శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/41వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

41వ అధ్యాయము.

నీతికథలు.

938. ఈవిశ్వమంతయు బ్రహ్మమయమేయని ప్రకటించు అద్వైత సిద్ధాంతమును ఒకరాజునకు వాని గురువు బోధించినాడు. అందువలన రాజునకు పరమానందము కల్గినది అతడు తన రాణినిసమీపించి "రాణికిని రాణిదాసీజనమునకును భేదములేదు. కావున రాణిదాసియె నాకు రాణిగ నుండవచ్చును" అనెను. రాణి తన భర్తమాటలకు నివ్వెఱపోయినది. ఆమె గురువుగారికి వర్తమానమంపి "అయ్యా! మీబోధల మహాదుష్ఫలమును చూడుదు" అని దీనముగ మొఱలిడినది. గురువు రాణిని ఓదార్చి, "నేడు రాజు భోజనముచేయుసమయమున అన్నముతో పాటు ఆవుపేడనుకూడ పళ్లెరమునందు పెట్టించుము" అని సలహా చెప్పినాడు. భోజనసమయమున గురువును రాజునుకలసి భోజనమునకు కూర్చుండిరి. అన్నముతోపాటు వడ్డించబడినఆవుపేడను చూడగనే రాజునకువచ్చినఆగ్రహము వర్ణింపనలవికాదు. దీనిని కనిపట్టిన గురువు "ఆర్యా, నీవు అద్వైతజ్ఞానము కలవాడవు. ఈఅన్నమునకును పేడకును భేదమేలపాటింతవు?" అని ప్రశ్నించినాడు. రాజంతట పట్టరానిక్రోధముతో "అద్వైతినని గర్వోక్తులుపలుకు మీరీపేడను తినండి" అని అఱచెను. గురువంతట "మంచిది!" అని తానొక సూకరము (పంది)గ మారి అత్యానందముతో ఆవుపేడను భక్షించి, తిరిగి మానవరూపునుధరించి నిలిచినాడు. రాజంతట సిగ్గుదెచ్చికొని రాణితో పిచ్చిప్రసంగములు చేయమానినాడు.

939. "మీరేల మీసతితోగూడి గృహస్థధర్మమును నడపరైరి?" అని ప్రశ్నింపగా శ్రీపరమహంసుల వారిటుల జవాబు చెప్పిరి:-

"కార్తికేయుడు ఒకదినమున పిల్లిని గిల్లినాడట. ఇంటిలోనికి పోయినప్పుడు తనతల్లిచెంప గీచుకొనిపోయియుంట కాన్పించినది. దానినిచూచి ఆకుమారస్వామి "అమ్మా! నీబుగ్గమీద ఈగాయమెటుల కలిగినది?" అని అడుగగా, "ఇది నీపనియే; నీగోటిగీతయే యిది" అని ఆజగజ్జనని ప్రత్యుత్తరమిడినది. కార్తికేయుడు వెఱగుపడి "అదెట్లమ్మా! నేను నిన్ను రక్కిన జ్ఞప్తిలేదే!" అనెను. "బిడ్డా! ఈయుదయమున నీవు పిల్లిని గిల్లినమాట మఱచిపోతివా?" అని తల్లి అడిగినది. "అవునమ్మా, నేను పిల్లిని గిల్లితిని. అయిన నీబుగ్గమీద గాయముపడుటెట్లు తల్లీ?" అని పలికినాడు. "ముద్దులబిడ్డా! ఈజగమున నాకు వినా ఏమియులేదు. సృష్టియంతయు నేనే! నీవెవరిని హింసించినను నాకే హింస కలుగును." అని తల్లిచెప్పినది. ఈపలుకులాలకించి కుమారస్వామి అత్యాశ్చర్యముచెంది, తాను వివాహమాడరాదని నిశ్చయించుకొనినాడట! అతడెవరిని భార్యగా గ్రహించగలడు? అటుల స్త్రీజనమునందెల్ల మాతృభావమును గఱచిన కుమారస్వామి పెండ్లియాడుటకు జంకినాడు. నేను కార్తికే యుని బోలియున్నాను. నేను ప్రతిస్త్రీని నాజగజ్జననిగ భావనచేతును."

940. బ్రాహ్మణుడొకడు ఒకసన్యాసిని కలిసికొని చాలసేపు మతవిషయములగురించియు లౌకిక వ్యవహారముల గురించియు, ప్రసంగించినాడు. తుదకు ఆసన్యాసి వానితో "బిడ్డా! చూడుము, ప్రపంచములో ఎవరిపైనను ఆశపెట్టుకొనుటతగదు. నీవునీవారుగానెంచుకొనునెవరును నీవారుకారు సుమీ!" అనెను. బ్రాహ్మణునకు నమ్మకము కుదరలేదు. తానురేయింబవళ్లు ఎవరికొఱకైపడరానిపాట్లు పడుచున్నాడో, అటువంటి తనకుటుంబమువారు అవసరముపట్ల తనకు సాయపడబోరనుటను అతడెటుల నమ్మగల్గును? కావున నిట్లనెను:- "అయ్యా! నాకు ఇసుమంత తలనొచ్చెనా, నాభాదతొలంగు నిమిత్తము తనప్రాణమును సయితము ధారవోయునంత ప్రేమతో నాతల్లి నన్నుచూచునే! అటువంటి నాప్రియజననిని నేను నమ్ముకొనలేకున్నచో, ఇంకెవరిపై నేనాధారపడగలనో ఊహింపజాల!"

సన్యాసి యిటులపలికెను:- "అటులనా! అయితే ఆమె నీకు ప్రాపైయుండునదే కావచ్చును! కాని నీవు చాలపొఱబడుచున్నావు, నిజము. నీతల్లిగాని, పెండ్లాముగాని కొడుకుగాని నీకొఱకై తమప్రాణముల నర్పింతురని ఎన్నడునునమ్మబోకుము. కావలసినచో నామాటలను రుజువుచూడవచ్చును. ఇంటికిపోయి కడుపులోశూలచేత మితిలేనిబాధపడుచున్నటుల నటించుచు పడికొట్టుకొను చుండుము. నేనువచ్చినీకొక చిత్రమును చూపెదను." అంతనాబ్రాహ్మణుడు ఇంటికిబోయి ఆలాగుననే చేసెను. వైద్యులెందఱో రావింపబడిరి; కాని ఎవరును ఏమియు చేయజాలరైరి. రోగితల్లి వెక్కి వెక్కి యేడ్చుచున్నది: వాని ఆలు బిడ్డలు రోదనము చేయుచున్నారు. ఆతరుణమున సన్యాసివచ్చినాడు. "ఈవ్యాధి దుర్నివార్యమైనది. ఎవరైనను ఈరోగిప్రాణమునకు బదులుగా తనప్రాణమును అర్పించువారున్న తప్ప ఏమాత్రమును ఆశలేదు." అన్నాడు. ఈపలుకులు విని ఎల్లరును తెల్లబోయి నిలుచుండిరి. ఆసన్యాసి రోగియొక్క ముసలితల్లినిచూచి, "మీఅందఱిని పోషించు ఈ కుమారుడుమరణించినవెనుక వృద్ధాప్యమున నీవుండుటబ్రతికియు చచ్చినట్లేయుండును. వాని జీవములు మారుగా నీప్రాణము నిత్తువేని వానిని రక్షింక్షగలను. వాని తల్లివైయుండియు వానికొఱకు నీవీపాటిత్యాగమును చేయనియెడల లోకములో నింకెవరుదిక్కు వానికి?" అని పలికినాడు.

ఆవృద్ధస్త్రీ దగ్గుచు తడబడుచు యిట్లనెను: "స్వామీ, స్వామీ! నాబిడ్డడికొఱకు మీరు నన్నేమిచేయుమనిసెలవిచ్చినను చేయుటకునేని సంసిద్ధమే! నాప్రాణమా? వానిబ్రతుకుతోపోల్చిన నాదెంతపాటిది? కాని - అయ్యో - నేను చచ్చిపోయినతర్వాత - ఈపసికూనలందరు - ఏమైపోదురో అనుతలపుచేత - పిఱికితనము తోచుచున్నది! నాపాసమెంతటిదో! ఈపసివాండ్రను విడువలేను."

సన్యాసియు తన అత్తయు నిటుల ప్రసగించుచుండవినిన, రోగిభార్య, తన తల్లిదండ్రులజూచి రోదనముచేయుచు "ప్రియజనకులారా! మీరేమగుదురో అనుచింతవలన నేనిట్టి త్యాగమునకు పూనజాలకుంటిని! కటకటా!" అని ప్రలాపింపసాగెను. అమెవైపుతిరిగి సన్యాసి తన ప్రాణనాథుని క్షేమముకొఱకు వానితల్లి త్యాగముచేయ జంకియున్నస్థితిలో తానైనసాహసించునేమొ యని విచారించెను. అంత నామె "అయ్యో! నేనెంతటిపాపిష్ఠిదాననో! నానొదుటవైధవ్యము వ్రాయబడెగాబోలును! నాకొఱకై శోకసాగరమున మునుగు తల్లిని తండ్రిని విడిచివేసి, నేనేమిచేయగలను?" అనినది. ఈరీతిగా ప్రతివారును తప్పించుకొనిరి. తుదకు సన్యాసి రోగితోనిట్లనెను.

"ఇకనిటుల చూడుము! ఒక్కరుమాత్రమేని నీకొఱకై ప్రాణమర్పించువారు లేరైరి. ఈలోకములో నెవరిని నమ్ముకొనదగదని నే ననినమాటలు ఇప్పటికైనభోధపడెనా?" ఇదంతయు కనిపెట్టుచున్న బ్రాహ్మణుడు తన బూటకపు సంసారమును త్యజించి ఆసన్యాసి ననుసరించి వెడలినాడు!

941. ఒకమానవుని పారమార్థికఫలము వానిమనస్సు యొక్క స్థితిని, జీవితాదర్శనమును, అనుసరించియుండును. అది వాని హృదయముపై నాధారపడును గాని బాహ్యకర్మలపై నాధారపడియుండదు. ఇద్దఱు స్నేహితులు భాగవతపురాణ కాలక్షేపము జరుగు తావునకు ప్రక్కగా పోవుచుండిరి. "అదుగో అక్కడికిపోయి కొంతసేపు పురాణమును వినుదుము." అని ఒకడనినాడు. "వద్దు మిత్రమా! భాగవతమువినినందున ఫలమేమున్నది. ఆవేశ్యవాటికకుపోయి వినోదముగ కాలక్షేపముచేయుదము." అని రెండవయతడు అనెను. మొదటివాడు దీని కొడంబడలేదు. అతడు భాగవతము చదువుచోటికి పోయి, వినుటకై అటకూర్చుండెను. రెండవవాడు వేశ్యవాటికకుపోయెను గాని, తానాశించిన ఆనందమును అనుభవించలేకపోయెను. కావున ఆతడిటుల తలపోయసాగెను:- "అకటా! నేనిక్కడికి ఏలవచ్చితిని? నామిత్రుడు శ్రీహరిలీలలను పావనకథలను వినుచు ఎంత సంతోషముతో నుండెనో కదా!" ఇటుల అపవిత్రస్థలముననుండి అతడు హరిని ధ్యానముచేసినాడు. రెండవవాడో భాగవతకథను వినుచును సంతసములేకయుండెను. అటకూర్చుండి తననుతాను నిందించుకొనుచు "ఏమీ, ఎంతబుద్ధిహీనుడనైతిని? నామిత్రునితోడ బోగముసానియింటికి పోనైతినే! అతడక్కడ ఎంతవిలాసముగా కాలము గడుపుచుండునో గదా?" అని గొణుగుకొనసాగెను. ఆతడు భాగవతమును చదువుతావున కూర్చుండెనను పేరేగాని, అక్కడనున్నంతసేపును వానిమనస్సు బోగముసానియింట తాను అనుభవించియుండగల వేడుకలపైననే యుండెను. ఇట్లు అతనిహృదయము నీచసంకల్పములతో మలినమైయుండుటవలన, అతడు స్వయముగా బోగమువాండ్ర యింటికి పోకపోయినను పాపమునే పొందినాడు. భోగవాటికకుపోయిన రెండవవాడు తాను అపవిత్రస్థలముననున్నను, హృదయము శ్రీహరి కథాకాలక్షేపముమీదనే యుండుటవలన భాగవత శ్రవణముచేసిన పుణ్యమును పడసెను. 942. వైశాఖమాసమున ఒక చిన్నమేకపిల్ల తల్లికడ నాటలాడుచు, చంగు చంగున ఎగురుచుండెను. అచ్చట నది రోజూ పూలనుచూచి తల్లితో తానాపూవులను కొన్నిటిని తిని విందారగింతునని చెప్పెను. అందుకు తల్లి యిట్లనెను:- "బిడ్డా! ఆపూలను నీవందుకొనుట అంత సులభకార్యము కాదు. ఆపూలు నీకుచిక్కులోపల నీవు అనేకములగు తిప్పలు పడవలసియుండును. రాబోవు నవరాత్రి పండుగదినములు నీకంతగా శుభదినములుకావు. ఎవరేని నిన్ను కొనిపోయి దుర్గాదేవికి బలియీయవచ్చును; అదితప్పిన కాళికి నిన్నర్పింపవచ్చును. అదృష్టవశమున ఆగండమును తప్పినను జగద్ధత్రికి నిన్నారగింపు చేయుదురేమొ. అప్పుడు మనజాతిలో మగవాని నన్నిటిని జాతరలో నఱికివేయుదురు. మహదదృష్టము నీపాలబడి నీవిన్ని గండములను గడచి, సురక్షితముగ బ్రతికి పెద్దదానవైనయెడల దీపావళినాటికి రోజాపూల విందు తిందువుగానిలెమ్ము! అప్పుడు మంచి రోజాపూలు దొఱకగలవుకూడను."

ఈకథలోని మేకపలికినటుల మన కోర్కెలను తీర్చుకొనుటలో అత్యుత్సాహము కూడదు. మన జీవనసరణిలో తటస్థించు అనేక క్లిష్టపరిస్థితులను జ్ఞప్తినుంచుకొని యౌవనపు గొంతెమ్మ కోరికలను ఆపుకొనదగును.

943. ఒకమనుష్యుడు ఒకసాధువును అత్యంత వినయముతో సమీపించి "స్వామీ! నేను కడు దీనుడను; సాధుసత్తమా! నేనెట్లు తరింతునో తెలుపవేడెదను" అనెను. సాధువు వాని హృదయమునగల భావమును గ్రహించి "మంచిది; నీవుపోయి నీకంటె క్షుద్రతరమైనదానిని దేనినైన తీసికొనిరమ్ము" అనెను. అంతట ఆమనుష్యుడు వెడలిపోయి, అచ్చటచ్చటచూచి, తనకన్న హీనతరముగనుండుదానినికనుగొనలేక పోయెను. తుదకు తన పురీషమునుగాంచి "ఓహో! ఇదిగో, నాకన్న నీచతరమైనది ఉన్నది" అనుకొని దానిని సాధువుచెంతకు దీసికొనిపోవుటకై చేతితోపట్టుకొనబోయెను. అప్పుడాపురీషమునుండి ఒక ధ్వనియిట్లు వినవచ్చెను:- "ఓపాపీ! నన్నుతాకబోకుము. నేనొక మధురమును రుచ్చమునైన పూపమనై దేవతార్పణమునకు తగియుంటిని; చూచువారెల్లఱు నానందించియుండిరి. నాదురదృష్టదేవత నన్ను నీకడకుదెచ్చినది; నీసంసర్గము నన్నీహీనదశకుతెచ్చినది. నరులు నన్ను చూచిఅసహ్యించు కొనుచు ముక్కులను గుడ్డలుపెట్టి గట్టిగమూసికొని పారిపోవుచున్నారే! నేను నీసంసర్గకు వచ్చినది ఒక్కసారియే; అయ్యో నకర్మమిట్లయినది! నన్ను నీవు మరల నొకసారి తాకితివేని నాకింకను ఎటువంటి హీనతరదశరాబోవునో గదా!

ఆమనుజుడు ఈరీతిగా నమ్రతనేర్పబడి, అత్యంతము వినయశీలుడయ్యెను. తుదను ఉత్తమ పరిపూర్ణత్వమును బడసెననుట తధ్యము.

944. ఒకడు చాలఋణములనుచేసి, ఋణదాతలబాధలను తప్పించుకొను నిమిత్తము పిచ్చియెత్తినట్లు నటించసాగెను. వైద్యులు వాని రోగనివారణ చేయజాలరైరి. వానికి ఔషధములను యిచ్చినకొలదిని వానిపిచ్చి హెచ్చగుచుండెను. తుదకొక బుద్ధిశాలియగు వైద్యుడు నిజమును కనుగొనెను. అంతట ఆవైద్యుడు వానిని చాటునకు దీసికొనిపోయి "అయ్యో! నీవిటులచేయుట క్షేమమా? పిచ్చియెత్తినటుల నటించుటచేత నీవు నిజముగాపిచ్చివాడవె కాగలవు సుమీ! ఇప్పటికే నీయందు కొన్నిఉన్మాదచిహ్నములునాకు కాన్పించుచున్నవి!" అని మందలించినాడు. ఈపలుకులు వానిహృదయమున గాఢముగ నాటినవి; వానిదోషము వానికి గోచరించినది. అంతట పిచ్చివానినటనను యతడు విడిచివేసినాడు. నీవు నిరంతరముగా ఎటువంటివాడవైనటుల నటింతువో అటువంటివాడవే యగుదువు.

945. ఒకానొక ధనికునిప్రధానసేవకుడు వాని ఆస్తినంతను పరిపాలన చేయుచుండెను. ఈఆస్తి ఎవరిదని అడిగినయెడల "అయ్యా, యీసంపదయంతయునాదే; ఈయిండ్లు, ఈతోటలు అన్నియు నావే" అనేవాడు. ఇట్లుపలుకుచు చాల గర్వాతిశయముతో త్రిప్పుకొనుచు నడిచేవాడు. అతని యజమానుడు ఎవరును చేపలపట్టవలదని కఠినశాసనముచేసియున్న చెఱువులో ఈసేవకు డొకనాడు ఒక్క చేపనుపట్టుట తటస్థించినది. వాని దురదృష్టమువలన అప్పుడే వానియజమానుడు యచ్చోటికి వచ్చి ఆమోసగాడు చేయుచున్న పనిని స్వయముగా చూడనయ్యెను. అంతట యజమాని కినిసి తక్షణమే వానిని దూరముగ వెడలగొట్ట నాజ్ఞయిడుటయేగాక, మిగుల అవమానించి పలువురు చూచుచుండగా చీవాట్లు పెట్టినాడు. పాపము ఆసేవకుని స్వంతసొత్తగు కొన్నిగిన్నెలు గుడ్డలుగల ప్రాత పెట్టెను తీసికొనిపోవుటకుగూడ అవకాశమీయక తఱుమగొట్టించినాడు. దుర్గర్వమునకు ఫలమిటులుండును!

