శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/11వ అధ్యాయము
11వ అధ్యాయము.
భగవంతునిగూర్చిన పరితాపము.
249. మాయయొక్క బంధనమునుండి తప్పించుకొనుటకు మనము ఏయుపాయములను అవలంబించవలసియుండును? దానిచిక్కులనుండి తప్పించుకొనపరితపించువారికి భగవంతుడే మార్గము చూపును; కాని అందుకు నిరంతర పరితాపము అవాసరము.
250. కొడుకులు పుట్టలేదని ఎందఱో కన్నీరు వరద లై పాఱ రోదనముచేయుదురు. తమకుధనము లంభించలేదని యెందరో దిగులుపడి శుష్కింతురు. కాని, ఆహా! భగవంతుడు కానరాలేదని ఏడ్చి దుఃఖించువారు ఎందరుయుందురో లెక్కించి చూడుడు. మిక్కిలి అరుదుగదా! వెదకువానికి యతడు దొఱకును. భగవంతునికొఱకు ఏడ్చువారు వానిని గనుగొందురు.
251. వానికొఱకై తపించువారు వానిని కనుగొనగలరు; నామాటనిశ్చయము. నీజీవితమున పరీక్షించుము, పొమ్ము. మూడుదినములు ప్రయత్నించుము. సత్యమగు ఆతురపాటు చూపి యత్నించుము. తప్పక నీకు జయముకల్గును.
252. నరుడు ఈశ్వరానుగ్రహమును సంపాదించుకొనవలయిననిన ఈకలియుగములో మూడుదినముల తీవ్రపరితాపముచాలును. 253. కనకమునకై పరితపించులోభివానివలె నీహృదయము భగవంతునికొఱకు తహతహ పడవలయును.
254. ఎవనిపరితాపము తీవ్రముగనుండునో, ఎవనిచిత్తము ఏకాగ్రతపొందునో, ఆతడు మిగులత్వరితముగా భగవంతుని చూడగల్గును.
255. ఓహృదయమా! నీజగజ్జననినిగూర్చి నిజముగా పిలువుము. ఆమెఎంతవేగిరముగా నీకడకు పర్విడివచ్చునో, నీకు తెలియగలదు. పూర్ణహృదయముతో భగవంతుని ఎవడేని పిలుచునెడల ఆయన ఉపేక్షించి యూరకుండజాలడు.
256. "ప్రియమాతా! నాకు ఆకలి అగునప్పుడు నన్నునిద్ర లేపుము." అనిబిడ్డఅడుగగా, "బిడ్డా! నీయాకలియేనిన్ను నిద్రలేపును సుమీ!" అనితల్లిచెప్పినది.
257. ఎన్నడును కొఱవడిపోని భక్తిని, ఎన్నడును చలింపని శ్రద్ధను దయచేయుమని జగజ్జననిని వేడుకొనుము.
258. ఒకతల్లికి చాలమంది పిల్లలుండిరి. ఒకబిడ్డకు మిఠాయిని, ఒకబిడ్డకుబొమ్మను, వేఱొకనికి ఒక పవడమును యిచ్చును. వారందఱును తల్లినిమఱచి తమ ఆటవస్తువులమీదనే దృష్టిగలవారై యుందురు. తల్లి ఆసమయమున తనగృహకృత్యములను చూచుకొనుచుండును. ఇంతలో ఒకపిల్లవాడు తన బొమ్మను అవలపాఱవైచి "అమ్మా! అమ్మా! అని ఏడ్వసాగును. తత్క్షణమే తల్లి పర్విడివచ్చి వానిని లాలన సేయును. అటులనే, ఓనరుడా! ఈప్రాపంచిక ఆడంబరములలోపడి నీవు జగజ్జననిని మఱచిపోయినాడవు. వానిని ఆవల త్రోసివేసి ఆమెకొఱకై పరివేదనము చేయుము. వెంటనే ఆతల్లివచ్చి నిన్ను చంకనెత్తుకొనగలదు.
