శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/39వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

39వ అధ్యాయము.

ఈ యుగమునకు తగినమతము

732. ఈకలియుగమునకు నిజముగా తగిన ఆధ్యాత్మిక భక్తిసాధన అల భక్తవత్సలుని నిరంతరనామస్మరణయే!

733. నీకు నిజముగా బ్రహ్మసాక్షాత్కారము కావలయునేని, హరినామస్మరణయందు విశ్వాసముంచి నిత్యానిత్య వివేకముతోవర్తించుము.

734. చేపలనుతినువారు నిరుపయోగమగు తలను తోకను పాఱవేసి, మధ్యమెత్తనిభాగమును తిందురు. అటులనే మన పురాతనస్మృతులందలి విధులను ధర్మములను విచారించునప్పుడు, కాలక్రమమున వచ్చిపడిన కాలుష్యములను తొలగించి, ఇక్కాలమునకు అనుకూలమగు సద్ధర్మములనే అవలబించవలయును.

735. నరుడు కరుణజూపునప్పుడు క్రైస్తవుడుగను, బాహ్యకర్మకలాపములందు పట్టుదలచూపుచో మహమ్మదీయుని వలెను, సర్వభూతసమత్వమును పాటించునప్పుడు హిందువుగను వర్తించవలెను.

736. చేతులతో తాళమువేయుచు హరినామమధురగానము ఉచ్చస్వరముతోచేయుము; నీకు ఏకాగ్రచిత్తమలవడును. చెట్టుక్రిందకూర్చుండి చప్పట్లుకొట్టినయెడల దాని కొమ్మలమీదకూర్చున్న పక్షులు ఎగిరిపోవును. హరినామ స్మరణచేయుచు చేతులుతట్టినయెడల నీహృదయమునుండి దుష్టచింతలెల్ల పాఱిపోవును.

737. భక్తిఆత్మార్పణముల సాధనమూలమున భగవంతుని సాంగత్యమును అభ్యసించుటయే భక్తియోగము. ఈ యోగము కలియుగమునకు ఎంతయు అనుకూలము. ఈకాలమునకు అదే యుగధర్మము. దానివలన కర్మ క్షీణించిపోగలదు. నిరంతరధ్యానముయొక్క ఆవశ్యకత నిది నేర్పును.

738. మున్ముందు భక్తిని సంపాదించుకొనుము. తక్కుంగల విషయములన్నియు నీకు లభింపగలవు. ముందు భక్తి, పిమ్మట కర్మ! భక్తి శూన్యమయ్యెనా కర్మనిరర్థకము. స్వతంత్రముగా కర్మ నిలువజాలదు.

739. ఈకలియుగమునకు నారదీయభక్తి విధ్యుక్తము కర్మయోగమునకు, అనగా శాస్త్రములందు విధింపబడిన కర్మజాలమునంతను నిర్వహించుటకు కాలముండదు.

740. దశమూలపచన మను కషాయము ఈ దినములలో జ్వరమునకు ఔషధము కాజాలకున్నదని తెలియును గదా! ఆ మందు పనిచేయుటకు ముందుగనే రోగికి యమలోకయాత్ర ఘటిల్లవచ్చును. కావున ఈ కాలమునకు (కొయినా) జ్వరరసాయనమే తగినది!


___________