శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/13వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

13వ అధ్యాయము.

సాధుసంగము.

312. సాధువులయొక్కయు, జ్ఞానులయొక్కయు సహవాసము పారమార్ధికసాధనమున ప్రధానాంశములలో నొకటియైనది.

313. ధనికుడగు యొకజమీందారుని ప్రతినిధి పల్లెలకు పోయినప్పుడు అచ్చటిప్రజలను అనేకవిధములుగా పీడించును. అతడే తిరిగివచ్చి తన యజమానుని సమక్షమునయున్నప్పుడు, పరమయోగ్యుడయి జమీప్రజలను చాలా దయతో చూచుచు, వారికష్టములను జాగ్రత్తగా విచారించి, పక్షపాతము లేక న్యాయముకూర్చును. ఈప్రజాపీడాకరుడగు ప్రతినిధి యజమానును భయమువలనను, వానిసమక్షమందుండుటవలనను యోగ్యుడై మెలగును. అటులనే యుత్తముల సహవాసము దుర్మార్గులందుసహా భయభక్తులను పురికొలిపి, వారిని ధర్మానువర్తులనుగ మార్చును.

314. తడసినకట్టెలుకూడ నిప్పుమీద నుంచినయెడల త్వరలోనేయెండి, బాగుగమండును. అటులనే సాధుసంగము పామరుల హృదయములందలి లోభమోహములను తేమను హరించును. అంతట వివేకాగ్ని వారియందు రగుల్కొని ప్రజ్వరిలగలదు.

315. జీవితమును ఎటుల నడుపవలయును ? నిప్పును అప్పుడప్పుడు యినుపకడ్డీతో కదల్చుచు చల్లారిపోకుండ బాగుగమండునటుల చేయుచుందురు. అటులనే సాధువుల సాహవాసముతో మనస్సునకు అప్పుడప్పుడు కదలిక చేకూర్చుచుండవలయును.

316. కమ్మరివాడు తన కొలిమిలోని నిప్పును తిత్తులతో ఊది ప్రజ్వరిల్లచేయుచుండును. సాధుసంగమువలన మనస్సును నిర్మలముగను ప్రకాశవంతముగను యుంచవలయును.

317. ఏనుగుశరీరమును శుభ్రముగ తోమి కడిగి, దాని యిష్టమువచ్చినటుల పోనిచ్చునెడల, త్వరలోనె అదితిరిగి ముఱికిచేసికొనును. కాని దానిని చావడిలోనికి దీసికొనిపోయి అక్కడ కట్టిపెట్టిన యెడల, శుభ్రముగ నుండును. అటులనే పుణ్యాత్ముల సత్ప్రేరణ వలన నీవు ఒకసారి సన్మార్గమునకు తిరిగినను, తదుపరి పామరజనముతోడ చేరినయెడల నీధార్మికత త్వరలోనె నష్టముకాగలదు. అటులగాక నీమనస్సును భగవంతునిపై స్థిరముగ నిలిపితివా, నీభావములు ఎన్నడును భ్రష్టములు కాజాలవు.

318. సాధుసంగము బియ్యపుకడుగు నీరువంటిది. కల్లుత్రాగినమైకమును హరించుశక్తి బియ్యపుకడుగునకు కలదు. అదేతీరున తుచ్ఛవాంచలనెడు కల్లునుత్రాగి కైపునపడియున్న పామరులను స్వస్థతపరచుశక్తి సాధుసంగమునకు కలదు.

319. జగజ్జననియగు ఉమాదేవి హిమవంతుని పుత్రికగా జననముకాంచినప్పుడు, ఆశక్తిమయిమాత తన అవతారరూపములను అనేకముచూపి వానిని ధన్యునిచేసినదని పురాణములు తెలుపుచున్నవి. కాని ఆపర్వతరాజు వేదవాచ్చుడగు పరబ్రహ్మమును చూపుమని అడుగగా, "ఓజనకా! నీవుపరబ్రహ్మమును చూడదలచితివేని నీవు సాధుసంగముచేయవలయును. సాధువులు సంసారపంకిలమును పూర్తిగవిసర్జించి యుందురు.