శ్రీ రామాయణము - మొదటిసంపుటము/అయోధ్యాకాండము

వికీసోర్స్ నుండి

శుభమస్తు

శ్రీ కట్టా వరదరాజు

వాల్మీకిరామాయణము

అయోధ్యాకాండము

శ్రీరాజితశుభాంగ - చిరగుణిసంగ!
హారికృపాపాంగ! - యలమేలుమంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మ నివేశ! - శ్రీవేంకటేశ!
అవధారు! కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణం బిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంత మెల్ల
కనుపించు నవ్వలి - కథ యెట్టులనిన
తనతండ్రి పనుపున - తమ్ముఁడుందాను
పనివూని భరతుఁడు - పయనమై కదల10
చెంగట నయ్యుధా - జిత్తుని వెంట
బంగరురథముల - పై వచ్చియతని
పురము ప్రవేశింపఁ - బుత్రుల కరణి
అరమర లేకుండ - యమ్మేనమామ
నడపింపు మిగుల మ - న్ననల నుండియును
తడవాయె నెడవాసి - తల్లిదండ్రులను
నెప్పుడు పోవుద - మెన్నడు చూత
మెప్పుడు రఘురాము - నీక్షింపఁగల్గు

ననుచుండ దశరథుం - డ ట్లెడబాయు
తనయుల మీఁది చిం - తను సంతతంబు20
నిరవురు నరుణ మ - హేంద్ర సమాన
చరితుల చరితముల్ - చారుల వలన
నానాట వినుచున్న - నలువురు సుతులు
పూనికె మైఁజతు - ర్భుజములుఁగాఁగ
హరిమాడ్కి నలరుచు - నమరు లాలోన
పరమేష్ఠిమీఁదట - పంకజాక్షునకుఁ
గరణ హెచ్చగు రీతి - కల్యాణశీలు
నరవిందలోచను - నారాముఁగూర్చి
మిక్కిలి ప్రీతుఁడై - మించుటయేమి
లెక్క? గోవిందుఁడా - లీలల న్మించి30
రావణాది నిశాచ - ర శ్రేణినెల్ల
కావరంబులు మాన్పఁ - గలిగిన కతన
నదితి యింద్రునిఁ గాంచి - యమరిన యట్లు
పొదలె రామునిఁ జూచి - పొలఁతి కౌసల్య

-: రామగుణ వర్ణనము :-


విలసిల్లె రాముండు - వీర్యాసమత్వ
కలనల దశరథు - గతిఁ జూడమించి
అతి శాంతి మృదుభాష - ణావలిఁగలిగి
హితబుద్ధిఁ బరుషోక్తు - లెవ్వ రాడినను
మాఱువల్కక యంత - మాత్రమౌ మేలు
చేరి చేసిన వారిఁ - జేపట్టి యపుడు40

మఱవక నేరముల్ - మఱచుచు నెల్ల
పరిజనులనుఁబ్రోచి - బోణాసనాది
సాధన క్రియలందు - సహవాసులైన
యోధులందగు వేళ - నుపచరింపుచును
మంచిమాటలు బుద్ధి - మగఁటిమి తానె
కాంచితి ననియెంచి - గరువంబు లేక
కల్లలాడక వృద్ధ - గణముఁ బూజింప
నెల్లరుం దనయందు - నెల్లర మీఁద
తాను నత్యనురక్తిఁ - దగిలి సమస్త
దీనుల యందు నెం - తే దయఁగలిగి 50
క్రోధంబు లేక ధ - ర్ముండునైపరమ
సాధులై బ్రాహ్మణ - సంతర్పణమున
నియమవంతుఁడయి - నిత్యశుద్ధుండు
నియతాత్ముఁ డిక్ష్వాకు - నృపనీతిధనుఁడు
కించులం దునిమి యం - కిలిలేక యుండ
మంచివారలఁ బ్రోచు - మర్యాదవాఁడు
మాని నిషిద్ధక - ర్మములు గ్రామ్యంబు
లైన కథాపంక్తు - లందనివాఁడు
అతులవాక్యముల బృ - హస్పతిఁగేరు
మతిగలవాఁడు స - మస్వభావుండు 60
ఆరోగ్యభాగ్యంబు - లందినవాఁడు
శూరుండు తరుణుండు - సుముఖుఁడార్యుండు
కాలదేశంబులు - గని తగినట్టి
వేళలఁ గర్మముల్ - వెలయించు వాఁడు
చక్కదనంబున - సరిలేనివాఁడు

మక్కువ తారత - మ్యంబాత్మ నెఱిఁగి
పురుషుల నడపించు - పుణ్యవర్తనుల
సరిలేనివాఁడు శ్రే - ష్ఠగుణవంతుండు
ప్రజలకెల్లనుఁదానె - ప్రాణమై సురల
భజియించి యచలిత - బ్రహ్మచర్యమున 70
నాగమంబులు నేర్చి - సాంగంబుగాఁగ
ఆగమాంతార్థర - హస్యముల్ దెలిసి
జనకజఁబెండ్లియై - శస్త్రాస్త్రరూఢి
జనకుని దశరథు - సరిమీరువాఁడు
ధీరఁ డార్జవగుణా - ధికుఁడెట్టి యెడల
నేరుచు మెలఁగ ని - న్నిటసమర్థుండు
ధర్మార్థ కామత - త్పరుఁడు వివేక
నిర్మలచిత్తుండు - నిశితైకబుద్ధి
ఆచారరతుఁడు స - త్యప్రతిష్ఠితుఁడు
చూచువారలకు మె - చ్చులొసంగువాఁడు 80
వినయభూషణుఁడా త్మ - వృత్త మన్యులకు
గనిపించక మెలంగు - గాంభీర్యశాలి
బలమునఁ గలిమిఁ గో - పప్రసాదముల
నలరినవాఁ డెందు - నాయంబు వ్రయము
కడునెఱింగి మెలంగు - గదలింపరాక
నడిపించు ప్రతిన మం - త్రరహస్యరక్ష
గావింప నేరుచు - ఖలులఁ గైకొనఁడు
వావిచ్చి పలుకఁ డె - వ్వరిఁగాని మాట
అలయఁ డేమరియుండఁ - డన్యులదోష
ములుఁ దనయెడ దోష - ములు గాననేర్చు 90

పరుల కీలెఱుఁగుఁ జే - పట్టిన విడువఁ
డరులను తగుసమ - యముల దండించు
చతురుఁడు న్యాయార్థ - సముపార్జనమున
నతి రహస్యార్థంబు - లరయంగ నేర్చు
నాటకాలంకార - నైపుణిం బ్రోడ
చాటుకావ్య నిరూఢ - సాహిత్యవేది
ఉచితవ్రయమె సేయు - చుండు గజాశ్వ
నిచయావరోహణ - నిరతవినోది
పురుషార్థపరుఁడు పెం - పున ధనుర్వేద
నిరతి సాంగంబుగా - నేర్చినవాఁడు 100
అతిరథుం డాత్మ సై - న్యవ్యూహ రచనఁ
బ్రతివీరులనుఁగెల్చు - పరమసాహసుఁడు
అకలుషాత్మకుండు దే - వాసురసాధ్యుఁ
డొకరి మేలునకుఁజూ - పోర్చినవాఁడు
అవమాన మెవ్వరి - యందునుం జేయఁ
డవసరంబునకిచ్చి - యక్కరల్ దీర్చు
నెల్ల గుణంబుల - కిరవైనవాఁడు
చల్లనివాఁడు కౌ – సల్యాసుతుండు
తాలిమిం బుడమి మే - ధను సురాచార్యుఁ
డాలంబులో నింద్రుం - డసమశౌర్యమున 110
గరములచేత భా - స్కరురీతినిట్టి
పరగుణంబుల రఘు - వర్యుండు మెఱయ
జనులెల్ల శ్రీరామ - చంద్రుఁడే తమకు
నినుఁడు గావలెనని - నిచ్ఛలందలఁప

తనదు కన్నుల మ్రోల - దశరథనృపతి
తనయుఁ బట్టముగట్టి - ధరణి యేలింప
పర్జన్యు కైవడిఁ - బ్రజలఁబోషించు
దుర్జయుం డలఘుస - ద్గుణ గణాన్వితుండు
రామచంద్రుని యువ - రాజ్యపట్టమున
నేమించి నిలుపుదు - నేనని యెంచి 120
తనహృదయంబు ప్ర - ధానులకెల్ల
కనిపించి తెలివిడి - గానేర్పరించి
యాలోచనము చేసి - యంతరిక్షమున
భూలోకమున చాలఁ - బుట్టు నుత్పాత
చయములు వినియును - చాలంగ ముదిమి
పయికొన్న తనదు స్వ - భావంబుచూచి
జనులకు నిటుసేయ - సమ్మతంబనియు
దనమనః ప్రీతియుఁ - దనయెడఁజేయు
రామునిభక్తి గౌ - రవమునుఁ దనకు
తామసింపక సేయుఁ - దలఁపు పుట్టింప 130
సకల భూపతులను - జానపదులను
ప్రకట నానాక్రమా - పారమౌనులను
రప్పించి కేకయ - రాజును జనకు
నప్పుడు తాఁ బిల్వ - నంపక తమరె
వినియెదరని యెంచి - విబుధేంద్రుమాడ్కి
ననఘ మాణిక్య సిం - హాసనాగ్రమున
వసియించి కొలువులో - వారినింజూచి
యసమ వాక్చతురుఁడై - యప్పుడిట్లనియె.

—: దశరథుఁడు ప్రజలతో రామాభిషేక విషయము ముచ్చటించుట :—


"మారఘువంశక్ష - మానాథులెల్ల
ధారుణి జనులను - తనయుల యట్ల 140
యరసి రక్షించుట - లందఱు మీరు
నెఱిఁగి యుండురె కదా - యీ రాజ్యమునకు
సంతోషమగు నట్టి - జాడ యేనొకటి
చింతించుటనుఁ జేసి - చెప్పెద మీకు
మాపెద్దలనుఁ బోలి - మహికెల్ల మేలు
ప్రాపింప నేకాత - పత్రంబుఁగాఁగ
నేఁటి పర్యంతంబు - నిశ్శంక భుజబ
లాటోపమున నేలి - యభినుతుల్ గంటి
నరువది వేలేఁడు - లయ్యెను మేని
మురువెల్లఁ బొలివోయె - ముదిసిన కతన 150
నూరట వలచెద - నుల్లంబు లోన
మారామచంద్రు బ్రా - హ్మణ ముఖ్యజనుల
సమ్మతి నిఖిలరా - జ్యమునకుఁబట్ట
మిమ్మెయిం గట్టి నే - నీక్షించువాఁడ
నను మీఱినట్టి యు - న్నత గుణారాము
మనువంశనిధిఁ చంద్ర - మండలవదను
సకలలోకము లేలఁ - జాలెడువాని
సకళకళాపూర్ణ - చంద్రుఁడౌ రాము
యువరాజుఁ జేసెద - నొప్పిదం బనుచు
నవనీ జనులు మీరు - నాడితిరేని 160

యేకసమ్మత మిది - యెట్లకో యనుచు
లోకసమ్మతికి నా - లోకించి నాఁడ
అందఱు నిది నిశ్చ - యంబని మీకు
నందమైనట్టు లూ - హ యొనర్చి యొక్క
మాటగాఁ గలిగిన - మాట డెందములు
మాటక యనుఁడ"న్న - మనుజేంద్రుమాట
జనులందఱను విని - జలధరధ్వనికి
వనమయూరములు చె - ల్వముఁగాంచురీతి
రాజులు మౌనులు - బ్రాహ్మణుల్ ప్రజలు
రాజ తేజుని దశ - రథు నిట్టులనిరి. 170
అనఘ! మీరలు వృద్ధు - లగుట రాజ్యమునఁ
దను నిల్పునపుడు ము - క్తాచ్ఛత్ర మొప్పఁ
బట్టపుటేనుంగు - పై రామచంద్రుఁ
డిట్టె యీపురవీథి - నేతేర మేము
నెన్నడు విందు మో - యెప్పుడుమాకుఁ
గన్నులుచల్లఁగాఁ - గందుమో యనుచు
నెదురులు చూడంగ - నిప్పుడు మీదు
హృదయంబు మీరాన - తిచ్చుటంజేసి
యెంత సంతోషమ - య్యెను మహీనాథ!
అంతపుణ్యముసేతు - మా"యంచుఁబలుక 180
జనుల కోరికయును - సమ్మతంబాత్మఁ
గనియుఁ దానెఱుఁగని - గతినిట్టులనియె.
“మీమనోవృత్తముల్ - మెల్లనె తెలియఁ
గామించి యేనాడి - గ్రక్కునమీరు
నాడిన మాటకు - నంతరంగమునఁ

జూడ సందియమును - సోద్యంబునయ్యె
ధర్మమార్గంబున - ధర యేలలేదొ?
కూర్మిచే మిమ్ముఁ జే - కొని ప్రోవలేదొ?
కంటిరో యొకకళం - కంబు నాయందు
కంటగింపుచు నన్నుఁ - గాదని రాము 190
రాజుఁగా మీరు గో - రఁగనేల" యనిన
రాజుతో హస్తసా - రసములు మొగిచి
సందేహము భయంబు - సందడింపంగ
నందఱు నేకవా - క్యముగ నిట్లనిరి.
"అనఘ! యనంత క - ల్యాణగుణంబు
లనుఁ బరిపూర్ణుఁ డె - ల్లరకు సౌమ్యుండు
దుర్జతా శౌర్యుఁ డిం - ద్రునిఁబోలుకీర్తి
యార్జించు మేటి స - త్యపరాక్రముండు
సుమతి యిక్ష్వాకు రా - జులలోన మేటి
శమదమాపద్ధర్మ - జనకాపఘనుఁడు 200
హారి సంగీత వి - ద్యాచతురుండు
పోరిలోన జయంబుఁ - బొందెడువాఁడు
మముఁగాంచు నపుడు సే - మములు వేఁడుచును
తమ ఖేదమోదముల్ - తనవైనవాఁడు
వెళుపైన తన యురో - వీథియుఁ గెంపు
సెలల క న్దామరల్ - చేతుల పొడువు
మత్తేభగమనంబు - మధుర వాక్యములు
చిత్తజాకారంబుఁ - జిఱునవ్వు మొగము
సుభ్రూవిలాసంబు - సుమహితాపాంగ
విభ్రమంబులుఁ గురు - వింద దంతములు 210

చామన నెమ్మేను - చక్కని చరణ
తామరసంబులుఁ - దళుకు చెక్కులును
క్రొన్నెల నుదురును - కోటేరువెట్టు
చెన్నుమీరిన ముక్కు - చెంగావిమోవి
నలరాఘవుఁడు త్రిలో - కంబులు నేలఁ
గలవాఁడు కోపించి - కాలుని నైన
దండించు వాఁడు సీ - తాప్రాణ విభుఁడు
చండభానునకుఁ గ - శ్యపునకు నెపుడు
సరియైన శ్రీరామ - చంద్రుఁ డారోగ్య
పరిణామ సామ్రాజ్య - పదవుల నొంది 220
అతులితాయుష్మంతుఁ - డై యుండవలయు
సతతంబునని మేము - సకలదైవములఁ
గొలుచువారము గాన - కోరికమీకుఁ
దెలుపుటల్ తప్పుగా - దిలకింపవలదు
ఉత్తమోత్తము రాము - నొండు గార్యములు
చిత్తగించక మమ్ముఁ - జేపట్టియిపుడె
పట్టంబుగట్టు మే - పట్టున నీదు
పట్టిరాజ్యము సేయు - భాగ్యంబు గనుము"
అనువారి వచనంబు - లాత్మభావించి
మనువంశ తిలకంబు - మఱియు నిట్లనియె. 230

—: పట్టాభిషేకమునకు వలయు వస్తువుల గూర్చుట :—


"మారాము నుర్వి స - మస్తంబునేల
మీరు గోరుట చాల - మెచ్చొదవించె
అటుల సేయుదు నని - యాచార్యముఖులఁ

జటివర్యులనుఁ జూచి - సంప్రీతిఁబల్కె
అగణితంబుగ వసం - తాగమం బగుట
చిగురించి పూచి కా- చి ఫలించె వనులు
పట్టాభిషేక సం - భ్రమమున కిట్టి
పట్టున వలయు న - పార వస్తువులు
రప్పింపుఁడన దశ - రథుని యానతిని
యప్పుడె వారలు - నధికారజనుల 240
జూచి కావలయు వ - స్తువులు వేర్వేర
సూచింప హేమరా - సులు రత్నములును
రజిత కాంస్యాది పా- త్రము లోషధులును
ధ్వజరమ్యమైన ర - థం బాయుధములు
నేయి లాజలును తే - నియలు గందంబు
నాయత వస్త్రమా - ల్యములు క్షత్రములు
పాండురచ్ఛత్రంబు - పట్టమేనుఁగయు
నండవాయని చతు - రంగబలంబు
మణి మయ హేమ - చామరములుఁ జతుర
గణికాజనమును బం - గారుకలశములు 250
నూరును సాంగమౌ - నూతనవ్యాఘ్ర
చారుచర్మమును కాం - చన శృంగమైన
యొకవృషభము శృం - గమొకటి కావలయు
సకల నానాద్రవ్య - సామగ్రిఁగూర్చి
యగ్నిహోత్ర గృహంబు - నందుచెంగటను
లగ్నంబు ఱేపని - లక్ష్మీకరముగ
నంగళ్లు వీధులు - నఖిల గేహములు
మంగళాలంకార - మహిమఁగై సేయఁ

గ్రముకేక్షుకదలీ ప్ర - కాండ శోభితము
రమణీయ నవరత్న - రంగవల్లికము 260
మకర తోరణ భాస - మాన మార్గంబు
చకచకాయిత సౌధ - చయదర్పణంబు
ప్రాలంబ మానవై - వణ చామరంబు
నాలోల పట్టాంశు - కాభి శోభితము
కనకాంబర వితాన - కాయమానంబు
ఘనసార కౌశికా - గరు ధూతచయము
వీణామృదంగాది - వివిధవాద్యంబు
గాణిక్య నూపుర - క్వణన కాంతంబు
మల్లికా చాంపేయ - మానకాస్వతము
పల్లవతోరణ - భద్రసూచనము 270
నగుచు నయోధ్యా మ - హాపట్టణంబు
పొగడొంద శృంగార - ముల విరాజిల్లు
పాలచేతనుఁ దేలి - బ్రాహ్మణకోటి
చాలభోజనముల - సంతుష్టినొంద
తన్నీరు తిత్తుల - తావి పన్నీరు
తిన్నని వీథులఁ - దెరలుగాఁజల్ల
హోమశాంత్యాదుల - నుర్వీసురాలి
కామించి శోభన - కర్మముల్ నడప
నట నర్తకములు ప - ణ్య సరోజముఖులు
విటులు హజారంబు - వెలపలనిండ 280
నంతరంబుల రాజు - లాప్తబాంధవులు
సంతుష్ట చిత్తమై - సబవులు నమర
గంధకారులు మాల్య - కారులు భటులు

బంధురగతి మ్రోలం - బాయక యుండ
అన్ని యత్నంబులు - నాయత్తమగుట
విన్నవించిన మహా - విభుఁడు హర్షించి
రమ్ము సుమంత్ర! శ్రీ - రాముని దోడి
తెమ్ము నా వినయ వి - ధేయుఁడై యతఁడు
శ్రీరామచంద్ర ! పి - ల్చెను మహీవిభుఁడు
రారమ్ము నెందుతీ - రదు తామసింప 290
నని తోడితేర నా - నామరశ్రేణి
తనుఁగొల్వ నున్న సు - త్రామునిరీతి
రాజులతో దశర - థుఁడు గొల్వుండి
రాజమార్గంబున - రా రామచంద్రు
తనమేడపై నుండి - దశరథ విభుఁడు
కని యరదంబుపై - గంధర్వరాజు
సముని లోకప్రశ - స్త మహా ప్రతాపుఁ
బ్రమదాత్ము నాజాను - బాహు మత్తేభ
సన్నిభ గమనుని - సత్యసంపన్నుఁ
గన్నులవిందయి - కనుపట్టువానిఁ 300
జంద్రబింబానను - జనమనఃకుముద
చంద్రుని జలధర - శ్యామ శరీరు
సర్వరక్షణ గుణో - జ్జ్వలుని సత్కీర్తి
సర్వోన్నతుని రామ - చంద్రునింజూచి
బీరెండ నలఁగి దూ - పిలిన మానవుఁడు
వారిదంబునుఁ జూచి - వడదీరినట్లు
తనియక కాంచు న - త్తరి సుమంత్రుండు
కనకరథం బలం - కారంబు సేయు

రాముని డించి క - రంబూఁతయొసఁగి
భూమీశు సమ్ముఖం - బునకుఁ దో తేరఁ 310
దనపాదములవ్రాలు - తనయుపై ప్రేమ
ననలొత్త నాలింగ - నంబుఁగావించి
చెంగట మణిమయ సింహాసనమున
సంగడి నునుపఁ గాం - చన శైలకూట
తపనుఁడో యన రఘూ - త్తముఁడుపొల్పెసఁగె
నపుడు నక్షత్ర గ్ర - హావళి చేత
శరదవసరమున - చదలు పైఁదోఁచు
పరిపూర్ణ చంద్రబిం - బంబు చందమునఁ
గొలువులో తనుఁబోలు - కొమరుఁబాయంపుఁ
దొలుచూలి తోడ నిం - ద్రునకుఁ గశ్యపుఁడు 320
వలికిన గతిఁ దత్స - భాసదుల్ వినఁగ
తలఁచిన చందంబు - దశరథుం డనియె.
“మొదటి పట్టపు దేవి - ముదిత కౌసల్య
కొదదీఱఁ గాంచిన - కొమరుండవీవు
తగినట్టివాఁడవు - ధారుణీ జనులు
మిగులనీసేమంబు - మేకొన్నవారు
కట్టెదఁ బుష్య న - క్షత్రంబు నందు
పట్టంబు ఱేపు నా - పలు కాదరింపు
యౌవ్వరాజ్యమునకు - నభిషిక్తుఁజేయు
నవ్వేళ నిది వ్యవ - హారంబు గాన 330
వినయాది గుణముల - వెలసిన నీకు
పనిలేదు బుద్ది దె - ల్పఁగ నైన వినుము
వినయంబు నింద్రియ - విజయంబు కామ

—: దశరథుఁడు రామునభిషేకమునకుఁ బ్రోత్సాహపఱచుట :—


మును క్రోధమును లోభ - మును మోహపఱప
మదము మాత్సర్యంబు - మానుట నృపుల
వదలని వ్యసనముల్ - వదలుట మంత్రి
ముఖ్యులం బ్రత్యక్ష - మునఁ గడలందు
సఖ్యంబు వాటించి - చనవు లిచ్చుటయు
కడజముల్ రాష్ట్ర దు - ర్గములు బొక్కిసము
కడుఁ బరామరిసించి - కనుకట్టుటయునుఁ 340
బ్రజలఁ బాలించుట - పలికిన మాట
నిజము సేయుట పౌర - నికరంబు కలిమి
కని యోర్చుటయు మొదల్ - గాఁగలగుణము
ననయంబుగల రాజు - నందు రందఱును
నమృతంబు చూచిన - యమరులమాడ్కి
సమచిత్తులై మేలు - సమకూర్పఁగలరు
కావున నాబుద్ధి - గైకొని యేలు
మీ వసుమతి యెల్ల - నీ వని" పలుకు
నృపుమాట రాముని - నెచ్చలుల్ వోయి
యపుడు కౌసల్యతో - ననిన నుప్పొంగి 350
యమ్మహాగుణవతి - యావులు మణులు
సొమ్ములు గనకరా - సులు నుడుగరలు
వారల కొసఁగుచో - వసుధేశుఁ డనుప
నారాఘవుఁడు తన - యావాసమునకు
దొరలు నాప్తులును బం - ధులుఁ జేరికొలువ

నరిది వారల నిండ్ల - కనిచిన యంత
తమ గృహంబుల కేఁగి - దశరథవిభుని
సమయంబు చేకూడి - సఫలమౌ కొఱకు
దేవతాకోటిఁ బ్రా - ర్థింపుచు ప్రమద
భావులై యుండుచో - పార్థివోత్తముఁడు 360
దశరథవిభుఁడు ప్ర - ధానులతోడ
విశదాత్ముఁడగుచు నీ - వృత్తాంతమెల్ల
పలికి తా నగరిలో - పలి కేఁగి యేమి
తలఁచెనో కాని చెం - తకుఁ జేరఁ బిలిచి
"ఓయి సుమంత్ర! నీ - వొకఁడవే యిపుడు
పోయి రాఘవుని గొ - బ్బునఁ దోడితెమ్ము
చను"మన్న నతఁడట్ల - చని రామునగర
చనవరులగు నవ - సరము వారలకుఁ
దనరాక వివరించు - తరి వారు నటుల
చని విన్నపము సేయ - సంశయింపుచును 370
పిలిపించి "యేటికి - బిలిపించె రాజు
తెలుపుమీ"వనిన మం - త్రివరేణ్యుఁ డనియె.
"మీరెఱుంగుదురు భూ - మీవరుడెఱుఁగు
యూరక ననుఁ బిల్చి - యొకఁడవు నేఁగి
రామునిఁ బిలుచుక - రమ్మనెంగాని
యేమి గార్యమునకో - యెఱుఁగ మేమియును
విచ్చేయ వలయును - వేగంబె మీరు
వచ్చినఁ దెలియంగ - వచ్చు నంతయును"
ననినఁ జూతముఁ గాక -యన్నియు ననుచు
తన తండ్రికడ కేఁగి - దవ్వుల నిల్చి 380

మ్రొక్కిన రమ్మని - మొదలింటి రీతి
యక్కునం జేర్చి సిం - హాసనాగ్రమున
వసియింపఁజేసి భా - వము పల్లవింప
వసుధాపరుఁడు రఘు - వరున కిట్లనియె.
"శ్రీరామ! యనుభవిం - చితి భోగభాగ్య
గౌరవంబులు వార్ధ - కముఁ బ్రాప్తమయ్యె
సాంగదక్షణలతో - నన్ని యాగములు
నంగంబు మిగుల ధ - న్యముగఁ జేసితిని
అభిమతంబైన నీ - వాదియౌ పుత్ర
విభవంబుఁ గాంచి భూ - వినుతు లందితిని 390
నడిగిన వారికి - నడిగిన కోర్కు
లిడి దేవఋషుల కేఁ - దృప్తి చేసితిని
తీర్చి కొంటివి ఋణ - త్రితయంబుధరణి
నేర్చియేలితినెల్ల - నృపుల మీరితిని
నిన్నుఁ బట్టము గట్టి - నీవిల యేల
కన్నులు చల్లఁగాఁ - గనునందు గడవ
నేకోరికయు నేల? - యిఁక మీఁద నాకు
నీకోర్కె సిద్ధించు - నెల్లింటి లోనఁ
గాని దుస్స్వప్నముల్ - గననయ్యె భౌమ
భాను రాహు గ్రహ - బలమేలె దనుచు 400
జ్యోతిష్కు లెచ్చరిం - చుచు నున్నవారి
భూతలమ్మున తార - ములు నశనులును
రాలుచు నున్నవి - రాజులకిదియె
పోలనివనవిందు - బుధులచేనెపుడు
జనుల మానసములు - చంచల తరము

లనఘ! నామదియు - నేనరయఁగఁ జాల
యిప్పటి కిట్లున్న - దిఁక తామసింప
నెప్పటి కిటులౌనొ - యెఱుఁగంగ రాదు
నానెమ్మదికి చల - నము రాక మునుప
పూనుము పట్టంబు - పుష్యంబులోన 410
తామసం బుడిగి సీ - తాసమేతముగ
నేమర కుపవాస - మెల్లి కావింపు
వ్రతనియమంబుతో - వర దర్భశయన
రతుఁడవై యుండు మీ - రాత్రి నేమమున
శ్రేయోభివృద్ధులు - చేకూడు నెపుడు
పాయక ప్రాపించు - బహుళ విఘ్నములు
అట్టివి రాకుండ - నరయుదు రెట్టి
పట్టున నినుఁజేరి - పరిమాప్తజనులు
తోడుతోడుత భర - తుఁడు రాక మునుపె
చూడఁగోరెద నీదు - శోభనం బేను 420
ఆయన మంచివాఁ - డందు పై నెపుడు
నీయందు నతనికి - నెయ్యంబుగలదు
ధీరాత్మకుఁడు జితేం - ద్రియుఁడు ధార్మికుఁడు
కారుణ్యశాలి ని - ష్కపటమానసుఁడు
యెటులైన మనుజుల - హృదయంబు దెలియ
దటుగాన ఱేపె నీ - కభిషేక మేను
కావింతు చనుమన్న - కరములు మొగిచి
యావేళ తనయింటి - కరిగి యవ్వెనక
దేవతలను గ్రహ - దేవతావళిని
భావింపుచును ధౌతపరి - ధానయగుచు 430

తాలిచి మౌనంబు - తనమేలువార్త
యాలించి ముదమొందు - నట్టి కౌసల్య
యింటికి తా నపు - డేఁగి సుమిత్ర
పంటవలంతి వెం - బట్టి లక్ష్మణుఁడు
యీవార్త విని వచ్చి - యెల్లవేలుపుల
భావంబులఁ దలంచి - ప్రార్థనల్ సేయు
వారలతోఁ గూడి వసి - యించుఁదల్లి
నారాఘవుఁడు చేరి - యలరుచుఁ బలికె.
"అమ్మ! మాతండ్రి రా - జ్యాభిషేకంబు
సమ్మతిగావింప - సమకట్టినన్ను 440
నుపవసింపుము సీత - యును నీవుననియె.
అపుడు వసిష్ఠాదు - లైనట్టి మునులు
మనప్రధానులు నిట్టి - మాటాడి నన్ను
పనిచిరి గాన తె - ల్పంగ వచ్చినాడ
శృంగార మొనరింపు - సీతను మాకు
మంగళాకార సం - పద లాచరింపు
తామసింపకు" మని - తనయుండు వల్క
నా మానవతి పర - మానందమంది
మున్ను తానోచు నో - ములు పండెననుచుఁ
గన్నుల బాష్పాంబు - కణములు తొలక 450
"అన్న! చిరంజీవి - వైరాజ్యమెల్ల
మన్ననఁ బాలింపు - మనుజేశు కరుణఁ
బట్టాభిషేకవై - భవములు పొందు
మెట్టునమ్మిన వారి - నెల్లరక్షింపు

నావగవారల - నడపుము కరుణ
బ్రోవు సుమిత్రకుఁ - బోరానివారి
జనియించితివి ప్రశ - స్తదినంబు నందు
మససురా మెలఁగితి - మానవేంద్రునకు
సీతతో రాజ్య ల - క్ష్మిని నీవువొంద
నాతపంబెల్ల పూ - ర్ణఫలంబుగాంచె" 460
అనుచో వినీతుఁడై - యండ నేయుండు
ననుఁగుదమ్ముని సుమి - త్రానందకరునిఁ
దనమేలు కార్యంబు - తనమేలుగాఁగ
మనసు లోనుంచు ల - క్ష్మణుఁజూచి పలికె.
"రావోయి సౌమిత్రి - రాజ్యపాలనము
నీవునేనుంగూడి - నిర్వహింపుదము
సతతంబు నాప్రాణ - సదృశుండవగుట
నతుల మహాలక్ష్ము - లందుము నీవు
నారాజ్యభారంబు - నాశరీరంబు
ధీరశేఖర! నీయ - ధీనంబు సుమ్ము" 470
అనుచు తల్లులకు ప్రి - యంబుతో మ్రొక్క
తనవెంట సీతయు - తమ్ముఁడురాఁగ
నిజగేహమునకేఁగి - నెమ్మి లక్ష్మణుని
సుజని సన్మాన్యునిఁ - జూచి పొమ్మనుచు
గృహమున కనిచి నాఁ - డెల్ల సంతోష
మహితుఁడై యున్నచో - మనుజేశుఁడచట
రామాభిషేక సం - భ్రమ చిత్తుఁడగుచు
ప్రేమ వసిష్ఠునిఁ - బిలిపించి పలికె.

—: వసిష్ఠుఁడు రామునుపవాసముండుమని చెప్పుట :—


"మీరలు పరమ ధా - ర్మికుఁడైన యట్టి
శ్రీరాముకీర్తి ల - క్ష్మీ వసుంధరలు 480
వరియించుటకు ను - పచారంబు జనక
ధరణీశ చంద్రుని - తనయతోఁగూడ
నుంచి రండనుచు ని - యోగింప నతఁడు
కాంచనరథము పై - కదలి రాఘవుని
నగరిలో సావళ్లు - నాలుగు గడచి
తగినవారలు బోయి - తనరాకఁ దెలుప
వేగంబులో రఘు - వీరుఁడువచ్చి
సాగిలి మ్రొక్కినం - జాల దీవించి
యరదంబు డిగ్గి రా - మాన్వితుఁడగుచు
పరమసంయమి - పైఁడి పావలుదొడిగి 490
కొలువుకూటము - చేరి గురురత్నపీఠ
తలమున వసియించి - తానిట్టులనియె
"మీతండ్రి నీయందు - మిక్కిలికరుణ
చేత సామ్రాజ్యాభి - షిక్తునింజేయఁ
దలఁచినవాఁడు సీ - తాసమేతముగ
వలయును నీ వుప - వాసముండుటకు
నల నహుషుండు య - యాతినింబోలె
యిలకుఁ బట్టముగట్ట - నెంచె నిన్నతఁడు"
అని సమంత్రకముగా - నట్లుంచి యతని
యనుమతిఁ గదలి మ - హారథంబెక్కి 500

వచ్చుచోఁ బురినెల్ల - వారువీథులను
పచ్చలతోరణ - పంక్తులుగట్టి
చెఱకుఁగోలలు పోఁక - చెట్లును పండ్ల
యరఁటి మ్రాకులును ద్వా - రావళింగట్టి
మేరువు ల్కురుజులు - మిన్నంటు పువ్వు
దేరులు మేల్కట్టుఁ - దెరలు నమర్చి
కెలంకులఁ గలయటె - క్కెంబు లెత్తించి
కలయంపి చల్లి శృం - గారించు జనుల
కోలాహలంబుచే - ఘోషించు జలధి
పోలికె రాఘవా - భ్యుదయంబు కొఱకు 510
రచితోత్సవంబైన - రాజమార్గమున
సుచిత్రుఁడగు వసి - ష్ఠుఁడు వచ్చి వచ్చి
రాజగేహము చేరి - రథ మొయ్య డిగ్గి
రాజున్న యంతఃపు - రము ప్రవేశింప
వరవిహంగముల - వారిజాతములఁ
గరమొప్పు చున్నట్టి - కాసార మనఁగ
జలజాననా సహ - స్ర ములచే మిగుల
పొలుపొంద నయ్యంతి - పురములోనున్న
నృపుఁజేరి గురునకు - నింద్రుఁడు వోలె
నపుడు ప్రత్యుత్థాన - మాచరింపంగ 520
నతఁడు దాను సమున్న - తాసనంబులను
జతగాఁగ వసియించు - జననాథుఁజూచి
"ఉర్వీశ! రాముని - యున్నెడకేఁగి
యుర్వితనూజతో - నుపవసింపంగ
నియమించి వచ్చితి - నిండు పట్టణము

జయమంగళములతో - సవరణమయ్యె
అంతియ కాదు నేఁ - డాబాలవృద్ధ
మెంతయుఁ భూజనం - బిచ్చలో నలరి
యెప్పు డస్తాద్రి కి - నినుఁడేఁగు మాకు
నెప్పుడు దెలవాఱు - నెప్పుడు రాము 530
పట్టాభిషేక వై - భవము చూడంగఁ
బట్టౌద"మని యున్కి - పరికింపఁ దగియె.
అనుమాటలకుఁ జాల - నలరి యమ్మౌని
ననిచి సింహంబు గు - హా ప్రవేశంబు
సేయు కైవడి నృప - సింహుండు మణిమ
యాయతమ్మగు శయ - నాగారమపుడు
చుక్కల జవరాండ్రు - చుట్టునుం గొలువ
చక్కని సంపూర్ణ - చంద్రుండుజేరు
సరణిమైఁజేరి య - చ్చట సుఖస్థితుల
బరమానురాగవై - భవములనుండె. 540

—: రామ పట్టాభిషేక ప్రయత్నము :—


సీతాసమేతుఁడై - శ్రీరామచంద్రుఁ
డాతరిసుస్నాతుం - డై హవిరన్న
భాజనంబౌఁదల - పై ధరియించి
రాజీవనయను నా - రాధించి యతఁడు
మది నలరంగ హో - మము చేసి కుశల
విదితమైనట్టి హ - విశ్శేష మెలమి
సేవించి రాముఁడా - సీతయు దాను
పావనంబవు దర్ప - పర్యంకసీమ

శౌరి సన్నిధియందు - శయనించి తెల్ల
వారు జామున నిద్ర - వదలి సమస్త 550
వందిమాగధ గీత - వాద్యముల్ వినుచు
వందితాలంకార - నైపుణి మెఱయ
నగరులోఁ దాను స్నా - నముచేసి మౌన
ముగ నుండి జపకర్మ - ములు నిర్వహించి
హరిఁబూజచేసి బ్రా - హ్మణులు పుణ్యాహ
పరిణతుల్ గావింప - భటులు సేవింప
మురవ భేరీశంఖ - ముఖ్య వాద్యములఁ
బురమెల్ల దిమ్మని - బోరుకలంగ
జనములు తమతమ - సదనంబులందు
ననుపమ సంతోష - మనుభవింపఁగను 560
మహనీయ తరకాయ - మానవితాన
బహుతరస్తంభరం - భాస్తంభనారి
కేళజక్రముక సం - కీర్నేక్షుకాండ
పాళికాధ్వజ పటీ - పల్లవమకర
తోరణ కర్పూర - ధూమదిగ్గగన
నీరంధ్ర బహుచిత్ర - నిర్మితపట్ట
పటసముత్కర పరి - ప్రాప్తాంధకార
పటలాప కరణ దీ - పసహస్రమగుచు
రాజమార్గ మెసంగ - రాముండు మహికి
రాజయ్యె మనమెల్ల - బ్రదికితి మింక 570
మంచుచే మణుఁగు తా - మరవోలి మేన
మించిన ముదిమిచే - మేదినీ విభుఁడు
తాళలేకిక బొంద - తలకెల్లయనుచు

మేలెంచి తనయుని - మీఁదటనుంచె
నెంతటి ధార్మికుం - డెంత పుణ్యాత్ముఁ
డెంతటి యుచితజ్ఞుఁ - డెంతధన్యుండు
తలఁచినాఁ డీమంచి - తలఁ పవ్విభుండు
కలకాలమును మనఁ - గావలెనింక
కన్నులు మనకెల్ల - గలిగిన ఫలము
లిన్నిసంతోషంబు - లీక్షింపఁ గలిగె 580
జానకీపతి సర్వ - సముఁడు భూజనుల
సూనులఁగా నెంచి - చూచి రక్షించు"
అని ముదితార్ణవ - మట్లు ఘోషించు
జనపరంపరల వా - చా విశేషములు
కేకయరాజు కై - కేయికిం బ్రియము
చేకూర్ప నిచ్చిన - శ్రీ ధనంబైన

—: కైకకు మంధర దుర్భోధనము సేయుట :—


మందరవిని పైఁడి - మచ్చుపై నెక్కి
సుందరాలంకార - శోభితంబయిన
సాకేత నగరంబు - చందంబు చూచి
లోకీఁడు దా బయ - లు పడంగనీక 590
దుహితుని రామచం - ద్రుని దాదిఁ గాంచి
స్నేహంబు నటియించి - చిఱునవ్వుతోడ
“అక్కక్క కౌసల్య - యవ్వారిగాఁగ
యెక్కుడుగా సొమ్ము - లెల్లవారలకు
నిచ్చుచున్నది - యేమి గారణము?

పచ్చదోరణములఁ - బట్టణం బెల్ల
నిండెనేమిటికి? దీ - నికి హేతువెఱిఁగి
యుండిన నెఱిఁగింపు - మొకమాట" యనిన
మొకమాట చేత రా - మునిదాదిచాలఁ
బెకలియై సంతోష - వివశత్వయగుచు 600
ఱేపెపట్టంబు మా - శ్రీరామచంద్రుఁ
డీప్రొద్దు కుపవాస - మెల్లజనంబు
నెఱిఁగిన యర్థ మీ - వెఱుఁగవె? నీకు
నెఱిఁగింప కున్న దే - యేలికసాని
మందరచూడుమా! - మనపట్టణంబు
బృందారక పురంబు - పెన్నుద్దియయ్యె
రామాభషేక సం - భ్రమముచేవస్తు
సామగ్రి యొసఁగుఁ గౌ - సల్య యందఱికి"
అనిన నోర్వఁగలేక - యామేడడిగ్గి
కనలుచు మందర - కన్నీరురాలఁ 610
బానుపు మీఁదటఁ - బవళించియున్న
మానినిం గేకయ - మనుజేశుపుత్రి
కైకేయి కడకేఁగి - గద్గదకంఠ
కాకుస్వరంబుతోఁ - గదిసియిట్లనియె.
“పట్టెమంచంబును - పఱపు నామీఁద
పట్టుతలాడయు - పడకయుంగాని
యేమియు మనసులో - నెఱుఁగవు నీవు
తామసించిన నుప - ద్రవము నొందుదువు
యీకీడు నీపాలి - కేదైవమింక
రాకుండఁజేయునో - రావమ్మ! లేచి 620

దయవాఁడు నామీఁద - దశరథనృపతి
ప్రియలలో ననినీవు - పెద్దఱికములు
గరివించి పలుకఁగ - కాఁబోలు ననుచు
గురిచేసి నీమాట - కొనలకెక్కుదుము
హాళినదీ ప్రవా - హమునకు గ్రీష్మ
కాలంబువోలి చ - క్కని నీదు మేని
చెలువంబునకు హాని - చేకూడె నీదు
తలఁపును దైవయ - త్నమును వేఱయ్యె
చెప్పితి గతజల - సేతుబంధనము
చొప్పుగా కిఁకనిట్లు - చూచినంగలదె? 630
మించెఁగార్యంబు న - మ్మిన వారి పుణ్య
మెంచుట గాక నీ - కెట్లున్న నేమి?
అని కురుమాపుఁడై - నట్టి చెఱంగు
తనమోముచేర్చు మం - దర వేగిరింప
నెలనవ్వు మోములో - నేల నీవింత?
కలఁగెద వనుచు నా - కైకేయివలికె.
కన్నుగొనల జల - కణములు రాల
విన్నఁజాలున వగ - వెక్కి యేడ్చెదవు
ఏమిగొఱంత యే - నేమంటి నిన్ను?
నేమయ్యె నీకిట్టు - లేల పల్కెదవు? 640
చాలదో నీకింత - సౌఖ్యంబు మందె
మేలంబుచే నేల - మించనాడెదవు?
పోవోసి" యనిన నా - పూఁబోణిఁ జూచి
ఏవవుట్టంగనది - యిట్లని పల్కె.
“నాకునై యింతవి - న్నదనంబుగలదె

నీకునై వగచెద - నిడువాలుఁగంటి!
యనరాని యట్టి భ - యంబు నీకిపుడు
జనియించె మదిలో వి - చారింపనైతి
రాజురాజ్యమునకు - రామునిందెచ్చి
రాజుఁజేయఁగ విచా - రము చేసినాఁడు 650
ఆమాట విని యయో - ధ్యాపట్టణంబు
చే మెఱయంగ గై - సేయుటంజూచి
దిగులు చేనేమియుం - దెలియక మేను
సగముగాఁగరఁగి వి - చారంబు చేత
నీకుహితంబుగా - నేఁగన్నయర్థ
మోకీరసల్లాప! - యుచ్చరించితీని
నీమేలుగీళ్లకు - నేలోను గాన
నీమాట మునుకల్ల - నెఱిఁగింపవలసె
రాజుల మర్మమె - ఱంగ శక్యంబె?
రాజీవముఖి! నమ్మ - రాదు వారలను 660
మదిలోనఁ గపటంబు - మాటి మాటలను
చదరులం బ్రియములం - జాలఁబన్నుదురు
మంచిమాఁటల నీకు - మనవిచ్చి నటుల
వంచించి యిరు - జెవి వాకొనకుండ
ఆకడ కౌసల్య - కఖిలభాగ్యములు
నేకాంతమునఁబిల్చి - యిచ్చుచున్నాఁడు
మంచితనంబున - మామ వెన్వెంట
నంచెదనని యుపా - యంబు చింతించి
భరతునిం బొమ్మని - పనిచె మున్నుగను
ధరణీశులకుఁగల - దా? సమత్వంబు 670

రాముఁడ కంటక - రాజ్యంబుసేయఁ
గామించి పట్టంబు - గట్టుచున్నాఁడు
మగఁడని యెంచి న - మ్మఁగరాని యట్టి
పగవానితోఁ గూడి - పాయకున్నావు
పాముతో చెలిమి ద - బ్బర వచ్చె నింక
యేమిసేయుదమమ్మ? - యిగురాకుఁబోణి!
ఎఱిఁగియుండియు నీవు - పేక్షించితేని
భరతుండు నీవునా - పదలనొందుదురు
నిన్నును నన్నును - నీకుమారకుని
కన్నడసేయక - కాచిరక్షింప 680
మదిలోననెయ్యది - మార్గమో చూచి
అదినడపించు కొ - మ్మ"ని పల్కుటయును.
సాంద్రవిలాసయౌ - శారదసమయ
చంద్రరేఖయుఁబోలు - సకియకైకేయి
దిగ్గునలేచి ధా - త్రేయిగౌఁగింట
బిగ్గఁజేరిచి మేనఁ - బెట్టిన యట్టి
సొమ్మెల్లనొసఁగి మె - చ్చుల చేత "దేవి
కొమ్మ నావీనుల - కును చల్లనయ్యె
శ్రీరామపట్టాభి - షేకవృత్తాంత
మీరీతి నాకు నీ - వెఱిఁగించు కతన 690
నింతకు మిక్కిలి - యేది సంతోష
మంతియ చాలు క - ల్పాంతంబుఁగాఁగ
రామచంద్రుండె చి - రంజీవి యగుచు
యీమహాసకలంబు - నేలఁగావలయు
ప్రాణనాథుఁడు దశ - రథుఁడు నాకెంత

నాణెంబుగూర్చి యా - నందంబు చేసె
భరతుండు శ్రీరామ - భద్రుండు నాకు
సరియందులో రామ - చంద్రుఁడుత్తముఁడు
కౌసల్యఁగడవ రా - ఘవుఁడు నాయందు
జేను మిక్కిలి ప్రీతి - చెప్పెడిదేమి? 700
యీపాటి సంతోష - మెందును లేదు
నాపాలికీ మాట - నాకుఁదెల్పితివి?
యేమిగోరిన విత్తు - నెయ్యిదివరము;
కామింపుమని" పల్కు - గై కేయి మాట
విని రాముపైఁగల - వెనకటి కినుకఁ
గనిపింప మందర - క్రమ్మరంబలికె.
“పడఁతి! నీయవివేక - పారవశ్యమున
కడలేని దుఃఖ సా - గరములో మునిఁగి
గట్టిమనంబు తో - గన్నడ గుట్టు
పట్టుక కార్యం - బు పెరిగినవెనుక 710
సేయుఁ గార్యంబు నీ - సేతనుంగాక
యీయెడగతి గూడి - యీసొమ్ములెల్ల
పాఱంగవైచు నె - పంబు చేనాకు
భారంబుగాఁదీసి - బామునుంజండి
పై వేయు కైవడి - పైబడవైవ
నీవిచ్చుటాయనో - నేను నీచేత
దీసుకొంటిని యని - తిరుగంగ వైచి
నీసేఁతఁజూచిన - నిడువాలుఁగంటి!
వచ్చుచున్నది నవ్వు - వైరి (దా)యాది
చిచ్చునుం బెరుగుచోఁ - జింతింపవలదె?

కడునీకుఁబగవాఁడు - కౌసల్యగన్న
కొడుకెందు సవతుల - కొడుకులకైన
సంపదల్ చూచిన - సంతోషమొందు
చంపకగంధులు - జగతిపైఁగలరె?
భరతుండు రాజ్యంబు - పాలించె నేని
పరికింప రాముఁడా - పద నెల్లనొందు
రామచంద్రుండు ధ - రావరుఁడైన
యేమిగాఁగలవాఁడొ - యికభరతుండు!
అనువిచారంబుచే - నంటి నీ మాట
మనభరతుండు తన - మర్యాదగాన 730
తగినవాఁడగుటనెం - తయు మున్నెఱింగి
సుగుణియై సమయంబు - చూచుక నీతి
మర్యాద చూచి రా - మవిభుండు తనదు
కార్యంబు కొఱకేమి - గావింపఁగలఁడొ
భరతుని ననుచు నీ - పట్టికై చాల
మఱుఁగుచున్నది నాదు - మది మదిరాక్షి
కొడుకు రాజ్యము సేయ - కోరికఁజూచు
పడఁతియా కౌసల్య - భాగ్యమెన్నుదునొ?
అసవతికి దాసి - వైయుండునీదు
వాసివోవుటకునై - వగలనొందుదునొ? 740
తొత్తుకిందటబడి - తొత్తులమైతి
మిత్తరి నని మమ్ము - నేవగింపుదుమొ?
నీకొడుకా రాము - నికి నూడిగములు
చేకొనిసేయుటల్ - చింతసేయుదుమొ?
సీత చెప్పిన పనుల్ - చేసి నీకోడ

లేతరిం బడుపాటు - నెన్నఁజాలుదుమొ?
యెందుకై వగచెద - నేనుందు" ననిన
మందరతోఁగైక - మఱియు నిట్లనియె.
"రాముఁడు సకలధ - ర్మజ్ఞుఁ డుత్తముఁడు
శ్రీమహితుఁడు గురు - శిక్షితాత్మకుఁడు 750
దయగలవాఁడు కృ - తజ్ఞుండు సత్య
నయవిశారదుఁడు దీ - నజనావనుండు
పరిశుద్ధుఁ డఖిలశో - భనగుణాన్వితుఁడు
ధరణీశునకు నగ్ర - తనయుఁ డార్యుండు
యా పుణ్యనిధియె ప - ట్టార్హుండు గాక
ఏ పట్టునఁ దలంపు - మితరుండు దగునె?
తమ్ములం బ్రజలను - తండ్రి కై వడిని
సమ్మతిఁ బాలించు - సకలసమ్మతుఁడు
యీమహోత్సనము నా - కిటు చూడఁగల్గె
నేమిఁటి కోర్వలే - కిటులాడనీకు 760
రాముఁడున్నన్నాళ్లు - రాజ్యంబు సేయ
నామీద భరతుఁడు - నవని బాలించు
రాముండు భరతుండు - రమణి యొక్కటియె
నామది కిటులాడ - నాయంబు గాదు
భరతునికై నట్టి - పట్టంబె సుమ్మ!
ధర యేలెనేని సీ - తాప్రాణవిభుఁడు
భ్రాతృవత్సలుఁడు చె - ప్పఁగ రాకుమిట్టి
ధాతువాదములకుఁ - దాళితి నిపుడు
తగు నాజ్ఞ సేయింపఁ - దగునిన్ను నితఁడు
తెగరామి చేకాచి - తినిపొమ్మనంగ 770

ఆ నంగనాచి యు - హ్హని వెచ్చనూర్చి
మానంగ లేక క్ర - మ్మఱనిట్టులనియె.
"అమ్మ! ధీరోదాత్త - వగుటచే నీవు
నెమ్మదిఁ దాఁచిన - నెమ్మదిఁ గలదె?
పొదలెడు చింతలో- బొరలగఁ దలఁచి
యిది యకార్యముకార్య - మిదియన లేవు
రాముని తరవాత - రాజ్యమేలంగ
రాముని సుతుల క - ర్హంబగుగాక
భరతుఁడెవ్వఁడు? నీదు - పట్టి గాఁబట్టి
దరిలేని యట్టి చిం - తల నందవలసె 780
యీరాజ్య మిరువురు - నేలుదురనినఁ
బ్రారంభమదియ య - నర్థంబులకును
అది గాక జ్యేష్ఠుని - నభిషిక్తుఁ జేయ
మది నెన్నుదురు నీతి - మార్గకోవిదులు
నెన్నడు భరతుని - కిడుములం బడఁగ
నిన్నుఁ జూపెఁ దదీయ - నిటలాక్షరములు
యవనికిఁ గర్తయ్యు - యనద గావల సె
నవివేకకు జనించు - నట్టి దోషమున
హితమని తెల్పితి - నెఱుఁగక నీదు
కృతకర్మఫలము చేఁ - గీడొందవలసె 790
సవతి మేలున కింత - సహియించివచ్చు
నవమానములకు లో - నైన మాకేమి
నీమెచ్చులునుఁ జాలు - నీవాజ్ఞ సేయ
కీమేరఁ దాళుట - లేలాభమయ్యె?
రాముఁ డకంటక - రాజ్యంబు సేయు

శ్రీమాన్యుఁడై యేను - చెప్పిన బుద్ధి
భరతుండు కానల - పాలైనఁ గాని
తెఱఁగైన వెనకఁ జిం - తింపు మింతయును
కడనున్న సుతులను - గడవ చెంగటను
కడవాఁడు రేవ - గల్గాఁ గాచియున్న 800
చనవరి యగు వాఁడు - జనపాలకులకు
మునుపుగా నీవె రా - ముని యదృష్టమున
మన కర్మమున మేన - మామ యింటికినిఁ
బనిచి తీవెఱుఁగక - భరతునిఁ బిలిచి
ములుతీగె ఫలవృక్ష - మునుఁ గూడినట్ల
యలరి రన్యోన్య స - మాశ్రయంబులను
రామలక్ష్మణులు వో - రంతులువారి
కేమరలనుఁ బొంద - వెలమి చెల్ములను
అశ్వినీ దేవత - లనఁగ వీరెపుడు
శాశ్వతులగుదురు - సౌమిత్రి కెందు 810
కొదవ రానీడు ర - ఘుప్రవరుండు
మదినెన్న భరతుని - మననీఁడు గాక
నీకుమారునిఁ గూడి - నిజము శత్రుఘ్నుఁ
డేకీడు నొందునో - యెఱుఁగంగరాదు
సందియంబేల? యి - చ్చటికి రానీక
యందున్న భరతుని - నడవుల కనుపు
రాముఁ డీతఱి వని - రాక యమ్మునుపె
నామాట చెవిజేర్పు - నారీలలామ!
భరతుఁ డీరాజ్యంబు - పాలించెనేని
పరికింప రాముని - పగవాఁ డతండె 820

ఆమీద నొక రాముఁ - డన నేల కినిసి
యేమి సేయఁగవచ్చు - నెవ్వరిచేత?
సింగంబునకు వెఱ - చిన మత్తగజము
సంగతి భరతుండు - జానకీరమణుఁ
చేతఁ జిక్కక మున్న - సింహాసనంబు
తోతే బనిచి భర - తుని కొప్పగింపు
కాదేని భరతునిఁ - గాచి రక్షింప
నేది మార్గాంతరం - బెన్నుము మదిని
వెనకకు నీచేత - వెతలచేఁ జివికి
కనుపెట్టుకొనిన యా - కౌసల్య యెపుడు 830
నాపగ దీర్పక - యాపంగ లేదు,
కోపంబు నీకు - నీకొడుకునీకిపుడ
అనవధికంబైన - యవధి రాకున్న
మునుపుగా వనవాస - మున రాము నునుప
మన భరతునకు భూ - మండలంబెల్ల
ననువుగాఁ జేకూడ - యత్నంబు చేసి
సవతులలో నీదు - సవతు లేనట్టి
యవిరళ సంతోష - మందుమీ"వనిన
కలగినమది నర - గడియ మాత్రంబు
తలపోసి చూచి యు - త్తమతురంగమునుఁ 840
గ్రక్కున మరలించు - గతి నెమ్మనంబు
చక్కని జాడగాఁ - జననీక త్రిప్పి
"మేలుమందర! సత్య - మే నీవు పలుకు
మేలెఱుఁగక నిన్ను - మించనాడితిని
రామునిఁ బనుతు న - రణ్యభూములకుఁ

గామించి పట్టంబు - గట్టుదు భరతు
మావారి కెల్లనె - మ్మదిని సంతోష
మావ హిల్లఁగఁజేతు - నదియెంత తనకు
నిందు నెయ్యది జాడ - యెఱిఁగి యుండినను
మందర! యెఱిఁగించు - మా" యంచుఁబలుక 850
"నోయమ్మ! మఱచితి - వో! నీవు లేక
నాయాత్మ పరిశోధ - నంబు గాంచెదవొ!
యెటులైన నేమి యే - నెఱిఁగిన యర్థ
మిటులంచుఁబలుకనీ - యిచ్చ యామీఁద"
అని మఱమఱియు న - య్యతివ వేఁడంగ
దన పూన్కి చెల్లింప - దాసి యిట్లనియె.
"మును దండకారణ్య - మున వైజయంత
మను పట్టణంబులో - నమరు మాయావి
దానవపతి తిమి - ధ్వజుఁడు పెంపొందు
వాని మీఁదికి బల - వైరి దండెత్తి 860
పోరాడి తనచేత - పొలియింపఁగాక
వీరుని దశరథ - విభుఁడోడువిలువ
యీరాజు వెనువెంట - నేఁగవే నాఁడు
దారుణంబైన యు - ద్ధము చూడవేఁడి
దేవతావళిఁ గూడి - తిమికేతు నాఁగి
యీవసుధాధీశుఁ - డెదిరి పోరాడ
జగడించు దానవ - శస్త్రఘాతములఁ
బొగరెల్లఁ జెడి గాయ - ముల రాత్రులెల్ల
పాళెముల్ చేరిన - ప్రజలను దనుజు
లాలోన వధియించి - యటపోవుచుండ 870

కోపించి దశరథ - క్షోణీశ్వరుండు
చాపంబుఁ గైకొని - శరపరంపరల
దానవేంద్రునితోడ - తలపడి పోరి
వాని వేటునఁ బెంపు - వదలి మూర్ఛిల్లి
యరదంబుపై వ్రాల - నప్పుడు తేరు
మఱలించి నీవు క్ర - మ్మర సేదఁదేర్చ
మెచ్చి యప్పుడు నీకు - మేదినీనాథుఁ
డిచ్చెఁ దా నొక వరం - బిటు లెచ్చరిల్లి
క్రమ్మరనె సనియె - కలన సారథియు
సొమ్మసిల్లిన నీవు - సూత్రకృత్యంబుఁ 880
గావించి విభు తేరు - గడపుచు మదికి
నీవ చేవలు మెర - యించిన మెచ్చి
అపుడొక్క వరమిచ్చి - యడుగుమీ వనిన
నిపుడేల నడిగెద - నెపుడైన ననుట
మఱచితివీ వేమొ - మఱతురె యేను
మఱువలే దది యభి - మతము నీకిపుడు
ఆ వరంబులు రెండు - నడిగి రాఘవుని
కావరం బడఁగించి - కానల నుంచి
భరతునిఁ గట్టించు - పట్టంబు నీకు
పరిణామమొందుము - పలికినపలుకు 890
తప్పఁడెన్నడు మన - దశరథనృపతి
యెప్పుడు నీయెడ - హితుఁడైన వాఁడు
అలక యింటికిఁ బోయి - యవ శయనించి
పలుకకయుండుము - పతి వచ్చినపుడు
మచ్చికఁ దాపండు - మనసెందు నీకు

చిచ్చైనఁజొచ్చును - చెప్పితి వేని
యడిగినచోఁ బ్రాణ - మైన నీకిచ్చు
నెడసేయఁగా నేరఁ - డెదురాడవెఱచు
నీచక్కఁదనమును - నీ విలాసములు
నోచెలి! యెఱుఁగలే - కున్నావు గాక 900
ఏమిచెప్పినఁ జేయఁ - డే సొమ్ములైన
కామించి యీవచ్చుఁ - గైకోకుమీవు
చలపట్టి యీరెండు - సంకల్పములును
వెలుతులుఁ దీఱక - విభుఁ జేరఁబోకు
అటులైన శుభముల - నందుదువీవు
ఘటియించు రాజ్యభో - గము భరతునకు
భరతుండు దొరయైన - బంధు లహితులఁ
బరివారములఁ జేరఁ - బట్టిరక్షించు
లాలనరూఢ మూ - లంబుగా నవని
పాలించు మితికట్టు - పదునాలుగేండ్లు 910
ఆపయి వచ్చియే - మనువాఁడు రాముఁ
డాపదలనుఁ బొంది - యడవిపాలైన
మఱలనేరఁడు పేరు - మాత్రంబు లేకఁ
గరఁగిపోవును దిన - క్రమములచేత
నంత నకంటక - మైన రాజ్యమున
సంతోషమున నుండ - జాలునీ సుతుఁడు
వెఱవకీ వరములు - వేఁడుము నీవు
మఱవకు" మనిపల్కు - మందరబుద్ధి
చెవినాని దాని నీ - క్షించి దుర్భుద్ధి
నవశాత్మయై కైక - యతనూజ వలికె. 920

"నీకు నింతటిబుద్ధి - నిర్వాహకంబు
చేకూడి యునికి నా - చిత్తంబులోన
నెఱుఁగ కేమంటినో - యింకనామాట
మఱవు మీమదిలోన - మందర నీవు
సరిలేదు నీకు కు - బ్జలలోన నెందు
పరమ హితంబు నీ - పలికినమాట
మనరాజు హృదయ మ - ర్మమెఱంగవైతి
విననీక నడపిన - వృత్తాంతమెల్ల
కుబ్జలు వక్రలు - క్రూరలుగాని
యబ్జాస్య యనుకూల - లగువారు గలరె? 930
పవనాహతిని వ్రాలు - పద్మంబురీతి
నవనంద్యమై చాల - యలరునీ మొగము
మొనచూపె యుభయ - దోర్మూల కూలములఁ
జెనకునీ పెనుబోర - శింగారమునకు
గృశియించి కాదె మి - క్కిలి కొంచమగుచు
శశిముఖి! నీకౌను - సన్నమైయుండె
పొడుపాటి కాళ్లు సొం - పుగ వెళపైన
యడుగులతో నీవు - హంసంబురీతి
కటిఁబట్టుపుట్టంబు - గట్టి మేఖలయుఁ
గటక ముల్మెఱయ నా - కడకునే తెర 940
రతిమన్మథుల జయా - రంభ యాత్రలకు
జతగూర్చు తమ కుల - చందంబు మెఱయ
మూపురంబు నురంబు - మురవునుం జూచి
చూపులు మదికి మె - చ్చుల నామతించ
అలవడితివి శంబ - రాసురముఖులఁ

బలుమాయలకు మెచ్చఁ - బరగు నీమహిమ
నీవునన్ను భజించు - నియమంబుతోడ
నీవంటి కుబ్జలు - నిన్ను సేవించి
రాఁజేతు నీమూపు - రమునరో వింత
గాఁజేసి యనుతు బం - గారంపుఁదొడవు 950
వోరచన్నుల తోడ - నొప్పు నీయురము
బోర మీఁదటి కిత్తు - బురుసారుమాలు
కుఱుచయై మూపులఁ - గుడుకిలియన్న
యఱుతకు నేనిత్తు - నర్థహారంబు
తాళితి నను తప్పు - దాళిన నీదు
తాలిమికై బిల్ల - తాళి యిచ్చెదను”
అనివెలిపై పావ - కార్చియుంబోలి
తనరుమేలిమికెంపు - తాపితా పరపు
మీఁదట వసియించు - మృగశాబనేత్రి
తోఁదత్తరించి యా - దుర్జాతి వలికె 960
"అమ్మ! గజస్నాన - మటుగాకనీదు
నెమ్మది నాబుద్ధి - నిలిపితివేని
కోపగృహంబున - కనుబోయియుండు
మీపూన్కి చెల్లింప - కేమర వలదు”
అని తోడుకొని పోయి - యాయింటిలోన
నునిచి తా నవ్వల - నొదిగి యున్నంత
సుదతిమై భోగపు - సొమ్ములన్నియును
వదలించి మాసిన - వలువ ధరించి
దాసి చెప్పినయట్ల - తలపట్టువెట్టి
వాసన కట్టు బ - ల్పడిఁ గట్టిచుట్టు 970

నుడిగింపు విరిఁబోణు లొక్కక్కమూల
నడఁగి యుండఁగఁ గను - లందు బాష్పములు
ధారలుఁ గాఁగ మం - దరఁ జేరఁబిలిచి
"ఓరామ! నామాట - యొకటి యాలింపు
భరతునిఁ గట్టుదు - పట్టంబు రాముఁ
దఱుముదు ఘోర కాం - తారవీథులకు
నీపూన్కి దప్పిన - వీక్షించినీవె
భూపాలుతోడఁ దె - ల్పుము తనతెఱఁగు
కడమ యేఁటికి యేడు - గడ రాముఁబిలిచి
యడవులకును జను - మనకనేమాన 980
నీదుమాటలు నాటి - నిండునాడెంద
మీఁదుచున్నది చాల - నీసు మున్నీట
యిదియ కాకున్నచో - నేల? యీతుచ్ఛ
పదవులు చలవట్టి - ప్రతిన చెల్లింతు
కానిమ్మనుచు తన - కరభంబు చేత
మానిని యురముఁ బ - ల్మారుఁ దాటించి
ముసుఁగు వెట్టుక కారు - మొగులులోఁదగులు
లసమాన చంద్ర క - ళా విలాసమున
మందరా వ్యాపాద - మాయానులాప
నిందితవిషదిగ్ధ - నిశితాస్త్రహతిని 990
మేదిని బవళించి - మిగుల రోషంబు
పాదుకొనంగ ని - బ్బరపుటూర్పులను
బుసకొట్టుచున్నట్టి - భోగిని యనఁగ
నసురుసురుగుచును - నవనిపైఁబడిన

కిన్నర రమణి పో - ల్కెను చుక్కలురివి
మిన్నుదోఁచిన మాడ్కి - మెరవడుల్ సడలి
కదలక మెదలక - కన్నులుమూసి
యెదనుబ్బు మందర - నింటికిబనిచి
యెదురులు చూచుచు - నిగురాకుఁబోణి
మది దశరథు రాక - మతియించునంత. 1000

—: దశరథుఁడు కైకేయిని చూడవచ్చుట :—


అప్పుడా దశరథుం - డాత్మవర్తనము
చెప్పి సుమంత వ - సిష్ఠులు వనుప
తనదు సంతోష మెం - తయును కైకేయి
వినకున్న దనుచు న - వ్వెలఁదితోఁ దెలుప
వచ్చికైకేయి ని - వాస మొక్కరుఁడు
చొచ్చినల్దిక్కులుం - జూచుచురాఁగ
"నెక్కడ నున్నావొ - యెదు రేగవమ్మ!
అక్కక్క! మనయింటి - కదె రాజువచ్చె”
ననుచు నెచ్చెలు లాడు - నడినేర్చి పలుకు
కనక పంజరకీర - కథనముల్ వినుచు 1010
"అజకుమారక! భాస్క - రాన్వయజలధి
రజనీకర! సమస్త - రాజమూర్ధన్య!
దానదీక్షాధురం - ధర! వైరిరాజ
మాన నీరాకర - మధన కృపాణ!
సత్యవాక్యప్రతి - ష్ఠా సంప్రదాయ
అత్యంత నియత - ధర్మాచార నిపుణ!

దశరథేశ్వర! యవ - ధార" నుపద్య
కుశలమౌ శారికా - కులముఁ గన్గొనుచుఁ
బువ్వుల చప్పరం - బులనాడుతేఁటి
జవ్వనుల వినోద - సంగీతమునకుఁ 1020
జక్కఁగానఱ్ఱులు - చాఁచు కేకినులఁ
జొక్కుటాటలకు మె - చ్చులనుఁ దేలుచును
కదియ హంసములుండి - కడదాఁటునపుడు
కదలు నుయ్యాల బం - గరు సరిపెణల
సకినలు వలుక ప - జ్జల దూరిపట్టు
బకదారి సరములు - బాలి మేకొనుచు
నుదపని హరువులం - జూపట్టి మదన
కదనంబులకు రంజి - కములైనయట్టి
సతులకుం బ్రాల్మాలు - సంయమీశ్వరుల
ప్రతిమలు బతిమాలు - బాగువీక్షించి 1030
నాటకశాలలు - నవరంగములును
దాఁటి సింహాస నాం - తరములుగడచి
కేళికావనములఁ - గెలఁకుల చంద్ర
శాలికావళి మీఱి - చలువరా జగతి
జగతు లాలోకించి - జలజాకరముల
మొగడ తమ్ముల చక్ర - ములఁ దేఱిచూచి
నవరత్న భాసమా - నంబయిన పెండ్లి
చవికెగన్గొని చెంత - సౌవర్ణచిత్ర
భాసమానంబైన - పడకిల్లు చేరి
దాసీసహస్ర ము - త్తలముతో నొదుగఁ 1040

గంచుకి వామన - గణ కుబ్జనికర
మంచెలం దగిన ప్రయత్నముల్ నడప
మొగ మొగమ్ములు చూచి ముసగసలాడు
మగువలం గనుచుఁ దా - మర సారిరేఖ
పాయ నాకాశంబు - పగిదిఁ గైకేయి
బాయు నయ్యలివేణి - పానుపుచేరి
మదిఁజాలఁగలఁగి "రా - మామణిఁగాన
మదియేమొ" యనుచుఁ గా - మాతురుండగుచు
నేవచ్చు నపుడు తా - నెదురుగా వచ్చి
తావి పన్నీటఁ బా - దంబులు గడిగి1050
బాటల సుమసౌర - భంబులు చల్లు
నీటుఁబయ్యెదను నా - నెమ్మోము చెమట
వారించి చిగురాకు - వంటికెంగేలు
గారాము మీఱంగఁ - గైలాగొసంగి
పానుపు పైనుంచి - బడలిక దీఱ
జీనితావి సురంటి - చేనొయ్య విసరి
యనురాగ మొందించి - "నక్కటా! ఏమి
పనికినో కాన మీ - పడకింటిలోన"
నని జాలిఁ బొంది మ - హారాజు చాల
వనరుచు హెగ్గడి - వనితనుం జూచి1060
"కైక యెక్కడఁ బోయె? కానము వేగ
వాకొను" మనిన నవ్వ - సువిభుం జూచి
"అయ్య కోపగృహంబు - నందు ధరిత్రీ
బయ్యదముసుఁగిడి - పవళించె నిపుడు.
యేమి నిమిత్తమో - యెఱుఁగ లేమనిన
నామానవాధీశుఁ - డచ్చటి కేఁగి
మూలంబు దెగఁగోయ - మొనసి ధరిత్రి
వ్రాలిన మల్లికా - వల్లిక యనఁగ
నవనవంబుగ విమా - నమునందు జారి
యవనిపై బడు కిన్న - రాంగనరీతి1070
నవనిఁ జూడఁగవచ్చి - యలసి తానచట
బవళించు దేవతా - భామిని కరణి
మహనీయ్య మధుపాన - మదమత్త యగుచు
మహివ్రాలు నచ్చర - మగువ చందమున
జవతురంగమ రతి - శ్రాంతిచే నలఁగి
రవణంబు దొఱఁగు తు - రంగికైవడిని
తడయక సింహనా - దము చెవిసోఁకి
కడుభీతి నోడిన - కరణివైఖరినిఁ
దలకొన్నయార్తిచే - తనువేఁటకాని
వలకుఁజిక్కినలేడి - వలె నిలమీఁద1080
నత్తమిల్లిన కేక - యాత్మజుఁ జూచి
మత్తేభగమనుఁ డ - మ్మనుజనాయకుఁడు
చెంగటి కొయ్యన - జేరి యారమణి
యంగంబుపైఁ దన - హస్తంబు వైచి
యిలమీఁద వసియించి - హితమధురోక్తు
లలవడ దశరథుఁ - డప్పు డిట్లనియె.
"ఓరమణీమణి! యుర్విపై నేమి
కారణంబున నిట్టి - గతి శయనించితివి?
యీతరి నీయల్క - కేమి గారణము?
హేతు వెయ్యది వంత - నింత చింతిల్ల?1090

నెవ్వరు నీతోడ - నెదురాడి నిటుల
నెవ్వగ చేసిరి - నీకునెవ్వారు?
యేనుండి నీ కేల - నిట్టి విచార?
మే నెపం బెంచి న - న్నిటుల నొంచెదవు?
సుందరి భూతంబు - సోఁకెనోనిన్ను
మందులిప్పింతు నా - మయ వికారంబొ
మగువ రప్పింతునో - మంత్రవాదులను
వగపేల పిలుతునో - వైద్యులనిటకు
నీకేమివలెనన్న - నేనొనగూర్తు
నాకడఁదొలఁగింతు - నప్రియార్థములు 1100
దండింపదగు వారిఁ - దాళికాచెదను
దండనీయులఁజేతు - తగనివారలను
బీదఁజేపట్టి కు - బేరుఁగావింతు
పేదనుఁజేయుదు - పృథివీశునైన
నేను నావారునీ - యిలయును నీదు
పూనిక యట్టట్ల - పొందువారలము
తలఁచినయర్థమం - తయు సమకూర్తు
వలసి కోరిననట్టి - వస్తువులిత్తు
నీమీఁది నా ప్రేమ - నెనరుమోహంబు
నోమానిని! యెఱింగి - యును చింతయేల? 1110
అనుమానములుమాని - యడిగెద నాదు
జనకుఁడు సుకృతంబు - సాక్షులుగాఁగ
భానుని రథమెంత - పర్యంతమవని
మానిని! చుట్టు నమ్మ - ధ్యోర్వియెల్ల
గరిమ నేలుదు నేను - గాంధార సిందు

కురు కోసలావంతి - ఘూర్జర మగధ
సౌరాష్ట్ర సౌవీర - శకమహీవిభుల
గారవింపుచు నరి - గాపులుగాన
అట్టివారలుడాఁచి - నట్టియర్థములు
నెట్టుకావలెనన్న - నీకు నర్పింతుఁ 1120
గన్నీరునీకేల! - కలవాణి లేచి
నన్నుఁజూడుము నీకు - నరులెవ్వరైన
కించుఁదనంబుతో - కీడుసేసినను
మంచుబో విరియించు - మార్తాండురీతి
తగునాజ్ఞచేసి ఖే - దము వాయఁజేతు
నగుమోముచూపు మ - ననముసుం గేల?
కరుణింపు" మను మాట - కైకేయి మదిని
బరికించి నిష్ఠుర - భంగినిట్లనియె.
"పగవారునాకునే - పట్టున లేరు
తెగి యవమాన మొం - దింప రెవ్వరును 1130
అలుకకుం గారణం - బడిగితి గానఁ
దెలపక తీరదు - తెల్లంబుఁగాఁగ
నీవుసేయు ప్రతిజ్ఞ - నిజముగాఁబూని
కావించుమాట - నిక్కంబగునేని
మఱికాని నీతోడు - మాటాడ” ననిన
మెఱమెఱల్ దీరియా - మృగనేత్రిఁజూచి
నగుమోముతోడ మ - నంబు రంజిల్ల
మగువ నెమ్మోముఁ దా - మరమీఁదఁ జెదరు
కురులు వేనలితోడఁ - గూడఁగా దువ్వి
కుఱుఁబైఁటచెఱఁగుగ్ర - క్కునఁ బాయఁద్రోచి 1140

కరముకరంబుతోఁ - గదియుంచి యెత్తి
యరవిందలోచన - నాసీనఁజేసి
“నీకన్నఁబ్రియురాలు - నిక్కంబుగాఁగ
నాకు రాముని మించి - న ప్రియుండు లేఁడు
యీయర్థమెఱిఁగియు - నెఱుఁగనియటుల
నోయిందుబింబాస్య! - యుచితమే పలుక!
నిమిషంబునేఁ బాయ - నేరనిప్రాణ
సముఁడైన మారామ - చంద్రుని యాన
కోరికె యిపుడె వా - కొను మిట్టులనుచు
కోరినయపుడె నీ - కు నొసంగువాఁడ 1150
యితరులౌ పుత్రుల - నింతులు మేను
హితులు సామ్రాజ్యంబు - నింతయు నాకు
నేఁటికిశ్రీరాము - నెనసియుండుటకు
సాటియె యట్టి కౌ - సల్య కుమారు
పైనానవెట్టి త - ప్పను నీదుచెలువు
మానవతీమణి! - మదిఁగానలేవు
ఆబలంబు సహాయ - మైయుండనీకు
నోబాల! సంశయం - బొకటేల? నీకు
నడుగుమీవన" మం - దారదేశ మాత్మ
బెడరింప శమనునిఁ - బిలిచిన రీతి 1160
అనరానిమాట కా - మాతురుండైన
మనుజేశుఁ జూచియ - మ్మగువ యిట్లనియె.

