శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము/ప్రథమ స్కంధము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రథమ స్కంధము

శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో

ద్రేక స్తంభకుఁ గేళివిలసద్ దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్.(1-1)


2. శివస్తుతి :


ఉ. వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా

శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికిన్

బాల శశాంకమౌళికిఁ గపాలికి మన్మథ గర్వ పర్వతో

న్మూలికి నారదాది మునిముఖ్య మనస్ సరసీరుహాళికిన్.(1-2)


3. బ్రహ్మస్తుతి


ఉ. ఆతత సేవ సేసెద సమస్త చరాచర భూతసృష్టి వి

జ్ఞాతకు భారతీహృదయ సౌఖ్యవిధాతకు వేదరాశి ని

ర్ణేతకు దేవతానికర నేతకుఁ గల్మష జేతకున్ నత

త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్.(1-3)


వ. అని నిఖిల ప్రధానదేవతా వందనంబు సేసి,(1-4)


4. విఘ్నేశ్వరస్తుతి :


ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం

పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా

చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్

మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్.(1-5)


5. సరస్వతీస్తుతి :


ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోఁకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితానత

శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామ శుక వారిజపాణికి రమ్యపాణికిన్.(1-6) 2


శా. పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ ! యో యమ్మ ! మేల్

పట్టున్ మానకుమమ్మ ! నమ్మితిఁ జుమీ ! బ్రాహ్మీ ! దయాంభోనిధీ !(1-7)


6. కనకదుర్గాస్తుతి


ఉ. అమ్మలఁ గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె

ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నండెడి యమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.(1-8)


7. శ్రీమహాలక్ష్మీ స్తుతి :


మ. హరికిం బట్టపు దేవి పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క చం

దురు తోఁబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోణి తా

మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా

సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.(1-9)


వ. అని యిష్టదేవతలం జింతించి దినకర కుమారప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి శుకయోగికి 3

నమస్కరించి మృధుమధుర వచన రచన పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్యకరణకళావిలాసుం గాళిదాసుం గొనియాడి కవికమల విసర రవిన్ భారవిం బొగడి విదళితాఘు మాఘు స్తుతియించి యాంధ్రకవితాగౌరవజనమనోహారి నన్నయసూరిం గైవారంబు సేసి హరిహర చరణారవింద వందనాభిలాషిఁ దిక్కనమనీషిన్ భూషించి భక్తివిశేషిత పరమేశ్వరుండగు ప్రబంధపరమేశ్వరుం బ్రణుతించి మఱియు నితరపూర్వకవిజనసంభావనంబుఁ గావించి వర్తమానకవులకుఁ బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై,(1-10)


ఉ. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచే

సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.(1-11)


తే. చేతులారంగ శివునిఁ బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేనిఁ , గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు.(1-12)

వ. అని మదీయ పూర్వజన్మసహస్రసంచిత తప:ఫలంబున శ్రీమన్నారాయణ కథా విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ యగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతల మండప మధ్యంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలిత లోచనుండనై యున్నయెడ,(1-13) 4


సీ. మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి, నువిద చెంగట నుండ నొప్పువాఁడు

చంద్రమండల సుధాసారంబు పోలిక, ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు

వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ , బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు

నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఘన కిరీటము తలఁ గల్గువాఁడు

ఆ.వె. పుండరీక యుగముఁ బోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపుల భద్ర

మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా, కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.(1-14)


వ. ఏ నా రాజశేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబు సేయు నెడ నతండు దా "రామభద్రుండ, మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము, నీకు భవబంధంబులు తెగు"నని యానతిచ్చి తిరోహితుండయ్యె. అంత నేను సమున్మీలిత నయనుండనై వెఱగువడి చిత్తంబున,(1-15)


కం. పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండఁట నేఁ ,

బలికిన భవహరమగు నఁట, పలికెద వేఱొండు గాథఁ బలుకఁగ నేలా. (1-16)


ఆ.వె. భాగవతముఁ దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన

విబుధజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేఁటపఱతు. (1-17)


కం. కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ , గొందఱికిని సంస్కృతంబు గుణమగు రెండున్

గొందఱికి గుణములగు నే, నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్. (1-18)


మ. ఒనఱన్ దిక్కన నన్నయాది కవులీ యుర్విం బురాణావళుల్

తెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో

తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్, దీనిన్ దెనింగించి నా

జననంబున్ సఫలంబు సేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్. (1-19)


మ. లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం

జులతాశోభితమున్ సువర్ణ సుమనస్ సుజ్ఞేయమున్ సుందరో

జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై. (1-20) 5

వ. ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబున హరికరుణావిశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధి నెఱింగి లేచి మఱలి కొన్ని దినంబుల నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృద్ధబుధబంధుజనానుజ్ఞాతుండనై, (1-21)

గ్రంథకర్తృ వంశవర్ణనము


సీ. కౌండిన్యగోత్ర సంకలితుఁ డాపస్తంబ, సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన

భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, కలకంఠి తద్భార్య గౌరమాంబ

కమలాప్తు వరమునఁ గనియె సోమనమంత్రి, వల్లభ మల్లమ వారి తనయుఁ

డెల్లన యతనికి నిల్లాలు మాచమ, వారి పుత్త్రుఁడు వంశవర్ధనుండు

ఆ.వె. లలితమూర్తి బహుకళానిధి కేసన, దానమాన నీతిధనుఁడు ఘనుఁడు

తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతముఁ గనియె. (1-22)


కం. నడవదు నిలయము వెలువడి, తడవదు పరపురుషు గుణముఁ దన పతి నొడువున్

గడవదు వితరణ కరుణలు, విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్. (1-23)


ఉ. మానిను లీడు గారు బహుమాన నివారిత దీనమానస

గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతా గభీరతా

స్థానికి ముద్దసానికి సదాశివ పాద యుగార్చనానుకం

పానయ వాగ్‌భవానికిని బమ్మెర కేసయ లక్కసానికిన్. (1-24)


కం. ఆ మానిని కుదయించితి, మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వర సేవా

కాముఁడు తిప్పయ ; పోతన, నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్. (1-25)


వ. అయిన నేను నా చిత్తంబునఁ బెన్నిధానంబును బోని శ్రీరామచంద్రు సన్నిధానంబును గల్పించికొని, (1-26) 6

షష్ట్యంతములు

ఉ. హారికి నందగోకుల విహారికిఁ జక్రసమీర దైత్య సం

హారికి భక్త దు:ఖ పరిహారికి గోపనితంబినీ మనో

హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీ పయో ఘృతా

హారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్. (1-27)


ఉ. శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్త ని

ర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపగోపికా

పాలికి వర్ణధర్మపరిపాలికి నర్జున భూజయుగ్మ సం

చాలికి మాలికిన్ విపుల చక్రనిరుద్ధ మరీచిమాలికిన్. (1-28)


ఉ. క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరి నర్తనక్రియా

రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ

హంతకు నింద్రనందన నియంతకు సర్వచరాచరావళీ

మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకున్. (1-29)


ఉ. న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ మన:

స్థాయికి భూతసమ్మద విధాయికి సాధు జనానురాగ సం

ధాయికిఁ బీతవస్త్ర పరిధాయికిఁ బద్మభవాండ భాండ ని

ర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయికిన్. (1-30)


వ. సమర్పితంబుగా నే నాంధ్రభాషను రచియింపఁబూనిన శ్రీమహాభాగవతంబునకుం బ్రారంభం బెట్టిదనిన, (1-31) 33

వ. ఇట్లు "సత్యమ్ పరమ్ ధీమహి" యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీ నామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీమహాభాగవతంబన నొప్పుచుండు. (1-33)

సీ. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన, భాగవతంబు సద్భక్తి తోడ

వినఁగోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక

యితర శాస్త్రంబుల నీశుండు సిక్కునే ? మంచివారలకు నిర్మత్సరులకుఁ

గపట నిర్ముక్తులై కాంక్ష సేయక యిందుఁ దగిలియుంట మహాతత్త్వబుద్ధి

తే.గీ. పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడచి పరమార్థభూతమై యఖిల సుఖద

మై సమస్తంబు గాకయు నయ్యు నుండు, వస్తు వెఱుఁగంగఁదగు భాగవతమునందు. (1-34)

ఆ.వె. వేదకల్పవృక్ష విగళితమై శుక, ముఖ సుధాద్రవమున మొనసి యున్న

భాగవత పురాణ ఫల రసాస్వాదన, పదవిఁ గనుఁడు రసిక భావవిదులు. (1-35)

నైమిశారణ్య వర్ణనము

కం. పుణ్యంబై మునివల్లభ

గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సా

ద్గుణ్యమయి నైమిశాఖ్యా

రణ్యంబు నుతింపఁదగు నరణ్యంబులలోన్.(1-36)


వ. మఱియును మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ సహితంబై బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై నీళగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై బలభేది భవనంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై మురాసురుని నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుం బోలె శంఖ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచన 8

స్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై సముద్రసేతు బంధనంబునుం బోలె నల నీప పణసాది ప్రదీపింతంబై భర్గు భజనంబునుం బోలె నానాzశోక లేఖాకలితంబై మరు కోదండంబునుం బోలెఁ బున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునుం బోలెఁ గేసర కరణ కాంతంబై నాట్యరంగంబునుం బోలె నట నటీ సుషిరాన్వితంబై శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలలకాలంకృతంబై వర్షాగమంబునుం బోలె నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుం బోలె సరస మృదు లతాకలితంబై వినతా నిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృత ఫలదంబై ధనజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుం బోలె హరిఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై లంకానగరంబునుం బోలె రామమహిషీ వంచక సమేతంబై సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భారద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిలీతంబై సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహు వితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిశంబను శ్రీవిష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్గలోక జేగీయమానుండగు హరిం జేరు కొఱకు సహస్ర వర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండి రందొక్కనాఁడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి,(1-37)

శౌనకాది ఋషుల ప్రశ్న

కం. ఆ తాపసులిట్లనిరి వి, నీతున్ విజ్ఞాన భణిత నిఖిల పురాణ

వ్రాతున్ నుత హరిగుణ సం, ఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్.(1-38) 9

మ. సమతం దొల్లి పురాణ పంక్తు లితిహాస శ్రేణులుం ధర్మ శా

స్త్రములున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్ మునుల్

సుమతుల్ సూచినవెన్ని యన్నియును దోఁచున్ నీ మదిన్ దత్‌ప్రసా

దమునం జేసి యెఱుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా ! (1-39)


కం. గురువులు ప్రియశిష్యులకుం, బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల

స్థిర కల్యాణంబెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. (1-40)


కం. మన్నాఁడవు చిరకాలము, గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్

విన్నాఁడవు వినఁదగినవి, యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్. (1-41)


చం. అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం

కలితులు మందభాగ్యులు సుకర్మము లెయ్యవి సేయఁజాలరీ

కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై

యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర ! చెప్పవే. (1-42)


సీ. ఎవ్వని యవతారమెల్ల భూతములకు, సుఖమును వృద్ధియు సొరిదిఁ జేయు

నెవ్వని శుభనామ మే ప్రొద్దు నుడువంగ, సంసార బంధంబు సమసిపోవు

నెవ్వని చరితంబు హృదయంబుఁ జేర్చిన, భయమొంది మృత్యువు పరుగు వెట్టు

నెవ్వని పదనది నేపాఱు జలములు, సేవింప నైష్కర్మ్య సిద్ధి గలుగుఁ

తే.గీ. దపసు లెవ్వాని పాదంబు దగిలి శాంతి, తెఱఁగు గాంచిరి వసుదేవ దేవకులకు

నెవ్వఁ డుదయించెఁ దత్కథ లెల్ల వినఁగ, నిచ్చ పుట్టెడు నెఱిగింపు మిద్ధచరిత. (1-43)


కం. భూషణములు వాణికి నఘ, పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ

త్తోషణములు గల్యాణ వి, శేషణములు హరిగుణోపచిత భాషణముల్.(1-44)


కం. కలిదోష నివారకమై, యలఘు యశుల్ వొగడునట్టి హరికథనము ని,

ర్మల గతిఁ గోరెడు పురుషుఁడు, వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు మహాత్మా ! (1-45)


ఆ.వె. అనఘ ! విను ! రసజ్ఞులై వినువారికి, మాట మాట కధిక మధురమైన

యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ , దలఁపు గలదు మాకుఁ దనివి లేదు. (1-46) 10

మ. వరగోవింద కథా సుధారస మహా వర్షోరు ధారా పరం

పరలం గాక బుధేంద్ర చంద్ర ! యితరోపాయానురక్తిం బ్రవి

స్తర దుర్దాంత దురంత సుస్సహ జనుస్సంభావితానేక దు

స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే ? (1-47)


సీ. హరినామ కథన దావానల జ్వాలలఁ , గాలవే ఘోరాఘ కాననములు

వైకుంఠ దర్శన వాయు సంఘంబుచేఁ , దొలఁగవే బహుదు:ఖ తోయదములు

కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ , గూలవే సంతాప కుంజరములు

నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిచేఁ , దీఱవే షడ్వర్గ తిమిర తతులు

ఆ.వె. నళిన నయన భక్తి నావచేఁ గాక సం, సార జలధి దాఁటి చనఁగరాదు

వేయు నేల మాకు విష్ణు ప్రభావంబుఁ , దెలుపవయ్య సూత ! ధీ సమేత ! (1-48)


వ. మఱియుఁ గపట మానవుండును గూఢుండు నైన మాధవుండు రామసహితుండై యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసె నఁట. వాని వివరింపుము. కలియుగంబు రాఁగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘ సత్ర నిమిత్తంబున హరికథలు విన నెడ గలిగి నిలిచితిమి. దైవయోగంబున,(1-49)

కం. జలరాశి దాఁటఁగోరెడి, కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిన్

గలిదోష హరణ వాంఛా, కలితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా !1-50)


కం. చారుతర ధర్మరాశికి, భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్

ధారకుఁడు లేక యెవ్వనిఁ , జేరెను ధర్మంబు బలుపు సెడి మునినాథా ! (1-51)

అధ్యాయము - 2

సూతుండు నారాయణకథా ప్రశంస జేయుట

వ. అని యిట్లు మహనీయ గుణ గరిష్ఠులయిన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్త్రుండై యుగ్రశ్రవసుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు, (1-52)


