శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/19వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

19వ అధ్యాయము.

పారమార్థిక సాధనయందు దీక్ష.

373. గాలమువేసి పెద్దచేపను పట్టుకొనయత్నించువాడు ఎఱనుగ్రుచ్చిన గాలమును నీటిలోవేసి, మౌనముపూని చాలాకాలము శ్రద్ధతోవేచియుండునెడల చేపవచ్చి పట్టుపడును. అటులనేధ్యానాదుల సాగించుచు శ్రద్ధతోవేచియుండు భక్తుడు తుదిని భగవంతుని పట్టుకొనగలడు.

374. క్రొత్తగాపుట్టినదూడ తడబడుచు అనేక పర్యాయములు నిలువబోయి పడుచుండును; తుదిని స్థిరత చిక్కినిలువగల్గును. అటులనే క్రొత్తగాధ్యానాదిసాధనలు పూనువాడు చాలసారులు తొట్రుపడును. కానితుదను వానికి జయను సమకూడుదు.

375. భయావహమగు శివసాధనను పూని యిరువురు కాళీదేవిని ప్రత్యక్షము చేసికొనయత్నించిరట. ఒకడు అర్ధరాత్రమునకుచాలపూర్వమె ఆస్మశానమున కాన్పించసాగిన దృశ్యములగాంచి భీతిలిపోయినాడు. రెండవవాడు అర్ధరాత్రము దాటువఱకును ధైర్యముచిక్కబట్టి నిలచి దేవినిప్రసన్నముచేసికొనగలిగినాడు. అప్పుడతడు "జగజ్జననీ! ఈరెండవవాడు "పిచ్చివాడై పోయినాడు; ఎందుచేతనమ్మా?" అని అడుగగా పుత్రా! నీవును నీపూర్వజన్మలందు పెక్కుతడవలు యిటు లనే పిచ్చివాడవగుచు వచ్చితివి. యిప్పుడు తుదకునన్నుగాంచగల్గితివి" అని జగజ్జనని పలికెను.

376. పాలగిన్నెక్రింద నిప్పున్నంతకాలమును పాలు పొంగుచునేయుండును; కాని నిప్పును తీసినవెంటనే పాలుపొంగుట మానును. అటులనే క్రొత్తగ భక్తిసాధనలు పూనునతడు ఆసాధనలు సాగునంతవఱకే ఆవేశముతో పొంగిపడుచుండును.

377. కమ్మరివాని దాగలిమీద ఎటువంటి సమ్మెట దెబ్బలుతగులునో చూడుడు; అయినను ఆదాగలి చంచలింపదు. మానవులకును అట్టి ఓర్పు, స్థిరత అలవడవలయును.

378. ఓడలోని దిక్సూచీయంత్రమున ముల్లు ఉత్తరదిశను చూపుచుండునంతకాలమును, ఓడ దారిదప్పి అపాయముల జిక్కుపడునను భయముండదు. జీవననౌకకు దిక్సూచి యననగు నరుని మనస్సు పరబ్రహ్మమువంకకు తిరిగియుండి చలింపకుండునంతవరకును వాని కేయనర్థమును వాటిల్లదు.

379. కాళీఘట్టమునకు త్రోవలనేకములుకలవు. సంశయశర్మయనువాడు అచ్చటికి పోవలయునని తనయూరినుండి బయలుదేఱెను. త్రోవలో యతడు "నేను కాళీఘట్టము చేరుటకు మార్గమెద్ది?" అని ఒకమనుష్యుని అడిగినాడు. "ఇదిగో ఈత్రోవనుపొమ్ము" అని అతడుచెప్పినాడు. మరికొంత దూరముపోయి సంశయశర్మ వేఱొకని చూచి "కాళీఘట్టమునకు దగ్గిఱత్రోవ యిదేనా? అని ప్రశ్నించినాడు. ఆమనుష్యుడు "అబ్బే యిదికాదు. కొంచెము వెనుకకుపోయి, ఆఎడమచేతివైపుత్రోవను పొమ్ము" అనెను. అప్పుడు సంశయశర్మ ఆరెండవ త్రోవను కొంతవడిపోయి యింకొకనినికలుసుకొని వానిని త్రోవయడిగినాడు. అతడు మరియొక త్రోవను చూపినాడు. ఇటుల మరలమరల త్రోవలను మార్చుకొనుచుసంశయశర్మ పొద్దుక్రుంకువఱకును నడచినాడు కాని పయనమైనతావునుండి ఎంతయోదూరము పోలేకపోయెను. నిశ్చయముగా కాళీఘట్టము చేరనెంచువాడు ఎవడోఒకడుతెలిసినవాడుచెప్పు త్రోవననే అనుసరించవలయును. అటులనే భగవత్సాక్షాత్కారమును, పడయజూచువాడు ఒక్కగురువునే ఆశ్రయించి యుండవలెను.

380. ఈతనేర్వ తలపెట్టునతడు కొన్నిదినములు ప్రయత్నమును సాగించవలయును. ఒక్కదినము సాధన చేసినంతటనే సముద్రమున ఈదులాడు సాహసము నెవడును పూనరాదు. అటులనే నీవు బ్రహ్మసాగరమున ఈదులాడునెంచితివేని, నీవు కృతకృత్యుడవగుటకు పూర్వము, ఫలముచే జిక్కకున్నను చాలప్రయత్నముల చేయవలసియుందువు.

