్చెను సుమిత్రకును.
దివ్యతేజోబలా - ధికపాయసంబు
లవ్యాహతము లింతు - లట్లు భుజించి
గర్భముల్ దాల్చినం - గని రాజమణికి
నిర్భరానందంబు - నివ్వటిలంగ
నమరావతీపురం బ - మరేంద్రుఁడేలు
క్రమమున సంతోష - కలితుఁడై యుండె.

-: దేవతలయంశమున వానరాదులు పుట్టుట :-

హరిపుట్టునట్టికా - ర్య మెఱింగి దాత
గరుడవిద్యాధర - గంధర్వసిద్ధ
చారణయక్షఖే - చరకిన్నరులను
స్వారాజుముఖదేవ - సమితి నచ్చరల1640
నందఱఁ జూచి మీ - యంశంబులందు
నందితసత్వస - న్నాహులం గపులఁ
బుట్టింపుఁ డే మున్నె - పుట్టించినాడ
నెట్టుక జవసత్త్వ- నిధి జాంబవంతు
నన నట్లకాకని - యంగదజనకు
ఘనువాలి నింద్రుఁడు - గల్పించె మొదట
తపనుండు సుగ్రీవు - తారుని గురుఁడు
నపు డనలుఁడు నీలు - నలవిశ్వకర్మ
నలుని నశ్వినుల మైం - దద్వినిదులను
జలదిరాజు సు - పేణు శరభాంగు శరభు1650
పర్జన్యు డలకాది - పతి బాహుబలస
మర్జితుండగు గంధ - మాదను ధీరు
నురుసత్త్వవజ్ర - కాయుని మనోవేగ
గరుడుని మేరు శం - కాశశరీరు
రుద్రతేజునిఁ గామ - రూపసంచారు
భద్రాత్ము హనుమంతుఁ - బవనుండు గాఁగఁ
బొడమించి రున్నవే - ల్పులు గల్గఁ జేసి
రడవులయందు ని - జాంశవానరుల
నందఱుఁ జవశాలు - లందరు ధీరు
లందరు గామరూ - పాతివిక్రములు1660

 
గోపుచ్ఛములు నెలుం - గులు వానరములు
సౌపూర్ణసత్త్వాడ్యు - లరిజయోన్నతులు
శైలభూరుహనఖ - శస్త్రాస్త్రదంత
వాలాయుధులు భూమి - వ్రయ్యలు సేయ
జలధులు గలఁప న - క్షత్రముల్ రాల్పఁ
గులగిరు లగలింపఁ - గుప్పింప శరధి
మిన్నుల నెగయంగ - మిహిరు గ్రహింప
నన్నిట నేర్పరు - లావనేచరులు
వాలిని సుగ్రీవు - వాలితనూజు
గాలిపట్టిని తారు - గంధమాదనుని1670
నలుని సుషేణు మైం - ద ద్వివిదులను
కొలిచి కొండలు పనుల్ - గుహలును దరులు
సంకేతములు గాఁగ - జగమెల్ల నిండి
యంకిలి లే కద - శాసనహరణ
కారణుండగురామ - కార్యనిర్వహణ
భారకులగుచు న - ప్పగిదినున్నంత.

-: శ్రీమద్రామచంద్రావతార ఘట్టము :-

కరమర్థితోఁబుత్ర - కామేష్టియందు
పరగ వేల్పులు హవి - ర్భాగంబు లంది
యందరుఁ దమయిచ్చ - నరిగినయంత
పొంది నయోధ్య య - ప్పుడు దశరథుఁ1680
అంగరాజ్యమునకు - నబలతో ఋశ్య
శృంగుఁడు చనియె మ - హీశుండు వనుప
రాజులందరు దశ - రథుఁ డంపఁజనిరి.

రాజసంబున నిజ - రాజ్యంబులకును
నాత్మవొంగఁగఁ జేరె - నమ్మహీనాథుఁ
డాత్మగేహినులతో - నంతపురంబు
జనపతి యంత పుం - సవనాదికంబు
లెనయువేడుకఁజేసి - యెదురులు చూడ
నెల లొకపండ్రెండు - నిండంగ దాల్చి
సులలితమధుమాస - శుక్లపక్షమున1690
నవమిఁబునర్వసూ - నక్షత్రమునను
ప్రవిమలబుధవాస - రమున నుచ్చమున
గ్రహములై దుండఁ - గర్కటకలగ్నమున
నహమునం జంద్ర బృ - హస్పతుల్ గూడి
యుదయించి శుభ - దృష్టినుండఁ గౌసల్య
సదయాత్ము శ్రీరామ - చంద్రునిం గనియె,
దివ్యలక్షణయుతు - దేవతానాథు
నవ్యయు నింద్రు న - య్యదితి గన్నట్లు
సర్వగుణాఢ్యుఁ బు - ష్యమునఁ గై కేయి
సర్వేశ్వరాష్టమాం - శంబున భరతు1700
లాలితంబుగ మీన - లగ్నంబునందు
భూలోకమందారుఁ - బుణ్యాత్ముఁ గనియె
శ్రీమించునట్టి యా - శ్లేషకర్కటక
నామలగ్నంబున - నలినబాంధవుఁడు
నుచ్ఛస్థితుండయి - యుండ సుమిత్ర
సచ్చరిత్రులను ల - క్ష్మణుని శత్రుఘ్నుఁ
గనియెను చుక్కల - కరణితేజమునఁ
దనిరి రుజ్జ్వలరూఢి - దశరథాత్మజులు

ఆవేళ భువినిండె - నలరులవాన
దేవతాదుందుభుల్ - దివినెల్ల మొరసె1710
పాడిరి గంధర్వ - భామినుల్ మింట
నాడిరి లాస్యంబు - లప్పరాంగనలు
మలసె వాసనలతో - మలయమారుతము
వెలసె వేలుపుల దీ - వెన లాకసమునఁ
బురజను లానంద - మునఁ దేలిరపుడు
ధరణీశుతపము నెం - తయు నిండఁబండె
పొంగెను విల్లెత్తు - పొడవు ధరిత్రి
మంగళాలంకారమయ - మయ్యెఁ బురము
దశరథుఁ డపుడు గో - దానసహస్ర
దశతులాపూరుషా - ద్యము లొనరించి1720
భూరిసువర్ణముల్ - భూరిగా నొసఁగి
పౌరులు ద్విజులు తె - ప్పలఁ దేలనిచ్చి
సేమంబున వసిష్ఠు - చే జాతకర్మ
నామక్రియాదులు - నడపించి యతఁడు
తనయులు నలువురు - ధార్మికాగ్రణులు
జనలోకవినుతు లా - జానుబాహువులు
చక్కనివారు వి - శాలలోచనులు
మిక్కిలిమగటిమి - మించినవారు
సత్యసంధులు సర్వ - సములుఁ బుణ్యాత్ము
లత్యుదారులు విన - యవివేకపరులు1730
వారలందఱిలోన - వర్ణింపరాదు
శ్రీరాముగుణము లా - శేషునకైన

రథములమీద సార - థుల మెచ్చింప
బృథులాశ్వముల - నెక్కి యెన్నికకెక్కఁ
గరివరారోహసంగ - తులఁ జరింప
వెరవుతొ కానల - వేఁటలాడంగ
గరిడీలు సాదనల్ - గావింప వెంట
దొరలు రా వాహ్యళిఁ - దులకించి మఱల
నెరవాదులయి కవల్ - నెమ్మితో గూడి
సరవితో రామల - క్ష్మణు లొక్కజతయు1740
భరతశత్రుఘ్ను లే - ర్పడి యొక్కజతయు
నొరిమతో నన్యోన్య - ముద్దులు గూడి
వెలయుచో సౌమిత్రి - విలువిద్య పేర్మి
సలలితపితృభక్తి - సమతానిరూఢి
పెనుపొంద రాముపై - పిన్నటనాఁట
మునుకొని నెయ్యంబు - మొలపించు మదిని
రామచంద్రుఁడును ని - ద్రల భోజనముల
సాముల చదువుల - సవరణలందు
నీరాడునెడఁ జాల - నెనరువాటిల్ల
నారసితనయట్ల - ననుజునినడపు.1750
ధరణీశ్వరుం డిట్టి - తనయులఁ గూడి
హరిదేవతలతోడ - నమరినజాడ
సకలలోకములకు - స్వామియౌ నజుని
యకలంకసంతోష - మనుభవింపుచును
తనయుల కెల్ల ను - ద్వాహముల్ సేయ
తనగురుండునుఁ దానుఁ - దలంపుచున్నంత.

-: దశరథునికడకు విశ్వామిత్రుఁడు వచ్చుట :-

యిచ్చమీదటికార్య - మెల్ల నెఱింగి
వచ్చె నచ్చటికి వి - శ్వామిత్రమౌని
దౌవారికులతోడ - తనవచ్పు రాక
యావేళ నెఱిఁగింపుఁ - డన వారు భీతి1760
విన్నవించెను మహీ - విభుఁడు తానున్న
యున్నతాసనము కా - లూఁదక డిగ్గి
యింద్రుండు బ్రహ్మకు - నెదురేఁగుమాడ్కి
సాంద్రభక్తిని వసి - ష్ఠసమన్వితముగ
గాధేయుకడ కేఁగి - కాంచి యమ్మునికి
సాధువైఖరి నమ - స్కారం బొనర్చి
యతిభక్తి నర్ఘ్యపా - ద్యంబు లొసంగ
అతఁ డమ్మహిపాలు - నాశీర్వదించి
“సేమమే రాజ! వ - సిష్ఠభద్రంబె?
భూమీశ! లెస్సలె - పుత్రుల కెల్ల?1770
కుశలమే? నీ రాష్ట్ర - కోశంబులకును
దిశలభూవరులు వి - ధేయులే నీకు?
సుఖమె మీప్రజలకుఁ - జుట్టంబులకును?
సఖులెల్ల నానంద - సహితులైనారె?
పరిణామమా నీఁదు - పడఁతులకెల్ల?
దొరసియుందు రెగడి - దొరలు నీయాజ్ఞ
సామంతు లెపుడు - చనువుగోరుదురె?
నేమముల్ నడుచు - నే నీయాశ్రితులకు?
నడపుదే రాష్ట్రకంట - కశోధనంబు?
కడతేర్చినావె సం - గరమున రిపుల?1780

మాననీయమె ధర్మ - మార్గంబు? దేవ
మానుషకర్మముల్ - మఱినడుపుదువె?”
అనిన "నీదయ చేత - నంతయు లెస్స"
లని యందరును స - భాయతనంబు చేరి
యున్నతాసనముల - నుచితవైఖరుల
మున్ను వసిష్ఠు న - మ్మునిరాజు నునిచి
యారాజు సింహాస - నారూఢుఁ డగుచు
గౌరవంబుగఁ జూచి - కౌశికుఁ బల్కె.
"భోరున నిర్జల - భూమినిఁ గురియు
ధారాళమగునమృ - తపువానరీతి1790
తగినదంపతులకుఁ - దనయులుగలిగి
యగణితసంతోష - మందించినటుల
యెన్నేనినాళ్లఁబో - యినసొమ్ముమఱల
కన్నులముందరఁ - గనుపించుకరణి
కొరికతారేఁగి - కొలుచునవ్వేల్పు
వారక యెదురుగా - వచ్చినమాడ్కి
మునినాధ! నామనం - బునకు నీఁరాక
యనుపమసంతో - ష మందించె నిపుడు.
ఎంతకల్యాణ మ - య్యెను నేటిదివస
మింతటి వేడుక - యెట్లు వాకొందు1800
ఫలియించె నాదు త - పంబులన్నియును
సులభంబుగా మిమ్ముఁ - జూడంగఁగల్గె
యేనుసేసినభాగ్య - మెవ్వరుఁ జేయ
రానందమగ్నుం - డనైతి నివ్వేళ
రాజర్షి వయ్యును - బ్రహ్మర్షి వైతి

నే జటీంద్రులకై న - నీశక్తిగలదె?
నీవువచ్చుటఁ జేసి - నేఁడునాభూమి
పావనంబయ్యెనా - భాగ్యవైఖరిని
నాకేశవందిత! - నాకిట్టిమేలు
చేకూరఁదలఁచి వి - చ్చేసితిరిటకు1810
నేమి వేడిననిత్తు - నెటుసేయుమనిస
తామసింపకొనర్తు - తప్పదీమాట
అవుగాము లెన్నక - యనుమానముడుగి
ప్రవిమలాత్మకనన్నుఁ - బనిగొనుమిపుడు.
అనుచువీనులకు నా - త్మాంబుజంబునకు
ననురాగకరమైన - యధిపతిమాట
వినివసిష్ఠాదులు - వినుచుండవేఁడు
జననాధుఁజూచి వి - శ్వామిత్రుఁడనియె.

—: రామునిఁ దనతోఁగూడఁ బంపుమని విశ్వామిత్రుఁడు దశరథు నడుగుట :—



“ఈమాట పలికితి - విక్షాకుతిలక!
యేమహీశులు సాటి - యేనిన్నుఁబోల్ప 1820
బుద్ధిమంతుడ వె - పుడునువసిష్ఠు
బుద్ధియామీద నె - ప్పుడునీకుఁదొడవు
పలికినపలుకు త - ప్పకసత్యకీర్తి
నిలుపుముసూనృత - నిరతుండవగుము
యూగంబొనర్చెద - ననుదైత్యులుసాగనీక
మాంసలచిత్తులై - మదిఁగ్రొవ్విర క్త
మాంసముల్ సవన ని - ర్మలవేదియందు

కురియింపుచున్నారు - కోపించి వారి
బొరిగొనఁజాలుదుఁ - బొలిపోవుతపము 1830
ననియెంచివారిపై - నలిగి శపింప
మినిరామునిదియేని - మిత్తంబుగాఁగ
తొడుకొని చను బుఁ - ద్ధితో వచ్చినాఁడ
కొడుకనిచూడక - కువలయాధీశ!
కరుణాభిరాము సం - గర రంగభీము
నరవిందహితధాము - నతిపుణ్యనాము
వరగుణైకలలాము - వైరివిరాము
చిరయశోధనకాము - శ్రీరాముఁగూర్చి
అనుపుమునావెంట - నాత్మీయ తేజ
మునఁగాతు నతని న - మ్ముము నాదుపల్కు 1840
చంపింతు నతనిచే - సవనఘాతకుల
సంపూర్తి గావింతు - సవనంబు నేను
ముల్లోకమునకీర్తి - మొనయింతునీకు
నెల్లసంతోషంబు - లీయఁఁజాలుదును
రామునిచేఁగాని - రాక్షసులితర
సామాన్యనృపులచే - చాయకురారు
పాపాత్మకులు కాల - పాశసంయుక్తు
లీపుణ్యుచేగాక - యేలత్రుంగుదురు
పుత్రమోహముమాని - భూప! నీ జ్యేష్ఠ
పుత్రునినావెంటఁ - బొమ్మనిపనుపు 1850
యేనెఱుంగుదు నిది - యీవసిష్ఠాదు
లైనపెద్దల కభి - వ్యక్తమిత్తెఱఁగు
వేఱొండుతలఁపులు - విడిచినావెనుక

మీరామునంపించు - మీ యనిపలుక
ధర్మార్థకామహి - తంబులౌ పరమ
ధార్మికుండైనయా - తపసిపల్కులకు
శోకంబుభయమును - సోఁకనేమియును
వాకొనలేక భా - వముపల్లటిల్ల
మ్రానురీతి మూహుర్త - మాత్రంబునిలచి
మేనువడంకయే - మియుఁ దెల్విగాక 1860
ఊరక తానుండి - యొకకొంతఁ దెలిసి
యీరెలుంగున నమ్ము - నీంద్రునకనియె.

—: విశ్వామిత్రునివెంట రాముని బంపుటకు దశరథుఁడు చింతిల్లుట :—



"యేమిపల్కుదు? బది - యేనేండ్లవాఁడు
రామచంద్రుండు సా - రసవిలోచనుఁడు
యేజాడనంపుదు - యేఁజూచిచూచి
రాజధర్మముల నే - రఁడు పోరొనర్ప
అక్షోహిణీబలం - బతిశౌర్యసార
మక్షయం బదిగొల్వ - నరుదెంతునేను
నావారునేనుదా - నవులఁ ద్రుంపుదుము
పావనాత్మ ! శరీర - పర్యంతమునకు1870
యాగంబునెఱువేర్తు - నప్పసిబిడ్డ
యాగడంబులుగాక - యని సేయఁగలఁడె?
చిప్పకూఁకటులనా - శ్రీరామచంద్రు
నొప్పునే పట్టి దై - త్యులపాయఁద్రోయ
వివిధమాయోపాయ - విధులు రాక్షసులు

 
దివిజులనైన సా - ధింపనోపుదురు
అట్టి వారల గెల్చు - నని రామచంద్రు
నెట్టువేడితిరి? నో - రెట్లాడెమీకు?
జగడంబులెఱుఁగునో - స్వబలంబు తెఱఁగు
పగవారిబలమని - పరికింపఁగలఁడొ1880
బాలుఁ డస్త్రకళాప్ర - భావంబు లెఱుఁగఁ
డేలయ్య నీబుద్ధి - యీచందమయ్యె?
నేరాము నెడబాసి - నిమిషమాత్రంబు
నేరుతునె మేన - నిలువఁబ్రాణముల
రామచంద్రుఁడెనాదు - ప్రాణంబు రాముఁ
గామించుబలము ని - క్కమయేని నీకు
యేనునాసైన్యంబు - లెల్లనువెంట
మౌనీంద్రవత్తునీ - మఘముచెల్లింతు
నరువదివేయేండు - లాత్మజుల్ లేక
దరిద్రొక్కియున్నయి - త్తరిఁబుత్రులనుచు1890
కలిగినారిందులొ - కల్యాణశీలుఁ
డలరాముఁడొకఁ - డె నాప్రాణాధికుండు
యెవ్వరారాక్షసు - లెవ్వాఁడుపనిచె?
నెవ్వనితనయులా - హీనమానసులు?
నేపాటివారు వా - రేర్పడఁబల్కు?
నీపూన్కినెరవేర్తు - నిజముగాననిన"
నతనిమాటలువిని - యలఁతినవ్వొలయ
క్రతురక్షణార్ధియౌ - గాధేయుఁడనియె,
"లోకకంటకుండు త్రి - లోకభీకరుఁడు
ప్రాకటజయశాలి - రావణాసురుఁడు1900

బ్రహ్మవరంబునఁ - బ్రబలినవాఁడు
బ్రహ్మసంతతివాఁడు - పరమసాహసుఁడు
ప్రౌఢయశుండువి - శ్రవసునందనుఁడు
రూఢిమీఱఁగఁ గుబే - రునికినగ్రజుఁడు
నాసవనంబు వి - ఘ్నము సేయఁగర్త
యాసురారాతి - నానాసురభర్త
నతని పంవునవచ్చి - నట్టిదుర్జయులు
ప్రతిభమారీచ సు - బాహులన్వారు
దశరథభూప! యా - దానవాధములు
దశరాత్రసవనమేఁ - దలకొనిసేయఁ1910
జేతురు విఘ్నముల్ - శ్రీరాముఁ బనుపు
మీతఁడొక్కఁడు సమ - యించువారలను."
అవివిని గుండియ - యవిసి శరీర
మవశంబుగా నాల్క - నటతడి లేక
నడుములువిఱిగి దై - న్యంబుతో మెడలు
వడి కౌశికమునీంద్రు - పదముల వ్రాలి,
"బ్రదికింపవయ్య యో - పరమమునీంద్ర!
యిదె తనూభవదాన - మీవయ్యతండ్రి
తల్లియును గురువునుఁ - దండ్రిదైవంబు
లెల్లరునా పాలికీఁ - వె నిక్కువము1920
రావణునకునంద - రమువణంక్కుదుము
నేవెరతును రాము - ని గణింపనేల?
మనుజులనెల్లనో - మనఁబూఁపలట్లు
కనిమ్రింగువాని నే - గతి గెల్వవచ్చు?
కాలుండువానితోఁ - గలహింపవెఱచు

కాళియైననువానిఁ - గనియోడిపరచు
వానిపంపునఁబూని - వచ్చినవారు
సూనుల సుందోప - సుందదైత్యులకు
నేమెల్లనోపుదు - మే వారిఁజెనక
మాముందరసుబాహు - మారీచులనుచుఁ1930
బలుకకుఁడొకఁడైన - బలముతోఁ గూడి
చలమునం బోరుదు - సాధింతువాని
నెటులైనమేలునీ - వింక్కిటమీద
జటి వర్య! మారామ - చంద్రునిమాట
తలఁపకు” మనవుఁడు - దశరథవిభుని
పలుకులకునునెయ్యి - పై వేల్చునపుడు
భగ్గునమండిన - పావకురీతి
దిగ్గునలేచిగా - ధేయుఁడిట్లనియె.

 -: వసిష్ఠుఁడు విశ్వామిత్రుని మహిమ రామునకుఁ జెప్పుట :-

తగునయ్యయిటులాడి - తప్పరాఘవుల
కగునయ్య యిటువంటి - యనృతవాదంబు 1940
నీచేత నీకార్య - నిర్వాహభ క్తి
చూచికాదనిన - చో సూయేమిగొఱఁత
మంచిది యిందుచే - మాకేమి మ్రోయఁ
గాంచెదు నాదు యా - గముచిక్కువడిన
నెఱుఁగకయున్నా - రమే వచ్చినట్టి
తెఱవుమీకేమిం - తతీరనిపనియె.
చుట్టాలునీవును - సుఖముననుండు
పట్టభద్రుండవై - పదివేలువచ్చె

రాముని మేమునే - రక తలంచితిమి
మామీదినేరంబు - మదిసహియింపు1950
మనునంత గడగడ - నల్లాడె ధరణి
వనధులు పిండలి - వండుగాఁగలగె
జలజలరాలె న - క్షత్రగణంబు
కలఁగి భీతిల్లి ది - గ్గజములు మ్రొగ్గె
గ్రక్కుననెల్లెడఁ - గావిరుల్ గప్పి
దిక్కులన్నియును వి - దిక్కులై తోఁచె
నావేళభానువం - శాచార్యుఁడైన
ధీవిశాలుఁ డరుంధ - తీప్రాణవిభుఁడు
మౌనికోపము రాజు - మాట తెఱంగు
పై నగుకార్యంబు - పరికించి పలికె.1960
“భూమీశ! మీవంశ - మున రాజులెల్ల
తాముపల్కిన మాట - తప్పరెవ్వరును
ధర్మస్వరూపుఁడు - దారమానసుఁడు
ధార్మికాగ్రణి చిరం - తనతపోరాశి
యితనితోమును మించ - నిందఱువినఁగ
ప్రతినలుచేసి ద - బ్బరలాడనగునె?
వలదీ యధర్మప్ర - వర్తనంబింత
సులభుఁడే మనకు నీ - సుజ్ఞానధనుఁడు
చేసెదనని పల్కి - సేయనివాఁడు
చేసినయట్టియ - శేషపుణ్యములు1970
బూదిలో హోమమై - పొలియుఁ గావునను
కాదుసుమీ మీఱ - గాధేయునాజ్ఞ
పావకపరిధిచేఁ - బదిలమై, యరిభ

యావహంబగునట్టి - యమృతంబురీతి
నీమునివెంటబో - యిన నెల్లనాడు
రామునికేల కొ - ఱంతరానేర్చు?
యకృతాస్త్రుఁడైన నీ - యనపంపువలన
సకలశాత్రవులను - సమయింప నేర్చు
పనుపుమీ కౌశిక - పరిపాలితునకు
మనరామునకు సామ్య - మా? జగత్రయము1980
యీమౌనివరువెంట - నేఁగినజాలు
రాముతోనెదురువా - రా? నిశాచరులు
శౌర్యోన్నతుఁడు సత్య - సంధుఁడత్యంత
ధైర్యమానసుఁడుశాం - తత వివేకధనుఁడు
ననఘుఁడు దివ్యశ - స్త్రాస్త్రకోవిదుఁడు
ఘనతరబుద్ధిమా - ర్గవిశారదుండు
కౌశికుఁడటె రక్ష - గావించువాఁడు
ధీశాలి మరి కలఁ - డే విచారింప
గరుడగంధర్వరా - క్షస యక్ష ఖచర
సుర సిద్ధ చారణ - స్తోమంబునందు1990
తెలియరెవ్వరును గా - ధేయుదివ్యాస్త్ర
బలము భృశాస్యుని - భార్యలైనట్టి
జయయు సుప్రభయు ద - క్షతనూజ లట్టి
దయితల యందు పు - త్రశతంబుగాంచె
నొక్కొక్కసతియందు - నొకయేఁబదేచేసి
లెక్కఁబుత్రకులు గ - ల్గిన, భృశాస్యునకు
జయకు నేఁబది మహా - స్త్రములు ప్రయోగ
నియతంబునై యుండు - నిఖిలయుద్ధముల

నుపసంహరింపంగ - యోగ్యంబులయ్యె
నపుడుసుప్రభ గాంచు - నన్నియస్త్రములు 2000
నివియెల్లనేరుచు - నీకౌశికుండు
వివిధంబు లితరాస్త్ర - విద్యలు నెఱుఁగు
నేరుపు నిన్నియు - నీకుమారునకు
శ్రీరాము నిమ్ముని - సింహునకిమ్ము
వలసినయపు డపూ - ర్వములుగల్పించు
దెలియ రెవ్వరును గా - ధేయుని మహిమ
యీతండు విల్లందె - నేని దేవతలు
భీతిఁబాఱకదండ - వెట్టంగ లేరు
వచ్చెను కీర్తిదే - వలసియిచ్చటికి
నిచ్చెదనని బొంక - నెట్లగునీకు2010
ననుమానములుమాని - యనుపు శ్రీరాము
జననాథ! లక్ష్మణ - సహితంబుగాఁగ
బిలిపింపు" మన గురు - ప్రియవచనములు
తలమీఁదనుంచి సం - తసమంది రాజు

 -: రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంటనడుచుట :-

రప్పించుటయు రఘు - రాముండు ముదము
ముప్పిరిగొనఁగ త - మ్ముఁడుఁ దానుఁగదలి
తల్లులకెల్ల వం - దనములుచేసి
తెల్లముగా వారు దీవెనలొసఁగ
వామదేవాదులు - వలగొని మ్రొక్కి
సేమమౌ వారియా - శీర్వాదములను2020
చేరితండ్రికి మొక్క - చిన్ని బాలకుల
గారాముతో నెత్తి - కౌఁగిటఁ జేర్చి

కన్నుల బాష్పాంబు - కణములురాల
నన్నువబిడ్డల - నంకపాళికల
ముద్దాడిశిరములు - మూర్కొనిమమత
కొద్ది కన్నులఁజూచి - కూఁకటుల్ దువ్వి
యిరువురచేతులు - నిరుగేలఁబట్టి
నరపతి గాధేయు - నకు నొప్పగించె.
తనకుమ్రొక్కినయట్టి - దశరథుపట్టి
గని వసిష్ఠుఁడు రాము - కరముల నిమిరి2030
సకలాంగరక్షకై - చాలమంత్రించి
యకలంకమతిగొల్వుఁ - డనిపనుచుటయుఁ
కైకొనివారలఁ - గౌశికుఁడమర
లోకంబునకు నాత్మ - లోఁదీఱె భయము
శుభశకునంబులు - చూచుచు రామ
విభుఁడువెంబడిరాఁగ - వెనకలక్ష్మణుఁడు
కవదొనల్ జోడుసిం - గాణులు దాల్చి
యవిరళప్రీతి పం - చాననుండైన
శేషునికైవడి - చెలువొప్పువారి
వేషముల్కన్నుల - విందొనరించె.2040
అసములు బద్దగో - ధాంగుళీత్రాణు
లసిధరుల్ కాకప - క్షాంచితులగుచు
నల యజుంగని కొల్చు - నశ్వినులనఁగ
నలరి రమ్ముని వెంట - నక్కుమారకులు
శంకరు వెనకవి - శాఖకుమారు
లంకిలి లేక పా - యకకొల్చు రీతి
అర్థయోజన మాత్ర - మరిగి రాజన్య
మూర్థన్యుతోడ న - మ్మునియిట్టులనియె,

-: విశ్వామిత్రుడు రామునకు బలాతిఁబలలను విద్యలనిచ్చుట :-

"తామసింపకుఁడు చే - త జలంబులంది
యామేరసంధ్యశు - ద్ధాచమనములు2050
చేయుఁడుమీరన" - చెప్పినయట్ల
సేయువారలఁజూచి - చిరతపోధనుఁడు
సకలమంత్రక్రియా - స్పదములై యెలమిఁ
బ్రకటించుబల యతి - బలయునావెలయు
నుత్తమంబగువిద్య - లుపదేశ మొసఁగె.
అత్తరి భావికా - ర్యంబు లూహించి
యా రెండువిద్యలు - నాకలిడప్పు
లేరాక్షసులమాయ - లిచ్చలభయము
మఱపులు రావని - మహిమముల్ దెలిపి
“సరిలేరుమీకుభు - జాశౌర్యములను2060
నతులంబులై నవి - ద్యలు నేర్చుకతన
సతతవిజ్ఞానవా - ననఁబాయకుండు
పుట్టెనీవిద్యలం - భోజగర్భునకు
పట్టఁగా దెల్పితి - పాత్రముల్ గాన
తలఁచు కార్యముల సా - ధనములన్నిటను
వెలయుఁడిందుల లోక - వినుతవర్తనల"
ననుచునాదేశింవ - నమ్మంత్రయుగము
వినివారు నేర్చి భా - వించి కౌశికుని
గురునిఁగానాత్మఁగై - కొనిసేయవలయు
పరమశిష్యవిధాన - పరిచర్యసేసి

రామచంద్రుండు శ - రత్కాలతపన
రామణీయకమహో - రాశియైమించె
ఆరాత్రి సరయూత - టావనియందు
నారాఘవులును మ - హాతపోనిధియు
దృణశయ్య లందు ని - ద్రించివేగుటయు
గుణశాలియాకౌశి - కుఁడు కోసలేంద్ర
కన్యకాగర్భము - క్తాఫల! రాగ
దన్మయతను ప్రభా - తంబయ్యెనిపుడు
తావితో నురలుబృం - దారకాస్యముల
తో వికసిల్లె ని - ద్దుర మేలుకొనుము!2080
శ్రీరామ! మునికోటి - చింతతోఁ దమము
దూరమై తొలఁగెని - ద్దుర మేలుకొనుము!
బలురక్కసుల ప్రతా - పంబులతోడఁ
దొలఁగెతారకలు ని - ద్దుర మేలుకొనుము!
మొగిసెను రక్కస - ముదితలకన్నుఁ
దొగలతోఁదొగలు ని - ద్దుర మేలుకొనుము!
దశరథరాజసు - ధాపయోరాశి
శశధర! నిద్దుర - చాలింపవయ్య!
భరతాదిసోదర - భావమిళింద
సరసిజ! నిద్దుర - చాలింపవయ్య !2090
మాయానిశాచర - మదవన్మరాళ
తోయద! రామ! ని - ద్దుర లేవవయ్య!
పర్జన్యముఖదేవ - పాలనశౌర్య
దుర్జయ! రామ! - నిద్దుర లేవవయ్య!
మలసియగస్త్యాశ్ర - మంబుఖేదములు

తొలంగింపవలయు ని - ద్దురలేవవయ్య !
సరణిలోనర్ధయో - జనమాత్రఁజిన్న
దురమున్నదొకటి ని - ద్దురలేవవయ్య!
చెనకి నాజన్నంబు - చెఱుచుదానవులఁ
దునిమింపవలయు ని - ద్దుర లేవవయ్య!"2100
అనుచు మేల్కొలుప నొ - య్యన లేచియతని
యనుమతిఁగాల్యసం - ధ్యాదులుఁదీర్చి
మునిరాజువెంటత - మ్ముఁడుఁదానుఁ గదలి
యొనరుగంగాసర - యూసంగమమున

-: అంగదేశపు వృత్తాంతము రామలక్ష్మణులకు విశ్వామిత్రుఁడు చెప్పుట :-

పుణ్యాశ్రమ మొకండు - పొడగని "మునివ
రేణ్య! యీవన మెవ్వ - రిది?" యంచునడుగ
నచటి వృత్తాంతమా - ద్యంతంబుఁదెలియ
వచియించెఁ బ్రీతివి - శ్వామిత్రుఁడంత.
“హరుఁడు పార్వతిఁ బెండ్లి - యై మౌనివరులు
సురలునుఁగొల్వని - చ్చోనుండునపుడు2110
దర్పంబుచేతఁగం - దర్పుండుగినిసి
నేర్పుచాలకతోడ - నె యనంగుఁడయ్యె
నందుచే నంగరా - జ్యమనంగ వెలసె
నిందుశేఖరవాస - మిమ్మహాశ్రమము.
ఆదేవుశిష్యులీయ్య - ఖిలసంయములు
పోదమచ్చటి" కని - పోయిరచ్చటికి
ఆవనసీమది - వ్యజ్ఞాననిధులు

పావనాత్ములు మది భావించి చూచి
యెదురుగాఁజనియమ్ము - నీంద్రు సేవించి
పదములకర్ఘ్యంబు - పాద్యంబునొసంగి2120
శ్రీరామచంద్రుఁబూ - జించి సౌమిత్రి
నారూఢభక్తితో - నర్చించి వారి
వేడుకమువ్వుర - వేడుక యచట
నాడెల్ల నిలువవి - న్నపమాచరింప
నియమముల్ దీర్చిమౌ - నియుఁదారునచట
శయనించిరప్పుడి - క్ష్వాకువంశజులు
మునివరబహుమాన - ములను గాధేయ
ముని కధావృత్తాంత - ముల నాటిరేయి
యచ్చటనుండివా - రమ్మఱునాఁడు

-: మలయకరూశదేశ వృత్తాంతము :-

మచ్చిక మీర న - మ్మౌనిపుంగవులు2130
తెప్పించునోడ గా - ధేయాన్వితముగ
నప్పుడువారెక్కి -యలఘుత్ప్రవాహ
రంగత్తరంగప - రంపరాపూరి
తాంగజారాతికే - శాంతరంబైన
గంగాస్రవంతిని - గడచుచో శ్రవణ
మంగళప్రదమైన - మధురస్వనంబు.
వీతేర విని రఘు - వీరుఁడీమ్రోఁత
యేతోయమనమౌని - యెఱిఁగి యిట్లనియె.
"కైలాసగిరిమీదఁ - గలదుమిక్కిలి వి
శాలమై మానస - సరసినాఁగొలను2140
 

అజునిమానసమున - నది జనియించె
నజపాత్రయట్టి మ - హాసరోవరము
జాలెత్తి ప్రవహించి - సరయువైమించె.
భూలోకముననిట్టి - పుణ్యంపుటేరు
సాకేతపురిచుట్టి - జాహ్నవియందు
నేకీభవింపన - య్యిరువాగుఁగూడి
సంధించునెడల త - త్సంగమజనిత
బంధురధ్వనియిది - భక్తి నీక్షింపు
సేవింపు” మనవారు - చేయెత్తి మ్రొక్క
నావల గంగామ - హానదిదాఁటి2150
దరిజేర్చెమము గా - ధితనయుఁడన్నట్లు
దరిజేరియవ్వల - దక్షిణదిశను
శరభవరాహకా - సరిఋక్షభల్ల
రురుసింహగవయశా - ర్దూలమాతంగ
కాకఘూకారవ - కంకవిరావ
భీకరంబైన య - భేధ్యకాననము
దవ్వులఁగనుఁగొని - తాపసనాథ!
యెవ్వరి నెలవది - యెఱిఁగింపుమనిన
నివిదివ్యదేశంబు - లినవంశ! మొదట
యవి మలదముకరూ - శాఖ్యమైవెలయు2160
వృత్రాసురునిఁజంప - వెనువెంట హత్య
సుత్రాముఁబీడింప - సురలుమౌనులును
నిచ్చోట కుండల - నెల్లతీర్థములు
తెచ్చిస్నాన మొనర్పఁ - దీరె పాపంబు
అగవైరి నిర్మలుం - డైనట్టికతనఁ

దగనొండుమల - దాభిదానంబుచేత
నచ్చాటనాఁకలి - యణఁగినకతన
యిచ్చెఁగరూశాఖ్య - యింద్రుఁడమ్మహికి
నతిశయశ్రీలచే - నమరునిందు
గతకాలమున వెన - కనుయక్షుజాతి2170
భామిని సుందుని - భార్యమారీచ
నామంబులగల యక్షు - నకు దల్లియగుచు
కొడుకునుఁదాను నుఁ - గూడియీసీమ
నడవిగాఁ జెఱిచి యా - తాయాతజనులు
సమయింపుచుండు ని - చ్చటికర్ధయోజ
నము మేరనుండుఁ దా - నవి యున్న టెంకి
దానినిమిత్తమై - దారుణంబైన
యీనట్టడవిత్రోవ - నేతేరవలసె
యిట్టిరక్కసిఁ ద్రుంచి - యీరాజ్యమునకుఁ
గట్టడసేయు మ - కంటకశ్రీలు2180
యీత్రోవరానేర - రింద్రాదిసురలు
నీతోడుగలనాకు నిశ్శంకమయ్యె.
పాపాత్మురాలిది - పట్టి వధింపు
మాపూర్ణ విఖ్యాతు - లందుము నీవు
యెచ్చరించితినన్న - యెంతయుమదికి
నచ్చెరవుగ రాముఁ - డమ్మౌనికనియె,
"ఆఁటది యబల య - క్షాంగనయిట్టి
మేటిసత్త్వము దీని - మేనికెట్లొదవె?
యక్షభామినియయ్యు - నదియేల? ఘోర
రాక్షసకర్మసం - రంభిణియయ్యె?2190

వివరింపు" మన రఘు - వీరునిమాట
చెవిసోఁకి పలికె కౌశికమునీంద్రుండు.