946. ఒకగుడిచెంతగా సన్యాసి యుండేవాడు. ఎదురుగా ఒకబోగముదాని యిల్లుండేది. అనేకులు నిరంతరము దాని యింటికి వచ్చిపోవుటగాంచి, ఒకనాడు సన్యాసి దానిని పిలిచి "దివారాత్రములు నీవిటుల విటులతో నీచసల్లాపముల కాలము పుచ్చుచున్నావే! నీకు రానున్నముందుగతి ఎంతఘోరముగానుండునో ఎఱుంగుదువా? అని చీవాట్లుపెట్టినాడు. పాపము, ఆసాని మిగుల విచారపడి అంతరంగమున పశ్చాత్తాపముతో తన పాపముల క్షమింపుమని దైవమును ప్రార్థించసాగినది. అయినను వ్యభిచారము దానికి వంశాచారమైయుండుటచేత, మరేవృత్తిని సులభముగాఅవలంభించి జీవించుతెన్నుగానక, తన తనువు వ్యభిచరించినప్పుడెల్ల మరిమరి పశ్చాత్తాపము పొందుచు దైవమును ప్రార్థించుచుండేది. ఆసన్యాసి తానుచేసిన హితబోధ వ్యర్థమైనదిగదా యని విసిగికొనుచు, ఆసాని జీవితమున ఎందరువిటగాండ్రు దానియింటికి బోవుదురో లెక్కవేయ సంకల్పించినాడు. ఆదినమునుండి ఆసానియింటిలోనికి పురుషుడు ప్రవేశించినప్పుడెల్ల ఒక బెడ్డనుతీసి యొకచోటున వేయసాగినాడు. రానురాను ఆబెడ్డలు పెద్దకుప్పగా పేరినవి. ఒకనాడాయన సానికి ఆకుప్పనుచూపి, "ఓవనితా! ఈకుప్పను చూచితివా? నీపాపపు హీనకార్యమును మానుమని నేను నిన్ను మందలించినపిమ్మట నీవెన్నిసార్లు వ్యభిచరించితివో అన్నిసార్లకు అన్నిరాళ్లుపేర్చగాయింత కుప్ప ఏర్పడినది! ఇంకనైనను నీదుర్వృత్తిని మానుమని చెప్పుచున్నాను" అని గద్దించిచెప్పెను. పాపము, ఆదీనురాలు తన పాపభారమునుగూర్చి భీతిచెంది, తన అశక్తతను గూర్చి దుఃఖించి "భగవంతుడా! నా యీ ఘోరజీవనము నుండి నన్నురక్షింపవా?" అని అంతరంగమున మొఱలిడ సాగినది. ఆప్రార్థనను భగవంతుడు వినినాడు; ఆనాడే యమదూతలు ఆసాని యింటిమీదుగా పోయినారు. ఆమె యీ ప్రపంచమును విడిచి చనినది. ఈశ్వరేచ్ఛవలన ఆనాడే సన్యాసియు దేహ త్యాగముచేసినాడు. యమదూతలు సన్యాసియొక్క జీవునిపట్టుకొని అధోలోకములకు గొనిపోయిరి; విష్ణుదూతలు వచ్చి సానిజీవుని వైకుంఠమునకు దీసికొనిపోయిరి. ఆసాని అదృష్టమునుగాంచి సన్యాసి గొంతెత్తి యిట్లనెను. "భగవంతుని సూక్ష్మధర్మనిర్ణయమిటులుండునా? నేను నాజీవితమును జపతపనిష్ఠలతో సర్వత్యాగముచేసి గడపితిని? నన్ను నరకమున కీడ్చుకొనిపోవుచున్నారు! నిరంతర కళంకజీవనమును గడపిన వ్యభిచారిణిని వైకుంఠమునకు గొనిపోవుటయా?"

ఈపలుకులువినిన విష్ణుదూతలిటుల తెలిపిరి:- "భగవంతుని నిర్ణయములు సదా న్యాయముగనే యుండును; నీ వెటుల సంకల్పింతువో అట్టిఫలితముల ననుభవింతువు. పేరు ప్రఖ్యాతులకై యత్నించి బాహ్యాడంబరముతోడను గర్వముతోడను జీవనము గడపితివి; భగవంతుడు నీకు దానినే లభింపజేసినాడు. నీహృదయము భగవంతునికొఱకై తపించి యుండలేదు. ఈవేశ్య కాయికముగ పాపమాచరించినను రేయింబవళ్లు భగవంతుని పూర్ణ హృదయముతో ప్రార్థించినది. జనులచేత నీశరీరమును, ఆమెశరీరమును ఎటుల చూడబడెనో యోచించుము. నీవెన్నడును శరీరముతో పాపముచేయలేదు గాన నీశరీరమును వారు పూలతోడను మాలలతోడను అలంకరించి, మేళతాళములతో ఊరేగించి పుణ్యనదిలో విడువబోవుచున్నారు! ఈ వేశ్యశరీరము పాపమాచరించియున్నదిగాన ఈక్షణమున నదికాకులచేతను గ్రద్దలచేతను చీల్చివేయబడుచున్నది. అయినను ఈమెహృదయము పవిత్రవంతమైయుండె గాన పావనలోకములకు బోవుచున్నది. నీహృదయము సదా ఆమె పాపకార్యములనే మననము చేయుచుండె గాన అపవితమైనదై అపవిత్రుల లోకమునకే పోవుచున్నది. యధార్థమున వ్యభిచారివి నీవుగాని, ఆమె కాదు!"

947. ఒకబ్రాహ్మణుడు తోటను వేయించుచుండెను. రాత్రింబవళ్లు దానిని జాగ్రత్తగా కనిపట్టి చూచుచుండెను. ఆతడు అత్యంత ప్రీతితో రక్షించుచున్న మామిడిమొక్కను ఆవొకటి తోటలోపడిమేసినది. తనకు ప్రియముగానుండిన ఆమొక్కను ఆవు మేయుచుంట చూడగానే బ్రాహ్మణునికి రౌద్రము రగుల్కొనివచ్చెను. అంతట బడితెతీసికొని మోదగా ఆయావు గాయములచేచచ్చిపడినది. బ్రాహ్మణుడు గోహత్యచేసినాడను వదంతి ఎల్లెడలవ్యాపించినది. ఈబ్రాహ్మణుడు వేదాంతిననిప్రకటించుకొనుచుండెడివాడు. గోహత్య దోషమునుతనపైనారోపించగానే, తానునిర్దోషినని రుజువు చేయుటకుగాను ఇట్లుపలుకసాగెను:- "కాదు కాదు" నేను గోహత్యచేయలేదు. ఆపని చేసినది నాచేయి సుడీ! ఈహస్తమునకు అధిష్ఠానదేవత యింద్రుడు; కావున ఎవరేని ఆవును చంపినదోషముకట్టు కొందురేని అది ఇంద్రునిదిగాని నాదికాదు."

స్వర్గమందలి యింద్రుడీపలుకులు వినినాడు. ఒకవృద్ధబ్రాహ్మణవేషమును ధరించి ఈతోటస్వంతగాని కడకు వచ్చి యిట్లు ప్రసంగించ నారంభించినాడు:-

ఇంద్రుడు :- అయ్యా! ఈతోట ఎవరిది?

బ్రాహ్మణుడు:- నాయదియే.

ఇంద్రుడు:- ఇది చాల సుందరముగానున్నది. కడునేర్పరి యగు తోటమాలిని మీరు సంపాదించియుందురు. ఆహా! ఎంతసొగసుగా, ఎట్టి చిత్రవిచిత్రారములతో మొక్కలను నాటించినాడో!

బ్రాహ్మణుడు:- ఇదంతయు నాపనియేనండీ! ఈచెట్ల నన్నింటిని నేను స్వయముగ పరీక్షించుచు స్థలనిర్ణయముచేసి పాతించి పోషించుచుందును.

ఇంద్రుడు:- అటనాఅండీ! మీరు మహా నిపుణులండీ! బహు బాగుగ చిత్రాకారముల కల్పనచేసి మొక్కలను పాతించినారు.

బ్రాహ్మణుడు:- అంతయు స్వయముగనే చేసినదే!

ఇంద్రుడు:- (చేతులుజోడించి) ఈతోటలోజరిగిన పనులన్నియు నీయవియేయని, వానింగూర్చిన ఘనతనంతను నీవే గైకొనుచుంటివి గదా! అవునుచంపిన దోషమును మాత్రము, పాపము, ఆయింద్రునినెత్తిన పడవేయుట చాల అన్యాయము సుమీ!"

948. నవనాగరిక విద్యావంతుడొకడు సంసారులు ఐహిక తత్పరులుగానుండక తప్పదని శ్రీపరమహంసులవారితో వాదించసాగెను. అప్పుడు శ్రీపరమహంసులవారిట్లనిరి:-

"ఈనాటి సంసారుల ఔదార్యము ఎటువంటిదో తెలియునా? ఒకబ్రాహ్మణు యాచనకువచ్చినయెడల గృహయజమాని తనభార్యయే యింటి వ్యవహారములన్నియు చక్కబెట్టుచుండునుగాన, తాను డబ్బువిషయములేవియు పెట్టుకొనడుగానను, గృహకృత్యముల జోక్యములేనివాడు గానను, ఆబ్రాహ్మణునితో "అయ్యా! నేను డబ్బు తాకువాడనుగాను; నన్ను యాచించవచ్చి నీవు వృధాకాలయాపనచేసికోనేల? అనును. ఆబ్రాహ్మణుడు అతిదీనముగా ప్రార్థించుచు పీడించువాడైన యెడల "సరే, రేపురండయ్యా; ఏమైనవీలుంటే చూచెదను" అని చెప్పును. ఈఅధర్మమూర్తియగు గృహస్థు, ఇంటిలోనికిపోయి, భార్యతో "ఓసీ, చూచితివా! పాపము ఒక పేదబ్రాహ్మణుదు, చాల కష్టదశలోనున్నాడు. ఒకరూపాయి యిత్తము" అనును. "రూపాయి" అనుమాట చెవినిబడగానే భార్య రుద్రాణి రూపుదాల్చి, "ఆహా! ఎంత ఔదార్యమండీ! రూపాయలు పుల్లియాకులో రాళ్లో అనునటుల మీకు కాన్పించుచున్నవి కాబోలు! వెనుక ముందు చూడనక్కఱలేదు; పాఱవేయ వచ్చు!" అని వేళాకోళముగ వచించును. ఐహిక తాత్పరత నెఱుంగననెడి యీబ్రాహ్మణుడు మోము తేలవేసి "అబ్బే, ఆబ్రాహ్మణుడు చాలపేదవాడు అంతకంటె తక్కువ నిచ్చిన బాగుండదు" అని నంజుచు మాటాడబోవును. "వీలుకాదు ఒక్కబేడకన్నహెచ్చు యిచ్చుటకు అవకాశములేదు. ఇష్టమైనయెడల అదియ్యండి" అని భార్య పలుకును. ఈబ్రాహ్మణుడు ఐహికచింతలుపెట్టుకొనడు గాన, భార్యయిచ్చినదానినేతీసికొనును. మరునాడాయాచకునకుదక్కునది బేడయే. ఐహికచింతలు వీడితిమని చెప్పుకొను మీగృహస్థులు నిజముగా స్వాతంత్ర్యములేనివారు; ఏలయన వారు స్వయముగా కుటుంబవ్యవహారములను చక్కబెట్టుకొనరు. తాము చాలయోగ్యులమనియు సాధుపుంగవులమనియు అనుకొందురు. కానియధార్థమునకు ఇల్లాండ్రఅదుపులోనుండి వారలుచెప్పునటుల వర్తించువారే; వీరియొద్ద సామాన్య పురుషస్వభావమును కొఱవడియుండును.

949. బావిలో ఒక కప్ప యున్నది. అది ఆనూతిలో బహుకాలమువాసముచేసినది. అదిదానిలోనెపుట్టి, దానిలోనెపెరిగినకప్ప. ఒకనాడు సముద్రములోనుండెడి కప్పవచ్చి యీ నూతిలోపడుట తటస్థించెను. నూతిలోనికప్ప క్రొత్తగావచ్చిన దానిని చూచి "ఎక్కడిదానవు" అని ప్రశ్నించినది.

సముద్రపుకప్ప :- "నేను సముద్రమున నుండుదానను"

నూతికప్ప:- "సముద్రమా! అదెంత పెద్దదిగానుండును?"

సముద్రపుకప్ప:- "అది చాల పెద్దది!" నూతికప్ప కాళ్లుబారసాచి "మీసముద్రము ఇంత విశాలముగా నుండునా?" అనెను.

"అంతకన్న చాలవిశాలముగానుండును" అని సముద్రపు కప్ప ప్రత్యుత్తరమిచ్చినది!

నూతికప్ప తానున్న చోటినుండి ఒక్కగంతువేసి "సముద్రము ఇంతగొప్పదిగానుండునా!" అనెను.

"మిత్రమా! సముద్రపువైశాల్యమును యీనూతితో పోల్చి చెప్పజూతువా?" అని సముద్రపుకప్ప జవాబిచ్చినది.

నూతికప్ప యిట్లునొక్కివక్కాణించినది:- "లేదు; ఈ నా బావికన్నపెద్దది ఎందునులేదు. నిజముగా, ఇంతకు మించి ఏదియు పెద్దదైయుండజాలదు. ఈ కప్ప బొంకులాడుచున్నది; దీనిని ఇక్కడనుండి లాగివేయవలయును."

సంకుచితాభిప్రాయములుగల నరులు ఈ తీరున నుందురు. తమ చిన్నచిన్నబావులలోకూర్చుండి జగమంతయు గూడ తమ నివాసములకన్న పెద్దదిగనుండజాలదని ధీరముగ వాదింతురు!

950. ఒకదొంగ రాజునింటికి కన్నమువేసి, అర్ధరాత్రివేళ లోపలప్రవేశించినాడు. రాజు తనకుమార్తెను ఏటిగట్టున నుండు సాధువులలో నొకనికిచ్చి పెండ్లిచేయుదునని రాణితో చెప్పుచుండగా వినినాడు. ఆదొంగ యిటుల తలపోసెను:- "మంచిది! నా అదృష్టముపండినది. రేపు నేను సాధువువేషము ధరించి ఏటికడనున్న సాధువులమధ్యకూర్చుందును. బహుశః రాజు తనకుమార్తెను నాకేయియ్యగలడు!" మరునాడువాడటులనేచేసినాడు. రాజుగారి యుద్యోగులు వచ్చి రాజపుత్రికను పెండ్లిచేసికొమ్మని ఏసాధువునడిగిననను యెవడునుఒడంబడడయ్యెను. తుదకువారు సాధువేషముతోడ నున్నదొంగకడకువచ్చి తమ ఉద్దేశ్యమును తెలిపిరి. ఈదొంగ ఊరకున్నాడు. అంతటవారు రాజునొద్దకుబోయి ఒకయువకుడగు సాధువున్నాడనియు, వానిని ప్రాధేయపడి రాజపుత్రికను పెండ్లాడుటకై ఒడంబఱచవచ్చుననియు తక్కిన సాధువులు ఇష్టపడలేదనియు తెలిపిరి. అప్పుడు రాజు స్వయముగా ఈ సాధువుచెంతకుపోయి, తన కుమార్తెను పెండ్లియాడి తనను అనుగ్రహించ వలయునని అతిదీనముగా ప్రార్థించెను. రాజువచ్చి వేడుకొనుటచూడగనే దొంగవానిహృదయము మారిపోయినది. అతడిటుల తలంపసాగెను:- "నేను సాధువేషమునుమాత్రము ధరించి యుంటిని. ఆహా! రాజంతవాడువచ్చి ప్రాధేయపడుచు వేడుకొననైనది! నేను నిజముగా సాధువునే ఐనయెడల నాకు లభింపగల మహత్తర లాభములను ఎవరూహించజాలుదురు!" ఈతలపులు వానిహృదయమున గాఢముగ నాటినవి. బూటకపువేసమువేసి పెండిలిచేసుకొనుటకన్న, తనవర్తనమును మార్చుకొని, ఇక నిజముగాసాధుశీలమును అలవఱచుకొనుటయే శ్రేష్ఠమని నిశ్చయించుకొనినాడు. ఆతడు వివాహమాడ నిరాకరించినాడు; సాధువులలోనెల్ల ఉత్తమసాధువు కాగల్గినాడు. యోగ్యమైనవేషమునుధరించుట సయితము ఒకానొకప్పుడు తలవనితలంపుగా శుభప్రదము కాగలదు! 951. ఒక పేద బ్రాహ్మణునకు ధనికుడగు వర్తకుడు శిష్యుడుగానుండెను. ఆవర్తకుడుచాలలోభి. ఒకనాడాబ్రహ్మణునికి తన పవిత్రమైన పుస్తకమును మూట కట్టుకొనుటకు చిన్నగుడ్డముక్క కావలసివచ్చినది. ఆయన తనశిష్యునిదగ్గరకుపోయిఅడిగినాడు. వర్తకుడిట్లుపలికెను:- "అయ్యో, రెండుగడియలక్రిందజెప్పినయెడల మీకుకావలసినది ఇచ్చియుందును; నాకెంతయో విచారముగ నున్నది! మీకు పనికివచ్చెడు చిన్న గుడ్డ ముక్క యిప్పుడేదియులేదే; ఏమి దురదృష్టము! కానిండు మీరడిగిన దానిని జ్ఞప్తియందుంచుకొందును; మీరప్పుడప్పుడు జ్ఞప్తికితెచ్చుచుండుడు." పాపమా బ్రాహ్మణుడు నిరాశతో వెడలిపోయెను. గోడప్రక్కనున్న వర్తకుని భార్య యీగురుశిష్యుల సంభాషణను వినినది. ఆమె వెడలిపోవుచున్నబ్రాహ్మణుని యింటికి పిలిపించి "స్వామీ! యీ గృహ యజమానుని మీరడిగినది ఏమి?" అని విచారించినది. బ్రాహ్మణుడు జరిగిన వృత్తాంతమును వినిపించినాడు. "చిత్తము; మీరింటికివెళ్లండి. మీరుకోరినగుడ్డరేపుపంపబడును" అని వర్తకునిభార్య చెప్పినది. వర్తకుడానాటిరాత్రి యింటికి రాగానే భార్య "దుకాణముమూసివేసితిరా?" అని అడిగినది. అవును, విశేషమేమి? అనిఆతడనెను. "ఇప్పుడేవెళ్లి మనదుకాణమునగలవానిలో శ్రేష్టమైన రెండుచీరలు తీసుకొని రండ"ని భార్యచెప్పగా "ఏమియీతొందఱ! ఉన్నవానిలో నెల్లమైలైన వానిని రేపు ఉదయాననే యిచ్చెదను" అని వర్తకుడుచెప్పెను. "అటులకాదు, యిప్పుడేయియ్యవలెను; లేదానకక్కఱనేలేదు" అని భార్యపలికినది. పాపమా వర్తకుడు అప్పుడుచేయగల దేమియున్నది? గురువుగారినా? ఏదోమాయమాటలతో పంపివేయుటకు? ఈమె వాని శయ్యాగృహపు గురువయ్యె! ఈమె ఆజ్ఞలు అప్పుడప్పుడే చెల్లితీరవలయును. లేదా యింటిలోనిపోరు ఇంతంతయని వర్ణింప వీలుండదు. తుదకా వర్తకుడు విధిలేక, అర్ధరాత్రివేళపోయి కొట్టుతీసి భార్యకోరినటుల చీరలను తెచ్చినాడు. మరునాటి ఉదయమున ఆగృహిణి రెండు చీరెలను గురువు గారింటికి పంపి "ఇకమీదట మీకేమైన కావలయునేని నన్నడుగుడు; మీకు దొఱకును" అనికబురుచేసినది. కావున వరములు కోరువారు సులభముగా దాక్షిణ్యముచూపని జగజ్జనకుని అర్చించుటకన్న దయామయు జగజ్జననిని పూజించుట లెస్స!

