Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/22వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

22వ అధ్యాయము.

అహంభావము

429. అహంభావము నిలిచియుండునంతకాలము ఆత్మజ్ఞానముగాని, ముక్తిగాని సంభవముకాదు. జననమరణబంధము తొలగదు.

430. నేనుఈగుడ్డను నాముందుతెఱగా పట్టుకొనినయెడల ఎప్పటివలె నేనుమీకు దాపుగనేయున్నను మీరునన్ను చూడజాలరు. అటులనే అహంభావమను తెఱవలన భగవంతుడు మీకుసర్వముకంటెను దాపుగనున్నను మీరువానిని చూడజాలకున్నారు.

431. ప్రశ్న:- స్వామీ మాకీఅవరోధమేల ఏర్పడినది? మేముదైవమును చూడజాలకుండుటేల?

జవాబు:- అహంభావమనునది జీవునియొక్కమాయ. ఈ అహంభావమే ప్రకాశమునుఅడ్డుచున్నది. ఈ 'అహం నేను: అనునదినశించెనాచిక్కులేదు. భగవదనుగ్రహమువలన 'నేనుకర్తనుగాను; ఆకర్తను' యనుభావము హృదయమున నెలకొనెనా ఈ జన్మయుండగనే నరుడు ముక్తుడగును. అతని కింక యేలాటిభయమును యుండదు.

432. పేరుప్రతిష్థలకై దేవులాడువారు భ్రాంతిలో పడినవారు. సర్వమునకును నియామకుడగు ఈశ్వరుడే అన్నిటిని నడిపించుచున్నాడనియు, సకలమునకును కారణము ఈశ్వరుడే గాని వేఱొకటి కాదనియు, అట్టివారు మఱచుచున్నారు. బుద్ధిమంతుడు "భగవాన్! అంతయు నీవే; సర్వమును నీవే" అనును పామరులునుభ్రాంతిపరులును "నేను, నేను" అనిప్రలాపింతురు.

433. నీవు ఎంతకాలము "నేనెఱుగుదును" అనిగాని "నేనెఱుగను" అనిగాని పలుకుచుందువో యంతకాలమును నీవొక వ్యక్తిగ భావించుకొనుచునే యుందువు. నీలోని అహమును నేనుతొలగించువఱకును, సమాధిని ప్రాపించి అవ్యయాఖండబ్రహ్మమును కనుగొనజాలవు సుమీ!" అని నాజగజ్జనని పలుకుచున్నది. అంతవఱకును ఈ "నేను" అనునది నా యెదుట నిలిచియే యుండును.

434. వెల్లుల్లిరసము పోసినగిన్నెను వేయుసార్లు తుడిచినను ఆవాసనపోదు అహంభావమనునది యంతటి మొండిభావము. ఎంతటి మహాప్రయత్నములు చేసినను అది పూర్తిగ మనలను విడిచి పోదు.

435. ప్రశ్న:- నరునికి మోక్షము లభించుటెన్నడు?

జవాబు:- వాని అహంభావము నశించినప్పుడే!

436. సమాధిని సాధించి అహంభావమును తొలగించుకొన గల్గువారు చాలఅరుదు. సాధారణముగా యదివిడువనే విడువదు. విసుగు విరామములేకుండ తర్కించినను వివేకించినను ఈ అహం అనునది మరలవచ్చి పై బడుచునే యుండును. రావిచెట్టును యీనాడు నఱికితిమిగదా అనుకొనిన రేపు చిగుర్చునే చిగుర్చును. 437. క్షుద్రాహంకారముతో ఎంతయో తీవ్రంపు పోరాటముసలిపి, ఆత్మజ్ఞానముకొఱకై భల్లూకపు పట్టుపట్టి ప్రయత్నించి, సమాధిదశను సాధించగల్గినప్పుడు మాత్రము ఈ "అహ"మును దాని పరివారమును తొలగిపోగలవు. అహంభావముచాలమొండిది. దాని మూలముననే మనము తిరిగి తిరిగి యీలోకమున జన్మయెత్తుచుండుట!

438. "నేను భగవంతుని సేవకుడను" అను భక్తుని అహంభావము, విద్యాహంకారమనబడును. దానిని సిద్ధాహంకార మందురు.