  -: తాటకా వృత్తాంతము :-

అదియందు సుకేతుఁ - డను యక్షవరుఁడు
గాదిలబిడ్డలఁ - గానక వగచి
ధాతనుఁగూరిచి - తపమాచరింప
నాతరింబ్రత్యక్ష - మై పద్మభవుఁడు
వెయ్యేనుగల లావు - వెలసియట్టి
తొయ్యలినిత్తు పు - త్రునొసంగనీకు
పొమ్మన్నయక్షుండు - పుత్రికంగాంచి
యిమ్మన్న సుందుల - కిచ్చె భార్యగను.2200
మారీచు వాని కు - మారుండువాఁడు
ప్రారబ్ధమైన శా - పము ప్రాప్తమగుట
దానవుఁడయ్యెనం - తటసుందుఁడీల్గ
వానిభామినికామ - వశ్యాత్మ యగుచు
గట్టివాతనమున - కాఁకచేనొడలు
పట్టఁజాలకవెఱ్ఱి - వట్టినయట్ల
తపముసేయునగస్త్య - తాపసుఁజూచి
కృపతోడనన్ను వ - రింపు మీవనుచు
వలవంత చే పయి - వ్రాలఁజేరుటయు
కలశజుం డలిగి రా - క్షసివి గమ్మనుచు2210
శాపమిచ్చిన నిశా - చారిణియగుచు
రూపింపదారుణ - రూపంబుతోడు
యిటులగస్త్యుఁడు శాప - మిచ్చునేయనుచు

నటపట్టి యయ్యా శ్ర - మవాసులైన
యతులఁబీడింపుచు - న్నది దానిఁదునిమి
వెతలెల్లమాన్పు మ - వ్విమలాత్మకులకు
నిపుడుగోబ్రాహ్మణ - హితమాచరింపు
ముపకార మొనరింపు - ముర్వికినెల్ల
నీవెకా కితరులు - నిర్జరులైన
లావునందీని వ్రే - లనుఁజూపలెను2220
యిదియాఁడుకొల - యనియెంచకు నీదు
మదిలోనరాజ ధ - ర్మమువిచారింపు
శిష్టరక్షణమును - శ్రీరామచంద్ర!
దుష్టనిగ్రహము నీ - దుష్ప్రవర్తనము
తరుణి విరోచను - తనయ మందరను
గిరిభేదివధియించి - కీర్తి గైకొనియె.
ఇలయెల్లఁదొల్లియ - నిద్రంబుసేయఁ
దలఁపవిష్ణువు శుక్రు - తల్లినిఁదునిమె
మఱియుధార్మికులైన - మనుజనాయకులు
పఱచుటింతులఁ జంపి - పావనులైరి.2230
నామాటచేదీని - నాతిగా యనుచు
నీమదిఁగొంకక - నేడె దండింపు
మను మాట విని యప్పు - డంజలిచేసి
వినయంబుతో రఘు - వీరుండిట్లనియె.

        -: తాటక వధ :-

అంపుమనుచుముందె - యడిగితినన్ను
నంపె మాతండ్రి - నీయడుగులవెంట

నలవసిష్ఠాదుల - యనుమతి సేయ
వలసి నీ వెనువెంట - వచ్చినవాఁడ
చెప్పినబుద్ధులు - శిరసావహించి
యప్పుడె మీచిత్త - మలరించువాఁడ2240
అలయగస్త్యాదులై - నట్టిమౌనులకు
నీలవేలుపులకునే - హిత మొనరింతు
ననుగులక్ష్మణుచేతి - యమ్ములవిల్లు
మునిచూచిమెచ్చ రా - ముఁడుకేలనంది
నారిసారించి గు - ణధ్వని సేయ
భోరుకలఁగెను - భువనంబులెల్ల
కంటకారులఁగూర్పఁ - గల స్వయంవరణ
ఘంటాధ్వనులు దేవ - కామినులకును
నార్తరక్షణకధా - యతవందిబ్బంద
కీర్తనల్ రాఘవాం - కిత బాణములకు2250
సంతతాహ్వానముల్ - సంగరాహార
చింతఁగ్రుమ్మరుముని - శ్రేష్ఠవీనులకు
రాజిత జలధరా - రావముల్ దైత్య
రాజన్యచేతోమ - రాళంబులకును
ఆధ్వని విని తాట - కాసురి చాల
సాధ్వసంబున గుండె - ఝల్లుమనంగ
దిగులు చే నేమియుఁ - దెలియకఁగడువు
పగిలి చెమర్చికం - పమునంది భ్రమసి
మ్రానుగంట ముహూర్త - మాత్రంబు నేల
యూనుక కరములు - నూరటనొంది2260
దిటదెచ్చుకొని క్రొత్త - తెలివితో నాద

మెటనుండివిననయ్యె - నెట్టిదోయనుచు
నామ్రోతఁ వచ్చు చా - యనెవచ్చుదాని
భీమారుణేక్షణ - భీకరాకారఁ
జూచి కాటుకకొండ - చొప్పగు మేను
యేచిపై పొడవుగా - నెత్తుఁ జేతులును
మెఱుపులువెదచల్లు - మెఱుఁగుకోరలును
హరిగెల రీతిన - ల్లాడుఁజన్నులును
వివృతాస్యగర్తంబు - వెళపైనకకడుపు
గవని వాకిళులట్లు - కరమొప్పుఁ జెవులు2270
వంకరముక్కు గ - వ్వలవంటిపండ్లు
సంకుకామాక్షులు - జగజంపుజడలుఁ
గలిగి పై వచ్చుర - క్కసిఁజూచినగవు
సెలవులం దులకింప - శ్రీరాముఁడనియె!
"కంటివె లక్ష్మణ! కై - కోదు మనల
దంటరక్కసి దీని - దాని యచ్చెరువు
పెనుఁగొండవలె నిది - పెరిగిపై రాఁక
కననెంతవారికి - గర్భముల్ గలఁగు
మోడుసేసెద దీని - ముక్కునుఁజెవులు
చూడు నీవెన్నడు - చూడవింత2280
బుద్ధి రాఁజేతు ని - ప్పుడ నిశాచరికి
వద్దేలమనకు స్త్రీ - వధమాచరింప”
అననంత తాటక - యట్టహాసమున
బెనుఁగొండ యోయనఁ - బేర్చిపై రాఁగ
దిగులొంది వెఱచిఁగా - ధేయుండుదాని
నగణిత టంకాక్కార - మడరించి నిలిపి

వెఱపులేకుండదీ - వించియెవ్వరికి
వెఱవని రక్షగా - వించెరామునకు
నాలోన వివిధది - వ్యాస్త్రముల్ దుమ్ము
రాలును మీదవ - ర్షముగాఁగఁగురిసి2290
తాటక రాఁజూచి దశర - థాత్మజుఁడు
హాటకపుంఖంబు - లైనబాణముల
నన్నియుఁబోవైచి - యర్ధచంద్రాస్త్ర
మెన్నికసంధించి - యెత్తినరెండు
చేతులు మొదలంట - చిదిమివైచుటయు
భీతిలే కదిచేరఁ - బ్రియసహోదరుఁడు
సౌమిత్రిచూచి య - స్త్రంబులు రెంట
తాముక్కుఁ జెవులు చిత్రంబుగాఁదునిమె,
చెవులుముక్కునుఁబోయి - చేతులుందునిసి
భువియెల్లనిండనా - ర్పుచునోరుఁ దెఱచి2300
మ్రింగెదననిచూచి - మించి రాలేక
యంగంబుకనుపింప - కాదుష్టబుద్ధి
మింటికినెగసి యే - మియుఁదోఁచనీక
కంటికి తనయున్కి - గనుపింపరాక
మాయగల్పించియా - మారీచుతల్లి
పోయఁబొమ్మనిపంచి - పోకకేడించి
మెఱయించు నొకచోట - మెఱుపులగుంపు
కురియించు నొచ్చోట - ఘోరవర్షంబు
రాలించు నందంద - రాలబల్ జడలు
తూలించు విషమవా - తూలముల్ విసరి2310
రప్పించు మధసింధు - రంబులందండ

తెప్పించు మీఁద న - దీప్రవాహములు
కదియించు నలువంక - కాఱుచిచ్చులను
చదియించు దరులపై - శైలముల్ వైచి
నిండించు పాముల - నేకముల్ చుట్టు
చండించుపోకపి - శాచవేషముల
నీరీతిమాయల - నేకముల్ సేయు
నారాఘవులు చాల - యలజడినొంది
కాలునుఁగేలును - గదలింపలేక
యాలోచనలుసేయు - నపుడుఁగౌశికుఁడు 2320
భయమంది, రఘురామ! - పాపాత్మురాలిఁ
జెయిగాచునేరమిఁ - జింతల్లవలసె
యాఁటదియని యెంచి - యక్కటికించి
గాటంపుమాయల - గాసినొందితిరి
చాలును సంధ్యావ - సరముగావచ్చె
నీలోనె దీని మా - యింపక యున్న
దానికి బల మనం - తంబగు నేరి
చేనైనఁ గినిసి శి - క్షింపంగ రాదు
తునుము వేగమె దీని - తోఁబోరుచాలు
పనిలేనివాఁడవే - పట్టిపాలార్ప" 2330
నన విని రఘురాముఁ - డన్ని దిక్కులను
కనుఁగొని మింటనె - క్కడమాయచూపె
నాదిక్కు చూచి మా - యలుమాయ శబ్ద
భేదిసాయకముల - బెగడుపుట్టింప
నదివచ్చి యిలనిల్చి - యాగ్రహంబొప్ప
నెదిరింప సాయకం - బేర్చి రాఘవుఁడు

నారితోగూర్చియ - న్నారిపేరురము
దూర నేయఁగనది - దూరిపారుటయు
నాయమ్ముదానవి - యాయమ్మునాఁటి
కాయమ్మువ్రయ్యలు - గావించునంతఁ2340
గూలెనుకాటుక - కొండయోయనంగ
నేలవ్రేఁగణఁగియు - నిండువ్రేఁకముగ
పిడుగుకైవడివచ్చు - భీమరాక్షసినిఁ
బడవైచి తముఁగాచె - భళిభళియనుచు
దివినుండి యింద్రాది - దివిజులు వచ్చి
భువనవందితు గాధి - పుత్రు నీక్షించి
"కలవురాఘవులకుఁ - గార్యముల్ మీఁద
బలియురతోఁ జేయు - బవరంబులితఁడు
సామాన్యుఁడే! దివ్య - శస్త్రాస్త్రజాలఁ
మేమెఱింగినవి నీ - వెఱిఁగిన వెల్ల2350
నేరుపు మీతండు - నీవెంటవచ్చు
శూరుండుపాత్రుఁడి - చ్చొటమాకొఱకు
రాఁ జేయు” ననవుఁడు - రఘురాము మోము
తాఁజూచి గాధినం - దనుఁడు దీవించి
శిరముమూర్కొని - "యలసితి రన్నలార!
యరమరల్ దీర నీ - యాశ్రమంబునకుఁ
దొరసిచైత్రరథంబు - తోఁదులఁదూఁగి
గరిమఁ గైకొనియె నీ - కాననంబిపుడు
తాటకవోవ ని - ద్రలెఱింగిమనిరి
యీటెంకినున్నమౌ - నీంద్రులందరును2360

యీప్రొద్దుకిచ్చోట - నే యుండిమనము
రేపుపోవుదము చే - రిక మదాశ్రమము
యిచటికిదవ్వులే - దేలవేగిరము
సుచరిత్ర! యీవన - క్షోణులయందు
వసియింత మని" తగు - వైఖరినుండి
అసమతపోనిధి - యమ్మరునాఁడు
రాజసూనుల నిద్దు - రలు మేలుకొల్పి
యాజటివర్యుఁడి - ట్లని పల్కెనపుడు.

 -: రామునకు విశ్వామిత్రుఁడు దివ్యాస్త్రముల నిచ్చుట :-

"శ్రీరామ నిన్నుఁ జూ - చి మనంబులోన
మీఱెసంతోష మే - మి హితంబొనర్తు? 2370
నేరుపువాఁడనే - నేరిచి నట్టి
యారూఢదివ్యశ -స్త్రాస్త్రమంత్రములు
ఆదరం బమర నిం - ద్రాదుల నిన్ను
కోదండదీక్షాది - గురుఁడనిపింతు
నీవు విల్లందిన - నిఖలలోకములు
లావునగెలుచు ను - ల్లాసమేనిత్తు
దేవగంధర్వదై - తేయరాక్షసులఁ
జేవాఁడి జయమందఁ - జేయుదునిన్ను
శుచివి గమ్మని” తాను - శుచిప్రాఙ్ముఖుండు
నచిలితాత్మకుఁడు నై - యాదేశమొసఁగె. 2380
దండచక్రంబును - ధర్మచక్రంబు
చండాంశునిభకాల - చక్రంబు చక్రి
చక్రంబు నైంద్రమౌ - చక్రంబు రౌద్ర

చక్రసాధనము వ - జ్రంబు శైవంబు
రుద్రంబు బ్రహ్మశి - రోనామకంబు
కాద్రవేయము నైషి - కము పినాకంబు
పాశి పాశము ధర్మ - పాశంబుఁగాల
పాశంబు బ్రహ్మస్త్ర - పావకాస్త్రములు
మోదకిశిఖరి నా - ముసలంబు లశని
భేదద్వయంబు - కౌభేరకాస్త్రంబు2390
రాక్షసంబును శిఖ - రంబు క్రౌంచంబు
నక్షయనారాయ - ణాస్త్రవజ్రములు
హయశిరఃకంకాళ - మనెడి శక్తులును
భయదవాయువ్య కా - పాలాస్త్రములును
కంకణంబును నంద - కము మధనంబు
శాంకరం బసిరత్న - శస్త్రదైత్యములు
సంతాపనంబు శో - షణము తర్పణము
శాంతంబు శౌర్యప్ర - శయనాస్త్రములును
సైంధవమానవా - స్త్రవిలాపనములు
గాంధర్వమోహన - కందర్పములును2400
సౌమనశంబు ప్ర - స్వాపనాస్త్రంబు
తామససత్యవిద్యా - ధరాస్త్రములు
మౌసల సంవర్త - మాయాధరములు
శాసకఘోరపై - శాచకంబులును
మదనదారుణసుదా - మని సితేషువులు
నదయ తేజములు సో - మాస్త్రంబుననఁగ
అతులప్రయోగది - వ్యాస్త్రముల్ నేర్పి
యతఁడుమార్గంబున - నరుగుచుఁబల్కె.

 “అస్త్రముల్ నేర్చితీ - వనఘ! నావలన
  నస్త్రోపసంహార - మరయంగవలదె2410

 -: ఉపసంహారముల రామున కుపదేశించుట :-

పలికెద యివినేర్చి - పనిగొమ్ముభక్తి
వెలయ నారాధింపు - వేర్వేర" ననుచు
సత్యవంతము రభ - సంబు దృష్టంబు
సత్యకీర్తి ధనంబు - సర్వనాభంబు
ప్రతీహారలక్షాక్షర - ముల వాఙ్ముఖము
ప్రతిపన్న కామరూ - ప పరాఙ్ముఖములు
నావరణము జృంభ - కాస్త్రమోహములు
నావల సంతాన - హరణధాన్యములు
కామరూపంబును - కరవీరరుచిర
భీమవిధూతక పి - తృసౌమనములు2420
నైరాస్యవిమలసు - నాభముల్ జ్యోతి
షారంభములు నుద - శానన పద్మ
నాభాస్త్రములు దృఢ - నాభంబు దుందు
నాభశస్త్రము మహా - నాభంబు వృత్తి
మంతంబు నల ధృతి - మంతంబు నర్చి
మంతంబు కృశనంబు - మధనంబు యోగ
ధర దశాక్షులు హరి - ద్రము విషమంబు
హరణశస్త్రంబుల - క్షాక్షరాస్త్రంబు
దశవక్త్రమును ప్రశాం - తము దశాక్షరము
దశశీర్షము ననంగఁ - దగువిద్యలొసంగి2430

కామరూపమును - సుఖస్వరూపములు
శ్రీమూర్తిమంతముల్ - శ్రీ కారణములు
జపియింపు" మనుచు వి - శ్వామిత్రుఁ డనిన
జపియించె శ్రీరామ - చంద్రు డన్నియును.
ఆవేళనస్త్రంబు - లాకృతుల్ దాల్చి
పావకమూర్తులు - పాటిల్లఁ గొన్ని
నీలనీలప్రభా - న్వితములైఁ గొన్ని
జ్వాలలతోఁ గొన్ని - సమదాట్టహాస
కలనలఁ గొన్ని భీ - కరములై గెలుపు
పలుకులతోఁ గొన్ని - పగ్గెలఁ గొన్ని 2440
యంగారసదృశంబు - లై కొన్ని ధూమ
లాంగంబులైఁ గొన్ని - యర్కతేజమునఁ
గొన్ని చంద్రప్రభఁ - గొన్ని యీరీతి
నన్నియు వెలుఁగుచు - నంజలుల్ చేసి
“పనిగొమ్ము మమ్ము నీ - పనుపుచేసెదము.
మునినాథుఁ డొసంగె మ - మ్ముఁ బరిగ్రహింపు
దాసుల మేము నీ - దలఁచుఁగార్యములు
చేసివచ్చెదము నీ - క్షింపుమమ్మ" నిన
శ్రీరాముడన్నియుఁ - జేపట్టినాదు
వారలై యేను గా - వలసిన యపుడు 2450
రండు మీరు మదంత - రంగంబులోన
నుండుడంచును పర - మోదారుఁడైన
యారామవిభుఁడు - భృశాశ్వపుత్రులను
నూరుగురిని లక్ష్మ- ణునికి తా నేర్పి
యవ్వలంజనుమ న - త్యాశ్చర్యమొకటి

దవ్వులంజూచి సం - తసముతో బలికె.
“అల్లదె మిన్నుల - నంటి కన్పట్టి
నల్లనై మదికి నా - నందంబుచేసి
నీలనీలాంబుధ - నిభమై యుపాంత
శైలమై కలకల - స్వనపరిష్కరణ2460
విహగమై హరిణాది - వివిధమృగాది
బహుళమై సకలతా - పనవేదఘోష,
నిబిడమై యాహవ - నీయాదివహ్ని
నిబిరీసధూమమా - నితగంధమైన
యీయాశ్రమంబుపే - రెయ్యది? దీన


-: వామనమూర్తి చరితము :-

నేయతీంద్రులు వసి - యించి యుండుదురు?
మీయాగశాల యే - మేర యెవ్వారు
దాయ లీ సవనవి - ధానవైఖరికి
నీప్రొద్దు మనముంద - మీ యాశ్రమమున
నేపణఁగింతు మీ - కెగ్గొనరించు2470
దనుజుల నొక ముహూ - ర్తమున విచ్చేయు
డ”ను మాటవిని తన - యాత్మ నుప్పొంగి
శ్రీరామచంద్రుని - చెక్కులు నిమిరి
గారవనం బమరంగ - గౌశికుండనియె.
“ఇది వైష్ణవస్థాన - మిందు విష్ణుండు
ముదముతో బహుకాల - ము తపంబు చేసి
నందుచే నిది వామ- నాశ్రమంబయ్యె.
చెందు నిచ్చట సర్వ - సిద్ధు లెల్లరకు

సిద్ధాశ్రమంబని - చెప్పిరిదాన
సిద్ధులకును తప - స్సిద్ధి గల్గుటను2480
బలియను రాక్షస - పతి పట్టణంబు
తొలుతనీదేశంబు - దుర్జయుండతఁడు
దితిజుల నేలి యా - దిత్యులఁదోలి
శతమఖాది దిగీశ - జాలంబుఁదరమి
ముల్లోకముల తన - ముద్రచెల్లించి
బల్లిదుండై హవి - ర్భాగంబు లెల్ల
సురలకీయక రా - క్షసుల పాలుచేసి
సురసతుల్ కేలన వీ - చోపులు వీవ
మత్తుఁడై తానొక్క - మఖముగావింప
నత్తర వహ్నిము - న్నగు వేల్పులెల్ల2490
వైకుంఠమున కేఁగిన - వనమాలిగాంచి
లోకేశ! యాశ్రిత - లోకమందార!
పుండరీకాక్ష! యం - బుజగర్భవినుత!
అండజరాడ్వాహ! - యాద్యంతరహిత!
విశ్వభావన! విశ్వ - విభవవిశ్వేశ!
విశ్వాత్మ! విశ్వాభి - వృద్ధిప్రచార!
పాలింపు మమ్ము నీ - పాలింటి వారి
నేలింపు నాకంబు - నింద్రాదిసురల
కలిగింపుమాకు యా - గముల భాగములు
తొలగింపు మిలకు - దైత్యులచేతిపోరు2500
రక్షింపు మిపుడు గో - బ్రాహ్మణశ్రేణి
శిక్షింపు మదమత్త - చిత్తరాక్షసుల
యాలింపు మామొర - యంతరంగములు

పాలింపు మేదినీ - భారంబుమాన్చి
మాయింపు బలిదైత్య - మదగర్వరేఖ
సేయింపు మముఁ బున - ర్జీవులఁగాఁగ
విడివింపు చెఱనున్న- విబుధకామినుల
నడపింపు ధర్మంబు - నాల్గుపాదముల
పుట్టుమిప్పుడు కశ్య - పుని భార్యయందు
కట్టు మనాధరక్షణ - కంకణంబు2510
నుడుగుము వటుఁడవై - నూతనదాన
మడుగుము బలినిమూఁ - డడుగుల నేల
పట్టు ముర్వియు నింగి - పదములురెంట
మెట్టుము వానిభూ - మినణంగిపోవ
కరమిమ్ము మాకు నే - గాఁచెద ననుచు
వరమిమ్ము కాశ్యపు - వద్దికిఁబోయి
పన్నించు గరుడనిఁ - బల్లన గట్టి
మన్నించు మమ్ము ర - మ్మా! యనిపలుక
మొర యాలకించి య - మ్మురభేదిసురల
గరుణించి పొమ్మని - కాశ్యపుఁ జేరి2520
తనయులకై నీవు - తపమాచరింప
నినుమెచ్చివచ్చితి - నీకుజన్మింతు
నని యదితికి వామ - నాకృతిఁబుట్టి
దనుజేంద్రుఁడగు బలిఁ - దాఁజేరఁబోయి
యాగంబుసేయుచు - నర్థులువేఁడ
చాగంబతఁడొసంగు - సమయంబుచూచి
స్వస్తివాద మొనర్చి - జగతిమూఁడడగు
లస్తోకమతివేఁడి - యతనిచే నంది

మురవైరిముల్లోక - ములు నిండఁ బెరిగి
ధరయెల్ల నొక్కపా - దంబునఁగొలిచి2530
యాకాశ మదియొక్క - యడుగుననుంచి
పైకొనిబలిఁద్రొక్కి - పాతాళమునకు
నాకైవడి నుపేంద్రుఁ - డన్నయైనట్టి
నాకీశునకు భువ - నము లెల్లనిచ్చి
యతులతపోనిష్ఠుఁ - డైయుండునునికి
నతనిచే నిదివామ - నాశ్రమంబయ్యె.
చేరుదమివ్వన - సీమకు” ననుచు
నారాఘవులతో మ - హాతపోధనుఁడు.

-: రామాదులు సిద్ధాశ్రమముఁ జేరుట :-

ప్రాలేయమని పున - ర్వసుఁగూడివచ్చు
లాలితశ్రీల క - ళానిధియనఁగ.2540
వచ్చుచో నచ్చటి - వాచంయ్యమీంద్రు
లచ్చపుభక్తితో - నర్ఘ్యపాద్యములు,
కౌశికునకు యిచ్చి - కరమర్థివచ్చి
దాశరథులకు స - త్కారముల్ చేసి
యాతిథ్య మొసఁగిన - నచ్చోటవారు
ప్రీతివసించి యో - రేయి నిద్రించి
మరునాడు రామ - లక్ష్మణులు ప్రభాత
కరణియ్యములు దీర్చి - గాధేయుఁజూచి
“సిద్ధసంకల్ప! యీ - సిద్ధాశ్రమమున
సిద్ధంబుగా యాగ - సిద్ధిఁ గైకొనుము.2550

దీక్షవహింపు దై - తేయులాఁగినను
శిక్షించెదము శర - శ్రేణుల చేత”
అనిన జితేంద్రియుం - డైదీక్షవార్చి
మునులెల్లఁ దత్కర్మ - ములఁ బ్రవర్తిల్ల
యాగమారంభించి - యమ్మఱునాడు
వేగిన నగ్నులు - వేల్చిరాజిల్లు
మునిశిఖామణికి త - మ్ముఁడుదానుమ్రొక్కి
వినయంబునను రఘు - వీర శేఖరులు
దేశ కాలంబును - దెలిసియిట్లనిరి.

-:రాముఁడు మారీచాదిరాక్షసుల జయించుట:-

"కౌశికమునినాధ! - క్రతువిఘ్నకరులు2560
యెప్పుడువత్తురో - యిషుపరంపరల
నప్పుడె వారలహతి - యొనర్చెదము.”
అని దొనల్ సవరించి - యమ్ము లేర్పరచి
ధనువులెక్కిడు కొని - ధట్టీలుకట్టి
కవచముల్ దొడిగి యా - గవిశాలశాల
సవిధదేశమునను నె - చ్చరికనున్నంత.
సంతోషమున మౌని - చయము రాఘవుల
నెంతయు నుతియించి - "యీతపోధనుఁడు
దీక్షచేమౌనవృ - త్తివహించినాఁడు
రక్షింపుఁడిఁక నారు - రాత్రు లిమ్మఘము2570
కనకల్గి గురవక - కాచియీడేర్పుఁ"
డనివారు సవనక్రి - యలునిర్వహింప.
ఆఁకలిడప్పియు - నలయికల్ లేక

సోఁకోర్చిదిక్కుల - చూపులునిల్పి
నిద్దురమానికం - టికిఱెప్పగాచు
పద్దునరేయును - పగలునేమరక
యెక్కిడునట్టి విం - డ్లెక్కిడినట్లు
తొక్కిన మెట్టులు - త్రొక్కినయట్లు
పట్టినశరములుఁ - బట్టినయట్లు
కట్టినధట్టీలు - కట్టినయట్లు2580
తమలోనఁ దారన్న - దమ్ములొండొరులు
సమయముల్ దెలుపుచు - జతనముల్ గలిగి
యాతరివర్తింప - నాఱవనాఁడు
హోతల వివిధమం - త్రోరు నాదములు
సామాదినిగమవి - స్తారఘోషములు
నామోదకరదేవ - తాహ్వనరవము
రాఘవజ్యాలతా - రావంబు నెనసి
మోఘంబుగాక క - మ్ముకఘూర్ణిలంగ
విని యాగ్రహమునభా - వించిరాక్షసులఁ
బనిచి మారీచసు - బాహులాయాగ2590
శాలలో రక్తమాం - సంబులుగురియు
నాలోచనల్ చేసి - యనిచి వెంబడిని.
మెఱుపులతోవచ్చు - మేఘంబులనఁగఁ
బరగి మారీచసు - బాహుదానవులు
అసిలతాయుగళమ - ల్లార్పుచుమింటి
దెెసఁదోఁచుటయును ఋ - త్విజులు భీతిల్లి
"శ్రీ రామచంద్ర! వ - చ్చిరినిశాచరులు
వీరె నెత్తురుజళ్లు - వేదికమీఁదఁ

గురియుచున్నారని - కూయికినంత
శరమును విల్లు హ - స్తములఁగీలించి2600
దుర్విత్తులును మదాం - ధులుక్రూరులైన
శర్వరిచరుల - క్ష్మణునకుఁజూపి
“చూడుము పిడుగుల - చొప్పునవీరు
జోడుగాఁగూడివ - చ్చు దురాత్మకులను
పావనాస్త్రంబుచేఁ - బవమానుచేతఁ
బోవు మబ్బులరీతిఁ - బోవనేసెదను.”
అనునంతలో నుర్వి- నాజానుబాహు
లును ధనుర్ధరులు బా - లులు నీలహేమ
గాత్రులునైన రా - ఘవుల దానవులు
మిత్రచంద్రులు పుడ - మినిఁ గాచినట్లు2610
సవనంబుగాచు నె - చ్చరికలు చూచి
తవిలి విఘ్న మొనర్చు - తలఁపునరాఁగ
దారుణమానవా - స్త్రంబు సంధించి
మారీచును రమురా - మవిభుండువైవ
నాఁటుతోడనె యోజ - న శతంబునకును
మీటినచందాన - మింటిపైత్రోవ
వొగడాకు గొనిపోవు - నోజమున్నీట
మొగముక్రిందుగవైవ - ముచ్చముణింగి
పడునంత దశరథు - పట్టి సుమిత్ర
కొడుకునెమ్మెముగ - న్గొనియిట్టులనియె. 2620
“మానవాస్త్రంబు ల - క్ష్మణ! యెంతమంచి
పూనికచెల్లించె - పొలియింప కతని
దూరంబుగాఁగ పా - థోరాశిలోనఁ

పారంగవైచె సు - బాహుఁబోనిక
పొరిగొందుచూడు మి -ప్పుడె" యనిపిడుగు
సరియైనపావకా - స్త్రంబుసంధించి
గురిసేసివేసిన - కుంభినిమీఁదఁ
దెరలె కాటుకకొండ - ద్రెళ్లినయట్లు
బాహుశౌర్యమున సు - బాహునిఁద్రుంచి
సాహసోన్నతుఁడు కౌ - సల్యాసుతుండు2630
వారిరాక్షసుల నె - వ్వరిఁబోవనీక
మారుతాస్త్రమువైచి - మహిఁగూలనేసె.
అజనంబు నెఱవేర్చి - యమరేంద్రుమాడ్కి
విజయంబు గైకొని - విల్లెక్కుడించి
సౌమిత్రి చేతి కొ - సంగె దండప్ర
ణామంబు గాధేయు - నకుఁ జేయునంత
కురిసె మిన్నుననుండి - కుసుమవర్షములు
మొరసెను నిర్జర - మురపారవములు
గంధర్వగాయన - గానంబులెసఁగె
సంధించెపవమాన - శాబంబులపుడు2640
కౌశికమౌని రా - ఘవుని దీవించి
“యోశౌర్యభూషణ! - హోమకార్యములు
కడతేఱెనొక్క వి - ఘ్నములేకమాకు
నెడపని సంతోష - మెచ్చెనీయందు
పితృవాక్యమును మాకుఁ - బ్రియమునుఁజేసి
యతిశయవిఖ్యాతు - లందితివీవు”
అనునంతనచటి సం - యములెల్లరాము
ననుపమ ప్రీతితో - నాశీర్వదించి

సాధారణుఁడు గాఁడు - సత్యసంధుండు
గాధేయమౌని రాఘ - వ వంశతిలక! 2650
అమ్మునీంద్రుఁడు నిన్ను - నర్థించు టెల్ల
నిమ్మఘం బీడేర్ప - నెంచియకాదు
పరమకల్యాణలా - భములెల్లనతని
కరుణచే నటమీదఁ - గైకొనఁగలవు
పాయనిదైతేయ - బాధలుమాన్చి
మాయాశ్రమంబక - ల్మషముచేసితివి.
ఏమెల్లదీవెన - లిచ్చుటఁగాక
యీమెచ్చుమెచ్చియే - మీయఁజాలుదుము
సుఖివి గమ్మ” నునంత - సూర్యుండు చరమ
శిఖరిఁ చేరెనుముని - శ్రేణులతోడ. 2660
ఆరాత్రివసియించి - యమ్మఱునాడు
శ్రీరామవిభుఁడు కౌ - శికున కిట్లనియె,
"ఓ మునీశ్వర! నీకు - నొనరింతు నతులు
కామించి మమునీవు - కార్యాంతరములు
పనిగొమ్ము మీరెందు - పనిచిన నటకు
జనివేఁడునర్థంబు - సమకూర్పఁగలము
దాసులు (దుష్టకృ - త్య)విధానములకు
నోసరిల్లము మాకు - నూరటల్ దగునె
నావుఁడు గాధి నం - దనుఁడు శ్రీరామ
యావలనొకకార్య - మిచ్చ నెంచితిని. 2670
అనఘుఁడు మిధిలాపు - రాధినాథుండు
జనకుండు యాగంబు - సలుపుచున్నాఁడు
అచ్చటి కేఁగి యా - యజ్ఞంబుచూడ

వచ్చితిమనిబల - వత్తరంబైన
కోదండమొకటి యా - క్షోణీశునింట
నాదిత్యఖచరవి - ద్యాధరాదులును
యెక్కడఁగా లేని - యీశుండుదాల్చు
నొక్కవిల్లున్నదా - యుర్వీశ్వరునకు,
యాగఫలంబైన - యదిసునాభంబు
యాగంబునకు మెచ్చి - యయ్యీశుఁడొసఁగె.2680
అదినాటనుండియు - నతనిదేహమున
సదమల గంధపు - ష్పములఁబూజింప
నున్నది నీవట్టి - యుగ్రకార్ముకము
కన్నులఁజూతువు - గాక రమ్మనుచు”
పయనమై మునులు వెం - బడిరాఁగఁగదలి
జయకారణములైన - శకునముల్ గనుచు
నరవిందనయన పా - దాబ్జమరంద
గరిమంబుఁగన్న గం - గకు నుత్తరమున
సరణినేఁగుచు నను - సారి మౌనులను
హరిణాదిమృగ వి - హంగావళి నెల్ల 2690
యిమ్మహాశ్రమముమీ - రేవేళఁగాచి
సమ్మతి నుండుడు - చనుఁడనిపల్కు
అందరనునిచియా - హైమాచలంబు
పొందికదక్షిణం - బునఁజుట్టివచ్చి
యావెన్క ధనదుని - యాశఁ బ ట్టిసుము
త్రోవను కమల బం - ధుఁడు పశ్చిమాద్రి
కూటంబునకు హేమ - కుంభమైవెలయు
పాటికి రఘువంశ - బాలకుల్ మునియు

శోణాస్రవంతినిఁ - జూచి రాఘవుఁడు
పాణియుగ్మముమోడ్చి - భక్తినిట్లనియె. 2700
“ఈభూమిఁగనుఁగొంటి - రే! మహనీయ!
వైభవంబు సమృద్ధ - వనశోభితంబు
లోచనానంద మా - లోకింపదగియె
వాచంయమీంద్ర! యె - వ్వరినివాసంబు
పలుకు? మీవన”, రఘు - ప్రవరునీక్షించి
కలతెఱంగెల్లను - గాధేయుఁడనియె.

