శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/40వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

40వ అధ్యాయము.

వివిధాంశములు.

741. నరుడు రెండురకముల సంస్కారములతో పుట్టుచున్నాడు: (1) విద్యా సంస్కారము :- ఇది మోక్షము వైపునకు దారిజూపును. (2) అవిద్యాసంస్కారము :- ఇది సంసారమువైపునకు బంధనమునకును దారితీయును. పుట్టుకసమయమునందు ఈరెండుసంస్కారములు త్రాసు సిబ్బెలవలె సమముగానుండుననవచ్చును. సంసారము తన సుఖములను ఆనందములను ఒకసిబ్బెలో వేయును; ఆత్మ తన ఆకర్షణను రెండవసిబ్బెలో నిడును. మనస్సు సంసారమును కోరుకొనెనా ఆసిబ్బెబరువై క్రిందికిదిగును. అటులకాక ఆత్మను కోరుకొనెనా ఆసిబ్బెబరువై దైవము వైపునకు దిగును.

742. ప్రశ్న:- జీవన్ముక్తునియందు మాయయుండునా?

ఉ:- శుద్ధ మేలిమిబంగారుతో నగలను చేయుట పొసగదు; ఏదో కొంత కలితీ కలపవలెను. నరునికి శరీర మొకటి యున్నంతకాలమును ఆశరీరధర్మములు నడచుకొఱకు కొంతమాయ యుండవలయును. బొత్తుగ మాయచేవిడువబడిన యతడు యిరువదియొక్క దినములకంటె బ్రతుకడు.

743. ప్రశ్న:- కృతనిశ్చయబుద్ధిలేక తాత్కాలికపు విరక్తిచే సంసారమునుత్యజించిన సన్యాసి స్వభావమెటులుండును? ఉ:- తండ్రితోడనో, తల్లితోడనో లేక భార్యతోడనో తగవుల బెట్టికొని సన్యసించినవానిని ఆతురసన్యాసి అనవచ్చును. వాని సన్యాసము తాత్కాలికము; ఏ ధనికుడో లాభాసాటిపనిని చూపినయెడల అది ఎగిరిపోవును.

744. పరమహంసులవారు ఉన్మాది (పిచ్చివాడు) అనియు చాలమంది ఐరోపా జిజ్ఞాసువులవలె ఏదో విషయముంగూర్చి కలతచెందగా వారిమనస్సు వికలమైనదనియు ఒకానొక బ్రహ్మసమాజ భోదకుడు పలికినాడు. కొంతకాలమునకు శ్రీపరమహంసులవారు వానితో ముచ్చటించుచు ఇట్లనిరి:- "యూరపునందు సయితము విద్యాధికులు ఏదోవిషయమును గూర్చి గాఢతర విచారణను పెట్టుకొనుటచేత పిచ్చివాండ్రగుదురని మీరు చెప్పుదురు. సరే వారి విచారణాంశము బౌతికమా? పారమార్థికమా? భౌతికమైనయెడల, భౌతిక పదార్థములగూర్చి నిరంతరము యోచనచేయువారు పిచ్చి వారగుటలో ఆశ్చర్యమేమున్నది? కాని ఏజ్ఞానము జగమునంతను ప్రకాశింపజేయునో ఆజ్ఞానముంగూర్చి మననము చేయుటవలన నరుడు జ్ఞానశూన్యుడగుటెట్లు? మీశాస్త్ర గ్రంథము లటుల బోధించునా?

745. ప్రేమ మూడురకములు :- (1) స్వార్థరహితమైనది (సమర్థము) (2) పరస్పరము (సమంజసము) (3) స్వార్థమగు సామాన్యప్రేమ (సాధారణము)

(1) సమర్ధప్రేమ ఉత్తమమైనది. ప్రియుడు ప్రేయసీ యొక్క క్షేమమునే గమనించునుగాని, తనకష్టములను బాధలనుగూడ సరకుచేయడు. (2) సమంజసప్రేమ అన్యోన్యమైనది. ప్రియుడు తన ప్రేయసి ఆనందమునేగాక తనసౌఖ్యమునుగూడ జాగ్రత్తగ చూచుకొనును.

(3) సాధారణప్రేమ అధమము. ఇందు నరుడు తనసుఖమునే చూచుకొనునుగాని తన ప్రేయసి సుఖదుఃఖములను పాటింపడు.

746. శ్రీశంకరాచార్యులయొద్ద ప్రతి యంశమునను వారిని అనుకరించు ఒకానొక మూర్ఖశిష్యుడుండెను. శ్రీశంకరులవారు "శివోహం" అనునప్పుడెల్ల ఆతడును "శివోహం" అనెడివాడు. వానికి బుద్ధిగఱపనెంచి శ్రీశంకరులవారు కమ్మరికొలిమిప్రాంతమున పోవుచు మూసలో కరగియున్న లోహమును తీసికొని త్రాగినారు; మఱియు శిష్యునికూడ అటులనే త్రాగమనిరి కాని గురునివలె ఈపనిని శిష్యుడు చేయజాలక పోయెను. అప్పటినుండి "శివహోం" అనుటయు మానినాడు. క్షుద్రానుకరణము ఎన్నడునుకూడదు. పెద్దల నడవడిని జూచి తమసు వర్తనము సవరించుకొనుట సర్వత్ర తగును గాని, అర్థహీనపు అనుకరణములు చేటుదెచ్చును.

747. సంసారములోనుండి బ్రహ్మజ్ఞానమును చెందిన వారెవరైన జనకమహారాజును ఉదాహరణగా ఎల్లప్పుడు చెప్పుదురు. మానవచరిత్రలో అట్టి ఉదాహరణ యిది ఒక్కటియే! సాధారణముగా సంసారములోనుండి కామినీ కాంచన విసర్జనలేనిది బ్రహ్మసాక్షాత్కారము పొందుట దుర్లభము. శ్రీజనకమహారాజు ఒకడే కామినీకాంచన విసర్జనలేక అట్లుబ్రహ్మజ్ఞానముపొందినది. నీవున్ను జనకుడవని తలంచవద్దు. ఎన్నియుగములో గడచినవిగాని ప్రపంచములో మఱియొకజనకుడు యింతవఱకును పుట్టియుండలేదు.

748. పాచి చిన్నచిన్న ముఱుగుడుగుంటలయందు పెరుగునుగాని, మిక్కిలి పెద్దసరస్సులందు పెరుగదు. అటులనే స్వార్థపరత, కపటము, మూర్ఖతమూలముగా వెలసినకూటములందు పాక్షికసంప్రదాయము వర్ధిలును; కాని నిష్కళంకములై విశాలాశయములుగలిగి, స్వార్థరహిత వర్తనముతో వెలయు సమాజములందు అట్టిసంకుచిత విషయములు ప్రవర్ధనము కాజాలవు.

749. హిందూమతమునకును బ్రహ్మసమాజమతమునకును బేధమేమని ఒకబ్రహ్మసమాజభక్తుడు ప్రశ్నించగా శ్రీపరమహంసులవారిటులతెలిపిరి:- ఏకస్వరమునకును రాగమునకును గలభేదమేవానికున్నది. బ్రహ్మసమాజము "బ్రహ్మమను" ఒక్కస్వరముతో తృప్తిచెందుచున్నది. హిందూమతమున చాలస్వరములుకూడి మధురమౌ రాగముగ నేర్పడుచున్నవి.

750. భావమును స్వరూపమునుగూడ పాటించుడు; లోపలనుండు భావనయు పైకికాన్పించు ప్రతీకమును మాన్యములే.

751. వరిగింజ మొలకయెత్తి పెరుగుటకు అందుండు అంకురమే ముఖ్యావసరమయినదనియు, పైనిఊకప్రధానమైనది కాదనియు సామాన్యముగ తలంతురు. అయినను ఊకను తొలగించి బియ్యపుగింజను నేలలో నాటినయెడల, అందుండి అంకురము వెలువడి మొక్కయై పంటనీయజాలదు. పంటను కోరుచో ఊకతోగూడ చెక్కుచెదఱకయున్న విత్తనమునే నాటవలయును. కాని వండుకొని తినుటకు కోరినయడల పైపొట్టును తొలగించి శుభ్రమైనబియ్యమునే చేకొనవలసియుండును. మతప్రచారమునకు, మతరక్షణకును క్రతువులు, కర్మలు అవసరములే. అవి సత్యాంకురములను దాల్చిన కర్ణికలవంటివి. కాబట్టి ఆంతర్యసత్యమును స్వానుభవమునకు తెచ్చుకొనునంతదాక, ప్రతినరుడును వానిని ఆచరించవలసినదే.

752. దీపముయొక్క స్వభావము వెలుగునిచ్చుట! దాని సహాయమున కొందఱు, తినుబండారములను వండుకొందురు. కొందఱు కృత్రిమ పత్రములను సృష్టింతురు; కొందఱు ఉత్తమశాస్త్రములను చదువుకొందురు. అటులనే కొందఱు భగవన్నామస్మరణచేసి ముక్తి పడయజూతురు; కొందఱు నీచస్వార్థములను సాధించుకొందురు. భగవంతుని పావన నామము మాత్రము అమలమై నిలిచియుండును.

753. క్రొత్తభాషను నేర్చుకొనమొదలిడిన యతడు, తన సంభాషణయందు ఆభాషాపదములను తఱచుగావాడుచు తన పాండిత్యమును ప్రదర్శించజూచును; కాని దానిని బాగుగ నేర్చినయతడు మాతృభాషను మాటలాడునప్పుడు ఆనూతన భాషాపదములను ప్రయోగించచూడడు. మతసాధనల సాధించువారిటులనే వర్తింతురు.

754. వట్టికడవలో పోయునీరు బుడబుడ ధ్వనుల కల్పించును. కాని నిండియున్నకడవలో నీరుపోసినచో అట్టిధ్వనిరాదు. అటులనే బ్రహ్మసాక్షాత్కారమును పొందనినరుడు భగవంతునిగూర్చియు; వానిలక్షణముల గూర్చియు వృధావాదనలకు దిగును; బ్రహ్మసాక్షాత్కారమును పడసినయతడో ఆ దివ్యానంద పరవశుడై మౌనము దాల్చును.

755. ప్రశ్న:- నరునియందు దైవత్వము ఎంతకాలము నిలుచును?

ఉ:- ఇనుము నిప్పులోనున్నంతకాలము ఎఱ్ఱగానుండును. దానిని నిప్పులోనుండి వెలుపలికితీయగా నల్లబడును. అట్లే నరుడు బ్రహ్మభావనను అనుభవించునంతకాలము ఆదివ్య ప్రభావము కలిగియుండును.

756. గంగానదీతీరమున వసించువారు పవిత్రులు.

757. ఒకతార్కికుడువచ్చి "జ్ఞాతజ్ఞేయజ్ఞానములనగా నేమి?" అని శ్రీపరమహంసులవారి నడిగిరి. అందుకు భగవాను లిట్లనిరి.

"మహాశయా! పాండిత్యవిశేషము ప్రకటించు ఈవిషయములు నాకుతెలియవు. నాకు నాలోనిఆత్మ నాదివ్యజనని మాత్రమేతెలియును."

758. మానసతత్వ ప్రబోధముగాంచిన యతడే నిక్కువమగు మానవుడు. తక్కినవారు పేరునకుమాత్రమే మానవులు.

759. దుర్లభమగు మానవజన్మ దొఱకినను ఈజన్మను బ్రహ్మసాక్షాత్కారము పడయుటకై వినియోగించనివాని జన్మవ్యర్థము. 760. లేగదూడచాలచుఱుకుగను, ఆనందముగను, కాన్పించును. దినమంతయు చంగుచంగున దుముకులాడుచుండును. తల్లికడ పాలుత్రాగునప్పుడు మాత్రమే నిలకడగ నుండును. కాడిమెడమీదవేసి పలుపుపెట్టగనే నిరుత్సాహము చెంది, ఆనందమునకు మారుగా దుఃఖమును మోమున దాల్చును. క్రమక్రమముగా చిక్కి శల్యమగును. సంసారబాధలు మీదపడనంతవఱకును బాలురు ఆనందముతో కేళీలుగొట్టుచుందురు. వివాహబంధముతో సంసారమున తగుల్కొని, కుటుంబబాధ్యతను నెత్తినబడగానే పొంగిపాటు అణగును. ముఖమున నిరుత్సాహము, విచారము, దిగులు మూర్తీభవించును. క్రమముగా ముఖము ముడతలుపడి, చెక్కిళ్లనుండి యౌవనతేజము జారిపోవును. ప్రాతఃకాలమారుతము వలెను; నవకోమల పుష్పములీలను, హిమవారి బిందుపోల్కిని ఆజన్మాంతము బాలవికాసమును నిలుపుకొనువాని జన్మధన్యము!

761. క్రొత్తగా పట్టణమునకువచ్చువాడు, రాత్రి పరుండుటకు తగిన గదినొకదానిని మొదటగా విచారించుకొని అచ్చట తనసామానును చేర్చుకొనవలెను. ఆపిమ్మట స్వేచ్ఛగా నగరవిచిత్రముల జూడపోవచ్చును. అటుల చేయనిచో రాత్రి చీకటిలో నిలువతావులేక చాలబాధలు పడవలసివచ్చును. అటులనే ముందుగా భగవంతునియందు నిత్య శాంతిధామమును కుదుర్చుకొని, అనంతరము తన నిత్యకృత్యములమీద ఇటునటు సంచరించుట క్రొత్తగా సంసారమున ప్రవేశించినవానికి క్షేమము. లేదా మృత్యువను భీకరకాళ రాత్రి ఆసన్నమైనప్పుడు అనేకయాతనలకు లోనై బహుదుఃఖము ననుభవించవలసివచ్చును.

762. మున్ముందుగా భగవంతుని ప్రాపు సంపాదింపుము, ఆపిమ్మట ధనము నార్జింపుము. ఈవరుసను తలక్రిందుచేయ జూడకుము. పారమార్థికత సంపాదించిన యనంతరము గృహస్థుడవైతివా నీమనశ్శాంతికి భంగమురాదు.

763. చిన్నపిల్లలు చావిడిగదిలో విచారము భయము ఆటంకము లేకుండ స్వేచ్ఛగా బొమ్మలు పెట్టుకొని ఆటలాడుదురు కాని తల్లి కనబడగానే తమ బొమ్మలనన్నిటిని విడిచివేసి "అమ్మ! అమ్మ!" అనుచు పర్విడుదురు. ఓనరుడా! నీవును ఈభూలోకమున ధనము, కీర్తి ప్రతిష్ఠమున్నగు బొమ్మలతో మిగులపరవశమునజిక్కి ఆటలాడుచున్నావు. నీ కేమియు భయముగాని, దిగులుగాని, విచారముగాని లేకున్నది. కానినీకు ఒక్కసారి ఆదివ్యమాతదర్శనమయ్యెనా, నీకీవిషయములందు మక్కువ నిలువదు. వీని నన్నిటిని తన్నివేసి నీవా ఆదివ్యజనని సన్నిధికి పర్విడుదువు సుమీ!

764. ఎఱిగియో ఎఱుగకనో ఎటులైనను మృతసరోవరమున పడెనేని, నరుడు అందుమునిగి అమృతుడగును. ఐచ్ఛికముగగాని, పరప్రేరణచేతగాని, ఎటులైననునేమి భగవన్నామస్మరణ చేయునెడల, తుదినిమనుజుడు అమరత్వమును పొందును.