మ. సముఁడై యెవ్వఁడు ముక్త కర్మ చయుఁడై సన్న్యాసియై యొంటిఁ బో

వ మహాభీతి నొహో ! కుమార ! యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ

త మయున్ మ్రొక్కెద బాదరాయణిఁ, దపో ధన్యాగ్రణిన్ ధీమణిన్. (1-53) 11

సీ. కార్యవర్గంబును గారణ సంఘంబు, నధికరించి చరించు నాత్మతత్త్వ

మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ , దెలివి సేయఁగఁజాలు దీపమగుచు

సకల వేదములకు సారాంశమై యసా,ధారణమగు_ _ _ప్రభావ

రాజకంబైన పురాణ మర్మంబును, గాఢ సంసారాంధకార పటలి

తే.గీ. దాటఁగోరెడి వారికి దయ దలిర్ప, నే తపోనిధి వివరించె నేర్పడంగ

నట్టి శుక నామధేయు మహాత్మగేయు, విమల విజ్ఞాన రమణీయు వేడ్కఁ గొలుతు. (1-54)


కం. నారాయణునకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ

స్కారము సేసి వచింతు ను,దార గ్రంథంబు దళిత తను బంధంబున్. (1-55)


వ. అని యిట్లు దేవతా గురు నమస్కారంబు సేసి యిట్లనియె. మునీంద్రులారా ! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనంబడిగితిరి. ఏమిటం గృష్ణసంప్రశ్నంబు సేయంబడు నెవ్వింధంబున నాత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయు నైన హరిభక్తి యే రూపంబునం గలుగు నది పురుషులకుఁ బరమ ధర్మంబగు. వాసుదేవునియందుఁ బ్రయోగింపఁబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణ కథల వలన నెయ్యే ధర్మంబులు దగులవవి నిరర్థంబులు. అపవర్గ పర్యంతంబైన ధర్మంబున కర్థంబు ఫలంబు గాదు. ధర్మంబునం దవ్యభిచారి యయిన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు. విషయ భోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు. ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు. తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మముల చేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు. తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస. కొందఱు ధర్మంబె తత్త్వంబని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానమను పేర నద్వయమైన యది తత్త్వమని యెఱుంగుదురు. ఆ తత్త్వం బౌషనిదుల చేత బ్రహ్మమనియు హైరణ్యగర్భుల చేతం బరమాత్మ యనియు సాత్వతుల చేత భగవంతుఁ డనియును బలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యముల తోడం గూడిన భక్తి చేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడఁగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపను వర్ణింపను దగు. చక్రయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన 12

కర్మంబుఁ ద్రుంచి వైతురు. (భగవంతునియందు శ్రద్ధయుఁ దత్కథా శ్రవణాదులం దత్యంతాసక్తియుఁ బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించును) కర్మనిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వండు రతి చేయి నిచ్చగించు వాని కితరంబులెవ్వియు రుచి వుట్టింపనేఱవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు. అశుభంబులు నష్టంబులయిన భాగవత శాస్త్రసేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు. భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామక్రోధాదులకు వశంబు గాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు దీపించు. ఈశ్వరుండు కానంబడినఁ జిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన ననారబ్ధ ఫలంబులైన కర్మంబులు నశించుం గావున, (1-56)

కం. గురుమతులు తపసు లంత: , కరణంబులు శుద్ధి సేయు ఘనతరభక్తిన్

హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్న భవ బంధనులై. (1-57)


తరల వృత్తము :- పరమపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్

సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలిసంజ్ఞలఁ బ్రాకృత

స్ఫురిత సత్త్వ రజస్ తమంబులఁ బొందు నందు శుభస్థితుల్

హరి చరాచర కోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై. (1-58)

వ. మఱియు నొక విశేషంబు కలదు. కాష్ఠంబున కంటె ధూమంబు, ధూమంబున కంటెఁ ద్రయీమయంబైన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబున కంటె రజోగుణంబు, రజోగుణంబున కంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్త్వమయుండని హరి నధోక్షజుం గొలిచిరి. కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవించుచుందురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి దేవతాంతర నింద సేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందఱు రాజస తామసులై సిరియు నైశ్వర్యంబును బ్రజలను గోరి పితృభూత ప్రజేశాదుల నారాధించుదురు. 13

మోక్షమిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవపరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుండు కలుగుచు లేకుండుచు గుణంబుల తోడం గూడిన తన మయ చేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజ మాయా విలసింతంబులైన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని యొక్కరుండయ్యుఁ బెక్కు మ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కఁడు తన వలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. మనోభూత సూక్ష్మేంద్రియంబుల తోడం గూడి గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులువడక తద్గుణంబు లనుభవంబు సేయుచు లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్ మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుఁ డిట్లనియె. (1-59)

అధ్యాయము - 3

సీ. మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై, చారు షోడశ కళా సహితుఁ డగుచుఁ

బంచ మహాభూత భాసితుండై శుద్ధ, సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ

జరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శి,రములు నానా సహస్రములు వెలుఁగ

నంబర కేయూర హార కుండల కిరీ,టాదులు పెక్కు వే లమరుచుండఁ

తే.గీ. బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ , డఖిల భువనైక కర్తయై యలఘు గతిని

మానితాపార జలరాశి మధ్యమునను, యోగనిద్రా విలాసియై యొప్పుచుండు. (1-60)

భగవంతుని యేకవింశత్యవతారములు

వ. అది సకలావతారములకు మొదలి గనియైన శ్రీమన్నారాయణదేవుని విరాజమానంబైన దివ్యరూపంబు. దానిం బరమయోగీంద్రులు దర్శించుదురు. అప్పరమేశ్వరు నాభీకమలంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె. అతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె. మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రాహ్మణుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరియించె. రెండవ మాఱు జగజ్జననంబు కొఱకు రసాతలగత యైన భూమి నెత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబుఁ దాల్చె. మూడవ తోయంబున నారదుండను దేవఋషియై కర్మనిర్మోచకంబైన వైష్ణవ 14

తంత్రంబు సెప్పె. నాలవ పరి ధర్మభార్యాసర్గమునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు సేసె. పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండై యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వసంఘ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె. ఆఱవ శరీరంబున ననసూయాదేవియందు నత్రి మహామునికి (దత్తుండను పేర) గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె. ఏడవ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండనఁ బ్రకాశమానుండై యమాది దేవతల తోడం గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించె. అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముండనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుఁ బ్రకటించె. ఋషుల చేతం గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నొంది మహీరూపమగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె. సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుం దన పృష్ఠ కర్పరంబున నేర్పరియై నిలిపె. ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మథ్యమాన క్షీర పాథోధి మధ్యభాగంబున నమృత కలశ హస్తుండై వెడలె. పదమూడవది యైన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించె. పదునాలుగవది యైన నరసింహ రూపంబునం గనకకశిపుని సంహరించె. పదియేనవది యైన కపట వామనావతారంబున బలినిఁ బద త్రయంబు యాచించి మూఁడు లోకముల నాక్రమించె. పదియాఱవది యైన భార్గవ రామాకృతినిఁ గుపిత భావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల నిఱువదియొక మాఱు వధియించి భూమిని క్షత్త్రియ శూన్యంబుఁ గావించె. పదియేడవది యైన వ్యాస గాత్రంబున నల్ప మతులైన పురుషులం గరుణించి వేద వృక్షంబునకు శాఖ లేర్పఱించె. పదునెనిమిదవదైన రామాభిధానంబున దేవ కార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె. ఏకోనవింశతి-వింశతి తమంబులైన రామ-కృష్ణావతారంబులచే యదు వంశంబున సంభవించి విశ్వంభరా భరంబు నివారించె. కలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు కీకట దేశంబున జిన సుతుండై ఏకవింశతి తమంబైన బుద్ధ నామధేయంబునం దేజరిల్లు. యుగ సంధియందు వసుంధరాధీశులు చోరప్రా 15

యులై సంచరింప విష్ణుయశుండను విప్రునికి కల్కి యను పేర నుద్భవింపం గలండని యిట్లనియె. (1-61)


మ. సరసిం బాసిన వేయి కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ

కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్

సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశముల్

హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దావిష్ణుఁడౌ నేర్పడన్. (1-62)


కం. భగవంతుండగు విష్ణువు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్

దగ నవ్వేళల దయతో, యుగయుగమునఁ బుట్టి కాఁచు నుద్యల్లీలన్. (1-63)


ఆ.వె. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు, మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ

జాల భక్తి తోడఁ జదివిన సంసార, దు:ఖరాశిఁ బాసి తొలఁగిపోవు. (1-64)

వ. వినుండు. అరూపుండై చిదాత్మకుండై పరఁగు జీవునికిఁ బరమేశ్వరు మాయా గుణంబులైన మహదాది రూపంబుల చేత నాత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలియందుఁ బార్థివ ధూళి ధూసరత్వంబును నే రీతి నట్లు ద్రష్ట యగు నాత్మయందు దృశ్యత్వము బుద్ధిమంతులు కానివారి చేత నారోపింపంబడు. ఈ స్థూలరూపంబున కంటె నదృష్ట గుణంబై యశ్రుతంబైన వస్తువగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మంబై కర చరణాదులు లేక జీవునికి నొండొక రూపము విరచితంబై యుండు. సూక్ష్ముండై జీవుని వలన నుత్‌క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు. ఎపుడీ స్థూల-సూక్ష్మ రూపంబులు రెండు నవిద్యం జేసి యాత్మకుఁ గల్పింపంబడె ననియెడి హేతువు వలన స్వరూప సమ్యగ్ జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁబడు నపుడె జీవుండు బ్రహ్మ యగు. సమ్యగ్ జ్ఞానంబె దర్శనంబు. విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించు నవిద్య యనంబడుచున్న మాయ యెప్పుడు విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యైన స్థూల-సూక్ష్మ రూపంబు దహించి కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునఁ దాన యుపరత యగు. అపుడు జీవుండు బ్రహ్మ 16

స్వరూపుండై పరమానందంబున విరాజమానుండగు. ఇట్లు తత్త్వ జ్ఞానంబు సెప్పుదురని సూతుం డిట్లనియె.(1-65)

చం. జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ

ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్

వినుతులు సేయుచుండుదురు వేద రహస్యములందు నెందుఁ జూ

చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్. (1-66)


మ. భువనశ్రేణి నమోఘ లీలుఁ డగుచున్ బుట్టించు రక్షించు నం

త విధిం జేయు మునుంగఁ డందు బహుభూత వ్రాతమం దాత్మ తం

త్ర విహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్

దివిభంగిన్ గొనుఁ జిక్కఁ డింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్. (1-67)


చం. జగదధినాథుఁ డైన హరి సంతత లీలలు నామరూపముల్

దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్

మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే ?

యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే ? (1-68)


ఉ. ఇంచుక మాయ లేక మది నెప్పుడు వాయని భక్తి తోడ వ

ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సే

వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో

దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్. (1-69)


మ. హరిపాదద్వయభక్తి మీ వలన ని ట్లారూఢమై యుండునే ?

తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్

ధరణీదేవతలార ! మీరలు మహా ధన్యుల్ సమస్తజ్ఞులున్

హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్‌వ్యథాయోగముల్. (1-70)

శ్రీమద్ భాగవత రచనాది వృత్తాంతము

సీ. పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు, బ్రహ్మతుల్యంబైన భాగవతము

సకల పురాణరాజముఁ దొల్లి లోకభ్,అద్రముగఁ బుణ్యముగ మోదముగఁ బ్రీతి

భగవంతుఁడగు వ్యాస భట్టారకుఁ డొనర్చి, శుకుఁ డనియెడు తన సుతుని చేతఁ

జదివించె నింతయు సకల వేదేతిహా,సముల లోపల నెల్ల సారమైన 17

ఆ.వె. యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి, గంగ నడుమ వచ్చి ఘనవిరక్తి

యొదవి మునుల తోడ నుపవిష్టుఁడగు పరీ,క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు. (1-71)


వ. కృష్ణుండు ధర్మజ్ఞాదుల తోడం దన లోకంబునకుం జనిన పిమ్మటం గలికాల దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు నిప్పుడీ పురాణంబు కమలబంధుని భంగి నున్నది. నాఁ డందు భూరితేజుండై కీర్తించుచున్న విప్రఋషి వలన నేఁ బఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయ వినిపించెద ననిన సూతునకు మునివరుండైన శౌనకుండిట్లనియె. (1-72)

అధ్యాయము-4

శా. సూతా ! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్టు నే

శ్రోతల్ గోరిరి యేమి హేతువునకై శోధించి లోకైక వి

ఖ్యాతిన్ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ దత్పుత్త్రుఁ డే

ప్రీతిన్ రాజునకీ పురాణకథఁ జెప్పెన్ జెప్పవే యంతయున్. (1-73)


వ. బుధేంద్రా ! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం డేకాంతమతి మాయాశయనంబు వలనం దెలిసినవాఁడు. గూఢుండు మూఢుని క్రియ నుండు నిరస్తఖేదుం డదియునుం గాక, (1-74)


తరలము :- శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల

జ్జకుఁ జలింపక చీరలొల్లక చల్లు లాడెడి దేవ క

న్యకలు "హా ! శుక" యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం

శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ ! (1-75)


వ. మఱియు నగ్నుండుఁ దరుణుండు నై చను తన కొడుకుం గని వస్త్ర పరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండు నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవ రమణులం గని వ్యాసుండు గారణం బడిగిన వారలు " నీ కొడు కిది సతి, వీఁడు పురుషుండని భేదదృష్టి లేక యుండు. మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దనిరి. అంత శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె ? మఱియు నున్మత్తుని క్రియ మూఢుని తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లు సిద్ధించె ? బహుకాల 18

కథనీయంబైన శ్రీ మహాభాగవత నిగమ వ్యాఖ్యాన మే రీతి సాఁగె ? అయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబున గోవును బిదికినయంత తడవు గాని నిలువఁడండ్రు. అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగు. పెద్ద కాలం బేక ప్రదేశమున నెట్లుండె ? భాగవతోత్తముండైన జనపాలు జన్మకర్మంబు లే ప్రకారంబు ? వివరింపుము. (1-76)


సీ. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ

బరిపంథి రాజులు భర్మాది ధనముల నర్చింతు రెవ్వాని యంఘ్రియుగముఁ

గుంభజ కర్ణాది కురుభట వ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరు తండ్రి

గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరు తాత

ఆ.వె. యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా, రాజు విడువఁదగని రాజ్యలక్ష్మిఁ

బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై, యసువులుండ నేల యడఁగి యుండె. (1-77)


ఉ. ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడున్

జిత్తములందుఁ గోరరు హసించియు లోకులకెల్ల నర్థ సం

పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా

త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో ? (1-78)


కం. సారముల నెల్ల నెఱుగుదు, పారగుఁడవు భాషలందు బహువిధ కథనో

దారుఁడవు మాకు సర్వముఁ , బారము ముట్టంగఁ దెలియఁ బలుకు మహాత్మా ! (1-79)

వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ. అని యడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతున్ డిట్లనియె. తృతీయంబైన ద్వాపర యుగంబు తీఱు సమయంబున నుపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవి నాఁదగు సత్యవతియందుఁ బరాశరునికి హరికళం జేసి విజ్ఞానియైన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీ నదీజలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై పరులు లేనిచోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయము వేళ నతీతానాగత వర్తమానజ్ఞుండై యా ఋషి వ్యక్తంబు గాని వేగంబు గల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు. యుగయుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు. పురుషులు నిస్సత్త్వులు 19

ధైర్యశూన్యులు మందప్రజ్ఞు లల్పాయువులు దుర్బలురు నయ్యెదరని తన దివ్యదృష్టిం జూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయందలంచి నలుగురు హోతల చేత ననుష్ఠింపఁదగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబు లెడతెగకుండు కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్‌సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదంబని పల్కె, నందు, (1-80)


సీ. పైలుండుఋగ్వేద పఠనంబు దొరకొనె, సామంబు జైమిని చదువుచుండె

యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ , దుది నధర్వంబు సుమంతుఁడు వఠించె

నఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి , రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ

దమ తమ వేద మా తపసులు భాగించి, శిష్య సంఘములకుఁ జెప్పిరంత

తే.గీ. శిష్యులెల్లరు నాత్మీయ శిష్యజనుల, కందు బహుమార్గములు సెప్పి యనుమతింపఁ

బెక్కు శాఖలు గలిగి యీ పృథివిలోన, నిగమ మొప్పారె భూసుర నివహమందు. (1-81)


వ. ఇట్లు మేధాహీనులైన పురుషుల చేత నట్టి వేదంబులు ధరియింపంబడుచున్నవి. మఱియు దీనవత్సలుండైన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన ననర్హంబులు గావున మూఢుల కెల్ల మేలగునని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితమందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటినుండి హేతువు వితర్కింపుచుఁ దనలో నిట్లనియె. (1-82)


సీ. వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మములఁ గొఱత

పడకుండ నడుపుదు భారత మిషమునఁ బలికితి వేదార్థభావమెల్ల

మునుకొని స్త్రీశూద్ర ముఖర ధర్మములందుఁ బెలిపితి నేఁ జెల్ల దీనఁ జేసి

యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు, సంతసింపక యున్న జాడ తోఁచె

ఆ.వె. హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబుఁ బలుకనైతి

మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున. (1-83)

వ్యాసుని కడకు నారదుండు వచ్చుట

సీ. తన చేయి వల్లకీ తంత్రీచయంబున, సతత నారాయణ శబ్దమొప్ప

నానన సంభూత హరిగీత రవసుధా ధారల యోగీంద్రతతులు సొక్కఁ

గపిల జటాభార కాంతిపుంజంబుల, దిశలు ప్రభాత దీధితి వహింపఁ

దనులగ్న తులసికా దామ గంధంబులు, గగనాంతరాళంబు గప్పుకొనఁగ 20

ఆ.వె. వచ్చె మింట నుండి వాసవీనందను, కడకు మాటలాడఁ గడఁక తోడ

భద్ర విమలకీర్తిపారగుఁ డారూఢ, నయ విశారదుండు నారదుండు. (1-84)


కం. కనియె న్నారదుఁ డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా

జనితోల్లాసున్ భవదు:ఖ నిరాసు గురుమనోవికాసున్ వ్యాసున్. (1-85)


వ. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబు తోడ విపంచికాతంత్రి వ్రేల మీటుచు నిట్లనియె. (1-86)

అధ్యాయము-5

ఉ. ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పరార్థ జాత వి

జ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్త్వ ని

ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే !

కాతరు కైవడిన్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా ! (1-87)


వ. అనినఁ బారాశర్యుం డిట్లనియె. (1-88)


కం. పుట్టితి వజు తనువునఁ జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రబోధమున మునినాథా !


వ. అదియునుం గాక నీవు సూర్యుని భంగి మూఁడు లోకములం జరింతువు. వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు.సర్వజ్ఞుండ వగుటం జేసి,


కం. నీ కెఱుఁగరాని ధర్మము, లోకములను లేదు బహువిలోకివి నీవున్

నా కొఱఁత యెట్టిదంతయు, నాకున్ వివరింపుమయ్య నారద ! కరుణన్. (1-91)


వ. అనిన నారదుం డిట్లనియె. (1-92)


ఉ. అంచితమైన ధర్మచయమంతయుఁ జెప్పితి వందులోన నిం

చించుక గాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం

చించిన మెచ్చునే గుణ విశేషము లెన్నినఁ గాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా ! (1-93)


మ. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరస్ స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ

హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమై యుండ దయోగ్య దుర్మద నదత్ కాకోల గర్తాకృతిన్. (1-94) 21

మ. అపశబ్దంబులఁ గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పా

ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచున్ బాడుచున్

జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబుఁ గీర్తించుచున్

దపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ ! చింతింపుమా ! (1-95)


వ. మునీంద్రా ! నిర్గత కర్మంబైన నిరుపాధికంబైన జ్ఞానంబు గలిగినను హరిభక్తి లేకున్న శోభితంబు గాదు. కర్మ మీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు. భక్తిహీనంబులైన జ్ఞానవాచా కర్మకౌశలంబులు నిరర్థంబులు. కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు. సకల దిగంత ధవళ కీర్తివి. సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము. హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులం జేసి పృథగ్దర్శనుండైనవాని మతి పెనుగాలి త్రిప్పునం బడి తప్పంజను నావ చందంబున నెలవు సేరనేఱదు. కామ్యకర్మంబులందు రాగంబు గల ప్రాకృత జనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండవగు నీవు వగచుట తగదు. అది యెట్లనిన, వార లదియే ధర్మంబని కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు. అది గావున తత్వజ్ఞుండవై వ్యథావియోగంబు సేయుమని మఱియు నిట్లనియె. (1-96)


చం. ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్

నెఱయ నెఱింగి యవ్వలన నేఱుపు సూపు గుణానురక్తుఁడై

తెఱకువ లేక క్రుమ్మరుచు దేహ ధనాద్యభిలాష యుక్తుఁడై

యెఱుఁగని వానికి దెలియ నీశ్వరు లీల లెఱుంగఁ జెప్పవే. (1-97)


చం. తన కుల ధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్

పనివడి సేవ సేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ

చ్చిన మఱుమేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా

సినఁ గులధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్. (1-98)


వ. అది గావున నెఱుక గలవాఁడు హరిసేవకు యత్నంబు సేయందగు. కాలక్రమంబున సుఖ దు:ఖంబులు ప్రాప్తంబులైనను హరిసేవ విడువం దగదు. దానం జేసి 22

బ్రహ్మస్థావర పర్యంతంబు తిరుగుచున్న జనులకు నెయ్యది పొందరా దట్టి మేలు సిద్ధించు (కొఱకు) హరిసేవ సేయవలయు. హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కఁడు. క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తిరస వశీకృతుండై విడువ నిచ్చగింపఁడు. మఱియును, (1-99)


సీ. విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను, వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధి లయములా పరమేశుచే నగు, నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున

నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ, భువన భద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము, కావున హరిపరాక్రమము లెల్ల

ఆ.వె. వినుతి సేయుమీవు వినికియుఁ జదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ

గలిమి కెల్ల ఫలము కాదె పుణ్యశ్లోకుఁ , గమలనాభుఁ బొగడఁ గలిగెనేని. (1-100)

నారదుని పూర్వజన్మవృత్తాంతము

వ. మహాత్మా ! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటి దాసికిం బుట్టి పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి యొక వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు, (1-101)


కం. ఓటమితో నెల్లప్పుడుఁ , బాటవమునఁ బనులు సేసి బాలురతో నే

యాటలకుఁ బోక నొక జం,జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా ! (1-102)


కం. మంగళమనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్

ముంగల నిలతును నియతిని, వెంగలి క్రియఁ జనుదు నే వివేకము తోడన్. (1-103)


వ. ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితిని. వారును నా యందుఁ గృప సేసిరంత. (1-104)


శా. వారల్ కృష్ణచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగాఁ బాడఁగా

నా రావంబు సుధాప్రతిమమై యశ్రాంతమున్ వీనులం

దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్

బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభదూరుండనై. (1-105) 28

వ. ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూపకుండనైన నా యందు స్థూలసూక్ష్మంబైన యీ శరీరంబు నిజమాయా కల్పితంబని యమ్మహాత్ములగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణియైన భక్తి సంభవించె. అంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువారలై యివ్విధంబున. (1-106)


మ. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై

చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని

ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై

యుపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానమున్. (1-107)


వ. ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబుఁ దెలిసితి. ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబుఁ దాపత్రయంబు మాన్ప నౌషధంబగు. ఏ ద్రవ్యంబు వలన నే రోగంబు జనియించె నా ద్రవ్య మా రోగంబును మానుప నేఱదు. ద్రవ్యాంతరంబు చేతనైన చికిత్స మానుపనోపు. ఇవ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపియుండు. ఈశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై ఈశ్వర సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు. ఈశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణగుణనామవర్ణన స్మరణంబులు సేయుదురు. ప్రణవ పూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణానిరుద్ధమూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు శూన్యుండు నైన యజ్ఞపురుషునిం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు. (1-108)


కం. ఏ నివ్విధమునఁ జేయఁగ, దానవ కులవైరి నాకుఁ దనయందలి వి

జ్ఞానము నిచ్చెను మదను,ష్ఠానము నతఁ డెఱుఁగు నీవు సలుపుము దీనిన్. (1-109)


కం. మునికులములోన మిక్కిలి, వినుకులు గలవాఁడ వీవు విభు కీర్తులు నీ

వనుదినముఁ బొగడ వినియెడి, జనములకును దు:ఖమెల్ల శాంతిం బొందున్. (1-110) 24

అధ్యాయము - 6

వ. ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె. (1-111)


మ. విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో

యిన బాల్యంబున వృద్ధభావమున నీకీ రీతి సంచారముల్

చనె నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ ద

త్తనువుం బాసిన చందమెట్లు చెపుమా దాసీసుతత్వంబుతోన్. (1-112)


వ. అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె. దాసీపుత్త్రుండ నైన యేను భిక్షుల వలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత. (1-113)


సీ. మమ్ము నేలినవారి మందిరంబునఁ గల, పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి

తన పరాధీనతఁ దలఁపదు సొలసితి, నలసితి నాకొంటి ననుచు వచ్చు

మాపును రేపును మా తల్లి మోహంబు, సొంపార ముద్దాడుఁ జుంచు దువ్వు

దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁ జేర్చు, నర్మిలితో నిట్లు నన్ను మనుప

ఆ.వె. నేను విడిచి పోక యింత నుండితి నయ్య, మోహి గాక యెఱుక మోసపోక

మాఱు చింత లేక మౌనియై యేనేండ్ల, వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు. (1-114)


వ. అంత. (1-115)


కం. సదనము వెలువడి తెఱువునఁ , జెదరక మా తల్లి రాత్రిఁ జీఁకటి వేళన్

మొదవుం బిదుకఁగ నొక ఫణి, పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా ! (1-116)


కం. నీలాయత భోగఫణా, వ్యాళానల విష మహోగ్ర వహ్నిజ్వాలా

మాలా వినిపాతితయై, వ్రాలెన్ ననుఁ గన్న తల్లి వసుమతి మీఁదన్. (1-117)


ఉ. తల్లి ధరిత్రిపై నొఱఁగి తల్లడపాటును జెంది చిత్తమున్

బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా

యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసె మేలు రా

జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధి సేయుచున్. (1-118)


వ. ఉత్తరాభిముంఖుండనై యేను వెడలి జనపదంబులును బురంబులును బట్టణంబులును గ్రామంబులును బల్లెలును మందలును మహోద్యానంబులును గిరాత పుళింద నివాసంబులును వనంబులును జిత్రధాతు విచిత్రితంబులైన పర్వతంబులును 25

సమద కరి కర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథిక జన క్రమాతిరేకంబులైన తటాకంబులును, బహువిధ విహంగ నినద మనోహరంబులై వికచారవింద మకరంద పాన పరవశ పరిభ్రమద్ భ్రమర సుందరంబులైన సరోవరంబులును దాఁటి చనుచు క్షుత్‌పిపాసా సమేతుండనై నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై, (1-119)


కం. సాలావృక కపి భల్లుక, కోలేభ లులాయ శల్య ఘూక శరభ శ

ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాది భయద వన మధ్యమునన్. (1-120)


వ. దుస్తరంబైన నలవేణు కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక రావిమ్రాను డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మస్వరూపు హరిం జింతించితి. (1-121)


శా. ఆనందాశ్రులు కన్నులన్వెడల రోమాంచంబుతోఁ దత్పద

ధ్యానారూఢుఁడనైన నాతలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే

నానందాబ్ధి గతుండనై యెఱుఁగలేనైతిన్ నను న్నీశ్వరున్

నానాశోకహమైన యత్తనువు గానన్నేఱ కట్లంతటన్. (1-122)


వ. లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుం బోలె చూచియుం గానక నిర్మనుష్యంబైన వనంబునం జరియించుచున్న నను నుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపఁజేయు చందంబున నిట్లనియె. (1-123)


ఉ. ఏల కుమార ! శోషిలఁగ ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ

జాలవు నీవు ; కామముఖ షట్కము నిర్దళితంబు సేసి ని

ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగిఁ గానఁగాఁ

జాలఁడు ; నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్. (1-124)


కం. నా వలనఁ గోర్కి యూరక, పోవదు విడిపించు దోషపుంజములను మ త్సేవం బుట్టును వైళమ, భావింపఁగ నాదు భక్తి బాలక ! వింటే ? (1-125)


కం. నా యందుఁ గలుగు నీ మది, పాయదు జన్మాంతరముల బాలక ! నీ వీ

కాయంబు విడిచి మీఁదట, మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. (1-126) 26

మ. వినుమీ సృష్టి లయంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా

మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁ జూ మీఁదం బున: సృష్టి యం

దు నిరూఢ స్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్

ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా ! (1-127)