—: కుశకుశనాభుల వృత్తాంతము :—


ఉత్తమకులజాతుఁ - డురుగుణాధికుఁడు
మత్తారిరాజదు - ర్మానభంజనుఁడు
దశదిశాలంకార ధవళయశుండు
కుశభూవరుఁడు నిరం - కుశ పరాక్రముఁడు 2710
వైదర్భియను గుణ - వతి యందునతఁడు
గాదిలితనయులఁ - గాంచెనల్వురను.
బోధముల్ గలకుశాం - బుఁడు కుశనాభుఁ
డాధూర్తరజనుఁడు - నవ్వసునృపుఁడు
జనియింప నపుడు కు - శక్షితీశ్వరుఁడు
తనయుల నల్వురం - దాఁజూచిపల్కె
"పాలింపుఁ డఖిలభూ - భాగంబుమీరు
తూలింపుఁ డెపుడు శ - త్రునృపాలకులను
ధర్మ మేమఱకుఁ డే - తరిని యాగాది
కర్మముల్ నడపుఁడా - గమవేత్తలైన 2720

యవనీసురలఁ బ్రోవుఁ - డనదలఁగావు
డవధానముల నుండుఁ - డని పనుపుటయు.
ఘనుఁ డాకుశాంబుండు - కౌశాంబిపురము
తనపేరనిర్మించి - తానేలుచుండె.
పొలుచు మహోదయ - పురము గావించి
యిలయెల్లఁ గుశనాభుఁ - డేలుచునుండె.
ఆధూర్తరజుఁడు ధ - ర్మారణ్యపురము
సాధువర్తనఁజేసి - జగతి వాలించె.
వసువిభుఁడా గిరి - వ్రజముఁ గావించి
యసమవైఖరి చేత - నవని వాలించె. 2730
“ఇది యావసునృపాలుఁ - డేలెడిపురము"
మదనారివిక్రమ! - మాకుఁగాణాచి
కొండలైదును వీటి - కోటయై పరిఘ
యుండు కైవడి చుట్టు - నొక పూవుదండ
వైచినతెఱఁగున - వర్ణింపఁదగియె.
చూచువారలకు నీ - శోణాస్రవంతి
మాగధ నిధి సంగ - మమున నీసీమ
మాగధదేశనా - మమున రంజిల్లె,
నలువురలోఁ గుశ - నాభుండు వేల్పుఁ
దలిరాకుబోఁడి ఘృ - తాచిఁ జేపట్టి 2740
దానికి నూర్వురు - తనయలఁగాంచె,
ఆనెలంతలు యవ్వ - నారంభమునను
వనకేళి నుద్యాన - వనము లోపలను
మనసిజు వలకారి - మాయలో యనఁగ
నందెలు ఘలుఘల్లు - మని మొరయంగ

చిందులాడుచు సన్న - జిలుఁగుఁబయ్యదలు
జాఱ దళాయను - జక్కవ కవల
మీరుగుబ్బలు మిఱి - మిట్లు గొనంగఁ
బరువులువారు ని - బ్బరమునఁజీర
నెరికె లట్టిటుపడ - నిగనిగమెఱచు 2750
తొడల చక్కదనంబు - తులకింప లేఁత
నడుములు నవ్వుల - నకనకలాడ
పేరాస సధరబిం - బీఫలంబులకుఁ
గీరముల్ వలగొనఁ - గ్రేళ్లుదాఁటుచును
తొంగలిరెప్ప సం - దులఁ బుటమెగసి
నింగిఁబేరెమువారు - నిడువాలుఁజూపు
బేడసదాఁటుల - పిఱుఁదువేఁకములు
వాడని విరులు రు- వారించు జడలు
సంకుమదంబు పి - సాళించు ఱవికె
కుంకుమలను మేన - ఘుమ్మని వలచు2760
పరిమళమ్ముల ముద్దుఁ - బలుకుల రత్న
వరభూషలకు వన్ను - (వను)వెట్టు మేని
చకచకలను వనీ - సరణుల మెలఁగు
మొకరిపాయపు రాచ - ముద్దుగుమ్మలనుఁ
బవనుండు చూచి ద - ర్పకునకు లోఁగి
యవల నిల్చి వసంతుఁ - డడపంబుఁ గట్ట
చక్కని రాజవే - షమునఁ గన్పట్టి
యక్కన్నెలకు దన - యాస దెల్పుటయు
నభిమానవతులైన - యంబుజేక్షణలు
సభయలై చందనా - చల(మందు) జొచ్చి 2770

"సకలాంతరాత్మవు - సాక్షివెల్లఱకు
నకట! మాచిత్త మీ - వరయకున్నావె?
మమ్ముఁ గావలసిన - మాతండ్రి నడిగి
సమ్మతించి యతండొ - సంగ పరించి
కామోపభోగముల్ - గైకోక యురకె
కామింప నీయంత - ఘనుకునగునె?
ఒల్లము పొమ్మ"న్న - నూరకే పోక
పల్లవాధరలపై - పవమానుఁడలిగి
వారల లోఁజొచ్చి - వారి యాకార
గౌరవంబుల కోర్వఁ - గా లేక యపుడు 2780
మరగుజ్జులనుఁజేసి - మంచిరూపములు
చెఱిచినఁ గన్నీరు - చింద నందఱునుఁ
దమతండ్రిఁ గుశనాభ - ధరణీశుఁజేరి
తమచందములకు నెం - తయు వెఱగందు
నతని పాదములపై - నడలుచుఁబొరలు
సుతల నెమ్మోములు - చూచి యిట్లనియె.
“ఏమి నిమిత్తమై - యెలనాఁగలార!
నీమేర పిళిమూరెఁ - డేసి యంగములఁ
గొఱమాలితిరి మిమ్ముఁ - గోపించియిట్టి
కొఱఁత యెవ్వఁడుచేసె? - కులధర్మసరణి 2790
తప్పితి” రోయను - తండ్రినీక్షించి
యప్పువ్వుఁబోణు లి - ట్లనిరి ఖేదమున,
“మాచెల్వుచూచి కా - మవికారమగ్నుఁ
డై చేరి పవమానుఁ - డాసించియడుగ
మాతండ్రి యనుమతి - మమ్ము వరింపు

మీతలంపులు మాను - మీవని పల్కఁ
గోపించి మాకు నీ - గుజ్జురూపములు
శాపించి నటులిచ్చి - చనియె" నటన్న,
వినియంతలోచాల - విస్మాతుఁడగుచుఁ
దనమదిలో మెచ్చి - తనయులఁ జూచి 2800
"మేలుమే లతుల ధా - ర్మికుఁడయ్యుఁ నింత
పాలుమాలునె మిమ్ము - పవనుండుచూచి
మీకతంబునకీర్తి - మించితి నేను
నా కులం బతిపావ - నంబయ్యె నేఁడు
దివిజులయెడ నింత - దీమసం బునుచు
నువిద లెచ్చటనైన - నున్నారె? జగతి
మెలఁతల కభిమాన - మే భూషణంబు
వలదె యీనిలుకడ - వారిజాక్షులకు
క్షమయె సత్యంబును - క్షమయె ధర్మంబు
క్షమయె కులంబును - క్షమయె వర్తనము 2810
క్షమయె మోక్షంబును - సకలార్థములకు
క్షమఁబోల సాధనాం - శము లెందుగలవు?
మీ యీలువులె యెందు - మీకంగరక్ష
యేయెడలనుఁ బ్రోవ - నీశుఁడున్నాఁడు
పొండ” ని తనమంత్రి - పుంగవు లండ
నుండంగ వారితో - నొకమాటవలికె.
"కన్నియలను దేశ - కాలపాత్రంబు
లెన్ని యొక్కరుఁబిల్చి - యిచ్చుట యొప్పు
వలయుఁ జేయంగ ను - ద్వాహముల్ వీరి
వలదింట నునుప జ - వ్వనులైన వారి 2820

—: బ్రహ్మదత్తుని చరిత్రము :—


చూళినా నొక మునీ - శుఁడు నియమంబు
చాలంగఁబూని ప్ర - శాంతచిత్తమున
నతఁ డూర్థ్వరేతుఁడై - యరిదితపంబు
కతిపయదినములు - కావింపుచుండ
నొకకొమ్మ గంధర్వ - యూర్మిళ యనెడి
సకియకు తా తనూ - జాత యైనట్టి
సోమద యను రామ - చూళినిఁ జేరి
యామేర పరిచర్య - లాచరింపంగ
చూచి యందుకు మెచ్చి - సోమదం బిల్చి
యాచూళి యేమిత్తు - నడుగు మీవనిన 2830
“బ్రహ్మనిష్ఠుని ధర్మ - పరుని నీయట్టి
బ్రహ్మైకనిధి నాకు - పట్టిగానొసఁగు
నొకనాడు పురుష సం - యోగ మే నెఱుఁగ
నొకని యధీననై - యుండుటలేదు”
అన విని యమ్మౌని - యనుమోద మంది
తనదు మానసపుత్రుఁ - దరుణికి నొసఁగె.
బ్రహ్మతేజోనిధి - పాలించు సుతుని
బ్రహ్మదత్తునిఁగాంచి - పడఁతియు నరిగె.
“అగణిత శ్రీలతో - నమరేంద్రుమాడ్కి
బొగడొందు కాంపిల్య - పురి నున్నవాఁడు 2840
నమ్మహాత్నునకు క - న్యాశతకంబు
సమ్మతినిత్తు ని - చ్చటికిఁ బిల్పించి”
అనుచుతోడనె కమ్మ - లంపి రప్పించి
తనయల నందఱఁ - దా ధారవోసె.

ఏణాంక వదనల - నెల్లఁబెర్వేర
పాణిగ్రహమొనర్చె - బ్రహ్మదత్తుండు
నతనికేల్సోఁకిన - యంతలో కన్య
లతనుని సమ్మోహ - నాస్త్రంబు లనఁగ
మొదటిచక్కదనంబు - మొదటిచిన్నెలును
మొదటిజవ్వనములు - మొలిపించినట్లు 2850
శశిరేఖలనఁగ మిం - చఁగ సంతసించి
కుశనాభుఁ డా ముద్దు - కూఁతులఁ జూచి
యందలంబుల నుంచి - యరణంబు లొసఁగి
యందఱ దీవించి - యల్లుని వెంటఁ
బనిచిన సోమద - పరమహర్షమున
తనదు కోడండ్ర లం - దఱ గారవించి
కాంపిల్యపురిలో సు - ఖస్థితినుండె

—: విశ్వామిత్ర కౌశికీనదుల వృత్తాంతము :—


సంపూర్ణ కాముఁడ - జ్జన నాయకుండు
గోత్రాభివృద్ధికై - కుశనాభుఁడెంచి
పుత్రులఁ గామించి - పుత్రకామేష్టి 2860
పూని కావించు న - ప్పుడు పద్మగర్భు
మానసపుత్రుఁ డౌ - మౌని కుశుండు
“వచ్చినీకొసఁగితి - వంశవర్థనుని
యిచ్చితి” ననిమౌని - యెఱగిన యంత.
ఆనరపతి గాధి - యను మహారాజు
మానితపుణ్యుఁ గు - మారునింగనియె.
“గాధిరాజునకు యేఁ - గలిగితి రామ

వాధీశ! యిదియె మా - యన్వయక్రమము
నాకు తోఁబుట్టువు - నాకన్నఁబెద్ద
యాకన్నె వెలయు స - త్యవతీ సమాఖ్య 2870
ఏము రుచీకున - కిచ్చిన వారు
భూమినుండఁగ రోసి - పుణ్యదంపతులు
యీశరీరములతో - నేఁగిరి దివికి
కౌశికి యందురా - కన్నియపేరు
హిమవన్నగము పొంత - నీయుర్విమీఁద
నమలాంగి తనకీర్తి - యతిశయిల్లుటకు
దివిజులు పొగడ న - దీరూప యగుచుఁ
బ్రవహించె కౌశికి - ప్రఖ్యాతిగాంచె.
ఏనాఁట నుండియు - నిచట వసింతు
నానందకర వామ - నాశ్రమంబునను 2880
సిద్ధాశ్రమంబు ప్ర - సిద్ధాశ్రమంబు
సిద్ధంబు మీరు వి - చ్చేసిన కతన
ప్రొద్దుగూఁకియుప్రొద్దు - బోయెను మీకు
నిద్దుర లేకున్న - నేరరు ఱేపు
పయనమై రా నిందు - పవళింపుఁ డబ్జ
నయనముల్ ముగుడించి - నాసమీపమున
చూడుమల్లపుడె ప - క్షులు గూళ్లుచేరె
నీడద్రుమంబుల - నిద్రింపవయ్య!
కొమ్మలు వ్రేల నా - కులు ముణిగించె
నెమ్మిమైఁ దరువులు - నిదురింపవయ్య! 2890
గగనంబు మేనెల్ల - కన్నులో యనఁగ
నెగడె తారకములు - నిదురింపవయ్య!

మెండుగా దిశల నే - మియుఁ గాననీక
నిండెను చీకటుల్ - నిదురింపవయ్య!
ఏచ్చోట వెన్నెల - లెసఁగించి కలువ
నెచ్చెలి పొడచూపె - నిదురింపవయ్య!
దుర్జయులై చరిం - తురు రాత్రులెల్ల
నిర్జరారాతులు - నిదురింపవయ్య!
ధారాళమకరంద - ధారల నీల
నీరజంబులమించె - నిదురింపవయ్య! 2900
పొగరు వెన్నెలలాని - పొట్టలనిండ
నిగుడెఁ జకోరముల్ - నిదురింపవయ్య!
పావన రఘురామ! - బడలిక ల్దీర
నీవును తమ్ముండు - నిదురింపరయ్య!"
అని రాము నూరార్చి - యా తపోధనుఁడు
కనుమొగుడింప రా - ఘవులు నిద్రింప
నచ్చోటఁగల మౌను - లందఱుఁగూడి
ముచ్చట గాధేయ - మునిచరిత్రంబు
విందుగా వీనుల - విని సమీపముల
నందఱు నిద్రించి - రమ్మఱునాఁడు, 2910
శోణాపగాంచల - క్షోణులం జనుచు
నేణాంకధరమూర్తి - ఋషిచక్రవర్తి
గనుఁగొని "యేచాయ - గడత మీయేరు?
కనరాదు ఱేవన" - గాధేయుండనియె.
“నా వెనకనె రమ్ము - నరవర! వారె
పోవుచున్నారు ము - న్పుగ తపోధనులు
నెళవరులందఱు - నే నేఁగుజాడ

తొలఁగక" రండ ని - తోకొనిపోయి
యవ్వలం జనుచు మ - ధ్యాహ్నసంగతికి
దవ్వుల జాహ్నవి - దర్శించి చేరి 2920
యన్నదిఁదీర్థంబు - లాడి కర్మంబు
లన్నియుఁగావించి - హవిరన్న మెలమి
భుజియించి యొక రమ్య - భూమిఁగూర్చుండి
విజయలోలుఁడు రఘు - వీరుఁడిట్లనియె.
“మునినాథ! యీయేఱు - ముల్లోకములను
తనచేత పావన - త్వమునొందఁజేసి
జలధిగామిని యైన - చంద మేలాగు?
తెలుపుమీ? వనిన” గా - ధేయుఁడిట్లనియె

—: గంగా పార్వతుల జన్మకథ :—


హిమవన్నగేంద్రుండు - హేమాచలంబు
కొమరిత దాను గై - కొని మనోరమను 2930
వరియించి యయ్యింతి - వలన యీగంగ
తరవాతఁ బార్వతి - తాఁగని పెనుప
తన తపంబున నుమా - తరుణి మెప్పించి
యెనసి యీశ్వరు వరి - యించె నాసాధ్వి
నగకన్యఁబెండ్లియై - నాగకంకణుఁడు
పగలును రేలెడ - బాయని రతుల
సడలక దివ్య వ - ర్షశతంబు ప్రేమ
లెడపకఁగ్రీడింప - నెల్ల దేవతలు
నజుని మున్నిడుకొని - యచటికి వచ్చి
“గజచర్మధర! శైల - కన్యయు నీవు 2940

నీలీలఁగ్రీడింప - నీతేజమోర్వఁ
జాలునే యీసర్వ - సచరాచరంబు
మానిమిత్తంబుగా - మానుము నీవు
మానిన యెడనతి - మాత్రరతంబు
లోకోపకారార్థ - లోలచిత్తమున
నీ కార్యమునకు మీ - రియ్యకోవలయు,
తీరునే నీదివ్య - తేజంబుఁ దాల్ప
నేరికి భువనంబు - లెల్ల రక్షింపు
దంపతుల్ కామ తం - త్రంబు చాలించి
యింపుతో తపముల - కేఁగుఁడు మీరు" 2950
అన "నట్లు కాకని” - హరుఁడాత్మతేజ
మొనర తేజము నందె - యునుపుదు నిపుడు
జారినయట్టి తే - జము దాల్పనొకరి
మీ రేర్పరింపుఁ - డిమ్మేదిని నన్న
మేదినియేకాక - మిగిలినవార
లోదేవ! ధరియింప - నొక్కరున్నారె?
నిలుపు ముర్వర” నన్న - నీలకంథరుఁడు
వెలువరించిన విశ్వ - విశ్వంబునిండి
యతుల ప్రవాహమై - యద్రులు నదులు
క్షితియు నేకముగ ముం - చిన వేల్పులెల్ల 2960
వనలుని ధరియింపు - మనిరి పావకుఁడు
తనశక్తిచేత రే - తము ధరియింప
నదికాఁకచే ముద్ద - యై మిన్నుమోచి
వదలక శ్వేతప - ర్వతము చందమునఁ
బావకాదిత్యప్ర - భారూఢివెలుఁగ

నావీర్యమనలుండు - నాపంగలేక
తోడైన వాయువు - తోఁగొంచు వచ్చి
వీడని కసువులో - విడిచె రేతంబు.
అప్పుడు తనసౌఖ్య - హాని గావించు
తప్పుచే శైలనం - దన కోపగించి 2970
వేలుపులనుఁగాంచి - వెతనొందుతన్నుఁ
బోలబిడ్డలులేక - పొమ్మని పలికి
పుడమి గనుంగొని - పుత్రులు లేక
యడలుచు బహునాట - కాధీనవగుచు
చరియింపు" మనియల్క - శపియించి తుహిన
ధరణీధరముచేరి - తపమాచరింప,
తనపతిఁదోడ్కొని - తానేఁగె గంగ
వినుత చారిత్రంబు - వినుపింతు మీఁద.

—: కుమారస్వామి జననము :—


తమబలంబుల కెల్ల - దళవాయి లేక
నమరులు పద్మజు - నడుగుల వ్రాలి 2980
దేవసేనాని న - ర్థించి యేమెల్ల
భావించి శంకరుఁ - బ్రార్థింప నతఁడు
“పార్వతియెడఁ బుట్టు - పట్టిని మీకు
సర్వసైన్యమునకు - స్వామిగా నిత్తు”
అనిపల్కి తపము సే - యఁగఁ బోవహరుఁడు
“వనజసంభవ! మాకు - వలయు సేనాని
కరుణింపు" మనిన నా - కంజాతభవుఁడు
సురల ఖేదంబులు - చూచియిట్లనియె,

“తనపట్టి యని గంగ - తనయు భావించి
మనసులోపల నర - మర యుంచుకొనదు. 2990
శైలజగాన త - జ్జాఠరగోళ
లాలితపిండ మ - ల్లన వహ్ని చేత
తెప్పించి గంగాన - దీ సలిలముల
నిప్పుడే యనుపుఁ డ - హీనసాహసుఁడు
సైన్యాధిపతి మీకు - సమకూడు" ననిన
మాన్యుఁ బావకు పవ - మానునిఁ గూర్చి
నగజ దాల్చినతేజ - మపుడు దెప్పించి
గగనగంగనుఁ దాల్పఁ - గా నొడఁబఱచి
యునిచిన గంగ య - య్యుగ్రతేజంబు
తనయందు నుంచి సం - తప్తతేజంబు 3000
ధరియింపఁ జాలక - తనతండ్రి పొంత
శరవణంబునఁదెచ్చి - సడలించి చనియె.
ఆరుద్రతేజస్స - మా కలనమున
భూరి మయంబయి - పొలిచె పర్వతము
నీరెల్ల బంగారు - నీరయ్యె నదుల
భూరుహంబులు స్వర్ణ - భూజంబులయ్యె
ధాతువులయ్యె నం - దలి పలములు
జాతరూపాఖ్య గాం - చన మిట్లుమించె
ఆరెల్లుగుట్టలో - నప్పుడుపుట్టె.
వీరాగ్రణి కుమార - విఖ్యాతుఁ డొకఁడు 3010
చనుఁబ్రాలు గ్రోలింప - షట్‌కృత్తికలనుఁ
బనిచిరి వేల్పులా - బాలుని యెడకు
నారులస్తన్యపా - నం బొనరింప

నాఱుమోముల మించె - నక్కుమారుండు
కృత్తికల్ వెనుప ధా - త్రి నతండు గాంచె
నత్తరిఁ గార్తికే - యాఖ్యగర్భమున
స్కన్నుండుగావున - స్కంధనామమున
వన్నియెగాంచె ను - ర్వర షణ్ముఖుండు.
అతనిసేనానిఁగా - నాదిత్యు లెల్ల
హితమతిఁబ్రార్థించి - యిడిరి పట్టమున 3020
నీ కుమారాఖ్యాన - మెవ్వరువినిన
శ్రీకరులైశుభ - శ్రీలనొందుదురు.

—: సగరచక్రవర్తి చరిత్ర :—


గంగభూమికి వచ్చు - కత యేర్పరింతు
మంగళాకరమని - మఱియు నిట్లనియె
"తాలిమతో నయో - ధ్యాపట్టణంబు
పాలించి సగర - భూపాలశేఖరుఁడు
నిండువేడ్క నరిష్ట - నేమి బిడ్డలను
రెండుపెండ్లిండ్లు ధా - ర్మికుఁడాతఁడాడె
నెనరుమీరఁగఁ గేశి - నీ సుమతులను
మనుజేశుఁడతఁడు స - మంబుగా నేలి 3030
హిమవంతమున కేఁగి - భృగువునుఁ గూర్చి
ప్రమదలుఁదాను త - పంబుగావింప.
అమ్ముని ప్రత్యక్ష - మై మహీవిభుని
కొమ్మకొక్కతె కొక్క - కొడుకు నొక్కతెకు
నరువదివేవుర - నాత్మనందనులఁ

గరుణించివేఁడుఁ డీ - గతి నిత్తుననిన
చాలునొక్కరుఁడె వం - శకరుండు తనకు
నేలపెక్కండ్రని - యెంచి నెమ్మదిని
వరముగా కేశిని - వాకొన్న సుమతి
యరువది వేవుర - నడిగె నందనుల 3040
భృగుఁడట్లవారల - కిచ్చిపోవుటయు,
సగరభూపతివచ్చె - సాకేతపురికిఁ
దానడిగినకోర్కె - తప్పక మొదటి
మానినీమణి యస - మంజునిఁ గనియె.
అరుదుగా రెండవ - యంగన సుమతి
అరువది వేవుర - నర్థించి కనియె.
ఒక్కమావిని లోకు - లుప్పతింపంగ
నెక్కొన్నతనయుల - నేతికుండలను
నునిచి పెంపఁగవారు - లొండొరుఁగడవ
ననిచిన రేఖల - నానాఁటఁబెరుగ 3050
నసమంజుఁడును బాల - కావలి నెల్ల
మసలక సరయువు - మడువు లోపలను
త్రోయుచు నుండ నం - దుకు సగరుండు
కూయిడు జనుల సం - క్షోభ మాలించి
నట్టేటఁద్రోయుచు - న్నాఁడు బాలకులఁ
బట్టివీఁడును తన - పట్టిగా యనక
నడవులఁద్రోపించె - నంశుమంతుండు
కొడుకాతనికి సర్వ - గుణసమన్వితుఁడు
తనయులు మనుమండు - తనచిత్తమునకు
ననురాగ మొనరింప - నమ్మహీవిభుఁడు 3060

శాశ్వతంబగు కీర్తి - సవరింపఁబూని
యశ్వమేధము సేయ - నాత్మలో దలఁచె."
అనవిని దీప్తాన - లార్కసంకాశు
మునిఁజూచె పల్కె రా - ముఁడు సంతసమున,
“మాకులంబునఁబుట్టు - మానవాధిపుల
శ్రీకరచరితముల్ - చెవి నాలకింప
సంతసంబయ్యె నా - సగరువృత్తాంత
మంతయు నెఱిగింపు" - మన మౌనిపలికె
ప్రాలేయనగ వింద్య - పర్వత సంధి
నాలింపుభూమి యా - ర్యావర్తమండ్రు. 3070
అచ్చోటమఘము సే - యఁగ నియమించి
వొచ్చమ్ము లేని య - శ్వోత్తమంబేర్చు
బలముతొ నస్త్రాస్త్ర - పాణియై వెంట
నల యంశుమంతుఁ బొ - మ్మని విడిపించి
దీక్షితుండై యుండ - దేవేంద్రుఁడలిగి
రాక్షసుఁడై యశ్వ - రత్నంబుఁబట్టె
మాయచే హరియింప - మది సగరుండు
సేయుతెఱంగేది - చింతిల్లుచుండఁ
బలికిరి ఋత్విజుల్ - పర్వకాలమునఁ
దొలగించు గుఱ్ఱపు - దొంగను వెదకి 3080
పట్టి తెప్పించ నీ - పట్టున యాగ
మెట్టును కొఱతయౌ - నింతియె కాక
యజమానునకు హాని - యగుఁగాన తగిన
ప్రజనంపి నీయాగ - పశువుఁదెప్పింపు"
మనవుఁడు తనయుల - నరువదివేల

జనపతి పిలిచి దీ - క్ష వహించి నాఁడ
నాకుఁబోరాదునా - నాప్రయత్నముల
మీకుఁదోఁచిన యట్ల - మేదిని యెల్ల
యోజనంబున కొక్కఁ - డోడక వెదకి
తేజిఁదెచ్చినఁగాక - తిరిగిరావలదు. 3090
మాయొద్ద నీయంశు - మంతుఁ డుండెడును
పోయిరండని" పల్కి - భూపాలుఁడనుప
సగరులువచ్చిభూ - చక్ర మంతయును
తగురీతి వెదకి వృ - థా ప్రయత్నములఁ
గసికలు పారలు - గడ్డపొరలును
ముసలముల్ దాల్చి - కమ్ముక పరిగట్టి
యిలయెల్లఁద్రవ్వుచు - నెదురైనచోట
బలురక్కసులను స - ర్పములను ద్రుంచి
కొండలతోఁగూడ - కుంభినియెల్ల
చండించి త్రవ్వి దు - స్సహ వృత్తి మెలఁగ 3100
భూతకోటులు పరా - భూతులై చాల
భీతిల్లి కూయిడ - బెగడి దేవతలు
థాతసన్నిధికేఁగి - ధరణికినైన
యీతిదెల్పిన వారి - కిట్లని పలికె.
"తురగంబుఁ గొనుచు నిం - ద్రుడువోయి కపిలు
మఱగునఁగట్టి నె - మ్మది నిల్లుచేరె.
ఈజగద్రోహు లా - యిరవున కేఁగి
యాజటివర్యుకో - పానలార్చులకు
నిగురుగానున్నారు - నిమిషంబులోన
సగరుల కవసాన - సమయంబు వచ్చె 3110

మీకేల చింతల? - మిన్నకయుండుఁ
డీకార్యమెల్ల నే - యెఱిఁగి యున్నాడ
వొమ్మన్న సురలెల్లఁ - బోయిరి నగరు
లిమ్మహి వెలయులో - నెచ్చోటు వెదకి
కానక తమతండ్రి - కడకేఁగి హయముఁ
గానలేమని పల్కఁ - గన్నెఱ్ఱఁ జేసి
"తురంగంబుఁదేక వ - త్తురె పొండుమరల
ధరయెల్లఁద్రవ్వి పా - తాళంబు వెదకి
యా రసాతలవిశ్వ - మంతయుఁ జూచి
ధీరులై తురగంబుఁ - దెండు పొండ"నిన 3120
నందరు ధరణి న - య్యలుగాఁగఁద్రవ్వి
యెందుఁజూచిన జీవ - హింస సేయుచును
పాతాళమునఁ బూర్వ - భాగంబు నందు
నాతరి భూభార - మౌదలఁదాల్చి
యమరు విరూపాక్ష - మను దంతిఁ గాంచి
తమరందు తురగ ర - త్నముఁగాన లేక
దక్షిణంబున కేఁగి - దర్పంబు మెఱసి
యక్షీణబలులు మ - హాపద్మగజముఁ
గాంచి యచ్చట వాజిఁ - గానక తామ
సించక పడమర - చేరి యచ్చోట 3130
సౌమనసం బను - సామజోత్తమము
భూమిఁ దాల్పఁగఁజూచి - పోయి యవ్వలికి
నుత్తరంబునను పాండు - రోరుగాత్రంబు
మత్తంబు భద్ర సా - మగజంబుఁగాంచి
వేలుపుమూల ద్ర - వ్వి రసాతలంబు

నాలోకనము సేయ - నల్ దిక్కునందు
తపనతేజుని సనా - తను వాసుదేవు
కపిలుని తురగంబుఁ - గాంచి హర్షించి
“ఓరిగుఱ్ఱపుదొంగ! - యోడకనీవు
గీరంబు తోడ మి - క్కిలి మౌనిఁబోలి 3140
పొడకట్టితివి నిన్నుఁ - బోనిమ్ము కట్టి
పొడవక పోకుము - పోకు" మనంగఁ
గాంచి యమ్మౌని హుం - కారం బొనర్ప
నంచితరోషాన - లాభీలశిఖలఁ
బాపాత్ము లన్యాయఁ - బరులొక్కఁడైన
రూపేర్పడక సగ - రులు భస్మమైరి.
అరువదివేవురు - నణఁగిపోవుటయు
తురగంబు వోయిన - త్రోవ గానమియు
జాలచింతలు వెంప - సగరుండు తాల్మి
మాలి యప్పుడె యంశు - మంతునిఁ బిల్చి 3150
“మతిమంతుండగు బుద్ధి - మంతుఁడ వార్య
హితుఁడవు శూరుల - కెల్ల నగ్రణివి
తురగంబుఁతే లేదు - తోతేరఁబోయి
తిరిగిరారైరి యే - తెరువునఁజనిరొ?
ఎచ్చోట పినతండ్రు - లేఁగిరి నీవు
నచ్చొటికరిగి మే - లరసిరమ్మ"నుచుఁ
గైదువు శరములుఁ - గలన మేలిచ్చు
కోదండమును కేలఁ - గొమ్మనియొసఁగి
యెచ్చరిక మెలంగు - మెందుఁ బూజ్యులను
మచ్చికతోఁ గొల్చి - మన్నన గనుము 3160

యనుమని యాతఁడ - మ్మనుమని భక్తిఁ
దనర దీవించి - ఖేదమునఁ బంపుటయు
నంశుమంతు రీతి - నలఘు తేజమున
నంశుమంతుఁడు తండ్రు - లరిగిన జాడ
ధరఁద్రవ్వివారు పా - తాళంబుచొచ్చు
తెరువునవచ్చి దా - దిగ్గజేంద్రముల
పర్వంబులను శిరో - భాగంబు లూఁప
నుర్వియెల్లఁజరించు - నురుసత్త్వధనులఁ
గాంచి తండ్రులఁ దుర - గము వేరువేరఁ
గాంచితిరే యన - గజరాజులెల్ల3170
పోయిరిత్రోవగాఁ - బొమ్ము నీవచటి
కా యశ్వరత్నంబు - నందె చూచెదవు
పొమ్మన్న వలవచ్చి - పూజించి యతఁడు
నమ్మత్తగజముల - నన్నిటిమీరి
రాసులై యొరుమూలఁ - బ్రబలుమంటలను
భాసితాంగములతో - భస్మమైపడిన
జనకులంగని మదిఁ - జాల శోకించి
మునిచెంతతమయశ్వ - ము మెలఁగఁజూచి
కైకొని సగరసం - ఘమునకు వార
లేకడ నొసఁగంగ - నిచ్ఛఁజింతించి 3180
జలము లెచ్చట లేక - చాలశోకించి
నల యంశుమంతు తో - నండజస్వామి
సగరునిబావ కా - శ్యపుఁడు పక్షీంద్రుఁ
డగణితప్రీతితో - నటపొడసూపి
వైనతేయుఁడను మీ - వారెల్లఁదనకు

మేనల్లు వారల - మేయ సాహసులు
తగునె సాధరణో - దకదానమొసఁగ
సగరులీ లౌకిక - జలములచేత
కడతేర నేర్తురే! - గంగాప్రవాహ
మడరించి తిలదర్ప - ణావలియొసఁగు 3190
కపిలకోపాగ్ని ద - గ్థశరీరులైన
విపులపాపాత్ముల - వే దరిజేర్పు
మంచివాఁడవు నీవు - మఘవాజిఁగొనుచు
సంచితపుణ్య మీ - సవన మీడేర్పు
మరుగు మయోధ్యకు - నన్న పక్షీంద్రు
చరణంబులకు మ్మ్రొక్కి - చయ్యనఁగదలి
తనపితామహునితో - తండ్రుల తెఱఁగు
వినతాసుతుని మాట - వినుపించుటయును.
కడ లేనిదుఃఖ సా - గరములోమునిఁగి
యడలుచు నెరవేర్చి - యశ్వమేధంబు 3200
గంగనుర్వికిఁ దెచ్చు - క్రమమాత్మలో నె
ఱంగక యాత్మసా - మ్రాజ్య మేలుచును
ముప్పదివేలేండ్లు - మునుముట్ట బ్రదికి
ముప్పున సురలోక - మున కేఁగెనతఁడు.
అతనికి తరువాత - నంశుమంతుండు
క్షితియెల్లఁ దా నభి - షిక్తుఁడై ప్రోచి
ఘనుని దిలీపుని - గాంచి యావెనక
తనరాజ్యమెల్ల నం - దనునకు నిచ్చి
వెలయ ముప్పదిరెండు - వేలేండ్లు గంగ
నిలకుఁ దేరఁగ మది - నెంచి కానలను 3210

వింతతపంబు గా - వించి చేఁగాక
యంతట దివమున - కరిగె నవ్విభుఁడు.

