Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/12వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

12వ అధ్యాయము.

ఆధ్యాత్మిక జీవనగతులు.

271. పండ్లతోనిండినచెట్టు క్రిందికివంగియుండును గదా; నీవు ఘనుడవు కాగోరుదువేని నమ్రతతో అణిగియుండుము.

272. త్రాసునందు బరువుగలసిబ్బె క్రిందికివంగును. తేలికగానున్నసిబ్బె పైకిపోవును. అటులనే యోగ్యత సమర్ధత కలవాడు ఎల్లెడల వినయవిధేయతలు చూపుచుండును. బుద్ధిహీనుడో గర్వముతో ఉబ్బిపోవుచుండును.

273. పసిపాపనుబోలి నిరాడంబరము పూననంతవఱకును దివ్యతేజము లభింపబోదు. నీవుగడించిన ప్రాపంచిక విజ్ఞానమంతయు మఱచిపోయి పసివానివలె ప్రజ్ఞవిడిచియున్నచో, నీకు బ్రహ్మజ్ఞానము అలవడును.

274. ఏమారుమూలనో, విజనవనముననో, నిశ్శబ్దమగు నీహృదయగుహయందో భగవధ్యానము సలుపుము.

275. పెనుగాలివీచునప్పుడు ఎండాకువలె స్వాతిశయము విడిచియుండుము.

276. ముఱికితోగూడిన అద్దము సూర్యకిరణములను ప్రతిఫలింపజేయదు. మాయతోగూడిన హృదయముతో అపవిత్రులై యున్న పాపుల భగవన్మహిమను ఎన్నడును కాంచ జాలరు. కాని పవిత్రహృదయులు, నిర్మలమగు అద్దము సూర్యుని ప్రతిఫలింపజేయువిధమున భగవంతుని చూడజాలుదురు. కావున పవిత్రుడవై యుండుము.

277. నేనుజీవుడను యనుకొనునరుడు జీవుడుగనే యుండును; నేనుశివుడను అనుకొనునతడు శివుడేయగును. ఎవడెటుల భావనచేసికొనునో అతడు యట్టివాడగును.

278. ఏమాత్రమైన కోరిక అను డాగు యున్నంతవరకును భగవంతుడు కానరాడు. కాబట్టి నీస్వల్పపుకోరికలను తీర్చుకొనుము. పెద్దకోరికలను వివేకముతో తర్కించి విడిచివేయుము.

279. ఎవడేని నిరంతరమును సత్యము పలుకువాడు కానియెడల, సత్యాస్వరూపుడగు భగవంతుని కనలేడు.

280. ఈజన్మయందేయెవడు మరణించియుండునో అనగా శవమునందువలె యెవనికామములును గుణములును మటుమాసియుండునో, యతడే నిజమైనపురుషవరుడు.

281. వేదములు, పురాణములు, చదువదగినవి, వినదగినవి. కాని తంత్రములు సాధనచేయవలసినవి. హరినామము నోటితో పలుకవలయును; చెవులతో వినవలయును. కొన్ని రోగముల నివారణకై పైకిని మందురాయవలయును, లోపలికిని మందుతినవలసియుండును.

282. నీభావములను, నీభక్తిని రహస్యముగ నుంచుము. బాహాటముగ వచింపకుము. కాదేని నీకు గొప్పనష్టము వాటిల్లును. 283. నీభావములయెడ ద్రోహివికాకుము. నిష్కపటముగనుండుము. నీభావములకు అనుసరణముగ వర్తించుము. నీకు తప్పక జయము చేకూరును. నిష్కపట వినిర్మల హృదయముతో ప్రార్ధనల చేయుము; అప్పుడు నీప్రార్ధనలు ఫలించును.

284. అద్వైతజ్ఞానము పరమోన్నతమైనదే, కానిస్వామిని సేవకుడు సేవించునటులను, పూజ్యుని పూజకుడు పూజించునటులను; భగవంతునికి మొదట ఆరాధనలు చేయవలయును. ఇది మిగులసులభమార్గము. ఇందువలన పరమమగు అద్వైతజ్ఞానమునకు దారిదొఱకును.