259. "ఈజన్మలోనె నేను భగవంతుని పొందవలయును. ఇంతేల? మూడుదినములలో నేను ఆయనను ప్రత్యక్షము చేసికొనవలయును. ఇంతేకాదు! ఒకసారి వానినామస్మరణ చేసి తప్పక వానిని నాకడకు ఆకర్షించుకొందును." అనునట్టి తీవ్రభక్తిచేత భగవంతుడులాగబడి త్వరలోప్రత్యక్షము కాగలడు. కాని మందభక్తిగలవారికి భగవంతుడుకనబడునేని ఎన్నియుగములకోగాని అట్టిది సంఘటిల్లదు.
260. నీటమునిగినవాడు "ఊపిరాడక పరితపించునంతగా, భగవత్సాక్షాత్కారమగుటకు పూర్వము వానికొఱకై, నీహృదయము తీవ్రపరితాపమును పొందవలయును.
261. సాధకుని బలమెందున్నది? ఆతడు దేవునిబిడ్డడు. కన్నీరే వానిబలము. వెంటబడిఏడ్చుబిడ్డని కోర్కెలు తల్లులు తీర్చువిధమున, తనకొఱకైఏడ్చు బిడ్డలకోర్కెలు ఎట్టివైనను భగవంతుడు తీర్చును.
262. భగవంతునికొఱకై పరివేదనముచేయునతడు, ఏమి తిందును. ఏమి త్రాగుదును అను స్వల్ప విషయములను గురించి ఎంతమాత్రమును యోచనయే చేయజాలడు.
263. దప్పిగొనినవాడు; బురదగానుండెనని, నదీజలమును విడిచివేయజాలదు; నిర్మలోదకముకొఱకని నూతిని త్రవ్వుటకును, పూనుకొనడు. అటులనే ఎవనికి సత్యమగుధర్మపిపాస కలుగునో యతడు హిందూమతమునుగాని మఱేమతమును గాని సులభముగాచేజిక్కు యేమతమునైనను నిరసింపజాలడు; తనకై ఒక క్రొత్తమతమును నిర్మించుకొనజూడడు. సత్యమగు పిపాస (దాహము) కలవానికి అటువంటి విచారణలు పెట్టుకొనుటకు వ్యవధి లేదు.
264. "ఓభగవతీ! నరులు నన్ను గౌరవించవలయునని నేను కోరను; నాకు యింద్రియభోగములు అక్కఱలేదు. గంగా యమునలు ఎడతెగక కలిసిపోయి ప్రవహించు తీరున నాఆత్మను నీలోనికి ప్రవహింపనిమ్ము. తల్లీ! నాకడభక్తిలేదు, ఏయోగమును ఎఱుగను. నేను దీనుడను; సావాసగాండ్రులేని వాడను. నాకు ఎవరిమెప్పులును అగత్యము లేదు. నామనస్సును మాత్రము నిరంతరము నీపాదపద్మములందు నిలువ నిమ్ము."
265. ఒకడు యిట్లుపలికెను. "పదునాలుగుసంవత్సరములనుండి నేనుదేవునికొఱకై దేవులాడుచున్నాను. ప్రతివానిసలహాను యనుసరించిపోవుచున్నాను; అన్నిపుణ్యక్షేత్రములకును యాత్రలుచేసినాను. అనేకులుసాధువులను, మహాత్ములను దర్శించినాను. ఏబదిఅయిదేండ్లు వచ్చినవి. నాకేమియు చిక్కు లేదు."
ఈపలుకులువిని శ్రీరామకృష్ణపరమహంసులు "నేను గట్టిగా చెప్పుచున్నాను; వినుము. భగవంతునికొఱకై పరితపించువాడు వానిని కనుగొనితీరును. నన్నుచూచిధైర్యము పూనుము" అనిచెప్పిరి. 266. బొమ్మలకొఱకు, డబ్బుకొఱకు పోరుపెట్టిఏడ్చుచు తల్లినిపీడించు బిడ్డతీరున, భగవంతుడు తనకు అత్యంతప్రియకరుడును ఆప్తుడును అనిగ్రహించినవాడు, వానినిచూచుటకై కపటమెఱుగని బిడ్డవలె లోలోనవెక్కివెక్కి ఏడ్చునెడల, భగవంతుడు తనదర్శనమును ప్రసాదించగలడు. తననుగురించి అంతతీవ్రముగా పరివేదనముచేయుచు వెదకులాడువారికి కాన్పించకుండ దాగియుండజాలడు.
