Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/23వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

23వ అధ్యాయము.

ఆహారనీమము - ఆధ్యాత్మజీవనము.

483. పగలు తృప్తిగ భుజించుము; కాని రాత్రికాలమున తేలికగ కొలదిగ భుజింపుము.

484. విద్యార్ధియొకడు భగవాన్ శ్రీరామకృష్ణులవారిని "ఒకే బ్రహ్మము సర్వజీవులందును వసించును గాన ఎవనిచేతి, ఆహారము తినినను హానియేమి?" అని ప్రశ్నించెను. నీవు బ్రాహ్మణుడవాయని యడుగగా ఆవిద్యార్ధి అవునని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట పరమహంసులవారు "అందువలననే నీవు నన్నిట్లడగినావు. నీవు ఒకనిప్పుపుల్లను వెలిగించి దానిపైన యిన్ని ఎండుకట్టెలనే పడవేతువనుకొనుము. ఏమగును?" అని యడిగిరి.

విద్యార్ధి:- ఆప్రోగుచే కప్పిపెట్టబడి, నిప్పు ఆరిపోవును.

పరమహంస:- కార్చిచ్చుమండుచుండగా, దానిలో పచ్చి అరటిబొదెలను చాలగ తెచ్చిపడవేతువు అనుకొనుము అవి ఎమగును?

విద్యార్థి:- ఒక్క క్షణములో అవి భస్మమైపోవును.

పరమహంస:- ఆవిధముననే నీయందలి ఆధ్యాత్మికశక్తి కొలదిపాటిగనున్నప్పుడు, విచక్షణలేకుండ ఎవడిచ్చిన ఆహారమునైనను తినుచుందువేని ఆశక్తి అడిగిపోవచ్చును. అదే ప్రబలముగ నున్నప్పుడు నీవు ఎట్టిఆహారము తినినను ఏమియు చేయదు.

485. శరీరమునకు వేడిచేయనట్టియు, మనస్సునకు ఉద్రేకము కల్గించనట్టియు ఆహారమునే భుజింపవలయును.

486. ఎవడు సాత్విక శాకాహారమునే తినుచున్నను, బ్రహ్మప్రాప్తిని కోరుకొనడో, వానికి ఆసాత్వికాహారము సయితము గోమాంసమంత అనర్ధకరమేయగును. ఎవడు గోమాంసము తినుచునుకూడ బ్రహ్మప్రాప్తిని కాంక్షించునో వానికి ఆగోమాంసము సయితము దేవతలారగించు అమృతమువంటిది కాగలదు.

487. శ్రాద్ధసమయములందిడు భోజనముల స్వీకరింపకుము. అట్టితిండి భక్తివిశ్వాసముల నాశముచేయును. ఇతరులచేత హోమాదులచేయించి జీవించుపురోహితుని యింటనుభోజనము చేయతగదు.

488. ఆహారవిషయములో ఏదిదొఱకిన దానినే తిన దగదా?

పరమహంస - అది వానివాని ఆధ్యాత్మికదశను అనుసరించియుండును. జ్ఞానమార్గమున దానివలని హానియుండదు. జ్ఞాని ఆహారమును భుజించునప్పుడు, దానిని అతడు కుండలినీ అగ్నియందు హుతముచేయును. భక్తునివిషయమో వేఱు. భక్తుడు తనయిష్టదైవతమునకు నివేదన చేయుటకు అర్హ మగు పవిత్రాహారమును మాత్రమే ఆరగించవలయును. మాంసా హారము భక్తునకు తగదు. కాని నామాటవినుము. ఒకడు పందిమాంసము తినుచునుగూడ, భగవంతునియెడ అనురక్తుడయ్యెనా అతడు ధన్యుడు. మఱియొకడు పరమాన్నమును లేక హవిష్యాన్నమునే ఆరగించువాడైనను, వానిమనస్సు కామినీ కాంచనములందు తగులువడి యుండెనా అతడు హతభాగ్యుడే!

489. నేనొకతరి మహమ్మదీయ గురునిచేత ఉపదేశమును పొంది, అనేకదినములు అల్లాస్మరణచేయుచు, మహమ్మదీయుల ఆచారములనే అవలంబించి వారి ఆహారములనే తినెడివాడను. ఆదినములలోనేను కాళీమాతదేవళమునకు పోజాలక పోతిని; హిందూదేవతానామముల స్మరింపనైన నాకు సాధ్యముకాలేదు.