Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/24వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

24వ అధ్యాయము.

ధ్యాన నిష్ఠ

490. తీవ్రధ్యాననిష్ట ధ్యేయ వస్తువుయొక్క నిజలక్షణములను ప్రస్ఫుటముగావించి, ధ్యాతయొక్క ఆత్మయందు నెలకొనునటుల చేయును.

491. సాత్విక స్వభావముగలవాడు ఎటుల ధ్యానించునో తెలియునా? ఆతడు అర్ధరాత్రి వేళను, ప్రక్కపై పరుండియు, ముసుగు వేసికొనియు, ఇతరులు తననుచూడ రాకుండ ధ్యానము సలుపును.

492. ప్రారంభదశయందు, మనోసంయమనము చేయునతడు, ఏకాంతస్థలములందు సాధనచేయవలయును; కాదేని అనేక విషయములు వానికి చంచలమును కల్పించును. పాలను నీటినిచేర్చి పెట్టితిమేని అవి కలసిపోవుటసత్యము. కాని పాలను చిలికి వెన్నగాచేసితిమేని, అటుల వెన్నగా రూపాంతరమును పొందినపాలు నీటిలో కలిసిపోవుటకు మారుగా ఆనీటిపైన తేలియాడుచుండును. అదేతీరున నిరంతరసాధనచేసి మనుజుడు ఏకాగ్రచిత్తమును పడసెనా, అది వాని ఆవరణమును ఉల్లఘించి, బ్రహ్మభావమున శాంతి ననుభవించుచుండును.

493. ప్రారంభకుడు ధ్యానసాధన సమయమున ఒకవిధమగు నిద్రలో పడుచుండును. దీనికి యోగనిద్రయనిపేరు; అట్టి తరుణమున వానికి పారమార్ధిక దృశ్యములు తప్పక కాన్పించు చుండును.

494. "ధ్యాన సాధనయందు పక్వదశను సాధించిన వారికి మోక్షము మిగులదాపు" అనుసామెత కలదు. మనుజుడు ధ్యానమున ఎప్పుడు పరిపక్వదశను పొందునో తెలియునా? ఆతడు ధ్యాననిష్ఠయందు కూర్చుండగానే, వెంటనే ఆత్మావరణయందు నిమగ్నుడై, వాని ఆత్మపరమాత్మ సంయోగమును పడయుస్థితి సంప్రాప్తించినప్పుడు!

495. మందులు మధువున సంమ్మిశ్రమైపోవు నడువున నీవు భగవంతునియందు విలీనమై పొమ్ము!