వ. అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు ని:శ్వాసంబునుగా నొప్పి సర్వ నియామకంబైన మహాభూతంబు వలికి యూరకున్న, నేనును మస్తకంబు వంచి మ్రొక్కి, తత్‌కరుణకు సంతసించి, మదంబు దిగనాడి, మత్సరంబు విడిచి, కామంబు జయించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబులు వెడలనడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠియింపుచుఁ బరమభద్రంబులైన తచ్చరిత్రంబులఁ జింతింపుచు, నిరంతర సంతుష్టుండనై (కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంత:కరణంబు తోడ విషయ విరక్తుండనై) కాలమున కెదురుసూచుచు, భూమిం దిరుగుచు నుండ నంతఁ గొంత కాలంబునకు మెఱుము మెఱసిన తెఱంగున మృత్యువు తోఁచినం బంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, హరికృపావశంబున శుద్ధసత్త్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితిని. అంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున (శయనించు) నారాయణమూర్తియందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మని:శ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితిని. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు చనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మ ప్రాణంబుల వలన మరీచిముఖ్యులగు మునులు, నేనును జనియించితిమి. అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబులయందు మహావిష్ణుని యనిగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తయై బ్రహ్మాభిరంజకంబులైన సప్తస్వరంబులును దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాప రతిం జేసి నారాయణ కథాగానంబు సేయుచుఁ జరియింపుచుండుదు. (1-128)


ఆ.వె. తీర్థపాదుఁడైన దేవుండు విష్ణుండు, తన చరిత్ర మేను దవిలి పాడఁ

జీరఁబడ్డవాని చెలువున నేతెంచి, ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.(1-129)


కం. వినుమీ సంసారంబను, వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే

దనఁ బొందెడువానికి వి, ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా ! (1-130) 27

చం. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యుఁ గామ రో

షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ

గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క

ర్మముల రహస్యమెల్ల మునిమండన ! చెప్పితి నీవు కోరినన్. (1-131)


వ. ఇట్లు భగవంతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు యదృచ్ఛామార్గంబున జనియె నని సూతుండిట్లనియె.(1-132)


వ. వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతములు జగములకున్

జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి ; నిట్టి మతి మఱి గలఁడే ! (1-133)

అధ్యాయము - 7

వ. అని నారదుం గొనియాడిన సూతుం జూచి "నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుండేమి సేసె" నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె. బ్రహ్మనదియైన సరస్వతి పశ్చిమ తీరంబున ఋషులకు సత్రకర్మ వర్ధనంబై బదరీ తరుషండ మండితంబై (శమ్యాప్రాసంబని) ప్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు. అందు జలంబులు వార్చి కూర్చుండి వ్యాసుండు తన మదిం దిరంబు చేసికొని భక్తియుక్తంబైన చిత్తంబునం బరిపూర్ణుండైన యీశ్వరుం గాంచి యీశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారంబు గని జీవుండు మాయచేత మోహితుండై గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచుం ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు నయ్యనర్థంబునకు నారాయణ భక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియును నిశ్చయించి, (1-134)


మ. అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా

ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ

క్తి విశేషంబు జనించు నట్టి భువన క్షేమంకరంబైన భా

గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగన్. (1-135)


వ. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించె నని చెప్పిన విని శౌనకుండు, "నిర్వాణ తత్పరుండును సర్వోపేక్షకుండు నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె ?"ననవుడు సూతుం డిట్లనియె. (1-136) 28

కం. ధీరులు నిరపేక్షులు నా, త్మారాములు నైన మునులు హరిభజనము ని

ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టివాఁడు నవ్యచరిత్రా ! (1-137)


కం. హరిగుణ వర్ణన రతుఁడై, హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త

త్పరతం బఠించెఁ ద్రిజగద్, వరమంగళమైన భాగవత నిగమంబున్. (1-138)


కం. నిగమంబులు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను, నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా ! (1-139)

అర్జునుండు పుత్త్రఘాతి యగు నశ్వత్థామ నవమానించుట

వ. అని పలికి, రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మకర్మముక్తులును, బాండవుల మహాప్రస్థానంబును, గృష్ణకథోదయంబును జెప్పెద. కౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులయినవారలు స్వర్గమునకుం జనిన వెనుక, భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. (1-140)


ఉ. బాలుర చావు కర్మములఁ బడ్డఁ గలంగి యలంగి యోరువం

జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి పాం

చాల తనూజ నేలఁ బడి జాలిబడం గని యెత్తి మంజు వా

చాలతఁ జూపుచుం జికుర జాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనెన్. (1-141)


మ. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబె ? తద్ద్రౌణి ని

ష్కరుణుండై విదళించె బాలకుల ; మద్గాండీవ నిర్ముక్త భీ

కర బాణంబుల నేఁడు వాని శిరంబున్ ఖండించి నేఁ దెత్తుఁ ద

చ్ఛిరముం ద్రొక్కి జలంబులాడు మిచటన్ శీతాంశు బింబాననా ! (1-142)


వ. అని యొడంబఱచి తనకు మిత్త్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి గాండీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబుఁ దోలించిన. (1-143)


శా. తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా

పన్నుండై శిశుహంత గావున నిజ ప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్

మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా

సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. (1-144) 29

వ. ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁ జూచి రథ తురంగంబు లలయుటఁ దెలిసి, నిలిచి ప్రాణ రక్షణంబునకు నొండుపాయంబు లేదని నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై, ప్రయోగంబ కాని యుపసంహారంబు నేఱకయుం బ్రాణ సంరక్షణార్థంబునకై పార్థుని మీఁద బ్రహ్మశిరోనామకాస్త్రంబుఁ బ్రయోగించిన నది ప్రచండ తేజంబున దిగంతరాళంబులు నిండి ప్రాణ భయంకరంబై తోఁచిన హరికి నర్జునుం డిట్లనియె. (1-145)


సీ. పద్మలోచన ! కృష్ణ ! భక్తాభయప్రద ! వినుము సంసారాగ్ని వేఁగుచున్న

జనుల సంసారంబు సంహరింపఁగ నీవు, దక్క నన్యులు లేరు తలఁచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతిపరుండవు పరమపురుష !

నీ ప్రబోధము చేత నీ మాయ నంతయు, నణఁతువు ని:శ్రేయసాత్మ యందు

ఆ.వె. మాయయందు మునిఁగి మనువారలకుఁ గృపఁ , జేసి ధర్మ ముఖ్యచిహ్నమైన

శుభము సేయుచుందు సుజనుల నవనిలోఁ , గావఁ బుట్టుదువు జగన్నివాస ! (1-146)


కం. ఇది యొక తేజము, భూమియుఁ , జదలును దిక్కులును నిండి సర్వంకషమై

యెదురై వచ్చుచు నున్నది, విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా ! (1-147)


వ. అనిన హరి యిట్లనియె. (1-148)


శా. జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై

బ్రహ్మాస్త్రంబదె యేయ వచ్చె ; నిదె తద్బాణాగ్ని బీభత్స ! నీ

బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మఱలింపన్ రాదు ; సంహార మీ

బ్రహ్మాపత్య మెఱుంగఁ ; డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. (1-149)


వ. అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుం డేసిన బ్రహ్మశిరోనామకాస్త్రంబు మీఁదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన. (1-150)


మ. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్

రవి వహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువన త్రాసంబుఁ గావింపఁగా

వివశ భ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా

ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్. (1-151)


వ. ఇ ట్లస్త్రద్వయంబు నుపసంహరించి ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం జూచి హరి ఇట్లనియె. (1-152) 30

ఉ. మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం

దేఱని పిన్నపాఁపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై ;

పాఱుఁడె వీఁడు ? పాతకుఁడు ! ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం

బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున ! పాపవర్జనా ! (1-153)


చం. వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై

మఱచినవాని, సౌఖ్యముగ మద్యముఁ ద్రావినవాని, భగ్నుఁడై

పఱచినవాని, సాధు జడభావము వానినిఁ , గావుమంచు వా

చఱచినవానిఁ , గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా ! (1-154)


శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణా సంగంబు సాలించి య

న్య ప్రాణంబులచేత రక్షణము సేయున్, వాఁ డధోలోక దు:

ఖ ప్రాప్తుండగు ; రాజదండమున సత్కల్యాణుఁ డౌ నైన నీ

విప్రున్ దండితుఁ జేయుమేటికి మహా విభ్రాంతితో నుండఁగన్ ? (1-155)


వ. అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు (కృతాపరాధుండైనను) వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజ పుత్త్రికిఁ దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి, (1-156)


కం. సురరాజ సుతుఁడు సూపెను, దురవధి సుతశోక యుతకు ద్రుపదుని సుతకున్

బరిచలితాంగ శ్రేణిం, బరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్. (1-157)


వ. ఇట్లర్జునుండు తెచ్చి చూపిన బాలవధజనిత లజ్జాపరాఙ్ముఖుండైన గురుని కొడుకుం జూచి మ్రొక్కి (సుస్వభావ) యగు ద్రౌపది యిట్లనియె. (1-158)


మ. పరఁగన్ మా మగవారలందఱును మున్ బాణ ప్రయోగోప సం

హరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం

చిరి ; పుత్త్రాకృతి నున్న ద్రోణుఁడవు ; నీ చిత్తంబులో లేశమున్

గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే ? (1-159)


కం. భూసురుఁడవు బుద్ధి దయా, భాసురుఁడవు శుద్ధవీర భట సందోహా

గ్రేసరుఁడవు శిశుమారణ, మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ ! (1-160) 31

శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, యుద్ధావనిన్ లేరు, కిం

చిద్ ద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్

భద్రాకారులఁ జిన్నిపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్

నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్లాడెనో ? (1-161)


ఉ. అక్కట ! పుత్త్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై

పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ

డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ

డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో ? (1-162)


వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. (1-163)


ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిని యున్నదింట, న

క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి నీ

ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో

ప్రాణ వియుక్తుఁడైన నతిపాపము ; బ్రాహ్మణహింస మానరే ? (1-164)


కం. భూపాలకులకు విప్రులఁ , గోపింపఁగఁ జేయఁదగదు, కోపించినఁ ద

త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగాన్. (1-165)


వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్‌వ్యళీకంబును సమంజసంబును శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముం డిట్లనియె. (1-166)


చం. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతుకున్

విడువు మటంచుఁ జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే ?

విడువఁగ నేల ? చంపుఁడిటు వీనిని మీరలు, చంపరేని నా

పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ , జూడుఁ డిందఱున్. (1-167)


వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి కడమ రెండు చేతుల ద్రుపదపుత్త్రికను దలంగంద్రొబ్బి, నగుచు భీమునికిట్లనియె. (1-168) 32

ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు ; శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం

తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము ; "బ్రాహ్మణో న హం

తవ్య" యటంచు వేదవిదితంబగుఁ ; గావున ధర్మదృష్టిఁ గ

ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా ! (1-169)


వ. అని సరసాలాపంబులాడి పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి "ద్రౌపదికి నాకు భీమసేనునకును సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు తదనుమతంబున, (1-170)


శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహా వీరుండు ఘోరాసిచే

నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంతర్ మహారత్నమున్

శశ్వత్‌కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్

విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీ భాగముం బాసిపోన్. (1-171)


కం. నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మఱియుఁ గోల్పడి నతుఁడై

ప్రబ్బిన చింతన్ విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్. (1-172)


ఆ.వె. ధనముఁ గొనుట యొండె తల గొఱుగుట యొండె, యాలయంబు వెడల నడచుటొండె

కాని చంపఁదగినయట్టి కర్మంబు సేసినఁ , జంపఁదగదు విప్రజాతిఁ బతికి. (1-173)

అధ్యాయము - 8

వ. ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి పాండవులు పాంచాలీసహితులై పుత్త్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జలప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందల నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులై యున్నయెడం బుత్త్రశోకాతురులైన గాంధారీ డృతరాష్ట్రులను గుంతీద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానునుం బంధుమరణ శోకాతురులైన వారల వగపు మానిచి మన్నించె, నివ్విధంబున, (1-174)


శా. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం

జంచద్‌గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి

ప్పించెన్ రాజ్యము, ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే

యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. (1-175) 33

శ్రీకృష్ణుం డుత్తరా గర్భస్థుండగు పరీక్షితునిఁ దన చక్రంబుచే రక్షించుట

వ. అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుండై యుద్ధవ సాత్యకులు కొలువ, ద్వారకాగమన ప్రయత్నంబునఁ బాండవుల వీడ్కొని, రథారోహణంబు సేయు సమయంబునఁ దత్తరపడుచు నుత్తర సనుదెంచి కల్యాణ గుణోత్తరుండైన హరి కిట్లనియె. (1-176)


మ. ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ ! నేఁ

డుదరాంతర్గత గర్భదాహమునకై యుగ్రాకృతిన్ వచ్చుచు

న్నది ; దుర్లోక్యము మానుపన్ శరణ మన్యంబేమియున్ లేదు ; నీ

పదపద్మంబులె కాని యొం డెఱుఁగ ; నీ బాణాగ్ని వారింపవే ! (1-177)


కం. దుర్భర బాణానలమున, గర్భములో నున్న శిశువు ఘనసంతాపా

విర్భావంబును బొందెడి ; నిర్భర కృపఁ గావుమయ్య ! నిఖిలస్తుత్యా ! (1-178)


కం. చెల్లెలి కోడల ; నీ మే,నల్లుఁడు శత్రువుల చేత హతుఁ డయ్యెను సం

ఫుల్లారవిందలోచన ! భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే ! (1-179)


ఆ.వె. గర్భమందుఁ గమల గర్భాండ శతములు, నిముడుకొన నటించు నీశ్వరేశ !