—: కైకేయి దశరథుని వరము లడుగుట :—


“సత్యసంధుఁడు కీర్తి - శాలి ధార్మికుఁడు
నిత్యదానవినోది - నేఁడు మారాజు

పలికిన పలుకులు - పన్నగ యక్ష
నలినాప్తదేవదా - నవ సిద్ధ ఖచర
చారణతారకా - చంద్ర కింపురుష
ధారుణిగగనభూ - త వ్రాతమెల్ల
వినుఁడు మీరలె సాక్షి - వెనక నీరాజు
మనసుఁగ్రమ్మఱిన ధ - ర్మముఁదప్పవలదు 1170
అడిగెద భూపాల - యాదికాలమున
వడినొసంగితి రెండు - వరములు నాకు
నావరద్వయము నే - నప్పు నిల్పితిని
కావలసినవేళఁగై - కొందు ననుచు
నిక్షేపములుగాఁగ - నీ యెడనున్న
అక్షయవరము లే - నడుగుటఁదగదె
నరనాథ! దేవదా - నవసంగరమున
నరదంబు నడపించు - నపు డిచ్చినావు
కలదు లేదో చూచి - కలిగినమదినిఁ
దలఁచుక యిమ్మ” న్న - దశరథవిభుఁడు 1180
కపటాత్ముఁడగు వేఁట - కాఁడుకాఱడవి
నిపుణుడై మృగము పూ - నికెనెఱింగింప
యాసద్దు విని మృగం - బని చేరితగిలి
మోసమొందిన మృగ - మునుఁబోలి యతఁడు
తనవరంబును వలఁ - దగులుట చూచి
కనికరంబేది కే - కయరాజ తనయ
మఱియు నిట్లనియె "నీ - మాటసత్యముగ
మఱవకయిచ్చిన - మననిత్తునీకు

యీకొన్నచోఁబ్రాణ - మిచ్చెదఁగాక
గైకయు నేర్చునా - కల్లలాడంగ 1190
నీవె సూచెదవు వూ - నిన మాటదెలిపి
యావల నెట్లైన - నదియె సమ్మతము
రామాభిషేక కా - రణమైన వస్తు
సామగ్రి యిట్లుండ - సరగున నేఁడు
భరతునిఁ బిలిపించి - పట్టంబు గట్టి
గరిమతోయువరాజుఁ - గావించు టొకటి
రామునిఁబిలిచి య - రణ్యభూములకు
వేమౌనివర్యుల - వేషంబుఁదాల్చి
యేనుచూచుచు - నుండ నిప్పు డయోధ్య
లోననుండఁగ నిక - లోకులు నగఁగ 1200
పనుపుట యొక్కటి - పార్థివ! నీవు
తనకిచ్చు వరములు - తప్పరాదింక
శీలంబు యశము ర - క్షింపు మేమఱక
చాల నిల్కడ సత్య - సంధుండ వగుము
సత్యంబు పరలోక - సాధకంబగుట
ప్రత్యయలీలగాఁ - బలుకవే శ్రుతులు
“యిచ్చెద ననుము వా - యెత్తక బేలు
పుచ్చెదనన మోస - పోవునె కైక”

—: కైకమాటలకు దశరథుఁడు శోకించుట :—


యనుమాటలకు కాఁచి - నట్టిశూలముల
తనదు వీనులునాఁటఁ - దపియించు నటుల 1210

భ్రమసితినొక్కొ! స్వ - ప్నంబుఁగాంచితినొ?
అమలినాత్మీయ్య మ - హాభోగహేతు
నానాపదార్థవి - నాశమో? యేమి
గానున్నదియొ యని - కళవళంబొంది
చిత్తంబు మఱచి మూ - ర్ఛిలి యంతఁదెలిసి
తత్తరింపుచుఁ దెల్విఁ - దప్పిమ్రాన్పడుచు
బెబ్బులింగని చాల - భీతి చేఁబఱచి
యుబ్బలింబడి మృగ - మున్నచందమున
వాకట్టువడు మహా - వ్యాళంబు రీతి
ప్రాకటనిశ్వాస - భంగిరోఁదుచును 1220
తా నచేతనుఁడయి - ధరణిపై వ్రాల
ధీనుఁడై యేమియుఁ - దెలియంగలేక
కనలుచుఁగోపించి - కన్నులకెంపు
జనియింపఁ దనదైన - జన్మంబు రోసి
సేకరించుకొని దా - క్షిణ్యంబులేని
యాకైకపై నల్గి - యవనీశుఁడనియె,
"ఏము రాముఁడు నీకు - నెగ్గైనకార్య
మేమిచేసితి మిట్టు - లేల వావిషము
చినుకుచు వంశనా - శినివైతి నీవు
వనిత రామునిఁజూచి - వనితలంబునకుఁ 1230
బొమ్మను తలఁపెట్లు - వొడమ విషంబు
గ్రుమ్మరింపుచు త్రాఁచు - కొదమయుంబోలి
యున్న నిన్నెఱుఁగక - నుంచితి నమ్మి
యిన్నాళ్లు సతివని - యింటిలోపలను
కౌసల్యమారుగాఁ - గను నిన్నురాముఁ

డీసెఱుంగఁడు తమ్ము - లెడనొక్కనాఁడు
సకలలోకహిత ప్ర - చారు నాసుతుని
నకట! యేకొఱఁత సే - యంగ నిట్టులంటి
సతులను సుతుల రా - జ్యమునైన విడుతు
నతివ! వేఁడిననిత్తు - ప్రాణంబులైన 1240
రామునిఁ బాయనే - రను లోకమెల్ల
సేమంబు రవిలేక - చెంద నేర్చినను
జలములులేకయు - సస్యంబు లురికె
బలువైన పంటలు - పండ నేర్చినను
కమలాక్షి! శ్రీరాముఁ - గానకయున్న
నిమిషంబుప్రాణంబు - నిలువ నేరుతునె?
నానాఁట నీయెడ - నడచు రాఘవుని
మానితహితగుణ - మర్యాదలెల్ల
నాతోడఁదెల్పు దా - నవు నీవు పరమ
పాతకహేతు దు - ర్భాషలాడుదువె? 1250
భరతుఁ డొల్లని వాఁడె - భామిని! నాకు
ధరణికి రాముఁ గ - ర్తనుఁ జేసినపుడె
యతని మేలున కెట్టి - యహితంబుఁ దలఁప
మతియింపకుము నన్ను - మన్నింపు మీవు
పూని కావింపు మి - ప్పుడు నాదు ప్రాణ
దానంబు నీదు పా - దముల వ్రాలెదను
అక్కటా! యీ పిశా - చావేశబుద్ధి
గ్రక్కున నీకు నె - క్కడ నుండివచ్చె?
రాజీవనయన! మా - రఘువంశమునకు
నీజాడ యపకీర్తి - యేనాఁడు రాదు 1260

అహిత మెన్నఁడునుఁ జే - యవు నాకు నీవు
విహితమె యీమాట - వినరాదు నాకు
నడవుల కే నెట్టు - లంపుదు రాముఁ
బడఁతి రాముఁడు నీకు - భరతుండు వేఱె?
నగరిలో నున్న క - న్యల నొక్కరైన
మగువ రాముని కెగ్గు - మదిఁ దలంపుదురె?
ఎంచిరే యపవాద - మెవ్వార లైన
మంచివాఁడను నట్టి - మాటయే కాక
గురుల శుశ్రూషచే - కోదండవిద్య
నరినృపాలకుల మ - హాప్రదానముల 1270
దీనుల మనల భ - క్తినిఁ దనియించు
వానికిఁ గీడాడ - వలదెట్టి యెడల
దమము సత్యమును కృ - తజ్ఞత నేర్పు
శమము నహింసయు - శౌర్యంబు మొదలు
నానాగుణముల ను - న్నతుఁడు కౌసల్య
సూనుండు గాన నె - చ్చో నాకు నతఁడె
గతిగాక వేఱొండు - గతిలేదు నాకు
వెతలెల్ల మాన్చి చే - విడక రక్షింపు
రాముని కీవ శ - రణ్యవై నాదు
సేమంబు వదలక - చేపట్టు మమ్ము 1280
యేమి కావలసిన - నిత్తుఁ గట్టెదుర
రాము నుండగ నిమ్ము - రాజీవనయన!"
అని పల్కు దశరథు - నదలించి కైక
యనుకంప లేక యి - ట్లని పల్కెనపుడు,
"అనఘ! నావలన దే - వాసురయుద్ధ

మున నీవు బ్రతికి యొ - ప్పునె కల్లలాడ?
మనువంశనృపులు ప్రా - మాణికు లట్టి
యనఘుల కపకీర్తి - యయ్యె నీకతన
పాప మసత్యంబు - పావనాన్వయముఁ
బ్రాపింపఁ జేసితీ - పట్టునకు నీవు 1290
వరములు మునుపిచ్చి - వచనంబు దప్పి
పరిహరించి యధర్మ - పరుఁడవైనావు
రాజర్షివరులు నే - రము మోపి పలుక
నేజాడ నుత్తరం - బిత్తువో నీవు?
పోనిమ్ము తనకేమి? - బొంకితి ననుము
దాన నేమిగొఱంత - తలఁతు వామీఁద
త్యాగియై శిబి కపో - త నిమిత్తముగను
డేగకు మేను వేఁ - డిన నిచ్చెమున్ను
అంధకుఁడైన బ్రా - హ్మణునకు తానె
యంధుడౌచు నలర్కు - డక్షులొసంగె 1300
నీరాకరము దప్పు - నే పొలిమేర?
యోరాజ! నీతప్పు - లొకరు దీర్చెదరె?
యిచ్చినట్టి ప్రతిజ్ఞ - యెంచి సద్గతికి
నిచ్చెన యగు సత్య - నిరతిఁ గైకొనుము
నీవు బొంకెద నన్న - నిజమతింజేసి
నీవంశ నియమంబు - నిలపక మాన
కొడుకుఁ బట్టము గట్టి - కూరిమిఁ గలుగు
పడఁతిఁ గౌసల్యఁ - జేపట్టి దబ్బఱకు
నొడిగట్టి నాకు ధ - ర్మోపదేశములు
విడువక పలికిన - విడువ నాప్రతిన 1310

రాముఁ బట్టము గట్ట - రాజసవృత్తిఁ
దా మీఱు కౌసల్య - తరి చూచి పోయి
చేతులు మొగిచి కొ - ల్చి యడంగి యుండి
జీతంబు వేఁడి గా - సిలు నంతకన్న
కణములో గరళభ - క్షణముఁగావించి
తృణమాత్రముగ వెత - దీఱిపోవుటయె
మేలు మాభరతుని - మీఁదటి యాన
చాలు నీతోడి సం - సర్గంబుఁ దనకు"
అని యాగ్రహంబు చే - నతిఘోరమైన
తనప్రాణ సదృశుఁడౌ - తనయుని మీఁద 1320
నానవెట్టిన వజ్ర - హతిఁబలె మేను
మ్రానుపడంగ సొ - మ్మసిలి మూర్ఛిల్లి
యవనిపైఁబడి మాట - లాడక యుండి
యవనీశ్వరుఁడు ధై - ర్యసహాయుఁ డగుచు
గోరలూడ్చిన బుస - కొట్టు సర్పంబు
మేర "యీకైక యే - మిటి కిట్టులయ్యె?
యెవ్వతె చెప్పెరా - యీబుద్ధి దీని
కివ్వేళ నేమియు - నెఱుఁగ లేదయ్యె
దయ్యెంబు సోఁకెనో - తనయదృష్టంబు
పయ్యాడి దీని నె - పంబైన యదియొ" 1330
అని తెల్వి నొంది తా - నాకైకఁజూచి
మనుజ నాయకుఁడు క్ర - మ్మఱ నిట్టులనియె,
"పడుచు దనంబుచే - భామిని! నీవు
చెడుబుద్ధి యెవ్వతె - చే నేర్చినావొ
భరతునికిని నాకుఁ - బ్రజలకు సేమ

మరలేక కావింప - నాశించె దేని
మాను మీ పలుకు నీ - మాట చేధరణి
తానేలునే భర - త కుమారకుండు?
రాముని కన్నఁ దీ - ఱని ధర్మయుక్త
మై మించె నేని నీవ - డిగిన వరము 1340
హితమని నామది - నెంచి కారుణ్య
మతిశయించి భయంక - రారణ్యములకుఁ
బొమ్మని తమము గ - ప్పు శశాంకుఁడనఁగ
నమ్మాటకు వివర్ణ - మైన రాఘవుని
మొగమెట్లు చూతును - ముచ్చట మంత్రు
లగు వారితోఁదెల్పి - యందఱు వినఁగ
రాముఁజేసెద యువ - రాజు నేనన్న
యామతి రిపులచే - హతమైన యట్టి
బలము బో విడిచిన - పగిదిఁ బోవిడిచి
తలఁపులో నిట్టి యు - త్సవము చూడంగ 1350
వచ్చు దిక్కుల రాచ - వారలు తోడ
యిచ్చటిపెద్దల - నిందఱితోడ
రాముని మీఁద నే - రంబేమి యనిన
నేమని యుత్తర - మీనేర్చు వాఁడ
నీమాట చేత వ - నీప్రదేశముల
రాముఁ బొమ్మనుట ధ - ర్మము సత్యమైన
పట్టంబు గట్టెద - పట్టి నేనన్న
యట్టిమాటల సత్య - మై పోవకున్న
కౌసల్యఁజేరి యే - గతి మోముఁజూతు? 1360

నాసాధ్వి గుణము నీ - వరయ కున్నావె
పరిచర్య లొనరించు - పట్టున దాసి
యొరిమె నెచ్చెలి లాల - నోపచారములఁ
బడకల నలరించు - పట్టున వేశ్య
కడు నగ్నిహోత్రాది - కములందు పత్ని
సోదరి మేలు రాఁ - జూచు కార్యముల
నాదు మెచ్చగు భోజ - నములందుఁ దల్లి
యాలోచనము లందు - ననురూప ధర్మ
శీలంబులందు నా - చేయూఁతకోల 1370
పలుకులెల్ల ప్రియంబె - పలుకు నాకెపుడు
తలఁపులెల్ల హితంబె - తలఁచు నాకొఱకు
రామునిఁ బాసి యో - ర్వదు నన్నుఁబోలి
యా మానవతి నెట్టు - లార్తిఁ బాల్వఱతు
రోగికి పథ్యంబు - రుచియింప నటుల
యా గుణవతి నెంచ - నైతి నీకొఱకు
నెఱుఁగక నిన్ను నే - నిఱుపెంపు చేసి
పరమ పతివ్రతా - భరణమైనట్టి
కౌసల్య నరసేయు - కలుష మీరీతి
నాసన్నదుఃఖమై - యనుభూతమయ్యె 1380
వనికి రామునిఁ బంపు - వార్త దావినిన
తనమది నేమని - తలఁచు సుమిత్ర?
వనభూములకు రఘు - వరుఁ డేఁగఁజూచి
తనపాటు గాంచి సీ - తావధూమణియు
హిమవంతమునఁ బతి - నెడవాసి యార్తి

దమకించు కిన్నర - తరుణియుంబోలి
యెంత చింతిల్లునో! - యెవ్వ రూరార్తు
రింతేల? శ్రీరాము - నెడ బాసి నపుడ
తనమేనఁ బ్రాణముల్ - తడవుగానుండ
వనుమానమేల? నీ - వా తరువాత 1390
భరతునిఁ బిలిపించి - పట్టంబుఁగట్టి
ధరణి వాలింవు పా - తకురాల వగుచు
కానక విషముతోఁ - గలయు మద్యంబు
పానంబు చేసి యా - పద నొందురీతి
యాలుగా యని నమ్మి - యపమృత్యువైన
పోలని నీతోడి - పొందు చేసితిని
కపటగీతమున మె - కంబు వంచించు
నిపుణత చేత తే - నియ పూయుకత్తి
కైవడి నీవు చ - క్కని మాటలాడి
యీవేళఁ జెఱచితి - వినవంశ మెల్ల 1400
కలుద్రావు విప్రుని - గతిఁ గన్న కొడుకు
ములుచనై నీకు న - మ్ముక పోవునన్ను
నొకరైన దిట్టక - యుందురో! రాముఁ
డొకరికిఁ గాని వాఁ - డో! యిట్లు వలుక
తన పురాకృత దురి - తంబుల చేత
తనుఁ గట్టుటకు త్రాళ్లు - తాఁదెచ్చినట్లు
చెడఁగోరి నిన్ను దె - చ్చితిఁ బెండ్లియాడి
పడఁతి బాలుఁడు పాముఁ - బట్టినయట్లు
పాపాత్ముఁడగు నాకుఁ - బట్టియై రాముఁ
డాపదలనుఁ జెంది - యనద గావలసె 1410

యాలిమాటలు విని - యధముఁడై బ్రదుకు
బ్రాలుమాలె నటంచుఁ - బలుకరే నన్ను
మొన్నఁ జేసితిని రా - మునిఁ బెండ్లి సీత
చిన్నారి పాయంవు - సిగ్గరి వీరి
నింత చింతల ముంచి - యీపాటు వఱప
నింతి! నీకును నాకు - నేగతు ల్గలవొ?
అడవికిఁ బిల్చి పొ - మ్మని పల్క నపుడె
గడియైన నిల్వఁ డి - క్కడ రఘూద్వహుఁడు
అందుకు నేఁబోన - ననుఁగదా! రాముఁ
డెందు నంతటి పుణ్య - మేను సేయుదునె? 1420
అటులైన సంతోష - మంది యేనుందు
నటువంటి వాఁడు గాఁ - డా కుమారకుఁడు
బ్రదికింపఁడే నాదు - పల్కు మీఱినను
హృదయ వర్తన మాతఁ - డెఱుఁగు టేలాఁగు!
అపవాదముల కోర్వ - వసువులు మేన
నపుడు మావారల - నందఱ నీవు
యేమేమి సేయఁగా - నెంచితోఁ దాను
రాముండు నెడవాయ - రమణి కౌసల్య
శోకవారాశిలో - సుడి గొనుచుండ
నీకడ చూచి స - హింపఁగలేక 1430
ననుగమనము సేయు - నపుడు సుమిత్ర
తనయుల మువ్వురిఁ - దమ్ముమువ్వురను
యిన్ని యార్తుల ముంచి - యిలయేలు మీవు
కన్నబిడ్డఁడు నీవు - కైక నెమ్మదిని
నాచేత నాయగ్ర - నందను చేత

నేచి వన్నియ కెక్కు - నిక్ష్వాకు కులము
చెఱుపుమ నీమాట - చేసి నట్లైన
భరతునిచే నొల్లఁ - బరలోకవిధులు
పగదాయు మపకీర్తి - పాలైతి నిట్టి
మగువ చేపట్టి నీ - మది గాననైతి 1440
రాముఁ డశ్వములపై - రథముల మీఁద
సామజంబుల నెక్కి - చనువాఁడు నేఁడు
పాదచారంబునఁ - బ్రబల కంటకిత
పాదపావృత వనీ - పర్వతావనుల
వసియించు నెట్లు? సు - వారంబు వారు
పొసఁగ వండిన వంట - భుజియించువాఁడు
కందమూల ఫలాది - కములు సేవించి
యందునే క్రియ దృప్తుఁ - డయ్యెడువాఁడు?
కాషాయములను వ - ల్కలముల మౌని
వేషంబుతో నెట్లు - విహరింపఁజాలు? 1450
పఱపుల మీఁదటఁ - బవళించు భోగ
పఱపైన తృణశయ్యఁ - బవళించునెట్లు?
చంద్రశాలికల ని - చ్చల నుండు రామ
చంద్రుఁడే గతి పర్ణ - శాలలనుండు
నేమంచు బల్కితి - వీ వేఁడిపల్కు
లేమానవులును స - హింతురే వినిన?
కామినులందరు - కఠినాత్ములనుట
యీమేర తలదాఁకి - యిక సరివచ్చె
రామునేఁబాయు కా - రణమున సుతుల
భూమిపై తండ్రు లె - ప్పుడు వదలుదురు. 1460

పతులఁ గైకొన రెందు - పడతులుఁ నీదు
కతనచే నిలకెల్ల - కట్టడయయ్యె
మగువ! జయంతస - మాను శృంగార
ముగ నిప్పుడలరు రా - మునిఁ జూచిజూచి
యడవికిం బొమ్మని - నల మున్న మేన
విడువకున్నవి ప్రాణ - వితతి చూచితివె?
వానలు గురియించు - వాసవుఁ బాసి
భానునితోఁ నెడ - బాసి లోకముల
వ్యాపారమది ధ్రు - వంబైన నౌఁగాక
నోపవు మేనిలో - నుండఁ బ్రాణములు 1470
రాముఁ బాసిన నీ ధ - రాజనావళికి
నీమేర నాచంద - మెఱిఁగింపనేల?
నేఁడేల తునియరో - నీ నాల్క యిట్టి
వేఁడి పల్కులు పల్క - వినరాని వెల్ల
యెలనాఁగ! యేమియు - నెఱుఁగని రాముఁ
జలపట్టి వెతఁబెట్ట - సమకట్టినావు
నీవెటు వోయిన - నేమిట్టులైన
నీవేల మారాము - నికి దాయవైతి
కులమెల్లఁ జెఱుచు నీ - కు హితంబు చేసి
కులదీపకుని రాముఁ - గొదవ సేయుదునె? 1480
యీకత్తి మీఁది సా - మేల? నీవేల?
నీ కీడుబుద్దు ల - న్నియు నిన్నెముంచె
విడిచితి నిఁక నిన్ను - వేఁడితి వేని
విడుతు బ్రాణములైన - విడువ రాఘవుని
యేల? నీకీ చలం - బీబుద్ది మాని

బాల! మాయందుఁ గృ - పాదృష్టి యునిచి
కోపంబు మాని నా - కొఱకు నీతప్పు
సైఁపుము మదిలోఁ బ్ర - సన్నతనొంది
నాయాన నడువుము - నాయాన యిత్తు
నీయాస వేఁడిన - నీదు కోరికలు " 1490

—: దశరథుఁడు సంతాపమును బొంది శోకించుట :—



అని కైకపదముల - యండఁ బ్రణామ
మొనరించి దీనుని - యోజ నెవ్వారు
లెమ్మను వారలు - లేక దుఃఖమున
సొమ్మసిల్లుచును వ - సుంధరమీఁద
సేయు పుణ్యంబులు - చెడి దివినుండి
యాయెడఁ బడిన య - యాతియుంబోలి
వ్రాలిన ధర్మాల - వాలు భూపాలు
నా లోలనయన యొ - య్యన సేదఁదేఱ్చి
వరము లంతఁ దలంచి - వసుధపైఁ బొరలు
శిరమెత్తి తొడలపైఁ - జేర్చి యూరార్చి. 1500
కులిశాహతునిఁ బట్టి - కొఱవులుఁ జూఁడు
పొలుపున కైక తెం - పున నిట్టులనియె.
"సూనృతవాదివి - శూరవర్యుఁడవు
మాననీయుండవు - మానుషనిధివి
కల్లలాడవు నాదు - గారాబు ప్రాణ
వల్లభుండవు దృఢ - వ్రతుఁడ వేలయ్య?
యిచ్చెద నను వరం - బిమ్మన్న వేగ
నిచ్చితి ననక నీ - విన్ని నేరుపులు

న్యాయ నిష్ఠురములు - నయగారి వగలు
సేయుచు నన్ను వం - చింపఁ జూచెదవు 1510
యిచ్చెదవో లేదొ - యిఁక నొక్కమాట
యుచ్చరింపుఁడు రాముఁ - డున్నాఁడు నీకు
కౌసల్య యున్నది - కడమ వారేల?
వేసాలు చాలించి - వినఁ బల్కుఁ”డనిన
విని మహీపతి కోప - విహ్వలుం డగుచు
కనలుచు కైకేయిఁ - గాంచి యిట్లనియె.
"సుందరి! యొక రాక్ష - సుండు మీతల్లిఁ
బొందు నప్పుడు నీవుఁ - బుట్టితిగాన
నిజము కైకయ విభు - నికిఁ బుట్టవీవు
సుజనుఁ డాతఁడు నిన్ను - చూడంగరాదు 1520
కైకేయి! యమరలో - కమునకు నేఁగ
నాకడ నున్న పు - ణ్యాత్ములందఱును
లక్ష్మణాగ్రజుఁ గుశ - లంబు వేఁడినను
పక్ష్మలేక్షణ! - యేమి పల్కెడువాఁడ?
తాళుదు నేరీతి - తపములు చేసి?
చాల దక్షణ లిచ్చి - సవనంబు నెల్ల
కావించి కడపటఁ - గన్నట్టి కొడుకు
నేవగ నీకొఱ - కేఁ బాయనేర్తు
దారుణశౌర్యు జి - తక్రోధు మిగుల
నూరువుగలవాని - నుత్పలశ్యాముఁ 1530
గమలపత్రాక్షు రా - కాచంద్రవదను
నమలినమానసు - నాజానుబాహుఁ
గరుణాభిరాము జ - గజ్జనాధారుఁ

బరమపావను నీతి - పరు సత్యసంధు
రాముని కనుఁబ్రోల - ప్రాణముల్ చనక
యీమేన నిందాక - యెససియున్నపుడె
యేమేమి చూతునో - యేల పెంచెదవు!
వామాక్షి! లోకాప - వాదంబు తనకు
చాలించవే”యని - చాల శోకమున
నాలిమాటలకు లో - నై విలపించ 1540
జనపతి కవసాన - సమయంబు వచ్చె
నని తెల్పుగతిఁ గ్రుంకె - నర్కబింబంబు,
దశరథు చిత్తవృ - త్తము ధాత్రికెల్ల
విశదమౌ కరణిఁ బ - ర్వెను తిమిరంబు
సాంద్రకళావిలా - సముల సంపూర్ణ
చంద్రుఁ దెచ్చియు - రామచంద్రుఁ దలంపు
జనపతి యాహ్లాద - సహితుండు గాక
మనసును సత్యంబు - మల్లుఁబోరాడ
వెడమతియై మిన్ను - విఱిగి పైఁబడిన
వడుపున నేమియు - వాకొనలేక 1550
దిక్కులు గగనంబుఁ - దేఱికన్గొనుచుఁ
గక్కసంబున రోగి - గతి నారటించి
"ఓరాత్రి! నీవు మా - యూరిలోఁ దెల్ల
వారకి ట్లుండంగ - వలెఁ జుమీ" యనుచుఁ
గరమెత్తి మ్రొక్కుచు - "కైకేయి! మొగము
పరమపాతకము చూ - పకుమీ" యటంచు
దీనుఁడై "చిత్తంబుఁ - ద్రిప్పవే చెలియ?
చానోప" ననుచు నం - జలి ఘటింపుచును

“దయఁజూడు మిది యాడి - తప్పుటల్ గాదె
నియతితోఁ గొల్వులో - ని జనంబు లెల్ల 1560
వినఁబల్కు నభిషేక - వృత్తాంత మింత
యనుమానమగునేని - యప్పగించెదను
రాముని చరణసా - రసయుగంబులకు
నోమానవతీ! నీవె - యునుపు రాజ్యమున
కాదేని రాము ని - క్కడి నుండనిచ్చి
నీదు పుత్రకునైన - నిలుపు పట్టమున
నటులైన సంతోష - మందెద వీవు
కిటుకులన్నియుఁ దీఱు - కీర్తి చేకూరు”
అని కరంబుల వ్రాల - నదలించి త్రోచు
వనిత యీసున మహీ - వరుఁడు మూర్చిల్లి 1570
క్రమ్మఱ నిలఁబడి - కాలునుం గేలు
నెమ్మేనుఁ గదలింప - నేరక యుండి
మందర నెమ్మోము - మాడ్కి నెత్తమ్ము
లందంద వికసిల్లి - యలులఁబోషింప
ఆవేళ వైతాళి - కావళి వచ్చి
భావించి గీతప్ర - బంధవైఖరుల
"తెలవాఱె! దశరథా - ధిప! మేలుకొనుము
కొలువిమ్ము రాజన్య - కోటికి నెల్ల
పట్టి రామునిఁగట్టు - పట్ట మీప్రొద్దు
పట్టయినావు శో - భనముల కెల్ల” 1580
అనువారి మాన్చి హ - స్తాభినయంబు
జనపతి జేసి వి - షాదంబు తోడఁ

దరిలేని యట్టి చిం - తాసాగరమునఁ
బొరలుచోఁ దపనుండు - బొడమె తూఱుపున.

—: రాజు రాము నడవికిఁ బంప నిశ్చయించుట :—


అప్పుడు కైకేయి - యవనీశుఁ చూచి
"ఒప్పునే యధిప! నీ - వొసఁగితి నన్న
వరము లే నడిగిన - వసుధపై నిట్లు
పొరలుచు సత్యంబుఁ - బోకడపెట్టి
లేవక కులమున - లేని లోభమున
నీవుండవచ్చునే - యింతమర్యాద 1590
యేలతప్పెదు? సత్య - మే ముఖ్యధర్మ
మాలింపవే పెద్ద - లాడుకొనంగ
సత్యంబె బ్రహ్మంబు - సత్యంబె శ్రుతులు
సత్యంబులో నిల్చె - సకలధర్మములు
కావున నీవు నా - కతన మేలొంది
నావరంబు లొసంగి - నయశాలి వగుము
మాట లేమిటికి? ము - మ్మాటికి నీకు
చాటి చెప్పెదను నీ - చందంబుచూచి
నీవు చూచుచునుండ - నేఁడె ప్రాణములు
నీవశంబుఁగఁ జేసి - నిన్ను మెప్పింతు 1600
పొమ్మీవు నాఋణం - బున మెచ్చి మెచ్చి
యిమ్మన్న నీయక - యిందందుఁగాక”
యని తూలపోనాడ - నమ్మహామహుఁడు
తనదైన సత్యంబు - దామెనత్రాళ్ల
కైవడి తను నంటఁ - గట్టి వామనుని

కైవసంబయి బలి - గట్టు వడ్డట్టు
నేమియు నన లేక - యెంత లేదనుచు
నామాటఁ బలుక స - మర్దుండుఁగాక
చంచలహృదయుండు - సత్యాపదేశ
వంచితాత్మకుండు వి - వర్ణముఖుండు 1610
నై కాఁడిమ్రాఁకుతో - ననడు హంబున్న
జోకఁ దప్పించుకో - చొప్పేమిలేక
యతిశయదుఃఖంబు - నంది యాధర్మ
రతుఁ డిట్టులనియె నా - రమణి నీక్షించి.
"అగ్నిసాక్షిగఁ బెండ్లి - యాడిన నిన్ను
నగ్నిఁగ్రాగిన చని - యటులఁ జేవిడుతు?
భరతుని నిట మున్న - పారవైచితిని
హరిహరి! యెంత సా - హసము చేసితిమి
అల వసిష్ఠాదు లీ - యభిషేకమునకుఁ
బిలువ వత్తురు రవి - బీరెండ గాసె 1620
అభిషేకవస్తు స - మస్తసామగ్రి
నభిమానధనుఁడు - నా యగ్రనందనుఁడు
రాముఁడు విడ నుత్త - రక్రియల్ దనకు
నేమించి కామించు - నీపూన్కి చేత
ఆరాము భాగ్య మి - ట్లగుటకు బొక్కు
పౌరుల శోకమేఁ - బరికింపఁజాల"
ననునంత ప్రొద్దు జా - మయ్యె నవ్వేళ
కినిసి కైకేయి శం - కింపక పలికె.
“అనఘ! విషప్రాయ - మైన యీమాట
యననేల నా హృద - యము చూచుకొఱకు 1630

నిక్కడికినిఁ బిల్చి - యేఁ జూచుచుండఁ
గ్రక్కున రామునిఁ - గానల కనుపు
భరతునిఁ బిలిపించి - పట్టంబుగట్టఁ
గరుణించి ముద్ర యుం - గర మిమ్ము నాకు
పగదీర్పు"మను వేఁడి – పలుకు గర్ణములఁ
బొగలెచ్చ ములుకులఁ - బొడిచినం గెరలు
తురగంబు గతిఁ గైక - తోఁ దొట్రుపడుచు
నరపతి చాల దై - న్యమున నిట్లనియె.
“ఏల యిట్లాడెద - వేనోర్వఁజాలఁ
జాలు మన్నింపు మ - జ్ఞానంబు గప్పె 1640
తెలివియుఁ దప్పె నెం - తే సొమ్మసిలుచు
నిలువ నేరదు మేను - నిమిషమాత్రంబు
మారాముఁ జూడంగ - మనసయ్యె నిపుడు
మీఱి వాకొనకు మే - మియు నింకమీఁద”
అనుచుఁ గన్నులు మూసి - యంతరంగంబు
తన యధీనము గాక - తలఁకుచున్నంత
యరుణోదయమునంది - యల వసిష్ఠుండు
సరయువునకు నేఁగి - స్నానం బొనర్చి
నందఱు శిష్యులు - నభిషేకవస్తు
బృందంబుతోడ సం - ప్రీతి నేతేర 1650
సుందరాలంకార - శోభితం బగుచు
బృందారకపురంబు - పెంపు రెట్టించు
నగరంబు సొచ్చి యా - నరనాథచంద్రు
నగరు ప్రవేశించి - నాల్గువాకిళ్లు
చొచ్చి పోవ సుమంత్రుఁ - జూచి "యేమిటకు

వచ్చినామని తెల్ప - వలయు రాజునకు
గంగోదకంబు సా - గరతీర్థములును
బంగరుకుండలఁ - బట్టియుంచితిమి
పావనంబగు నుదుం - బరపీఠ మిపుడు
గావించియున్నది - కనకాసనమ్ము 1660
నానావిధములధా - న్యములు గంధాక్ష
తానూనమాల్యాంబ - రాభరణములు
కన్నియ లెనమండ్రు - గంధేభ మొకటి
యున్నత తురగంబు - లొకనాల్గుగట్టు
నరదంబు ఖడ్గబా - ణాసనాస్త్రములు
వరవాద్యనిచయంబు - వ్యాఘ్రచర్మంబు
హోమపదార్థంబు - లుత్తమాశ్వంబు
శ్రీమీఱు నవరత్న - సింహాసనంబు
ధవళాతపత్రంబు - తపనీయకలశని
వహముల్ భూషణా - న్వితవృషభంబు 1670
నుభయచామరములు - నుచితపట్టంబు
శుభకరంబులగు ప - క్షులు మృగంబులును
ఆవులు ఋత్విజు - లాచార్యవరులు
భూవరులు నమాత్య - పుంగపుల్ భటులు
వారకామినులుసు - వర్తకుల్ నటులు
పౌరులు మున్నుగాఁ - బట్టాభిషేక
వరవైభవము చూడ - వలసి సమస్త
వరవస్తువులతోడ - వచ్చి యందఱును
కాచియున్నారు వే - గమ దశరథుని
మాచెంగటికిఁ బిల్వు - మా" యని పనుప 1680

ఆ సుమంత్రుఁడు రాజు - నభినుతింపుచును
భూసురవృద్దు నా - ప్తుని జోడుగూడి
యిరువురుగా లోని - కేఁగి యా యంతి
పురము వాకిలి దూరి - పోవుచునుండ
వారలు సంతోష - వార్తఁ దెల్పంగ
నారాజు సన్నిధి - కరుగుట నెఱిఁగి
వాకిట గొల్లలు - వలదని నిలుప
రాక యూరక యుండ - రాజు చెంగటికి
వచ్చి మిక్కిలి దుర - వస్థచే నునికి
యిచ్చలో నేమియు – నెఱుఁగక సౌఖ్య 1690
పరవశుం డగుటఁగా - భావించి చేర
నరిగి "ఓ భానువం - శాంభోధిచంద్ర!
ధాతను నిగమముల్ - ధరణీధరారి
మాతలియును నంశు - మాలియు శశియు
వసుధను మేల్కొల్పు - వైఖరి మేము
వసుధేశ! మీనిద్ర - వారింపవలసె
చేరితి మిటకొల్వు - సింగార మగుఁడు
తీరుపుఁ డిఁక నామ - తీర్థాదికములు
మేరువుపై నుండు - మిహిరునిం బోలి
సేరుఁ డుజ్వలరత్న - సింహాసనంబు 1700
చంద్రసూర్యులు రుద్ర - శమన కుబేరు
లింద్రాగ్ని వరుణాదు - లేవేళ నీకు
జయమంగళంబులు - సమకూర్పఁగలరు
రయము మీఱఁగ లేచి - రావయ్య నీవు
మీకును మాకును - మేదినికెల్ల

ప్రాకటశోభన - ప్రభవ మైనట్టి
యీరాత్రి గడతేరు - నినుఁ డుదయించి
చేరెను సంకల్ప - సిద్ది వాసరము
అభిషేకసామగ్రి - యాయత మయ్యె
విభవసంపన్నయై - వెలసె నయోధ్య 1710
చేరియున్నారు వ - సిష్ఠాది మునులు
శ్రీరామపట్టాభి - షేకంబు చూడ
యెదు రెదురులు చూచి - యెల్ల వారలును
మదిలోన నానంద - మగ్నులైనారు
రవి లేనిదినము సా - రథి లేనిరథము
కవి లేనికీర్తి యం - కము లేనిపోటు
ప్రతి లేనివాదు తీ - ర్పరి లేనిసేన
ధృతి లేనితెగువ కూ - రిమి లేనిచెలిమి
దొర లేనిసీమ చం - ద్రుఁడు లేనిరాత్రి
తరి లేనిసంధ్య మం - త్రము లేనిజపము 1720
సతి లేనిగృహము వా - సన లేనిపువ్వు
భృతి లేనికొలువు కో - యిల లేనివనము
శ్రుతి లేనిపాట శూ - రులు లేనికోట
కత లేనిరచన ని - ల్కడ లేనిమాట
యెల్లడ వృథయైన - యెన్నికగాక
యెల్లవారలు గూడి - యేమిటివారు?
విచ్చేయుఁడ" ని పల్క - విని విననట్ల
యిచ్చలోఁదనఖేద - మినుమడి గాఁగ
కనువిచ్చి చూడ క - గ్గలమైన యార్తి
మునిఁగి 'యోయి! సుమంత్ర - మొదట నామనసు 1780

మిగుల నొచ్చినది యా - మీఁదట నీవు
పగవానివలె వాఁడి - బాణముల్ మేను
నాఁట నేసిన రీతి - నామదినొవ్వ
మాటలాడెదవేల? - మానుమీ" ననిన
గజగజ వడఁగి వె - న్కకు వెన్క వచ్చి
బుజముల చేతులు - పొదువుక మొదిగి
యున్నచో కైకేయి - “ఓయి సుమంత్ర!
నిన్నట నుండియు - నిద్దురలేక
సంతోషమున వేగు - జాము పర్యంత
మెంతయు వేగించి - యింతకు మునుప 1740
నిద్రించు కతమున - నిను నొవ్వఁబలికె
భద్రాత్ము మనరామ - భద్రు నిచ్చటికిఁ
బిలిపింపు చూడంగఁ - బ్రియమయ్యె నాకు
సలలితమంగళా - చారసంపన్ను
నిప్పుడె తోడితె - మ్మేల తామసము
తప్పకుండఁగ ముహూ - ర్తము పంపవలయుఁ
బొ"మ్మన్న సంతోష - మున నాతఁడరసి
కమ్ముకజనులెల్లఁ - క్రందుగాఁజూడ
వనధి తరంగముల్ - వడిఁద్రోచివచ్చు
ననుపమంబైనను - హామీన మనఁగ 1750
సందడిఁ ద్రోయుచుఁ - జని రఘువీరు
మందిరంబునకు సు - మంత్రుండు రాఁగ
నెదుర వసిష్ఠుండు - నెల్లరాజులునుఁ
గదిసి "సుమంత్ర! యె - క్కడకు నేఁగెదవు
అభిషేకవస్తువు - లన్నియుంగూర్చి

విభుని యాగము నందు - వీక్షించి యేము
కాచియుండంగ ది - గ్గన నీవు మమ్ము
చూచియుం జూడక - జుణిఁగి వోయినను
మామనవులు దెల్ప - మఱివేఱె యెవ్వ
రేమేర మాకొల్వు - లెక్కు రాజునకు” 1760
అనిన సుమంత్రుఁ డి - ట్లనియె "మీరెల్ల
ఘనులు పూజ్యులు రాజుం - గారికి నగుట
యెఱుఁగుము రాముని - నిచటికిఁ బిల్వ
నరుగుము నీవన్న - నమ్మహీవిభుని
ఆనతిం జనియెద - నైన నేమయ్యె
గానిండు పోయి మీ - క్రమము దెల్పెదను"
అని గిఱుక్కున వార - లనుపంగ మఱలి
చని కేకయతనూజ - సదనంబుచేరి
రాజుమంచముపై కు - రాడంబు చెంత
రాజిల్లు పట్టు తె - రయ వెలిగాఁగ 1770
నుండి తన్నెఱింగించి - "యోమహీనాథ!
మండలాధిపులును - మౌనిపుంగవులు
పనిపూని నీ విన్న - పము సేయుమనిరి
చనువాని నరికట్టి - సందడింపుచును
నందఱి తో నేమి - యందు" నటన్న
యందుకు దశరథుం - డతని కిట్లనియె,
“రామునిఁ దోడితే - రఁగ నేము పనుప
ఆమాట మఱచి నీ - వటువోయివచ్చి
బనికిమాలినవారి - పలుకులు దెల్ప
పనిపూని యిటకు రాఁ - బరగునే నీవు? 1780

యేలవచ్చితివి? పొ - మ్మిఁక నైన రాము
పాలికి తామసిం - పక పోయి పిలిచి
తొడితెమ్ము వాకిటి - దొరలు నిన్నేమి
యడిగిన వచ్చెద - మని పల్కి రనుము
పొమ్మన” నగరు గొ - బ్బున నిర్గమించి
యమ్మంత్రివరుఁ డయో - ధ్యారాజవీథి
రామునిమేలు వా - ర్తలు గుముల్ గూడి
యేమేరఁ జూచిన - నితరముల్ మఱచి
పలుకు నానాజన - భాషణంబులకు
నలరుచు రాము గే - హము చేరఁబోయి 1790
పసిఁడి హజార ము - ప్పరిగలుఁ జిత్ర
వసనవితానముల్ - వజ్రాలపలక
రాకట్టునేలలు - రంగవల్లికలు
దాకొన్న యపరంజి - తలుపులు మణుల
గోడలు పగడంపు - కొణిఁగెలుఁ కెలని
క్రీడాశుకీ హంస - కేకినీ వ్రజము
కదళికా క్రము కేక్షు - కాండ ప్రకాండ
సదమల స్తంభ రా - జన్మండపములఁ
గర్పూర కౌశుకా - గరుధూపములును
దర్పణమాలికాం - తర బొమరములు 1800
చాంపేయ మల్లికా - సరదివ్యగంధ
సంపదలుం గల్గు - సదనంబుఁ జొచ్చి
కానుకల్ పూనియే - కడగాచియున్న
నానాజనములు మ - న్ననఁ దేఱిజూచి
తనుఁగని లేచి హ - స్తంబులు మొగుచు

జనపాలకులఁ దగు - సరణిమై కొనుచుఁ
గమనీయపర్వతా - కరమయిమ్రోల
నమరు శత్రుంజయ - మనుభద్రగజము
భావించి చతురంగ - బలములు బలసి
త్రోవయీయక యుండ - త్రోపుఁ ద్రోపులను 1810
వచ్చి దాసీకుబ్జ - వామనాంతరముఁ
జొచ్చి ప్రాఁతఱికమై - చుట్టాలగుంపు
ముదుసళ్ల సావడి - మొగదల నిలిచి
చదురాలి నెగ్గడి - సకియ రప్పించ
తనరాక వివరించు - తఱి నదిపోయి
వనజలోచను దీన - వత్సలు రాము
సీతాసమేతు నీ - క్షించి తెల్పుటయు
నాతలోదరి చేత - నతని రప్పింపఁ
దావచ్చి యెదుటఁ బ్ర - ధాన వర్యుండు
రావణహరణకా - రణమైన వాని 1820
జాఱినసిక మీఁది - సంపఁగె సరులు
సూరెల వలపు లె - చ్చుగ నిచ్చువాని
అక్కజంబగుచు ఘు - మ్మని తావు లీను
చెక్కులు జవ్వాది - చిన్నెలవాని
సీతకౌఁగిట నంటి - చెదఱు నెమ్మేనఁ
జాతిన కుంకుమ - సవరణవాని
నున్నని వీడెంపు - నును గెంపుమోవి
జెన్ను మీఱినయట్టి - చిఱునవ్వువాని
సడలని కరుణార - సప్రవాహములఁ
కడవోని నెత్తమ్మి - కన్గవవాని 1830

మగువల హస్తచా - మర మారుతములఁ
దగ నసియాడుకుం - తలములవాని
ధరణితనూజ యం - దములైన తొడలఁ
జరణపద్మంబులు - చాఁచినవాచి
బంగరుమంచము - పై తలగడను
శృంగారముగ మేనుఁ - జేర్చినవాని
నుడిగపుఁ జెలియిచ్చు - నొసపరియాకు
మడుపునకై కేలు - మలచినవాని
వెలఁదియొక్కతె వంతు - విధమునఁ బాడు
జిలిబిలి పాటలు - చెవినానువాని 1840
వలనొప్పు సుఖపార - వశ్యత నిదుర
మెలఁకువ నటమున్న - మేల్కనువాని
చిత్రాసమేతుఁడై - చెలువొందు కుముద
మిత్రు తేజంబున - మించినవాని
శ్రీరామచంద్రు నీ - క్షించి రమ్మనఁగ
చేరిచెంగట నిల్చి - చేతులు మొగిచి
"జలజాతనయన! కౌ - సల్యాకుమార
యిలపతి కైకేయి - యింటిలోనుండి
రామునిఁ బిలుచుక - రమ్మని బనిచె
నామోము చూచి వి - న్నపము చేసితిని 1850
వేగ మీ రచటికి - విచ్చేయుఁ డనిన"
నాగుణశాలి వా - క్యము లాదరించి
యయ్యెడ లేచి శ - య్యనుఁ గూరుచుండి
నెయ్యంబు మైచెంత - నిలిచిన యట్టి
జానకితో రామ - చంద్రుఁ డిట్లనియె.

--: సుమంత్ర పేరితుఁడై శ్రీరాముండు కైకేయి కడకువచ్చుట :--

మానసంబున నను -మానింప కపుడు
అతివ కైకేయి గృ - హంబులోనుండి
క్షితిపతి పిలువఁ బం - చె సుమంత్రుచేత 1860
కౌసల్య యట్లట్ల - కానన్నుఁజూచి
యాసాధ్వి వాత్సల్య - మందు నాయందు
నాయభిషేకయ - త్నంబు మాతండ్రి
మాయింతితోఁ దెల్ప - నతిశయప్రీతి
ననుఁదోడి తెమ్మని - నారు గాబోలు
చనియెద పినతల్లి - సదనంబునకును
కాని కార్యమునకుఁ - గడవానిఁగాని
యీ నయగుణశాలి - నేల పంపుదురు?
ప్రాప్తుండు సత్యసం - పన్నుండు నాకు
నాప్తుండు నగుట నీ - యనవచ్చినాఁడు 1870
అభిషేక మీప్రొద్దె - యగు నేను వారి
యభిమతం బెట్టిదో - యరసి వచ్చెదను
పరిచారకుల తోడ - పరిణామమొంది
తరుణి నీవొక ముహూ - ర్తము నిల్వు మిచట "
అనిపోవ తనకు రా - ననువైన యట్టి
తనగృహంతర ముఖ - ద్వారముఁ గడచి
మొగమఱుంగున నిల్చి - ముచ్చటచేత
మగని నెమ్మోము దా - మర చక్కఁజూచి
“స్వామి యింద్రుని బ్రహ్మ - సకలలోకములు
నేమించి పాలింప - నిలిపినయట్లు 1880

మామామ మిమ్ము స - మస్త ధారుణికి
సేమంబుగా నభి - షిక్తునిఁ జేయు
దిక్కులవాలించు - దేవతల్ నాల్గు
దిక్కుల నిన్ను భ - క్తినిఁ గావఁగలకరు
యాయభిషేక మ - హా ముహూర్తమునఁ
బాయక మృగచర్మ - పరిధాన మొప్ప
నామృగ శృంగంబు - హస్తపద్మమున
సేమంబుతోఁ దాల్చి - నీవుండు నపుడు
దీక్షితుండగు నిన్న దేవ - నేఁజేరి
వీక్షింపఁగలదాన - విచ్చేయుఁడ"నిన 1890
మానవతీమణి - మఱలిపొమ్మనుచుఁ
దాను సుమంత్రుండు - తననివాసంబు
ధారుణీధరగుహాం - తరము సింహంబు
తీరున వెడలి యం - తిక భూమినున్న
సౌమిత్రినాప్తుల - సకలబాంధవుల
సామంతులనుఁగూడి - జనులు సేవింప
వరమణిజ్వాలాల - వాలమధాంధ
కరివరోపమతు - రంగచతుష్కభయద
శార్దూలచర్మచం - చత్పరిస్తరణ
దుర్దాంతరిపు రాజ - దోర్గర్వహరణ 1900
సారధికంబునౌ - స్యందనవరము
నా రామవిభుఁడెక్కి - హైమచామరము
సౌమిత్రివీవ ని - స్సాణరావముల
భూమి యల్లలనాడఁ - బురుహూతు మాడ్కి
వందిమాగధులకై - వారంబు లెసఁగ

ముందర చతురంగ - ములు సందడింపఁ
గరులపై కేతన - కలశాగ్రహతిని
దరణిముఖగ్రహ - తారకల్ చెదర
మేడలపైనుండి - మీనలోచనలు
వాడని పువ్వుల - వానలఁగురియ 1910
చేరి పుణ్యాంగనల్ - సేసలుచల్ల
పౌరుల జయజయయా - ర్బటి మిన్నుముట్టఁ
దనగేహముననుండి - తండ్రిచెంగటికిఁ
జనుచోట మణిమయ - సౌధవీథికల

—: రాముఁడు తండ్రి వద్దకు వచ్చుట :—


కడుపు చల్లంగ నీ - కల్యాణశీలుఁ
గొడుకుఁగాఁగన్నట్టి - కోసలతనయ
యీమహితోత్సవం - బీక్షింపఁదొల్లి
యేమిపుణ్యంబు లె - న్నేనిసేసినదొ?
పట్టభద్రుని రామ - భద్రుని చెట్ట
వట్టి యీసౌమ్రాజ్య - పదవులందుటకు 1920
సీతయేమేమి నో - చినదొ తొల్మేన
నీతనిచరణంబు - లెప్పుడుంజూచి
సేవింస మనము చే - సినయట్టి భాగ్య
మావేలుపులకైన - నదియేలకలుగు?
ఈపుణ్యవర్తనుం - డిలయేల నితని
ప్రాపున నెల్లశో - భనములందుదుము"
అనికరంబులు చాఁచి - "యయ్య! శ్రీరామ!
కనుచాటు లేక యా - కల్పంబుగాఁగ

మీతండ్రితాతల - మిగిలిన యిట్టి
మీతరంబునఁబుట్టు - మిహిరాన్వయులను 1930
నందఱ మించి యీ - యవనిఁ బాలించి
యిందులనయ మార్గ - మిచ్చ నేమఱక
ఆచంద్రతారార్క - మైన సత్కీర్తి
యేచాయవెలయ మ - హీపుత్రిఁగూడి
తల్లితండ్రులమాడ్కి - తమవంటి జనుల
నెల్లను రక్షింపు - మీ"యనిచాల
వినుతులుగావింప - వినియింతయైన
మనసులోనుబ్బక - మన్ననఁజూచి
శోభనద్రవ్యమం - జులములౌవిపణి
వైభవంబులకు భా - వము వికసింప 1940
మౌనిభూసురవృద్ధ - మండలాచరిత
మానితాశీర్వాద - మహనీయుఁడగుచు
బురవీథివచ్చున - ప్పుడు రాముఁజూచి
తిరుగునే మనసులు - దృష్టులు ప్రజకుఁ?
కన్నులు తమకెల్లఁ - గలిగినఫలము
గన్నకై వడిఁజూడఁ - గల్గె నన్వారు
యీ రాముఁ జూడని - హీనులు మనుజ
దానవులనుచు నా - త్మల నెంచువారు
ఆరతులెత్తరే - యదె రామవిభుఁడు
చేరికిగాఁగ వ - చ్చెనటన్న వారు 1950
యీతరి సేవింప - నెఱుఁగనివారు
రాతిపుట్టువులు నీ - రసులనువారు

వమ్మానవుఁడు నింద్యుఁ - డనియెంచువారు
నై జనుల్ నలువంక - ననుచరింపంగ
రాజమార్గమునందు - రఘుకులోత్తముఁడు
సభలును దేవతా - స్థలములుం జూచి
యభిముఖుండై వల - యై వచ్చివచ్చి
చుక్కలుగోరాడు - సున్నపుమేడ
టెక్కియమ్ములు నివ్వ - టిల్లు భూరమణు 1960
నగరిలో కొన్నియం - తరములు గడచి
దిగదిగమను రత్న - దీప్తుల నమరు
కైకేయియింటి చెం - గటఁ దేరు డిగ్గి
వాకిటిముదుసలి - వారి నీక్షించి
వారలు బెదిరి లే - వఁగఁ గనుసన్న
వారించి వెనువెంట - వచ్చు రాజులను
నందర నునిచి తా - నంతిపురంబు
నందు బ్రవేశింప - హరిణాంకురాక
నాసించు జలరాశి - యనఁ దనరాక
ఆసించి సకలసై - న్యము నంతరముల 1970
యేఁడుగాఁగ నిమేష - మెదురులుచూడ
ఆఁడుఁబుట్టువె కాని - యన్యంబులేని
బడిఁదల్లియిలుచొచ్చి - పానుపుమీఁద
బడి దీనుఁడై ముఖా - బ్జము వాడువాఱి
వెలవెలనై కన్ను - విచ్చకచాల
నలసి కైకేయీ స - హాయుఁడై యున్న
తనతండ్రిపదము లౌఁ - దలసోఁక మ్రొక్కి

పినతల్లియడుగులఁ - బేర్కొనివ్రాలి
కరములు మొగిచి చెం - గటనుండునపుడు

—: కైక రామునితోఁ దన యభిప్రాయము జెప్పుట :—


ధరణీశ్వరుండు కం - దామరల్ దెఱచి 1980
చూచి "రామా!" యని - సుతుని నెమ్మోముఁ
జూచుచుఁగడుపులో - చుమ్మలుచుట్ట
పురపురఁబొక్కుచుఁ - బొరలి కన్నీరు
కురియనేమియుఁ బేరు - కొని పల్క లేక
యూరకె మ్రాన్పడి - యున్నట్టితండ్రి
నా రామవిభుఁడు భ - యంబుతోఁజూచి
త్రోవలో పామునుఁ - ద్రొక్కినవాని
కైవడి దిగులొంది - గజగజవడఁకి
“నెన్నడు లేనట్టి - యీదైన్యమేల?
నన్నుఁగన్న నృపాలు - నకుఁగల్గె" ననుచు 1990
పంచేంద్రియంబుల - పాటవంబెల్ల
నించుకయును లేక - యిలవ్రాలువాని
కలఁగిన మనసుతో - కవ్వపుఁగొండ
కలఁకనొందిన వార్ధి - గతి నున్నవాని
రాహుగ్రహంబుచే - గ్రస్తుఁడై యున్న
యాహరిణాంకుడో - యన నొప్పువాని
తడఁబాటుతో నస - త్యంబులుఁబలికి
కడునార్తుఁడగు మౌని - గతిఁబొల్చువాని
భావించియేలకో - పదములవ్రాల
దీవెన లీయండు - దేఱికన్గొనఁడు 2000

యొరులపైఁగినుకచే - నుండియు నేను
దరియవచ్చినఁబ్రమో - దమునొందు నెపుడు
ననుఁజూచియిట్టి దీ - నతఁజింతనొంది
జననాథుఁడేల? ప్ర - సన్నుండుగాఁడు
యేమమ్మ! కై కేయి - యీమహీవిభున
కేమేమి నేరంబు - లేనుచేసితిని
కాననే నపరాధి - గాఁగదా! యితని
కీ నెగులునుఁగోప - మేల జనించె?
ఈ యనఘాత్ముని - నీవైనవేఁడి
నాయెడఁజేయు మ - న్నన నియ్యకొలుపు 2010
యెప్పుడు నాయందుఁ - గృపయుంచు నృపతి
యిప్పుడేల యుపేక్ష - నిటులున్నవాఁడు?
నాతో మృదూక్తులా - నతియియ్యఁడేల?
యీతనిచిత్తమీ - వెఱిఁగియున్నావె?
ఈ రాజునకు సేమ - మేకదా! నేడు
శారీరపీడలె - సంగకున్నదియె?
భరతశత్రుఘ్నుల - పరిణామవార్త
లరసియున్నా రెకా - యమ్మ! వారలను
సేమంబుతో సుర - క్షితులెకా నగర
యీమహీపతి చిత్త - మింతగాసిలిన 2020
సంతోషపఱపక - క్షణమైనమేని
పొంతనుండవు ప్రాణ - ములు తనకిపుడు
తనకు దైవంబును - తండ్రియునైన
జనపతి యిటులుండ - సహియింపఁగలనె?
యెవ్వరీ విభునకు - నెగ్గుగానడచి

రివ్విధమని యాన - తీవమ్మ! తనకు
మదిమదినుండక - మందెమేలమున
నెదురాడి పరుషోక్తు - లీవుపల్కితివొ?
పిలువనంపినరాజు - ప్రియవచనములు
పలుకకయిపుడొక్క - పగిదినున్నాఁడు 2030
హేతువుదెలిసిన - నివ్విధంబనుచు
నాతోడఁదెలుపు మా - నవతీలలామ!”
అన విని కైకేయి - యడఁకువలేక
వినుమని యారఘు - వీరుతోఁబలికె.
"ఈ రాజునకుఁ గోప - మింతయుఁగాన
మేరిపై నేరమొ - క్కింతయు లేదు
వేఱేయున్నది మహీ - విభుని చిత్తంబు
పోరామి నీకు ని - ప్పుడుగలదేని
నీ నిమిత్తంబుగా - నెలకొన్న భయము
మానఁ జేయము తండ్రి - మాట చెల్లించి 2040
అహితంబు నీకు నా - కదియె హితంబు
మహిపాలకుండు ప్రే - మఁబ్రతిజ్ఞ చేసి
యేమనిపల్కుదు -- నితనితో ననుచు
నీమేర మొగమాట - నిటులున్నవాఁడు
యీరాజు తొల్లినాకి - చ్చెనువరము
లోరామ! వేఁడితి - నోడకయిపుడు
నాకునిచ్చితినని - నమ్మికల్ సేసి
ప్రాకృతగతి రిచ్చ - వడియున్నవాఁడు
యేమిసేయుదునని - యిటునటుఁగాక
యీమహీశుని సత్య - మిటులుండఁజేసె మూస:Float right2050

వట్టి యాలోచనల్ - వలవని జాగు
పెట్టుక యిటుల నం - బేద యైనాఁడు
దాఁచ నేమిటికి ? స - త్యంబు రాజునకు
నీచేత నిలుచునో - నిలువదో యెఱుఁగ
జనపాలుఁడిట్టి య - సత్యదోషమున
మునుఁగకుండఁగఁ జేయు - ము కుమార! నీవు
హితుఁడవై చేసెద - నేనంటి వేని
యితనియభిప్రాయ - మెఱుఁగఁబల్కెదను
తగవుతోఁ దండ్రి స - త్యంబు చెల్లించు
తెగువ నీమదిలోన - దృఢమయ్యె నేని 2060
జనసమ్మతంబును - సద్ధర్మమూల
మును పితృనిర్దిష్ట - మును నైనమాట
నీతండు మదిఁగొంకి - యిట్లన కున్న
నీతోడవివరింతు - నిక్కంబుఁగాఁగ
నీమదిఁగానక - నేఁబల్క రాదు
రామ! వాకొను"మని - రాజువినంగ
కట్లిడియై పల్కు - కైకేయి మాట
వెట్టపుట్టఁగతన - వీనులు సోఁక
రామచంద్రుఁడు దశ - రథుఁ డార్తిమునుఁగ
గామిడియై నట్టి - కైకకిట్లనియె. 2070
"ఏలమ్మ! నన్నునీ - విటులాడియిట్టి
యాలోచనలు సేతు - రా వెఱ్ఱితల్లి!
యీ రాజుపనుపుచే - నింగలంబైనఁ
బోరునఁజొత్తునం - బుధిఁబ్రవేశింతు
మ్రింగుదు విషమైన - మిగిలిన వేల?

యింగితంబెఱిఁగింపు - మెఱుఁగవు గాక
అకట! రాముఁడును రెం - డాడునా పనికి
యొకయెడనైననీ - యుల్లంబులోను
కలిగినమాట వే - గమె తెల్పు" మనుచు
నిలువ నాడినబుద్ది - నేరనికైక 2080
సత్యఋజుత్పాది - సద్గుణైశ్వర్య
నిత్యుఁడా శ్రీరాము - నిమ్మోముఁజూచి
"వినుము! రాఘవ! తొల్లి - విబుధాసురలకు
ననియైన యపుడు మీ - యయ్య నాచేత
బ్రదికి వరంబులు - పాలించె రెండు
మదిలోన నిన్నాళ్లు - మఱచియుండితిని
అప్పుదీరువుమని - యా వరంబులకు
నిప్పుడు పదునాలు - గేండ్లు కానలకు
నినుఁ బంపనొక్కటి - నేఁడు మాభరతుఁ
గని మనుపట్టంబు - గట్టుట యొకటి 2090
అడిగిన నిచ్చితి - ననిపల్కి నిన్ను
తడయక పిలిపించి - దాక్షిణ్యమొప్ప
తానాడలేక యీ - దశరథ నృపతి
దీనుఁడై యున్నాఁడు - తెల్పితినీకు
నీవును నీమాట - నిల్పి వంశంబు
పావనంబుగ తండ్రి - పలికిన పలుకు
సత్యంబు గాఁ జేసి - చనుము కానలకు న
త్యంత సంతోష - మందింపునన్ను
డాఁపనేమిటికి ? జ - టా వల్కలంబు
లీప్రొద్ధె ధరియించి - యీవు పట్టంబు 2100

విడిచి పోయితివేని - వేగ నొక్కటియుఁ
జెడకుండు నీయభి - షేకంబు కొఱకు
యీ సంతరించిన - యిన్ని వస్తువులు
దాసి యాభరతుఁ బ - ట్టంబు గట్టుదురు
తనకిచ్చు వరములు - తప్పఁ గారాక
నినుఁజూచి యొకమాట - నేఁడాడలేక
యేమి సేయుదునని - యీచింతచేత
రామ! మీతండ్రి యా - రటము నొందెడును
యిది నిక్కమ"ను మాట - యెప్పుడు వల్కె
నదివిని యప్రియం - బను చింత లేక 2110
చిరధైర్యశాలియై - శ్రీరామవిభుఁడు
దొర వినఁ గైకేయి - తో నిట్టులనియె,

--: కైకతో రాముఁడడవికిఁ బోయెదనని చెప్పుట :--


“తల్లి! మిక్కిలి లెస్స - తండ్రివాక్యములు
చెల్లించితిని నార - చీరలుగట్టి
యిదె చనుచున్నాఁడ - యేను కానలకు
నదియేల ననుఁజూచి - యలరఁడీ రాజు
నాయెడఁ గృపయుంచి - నరనాథు మదికి
నోయమ్మ! సంతోష - మొందింపు నీవు
అకట! రాజట! తండ్రి - యఁట! నాకునట్టి
యకలంక చరితు వా - క్యము సేయుటరుదె 2120
మేలయ్యె నాకు నా - మీఁ దాన నీకు
వేళంబ భరతు నీ - వేళ రప్పించి

పట్టంబుఁగట్టుము - భరతుని కన్న
నిట్టిరాజ్య సుఖంబు - లేఁటికినాకు
నతనికినై ప్రాణ - మైన యేనిత్తు
నితరునిగా నన్ను - నిట్లరచేసి
నీవు వల్కినమాట - నెమ్మదిలోన
నావదిన్నటుల ఖే - దావహంబయ్యె
నేమి యిమ్మన్న నే - నియ్యనే యతఁడు
సామాన్యుఁడే ప్రాణ - సదృశుండు నాకు 2130
యేలమ్మ! యిందుకై - యింతప్రయత్న
మీలీల నొప్పింతు - రే మహీవిభుని
సేదదేర్పుము నన్పుఁ - జేపట్టి రాజు
ఖేదంబు మాన్చి యం - కిలి నొందనీకు
అమ్మ! పోయెద దండ - కారణ్యమునకుఁ
బొమ్మన వలవదీ - భూపతి నన్ను
నీవుపల్కుట చాలు - నిక్కువంబ"నిన
నా వేళ సంతోషి - తాత్మ యై పలికె.
"భయభక్తు లెఱుఁగుదుఁ - బతి యెడఁగలిమిఁ
పయనమై పొమ్ము ద - బ్బర లేదు నీకు 2140
యీరాజు సిగ్గుచే - నిట్టననోడి
యూరకయున్న వాఁ - డోర్చి యింతటికిఁ
కెరలఁడు గుటికెమ్రిం - గిన సిద్ధుఁ డగుచు
తరలఁడు నను కాని - దాసిఁగా జేసి
నినునంప భరతుని - నేఁబిల్వనంపి
తనపూన్కి చెల్లించు - దనుక నీరాజు

నిజమున కాహార - నిద్రలు సుఖము
త్యజియించి చలపట్టి - తలఁకకున్నాఁడు
జాగుసేయక నీవు - క్షణమైన పురిని
వేగంబ చను" మన్న - వేఁడి పల్కులకు 2150
నుర్విపై బడి మూర్చ - నొందిన రాజు
సార్వభౌమునిఁగాంచి - చాలఁ జింతించి
చెంత కొయ్యనచేరి - చేతులు నెత్తి
కొంతయూరట చేసి - కూర్చుండఁ జూచి
తలఁకి కశాహతో - త్తమతురంగంబు
పొలుపున దశరథ - పుత్రుఁడిట్లనియె.
"రమణి! నాకర్థాతు - రత లేదు మౌని
సమచరిత్రుఁడను రా - జహితంబువేడి
యెంతటి కార్యంబు - నేఁ జేయువాఁడ
నెంతటి పుణ్యంబు - లీడు గావనిరి 2160
తల్లిదండ్రులకు చి - త్తములు రామెలఁగి
యుల్లసిల్లుటకు నా - యుల్ల మీ వెఱిఁగి
యిటు లానతిత్తురే - యెఱుఁగకయున్న
పటుబుద్ది నడుగు మా - పార్థివోత్తముని
భరతుండు వచ్చిన - ప్పటికి మీయన్న
చరిత మిట్టిదియని - సమ్మతి వినుము
వేడు మెవ్వరినైన - వేయేల కదలి
నేఁడె పోయెదను వ - నీ భాగములకు
కౌసల్యతో జన - క తనూజతోడ
నో సాధ్వియేఁబోయి - యొకమాటఁ దెలిపి 2170

చనియె" దన నీయను - జ్ఞ యొసంగునాకు
పనివిందు నేనిల్పు - భరతుఁ బట్టమున
నెచ్చరికను భర్త - నెవ్వేళఁగాంచి
మెచ్చురాసేవ నెమ్మెయిఁ - జేయు మనుము
నయ్యచిత్తంబు రా - నశ నాదులందు
నెయ్యెడ భయభక్తి - నీవు వర్తిలుము”
అనునంతలో తాల్మి - యరికట్ట లేక
జననాయకుఁడు రామ - చంద్రుఁ గట్టెదుట
నెలుఁగెత్తి బెట్టుగా - నేడ్చినఁ జూచి
నిలుపోపరాక - తానిలిచితి నేని 2180
తప్పు కార్యంబని - తల్లిదండ్రులకు
నప్పుడ వలవచ్చి -సాష్టాంగ మెరగి
మజిలి చూడక కైక - మందిరంబపుడు
చిఱునవ్వు మోముపైఁ - జిట్టెడ వెడలి
కోపశోకంబుల - గుందు లక్ష్మణుని
చూపుల నూరార్చి - చూచుచోనెల్ల
మొత్తమౌనభి పేక - ముఖ్యవస్తువులు
చిత్తగింపుచుఁ బ్రద - క్షిణముగావచ్చి
లాలిత సామ్రాజ్య - లక్ష్మిఁ బాసియును
శ్రీలెంచి యతులవి - శేషలక్ష్ములను 2190
మేనిచెల్వమర భూ - మియు వైభవములు
మౌనికైవడిఁ బాసి - మదిరంజిలంగ
నే వికారము లేక - యెవ్వరి వెంట
రావలదనుచు ఛ - త్రము చామరములు
బిరుదులు టెక్కెముల్ - భేరిమృదంగ

మురవాదులును మును - మున్ను వారించి
మృదువచనముల భూ - మి జనాళినెల్ల
హృదయ రంజనము వ - హింపఁ జేయుచును
తనవారు మిగుల చిం - తల నొందకుండ
మనసు చల్లఁగ జేయు - మాటలాడుచును 2200
తల్లియింటికి సుమి - త్రా పుత్రుఁగూడి
యల్లన వచ్చుచో - నట మున్నుగాఁక
నగరిలోనున్న కాం - తా జనంబెల్ల
పొగులుచు కైకేయి - బూమెలం దగిలి
అక్కటా! రాజు కామాం - ధుఁ డై నీతిఁ
దక్కి యీయింతికి - దక్కి రాఘవుని
వెడలి పొమ్మను మాట - విని యూరకుండి
వెడబుద్దియై లేని - వెతలఁ బొందెడును
రామునికా యీయ - రణ్య ప్రయాణ
మేమని? విధి నెంత - మెటులోర్వగలము 2210
కౌసల్య మాఱుఁ గాఁ - గనుచుండు మనల
నీ సెఱుంగఁడు మన - మేమి సేసినను
నొరులు గోపించిన - నోర్చిసైరించు
తరతమత్వముల నం - దఱఁ బ్రోవనేర్చు
అనివత్సములఁ బాయు - వట్టిధేనువులు
యనువున విలపించు - నార్తరవంబు
రాజన్యు శోకాగ్ని - రవులు కొల్పంగ
రాజీవనయనులు - రామ లక్ష్మణులు
వినియును విననట్లు - వృద్ధసేవితము
జనిన గృహద్వార - సవిధంబు చేరి 2220

వారు ప్రత్యుద్ధాన - వైఖరుల్ నడప
నారసి మన్నించి -యవ్వలికక్ష్య
భూసురవృద్ధులఁ - బొగడనివారు
చేసిన మంగళా - శీర్నుతులంది
అవలి యంతరమున - కరిగిన నచటి
యువతులు కౌసల్య - యున్నెడకేఁగి
తమరాక వివరింపఁ - దారునువెంట
దమతల్లి యుండు చెం - తకుఁ జేరనపుడు.

—: కౌసల్యతో నడవికిఁ బోయెదనని రాముఁడు చెప్పుట :—



ఆరేయి సకల దేవా - రాధనములు
నారాయణ స్మర - ణములు సేయుచును 2230
ఆదినంబెల్ల బ్రా - హ్మణ సమర్చనము
లాదిత్య చంద్ర బృ - హస్పతి ప్రముఖ
నానాగ్రహ ప్రస - న్నత్వనిదాన
మానిత శాంత్యాది - మంగళాచార
నియమితంబగు వస్తు - నికరంబుచూచి
ప్రియసోదరుఁడు కంటఁ - బెట్టిననీవు
కరమున వారించి - కలఁక యడంచి
యిరువురు గదియరా - నెదురులు చూచి
అప్పుడాసన్న ప - ట్టాభిషేకమున
కుప్పొంగి తనకున - భ్యుదయంబుఁగోరు 2240
తల్లిపాదములపై - దలమోపిమ్రొక్క
చల్లని చూపుల - సాధ్వి కౌసల్య
తనయుని నిండారఁ - దనదు కౌఁగింట

నునిచి మూర్థాఘ్రాణ - మొనరించి యలరి
"రామ! పురాతన - రాజర్షి వరుల
యామేరఁ గీర్తియు - నాయువుఁ గలిగి
వివిధ వైభవముల - వెలయుదుఁగాక
యవనీశ్వరుని కృప - నభిషేకమొంది
సత్యసంధుఁడు రాజు - సామ్రాజ్యపదవి
నిత్య సద్గుణశీలు - నికి నీకు నొసంగి 2250
పరమాయు రున్నతిఁ - బరగితోకైక
విరచిత స్తుతులచే - విలసిల్లుఁగాక
అన్న యాకొంటివి - యన్నమే నిడఁగ
మన్నన భుజియించి - మందిరంబునకు
నరుగు మీవ"ని పీఁ - ట లన్నఁదమ్ములకు
సరిగాఁగ నునుపఁ గౌ - సల్య వాక్యములు
వినిసిగ్గుతో మోము - వెలవెలఁగాఁగఁ
దన తలవాంచి యే - దండకాటవికిఁ
జనువాఁడ నినుఁజూచి - చనియెద ననుచు
జనని! వచ్చితి నేను - జానకితోఁడ 2260
యీవార్త యిప్పుడే - యెఱిఁగించి వనికిఁ
బోవఁగా వలయు గొ - బ్బునఁ బంపు మిపుడు
చనదింక మునివ - రాసనములంగాని
కనకాసనములపైఁ - గదిసి కూర్చుండ
సహజంబులగు కరాం - జలు లింతెకాని
విహితమే యపరంజి - వెడఁదపళ్లెములు
కందమూల ఫలాది - కము లింతెకాని

యందంబు గాదురా - జాన్న భోజనము
నీకు నీలక్ష్మణు - నికి మహీసుతకు
నేకడఁ దరివచ్చె - నిడుములం బడఁగ 2270
పదునాలు గేఁడులా - పదలెల్ల నొంది
వదలక యేనుండ - వలయుఁ గానలను
భరతునిఁ గట్టను - పట్టంబు రాజు
ధరణి కెల్లను నన్నుఁ - దరమె కానలకు"
అన మొదలంటంగ - నసిచేతఁ దునియు
ఘనతరశాఖి శా - ఖనుఁ బోలి యపుడ
ధరణిపైఁబడిన బృం - దారక రమణి
తెఱఁగున మూర్ఛిలి - తెలివిడి లేక
యిలనున్న కౌసల్య - నెత్తి యూరార్చి
అలయిఁక బొడవెట్టు - నశ్వ యనంగ 2280
ధూళిబ్రుంగిన మేని - దుమ్ము తాగట్టు
చేలచే దుడిచి స- చేతనం జేయ
రామునిఁ జూచి తీ - రని యార్తి వెనిచి
సౌమిత్రి వినఁగఁ - గౌసల్య యిట్లనియె,
“గొడ్డువీఁగినయట్టి - కొమ్మలకెల్ల
బిడ్డలు లేరను - పెనుచింతగాని
యితరదుఃఖములు వా - రెఱుఁగరు నీదు క
తమున శోకసా - గరమగ్ననైతి
రాజునకేపెద్ద - రాణివాసమను
పూజనీయతలెందుఁ - బొరయ లేనైతి 2290
అనువిచారములచే - నడలెడునాకు
నినుఁగూర్చియిటమీఁద - నిర్విచారముగ

నుండంగ లేనంచు - నుండితి నిటుల
పండెనే నానోము - ఫలము లన్నియును
సవతులందరు నన్ను - చవుకగానెంచి
యవమానవాక్యంబు - లాడుచునుండ
వినునంతఁగడవ యీ - వెలఁదిపుట్టువుల
గొనియు నీఁగించు నె - గుల్ మరికలదె
నీవున్నయపుడె యి - న్నిదొసంగులైన
నావల మన సిత్తు - రా? వీరునన్ను 2300
కైకేయికిని దాసిఁ - గావలెనొండె
యాకొమ్మ దానిదా - స్యము సేసి బ్రదుక
వలెనొండెఁగాని యే - వలనఁ జూచినను
కలదె రాఘన! నాకు - గతివేఱెయింక?
కైకేయిచల్లని - కడుపునఁబుట్టి
లోకంబు నీవె యే - లుటకు రప్పించి
కట్టడి నగునాదు - కడుపున నేల
పుట్టించె నిను ధాత - పొరపొచ్చముగను
మగఁ డొల్లనట్టి య - మ్మగువల కెందు
జగమెల్ల వెదకఁ బూ - జ్యత లేలకల్గు? 2310
పరిజను లెల్లను - భరతునిం గొలిచి
సరకు సేయరు నన్ను - సవతుల మొగము
చూచియే శిరము వం - చుక సంచరింప
నాచాయ కైకయేమ - ని పల్కఁ గలదొ?
కొడుక! నీకును తండ్రి - కోరియు వేడి
వడుగు చేసిన తర - వాత నెమ్మదిని
నేనుండితిని పది - యేడేండ్లు కైక

చేనింక నేనేమి - సేగులందెదనొ?
నీమోము చూడక - నిమిష మాత్రంబు
రామ! యేక్రియఁ దాల్తు - ప్రాణముల్ మేన 2320
నియమవ్రతంబు ల - న్నియును గావించి
నియతి నుండుట లెల్ల - నిష్పలంబయ్యె
యీమాట వినియు నేఁ - డేలకో యవిసి
యేమియుఁ గాకున్న - దిపుడు నామనసు
యేటి వెల్లువచేత - నిడియు గట్టునకుఁ
బోటియై దినదినం - బులఁ దీరవలసె
పంచాననము లేడిఁ - బట్టిన యటుల
కొంచు నేఁగఁ డదేల - కో నేఁడు జముఁడు
యమపురి చోటులే - దయ్యెనో తనకు
సమయంబు లందునా - శము లొందువారి 2330
కరణి యే చందమో? - కాన నత్తెఱఁగు
విరియదు మే నయో! - వినిమయంబగుచు
వ్రతదాన నియమ ప్ర - వర్త నాద్యములు
వితలయ్యె వెతలయ్యె - వేడుక లెల్ల
చవుటనేలను వెదఁ - జల్లు బీజములు
హవణికం బోలివోవ - నాత్మ పుణ్యములు
నావు లేఁగనుఁ బాసి - యఱచినయట్లు
చావులేకునికి వి - షాద వేదనల
వేగింపఁ జూల నీ - వెంట నరణ్య
భాగంబులకు వత్తు - పైనమై యిపుడె” 2340
అనిమోము మీదఁ బ - య్యద కొంగుఁ జేర్చి
తనచెంత కిన్నర - తరుణియుం బోలి

యెలుఁగెత్తి యెగవెక్కి - యేడ్చుచునున్న
కలఁగు చిత్తంబుతోఁ - గౌసల్యఁజూచి
యీసును రోషంబు - నినుమడి గాఁగ
నాసుమిత్రాపుత్రుఁ - డలుక నిట్లనియె.

-:కౌసల్యను లక్ష్మణుఁడూరడించుట :-

"ఓయమ్మ! శ్రీరాముఁ - డూరకే యేల
శ్రేయోభివృద్ధులు - చెదిరి పోనాఁడి
యడవుల కేఁగ నా - యాత్మకు నిట్టి
వెడబుద్ది సరిపోదు - విషయాతురుండు 2350
స్త్రీలోలుఁడును నైన - క్షితిపతి కైక
చాలనిర్బంధింపఁ - జనవు చెల్లించి
మాఱాడ నేరఁడు - మన రాముమీఁద
నేరమిట్లని పల్క - నేర్చునే యొకఁడు
ద్రోహంబుఁ గల్లయు - దోషంబు వెదకి
యూహించి పై మోప - నోపునే రాజు
త్రికరణాచారుండు - దేవతుల్యుండు
సకలసద్గుణగణై - శ్వర్యపూర్ణుండు
నయశాలి సుజనస - న్మాన్యుఁ డుత్తముఁడు
దయగలవాఁడు సీ - తాప్రాణవిభుఁడు 2360
నీతనయుఁడు నైన - నిర్దోషు రాము
నీతండ్రివలెఁ బుత్రు - నేతండ్రివదలె?
ఆలికి లొంగిన - యతని మాటలకు
భూలోకమున లొంగు - పుత్రులున్నారె?
యీ రాజు గతి యన్యు - లెఱుఁగక మున్న

కోరి రాజ్యము గట్టు - కొందము మనము
కేల కోదండంబుఁ - గీలించి యేను
వాలాయముగ నిల్వ - వలెఁగాక రామ
ప్రతికూలుఁ డొక్కఁ - డే పట్టంబుగట్టి
క్షితికెల్ల నిను నఖి - షిక్తుఁగావింతు 2370
అందుకుఁ జూపోప - నట్టి వారలను
చిందఱ వందఱ - చేసి వధింతు
బలిమిచే భరతుని - పక్షంబువారిఁ
జలపట్టి పోనీక - సంహరింపుదును
అటుమీద ని య్యయో - ధ్యా పట్టణంబు
చటులత నిర్మను - ష్యంబు చేసెదను
దానఁదీరక యున్న - ధరణి యంతయును
యే నస్త్రవహ్నికి - నిత్తు నాహుతిగ శ
త్రుపక్షము వాఁడు - జనపతి నికట
శత్రుఁ డీతఁడె కాన - సంకెలల్ వైతు 2380
కాదేని యొకమాటఁ - గడ తేఱ్తుఁ బట్టి
యీదుష్ట మానసు - నిదియె నాపూన్కి
తప్పిన గుడునైన - దండింపు మనుచుఁ
జెప్పి రాగమశాస్త్ర - సిద్ధాంతవిదులు
కైకేయి ప్రేరేపఁగా - మెత్తఁబడిన
నీకు నిట్టి యవస్థ - నేఁడు వాటిల్లె
యే రాజనని మది - నెంచియో యీతఁ
డీరాజ్య మాలికి - నీయఁ జింతించె
నినుఁ బేలుపుచ్చిన - నేఁబగయైన
తనకేది శక్తియో - ధరణి నిచ్చుటకు ? 2390

నోమానవతి ! నిక్క - మొకమాట వినుము
రామునియందె పో - రామి నాకెపుడు
తప్పదు నాదు కో - దండంబు నాన
చెప్పితతి సుకృత సా - క్షికముగా నీకు
నామాట మీఱి వ - నంబుల వెంట
రాముఁడు పోవునే - రముమీఁదమోపి
యితనికిఁ బ్రీతిగా - నీ శరీరంబు
హుతవహార్చులకు నా - హుతి సేయువాఁడ
యేనుఁ గలఁగ నీకు - నీచింత యేల?
మానిని! మానవ - మ్మా! ” యంచుఁ బలుక 2400
ఆ సుమిత్రా పుత్రుఁ - డాడు మాటలకుఁ
గౌసల్య రఘువీరుఁ - గాంచి యిట్లనియె.
“అన్న! రాఘవ! తమ్ముఁ - డాడినమాట
విన్నావె కదనీకు - వినఁ గూడదేమొ
ఆలోచనముచేసి - యది హితంబైన
మేలెంచి నాదుని - మిత్తంబుఁ గాఁగ
నడపింపు కాడేని - ననువెత బెట్టి
సడికి నోర్చినకై క - చనవు చెల్లింపు
ననుడించి నీవు వ - నంబుల కేఁగ .
చనునయ్య యెఱుఁగవె - సకల ధర్మములు? 2410
మాతృ శుశ్రూష యే - మఱక కశ్యపుఁడు
ఖ్యాతిగా నమర లో - కసుఖంబు లందె
దశరథు మాటచం - దమున నామాట
కుశలంబు దలఁచి నీ - కునుఁ జేయుటొప్పు
తల్లి యేకద పర - దైవతం బనుచు

నెల్లెడ నిగమంబు - లేవేళఁ బల్కు
పనికిఁ బోవఁగ నేల? - వందెడునాడు
మనసు చల్లఁగఁ జేసి - మనుము కుమార!
కాదంటివే జన - క తనూజఁ గూడి
యాదండకాటవు - లందు నీదండ 2420
నాకుల నలముల - నాఁకలిదీర్చి
శోకంబు లేనట్టి - చో వసింపుదము
విడిచి పోయెదనన్న - వేగఁ బ్రాణములు
విడుతునేఁ బ్రాయోప - వేశంబు చేసి
పిప్పలాదుండను - పృథివీసురుండు
తప్పి సముద్రుఁ బా - తకుఁ జేయురీతి
మాతృహత్యాదోష - మహితుండు ఘోర
పాతకి యనుపింతుఁ - బ్రజలచే నిన్ను
వనముల కరుగంగ - వలదు చాలింపు"
మను తల్లితోడ ని - ట్లనియె రాఘవుఁడు. 2430
"వేఁడెద నిన్ను వే - వేలైనఁ దండ్రి
నేఁడు వల్కినమాట - నేమీఱఁ జాల
గురుని యోగంబుచే - గోహత్యచేసి
దురితంబులనుఁ బాసెఁ - తొలుత కండుండు
తనతండ్రి ముదుసలి - తపము తామోచి
ఘనుఁడు పూరుఁడు వంశ - కరుఁడై యొసంగె
తమపితృహితము నా - ధారుణిఁద్రవ్వి
సమసియు సగరులు - సద్గతిఁ గనిరి
జనకుని పంపున - జనయిత్రిఁ ద్రుంచి
మునుభార్గవుఁడు లోక - మునఁ బుణ్యుఁడయ్యె 2440

పితృవాక్య మొనరించి - పృథివి ననేకు
లతిశయ విఖ్యాతు - లందిరి మఱియు
నేనట్ల తండ్రికి - హితమాచరింపఁ
బూనితి దాన నె - ప్పుడు హానిరాదు
అమ్మ! నీకిటులాడ - నగునే" యటంచుఁ
దమ్మునిఁజూచి సీ- తా విభుఁడనియె.
"ఓయి! లక్ష్మణ! నీకు - నుల్లంబు లోన
నాయందుఁగల ప్రేమ - నామదిం గలదు
యెఱుఁగుదు నీశౌర్య - మెఱిఁగియు నీతి
దొఱఁగి యిట్లాడుటల్ - ద్రోహంబుగాదె 2450
ధర్మంబె లోక - హితంబు ఘనంబు
ధర్మంబునందె స - త్యము బాదుకొనియె
తండ్రియాజ్ఞ మెలంగ - ధర్శంబు తల్లి
దండ్రుల మాటలు - దప్పింపరాదు
కైకేయిమాట ని - క్కము రాజుమాట
యీ కీడుమాట - నీ విటులాడదగునె
వలవదీపలుకని - వారించి తల్లి
కెలఁకునఁ జేరి భ - క్తి నమస్కరించి
"దేవి! నాకునుఁ బ్రసా - దింపు మనుజ్ఞ
యే వనభూముల - కిపుడె పోవలయు 2460
నిప్పు డౌగాదని - యేమన్న తనకుఁ
దప్పిన దానవు - తల్లివిగావు
నీ దీవెనలచేత - నే వనవాస
ఖేదముల్ మానిసా - కేతంబు చేర
వలయుఁగావున స్వస్తి - వాదంబొసంగి

యెలమితోఁ గానల - కేఁగి రమ్మనుము
పదునాలుగేఁడులు - పదునాల్గుగడియ
లదియెంత నాకు - నీ వనిపినం జాలు
ఆకసంబున నుండి - యవనికి వచ్చు
నాకల్పకీర్తి య - యాతి చందమున 2470
మఱలివచ్చెద నీదు - మది యలరింతు
మరి తరవాత నీ - మాట చేసెదను
నీవు సుమిత్రయు - నీ లక్ష్మణుండు
నా వసుధాపుత్రి - యందఱుఁగూడి
మనరాజు చెప్పిన - మాటలో నడచి
మనువారమిది - సుమీ మర్యాద మనకు
ననుకూల మగు నన్న" - యా రాము మాట
తనమది నెంచక - తల్లియిట్లనియె.
"నీవులేనట్టి నా - నియమంబు లేల?
యీవిశ్వజనులచే - యెన్నికయేల? 2480
తగవేల? సుఖమేల? - ధర్మంబులేల?
పగయేల? హితమేల? - పదవులదేల?
అమరలోకం బైన - నదియేల? సర్వ
సమచరిత్రునిఁ సత్య - సంధుఁ గుమారు
నిన్నుఁ జూచుచు చెంత - నేయున్నఁజాలు
నన్నియు నేనొల్ల - నన్యంబులైన”
అని నిశ్చయంబుగా - నాడిన తల్లి
యనుపమదైన్య వా - క్యంబు లాలించి
కొఱవిఁ జూచిన యేను - గునుఁ బోలి చాల
వెఱచి యా శ్రీరామ - విభుఁ డిట్టులనియె. 2490

'అదియేమి లక్ష్మణ! - యమ్మయన్నట్ల
మదికిఁ దోఁచినయట్టి - మాటలాడెదవు?
తొల్లిమన్వాదులు - దుఃఖంబు సుఖము
నెల్లెడం బ్రాపింప - హేతువుల్ గాఁగ
ధర్మార్థ కామసం - తతి నెందు పలికి
రర్మిలితోడ నే - నది సమ్మతింప
నాదు సిద్ధాంత ని - ర్ణయ మెటులన్న
నాదిఁ బల్కిన ధర్శ - మాచరించెదను
నందుచే నితరంబు - లన్నియుఁగల్గు
నిందుకు దృష్టాంత - మెటులంటివేని 2500
వలచినదై వశ - వర్తిని యగుచు
వెలయు పుత్రులఁగన్న - వెలఁది యొక్కరిత
కలిగిన ధర్మార్థ - కామసౌఖ్యములు
గలిగించు కరణి నొ - క్కట (గలిగించు)
సకలజనద్వేష - జనక మర్థంబు
ప్రకటమౌ నింద కా - స్పదము కామంబు
అటుగాన నేయే ప్ర - యత్నంబులందుఁ
బటుమతి ధర్మత - త్పరుఁడు గావలయు
గురుఁడు వృద్దును తండ్రి - కువలయేశ్వరుఁడు
పరికింపఁ దానయౌ - పార్థివోత్తముఁడు 2510
నానతిచ్చిన యర్థ - మౌదలయందు
బూనికావించుట - పుత్రధర్మంబు
మనతండ్రి కౌసల్య - మగఁడట్టిరాజు
మనకెల్లగతి గాక - మరివేఱ కలదె?
రాజు జీవంతుఁడై - రాజ్యంబుసేయ

నేజాడ నావెంట - నేవత్తుననుచు
కౌసల్యపలికెడుఁ - గంటివే?" యనుచు
"నోసాధ్వి! దీవెన - నొసగుము నాకు
వనవాసమీడేర్చి - వచ్చెదఁదిరిగి
తనకేల? నొల్లన - ధర్మరాజ్యంబు 2520
యీరాజ్యకాంక్షచే - యేఁగీర్తివదల
నేర నే"నని తన - నిశ్చితార్థంబు
తమ్ముఁడు వినుచుండఁ - దల్లితోఁబలికి
నెమ్మదిలోపల - నే ప్రదక్ష్మిణము
చేసి పోవుదు నని - చెంగట మిగుల
గాసిలి బుసకొట్టు - కాలాహిరీతి
యున్న లక్ష్మణుఁ జూచి - యూరార్చి చాల
మన్నన సాత్త్విక - మతి రాముఁడనియె.

--: లక్ష్మణుని రోషమును రాముఁడుఁపోగొట్టుట :--


"శోకరోషంబుల - సుడి గొనియుండ
నీకేల? విభు మాన - నీయుఁగాఁ గనుము 2530
వలవ దీయభిషేక - వార్త చిత్తంబు
నిలువఁబట్టుము నా వ - నీప్రయాణంబు
నభిషేకయత్నంబు - నటులచేకూర్చి
యభీమతింపుము కైక - యనుమానముడుపు
గణుతింప నాసాధ్వి - కడనాహితంబు
క్షణమైనఁ దామ - సించఁగ రాదు నాకు
తలితండ్రులకు నహి - తము కలనైన
దలఁచుట లేదు స - త్యపరాక్రముండు

సత్యసంధుండు - నైన జనకుండె సుమ్ము
ప్రత్యక్షదైవంబు - పరికింపనాకు 2540
నతనికి పరలోక - హానిలేకుండ
ప్రతిపాలనము సేతు - పలికినపలుకు
సత్యంబునకు రాజు - సంతాపమంద
సత్యంబు నేఁజూచి - సహియింపఁగలనె?
కావున వనికేఁగఁ - గలవాఁడ నిపుడె
భావించి యాదేవి - భరతునిందెచ్చి
గ్రక్కున పట్టంబు - గట్టుకోనిమ్ము
మిక్కిలి వేడుక - మెఱయించువాఁడ
జడలు వల్కలము లి - చ్చటఁదాల్చి పురము
వెడలునప్పటి నాదు - వేషంబుచూసి 2550
నా వనవాస మే - నరులకునైన
భావంబులనుఁ కోరఁ - బడు వారికెల్ల
జాగేల? మనసులు - చల్లఁగాఁజేతు
వేగంబుగా వట్టి - వెత నింతెకాక
చేకూడు రాజ్యంబు - చెదరిపోవుటకు
దాకొన్న దైవ య - త్నంబు ఋణంబు
దైవానుగూల్య మి - త్తరిఁగల్గెనేని
కావింపనేర్చునే - కైకయిత్తెఱఁగు
కైకేయి యెడనాకు - కౌసల్యకన్న
నేకడ భయభక్తు - లెచ్చుగానడతు 2560
భరతుని కన్న నా - పట్టున నెపుడుఁ
గరుణయు నెనరు న - గ్గలము కైకకును
అదినీవు నెఱుఁగుదు - వట్టి కైకేయి

చెదరనాడుట విధి - చెయ్దిగాకున్నె?
నాకిట్టిరాజ్యహీ - నత యిట్టిబుద్ధి
కైకకుం గలుగుట - కర్మకృత్యంబు
యిందుచే దైవంబు - హెచ్చని జనుల
కందరకునుఁగాన - నయ్యె చూచితివె?
అన్ని కార్యములు దై - వాధీనబుద్ధి
నెన్ననేరకత్రోయ - నెవ్వారితరము? 2570
భయముఁ గ్రోధమును లో - భమును లాభంబు
జయ మపజయమును - కర్మంబు వెతయు
మొదలైన వ్యాపార - ములు కొనసాగు
నది ధ్రువంబుగ దైవ - యత్నంబుసుమ్ము
మునులును తమ తపం - బులు పోవనాడి
యనయంబు కామమో - హక్రోధములకు
లోనౌట ధారుణి - లో జనులొకటి
గానెంచ వేఱొండు - గా నౌటయెల్ల
దైవయత్నమె కాన - తన రాజ్యహాని
నేవలఁబరితాప - మేల నొందుదును? 2580
శుభము చేకుర దిట్టి - చోఁ గాన నీవు
నభిషేకసంప్రాప్తి - యభిలాష ముడిగి
యందుకై తెచ్చిన - యట్టి తీర్థములు
నం దభిషేకింవు - మడవి కేఁగుటకు
వనవాసమున కేఁగు - వానికినేల?
తనకు నీ మంగళా - ర్థ సువర్ణపూర్ణ
కలశోదకస్నాన - కలన యట్లైన
తలఁచి వేఱుగఁ గైక - ధరణీశు దూరు

నీవుచింతింప కే - నీటిచేనైన,
నీవేళ నాతలం - పెఱఁగి కావింప 2590
నామతంబున రమ్ము - నామది మిగుల
కామింపుచున్నది - కానలుచేర
నేరాజ్యమొల్లక - యేఁగరె తొల్లి
ధీరులు వనులకెం - తేమేలుఁదలఁచి
అదియె నామదికిఁబ్రి - యంబయి తోఁచె
నిదిదైవగతి కైక - నేలదూరేదవు?”
అనిపల్క ఖేదమో - దాయత్తచిత్త
వనరుహుఁడై తల - వాంచి యుహ్హనుచు
నురగంబురీతి ని - ట్టూర్పులు నిగుడ
హరిమాడ్కి చూడ భ - యంకరుఁడగుచు 2600
కోరవోవుచు ముడి - గొన్నకన్బొమల
గారదాఁకిన మీను - గతి మౌళిఁగదల
కన్నులచెంగావి - గమ్మమోమెత్తి
యన్నతో లక్ష్మణుఁ - డప్పు డిట్లనియె.

—: దైవబలంబుకన్న పురుషకారమే ప్రబలమని లక్ష్మణుఁడు చెప్పుట :—


"తండ్రికిం దప్పెని - తఁడు రాజ్యకాంక్ష
వేండ్రమైనది రామ - విభుని చిత్తంబు
మనలఁ బ్రోచునె యిట్టి - మర్యాదవాఁడు
మనముల నితని న - మ్మఁగరాదటంచు
జనులెంతురో యను - శంకచే నీవు
వనుల కేఁగెదనన్న - వలవదియ్యెడల 2610

అసమర్థమగుదైవ - యత్నంబు శౌర్య
లసమానుఁడగురాజు - లక్షింపదగునె?
అలవడియున్న క్ష - త్రాచారరూఢి
గెలువుము దైవంబుఁ - గేకయరాజ
తనయ బుద్ధులు విని - దశరథవిభుఁడు
కననీఁడు కపటంబు - కల్ల నెయ్యమున
మంచివారునుఁబోలి - మచ్చిక సేసి
కించుఁదనంబునఁ - గీడాచరించు
వారలుగలరట్టి - వారల నెఱుఁగ
కే రీతి మోసపో - యెద వాత్మనమ్మి
యభిషేకమిది నిశ్చ - యముగాక మున్నె 2620
యభిలషించి వరంబు - లడిగెనే కైక
యీ మాటవినికద - యిప్పుడు వేడె
నామున్నె నీకిచ్చె - నవని భూవరుఁడు
ఆలితో నేకాంత - మాడినమాట
మేలెంచి సత్యంబు - మేకొనువాఁడు
ఆసత్యమెటుపోయె? - నందఱువినఁగ.
జేసెద నిను నభి - షేకమన్నపుడు
యిందులకేరీతి - నేఁదాళియుందు
నిందితుండై యవి - నీతివాఁడైన 2630
కామాతురుండైన - ఖలుఁడైన చిత్త
మేమరి భ్రమసిన - నెవ్వారి పలుకు
నడపింపరాదని - నయశాస్త్రవిదులు
నొడువుదు రితఁడట్ల - నోరెత్తవెఱచి
యాటదానికి లొంగి - యధముఁడౌ వాని

మాటకు నీయట్టి - మానుషాధికుఁడు
కైకేయి దొరసానిఁ - గానెంచి యామె
యేకీడుదలచిన - నేమియుననక
నాపదలొందెద - ననియున్న నీదు
పాపంబు చూచియేఁ - బరితపించెదను 2640
కోరగఁదగు మేలు - కోరక కీడు
గోరువారల కెల్ల - గురుఁడవై నావు
అన్నిటఁగొఱమాలుఁ - నంబేద రీతి
నెన్నెదు దైవంబ - యిటుచేసె ననుచు
యిది దైవకృతమని - యెంచెదవేని
మదిలోన నీవు నా - మతము చెల్లించి
అట్టికార్యము దైవ- యత్నంబుఁగాఁగ
గట్టిగా మదినెంచి - కావింపుమటుల
పురుషయత్నముచేతఁ - బొలుచు ధీరుండు
తఱమిఁదాఁద్రోయును - దైవయత్నంబు 2650
అట్టిపౌరుషశక్తి - నలరు నాకతన
యెట్టిచోదైవంబు - నెఱుఁగనయ్యెడును
నీ మేలుగనఁగోరు - నిఖిలలోకులను
నామతంబ తలంచి - నడవఁ జేసెదను
దైవబలంబు మ - త్తగజంబుఁ ద్రిప్పు
మావంతు గతి నేను - మరలఁద్రిప్పెదను
యేనిన్ను గట్టెద - నిపుడు పట్టంబు
దీని కెవ్వరు సమ్మ - తింపకయున్న
హరిహరబ్రహ్మాదు - లడ్డమై రేని
పొరిగొందు నపుడనా - భుజశౌర్య మొప్ప 2660

ముల్లోకములు నొక్క - మొత్తమై మీఁదఁ
బెల్లఁగిల్లినఁ ద్రుంతు - భీకరాస్త్రమున
వనవాసముల నుండ - వలెనని నిన్నుఁ
గనువారి నేనుంతుఁ - గానలయందు
వేవేలువర్షముల్ - విశ్వమంతయును
నీవేలి తరువాత - నీకుమారకుల
మహికిఁ బట్టముగట్టి - మఱిపొమ్ము వనికి
యహితుఁడౌ భరతుని - కవని గానీను
యీరాజుమాటచే - నియ్యకోవేని
ధారుణి నాదుప్ర - తాపంబుచేత 2670
నీముద్ర తల మోచి - నిష్కంటకముగ
రామ! యేఁబాలింతు - రానీయ నొకని
నిర్వహింపకయున్న - నేనన్నమాట
యుర్విపైగలయా - యుధోపజీవులకు
వెలితియై చనువాఁడ - వినుము నా ప్రతిన
చలముతో నిది నాకు - సాధించుటెంత?
కానిచో నీ విల్లు - ఖడ్గబాణములు
నే నలంకరణార్థ - మేతాల్చు టెల్ల?
సాధనాంతరములు - శత్రులనెల్ల
సాధింపఁ గాక పూ - జలుసేయకొఱకె? 2680
ధనువు నేఁదాల్చినఁ - దా బంటననుచు
ధనువొందునే దేవ - తానాథుఁ డైన
మనుజులలో మారు - మలసి నాతోడ
మొనసేయనున్నారె - మూఁడులోకముల?
బలిమిచేఁ జతురంగ - బలము నాచేత

పొలియునప్పుడు గజం - బులు వడియుండ
మెఱుపులతోఁగూడు - మేఘంబు లవనిఁ
దెరలినగతినున్న - దేఱి చూచెదవు
శరదారుణానల - జ్వాలలచేతఁ
బరస్యైనగహనంబు - భస్మీకరింతు 2690
విశదంబుగాఁగ నా - విక్రమంబిపుడె
దశరథుపూనికె - దప్పింపఁ దలఁచె
కేయూరకుంకుమాం - కితమైనయట్టి
యాయతాత్మీయ బా - హాయుగళంబు
నీయవసరముల - నీప్రోచుఋణము
పాయఁద్రోయక యేమి - పనులకామీఁద?
నాభుజాకండూతి - ననునెచ్చరించె
నాభరతునిఁ జూపు - మని పెచ్చు పెఱిగి
పనిగొమ్ము తామసిం - పక నీకునేల?
యనుమానములు తల్లి - యనుమతి వినుము. 2700
నావిన్నపంబు మ - నంబునఁజేర్చి
దేవ! కాదని యాన - తి యొసంగవలదు"
అనిపల్కు లక్ష్మణు - నాగ్రహం బెఱిఁగి
యనునయోక్తుల రాముఁ - డతని కిట్లనియె.
“అన్న! లక్ష్మణ! నాకు - ననుగుణంబైన
యెన్నిక నీమది - నెన్నుమీ" యనుచు
మాఱాడుకుండ ప - ల్మారు నేనిన్ను
కూరిమితో వేడు - కొనను నీవిట్లు
నాతలం పెఱిఁగియు - ననుమీఱి పలుక
నీతియె" యనుచు క - న్నీరు వోఁదుడిచి 2710

సౌమిత్రి నూరార్చు - సమయంబునందె
రామునిఁ జూచి ధా - రాళంబుగాఁగ
కన్నుల వెన్నీరు - కాలువల్ గట్ట
సన్నుతశీల కౌ - సల్య యిట్లనియె.