439. ప్రశ్న:- "నీచాహంకారమ"నగా ఎటువంటిది.

జవాబు:- "ఏమిటి! వారునన్నెఱుగరా? నేనింత ధనికుడనే? నాయంతటిభాగ్యవంతు డింకెవడుగలడు? నన్నుమించి పోజాలువాడెవడు? అని ప్రలాపించు "అహంకారము" నీచాహంకారము.

440. తమస్సుయొక్క స్వభావమే అహంభావము. అజ్ఞానమువలననే అదిపుట్టి ప్రబలమగుచున్నది.

441. ప్రశ్న:- నేనుముక్తుడనగుట ఎప్పుడు?

జవాబు:- "నేను" అను మాటనీనుండి తొలగినప్పుడు! "నేను", "నాది" అనుట అజ్ఞానము; "నీవు, నీది" అనుట సుజ్ఞానము, నిజమగుభక్తుడు "దేవా! నీవేకర్తవు, సకలమును చేయునది నీవు. నేనునీచేతులలో ఉపకరణమాత్రమను. నీవు నాచేత ఏమిచేయించిన, నేనుదానిని చేయుచున్నాను. ఈసమస్తమును నీవిభూతియే. ఈయిల్లు, ఈసంసారము సర్వమును నీయదియే; నాదికాదు. నీయాజ్ఞానుసారమే సేవయొనర్చుటకుమాత్రము నాకుహక్కుగలదు." అనిపలుకును.

442. ఇనుము పరశువేదిని (Philospher's stone) తాకి బంగారముగా మారనంతవఱకు, నీచలోహముగనే యుండుతీరున, జీవునకు ఈశ్వరసాక్షాత్కారము కానంతవఱకు "నేను కర్తను" అను భ్రమతొలంగదు. అంతవఱకును "నేనుఈసత్కార్యముచేసితిని ఆదుష్కర్మనుచేసితిని" అనుభిన్నభావము తప్పక వెన్నంటియేయుండును. ఈభిన్నభావమే, యీద్వైతిభావమే నిరంతరముగ సాగివచ్చుచున్న సంసారమునకు మూలమగు మాయ. ఉచితమార్గముననడుపుసత్వగుణప్రధానమై పఱగునది విద్యామాయ. దీనినిశరణుజొచ్చుదుమేని భగవంతునిచేర గల్గుదుము. ఇట్లు భగవంతుని ముఖాముఖినిచూచి వానిని ప్రసన్నుని చేసికొనినవాడు మాత్రమే మాయాసంసారమును దాటగల్గుచున్నాడు. భగవంతుడే కర్త యనియు, తాను అకర్తననియు గ్రహించునతడు ఈశరీరముండగనే ముక్తుడు కాగల్గుచున్నాడు. (అనగా జీవన్ముక్తుడగుచున్నాడు.)

443. అహంభావము చాల చెడ్డది. అది నిర్మూలము కానిది ముక్తిచేకూరదు. లేగదూడనుచూడుము. అది పుట్టుటతోడనే "హంహై" (నేనున్నాను) అని యఱచును. అందు ఫలితార్ధమేమి? అది పెద్దదైఎద్దగును. అప్పుడు దానిని నాగలికి కట్టుదురు. బరువులతో నింపిన బండ్లనది లాగవలసి యుండును. ఆ వైనచో గుంజలకు కట్టివేతురు; ఒక్కొక్కప్పుడు చంపియుయుగూడ తిందురు. కానియింతగా దండనల పాలైనను, ఆపశువు "అహం"కారమును వీడదు దాని చర్మముతో డోలు కప్పినప్పుడు "హం" (నేను) అను ధ్వని చేయును. దాని ప్రేవులను పెఱికి చీల్చి దూదేకులవాని నారిగాపెనవేసినప్పుడుగాని ఆపశువు వినయమునేర్చుకొనదు; అప్పుడీపశువు ప్రేవులు "తుహై" (నీవు) అను గానముజేయును. "అహం" (నేను) తొలగి "తు" (నీవు అనుభావము రావలయును. ఆత్మజ్ఞానముకలిగినగాని నరునకు ఈదశప్రాప్తముకాదు.

