Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/35వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

35వ అధ్యాయము.

లోకవృత్తము - ఆధ్యాత్మికత

655. ఒక సేద్యగాడు దినమంతయు తన చెఱుకుతోటకు నీరు తోడుచుండెను. తన పనిని ముగించిచూడగా ఒక్క చుక్క నీరైనను తోట కెక్కలేదని తెలియవచ్చెను. నీరంతయు ఎలుకలకలుగులగుండ నేలలోనికి పోయినది. తన హృదయమున రహస్యముగా కీర్తికొఱకును, సుఖముల కొఱకును, సౌకర్యముల కొఱకును భూరిసంపదల కొఱకును, గొంతెమ్మ కోరికలను పెంచుకొనుచు, భగవదారాధనలు చేయు భక్తునిస్థితి పైనిచెప్పిన సేద్యగాని స్థితిని బోలియున్నది. అతడు ప్రతిదినము ప్రార్థనలు చేయుచున్నను పురోభివృద్ధి కాంచడు. వానిభక్తియంతయు కోరికలనెడు ఎలుకల కలుగుల ద్వారమున వ్యర్ధమై పోవుచుండును. తనజన్మాంతము వఱకు ఇట్టిభక్తి చేయుచున్నను ఆతడు ఎప్పటియట్లేయుండును, కాని అభివృద్ధి పొందజాలడు.

656. ప్రశ్న:- ధ్యానమందుండగా మనస్సు చంచలించుటకు కారణమేమి?

ఉ:- మిఠాయిఅమ్మువాని దుకాణములో పెట్టియుంచిన మిఠాయిమీద ఈగలు వ్రాలియుండును. కాని పాకివాడొకడు అశుద్ధపుతట్ట తీసుకొని ఆత్రోవననురాగానే, ఈగలు మిఠాయిని విడిచివేసిపోయి అశుద్ధముపైనివ్రాలును. కాని తేనెటీగ సదా విచ్చినపూలపైననే నిలుచునుగాని అశుద్ధవస్తువులకై పోదు. లౌకిక పురుషులు ఈగలవలె అప్పుడప్పుడు భగవద్భక్తియను మిఠాయిని రుచిచూతురు, కాని వారి అపవిత్ర సంస్కారములు సహజముగా వారిని క్షుద్రవాంఛలవైపునకే లాగుచుండును. మహాత్ములగు పరమహంసలో, సదా భగవత్కృపనుగూర్చి ధ్యానముచేయుచు ఆనందపరవశులై యుందురు.

657. పూర్తిగ సంసారబంధమున జిక్కిన నరుడు అశుద్ధమునపుట్టి అశుద్ధమునచచ్చు పురుగువంటివాడు; వానికి ఇతర మేమియు తెలియదు. సామాన్యసంసారి ఒకప్పుడు అశుద్ధము మీదను, ఒకప్పుడు మిఠాయిమీదను వ్రాలుచుండు ఈగను బోలువాడు. ముక్తాత్ముడో సర్వదా పూదేనియనేత్రాగుచు, ఇతరమును చవిగొనని భ్రమరము వంటివాడు.

658. లౌకికపురుషుని హృదయము పేడకుప్పలోని పురుగువంటిది. అది నిత్యముపేడలోనె కాలముగడుపుచు, అక్కడనేయుండగోరును. కర్మముచాలక ఎవరైనను దానిని ఆ మలిన స్థలమునుండితీసి తామర పువ్వునందుంచినను, ఆపువ్వుయొక్క కమ్మనివాసనను భరించలేక చచ్చిపోవును. అటులనే లౌకికజనుడు తమ లౌకికవ్యవహారములను చింతలను వాంఛలను విడిచి ఒక్కనిమిషమైనను బ్రతుకజాలడు.

659. కాల్చనికుండ పగిలినయెడల, కుమ్మరి దాని మట్టిని ఉపయోగించి వేఱొక కుండను చేయగలడు. కాని కాల్చిన కుండ పగిలెనా వాడటుల చేయజాలడుగదా! అదేవిధమున మనుజుడు అజ్ఞానదశలో మరణించెనేని ఆతడు మరల జన్మనెత్తును; కాని అతడు బ్రహ్మజ్ఞానాగ్నియందు తప్తుడై సిద్ధత్వమును పొంది మరణించుచో తిరిగి జన్మకు రాడు.