952. బాగుగచదువుకొనిన బ్రాహ్మణుడొకడు విజ్ఞానవంతుడగు రాజునొద్దకువెళ్లి "రాజా! నేను శాస్త్రములను చక్కగచదివినపండితుడను. నేనునీకు భాగవతమును బోధింపనెంచివచ్చితిని" అనెను. ఆయిద్దరిలో బుద్ధిమంతుడైనరాజు ఎవడేని నిజముగా భాగవతమునే చక్కగా చదివియున్న యెడల అట్టివాడు తన ఆత్మనుతెలియగోరు విచారణయందు నిమగ్నుడైయుండును గాని రాజస్థానమున గౌరవమును ధనమును సంపాదించ నెంచియుండడని బాగుగ నెఱుంగును. కావున రాజాయనతో "బ్రాహ్మణవర్యా! నీవాగ్రంధమును జక్కగతెలిసికొని యుండలేదని నేను గ్రహించితిని. నేను నిన్ను నాగురువుగాచేసికొనుటకు వాగ్దానము చేయుచున్నాను; కాని నీవుపోయి ముందాగ్రంధమును నేర్చిరమ్ము" అనెను. అంత నాబ్రాహ్మణుడు మరలి తన త్రోవనుబట్టి "నేను భాగవతమును యెన్నిసంవత్సరములనుండియో మరల మరల పఠనము చేసియుంటినే! అట్టి నన్నీరాజు భాగవతమును బాగుగ గ్రహించని వానిక్రింద గట్టినాడు! ఎంతటి మూర్ఖుడో!" అని తలంచసాగెను. అయినను అతడు భాగవతమును మరొకసారిచదివి తిరిగి రాజునొద్దకు వెళ్లెను. రాజు మరల ఆమాటనే చెప్పి పంపివేసినాడు. బ్రాహ్మణుడుమిగుల విసుగుజెందినాడు; కాని, రాజు అటులవర్తించుటకుకరణముండియుండుననుఊహవానికి తట్టినది. ఆయనయింటికిపోయి ఒక గదిలోజేరితీవ్రబుద్ధితో భాగవతమును పఠించనారంభించెను. రానురాను అందలి రహస్యార్థములు వానిబుద్ధికి తోచనారంభించెను. ధనము, గౌరవము, రాజులు , ఆస్థానములు, సంపదలు, ఖ్యాతి, మొదలుగాగల బుద్బుదప్రాయములగు విషయముల వెంటపర్విడుసంకల్పములేబొత్తుగ వానిదృష్టినాకర్షించవయ్యెను. ఆదినముమొదలు ఆబ్రాహ్మణుడు భగవదారాధనముచేయుచు ఆత్మసాక్షాత్కారమునుబడయు నిష్ఠయందు నిలిచిపోయెను. కొన్నియేండ్లు గడచినయనంతరము రాజుబ్రాణునిగూర్చి విచారించి ఆయన యమిచేయుచుండెనో చూచుటకై వాని యింటికి వెళ్లినాడు. వానిముఖముదివ్యతేజముతో ప్రకాశవంతమైయుండుటగాంచి రాజు వానిమ్రోలసవినయముగ మోకరించి "నీవిప్పుడు భాగవతార్ధమును నిజముగాగ్రహించితిరని నాకుతెల్లమైనది. నన్ను నీవు శిష్యునిగాస్వీకరించుటకుఒడంబడితివేని సిద్ధముగనుంటిని" అని పలికెను. 953. మూర్ఖతయందు ఘంటాకర్ణునివంటి వాడవు కాకుము. శివుని పూజించుచు తదితరదేవతల నందఱను ద్వేషించిన మనుజుడొక డుండెడివాడు. వానికొకనాడు శివుడు ప్రత్యక్షమై "నీవితరదేవతలను ద్వేషించునంతకాలము నేను నీయెడ ప్రీతుడనుకాను" అనిచెప్పెను. కాని ఆతడు వినడయ్యెను. కొన్ని దినములైనపిమ్మట శివుడు వానికి మరల కాన్పించెను. కాని హరిహరరూపము దాల్చి వచ్చెను; అనగా సగముభాగము శివునిరూపు, తక్కినభాగము విష్ణువుగా నుండెను. ఆనరుడు సగము సంతోషమును సగము వెగటును పొందెను. తానర్పించు నైవేద్యమును శివునిరూపుగల వైపునుంచి, విష్ణురూపున్నవైపున నేమియు పెట్టడయ్యెను. తన యిష్టదైవతమగు శివునికి ధూపమువేసి, ఆసువాసనను అనుభవించిపోవునేమొయని విష్ణునిముక్కు గట్టిగ నదిమిపట్టినాడు. అంతట "నీమూర్ఖత చక్కబడరానిది. నేనిటుల ద్వైతరూపముదాల్చి, సకలదేవతలును ఒక్కపరబ్రహ్మయొక్క వివిధ కళాప్రదర్శనములేయని నీకు నచ్చచెప్పబూనితిని. సద్బుద్ధితో నీవు గుణపాఠమును నేర్చుకొననైతివి. నీవైషమ్యబుద్ధికై నీవు దుఃఖములనుభవించవలసినదే. చిరకాలము నీవు దండనలపాలుకావలయును" అని శివుడుపలికెను. అంతట నామనుజుడు గ్రామాంతరమునకు బోయి దాగియుండెను. కాని గాఢతరవిష్ణుద్వేషమును హృదయమున రగుల్కొల్పుకొనెను. ఆయూరిపిల్లకాయలు ఆతడువినునటుల విష్ణునామముల నఱచి వానిని పీడించసాగిరి. అతడు రెండుచెవులకును రెండుగంటలను గట్టుకొని, పిల్లలు "విష్ణు విష్ణు" అనుతోడనే తన కాధ్వని వినరాకుండ ఘంటలను మ్రోగించుచుండెడివాడు. ఈ కారణముచేత వానికి ఘంటాకర్ణుడను పేరుప్రసిద్ధమైనది.

954. ఏమియు ఉద్యోగములేని ఒకమనుష్యుడు ఏదేని పనిని సంపాదించుమనభార్యయొక్క పోరు పడలేకుండెను. ఒకనాడు వానికుమారుడు చాలజబ్బుచేసి, వైద్యులు ఆశలు లేవనిచెప్పు స్థితిలో నుండగా ఉద్యోగము సంపాదించు నిమిత్త మామనుష్యుడు తిరుగసాగెను. ఇంతలో కొడుకు చచ్చిపోయినాడు; తండ్రి కొఱకైవెదకగా యెక్కడనుకానరాలేదు. తుదకు సాయంకాలము ప్రొద్దుక్రుంకిపోయిన పిమ్మట అతడింటికిరాగా, ప్రాణావసానకాలమున కొడుకును విడిచిపోయినాడని భార్య వానిని చివాట్లుపెట్ట మొదలిడెను. ఆయన చిరునగవుతో నిట్లనెను:- "వినండి వినండి. నే నొకసారి రాజునైనట్లును, ఏడుగురు కొడుకుల గనినట్లును, వారితో అష్టైశ్వర్యములను అనుభవించుచున్నట్లును కలను గంటిని. కాని మేల్కొనగానే వారెవరును కానరారైరి! అదొక స్వప్నము. నేను ఆనాటి ఏడుగురు కొడుకులకై ఏడ్వవలెనా? లేక యిప్పుడు చచ్చిన నీకొడుకై ఏడ్వవలెనా? చెప్పుము!" ఈ ప్రపంచానుభవమును స్వప్నముగా నెంచు నరుడు, సామాన్య నరులవలె సంసారబంధుత్వముల నమ్ముకొని, సుఖములనుగాని, దుఃఖములనుగాని పొందబోడు!

955. శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుని హృదయమున ఒకప్పుడు గర్వము ప్రవేశించినది. తన స్వామియు, మిత్రుడునైన శ్రీకృష్ణునియెడల భక్తివిశ్వాసములు చూపు టలో తనతో సమానులులేరని అర్జునుడు భావించెను. సర్వజ్ఞుడగు శ్రీకృష్ణభగవానుడు వాని హృద్గతభావమును గనుగొని యొకనాడు విలాసముగా తిరుగుటకై వానిని తోడ్కొని పోయెను. వారు కడుదూరముపోకమునుపే యొక బ్రాహ్మణుడు ఎండిపోయిన గడ్డిన నమలుచు కాన్పించెను. వానిమొలలో ఒక ఖడ్గము వ్రేలాడుచున్నది. వానిని చూడగనే, ఏజీవికిని హింసచేయనొల్లని "అహింసా పరమోధర్మ" యను నీమముంబూనిన పవిత్ర విష్ణుభక్తవరుడై యుండునని అర్జునుడు గ్రహించెను. గడ్డిలోను ప్రాణముండుటం జేసి పచ్చిగానుండు గడ్డినైనను అతడు తిన సహించకుండెను; కావున ఎండి ప్రాణశూన్యముగనున్న గడ్డిని మాత్రమే ఆతడు తినుచున్నాడు. అయినను ఖడ్గధారియైయున్నాడు. ఈ వైపరిత్యముంగూర్చి వింతజెందిన అర్జునుడు శ్రీకృష్ణస్వామితో "ఇదేమివింత! తుదకు గడ్డిపోచకైననుహానిచేయనొల్లని సాధుపురుషుడు, ద్వేషమూలమును మారణోపకరణమును అగు ఖడ్గమును ధరించియున్నాడు!" అనెను. "ఆతనినినీవేప్రశ్నించి తెలిసికొనుము" అని భగవానుడు పలికెను. అర్జునుడంతటబ్రాహ్మణుని సమీపించి "స్వామీ! నీ వేజీవినిహింసించబోవు! ఎండుగడ్డినితిందువు. అట్టి నీవీకఱకుకత్తిని పూనియుంటివేల?" అని అడిగినాడు. నాకు కంటబడిరేని నలుగురినిశిక్షించనెంచి దీనినిపూనియున్నాను" అని బ్రాహ్మణుడు తెలిపెను.

అర్జునుడు - "వారెవరెవరు?"

బ్రాహ్మణుడు - "మొదటివాడా నీచుడు నారదుడు" అర్జు:- "ఏల? ఆయన యేమిచేసెను?"

బ్రాహ్మ:- "ఏమిచేసెనా? వాని దుండగముచూడు; తనకీర్తనలు, తన సంగీతముతో నాస్వామికి నిద్రలేకుండ చేయుచుండును. స్వామిసుఖము వాని కిసుమంతయు పట్టదు. వాడుసదా ప్రార్థనలుచేయుచు స్తోత్రముల పాడుచు, రేయింబవళ్లు ఈకాలము ఆకాలము అనక, స్వామికి శాంతిదోప నీడు."

అర్జు:- "రెండవయతడెవడు?"

బ్రాహ్మ :- "ఆపెంకియిల్లాలు ద్రౌపతి!"

అర్జు:- "ఆమె నేరమేమి?"

బ్రాహ్మ:- "దాని అవివేకముంగనుము; నాస్వామిసరిగా భోజనమునకై కూర్చుండువేళ, ఉచితానుచితము లరయక, బొబ్బలిడసాగినది. నాస్వామి తినబోవునన్నమునువిడిచి గబగబ కామ్యవనమునకు పర్విడి దుర్వాసుని శాపమునుండి పాండవుల రక్షింపబోయినాడు! ఇంకను దానిపొగరేమని చెప్పను. నాస్వామికి అందఱు తినగామిగిలిన ఎంగిలి అన్నము పెట్టినదట!"

అర్జు:- "మూడవవారెవరు?"

బ్రాహ్మ:- "ఆనిర్దయుడు ప్రహ్లాదుడు! వాని ఆగడము ఎంతనుకొన్నారు! జంకుగొంకు లేకుండ నాస్వామిని పిలిచి సలసలకాగుచున్న నూనెతొట్టెలో దింపినాడు. మదపుటేనుగుల పాదములక్రింద త్రొక్కించినాడు. ఇనుపస్తంభమును పగులకొట్టుకొని వచ్చునటుచేసినాడు!"

అర్జు:- "నాల్గవవారెవరు?"

బ్రాహ్మ:- "ఉన్నాడొక ఖలుడు, అర్జునుడు."

అర్జు:- "ఏమి? అతడేమిపాపముచేసినాడు?"

బ్రాహ్మ:- "వాని అదరుపాటుకాల, నాస్వామిని తీసికొనిపోయి కురుక్షేత్రరణములో తనకైబండితోలు నీచపుపని యందు నియోగించినాడు."

అర్జునుడు ఆబ్రాహ్మణుని భక్తిఎంతగాఢమైనదో తెలిసి నివ్వెఱపోయినాడు. ఆక్షణమునుండి వానిగర్వము అదృశ్యమైనది; తానే స్వామిభక్తులలో మేటిననుకొనుట మానినాడు.

956. వైరాగ్యమును నేర్చుటయెట్లు?:- ఒకానొకపురుషునితో భార్య "నాధా! నాకు నాఅన్నను చూడగా చాల దిగులు కలుగుచున్నది. వారముదినములనుండి సన్యాసమును దీసికొనవలయునని చూచుచున్నాడు; అందుకై ప్రయత్నములును చేయుచున్నాడు. క్రమక్రమముగా తన కోరికలను అవసరాలను తగ్గించి వేయుచున్నాడు!" అనెను. భర్త యిట్లనెను:- "ప్రేయసీ! నీఅన్ననుగూర్చి నీకు దిగులే అవసరములేదు. అతడెన్నడును సన్యాసి కాబోడు. ఆరీతిగా నెవడును సన్యాసి కాజాలడు." ఈపలుకువిని "ఇంక సన్యాసిఅగు విధమేది?" అని భార్య అడిగినది. "అది యీవిధాన జరుగవలయును" అనిచెప్పుచు ఆమెభర్త తన వస్త్రములను తటాలున చింపివేసి, ఒక్కటేపేలికనుదీసి గోచిగా ధరించినాడు. అంతటినుండి ఆమెయు, ఆమెనుబోలు స్త్రీజనమును తనకు తల్లులని చాటినాడు. వెంటనే గృహమునువిడిచి పర్విడిపోయి తిరిగి కాన్పించడయ్యెను.

957. ఒకడు తన యిరువురు కుమారులను దీసికొని పొలములోగుండ పోవుచుండెను. ఒక బాలుని చంకనెత్తికొనినాడు; రెండవవాడు తండ్రిచేతిని పట్టుకొని నడచుచున్నాడు.

గరుడ పక్షి యొకటి వారికి కానవచ్చినది. తండ్రి చేయిబట్టుకొని నడుచు బాలుడు తనపట్టువిడిచి చేతులుచఱచుచు ఆనందముతో నాన్నా! నాన్నా! అదిగో గరుత్మంతుడు వచ్చినాడు! అనికేక లిడసాగెను. ఇంతలో తడబడి పడిపోయెను; దెబ్బలు తగిలినవి. తండ్రియొడిలోని బాలుడును ఆనందముతో చప్పట్లు కొట్టినాడు; కాని పడలేదు. తండ్రి వానిని పట్టుకొనియే యున్నాడుగా! మొదటి బాలుడు ఆథ్యాత్మసాధనలందు స్వయంసాహాయ్యమును నమ్ముకొనినవాని వంటివాడు; రెండవ యతడు దేవునికి ఆత్మార్పణముచేసికొనిన భక్తునిబోలువాడు.

958. ఒకడు నూయిత్రవ్వ నారభించినాడు. అయిదారు బారలలోతు త్రవ్వినీరుగానకఆతావునువిడిచి వేసి వేఱొకతావు నిర్ణయించినాడు. అక్కడ యింకను లోతుగ త్రవ్వినాడు; నీళ్ళుపడలేదు. కావున మఱొకచోటున యింకను లోతుగ త్రవ్వించినాడుగాని ఫలములేకపోయినది. తుదకు వేసరి ఆపనినేవిడిచివేసినాడు. ఈమూడునూతులలోతును కలిపిననూరు బారలకు కొంచెము తక్కువగా నుండెను. వేర్వేఱు స్థలములకై పోక పట్టుదలతోడను విశ్వాసము తోడను తనకష్టములో సగపాలు మొదట త్రవ్విన నూతినే యింకను లోతు చేయుటలో వినియోగించిన యెడల దివ్యమైన జలము వానికి లభించియుండును. తడవ తడవకు మతములను మార్చుకొనుటయు యిట్టిదే! ఒక్క సాధననేనమ్ముకొని, దానియోగ్యతనుగూర్చి సంశయమును పూనక, భక్తివిశ్వాసములతో సాగించిన యెడల తప్పక జయముచేకూరును.

959. ఒక భార్యయు భర్తయు కూడ సంసారత్యాగము చేసి, తీర్థయాత్రలసేవించ మొదలిడిరి. వారు దాఱినిపోవుచుండగా, భార్యకన్న కొంచెము ముందు నడచుచున్నభర్తకు త్రోవలో రవ్వయొకటి కంటబడినది. దానిని భార్యచూచినయెడల ఒకవేళ లోభముచే మోహితయై వైరాగ్యఫలమును చెడగొట్టుకొనునేమొ యను భయము వానికి తోచినది. వెంటనే ఆరవ్వను నేలలోపూడ్చిపెట్టి, ఆమెకు కాన్పించకుండ చేయవలయుననుతలంపుతో నేలను గోకనారంభించెను. ఇట్లతడు నేలనుగీచుచుండగా భార్యసమీపించినది. అతడు చేయునదేమనిప్రశ్నించినది. సరియైన జవాబునీయక ఏమోమొ చెప్పి తప్పించుకొనజూచెను. ఇంతలో రవ్వ ఆమెకు కాన్పించినది, భర్తయుద్దేశ్యము ఆమెకు పొడగట్టినది. ఆమె యిట్లు మందలించెను:- "మీరెందుకు సంసారవిసర్జనముచేసి వైరాగ్యము పూనితిరి? ఆ రవ్వకును మట్టిబెడ్డకును భేదమేల మీకు స్పురించవలెను?" 960. నలుగురు గ్రుడ్డివాండ్రు ఏనుగును చూడబోయిరి. ఒకడు ఏనుగు కాలును తడవిచూచి అది స్తంభమువలె నుండుననుకొనును. రెండవవాడుదానితొండమునుతాకిచూచి అది కొండచిలువవలె నుండెననితలచెను. మూడవయతడు దానిపొట్టను స్పర్శించి పెద్దపీపావలెనుండునని యూహించెను. నాలుగవవాడుదానిచెవులనునివిరిచూచి పెద్దచేటనుపోలియుండునని యెంచెను. తుదకు ఏనుగుస్వరూపమును గురించి తమలోతాము వివాదపడసాగిరి. దారిపోవు నాతడొకడు "మీరు వివాదపడు విషయమేమిటి?" అని అడిగెను. వారు తమ వృత్తాంతమును తెలిపి మధ్యవర్తిగా నుండి న్యాయము చెప్పమనిరి. ఆమనుష్యుడిట్లనెను:- "మీలో నెవరును ఏనుగును చూచియుండలేదు. ఏనుగు స్తంభమువలె నుండదు; దాని కాళ్లు స్తంభమును పోలియుండును. ఏనుగు చేటనుపోలియుండదు; దానిచెవులు చేటలవలె నుండును. దానితొండము పెద్దచిలువవలె నుండును; దానిపొట్ట బుట్టవడువున నుండును. ఏనుగుఅనగా దానికాళ్లు పొట్ట చెవులు తొండముచేరినఆకారమగును." ఇదేవిధముగా భగవంతుని ఒక్క కళనుమాత్రము ప్రత్యక్షముచేసికొనిన వారు తమలో తాము వివాదపడుచుండుదురు.

