శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/21వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

21వ అధ్యాయము.

కామినీకాంచనములు.

(శ్రీరామకృష్ణపరమహంసులవారి బోధల భావమును చక్కగ గ్రహించువారికి శ్రీవారు స్త్రీయెడ నిరసనభావము కలవారు కారనియు, ప్రతివనితయందును శ్రీవారు సాక్షాత్తు భగవతి స్వరూపమునే గుర్తించువారనియు సులభముగ తెలియవచ్చును. శ్రీవారి యాక్షేపణయంతయు కామనిరసనమును సూచించునదే అయియున్నది. పురుషునిగూర్చి వచించునప్పుడు వానిని కామాగ్నిపాలు చేయుటలో స్త్రీ కారకురాలగునని మాత్రమే శ్రీవారి వాక్యములందు మనము గ్రహించవలసియున్నది. అటులనె శ్రీవారు స్త్రీరత్నములతో మాటలాడునప్పుడు పురుషునివలని అపాయములను గూర్చి నిర్దాక్షిణ్యముగ వచించెడివారు. శ్రీవారి స్వవిషయములోనో వారు స్త్రీపురుష భేదభావమునకు అతీతులై యుండెడివారు.)

399. భక్తిసాధనలను సాగించి భగవంతుని ప్రాపించగోరువారు ముఖ్యముగా కామలోభములయొక్క (అనగా విషయలోలతయొక్కయు; ధనకాంక్షయొక్కయు) వలలందు చిక్కు బడకుండ జాగరూకలై మెలగవలయును. లేనియెడల వారు పరిపూర్ణము నెన్నడు చేరజాలరు.

400. పాడుపడి పాములకు నిలయమైన యింటిలో కాపురముచేయువారు, ఏఅపాయము ఎప్పుడు మూడునోయని నిరంతరము మెలకువతో నుందురుగదా. అటులనేగృహస్థులై వర్తించువారు, కామము లోభము తమను భంగపఱచకుండ మెలకువగలిగి మెలగవలెను.

401. అడుగున సూదిబెజ్జమంత చిల్లియున్నను కడవెడు నీరును క్రమముగా కారిపోవును. అటులనే సాధకునియందు ఏమాత్రపు లోలతయున్నను వాని సాధనలన్నియు సున్న యగును.

402. సన్నిపాతజ్వరముచే బాధపడుచు సంధించియున్న వానిచెంత మంచునీరును, మిఠాయీలను పెట్టియుంచినయెడల వానిని ఆరగించవలయునను ఉద్రేకమును ఆరోగి ఆపుకొన గలడా? అటులనే కామజ్వరముతో కొట్టుకొనుచు యింద్రియ సుఖములకై ఆరాటపడు నరునికి ఒకవైపున సుందరవనితల టక్కులును మరొకవైపున ధనాకర్షణలును సిద్ధమైనచో వానిని అతడు నిగ్రహించ జాలడు. అతడుభక్తిని పోనాడి పెడత్రోవల త్రొక్కుట నిక్కువము.

403. కామినియు, కాంచనమును, లోకమునంతటిని పాపమున ముంచెను సుమీ! స్త్రీజగజ్జనని ప్రతిరూపముగా చూడబడినయెడల ఆమెవలని ప్రమాదముండదు.

కామినీకాంచనములందనురాగము నరుని పీడించుచున్నంతకాలము భగవత్సాక్షాత్కారముకాజాలదు.

404. "నేనుచేయుహరిభక్తి బోధలన్నియు నరులమానసములందు పరివర్తనమును గల్పింపజాలకుండుటకు కారణమేమి?" అనిచైతన్యులవారిని నిత్యానందుడు అడిగినాడు. ఇందుకు సమాధానముగా "స్త్రీల సాంగత్యముననున్నారు గాన వారుఉత్తమబోధలను మనసున నిలుపుకొనజాలకున్నారు. కావున నిత్యానందసోదరా! ఈలౌకికజనులకు పాపము! ముక్తి యలవడుట దుర్లభము" అని శ్రీచైతన్యులవారు పలకిరి.

405. ఈసర్వమును దిగమ్రింగుదానిని "మాయ" యనవలయునా 'మాయి' అనవలయునా?

406. కామినీకాంచనములందు తగులువడిన నరులు వాని మూలమున వేనవేలుగ అవమానములు పొందుచున్నను, వాని బంధములనుండి విడివడి, మనస్సును మాధవునిపైకి ద్రిప్పజాలకున్నారు.