765. సదా హరికీ రనము జరుగు నింటిని దయ్యము చొచ్చబోదు. 766. "హరి" అనగా మన హృదయములను హరించువాడు అని అర్థము. "హరిబలము" అనగా మనబలము శ్రీహరి అన్నమాట.

767. పామరులు విమర్శింతురనిగాని, లోకము వెక్కిరించుననిగాని, మత సాధనగూర్చి లజ్జపడకుము. అటువంటి జనుల నందఱిని గణనచేయనర్హముగాని పురువులుగ నెంచుము.

768. మానవులు ఎంతసులభముగా స్తోత్రముచేయుదురో అంత సులభముగా నిందలు చేయుదురు. కావున వారు నిన్ను గూర్చి యేమన్నను సరకుసేయకుము.

769. నిత్యమును అనిత్యముసాహాయముననే కనుగొనవలయును; సత్యమును అసత్యము నాధారముచేసికొని కనుగొనవలయును. నిర్వికారమును సవికారముయొక్క సాహాయ్యమున ప్రాపించవలయును.

770. గృహస్థులుగానుండి మోక్షసాధనముల సాగించువారు కోటగోడ చాటునుండి పోరాడు యోధులవంటివారు. సంసారములత్యజించి బ్రహ్మసాధనలకుపూను సన్యాసులు బయట బయలుమీద యుద్ధముచేయు భటులుబోలువారు. బయట బయలునందు పోరాడుటకంటె కోటలోపల నుండి యుద్ధముచేయుట ఎక్కువక్షేమకరమును సుకరమును గూడనగును.

771. అనులోమ విలోమనాదమని తర్కమురెండుతెగలుగలది, అనులోమప్రకరణమున సృష్టినాధారముచేసికొని సృష్టికర్తను తెలిసికొందుము; అనగా "కార్యము" ననుసరించిపోయి "కారణము"ను తెలిసికొందుము. పిమ్మట విలోమవాదము ప్రారంభమగును. ముందు బ్రహ్మమును పొంది, విశ్వమునందలి ప్రతికార్యమునందును ప్రతిఅంశమునందును వాని ప్రభావము వ్యక్తమగుటను తెలిసికొందుము.

ఒకటి పృధక్కరణపద్ధతి; రెండవది సమ్యక్కరణపద్ధతి. మొదటిది అరటిదొప్పలను వలుచుచుపోయి నడుమనున్న ఊచను కనుగొనుటవంటిది. రెండవది ఒకపొఱమీద ఒకపొఱగా దొప్పలను పేర్చుచు పోవుటవంటిది.

772. ప్రశ్న:- సాత్త్విక, రాజసిక, తామసికపూజలనగా ఎట్టివి? భేదమేమి?

ఉ:- సంపూర్ణహృదయముతో, నిరాడంబరముగా, ఆర్భాటమేమియులేక, పూజలర్పించునతడు సాత్త్వికభక్తుడు. పూజామందిరమును అలంకరించుటలో మిగుల శ్రద్ధపూని, నృత్యగీతాదుల ఆర్భాటమును సమకూర్చి, హెచ్చుధనమునువెచ్చించి సమారాధనలుచేసి, పూజార్చనలను జరుపువాడు రాజసికభక్తుడు; నోరులేని గొఱ్ఱెలను మేకలను వందలకొలదిగా బలిపీఠములమీద నఱికి ప్రోగువేసి, మాంసము మద్యములతో సహా కుంభముపోసి, చిందులువేయుచు పదాలుపాడుచు పూజలుచేయువాడు తామసికభక్తుడు;

773. ప్రశ్న:- సంసార మెటువంటిది?

ఉ:- చర్మము టెంకమాత్రము గల ఎండిన పుల్లమామిడికాయవంటిది. గుజ్జుండదు. దానినేగీకుకొని తినినచో కడుపులోశూలపుట్టును. 774. జ్వరాతిశయముచేత విదాహముగలిగి పీడితుడగు రోగి సముద్రములోని నీరంతటిని త్రాగివేయ గలననితలచును. ఆజ్వరముతగ్గి ఎప్పటిస్థితికివచ్చినప్పుడు గిన్నెడు నీటినైనను త్రాగడు; పురిసెడు నీటితో సంపూర్ణముగాతృప్తిపడును. అటులనే "మాయా" జ్వరపీడితుడై, తన కించిజ్ఞత్వమును మఱచిన నరుడు అనంతుడగు భగవంతుని విభూతులనన్నిటిని తనచిన్ని హృదయమున యిముడ్చుకొనగలనని తలచును. వాని యీభ్రాంతి తొలగినప్పుడు దివ్యజ్ఞానకిరణమొక్కటియే చాలును వానిని పరమానందభరితుని చేయుటకు!

775. ఒకానొక పెద్దమనుష్యుడు "నాకొమారుడు హరీశుడు పెద్దవాడుకాగానే వానికి పెండ్లిచేసెదను; కుటుంబ వ్యవహారములన్నియు వానికి విడిచివేసి సన్యసించి నేను యోగాభ్యాసము మొదలిడెదను" అని చెప్పెను. ఈపలుకులువిని శ్రీపరమహంసులవారు వానితో "భగవద్భక్తి"ని సాధన చేయుటకు నీకెన్నడును అవకాశము దొఱకదు సుమీ. ఆపిమ్మటనుగూడ "ఈహరీశునకును ఆగిరీశునకును నాపై ప్రేమానురాగముమెండు. నేను సన్యసించితినా, వారు బెంగ గొందురు. హరీశునకొకకొడుకు పుట్టనీలే. మనమని పెండ్లికూడ చూడవద్దూ!" అనబోదువు! ఈవిధముగా నీగొంతెమ్మకోరికలకు హద్దుండబోదు" అనిరి.

776. సన్నని ధాన్యపుగింజలను పోవిడిచి ముతకగింజలను నిలుపుకొనుట జల్లెడకు స్వభావము. అట్లే దుష్టాత్ములు సద్విషయములను జారిపోవిడిచి, దుర్విషయములను నిలిపి యుంచుకొనుచుందురు. చేటయొక్కయు, మహాత్ములయొక్కయు స్వభావము దీనికివ్యతిరేకముగ నుండును. (తాలు, తప్ప, చెత్తత్రోసివేసి ఉపయోగకరమగు గట్టిగింజలను నిలుపు కొనును.)

777. దుఃఖాశ్రువులును, ఆనంద బాష్పములును ఒకేకంటినుండి వచ్చును; కాని వేర్వేఱు కొనలునుండి ప్రవహించును. దుఃఖముచేవచ్చు కన్నీరు ముక్కుదాపుకొనలనుండియు, ఆనందముచే గలుగు కన్నీరు వెలుపలి కొనలనుండియు వచ్చును.

778. "మిత్రులారా! నేనెంతకాలము బ్రతుకుదునో అంతకాలము ఏదియో నేర్చుకొనుచునే యుండగలను."

779. భగవంతుడుఇచ్ఛించుచో సూదిబెజ్జములో సామజమును (ఏనుగును) దూర్చగలడు. ఇచ్ఛానుసారము ఆయన యేమైనను చేయగలడు!

780. భరతుడు, ప్రహ్లాదుడు, శుకదేవుడు, విభీషణుడు, పరశురాముడు, బలి, బృందావనగోపికలును భగవంతుని సేవించునిమిత్తము తమ పెద్దలయెడ అవిధేయులై వర్తించిరి.

781. ప్రశ్న:- మతధర్మములు క్షీణించుటకు కారణమేమి?

ఉ:- వాననీరు నిర్మలమైనదేకాని అది భూమిపై పడునప్పటికి సంపర్క దోషముచేత మలినముగ నుండును. మిద్దెలు తూములు, కాలువలు, అన్నియు మురికిగా నున్నప్పుడు వాని గుండ ప్రవహించు వర్ష జలమును ముఱికిగానె యుండునుగదా! (ఇట్లే మతధర్మములును ఆయాప్రచారకుల లోపములచేత దోషభూయిష్టములు కాగలవు).

782. సాధువే సాధువును గుర్తించగలడు. నూలువర్తకునకే నూలుయొక్కనాణెము గుణగణములు తెలియగలవు.

783. పాపము, రసము, (Mercury) జీర్ణమగుట దుర్లభము.

784. ముల్లంగిగడ్డ తినిన వానికి ముల్లంగివాసన త్రేణువులేవచ్చును; దోసకాయమెసవిన వానికి దోసకాయవాసన త్రేణువులేవచ్చును. అటులనే నోటవచ్చుమాటలు మనస్సులోనున్న సంకల్పములకు అనుసరణముగానె యుండును.

785. చాకలివానియింట ముఱికిగుడ్డలు అనేకముండును; కాని అవన్నియు వానివికావు. ఉతుకగానె వానియిల్లు కాళీ యగుచుండును. స్వంతసంకల్పములులేనివారు చాకలివాని పగిదినుందురు. భావములవిషయమున నీవు చాకలివానిలీల నుండకుము.

786. ఈశ్వరవాణి ఒక్కొకప్పుడు పిచ్చివారినోటను, త్రాగుబోతులనోటను, పసిబిడ్డలనోటను వినవచ్చును.

787. గ్రంథము అనగా సదా సచ్ఛాస్త్రమనిఅర్థముకాదు. "గ్రంధి" అనగా "ముడి" అను అర్ధముకూడ తఱచుగాదానికి చెల్లును. నరుడు గ్రంథమును చదువునప్పుడు, గర్వమును విడిచి పూర్ణ హృదయముతో సత్యమునుతెలిసికొనవలయును. అట్టి దీక్షలేనియెడల, వేడుకగా చదువుటచేత, విషమ పాండిత్యము, అహంకారము, గర్వము, మున్నగునవి, వాని హృదయమున గ్రంధులై కూడును.(బాధించును)

788. మనస్సును, హృదయమును, పవిత్రముచేయు చదువుమాత్రమే విద్య! తదితరమగు ఎఱుక అంతయు అవిద్యయే.

789. వంగభాషలో ఏమూడు అక్షరములకును ధ్వనిలో పోలికయుండదు. శ, ష, స, అనువానికి మాత్రము పోలిక కలదు. ఆమూటికికూడ "శాంతించుము" అను అర్ధముకలదు. దీనినిబట్టి మనము అక్షరాభ్యాసము చేయుచున్నప్పుడును, బాల్యమునుండియు "శాంతితోనుండుము" అను పాఠమునే నేర్చుచున్నామని గ్రహించవచ్చును. ప్రతివానికిని శాంతియే పరమభాగ్యము.

790. (1) సర్వోహం (అంతయు నేనే) (2) తత్వమసి (ఈసర్వమును నీవే) లేక (3) త్వమేనస్వామి; అహమేవసేవకః (నీవు యజమానివి; నేను సేవకుడను) అని పలుకగల చిత్తపరిపాకదశ నరునియందు కలిగినప్పుడు భగవంతుడు ప్రత్యక్షము కాగలడు.

791. స్త్రీ లందఱును, జగజ్జనని అవతారములే. కావున స్త్రీ జనమునెల్ల తల్లులుగ భావనచేయవలయును సుడీ!

792. సాధువును చూడబోవునప్పుడును, దేవాలయమునకు పోవునప్పుడును వట్టిచేతులతో పోతగదు. పూజ్యులకు అర్పణచేయుటకై ఏదేని స్వల్పముగనైనను తీసికొనిపోవలెను. 793. ఇతరులేమి చేయవలయునని నీవు కోరుదువో, దానిని నీవును జేయుము.

794. చిలుక ఎగిరిపోయినవెనుక ఎవడును పంజరముమీద శ్రద్ధవహించడు. ప్రాణమనెడు చిలుక ఎగిరిపోయిన వెనుక మిగిలియున్న కళేబరము ఎవరికిని అక్కఱలేదు.

795. ఎవరికిని కొఱగాని వానియందుకంటె, అనేకుల గౌరవ మర్యాదల బడయుచు, వినయవిధేయతలతో అనుసరించబడు నతనియందు దైవశక్తి అతిశయముగ నుండును.

796. తెల్లని గుడ్డమీద నల్లనిడాగు నలుసంతపడినను ఎంతో అసహ్యముగ గాన్పించును. అటులనే సాధువునందు చిన్నలోపమున్నను ప్రకాశమునకువచ్చి బాధకరమగును.

797. ఇతరులు శిరస్సువంచుతావున నీవును వంచుము. వినయవర్తనము వ్యర్థముగపోదు.

798. అద్దెయింటిలో కాపురమున్నయెడల బాడుగచెల్లించవలయు రీతిని, శరీరమునువాడుకొని నందుకు జీవుడు రోగపీడలనెడు పన్నులను చెల్లించుకొనవలయును.

799. ఇనుమును కొలిమిలోకఱగి చాలసేపు శుద్ధిచేసినగాని మంచిఉక్కుకాదు. అప్పుడు దానిని మంచికత్తిగాచేసి నీయిష్టమువచ్చినటుల ఎటుపట్టిన నటువంచవచ్చును. ఆతీరుననే మనుజుని ఆపదలను కొలిమిలో చాలసార్లుకాచి, బాధలనెడు సమ్మెటలతో మోదిన అనంతరము వాని హృదయము స్వచ్ఛమగును; వినయసంపత్తి గలదగును. అప్పుడతడు భగవత్సాన్నిధ్యమున మెలగుటకు అర్హుడగును. 800. (కలకత్తాలోని కోటీశ్వరుడగు) యదునాధమల్లికు వంటి శ్రీమంతునిభవనములగురించియు ధనరాసులగురించియు విచారణసేయువారు అనేకులుందురు; కాని వానిని స్వయముగాచూచి వానిపరిచయమును చేసికొనగోరువారు అరుదు. అటులనే వేదాంతగ్రంథముల చదువువారును మతధర్మములగూర్చి ఉపన్యాసములు చేయువారును పెక్కండ్రుందురు. కాని బ్రహ్మమును చూడగోరువారును, సాయుజ్యము బడయుటకై శ్రమదీసికొనువారును చాల కొలదిగనే యుందురు.

801. ఒకనికి న్యాయవాది (ప్లీడరు) కాన్పించగానెవ్యాజ్యములు కోర్టులు తలపునకు వచ్చును. అటులనే సద్భక్తులను చూచినప్పుడు భగవంతుడును పరలోకజీవనమును తలపునకు రాగలవు.

802. బ్రహ్మానందము లభించినప్పుడు దానితోడ మైమఱపు కలుగును. అట్టివాడు కల్లుత్రాగ నవసరములేదు; త్రాగినవానివలెనే కాన్పించును. నను నాదివ్యజనని పాదదర్శనము చేయుసమయమున అయిదుసారాబుడ్లు త్రాగినంత కైపెక్కును. అట్టిస్థితియందు ధారాళముగా తిండినైనతినుటకు వీలుండదు.

803. సమారాధనలని చాలామందినిచేర్చి విందులు చేయుట ఎందులకు? అటులచేయుట సర్వభూతములందును ప్రజ్వలించుచుండు ప్రాణాగ్నియందు ఆహుతులిడుటే అనిగదా మీతలంపు? అట్లయిన దుర్వర్తనులును, నీచ చారిత్రులును అగు క్షుద్రమానవులను, అట్టి సమారాధనలందు ఆదరించ దగదుసుడీ!