961. పల్లెవనితలు కొందఱు తమగ్రామమునకు దూరముగనున్న సంతకుపోయి, సాయంతనము మరలిపోవుచుండగా గాలివాన వచ్చినది; చీకట్లుక్రమ్మినవి. నడకసాగక దాపుననున్న ఒక పూలవర్తకునియింట తలదాచుకొనవలసిన వారైరి. ఆవర్తకుడు దయదలచి వారిని ఒకగదిలో పండుకొననిచ్చెను. ఆగదియందు మరునాడు అమ్ముకొనునిమిత్తం చేర్చిపెట్టిన సువాసనగల పూలగంపలుండెను. ఆపూలవలన వచ్చు కమ్మనివాసనలు గాలినిండగా, ఆపల్లెవనితలు భరించ లేకుండిరి. వారికి కునుకుపట్టదయ్యెను. అప్పుడు వారిలో నొకతె "ప్రతివారును తమచేపలబుట్టలను ముక్కులకు దాపుగా పెట్టుకొనుడు. ఇక ఈపూలకంపు మనలను బాధించదు. మనము చక్కగనిదురించగలము" అని యుపాయము చెప్పెను. వారందఱును ఆమె యుపాయమునకుమెచ్చి ఆమె చెప్పినటుల చేసిరి. క్షణములో పాటికి నిదురపట్టినది; ఎల్లరును గుఱ్ఱువెట్ట సాగిరి. అభ్యాసముయొక్క బలమును మహిమయు అటులుండును. ఐహికవ్యాపారతత్పరులు విషయ చింతలకు భోగవాంఛలకును మరగినవారై భక్తివైరాగ్య వాతావరణమును సహించలేరు; ఉబ్బుగుడుచుకొనితబ్బిబ్బులగుదురు.

962. ఒకయోగి త్రోవప్రక్కను సమాధియవస్థలో నిమగ్నమైపడియుండెను. ఒక దొంగవాడాత్రోవను పోవుచు వానిని చూచి "వీడు దొంగవాడైయుండును. రాత్రి కొన్ని యిండ్లుదోచి అలసటతో యిట్లుపడి నిదురబోవుచున్నాడు. పోలీసువారువచ్చి త్వరలోనె వీనిని పట్టుకొనగలరు. నేను పారిపోవుట మంచిది" అని తనలో తాననుకొనెను. ఇట్లు భావనచేసి వెడలిపోయెను. ఇంతలో ఒక త్రాగుబోతువచ్చి యిట్లు పలుకసాగెను. "ఓహో! వీడు ముంత ఎక్కువేవేసి నాడు. ఒడలుతెలియక ముఱికి కాలువలో పడియున్నాడు! నేనే నయము. ఒరే! నీకంటె నేనే కైపు ఆపుకొన్నానే! పడిపోకుండ తూలుతూనైన పోగల్గుచున్నాను." తుట్టతుదకొక సాధువువచ్చి ఆమహనీయుడు సమాధిదశనుండెనని గ్రహించినాడు. దగ్గఱచేరి కూర్చుండి వానిపాదములను ఒత్తసాగినాడు.

963. ఒకానొక గ్రామములో మఠమొకటి కలదు. అందలి సన్యాసులు ప్రతిదినము బిక్షాపాత్రలను చేతబూని యూరిలోనికి పోయివచ్చెడివారు. ఒకదినమున ఒకసన్యాసి యిట్లు బుక్షాటనము చేయబోయి, పేదవానినొకనిని కఠినముగ కొట్టుచున్న జమీందారుని చూచెను. దయాద్రహృదయుడగు ఆసన్యాసి వానిని కొట్టవలదని జమీందారుని బ్రతిమాలెను. మహాక్రోధముచే కన్నుగానకున్న జమీందారుడు తన కోపానలమును సన్యాసిపైకి త్రిప్పినాడు. పాపము ఆయనను స్పృహతప్పిపడు నంతగా పెడపెడ బాదినాడు. ఇదంతయు కనిపట్టి యొకమనుజుడు చచ్చఱ పర్విడిపోయి మఠములోనివారికి చెప్పెను. తక్కిన సన్యాసులు ఈసన్యాసి పడియున్నతావునకు పర్విడివచ్చిరి. వారాయనను మఠమునకు మోసికొనివచ్చి యొక గదిలో పరుండబెట్టిరి. చాలసేపటి వఱకును ఆయనకు స్మృతి తెలియలేదు. చాల విచారముతో దిగులుపడి కూర్చుండిన సోదరులు విసరుచు చల్లనినీట ముఖమును కడుగుచు ఉపచారముల సాగించిరి. కొంచెము పాలు నోటిలో పోసిరి. వారిటుల ఉపచారములుచేయగా కొంతసేపటికి ఆయనతేరుకొనినాడు. ఆయన కండ్లుతెఱచి చుట్టునున్నవారిని చూడగా, ఆయన తమను గుర్తించగలడో లేడో తెలిసికొను నాతురతతో, వారిలోనొకడు "మహారాజా! మీకు పాలు త్రాగనిచ్చుచున్నవారెవరో గుర్తించితిరా?" అని బిగ్గఱగ అడిగెను. అందుకా సాధుపుంగవుడు హీనస్వరముతో "సోదరా! నన్నుకొట్టినయతడే నాకు పాలుపోయుచున్నాడు." అనెను. బ్రహ్మత్మైక్యజ్ఞానమును పొంది శుభా శుభములను ధర్మాధర్మములను దాటిపోయినగాని యిట్టి అద్వైత భావము అలవడజాలదు.

964. కట్టెలమ్మువాడొకడు అడవికిపోయి కట్టెలు కొట్టి తెచ్చి ఊరంతయు తిరిగి అమ్ముకొని యెట్టెటో పేదకాపురముచేయుచు బాధలు పడుచుండెను. ఒకనాడు ఆ అడవిగుండ పోవుచున్న సన్యాసి అతడు చాల కష్టపడి కట్టెలను నఱకుచుంట చూచి, అడవి లోతట్టునకు పొమ్మనియు, అటుల చేసినయెడల లాభము కలుగుననియు వానికి చెప్పెను. ఆకట్టెలమ్మువాడు సన్యాసి చెప్పినట్లు, లోనికిచొఱబడి పోసాగెను. వానికొక శ్రీగంధపుమాను కాన్పించినది. అతడు మోయ గల్గినన్ని శ్రీగంధపు చక్కలను కొట్టుకొనివచ్చి, అమ్ముకొని చాల లాభమును గడించగల్గెను. అతడిట్లు తలపోయసాగెను:- "ఆసాధుసత్తముడు శ్రీగంధపుచెట్టును గురించి మాట్లాడి యుండలేదు; అడవి లోతట్టునకు పొమ్మనిమాత్రమేచెప్పియున్నాడు." మరునాడు శ్రీగంధపుచెట్లున్నతావునుదాటి ఇంకను లోపలికి పోసాగెను. తుదకొక రాగి గనిని కాంచినాడు. తాను మోయగలంత రాగిని కొనిపోయి బజారులోనమ్మి చాల ధనమును సంపాదించెను. ఆమరునాడు రాగి గని దాపు నను ఆగక, సన్యాసి చెప్పినటుల ఇంకను లోతట్టునకు పోయి వెండి గనిని కనుగొనెను. తేగలిగినంత వెండినితెచ్చి అమ్ముకొని యింకను సొమ్ము సంపాదించినాడు. ఇట్లే దినదినమును అడవిలోపలికి చొచ్చుకొనిపోవుచు బంగారపు గనులను, వజ్రపుగనులను, కనుగొనుచు మహాశ్రీమంతుడాయెను. బ్రహ్మజ్ఞానమును సంపాదించకోరు నతడీ తీరుననే చేయవలయును. ఏకొలదిపాటి సిద్ధులనో మహిమలనో సంపాదించగనే ఆగిపోక సాధనను సాగించినయెడల పరమాత్మ జ్ఞానమహ దైశ్వర్యమును పడయగల్గును.

965. మంగలియొకడు భూతముఆవేశించిన చెట్టుక్రిందుగా పోవుచు "బాంగారుతో నిండిన ఏడు కడవలు నీకు కావలయునా?" అను ధ్వనినివినెను. ఆమంగలి యిటునటునుచూచి యెవరిని కాంచలేదు. కాని, ఏడు బంగారపు కడవలు కావలెనా అనుశబ్దము వానిలోలోభమునుపుట్టించగా; ఆతడు బిగ్గఱగా "ఔను. ఆఏడుకుండలను నేనుతీసికొనెదను" అని అఱచినాడు. "పొమ్ము! ఇంటికిపొమ్ము! నేనాకుండలను నీయింటికిచేర్చినాను" అను ధ్వని వినవచ్చినది! ఈ వింతపలుకులు సత్యములా అని తెలిసికొను ఆతురపాటుతో రివ్వు రివ్వున యింటికి పర్విడినాడు. ఇంటిలో అడుగిడగానే ఎదుట బంగారముతోనిండిన ఏడుకుండలు కండ్ల బడినవి! ఆతడు వానిని పరీక్షించిచూడగా ఒక్కదానిలోమాత్రము సగమువఱకు బంగారమున్నది; తక్కినవానిలో నిండుగా బంగారమున్నది. ఆమంగలిమనస్సున ఇప్పుడొక తీవ్రసంకల్పముపుట్టినది. ఆఏడవకుండను బంగారుతో నింపవలెను; అప్పుడు వాని ఆనందము సంపూర్ణము కాగలదు అని వానికి తోచినది. ఆతడు తనయొద్దనున్న బంగారు నగలను వెండినగలను అన్నిటిని అమ్మి వరహాలుగమార్చి ఆకడవలో వేసినాడు. కాని ఆవిచిత్రపుకడవ ఎప్పటివలెనే పూర్తికాకయేయుండెను. అందువలన మంగలికి మిగుల ఆరాటముకలిగి, తానును తన కుటుంబమును తిండికిలేక మాడుచును, సంపాదించిన ఆర్జన నంతటిని బంగారుగ మార్చి, దానిలో పడవేయసాగెను. కాని ఆకుండ ఎప్పటియట్లేయుండెను. ఒకనాడు తనసంపాదన కుటుంబపోషణకు చాలకున్నదనిచెప్పి తనజీతమును పెంపు చేయుడని రాజును అతడు వేడుకొనినాడు. ఈమంగలి మీద రాజునకు అభిమానముండుటచేత వాని జీతమును తక్షణమే రెట్టింపుగావించ యుత్తర్వులచేసినాడు. ఆమంగలి తన రెట్టింపు జీతమును పైసంపాదన ద్రవ్యమును అంతయు ఆకుండలోవేయుచుండెను. కాని ఆకడవనిండు సూచనలేవియు కానరాలేదు. తుదకామంగలి తిరిపెమెత్తసాగి, తన ఉద్యోగముచేవచ్చు జీతమును, ఇతరసంపాదనమును, తిరిపెపుడబ్బును, సర్వమును ఆవింతకడవలోనె వేయసాగెను. నెలలు గడచుచున్నవి. ఆలోభియొక్క దుఃఖము పెంపొందుచుండెనే గాని తగ్గుటలేదు. రాజు వాని దీనదశనుకనిపట్టి ఒకనాడు "ఓరీ! నీజీతము సగముగానున్న దినములలోనే నీవు సంతోషముతోడను, ఆనందముతోడను, వికాసముతోడను చూపట్టెడి వాడవు. నీ జీతమును రెట్టింపుచేసినపిమ్మట నీవు శోకాక్రాంతుడవై దిగులు నిరాశ పొంది చిక్కినట్లున్నావు. నీకేమి వాటిల్లినది? నీ వాఏడుకుండలను తెచ్చుకొంటివాఏమి?" అని అడిగెను. ఈ ప్రశ్నవినగానె మంగలి ఉలికిపడి "ప్రభూ! ఎవరాసంగతిని ఏలినవారికి వినిపించినారు?" అనెను.

రాజిట్లుపలికెను:- "నీకుతెలియదా? ఎవరికా ఏడుకడవలను యక్షుడు దత్తముచేయునో వారియందీలక్షణములే కానవచ్చును. ఆయక్షుడు నాకును వానినితీసుకొమ్మనిబోధించినాడు; కాని ఆధనము వ్యయధనమా, దాపుడుధనమా, అనగా ఆసొమ్ము వాడుకొనుటకు వీలగునదాలేక దాచి పేర్చియుంచవలసినదా అని అడిగితిని. నేనీప్రశ్నను అడుగగనే యక్షుడు మారుపలుకక పారిపోయినాడు. ఆధనము ఎవరును వాడుకొనదగినదికాదని నీకుతెలియదా? ఇంతేకాక దానిని తెచ్చుకొనువారికి ధనము కూడబెట్టుతలంపేగాని వినియోగముచేయుబుద్ధి యుండదు. తక్షణమేపోయి ఆధనమును తిరిగి యిచ్చివేయుము." రాజిట్లుబోధించగా మంగలి బుద్ధితెచ్చుకొని ఆచెట్టుకడకుపోయి "నీబంగారును నీవుతీసికొనిపొమ్ము" అనెను. "సరే" అని యక్షుడు ప్రతిపలికినాడు. మంగలి యింటికిపోయిచూడగా, ఆకడవలు తనుయిల్లుచేరిన తీరుననే అతివిచిత్రముగా అదృశ్యమైపోయినవి. మఱియు ఆతడు ఎన్నెన్నియోపాట్లుపడి తన జీవితకాలమున సంపాదించిన ధనమంతయుకూడ ఆకుండలతో అదృశ్యమైపోయినది! స్వర్గ రాజ్యమున కొందఱి గతి యిట్లుండును. యదార్ధమగు వ్యయము ఏదియో యదార్ధమగు ఆదాయము ఏదియో, ఎఱుంగనివారు తమ సర్వస్వమును పోగొట్టుకొందురు. 966. ఒకశిష్యుడు శ్రీపరమహంసులవారిని కామమును జయించుటెట్లని ప్రశ్నించెను. ఏలన అతడు యెంతగాధ్యానమున కాలముగడపుచున్నను దుస్సంకల్పములు అప్పుడప్పుడు వానిమనస్సున పొడగట్టుచునేయుండెను. శ్రీపరమహంసుల వారిటుల బోధించిరి: ఒకనియొద్ద పెంపుడుకుక్క యుండేది. వాడు దానినిగారాబముగచూచి, తనవెంటదీసికొనిపోవుచు, దానితో ఆటలాడుచు ముద్దాడుచు నుండేవాడు. ఒకజ్ఞాని వానిచేష్టలనుచూచి, ఆకుక్కకు అంతచనువీయదగదని మందలించినాడు. అది మూర్ఖజంతువు; ఒకనాడు కఱవను కూడ తటస్థించవచ్చును. ఆమనుజుడు సాధువచనముల మనస్సునబెట్టుకొని, కుక్కను ఒడిలోనుండి త్రీసివేడినాడు; ఇక నెన్నడును దానిని దఱిరానీయ దగదనియు, ముద్దాడదగదనియు నిశ్చయముచేసికొనినాడు. కాని ఆకుక్క యజమానుని భావమును గ్రహించజాలదు కావున ఎప్పటియట్లనే ఆదరింపబడి ముద్దిడుకొనవడుటకై తఱచుగా వానికడకు పర్విడివచ్చుచుండెడిది. అనేకపర్యాయములు అతడు దానిని విదలించి కొట్టగా కొట్టగాగాని అది వానిని బాధించుట మానలేదు. నీస్థితియు అటులనున్నది. నీవింతకాలమును నీహృదయమునబెట్టుకొని లాలనచేసినకుక్క, దానిని నీవు విడువ నిశ్చయించుకొనినను అదినిన్ను సులభముగా విడువదు. అయినను గొప్ప భంగపాటులేదు. ఆకుక్క ముద్దాడుమని దాపునకు వచ్చినప్పుడు, దానిని ఆదరింపకుము; అది చేరవచ్చునప్పుడెల్ల బాగుగమర్దించి వెడలనంపుము. కొంతకాలమునకు, అదినిన్ను బాధించుటమాని దూరముగ తొలగును. 967. ఒకగొల్ల, ఏటి కావలియొడ్డున నుండు బ్రాహ్మణునకుపాలు తీసికొనిపోయియిచ్చుచుండేది. పడవ సరిగానడువని కారణమున ప్రతిదినమును సకాలమున పాలందీయలేకుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు చివాట్లుపెట్టగా "అయ్యో, నేనేమిచేయుదును? ఇంటికడనుండి పెందలకడనే బయలుదేఱి వచ్చితిని. ఏటియొడ్డున పడవవానికొఱకును, పడవదాటువారందఱు చేఱుకొఱకును కనుపెట్టుకొని కూర్చుండవలసివచ్చినది" అని సమాధానము చెప్పినది. అంతట నాబ్రాహ్మణుడు "భగవన్నామము నుచ్చరించిన జన్మసాగరమునే దాటవచ్చునే నీవీచిన్ననదినిదాటలేవా?" అనెను. నిష్కపటహృదయయగు గొల్లది ఏరుదాటునుపాయము సులభముగా దొఱికినదని ఆనందమును పొందినది. మరునాటినుండి ప్రతిదినమును అరుణోదయ సమయమునకే పాలందించుచుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు ఆగొల్లదానితో "ఏమిది? నీవింత పెందలకడ వచ్చుచున్నావే?" అనెను. "అయ్యా! మీరుచెప్పినటుల స్వామిపేరు తలంచుకొంటూ ఏరుదాటివచ్చుచున్నాను. పడవతో పనిలేదుగదా!" అని గొల్లది చెప్పినది. బ్రాహ్మణుడు ఆపలుకులు నమ్మలేకపోయెను. "నీవు ఏరెట్లు దాటినావోచూపెదవా?" అని అడిగినాడు. ఆస్త్రీ బ్రాహ్మణుని తనతోతీసుకొనిపోయి నీటిమీద నడిచిపోసాగెను. వెనుకకుతిరిగిచూడగా బ్రాహ్మణుని దురవస్థతెలిసెను. "అదేమిటండీ? నోటితో భగవన్నామమును పఠించుచు చేతితో బట్టపైకెట్టిపట్టుకొందురేమి? తడియుననియా? మీరు పూర్తిగాదేవునిపైనాధారపడియుండరేమి?" అని గొల్లది ప్రశ్నించెను. స్త్రీగాని పురుషుడుగానిసలుప గల్గు అలౌకికచర్యలరహస్యము వారు పూర్ణముగను సుస్థిరముగను భగవంతునిపై విశ్వాసముంచుటలోనున్నది.