285. మహాచక్రవర్తిని దర్శించగోరువాడు, ద్వారముకడ కావలికాచునట్టియు, గద్దెడాపున కనిపట్టియుండునట్టియు వారిని ముందుగ తృప్తిపఱచవలసియుండును. సర్వేశ్వరుని కృపాపీఠమును చేరదలచువాడు గాఢభక్తిని సాధనచేయవలయును; భక్తులసేవించవలయును. చాలకాలము సాధుస్నేహము చేయవలయును.

286. గంజాయాకుతినుట, తోటకూరతినుటవంటిది కాదు; చక్కెఱమెక్కుట, అప్పాలు తినుటవంటిదికాదు; మొదటివి ఆరోగ్యమునకు హానికరములు; రెండవవాటిని రోగులును తినవచ్చును. పరమమంత్రమౌ ప్రణవము, శబ్దమాత్రము కాదు; పరబ్రహ్మమును ప్రకటించు స్వరచిహ్నమగును. అటులనే భక్తి ప్రపత్తులగుకోరిక, లౌకిక, కామవాంఛతో పోల్చతగినదికాదు. 287. లోతగు నూతియొడ్డున యుండువాడు దానిలో పడిపోదునేమోయని కడుజాగరూకుడై యుండితీరును. సంసారముననుండువాడు దానిమోసములకు చిక్కిపోకుండ మెలకువతో నుండవలయును. మోసములప్రోవగు సంసారకూపమున ఒక్కసారి పడిపోయినవాడు, నిరపాయముగను నిష్కళంకముగను వెలువడుట యరదు.

288. చేపలుపట్టు మక్కువతో ఒకానొకగుంటలో మంచి చేపలు చాలగా యున్నవేమొ తెలియగోరువాడు, అందు యిదివఱకు చేపలుపట్టినవారికడకు చచ్చఱపోయి "ఈ గుంటలో పెద్దపెద్ద చేపలుదొఱుకుట నిజమేనా? వానిని పట్టుటకు యేలాటి యెఱవేయవలయును?" అని యాతురముతో విచారించును. వారివలన అవసరమగు విషయములను తెలిసికొని, గాలపుకోలను చేపట్టి గుంటకడకుపోయి, గాలమును లోనవేసి నెమ్మదిగ కూర్చుండి, ఓపికతోను నేర్పుతోను చేపలను రాబట్టచూచుచుండును. తుదకు లోతున నుండు పెద్దసొగసగుచేపనొకదానినిపట్టుకొనగల్గును. అటులనే మహ్మాత్ముల యొక్కయు, ఋషివరులయొక్కయు వాక్కులందు పూర్ణవిశ్వాసముంచి మనస్సను గాలపుకోలతోడను భక్తి యనుఎఱతోడనునేర్పుతో భగవంతునిపట్టుకొనిహృదయమున దాచిపెట్టుకోవలయును. అదనుకొఱకై తెంపులేని ఓర్పుతో కనుపెట్టుకొనియుండవలయును. అటుల చేసినచో ఆదివ్య మీనము చిక్కగలదు. 289. ఈతనువు తుచ్ఛమును అశాశ్వతము నైన పక్షమున పుణ్యపురుషులును భక్తులును దీనిని జాగ్రత్తగా సంరక్షింతురేల? వట్టిపెట్టెను ఎవడును కాపలా కాచబోడు. విలువగలనగలు, బంగారము, అమూల్యవస్తువులు నిండియున్న పెట్టెను ఎల్లరును రక్షణచేతురు. ఏతనువున దివ్యాత్మ వాసముచేయుచుండునో, దానిని పుణ్యాత్ములు సంరంక్షించకవీలులేదు. మన శరీరములన్నియు భగవంతుని ధనకోశములే.