444. ప్రశ్న:- "అహం" కారము పూర్తిగ ఎన్నడును నశింపదా?

జవాబు:- కాలపరిపాకమున కలువరేకులు రాలిపోవును. కాని వానిమచ్చలు నిలిచియుండును. అటులనే నరుని "అహం"కారము పూర్తిగ వదలిపోగలదు; కాని పూర్వస్థితియొక్క చిహ్నములు నిలిచియుండును. అయినను అయ్యవి దుష్కర్మప్రేరకములు ఎంతమాత్రమునుకావు.

445. నీనీ "అహం"కారమును పోనడంచజాలనటుల కాన్పించినయడల, దాని "దాసోహం" భావముగ నిలిచియుండనిమ్ము. "నేను భగవంతుని కింకరుడను; నేను వాని భక్తుడను" అనుకొనునట్టి అహం" భావమువలన అంతగా కీడుకలుగదు. మిఠాయీలు అజీర్ణవాతమునకు కారణములగును; కాని కలకండ అట్టిదికాదు; దానియందంతటి దుర్గ్ణములు లేవు. దాసుని "అహం" భక్తుని "అహం", పశివాని "అహం" నీటిపైన పుల్లతోగీసినగీతను పోలియుండును. చాలా కాలము నిలువదు.

446. "నేను" అనుశబ్దమును గురించి ఎవడేని మననము చేసి దానిజాడ కనిపట్టవలయునని ప్రయత్నించినయెడల అది "అహం"కారమును సూచించు ఒకశబ్దముమాత్రమని తెలియవచ్చును. దానిని వదలించుకొనుట కడుదుర్లభము. దుష్టమగు అహంకారమా, నీవేవిధముగాను నన్నువదలకున్న నే నీశ్వరదాసుడను అను అహంకారరూపమునుధరింపుము. దీనినే పక్వమైన అహంకారమందురు.

447. నీకు గర్వమున్నయెడల, భగవత్కింకరుడననియో, ఈశ్వరతనయుడననియో భావనచేసి గర్వపడుము. మహనీయులందు శిశుస్వభావము కాన్పించును. వారు భగవంతుని యెదుట పసివారివలె నుందురు గాన వారికడ "అహం"కార ముండదు. వారి బలమంతయు భగవంతునిదే. అది భగవంతుని నుండియేవచ్చును. వారిదేమియు నుండదు.

448. సమస్తమును ఈశ్వరేచ్ఛననుసరించి జరుగుననియు తాను ఈశ్వరునిచేతిలోని ఉపకరణమాత్రమనియు, ఎవడేని దృఢవిశ్వాసమును పడసెనేని అట్టివాడీ జన్మమందేముక్తుడగును. "ఓ భగవంతుడా! నీపనులు నీవచేయుచున్నాడవు! ఇట్లుండ ఆహా! వీరలు "నేను చేయుచున్నాడను అని వాకొనుచున్నారే!" 449. నీ "అహం" భావమురూపుమాసి నీవు పరమాత్మయందు లయముగాంచునప్పుడు ముక్తిలభించును.

450. జీవుని నిజస్వభావము నిత్యసచ్చిదానందము. "అహం" కారమువలన పెక్కుఉపాధులుకలుగగా, అతడు తననిజస్వభావమును మఱచుచున్నాడు.

451. అందఱి దంభములును క్రమక్రమముగ సమసిపోగలవు. కాని జ్ఞానికి వానిజ్ఞానము గూర్చిన ఆడంబరము వీడుట దుర్లభము సుమీ!

452. "జగజననీ! నేను ఘనుడను, నేను బ్రాహ్మణుడను వారు క్షుద్రులు, మాలవారు అను భావములన్నింటిని నశింపజేయుము. ఏలయనవారలెవరు?, నీయనంత రూపాంతరములు గాక!"