నీకు నొక్క మానినీ గర్భరక్షణ, మెంత బరువు నిర్వహింతు గాక ? (1-179)


వ. అనిన నాశ్రిత వత్సలుండైన పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు లవధరించి యిది ద్రోణ నందనుండు లోకమంతయు నపాండవం బయ్యెడునని యేసిన దివ్యాస్త్రమని యెఱింగె. అంతఁ బాండవుల కభిముఖంబై ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబు డగ్గఱిన బెగ్గడిలక వారును ప్రత్యస్త్రంబు లందుకుని పెనంగు సమయంబున, (1-181)


మ. తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స

జ్జనులం బాండు తనూజులన్ మునుపు వాత్సల్యంబుతో ద్రోణ నం

దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా

ధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్. (1-182) 34

మ. సకలప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ

క్ష్మ కళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్ర హ

స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురుసంతానార్థియై యడ్డమై

ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణ తనయు బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. (1-183)


వ. ఇట్లు ద్రోణ తనయుం డేసిన ప్రతిక్రియా రహితంబైన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవ తేజంబున నిరర్థకం బయ్యె. నిజమాయా విలసనమున సకల లోక సర్గ స్థితి సంహారంబు లాచరించునట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు. తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాల పుత్రికాసహితయై గొంతి, గమనోన్ముఖుండైన హరిం జేరవచ్చి యిట్లనియె. (1-184)

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కం. పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ , బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంతర్ భా

సురుఁడు నవలోకనీయుఁడు, పరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ ! (1-185)


వ. మఱియు జవనిక మఱువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా జవనికాంతరాళంబున నిలువంబడి మహిమచేఁ బరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములు నైన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢదృక్కులుఁ గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు ? శ్రీకృష్ణ ! వాసుదేవ ! దేవకీనందన ! నందగోప కుమార ! గోవింద ! పంకజనాభ ! పద్మమాలాలంకృత ! పద్మలోచన ! పద్మసంకాశ చరణ ! హృషీకేశ ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. (1-186)


సీ. తనయుల తోడనే దహ్యమానంబగు, జతుగృహంబందును జావకుండఁ

గురురాజు వెట్టించు ఘోరవిషంబుల, మారుత పుత్త్రుండు మడియకుండ

ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ, ద్రౌపది మానంబు దలఁగకుండ

గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే, నా బిడ్డ లనిలోన నలఁగకుండ

తే.గీ. విరటు పుత్త్రిక కడుపులో వెలయు చూలు, ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ

మఱియు రక్షింతివి పెక్కు మార్గములను, నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష ! (1-187) 35


మత్తకోకిలము :- బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ

తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రుల చేత నేఁ

దల్లడంబునఁ జిక్కకుండఁగ దావకీన గుణవ్రజం

బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ ! (1-188)


కం. జననము నైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం

చన గోచరుఁడగు నిన్నున్, వినుతింపఁగ లేరు నిఖిల విబుధస్తుత్యా ! (1-189)


వ. మఱియు భక్తిధనుండును, నివృత్త ధర్మార్థ కామ విషయుండును, ఆత్మారాముండును, రాగాది రహితుండును, కైవల్యదాన సమర్థుండును, కాలరూపకుండును, నియామకుండును, నాద్యంత శూన్యుండును, విభుండును, సర్వసముండును, సకలభూత నిగ్రహానుగ్రహకరుండు నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము. మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు ? నీకుఁ బ్రియాప్రియులు లేరు ; జన్మ కర్మశూన్యుండవైన నీవు తిర్యగాది జీవులయందు వరాహాది రూపంబులను మనుష్యులందు రామాది రూపంబులను ఋషులయందు వామనాది రూపంబులను, జలచరంబులయందు మత్స్యాది రూపంబులను నవతరించుట లోక విడంబనార్థంబు గాని జన్మకర్మసహితుండవగుటం గాదు. (1-190)


ఉ. కోపము తోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో

గోపిక త్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా

రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం

బాఁపఁడవై నటించుట కృపాపర ! నా మదిఁ జోద్యమయ్యెడున్. (1-191)


కం. మలయమునఁ జందనము క్రియ, వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై

యిలపై నభవుఁడు హరి యదు, కులమున నుదయించె నండ్రు కొంద ఱనంతా ! (1-192)


కం. వసుదేవ దేవకులు తా,పస గతి గతభవమునందుఁ బ్రార్థించిన సం

తసమునఁ బుత్త్రత నొందితి, వసురుల మృతికంచుఁ గొంద ఱండ్రు మహాత్మా ! (1-193)


కం. జలరాశిలో మునింగెడి, కలము క్రియన్ భూరిభార కర్శిత యగు నీ

యిలఁ గావ నజుఁడు కోరినఁ , గలిగితివని కొంద ఱండ్రు గణనాతీతా ! (1-194)


తే.గీ. మఱచి యజ్ఞాన కామకర్మములఁ దిరుగు, వేదనాతురునకుఁ దన్నివృత్తిఁ జేయ

శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు, కొఱకు నుదయించితండ్రు నిన్ గొంద ఱభవ ! (1-195) 36

మ. నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచు న్నీ దివ్యచారిత్రముల్

వినుచుం జూతురు గాక లోకు లితరాన్వేషంబులం జూతురే ?

ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్

వినుతంబైన భవత్‌పదాబ్జ యుగమున్ విశ్వేశ ! విశ్వంభరా ! (1-196)


వ. దేవా ! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి నీవారలమైన మమ్ము విడిచి విచ్చేయనేల ? నీ కరుణావలోకనంబుల నిత్యంబును జూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల అచందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు. కల్యాణ లక్షణ లక్షితంబులైన నీ యడుగుల చేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు. నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు కుసుమ ఫలభరితంబులు నోషధి తరు లతా గుల్మ నద నదీ నగ సాగర సమేతంబులునై యుండు. (1-197)


ఉ. యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర ! నాకు మోహ వి

చ్ఛేదము సేయుమయ్య ! ఘనసింధువుఁ జేరెడి గంగ భంగి నీ

పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న

త్యాదర వృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁగదయ్య ! యీశ్వరా ! (1-198)


శా. శ్రీకృష్ణా ! యదుభూషణా ! నరసఖా ! శృంగార రత్నాకరా !

లోకద్రోహినరేంద్రవంశదహనా !లోకేశ్వరా ! దేవతా

నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా ! నిర్వాణ సంధాయకా !

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ ! (1-199)


వ. అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులన్ వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున నిట్లనియె. (1-200) 37


మ. తన దేహంబునకై యనేక మృగ సంతానంబుఁ జంపించు దు

ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని

ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా

యన లక్షావధికైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే ? (1-201)


వ. మఱియుఁ బ్రజాపరిపాలనపరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువులఁ జంపించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు కలదు. అయిన నిది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు. చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబుల చేతం బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబునఁ బంకిల స్థలంబునకును, మద్యంబున మద్యభాండమునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాప నిర్ముక్తి లేదని శంకించెద. (1-202)

అధ్యాయము - 9

కం. అని యిట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహార భావమున దేవనదీ

తనయుఁడు కూలిన చోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. (1-203)


వ. అయ్యవసరమునం దక్కిన పాండవులును, ఫల్గున సహితుండైన పద్మలోచనుండును గాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుం గూడి చన నతండు గుహ్యక సహితుండైన కుబేరుని భంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు కొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రమున కేఁగి దివంబు నుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వశిష్ఠాద్యనేక రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి, (1-204)


కం. మాయాంగీకృత దేహుం,డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాడని ప్ర

జ్ఞాయుత చిత్తంబున గాం,గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్. (1-205) 38


వ. మఱియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులం గూర్చుండ నియోగించి, మహానురాగ బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె. (1-206)


ఆ.వె. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ , బ్రదుకఁదలఁచి మీరు బహువిధముల

నన్నలార ! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదె ? (1-207)


ఉ. సంతసమింత లేదు ; మృగశాప వశంబునఁ బాండు భూవిభుం

డంతము నొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో

నింతటివారుగాఁ బెనిచె ; నెన్నడు సౌఖ్యము పట్టు గానదీ

కుంతి ; యనేక దు:ఖములఁ గుందుచునున్నది ; భాగ్యమెట్టిదో ! (1-208)


ఉ. వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం

బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై

పాయుచుఁ గూడుచుండు ; నొక భంగిఁ జరింపదు ; కాల మన్నియుం

జేయుచునుండుఁ ; గాలము విచిత్రము ; దుస్తర మెట్టివారికిన్. (1-209)


ఉ. రాజఁట ధర్మజుండు ; సురరాజ సుతుండఁట ధన్వి ; శాత్రవో

ద్వేజకమైన గాండివము విల్లఁట ; సారథి సర్వభద్ర సం

యోజకుఁడైన చక్రి యఁట ; యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ

య్యాజికిఁ దోడు వచ్చునఁట ; యాపద కల్గుట యేమి చోద్యమో ! (1-210)


ఆ.వె. ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని, నేమి సేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు ?

నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లణఁగి మెలగుచుందు రంధులగుచు. (1-211)


వ. కావున దైవతంత్రంబైన పనికి వగవం బనిలేదు. రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు తేజో నిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబులన్ మోహాతిరేకంబు నొందించు. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన శివుండెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధుమిత్త్ర ప్రయోజనంబుల నియమించుదు రన్నిటం గొఱంత లేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుం డద్వయుండు, సమదర్శ 39


నుండు, సర్వాత్మకుండైన యీశ్వరునకు నతోన్నత భావ మతివైషమ్యంబు లెక్కడివి ? అయిన భక్తవత్సలుండు గావున నేకాంత భక్తులకు సులభుండై యుండు. (1-212)


సీ. అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి, యెవ్వని నామ మూహించి పొగడి

కాయంబు విడచుచుఁ గామకర్మాది నిర్,మూలనుండై యోగి ముక్తినొందు

నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ, డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు

నందాక నిదె మందహాసుఁడై వికసిత, వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే.గీ. నాల్గు భుజములుఁ గమలాభ నయనయుగము, నొప్పుఁ గన్నుల ముంగట నున్నవాఁడు

మానవేశ్వర ! నా భాగ్యమహిమఁ జూడు, మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి. (1-213)


వ. అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మునులందఱు వినుచునుండ మందాకినీనందను వలన (నరజాతి సాధారణంబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును) రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును. దానధర్మంబులును, రాజధర్మంబులును, స్త్రీధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థ కామ మోక్షంబులును (నానావిధేతిహాసోపాఖ్యానంబులును ) సంక్షేప విస్తార రూపంబుల నెఱింగె. అంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి, (1-214)


శా. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ

గ్జాలంబులు హరి మోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని

ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం

శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. (1-215)


వ. ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుద్ధిని సమర్పించి పరమానందంబు నొంది ప్రకృతి వలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలంపున మందాకినీనందనుం డిట్లనియె. (1-216) 40

భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట

మ. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ

రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. (1-217)


మ. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చు వేడ్క నని నా శస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. (1-218)


మ. నరు మాటల్ విని నవ్వుతో నుభయసేనా మధ్యమ క్షోణిలోఁ

బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువులెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడు మన:పద్మాసనాసీనుఁడై. (1-219)


కం. తనవారిఁ జంపఁజాలక, వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్

ఘన యోగవిద్యఁ బాపిన, మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్. (2-220)


సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి, గగన భాగం బెల్లఁ గప్పికొనఁగ

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న, జగముల వ్రేఁగున జగతి గదలఁ

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ , బై నున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నా లావు నగుబాటు సేయక, మన్నింపుమని కిరీటి మఱలఁ దిగువఁ

తే.గీ.గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాఁతు

విడువు మర్జున ! యంచు మద్విశిఖ వృష్టిఁ , దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. (2-221)


మ.తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జున సారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్

మునికోలన్ వడిఁజూపి ఘోటకములన్ మోదించి తాటింపుచున్

జనులన్ మోహము నొందఁజేయు పరమోహాత్సాహుం బ్రశంసించెదన్. (1-222)


కం. పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీర వధూ

కులముల మనముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. (1-223) 41


ఆ.వె. మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా, మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁడమరు నాదు దృష్టియందు. (1-224)


మ. ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో

లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై. (1-225)


వ. అని యిట్లు మనో వాగ్దర్శనంబులం బరమాత్మ యగు కృష్ణుని హృదయంబున నిలిపికొని ని:శ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి. దేవమానవ వాదితంబులై దుందుభి నినదంబులు మొరసె. సాధుజన కీర్తనంబులు మెఱసె. కుసుమ వర్షంబులు గుఱిసె. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి (ముహూర్తమాత్రంబు దు:ఖితుండయ్యె. అంత నచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులగుచుఁ దదీయ దివ్యనామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుఁ జనిరి. పిదప నయ్యుధిష్ఠిరుండు) కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీసహితుండైన ధృతరాష్ట్రు నొడంబఱచి వారి సమ్మతంబున వాసుదేవానుమోదితుండై, పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బాలనంబు సేయుచుండె నని సూతుండు సెప్పిన విని శౌనకుం డిట్లనియె. (1-226)


అధ్యాయము - 10

ఆ.వె. ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి

బంధుమరణ దు:ఖ భరమున ధర్మజుఁ , డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె. (1-227)


వ. అనిన సూతుం డిట్లనియె. (1-228)


కం. కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ

ధరణీ రాజ్యమునకు నీ,శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. (1-229)


వ. (ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబు గా దనునది మొదలగు భీష్ముని వచనంబుల) హరిసంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తిత శంకాకళంకుండు నై నారాయణాశ్రయుండైన 42


యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదర సహాయుండై యేలుచుండె. (1-230)


సీ. సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గుఱియించు, నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు

గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు, ఫలవంతములు లతాపాదపములు

పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల, ధర్మమెల్లెడలను దనరి యుండు

దైవభూతాత్మతంత్రములగు రోగాది, భయములు సెందవు ప్రజలకెందు

ఆ.వె. గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దానమానఘనుఁడు ధర్మజుండు

సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవభాజియైన వేళయందు. (1-231)

శ్రీకృష్ణుండు ద్వారకా నగరమున కేగుట

వ. అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుం బ్రియంబు సేయు కొఱకును గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయందలంచి ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు నతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి కొందఱు తనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు తనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ , గుంతియు నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును నకుల-సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును (సత్సంగంబు వలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁ డట్టి) హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబును హరికి నెడలేనివారలైన పాండవులం గూడికొని, హరి మఱలవలెనని కోరుచు హరి సనిన మార్గంబుఁ జూచుచు, హరివిన్యస్తచిత్తులై లోచనంబుల బాష్పంబులొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున. (1-232)


సీ. కనక సౌధములపైఁ గౌరవ కాంతలు, కుసుమ వర్షంబులు కోరి కుఱియ

మౌక్తిక దామ సమంచిత ధవళాత,పత్త్రంబు విజయుండు పట్టుచుండ

నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై, రత్నభూషిత చామరములు వీవ

గగనాంతరాళంబుఁ గప్పి కాహళభేరి, పణవ శంఖాది శబ్దములు మొరయ

ఆ.వె. సకల విప్ర జనులు సగుణ నిర్గుణ రూప, భద్రభాషణములు పలుకుచుండ

భువనమోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె. (1-233) 43


వ. తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి మార్గంబుల రెండు దెసలఁ గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం, "దొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుం డీతం"డనువారును, "జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యె"ట్లనువారును, "జీవనోపాధిభూతంబులైన సత్త్వాది శక్తుల లయంబు జీవలయం"బనువారును, "గ్రమ్మఱ నప్పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు వేదంబుల నిర్మించి మాయానుసరణంబు సేయు"ననువారును "నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహాభావు నిజరూపంబు దర్శింతు"రనువారును, "యోగమార్గంబులం గాని దర్శింపరా"దనువారు నై. (1-234)