968. ఒకచోటున పామువసించుచుండెను. ఆవైపుగా పోవుటకు ఎవరును సాహసించెడివారుకారు. ఏమన ఎవరేని అచ్చోటికిపోయిరా అది తక్షణమే కఱచి చంపెడిది. ఒకనాడు మహాత్ముడొకడు ఆత్రోవనుపోగా పాము వానిని తఱుముకొనిపోయి కరువజూచెను. కాని అదివానిని సమీపించగనే తన భీకరస్వభావమును గోల్పోయి ఆయనయోగమహిమకు వశమైపోయినది. అప్పుడు దానినిచూచి యోగి "మిత్రమా! నీవు నన్ను కఱవనెంతువా? అనెను." పాము సిగ్గుపడి మిన్నకుండెను. తుదకాయన "ఇటువినుము, సోదరా! ఇకమీదట నీ వెవరిని హింసింపకుము" అనిబోధించెను. పామును శిరమువంచి అందుకొడంబడెను. యోగి వెడలినాడు; పాము తన కలుగున ప్రవేశించినది. అప్పటినుండి అది నిరపాయకర జంతువై, ఎవరిని బాధింపనెంచక పావనజీవనమును గడపు చుండెను. కొలది దినములకే చుట్టుపట్టుల వారెల్లరును ఆపామువిషము వమ్మయ్యెననియు, చెంతకుపోయిన అపాయములేదనియు చెప్పుకొనుచు దానిని పలువిధముల పీడించసాగిరి. కొందఱు రాళ్లు రువ్విరి; కొంద`రు క్రూరత తోకబట్టియీడ్చిరి; ఈవిధముగా దానిబాధలు వర్ణించనలవి కాకుండెను. అదృష్టవశమున యోగితిరిగి ఆమార్గముననేవచ్చి గాయములచే కృశించియున్న పాముదుర్దశనుగాంచెను. చాల జాలిచెంది హేతువేమని యడిగెను! అందుకాపాము స్వామీ! మీబోధననుసరించి నేనెవరిని హింసించకుండుటే కారణము కటా! వారెంతయు క్రూరులైవర్తించుచున్నవారలు" అనెను. యోగినవ్వి యిట్లుపలికెను:- "మిత్రమా! నేను ఎవరిని కఱవవద్దని చెప్పితినిగాని, ఎవరిని భయపెట్టవలదంటినా? నీవేజంతువును కఱవకున్నను, బుస్సుకొట్టి ఎవరును నీదఱికిరాకుండ నుంచగల్గుదువే."

అటులనే మీరు సంసారులై జీవించునెడల బెదరించువారును, గౌరవపాత్రులునునై యుండవలయును. ఎవరికిని హింస కలిగింపకుడు; మఱియు ఎవరివలనను హింసలను పొందకుడు.

969. "సర్వము బ్రహ్మమేన"ని గురువు బోధించెను. శిష్యుడు దానిని అక్షరతః అర్థముచేసికొని, దాని అంతరార్థమును తెలియడయ్యెను. ఒకనాడు రాజవీధినిపోవుచుండగా వానికి ఏనుగొకటి ఎదురయ్యెను. పైనున్నమావటివాడు "తొలగుడు; తొలగిపొండు" అని అఱచుచుండెను. బ్రహ్మచారి "నేనేల తొలగిపోవలెను? నేను బ్రహ్మమను; ఆఏనుగును బ్రహ్మమే. బ్రహ్మమునకు బ్రహ్మమువలననే అపాయమేమి రాగలదు? అని తర్కించుకొనసాగెను; అటుల తర్కించి దాఱి తొలగడయ్యె. తుదకు ఏనుగు వానిని తొండముతో పట్టుకొనిప్రక్కకువిసరివేసినది. బ్రహ్మచారికిగాయములుతగిలినవి. కొంతవడికి ఎట్టెటోగురువునుసమీపించి తనపాటునంతను వివరించి చెప్పినాడు. గురువామీదట "మంచిదే! నీవు బ్రహ్మవు; ఆఏనుగును బ్రహ్మము! కాని మావటివానిరూప ముననున్న బ్రహ్మము పైనుండి నీకు హెచ్చరిక చేసెనుగదా? ఆబ్రహ్మముమాటనీవేల చెవినిబెట్టవైతివి?" అని మందలించెను.

970. ఒకసారి నారదుడు తనకుమించిన భక్తుడులేడను గర్వమును పొందెను. వానిభావమును గ్రహించి శ్రీహరి యిట్టులనెను. "నారదా! అల్లదిగో నీవాగ్రామమునకు పొమ్ము. అచ్చట గొప్పభక్తుడొకడుకలడు. వానిపరిచయము చేసికొనుము. అతడు నాభక్తుడు."

నారదుడాయూరికిపోయి ఒక వ్యవసాయకుని కనుగొనెను. ఆతడు ఉదయముననేలేచి ఒక్కసారి హరీ! అనుచు నాగలినితీసికొని పొలమునకుబోయి దినమంతయు నేలదున్నుచుండును. రాత్రివేళమరల ఒక్కసారి హరీ! అని పరుండును. నారదుడిట్లు తలంచెను; "ఈమోటుమానిసి భగవద్భక్తుడెట్లు కాగలడు? వీడు దినమంతయు తీరికలేక పనులుచేయుచుండును. భక్తుని చిహ్న లెవ్వియు వీనియందు కానరావు."

అంత నారదుడు తిరిగి శ్రీహరిని సమీపించి తాను చూచివచ్చిన విషయమును తెలిపెను. ఆపలుకు లాలకించి శ్రీహరి "నారదా! ఈ నూనెగిన్నెను తీసికొని పట్టణమును చుట్టిరమ్ము. ఒక్కచుక్కయైనను గిన్నెనుండి పడరాదు సుమీ! అనిచెప్పెను. నారదుడటులచేసి తిరిగివచ్చినప్పుడు "నారదా! ఈపట్టణముచుట్టు నీవు నడచునప్పుడు త్రోవలో నీవు నన్ను యెన్నిమారులు తలంచుకొంటివి?" అని అడిగెను. "స్వామీ! ఒక్కసారియు అటులచేయ లేదు. అంచులదాక నిండియున్న ఈగిన్నెను కనిపెట్టి చూచు చున్న నాకు అన్యసంకల్ప మెటుల రాగలదు?" అని నారదుడు పలికెను. అంతట శ్రీహరి యిటుల మందలించెను:_ "ఈ ఒక్కగిన్నె నిన్ను నన్ను పూర్తిగ మఱచునటులచేసి, నీమనస్సును అన్యధా లాగివేసినది! ఆసేద్యగాని స్థితిచూడుము! అంతులేని సంసారభారమును మోయుచును గూడ ప్రతి దినము రెండుతడవలు నన్ను సంస్మరించును గదా!"

971. ఒక బ్రాహ్మణుడు తన శిష్యుడున్న ఒకానొక గ్రామమునకు పోవుచుండెను. వానివెంట సేవకులెవరును లేరు. త్రోవలో నొకమాదిగవాడు కాన్పించగా ఆయన వానితో నిట్లనెను. "ఓయీ! నీవు నాసేవకుడవుగానుండి నాతోడ వచ్చెదవా? నీకు చక్కనితిండి దొఱకును; నిన్ను బాగుగ పోషించెదను. రమ్ము!"

ఆ మాదిగవాడిట్లనెను:- "పూజ్యుడవగు దేవా! నేను నీచజాతివాడను; నీ సేవకుడనిని యెట్లు చెప్పుకొనగలను.

ఆ బ్రాహ్మణుడు అందుమీద, "నీకు సంశయమేల? నీవెవ్వడవో యెవరికిని తెలుపకుము; ఎవ్వరితోడను మాటాడవద్దు; ఎవరి పరిచయమునుచేసికొనకుము" అనగా ఆతడు ఒడంబడినాడు. సాయంసమయమున ఆబ్రాహ్మణుడు శిష్యునింటిలో ధ్యాననిష్ఠయందుండగా, వేఱొకబ్రాహ్మణుడు వచ్చి ఈబ్రాహ్మణుని సేవకునితో "ఓరీ! నీవు లోనికిపోయి నా చెప్పులను తెచ్చిపెట్టుము" అనెను. ఈసేవకుడు తన యజ మానుని యుపాయము ననుసరించి మా రాడక యుండెను. ఆబ్రాహ్మణుడు మఱొకసారి పలుకరించినాడు. అప్పుడును వాడూరకుండెను. ఆబ్రాహ్మణుడు చాలాసార్లు వానిని పలుకరించసాగెను; కాని వాడుమాట్లాడడయ్యెను. తుదకా బ్రాహ్మణుడు విసిగి ఆగ్రహముచెంది "ఓరీ! నీవు బ్రాహ్మణుని ఆజ్ఞను తిరస్కరించుటకు సాహసించితివే! నీపేరెయ్యది! నీవు నిజముగా మాదిగవైయుందువు!" అనెను.

ఈ మాదిగవాడాపలుకులను విని గజగజ లాడుచు తన యజమానునితో దీనముతో నిట్లనెను. "మహాప్రభూ! నాగుట్టు తెలిసిపోయినది. నేనింక నిక్కడ నుండజాలను. నన్ను చచ్చఱపోనిండు." ఇట్లు మనవిచేసి తక్షణమే కాళ్ళకు బుద్ధిచెప్పినాడు. ఇదేతీరున మాయ తనగుట్టు బయటపడిన తోడ్తోడనే పరుగిడిపోవును.

972. "అది త్వరలో జరుగును" "జరుగబోవుచున్నది". "ప్రారంభముచేయుచున్నాను"-

ఈరీతిగా పలుకుచు జాగుచేయుటవలన వైరాగ్యము మందగించును. ఎవ్వని హృదయమున వైరాగ్యాగ్ని ప్రజ్వరిలుచుండునో, ఆతడు బిడ్డకొఱకై పరితపించు తల్లినిబోలి, భగవంతునిగూర్చి తల్లడిల్లును. ఆతడు భగవంతుని వినా ఏమియు కోరదు. ప్రపంచము అంచుగోడలేని నూతివలె వానికి గోచరించును. యెప్పుడు దానిలోపడిపోదునో అని యతడు బహుజాగరూకుడై మెలగును; ఇతరులవలె "ముందు నా సంసార విషయముల నన్నిటిని చక్కచేసికొననిండు; తరువాత బ్రహ్మనిష్ఠనుపూనెదను" అని పలుకబోడు. అతడు తీవ్రమగు మనోనిశ్చయము గలిగి యుండును.

ఒకానొకదేశములో అనావృష్టిబాధ సంభవించినది. వ్యవసాయకులందఱును కాలువలుత్రవ్వి పొలములకు నీరు బెట్టుట కై తీవ్రప్రయత్నములచేయుచుండిరి. వారిలోనొకడు గట్టిపట్టుదలగలవాడు, ఏటితో తనకాలువను కలుపువరకు ఆగకుండ త్రవ్వుటకునిశ్చయించెను. వానికిస్నానమువేళయైనది. వానిభార్య కొమార్తెచేతికిచ్చి నూనెను పంపినది. కూతురు వచ్చినాయనా! "మిట్టమధ్యాగ్నమైనది. ఇదిగోచమురు, స్నానముచేయరమ్ము" అనెను. "ఉండుము; నాకింకినుపనితీరలేదు" అని తండ్రిచెప్పినాడు. మూడవజామును దాటినది; ఇంకను అతడు స్నానముచేయరాడు; తిండిమాట తలపెట్టడు! తుదకు వానిభార్య వచ్చి "నీవింకను స్నానము చేయవైతివేమి? అన్నము చల్లారిపోయినది. కూర రుచితప్పిపోవును. నీకెప్పుడును అతిఛాందసమే! ఇక నైననురమ్ము! తక్కినపని రేపో లేకున్న భోజనమైనపిమ్మటనో చేసికొనవచ్చును" అనిచెప్పసాగినది. ఆసేద్యగాడు మహారౌద్రరూపుడై, శాపనార్థములు పెట్టుచు, చేతినున్న పలుగుతో చావమోదువానివలె పెండ్లామును తఱుముచు ఇట్లనెను:- "ఓసీ! బుద్ధిహీనురాలా! చేనుఎండిపోవుచున్నది. కండ్లుకనబడుటలేదా? నేను ఈదినమున చేనుకునీళ్లు పెట్టవలెను; ఆపిమ్మటనే ఏసంగతైనను!" వాని ఆగ్రహమునుగాంచి ఆస్త్రీ పర్విడిపోయినది. భగీరధ ప్రయత్నముచేసి, ఎట్టకేలకు, అర్ధరాత్రివేళ, అతడు తనపంతమును నెగ్గించుకొనగల్గినాడు. ఏటినీరుజలజలసందడిచేయుచు తనపొలములోనికి ప్రవహించుటచూడ వానిఆనందమునకు మేర లేకుండెను. అనంతరము అతడు ఇంటికిపోయిస్నానముచేయుటకై చమురుతెమ్మనెను. స్నానమును, భోజనమును ముగించిన పిమ్మట సుఖముగా గుఱ్ఱువెట్టి నిదురించినాడు. ఇటువంటి స్థిరసంకల్పము తీవ్రసద్వైరాగ్యమునకు నిదర్శనము.

ఇంకొక వ్యవసాయకుడును అదేపనిలోనుండెను. వాని భార్యవచ్చి యింటికి రమ్మనగనే, పార భుజమునబెట్టుకొని మారాడక వెడలిపోయినాడు. ఆతడు సకాలమున పొలమునకు నీరుపెట్టుకొనలేకపోయినాడు. ఇతని వర్తనము సోమరితనమునకును, మందవైరాగ్యమునకును నిదర్శనము. తీవ్రయత్నములేక పొలమునకు నీరుపెట్టజాలని విధమున తీవ్రసంకల్పము నిష్ఠ లేనిది బ్రహ్మసాక్షాత్కారమును బడయుటయు సాధ్యముకాదు.

973. ఒకప్పుడు సాధువొకడు తన శిష్యునికి ఆత్మజ్ఞానము నేర్పు నుద్దేశ్యముతో ఒకతోటలోనుంచి వెడలిపోయెను. కొన్నిదినములకు గురువువచ్చి వానికేమైన కొఱతయుండెనా? యని విచారించెను. శిష్యుడు ఔననగా, వానికి తోడుగ నుండుటకై "శ్యామ" అను ఒకసుందరిని పంపి, మత్స్య మాంసములను స్వేచ్ఛగా తినుచుండుమని చెప్పెను. చాల కాలమునకు పిమ్మట గురువు తిరిగివచ్చి వెనుకటిరీతినే విచారణచేసెను. ఈసారి శిష్యుడు "లేవు, నా కేమియు కొఱతలు లేవు" అనెను. అంతట గురువు వారిరువురను పిలిచి శ్యామచేతులనుచూపి "ఇవియేమిటో చెప్పగలవా?" అని శిష్యుని అడిగెను.

శిష్యుడు - "ఏల అట్లడిగెదరు? అవి శ్యామ చేతులు!'

గురువు - "ఇదేమిటి?"

శిష్యుడు - "శ్యామముక్కు!"

గురువు - "ఇవేమిటి?"

శిష్యుడు - "శ్యామకండ్లు!"

ఇట్లే గురువుప్రశ్నించుచు నుండెను.

ఇంతలో "నేను ప్రతిదానినిగూర్చియు శ్యామకు చెందినదిగా చెప్పుచున్నాడనే! ఇక శ్యామఎవరు?" అనుశంక శిష్యునిమనస్సునకు తట్టినది. అంతట రిచ్చపాటుచెంది "ఈ కండ్లు చెవులు మున్నగునవి యెవరివో ఆఈశ్యామయెవరు?" అని శిష్యుడు గురువును అడిగినాడు. గురువు "ఈశ్యామ యెవరో నీవు తెలియకోరుదువేని నాతోడరమ్ము. నీకు బోధచేసెదను" అనిచెప్పు తీసికొనిపోయి ఆ రహస్యము నుపదేశించెను.

974. మండోదరి తనభర్తయగు రావణునితో "నీకు సీత కావలసియున్నచో, నీకుగల మాయాశక్తులవలన సీతా పతియగు రామునిరూపమునుదాల్చి ఆమెభ్రమపెట్టవచ్చునే?" అనెను.

"ఛీ ఛీ! మూఢురాలా! నేను రాముని పవిత్రరూపమును దాల్చినయెడల నాకింక యింద్రియ భోగవాంఛలు మనసుననిలుచునా? ఆరూపుస్ఫురణకురాగానే నాహృదయము అనిర్వాచ్యమగు ఆనందముతో తాండవించునుగదా! అప్పుడు స్వర్గమహదైశ్వర్యములును క్షుద్రములై తోచును." అని రావణుడు ప్రత్యుత్తరమిచ్చినాడు.

975. ఒక మాలవాడు మాంసముతోనిండిన తట్టలను యిరువైపులను కావడిలో పెట్టుకొని మోయుచు, శ్రీశంకరాచార్యులవారికెదురుపడెను. ఆయన అప్పుడే గంగాస్నానముచేసి మరలిపోవుచుండెను. ఆయన పవిత్రశరీరమునకు మాంసపుకావడి తాకుట తటస్థించినది. "ఛీ ఛీ! నీవు నన్ను తాకితివే!" అని శ్రీశంకరాచార్యులువారు క్రోధియై పలికిరి. ఆమాలవాడిటుల ప్రతిపలికెను:- "అయ్యా! నేను నిన్ను తాకలేదు; నీవునన్ను తాకలేదు. నీవుయదార్ధమున శరీరమా, లేక మనస్సా, లేక బుద్ధియాతర్కించి చెప్పుము. నీవుఎవ్వరవో యదార్దము వచింపుము. ఈవిశ్వముగాకూడిన త్రిగుణములలో దేనికిని, సత్వమునకుగాని, రజస్సునకుగాని, తమస్సునకు గాని, యదార్థముగ నీఆత్మ అంటియుండజాలదని నీకు తెలియునుగదా!"

అంతట శ్రీ శంకరాచార్యులు లజ్జావహితుడై సత్య ప్రబోధమును గాంచినాడు.

976. ఒక తండ్రికి ఇద్దఱు కొడుకులుండిరి. సరియైన వయస్సురాగానే వారిని బ్రహ్మచర్యాశ్రమమును స్వీకరింపజేసి, వేదాధ్యయనము కొఱకై ఒక గురువునొద్ద ప్రవేశపెట్టినాడు. వారు చదువులముగించి చాలకాలమునకు ఇంటికి మరలివచ్చిరి. వారువేదాంతమును చదివియుండిరాయని తండ్రి విచారణ చేయబూనినాడు. వారౌనని చెప్పగా, "మంచిది! బ్రహ్మమన నెట్టిదో నాకుచెప్పుడు" అనెను.

పెద్దకుమారుడు వేదములనుండియు, శాస్త్రములనుండియు, ప్రమాణములనుఎన్నిటినోజూపుచు ఇటుల జవాబుచెప్పినాడు:- ఓజనకా! బ్రహ్మమును నోటిమాటలతో వర్ణించుటకు వీలుపడదు; అది మనస్సునకు గోచరముకాదు." ఇటులతెలిపియు బ్రహ్మము ఇట్టిదిఅట్టిది అని వర్ణింపబూని, నాకంతయుతెలియునని వక్కాణించినాడు. తాను చెప్పుదానిని బలపఱచుటకై శృతివాక్యములను ఏకరువుపెట్టసాగెను.

కొంతవడికి తండ్రి వానితో "సరే! నీకు బ్రహ్మమును నిజముగా తెలిసినట్లే! నీపనిమీద నీవుపొమ్ము" అని వానిని పంపివేసెను. పిమ్మట చిన్నకొమరునిగూర్చి ప్రశ్నను తిరిగి వేసెను. ఆకుర్రవాడు మౌనముదాల్చినాడు. వానినోట ఒక్క పలుకైనను వెలువడదయ్యె. మాటాడుటకై ప్రయత్నమునేని అతడు చేయలేదు.

తండ్రి యిటులపలికినాడు:- "మంచిది; బిడ్డా! నీవు చేసినదే సరి! అవ్యయునిగురించి ఏమియు చెప్పగలదిలేదు. దానినిగురించి చెప్పుటకు నోరుతెఱవగనే అనంతము సాంతముగను, సంగరహితుని సంగసహితునిగను, అప్రమేయుని ప్రమేయునిగను వర్ణింపబూనినట్లనెను. మహాప్రగల్భముతో నూరు శ్లోకములను ఏకరువుపెట్టుటకంటే మౌనముతాల్చుట ఈవిషయమున మహోపన్యాసము నిచ్చినట్లగును!"