453. "తల్లీ! నేను యంత్రమను; నీవు యంత్రివి. నేను గృహమును; నీవందుండుదానవు. నేను కత్తియొరను. నీవు కత్తివి. నేను రధమును; నీవు రధికవు. నీవు నాచేత ఎట్లు చేయించిన, నేను అటుల చేయుదును. నీవు మాట్లాడించిన తీరున నేను మాట్లాడుదును. నీవు నాలోనుండి వర్తించు రీతిని నేను వర్తింతును. "నాహం నాహం" (నేనుకాదు, నేనుకాదు.) "త్వమసి" (అంతయు నీవే)"

454. రెండు తెఱగుల 'అహం' కారము కలదు; ఒకటి పక్వమయినది, రెండవది అపక్వమైనది. "నాదేమియులేదు, నేనేమి చూచినను, అనుభవించినను, వినినను, ఇంతేల నాశరీరము సయితము - నాది కాదు. నేను సదా నిత్యముక్త బుద్ధ రూపమను' యిట్టిభావముతో వెలయు "అహం" కారము పక్వమైనది ఇది "నాయిల్లు, నాబిడ్డ, నాభార్య, నాతనువు' ఈరీతిగా తలపోయు "అహం" కారము అపక్వమైనది.

455. ప్రశ్న - "దాసోహం" భావముగలవాని అనుభవములును ప్రేరణలును యెట్టిలక్షణములు గలవిగ నుండును?

జవాబు:- ఆభావము సత్యమును నిర్మలమును అగు నెడల, యాఅనుభవములును, ప్రేరణలును, పేరునకుమాత్రము లీలగానుండును. బ్రహ్మసాక్షాత్కారానంతరము "దాసోహం" భావముగాని, భక్తభావముగాని, ఎవనియందేనినిలిచియున్నను, అతడు ఎవనికిని అపకారము చేయజాలడు. అట్టివానియందు వ్యష్టిభావంపు విషయమంతయు హరించి పోయియుండును. పరుశవేదిని తాకినఖడ్గము బంగారుగ మారిపోవును. దాని ఆకారము నిలిచియుండునుగాని అది ఏరికిని హానికూర్పజాలదు.

456. శంకరాచార్యుల యొద్దయొక శిష్యుడు చిరకాలము సేవలుచేయుచుండెను. కాని గురువు వాని కేమియు బోధించి యుండలేదు. శంకరాచార్యులు ఒకతరి యొంటరిగాకూర్చుండి యుండ, వెనుకనుండి ఎవరో వచ్చుచున్నటుల కాలి చప్పుడు ఆయనకు వినవచ్చెను. "ఎవరక్కడ" అనెను. "నేనే" అని ఆశిష్యుడు పలికెను. ఆచార్యులవారప్పుడు "నేను" అనుమాట నీకంత ప్రియమగునేని, దానిచే విశ్వమునంతటిని ఆవరించు నంతగా పెంపుచేయుము; లేదా దానిని పూర్ణముగా విడిచి వేయుము" అని బోధించిరట! 457. నరుని లౌకిక ప్రవృత్తునిగను, కామినీకాంచనప్రియునిగనుచేయు "అహం" కారము క్షుద్రమైనది. ఈ "అహం" కారము నడుమచేరి వ్యష్టిని, సమష్టినుండి వేఱుపఱచుచున్నది. నీటిమీద పుడకనొకదానిని పడవేసిన యెడల ఆనీరు విభాగమైనట్లుకాన్పించును. ఈపుడకయే "అహం" కారము. దానిని తొలగించిరా, నీరంతయుఏకమై ఒక్కటగును.

458. వాననీరు ఎన్నడును మెట్లమీదనిలువదు; అదిపల్లమునకే ప్రవహించివచ్చును. అదేరీతిని భగవదనుగ్రహము గర్వితులయొక్కయు, డాంబికులయొక్కయు, హృదయముల నుండిజారి, దీనజనులహృదయములందు నెలకొనును.

459. బియ్యము, పప్పు, ఆలుగడ్డలుమున్నగునవి చల్లని నీళ్లుగలకుండలోవేసినను, దానికి నిప్పుసెగతాకనంతవఱకే వానిని మనముతాకగల్గుదుము. జీవునిస్థితియు యిటులనే యుండును. ఈ దేహమే భాండము, ధనము, విద్య, కులము, వంశము, అధికారము, పలుకుబడి మొదలగునవి బియ్యము, పప్పు, ఆలుగడ్డలు మున్నగువానికి పోల్పవచ్చును. "అహం" కారమే అగ్ని. 'ఈఅహం' కారముసోకినచోజీవునకుతీండ్రము కల్గును.