—: రాముఁ డడవులకు బోవ కౌసల్య యంగీకరించుట :—


"రామ! నాకును దశ - రథునకుఁ బుట్టి
యేమేర నీవుంఛ - వృత్తి నుండెదవు?
నినుఁగానలకుం బంపు - నృపతి నెవ్వారు
కనికొల్చి నమ్మియే - గతినుండువారు
ధరణీశు సత్యమై - తన యదృష్టంబు
దరమించె నిన్నుఁ గాం - తారవీథులకు
"రాకుమీవన" వెంట - రాకేలయుందు
నేకైవడిఁ దరింతు - నీశోకజలధి 2720
కన్నతల్లినిఁ కాని - కైకచే నేల
నన్నొప్పగించి గా - నలకు నేఁగెదవు?
వలదంచు" మిక్కిలి - వాపోవఁ జూచి
తలఁకక రఘుకులో - త్తముఁ డిట్టులనియె.
"ఓయమ్మ! నావెంట - నుగ్రాటవులకు
నీయెడ నీవురా - నృపతి ప్రాణములు
నిలుప నేరఁడుగాన - నీయట్టి సతికిఁ
దలఁప వచ్చునె యీయ - ధర్మవర్తనము
రాజుఁ బోషింప ధ - ర్మము గాదటన్న 2730

వనవాస మొనరించి - వచ్చెద నీదు
పనుపు చేసెదఁ దీర్చి - పదునాలుగేండ్లు"
అనియెంత వేఁడిన - నడలుచు లేటి
యనువునఁ దొడక పొ - మ్మని తపింపుచునుఁ
దెలివి చాలని తల్లి - దెసచూచి చాలఁ
గలఁగుచు రాముఁడు - కన్నీరు రాల
కరుణ వెంపునఁ బోవఁ - గాఁ గాళ్లురాక
తెఱఁగేది లక్ష్మణుఁ - దేఱి చూచుచును
చెదఱుఁ గుత్తుకతోడ - సీతావరుండు
మదిచిక్కఁబట్టి తా - మఱియు నిట్లనియె. 2740
“అమ్మ! యీరాజు గ - లంత గాలమును
నెమ్మదియేఁగాక - నెగులేల మనకు?
భరతుండు సద్ధర్మ - పరుఁడటమీఁద
పరిచర్య సేయునీ - పట్టున మిగుల
కానల కే నేఁగఁ - గడుం జింతనొందు
మానవనాథు నే - మఱకుమీ నీవు?
అతివ లేమేమి పు - ణ్యములు చేసినను
పతిసేవ సేయు శో - భనములు లీలేవు
పెనిమిటిఁ గొల్వక - పెక్కుధర్మంబు
లొనరింపఁ బాపంబు - లొందు నింతులకు 2750
మగఁడె దైవముగాని - మఱి దైవమనుచు
మగువలకే యాగ - మములఁ బేర్కొనరు
ప్రాణవల్లభుఁ డిహ - పరసౌఖ్యదాత
యేణాక్షులకుఁ గాన - నీతరంబులేల?
వల్లభునకుఁ గాని - వనితపుణ్యంబు

లెల్ల బొల్లైపోయి - యేఁగు దుర్గతికిఁ
దన నాయకునకు హి - తం బాచరించు
వనిత కోరికలు కై - వశము లన్నియును
కైకమీఁది యసూయ - గలిగి యుండినను
నీ కహితంబులు - నెరయఁ జేసినను 2760
వనికి రామునిఁ బంప - వచ్చునే యనియు
మనసు నొవ్వఁగఁ గాని - మాటలాడకుము
పృథివీశు మదినొవ్వ - బిట్టు వల్కినను
వృథసుమ్ము కులశీల - వృత్తంబులెల్ల
శాంతిక పౌష్ఠికా - చారకర్మముల
నెంతయు నాకు మే - లెంచి భూసురుల
పూజసేయుచు నెల్ల - ప్రొద్దునేమఱక
రాజుఁబోషింప ధ - ర్మంబు తప్పకుము
నేవచ్చు నన్నాళ్లు - నృపతి సౌఖ్యమున
జీవంతుఁడై యున్న - జెప్పెడిదేమి? 2770
భాగ్య మంతయును - నీ పాలనేనిల్చి
యోగ్యకామిత సిద్ధు - లొందఁ జాలుదువు
అమ్మ యౌఁగాదని - యనక నామనవి
సమ్మతింపు" మటంచు - సాఁగిలి మ్రొక్క.
భావించి మదిచిక్కఁ - బట్టి లెమ్మనుచు
దీవించి "నీమది - ద్రిప్పలేనైతి
అన్న సేమముగాంచి - నరుగుము వనుల
కున్నత జయకీర్తు - లొంది క్రమ్మఱుము
కాలంబు దొడ్డది - గావున నిట్టి
యాలోచనలు గల్గె - నైనట్టులయ్యె 2780

పొమ్ము నీకెల్ల వే - ల్పులుఁదోడునీడ
లెమ్మేరల నసాధ్య - మెయ్యదినీకు?"
అనిరాముఁ జూచి యే - కాగ్రచిత్తమున
“ననఘ ! జటావల్క - లాదులతోడ
వనవాస మీడేర్చి - వత్తువుగాక
పునరాగమనలక్ష్మిఁ - బొందుదుఁగాక
చేరరమ్మ"ని పిల్చి - శిరము మూర్కొనుచు
గారాన కౌసల్య - క్రమ్మఱంబలికె.

—: కౌసల్య శ్రీరాముని దీవించుట :—


“రామ ! సప్తర్షుల - క్రమమున నీవు
సేమంబుతో వని - శ్రేణిఁ జరించి 2790
నీ సుకృతంబెందు - నిన్ను రక్షింప
గాసియెందును లేక - క్రమ్మరుమయ్య!
వనదేవతలను భా - వన చేసినీవు
కనికొల్చు వారెల్లఁ - గాతురు నిన్ను
గాధేయుఁ డిచ్చిన - కమనీయ శస్త్ర
సాధనంబులు నిన్ను - సంరక్షసేయు
తలిదండ్రులందు నీ - తలఁకనిభక్తి
యలఘుసత్యమును దీ - ర్ఘాయువు వొసంగు
ద్వాదశార్కులును న - వబ్రహ్మ లవని
యాదిత్యులును రాత్రు - లహములు దిశలు 2800
స్థావరజంగమ - చయము వాయువులు
దేవర్షి పితృపూర్వ - దేవతావళియు
వనధు లద్రులును - సంవత్సర మాన

దిన ముహూర్తకళావ - ధికకాలదశలు
నారద దిక్పాల - నాగ గంధర్వ
భారతాదిక వర్ష - పక్షిపుంగవులు
ఆకాశమున వార - లంతరిక్షంబు
నాకీశుఁ డజుఁడు పి - నాకపాణియును
నదులు ద్వీపంబులు - నలినాకరములు
నదములు దైత్య దా - నవ పిశాచములు 2810
ఆగమంబులు ఋషు - లష్టవసువులు
నాగసింహ వ్యాఘ్ర - నానామృగములు
వనులఁ గ్రుమ్మరు నిన్ను - వాత్సల్య మొప్పఁ
గని తోడునీడలై - కాచి యుండుదురు"
అని గంధపుష్పాక్ష - తాదులు ఘృతము
ననువైన తెల్లని - యావాలు దెచ్చి
కౌసల్య పరమమం - గళకారణముగ
భూసురకోటి న - ప్పుడ పిలిపించి
హోమముల్ సేయించి - హోతలచేత
నేమేరలను బలు - లిప్పించి స్వస్తి 2820
వాచనం బొనరించు - వారికి శోభ
నాచారముగ దక్షి - ణాదు లొసంగి
"అన్న! వృత్రాసురు - నణగించు నపుడు
మున్నింద్రునకు దేవ - ముఖ్యు లందఱును
నేమంగళము లిచ్చి - రిప్పుడు నీకు
నామంగళము లెల్ల - నవుఁగాక రామ!
అమృతంబుఁ దేబోవు - నప్పుడు వినత
ప్రమదంబుచేఁ బిల్చి - పక్షినాథునకు

యేమంగళము లిచ్చె - నిప్పుడు నీకు
నామంగళము లెల్ల - నవుఁగాక రామ! 2830
క్షీరాంబురాసి ద్ర - చ్చిన తరువాత
స్వారాజుఁ జూచి య - బ్జాతలోచనుఁడు
నేమంగళము లిచ్చె - లిప్పుడు నీకు
నామంగళము లెల్ల - నవుఁగాక రామ!
అదితి వామనుఁడయి - హరి జనియించి
మదమత్తుఁడగు బలి - మర్దించు నపుడు
నేమంగళము లిచ్చె - నిప్పుడు నీకు
నామంగళము లెల్ల - నవుఁగాక రామ!"
అని శిరంబున శోభ - నాక్షత లునిచి
తనయుని సందిట - తా రక్షగట్టి 2840
వనవాసఖేదంబు - వదలి క్రమ్మఱిన
నినుఁ బూర్ణచంద్రస - న్నిభుఁ బురవీథిఁ
బట్టపుటేనుంగుపై - రాఁగఁజూచు
నట్టి సంతోషమే - ననుభవించెదను
పోయివత్తువుగాక - పొలిమేరవనులఁ
బాయక తీర్పు మీ - పదునాలుగేండ్లు
దూరమేగెదు సుమీ! - తూణీరధనువు
లారసి మఱువకు - మన్న యేవేళ”
అనుచు గౌఁగిటఁ జేర్చి - యఖిలదేవతలఁ
దనయునిమీఁదట - తానావహించి 2850
శ్రీరామునికి ప్రద - క్షిణముగా వచ్చి
యోరఁగా నిలిచిన - యుల్లాసమొంది
తనుఁ గన్నతల్లికి - దండప్రణామ

మొనరించి కన్నుల - నురల బాష్పములు
ఱెప్పల నణఁచి ధా - త్రిని యూరడించి
అప్పుడ జననీమ - హాయతనంబు

—: రాముఁడు సీతకడకుఁబోయి వనగమనము చెప్పుట :—


వెడలి సీతకు నిట్టి - వృత్తాంతమెల్లఁ
దడయక వివరింపఁ - దలఁచి రాఘవుఁడు
నగరు వెల్వడి రాఁగ - నగరమార్గమునఁ
బొగులుచు జనులు గుం - పులు గట్టిచూడ 2860
చేరుమున్నుగ నభి - షేకవిఘ్నంబు
లేరిచే రాకుండ - నెల్లవేలుపుల
మనసులోఁ గొల్చుచు - మాటమాటకును
తనరాక కెదురులు - తాఁ జూచుచున్న
ధారుణీతనయచెం - తకుఁ దలవాంచి
యేరామలను మొగం - బెత్తి కన్గొనక
సిగ్గువాటున నుండఁ - జేరి యా సీత
బెగ్గడిల్లుచు నిట్టి - బెడిదంపు మాట
నేరీతిఁ బల్కుదు - నీయింతి కనుచు
నోరాడకున్న మ - నోనాథుతోడ 2870
నేమియు నెఱుఁగక - యెద వడి సీత
రామునిఁజూచి ధీ - రత నిట్టులనియె,
"అనఘాత్మ! నేఁడు బా - ర్హస్పత్యమైన
జననుత పుష్యన - క్షత్రంబు మీకు
నభిషేకమున కర్హ - మని విప్రులెల్ల

విభునితో ననుమాట - వినియున్న దాన
శతశలాకాశ్విత - చ్ఛత్రంబు రత్న
చతురంతయానంబు - చామరద్వయము
వందిమాగధగీత - వాద్యముల్ పణవ
దుందుభికాహళా - స్తోకరావంబు 2880
నభిషేకవస్తు వి - న్యస్తహస్తాగ్ర
శుభకర్మనిరత భూ - సురసమృద్ధియును
చతురంగబలమును - సామంతమంత్రి
హిత పురోహిత రాజ్య - బృందంబు నాల్గు
హయములంగల యుత్స - వార్థరథంబు
నయకారణము మృగేం - ద్రాసనోత్తమము
పట్టభద్రలలాట - పట్టియు మ్రోలఁ
బట్టపుటేనుంగుఁ - బాసి యదేల
వెలవెలఁగా మోము - విచ్చేయుకతనఁ
గలఁగుచున్నది మిమ్ముఁ - గని నామనంబు 2890
నానతియిండ"ని - యాపన్నయైన
జానకితో రామ - చంద్రుఁ డిట్లనియె.
“సత్యప్రతిజ్ఞుండు - సద్ధర్మవేది
యత్యంతధార్మికుఁ - డైన మాతండ్రి
వనవాసమున కేఁగ - వచియించె నన్ను
తనకు పూర్వంబున - దత్తంబులైన
వరములు కైకేయి - వరునిఁ బ్రార్థించి
భరతు నయోధ్యకుఁ - బట్టంబుఁగట్ట
నడిగిన పదునాలు - గబ్దముల్ నన్ను
నడవి నుండఁగఁబంచి - యాకైకపట్టిఁ 2900

బట్టంబుఁ గట్టుకోఁ - బడి తల్లి వరము
కట్టడ సేసినం - గడుసమ్మతించి
యేను వచ్చితి నీకు - నెఱిఁగింప నీవు
మానసంబున శోక - మగ్నవుగాక
మున్నాడి భరతుని - ముందఱ నీవు
నన్ను భూషింపక - నడవు మెట్లనిన
ధన్యుఁ డానృపతి యే - తరితన్నుఁ గాక
యన్యుల నుతియింప - నవియేల సైఁచు
నాభరతుండు ధాత్రి - యంతయు నేలు
ప్రాభవంబున నిన్నుఁ - బాటింపకున్న 2910
నందఱ తోడిదే యని - నిన్నుఁ బ్రోచు
నందు నేమరియున్న - నది తాళుకొనుము
ఆయన కనుకూల - వై యుండు నీవు
సేయుమా భరతుండు - చెప్పినయట్ల
భరతునికిని రాజు - పాలించె నెల్ల
ధరణియుంగాన నా - తఁడె కర్త మనకు
బోవుదు నే వనం - బునకు నిత్యంబు
దేవతార్చనము భూ - దేవతాప్రీతి
దశరథుపూజ య - త్తల కెల్లసేవ
కుశలబుద్ధినిఁ జేసి - కొలువు మేమఱక 2920
కౌసల్య చింతలఁ - గరఁగకయుండ
బాసటవై ప్రోచు - పగిది యేమఱకు
భరత శత్రుఘ్నులు - ప్రాణముల్ నాకు
తరుణి! తమ్ములుగారు - తనయులుసుమ్ము
వారలు చెప్పిన - వైఖరి నడచి

గౌరవంబొందు మే - కడ నన్వయమున
రాజుల చిత్తంబు - రా సేవచేసి
తేజంబుఁగాంచుట - తెల్లమెల్లరకు
నించుకదప్పిన - నెంత లేదనుచు
నెంచి సహింపరు - హృదయంబులోన 2930
ననుకూలులై యుండు - నన్యులనైన
మనసిచ్చి చనవిచ్చి - మన్నింతు రెపుడు
కడనున్న తనయుల - కడకుఁ ద్రోయుదురు
పుడమియేలెడువారి - బుద్దు లీతెఱఁగు
నటుగాన భరతుని - ననుసరింపుచును
పటుమతివై భయ - భక్తుల మెలఁగు
నిజమున నుండుము - నీ వీక్షణంబు
విజనాటవుల కేను - వెడలిపోవలయు
నెవ్వరు నప్రియం - బెన్నకయుండ
పువ్వుఁబోణి! మెలంగు - పోయివచ్చెదను” 2940
అని రఘువరుఁ డాడు - నట్టి మాటలకు
వనజాక్షి ప్రణయపూ - ర్వకముగాఁ బలికె.

—: అడవికి రావలదనగా సీతకోపమొందుట :—


"దేవ ! నాతో నిట్టి - తెఱఁగున మీరు
భావింప లాఘవా - స్పద మయోగ్యంబు
నపహసకర మప్రి - యంబు నైనట్టి
యపలాపవచన మె - ట్లానతిచ్చితిరి?
తల్లిదండ్రులు నన్న - దమ్ములు బిడ్డ
లెల్లరుఁ దమ పురా - కృతపుణ్యపాప

ఫలములు తమపాలఁ - బంచుక యందుఁ
దొలఁగక యనుభవిం - తురు దాఁచియుంచి 2950
ఆరీతిఁ గాదుగ - దయ్య వల్లభులు
ప్రారబ్ధనిజకర్మ - ఫలములన్నియునుఁ
బంచుకొందురు సరి - పాలుగా భార్య
లంచు నాగమవేత్త - లాడుచుండుదురు
యిహపరంబులఁ - బ్రోవ నీశుఁడే కర్త
మహిళల కిటులాడ - మర్యాదయగునె?
పురుషులపుణ్యంబు - పొత్తు కాంతలకు
పరిహరించిన నేల - పాయుదు నిన్ను?
నీవు కానల కేఁగ - నిచ్చుననుజ్ఞ
దేవ నాకు ననుజ్ఞ - తెలియదే మీకు 2960
నెవ్వరు నెందుల - కెవ్వరు నన్ను
నెవ్వేళడించి పో - నెట్లగునయ్య?
కంటకాటవుల మీ - క్రమమున నేను
వెంటవచ్చుట గాక - వేఱుగాఁగలనె?
రాఁదగ వనెడి నే - రమి సేయలేదు
లోఁదాల్మిచే నీర్ష్య - లు నసూయలెల్ల
మానిన గతి నట్టి - మాటయుమాని
యానతి యిమ్ము నే - ననుసరించుటకు
దగదప్పులను నీరు - ద్రావి యవ్వెనక
మిగిలినజలము భూ - మినిఁ జల్లినటుల 2970
నను విడనాడిన - నా కేదిదిక్కు
మనసులోఁ బరికింపు - మా రఘువీర!

అణిమాదికములైన - యైశ్వర్యములును
గణుతింప నమరలో - కసుఖంబులెల్ల
పొందుట కన్నను - పురుషునిసేవ
యందు నేమఱకుండు - నదియె యుత్తమము
అతివకుఁ గులవధూ - న్యాయ మిట్లనుచు
కతలందు వినియునుఁ - గనియెఱుంగుదును
నీచరణాంబుజ - నియతసేవనమె
యాచారవిధి నాకు - నన్య మేమిటికి? 2980
కట్టిడి వనుల మృ - గంబులలోనఁ
పుట్టినయింటనుఁ - బోలియుండెదను
నీవెంట రానిచో - నెమ్మదికింపు
గావు త్రిలోకభా - గ్యములు పొందినను
నియమవ్రతంబుల - నిన్ను సేవించి
భయదాటవులఁ దరు - ప్రసవమంజరుల
వాసనలనుఁ గూడి - వాసించుచైత్ర
మాసదక్షిణపవ - మానాంకురములు
పొలయ సేదలు దేఱి - పొదరిండ్లలోన
మెలఁగ నీతోఁగూడి - మెచ్చులయ్యెడును 2990
నడవుల నెవ్వరి - నైన రక్షింప
కడునేర్చుశక్తియుం - గలిగిననీవు
ననుఁ బ్రోవఁజూలవే - నను డించిపోదు
నని యనవలవ దీ - యడవులయందు
కందమూలఫలాది - కములు సేవించి
యుందు నింతియెకాని - యొల్లనేమియును
లేనివి యడిగి తా - లిమి లేక యలసి

యే నిన్ను వెతఁబెట్ట - నెట్టిచోనైన
నెందులకు విచార - మేల? సీతార
విందలోచన కీవు - విభుఁడవుగాన 3000
నిను నెడబాయక - నెమ్మదినున్న
వనులెల్ల నుద్యాన - వనములు నాకు
కృతకాచలంబులు - గిరులు నాకెపుడు
శ్రితసఖల్ వనమృగీ - శ్రేణులన్నియును
పూవుఁబాన్పులు తృణం - బులశయ్యలెల్ల
నీవున్నస్థల మయో - ధ్యాపట్టణంబు
లాలితకందమూ - లములు రాజాన్న
మేల నిన్నెడవాయ - నితరభోగములు?
గిరులును చరులును - కింజల్కమంజు
సరసిజాకరముల - చలువనీడలను 3010
కానలఁగోనల - గైరికంబులను
నానాఝరీనదీ - నదములయందు
నామదిలో ప్రాణ - నాయక! నేఁడు
కామించితిని నిన్ను - కలసిచరింప
వలదన్న ప్రాణముల్ - వదలుదు నిన్నుఁ
దలఁపుచు నొక ముహు - ర్తము పాయఁజాల"
ననుచుఁ గన్నీటితో - నడలు భూపుత్రి
గని రఘువీరుండు - కరుణనిట్లనియె.

—: సీతకు రాముఁడు వనవాసకష్టమునుఁ జెప్పుట :—


"ఉత్తమకులజాత - వుర్వితనూజ
విత్తఱి నాదు గే - హిని వయ్యు నీవు 3020

ధర్మంబు మదిలోనఁ - దప్పక నాదు
శర్మంబుగోరి యి - చ్చట వ్రతాద్యములు
నడపుచునుండక - నావెంటనేల
యడవుల కేవత్తు - ననిపల్కెదీవు
యేలచేసెదవు నా - కింతఖేదంబు
చాలింపు వలన ది - చ్చట నుండు మీవు
సామాన్యమే? వన - స్థలనివాసంబు
భామిని దుఃఖాను - భవకారణంబు
నేనుంచి నటు లుండు - టే నీకు ధర్శ
మౌనది కాదని - యనరాదు నీకు 3030
హితము వల్కెద సుఖ - మేడది వనుల?
నతివ! బాలవు గాన - నంటివిమాట
ఘుమఘుమారావ సం - కుల ఝురీలహరి
తిమిరాతి భయదకు - త్కీలగహ్వరము
ప్రబల హర్యక్ష గ - ర్జాస్ఫూర్జితంబు
నిబిడ ఘుర్ఘుర రవా - న్విత వరాహంబు
భల్లూక గుటగుటా - ర్బటి భీకరంబు
ఝిల్లీసముత్కీర్ణ - ఝీంకరణంబు
గంధసింధుర ఘటా - ఘన ఘీంకృతంబు
సైంధవ ద్వేష దు - స్తర పల్వలంబు 3040
సముదగ్ర వాత్యాప్ర - చండ మారుతము
కమలాప్త బింబ తి - గ్మకరాతపంబు
యేకపదీ కంట - కేంధనాపూర్ణ
మా కంఠవారి మా - ర్గాపగాశతము
వీత శోణిత సుప్త - భీమ శార్దూల

మాతత నిమ్న గా - యతజలగ్రహము
దుర్దమ కర్దమ - స్తోమాంతరంబు
మర్దితాజాది గో - మాయు సంకులము
నిబిడ పాదపలతా - నీరంధ్రకాష్ఠ
మబల సంచార క్రి - యాదురాసదము 3050
నిర్జనాయత పథా - న్వితమరుదేశ
మూర్జితబంధాన - వోపరోధంబు
నలఘు ప్రవృద్ధాశ - నాయా కరాళ
మలసత్వ తృష్ణాభ - యవృధావహము
అపగత సౌఖ్యని - ద్రాహార శయన
మపరిమి తోటజా - యతన వృశ్చికము
బాల! నీవెక్కడ - భయదవనాంత
రాళ సంచరణ ధూ - ర్వహ ఖేదమేడ?
వలసిన యెడఁ దృణా - వనులందు బొరలి
యలసి రాలిన పండు - టాకులు మెసవి 3060
సెలయేరులందు దె - చ్చిన నీరుఁగ్రోలి
కలెఁగొను నడవి యీఁ - గలు మూఁగ జడిసి
చీమల దోమల - చేగాసి నొంది
పాముల గాములఁ - బ్రాణాశ వదలి
జడలు వల్కలములు - సంధించి చలికి
ముడిఁగి కార్చిచ్చుల - మూలల నొదిగి
యతిథి భాగము లిచ్చి - యమరులం గొలిచి
వ్రతనియమంబుల - వసివాడి చిక్కి
కామలోభ క్రోధ - గతులు వర్జించి
యేమేర నిల్చిన - యెడనిల్పరాక 3070

యెందునేనియు భయం - బెఱుఁగక మనసు
నందు తాలిమిపూని - యాపదలోర్చి
రానేలలం గ్రుమ్మ - రఁగ నేల నీకు?
బాల! యోరుతువె! నా - పలుకు గాదనిన
కావున నీబుద్ధి - గాదు చాలింపు
నీవనవాసంబు - నిన్ను వేఁడెదను"
అని రామ విభుఁడాడ - నశ్రు పూరములు
కొనగోర మీఁటుచు - కుత్తుకరాయ
ప్రాణేశు వదనంబు - పైజూపు లునిచి
యేణాంకముఖి సీత - యిట్లని పలికె. 3080

—: సీత భర్తతో నడవులకు రాక తప్పనని నొక్కిఁజెప్పుట :—


“నన్ను రావలదని - నాకు నచ్చోట
నెన్నేని భయము లూ - హించి పల్కెదరు
మీ సహవాసంబు - మేకొని యందు
నే సుఖంబున జంతు - నిచయంబులెల్ల
నిన్ను కోదండపా - ణినిఁ జూచి నపుడ
నన్నియు బెదరి పో - కవి యేలనిల్చు?
నీదు ప్రావున నున్న - నిర్జరప్రభుఁడు
నో దేవ! దృష్టింప - నోపునే నన్ను?
ప్రాణనాథులఁ బాయు - పడఁతుల కెందు
ప్రాణముల్ నిలుప ను - పాయంబు గలదె? 3090
భయము చెప్పెదు మీఁద - ప్రాణముల్ దొరగు
భయము నిమేషసం - ప్రాప్తమైయుండ

రాకేలయుందు పూ - ర్వమున బ్రాహ్మణులు
వాకొన్న వారేను - వనులఁ జరింప
నా పిన్ననాడె వి - న్నతెఱంగు జనక
భూపాలు నగర ని - ప్పుడు దలంచితిని
లలిత సాముద్రిక - లక్షణ విదులు
తెలియంగ ననుఁజూచి - తెలిపిరి మొదల
వనవాస సంప్రాప్త - వార్తనే నదియ
వినిబుద్ధి యెఱిఁగిన - వెనక చింతింతుఁ 3100
దప్పింతునని యెన్ని - దలఁచితివేన
తప్పునే కాఁగల - దైవయత్నంబు
నందుకు ననుగుణం - బైనది నాదు
డెందంబు మిమ్ముఁ గూ - డి మెలంగ నెంచి
అవనీసురుల మాట - లవియేల తప్పుఁ
దవిలి క్లేశము లొందఁ - దరియయ్యె నిపుడు
వనముల నిడుములె - వ్వరికైనఁగాక
నినుఁ గొల్చివచ్చుదా - నికి నాకుఁ గలదె?
నాతల్లి చెంత మా - నగరిలో నుండు
నాతరినొక జోగు - రాలు దావచ్చి 3110
నావనవాసంబు - నాఁడె వాకొనియె
నీవేళ సరివచ్చె - నిచ్చలో నిపుడు
గంగానదీ కూల - కమనీయ గహన
మంగళప్రదలతా - మంజునికుంజ
కిసలయ తల్ప సం - క్రీడా వినోద
రసభావములచేఁ గ - రంగి నీతోడఁ

గలయుటల్ కన్నులఁ - గట్టినయట్లు
తలఁపులో కోరికల్ - తలచూపఁ దొడఁగె
నడవులఁ జరియించు - నప్పుడే నీకు
నుడిగముల్ గావింప - నూహ చేసెదను 3120
లోకేశ! కానల - లోన నీతోడి
లోకమౌనది పర - లోకసాధకము
అధిపతియే దైవ - మని యాగమములు
విధియించెఁ గాన యే - వేఁడిన మనవి
తగవని వినుటొప్పు - తలిదండ్రు లెందు
తగునని యొకనికి - ధారవోసినను
ఆకన్యయే కదా - యధిపతి నెల్ల
లోకంబు నందు సు - శ్లోకుఁ గావించు
నకట! పతివ్రత - నైన నన్నేల
తెక తేరడించి పోఁ - దెగువ చేసెదవు? 3130
నీసుఖ దుఃఖముల్ - నేఁబంచి కొనగఁ
జేసిన యజుఁడు వ్రా - సిన యట్టివ్రాఁత
నీవు గాదనవచ్చు - నే సెలవిమ్ము
భావించి వత్తు నీ - పదములు గొల్చి
కాదన్న నొకత్రాట - గరళ కూటాన
లాదులం బ్రాణంబు - లర్పింతు నీకు
ధర్మజ్ఞుఁడవు నీకుఁ - దగునయ్య యీయ
ధర్మవాక్యములనీ - తాలిమి లేక
సమ్మతింపని నాథు - సన్నిధియందు
నమ్మీనలోచన - యశ్రు బిందువులు 3140

చనుమిట్టలను రాల - సాంత్వనంబొప్ప
ననునయాలాపంబు - లాడు ప్రాణేశుఁ
గోరగించిన వాఁడి - కొలుకులఁ జూచి
ధీరాత్మ యగుచు ధా - త్రీజాత యలిగి
ప్రణయాభిమానముల్ - బయలు పడంగ
గణుతి సేయక యవు - గాము లిట్లనియె.

—: సీత రామునాక్షేపించుట :—


"నిన్ను మాతండ్రి పూ - నిక దప్పలేక
తిన్నని పాయంబు - తీరునుంజూచి
మగవాలకంబుతో - మలయుచునున్న
మగువ యౌటెఱుఁగక - మదిలోననమ్మి 3150
యల్లునిఁ గా నెంచి - యతఁడు నన్నిచ్చె
తెల్లమాయెను నీదు - తెఱఁగెల్ల నిపుడు
రవితేజుఁ డా రఘు - రాముఁ డన్నట్టి
యవివేకవాక్యంబు - లనృతంబులయ్యె
నీవె దిక్కనియున్న - నెలఁతను డించి
పోవ నేయార్తి ని -ప్పుడు నీకు వచ్చె
కాలాగ్ని కల్పునే - గానకయంటి
నేలక నాదోష - మేమి గాంచితివొ?
యిదినేర మన్న నే - నెఱుఁగుదుగాక
వదలనూరక నన్ను - వర్జించితేని 3160
సత్యపతివ్రతా - చారయై తొల్లి
సత్యవంతునిఁ గూడు - సావిత్రి యనఁగ

యేననువ్రత నయి - యేతెరకేల?
మానుదుఁగుల శీల - మర్యాదలెల్ల
వదలిన వెలయాలి - వలె నిన్ను నేల
మదిమది నుండి యే - మఱి యెడబాతు
జాయోప జీవియౌ - సాని నట్టువుని
చాయ నిల్లాలిని - సడలఁ జూచెదవు
ఒక తెనుఁ ననుఁబ్రోవ - నోపనివాఁడ
నకట! యేఁటికిఁ బెండ్లి - యాడితివయ్య! 3170
నను నొక్కరునికిచ్చి - నయమునఁ దొలఁగి
చనఁజూచి నావేమొ? - చనరాదుగాక
వలసిన నిన్ను నె - వ్వఁడు మోసపుచ్చి
బలవంతుడగుచు నా - పద లొందఁజేసి
నీచేతి రాజ్యంబు - నీదుపట్టంబు
గోఁచి చేతికినిచ్చి - కోరికైకొనియె
నట్టివానికి బంటవై - యుండుమీవు
పుట్టసాఁకఁగ నేర్పు - పొడమకయున్న
నాకేల యొకని క్రిం - దనణంగియుండ
వాకొంటి వనరాని - వచనముల్ నన్ను 3180
నిన్నేల పోనిత్తు - నీవెంటవచ్చి
యున్న చోటున నుండీ - యూరిలోనైన
నడవి లోపలనైన - నద్రులనైన
కడపట స్వర్గలో - కము నందునైన
జతకూడి యుందు నీ - చరణముల్ గొలిచి
వెతలేక నామాట - వినుమింక నొకటి

అడవులఁ జరియించు - నందుకు నీకు
కడుభీతి వొడమెనే - కాని యించుకయు
వెఱపను మాటయే - వెంట యేనెఱుఁగ
పఱపును కంటక - పదములు నాకుఁ 3190
బడియలు రత్నకం - బళములు గంద
వొడిసుమ్ము గాలికిఁ - బొదివినధూళి
పచ్చిక పానుపుల్ - పట్టె మంచములు
మచ్చిక నీవు స-మ్మతముతో నొసఁగు
నాకునలమ్ము నా - కమృతమౌ నిల్లు
వాకిలిఁ దలఁపక - వత్తు నీవెంట
తల్లిదండ్రులను మదిఁ - దలఁప నేనొల్ల
కలిగినయందు నాఁ - కలిఁ దీర్చు దాన
నానిమిత్తంబు చిం - తలును వంతలును
మాని తోడుక పొమ్ము - మనవి చేకొమ్ము 3200
నినుఁగూడి యెచట నుం - డిన స్వర్గసుఖము
నినుఁబాయ స్వర్గంబె - నిరయ స్థలంబు
పగవాని కేలయొ - ప్పన సేయనన్ను
తగవౌనె యేను నీ - దాననుఁగానె?
యింకఁగాదని యం - టివే జాలలెస్స
యంకిల దీరెస - మక్షంబు నందె
సీత యేమాయనో - చెప్పెడి వార
లీతరి లేరని - యెంచి చింతిలుచు
నీవు వనంబులో - నెగులొందకుండ
యీవేళ మెప్పించి - యేక చిత్తమునఁ 3210

పయనంబు సేతునీ - పలుకుచెల్లించు
దయితలు సంకెలల్ - ధవులకునెల్ల
కావున విడనాడి - కదలుము వనికి
వేవేగ నీచిత్త - వృత్తమేర్పఱవు
నన్ను మాన్చెదుగాని - నాదుప్రాణములు
వెన్నాడి రా నీవు - విడనాడఁ గలవె?
అదియుఁ జూచెద - వేల యనుమానమింక
మదిఁగలమాట ప్ర - మాణంబుఁగాఁగ
నానతిండన” నిట్టు - లనిపల్క లేక
మౌనంబుతో మాఱు - మాట చాలించి 3220
చింతింపుచున్న దా - క్షిణ్య వారాసి
యింతిఁగన్గొని ఖేద - మినుమడి గాఁగ
నిలుపోపఁ జాలక - నెమ్మేన క్షణము
నిలుపంగ ప్రాణముల్ - నేరుపు లేక
ఆపన్నయై చాల - నడలుచు బిట్టు
వాపోవుచును పయి - వ్రాలికౌఁగిటనుఁ
బెనచి ముల్కులు - నాఁట బెదరి వేదనలఁ
గనలి కూయిడుచున్న - కరణియో యనఁగ
తమ్మిఱేకులు మరం - దము చిందురీతి
నెమ్మేన వేఁడి క - న్నీరు రాల్చుచును 3230
జలములబాసిన - జలజంబురీతి
కలకలనవ్వు చ - క్కని మోము వాఁడ
కలకంఠకాకలి - కారావుఫణితి
వెలితిమాటల వెక్కి - వెక్కి యేడ్చుచును
తన యనపాయత్ప - దర్థంబు దెలుపు

కనకకోమలగాత్రిఁ - గౌఁగిటఁజేర్చి
కానిమ్మని యవేల - కారుణ్యశరధి
జానకి వీనులు - చల్లఁగాఁబలికె.
"ఏలచైతన్య మి - ట్లేమరి నీవు
బాలాలలామ! కో - పమున నేడ్చెదవు? 3240
యేనిన్ను నెడబాతు - నే యింద్రభోగ
మైన నాకేల నీ - యండలేకున్న
వనులకు నేనేఁగ - వలసిన కతన
వనిత! నీమదిఁజూచు - వాఁడనై యుంటి
చిత్తంబులోనేను - చేసిననేర
ముత్తమగుణవతి! - యోర్చిసైరింపు
జగములు నిర్మింప - సమయింపఁజాలు
పొగడికల్ గన్న యం - బుజగర్భుశక్తి
యెంత యంతటికన్న - యెచ్చైనశక్తి
మంతుని నన్ను నీ - మాటలాడుదురె? 3250
జ్ఞానాధికుఁడు కీర్తి - సడలనియటుల
యేనేల యిట్టిచో - నెడవాతునిన్ను
వనవాసములనుండ - వనజభవుండు
వనిత! నీతలయందు - వ్రాసినవాఁడు
అదియేలతప్పు రా - నన్న నిన్నేల
వదలుదు నెఱుఁగకీ - వగ వగపేల?
అతివ! వానప్రస్థు - లడవులయందు
సతులతోనుండరే - సంసారులగుచు
వారికేదోషముల్ - వచ్చె నీవరము
కోరినదే కైక - కొసరుదీఱంగ. 3260

వర్యము వెనుక ఛా - యదేవివచ్చు
మర్యాద నా వెంట - మానిని! రమ్ము
నిలువరాదిచ్చోట - నేఁడెపోవలయుఁ
తలిదండ్రులాజ్ఞయౌ - దలఁదాల్తు నెపుడు
తనగురుండును తల్లి - దండ్రులెవ్వరికి
వనితస్వాధీనదై - వతములు సుమ్ము.
అటులుండ నితర దే - వారాధనంబు
లెటులఁగావింతురో - హీనమానవులు
లలన! ముల్లోకంబు - లను వారితోడఁ
దులగాఁ బవిత్రవ - స్తువు లేలకల్గు? 3270
నిట్టిపుణ్యులఁగొల్వ - నేవలంగాక
గట్టిగా సకలభా - గ్యములు చేకూడు
యిహపరంబులు గురు - లేకాక దిక్కు
వహియించుకొని ప్రోవ - వశమె యన్యులకు?
గురుసేవచేత చే - కురని యర్థంబు
ధరలేదుగాన యిం - దగునాచరింప
యిదిసనాతనధర్శ - మిందీవరాక్షి!
వదలక నావెంట - వత్తువుగాక
దండకారణ్యయా - త్రకుఁగొంకులేక
అండగా నీవున - న్ననుసరించుటను 3280
వన్నియదెచ్చితి - వంశంబునకును
కన్నె! నాకును నీకుఁ - గన్నవారికిని
చాలదే సహధర్మ - చరివైతివెంత
మేలునీబుద్ధికి - మిగులమెచ్చితిని
మదిరాక్షి! వేగ బ్రా - హ్మణభోజనములు

నదనుతో నగ్నిహో - త్రాదికర్మములు
జపములు హోమముల్ - శాంతులుఁదీర్చి
తపసులం బిలిచి యా - త్రాదానమొసఁగి
శయనీయ రత్నభూ - షణ వస్త్ర కనక
మయ పాత్రికాదులౌ - మనసొమ్ము లెల్ల 3290
నడుగువారికి పేర - టాండ్రకు నొసఁగి
కడునమ్మిమనల నే - కడఁ గాచువారి
అందరవలసిన - యర్థంబు లిచ్చి
ముందుగాఁగదలి ర - మ్ము ప్రయాణమునకు"
అని యూరడించి పొ - మ్మన పల్కు మగని
యనుమతింబరమ క - ల్యాణియా సీత
తనయింటిసొమ్ములం - దఱకునొసంగఁ
గని యదిసమయంబు - గావునఁ జేరి
అన్నపాదముల సా - ష్టాంగంబువ్రాలి
సన్నుతభక్తి ల - క్ష్మణుఁడిట్టులనియె. 3300

—: రాముఁడువనములకు రావలదని లక్ష్మణునకుఁ జెప్పుట :—


"శ్రీరామ! నిజము - సేసితిరే పయనము
మీరన్నగతి దైవ - మేగెల్చెనన్ను
చనుదురుగాక యే - శరములు విల్లుఁ
గొని మీపదాబ్జముల్ - కొలిచివచ్చెదను
మునుపుగాగహన భూ - ములఁద్రోవవెంటఁ
జనుచు దృష్టమృగాళిఁ - జమిరివైచెదను
యేమేర మిముఁజూడ - కెడవాయఁగలుగు
నాయింద్రసామ్రా - జ్యమైన నేనొల్ల

ననుమతియిండన్న" - ననునయోక్తులను
తనదురాకకు సమ్మ - తము నొందకున్న 3310
రాముని చరణ సా - రసముల వ్రాలి
సౌమిత్రిచిత్తంబు - చలియించఁబలికె.
“మనతండ్రిపలికిన - మాటగాదనఁగ
మనకుధర్మముగాదు - మారాడవలదు
వనికిఁబోవుదమని - వాత్సల్యమొప్ప
ననుఁగూర్చిపల్కుటల్ - నమ్మియుండితిని
మున్ననుజ్ఞ యొసంగి - మొగమాట లేక
నన్నువీడఁగనాడ - నాయమే నీకు?
యిపుడేల వద్దన - నీమాటవలుకు
నపుడు మిక్కిలి సంశ - యంబయ్యె నాకు 3320
రాకమాన" నటన్న - రాముండు సుగుణ
సాకల్యశాలి ల - క్ష్మణునకిట్లనియె.
"సద్ధర్మపరుఁడవు - సైదోడవెపుడు
బుద్ధిమంతుండవు - పుణ్యశీలుఁడవు
చలమేలప్రాణ - సముఁడవిట్లయ్యు?
కలగి యీక్రియబల్క - గారణంబేమి?
నీవును నావెంట - నేవచ్చినపుడు
దేవికౌసల్య యే - తెఱఁగున బ్రతుకు?
తలఁపనెవ్వరు సుమి - త్రనుఁ బ్రోచువారు?
పలుకుమా మనవారి - బ్రదుకుచందంబు 3330
పర్జన్యుఁడవని తా - పముఁదీర్చినట్ల
దుర్జయశౌర్య! నీ - తోడుగావలదె
కామాతురుఁడు రాజు - కైకేయికొడుకు

భూమికెల్లనురాజు - ప్రోచునేవీరి?
భరతుండుతమ - తల్లిపలుకులోవాఁడు
సరిగాఁగనడవునే - సవతితల్లులను?
నీరాకకన్నవ - న్నియగాదె నాకు
పోరానితల్లులఁ - బోషించితేని
అరలేనిభక్తి నా - యందుగల్గుటకు
గుఱుతుగా నిరువురి - కొలలురాకుండ 3340
నన్నునీడేర్ప న - నంతపుణ్యంబు
వన్నెయు వాసియు - వచ్చునీకిపుడు
చలమేలవలదన్న - సౌమిత్రి!" యనుచుఁ
బలికిన క్రమ్మరఁ - బలికె లక్ష్మణుఁడు.
"భరతుండు మీప్రతా - పంబున వారిఁ
గరుణతోఁబోషింపఁ - గలఁడేల యింత
చింతకౌసల్యకు - స్త్రీధనంబైన
స్వంతమైనది గ్రామ - సాహస్రకంబు
ననువంటివారి నెం - దఱనైనఁబ్రోవ
తనశక్తి గలిగిన - తల్లికై వగచి 3350
పసవునకిచ్చిన - పల్లెలునూరు
రసఖండములు సుమి - త్రకుఁగల్గియుండ
నాయమ్మలకు లేని - యవధిగల్పించి
పాయఁజూచెదవు - నాపలుకియ్యకొనక
యేయమ్మ! జానకి! - యెప్పుడునీదు
సేమంబుఁగోరి కా - చి భజించుటెల్ల
యింతమాత్రమె యయ్యె - నే నన్ను వెంట
సంతరించుకపోక - జాఱద్రోచెదవు

నీకన్నప్రాణముల్ - నిలువవు సుమ్ము
నాకు శ్రీరాముఁ గా - నక క్షణంబైన 3360
యొకమాటయనవమ్మ! - యొచ్చంబురాదు
నికటంబునందునుం - డి యుపేక్షయేల?
యెఱుఁగవే శ్రీరామ! యెల్లధర్మములు
పరికింప నిన్నెడ - బాయకుండుటలె
నాకు ధర్మముగాక - ననుడించివోవ
మీకుధర్మముగాదు - మేలెంచితేని
వనవాసముల కేను - వలసినవాఁడ
వనితతోఁజనుచున్న - 'వాఁడవు నీవు
పారయువిల్లును - బాణముల్ దాల్చి
మీరునిల్చిన చోట - మేదినియూడ్చి 3370
మిట్టపల్లములొక్క - మేరఁగాఁ జెక్కి
చుట్టిన చీమలుం - జొరరాకయుండ
ములుకంప యొనరించి - ముందరనొక్క
చలువపందిరిపర్ణ - శాల యేర్పఱచి
మిమ్మునచ్చటనుంచి - మీకుఁగావలయు
కమ్మదావుల విరుల్ - కందమూలములు
తీయనిఫలములు - తేటలౌనీళ్లు
నేయెడవలసిన - నేఁదెచ్చియిచ్చి
యానందమున సౌఖ్య - మనుభవింపుచును
జానకీయుతముగా - శయనించునవుడు 3380
గిరికందరంబులఁ - గ్రీడించునపుడు
శరమేర్చి చేవిల్లు - సజ్జంబుచేసి
తగునట్టి నెలవునఁ - దరలక రేయుఁ

బగలు నేమరకుందుఁ - బనిగొమ్మునన్నుఁ"
అనినరాముఁడు చాల - హర్షించి యతఁడు
తనవెంట రా సమ్మ - తమున నిట్లనియె.
"వినిపించఁదగు నెడ - వినిపించి పయన
మనిపించి కొనుము నీ - యాప్తులచేత
జనకయజ్ఞంబున - జలధినాయకుఁడు
తనకిచ్చినట్టి కో - దండముల్ రెండు 3390
కనకతూణీరముల్ - కవచంబు హేతి
మునువసిష్ఠునిగృహం - బున పూజలంది
యున్నవి దెమ్మన్న - నూర్మిళారమణుఁ
డన్నియు నతనిగే - హమునకునేఁగి
ఆమునియొసఁగంగ - నవిగొంచువచ్చి
రామునికట్టెదు - రను దెచ్చియునుప
చూచి హర్షించి మె - చ్చుచు నింక మనకు
నీచాయతామసం - బేల నీవిపుడు
పిలిపింప భూసుర - బృందంబుమనలఁ
గొలిచినవారికి - కోర్కెలీవలయు 3400
మనయింటఁగలుగు స - మస్తధనంబు
నునిచియెవ్వరికని - యొప్పగించెదము.
ఆచార్యపుత్రుసు - యజ్ఞునింబిలువు
మేచాయనర్థుల - నెల్లరమ్మనుము
వలసినవిచ్చి పో - వలయునువెడలి
వలదు" తామసమన్న - వచ్చి లక్ష్మణుఁడు
అగ్నిహోత్రగృహంబు - నందువసించు
నగ్నిసంకాసు సు - యజ్ఞునింగాంచి

ప్రణమిల్లి “మిము రామ - భద్రుండుబిలిచె
క్షణమైన తామసిం - చఁగరాదు రండు" 3410
అనవినియతఁడు మా - ధ్యాహ్నికవిధులు
చనఁదీర్చివచ్చి ల - క్ష్మణుఁడునుఁ దాను

—: రాముఁడు దానములుఁ జేయుట :—


శ్రీమించిసకల ల - క్ష్మీధామమైన
రామునినగరిని - రామునిఁజూచి
సీతాసమేతుఁడై - శ్రీరామచంద్రుఁ
డాతతభక్తితో - నంజలిచేసి
తమయాత్ర వివరించి - తారహారములు
కమనీయకుండలాం - గదభూషణములు
యిచ్చిజానకిచేత - నిప్పించెసొమ్ము
లచ్చపుభక్తితో - నతని భార్యకును. 3420
పట్టిమంచంబులు - పఱపులు, మేలు
కట్టులు తలగడల్ - కనకాసనములు
అందలంబులుఁజతు - రంతయానములు
కుందనపుంగట్ల - కొమ్ములతోడి
శత్రుంజయాది గ - జంబులు వేయి
పాత్రవైఖరిసమ - ర్పణముగావింప
రామలక్ష్మణుల ధ - రాతనూజాత
నామౌని దీవించి - యరిగినయంత
“రమ్ము! లక్ష్మణ! నవ - రత్నంబు” లనుచు
సొమ్ములచే నగ - స్త్యుని గాధిసుతుని 3430

జలములచేత స - స్యంబులపోలి
అలరింపు పిలిపించి - యన్నియు నొసఁగి
సిరులు కౌసల్య యా - శ్రితులకు వారి
తరముల గురులైన - తైత్తిరీయులకు
వాహన భూషణ - వసన సౌవర్ణ
బాహుళ్య మొసంగి - సంపన్నులఁ జేయు
కడునమ్మి మనములఁ - గాచియున్నాఁడు
తడవులనుండి చి - త్రరథుఁడన్మంత్రి
ఆయనకును సువ - ర్ణాంబరాభరణ
దాయినై మదికి సం - తసము ఘటింపు 3440
మలరంగ కఠశాఖ - యధ్యయనంబుఁ
గలుగు నాశ్రితులైన - కాఠ విప్రులకు
నర్థిఁ గలాప శా - ఖాధ్యాయు లగుచు
నర్థించు (నా) కాపు - లగుభూసురులకు
నిత్యాధ్యయన కర్మ - నిరతులు బ్రహ్మ
నిత్యులు నగువటు - నికరంబునకును
ఆవులునుం బలు - నజములు హరులు
లావుటెద్దులు దెచ్చి - లక్షల కొలఁది
కౌసల్య మెచ్చ ల - క్షలకు దీనార
రాసి దక్షిణలు గా - రప్పించి యిమ్ము 3450
యీసీత వెంబడి - నేతెంచువారి
కేసొమ్ము లడిగిన - నిమ్ము ధన్యులుగ
నీవలసిన వారి - నెవ్వలుదీఱ
కావలసిన యట్టి - కనకంబు లిమ్ము
చను" మన్నయపుడు ల - క్ష్మణుఁడు శ్రీరాము

ననుమతి దానసిం - హాసనంబెక్కి
త్యాగధ్వజం బెత్తి - తముకు సేయించి
వేగంబె తమసొమ్ము - వెచ్చింపుచుండ
తనుఁజూచి పరికించు - తనపగవారిఁ
గని రఘువీరుఁడు - కరుణ నిట్లనియె. 3460
"వనవాసమున కేఁగి - వత్తుము మఱలి
మనమున నేల యు - మ్మలికింప మీకు
నాకెంత యీపదు - నాలుగేండ్లనఁగ
మీకేమి కొఱఁత యే - మిటికిఁ జింతిలఁగ
నామందిరము లక్ష్మ - ణ కుమారు నగరు
నేమఱ కేవేళ - నెచ్చరిల్లుచును
కావుఁడీ ” యనుచు బొ - క్కసముల వారి
నావేళ పిలిపించి - యాదరం బొప్ప
మనలక్ష్మణుండు బ్రా - హ్మణులకునెల్ల
ధనములు నొసఁగె నే - దానంబు సేయ 3470
మిగిలిన ధనమెల్ల - మీ వశంబగుచు
నగరిలోనున్న భం - డారమంతయునుఁ
దెమ్మన్న వారలు - తెచ్చి శ్రీరాము
సమ్ముఖంబున నుంప - సకలయాచనక
గాయక నటక మా - గధ బాలకులకు
నేయర్థ మడిగిన - నిచ్చి వెచ్చించి
ఘనుని జైవాతృకు - గర్గ వంశమునఁ
దనర జనించు చం - ద్ర సహస్రజీవి
త్రిజటుఁడ న్విప్రుని - తెఱవ దారిద్ర్య
రుజనతి మాలిన్య - రూపిణి యగుచు 3480

మగనిఁ జేరఁగ వచ్చి - మనరామవిభుఁడు
జగదేకదాత యీ - జనుల కందఱికి
కోరికలిచ్చుచో - గొడ్డలి గడ్డ
పారయు పారచి - ప్పయుఁ గొడవలియు
మోచుక వనమూల - ములు ద్రవ్వితెచ్చి
యేచాయఁ గడలేని - యిడుమలం బడుచు
కడుపున కన్నంబు - కట్టుకో చీర
ముడువఁ గాసునులేక - ముదిసి ముప్పునను
అలమట పడనేల - యడుగుముపోయి
వలసినవిచ్చు భూ - వర కుమారకుఁడు” 3490
అనియాలు బోధింప - నాత్రిజటుండు
పెనుఁజింపి గుడ్డలు - పిఱుఁదునఁజుట్టి
చంటను వెంటవా - చఱచుబిడ్డలను
కంటగింపుచు భార్య - కడకునేతేర
గూనువంచుక యూఁత - కోలయుఁదాను
దీనుఁడై నగరు సొ - త్తెంచి నాల్గేను
సావళ్లు గడచి య - చ్చట దడలేక
పోవుచు సీతావి - భునిఁ జేరఁనేఁగి
"బిడ్డలుగలవాఁడ - పేదవిప్రుఁడను
గొడ్డలి నాయాస్తి - కోనయుంగూడు 3500
నెన్నడులే దుంఛ - వృత్తినుండుదును
నన్నుఁబ్రోవుమనాథ - నాథ! వేఁడెదను
ఆలిబిడ్డలచేతి - యాపదమాన్పి
పాలింపు నన్ను కృ- పాదృష్టిఁ జూచి

అనలేఁతనవ్వుతో - నారఘువీరుఁ
డనుకంప చిగురింప - నతనికిట్లనియె.
"వలసిన యావులు - వలసినసొమ్ము
వలసిన వారి క - వ్వారిగా నేఁడు
సౌమిత్రియొసఁగె నె - చ్చటనుండినీవు
లేమిఁజెప్పెదు సొమ్ము - లేదు మానగర 3510
తరిదప్పెనైన ని - త్తరి నన్నునడిగి
చిఱుతపోవుదు వేని - చేయూఁతకోల
యీయాలమందపై - నిప్పుడు విసరి
చేయెత్తిపార వై - చిన నెందు వడియె
నందుకులోనైన - యావులన్నియును
తుందుడుకులు మాని - తోలుకపొమ్ము
యిచ్చెద నీశక్తి - యిపుడె చూచెదము
విచ్చేయుఁడ "నినని - వ్విప్రుండుబొంగి
గోసిసౌరించి గ్ర - క్కున బయల్ దేరి
చేసన్న నిల్లాలిఁ - జెంతకుఁబిలిచి 3520
వడిమీర పాఁతదో - వతిగుడ్డలెల్ల
మడతలువెట్టి ప - ల్మరు వడివెట్టి
గట్టిగానడుము వం - గక యుండఁజుట్ట
చుట్టి యింతి బిగింప - శూరుఁడై యతఁడు
బిగువుతోఁ బ్రాణముల్ - పిడికిటఁబట్టి
తెగియూఁతకోలచేఁ - ద్రిప్పివైచుటయు
బిరబిరనదిపోయి - పెనుమందలోన
సరయూ తటంబున - జప్పుడుగాఁక

వొకవృషభముచెంత - నుర్విపైఁబడిన
సకలేశుఁడగు రామ - చంద్రుండుమెచ్చి 3530
అద్దిరా! యీ బాఁప - నాస" యటంచు
వద్ద వై దేహిన - వ్యఁగ రఘూద్వహుఁడు
చేయి నొచ్చెనో యల - సితి రంచునతని
డాయంగ వచ్చినిం - డఁగ గౌగిలించి
ఆమందఁగలయావు - లన్నియునొసఁగి
యామౌనిఁ జూచియి - ట్లనియాదరించె.
"పరిహాసకముగ నేఁ - బలికినమాట
ధరణీసురేంద్ర! చి - త్తమున సహింపు
యిదివేఁడవచ్చురా - దిదియంచు నీదు
మది ననుమానంబు - మాని కావలయు 3540
సొమ్ములు వేఁడుమి - చ్చోనిత్తు "ననిన
సమ్మోదమున మునీ - శ్వరుఁడిట్టులనియె.
“అడిగెడికొలఁది యే - యనఘుని దాన
మడుగనేర్తురె యిన్ని - యావు లిమ్మనుచు
నతిమానుషములు నీ - యతులితశౌర్య
వితరణంబులు చాలు - వేవేలుమాకు
సుఖవిఁగమ్మని" వోవు - చో రామవిభుఁడు
సఖులకు భృత్యదా - సవితానమునకుఁ
గలిగినధనమెల్ల - గ్రామంబులొసఁగి
తలతలనందఱఁ - దనియంగఁజేసి 3550
తమ్ముఁడుదాను సీ - తయుఁ దండ్రికడకు
సమ్మదంబుననేఁగ - సదనంబు వెడలి.

—: సీతాలక్ష్మణులందోడ్కొని పోవ ననుజ్ఞవేఁడ రాముఁడు తండ్రికడకు బోవుట :—


జానకిసంతతా - ర్చనముల భాస
మానంబులైన భీ - మశరాసనములు
నతుల నిషంగద్వ - యంబు ఖడ్గములు
హితభక్తిఁదాలిచి - యిరువురివెనక
సౌమిత్రిఁ గొలిచి రా - జనకజంగూడి
రామచంద్రుఁ డయోధ్య - రాజమార్గమున
పురజనులెల్ల గుం - పులు గట్టివీథు
లరికట్టుకొని వింజ - మాకిడినట్లు 3560
చూడఁజోటేది మ - చ్చులును మేడలును
మాడుగులును నెక్కి - మతులఁజింతిలుచు
"అకట! నల్గడఁజతు - రంగబలంబు
లకలంకమతిఁగొల్వ - నలరుచువచ్చు
నాదిగర్బేశ్వరుం - డగు రామవిభుఁడు
వైదేహితో నొంటి - వచ్చె కాల్నడను
నొరులకునైశ్వర్య - మొసఁగు సామర్థ్య
గరిమంబుగలుగు రా - ఘవుఁడద్దిరయ్య!
తనతండ్రిరాజ్యమం - తయునేలుచుండ
ననదకైవడినొంటి - నరుదేరవలసె 3570
వైమానికులు మింట - వచ్చుచోనైన
తాము చూచెదమని - తలఁపరానట్టి
రాముని పట్టంపు - రాణివాసంబు
భూమిజఁ బురజనం - బులు చూడవలసె

పరిమళంబులువోసి - పసిఁడిమేడలను
పరమదివ్యాంబరా - భరణముల్ దాల్చి
చెలులుగొల్వ మెలంగు - సీతయేరీతి
మెలఁగునోగహనభూ - మిని నాథుఁగూడి?
ఆనరపతి పిశా - చావిష్ఠుఁడైన
వానికైవడి నంప - వచ్చునెవీరి? 3580
గుణహీనులైనట్టి - కొడుకులేమైన
గణుతింపకిటుసేయఁ - గలతండ్రిగలఁడె?
యీసర్వగుణముల - కిరవైనరాముఁ
బాసిపొమ్మనియెట్లు - వల్కెనోరాజు
సతతంబు షడ్గుణై - శ్వర్యసంపదల
నతిశయించిన రాము - నలమటల్ చూచి
గ్రీష్మవాహినులఁగ్రాఁ - గిన యల్పవారి
నూష్మచే జలచర - వ్యూహమంతయును
తపియించు గతివీరు - దఱిలిపోఁజూచి
యిపుడోర్వనేర్తురే - యీపురజనులు 3590
వేఱుఁగొట్టినచెట్టు - విరులచందమున
పౌరులందఱువాడు - బొరియున్నారు
శ్రీరాముఁడే తమ - జీవనస్థితికి
నారయ మూలమై - యాధారమగుట
తడయకపుత్రమి - త్ర కళత్రములతొ
యడవులకీ రాము - ననుసరింపుచును
ధనధాన్యపశువస్తు - తతితోడఁగూడి
జనులెల్లఁబోవని - చ్చట నివాసముల

నారామముల మూషి - కాది జంతువులు
క్రూరసర్పములు నె - క్కొనియుండుఁగాక! 3600
రామునింగూడి య - రణ్యంబులందు
భూమీజనంబులు - పురముగానుండ
అచ్చటిజంబుక - వ్యాఘ్రాదిమృగము
లిచ్చటివాడల - నిరవొందుఁగాక!
ఎవ్వరు లేనట్టి - యీపాడుపురము
దవ్వులనున్న యా - త్మజుని రప్పించి
పట్టంబుగట్టుక - పతియునుఁదాను
నట్టిచోఁగైక రా - జ్యము సేయుఁగాక!
యీరాముఁడున్నట్టి - ఎడ పట్టణంబు.
కారడవి యితండు - కడనుండుపురము 3610
మనములఁజూచి జి - హ్మగములు వెఱచి
వనముల నెడవాసి - వచ్చియిచ్చోట
చెడి దిక్కు లేనట్టి - సింహాసనములు
విడకచుట్టును పరి - వేష్టించుఁగాక!
ఝిల్లీరవక్రూర - ఝింకారరవము
పిల్లఁగ్రోవులనాఁదు - పెంపుగానెంచి
నిదురమేల్కనువేళ - నిరతంబు భరతుఁ
డదియె మంగళగాన - మనియెంచుగాక!"
అని వాడవాడల - నాడాడ నాడ
జనులమాటలు తన - శ్రవణముల్ సోఁక 3620
కరుణించి విని నిర్వి - కారుఁడై మత్త
కరిరాజగంభీర - గమనంబుతోడ
మొగమువాంచు సుమంత్రు - ముందరఁజూచి

“రమ్ముసుమంత్ర! - మారాజునుంజూడ
సమ్మోద మొదవ ని - చ్చటికి వచ్చితిమి
మాతండ్రితోడ నీ - మాటయేర్పఱచి
ప్రీతితో మమ్ముర - ప్పింపుమీ" యనిన
అర్తుడై రాహుగ్ర - హగ్రస్తుఁడగు వి
కర్తనుగతి నీఱు - గప్పినవహ్ని
కరణి నిర్జలతటా - కమురీతిఁబొంగు 3630
తరుగువారధిమాడ్కి - దశరథనృపతి
రామునికై విచా - రముతోడనుండ

—: శ్రీరాముఁడు మఱల తండ్రికడ సెలవు పుచ్చుకొనుట :—


చేమోడ్చి తాను వ - చ్చిన యట్టిరాక
ధరణీసురాళికి - దానముల్ చేసి
పరిజనంబులఁబోచి - బాంధవావళికిఁ
జెలులకుఁదల్లికిఁ - జెప్పి వారనుపఁ
దలఁవులో మిముఁజూడఁ - దలఁచి వాకిటను
జానకీలక్ష్మణ - సహితుఁడై వచ్చి
భానుసంతతిఁగూడు - భానునికరణి 3640
నుత్తమరాజగు - ణోత్తరుండై వి
యత్తలంబునఁబొందు - లన్నియు మాని
యత్యంత పరిశుద్ధుఁ - డై ప్రమోదమున
సత్యసంధుండు రామ - చంద్రుఁడున్నాఁడు”
అన విని దశరథుఁ - డడలుచు నతనిఁ
గనుఁగొని నగరిలోఁ - గల కులాంగనల

నందఱఁదోడితె - మ్మతివలు నేను
నిందుసన్నిభు రాము - నీక్షింపవలయు
పొమ్మ"న్న నతఁడంతి - పురమునకరిగి
అమ్మాట వివరించి - యచటమున్నూట 3650
యేఁ బండ్ర కులసతు - లింతి కౌసల్య
తోఁబొదువుక రాఁగఁ - దోడ్కొనివచ్చి
భూమీశుచెంతన - ప్పుడు నిల్వ నతఁడు
రామునిం బిలిపింప - రామలక్ష్మణులు
సీతయురాఁజూచి - సింహాసనమున
నాతరి నిల్వలే - కవనిమూర్చిల్లి
పడియుండునెడ రఘు - పతి చేరనేఁగ
పడఁతులందరుఁ గలా - పంబులుమొరయ
"హారామ! హారామ! యనునార్తరవము
బోరుననిండ న - ప్పుడు రఘూద్వహుఁడు 3660
జానికిలక్ష్మణ స - హితంబుగాఁగ
దానునుబిట్టురో - దనమాచరించి
తనతండ్రినచ్చట - తల్పంబునందు
నునిచిసీతయుఁదాను - నుపచరింపఁగను
తెలివిగైకొని కన్ను - దెఱచిన విభుని
వలగొని యారఘు - వర్యుఁడిట్లనియె.
“వనవాసమున కేఁగు - వాడఁనై మిమ్ముఁ
గనుగొనవలసి యి - క్కడికి వచ్చితిని
నన్నుఁగన్గొని దీవ - న లొసంగి ననుపు
యెన్ని చందంబు - ల నేవలదన్న 3670

యీసుమిత్రా పుత్రుఁ - డీ సీతవెంట
రాసమకట్టి వా - రలు వచ్చినారు
యీజానకి కనుజ్ఞ - యిమ్ము లక్ష్మణుని
తేజోధికునిఁ జూచి - దీవించి పనుపు
మందరికినిఁ గర్త - యైన రాజీవ
నందనుగతి భూజ – నంబులకెల్ల
రాజవు మాకుఁ గ - ర్తవుఁదండ్రి వగుట
కీజాడ మీరాన - తిచ్చిరి రటుల
నడచువారము గావు - న ననుజ్జయిమ్ము
తడవేల" యనుటయు - దశరథుం డనియె. 3680
"కామాతురుండను - కైకకు లొంగి
యేమున్ను వరమిచ్చి - యిటునటుఁగాక
ఆర్తి నొందిన వాఁడ - నట్టిదుర్బుద్ధి
వార్తలు చెవి నాన - వలపదునీవు
లెక్క సేయక యెంత - లేదు వొమ్మనుచుఁ
గ్రక్కున పట్టంబు - గట్టు కొమ్మీవు
నామాట విను”మన్న - నమ్రుఁడై లేచి
భూమీశునకును న - ప్పుడు రాముఁడనియె.
“పలుకుదు రే యిట్లు - పార్థివ! మీరు
గలిగిన పదివేలు - గాలంబులకును 3690
ఆడి తప్పుదురయ్య - యరిగెద వనికి
నేడె నాపంతంబు - నెనయజెల్లించి
తరవాత మీపద - ద్వయములు చూడ
మరలి వచ్చినవెన్క - మఱిసేతు నటుల”
అనవిని కైక తా - నడ్డంబు దూరి

"జనపాల! యిఁక తామ - సంబేల? రాముఁ
బొమ్మను" మనిపల్కఁ - బోయి రండనుచు
సమ్మానవాధీశుఁ - డాడి నట్లాడి
యీరేయి కౌసల్య - యేనునుగూడి
యూరడిల్లఁగ యిందు - నుండివేఁకువను 3700
"అన్న! సేమంబున - నరిగి క్రమ్మరుము
నినుఁ బొమ్మనునది - నిక్కంబు గాదు
కైకేయి పోరుకుఁ - గాక పొమ్మనుచు
వాకొంటెనది యెన్న - వలదు నిక్కముగ
నాసుకృతమె సాక్షి - నమ్మితింజిచ్చు
తోసరియగు నిట్టి - దుష్టాత్మురాలి
చేత నిర్బంధంబు - చే నినుఁబాయు
హేతువు గనలేక - యిచ్చకోర్చితిని
చాలు నింతేల నా - సత్యంబు నీవు
పాలింతు నని కైక - పలుకు చేసెదవు 3710
హితము గాదిది నాకు - నేలకుమార!
వెతల పాలుగఁ జేసి - వెడ బుద్దివైతి"
అనిన లక్ష్మణుఁగూడి - యంజలిచేసి
వినయంబునను రఘు - వీరుండు పలికె.
"ఎల్ల రాజ్యంబును - నేలుటకన్న
నుల్లంబులోఁ గాన - నుండఁ గోరెదను
కోరెద కైకేయి - గోరిన వరము
మీరిచ్చు నదియె నా - మేలుగానెంచి
భరతునిఁ గట్టుఁడు - పట్టంబునాకు
పరమ లాభంబు మీ - పల్కు నిల్పుటలు 3720

తొలఁకు మానినయట్టి - తోయధిరీతి
కలఁక నొందక యుండఁ - గావలెఁగాక
యిట్టు లాడుదురె మీ - కేల విచార
మెట్టైన వనుల కే - నేఁగకమాన
నీరాజ్య సుఖమైన - నీసీత నైన
స్వారాజ సామ్రాజ్య - సౌఖ్యంబెయైన
మానుదుఁ గాకేల - మానుదునీదు
పూనికె చెల్లింపఁ - బూనిన వ్రతము
యిది సత్యమని యెన్ను - మింక నాపూన్కి
వదల క్షణంబైన - వసియింప నిచట 3730
శోక మోహంబు లి - చ్చో మాను మేను
కైకేయికి హితంబుఁ - గావించువాఁడ
దేవతావళికైన - దేవుండుతండ్రి
గావున మీమాట - గడవ నోడుదును
యొరుల ఖేదము మాన్ప - నోపిననీవు
ధరణీశ ! నాకునై - తలఁపంగఁ దగునె?
పనిలేదునీకు తా - పము సుఖివగుము
తనకేమి కొఱత కాం - తారంబులందు
కందమూలముల నాఁ - కలి దీర్చిమేలు
నందెద పదునాలు - గబ్దముల్ చనిన 3740
పోయివత్తునె యన్న " - భూపతి రాముఁ
బాయఁజాలక కేలు - వట్టిరాఁదిగిచి
కౌఁగిటనునిచి శో- కమున మూర్చిల్లు
చోఁగాంచి రఘుపతి - శోకింపుచుండ

కౌసల్య మున్ను గాఁ - కైకేయిదక్క
వాసంబులో రాణి - వాసంబులెల్ల
విలపింప సౌమిత్రి - వెత నొందసీత
కలఁగుచు పుట్టెడు - కన్నీరుగార
చూచి సుమంత్రుఁడే - డ్చుచుఁ దెల్వినొంది
లోచనంబులనుఁ జ - ల్లున నిప్పులురల 3750
జేగురింపగ మొగంబు - చెమరింపమేను
సాగునిట్టూర్పు వె - చ్చఁదనంబు లీన
కటకముల్ గదలను - త్కట కోపుఁడగుచు
కిటకిట మొనబండ్లు - గీఁటుచుఁగైక
దిట్టమై నిలుచున్న - తెఱఁగాత్మరోసి
చుట్టు నందఱుఁ వినఁ - జూచి యిట్లనియె.

—: సుమంత్రుఁడు కైకను నిందించుట :—


"రాజు చిత్తము నీవె - ఱంగఁగలేక
యోజంత! యెంతకు - నొడిగట్టినావు
కులమెల్లఁ జెఱచి నీ - కునుఁ గర్తయైన
యిలపతిఁ బొలియింప - నెత్తుకొన్నావు 3760
యిట్టుచేసిన మీఁద - నేమేమిసేయ
దట్టి గట్టితివొ పా - తకురాల వీవు
కలఁగఁ బారని యట్టి - కలశాంబురాశి
చలియింపకున్న కాం - చనభూధరంబు
అని పరాజయము లే - నట్టి దేవేంద్రుఁ
డన మీరునట్టి మ - హారాజు నిట్లు

వెతఁ బెట్టెదవు తన - విభు మీఱి నడుచు
నతివ పుట్టువు నిర - యముల కాస్పదము
కొడుకు నిమిత్తమై - కులమెల్లనీవు
చెడఁజూచెదవు ధర్శ - శీలముల్ వదలి 3770
భరతునిఁ బిలిపించి - పట్టంబు గట్టి
ధరణి యేలితివేని - తగనిచో మేము
కాలూఁది నిలరాదు - గావున నిచట
చాలించి రాముని - జాడ నేఁగెదము
పాపాత్మురాల! యే - పగిది నీపెద్ద
మోపుగా నిను ధాత్రి - మోచెనో కాక
యివ్విప్రులును మౌను - లేవేళనిన్ను
ప్రువ్వఁదిట్టిన తిట్లు - పొరిగొనకున్నె?
చాయల వెలయు ర - సాలంబు నరికి
డోయిట వేపచె - ట్లుకుఁబాలు వోయ 3780
నదిచేఁదు మానని - యటుల కౌసల్య
వదలని పైదయ - వాఁడైన కతన
నాకర్మ ఫలము దా - ననుభవింపుచును
నీకునై మీఁదెత్తె - నృపతి ప్రాణములు
జననికింగల యాభి - జాత్యంబునీకు
నినుమడి గాఁగల - దిఁకదాఁచనేల?
ముసిఁడి చెట్టునఁదేనె - మొలచునే తల్లి!
యసమెల్లఁ దింపుసే - యఁగఁబుట్టి తీవు
నీజనని తెఱం గ - నేకులచేత
నేజాడ వినికని - యెఱిఁగి యుండుదును 3790

ఆకథ వివరింతు - నదియెట్టు లనిన
వాకొందు శ్రవణ ప - ర్వంబుఁగా వినుము.
ఒకయోగి వర్యుచే - నువిద! మీతండ్రి
సకల జంతువుల భా - ష లెఱుంగునట్టి
వరములు గైకొన్న - వరమౌని యతనిఁ
బరికించి యొరులకీ - భావంబు నీవు
చెప్పినచో గత - జీవుండ వగుదు
వప్పుడే యనిపల్క - నటుతరవాత
కొన్నినాళ్లకుచీమ - గుంపులో పసిఁడి
వన్నియగల చీమ - వనితతానొక్క 3800
కందువ మాటాడఁ - గా వినిమెచ్చి
యందుకై నవ్విన - యపుడు కైకయునిఁ
జూచి మీతల్లి “యి - చ్చో నేల నవ్వి
తీ చీమఁ గనియన్న - నెఱిఁగింపఁజూచి
తలఁచుక కారాదు - తరుణి నేఁ దెలుపఁ
బలికి నప్పుడ తన - ప్రాణముల్ బోవు
ననినఁ గోపించి మీ - యమ్మ యమ్మగనిఁ
గనుఁగొని యివి గొన్ని - కల్లలుగాక
యెందైన తమరు ము - న్నెఱిఁగినమాట
పొందుగాఁ దెలిపి న - ప్పుడె హానిఁజెందు 3810
వారలు గలరె? యీ - వార్త నాతోడ
నేరుపాటుగఁ దెల్పు - మింతటిలోనఁ
బోవుప్రాణము లున్నఁ - బోయిననేమి?
చావుకు వెఱచినఁ - జావ కుండెదవె
యామీఁద నీవెటు - లైన నాకేమి?

యీమాట వివరింప - కెటులుండనిత్తు
వేగఁబల్కు మటన్న - వెఱచియా మొదటి
యోగి చెంతకుఁబోయి - యోమౌనిచంద్ర!
నేవచ్చు తెఱుఁగిది - నేఁడు నావనిత
భావమిట్టిది యని - పలికిన నవ్వి 3820
“మేలుమే లే సాధ్వి - మేదిని మఱియు
నాలని మొగఁడని - యాడుకోవలనె
అని తలయూచి - ఓ యధిప! వర్జింపు
మనుమానమేల యి - ట్లాడిన దాని
మొగము చూడఁగరాదు - మోదించివానిఁ
దెగఁజూచి యింట బం - దిగమునవైచి
వలయు నింతులఁగూడి - వరమిచ్చినాదు
పలు కేమఱకసౌఖ్య - పరుఁడవుగమ్ము
పొమ్మన్న " నతఁ డంతి - పురికేఁగిదాని
సొమ్మెల్లదోఁచి యీ - సున దయలేక 3830
తొత్తుల చెఱసాలఁ - ద్రోపించెనితని
యత్తనుత్తము రాలి - నటువలెఁ జేసి
యిలయెల్ల నేలుచు - నిపుడున్నవాఁడు
తలఁపని వట్టి పా - తకురాలియందు
పుట్టితి విపుడు నీ - బోధన చేత
నిట్టి యాపదలకు - నిరవయ్యె నితఁడు
కొడుకులకునుం దండ్రి - గుణములునాఁడు
బడుచులు తల్లికిఁ - బాటిల్లు గుణము
మజ్జాతియని యాగ - మంబులు పలుకు
విజ్జోకు గాదునీ - విధము నట్టిదియె 3840

నామాట వినినీవు - నరపతిం బ్రోచి
యీమహీ జనులకు - హిత మాచరింపు
పాపంబునకుఁ జొచ్చి - పతి నపవాద
కూపంబులోఁ గట్టి - కూలఁ ద్రోయకుము
వదలఁడు నీకిచ్చు - వరము లీరాజు
పదవులన్నియు సమ - ర్పణ సేయునీకు
మగని ప్రాణము లిచ్చి - మముఁబ్రతికించి
పొగడికల్‌గని సర్వ - భోగభాగ్యముల
నందఱిలో మించి - అమ్మ! నామాట
చిందు సేయకనీవు - చేపట్టి తేని 3850
వన్నెయు వాసియు — వచ్చునునీకు
నిన్నుఁ జేపట్టిన - నృపతికిఁగాన
నుత్తమ గుణురాము - నుర్వి పాలింప
నుత్తరు వొసగుమి - ట్లుచితంబుగాదు
ముట్టఁ జిక్కిన తండ్రి - ముదిసి ముప్పునకు
నిట్టిచో శ్రీరాము - నెడవాసి తేని
అపకీర్తి పాలౌదు - వాపదల్ గాంతు
వపమృత్యు వగుదు వీ - వవనీశ్వరునకుఁ
గావున రాఘవుఁ - గట్టు పట్టంబు
భూవరుఁడట మీఁదఁ - బోవు కానలకు 3860
నిటుసేయ కులధర్శ - మిది నీకు హితము
కటకటల్ బడుదువు - కాదంటివేని
అని నయంబు భయంబు - నందందఁదోప
మనుజేశు నెదురను - మంత్రుఁ డాడంగ
అదరక బెదరక - యణఁకువలేక

యదినియ్య కొనక - యామందర బుద్ధి
నందర బ్రదుకుల - యడియాస లుడుప
క్రిందు చూపులఁగైక - గెంటక యుండె.
ఆ దశరథుఁడు రా - మాంగ సంగతిని
సేదదేరి విషణ్ణ - చిత్తుఁడై చాల 3870
నసురుసురై ధైర్య - మవలంబనముగ
విసువుతో కైకేయి - విన మంత్రిఁజూచి
“రమ్ము! సుమంత్ర! యీ - రాముని వెంట
పమ్మిన చతురంగ - బలమునుఁగూర్చి
సకలవస్తువిశేష - సామగ్రియందు
బ్రకటించు సంగళ్లు - పణ్య భామినులు
పాళెము వెంటఁ బో - పయనంబుచేసి
చాల రామునియెడఁ - జనవరులైన
వారికెల్ల విశేష - వస్తువులిచ్చి
పోరాని మనచుట్ట - ముల వెంటఁగూర్చి 3880
పురములో వెనువెంటఁ - బొందగువారి
పరిజనులను నల్ల - బ్రజల వెంటరుల
శకట యంత్రాయుధ - సాధనా వళుల
నొకటఁ గొఱంతలే - కుండఁ బొమ్మనుచు
విపిన జంతువులను - వేఁట లాడుచును
నిపుణత జుంటితే - నీయలు గ్రోలుచును
పనస రసాలాది - ఫలము లానుచును
మునుల పుణ్యాశ్రమం - బులఁ జరింపుచును
సరసి నదీనద - స్థలులఁ గ్రుమ్మరుచు
గిరిగహ్వరంబులఁ - గ్రీడలాడుచును 3890

మంజరి ప్రసవసం - పదల నిం పెసఁగు
కుంజరాంతరంబులఁ - గూర్కుచు నాదు
గారాపు తనయుండు - క్షమియించుఁగాక
యీరీతిఁ బదునాలు - గేండ్లు కానలను,
ధనధాన్య పశుదాస - దాసీ జనంబు
లనుపుము సవనంబు - లాచరింపుచును
జానకీ సహితుఁడై - సంయమీశ్వరుల
తోనఁ బుణ్య పురాణ - లోలుఁడై యుండు
తల్లి యిప్పించిన - తనయన్న రాజ్య
ముల్లంబులోనఁదా - నుల్లాసమొంది 3900
భరతుఁ డేలఁగ నిమ్ము - పగవారిదైన
పురము రామునికేల - పోనిమ్ము వనికి”
అనుటయు విని కేక - య తనూజ చాల
తనలో భయంబు ఖే - దంబు దైన్యమును
నవమానమునుఁ బొంది - యశ్రులు చింద
పవడంపు మోవి ని - బ్బరపు టూరుపుల
యెండి బీటలు వాఱ - యెలుఁగు రావడఁగ
నొండేమియును వల్క - నోపకయుండి
వంచిన తలయెత్తి - వంచకురాలు
సంచుఁ గుత్తుకతోడ - జననాథుఁ బలికె. 3910
“వడుపు పోయిన నీళ్ల - వడువును బెండు
వడి మీఁగడ దొఱంగు - పాలచందమున
నిస్సార మైనట్టి - నీవిచ్చు ధరణి
లెస్సగా భరతుఁడే - లెడునంటి రిపుడు
మీసత్యమే నమ్మి - మేదిని యడిగి

మోస మొందితిని రా - ముఁడె యేలనిమ్ము
వట్టి యారునుదూరు - వలవని నిందఁ
గట్టుకొంటిని మిమ్ము - గడవనర్థించి
పదివేలు వచ్చె మా - భరతునిమాట
మదినింకఁ దలచిన - మర్యాదగాదు” 3920
అని సిగ్గు విడిచిగా - యకమును ఱాఁగ
తనమును గట్టువా - తనమును మీర
నాడినయంత మ - హా రాజుకైక
మోడిమాటలు విని - మొగమాట వలికె.
“నీవు చెప్పినయట్ల - నేఁజేయ నిట్టి
గావుక నటనముల్ - గయ్యాళి వగలు
నేరుపులునుఁ జూపి - నేఁడు నన్నింత
యారాటముల ముంప - నందేమి ఫలము?"
అన విని యినుమడి - యగుచు నాగ్రహము
పెనఁగొన దశర - థుఁ బేర్కొని పలికె. 3930
“ననువెఱ్ఱి దానిఁగా - నరనాథ! యెంచి
కనుబ్రామఁ జూచె - దే కడలైన లేదె
ననువంటి సతులు నం - దనులనుఁ గన్న
నినువంటి దొరలును - నీయొక్క తలనె
పుట్టెనే? మీకులం - బున సగరుండు
పట్టి జ్యేష్ఠతనూజుఁ - బారఁదోలుటలు
వినలేదె నినువలె - వేడబంబులను
మునుఁగడాయె నతండు - ముద్దుగాఁ బెనిచి
వనికి రామునిఁ బంప - వలదసత్యమున
మునిఁగి కౌసల్యకై - మొగమోడిపల్క" 3940

అని తన్ను నిందించు - నందఱిలోనఁ
గినిసి వాదించుఁ గై - కేయి వాక్యములు
బుద్ధిలోఁ గడురోసి - పోరామిఁజేసి
సిద్ధార్థుఁడను మంత్రి - శేఖరుం డనియె.

—: సిద్ధార్థుడు కైకకు నీతిఁజెప్పుట :—


“అమ్మ! సీమకు లేని - యట్టి సామెతలు
నమ్మీఁదఁ గొన్ని దృ - ష్టాంతముల్ చూపి
చెప్పి నోరాడఁ జూ - చెదవు మమ్మెల్ల
చెప్పిన యటులెల్లఁ - జేయుటఁ జేసి
అసమంజుఁ డూరిలో - నందఱి చిన్న
నిసువులంగొని యేటి - నీటిలోవైవ 3950
అదినిమిత్తము తండ్రి - యనిచెఁ గానలకు
నిది దోషమని రాము - నెడనెన్ను మొకటి
కందు గుందును లేని - కలువలఱేని
చందంబుగల రామ - చంద్రునింజూచి
యొకరైన వీటఁ జూ - పోపనివార
లొక నీవెదక్క వే - ఱొక యెడలేరు
మనరాజనఁగ నెంత - మది నధర్మంపుఁ
బనిసేయఁజెడునింద - పదవి వాఁడైన
నటుగాన నభిషేక - యత్నంబు చెఱచి
కటకటా! యానిందఁ - గడ తేరఁగలరె? 3960
వలవరో రాజులు? - వలపించు కొనరొ?
వెలఁదు లన్యాయ మీ - విత మెందుఁ గాన

మేలమ్మ! యపవాద - మింత పొందెదవు?
మేలెంచి నామాట - మేకొనవమ్మ!
పట్టిన చలమె చే - పట్టుట యాఁడుఁ
బుట్టుల మతమైనఁ - బుడమికి నెల్లఁ
గానికార్యము సేయఁ - గాదు కాంతలకు
మానంబె ధనము నీ - మగఁ డొక్కరాజ
సామాన్యుఁడే? సిగ్గు - సైరణ వలయు
రామామణులకెల్ల - రమణులలోన 3970
యిన్నాళ్లు పతిభక్తి - నెచ్చుగా నడచి
చెన్నటిబుద్ధి వ - చ్చె నదేల నిపుడు?"
అని దీనుఁడైన సి - ద్ధార్థుని మాట
విని కైకతో మహీ - విభుఁ డిట్టులనియె.
యింతి! నీకును నాకు - నిహపర సౌఖ్య
మెంతయు సిద్ధార్థుఁ - డిపు డన్నమాట
బ్రదికించు కొనుము నా - పాలిటం గలిగి
మదినిన్ను నమ్మిన - మగని రక్షింపు
యీమాట నీవిప్పు - డియ్యకో వేని
రాముని వెంట న - రణ్య భూములకు 3980
పోవుదు నేను నీ - పుత్రుని మహికిఁ
గావలసిన యట్ల - కంటకంబైన
పట్టంబు గట్టింపు - పడఁతి! నీచిత్త
మెట్టియెన్నిక నుండె - వీడేర్పు మటుల"
అనువేళ తండ్రికి - నంజలిచేసి
వినయంబుతో రఘు - వీరుఁడిట్లనియె,

—: రామాదులు కైకయిచ్చిన నారచీరలు ధరించుట :—


"ఏల మీకీచింత - యీసాధ్వికేను
మేలెంచి విపిన భూ - మికిఁ జనువాఁడ
అట్టివానికి చతు- రంగ బలంబు
పట్టణంబున జన - ప్రకరమేమిటికి? 3990
ఏనుఁగ నడిగిన - యిచ్చువాఁడేల
దీనుఁడై త్రాపికిం - దెఱకువ మాను
ధరయెల్ల విడిచి కాం - తార భూములకు
నరుగుచో నికనేల - యన్య వస్తువులు?
నారచీరలుదెండు - నాకు నెచ్చోటఁ
బోరాని సాధనం - బు లొసంగుఁ డ"నిన
సిబ్బితిం బోకార్చి - చిడిముడితోడ
గొబ్బున "నివి గట్టు - కొండ"ని యెదుట
చీరంబు లొసంగిన - శ్రీరామవిభుఁడు
చేరి తా మును ధరిం - చిన దుకూలంబు 4000
కడకోసరించి వ - ల్కలములుఁదాల్ప
తడయకట్లన సుమి - త్రాకుమారకుఁడు
కైకయొసంగు వ - ల్కలములుఁదాల్ప
రాకేందువదన ధ - రాతనూజాత
వలచూచులేడి కై - వడి భీతినొంది
జళుకుతోఁగన్నీరు - జలజలరాల
చేతికిచ్చిన నార - చీరలుచూచి
భీతితో శ్రీరాముఁ -- బేర్కొనిపలికె.
"ఏరీతి మునికన్య - లిటువంటినార
చీరలతో వన - శ్రేణినుండుదురు? 4010

యేనేర నివిగట్ట - నెఱిఁగిన నాదు
మేనిపైఁగట్టుండు - మీర" నిపలుక
సప్పుడా రఘుపతి - యావల్కలంబు
లొప్పుగా మునుదాల్చి - యున్నట్టిచీర
మీఁదఁగట్టినఁజూచి - మిక్కిలివెతల
నీఁదుచు నగరిలో - నింతులందఱును
చూచి యోర్వఁగలేక - శోకించి రాముఁ
జూచి "నీవేల? యీ - శోభనాకార
బడరానిపాటులఁ - బరచెదీ రమణి
నడవికిఁబొమ్మనిఁ - యనిచిరేయొకరు? 4020
వలవదిచ్చటనుంచి - వనికేఁగునీవు
కలవాణి నీ సీత - కన్నులంజూచి
యుడుకారి యేమెల్ల - నుండెదమిల్లు
వెడలిరమ్మందు రే - విరిఁబోణినిట్లు
మీవెంటవచ్చు సౌ - మిత్రికానలకు
నీవెఱుఁగనియట్టి - నీతియున్నదియె?
వలదన” వినక - యావై దేహిమేన
వలువపై వల్కల - వసనంబులునుచు
రాముని వారించి - రాజువినంగ
సేమంబుదలఁచి వ - సిష్ఠుఁడిట్లనియె. 4030
"లలన కైకేయి! కు - లంబెల్లఁ జెఱిచి
చలపట్టి యంతయు - చక్కఁజేసితివి
ఏలపోవలె సీత - యీరాజ్యమెల్లఁ
బాలించిమగఁడెక్కు - భద్రాసనమునఁ
దానుండుగాక యీ - దశరథాత్మజుని

మేనిలోసగము సు - మ్మీ! మహీతనయ
సీత యర్ధాంగ ల - క్ష్మి రఘూత్తమునకు
యీతన్వియు నతండు - నేక దేహంబు
గడుసరివై యిట్లు - గాదంటివేని
యడవుల కీరాము - నడుగులవెంట 4040
యేను సుమంత్రాదు - లీదశరథుఁడు
నీనగరవసించు - నింతులందఱును
పరిజనంబులుఁగూడి - పయనమై పురము
భరతుండు రా మున్నె - పాడుచేసెదము
అనవలసినమాట - యంటిమిగాక
నినుఁదేఱిచూచునే - నీకుమారకుఁడు?
తానువల్కలములు - ధరియించివచ్చు
జానకిశ్రీరామ - చంద్రులున్నెడకు
నారీతిశత్రుఘ్నుఁ - డరుదెంచు నీవు
నీరామమై జన - నికరంబులేమి 4050
యీపట్టంబులో - యేకాకివగుచు
పాపాత్మురాల! యా - పదలనొందుదువు
నీవెవ్వతెవు? రాము - నికిఁగీడుసేయ
కావలసిప్రియంబుఁ - గైకొనిరాజు
నినునేలుమని యిచ్చె - నేధాత్రియెల్ల?
మనసులో నిది నీ కు - మారుండుదెలసి
అందుకులొంగిన - యతఁడెట్టివాఁడ
యందులోనొక్కఁడొ - యరయఁగావలయు
నారచీరలుగట్టు - నారాముదేవి
వారింపకున్నయి - వ్వసుధయోరుచునె? 4060

సొమ్ములుచీరలి - చ్చోటఁదెప్పించి
యిమ్ముని కీవరం - బిచ్చెనేయితఁడు
మునివేషమొక్కరా - ముని కింతెగాక
వనితకునేల? సే - వకులరప్పింపు
పల్లకిఁ దెప్పింపు - పరిచారకులను
గొల్లల వెంబడిఁ - గూర్చి కావలయు
వనవాస సముచిత - వస్తువులిచ్చి
పనుపుము కైకనా - పలుకాదరింపు"
మని వసిష్ఠుఁడు వల్క - నవనితనూజ
వనికి నేఁగఁ దలంచు - వల్లభుమనసు 4070
వేఱెయుండుటఁజేసి - వినివిననట్ల
యూరకయుండె దా - నుచిత వైఖరిని;
ఆమాట యందుక - యధిపతి నతని
భామినుల్ వినరాని - పలుకులువలుక
నిందనలకులోఁగి - నెగులుతో మేని
యందు రాజ్యమునందు - నైహికఫలము
లందు నూర్జితకీర్తి - యందుఁబ్రాణంబు
నందు నించుకయైన - యాసఁబోవిడిచి

—: దశరథుఁడు సీతకు నారచీరలు వలదని కై కేయిని వేఁడుట :—


ఆలిమోమీక్షించి - యకట! నాయెదుట
నేలకట్టించితి - వీ సీతమేన 4080
నారచీరలు రాము - నకు నీయఁజూచి
యూరకప్రాణంబు - లుండఁజూచితివొ?