—: భగీరథుఁడు గంగకై తపంబొనర్చుట :—


ఆ దిలీపుఁడు పది - యార్వురైనట్టి
యాదిమరాజుల - యందొక్కఁడగుచు
ధరణి యంతయు సము - ద్ర పరీతముగను
పరిపాలనముచేసి - పావనచరితు
సుతు భగీరథుఁ గాంచి - సుస్థిరభోగ
వితతిచే ముప్పది - వేలేండులుండి
ఘనమైన రుజఁగాల - గతినొందిఁజనియె.
అనిమిషపురమున - కా తరువాత 3220
రాజన్యుఁ డా భగీ - రథుఁడు సాకేత
రాజధాని మహావి - రాజితుండగుచు
పాలింపుచును గంగ - పావనశ్రీల
భూలోకమునకుఁ - దేఁబూనియుఁ దనకు
కొడుకల వేఁడియు - గోకర్ణమునకు
వెడలి తపంబు - గావించె రాజ్యంబు
సచివులు పాలింవ - సమకట్ట నియతి
నచలుఁడై ఘోర పం - చాగ్ని మధ్యమున
యినునిపై తనచూడ్కి - యిడి రెండుచేతు
లును పొడవెత్తి కా - లు ధరిత్రిమీఁద 3230
మోపక యంగుష్ట - మున నిల్చినెలకు
నాపోశనవ్రత - మాచరింపుచును
తపమొనరింప ప - ద్మభవుండు మెచ్చి

యపుడు ప్రత్యక్షమై - యతనికిట్లనియె.
"అనఘ! మాసాహారి - వై యిట్టి భీమ
వనిలోన వేయేండ్లు - వదలని తపము
చేసితి మెచ్చి వ - చ్చినవాఁడ నిన్ను
వాసిగాఁగోరిన - వరము లిచ్చెదను
నడుగు మీవన" "దేవ - యడిగెద మిమ్ము
కొడుకులఁ గామించు - కోరిక యొకటి 3240
మావంశజులకు గ - ర్మంబులు దీర్ప
దేవతానదిని ధా - త్రికిఁ దెచ్చుటొకటి
కోరితి"నన "నీదు - కోరికల్ రెండు
కూరిమినొసఁగితి - కొడుకులం గనుము
గగనవాహినిఁ దెమ్ము - కరమర్థి మీదు
సగరుల కొసఁగుము - స్వర్గభోగములు
గంగను ధరియింపఁ - గానొక్క సర్వ
మంగళావిభుఁడె స - మర్థుండుగాక
యెవ్వరు నోప ర - య్యీశునిం గూర్చి
యెవ్వేళ గావింపు - మీవుతపంబు” 3250
ననిపల్కి. గంగతో - ననుమతి యొసఁగి
చనియె వేల్పులు గొల్వ - జలజసంభవుఁడు.

—: గంగావతరణము :—


మొదలింటి గతి నుగ్ర - ముగ తపం బతఁడు
మదనారిఁగూర్చి భీ - మ వనంబులోన
కావింపుచుండగఁ - గరుణశంకరుఁడు
దేవి యుతంబుగా - దివిజులు గొల్వ

సన్నిధిచేసి యొ - సంగెద కోర్కె
నన్ను వేఁడు మనంగ - నరనాధుఁడనియె.
“దేవ! ధాత్రికి వచ్చు - దివిజ స్రవంతి
నీవది తలఁదాల్చి - నిలుపంగవలయు 3260
నెవ్వారిచేఁ దీర - దెదిరించి నిలువ
నివ్వరం బిమ్మన - నిచ్చితి ననిన
తలఁచు భగీరథు - తలఁపు వెంబడినె
యల మంచుమలపట్టి - యాకాశగంగ
హరునిఁగూడఁగ సచ - రాచరంబైన
ధరణియెల్లను రసా - తలముతోఁగూర్తు
ననుచు నుత్కటవేగ - మమరంగ నొక్క
పెనువెల్లియై గంగ - పృథివికి దుమికె.
ఆగర్వమెఱిఁగి పు - రారి యట్టిట్టు
సాగనీయక హిమా - చలదరీనిబిడ 3270
భీకరారణ్యశో - భితము లౌజడలు
జోకగా దిక్కులు - చుట్టి రాఁబఱచి
నటియించు నెడమహా - నటజటాటవినిఁ
బొటమరింపఁగలేక - పొంగెల్ల మాని
నుడివడి నదియున్న - చొప్పు నేర్పడక
సడలి యేసందున - జూరి పోరాక
యిందాఁకఁజూచితి - యెక్కడఁ బోయ
బృందారకాపగ - పేరైనలేక ”
యనుచు భగీరథుం - డచ్చోట గొన్ని
దినములుచూచి య - ద్దేవు భావించి 3280

యతఁడువెండియు తప - మాచరింప
నతికృపాపరుఁడై మ - హాదేవుఁడపుడు
జడచుట్టు వదలించి - జగతికై కొంత
సడలినంతన బిందు - సరములోపలను
గుభులు గుభుల్లని - ఘూర్ణిల్లిదాఁటి
త్రిభువనంబులను ప్ర - తిధ్వనులీయఁ
బ్రవహింప యవియె స - ప్తప్రవాహముల
నవతరించెను భువ - నాశ్చర్యముగను
ప్రాచుర హ్లాదిని - పావని నలిని
యైచెన్నుమీఱె మ - హాపగల్మూడు 3290
సీతయు చక్షువు - సింధువు ననఁగ
ఖ్యాతిగాఁపడమర - యై మూఁడునదులు
ప్రవహించె నాభగీ - రథుని న్వెంట
నవనిభేధిల్ల మ - హానది యొకటి
అమ్మహారథు రథం - బరిగినత్రోవ
గ్రమ్ముకయుత్తర గా - మిని యగుచు
కారండవ క్రౌంచ - కలహంస చక్ర
సారసకలకల - స్వనశోభితంబు
కమఠకుళీరన - క్రగ్రాహభయద
తిమి తిమింగిల సము - త్కీర్ణాంతరంబు 3300
కనకాబ్జకల్హార - కైరవప్రసవ
వినుతమాధ్వీ రసా - వితషట్పదంబు
అభ్రంలిహోర్మికా - ప్రాంచలచార
శుభ్రడిండీరవి - శ్రుతదిశాముఖము
బహుతదావర్తాన - పాయచంక్రమణ

మహనీయతరతరు - మధ్యమాసంబు
నగుచు మిన్నుననుండి -యభ్రయానముల
నిగనిగమెఱచు మ - ణీభూషణముల
నాదిత్యరుచులతో - నధినుతుల్ సేయు
నాదిత్యకోలాహ - లానువాదముల 3310
శరదభ్రముల యాక - సంబు చందమున
హరిణపక్షములైన - హంసపోతముల
దొరయుచునిలకెల్ల - దొడవుకైవడిన
వరనదీరత్న ము - ర్వరవచ్చునపుడు
మలకలైదిక్కుల - మలయు నొక్కెడను
చులకనై వేగంబు - చూపు నొక్కెడను
తగునశ్వముల రీతి - దాఁటు నొక్కెడను
నిగుడక యందంద - నిలుచు నొక్కెడను
గజములోయన నొక్క - కడమందమంద
నిజగమనము చూపు - నిలుచు నొక్కెడను 3320
లహరీపరస్పరో - ల్లాసఘట్టనల
విహితాట్టహాసముల్ - వెలయించు నొకట
నమరలోకముఁబాసి - యవనిపైఁ బుట్టు
నమరుల మరలంగ - ననుపు నీరార్చి
తొలఁకుల నెగయు లేఁ - దుంపురులంటి
పొలయుగాడ్పులఁ బాప - ములుఁబాఱమీటు
యిరుగడ నింద్రాదు - లెల్ల సేవింప
గరుడగంధర్వయ - క్షప్రభుల్ గొలువ
వచ్చినదీ నద వన - పర్వతములు
గ్రొచ్చుచు నన్ని ది - క్కులునాక్రమించి 3330

నాచాయనొకజహ్నుఁ - డనుముని యాగ
మాచరింపఁగ ద్రవ్య - మలర తోఁగూర్చి
శాల యువ్వెత్తుగాఁ - జరుముక పాఱ
నాలోన జహ్ను మ - హామౌని యలిగి
పోనీక యయ్యేరు - పుడిసెండునీరు
గానుంచి యొక్క గ్రు - క్కనె పట్టిమ్రింగె.
అదిచూచి విబుధులా - హా నినాదముల
వదలక యమ్ముని - వర్యుఁగీర్తింప
గంగ! నీ తెఱఁ గెఱుఁ - గంగ లేనైతి
భంగమందితి" నని - ప్రార్థింపుచుండ 3340
చింతచేఁదిరిగి చూ - చి భగీరథుండు
చెంతలఁ బ్రణమిల్లి - చేరి ప్రార్థింప
నా రాజ జటివర్యుఁ - డై సజహ్నుండు
భోరున తనకర్ణ - పుటముల వెంట
పొమ్మన్న నతనికిఁ - బుట్టితి ననుచు
సమ్మతితో గంగ - జాహ్నవియనఁగఁ
బేరుఁబెంపునుఁగల్గి - పెల్లుబ్బెదిశల
మీరుచు పరమధా - ర్మికవర్యుఁడనఁగ
వెలయు భగీరథు - వెంబడివచ్చి
జలరాశిచొచ్చి ర - సాతలంబునకు 3350
దుమికి పాతాళంబు - దూరి యాసగర
సుమహితభస్మరా - సులునీటఁగలయ
కాపిలకోపాగ్నిఁ - గ్రాఁగినవారి
పాపంబులెల్లను - పైపయిఁదొలఁగఁ
బ్రవహించుటయు భగీ - రథునిదీవించి

దివికినేఁగిరివారు - దివ్యవేషముల
నపుడబ్జభవుఁడుప్ర - త్యక్షమై నిలిచి,

—: బ్రహ్మ భగీరథుని కడకువచ్చుట :—


యపరిమితప్రీతి - నాభగీరథునిఁ
గాంచియుర్వికిని గం - గాప్రవాహంబు
పెంచి పావనత గ - ల్పించితి వీవు 3360
నందఱునుఁ గృతార్థు - లైరి మీవారు
నందన నీకు నీ - నాకస్రవంతి
యవని భాగీరథి - యనుపేరువెలయు
తవిలియున్నది జగ - త్రయిఁబ్రవహించి
త్రిపథగా నామ మం - దెను మీకులంబు
నృపవర్యు లపవర్గ - నిత్యభోగములు
యెందాంకజలరాసు - లీయేఱునుండు
నందాకనెమ్మది - ననుభవింపుదురు
కావింపు వీరికి - గంగాజలముల
పావనవృత్తి త - ర్పణముఖ క్రియలు 3370
యసమానుఁడు దిలీపుఁ - డంశుమంతుఁడు
నసమంజసుఁడు సగ - రావనీవిభుఁడు
పూని చేతనుఁగాక - పోయిరి గంగ
దేనేర కీరీతిం - దెచ్చితి వీవు
సేయునట్టి ప్రతిజ్ఞ - చెల్లించుకొంటి
వాయతవిఖ్యాతు - లందితివీవు
ధార్మికుండవు వీనఁ - దానమొనర్పు
కర్మముల్ నడుపుము - కనుము నందనుల"

ననుచు దీవించిరా - యంచపై నెక్కి
చనియె పద్మభవుండు - సత్యమార్గమున. 3380
ధాతయానతి చేతఁ - దండ్రికిఁదనదు
తాతకు సగరుని - తరము రాజులకుఁ
దిలతర్పణములిచ్చి - తీర్చికర్మములు
విలసితాలంకార - విధిశోభనంబు
చేకొని జనులెల్ల - సేవింపవచ్చె
నాకల్పయశుఁ డయో - ధ్యాపురంబునకు
ధరణిజనంబుల - ధర్మమార్గమునఁ
బరిపాలన మొనర్చి - పరగుటంజేసి
గంగావతరణంబు - కథవిన్నఁగలుగు
సంగరవిజయంబు - సకలధర్మములు 3390
పితృ దేవతాప్రీతి - ప్రియవధూలబ్ధి
హిత కార్యసిద్ధి య - నేకపుణ్యములు
గలిగి పాపంబులు - కడకొసరించి
వెలయుదు రటుగాన - వివరింపవలసె.

—: విశాలాపుర వృత్తాంతము :—


సాయంసమయమయ్యె - సంధ్యాదివిధులు
సేయుండు నా నట్లు - చేసెరాఘవుఁడు
సౌమిత్రియునుఁ దాను - సంయమినాథ!
నీమృదూక్తులచేత - నిమిషమైతోఁచె
యీ రేయియొకనిద్ర - నేతెల్లవాఱె
చేరెఁబూర్వాచల - శిఖర మర్కుండు 3400

నోడయీరేవున - నున్నదిమునులఁ
గూడి పోదము రమ్ము - గొబ్బుననెక్కి
యని యుత్తరంబుగా - నయ్యేఱుదాఁటి
మును లెదుర్కొనుచు త - మ్ముబహూకరింప
నావలఁజనుచోట - నతిరమ్యమగుచు
దేవలోకముమాడ్కి - దివ్యసంపదల
సమధికంబైన వి - శాలాపురంబు
రమణీయతకుమెచ్చి - రాఘవుండనియె.
“ఎవ్వరుగావించి - రెయ్యది నామ
మెవ్వరుందురుదీన? - నెఱింగింపు” మనిన 3410
విని విశాలపురి ప్ర - వృత్తంబు గాధి
తనయుఁడు రఘువరో - త్తమున కిట్లనియె,
“ఇంద్రుని చారిత్ర - మిది వినుపింతు
చంద్రసన్నిభ! రామ - చంద్ర! ఆలింపు
సకలసురాసుర - సంఘంబు బుద్ధి
నొకచింతయిడి కృత - యుగవేళయందు
జరయు నాఁకలియునుఁ - జావును లేక
పరిణామముననుండు - పరమౌషధంబు
క్షీరాంబురాశి ద్ర - చ్చి గ్రహింత మమృత
పూరంబు జనియించు - బుగ్గచందమున 3420
నదితెచ్చి సేవింత - మని మందరాద్రి
వదలకజలధిఁ గ - వ్వంబుగానునిచి

—:పాలసముద్రమును మథించుట :—


వాసుకి తరిత్రాడు - వలె దానఁజుట్టి
యాసురాసురలు స - వ్యాపసవ్యములఁ

దరువంగ వాసుకి - దంష్ట్రమూలముల
గరళంబు జలరాసిఁ - గాలకూటంబు
పేరిట జనియించి - పృథివి నింగియును
స్ఫారవిషానల - జ్వాలలచేతఁ
గమలింప సురలు శం - కరు పాలికరిగి
తమ కభయము వేఁడు - తరి నచ్యుతుండు 3430
వనజాక్షుఁ డప్పుడు - వచ్చి యీగరళ
“మనఘ! నీ వగ్రపూ - జార్థంబు గొనుము
కాలకూటంబు మ్రిం - గక యుంటివేని
తాళఁజాలక జగ - త్త్రయము నశించు
నేమరకు" మటంచు - నీశుతోఁ బలికి
తామరసాక్షుఁ డం - తర్ధానమంద,
అమృతోపమంబుగా - హలహలపాన
మమరహితార్థియై - హరుఁడు గావింప
మున్నిట్టి చందాన - మున్నీఁటిలోనఁ
బన్నగ రజ్జుసం - పన్నమందరము 3440
వైచి సురాసురల్ - వరుస మథింప
నాచాయ తరికొండ - యడుగు వట్టుటయు
దితి కొడుకులు నది - తి కుమారకులును
వెతలతో మొఱ - వెట్ట విన్నువీక్షించి

—: ధన్వంతరిపుట్టుట :—


యందరు మెచ్చఁగూ - ర్మావతారమున
మందరం బెగనెత్తి - మత్తుగా నునిచి
దేవతలును పూర్వ - దేతావళియు

లావఱఁబద్మప - లాశనేత్రుండు
వారధి వేయిండ్లు - వరబాహుశక్తి
భారకుండై మథిం - పఁగ నందువలన 3450
మానితాయుర్వేద - మయుఁడు ధార్మికుఁడు
పూని ధన్వంతరి - పుట్టె నవ్వెనక
నచ్చరల్ జనియించి - రమరదానవులు
వచ్చి వారెవ్వరి - వంతుగాకున్న
వలయు కైవడినుండ - వాకొనుటయును
వెలజాతి వారైరి - విబుధలోకమున
తరవాత జలరాశి - తరువ నన్నడుమ
వరుణనందన యైన - వారుణివుట్ట
నామద్యము గ్రహించి - రమరులు గాన
నామయిం గనిరి సు - రాసురత్వములు 3460
నుచ్ఛైశ్రవము వుట్టె - నొడిచె నయ్యింద్రుఁ
డచ్యుతుండు హరించె - నట్ల కౌస్తుభము
నమృతంబు వుట్టె దై - త్యాదిత్యవరులు
తమలోన జగడించి - దర్పంబు లెంచి
కలహింపు చుండంగఁ - గమలేక్షణుండు
నిలిచె నప్పుడు మోహి - నీ స్వరూపమున
మాయదైత్యులఁ గను - మాయించి మించి
గాయకంబున సుధా - కలశమంకించి
ఇంద్రాదులకుఁ బంచి - యిడియె వేల్పులకు
నింద్రునితో కల - హించి రాక్షసుల 3470
పొలిసిన తరివేలు - పుల తోడఁగూడె
నెలమి త్రిలోకంబు - నేలె వాసవుఁడు.

సిద్ధచారణుల ర - క్షించె శరీర
సిద్ధిగైకొనిరి ని - శ్చింతతో సురలు.

—: పుత్రశోకాతురయైన దితి తసంబుసేయుట :—


ఆదిత్యు లీరీతి - నమరులౌటెఱిఁగి
యాదితి శోకభ - యార్తయై కలఁగి
ప్రాణనాథుని కశ్య - ప బ్రహ్మఁజూచి
పాణియుగ్మముమోడ్చి - పలికె నిట్లనుచు.
"అనఘాత్మ! ఆదిత్యు - లమృతంబుఁ గ్రోల
తన తసూజలనెల్ల - తవిలివధించి 3480
యున్నవా రింద్రాదు - లొకఁడైన యేను
గన్నవారల పరా - క్రమశాలిఁ గాన
నాయింద్రుఁజంపింతు - నాత్మజుంగాంచి
యీయభిమతము నా - కీడేర్పవలయు"
నన నట్లు యిచ్చితి - నశుచి రాకుండ
వినుతశీలమున నే - వేళకన్గల్గి
తపము గావింపు మ - బ్దసహస్రదినము
లపుడు నీకు జనించు -నతఁ డింద్రుఁజంపు
పొమ్మని తనకరం - బున నింతిమేను
సమ్మతంబున ముట్టి - చనియె కశ్యపుఁడు. 3490
పతినిఁ గూరిచి కుశ - ప్లవనంబునందు
దితి యుగ్రతపము భ - క్తి నొనర్పుచుండ
యీతెఱఁ గాత్మలో - నింద్రుండుదెలిసి
భీతిల్లి గురుండు చె - ప్పిన యుపాయమున
వంచనచేత న - వ్వనిత యున్నెడకు

మంచివాఁడునుఁబోలి - మఱుదల్లి యగుట
నిజముగా నడచువా - ని తెఱంగుదోఁప
భుజియించు వేళ మై - పూఁతలవేళ
జలకంబువేళ వ - స్త్రము లందువేళ
మెలఁగువేళల నిద్ర - మేకొనువేళ 3500
నేమేమి వలయుఁ దా - నెటులుండవలయు
నేమిసేయుటయొప్పు - నెయ్యవి వేఁడు
నన్నియు నొనగూర్చి - యరలేకసవతిఁ
గన్నబిడ్డఁడు తన్నుఁ - గాచుకయుండ
"మది తొమ్మనూటతొం - బదియేండ్లు చనియె
బదియేండ్లు వెలితి నా - పతివరంబునకుఁ
గొడుకు పుట్టిన నింద్రు - గుణవంతునెట్లు
తొడఁ బడఁజంపింతు - దోసంబుగాదె”.
అనియింద్రు పరిచర్య - లాత్మలో మెచ్చి
కనికరంబున పూర్ణ - గర్భిణిపల్కె. 3510
"వాసవ ! మీతండ్రి - వరమిచ్చినాఁడు
నాసుతుఁడొకరుఁ డు - న్నత బాహుబలుఁడు
జనియించు నిఁక దశ - సంవత్సరముల
నినువంటి యున్నవా - నికిఁ గల్గినాఁడు
యిరువురు నేకమై - యీజగత్రయిని
సరిలేని యట్టి భు - జాశౌర్యములను
ఎల్లలోకంబుల - నేలుండు కడుపు
చల్లగా మిముఁజూతు - సవతియు నేను
నీ యంతవాఁడగు - నినుఁగెల్వఁగలఁడు
నీయనుజుఁడు డాప - నీతోడఁదగదు. 3520

కనియెదు, సుఖముందు - గాకనీ" వనుచు
వనిత కంటికి నిద్ర - వచ్చినట్లైన
తనకాళ్లు చాఁపుచో - తలవీడ నొఱిగి
మనసులో నేమఱి - మధ్యాహ్నవేళ
నశుచియై శయనించు - నవసరంబెఱిఁగి
యశనిచే యోగవి - ద్యాబలంబునను
కామరూపము దాల్చి - కడుసంతసమున
సోమరియగు నిండు - చూలాలిఁ గాంచి

—: సప్తమరుత్తుల చరిత్ర :—


కడుపులోనికిఁ జొచ్చి - గర్భపిండంబు
తొడిఁబడ నతఁడేడు - తునియలుగాఁగ 3530
కడుపులో బాలుఁ డు - త్కట రోదనంబు
లడరింప భయద వ - జ్రాయుధాహతిని
మానక "మారుద - మారుద" యనుడు
తోనె యొక్కటి యేడు - దునియలుసేయ
నంతట మేల్కని - యా దితితనదు
సంతును "చంపకు - చంపకు" మనుచు
వాపోపు నెడల వె - ల్పడి వజ్రహస్తుఁ
డై పెదతల్లికి - సాష్టాంగ మొరిగి
చేతులు మొగిచి “ర - క్షింపుము నన్ను
నాతి ! నీ తనయుండు - నాపగవాఁడు 3540
నను గెల్చునట్టి యు - న్నతసత్త్వశాలి
జనియించు ననుమాట - సహియింప వెఱచి
తునిమితి నే నేడు - తునియలుగాఁగ

కనికరంబున ననుఁ - గావుమీ" వనిన
నా మాటవిని దితి - యాత్మఁజింతించి
యా మఘవునిఁ జూచి - యప్పుడిట్లనియె.
“నీకేఁటి నేరము - నిర్జరాధీశ!
నీకు నేర్పరచు నా - నేరముగాక
మదిమదినుండి సు - మాళించి మర్మ
మిది దెల్పఁగా వచ్చు - నిదిదెల్పరాదు 3550
అనక వావెఱ్ఱినై - యట మించ నాడి
యనుభవించితి యట్టి - యవివేకఫలము
తునియ లేడును మరు - త్తులు గాఁగనుండు
రనిశంబు నీవార - లై మెలంగుదురు
సకలలోకములు ని - చ్చకు వచ్చినట్లు
సుకరులై మెలఁగఁగూ - ర్చుక నడపింపు
దేవతలై వాయు - దేవతాఖ్యలను
నీవు పెట్టినపేర - నే మెలంగుదురు
మారుతులై" యన్న - మాటకు మెచ్చి
స్వారాజువల్కె నీ - వచనసంగతిని 3560
అమ్మ ! నీసుతులట్ల - యమరులై లోక
సమ్మతి మారుత - స్కంధంబులందు
వసియింతు రేఁ బోయి - వచ్చెద "ననుచు
కొసరులన్నియుఁదీరి - కుధరారి చనియె.

—: విశాలాపుర వృత్తాంతము :—


ఆ యింద్రుఁడున్నట్టి - యవని యిచ్చోటు
యీయర్క సంతతి - నిక్ష్వాకునృపతి

తా నలంబసయను - తరలాక్షియందు
పూని విశాలాఖ్య - పుత్రునింగనియె.
అతని పేరిట నిమ్మ - హాపట్టణంబు
క్షితి విశాల యనంగ - సిరులతో వెలసె. 3570
అతఁడు ధూమ్రాశ్వు నా - యన శృంజయాఖ్య
జితవైరి నృపులఁగాం - చిరి సహదేవు
అతనికి హేమచం - ద్రావనీశ్వరుఁడు
సుతుఁడయ్యెను సుచంద్ర - శుభనాము నతఁడు
నా రాజుఁగనియెఁ గు - శాశ్వుఁ డాతనికి
శూరోత్తముఁడు పుట్టె - సోమదత్తుండు
కలిగె వాని కతండు - కాంచెఁగకుస్థుఁ
డలరాజు సుమతి నా - మాత్మజుఁగనియె.
అతఁడివ్విశాలామ - హారాజధాని
హితుఁడై జనులకెల్ల - యేలుచున్నాఁడు. 3580
ఈవిశాలాపురం - బేలినకతన
నావిభుల్ వైశాలి - కాహ్వయులైరి.
అందరు నుత్తము - లందరు శూరు
లందరు ధర్మజ్ఞు - లాయురున్నతులు
నీరాజకులము వా - రిచ్చోట మనము
నీరేయి వసియించి - యెల్లి వైదేహి
పురి కేఁగుద మటంచుఁ - బోయినాఁడచట
ధరణీశసుతులతోఁ - దాపసోత్తముఁడు
వచ్చిన నెదురుగా - వచ్చియాసుమతి
యచ్చపుభక్తితో - నర్ఘ్యపాద్యముల 3590

గాధేయుఁబూజించి - "కనుఁగొంటి మిమ్ము
నేధన్యుఁడ సమాను - లెవ్వారునాకు
వీరు నాయనుజులు - వీరు నందనులు
వీరుప్రధానులు - వీరాప్తజనులు
యిది సైన్య మిదిపురం - బిట్టిసామ్రాజ్య
పదవియెల్లను మీకృ - పాపాలితంబు
వీరులు దేవతా - వీరవిక్రములు
(వీరిరువురుఁజూడ - విష్ణుఁ బోలుదురు)
గజసింహగమనులు - కంజాతపత్ర
విజయావలోకులు - విండ్లునమ్ములును 3600
దొనలుఁగైదువులు నం - దుకవచ్చువారు
చను నశ్వినులవంటి - చక్కనివారు
జోడుగూడినవారు - సూర్యచంద్రులకు
జోడైన పరమతే - జోవిరాజితులు
కొమరుఁ బాయపువారు - కూడియిద్దరును
సమచిత్తవృత్తు లై - సంగినవారు
భూమికి డిగినవే - ల్పులరీతి రూప
సామగ్రిచూడఁ బొ - సంగినవారు
తలిరుటాకులను కెం - దమ్ములమీఱఁ
గల పదంబులవారు - కరకురానేల 3610
రానేల? వీరలే - రాజనందనులు?
ఫూనికె యెయ్యడ - పోవుట చెపుడ?
వీరలపేరెద్ది - వినుపింపు ” మనిన
నారాజుఁజూచి మ - హామునిపల్కె
"రాజన్య! దశరథ - రాజనందనులు

రాజీవనేత్రులు - రామలక్ష్మణులు
ఆసురిఁదాటక - నణఁగించి మించి
నాసవనముఁగాచి - నన్నుమన్నించి
జనకు జన్నము చూడఁ - జనుచున్న వారు
కని వీరిఁబూజింపు - కరమర్థి" ననిన 3620
నా రాజువారల - నర్థించి నిలుప
నారాత్రి యతని గే - హమున వర్తించి
మఱునాడు గదలి - యమ్మౌనీంద్రు వెనక
(............ .. . . . . . . .)
మిథిలాపురము చూచి - మెచ్చుచుఁ జేరి
మిథిలోపవనములో - మెఱయు నాశ్రమము
జంతుశూన్యంబు వి - జనము నౌ నొక్క
కాంతార మీక్షించి - కౌశికుఁ జూచి
“మెవ్వరి యాశ్రమం - బిది యిందుఁగాన
మెవ్వరి?" నన మౌని - యిట్లనిపల్కె 3630

—: అహల్య వృత్తాంతము :—


గౌతమాశ్రమ మిది - కాకుస్థతిలక!
ఆతని సతి నహ - ల్యా దేవియండ్రు
దంపతు లిచ్చోటఁ - దపమాచరించి
రింపు పుట్టింప న - నేక వర్షములు
నావేళ తరిచూచి - యమరనాయకుఁడు
తావచ్చెనటకు గౌ - తముని వేషమున
నపు డహల్యనుఁ జేరి - “యతివ! నీకడకు
నిపుడు వచ్చినరాక - యెఱిఁగింతు వినుము

అతివలఁ గామించు - నట్టివారెందు
ఋతుకాలమనరు కో - రికగల్గెనేని 3640
ప్రొద్దున్న దిపుడు సం - భోగేచ్ఛ నీదు
వద్దకిఁజేరితి - వనిత! రమ్మ” నిన
“ఆతలోదరి నన్ను - నర సేయనేల!
యేతెమ్ము తెలిసితి - నింద్రుండవగుదు
కోరివచ్చిన వారి - కోరికల్ దీర్ప
నేరని సతులకు - నిష్కృతుల్ లేవు
రమ్మని యింద్రునా - రాటమ్ముదీర్చి
పొమ్ము నిన్నును నన్నుఁ - బోషించు కొనుము
కనుకల్గి మీఁదటి - కార్యమూహింపు
మెనయునే? జారుల - కిట్టితామసము”, 3650
అని యహల్యా యత్త - మగుపర్ణ శాల
యనిమిషస్వామి స - య్యన నిర్గమించి
వచ్చుచో భువనపా - వనుని గౌతముని
సచ్చరిత్రుని నదీ - స్నానార్ద్రవసను
ననలసంకాశు దే - వాసురారాధ్యు
ఘను సమిత్కుశ పాణిఁ - గని చాలవెఱచి
“తొలఁగునీమది మది - ద్రోహి దుర్మార్గు
నలిగి కోపించి య - హల్యనీవేళ 3660
భోగించి నాదురూ - పున వచ్చినట్టి
రాగాంధుండవు సుర - ప్రభుఁడవానీవు?
నీ వృషణంబులు - నేలపైఁబడక
కావరంబును కాము - కత్వంబుఁజెడదు
పడుఁగాక పొమ్మ"న్న - పడిపోవ నట్లు

తడయ కహల్య గౌ - తముఁడు వీక్షించి
"నీకు నాహారంబు - నిద్రయు సుఖము
లేక తపించి ధూ - ళిమునింగి యొరులు
గనరాక పాషాణ - గతినివేయేండ్లు
చనిన యవ్వెనక కౌ - సల్యాసుతుండు 3670
రాముఁడు వచ్చునా - రాధింపు మతని
నీమేను దాల్చినా - నెలవుగోరెదవు”.
అనుచు శపించినీ - హారాద్రి కరిగి
మునినాథుఁ డచ్చోట - మునిచర్యనుండె.
అమరేంద్రుఁ డఫలుఁడై - యధికదైన్యమున
నమరులఁ జూచి యి - ట్లనిపల్కలేక

—: రాముఁ డహల్యకు శాపవిముక్తి ననుగ్రహించుట :—


"గౌతముఁడు తపంబు - గావింపుచుండ
నాతపోనిధి తపో - హాని గావింప
దేవకార్యార్థ మ - ద్దేవి నహల్య
నేవంచన మొనర్చి - యీలువుచెఱిచి 3680
యాగౌతముని శాప - మందితి నిట్లు
ఆగడంబయ్యె నా - యత్న మంతయును
నతఁడు గోపించి య - హల్యనుఁ దిట్టె
నతని తపంబెల్ల - నాఱడిఁబోవ
మీ నిమిత్తంబు నా - మేనికి కొదవ
రా నిట్లు చూచి యూ - రక యుండఁదగునె?
మతియింపుం డిందుకు - మార్గాంతరంబు
హితమన్న పితరుల - నీక్షించి సురలు

మీరు మేషాండముల్ - మెలఁకువఁదునిమి
స్వారాజు కటిసీమ - సంధింపవలయు.
పొట్టేళ్ల నిది మొదల్ - పుడమి జన్నములఁ
బట్టి వధింపరు - పశుకర్మమునకు
మీ నిమిత్తంబది - మేకొనవలయు
మా నిమిత్తంబున - మారాడవెఱచి
వారట్ల సేయ నె - వ్వరు యజ్ఞములకు
దేరు మేషముల పి - తృప్రీతికొఱకు
నిది గౌతమాశ్రమం - బిచట నమ్మౌని
సుదతియున్నది పోయి - చూతము రమ్ము"
అనుచు ముందర మౌని - యరుగ వెంబడిన
యినకులోత్తములు రా - నెట్టి చిత్రంబొ 3700
మఱఁగుగానున్న ధూ - మమువాయఁద్రోచి
కరమొప్పు పవనస - ఖజ్వాలయనఁగ
వ్యాకీర్ణమైన నీ - హారంబు ద్రోచి
రేకమించిన చంద్ర - రేఖ యోయనఁగ
జలములలోఁ బ్రతి - చ్ఛాయ గన్పట్టు
జలజభాంధవుదీప్తి - సరణియోయనఁగ
మహనీయపుణ్యశ్ర - మంబులో నలఘు
మహిమఁగ్రుమ్మరు దేవ - మాయయో యనఁగ
నలఘు తపస్విని - యైన యహల్య
తలనాఁడు వొందు గౌ - తమునిశాపంబు 3710
పోఁబెట్టి తనదైన - పూర్వవేషమునఁ
బూఁబోణియై వచ్చి - పొడకట్టుటయును
తనకు మ్రొక్కిన రఘూ - త్తముని దీవించి

మనములో గౌతము - మాటలు దలఁచి
యారామచంద్రుని - యర్ఘ్యపాద్యముల
నారాధనము సేయ - నమరవాటికను
ధిమ్మని మొరసెను - దివిజదుందుభులు
ఘుమ్మనమారుతాం - కురములు వొలసె
కురిసె నల్ దిక్కులఁ - గుసుమవర్షములు
నెరసెను సురకామి - నీనర్తనములు 3720
నాతరి రామస - మాగమం బెఱిఁగి
గౌతమముని వచ్చి - కాకుస్థుఁజూచి
పూజలుచేసి య - ప్పుణ్యాశ్రమమున
నాజటివరుం డహ - ల్యనుఁగూడియుండె.