290. లోతులేనిమడుగులోని తేటనీరు త్రాగదలచువాడు దానిని ఎంతమాత్రము కదల్చకుండ, పైపైనీటిని నెమ్మదిగా తీసికొని త్రాగవలయును. దానిని కదిలించేయెడల అడుగు బురదపైకివచ్చి నీటినంతను చెఱచును. నీవు పవిత్రుడవుగా నుండకోరితివేని నిశ్చలవిశ్వాసముగలిగి నెమ్మదిగా నీభక్తి సాధనను సాగించుకొమ్ము. శాస్త్రచర్చలలోనికిని తర్కవాదములలోనికిని దిగి నీసామార్ధ్యమును వృధాచేసికొనకుము అటులకాదేని అల్పమగునీమెదడు కలవరమున చిక్కిపోవును.

291. మనము భగవంతునిగూర్చి బిగ్గఱగా ప్రార్ధనలు చేయవలయునా! నీయిష్టమువచ్చినతీరున వానిని ప్రార్ధించుము. ఆయన నిశ్చయముగా నిన్నాలకించును. ఆయన చిన్న చీమకాలు చప్పుడును సయితము వినగలడు.

292. చిన్న మొక్కయుండినచోమేకలు, పశువులు, మేయకుండను పిల్లవాండ్రుపాడుచేయకుండను కాపాడుటకుచుట్టుకంచెవేయవలయును. ఆమొక్క పెద్ద చెట్టైనపిమ్మటమేకలమందగాని, ఆవుల గుంపుగానినిరపాయముగదానికొమ్మలనీడవిశ్రమించవచ్చును. దాని ఆకులు పండ్లుతిని పొట్టలునింపుకొననువచ్చును. అట్లే నీయందుకొద్దిదగుభక్తిమాత్రమే యున్నప్పుడు దుష్టసాంగత్యమును, సంసారవ్యావృత్తియు దానినిచెడగొట్టకుండసంరక్షించవలయును. కాని, నీభక్తిదృఢపడినపిమ్మట, సంసారవ్యావృత్తిగాని దుష్టవాంఛలుగాని, నీపవిత్రసమక్షమునుదాపరించ సాహసించవు. దివ్యమౌనీసాంగత్యమహిమచేత పలువురు దుర్మార్గులు దైవభక్తులుగ మారగలరు.

293. "నేను మీకొసగుఉత్తరువులకు పూర్ణముగా విధేయులై వర్తింపగలరా? నేనుమీకు తెలుపుదానిలో ఒకవీసమైనను నిర్వహించితిరేని మీరుతప్పక తరించెదరని నేనుదృఢముగా చెప్పుచున్నాను." అనిభగవాన్‌శ్రీరామకృష్ణపరమహంసులవారు చెప్పుచుండెడివారు.

294. కంబళిపురుగు స్వయముగా తాను అల్లుకొనినగూటిలోనే బంధనమున చిక్కుకొనును. అటులనే లౌకికాత్ముడు తనకోర్కెలవలలోనే తగులువడును. కాని ఆకంబళిపురుగే మెఱుగులుగ్రక్కు చక్కని సీతాకోకపురుగుగా పరిణమించినప్పుడు, తనగూటినిభేదించుకొని యెగిరివచ్చి సూర్యరశ్మిని, వాయువును, ఆనందముగా యనుభవించును. అటులనే లౌకిక జీవియు వివేకము వైరాగ్యము అనురెక్కలతో మాయాబంధముల తెంచుకొని విడివడగలడు.

295. మనస్సును ఏకాగ్రముచేయుటకు, దీపముపైని నిలుపుట అతిసులభమైనమార్గము. దానిమధ్యనుండు సువినీలభా గముకారణశరీరమును బోలును. మనస్సునుదానిపైనిలుపుటవలన ఏకాగ్రశక్తిత్వరితగతిని అలవడును. ఈనీలాంశమును ఆవరించు ప్రకాశవంతమగుభాగము సూక్ష్మశరీరమును అనగా మానసికశరీరమును పోలును. దానివెలుపల స్థూలశరీరమునకు పోల్చదగిన కోశముండును.