460. సూర్యుడు లోకమునకంతకును వేడిని, వెల్తురును యొసగును; కాని మబ్బులుక్రమ్మి వానికిరణములనుఅడ్డగించివేయునెడల అతడేమియు చేయజాలడు. అధేవిధమున "అహం"కారము హృదయమును ఆవరించుచో భగవంతుడు అందుప్రకాశింపజాలడు. 461. "అహం"కారము భగవంతుని మనకు కానరాకుండ కప్పిపెట్టు మేఘము లీలనున్నది. సద్గురుకటాక్షము వలన "అహం"కారము అడగెనేని భగవంతుడు నిండుతేజముతో కాన్పింపగలడు. ఉదాహరణకు పటములో శ్రీరామచంద్రభగవానుని బొమ్మను చూడుము. (జీవుడగు) రామచంద్రభగవానుడు లక్ష్మణస్వామికి ముందుగ రెండుమూడు అడుగుల దూరమున మాత్రముండును. కాని (మాయా స్వరూపిణియగు) సీత వారిరువురకును నడుమనుండుటచేత, లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రుని దర్శనము లభింపకున్నది.

462. ఒక్కొక్క ఉపాధిచేరినకొలదిని జీవుని నైజము మారుచుండును. ఎవడైనను నిగనిగలాడు నల్లంచు సన్నధోవతిని గట్టి సోకుగ దుస్తులు ధరించెనేని, నిధుబాబు విరచిత శృంగారగీతములు వాని పెదవులపై నాట్యము సలుప మొదలిడును. ఇంగ్లీషుబూట్లు తొడగెనా కాలులీడ్చుకొనుచుపోవు బక్కవానికైనను డంబము సోకును. తక్షణమే అతడు ఈలలువేయసాగును; మేడ మెట్లెక్కవలసినచో దొరగారివలె మెట్టుపైనుండి మెట్టునకు కుప్పించుచుపోవును. వానిచేతికొక కలము చిక్కినయెడల, కైవశమైన కాగితము మీద నెల్ల గిలుకసాగునుకదా!

463. ధనమనునది మిగుల తీవ్రస్వభావముగల ఉపాధి ఏనరుడేని ధనికుడయ్యెనా వెంటనే పూర్ణముగమారిపోవును.

464. వినయ విధేయతలతోనొప్పు బ్రాహ్మణుడొకడు (ఇక్కడికి దక్షిణేశ్వరమునకు)తఱచుగా వచ్చుచుండెడివాడు. కొంతకాలమునకు అతడు రామానినాడు; వానిసంగతి యేమయ్యెనో మాకు తెలియలేదు. ఒకనాడు మేము కొన్నానగరము బోటెక్కిపోతిమి. మేము పడవదిగుచుండగా గంగానదిగట్టునకూర్చుండియున్న ఆబ్రాహ్మణుని కాంచితిమి. నదిపై నుండివచ్చు నిర్మలవాయువులు ననుభవించుచు దొరవలె కూర్చుండి యుండెను. నన్నుచూడగనే అనుగ్రహసూచనగా "ఓహో ఠాకూరూ! క్షేమమా?" అనిపలుకరించినాడు. వాని కంఠస్వరమున మార్పునుగనిపట్టి హృదయునితో నేనిట్లంటిని: హృదయా? వీనికేదియో సంపద చేజిక్కి యుండును. వీనిలో యెంతమార్పుచూపట్టుచున్నదో గ్రహించితివా?" అంతట హృదయుడు పకపకనవ్వసాగినాడు.

465. గర్వపడుట మహాధఃపతనము. కాకినిచూడుము; అదితానెంతయో బుద్ధిశాలిననుకొనును. అదెన్నడును వలలో చిక్కదు. ఏమాత్రము అపాయకారణముచూపట్టినను తప్పించుకొనిపోవును. కడునేర్పుతోదొంగిలించి మేతనుసంపాదించుకొనును. కాని పాపమాజంతువునకు అశుద్ధముతినక తప్పదయ్యె. అతిగా తెలివియున్నందుకు, అనగా నీచపు చమత్కారమున్నందుకు ఫలమిటులనుండును.