—: రామాదులు మిథిలఁజేరుట :—


మునివెంట తానుఁ ద - మ్ముఁడును రాఘవుఁడు
చని మిథిలాప్రవే - శంబు గావించి
ఆ పురినీశాన్య - మైన దిక్కునను
చూపట్టు నమ్మహీ - శుని యజ్ఞశాల
గనుఁగొని గాధేయ! - "కంటిరే మ్రోల
జనకుని మఘవాటి - చక్కదనంబు 3730
పావనశ్రీల వి - ప్రనికేతనముల
దేవతాహ్వాన సం - దీప్తరావంబు
సవనహుతాగార - శకటపంక్తులును
ప్రవిమలతర ముని - ప్రవరవాటికలు
మెచ్చొనరించె ని - మ్మిథిలాపురమున
నెచ్చోట వసియింతు - మెఱిఁగింపుఁ" డనిన

“అల్ల జలాశయం - బరుత చూచితివె
చల్లనై యొకపర్ణ - శాల చూపట్టె
అం దరుగుదమన్న" - నక్కుమారకులు
కొందఱ మునులతోఁ - గూడి కౌశికుఁడు 3740
తారును వసియించు - తరి జనకుండు
చారుల వలన వి - శ్వామిత్రు రాక
నెఱిఁగి యప్పుడె పురో - హితు శతానందు
నెఱిగించి యతనితో - నేఁగె నచ్చటికి
అప్పుడు ఋత్విక్కు - లా గాధితనయు
నొప్పుగా జనక ని - యోగంబుచేత
పూజించు పూజలఁ - బొదలి యజ్జనక
భూజాని సంప్రశ్న - ముల నాదరించి
అతఁడొసఁగిన కన - కాసనాగ్రమున
హితమతి వసియింప - నెల్లవారలును 3750
ఉచితాసనంబుల - నుండ నవ్విభుఁడు
సుచరిత్రు నమ్మునిఁ - జూచియినిట్లయె.
"ధన్యుండనైతి నా - తపము లీడేరె
మాన్యుండ నేఁజేయు - మఘము ఫలించె
నీ రాకచేత పు - నీతుండనైతి
నారయ నేనె కృ - తార్థుండ జగతి
తీరును పదిరెండు - దినముల కింక
ప్రారంభ మొనరించు - నాత్మీయమఘము
వచ్చినవారు స - ర్వము నెరవేర్చి
విచ్చేయుఁ డిదియె నా - విన్నపంబ"నుచు 3760

నంజలిచేసి య - య్యనఘుని చెంత
రంజిల్లు చున్నట్టి - రామలక్ష్మణులఁ
జూచి "వీరెవ్వ రె - చ్చోటికేఁగెదరు
రాచకుమారులే - రాజనందనులు
వీరి పేరెయ్యది! - వినుపింవుఁ” డనిన

—: కౌశికుఁడు రామలక్ష్మణుల వృత్తాంతము జనకునకుం దెల్పుట :—


యారాజుఁ జూచిమ - హాముని వల్కె
వరమతు లిక్ష్వాకు - వంశవర్ధనులు
కరుణాకరులు ధైర్య - గాంభీర్యనిధులు
రాజతేజులు దశ - రథకుమారకులు
రాజీవనేత్రులు - రామలక్ష్మణులు 3770
నా వెంటవచ్చి దా - నవిని తాటకిని
దేవతల్మెచ్చ ధా - త్రినిఁద్రెళ్ల నేసి
బలిమి మారీచ సు - బాహులగెల్చి
యెలమి నాపూనిక - యీడేర్చి మఘము
కడఁక మైఁగాచి మా - ర్గమున శాపంబు
తడకట్టు దీర్చి గౌ - తము నిల్లునిల్పి
నీవీటిలోపల - నీలకంథరుని
చేవిల్లు దాఁచియుం - చిన తెఱంగెల్ల
వినిచూడవచ్చిరి - వీరశేఖరులు
కొనితేరఁబనుపుము - కోదండమిపుడు”, 3780
అనిన శతానందుఁ - డమలినానంద
మున నాకుమారుల - మొగములు చూచి

వీరలే మాపాలి - వేలుపులైన
శ్రీరామలక్ష్మణుల్ - స్థిరశౌర్యనిధులు
కాంచెనే మాతల్లి - గౌసల్యపట్టి
కాంచెనే శాపమో - క్షమహల్య నేఁడు
వినియెనే యీరాము - గౌతము సాధ్వి
వినియెనే వీరల - వృత్తాంతమెల్ల
చేతుల నంటి పూ - జించెనే యితని
ప్రీతునిఁగావింప - శ్రీపాదయుగము 3790
తావచ్చెనయ్య? గౌ - తమముని యటకు
దేవితోఁగలిసియం - దె వసించి నాఁడె?
ఆదంపతుల సేమ - మరసివచ్చితిరె?
నీదుమాటల చేత - నీఁగె ఖేదములు
తలఁచిరె వన్ను మా - తలిదండ్రులవుడు
పలికిరె నాకు దె - ల్పఁగ మేలువార్త"
అనిన విశ్వామిత్రుఁ - డన్నియు నతని
మనసురంజిల నాల్గు - మాటలఁబలికె
తగి రేణుకాజమ - దగ్నులం బొల్చి
మగువ తా గౌతము - మనికి వాకొనిన 3800
యాళలెల్ల ఫలించి - యారాముఁజూచి
యాశతానందుఁ డి - ట్లనిపల్కె నపుడు.
నాపుణ్యమున వచ్చి - నార లిచ్చటికి
తాపసొత్తమువెంట - దశరథుండనుప
నీతండు మునిమాత్రుఁ - డే? తపోమహిమ
రాతిగుండియగల్గ - బ్రహ్మర్షియయ్యె
సాధారణుండె యీ - సత్యాత్ముఁడైన

గాధేయు నావేల్పు - గాఁగనెంచితిని
యీతండె గతి నాకు - నెల్ల కార్యముల
యీతపోనిధి సేవ - నీవుధన్యుఁడవు 3810
వినుపింతు నిమ్మౌని - వృత్తాంతమెల్ల
వినుమని యందఱు - వినఁగనిట్లనియె.

—: విశ్వామిత్ర చరిత్రము :—


“పరమధార్మికుఁడు కృ- పా పరాయణుఁడు
శరజాలసంవేది - సాహసాధికుఁడు
దాక్షిణ్యశాలి ప్ర - తాపభూషణుఁడు
దక్షుండు నిరుపమ - ధర్మవర్తనుఁడు
కుశుఁడననొక రాజు - కుంభినివెలసె,
కుశనాభుఁడతనికిఁ - గొమరుఁడై మించె
గాధి యవ్విభునకుఁ - గలిగె నాయనకు
గాధేయుఁ డీ ఫుణ్య - ఖని జనియించె 3820
నితఁడురాజ్యముచేసి - యెల్లరఁబ్రోచి
క్షితియెల్లఁదనయాజ్ఞ - శిరసావహింప
నక్షోహిణీబలం - బరుదేర వెంట
నీక్షోణిఁజరియించు - నెడనొక్కనాఁడు
వేఁటవెంబడి వన - వీథులవచ్చి
గాఁటుప్పుటెండల - గాసిలి యలసి
పనస రసాల నిం - బ కదంబ వకుళ
ఘనసార చందనా - గరు శోభితంబు
కురువకమల్లికా - కుంద చాం పేయ
మరువక మల్లికా - మాననీయంబు 3830

నాహవనీయమ - ఖానలధూమ
సాహాయ్య జలధర - శతసమన్వితము
కారండవక్రౌంచ - కమల కల్హార
సారస కుముదకా - సార శోభితము
హరిణాది నానామృ - గాకీర్ణమౌని
వరగృహోపాంత ప - ల్వల సమన్వితము
ఘనవాలఖిల్య వై - ఖానసప్రముఖ
మునివరస్వాధ్యాయ - ముఖరీ కృతంబు
అనఘ పుణ్యపురాణ - హరికథాశ్రవణ
మసన పారగ ధరా - మరకదంబకము 3840
పావనతర హావి - ర్భాగాను యాత
దేవ పరంపరాం - తిమ దిశాముఖము
నైన వసిష్టమ - హామౌనిచంద్రు
మానిత పుణ్యాశ్ర - మంబు వీక్షించి
కడువేడ్క మౌనికిఁ - గౌశికవిభుఁడు
తడయక సాష్టాంగ - దండ మర్పించ
దీవించిన యరుంధ - తీ ప్రాణవిభుని
భావుక ప్రశ్నముల్ - పరిపాటినడుగ
ధార్మికు ల్మీయట్టి - ధరణీశులుండ
శర్మంబులకు నేమి - చదువుల కేమి 3850
యాగంబులకు నేమి - యధ్యాత్మనిరత
యోగంబులకు నేమి - యొక వెల్తిగలదె?"
అనుచుదీవించి ఫ - లాంబుముఖ్యముల
ననుపమ ప్రీతితో - నాతిథ్య మొసఁగి
యాసనంబిచ్చి హి - తానులాపముల

నాసంయమీంద్రుఁడి - ట్లని పల్కెనపుడు.
"మీకులెస్సలె? సర్వ - మేదినీనాథ!
ఏకడధర్మంబు - నెడవాయె కుందె?
పాలింతువే? నీవు - పరిజనంబులను
మేలుగోరుదురె? భూ - మీజనుల్ నీకు 3860
విజయంబుగాంచితే - విమతులంగెల్చి
భజియించితే గురు - బ్రాహ్మణోత్తముల
సప్తాంగములకు లె - స్సలెకదా? మహికి
ప్రాప్తులే నీ పుత్ర - పౌత్రాదులెల్ల
నరసిపోషింతువే - యసదలఁజూచి
పరిణామమేనీదు - బాంధవావళికి?
సేమమే? నిన్నుఁ గొ - ల్చిన రాజులకును
భూమి యకంటకం - బుగనేలినావె?
సంతోషమా నీకు - సచివుల కెల్ల
యింతులఁగోరిక - యిచ్చియేలుదురె? 3870
సకలంబుసేమమే? - జననాథ!" యనిన
ముకుళితహస్తుఁడై మునిఁ - జూచిపలికె.
"మీకటాక్షమున భూ - మిజనంబు నేము
నేకొఱంతయు లేక - యెలమి నుండితిమి
మాయేలుబడియైన - మహానుందురట్టె
మీయంతవారలే - మి విచారమింక"
అని పరస్పరము వా - రాత్మల ముదము
ననలొత్త సంభాష - ణములవర్తిల్లి
మాయింటభుజియించి - మనుజేశ ! వెనుక
మీయూరికరుగఁగ - మేకొనవలయు 3880

రాజ్యాధిపతివి ధ - ర్మస్వరూపుఁడవు
పూజ్యుండవటుగాన - పోరామి మాకు”
అనిన విశ్వామిత్రుఁ - డనియె "మామీఁద
ననుకంప మీరుంచు - నంతయె చాలు
భుజియింవు టెంతయు - పోయి వచ్చెదము
నిజముగా మఱువక - నిలుపుండికరుణ
మదిలోన" నన విని - మఱియు నమ్మౌని
సదయుఁడై "మాయెడ - చనువుచెల్లించి
త్రోచిపోవకయున్న - తోయమాత్రంబు
మాచేత భుజియింపు - మాకుగౌరవము 3890
పోవల" దన గాధి - పుత్రుండునట్ల
కావింపుఁడని పల్క - కామధేనువును
రప్పించి నందిని - రాజుకుంబ్రజల
కిప్పుడు నీవు విం - దిడి పంపుమనిన

—: కామధేనువు నిమ్మని విశ్వామిత్రుఁడు వసిష్ఠు నడుగుట :—


బంతులుసాగిన - పరివారమునకు
సంతసంబున నొక్క - సరియగుచుండ
లీల బంగారుప - ళ్లెరములు వారి
మ్రోల గిన్నెలతోడ - మొలపించి యుంచి
కలిగించె నందుల - కలమాన్నరాశి
మొలపించె బహుసూప - ముల కన్నుదనియ 3900
పెరిగించెఁజుట్టును - పెక్కుశాకములు
పరగించె మితి మీఱ - పచ్చళ్లగుంపు

జాలెత్తఁజేసె నా - జ్యప్రవాహములు
తేలించె తెప్పల - తేనె కాలువలు
వెలయించె నేచాయ - వింతకజ్జములు
కలయించె నెడమీక - కలవంటకములు
ప్రవహింపఁజేసెను - పాయసాన్నములు
నవని నిండించె ర - సావళ్లచేత
పులసులు షడ్రసం - బులు వారివారి
తలఁపులఁదలఁచునం - తకు మున్నుగాఁగ 3910
ఘుమ్మని తావులు - గుమ్మరింపంగ
కమ్మందనంబు లా - కసమెల్లనిండ
దొరలతో నాలుక - త్రుప్పుడుల్ దీఱ
పరిజనుల్ కుత్తుక - బంటిగా నపుడు
భుజియించి వార్చి తాం - బూలంబులంది
రుజలును మానస - రుజలును మాని
వలసిన తరులక్రే - వల నీడలందు
చలువపట్టుల సుఖ - శయనులైరంత.
పల్లకీలునుఁ దాను - భక్ష్యభోజ్యములు
నుల్లముల్ రంజిల - నొకపొత్తుగలసి 3920
యారగించి నృపాలుఁ - డామేలు మఱచి
"వీఱిఁడియై యావు - విందొనర్చుటకు
ములుచతనంబున - మునులకునేల?
వెలలేనియీ యావు - వింతలుగాక
రాజయోగ్యంబిది - బ్రాహ్మణులేడ?
యీ జీవధనరాజ - మేడ?" యటంచు
మునిఁజూచి "నాకు ని - మ్మొదవుఁబాలింపు

మనఘాత్మ! వలసిన - యావులిచ్చెదను
యేమివేఁడినిత్తు - ని"మ్మన్ననవ్వి
“యోమహీశ్వర! యావు - లొక్కటియేల? 3930
యిలఁగల సొమ్మెల్ల - నిచ్చెద నన్న
వెలయౌనె యొక దీని - వెంట్రుకకైన?
స్థిరధైర్యశాలి కం - చితకీర్తి యటుల
యరయంగ మాకునీ - యావు నిత్యంబు
మాహవ్యకవ్యహో - మక్రమంబులకుఁ
దాహేతువగు దీనిఁ - దగునయ్యయడుగ?
మంచిసొమ్ములుదెచ్చి - మాకు నర్పించి
మంచివారగుట ధ - ర్మంబు రాజులకు
మాయావుఁగనికని - మంచిదియనుచు
మీయంతవారికి - మేరయే యడుగ? 3940
దీనియధీన మా - త్మీయ జీవనము
దాన శరీరయా - త్రయు నడపుదుము
కాన మీరడుగుట - గాదు మాహోమ
ధేనువు మాకీయఁ - దీరదు మాకు
పురికేఁగుఁ”డన గాధి - పుత్రుండు గనలి
మఱుపడఁ గోపంబు - మఱియు నిట్లనియె.
బాగొప్ప నిలువెల్ల - పసిఁడియౌ గంధ
నాగంబులొక పదు - నాలుగువేలు
లాలితమణిమయా - లంకారరథము
లీ లోకమునలేని - వెనిమిదినూర్లు 3950
నవనవఖండ స - న్నాహంబులైన
పవనజవాశ్వముల్ - పదినొండువేలు

నాపాదశృంగ భూ - షాయత్తకనక
నూపుర కపిలధే - నువు లొక్కకోటి
వలసినయట్టి సౌ - వర్ణ రాసులును
వెలగాఁగ నిత్తు ని - వ్వేల్పుటావునకు
నిమ్మని" పల్కిన - "నిదియేఁటిమాట
యిమ్మఘంబులకు నా - యిట్టిసంతతికి
నాతిరువారాధ - నమున కిమ్మొదవు
నీతోడు వలయు దీ - ని నొసంగఁజాల 3960
వట్టిమాటలు మాని - వచ్చినత్రోవ
పట్టిపొ" మ్మనిన వి - శ్వామిత్రుఁడలిగి

—: కామధేనువు విశ్వామిత్రుబలంబులఁ దునుమాడుట :—


తనబలంబులఁ బిల్చి - “దామెనత్రాళ్లఁ
గొని కట్టి తెండుకై - కొండు ప్రియంబు
వీరింటి ముంగిటి - వెల్లావు" నన్న
వారలు వలెత్రాళ్లు - వైచిబంధింపఁ
బలుపుచే బిగియించి - పట్టుక యోడ్చి
బలవంతులై పోవు - పట్టుననావు
చిక్కి వారలచేత - చింతిల్లి నన్ను
తెక్కలికాండ్రెల్ల - తెగిపట్టిరొక్కొ 3970
యపరాధమేమి సే - యఁగ వసిష్ఠుండు
కృపలేక వీరల - కిచ్చెనోనన్ను
ఏమినేరము చూచి - యీవీరభటులు
బాములకెల్లలోఁ - బఱచెనోనన్ను
నెఱుఁగవేకేమియు - నేఁజేరఁబోయి

మొఱసేయ నమ్మ హా - ముని యానతిచ్చు
కరుణాసముద్రుఁ డీ - గాధేయుపాల
చెఱఁబెట్టు నేయేమి - సేయుదునింక?
నరయుదుఁగాక యే - నతని చిత్తంబు
పరికింప నాపాలి - భాగ్యమెట్టిదియొ” 3980
యనుచుఁదన్నరికట్టి - నట్టి దుర్జనులఁ
దనశక్తిచేత నం - దఱఁబడనిచ్చి
విదిలించుకుని తపో - విజ్ఞానరాశి
సదయాత్మున వ్వసి - ష్ఠమునీంద్రుఁజేరి
"పరమధార్మికుఁడవు - బ్రహ్మపుత్రుఁడవు
కరుణానిధివి రమా - కాంత కల్పుఁడవు
శాంతమూర్తివి - సర్వసముఁడవు నేర
మెంతసేసిననన్ను - నిటుసేయనగునె?
ఏలయ్య? వీరిచే - నిటులీడిపించి
కాలికి మెడకంటఁ - గట్టించినావు 3990
తెగి యిట్లు నామీద - తెంపుచేసినను
తగినదండము సేయఁ - దగుఁగాదె మీకు
నీదు పాదంబుల - నీడయేకాక
యేదిక్కుగలదు నా - కెన్నిచూచినను"
ననుచుఁగన్నుల వెంట - నశ్రువుల్గురియఁ
దనచెంతవిలపింపఁ - దాఁదేఱిచూచి
చెంగట తోఁబుట్టు - చెలియలి దుఃఖ
మంగదపడి చూచు - నన్నయుంబోలి
దూరుచుండెడు కామ - దుఘమునుఁజూచి
చేరంగఁ దిగిచి వ - సిష్ఠుఁడిట్లనియె. 4000

"వారికి నిచ్చిన - వాఁడను గాను
నేరమించుకయైన - నీయెడ లేదు
రాజు గావున నపా - రబలంబు వెంట
లేజాడఁ గొలువ దం - డెత్తి మామీఁద
నక్షోహిణీబల - మతనికిఁగలుగ
దక్షుఁడై నిన్నును - దండంబుసేసె
బలవంతుండాతఁడు - బ్రాహ్మలమేము
బలముగల్గిన నిన్నుఁ - బట్టుకపోవ
నూరకుందునె వాని - కొప్పనచేసి
కరుణించు నతఁడు వే - గ పడంగనేల" 4010
అన వినయంబుతో - నాయావు వల్కె
“ననఘ! దివ్యంబు బ్ర - హ్మబలంబు మీది
క్షత్రబలంబెంత - కావున భువన
పాత్రంబు సరిలేని - బలము మీబలము
బలవంతుఁడన నేల - భవ్యాత్మ! నీదు
బలము చేతనె వాని - బలమడం చెదను
నాకు నానతి యిమ్ము" - నావుఁడునట్ల
కాక పొమ్మన కామ - గవి మై విదిర్చి
హుంభారవమొనర్ప - హూణ పుళింద
పుంభావశౌర్యద - ర్పులు కీకటులునుఁ 4020
దనదుకన్నులమ్రోలఁ - దరమివెన్నాడి
తనబలంబులఁగృతాం - తపురంబుఁజేర్ప
కోపించి యా కౌశి - కుఁడు వారినెల్ల
రూపణఁగించె నా - రూఢ శౌర్యమున
పవివిభాంగుల నుప - ప్లవులఁగీకటుల

యవనుల శకుల న - య్యావుగల్పింప
వారలు కింజల్క - వర్ణులై యెల్ల
మేరలు బొదివి దొ - మ్మిగఁజుట్టుముట్ట
వివిధాయుధంబుల - వివిధవస్త్రముల
వివిధభూషల మహా - విలయాగ్నిరీతి 4030
గాధేయుబలము నొ - క్కరిఁబోవనీక
యోధులై సమయింప - నుగ్రసాహసుఁడు
కౌశికుఁడు నిశాత - కాండవహ్నులకు
నాశౌర్యనిధుల పూ - ర్ణాహుతిచేసి
సేనలుపోవఁజూ - చి వసిష్ఠమౌని
“ధేనువుఁబిల్చి నీ - దేహంబువలన
సృజియింపు మిప్పుడ - జేయసాహసుల
ప్రజల నున్నత భుజా - బలుల” నావుఁడును
కొమ్మల ముక్కున - గొరిజల చెవుల
హుమ్మను నూర్పుల - నొడిని వాలమున 4040
కన్నులం బొదుగున - కడుపున మెడను
చన్నుల కాళ్ల గ - జ్జల మూఁపునందు
శక కీకట పుళింద - సంవీర హూణ
కుకురు కాంభోజ ము - ఖ్యులఁగిరాతులను
నేలయీనినమాడ్కి - నిండఁబుట్టింప
కాలుబలంబెల్ల - కాలుబలంబు
గాధేయజననాథు - కడ దండిబారు
యోధులఁదలపడి - యుర్విపైఁగలప
వారలం దరమి వి - శ్వామిత్రసుతులు
నూరుగు రుగ్రధ - నుర్భాణులగుచుఁ 4050

జేరిన యంత వ - సిష్ఠ హుంకార
మారుతాహతిచేత - మ్రగ్గిరందఱును.

—: విశ్వామిత్రుఁడు తపంబునకరుగుట :—


పుత్రులుబలములుఁ - బోయినంజూచి
మాత్రాధికంబైన - మదిలోనిభీతి
చింతిల్లి మిక్కిలి - సిగ్గుతోవేగ
మంతయు పొలిఁబోవు - నంబుధియనఁగ
కోఱలువెఱికిన - కోపంబుచెడక
సారె గుందుచునున్న - సర్పంబుమాడ్కి
నుగ్రతేజమున రా - హుగ్రహగ్రస్త
విగ్రహుండైనట్టి - విమలార్కుఁడనఁగ 4060
ఱెక్కలువిఱిగి ధ - రిత్రిఁబోలేక
చిక్కినయట్టి ప - క్షివరేణ్యుఁడనఁగ
హతశేషుండై నట్టి - యాత్మజు నొకని
నతనిరాజ్యమునకు - నభిషిక్తుఁజేసి
హిమవంతమున కేఁగి - యీశ్వరుఁగూర్చి
ప్రమదంబుతోడఁ ద - పంబాచరింప
హరుఁడు ప్రత్యక్షమై - యతనిఁగావలయు
వరములిచ్చెద" నని - వచియింప నలరి
దేవదానవులైనఁ - దివిరి నాతోడ
లావున గెలువఁ జా - లక యోడిపఱవ 4070
కార్ముకాగమము సాం - గంబుగానేర్చి
ధర్మదివ్యాస్త్ర శ - స్త్రములునాకిమ్ము”

అన నట్లయిచ్చితి - నని యీశుఁ డరుగ
జననాయకుఁడు పర్వ - జలరాశివోలె

—: విశ్వామిత్రుఁడు వసిష్ఠుని పైదండు వెడలుట :—


నుప్పొంగి గర్వించి - యుగ్రబాణములు
కప్పి వధింతు వే - గ వసిష్ఠుననుచు
నతనియాశ్రమమున - కరిగిబాణాగ్నిఁ
బ్రతి లేక వనమెల్ల - భస్మీకరింప
మునులుశిష్యులు మృగ - ములుఁబక్షికులము
ఘనసాయజాగ్ని శి - ఖాపరంపరల 4080
గ్రాఁగి యాశ్రమ మూష - క క్షేత్రమైన
వేఁగి యెల్లరు మౌని - వెనకచొచ్చుటయు
వెఱవకుమని మంచు - విరియించునట్టి
తరణికైవడి వీని - దర్పంబుమాన్తు
కనుఁ" డనివచ్చి యా - గాధేయుఁజూచి
కినిసి “మూఢాత్మ! - యీకీడేలనీకు?
చిరకాలముననుండి - చెడనియాశ్రమము
చెఱిచి నీవెక్కడ - చేరుదువింక"
ననుచు కాలాగ్నియో - యన దండధరుని
యనువున బ్రహ్మదం - డాన్వితుఁడగుచు 4090
రాఁ జూచి "నిలునిలు - రారాదు నీకు
పోఁజూచి ననుపారి - పోనీయ నిన్ను"
ననుచు నాగ్నేయాస్త్ర - మతఁడు సంధించి
కనలివైచిన ముని - గ్రామణిపలికె.
“క్షత్రియాధమ! నీదు - సామర్థ్యమున్న

క్షాత్రంబుఁ జూపుము - సంహరించెదను
నాబ్రహ్మబలముచే - నన్నుమార్కొన్న
నాబ్రహ్మ రుద్రాదు - లడ్డమైరేని"
అనుచునంబువు చల్లి - యగ్నిచల్లార్చు
ననువున బ్రహ్మదం - డాగ్రంబువలనఁ 4100
బావకాస్త్రమడంప - పరమదివ్యాస్త్ర
కోవిదుఁ డతఁ డస్త్ర - కోటులన్నియును
నొక్క మొత్తంబుగా - నోడకవ్రేయ
నక్కజపడిమెచ్చి - యమ్మౌనివరుఁడు
తనబ్రహ్మదండ మిం - త గదల్పుచుండ
పొనిఁగి యన్నియు రిత్త - వోయినంజూచి
బ్రహ్మాస్త్రమతఁడు పం - పఁగభీతినొంది
బ్రహ్మాదిసురలెల్లఁ - బలవరింపంగఁ
జీరీకిగొనక వ - సిష్ఠుండు కేల
దారుణంబగు బ్రహ్మ - దండంబుఁదాల్చి 4110
భీకరాకారుఁడై - పేర్చిదండమున
లోకేశునస్త్రంబు - లోఁగొనునంత
నమ్మహామౌని కో - పానలంబాత్మ
నిమ్ముచాలక మేన - నెల్లెడ వెడలి
రోమరంధ్రంబుల - రూఢమై జ్వాల
లామీద నిగిడి కా - లాగ్నియవోలె
కౌశికుతోడ జ - గత్రితయంబు
ప్రాశించు గతిమిన్ను - లంటినంజూచి
“చాలుఁజాలువ - సిష్ఠ! చాలింపుకోప
మేల? యెల్లరఁద్రుంప - నీతనికొఱకు 4120

నీయంగమతి రౌద్ర - నిబిడతేజంబు
గాయుచున్నది మాన్పఁ - గలఁడెయొక్కరుఁడు.
ఉపసంహరింపు మీ - యుగ్రతేజంబు
తపియించె నిదె చతు - ర్దశభువనములు
చాల మాయందుఁబ్ర - సన్నుండ వగుము
మేలొందు" మన శాంతి మేకొనునంత
తీరెబ్రహ్మాదుల - దిగులెల్లభీతి
పారె కౌశికుఁడు కో - పము వీటిఁబుచ్చి
"బలమన్నయది బ్రహ్మ - బలమె; క్షత్రియుల
బలమేలదానిఁగా - ల్పనె” యంచురోసి 4130
చెల్లరె యీతని - చే యూఁతకోల
యెల్లదివ్యాస్త్రంబు - లిటు మ్రింగిపోవ
యీవిల్లు తనకేల? - యీయమ్ము లేల?
యీవిరోధంబేల? - యిఁకఁజాలుతనకుఁ
బగదీర్పఁజాలు త - పంబుచేసెదను,

—: విశ్వామిత్రుఁడు రాజర్షి యగుట :—


జగతిబ్రహ్మణ్యంబు - సంతరించెదను
కానకయితనితో - కలహించుపొందు
మానభంగంబెల్ల - మాయఁజేసెదను”
అనిమదిఁదలఁచి జా - యాసమేతముగఁ
దనయేలుబడిగాని - దక్ష్మిణదిశకుఁ 4140
బోయి ఘోరారణ్య - భూములందపము
సేయుచునుండె కౌ - శికనృపాలుండు.
అనఘ హవిష్యందుఁ - డామథుష్యందుఁ

డును మరి దృఢనేత్రుఁ - డును మహారథుఁడుఁ
గలిగిరి తనయులు - కౌశికమునికి
నెలమిఁదపంబువే - యేఁడులు చెల్లె
నపుడు సన్నిధిచేసి - నబ్జగర్భుండు
తపముచే రాజర్షి - ధర్మమొసంగె
పోయెఁగ్రమ్మర వేలు - పులుగొల్వధాత
అయెడ గాధేయుఁ - డాత్మఁజింతించి 4150
లెస్సగాఁజేసితి - లే తపంబేను
లెస్సఁగా తమ్మిచూ - లియు వరంబిచ్చె
రాజనేనట నన్న - రాజర్షి యనుచు
రాజీవభవుఁడాడి - రసికుఁడై చనియె.
యెవ్వరిఁచేఁగాని - యింతటివరము
నవ్వుబాటుల కోర్చి - నాతోడఁబలికె.
పోయినం బోనిమ్ము - భూరితపంబు
సేయుదుబ్రాహ్మణ్య - సిద్ధియౌటకును"
ననచు గ్రమ్మర నుగ్ర - మైనతపంబు
వనిఁ జేయుచుండె వి - శ్వామిత్రుఁడపుడు. 4160

—: త్రిశంకుని చరిత్ర :—


వసుమతి యేలు ని - క్ష్వాకు కులీనుఁ
డసమానుఁడు త్రిశంకుఁ - డను మహీవిభుఁడు
బొందితోడ నెని నాక - మున కేఁగదలఁచి
యందుకై యొకయజ్ఞ - మాచరించుటకుఁ
బూనివసిష్ఠ త - పోనిధిఁ జేరి
తానాత్మదలఁచు య - త్నము విన్నవింప

నాయన చేతగా - దనినఁ దత్‌క్షణము
పోయి తపోనిష్ఠ - పూనియున్నట్టి
ధన్యాత్ముల వసిష్ఠ - తనయుల భువన
మాన్యులఁజూచి న - మస్కృతింజేసి 4170
తలవాంచి వినయ వ - ర్తనముతో తనదు
తలఁపు వసిష్ఠుఁడు - తప్పించుకొనుట
వివరించి, “యిక్ష్వాకు - విభులకునెందు
నవుఁగాములకు కర్త - లైనట్టివారు
మీరుపురోహితుల్ - మీకన్ననొరులు
వేరి! మాకునుగతి - వెదకిచూచినను
మీకన్నమరి మాకు - మేలుకార్యములు
వాకొనఁ డొనఁగూడు - వారి నొక్కరిని
నన్నుఁజేకొని మీరు - నొకోర్కెదీర్పుఁ”
డన్ననూర్వురునవ్వి - యతనికిట్లనిరి. 4180

—: వశిష్ఠపుత్రులుత్రిశంకుని నిరాకరించుట :—


"తగునె వసిష్ఠునం - తటిమహామహుఁడు
విగణించి నీచేత - విని తనచేత
కాదనునటె యిట్టి - క్రతువొక్కరుండు
కాదనక యొనర్పఁ - గలడెధరిత్రి ?
కోరిన పని బ్రహ్మ - కొడుకుచేగాక
తీరిననవ్వులఁ - దీరనేరుచునె?
సత్యసంధుని వసి - ష్ఠమునీంద్రుమాట
సత్య మీపనికొన - సాగదునీకు

పొమ్మన్న గోపించి - పోకత్రిశంకుఁ
డమ్ముని సుతులతో - నంజక పలికె. 4190
“గురువుగాదని పల్క - గురుపుత్రులయిన
స్థిరమతి నామాట - చెల్లించవలయు
నందరుఁ గాదన్న - నవ్వలమాకు
మందయి వోయిరె - మౌనిశేఖరులు
వేఱెయొక్కరిఁజేరి - వేడి నా మఘము
తీఱుతు మీరు చిం - తిలిచూచుచుండ”
నన విని శక్తి ము - న్నగువారలెల్ల
జననాథుఁజూచి - "యాచార్యాంతరంబు
చండాలుఁడేకాక సలుపునె? కాన
చండాలుఁడవుగమ్ము - చను” మంచువారు 4200
శపియించు నంత త్రి - శంకునిమేన
నపుడ చండాలత్వ - మావేశమయ్యె.
నల్లనిదేహంబు - నలఁగినచీర
పల్లవెంట్రుకలు కం - బళివలెవాటు
యినుపసొమ్ములు మేన - నెఱ్ఱగందంబు
గునుకులేనడ మట్టి - కుళ్లాయి నీలి
దట్టియు కేలిబె - త్తపుబొందెకోల
పట్టినకొఱడును - పంగనామములుఁ
గనుపట్ట యెవ్వరిఁ - గనిమ్రొక్కులిడుచు
మనసులోనొదుగుచు - మత్తాయి గొనుచు 4210
పౌరుల మంత్రులఁ - బాసిపోవుటయు
వేఱొక్కటను దిక్కు - వెదకినలేక
వచ్చియల్లంత వి - శ్వామిత్రుఁగాంచి

ముచ్చటమోకాళ్లు - ముణిచిమ్రొక్కుటయు
కరుణించి యేమని - గాధేయుఁ డడుగ
చరణముల్ చూచి త్రి - శంకుఁడువల్కె
“గురుఁడును గురుపుత్ర - కులు చేతఁగాక
పరిహరించిన యేను - పట్టినపూన్కి
వేఱొక్కమౌనుల - వేఁడి యా వెలితి
తీరుతునన్న నెం - తే కోపగించి 4220
“మాలవుగమ్మ” ని - మదిలోనకరుణ
మాలి శపింప ని - మ్మైలవాటిల్లె.
నోచి యేఁజేసితి - నూఱుజన్నములు
ప్రోచితి నీతిచేఁ - బుడమియంతయును
పారంగఁదోలితి - పరిపంధినృపుల
భూరివైభవరాజ్య - భోగముల్ గంటి
కొలిచితి భక్తిచే - గురుదైవతముల
వెలయని యత్నముల్ - వృథగాఁగఁజనియె,
తనయదృష్టంబుచే - దైవయత్నంబు
“కొనసాగె విధిప్రతి - కూలమౌ కతన 4230
కౌశిక! నాదుదు - ష్కర్మానుభవము
నీశక్తిఁబ్రోచియీ - నెగులు వారింపు
దైవంబు గెలువుము - దయఁజూడు మనిన"
భూవరుతో గాధి - పుత్రుఁడిట్లనియె,

—: త్రిశంకు నిమిత్తము విశ్వామిత్రుఁడు యజ్ఞ ప్రయత్నముఁ జేయుట :—


యేనున్నవాఁడ నీ - కేలభయంబు?
మానుము నీయభి - మానఖేదములు

పరమధార్మికుండవు - బ్రహ్మర్షివరుల
సరవితోఁనేఁగూర్తు - జన్నమీడేర్తు
గురుశాపమునఁ జెందు - గుత్సితాంగమున
సురపురికిందఱుఁ - జూడఁబంపుదును 4240
యీమేనితోడ నీ - వింద్రు సన్నిధిని
సేమంబుతోనుండఁ - జేయుదునిపుడు.”
అని తనపుత్రుల - నందఱఁబిలిచి
జనపతియజ్ఞంబు - సలుపుచున్నాఁడు
సవదరింపుఁడు వస్తు - సామగ్రిమీరు
జవమున నీ శిష్య - జాలంబుఁజూచి
“పొండుమీ రేల్ల నీ - పుణ్యాశ్రమముల
నుండెడు మునులనా - యొద్దకుఁదెండు
సవన కర్మమున - సంయములందు
నవివేకియై యొక్కఁ - డవుఁగాదటన్న 4250
నామాట వివరింపుం - డని పంప వారు
నామునీంద్రులంబిల్వ - నందఱువచ్చి
నిలువ శిష్యులు చెంత - నిలిచి కేల్మొగిచి
యిలఁగల్గు మునులెల్ల - నేతెంచి రిపుడు
తగదని యమ్మహో - దయుఁడురాఁడయ్యె
పగవారు వసిష్ఠు - పట్టులందఱును
అనరానిమాటగా - ననిరి పోనాడి
వినుఁడెట్టులన్న నా - వృత్తాంతమెల్ల
యాగంబు సేయించు - నతఁడుక్షత్రియుఁడు
యాగంబు చండాలుఁ - డటెసేయువాఁడు? 4260