యీవరంబిచ్చితి - నే కోమలాంగి
పావనచారిత్రఁ - బరమకల్యాణి
సీత సంచిత సుఖో - చితసుకుమార
నూతనలావణ్య - నుత నయోవిభవఁ
గన్నులంజూచి యే - గతి వల్కలములు
మిన్నకచేఁదెచ్చి - మీఁదవైచితివి
వనులకుం బొమ్మన - వచ్చు నే జనక
తనయ నీవంటి పా- తకురాలిమోము 4090
చూడక తొలఁగిపో - జూచుట గాక
వేడుక చెల్లెనే - వెలఁది! నీ మదికి
వెదురునఁబుట్టిన - వీతిహోత్రుండు
వెదురెల్లదహియించు - విధముననేఁడు
ముప్పున నీకిచ్చు - మొదటివరంబు
తప్పరాదని పల్కఁ - దనకిటులయ్యె
సీతచేతికి నార - చీరలిప్పించు
పాతకంబెటువోవు - పడుము దుర్గతిని”
అనిపల్క శ్రీరాముఁ - డంజలిచేసి
తనతల్లిఁబేర్కొని - తండ్రితోఁబలికె. 4100
"ఓ దేవ! మాతల్లి - యున్నది నీదు
పాదపద్మంబులు - భక్తిఁగొల్చుచును
యేను వనంబుల - కేఁగిన వెనుక
దీనయై మిగుల నా - ర్తి వహింపనీక
కైకేయిఁజూపకఁ - గరుణనౌఁగాము
లేకడంజూడక - యేవచ్చుదనుక

ప్రాణముల్ మేనిలోఁ - బట్టుకయుండఁ
బ్రాణదానముచేసి - పనుపుమునన్ను
అభయహస్తమొసంగు - డ" నుచుఁ గౌసల్య
నభిముఖంబుగనుంచి - యడుగులవ్రాల 4110
నామహీశునిఁ సుమం - త్రాదు లింతులును
సౌమిత్రియును శోక - జలధిలో మునుఁగ
గొంతధైర్యముఁ దెచ్చు - కొని మహీవిభుఁడు
చెంతలవారి నీ - క్షించి యిట్లనియె.
“తొల్లియనేకుల - ద్రోహినై మేను
తల్లితండ్రులను పు - త్రుకులతోఁబాపి
సంసారసుఖము మున్ - చననీక చెఱచి
హింసచేసితిగాన - యీకాలమునకు
నాదోషమీరీతి - ననుభవించెదను.
కాదన్నఁబోవునే - కర్మఫలంబు 4120
యీకై కచేబాధ - లిన్నియుం దాళి
పోకయున్నవి ప్రాణ - ములు శరీరమున
ఎంతచేసితి బాపు - రే! కైక విశ్వ
మంతయుఁ జీఁకటు - లయ్యె నీకతన"
అని యొక్కమారు "రా - మా"యని యేమి
యనఁజూచెనో కాని - యావలిమాట
నాడనేరక మూర్ఛ - నరగన్ను వెట్టి
వాడినమోముతో - వాతెఱయెండ
నొకమూహూర్తమునకు - నొయ్యన తెలిసి
తొకతొకతో సుమం - త్రునకు నిట్లనియె. 4130

—: రాముని వనగమనమునకు దశరథుఁడు సమ్మతించుట ; సుమంత్రుఁడు రథమును దెచ్చుట :—


"తేజీల సమకట్టి - తెమ్ము వేవేగ
రాజయోగ్యంబైన - రథమువాకిటికి
రథముమీఁదట నీవు - రామునితోడ
నధివసించి యయోధ్య - కామడమేర
ననిచివత్తువుగాక - యధముఁడౌతండ్రి
పనుపుచేసిననిట్టి - పాటురాకున్నె?
కొడుకులయుత్తమ - గుణములన్నియునుఁ
గడపటనది దుఃఖ - కారణంబులుగ
నెంచితిఁజను” మన్న - నేఁగి సుమంత్రుఁ
డంచలనున్న మ - హారథంబొకటి 4140
ఆయత్తమొనరించి - యపుడెతెచ్చుటయు
నాయవనీభర్త - యటునిటుఁజూచి
కడనున్నలోని బొ - క్కసములవారి
కడగాంచి చేరరాఁ - గనుసన్న చేసి
వారితో నీసీత - వనికినేఁగెడును
మీరలు నగరిలో - మేలిసొమ్ములును
చీరలు వీరు వ - చ్చి యయోధ్యచేరు
మేరకుఁజాల భూ - మిజకు నిండ "నిన
మాటమాత్రనె వారు - మణిభూషణముల
పేటికల్ కోకల - పెట్టెలుదెచ్చి 4150
తనచెంతనిలిపిన - దశరథవిభుఁడు
కొనుమంచుఁదన పెద్ద - కోడలికొసఁగ

నాసొమ్ములందు ధా - ర్యములైనవెల్ల
భూసుతం జేరి య - ప్పుడు వధూమణులు
నుడుకుచుఁ గైక చూ - పోపక మారు
మెడవెట్టుకొనఁగ నె - మ్మేని నిండంగ
రత్నాంగి తొడుగుమే - రను భానువంశ
రత్నమౌరాముని - రాణిగై సేయ
దినమణిప్రభ చేత - దీప్తమౌనింగి .
యనువునఁగైకేయి - యావాసమెల్ల 4160
జానకిభూషణ - జాజ్వల్యమాన
మై నిగనిగలీన - నత్తఁగారికిని
మ్రొక్కిన సీతను - ముచ్చటదీర
నక్కునఁజేర్చిమో - మౌదల నుంచి
దీవించి రఘువీరు - దేవేరితోడ
నావేళ కోసలేం - ద్రాత్మజవలికె.
"పదవులుఁ దప్పిన - పతులఁజీరికిని
మదినెంచిరసతులౌ - మదవతులెల్ల
కలిగినవేళ సౌ - ఖ్యంబులం దేలి
యలమట గోరంత - యైనఁ బొందినను 4170
మగనిదూషింపుచు - మానుగాఁగనరు
మగువల మొదటిసం - పదలెన్నుకొనరు
ఆటవారలబుద్ధు - లరయంగరాదు
పాటలాధర! చెలుల్ - పాపరూపిణులు
తలఁతురు పాప చిం - తలు క్షణంబైన
నిలుపనేరరు తమ - నియమముల్ మదిని

కులమును శీలంబు - గుణము రాగంబు
వలసి వేఁడినసొమ్ము - వరుసనిచ్చుటయు
బూదిలో హోమమై - పోఁజేసి మగఁడు
పేదగిల్లినయంత - బిలువనూఁకొనరు 4180
కొంచపుమాటలఁ - గోతురు మనసు
వంచింపఁజూతురు - వాదులాడురు
అగ్నిసాక్షిగఁబెండ్లి - యాడెఁదమ్మనుచు
లగ్నంబుసేయ రు - ల్లమున నించుకయుఁ
కన్నీరునింతురు - కలహముల్ వెనిచి
యన్నమాటలకెల్ల - నాడుదు రెదురు
ఉత్తమసతులైన - నొకపాటివాని
విత్తమేమియులేని - వీఱిఁడినైన
ముసలినేనియు రోగ - ములఁ జిక్కెనేని
యసమర్థుఁడగునేని - యన్నవస్త్రముల 4190
మాత్రంబునెడ లేక - మానిని ! హేయ
గాత్రుఁడై నను మహా - గమధర్మ మెఱిఁగి
తనపాలి పెనిమిటి - తనదైవమనుచు
మనసులో మొగఁడైవ - మానవాధముని
మేరువుగానెంచి - మేదినిగీర్తి
స్వారాజు నగరిలో - సకలభోగములు
ననుభవింతురు గాన - నబల! రాఘవుఁడు
ధనవంతుఁడైన ని - ర్థనుఁ డైన నీకు
వల్లభుం డగుటదై - వంబు దాతయును
తల్లిదండ్రులు సమ - స్తము రాముఁడనుచు 4200

నెంచి చిత్తమునొవ్వ - నీయక యనుభ
వించు మీ విహపర - విభవంబులెల్ల
అమ్మ! యేనొకమాట - యనవేఁడియంటి
నెమ్మది నఖిలంబు - నీ వెఱుంగుదువు
నినుఁజూచి మెలఁగంగ - నేర్తురీ ముందు
వెనుకల కిల్లాండ్రు - విశ్వంబునందు
తల్లి! మాయెడ దయ - తప్పక మనసు
చల్లఁజేయుము రామ - చంద్రున కెపుడు
తలపువ్వు వాడక - ధవుని వెంబడిని
అలివేణిపోయి ర - మ్మ"ని పల్కుటయును 4210
ధర్మయుక్తంబైన - తన యత్తమాట
యర్మిలి విని సీత - యణఁకువఁ బలికె.
"దేవి! మీశిక్షఁ బా - తివ్రత్యధర్మ
మీవిధంబని వింటి - యిటుల యుండెదను
హరిణాంక కళచంద్రు - నదియేల తలఁగు
నితరమౌ ధర్మంబు - నేనట్లు వదల
మొరయునే తంత్రిక - మ్ములు లేనివీణె?
తరలునే చక్రముల్ - దప్పింప రథము?
పతిహితంబే మరి - పడఁతులకిట్లు
గతిగల్గు మనిన నే - గతిగల్గనేర్చు? 4220
తల్లిదండ్రులు సుతుల్ - తనవారలైన
నెల్లరు మితముగా - నిత్తురు ఫలము
నపరిమితంబైన - యఖిల సౌఖ్యములు
కృపనిచ్చు పతిగాన - నితరంబులేల!
మొదట నాతండ్రి స - మ్ముఖమున వింటి

వదలక పతియు దై - వముగ శాస్త్రముల
నారీతి మెలఁగుదు" - మనువేళ నశ్రు
పూరముల్ కన్నులఁ - బొరల నున్నట్టి
తల్లులలో నున్న - తల్లి నెమ్మనము
చల్లఁగా శ్రీరామ - చంద్రుఁ డిట్లనియె. 4230
"అమ్మ! నీవు విచార - మందక రాజు
సమ్మతంబంది పూ - జలు సేయుమిపుడు
నీవొక్క నిశియందు - నిదురించి లేచు
కైవడిగా యేను - కానలయందు
జరుపుదు పదునాల్గు - సంవత్సరములు
సరకుగా మదినెంచ - క్షణమనితోఁచె
వ్యథలెల్ల మాని యే - వచ్చి యివ్వీట
రథముమీఁదట మనో - రథము లన్నియును
చేకూడి రాఁగ నీ - క్షించెదు రేప
నీకేమి గొఱఁత క - న్నీరు రాల్వకుము ” 4240
అనిచాల నూరార్చి - యాతల్లికన్న
నినుమడిగా దుఃఖ - మేడ్చుచునున్న
యందఱ తల్లుల - యడుగులమీఁద
నందందవ్రాలి వా - రాశీర్వదింప
“నోయమ్మలార! మీ - రొక్కట వెలితి
సేయక నన్నుఁ బో - షించి పెంచితిరి
ఇన్నాళ్లు నేరంగ - యేను మీయెడల
నెన్ని నేరంబు లే - మేమి చేసితినొ?
ఆతప్పు లెల్ల మీ - రాత్మల మఱచి
మాతృధర్మంబు లే - మఱక రాఘవుఁడు 4250

కడకేఁగెనని మీకుఁ - గలిగిన కరణ
సడలక యడలు కౌ - సల్య నూరార్చి
రాజు చింతలచేఁ గ - రంగక యుండ
భోజనాదికములౌ - పూజనక్రియలఁ
గనుకల్గి యుండుఁడు - గహన భూములకుఁ
జనుఁడని మాకను - జ్ఞయొసంగుఁ" డనిన
కలఁగి వాపోవుచుఁ - గ్రౌంచి స్వరముల
నెలుఁగెత్తి మున్నూట - యేఁబండ్రు సతులు
నృత్తగీతనినాద - నిబిడమౌ నగర
నత్తరి బహు రోద - నారావమొప్ప 4260

—: శ్రీరాముఁడు వనవాసమునకుఁ బ్రయాణమగుట :—


శ్రీరామ లక్ష్మణుల్ - సీతయునట్టి
వారల నూరార్చి - వలగాఁగవచ్చి
దశరథ పదపద్మ - దండప్రణామ
కుశలులై యనుపించు - కొనివారు మఱియు
కౌసల్యఁగని నమ - స్కారంబొనర్చి
యాసుమిత్రకు మ్రొక్క - నప్పుణ్యసాధ్వి
రామ హితార్థియౌ - ప్రాణసమాను
సౌమిత్రి నాయతా - జాను సుబాహుఁ
జేరి కౌఁగిటఁజేర్చి - శిరమాస్వదించి
కూరిమి సుతునిఁ బే - ర్కొ ని యిట్టులనియె. 4270
"అన్న! కానల కేఁగ - నన్నకు నీకు
నన్నలువ లిఖంచె - నదియేలతప్పు?
తాను రాఘవుఁడు సీ - తా సమేతముగ

పూని కానలనుండఁ - బోవు చున్నాఁడు
మది వీరిసేమ మే - మఱక యేవేళ
గదిసి కంటికిఱెప్ప - గతినుండు మీవు
గలిమిలే కుండినఁ - గలిగిన నీకుఁ
గలకాలమును గతి - కాకుస్థ కులుఁడు
తనకు జ్యేష్ఠునిఁగొల్వ - ధర్మంబు లోక
మున సజ్జనునికి మీ - మొదటి రాజులకు 4280
దానంబు దయయు స - త్యము యాగదీక్ష
పూనుట రణములోఁ - బొలియుట వారి
నిజగుణంబులు గాన - నీవు రాఘవుని
భజియింపుచు శరీర - పర్యంతమైన
నెంత లేదని కాచు - నెడ కను కల్గి
సంతోష మొందింప - జూనకీవిభుని
రామచంద్రుని దశ - రథు గా నెఱుంగు
మామాఱుగా నెన్ను - మా! జనకజను
అడవి యయోధ్యగా - నరయుము వలయు
నెడకేఁగి సుఖివిగా - వే! తండ్రి! నీవు" 4290
అనువేళ మాతలి - యమరేంద్రుతోడ
ననినరీతి సుమంత్రుఁ - డారాముఁజూచి
"శ్రీరామచంద్ర! మీ - చిత్త మెట్లుండె
నారీతి నేర్తు నే - నరదంబు నడప
వనుల కేఁగఁగ నేఁడె - వత్తురుగాక
చలనేల? వ్యర్థవా - సర మీయయోధ్య "
అనుమాట విని - రాము ననుమతి మేన
జనకనందన విభూ - షణములు దాల్చి

మున్నుగా తా రథం - బునఁ బ్రవేశింప
నన్నిసొమ్ములుఁ బెట్టి - యను నిండ నుంచి 4300
రాజు సీతకుఁ బంప - రామలక్ష్మణులు
తేజోధికులు తాము - దెచ్చినయట్టి
యాయుధ వనసాధ - నాదులు వరుస
చేయెత్తి యంది యి - చ్చిరి సుమంత్రునకు
నన్నియు రథముపై - నతఁడుంప నరద
మన్నదమ్ములు నెక్కి - నంత సారథియుఁ
తెరువు వోనిచ్చుచో - దెరువెల్ల నిండి
పౌరులందఱు శోక - పరవశు లగుచు

—: రాముని వనగమనమునకై పౌరులు శోకించుట :—


నార్తనాదము లయో - ధ్యా పట్టణమున
మూర్తీభవింపఁ గ్ర - మ్ముక వచ్చు జనులు 4310
వేఁగిరించక రామ - విభుని రథంబు
సాఁగనిమ్ము సుమంత్ర! - చనవిచ్చిమాకు
రాముని వదనసా - రసము గన్గొనుచుఁ
జేమోడ్చి వెంట వ - చ్చెద మనువారు
"కౌసల్యహృదయ మ - క్కట! యుక్కు గరచి
చేసినారా”యని - చింతించువారు
"కనకాచలము పతం - గప్రభవోలె
ననుసరించెను సీత" - యని పల్కువారు
"ఓయిలక్మణ! రాము - నుల్లంబుమెచ్చఁ
జేయుచు సేవ చే - సెదు గాన నీకు 4320

నుచితధర్మంబు న - భ్యుదయకారణము
నచలిత స్వర్గలో - కానందకరము
అయ్య! నీసరిసాటి - యగుభాగ్యవంతుఁ
డెయ్యెడ వెదకిన - నెఱఁగ” మన్వారు
"రామ! నీచరణసా - రసములు గొలిచి
యేమువచ్చెదము సు - మీ!" యనువారు
నగుచుండ దశరథుం - డారామచంద్రు
మొగము చూచెదనని - ముదితలుఁదాను
రథము వెంబడి హజా - రమునకు వచ్చి
శిధిలమౌ మతి వధూ - శ్రేణి శోకింప 4330
దీనుఁడై వచ్చి ధా - త్రీనాథుఁజూచి
భానుతేజుఁడు రామ - భద్రుఁడిట్లనియె.
“వచ్చుచునున్నాఁడు - వాఁడె మాతండ్రి
యిచ్చోట వేగఁబో - నిమ్ము రథంబు"
అని రాఘవుండన - నల్లన తేరు
చనఁగ నిమ్మని జనుల్ - చాలఁబ్రార్థింప
తా సూతకృత్య మ - త్తరిఁజేయు కతన
నాసుమంత్రుఁడు నిట్టు - నటు విచారింప
ప్రబలధరాధూళి - పటలంబు జనుల
నిబిడవాహినియుఁ గ - న్నీటనణంగ 4340
దుముకు మీనములచేఁ - దొలఁకుచునున్న
కమలంబుల మరంద - కణములోయనఁగ
గనుఁగొనునింతుల - కన్నీటనైన
పెనురొంపిని రథాంగ - బృందంబుఁగ్రుంగ
చేరుదునని యాసఁ - జేరు భూపతికి

దూరంబుగా సుమం - త్రుఁడు తెరువునను
నరదంబువోనీక - యట నిల్వుఁడనుచుఁ
బరిజనంబుల మహీ - పాలుండు ననుప
నామాట విని 'రామ! - యధిపతియాజ్ఞ
యే మీర రాదిందు - కెటు సేయవలయు? 4350
నానతిం" డన రాముఁ - డదియేఁటిమాట
పోనిమ్ము తేరు గొ - బ్బున నంచుఁబలుక
నిలుపవచ్చిన వారు - నిలిచి క్రమ్మరిన
తొలఁగిపొయెను తేరు - దూరంబుఁగాఁగ.
అపుడుకన్నీటితో - నరదంబుఁజూచి
నృపతి నేమీరేణు - నికరంబుఁజూచి
నిలువయ్య! కుమార! - నిలుము సుమంత్ర!
తొలఁగకు" మనుచుఁ గు - త్తుక యెల్లనెండ
నాలుకఁదడి లేక - నరపతి వెతల
మూలంబు దెగు వృక్ష - మునుఁబోలిపడిన 4360
శోకంబుచేత న - చ్చోవధూజనులు
హా! కోసలేంద్రక - న్యామణి! యనుచు
హా! రాజలోక సిం - హస్వామి! యనుచు
హారామ! మీరి యే - లా? పోయెదనుచు
దీనులై విలపింపఁ - దిరిగి చూచుచును
తానేఁగునెడ తల్లి - దండ్రులపాటు
చూడక యశ్వకి - శోరంబు పలుపు
ద్రాడుననున్నట్ల - ధర్మపాశమునఁ
గడుఁజిక్కి వెనువెంటఁ - గాల్నడ తండ్రి
నడలుచు వచ్చుచో - నంకుశాహతిని 4370

మత్తేభమలయు క్ర - మంబునం దనదు
చిత్తంబు మిక్కిలి - చింతవహింపఁ
బోవలదని పల్కు - భూవరువలనఁ
బోవనిమ్మను రాజ - పుత్రుపల్కులను
కడుఁజిక్కువడి బండి - కండ్ల నెన్నడుమఁ
బడిన కైవడి మంత్రి - భావంబుఁదవిలి
రాజుపల్కులనిల్ప - రాదు పొమ్మనెడు
రాజన్యమణియైన - రామునిమాట
నాసుమంత్రుఁడు సేయ - నదికంటఁబోవు
నాసచివులు వచ్చి - రనుమాటగాని 4380
నిలిపిరో చిత్తముల్ - నిలిపిరో రాము
నిలిపిరో తమదు క - న్నీరురాలంగ
ఆమంత్రులేతెంచి - యవనీశుతోడ
"రామునిరథము దూ - రంబునంజనియె
దవ్వువచ్చితిరి చి - త్తము నిల్వబట్టి
యివ్వేళనగరికి - నేతెండు మఱల"
నను ప్రధానులమాట - లాలించి యవల
చనుటకు పద - శ క్తిచాలని కతన
నిలిచిన తలిదండ్రి - నెమ్మదిలోనఁ
దలఁచి మ్రొక్కుచు రఘా - ద్వహుఁడు పోవుటయు 4390

—: రాముని వనగమనమున కంతఃపుర స్త్రీలు శోకించుట :—


నారామునెడఁబాసి - యంతఃపురంబు
నారులా దశరథ - నరపతివినఁగ
నాళీకనేత్రుం డ - నాథనాథుండు

చాలనందఱఁబ్రోవఁ - జాలినయతఁడు
ఓయమ్మలార! యి - ట్లొంటి రాఘవుఁడు
కాయంబుఁగంద నె - క్కడికిఁబోయెడును?
తనకొరు లలిగినఁ - దానొక్కరందుఁ
గినిసినవారి యం - కిలిమాన్చిచాల
నుపలాలనము సేయు - నోర్పరి వీత
కపటుఁడీ రాముఁడె - క్కడికి నేఁగెడును? 4400
తనలోన ఖేదమో - దంబు లొక్కటిగఁ
గనుచుండు రాముఁడె - క్కడికి నేఁగెడును?
కన్నతల్లియె కాఁగ - గనుచుండు మనలఁ
గన్నట్టితండ్రి యె - క్కడికి నేఁగెడును?
కైకేయి బాధకుఁ - గాక రాజనుప
కాకుస్థతిలకుఁ డె - క్కడికి నేఁగెడును?
తనబుద్ధిచలియించి - తండ్రిపొమ్మనిన
కనలేక రాముఁడె - క్కడికి నేఁగెడును?
ఎన్నడు సూతుమో? - యెన్నడువచ్చుఁ
గన్నులయెదుటికె - క్కడికి నేఁగెడును? 4410
ఆశచేక్రమ్మర - నడిగెనే తన్ను
కౌశికమౌని యె - క్కడికి నేఁగెడును?
ఆసుమిత్రాపుత్రు - నవనిజంగూడి
కౌసల్యపట్టి యె - క్కడికి నేఁగెడును?”
అని ఱెప్పవేయక - యారాముఁజూడఁ
గనుఁగొని విలపించు - కామినీమణులఁ
జూచి మిక్కిలి రాజు - శోకవారాశి

వీచులంబడి దరి - వెదకిన లేక
ఆపన్నుఁడై యుండె - నాసమయమున
నాపట్టణంబులో - నగ్నిహోత్రములు 4420
సలిపెడువారు భో - జనమజ్జనములు
దలఁచినవారును - తల్లులపాలు
ద్రావువత్సములు మేఁ - తలకు నాసించు
నావులు కవణంబు - లంటెడుకరులు
నీరానుఁదేజులు - నిజకుమారకులఁ
గూరిమితోఁజూచు - కొమ్మలులేక
అసమయంబునఁబంక - జాప్తుండుతొలఁగ
వసుధఁ గావిరులు న - ల్వంకలఁబొదువ
గ్రహతారకముల పొ - గల్ గనుపింప
మిహికాంశుబింబంబు - మేనెల్లఁగంద 4430
నుదధిప్రచండ వా - యువులఁజలించు
విధమునంగలఁగె న - వ్విభు పట్టణంబు
ఆవేళ తలిదండ్రు - లందలి మమత
యావంతయునుమాని - రర్భకులెల్ల
సతులమీఁదటి యాస - చాలించిరెందు
పతులెల్ల కైకేయి - భావంబుదలంచి
అన్నదమ్ములు తమ - యనురాగమెల్ల
సున్న చేసిరిమోము - చూడనొండొరులు
నిద్రాదిసుఖము ల - న్నియునుఁజాలించి
భద్రకర్మంబులు - బాసిరందఱును 4440
నెఱకలు దునిసి మ - హీధ్రముల్ వడిన
తఱిదెల్పనో యన - ధరణిగంపించె

--: దశరథుని విలాపము :--


ముదుసలిరాజు రా - మునిఁ జూచి చూచి
యెదవడి తేరువో - యెడు జాడచూచి
తేరునుంగానక - తెరువున నెగయు
ధారుణీరేణు సం - తతి చూచిచూచి
కన్నీరు దొట్టిన - కానకేమియును
కానక యిదియు రా - ఘవుఁడేఁగుదిక్కు
గా ననిమేషవై - ఖరిఁ జూచిచూచి
విన్నఁదాటున దుఃఖ - వివశుఁడై యుండె. 4450
భూమీశుఁజూచి య - ప్పుడు మదిఁగలఁగ
వామాక్షి కౌసల్య - వలపలియెదను
కైలాగొసంగిన - కైకేయి యెడమ
కేలున కూఁతగాఁ - గెంగేలొసంగ
చేరవచ్చిన గరి - సించి పొమ్మనుచు
"నోఱాఁగ! నీవునా - యెడలంటవలదు!
నీవుపత్నివిఁగావు - నేఁబతిఁగాను
నీవారినెల్ల ము - న్నే వదలితిని
నినుఁజూడఁగారాదు - నీకుమారకుఁడు
తనకుఁదీర్పఁగరాదు - తరవాతఁగ్రియలు 4460
ఏటిమాటలు త్యజి - యించితి మిమ్ము
మాటనేఁటికి నీదు - మాటగాదింక”
అని విడనాడి తా - నవలిమోమైనఁ
గని సుమిత్రాదేవి - కైదండయొసఁగ
నెప్పుడు దశరథుం - డీ మాటపలికె

నప్పుడు కౌసల్య - యడలురెట్టింప
మునివేషమున నేఁగు - మోహనా కారుఁ
దనయగ్రనందనుఁ - దలఁచి తలంచి
అవనీసురునిఁ జంపి - నట్లు మేనెల్లఁ
దవిలి యగ్నిజ్వాల -- దరికొన్నయట్లు 4470
సంతాపమునుఁబొంది - జనపతి మిగుల
చింతిల్లుచును రఘు - శ్రేష్ఠుని రథము
పోయినజాడలోఁ - బొరలుచు దుమ్ము
కాయమంతయు నిండఁ - గప్ప దీనతను
యివిగదా! రాఘవుం - డెక్కిన రథము
జవమునందివియు న - శ్వముల పాదములు
అని తద్రజంబుమై - నలముచు రామ!
వనులకు నేఁగితి - వా! యంచు వగచి
భూనుతపరిమళం - బులు వేసి భాస
మాననానారత్న - మయభూషణములు 4480
పూని క్రొవ్విరి సరం - బులుఁ జుట్టిమేన
చీనిచీనాంబర - శ్రేణిధరించి
మగువలు హేమచా - మరములు వీవఁ
దగు హంసతూలికా - తల్పంబులందు
మెలఁగు రాఘవుఁడు భూ - మిని శయనించి
తలగడల్ గాఁగఁ బ్ర- స్తరములమర్చి
తరువులక్రింద ని - ద్రలు వోయిలేచి
కరిరవంబనఁగ భూ - త్కారంబు చేసి
యెటులుండు వాఁడకో? - యింతి వైదేహి
కటకటా! యొకనాడుఁ - గానల గుఱుతు 4490

గానని జనకుని - గారాపుఁబట్టి
దీనయై వనములఁ - ద్రిమ్మరునపుడు
పులులు యెలుఁగులం - బొడగని భీతిఁ
గలఁగుచు రఘువీర! - కావుమీ! యనుచు
నేరీతి మెలఁగునే - నేమి సేయుదును?
మారాముఁ జూడక - మననెట్లువచ్చు
తన పురాకృత దురి - తము లిట్టులెంత
పనిచేసెనని మహీ - పతి కైకఁజూచి
“పాపాత్మురాల! యీ - ప్రాణముల్ మేన
నోపవు నిలువ నిం - కొక మాటవినుము 4500
తాలేనిచోట వై - ధవ్యంబు పూని
యేలుచుండు మయోధ్య - యేకచిత్తమున”
అనివల్కు తలవాంచి - యశ్రులురాల
జననాయకుఁడు మృత - స్నాతునిరీతి
వచ్చుచు పురమున - ల్వంకలుఁ జూడ
నెచ్చటఁ జూచిన - నెవ్వారులేక
పాడరి యున్నట్టి - భవనముల్ మూసి
పూడవైచిన ద్వార - ములతోడిగుళ్లు
కట్టినయట్టె యం - గళ్లు మిన్నేల
ముట్టిన రోదనం - బులుచూచి వినుచు 4510
జనుల సందడిలేక - జరడులు బాలు
లును జ్వరితులు నింతు - లును గోచరింపఁ
గనుఁగొని రాజమా - ర్గంబునవచ్చి
జనకజరామ ల - క్ష్మణులు లేనట్టి
నగరు ప్రవేశించి - నరపతి యార్తిఁ

బొగులుచుఁ గెలనియా - ప్తుల మోముచూచి
“తనకు నెచ్చోటఁ జి - త్తమునకుఁ దాల్మి
జనియింప దైనఁ గౌ - సల్య మందిరము
చేరుపు" డన విని - క్షితిపతినట్ల
ద్వారపాలకులు సాం - త్వనముతోఁ దెచ్చి 4520
ఆయింతి నగర శ - య్యా ప్రదేశమున
నాయెడ నునిచిన - యమ్మహీ విభుఁడు
చిత్తంబులోఁ దాల్మిఁ - జెందక చేతి
విత్తంబు గోల్పోవు - విధమున నుతులు
జానకియును లేక - చంద్రతారకలు
తోనఁబాయు నభంబు - తోసరి వచ్చు
నామందిరంబులో - నందఱుఁజూడ
"రామా" యనియెలుంగు - రాయంగ నేడ్చి
ఏపుణ్యులో రాము - నింకొక్కనాఁటి
కీపుర వీథిలో - నేతేరఁజూచు 4530
తపములుసేయ ను - త్తము లట్టివారి
యపరిమిత శ్రీల - నఖిల భోగములఁ
గలకాలమును మనఁ - గలవారుగాఁక
కలఁగునేయట్టి భా - గ్యం బన్యులకును”
అని పలవింపుచు - నర్ధరాత్రమున
జననాయకుండు కౌ – సల్యతోఁ బలికె
"రామునివిడువ నే - రక వెనువెంట
రామ! నాదృష్టి దూ - రంబుగాఁ జనియె
కన్నుల నేమియుఁ - గనరాదు చెంత
నున్న నిన్నునుఁగాన - నూరటచేసి 4540

నీదు కరంబునా - నెమ్మేన నుంచి
సేదదేఱ్పు మటన్న - జీవితేశ్వరుని
గ్రక్కునంజేరి యా - కౌసల్య యతని
చెక్కులు నురమునుఁ - జేతుల నివిరి
రామునిమీఁది వి - రాళిఁ జింతిల్లు
నామహారాజుఁ బా -యక యిట్టులనియె

—: కౌసల్య విలపించుట :—


“కుపస మూడ్చిన త్రాఁచు - కొదమయో యనఁగ
కపటంబు పేరిటి - గరళంబుఁదాల్చి
గైకేయి యున్నట్టి - గతి ప్రాణనాథ!
నాకుఁజూచిన నెమ్మ - నము భీతినొందె 4550
వరమడిగిన నేమి - వనముల కేల
తరమించె నురక - నా తనయుపై నలిగి
తనుఁ గొల్చియుండఁడొ - తా మోముచూడ
ననిన యుండఁడొ నాగృ - హంబులోనైన
తననేరుచెప్పి చెం - తలవారి నడుగు
కొనియైన మెలఁగఁడో - కొన్నాళ్లు పురిని
పర్వకాలముల వెం - బడి సోమయాజి
పర్వి పురోడాశ - భాగంబుఁదెచ్చి
యసురల పాల్సేయు - నట్టి చందమున
పొసఁగునే రామునిఁ - బొమ్మనిత్రోయ? 4560
కొడుకులు తనపెద్ద - కోడలునిట్లు
నిడుములం బడుదురే - యెలజవ్వననముల
నెన్నడు వత్తురో - యిచటికి మఱలఁ

బున్నమరేల నం - బుధి యుబ్బుకరణి
వారలంగని యెల్ల - వారు నానంద
వారిధిఁదేలి చె - ల్వము గాంతురొక్కొ?
ఉప్పరిగల యందు - నుత్పలగంధు
లెప్పుడీ పురవీథి - నెడమీక కూడి
సీతా సమేతుఁడై - శ్రీరామచంద్రు
డేతేర కవదొన - లిరువంకఁదాల్చి 4570
శృంగంబులను మహా - శిఖరిఁ గన్పట్టు
సింగారమునఁ జేతి - సింగాణు లమర
వెనుక లక్ష్మణుఁడు రా - విరులును లాజ
లును కరంబులను జ - ల్లుచుఁ జూతురొక్కొ?
నయశాస్త్ర విదుల యం - దఱి లోనఁ బెద్ద
వయసు నిల్కడను దే - వతలతో నుద్ది
యిట్టి రాఘవుఁడు మూఁ - డేండ్ల పాయంపుఁ
బట్టికైవడి కనుఁ - బండువుఁగాఁగ
నా చెంత నుండు చం - దంబునే మఱలఁ
జూచి యింకొకనాఁడు - సుఖముందు నొక్కొ? 4580
తల్లులఁ గొడుకులఁ - దానెడల్ చేసి
తొల్లి యెవ్వరికింత - దొసఁగుచేసితినొ?
లేఁగఁగానక కోల్పు - లికిఁ జిక్కునావు
తోఁగూర్చెఁ గైకేయి - తోఁగూడి యజుఁడు
అతిశయ గ్రీష్మంబు - లందు భాస్కరుఁడు
కతకత నిలయెల్లఁ - గ్రాఁగించురీతి
యీపుత్ర శోకాగ్ని - యెంతయు మదికిఁ

దాపంబు నొందించెఁ - దరియింపఁ గలరె?"
అనిచాల నాపన్న - యైన కౌసల్యఁ
గని యాసుమిత్ర చెం - గట నిట్టులనియె 4590

—: కౌసల్యను సుమిత్ర యూరడించుట :—


"అక్క! లోకస్తుతుం - డైన రాఘవుని
చక్కందనంబును - సద్గుణంబులును
నెఱిఁగి యుండిన పతి - కింత శోకంబు
మఱియుఁ గల్పింప నీ - మాటలాడుదురె?
కొడుకు లందఱు నీదు - కొడుకులుగారె
అడల నేఁటికి యొక్కఁ - డని పలుమారు
తనతండ్రి యానతిఁ - దాల్చి రాఘవుఁడు
తనకుధర్మము మఁది - దలఁచి జానకియు
యిహపరంబులకు మే - లెంచి లక్ష్మణుఁడు
విహిత వైఖరి నట - వికి నేఁగినారు 4600
వారికినై చింత - వలదు నీకింత
యూరడింపుము రాజు - నుపతాపమణఁచి
జగతిపైఁ గీర్తిధ్వ - జంబు శోభిల్లఁ
బొగడికల్ గను నీదు - పుత్రుని మీఁదఁ
గాఁకవుట్టఁగ నెండ - గాయునే తరణి?
సోఁకునే బిట్టుగా - సుడిసి వాయువులు
ఏమిసేయఁగవచ్చు - నెవ్వరికైన
రాముని భుజపరా - క్రమ మెన్న వైతి
అట్టి నీదు కొమారుఁ - డన్నిదిక్కులనుఁ
గట్టిగా సేమంబు - గైకొనగలఁడు 4610

చందమామ యొసంగు - చల్లందనంబు
కందనీయదు పాద - కమలంబు లవని
వనిత! తిమిధ్వజా - హ్వయనిశాచరుని
తనయుని వైజయం - త పురంబులోన
తునుచుదివ్యాస్త్రముల్ - తోయజాసనుఁడు
మనరామునకునిచ్చె - మఱియందుమీఁద
యాలక్ష్మణుఁడువెంట - నరుదేర రాము
నాలంబులో నింద్రుఁ - డైన మార్కొనునె?
ఈతండ్రికడ మన - యింటిలోనున్న
రీతిగా వనులఁజ - రించి రాఁగలఁడు 4620
రామునిచేతి శ - రంబు గన్గొనిన
సామాన్యమే నిల్వ - శత్రురాజులకు?
రామునియాజ్ఞ మీ - ఱఁగ నెవ్వఁడోపు
సామాన్యుఁడె యమాను - షపరాక్రముండు
ఇనునికినినుఁడు వ - హ్నికి వహ్ని భాను
తనయునకును భాను - తనయుండు క్షమకు
క్షమ కీర్తికినికీర్తి - శాశ్వతదైవ
తములకుఁ దాదైవ - తము శ్రీకిశ్రీయు
నైన నీతనయుఁడి - య్యవనియు లక్ష్మి
జానకియునుఁ గొల్వ - సత్వరంబుగను 4630
పట్టాభిషిక్తుఁడై - భర్మలాలాట
పట్టంబుతో మన - పట్టణవీథి
తరుణు లారతులెత్తఁ - దారాఁగఁజూచు
పరమకల్యాణ లా - భము లొందఁగలవు

లక్ష్మీసమాన యి - లాసుత గూడి
లక్ష్మణుండు భుజావ - లగ్నకోదండ
యుగళుఁడై ముందర - నుండు రామునకు
జగతి నసాధ్యమె - చ్చట గల్గనేర్చు?
వనవాసమీడేర్చి - వచ్చి నీచరణ
వనజయుగ్మమునకు - వనితతోఁగూడి 4640
మ్రొక్క శ్రీరాముని - ముచ్చటదీరఁ
గ్రక్కున నానంద - కలితబాష్పములు
కన్నులంగురియంగఁ - గౌఁగిటంజేర్చు
నిన్నుఁగన్గొనువేడ్క - నేఁగాంచుదాన
యిదెవచ్చె మనరాముఁ - డేలశోకంబు
వదలవమ్మా!" యని - వాకొనుచుండ
శరదావసరమున - జలములల్పముగ
ధరియించునట్టి కా - దంబినిం బోలి
యాసుమిత్ర వచించు - నట్టిమాటలను
కౌసల్య యూరట - గాంచెనెమ్మదిని. 4650
 

—: రాముఁడు తనవెంటవచ్చు పౌరులనూరడించుట :—


ఆవేళ రఘురాముఁ - డఖిలజనంబు
సేవింప దా వన - సీమకుం జనుచు
నందఱఁజూచి ప్రి - యంబున పుత్రు
లందలివాత్సల - మమరనిట్లనియె.
"మీరేల? విపినభూ - మికి నాదువెంట
దూరమేతేర వ - త్తురె యిండ్లువిడిచి

భరతుండు వయసున - బాలుఁడౌఁగాక
పరమవిజ్ఞానసం - పన్నుండు ప్రభుఁడు
మంచివాఁడు వివేకి - మాన్యుఁడు తాల్మి
మించినవాఁడు న -మ్మిన వారి నెఱుఁగు 4660
ప్రజలఁబ్రోవనెఱుంగు - పౌరుషశాలి
నిజవరి గుణము ల - న్నియుఁ గలవాఁడు
నాకుఁదమ్ముఁడు గాన - నామారుగాఁగ
మీకు నాయనమాట - మేకొని కొలిచి
మనుట ధర్శముగాన - మనకెల్లనతఁడె
పనిగొని రక్షింపఁ - బాల్పడినాఁడు
మాతండ్రియతనికి - మహియిచ్చె భరతు
చేతిలోవార మీ - చెప్పినమాట
మీరుచేయుటయె నా - మెచ్చు నాకొఱకు
మారాజు భరతుఁడు - మనసులయందు 4670
కడలేనిచింతలఁ - గరఁగకయుండ
కడుఁజేరి రేపగల్ - గాఁ గాచియుండి
మెలఁగుఁడీ” యనిన భూ - మీజనంబెల్ల
తొలఁగక రాముని - తో నిట్టులనియె.
"ఏమేలయెడవాతు? - మినవంశ! మిమ్ము
భూమీశుఁడెక్కడఁ - బోయిననేమి?
భరతుఁడేఁటికి మాకు - పట్టణంబేల?
దొరవీవెకాకయం - దునకెవ్వరైన”
అనునందులోవృద్ధు - లైన బ్రాహ్మణులు
వెనుకొని రాముండు - విననిట్టులనిరి. 4680

“రథమునఁగట్టు తు - రంగంబులార!
పృథువేగమున మీర - లేల పోయెదరు?
మనరాజునకు ధరా - మరులకునెల్ల
జనులకు హితముఁగాఁ - జనక కానలకు
రామునిఁగొనితెండు - రథముమఱల్చి
మామీఁదికృప” నన్న - మాటలాలించి
యున్నతాసనముల - నుండి పెద్దలనుఁ
గన్నలేవకయున్నఁ - గారాదు గాన
తనతేరుడిగ్గి చెం - తకు వారువచ్చు
దనుకఁగాల్నడ రఘూ - త్తముఁడొయ్య నరుగ 4690
వారు కూడఁగవచ్చి - “వచ్చెదమేము
శ్రీరామ! మీవెంటఁ - జేరి కానలకు
మాయగ్నిహోత్రసా - మగ్రితో వాజి
పేయశితచ్ఛత్ర - బృందంబు కడల
శారదసమయ హం - సంబులలీలఁ
దేర మీరానిండ - దిరుగంగవలయు
వేదమంత్రములంటి - వెన్నాడుబుద్ధి
మీదువెంబడి రాఁగ - మెయికొల్పెమాకు
తమకు సర్వార్థసా - ధనమైన వేద
మమరియున్నది కూడి - యంతరంగముల 4700
మాయింటివేలుపుల్ - మఱవకయిండ్లు
వాయకయుందురే - పట్టులనైన
మముఁదోడుకొని పొమ్ము! - మా మాటనీకు
నమరకయున్ననీ - యరదంబుఁ ద్రిప్పి
మఱలి యయోధ్యకు - మావెంటరమ్ము

సరిచూచుకొను మెద్ది - సరణియో నీకు
కాదనిమామాట - కడఁద్రోచితేని
వేదశాస్త్రంబుల - విప్రులనింక
నాదరించి ప్రయోజ - నాంతరంబులను
మేదినీజనము లే - మిటికిఁ గైకొనరు 4710
యిది ధర్మమనిమది - నెఱుఁగవే? ధర్మ
పదవికెల్లనుమేలు - బంతినీనడక
నిజముగా షట్కర్మ - నిరతులమేము
యజనయాజనల స - మర్థుల మగుట
తపములుసేసి యెం - తయు నిండఁబండి
జపములఁగృశియించి - శాంతివహించి
యుపవాసములఁజిక్కి, - యూర్ధ్వరేతములఁ
దపియించి యజుని వ్రాఁ - తలు మించబ్రతికి
యున్నవారముగాని - యున్నవారనుచు
నెన్నకు మిట్టియే - మిందఱుఁగూడి 4720
తెల్లఁగా నరసి యెం - తేజడల్ గట్టి
పల్లచాయలఁబొగల్ - వట్టిభస్మముల
ధూసరితంబులై - ధూళిపై బొదివి
డాసి వాహినులనీ - టనుఁదోఁగితోఁగి
పోరాని పుణ్యంపు - పుట్టలోయనఁగ
మీరుమాశిరములు - మేదినిసోఁక
నీపాదములచెంత - నిలిపి సాగిల్లి
యోపుణ్యనిధి! మ్రొక్కు - చున్నాము నీకు
నినుఁ బాసియున్న మా - నియమంబులేల
కొనసాగు మము నెన్ను - కొననేల నేఁడు 4730

స్థావరజంగమా - త్మకమైనధరణి
దేవ! నీరాకయ - ర్ధించె మాసరణి
సంచారపటుశక్తి - చాలమి వనులు
సంచలింపుచును ప్ర - చండవాయువుల
మొరయుచున్నవి వృక్ష - ములు పాయలేక
మొఱవెట్టుగతిఁజూడు - మో రఘుప్రవర!
జగతి నాహారసం - చారముల్ మాని
ఖగములు మీదురా - క యపేక్షచేసి
కలకలస్వనములఁ - గలగుండునడుచుఁ
గలఁగెడుఁగనవయ్య - కాకుస్థతిలక! " 4740
అని తన్నుమఱలింప - నర్ధించి చాల
వినయసూక్తులువల్క - విప్రులంగూడి
అడ్డిసేయక రాము - నరికట్టఁదలఁచి
అడ్డంబువచ్చెనో - యనఁదరుల్‌నిండి
సరణిఁదోఁచిన తమ - సా నదిచేర
నరుగ సుమంత్రుఁడా - హయములవిడిచి
నీరార్చి కెలని ది - న్నెలఁబచ్చనైన
పూరిమేపుచుఁ జరిం - పుచు నుండెనంత.

—: రాముఁడు తమసానదియొడ్డున విశ్రమించుట :—


రామచంద్రుండు పు - రాణపూరుషుఁడు
సౌమిత్రిఁజూచి ప్ర - సన్నుఁడై పలికె. 4750
“వనవాసమున కాది - వాసరంబిట్టి
దినముమొదల్గాఁగ - తిర్యగాదులనుఁ

గలసిచరించుట - గాని సౌఖ్యములు
నిలయంబులును మది - నిలుపుటమాని
చరియింతమిపుడు వి - చారంబుతోడ
నరపతి దేవులం - దరు పట్టణమున
మనలఁదలంపుచు - మఱుగుచుండుదురు
మనరాజు ఖేదంబు - మాన్పనోపుదురు
భరత శత్రుజ్ఞులా - పట్టునఁగాన
పరితోషమొందెడి - భావంబులోన 4760
తల్లితండ్రులకు ఖే - దంబు లేదచట
నుల్లాసమొందింప - నోపుదువిచట
సీతతోఁగూడి వ - చ్చిన నాకునీవు
నీతోడుగలుగ న - న్నిటనుమేలయ్యె
నేఁటికీ యేటిపా - నీయంబె తక్క
నేఁటికి నితరంబు - నితవుగా”దనుచు
నాసుమంత్రునిఁచూచి - "యశ్వముల్ లెస్స
మేసెనే కసవులా - మిక" నంచుఁబలుక
ఆతఁడుమేసిన యట్టి - హయములఁగట్టి
యతి నీవు సమయకృ - త్యంబులుదీర్చి 4770
చల్లనౌ నొక్కర - సాలంబు చెంత
పల్లవంబులుదెచ్చి - పఱపుగానునుప
లక్ష్మణసీతాను - లాపముల్ రాజ్య
లక్ష్మితోఁబాయుతె - ల్పాటు వారింప
అందుమువ్వురును శ - యానులైనిదురఁ
జెందు చోట సుమంత్రు - జేరి లక్ష్మణుఁడు

రామునిసుగుణకీ - ర్తనములు నడవి
భూమిజతో శయిం - పుటలుఁ బేర్కొనుచు
నున్నచోఁ దా నరు - ణోదయంబునకుఁ
గన్నులు విచ్చి మే - ల్కాంచిరాఘవుఁడు 4780
తన చుట్టునిదురించు - ధారుణీజనులఁ
గనుగొని లక్ష్మణుఁ - గని యిట్టులనియె
"పౌరులకెటువంటి - బాళిచూచితివె?
వీరిండ్లనింతుల - విడిచియున్నారు
ఆహారములు మాని - యలసి యిందఱును
దేహముల్ మఱచి ని - ద్రింపుచున్నపుడె
కడకుఁబోవుదము మే - ల్కనిరేని మనల
నడవికిం బోనీయ - రడ్డగింపుదురు
విడుతురుప్రాణముల్ - విడువరుమనల
నెడవాసిక్షణమైన - నిట్టట్టుఁజనరు 4790
వీరును మనవెంట - విపినభూములను
కారాకు దిని యేల - గాసిచేనలఁగ
తొలఁగుటొప్పగు” నన్నఁ - దొలఁగుటేమంచి
తలఁపని తా నర - దంబుఁదెమ్మనిన
నాసుమంత్రుఁడు రథం - బటతెచ్చి యునుప
నాసీతతోడ వా - రల్లనయెక్కి
తమసాస్రవంతిని - దాఁటి యాతేరు
తమ రయోధ్యకుఁ బోవు - తలఁపు పుట్టింప
రథముగ్రమ్మర నుత్త - రముగ రానిచ్చి
పృథుమతి నాజాడ - పేరేటఁగూర్చి 4800

యావల నీటిలో - నరదంబుతూర్పు
వోవఁగానిచ్చియ - ప్పుడు దక్షిణముగ
గట్టెక్కి చట్టుపైఁ - గదలించిరాల
మిట్టల నడపించి - మెల్లనేచుట్టి
తెరువు గూడుక తమ - తేరు కాంతార
సరణినిఁ బోనిచ్చు - సమయంబునందు,

—: పౌరులు రామునింగానక యయోధ్యకు మఱలిపోవుట :—


నిదురింపు చున్నట్టి - నిఖిల జనంటు
నదరిపాటున లేచి - యరదంబు లేక
రామలక్ష్మణుల ధ - రాతనూజాత
నేమేరఁ గానక - యిచ్చలం గలఁగి 4810
యీనిద్ర యక్కటా ! - యిటుసేసె మనల
తాను దాసులఁబాయఁ - దగునె రాఘవుఁడు?
తనయుల వంటి యిం - దఱఁ బాసిపోవ
తనకెట్లుచెల్లు సీ - తా సహాయునకు
నేల రామునిఁబాసి - యింకఁ బ్రాణములు
చాలు మేనులతోడి - సంసర్గ సుఖము
పాటింపుదుము మహా - ప్రస్థానమైన
యేటివెల్లువఁబడి - యేనిఁ బోవుదము
కనుకని చొత్తము - కారుచిచ్చైన
కనకెట్టులోర్తుమీ! - కాకుస్థకులని 4820
రామునిఁబాసి యూ - రక యిండ్లుచేర
నేమందు రచ్చోటి - యెల్లరు మనల
శ్రీరాముఁగూడి వ - చ్చిన వారమకట!

యేరీతిఁ బోవుద - మిటువాసి యతని
యేమి సేయుదమని - యెల్లధనంబు
నేమరి కొల్పోవు - నెన్నిక వారు
నటునిటుఁ బరికించి - యరదంబుపోవు
పటుతర మార్గంబు - భావించిచూచి
మనగంటి మీజాడ - మనయయోధ్యకునుఁ
జనియె రాఘవుఁడునుఁ - జనియెఁ గానోవు 4830
వలదు ఖేదంబని - వచ్చినజాడఁ
దొలఁగక యందఱుఁ - దోడ్తోనె కదలి
సాకేత నగరికిఁ - జని రాఘవుండు
లేకయుండుటకు జా - లివహించి యచట
నెమ్మియు నాహార - నిద్రలుమాని
యుమ్మలికింపుచు - నుండి రందఱును.
పాములు లేనిచోఁ - బక్షిపుంగవుఁడు
కామించి చేరని - కాసార మనఁగ
హరిణాంకు నెడబాయు - నాకాశవీథి
సరణి నంబువులేని - జలధి చందమున 4840
రామునిఁబాసి గౌ - రవ మెల్లఁదొలఁగి
శ్రీమించదయ్యె నీ - క్షింప నప్పురము

—ː రామునిఁగూర్చి పౌరస్త్రీలు దుఃఖించుట ː—


యితరులుఁ దమ వారు - నిండ్లు భోగములు
హితమని తమమది - నెంచ రెవ్వరును
జీవనంబుల మీఁద - స్థితులందు తమదు
జీవధనంబుపై - చింతలుమాని

యందఱును విరక్తు - లై పణ్యవీథు
లెందుఁ బాయకయుండ - నెల్లవారికిని
చెడిపోయిన ధనంబు - చేతికిచ్చినను
పొడమక ప్రమదంబు - పురుషులయందు 4850
పుత్రులయందును - పొలఁతులయందు
శత్రుభావముగ ని - చ్చలుఁ గనుఁగొనుచు
శ్రీరాము నెడబాసి - చేరు వల్లభుల
నారులందఱును చెం - తలఁ జేరనీక
యేల వచ్చితిరి మీ - కీపట్టణమున
నేలాభ మాసించి - యేతేర వలసె?
రామానుజీవి ధ - ర్మస్వరూపుండు
సౌమిత్రి యొక్కఁడే - సత్పురుషుండు
మీకేల యట్టి య - మేయ భాగ్యంబు
చేకూడు గృహవధూ - జీవనాశులకు? 4860
శ్రీరాము పదపద్మ - చిహ్నాంకితంబు
లై రాజిలంగ మ - హానదీ వనులు
యింత పుణ్యము సేయు - నే యవియెల్ల
సంతతం బతని బూ - జలు సేయకున్నె
కమనీయ గంధోద - కముల సంఫుల్ల
సుమములఁ దమతమ - సొమ్ములుగాన
వరకందర ఝరీ ని - వాసంబులైన
గిరు లమ్మహాత్ముండు - గ్రీడించు కతన
నవియౌర? యెంత ధ - న్యములయ్యెఁ గొదవ
లవమానములు గల్గ - వతఁడున్న యెడల 4870

రాముని పదసమా - శ్రయమె యెల్లరకు
సేమంబుగాన భ - జింతము వోయి
యేము సీతను మీర - లెల్ల రాఘవుని
కామించి కొలువక - గతివేఱె గలదె?
అన్యాయపద మయో - ధ్యా పట్టణంబు
సన్యసింపకఁ జూడఁ - జనునె యెవ్వరికి?
తరమె కైకేయి య - ధర్మ రాజ్యమున
పురమని నమ్మికా - పురములుసేయ
తన బ్రదుకాశించి - తనుఁ బెండ్లియాడు
పెనిమిటి పుత్రుని - పేరు వెంటాడి 4880
కలుషంబులకు నొడి - గట్టినకైక
పొలియింప కెవ్వరిఁ - బోనిచ్చునింక?
కూలికాండ్లను బోలి - కొలిచెద మనిన
జాలియింతియె కాక - సౌఖ్య మెక్కడిది?
పుర మనాయకమయి - పోఁదరివచ్చె
ధరణీశ్వరుఁడు రాముఁ - దానెడవాసి
వొలియుటసిద్ధ మ - ప్పుడు పోవరాదు
తొలఁగి పోవుదము మీఁ - దు తలంచి యిపుడ
నుండుకంటె విషప్ర - యోగంబె మేలు
పొండెఱుఁగని దేశ - ములకైన వెడలి 4890
చంపుడు గొఱియల - చందాన నిట్టి
కొంపలలో తాము - గూలియుండెదము
కారుణ్యశరధి య - కల్మషాత్మకుఁడు
సారస పత్రవి - శాలలోచనుఁడు
దయగల తండ్రి స - త్యపరాక్రముండు

జయశాలి నీతిశా - స్త్ర విశారదుండు
పురుష శార్దూలుండు - పుణ్యుండు మత్త
కరిరాజ గంభీర - గమనుఁ డుత్తముఁడు
అట్టిరాముఁడు వను - లందుఁ జరింప
నిట్టి మీవంటి వా - రిండ్లు చేరుదురె?" 4900
అని పురస్త్రీలు నా - యకులతో మృత్యు
వునుఁబోలు కైక చై - వులకు శోకింప
నంతట భానుఁడ - స్తాద్రికిఁజేరె
నెంతయు మహినెల్ల - నిరులల్లు కొనియె
అధ్యయనాగ్నిహో - త్రాదులు లేక
విధ్యుక్త కర్మముల్ - వీడుకోలొంది
యుదక శూన్యంబైన - యుదధియం బోలి
యొదవు నిశ్శబ్దత - నుండె పట్టణము

—: వేదశ్రుతి గోమతులను నదులను రాముఁడు దాఁటుట :—


ఆరీతి పౌరుల - నందెల్ల డించి
తేరుదోలించి మం - త్రియుఁ దామునేఁగి 4910
మిగుల దూరముపోయి - మిహిరోదయమునఁ
తగునెడ కాల్యకృ - త్యంబులఁ దీర్చి
దమసీమ పొలిమేర - దాఁటి కట్టెదుల
నమరపంటలుఁ బండి - నట్టి గ్రామముల
బడలికల్ దీఱఁ జూ - పట్టఁ గన్గొనుచు
నెడనెడఁ బల్లెల - నెల్ల వారలును
"కామాతురుఁడు రాజు - కైకకు లొంగి
రామునివంటి గా - రాపుఁ బుత్రకుని

యేమని పొమ్మని - యెను పాపజాతి
గామిడికైక యే - గతివరం బడిగె? 4920
అట్టి దుర్మార్గురా - లకట! యీసీత
నిట్టి బాములఁ బెట్టె - నేమనవచ్చు”
అనిపల్క, వినుచు వా - రవ్వల చనఁగ
ననఘ వేదశ్రుతి - యను నొక్కయేఱు
దాఁటె దక్షిణముగాఁ - దమరు పోవుచును
మాటికి నావుల - మందలున్నట్టి
గోమతినది గనుం - గొని యదిమీఱి
యామొగదల స్యంది - కాపగఁగడచి
మనువు మున్నిక్ష్వాకు - మనుజేశ్వరునకుఁ
దనసీమలోఁ బంచి - తానిచ్చినట్టి 4930
యారాజ్యమిదియని - యవనిజతోడ
నారాఘవుఁడు దెల్పి - యవ్వలచనఁగ
నెంతదవ్విక మన - మేఁగు కాఱడవి
యింతకన్నను దూర - మేల పోయెదరు?
మనవారి నింకొక్క - మఱిచూడనాకు
మనసయ్యె పురికేఁగి - మఱలుద మిటకు
దిగులయ్యె"ననిన ధా - త్రీతనూజాత
మొగముచూడఁ బ్రధాన - ముగ నశ్రులొలుక
నావల నరుగుచో - "నవనిజ ముగ్ధ
యేవగ పదునాలు - గేండ్లు చరించు 4940
నోయి సుమంత్ర! యిం - కొకనాఁడు మఱలి
పోయి యీసరయువు - పొలముల యందు
వేడుకతో డేగ - వెంటాడి చెలులఁ

గూడి మా దశరథు - కొలువునకేఁగి
డాసి చిక్కముల పి - ట్టలనెల్లఁగాన్క
చేసి కౌసల్యకుఁ - జేరి మ్రొక్కుదునొ?
యీడేరు నొక్కొమా - కివ్వన వాస
మేడ యయోధ్యమా - కిఁక చూడగలదె?
యీమాట వెంటాడ - నెంచితి నంచు
నీమది లోపల - నిలుపకు మెందు 4950
విలుకాండ్రకును గురుల్ - వేయుట దేహ
మలయించుటయు శ్రమం - బణఁచుట ముసలి
రాజులు వేఁడిన - శ్రాద్ధార్హ మాంస
రాజిఁదెచ్చుటయుఁ గ - ర్తవ్యముల్ గాన
మనసున దోఁచిన - మాటవాకొంటి"
ననిపల్కి- రఘువీరుఁ - డామ్రోలనున్న
నుత్తర కురుకోస - లోత్కలభూము
లత్తరి చూచుచు - నదిదాఁటి నిలిచి
గతి నయోధ్యాభిము - ఖంబుగా మఱలి
యతిభక్తిఁ గేలెత్తి - యంజలిచేసి 4960

—: రాముఁడు గంగాతీరముఁ జేరుట :—


"ఓపురరాజంబ! - యొక్కొక్కయెడల
నేపుణ్య దేవత - లెపుడు నీయందు
నున్నవారలొ వారి - కొక నమస్కార
మెన్నిక మారాజు - ఋణము దీర్చుటయు
మఱలివచ్చి భజింతు - మఱువక వారి

నరలేక నాకు స - హాయు లౌటకును"
అనిజలజలఱెప్ప - లందు బాష్పములు
చినుకంగఁ గన్నుల - చెంగావిగ్రమ్మ
పొడవుగా వలపలి - భుజమెత్తి యెలుఁగు
కడురాయ గద్గద - కంఠుఁడై యచటి 4970
జనుల నుద్దేశించి - "చాల నామీఁద
కనికరింపుచు వెను - కటి దినంబులకు
కలసియుంటిమి బహు - కాలమిమ్మీఁద
తొలఁగిపోవలసె నా - దురదృష్టమునను
దయమఱువకుఁ"డను - ధరణీశతనయుఁ
బ్రియవచనంబుల - ప్రేమతోవినచు
నచ్చోటిజనులెల్ల - నలమరుగంగ
వచ్చెనస్త్రాద్రికి - వనజబాంధవుఁడు.
చీకటిమరుగున - సీతావరుండు
వేఁక మౌస్యందన - వేగంబుతోడ 4980
జనపదంబులుగొన్ని - సరణిగన్గొనుచు
చనిచని యెదుట లో - చనపర్వలీల
కాంచనదళరత్న - కందళ కర్ణి
కాంచిత కమలవ - నాభిశోభితము
మకరంద రసలోల - మదచంచరీక
నికర గాయనగాన - నిబిడీకృతంబు
శౌనకాదిమ మహా - సంయమిశ్రేష్ఠ
మానితాశ్రమలస - మానకూలంబు
మానితసురత సం - భ్రమ రణ దివిజ
మీనేక్షణా మణీ - మేఖలారవము 4990

కలితలతా డోలి - కాలోల మౌని
కులకన్యకా తులా - కోటిస్వనంబు
పనస రసాల రం - భానారికేళ
తినిశక్రముకవనో - త్కీర్ణరోదంబు
వారికేళీలోల - వైమానికాభి
సారికా వీక్షామృ - షా మీనబలము
యాజన హోమధూ - మాకాండ జలద
రాజికాచ్చన్నత - రంగ మాలికము
కారండవ మరాళి - కాప్లవీభూత
గౌరసారస పరా - గ ప్రపంచంబు 5000
నగుచు తుమ్మెద - దాఁటులలకలు గాఁగ
మొగుడు దమ్ములు చన్ను - మొలకలుగాఁగ
కలితకటీర చ - క్రము పులినముగ
వలనొప్పు విరి - దమ్మి వదనంబుగాఁగ
కెందమ్మిదోయి యం - ఘ్రియుగంబు గాఁగ
పొందుబేడసలు చూ - పుల బాగుగాఁగ
సరళవళీ విలా - సము తరంగలుగ
నెరసిన నాచు పె - న్నెఱి గుంపుగాఁగ
మీఁగాళ్లు మేటితా - మేటి పిల్లలుఁగ
తీగ లే నగవులు - తేలు నుర్వులుగ 5010
కామినియునుఁ బోలు - గంగానదీల
లామంబు చూచియా - లక్ష్మణాగ్రజుఁడు
చేరి చేతులుమోడ్చి - శృంగిబేరంబు
చేరువాఁడగుచు ద - క్షిణముగా నరిగి
"యిచ్చోటనున్నది - యింగుదుశాఖి

వొచ్చంబు లేకనేఁ - డుంద మీవీడ"
అన లక్ష్మణ సుమంత్రు - లట్ల కాకనుఁడు
చన యమ్మహీరుహ - స్థలిఁ దేరుడిగ్గి
చెంత దేజీలఁ బ - చ్చిక మేయవిడిచి
వింతవారలు లేని - విజనదేశమున 5020
వసియించుతరి రఘు - వర్యుని రాక
వెసఁదన వారిచే - విని సంతసించి
తససీమ గావునఁ - దగిన సన్మాన
మొనరింప గుహుఁడను - నొకబోయఱేఁడు
తనవారు ముదుసళ్లు - తనుచుట్టుఁ గొలువ
పనిపూని బహువన్య - ఫలములఁ గొనుచుఁ
గానుకచేసి ల - క్ష్మణుఁ గూడియున్న
జానకీజాని న - చ్చటఁ బొడగాంచి
అతిథివైతివి యేఁగృ - తార్ధుండనైతి
హితమెద్ది నాకాన - తిచ్చి కైకొనుఁడు 5030
అనిస్వాదు జలములు - నన్నంబు భక్ష్య
వనఫలాదు లొసంగి - వారియ్యకొనిన
"ఇనవంశ! ఆది గ - ర్భేశ్వరుఁడైన
నినువంటి యతిపుణ్యు - నికి నింతచింత
అకట! రావచ్చునే? - యడిగెఁబోకైక
ఒకమాట కాఁదన - కుర్వీశ్వరుండు
వరమిత్తునని పంప - వచ్చునే మిమ్ము
పరికింప ననువంటి - బంటు గల్గియును
నేలయింత విచార - మే నాయయోధ్య
యేలింతునో? నిన్ను - నిటుగాదటన్న 5040

నందుకు బదులుగా - నధిప! నాపురము
నందు పట్టము గట్టి - యస్మదాదులము
కొలుతుమో? మరి - వేఱె కోరికె నీకుఁ
గలిగియున్నదియొ? యొ - క్కటి పేరుకొనుము
చేకూర్తుమీకు నా - చేతనుంగాని
యేకార్య మొకటున్న - దే” యనిపల్క
ఆదరంబున గుహు - నక్కునఁజేర్చి
మోదంబుతో రఘు - ముఖ్యుఁ డిట్లనియె
"నీవు నీవారును - నెమ్మదింగూడి
యేవలనఁ గొఱంత - యింతయులేక 5050
సుఖమున్నదియేచాలుఁ - జూచితిమిట్టి
సఖు నిన్నుఁ గనుటలే - చాలును మాకు
అసలన్నియు మాని - యడవులఁదిరుగ
నాసించు మాకు న - న్యప్రతిగ్రహము
గారాదు నీయీవి - కైకొంటి మేము
పోరానియట్టి యా - ప్తుఁడ వైన కతన
మాకునై యిన్నియు - మఱలంగనీవు
కైకొమ్ము నగరివి - గాన తేజీలు
మేపింపు" మన నట్ల - మేకొని గుహుఁడు
జోపానచేసి న - చ్చోఁ దురంగముల 5060
బహుమానమిది మాకు - భక్తిఁ దెమ్మనుచు
గుహుఁడొసంగఁగ నార - కోకలుదాల్చి
సౌమిత్రి దెచ్చిన - జహ్నవీవారి
రామచంద్రుఁడు గ్రోలి - రాత్రి యచ్చోట
సామాన్యమగు తృణ - శయ్యాతలమున

రామామణియుఁ దాను - రామచంద్రుండు
నిదురింప గుహుఁడు మం - త్రియుఁ దనచెంతఁ
గదిసి రాఘవగుణ - కథనముల్ సేయ
సౌమిత్రి విలు నారి - సారించికెలన
నేమఱ కొక్కింత - యెడ నిద్రలేక 5070
కాచి వారలుఁ దానుఁ - గనుకల్గియున్న
నాచోట గుహుడు రా - మానుజుఁ బలికె

—: గుహుఁడు లక్మణునితో సంభాషించుట :—


"శయ్యనీకొకటి ల - క్మణ! యేరుపఱచి
యియ్యడ నున్నది - యిందునిద్రింపు
మదన సుఖోచితం - బైన నీమేను
నిదురలేదేని యెం - తే గాసినొందు
రాముసంరక్షణా - ర్థమున కేఁజాలి
యేమరకుందు నా - హితులతోఁ గూడి
అలవడియుండు ని - ద్రాహార విధులు
కలిగిన లేకున్న - కాయముల్‌మాకు 5080
నమ్ముచు నీపూన్కి - నామీఁదనుంచి
నెమ్మదిఁ బవళించి - నిదురింపుమీవు
సీతాసమేతుఁడౌ - శ్రీరామచంద్రు
నేతరిఁగని కొల్వ - కిందునకన్న
నేకార్యమైన నా - కేల? యీస్వామి
శ్రీకర కరుణావి - శేషంబు వలన
పురుషార్థములు నాల్గుఁ - బొందెదననుచుఁ
బరికించినాఁడనా - భావంబులోన

చతురంగబలము లి - చ్చట నెదురించి
ప్రతికూల మైనయేఁ - బాఱఁద్రోలెదను 5090
ననుఁబని గొను" మన్న - నవ్వి లక్ష్మణుఁడు
వినయంబునఁ బుళింద - విభున కిట్లనియె
“ఎంతకైననుఁ జాలు - దీవుఁ గల్గఁగను
చింతయేడది రఘు - శ్రేష్ఠుఁగాచుటకు
నేలపై సీతతో - నిదురించురాము
నీలీల కన్నుల - నేఁజూచిచూచి
తనువునం బ్రాణముల్ - దాల్చియున్నట్టి
నినుఁజూచి కంటికి - నిద్దురగాంతు
తపముల పంటయౌ - తనయు నీరీతి
నపవాదముల కోర్చి - యడవుల కనిచి 5100
యాలిమాటల వెఱ్ఱి - యైన మారాజు
జాలిచే విలపించి - చాకుండఁ గలఁడె?
ఈరాము నగరిలో - నింక నయోధ్య
నూరిక పాడుగా - కుండ నేరుచునె?
కౌసల్యమాట యిం - క వంచింప నేల?
అ సుమిత్రయు నట్ల - యైన శత్రుఘ్నుఁ
జూచి యూరడ యొకిం - చుక గననేర్చు
భూచక్రమునకు నీ - పుత్రరత్నమును
పట్టంబుగట్టి యీ - భాగ్యంబుఁజూచు
నట్టి పుణ్యంబు లే - దాయె రాజునకు 5110
నారాజునకుఁ క్రియ - లర్థిఁగావించు
వారలకగు రాజ్య - వైభవోన్నతులు
వనుల పూనికదీర్చి - వచ్చి రాఘవుఁడు

తనుఁజూచు నందాక - దశరథ విభుఁడు
పాటించి ప్రాణముల్ - బట్టుకయున్న
నాఁటివేఁడుక యేమ - నఁగ వచ్చునీకు”
అని గుహుతో మాట - లాడుచు నుండ
విని యతండును ఖేద - వివశాత్ముఁ డగుచు
కన్నీరు దొరుగ రో - గంబుచే నలఁగి
యున్నట్టి మత్తేభ - మో యన మిగులఁ 5120
గలఁచుచు నుండఁ జీ - కటు లెల్ల విరిసెఁ
దెలవారె నిద్దుర - దెలిసి రాఘవుఁడు

—: రాముఁడు గంగనుదాఁటఁ బ్రయత్నించుట :—


ఓయి లక్ష్మణ! భాస్క - రోదయంబయ్యె
కూయిడఁ దొడఁగె ప - క్షులువనాంతముల
నీగంగదాఁటుద - మిప్పుడేయనిన
నాగుణ నిధిమాట - లతఁ డాలకించి
వినుఁడంచును కిరాత - విభుని సుమంత్రుఁ
గనిపల్కి యతఁడు చెం - గట నిల్చునంత
తనప్రధానులతోడఁ - “దగినట్టియోడ
గొనితెండు మీ"రని - గుహుఁడు వల్కుటయు 5130
వారు నట్లన సేయ - వచ్చియతండు
"శ్రీరామచంద్ర! వ - చ్చెను నావ” యనిన
గుహుఁడోడదేర ము - గ్గురుఁజేరఁబోయి
విహిత వైఖరినెక్కు - వేళ సూతుండు
"దేవ! నాకేది బు - ద్ధి యనుజ్ఞయిండు
నీవాఁడ" ననిన మం - త్రికి రాముఁడనియె


—: సుమంత్రునికిఁ జెప్పఁదగిన సందేశముల రాముఁడు చెప్పుట :—


"అరదంబుతో నయో - ధ్యకుఁ బొమ్మునీవు
ధరణీశు సేమంబుఁ - దలఁచి వర్తిలుము
గహనభూముల నింక - కాల్నడఁగాని,
విహితమే రథముతో - విహరింపమాకు" 5140
అనిన సుమంత్రుఁడు - హ్హని వెచ్చనూర్చి
అనఘ! రాఘవ మిమ్ము - నడవుల కనిచి
యీవట్టి రధముతో - నేరీతి పురికిఁ
బోవనేరుతు నాదు - పుణ్యమిట్లయ్యె
నేరీతి మువ్వురు - నేఁగి యుండెదరు
ఘోరాటవుల మిమ్ముఁ - గొలువ కెట్లుందు
ఆచార్య వాసంబు - నందు నధ్యయన
మాచరించి కృతార్డుఁ - డగు బ్రహ్మచారి
కైవడి వీరితోఁ - గానలయందు
దేవ! చరించి స - త్కీర్తి గాంచితివి 5150
పోనేర నే" నన్న - భూమిజారమణుఁ
డాననంబు మఱల్చి - యతని కిట్లనియె
"మనువంశమునఁ బుట్టు - మావారికెల్ల
నినువంటి యాప్తుఁడౌ - నెయ్యుఁ డున్నాఁడె?
మానిమిత్తము నీవు - మఱలి నాకొఱకు
మానసంబున శోక - మగ్నుఁ డైనట్టి
మాతండ్రి నూరార్చి - మనవి వాకొనుము
సీతయు సౌమిత్రి - చేరి భజింప
వనులలో సుఖమున్న - వాఁడ నేననుచు
ననుమంటి మనిపల్కు - మమ్మహీపతికి 5160

ముదిసి ముప్పునఁ గైక - మోహంబుచేత
మది నీతిమార్గంబు - మాని యేమన్న
నారాజుమాట నీ - వౌదలయందుఁ
జేరిచి యటులనే - సేయు మేయెడల
కౌసల్యకును నమ - స్కారంబు మేము
చేసితి మని మున్న - చేరి వాకొనుము
దశరథేశ్వరుఁడు చిం - తల నొందకుండ
కుశలత నీవు మా - కు హితంబుగాఁగ
భరతునిం బిలిపించి - పట్టంబుఁ గట్టి
ధరణీశ్వరుని మన - స్తాపమ్ము మాన్పు5170
మముఁ బాసి దుఃఖాబ్ధి - మగ్నుఁడౌ భరతు
శమియింపు మనినా వ - చనముగా ననుచు
తల్లుల సరిగాఁగ - దశరథునట్ల
యెల్లరకడ నీవు - హితబుద్ది మెలఁగు
కౌసల్యఁ జూడుము - కైకేయియట్ల
యాసుమిత్రల వారి - యట్లపాలింపు
మీలీల మెలఁగిన - నిహపరంబులకు
మేలగు ననుచు ధా - ర్మికుఁడయిన యిట్టి
మాభరతుని తోడ - మఱవక పలికి
యాభిముఖ్యము గాంచి - నపుడ వాకొనుము 5180
పొమ్మ” న్న సూతుఁడ - ప్పుడు కేలుమొగిచి
సమ్మతింపక బాష్ప - జలములు దొరుగ
"అయ్య! నేరిచినేర - కాడినమాట
లియ్యెడ సైరింపుఁ - డేల పోవుదును
నీతియే? దొరవైరి - నృపులచేఁ బడిన

సూతశేషరథంబు - చులకఁగాఁ దెచ్చు
వాని కైవడి నిన్ను - వనులకుం బనిపి
దీనుండనై రిత్త - తేరుతో నేను
పురికేఁగ దైన్యంబుఁ - బొందరే జనులు
నిరతంబు నాహార - నిద్రలుమాని 5190
నీవయోధ్యాపురి - నిర్గమనంబుఁ
గావింప నెంతదుః - ఖము పొందినారొ?
అంతదుఃఖము గాంతు - రప్పుడు నన్ను
చెంతలఁజేరి వీ - క్షించు భూజనము
నేమందుఁగౌసల్య - కేఁబోయి మేన
మామయింటను డించి - మరలివచ్చితిని
రాముని నని దబ్బ - రలువలుకుదునె?
భూమిజతో వనం - బులలోన రాము
విడిచివచ్చితినని - వేదనవెట్ట
నుడువుదునో నాకు - నోరెట్టులాడు 5200
మీరు లేనట్టిచో - మిన్నకరథము
వారువంబులు నన్ను - వహియించునెట్లు?
కావున నడవికిఁ - గదలిరమ్మనుచు
దేవ! యానతి ప్రసా - దింపుఁడు నాకు
రమ్మనవేని యీ - రథముతో శిఖి ము
ఖమ్మునఁజొచ్చినే - కడతేఱువాఁడ
వనములోపల మీకు - వ్రతనియమములు
కొనసాగకుండ మా - ర్కొనునట్టి వారి
యీతేరుచే వధి - యింప నోపుదును
సూతమాత్రుని గాఁగఁ - జూడకుమయ్య! 5210

నియమించి నీచెంత - నిలుపుకనన్ను
భయదాటవులయందుఁ - బనిగొనుటొప్పు
మాన్యంబులగుముని - మాపులట్లైన
ధన్యవైఖరుల ను - త్తమగతుల్ గాంచు
మీకొల్వులేకున్న - మిహిరాన్వయేశ!
నా కయోధ్యయె కాదు - నాకంబునొల్ల
పాపాత్ముఁడపవర్గ - పదవికి దొఱఁగి
తూపిలి పడఁబోవు - దుర్గతింబోలె
బేలనై యేనిన్నుఁ - బెడవాసి పురికి
నేలపోవుదువెంట - యేవచ్చువాఁడ 5220
తరవాతమిమ్ము సీ - తాసమేతముగ
నరదంబుపై నుంచి - యరుగుదుపురికి
పదునాలుగేఁడులు - పదునాల్గు క్షణము
లదియెంత మీవెంట - నరుదేరనాకు
మిముఁబాసియున్న ని - మేషంబు నాకు
క్రమియించునది బ్రహ్మ - కల్పమైతోఁచు
భక్తవత్సలుఁడ వీ - పట్టునఁ దగునె?
భక్తుని నన్నుఁజే - పట్టక వదల?"
అని దీనవదనుఁడై - యడలు సుమంత్రుఁ
గనుగొని లక్ష్మణా - గ్రజుఁ డిట్టులనియె. 5230
"నీభక్తివిశ్వాస - నియమంబులెల్ల
నీభూమిజనులెల్ల - నెఱిఁగియుండుదురు
యేనెఱుంగుదు నింత - యేఁటికీచింత
మానసంబున నాదు - మనవిఁగైకొనుము
పురికినన్నేఁటికిఁ - బొమ్మంటివనిన

తరుణితో రాఘవు - దండకాటవికి
ననిచి వచ్చితినన్న - యప్పుడు గాని
జననికైకేయి ని - జంబుగాఁగొనదు
వేయేల! నీ వేఁగి - విశ్వాసమొదవ
నాయమ్మతోఁ జెప్పి - యనుమానముడుప 5240
నంత మాతండ్రి స - త్యము మెచ్చి నమ్మి
యింతట దోషంబు - లెన్నక మనుచు
భరతుండు రాజ్యంబు - పాలింపఁజూచి
పరిణామముననుండు - పార్థివోత్తముఁడు
మారాజునకు నాకు - మదిలోనహితముఁ
గోరి యయోధ్యకుఁ - గొనిపొమ్మురథము
ఎవ్వరెవ్వరితోడ - నేమనుమంటి
నవ్వచనములె కా - నాడు మందఱికి"
అని సుమంత్రునికిఁ బ్రి- యంబులు చెప్పి
మనసు రంజిలఁజేసి - మఱలిపొమ్మనుచు 5250
గుహుని నెమ్మోము గ - న్గొని యిట్టులనియె
“మహితాత్మ! జనులస - మ్మర్దమిచ్చోట
కలిగియున్నది నిల్వ - గారాదు మాకుఁ
దొలఁగి పుణ్యాశ్రమా - దుల నుండవలయు
నియమపూర్వకముగా - నేదీక్షఁదాల్చి
దయసేయఁదగిన సీ - తాలక్ష్మణులకు
మాతండ్రికిని సర్వ - మంగళహేతు
భూతంబుగా జడల్ - బూనంగవలయు
పరిజనులను మఱ్ఱి - పాలు దెమ్మనుము
పరమ సంయమివృత్తి - పరుఁడగావలయు" 5260

అన నట్లకావింప - నచట రాఘవులు
మునివేషధారులై - మున్నటికన్న
చెలువంబు లెచ్చి యా - చెంచులఱేని
వలనుఁగన్గొని రఘు - వరుఁడిట్టులనియె.
"బలదుర్గములయందు - ప్రజలందు రాష్ట్ర
ములయందు నిజధర్మ - ములయందు నీవు
నేమరియుండక - హితులతోఁగూడి
భూమియేలుము మేము - పోయివచ్చెదము"
అని మఱలఁగఁబంచి - యాయోడచేర
జని రఘువరుఁడు లక్ష్మణుఁజూచిపలికె 5270
“ఎక్కింపులక్ష్మణ! యీయోడ మీద
నిక్కడభూపుత్రి - నేలతామసము?
పోవు“దమనిన య - ప్పుడు లక్ష్మణుండు
దేవి నయ్యోడపైఁ - దెచ్చియుంచుటయుఁ
దరవాతఁ దమ రన్న - దమ్ములు నెక్కి
తరణిభాగీరధిఁ - దరలింపుఁడనుచు
నాగుహు దాయాదు - లైన నావికుల
వేగంబె వాకొని - విడిచిపోలేని
సూతుని గుహుని న - చ్చో మఱలించి
పూతాత్ముఁడగుచు వి - ప్రులకు రాజులకు 5280
జపియింపఁదగునట్టి - సన్మంత్రమొకటి
యపుడుచ్చరింపుచు - నంజలిచేసి
నడిపింపుఁ డనవుండు - నావికు లోడ
గడపుచో సీత గం - గానదిఁగాంచి
దేవి! భాగీరథి! త్రిభువనంబులను

పావనంబులుగాఁగఁ - బ్రవహించితీవు
వనవాసమీడేర్చి - వచ్చితిమేని
యెనయువేడుక బలు - లిత్తుము నీకు
వనధిపట్టపురాణి - వాసమ! నీవు
వనులలో మాకు నీ - వలయు సేమంబు 5290
రాముఁ డయోధ్యాపు - రము ప్రవేశించి
శ్రీమించఁగా నభి - షిక్తుఁడౌనపుడు
నీకొఱ కప్పుడ - నేకవిప్రులకు
సాకేతనగరి భో - జనములమర్చి
శాటికా గోదాన - శతములుచేసి
చాటించి పురి గంగ - జాతరనడచి
మైరేయమాంస సా - మగ్రితోఁగొలిచి
పేరటాండ్రకు నీదు - పేర పుట్టములు
కట్టించి నీదరి - గాఁచువేల్పులకుఁ
గట్టించెదము గుళ్ళు - గ్రామాంతరముల" 5300
అని మ్రొక్కుచునుఁబోవ - నవల దక్షిణపుఁ
బెనుగట్టునకు నోడ - బిరుసున జాఱ
మున్నెక్కినట్లనే - మువ్వురుడిగ్గి
మన్నించి నావికు - మఱలంగఁబనిచి
మునులక్ష్మణుఁడు సీత - ముందఱతాను
వెనకయునై రఘు - వీరశేఖరుఁడు
వనులలోఁజరియించు - వారలై పల్ల
మును మిఱ్ఱు రాలును - ముండ్లునుంగల్గు
త్రోవల నొకకొంత - దూరంబువోయి
యానల సకలస - స్యసమృద్ధమైన {{float right|5310||

వత్సదేశముచూచి - వచ్చుచో దీన
వత్సలుండా రఘు - వర్యుఁడు సీత
యలసి యాఁకటిచేత - నడుగిడలేక
కలగుఁచందము చూచి - కఱకుటమ్ములను
నొకపంది నొకలేటి - నొక్కుకుందేటి
నొకచింకఁబడవైచి - యొలిచి మాంసములు
తెచ్చి యొండొకయేటి - తీరంబుచేరి
యచ్చోటనొక భూరు - హచ్చాయ నిలువ
ముగ్గురు నాహార - మునఁదనివొంది
యగ్గలిక వసింప - నర్కబింబంబు 5320
నపరాద్రి చేర సం - ధ్యాదులుఁదీర్చి
యపుడు లక్ష్మణుఁజూచి - యనియెరాఘవుఁడు

—: రాముఁడు పరితపించుచు లక్ష్మణుని నింటికిఁ బొమ్మనుట :—


"మఱలనంపితిమి సు - మంత్రునిచ్చోట
బఱపుగాఁదీర్పుము - పండుటాకులను
నీవును సీతయు - నిదురింపు మిమ్ము
గావనే జాగరూ - కతనుండువాఁడ
నడవి గావున నిది - యాదిగా పూన్కి,
కడతేర్చునందాఁక - క్రమమిదినాకు "
అని శయనించి పా - యని చింతతోడ
మనువంశతిలకంబు - మఱియునిట్లనియె. 5330
కడలేని యట్టి శో - కంబు రాజునకుఁ
గడువేడ్క కైకకుఁ - గల్గునీవేళ

ప్రాణేశునకుఁగైక - భరతునిఁజూచి
ప్రాణధారణమంత్ర - పటిమనువోలె
నూరటఁగల్పించు - నుల్లంబునకును
నేరుచునెటులైన - నృపునిరక్షింప
ననుఁబాసి వృద్ధుం డ - నాథుండునైన
జనపతికైక హ - స్తంబులోవాఁడు
ఏమిసేయఁగనోపు - నింతినిమిత్త
మీమహారాజున - కిట్టిపాటైన 5340
ధర్మమర్థమును వ్య - ర్థంబులు కామ
కర్మంబె యధికంబు - గా నెంచనయ్యె
యెంతటి మూఢుండు - నిటులొక్క యాలి
పొంతనంబునకు సు - పుత్రుఁడై నట్టి
ననువంటివానిఁ గా - నల కెటులంపు
కనలేని పనిచేసెఁ - గామాంధుఁడగుట
పతిదెచ్చి యొకమూలఁ - బడవైచి మనల
వెతఁబెట్టి తనపట్టి - విభునిఁ జేయుటను
భరతుఁడాలునుఁదాను - పట్టాభిషేక
పరతచే నతి సౌఖ్య - పరతంత్రుఁడగుచు 5350
దీనులౌ కోసల - దేశాధిపతుల
లోనుచేసుక యేలు - లోకమంతయును
తనకు లోనగు రాజుఁ - దాఁజంపఁ దలఁచి
మనలఁ గానలఁదోలి - మాయలకైక
కొడుకుఁ బట్టము గట్టఁ - గోరి విశ్వంబుఁ
దడకట్టె నెవ్వరిం - తకు నేరఁగలరు?
ముదముతో నామీఁది - మచ్చరంబెల్ల

మదినుంచి కైకేయి - మనలఁ గౌసల్య
బ్రదుక నీయని యట్టి - బాములంబెట్టి
చెదరక నేమేమి - సేయనున్నదియొ? 5360
నానిమిత్తమున వ - నంబుల కీవు
పూనివచ్చినది త - ప్పుగ నెంచి కైక
తెగఁజూచును సుమిత్రఁ - దెలియక వట్టి
పగగొను కొంటివి - భరతునితోడు
మాయన్న! యిఁకనైన - మాఱు మాటాడి
దాయలచేతి బా - ధలకు లోఁగాక
వేఁకువతో లేచి - వీటికి నరిగి
సోఁకోర్చి కౌసల్య - జూచి పోషించు
భరతుఁడెప్పుడు వచ్చెఁ - బాయకయతని
కరములో మాతల్లి - కరము నీవునిచి 5370
కానకకన్న రా - ఘవు నొంటి కొడుకుఁ
గానకుననిచి దుః - ఖముల నున్నట్టి
యీపుణ్య భామిని - నెపుడు కై కేయిఁ
జూపక ప్రోవుమం - చు వచింపుమీవు
మనతల్లులకు దిక్కు - మరిలేదు వేగ
జనుమీవు భరతుండు - సద్ధర్మ పరుఁడు
తల్లికి బిడ్డకు - తానెడల్ చేసి
తొల్లి కౌసల్యయీ - దుఃఖ మొందెడును
గలగాలమును నోచి - కన్నట్టి కొడుకు
తలగాకయీ యాప - దలఁ గుందదలసె 5380
యెందుకు నీజన్మ - మిటుగన్నతల్లి
నందరి లోపల - నవిధిఁ బాల్పఱచి

మనువార లేజాతి - మానుసులందు
ననుఁబోలి యొక్కఁడు - న్నాఁడె లోకమున?
పిలుకతో కౌసల్య - బెంచిన యాఁకు
చిలుక యల్లదె పిల్లి - చేరంగవచ్చె
కరవు మీదాని మో - కాలు తున్కలుగఁ
కరవాఁడి ముక్కునఁ - గత్రించి నటుల
అనుచుండు నాజన్మ - మాపాటిలేక
పనికిమాలెను తల్లి - పట్టున నిపుడు 5390
తనకుపుణ్యము లేక - తనయుఁ గోల్పోవు
జననికి నేల నిష్ఫల - మిట్టి బ్రదుకు
కనిపించి యొకవేడు - కయుఁ గానకున్న
కనియె నాచేత దుః - ఖంబు కౌసల్య
తలఁచినప్పుడె యయో - ధ్యా పట్టణంబు
బలిమినిఁ గైకొందు - బాహుశౌర్యమున
నెఱఁగవే మునుపన్న - నే ధర్మమునకుఁ
బరలోకహాని యా - పదలంద వలసె "
అనియొక్కచో తమ్ముఁ - డవ్వల జనక
తనయయు వినుచుండ - తలపోసి పోసి 5400
కన్నీరుఁగురియ గ - ద్గద కంఠుఁడగుచు
విన్నఁబాటున మాట - వెడల కేమియును
జ్వాలలడంగు వై - శ్వానరు రీతి
చాలవేగము మాను - జలధి చందమున
మౌనంబుతో నున్న - మనువంశ మణికి
జానకి వినఁగ ల - క్ష్మణుఁ డిట్టులనియె.
"రామ! సోముఁడు లేని - రాత్రియో యనఁగ

సేమమేది యయోధ్య - చేడ్పడియుండ
చెంతనున్నట్టి యీ - సీతకు నాకు
నింత ఖేదంబుగా - నిట్టు లాడుదురె? 5410
తగునయ్య యీపాటి - దైన్యంబునీకు
తగవుగా దేను సీ - తయు మిమ్ముఁబాసి
నేరుతుమే మేన - నిలుపఁ బ్రాణములు
నీరంబులేక గం - డెలు మనఁగలవె?
యేలమాకు నయోధ్య - యేలకౌసల్య ?
యేలసుమిత్ర నా - కితరు లేమిటికి ? "
అనులక్ష్మణుని మాట - లాలించి వనికిఁ
దనవెంట రా సమ్మ - తమున నతండు
నమరించి తృణశయ్య - యందు శయించి
కమలాక్షిసీత చెం - గటఁ బవ్వళింప 5420
సింగముల్ గిరిగుహా - సీమలయందు
వొంగుచు నిశ్శంక - మున నున్న రీతి
విజనాటవిని రఘు - వీరు లారాత్రి
నిజవీర ధర్మంబు - నిర్జరుల్ మెచ్చ
వసియించి యందొక్క - వటము క్రీనీడ
నెసఁగుచోఁ దూర్పున - నినుఁడుదయించె.