407. తీవ్రవైరాగ్యముపూని యొక్కసారి బ్రహ్మసాక్షాత్కారమును పడసినయెడల, అతిబలతరములగు మోహబంధములు తెగిపోయి, భార్యదాపున నున్నను వానికి అపాయము వాటిల్లదు. ఒక యినుపముక్కకు సమదూరమున రెండువైపులను సూదంటురాళ్ళున్నయెడల, వానిలో యేది దానిని లాగివేయును? ఆసూదంటురాళ్ళలో పెద్దదనుటకు సందియములేదు. శ్రీహరి పెద్దసూదంటురాయి అనుటకు సంశయములేదు. అప్పుడు చిన్నసూదంటురాయివంటి స్త్రీ నరునేమిచేయగలదు?

408. నీవెంత జాగరూకతతో మెలగువాడవైనను,నిండుగ పొగచూరి మసిపట్టియున్నగదిలో వాసము చేసితివా, యింతయో అంతయో మసిడాగుపడక తప్పించుకోలేవు. ఎం తబుద్ధిమంతుడైనను, ఎంతమెలకువతో మెలగువాడైనను, నరుడు స్త్రీజనము నడుమ వసించునెడల, ఏకొలదిగనైనను కామచింతలు వానిమనస్సున పొడసూపుట నిశ్చయము.

409. యౌవనవంతుడగు ఒకశిష్యుని సందర్భములో శ్రీపరమహంసులవారిట్లనిరి. వానిముఖమున పతితచిహ్నములు చూపట్టుచున్నవి. నల్లనిపొఱయొకటి వానిమోమున ఆవరించినది. ఇదంతయు వానియుద్యోగబాధల వలన సంభవించుచున్నది. జమాఖర్చులెక్కలు, మరియిట్టివెన్నియో విషయములు వానిని ఆవరించివేసినవి."

410. ధనము నీకు తిండినిమాత్రమే ప్రసాదించ గలదు. అదియొక్కటియే నీజీవనగమ్యమును పరమలక్ష్యమునని తలపోయకుము.

411. ఒకతడవ శ్రీపరమహంసులవారు తరుణవయస్కుడగు శిష్యునొకని చూచి "పామర జనునివలె నీవు డబ్బుపుచ్చుకొని ఉద్యోగముచేయప్రారంభించినాడవు. నీతల్లికొఱకై నీవు పాటుపడుచుంటివి. అటులకానియెడల ఛీఛీ! ఛీఛీ! అనియుందును." అని నూరుసార్లు పదే పదే పలికినారు. తుదకు "నీవు భగవత్సేవ యొకటియే చేయుముసుమీ!" అని పలికిరి.

412. కామినియు కాంచనమును నరులను నారాయణుని నుండి వేఱుచేసి, సంసారమున ముంచివేయునని జ్ఞప్తినుంచుకొనుడు. మంచిదిగాని, చెడ్డదిగాని నరుడు తన భార్యను పొగడుచునేయుండుట కడుచిత్రము. 413. కామినీ కాంచన ప్రేమయందు మునిగిన మనస్సు లేత పోకకాయవలె నుండును. అది పచ్చిగానుండునంతకాలమును పై బెరడునకు అంటుకొనియే యుండును. అది పండి యెండినప్పుడు వక్కయు, డొల్లయు వేఱుపడి, కదలించునప్పుడు లోపలికురిడి లొటలొటలాడును. అటులనే లోనున్న కామినీ కాంచన మోహము ఎండబారినప్పుడు, జీవునకును శరీరమునకును ఎంతమాత్రమును సంబంధము లేదనుట తెలియవచ్చును.

414. త్రాసుయొక్కముల్లు నిటారుగనిలువకుండ ఎప్పుడు ఒరగిపోవును? ఒకవైపుశిబ్బె రెండవదానికన్న బరువైనప్పుడే గదా? అటులనే మనస్సున కామినీకాంచనములంగూర్చిన ప్రేమభారముపడినప్పుడు, అదిభగవంతుని చూచుటతప్పి ఒరగిపోవును.

415. సంసారులారా! స్త్రీలపైమిక్కుటముగ ఆధారపడి యుండబోకుడు. కానరాకుండవారు మీపైని తమఅధికారమును స్థాపించుకొందురు సుడీ!

416. క్రోతి వేటగానికాళ్లకడపడి చచ్చుచందమున పురుషుడు సుందరాంగి చరణములకడ బలియగుచున్నాడు.

417. శ్రీరామకృష్ణ పరమహంసులవారికి ఏలాటికర్చులు అవసరమైనను డబ్బుసిద్ధముగచేతనుండు నటుల కొన్నివేలరూపాయలను అర్పణచేయుటకు అనుజ్ఞనీయుడని యొకమార్వాడీ వర్తకుడు వేడుకొనెను. కాని శ్రీపర మహంసులవారు నిష్ఠురముగ వలదనిచెప్పుటతప్ప ఆకానుకను సంతసమున స్వీకరింపరైరి. "నాకుడబ్బుతో నేలాటి పనియు నుండరాదు. దానిని స్వీకరించితినా నామనసు యికదానిపైననే నిలిచియుండును" అనిరి.