అటువంటి పాపములు వారు కూర్చుండుస్థలమును సయితము చాలబారల లోతువరకు అపవిత్రము చేయునంత ఘోరములుగా నుండును.

804. పూర్వము కసాయివాడొకడు దూరముననున్న వధశాలకు ఒక ఆవును తోలుకొని పోవుచుండెను. ఆకసాయివాడు దానిని క్రూరముగ చెండాడుటవలన ఆ ఆవు చాలా తిప్పలు పెట్టసాగెను. దానిని తోలుకొనిపోవుట వానికి దుర్లభమైనది. ఇట్లుచాలసేపు శ్రమపడి మధ్యాహ్నవేళకు ఎట్టెటో ఒకగ్రామముచేరినాడు. చాల అలసినవాడై, ఒకధర్మసత్రవునకుబోయి, అచ్చటనొసగబడు సదావ్రతమును పాల్గొనినాడు. అందువలన పొట్టనిండ తృప్తిగాతినినవాడై, సేదదేఱి సులభముగా ఆవును తోలుకొనిపోయి వధశాలకు చేర్చగల్గినాడు. ఆగోవును హత్యచేసినపాపములో కొంతభాగము సదావ్రతమునొసగినవానికిని ప్రాప్తించినది. కాబట్టి అన్నమునుగాని, బిచ్చమునుగాని ఎవరికైనపెట్టి పుణ్యముసంపాదింపనెంచువాడు ఆదానమును పుచ్చుకొనువాడు దుష్టుడును సాపవర్తనుడును కాడుగదా యని వివేకించి చేయుచుండవలయును.

805. ప్ర:- ఈజగత్తు అసత్యమా ?

ఉ:- నీవు బ్రహ్మమును చూడజాలనంతవఱకు నీకు జగము అసత్యమే. ఏలయన, నీవుబ్రహ్మమును చూడజాలవు కాన, "నేను, నాది" అను బంధములతో జగమునకు అంటకట్టుకొనియేయుందువు. అజ్ఞానమువలన భ్రాంతుడవై, ఇంద్రియభోగములందు తగుల్కొని, మాయాఘాతమున అట్ట అడుగున పడిపోదువు. తరుణోపాయముదాపున సూటిగనున్నను, మాయ మానవులను మిగుల అంధులనుచేసి వైచును.

806. ఒక్కసారిగా జ్ఞానమును కఱపుటకు వీలులేదు. దానిని పొందుటకు కాలముపట్టును. తీవ్రస్వభావముగల జ్వరమున్నదనుకొనుడు. ఆస్థితిలో వైద్యుడు "కొయినాను" ఇయ్యడు. దానివలన లాభముండదని అతనికి తెలియును. ముందుగ జ్వరము రోగిని విడువవలెను. దీనికికాలము అవసరము. పిమ్మట "కొయినా" గాని మఱేమందుగాని ఇయ్య వీలుపడును. జ్ఞానమును బడయగోరు నరునిస్థితియు యిట్టిదే. నరుడు సంసారతాపత్రయములలో మునిగియున్నంతకాలమును ధర్మోపదేశములు వ్యర్ధములగును. కొంతకాలము సంసారవిషయముల అనుభవమునుపొందనీయ వలెను. వానిసంసారప్రీతి ఒకింత తగ్గిన వెనుక ధర్మోపదేశములు వానియందుఫలించు స్థితి వచ్చును. అంతవఱకును వానిగూర్చిచేసిన ఉపదేశములన్నియు వ్యర్ధములే!

807. సంధ్యగాయత్రియందు లయమందుచున్నది. గాయత్రి ప్రణవమున లయమగుచున్నది. ఈ ప్రణవము సమాధియందు లయముగాంచుచున్నది. ఇటుల (సంధ్యావందనాది) కర్మయంతయు సమాధియందు పరిసమాప్తిపొందుచున్నది. 808. ఎవనియందు బుద్ధియు హృదయమును పూర్ణవికాసమునుపొంది, సమతకువచ్చియుండునో, అట్టివాడు ధన్యుడు. అటువంటివాడు ఎచ్చటనున్నను సమంజసముగ వర్తింపజాలును. వాని నిర్మలభక్తి పరిపక్వముకాగా అతడు నిశ్చల విశ్వాసము గలిగియుండును. అప్పుడు అతడు యితరులతో నడుపు వ్యవహారములందు లోపముండదు. ఆతడు లౌకికవ్యవహారములను చక్క బెట్టునప్పుడు దక్షతచూపును; పండిత సభలందు, ఉత్తమవిద్యాప్రదర్శనముచేత తనవాదనను నిలుపుకొనును; తర్కమున అద్భుతచాతుర్యమును చూపును. తల్లిదండ్రులయెడ విధేయుడై భక్తిసలుపును; ఇరుగుపొరుగు వారియెడ దయాదాక్షిణ్యములు గలిగి ఉపకారము సలుపుటకు సిద్ధముగనుండును. భార్యయెడ ప్రేమంపువేలుపై వర్తించును. అట్టి పురుషుడే నిజముగా సిద్ధాత్ముడు!

809. సంసారము ఎంతఅశాశ్వితమైనదో నీకు తెలియును. మనముకాపురముండు యింటిసంగతి కొంచెము చూడుము. ఎంతమంది దానిలోపుట్టినారో! ఎంతమంది దానిలో చచ్చినారో! ప్రపంచవిషయములు మనయెదుట ఒక్కక్షణము కాన్పించును; మరునిమిషమున అదృశ్యమైపోవును. నీవారుగానీవుచూకొనువారు మరణమున నీవు కనుమూయగనే, నీవారనుమాట ముగియుచున్నది. సంసారికి ఎంతటిబలముగల బంధములుండునో చూడుము. కుటుంబములో తన పోషణపై నాధారపడువారెవరును లేకున్నను, మనుమని పెండ్లిచూడ వలయునను కోరికనుపెట్టుకొని, కాశికిపోవ నిరాకరించును. "నాహరి ఏమైపోవునో?" అనుతలంపు వానిని సంసారమునకు బంధించియే యుంచును. ఈడుపువలలో పడిన చేప బయట పడిపోవుతకు వీలున్నను అది పోజూడదు. కంబళిపురుగు తానల్లుకొనిన గూటిలో ముడుచుకొని పడియుండి అందేచచ్చును. ఇటువంటి సంసారము అసత్యము కాదా? మఱియు అశాశ్వతము కాదా?

810. పెద్దపిల్లలమందను కని పెంచినంతమాత్రాన నరుడు స్తుతిపాత్రుడు కాజాలడు. అందు సత్యమగు పురుషత్వమేమియులేదు. కుక్కలు పందులు సయితము పిల్లలను కనుట లేదా? పెంచుటలేదా? సత్యమగు పురుషత్వము స్వధర్మ నిర్వహణమున కలదు. అట్టిపౌరుషమును చూపినవాడు అర్జునుడొక్కడు!

811. బాహ్యప్రపంచస్ఫురణతో నున్నప్పుడు మనస్సు స్థూలవిషయములనే గమనించుచు, అన్నమయకోశమున వసించును. ఈకోశము అన్నముపై నాధారపడు జీవుని స్థూల కవచము. మనస్సు అంతర్ముఖమైనప్పుడు, ఇంటిద్వారమును బంధించి అంతఃపురమున ప్రవేశించినట్లగును. అనగా అది సూక్ష్మశరీరమునప్రవేశించి, అందుండి కారణశరీరము ప్రవేశించును. తుదకు మహాకారణమును చేరును. ఆదశయందు మనస్సు అవ్యయబ్రహ్మమున లయమగును. ఆస్థితిని గురించి ఏమివచించుటకును సాధ్యపడదు.

812. పరమహంసులవారు జబ్బుపడినప్పుడు శశిధరపండితులవారుచూచి "రోగగ్రస్తమైన అవయవముమీద మనస్సును ఏకాగ్రముచేసి మీరేల మీరోగమును కుదుర్చుకోరాదు?" అని అడిగిరి.

శ్రీ పరమహంసులవారిట్లనిరి:- "నేను బ్రహ్మార్పణముచేసియున్న మనస్సును కేవల రక్తమాంసకోశ మగు ఈశరీరముపైని ఎట్లు పెట్టగలను?"

శశిధరపండితులు మరల యిట్లనిరి:- "మీ జబ్బునెమ్మదింపజేయుమని జగజ్జననిని మీరేలప్రార్థింపరాదు?

శ్రీపరమహంసులవా రిట్లు జవాబుచెప్పిరి:- "నేను నాతల్లినిగూర్చి స్మరించినతోడనే నాస్థూలశరీరము అదృశ్యమైపోవును. నేను పూర్తిగ దానినుండి తొలగియుందును. కాబట్టి అప్పుడీస్థూలశరీరమును గురించి ప్రార్థించుటకే సాధ్యము కాదు."

813. శ్రీరామకృష్ణ పరమహంసులవారివ్యాధి ముదిరి, వారేమాత్రమును ఆహారపానీయములు తీసుకొనజాలని స్థితిలో ఇట్లువచించిరి.

"నేనిప్పుడు అనేకములగు నోళ్లతో మాటలాడుచు తినుచు ఉన్నాను. నేనుఆత్మలకు ఆత్మను, నాకు అనేకముఖములున్నవి. నేను అఖండాత్మను. గొంతులో పుండుగల నరచర్మముతో కప్పబడినాను. ఆశరీరము రోగగ్రస్తమైనప్పుడు, అది మనస్సును బాధించును. వేడినీరు మీదపడినప్పుడొకడు "ఈనీరు నన్ను కాల్చినది" అనవచ్చును. కాని సత్యమేమనగా, ఉష్ణము వానినికాల్చును గాని నీరెన్నడును కాల్చదు. బాధ యంతయు శరీరమునందుండును; రోగమంతయు శరీ రముదే. ఈబాధయు ఈరోగమును ఆత్మను దఱిచేర జాలవు.

814. శరీరమునందు తీవ్రబాధయున్ననుకూడ, నరుడెట్లు ఆత్మవిచారముసలుపవలయునో ఎట్లుబ్రహ్మభావనయందు మునిగియుండవలయునో, నేర్పుకొఱకే అల జగన్మాత ఈ జబ్బును కల్పించినది. తీవ్రబాధతోడను, ఆకలితోడను శరీరము పీడనొందుచున్నసమయమున, నరుని వశమున నివారణోపాయములేనప్పుడును, ఈశరీరమునకు అధిపతి ఆత్మ సుమీ అని నాకు నాజనని బోధించుచున్నది. ఆత్మ దైవీయమనియు, బ్రహ్మభావము సత్యమైనదనియు, నరుడు సిద్ధత్వమును సాధించునప్పుడు సర్వబంధవిముక్తి లభ్యమగుననియు, విశ్వాసశూన్యులకు సందేహనివృత్తి చేయుకొఱకు దివ్యమాత ఈజబ్బును కల్పనచేసినది.

815. శ్రీ రామకృష్ణ పరమహంసులవారు కేశవచంద్రసేనులతో నిట్లనిరి:- "నీవుబాధపడుచున్నావు; కాని నీజబ్బునకు అర్థము గొప్పదిగనున్నది. ఈశరీరములో నీవుచాల ఆధ్యాత్మికావస్థలను గడిపియున్నావు. తత్ఫలితముగా ఈశరీరము బాధపడుచున్నది. పారమార్థికతరంగములేచునప్పుడు దేహస్మృతి అదృశ్యమగును; కాని అది తుదినిదేహమును బాధించును. గంగాజలములమీద పెద్దపొగయోడ నడుచునప్పుడు, కొంతసేపటికి పెద్దతరంగములులేచి ఒడ్డునకు కొట్టుకొనును. ఓడపెద్దదైనకొలదిని తరంగములదెబ్బ బలతరముగ నుండును. ఒక్కొకప్పుడు వానివలన ఒడ్డువిరిగిపడును. ఏనుగు చిన్నగుడిసెలో జొఱబడినయెడల, అది దానిని ఉఱ్ఱూత లూగించి, విరుగలాగును. అటులనే ఆత్మావేశానుభవము చేత సాధకునిశరీరము కదలబారి ఒక్కొకప్పుడు విచ్చిపోవును. అప్పుడేమిజరుగునో తెలియునా? ఆయింటిలో నిప్పున్నయెడల చాలసామాగ్రిని తగులబెట్టివేయును. అటులనే దివ్యజ్ఞానాగ్నిచేత వ్యసనములన్నియు, కోపము మొదలగు శత్రువర్గము దహింపబడును. తుదకు "నేను, నాది" అను స్ఫృహయే నాశముచెందును. శరీరము తీవ్రబాధనుపొంది, చెదిఱిపోగలదు. సర్వమును ముగిసెనని నీవు తలంచవచ్చును. కాని "అహం" కారము లేశమేనియున్నంతవఱకును భగవంతుడు నిన్ను ముక్తునిచేయడు. నీవొకవైద్య చికిత్సాలయములో రోగిగాప్రవేశించినయెడల నీకు పూర్తిగ రోగముకుదురువఱకును నిన్ను విడువరు సుమీ!"

816. నాశరీరస్థితిని చూచినపిమ్మట "శరీరము ఇంత శుష్కించియున్న స్థితిలో అంత పారమార్థికత విజ్ఞానసంపద నే నెన్నడును చూచియుండలేదు" అని హృదయుడు అనేవాడు. నాశరీరము బలహీనముగనున్నను నేనితరులతో భగవంతుని గూర్చి ప్రసంగించుట మానలేదు. ఒకసారి, నాకు జ్ఞాపకమే, కేవలము శల్యావశిష్టముగనున్నాను; అప్పుడును నాకొక శరీరమున్నదనే గుర్తేలేకుండ గంటలకొలది కాలము పారమార్థిక విషయములగురించి ప్రసంగములు చేయుచుండెడి వాడను. 817. (కేశవచంద్రసేనుల వారితో):- "తోటమాలి ఒక్కొకప్పుడు రోజాపూల మొక్కల వేళ్లపై మట్టితీసివేసి వానిపైని మంచుపడనిచ్చును. ఒక్కొకప్పుడు పూలుపెద్దవిగా పెరుగునిమిత్తము వేళ్లను నఱుకుచుండును. బహుశః భగవంతుడు నిన్నిటు ఘనకార్యములకై సిద్ధము చేయుచుండబోలును!

818. ఒకశిష్యుని ప్రశ్న:- శ్త్రీ జనమును మేమెటుల చూడవలయును?

ఉ:- బ్రహ్మ సాక్షాత్కారమును బడసి దివ్యదృష్టిని సంపాదించుకొనినవానికి వారినిచూచిన భయములేదు. ఆతడు వారి నిజస్వరూపముల గాంచును; వారాజగజ్జనని అంశములని తెలిసికొనును. కావున అటువంటివాడు వారియెడ గౌరవమర్యాదలను చూపుటేగాక, పుత్రుడు జననినివలె సాక్షాత్పూజల నర్పించును.

819. స్త్రీలు సద్గుణములతో జనించనీ లేకపోనీ, పతివ్రతలు కానీ వ్యభిచారిణులుకానీ, వారిని సర్వత్ర ఆనందమాయి దివ్యస్వరూపములుగ చూడవలయును.