977. అగ్బరు రాజ్యము చేయుచుండినకాలమున ఢిల్లీ సమీపమున నొక అడవిలో ఫకీరొకడు ఒక గుడిసెలో వసించుచుండెను. అనేకులుప్రజలు వానిని దర్శించి వచ్చుచుండిరి. కాని వారికెవరికిని తన ఔదార్యమునుచూపుటకు వానికడ నేమియులేకుండెను. వానికి ధనము కావలసివచ్చినది. అగ్బరు ఫకీరులయెడ భక్తిగలవాడను ప్రఖ్యాతియుండెగాన, ఈఫకీరు ధనసాహాయ్యముకొఱకై పాదుషాకడకుపోయెను. అగ్బరు ఆసమయమున దైవప్రార్థన సలుపుచుంటతెలిసి ఫకీరు ప్రక్కనకూర్చుండి వేచియుండెను. అగ్బరుషా తన ప్రార్థనలలో "ఓదేవా! నాకు ఇంకను సంపదనిమ్ము! ఎక్కువ బలమునుగ్రహింపుము! నారాజ్యమును విస్తరింపజేయుము!" అని వేడుకోలుసాగించినాడు తక్షణమే ఫకీరు లేచి గదివిడిచి పోనుండెను. ఇంతలో చక్రవర్తియగు అక్బరు కూర్చుండియుండుడని సైగచేసినాడు.

ప్రార్థానానంతరము పాదుషా ఫకీరుతో "మీరు నన్ను చూడవచ్చితిరే! నాతోఏమియు చెప్పకుండనే వెడలిపోవ నెంచితిరేమి?" అనెను. అంతట ఫకీరు "నేను శ్రీవారిని చూడవచ్చినపనియా - ఎందుకులెండి మిమ్మును బాధించను" అనెను. వానికేమికావలయునో తెలుపుమని అక్బరు ఒత్తిడిచేసి అడుగసాగెను. తుదకు ఫకీరు "అయ్యా! నాకడకు అనేకులు బోధకొఱకై వత్తురు. ధనములేమిచేత నేను వారిని ఆదరింపజాలకున్నాను. కావున చక్రవర్తులగు మీసాహాయ్యమునుకోరుట మంచిది అనుకొంటిని" అని తెలిపెను. అటులైనచో తన యుద్దేశమును తెలుపకయే వెడలిపోవచూచుట కారణమేమని అక్బరు అడిగినాడు. ఫకీరిటుల జవాబు చెప్పినాడు:- "మీరలే అల్లానుగురించి ఎక్కువసంపదకొఱకును, అధికారము కొఱకును, రాజ్యముకొఱకును అడిగికొను యాచకులుగానుండుట గ్రహించితిని అంతట నాకిటులతోచినది:- "తానే యాచకుడుగానున్నపురుషుని నేను యాచింపనేల? యాచనచేయక నాకు గడవనేగడవనిచో ఆ అల్లానే యాచించుట మంచిది!"

978. ఒకప్పుడు ఒకనికొడుకు చావునకు సిద్ధముగనుండెను. ఎవరును వానిరోగము మాన్పలేకుండిరి. ఎట్టకేలకొకసాధువు వచ్చి "ఒక్కఉపాయమున్నది. త్రాచుపాము విషముతెచ్చి స్వాతినక్షత్రమునుండి పడిన వర్షబిందువులు కొద్దిగవేసి, మానవునిపుఱ్ఱెలోకలిపి యిచ్చినయెడల నీకుమారుడు బ్రతుకునని" తెలిపెను. వానితండ్రి ఆలోచించి, మరునాడే స్వాతినక్షత్రము ఆకాశమున ఉచ్చస్థానమున నుండునని తెలిసి "ఓదేవా! ఈపరిస్థితులన్నియు కలసివచ్చు నట్లనుగ్రహింపుము. నా పుత్రునిప్రాణము రక్షింపుము" అని ప్రార్థించినాడు. ఎక్కువ ఆతురపాటుతో పరితపించు హృదయముతో నాటిసాయింతనమే బయలుదేఱి స్మశానములన్నియు తిరిగి నరకపాలము కొఱకై వెదుకసాగెను. తుట్టతుదకు ఒక చెట్టుక్రింద పుఱ్ఱెయొకటి పడియుంట కాననయ్యెను. ఆయన దైవ ప్రార్ధనము చేయుచు కనుపెట్టుకొనియుండెను. ఆకస్మికముగా జల్లువచ్చి కొన్నిచినుకులు పైకితెఱచియున్నపుఱ్ఱెలో పడినవి. ఆయన సంతసించి "ఇదిగో! స్వాతి వర్షజలము నరుని పుఱ్ఱెలోనె లభించినది! అనుకొని, "భగవంతుడా! తక్కినవి కూడ సమకూర్చుము!" అని భక్తిపూర్వకముగ ప్రార్థించుచుండెను. కొలదిసేపటికే ఆపుఱ్ఱె సమీపమునందే ఒకకప్ప కాన్పించగా మరల ప్రార్థనలసాగించినాడు. ఒక త్రాచు సమీపముననున్న గడ్డిలోనుండి బుస్సుమనుచు లేచి కప్పను పట్టుకొనబోయినది. వెంటనే కప్పపుఱ్ఱెమీదుగా దుమికినది. ఆత్రాచుపామువిషము పుఱ్ఱెలో పడినది. అపరిమితమగు కృతజ్ఞత మనస్సున వెల్లివిరియ ఆతండ్రి "ఓదేవదేవా! నీకృపవలన దుర్లభవిషయములన్నియు సాధ్యములైనవి! ఇక నాపుత్రుని జీవములు సురక్షితములు కాగలవు. నేనెఱుగుదును" అనెను. కాబట్టి నేను తెలుపునదేమన, నీయందు నిజమగు గాఢవిశ్వాసమున్న యెడల ఈశ్వరానుగ్రహమువలన సమస్తమును సమకూరగలవు.

979. ఒకానొక దేవతార్చన బ్రాహ్మణుడు ఒకరింట దేవపూజలు చేయుచుండేవాడు. ఆపనిని తన చిన్నకుమారునకు ఒప్పగించి యొకసారి ఆయన గ్రామాంతరముపోయెను. నిత్యనైవేద్యమును దేవునిముందుబెట్టి ఆదేవత దానిని ఆరగించుట కనిపెట్టుమని చెప్పిపోయెను. తండ్రియాజ్ఞచొప్పున పిల్లవాడు నై వేద్యమును విగ్రహముముందుపెట్టి మౌనముతో వేచియుండెను. కాని ఆవిగ్రహము తిననుతినదు; మాటా డను మాటాడదయ్యె. పిల్లవాడుచాలసేపు అటులనే వేచియుండెను. ఆదేవత పీఠముదిగివచ్చి నై వేద్యముపెట్టిన పళ్లెరము చెంతకూర్చుండి, దానిని తినునని ఆపిల్లవాని దృఢవిశ్వాసము! అంతనాతడు "ఓదేవా! రమ్ము ఆరగింపుము! చాల ఆలస్యమగుచున్నది; నేనింక వేచియుండ జాలను" అని ప్రార్థించ మొదలిడెను. కాని భగవంతుడు పలుకలేదు. ఆబాలుడప్పుడు "భగవంతుడా! నీవీనై వేద్యమును ఆరగింపగా కనిపెట్టియుండుమని నాతండ్రి ఆజ్ఞాపించియున్నాడు. నీవేలరావు? నీవు నా తండ్రికడకువచ్చి ఆయన అర్పించుదానిని ఆరగింతువుగదా! నీవువచ్చి నేను అర్పించుదానిని గ్రహింపకుండుటకు కారణమేమి? నానేరమేమి? అనుచు ఏడ్వసాగెను. ఆవిధముగా చాలసేపు వెక్కి వెక్కి ఏడ్చినాడు. అంతట దేవతాపీఠమువంక కనువిచ్చిచూడగా, భగవంతుడు నరరూపమునవచ్చి నివేదిత పదార్థములను తినుచుంట కాననయ్యెను. అటులదేవతార్చనను ముగించి బాలుడు వెలుపలికిరాగా, ఆ యింటివారు దేవతార్చన ముగిసినయెడల ప్రసాదమును తీసికొనిరమ్మనిరి. "అవును. దేవతార్చన ముగిసినది! భగవంతుడు అంతయు తినివేసినాడు!" అనిబాలుడు పలికెను. అందఱును నివ్వెరపోయి "ఏమనుచుంటివి!" అనిరి. సంపూర్ణనిష్కాపట్యము మోమున తాండవించగా బాలుడు "ఏమున్నది? భగవంతుడు నేను అర్పించినదాని నంతటిని ఆరగించినాడు" అనెను. అప్పుడువారు దేవతార్చనమందిరముప్రవేశించి వట్టివైయున్న పళ్లెరములగాంచి అద్భుతపడిరి! సత్యమగు భక్తియొక్కయు, నిష్ఠయొక్కయు మహత్తు అటువంటిదిగ నుండును!

980. ఒకమనుష్యుడు అడవులగుండ ప్రయాణముచేయుచుండెను. త్రోవలో ముగ్గురుదొంగలు వానిని ముట్టడించిరి. వానికడ కాన్పించినదానినెల్ల వారు ద్రోచుకొని పోయిరి. అంతట నొకదొంగ "ఈమనిషిని జీవముతో విడిచిన లాభమేమున్నది?" అనుచు కత్తిదూసి వానిని చంపబోయెను. ఇంతలో మఱొకడు వానిని ఆపి, "వీనిని చంపినందువలన లాభమేమున్నది? చేతులు కాళ్లు కట్టివేసి ఒకప్రక్కను పడవేసి పోవుదము" అనెను. అంతట వారాతనిని కాళ్లుసేతులు బంధించి, త్రోవప్రక్కగా పడవేసిపోయిరి. వారు వెడలిపోయినకొంతసేపటికి మూడవదొంగ తిరిగివచ్చి "అయ్యో! నీకుబాధకలిగినదా? నీబంధనములు విప్పి నిన్ను విడుదలచేతును" అని కట్లువిప్పివేసెను. మఱియు "నాతోడరమ్ము; నీకు త్రోవచూపిపోదును" అనెను. వారటుల చాలదూరము కలసిపోగా మార్గముకాన్పించినది. అప్పుడాదొంగ "అదిగో! నీయిల్లు! ఈత్రోవనుపొమ్ము; నీయిల్లుచేరుదువు" అనెను. అంతట ఆమనుష్యుడు "అయ్యా! నీవు నాకు చాల ఉపకారముచేసినావు. నేను సదాకృతజ్ఞుడనై యుందును. నీవు నాతోకూడ మాయింటికిరావా!" అనెను. దొంగవాడాతనితో "వల్లపడదు. నేను అక్కడికి రాజాలను. పోలీసువారు నన్ను పట్టుకొనగలరు అని పలికెను. ఈసంసారమే అడివి. ప్రకృతి గుణములగు సత్వరజస్తమో గుణములే మువ్వు రుదొంగలు. జీవుడే బాటసారి. ఆత్మజ్ఞానమే వానిసొత్తు. తమోగుణము జీవుని నాశనముచేయ జూచును; రజోగుణము సంసారబంధనమున చిక్కించును. సత్వగుణము వానిని రజస్తమస్సుల బారినుండి రక్షించును. సత్వగుణముయొక్క శరణుజొచ్చి జీవుడు తమోగుణబంధములగు కామక్రోధాదుల నుండి విడివడును. సత్వగుణము జీవుని సంసారబంధనములన్నిటినుండియు విడిపించును. కాని సత్వగుణముసయితము దొంగయే. అయినను అది జీవునికి పరమాత్మనుజేరు మార్గమునుజూపి "అదిగో నీయిల్లు!" అని మాత్రము తెలుపును. అంతట అదియు అదృశ్యమగును. ఈసత్వగుణముసయితము పరమాత్మ సమీపమునకు పోజాలదు.

981. భగవత్సాక్షాత్కారమును పొందవలయునని యిద్దరు యోగులు సాధనలుచేయుచుండిరి. నారదుడు వారి పర్ణశాలమీదుగా పోవుచుండుట తటస్థించెను. వారిలో నొకడు నారదునితో నీవు స్వర్గమునుండి వచ్చుచుంటివా అనెను. నారదుడు ఔననగా, ఆయన స్వర్గాధినాధుడు ఏమిచేయుచుండగా చూచితివని అడిగెను. నారదుడు అంతట "లొట్టిపిట్టలను ఏనుగులను భగవంతుడు సూదిబెజ్జముగుండ దూర్చుచుండ చూచితిని!" అనెను. "దానిలో ఆశ్చర్యపడదగిన అంశములేదు. భగవంతునికి అసాథ్యకార్యమేముండును?" అని ఆయోగిపలుకగా, రెండవయోగి "వెఱ్ఱిమాట! అది అసంభవము! దీనివలననీవు భగవత్సాన్నిధ్యమునకు పోనేలేదని రుజువగుచున్నది" అనెను. మొదటియోగిభక్తుడు; పసివానినిబోలు విశ్వాసముకలవాడు. భగవంతునికి అసాధ్యమనునదిలేదు. ఆయన మహిమను ఎవడుపూర్ణముగ గ్రహించినాడు? భగవంతునిగూర్చి ఏమైనను పలుకవచ్చును!

982. ఒకానొక పల్లెలో సాలెయతడొకడుండెను. ఆతడు పరమార్థ చింతకలవాడు. ప్రతివారును అతనిని విశ్వసించి ప్రేమించెడివారు. ఆసాలె తాను నేసిన వస్త్రములను అమ్ముటకై బజారునకు పోయేవాడు. ఎవరేని బేరమడిగినయెడల "రామేచ్ఛవలన నూలుకరీదు ఒక్కరూపాయి. రామేచ్ఛవలన కూలి పావలా రామేచ్ఛవలన లాభము బేడ. రామేచ్ఛవలన ఈగుడ్డకరీదిప్పుడు రూపాయి ఆరణాలు" అనేవాడు. ఆతడెంత వెలచెప్పినను ప్రజలు ఆవెలనిచ్చి కొనుచు అతనియెడ కడువిశ్వాసముతో నుండిరి. ఆతడును గొప్పభక్తుడు. రాత్రులందు భోజనానంతరము ధ్యానముమీదకూర్చుండి భగవన్నామస్మరణ చేయుచుండును.

ఒకదినమున రాత్రిచాల ప్రొద్దుపోయినది; వానికి నిద్దురపట్టలేదు. చావడిలో ద్వారముకడ కూర్చుండి పొగద్రావుచుండెను. ఒకజట్టుదొంగలు ఆత్రోవను పోవుచుండిరి. వారికొక మోతగాడు కావలసియుండెను. వారీసాలెవానిని చూచి తమతో లాగికొనిపోయిరి. వారొకయింటిలో చొరబడి చాల సొత్తును మ్రుచ్చిలిరి. దానిలోకొంత ఈసాలెవాని నెత్తినబెట్టి మోయుమనిరి. ఇంతలో కావలివాడా వైపునకు రాగా దొంగలు పారిపోయిరి. నెత్తిని దొంగసొత్తు మోయు చున్న సాలె పట్టుపడెను. ఆరాత్రి ఆతడు చెఱసాలలో గడుపవలసివచ్చినది. మరునాటిఉదయము న్యాయాధికారి ఎదుట విచారణకై అతడు తీసికొని రాబడెను. గ్రామస్థులందఱు ఆవార్తవిని సాలెవానిని చూడవచ్చిరి. వారందఱును ఒక్కమాటగా "ప్రభూ! ఈమనుష్యుడు దొంగపని చేసి యుండడు." అని యేకగ్రీవముగా చెప్పిరి. న్యాయాధిపతి జరిగినదేమొ చెప్పుమని సాలెవానిని అడిగెను. అంతట సాలె యిట్లుమనవిచేయసాగెను:- "ప్రభూ! రాముని యిచ్ఛవలన నేను చావడిలో కూర్చున్నాను; రామేచ్ఛవలన రాత్రి చాలప్రొద్దుపోయినది; రామేచ్ఛవలన నేను భగవధ్యానము చేయుచుంటిని; రామేచ్ఛవలన హరినామస్మరణచేసితిని; రామేచ్ఛవలన దొంగాలావైపుగ వచ్చిరి; రామేచ్ఛవలన వరునన్ను తమతో ఈడ్చుకొనిపోయిరి; రామేచ్ఛవలన వారు ఒకయింటిలో కన్నమువేసి దూరిరి; రామేచ్ఛవలన వారుదొంగిలినసొత్తును కొంత నానెత్తినబెట్టిరి. రామేచ్ఛవలన నేను పట్టుబడితిని. రామేచ్ఛవలన నన్ను చెఱలో నుంచిరి; రామేచ్ఛవలన మీయెదుట నేను విచారణకు నిలుపబడితిని; న్యాయాధిపతి వాని నిష్కాపట్యమును పారమార్ధికతనుచూచి నిర్దోషియని విడిచివేసెను. ఆతడు బయటికి వచ్చి "రామేచ్ఛవలన నిర్దోషినైతిని" అనెను. నీవు సంసారివిగా నుండుము.; లేదా సన్యాసిగా నుండుము. అంతయు రామేచ్ఛవలననే జరుగును. బాధ్యతనంతను భగవంతునిపై నిడి కర్తవ్యకార్యములను నీవుచేయుము. 983. తీవ్రకాంక్ష భగవత్సాక్షాత్కారమునకు త్రోవ. పసివాండ్రకుండునట్టి నిష్కాపట్యముండవలయును; తల్లిని చూచుటకై వారికి కలుగునంతటి తీవ్రకాంక్ష యుండవలయును.

జటిలుడను పిల్లవాడుకలడు. అతడు బడికిపోవునప్పుడు అడవిగుండ ఒంటరిగా పోవలసి యుండెను. అతడు తఱుచుగా భయపడుచుండెడివాడు. ఈమాట అతడు తల్లితోచెప్పగా తల్లి "బిడ్డా! భయపడనేల? నీకు భీతికలిగినప్పుడెల్ల కృష్ణుని పిలువుము" అని చెప్పెను. "కృష్ణుడెవరమ్మా?" అని బాలుడు అడిగినాడు "కృష్ణుడు. నీఅన్న" అని తల్లిచెప్పినది. ఆపిమ్మట జటిలునకు అడవిలో భయముతోచినప్పుడెల్ల "అన్నా! కృష్ణా!" అని అరచెడివాడు. ఎవరును రాకపోవుట చేత ఇంకనుబిగ్గఱగా "అన్నా! ఓకృష్ణా! ఎక్కడనున్నావు? నాకు భయముకలుగుచున్నది. రారమ్ము! నన్ను రక్షింపుము." అని మొఱలిడేవాడు. పరమవిశ్వాసియగు ఈ బాలుని మొఱవిని కృష్ణుడు రాకయుండగలడా? కృష్ణుడొక చిన్న బాలునిరూపు తాల్చివచ్చి "సోదరా! వచ్చితిని. నీకు భయమెందుకు. నాతోడరమ్ము! నేను నిన్ను బడికితీసికొని పోయెదను" అనెడువాడు. ఆబాలుని బడికడ విడిచి "నీవు పిలిచినప్పుడెల్ల నేనువచ్చెదను. భయపడకుము." అని కృష్ణుడు చెప్పెడివాడు.

సత్యమగు భక్తివిశ్వాసముల మహిమయట్టిది!

984. ఆత్మజ్ఞానము పొందుటకు పారమార్ధిక సాధనలు ముఖ్యావసరము; కాని పూర్ణవిశ్వాసమున్నయెడల స్వల్పపుసాధనయే చాలును.