660. ప్రశ్న:- లోకచింతగల మనుజుని పోలిక యెట్లుండును?

జవాబు:- ముంగిసల పెంచువాని కుండలోని ముంగిసను పోలియుండును. ముంగిసలపెంచువాడు గోడలో ఎత్తుగా ఒక కుండను పెట్టును. త్రాడు నొకదానిని తెచ్చి ఒక కొసను ఒదులుగా ముంగిసమెడకు తగిలించును; రెండవ కొసకు బరువు నొకదానిని కట్టును. ముంగిస కుండలోనుండి వెలువడి గోడదిగివచ్చి ఇటునటు తిరుగులాడును. ఏదేని భయము తోచగానె చఱచఱ పైకిపోయి కుండలోదూరి దాగికొనును. కాని పాపము, త్రాడునకు రెండవ కొనను కట్టియున్న బరువు, దానిని సుఖముగా ఆకుండలో కూర్చుండ నీక క్రిందికి లాగుచుండును. అటులనే లోకవ్యావృత్తుల మునింగియుండు జనుడు జీవనపు కష్టనష్టములచే బాధితుడై అప్పుడప్పుడు ప్రపంచమునకు అతీతముగపోయి భగవంతుని శరణు చొచ్చును. కాని పాపము, లౌకిక వ్యవహారభారమును అందలి వ్యసనములును, వానిని మరల మరల ఇహలోక దుఃఖములలోనికి పడలాగుచునేయుండును.

661. రెట్టింపు నీటితో కలిపిన పాలను (గడ్డగట్టిన) క్షీరముగా మార్చుటకు చాలకాలము పట్టును; శ్రమయు కలుగును. దుష్ట పాపచింతలనెడు ముఱికినీటితో పలుచబడిన సంసా రుల మనస్సును పవిత్రభూతముచేసి, సద్భక్తి పూరితముగ ఘనమగుదానిగ నొనర్చుటకు చాలకాలము పట్టును; శ్రమయు అధికముగా పడవలసివచ్చును.

662. దయ్యముపూనిన మనిషిమీద మంత్రించిన ఆవాలను చల్లి ఉచ్ఛాటన చేయుదురు. కాని ఆ ఆవాలలోనె దయ్య మాసించియున్నచో వానివలనదయ్యమెటులపోగలదు? నీవు భగవధ్యానమున బెట్టు హృదయము లౌకికవాంఛలతో దుష్టమై యున్నయెడల, అట్టి క్షుద్రసాధనముతో నీధ్యాన నిష్టలను జయప్రదముగ ఎట్లు సాగించ గలవు?

663. చిలుకముదిరి, దానికంఠమందలి స్వరనాడులు గిడసబారిన తరువాత, దానికి సంగీతమునేర్పుట వలనుపడదు. అది చిన్నదిగానుండి, మెడమీది ఎఱ్ఱచాఱ కాన్పించక మునుపే దానికి గీతములు నేర్పవలసి యుండును. అటులనే ముసలితనమున భగవంతునిపైని మనసు నిలుప నేర్వవలయు ననిన సాధ్యముకాదు; చిన్నతనములో అది సుసాధ్యమగును.

664. కాల్చనిమట్టితో కుమ్మరిబొమ్మలనుతయారుచేయును; గాని కాల్చిన మట్టితో అతడేమియు చేయజాలడు; అదేవిధముగ లౌకికవ్యసనములఅగ్నిలోపడి నరుని హృదయము దగ్ధమయిన వెనుక ఉత్తమాశయములు దానినిమార్చి, ఏదేని సుందర రూపము నొసగవలయుననిన సాధ్యముకాదు.

665. ఈగ నరశరీరమందలి పుండుపైనొకప్పుడు వ్రాలును; మరలదేవుని కర్పణచేయు నైవేద్యముపైని వ్రాలును. అట్లే సంసారుని బుద్ధి కామినీకాంచనభోగముల తగులవడియుండును, ఒక్కొకప్పుడు పారమార్ధిక విచారణకు దిగుచుండును.