820. వ్యవసాయదారులు గిత్తలబేరము ఎటులచేతురో తెలియునా? ఓహో! ఆవిషయములలో వారెంతయో నేర్పఱులు. మంచివానిని చెడ్డవానిని వివేకించుట వారికి చక్కగతెలియును. ఒకగిత్తయొక్క చుఱుకుదనమును కనుగొనుటెట్లో వారికి ఎఱుకయే; ఊరక తోకతాకెదరు; ఓహో! ఫలితము చిత్రము! చుఱుకుదనములేనివి చలించవు, నిద్రపోవు వానివలె పడుకొనియెయుండును. చుఱుకుదనము కలవియో, అబ్బో; తమజోలికివచ్చినందుకై ఆగ్రహపడినటులలేచును. వ్యవసాయకులు ఈరకమువానినే కోరుకొందురు.

ఎవడేని ప్రయోజనపరుడై జీవించునెడల తనయందు నిజమగు పౌరుషమును తాల్చవలయును. కాని పౌరుషహీనులు చాలమందియుందురు - పాలలోనానవేసిన మరమరాలవలె మెత్తనై అంటుకొనిపోవుచుందురు. వారిలోబలమే శూన్యము. నిలువబడి పనిచేయుసమర్థత యుండదు. సంకల్పశక్తి సున్న! అట్టివారిజీవనములు వ్యర్థములు.

821. శంభుమల్లికుగారు ఒకసారి "అయ్యా! నాసంపదనంతను దివ్యమాత పావన పాదపద్మములు చెంత అర్పణముచేసి మరణించునటుల నన్నాశీర్వదించుడు" అని కోరెను. నేనిట్లు చెప్పితిని:- "ఏమనుచుంటివి? అదంతయు నీవు గొప్పసంపదగా ఎంచుకొనవచ్చును; ఆదివ్యమాతకో పాదముల క్రింద నీవుత్రొక్కుచు నడుచుధూళికన్న ఏమియు అతిశయముగ చూపట్టదుసుమీ!"

822. ఒకసారి దక్షిణేశ్వరమునందలి రాచమణిరాణిగారి తోటలో దొంగతనముజరిగినది. విష్ణ్వాలయమందలి విగ్రహములకు ధరించిన ఆభరణములన్నియు పోయినవి. (రాణీగారి అల్లుడును దేవాలయధర్మకర్తయునగు) మధురనాధుగారును నేనును ఏమిజరుగునో చూడబోతిమి. మధురనాధుగారు "ఓ దేవుడా! నీవసమర్థుడవు. దొంగలు నీనగలనన్నిటిని దోచుకొనిపోయిరే! అడ్డుపడలేకపోతివి!" అనెను. నేనంతట, వారిని గాఢముగా మందలించి "ఇట్లు పలుకుట ఎంత బుద్ధిహీనత! మీరా విగ్రహము ద్వారమున అర్చించుస్వామికి ఈ ఆభరణరాశియంతయు ఒకమట్టిగడ్డను మించిన విలువగలవికావు సుడీ! ఆదేవదేవునినుండియేగదా, లక్ష్మీదేవి సయితము తన వైబవమునంతను పడయునని జ్ఞప్తినుంచుకొనుడు!" అని చెప్పితిని.

823. ఎవడెంతగా ధనము నర్పించినను భగవంతుడు లెక్కసేయునా? ఎన్నడునులేదు! ప్రేమను భక్తిని ఎవడర్పించునో వానిపైని స్వామికి కృపగల్గును. స్వామి తననుగూర్చి చేయబడు ప్రేమను, భక్తిని, వివేకమును వైరాగ్యమును మాత్రమే గణనచేయును.

824. బ్రహ్మసాక్షాత్కారమునుగోరి, అనేకులుదీర్ఘకాలము నిష్ఠలను, జపములను, ధ్యానములను, తపములను, పూజలను సలిపిన పవిత్రస్థలములందు భగవంతుడు ప్రత్యక్షమైయుండునని యెఱుంగుము. వారి శ్రద్ధవలన ఆధ్యాత్మభావములు అక్కడ ఘనీభూతములైయుండు ననవచ్చును. అట్టిప్రదేశములందు పరమార్ధభావమునకు ప్రబోధముకలుగుటయు బ్రహ్మసాక్షాత్కారము లభించుటయు అందువలననే స్మృతిదాటి పోవుకాలమునుండియు అసంఖ్యాకులగు సాధువులు, భక్తులు బ్రహ్మవిదులు ఇట్టితీర్థములను దర్శించి సకలవాంఛలను మట్టుపెట్టి, భక్తావేశిత హృదయములతో బ్రహ్మపరోక్షాను భూతికొఱకై నిష్ఠలుసలిపియుందురు. కాబట్టి భగవంతుడు సర్వత్రనిండియున్నను ఈక్షేత్రములందు ప్రత్యేకముగ ప్రసన్ను డగుచుండును. ఎక్కడత్రవ్వినను నీరుదొఱకగలదు. కాని బావియో, కోనేరో, సరస్సోయున్నచోట త్రవ్వవలసిన పని లేకయే, కావలయునన్నప్పుడెల్ల సంసిద్ధముగ నీరుదొఱకును గదా!

825. ఆవులు పొట్టలనిండ గడ్డిమేసి, నెమ్మదిగ ఒకచోట పరుండి నెమరువేయును; అటులనే నీవొక పుణ్యతీర్థమును దర్శించినపిమ్మట, అక్కడ నీమనస్సునకుతట్టిన పవిత్ర సంకల్పములను శ్రద్ధగా కూడబెట్టుకొనియుంచి, ఒక ఏకాంతస్థలమునకూర్చుండి వానిలో నీవు నిమగ్నమై పోవువఱకును మననము చేయవలయును. ఆక్షేత్రమునుండి నీవు మరలగానె ఆసంకల్పములను నీమనస్సునుండి జారిపోనిచ్చి, యింద్రియభోగములందు పడిపొరాదు.

826. భూమినలుదిక్కులను ద్రిమ్మరినను అందునకేమియు (సత్యమగు మతము) చిక్కబోదు. ఉన్నదంతయు ఇక్కడనే (హృదయమందు) ఉన్నది.

827. అహంకారనాశమును ఎట్లు చేయవలయునో తెలియునా? వడ్లుదంచునప్పుడు, వారప్పుడప్పుడు ఆగి, ధాన్యము మెదిగెనో లేదో చూతురు. సన్నసరకును తూచునప్పుడు నడుమ నడుమ ఆగి, త్రాసుపుల్లసరిగా ఆడుచున్నదో లేదో అని త్రాసును సవరించుచుందురు. అటులనే నాలోనిఅహంభావము అణగిపోయినదో లేదో చూచుకొనుటకు, అప్పుడప్పుడు ఆత్మనిందచేసికొను చుండెడివాడను. ఒక్కొకప్పుడు నాశరీరమును పరిశీలించుకొనుచు ఇట్లుతలపోసెడివాడను. ఈశరీరమునుచూడు. ఎముకలు మాంసముతోకూడిన పంజరముకాక ఇదేమిటి? ఇందులో నెత్తురు, చీము, ఇంక నిట్టి మలినపదార్థములుతప్ప యేమున్నవి? ఆహా! దీనినిగురించి మహాగర్వమును పూనుచుండుట ఆశ్చర్యముకాదా?"

828. భగవంతునియొక్కయు, గురువుయొక్కయు, సాధుసత్తమునియొక్కయు, అనుగ్రహములను పొందినను, ఒకదాని అనుగ్రహములేకపోయెనా, జీవునికి నాశము తప్పదు. ఒకడు అదృష్టవశమున పైమూడురకములగు వరములను పొందుగాక, వానిహృదయము తనను తాను అనుగ్రహించుకొనిన యెడల - తానుతరించవలయునను ఆతురపాటు దానికిలేనియెడల - ఎన్నియున్నను నిష్ఫలము!

829. సాధనాక్రమము మూడుతరగతులగనుండును:- (1) పక్షుల స్వభావముగలది (2) కోతుల స్వభావముగలది. (3) చీమల స్వభావముగలది.

1. పక్షివచ్చిఒకపండును పొడుచును. ఆపోటుతో పండుక్రిందపడిపోవును. ఇక అది పక్షికిదొఱకదు. (అటులనే కొందఱుసాధకులు అతితీవ్రముగా సాధనలను సాగింతురు. వారితీవ్రతయే వారిప్రయత్నములను భగ్నముచేయును.)

2. కోతి పండును నోటకఱచుకొని, కొమ్మనుండికొమ్మకుదుముకులాడుట దానిస్వభావము. ఇట్లుదుముకులాడునప్పుడు పండు దానినోటినుండి జారిపోవుచుండును.

(అటులనే సాధకుడు కొన్నికొన్ని సమయములందు జీవనక్లిష్టసమస్యలు వచ్చినప్పుడు తనసాధానా విధానమును జారవిడుచును. పట్టునిలుపుకొనలేడు.) (3) చీమ నెమ్మదిగను పట్టుదలతోడను తన ఆహారమును వెదకిపట్టుకొనును. దానిని జాగ్రత్తగా తన పుట్టలోనికి చేర్చి సుఖముగా భుజించును. ఇట్టి చీమవర్తనమును బోలు సాధన శ్రేష్టమయినది. ఇందు ఫలప్రాప్తి నిశ్చయము.

830. పసిపిల్లలు తమ యొడళ్ళను ముఱికిచేసికొనుట వారి స్వభావము. కాని తల్లి వారినటుల నుండనీక తరుచుగా వారి శరీరములను కడుగుచుండును. అట్లే నరుడెంతగా పాపములు చేయుచున్నను, భగవంతుడు తుదకు వానికి తరుణోపాయమును చూపకతప్పదు.

831. చీకటి గదియొకటి కలదు. దానిలోనికి ఒక చిన్నరంధ్రముగుండా బైటనుండి వెలుగు కిరణమొకటి వచ్చుచుండెను. ఆగదిలోనుండు నరునకు వెలుగనగా ఆకిరణమే ననుభావము కలుగును. ఆతడు క్రమేణ కిటికితలుపులను ద్వారములను తెఱచుచు, లోపలికి వెలుగువచ్చు అవకాశములు హెచ్చుచేసినకొలదిని హెచ్చుగ వెలుగును చూడగలడు.

కాని బహిరంగమున పొలములో నిలుచున్నవానికి అంతా వెలుతురే!

ఈపోలికను భగవంతుడు బుద్ధియొక్క స్వభావ సమర్థతల ననుసరించి ప్రత్యక్షమగుచుండును.

832. నరుడు పరమాత్మను సమీపించినకొలదిని, ఎక్కువ ఎక్కువగా తన అనంతస్వభావ విభూతులను భగవంతుడు నవ్యతర ప్రత్యక్షము గావించుచుండును. తుదిని నరుడు జ్ఞాన పరిపాకమును బడసి పరమాత్మ యందైక్యము గాంచును. 833. దేవకీదేవికి చెఱలో శ్రీకృష్ణ దివ్యదర్శనప్రాప్తి లభించినను, అంతమాత్రాన ఆమెకు బంధనము విడిపోలేదు.

834. ఒక గ్రుడ్డివాడు గంగా పవిత్రజలములందు స్నానముచేయుటచేత, వానిపాపములన్నియు సమసిపోయెను; కాని గ్రుడ్డితనము విడిచిపోదయ్యెను.

835. భక్తునకు శారీరకముగా ఎటువంటిసుఖములు దుఃఖములు కలిగినను శ్రద్ధాభక్తిజ్ఞానముల మహాత్ఫలములు వానికి చెందకుండవు. ఆ విభవములు కుంటుపడవు. చూచితిరా, పాండవులకు ఎటువంటి ఘోరతరాపదలు వాటిలినవో! అయినను వారి సుజ్ఞానతేజము భంగపడలేదు.

836. "రోగము దానిపనిని అది చేయుగాక; శరీరము బాధపడుగాక. మనసా! నీవు నిత్యానందము తోడ నుండుము!"

837. భర్తతోడి కాపురము చేయుచును బ్రహ్మచర్యము నాచరించు స్త్రీ, సాక్షాత్తు జగజ్జనని స్వరూపమే!

838. నేను సర్వమును అంగీకరించెదను. జాగరము, స్వప్నము, సుషిప్తి, తురీయము, బ్రహ్మము, జీవుడు, ప్రకృతి అన్నియు అల పరమాత్మయొక్క వ్యక్తరూపములే. లేకున్నచో పరిపూర్ణత్వమునకు లోటువచ్చును. అందువలన నాకు ఖండాఖండ రూపములు రెండును సమ్మతములే.

839. ఒకానొక భక్తుడగు కట్టెల కొట్టువానికి దివ్యమాత ప్రసన్నమై కృపజూపినది; కాని కట్టెలు కొట్టువృత్తి మాత్రము వానికి తప్పలేదు. వెనుకటివలెనే కట్టెలకొట్టి అమ్ముచూ, స్వల్పజీవనము చేయుచుండెను. 840. మేడకట్టుచుండుకాలమున, పరంజాచాలఅవసరమే. కాని కట్టుడపుపని ముగిసిన యనంతరము పరంజా ఎవరికినిఅవసరముండదు. అటులనే విగ్రహారాధనము ప్రారంభమున అవసరమే గాని పిమ్మట నవసరముండదు.

841. కోపము తమో గుణలక్షణము. కోపమువచ్చినప్పుడు మానవుడు వివేకమును పూర్తిగ పోగొట్టుకొనును. హనుమంతుడు లంకకు నిప్పంటించి దహించెను కాని ఆసమయమున సీతాదేవియున్న గదికూడ తగులపడునేమొయని ఊహించుపాటి వివేకమువానికి లేకపోయెను.

842. భగవంతుని శరణుజొచ్చినవానినడకలో తడబాటుండును.

843. సూక్ష్మధర్మముల భావమును నిజముగా గ్రహింపజాలువారు అరుదుగానుందురు. లోకులచేత దుర్మార్గులుగా చూడబడువారియందు సయితము యోగ్యులుండుట సంభవించును.

844. లౌకికులు భగవంతుని ఎట్లు తలపోయుదురో తెలియునా? తమలోతాము ఆటలాడుకొను సమయమున చిన్నపిల్లలు ప్రలాపించి నట్లుండును. ఒక్కొకప్పుడు వారు "దేవునితోడు నామాటనిజము" అందురు. పెద్దవాండ్రు ఒట్లు పెట్టుకొనుచుండగావిని వీరును నేర్చియుందురు. లేదా బడాయి కోరొకడు పూలతోటలో విలాసముగ తిరుగాడుచు పూవు నొకదానిని పెఱికి "ఆహా! భగవంతుడీ పుష్పమును ఎంతమనోహరముగ చేసినాడు!" అని బుద్ధి నెక్కడనో పెట్టుకొని అశ్రద్ధగా పలికినట్లుండును. ఎఱ్ఱగ కాలియున్న ఇనుపకమ్మి మీద గోరునీరు చిలుకరించినటుల క్షణకాలపు పలుకువిని! భగవంతుని గూర్చి తీవ్రపిపాస యుండవలెను సుడీ! ఆమహాసముద్రములో దుమికి మునిగిపోవలసినదే.

845. ఆత్మయొక్క విభూతిని ప్రకటించు గర్వము గర్వముకాదు; ఆత్మకు అవమానముంగూర్చు వినయము వినయముకాదు.