వ్యాసులవారు నదిని దాటబోవుచుండిరి. అప్పుడే గోపికలును వచ్చిరి. వారును ఏఱుదాటగోరి యున్నారు; కాని రేవున పడవలేదు. చేయదగునదేమని వారు వ్యాసులవారి నడిగిరి. అందుకాయన "దిగులుపడకండి నేను మిమ్మును ఏఱుదాటించెదను. కాని నాకు ఆకలివేయుచున్నది. తినుటకు ఏమైనపెట్టెదరా?" అనెను. గోపికలకడ పాలు వెన్న మీగడ యుండగా వానికి పెట్టిరి. ఆయన భుజించినాడు. అంతట గోపికలు "నదిని దాటించుటేమైనది?" అని వేగిరించిరి. వ్యాసులవారు నీటియొడ్డున నిలువబడి "ఓయమునా! ఈదినమున నేనేమియుతినియుండనియెడల, ఆ మహత్తువలన నీరుపాయలై మేము పొడినేలమీదుగ దాటిపోవునటుల త్రోవనిత్తువుగాక!" అని పలికెను. ఆయన నోటనుండి యీపలుకురాగానే నీరు రెండుపాయలై నడుమగా పొడినేల కాన్పించెను. గోపికలు అద్భుతపడిరి. "ఇప్పుడే మనము పెట్టినవన్నియుతిని, నేనేమియు నేడుతిననియెడల, అని యీయన పలుకుటేమివింత!" అని తలంచుచుండిరి. వ్యాసులవారు తానుగాదేనిని తినలేదనియు, తనలోనిస్వామియే నిజముగా ఆరగించియున్నాడనియు స్థిరభావమును కలిగియున్నందుకు అది నిదర్శనమని ఆగోపికలు గ్రహించరైరి.

985. ప్రతాపచంద్రముజుందారుగారితో శ్రీపరమహంసులవారిట్లనిరి:- "మీరువిద్యావంతులు, బుద్ధిశాలురు; జిజ్ఞాసాపరులు. కేశవచంద్రసేనులును మీరును గౌరాంగనిత్యానందులబోలు సోదరులు. మీరు ప్రపంచమును చాలినంత చూచినారు - కావలసినన్ని ఉపన్యాసాలు, వివాదములు, శాఖాసమాజాలు ఎన్నో చూచినారు. మీకింకను వానియెడ లక్ష్యమున్నదా? అటునిటు చెదఱు మీమానసములను ఏకాగ్రముచేసి భగవంతునివైపునకు మరలించు సమయము దాటిపోవుచున్నది. పరమాత్మ సాగరమున నిమగ్నులు కండు."

మజుందారుగారు:- "అవును, స్వామీ! నేను అటుల చేయవలసినదే ఆ విషయములో సందేహము లేదు. కాని ఇదంతయు నేను చేయుట కేశవుని పేరు ప్రఖ్యాతులను నిలువబెట్టుటకే!"

పరమహంసులవారు:- (నవ్వుచు) "నేనొక కథచెప్పెద వినుడు. ఒకడు కొండనెత్తిని గుడిసెవేసినాడు. చాల కష్టపడినాడు; డబ్బును హెచ్చుగ కర్చుచేసినాడు. కొద్ది దినములకే గాలివానవచ్చి ఆకొంపను ఉఱ్ఱూతలూగింపసాగినది. దాని నెటులైన సంరక్షించనెంచి "ఓదేవా! ఈగుడిసెను నాశము చేయకుము!" అని వాయుదేవుని ప్రార్థించినాడు. ఆతడు పెక్కుసారులు ప్రార్థించినను గుడిసె ఊగులాడుచునే యున్నది. అప్పుడు అతడు వేఱొక ఉపాయమును ఆలోచించినాడు. హనుమంతుడు వాయుదేవుని కుమారుడని పురాణములు చెప్పుమాట వానికి జ్ఞప్తికివచ్చినది. వెంటనే "ఓదేవా! ఈగుడిసెను కాపాడుము. ఇదినీతనయుడగు హనుమంతునిది!" అని కేకలు వేసినాడు. అయినను వాయుదేవుడు వినిపించుకొనలేదు. అంతట "ఓదేవా! ఈగుడిసె హనుమంతునిస్వామియగు శ్రీరామచంద్రునిది" అని అఱచినాడు. అప్పుడును వాయువు లక్ష్యముచేయలేదు. పిమ్మట ఆగుడిసె తలక్రిందై పోవుచుంట కనిపెట్టి తన ప్రాణరక్షణార్థమై బయటికి వచ్చివేసి, అతడు "ఈముష్టిగుడిసె ధ్వంసమైపోనీ! నాకేమి?" అనినాడు.

మీరిప్పుడు కేశవునిపేరు నిలుపుటకు ఆతురపడుచున్నారు; అయినను, భగవదేచ్ఛయుండుటంజేసి ఆ పవిత్రోద్యమము కేశవునిపేర బయలువెడలినదనియు, ఆ యుద్యమము అంతరించునేని అదియు భగవత్సంకల్పము చేతనే జరుగుననియు జ్ఞప్తినుంచుకొనుడు; శాంతిపడుడు. కాబట్టిమీరు అమృతసాగరమున నిమగ్నులగుటకు ఆయత్తపడుడు."

986. అడవులలో తిరుగుచుండగా శ్రీరామచంద్రుడు తన విల్లంబులను నేలలోగ్రుచ్చి, సంసారసరస్సులోనికి నీరుత్రాగ దిగినాడు. వానివిల్లు గ్రుచ్చుకొనుటచేత ఒడలంతయు నెత్తుటితో నున్న కప్పయొకటి, ఆయన తిరిగివచ్చినప్పుడు కంటబడినది. ఆయన విచారపడి "నీవెందుచేత ఏదోరీతిగా అరవవైతివి? అప్పుడు నీవిక్కడనుంటివని గ్రహించి నీకీ దుఃఖపాటును కల్పించి యుండెడివాడను కానే!" అని కప్పతో ననెను. అందుకాకప్ప "ఓరామా! నాకపాయము సంభవించినప్పుడు 'ఓరామా! రక్షింపుము' అనినిన్నువేడుకొనుచుందును. ఇప్పుడో నీవే నన్ను చంపుచుండగా ఇంక నెవరినిగురించి నేను మొఱలిడగలను?" అని జవాబు చెప్పినది.

987. పతివ్రతయు భక్తాగ్రేసరియు నగు ఒకానొక స్త్రీ భర్తతో కాపురముచేయుచు, బిడ్డలను ప్రేమతో చూచుచును తనహృదయమును భగవంతునిపై స్థిరముగా నిలిపియుంచెడిది. ఆమె భర్తమృతిచెందగా చేతులనున్న గాజులను బగులగొట్టివేసి వానికిమారుగా బంగారుకంకణములను ధరించినది. ప్రజలు ఆమె విపరీతచర్యను గురించి ఆశ్చర్యపడసాగిరి. అప్పుడామె యిటుల సమాధానముచెప్పినది:_ "ఇంతవఱకును నాభర్తశరీరము గాజులవలె అల్పబలముగలదై పెళుసుగ నుండెను. ఆ అశాశ్వతతనువు పోయినది. ఆయన యిప్పుడు నిర్వికారుడై సర్వవిధముల సుస్థిరుడై యున్నాడు. వానిశరీరము ఇప్పుడు ఓటికుండగాదు. కావున నేను ఓడోడుగానుండు గాజులను దీసివేసి స్థిరతరస్వభావముగల ఆభరణములను ధరించుచున్నాను."

988. ఒకపర్యాయము ఇద్దరుసాధువులు దక్షిణేశ్వరమునకు వచ్చిరి. వారు తండ్రికొమరులు. కొమారుడు జ్ఞానసిద్ధిని పడసినాడు; తండ్రికింకను సిద్ధి యలవడలేదు. ఇరువురును శ్రీరామకృష్ణపరమహంసుల వారుండు గదిలోకూర్చుండి శ్రీ వారితో ప్రసగించుచుండిరి. ఇంతలో ఒక ఎలుకకన్నములోనుండి త్రాచుపామువచ్చి కొమారుని కఱచినది. అదిచూచి తండ్రి భీతిలిపోయి చుట్టునున్నవారినందఱిని పిలువసాగెను. కాని కుమారుడు కదలక కూర్చుండియుండెను; ఇది వానితండ్రికిం కను అబ్బురము గొలిపెను. అట్లెందుకు నిశ్చలముగకూర్చుంటివని ఆయన కొమారుని ప్రశ్నింపగా, ఆ కుమారుడునవ్వి యిట్లనెను: "పాముఏది? ఎవరిని కఱచినది?" ఆతడు అద్వైతసిద్ధిని పడసినవాడు. కావునపామని నరుడని భేదభావమును దఱిరానీయడయ్యెను.

989. ఒకసారి చాకలియొకడు ఒక భక్తుని పట్టుకొని కొట్టుచుండ, ఆభక్తుడు "నారాయణ నారాయణ" అని మాత్రము పలుకసాగెను. స్వామి నారాయణుడు వైకుంఠపురములో లక్ష్మీదేవిసమీపమున కూర్చుండియుండెను. భగవానునికి వీనిమొఱవినరాగానే తటాలునలేచి వానిని రక్షించు నిమిత్తము ఆచోటునకు పోనెంచెను. కాని రెండుఅడుగులు పోయి మరలివచ్చి కూర్చుండెను. దీనిని కనిపెట్టిన లక్ష్మీదేవి భగవంతుడు అటుల వెంటనే వచ్చివేయుటకు కారణమేమని అడిగినది. స్వామినారాయణుడిటుల చెప్పినాడు: "నేను ఆ తావునకుపోవలసినఅగత్యము కానరాలేదు. ఆభక్తుడుకూడ చాకలివాడైపోయినాడు. ఆతడు తన సంరక్షకుడు తానయై నిలచినాడు; ఏలన తనను కొట్టుచున్న వానిని తిరిగి కొట్టసాగినాడు కావున నేను అక్కడికి పోవలసిన ఆవశ్యకత యేమున్నది?" చూచితిరా, భగవంతుడుతనకుపూర్ణముగ స్వార్పణచేసికొనినవానినితప్ప రక్షించబూనడు.

990. అర్చకకులమునకు సంబంధించిన యొక కథను శ్రీపరమహంసులవారు చెప్పుచుండెడివారు. శ్రీగౌరాంగదేవుడు (శ్రీ చైతన్యులు) భావసమాధిలోనుండి మైమఱచి సముద్రమున పడిపోయినప్పుడు పల్లెవాండ్రు వలలో వెలికితీయబడుట తటస్థించినది. అప్పుడు వారాయనను స్పృశించుటవలన వారికొక విధమగు మైకముకలిగినది. వారంతట తమపనిపాటలను విడిచివేసి హరినామస్మరణముచేయుచు పిచ్చెత్తినవడుపున ఆటలాడసాగిరి. వారి బంధుమిత్రాదులు వారికి చికిత్సచేయు విధమును తెలియక శ్రీ గౌరాంగదేవునికడకువచ్చి దుఃఖించిరి. శ్రీ చైతన్యులవారప్పుడు మీరుపోయి యేఅర్చకుని యింటనైన కొంచెము అన్నముతెచ్చి వారినోటిలో పెట్టుడు. వారి మైకముతగ్గిపోవును పొండు" అనిరి. పల్లెవాండ్ర బంధుగులు అటులచేయగా వారిదివ్యానంద పారవశ్యము తగ్గిపోయినది.

991. మాయ యిట్టిదని తెలియరానిది. ఒకనాడు నారదుడు శ్రీహరిని సమీపించి "స్వామీ! అసాధ్యములను సాధ్యములుగనొనర్చు నీమాయను నాకు చూపుము" అని వేడుకొనెను. శ్రీహరి వల్లెయని తలయూచినారు. కొన్నాళ్లైన పిమ్మట నారదుని వెంటదీసికొని ప్రయాణమైపోవుచు దారిలో శ్రీహరి దప్పిగొనిరి. చాలడస్సికూర్చుండి "నారదా! నాకు దప్పి హెచ్చుగనున్నది. ఎచ్చటికైనపోయి కొంచెము నీరు తెమ్ము" అని చెప్పిరి. వెంటనే నారదుడు నీటికై వెదకుచు పరుగిడిపోయినాడు.

దాపున ఎక్కడను నీరు చిక్కలేదు. చాలాదూరము పోగా ఏరొకటి యున్నటుల ఎదుటకాన్పించినది. నారదుడా ఏటియొద్దకుపోగా వానికొక సుందరాంగి నీటిదాపున కూర్చుండి కానవచ్చినది. నారదుడు మోహానిష్టుడైనాడు. దాపునకుపోగా ఆమె ముద్దులొలుకు పలుకులతో నారదుని పలుకరించినది. వెంటనే ఒకరినొకరు ప్రేమించిరి. అచ్చోటున నారదుడామెతో కాపురముచేయుచు నిలచిపోయెను. కాలక్రమమున వారికి సంతానము కలిగినది. ఇట్లు నారదుడు ఆలుబిడ్డలతో మహానందముగ కాలముగడుపుచుండగా ఆదేశములో మహామారిజాడ్యము ప్రవేశించినది. అనేకులు ఆరోగముచే మృతినొందుచుండిరి. ఆచోటు విడిచిపోవుటకు నారదుడు తలపెట్టి భార్యతోచెప్పినాడు. ఆమెయుసరేయనగా వారుబిడ్డలను చేతులుపట్టుకొని నడిపించుచు ఇల్లువిడిచి పయనమాయిరి. వారొకవంతెనమీదుగా బోవుచుండ హఠాత్తుగా వరదవచ్చి నీరుపైకుబికినది. ఒక్కొక్కరేపిల్లలు ప్రవాహవేగమున కొట్టికొనిపోయిరి. తుదకు భార్యయు నీటమునిగిపోయినది. దుఃఖావేశమునమునిగి నారదుడు ఒడ్డునఏడ్చుచు కూర్చుండెను. ఆసమయమున శ్రీహరి సమీపించి "ఓనారదా! మంచినీరేది? నీవిటులఏడ్చుచున్నావెందులకు?" అనిరి. స్వామిదర్శనముకాగానే నారదుడు దద్దఱిలిలేచెను. అంతట వానికి సర్వమును తెల్లమైనది. "ప్రభో! నీకు నమస్కారసహస్రమర్పించెద నీవిచిత్రమాయకు కోటినమస్కారములు అర్పించువాడ" నని నారదుడు పలికెను.

992. గోపాలునిగూర్చి యొకప్పుడు వర్తమానమేమియు తెలియనందున యశోదాదేవి రాధకడకువచ్చి ఆమెకేమైన గోపాలుని వర్తమానముతెలియునా యని అడిగినది. ఆసమయమున రాధ మూర్ఛిల్లియున్నది. యశోదవచనములామె విననేలేదు. కొంతసేపటికి మూర్ఛదేఱిచూడగా నందరాణి ఎదుట కూర్చుండియుంటగాంచి వందనమాచరించినది. పిమ్మట యశోదాదేవివచ్చిన కారణమేమని రాధ ప్రశ్నింపగా ఆమె తానువచ్చిన విషయము తెలిపినది. రాధఆమెతో "తల్లీ! నీకండ్లనుమూసి శ్రీగోపాలునిరూపును తలంచి ధ్యానముచేయుము. నీవాయనను చూడగలవు" అని చెప్పినది. యశోదాదేవి కండ్లుమూయుటతోడనే భావస్వరూపిణి యగు రాధ తన ఆత్మశక్తిచేత యశోదకు సమాధిదశను ప్రాప్తింపజేయగా ఆమె తన గొపాలుని చూడగల్గెను. అప్పుడు యశోదాదేవి "తల్లీ! నేను కండ్లుమూసినప్పుడెల్లను నాముద్దులగోపాలుని చూడగల్గునటుల వరమిమ్ము" అని రాధను వేడుకొనిరి.

993. పూర్వకాలమున జయపురమందలి శ్రీగోవిందాలయపు అర్చకులు పెండ్లిండ్లుచేసికొనెడివారు కారు. అప్పుడు వారు ఆత్మతేజోవిరాజితులై యుండెడివారు. ఒకసారి రాజు తనకడకురమ్మని వారికికబురుచేయగా "రాజునే యిక్కడికి రమ్మనుడు" అని జవాబుచెప్పిరి. తరువాత వారు పెండ్లిండ్లు చేసికొనసాగిరి. అప్పుడిక రాజుకు వారిని పిలువనంపించవలసిన అగత్యమేలేకుండ పోయినది. వారు తమంతట తామేపోయి "మహారాజా! ప్రభో! మిమ్ము దీవింపవచ్చితిమి. మీ కొఱకై దేవాలయమునుండి ప్రసాదమును తెచ్చితిమి. పుచ్చుకొనుడు" అనుచు వేడవలసివచ్చెను. వారటులచేయక తప్పినదికాదు. పాపము వారేమిచేయగలరు? ఒకనాడు ఇల్లు కట్టుకొను నవసరము మరొకనాడు పిల్లలకు అన్నప్రాశనము చేయువేడుక, ఇంకొకనాడు కొమార్తెల పెండ్లిండ్లు ఇట్లెన్నె న్నియో అవసరములువచ్చి నిరంతరముడబ్బునకై యాచించుచు నుండవలసినవారైపోయిరి!

994. ఒకనాడొక పల్లెవాడు రాత్రివేళ ఒక పెద్దమనుష్యుని తోటలో ప్రవేశించి కోనేటిలో చేపలుపట్ట సాగెను. యజమానునికి ఆసంగతితెలిసి తోటచుట్టును తనసేవకుల నునిచి, కాగడాలు పట్టించుకొని దొంగనుపట్టుకొనుటకై తోటలోనికి వచ్చెను. ఇంతలో నాపల్లెవాడు తప్పించుకొనిపోవుతెరవు గానక ఒడలెల్ల బూడిదపూసుకొని, సాధురూపమున ఒక చెట్టుక్రింద కూర్చుండెను. ధ్యానమున మునిగినవానివలె నటించెను. మరుచటి ఉదయాన ఆతోటలోనికొక మహాత్ముడు వచ్చియున్నాడని ఊరెల్ల చెప్పుకొనసాగిరి. కాబట్టి వందలు కొలదిప్రజలు పండ్లుపూవులు కొల్లగదెచ్చి సాష్టాంగపడి సాధుపూజల సాగించిరి. వానియెదుట వెండి బంగారునాణెములు కుప్పలుకుప్పలుగాపడినవి. అప్పుడాపల్లెవాడు "ఆహా! ఏమిచిత్రము! నిజముగా నేను సాధువునుకాను. అయినను వీరలు నన్నింతగా పూజించుచున్నారు. నేను నిజముగా సాధువునే అయిపోయినయెడల నాకు భగవంతుడే జిక్కగలడు!" అని తలపోసెను. ఈరీతిగా బూటకపు నటన ఆపల్లెవానిమనస్సున జ్ఞాన ప్రబోధము కలిగించినది!