466. దంభము బూడిదప్రోవువంటిది. దానిమీద నీరుపడినతోడనే ఎండిపోవును. దంభముతో ఉబ్బిపోవువాని హృదయమున ప్రార్ధనలు ధ్యానములు ఫలప్రదములు కాజాలవు.

467. రెండుసందర్భములందు భగవంతుడు నవ్వునట! ఒకటి:- జబ్బుముదిరియొకడుచావనున్నప్పుడువైద్యుడు వచ్చి, వానితల్లితో "ఎందుకమ్మా! ఆతురపాటునకుకారణమేలేదు. నీకొడుకుప్రాణముసంరక్షించుటకు నాదిభారము" అని పలుకుసమయమున;

రెండది:- ఇద్దఱుసోదరులుచేరి భూమినిపంచుకొన నెంచి వారుకొలపగ్గములను చేబూని, పొలముమీదికిపోయి "ఈ ప్రదేశమునాది, ఆ ప్రదేశమునీది" అనుకొనుసమయమునను!

468. కొలదిచదువుగలవారు గర్వముతో తబ్బిబ్బగుదురు. ఒకమానవుడు నాతోభగవంతునిగూర్చి తర్కముసాగించినాడు "అబ్బో! ఈవిషయములన్నియు నేనెఱిగినవే!" అనెను. నేనంతట "ఢిల్లికి పోయివచ్చినవాడు, తానటుల పోయివచ్చితినని చాటుచు దంభములు పలుకునా? ఘనుడు తానుఘనుడనని వాక్రుచ్చుచుండునా?" అంటిని.

469. అజీర్ణవాతరోగముగలవాడు పులుసు వస్తువులు తనకు హానికరములని బాగుగాఎఱుగును! కాని అభ్యాసవశమున, అట్టివికండ్లపడెనా వానికినోరూరును. అటులనే "నేను" "నాది" అను సంకల్పములను ఎంతగా అడంచివేయ ప్రయత్నించినను, కర్మక్షేత్రమున దిగగనే అపక్వపు "అహం"కారము తలవెళ్ళబెట్టుచునే యుండును.

470. సతతము నీవిటుల తలపోయుచుండుము; "ఈ సంసారవిషయములు నావికావు; అవి భగవంతునివి; నేను వానిదాసుడను. వాని కోరికలు చెల్లించుటకే నేనిక్కడ నున్నాను." ఈభావము స్థిరపడినయెడల, నరుడు తనది అనుకొనుటకేమియు మిగిలియుండదు.

471. ఉత్తమసమాధియను, సప్తమభూమికను పొంది బ్రహ్మభావమున లయముగాంచిన కొన్ని జీవాత్మలు మానవ లోకమునకు మేలుచేయ కరుణగలవారై తమ ఆత్మోన్నతిని నుండి దిగివత్తురు. వారు విద్యాహంకారమును అనగా ఉత్తమాత్మ భావనను నిలుపుకొనియే యుందురు. కాని ఈ "అహం"కారము ఉన్నదనుమాటమాత్రమేగాని నీటిమీద గీసినగీతను బోలియుండును.

472. హనుమంతునకు భగవంతుని సాకార నిరాకార స్వరూపముల రెండును గ్రహించుభాగ్యము లభించినది. అయినను ఆతడు భగవత్సేవకుడను "అహం" కారమును నిలుపుకొనియెను. నారద, సనకసనంద, సనత్కుమారుడును అటులనే నిలుపుకొనగల్గిరి.

(ఈసందర్భమున, నారదుడు మున్నగువారు భక్తులు మాత్రమేనా, జ్ఞానులుకూడనా, అను ప్రశ్న బయలుదేరినది. శ్రీరామకృష్ణపరమహంసులవారిట్లనిరి.)