846. యోచనచేత నరుడు క్రుంగిపోవును. బలిచక్రవర్తిని యాచించబోయినప్పుడు విష్ణుదేవునంతటి వాడు వామనుడు కావలసివచ్చెను. నీవు ఎవరినుండియేని దేనినైనను యాచింపబూనితివా తక్షణము నీకు హీనతవాటిలునని భగవంతుడట్లు నిదర్శనమును చూపినాడు.

847. శివాంశతో పుట్టినవాడు జ్ఞానియగును. ఆతడు నిరంతరము "బ్రహ్మసత్యము, జగన్మిథ్య" అనుభావముతో నుండును విష్ణ్వాంశతో పుట్టినవానికి భక్తిశ్రద్ధలందేనాడును లోపముండదు. ఎన్నడైన తర్కముగాని, పండితప్రకర్షగాని వానిని ఆవహించి, క్షణకాలము భక్తిశ్రద్ధలు వన్నెతగ్గినను, యాదవకులమును నాశముచేసిన ముసలమువలె తీవ్రరూపమున పునరుద్ధరణమునందును.

848. ఆత్మ నిర్లేపుడని (దేవిని అంటనివాడని) వేదాంతులు చెప్పుదురు. పాపముగాని పుణ్యముగాని, దుఃఖముగాని సుఖముగాని దానిని అంటవు. అయినను దేహభ్రాంతి గల వారిని ఇవి బాధించును. గోడకు మసి అంటుకొనునుగాని ఆకాశమునకు అంటుకొనజాలదు సుమీ!

849. బాలుని బోలు విశ్వాసమును పూనినగాని నరుడు బ్రహ్మావలోకనము చేయజాలడు. ఎవనినైనను చూపి, వాడు నీ అన్న అని తల్లి చెప్పినయెడల చిన్నబిడ్డడు వానిని తన సోదరుడుగ భావించును. "అటుపోకు, అక్కడ బూచియున్నది" అని తల్లి చెప్పుచో అక్కడ బూచియేదో యున్నదనియే పసివాడు విశ్వసించును. అట్టి పసివారికున్నట్టి విశ్వాసముగల మనుజులపైని భగవంతునికి కరుణ కలుగును. లోకవ్యవహర్తలవలె గణితములువేయు బుద్ధులుగలవారికి భగవంతుడు సులభుడుకాడు.

850. అద్వైతజ్ఞానము పరమోత్తమమైనది. అయినను మొదటపూజకుడు పూజ్యుడు అనుభావముపూని క్రమసాధనను చేయవలెను. (అనగా భగవంతుడు నాపూజల నందుకొనువాడు, నేను పూజలర్పించువాడను అను భావము ప్రారంభమున పూనవలయును). తుదను సులభముగా అద్వైజ్ఞానమును పడయవచ్చును.

851. అర్జునుడు సత్యమగు వీరుడు; దేనిని తన ధర్మమని నమ్మెనో, దేవిని ఆచరించుట యోగ్యమని విశ్వసించునో, దానిని చేసితీరెను.

852. జీవన్ముక్తులనంటుకొని కొంచెము మాయయుండును. పూర్ణ బ్రహ్మజ్ఞానము కలిగినపిమ్మట ఇరువదియొక్కదినములలో శరీరము పడిపోవును. 853. మనస్సునిలుచు ఏడుస్థానముల (చక్రముల లేక పద్మముల) గురించి వేదములు చెప్పుచున్నవి. మనస్సుఐహిక విషయములగూర్చివిచారించునప్పుడుఅది లింగ, గుహ్య, నాభి స్థానములందుండును .ఆస్థితిలో మనస్సునకుఊర్ధ్వదృష్టియుండదు. కామినీకాంచనములపై వాంఛలతోనిండియుండును.

నాలుగవస్థానము హృదయము. మనస్సు ఈస్థానముచేరునప్పుడు ఆత్మప్రబోధము ప్రధమమున కలుగును. సాధకునకు ఒకవిధమైన తేజము ఎల్లెడలకాన్పించును. భయాద్భుతములుతోచును. ఈదశయందు మనస్సు ప్రాపంచికవిషయములకై అధోదృష్టిపూనదు.

కంఠము అయిదవస్థానము. మనస్సు ఈస్థానముచేరునప్పుడు అజ్ఞానము లేక అవిద్యఅంతయు నశించును. అప్పుడు భగవంతునిగూర్చి తప్ప యితరవిషయముల ప్రశంసవిన నిష్టముండదు. భగవంతునితప్ప ఇతరవిషయముల ప్రస్తాపము వచ్చెనేని సాధకుడాస్థలమును విడిచి వెడలిపోవును.

ఆరవస్థానము నొసలు ( భ్రూమధ్యము). మనస్సు ఈచక్రము జేరినప్పుడు రేయింబవళ్లు భగవద్విభూతులు గాన్పించుచుండును. అప్పుడును "అహం" నేను జ్ఞప్తికొంత యుండును. ఇచ్చట అసాధారణ దివ్యమహిమను చూచు నాతడు ఆనందపరవశుడై దానిం జేరవలయుననిఉత్సాహము పడును; కాని చేరలేడు. అది జ్యోతియొక్క తేజమును బోలియుండును. తాకుటకు వీలగునటుల కాన్పించును, గాని అద్దము అడ్డమై తాకనీయునట్లుండును. శిరస్సు ఏడవస్థానము. మనస్సు అక్కడచేరినప్పుడు నరునికి సమాధికలుగును. జ్ఞానియై బ్రహ్మమును గాంచును. ఆదశయందు శరీరము చాలాకాలము నిలువదు. స్మృతియుండదు. ఏమియు తినజాలడు; నోటపాలుపోసినను అది వెలుపలికి జారిపోవును. ఈస్థితిలో నరుడు ఇరువదిఒక్క దినముండి మరణించును.

854. సమాధిని పొందిన యనంతరము సర్వకర్మలును తొలగిపోవును. బాహ్యపూజలు, జపములు మొదలగు భౌతిక కార్యములు సాగవు.

ప్రారంభమున కర్మాడంబరము విశేషముగ నుండును. ఒకడు భగవసాన్నిధ్యమును చేరుకొలదిని ఆడంబరము తగ్గుచువచ్చును. తుదకు ప్రార్థనలు భగవన్నామస్మరణయు నిలిచిపోవును.

( బ్రహ్మసమాజ ప్రముఖుడగు శివనాధశాస్త్రిగారితో నిట్లనిరి:-) మీరు సభాస్థానమునకు చేరునంతవరకు మీపేరు ప్రఖ్యాతుల గూర్చియు గుణగణముల గూర్చియు ప్రేక్షకులు చెప్పుకొనుచుందురు. మీరు రాగానే ఆప్రసంగములన్నియు ఆగిపోగలవు. ప్రతివాడును మిమ్మును చూచుటతోడనే ఆనందించును. "అడుగో శివనాధబాబు వచ్చుచున్నాడని మాత్రము పలుకుదురు. - తదితర ముచ్చటలన్నియు కట్టుపడును.

855. భగవదనుగ్రహములేనిది, నీవెంతగా ప్రయత్నముచేసినను నీకు సాక్షాత్కారము దొఱకదు. కాని భగవదను సులభముగ వచ్చునదికాదు. నీహృదయమునుండి పూర్తిగా అహంకారమును తొలగించు కొనవలయును. "నేను కర్తను" అనుపాటి అహంకారమున్నను నీకు బ్రహ్మ సాక్షాత్కారము లభించదు. భాండాగారమున (వస్తువులుంచు గదియందు) ఎవరేని ఉన్నయెడల, ఇంటి యజమానుని ఆభాండాగారమునుండి ఏమితెచ్చిపెట్టుమని అడిగినను, "భాండాగారములో ఎవరో ఉన్నట్లున్నారు; చూడుడు. అతనిని తెచ్చియిమ్మని అడుగును. నేను అక్కడికి పోనగత్యములేదు" అనును. "నేను కర్తను" అని భావించువాని హృదయమునందు భగవంతుడు ప్రత్యక్షముకాడు.

856. భగవంతుడు తన కృపమూలమున ప్రత్యక్షమగును. ఆయన జ్ఞానసూర్యుడు. ఆయనకిరణ మొక్కటిమాత్రమే ఈప్రపంచమును తెలివితో నింపుచున్నది; దాని మూలమున మనము ఒకరినొకరు తెలిసికొనుచున్నాము. ఎన్నిరీతుల జ్ఞానమునో పొందుచున్నాము. ఆయన తన తేజమును, తనముఖముపైకి త్రిప్పుకొనినప్పుడుమాత్రమే మనము ఆయనను దర్శించగలము.

857. రక్షకభటుడు రాత్రివేళ దొంగలాంతరు చేతబట్టుకొని తిరుగుచుండును. అతనిని ఎవరును చూడలేరు. తనదీపము సాహాయ్యమున అతడు ఎల్లరను చూడగలడు; ఇతరులు కూడ దానిసహాయ్యమున ఒకరినొకరు చూచుకోగల్గుదురు. ఎవరైనను ఆభటునిచూడవలయుననిన వానితో "అయ్యా! దయచేసి నీలాంతరును నీముఖమువైపునకు త్రిప్పుకొనుము. నేను నిన్ను చూడగోరుచున్నాను." అని బ్రతిమాలవలసివచ్చును. ఇదేరీతిని నీవు భగవంతుని ప్రార్థించవలయును. "ఓదేవా! నీజ్ఞానజ్యోతిని నీపైకి త్రిప్పుకొనుము. నేను నిన్ను చూడ వాంఛించుచున్నాను." అని మనవిచేయవలయును.

858. ఇంటిలో దీపములేకపోవుట యింటివారి దారిద్ర్యమునకుగుర్తు. కాబట్టి నరుడు తన హృదయమునందు జ్ఞానదీపమును వెలిగించుకొనవలయును. "ఓమనసా! జ్ఞానదీపమును వెలిగించి" బ్రహ్మమాయిని, "కనుగొనవే!"

859. బూటకము సర్వత్రచెడుగే. అసత్యపువేషముకూడ చెడ్డదే. నీమనస్సు నీవేషమునకు తగినటుల యుండనియడల నీవుగొప్ప ఆపదలపాలగుదువు. ఈరీతిగనే నరుడు మోసగాడై దొంగపనులు చేయుటకును, అబద్ధములు పలుకుటకును జంకులేనివాడగును.

860. ఒకభక్తునిప్రశ్న:- దివ్యమాతకు "యోగమాయ" అను పేరేల వచ్చినది?

శ్రీపరమహంసులవారి ఉత్తరువు:- యోగమాయ అనగా ప్రకృతిపురుషుల సంయోగము. నీవుచూచునదెల్ల వాని రెంటిసంయోగము తప్ప యితరమేమియుకాదు. శివ కాళీవిగ్రహమును చూడలేదా? కాళి శివునిపై నిలిచియుండును. శివుడు శవమువలె పడియుండును; కాళి శివునిపై నిశ్చలముగ దృష్టినిలిపి వానిపైని నిలిచియుండును; ప్రకృతి పురుషుల సంయోగమే దీనికంతకును అర్థము. పురుషుడు అకర్త; కావున శివుడు శవమువలె కదలక పడియుండును. కాని వానితోడి సంయోగమహిమచేతనే ప్రకృతి సృష్టి, స్థితి లయములను చేయుచున్నది. రాధాకృష్ణవిగ్రహముయొక్క అర్థమును ఇదియే.

861. తల్లి తండ్రి, సోదరి సోదరుడు, భార్యాభర్త. బిడ్డలు, చుట్టాలు అను బంధుప్రేమయే "మాయ" సర్వజీవుల యెడలను సమమైప్రవహించు అనురాగమును "దయ" అందురు.

862. సత్యమందు తీవ్రభక్తికలవానికి భగవంతుడు ప్రత్యక్షమగును. ఇందుకు వ్యతిరేకముగా సత్యమునందు గౌరవములేక వర్తించునెడల వాని సర్వమును ఒక్కొకటే నాశమగును. సాక్షాత్కారదశను పొందినపిమ్మట నేను చేతులందు పూలు పట్టుకొని "ఓతల్లీ! ఈనీప్రకృతిజ్ఞానమును నీఅజ్ఞానమును, నీపుణ్యమును నీపాపమును, నీశుభమును నీఅశుభమును, నీధర్మమును నీఅధర్మమును, అన్నిటిని నీవేతీసికొనుము. దివ్యమాతా! వినిర్మలభక్తినిమాత్రము నా కొసగుము" అనిప్రార్థించితిని. అయినను నేనిట్లు ఆతల్లితో పలికినప్పుడు "నీసత్తును నీఅసత్తును తీసికొనుము" అనజాల నైతిని. ఆజగన్మాతకు నేను అన్నిటిని తిరిగి ఒసగితిని, కాని "సత్యము"ను విడువజాలనైతిని.

863. బ్రహ్మసాక్షాత్కారమునకు చిహ్నములలో నొకటిగ "మహావాయువు" అను మహచ్ఛక్తి ప్రబోధముగాంచి చంగున శిరస్సునకెగురును. అప్పుడు సమాధిలో పడుదుము. అంతట పరోక్షానుభూతి కల్గును. 864. ప్రశ్న:- భగవంతుడే ఈజీవులుగా ఉన్నయెడల ఇక పాపములేదు; పుణ్యమును లేదుగదా?

ఉ:- అవును; ఉన్నది, మఱియు లేదుకూడను. ఆయన మనలోని అహంకారమును నిలిపినప్పుడు, ద్వైతభావమును, పుణ్యపాపముల విచక్షతయు నిలుపును. ఒక్కొకప్పుడు కొందఱిలోని అహంకారమును బొత్తుగతొలగించును; అట్టివారు పుణ్యపాపములకు అతీతులు. నరుడు బ్రహ్మసాక్షాత్కారమును పడయునంతవఱకు ద్వైతదృష్టియు శుభాశుభ భేదములును ఉండితీరును. ధర్మాధర్మములు రెండును నీకు సమములే యనియు భగవంతుడేమిచేయించిన దానినే చేయువాడ ననియు నీవు నోటిమాటలతో అనవచ్చును. కాని నీ హృదయములో అవన్నియు వట్టిపలుకులే యని తెలియుచుందువు. నీవేదేని చెడుపనిచేయగానె నీ అంతరాత్మ బాధించుచునే యుండును,

865. నీవు ప్రజలతో కలిసి యుండబోవునప్పుడు వారందఱి యెడలను నీకు ప్రేమ యుండవలయును. వారితో స్వేచ్ఛగా కలిసి యేకమైపొమ్ము. "ఓ! వారు సాకారమును నమ్ముదురు; నిరాకారమును నమ్మరు అనియో, వారు నిరాకారమును నమ్మెదరు సాకారమునందు విశ్వాసము చూపరు అనియో, అతడు హిందువు, ఇతడు క్రైస్తవుడు, వేఱొకడు మహమ్మదీయుడు అనియో పలుకుచు, మూతి విఱిచి వారిని ద్వేషించ బోకుము. భగవంతుడు తననుగూర్చి ఎంతవఱకు తెలిసికొను అవకాశమునిచ్చునో అంతవఱకే నరుడు ఆయనను తెలిసికొనగలడు. మఱియు మానవులు వేర్వేఱు స్వభావములుగలవారై యుండుటనెఱిగి, వారితో నీకు సాధ్యమగునంతవఱకే కలియవలయును. నీవు మాత్రము అందఱిని ప్రేమించవలసినదే.