రాముఁడు భరద్వాజాశ్రమమున కరుగుట



ఆవేళ రాఘవుం - డచ్చోట వాసి
పోవుచునొక కొన్ని - భూములు గడచి
దండితారాతి మ - ధ్యందిన భాను
మండలా తపముచే - మరిపోవరాక 5430

తమ్మునిఁజూచి యా - దరమునఁ బలికె
“యిమ్మేరఁ జూచితి - వే ప్రయాగంబు
యేముని శేఖరుం - డిందున్నవాఁడొ ?
హోమ ధూమములు మి - న్నొరయుచుఁ గవిసె
నెవ్వరున్నార కో! - యీ యాశ్రమమున
దవ్వుల వింటివే - తరళతరంగ
లహరిం బరస్పరో - ల్లాస ఘట్టనల
మహనీయ నినదంబు - మహియెల్ల నిండె
అమర గంగాయము - నాపగా సంగ
మమునకు నెచ్చోట - మసలక నేఁడు 5440
వచ్చితిమిది భర - ద్వాజా శ్రమంబు
వచ్చెనల్ల వె చూడు - వనచరావళిని"
అనిచేరఁ బోవుచో - నపరాహ్ణ వేళ
ధనువులుతో వచ్చు - తమ్మునీక్షించి
బెదరి మృగశ్రేణి - భీతి నట్టిట్లు
చెదరి పాఱఁగఁజూపి - సీత నూరార్చి
యపుడు భరద్వాజు - నాశ్రమంబునకు
నృపకుమారులు చేరి - నిలిచి రొక్కడను.
ఆమౌని యగ్నిహో - త్రాది కర్మములు
నేమంబుతోఁ దీర్చి - నిజశిష్యకోటి 5450
పరివేష్టన మొనర్పఁ - బరగెడునట్టి
వరమౌని సమయంబు -- వారలెఱింగి
అతిభక్తితో వచ్చి - సాష్ఠాంగ మెరగి
యతని సన్నిధి నిల్చి - హస్తముల్ మొగిచి
"వినవయం ! దశరథ - విభునకు మేము

తనయుల మూరయో - ధ్యా పట్టణంబు
యీతఁడు సౌమిత్రి - యేనురాఘవుఁడ
యీతన్వి సీతనా - యిల్లాలు వీరు
నావెంట వచ్చిరి - నన్నుమాతండ్రి
భావించి వనులకుఁ - బనిచిన కతన 5460
మునులలో మునివేష - ములఁ జరియింపఁ
దనమది నియమంబుఁ - దాల్చివచ్చితిని "
అనిన భరద్వాజుఁ - డాతిథ్య మొసఁగి
మనసు రంజిల్ల స - మర్చనల్ చేసి
ఫలములు నన్నంబు - భక్ష్య భోజ్యముల
నలఘు వైఖరిఁ దెచ్చి - యర్పించిభక్తి
ఆరాముఁ జూచి మ - హా మౌనిరాజు
గారాము మీఱఁను -- త్కంఠ నిట్లనియె.
“నిన్నుఁ జూడఁదలంచి - నిచ్చలుమేము
జన్నముల్ దేవతా - ర్చనలుఁ గావింప 5470
నన్ని పుణ్యంబులు - వఱలేక తెచ్చె
నిన్ను నిచ్చటికి న - న్నింట ధన్యుఁడను
ఎచటికిఁ బోనేల ? - యిది పుణ్యభూమి
యిచట నుండుఁడు మీర - లే నెఱుంగుదును
మీరువచ్చిన రాక - మేదినీతనయ
తో రామచంద్ర ! యిం - దు వసింపు మీవు”
అని యాశ్రమమున ర - మ్య ప్రదేశంబు
మునిశిఖామణి చూపి - ముదల యొసంగ
క్రమ్మరఁ గేల్మోడ్చి - కాకుస్థ తిలకుఁ
డమ్ముని రాజుతో - నర్థి నిట్లనియె, 5480

"ఇవ్వనంబున నుండ - నెట్లగు మాకు ?
దవ్వులేదిదె యయో - ధ్యా పట్టణంబు
మాయున్కి వినిన స - మస్త జనంబు
నీయాశ్రమము చేరి - యిండ్లకుఁబోరు
కావున మాకు నె - క్కడనైనఁ దగిన
తావునం జేచూపి - తాపసనాథ !
జానకి యొంటిగాఁ - జరియింపఁ దగిన
యా నెలవున నుంపుఁ - డని" పల్కుటయును
"విలసిల్లు పదికూఁత -- వేటులనేల
యలరామ చిత్రకూ - టాఖ్య శైలంబు 5490
తగునది గంధమా - దనశైలమునకు
ద్విగుణించి సౌభాగ్య ~ వినుత వర్తనల
లాలిత రక్షకో - లాంగూల వనచ
రాళికినది విహా - రావాసభూమి.
ఆగిరి శిఖరంబు - లందులఁ జూడ్కి
సాగు నెచ్చటనున్న - జనుల కన్నడిమి
సీమద్రొక్కిన పాప - చింతలు వొడమ
వామహీధర మహి - మాను భావమున
నందు తపోనిష్ఠు - లైనట్టివారు
పొందుదు రింద్రుని - పురమెల్లనాఁడు 5500
అదియె నివాస యో - గ్యము మీరుచేర
నదిగానిచో నుండుఁ - డరలేక యిచట.”
అనిజానకీ లక్ష్మ - ణాన్వితుండైన
మనువంశమణికి న - మ్మౌని నాయకుఁడు

నుచితోప చారంబు - లొనరించిపూజ
లచలిత ప్రీతిమై - నాచరించుటయు
సమ్మదంబొప్ప న - చ్చట నాఁటికెల్ల
నమ్మువ్వురు వసించి - రమ్మఱునాఁడు


—: చిత్రకూటా శ్రమగమనము యమునానది దాఁటుట :—




రామచంద్రుఁడు మౌని - రాజు నీక్షించి
“యో మహాత్మక ! యెందు - నుండుదుమేము 5510
ఆనతియిండ "న్న - నాభరద్వాజుఁ
డైన వంశోత్తంసుఁ - డైన రాఘవునిఁ
గాంచి యిట్లనియె. "నె - క్కడ యననేల ?
యంచిత మునివర - యజ్ఞ వాటంబు
నవరత్న శోభాపి - నద్ధకూటంబు
పాలిత తరువరా - పారఝూటంబు
నీలనీలాంబుద - నికర ఖేటంబు
ప్రాలేయ కర సుసం - బద్ధజూటంబు
పరిసర సంచర - ద్భాను ఘోటంబు
స్థిరపుణ్య కూటంబు - చిత్రకూటంబు 5520
సీతతోఁగూడి వ - సించుచో నీకు
నేతఱి నీమది - కింపుఁ గల్పింతు
అచటి యాశ్రమములు -- నచ్చోటివనుల
నచటి నికుంజంబు - లచ్చోటిదొనలు
అచ్చటఁగల నిర్ఝ - రాపగా వళుల
నేచ్చోట వెదకిన - నేఁటికిగల్గు ?

అందునిల్చిన నయో - ధ్యా వియోగమునఁ
జెందుదుఃఖము మఱ - చి సుఖింపఁగలరు
పొమ్మ "న్న నమ్మోని - పుంగవుఁ జేరి
తమ్ముండుఁ దానువం - దన మాచరించి 5530
దీవనలంది ధా - త్రీ జూతఁగూడి
యావలఁ జనువారి - కమ్మౌని పలికె.
‘‘కాకుస్థతిలక ! గంగయు - యమునయునుఁ
జోకఁగాఁ గూడిన - చో నట్టనడుమ
సంభేదమునఁ గూడి - చనుచు నందుండి
అంభోధి నాయకు - నాశగా మఱలి
యమునవెంబడిఁ బోయి - యనతి దూరమున
నమరు ఱేవున డిగ్గి - యావలికాల్వ
తెప్పమీఁదట దాఁటి - తీరంబునందు
నొప్పశ్యామ యనంగ - నూడల నమర 5540
మార్గంబులోనున్న - మఱ్ఱి నీక్షించి
వర్గత్రయంబును - వరముగా నడిగి
ఆచెట్టు సీతచే - నర్ఘ్య పాద్యాస
నాచమ నాదుల - నర్చింపఁ జేసి
నిలువవేఁడిన నందు - నిలిచి లేదేని
వలగాఁగ వచ్చి యా - వల సాగి నడిచి
పరువునేలనుఁ గను - పట్టు కాఱడవి
తెరువుల డాపలి - తెరువుగాఁ జనిన
వనమృగదావ పా - పక భీతులెందు
నెనయక మెత్తని - యిసుము ద్రోవలను 5550

నీరునీడయుఁ గల్గు - నెలవులనిల్చి
చేరుదు రీప్రొద్దె - చిత్రకూటంబు
పదియైదు వరుసలా - పర్వతంబునకు
నదలకయేఁ బోయి - వచ్చినవాఁడ
సుపధంబు నే మీకుఁ - జూపినత్రోవ
తపనోదయంబయ్యెఁ - తరలి పొండనుచు
అనిచి యాశ్రమభూమి - కరిగినయంత
జనకజా ధీశుండు - సౌమిత్రి కనియె.
ఈమహా మహుఁడెంత - హిత మాచరించె
సామోక్తులను మంచి - జాడ నేర్పరచి 5560
యటుల వోవుదమని - యవనిజవెంట
పొటిలంబుగాఁ గూడి - పోయి వారచట
యమునా తటముచేరి - యయ్యేఱు దాఁటు
క్రమమొద్దియో యని - కడు విచారింప
సాధకంబులు దాల్చి - సౌమిత్రి గగన
రోధకంబగు వెదు - రుల గుంపుచూచి
బొంగలు నరికి య - ప్పుడు తెప్పగట్టి
వింగడించిన పది - వేరు పైపఱచి
మెత్తఁగానందుపై - మేదినీతనయ
క్రొత్తసిగ్గుననెక్క. - గొంకుచుఁబెనఁగ 5570
రాముఁడెత్తుక తెచ్చి - రామ నాతెప్ప
పైమెదలకయుండ - పద్మాసనముగ
నునిచి సాధనములు - నుర్విజ సొమ్ము
దొనలును విండ్లుఁగై - దువులందమర్చి
తమరు కాల్నడఁ బ్లవ - దండంబువట్టి

యమునలోఁద్రోయుచు - నవ్వలరాఁగ
యామహీసుత యమ్మ - హానదిఁజూచి
సేమంబుమదిఁగోరి - చేయెత్తిమ్రొక్కి
"ఓతల్లి ! నావిభుఁ - డుగ్రాటవులను
నీతితోమౌనుల - నియమంబుపూని 5580
చరియింపఁబోయెడు - సాగించివ్రతము
పురికేము మఱలంగఁ - బోయినయపుడు
ఆవులువేయి బ్రా - హ్మణులకునిచ్చి
నీవుమెచ్చఁగ సురా - న్వితఘటయుతము
పలలౌఘములతో ను - పారమొసంగి
కొలిచెద మిదియె మ్రొ - క్కుచునున్న దాన"
అని పోవ వారమ్మ - హానది దాఁటి
పెనుతెప్పపైనున్న - పృథివిజ డించి
శ్రీరామవిభుఁడు ద - క్షిణముగా వచ్చి
చేరె మౌనివరుఁడు - చెప్పినమాడ్కి 5590
ఆవటమైనట్టి - యాపటంబునకు
నావసుధాపుత్రి - యంజలిచేసి
"శ్యామాభిథానంబ ! - జగతిజసార్వ
భౌమ ! ప్రోవుము నాదు - ప్రాణేశువనుల "
అనువేళల "లక్ష్మణ ! - యడవి త్రోవలనుఁ
చనుచున్నవారము - జతనంబుగాఁగ
పొమ్ము ! మున్నుగనీవు - భూవుత్రివెంట
నమ్ములువిల్లు నే - నందిమీవెనక
వచ్చెద ! సీతకు - వలయువన్యంబు
లిచ్చుచు వలయంగ - నీకపొమ్మనిన " 5600

కరి మధ్యముననున్న - కరణియోయనఁగ
హరిణాక్షివారల - ననుసరింపుచును
తా నెఱంగని లతా - తరుమృగంబులను
జానకి విభుఁజూచి - సారెవేఁడుచును
పోవుచో సౌమిత్రి - భూపుత్రి తనకుఁ
గావలయు నటంచు - కామించియడుగు
నన్ని పదార్థంబు - లన్నయుఁదమ్ముఁ
డన్నెలవులఁదెచ్చి - యందియిచ్చుచును
కాళిందిచెంగట - గడియ పైనంబు
బాలాశిరోమణి - బడలకయుండ 5610
పోయి యొక్కెడనిల్చి - ప్రొద్దుగ్రుంకుటయు
నాయెడవసియించి - రారాత్రియెల్ల.
తెలవారి నిద్దుర - దెలిసి జానకినిఁ
బలికించి సౌమిత్రి - పవళించియుండ
"వోయి ! లక్ష్మణ ! గూళ్ల - నుండకపక్షు
లేయెడ విహరించె - నెలుఁగులిచ్చుచును
చాలింపు నిదుర భా - స్కరుఁడుదయించు
వేళయయ్యె ” ననంగ - విని లక్ష్మణుండు
నిదురమేల్కని కాల - నియమముల్ దీర్చి
కదలిపోవుచునుండ - గహనమార్గమున 5620
సీత నెమ్మోము వీ - క్షించి రాఘవుఁడు
చూతాదితరువులఁ - జూపియిట్లనియె.

—: రామాదులు వాల్మీకియాశ్రమమునకుం బోవుట :—


"వనజాక్షి ! మధుమాస - వాసరంబగుట

వనములశిఖి శిఖా - వళిఁదాల్చుకరణి
చందన పసస ర - సాల జంబీర
మందార వకుళ త - మాల పున్నాగ
కతక కింశుక మధూ - క లవంగ లుంగ,
లతల నారక్తప - ల్లవములుమించె
చూచితే! వికచప్ర - నూనమంజరుల
వాచవులకు మధు - వ్రతమిధునములు 5630
సంపూర్ణమాధ్వీ ర - సంబులుఁ గ్రోలి
ముంపుగాఝంకార - ములనాడఁదొణఁగె
అదె కనుఁగొంటివే? - యలినీలవేణి!
మదకోకిలంబులు - మావికెంజిగురు
మేఁతల నలరాజు - మీఁదిగీతముల
రీతిఁబాడుచుఁ గొస - రెడు ముద్దుగులుక
యల్లదె చంద్రబిం - బాస్య! వీక్షింపు
చల్లని పవమాన - శాబముల్ పొలయ
సరసిజాంబకు నాట్య - శాలలోనాడు
బిరుదుపాత్రలనంగ - పించముల్ విరియ 5640
చొక్కుటాటల దిశల్ - చూచు కేకినుల
చక్కందనంబులీ - సానుదేశముల"
అని లక్ష్మణునిఁజూచి - యవె కనుఁగొమ్ము
మనములఁజూచి కొ - మ్మలఁదారునట్టి
కలమధురారావ - కలితనత్యూహ
విలసనంబులు వీను - విందులయ్యెడును
మానితద్రోణప్ర - మాణంబులగుచు
నానామహీరుహా - నతశాఖలందు

యీడాడుచున్నట్టి - యీతేనెపెరలు
జూడుము మదికి మె - చ్చులు పాదుకొల్పె 5650
యీచిత్రకూట మ - హీధరాగ్రమున
రేచితప్లుతసంచ - రిష్ణుహంసములు
తేలుచు మాల్యవ - తీ ప్రవాహోర్మి
మాలికాడోలల - మలసెఁ గన్గొనుము.
చింతలుమఱచి యీ - శిఖరిగావున్న
నెంతవేడుకచెల్లు - నేవేళమనకు
చూతమె చేరి యి - చ్చో నాశ్రమముల
నేతరి మౌనుల - నేకులున్నారు”
అనుచు వాల్మీకుల - యాశ్రమంబెదుటఁ
గనుఁగొని యమ్మౌని - కంఠీరవునకు 5660
సాగిలి మ్రొక్కిన - సన్మౌనివారి
యాగమన మెఱింగి - యర్చ లొసంగి
తనయాశ్రమోపాంత - ధరణీ తలమున
ననువైన యెడనుండ - నానతి యొసఁగ
రాముపంపున సుమి - త్రా కుమారకుఁడు
భూమియొక్కెడఁ చౌక - ముగ నందపరచి 5670
చుట్టును ములుగంప - సొరిది నమర్చి
గట్టిమ్రాఁకులు దెచ్చి - కవరు లేర్పరచి
వాసంబులెత్తిపై - వాసపోయించి
ఘాసంబు దెచ్చి పొం - కంబు గాఁగప్పి
ముందర వెదురుల - మొత్తంబుచేత
పందిరి యమరించి - పారవాకులను
తడికె పెండెముగట్టి - తలుపుగా నుంచి

గుడిసె యొక్కటి తన - కునుఁ జోకపఱచి
అన్నకుఁ జూపిన - యాపర్ణశాల
చెన్ను శ్రీరాముఁ డీ - క్షించి యిట్లనియె. 5670
“నూతన గృహములం - దులఁ బ్రవేశింప
నేతరి యిదియర్హ కృ - త్యంబుగాన
హరిణమాంసము హోమఁ - మాచరింపంగ
సరగఁ దెమ్మనిన ల - క్ష్మణుఁ డట్లకాఁగ
ననుపక్వముగ చేసి - యట తెచ్చి యునుపఁ
గనిరాఘవుఁడు యథో - క్తప్రకారముగ
వైణేయపల హవి - రన్న హోమంబు
ప్రాణేశ్వరియు దాను - భక్తితోఁజేసి
యితర దైవతముల - నెల్లఁ బూజించి
శతపత్ర నేత్రుని - శంకరుఁగొల్చి 5680
వైశ్వదేవ మొనర్చి - వాస్తుదైవముల
శాశ్వత భక్తిఁ బూ - జల బలిక్రియల
నారాధనము చేసి - యాపర్ణశాల
శ్రీరామచంద్రుండు - సీతయుందాను
మంచిలగ్నమున స -మ్మతిఁ బ్రవేశించి
యంచితామోదకం - దాప్తుఁడై యుండె.
ప్రతిదినం బూర్మిళా - పతిదెచ్చి యిచ్చు
హితవన్య ఫలము ల - నేక మాంసములు
సీతతో నారగిం - చి రసాలసాల
శీతలచ్చాయలఁ - జిత్రకూటాగ్ర
సానుభాగముల నా - సంతికాకుంజ
నూన తల్పలముల మం - జుల కందరముల

మాల్యవతీ నదీ - మహనీయ సలిల
కుల్యాభి వర్థిత - కుసుమిత ఫలిత 5700
వివిధ వనంబుల - వెలఁదియుఁదాను
రవివంశమణి మనో - రాముఁడై మెలఁగి
తమమనంబుల యయో - ధ్యా పట్టణంబు
తమవారిఁబాయు చిం - తలు దూరముగను
సమయోచిత క్రీయల్ - సలుపుచు నచటఁ
బ్రమదానురాగ సం - పదల నున్నంత,

—: సుమంత్రుఁ డయోధ్య జేరుట :—


అచ్చట రఘువీరుఁ - డంపిన మరలి
వచ్చు సూతకిరాత - వరులాత్మలోన
రాముని సుగుణకీ - ర్తనములు చేసి
తాము వెంబడిఁబంపు - తమవారుచేరి 5710
శ్రీరామచంద్రుండు - చిత్రకూటమున
చారువైఖరిఁ బర్ణ - శాలలో నునికి
చెప్పినవిని చాల - చింతించు గుహుని
నప్పుడే వీడ్కొని - యాసుమంత్రుండు
నరదంబుతో నయో - ధ్యా పురిత్రోవ
మఱలివచ్చుచును గ్రా - మంబులు వనులు
కడచి మూఁడవనాఁటి - కడజామునందు
నడలుతోఁదమ యయో - ధ్యా పట్టణంబు
చేరంగనేఁగి యా - క్షితిపతితోడ
శ్రీరామ విభువార్త - చెప్పెద ననుచుఁ 5720

"బోవుచో పురజనం - బులు రాముఁడేఁడి?"
“యీవట్టి రథమునీ - వేల తెచ్చితివి”?
అనిగువ్వ కరిగొని - యడుగువారలనుఁ
గనుఁగొని రాము - గంగా సమీపమున
నునిచి పొమ్మనిపంప - నొంటిగా నేను
చనుదెంచినాఁడ ని - చ్చటికని పలుక
నెన్నడుఁగను గొందు - మెటువలెనుందు
మెన్నినాళ్లకు వచ్చు - నేమనవచ్చు
యాగవివాహాదు - లందు వేడుకలు 5730
సాగునే శ్రీరామ - చంద్రుండులేక
దయనెల్ల వారిని - తండ్రియైప్రోచు
ప్రియముతో రక్షించు - పేదసాదలను"
అనిచాల విలపింప - నారాజవీథి
వనిత లిండ్లిండ్ల గ - వాక్ష మార్గములఁ
జూచి "రామా" యని - శోకింపుచుండ
చూచియుఁ జూడక - చ్చోఁదలవాంచి
నగరి వాకిటికేఁగి - నరులెల్లఁదన్ను
తెగితిట్టుచుండ మం - త్రివరేణ్యుఁ డపుడు
ఆ యజారము మీరి - యావలనొక్క
చాయ రథంబుంచి - చయ్యన డిగ్గి 5740
వడదేర మోము సా - వడు లైదురెండు
గడచి యాదశరథా - గారంబుచేరి
యంతఃపురంబున - కరుగుచో నచటి
యింతులెల్ల సుమంత్రు - నీక్షించి కలఁగి
"అమ్మకచెల్ల! యీ - యన వొంటివచ్చె

అమ్మలార! వనంబు - లందు రాఘవుని
విడిచి వచ్చెనుఁగదే - వెతలఁ గౌసల్య
యడుగుచో నేమని - యనువాఁడో యితఁడు
కటకటా! కౌసల్య - గన్నదే తల్లి
యిటువంటి రాముని - నెడవాసి మేన 5750
తానుఁ బ్రాణంబులు - దాల్చిన యపుడె
యేనాట నోర్తురే - యితర భామినులు"
అనువార్త లాలించి - యారాజుఁజేరి
తనరాక రాము వ - ర్తనము దెల్పుటయు
ఆదశరథుఁడు మూ - ర్ఛాయత్తుఁడైన
పైదలు లందరుఁ - బలవింపుచుండ
మిగుల కౌసల్య సు - మిత్రయుఁదాను
పొగులుచు వచ్చి య - ప్పుడు దశరథుని
యెత్తి పానుపు - మీఁద నిడి సేదదీర్చి
యత్తఱికౌసల్య దా - నడలుచుఁ బలికె. 5760
"ఏఁటికయ్య సుమంత్రు - నీక్షించియొక్క
మాటయు నుడుగవు - మదిఁ గొంకనేల?
అన్యాయ పరుఁడనే - నైతిఁ గాయనుచు
దైన్యంబుతో సిగ్గు - దాల్చినావేమొ?
వట్టివేడబముల - వగవ నేమిటికి?
యిట్టిచో వెఱచి వా - యెత్తవిదేల?
కైకయిచ్చట లేదు - గావున భయము
మీకు నేమిటికి యే - మియు ననవేల?
యీసుమంత్రునిఁ జూచి - యెచట నున్నాఁడొ
నాసుతుండేల కా - నలకుఁ ద్రోలితివి?” 5770

అనితానుఁ బుడమిపై - నడలుచుఁ బొరలఁ
గనిదంపతుల మూర్ఛ - కాంతలందరును
చూచియోర్వఁగలేక - శోకింపుచుండ
నేచాయఁ బురవీథి - నేడ్పులునిండె.
అంతటఁ దెలివొంది - యాదశరథుఁడు
కొంతయూరట దెచ్చు - కొని మంత్రిజూచి
చేరరమ్మని పిల్వఁ - జేతులు మొగిచి
చేరిన యతనితో - క్షితిపాలుఁ డనియె.

—: రాముని వార్తల సుమంత్రుండు దశరథునికిఁ జెప్పుట :—


“మారామ చంద్రుఁ డే - మాడ్కినున్నాఁడు?
చేరివసించె నే - చెట్ల క్రిందటను? 5780
నెయ్యెది యాహార? - మెచ్చోటనిలిచె?
నెయ్యెడఁ బవళించె - నేమేమి పలికె?
శీతలగుణయైన - సీతయుందాను
ఱాతికొట్టుల పాద - రాజీవయుగము
కందిబొబ్బలువోయి - కతకతనెరియ
నెందెందు నడవుల - నిడుము లొందెదరొ?
ఆశ్వినేయులు మంద - రాచలాగ్రమున
శాశ్వతులై యుండు - సరణి నాసుతులు
పాదచారములు వై - భవములుమఱచి
బీదలవలెఁగిటుల్ - బెబ్బులుల్ మెలఁగు 5790
వనులఁగ్రుమ్మరుచున్న - వారలే వారిఁ
గని వెంటఁబోయి యా - క్రమమెల్లఁదెలిసి
వచ్చి కృతార్థ భా - వంబుఁ గాంచితివి

ముచ్చటయయ్యె న - మ్మువ్వురు నిన్ను
బనుపుచో నే - మేమి పలికిరి వార
లనుమన్నయవి యల్ల - ననుము నాతోడ
విని యూరడిల్లెద - వినుపింపు మీవు
అనఘఁడైనట్టి య - యాతి భూవరుఁడు
హితులైన యట్టి దౌ - హిత్రుల వలన
వెతఁదీరి యున్నట్టి - విధమున నేను 5800
మానస శోకంబు - మానెద"నన్న
మానవేంద్రునితో సు - మంత్రుఁ డిట్లనియె.
“అనఘాత్మ! మీసేమ - మడిగి సాష్టాంగ
మొనరించితి నటంచు - నొగిఁ బల్కుమనియె.
తనమారుగాఁగ నం - దరు తల్లులకును
వినతి చేసితినని - వినుపింపు మనియె.
జానకీజాని కౌ - సల్యతో మిమ్ము
తానుపోషింప నెం - తయుఁ దెల్పుమనియె.
అదిగాక యగ్నిహో - త్రాది కర్మములు
వదలక మిముఁ - జూచు వైఖరిభరతు 5810
పట్టున నేవేళ - భయభక్తు లునిచి
యెట్టిచో కైకకు - హితముగా మెలఁగి
సవతులపట్టునఁ - జాలప్రియంబు
దవులంగ నడచి బాం - ధవుల నేమఱక
పాలింపుమని రఘు - పతి తల్లితోడ
మేలెంచి ననుదెల్పు - మీ” యనిపల్కె.
భరతునితోడ - "మీ పనుపుననెల్ల
ధరణియుం బాలించి - తండ్రి నేమఱక

సముచితంబైన పో - షణ మాచరించి
క్రమము దప్పక యుప - ద్రవ మొందనీక 5820
కైకేయి మారుగాఁ - గౌసల్యఁజూచి
చేకూర్చి నడపి య - చ్చికము లేకుండ
కడమ తల్లుల నట్ల - కా ధర్మ మెఱిఁగి
నడపింపుమీ యని - నామాటగాఁగ
పలుకుమంచు" వచించి - పలపలకంట
వెలువడు నీటితో - వెలవెలనైన
మోముతో నవమాన - మునఁ జాలడస్సి
సామాన మేనితో - సగము మాటాడి
పలుక నేరని తొట్రు - పాటుతో చాల
కలఁగు చిత్తంబుతో - కడుఁ దలవాంచి 5830
యున్న రామునిచంద - ముర్వీశతిలక!
కన్న వారలకు నే - గతినేర్వవచ్చు?
అటమున్న తమయన్న - యలమట చూచి
కటకటంబడి కన్నుఁ - గవ జేవురింప
యేమీకుఁ దెల్పిన - యెంత లేదనుచు
సౌమిత్రి పలుకు భా - షణము లాలింపు.
"రాముఁడేమేమి నే - రంబులుచేసె?
యేమిటికింత సే - యించె మీరాజు?
కైకమాటలె వినెఁ - గాని యించుకయు
లోకాప వాదంబు - లో నెంచఁడయ్యె? 5840
కడపట దనురాజు - గాయని యెంచి
పుడమి నెవ్వరు నిద్ర - పోదురునమ్మి
తానేడతండ్రి? యిం - తట నుండి నాకు

దీనబాంధవుఁడు కీ - ర్తి విభూషణుండు
కారుణ్య శరనిధి - కల్యాణగుణుఁడు
శ్రీరామచంద్రుఁడే - చెప్పెడిదేమి?
తల్లియుఁ దండ్రియు - దైవంబునాకు
నెల్లవారలు నుండి - యేమిటి కింక”
అనిలక్ష్మణుఁడు వల్క - నాసీత నన్నుఁ
గనుఁగొని జలజలఁ - గన్నీరు రాల 5850
వాడఁ బారుచుఁ దల - వాంచి యేమాట
నాడలేదయ్య ద - య్యము సోఁకినటుల
ఆరీతి వారల - యనుమతి నేను
తేరు దోలుక సారె - తిరిగి చూచుచును
వారలు ననుఁజూడ - వచ్చుచో రథము
వారువములు నాదు - వలనకురాక
తిరుగుడు పడుచుండఁ - తేరొక్కరీతి
బరపుచు గుహునితోఁ - బఱిచితి చేసి
మూనాళ్లు మఱల రా - ముఁడు నన్నుఁబిలుచు
గాని పోనీండని - కాచుకయుండి 5860
అంతటఁ జాల ని - రాశచే వెడలి
యెంతయు విన్ననై - యేవచ్చునవుడు
నింకిన యేఱులు - నిండిన చెరువు
లంకిలితో వాడి - నట్టిభూజముల
మేయని మృగములు - మెలుపులయాస
వాయు ధేనువులును - పంటలులేని
భూములు విలపించు - పులుగులుంగలిగి
నీమహి యెల్ల న - న్నిటఁ బాడువడియె,

కమలాకరంబులఁ - గమలకల్హార
కుముద చక్రాది సం - కులత లేదయ్యె. 5870
చాంపేయ మల్లికా - చయ కుందకుసుమ
సంపద నుడివోయి - సౌరభంబెల్ల
పనస రసాల రం - భాముఖ్య తరుల
మనసైన ఫలమను - మాటలేదయ్యె.
ననుఁగాంచి గొణఁగుచు - నాలి యేడ్పులను
వనితలందరుఁ దిట్టు - వారైరి వీట
మొగముఁ జూచినమారు - మొగమిడి నన్ను
మగవా రదేమని - మాటాడరైరి
కరులు రోదనములు - గావింపఁ దొణఁగె
హరులకు ధారాళ - మయ్యెఁ గన్నీరు 5880
భూవర కౌసల్యఁ - బోలి యార్తులకుఁ
దావయ్యె నీయయో - ధ్యా పట్టణంబు."
అని విని యేమియు - ననలేక వగల
మునిఁగి మంత్రికి రాజ - ముఖ్యుఁ డిట్లనియె.
"ఆలిమాటలువిని - యాప్తులం బిలిచి
యాలోచనముచేసి - యైన కార్యంబు
కానికార్యంబునుఁ - గనలేక యింత
దీనుఁడ నైతిని - దిక్కెవ్వరింక
అపకీర్తి నా యన్వ - యమునకుఁదెచ్చి
యపమృత్యువునకు లో - నై పోవవలసె. 5890
రామునిచెంత చే - ర్పక యుంటివేని
యీమేనఁ బ్రాణంబు - లిక నేలయుండు?
హితమాచరించెద - వేని వే పోయి

క్షితి తనూభవతోడ - శ్రీరాముఁదెమ్ము
నినునమ్మితిని నాదు - నేరముల్ సైఁచి
ననునెంచి ప్రొణదా - నంబుఁ గావింపు
రాముఁడు మిగుల దూ - రము వోయెనేని
తామసంబేల? ర - థంబుపై నన్ను
నునిచి తోకొనిపోయి - యూర్మిళా రమణు
జనకజాతను రామ - చంద్రునింజూపు 5900
అటులైన బ్రదుకుదు - నని హా కుమార!
యెటు వోయితే పల్క - నే మహీజాత!
హాలక్ష్మణా!" యని - యార్తుఁడై చాల
జాలిఁగుందుచును కౌ - సల్యతోఁ బలికె.
“అతివ! శోకంబను - నలఘు వేగంబు
క్షితిజఁ బాయుట పేరఁ - జెందువారంబు
ననిశంబు నాయూర్పు - లను తరంగములు
పెనుపొందు కన్నీరు - పేరియంబువులు
కరతాడనములను - కడలు మీనములు
పెరుగు నీయేడ్పుల - పెరియ మ్రోఁతయును 5910
పృథుల పెన్నెరిగుంపు - పేరిటినాఁచు
నదిరయ్య! కైకేయి - యను బాడబంబు
నలము మందరబుద్దు - లను నక్రకులము
నలనాఁటి వరమను - నట్టి వేలయును
రామప్రవాస దు - రంతంబు నగుచు
యేమేర కడలేని - యీదుఃఖ జలధి
యేరీతిచేఁ బాధ - నీఁదెడివాఁడ
నారాముఁడను గట్టి - నావ లేకున్న"

అని మ్రానుఁ గన్నిడి - యవనిపైఁద్రెళ్ళి
పెనుమూర్ఛ పాల్పడ - పృథివీశుఁజూచి 5920
కౌసల్య చాల శో - కమున నిల్పోప
కా సుమంత్రుని తోడ - యడలుచుఁ బలికె.

—: కౌసల్య శోకింపఁగా సుమంత్రుఁ డూఱడించుట :—


"నన్ను మారాము చెం - తకుఁ గొనిపోవ
వన్న నాయాపద - కడ్డమై నీవు
అరదంబు దెప్పింపు - మటుసేయవేని
మఱలితెల్పుము నాదు - మాట రామునకు
కాదని పల్కినం - గైకేయి కల్ల
నీదుపూనికె నేఁడు - నిక్కంబుగాఁగ
యిచ్చెదఁ బ్రాణంబు - లివె నీవుచూచి
మెచ్చుచుఁ దలఁతువా - మీఁద నేనియును” 5930
అనిపలికి సుమంత్రు - డా సాధ్విఁజూచి
వినయ పూర్వకముగా - వినుమంచుఁ బలికె.
“ఏలమ్మ! దేవి! నీ - విటునన్నుఁ బలుకఁ
బోలునే వనుల నీ - పుత్రుఁ డున్నాఁడు
జానకి లక్ష్మణుల్ - సతతంబు రాముఁ
గానలఁ గొలిచి సౌ - ఖ్యమున నున్నారు.
మునువును తాక్లేశ - ముల నంది నటుల
తనప్రాణనాయకు - దండ నుద్యాన
వనులలోఁ గ్రీడించు - వైఖరి భయము
తనమది లేక సం - తసమందె సీత 5940

కారడవులలోనఁ - గాపున నీవు
వారికినై యేల - వగలఁ గుందెదవు?
ప్రాణముల్ మనసు రా - మాధీన మగుట
యేణాక్షి! యాసీత - యేల చింతిల్ల?
నూరు కారడవిని - యొకరూపెకాని
వేఱుగాఁ దలఁపదు - వినుమింక నొకటి
తానదీ నదములు - దాఁటి పోవుచును
జానకి కైక ప్ర - సంగంబుగాఁగ
అనియెనంచని యేమి - యనఁ జూచినాఁడొ!
తనలోనే యామాట - తలఁపక డాఁచి 5950
కౌసల్యకు హితంబు - గా కైక వినిన
నీసువుట్టునొ యని - యిమిడి యామాట
మఱపించి వేఱొక్క - మై తప్పఁ దాల్చి
నెఱమంత్రి యతఁడొక్క - నేర్పునఁ బలికె.
"జానకీ చరణలా - క్షారసం బపుడు
లేనిచందమకాన - లేరెవ్వరైన
కెందామరల నేవ - గించు పాదములు
గంది నెత్తురుఁగ్రమ్మ - గమనించు నపుడు
అడుగుల ఘల్లున - నందియ ల్మొరయ
జడిసి పారెడిమృగ - శాబకంబులను 5960
వేఱ్వేర రాముండు - వివరించి చూపు
నుర్వీతనూజకు - నూరటగాఁగ
మునివృత్తిచే ఫల - మూలముల్ గొనుచు
వనములలో పిత్రు - వాక్య పాలనము
సేయు రాఘవులకై - చింతిల్లనేల ?

మాయమ్మ! వగపేల - మానుము మదిని”
అనిన మాటలువిని - యపుడె కౌసల్య
జననాథుఁజూచి కొం - చక యిట్టులనియె.

—: రామవనవాసమును గూర్చి కౌసల్య భర్తతోఁ జెప్పి దుఃఖించుట :—


“రవివంశమునఁ బుట్టు - రాజులయందు
నవనీశ! యసమాన - మగుకీర్తిఁగాంచి 5970
యిన్నాళ్లు వెలసితి - విపు డపకీర్తి
నెన్నిక గాంచితి - వెనలేకయుండ
నీకడుపునఁ బుట్టి - నిఖిలభోగములు
గైకొన్నియట్టి రా - ఘవులకు నిట్టి
పాటువచ్చిన నోర్వఁ - బడుగాక సీత
పాటు నావీనులఁ - బడియెట్టు లోర్తు
తలగడలనుఁజేరు - తన పట్టిచేయి
తలగడగా నుంచి - ధరఁ బవ్వళించి
యున్నట్టి చందమో - యుర్వీశ! నాదు
కన్నులం గట్టిన - గతి నున్నదిపుడు 5980
యినుమొ పాషాణ - మొ హృదయంబు నాకు
తునిసి వ్రయ్యలుగాదు - తోడ్తోనె యిపుడు
అకలంక చంద్రబిం - బానను రాము
నకట! కానల కెట్టు - లంపితి వయ్య!
భరతుండు దొరయైన - పదునాలుగేండ్ల
తరవాతఁ జేరుసీ - తానాయకునకుఁ
దానేల సొమ్ముతో - ధరణి యీ నేర్చు

కానిండు పితృకర్మ - కర్త లౌవారు
నియమించు శిష్ఠుల - నిల్పి బంధులకు
ప్రియముతో భుజియింపఁ - బెట్టిన వెనక 5990
వత్తురే మిగిలిన - వంటకంబులకు
నుత్తములగు వార - లుపవాస ముండి
కొమ్మలు పడవేసి - కోసె దుమనిన
సమ్మతించునటె వృ - షభము లెచ్చోట
రాముఁడు భరతుచే - రాజ్యంబు మరల
కామించునే యెఱఁ - గఁగ లేవుగాక
నక్కలు దిన్నట్టి - నంజుఁడు గొంత
చిక్కిన మేయునే - సింగంపుఁ గొదమ?
యాగ శేషములైన - యా సాధనములు
యాగార్హ మనియన్యుఁ - డా సించునేల 6000
మనుజేశ! నష్టహో - మంబైన మఘము
మునుపటి సారమ - మ్ముడుపోవు మధువు
ఏమిటికినిఁ గొఱ - యే? రాముఁ డెట్లు
గావింప నేర్చునొ - క్కనిచేతి ధరణి
వొరులధర్మము సేయ - నోర్వని యతఁడు
మఱచితప్పిన నధ - ర్మము సేయగలఁడె?
యెంతలేదని యున్న - నెఱఁగము గాక
పంతంబు పూనిఱె - ప్ప గదల్చి నంత
పదునాల్గు లోకముల్ - బాణాగ్ని చేత
సదమదంబులుగ భ - స్మముసేయఁ గలఁడు 6010
విల్లెక్కు వెట్టిన - విలయంబు సేయు
నెల్ల భూతములకు - నేక కాలమున

శర వహ్నిశిఖలకు - శరనిధు లెపుడు
పొరలింపఁ జూలునా - పోశనంబుగను
అట్టి మారాఘవుఁ - డక్కట! వెఱ్ఱి
పట్టి యీకైకచే - బాము లందగిలె
గొప్ప చేఁపకుఁజిక్కు - కొండుక మీను
చొప్పునం జిక్కెని - చ్చోటకు నతఁడు
వనితలకును గతి - వల్లభుఁ డందు
వెనకపుత్రులు గతి - వివరించి చూడ 6020
నన్ను నీవును నాదు - నందనుం డిపుడు
మిన్నకవిడిచి యే - మేలు గాంచితిరి?
నీవు నన్నును నిన్ను - నీవారి రాము
గానక చెరిచితి - కైకేయి కొఱకు
భరతుఁడు నీయాలు - బ్రతికినఁ జాలు
కర మెచ్చి యెవ్వ - రెక్కడఁ బోయి రేమి”

—: దశరథుఁడు మూర్చపోవుట :—


అనునంత దుఃఖితుం - డై రాజు చాల
మనములో నార్తి ము - మ్మడిగాఁగ వగచి
యిన్ని యాపద లొంద - నేమి పాపములు
మున్ను చేసితినో రా - మునివంటి కొడుకు 6030
విడిచి పోయెనటంచు - వెడవెడ మూర్ఛ
లడరంగ మునిశాప - మనుభవ్య మనుచు
చింతఁ గౌసల్యకుఁ - జేదోయి మొగిచి
యంతయుఁ దనమది - కపుడు దోఁచుటయు
గాకుస్థకుల మౌళి - కౌసల్యతోడ

నాకథా వృత్తాంత మ - ప్పుడిట్లనియె.
“రమణి! నీపువు ప్రసన్ను - రాలవు గమ్ము
శమియింపు నాతప్పు - సయిరించి మదిని
నెల్లరకునుఁ జాల - హితముగా మెలఁగు
చల్లని మాటల - సాధ్వివి నీవు 6040
నాకు నప్రియముగా - నడతు వే యెల్ల
లోకంబులందుల - లోలనేత్రులకు
వల్లభుం డెటువంటి - వాఁడైన నతఁడె
తల్లియుఁ దండ్రియు - దైవంబు సుమ్ము
యేనన నేల? నీవె - ఱుఁగవే సతుల
కైన శాస్త్రార్థంబు - లఖిల ధర్మములు
కడలేని శోకసా - గరములో మునిఁగి
యడ లెడు నాతోడ - నప్రియంబులుగ
యేమైన ననరాకు - మికమీఁద నన్ను
నేమి సాధించెద - వీవని పలుక" 6050
విభుని దైన్యోక్తులు - విని మేనువణఁక
సభయయై చేరికౌ - సల్య నాయకుని
కేలుఁదమ్ములు రెండు - కెంగేలనెత్తి
చాల శోకమున మ - స్తకముపై నునిచి క
నుఁదమ్ములఁ జేర్చి - గండ పాళికల
నునిచి పేరెదనంట - నొ త్తి యిట్లనియె.

—: కౌసల్యభర్త నూరడించి మన్నింపుమని వేడుకొనుట :—


"ఓ దేవ! మ్రొక్కెద - నోర్చి కొమ్మిటుల
నీదు చిత్తంబున - నిలుపుదురయ్య

పతివేఁడు కొనఁగ నె - పంబైన నడక
యతివకు నిహపర - హాని గావించు 6060
దానికి నిల్లాలి - తనమేల కల్గు?
నైననే నాపన్న - నైత్రోయ రాని
పుత్ర శోకమ్మునఁ - బొగులుచు రాజు
మాత్రుఁగా నెంచి యీ - మాట లాడితిని
అత్యంత సకల ధ - ర్మాచారనిధివి
సత్య సంధుఁడవు రా - జర్షి వర్యుఁడవు
ఆడరానివి మిమ్ము - ననిన నేరంబు
చూడక ననుదయఁ - జూచి రక్షింపు
పగవారిచే బాధఁ - బడవచ్చుఁ గాక
జగతీశ! శోకంబు - సహియింప రాదు 6070
రాముఁడు ననుఁబాసి - రాత్రులైదయ్యె
భూమీశ! ఐదేండ్లు - పోలి వేగితిని
తెలియదే మీకు న - దీ వేగమునను
జలధిపొంగిన లీల - జానకీ విభుని
యెడవాయుటనుఁ జేసి - యేవేళ మదిని
విడువని దుఃఖంబు - వేరులు వారి”
అని కొంతయూరట - యైన కౌసల్య
వినయ భాషణములు - వినుచుండునంత
సాయంసయమయ్యె - జనపతి నిదుర
వోయెనప్పుడు మనం - బున తాల్మివొంది 6080
నిదుర కంటికివచ్చు - నే యట్టివాని
కదియు నాసన్న మూ - ర్ఛాంతరంబయ్యె
తోడన తెలివిడి - తో కనువిచ్చి

వ్రీడావతీమణి - వెలఁది కౌసల్య
అడుగు లొత్తుచునుండె - నమ్ముగ్ధమోము
కడకంటఁజూచి చెం - గటఁ జేరఁబిలిచి
"ముదిత! నీతో నాదు - మొదటికార్యంబు
విదితంబు సేయుదు" - వినుమంచుఁ బలికె.

—: రాజు కౌసల్యతో దానుమున్ను మునికుమారునిం బ్రమాదంబునఁ జంపినవార్త చెప్పుట :—


"ఎల జవ్వనంబున - యిగురాకుఁబోణి!
యిలనాలు చెఱుఁగులు - నేలుచునుండి 6090
యువరాజనై యజుఁ - డున్న కాలమున
నవినీతి నినుఁబెండ్లి - యాడకమున్ను
నసమాన దివ్యశ - స్త్రాస్త్ర వర్గమున
నెసఁగుచు విధిచైద - మిటులున్న కతన
ప్రాప్తమైనట్టి మ - హా శాపమొకటి
గుప్తంబుచేసి వా - కొన నైతిమున్ను
ననుభవింపఁగ దరి - యయ్యె నేడారు
దినము లాయెను కళల్ - దేరుచునున్న
చంద్రుఁ బోలిన రామ - చంద్రుని మొగము
చంద్రశీతలగంధి - చక్కఁగా చూచి 6100
వోర్వలే నిఁకనని" - యున్నట్టి తెఱఁగు
సర్వంబురాజు కౌ - సల్యతోఁ బలికె.
"రవిమండలము సహ - స్రకరాళిచేత
నవనిపైఁ గలనీర - మంతయుఁగ్రోలి
వేసవిఁగనుపించి - విశ్వమంతయును

గాసిల్ల తపియింపఁ - గాఁ జేసెనంత.
దక్షిణాయనముగా - ధర తాప శాంతి
దీక్షగైకొని నట్ల - దిందు పడంగ
వానకాలమువచ్చె - వసుమతికెల్ల
నానంద కరమయ్యె - నంబుదాగమము 6110
ప్రావృషేణ్యాంబుద - పటలంబునిండి
యావేళ దట్టమై - యల్లె నెల్లెడల
నుప్పొంగి భేకమ - యూర చాతకము
లప్పుడు చెలరేఁగి - యానందమొందె.
కాలువలేఱు వే - కముగాఁగ పాము
వ్రేలగట్టినరీతి - విలసిల్లెజళ్లు
యెఱకులు దడిసి య - ట్టిట్టు వోవలేకఁ
జొరఁ బారె జడిసి ప - క్షులు కులాయముల
సెలయేఱులను మీరు - శిఖరులరీతి
బొలిచె గజంబు లం - బుప్రవాహముల 6120
వామలూరుల వచ్చు - వ్యాళంబు లనఁగ
భూమీధ్ర గుహల నం - బు ఝురంబు లుబ్బె
అట్టిచో నెవ్వరి కై - ననుం జేసి
నట్టికర్మము లెందు - నను భావ్యమగుట
గొప్పలై కెంజాయ - గుదులైన పువ్వు
లొప్ప మోదుగుఁ జెట్టు - లున్నతిఁ బెనిచి
నిగనిగమను నెఱ్ఱ - నిమహాఫలముల
దగునట్టి ముశిని నెం - తయుఁ బ్రోచేసి
సన్నఁ బువ్వులును ప - చ్చనికాయ లమరు
గున్నమామిడి బడఁ - గొట్టిన రీతి 6130

దుర్జాతి కైకేయి - తోఁ జెల్మిచేసి
వర్జించి నినువంటి - వరపుణ్య సతుల
కన్నుగానక యున్న - కల్మషరాసు
లన్నియు నీవేళ - ననుభవింపంగ
కారణంబగుట న - క్కాలంబు నందు
జోరున వానవం - చుక కురియంగ
నొకనాడు చీకటి - నొంటి వేఁటాడ
నకలంక గతివిల్లు - నమ్ములుఁ దాల్చి
సరయూ తటంబున - జలములు గ్రోలు
కరటిభల్ల వరాహ - కాసారవళుల 6140
వేఁటలాడఁగ చెంత - వెదురు గుంపులను
వాఁటంబుగాఁ బొంచి - వన మృగశ్రేణి
వచ్చుఱేవునఁ గాచి - వాఁడియమ్మొకటి
యెచ్చరికను బట్టి - యేసుండు నంత.
పువ్వుఁ బోడి! యపూర్వ - బుడబుడధ్వనుల
దవ్వుల నొక్కనా - దము చెవిసోఁక
ఆశబ్దమేనుగ - దని ని శీధమున
పేశల మతిశబ్ద - భేది సాయకము
సంధించి వ్రేసినఁ - చనుమరనాటె
సింధురం బనియుంటిఁ - జెప్పెడిదేమి 6150
ఆచాయహాతాత - హామాతయేల
నాచను మక్షవచ్చి - నాఁటె నీయమ్ను
యీయర్ధనిశియందునే - నీళ్లు గొనుచు
బోయొడుచో యతి - పుత్రునిమీఁద
అకట తపస్వివిం - డనక యిటేయ

నొకరికిఁ జేయనే - నొకనాఁడు కీడు
కనికని వాఙ్మనః - కాయ కర్మముల
జనుల కెవ్వరికి నె - చ్చటనెగ్గుదలప
అటువంటి వానికీ - యాయుధ మరణ
మెటుల వ్రాసితి విధి - యీతలయందు? 6160
"మునిచర్య వానిన - మ్మునఁ బడవైచి
కనిలేని వాఁడేమి - గట్టుకోఁ గలఁడొ?
గురుతల్ప గమనుఁడౌ - ఘోర పాతకుని
కరణి వీఁడునుఁ గూలు - కల్మషంబులను
కడచేరి వృద్ధులై - కాల్మోచి పుడమి
నడుగిడ నోపక - యంధులునైన
తల్లిదండ్రులకు నై - తనమదిలోన
బల్లటిల్లెదఁ గాని - ప్రాణాశగాదు
పూనియే నిన్నాళ్లు - బోషింతువారి
దీనులైరిఁక నేది - దిక్కు వారలకు? 6170
యీయమ్ము ముగురికి - హేతువై నాటె
నాయమ్ము నేమని - యనఁ గలవాఁడ"
అనుచు మానిసిమాట - లాచాయఁ బొడమ
వినిగుండె భగ్గని - విల్లు నమ్ములును
నవనిపైఁ బడవైచి - యంగంబు చాల
వివశత్వమున మిన్ను - విఱిగిపైఁ బడిన
బాగున మిగులనా - పద నొంది యేను
వేగంబె యటవోయి - వీక్షించు నపుడు
వీడెడి జడలతో - నెలవెలనైన
వాడిన మొగముతో - వరదలై తొరుగు6180

రొమ్ముగాయము నెత్తు - రుల తోడఁ దనమొ
గమ్ముజేర్చిన జల - కలశంబుతోడ
ధూళి బ్రుంగిన మేని - తోడనుండుచును
కాలునుఁగేలును - గదలింపలేక
యున్నట్టి మునిచెంత - నొయ్యనచేర
గన్నులాతఁడు విచ్చి - కాకుస్థ కులముఁ
జెఱపఁజూచిన యట్లు - చెంతనున్నట్టి
పరమ పాతకుఁ దన్ను - భావించి చూచి
నా పేరు నారాక - నడిచిన తెఱఁగు
నాపుణ్యనిధి విని య - డలుచుఁ బలికె. 6190
“కలుషాత్మ! నీటికి - గావచ్చునన్ను
నలుగునఁబడవేయ - నందు నీకేమి
చేకూడె నేనీకుఁ - జేసిన దేమి?
యేకతనం ద్రెళ్ల - నేసితి రాత్రి
తనసాటుచేఁ దన - తల్లిదండ్రులకు
ననరాని యాపద - లన్నియుఁజెందె
దప్పిచే నుదకంబు తా - దెత్తుననుచు
యిప్పుడు నారాక - కెదురులుచూచి
యేమని యెంతురో? - యెట్లున్నవారొ?
యేమయిపోదురో? - యేమి సేయుదును? 6200
ఈ పాటు నీచేత - నేబడుటయ్యె
నేపాటు బడుదురో - నిటమీద వారు!
తపములు నెఱుక శా - స్త్రంబులు నేమి
యుపకారమున కయ్యె - నొక్కని చేతి

నేటి ధర్మము మోచు - నేధాత్రి నిన్ను
దురితాత్మ! వృద్దుఁ డం - ధుఁడు నాదుజనకుఁ
డెఱిఁగె నేనియు నిన్ను - నేమన నోపు?
అనవలసినమాట - యంటిఁ గాకతఁడు
తనయోగ దృష్టినిం - తయుఁ జూచెనేని 6210
యినవంశమంతయు - నిపుడె కోపాగ్ని
కనఘ తేజమునఁ బూ - ర్ణాహుతిసేయు
తబ్బిబ్బు రాకుండ - దశరథ! నీవు
గొబ్బున నమ్మౌని - కుంజరుతోడ
యీకాలిత్రోవనే - యేఁగి యమ్మునికి
వాకొమ్ము నాదుర - వస్థయింతయును
ఆమీఁద నెటులైన - నయ్యెడుఁగాక
యామునీంద్రుని శాప - మందకు మిపుడు
జలవేగమున దరుల్ - సమసినరీతిఁ
గలఁగెడు నీయమ్ము - గాఁడి ప్రాణములు 6220
తాళనే నస్త్రవే - దనకు నీచేత
వేళంబె యీతూపు - వెడలింపు మని"న
వినియేను బాణంబు - వెలిపుచ్చినపుడె
చనుప్రాణములుమునీ - శ్వరునకు నిపుడ
యేమిసేయుదునని - హెచ్చు జింతించు
నామోము చూచి దీ - నత మౌని పలికె,
"నెమ్మదిలోఁ గొంకు - నీకేల నాటు
నమ్ముదియ్యక బ్రహ్మ - హత్యకు వెఱచి
యేను విప్రుఁడనని - యెంచకు శూద్రి
మానవేశ్వర నాదు - మాత వైశ్యుండు 6230

తనతండ్రి యటుగానఁ - దగదీ విచార
మనుమానములు - మాని యలుగు వారింపు"
అనియుర్విపై బడి - యడలుచోఁ జేరి
తనయమ్ము దీసిన - దాని వెంబడినె
అతఁడసువులఁ బాసి - నంత నాయార్తి
యతివ! యే మనువాఁడ - నట్లు శోకించి
వారికీ తెఱుఁగు స - ర్వముఁ దెల్పకున్న
తీరని పనియని ధృ - తిపూని యేను
మునికొమారుఁడు దెచ్చు - మొదలింటి కలశ
మున సరయూజలం - బుల నిండనించి 6240
కొనిపోయి చూచుచో - కుంభినిమీఁద
యనదలై యేనేమి - యనువాఁడ నబల!
ఱెక్కలు విరిగి ధ - రిత్రిపై బులుఁగు
లొక్కటఁ బడియున్న - యూహఁ గన్పట్ట
తనరాక వారలు - తనయుని రాక
యనితలంపుచు నుండ - నణఁకువఁ జేరి
నిలిచిన యంత మౌ - నివరేణ్యుఁ డాత్మ
గలఁగుచుఁ దనయుండె - కానిట్టులనియె. 6250
"ఓయజ్ఞదత్త! యి - ట్లుందురే నీవు
వోయి యిప్పటికింత - ప్రొద్దుగావచ్చె
దప్పిచే నలసి నీ - తల్లి యుండంగ
నిప్పుడు తామసం - బేల చేసితివి ?
యెగ్గుచేసితినొ నీ - కీసరయువున
నగ్గలికను క్రీడ - లాడుచుండితివొ
మఱచితివో నీవు - మమ్ముఁ బ్రోచుటకు

నరుచిచే వేసట - యయ్యనో నీకు
పదములుఁ గన్నులు - ప్రాణముల్ నీవె
యిదిగాక మాకు ది - క్కెవ్వ రున్నారు?
మారుమాటాడవు - మాతోడ నంధ
కారంబులోఁ బంపఁ - గాదు నిన్ననియొ 6260
జలములు దెచ్చితే - చయ్యన" ననుచు
పలుమారు విలపించి - పలుక నమ్మౌని
మాటలు వినినాదు - మదిలోన భీతి
వాటిల్ల నేమియుఁ - బలుకంగ నోడి
పలుకక తీరని - పనిగాన దంప
తులతోడ నేనార్తి - తో నిట్టు లంటి.
"తాపసోత్తమ! నీదు - తనయునిఁ జంపు
పాపవర్తనుఁడ మీ - పట్టి నేఁగాను
విశదంబుగా నన్ను - విను మినకులుఁడ
దశరథుండ న నయో - ధ్యా పట్టణంబు 6270
పాలించువాఁడ ని - ప్పటినర్ధ రాత్రి
వేళ నీనదిపొంత - వేఁటాడ వచ్చి
వొకసద్దువిని గజం - బోయని వింట
వొకతూపు తొడిగి యే - యుటయు నచ్చోట
"హాతాత" "హామాత" - యను మానవోక్తి
వీతేర గుండియ - వ్రీలివడంగ
నదరుచు నేఁ బోయి - యావ్రేటు వలన
మెదడునెత్తుటఁ దోఁగి - మేదినిఁ ద్రెళ్ళి
కడునార్తితో జల - కలశంబు మీఁద
బడియున్న యుమ్ముని - బాలకుఁ గాంచి 6280

ఆయన యనుమతి - నాయమ్ము దివియఁ
బోయె వెంటనె ప్రాణ - ములు నిమేషమున.
ఈమాట మీతోడ - నెఱిఁగింప వలసి
యోమౌనివర! వచ్చి - యున్నాఁడనిచట
తగునాజ్ఞ సేయుఁడు - దండనీయుఁడను
తెగరాని పనిగాదు - తెలుపుండు తెఱఁగు"
అనిన వారలు కులి - శాహతులైన
యనువున మూర్ఛిల్లి - యంతన తెలిసి
చేతులు మొగిడించి - చెంగట నున్న
నాతోడ నమ్మౌని - నాయకుం డనియె, 6290
"నరనాథ! యెందువా - నప్రస్థులైన
పరమ సంయముల కా - పదలు చేసినను
చెడు నింద్రుఁడైన నీ - చేసిన పనికి
చెడిపొవు టెంతయీ - క్షితియేలు వాఁడు
తననేర మెఱుఁగుట - ధర్మంబు మంచి
పనిచేసితివి నాదు - పజ్జకు వచ్చి
చేసిన దోషంబు - చెప్పక నీవు
మూసియుంచిన క్షణం - బున నీశిరంబు
పదియారు వ్రయ్యలై - పడు నిలమీఁద
నదిదప్పె నింకనెటు - లైన నీకేమి 6300
యిది జ్ఞానకృతమైన - యిక్ష్వాకు కులము
తుదిముట్టి యింతక - త్రుంగు నంతయును
యింతచేసిన వాఁ - డ విప్పుడ యతని
చెంతనిల్వుము మాకు - జీవంబు లతఁడ
అని నన్నుఁ బల్కిన - యట్లనే వారి

దనమూపు పైనుంచి - తనయుని చెంత
నునిచిన యంతన - య్యుగళంబు శోక
వనరాశి మునుఁగుచు - వాతెఱ లెండ
వేఁడి మాతనయుండు? - వేఁడి ధార్మికుడు?
వేడి తపోనిధి? - వేఁడి యుత్తముఁడు? 6310
వీఁడా మహాత్ముండు - వీఁడా సుతుండు
వీఁడా కృతార్ధుండు - వీఁడా ఘనుండు”
అనిచేరి తమ చేతు - లతనిపై వైచి
కన నోర్వరానిశో- కంబుల మునిఁగి
పావనాత్ములు చాలఁ - బలవించి మౌని
యే వినుచుండంగ - నిట్లని పల్కె.
"అదియేఁటి కన్నమ - హాత్మ! మాతోడ
మదినల్గితివొ యొక్క - మాటాడ వేల?
యీనేలఁ బడియుండ - నేఁటికి నీకు
మానుపం జెల్లదే - మాయార్తి నీకు 6320
యిదెనేడు నీజన - యిత్రి శోకింప
మదిఁ గనికరముంచి - మానుప వేల?
శ్రవణ హితంబుగా - శాస్త్ర పురాణ
నివహ మెవ్వరి చేత - నే విందునింక
సమయోచిత క్రియల్ - జపములు దీర్చి
తమకు నెవ్వాఁడు వం - దన మాచరించు
అలసి యాకొన్న వా - రని కందమూల
ఫలము లెవ్వఁడు మాకు - భక్తితో నొసఁగు
కన్నుల నిరువురఁ - గానమీ మమ్ము
నన్న! రక్షింప - సమర్థుఁ డెవ్వాఁడు 6330

మముడించి పోవ ధ - ర్మముగాదు నీకు
తమకడ కేతెమ్ము - తనయ! యీ ప్రొద్దు
ఱేపు మువ్వురముఁ గో - రిన యట్టియెడకు
వేపోద మొంటిగా - విడిచి పోఁజనదు
వినవేని యిప్పుడే - వెంబడి వచ్చి
యినతనూజుని వేఁడి – యేనిన్నుఁ దెత్తు
అనిశంబ దీర్ఘాయు - వనుచు దీవించి
నినునొక్క వేఁటకా - నికిఁ గోలుపోతి
నెక్కడ దశరథుఁ? - డెచటి యయోధ్య?
యెక్కడి మనమునీ? - వెక్కడి రాత్రి? 6340
గురియైతి వీయంప - కోల పెట్టునకు
సరసిజగర్భుఁ డి - చ్చట నెన్నెయిట్లు
హరిహయు వీట క్ష - త్రాచార ధర్మ
నిరతుల సౌఖ్యంబు - నినుఁ జెందుగాక!
జనమేజయ యయాతి - సగర దిలీప
జనకాది లోక వా - సము గాంతుగాక!
నిజతప స్వాధ్యాయ - నిధులైన వారు
యజన పరాయణు - లైనట్టివారు 6350
భూదాన గోదాన - ములనుంచువారు
పేదల కన్నముల్ - పెట్టిన వారు
యేక పత్నివ్రత - హితులైన వారు
వాకొన్న సత్యంబు - వదలని వారు
గంగలో మేనులు - గడతేర్చు వారు
సంగతి గురుపూజ - సల్పిన వారు
యే లోకములు గాంతు - రిచ్చలు మెచ్చ

నాలోక సౌఖ్యంబు - లందుము నీవు
తలఁపనేరక నిన్నుఁ - దమి వధియించు
కలుషమానసుఁడు దు - ర్గతి నేఁగుఁగాన”
అని యుదకక్రియ - లాచరించుటయు
ముని కుమారుఁడు స్వర్గ - మున కేఁగునపుడు 6360
వరవిమానంబుతో - వాసవుతోడ
ధరణిపై శోకించు - తల్లితండ్రులను
గనుఁగొని గగనమా - ర్గంబున నుండి
వినయంబుతో వారు - వినఁగ నిట్లనియె.
“అనఘాత్ములార! మీ - యంఘ్రి పద్మములు
కనిగొల్చి యుత్తమ - గతులు గాంచితిని
మీర లింకేల యి - మ్మేదిని నుండ
రారండు వేగ స్వ - ర్గంబు చేరుదము
యెఱఁగక వధియించె - నీ రాజుతన్ను
కరుణించి కావుఁ డ - కల్మషుఁ డతఁడు 6370
పోయెద” నని ముని - పుత్రుండు పోవ
కాయముల్ పుత్రశో - కమున వ్రేఁగైన
నామునిశోకార్తుఁడై - తాల్మిలేక
నేమన వచ్చున - న్నీక్షించిపలికె.
"ఇనవంశ! విను జీవి - తేచ్ఛ నేనొల్ల
తనకుమారుని మున్ను - ధరణిపైఁ గూల
యేయమ్ముచే నేసి - తేయమ్ము నన్ను
నాయమ్ముసంధించి - నాయమ్మునాట
యెఱఁగమిచే నీకు నీ - బ్రహ్మహత్య
పరిహృతంబయ్యెనీ - భాగ్యంబుకతన6380

ఐననేమాయె మా - యట్లనె నీవు
సూనులంగని పుత్ర - శోకంబుచేత
మృతినొందుమని" శపి - యించి తానంత
మృతుఁడయ్యె జాయాస - మేతంబుగాఁగ.
దానఫలంబు దా - తనుఁబొందినట్ల
యానాటిఁ మునిశాప - మాసన్నమయ్యె.
చిన్ననాఁడేనుచే - సినకర్మఫలము
వెన్నాడిమేనఁబ్ర - వేశించె నిపుడు
చాన యపథ్యభో - జనమునమేన
మానకవ్యాధి ము - మ్మరమైన యట్లు 6390
మునికుమారచ్ఛేద - మున నైనపాప
మనుభవింపఁగఁ గైక - యనుకూలయయ్యె.

—: దశరథుఁడు రామునిఁ దలఁచు కొనుచు మృతినొందుట :—


వినరాదు నీమాట - వీనులనిపుడు
కనరాదు నీశుభా - కారంబు నాకు
యిపుడెవోయెడుఁబ్రాణ - మిఁకనైన రాముఁ
డుపకారియై వచ్చి - యుండినంజాలు
బ్రదుకుదు నటులైన - పంకజనయన!
యిది పురాకృతకర్మ - మేఁటికి దప్పు
నాయెడభయభక్తి - నడుచు రామునకు
నీయెడనపకార - మేమిచేసితిని? 6400
తనయులు తనకేమి - తప్పుచేసినను
జనకుఁడుత్తముఁడైన - పడలిపోలేఁడు

యేకొమారుఁడు తండ్రి - కెదిరి యేమియును
వాకొనయూరకె - వనములకేఁగు?
చలియించె బుద్ధియు - శమనకింకరులు
బలిమి నీడ్చుకపోవఁ - బదరుచున్నారు
యీవేళరాఘవు - నెడబాసి యేల
జీవనం బిక మృతిఁ - జెందు టేమేలు?
ఎండకొంచెపు నీటి - నింకించినట్ల
నిండుతాపమున మే - నికి హానియయ్యె 6410
చంద్రాస్య! వికసిత - జలజాతపూర్ణ
సాంద్రతగల రామ - చంద్రుమొగమ్ము
చేరి యేపుణ్యులీ - క్షింతురో యింక
వారివె స్వర్గాప - వర్గసౌఖ్యములు
పంచేంద్రియమ్ముల - పాటవంబెల్ల
నించుకయునులేక - యెనసిభూతముల
నలివేణి! తైలశూ - న్యతనారు దీప
కళికయోయన జ్ఞాన - కళ తెల్విమాసె
అని యింత పతిహంత - వని నీమనంబు
కననేరనైతిఁ గై - కా! యందువగచి 6420
హాలక్ష్మణా! సుమి - త్రా! కోసలేంద్ర
బాలికా! యనుచుఁదా - పంబుచేఁబొరలి
హాజనకాత్మజా! - యనివిలాపించి
హాజలజేక్షణ! - హారామ! రామ!"
అనిప్రాణములఁబాసి - యాదశరథుఁడు
చనియె నంతట నిశా - సమయంబునయ్యె.

—: రాజపత్నులు దశరథుమృతికై విలపించుట :—

నిదురవోయెనటంచు - నెలఁతలందరును
నిదురించి రందంద - నెగులురెట్టింప
నాయెడ నరుణోద - యంబైన నగర
గాయనమంగళ - గానరావంబు. 6430
కలకలాయితశారి - కా కీరరవము
చెలరేఁగు బ్రాహ్మణా - శీర్వాదములును
నిండిన నగరిలో - నిద్దురల్ దెలిసి
యండనుండిన విక - చాబ్జలోచనలు
పరిచారకులును ద - ర్పణములుదాల్చి
గురుతరసౌవర్ణ - కుంభంబులందు
నొకట సుగంధహి - తోష్ణోదకములు
చకచకలీను ని - చ్చలవుచల్వలును
విరిపొట్నముల్బహు - విధములై నట్టి
పరిమళ ద్రవ్యముల్ - భద్రాసనంబు 6440
నవరత్నమయభూ - షణంబులుఁ దిలలు
ప్రవిమలాజ్యంబు సం - పంగి నూనెయును
నారికేళములు తి - న్నని ఖాదిరంబు
జీరకంబు నమర్చి - చెలు లామతింప
యినుఁడుదయించియు - నేలకోనేఁడు
జనపతి నిద్దుర - చాలింపఁడయ్యె?"
అనిపల్కియుడిగెంపు - టతివలు హస్త
వనరుహంబుల మహీ - వల్లభుఁజేరి
యతనిపాదంబు లొ - య్యన యెచ్చరింప
నతిశయదీర్ఘని - ద్రాతురుండగుచు 6450

లేవకూరకయున్న - లేమలు వెఱచి
భూవల్లభుఁడు మృతిఁ - బొందెనే కాక
యింతులందరును కూ - యిడఁగ నాచెంత
యింతనంతట నున్న - యిగురాకుబోండ్లు
యేటివెల్లువఁ దృణ - బృందమోయనఁగ
గాటంపుభీతితో - గజగజవణఁకి
పుడమిపై నుత్సాత - ములఁబొగల్ గప్పి
కడుమాయునక్షత్ర - గణమ కోయనఁగ
తేజముల్ దరగి ని - ద్రింపుచున్నట్టి
రాజీవనేత్రల - రామునితల్లి 6460
యాసుమిత్రనుఁజేరి - యద్దరిపాటు
దోసపుమాట రం - తుగ లేపివలుక
దిగ్గనలేచి యా - తెఱవలిద్దఱును
బెగ్గడిల్లుచుఁబ్రలా - పింపుచుఁజేరి
చుక్కలుఁదెగిపడ్డ - సొబగునవారు
నక్కైకయును ధాత్రి - నడలుచుంబొరల
యితరకులాంగన - లెల్లశోకింప
క్షితిపాలునగర మిం - చెను రోదనములు
హితులు రాజులుఁబురో - హితులు మంత్రులును
క్షితిజనంబునుఁగూడి - చింతించునపుడు 6470
రాజభామినులు మ - రందముల్ గురిసె
రాజీవములనంగ - రాలుఁగన్నీట
రోదనంబులుబెట్టు - రొదసేయ దీప్తి
నాదిత్యుఁడుదొలంగి - నట్టిచందమున
చల్లఁగానారు వై - శ్వానరులీల

వల్లభుఁడుండు భా - వంబు నీక్షించి
దశరథుశిర మంక - తలమున నునిచి

—: కౌసల్యవిలాపము :—


శశిముఖి కౌసల్య - చాలశోకమున
కైకేయి మోముచ - క్కఁగఁజూచి యొరులు
వాకొనగారాని - వచనముల్ వలికె. 6480
“ప్రతినచేసుక యోసి - పాపాత్మురాల!
పతినందరునుఁజూడఁ - బదరి మ్రింగితివి
కడతేరెఁగోర్కె య - కంటకంబైన
పుడమియేలుము రాముఁ - బొమ్మనఁదగునె?
అక్కటా! యేను కా - రడవిలో నొంటి
జిక్కిన గతి నీదు - చేతఁజిక్కితిని
పతిని మున్నిచ్చితి - ప్రాణేశుప్రాణ
తతియ నీకిప్పుడు - దారవోసితిని
మగనిఁజంపినయట్టి - మగువయెందైన
జగతిపైఁగలదె? యి - చ్చటనీవెకాక 6490
దీనకంబున విష - దిగ్ధాశనంబు
పోనీక భుజియించి - పొలిసిన యట్లు
మందరబుద్ధిచే - మనవంశమెల్ల
మ్రందఁజేసితీ మాట - మాత్రలో నీవు
వనముపేరిట రాము - వనులకుఁబంప
దురపిల్లుఁదనుఁబోలి - దుహితృమోహమున
జనకుఁడింతక మేను - సగముగాఁగరఁగు
పెనిమిటియునుఁ బోయి - బిడ్డలవిడిచి

తానున్నచందంబు - తనకుమారకుఁడు
వీనుల నెవ్వాఁడు - వినఁగలఁడొక్కొ! 6500
యెన్నడు నొకచింత - యెఱఁగని సీత
విన్ననితెఱఁగెల్ల - విలపించునొక్కొ!
వనములలో సీత - వసియించుమాట
తనయహీనుఁడుగాన - తండ్రియెట్లోర్చు?
యేఁబతివ్రతనౌట - నీరాజువెంట
పోఁబోలు శిఖిముఖ - మున నిల్వఁదగదు"
అనియేడ్చుఁగౌసల్య - నతివలందరును
బెనఁగొని శోకంపఁ - బృథివీతలేశు
మంత్రులందరునొక - మాటగాఁజాల
మంత్రకోవిదులౌట - మానవేంద్రునకు 6510
గన్నట్టికొడుకు సం - స్కారంబుసేయ
నన్నలువుర నొక్కఁ - డైన నప్పటికి
వేళకు లేకున్న - వెడద కొప్పెరను
తైలపక్వముచేసి - ధరణీశుమేను
బుద్ధిమంతులుగానఁ - బోలినజాడ
సిద్ధార్ధముఖ్యమంత్రి - శేఖరుల్ గూడి

—: రాజపత్నులవిలాపము :—


అధిపుఁదైలద్రోణి - యందు నిల్పుటయు
నధికశోకమునఁ గు - లాంగనామణులు
నరనాథ! తమ్ము న - నాథలంజేసి
విరతిచే నీవెట్లు - విడిచిపోయితివి? 6520

యెంతటికి నిమూల - మీకైక యీపె
పొంత నే క్రియప్రాణ - ముల్ నిల్పఁగలము?
నీతనయులకును - నీకును మాకు
సీతకుఁగానట్టి - చెడుబుద్ధికైక
ఎవ్వరికిని మంచి - దేమనువార
మెవ్విధమో యని - యిలవ్రాలి వెడల
కలిమిచుక్కలులేని - గగనంబురీతి
చెలువుండు లేనట్టి - చెలువచందమున
ఆ యయోధ్యాపురం - బటుపాడుదేరె
నాయినమండలం - బస్తాద్రిచేరె 6530
నెచ్చటఁబురములో - నేడ్పులునిండె
వచ్చెనంతటఁదెల - వార నవ్వేళ

—: మార్కేండేయులు వసిష్ఠునితో నరాజకమును చెప్పి వేడుట :—


వామదేవాత్రేయ - వత్సజాబాలి
జమదగ్నిమృకండు - శరభశాండిల్య
గౌతమకపిలాత్రి - కణ్వాదిమౌను
లేతెంచి యందరు - నేకవాక్యముగ
సచివులలో వసి - ష్ఠమునీంద్రుఁజూచి
యుచితంబు నడపింప - కునికి నిట్లనిరి.
“రాజులేనట్టియీ - రాత్రి యుల్లముల
యోజింప నూరేండ్ల - యోజఁగన్పట్టె 6540
తనయులెవ్వరులేని - తరిఁ బిలిపించి
యొనరఁబట్టంబు లే - కున్న నొప్పగునె?

మహి యరాజకమై య - మాత్యులు చత్తు
రహరహంబును ప్రజ - లార్తినొందుదురు
వసుమతి పండదు - వానలు గురియ
వెసఁగవు ధర్మంబు - లెచ్చుఁబాపములు
మర్యాద లుడిపోవు - మఘములుసాగ
వార్యులనెంచ ర - ధ్యయనముల్ మాయు
మగల గణింపరు - మగువలు జనులు
తెగుదురు జన మని - దెస బలహీను 6550
బలియుండు మననీఁడు - పరుల యిల్లాండ్ర
దొలఁగక నితరులె - త్తుకొని పోవుదురు
దేవదాయములు భూ - దేవ దాయములు
పొవునుఁ జెడిభయం - బులు పుట్టునెందు
సంగీతనాట్య ప్ర- సంగముల్ దప్పు
నంగంబులకు నిర్ణ - యంబులు దొలఁగు
వేడుకల్ చెల్లవు - విభవముల్ దీరు
కూడును రోగముల్ - కుంజరాదులకు
కలుగును వెత లస్త్ర - గరిమముల్ వొలయు
వెలలేక వర్తకుల్ - విడుతు రంగళ్లు 6560
తెరువులు నడవవు - దివ్యవస్త్రములు
పరిమళంబులునుఁ దా - ల్పరు రాజులెల్ల
మెదలరు పాఁడి న - మ్మిక లెల్లఁబోవు
పొదలవు పుణ్యముల్ - పొందునాపదలు
జాతిసంకరమగు - సత్యంబు దొలఁగ
నీతిమార్గమునిల్చు - నెయ్యముల్ దరగు
వావులు చెడిపోవు - వరుసలు దీరు

పోవును శుభములు - పొందు రోగములు
హేతిప్రదీప్తవ - హ్నికి రథంబునకు
కేతువు హేతువుల్ - కెలని చూపఱకు 6570
మనవంటి వారల - మనుకుల కెల్ల
మనుజేశ్వరుఁడు లేక - మరిదిక్కు గలదె?
మునుపు రాజాజ్ఞచే - మూలల నొదుగు
చెనటు లందరుఁ బ్రకా - శింతురిట్లైన
అంగంబునకు దృష్టి - యటుల సమస్త
మంగళప్రదుఁడు సీ - మకు నృపాలకుఁడు
దిక్కులు వాలించు - దివిజుల శక్తి
యొక్క భూవరునందె - నుండు నేకముగ
న్యాయ మన్యాయము - నడపించు రాజు
సేయఁడే లేనిచోఁ - జీకటి పగలు 6580
జలధివేలనుఁ బొలి - జవదాఁట రాదు
తలఁపున మామాట - ధరణి రక్షింపు
కట్టుము పట్టంబు - కర్తనుఁ దెచ్చి
గట్టిగా నీ వేడు - గడ యిందఱకును”
అనిన వసిష్ఠుఁ డ - య్యందఱం జూచి
తన మనంబునకు నెం - తయు హితంబగుట
మంత్రజ్ఞులైన సు - మంత్రాది రాజ
మంత్రులతొ నొక్క - మాట యిట్లనియె.