వింత యీసభలో హ - విర్భాగములకు
వంతు వెంబడి సురల్ - వచ్చుట లాగొ?
ఆ సవనమున బ్రా - హ్మణులు భోజనము
చేసి యేగతికేఁగఁ - జింతించినారొ?
బొందితో నంపక - పోఁడులే గాధి
నందనుఁడిట్టి చం - డాలుఁజేపట్టి"
అని మహోదయునితో - ననిరి వాసిష్ఠు
లన విని కౌశికుఁ - డట్టిట్టుపడుచు
నెలకొన్నతపముచే - నిర్దోషినగుచు
వెలసిన నన్నుని - వ్విధమునఁబలికి 4270
“రెవ్వరు దూషించి - రెప్పు డవ్వారు
క్రొవ్వఱి భస్మమై - కుమిలిపోఁగలరు.
బారిగా యమపాశ - బద్ధులై యేడు
నూఱుజన్మముల యందు - ను సతుల్ సుతులు
శునకమాంసములు దిం - చును దయాహీను
లును ఘోరచండా - లునుఁగ్రూరులగుచు
నుందురుగాక మ - హోదయుం డార్తి
నందుచు బోయవాఁ - డైపోవుఁగాక”

—: త్రిశంకుకొఱకు విశ్వామిత్రుఁడు స్వర్గమును నిర్మించుట :—


అని సభలో నిల్వ - నాడి "త్రిశంకుఁ
డనఘుఁ డిక్ష్వాకువం - శాగ్రణి పరమ 4280
పావనుం డేను చే - పట్టినవాఁడ
యీవిభుండిప్పుడె - యీమేనితోడ

సురలోకమున కేఁగఁ - జొప్పడు మఖము
పరికించి సేయుఁ - డీ పట్టున "ననిన
మునులెల్లనొండొరు - మొగములు చూచి
అనుమానములు మాని - యాత్మఁజింతించి
కాలాగ్నికల్పుఁడీ - కౌశికమౌని
చాలఁగోపించిన - శపియించు మనల
నితని చేజిక్కితి - మేమనవచ్చు
నితని చండాలు న - య్యింద్రునిపురికి 4290
నంప యాగముసేయుఁ - డను చున్నవాఁడు
అంపరాదని పల్క - నాపదవచ్చు
నాడి నట్లాడుద - మని మహామునులు
కూడి ఋత్విక్కులై - కొనసాగ మఘము
కర్మముల్ నడపుచో - గాధేయమౌని
యర్మిలి యాజకుం - డై వేల్చునపుడు
మొదల హవిర్భాగ - ములకు రమ్మనిన
త్రిదళులు రాక గా - ధేయునిందింపఁ
గోపించి యాకౌశి - కుఁడు స్రువంబొప్పు
టేపారుచెయి చాఁచి - యిట్లని పల్కె 4300
“రమ్ము త్రిశంకు భూ - రమణ! నామహిమ
నిమ్మేనితో దివి - కేఁగింతు నిన్ను
చూడుమీవ"నినంత - చోద్యంబుగాఁగ
యేడ ఱెక్కలు మొల్చె - నే వీనికనఁగ
మునులెల్ల నాశ్చర్య - మునఁ జూచుచుండ
ననిమిషవాటికి - నరిగె నవ్విభుఁడు.
వచ్చినయాతని - వదనంబుచూచి

“పచ్చిమాలవు నీవు - పాపాత్మ ! యోరి
గురుశాపహతుఁడవు - కొంక కేరీతి
నరుదెంచినావు నా - యాస్థానమునకు?" 4310
ననుచు మోదించి పొ - మ్మనిపించు నింద్రు
కినుకకోర్వక తల - క్రిందుగా నతఁడు
మొఱపెట్టుచును మెర - ములు వింతవింత
తిరుపులు దిరుగుచు - "దిక్కుగానయ్య
నమ్మితిఁ గౌశిక! నాకుఁ - జేయిచ్చి
యిమ్మహిఁబడనీక - యెత్తుకోవయ్య”
అన మొఱయాలించి - "యట నిల్వు నిలువు
జననాథ! పడవు వి - చారమేమిటికి?"
అన దక్షిణాశ న - య్యాకాశవీధి
జననాయకుని నిల్పి - స్వర్గంబు బదులు 4320
స్వర్గంబు సురలు న - క్షత్రరాసులును
భార్గవగురు బుధ - భౌమార్కముఖులు
సరసిజాసనుఁడెట్టి - జాడసృష్టించె
సరిసృష్టిగావేరె - జతయేఱుపరచి
కల్పించి యింద్రునొ - క్కని తనమహిమఁ
గల్పింతు నేనట్లు - గాదె నీమహికి
లేకుండఁజేతు నీ - లేఖవల్లభుని
కాకున్న నను నెఱుం - గరు వేల్పులనుచుఁ
దలఁపుచోదివిజు లు - త్తమ ఋషీశ్వరులు
కలఁగుచువచ్చి యా - కౌశికుఁజూచి 4330
గురుశాపదగ్ధుఁడీ - క్షోణివిభుండు
సురలోకమున నున్పఁ - జూతురె నీవు

యీయనకొఱకునై - యింద్రుని మీఁద
నీయత్నమూహింప - నేల ? చాలింపు
తగునిది తగదని - తలఁప కీరీతి
తెగి తపోహాని చిం - తింప వయ్యెదవు"
అన వారితో నిటు - లనియె కౌశికుఁడు.
వినుఁడు! చేసితిని యి - వ్విభునితో ప్రతిన
స్వర్గంబునందు నుం - చఁగ యే నొనర్చు
స్వర్గంబు సకల న - క్షత్రాదికములు 4340
అలధాత సృష్టి యు - న్నంతగాలంబు
నిలువనునగ్రహ - నియతులుగండు
చనుఁడున్న వారువై - శ్వానర మార్గ
మునకులోగాని యి - మ్మున నభోవీథి
నీవు సృష్టించు ని - న్నిటి నట్టనడుమ
నీవిభుండమరుల - కెనయైన మహిమ
తలక్రిందుగానుండఁ - దలఁచి యిందఱము
నిలిపినారము ప్రీతి - నీనిమిత్తంబు
పూని యెంతటికార్య - మును నిర్వహింప
మౌనులులోని స - మానులుగలరె? 4350

—: శునశ్శేఫు నంబరీషుఁడు పశువుగాఁ గొనుట :—


పోయి వచ్చెదమని - పోయిరాదిత్యు
లాయెడ కౌశికుం - డాత్మఁజింతించి
యిచ్చోట విఘ్నంబు - లెన్నైనఁగూడి
వచ్చుచున్నవి తపో - వర్తనంబులకు
వేఱొక్కచోటఁగా - వింతుఁదపంబు

ధీరవైఖరినని - తెలిపె మౌనులకు
దక్షిణంబున కేఁగి - తపము గొన్నాళ్లు
దీక్షగావించి గా - ధేయుండు వెనక
పడుమర పుష్కర - ప్రాంతంబునందు
తడవుగా నత్యుగ్ర - తపముఁగావింప 4360
నాకాలమున నయో - ధ్యానాయకుండు
శ్రీకరుండగు నంబ - రీషుఁడన్ రాజు
సవనంబుసేయుచో - శతమన్యుఁ డలిగి
సవనాశ్వమునుఁ గొంచు - జనియె వంచనను
సేయించు ఋత్విజుల్ - చింతలనొంది
యీ యాగపశువు వో - యిన యట్టికతన
నీదుర్ణయమ్ము గ - న్పించనెల్లరకు
కాదు దీనికి శాంతిఁ - గావింపకున్న
పశురక్షకుఁడుగాని - పార్థివోత్తముని
విశద దోషంబులు - వెంటాడి చెఱచు
నిందుకు నరపశు - విపుడు దెప్పింపు 4370
మందుచేఁ దీఱునీ - మఘము లన్నియును
నన నంబరీష మ - హారాజు భీతి
గనకరథం బెక్కి - కదలి దేశములు
పుణ్యాశ్రమంబులుఁ - బురములు వనులు
పుణ్యభూములు రయం - బున వెదకుచును
భృగుతుంగమను గిరి - బిడ్డలతోడ
మగువతోవసియించు - మౌని ఋచీకుఁ
గని యంజలి యొనర్చి - కలసేమమడిగి
తనరాక వివరించి - ధరణీశుఁడనియె. 4380

"ఏనూరు వేలావు - లిచ్చెద నీకు
సూనులందొకని ని - చ్చుటగల్గెనేని
దేశంబులెల్లనుఁ - దిరిగితి పశువు
నాశించి యొనగూడ - దయ్యె నెయ్యెడను
నొకచిన్నవానిని - యొసఁగదే వెలకు?
నకలంకమతి" నన్న - నమ్మౌని పల్కె
"నేపెద్దఱికమైన - నియ్యంగఁజాల
నా పెద్దసుతుని మా - నవనాథ! నీకు”
అనిన నాయన యింతి - నట్లనె యడుగ
ననియె నక్కోమలి యంబరీషునకు 4390
యీఁబోలిన కుమారు - నిచ్చు నమ్మౌని
నేఁబిన్నకొడుకుని - నీఁజాలననియె,
కోరికెతో పెద్ద - కొడుకుల మీఁద
కూరిమి తండ్రుల - కునుఁ గల్గియుండు.
ధారుణిఁగడగొట్టు - తనయుల మీఁద
కూరిమి తల్లుల - కునుఁ గల్గియుండు
అటుగాన తలిదండ్రు - లాడినమాట
లటువిని మధ్యస్తుఁ - డైన బాలకుఁడు
వంతుకురాక యె - వ్వరి వాఁడుగాక
యెంతయు నడుమంత్ర - మేలయ్యె ననుచు 4400
నపుడు శునశ్శేఫుఁ - డనునట్టివాఁడు
నృపతిఁ గన్గొని చాల - నెగులుతోఁబల్కె
"నన్నునిచ్చిరి నీకు - నాతలిదండ్రు
లిన్ని యూరక - నేల? యే వెంటవత్తు
పశువుగాఁ గొని పొమ్ము - పలికినయట్టి

పశువుల నిమ్ము తా - పసవరేణ్యునకు
వ్యర్థశరీరిగ - వాని నీరీతి
నర్థించి నన్నుఁ గృ - తార్థుఁజేసితివి
బలితంపులేమిచేఁ - బలికిరిగాక
తలిదండ్రులొల్లని - తనయులుంగలరె? 4410
వారలలేములు - వారించి నీదు
కోరికెచెల్లింతు - కొనుకొమ్ము నన్ను”
అన నగ్నిసహితులై - నట్టిదేవతలు
మనములమెచ్చి య - మ్మౌనిబాలునకు
స్వర్గవైభవము లొ - సంగిరి ధేను
వర్గంబుఁ దెప్పించ - వసుమతివిభుఁడు
నరపతిఁజూచి శు - నశ్శేఫుఁడనియె
తరమైన క్రయమీక - తానేలవత్తు
రత్న రాసులు సువ - ర్ణంబొకకోటి
నూత్నంబుగాఁగ ధే - నువు లొక్కలక్ష 4420
నా వారికిమ్మన - నరపతి యట్లు
యావిమలాత్మకుం - డడిగిన విచ్చి
తనరధంబునమౌని - తనయునెక్కించి
చనియె సంతోషిత - స్వాంతుఁడై యతఁడు.
గమనవేగమున పు - ష్కరతీర్థమునను
విమలచిత్తంబుతో - విడిసియున్నంత
నాశునశ్శేఫుఁడ - త్యాపన్నుఁడగుచు
కౌశికమౌని సా - క్షాదుమానాథుఁ
దనమేనమామ నత్తరిఁ - జూచి విభుని
యనుమతంబున నమ్మ - హామహుఁజేరి 4430

తనదు కన్నీట నా - తని పాదయుగళ
వనజముల్ గడిగి కై - వారంబుచేసి
అంబరీషునిరాక - యడిగినతెఱఁగు
నంబయుగురుఁడుఁ ద - న్నతని కిచ్చుటయు
విన్నపంబొనరించి - విశ్వమిత్రుఁడవు
సన్నుతకీర్తివి - సత్యసంధుండవు
నాకీవుప్రాణదా - నంబు గావింపు
నీకుమేనల్లుండ - నీవాఁడనేను
శరణుజొచ్చితి మీదు - చరణంబులకును
కరుణింపునన్ను వి - ఖ్యాతిఁగైకొనుము 4440
యీరాజు సవనంబు - నీడేర్చినన్ను
చేరఁదీసుక పున - ర్జీవితుఁజేయు
చేపట్టి నన్ను ర - క్షింపవేతండ్రి!
నీపాలనిడుకొని - నెనరువాటిల్ల"
నని లేవకున్న చో - నడుగులమీఁది
తనమేనయల్లు నెం - తయుఁగటాక్షించి
యూరడించి సమంచి - తోపగూహనము
చేరఁజీఱఁగఁ జేసి - చిత్తంబుగరఁగ
"నన్న! నీకేల భ - యంబు నేఁగలుగ?
నిన్నుఁగాచుటయెంత - నెగులొందనేల? 4450
వెరవకు" మనుచు న - వ్వేళకారుణ్య
శరధియైనట్టివి - శ్వామిత్రమౌని
తనతనూభవుల నం - దఱఁబిల్చిపల్కె!
తనయులుగల్గుట - తల్లిదండ్రులకుఁ
బరలోకహితమొన - ర్పఁగఁగదా యిదియె

పరలోకసుఖము నా - పాలికెన్నఁగను
వీడు మేనల్లుండు - వీనిరక్షింప
వేఁడెద మిమ్ము న - వ్విభునికిచ్చుటకుఁ
జావునకోడి నా - శరణంబుజొచ్చె
నే వీని కభయంబు - నిచ్చినవాఁడ 4460
యిందులోపల నొక్కఁ - డేర్పడి మౌని
నందనుప్రాణంబు - నకు నడ్డపడుఁడు
యాగంబునకుఁపశు - వైనవానికిని
వేగంబె యేనిత్తు - విబుధలోకంబు
యిదె సమయంబు నా - కిదియె సుపుత్ర
పదవిచే లభియించు - పరమలాభంబు
పరధర్మమును పితృ - వాక్యపాలనము
శరణాగతత్రాణ - సంపత్తి సకల
దేవతాతృప్తి పి - తృప్రీతియిట్టి
పావనశ్రీలుచే - పట్టడొక్కరుఁడు.” 4470
అనిన గర్వంబుతో - నలఁతి నవ్వొలయ
జనకునిఁజూచి వి - శ్వామిత్రులనిరి.
"గారవించుటయు శృం - గారించి భక్తిఁ
దేఱిచూచుటయొ చే - తికి పండు ఫలము
యిచ్చుటో పెండ్లి - సేయించుటో చదువు
వచ్చెనా యనివిని - వారిమెచ్చుటయొ
క్రతువులు సేయించి - కలిగినసొమ్ము
హితబుద్ధితోఁబంచి - యిడుటయో యాత్మ
బోధంబుపిలిచి తె - ల్పుటయొ సద్వృత్తి
బోధించుటో నీవు - పుత్రులంజూచి 4480

పట్టుచుఁబట్టి యీ - పాపంబుమాట
యెట్టాడితిరి చావ - నేఁటికితమకు
నొనరునె యిట్టాడ - నొక్కనిచావు
తనమీదఁదెచ్చుకోఁ - దలఁచునె యొకఁడు?
నొప్పుగాదిది తన - యుల ప్రాణములకుఁ
దప్పి చావుండను - తండ్రిగలాఁడె?
ఆడక నీకేమి? - యామాటవినఁగ
కూడదుగాక మా - కునువెఱ్ఱితండ్రి!
మహిభోజనము లశ్వ - మాంసంబు నటుల
విహితంబుగా దిట్టి - విధమునఁబల్క 4490
యీ మునిబాలకుం - డెటువోయనేమి?
యీ మహీవరు యాగ - మేమైననేమి?
మీమాట మాతల - మీఁదటనున్న
దీ మొల్ల” మనిన మా - నీంద్రుఁడిట్లనియె.
"ఓరి! వాసిష్ఠుల - యొద్దిక దుర్వి
చారులై శునకమాం - సంబులఁదినుచు
వేయేడులుండుఁ డి - వ్విపినభూములను
పాయక " యనుచు శా - పంబిడియపుడె
"రమ్ము! శునశ్శేఫ ! - రక్షింతునిన్ను
నమ్ముమెల్లరు మెచ్చ - నాశక్తిఁజూచి 4500
జయమందు" మనుచు ర - క్షాబంధ మునిచి
పయనమై పొమ్మని - పశువిధానమున
శాల పవిత్రపా - శముల బంధించి
నాలోన రక్తమా - ల్యంబులువైచి
యొనరిన వైష్ణవ - యూపంబుతోడ

“నినుఁ గట్టునపుడు - వహ్నిఁ దలంచుకొనుము
యింద్రు నుపేంద్రుని - హృదయంబులోన
సాంద్రభక్తి దలంచి - జపవిధానముల
రెండుమంత్రము లుచ్చ - రింపు మవ్వేళ
నొండురక్షించు ని - న్నొక్కటి మఘము 4510
కడతేర్చు” ననుపల్కు - కౌశికుమాట
కడునమ్మి యుత్సాహ - కలితుఁడై వచ్చి
"తామసింపక రమ్ము - ధరణీతవేశ!
సేమంబు గైకొమ్ము - చెల్లింపు మఘము
పొదఁడన్న" మాటక - ప్పుడు వెఱఁగంది
మదిమెచ్చి రథముపై - మౌనిబాలకుఁడు
అంజక రా నయో - ధ్యాపురిలోన
రంజిల్లుశాల చే - ననంతరంబ
తనయూపమునఁగట్టు - తరి మౌనిబాలుఁ
డొనరంగ నమ్మంత్ర - యుగమాత్మలోన 4520
జపియించి యింద్రుని - జలజపత్రాక్షు
నపుడు పావకు నుతు - లాచరింపుచును
నున్నెడ నింద్రుఁ "డో - హో! నిల్వుమనుచు”
మన్నించి యారాజు - మఘశాల నిలిచి
"వలవదు మునిబాలు - వధియింపవిడువు
నెలుతులన్నియుఁదీఱె - వెలసె నీ మఘము
యాగఫలంబిత్తు" - నని శునశ్శేఫు
నాగోత్రవైరి ద - యాళుఁడై పనిచి
అంబరీషుని కోర్కె - లన్నియునొసఁగి
యంబరంబున నేఁగె - నట గాధిసుతుఁడు. 4530

—: విశ్వామిత్రుఁడు మహర్షి యగుట :—


వేయేండ్లుతపము గా - వింపుచు నుండ
నాయెడనమరసై - న్యముచుట్టుఁగొల్వ
నజుఁడెంత ఋషివైతి - వని వచ్చిపల్కి
నిజధామమునకేఁగె - నిష్ఠఁగౌశికుఁడు
అపుడు ఘోరంబుగా - నాశ్రమంబునను
తపము పుష్కరము చెం - త నొనర్చుచుండ

—: మేనక విశ్వామిత్రుని కడకు వచ్చుట :—


అచ్చర మేనక - యనునది యటకు
వచ్చి నెచ్చెలులతో - వనకేళిస లుప
గాథేయుఁడా యింతిఁ - గనుఁగొని భ్రమసి
"యీధవళాక్షితో - నెససినఁజాలు 4540
తపములు ఫలియించె - ధన్యుఁడనైతి
నివుడుగా” దా కోర్కు - లీడేఱె ననుచు
నడుపుల మురిపెంబు - నగవులతేట
తొడలచక్కదనంబు - తురుమువ్రేఁకంబు
కలికిచూపుల బాగు - గబ్బితనంబు
కులుకులుఁజూచి సం - కోచంబుమాని
తొయ్యలి గాదిది - తొలుకారుమెఱుపు
వెయ్యేలయిదినాకు - వెలఁది యౌనేని
యేలనే భువనంబు - లేల? నేఁజేయు
గాలి యావటముల -గాలీఁచ పోవ 4550
తపముసేయఁగఘోర - తపన ప్రచండ
విపులాతపముల ని - వ్విపులాటవులను"

అని చేరఁగావచ్చి - హస్తంబుచాఁచి
వనితామణికి స్వస్తి - వాదంబొసంగి
“యారామముల నొంటి - నలసినవాఁడ
నోరామ! నీచెంత - నునిచి లాలింపు
తీఱనియాఁకలి - తీఱంగనీవు
పారణయిడుము బిం - బఫలాధరమునఁ
బంచాగ్నిమధ్య త - పశ్రాంతి నీదు
మించుకౌఁగిటలో శ - మించంగఁజేయు 4560
మేనితాపముదీఱ - మీనాంకుకేళి
నానందరసవార్థి - యందుఁదేలింపు
నాయాశ్రమంబులో - నాదానవగుచు
నోయిందువదన! నీ - వుండినఁజాలు
యెవ్వారిచేఁగాని - యేకోర్కులైన
నెవ్వేళ గోరిన - నేనిత్తునీకు
మరుని బారికిలోఁగి - మానంబువదలి
శరణుజొచ్చితినీదు - చరణంబులకును
బంటనయ్యెద నన్నుఁ - బనిగొమ్మువాలుఁ
గంటి! వేఁడిన యూడి - గములుచేసెదను” 4570
అని ప్రియంబులు వల్క - నయ్యెలనాఁగ
తనలోనమెచ్చి యెం - తయుసమ్మతించి
గాధేయుతపమెల్లఁ - గట్టి పెట్టించి
బోధంబు సెడఁగ న - మ్ముని యాశ్రమమున
పదియేండ్లు క్రీఁడింపఁ - బావనుండతఁడు
మదిలోన నిది దేవ - మాయగా నెఱిఁగి
అచ్చపలాక్షి యిం - ద్రాదులు ననుప

వచ్చినదనుచు భా - వమున నెఱింగి
తనయపరాధంబు - తాళుకొమ్మనుచు
వనితవేఁడిన వెఱ - వకుమని కాచి 4580
యనిచి యుత్తర దిశ - హైమాచలంబు
మునిశిరోమణి చేరి - మొదలింటిరీతి
కౌశికీనది పొంత - ఘనమైన తపము
కౌశికుఁ డొనరింప - గడచె వెయ్యేండ్లు.
అప్పుడు దేవత - లమ్మహాతపము
చెప్పినధాత కౌ - శికు పాలికరిగి
అనుపమంబైన మ - హత్వంబుగలుగ
"ననఘ! మహాఋషి - వైతివొమ్మనిన
బ్రహ్మయిట్లాడుటల్ - పరగునె? నన్ను
బ్రహర్షియనుదాఁక - పరగినపూన్కి 4590
యేమాన నన్నుజి - తేంద్రియుండనుము
నీమది మెచ్చుట - నిజమగునేని"
అనుటయు నైనప్పు - డనియెదుగాని
పనివడియేనెట్లు - బ్రహ్మర్షి వందు
కావనిపల్కి య - క్కములజుఁడరుగ
నావేళనూర్ధ్వమ - హాబాహుఁడగుచు
ఆలంబశూన్యుండు - ననిలాశనుండు
కీలికీలాసము - త్కీర్ణుండునగుచు
వేసవి పంచాగ్ని - విమలమధ్యమున
మూసికన్నులు వర్ష - ముల బట్టబయట 4600
జలములలోనుండి - చలికాలములను
తలఁకక యత్యుగ్ర - తపము గావింప

వేయేండ్లు చనునంత వి - బుధనాయకుఁడు
సేయుఁగార్యము మదిఁ - జింతించిచూచి

—: విశ్వామిత్రుఁడు రంభను శపించుట :—


రంభనురావించి - "రంభ ! కౌశికుండు
కుంభినిపై నతి - ఘోరతపంబు
చేయుచున్నాఁడది - చెఱచిరావలయు
పోయిరమ్మన"వుఁడు - పోవ శంక్కించి
"కోపకాఁడల కౌశి - కుఁడుచేరవెఱతు
నీపాదమాన పో - నేరనచ్చటికి 4610
నాచేతఁదీఱ దు - న్నదిహేమ యాఘృ
తాచి యుర్వశి తిలో - త్తమ మంజుఘోష
హరిణి ప్రమ్లోచి వీ - రందు నొక్కతెను
సురనాథ! పనుపు మం - చు"ను రంభపలుక
వెఱపేల? యేవత్తు - వెంబడినీకు
మరుఁడుఁజంద్రుండును - మలయమారుతము
కీరంబు లామని - కేకులుఁ దేటి
బారులు నీయాప్త - బలమయిరాఁగ
నీచక్కఁదనముపై - నిండుశృంగార
మాచరించి మనోహ - రాంగముల్మెఱయ 4620
పొమ్మెంతవాఁడు నీ - భ్రూవిలాసముల
నమ్ముని కింకరుఁ - డై యుండఁగలఁడు"
అని స్వకార్యనిమిత్త - మమరేంద్రుఁడనుప
మునిచెంగటికి జగ - న్మోహినివోలె
పొడకట్టునంత య - ప్పుడుదేఱిచూచి

సడలిపోనీక వి - శ్వామిత్రుఁడపుడ
"ఓసి! యింద్రుఁడ వంప - నుప్పొంగివెఱ్ఱిఁ
జేసి నా తపమెల్లఁ - జెరవిపోవలసి
మాయలాఁడితనాన - మసలవచ్చితివె?
అయింద్రుఁడేఁడి? నీ - కడ్డమౌఁగాక 4630
వింటివె యొక పది - వేలేండ్లు నీవు
కండకాటవులందు - కఠినభావమున
పాషాణరూపమై - పడి యటమీద
యీషణత్రయ దూరుఁ - డిచ్ఛావిహారి
యొకమునికృపమోక్ష - మొందెదు నీవు
తెకతేర విధి నిన్నుఁ - దెచ్చెనాకడకు
శతమఘరూపమై - చనుమన్న” శాప
హతిచేతఁబాషాణ - మై యుండెరంభ .
అదిచూచి భీతిచే - నన్నిదిక్కులకు
మదనాదులైన ది - మ్మరులు వాఱుటయు 4640

—: విశ్వామిత్రుఁడు బ్రహ్మర్షి యైన విధము :—


కౌశికుండంతలో - కడుచింతనొంది
"యేశాంతి వహియింతు - నింతటనుండి
కటకటా! చేసిన - కడిఁదితపంబు
చిటికవ్రేసినయంత - క్షీణింపసాగె
కోపంబుచేనింకఁ - గ్రోధంబు మాని
యూపిరి విడువక - యూర్థ్వరేతమున
నే జితేంద్రియుఁడనై - యెన్నేండ్లకైన
భోజనంబనక యే - ప్రొద్దుమౌనమున

నాకుబ్రాహ్మణ్య మె - న్నడు వచ్చునట్టి
యాకల్ప పర్యంత - మైన నట్లుండి 4650
ప్రతిన చెల్లింతు త - ప్పకమేనఁబ్రాణ
వితతి రక్షింతు ని - ర్విఘ్నతపంబు
సేయుదు ననుచు వీ - క్షించి గాధేయుఁ
డాయతధైర్య స - హాయుఁడై యుండె.
అచ్చోట వేయేడు - లనశనుం డగుచు
నుచ్చరించుట లేక - యుగ్రతపంబు
చేసి తూర్పునకేఁగి - చీమలు చొరక
వేసిన యిసుక యు - ర్విని రాలనీని
కారడవినిఁ దాను - కాష్ఠంబు రీతి
యూరుపుసడలక - యుద్గ్రీవుఁడగుచు 4660
చేతులుచాఁచి య - చేతనవృత్తి
రాతికైవడి ది వా - రాత్రముల్ నిలిచి
యొకనాడు భుజియింప - నుద్యుక్తుఁడగుచు
నకళంకమగు హవి - రన్న భాగంబు
ముందరనుంచుక - ముని యారగింప
ముందరగా పులోము - ని కన్యమగఁడు
అతిథియైవచ్చి తా - నాతిథ్యమడుగ
నతనికి నయ్యన్న - మంతయుఁబెట్టి
ఉరకుండి క్రమ్మర - నుగ్రతపంబు
కొఱఁడుకైవడి నుండ - కొన్నినాళ్లకును 4670
పొగలెగసెను శిరం - బున నటమున్న
ధిగధిగమంటలు - దివినల్లుకొనియె.
క్రాఁగెలోకములు మం - గలములమాడ్కి

వేఁగె లాజలరీతి - వివిధజంతువులు
పెనుఁదాపములఁబొర్లి - పెదవులెండంగ
ననిమిషులెల్ల న - త్యాపన్నులగుచు
కమలజు కడకేఁగి - కౌశికుఁదపము
తమకువచ్చిన యాప - దలు విన్నవించి
“చేతనైనట్టు చూ - చితిమి గాధేయుఁ
డీతరి నీసృష్టి - యింతయుంజెఱచి 4680
తావేఱెనిర్మింపఁ - దలంచెనో! లేక
యావల నీపట్ట - మాసించినాఁడో?
యేమేమియెంచెనో? - యేమియునెఱుఁగ
మీమేరఁగలకార్య - మెఱుకచేసితిమి;
అతని కోరికలిమ్ము - హతశేషమైన
క్షితియెల్లఁబాలింపు - జీవకోటులను
చెడనీక యింద్రుని - సింహాసనంబు
జడదారి వేఁడినఁ - జాలు నిప్పింపు
చలియించె కులగిరుల్ - జడిసెవాయువులు
కలఁగె వారాసులు - కాఁగెధరిత్రి 4690
అరచె భూతములు వి - హాయసం బవిసె
సొరిగె విమానముల్ - చుక్కలురాలె
తపనుండు మాసె నం - తకుఁడు భీతిల్లె
కృపఁజూడవయ్య! లో - కేశ! యిందరను
కాలాగ్నికీల లం - గలుగొన్నయట్లు
కాలకంధరుం డెచ్చు - కను విచ్చినట్లు
యేమని పల్కుదు - మెల్ల లోకములు
బాములంబఱచె న - పారతపంబు

కరుణింపు" మనిన వే - గమె వచ్చినిలిచి
"పరమ తపంబుచే - బ్రహ్మర్షి వైతి 4700
వాయువొసంగితి - నతిశయంబుగను
నీయీడు నీవె యె - న్నిటఁదలంచినను"
అనిన విశ్వామిత్రుఁ - డంబుజాసనుని
కని "నీవరంబు ని - క్కము సేయుదేని
ఆది నోంకారంబు - నఖిల మంత్రములు
వేదముల్ నాకుఁ దె - ల్విడిగా నొసంగి
వేదమయుండును - వేదవిదుండు
వేదవేద్యుఁడు క్షత్ర - వేదవిధాత
యైనవసిష్ఠ మ - హా మౌనివచ్చి
పానిపట్టుక నన్ను - బ్రహ్మర్షి వనక 4710
యనుమానములు దీఱ" - వననట్ల యొసఁగి
తనయుఁడైన వసిష్ఠుఁ - దాఁబిలిపించి
యమ్మహామహునిఁ బ్ర - యత్నంబుతోడ
సమ్మతపఱప నా - సంయమీశ్వరుఁడు
"సందియంబేల? వి - శ్వామిత్ర! గెలిచి
తందరి నీవు బ్ర - హ్మర్షివై నావు
సత్యసంధుండవు ని - ష్ఠాగరిష్ఠుఁడవు
నిత్యశోభన తపో - నిధివి పూజ్యుఁడవు
అజునిమన్ననగంటి - వస్మదాదులకు
భజనీయుఁడవు నీకు - భద్రమౌగాత" 4720
అనిన విశ్వామిత్రుఁ - డౌదల సోఁక
కనుకల్గి తత్పాద - కంజాతములకు
సాగిలిమ్రొక్కి “యా - చార్యుండవీవు

మా గాధిభూవరు - మాఱయినావు
భ్రమరకీటన్యాయ - పద్ధతి నన్ను
సమచిత్తమునఁబ్రోవఁ - జాలితి వీవు
పూజింపఁగంటి నే - పుణ్యుండనైతి
నాజన్మమెంత ధ - న్యంబయ్యె" ననిన
నతనిదీవించి బ్ర - హ్మయు వసిష్ఠుండు
శతమఖాదులు తమ - జాడలంజనిన 4730
యసమతపోనిధి - యైన కౌశికుఁడు
వసుధ మించినకథ - వాకొంటి నీకు
తెలియంగఁబల్కితి - తెలిసిన యంత
తెలియరెవ్వారు గా - ధేయుని మహిమ.
అట్టి వాఁ డీతఁడీ - యనఘునిఁగొలిచి
పట్టయినారు శో - భనములకెల్ల
యీతనిగుణములు - నీతనిబలము
నీతనితపము నే - నెంతవర్ణింతు?
నపరాచలము చేరె - నర్కబింబంబు
కృపఁజూడుఁ డే వత్తు - ఱేపె మీకడకు" 4740
నన శతానందుఁ డి - ట్లందఱువినఁగ
నను రాఘవులచేత - ననుమతుండగుచు
పోయిన జనకుఁడ - ప్పుడు వలవచ్చి
పోయె నింటికి గాధి - పుత్రుండు వనుప
తనప్రధానులతోడ - తనయులతోడ
తనవారితోడ నం - తట దాశరథులు
తముఁ జేరు మునులతో - తమనెలవునకు
విమలాత్ముగాధేయు - వెంబడి నేఁగి

యచ్చోటసమయసం - ధ్యాదులు దీర్చి
యిచ్చలకితవైన - యెడలనున్నంత 4750

—: శివధనుఃప్రభావమును జనకుఁడు చెప్పుట :—


కొలువుండి యాజన - కుఁడు మఱునాడు
పిలువనంపిన నతి - ప్రీతిఁగౌశికుఁడు
తనవెంట రాజనం - దనులు రా వచ్చు
మునిఁజూచి యపుడర్ఘ్య - మును పాద్యమొసఁగి
యాసనంబిచ్చి సు - ఖాసీనుఁడగుచు
'నోసంయమీంద్ర! భృ - త్యుల మందఱమును
చెప్పినయటులఁజే - సెద మేమిగార్య
మిప్పుడు గావింతు - మెఱిఁగింపుఁ ”డనిన
యీ దశరథ పుత్రు - లీశానువిల్లు
నీదుమందిరములో - నెలకొన్నదనుచు 4760
విని చూచిపోనెంచి - విచ్చేసినారు
కొనితేరఁబంపుమా - కోదండ” మనిన
జనకుఁడిట్లనియె. "నో - సంయమినాథ!
తనయింటిలో నీశు - ధనువు గల్గుటకుఁ
గారణంబున్నదా - కత యేర్పరింతు
వీరలు మీరలు - వినుఁడంచుఁబలికె.
నిమికి నాఱవవాఁడు - నిజధర్మరతుఁడు
రమణీయమతి దేవ - రాతుఁడన్ రాజు
సవన మొనర్చి మె - చ్చఁగఁజేసి తనకు
దివిజు లొసంగఁగాఁ - దెచ్చె నీవిల్లు 4770

దక్షుండు యజ్ఞంబు - తానొనర్పుచును
దాక్షాయణీనాథుఁ - దాఁబిలిపించి
యాగభాగములింక - యతఁడురాకున్న
సాగదే నాకేమి - సవనంబటంచుఁ?
గావింపుచుండ శం - కరుండు గోపించి
యీవింటిచే వారి - నెల్ల వధింతు
నని యెంచుచో మౌను - లమరులుఁజేరి
తనువేఁడుకొనిన కా - త్యాయనీవిభుఁడు
కోపంబు మాని కై - కొనుఁడని చేతి
చాపంబు బిలిచి ని - ర్జరులకునిచ్చె. 4780
దేవతలిచ్చిరా - దేవరాతునకు
నీ విల్లు తనయింట - నిడియె నవ్విభుఁడు
ఆవెనకటి రాజు - లందఱుఁదమదు
సేవధిగాఁగ నుం - చిరి నేఁటిదనుక
సవనశాలాంతర - స్థలము శోధింప
భువి దున్నునెడ నొక్క - పుత్రికపుట్టె.
ఆయవనీకన్య - యాత్మజయగుచు
నాయింట సీత య - నంగఁబెంచితిని
వడిగలతనము స - త్త్వంబు నుంకువఁగఁ
బుడమికన్నియ నిచ్చు - పూనికె చేసి 4790
యేనున్న చో రాజు - లెల్లరు వచ్చి
పూని యీవిల్లు చూ - పుటయు లజ్జించి
కదలింప నెక్కిడఁ - గాలేక వారు
మదిలోనఁదా రభి - మానముల్ దాల్చి
తనయింటిలోన యీ - తఁడు కొండవంటి