మ. రమణీ ! దూరము వోయెఁ గృష్ణు రథమున్ రాదింక వీక్షింప ; నీ

కమలాక్షుం బొడఁగానలేని దినముల్ కల్పంబులై తోఁచు ; గే

హములం దుండఁగ నేల ? పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం

దము రమ్మా ! యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయై. (1-235)


మ. తరుణీ ! యాదవరాజు కాఁ డితఁడు ; వేదవ్యక్తుఁడై యొక్కఁడే

వరుసన్ లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁజేయు దు

స్తర లీలారతుఁడైన యీశుఁ ; డితనిన్ దర్శించితిన్ బుణ్య భా

సుర నేనంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్. (1-236)


కం. తామస గుణులగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స

త్త్వామల తనుఁడై యీతఁడు, భామిని ! వారల వధించుఁ బ్రతికల్పమునన్. (1-237)


సీ. ఈ యుత్తమ శ్లోకుఁ డెలమి జన్మించిన, యాదవ కులమెల్ల ననఘమయ్యె

నీ పుణ్య వర్తనుం డే ప్రొద్దు నుండిన, మథురాపురము దొడ్డ మహిమ గనియె

నీ పురుషశ్రేష్ఠు నీక్షించి భక్తితో, ద్వారకావాసులు ధన్యులైరి

యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగా, నిష్కంటకంబయ్యె నిఖిల భువన 44


తే.గీ. మీ జగన్మోహనాకృతి నిచ్చగించి, పంచశర భల్లజాల విభజ్యమాన

వివశ మానసమై వల్లవీ సమూహ, మితని యధరామృతముఁ గ్రోలు నెల్ల ప్రొద్దు. (1-238)


ఉ. ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁ గాఁ

జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడి రుక్మిణీ ముఖా

నేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతా

స్తోక విశేష తీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో ! (1-239)


వ. అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగంబులం బంపిన దత్సేనా సమేతులై తన తోడి వియోగంబునకు నోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మఱలించి, కరుజాంగల, పాంచాల, శూరసేన, యామున భూములం గడచి బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర విషయంబు లతిక్రమించి తత్తద్దేశ నివాసు లిచ్చిన కానుకలు గొనుచు నానర్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు నిమగ్నుండైన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చని చని. (1-240)

అధ్యాయము - 11

మ.జలజాతాక్షుడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్

గలహంసావృత హేమపద్మ పరిఘా కాసారకన్ దోరణా

వళి సంఛాదిత తారకన్ దురు లతా వర్గానువేలోదయ

త్ఫల పుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్ (1-241)


వ.ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి. (1-242) 45

క.

బంధులు పౌరులు దెచ్చిన

గంధేభ హయాదు లైన కానుకలు దయా

సింధుఁడుఁ గైకొనె నంబుజ

బంధుఁడు గొను దత్త దీపపంక్తుల భంగిన్‌. 245


వ.

ఇట్లాత్మారాముండు పూర్ణకాముండు నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు

లిచ్చుచు నాగరులు వికసిత ముఖులై గద్గద భాషణంబులతోడ డయ్యకుండ

నడపు నయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డలచందంబున మ్రొక్కి

యిట్లనిరి. 246


శా.

నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం

తాప ధ్వంసినియౌఁ గదా! సకల భద్రశ్రేణులం బ్రీతితో

నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబుని

ర్వ్యాపారంబు గదయ్య! చాలరుగదా! వర్ణింప బ్రహ్మాదులున్‌. 247


క.

ఉన్నారము సౌఖ్యంబున

విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్‌

మన్నారము ధనికులమై

కన్నారము తావక్రాంఘి కమలములు హరీ! 248


క.

ఆరాటము మది నెఱుఁగము

పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ

జోరాటన మెగయదు నీ

దూరాటన మోర్వలేము తోయజనేత్రా! 249


ఉ.

తండ్రులకెల్లఁ దండ్రియగుఁ ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా

తండ్రివి తల్లివిం బతివి దైవమవు¦ సఖివి¦ గురుండ వే

తండ్రులు నీక్రియం బ్రజల ధన్యులఁ జేసిరి? వేల్పులైన నో

తండ్రి! భవ న్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబున¦. 250


క.

చెచ్చెరఁ గరినగరికి నీ

విచ్చేసిన నిమిషమైన వేయ్యేండ్లగు నీ

వెచ్చోటికి విచ్చేయక

మచ్చికతో నుండుమయ్య! మా నగరమునన్‌. 251


ఆ.

అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ

జనిన నంధమైన జగము భంగి

నిన్నుఁ గానకున్న నీరజలోచన!

యంధతమస మతుల మగుదుమయ్య! 252


వ.

అని యిట్లు ప్రజ లాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణకలా

పంబులుగా నవధరించి, సకరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుం

దనరాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జన భోజన శయనాది

కృత్యంబు లొల్లక, యుగ్రసేనాక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ 46

చారుదేష్ణ గద ప్రముఖ యదుకుంజరులు గుంజర తురగ రథారూఢులై దిక్కుం

జరసన్నిభం బైన యొక్క కుంజరంబు ముందఱ నిడుకొని సూతమాగధ నట

నర్తక గాయక వందిసందోహంబుల మంగళభాషణంబులును, భూసురాశీర్వాద

వేదఘోషణంబులును, వీణా వేణు భేరీ పటహ శంఖ కాహళ ధ్వానంబులును,

రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులును నసమానంబులై

చెలంగ నెదురుకొని, యథోచిత ప్రణామ నమస్కార పరిరంభ కరస్పర్శన

సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం

దానును భుజగేంద్ర పాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వసమానబల

యదు భోజ దాశ్హార కుకురాంధక వృష్ణి వీర పాలితంబును, సకలకాల సంపద్య

మానాంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫలమంజరీ పుంజభార వినమిత లతా

పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును, వనాంతరాళ

రసాల సాల శాఖాంకుర ఖాదన క్షుణ్ణ కషాయకంఠ కలకంఠ మిథున కోలాహల

ఫలరసాస్వాద పరిపూర్ణ శారికా కీరకుల కలకల క్హలారపుష్ప మకరందపాన

పరవశ భృంగభృంగీ కదంబ ఝంకార సరోవర కనకకమల మృదుల కాండఖండ

స్వీకార మత్త పరటాయత్త కలహంసనివహ క్రేంకారసహితంబును, మహోన్నత

సౌధజాలరంధ్ర నిర్గత కర్పూరధూప ధూమపటల సందర్శన సంజాత జలధర

భ్రాంతి విభ్రాంత సముద్ధూత పింఛ నర్తనప్రవర్తమాన మత్తమయూర కేకారవ

మహితంబును, ముక్తాఫల విరచిత రంగవల్లికాలంకృత మందిరద్వార

గేహళీ వేదికా ప్రదేశంబును, ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగ్గేహ

గేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారా సంసిక్త విపణిమార్గంబును,

ప్రతినివాస బహిరంగణ సమర్పిత రసాలదండ ఫల కుసుమ గంధాక్షత ధూప

దీప రత్నాంబరాది వివిధోపహారంబును, ప్రవాళ నీల మరకత వజ్ర వైఢూర్య

నిర్మిత గోపురాట్టాలకంబును, విభవనిర్జిత మహేంద్రనగరాలకంబును నైన

పురవరంబు ప్రవేశించి రాజమార్గంబున వచ్చు సమయంబున. 253


మత్తకోకిల.

కన్నులారఁగ నిత్యము¦ హరిఁ గాంచుచున్‌ మనువారల

య్యు న్నవీన కుతూహలోత్సవయుక్తి నాగరకాంత ల

త్యున్నతోన్నత హర్మ్యరేఖలనుండి చూచిరి నిక్కి చే

సన్నలం దమలోనఁ దద్విభు సౌకుమార్యము సూపుచు¦. 254 47

సీ.

కలుముల నీనెడి కలకంఠి యెలనాఁగ వర్తించు నెవ్వని వక్షమందు

జనదృక్చకోరక సంఘంబునకు సుధా పానీయపాత్ర మే భవ్యుముఖము

సకల దిక్పాలక సమితికి నెవ్వని బాహుదండంబులు పట్టుఁగొమ్మ

లాశ్రితశ్రేణి కే యధిపతి పాద రాజీవయుగ్మంబులు చేరుగడలు

ఆ.

భువన మోహనుండు పురుషభూషణుఁ డట్టి కృష్ణుఁడరిగె హర్మ్యశిఖర

రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు గుసుమరాజిఁ గురియ. 255


మ.

జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళ చ్ఛత్రంబుతోఁ జామరం

బులతోఁ బుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుఁడై

నలినీబాంధవుతో శశిద్వయముతో నక్షత్రసంఘంబుతో

జలభిచ్చాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఫూకృతి¦. 256


వ.

ఇట్లు తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీప్రముఖలైన తల్లుల కేడ్వురకు

మ్రొక్కిన. 257


క.

బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు

జడ్డన నంకముల నునిచి చన్నులతుదిఁ బా

లొడ్డగిలఁ బ్రేమభరమున

జడ్డువడం దడసి రక్షిజలముల ననఫూ! 258


వ.

తదనంతరం బష్టోత్తరశతాధిక షోడశసహస్ర సౌవర్ణసౌధ కాంతంబైన శుద్ధాం

తంబు సొచ్చి హరి తన మనంబున. 259


మ.

ఒక భామాభవనంబు మున్ను సొర వేఱొక్కర్తు లోఁ గుందునో!

సుకరాలాపము లాడదో! సొలయునో! సుప్రీతి నీక్షింపదో!

వికలత్వంబున నుండునో! యనుచు నవ్వేళన్‌ వధూగేహముల్‌

ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుఁడై భార్గవా! 260


వ.

ఆ సమయంబున. 261

క.

శిశువులఁ జంకలనిడి తను

కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్‌

రశనలు జాఱఁగ సిగ్గుల

శశిముఖు లెదురేగి రపుడు జలజాక్షునకు¦. 262


మ.

పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా

గతుఁడయ్యెన్‌ మును సేరెఁ బో దొలుత మత్కాంతుడు నాశాల కే

నితరాలభ్య శుభంబు గంటి నని తా రింటింట నర్చించి ర

య్యతివల్‌ నూఱుఁ బదాఱువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరు¦. 263


వ.

వారలం జూచి హరి యిట్లనియె. 264 48

మ.

కొడుకుల్‌ భక్తివిధేయు లౌదురుగదా? కోడండ్రు మీ వాక్యముల్‌

కడవం బాఱక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?

తొడవుల్‌ వస్త్రములం బదార్థ రస సందోహంబులు జాలునా?

కడమల్‌ గావు గదా? భవన్నిలయముల్‌ గల్యాణ యుక్తంబులే? 265


సీ.

తిలక మేటికి లేదు? తిలకినీ తిలకమ! పువ్వులు దుఱుమవా? పువ్వుఁబోణి!

కస్తూరి యలఁదవా? కస్తూరికాగంధి! తొడవులు తొడవవా? తొడవు తొడవ!

కలహంసఁ బెంపుదే? కలహంస గామిని! కీరంబుఁ జదివింతె? కీరవాణి!

లతలఁ బోషింతువా? లతికా లలితదేహ! సరసి నోలాడుదె? సరసిజాక్షి!

ఆ.

మృగికి మేఁతలిడుదె? మృగశాబ లోచన! గురుల నాదరింతె? గురువివేక!

బంధుజనులఁ బ్రోతె? బంధుచింతామణి! యనుచు సతుల నడిగె నచ్యుతుండు. 266


వ.

అని యడిగిన వారలు హరిం బాసిన దినంబులందు శరీర సంస్కార కేళీవిహార

హాస మందిరగమన మహోత్సవ దర్శనంబు నొల్లని యిల్లాండ్రు గావున. 267


మ.

సిరి చాంచల్యము తోడి దయ్యుఁ దనకుం జిత్తేశ్వరుండంచు నే

పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్‌ బుద్ధిన్‌ విలోకంబులన్‌

గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్‌ గల్యాణ బాష్పంబు లా

భరణ శ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తాను రాగంబుల¦. 268


మత్తకోకిల.

పంచబాణుని నీఱుచేసిన భర్గునిం దనవిల్లు వ

ర్జించి మూర్ఛిలఁ జేయఁజాలు విశేష హాస విలోకనో

దంచితాకృతు లయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవు¦

సంచలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా! 269


వ.

ఇవ్విధంబున సంగ విరహితుండైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన

విలోకులైన లోకులు లోకసామాన్య మనుష్యుండని తలంతురు. ఆత్మాశ్రయ

యైన బుద్ధి యాత్మయందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు

ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ

జెందక యుండు. పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్నిఁ బుట్టించి

వనంబుల దహించు మహావాయువు చందంబున, భూమికి భారహేతువులై

యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజు లగు రాజుల కన్యోన్య వైరంబులు 49


గల్పించి, నిరాయుధుండై సంహారంబుసేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ

బ్రాకృత మనుష్యుండునుం బోలె, సంచరింపుచుండె నా సమయంబున. 270


క.

మతు లీశ్వరుని మహత్వ్తము

మిత మెఱుఁగని భంగి నప్రమేయుఁడగు హరి

స్థితి నెఱుఁగక కాముకుఁడని

రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! 271


క.

ఎల్లపుడును మా యిండ్లను

వల్లభుఁడు వసించు మేమ వల్లభలము శ్రీ

వల్లభున కనుచు గోపీ

వల్లభుచే సతులు మమతవలఁబడి రనఫూ! 272


వ.

అని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె. 273

అధ్యాయము - 12

ఉత్తరకు పరీక్షిత్తు జన్మించుట

సీ. గురునందనుడు సక్రోధుఁ డై యేసిన బ్రహ్మశిరోనామ బాణ వహ్నిఁ

గుంపించు నుత్తర గర్భంబు గ్రమ్మఱుఁ బద్మలోచనుచేతఁ బ్రతికె సండ్రు

గర్భస్థుఁడగు బాలు గంసారి యేరితి బ్రతికించె? మృత్యువు భయము వాపి

జనియించి యతుఁడెన్ని సంవత్సరము లుండె? నెబ్భంగి వర్తించె నేమి సేసె?