296. ఏయింటిలోనివారు మెలకువతోనుందురో ఆయింటిలో దొంగలు చొఱజాలనివిధమున నీవుజాగ్రత్తపూనియుండిన యెడల నీమనస్సున చెడుతలంపులు ప్రవేశించి నీశీలమును హరించజాలవు.

297. చెఱువునీటిపైని పాచిని యొక్కింత తొలగించినను తిరిగి క్రమ్ముకొని నీటిని కప్పివేయును. వెదురుతడికలుకట్టి దానిని రాకుండచేసినయెడల యిక అది క్రమ్ముకొనదు. ఎన్నడో ఒక్కసారి మాయను నెట్టివేసినను యదిమరలివచ్చి బాధించుచునే యుండును. భక్తిజ్ఞానములతో హృదయమును సంరక్షించినయెడల యది స్థిరముగా వెడలిపోవును. ఆయొక్క విధానమాత్రమే నరునికి భగవద్దర్శనము కాగలదు.

298. ఒక కుటుంబములోని చిన్నకోడలు, అత్తకును మామకును సేవలుచేయుచు గౌరవించి, వారియెడల అవిధేయురాలుగాక నిరసనజూపక వర్తించును; అయినను తన పెనిమిటిని అందఱికంటెను హెచ్చుగాప్రేమించును. అటులనే నీ యిష్టదైవమునెడల ప్రత్యేకముగ స్థిరభక్తివహించియు, యితరదైవముల నిరసింపక, ఎల్లరను గౌరవించుము. వారంద ఱును యొకే అధికారమునకు ప్రతినిధులై, భక్తికిపాత్రులగుదురు సుమీ!

299. చల్లనుండి వెన్నను చిలికితీసినప్పుడు, దానిని ఆ చల్లతోపాటు ఒకేకుండలో నుంచతగదు. అటులయినచో దాని మాధుర్యమును చిక్కదనమును కొంతతగ్గిపోవును. దానిని వేఱుగ నిర్మలమయిన నీటిలో మఱొకకుండలో నుంచవలయును. అటులనే సంసారములోనుండి కొంత పరిపక్వ దశను సాధించిన పిమ్మట లోకులతోకలసి సంసారిక దుష్ప్రేరణలమధ్య నిలిచియుండునేని కళంకముపొందుట తటస్థించును. అటువంటివాడు సంసారమునకు దూరముగనుండిననే నిర్మలుడుగ నుండగలడు.

300. ఏనుగును విచ్చలవిడిగ విడిచివేసినప్పుడు అది చెట్లను మొక్కలను పెఱికివేయును. కాని మావటివాడు అంకుశముతో తలమీద ఒకదెబ్బవేయగానే ఊరకుండును. అటులనే మనస్సు నియమములేక విడిచినయెడల పనికిమాలిన తలంపులతో చెలగాటలాడుచుండును. వివేకము అను అంకుశముతో ఒకదెబ్బ తగులనిచ్చినయెడల తక్షణము నిశ్చలత వహించగలదు.

301. ప్రార్ధనలవలన నిజముగా ప్రయోజనముకలదా? ఉన్నది:- మనోవాక్కులుఏకమై శ్రద్ధతో దేనికొఱకైన ప్రార్థించినయెడల, ఆప్రార్థనఫలించును; నోటితోమాత్రము "స్వామీ, ఈసకలమునునీయవియే" అనుచు, హృదయములో అవన్నియు తనవనిభావించు నరునిప్రార్ధనలునిష్ప్రయోజనము.

302. కామక్రోధాది శత్రువులు ఎప్పుడులోబడుదురు? అని యడుగగా శ్రీరామకృష్ణులవారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి:- "ఈతీవ్రవాంఛలు ప్రపంచమువైపునకును యందలివిషయ భోగములవైపునకును నడుపబడునంతకాలమును అవి శత్రువులుగనేవుండును. వానిని భగవంతునివైపునకు నడుపునెడల అవియే నరునికి ఆప్తమిత్రవర్గమగును. అవివానిని భగవంతుని దఱిచేర్చును. సంసారమునెడలగలుగు కామమును భగవంతునివైపునకు త్రిప్పవలయును. తోడిమానవునిపైనిరేగు కోపమును, సత్వరము ప్రత్యక్షముకాలేదని భగవంతునిమీద చూపవలెను.