—: భరతుని దోడ్కొనివచ్చుటకై వసిష్ఠముని దూతలనంపుట :—


“భరత శత్రుఘ్నుల - పాలికి మీరు
వెరవరులై నట్టి - వేగుల వారి 6590

ననుపుఁ డిప్పుడె జవ - నాశ్వంబు లిచ్చి
యనిన మీరలె పంపుఁ" - డని వారు వలుక
నతఁడు జయంత సి - ద్ధారుల విజయు
స్తుతమతిశాలి న - శోక నందనుల
పయనముల్ సేయించి - “పనివూని మీరు
రయమునఁ గేకయ - రాజన్యు పురికి
పోయి కేల్మొడ్చి య - ప్పుడు వారితోడ
నీయర్థ మేమియు – నెఱింగింపఁ బోక
మేముపిల్చితి మని - మీరాడి వారి
కేమేర లుడుగర - లెప్పుడు గట్టి 6600
యనుపుదురో నేడు - నట్టి కట్టడనె
కొనిపొండ"నుచు మౌని - కుంజరుండనిన
పయనమై సంబళ - బత్యంబు లంది
కయికాన్క లుడుగర - కట్టలు గొనుచు
ననుపంగఁ దగువారి - నటమున్నె వనిచి
వెనకఁదారు నయోధ్య - వెడలి యప్పురికి
పడమరగాఁ గొంత - పర్యంతమునకు
నడచి యుత్తర దక్షి - ణములుగాఁ బెరుగు
నుపరి తాలంబను - నొకకొండ యుత్త
రపు దిక్కుగాఁ జుట్టి - ప్రవహించు నట్టి 6610
మాలినీ నదిదాఁటి - మార్గంబు లందు
జీలంగ పూర్వ ప - శ్చిమ దీర్ఘమగుచుఁ
దనరు ప్రలంబ భూ - ధరముఁ గన్గొనుచుఁ
జని యుత్తరముగన - శ్వముల మఱల్చి
ఆవల పడమర - యై పోవుచాయ

త్రోవనే నడచి యా - దూత లేవురును
జాడఁ బాంచాల దే - శంబులు గడచి
నాఁడెవారలు కరి - నగరంబు దాఁటి
గంగానదిని మీరి - కదలుచోఁ గుకురు
జాంగలకురు మహీ - స్థలముల నడిమి 6620
మార్గంబు వట్టి గ్రా - మంబు లేఱులును
నిర్గమింపుచు నొక్క - నిబ్బరంబుగను
కారండవక్రౌంచ - కలహంస చక్ర
సారస నిబిడయౌ - శరదండ యనెడు
నది సదిత్యోపయా - నమహీరుహంబు
నెదురు గన్గొనిమీరి - యెంతే రయమున
నరుగువారు కుళింగ - మను పట్టణంబు
తెరువుగా నిక్షుమ - తీ మహానదిని
దాఁటిదోసెఁడు నీళ్లు - ద్రావి యాకేవ
సాటికి నిగమ ప్ర - సంగముల్ సేయు 6630
ధరణీసురలఁ జూచి - తారు బాహ్లికుల
హరిగేహములఁ జూచి - యచటి విపాశ
దెరువున దాఁటి న - దీ తటాకములు
సరగ నంగార్య సం - సక్రి మీరుచును
వివిధ మృగంబుల - వీక్షించి వార
లవలఁదురంగంబు - లవియునోయనుచు
యెంచక చనుచు న - య్యెడ గిరి వ్రజము
గాంచి రాజహితంబు - గా భరతునకు
సేమంబుచే కూడ - క్షితి శోభనముల
చేమించి వారట్లు - చేరి కైకయుని 6640

సముఖంబునకుఁ బోవ - సమయంబు గామిఁ
దమకునాఁటికి నిల్వఁ - దగినచో నుండి
గ్రక్కున భరతునిఁ - గనుపించుకొనక
యెక్కడి వారొకా - నిమిడి యున్నంత

—: భరతుఁడు తన దుస్స్వప్నమును మిత్రులతోఁ జెప్పుట :—


తెలవారు వేళ ని - ద్రింపుచు నొక్క
కలగాంచి భరతుండు - కలఁగుచు లేచి
వేసట సంధ్యాది - విధు లాచరించి
బాసట లేక య - ప్పటి పరిజనుల
యుపలాలనము చేసి - యొకమాట యైన
నపుడు పల్కక చెక్కు - నందు చేయుంచి 6050
యున్నెడ ననుచరు - లూరట గాఁగ
గొన్ని వినోదముల్ - కొన్ని హాస్యములు
కొన్ని పదంబులు - కొన్ని పద్యములు
కొన్ని ప్రసంగముల్ - కొన్ని యాటలును
మఱపింప నడపింప - మది నొక్కటియును
సరకుగాఁ జూడక - చాల చింతలఁగ
నందొక్క నెచ్చలి - యతని వీక్షించి
యెందు నిమిత్తమో - యిపుడు మీ మొగము
విన్నఁబాఱిన దేమి - విధమని చేరి
విన్నపించినమాట - విని భరతుండు 6660
తెలుప నోరాడక - తెలపక మదిని
నిలుపను లేక వా - నికి నిట్టులనియె.
"యీరేయి నాకల - యేమని పలుక

నేరుతుఁదమ తండ్రి - నెఱిగుంపు వీడ
మలిన వస్త్రముగట్టి - మలినుఁడై యొక్క
శైలాగ్రమున నుండి - జగతిపై పేఁడ
మడువు లోఁబడినట్టు - మరితెలినూనె
పుడిసిటఁ ద్రావుచు - పొరలి నవ్వుచును
తలయంటు కొనినట్లు - దశరథ నృపతి
తిలమిశ్రితాన్నంబుఁ - దినుచున్నయట్లు 6670
తైల ఘట్టంబులోఁ - దల క్రిందుగాఁగ
వ్రేలుచు నున్నట్లు - విషరాశి యింకి
బీడయినట్లు జా - బిల్లి మిన్నెల్ల
బాడుగా ధరణిపైఁ - బడినట్లు వసుధఁ
గానరాక యదృశ్య - గతి నొందినట్లు
మానవేశ్వరుఁ డెక్కు - మదదంతి కొమ్ము
విఱిగిపోయిన యట్లు - వెలుఁ గొందువహ్ని
యెఱమంట లుడిగి పో - యి శమించినట్లు
ధర వగిలిన యట్లు - ధరణీరుహములు
దెరలియెండిన యట్లుఁ - దెకతేర గిరులు 6680
పొడి పొడియైనట్లు - భూమీశుఁ డినుప
నిడుద గద్దియ - నుండ నీలవర్ణలును
పచ్చని వారునౌ - పడఁతు లెత్తుకొని
యెచ్చటికో కొంచు - నేఁగిన యట్లు
గర్దభంబులు నాల్గు - కట్టిన రథము
కర్దమ క్షితినెక్కి - కదలించి రాజు
మఱలి చూడక రక్త - మాల్య గంధములు
ధరియించి దక్షిణ - స్థలి కేఁగినట్లు

ఆ మహీపతి వికృ - తాకార యైన
భీమరాక్షసి వట్టి - బెదరించినట్లు 6690
నీరీతి దుస్వప్న - మేఁగంటి నిందు
చే రాఘవున కైన - క్షితిపతి కైన
తనకైన మృతియౌట - దప్పదుగాన
మొనచూపు నార్తిచే - మునిఁగిన వాఁడ
చలియించె శారీర - సంపద మనసు
కలంగెడు మాటాడఁ - గా వేసటయ్యె
యిందుల కెద్దియో - హేతువు నెఱుఁగ
పొందెడు భీతి యి -ప్పుడు దాఁపనేల?
తనమేని చాయ యుం - దప్పె నెన్నడును
వెనకటికిని నిట్టి - వెతనంద లేదు” 6700
అనిపల్కు చున్న - చో నల బౌరజనులు
కనిపించు కొనుచు కే - కయ రాజునగరు
చొచ్చి కొల్వున్న రా - జునకుఁ గే ల్మోడ్చి
చెచ్చెర నయ్యుథా - జిత్తుకు మ్రొక్కి
పజ్జన యున్నట్టి - భరతునిం జేరి
బుజ్జవంబునఁ గొంత - పోరామి నడపి
శత్రుఘ్నుఁగని వసి - ష్ఠ సుమంత్ర ముఖులు
మైత్రితో మీదు సే - మము వేఁడుమనిరి
మీతాతకును మీదు - మేన మామకును
ప్రీతితో వార లం - పిన కాన్కలిచ్చి 6710
"రండు మావెంటకా - ర్యముమాకుఁ దెలిసి
యుండదు వారేమి - యూహించినారొ?
యిరువది కోటులై - హెచ్చైన వెలకుఁ

దరమైన యీసొమ్ము - తాతకు నిచ్చి
పదికోట్లు సేయు నా - భరణంబు లిమ్ము
మదిమెచ్చ మీమేన - మామకు ననుచు
చూపియిచ్చినఁ గైక - సుతుఁడది యంది
యోపి మోచిన యన్ని - యుడుగరలిచ్చి
వేగుల వారల - వీక్షించి భరతుఁ
డీగడ దెలియంగ - నీక్షించి పలికె. 6720

—: భరతుఁ డయోధ్యకుఁ బ్రయాణమగుట :—


“మనరాజు రామల - క్ష్మణులుఁ గౌసల్య
యును సుమిత్రయు లెస్స - యున్నారె పురిని?
చలము రోషమును మ - చ్చరము నోర్వమియుఁ
గలుగు నాతల్లికిం - గైకకు సుఖమె?
ఆకైక నాతోడ - నను మన్నమాట
వాకొనుం”డని పల్క - వారలిట్లనిరి.
“అయ్య! నీ వడిగిన - యందరు లెస్స
నియ్యెడ నినుబొందు - నెల్ల సేమములు
నరదంబు దెప్పింపుఁ - డాలస్యమేల?
సరగ విచ్చేయుఁడు - సాకేతమునకు" 6730
అనిన కేకయుఁజూచి - యనఘ! మావారు
ననుఁ బిల్వనంప నం - దరు వచ్చివారు
పోయివచ్చెద నను - పుఁడు మీరలనిన"
నాయవనీశుండు - నౌఁగాక యనుచు
శిరము మూర్కొని మీరు - చేరుఁ డయోధ్య
పరిణామమున మన - పార్థివోత్తముని

నడిగితి మ్రొక్కితి - నని పల్కు మతని
పడఁతుల సుతల మా - పైదయ యెప్పుడు
మఱవకుండనుము నె - మ్మదినేఁగు మనుచు
కరితురంగమ రత్న - కంబళ వస్త్ర 6740
వరభూషణాదుల - వ్వారిగా నిచ్చి
"తనవారి వెంటం గొం - దరిఁ గూర్చి భరతుఁ
బనిచిన కేకయ - పతి కుమారకుఁడు
ఐరావతాంశంబు - లైనవి యింద్ర
శీరదేశమునఁ దె - చ్చినయవి భద్ర
సామజోష్ట్రంబుల - జవ నాశ్వములను
నా మేనమామ ప్రి - యంబుతో నొసంగి
సింగంబులన గ్రామ - సింహముల్ హతకు
రంగముల్ గొన్నిగా - రామున నిచ్చి 6750
యనిచినయంతఁ బ్ర - యాణ తత్పరతఁ
దనకిచ్చు వాన నా - దర మింతలేక
రయముతో చారులు - రమ్మని పిలువ
భయ పుట్టఁగాని స్వ - ప్నముగన్న కతన
చిడుముడి పాటుతో - జేరి యవ్వలకు
గడమ వారలకు న - గళ్లలోఁ దమదు
పయనంబు చందమే - ర్పఱచి వా రనుప
రయముతో నొకమహా - రథముపై నెక్కి
తానుఁ దమ్ముఁడు నయో - ధ్యా పురంబునకుఁ
బూని కేకయుల పం - పుడు మూకగొల్వ 6760
మఱలి పట్టణ పూర్వ - మార్గంబు నందు
నరుగు వారు సుధామ - యను నది దాఁటి

పడమర దిక్కుగాఁ - బాఱు హ్లాదినియుఁ
గడచి శతద్రువుఁ - గమియించి యేల
ధాన జనపదంబు - దాఁటి శీఘ్రమున
రా నందు నపర ప - ర్పట దేశములునుఁ
దరియించి యొక యేఱు - దాఁటి యాగ్నేయ
పురశల్యకర్తన - పురములు గడచి
తనచాయఁ జైత్ర ర - థంబను వనము
గ్రమియించి గంగా స - రస్వతుల్ మీరి 6770
చని వీర మత్స్య దే - శము లుత్తరమున
తనరు బారుండాభి - ద వనంబు చేరి
కాంచిదేవినిఁ గుళిం - గమునను నదులు
ప్రాంచల నగములు - భావించి యమున
చెంగట నొకరేవు - చేరి యుత్తమ మ
తంగజాశ్వములు సే - దలు దేర్చి బలము
విశ్రమింపఁగఁ గాల్య - విధులాచరించి
యశ్రాంతులై వార - లవలఁబోవుచును
పవనుండు మబ్బులఁ - బాపిన కరణి
జవసత్వ భద్రేభ - సంఘంబు మీరి 6780
మట్టి చిట్టడవిదు - మారంబు రేయి
బట్టబయల్ సేయఁ - బరగు కాఱడవి
త్రోవగావచ్చి చే - రువనఁ శుధాన
మావల ప్రాగ్వట - మనునూళ్ల చెంత
భాగీరథి దరించి - బలముల తోడ
సాగి యాకుటి కోష్ఠ - శైవలినియును
గ్రక్కున ధర్మవ - ర్థన పురి గడచి

యక్కడ తోరణ - మను నూరుచూచి
వోయి యామ్యమున జం - బూప్రస్థపురము
చాయ వరూధాఖ్యఁ - జను నూరుచేరి 6790
అర్కుండు గ్రుంక సౌ - రచ్చోట నిల్చి
యర్కవంశలలామ - మమ్మఱునాఁడు
అరుణోదయమ్మున - నఖిల సైన్యముల
దరలించి పూర్వ ప - థంబున వచ్చి
యుజ్జయినీ పురిని - నుద్యాన భూమిఁ
బజ్జలఁ జతురంగ - బలములు గొలువ
నందునాఁటికి నుండి - యవ్వలి దినము
నందు సూర్యోదయం - బగువేల లేచి
బలముల వెంబడిఁ - బయనంబు చేసి
యలఘు వేగమున - జాశ్వంబు లెక్కి 6800
ముందర నన్నద - మ్ములు కొంత తురగ
బృందంబు నొకకొన్ని - యేనుఁగల్ వెంట
చను దేరమున్నుగా - సర్వ తీర్థంబు
దనరు నౌత్తానకి - దాఁటి రాఘవులు
మఱియునుం గొన్ని ని - మ్నగ లుత్తరించి
అరుగుచుఁ దురగంబు - లలసిన కతన
మసలక పడివాగె - మర్తు మావులను
వెస నెక్కి రఘువంశ - వీరులు గదలి
నవియును నలసిన - నచట కళింగ
భవమైన యేనుఁగ - పై వారలెక్కి 6810
పోవనిచ్చి ప్రయాగ - మునుఁ బోలుకుటిక
యావల లోహిత్య - మనుపురి చెంత

కపివతి యనునది - గనియేకసాల
మపుడు వీక్షించిత - దగ్ర భాగమున
స్థాణుమతీ నది - చనిచూచి మహికి
వేణియై కనిపించి - వినతా పురమున
గోమతినది గనుం - గొని కళింగమున
రాముని తమ్ములా - రామంబు చేరి
కరిడిగ్గి యంచలఁ - గట్టిన హరుల
నిరువురు నెక్కి రా - నినుఁడస్తమింప 6820
కాఱడవిని త్రోవ - గనిపింప దివిటి
బారులతో వేగుఁ - బర్యంతమునకు
వచ్చి సూర్యోదయా - వసరంబు నందు
నెచ్చోట శుభచిహ్న - లేమియు లేని
తమ పట్టణముచూచి - తరణి వంశజులు
తమితోడ సప్త రా - త్రమునకుం జేరి
అరదంబు పై నెక్కి - యపుడు సారథిని
బరికించి యిట్లని - భరతుండు పలికె
"తగఁజూచితే? సు - ధాధౌత సౌధములు
మిగులు శోభాలక్ష్మి - మించ వేమియును 6830
అధ్యయనములు యా - గాదు లైనట్టి
విధ్యుక్త కర్మముల్ - వెలయ వేమియును
రణదురుమణి నూపు - రంబుల వెలయు
గణికాజనంబు నే - కడల లేరైరి?
కేళికా వనములఁ - గ్రీడలు సల్ప
బాలికావళిఁ గూడి - పల్లవుల్ రారు?
శృంగార వనములు - చెలువముల్ దిరిగి

చెంగలించుట లేక - చిన్న వోయెడును
ఏ మగలశ్వంబు - లెక్కుక రాజ
సూనులు పురినెందుఁ - జూపట్టరైరి? 6840
కొడిగెల యందుఁగే - కులును హంసములు
నడయాడు నట్టి స - న్నాహ మేర్పడదు
జలజాకరంబులఁ - జక్రవాకాది
జలపక్షికలకల - స్వనములు మాసె
నా చూపులకునర - ణ్యంబునుం బోలి
యేచాయ నీపురం - బేలకో తోఁచె
పువ్వు లేమియు లేక - పూఁదోట లేల
మవ్వముల్ దరగి రె - మ్మలు వాడువారె
కౌసికాగురు కాష్ట - కర్పూర ధూమ
పేశల గంధముల్ - పెల్లుబ్బ వయ్యె 6850
చలువలీనుచు మాంద్య - సౌరభంబులను
మలయదు దక్షిణ - మారుతాంకురము
కలిత వాదిత్ర మం - గళ వాద్యరవము
విలసిల్ల దొకచోట - వీథుల యందు
తొలఁగక కనిపించె - దుశ్శకునములు
కలఁగెడు చిత్తం బ - కారణంబుగను
మనవారి కెల్ల సే - మము లేకయేమి
పని వుట్టెనోకద - పట్టణంబునను"
అని చింతిలుచు నయో - ధ్యా పట్టణమున
దనమ్రోల వైజయం - తంబను పేర 6860
గురుతైన పడమటి - కోట వాకిటను
బరగు గోపురము దా - భరతుండు చొచ్చి

వాకిటి కావళ్ల - వారలు లేచి
చీకాకు పడుచుండ - చేసన్న నాఁచి
ఆ కుమారాగ్రణి - యవల నేఁగుచును
కేకయసారధిం - గీర్తించి పలికె.
“వింటివే సూత యీ - వీడున్న లాగు
తొంటి రాజులుమేని - తోఁ బాసినపుడు
యెట్లుండు ననివిందు - మెల్ల జనంబు
నట్లయున్నది సంది - య మొకింత లేదు 6870
తెఱచిన వాకిళుల్ - దెఱచిన యట్లు
పఱచిన కంబళ్లు - పఱచిన యట్లు
మూసిన యంగళ్లు - మూసిన యట్లు
వేసిన గౌనులు - వేసిన యట్లు
కట్టిన గజములు - గట్టిన యట్లు
పట్టిన కైదువుల్ - బట్టిన యట్లు
నిలిపిన రథములు - నిలిపిన యట్లు
మలపిన దీపముల్ - మలసిన యట్లు
పడియున్న టెక్కెముల్ - పడియున్న యట్లు
చెడిపోవు మ్రుగ్గులు - చెడి పోవునట్లు 6880
చెదరిన చిత్రముల్ - చెదరిన యట్లు
వదలిన మేల్కట్లు - వదలిన యట్లు
మానిన శుభములు - మానిన యట్లు
పూనిన మఘములు - పూనిన యట్లు
విలువని సొమ్ములు - విలువని యట్లు
కొలవని వేల్పులఁ - గొలవని యట్లు
సేయని పూజలు - సేయని యట్లు

హాయన నేడ్పులు - హాయను నట్లు
యిటువలె మున్నుండు - నే యీపురంబు
కిటుకులు వుట్టె సా - కేతంబు నందు" 6890
అని వేగమున మన - యరదంబు నడపు
మన తమ నగరు డా - యఁగఁ బోయి యచట
యా తేరుడిగ్గి యొ - య్యన తండ్రి నగరి
కేతేర నచ్చోట - నెవ్వారు లేమి
గ్రక్కున మరలి యా - కైకేయి నగరు
చక్కఁగాఁ జొచ్చి ప్ర - సన్నయై యున్న

—: కైక భరతునితో జరిగిన వృత్తాంతమును జెప్పి రాజ్యమును బూనుమనుట :—


తల్లినిఁ జేరి వం - దన మాచరింప
"చల్లఁగా మనుమ"ని - చాల దీవించి
తడవులకై వచ్చు - తనయునిఁ జేరి
కడువేడ్క నిండారు - కౌఁగిటం జేర్చి 6900
ఆసీనుఁ జేసి ప్రి - యంబుతో చెంత
నాసీనయై కైక - యతని కిట్లనియె.
"అన్న! మీతాత గృ- హంబీవు వెడలి
యెన్నినాళ్లాయనో - యెల్లవారకును
సేమమేకద? యధా - జిత్తుండు సుఖియె?
నీమేనువాడె - నేంతే ప్రయాణముల"
ననవినిభరతుఁ "డో - యమ్మరో! నేడు
దినములాయను వెళ్ళి - తెరువు నిద్రలను

వారెల్ల సుఖమున్న - వారలునాకు
కూరిమి నిచ్చిరి - కోరువస్తువులు 6910
అలసినవాఁడ మా - యయ్య యెచ్చోట
నెలకొని యున్నాఁడు - నిజమందిరమున?
కానక వెదకి యి - క్కడనుండు ననుచు
యేనిన్నుఁ గనుఁగొంటి - నెన్నినాళ్లాయె
తమతండ్రిఁజూచి యో - తల్లియేర్పరపు
ప్రమదంబు తోడనే - భామినియింట
నున్నవాఁడో పోయి - యుర్వీశు మోము
కన్నులుచల్లగాఁ గ - నుఁగొనవలయు
కాకచూపెదెతల్లి - కౌసల్యయింట .
శ్రీకరమూర్తియై - చెలఁగు చున్నాఁడొ 6920
వేగవాకొను"మన్న - విని భరతునకు
నాగుణహీనురా - లప్పు డిట్లనియె.
“అన్ని గార్యంబులు - నటులుండ నీవు
తన్నుఁగన్గొని వేఁడి - తండ్రియటంచు
అడిగెదీ వఖిలజ - నావళి ముదిసి
కడతేరియెట్టి లో - కమున కేఁగుదురు
ఆలోకమున కేఁగె - నవని పాలకుఁడు
కాలమందరికినిఁ - గర్తయౌఁగాదె
తగవున నోడిన - ధరనిండ బ్రదికి
తెగిపోయిననుఁ గల - దే విచారములు 6930
ఉండి యే ననుభవం - బుర్వియేలెడునొ?
గండెచ్చి బిడ్డలఁ - గనిపెంచఁ గలఁడొ?
పగవారి గెలుచునో - పనికిరా నతఁడు?

తెగిననుండిన నొక్క - తీరె చూచినను
కలవు సేయఁగఁబెక్కు - కార్యముల్ మనకు
తెలిపెద శుభము లం - దెడువేళ నీకు
యీవిచారముమాను - మీవంచుఁబలుక
భావించి తనగుండె - భగ్గున నవియ
దిగులుచే మూర్ఛిల్లి - తెలిసి హస్తములు
జగతిపైఁ బుణుకుచు - జాఱఁగన్నీరు 6940
తలయాఁపుచునుఁ బరి - తాపించి మదిని
కలగుచు నలుదిశల్ - కలయంగఁజూచి
కమలారిఁ బాయునా - కాశంబ పోలి
తమతండ్రి లేనట్టి - తల్బంబుఁగాంచి
అతని యాకారంబు - నతనివర్తనము
మతిఁదలంపుచు పలు - మారుఁ బేర్కొనుచు
వెతనొందు భరతుని - వీక్షించి కైక
హీతమతి తాఁజే - రి యిట్లని పలికె.
"నరికిన మ్రానిచం - దమున నేమిటికి
యురక నేలనుఁబడి - యొరలి యేడ్చెదవు? 6950
నినువంటి వానికి - నియతమే యిట్టి
పనిలేనిదుఃఖంబు - పైవేసి కొనఁగ?
మందరాచలముపై - మార్తాండుదీప్తి
చందాననీయచం - చల హృదయమున
గనిపించు దైన్యత - కళయేల మాని
మునుపటి శ్రుతి శీల - ములు మఱచితివె?
మాయన్న వలదు నీ - మదిఖేద" మనిన
నాయమ్మఁ గనుఁగొని - యతఁ డిట్టులనియె,

"శ్రీరాముపట్టాభి - షేకంబుచేసి
కోరికలెల్లఁజే - కూర్చుకొన్నాఁడొ! 6960
హయమేధ రాజసూ - యాదిమయాగ
చయముగావింప దీ - క్ష వహించినాఁడొ!
తడవాయెఁ జూచియి - ద్దఱ నయోధ్యకును
వడిగ రండను కమ్మ - వచ్చు నోమాకు
యెప్పుడు చేరఁబో - యి మహీశు మొగము
తప్పకచూచి సం - తసము నొందుదుమొ?
అని తలంపుచువచ్చి - యమ్మ! యేనెట్లు
విని యోర్తు నీమహీ - విభుఁడు వోవుటకు
యేమిగారణమున మృ - తినొందెరాజు
రామలక్ష్మణుల దౌ - రా! భాగ్యమైన 6970
యిటువంటి తండ్రికి - నిహపరంబులకుఁ
గటకటా! వారలే - కర్తలై మనిరి
రామలక్ష్మణు లుత్త - రక్రియల్ దీర్ప
నేమిటి కేఁ దండ్రి - కిచ్చోట నున్న
యోజింపఁగా నప్ర - యోజకంబయ్యె
నాజన్మ మికనెందు - నావెతల్ దీరు
యేను మ్రొక్కిన నన్ను - నెవ్వారు దిగిచి
చేనిండ కౌగిటఁ - జేర్చుకో గలరు?
ఎవ్వారు నారాక - కెదురులుచూచి
యవ్వేళఁ గనినంత - నాత్మఁ బొంగుదురు? 6980
తండ్రిలేనట్టిచో - దల్లియు గురుఁడుఁ
దండ్రియు నాకు సీ - తావరుం డొకఁడె
ఓయమ్మ! యెచ్చోట - నున్నాడొతెల్పు

మా" యన్న యపుడు ల - క్ష్మణునితో గూడి
చేరి యారాముని - శ్రీపాదయుగము
నూరటగాఁజూచి - యుడుకారువాఁడ
రాజు లేనట్టిచో - రాఘవు చరణ
రాజీవయుగళి చే - రఁగదిక్కు నాకు
యెందుఁజూచిన మరి - యెద్ది మాతండ్రి
జెందిన దురవస్థ - చేనున్న యపుడు 6990
యేమని నాతోడ - నెఱిఁగింపు మనియె?
నోమానవతీ! విని - యూరడిల్లెదను
మఱుగు వెట్టక తెల్పు - మా" యనిపల్క
భరతునిఁ జూచిదాఁ - పక కైకవలికె.
"మీతండ్రి రామ సౌ - మిత్రుల కొఱకు
సీతానిమిత్తంబు - చింతలం జివికి
కాలధర్మమునొందె - గంధసింధురము
కాలయసోరుశృం - ఖలనుఁ బోలి
సద్ధర్మ సత్యపా - శంబులఁ జాల
బద్ధుఁడై యన విని - ప్రాణముల్ గలఁగ 7000
బిమ్మిటిగొని తన - పెంపెల్ల మఱచి
అమ్మరాఘవుఁడేమి - యయ్యె? సౌమిత్రి
యెక్కడికేఁగె? మ - హీ జాతయెట్టి
దిక్కున నున్నది? - తెలుపు” మీవనిన
దిట్టయై కైకయా - త్మీయ వర్తనము
బట్టుచు పట్టియా - పట్టికి ట్లనియె.
“తానుతమ్ముఁడును సీ - తయుఁ గూడియేను
చేనొసంగిన నార - చీరలుగట్టి

అడవులకునుఁ బోయె - నన్న శ్రీరాము
నడవడియును నిజా - న్వయ వర్తనంబు 7010
తనమదినెంచి హి - తంబని పలుకు
జననితో భరతుండు - జాలి నిట్లనియె.
“పరులసొమ్ముల కాస - పడియెనోలేక
పరకాంతలనుఁ బట్టి - బలిమిజేకొనెనొ!
పనిలేక యుడిచె - నో! బ్రాహ్మణశ్రేణి
ధనమెల్ల బ్రహ్మహ - త్య యొనర్చినాఁడొ!
యేమమ్మ! శిశువుల - హింసించువాని
భూమినుండఁగ నీక - పొమ్మనినట్లు
యీరాజు వనముల - కేఁటికిం దరమె?
శ్రీరామచంద్రు నూ - ర్జిత పుణ్య నిధిని 7020
కలతెరంగెల్ల ని - క్కముపల్కు మనిన"
కలుషాత్ము రాలైన - కైక యిట్లనియె
"నీవుపల్కినపాప - నికరంబునందు
నావంతయైన జే - యఁడురఘూద్వహుఁడు
శ్రీరామపట్టాభి - షేకంబుచేసి
ధారుణి యేలింపఁ - దలఁచె మీతండ్రి
అది నే సహింపక - యాత్మలో నీకు
నిది హితమని యెంచి - యెల్లరు మెచ్చ
సీతతో నడవికి - శ్రీరాముఁ బనిచి
మీతండ్రిచే సర్వ - మేదినీ భరము 7030
కై కొంటిఁ బట్టంబుఁ - గట్టెద నిన్ను
నీకునై చలపట్టి - నిర్వహించితిని
పడరాని పాటులం - బడి నాచలంబు

కడతేరె బ్రతికితిఁ - గాయంచు నుండ
నడుమంత్రమునవచ్చి - ననుఁ జిన్నబుచ్చి
చెడుబుద్ధివగుచు నే - డ్చెదు తెకతేర
రామునిఁ బాసియో - ర్వఁగలేకరాజు
భూమిపైఁబడిమృతిఁ - బొందెఁ గావునను
మనయధీనము మహీ - మండలంబెల్ల
మునుపు వసిష్టాది - మునుల యనుజ్ఞ 7040
రాజన్యునకు నుత్త - రక్రియల్ దీర్చి
రాజవు గమ్ము ధ - రా చక్రమునకు”

—: భరతుఁడు కైక నాక్షేపించుట :—


ననిన నచేతనుం - డై కైక మొగముఁ
గనుఁగొని భరతుండు - క్రమ్మరం బలికె.
"రామచంద్రుఁడు దశ - రథుఁడునులేని
భూమియేలు మనంగఁ - బోలునేనన్ను?
నోరువనేర్తునే - యొకపుంటిమీఁద
కారంబువేసిన - గతిదాపమెచ్చె
చెట్టవై కులమెల్లఁ - జెఱపంగనీవు
రట్టుకోరిచి కాళ - రాత్రివైనావు 7050
నరపతి ప్రాణంబు - నకుఁ దెచ్చుకొనియె
నెఱఁగక నినుఁదన - యిల్లాల వనుచు
నీతోడి చెలిమి వ - హ్నినిఁ బడినట్లు
మాతండ్రి కన్యాయ - మరణంబువచ్చె
దశరథుఁజంపి మా - తరము రాజులకు
యశమెల్లఁ బోకార్చి - యార్తిఁజేసితివి

ఏకారణములేని - యీపాపచింత
నీకుఁగల్గగ నేర్చు - నే కాలగతిని?
సతులైన యట్టి కౌ - సల్యా సుమిత్ర
లతిశయపుత్ర శో - కార్తి నొందుదురె! 7060
నిన్నుఁ గౌసల్యగా - నెమ్మదిలోన
నెన్నుమా యన్న కే - యిటువంటిపాటు
కౌసల్య తోఁబుట్టు - గానిన్నుఁజూచు
నాసాధ్వికెట్లు కీ - డాచరించితివి?
ఉత్తమగుణు రాము - నూరక వదలి
చిత్తమొక్కటిచేసి - చెదర కున్నావు
ఏమిఫలంబబ్బె - నిందుచే నీకు
రాముని వెడలించి - రాజ్య మేలుదునె?
అతనిపై నాహృద - యమున విశ్వాస
మతిమాత్రమగుట నీ - వరయవే యపుడు 7070
తల్లి! యెంతటి యన - ర్థంబు చేసితివి!
మెల్ల నేపల్కి సౌ - మిత్రితోఁ గూడి
రాముఁడు లేనట్టి - రాజ్యంబుసేయ
సామాన్యమే నాకు - శక్తి యెక్కడిది?
మేరుశైలమున జ - న్మించిన యడవి
మేరువు గాచిన - మేర రాఘవుని
తేజంబు చేతఁగా - దే దశరథుఁడు
రాజయ్యె నిఖిల ధ - రాచక్రమునకు
బటుమాహాశక్తి సం - పన్నుండౌరాజు
చటులవిక్రమముచే - సంరక్షసేయు 7080

నీ భూమియతి బల - హీనుండనైన
యేభరింపఁగనేర్తు - నే వెఱ్ఱితల్లి!
కాఁ దనియతశక్తి - గలిగెనేనియును
నీదుమాటలు విందు - నే ధాత్రికొఱకు?
అన్న రాజ్యముసేయ - ననుజన్ములతని
మన్నన సేవింప - మాకులక్రమము
యీమేరయెప్పుడు - నిక్ష్వాకువంశ
భూమీశులవనిపైఁ - బుట్టఁబుట్టినది
మీవారు మహినిట్టి - మేర వారొక్క
నీవుగల్గగ లోక - నిందితులైరి 7090
తనప్రాణమున కీవు - దప్పినయట్టి
పనిచేసితివి చల - పట్టి నీకొఱకు
రామునిందెచ్చి యు - ర్వర యేలఁజేతు?
నామహామహుఁగొల్చి - యడుగులొత్తుదును
చిత్తంబురా సేవ - సేయుదుఁ గాంతు
నుత్తమస్థితుల ని - యుర్వీధరముల
సింగంబు గుహను గ - ర్జించినయట్టి
సంగతి శోక రో - షంబులు పెనఁగ

— : భరతుండు కైకను నిందించుట :—


క్రమ్మరంబలికె నో - కైక! లోకైక
సమ్మతు మాయన్న - జానకీరమణు 7100
ప్రాణనాథుని నీవు - పఱచినపాటు
ప్రాణపర్యంతమౌ - పనివచ్చెనాకు
చేరనేర్తువె రాజు - చెంతకు నీవు

ఘోరనారకములఁ - గూలుటగాక
కడుద్రోహి వీఁడు కై - కకుఁ బుట్టినాఁడు
చెడుగని లోకులీ - క్షింతురే నన్ను?
కల్లరివై కన్నుఁ - గాన కెవ్వరిని
తల్లివా? నాపగ - దాయవు గాక
కులఘాతినివి నీదు - కొడుకునుఁగాను
తలఁపకునను - నీవు తల్లివిగావు 7120
కైకయునింటి రా - క్షసివి జన్నించి
నాకుఁ జేసితివి ప్రా - ణమునకుహాని
కౌసల్యతోడ రా - ఘవుఁ బాపినీవు
చేసిన పాపంబు - చెఱపకపోదు
రామచంద్రుఁడు దశ - రథునిమర్యాద
నేమదిఁబూనిన - నీమంబుగాన
నీమోముచూచిన - నిష్కుృతి లేదు
భూమిపైఁ గానని - ప్పుడెమానినాఁడ
దయ్యమువలెఁ నీవు - దరమిన రాము
నియ్యెడఁగౌసల్య - యెడవాయఁగలదె? 7130
మున్నొక్కసురగవి - ముద్దుఁగోడెలను
దున్నుచునొక్కండు - తోలియాడంగ
యెండలోతన బిడ్డ - లీపాటుపడుచు
నుండఁగ సురగవి - యుల్లంబుఁగలఁగ
శోకింప కన్నుల - జొటజొట నశ్రు
లేకడఁదొరగింప - నింద్రుండు జూచి
ఆజలంబు విమాన - యానుఁడౌ నింద్రు
పై జడిగురియ సం - భ్రమమున నతఁడు

ధరణిపై నయ్యంబు - ధారలు చెదరి
తొరుగకయుండ చే - తులయందుఁదాల్చి 7140
యెలకో! యీచింత - యేఁగల్గియనుచు
పేలుపుటావుతో - విబుధేంద్రుఁడనియె.
ఏమిచేసితినీకు - నెవ్వారు నిన్ను
నేమనిపలికి రి - ట్లేల యేడ్చెదవు?
లేదుగదా! భయ - లేశంబునీకు
నాదుపురంబులో - నా కేర్పరింప"
“అన దేవ! సురభి య - య్యమరేంద్రుఁజూచి
తనతనయులపాటు - తగవిన్నవించి
దేవ! నీయాజ్ఞచే - దివిజలోకమున
నేవలనొకభయం - బెఱుఁగ నెన్నడును 7150
సుతుల ఖేదంబునేఁ - జూచి యీరీతి
వెతలనొందెద నన్న - విబుధనాయకుఁడు
అదియుచితంబె కా - యనియూరడించె
నది చాలపుత్రుల - నంది యిట్లైన
కన్నట్టి తనయుఁడొ - క్కఁడు కడ కేఁగ
సన్నుతశీల కౌ - సల్యయెట్లోర్చె?
నీకీడు నినుఁజెందె - నేఁడె నే నేఁగి
శ్రీకరచరితు రా - జీవలోచనుని
సత్యసంకల్పుఁ గౌ - సల్యాకుమారు
సత్యుదారు మనోహ - రాకారు రాము 7160
శరణంబుచొచ్చి పూ - జలు చేసి పిదపఁ
బరలోకవిధులు భూ - పతికాచరించి
తేజంబుగాంతు నే - దెత్తు రాఘవుని

భూజనంబులచేత - పొగడికల్ గందు
నెల్లరు రోసిన - యీబ్రదు కేల?
చెల్లదు నీకు నీ - క్షితి మేనుఁదాల్ప?
నడవికిజనుము కా - రగ్గిలోఁజనుము
జడనిధింబడుము వ - షంబైన కొనుము
నురిబెట్టుకొను మాయు - ధోరుఘాతమునఁ
దెరలుము నూతిలోఁ - ద్రెళ్లుము నాల్క 7170
వెఱుకుకొమ్మిఁక గొంతు - విసుకుక చావు
మురకకూడును నీరు - నుడిగి నశింపు
పడుముర్వినీమేడ - పైబొడువెక్కి
గడియలొన నపకీర్తి - కడతేర్చుకొనుము
గతివేఱె నీకెద్ది? - కాకుస్థ తిలకు
క్షితినెల్ల నే నభి - షిక్తుఁ జేసెదను
పాపపుఁ గన్నులఁ - బట్టాభిరాముఁ
జూపోపలే కొకిం - చుక దాళితేని”
అనియోదమునఁ జిక్కు - నట్టి మత్తేభ
మనభరతుండు డో - లాలోల మతిని 7180
జగతిపై నింద్రధ్వ - జంబుత్సవాంత
మగునెడఁ బడియెనో - యని పురుణింప
కెంజాయ చూడ్కితోఁ - గేశముల్ విరియ
మంజు కుంకుమము చె - మ్మటలచేఁ గరఁగ
చెదరి భూషణమణి - శ్రేణి రాలంగ
వదలి కట్టినయట్టి - వలువమైఁజాఱ
సిగపువ్వు టెత్తులు - చెదర లేనవ్వు
మొగము మిక్కిలివాడ - మూర్ఛిల్లినట్టు

లవనిపైఁ బొరలాడి - "హారామ! రామ!
రవివంశనిధి! ప్రోవ - రావే" యటంచు 7190
నన్న యీపదముల - యాన యీకార్య
మెన్నడు కలనైన - నెఱుఁగనే ననుచు
నీమందభాగ్యకు - నేఁబుట్టి నపుడె
యేమని నీదుమో - మీక్షింతు ననుచు
నీచిత్తమఱయక - నేనొక్క తెంపు
చూచి ప్రవర్తింప - చొప్పడ దనుచు
నడలుచున్నెడ సుమం - త్రాదులు హితులు
తడయ కానగరికి - తనరాకదెలిసి
వచ్చినవారల - వదనముల్ చూచి
యచ్చోటఁదగిన మ - ర్యాద సంధించి 7200
కనుఁగొల్కు లను జల - కణములురాల
మనసులో భరతుఁ డు - మ్మలికించి పలికె.

—: భరత శత్రుఘ్నులు కౌసల్యనుఁ జూడఁబోవుట :—


"ఎఱిఁగిన వాఁడఁగా - నీకైక తలఁపు
ధరణిపై యాస యిం - తయు నాకులేదు
నామేనమామ యిం - టను వీరుననుప
సామవైఖరి నుండి - శత్రుఘ్నుఁగూడి
యీరాము వనవాస - మెఱుఁగ నేమియును
చేరుదులక్ష్మణ - సీతలరీతి
వనభూములను రఘు - వర్యునిచెంత
తనకు నప్పుడుగాని - తలగదుచింత" 7210
అనువేళ పరిచారి - కావళి వలన

వినిభరతునిరాక - వెలఁదికౌసల్య
తనచెంగటికి సుమం - త్రని చేరఁబిలిచి
కనలేక పుత్రశోక - మున నిట్లనియె.
"వచ్చెఁగదమ్మ జ - వ్వని కైకకొడుకు
ముచ్చటల్ దీరె రా - ముని మారునాకు
యింతమాత్రము భాగ్య - మేనియుఁగల్గె
చెంతకుఁబోయి - చూచెద వెంటరమ్ము
యెరీతినున్నాఁడొ - యేమందు చెలియ!
మారాము నెడవాసి - మనలేఁడువాఁడు” 7220
అని మాగధినిఁగూడి - యపుడ కైకేయి
కనకరత్న గృహంబు - కౌసల్యచొచ్చి
తనకా సుమిత్ర కై - దండయొసంగ
తనచాయగా రాగ - తల్లులంజూచి
తమ్ముండుదాని న - త్తరి నెదురేఁగి
యమ్మలయిరువురి - యడుగులవ్రాలి
శోకింప నెప్పుడు - చూచెనోభరతు
వాకొనరాని య - వస్థల మునిఁగి
అవనిపైఁబడి మూర్ఛ - నంది వే తెలిసి
చివురాకు చేతుల - చేఁజేరఁ దిగిచి 7230
భరతుఁ గౌఁగిటఁ జేర్చి - భక్తిఁగౌసల్య
కరుణ నెమ్మదిడాఁచి - కలుషించి పలికె.
"కలఁగనేల? కుమార! - కైకేయివలన
నలరు మకంటక - మైనరాజ్యంబు
నీకుఁగట్టడచేసె - నీతల్లిగాన
చేకొమ్ము పట్టాభి - షేక సంభ్రమము

తల్లిని బోధించి - తనకుమారకుని
వెళ్లనంపితి మున్నె - విపిన భూములకు
కైకేయి పనుపున - గహనంబునందు
నాకుమారుని చెంత - నను డించిరమ్ము 7240
రాజన్నవాఁడ నీ - రాముండునన్ను
నీజాడవిడనాడి - యేఁగెఁ గానలకు
యింక నెవ్వరిదాన - నిచ్చోటనుండి
సంకెళల్ వీడ భూ - జానిపోవుటను
కాదన్న యేను మా - గధియునుఁగూడి
యీదశరథువెంట - నేఁగువారలము
లేక మీతల్లికి - లెంకలమగుచు
మాకేలయుండ - మీ మనసటమీఁద”
అన విని భయముతో - నాసాధ్విపాద
వనరుహంబులమీద - వ్రాలియిట్లనియె. 7250

—: భరతఁడు శపధములు చేయుట :—


"పావనశీల! యే - పాపంబు మదిని
భావింపనేరని - పట్టినింబట్టి
యింత నిందింతురే - యెఱుఁగవే నాదు
స్వాంతంబురామ వ - శంవర్తి నేను
అక్కటా! శ్రీరాము - నడవుల కనుప
నుక్కుగుండియ వాడు - నోపునే తలఁప?
యెవ్వడింతకు దెగి - యిన్నియుం జేసె
దవ్వువానికి యశో - ధర్మ సద్గతులు

యిదినేఁ దలంచిన - నినమండలంబు
నెదిరి చూడకనిష్ఠుఁ - డేఁగెడు గతికి 7260
నిదురించు నావుఁ ద - న్నిన వానిగతికి
బెదరించి విప్రుఁ జం - పిన వానిగతికి
కొలిచిన వారల - కొలువు పాటెఱిఁగి
అలరించి జీత మి - య్యని వానిగతికి
ధరణియేలుచుఁ బ్రజఁ - దగినట్టి జాడ
నరసి ప్రోవఁగ లేని - యతఁడేగుఁ గతికి
యాగంబు లొనరించు - నపుడు దక్షిణల
చాగమియ్యని వాఁడు - చనియెడు గతికి
భీతిచే ననిలోన - బెదరెడు పాఱుఁ
బోతు బంట్రౌతులు - వోయెడు గతికి 7270
హితమతి నిగమంబు - లెల్లనుం జదివి
మతి లేక మఱచు దు - ర్మతి పోవు గతికి
నైవేద్య మిడక య - న్నము భక్షములును
తా వేడ్క మెసవు పా - తకు లేఁగుగతికి
సజ్జనులగు వారిఁ - జవుకగా నెంచి
రజ్జులు వల్కి దు - ర్జనుఁడేగుగతికి
ధారణీసురలను - తన దైవమనుచుఁ
గోరికొల్వని పాత - కులు గూలుగతికి
కేరడంబులు వల్కి - గేలి సేయుచును
సూరుల నెంచు కిం - చులు వోవుగతికి 7280
నెఱుఁగని యర్థంబు - లెఱిగిన యల్ల
బరవకూఁతలు గూయు - పలవలగతికి

నొరుల మేలునకు జూ - పోపకవారిఁ
జెఱపఁ జూచినవాఁడు - చెడిపోవుగతికి
కండకావరమున - గర్వించి నగర
గొండియంబులు నల్కు - కూళలగతికి
ఐనయర్థంబు కా - దనియీసు వెనిచి
లేని కార్యములు వ - ల్కెడు వానిగతికి
నొరులుచేసిన మేల్మి - యుల్లంబులోన
మఱచి కీడాడు దు - ర్మతి వోవుగతికి 7290
బహుజన ద్వేషులై - బ్రతుకుల కొఱకు
తహతహ మెలఁగు పా - తకు లేఁగుగతికి
గుణములన్నియుఁ ద్రోచి - కొంచెపు తప్పు
గణుతించి తెగడు ము - ష్కరుఁ డేఁగుగతికి
కలిగియుండియుఁ జాల - కష్ఠుఁడై దాఁచి
బలిభిక్షములు మాను - పాపాత్ము గతికి
తీసిన ఋణము తా - దిద్దక యొరుల
మోసపుచ్చిన దురా - త్ముఁడు వోవుగతికి
నన్యుల దూపించి - యాత్మప్రశంస
లన్యాయముగఁ జేయు - నధముల గతికి 7300
తనపుణ్యఫలమైన - తనయులు లేక
వెనక చింతింపని - వీఱిఁడి గతికి
నాలుబిడ్డలు మాని - యటు తన కడుపు
చాల పోషించు దు - ర్జనుఁ డేఁగుగతికి
ప్రత్యేక శాకాన్న - పాకముల్ బంతి
నిత్యంబు భుజియించు - నిర్భాగ్యుగతికి
తగవులో పక్ష పా - తంబుగాఁ బల్కి
మొగమాట పడునట్టి - మూర్ఖుల గతికి

పరకామినీ ద్రవ్య - పరతంత్రు లగుచు
గరివించి మెలఁగు త - స్కరు లేగుగతికి 7310
పితృకర్మముల యందుఁ - బ్రీతి విశ్వాస
మితవును లేనివాఁ - డేఁ గెడుగతికి
ఆలినొల్లక వెల - యాలి కిందగిలి
జాలిపుట్టి చరించు - చండాలుగతికి
యింతుల నందరి - యేక భావమున
వంతుకు నడపని - వాఁడేగుగతికి
నెలఁతల రాజుల ని - సువుల ద్విజులఁ
బొలియుంచు ఘోరపా - పులు వోవుగతికి
మధుమాంసలవణ సా - మగ్రి యమ్మించి
యధమ జీవనుఁడైన - యతఁ డేగుఁగతికి 7320
తనవంశ ధర్మంబు - దప్పి యన్యమున
మనసొగ్గి నడచు దు - ర్మతి వోవుగతికి
వెఱచిపారెడు వాని - విడువక సమర
ధరణిలోఁ జంప పా - తకుఁ డేగుగతికి
జీవహింసలు తెగి - సేయుచు మేని
కావరంబున నుండు - కలుషాత్ముగతికి
రసనకు సత్యంబు - రానీక యపుడు
వ్యసన పరుండైన - వాఁడేఁగుగతికి
నుచిత వ్రయముసేయ - నోపక కాని
యచటవెచ్చము సేయు - నల్పులగతికి 7330
నుభయసంధ్యల నిద్ర - లుడుగక వీత
శుభకర్ములైన నీ - చులు వోవుగతికి
దాఁచఁ బెట్టినయట్టి - ధనము లేదనుచు

నేఁచిబాసలు సేయు - హీనులుగతికి
నొరులకు హానిరా - నూరక యుండి
యెఱిఁగి తెల్పని యల్పు - లేఁగెడుగతికి
దేవాలయ క్షేత్ర - తీర్థ దూషణము
గావింపు చున్నట్టి - కలుషాత్ముగతికి
జగతి నభక్ష్యభ - క్ష్యములు చూడకయె
తెగి రుచుల్ గొనునాఁడు - తెగిపోవుగతికి 7340
కుమతియై గృహదాహ - కుఁడు వోవుగతికి
నమరగేహంబుల - యధికారిగతికి
ఋతుకాలముల యందు - నింతులఁ గూడి
రతిలేని దుష్కర్మ - రతుఁడేఁగుగతికి
మందుల మాయల - మగువలఁ జెఱిచి
పొంది రమించు న - ల్పులువోవుగతికి
నమ్మియేలిన రాజు - నడిపిన నతని
సొమ్మువంచన సేయు - క్షుద్రుని గతికి
కొడుకుల నిల్లాలిఁ - గోపించి తరమి
కడుపుపెంచుచునున్న - కష్టుని గతికి 7350
అర్థులు వేఁడిన - నాసలఁ బెట్టి
వ్యర్థంబుగాఁ ద్రిప్పు - నధముని గతికి
జలములు నన్నంబు - చాల నిందించి
పలవకూతలు గూయు - పాపాత్ము గతికి
తససీమలో వారి - దండుగల్ వట్టి
ధనములార్జించు పా - తకుఁ డేఁగుగతికి
లేఁగ దూడలకు పా - ల్విడువక కట్టి
యాగోఁదలనుఁ బిండు - నతఁ డేఁగుగతికి

నీరాన్నముల చేత - నెవ్వ లొక్కరికి
దీరుపని ఖిలుండు - త్రెళ్లెడి గతికి 7360
గరళ మన్నంబులోఁ - గలయించి యొకరిc
జెఱపఁ జూచినద్రోహి - చేరెడుగతికి
వాలాయముగ నేఁగు - వాఁడనో యమ్మ
ఏల నన్నీ మాట - లిపుడు వల్కితివి?"
అని శోకపరవశ - యైన కౌసల్య
గని భరతుఁడు పల్కి - కన్నీరురాల
పుడమిపై బొరలు న - ప్పుడు రాముజనని
యడలుచు మరల నా - యనఁ జూచిపలికె
"అన్నయీ శపథంబు - లాడంగనేల?
నిన్ను నేనెఱుఁగ - నే? నేఁడు నామనసు 7370
సురసుర నీసుత - శోకాగ్నిఁ గమలి
మరగు చున్నదిగాన - మరి తాళలేక
ఆడితి సైరింపు - మనుచు నూరార్చి
నేఁడు నాప్రాణముల్ - నిలిపితి వీవు
రాముని నెనయు - రణమునఁ జేసి
నీమది చలియింప - నేర దెన్నటికి
అల లక్ష్మణునిఁ బోలి - యలఘు కల్యాణ
విలసన శ్రీలచే - వెలయుదు గాక"
అని భరతుని తన - యంకపాళికను
తనయ వాత్సల్యంబు - దళుకొత్త నుంచి 7380
తల్లియు కొడుకు నెం - తయు ప్రొద్దుజూచి
యెల్లరు శోకింప - నేడ్చి కౌఁగింటఁ
గలయంగ శత్రుఘ్నుఁ - గదియించి ముగురు

విలపించు నంతట - వేగు జామయ్యె.
తెలవాఱుటయును మం - త్రి యుతంబు గాఁగ
నలరువసిష్ఠ మ - హామౌని వచ్చి
భావికార్య విచార - పరతచే భరతు
నా వేళ వీక్షించి - యతని కిట్లనియె.

—: భరతుండు తండ్రికి సంస్కారముచేయుట :—


"చాలింపు మింక వి - చారంబు తండ్రి
మేలెంచి తీర్పుము - మీది కార్యములు 7390
కలిగియున్నవి పెక్కు - కార్యము ల్మీఁద
కలఁగకు మన" విని - కాకుస్థకులుఁడు
గురునియానతి నూన - కొప్పెరలోని
ధరణీశుఁ దెప్పించి - తానమాడించి
నవరత్న సింహాస - నంబుపై నుంచి
వివిధకాంచన వస్త్ర - వితతి గట్టించి
సొరదియై బోగపు - సొమ్ములన్నియును
వరసతోఁ దెప్పించి - వానగైసేసి
కుండల మాణిక్య - కోటీర దివ్య
మండనంబు లమర్చి - మనుజేశుఁ జూచి 7400
"అయ్య! యీయానతి - యౌదల నుంచి
చయ్యన మాతుల - సదనంబుఁ జేరి
తడవుంటి నని మదిఁ - దలంచియో నన్ను
కడకంటఁ జూడవు - కన్నులు దెఱచి
రామునిఁ బాసి తీ - రని చింతనున్న
భూమీజను లడంచి - పో నీకుఁ జనునె?

నీ కుమారుండును - నీవును లేక
యేకైవడి శుభంబు - లెనయు నీపురము
మామేనమామ సే - మము వేఁడిమీకు
కామించి పనుపు కా - న్కలు చూడవేల? 7410
కష్టాత్మయైన కై - కకు వీడు కొడుకు
దుష్టాత్ముఁడని కడం - ద్రోచి పోయెదవొ
తల్లిని మతియించి - దండ కాటవికి
చెల్లరె రాముఁ బం - చిన ద్రోహియనియొ
పుడమిపై నేడ్చుచుఁ - బొరలు సుమిత్ర
కొడుకునై ననుఁ బేరు - కొని పిల్వ వేల?
వాఁడేమిచేసె భూ - వర! రామచంద్రుఁ
డేడి తానేల మి - మ్మెడ బాసిచనియె?
ధైర్య గాంభీర్య స - త్య పరాక్రమాది
చర్యలన్నియు నెందు - సడలె నీకిపుడు? 7420
లోకముల్ గెలువఁ జా - లుదువు నీవిట్టి
కైకమాయలు గెల్వఁ - గా నేరవైతి
పతిప్రాపు సుతుప్రోవుఁ - బాసి కౌసల్య
వెతల నెవ్వరియాస - వేగించు నింక?
యిదిబుద్ధియని యాన - తీవయ్య తండ్రి!
యది యాచరించెద - నర సేయనేల
పోవుదునో వనం - బుల కన్న వెంట
మీవెంట వత్తునో - మీరు గన్నట్టి
తనయునకుం గల - దా యసత్యంబు?
పనిగొమ్ము సేతునీ - పదముల యాన" 7430

అని ధూళిధూసరి - తాంగుఁడై పొరలు
మనువంశనిధిఁ జేరి - మంత్రులు వినఁగ
ఆ వసిష్ఠుఁడు వల్కె - "నవనిపాలునకు
గావింపు ముత్తర - కర్మంబు లిపుడు"
అనునంత ఋత్విజు - లగ్నులన్నియును
గొనితేరఁ బరిచారి - కులు దశరథుని
పల్లకిలో నుంచి - బహుతూర్యరవము
లుల్లసిల్ల మహీశు - లోలగింపంగ
చతురంగ బలములు - సందడి సేయ
హితమతి మును గల్గ - నేఁగుచో వెంట 7440
మగువలు హేమచా - మరములు వీవ
పొగడుచు భటులు గుం - పులుగూడి నడవ
రాజుపల్లకి వెంట - రాజీవముఖులు
లాజలు నాగద - ళంబులుఁ జల్ల
ఆసించు వారలు - యడిగిన యట్ల
వాసో విభూషణ - వ్రజ కనకములు
ఆవుల కదుపులు - నధికారి జనులు
రావించి వెదచల్ల - రాజమార్గమున
భరతుండు వెంబడి - బాంధవుల్ హితులు
దొరలు రా కాల్నడ - తో నశ్రులొలుక 7450
జారిన కేశపా - శంబుల తోడ
తారిన మేనితో - తమ్ముండు దాను
పోవుచుండఁగ నంతి - పురినుండి వెడలి
దేవేరులందరు - దిడ్లతో నమరు
చతురంత యాన పం - చాదశత్రితయ

శతములలో వెంటఁ - జను దేరవారు
రాజన్యుఁ బురి యుత్త - ర ద్వార సరణి
భూజనుల్ పొక్క న - ప్పుడు గొనిపోయి
సరయూనది ప్రాంత - సైకత క్షోణి
నిరవు కొల్పినయంత – ఋత్విజు లెల్ల 7460
చందనాగరు మహి - సాక్షి కర్పూర
కందళ గుగ్గులు - కస్తూరి కాది
మహితచితా కాష్ఠ - మధ్యంబునందు
మహిపాలు నునిచి స - మస్త భూసురలు
నిగమముల్ పఠియింప - నెలఁత లందరును
జగతీశుచుట్టు క్రౌం - చ స్వరంబులును
రోదనం బొనరింప - రోహణా చలము
పై దవానలములు - బలసిన యట్లు
భరతాచరిత బృహ - ద్భాను కృత్యంబు
వరమంత్రయుతముగా - వర్తిల్లె నంత. 7470

—: భరతుండు శ్రాద్ధములుఁ జేయుట :—


సరయు మహానదీ - స్నానంబు చేసి
భరతుండు దానముల్ - పౌరుల కిచ్చి
అందరతో నయో - ధ్యా పట్టణంబు
నందుఁ బ్రవేశించి - యటు తరవాత
సూతక దినములు - సోఁకోర్చి తగిన
రీతిఁ గ్రమించి యా - రేయి వేగుటయు
ధేనుప్రదాన ధాత్రీ - దాన కనక
దాన కన్యావస్త్ర - దాన మాణిక్య

దాన దాసీ - దాన దానగజాశ్వ
దాన నానామహా - దానముల్ చేసి 7480
భరతుండు తండ్రికి - పరలోక విధులు
పరిపాటి నొనరించి - బాంధ వావళియు
హితులు మంత్రులుఁబురో - హితులును వెంట
జతగూడి నృపతిసం - స్కారాది యైన
పదియు మూఁడవనాడు - భరతుఁ డిల్వెడలి
నది కేఁగి చితశోధ - నంబు గావించి
జనకు నుద్దేశించి - చాల శోకమున
మనసులోఁ గుందుచు - మమత నిట్లనియె,
"రాజేంద్ర! వనులకు - రాఘవుం డరిగె
నీజాడ దివమున - కేఁగితి నీవు 7490
మీరు లేని యయోధ్య - మిన్నక యెట్లు
చేరెడువాఁడ? వ - ర్జింపుదుఁ గాక!
సుతు నెడవాసిన - చోటఁగౌసల్య
వెతనొంద నెక్కడ - విడిచి పోయితివి?
మాకేది దిక్క" ని - మరియు వాపోవ
నాకడ కడ నమా - త్య శ్రేణిచేరి
మునులు యయాతిని - మూగు కున్నట్లు
యినవంశమణికి వా - రెల్ల వైరాగ్య
కారణ కథనముల్ - కనుపింపనొక్క
మేర శత్రుఘ్నుండు - మేదినివ్రాలి 7500
హాతండ్రి! యెచ్చటి - కరిగితివీవు
నీతమే నీయంత - నృపతికి పాటు!

మందరచేత స - మగ్రమై పుట్టి
యందుఁ గైకేయీ మ - హా జలగ్రహము
చరియించు నీశోక - జలరాశిలోన
తరణి వంశంబురి - త్తకు రిత్తమునిఁగె
నీలాలనకుఁదగు - నీలాలకోరు
బాలచంద్ర విభాసి - ఫాలునిభరతు
నెవ్వరిచేతికి - నిచ్చి పోయితివి?
యెవ్వ రున్నారు మా - కిటమీఁద దిక్కు? 7510
భోజన మజ్జన - భూషణాంబరము
లోజనక! యెఱింగి - యొరు లొసంగుదురె?
మముఁజేరఁ బిలిచి స - మ్మతితో నొసంగ
తమతండ్రి యే - తండ్రి ధరణికినెల్ల
నెప్పుడు ధాత్రిని నీ - నెడవాసి పోయి
తప్పుడ రెండు వ్ర - య్యలుగాక యురక
కుదురయి యున్నచో - క్షోణికై యజుఁడు
తుదిగన్న నాఁడు నెం - దునుఁ జేటులేదు
యేను నయోధ్యకు - నేల పోవుదును?
మౌని వేషమునఁ గ్రు - మ్మరుదుఁ గానలను" 7520
అనియిట్లు శోకించు - నక్కుమారకులఁ
గనియెల్ల వారలు - కటకటం బడఁగ
తేరిచూచి యరుంధ - తీ ప్రాణవిభుఁడు
చేరి యాభరతుని - చేఁ జేతఁ దిగిచి
యిలమీఁద వసియింప - నిడియిట్లు పలికె
“కలఁగుదు రయ్య! యీ - గతి ధైర్యవిధులు

—: వసిష్ఠుండు భరతునకుఁ బోధించుట :—

నినువంటి సుతులు - మానిత పుణ్యుఁడైన
జనపాలకునిఁ బోలు - జనకులుం గలరె?
కావించితివి పితృ - కర్మంబు విమల
భావంబుతోఁ బూని - పదుమూఁడు నాళ్లు 7530
నీచేతతండ్రి వ - న్నియగాంచె వేల్పు
రాచవారలలో పు - రందరు వీట
సకల జీవులకును - సాధారణములు
ప్రకట భోజనబుద్ధి - పానీయ వాంఛ
మోహంటు శోకంబు - ముదిమియుఁ జావు
దేహధారులకు సం - దేహ మేమిటికి?
యింతయు నెఱింగియు - నింత విచార
మెంత యేనియుఁ - జేయనేటికి? రమ్ము"
అనిపలుక సుమంత్రుఁ - డపుడు శత్రుఘ్ను
ననుపయాలాపంబు - లాడి యూరార్చి 7540
ఆకొమారకుల నొ - య్యన బుజ్జగించి
సాకేతమున కేఁగ - సమకట్టు నపుడు
భరతుఁడు వనికేఁగ - పైనమై యుండు
తరిగాంచి యతనితో - తమ్ముఁడిట్లనియె,

—: శతృఘ్నుండు మందరను శిక్షించుట :—


“నోయన్న! మనయింట - నొకనాఁడు లేని
నాయంబు నడపించి - నాఁడు రాఘవుఁడు
కంటివే తండ్రి మా - ర్గముచూచి యేము
వెంటఁ గూర్చుక పోయె - వెలఁది గానలకు

ఆలిమాటలు విని - యవుఁగాము లెన్న
కేలలొంగెనొ తన - కిది చెల్లు బడియె? 7550
యింతటి గుణశాలి - యిటులైన చోట
నింతుల గెలుచు వా - రెవ్వ రున్నారు?
తానైన మన సుమి - త్రా కుమారకుఁడు
మానవనాథుని - మతి చలియించె
నెంత లేదనినిగ్ర - హించి శ్రీరాము
చెంతనుండిన వాఁడు - చెడకుండ కులము
కైకయెన్నికె మాన్పఁ - గా నోపఁడయ్యె
నీకుఁదీరదు తెచ్చి - నిలుపక యున్న"
అనిమాట లాడుచో - నల వసిష్ఠాది
మునులు మంత్రులునుఁ గ - మ్ముక వారివెనక 7560
పొదివెట్టుకొని వచ్చి - పురములోఁ జొచ్చి
యెదురై న దొరలంత - నింతఁ గేల్ మొగుప
నగరి తూరుపు దివా - ణంబు వాకిటను
జగతీశ సుతులేఁగు - సమయంబు నందు
"యింతకార్యము నిర్వ - హించిన నన్ను
యెంతమెచ్చునొ కదే - యిఁక భరతుండు
ఆతని యభిషేక - యత్నంబు చేరి
చూతునే నని" మున్నె - చొరఁ బారి నగరు
కైకయిచ్చిన యన - ర్ఘ విభూషణములు
కోకలుఁ గైచేసి - గునుకు లేనడను 7570
పెనుగొలుసునఁ జిక్కు - పెంపుడుఁ గొంతి
యనువున గలగల - నందెలు మొఱయఁ
గైకయింటికిఁ బోవఁ - గని యందు నున్న

వాకిటి కావళ్ల - వా రరికట్టి
దానిఁ బట్టుక తెచ్చు - తరిమహారాజ
నూను లచ్చటికి రాఁ - జూపరమెచ్చ
గొల్లలు శత్రుఘ్నుఁ - గోపంబు రేఁచి
“యెల్ల కార్యములకు - హేతువీ జంత
రాముఁ గానలకంపి - రాజన్యుఁ జంపి
సీమవారినిఁ జెఱ - చి” నదిది యనుచు 7580
చూపిన మీరలు - చూడంగ నిపుడె
ఆ పాపములకు బ్రా - యశ్చిత్త మేను
చేసెద" నని తన - చేఁ గొప్పువట్టి
తీసిధారుణిఁ బడ - ద్రెళ్లఁగ నీడ్చి
యేనుఁగ యనకాల - నిడి నేల రాచి
గూనుబోరయుఁ దన్ని - గులగులల్ చేసి
యిలమీఁదఁ బొరలింప - నేడ్చుచోదాని
యెలుఁ గాలకించి స - హింపంగ లేక
కైకేయి మదినోర్వఁ - గా లేకయింటి
వాకిలి వెలువడి - వచ్చి మందరకు 7590
నడ్డంబు వచ్చిన - నదిలించి చూచి
అడ్డియంతయుఁ దీరె - నైనట్టు లయ్యె
వేగ రమ్మను మాట - విని భీతినొంది
వేగంబె భరతుని - వెనుకకు జాఱ
నాపుణ్యనిధివల - దన్న! శత్రుఘ్న!
పాపంబు వచ్చు చం - పకు మాటదాని
నేనుచంపఁగ నేర - నే? కైక బట్టి
పూనిచేసిన ద్రోహ - మున కోర్వఁగలనె?

కన్నతల్లినిఁ జంపె - కలుషాత్ముఁ డనుచు
నన్నుఁ జూడఁడు మహి - నందనాప్రియుఁడు 7600
దాసి పొమ్మిది యని - దండించి తేని
వాసియుఁ బోవు - స్త్రీవధ మాచరించి
వీడని నీమోము - వీక్షింపఁ డొక్క
నాఁడును దశరథ - నందనోత్తముఁడు
రాముని కొఱకు వీ - రలదెగఁ జూడ
నేమిటి కెటువోయి - రేమి పోనిమ్ము”
అనవిని శత్రుఘ్నుఁ - డగుఁ గాకయనుచు
దన చేతి ఘాతల - ధరణిపైఁ ద్రెళ్ళి
తనమేని సొమ్ముల - ధరణి తలంబు
మినుకుఁ జుక్కలతోడి - మింటితో నెనయ 7610
బుసకొట్టు మందరఁ - బొమ్మని వదల
బసువెద్దునుం బోలి - బడిదొత్తు లెల్ల
తమునేలి నట్టి మం - దరఁ బట్టినపుడె
తమకేది దిక్కని - తమకించి పఱచి
కౌసల్య పదములు - గని శరణొంద
నాసాధ్వికని పోవ - నమ్మందరయును
కైక చెంగటఁ బడి - కన్నీరు రాల
శోకించుటయు దానిఁ - జూచి యవ్వెలఁది
సమ్మతపడఁ బల్కి - సదనంబు చేరి
నిమ్మకాయలును నూ - నెయు దానికిచ్చి 7620
అణఁకువతో నుండ - నక్కుమారకులు
కణఁక శోభనకర్మ - కలితులై రంత.

—: భరతుఁడు రామునియొద్దకుబోవ మార్గమును చక్కంజేయ నాజ్ఞాపించుట :—

మఱునాడు మౌనులు - మంత్రులుఁ గూడి
"భరతునిం జేరి - యోపావన చరిత!
రాజులేనట్టి యీ - రాజ్యంబు చూడ
రాజులేనట్టి యీ - రాత్రియ వోలె
మనుజులు మంత్రుల - మాటలువినక
తనతన యిచ్చగాఁ - దలఁచిన యట్లు
మెలఁగ నూరకయుండ - మేరయే రాజు
పొలిసి రాముఁడు వనం - బులను నేఁగుటను 7630
"అయ్య! నీవురకున్న - నవనికి నెల్ల
నయ్యె నవాంతరం - బట్లుండ రాదు
గ్రక్కున పట్టంబు - గట్టుకొమ్మీవు
దిక్కయి నిలుపు ధా - త్రీ జనావళికి
యివె యగ్రతోయ స - మేత కుంభంబు
లివె ఛత్రచామరరా - నేక వాద్యములు
మంగళ ద్రవ్య సా - మగ్రినీక్షింప
సింగపు గద్దె యుం - చితి మజారమున
వినియోగముల వారు - వేర్వేర వచ్చి
పనిపూని యున్నారు - పార్వ భాగముల 7640
లేచిరమ్మన ముకు - ళీ కృత హస్తుడై
చామరాది చి - హ్నములకు మ్రొక్కి
పరిపూర్ణ కనక కుం - భ ప్రదక్షణముఁ
దిరిగి మంత్రులం జూచి - ధీరుఁడై పలికె,
“యీ మాటలాడు దు - రే? రఘువంశ

భూమీశ్వరుల శీల - ములు వినలేదె?
అన్నయుండఁగ తమ్ముఁ - డందునే రాజ్య
మిన్నినాళ్లకు వింటి - మీ వింతనేఁడు
యెప్పుడుఁ గలవార - లిందరు మాకు
నిప్పుడు గానెవ్వ - రున్నారుక్రొత్త 7650
పట్టంబు గట్టుఁడు - పట్టి కౌసల్య
పట్టినే నుండెద - పదునాలు గేండ్లు
కానలయందు రా - ఘవు మాఱుగాఁగ
సేనలం బయనంబు - సేసుక రండు
మంత్ర పూతంబుగా - మంగళ ద్రవ్య
సంత్రాణ మొనరించి - చనుదెండు వెంట
మనమందరము బోయి - మరలఁ బ్రార్థించి
జనకజా జానిన - చ్చటనె పట్టంబు
కట్టి శాలాంతర - గతుఁడైన వహ్ని
నెట్టుకతెచ్చిన - నేర్పు సంధిల్ల 7660
తెత్త మయోధ్య కా - దీన మందారు
నిత్తము కాదన్న - నీ శరీరములు
మనుజుల నంపించి - మార్గ మధ్యమున
వనములు నరకిద్రో - వలు చక్కఁ జేసి
చలిపందిరులు జలా - శయము లేర్పఱచి
నిలుకడ విడుదు ల - న్నియు జోకపఱచి
తెరలు గుడారు లె - త్తించి సరాతు
లిరవుగాఁ గట్టించి - యేముఁ దల్లులును
పరిచారకులును రాఁ - బల్లకీల్జోక
పఱపించి కొల్లారు - బండ్లు దెప్పించి 7670

చతురంగ బలములు - సాగించి తగిన
యతనంబు గావింపుఁ - డని పల్కుటయును
ఆ సుమంత్ర ప్రము - ఖామాత్య వరులు
రాసుతుంగని క్రమ్మ - రఁగ నిట్టులనిరి.

—: వన మార్గమున జక్క బఱచుట :—


“నిన్నుఁ జేరినయట్టి - నిఖిల రాజ్యంబు
నన్నకు నేనిత్తు - నని పల్కినపుడె
జగతినెంతటి భాగ్య - శాలివి నీవు
తగునీకు శుభము లం - దంగఁ జాలుదీవు
పొందు నిందిర - నిన్ను పుణ్యాత్మ" యనిన
అందర మధురోక్తు - లతఁ డాలకించి 7680
నయనాంబుజంబు లా - నందాశ్రు లీన
బయనమై యున్నచోఁ - బనుల వారెల్ల
అయ్య! సర్వంబు నే - డాయత్త మయ్యె
నయ్యడవులు దీర్ప - నైన శిల్పులను
పనిచితి మవివారు - పలుకు నవ్వేళ
వనమార్గములు దీర్ప - వచ్చినవారు
పారలు నుప్పర - పారలు గడ్డ
పారలు చెక్కుడు - పారలు మడ్పు
గత్తులు గొడ్డండ్లు - కర్ణెలుం గొలిమి
తిత్తులు దన్నీరు - తిత్తులు కరకు 7690
కొడవండ్లు నెడ్లును - గోనెలుఁ దాటి
గుడము సున్నంబు సం - కులుఁ గావిరాళ్లు
పంచవర్ణ ద్రవ్య - భాండముల్ నీరు

మంచముల్ నిచ్చెనల్ - మ్రాకుల బండ్లు
చించపు రేకులు - చింతయంబళ్లు
పెంచులు నిటికలు - బేర్పులు నూనె
లగపలు కణికలు - నావులు రెట్లు
నగరి బొక్కిసము గు - న్నాపట్ట కరక
కాయలు పంచాణి - కపుఁబనిముట్లు
చాయల వస్తువుల్ - జల్లులు మేలు 7700
కట్టులు శుకశారి - కాపంజరములు
పట్టెమంచంబులు - పఱపులు దివియ
గంబముల్ వెండి - బంగరు కొప్పెరలును
కంబళ్లు మెరుగులు - గాజుఁ గుండలును
మొదలైన సాధనం - బులు బరువులును
సదలంబు ముందర - సాగించు నపుడు
చెట్టులు గొట్టి ప - చ్చికలు చెక్కించి
మిట్టపల్లము లొక్క - మేరగాఁ జేసి
బావులు ద్రవ్వించి - పందిళ్లు వేసి
త్రోవచక్కఁగఁ జేసి - తోపు లూడ్పించి 7710
కలయంగ గంగోద - కంబులు చల్లి
చలువ నీడలచెట్ల - చాలు నాటించి
పాళెముల్ విడుదు లే - ర్పఱచి నగళ్లు
వేళంబె నిర్మించి - వీధు లమర్చి
అంగళ్లు వేయించి - యపుడు సాకేత
గంగానదీ మధ్య - గత వసుంధరను
యెడమింతయును లేక - యెవ్వ రెచ్చోట
నడిగిన వస్తువు ల - న్నియుఁ గలుగ

దివిజ మార్గము రీతి - దివ్య వాసనల
పువుఁదావి చప్పరం - బులు మిన్నుముట్ట 7720
మలయమారుతములు - మలయ బీరెండ
పొలప మించుకయైనఁ - బొరయంగ నీక
యన్నియు శుభముహూ - ర్తాయత్తమగుట
న న్నగరీజనం - బది విని యలర
వ్రేగుఁబ్రొద్దున మహీ - విభునింట వంది
మాగధగీత సం - పదలు సొంపెసఁగ

—: భరతుండు శోకించుట :—


నిద్దుర మేల్కని - "నేరాజు గాను
బుద్ధిగాదిదినన్నుఁ - బొగడి మేల్కొలుప
నిటపట్టి చాలింపుఁ - డిట్టి మర్యాద
లిటువంటివియుఁ దగు - నే? యంచుఁబలికె" 7730
అని దమ్ముఁడును విన - నాఁడు నాభరతు
గనుగొని సతులెల్లఁ - గలఁగి శోకింప
నావేళ భాను వం - శాచార్యుఁడై న
యావసిష్ఠుండు శి - ష్యగణంబుఁ గొలువ
ధరణిపై వ్రాలు సు - ధర్మయో యనఁగ
నిరుపమ నవరత్న - నిర్మితంబైన
కొలువుసావడి మీఁద - గూర్చుండి చార
కులము నిరీక్షించి - గొబ్బున మీరు
హితుల బంధులఁ బురో - హితుల నాప్తులను
క్షితిపాలకుల నను - జీవులమున్ను. 7740

ధరణీ సురలఁ బిల్చి - తనదు చెంగటికి
భరత శత్రుఘ్నుల - పాలికి నేఁగి
తోడుక రండన్న - తోడనేవాడ
వాడల వారెల్ల - వారలం బిలువ
నందరుఁ జేరిన - యప్పుడు రాజ
నందనుల్ జనులు మ - నంబులం బొదల
కొలువు సావడిఁ జేర - కొమరొప్పఁ జూడ
కలశాబ్ధినడు చక్కిఁ - గను పట్టుచున్న
తిమి తిమింగలములఁ - దెరఁ గొప్పుమడుగు
క్రమమునఁ గొలువుఁబు - రంబుఁ జూపరకు 7750
రాజు లేఁడను విచా - రములేక భరతు
రాజుఁగానెంచి పౌ - ర జనంబు వొదల

—: భరతుఁడు పౌరులతోఁ గూడి రామునికడకుం బ్రయాణమగుట :—


గురు భార్గవులచేత - గొమరొప్ప నభము
హరిణాంకుఁడన వసి - ష్ఠామాత్యయుక్తి
భాసిల్లు సభచూచి - భరతునిం జూచి
నాసభ వారెల్ల - నంజలి సేయ
శారద యామినీ - చంద్రుఁడో యనఁగ
నారఘుకుల వీరుఁ - డల్లన చారు 7760
చతురనీతికళా వి - శారదుం డగుచు
నతనితో నిట్లని - యాచార్యుఁ డనియె.
"అన్న! మీతండ్రి స - త్యంబె పాలించి
యున్నత సత్కీర్తు - లొందె నాకమున
శ్రీరామ చంద్రుఁ డూ - ర్జిత ధర్మరతుఁడు

చేరె ఘోరారణ్య - సీమల కతఁడు
యిరువురు నీకిచ్చి - రిలయెల్లఁ గాన
ధరణికినెల్ల క - ర్తవు నీవె సుమ్ము.
రహిఁబూను మివుడు సా - మ్రాజ్య పట్టంబు
బహుళంబుగా నులు - పలుఁ గానుకలును 7770
గొనితెచ్చి యెల్ల ది - క్కుల మహీవిభులు
నినుఁ గొల్వవాకిట - నిండి యున్నారు"
అనియిట్లు కులగురుం - డాడిన మాట
వినియేమియునుఁ బల్కు - విధము చొప్పడక
“అయ్య! యేమని యిట్టు - లానతిచ్చితిరి?
చయ్యన తనబ్రహ్మ - చర్యంబు నందు
గురుశిక్షితుం డయి - గుణవంతు లందు
సరిలేని మాయన్న - సామ్రాజ్య పదము
వదలక ననువంటి - వాఁడు గైకొనునె?
అదియేఁటి మాట స - త్యంబె వాకొనుము 7780
యే రామునిం జేర - నిప్పుడే పొందు
నీరాజ్య మంతయు - నినవంశతిలకు
రాజ్యమేలఁగ నన్ను - రక్షింప లోక
పూజ్యుఁడా కౌసల్య - పుత్రుఁడున్నాఁడు
అటుగాన నే వంశ - హానికి వెఱతు
నిటువంటి రాజ్యంబు - లేలుట యెంత?
ముల్లోకములఁదన - ముద్దుటుంగరము
చెల్లఁ బ్రోవఁగఁ జాలు - సీతా వరుండు"
అనుమాట వినినంత - నాసభాజనులు
కనుఁగవల్ బాష్పంబు - కణములు గురియ 7790

మరియు నిట్లనియె "నో - మౌనివరేణ్య!
యరుగుదు నిపుడునే - నందఱం గూడి
రాముని చరణ సా - రసములు గాంచి
యా మహామహునిర - మ్మనుచుఁ బ్రార్థింతు
నతఁడు రాఁడేని నే - నచట సౌమిత్రి
జతగూడి కొలుతు ద - చ్చరణ పద్మములు
పయనంబు చేసితిఁ - బరిజన శ్రేణి
రయమున గహన మా - ర్గము చక్కఁ- జేయ
తమకింపు చున్నది - తలఁపు యాత్రకును
మమునంపుఁ" డని యాసు - మంత్రుతోఁ బలికి 7800
"బలములఁ బిలిపించి - పయనంబుఁ గమ్ము
వలయునట్టి ప్రయాణ - వస్తువు లెల్ల
చేకూర్చు కొమ్మ”ని - చెప్పిన నతఁడు
నాకైవడి తగి - నట్టి వారలను
పనిచి పైనము చాటఁ - బౌర జనంబు
ననురాగమునఁ బొంది - యట్ల కావింప
యిల్లాండ్రు పురములో - నింటింటి తమదు
వల్లభులనుఁ జూచి - వనులకు జనుఁడు
"రామునిఁ దోడితెండు - రయమున నేల
తామసించెదర” ని - తరువులు సేయ 7810
నందఱు బయనంబులై - వీడు వెడలి
ముందర చతురంగ - ములతోడ గదల

—: భరతుండు పయనమైపోయి గంగాతీరంబు చేరుట :—


భరతుఁ డాచార్యుని - పనుపున మంత్రి

వరుఁజూచి "రథము దే - వలయు నీవ"నిన
నతఁడట్ల తెచ్చితి - నని పల్కుటయును
చతురుఁడై యమ్మ హా - స్యందనం బెక్కి
ఖరము లుష్ట్రములు రొ - క్కములు సొమ్ములుసు
బరువులుం గొనితేర - బంధులు దొరలు
రాజులు వెంట నే - రాళంబు గాఁగ
నేజాడ నెడమీక - నిరుగడంగొలువ 7820
చామర కేతన - చ్ఛత్ర చిహ్నములు
సామజ హయభట - స్యందనావళులు
భేరీ మృదంగాది - బిరుద వాద్యములు
భోరున నొకమొత్త - ముగ నుర్విఁగదల
నడచుచో డిండిమ - నాదముల్ మొరయ
పడగలు నక్షత్ర - పదము గోరాడ
నిగళంబు లిల దు - మ్ము నగయించిదాన
గగనవాహిని రొంపి - కాల్వఁగా జేయ
తొమ్మిదివేలు దం - తులు రాజవాహ
నమ్ములు రథము ముం - దర నడతేర 7830
అరువదివేలు మ - హా రథశ్రేణి
దొరలతో సూతుల - తో వెన్క రాఁగ
మావులప్పుడు వీర మల - హరుల్ మొరయ
క్రేవలఁ జామర - శ్రేణిపై నాడ
అడుగుల నపరంజి - యందెలు గులుక
జడగుంపు మెడవంపు - చాయనల్లాడ
వాలచామరములు - వలమాన గతులు
చాలఁ ద్రిప్పుచును కై - జామోరలార్చు

పడివాగె తేజీలు - పదినూరు వేలు
కడవాగె సాదులు - గైకొనినడవ 7840
పొగరు జీనానూలి - బొందుల యోర
సిగ కొత్తమొలపము - సేయుఁ గత్తులును
బురుసారుమాలు ల - బ్బురపుమైఁ బూఁత
పరిమళంబులు దు - ప్పటి వల్లెవాట్లు
పట్టు చల్లడములు - పైదట్ల మీఁద
గట్టిన వంకులుం - గల వీరభటులు
కైజీత మొకకోటి - కన్నుల యెదుర
రాజమార్గము నిండి - రా భరతుండు
తమ్ముఁ డాచార్యుండు - తమ ప్రధానులును
కమ్ముక మణిశతాం - గములపైఁ గదల 7850
కౌసల్యయు సుమిత్ర - కైకేయి మున్ను
గాసాధ్వు లందరుఁ - గనక పల్లకుల
గొల్ల లాప్తులుఁ గంచు - కులు చేటికలును
పల్లకీలను వెంటఁ - బాయక రాఁగ
వెలయు డెబ్బదిరెండు - వినియోగమునకు
గలవారు నలుదిక్కు - గదిసి భజింప
మున్నుగాఁ గోమట్లు - ముదుసళ్లు సెట్లు
పొన్నారములవారు - సూపకారులును
పౌరులు నటులును - పాఠకు లాట
వారును కంచర - వారును కాశ 7860
వారును సోదపని - వారును సాలె
వారును పటుసాలె - వారును ముచ్చి

వారును కుమ్మర - వారును చాకి
వారును చాయల - వారును పనుల
వారును కటికిరి - వారును వడ్ల
వారును మేదర - వారును గంధ
కారులు జెట్లును - గణికులుఁ జొప్పె
వారును మాంత్రికుల్ - వైద్యులు సోది
చెప్పెడు వారును - శీర్నాల వారు
చొప్పరులుఁ దలార్లు - జోశ్యులుం గదల 7870
భరతుం డష్టకములు - పాడుచు నున్న
ధరణి దేవతల ర - థంబుపై నునిచి
కదలి యింద్రునిరీతి - గంగా తటంబు
కదిసిసేనలు డిగ్గఁ - గా నెచ్చరించి
అపుడు సుమంత్రుని - యాచార్యుఁ జూచి
యపరాహ్ణ మయ్యె నేఁ - డలసిన వారు
జనులెల్ల మనము ని - చ్చట నేఁడునిల్చి
యినుఁ డుదయించు చో - ని మ్మహానదిని
తమ తండ్రికిని వారి - దాన మొసంగి
సమచిత్తమున రేపు - చనుద మవ్వలికి " 7880
అనివారి విడుదల - కనిచి కై సేయు
తన సగరను కూర్మి - తల్లులుం దాను
యెప్పుడు దెలవారు - నెప్పుడు పోదు
నెప్పుడు రఘురాము - నీక్షింతు ననుచు
తమ్ముఁడుఁదా నొక్క - తల్పంబు నందు
సమ్మతి శయనించు - సమయంబు నందు

—: గుహుండు భరతుని సత్కరించుట :—

గుహుఁ డింతయును కనుం - గొని ముఖ్యలైన
గహనచారులఁ దన - కడ వారిబిలిచి
చూచితిరే! బహు - స్తోమముల్ వచ్చె
నేచాయ నిలమీఁద - నెడమింతలేక 7890
చతురంగ బలముల - సంఖ్యంబు లింత
యతిశయించిన రాజు - లన్యు లున్నారె?
తళతళమని కోవి - దార ధ్వజంబు
వెలయుచున్నది మహీ - విభుతేరి మీఁది
రథము చెంగట నవే - రవివంశ నృపుల
పృథుతర కాహళ - బిరుదముల్ దోఁచె
భరతుఁడె యితఁడు త - ప్పదు మనమీఁద
బెరిగి దండెత్తచం - పెదనని తలఁచి
వచ్చెనో లేక యి - వ్వసుమతి కాంక్షు
నెచ్చట నున్న బో - నిత్తునే యనుచు 7900
రామునిమీఁదఁ దీ - రని మచ్చరమున
నీమేరవచ్చెనో - యెఱఁగమేమియును
నెటులైన నేమిది - యేర్పడుదనక
నటునిటు నొక్కరి - నైనఁబోనీక
యోడలే నూరు నా - యొడ్డునంగట్టి
యోడకు నూఱేసి - యొంటర్లనునిచి
పదిలమైయుండుడు - భరతుని హృదయ
మిదినిశ్చియం బని - యేర్పడువెనక
చేతనైనట్టు చూ - చెదమని పనిచి
యాతరి నాటవి - కావళిగొలువ 7910

కుందేటి చట్టలు - గునుకుఁబ్రాల్దేనె
బిందెలు గసగసాల్ - సేర్పులుచార
పప్పును పికిలిపూ - బంతులు నేన్గు
గొప్పకొమ్ములునాలు - గులుఁ బులితోళ్లు
జవ్వాది పిల్లులు - జల్లులువేఁట
దువ్వులు నేదు - పందులు కేరిజనులు
బిరుదు జాగిలములు - పిలిజల్లులను
పొరలతో కప్పురం - బును సెలవిండ్లు
రాపువ్వు లేటిగో - రజమును తాండ్ర
చాపలు మొదలైన - సకలవస్తువులు 7920
కానుకల్ దెచ్చినఁ - గని సుమంత్రుండు
మానవాధీశ కు - మారునింజేరి
"అయ్య! యిచ్చట గుహుం - డను పాళగాఁడు
నెయ్యుండు మనరాము - నిక వీనితోడి
చెలిమి మీకును వల - సినది యిచ్చోటి
నెలవరి యోడల - న్నియు వీనివశము
రాముఁడున్నట్టి మే - రయు వీఁడెతెలుపు
నేమున్నెఱుంగుదు - నితనివర్తనము
కానుకల్గొని పొడ - గనిపించుకొనుఁడు
వానిఁబిల్తునె మంచి - వాఁడనిపల్క. 7930
యనుమతుఁడైనచో - నాసుమంత్రుండు
చనుమానమున దెచ్చి - సంధింపఁ జేయ
నతండు కైకానుక - లన్ని యునిచ్చి
యతిభక్తి భరతుని - కంజలిచేసి
"దేవ! మీరిట కరు - దేర నీయడవి

భావింప నుద్యాన - భంగిఁ జూపట్టె
యిదిమాకుటెంకి యే - మెల్ల నిచ్చోట
వదలకుండుదుము మీ - వారైన యెపుడు
కడులాఁతివారము - గాము సుమయ్య
విడిసియుండుము నాదు - వీట నీప్రొద్దు 7940
సేనల కే విందు - సేసెదనేఁడు
కానుక లివియేమి - గావలె? మీకు
మావంగడము చూచి - మదిలోననన్ను
నేవగింపక సెల - విడి పనిగొమ్ము
స్వామి! యెంతటికైనఁ - జాలుదునేను
రామునిబంటఁ బో - రానట్టివాఁడ”
అనిన బోయల రేని - యర్థాంతరములు
గనిపించు మాటలా - కర్ణించిమెచ్చి
అతనితలఁపెల్ల - నాత్మలోనెఱింగి
హితమతి నృపసూనుఁ - డిట్లనిపలికె. 7950

—: భరతుని గుహుఁ డూఱడించుట :—


"అనఘ! రామునికి నే - నరలేనిబంట
ననియుంటి నామాడ - లఖిలార్థములును
యిచ్చిన వాఁడనే - యీసేనకెల్ల
నిచ్చట నీవు విం - దిడి పంపు టెంత?
యీదారిచనియెద - మేమెల్ల నెట్లు
పోదుమీ యేఱు గొ - బ్బున నుత్తరించి?
అందుకు మార్గ మి - ట్లని పల్కుమనిన
డెందంబులోనఁ దొ - ట్రిల్లుచు గుహుఁడు

హేతువెద్దియొ యని - యింత శంకించి
రాతిగుండియతోఁ గి - రాతుఁ డిట్లనియె. 7960
"నరనాథ! మీవెంట - నావారునేను
ననుదేరనిఁక యసా - ధ్యము లేదు. మీకు
యిటురాముఁ డొంటిగా - నేఁగెకానలకుఁ
బటుతర చతురంగ - బలముతోఁగూడి
యేమి గారణముగా - నేఁగెదరొక్క
రామునిపై నకా - రణముగా మీరు
అహితులరని తోఁచె - నాత్మలో నాకు
సహజంబుగానున్న - చందమేర్పఱప"
అనుమాటవిని పుళిం - ధాధిపుఁజూచి
మనువంశ తిలకంబు - మఱియునట్లనియె. 7970
"మారామ చంద్రుని - మది దశరథుని
మారుగానెంచి యే - మఱలఁ బిల్చుటకుఁ
నరిగెదఁగాని ద్రో - హము సేయఁగాదు
పరిశుద్ధుఁని నన్ను - భావింపు మీవు"
అనుభరతుని మాట - లాలించి గుహుఁడు
మనసులో మఱియు న - మ్మక యిట్టులనియె.
"అయ్య! కోరక పొంది - నట్టి సామ్రాజ్య
మియ్యెడ నీకు న - ధీనమైయుండి
నన్నకు నేనిత్తు - ననిపోవునపుడె
నిన్నుఁబోల నొకండు - నేర్చునె కలుగ 7980
నీయంతవాఁడవు - నీవె యేనిన్ను
సేయుఁబూజలు నన్నుఁ - జేసె పావనుని"

అనిపల్కు నెడ యినుం - డస్తాద్రిచేరఁ
గనుమూయుగతి నంధ - కారంబుఁగప్ప
గుహుఁడు సుమంత్రుండుఁ - గూడియాచెంత
విహితరీతి సుఖోప - విష్ఠుఁడై యుండ
శయనించి భరతుఁడూ - ర్జవలాభరతుఁడు
నియతాత్ముఁడై యుండి - నిద్దురలేక
తరుకోటరంబున - దహనుఁడా తెరువు
దరికొననేర్చు చం - దంబున నతని 7990
మదిఁబుట్టినట్టి రా - మవియోగవహ్నిఁ
బొదలుతాపమున నో - ర్పునుఁ బ్రాపులేక
హిమవన్నగంబు బీ - రెండచేఁ దప్త
హిమవారి ఝరముల - నీనినయట్లు
చింతచేఁబుట్టిన - చెమరుమై నిండి
యెంతయు జడిగొన - నిటునటుఁ బొరలి
తాపవేదనలు ప్ర - త్యంత శైలములు
నాపోవనిట్టూర్పు - నందుధాతువులు
నాయాస శోకదై - న్యమనోరుజాదు
లాయత శృంగంబు - లడుగడుగునకుఁ 8000
బొడమెడు మూర్ఛలం - బొలయు జంతువులు
దొడరు సంతాపౌష - ధులుఁ గల్గియున్న
తనదుఃఖమను పర్వ - తము మోవలేక
కనుమూసి గడియ యొ - క్కయుగంబు గాఁగ
వేగించు భరతుని - వెతలాత్మ నెఱిఁగి
యాగుణనిధిఁ జేర – నల్లనవచ్చి

—: గుహుండు భరతునకు రామవిషయైక వృత్తాంతమునుఁ జెప్పుట :—

యూరటగాఁజెంత - నుండిన గుహుఁడు
వేఱే పరాకు గా - వించి యాచింత
మఱపింప తాను ల - క్ష్మణుఁడును మున్పు
పరిచర్య సేయున - ప్పటి మాటలెల్ల 8010
నాసుమంత్రుండు విని - యవియెచ్చరింప
గాసిల్లు భరతునిం - గాంచి యిట్లనియె.
“రాజకుమార! శ్రీ - రామచంద్రుండు
తాజానకీ సహి - తంబుగా నాఁటి
రేయి యిచ్చోట ని - ద్రింపుచు నొక్క
చాయ నూతనతృణ - శయ్య గావించి
సౌమిత్రికినిఁజూపి - శయనింపుమనిన
రామునిబన్నంబు - రాజువర్తనము
తనవిచారము సవి - స్తరముగాఁదనదు
మనసులోఁగల యవి - మాతోడఁదెలిపె 8020
యీసుమంత్రుఁడు నేను - నేమన్నవినక
యీసుమిత్రా పుత్రుఁ - డడలు చందంబు
యెంతని పలుకుదు - నీరీతినుండ
అంతటఁ దెలవారె - నారఘూద్వహుఁడు
దానునిద్దుర లేచి - తమ్మునిం బిలిచి
జానకీ సహితుఁడై - చనునట్టివేళ
చెలిమి నాచే మఱ్ఱి - పాలుఁ దెప్పించి
ముళ్లువిడిచి యి - ద్దరురాఘవులును

జానకి యడలంగ - జడలు ధరించి
మానితవల్కలాం - బరములుగట్టి 8030
యేను దెచ్చినయోడ - యెక్కి సుమంత్రు
తోనొకకొన్ని బు - ద్ధులు వచియించి
గంగ యాత్రోవగాఁ - గడచిరి వారి
యరిగద యప్పుడే - మన వచ్చు ననిన
క్రొవ్వాఁడియైన యం - కుశముచే నరుక
నొవ్విచేఁగూయు సిం - ధురమో యనంగ
హోయని యిలఁబడి - యొరలుచో భరతు
బాయక తమ్ముండు - పలవరింపంగ 8040
సైరింపలేక కౌ - సల్యాదులైన
నారీమణులు రోద - నములు గావించి
యేమియు నెఱఁగక - యింతంతచేర
నామేర కౌసల్య - యడలుచునున్న
భరతుఁ గౌఁగిటఁ - జేరి "పట్టి! యిదేల
యురక నిద్రింపుచు - నుండి యీరేయి
యేమిగారణముగా - నేడ్చెదు వనుల
రామలక్ష్మణులు భ - ద్రమున నున్నారె?
సేమమేకద మన - సీతకు? లేక
యేమైన వింటిరో! - యెఱిఁగింపుమనిన” 8050
తావిన్న తెఱఁగెల్ల - తల్లితోఁబలికి
యావేళకొంత యూ - రార్చి యవ్వెనక
గుహుని నెమ్మోముఁ గ - న్గొని చేరఁబిలిచి
బహుళ ఖేదంబుతో - భరతుండు వలికె,
"ఓయి పుళింద వం - శోత్తమ! రాముఁ

డేయెడ వసియించె - నేమివచించె
నెయ్యెది భుజియించె - నింతియుందాను
నెయ్యెడఁ బవళించె - నెఱిఁగింపు" మనిన