ఆ. వినుము శుకుడు వచ్చి విజ్ఞాన, నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ

దన శరీర మే విధంబున వర్జించె? విప్రమ్ముఖ్య! నాకు విస్తరింపు.(1-274)


వ. అనిన సూతుండు డిట్ల్నియె.ధర్మనందనుడు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీపరాజ్యంబు నార్జించియు,మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు,నంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్యసంపదలు సంపాదించియు,వీరసోదర విప్ర విద్వజ్జన వినోదంబులం బ్రమోదించియు,వైభవంబు లలవరించియుఁ,గ్రతువు లాచరించియు,(దుష్ట శిక్షణ,శిష్టరక్షణంబు లొనరించియు) ముకుంద చరణారవింద సేవారతుండై,సమస్త సంగంబులంచు నభిలాషంబు వర్జించి,యరిషడ్వార్గంబు జయించి రాజ్యంబు సేయుచు.(1-275)


తే. చందనాల నాఁకట స్రగ్గువాఁడు,దనివి నొందని కైవడి ధర్మసుతుడు

సంపదలు పెక్కుగలిగియుఁ,జక్రిపాద,సేవనంబులఁబరిపూర్తి సెందకుండె.(1-276) 50


వ. అంతం గొన్ని దినంబులకు నభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమాన పరిచ్ఛేద్యుండై,గర్భాంతరాళంబున దురంతంబైస యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. (1-277)


ఉ. కుయ్యిడ శక్తిలే దుదర గోళములోపల నున్న వాఁద ది

క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నేఁ

డియ్యిషువహ్ని వాయుట్కు నెయ్యది మార్గము? నన్నుఁ గావ నే

యయ్య గలండు? గర్భ జనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! (1-278)


క. చిచ్చఱకోల వశంబునఁ, జచ్చిన బహిర్గతుడుఁ గాని సమయమునను దా

నుచ్చలిత గర్భవేదనఁ, జచ్చును మాతల్లి ఘెర సంతాపమున్. (1-279)


క. చెచ్చెర బాణ జ్వాలలు, వచ్చిన విష్ణండు గావవచ్చు ననుచుఁ దా

ముచ్చటలు సెప్పు సతులకు, నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో! (1-280)


శా. రాఁడా చూడు? సమస్త భూతములులో రాజిల్లువాఁ డిచ్చటన్

లేడా? పాఱుని చ్చిచ్చఱమ్ము దిలగన్ లీలాగతిన్ ద్రోచి నా

కీడా? నేఁ డభయప్రదాన మతఁ దూహింపన్ నతత్రాత మున్

గాఁడా? యెందఱిఁ గావఁడీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో! (1-281)


వ. అని గతాగత పాణుండై శిశువు చింతించు సమయంబున. (1-282)


సీ. మేఘంబు మీఁద క్రొమ్మెఱుఁగు కైవడి మేనిపై నున్న పచ్చని పటమువాఁడు

గండ భాగంబులఁ గాంచన మణినయ మకరకుండల కాంతి మలయువాఁడు

శరవహ్ని నణఁగించు సంరంభమునఁ జేసి కన్నుల నునుఁగేంపు గలుగువాఁడు

బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాఁడు

తే. గంకణాంగద వనమాలి విరాజి, మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ

డొక్కగదఁ జేతఁదాల్చి నేత్రోత్సవమగు, విష్ణుఁ డావిర్భవించె న వ్వేళయందు. (1-283)


వ. ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుం డావిర్భవించి, మంచు విరియించు మార్తాండు చందంబున శిశుకునకు దశదిశలం యఖండిత మహోల్కాజాల సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి, విప్రుని చిచ్చరమ్ము వేఁడిమి పోఁడిమిఁ జెఱిచి, డింభకుని పరితాప విజృంభణంబు నివారించి, గర్భంబు కందకుండ రక్షించి యర్భకునికి నానందంబు గల్పించిన. (1-284) 51


మ. గదఁ జేఁ బట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయ

ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ

సదయుం డెవ్వఁడొకో! యటంచు మదిలోఁ జర్పింపుచున్ శాబకుం

డెదురై చూడు నదృశ్యుఁడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! (1-285)


వ.అంత ననుకూల శుభ గ్రహోదయంబును, సర్వ గుణోత్తర ఫల సూచకంబునైన మంచి లగ్నంబునం భాడవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మ నందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యహంబు సదిమించి, జాతకర్మంబులు సేయించి, కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచి సంపన్నంబులై న యన్నంబులు నిడిన,వారలు ధర్మపుత్రునకిట్లనిరి.(1-286)


చ. ప్రకటిత దైవయోగమునఁ బొరవసంతతి యంతరింపఁగా

వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు కృష్ణుఁడు డనుగ్రహించి శా

బకు బ్రతికించెఁ గావున నృపాలక బాలకుఁ డింక శాత్రవాం

తకుఁ డగు విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కెఁ బూజ్యుడై. (1-287)


వ. అని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. (1-288)


శా. ఓ పుణ్యాత్మకులార!నా పలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్

మా పెద్దల్ చిరకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై

యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా! యెల్లప్పుడున్ మాధవ

శ్రీ పాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే! (1-289)


వ. అనిన విని నరేంద్రా! భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన యిక్ష్వాకు చందంబునం బ్రజల రక్షించ. (శ్రీ రామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండు నగు)డేగె వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబిచక్రవర్తిభంగి (శరణ్యుండును, వితరణఖనియు నగు). దుష్యంత సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు(యజ్వలకు)ననర్గళ కీర్తి విస్తరించుచు,ధనంజయ కార్తావీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు. కీలిపోలిక దుర్ధర్షుండగు. సముద్రుని తెఱంగున దుస్తరుండాగు.మృగేంద్రుని కైవడీ విక్రమశాలియగు. వసుమతిం బోలె నక్షయ క్షాంతి యుక్తుండగు. భానుని లాగు ప్రతాపవంతుండగు.వాసుదేవు వడువున సర్వభూతహితుండగు. తల్లిదండ్రులమాడ్కి సహిష్ణుఁడగు. మఱియును. (1-290) 52


సీ. సమదర్శనంబున జలజాతభవుఁ డనఁ బరమ ప్రసన్నత భర్గుఁ డనఁ గ

నెల్లగుణంబుల నిందిరావిభుఁ డన నధిక ధ్ర్మమున యయాతి యనఁ గ

ధైర్యసంపద బలి దైత్యవల్లభుఁ డన నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనగ

రాజితోదారత రంతిదేవుం డన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ

తే. యశము నార్జించుఁ , బెద్దల నాదరించు,నశ్వవేభంబు లొనరించు,నాత్మసుతులు

ఘనులఁ బట్టించు,దండించు ఖలులఁబట్టి మాధనుఁడు నీమనుమండు మానవేంద్ర! (1-291)


"భుజంగ ప్రయాతము". హరించు గలిప్రేరి తాఘంబు లెల్లన్

భరించున్ ధరన్ రామభద్రుండు వోలెన్

జరించున్ సదా వేదశాస్త్రాను వృత్తిన్

గరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. (1-292)


వ. ఇట్లు పెక్కేండ్లు జీవించి, భూసుర కుమారక ప్రేరితంబైన, తక్షక సర్పవిషాన లంబునం దనకు మరణంబని యెఱింగి, సంగవర్జితుండై, ముకుందు పాదరవింద భజనంబు సేయుచు శుక యోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుంఢై, గంగా తటంబున శరీరంబువిడిచి,నిర్గత భయశోకంబైన లోకంబు ప్రేశించును. అని జాతకఫలంబు సెప్పి లబ్ధకాములై భూసురులు చనిరి. అంత (1-293)


క. తనతల్లి కడుపు లోపల, మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం

డనుచుఁ బరీక్షింపఁగ జను, లనఘుఁ, బరీక్షిన్నర్రేంద్రుఁ డండ్రు నర్రేంద్రా! (1-294)


ఆ.కాలళచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణుఁ, డైన భంగఁ దాత లనుదినంబుఁ

బోషణంబు సేయుఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ,పటల పాలకుంఢు బాలకుంఢు(1-295)

వ.మఱియు ధర్మజుండు బంధుసంహార దోషంబు వాయుకఱకు నశ్వమేధయాగంబు సేయందలంచి,ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబైన విత్తంబు చాలక చిత్తంబునం జింతించునెడ, నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరత్తుండను రాజు మఖంబుచేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తముత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన,నా రాజసత్తముండూను సమాయత్త యజ్ఞోపకరణుండై, సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు చేసి, పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించె. (తదనంతరంబు కృష్ణుండు బంధు ప్రియంబు కొఱకుఁ గరినగరంబునం గొన్ని నెల లుంఢి, ధర్మపుత్రాదులచే నామంత్రణంబు వడసి, యాదవ సమేతుండై ధనంజయుండూ తోడరా నిజనగరంబునకుఁ జనియె.) 53

అంతంకు మున్నువిదురుండు తీర్థయాత్రకుఁ జని మైత్రేయు ముందటఁ గర్మయోగంబులైన ప్రశ్నలు గొన్ని చేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలసి కృతార్థుండై హస్తిపురంబునకు వచ్చిన(1-296)

అధ్యాయము - 13

క. బంధుఁడు వచ్చె నటంచును, గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం

బంధములు నెఱపి ప్రీతి న, మంథరగతిఁ జేసి రపుడు మన్నన లనఘా! (1-297)


వ. అంత ధర్మనందనుడు విదురునికి భోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవారు లందఱు విన నిట్లనియె.
(1-298)


సీ. ఏ వర్తనంబున నింత కాలము వీరు సంచరించితిరయ్య? జగతిలోన

నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి? భావింప మీవంటి భాగవతుల

దీర్థసంఘంబుల దిక్కరింతురుగదా! మీయందు విష్ణుండు మెఱయుకతన

మీరె తీర్థంబులు మీకంటె మిక్కిలి తీర్థంబు లున్నవే? తెలిసిచూడ.

తే. వేరె తీర్థంబు లవనిపై వెదకనేల, మిమ్ముఁ బొడగని భాషించు మేలె చాలు

వార్తలేమండ్రు? లోకులు వసుధలోన, మీకు సర్వంబు నెఱిగెఁడి మేరగలదు.(1-299)


మత్తకోకిల. తండ్రి సచ్చిన మీఁద మా పెదతండ్రి బిడ్డలు దొల్లి పె

క్కండ్రు సర్పవిషాగ్ని బాధల గాసి పెట్టఁగ మమ్ము ని

ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా

తండ్రిభంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? (1-300)


క. పక్షులు తమ ఱెక్కలలోఁ, బక్షంబులురాని పిల్లపదువుల మమతన్

రక్షించినక్రియ మీరలు, పక్షీకరణంబు సేయు బ్రతికితిమి గదే! (1-301)


క. మన్నారు? ద్వారకలో, నున్నారా? యదువు లంబుజోదరు కరుణన్

గన్నారా? లోకులచే, విన్నారా? మీరు వారి విధి మెట్టిదియో. (1-302)


చ. అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోకవ

ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి, యదుక్షయంబు సె

ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్

విను మని చెప్పఁ డయ్యె యదువీరుల నాశము భార్గవోత్తమా! (1-303) 54


ఆ. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు, చేటు చెప్పెనేని చెట్టయండ్రు

అంతమీఁద శూద్రుఁ డైన కతంబున శిష్టమరణ మతఁడు సెప్పఁ డయ్యె.(1-304)


వ. అది యెట్లనిన మాండవ్య మహాముని శాపంబునం దొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న నూఱుసంవత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె. ఇట యుధిష్థిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాల సంకశులైన తమ్ములుం దానును కులదీపకుండైన మనుమని ముద్దుసేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె.(1-305)


క. బాలాజన శాలా ధన, లీలా వనముఖ్య విభవ లీన మనీషా

లాలసులగు మానవులను, గాలము వంచించు దురవగాహము సుమతీ! (1-306)


వ. అది నిమిత్తంబునం గాలగతి యెఱింగి విదిరుండు ధృతరాష్ట్రున కిట్లనియె. (1-307)

గాంధారీ ధృతరాష్ట్రులు దేహత్యాగము సేయుట

మ. కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం

గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నేకాలంబు దుర్లంఘ్యమై

యనివర్యస్థితిఁ జంపు నట్టి నిరుపాయం బైన కాలంబు వ

చ్చె నుపాంతంబున మాఱు దీనికి మదిన్ జింతింపు ధాత్రీశ్వరా! (1-308)


శా. పుట్టంధుండువు, పెద్దవాఁడవు, మహాభోగంబులూ లేవు, నీ

పట్టెల్లంజెడిపోయె, దుస్సహ, జరాభారంబు పైఁ గప్పె, నీ

చుట్టా లెల్లను బోయి రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై

కట్టా! దాయలపంచ నుండఁ దగవే, కౌరవ్యవంశాగ్రణీ! (1-309)


క. పెట్టితిరి చిచ్చు గృహమునఁ, బట్టితిరి తదీయభార్యఁ, బాడడవులకుం

గొట్టితిరి, వారు మనుపఁగ, నెట్టైన భరింపవలెనే? యీ ప్రాణములన్. (1-310)


క. బిడ్డ లకు బుద్ధిసెప్పని, గ్రుడ్డికిఁ బిండింబు వండికొని పొం డిదె పైఁ

బడ్డాఁ డని భీముం డొఱ, గొడ్డెము లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా. (1-311)


క. కనియెదవో బిడ్డల నిఁక, మనియెదవో తొంటికంటె మనుమలమాటల్

వినియెదవో యిచ్చెద ర, మ్మనియెదవో దానములకు నవనీసురులన్. (1-312)


క.దేహము నిత్యము గాదని, మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై

గేహము వెలువడు నరుడు, త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా! (1-313) 55


వ. అని విదురుండు ధృతరాష్ట్రునకు విర క్తిమార్గం బుపదేశించిన నతండు, ప్రజ్ఞాచక్షుండై సంపారంబు దిగనాడి, మోహపాశంబులవలన నూడి, విజ్ఞసమార్గంబునం గూడి, దుర్గమంబుగు హిమవన్నగంబునకు నిర్గమించిన. (1-314)


శా. అంధుడైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ

బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమ ప్రఖ్యాతయై యున్న త

ద్గాంధార ఝితినాథు కూఁతురును యోగప్రీతి చిత్తంబులో

సంధిల్లం బతివెంట నేఁగె నుదయ త్సాధ్వీగూణారుఢయై. (1-315)


చ. వెనుకకు రాక చుచ్చు రణవీరునఇకైవడి రాజదండనం

బునకు భయంబులేక వడిఁ బోయెడు ధీరునిభంగి నప్పు డా

వనిత దురంతమైన హిమవంతముపొంత వనాంతభూమికిం

బెనిమిటితోడ నించుకయు భీతివహింపక యేగెఁ బ్రీతితోన్. (1-316)


వ. ఇట్లు విదురసహితులై గాధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన, మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి, నిత్యహోమంబులు గావించి,బ్రహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబు లిచ్చి, నమస్కరించి, గురువందనంబు కొఱకుఁ బూర్వప్రకారంబునం దండ్రి మందిరంబునకుం జని యందు విదురసహితులైన తల్లిదండ్రులం గానక మంజు పీఠంబునం గూర్చున్న సంజయున కిట్లనియె.(1-317)


సీ. మా తల్లిదండ్రులు మందిరంబున లేరు సంజయ! వా రెందుఁ జనిరొ నేఁడు

ముందఱ గానఁడు ముసలి మా పెదతండ్రి, పుత్రశోకంబునఁ బొగులుఁ దల్లి

సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి, మందబుద్ధులమైన మమ్ము విడిచి

యెందుఁబోయిరొ? మువ్వరెఱిఁగింపు గంగలోఁ దన యపరాధంబుఁదడవికొనుచు

ఆ. భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ గపట మింత లేదు,కరుణగలదు

పాండు భూవిభుండు పరలోకగతుఁడైన, మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు. (1-318)


వ. అనిన సంజయుండు (దయాస్నేహంబులనతికర్శితుండగుచు తన ప్రభువు పోయిన తెఱం గెఱుంగక కొంతదడ పూరకుండి) త ద్వియోగదుఃఖంబునఁ గన్నీరు కరతలంబునఁ దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి (తన భర్తృపాదంబుల మనంబున నెన్నుచు) ధర్మజున కిట్లనియె. (1-319) 56


తే. అఖిలవార్తలు మున్ను నన్నురుగుచుండు, నడుగఁ దీరేయి మీతండ్రి యవనినాథ!