(నారదాదులు బ్రహ్మజ్ఞానమును పడసినవారే. అయినను మర్మఱధ్వనులతో ప్రవహించు సెలయేరులరీతిని వారలు భాగవతస్తోత్రముల గానము గావించిరి; పరబ్రహ్మమును, తామును వేఱను స్ఫృహను కలుగజేయు లీలామాత్రపువ్యక్తిత్వమును అనగావిద్యాహంకారమునువారునిలు పుకొనిరని తెలియుచున్నది. పారమార్ధిక మహత్తత్వమును యితరులకు బోధించునిమిత్తము వారటుల చేసియుండిరి.

473. తగులబడిన త్రాడునకు పూర్వపుఆకారము నిలిచి యున్నను; దేనినేని కట్టివేయుటకు పనికిరాని విధమున, బ్రహ్మ జ్ఞానాగ్నిచేత దగ్ధమైన "అహం" కారముండును.

474. కొబ్బరిమట్ట పడిపోవునప్పుడు చెట్టుమీదనొకమచ్చనునిలిపి పోవును. దీనినిబట్టి ఆతావున ఒకమట్టయుండెడి దని మనకు తెలియవచ్చును. అటులనే బ్రహ్మవే తలకు క్రోధాది ఉద్రేకములు కృశించి నశించిన చిహ్నములు మాత్రము నిలుచును. అట్టివారి స్వభావము పసివానినైజమును బోలియుండును, పసివానినైజమున సత్వరజ స్తమో గుణములు బలపడియుండని కారణమున అతడు ఒకదానియందు ఆసక్తినిపొందునటులనే దానిని విడిచివేయును: ఒక చిన్నపిల్లవాని కడ చాలవిలువగల వస్త్రముండగా "నేను దీనిని ఎవరికిని యియ్యను. యిది మానాయనకొనిపెట్టినాడు." అని పట్టుదలతో మొదటచెప్పిననుకూడ, దమ్మిడీ ఖరీదుచెయ్యని బొమ్మనిచ్చి ఆవస్త్రమును నీవు సంగ్రహింప గలుదువు. పసివానిదృష్టిలో ప్రతిది సమానమే. ఉత్తమాధమములను భేద భావములేదు. కులభేదముల పాటింపడు. వానితల్లి యింకొకని చూపి "వాడునీఅన్నే" అనిచెప్పినచాలును, ఆతడుకడజాతివాడైనను సరియే. ఒక్కకంచములో వానితోడ తిండితినుట కొడంబడును. వాని ద్వేషగుణము, శుచి, అశుచి అనుభావములుసయితముయుండవు. 475. ఎవడో తనను ముక్కలుముక్కలుగా నఱుకవచ్చు చున్నటుల ఒకనికి కలవచ్చును. దద్దఱిలిపోయి, ఆతడు మేల్కాంచును. తనగదితలుపులులోపల గడియవేసియేయున్నటులను, అందెవరును లేనటులను తెలిసికొనును. అయినను కూడ కొన్నినిమిషములవఱకును వానిగుండెకొట్టుకొనుచునే యుండును. అటులనే మనఅభిమానాహంకారములు మనసువీడి చనునప్పుడు తమమహిమను లేశమైన వెనుకవిడిచియేపోవును.

476, ప్రశ్న:- మీరుసమాధిస్థితిలో నుండునప్పుడు, లీలగానైనను "అహం" కారము మీయందు నిలుచునా?

జవాబు:- ఆహా! సామాన్యముగాకొంత "అహం"కారము నిలిచి యుండును. బంగారపుసుద్దమీదవేసి రుద్దిన చిన్న బంగారురేకు పూర్తిగా అరుగుకుండురీతి నుండును. బాహ్యస్మృతి యంతయు తొలగును; కాని బ్రహ్మానందమును అనుభవించుకొఱకు కొంత "అహం"కారమును భగవంతుడు నాలో నిలిపియుంచును.