666. దమ్ముకొనిన అగ్గిపుడక ఎంతఅదిమిగీసినను మండక పొగవిడును. కాని పొడిగానున్న అగ్గిపుడక తేలికగాగీసినను వెంటనే రగుల్కొనును. ఉత్తమభక్తుని హృదయము ఎండిన అగ్గిపుడకవంటిది. భగవన్నామస్మరణ ఇసుమంతకలిగినను వానిహృదయమునుండి భక్తి ప్రభవించును. లోలత్వమున దమ్ముకొని భోగమునతడిసియున్న గృహస్థునిహృదయము తడిసిననిప్పుపుల్లవలె ప్రబోధమును పొందదు. అట్టివానికి తఱుచుగా ఆత్మప్రబోధము కల్గించినను దివ్యభక్త్యాగ్ని రగులువడనే పడదు.

667. మామిడిపండును దేవునికి అర్పణచేయవచ్చును; లేదా ఏదోవిధముగా వినియోగము చేసికొనవచ్చును; కాని కాకి దానిని ఒక్కసారి పొడిచిన చాలును, అది ఎందుకును కొఱగానిదగును. అది దేవతార్పణకా పనికిరాదు. బ్రాహ్మణునికి దానమీయుటకా కొఱగాదు; మఱియు ఉత్తము లెవరును దానిని తినదగదు. అట్లే బాల బాలికలు వారి హృదయములు నిర్మలములుగ నున్నప్పుడే అనగా వారు భోగవాంఛలచే అపవిత్రులు కాకమునుపే భగవంతుని సేవకు అర్పణ చేయదగుదురు. ఒక్కసారి భోగవాంఛలు వారి మనముల జొచ్చెనా, ఇంద్రియలోలతయను దయ్యము తన క్షుద్రచ్ఛాయలను వారిపై నొక్కసారి ప్రస రింపచేసెనా, అంతట వారిని సదా ధర్మమార్గమున నడువం జేయుట దుర్లభమగును.

668. లేత వెదురువాసమును సులభముగా వంచనగును; ముదురు వెదురును గట్టిగబట్టి వంచబోతిమా అది విరుగును గాని వంగదు. బాలుర మతులును సులభముగ భగవంతుని దిశకు మరల్చవచ్చును; కాని శిక్షణ యెఱుంగని పెద్దవారల మతులు ఎటుత్రిప్పబోయినను పట్టు తప్పిబోవును.

669. వరిపొలములలో చేపలను పట్టుటకు పెట్టు వెదురు మావుల ద్వారములగుండా నిగనిగలాడుచు నీరు ప్రవహించుటనుచూచి చేపల సమూహములును ఆనందముతో అందు ప్రవేశించును. కాని అందొకసారి ప్రవేశించినవెనుక తప్పించుకొని బయటపడజాలవు. అటులనే బుద్ధిహీనులు సంసారపు వలలలో మాయసుఖముల కాశపడిజొరపడుదురు. మావులజొచ్చు చేపలవలెనే వీరును సంసారములందు జొరబడగలరే కాని దానిని త్యజించి విరాగులుకాలేరు సుడీ!

670. ధనమదాంధులు, దుర్గర్వులు, జ్ఞానపాషండులును ఆత్మజ్ఞానము పడయుటకు అనర్హులగువారిలో లెక్కింప బడుదురు. "ఒకానొకచోటున మంచిసన్యాసి యున్నాడు. చూచి వత్తమా?" అని ఎవరైన వీరితో ననినయెడల, వీరు తప్పకుండ సాకులనుపన్ని రాజాలమని చెప్పుదురు. కాని తమ మనస్సులలో మాత్రము "మనము పలుకుబడిగల పెద్ద మనుష్యులము! ఎవనినో చూచుటకు రమ్మనిన మనము పోతగదు." అని తలంతురు. 671. ఈప్రపంచములో తమకు ఆకర్షవంతమగునదేమియు లేకున్నను, ఏదో విధమగు తగులాటమును కల్పన చేసికొని అందులో చిక్కుకొను మనుష్యులు కొందఱుందురు. తన పోషణకోరు కుటుంబముగాని, తన రక్షణ అవసరమగు బంధువులుగాని లేని మానవుడు ఏదియో పిల్లినో, కోతినో, కుక్కనో, పిట్టనో పెంచ నారంభించి దానితో లీలలు సలుపుచుండును. పాలకొఱకగు పరతాపమును తేట చల్లనీటితో చల్లార్చుకొనజూచునట్లు! మాయ మానవజాతిపైని పడవేయుటవల్ల చమత్కార మిట్టిది!