—: రాముఁడుజలము లాహారముగాఁ గారచెట్టుక్రింద బండుకొనిన వృత్తాంతము గుహుఁడు చెప్పుట :—


"నోదేవ! సౌమిత్రి - యును రామవిభుఁడు
వైదేహియును నిందు - వచ్చియున్నపుడు 8060
పొడగని బహుభక్ష్య - భోజ్యాదికములు
తడయక తెచ్చినీ - దాసుండనేను
కైకొనుం డన విని - కాకుస్థకులుఁడు
మాకేల కొనిపొమ్ము - మరలవన్నియును
యీజలంబులెచాలు - నితరంబు లేల?
రాజుల కప్రతి - గ్రహము ధర్మంబు"
అనిలక్ష్మణుఁడు తెచ్చు - నంబువారములు
గొనియెల్ల యింగుదీ - కుజము చెంగటను
తమ్ముఁడొనర్చిన - తల్పంబునందు
నమ్మతిదంపతుల్ - శయనించు నపుడు 8070
సౌమిత్రి వారల - చరణముల్ గడిగి
యీమేర నే రచి - యించు పానుపున
నుండనొల్లక కడ - నుండి కోదండ
మండలాగ్రంబు లే - మఱక వేగింప
ఏను మావారలు - నీసుమంత్రుండు
పూనిపల్కిన నిద్ర - వోవకయతఁడు
యేజాడ నిద్దుర - యేఁబోదు నకట

యీజానకీ రాము - లిటులుండఁ జూచి"
అనుచు నాతోమాట - లాడు చున్నంత
నినుఁడు దోఁచెననంగ - హృదయంబు విరియ 8080
తల్లులు తమ్ముండుఁ - దాను నచ్చటికి
తల్లడిల్లుచు భర - త కుమారుఁ డరుగ
యిదిరాము తృణశయ్య - యిదియు లక్ష్మణుని
గదిసి యేము వసించు - గరిమిడి పఱపు”
అనిగుహుం డెఱిఁగింప - నా భరతుండు
జననుల కెల్లఁ జే - సాఁచి వాకొనుచు
ఆది గర్భేశ్వరుం - డై హంసతూలి
కాది తల్పంబుల - యందుశయించి
నానామణీ భూష - ణములఁ జెన్నొందు
భానుసన్నిభున కా - పచ్చిక పఱపు? 8090
కలగంటి నొక్కొ ని - క్క మొ కాక తనకు
తెలివిడి దప్పెనో - తెలియ లేదనుచు

—: సీత నగలలోని బంగరుపొడి గారచెట్టుక్రింద రాలియుండుటకు భరతుఁడు శోకించుట :—


ధరణీతనూభవ - దశరధు కోడ
లరయంగ జనకుని - యంకభూషణము
శ్రీరాముదేవి యీ - సీత కా యిట్టి
పూరిపాన్పున నిద్ర - వోవు పాపంబు?
దైవయత్న మిదౌర! - తప్పింప రాదు
భావించి చూచిన - బ్రహ్మాదులకును"
అనిచేరి చూచుచు - నా శయనమున
జనకనందన బురు - సాచీర చెఱుఁగు 8100

బంగరు పొళ్లును - పైఠాని రవికె
కంగుల నూలంటు - కఱకు పచ్చికలు
గమగమ జవ్వాది - కమ్మ నెత్తావి
గమిచిన నివ్వరి - కసువుతలాడ
యెండబారిన పువ్వు - టెత్తులుం గెలన
నిండిన వీటికా - నిబిడ రసంబు
త్రొక్కు రాలంటు ల - త్తుకయు నాశయ్య
చక్కటింజూచి మూ - ర్ఛమునింగి లేచి
“రాముని కిపు డంగ - రక్షయై నట్టి
సౌమిత్రి భాగ్యంబు - చాలదే" యనుచు 8110
“నారడి పుట్టువు - నైతి నాజన్మ
మేరికిఁగొఱగాక - యట్లయ్యె” ననుచు
యెంత చేసితి - దగునెే యిఁక రాము
డింతకు నోరుచు - నే విధి యనుచు
మందర బుద్ధిని - మాతల్లి చేసి
యందరి రక్షించె - నేమందు ననుచు
రాముఁగా కని దశ - రథునకుఁ దప్పె
సీమ యేలంగ నా - సింతునే యనుచు
రామచంద్రుఁడు లేని - రాజ్యంబు పరులు
కామింప వెఱతురు - గరళంబు తోడి 8120
యన్న మొక్కఁడు దిన్న - నరుగునే యచట
నున్నరాముని శౌర్య - మొరు లెఱుంగమియె
జడలెందు శ్రీరామ - చంద్రుండు దాల్చె?
తడయక యచ్చోటఁ - దాలు నే జడలు?
రాము నయోధ్యకు - రాజుఁగాఁ బనిచి

సౌమిత్రిఁ బట్టణ - స్థలినుంచు వాఁడ
యిట్టినా పూనికె - యీడేర్పఁ గేల
గట్టుదుఁగాక! కం - కణము దైవంబు
అమరు లందఱునుఁ దో - డైవచ్చి నాదు
సమయంబు చేకూర్చి - చనుదురు గాక! 8130
గహన భూములనన్నుఁ - గాఁచి వెన్వెంట
సహచరుండైయుండు - శత్రుఘ్నుఁ డపుడు
మాయన్ననేఁడు నా - మనవి గాదనిన
పాయకయేను త - త్పదములు గొలిచి
జానకి లక్ష్మణ - సమ బహుమాన
మానితవృత్తి నె - మ్మది నుందు వనుల"
అనిభరతుఁడు వలి - యమ్మఱునాఁడు
తనచెంత నున్నట్టి - తమ్ముని కనియె.
"ఈపుణ్య వాహిని - నీప్రొద్దెగడుత
మా పుళిందాగ్రణి - నర్థి రప్పించి 8140
యతని వశంబై న - యన్ని యోడలును
జతగూర్చి రప్పింప - సమకట్టు మనిన
వాకిట తనభట - వ్రాతముం దాను
నాకిరాతాగ్రణి - యచలుఁడై యుండ
తనయన్న మాట లా - తఁడు వివరింప
విని గుహుండు కిరాత - వీరులం బనిచి
యోడలేనూఱు నం - దొక్కొక్క యోడ
యోడకు నూరేసి - యొద్దికలైన
దోనులు నొకొక్క - దోనికిం దగిన
మానుసుల్ నూరేసి - మతియించి నట్లు 8150

తెప్పించి యునిచి - విస్తీర్ణమై మేడ
చొప్పున నిఖిల వ - స్తువులునుం గలిగి
రాముఁడెక్కు మనోహ - రంబైన యోడ
యామేరఁదమరెక్క - నతఁడు దెచ్చుటయును
రాజులు మంత్రులు - రథికులు మౌని
రాజులు సకల వ - ర్ణంబులవారు
సామజ ఘోటక - చయము సైన్యంబు
కామినీమణులాది - గా నెల్లవారు
నోడలపైఁ బోవ - నుర్వీశు సేన
చూడఁజూడగ నెందు - జూచిన నిండి 8160
కొందఱు హరి గోళ్లఁ - గొందఱు పుట్ల
గొందఱు దోనులఁ - గొంద రీఁతలను
కొందరు తెప్పలం - గొందఱు క్రొత్త
బిందెల నీరీతిఁ - బేర్చి యందఱును
నేఱుదాఁటిన యంత - నినవంశమణులు
తారోడ మీఁదికి - తల్లుల తోడఁ
దగిన వారలతోడ - దాసుల తోడఁ
దగినవైఖరి నెక్కి - తలఁచిన యంత
దాఁటి యాయేఱు మై - త్రంబను పేర
హాటకంబైన మ - హాముహూర్తమున 8170
నందఱుంగూడి ప్ర - యాగంబు చేరి
యందు సైన్యమునెల్ల - సమరించి యనిచి
తన పురోహితులతో - తమ్ముని తోడ
తనువురంజిల భర - ద్వాజాశ్రమంబు
చేరిమంత్రుల నొక్క - చెంగట నిల్పి

వార లరుంధతీ - వల్లభు వెనుక
అమ్మహాశ్రమమున - కరుదేర వారి

—: భరతుఁడు భరద్వాజునితో మాటలాడుట :—


నమ్ముని శేఖరుఁ - డల్లంతఁ గాంచి
యెదురుగావచ్చి య - య్యిన వంశగురుని
పద పంకజములకు - పాద్యం బొసంగి 8180
తనయాత్మలో వీరు - దశరథ తనయు
లనియెంచి వారికి - నర్చ లొసంగి
కుశలంబు లడిగినఁ - గూర్చుండి యతని
కుశలముల్ వారు పే - ర్కొని యడుగుటయు
నితరేతరముఁ దెల్పు - నెడ భరద్వాజుఁ
డతుల తపోనిధి - యంతయు నెఱిఁగి
యెఱుఁగని చందాన - నెలనవ్వు తోడ
భరతునితో మృదు - ఫణితి నిట్లనియె.
"ఎల్ల సామ్రాజ్యంబు - నేలెడు నీవు
చెల్ల రే యొంటిగా - చెట్టులు వట్టి 8190
ఆలుఁ దమ్ముఁడుఁ దాను - నాకులు నలము
తాళి శరీరయా - త్రకు నీడు చేసి
తమతండ్రి పనుపను - దరిదావు లేక
కుమకుమ శోకాగ్ని - గుములుచు నున్న
రామునిమీఁద నూ - రకె చంపనలిగి
యేమి సాధించెద - విటమీఁద నీవు?
కైకేయి కొడుకవు - గాన కౌసల్య
శోకించునని మదిఁ - జూడలే వైతి

యెవ్వరెక్కడఁ బోయి - రేమి మాకేల
యివ్వేళ నాదు క - ట్టెదురును నిలిచి 8200
కనిపించుకొని కడ - కడలనుం బోక
నను నొక్క చీరి కై - నను సడ్డగొనక
కనువొడిచిన యట్లు - గర్వించి నిలుచు
నినువసిష్ఠునిఁ జూచి - నేడు తాళితిని
లేకున్న నిన్నొక్క - లెక్కయె మాకు
కైక చేనగు మేలు - గనఁజేతు నిన్ను"
నన గడగడ కంప - మంది వసిష్ఠు
గనుఁగొని యమ్మౌని - కనుసన్న సేయ
తెలివి దెచ్చుకమౌని - దృష్టి పథంబు
దొలఁగి ఫాలమున చే - దోయి గీలించి 8210
ఆ భరద్వాజుల - యడుగులు చూచి
యా భరతుఁడు భక్తి - నప్పు డిట్లనియె.
"అయ్య! మీయట్టి మ - హానుభావులకు
నియ్యెడను జూడ - నిటువంటి బుద్ధి
బుడమి నప్పుడె నాదు - పుట్టువు వంటి
చెడుఁబుట్టు వెందుఁ జూ - చిన మరిలేఁడు
యేలనన్నిట్టు లాన - తిచ్చితి రయ్య”
వ్యాళదుష్టుని వహ్ని - యందుఁ ద్రోయుదురె?
శ్రీరాము నెడవాసి - చింతాపయోధి
భారంబు గానక - ప్రాణాశు చేత 8220
అతనిఁ బ్రార్థించి రా - జ్యమునందు నుంచి
హితము గావించి యే - నిచట నుండెదను
అనియెంచి వచ్చితి - నంతియె కాని

తనయందు లే దాత - తాయి వర్తనము
కానలేనైతి కై - క తలంపు మొదట
యేనది హితముగా - నెంచుట లేదు
యీవసిష్ఠుఁడు సాక్షి - యిటమీఁద మీఁదు
భావంబె సాక్షి త - ప్పదు ద్రోహిఁగాను
సదయాత్మ రాముఁ డె - చ్చట నున్నవాఁడొ
యదిదెల్పి ననుఁబంపుఁ - డాశాస్య మెఱిఁగి" 8230
అనిన భరద్వాజుఁ - డక్కుమారకుని
గనుఁగొని యుప్పొంగు - కరుణ నిట్లనియె,
“రాజేంద్ర! రఘువంశ - రత్నంబులైన
రాజులకిట్టి మ - ర్యాద లేమరుదు?
ఆ రాజులందు నీ - యట్టి ధార్మికులు
లేరు నీమదినిఁ గ - ల్గిన వృత్తమెల్ల
కనలేక పలుకుట - గాదు నీతలఁపు
గని దృఢీకరణంబు - గావింపఁ దలఁచి
యిటులంటి సైరింపు - మీచిత్ర కూట
తటతరుచ్ఛాయలం - దరుణితోఁ గూడి 8240
యున్నాఁడు మూయన్న - యొకనాఁడు మమ్ను
మన్నించి మాయాశ్ర - మంబులో నుండి
చేరుము రేపె యా - చిత్ర కూటాద్రి
మీర రాదనిన నే - మియు ననవెఱచి
చాలభక్తి మహా ప్ర - సాద మటంచు
తాలిమి భరతుం డ - త్తరి సమ్మతింప
వర తపోనిధియైన - వాల్మీకి శిష్యు
డనలేని భక్తితో - నతని కిట్లనియె,

—: భరద్వాజముని భరతాదుల కాతిథ్యమొసంగుట :—

దశరథనందన! - తపముల మేము
కృశియించి వేల్పుల - నెల్ల భజించి 8250
చేసిన పుణ్యముల్ - చేఁ జేతవచ్చి
వాసిగా తమ భాగ్య - వశమునం జేసి
యిట్టిమేనులు దాల్చి - యే తేరమిమ్ము
నెట్టిపూజలు చేసి - యెన్నిక గాంతు?
ఫత్రంబు పుష్పంబు - ఫలమును తోయ
మాత్రమైన నొసంగి - మదిఁ బ్రమోదింతు
యెంచి రేపటికి మా - యింట విందార
గించి రాముని పాలి - కని మఱిపొండు."
అనిన "నోస్వామి! మీ - రర్చ లిచ్చితిరి
మనసురంజిల నాశ్ర - మము లోనెఁగలుగు 8260
కందమూల ఫలాది - కంబులె చాలు
విందని యందుపై - వేరె యేమిటికి?"
అనిన "మాకునభీష్ట - మైన యర్థంబు
కొనసాగఁ జేయక - కుఱుచ సేయుదురె?
సేనల నేలయుం - చితి నొక్కయెడను
మౌనుల మే మస - మర్థులమగుచు
నిందరికిని వండి - యిడఁ జాలఁడనుచు?
నందుచే కడ నుంతు - రయ్య మీవారి
రప్పింపు” మనిన భ - రద్వాజుఁ జూచి
అప్పుడు భరతుఁ డి - ట్లనియెఁ గొంకుచును. 8270

“అనఘ! మాయాచార్యుఁ - డాశ్రమంబులకు
జనుచోట మితపరి - జనముతోఁ గాని
చనదు మూకల తోడఁ - జన విహరింప”
అనిననే వెఱచి సై - న్యము నందయునిచి
పనివింటి పిలిపింతు - బలముల నెల్ల
తనకిది తప్పుగాఁ - దలఁప నేమిటికి?
చిత్తేశ నా ముని - సింహంబు తనదు
చిత్తంబు వొదల వ - చ్చిన వారికెల్ల
విందు సేయఁగ యాగ - వేదికచేరి
అందుపై శుచియు ప - ద్మాసనస్తుండు 8280
ముకుళితకరుఁడునై - మొదటి వర్థికిని
సకలజ్ఞు నయ్యాగ - శాలకుఁ బిలిచి
కావింప వలయు రా - ఘవులకు విందు
రావింతు నిపుడె - యింద్ర ప్రముఖులను
పూర్వపశ్చిమ ముఖం - బుల నేఁగునదుల
వేర్వేర రప్పింతు - వింద మర్చుటకు
నీచేత నైనట్లు - నిర్మింపు మనుచు
వాచయ్యమీంద్రుండు - స్వరపూర్తి గాఁగ
నొక్కశిక్షా శాస్త్ర - యుక్త మంత్రంబు
చక్కఁగా నుడివిన - సకల దేవతలు 8290
నందుచేతఁ బ్రసన్ను - లై తమశక్తు
లందరు గనుపించి - యధికారులై రి
చల్లఁగా వీచెను - చందనానిలము
జల్లుగా పుష్ప వ - ర్షంబులం గురిసె
పాడిరి దేవతా - పాఠకులెల్ల

నాడిరి రంభాదు - లైన యచ్చరులు
యీదృశ మహిమంబు - నేవేళఁ గలిగె
నైదు యోజనముల - యందాక దిశల
కల్పికమై విశ్వ - కర్మ విచిత్ర
శిల్ప చమత్కృతి - చేనొక్క పురము 8300
మేడ లుప్పరిగలు - మేల్కట్లు దగిన
వాడలు వీధులు - వనజాకరములు
పువ్వుఁ దోఁటలను తోఁ - పులు వెలజాతి
జవ్వను లంగళ్లు - చప్పరంబులును
కోటలు నగడితల్ - కొత్తళంబులును
నాటకశాలలు - నవరంగమిండ్లు
చవికెలు చిత్తరు - సావళ్లు దివ్య
భవనముల్ రథగజ - భటతురంగములు
వివిధవర్ణ జనాభి - వృద్ధియు గలిగి
దివిజలోకము ధరి - త్రిని వ్రాలెననఁగ 8310
భరతుఁడు డించిన - పాళెంబు లెల్ల
పురములో వెదకనం - బొడగాన కుండ
యెక్కడ మొలచెనొ - యీ పురంబనుచు
ముక్కుపై వ్రేలిడి - మునివరు ల్మెచ్చ
కెలిగెనో తోఁపుల - ఖర్జూర సప్త
దళనారికేళ చూ - తరసాలపనస
పరిపక్వ ఫలము ల - సారమై యుండ
కురువక మల్లికా - కుంద చాంపేయ
మరువక కేతకీ - మాలతీ వకుళ
సురభిళ నవ్యప్ర - సూన గుచ్ఛములు 8320

పారిజాతలతాంత - పరిమళ మిళిత
సౌరభంబులఁ జొక్కు - చల్లుచు మలయ
మొకచోట నపరంజి - యోడు బిల్లలను
చకచక లీను హ - జారంబు మెరయ
నవరత్నమయయ మైన - నగరిలో వెండి
చవికెలోవరు లుబ్బ - చప్పరంబును
పట్టి మంచంబులుఁ - బఱపులు మేలు
కట్టులు వెండి బం - గారు కొప్పెరలు
పచ్చల పళ్లెముల్ - పసిడిఁ గిన్నెలును
పచ్చరా గోడలు - పలక వజ్రముల 8330
తలుపులు నీలాల - దార బంధములు
కలమాన్న శాక పా - కము లమరించు
బోనపుటిండ్లలో - పువ్వుఁబోణులును
నానామణీభూష - ణములు పేటికలు
చేటి సహస్రముల్ - చీనాంబరములు
హాట కావరణంబు - నమరు గేహమున
విడిదిగా భరతుని - విడియించి వారి
కడమ రాజులను న - గళ్లలో నునుప
తన నగరను భర - త కుమారకుండు
ఘనతర నవరత్న - కాంచన ప్రభల 8340
చెలువుమించిన యట్టి - సింహాసనంబు
కెలనఁగన్గొని చేరి - కేలెత్తి మ్రొక్కి,
అందుమీదటఁ దమ - యన్న యున్నట్టి
చందంబుగా మాన - సమున భావించి
భరత శత్రుఘ్ను లా -పజ్జ చామరము

లిరువురు గైకొని - యించుక సేపు
విసరి మంత్రులకని - వేర్వేర యునుచు
పసిఁడి పీఠంబుల - పైఁ గూరుచుండి
తనదు ప్రధానులం - దగిన పీఠముల
నునిచి బాంధవహిత - యుతముగా నుండ 8350
మెఱుపులు విడివడ్డ - మెలఁకువ నొక్క
తరమైన దేవతా - తరుణీశతంబు
కంకణంబులు మ్రోయ - కౌనులు గదల
బింకెపు చూపులు - పేరెముల్ వార
నందెలు ఘలుఘల్లు - మనఁ బళ్లెరముల
యందుల భక్ష్య భో - జ్యాది వస్తువులు
యెన్నడు వినికని - యెఱుఁగని వెల్ల
కన్నులు చిత్తముల్ - కడుఁ దనియంగ
వడ్డింప భుజియించి - వార్చి రాఘవుల
యడ్డియించుక లేక - యలసువారంపు 8360
పడుచుల వలకు లోఁ - బడి రాజసుతుల
దడవక యేమియుం - దలఁపక మౌని
మాయచే మేనులు - మఱచి యందఱును
మాయలాఁడుల కీరి - మరిగి యున్నంత
నాపురి నాల్గు చా- యలను నానామ
హాపగల్ జలధులు - నాత్మ శక్తులను
నేకమై యపరంజి - యిసుము గఁన్పట్ట
జోక మహానది - స్తోమంబు వార
నదుల తీరములందు - నగరులు నిండ్లు
పదులు నూరులు వేలుం - బరిపాఁటి మెఱయ 8370

కొలువు లోపలనుండి - కొసరులు దీరి
నలకారి ప్రాయంపు - వనితలం దగిలి
అందరుఁ గడకేఁగ - నా దశరథుని
నందనులొంటి ను - న్నారని యటకు
యెచ్చుసొమ్ము లొసంగి - యిరువది వేల
యచ్చరులఁ గుబేరుఁ - డనిచె కొల్వునకు
అందరు దేవతా - హరిణాంక ముఖులు
నందనోద్యానంబు - న మెలంగువారి
వాసవుం డల భర - ద్వాజాశ్ర మంబు
గైసేయ నలసము - ఖమునకు నంపె 8380
కడమ దిక్పాలుర - కడనున్న వేల్పు
పడతులు దొరలుఁ బం - పంగ వచ్చిరటకు
నజుని కొల్వుననున్న -యమరకామినులు
రజితాచలంబుపై - రాజీవముఖులు
నాగలోకమునను - న్న మెఱుంగుఁబోండ్లు
వేగంబ భరతుని - విడిదికింజేరి
అందరు గుమిగూడి - యపుడుమేళంబు
క్రందుగా నపరంజి - కాశలు గట్ట
తుంబురునారదా - దులు రాఘవారికి
తంబులైనట్టి ప - దమ్ములువాడ 8390
సకలమహామహీ - జశ్రేణిఁగూడి
యొకటి మద్దెలతాళ - మొకటి యుపాంగ
మొకటి రావణహస్త - మొకటి చెంగొకటి
యొకటి దండియు నొక్క - టురమయు నొకటి
భరతుని ముందర - భరతశాస్త్రమున

గరిమె మీరుచు తత్త - కారతాళముల
కొనుగోలు గనిపించు - కొలువుండి యతఁడు
తనమదిలో భర - ద్వాజులయాజ్ఞ
యేమియు ననరాక - యీక్షింపుచుండ
నామౌనివరు మహి - మానుభావమున 8400
మల్లికాపాటల - మాధవీకుంద
వల్లికావళికుబ్జ - వామనశ్రేణి
పనులు పూనంగ రం - భలు కంచుకాళి
యనువున సాంగుబ - లానులాపముల
సముఖంబు విప్పియె - చ్చరికగావింప
గుములుగాఁ గొందరు - కొలవణిచూప
కొందరుకొమ్మలు - కోలాటమాడ
కొందరు పేరణిం - గులుకుచునాడ
కోలచారిని చిందు - గుజ్జరి దేశి
లీలలగొందరు - లేమ లాడంగ 8410
వేలుపుజవరాండ్రు - వినుపించునట్టి
కేళికరాముల - కితవగు ననుచు
మౌనిమాయల యందు - మనసురానీక
తానిర్వికారుడై - దశరధాత్మజుడు
నూరకె చూచుచు - నుండునప్పురము
సూరెల బహునదీ - స్తోముంబులందు
గాలిచే నెగసిస - కరడుల దరుల
రాలుతుంపురు లెల్ల - రమణులైనిలువ
మలయానిలమునఁ గొ - మ్మలు చలియింప
జలజల వృక్షముల్ - సకియల రాల్ప 8420

నిరుగడ పాళెంబు - లెందుఁజూచినను
తరుణులే కాఁగ నం - తయు నిండియుండ
నెచ్చట మొలిచి రీ- యెలజవ్వనంపు
తచ్చనకత్తెలిం -దరు ననుచూడ
మాయంపు మబ్బులు - మహిమీదఁగొన్ని
పాయక చినుకొక్క - పణఁతిగాఁ గురియ
నురిమినయురుమెల్ల - నొసపరిసతులు
మెఱసిన మెఱపెల్ల - మీనలోచనలు
జలచరావళి యెల్ల - జంద్రాసల్యచట
గల బుద్బుదములెల్ల - కన్నెలబారు 8430
అగుచుండ నయ్యేటి - యంచులయందు
ధగధగ వెలుఁగు కుం - దనపుపాత్రికల
నిమ్మకాయలను నూ - నెయు నుశిరికాయ
ఘుమ్మను జవ్వాది - కుంకుమరసము
ముడిఁబువ్వు సరులు గం - బురసున్న మాకు
మడుపులు నొరవొత్తు - మంచిభాగములు
పలగర కొమ్మలు - పనుపునుఁగొత్త
చలువలు తిరుమణి - చాఁదులద్దములు
పావకోళ్లును మెట్ట - పాపోసుజోళ్లు
దూవెనల్ చిక్కట్లు - తోపుబావడలు 8440
సవరముల్ దట్టులు - చల్లాణములును
రవికెలును రుమాలు - రాసులు వలయు
కైదువులును జొళ్లు - గాజుగిన్నెలును
జాదుల పొట్లముల్ - సంపెంగి విరుల
గసగసాల్ కొబ్బెర - కాయలు జీని

మిసిరిగంజాపొడి - మీగడ వడుపు
జాపత్రియును కురా - సానియామంబు
వేపుడు శనగలు - వెల్లుల్లిదిండ్లు
నెచ్చోటఁజూచిన - యెడమీకయుండ
నచ్చోట మౌనిమా - యాకల్పనమున 8450
సారాయి నొకయేఱు - చరుచుక పారె
పారెఁగల్లున నొక్క - పావనతటిని
తేనియ వెల్లినే - తెంచె నందొకటి
యాని యాజ్య ప్రవా - హము చూపెనొకటి
పాలచే నొక్కటి - ప్రవహించె చెఱకుఁ
బాలచే నొకటి ని - బ్బరముగావచ్చె
ఫలరసంబులునించి - పారెనం దొకటి
కళుకు లేఁ బెరుగు ము - ద్దల వచ్చెనొకటి
పాయసమయముగాఁ - బ్రవహించెనొకటి
ఆయను సూపమ - యంబుగా నొకటి 8460
యెలనీరుతొఁ బ్రవ - హించె నందొకటి
చలువమజ్జిగనిండఁ - జనుదెంచె నొకటి
పానకంబులచేతఁ - బ్రవహించెనొకటి
నానారసముల ను - న్నతి గాంచెనొకటి
యీరీతినదులెల్ల - నెల్లెడనిండఁ
జేరుఁవ బర్వత - శ్రేణులవ్రాలి
యొకకొండ మాంసమై - యుప్పరంబంటె
నొకపర్వతముమిన్ను - లొరసె కజ్జముల
ఒకగిరియన్నమై - యుండె బచ్చళ్ల
నొకగట్టు దిశలన్ని - యునుఁ దానె వొదివె 8470

నొకభూధరము మించె - నురుశాక సమితి
నొకదిప్పఁ గనుపట్టె - నూరుఁ గాయలను
యిటులుండ భరత మ - హీశు సైన్యంబు
లటునిటుఁ గనుఁగొని - యయ్యాశ్రమమునఁ
గలవినోదంబులుఁ - గనుఁగొనివేల్పు
తలిరుఁబోణులఁ జూచి - తగిలిపోలేక
యందునెవ్వతె నెవ్వఁ - డీక్షించె వాని
నందె కాకవ్వలి - కది చననీక
అందరికందరై - యందంబు లైన
మందిరంబులకు స - మ్మతి నెలయించి 8480
తలలంటి వలచుచం - దనములు వులిమి
జలకంబు లారిచి - చలువలందిచ్చి
ఉడిగింపు విరిబోణు - లొకకొందరెడల
నడపముల్ గట్టంగ - నద్దముల్దాల్ప
తలదడియార్చనం - దపుసిగల్ వేయ
నెలమిపుట్టఁగఁ బువ్వు - టెత్తులుంజుట్ట
మలసులు మెచ్చ రు - మాలులుగట్ట
కలపంబులలద బం - గరు పళ్లెరములు
భోజనంబు లమర్పఁ - బొదలుచు మొదటి
రాజీవముఖిఁగూడి - రాజసంబులను 8490
పట్టెమంచములపైఁ - బవళించి భటులు
కట్టుకంబంబుల - గజములవోలి
రాగరసంబులు - రారాఁపుసేయ
భోగముల్ గలిగి సం - భోగముల్ మరిగి
అపరంజిగిన్నెల - నరబ్రాలుగ్రోలి

చపలలోచనలు పూ - సారాయొసంగి
సంజుడు లెడనెడ - నంజు కోనిచ్చి
కెంజిగురాకు లే - కెమ్మోవు లొసఁగి
మబ్బురామబ్బురా - మస్తుకుండలును
గొబ్బెర గసగసాల్ - గోధుమనేతి 8500
కజ్జంబులను తృప్తి - గావించి రమణు
లజ్జవాయకయుండ - నాసైన్యమెల్ల
నేఁటికయోధ్య? మా - కేటికి భరతుఁ?
డేఁటికి రఘురాముఁ - డెటువోయెనేమి?
కొలువేల! యిల్లాండ్రు - కొడుకులునేల?
కలిగెరా! మనకు ని - క్కడ మిట్టపంట
కట్టుఁగోకలను భో - గములు భాగ్యములు
పెట్టెల సొమ్ములు - పేర్సులపాఁడి
చక్కని కొమ్మలు - సంతరించకయె
దక్కిన దాసీ వి - తానంబు గలిగె 8510
నేలికయును దైవ - మీభరద్వాజుఁ
డేల రాజులఁగొల్చి - యిడుములంబడఁగ
చాలుఁజాలు నటంచు - సంతుష్టమతులు
కేళిరతులుఁదృణీ - కృతపురందరులు
నగుచు సైన్యములుండ - హయసామజములుఁ
దగునెడకట్టిన - తావులయందు
మడ్డియుఁ గవణముల్ - మధుమాంసములును
గడ్డియుఁ దెప్పలు - గాఁదెచ్చి వేసి
నీరార్చువారును - నెమ్మేనిదుమ్ము
వోరాల్చు వారును - పోషించువారు 8520

ఎచటనుండియొ వచ్చి - యిన్నియందములుఁ
బచరింపఁ జతురంగ - బలమునుప్పొంగి
అరవది గడియలు - నమ్మునీశ్వరుని
కరుణఁగాలమునకుఁ - గట్టిరిబొమ్మ
తెలవారు నంతలో - దేవతామాయ
తొలఁగె భోగములెల్లఁ - దొలఁగెనెల్లరకు
కలగన్నగతి నీరు - కడకేఁగ నిలుచు
జలచరంబుల రీతి - సైన్యమంతయును
యెందుపాళెముడిగ్గి - యేరీతినుండి
రందరు నారీతి - నచ్చోటనుండ 8530

—: భరతుఁడు చిత్రకూటమునకుఁ బ్రయాణము చేయుట :—


మరునాడు భరతుఁ - డమ్మౌనిశేఖరుని
చరణంబులకుభక్తిఁ - జాగిలిమ్రొక్కి
అయ్య! మీకరుణచే - నఖిలసైన్యంబు
నియ్యెడ నిన్నటి - కెల్ల నానంద
పారవశ్యమునొంది - బడలికెల్ దీరె
శ్రీరాముచెంతకుఁ - జేరంగవలయు
నెయ్యెడ నున్న వా - రేరీతిఁబోదు
యెయ్యెది మార్గ మీ - వెఱిఁగింపు మనిన
ఆభరద్వాజ మహా - ముని కరుణ
తో భరతునకుఁ బొం - దుగ నిట్టులనియె 8540
“అనఘ! యిచ్చటికి మూఁ - డామడమేర
నొనరిన చిత్రకూ - టోర్వీధరమున
మందాకినీ నది - మలయు నుత్తరము

నందున నయ్యేటి - యామ్యభాగమునఁ
గలదొక్క రమ్యమౌ - గహనంబుదాన
నెలకొనియున్నాఁడు - నీయన్నయిపుడు
అడవిమార్గముగాన - నతి దుర్ఘటంబు
కుడియెడమల త్రోవ - గూడిపోవుటకు
బహుసైన్యములు గాన - పదిలంబుగాఁగ
గహనంబులో కసి - గందక చనుము" 8550
అనునెడ భరతుని - యనుమతి నతని
జననులందఱు మౌని - సన్నిధిచేరి
చేతులు మొగిచి ని - ల్చినఁ జూచి భరతు
నా తపోనిధి గాంచి - యప్పుడిట్లనియె,
"అందఱు వీరెవ్వ - రయ్య! యీ సాధ్వు
లిందఱి గురుతులు - నెఱింగింపుమాకు
వినవలయునటస్న - వినిభరతుండు
మునిచంద్రునకుఁగేలు - మోడ్చియిట్లనియె.
“అయ్య! వామనుఁగన్న - యదితిచందమున
నియ్యెడ నిలుచున్న - యీయమ్మసుమ్ము 8560
కౌసల్య రామునిఁ - గన్నట్టితల్లి
యీసాధ్విదండ నే - యెలవంకనున్న
మెలఁతయె సుమ్ము సు - మిత్ర లక్ష్మణుఁడు
తొలుచూలి పిదప శ - త్రుఘ్నండు పుట్టె
అల్ల యాకడనున్న - యామెకైకేయి
వల్లభుఁజంపి యా - వనవాసములకు
రామునిఁబంపి యె - ఱంగని యెటుల
సీమలన్నియునుఁ గా - ల్చినది నాతల్లి

యీపెకు జన్మించి - యిన్నియాపదలఁ
బాపంబుచేసి లోఁ - బడి వేగవలసె 8570
చూడుఁ డీపెమొగంబు - చూచినవెనక
జూడుఁడు తరవాత - సూర్యమండలము”
అనవిని యదలించి - యాభరద్వాజ
ముని భరతునిఁజూచి - ముదముతోఁబలికె.
“యిట్టులాడుదురయ్య - యీయమ్మవలన
గట్టిగానిద్దురల్ - గనిరి వేలుపులు
సకలలోకమ్ము నీ - సాధ్విచేఁగాంచె
నకలంకసౌఖ్య క - ల్యాణ సంపదలు
వందితఁగాని యె - వ్వారిచేఁ గైక
నిందిత గాదది - నే నెఱుంగుదును 8580
తరవాత మీరలం - దరు నెఱింగెదరు
పొరపొచ్చముగ నిట్లు - వోనాడఁదగదు
ధరణిబ్రోవఁగ నిమి - త్తము కైక జేసి
పరమేష్ఠి నెమ్మదిఁ - బరగియున్నాఁడు
ఆమందరయు విశ్వ - మంతయుఁబ్రోవ
భూమిపైఁజనియించెఁ - బుణ్యశీలమున
కావున నేడాది - గాగైకమనసు
నోవఁ జేయకుఁడు మ - నోవాక్యములను
పొండని దీవించి - పుత్తేరవారు
వెండియుఁ బ్రణమిల్లి - వెడలిరాశ్రమము 8590

—: భరతుఁడు చిత్రకూట ప్రాంతమును బ్రవేశించుట :—


తల్లులు భరతుండుఁ - తమ్ముండు బసిఁడి

పల్లకీలెక్క యా - ప్తజనంబుగొల్వ
పదిలమై నలుగడ - బలమెల్ల రాఁగ
చదలంబు ముందర - సాగించకదల
దక్షిణంబుగ జల - ధరములు నడచు
లక్షణంబున శుభ - లక్ష్మణులైన
రాకుమారుల సేన - రయమునం గదలి
భీకరారణ్యంబు - భేదించినడచె
పులులు దుప్పులుఁ గారు - పోతులు లేళ్లు
నెలుగులు కుందేళ్లు - నేదుబందులును 8600
కరులు మర్కటములు - గండకంబులును
కరులుఁ దోఁడేళ్లు బె - గ్గిలి భీతిఁ బరవ
నేల యీనినయట్లు - నిబిడమై నదులు
శైలంబులును వన - స్థలములుదాఁటి
కొంతమారమువచ్చి - గురుఁజూచి భరతుఁ
డంతరంగంబున - నలరుచుఁ బలికె.
“దవ్వులనదె భర - ద్వాజు లన్నట్టు
పువ్వుఁ దోఁటలుచుట్టుఁ - బొదువుకయుండఁ
దళుకొత్తునట్టి మం - దాకిని చెంత
జెలువొప్పె నల్లనై - చిత్రకూటంబు 8610
జలదముల్ వడఁగండ్లు - చల్లినరీతి
నిలమీదరాల్చె మ - హీజముల్ విరులు
జలజంతువులతోడి - జలనిధియనఁగ
పొలిచెఁ గిన్నరు లని - భూమీధరంబు
అరవరాజ్యముఁబోలి - యందరు సిగల
విరులుచుట్టిరి గంటె! - వేడుకనిచట

మనకుహితంబుగా - మలయమారుతము
చనుచోట ధరణీ ర - జంబు వారించె"
అనుచుఁ దమ్మునిఁజూచి - యనియె నిచ్చోట
"మునుల మహాశ్రమం - బులు గాననయ్యె 8620
అమరావతి యనంగ - నతిరమ్యమగుచు
నమరె నీవన మయో - ధ్యాపురి కరణి
ఎచట నున్నాఁడకో - యెచ్చోట రాముఁ
డచలుఁడై యందందు - నరయంగ వలయు"
అనునెడ నాయుధ - హస్తులై నట్టి
జనులు కేల్మొగిచి దా - శరథికిట్లనిరి.
అల్లదె కనుఁగొను - మయ్య! యీచక్కి
నల్లనిపొగలు గా - నఁగవచ్చె నెదుట
జనులున్న వారలు - సందియంబేల?
జనకజారమణుఁ డి - చ్చట నుండనోపు 8630
కాదేని మౌనులు - గాఁబోలు లేక
లేదుహేతువు వనీ - లేఖ నగ్నికిని”
అనవిని శత్రుఘ్ను - నాచార్యుఁగూడి
తనసేననెల్ల న - త్తరి విడియించి
భరతుండు ముందర - పయనమై కదల
పరీజను లామోద - భరితులై రంత

—: రాముఁడు పర్వత శృంగారమును సీతకుఁ జెప్పుట :—


అక్కడ రఘురాముఁ - డవనిజంగూడి
చక్కని యా - శైల సానువులందు

మెలఁగుచుఁ గంటివే - మృగశాబనయన!
అలరెనీ చిత్రకూ - టాచలం బిపుడు 8640
మన మయోధ్యాపురి - మఱచి యిచ్చోట
మనసురంజిలఁగ ని - మ్మహినుండఁగల్గె
యీగిరి కూటంబు - లినుని రథంబు
సాగిపోనీ వన - చదలఁగన్పట్టె
జాతివైరంబు లె - చ్చట లేకజంతు
జాత మిచ్చటఁగూడి - చరియించెఁగనుము
ధరణీతనూజ! వి - ధ్యాధరు లిచట
గిరికందరంబులఁ - గ్రీడించువారు
తమచేతి కైదువుల్ - దగిలింపవాన
నమరు నున్నత భూరు - హములఁగన్గొనుము 8650
జానకి! చూడు మి - చ్చటి గైరికములఁ
బూనెను కుంకుమ - పూఁత యీనగము
దానధారల గజేం - ద్రము మించురీతి
నీ నగంబున సెల - యేరు లొప్పెడును
సౌమిత్రివంటి నా - సైదోడుగూడి
భూమిజ! నినువంటి - పొలఁతిగల్గుటను
తమ్మునికై యెల్ల - ధరణియునిచ్చి
సమ్మతితోఁదండ్రి - సత్యంబు నిలిపి
యీరెండు కోరిక - లీడేర్చికొంటి
నోరామ! యిచ్చోట - నున్నట్టికతన 8660
నెన్నెన్ని వేడుక - లిచ్చోటఁగలిగె
నిన్నగేంద్రంబుపై - నెట్టిపుణ్యులమొ?

అతివ! వానప్రస్థ - మైన యాశ్రమము
వ్రతులకు స్వర్గాప - వర్గసాధకము
మావారికెల్ల ధ - ర్మంబిదిగాన
నీ విపినంబుల - కేను వచ్చితిని
మంజుల సుమితద్రు - మచ్ఛాయ నెపుడు
రంజిల్లు నీచల్వ - రాయిఁ గన్గొనుము
కనఁగనమను దీప - కళికలో యనఁగ
దనరు నీజ్యోతిర్ల - తలురాత్రులందు 8670
యీచుట్టుకట్టిన - యిండ్లనుంబోలె
జూచితే వికచప్ర - సూనకుంజములు
సీత! యీవనము లీ - క్షింపుముద్యాన
రీతి శ్రమంబు వా - రింపుచు మించె
పఱచిన పువ్వుల - పఱుపులోయనఁగ
ధరణిఁ గ్రొవ్విరివసం - తములాడె వనులు
తరలాక్షి! దేవతా - దంపతులిచట
మరుకేళిఁదేలి క్ర - మ్మరుట దెల్పెడును
వాడిన పువ్వులు - వన్యఫలంబు
లేడవి కాకున్న - నీప్రదేశముల 8680
కోమలి! యుత్తర - కురు భూములందు
ప్రేమంబుతో విహ - రించినయట్లు
మానససరము ర - మ్యతయు స్వర్గంబు
మాననీయ్యతయు స - మగ్రమై కలుగు
నిచ్చోట పదునాలు - గేండ్లు నీతోడ
విచ్చనవిడిఁగూడి - విహరించువాఁడ"

—: రాముఁడు సీతను పలాలించుట :—

అనిపల్కిగరి డిగ్గి - "యతివ! చూచితివె
తనియించె చూడ్కి మం - దాకినీతటిని
కారండవ క్రౌంచ - కలహంస చక్ర
సారస బకముఖ్య - సంకులంబగుచు 8690
గైరవ నీరజ - కల్హారనికర
నీరంధ్రమకరంద - నిష్యంద మగుచు
చంచరీకాంగనా - సంగీతమంత్ర
వంచితనియమ ది - వ్య మహీధ్రమగుచు
కుసుమితోభయనదీ - కూలసమస్త
వసుమతి రుచిశీత - వాతూలమగుచు
జలపిపాసాయాస - జంతువితాన
కలుషిత ప్రాంచల - కర్దమంబగుచు
స్నాతలై చనునట్టి - సంయమీశ్వరులు
చేతులు పొడవెత్తు - చిర తపోధనుల 8700
గలిగినాట్య మొనర్చు - కాలకంధరుని
పొలుపున నీనది - పొంత నిన్నగము
గాలిచేగదలు వృ - క్షములతో లాస్య
కేళిసల్పెడు నట్ల - కీర్తింపఁదగియె
రాలినపువ్వులే - రాలమై యొక్క
చాలుకట్టుక రాగ - జలపక్షికులము
తెప్పయెక్కినరీతిఁ - దేలియాడుచును
దెప్పరంబుగవచ్చె - తెరవ కన్గొనుము!
మునులునిచ్చలుఁ దాన - ములు సేయుకతన
వనమెల్ల భువన పా - వనముగా నమరు 8710

నియ్యేరు నీగిరి - యెంత యింపెసఁగె
తొయ్యలి! నాకు నీ - తోడఁ గ్రీడింప
చెలియ! యయోధ్యయౌ - చిత్రకూటాద్రి
పొలయ నిచ్చటి మృగం - బులు ఫౌరసమితి
యనితోఁచె నీవునా - యవరజుం డొక్క
మనసుతో ననుఁగూడి - మలసిన కతన
వెలఁది! నిచ్చలు మూఁడు - వేళల నిచట
జల పూరములయందు - స్నానంబు చేసి
మునిచర్యచేఁ గంద - మూలముల్ గొనుచు
నినుఁజూచి మఱతు న - న్ని విచారములును” 8720
అని వినోదింపుచు - నటకు లక్ష్మణుఁడు
వనమృగంబుఁ గొన్ని - వధియించి తెచ్చు
చవులైన మాంసముల్ - సతియునుఁ దాను
నవిరళ ప్రీతితో - నపుడారగించి
మెచ్చులు గలయెడ - మెలఁగుచు నుండి
రచ్చిత్రకూట ర - మ్యవనాంతరముల.

—: అడవిమృగములు భయపడి పాఱుటంజూచి రాముఁడు తత్కారణమును లక్ష్మణుని జూడుమనుట :—


ఆవేళ మృగము లి - ట్టట్టును బెదరి
పోవఁజూచియు రవం - బులు మిన్నుముట్టి
వినఁగ వచ్చుటయు పృ - థ్వీపరాగంబు
కనుచాటుగా రవిఁ - గబళించుటయును 8730
వినుచోటఁ గనుచోట - విస్మితుండగుచుఁ
దన తమ్ముఁజూచు సీ - తాకాంతుఁ డనియె.

"ఇదియేమి లక్ష్మణ! - యెన్నండు నెఱుఁగ
మదరుచునున్నది - యవనీతలంబు
రభసంబుపుట్టెఁ గా - రణమేమి యిచట
విభులెవ్వరైనను - వేఁట లాడెదరొ?
క్రూర మృగంబుల - కోలాహలంబొ?
నేరుపుతో దీని - నిశ్చయం బెఱిఁగి
వివరింపు నాతోడ - వేగంబె" యనిన
రవితేజుఁడగు సుమి - త్రా కుమారకుఁడు 8740
ఆ చెంతనున్న మ - హానగం బెక్కి
చూచి పైవచ్చు పౌఁ - జుల విలోకించి
ధరణీపరాగ మం - తయు నిండఁజూచి
పరసైన్య మిదియని - భావనచేసి
"శ్రీరామ యేరాజు - సేనయో వచ్చె
నూరక యేమరి - యుందురే మీరు?
ఆ వీతిహోత్రస- మారోపణంబు
గావింపుండీగిరి - గహ్వరాంతమున
జానకి నునుపుండు - శస్త్రకోదండ
నానాస్త్రములను స - న్నాహమై నిలుఁడు" 8750
అనివిని శ్రీరాముఁ - డాబలం బెట్టి
జననాయకునిదో వి - చారించి చూచి
మరి తెల్పుమనిన ల - క్ష్మణుఁడును వారి
గుఱుతులన్నియుఁ గనుం - గొని యన్నతోడ
బొమముడి నిగుడఁ జూ - పుల నిప్పులురుల
గుమిగొన్న యూర్పులఁ - గ్రొంబొగలెగయ

"కనుఁగొంటి గుఱుతుగాఁ - గైకేయి కొడుకు
మనమీఁద దండెత్తి - మచ్చరం బెచ్చి 8760
నీచేతి రాజ్యంబు - నిష్కారణముగ
దోఁచుక యంతటి - తోఁజాలుననక
అడవులు వట్టించి - యందుచే నైన
యుడుగని పగఁ గైక - యుపదేశ మొసఁగఁ
జంపెదనని పూని - చతురంగ బలము
గుంపులు గూర్చి యు - క్కోలుగాఁ గవిసె
బాహుబలంబుచేఁ - బగవాని నహితు
ద్రోహి నీతని జంప - దోషంబు రాదు
చదలంటె దేవగాం - చనపుఁబతాక
యదిచూచి భరతుఁడౌ - నని తలంచితిని 8770
యెవ్వనిచే నీకు - నిన్ని ఖేదములు
నివ్వటిల్లెను వాని - నేఁడె దండింతు
యిందెయుందము మన - కిది యిరవైన
కందువ యతఁడె యి - క్కడికి రానిమ్ము
వచ్చిన వాని నే - వధియించి మీకు
నిచ్చెద సామ్రాజ్య - మేలు మెల్లెపుడు
నేనుఁగ వొడిచిన - యిలమీఁదఁ గూలు
మ్రాను చందమునఁగు - మారుఁ డిచ్చోట
కలనిలోఁ బడజూచి - కైకేయి చాల
విలపింప నెవ్వరు - విడుమన్న వినక 8780
బందులు దేగజేరు - బందులఁ గొట్టి
ముందర మందర - ముందల గోసి

యా పగవారైన - యట్టివారలను
లావునుఁద్రుంచి యె - ల్లరుఁజూచి మెచ్చ
నాతని డాలు నీ - యడుగుల చెంత
నీతరి కానుకఁ - నేజేయువాఁడ
వనమెల్ల రక్త ప్ర - వాహముల్ నించి
తనియించువాఁడ భూ - తశ్రేణి నెల్ల
కాకజంబుక ఘూక - కంకాది ఖగము
లేకడఁ దనియఁగా - కీ రణస్థలిని 8790
క్రూర మృగంబులు - గొనిపోవుఁ గాక
భారత వీరులు - పడిన యుద్ధమున
నడఁగి నా మదినున్న - యతికోపవహ్ని
వెడలించి నీరస - విపినంబు వోలు
భరతునిసేన లో - పలఁ దవిలించి
దరికొల్పువాఁడ ని - త్తరి నిమేషమున
నాయుధంబులు గాఁచి - నట్టి ఋణంబు
పాయక తీర్తునే - బవరంబులోన"
అనిన సహింపక - యనునయోక్తులను
జనకజా విభుఁడు ల - క్ష్మణున కిట్లనియె. 8800

—: రాముఁడు లక్ష్మణుని కోపమును శాంతి నొందించుట :—


"బలపరాక్రమశాలి - ప్రాజ్ఞుండు భరతుఁ
డలఁతిమాటలు నీకు - నాడ నేమిటికి?
మనతండ్రి పనుపున - మనము కానలకుఁ
జనుదేర నతని దో - షముగఁ బల్కెదవె?
భరతుని మీఁదటఁ - బనికి రాఁగలమె?

ఎఱఁగ వింతియెకాక - యీ సాధనములు
వనికిఁదానయి పూని - వచ్చిన యతనిఁ
దునిమిన నపవాద - దోషంబు వచ్చు
నాత్మీయజనులకు - హాని గావించు
నాత్మలాభము విషం - బని యెంతు నేను 8810
నామదినైన ని - ర్ణయము ధర్మార్థ
కామంబులేఁ బూనఁ - గా మించుటెల్ల
తమ్ములకే కాని - తనమేలు దలఁచి
సమ్మతింపను దివ్య - శరముల యాన
యీకత్తితోడు మ - హీ చక్రమెల్లఁ
జేకొననె యధర్మ - చింత చేసినను
యిలయేల నొల్లనే - నింద్రపట్టంబు
బలిమిజేరిన న్యాయ - పథముఁ దప్పించి
మిమ్ముగాదని నాకు - మేదిని యేల
యమ్మెయిం బ్రాణంబు - లైన నేమిటికి? 8820
సతతంబు నాప్రాణ - సదృశుండు గాన
యితఁ డయోధ్యకువచ్చి - యిన్నియుఁ దెలిసి
నన్నుఁ జూడఁగవచ్చి - నాఁడేమొ? కాని
యున్నబుద్ధులు వాని - కొకనాఁడు లేవు
అతఁడేల? మనయన్వ - యముననే నాఁడు
నితరంబు లెవ్వరి - యెడనైనఁ గలవె?
తల్లిపై కడు నల్గి - తండ్రి నూరార్చి
యెల్ల రాజ్యంబు న - న్నేలింతు ననుచు
నిది పనిగావచ్చె - నేమొ? యాభరతు
హృదయంబునకుఁ గల - దే చలనంబు? 8830

పదరి యాతని నొవ్వఁ - బలికితి వేని
యది నన్ను దూషించి - నట్లుగాఁ దలఁపు
మన్నదమ్ముల తండ్రి - నవనిపై నందు
విన్నామె చంపిన - వీరశేఖరుల
నదిగాక యవనిపై - యాస నిక్కముగ
మది నీకుఁ గలిగిన - మాట మాత్రమున
భరతుచే నిప్పింతు - పాలింపు మీవు
ధరణి యంతయును బం - దయె తీరె మాకు
నతఁడు నామాటగా - దని మీఱవెఱచు
హితుఁ”డని పల్కిన - నేమియుననక 8840
తలవాంచి తనలోనె - తాఁజాలఁ గ్రుంగి
వెలవెలనై మాట - వెడలక యుండి
యూరకె మాటాడ - కుండ రాదనుచు
వేఱె తానొక యుక్తి - వెదకి లక్ష్మణుఁడు
గతిగూడుకొని యీసు - గనిపించి పలుకు
క్షితిసుతారమణు నీ - క్షించి యిట్లనియె.
"దశరథుం డిచటికిఁ - దావచ్చె నేమొ?
కుశలంబు లరసి కఁ - న్గొన వేఁడిమిమ్ము
చేర వచ్చి ననుఁ జూ - చెదము వీరనుచు
నేరు పాటగునన్న - నింగితం బెఱిఁగి 8850
యటులయౌ వీర లీ - యడవుల యెందు
నిటులుండ వచ్చు నే - యేఁబోయి తోడి
తెత్తుఁగాకని యరు - దెంచెనో కాక
మెత్తని మేనిది - మేదినీ తనయ
యనియెంచి యాసీత - నైనను వెంటఁ

గొని పోవవచ్చెనొ - కోయంచుఁ బల్కి
కనిపించి కొనక రా - ఘవుఁ డట్టులైన
మనరాజు ఛత్రచా - మరములు లేవు
శత్రుంజయంబను - జనపాలుఁ డెక్కు
గోత్రాధరముఁ బోలు - కొలువు సామజము 8860
వచ్చుచున్నది గాన - వసుమతీనాథుఁ
డిచ్చోట లేఁడని - నిచ్చ నెంచెదను
మిన్నక యీచెట్టు - మీఁదట నేల
యున్నవాఁడవు డిగ్గు - మొయ్యన మహికి
నన డిగివచ్చి చెం - గటను తానన్న
జనకజ కెలన ల - క్ష్మణుఁ డున్నయంత

—: భరత శత్రుఘ్నులును గుహాదులును రామాశ్రమము వెదకుట :—


నడవి లోపలను రెం - డామడ మేర
నెడపక తనమూఁక - నెల్లను డించి
వెనకవచ్చుఁ గిరాత - విభుఁజూచి మాకు
చనదిట మీఁద రా - జన్య వేషములు 8870
పనిచిలెంకల మఱ్ఱి - పాలు దెప్పింపు
మన నాతఁడట్ల సే - యఁగ భరతుండు
తమ్ముండు దాను న - త్తరి జటావల్క
లమ్ములు దాల్చి యు - ల్లాసంబు తోడ
తనదుతమ్మునిఁ జూచి - తగు నెలవరుల
వనములోపల రఘు - వరు వెదకుచును
యెలవంకగాఁ గర - మ్మేనును గుహుఁడు

వలదపరినుల నీ - వైపున వచ్చి
అరసి చూచెదమని - యీ భరతుండు
మఱియు నిట్లనియె "నీ - మహితా శ్రమముల 8880
లాలిత పద్మ ప - లాశ లోచనుని
నీలమేఘ శ్యాము - నిత్య కల్యాణు
హలకులిశాదిరే - ఖాంకితచరణు
నలఘు సత్యవ్రతు - నా రామచంద్రుఁ
జేరి నెమ్మోము వీ - క్షించి తచ్చరణ
వారిజంబుల మీఁద - వ్రాలి ప్రార్థించి
అల యయోధ్యకుఁ దెచ్చి - యభిషిక్తుఁ జేసి
కొలిచినప్పుడు గాని - కోరిక లెల్ల
చేకూడి పాయదు - చింత నామదిని
శ్రీ కరమూర్తియై - సీతయుఁ దాను 8890
తమ్ముండు నందనో - ద్యాన వాటికల
సమ్మతి నింద్రుండు - చరియించు నట్లు
విహరింప నీపుణ్య - విపినంబు లెట్టి
మహిమంబు గాంచునో - మహినెల్ల నాఁడు"
అని వెదకుచుఁబోయి - యనతి దూరమున
వనవీథికను ధూమ - వల్లి వీక్షించి
జూనకీ రమణుఁడీ - శైలంబు చేత
తానున్న వాఁడని - తన మంత్రివరుల
హితుల నచ్చటనుంచి - యేఁగె కాల్నడసు
ప్రతిపదంబును రఘు - పతిఁ దలంపుచును 8900
నపుడొక్క యెడనిల్చి - యాచార్యుఁ జూచి
"యిపుడు మాతల్లుల - నెల్లను మీరు

తోడితెండ"ని పంచి - తోడనే గుహునిఁ
గూడియావలి కేఁగి - కూర్మి తమ్ముఁడును
ఆ సుమంత్రుడు రాఁగ - నాశ్రమ క్షోణి
యేసంయమీంద్రుల - యిరవకొ యనఁగ
పెనురాసి యగునేరు - బిడుకలు విఱిచి
కొనితెచ్చు కట్టెల - గుంపును దివిజ
పూజార్థముగఁ దెచ్చు - పువ్వులుఁ జెట్ల
రాజిల్లు నారచీ - రలు నజినములు 8910
కనిచేరఁబోవ న - క్కడ పర్ణశాలఁ
గనుఁగొని భరతుండు - కరమర్థిఁ బలికె.
"మున్ను భరద్వాజ - మునివల్కు గుఱుతు
లన్నియు శత్రుఘ్న! - యవె కనుంగొనుము
యిదియె మందాకిని - యిది చిత్రకూట
మిది పర్ణశాల యీ - యెడ లక్ష్మణుండు
కందమూలముల నె - క్కడికెనో చనుచు
నిందువ్రేలఁగఁ గట్టె - నీ వల్కలములు
మునివర ప్రార్థనం - బుల నిందునిలుచు
మనరాము నెలవు ధూ - మంబిది గనుము" 8920
అని యానగముచేరి - యయ్యేటి యోర
వనముల జానకీ - వరుఁజూత మనుచు
మునివంటి వానిసో - ముని వంటివానిఁ
గనఁగల్గె భాగ్యంబుఁ - గనఁగల్గె ననుచు
నా మహాపురుషు వీ - రాసనాసీను
నీమేర నాకొఱ - కిట్టి కానలకు
సీతతోఁగూడి వ - చ్చిన రామచంద్రు

నేతరిఁగని కొల్చి - హిత మాచరింతు
నని ప్రదక్షణముగా - నాయింటి చుట్టు
పెనుముల్లు కంపకు - పట పరగాఁగ 8830
తడికె పెండముగల - ద్వారంబు దూరి
బడగరమ్మునకు నై - పన్నిన యట్టి
సౌమిత్రి గుడిసె య - చ్చటఁగాంచి యవల
రామచంద్రుని మంది - రము చేరనరిగి
మొగదల నాయుధం - బులశాల లోన
దిగదిగవెల్గు హే - తిద్వితయంబు
అపరంజి మొలలచే - నమరు కేడెములు
నపహసితపినాక - మగు ధనుర్యుగము
నాలుకల్ గోయుచు - నాకువులందు
వ్యాళముల్ వెలువడు - వైఖరి దోఁప 8940
అలుగులు వెలుఁగ మ - హా హేమపుంఖ
ములతోడి దివ్యాస్త్ర - ములఁ దేజరిల్లు
దొనలునుఁ జూచి చే - దోయి మొగిడ్చి
చని నరమృగదురా - సద మైనయట్టి
హరులున్న గుహవోలి - యరులకుఁ జేరఁ
దరముగానట్టి సీ - తా ప్రాణవిభుని
శాలలోఁజొచ్చి యీ - శాన్య భాగంబు
చాలంగ తరిగి ప - శ్చిమ దిశహెచ్చి
వలమాన పావక - జ్వాలల చేతఁ
బొలుపొందు డొక - వేదిపొడగని దాని 8950
చెంగట తమ్ముఁడు - సీతయుఁ గొలువ
మంగళాకారమౌ - మౌని వేషమున

నారచీరలును తి - న్నని జడల్‌ దాల్చి
చారువైఖరిఁ గుశా - స్తరణంబు మీఁద
నచలుఁడై వీరాస - నాసీనుఁ డగుచు
నుచిత ప్రసంగంబు - లొనరింపు చున్న
లోకేశనిభు నార్త - లోక శరణ్యు
గాకుత్థ్సతిలకు రా - కా చంద్రవదను
కరుణాసముద్రు నా - కర్ణాంతనయను
నరుణారుణాధరు - నాజానుబాహు 8960
నీరదనిభ గాత్రు - నిత్య కల్యాణు
వీరశేఖరు ధను - ర్వేద పారగుని
సారవివేకుఁ గౌ - సల్యా కుమారు
శ్రీ రామచంద్రు నీ - క్షించి శోకించి
జలజలఁ గన్నీరు - జాలుగాఁ గురియ
యెలుగురాయంగ నొం - డేమియుఁ బలుక
నేరక తనదైర్య - నిర్వాహ శక్తి
సూరెల మంత్రులఁ - జూచి యిట్లనియె
“కంటిరే! మాయన్న - కాకుస్థ తిలకుఁ
డొంటిగా నిచ్చోట - నువిదయుఁ దాను 8970
తమ్ముఁడు ననువంటి - తమ్ముని కతన
నుమ్మలి కింపుచు - నున్నట్టి వాఁడు
రాజవేషము మాని - రాముఁడు మౌని
రాజవేషమున ను - గ్ర వనంబులందు
నుండఁజూచియు నోర్చి - యుండిన నన్ను
చండాలుఁడై న తు - చ్చము లాడకున్నె?
లాలిత సౌఖ్యోప - లాలితు లడవి

పాలుగా నతిపాప - భాజనంబైన
యీమేను తనకేల? - యిఁకనని చేరి
“రామా" యనుచు నాప - రాని ఖేదమున 8980
నిలఁబడి పొరలి మే - నెఱుఁగ కేమియునుఁ
బలుకక యుండ న - పార శోకమున
రాముని చరణ సా - రసముల మీఁద
నామేర శత్రుఘ్నుఁ - డడలుచు వ్రాల

—: రాముఁడు భరతుని కుశల ప్రశ్నముచేయుచు రాజనీతిని బోధించుట :—


యిరువురు తమ్ముల - నిరుగేల నెత్తి
కరుణతో నిండారఁ - గౌఁగిటం జేర్చి
చాలశోకింప ల - క్ష్మణుఁడు సీతయునుఁ
దాలిమిలేక రో - దనములు సేయ
మదిలోనఁ గలఁగి సు - మంత్రుండు గుహుఁడు
కదియంగ రామల - క్ష్మణులనుఁ జేరి 8990
గురుఁడును శుక్రుండుఁ - గూడి భాస్కరుని
హరిణాంకుఁ గదిసిన - యందంబుఁ దోఁప
రామలక్ష్మణుల నూ - రడఁ బల్కునంత
నామహామహు లైన - యర్క వంశజులు
నలువురు దిగ్గజేం - ద్రంబుల రీతి
నలరుచో భరతుఁడ - త్యాపన్నుఁ డగుచు
తన జడలన్న పా - దములపైఁ బొరలఁ
దనువున వల్కల - దట్టంబు జార

క్రమ్మర విలపింపఁ - గని రఘూద్వహుఁడు
తమ్మునిఁ దనయంక - తలమున నునిచి 9000
శిరము మూర్కొని రెండు - చేతుల నతని
యుర మప్పళించి మృ - దూక్తి నిట్లనియె.
"మనతండ్రి యిపుడు సే - మమున నున్నాఁడె?
వినుపింపు మట్లైన - విడిచి యిక్కడికి
వత్తురే! మేనులు - వసివాళ్లు వాడి
వత్తులై మీరున్న - వైపులు చూచి
కలఁగెడు చిత్తంబు - గహన భూములకు
వెలువడి రానేల - వినుపింప వన్న!
రాదుగదా! దశ - రథునికిఁ గొదవ
లేదుగదా! హాని - లెక్కింపఁ బురిని” 9010
అనిపల్క నేమియు - ననకున్న నతని
మనసులో దుఃఖంబు - మఱపింపఁ దలఁచి
హితము దెల్పఁగమది - నెంచి శ్రీరాముఁ
డతనితో మఱియు ని - ట్లని పల్కెనపుడు.
"సేయుదువే! తండ్రి - చెప్పిన యటుల
పాయవే! యవ్విభు - పరి చర్యలందు
కావింతువే! కులా - గత గురుపూజు
భావింతువే! వారి - పరిణామ మెల్ల
కౌసల్యయు సుమిత్ర - కైకయు రాణి
వాసంబులను శుభా - వహులైన వారె? 9020
సుఖియేకదా! సుయ - జ్ఞుఁడు వామదేవ
ముఖులందఱును సౌఖ్య - మున నున్న వారె?
చెలికాండ్ర కెల్లను - సేమమే? బంధు

కులమెలమెల్ల నీమేలు - గోరియున్నారె?
యేమేరల భజింతు - వే యజ్ఞు లెల్ల
యేమరవే దేవ - ఋషి తర్పణములు?
కొలిచినవారి నె - గులు మాన్చినావె?
యిలవేలుపులు సుఖు - లే పట్టణమున?
బహుమాన మొనరింతె - పండిత శ్రేణి?
గృహదేవతలను భ - క్తి భజించినావె? 9030
భరత ధనుర్వేద - పారీణుఁడైన
గురుని సుధన్వుఁ జే - కూర్చి రక్షింతె?
మంతుకెక్కిన బుద్ధి - మంతులై నట్టి
మంత్రులకెల్ల సే - మమె కదవయ్య?
రాజులకును మంత్ర - రక్ష సర్వప్ర
యోజనంబుల యందు - నుత్తమం బగుట
తగినవారలు సంప్ర - దాయకుల్ నిపుణు
లగువారు నుందురె - యాలోచనముల
వేళల నిదురించి - వేఁకువ లందు
నాలోచనము సేతె - యర్థ మార్జింప 9040
నొంటి యాలోచన - ముడిగి పెక్కండ్ర
నంటు నాలోచించు - నదియును మాని
సులభ యత్నముగ నె - చ్చుగవచ్చు లాభ
ములయందు తామసం - బుగ జారవిడిచి
యుండక కనుగల్గి - యుందువే? యితర
మండలాధిపులు నీ - మాట సేయుదురె?
సేయు నాలోచనల్ - చేసిన దనక
యేయెడఁ బొడమక - యీడేర్చుకొనిన

నప్పుడందఱు విని - యౌనని మెచ్చి
యొప్పునిట్టిది యన - నుర్వి యేలుదువె? 9050
శ్రేయాభివృద్ధి గో - రి వివేకులందు
వేయింట నొక్కని - వెదకి యేర్పఱచి
చేపట్టి యెవ్వరు - చెప్పిన వినక
యాపురుషుని యాప్తుఁ - డని నడుపుదువె?
ఎందరు గలిగిన - యేమిఁటి వార
లందరు నర్థ వ్ర - యంబింతెకాక
అన్నిఁటికినిఁ దగి - యామంత్రి యొకఁడె
యున్నఁజాలదెనిధి - యున్నట్టి కరణి
మనుజుల నుత్తమ - మధ్య మాధములఁ
బనిగొంటె? తగినట్టి - పనులందు నిలిపి 9060
పరిజనుల స్వహస్త - పరహస్తములను
పరిశీలనము సేసి - భావముల్ గనుదె?
తగనిదండనము చే - తప్పు లేకయును
తెగినొంప కుందువే - తెకతేర జనుల?
నన్యాయ పరుఁడైన - యవని పాలకుని
సైన్యముల్ ఋత్విజుల్ - సవనంబు నందు
పతితుఁడా యజమానుఁ - బాసిన కరణి
యతివేల కామాంధుఁ - డైఁ బల్మిఁబట్టు
హితమెఱుఁగని మూర్ఖు - నెడవాయు నట్లు
ప్రతి కూలు లగుదురు - భావంబులోన 9070
చతురుపాయంబుల - జనపాల నీతి
చతురుఁడై మన రాజు - జగతిఁ బెంపెక్కుఁ
దన బ్రదుకునకు నం - దఱిమీఁద విభుని

మన సెడయించి దు - ర్మానుసుండైన
వానిఁ జేపట్టిన - వసుమతీ విభుఁడు
హీనుఁడై యాపద - లెల్లనుఁ బొందు
అటుగాన నిట్టి ప - ర్యాయం బెఱింగి
పటుధైర్య గాంభీర్య - బాహు శౌర్యముల
నెన్నికగను వాని - హితుని నీ మొనకు
వన్నియగా దళ - వాయిఁ జేసితివె? 9080
సమరంబు లొనరింప - చతురులై నీదు
సమయంబునకు వచ్చి - సాహసులైన
సేనలకెల్లఁ జే - సిన సంబళములు
నానాటనిచ్చి మ - న్ననఁ బ్రోచినావె
అనురక్తు లైనట్టి - యాప్తులు నిన్ను
గనిగొల్చి సకల సౌ - ఖ్యముల నున్నారె?
నీవువల్కిన మాట - నిజమని నమ్మి
సేవకులెపుడు వ - చ్చి భజింతురయ్య
యెదురువారల మర్మ - మెఱిఁగి యీవేళ
కిదియుచితంబని - యెంచి భాషింతె? 9090
వలఁతులౌ వేగుల - వారు కన్నులుగ
తెలియుదువే యెల్ల - దిశల కార్యములు?
వరమహీ పాలుర - పట్టున నీకు
నెఱఁగంగ దగుపదు - నెనిమి దెట్లనిన
తొలుత మంత్రి పురోహి - తుఁడు యువరాజు
దళవాయి గొల్ల లం - తః పురకర్త
ఆజ్ఞాధికుఁడు తీర్చు - నతఁడు నెచ్చెలియు
తజ్ఞుఁడై సెలవులే - తరిసేయ నతఁడు

నగరంబు పాలించు - నర నాయకుండు
తగవరి ధర్మశా - స్త్రము దెల్పువాఁడు 9100
చనవరియు తలారి - సాల దుర్గములు
తనగడినుండు నా - తఁడు ననంగలుగు
వారల తెఱఁగు స - ర్వంబు నానాట
యేరుపాటుగ విందు వే - యేకతమున?
హితుఁడు మంత్రుల - నీవునే తక్కనీదు
 క్షితిఁబదియేను వీ - క్షింతె యేమరక?
వీరల చందముల్ - వెర్వేర గుప్త
చారులచే విని - సాధించినావె?
పరులరాజ్యము గొని - పాఱంగ ద్రోల
కరిగాపులుగ వారి- నణఁచి యేలుదువె? 9110
బలహీను లనియెంచి - పగవారి జేరఁ
బిలిచి రక్షించు ను - పేక్ష మానితివె?
వేద శాస్త్రంబులు - విడిచి చార్వాక
వాద తర్కంబు లే - వలఁగొన్ని నేర్చు
దుర్మత పాషండ - దుర్జన శ్రేణిఁ
గూర్మిఁ జేరఁగ నీవె - కొలువు లోపలికి
చతురంగ బలములఁ - జతురుపాయైక
చతురులౌ మంత్రుల - సకల భూజనుల
తనరెడుమన యయో - ధ్యా పట్టణంబు
పనుపడ లెస్సగాఁ - బాలింతె నీవు 9120
చలివెందరులు యాగ - శాలలు దివ్య
నిలయముల్ సత్రముల్ - నీరా కరములు
ధర్మసావడులు నెం - తయు త్రోవఁగల్గ

నర్మిలి బాలింతె - యరసి పాంథులను?
మహినెల్లచో నదీ - మాతృ కత్వమున
బహుళంబులగు జాన - పదము లన్నియును
ముక్కారు పంటలు - మోచి స్వర్గమును
లెక్క సేయక యవి - లెస్స యున్నవియె?
అరయు దే నగరి కా - ర్యముల నాదాయ
పరులునై నమ్మిన - ప్రాఁత వర్తకుల 9130
నిన్నునమ్మిన వారు - నిఖిల భోగముల
నున్నారె యచ్చిక - మొకయందు లేక
యిల్లాండ్రతో మర్మ - మెఱింగింపఁ బోక
యెల్ల కామితములు - నిచ్చి యేలుదువె?
సింధురాశ్వ ముల నా - ర్జించుచోనతి మ
దాంధతకును దని - యక మెలంగుదువె?
ఉభయవేళలఁ గొలు - వుండి నిచ్చటను
సభలోన హితగోష్ఠి - సలుపు చుండుదువె?
పనులవారల నొక్క - పరిపాటి గాఁగ
చనవిచ్చి యూనిక - సవదరింపుదువె? 9140
దుర్గాంతరముల ర - స్తులవిధరస
వర్గముల్ గలుగ స - ర్వమువిచారింతె?
ఆదాయమున కన్న - నధికమౌ సెలవు
కాదుసేయఁగ నంచు - కని మెలంగుదువె?
కరణముల్ దెలుప లె - క్కలు విచారించి
యెఱుఁగుదువే సీమ - నెత్తు రొక్కంబు?
నిలువ లుండఁగనీక - నెఱి నాడునాట
నిలవృద్ధిం బొందించి - యేలు చుండుదువె?

పాత్రంబు నందు లా - భంబు వెచ్చంబ
పాత్రంబులను జలు - పక యుందువయ్య? 9150
గురుబుధ కవియాచ - కులను లాలించి
నిరతంబు గొర్కెల - న్నియు నొసంగుదువె?
చోరుండు వీఁడను - చో విచారింప
కూరక దండింప - నోడుదే నీవు?
సొమ్ముకై యాసించి - చోరులం గాచి
యిమ్మహి కెల్ల గీ - డెంచ కుండుదువె?
యిరువురు జగడించి - యే తేరవారి
తెఱఁగెల్ల గట్టిగా - తెలియంగ వినక
యందు లంచములిచ్చు - నతనిఁ జేపట్టి
చిందుగాఁ బ్రతివాది - చెప్పిన మాట 9160
తగవులుఁదీర్చు పా - తకులు లేకుండ
నగరివాకిట నీతి - నడపు చున్నావె?
న్యాయ మన్యాయంబు - నరులపై చింత
సేయకొక్కరుని దూ - షించి నిందింప
వాని కన్నులనీరు - వసుమతి రాల
నానరపతి నిర - యంబులఁ గూలు
వృద్ధబాలక వైద్య - వితతి దానమున
బద్ధానురాగ సు - భాషితంబులను
నలరింపుదువె? పూజ - నారాధనములఁ?
గొలుతువే మునుల నా - కుల నిరంతరము? 9170
ధర్మార్థ కామముల్ - తరి దప్పకుండ
శర్మంబుగోరి ని - చ్చలు నొనర్పుదువె?
ఆది నాస్తికతయును - ననృతంబు నప్ర

సాదమే మగుటయు - జడతయు బుధుల
మన్నింపమియు పాలు - మాలుట సతుల
చిన్నెలం దగులుట - సేయుఁ గార్యములు
తనయిచ్చ నడపుట - తగని మంత్రములు
చెనటివారలఁ గూర్చి - సేయుట తగిన
యాలోచనమును సే - యమియును సేయు
నాలోచనములు బ - యల్సేయుటయును 9180
శుభకర్మములు మానఁ - జూచుట నలుగు
రభిముఖులై దొర - లనికి నేతేర
నొకఁడు నెదుర్చుట - యునుఁ జూవెరాజు
నకుదోషములు పదు - నాలుగై యుండు
తొలఁగి యీచెప్పిన - దోషంబులకును
విలసిల్లదే నయ - విదులేన నంగ
ఆలస్యమును లోభ - మాగ్రహించుటయు
చాల మోసంబు న - సత్య వాదంబు
పిరికి తనంబుతో - బేదఱికంబు
నెఱుక లేమియు నీతి - యెడ వాయుటయును 9190
కొంచంబు లాడుటఁ - గూడ వివేకు
లెంచిరి దశ - వర్గ మిదిమానినావె?
స్థలదుర్గ వనదుర్గ - శైల దుర్గములు
జలదుర్గ ధనురస్త్ర - చయ దుర్గములును
అనఁ బంచదుర్గంబు - లరసి నీమేని
యనువున మఱవక - యరయుదే యెపుడు?
చెలిమియు నెడవాయఁ - జేయుటఁగాఁగ
కొలది నిచ్చుట పనిగొని - యడంచుటయు

కలుగునుపాయ వ - ర్గంబులీ నాల్గుఁ
దెలియుదే రిపుల - సాధించు పూనికెల 9200
సమునితో సామంబు - చపలుని తోడ
నమరుభేదంబు శౌ - ర్యాధికు నందు
దానంబు లోనైన - దండన క్రమము
 పూని గావింతువే - బుద్ధి నెల్లపుడు?
నిజశక్తి మంత్రుల - నెపుడు జుట్టమున
భుజశౌర్యమును పరి - పూర్ణ ధనంబు
సీమయు దుర్గముల్ - సేనయుఁ జుమ్ము
భూమీశునకు నంగ - ములు రెండునైదు
అట్టి స్వామ్యాది స - ప్తాంగ వర్గమున
గట్టిగాఁ గొదవలు - గాక యిన్నావె? 9210
సాహసంబు నసూయ - చాడియుం బనుల
ద్రోహంబు నీర్ష్యయు - దూషణంబులును
ప్రల్లదంబులు విన - రాని దండనము
చెల్లదీ యెనిమిది - సేయు పాతకుల
వర్జించి యీయష్ట - వర్గంబు నెఱిఁగి
యూర్జిత నీతిచే - యుర్వి యేలుదువె?
ప్రభుశ క్తియును మంత్ర - బలము నుత్సాహ
మభిమతవర్గ త్ర - యంబెఱుఁగుదువె?
ధరిత్రయీవార్తలు - దండనీతియును
నరయుదె? విద్యాత్ర - యంబనిమదిని 9220
కానిచోసంధి వి - గ్రహములు నుచిత
యానాసన ద్వివి - ధాక్రమణములు
ననఁగషడ్వర్గంబు - లానీతిచేత

చెనకువైరులను శి - క్షించి మించితివె?
పూనిక యింద్రియం - బులగెల్చి దైవ
మానుషకృత్యముల్ - మదినెఱుంగుదువె?
సీమయు నెలవును - చెలులుదేశంబు
నేమంబుఁదనవారి - నెవ్వాఁడఁజెఱుచు
మదముదుర్విషయంబు - మానంబుపీడ
లొదవించుటయుఁదెల్పి - యుడపుటల్ గలిగి 9230
ధర్మార్ధశక్తిఘా - తకుఁడయి దేవ
కర్మావమానుఁడై - కడఁగునెవ్వాఁడు
కాని వాఁడితఁడని - కడుఁబ్రజకెల్ల
హానిసేయుచునుండ - నయ్యెనెవ్వాఁడు
తనమాటగాదన్న - తాఁజలపట్టి
పెనఁగు నెవ్వఁడువానిఁ - బెంపుఁగావించి
రమ్ముపొమ్మనియాద - రము సేయఁబోక
సొమ్మెల్లఁగొని వీడు - చొరనీవె వాని?
యెన్నిక సేయనీ - యిరువదిగుణము
లున్నవారి నెఱింగి - యుండుదే మదిని? 9240
గడిరాజు శత్రుఁడా - కడిరాజు మిత్రుఁ
డెడరాజుదాసీనుఁ - డెవ్వారికైన
తన రాజ్యమునకు నే - తరినలుదిక్కు
లనుఁగల్గురాజు లె - ల్లనునిక్కమనుచు
రాజులు ద్వాదశ - రాజమండలము
యోజింతురది మది - నున్న దేనీకు?
నలువురఁగూర్చియై - నను మువ్వురైన
వలయునాలోచనల్ - వరుసఁగావింప

నందరుంగూడియే - కాలోచనంబు
వొందుగానడపించి - బుద్ధిలోనెంచి 9250
యిటమీఁదనీకు నె - య్యెది సరిపోయె
నటుల సేయుదువే జ - నాళిమెచ్చంగ?
యాగంబు లొనరించి - యాగమంబులును
భోగంబులునుఁదేల్చి - పువ్వుఁబోణులను
దానధర్మములచే - త నపారధనము
మానితశీలక - ర్మముల శాస్త్రముల
కొలిచినవారిచే - గుణచరిత్రములు
ఫలములొందించెనే - భరత! నీకిపుడు?
ధర్మార్థ కామోచి - తంబులై నాదు
నిర్మలహృదయంబు - నెలకొన్నయట్లు 9260
నేవివరించిన - యీనీతులెల్ల
భావంబులోనీకుఁ - బాదుకొన్నవియె
మనపెద్దలైనట్టి - మనువంశనృపుల
యనువునంబ్రోతువే - యవనియంతయును
మంచిపదార్థ సా - మగ్రితో సరస
బంచుక భుజియింతె - బంధులంగూడి
యేనుచెప్పిన బుద్ధి - నెవ్వారలైన
మానవాధీశులి - మ్మహియేలిరేని
సకలభోగములు య - శంబునుఁగాంచి
యకలంక సంతోషి - తాత్ములై పిదప 9270
యెల్లనాఁడును దివి - నింద్ర భోగముల
నుల్లసిల్లుచు వేడ్క - నుండుదురెపుడు'
అన్నమాటలువిని - హస్తముల్ మొగిచి
యన్నతో భరతుఁడి - ట్లని విన్నవించె

—: రామునకు భరతుఁడు తండ్రి మృతి నెఱింగించుట :—

"ఏలయ్య! ధర్మవి - హీనుండనైన
పాలసునకు నాకుఁ - బార్థివనీతి
అన్నయుండఁగ నొకం - డైన రాజ్యమునఁ
గన్నిడునే మన - కాకుస్థులందు
తనకేల వట్టివె - తల్ నాదురాక
వినవయ్య! మీరు నా - వెంబడివచ్చి 9280
పట్టంబు గట్టుక - భానువంశంబుఁ
జుట్టనవ్రేల్ వంచి - చూపరాకుండ
వన్నువ వెట్టుము - వర్ణితగుణము
లన్నియు మీయొక్క - రందె కల్గుటను
దేవుడవును నృప - తివి నీకునేను
సేవకుండను పరీ - క్షింపు ముల్లంబు
ఏను కేకయ పురి - కేఁగియు మీరు
కానల కరుగుట - కారణంబులుగ
దశరథేశుండు కాల - ధర్మంబు నొందె
దశవారములుఁ దీఱు - తరిఁ జేయవలయు 9290
కర్మంబు లేఁ దీర్చి - కదలి వచ్చితిని
ధర్మాత్మ! నీసన్ని - ధానంబునకును
మీరునుఁ జేయుఁ - డమ్మేదినీపతికి
వారిదానము దృఢ - వ్రతుఁడవు నీవు
ప్రియపుత్రుఁడవు గాన - పేర్కొని యొసఁగు
నియమపూర్వకతిలా - న్వితపుణ్యవారి
అక్షయదివ్యలోకా - వ్యాప్తిఁ జేయు

—: రాముఁడు తండ్రికై శోకించి తర్పణ మొనర్చుట :—

లక్షింపఁ బితృకోటు - లకునెల్ల నేఁడు”
అని భరతుఁడు బల్కు - నమ్మాట చెపుల
విని మహానగము ప - విప్రహారమున 9300
బడినట్లు నరకినం - బడు భూరుహంబు
వడువున జూనకీ - వరుఁడు మూర్ఛిల్లి
కూలంబు గోరాడి - కుంభిని నలసి
వ్రాలిన మత్తేభ - వరము చందమున
నున్నగన్గొని వివి - ధోపచారంబు
లన్నకుం దమ్ములు - నవనిజాతయును
కావింపఁ దెలివొంది - కన్నులు దెఱచి
ఆవీరశేఖరుం - డడలుచుఁబలికె.
“కీడైనమాట కై - కేయి కుమార!
ఆడుదు రేయిట్టు - లదరిపాటునను? 9310
యేగతినోర్తు న - న్నిటు లెడవాసి
యాగుణనిధి తండ్రి - యంతరించినను
మనజనకుఁడు వోవ - మహియెల్ల నెట్టి
యనువునం ద - ల్లడమందెనో యపుడు
దశరథుగతి నయో - ధ్యారాజధాని
వశమె యేలంగ నె - వ్వారికినైన?
యేలేనిచోఁ దండ్రి - ఋణమెల్లదీర్చి
మేలుఁ గైకొంటిరి - మీర లిర్వురును
యెందుకు నాజన్న - మిఁక ననువంటి
నందనుం డుండి యుం - డని చందమయ్యె 9320

యెన్నినాళ్లకునైన - యిఁక ననువంటి
చెన్నటికి నయోధ్య - చేరంగనగునె?
నన్ను నాతండ్రి నా - నాఁటికిఁ జేయు
మన్నన లేనెట్లు - మరతు నుల్లమున
నేరుపు నెరముల్ - నెమ్మదినోర్చి
చేరి యెవ్వరు బుద్ధి - చెప్పెడివారు?
ననునొక్క పాలునుఁ - నందనులెల్ల
దనకొక్కపాలుగాఁ ద - లఁచు భూవరుఁడు
వనవాస మీడేర్చి - వచ్చిననన్నుఁ
గనుఁగొని లాలించఁ - గలతండ్రివోయె 9330
యెవ్వరు నారాక - కెదురులు చూతు?
రెవ్వరి యడుగుల - కేనువ్రాలుదును?
కన్నులు బాష్పంబు - కణములురాల
నన్నుదీవింప ను - న్నారె యింకొరులు?
పలికి బొంకఁగ లేక - ప్రాణముల్ విడుచు
నలఘు సత్యవ్రతుండై - నట్టితండ్రి
నన్ను తానెడవాసి - నానిమిత్యముగ
నెన్నిపాటులఁబడి - యేఁగెనో దివికి
నొకరైన లాలింప - నోపలేరైరి
యకట కోల్పోతి నే - నసదనుం జేసి 9340
నమ్మి యందరితోన - నారనాఁథు డించి
పొమ్మనుటకు మోస - పోయివచ్చితిని
యేమందు నని విను - మిందీవరాక్షి
మీమామ దివి కేఁగి - మేదినీతనయ!
వినవన్నలక్ష్మణ! - విభుఁడు దిక్కేది?

మనల తానెడవాసి - మరణంబునొందె”
అనుమాటలకుఁ దమ్ము - లందరు జనక
తనయయు బెట్టు రో - దనములు చేసి
తనువారు వారలం - దాను నూరార్చి
మనకులోత్తముఁడు ల - క్ష్మణున కిట్లనియె. 9350
“ఇపుడు తండ్రికి వారు - లియ్యంగవలయు
తపినికాయల సైయి - దముఁ గొనిరమ్ము
తెమ్ము! వల్కలము లెం - తేవేగమనుచు
రమ్మని జానకీ - రమణి దోకొనుచు
తమ సుమంత్రుఁడు కయి - దండ యొసంగ
నమరవాహినినంటి - యాయేటి నీట
సంకల్పపూర్వక - స్థానంబుచేసి
క్రుంకిడు తరవాత - కోమలాంజలుల
దక్షిణముఖముగా - తండ్రిఁనిఁగూర్చి
యక్షయపుణ్యలో - కావాప్తి నీకు 9360
నయ్యెడు ననివారు - లర్పించి వార
లయ్యెడదరి కేఁగి - యచట తండ్రికిని
తర్పణంబులు తిలో - దకములు నిచ్చి
నేర్పుతో తపినిపిం - డియు రేఁగుఁబండ్లు
కలిఁగూర్చి ముద్దలు - గావించి పిండ
ములు పితరులకిచ్చి - మువ్వురు నపుడు
శోకించి జనులకె - చ్చో భుజియింప
జేకూడఁదానం - జేసిన పైతృకంబు
పితరులకెల్లఁ దృ - ప్తి వహింపఁజేయు
నతిశయంబుగ నని - యాగమవిదులు. 9370

పలుకుదు రటుగాన - భక్తి నేమిచ్చు
జలమాత్రమునఁ దృప్తిఁ - జనుదురు గాక!
మమ్మును పితృపితా - మహులు మన్నించి
క్రమ్మర పుణ్యలో - కములకు ననుచు
నచ్చోటువాసి నిజా - వాసమునకు
వచ్చి యచ్చటనున్న - వారునుం దాము
రోదనం బొనరింప - రోదసి నిండి
నాదంబు భరతుసై - న్యము చెవిసోఁక
వారలందఱు విన - వచ్చు నీరవము
శ్రీరామచంద్రు నీక్షిం - చెఁ గానోపు 9380
భరతుఁడచ్చట విలా - పము నింగిముట్టె
గిరిమీఁదవారి యం - కిలి చూతమనుచు
నందరు వివిధవా - హనములతోడ
నందు ప్రవేశించి యా - శ్రమంబులును
చిత్రకూటము నిండ - సేనారవంబు
మాత్రాధికంబయి - మహిగఁప్పు కొనిన
కలగుండువడి విహం - గమకోటి యెగసి
కలకలధ్వనుల నా - కసము గప్పుటయు
తల్లితండ్రులఁబాసి - తడవుఁగాలంబు
చెల్లించి బిడ్డలు - చేరుచందమున 9390
తలఁపు లుప్పొంగ సీ - తారామలక్ష్మ
ణులజేరి యెపుడు కన్గొను - దుమో యనుచు
కొందరు మందరఁ - గోపించితిట్టి
కొందరు కైకదు - ర్గుణము లెన్నుచును
సవిధకానన పర్ణ - శాలాగ్రసీమ

నవనిపై వీరప - ద్మాసనాసీను
అనుజసమేతు నీ - లాంబుదశ్యాము
జనకజావిభు రామ - చంద్రు నీక్షించి
నడలుచుఁ జేరరా - నాప్తబాంధవుల
వెడఁద కన్నులదయల్ - వెదచల్లఁజూచి 9400
అందరందగిన మ - ర్యాద సంధించి
కొందర తనచెంతఁ - గూర్చుండఁజేసి
కుశలంబు లడుగుచుఁ - గూర్మితోవినుచు
దశరథరాజ నం - దనుఁ డున్నయంత,
అలవసిష్ఠుఁడు రా - జాంతఃపురంబు
కలయఁగూర్చుకొని హె - గ్గడు లెల్లఁగొలువ
కదిసిముందర వెన్కఁ - గనుకల్గి రాచ
ముదుసళ్లుఁ బెద్ద లి - మ్ములఁ జేరిరాఁగ
ముందర గంచుకుల్ - మూఁకల జడియ
గొందరు దవ్వారి - కులు వెంటరాఁగ 9410
ముదిత లందరు మేలు - ముసుఁగులతోడ
పదములుగంద చూ - పట్టుకాల్నడను
ఆచిత్రకూట మ - హాపర్వతంబు
చూచి మందాకినిఁ - జూచి కౌసల్య
కైలాగొసంగు ల - క్ష్మణుతల్లిఁజూచి

—: కౌసల్యాదులు రాముని దగ్గఱకు వచ్చుట :—


"బాల! చూచితివె! యీ - పావనతటిని
నీకొడు కీయేటి - నీరంబు లిచ్చి
నాకుమారుని చెంత - నవయుచున్నాఁడు.