ఒక్కొక్కప్పుడు మాత్రము, దానిని సయితము భగవంతుడు తొలగించివేయును. ఇది పరమోత్తమ సమాధి స్థితి. ఆస్థితి యిట్టిదని ఎవ్వరును పలుకజాలరు. అది జీవాత్మపరమాత్మగా సంపూర్ణముగా మారిపోవు అనిర్వచనీయావస్థ. ఉప్పుతోచేసిన బొమ్మ సముద్రమును కొలుచుటకై దానిలో ప్రవేశించును. అది నీటిని తాకినతోడనే కరిగిపోవును. ఆపిమ్మట సముద్రము ఎంతలోతుగలదో చెప్పుటకై మరలివచ్చుటకు ఎవరున్నారు? 477. ఒకసారి గురుదేవుడు తన శిష్యులలో నొకనిని వేడుకగా యిట్లు ప్రశ్నించెను? "సరేగాని, నాయందు అభిమానమున్నట్లు నీకు కాన్పించుచున్నదా? నాకు అభిమానమేమైన కలదా?"

శిష్యుడిటులనెను. "అవును, కొంచెమున్నది. ఆ కొంచెము నిలిచియుండుట ఎందుకొఱకనగా; (1) శరీర రక్షణకొఱకు, (2) భగవద్భక్తి సాధననిమిత్తము, (3) భక్తులసాంగత్యమునకూడియుండు యిచ్ఛవలన, (4) అన్యులకు సుబోధగఱపుకోరికను బట్టియును. అయిననుకూడ మీ రెంతయో ప్రాధేయపడిన యనంతరము అటుల నిలుపుకొనియుందురు. మీ ఆత్మయొక్క సహజదశ "సమాధియే" యని అభివర్ణింపనగును అని నాభావము. కాబట్టి మీకుగల అభిమానము మీరు ప్రత్యేకముగ ఉద్యమించి చేసిప్రార్ధనాఫలమని చెప్పితిని.

గురువు:- అవునుకాని ఈ జీవుని నిలిపియుంచుకొనునది నేనుకాదు. అటులచేసినది నాజగజ్జనని; నాప్రార్ధనను అంగీకరించు య్ధికారమంతయు నాదివ్యమాతదే.

478. భగవద్దర్శనముచేసినవాడే నిజమగుజ్ఞాని. అతడు పసిబాలునితీరున నగును. బాలుడుతనదగు వ్యక్తిత్వముగల వాడుగనే తోచును. కాని వాని వ్యక్తిత్వము చూపులకు మాత్రమే; సత్యముకాదు. పెద్దవారలవ్యక్తి భావముతో పోల్చిన యెడల పసివారల వ్యక్తిత్వము శూన్యమైతోచును 479. సమాధిని సాధించిన పిమ్మటను "దాసోహం" రూపమునగాని, "భాగవతోహం" రూపమునగాని తమ "అహం" కారమును కొందఱునిలుపుకొందురు. ఇతరులకు బోధచేయునిమిత్తము శ్రీశంకరాచార్యులవారు విద్యాహంకారమును నిలుపుకొనిరి.

480. "తల్లీ, నీదుకార్యములను నీవ చేసుకొనుచున్నావు; కాని నరుడు "నేను చేయుచున్నాను అని తలచును" అనుచు ఎవడేని సర్వమును చేయునది భగవంతుడేయను విశ్వాసమును పూనినయడల జీవన్ముక్తుడగును. (ఈ జీవముండగనే ముక్తుడగును.)

481. ఒకనికి తాను నాయకుడననియు, ఒక సంప్రదాయ నిర్మాతననియు, తలంపుకలదేని వాని "అహం"కారము అపక్వమైనది. అయినను బ్రహ్మానుభవమును పొందిన యనంతరము భగవంతుని ఆదేశము ననుసరించి, పరోపకారమునకై ఉపదేశములు చేయుటవలన హానిలేదు. పరిక్షుతునకు భాగవతమును బోధించునిమిత్తమై శుకమహామునికి అట్టి ఆదేశము కలిగినది.

482. గట్టిపాఱిన కలకండయందు, యితరములగు మధురపదార్ధములందలి దుర్గుణములు లేనితీరున "దాసుడను" "ఉపాసకుడను" అనుకొను జీవాత్మయందు ఆపక్వజీవులందు గల దోషములుండవు, మఱియు వాని బావము భగవంతునే చేర్చును. నిజమునకు యది భక్తియోగమే!