672. మెత్తనిరేగడపైని ముద్ర పడునటుల రాతిపైని పడదుగదా! అటులనే భక్తుని హృదయముపైని పరమార్థ జ్ఞానము అంకిత మగునటుల; బద్ధాత్ముని హృదయముపైని నాటదు.

673. సంసారానురక్తునియందు పారమార్థికమగు సర్వము నెడను వానికిగల వెగటు ప్రస్ఫుటముగ గోచరించును. భక్తి గీతమునుగాని, స్తోత్రమునుగాని, తుదకు భగవన్నామమును గాని అతడు విననొల్లడు; అంతట పోక యితరులనుగూడ నిరుత్సాహముచేసి మాన్చును. ఎవడు ప్రార్థనల నిరసించునో, సజ్జనసంగములను సాధుపురుషులను నిందించునో, అట్టివాడు ప్రపంచమునకు దాసుడు!

674. కొలిమిలోబాగుగ కాలుచున్నంతవఱకును ఇనుము ఎఱ్ఱగకాన్పించును; కాని అందుండి తొలగినపిమ్మట నల్లబడును. సంసారులును యిట్లేయుందురు. తాము దేవళములోనో, భక్తుల నడుమనో ఉన్నంతకాలమును ధర్మచింతలతోపరవశులుగ కాన్పింతురు; ఆసహవాసము తొలగించినపిమ్మట భక్తిభావమంతయు శూన్యమైపోవును.

675. ప్రశ్న:- సంసారులు సర్వమును త్యజించి భగవంతునికొఱకై ఏల పరుగిడజాలరో?

ఉ:- నరులు వేర్వేఱువేషములనుదాల్చినటనలు చేయు నాటకరంగమువలె యీప్రపంచమున్నది. కొంతకాలముతమ ఆటలను సాగించనిది వీరు తమవేషములను తొలగించుకొన జాలరు. కొంతకాలము వారియాటలను వారి నాడనిండు! అంతట వారే తమవేషముల చాలింపగలరు!

676. మొసలికి ఏఆయుధమును భేదింపజాలని గట్టిపొలుసుతోనేర్పడిన కవచముకలదు. గృహవ్రతు లట్టివారు. వారికి నీవెన్నిపారమార్థికబోధలు చేసినను; అవి వారిహృదయమున జొచ్చజాలవు.

677. వంతెనక్రింద నీరు ఒకవైపునుండిచొచ్చి రెండవవైపునుండి వెడలిపోవురీతిని గృహస్థులకు చేయు ధర్మబోధ ఒకచెవినుండిదూరి రెండవచెవిగుండ జారిపోవును. అందేమియు దానిజాడయైన నిలువబోదు.

678. దుఃఖములును జీవనవ్యధలును గాఢముగా నెత్తిపై బడి మొట్టునుగాక, సంసారనిమగ్నులు కామినీ కాంచనములపై మోహమును సులభముగ నిగ్రహించి, మనస్సును భగవంతునివైపు త్రిప్పనొల్లరుగదా! 679. మనస్సు చంచలమై తడబడుచుండునంతకాలమును నరునకు సద్గురునివలనను, సాధుసంగమువలనను ఏమియు మేలుచేకురబోదు.

680. అచ్చటచ్చట నేరుకొనినగింజలతో పావురముల బుగ్గలెటులనిండియుండునో, అటులనే సంసారుల హృదయములు ప్రాపంచికభావములతోడను సంకల్పములతోడను నిండియుండునని వారితో కొంచెము ముచ్చటించినచో తెలియవచ్చును.

681. పాపాత్మునిహృదయము ముంగురులుచుట్టుకొను జుట్టు వంటిది. ఆజుట్టును సరళముగ దువ్వుటకు నీవెంతప్రయత్నించినను ఫలముండదు. దుష్టునిమనస్సును సరళముగను నిర్మలముగను మార్చుటకు చేయుయత్నమును అటులనే వ్యర్ధమగును.

682. రాతిముక్కలో నీరుయింకనితీరున బద్ధజీవుని హృదయమున ధర్మబోధచొచ్చజాలదు.