ఈరీతిగా తక్కినభావోద్రేకములను యన్నింటిని వినియోగించుకొనవచ్చును. ఈభావోద్రేకములను మొదలంట నాశముచేయుటకు వీలులేదు. వానిని తిన్ననిమార్గమునకు త్రిప్పవచ్చును.

303. సన్యాసులు కాషాయవస్త్రమును ధరించుటవలన లాభమేమున్నది? వస్త్రధారణలోఏమున్నది? - కాషాయవస్త్రముదానితోడి అనుసంధానమైయున్న నిర్మలభావములను స్ఫురింపచేయును. అరిగిపోయిన చెప్పులను, చిరిగిపోయిన గుడ్డలను వేసికొనుటవలన మనస్సున అవి నమ్రభావములు తోపచేయును. నీటగుదొరలాగులనుకోటులను, లాగూలునువేసి సొగసగు బూటులను తొడగినప్పుడు సహజముగా గర్వమును యాడంబరమును పురికొలుపును. నల్లని అంచులుగలిగి సొబగుమీరు మజిలును ధోవతికట్టిన యెడల డంబముతోచును; శృంగారకీర్తనలనుకూడ పాడవచ్చును. సన్యాసుల కాషాయవస్త్రమువేసికొనుట, మనస్సునందు సహజముగా పవిత్రసంకల్పములను స్ఫురింపచేయును. కేవలము, వస్త్రధారణమువలననే ప్రత్యేకఫలము లభింపకున్నను, ఆయారకముల వస్త్రముతో అనుసంధించియుండు భావములు కలవు.

304. సూదిలోదారము గ్రుచ్చకోరుదువేని, విప్పారు పోగులను తొలగించి, దారమును కొనతేలునటుల పేనవలయును. అప్పుడుదారము సులభముగాసూదిబెజ్జములో దూర గలుగును. అటులనే నీవు నీమనస్సును, నీహృదయమును దైవముమీద ఏకాగ్రముగ నిలుపుగోరుదువేని, యిటునటు వ్యాపించు కోరికలను తొలగించి, వినయముపూని నమ్రుడవై దీనభావము వహించవలయును.

305. అష్టకాష్టముయను ఆటలో (పులిజూదపు ఆటవంటిది) పావులు అన్నిగదులను గడచి పోయిపోయి, తిరిగిరాకుండమధ్యగదిచేరి పండవలయును. ఆనడిమిగది చేరువఱకును, ఏపావైనను మరలమరల వెనుకకుపోయి, మొదటినుండి ప్రారంభించి ప్రాకులాడవలసినగతి తటస్థింపవచ్చును. కాని రెండుపావులుకూడి ప్రయాణము సాగించి, ఒక్కొక్క గదిని తోడుతోడుగ గడచుచు పోవునెడల, యింకొకరి పంటపావు చంపి వీనిని మొదటికి నెట్టివేయునను భయముండదు. అటులనే ఈప్రపంచములో ఆధ్యాత్మికసాధనను సాగించువారు గురువును, యిష్టదైవమును తోడుచేసికొని నడచువారు, మార్గమున అవరోధములను బాధలను గురించి, భయపడనవసరముండదు. వారి పురోగమనము సరళముగ సాగును. ఆతంకములు కలుగవు. వెనుకతిరుగుడులు తటస్థించవు.

306. సంసారపుయోచనలు, దిగుళ్లు నీమనస్సునకు తొందఱ కలుగజేయనీయకుము. ఏదియెప్పుడు అవసరమో యది అప్పుడు చేయుచుండుము. నీమనస్సునుమాత్రము భగవంతుని పైన స్థిరముగనుంచుము.