అంతట నీవింటికి (నీఅంతరాత్మలోనికి) మరలిపోయి శాంత్యానందముల ననుభవించుము. అక్కడ నీవు నీసత్యాత్మను కనుగొనగలవు.

866. అపరోక్షానుభూతిని పడయుటకు గట్టిప్రయత్నము అవసరము. ఒకనాడు నేను భావసమాధిలో నుండగా నాకు హలధరసరస్సు కాన్పించినది. (ఇదిశ్రీరామకృష్ణపరమహంసులవారి జన్మగ్రామమగు కర్మకారపురమున వారిపూర్వీకులు వసించినయింటిఎదుట నున్నది.) ఒక మోటుమానిసి నాచుమొక్కలను తీసివేసి నీటిని ముంచుకొనుచున్నటులను అప్పుడప్పుడు దానిని చేతిలోనికిదీసికొని పరీక్షించుచున్నటులను కన్పించినది. నాచును తొలగించినిది నీరుకనబడదు - కష్టపడి సాధనచేయనిది భక్తి అలవడదు, బ్రహ్మసాక్షాత్కారము లభించదు - అనినాకునేర్పుటకో యనునటుల నాకాదృశ్యము చూపబడినది. ధ్యానముసలుపుట, భగవన్నామస్మరణ చేయుచు తులసీమాల త్రిప్పుట, హరిమహిమలపాడుట, ప్రార్ధనలుచేయుట, దానములొసగుట, యజ్ఞములుచేయుట మొదలగు సత్కార్యములు భగవంతుని ప్రసన్నునిచేయును.

867. "ఈయీకర్మలుచేయవలయునని శాస్త్రములువిధించుచున్నవి. కావున నేను చేయుచున్నాను" - అనునట్టిభావము "వైదీభక్తి" అనిపించుకొనును. "రాగభక్తి" అను నింకొక విధభక్తికలదు. భగవంతునియెడగాఢప్రేమయున్నవారికి కలుగును. ప్రహ్లాదుని భక్తి అటువంటిది. "రాగభక్తి" అలవడిన పిమ్మట "వైధీకర్మ" అనగా శాస్త్రనియమిత కర్మలుచేయు నవసరములేదు.

868. నరునికి సత్యజ్ఞానప్రాప్తియైన పిమ్మట వానికి భగవంతుడు ఏదోదూరపువస్తువుగ గోచరించడు. అప్పుడు "ఆయన" గా కాక "ఈయన" గా ఇచ్చట మనహృదయములోపల ఉన్నవాడుగ భగవంతుడు దాపైతోచును. ఆయన అందఱిలోనున్నాడు. ఆయనను వెదకువారికెల్ల అక్కడ దర్శనమిచ్చును.

869. ప్ర:- గృహస్థజీవనముగడుపుచుండగను జ్ఞానప్రాప్తియైనయెడల, ఎటులగ్రహించవచ్చును?

ఉ:- హరినామము చెవినిబడగనే వెల్లివిరియు బాష్పములు గగుర్పాటును చిహ్నములు, స్వామిపేరు వినినంతనే కండ్లనుండి నీరుప్రవహించెనా, రోమము నిక్కబొడుచుకొనెనా, అట్టివాడు నిజముగా జ్ఞానియైనట్లే!

870. భగవంతునియెడ విశ్వాసములేని కారణముననే నరుడు దుఃఖముల ననుభవించును.

871. వేదాంతమునకు శంకరాచార్యులవారు చేసిన అర్థము సత్యమైనదే. దానింగూర్చి రామానుజా చార్యులవారు చెప్పునదియు - వారివిశిష్టాద్వైతమును - సత్యమే!

872. నరునందలి అంతరాత్మప్రబోధము గాంచినగాని వానికి బ్రహ్మసాక్షాత్కారముకాదు. 873. తర్కము ద్వారమునగలుగు జ్ఞానము ఒకరకము; ధ్యానమువలనగలుగు జ్ఞానము వేఱొకరకము; మఱియు భగవత్ప్రసన్నముచేగలుగు జ్ఞానము మఱొకరకము అని నేను గ్రహించినాను.

874. మనుజునందు శుద్ధసత్వము ప్రధానముగ నున్నప్పుడు అతడు కేవలము భగవధ్యానమున కాలము గడుపును; ఏయితర వ్యాపారమునందును వానికి హితవుండదు. ప్రారబ్ధవశమున కొందఱు ఇట్టి శుద్ధసత్వగుణముగలవారై పుట్టుదురు. కాని నిష్కామకర్మలను పూనికతోచేయుచుండిన యెడలను శుద్ధసత్వగుణము అలవడగలదు. రజోగుణముతో మిశ్రమైన సత్వగుణముగలవాని మనస్సు నెమ్మదిగా వేర్వేఱుదిశలకు లాగబడును; "నేను ప్రపంచమునకు మేలుకూర్తును" అను అహంభావమును తెచ్చిపెట్టును. సామాన్యజీవులు లోకోపకారమునకు పూనుట చాల అపాయకరము. కాని కేవలము ఇతరుల క్షేమమునిమిత్తము, అపేక్ష యేమియులేకుండ పనిచేయునెడల అపాయముండదు. "నిష్కామకర్మ" అనగా నిటువంటిదే. అటువంటికార్యములను చేయుట వాంఛనీయమే. కాని అందఱునుచేయలేరు! చాలకష్టము!

875. అందఱును కర్మచేయవలసియే యుండును - కొలదిమంది మాత్రమే కర్మత్యాగము చేయనగును. అందుకు తగిన శుద్ధసత్వగుణము కొలదిమందియందే యుండును. స్వలాభాపేక్షలేకుండ కర్మ చేయగా చేయగా, రజస్సుతో కలిసిన సత్వగుణము, ఆరజోగుణాంశమునుండి విడివడి శుద్ధసత్వముగా తుదిని మారును. ఇటుల శుద్ధసత్వగుణమును పడయుటచేత నరుడు బ్రహ్మసాక్షాత్కారమును పొందగల్గును. సామాన్యజనులకు శుద్ధసత్వమయదశ అనగా అర్థముకాదు.

876. పంచభూతములతో ఏర్పడిన ఈశరీరమును "స్థూలశరీరము" అందురు. సూక్ష్మశరీరము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములతో కూడి ఏర్పడును. బ్రహ్మ దర్శనానందమును గ్రహించి బ్రహ్మైక్యానందమునందే నిలుచుట కనువగు శరీరము కారణశరీరము. తంత్రశాస్త్రమున దీనిని "భగవతీతనువం"దురు. ఈ అన్నింటికిని అతీతముగా నుండునది "మహాకారణము" - అది మూలకారణము.

877. భగవత్సాక్షాత్కారము కానిది "ప్రేమ" లభించదు.

878. బ్రహ్మసాక్షాత్కారమయిన చిహ్నములు కలవు. భక్త్యావేశము మీ కెవరియందు కాన్పించునో వారు బ్రహ్మపరోక్షానుభూతిని బడయుటలో ఆలస్యముండదని గ్రహించుడు.

879. భక్త్యావేశము వివేకరూపమునను, వైరాగ్యరూపమునను, సర్వభూతదయ, సాధుజనసేవ, భాగవతసంగము, హరినామకీర్తనము, సత్యసంధత, మొదలగు సద్గుణపూజ రూపమునను ప్రకాశించును. 880. ప్రశ్న:- భగవాన్, సదసద్విచారముచేత, మున్ముందు ఇంద్రియ సంయమనమును సాధించుట అవసరమగునా?

ఉ:- మంచిది, అది యింకొక మార్గమే - సదసద్విచారపంథా! భక్తిమార్గమున యింద్రియనిగ్రహము దానంతనదియే వచ్చును. అతిసులభముగ వచ్చును. భగవంతునియెడ అనురక్తి హెచ్చినకొలదిని ఇంద్రియభోగములందు అరుచియేర్పడును. బిడ్డచచ్చినదినమున తలిదండ్రులు భోగముల చింతపెట్టుకొనరుగదా!

881. భగవద్భక్తిని ఒకకవి పెద్దపులికి పోల్చినాడు. పెద్దపులి మృగములను దిగమ్రింగులాగున భక్తి నరునిశత్రువర్గమగు కామక్రోధాధి వ్యసనములను మ్రింగివేయును. ఒక్కసారి భగవద్భక్తి పూర్ణప్రబోధమునుపొందెనా, కామము క్రోధము, మున్నగు దుర్వ్యసనములన్నియు నిర్మూలములగును. శ్రీకృష్ణ భక్తిమూలమున బృందావనగోపికలకు అటువంటిదశ ప్రాప్తించినది.

882. భక్తిని అంజనమునకును పోల్తురు. రాధ ఒకతడవ "ఒహో సఖులారా! నాకు సర్వత్ర శ్రీకృష్ణుడే కాన్పించు చున్నడు!" అనగా తక్కినగోపికలు "నీకండ్లకు ప్రేమాంజనమును పెట్టుకొన్నావు; అందుమూలమున నీకట్టుకాన్పించుచుండును!" అనిరి.

883. సిద్ధులలో రెండురీతులవారు కలరు; సాధనసిద్ధులు, కృపాసిద్ధులు. మంచిపంటపండించు కొఱకై కొందఱు అతి కష్టముతో కాలువను త్రవ్వి తమ పొలములకు నీరుపెట్టుకొనవలసియుండును. నీటికొఱకై కొందఱిట్టి శ్రమనేమియు పొందనవసరములేకపోవును. వానలువచ్చి పొలములనిండ నీరునింపును. అందఱును శ్రమలుపడి సాధనలుచేసి మాయ తగిలించు సంకెళులను తప్పించుకొనవలసి యుండును. కాని కృపాసిద్ధులకీశ్రమలన్నియు నుండవు. (వారికి భగవత్కృప వలననే సిద్ధత్వము చేకూరును.) వీరి సంఖ్య అత్యల్పము!

884. గోపికలభక్తి "ప్రేమభక్తి!" ఈభక్తిని "కేవలభక్తి" అనియు "తీవ్రభక్తి" అనియుకూడ పిలుతురు. "మిశ్రభక్తి" అన నేమొ తెలియునా? భక్తితో జ్ఞానముకలిసిన యెడల దానిని మిశ్రభక్తిఅందురు. "శ్రీకృష్ణుడు సర్వమయుడు. అతడే పరబ్రహ్మము. అతడే రాముడు. అతడే శివుడు. అతడే మహాశక్తి!" అను భావనను పోలియుండును. కాని అటువంటి జ్ఞానమేమియు ప్రేమభక్తిలో మిశ్రమై యుండదు. హనుమంతుడు ద్వారకకువచ్చి తాను సీతారాములను మాత్రమే చూడనిచ్చగింతుననెను. అందువలన శ్రీకృష్ణస్వామి రుక్మిణిని సీతరూపు ధరించుమనినాడు. లేకున్న హనుమానుని సమాధానపఱచు మార్గములేదు. పాండవులు రాజసూయయాగమునుసలిపినప్పుడు, యుధిష్ఠిరుడు సింహాపీఠమున కూర్చుండ రాజులందఱును వానికి నమస్కరించిరి. ఆసమయమున విభీషణుడు తాను శ్రీకృష్ణునకుతప్ప మరెవరికిని నమస్కరించనని పట్టుపట్టెను. అప్పుడు శ్రీకృష్ణుడే యుధిష్ఠిరునికి నమస్కారము చేసెను; ఆపిమ్మట విభీషణు డును నేలపై సాగిలబడి తనకిరీటము నేలమోపి యుధిష్ఠిరునకు మ్రొక్కినాడు.

885. ప్రేమభక్తిలో రెండు ముఖ్యాంశములున్నవి. - "నేను" "నాది" అనుభావములు ("నేను" భక్తుడను; భగవంతుడు "నావాడు" అనుభావములు)

యశోద తానుతప్ప మరెవరును తన గోపాలుని శ్రద్ధగాచూడరని భావించేది; తాను పోషణ చేయనియెడల గోపాలుడు చిక్కిపోవును అనుకొనెడిది. తనకృష్ణుని భగవద్భావముతో చూచుట ఆమెకు హితవుకాదయ్యెను. భక్తుని "మమకారము" (నాదనుభావము) "భగవంతుడు నావాడు, నాస్వంతము - నా గోపాలుడు!" అనుభావమును కల్పించును. ఉద్ధవుడు యశోదను చూచి, "తల్లీ! నా కృష్ణుడు శ్రీహరిస్వామియే. ఆతడు విశ్వమునకు చింతామణి! అతడు మనుజమాత్రుడుకాడు." అనిపలికెను. ఆపలుకలువినిన యశోద "కాదు, కాదు" అటులకాదు. నేను చింతామణినిగూర్చి అడుగుటలేదు. 'నా' గోపాలుడెటులున్నడో చెప్పుము. చింతామణి పోనీ! నాగోపాలుడు!" అనెను.

866. గోపికల నిష్ఠ అద్భుతమైనది. కృష్ణుడు మధురలో నుండగా, ద్వారపాలకులను బ్రతిమాలుకొని, సభామందిరము చేరిరి. అచ్చట శ్రీకృష్ణుడు రాజవేషముతో కిరీటమునుధరించియుండగాకాంచి, నేలచూపులుచూచుచు, "ఈకిరీటధారి యెవడు? మనము వీనితోమాటాడ తగదు. అటులచేయుట మనకృష్ణునియెడ అపచారముచేసినట్లగును. అయ్యో! మనస్వామిఎక్కడ? పీతాంబరముకట్టి, నెమలిపింఛమునుధరించు మనపరమప్రియుడేడీ?" అని తమలో తాము గొణుగసాగిరి. ఆహా! ఈగోపికల అనన్యభక్తి ఎట్టిదో.

887. ఎటువంటివానికి విశ్వాసముకుదురునో ఎటువంటి వానికికుదరదో సూచించు శరీరచిహ్నములున్నవి. ఎముకలు కనబడునటుల బక్కిచిక్కి, గుంటలుపడిన కండ్లతో, మెల్ల చూపులుగల మనుజులవంటివారికి సులభముగ విశ్వాసము కుదురదు.

888. లౌకికవ్యవహారములు చక్క బెట్టునప్పుడు మనోశక్తి చాలవ్యర్థమైపోవును. సన్యాసమును స్వీకరించినగాని ఆనష్టమును పూరించ శక్యముకాదు.

889. తండ్రినుండి ప్రధమ జననము కలుగును. రెండవ జననము ఉపనయనకాలమున ప్రారంభమగును. సన్యాసము మూడవజననము.

890. జ్ఞాని "శివోహం; నేనుపరమాత్మను" అనును. కాని భక్తుడు "ఓహో! ఈసర్వమును ఆయన విభూతియే సుడీ!" అనును.

891. నీసాధనామార్గమేదైనను సరియే, మనస్సు సంపూర్ణముగ నిశ్చలతను పొందినగాని యోగము లభ్యముకాదు; ఇది మహారహస్యము. మనస్సు సదాయోగికి వశమైయుండు; యోగి మనస్సునకు వశుడుకాడు. 892. మనస్సు రెపరెప కొట్టుకొనుట పూర్తిగమానినప్పుడు శ్వాసనిలిచిపోయి కుంభకముఘటిల్లును. కుంభకము భక్తియోగముద్వారమునను ఘటిల్లును. తీవ్రభక్తిచేతను శ్వాసనిలివిపోవును.