683. మేకు రాతిలోచొఱజాలదు. కాని మట్టిలో తేలికగ చొచ్చగలదు. అటులనే సాధుబోధనాస్తికుని హృదయమున చొఱదు. కాని భక్తునిహృదయమున అతిసులభముగ నాటుకొనును.

684. పసిబాలునకుగాని, బాలికకుగాని, సంభోగానంద మన అర్ధముకాదు. అటులనే సంసారులకు ఆత్మసంయోగానంద మన అర్ధముకాజాలదు. 685. జిడ్డుగానున్న అద్దమున ముఖబింబము సరిగాకానరానిరీతిని కళంకితహృదయమున శివస్వరూపము ప్రకాశింప జాలదు. జిడ్డును తొలగించినయెడల ఆ అద్దమున ముఖ వైఖరి చూచుకొనుటకు వీలుపడుతెరగున హృదయము పవిత్రవంతమగునేని దానియందు భగవంతునిరూపు కాన్పించును.

686. ఒకసారి పెరుగుతోడుపెట్టినకుండలో పాలు పోయుట కెవరును సాహసించరు. పాలు విరిగిపోవునేమో యను భయము బాధించును. ఆకుండను వంటచేయుటకును వినియోగించరు; నిప్పుమీదపెట్టిన విచ్చిపోవునని జడియుదురు. కాబట్టి అది దాదాపుగా నిరుపయోగ మన్నమాట! అట్లే గృహవ్రతునికి గురువు ఉత్తమసద్భోదలు చేయసాహసించడు. గృహస్థుడు వానికి అపార్థములు కల్పించి, తన పబ్బములు గడుపుకొనుటకు ప్రయత్నించును. కొంచెము శ్రమను కలిగించు సత్కార్యములందును వానిని నియోగించ జాలడు. అప్పుడతడు తన గురువు తన మంచితనమువలన లాభము పొందజూచుచున్నాడని అపవాదము చేయగలడు.

687. లౌకికునకు జ్ఞానికున్నంత తెలివియు, జ్ఞానమును ఉండవచ్చును. ఆతడు యోగిపడునంత శ్రమను కష్టమును పడవచ్చును; సన్యాసి చేసినంత త్యాగమును చేయవచ్చును. కాని వాని కఠిన ప్రయత్నములన్నియు వ్యర్థములే. ఏలయన వాని శక్తులన్నియు వక్రగతిని నడచును; ఆత డెన్నిపాట్లుపడినను, భగవంతునికొఱకు కాక, భౌతిక సంపదలు భోగములు, ఖ్యాతికొఱకే. 688. పూర్వ సంస్కారబలము యెంత గొప్పదో చూచితిరా! ఒకానొకచోట కొందఱు సన్యాసులు కూర్చుండి యుండిరి. అప్పుడొక పడుచు ఆత్రోవనువచ్చినది. అందఱును తమ దైవధ్యానములందే నిమగ్నులైయుండిరి; ఒక్కడు మాత్రము రహస్యముగ ఆమెవంక చూడ్కి నిలిపినాడు. ఇట్లా స్త్రీసౌందర్యముచే ఆకర్షింపబడిన యతడు పూర్వము గృహస్థుడై యుండి, సన్యాసమున ప్రవేశించునప్పటికి మువ్వురుబిడ్డల కనియున్నవాడు.

689. సంసారవ్యావృత్తియందు మునగియున్నవానికి బ్రహ్మజ్ఞానము అబ్బదు. వానికి భగవత్సాక్షాత్కారము కాజాలదు. బురదనీటిలో చుట్టునున్నచెట్లుమున్నగునవిగాని సూర్యుడుగాని ప్రతిఫలింపజాలునా?

690. ఐహికరతునకు ఎన్ని దుఃఖములువచ్చినను, ఎన్ని కష్టములు వాటిల్లినను, ఎన్నడును జ్ఞానము రాబోదు. ఒంటెలకు ముండ్లతుప్పలు ఇష్టము. అవి వానిని మేసినకొలదిని నోట నెత్తురు కారుచుండును. అయినను అవి ముండ్లతుప్పలనే తినునుగాని మానవు.