భరతుండు రామునిఁ - బ్రార్థించితెచ్చి
పురినుంచి రాజ్యంబె - పూనించెనేని 9420
అట్టి భాగ్యంబెల్ల - నలివేణి నీదు
పట్టియెకాక చే - ర్పగనేల యొరుల?
ఆపదలకు నోర్చు - నట్టివారలకె
ప్రాపించువలయు సం - పదలెల్ల వెనక
యెందునున్నారకొ - యిక్ష్వాకుతిలకు
లందరఁజూచిరొ - యపుడె రాఘవుని”
అనివచ్చుచో దక్షి - ణాగ్రముల్ గాఁగ
నునిచిన దర్భల - నుంచుపిండములు
గనుఁగొని “చెలియ! యి - క్ష్వాకు వంశమున
జనియించి యిలయొక్క - ఛత్రంబు నీడ 9430
నడిపించు దశరథు - నకు రాముఁబోలు
కొడుకు మందాకినీ - కూలంబు నందు
తవనిపిండిని పిండ - దానంబు సేయు
నపుడె యెవ్వరు - నేర్తు రావిధి గెలువ?
యిన్ని దుఃఖంబులు - నీక్షించి యోర్చు '
నన్నుఁబోలిన యట్టి - నాతు లున్నారె?”
అని చేరఁగావచ్చి - యల్లంతరాముఁ
గనుఁగొని యేడ్చుచో - గడమ తొయ్యలులు
నందరు నెలుఁగెత్తి - హాహారవంబు
క్రందుగా శోకింపఁ - గాంచి రాఘవుఁడు 9440
చేసిన పుణ్యముల్ - చెల్లించి దివికి
బాసివచ్చిన యాసు - పర్వుఁడోయనఁగ
గ్రక్కున లేచి తా - కౌసల్యమోము

చక్కఁగా గనునంత - జలజలమనుచు
కనుఁగొలుకులజల - కణములు రాలఁ
దనతల్లిపాదప - ద్మములపైవ్రాలి
ఆయమ్మశ్రీరాము - నక్కునఁజేర్చి
హాయను యెలుంగెత్తి - యారటలేక
విలపింప సౌమిత్రి - వెనక మ్రొక్కుటయు
గలఁగుచు నాతనిఁ - గౌగిటఁజేర్చె 9450
జలదమాలికలోని - శశిరేఖకరణి
చలువేది నిగురుముం - చిన నిప్పు రీతి
పసివాఁడు మోముతో - వనధూళిఁబొదివి
కనుగందియున్న యం - గకములతోడ
జానకీరమణి త - చ్చరణంబులకును
తానుమ్రొక్కినఁ గన్న - తల్లియ పోలి
ఆసతీమణినెత్తి - యాలింగనంబు
చేసి యా కౌసల్య - చింతించి పలికె
"ఓయమ్మ! నినువంటి - యుత్తమాంగనకు
నీయవస్థలువచ్చె - నేమనవచ్చు? 9460
జనకుండు నీకును - జనకుండు దశర
థునియంత రాజచం - ద్రుఁడు నీదుమామ
రామచంద్రుండు వంటి - రమణుండునయ్యు
నోమానవతీ! యిట్టు - లుండనోచితివె?
నినుఁజూచియేఁ దాళ - నేర్తునే? నాదు
జననంబు దుఃఖ భా - జనమయ్యె నింత"
అనుచుండు నాచార్యుఁ - డరుదేర నతనిఁ
గని బృహస్పతికి సం - క్రందనుఁ బోలి

మ్రొక్కిన రాము న - మ్మునిరాజు చూచి
యక్కునఁ జేర్చి దా - నాశీర్వదించి 9470
యతనిచెంగట నుచి - తాసీనుఁడైన
క్షితిపాలకులు రాజ - శేఖరుల్ హితులు
సచివులు బాంధవుల్ - సంగడిం గదిసి
యుచితస్థలంబుల - నుండు నవ్వేళ
భరత సౌమిత్రులఁ - బరగు నాస్థాన
మరుదయ్యె నెలుఁగుత్రే - తాగ్నులచేత
అలరెడు యాగశా - లాంతరం బనఁగ
నలరె రాఘవుఁడు మ - హావపాహోమ
సమయసాక్షాత్కృత - జలజలోచనుని
క్రమమున జనులకుఁ - గనుపండువులుగ 9480
“భరతుఁడే క్రియనొడఁ - బడఁబల్కునొక్కొ
పురికి రాఘవుఁడెట్టు - పోవునో మఱలి
అట్టిభాగ్యము! చూతు - మా వీరిమాట
నెట్టులుండునొ చంద - మెల్లరు" ననుచు
సద్దుసేయకుఁడను - సమయంబు చేసి
వద్దివారెల్ల భా - వములఁగోరంగ
కరుణాపయోధి ల - క్ష్మణసహాయుండు
భరతునితో మృదు - ఫణితి నిట్లనియె.

—: భరతుఁడు రాజ్యము గైకొనుమన రామునివేడుట :—


"నీకునేమిటి కన్న! - నిష్కారణముగ?
నీకాననమునకు - నిట్టివేషమున 9490

జడలతో వల్కల - శాలులతోడ
పుడమియేలకరాజ్య - భోగముల్ మాని
వచ్చితి విటువంటి - వారల మిమ్ము
నిచ్చోటఁ జూచి నే - నెటులోర్చువాఁడ?
మీకు సుఖంబైన - మేలని యెంచి
నాకెట్టిఖేదమైన - సహింతుగాక!
నాతలం పెఱిఁగియు - ననువెతం బెట్ట
నీతియే యహితంబు - నీవుసేయుదురె?
యేలవచ్చితివి? నీ - హృదయంబులోని
కీలునాతో నెఱిఁ - గింపు వేఁడెదను” 9500
అనవిని యన్నతో - నంజలిచేసి
తనవర్తనము భర - త కుమారుఁడనియె.
దశరథనృపతి మా - తల్లిచేఁ గాల
వశుఁడయ్యె మిముఘోర - వనులకు ననిచి
యీకైక తనకోర్కు - లీడేర్చుకొనియు
పోకయున్నది యమ - పురి కింకనైన
రాజులేనట్టియా - రాజ్యంబుసేయ
రాజవుగాన ప్రార్ధన - చేసి మిమ్ను
నర లేని బంటనే - నని యెన్నుకతన
మఱలఁదోకొని పోవు - మతివచ్చినాఁడ 9510
నాయందు నిట్టి య - నాథ లైనట్టి
యీయమ్మలందు - మిమ్మెడ వాయలేని
ధరణీ జనుయందు - దయయుంచి మఱలి
పురికి నేతెండు నా - పూనికదలఁచి
శారదయామినీ - చంద్రునిచేత

మీరు కైవడి సర్వ - మేదిని తలము
మీచేతఁగాకయే - మిటఁ బ్రకాశించు
నాచేతనైన విన్న - పము చేసితిని
యెల్లవారలఁగూడి - యేను మీచరణ
పల్లవయుగళంబు - పట్టిమ్రొక్కెదను 9520
మీతండ్రియేలు భూ - మికి మీరెకాక
యోతండ్రి వేరొక్కఁ - డున్నాడె దిక్కు?
విచ్చేయుఁడ" నిదైన్య - వృత్తినిట్టూర్పు
లుచ్చుచు మత్తేభ - మో యనఁగలిగి
పలవించు భరతుని - పైగృపయునిచి
కొలువెల్ల విన రఘు - కంజరుండనియె.

—: తండ్రియాజ్ఞ శ్రేష్ఠమని రాముఁడుచెప్పుట :—


"రావన్న భరత! యీ - రాజ్య మోహమున
నీవు మాయడఁదప్పు - నెంచుటలేదు
నీయెడదోషంబు - నెమకిననైన
నేయెడ నొకడెంచ - నెవ్వఁడున్నాఁడు? 9530
బాలుండ వగుట - నీపట్టునఁగైక
నేలదూషించెదఁ? - వెరఁగకాడితివి
మనలకర్మ ఫలంబు - మనకు నీరీతి
జనుల కెవ్వరికి నె - చ్చట లేనియట్టి
యలమటలను ముంప - నాయమ్మనిట్లు
పలుమాఱు మదినొవ్వఁ - బలుక ధర్మంబె?
సుతులును సతులును - చుట్టముల్ ప్రజలు
క్షితిపాలుఁడానతి - చ్చినఁ జేయువారు

మనతండ్రి యానతి - మన మాచరించి
యనుభవింపుదము - మేలైన కీడైన 9540
పట్టంబు గట్టింప - పాఱఁదోలుటకు
గట్టిగా మనకెందుఁ - గర్తభూవరుఁడు?
కావున తండ్రిపై - గల మమత్వంబు
నీవేల తల్లిపై - నిలుప కాడెదవు?
ఆతండ్రి లేఁడేని - యడవుల కనుచు
నీతల్లి యున్నది - యీయమ్మమాట
చిన్నఁబుచ్చి ప్రతిజ్ఞ - చేసిన యేను
నన్ను నేమరితప్ప - నడవ నేరుతునె?
నిన్ను పట్టముగట్టి - నిలిపి కానలను
నన్ను నుండఁగఁ జేసి - నరనాయకుండు 9550
సాక్షియై దివినుండ - చనునయ్య మనము
దక్షులమై యామ - తంబు వోనాడి
యెప్పుడెప్పు డటంచు - యేవచ్చి నీకు
జెప్పిన భూమి నీ - చేత హరించి
యిటువంటి వాఁడని - యెల్లరు నాడ
నటువంటి ఖలునిఁ జే - యఁగఁ దలంచెదవు
హితమిది నాకు - యేనిచ్చెద నీకు
క్షితిపతి పాలించు - సింహాసనంబు
పదునాలుగేండ్లు త - ప్పక యిందునుండి
తుది నయోధ్యకు వచ్చి - తోఁబుట్టు వైన 9560
నీమాటవిని యెద్ది - నేమింతు వప్పు
డామాట సేయుదు - నరుగము మఱలి”
అనునంతఁ తఁపనుఁ - డస్తాద్రిఁ గ్రుంకుటయు

జనులతోడను నను - జన్ములతోడ
సేనలతోఁ గూడి - చిత్ర కూటాద్రి
జానకీ రమణుఁడా - శ్వాసితుఁ డగుచు
ఆ దినంబు వసించి - యందరు భాస్క
రోదయంబున లేచి - యుచితంబులైన
సమయవిధుల్ దీర్చి - జనులెల్ల వినఁగ
రమణీయ మూర్తియౌ - రామునితోడ 9570
వెరవక తొలునాటి - వృత్తాంతమునకు
భరతుండు కేల్మోడ్చి - భక్తి నిట్లనియె.

—: రాముని రాజ్యమును గ్రహింపుమని ప్రార్థించుట :—


"దేవ! మీయానతి - తెఱగెల్ల వింటి
భావింపుఁ డెఱగక - పల్కుట గాదు
వసుమతి కైకకు - వసుధేశుఁ డిచ్చె
నసమ వైఖరినిచ్చె - నాయమ్మ నాకు
నాచేతఁగాక యెం - తయునుఁ బ్రార్థించి
మీచేతి కిచ్చితి - మేదిని భరము
అధికార మెఱఁగక - యెవని యాసించు
నధముని రాజని - యందురే జనులు? 9580
సింగంబునకు నమ - ర్చిన యామిషంబు
చెంగక శునక మా - సింపఁ జేకూరునె?
గరుడని గమనంబు - కాకికిఁ దగునె?
ఖరమువోవునె తురం - గమము చందమున?
నీదైన రాజ్యంబు - నీచేతఁ గాక
యోదేవ! పాలింప - నోపునే యొకఁడు?

ధరణీరుహంబులఁ - దాఁ బ్రయత్నమున
పరిపాలనము చేసి - ఫలమందువేళ
యవివీటిఁ బుచ్చిన - యట్టు లిన్నాళ్లు
నవమతి లేక మ - మ్మరసి రక్షించి 9590
పగవానిఁ జూచిన - పగిదిగాఁ జూచి
దిగ విడిచిన నేది - దిక్కు మాకింక?
మమ్ము నీచేతికి - మాతండ్రి యిచ్చె
నెమ్మది తానేఁగె - నీ వింకమీఁద
మమ్ము రక్షింపకీ - మాట లాడినను
సమ్మతమే మహీ - జనుల కిందఱకి
జనులెల్ల మీరు రా - జ్యము సేయఁగోరి
నను రమ్మనఁగ వచ్చి - నాఁడ మీకడకు
వారేల యిలయేల - వలసిన ట్లయ్యె!
నోరామ! మిముఁ - గొల్చియుండెద నేను 9600
బంటులకే యూరు - ప్రభువుల తోడ
నంటి యౌఁగాదని - యాడు టే యూరు
మీచిత్తమింక నే - మియుఁ బల్కనొల్ల
చూచికొండు పురంబు - చూర వోకుండ”
అనిపల్కు భరతుని - యందు నెయ్యంబు
ననలోత్తఁగా రఘు - నందనుం డనియె
"భరత కుమార! నీ - పలుకెల్ల నిజము
పరికింపు మిఁకనాదు - భావ వర్తనము
అరయ దైవాధీఁ - నుఁ డస్వతంత్రుండు
నరునకు కార్యని - ర్ణయ శక్తిగలదె? 9610

సంపదలెల్ల నా - శము నొందఁగాక
సంపన్నులకు కొన - సాగ నెక్కడిది?
పెరుగుట లెల్లను - పెక్కువ దక్కి,
తరుగుటకే కాక - తాయేల నిల్చు?
జగతిఁ బుట్టుటలెల్ల - చచ్చుట కొఱకు
పగగొనుటకుఁ జెల్మి - బలవంత మగుట
పొందుసేయుట - బాసిపోవుట కొఱకు
నెందు ఫలించుట - యిలరాలు కొఱకు
కావున గట్టిగా - గట్టిన యిండ్లు
భావింప నానాటఁ - బడిపోవు నట్ల 9620
మనుజు లెల్లను జరా - మరణాధికముల
ననుదినంబు లయించు - నది నిక్కువంబు
దరిచేరు కరడు లె - త్తరి మళ్లి రావు?
నరులవయః ప్రమా - ణము లట్లపోవు
నిన్నటి రాతిరి - నేటికి రాదు
చన్నట్టివార లె - చ్చట మళ్లిరారు
జలధిఁ గూడిన నదీ - జాలంబు రీతి
జలములనెల్ల గ్రీ - ష్మము గాఁచినటుల
రయముతోడుత నహో - రాత్ర రూపముల
వ్రయమగు నాయువు - వసుధ యెల్లరకు 9630
కావున నీకునే - కడఁ బనిలేని
యీవిచార భరంబు - లేల మోచెదవు?
పరలోకచింత నీ - భావంబు లోన
మరవక సౌఖ్యంబు - మరిగి వర్తిలుము
నీడకైవడి వెంట - నే కాచియుండి

వీడదు మృత్యువే - వెంట మానవుల
ఉదయాస్త సమ - యంబు లూరకెచూచి
మదిలోన భోగేచ్చ - మానక నరుఁడు
వుప్పొంగుఁగాని యాయు - వు బోవుననెడు
చొప్పు వివేకించి - చూడఁ డేమియును 9640
తృణకాష్ఠకోటి న - దీ ప్రవాహముల
క్షణమాత్ర మొక - చోట జతగూడివచ్చు
అన్నియు నన్నియై - యావలఁ బోవు
నన్నట్లు పుత్ర మి - త్రాంగనావళియు
పాయని కర్మాను - భవముచేఁ గూడి
పాయుచునుండు ని - బద్ది యెక్కడిది?
చనువారిఁ జూ - చితాఁ జావనియట్ల
మనువార లేడ్చుచు - మరుగు చుండుదురు
యెఱుఁగని జాడగా - నేఁగెడు వాఁడు
తెఱవరులనుఁ గూడి - తెఱవు గన్నట్లు 9650
పెద్దల నడక ల - పేక్షించి చూచి
బుద్దినట్ల మెలంగుఁ - బుడమి సజ్జనులు
మడికిఁ బారిననీరు - మఱిలిన యట్లు
వడిమీరి తొలఁగు జ - వ్వనమున్న యపుడె
ముదిమిచే సరము - లేములు బయల్దేరి
మదియావ చావలు - మానిన యపుడె
అత్యంతమును పరా - యత్తులై నపయ
మృత్యువుకన్నులు - మెరయని యపుడె
తరవాత యముని బా - ధలం బడునపుడు
ధరఁజేయు ధర్మముల్ - తలంచుకో నపుడె 9660

యాగాదు లొనరించి - యాత్మకింపైన
భోగమ్ములనుఁదేరి - పుణ్యముల్ చేసి
కొలిచినవారల - కొదవల దీర్చి
యిలవేలుపుల కోర్కి - లిచ్చిపోషించి
జగతియేలఁగలేని - జననాథు దలఁచి
పొగిలెడు వారి కి - ప్పుడు దగుఁగాక
పరమధార్మికుండయి - భాగ్యసంపదల
నరవదివేలేఁడు - లవనిపై బ్రదికి
హయమేథవాజిపే - యాది యాగములు
నియత దక్షణలతోఁ - నిండారఁజేసి 9670
అరియను మాట యే - యదనలేకుండ
ధరణి యేకాతప - త్రముగఁ బాలించి
కొదదీర మనవంటి - కొడుకులఁ గాంచి
తుదిబ్రహ్మలోకంబు - తోరణకట్టి
రాజిల్లు దశరథ - రాజునకేల
యీజాడఁ బలవించి - యేడ్చెద వీవు?
తగవు గాదిఁకనైన - తాలిమిపూని
వగపెల్లమాని నా - వచనంబు చేసి
గ్రక్కునపట్టంబు - గట్టుక తండ్రి
యక్కరతో నిచ్చు న - వని యంతయును 9680
నామారుగాపాల - నంబు గావింప
మీమాట కెదురాడ - నేఁటికి నీకు?
తాను నీ వనిలోన - తండ్రి యానతిని
మౌని వేషమున స - మ్మతిఁ జరించెదను
మనమందరము రాజు - మాటలోవార

మొనరునే విభుని - యాజ్ఞొల్లంఘనంబు
నిన్న భూవరుఁ డీ - ల్గె నే డిటువంటి
యన్నదమ్ములును మ - ర్యాద పోవిడిచి
నడచినారని భూజ – నంబెల్ల మనల
పుడమి నుండక - పారిపోదు రెట్లైన 9690
చలమేల నీవుమా - సత్యంబు నిలిపి
యిలయేలు మనిపల్కి - యేమియు ననక
వురకున్నఁ జూచి ని - ట్టూర్పు నిగుడ్చి
భరతుఁ డప్పుడు రఘు - పతికి నిట్లనియె.

—: రాముని భరతుండు మరల యుక్తియుక్తముగఁ బ్రార్థించుచు మాటలాడుట :—


"శ్రీరామ ! చిత్ర - చారిత్రుండ వీవు
ధారుణియందు విం - తలు మీగుణములు
సుఖదుఃఖములను హె - చ్చునుం గుందు
లేని అఖిలసన్నుతుఁ - డవి యెవనినందైన
లేని వస్తువులజా - లినిఁ బొర్లువాఁడు
తానింటఁ గలును న - ర్థము నొల్లనతండు 9700
మదిమదినుండి స - మస్తంబుఁ గలిగి
మదమచ్చరంబులు - మానిన యతఁడు
కలిగినవాని కొ - క్కనికి సౌఖ్యంబు
కలదె యన్యుల కిట్లు - గాక వేరొకట?
యీ రీతి చింతిల్ల - నేఁటికి మీకు?
నేరామ! నేనులే - కున్నట్టిచోట
యేమేమి నడచునో -యీకైకనేర

మేమియు మదిలోన - యెన్నకయోర్చి
నీకు భృత్యుండఁగా - న నేనన్నమాట
చేకొమ్ము ధర్మంబు - చేపట్టి యేను 9710
ఆడఁబుట్టువు తల్లి - యని తెగవ్రేయ
నోడితి నీ కైక - నోర్చి కొమ్మిపుడు
ఆ తండ్రికిం బుట్టి - యతి పాపచింత
సేతునే యజుఁడు వ్రా - సిన వ్రాఁతగాక
అధమాధమునికైన - ఆలన్నమాట
విధిగతి నిటుమేను - విడిచి పోదగునె?
యెఱఁగఁ డందమె - రాజు నింతటివాఁడు.
మఱచె యశోనీతి - మానసోన్నతులు
మగనిజంపుట యెంత - మహియెల్లగాల్చి
నిగురు సేయరె చెల్ల - రె యింతులెల్ల 9720
చేటుఁ గాలమునకు - చెడు బుద్ది యనిన
మాట నిజంబయ్యె - మనతండ్రి వలన
యెటువంటివాఁడైన - నేఁదప్పననుచు
నిటుతండ్రి పాలార్ప - నెవ్వరోపుదురు?
ధర్మంబు దప్పిన - తండ్రి యానతియె
ధర్మంబు గానెంచు - తనయుండ వీవు
ఐన నాపదవచ్చు - నప్పుడు మర్యాద
మానఁ జెప్పిరి నీతి - మార్గకోవిదులు
నేరక చెడిపోవు నృ - పతి దోషంబు
కౄరాత్మయగుకైక - గుణదోషములును 9730
ఆపెకు నేఁ బుట్టి - నట్టిదోషంబు
బాపుమో! స్వామి! నా - పలుకుచెల్లించి

అయ్య! క్షత్రాచార - మారడిఁబుచ్చి
యి య్యతీశ్వర వేష - మేల పూనితివి?
యేవిట్టు లున్నచొ - నిక్ష్వాకువంశ
హాని యౌనను బుద్ది - యాత్మఁ బాయుదురె?
రాచవారికి ప్రజా - రంజనం బొకటి
చూచుకోవలెఁ గాక - చూడరేమియును
ప్రజలఁ బ్రోచుట యిహ - పరసాధకంబు
భుజసౌర్య నిరతులో - భూమిపాలరకు 9740
కాక యీ మునివృత్తిఁ - గడతేర మనసు
దాకొల్చు క్షత్రియా - ధము లెందుగలరు?
మునివృత్తి బహుకాల - మునఁ బొందుమేలు
జనపాలనము చేత - సవరించికొనుము
ఆశ్రమంబులు నాల్లు - నందుల శోభ
నాశ్రయంబగు గృహా - స్థాశ్రమం బెచ్చు
అందుఁజెందఁగరాని - యట్టి పుణ్యంబు
లిందుఁ గల్గఁగమీకు - నెద్దిసాధకము?
వొక వయసేల నీ - యురుగుణాంశముల
నొక కళామాత్రం - బు నున్నదే నాకు? 9750
అన్నిట నల్పుండనై - నట్టివాఁడ
నిన్నుగాదని ధాత్రి - నే నేలఁగలనె?
అనవలసిన మాట - యనుటలుగాక
నినుఁబాసి నిమిషంబు - నే నేలపోదు?
యిదె సుమంత్ర వసిష్ఠు - లెల్లవారలనుఁ
గదిసి యెచ్చరికె తోఁ - గాచియున్నారు
అభిషేక మొనరింప - ననుమతి యిండు

విభవ సామగ్రి - నా వెనుక వచ్చినది
పట్టంబు గట్టుక - పయనమై వెనక
పట్టణంబున కేఁగఁ - బాటిల్లుఁగాక 9760
యీ మౌనివేషంబు - లేఁటికి మనకు?
భూమీజనుల నెల్ల - బోషింప మీవు
నీవార మగు మమ్ము - నిఖిల లోకములు
నేవేళఁ బోషించు - నీశ్వరునట్ల
కరుణించి మా నమ - స్కారంబులంది
శరణాగతులెల్లఁ - చాలఁ బాలింపు
అదియొల్లవేని యీ - యడవిలో మీదు
పదములుగని కొల్చి - పాయకుండెదను”
అని యెంత వేఁడిన - నా రామవిభుఁడు
మనసులో భరతుని - మాటగైకొనక 9770
తనచేత ఖేదమో - దంబు లందఱికి
నినుమడిగానుండు - నెడఁ దల్లులెల్ల
భరతుని మనవిగా - బ్రార్థించి చాల
కరుణవుట్టఁగ పాయఁ - గాలేక వగువ
చిరునవ్వు మొగము - తో సీతావరుండు
భరతుని మొగము త - ప్పక చూచి పలికె.

—ː భరతుఁడు దశరథుఁడు కామమోహితుఁ డని నిందింపగా రాముఁడు కాడని చెప్పుట ː—


“రమ్ము కుమార! యె - ఱంగని నీదు
నెమ్మదింగల సత్య - నియమమెల్లపుడు

దశరథరాజనం - దనుకు నీకు
శశిభాస్కరులు తప్పు - జాడ నేఁగినను 9780
బొంకేల? కలుగు ని - పుడు కలతెఱఁగు
కొంకెలపలికి నీకు - హితం బొనర్తు
మన తండ్రి కేకయ - మనుజేశు తోడ
తన పెండ్లినాడు నీ - తల్లిపై ప్రేమ
గైకేయి కడుపునం - గలిగిన సుతుని
జేకొని పట్టాభి - షిక్తు గావింతు
యిది సత్యమని వరం - బిచ్చినవాఁడు
మదినెఱుంగుదు పెక్కు - మాటలేమిటికి?
ఆదినిచ్చిన వరం - బది మదినెంచి
కాదె భూవరుని సం - గర వేళయందు9790
యెచ్చరికెను వేఁడి - నిమ్మని వరము
లిచ్చితి ననిపల్కె - నీవిభుఁ డపుడు
అట్టి కారణమున - నడిగెఁ గైకేయి
పట్టంబు నినుగట్ట - పతి నెచ్చరించి
ముమ్మాటుగా నిచ్చు - మొదలింటివరము
లమ్మవేఁడిన దీని - వదిగానలేవు
నేరమే కైకకు - నృపతికిచ్చుటలు?
నేరమే యిదికన - నేరముగాక?
నినువంటి సుతుండు తం - డ్రికిని సత్యంబు
కొనసాగఁ జేయక - కొదవ సేయుదురె? 9800
సామాన్య నృపుఁడీ కో - సల సుతారమణు
డేమిటిచే తండ్రి - ఋణము దీర్చెదవు?
నిందింప కీ కైక - నెగులు వారింపు

మందర దీవెన - లందుము నీవు
గయలోపల మఘంబు - గావించి తొల్లి
గయుండను రాజువ - క్కాణించినాడు
పున్నామనారకం - బునఁ బడకుండ
తన్నుఁ గాంచి తలి - దండ్రులబ్రోచు
నతఁడొక్కఁడే పుత్రుఁ - డనఁ జెల్లుఁగాక
యితరుండు కలిగియు - నేమిటికనుచు! 9810
బహుపుత్ర లాభంబు - వడసిన బుణ్య
మహిమచే నొకఁడైన - మంచివాఁడగుచు
కడతేర్పనేర్చు వం - గడము వారలను
పుడమి భగీరథుఁ - బోలి కావునను
మాయన్న నీచేత - మనరాజుసత్య
మీయెడఁ జెల్లించి - యేఁగుము పురికి
శత్రుఘ్ను నూరార్చి - జనులను బ్రోచి
మిత్రులఁ బాలించి - మేదినీ జనుల
తండ్రి కైవడిఁగాచి - ధరయెల్ల నేలి
తండ్రికైవడి గుణో - దారుండవగుము 9820
వనుల కిచ్చట నేను - వసుమతి కీవు
నొనరంగ దొరలమై - యుండంగవలయు
దండకావనమహీ - స్థలముల నేను
మండితచ్ఛత్రచా - మరముల నీవు
కందమూల ఫలాధి - కములచే నేను
నందితరసరసా - న్నంబుల నీవు
క్రమముతో నారచీ - రలు గట్టియేను
రమణీయ దివ్యాంబ - రమ్ముల నీవు

పనిత జటాకలా - పములతో నేను
జననుత రత్నభూ - షణముల నీవు 9830
ముందర వనమృగం - బులు గొల్వ నేను
నిందఱికిని కొల్వు - నిచ్చుచు నీవు
సౌమిత్రి యొక్కఁ డి - చ్చట నుండ నేను
సౌమిత్రి యొక్కఁ డ - చ్చట నుండ నీవు
రాజితగిరికంద - రం బేల నేను
రాజగేహ పరంప - రలయందు నీవు
సీతయొక్కతె సేవ - సేయంగ నేను
శీతాంశు వదనలు - సేవింప నీవు
పాదసంచార వై - భవముతో నేను
వేదండ తురగాది - విహృతిచే నీవు 9840
యీచిత్రకూట మ - హీధరం బేను
ఆ చక్రవాళ మ - హాధాత్రి నీవు
తల్లిదండ్రుల యాజ్ఞ - తప్పక లోకు
లెల్లమెచ్చ వహింప - కేమనవచ్చు
అజుల పుత్రుఁడు చేసి - నట్టి కట్టడకు
నజుని పుత్రుఁడే సాక్షి - యవుఁగాములకును
కొడుకులు లేరని - కోరి పుత్రేష్ఠిఁ
దడయక యిట్టి నం - దనులనుఁ గాంచి
మన నలువురిచేత - మనరాజు నిజము
కొనసాగ కున్నచో - కొడుకు లేమిటికి?" 9850
అని భరతునిఁ బల్కు - నా రాము మాట
వినియంతయును ధర్మ - విరహితంబైన

మత మవలంబించె - మౌని జాబాలి
క్షితి సుతారమణు నీ - క్షించి యిట్లనియె.

—: చార్వాకమతము నవలంబించి జాబాలి రాముని రాజ్యము చేయుమని చెప్పుట :—


"రామునికి నిర -ర్థక బుద్ధిగలిగె
నేమింటి కెవ్వని - కెవ్వాఁడు హితుఁడు?
యే పురుషుండు మహి - నెవ్వని వలన
నే పురుషార్థ మూ - హించి వొందెడును?
తా నొక్కఁడే పుట్టి - తానె నశించు
వానికి తనతండ్రి - వలననే ఫలము 9860
తెఱవరు లేఁగుచో - తెఱువున నొక్క
పురములో నా డుండి - పోయిన యట్లు
యీ యాత్మ తలితండ్రు - లిండ్లును సుతులు
జాయలు ధనమని - సంచరింపుచును
బద్ధుఁడై యిందరుఁ - బాసి పోయినను
సిద్ధమొక్కఁడె తుదిఁ - జేరు నొక్కెడకు
రమ్మన్న రాదు స - ర్వంబును వచ్చి
పొమ్మన్న మఱిపోదు - పోవు నూరకయె
కావున సజ్జనుల్ - కలుముల యందు
భావించి నిజమని - పాటింపబోరు 9870
నినువంటి సద్గుణా - న్వితుఁడైన రాజు
మనవంశమునఁ గల్గు - మర్యాద వదలి
తమ్ముని మహియేలఁ - దగవులు చెప్పి
కొమ్మతోఁబర్వత - గుహల నుండుదురె?

యెప్పుడు మీరాక - కెదురులు చూచు
నప్పౌరజన మయో - ధ్యా పట్టణమున
యున్నవారలు వారి - యునుకులు చూచి
మన్నించి యిందర - మనవి చేపట్టి
యిలయేలు మఖిలభో - గేచ్ఛ లందేలి
తలఁపకు మిటమీఁ - ద దశరథుమాట 9880
పనియేమి నీకు న - ప్పార్థివేంద్రునకు
ననఘ! నీ వొక్కఁడ - వతఁడు నొక్కండు
నిజమన్న శుక్లశో - ణిత మేళనమున
ప్రజ జనియించు దం - పతులు రాగముల
కామాతురత చేతఁ - గలయుచో ప్రజకు
తాము నిమిత్త మా - త్రనుఁ దండ్రులైరి
జీవకోటులు చేరు - చెంతకుఁ జేరె
నావసుధా నాథుఁ - డది గనలేక
నీవేల “తండ్రి తం - డ్రి" యటంచు లేని
భావఁ సంబంధ మీ - పగిదిఁ గల్పించి 9890
భ్రమసి యాయన యిట్లు - పలికి నాఁడనుచు
నమరునే పట్టి పాల - ర్ప నమ్మాట
యిహలోక సుఖపరు - లెవ్వారుఁ గాక
విహరింతు రత్యంత - విహిత ధర్మమున
అట్టివారల మతంబిది - నాదు మదికిఁ
బట్టియుండదు హేయ - పదమగుఁ గాని
యీలోక సౌఖ్యంబు - లేమరి పిదప
నాలోకమున నేమియ - నుభవించెదరు?

యిది ధర్మమని చెడి - యెందుకుఁ గాక
తుదిఁ జచ్చితాను వొం - దుదు సౌఖ్యమనెడి 9900
అవివేకులునుం గల - రామీఁద స్వర్గ
మవలనున్నది యని - యదియెవ్వఁ డెఱుఁగు?
యెవ్వ రిందుకు సాక్షి - యేమగు వాఁడొ
యెవ్వఁ డెఱుంగు తా - నిటువోదు ననుచు
మేను విడకమున్నె - మేనెత్తు జీవి
తానట యమరప - దం బొందువాఁడు
చచ్చినవారికి - శ్రాద్ధ కర్మంబు
లిచ్చట తాఁజేయ - నెక్కడ నుండి
వారు వత్తురో తమ - వంటకంబులకు
సారులు నడపించు - బందు కట్లవియు 9910
పరలోక మనుట ని - బద్ధి యౌనేని
పరికింపు పుణ్యంబు - పాపంబు చేసి
దివికేఁగి మఱల నే - తెంతురో విడిచి
రవితనయుండు పోయి - రమ్మనఁ గలఁడొ
వొకఁడూరి కేఁగుచో - నున్నట్టి వాని
కొకరు విందమరింప - నూరికిఁ బోవు
వానియాఁకలి వోని - వడువునఁ దెగిన
వానిపేరడి వృథా - వ్యయము సేయుటలు
కర్మముల్ దెలిపెడు - గ్రంథముల్ వినఁగ
ధర్మంబు గా దబ - ద్ధము విచారింప 9920
ప్రత్యక్ష సౌఖ్యాను - భవము ధర్మముగ
సత్యవాదము సేయు - శాస్త్రముల్ వినుచు
అఖిల సుభావం - బైన సామ్రాజ్య

సుఖములం దేలు మే - జోలియు నేల?
అదిగాక పరలోక - మని యొక్కటించి
యదినమ్మి యచటి సౌ - ఖ్యము లందవేఁడి
అందుకు సాధకం - బని తండ్రిమాట
విందు నేనని రాజ్య - విభవముల్ వదిలి
యిడుములం బడ నీకు - నేలన్న! రామ!
విడుపుము నాబుద్ధి - వినియిట్టి చింత 9930
భరత సంప్రార్థనా - ఫలమైన సకల
ధరణిభారము నీవు - దాల్చి సుఖింపు"
అనవిని కనుశల - లందు కెంజాయ
జనియింప శ్రీరామ - చంద్రుఁ డిట్లనియె.

—: జాబాలిమతమును నిరాకరించి రాముఁడు వైదికమతమును స్థిరపరచుట :—


"జాబాలి! యిటువంటి - చదువులు చదివి
నీబుద్ధి యొరులకు - నేర్పఁ బూనితివి
హితము పథ్యముగాని - యీమాట లేల
యతు లందరును నవ్వ - నాడితీ విపుడు
ఆగమోక్తములైన - యట్టి కర్మములు
సాగనియ్యక దురా - చారుఁడై పాప 9940
భాజనుం డగు వాఁడు - పాయని నింద
నీ జనావళి చేత - నెప్పుడు నొందు
ఆచారమునఁ దోఁచు - నతని కులంబు
వాచాలతనుఁ దోచు - వాని మనీష
తనువు చూచినఁ - దోఁచు ధనికునిజాడ

కనిపించు నడకలఁ - గలుగు నెయ్యములు
కావున సకల ర - క్షణ రక్షితుండు
కోవిదుండు వివేక - కుశలుఁ డుత్తముఁడు
నీమాట విననేర్చు - నే యధర్మంబు?
గామించి ధర్మంబు - గా పలికితివి 9950
చేసిన ప్రతినయుఁ - జెల్లింప లేక
వాసియంతయుఁ బోయి - వంశంబు చెరిచి
యిటువంటి నడకచే - నింద్రుని పురికి
నిటమీఁద నే జాడ - నేఁగెడు వాఁడ?
రాజెట్లు నడచె ధ - రాజనులట్ల
యోజించి నడచుట - యుక్తమై యుండ
జననాయకుండు సత్య - సంధుఁడౌ నేని
జనులెల్ల సత్యంబు - సడల కుండుదురు
సత్యవాదికిఁ గల్గు - సద్గతి యనుచు
నిత్యంబు చదువు ల - న్నియుఁ బల్కుచుండు 9960
బొంకెడు వారలం - బొడగని ప్రజలు
శంకింపుదురు క్రూర - సర్పంబు లనుచు
కావున సత్యంబె - కర్త రాజునకు
భూవరుండగు కర్త - పుడమికి నెల్ల
సత్యంబున వసించు - జలజాక్షు రాణి
సత్యంబె యిహపర - సౌఖ్య సాధనము
సత్యంబు గలిగినఁ - జాలునుఁ గాక
సత్యలోకా వాస - సౌఖ్యమే యరుదు
దానంబు హోమంబు - తపమును జపము
ధ్యానంబు నొండొక్క - సత్యమునందె నిలుచు 9970

హానియైనను వృద్ధి - యైనను నరక
మైనను సురలోక - మైన నొక్కరుఁడు
వంచించినను మనో - వాక్కాయ కర్మ
సంచిత క్రియలందు - సత్యంబె కాని
యితరంబు నేనొల్ల - నెవ్వండుఁ బొంకు
నతనిపుణ్యము భస్మ - హవ్యమై పొలియు
అటుగాన నిజమున - కై పూనినాఁడ
జటలు వల్కలముల - శైలవాసంబు
యేనె సూనృతవాది - నేని లక్ష్మియును
భూనుత కీర్తియు - పుడమియుఁ బొందు 9980
పనిలేనిపాట మా - భరతుని మాట
కొనసాగనీ విచ్చ - కుఁడ వౌచు వచ్చి
యిట్టులాడిన -యంతనె నాకు వెఱ్ఱి
వట్టికానిమ్మని - పలుక నేరుతునె?
తండ్రిసత్యమె నిల్పఁ - దలంచిన యేను
తండ్రిమాటయె కాక - తమ్ముని మాట
విననేర్తునే చారి - వేకంబులేల?
మునివయ్యుఁ బలుక రా - ముని యెడాటమున
యేఁగొంచ పరతునే - యీకైక వరము?
కాఁగల యర్థముల్ - కాకేల మాను 9990
పితృ దేవతావళి - ప్రీతి గావించి
హితమని మునివృత్తి - నిచట నుండుదును
యీకర్మ భూమిలో - నిద్ధ కర్మములు
చేకొని నియతిచేఁ - జేసియె కాదె
యీగాలి యీవహ్ని - యీవరుణుండు

నీగతి సకల లో - కేశ్వరులై రి
యాగంబు లొనరించి - యతఁ డింద్రుఁడయ్యె
యోగంబులను మౌను - లున్నారు దివిని
కర్శకాండము నీవు - గాదని విహిత
ధర్మముల్ పోనాడి - తపసి వెట్లైతి?” 10000
అనిపల్కి నాస్తికుం - డైన జాబాలి
గని రఘువీరుఁడు - క్రమ్మరఁ బలికె.
“సత్యంబు ధర్మంబు - శమమును దమము
భృత్య రక్షణము - మహీ పాలనంబు
మొదలైన సత్కర్మ - ములు సునాశీర
సదనంబునకు మెట్ల - చందంబు లండ్రు
అరయుదు బోరుఁగా - నాస్తికుండైన
దురితమానసుని బౌ - ద్ధునికెనగాఁగ
భూదేవతలు నీవు - పొడమకమున్ను
వేదోక్తకర్మముల్ - విడవ రెవ్వరును 10010
త్రిభువన దేశ - దేశికుఁడైనయట్టి
శుభమూర్తి మా వసి - ష్ఠుఁడు నీదుమాట
వినియోర్చెఁ గావున - విడనాడరాదు
నినునీదుమాట ల - న్నియు నిన్నె పోలు
వురకయుండుటన్న - నుండక మఱియు
పరమవివేకి జూ - బాలియిట్లనియె.
"శ్రీరామ! యేనునా - స్తికుఁడనుఁకాను
పోరానిపని గానఁ బొ - సఁగఁ బల్కితిని
ఆస్తికత్వంబు నా - యందునెల్లపుడు
శస్తమౌనది వసి - ష్ఠమునీంద్రుఁడెఱుఁగు 10020

పూనియేనన్యాయ - ములు వచియింప
కానిమార్గములని - ఖండింతు వీవు
అందుచే నీమాట -లందరు నమ్మి
యుందురు ధర్మంబె - యూఁతగా నెపుడు
శాంతమూర్తివి దయా - జలరాశివగుట
నింతటి యపరాధమే - జేయునపుడు
కోపగింపకతాళు - కొని యుంటిగాన
నేపుణ్యనిధి నీకు - నున్నారె సములు?"
అన నమ్మునీంద్రుని - యభిమతం బెఱఁగి
మునివసిష్ఠుండు రా - మునిఁ జూచి పలికె 10030

—: వసిష్ఠుఁడు రాముని కోపమునుదీర్చి హితముపదేశించి రాజ్యముఁ గొనుమని చెప్పుట :—


“అయ్య! జాబాలి మ - హాధర్మ నిరతుఁ
డియ్యడపురికి ని - న్నెలయించు కొఱకు
భరత హితంబుగాఁ - బలికిన మాట
లెఱుఁగ కాడెనటంచు - నెంచెదు సుమ్ము
యీవు సామాన్యుఁ - డవే వంశమెల్ల
పావనంబుగఁ జేయఁ - బ్రభవించి తీవు
యెటులన్న వంశ - వృత్తాంత మెల్ల
పటుబుద్ధిఁ దెలియు మే - ర్పరతు నెట్లనిన
“అనఘ! మహాప్రళ - యంబు నన్నీట
మునిఁగి విశ్వము సర్వ - ము నణఁగియుండు 10040
అనఁ బవళించు - నబ్జాక్షునాభి
నానంద కరమైన - యజ్ఞంబు మొలిచె
కమలంబులోఁ బుట్టి - కమలసంభవుండు

కమలాక్షుఁ డపుడు సూ - కరమూర్తితోడ
జలమున మునుఁగు ర - సాతలం బెత్తి
బలుగోర కొననీటఁ - బఱుపుగాఁ బఱచె
ఆధాత సృష్టించె - నపుడు విశ్వంబు
వేధకుఁ గలిగెన - వ్వేళ మరీచి
ఆ మరీచికిని కా - శ్యపుఁడు జనించె
నా మహామహునికి - నర్కుండు బుట్టె10050
భానునకు మను - ప్రభుఁడు జన్మించె
భూసుతుం డిక్ష్వాకు - పుట్టె నాయనకు
నా సత్యనిధి యయో - ధ్యా పట్టణంబు
చేసి కూటస్తుఁడై - క్షితి యెల్లఁబ్రోచె
శ్రీరాము నినుఁ బెండ్లి - సేయు నవ్వేళ
మారాజు జనకుండు - మిగిలినవారు
వినుచుండ మీవంశ - వృత్తాంతమెల్ల
వినిపింపంగా నీవు - విన్నావె కాదె
ఆ దశరథునకు - నగ్ర నందనుఁడ
వాదిమరాజ న - య ప్రతాపుఁడవు 10060
నీ వయోధ్యకు వచ్చి - నిఖిలరాజ్యంబు
శ్రీవెలయంగ ర - క్షింప ధర్మంబు

—:వసిష్ఠుఁడు గురుమతమును విడనాడరాదని రామునకుఁ జెప్పుట :—


తగవు వల్కెద తల్లి - దండ్రులు గురుఁడు
జగతిపై నొకరూపె - జనుల కందఱికి

తనదు పుట్టువునకు - తలిదండ్రు లిద్ద
ఱునుఁ గారణంబులై - రూఢి మీఱుదురు
జ్ఞానోపదేశమా - చార్యుండు సేయు
గాన యాయన సూవె! - కర్త యందులకుఁ
గావున తండ్రినిఁ - గడవ నాచార్యుఁ
డేవిధంబునఁ జూడ - నెచ్చైనవాఁడు 10070
నీకు మీతండ్రికి - నీ పితామహుల
కాకడివారికి - నర్క వంశ్యులకు
కులగురుండనుగాన - కోరినమాట
చులకఁజేయక చెవిఁ - జొనుపు మీవేళ
అందు నిన్నెట్టివి - యఘములు నచ్చి
పొందవు మా మీఁదఁ - బూన్పు మాభరము
పూఁటకాఁపుల మేము - పుణ్యంబులెల్ల
నాటిదుర్దోషముల్ - నరకివైచుటకు
మాయందు విశ్వాస - మతినున్నవారి
కా యపవర్గంబు - హస్తగతంబు 10080
సేయరానివి యెల్లఁ - జేసి మామాట
సేయువారికి లేవఁ - జేయ లోకములు
చెప్పినయట్లనే - సేయ కర్మములు
దప్పును విధి నిషే - ధము లేల నీకు?
తల్లిచెప్పినఁ జేసి - తండ్రివాక్యములు
పొల్లువుచ్చిన నఘం - బులు దానరావు
కొసల్య మాటచే - గడవుము తండ్రి
చేసిన కట్టడ - చెప్పితి నదియు

ప్రార్థింపుచున్న యీ - భరతుని మనవి
సార్థంబు సేయ దో - షంబు లేదందు 10090
నీ సత్యమునకు హా - ని యొకింతరాదు
మోసంబువచ్చు మ - మ్ముఁ దృణీకరింప
కాదను నీమాట - గాదు మాకన్న
వేదశాస్త్రములఁ గో - విదుఁడవ నీవు
తలఁచుకొమ్మ" నుమాట - దశరథసుతుఁడు
తలపోసి గురునితోఁ - దా నిట్టులనియె.

—: రాముఁడు గురునిమాటకంటె దండ్రిమాటయే శ్రేష్ఠమని చెప్పుట :—


"అయ్య! యెందునఁ దీరు - నయ్య ఋణంబు
మియ్యానతులకు నే - మియు నాడరాదు
తనయుల మదిఁగోరి - తపములు చేసి
కని బాల్యదశలందుఁ - గాచి రక్షించి 10100
యింతేసి వారిఁగా - నీ డేర్చుతండ్రి
యంతటివాని వా - క్యము సేయు టరుదె
యిపుడు మీ రానతి - యిచ్చినవెల్ల
నుపమింపు సద్ధర్మ - యుక్తంబు లైన
జనకుని యాజ్ఞకొం - చక దాఁటుబుద్ధి
జనియింప దేమి దో - షంబొ నామదిని"
అనుమాట విని మది - నాస చాలించి
తనమదిలోని కొం - దల మెల్లదీరి
మంతనంబున తా సు - మంత్రునిం బిలిచి
పంతంబు చెల్లింప - భరతుఁ డిట్లనియె. 10110

"తడవుసేయక పోయి - దర్భలు దెచ్చి
పుడమినిచ్చటఁ బఱ - పుగ నేర్పరింపు
నందుపైశ్రీరాము - నవ్వుల వాని
చందాన నాకుఁ బ్ర - సన్నుఁడౌటకును
ప్రాయోపవేశన - పరుఁడనై యనువు
లా యనఘున కిత్తు - ననుచు మీఁదెత్తి
యేమియు భుజియింప - కిలఁబడి యున్న
రామునిచిత్త మె - ఱంగ నయ్యెడును "
అనిచెవిలోఁ బల్క - నాసుమంత్రుండు
జనకజనాయకు - సముఖంబు నందు 10120
పఱచిన దర్భలు - భావించి తెలిసి
భరతునితో రఘు - ప్రవరుఁ డిట్లనియె.
“నీకేమి దోషంబు - నేజేయనట్టి
లోకాపవాదంబు - లోన ముంచెదవు?
అప్పులవాఁడవే - యడ్డపాటేల?
యిప్పుడేఁటికి మాని - తీవు భోజనము?
ప్రాయోపవేశంబు - బ్రాహ్మణు లెందు
జేయుదు రొప్పు నే - క్షితిపాలకులకు?
తగునె? సుమంత్ర! ప్ర - ధానివైయుండి
తెగుబుద్ధి నేర్పి యీ - తెంపు సేయింప? 10130
మానేర్పు నేరముల్ - మఱిచక్కఁ జేసి
పూని సింహాసనం - బున కొక్క కొదవ
రాకుండ నడప భా - రము నీదెగాదె
మాకేమి ధర్మంబు - మదిఁ జూచుకొనుము

అయ్య! వసిష్ఠ! మహా - మౌనిచంద్ర!
మియ్యాజ్ఞ యెవ్వరు - మీరనోపుదురు?
యినవంశ మెల్ల మీ - రిడినట్టి చెట్టు
నినునందు నొక్క హా - ని జనించెనేని
యెల్లధర్మంబులు - నెఱుంగుదు వీవు
ప్రల్లదం బివుడు జా - బాలి వల్కినను 10140
విని సమ్మతించి యా - వెంబడి గాఁగ
ననుఁగొంచ పఱచి యా - నతి యొసంగితిరి
రావోయి! భరత! ధ - ర్మంబు వోవిడిచి
యీ విధంబున నన్ను - నింత గైకొనక
పతితునిఁ జేయంగ - ప్రతిన చేసితివి
హితుఁడని నిన్నునే - నెంచి యుండితిని
యిది బుద్ధిగాదు నీ - విందఱిఁగూడి
కదలిపట్టణ మెల్లఁ - గైసేయఁ బనిచి
చేరి సామ్రాజ్యంబు - సేయుము తగదు
మారాడి నీవు నా - మనసు నొప్పింప " 10150
అనవిని వెలవెల - నై భరతుండు
తనచెంత దొరల నం - దఱఁ జూచిపలికె.
“పగవానిఁ దెచ్చియొ - ప్పన చేసినట్లు
తగుఁదగదని మదిఁ - దలఁచి మీరెల్ల
ననవలసిన మాట - యనక యుపేక్ష
గనుచుండ మర్యాద - గాదు మీకనిన
అందరు నేకవా - క్యముస నోరాజ
నందన! జలధిలో - నావలాడంగ
తడికె చాటు లదేల? - తమచేత నేమి
గడతేరు నతని సం - కల్పంబె గాక 10160

మాచేతఁ దీఱెడు - మాత్రమే మీరు
చూచియు మమ్ము ని - ష్ఠురము లాడుదురె?"
అనువేళ భరతుని - యాననాబ్జమునఁ
దనచూపు లునిచి సీ - తాకాంతుఁడనియె,
"అనఘాత్మ! యీ పౌరు - లాడిన మాట
వినియైన మదిని వి - వేకించు కొనుము
కాని కార్యము సేయఁ - గడఁగిన యట్టి
నీనేరమునకైన - నిష్కృతి వినుము
విడువు మీప్రాయోప - వేశంబు లేచి
తడయక పోయి మం - దాకినిఁ గ్రుంకి 10170
ననువచ్చియంటుము" - నావుఁడు భరతుఁ
డనుమానములు మాని - యల్లన జేసి
"యేదోషము నెఱుంగ - నేమియు నేను
లేదు నాయెడ నొక్క - లేశంబుఁ గీడు
యింకనేమియు నేల? - యీ రామవిభుని
లెంకనై రాజ్యమే - లినఁ గొల్చియుందు
కానల నున్న ని - క్కడ నుందు నింతె
కానియేమియుఁ బ - ల్కఁగా నేలనాకు?”
అని యురకున్నచో - నందఱఁజూచి
మనుకులాభరణంబు - మఱియు నిట్లనియె. 10180

—: భరతునకు సమాధానముచెప్పి రాముఁడయోధ్యకుఁ బంపుట :—


"భరతుఁ డెప్పుడు ధర్మ - పరుఁడు వివేకి
పరమకల్యాణాన - పాయసద్గుణుఁడు

తప్పింపనేర్చునే? - తండ్రియే మాట
చెప్పిన నదిపూని - చెల్లించుఁగాక
ననుఁ గాన లందును - నగరంబు లోన
తమనుండ నియమించె - దశరథనృపతి
అది విపరీత మె - ట్లగు? మీరు మాకు
తగవు దేలుపుఁ డస్వ - తంత్రుల మేము"
అనువేళ నమరవి - ద్యాధరయక్ష
ముని మహర్షులు తమ - మూర్తు లెవ్వరికి 10190
కానరాకుండ న - క్కడఁ బొంచియుండి
దానిచే పంక్తికం - ధర వధ మరసి
యపుడు ప్రసన్నులై - నట్టివారలును
కపటంబు మాపి రా - ఘవున కిట్లనిరి.
“భరతకుమార! భూ - పతి మాటనీవు
పరమ ధర్మంబని - భావింతు వేని
ధరణీశుమారుగా - దా రఘూద్వహుఁడు
పరికింపు మీ రామ - భద్రుని మాట
అట్టి చందంబుగా - నాత్మలో నునుపు
మిట్టిచలంబు నీ - కేల? పాలింపు 10200
సుతశౌర్యుండవు కులీ - నుఁడవు ప్రాజ్ఞుఁడవు
చతురుండవు వివేక - శాలివి గాన
మా యభీష్టము విను - మాయన్న రాముఁ
డీ యడవులనున్న - హితమది మాకు
యితఁడు భూవరు ఋణం - బీడేర్చుకొనిన
నతిశయ సంతోష - మగుమాకు నెల్ల"

ననుచు నంతర్హితు - లైనదేవతల
వినయోక్తు లాలించి - వేడ్కలం దేలి
యున్నట్టి యెడఁ దన - యొడలెల్ల వడఁక
విన్నఁబాటున మాట - వెడలక యుండి 10210
తెఱఁగుగానక దిట - దెచ్చుక మఱియు
భరతుండు జానకీ - పతికి నిట్లనియె.
"ధర్మజ్ఞ! మనవంశ - ధర్మంబు రాజ
ధర్మంబు నెంచి యీ - తల్లుల మనని
నావిన్నపము విని - నాకునై సకల
భూవలయము నీవు - ప్రోతువు రమ్ము
యిలయేల నేర మ - హీజనులెల్ల
హాలికుల్ మేఘంబు - నాశించునటుల
నినుఁ గోరియున్నారు - నృపునిఁగా మమ్ము
మనుప నీవే కాని - మరిలేరు దిక్కు. 10220
కరుణింపు" మనుచు లో - కశరణ్యుడైన
ధరణిజా రమణు పా - దములపై వ్రాలి
లేవకయున్న నా - ళీకపత్రాక్షు
పావనచరితుని - భరతునిఁజూచి
యెత్తికౌఁగిటఁ జేర్చి - యెలవంకతోడ
హత్తించి కరుణచే - నాసీనుఁజేసి
"నిజముగా నీబుద్ధి - నీ కెట్లుగలిగె?
ప్రజల నాలోచించి - పాలింపు ధరణి
అడియాస నీకేల? - యాడినమాట
పుడమి గ్రుంగిన వార్థి - పొరలివచ్చినను 10230

కమలారి బింబము - కళలు మాసినను
హిమవన్నగంబు మం - చెడిలి పోయినను
తప్పుదునే మాట - దప్పిన నీకు
దప్పినవాఁడ నెం - తయు విచారింపు
కైకేయి నీమీఁది - కరుణచే నైన
ప్రాకట రాజ్యలో - భము చేతనైన
యిల పుచ్చుకొని నీకు - నిచ్చెనేమిటికిఁ?
గలఁగెదు దీననొ - క్క కొఱంత లేదు
మాయన్న! వీటికి - మరలి పొమ్మనిన
యాయన్నయెదుర మా - ఱాడంగ లేక 10240
భరతుండు రత్నంవు - పావాలుదెచ్చి
ధరణీ భరం బివి - దాలుప నోపు
మోపుము మీపాద - ములు వీఁటి మీఁద
నీ పాదుకలు రాజ్య - మేలు చుండెడును
బంటనై సేతుఁ ద - త్పరిచర్యనెల్ల
వెంటను మీరలు - విచ్చేయు దనుక”
అనవిని లోకత్ర - త్రయమునకు సౌఖ్య
జనకంబులగు తన - చరణపద్మములు
పాదుకలను మోప - భరతుఁ డుప్పొంగి
యాదరంబున మౌళి - యందుఁగీలించి 10250
శ్రీరామ పదము లీ - క్షించి సేవించి
“వోరామ! యిదె యేఁగు - చున్నాఁడఁ దరికి
పదునాలు గేఁడులు - పాదుకా రాజ్య
పదవిచూచుచు మీకుఁ - బలె సేవసేతు

వోయి నందిగ్రామ - మున వసియించి
యా యతి వేషంబు - లిట్లనే యుండ
ఆమేర కందమూ - లాశినై గడువు
నీమది మఱచిన - నిమిషంబు నోర్వ
పదియు నేనవ యేఁడు - ప్రాపింప నాఁటి
మొదటి దినంబులో - మొదటి యామమున 10260
ననల ప్రవేశమై - నాచరింపుదును
విను డిందఱును సాక్షి - వీరు వారనక"
అన నట్లయగుఁ గాక - యని రాఘవుండు
కనికరంబున గ్రుచ్చి - కౌఁగిటం జేర్చి
భరత శత్రుఘ్నుల - పరికించి వారి
శిరములు మూర్కొని - శ్రీ రాముఁ డనియె.
"కైకేయి నిపుడాదిఁ - గాఁ గానిమాట
వాకొనవలదు కా - వలసిన నన్ను
కౌసల్యతో సరి - గాఁ జెప్పినట్లు
చేసియాత్మకు నింపు - సేయుఁ డిద్దఱును 10270
యేతరి మఱవకుఁ - డీ సీతతోడు
నాతోడు దశరథ - నరపతి తోడు"
అనిపల్కి కన్నుల - నానంద వారి
చినుకఁ బొమ్మనుటయు - శ్రీరామచంద్రు

—: భరతుం డయోధ్యకుఁ జేరుట :—


వలగొని మ్రొక్కి పా - వలు పదిలముగ
తలమీఁద ధరియించి - తమ్మునిఁ గూడి

మఱలి శత్రుంజయ - మదదంతి వరము
శిరముపై పాదుకల్ - చేర్చి యావెంట
యిరువురుఁ గొలిచి రా - హితులు మంత్రులును
గురుఁడు రాజులు సైని - కులు వేరువేర 10280
ననిపించుకొని పోవ - నపుడు కౌసల్య
మునుగాఁగ దశరథు - ముదిత లందఱును
రోదనంబులు సేయ - మ్రొక్కి పొండనుచు
నేదెస నిలుపక - యేమియు ననక
సీతాసహాయుఁడై - చెంత సౌమిత్రి
యేతేరఁ దమరున్న - యింటి లోపలికి
తిరిగిచూడక పోవఁ - దెఱవ లందఱును
మఱలి యాభరతాను - మతిఁ దెచ్చినట్టి
చతురంత యానముల్ - సరవితో నెక్కి
చతురంగ బలములు - చనుదేరఁ గదలి 10290
రథములపై దశ - రథ కుమారకులు
రథనేమి హాయగజా - రావముల్ మీర
చిత్రకూటము ప్రద - క్షిణముగా వచ్చి
చైత్రరథంబు మె - చ్చ నీయాశ్రమములు
చూచుచు వచ్చియ - చ్చో భరద్వాజ
వాచంయమీంద్రుని - వాసంబు చేర
నెదురుగా నమ్మౌని - యేతేర నతని
పదములు కెరగిన - భరతునిం జూచి
ఆశీర్వదించి మ - హాతపోధనుఁడు
దాశరథికిం బ్రమో - దమున నిట్లనియె. 10300

“అన్న నాచే మీర - లను మతులగుచు
నిన్న నేఁగిన వారు - నేఁడె వచ్చితిరి
సమకూడెనే నీకు - సంకల్ప సిద్ధి
రమణీయమూర్తు లా - రామ లక్ష్మణులు
యెచ్చట నున్నవా - రెఱిఁగింపుమనుచు
నిచ్చ నెఱింగియు - నెఱఁగని యటుల
పలికిన మౌనితో - భరతుండు మఱల
కలతెరంగెల్ల ని - క్కముగ నిట్లనియె.
“అయ్య! మారామునిం - బ్రార్ధించి మఱల
నయ్యయోధ్యకుఁ బిల్వ - నాత్మఁ గైకొనక 10310
ఆచార్యు ననుమతి - ప్రాఙ్ముఖుం డగుచు
లేచి పాదములఁ గీ - లించి పాదుకలు
మహియేల నియమించి - మన్నించి నన్ను
బహుమాన మొనరించి - పనిచితా రాక
పదునాలుగేండ్లు భూ - పతి మాటచేసి
తుదివత్తు మనుచు నా - తో నానతిచ్చె
మఱలివచ్చితి" నన్న - మౌని వరుండు
భరతుని కామోద - భరితుఁడై పలికె.
“అనఘాత్మ! నీవు జ్యే - ష్ఠాను వర్తనము
మనసున నునిచి యీ - మర్యాద నడచి 10320
పల్లంబులను వారి - వాయని యటుల
యెల్ల సద్గుణముల - కిరవయి నావు
కావున నినువంటి - ఘనుఁడు శ్రీరామ
దేవు పాదుక లిట్లు - దెచ్చుట యరుదె?

యీమాటవినిన నా - హృదయ సంతోష
మేమని వాకొందు - నింతంత గాదు
అడిగెడి దేమి నీ - యంత సత్పుత్రు
బడయు భూపాలుఁ డె - ప్పటికి నున్నాఁడు
పోయి రమ్మన రాజ - పుత్రుఁ డమ్మునికి
జేయెత్తి మ్రొక్కితా - సేనలు గొలువ 10330
యమునయు గంగయు - నట మీరియెదుర
రమణీయ శృంగిబే - ర పురంబు దాఁటి
తనదు తండ్రినన్నఁ - దమ్ములు లేక
తనకన్నులకు నయో - ధ్యా పట్టణంబు
రహిలేని తెఱఁగు సా - రథి మోముజూచి
బహుళ ఖేదంబుతో - భరతుండు పలికె

—: భరతుఁ డయోధ్యనుజూచి శోకించుట :—


“సూత! యీపురి దేరి - చూడు మెల్లెడల
గీతవాద్యాది సం - కీర్ణతల్ మాని
మొగదల మార్జాల - ములును ఘాకములు
జగడింపఁ దిమిర మె - చ్చట నిండికొనఁగ 10340
పాములాడఁగఁ గృష్ణ - పక్షంబు నాఁటి
యామినితోడి జో - డై చెలంగెడును
అలరాహు ముఖములో - హరిణాంకుఁ గూడి
నిలుకడ చెడురోహి - ణీ దేవిఁబోలి
పలుచని నీటిలో - పలఁ దపియించు
జలజంతువుల తోడి - ఝరియునుం బోలె

హవ్యంబు చేఁదేజ - మణఁగిన సవన
హవ్యవాహనునిఁ బా - యని కీలవోలి
కదనంబులో హరుల్ - కరులనుం బొలియ
చెదరి బీడరియున్న - సేనలం బోలె 10350
మొరయుచు జలధిలో - మొలచి నీరంబు
విరియఁ బొంగణఁగిన - వీచియుం బోలె
మహనీయయాగ స - మాప్తి యాజకుల
విహరణం బుడిగిన - వేదిక పోలె
మందలేఁగల బాసి - మరి మేపులుడిగి
బందఁజిక్కిన ధేను - పంక్తియ బోలి
యెందు నాయకమణి - నెనయక చూడ
నందంబులేని ము - క్తావళిం బోలి
వరపుణ్య ఫలమెల్ల - వమ్మయి పోవ
ధరణిపైయిఁ బడియున్న - తారక వోలె 10360
చూడఁ గార్చిచ్చులు - సుడిగొన్న సెగల
వాడిన నవపుష్ప - వల్లియుం బోలె
జలదమాలికలు న - క్షత్రముల్ గప్ప
లలిమాయు నాకాశ - లక్ష్మియుం బోలె
పగిలిన భాండసం - పద చేత మత్తు
లగువారు లేనిపా - నావనిఁ బోలె
కడప పెంచులును మొ - గ్గరములుం గలిగి
పడిపోవు నడిత్రోవ - ప్రపయునుం బోలె
దొమ్మికయ్యముల రౌ - తుకుఁగాక నొవ్వి

సవరణ లేమియుం - జాలక ధన్యుఁ
డవు పురుషునిగాత్ర - యష్టియుం బోలె
జలదాగమంబున - జలధర శ్రేణి
యలమిన మాయు సూ - ర్యప్రభ వోలె
ఎలమి యేమియు లేక - యీపట్టణంబు
తలమాసి యున్న చం - దంబు చూచితివె?
మంగళా లంకార - మహిమముల్ లేక
సంగీత సాహిత్య - సౌష్ఠవం బెడలి
చతురంగ బలముల - సంకులం బెడలె
క్షితిపాల సుతులుకై - చేసిరా రిపుడు 10380
తొలఁగెను సాంబ్రాణి - ధూప వాసనలు
వెలయవు పురిలోన - విభవంబు లెచట
ధరణిజ రీతి సీ - తా కాంతు వెనక
పురలక్ష్మియునుఁ గూడి - పోయెఁగానోవు
యిదిదుర్దినముఁ బోలి - యిప్పుడు దోఁచె
బదునాలుగేఁడులుం - బాసిన వెనక
మండ్రువేసవిఁ దోఁచు - మబ్బుచందమున
దండ్రియై రాముఁడే - తరివచ్చు నొక్కొ"
అని పలుకుచును పం - చానన హీన
ఘనకందరముఁ బోలు - కాకుస్థ విభుని 10390
నర శూన్యమైనట్టి - నగరిలోఁ జొచ్చి
తరుణులు తోడుగా - తల్లుల నెల్ల
నచట నుండంగఁ జేసి - యాచార్యుఁ జూచి
పచరించి యొకమాట - భరతుండు పలికె,

—: భరతుఁడు నందిగ్రామమున రామపాదుకల బురస్కరించుకొని రాజ్యమును బాలింపఁబూనుట ;—


"యీ యయోధ్యాపురం - బిఁకనేల నాకు?
వోయి నందిగ్రామ - మున వసించెదను
రాముఁబాసిన విచా - రముఁ గాకయున్న
నేమిటం దీరు నిం - కేమియు నొల్ల
రామచంద్రుఁడు నాకు - రాజగుగాన
నామహాత్ముని రాక - నాత్మ నుంచెదను 10400
మీ మనంబుల నిది - మేలని యెంచి
నేమింపుఁడ"నిన మం - త్రివరేణ్యు లనిరి.
"అన్నదమ్ముల మే - ర లన్నియు నీకె
వన్నెగా కితరు లె - వ్వరు సాటినీకు?
నీచిత్త మెట్లుండె - నీవట్ల చేసి
యాచంద్రతారార్క - మగుకీర్తిఁ గనుము.
సీతా విభుండని - చిత్త మెఱుంగు
నాతని హృదయ మీ - వరసి వచ్చితివి
సరిపోయినట్లు వి - చారించి కొనుము
భరత రాజకుమార! - పలు మాటలేల?” 10410
అన సారథిని రథం - బరిది వేగమున
గొనితెమ్మనుఁడు మిన్ను - గోరాడు చున్న
తళు తళుక్కున కోవి - దారధ్వజంబు
గల రథంబతఁడు చెం - గటఁ దెచ్చినిలుప
నందరతల్లుల - యనుమతి చేత

నందుతమ్మునిఁ గూడి - యచలుఁడై యెక్కి
వచ్చిన వారలె - వ్వరు నిండ్లు చొరక
యెచ్చటి కేఁగిన - నేఁగుద మనుచు
రామునిఁ బాయువా - రల మిఁకమీఁద
నేమరనేర్తుమె యీ - విభు ననుచు 10420
వీడెల్ల రఘుపతి - విడిచిన నాడు
పాడుగా దిప్పుడు - పాడయ్య ననుచు
యిల్లని యాండ్రని - యిచ్చట నేల?
యెల్లరు వెంటరం - డిఁకఁ జాలు" ననుచు
గురువురోహిత మంత్రి - కోవిదామాత్య
వరులుమున్నుఁగ బౌర - వర్గంబు గొలువ
రామచంద్రుని నవ - రత్న పాదుకలు
తామౌళినిడి యర - దము గదిలించి
పోయి నంది గ్రామ - పురిచేరి భరతుఁ
డాయెడ గురుఁడు ము - న్నగు వారిఁబలికె. 10430
"యీయవనీ చక్ర - మెల్ల రామునిది
ఆయన నాచేత - నది డాఁచనుంచె
కర్తయిందుకు పాదు - కా యుగళంబు
కర్తవ్య మిదినాకుఁ - గాచి కొల్చుటకుఁ
గాక యే నెవ్వఁడఁ - గడమకు ననుచు
నాకెలంకుల సుమం - త్రాదుల కనియె.
"పాదుకలను రాజ్య - భార మంతయును
పాదు కొన్నదిగాన - భర్మ పీఠంబు

నుభయ చామరములు - నుచితాతపత్ర
మభిముఖులై మ్రొక్కి - యర్పింపుఁ డిపుడు 10440
శ్రీరామవిభుఁడు వ - చ్చిననాఁడు భక్తి
చేరి యీపాదుకల్ - శ్రీ పాదములను
తొడిగించి చూచు సం - తోషముల్ గాంచి
పుడమి యర్పింత మా - పుణ్యశీలునకు
నాఁడుగదా నామ - నంబులో నున్న
వ్రీడయు పాపంబు - వీడి సుఖంతు
రామాభిషేక సం - భ్రమమునేఁ జూచి
యీ మూఁడు లోకంబు - లేలి నట్లుండు "
అనుచు పాదుకలు సిం - హాసనాగ్రమున
నునిచి వసిష్ఠు ని - యోగంబుచేత 10450
నభిషేక మొనరించి - యా పాదుకలకు
నభిముఖుండై మ్రొక్కి - యట కొల్వుచేసి
జడలతో వల్కల - శాలులతోడ
పుడమియెంతయుఁ దన - భుజశక్తిఁ బ్రోచి
దినమును పారుప - త్తెములు పాదుకలు
గని విన్నపముచేసి - కాన్కలే మయిన
నెవ్వారు దెచ్చిన - నెచ్చరింపుచును
దవ్వులం గనిపించు - దారి యేర్పఱచి
మనవుల వారల - మనవు లాలించి
చనిపాదుకల తోడ - చాలంగ దడవు 10460
యేకతంబున నుండి - యెవ్వారి కెట్లు
నాకొనవలయు స - ర్వమునట్లు దీన

రాముఁడులేని కొ - ఱంత రావిక
సీమ యంతయు సుర - క్షితము గానేలి
తమ్ముండుఁ దాను నా - దశరథ తనయుఁ
డమ్మేర సంతోషి - తాత్ముఁడై యుండె.

—: శ్రీరాముఁడు చిత్రకూటమునువిడిచి వేఱొక యాశ్రమమున కరుగుట :—


చిత్ర కూటంబున - శ్రీరామ విభుఁడు
మిత్రసన్నిభుఁడు సౌ - మిత్రి సేవింప
శీతల వనతరు - సీమల యందు
శీతాంశు ముఖబింబ - సీతతోఁ గూడి 10470
వసియింప నచటి పా - వన మునిశ్రేణి
పొసఁగదిచ్చట తపం - బులు జపంబులును
వేఱె యెచ్చటనైన - విపిన భూములకుఁ
జేరుదమని చింత - చేసి యందఱును
పయనంబులగు జాడ - భావించి మిగులు
ప్రియముతో నొకమౌనిఁ బేర్కొని పిలిచి
"యేల! యీ మునిగణం - బెల్ల నుల్లముల
చాలంగ కలఁగి వి - చారముల్ సేయ
మామువ్వురందు మీ - మనసులు నొవ్వ
నేమైనఁ జేసితి - మేని వాకొనుఁడు" 10480
అనిన నమ్ముని వృద్ధుఁ - డా రాముమాట
విని తమ తెఱఁగెల్ల - వినుమంచుఁ బలికె.
"సీత సుశీల వి - శేషించి మౌని

జాతంబునందు వా - త్సల్యంబు వెనుచు
మీయెడగొఱఁత లే - మియు నేలకల్గు?
నీయెడల ప్రయాణ - హేతువు వినుము
మీర లీశైలంబు - మీఁద వసించు
కారణంబునఁ జేసి - ఖరుఁడను వాఁడు
రావణానుజుఁడైన - రాక్షుసుం డొక్కఁ
డీ వనంబునఁగల - ఋషుల నందఱిని 10490
వెతఁబెట్టుచును యాగ - వేదులు ద్రవ్వి
ప్రతిదివసంబు యూ - పంబులు విఱిచి
సృక్కులు పొడిసేసి - సృవములు గాల్చి
మొక్కళంబున పాత్ర - ముల్ పాఱవైచి
అగ్నులు చల్లార్చి - యాగ వాటికలు
భగ్నంబులుగఁ జేసి - పశువుల మెసవి
శ్రీరామ! యేమని - చెప్పుదు ఖరుని
జేరిన దైత్యుల - చే దుండగములు
నందుచే నిటనిల్వ - యజ్జ గాకున్న
నెందైన గదల వీ - రెంచిన వారు 10500
యిఁకనున్న బ్రతుకుల - కేవచ్చు కొదవ
యిఁకనేల యడియాస - లీ యాశ్రమమున"
అని ప్రాణముల మీఁది - యాసచే నిచటి
మునులిందుకు సమీప - మున మునుపున్న
యడవి యున్నదిగాన - నరిగెద రట్టి
యెడకు మాకును మోస - మిచ్చోట నున్న
ఖరుఁడు జగద్రోహి - కాంతతో వచ్చి

యెఱఁగక యున్నాఁడ - విచటి ఖేదములు
వలసిననీవు మా - వలన వెంబడిని
తొలఁగిరమ్మిదె కత్తి - తో సాము నీకు” 10510
అనిన యేమియును మా - ఱాడక యురక
వినుచున్న తనువారి - వెనక నమ్మౌని
కదలి పోయినవెంట - గహన మార్గమున
పదియడుగులు రాఁగ - పరమ సంయములు
దీవించి పనుప ధా - త్రీ సుతాజాని
యావేళవారిఁ బా - యకలేక మఱలి
తన పర్ణశాలకు - తమ్మునిం గూడి
వనిత చెంగటికి తా - వచ్చి యచ్చటను

—: రాముఁ డత్రిముని యాశ్రమము జేరుట :—


"కంటివె లక్ష్మణ! - గహన మార్గమున
నొంటి వీరలు వచ్చి - యున్నారటంచు 10520
మనశక్తి నమ్మక - మౌను లందఱును
దనుజులచేతి బా - ధకు నోర్వలేక
తొలఁగి పోయిరి దైత్య - దూషితంబైన
నెలవేల మనకు మౌ - ని గణంబులున్న
చోటు వేరొకయెడఁ - జూచి వసింత
మీటెంకి మనవార - లిందరు వచ్చి
రొచ్చుచేసిరి గాన - రుచియించి యుండ
దిచ్చోటు పయనమై - యేతెండు మీరు"

అనుచు లక్ష్మణ సీత - లనుసరింపంగ
మనువంశమణి అత్రి - మౌని వసించు 10530
ఆశ్రమంబునకు మ - ధ్యాహ్నంబు నందు
నశ్రములై చేరు - నా తపోధనుఁడు
తనకు మ్రొక్కినరాజ - తనయులం జాల
మనుఁడని దీవించి - మహిపుత్రిఁ గాంచి
ఆమౌని తనభార్య - ననసూయఁ జూచి
యీ మానవతి సీత - నీవు లాలించి
ఉపచరింపు మటంచు - నొగి నప్పగించి
యపుడు రామునిఁ జూచి - యతఁ డిట్టులనియె
“సుజనసన్నుత! యన - సూయ ప్రభావ
మజహరాదులకు ని - ట్లని పల్క రాదు10540
వినుమెట్టులనిన ని - వ్వెలఁది పూర్వమున
వినని కానని యనా - వృత్తి దోషమున
పదియేండ్లు మహియెల్ల - బాధల నొంద
నది తా నెఱంగి మ - హా మాతశక్తి
కందమూల ఫలాది - కములు గల్పించి
మందాకినీ నది - మహిఁబాఱఁ జేసి
వసుమతిజనుల నె - వ్వలు దీర్పఁజూచి
మసలక వేల్పులు - మది మచ్చరించి
పదివేలు వర్షముల్ - పడఁతి తపంబు
వదలక కావింప - వారు విఘ్నములు 10550
చేతనైనట్టు చే - సిన నొకించుకయు
భీతిఁ జలింపక - పెంపుతో నున్న

సిగ్గున దేవతా - శ్రేణి తచ్ఛక్తి
యుగ్గడింపుచు మెచ్చి - యోడిరి గాన
యీసాధ్వి నేమని - యెన్నెదో నీకు
కౌసల్యమాఱు రా - ఘవవంశతిలక!
మేలుగోరిన నీవు - మేదినీతనయ
నా లలనామణి - యండకుఁ బనిచి
మ్రొక్కింపు మనిన రా - ముఁడు సీతఁజూచి
చిక్కని భక్తితో - సేవింపు మీవు 10560
పుణ్యవతి నన్న - నిలసుత వచ్చి
యా పురాణినిఁ బర - మాయురున్నతను
ననసూయఁ జేరి ని - జాభిధానంబు
వినిపించి మ్రొక్కిన - విని యావెలంది
పావన చరితను - పరమ కల్యాణి
నావసుధాపుత్రి - నప్పుడు చూచి
"అమ్మ! పాతివ్రత్య - మాత్మ నేమఱక
నమ్మినవారి మనం - బ్రోచినావె?
యిలయెల్ల నేలిన - నీ కానలందు
మెలఁగిన సమబుద్ధి - మెలఁగ నేరుతువె? 10570
తరుణివై యుండి బాం - ధవులనుఁ బాసి
పరిచర్య లొనరింతుఁ - బతికి నేననుచు
వచ్చిన యప్పుడే - వసుమతి నీవు
నిచ్చట శుభము ల - న్నియు నందఁగలవు
తగినవాఁడైన నను - తగనివాఁడై
మగఁ డొరపరియైన - మైలఁ బాఱినను

కాముకుండైనను - కానివాఁడైన
లేమిఁజెందిన వీర - లేమఁ బొందినను
పతియెదైవము గాక - పడఁతుల కెందు
గతి వేరెకలదె యే - గతిఁ దలంచినను? 10580
సరకుసేయక పతిఁ - జాల నిందించు
గరితలకెందు స - ద్గతు లేలకల్గు?
నినువంటి సతు లు - ర్వి నెగడంగఁగాదె
యనుపమ ధర్మంబు - లభివృద్ది నొందె
ఆదిఁ బతివ్రతలై - నట్టి సతుల
వేద శాస్త్రంబులు - వినుతించు గాన
అట్టివారలజాడ ప్రాణ - నాయకుని
పట్టున మెలంగుదే - పతిహితం బెఱిఁగి
పెద్దలమగుటఁ జె - ప్పిన మాటగాక
బుద్ధులు నేర్పనో - పుదుమె నీ కేము 10590
నా తపంబీడేరి - నకతంబు చేత
నాతి నేనిన్ను మ - న్ననజూడఁ గల్గె"
అనియత్రి భామిని - యాడినమాట
వినయంబుతో సీత - విని యిట్టులనియె.

—: సీత యనసూయతోఁ బాతివ్రత్య ధర్మములఁగూర్చి ముచ్చటించుట :—


"ఓయమ్మ! నినువంటి - యుత్తమ సాధ్వు
లీ యర్థములు బల్క - కేల మానుదురు?
ధరణి నీవంటి యు - త్తమసతుల్ నడచు

పరమ ధర్మంబె - పట్టిన దాన
నెచ్చట నా నాథు - నిట్టివాఁడనఁగ
వచ్చునే? లోకైక - వర్ణితుండతఁడు 10600
అత్త చేతను తల్లి - యందు నే వినిన
యుత్తమ ధర్మంబు - లుల్లంబు లోన
అమ్మ! నీమాటచే - నవి వ్రేళ్లువారి
కొమ్మలు వెట్టి చి - గు ళ్లంకురించె
పతిసేవఁ బోలునే - పడఁతుల కెల్ల
వ్రతములుఁ దపములు - వరనియములు
పతిసేవచేఁ గాదె - భామ సావిత్రి
యతిశయ సౌఖ్యంబు - లందె స్వర్గములు
నినుఁబోలి యల రోహి - ణీదేవి చంద్రు
నెనసి నిత్యానపా - యినియై సుఖంచె 10610
నారీతి మఱియుఁ గు - లాంగనల్ పతుల
జేరియు తమసుఖ - స్థితులు గైకొనిరి.”
అనవిని "యో సీత! - యడుగు మేమైన
మనసునఁ గలయభి - మతము లిచ్చెదను
యేమివేడెద వస్న - నేమియు నొల్ల
నోమానవతి! నీ హి - తోక్తులే చాలు
నిన్నికోరికలు నే నం - దితి" ననుచు
విన్నవించి నత్రి - వెలఁది హర్షించి
"అలివేణి యీసొమ్ము - లంబరంబులును
వెలలేని యవి నీవు - వేడ్కధరించి 10620

శ్రీమహాలక్ష్మి రాజీ - వాక్షుఁబోలి
రాముని చిత్తంబు - రంజిల్లఁజేసి
మనుమని యిచ్చిన - మాఱాడ వెఱచి
అనసూయ చేత న - య్యంగ రాగములు
చేకొని సేవించు - సీతనుఁగాంచి
వాకొని యాపతి - వ్రత యిట్టులనియె.
"అతివ! రాఘవుఁడు స్వ - యంవరణమున
అతిశక్తి నినుఁ బెండ్లి - యాడెనటంచు
మునువింటి మది సర్వ - మును దెల్పుఁమనిన
జనకనందన పుణ్య - సాధ్వితో బలికె. 10630
“మాతండ్రి నిమివంశ - మండనుండగుచు
నీతివైఖరి ధ - రణీ చక్రమెల్ల
పాలించి కీర్తి సం - పన్నుఁడై యాగ
శాల దున్నింప నా - చాలు వెంబడినిఁ
బుట్టితి నేను న - భోవాణి పేరు
పెట్టి సీతయటంచు - బేర్కొని నన్ను
బిడ్డల లేనిచోఁ - బ్రేమ నారాజు
గొడ్డువీఁగిన తన - కులకాంతఁ పిలిచి
ననుఁ జేతికిచ్చిన - నాలికి నపుడె
చనుదోయి చేపిపా - ల్జడిగొని కురియ 10640
నన్నుఁబోషింపుచో - నాకు నానాఁట
చిన్నారి పొన్నారి - చిఱుత ప్రాయంబు
వచ్చినఁ దగినట్టి - వరునికీఁ దలఁచి
యిచ్చలో మాతండ్రి - యిట్లని యెంచె.

ననిపల్కి తనవివా - హ ప్రసంగంబు
తన మఱఁదులకు ను - ద్వాహంబు లగుట
నీవలి కథ తమ - రే తెంచుటయును
కోనగట్టుక పూస - గ్రుచ్చిన యట్లు
పలికిన విని సీత - పైఁ గృపాదృష్టి
వెలయించి పరమసా - ధ్వీరత్నమనియె. 10650
అతని యీకథవిని - యానందమయ్యె

—: రాముం డత్రి యాశ్రమంబుననుండి దండకారణ్యంబునకుం బోవుట :—


శతపత్ర మిత్రుఁడ - స్తనగంబుఁ గదిసె
గూడులు చేరె ప - క్షులు మేవులుడిగి
నాడువారె వికాసి - వనరుహశ్రేణి
మునివరానుష్టాన - ముల వేళయయ్యె
గనువిచ్చెఁ గాసార - కైరవశ్రేణి
వెలిఁగె నాహవనీయ - వీతిహోత్రములు
చెలఁగె నుర్వరనిండి - చీకటిపిండు
చరియించె నవె నిశా - చారజంతువులు
హరిణముల్ వేదిక - లందువసించె 10660
మెఱసె చుక్కలగుంపు - మిన్నులనుండి
దొరసె తూరుపుదిశం - దోయజారాతి
నిండెను పండువె - న్నెల యెల్లయెడల
పండెఁ గోర్కెచకోర - పాళికి నిపుడు

యేనొసంగిన సొమ్ము - లెల్లధరించి
మానిని పొమ్ము! నీ - మగని చెంగటికి"
అనవిని యనసూయ - యానతి సీత
యనుపమ దివ్య భూ - షాన్విత యగుచు
రామలక్ష్మణులఁజే - రఁగ నేఁగి యత్రి
భామిని సేయు సం- భావనల్ దెలుప 10670
వినివారు వెఱగంది - వీక్షించి యచట
మునులచే బహుమాన - ములఁ బ్రీతులగుచు
నారేయి యత్రి పు - ణ్యాశ్రమంబునను
వార లొక్కెడఁ దగు - వైఖరినుండి
మఱునాడు విహిత క - ర్మంబులు దీర్చి
మఱలి యయ్యాశ్రమ - మౌనిపుంగవుల
చెంతకుఁ జేరిన - శ్రీరాముఁజూచి
సంతసంబున మౌని - సమితి యిట్లనియె.
"అనఘ! మా జపతపో - హాని వారించి
యనయంబు కందమూ - లాదులు దేరఁ 10680
జనువారలకు బాధ - సలుపుచుఁగ్రూర
వనమృగంబులు దై - త్య వర్గంబు నిచట
నిలువ రాములుచేసె - నీవు మాకొఱకు
నిలిచి యిచ్చట మాకు - నెగులెల్లఁదీర్చి
శరముల సహితులఁ - జక్కాడి మునుల
గరుణించి పుణ్యంబు - గట్టుకో వలయు
యిదియె యతాయాత - ఋషులాశ్రమముల

బ్రదుకులపై యాసఁ - బాసి నిత్యమును
నడవులకునుఁ బోవు - నట్టి మార్గంబు
చెడకుండ యందరిఁ - జేపట్టి మీరు 10690
నీత్రోవ నడవుల - కేఁగ నిచ్చోటి
దైతేయబాధలు - దలఁగించి ప్రోచి
యభయ దాన మొసంగు - మనిన మౌనులను
నభిముఖుఁడై రాముఁ - డంజలి సేసె
అటుల కానిండని - యనుమతుండగుచు
పటుశౌర్య నిర్వాహ - బాహుగర్వమున
విలసిల్లెనని వేద - వేద్యుని పేర
నలమేలు మంగాంగ - నాధీశుపేర
నంచితకరుణాక - టాక్షునిపేరఁ
గాంచనమణిమయా - కల్పుని పేర 10700
వేదవేదాం తార్థ - వినుతునిపేర
నాదిత్య కోటిప్ర - భాంగుని పేరఁ
గంకణాంగదరత్న - కటకుని పేర
వెంకటేశునిపేర - విశ్వాత్ముపేర
నంకితంబగు వెంక - టాద్రీశచరణ
పంకజసేవాను - భావమానసుఁడు
హరిదాసమణి కట్ట - హరిదాసరాజు
వరదరాజు నితాంత - వరదానశాలి
రచియించు వాల్మీకి - రామాయణంబు
ప్రచురభక్తిని మదిఁ - బాటించి వినిన 10710

జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మదిదలంచినయెట్టి - మనుజులకైన
ధారుణిమీఁద సీ - తారామచంద్ర
పారిజాతదయా ప్ర - భావంబు వలన
హయమేధరాజసూ - యాదిమ యాగ
నియత ఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శో వైభవములు
నకళంక తీర్థయా - త్రాది పుణ్యములు
సత్యవ్రత పదంబు - సకల సౌఖ్యములు
నిత్య మహాదాన - నిరుపమశ్రీలు 10720
కలికాల సంప్రాప్త - కలుష నాశనము
కలుములు హరిభక్తి - గౌరవోన్నతులు
శత్రుజయంబును - స్వామిహితంబు
పుత్రలాభంబును - భోగభాగ్యములు
ననుకూలదాంపత్య - మంగనాప్రియము
ధనధాన్య పశు వస్తు - దాసీసమృద్ధి
మానస హితము ధ -ర్మ ప్రవర్తనము
నానందములు ఖేద - మంద కుండుటయు
నలఘు వివేకంబు - నతుల గౌరవము
వలయుకార్యములు కై - వశము లౌటయును 10730
పావనత్వము దీర్ఘ - పరమాయువులును
కైవల్య సుఖము ని - క్కముగాగల్గు
నెన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు

లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
నెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యలరు నార్షంబు
నాదికావ్యం బయో - ధ్యాకాండమనఁగ
వేదసమానమై - విలసిల్లుఁగాత.


ఇది

కట్టా వరదరాజ రచితమైన

వాల్మీకి రామాయణ మందలి

యయోధ్యాకాండము

సమాప్తము