893. నరేంద్రుని ప్రశ్న:- "తంత్రశాస్త్రమున బోధింపబడునటుల స్త్రీలమధ్యనుండిసాగింపబడు ఆత్మసాధనా పద్ధతిని గురించి మీ అభిప్రాయమును సెలవిండు."

శ్రీపరమహంసులవారి ఉత్తరువు:- "వద్దు, అని నిరపాయమైనమార్గములుకావు; చాల దుర్లభమైనవి; అవాంతరములు కల్పించునవి. తంత్రశాస్త్రానుసారము మూడువిధములగు సాధనలుకలవు. వీరుని సాధన, సఖీసాధన, పుత్రభావసాధన. నాది పుత్రభావన. భగవంతునికి మాతృరూపము నారోపించునది. జగజ్జనని ప్రియసఖురాలుగ భావించుకొని సాధనయు మంచిదే. కాని వీరుని సాధన (వీరాచారము) అపాయములతో గూడినది. తనను దివ్యమాత పుత్రునిగా భావనచేసికొనుసాధన చాలనిర్మలమైనది."

894. ఒకభక్తుని ప్రశ్న:- (ఆధ్యాత్మసాధనలకు పూను భర్తనుగురించి) నీవు నన్ను ఉచితవిధిని చూడకున్నచో నేను ఆత్మహత్యచేసికొందును అని భార్యబెదరించినయెడల అతడేమిచేయవలసి యుండును?

శ్రీపరమహంసులవారు :- "అటువంటిభార్యను విడిచివేయవలయును. భగవత్సాక్షాత్కారమునకు అడ్డుపడు పెండ్లమును విడువవలసినదే; ఆమె ఆత్మహత్యచేసికొననీ లేక ఏమైనకానీ. భగవంతుని చేరకుండ అడ్డుపడుభార్య అవిధ్యారూపిణి! కాని రాజు దుష్టుడు, భార్యమొదలగువారందఱును భగవంతునియెడ నిర్మలభక్తికలవానికి వశులగుదురు. ఒకనికి సత్యమగు భక్తియున్నయెడల భార్యయు క్రమక్రమముగాదైవమార్గమున తిరుగగలదు. అతడు యోగ్యుడగునేని, భగవత్కృపవలన, భార్యయు యోగ్యురాలగును.

895. బ్రహ్మసాక్షాత్కారము పొందినపిమ్మట భగవంతుడు సర్వత్ర సర్వమునందును ప్రత్యక్షముగ నుండును. కాని భగవత్ప్రసన్నత నరునందు శ్రేష్ఠముగ నుండును; మఱియు సత్వగుణప్రధానులగు భక్తులందు అత్యంత శ్రేష్ఠముగ నుండును. కామినీకాంచనములయెడ వ్యసనము ఉత్తమ భక్తులకుండదు.

896. భక్తునిప్రశ్న:- "స్వామీ! నాకొక సందేహ మున్నది. మనకు స్వేచ్ఛకలదందురు; అనగా ధర్మముగాని అధర్మముగాని మన యిష్టమువచ్చినటుల చేయగలమందురు. అది సత్యమా? మనయిచ్ఛకు స్వాతంత్ర్యము కలదా?"

శ్రీపరమహంసులవారు:- "సర్వమును భగవంతుని సంకల్పము ననుసరించి నడుచును! ఇదంతయు వానిలీల! ఆతడు మనచేత అనేకవిధముల అనేకకార్యములను - మంచివి చెడ్డవి, కొద్దివి గొప్పవి, క్షుద్రమైనవిఘనమైనవి - చేయించుచుండును. యోగ్యులు అయోగ్యులు ఎల్లరు వాని మాయయే - వాని లీల. ఉదాహరణకు చూడుడు. తోట లోని చెట్లన్నియు ఎత్తులోను, యోగ్యతలోను, సౌందర్యములోను సమానములు కావు.

"బ్రహ్మసాక్షాత్కారము కానంతవఱకును నరుడు తాను స్వతంత్రుడ ననుకొనుచుండును. కాని భగవంతుడే యీభ్రాంతినివానియందు నిలుపువాడు. లేనియెడలపాపకార్యములసంఖ్య చాలగా హెచ్చిపోవును. ప్రజలు పాపపు పనుల చేయుటకు జంకక, దోషకార్యములకు శిక్ష అనుభవించ వలయునను బాధ్యతలేక విచ్చలవిడి వర్తింతురు."

"సరే! బ్రహ్మసాక్షాత్కారము పడసినవాని భావన యెట్లుండునో తెలియునా? - "నేనుయంత్రమను, నీవుయంత్రచోదకుడవు; నేనుగృహమను, నీవు గృహాధిపతివి; నేను రధమను. నీవు రధికుడవు. నీవు కదలించుతీరున నేను కదులుదును. నీవు పలికించినరీతిని నేను పలుకుదును." ఇట్లుండును!

897. శ్రీచైతన్యస్వామికి మూడురకముల దశలుండెడివి. (1) మనస్సు స్థూలసూక్ష్మశరీరములందు వసించునప్పుడు జాగ్రదవస్థ. (2) మనస్సు కారణశరీరమున ప్రవేశించి "కారణానందమును" అనుభవించునప్పుడు అర్థజాగరము. (3) మహాకారణమున పూర్తిగమనస్సు లయమగునప్పుడు అంతర్ముఖమై యుండు తురీయము.

ఈవర్ణనకును వేదాంతుల పంచకోశములకును పోలికయున్నది. (1) స్థూలశరీరము - అన్నమయకోశము. ప్రాణమయకోశమును. (2) సూక్ష్మశరీరము - మనోమయ విజ్ఞానమయకోశములు. (3) కారణశరీరము - ఆనందమయకోశము. మహాకారణము ఈపంచకోశములకు అతీతముగ నుండును. మనస్సు మహాకారణమున ప్రవేశించునప్పుడు చైతన్యస్వామికి సమాధిదశ ప్రాప్తించెడిది. దీనిని నిర్వికల్పసమాధి లేక జడ సమాధి అందురు."

898. ప్రారబ్థ సంస్కారములుండుటవలన నరుడు సంసారత్యాగముచేయవలయునన్నను చేయలేడు. ఒకసారి యోగి యొకడు రాజును తన దాపున కూర్చిండి భగవధ్యానము చేయుమనెను. అందుకారాజు "అయ్యా! అదిపొసగదు. నేను నీసామీప్యమున నుండవచ్చును; అయినను నాకు భోగమున్నది గదా! నేను ఈఅడవిలోనే ఉండిపోయినయెడల బహుశః ఇచ్చటనే ఒకరాజ్యమేర్పడ గలదు. నేను నాభోగమును అనుభవించక తీరదుగదా!" అనెను.

899. "అనాహత" ధ్వని దానంతట నదియే శబ్దించుచుండును. ఇది "ఓం" అను ప్రణవనాదము. ఇది పరమాత్మ నుండి కలుగును; యోగులు దీని వినగలరు. సామాన్య లౌకికులు దీనిని వినజాలరు. ఈనాదము ఒకపక్షమున నాభిస్థానము నుండియు, రెండవ పక్షమున పరబ్రహ్మమునుండియు పుట్టునటుల యోగులకు తెలియవచ్చును.

900. పురాణముల ప్రకారము భక్తుడును భగవంతుడును వేఱు. నేనొక వ్యక్తిని భగవంతుడు వేఱొకవ్యక్తి. ఈశరీరము ఒక ఘటమువంటిది; మనస్సు బుద్ధి అహంకారము ఆకుండలోని నీటిని బోలునవి. బ్రహ్మము సూర్యుడు. ఆసూర్యుడు ఈనీటిలో ప్రతిబింబించుచున్నాడు. ఈరీతిగా భక్తులు ఆయా దేవతామూర్తులను చూచుచుందురు.

901. కాని వేదాంతము ప్రకారము బ్రహ్మము మాత్రమే సత్యము - మూలాధార వస్తువు; తదితరమంతయు మాయ - స్వప్నమువలె అసత్యము. బ్రహ్మమను సాగరమున తేలుచు "అహం" అను పుడకయున్నది. ఈపుడకను తీసివేసినయెడల అఖండమై ఒక్కనీరే వ్యాపించియుండును; ఆపుడక ఉన్నంతవఱకును దానిచేత రెండు భాగములుగా విభజింపబడినటుల కాన్పించుచు దానికి రెండువైపులను నీరుండును. బ్రహ్మజ్ఞానము కలుగగానె నరుడు సమాధి అవస్థను చెందును. "అహం" అనునది అదృశ్యమైపోవును. వేదాంత మతానుసారము జాగ్రత్తు సయితము అసత్యమే.

902. తల్లియు తండ్రియు నరునికి ప్రధానులు. వారు సంతుష్టులైనగాని ఏపూజలును ఫలించవు. చైతన్యస్వామి చరిత్ర చూడుడు. భగవద్భక్తి పరవశుడయ్యును, తాను సన్యాసమును స్వీకరించుటకు పూర్వము తల్లిని సమాధానపఱచవలసినవాడయ్యెను. "తల్లీ! దుఃఖపడకుము; అప్పుడప్పుడువచ్చి నిన్ను దర్శించుచుందును." అని చెప్పినాడు. నరుడు తీర్చవలసిన ఋణములున్నవి:- దేవతల ఋణము; ఋషులఋణము; జనకులఋణము; భార్యఋణము - ఎన్నో యున్నవి. తల్లిదండ్రులఋణమును తీర్చనియెడల ఏకర్మయు ఫలప్రదము కాజాలదు. భార్యయెడకూడ ఋణముండును. 903. కొందఱు, కొందఱితో మెలగునప్పుడు మనము జాగ్రత్తతో మెలగవలయును. (1) ధనికులు, వారికి ధనబలము, మనుష్యబలము, మఱియు ఇతరవిధబలము కలదు. వారుతలచుకొనిరేని నీకు అపకారము చేయగలరు. నీవువారితో జాగరూకుడవై మెలగవలయును. - వారుచెప్పుదానికెల్ల తలయూచి సరే అనవలసియురావచ్చును. (2) కుక్క. అది మొఱగినప్పుడును కఱవవచ్చినప్పుడును, ఆగిఈలవేసి దానిని శాంతిపఱచవలెను. (3) ఆబోతు. అది నిన్ను పొడవవచ్చినప్పుడు కొన్నిశబ్దముల చేసి దానిని శాంతిపఱచవలెను. (4) త్రాగుబోతు. వానిని రెచ్చకొట్టితివా అతడు నానానీచ బాషణములతో నిన్ను బూతులుతిట్టును. కాని "మామా! ఓహో! ఎట్లాఉన్నావు?" అనుచు వానిని బుజ్జగించిన యెడల వా డానందించును. నీదగ్గఱచేరి పొగద్రాగుచుస్నేహముచూపును.

904. కొందఱుపామునైజముకలవారుందురు. వారెప్పుడు కాటువేయునది నీకు తెలియదు. వారివిషమునకు విరుగుడుకనుక్కొనుటకు చాల శ్రమపడవలసియుండును. లేదా వారిమీద నీకు ఆగ్రహముపుట్టి నిను క్రోధావేశుని చేయును.

905. ఎవడు ఎటువంటి సహావాసగాండ్రతో తిరుగునో అటువంటిగుణములు వానికి అబ్బును. మఱియు ఎవనికెటువంటి గుణములుండునో అటువంటిసహవాసమునే అతడు కోరుకొనును.

906. "స్త్రీలమధ్య వసించుచును, వారిని ఎఱుగనట్టి జనుడు నిజముగ వీరుడు." 907. ఒకపండితుడు:- దివ్యజ్ఞానసమాజమువారు మహాత్ములున్నారందురు. గంధర్వలోకము దేవయానలోకము సూర్యలోకము చంద్రలోకము అనుచు ఏమేమో లోకములున్నవనియు, నరుని లింగశరీరము వీనిలో సంచారముచేయగలదనియు అందురు. ఇట్టివిషయములు అనేకము వారు చెప్పుదురు. స్వామీ! ఈదివ్యజ్ఞానమునుగూర్చి మీ అభిప్రాయమేమి?

శ్రీపరమహంసులవారు:- భక్తియొక్కటి శ్రేష్ఠమైనది - భగవంతునియెడ అనురాగము. వారు భక్తిని ఆదరింతురా? ఆదరింతురేని మంచిదే. బ్రహ్మసాక్షాత్కారము తమ పరమార్ధముగ పెట్టుకొనిరా మంచిదే. కాని సూర్యలోకము, చంద్రలోకము, గంధర్వలోకము అను నిట్టి అల్పవిషయములందు మునిగియుండుట సత్యమగు బ్రహ్మసాధన కాదని మాత్రము జ్ఞప్తినుంచుకొనుడు. భగవత్పాదార విందముల యెడ భక్తికొఱకై తీవ్రసాధనలు చేయవలయును; హృదయము ఆవేదనపడునట్లు గావించవలయును! ఆయావిషయములందు పర్విడు మనస్సును మరల్చి భగవంతునిమీదికే త్రిప్పవలయును. భగవంతుడు వేదములలో లేడు. వేదాంతమునందులేడు. ఏశాస్త్రమునందును కానరాడు! నరుని హృదయము వానికొఱకై మహాపరితాపమును పొందినగాని ఏమియు ఫలము రాబోదు. సాంద్రభక్తితో దైవప్రార్థనలు చేయుచు, పారమార్థిక సాధనలను చేయవలయును. భగవంతుడు సులభముగా చిక్కువాడుకాడు. సాధనాత్యవసరము. 908. "నేతి, నేతి!" అనుచు విశ్వమును దాటిపోయి, ఆత్మపరోక్షానుభూతిని పొందుటేజ్ఞానము. విచారముచేయుచు పోయి దృశ్యజగమును బుద్ధినుండి తొలగించుటచేత సమాధి లభించును; పిమ్మట ఆత్మ సాక్షాత్కారము కలుగును.

"విజ్ఞానము" అనగా హెచ్చువివేకముతోడను పూర్ణతతోడను ఎఱుగుట అని అర్థము. కొందఱు పాలనుగూర్చి వినియుందురు; కొందఱు పాలను చూచియుందురు. మఱికొందఱు పాలను రుచిచూచియుందురు. దానిని చూచినవాడు జ్ఞాని. దానిని రుచిచూచినయతడు విజ్ఞాని అనబడును; అతడే దానిని పూర్ణముగ నెఱింగినవాడు. భగవంతునిచూచి, కేవలము మన బంధువువలె వానితోడ సంసర్గము కలిగి యుండుటకు విజ్ఞానమనిపేరు.