ఒక్కొకప్పుడు గృహస్థులగతి ఉదుమును పట్టుకొనిన పామురీతి నుండును. అది ఉడుమును తినజాలదు, విడువను జాలదు. గృహస్థుడు సంసారములో సారమేమియు లేదని గ్రహించవచ్చును. సంసారము గుజ్జనునదిలేక ఎండిపోయిన తోలు టెంకమాత్రము మిగిలిన పుల్లమామిడిపండును బోలియుండును. అయినను ఈసంసారులు దానిని త్యజించి భగ వంతునిపై తమ మనస్సులను నిలుప జూడకున్నారు!

వారిలో నింకొక చిత్రముకలదు. సంసార తాపత్రయములనుండి వారిని తొలగించి సజ్జనులు సాధువులు నుండు సమాజమున వేదాంతగోష్టియందు నిలిపిన యెడల వారిహృదయమునకు ఆనందమే గోచరించదు. ఎప్పుడు వెడలిపోదుమాయని తహతహపడుదురు. పెంటకుప్పలలో పుట్టి పెంటకుప్పలలో పెరుగుపురుగులు పరిశుభ్ర స్థలమున మంచి అన్నములో పెట్టినయెడల అవిబ్రతుకలేక చచ్చును గదా!

691. సాధువుచేతనున్నకమండలువు, ఆతడు తీర్థయాత్రలుచేయు, 'ధామముల' నాల్గింటిని దర్శించినను, దానిరుచి ఎప్పటివలె వగరుగనే యుండును. సంసారనిమగ్నుల స్వభామును అట్లేయుండును.

692. లౌకికపురుషులు ఐహికఫలములకు ఆశించి చాల పుణ్యకార్యములను ధర్మక్రతువులను చేయవచ్చును; కాని ఆపదలు, దుఃఖము, దారిద్ర్యమువచ్చినప్పుడు ఆభక్తి ఆధర్మచింత ఎగిరిపోవును. వారు దినమంతయు "రాధాకృష్ణా రాధాకృష్ణా" అని అఱచుచుండు చిలుకవంటివారు. చిలుకను పిల్లిపట్టుకొనినప్పుడు, అది భగవన్నామమును మఱచి "కా" "కా" అనియే అఱచును.

కావున నేనేమందునంటే అటువంటి వారికి ధర్మబోధలు చేయుట వ్యర్ధమని, నీవెన్నియుపదేశములు చేసినను సంసారులు మారరు. 693. క్రొత్తపరుపుమీద కూర్చుండునప్పుడు అదిఅణగును. కాని పైబరువు పోగానే అది యెప్పటి ఆకారముపొందును. గృహస్థులును అటులనే చేయుదురు. వారు పురాణశ్రవణము చేయునంత కాలమును ధర్మబుద్ధితో నిండియుందురు. ఇంటికి పోయిగృహకృత్యములలో ప్రవేశించగానె తామువినిన ఉన్నత ధర్మభావములను బొత్తుగమఱచిపోయి, ఎప్పటి నీచకార్యములకే పాల్పడుదురు.

694. లోకవ్యావృత్తులుగల పురుషులు భక్తులతోగూడి అప్పడప్పుడు ఇక్కడికివచ్చుట చూచినాను. వారికి వేదాంత ప్రసంగమనిన గిట్టదు. ఇతరులు భగవంతునిగూర్చియు పారమార్థికతనుగూర్చియు, దీర్ఘకాలము ముచ్చటించుచుండుట చూడ వారు సహించలేక చీకాకుపడుదురు. ఊరకకూర్చుండుటయు వారికి కష్టముగనుండెను. "ఎప్పుడు బయలుదేఱుట? ఎంతసేపువుంటారు?" అని తమస్నేహితులను రహస్యముగ నడిగేవారు. అప్పుడాస్నేహితులు "కొంచెము తాళుడు, త్వరలోనెవత్తుము" అనుచుంటయుకలదు. ఈమాటలకు వారు విసుగుచెంది "సరే! మీరుమాట్లాడుచుండుడు. మేముపోయి పడవలో కనుపెట్టుకొనియుంటాము" అనుచు వెళ్లెడివారు!

695. మనుష్యులలో రెండురకములవారు కలరు. పేరునకు మాత్రము మనుష్యులు ఒకరకము. ప్రబోధమానసులగు వారు ఇంకొకరకము. భగవంతునిగూర్చి తపించువారు ఈ రెండవరకములో చేరినవారు. కామినీకాంచనములకై ఆరాటపడువారు నామమాత్ర మానవులు.

-:O:-