పెనువిల్లుజూసి నే - బిడ్డనిచ్చెదను
యెక్కిడుఁడని పల్కి - యిందర వాసి
మొక్కపుచ్చుచుఁ జాల - ములుచయైనాఁడు
కలనిలో నీతని - గర్వంబణంచి
బలిమిగొంపోద మీ - బాలకి ననుచు 4800
హత్తుక వారు నా - యవనిపై కోట
ముత్తికచేసిన - ముట్టడి దాఁకి
దవసధాన్యంబులుఁ - దగు రసవర్గ
మవల రాశాక నా - యవనిలోలేక
జనులెల్లఁదల్లడిం - చఁగఁజూచి భక్తి
ననిమిషారాధన - మాచరింపంగ
వారు నాతపము భా - వంబుల మెచ్చి
యారూఢబలచతు - రంగబలంబు
నిచ్చినఁ బగవారి - నెదిరించి పోర
విచ్చిపోయినవారు - వెతనొందువారు 4810
శరణొందువారును - సామభేదముల
మఱిలిపోయినవారు - మడిసినవారు
నగుచుఁబోయిన పగ - యనుమాటలేక
జగతి మీకరుణచే - సవనమే నొకటి
కావింపుచుండ రా - ఘవులఁ దెచ్చితివి
యావిల్లు శ్రీరాముఁ - డందియెత్తినను

—: రామచంద్రుఁడు శివునివిల్లు విఱచుట :—


నిప్పుడె భూమిజ - నిత్తునేన"నిన
తెప్పింపుమనుచు గా - ధేయుఁడాడినను

తనమంత్రులనుఁజూచి - ధారణీనాథుఁ
"డనుపమగంధ మా - ల్యాంచితంబయిన 4820
విలు వేగదెప్పించి - వీరికిఁజూపుఁ
డెలమితోఁ జనుఁ"డన్న - నేఁగివారపుడు
మేరుపర్వతమున - మెఱయు గహ్వరముఁ
గేరు నవ్విభుని బొ - క్కిసమింటిలోన
యెనిమిదిబండ్లతో - నెసఁగు మందసము
వినుతదోర్బలు లైదు - వేలు మానసులు
తమప్రయాసముల నా - ధనచమత్కృతుల
సముఖంబునకుఁ దెచ్చి - శకటంబు నిలుప
దేవతుల్యుండు మం - త్రియుతంబుగాఁగ
నా వేళ జనక మ - హారాజు పలికె. 4830
"కౌశిక! విల్లు రా - ఘవునకుఁజూపు
మీశానుదత్త మీ - యిష్వాసనంబు
నీవిల్లు మావంశ - నృపులు పూజింతు
రే వసుధానాథు - లెత్తంగలేరు
నరులేల? దేవదా - నవయక్షఖచర
గరుడ గంధర్వులు - కదలింపలేరు.
ఆయీశ్వరుఁడె కాక - యన్యులచేత
నీ యహీనశరాస - మేమనవచ్చు
అదె చూడుమని పల్కు - మారామవిభుని
హృదయవర్తనము మా - కేర్పడుఁగాని” 4840
అన విని కౌశికుఁ - డారామవిభునిఁ
గని "కుమారక! భీమ - కార్ముకంబెత్తి
చూడుము నీవన్న - చో నాత్మలోన

వ్రీడఁగైకొని లోక - విశ్రుతంబైన
మందసఁదెఱచి రా- మవిభుండు మౌని
బృందారకాధీశుఁ - బేర్కొని పల్కె
“ఎక్కిడుచున్నాఁడ - నిక్కార్ముకంబు
చక్కఁగాఁగనుము వి - శ్వామిత్ర! నన్ను”
అన మౌని యట్లకా - కన జనకుండు
తన మది నలరి యెం - తయు నెచ్చరింప 4850
నడుచక్కివట్టి యు - న్నతిమీఱ నెత్తి
కడువేగ రసదాడి - గజమునుఁబోలె
నారిసారించి స - న్నాహంబు మెఱసి
గౌరవంబమర నా - కర్ణాంతముగను
నట వినోదంబుగా - నలవోక దోఁప
కటకాముఖ నిరూఢ - కరపద్ముఁడగుచు,
దొడికి యందఱును క్రం - దుగఁజూచుచుండ
పిడిపట్టు మెల్లనె - బిగువుసళ్లుటయుఁ
బెటిలు పెటిల్లునఁ - బృథివి నింగియును
దిటదప్పనెందుఁ బ్ర - తిధ్వనుల్ నిండ 4860
బలుగొండ యతనిచేఁ - బగిలిన రీతి
కలగుండు వడఁగ జ - గంబులన్నియును
జనకుఁడు రామ ల - క్ష్మణులు గాధేయ
మునియునుఁదక్కఁ గా - ర్ముకపరాభంగ
భంగనిష్ఠురమహా - ర్భటి కోర్వలేక
అంగదనచ్చోటి - యఖిలజనంబు
భీతిల్లి మూర్ఛచే - పృథివిపైఁద్రెళ్లి
యాతరి నొక ముహూ - ర్తానంతరమున

నందఱువినుచుండ - నంజలి జేసి
యందుకై జనక మ - హారాజువల్కె 4870
"ఎఱిగిఁతి మనఘాత్మ! - యీరాము బలము
గుఱుతింపను తలంపఁ - గూడదెవ్వరికి
మిగుల నాశ్చర్యమై - మించెశ్రీరాము
మగువయై జానకి - మావంశమునకుఁ
గమనీయకీర్తిరాఁ - గలిగె నాపూన్కి
సమకూడె నెందు పూ - జ్యతలు నేఁగంటి
యిపుడ మీమంత్రుల - నీవయోధ్యకును
నిపుణులఁబనిచిన - నీవెనువెంట
సుతులు వచ్చుటయు న - చ్చోనాఁడు నాఁటి
కతలు నాయింట యా - గము చూచుకొఱకు 4880
వచ్చి రాఘవుఁడు భా - వజవైరివిల్లు
చెచ్చెర తునుకలు - చేసివైచుటయు
సీత నిచ్చు తెఱంగు - శ్రీరాముపెండ్లి
కేతెరవలయు మీ - రింతులంగూడి ”
అని దశరథునితో - నాడనేర్పరుల
పనుపుఁ డిచ్చితి నేను - పసపుఁగమ్మలును.
అనిన గాధేయుండు - నా శతానందు
ననుపఁజొప్పడు వారి - నరసి పంవుటయు

—: జనకభూపతి యయోధ్యకు దూతలనంపుట :—


వారయోధ్యకు నాల్గు - వాసరంబులకు
నారూఢ పవన జ - వాశ్వంబులెక్కి 4890

సాకేతమున కేఁగి - సమదేభ పుష్క
రాకీర్ణశీకర - వ్యపగతోత్తుంగ
ఘోటక ఖురపుట - కోటిధరా వి
పాటనోదర రేణు - పటలమైనట్టి
రాజగేహము హజా - రము చేర నేఁగి
రాజన్యమణి దశ - రథుఁడున్నయట్టి
కొలువుసావడి మఱం - గున నిల్చి యిందు
కులదీపకుఁడు జన - కుఁడు బంచినాఁడు
వారిప్రధానులు - వచ్చినారనుచు
మారాకదెల్పుఁ డే - మఱక రాజునకు 4900
చనుఁ" డన్న విని యవ - సరములవారు
జననాథునకు నవ - సమచరిత్రునకు
వినుపింపఁ బిలుపింప - వినయంబుతోడఁ
జని వారు దశరథు - సముఖంబుఁజేరి
చేమొగిడించి పం - చిన శుభలేఖ
లామేరఁజూప రా - యసములవారు
అందుక "శ్రీమన్ మ - హామండలేశ్వ
రేందు కులోత్తమా - హీనప్రతాప
జనకమహారాజ - చంద్రులంగారు
మనవంశ దశరథ - మనుజేశు నగరి 4910
చాలుమానుసులకు - సంప్రీతిఁబంపు
మేలువార్త నిరుద్ధ - మితమున కేము
అందఱుఁబరిణామ - మచటి మీరాజు
నందు యోగక్షేమ - మప్పటప్పటికి
వ్రాసి యంపునది మా - వైదేహిఁబెండ్లి

చేసెద మిపుడు మీ - శ్రీరామునకును
మీరాజువారును - మీపురోహితులు
చారువైఖరులఁ గౌ - సల్యాదిసతులు
రావలెనని తమ - రాజుతోఁదెలుపఁ
గావలె"ననెడి వ - క్కణఁజదివింప 4920
జనక ప్రధానులా - జననాథుఁజూచి
అనఘ! మా రాజు పా - ధ్యాయులగ్నులును
హితగాధిసుత పురో - హితులు నుండంగ
ప్రతినఁ జెల్లింప నేఁ - బట్టి నిచ్చితిని
వీర్యశుల్కను రామ - విభునకు నతఁడు
శౌర్యాడ్యుఁడై యీశ - చాపంబుఁదునిమె,
ఆ పెండ్లికై మీర - లటకు రావలయు
నీ పుత్రులకుఁబెండ్లి - నెఱవేర్చుకొనుము
సుత వైభవము నీవు - చూడంగవలయు
నితరు లందఱుఁగూడ - నేమిటివారు." 4930
అనుచు విశ్వామిత్రుఁ - డాశతానందుఁ
డనుమన్న వారు - మాయయ్యఁగారొకరె
ఆనతిచ్చినవార - లనుచు (మీరిపుడు
లోననుకోనవ)ద్దు - లోకేశ!" యనిన
వారిమాట వసిష్ఠ - వామదేవులకుఁ
గూరిమి మంత్రుల - కును తేటపఱచి
పృథుశక్తి మెఱయించి - భీమకార్ముకము
మిథిలాపురంబులో - మెఱసెను డించి
మనరాముఁడున్నాఁడు - మహిపుత్రినిచ్చె
జనకుఁడు మీకెల్ల - సమ్మతమ్మునను 4940

జనకమహీనాథ! - సాదృశ్యమహిమ
లనయంబు మనకభి - వ్యక్తంబుగాదె
కోరియువేఁడిఁ జే - కూర్చుకోవలయు
నా రాజు మనకు వి - య్యముగాఁగలండె?
ఆలోచనముచేసి - యందఱుఁబలుకుఁ
డేల? తామసమన్న - నెంతయునలరి
సామాన్యుఁడే చూడ - జనకభూవరుఁడు
భూమీశ! నిమి వంశ - మునఁ బుట్టినాఁడు
నవ్యరత్నము కాంచ - నంబునుఁబోలి
యవ్యయ తుల్యయో - గాప్తిచేగూడె 4950
అన్యోన్యమునుఁబావ - నాన్వయులిట్టి
మాన్య బాంధవము సం - భావించుకతన
నొదవి యొక్క ముహూర్త - మున్నది లోనె
కదిసి “శుభస్యశీ - ఘ్రంబ” న్నకతన
తామసమేల? యం - దఱకుఁబైనంబు
లీమేఱ వివరింపుఁ - డిదియె నిశ్చయము.
అన విని జనక మ - హారాజు మంత్రి
జనుల సగౌరవ - సన్మానములను
విడిదికింబనిచి వే - ఱ్వేఱ నందరను
పుడమిఱేఁడనిచి య - ప్పుడుకొల్వుదీఱి 4960
యంతఃపురంబున - కరిగి యత్తెఱఁగు
కాంతలకెఱిఁగించి - కరమర్థినుండె,

—: దశరథుఁడు మిథిలాపురికిఁబోవుట :—


ఆమఱునాఁడు స - మస్తబాంధవులు
సామంతులునుఁగొల్వ - సచివు సుమంత్రుఁ

గాంచి యిట్లనిపల్కె - "ఘనవర్తకులను
పంచితివే మున్ను - పైనంబుచేసి
బొక్కిసబండార - ములుదేరఁబనుపు
మెక్కుగా నుడుగర - లేర్పడందెమ్ము
అందంద విడుదులా - యతము సేయింపు
పొందుగా రసవర్గ - ముల నెచ్చరిలుము 4970
చతురంగబలములు - సవరణల్ చూడు
మతిశయంబుగసొమ్ము - లందరికిమ్ము
పల్లకు లాయత్త - పఱపుము కొన్ని
చల్లనీరును నింపు - చలివెందిరులను
నక్కడక్కడనిల్పు - మన్నియంగళ్లు
చక్కనివెలజాతి - సతుల రమ్మనుము
కేవనులను బిల్చి - కెలంకులఁబ్రజకు
నే వలన గుడారు - లెత్తవాకొనుము
రథముఁగై చేసి సా - రథినిఁ దెమ్మనుము
పృథులాశ్వములఁబూన్చి - బిరుదులెత్తించు" 4980
అనియెల్లవారుఁబా - యక కొల్చిరాఁగ
ముని వసిష్ఠుడు తన - ముందఱజనఁగ
వామదే వాత్రేయ - వాసిష్ఠ కణ్వ
జామదగ్ని మృకండు - సంయముల్ గదల
కరులపైనెక్కి ము - క్తాచ్ఛత్రములను
భరత శత్రుఘ్నులు - పజ్జలంగొలువ
భేరిమృదంగాది - బిరుదవాద్యములు
భోరుకలంగ భూ - భుజులు సేవింప
బలమెల్లవెంటరాఁ - బరమహర్షమున
లలితప్రయాణ లీ - లంజేరవచ్చి 4990

రాజీవముఖుల పా - రముగాఁగ ముందు
లాజలతో మిథి - లాప్రవేశంబు
చేసి యాజనకుండు - సేనలుఁదాను
భాసిల్లనెల్లెడఁ - బౌఁజులుఁదీర్చి
పొడగని పూజించి - భూపాలచంద్ర!
కడుమంచిదినమయ్యుఁ - గనుఁగొంటిమిమ్ము
నీకుమారులఁగంటి - నేఁడువసిష్ఠుఁ
జేకొనిపూజలు - సేయంగఁగల్గె
వచ్చితి నాభాగ్య - వశమున నీవు
సచ్చరిత్ర! మఘంబు - సఫలంబునొందె. 5000
సర్వోన్నతుని రామ - చంద్రుంగాఁచితివి
యుర్వీశ! నీభాగ్య - మొకరెన్నఁగలరె?
అనునంత లోపల - నా గాధిరాజ
తనయుఁడు రఘుకులో - త్తములనుఁదెచ్చి
వీరె "నీతనయులు - వీరశేఖరులు
కూరిమి నావెంటఁ - గూర్చిపంపితివి
ఒప్పగించితి మీకు - నుర్వీశ! యనిన
అప్పుడ! దశరథుఁ - డడుగులవ్రాలు
తనయుల నిర్వుర - తాఁగౌఁగిలించి
"మునివర్య! కౌశిక! - మొదట నీమహిమ 5010
నెఱుఁగ కేమంటినో - యెన్నకమదిని
కరుణింపు"మన జ - నకక్షితీశ్వరుండు
"నీతనయుల శౌర్య - నిర్వాహకము
లీతని కరుణఁ జు - మీ! మనువంశ!”
అని తోడుకొని పోయి - యన్నగరమున

వినుత వైభవమైన - విడిదిలోపలను
జనకుండు దశరధ - జనపాలు నుంచి
తననగరికిఁ బోయి - తగినవైఖరుల

—: ఇక్ష్వాకు వంశక్రమమును వసిష్ఠుఁడు జనకునకుఁ జెప్పుట :—


నారేయి వసియించి - యమ్మఱునాడు
ప్రారంభసవన క - ర్మము నిర్వహించి 5020
తనపురోహితుని శ - తానందుఁజూచి
జనకుఁడిట్లనియె నా - సైదోడు ఘనుఁడు
సలలితాత్మకుఁడు కు - శధ్వజనృపతి
పొలుపొంద సాంకాశ్య - పురినున్నవాఁడు
యిక్షుమతీ తీర - మేలుచున్నాఁడు
దక్షుఁడై యితని నం - దనలఁ దోకొనుచు
రమ్మని తగినవా - రలఁ బిల్వఁబంపు
మిమ్మహోత్సవ మతఁ - డీక్షింపవలయు
ననుచు వేగుల వారి - నంపినవారు
ననుపమ రయముతో - నచ్చటికరిగి 5030
వాసవునాజ్ఞ చే - వనమాలిఁబిలువ
నాసురల్ వోయిన - యందంబుమీఱ
నాపురంబునకేఁగి - యాకుశధ్వజుని
భూపాలశేఖరుఁ - బొడఁగాంచి తమదు
రాకదెల్పిన మహా - రథుఁడుపైనంబు
జోకచేసుక యట్ల - శుభయత్నమునకు
మహనీయ వస్తు సా - మగ్రితోనపుడ

సహజన్ము వీటికిం - జని జనకునకు
మ్రొక్కి శతానంద - మునికిఁజాగిల్లి
యక్కజంబైన సిం - హాసనంబులను 5040
నన్నదమ్ములు విహి - తానులాపముల
మన్ననల్ గని సుదా - మనుఁడను మంత్రి
"తడయక నీవేఁగి - దశరథవిభునిఁ
దొడుక రమ్మ"నవుఁడు - తోడనే కదలి
యాపక్తిరథుఁజూచి - "యనఘాత్మ! మిమ్ము
మీ పురోహితులను - మీ యుపాధ్యాయు
లందఱ జనక మ - హారాజు బిలిచె
నందు విచ్చేయుఁ డిం - కాలస్యమేల?"
అనవిని దశరథుం - డప్పుడె కదలి
జనకుని యింటికిఁ - జనిన నవ్విభుఁడు 5050
యెదురుగావచ్చి య - నేక సత్కృతుల
మదివొదలింప న - మ్మానవేశ్వరులు
కొలువు కూటంబులో - గురుతరరత్న
విలసితాసనము ల -వ్వేళఁ గైసేయ
సద్దుసేయకుఁడని - జనకునిఁజూచి
తద్దయు వేడుక - దశరథుండనియె.
"ఈ వసిష్ఠమునీంద్రుఁ - డిక్ష్వాకులైన
మావంశమునఁ బుట్టు - మానవేంద్రులకు
దైవంబు గురుఁడు - ప్రధానరక్షకుఁడు
సేవధిఁ గర్త యా - శ్రితుఁడు శిక్షకుఁడు 5060
నన్నియు నితఁడౌట - యప్పటప్పటికి
విన్నావుగాదె మీ - వేగులవలన

కావున మావంశ - కథయేర్పరించు
నేవేళగాధేయు - నింగితంబెఱిఁగి"
అనిన యంత వసిష్ఠుఁ - డా శతానంద
జనకులు వినుచుండ - సభలోనఁబలికె.
"అవ్యక్తుఁడైనట్టి - యాబ్రహ్మవలన
నవ్యయుండు మరీచి - యాత్మజుఁడయ్యె,
ఆమరీచికిని క - శ్యపుఁడు జనించె
నామహాతాత్మున - కా వివస్వతుఁడు 5070
తనయుండు వైవస్వ - త సమాఖ్యుఁడైన
మనువు జనించె న - మ్మనువు కిక్ష్వాకు
జనపతి యతఁడేలె - సాకేత నగరి
ననఘుఁడాతఁడు కుక్షి - యనురాజుఁగాంచె
నతనికిని వికుక్షి - యతనికి బాణుఁ
డతనికి నవరణ్యుఁ - డతనికి పృథుఁడు
నారాజుకు త్రిశంకుఁ - డతనికి దుందు
మారుండు యవనాశ్వ - మహిపుఁ డాయనకు
నతనికి మాంధాత - యతనికి సంధి
యతనికి ధ్రువసంధి - యలసేనజిత్తు 5080
లనువార లిరువురా - యవనీశ్వరునకు
జనియించి రాధ్రువ - సంధికి భరత
విభుఁ డాయనకుఁగల్గె - వెస నసితాఖ్యుఁ
డభినుతుండయ్యె న - య్యసితుండు చాల
బలవంతుఁడై రాజ్య - పరిపాలనమున
వెలయుచో వైరంబు - వెనిచి హైహయులు
శశిబిందులును తాళ - జంఘులుఁ గూడి

దిశ లాక్రమించి యెం - తే సాహసమున
నతని నోడించి రా - జ్యముఁ గట్టుకొనిన
నతఁడు గర్భిణులైన - యాత్మగేహినుల 5090
యిరువురతోఁ గూడి - హిమవంతమునకు
నరిగి యంతటఁబోయె - నమరుల పురికి.
అందులోఁ గాళింది - యనెడి చూలాలి
చందంబు గనుఁగొని - సహియింపలేక
యితరకామిని విషం - బిడియె గర్భంబు
చ్యుతమయి పోవ తాఁ - జూపోపలేక
భార్గవ చ్యవన తా - పసవరేణ్యుండు
మార్గంబునందు రా - మగువ కాళింది
వచ్చి మొక్కినఁ "బుత్ర - నతివి గ "మ్మనుచు
నచ్చాన దీవించి - యమ్మౌనివలికె. 5100
‘‘ఓయమ్మ! నీకుక్షి - నున్నకుమారుఁ
డీయెడ విషముతో - నెనసియున్నాఁడు
గరముతో జనియించుఁ - గలఁగకుమీవు
పరిణామ మొందుము - పట్టిఁ జేపట్టి"
అనివోవ సగర నా - మాత్మజుఁగనియె.
ఘనుఁడాతఁ డసమంజుఁ - గాంచె బాలసుని
నతఁ డంశుమంతుని - నతఁడు దిలీపు
నతఁడు భగీరథు - నతఁడు కకుస్థుఁ
నాదొర రఘునాము - నతఁడు కల్మాష
పాదు శంఖణుని నా - ప్రభువునింగనిరి. 5110
అతఁడు సుదర్శను - నతఁడగ్నివర్ణు
నతఁడు శీఘ్రగుమారుఁ - డతఁడా మరువును

నతఁడు ప్రశుక్రుని - నతఁ డంబరీషు
నతఁడు నహుషుని య - యాతి నవ్విభుఁడు
నతనికి నాభాసుఁ - డతనికి నజుఁడు
నతనికి దశరథుం - డా రాజమణికి
నీరామ లక్ష్మణు - లిట్లుజనించి
రారూఢ గుణవిశు - ద్ధాన్వయుల్ వీరు
పరమధార్మికు లన - పాయ విక్రములు
స్థితధైర్యశీలు రూర్జి - త యశోనిధులు 5120
సత్యసంధులు నీతి - సంపన్ను లెపుడు
నిత్యదానకళాతి - నిపుణు లుత్తములు
యీరఘు వంశజు - లిందఱి లోన
శ్రీరామచంద్రుఁడా - శ్రితరక్షణుండు
తమ్ములున్నట్టి యు - త్తములు వీరలకు
నిమ్ము కుమార్తెల - నేక లగ్నమున
అడుగుచు నున్న వాఁ - డల దశరథుఁడు
కొడుకుల కెల్లనీ - కూఁతులనిచ్చి
యిట్టి యల్లురఁ జూడ - నెన్ని జన్మములు
నెట్టివి సుకృతంబు - లీవుసేసితివొ? 5130
యిప్పింపుఁ డనవుఁడు - "నిచ్చెద ననుచు
నప్పుడ జనక మ - హారాజువలికి
"ఆదిఁబెండ్లిండ్ల వం - శావళిక్రమము
మేదినిఁ దెలుపుటల్ - మేలగుఁగాన
నావంశకథ శతా - నందునిచేత
నీవేళ వినుఁడ"ని - యెచ్చరించుటయు,

—: జనకుఁడు వసిష్ఠునితోఁ దనవంశ క్రమమును జెప్పుట :—


"జనకుని వంశ ప్ర - చార మందఱును
వినుఁడ"ని వారల - వృత్తాంతమెల్ల
నెలమి వసిష్ఠు మో - మీక్షించి పలికె
నల దశరథ ముఖ్యు - లందఱు వినఁగ. 5140
"అనఘాత్మ! యిందు - వంశాభరణంబు
ఘనశౌర్య నిధి నిమీ - క్ష్మాతలేశ్వరుఁడు
జనియించె మిథియను జనపతి యతని
తనయుండు మిథిల యా - తనిపేర వెలసె.
ఆమిథికిని జన - కావనీనాథుఁ
డా మనుజేంద్రున - కల యుదావనుఁడు
నతవైరి యతనికి - నందివర్థనుఁడు
కృతపుణ్యుఁడైన సు - కేతుఁడాతనికి
నతనికి దేవరా - తావనీవిభుఁడు
నతనినందనుఁడు బృ - హద్రధాఖ్యుండు 5150
నాయశోనిధికి మ - హా వీరవిభుఁడు
నాయనధృతిమంతుఁ - డైన సుధృతిని
కీర్తిమంతుని దృష్ట - కేతు నవ్విభుఁడు
నార్తరక్షణుఁడైన - హర్యశ్యునతఁడు
నరసన్నుతుం డాయ - నకుఁ గీర్తిరథుఁడు
స్థిరశౌర్యుఁ డతనికి - దేవమీఢుండు
నతనికి సువిధుఁ డా - యస మహీధ్రకుని
ప్రతిభ మించినకీర్తి - రాతు నవ్విభుఁడు
నమ్మహీపతికి మ - హా రోమవిభుఁడు
సమ్మతి నతనికి - స్వర్ణ రోముండు 5160

నాధరావరునకు - హ్రస్వరోముండు
నాధీరునకు నిర్వు - రాత్మజులందు
నీ జనకుఁడు జ్యేష్ఠుఁ - డితనికిఁదమ్ముఁ
డాజిలో నుతికెక్కు - నల కుశధ్వజుఁడు
నితనిఁ బట్టముగట్టి - యీరాజుతండ్రి
హితమతిఁ గానలఁ - కేఁగిన వెనుక
మహిమ సంకాశ్యనా - మపురాధి నాథుఁ
డహితవృత్తి సుధన్వుఁ - డనియెడు రాజు
యితనింటిలో నున్న - యీశచాపంబు
నితని తనూజాత - నీసీతఁదనకు 5170
నిమ్మన్న నివ్విభుం - డియ్యఁబొమ్మన్న
నమ్మానవేంద్రుఁ డీ - యనరాజధాని
మిథిలాపుర వరంబు - మీఁద దండెత్తి
పృథుశక్తి జగడింప - భీమసంగ్రామ
చండకోదండ దు - స్సహ దేవదత్త
కాండ ప్రకాండ భీ - కరదావదహన
హేతులు వెలివిరి - యించి యీజనకుఁ
డాతని శలభాయి - తాంగుఁ గావించి
యంకిలిలేక వాఁ - డర్థిఁబాలించు
సాంకాశ్యపురిని కు - శధ్వజునుంచి 5180
వసుధయేలెడు వీరి - వంశ వర్తనము
పొసఁగఁ దెల్పితి నిట్టి - పుణ్యశీలుండు
సీత నూర్మిళను మీ - శ్రీరామునకును
బ్రీతి లక్ష్మణునకుఁ - బెండ్లిండ్లుసేయఁ
దలఁచెఁగావున మఘ - తార యీప్రొద్దు

వలనొప్పఁగా సమా - వర్తనాద్యములు
సేయఁబంపుఁడు వారి - చేత నీమీఁద
పాయక యుత్తర - ఫల్గునియందు
ముదముతో నేఁటికి - మూఁడవనాఁడు
కదిసెను పెండ్లిలగ్న - ము ధ్రువంబుగను" 5190
అనినంత కౌశికుం - డా దశరథుని
ఘనువసిష్ఠుని జన - క నృపాలుఁగాంచి
యీ నిమివంశంబు - నిక్ష్వాకువంశ
మే నియమంబుల - నెన్నిచూచినను
సరి దశరథుఁడు నీ - జనకభూ విభుఁడు
సరివత్తురే గుణాం - శములఁ జూచినను
చక్కదనంబుల - జవ్వనంబులను
మిక్కిలి కులముల - మెఱయుఁగల్ములను
రామలక్ష్మణులు ధ - రాసుతోర్మిళలు
కామించి పతిసతుల్ - గాఁదగువారు 5200
కల్యాణములొనర్పఁ - గా నింతమంచి
తుల్యయోగము లెట్టి - దొరకును దొరకు
మీభాగ్యమిదిగాక - మేదినియెందు
శోభనంబుల మీఁద - శోభనంబగుట.”
అని జనకునిఁ జూచి - "యనఘ! యింకొకటి
వినుము కుశధ్వజ - విభుని పుత్రికల
భరత శత్రుఘ్నుల - పరిణయంబులకుఁ
దరణి వంశాగ్రణి - దశరథ విభుఁడు
యీవసిష్ఠమునీంద్రుఁ - డీ ముహుర్తమునఁ
గావింపఁదలఁచి రా - కన్యామణులకు 5210

వారలు తగినట్టి - వారలు దివిజ
వీరపరాక్రముల్ - వీర శేఖరులు
కట్టడసేయింపఁ - గావలె "నన్న
"నట్టెకానిమ్మ "ని - యాజనకుండు
"అయింటికీ యింటి - కరమరయేది?
ఆయయోధ్యయు విదే - హము మీకుసరియె
నీవు వసిష్ఠమౌ - నియు విచారించి
కావలసినపనుల్ - గావించు కొనుఁడు
దశరథుండేను ని - ద్దరి సరిమీకు
వశులము వేఁడంగ - వలవ దెందులకు? 5220
మాకు నొక్కస్వతంత్ర - మా ! అన్ని పనుల
మీకెట్లు సరిపోవు - మేలవి మాకు
వొప్ప నేనెవ్వఁడ - నొక ముహూర్తమున
నిప్పుడ నలువుర - కిత్తు కన్నియల
మీచిత్తమున్నట్లు - మేకొంటి "ననుచు
వాచంయమునిఁ బల్కు - వరపుణ్యశీలు
జనకునిఁజూచి ద - శరథభూజాని
వినయ గౌరవములు - వెలయ నిట్లనియె.
"అన్నదమ్ములు మీర - లతిపుణ్యశాలు
లున్నతగుణవంతు - లుత్తమోత్తములు 5230
శ్రీకరుల్ బుధుల బూ - జించు భాగ్యంబు
మాకుమారకుల స - మావర్తనములు
వేల్పింతు మేమని - విచ్చేయుఁడనిన
వేల్పు లెల్లనుచాల - వినుతులుసేయ

—: దశరథుఁడు గోదానాదులు సేయుట :—


తమనగరికి వచ్చి - దశరథ విభుఁడు
క్రమముతోనాందీ ము - ఖములు గావించి
వరుస వసిష్ఠు వి - శ్వామిత్రమునుల
విరచించు సంకల్ప - విధిపూర్వకముగ
నొక్కొక్క తనయు న - భ్యుదయంబుకొఱకు
నొక్కొక్కలక్షగా - నొప్పుధేనువులు 5240
బంగారుకొమ్ములు - పసిలేఁగదూడ
లంగైన బలుగెంపు - టందెలు పసిఁడి
గొరిజలు తామ్రలాం - గూలముల్ కంచు
పరుస పాత్రలు సాధు - వర్తనల్ కలిగి
తొలుచూలియౌ కామ - దుఘమునుంబోలి
వలసినన్నియు పాలు - వలనుగాఁగురియు
నావుల నవనీ సు - రావళికిచ్చి
కావలసిన రత్న - కనకాంబరములు
నడిగినవారికి - నడిగినయట్లు
తడయక యొసఁగి యీ - దశరథుఁడంత 5250
కమలభవుండు ది - క్పతులతోఁగూడి
యమరుకైవడిఁ గుమా - రాసక్తినుండె.
ఆదినంబునఁగేక - యాధినాయకుని
గాదిలి సుతుఁడు కై - కకును సైదోడు
దొరయు వియ్యము భర - తునిమేనమామ
స్థిరయశోనిధి యధా - జిత్తనురాజు
వచ్చిన నెదురేఁగి - వలయుమన్ననలఁ

దెచ్చితానున్న గ - ద్దియ మీఁదనునిచి
దశరథనృపతి యా - తనిమోముఁజూచి
కుశలంబులడుగనా - క్షోణీశుఁడనియె. 5260
"తమరాజు నితర బాం - ధవులు నందఱము
ప్రమదంబుతోడ ని - ప్పటికి సేమమున
నున్నార మతని ని - యోగంబుచేత
నిన్ను నీభరతుని - నేఁజూడవలసి
యే నయోధ్యకువచ్చి - యీ తొలునాఁడె
జానకికల్యాణ - సంబరంబునకు
చనినవారని పల్క - సంతోషవార్త
విని యేను కన్నుల - విందుగాఁజూడ
వలసివచ్చితి"నన్న - వచనసంగతికి
నెలమి "సంతోషమా - యె" నటంచుఁబలికి 5270
ఆరాత్రివసియించి - యమ్మఱునాఁడు
శ్రీరామ విభుఁడు వ - సిష్ఠానుమతిని

—: శ్రీ సీతాకల్యాణము :—


ధరణీశునాజ్ఞ సో - దరులతోఁగూడి
సరవిగా మంగళ - స్నానముల్ చేసి
సాంకవ మృగమద - సమ్మిశ్రమైన
కుంకుమపంకంబు - ఘుమ్మననలఁది
నవరత్న భాసమా - నములైన యట్టి
వివిధాంగుళీయక - వితతిఁగీలించి
జవ్వాదితావు లె - సంగు సంపంగి
పువ్వుటెత్తులు సిగఁ - బొసఁగించిచుట్టి 5280

సరిలేని కట్టాణి - చౌకట్లతోడ
నొరయుఁజొక్కపుఁగెంపు - టొంటులుదాల్చి
శ్రీకర రోహణ - శిఖరికూటంబు
రేక మాణిక్యకి - రీటం బమర్చి
మరకత శ్యామ కో - మల కటీరమున
గరువంబుగాంచు బం - గరుచేలఁగట్టి
పరమయోగుల మనః - పద్మముల్ వ్రాలు
సరణి సుతారక - సరములు వైచి
మనసులోఁ జొచ్చి య - మ్మదనుండు నిలిపెఁ
దనతేజి నన చిల్క - తాళి ధరించి 5290
పలక వజ్రములఁ జొ - ప్పడు భాషికంబు
నెలరేక హరుఁడు పూ - నినమాడ్కిపూని
ధరణీభరము మాన్పఁ - దాదీక్ష దాల్పు
కరణి ముంగేల కం - కణము ధరించి
శ్రీరామవిభుఁడు గై - సేసి సోదరులు
చేర రాఁ గల్యాణ - శృంగారములను
జనకునిఁజేరి రా - జననాయకుండు
జనకు నింటికి వసి - ష్ఠపురస్సరముగ
వచ్చునమ్మునుపె య - వ్వైదేహరమణుఁ
డిచ్చలోఁ దనయల - నెల్లఁగైసేయ 5300
నియమింప నపుడొక్క - నిడువాలుఁగంటి
రయమునఁగాంచన - రత్నపీఠమున
చెంగట జతగూడి - చేరు నైదువులు
మంగళగాన సా - మగ్రితోఁగూడ
జానకి నునిచి కే - శములకీల్గంటు