అంతట ఆపెద్దమనుష్యుడు సొమ్మును శ్రీరామకృష్ణపరమహంసులవారి బందుగులలో నెవరిపేరటనో బ్యాంకులోవేసి శ్రీ వారికి వినియోగపడునటుల చేసెదననెను. "అటులను వలదు. ఆపని కపటకార్యము. యింతేగాక ఒకరి దగ్గఱ నాధనమున్నది అను భావము నామనస్సును పట్టుకొనగలదు." అని శ్రీ వారుచెప్పిరి.

అప్పుడును ఊరకొనక ఆమార్వాడీ "మనస్సు తైలము తీరున నున్నయెడల, అది కామినీ కాంచనములతో గూడిన సంసార సాగరముపైని తేలికగ పఱచుకొని పైపైని తేలుచుండగలదని" ఒకప్పుడు శ్రీపరమహంసులవారు చెప్పిన వాక్యమును జ్ఞప్తికితెచ్చి, తనదానమును అంగీకరించుడని మరి మరి ఒత్తిడిచేయసాగెను.

"ఆమాటనిజము. కాని ఆచమురే నీటిపైని చాలకాలము అటులతేలుచుండిన యెడల మురుగెత్తును సుమీ! అటులనే కామినీకాంచనయుత సాగరముపైని తేలియాడుచున్ననుకూడ, మనస్సునకు వానితోడి సహావాసము చాలకాలము కలిగినయెడల, అది భ్రష్టమై కంపుకొట్టగలదు." అని శ్రీవారు సమాధానము చెప్పిరి. 418. ఇంకొక మార్వాడీ శ్రీపరమహంసులవారిని దర్శించినప్పుడు "స్వామీ! నేను సర్వమును త్యాగముచేసి యున్నాను; ఇంకను నాకు భగవత్సాక్షాత్కారము లభించకుండుటకు హేతువేమి?" అని ప్రశ్నించెను.

శ్రీవారు "నూనెపోసి నిలువయుంచు తోలుతిత్తులను చూచియుందురు. ఆతిత్తుల నొకదానినుండి నూనెనంతటిని కార్చివేసిచూడుడు. దాని అడుగునను ప్రక్కలను కొంత నూనె అంటియేయుండి విడిచిపోదు. నూనెవాసనయో తుదివరకు నుండును. అటులనే కొంతసంసారవాసన మీయందు మిగిలియున్నది." అని వివరించిరి.

419. పాము కంటబడినప్పుడు "తల్లీ! మనసా! నీతోకను మాత్రము చూపుచు, తలను చూపకుండ తొలగిపొమ్ము" అను ఆచారము కలదు; అటులనే కామోద్రేకము పురికొలుపు విషయములనుండి దూరముగానుండుట తెలివిగలపని; వానిపొత్తువలన పతితులై తెలివి తెచ్చుకొనుటకన్న వాని పొత్తునకే పోకుండుట శ్రేష్టము.

420. మనస్సు భోగములపైని ఆశవీడి నిర్మలమైనప్పుడు అది మాధవునిపైని లగ్నముకాగలదు. ఈతీరున బద్ధజీవుడు ముక్తుడుకాగల్గును; హరినివీడి పెడత్రోవనుబోవు జీవుడు బద్ధుడే.

421. ఒకశిష్యుడు భగవధ్యానముచేయుచు కాలము గడుపుచున్నను, అప్పుడప్పుడుదుస్సంకల్పములు తమమనస్సులోలజూపుచునేయుండి, తానుకామమును జయింపలేకుండుటకు కారణమేమని శ్రీపరమహంసులవారినిఅడిగెను. శ్రీ వారిటుల బోదించిరి.