909. మొదట "నేతి, నేతి" (ఇదికాదు, ఇదికాదు) అను మార్గమున అవలంబించవలయును. ఈపంచభూతాత్మక శరీరము బ్రహ్మముకాదు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధియు బ్రహ్మముకాదు; అహంకారమును బ్రహ్మముకాదు. బ్రహ్మము సకలతత్వములకును అతీతము. నీవు మేడచేరుటకు ఒకటొకటిగా మెట్లనన్నిటిని విడిచివేయవలయును. మెట్లెన్నటికిని మేడకాజాలవు. కాని నీవు మేడచేరినపిమ్మట, ఏయిటుకలు, సున్నము సిమెంటు ఇసుక మున్నగు పదార్థములతో మేడ ఏర్పడినదో, ఆపదార్థములతోడనే మెట్లును నిర్మాణమైయున్నవని గ్రహింతువు. బ్రహ్మముగా తెలియబడునదే జీవజగత్తులు నైనది - ఈ యిరువదినాలుగు తత్వముల రూపమును తాల్చి నది అదియే. ఆత్మ అనబడునదియే పంచభూతములుగ మారినది. ఈభూమి ఆత్మయైనచో, ఇంత గట్టిగానుండుటేలనని నీవు ప్రశ్నించబోదువు. కాని భగవంతుని యిచ్ఛకు ప్రతిదియు సాధ్యమే. రక్తము వీర్యము కూడి మాంసము శల్యమును ఏర్పడుటలేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిపడుటలేదు!

910. భగవత్సాక్షాత్కారము లభించినపిమ్మట జగత్తు మిధ్యగాకాన్పించును. బ్రహ్మమునుచేరిన యతడు, ఆబ్రహ్మమే ఈసర్వమును - జీవులును జగత్తును - అయ్యెనని తెలిసికొనును. అటువంటివాడు తనబిడ్డలకు అన్నముపెట్టునప్పుడు, శ్రీగోపాలకృష్ణునికే అన్నముపెట్టుచున్నటుల భావించును; తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులనుగనెంచి వారికి సేవలొనర్చును. బ్రహ్మసాక్షాత్కారమును పొందిన యనంతరము ఎవడేని గృహస్థుడుగనుండి సంసారముచేసినను, భార్యతోసంభోగించబోడు. భార్యాభర్తలిరువురును భక్తులై జపతపములతో కాలముగడుపుదురు. సర్వభూతములందున బ్రహ్మమేయుండుట నెఱిగి వారు సకలప్రాణులను సేవింతురు; అన్నిటియందును పరమాత్మనే పూజింతురు.

911. ఒక శిష్యుడు:- "నిజముగా సాధువైనవానిని గుర్తించుట ఎట్లు?

శ్రీపరమహంసులవారు:- "ఎవనిహృదయమును ఆత్మయు పూర్ణముగ భగవదర్పితములైయుండునో అతడు నిజమగుసాధువు. కామినీకాంచనములను త్యాగముచేసిననాడు నిజమగుసాధువు. నిజముగాసాధువైనవాడు స్త్రీని మోహముతో చూడడు. ఆతడు స్త్రీ యనిన దూరముగానుండును; సమీపమునకురాతటస్థించినయెడల ఆమెను తనతల్లిగాభావించి గౌరవముచేయును. నిజమగుసాధువు నిరంతరము దైవధ్యానము చేయుచుండును; సర్వమునందు బ్రహ్మముకలడను భావనతో సకలభూతములను సేవించును. సాధువులందివి సామాన్యలక్షణములు."

912. శరీరము నిర్మాణమైనది; వినాశమును పొందును కాని ఆత్మకు మరణములేదు! పోకకాయ పోలిక:- పోకకాయ పక్వమైనప్పుడు లోపలి గింజ పై డొల్లనుండి విడిపోవును. కాని పచ్చిగానున్నప్పుడు ఆవిత్తును పచ్చని బెరడును విడదీయుట దుర్లభము. బ్రహ్మమును చేరినప్పుడు అనగా బ్రహ్మసాక్షాత్కారమును పొందినప్పుడు - ఆత్మ శరీరమును నుండి భిన్నమను జ్ఞానము కలుగును.

913. ధ్యానమునందు ఏకాగ్రచిత్తత కలిగి పిమ్మటఏమియు కనబడక, వినబడకయుండును. దృష్టియు స్పర్శజ్ఞానమునువిడిచిపోవును, శరీరముమీదుగా పాము ప్రాకిపోయినను తెలియరాదు! ఆవిషయము ధ్యానముచేయువానికి తెలియదు; పామునకును తెలియదు!

914. తీక్షణ ధ్యానమునందు యింద్రియ ధర్మములన్నియు ముకుళితములై పోవును. మనస్సుయొక్క బాహ్యప్రసారణము పూర్తిగ ఆగిపోవును. బహిద్వారము కట్టుబడిపోయినట్లగును. జ్ఞానేంద్రియాను భవములైదును - శబ్ద స్పర్శ రూప రస గంధములు తెలియరాక వెలుపలనేయుండును. ధ్యానసమయమున ప్రధమమున యింద్రియానుభవములు మనస్సునకు గోచరించును; ధ్యానము తీక్షణమైనప్పుడు అవి గోచరించవు - సమీపించలేక దూరముగ నిలిచిపోవును.

915. క్షుద్రస్వభావములు గలవారు:- రోగనివారణము చేయుట, వ్యాజ్యములుగెలుచుట, నీటిపై నడచుట మొదలగు - మహిమలకొఱకును సిద్ధులకొఱకును దేవులాడుదురు. నిజమగు భక్తులు స్వామిచరణారవిందములుతప్ప యితరమును కోరనేకోరరు.

916. "మహాభావ" మనగా పరబ్రహ్మభావము. అది శరీరమునకును, మనస్సునకును గూడ భయంకరమగు విఘాతమును చేకూర్చును. మదపుటేనుగు చిన్నగుడిసెలోదూరి దానిని ఉఱ్ఱూతలూగించినటుల - ఒక్కొకప్పుడు దానిని భిన్నాభిన్నము చేసివేయును. ఈదశ గడచినయనంతరము, పూర్వము ఎంతదుఃఖము వాటిలునో అంతయధికమగు ఆనందము లభించును.

917. భగవంతునినుండివేఱుపడు భావనచేగలుగు విరహవేదన అబ్బా! చెప్పనలవికాదు. అటువంటివిరహవేదనను అనుభవించిన (శ్రీచైతన్యస్వామి శిష్యులగు) రూపుడు సనాతనుడు అనువారి తాపాగ్నివలన, వారేచెట్టునీడను కూర్చుండిరో ఆ చెట్టుఆకులు సయితము వాడిపోయినవట! అటువంటి దశలో నేను మూడుదినములు దాదాపు స్మృతిలేకయుంటిని! నేను కదలలేక ఒక చోటపడియుంటిని! నాకుకొంచెము స్పృహ వచ్చినప్పుడు బ్రాహ్మణి (శ్రీపరమహంసులవారికి తాంత్రిక సాధనలునేర్పిన యామె) నన్నుతీసికొనిపోయి స్నానము చేయించెడిది. కాని ఆమె నాచర్మమును తాకలేకుండెడిది. ఆమె నాశరీరమునంతను దట్టముగగుడ్డలతోచుట్టి ఆగుడ్డలమీద చేతులువేసి పట్టుకొనెడిది. నాశరీరమునకు పులిమిన బురదమన్ను వేడెక్కెడిది! ఆస్థితివచ్చినప్పుడు పెద్దయీటెను నా వెన్నెముకగుండ గ్రుచ్చుచున్నట్లు బాధకలిగెడిది. చచ్చిపోవువానివలె బొబ్బలుపెట్టితిని. కాని ఆబాధకు పిమ్మట అత్యంత దివ్యానందము కలిగెడిది.

918. పండ్రెండువత్సరములు వీర్యమును సంరక్షించుకొనినవానికి గొప్ప మహిమలు అలవడును. నూతన నాడి యొకటి సృష్టియగును. దానిని "మేధనాడి" అందురు. ఆనాడి బలపడినప్పుడు నరుడు సర్వమును జ్ఞప్తినుంచుకొనగలడు; సర్వమును ఎఱుంగ గలడు.

919. వీర్యనష్టమువలన శక్తి క్షీణించును. అనేచ్ఛితముగ సంభవించు శుక్లనష్టమువలన అంతగా అపాయములేదు. కాని సిద్ధులుసహా స్త్రీల గలియదగదు.

920. సంపూర్ణ బ్రహ్మచర్యము నవలంబింపక ఆధ్యాత్మిక రహస్యముల గ్రహింప నలవికాదు.

921. స్త్రీభోగమును విడిచినవాడు ప్రపంచమును త్యజించినవాడే! భగవంతుడు వానికి కడుదాపున నుండును.

922. సత్యమగు సాధువుయొక్కమనస్సు ముప్పాతిక భాగము భగవదర్పితమైయుండును; ఒక్క పాతికభాగము మాత్రము ఐహిక వ్యాపారములకు వినియోగమగును. భక్తుడు సదా దైవకార్యము లందెక్కువ ఉత్సాహియై యుండును. పాము తోకత్రొక్కినయెడల మహాకోపముచెందును, ఒడలంతటికంటె పామునకు తోకయందు స్పర్శజ్ఞానమెక్కువ.

923. పరమహంసదశ పంచాబ్దములబాలుని దశను పోలియుండును. వానికి స్త్రీ పురుష భేదము తెలియదు. అయిననుకూడ లోకమునకు ఆదర్శము జూపునిమిత్తము పరమహంసయు స్త్రీలవిషయమున జాగరూకుడై మెలగవలయును.

924. నిష్కాపట్యము సులభముగా భగవంతునికడచేర్చును. రాళ్లులేక చక్కగదున్ని మెత్తగాచేయబడిన నేలయందు విత్తనము సులభముగా మొలకనెత్తి పెరిగి ఫలమునిచ్చుతీరున, అమాయకునియందు వేదాంతబోధలు సులభముగా ఫలప్రదములగును.

925. ప్రాపంచిక వ్యావృత్తులు గలవారి భక్తిసాధనాఫలితము తాత్కాలికము. (ఆసంస్కారములు చాల కాలము నిలువవు.) కాని నిరంతరము భగవద్భక్తిసలుపువారు ప్రతిశ్వాసముతోడనుఈశ్వర నామోచ్చారణచేయుదురు. కొందఱు తమలోతాము "ఓం రామ ఓం" అని నిరంతరము స్మరణ చేయుచుందురు. జ్ఞానయోగావలంబులు "సోహం" అని పఠింపుచుందురు. కొందఱి జిహ్వ ఏదో మంత్రమునో స్తోత్రమునో ఉచ్చరించుచు, కదలుచునేయుండును.

926. జప తపములు సదా ఆచరించుచుండవలయును. 927. బహుస్వల్పసంఖ్యాకులు మాత్రమే జ్ఞానబోధకు అర్హులుగనుందురు. భగవద్గీతలోయిట్లున్నది; వేలకొలది జనులలో ఒక్కడు భగవంతునితెలియగోరును; అటులతెలిసికొనగోరు వేయిజనులలో ఒక్కడుమాత్రము బ్రహ్మమును తెలిసికొని కృతార్థుడు కాగల్గును. కామినీకాంచనములంగూర్చి వ్యసనము తగ్గినకొలందిని జ్ఞానాభివృద్ధి చేకూరగలదు.

928. సాంసారికజీవనమున డబ్బుతోనిమిత్తమున్నమాట నిజమే. కాని దానినిగూర్చి విస్తారముగా చింతించతగదు. సంపదనార్జించు చింతకూడదు. దానంతటవచ్చుదానితో తృప్తిపడుట శ్రేష్ఠము. ధనముకూడబెట్టుకోరిక యుండతగదు. ఎవరు తమహృదయమును తమజీవనమును భగవదర్పితము చేయుదురో, ఎవరు భగవద్భక్తులై వానియందే శరణుజొత్తురో, అట్టివారలిట్టి విషయముల చింతపెట్టుకొనజాలరు. అటువంటివారి వ్యయము ఆదాయము ననుసరించి నడచును. ఒకవైపునుండి ధనమువచ్చుచుండ రెండవవైపునుండి వ్యయమగు చుండును.

929. శాక్తేయులలో సిద్ధులను శౌలులందురు. వేదాంతులు పరమహంసలనియు, బౌలసంప్రదాయికవైష్ణవులు శాయినులనియు అందురు.

930. పనులనన్నిటినివిడిచివేసి సాయంసమయమున దైవధ్యానము చేయవలయును. సంజవేళలందు సహజముగా భగవద్భావనలువచ్చును. క్షణకాలముక్రిందట సకలమును దృగ్గోచరములై యుండెనే, యిప్పుడు చీకటులచే కప్పివేయబడినవి! ఎవరిట్లుచేసిరి! ఈమొదలగుభావములు స్ఫురించును. మహమ్మదీయులు సాయంకాలమునందు పనులన్నియు మానివేసి నమాజునకుకూర్చుండుట చూడలేదా?

931. నీవు భగవంతునకు ఏమిఅర్పణచేసినను నీకు వేయిరెట్లు తిరిగియొసగబడును. కావున సర్వకర్మలందును తుదిని ఆకర్మఫలమును కృష్ణార్పణముచేసి నీళ్లువిడువవలయును.

932. యుధిష్ఠిరుడు తనపాపములనుసయితము కృష్ణార్పణముచేయబోగా "వలదు, వలదు. అటులచేయకుము. నీవుశ్రీకృష్ణునకు దేనిని అర్పణచేసినను అది వేయియంతలై తిరిగి నీకువచ్చును" అని భీముడు హెచ్చరించినాడు.

933. ఒకడు ధ్యాననిష్ఠలను ఇతరులకు తెలియరాకుండ ఎంతరహస్యముగచేసిన అంతలాభకరము.

934. భగవంతుడు అనేకరూపములుతాల్చి ప్రసన్నుడగును; ఒకప్పుడు నరరూపమునను, ఒకప్పుడు చిన్మయరూపమునను ప్రసన్నుడగును. కాని ఈదివ్యస్వరూపములందు విశ్వాసముండవలయును.

935. శ్రీకృష్ణుడుసయితము రాధాయంత్రముతో మహాసాధనలుచేసియున్నాడు. ఈయంత్రమే బ్రహ్మయోని - దాని ధ్యానార్చనలు సాధనచేయవలయును. ఈబ్రహ్మయోనినుండి అనంత బ్రహ్మాండములు ప్రభవించును!

936. కుండలిని ప్రబోధముకాంచినగాని ఆత్మప్రబోధము కలుగదు. కుండలినీశక్తి మూలాధారకమలమున నిద్రించు చుండును; అది మేల్కాంచినప్పుడు సుషుమ్నయందు ప్రవేశించి, స్వాధిష్ఠానమణిపూరకాది పద్మములగుండపోయి, తుదకు సహస్రారము చేరును. అప్పుడుసమాధిదశ లభించును. నాకిదంతయు స్వానుభవమున తెలిసినది.

937. నిశ్శబ్దముగనుండు స్థలమునజేరి, హరినామమును పలుకుచుండుట జపమనబడును. ఇట్లొకడు ఎడతెగకుండ హరినామస్మరణను నిండుభక్తితోచేసెనేని తుదకు వానికి భగవద్విభూతులు గోచరములగును. బ్రహ్మసాక్షాత్కారమును లభించును. ఒడ్డునకు ఒకకొనతగిలించియున్న పొడువగు గొలుసుకొనను పెద్దదుంగకట్టబడి నీటిలోపలమునిగియున్నది. ఆగొలుసుపట్టుకొని, కడియములను తడవుకొనుచు పోతివేని నీవాదుంగనుచేరగల్గుదువు. అటులనే ఒకడు జపముసలుపుచు దైవధ్యానమున మునింగిపోయినయెడల తుదను భగవంతుని ప్రత్యక్షము చేసికొనగల్గును.