307. నీమనస్సున సంకల్పించినదానినే నీవు పలుకవలెను. నీభావములకును, నీమాటలకును సమరసత యుండవలెను. అటులగాక, దైవమేనీకు సర్వమును అని నోరుయూరక పలుకుచుండ, మనస్సుమాత్రము సంసారమేసర్వమునుయని భావించునెడల, నీకు అందువలన యిసుమంతయు లాభము కలుగబోదు.

308. భక్తునకు ప్రత్యేకవేషముండవలయునా? ప్రత్యేకవేషముమంచిదే. సన్యాసివలె కాషాయధారణచేసినప్పుడుగాని, హరిదాసువలె తాంబురను, తాళములనుచేబూనినప్పుడుగాని, సరసాలాపములు, బూతుమాటలు, జావళీలు, సాధారణముగా నోటరావు. కాని విటునివలెసోకుగ వేసమువేసినవాడు సామాన్యముగా నీచపుతలపులకులోనై బూతుపాటలను పాడవచ్చును. 309. భగవద్భక్తుడుతానుప్రేమించిన సర్వమును దైవముకొఱకై విడిచివేయుటెందులకు?

శలభమునకు దీపము గోచరించినపిమ్మట చీకటిలోనికి మరలుటకు యిష్టముపుట్టదు. చీమ చక్కెరరాశిలోపడి చచ్చునుగాని, వెనుకకుతిరిగిపోదు. అటులనే భగవద్భక్తుడు, బ్రహ్మానందప్రాప్తికొఱకై తనప్రాణమునే అర్పించును; దేనిని లెక్క చేయడు.

310. నీవు ఆర్జించకోరు ఫలమునకై తగిన సాధనలను పూనుము. "పాలలో వెన్నయున్నది" అని గొంతుక బొంగురుపోవునటుల అఱచినను నీకు వెన్నచిక్కదు. నీకు వెన్న కావలయుచో, పాలను తోడుపెట్టి పెరుగుచేయుము; దానిని చిలుకుము; అప్పుడు నీకు వెన్నలభించును. అటులనే నీకు దైవము ప్రత్యక్షముకావలయునని కోరుదువేని భక్తిసాధనలను చేయుము. "దేవా, దేవా! ఓదేవా!" అనియూరక అఱచిన ఫలమేమున్నది?

311. ఆత్మపారిశుద్ధ్యమునకు తోడ్పడు సాధనాంగములు ఏవన:-

(1) సాధుసంగము :- అనగా పుణ్యాత్ముల సహవాసము.

(2) శ్రద్ధ:- ఆత్మకు సంబంధించిన విషయములందు విశ్వాసము, భక్తి.

(3) నిష్ఠ:- తన ఆదర్శమునుగురించి అనన్యమైన భక్తి.

(4) భావము:- భగవంతుని చింతనమందు మునిగిమౌనముగనుండుట. (5) మహాభావము:- భావముసాంద్రమైన యెడల మహాభావముఅనబడును. భక్తుడుఒకసారి పిచ్చివానివలె నవ్వును. ఇంకొకసారి ఏడ్చును. ఆతడు యింద్రియములను పూర్ణముగ జయించియుండును. శరీరస్ఫురణయే అతనికియుండదు. జీవునికి ఈదశ తరుచుగా అలవడునదికాదు. మహాపురుషులకు, ఈశ్వరావతారములకు మాత్రము ప్రాప్యమగుచుండును.

(6) ప్రేమ:- భగవంతునిపైని అత్యంతగాఢానురాగము. ఇయ్యది మహాభావముతోకూడి లభించుచుండును. ఈదశను సూచించు రెండు చిహ్నము లేవన:-

(1) ప్రపంచస్పృహ లేకపోవుట.

(2) తనశరీరమును, జీవాత్మనుకూడ మఱచుట. దీనివలన భక్తుడు దైవముతో ముఖాముఖిని (ఎదు రెదురుగా) నిల్చును అప్పుడు వానిజన్మ ధన్యమైనట్లే.