267. మననాటకశాలలో, శ్రీకృష్ణలీలలు, ఆటాడు నప్పుడు "శ్రీకృష్ణరారా; ప్రియకృష్ణరారా!" అను పాడుచు తాళమృదంగముల తట్టుచు ప్రారంభముచేతురు. కాని శ్రీకృష్ణవేషము వేసినవాడు ఈగొడవనే వినిపించుకొనకుండ, వేషాలువేయుగదిలో కూర్చుండి పొగద్రావుచు కబర్లుచెప్పు చుండును. కాని ఈసద్దు అణగినపిమ్మట, నారదుడు రంగమున ప్రవేశించి, మృదుమధుర గానముచేయుచు, హృదయమున ప్రేమవెల్లివిరియ, వెడలిరమ్మని కృష్ణునిపిలుచుతోడనే, తానింక అశ్రద్ధతోడనుండరాదని కృష్ణుడువేగమే తెఱవెలుపలికివచ్చును. సాధకుడు పెదవులతో మాత్రమే "రారా నాస్వామిరారా!" అనిప్రార్ధనలు చేయుచుండునంతకాలమును భగవంతుడురాడు. ఆస్వామి వచ్చుతరుణమున భక్తునిఉద్వేగముకఱగి నోటధ్వనిరాక అడగిపోవును. అంతరాళమునుండి తీవ్రభక్తిపొంగి పొఱలుహృదయముతో భక్తుడుపిలుచునప్పుడు, ఇంక భగవంతుడు జాగుచేయజాలడు. 268. జగజ్జననికొఱకు తానుపడిన పరితాపమునుగూర్చి చెప్పుచు శ్రీరామకృష్ణ పరమహంసులవారిట్లు శెలవిచ్చిరి. "దక్షిణేశ్వరాలయమునందు సాయంతనపూజా సమయమున; తాళాలు, జేగంటలు, గంటలుమ్రోగుట వినగానె, నేను గంగాతీరమునకు పర్విడిపోయి "ఓ జననీ! యింకొకదినము గడచిపోయినది. అయ్యో! ఇంకను నీవు నాకు ప్రత్యక్షము కాకపోతివి!" అనిఘోరముగా ఏడ్చెడివాడను.
269. భగవంతునియెడ మనప్రేమ ఎంతగాఢముగా యుండవలయునో, మీకు తెలియునా? పతివ్రతకు ప్రియభర్తపైనుండు ప్రేమ, లోభివానికి తాను కూడబెట్టుకొనిన ధనముపైనుండు అనురాగము, లోకులకు కామ్యవస్తుజాలముపైనుండుమక్కువ - ఈమూడునుకూడినంత తీవ్రతతో నీహృదయమున భగవద్భక్తి నిండినప్పుడు, భగవత్సాక్షాత్కారము కాగలదు.
270. ఏసుక్రీస్తు సముద్రతీరమున సంచరించుచుండగా యొకనాడు భక్తుడొకడువచ్చి "ప్రభూ! భగవంతుని పొందుటఎట్లు?" అని ప్రశ్నించినాడు. ఏసుక్రీస్తు ఆభక్తుని తోడ్కొని తిన్నగ సముద్రములోనికిదిగిపోయి వానినినీళ్లలో అణచిపట్టెను. కొంతసేపటికి వానినివిడిచి పైకిలేవదీసి "నీకుఎట్లున్నది?" అనిఅడిగెను. "నేను నాఅంత్యకాలము ఆసన్నమైనదను కొన్నాను. ఏమియుతోచినదికాదు"అనిభక్తుడు ప్రత్యుత్తరముచెప్పినాడు. అంతట ఏసుక్రీస్తు; "నీవిప్పుడు ఊపిరికొఱకై ఎట్లుపరితపించినాడవో, అంతగా ఆతండ్రిని గురించి పరితపించితివా నీకు ఆయనకానవచ్చును." అని బోధించినాడు.