381. సంచిచిరిగికారిపోయి నలుదిశలునేలబడిన ఆవగింజలను ప్రోవుచేయుట చాలాకష్టము. అటులనే నరునిమనస్సు పలుతెరగుల లోక విషయములంబడిపోయినయెడల దానిని కూడదీసికొని ధ్యానమునందు ఏకాగ్రముచేయుట దుర్లభము. 382. పండ్రెండువత్సరములు అనావృష్టివచ్చి యేమియు పండకపోయినను వంశపరంపరగా వ్యవసాయముచేయుచుండిన రైతు సేద్యమునుమానడు. కాని క్రొత్తగావ్యవసాయమునకు దిగినకోమటి ఒక్కఋతువులో వానలులేక బెట్టగా నుండుట తటస్థించినయెడల దిగులుపడి ఆవ్యవసాయమును కట్టిపెట్టును. అదెతీరున సహజమగుభక్తిగలవాడు ఒకజన్మకాలమంతయు తనభక్తిఫలించి దేవతప్రత్యక్షము కాకపోయినను నిరుత్సాహమును చెందడు. (క్రొత్తగాభక్తిచేయ మొదలిడు నతడు సద్యోఫలములేదని మానివేయును.)

383. పతివ్రతయగు స్త్రీ తాను ప్రేమించిన భర్తమరణించిన యనంతరమును తన పాతివ్రత్యమును వీడక తనభర్తను భావమున పూజించుచునేయుండును. అటులనే అనన్య భక్తిగలనరుడు తన యిష్టదైవతమును నిశ్చలముగ అంటిపట్టుకొనియుండి వానితో సైక్యతను సాధించును.

384. ఇత్తడిచెంబు అనుదినము తోమనియెడల చిలుముపట్టి కగ్గిపోవును. అటులనే ప్రతిదినమును ధ్యానాదులుచేయక విడచినయెడల నరుని హృదయము మలినమగును" అని శ్రీపరమహంసుల వారిగురువుశ్రీతోతావురిసెలవిచ్చెను. ఆచెంబు స్వర్ణమయమైనదైనయెడల దానిని ప్రతిదినము తోముట అనవసరము. అటులనే బ్రహ్మసాన్నిధ్యమును పడసిన నరుడు పూజలు పునశ్చరణలు చేయకున్నను లోటుకలుగదు. అని శ్రీపరమహంసులవారనిరి. 385. నీవు సజీవుడవై యున్నంతకాలమును, భక్తిధ్యానముల రహస్యములను గూర్చి యనుదినమును విచారణచేయుచునే యుండుము. అందువలన నీకు లాభముకలదు.

386. ప్రశ్న:- ఎప్పుడో అరుదుగా గాని హృదయమున శాంతి పొడమదు. అట్టిశాంతి దీర్ఘకాలము నిలువకుంటకు హేతువేమి?

జవాబు:- వెదురుకట్టెలు కాల్చిచేసిననిప్పు చల్లారకుండ నిలుపుటకు తఱచుగా కదల్చుచు ఊదుచునుండవలెను. అటులనే ఆధ్యాత్మికాగ్నిని నిరంతరము జ్వలింపజేయు ప్రయత్నము సాగించుచునే యుండవలయును.

387. ముంగురులు చుట్టుకొనిపోవుసిద్దీ (Negro) జుట్టును పోలియుండుమనస్సు నీవెంతగా సవరించి దాని కుటిలతను (వంకరగతిని) మాన్పజూచినను అది పెడత్రోవల బోవుచునే యుండును. మనస్సును తిన్నగ లాగిపట్టి గట్టిగ నిలిపియుంచునంత కాలము యది సరిగనే నడచును. ప్రయోజనకారిగనే యుండును; కాని జాగ్రత్తకొఱవడెనా యది వక్రగతికి తిరుగును.

388. క్రొత్తకుండను నిండుగానింపి ఉట్టిమీద బెట్టియుంచుము. నాల్గుదినాలలో నీరంతయుపోయి తడియు ఆరిపోయి పొడిగనుండును. కాని దానినే నీటిలోనుంచితివేని అదటుల నున్నంతకాలమును నిండుగనే యుండును. భగవద్భక్తి విషయమున నీగతియు యిటులనేయుండును. అదేతీరున నీ హృదయమును భగవద్భక్తితోడనింపి, కొంతవడికి దైవమునుండి దానిని వేఱుచేసి, లోకవ్యవహారములందు నిలిపితిరా, కొలదికాలములోనె భక్తియంతయు పోయి పేదపడును. పావనభక్తివిశ్వాసములు నిరంతరము నీహృదయమును ఆవరించి యుండునటుల జేసితివాసదాయది పవిత్రభక్తిపూరితమైయుండి ప్రసన్నముగ నుండును.

389. సముద్రమున ముత్యములున్నవి; కాని వానిని తీయగోరు నరుడు ప్రాణాపాయమునకు వెఱువక నీటమునుగవలయును. ఒక్కసారి మునిగినంతనే ముత్యములు చేజిక్కిని యెడల సముద్రమున ముత్యములులేవని నిర్ణయించతగదు. మరలమరల మునిగి వెదకులాడినచో తుదకు కష్టము ఫలించును. ఈజగమున భగవంతుడుగలడు. ఆదేవుని కనుగొనుటలో నీతొలిప్రయత్నముఫల మొసగనియెడలనిరుత్సాహివి కాదగదు. పట్టువీడక పెక్కుసారులు పాటుపడుము. తుదిని నీకు వాని సాక్షాత్కారము లభించును.

390. జ్ఞానదానమును పూర్ణముగా నొక్కసారి చేయుటకు వలనుపడదు.