శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/36వ అధ్యాయము
36వ అధ్యాయము.
మహిమలు
696. సిద్ధులకొఱకై దేవులాడువారినిమహిమలప్రకటించువారిని దరిచేరకుడు. అట్టిపురుషులు బ్రహ్మపధమును వదలి చరించువారు. బ్రహ్మముంజేరు యాత్రాపధమున, అడ్డమువచ్చుచుండు మహిమల వలలలో వారిబుద్ధులు తగులువడి యుండును. ఈ మహిమలంగూర్చి హెచ్చరికతోనుండు వానికై ఆశపడకుడు.
697. ఒకడు పదునాలుగేండ్లు అడవిలో ఘోరతపస్సుచేసి, తుదకు నీళ్లపైనినడుచుసిద్ధిని సంపాదించినాడు. ఈసిద్ధికలిగెనని ఆనందపరవశుడై, తనగురుసన్నిధికిపోయి, "గురుదేవా! గురుదేవా! నేను నీటిపైనినడుచు మహిమను పడసితిని!" అనెను. వానిగురువు వానినిట్లు చీవాట్లుపెట్టినాడు. "ఛీఛీ! పదునాలుగేండ్లశ్రమకు ఇదియాఫలము? ఆహా! నీవొక కాని డబ్బును సంపాదించినవాడవైతివి! నీవుపదునాలుగేండ్లు పాటుపడి గడించినదానిని సామాన్యనరులు పడవవానికి కానిడబ్బు నిచ్చి పొందగలరు సుమీ!"
698. భగవాన్ శ్రీరామకృష్ణపరమహంసులవారి బాలశిష్యులలో ఒకడు ఇతరుల మనోభావములను ముఖముచూచి గ్రహించుశక్తిగలవాడయ్యెను. దీనింగూర్చి అత్యానందభరితుడై వచ్చి తనశక్తినిగురించి గురుదేవులతో ప్రశంసించెను. పరమ హంసులవారు వానిని మందలించి యిట్లనిరి:- "సిగ్గు సిగ్గు! బిడ్డా! నీశక్తియుక్తులను ఇట్టి క్షుద్రవిషయములందు వ్యయము చేయకుము!"
699. మందులిచ్చుచు , గంజాభంగీలను సేవించుసాధువు యోగ్యుడనతగదు. అటువంటివాని సాంగత్యముచేయకుడు.
700. నేను పంచవటికడ తీవ్రసాధనలు చేయుచుండు దినములలో గిరిజ అను నొకపురుషుడు అచ్చటికివచ్చెను. ఆయన గొప్పయోగి. ఒకతడవ చీకటిరాత్రిలో, నేను నాగదిదగ్గఱకు పోవయత్నించుచుండగా, అయన తనచేతిని పై కెత్తినాడు. వానిచంకలోనుండి గొప్పవెలుగుబయలు దేఱి మార్గమంతయు చక్కగ కాన్పించినది. నాహితవాక్కునువిని, ఆయన తనసిద్ధిని వినియోగించుట మానివేసి, బ్రహ్మసాధనకై తన మనస్సును మరల్చినాడు. కొన్నాళ్లకు వాని కాశక్తితగ్గిపోయినది; కాని సత్యమగు పరమార్ధమును సంపాదించుకొనగల్గినాడు.
701. ఒకశిష్యుడు తానుధ్యానముచేయు సమయమున దూరమున జరుగుసంగతులు ప్రత్యక్షముగ తనకుగోచరించుననియు ఆసమయమున కొందఱుప్రజలు ఏమిచేయుచుందురో స్పష్టముగ తెలియవచ్చుననియు, అనంతరము విచారించగా తనఅనుభవము సత్యములయ్యెననియు, శ్రీపరమహంసులవారి కెఱిగించెను. అంతట వారు బిడ్డా! కొన్నిదినములు ధ్యానమునుమానుము. ఇట్టిదూరదర్శనములు మున్నగుమహిమలు బ్రహ్మసాక్షాత్కారమునకు అడ్డుతగులును సుమీ!" అని చెప్పిరి. 702. సిద్ధులను అశుద్ధముబోలి త్యజించవలయును. యోగసాధనలవలనను, ఇంద్రియ సంయమనమువలనను ఇటువంటి సిద్ధులు లభించుచుండును. కాని ఎవరు వీనిపైని, మనస్సు నిలుపుదురో వారక్కడచిక్కుబడి పోదురు. ఇంక పైకి పోజాలరు.
703. చంద్రము అనువానికి అదృశ్యఘటికాసిద్ధి లభించినది. దాని సాహాయమున, ఇతరులు తననుచూడకుండ, ఇచ్ఛానుసారము అతడెచ్చోటికైనపోగలడు. ఆమహిమఅలవడినపిమ్మట క్షుద్రభోగములకై దానినివినియోగించసాగినాడు. నేనుఅతనిని మందలించినను, అతడు సరకుచేయడయ్యెను. అతడు ఇతరులకు కానరాకుండ ఒక పెద్దమనుష్యుని భవనమునప్రవేశించి, అందొకయువతితో వ్యభిచరించసాగినాడు. కడకతడు తన సిద్ధినికోల్పోయినాడు. ఎందుకునుకొఱగాని పతితుడై పోయినాడు.
704. శ్రీకృష్ణుడు అర్జునునితో నిట్లనెను. "నీవునన్నుపొందవలయుననినచో, నీకడ అష్టసిద్ధులలో నేదేని యున్నంతవఱకు కృతార్థుడవు కాజాలవు."
మహిమలవలన "అహం"కారము బలపడి బ్రహ్మము మఱుగుపడును.
705. ఒక్కొకప్పుడు సిద్ధులవలన గొప్పఅనర్ధములు వాటిలును. ఒకగొప్పసిద్ధునిగురించి "తోటపూరి" అనువారు నాతోడచెప్పిరి. ఆయన సముద్రతీరమున కూర్చుండియుండగా గొప్పతుపానురేగెనట. ఆగోలకు విసుగుచెంది, ఆసిద్ధుడు "తుపాను ఆగిపోవుగాక!" అనగనే వానిమాటప్రకారము జరిగినది. సరిగా ఆసమయమున అతివేగముతో ఒకఓడ నిండు తెఱచాపలతో సముద్రముమీద పోవుచున్నదట! ఆకస్మికముగ తుపానుఆగగనే, ఆఓడమునిగినదై, అందున్నవారందఱును సముద్రముపాలైరి! అంతమందికి ప్రాణహానిగల్పించిన పాపము ఆసిద్ధునికి తగిలినది. అదికారణముగా వాని కామహిమయు పోయినది; మీదుమిక్కిలి నరకప్రాప్తియు ఘటిల్లినది!!