Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/20వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

20వ అధ్యాయము.

పారమార్ధిక సాధనయందలి

అవాంతరములు.

391. పిఱికితనము, ద్వేషము, భయము, --జ్యముచేయుపట్ల భగవంతుడు గోచరించడు

392. ప్రశ్న:- మనస్సు ఎట్టిదశయందున్నప్పుడు భగవత్సాక్షాత్కారము లభించును?

జవాబు:- మనస్సు ప్రశాంతముగ నున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరించును. మనోజలధిని వాంఛల నెడు గాడ్పులు కల్లోలపఱచుచో అందు దేవునిప్రతిబింబము గోచరించదు; భగవత్సాక్షాత్కారము అట్టిదశయందు అసంభవము.

393. పాపవిషయములందుచరించు మనస్సును మాలపల్లె యందు వసించు బ్రాహ్మణునికి పోల్చనగును; లేదా పెద్దనగరములలోని వేశ్యవాటియందు కాపురముండు సజ్జనునితో పోల్చదగును.

394. అనేకమంది మానవులు వినయము చూపనెంచి "నేను మురికిగుంటలలో నుండు వానపామువంటివాడనండి! అనుచుందురు, అటుల సదామననము చేయుచు నుండువారు కొంతకాలమునకు కీటకములమాదిరి పారమార్ధికత యందు క్షుద్రులగుదురు. హృదయమున నిరాశయుండ తగదు. నిరాశయనునది పురోగమనమునకు ప్రబలశత్రువు. "మనుజుడు తాను మననము చేయురూపమునే పొందును."

395. దారపుకొనను రేగినపోగులున్నంతకాలమును యది సూదిలో దూరజాలని చందమున, నరునందు కోరికలు యేమాత్రమేని రేగుచుండు నంతకాలమును ఆతడు బ్రహ్మలోకమున ప్రవేశింప జాలడు.

396. కడుపునిండియున్నను అజీర్ణవాతముతో బాధపడుచున్ననుగూడ నరునికి మిఠాయిగాని, కమ్మని కూరగాని కంటబడగానే నోరూరును. ఒకనికి లోభగుణము యిసుమంతయు లేకపోవచ్చును. అతడు పవిత్రభావములు కలవాడై యుండవచ్చును. కాని ధనము కన్నులకగపడినప్పుడును, కామ్యార్ధములు చేరువలో నున్నప్పుడును, వానిమనస్సు పెరపెరలాడును సుమీ!

397. ఇతరులమంచిచెడ్డల విమర్శించుచు కాలముగడుపు వానిజీవనము వ్యర్ధముగావ్యయమై పోవును. యిట్లితరులజోలి పెట్టుకొని వ్యర్ధకాలయాపనచేయువానికి తనఆత్మను గురించిగాని, పరమాత్మను గురించిగాని చింతనచేయుటకు సమయము చిక్కదు.

398. పెద్దపెద్దధాన్యపుకొట్ల ద్వారములకడ పేలాలు మూటలుగల యెలుకబోనులు పెట్టుదురు. ఆపేలాలవాసనచేతలాగబడి యెలుకలు ధ్యాన్యపుగింజల రుచిచూడవిడిచి బోనులలోనికిపోవును. అందవి చిక్కుకొనిచచ్చును. జీవునిగతి అట్లగుచున్నది. కామాదులను తృప్తిపఱచుకొనుటచేత కలుగు అల్పసుఖములకంటె యెన్నియోకోట్లరెట్లు సుఖప్రదమగు బ్రహ్మానందమునకు చేరువనే జీవుడున్నాడు. కాని ఆ బ్రహ్మానందమును యనుభవించుటకు మారుగా ప్రాపంచిక విషయ సుఖముల వాసనచేత లాగబడి మాహామాయపన్నిన వలలో జిక్కుకొని, భ్రాంతుడై యందేమరణించుచున్నాడు.