చేనోడ్చి సవరంబు - చెలి చేతికిచ్చి
నెఱులుగూడఁగదువ్వి - నిడువాయదివిచి
కరమున చాంపేయ - గంధతైలంబు
చేడియగిన్నె దా - చిఱుఁగేల నంది
కూడుఁ గనిష్ఠికాం - గుళ నఖాగ్రముల 5310
దారసన్నముగ నౌఁ - దల మీఁదనుంచి
హారవాయితముగా - నరచేతనద్ది
కొఱగోళ్లఁగురులు చి - క్కులు దీర్చిసోఁగ
కరముల నీలంపు - గాజులుమొఱయ
నుదురుచెమర్ప న - న్నునకౌనువణఁక
కదలుచు రవగెంపు - కడియము ల్మ్రోయ
చన్నులహారముల్ - చౌకళింపంగ
నున్ననిగొప్పు వె - న్నునవీడిజార
తాటంకములడాలు - తళుకుఁ జెక్కులకు
దాటంగఁబరిపరి - తాళవైఖరుల 5320
తలయంటు నెడ నొక్క - తలిరాకుఁబోణి
యలమిఁ బెన్నెఱులగం - ధామలకంబు
రయణీయఁమగు నప - రంజికొప్పెరల
సమరుగోర్వెచ్చని - యంబుపూరములు
తంబిగలను ముంచి - తరుణినీరార్చె
కంబుకంఠికి జన - కతనూజకపుడు
తడియొత్తె నొక్క బి - త్తరి సన్నవలువ
మడుఁగుఁ బానడ నొక్క - మలయజగంధి
వీవనం దడియార్చె - విసరియొక్కరితె
యావెలందికి జడ - యల్లెనొక్కర్తె 5330

సరిలేని విరవాది - సరములు చుట్టె
విరిబోణి యొకతె య - వ్వెలఁది యౌదలను
నవరత్న సూర్య చం - ద్ర కలాపయుగము
సవరించెనొక్కచం - చలనేత్ర జడను
వడిఁ జంద్రకావి పా - వడమీఁదఁబసిఁడి
పొడులెందు వెదచల్లు - బురుసా పటంబు
పసిఁడి కంగులు దీరు - పైఠిణీ రవికె
నొసపరిఁ దొడిగించె - నొకతె సీతకును
నిలువుటద్దము చెంత - నిలిపెయొక్కర్తు
తిలకించికస్తూరి - తిలకంబుదీర్చె 5340
పలచనగా కదం - బము పూసిమేల్మి
తళుకు గందవొడి మీఁ - ద నలందె నొకతె
సరిలేని ముత్యాల - సరులును కంట
సరియు నొడ్డాణంబు - సందిదండలును
కట్టాణి ముక్కర - కళుకుఁ గమ్మలును
మట్టెలుఁ గరము ల - మ్మణుల గాజులును
కంకణమ్ములు నూడి - గములు నందెలును
కింకిణీ రవములఁ - గెలయు మేఖలయు
ముత్తేల బొగడలు - ముక్కెఱనడుగు
లత్తుకలును నేర్పు - లను చంద్రముఖులు 5350
సవరణల్ చేసిరి - జనక తనూజ
నవలఁ బెండ్లికుమార్తె - లైనమువ్వురునుఁ
గై సేసి రీరీతిఁ - గన్యాకామణులు
చూచువారలు మెచ్చి - చోద్యంబునొంద
“శృంగారముల కేమి - చెప్పితిఁగాక

అంగనామణి కన్య - లానల్వురందు
పరమకల్యాణి శో - భనగుణజాత
కరుణావలోక జ - గత్త్రయీ జనని
జనకనందన మహీ - జాత యాసీతఁ
గనుఁగొన్నకన్ను లే - కైవడి మరలు 5360
సొమ్ములకెల్లను - సొమ్ములై మించు
నమ్మనోహరగాత్రి - యతులితాంగములు
సీతచక్కదనంబు - చెప్పి వేఱొక్క
నాతిఁదలంచిన - నగుఁబాటుఁగాదె.”
అంతట దశరథుం - డాత్మనందనుల
దంతులమీఁద ము - క్తాచ్ఛత్రములను
బిరుద ధ్వజంబుల - భేరీమృదంగ
మురవ దుందుభి ఘోష - ములవచ్చునపుడు
సామంత వివిధభూ - షణఘట్టనముల
హేమరజం బుర్వి - నెల్లశోభిల్ల 5370
వందిబ్బందముల కై - వారంబుమెఱయ
సందడిగా క్రంత - సతు లందికొలువ
ధారుణిసురలవే - దనినాద మమర
చేరిపుణ్యాంగనల్ - సేసలుచల్ల
పాదచారమున భూ - పతి తోడిదొరలు
కై దండ లొసఁగ చెం - గటఁ జేరివచ్చి
హితమంత్రిజనపురో - హితులతోఁగూడి
యతులమౌ జనక మ - హారాజనగరు
చేరి "వసిష్ఠుని - చేతమారాక
యారాజునకుఁదెల్పుఁ - డ" ననట్లయరిగి 5380

వివరింప జనక భూ - విభుఁ డెదుర్కొనుచు
వివిధసన్మానముల్ - వెలయరాఘవుల
సవరణగల తన - సదనంబులోని
కవిరళప్రీతిమై - నట తోడితేర
నిగనిగమనునింద్ర - నీలంపుటరుఁగు
పగడాలకంబముల్ - పచ్చలలోవ
పసిఁడిచొక్కపుఁదీగె - పనిహరువులను
పసమీరు టంకులు - పలకవజ్రముల
మెట్టికల్ చుఱుకుమే - ల్మిపరంగి లాగి
దట్టంపుకెంపుల - తళుకు బోదెలును 5390
జీవదంతముల దం - చెలు ముత్తియముల
కోవలమేల్కట్లు - గోమేధికముల
జూలకంబులు బురు - సాతెరల్ చందు
వాలపూఁదేనియ - వాచవిఁజొక్కి
ఘుమ్మను మగతేఁటి - కులములరెక్క
తెమ్మరల్ గలయించు - దివ్యసాంబ్రాణి
ధూపగంధముల ని - స్తులిత మాణిక్య
దీపంబులను సము - దీర్ణ చిరత్న
రత్ననానాచిత్ర - రంగవల్లికల
నూత్న వైఖరుల క - న్నుల విందుసేయు 5400
జనకభూవరు పెండ్లి - చవికె లోపలికి
తనయులతోవచ్చె - దశరథుఁడంత
నవనవానంద స - న్నాహంబుతోడ
రవివంశదీపకుల్ - రత్నపీఠముల
నాసీనులగు తరి - నంకురార్పణము

చేసి యక్షతముల - శ్రీచందనంబు
లాజలు నేయి పా - లాశముల్ తేనె
భాజనంబులును ద - ర్భములు మున్‌గాఁగ
హోమసామాగ్ని వ - హ్నులుఁదెచ్చియునిచి
శ్రీమించ రఘురాము - చేత వేల్పించి 5410
వసియింప జనకుండు - వైదేహిఁదెచ్చి
ప్రసవసాయకు పూజ - బాణమో యనఁగ
కల్యాణవేది చెం - గటికి రా నపు డ
హల్యాతనూజుండు - నలగాధి సుతుఁడు
తెరయెత్తిన నరుంధ - తీనాయకుండు
మఱియుఁ "గుర్వంతుతే - మంగళం"బనఁగ
"ఆయత్త" మనిని “స - ర్వాయత్త "మనెడి
యా యుపాధ్యాయుల - యనుమతిగొంత
తెరవంప శ్రీరాము - దృష్టి యాసీత
చిఱునవ్వు నెమ్మోము - శృంగారమనెడు 5420
కొలనులోపలఁ బాదు - కొను పుండరీక
దళములోయనఁగ నెం - తయు వికసిల్లె
సిగ్గరి యగు నేల - చేడియపట్టి
యగ్గలికనుఁజూచు - నపుడు శ్రీరాము
లావణ్యజలధి న - ల్లనెదాఁటు మీల
కైవడి నందమై - కనుపట్టిఁజూపు
యిరువురు నొండొరు - లిటుజూచునపుడు
సరసానురాగ వీ - క్షణము లొప్పమరె.
అటుచూచియిటుఁ జూచి - యతనుండువైచు
చటులసవ్యాసవ్య - శరములోయనఁగ 5430

నావేళ తెర దివి - యంగ రాఘవుని
భావించి తా మధు - పర్కంబొసంగి
సర్వలక్షణవతిఁ - జంచలాగాత్రి
సర్వాభరణ సము - జ్జ్వలమహీపుత్రి
ననలుఁడు సాక్షిగా - నా రామవిభునిఁ
గని యభిముఖముగాఁ - గల్యాణి నునిచి
“అనఘ! యీకన్య నా - యాత్మజ సీత
జనవిచ్చి సహధర్మ - చారిణిఁగాఁగ
నంగీకరింపు మీ - వ"ని రాముచేత
నంగనామణి కరం - బల్లనె కూర్చి5440
"పరమపతివ్రతా - భరణ మీరమణి
వరియింపు ఛాయాను - వర్తిని” యనుచు
కనకభృంగారు క - ర్కరికాముఖమునఁ
దనరు కల్యాణమం - త్ర పవిత్రితములు
జలములు శ్రీరామ - చంద్రు హస్తమున
నెలకొన విభుఁడు క - న్యను ధారవోసె.
ఏపున రఘురాముఁ - డింతి కంధరను
చూపట్ట మంగళ - సూత్రంబుఁగట్టి
తళుకు ముత్యముల సీ - తారామవిభులు
తలఁబ్రాలువోసిరి - తమకముల్ మెఱయ5450
నావేళదివి నిండె - నమరదుందుభులు
పూవులవానలు - పుడమిపైఁ గురిసె
తగ విననయ్యె గం - ధర్వగానములు
మిగులంగ వలపు తె - మ్మెర లల్లుకొనియె
రహిమించె దేవతా - రమణుల యాట

విహితోత్సవంబయ్యె - విశ్వంబునకును
సీతఁజేపట్టి యా - శ్రీరామచంద్రుఁ
డాతతభక్తితో - నాశ్రయాశునకు
వలగాఁగ ముమ్మారు - వచ్చి మౌనులకుఁ
గులవృద్ధులకు నిజ - గురులకు మ్రొక్కి 5460
యున్నెడ లక్ష్మణుఁ - డూర్మిళాదేవి
నున్నతగుణవతి - నుద్వాహమయ్యె,
మాళవి భరతుఁడా - మంచి లగ్నమున
లాలితశ్రీల - లనఁబెండ్లియాడె
సమరాగముల మించి - శత్రుఘ్నుఁడపుడు
కమలాక్షిశ్రుతకీర్తిఁ - గల్యాణమయ్యె,
నలువురు రాజనం - దనులు నీరీతి
నలుగురా జనక నం - దనల వరించి
శోభనదినము ల - చ్చోనాల్గునాళ్లు
వైభవంబుల శాస్త్ర - వైఖరిఁదీర్చి 5470
ప్రాఁకెనయును నాక - బలి వసంతములు
వీఁకతోఁగావించి - విందులఁ దెలచి
వచ్చిన సకల భూ - వరులకు వలువ
లిచ్చి కుమారుల - యేఁగుఁబెండ్లిండ్లు
ధరణి నల్లెడ వెల్గ - దశరథవిభుఁడు
నిరతిమైఁగావించి - నిజగేహమునకు
శ్రీమెఱయఁగఁబ్రవే - శించి సమస్త
భూమీశులను వారి - పురముల కనిచి
ఆనందముననుండు - నప్పుడు గాధి
సూనుఁడు వారలఁ - జూచి దీవించి. 5480

యను మతుండై తుహి - నాచలంబునకు
జనియె నా తరువాత - జనకవిభుండు

—: దశరథాదు లయోధ్యకుఁ బోవుట :—


దశరథు ననిచి సీ - తకు నరణముగ
దశశతకన్యకా - దాసీ జనములు
లక్షయేనుఁగ లైదు - లక్షలహరులు
నక్షయంబగు పాఁడి - నమరుధేనువులఁ
గోటిరథమ్ములుం - గొన్ని వస్త్రములు
కోటియు గ్రామముల్ - గొన్నియాభరణ
కోటియు రత్నముల్ - కొన్నిదీనార
కోటియు వస్తువుల్ - గొన్నిశాలువులు 5490
పట్టెమంచములును - పరపులు మేలు
కట్టులు తెరలు చొ - క్కపు గురాడములు
దివ్వెగంబములు చే - దీపముల్ గొలువ
జవ్వాది పిల్లులు - జాలవల్లికలు
చప్పరమంచముల్ - సానలు పచ్చ
కప్పురంబుల క్రోవి - గములుఁ బన్నీరు
చెంబులుం గందపు - చెక్కలు రత్న
కంబళంబులు పచ్చి - కస్తూరి వీణె
పెట్టెలుం జీరల - పెట్టెలు సొమ్ము
పెట్టెలు నపరంజి - బిందెలు పైఁడి 5500
కొప్పెరలును తంబు - గులు వట్టివేళ్ల
చప్పరంబులును వా - సన సురటీలు
గిండులు పడిగముల్ - కిన్నెరల్ వీణె

దండెలు తంబురాల్ - తలగడల్ పడక
కత్తులు బటువులు - గాజుగిన్నెలును
చిత్తరు తెరలును - చిటికె వార్వములు
చిలుకపంజరములు - సింగాణివిండ్లు
నిలువుటద్దములు మా - ణిక్య దీపములు
నుయ్యాలగొలుసులు - నుదిరిపావాలు
ముయ్యీడు చదరంగ - ములు సొగటాలు 5510
మొదలుగా నొసంగి రా - ముని కొప్పగించి
మదిఁగలఁగఁగ బుద్ధి - మార్గముల్ పలికి
కడమకన్నియల కీ - గతి నరణములు
సడలనిప్రేమ నొ - సంగి బంగారు
పల్లకీలనమర్చి - పంచి యామునుపె
యల్లుండ్ర నలువుర - ననిచిన యంత
తనబలంబులతోడ - తనయులతోడ
తనదు కోడండ్రతో - దశరథవిభుఁడు
శ్రీకరలీల వ - సిష్ఠుతోఁగూఁడి
సాకేతసరణి రా - శకునముల్ గొన్ని 5520
విపరీతములుఁగాఁగ - విభుని కట్టెదుట
నపుడు గన్పట్టె భ - యంకరధ్వనుల
విహగంబు లాకాశ - వీథిఁగూయుచును
బహుళంబుగా సేన - పైనాడుచుండె
మృగములుగొన్ని భూ - మిఁ బ్రదక్షిణముగ
నిగుడఁ జరింపుచో - నృపతి భీతిల్లి
“ఏలయ్య? మునినాథ! - యీపక్షులెల్ల
కోలాహలంబుగాఁ - గూయిడఁదొడఁగె

పోఁకఁబ్రదక్షణం - బులుగా మృగంబు
లేకడ విహరించె - నేమిగాఁగలదొ? 5530
కలఁగె నామది సేన - కళవళంబందె
తెలియఁగఁ బల్కంగ - దే నిల్చి” యనిన
నా వసిష్ఠమునీంద్రుఁ - డంతయు నెఱిఁగి
“ఓవసుధాధీశ! - యోడకు మింక
క్రూరముల్గాఁగఁ బ - క్షులు వల్కుకతన
ఘోరభయంబు నీ - కునుఁ గల్గునిపుడు
వనమృగంబులు వల - వచ్చినకతన
ననుపమ సంతోష - మందెదు మొదల
రమ్మ"ని పోవ ధ - రా ధూళులెగసె.
కమ్మె నల్గడఁ జీ - కటు లుర్విమీఁద 5540
విసరె నుక్కోలుగా - విషమవాయువులు
వసుధ నద్దపుఁ బిల్ల - వలెఁదోఁచె నినుఁడు
మూకలమీఁద దు - మ్ములు కుప్పవడియె
నేక డాకడ యయ్యె - నెల్ల దిక్కులును
దశరథుండును మౌని - తతి వసిష్ఠుండు
దశరథపుత్రులు - దక్కనందఱును
నొడలిలోఁ బ్రాణంబు - లునికి సందియము
వడ నచేతనులై రి - బలకోటులెల్ల

—: పరశురామ సందర్శనము :—


నపుడు భయంకరు - ననలప్రతాపుఁ
దపనసంకాశు ను - ద్ధత జటాధరుని 5550

నచలకైలాస మ - హాశైలకాయు
రుచిర పరశ్వధా - రూఢ భుజాగ్రు
రాజులనెల్లర - రణవీథిఁద్రుంచి
రాజిల్లు భార్గవ - రాము నిర్దయుని
మేరువువంటి య - మేయకార్ముకము
పారావతమ్ముగాఁ - బట్టినవాని
గదిసి కుత్తుక చేఁదు - ఖలులపై నుమిసి
నుదుటి యింగలము క - న్నులఁ బంచిపెట్టి
పురములమీఁద న - ప్పుడె కోపగించు
హరుని కైవడిఁజూడ్కి - కందనివాని 5560
నా జమదగ్నిజు - నటుగాంచి మౌని
రాజులు భయనివా - రణ మంత్రజపము
గావించి తమలోన - గజిబిజి మనుచు
నావీరవరుమాట - లాడుచునుండ
రాముని శిష్యుఁడౌ - రాముని మీఁది
రాముని కోపమో - ర్వఁగ నెవ్వఁడోపు ”
నని దశరథముఖ్యు - లాడ శ్రీరాముఁ
గనుఁగొని పల్కె భా - ర్గవరాముఁడపుడు.

—: శ్రీరాముని పరశురాముఁడు తిరస్కరించుట :—


"వింటిని హరువిల్లు - విఱిచిన నీదు
బంటుతనంబు నే - పదినాళ్లవెనక 5570
జగతిని యాశ్చర్య - చర్యయి చూడఁ
దగునని నీవెంపుఁ - దలచి వచ్చితిని
జమదగ్నిసంబంధ - చాపంబు నీదు

విమలసత్త్వము దాన - వెలివిరియంగఁ
జూతముగాని తీ - సుక యెక్కుపెట్టు
మీతరి నపుడు ని - న్నెఱిఁగినమీఁద
నెలమి నాచేతివి - ల్లెత్తిన వెనుక
తలపడి ద్వంద్వయు - ద్ధంబు సేయుదము
వెఱచితివేని వా - విడిచి నాతోడ
నెఱిఁగింపు కాతు ని - న్నిది నిశ్చయంబు 5580
కాకున్న నాతోడ - కలనికి రమ్ముఁ
లేకున్నఁబోనీఁడు - లే భార్గవుండు”
అనుమాటలకు చాల - నవశుఁడై చేరి
వినయంబుతో మహీ - విభుఁడిట్టులనియె.
"ఓయయ్య! నేనునా - యొజ్జయుఁగూడి
నీయడుగులకు పూ - నిక నర్చలొసఁగ
నవియేల కైకొన - నాగ్రహంబేల?
భువి క్షత్రధర్మంబుఁ - బోకడవెట్టి
శాంతుండవై మౌని - చర్యల నుండు
నింతటి పుణ్యుని - కీయల్కదగునె? 5590
కారుణ్యనిధివి భా - ర్గవంశజలధి
నీరజారాతివి - నీవు నాసుతుల
రక్షింపఁదగుఁగాక - రామునిఁ గాక
పక్షచూడుని నిట్లు - పలుకంగఁదగునె?
వాసవముఖ్య ది - వ్యశ్రేణి వినఁగఁ
జేసినట్టి ప్రతిజ్ఞ - చెల్లించుకొనక
జయరమాశయ కుశే - శయమన లోక
భయదమౌ రా దిండి - పరశువుఁదాల్చి

రానేల? ధనువు న - స్త్రములు శస్త్రములు
మాని కాశ్యపునకు - మహి ధారవోసి 5600
యీవు మహేంద్రాద్రి - కేఁగితి వనుచు
భావంబు లోనమ్మి - బ్రతికితిమనఁగ
వోనీక నా పాప - ములు పెడరించి
యీనిన్నుఁదెచ్చె నిం - కేమి సేయుదుము?
తమకెల్ల నత్యుప - ద్రవహేతు వైతి
నమరులచే నిన్ను - నరికట్టఁదరమె?
రామునితోటి వా - రమె యిందఱమును
రామచంద్రుండె మా - ప్రాణంబులెల్ల"
అని దశరథుఁడాడ - నదలించి మించి
ఘనురాముఁజూచి భా - ర్గవ రాముఁడనియె. 5610
"వినుము రాఘవ! జగ - ద్విదితంబులైన
ధనువు లీరెండు నా - ద్యములు దివ్యములు
నిర్మించె నివి తన - నేర్పున విశ్వ
కర్మ యందొక విల్లు - కాలకంఠునకు
దేవత లిచ్చిరి - త్రిపురముల్ గెలువ
నావిల్లు విఱచితి - వతిశక్తి నీవు
సరియందు తోడ వై - ష్ణవ శరాసనము
హరికి నిచ్చిరి వేల్పు - లందరు దీని
నజునితో నింద్రాదు - లైన వేలుపులు
భుజశక్తి శౌర్యవి - స్ఫురణలచేత 5620
హరియెక్కుడో కాక - హరుఁడధికుండొ
అరసి యేర్పఱపు మీ" - వనిపల్కుటయును
నారదు నంపింప - నానాఁట నతఁడు

వార లిద్దరికిని - వాదు గల్పింప
హరిహరుల్ వెడలి మ - హాసంగరంబు
సురలు వీక్షింప ని - స్తుల సత్త్వములనుఁ
బోరుచో నపుడు శం - భుని కార్ముకంబు
సారసాక్షుఁడు దివ్య - శరము సంధించి
వ్రేసినఁ బేటెత్తి - విల్లు సత్త్వంబు
దీసి జిబ్బయి పోవ - దిగులుచేహరుఁడు 5630
మ్రానుపాటున నుండు - మాధవుశక్తి
యానిటలాక్షున - కగ్గలం బనుచు
హరినిఁ బ్రార్థించి మ - హా సమరంబు
పరిహరించి పినాక - పాణిచే విల్లు
దేవత లిప్పింప - దేవ రాతునకు
నావిభుఁ డది యుంచె - నాత్మదేహమున
నాయెడ భార్గవుం - డగు రుచీకునకుఁ
గాయజ జనకుఁడీ - కాండౌసనంబు
నిచ్చెను జమదగ్ని - కెలమి మాతండ్రి
యిచ్చెను నాచేతికి - కిమ్మహాధనువు 5640
నాజమదగ్ని మ - హామౌని శౌరిఁ
బూజించునపుడు దు - ర్భుద్ధి యైనట్టి
కార్త వీర్యుండు ము - ష్కరుఁడై వధించు
వార్తనే విని రాజ - వంశజులైన
యర్జునుం డాదిగా - నవని పాలకుల
నిర్జించి కాశ్యపు - నికి ధాత్రియెల్ల
యాగదక్షణ గాఁగ - నర్పించి వీత
రాగుఁడనై మహేం - ద్ర నగంబు నందు

తపముసేయుచు నుండి - తాపస వర్యు
లిప్పుడు నీవెక్కడి - యీశ చాపంబు 5650
విఱచితి వనిపల్క - వినివచ్చినాఁడ
గరిమఁ బరంపరా - గతమైన యట్టి
యీవిల్లు నీసత్త్వ - మేనుచూడంగ
యీవేళ యెక్కిడి - యెల్లరు మెచ్చ
శరముపూనిన మెచ్చి - సమరంబు సేతు
కరము చాఁపుము విల్లుఁ - గైకొను మిపుడు
తమతండ్రి పగఁదీర్చి - ధారుణీ విభుల
సమయించి శోణిత - స్రావంబుచేత
నెసఁగించి నదులు పి - తృశ్రేణికెల్ల
నొసఁగితి భక్తిఁ ది - లోదక క్రియలు 5660
రాజ కళేబర - రాజిచే మెట్లు
గా జతకట్టి స్వ - ర్గంబున కేను
పనిచితిఁ బితరులఁ - బగయెల్లఁదీరి
మునినైతి నాకుఁ గా - ర్ముక విద్యనేర్పి
యేనుఁ గుమారుండు - నెక్కటిఁబోరఁ
దానన్ను గెలిపించె - తలనాఁడు హరుఁడు
ఆదేవు శిష్యుండ - నగుట నీవతని
కోదండ భంగ ముం - కువ చేసి పెండ్లి
యాడి పోవఁగఁ గని - యడ్డగించితిని
కూడదు జుణిఁగిన - గొమ్ము కార్ముకముఁ 5670

—: పరశురామ గర్వభంగము :—


నావుడు దశరథ - నరపతి వినఁగ
నావేళరఘు వీరుఁ - డతని కిట్లనియె.

"నీమాట లన్నియు - నిజము మాతండ్రి
కీమాన భంగంబు - నిపుడ తీర్చెదను
యెక్కిడఁ బోయిన - నీశ చాపంబు
గ్రక్కునఁదునియలు - గావ్రీలెఁగాని
విఱిచెదనని విల్లు - విఱుచుటగాదు
ధరణీ సురుఁడ వౌట - తగదు నీమీఁద
కోపింప దండింప - కోపంబునీకు
నాపయిఁ గలిగిన - న్యాయ దండనము 5680
సేయుము మారఘు - శ్రేష్ఠు లావులకు
నేయెడ ద్విజులకు - నేనాడు దెగరు"
అనిన "నీతఁడు విప్రుఁ - డనియు నేరాజ
ననియు నున్నది నీ య - హంకరణంబు
విల్లుచే నందక - వెడమాటలాడి
వెళ్లఁ జూచెదవొ - వో విడువ ని" న్ననిన
కోపించి తెమ్ము! - నీ కోదండమెంత!
యీపలుకుల ఫలం - బిపుడె కాంచెదవు ”
అనిచేతి విల్లంది - యమ్ము సంధించి
కనుఁ దామరలఁ గెంపు - గడలు కొనంగ 5690
నిను నేఁడు గాధేయు - నికిని మేనల్లు
మునికి బుత్రుఁడవని - మొదట విప్రుఁడవు
అనియునుఁ బూజ్యుండ - వనియుఁ దాళితిని
చనదునేఁ బూనిన - శరము రిత్తగను
నుడువుము తెగవ్రేతు - నో నీపదంబు
లుడిగింతువో నీకు - నూర్థ్వ మార్గంబు
యేగతి నీకింక - నేగతి మాన్తు

వేగ వాకొనుమన్న - వెలవెలంబాఱి
అమర నదీవేగ - మౌర్వాగ్ని చేతఁ
దెమలిన కైవడి - దీమసం బుడిగి 5700
అజహరీంద్రాదులై - నట్టిదేవతలు
భజియింపుచును మింటఁ - బరికించి చూడ
బలమెల్లఁ బోయియా - భార్గవరాముఁ
డల దశరథ పుత్రు - నాశీర్వదించి
"నన్నురక్షింపు మ - నాథశరణ్య!
విన్నవించెదను నా - వృత్తాంతమెల్ల
రాజసూయ మొనర్చి - బ్రాహ్మణావళికి
నీజగతీచక్ర - మెల్ల దక్షిణగ
నిచ్చినవాఁడ ని - దే నొక్కనాఁడు
నెచ్చట నుండరా - దీగతి చెఱుప 5710
యేను మహేంద్రాద్రి - కేఁగంగఁజాలఁ
గాన నాపుణ్య మా - ర్గములడ్డగింపు
ఆవిల్లు విఱిచి నా - యస్త్రాసనంబు
నీవు గైకొనుటచే - నిక్కంబుగాఁగ
వనజాక్షుఁడును మధు - వైరి యక్షయుఁడు
ఘనుఁడు విష్ణువునని - కని యెఱింగితిని
నీకుమేలగుఁగాక - నినుఁజూచు వేడ్క
లోకేశ ముఖదివ్యు - లును వారె వచ్చి
యున్నవారిదె నీకు - నోడుటల్ మిగుల
మన్నన యగు నవ - మానంబుగాదు 5720
యేఁగెద నేను మ- హేంద్రాది కిపుడె
ఆఁగుము నాదు పు - ణ్యపదంబు లేసి

ననుఁగావు" మనిన బా - ణ ప్రయోగమున
మనువంశనిధి పుణ్య - మార్గంబు లేసె.
రాము వీడ్కొని మహేం - ద్రనగంబుత్రోవ
నామేరవలగొని - యరిగె భార్గవుఁడు.
సకల దిక్కులును ప్ర - సన్నంబులయ్యె
నకలంక మతులైరి - యఖిలసైన్యములు
పొగడి రింద్రాదు ల - ప్పుడు రాముఁజూచి
జగతికి నెల్లను - సంతోషమయ్యె. 5730

—: దశరథాదు లయోధ్య కరుగుట :—


తరవాత రఘుపతి - తనచేతి విల్లు
వరుణుని యందుఁ గై - వశముగా నుంచి
చేరి వసిష్ఠుని - శ్రీ పాదమునకు
నారూఢ భక్తితో - సాష్టాంగ మెరగి
భయము దీరిన తండ్రి - పదములవ్రాలి
రయమున సాకేత - రాజధానికిని
చతురంగ బలముతోఁ - జనుఁడన్న మాట
కతఁడు సంతోషించి - యాలింగనంబు
గావించి మౌళి యా - ఘ్రాణంబుచేసి
దీవించి మరల ధా - త్రినిఁ దా జనించు 5740
సరణిగా నెన్నుచు - సైన్యంబు గొలువ
బిరుద ధ్వజంబులు - పెరిమ వేలింప
నానక పణవ తూ - ర్యమృదంగభేరి
కా నినాదముల ది - క్తటములు మొరయ
జలయంత్రములను ధ్వ - జంబులఁ బుష్ప

కలిత మార్గముల నే - కడ నుర్విఁదనుప
వీథులు గైసేయు - వేడుకల్చూచి
యాదశరథుఁ డయో - ధ్యాపురి చేరి
సంతోషమున పౌర - జను లెదుర్కొనఁగ
కాంతల వీచోపుఁ - గరువలి వొలయ 5750
చతురంగ బలములు - సందడిసేయ
అతివ లంచల మంగ - ళారతులెత్త
సీమంతినీమణుల్ - సేసలు చల్ల
సామంత రాజులు - చనువుతోఁ గెలువ
సంతుష్ఠులైన భూ - జనులు రాఘవుల
నెంతయుఁజూచి య - ట్టిటు పోకరాఁగ
సున్నపుమేలు మ - చ్చులను కైలాస
మున్నకైవడిఁ గర - మొప్పెడు నగరు
ప్రేమఁ బ్రవేశింపఁ - బెండ్లికూఁతులకు
రామచంద్రాది పు - త్రచతుష్కమునకు 5760
వారిజముఖులు ని - వాళులు దివియ
భూరమణుం డంత - పురము చేరుటయుఁ
గొడుకులుఁ గోడండ్రు - కోరిమ్రొక్కంగ
సడలనిభక్తిఁ గౌ - సల్యాదులైన
యింతులు దీవింప - యిలవేలుపులకు
నెంతయు సాష్టాంగ - మెరగి మాన్యులకు
మ్రొక్క శోభనదాన - మును చేసి వాసి
కెక్కిన తమతమ - యిండ్లలోపలను
వసియింప రఘుపతి - పత్నితోఁ గూడి
యసమాన చంద్రశా - లావళియందు 5770

పరపైన కెంపు టు - ప్పరిగలయందు
విరుల తావులుచల్లు - విపినంబులందు
కేళిదీర్ఘకలను - కృతకశైలముల
నాలోల దోలావి - హారలీలలను
పడకయిండ్లను రేయి - పగలునుఁగూడి
యెడపని రాగంబు - లిగురులొత్తంగఁ
కొన్నినాళ్లు వసింపఁ - గువలయ విభుఁడు
మన్నించి “మీమేన - మామ రమ్మనుచు
యీ యుధాజిత్తుఁడి - ట్లెన్నేని దినము
లాయత భక్తి ని - న్నంపండు మనుచు 5780
కాచియున్నాఁడు వే - గమునఁ బొమ్మనిన”
ప్రాచీనవిభు దశ - రథుఁ జేరిమ్రొక్కి
తల్లులకెల్ల వం - దనములు చేసి
యల్లన రఘురాము - నడుగులవ్రాలి
సరగున భరతుఁడు - శత్రుఘ్నుఁగూడి
యమ్మేనమామ ని - జావాసమునకుఁ
జనునెడ నారామ - చంద్రుండు ముదముఁ
బెనగొన తండ్రి చె - ప్పిన పల్కులోన
చుట్టాల సురభియై - సోఁకోర్చి జనకు
పట్టున తల్లుల - పట్టున గురుల 5790
పట్టున పౌరుల - పట్టున హితుల
పట్టున మంత్రుల - పట్టున సీత
పట్టున తమ్ముల - పట్టున ప్రజల
పట్టున నేకభా - వముతోడఁగలసి
యున్నెడ భూజను - లుల్లంబులోన

సన్నుతింపుచు రామ - చంద్రుచర్యలకు
మెచ్చుచునుండ భూ - మిజ మీఁదఁబ్రమద
మెచ్చంగ నడకలు - నింగితంబులును
చెలువము ల్గుణములు - శృంగారములును
తలఁపులు నొకటిమై - తమకముల్ వెనుప 5800
సకలజనస్తుత - సద్గుణనిధిని
వికచాబ్జనయనఁ బృ - థ్వీజాత సీత
ధారుణీరమలు నం - దకపాణి నెనయు
మేర శ్రీరాముని - మెచ్చునందేలి

—: గద్య :—


విలసిల్లెనని వేద - వేద్యునిపేర
నలమేలుమంగాంగ - నాధీశుపేర
సంచితకరుణాక - టాక్షునిపేరఁ
గాంచనమణిమ - యాకల్పునిపేర
వేదవేదాంతార్థ - విహితునిపేర
నాదిత్యదివ్య ప్ర - భాంగునిపేరఁ 5810
గంకణాంగదరత్న - కటకునిపేర
వేంకటేశునిపేర - విశ్వాత్ముపేర
నంకితంబుగ వేంక - టాధీశచరణ
పంకజ సేవాను - భావ మానసుఁడు
హరిదాసమణి కట్ట - హరిదాసరాజు
వరదరాజు నితాంత - వరదానశాలి
రచియించు వాల్మీకి - రామాయణంబు

—: ఫలశ్రుతి :—


ప్రచురభక్తిని మదిఁ - బాటించి వినినఁ
జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మదిఁదలంచిన నెట్టి - మనుజులకైన 5820
ధారణి మీఁద సీ- తా రామచంద్ర
పారిజాత దయా ప్ర - భావంబు వలన
హయమేధ రాజసూ - యాదిమ యాగ
నియత ఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శోవైభవములు
నకలంక తీర్థయా - త్రాది పుణ్యములు
సత్యవ్రత పదంబు - సకల సౌఖ్యములు
నిత్యమహాదాన - నిరుపమశ్రీలు
కలికాల సంప్రాప్త - కలుష నాశనము
కలుములు హరిభక్తి - గౌరవోన్నతులు 5830
శత్రు జయంబును - స్వామి హితంబు
పుత్రలాభంబును - భోగ భాగ్యములు
ననుకూల దాంపత్య - మంగనా ప్రియము
ధనధాన్య పశువర్గ - ధరణి సమృద్ధి
మానస హితము ధ - ర్మప్రవర్తనము
నానందములు ఖేద - మందకుండుటయు
నలఘు వివేకంబు - నతుల గౌరవము
వలయుఁ గార్యములు కై - వశము లౌటయునుఁ
బావనత్వము దీర్ఘ - పరమాయువులును
కైవల్య సుఖము ని - క్కముగాఁగఁ గలుగు 5840

నెన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
ఎన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యరయ నారుషము
నాదికావ్యంబు బా - లాఖ్య కాండంబు
వేదసమానమై - విలసిల్లు నెపుడు.

ఇది

కట్టా వరదరాజు రచితమైన వాల్మీకిరామాయణ మందలి

బాలకాండము.


---------------