995. ఒకానొక సాధువునకు గొప్ప మహిమలు అలవడినవి. వానిగురించి అతడు మహాగర్వియైనాడు. అయినను ఆసాధువు చాలమంచివాడు; తపశ్శాలియు నై యుండెను. వానికి బుద్ధిగఱపనెంచి భగవంతుడు సన్యాసి వేషము దాల్చి వానిచెంతకువచ్చి "అయ్యా! మీరు మహామహిమ లను సంపాదించితిరని విన్నాను" అనెను. సాధువు వానిని సగౌరవముగ స్వాగతమిచ్చి కూర్చుండజేసెను. అప్పుడే ఒక ఏనుగు ఆవైపుగా పోవుచున్నది. "అదిగో! ఏనుగు వచ్చుచున్నది. మీరు ఇచ్ఛామాత్రమున దానిని చంపగలరా? అని సన్యాసి సాధువునడిగెను. "ఆహా! చేయవచ్చును" అని సాధువు పలికెను. ఇట్లనుచు చేతిలో కొంత మట్టినిదీసి మంత్రించి ఏనుగుశరీరముపైని చల్లినాడు. ఆయేనుగు గిలగిల తన్నుకొనుచు పడిచచ్చినది. దానిని చూచి సన్యాసి ఓహో! మీశక్తి అత్యద్భుతమైనది! ఎంతసులభముగా ఏనుగును చంపితిరి!" అని పొగడెను. సాధువు సంతృప్తుడై మందహాసముచేసినాడు. సన్యాసి మరల "ఈఏనుగును తిరిగి బ్రతికింపగలరా?" అనెను. "ఆహా! "అదియు చేయనగును" అనుచుకొంతమట్టిని మంత్రించి ఏనుగు కళేబరముమీదచల్లగా అది బ్రతికి లేచినది. అంతట సన్యాసి యిట్లుపలికెను:- "బహు విచిత్రమహిమ! కాని నేను మిమ్మొక్క ప్రశ్ననడుగదలచినాను. ఇప్పుడే మీరొకఏనుగును చంపి, తిరిగి బ్రతికించ గల్గితిరి. కాని దానివలన మీ కేమిలాభము వచ్చినది? మీరేమైన అభివృద్ధి గాంచితిరా? అందువలన భగవంతుని పొందగల్గితిరా?

ఇట్లనుచు సన్యాసి అదృశ్యమయ్యెను!

996. ఒకశిష్యుడు గురువుతో తనభార్య తనను మిక్కిలిగ ప్రేమించినదిగాన, సన్యసించజాలనని చెప్పెను. ఆతడు హఠయోగాభ్యాసము సాగించినాడు. గురువు కొంతరహస్యమును వానికి బోధించినాడు. ఆకస్మికముగా ఒకదినమున శిష్యుని యింటిలో గందఱగోళము, ఏడుపులు పెడబొబ్బలు వినవచ్చెను? ఇరుగు పొరుగువారెల్ల వచ్చి ఆశిష్యుడు ఒక గదిలో కదలక మెదలక విచిత్రరీతిని కూర్చుండియుండ గాంచిరి. అందఱును ప్రాణముపోయెనని తలంచిరి. ఆతని భార్య "అయ్యో! నాధా, నీవెక్కడికిపోతివి? నన్నెందుకు విడనాడిపోతివి? ఇట్టి ఆపదవచ్చునని ఎన్నడును కలలో నైన తెలియమైతిమి!" అని విలపింప సాగెను. ఇంతలో బంధుగులు వచ్చి పాడెనుగట్టి శవమును దహనమునకై తీసికొనపోవ సిద్ధపడిరి. అప్పుడు కొంత అలజడి జరిగినది. ఆకళేబరము వంకరలుతిరిగియుండెగాన ద్వారములోనుండి రాదయ్యె. అదిచూచి పొరుగు పెద్దమనుష్యుడొకడు గడ్డపలుగును దెచ్చి ద్వారబంధమును త్రవ్వివేయ సమకట్టెను. అంత వఱకును పొక్కిపొక్కి యేడ్చుచున్న భార్య పలుగుచప్పుడు వినబడగానె అక్కడికి పరుగిడిపోయి ఏడ్చుచు వారేమిచేయ నుండిరని అడిగెను. అచ్చటివారిలో నొకడు ఆమెభర్తను ద్వారములోగుండ తీసుకొనిపో వీలులేనందున ద్వారమును ఊడగొట్టుచుంటిమని చెప్పెను. ఆభార్య యిట్లనెను:- "వద్దు, వద్దు. అలాచేయవద్దు. నేను వితంతువునైతిని; దిక్కులేనిదానను. దిక్కులేనిబిడ్డలను పోషించుకొనవలసినదాననైతిని. మీరు ద్వారమును పడగొట్టివేసినచో తిరిగి బాగుచేయుటపడదు. నాభర్తకు వాటిలినది ఏమొవాటిలినది - వాని కాలుచేతులను నఱికి బయటికితీసికొనిపొండు." తాను సేవించినమూలిక ప్రభావము తగ్గిపోవుటచేత అప్పుడే స్మృతితెలిసిన హఠయోగి, భార్యపలుకులువిని "ఏమేమే! నాకాలు సేతులు నఱుకుడనుచుంటివా?" అని లేచి బొబ్బలు పెట్టెను. తత్క్షణమే యిల్లువిడిచి గురువుతోగూడి వెడలిపోయెను.

997. ఒకపేద ఉద్యోగముదొఱకక భాదలుపడుచుండెను. అనేకపర్యాయములు రాజుకడకుపోయి పడగాపులుపడి యుండి ఏదేని సేవలోనుంచుకొనుడని వేడుకొనెను. ఆరాజు నిరంతరము ఈదినముకాదు రేపురమ్మనుచునేకాలముగడుపుచుండెను. చాలదినములు జరిగిపోయినవి. ఒకదినమున అతడు తన బాధలగురించి యొకస్నేహితునితో చెప్పుకొనెను. ఆస్నేహితుడు వెంటనే "నీవెంత తెలివిలేనివాడవు! ఆరాజు కడకు పోయిపోయి నీకాళ్ళఱిగిపోయియుండును. గంగాబాయికడకు పోయి దానికాళ్లమీద పడుము. నీకు రేపే ఉద్యోగముదొఱకును" అని ఉపాయము చెప్పెను. గంగాబాయి రాజుయొక్క ఉంపుడుకత్తె. పాపమాపేదవాడు గంగాబాయికడకేగి, "తల్లీ! నేనుకడుదుర్దశ ననుభవించుచున్నాను. నీవుతప్ప నన్ను రక్షించువారులేరు. నేను బ్రాహ్మణుడను; నాకితరమగు ఆధారములేదు. జననీ! చాలకాలమునుండి ఉద్యోగము చిక్కక దుఃఖించుచున్నాను. ఆలుబిడ్డలు అన్నమో రామచంద్రాయనిఅడలుచున్నారు. నీవొక్కమాట చెప్పితివా నాకుద్యోగము లభించగలదు" అని బ్రతిమాలుకొనెను. గంగాబాయి "సరేగాని, ఎవరితోచెప్పిన నీకు ఉద్యోగము రాగలదు?" అని అడిగినది. ఆబ్రాహ్మణుని దైన్యముచూచి ఆమె అయ్యో పాపము! ఈబ్రాహ్మణుడు కడు దరిద్రుడుగ నున్నాడు!" అనియు అనుకొనెను. ఆబ్రాహ్మణుడు వెంటనే "నీవురాజుగారితో ఒక్కమాటమాత్రము అంటివా నాకుద్యోగము రాగలదు" అనెను. గంగాబాయి ఆరాత్రియే రాజుగారితో చెప్పెదనని వాగ్దానము చేసినది. చూచితిరా! మరునాటివేకువజాముననే బ్రాహ్మణుని యింటికి రాజభటుడువచ్చి ఆనాటినుండియే ఉద్యోగమందిరమునకురమ్మని రాజుగారియుత్తర్వును తెలిపిపోయినాడు! రాజు మంత్రితో "చూడుడు! ఈబ్రాహ్మణుడు చాల బుద్ధికుశలుడు. వీనిసేవ మనకు లాభకరముగ నుండును గాన ఉద్యోగము నిచ్చితిని. ప్రవేశపెట్టుకొనుడు" అని బ్రాహ్మణుని మంత్రిపరిచయముచేసినాడు. స్త్రీమోహమునకు పురుషునిపైనట్టి శక్తికలదు. జగమంతయు కామినీకాంచనాధీనమైయున్నది!

998. ఒక బాలసన్యాసి బిక్షకై ఒక గృహస్థునియింటికి పోయినాడు. అతడు చాలచిన్నతనమునందే సన్యసించుటచేత వానికి లోకజ్ఞానము కొఱవడియుండెను. ఒకయువతి బిక్ష పెట్టరాగా, ఆమెస్తనయుగ్మమునుచూచి, నీకేమైన రొమ్మున వ్రణములు లేచినవాయని ప్రశ్నించినాడు. ఆమాటలు ఆయువతి తల్లివిని "లేదులేదు, బిడ్డా! ఆమెకవి వ్రణములుకావు త్వరలోనే భగవంతుడు ఆమెకు ఒక బిడ్డను దయచేయనున్నాడు. ఆబిడ్డకు పాలిచ్చునిమిత్తము ముందుగనే ఆమెకు రెండు స్తనములను అనుగ్రహించినాడు. బిడ్డపుట్టినప్పుడు ఆస్తనములనుండి పాలు త్రాగ గలడు." అని చెప్పినది. ఈపలుకులాలకించగనే ఆబాలసన్యాసి" ఇక నేనుతిండికై యింటింట తిరుగను. నన్ను సృజించినవాడే నాకు తిండినొసగగలడు!" అనిపలికెను. 999. ఆత్మవిచారము చేయుచుపోగా, మనసుపూర్ణశాంతినిపొందినప్పుడు బ్రహ్మ సాక్షాత్కారమగును.

ఒకడు రాజును చూడనెంచెను. సప్తద్వారములకు లోపల అంతఃపురమున రాజుండెను. ఆమనుష్యుడు మొదటి ద్వారముకడకువచ్చి, అక్కడ డంబముగా దుస్తులు ధరించి చుట్టును భటులతోకూడియున్న యొకనిని చూచెను. రాజు దర్శనార్ధముపోయినవాడు తన స్నేహితునితో "ఈతడేనా రాజు?" అనగా స్నేహితుడునవ్వి కాదనెను. తరువాత నతడు రెండవ, మూడవ, నాలుగవ ద్వారములదాటి పోవుచు అందందు హెచ్చుహెచ్చుగా డంబపు వేషములతో నుండువారిని కాంచెను. ఆతడు లోనికేగినకొలదిని ఆడంబరము హెచ్చిపోవుచున్నది. ప్రతిద్వారముచెంతను అతడు రాజు కనబడెననితలచి తన స్నేహితుని ప్రశ్నించుచు వచ్చెను. కాని ఆతడు ఏడవద్వారము దాటి రాజును ముఖాముఖిని చూచినప్పుడిక రాజెవరని స్నేహితుని అడుగనక్కరలేకపోయినది. అనంతైశ్వర్యముతో దేదీప్యమానముగ తేజరిలుచున్న రాజునుకాంచగనే తాను జననాధునియెదుట నిలువబడి యున్నటుల వానికి సహజముగనే తెలిసినది.

1000. పెద్దపులియొకటి గొఱ్ఱెలమందపై బడినది. అది సూడిపులిగాన ఎగురుటతోడనే యీనిచచ్చి పడినది. పులికూన మాత్రము ఎటోబ్రతికి గొఱ్ఱెలలో కలిసి పెరిగినది. గొఱ్ఱెలు పొలములో మేతమేయుచుండ అదియు మేతమేయ నేర్చు కొనినది. అవి అఱచినటులనే పులిపిల్లయు అఱచెడిది. కొంతకాలమునకు అదియుపెరిగి పెద్దపులియైనది. ఒకనాడు పెద్దపులి యింకొకటి యీగొఱ్ఱెలమందపైబడినది. ఈమందలో గొఱ్ఱెవలెవర్తించు ఈపులినిచూచి అత్యాశ్చర్యము పొందినది. దీనిని తఱిమి మెడపట్టి యీడ్చినది. ఇది గొఱ్ఱెవలె దీనముగా అఱవసాగినది. అంతట క్రొత్తపులి దీనిని చెఱువుకడకు లాగికొనిపోయి నీటిలో తమ ఇరువురి బింబములను చూపినది. "చూడుము; చూడుము; నీ రూపు, నారూపును, పోలియున్నది. నీవును నావలె పెద్దపులివే! ఇదిగో ఈమాంసమును తినుము" అనిచెప్పి బలవంతముగా మాంసమును తినిపించ చూచినది. మొదటమొదట గొఱ్ఱెలలోపెరిగిన పులి మాంసమును తిననొల్లలేదు. మఱియు తాను పులిగాక గొఱ్ఱెననియే చెప్పసాగినది. రెండవదాని బలవంతముచేత కొంచెము నెత్తురు రుచిచూడగా దానిలో అణగిపడియున్న వ్యాఘ్రసంస్కారములు మొలకలెత్తినవి. మాంసమునందు ప్రీతిని గల్పించినవి. అప్పుడా క్రొత్తపులి "ఇప్పుడుగదా నీవునావలెనే వ్యాఘ్రవంశపుదానవని గ్రహించితివి! కావున ఇక అరణ్యములకు పోదమురమ్ము!" అని తీసికొనిపోయినది.

ఈరీతిగా ఒకనికి గురుకటాక్షములభించెనా భయము తొలగును; గురువు కండ్లుతెఱచి సత్యస్వరూపమును తెలుపును. 1001. ఒక శ్రీమంతుని సేవకుడు యజమానియింటికివచ్చి వినయవిధేయతలతో ఒకమూల నొదిగి నిలువబడెను. వాని చేతిలో గుడ్డతో కప్పినదేమొయుండెను. యజమాని "ఓరీ! ఆ నీచేతిలోనిది ఏమి?" అని ప్రశ్నించెను. అంత నాసేవకుడు తన గుడ్డలోనున్న ఒక వెలగపండునుదీసి, కడునమ్రతతో యజమానునిముందుబెట్టి, దానిని యజమానుడు రుచిచూచు నెడల తాను కృతార్ధుడనగుదునని ఉవ్విళ్లూరుచుండెను. యజమానుడు సేవకుని వినయవర్తనమునకుమెచ్చి, ఆతడు తెచ్చిన స్వల్పపుకానుకనైనను ఆదరమొప్పగ్రహించి "ఆహా! ఈఫలము ఎంతసువాసన గొట్టుచున్నది! ఎక్కడినుండి దీనిని సంపాదించితివి?" అనుచు ఎంతయో ఆనందించెను.

ఈతీరుననే భగవంతుడు భక్తుల హృదయములను పాటించును. వాని ఐశ్వర్యము అనంతమై వెలయునదైనను భక్తిశ్రద్ధలకు భగవంతుడు వశుడగుచుండును.

1002. ఒకడు రోగముతోనున్న తన చిన్నబిడ్డను చేతుల నెత్తుకొని ఒకసాధువుకడకు ఔషధముకొఱకై వెళ్లెను. ఆసాధువు మరునాడు రమ్మనెను. మరునాడు రాగా "నీబిడ్డకు తీపిపదార్థములు పెట్టకుము. వానిరోగముకుదురును." అని చెప్పెను. అంత నామనుష్యుడు "అయ్యా! ఈమాటను నిన్న సాయంతనమే చెప్పి యుండవచ్చునే!" అనెను. "అవును, కాని నిన్ననాయెదుటనే పంచదార కనబడుచున్నది. దానిని చూచినచో నీబిడ్డడు ఈసాధువుకపట వేషదారి. ఆయన నన్ను పంచదార తినవద్దనునుగదా! తానుతినుచున్నాడే!" అనుకొని యుండును. అనిసమాధానము చెప్పెను.

1003. జీవుని స్వాతంత్ర్యమునకును ఈశ్వరుని కృపకును సమన్వయము కుదరక ఇరువురు శిష్యులు తమ సమస్యను పరిష్కరింపుడని శ్రీరామకృష్ణపరమహంసులవారి కడకు పోయిరి. శ్రీవారు "స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము అని మీప్రసంగమేమిటి? సర్వమును ఈశ్వరేచ్ఛపై నాధారపడి యుండును. మనఇచ్ఛ ఈశ్వరేచ్ఛతో ఆవు గుంజకు కట్టబడినటుల బంధింపబడియున్నది. మనకు కొంత స్వతంత్రత యున్నమాట నిజమే; అది ఒక నిర్ణీతవలయములోపలనే! కావున నరుడు స్వతంత్రుడ ననుకొనుచుండును. కాని వాని యిచ్చ ఈశ్వరేచ్ఛకు లోబడియుండునదే యని గ్రహించుడు!" అనిరి.

"అటులగునెడల జపతపముల సాధనలు అవసరముండవా? ఏలయన, అంతయు ఈశ్వరేచ్ఛయే! అని ప్రతివాడును అనవచ్చును. ఏదిజరిగినను వానియిచ్ఛవలన జరిగినదే అనవచ్చును" అని శంకించిరి.

పరమహంసులవారిట్లనిరి:- "ఓహో! ఎంతవఱకామాట? ఊరక నీవు నోటిమాటతోఅనిన చాలునా? నీవు రక్కిసకంపమీద చేయివేసి మాటలతో ఏమియులేదు లేదనిన ముండ్లు గ్రుచ్చుకొనక విడుచునా? పారమార్థిక సాధనలచేయుట నరుని స్వాధీనములోనె పూర్తిగాయున్న యెడల సర్వజనులును అటుల చేసియుండెడివారలే! అయినను ప్రతివారును చేయలేరు! ఎట్లు? మీకాయనయిచ్చు బలమునంతను సద్వినియోగము చేయునెడలనే మీకాయన హెచ్చుగ నిచ్చుచుండును. అందుకై స్వయంకృషి అత్యవసరము. కాబట్టి ఈశ్వరకృపకు పాత్రులగుటకును మనము చాల పరిశ్రమచేయవలసియున్నది. అట్టిపరిశ్రమయున్నప్పుడు ఈశ్వరకరుణవలన అనేకజన్మలకష్టము ఒక్కజన్మలో తీరగలదు. కొంతైన స్వయంకృషి ఉండియే తీరవలయును. ఒక కథ చెప్పెద వినుడు:-

"గోలాకాధిపతియగు విష్ణువు నారదుని ఒకసారి నరకమున పడిపోదువుగాక అని శపించెను. అందుకై నారదుడు మదిలో చాల తహతహపడెను. అంతట కీర్తనల పాడుచు స్తోత్రములచేయుచు నరకము ఎచ్చటనుండునో, తానచ్చటికి ఎటులపోవుటో తెలుపుమని భగవంతుని వేడుకొనసాగెను. అప్పుడు విష్ణువు నేలమీద విశ్వముయొక్క పటమును గీసి స్వర్గనరకములను దానిలో సూచించినాడు. అంతట నారదుడు నరకము అని చూపబడిన తావునుచూపి "ఇదేనా ఇదేనా నరకము?" అని అడిగెను. అట్లు ప్రశ్నించుచు ఆతావున పడిదొర్లి "స్వామీ! నేను నరకబాధలు పడి నాశిక్షను అనుభవించివేసితిని" అనెను. "అదెట్లు?" అని విష్ణువు అడుగగా నారదుదు "ఏమిస్వామీ! స్వర్గనరకములు నీవు సృష్టించినవి కావా? నీవే యీపటమును రచించితివి. అందు నరకమును చూపించితివి. అది నిజముగా నరకమే ఐనది. అందు నేనుపడి దొర్లునప్పుడు నాబాధలును మిక్కుటములైనవి. కాబట్టి నాశిక్షను నరకమున అనుభవింతితినని చెప్పితిని" అని సమాధానము చెప్పినాడు. నారదుడు యీపలుకులను హృదయపూర్వకముగా నమ్మి చెప్పినాడు. కావున విష్ణువును వాని సమాధానమును అంగీకరించినాడు!"


సమాప్తము.