"ఒకనికడ పెంపుడుకుక్కయుండెడిది. ఆతడు దానిని మక్కువతోచూచి, చేతులలో ఎత్తుకొని, ముద్దాడుచు దానితో చలగాటలాడెడివాడు. ఒకజ్ఞాని యిదిచూచి కుక్కపైని యింతటి యనురాగము చూపతగదని మందలించినాడు. ఏమిచేసినను కుక్కమూఢజంతువుగదా; ఎన్నడైనకఱవచ్చును. దానియజమాని యీబోధనాలకించి యొడిలోనున్నకుక్కను ఆవలికిత్రోసివేసి యికనెన్నడును దానిని చేరదీయుటగాని, ముద్దాడుటగాని, కూడదని నిశ్చయించుకొనెను. కాని, ఆకుక్క యజమానుడు బుద్ధిమార్చుకొనిడాని తెలియజాలక యెప్పటివలె యెత్తుకొని ముద్దాడునను పేరాశతో తఱచుగావాని చెంతకు పరుగెత్తుచుండెడిది. ఎన్నిసారులో యజమానుడు దానినికొట్టి తఱిమివేసినగాని కుక్కవానిని బాధించుటమానినదికాదు. నీగతియు, ఆయజమానుని గతిని బోలియున్నది. నీవు నీహృదయమునందు చిరకాలము ప్రేమచూపి పెంచిన కుక్కను నీవు వదలించుకొనకోరినను నిన్నుసులభముగ వదలకున్నది. అయినను భయములేదు. ఆకుక్కనిక చేరదీయకుము. అదినిన్నుచేరవచ్చునప్పుడెల్ల ఛీకొట్టి దూరముగతఱిమివేయుచుండుము. కొంతకాలమునకు ముద్దాడుమని నిన్ను తిప్పలు పెట్టుచున్న ఆకుక్క (కామము) నిన్నువిడిచివేయును."

422. నీకామసంకల్పమును పూర్తిగ వశముచేసికొనుము. అటులచేయుటయందు కృతకృత్యుడవైనచో నీస్థూలశరీరము నందొకమార్పేర్పడి "మేధ" అనునాడి యొకటి ప్రబలమగును. ఈనాడికి శరీరమందలి క్షుద్రశక్తులను ఉత్తమశక్తులగపరిణమింపజేయు స్వభావముకలదు. ఈ "మేధ" నాడిబలబడినయనంతరము ఆత్మజ్ఞానము యలవడగలదు.

423. పాములు విషజంతువులు. వాని పట్టుకొనబోయిన యెడల అవి నిన్ను కఱచును. మన్నుమంత్రించి వానిపైనిజల్లి వానిని వశముచేసికొను పాములవానికి పాములనుపట్టుకొనుట యంతకష్టమగు పనియేకాదు. ఏడెనిమిది పాములను సయితము అతడు చేతులకును మెడకును చుట్టుకొని యతడు ఆటలాడ గల్గును.

424. వంతెనక్రిందుగా నీరుపాఱుచు పోవునేగాని అక్కడ యదిమురుగదు. అటులనే ముక్తపురుషుని చేతులగుండా ధనము నడచిపోవునేగాని అందది నిలిచి పేరుకొనదు.

425. ఎవనికి ధనము దాస్యముచేయునో యతడే పురుషుడు. ధనమును వ్యయముచేయుట నెఱుగని వానిని పురుషుడనతగదు.

426. తమ ధనమును, తమ యధికారమును, తమ పేరు ప్రతిష్ఠలును, పలుకుబడిని చెప్పుకొని గర్వించువారు కలరు. కాని యివన్నియు నాలుగుదినాలముచ్చటలే! చచ్చినవెనుక వీనిలో వెంటవచ్చునదేదియు లేదు.

427. ధనములో గర్వించదగిన యంశమేమియులేదు. నీవు ధనవంతుడవని చెప్పుకొనజూతువేని నీకంటె ఎందరో యధికధనవంతులుకలరు. వారితోపోల్చునెడల నీవుదరిద్రు డవే అగుదువు. సంజచీకటులు క్రమ్మగానె మెరుగుడుపురుగులుకాన్పించి తాముప్రపంచమునకు వెలుగునిచ్చుచున్నట్లు గర్వించును. కాని నక్షత్రములు తళతళ మెరయుట ప్రారంభముకాగానే వానిగర్వము అడంగును. అప్పుడు నక్షత్రములు "మేముజగమునకు ప్రకాశమునిచ్చుచున్నాము." అని ప్రగల్భములుసాగించును. చంద్రోదయముకాగా యవి వెలవెలపోవుచున్నవి. ఆచంద్రుడో తాను విశ్వమునంతను వెలుగుతో నింపి మనోహరసుందరమూర్తినై పఱగుచుంటినని ఆత్మలో పొంగుచుండును. ఇంతలో అరుణోదయమై తూర్పుదిశను సూర్యభగవానుడు యుదయించనున్నడనిచాటును. అప్పుడు చంద్రుని ప్రభావమెక్కడ?

ధనికులని విఱ్ఱవీగువారు ఈప్రకృతి సంఘటనల తలపోసి తమ భాగ్యభోగ్యములగూర్చి మిట్టిపడకుంద్రుగాక.

428. కామినీ, కాంచనముల మోహము మనస్సునుండి తొలగిన యనంతరము జీవునికి మిగులునదేమిటి? అప్పుడు బ్రహ్మానందము ప్రశాంతముగ పఱగ గలదు.