మందిరములోన విదురుతో మంతనంబు, నిన్న యాడుచునుండెను నేఁడు లేఁడు. (1-320)


వ. విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁ బోయిరో? (వారల నిశ్చయంబు లెట్టివో?) యెఱుంగనని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురుసహితుండై నారదుండు వచ్చిన లేచి, నమస్కరించి, తమ్ములుందానును నారదుం బూజించి కొంతెయాగ్రజుం డిట్లనియె. (1-321)


ఉ. అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు, మహాత్మ! వారు నేఁ

డెక్కడ బోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డ పేరు గ్రుచ్చి తాఁ

బుక్కచునుండుఁ దల్లి: యెటు వోయె నొకో! విపదంబురాశికిన్

నిక్కము గర్ణధారుఁడవు నీవు జగజ్జన పారదర్శనా! (1-322)


వ. అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె. (ఈశ్వరవశంబు విశ్వంబు. ఈశ్వరుండె భూతంబుల నొకటితో నొకటిఁ జేర్చుఁ , నెడఁబాపు. సూచీభీన్న నాసికలందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీవర్దంబులబోలెఁ గర్తవ్యాకర్తవ్య విధాయక వేదలక్షణ యగు వాక్తంత్రియందు వర్ణాశ్రమలక్షణంబులు గల నామంబులచే బద్ధులైన) లొకపాల సహింబులైలొకంబులీశ్వరాదేశంబు వహించు. క్రీడాసాధనంబులగు (నక్షకందుకాదుల) కెట్లు సంయోగవియోగంబు లట్లు క్రీడించు నీశ్వరునికిం గ్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగవియోగంబులు గలుగుచుండు. సమస్తజనంబును జీవరూపంబున ధ్రువంబున, దేహరూపంబున నధ్రువంబునై యుండు.మఱియు నోక్కపక్షంబున ధ్రవంబు నధ్రువంబు గాకయుండు. శుద్ధబ్రహ్మరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు. అజగతరంబుచేత మ్రింగబడిన పురుషుఁడన్యుల రక్షింపలేని తెఱంగునఁ బంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరులరక్షింప సమర్థంబుగాదు. కరంబులుగల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదాదు లాహారంబులగు. చరణంబులు గల ప్రాణులకు జరణంబులులేని తృణాదులు భక్షణీయంబులగు. అధిక జన్మంబులుగల (వ్యాఘ్రాదులకు) నల్పజన్మంబుగల మృగాదులు భోజ్యంబులగు. సకల దేహిదేహంబులందు జీవుండు గలుగుటంజేసి జీవునికి జీవుండ జీవికియగు. అహస్త సహస్తాది రూపమ్బైన విశ్వమంతయు నీశ్వరుండుగాఁ దెలియుము. ఆతనికి వేఱు లేదు. నిజమాయా విశేషంబున మాయావియై జాతి భేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగి భోగ్య రూపంబుల నంతరంగ బహిరంగబుల దీపించు. (కాన 57


యనాథులు దీనులునగు నామ తల్లిదండ్రులు నమం బాసి యే మయ్యెదరొ? యెట్లు వర్తించుదురొ? యని వగవం బనిలేదు. అజ్ఞానములం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మని మఱియు నిట్లనియె).(1-323)


ఆ. అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ , డసురనాశమునకు నవతరించి

దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కినపని, కెదురు సూచుచుండు నిప్పు డధిప! (1-324)


మత్తకోకిల. ఎంతకాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు,మీ

రంతకాలము నుండుఁ డందఱు, నవ్వలం బనిలేదు, వి

భ్రాంతి మానుము, కాలముం గడవంగ నెవ్వరు నోప, రీ

తించయేల? నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్ . (1-325)


వ. ధృతరాష్ట్రుడు గాంధారీ విదురు సహితుండై హిమవత్పర్వత దక్షినభాగంబున నొక్క మునివనంబున జని, తొల్లి సప్తఋషులకు సంతోషంబు సేయుకోఱుచు, నాకాశగంగ యేడు ప్రవాహంబులై పాఱిన పున్యతీర్థంబున గృత స్నానుండై యథావిది హోమ మెనరించి, జలభక్షనంబు గావించి, సకల కర్మంబులువిసర్జించి, విఘ్నంబుఁ జెందక, నిరాహారుండై, యుపశాతాత్ముఁ డగుచు, పుత్రార్ధదారైషణంబులు వర్జించి, విన్యస్తాసనుండై, ప్రాణంబులు నియమించి, మనస్సహితంబులైన చక్షు రాదీంద్రియంబులు నాఱింటిని విషయంబులం ప్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపంబగు ధారణా యోగంబుచే రజ స్సత్త్వతమో రూపంబులగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకారస్పదంబైన స్థూలదేహంబువలనం బాపి, బుద్ధియందు నేకీకరణంబుచేసి, యట్టి విజ్ఞానాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందింది ద్రష్ట్రంశంబువలన క్షేత్రజ్ఞునిం బాసి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మమందుఁ గలిపి, లోపలి గుణక్షోధంబును, వెలుపలి యింద్రియ విక్షేపంబును లేక నిర్మూలిత మాయాగుణ వాసనుండగుచు, నిరుద్ధంబులగు మనశ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలహారంబులను వర్జించి, కొఱడు చందంబున. (1-326)


మ. ఉటజాంతస్థల వేదికన్ నియతుఁడై యునాఁడు నేఁ డాదిగా

నిటపై నేనవనాఁడు మేన్ విడువఁగా నిజ్యాగ్ని యోగాగ్నిత

త్పట దేహంబు దహింపఁ జూచి, నియమ ప్రఖ్యాత గాంధారి యి

ట్టటు వో నొల్లక, ప్రాణనవల్లభునితో నగ్నిం బడుం భూవరా ! (1-327) 58


క. అంతట వారల మరణము, వింతయగుచుఁ జూడఁబడిన విడురుఁడు చింతా

సంతాప మొదవఁ బ్రీత, స్వాంతుడై తీర్థములకుఁ జనియెడు నధిపా ! (1-328)


వ. అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనున కెఱింగించి తుంబురు సహితుండై నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక, ధర్మజుండు, భీమునిం జూచి యిట్లనియె. (1-329)

అధ్యాయము - 14

ధర్మరాజు దుర్నిమిత్తంబులం గని చింతించుట

సీ. ఒక కాలమునఁ బండు నోషధీచయము వే ఱొకకాలమునఁ బండకుండ నండ్రు

క్రోధంబు లోబంబుఁ గ్రూరత బొంకును దీపింప నరుల వర్తింతు రండ్రు

వ్యహహారములు మహావ్యాజయుక్తము లండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు సుతులు దండ్రులఁ దెగఁజూతురండ్రు

తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు, శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు

న్యాయపద్ధతి బుధులై వడవ రండ్రు, కాలగతి వింతయై వచ్చెఁ గంటె నేడె. (1-330)


మ. హరిఁ జూడన్ నరుఁ డేఁగినాడు నెల లే డయ్యంగదా ! రారు కా

లరు లెవ్వారును, యాదవుల్ సమద లోలస్వాంతు లేవేళ సు

స్థిరులై యుండుదురా ? మురారి సుఖియై సేమంబుతో నుండునా ?

యెరవై యన్నది చిత్త మీశ్వరకృతం బెట్లోకదే ? మారుతి ! (1-331)


క. మానసము గలఁగుచున్నది మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు, స

న్మానవ దేహక్రీడలు, మాన విచారింప నోపు మాధవుఁ డనుజా ! (1-332)


క. మనవులు చెప్పక ముందఱ, మన దార ప్రాణ రాజ్య మాన శ్రీలన్

మనుపుదు నని యాదేవుఁడు, మనమునఁదలపోసి మనిచె మనలం గరుణన్. (1-333)


క. నారదుఁ డాడిన కైవడిఁ, గ్రూరపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్

ఘోరములగు నుత్పాతము, లారభటిం జూడఁబడియె ననిలజ కంటే. (1-334) 59


సీ. ఓడక నాముందు నిక సారమేయంబు మొఱుఁగుచు నున్నది ఘోర యెత్తి

తయాదిత్యుఁ డుదయొంప సభిముఖియై నక్క వాపోయె మంటలు వాతఁ గలుగ

మిక్కిలు చున్నవి మెఱిసి గవాదులు గర్దభాదులు దీర్చి క్రందుకొనియె

నుత్తమాశ్వములకు నుదయించెఁ గన్నీరు మత్తగజంబుల మదము లుడిగెఁ

ఆ. గాలుదూతభంగి గవిసెఁ గపోతము మండ దగ్ని హోమ మందిరములఁ

జుట్టుఁ బొగలు దిశల నారిది నాచ్చాదించె, ధరణి మాసెఁజూడు ధరణి గదలె. (1-335)


క. వాతములు విసరె రేణు, వ్రాతము లాకసముఁ గప్పె వడి నుడిగొని ని

ర్ఘాతములు వడియె ఘనసం, ఘాతంబులు రల్త వర్ష కలితము లయ్యెన్. (1-336)


క. గ్రహములు పోరాడెడి నా, గ్రహములు వినఁబడియె భూతకలకలముల, దు

స్సహములగుచు శిఖికీలా, వహములక్రియఁ, దోఁచె గగన వసుధాంతరముల్. (1-337)


క. దూడలు గడువవు చన్నులు, దూడలకును గోవు దుగ్ధము, లౌడలం

బీడలు మానవు, పశువులఁ, గూడవు వృషభములు దఱిపికుఱ్ఱల నెక్కున్. (1-338)


క. కదలెడు వేల్పుల రూపుల, పదలెడుఁ గన్నీరు వానివలనం జెనటల్

వొదలెడిఁ బ్రతిమలు వెలి, జని, మెదలెడి నొకొక్క గుడిని మేదిని యందున్. (1-339)


క. కాకంబులు వాపోయెడి, ఘాకంబులు నగరఁ బగల గుండ్రలు గొలిపెన్

లోకంబులు విభ్రష్ట, శ్రీకంబుల గతి నశించి శిథిలము లయ్యెన్. (1-340)


మ. యవ పద్మంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతం బైన మా

ధవు పాదద్వయ మింక ముట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా

నవనీకాంతకు లేదువో ! పలుమఱు న్నందంద వామాఝక్షి బా

హువు లకంపము నొందుచుండు, నిల కే యుగ్రస్థితు ల్వచ్చునో ! (1-341)


న. మఱియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుచున్నయని. మురాంతకుని వృత్తాంతంబు వినరాద. అని కుంతీసుతాగ్రజుండు భీమునుతో విచారించి సమయంబున. (1-342) 60

అర్జునుండు ద్వారక నుండి వచ్చి ధర్మరాజునకుఁ గృష్ణనిర్యాణమును గూర్చి తెలియజెప్పుట

క. భేదమున నింద్రసూనుడుఁ, యాదవపురినుండి వచ్చి, యగ్రజుఁ, గని, త

త్పాదముల నయన సలిలో, త్పాదకుడై పడియె దీనుభంగి నరేంద్రా ! (343)


క. పల్లటిలిన యుల్లముతోఁ దల్లడపడుచున్న పిన్న తమ్మునిఁ గని వె

ల్వెల్ల నగు మొగముతో జని, లెల్లన విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్. (344)


సీ. మాతామహుండైన మన శూరఁ డన్నాఁడె ? మంగళంమే మన మాతులునకు ?

మోదమే నలుగురు ముగురు మేనత్తల ? కానందమే వారి యాత్మజులకు ?

నక్రూర కృతవర్మ లాయుస్స మేతులే ? జీవితుఁడే యుగ్రసేన విభుఁడు

గల్యాణ యుక్తులే గద సారణాదులు మాధవు తమ్ములు మానధనులు ?

తే. నందమే? మన సత్యక నందనునకు, భద్రమే ? శంబరాసుర భంజనునకుఁ

గుశలమే? బాణాదనుజేంద్రు కూఁతుపతికి, హర్షమే? పార్థ ! ముసలికి హలికి బలికి. (345)


వ. మఱియును నంధక మధు యదు భోజ దాశార్హ వృష్ణి సాత్వతు లనియెడి వంశంబుల వీరులును, హరి కుమారులై న సాంబ సుషేణ ప్రముఖులును, నారాయణాను చరులైన యుద్ధావాదులును, కృష్ణసహచరులై న సునందాదులును సుఖానందులే? యని యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె. (346)


సీ. వైకుంఠవాసుల వడువున నెవ్వని బలమున నానంద భరితులగుచు

వెఱవక యాదవవీరులు వర్తింతు, రమరులు గొలువుండు నట్టి కొలువు

చవికె నాకర్షించి చరణ సేవకులై న బంధు మిత్రాదుల పదతుగమున

నెవ్వఁడు ద్రొక్కించె, నింద్రపీఠము మీఁద, వజ్రంబు జళిపించి వ్రాలువాని

తే. ప్రాణవల్లభ కెంగేలఁ బాదుచేసి, యమృతజలములఁ బోషింప నలరు పారి

జాత మెవ్వఁడు కొనివచ్చి సత్యభాను, కిచ్చె, నట్టి మహాత్మున కిపుడు శుభమె ? (347)


శా.అన్నా ! ఫల్గున ! భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁ డా

పన్నానీక శరణ్యుఁ డీశుఁడు జగద్భద్రానుసంధాయి శ్రీ

మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు సుధర్మమధ్య పీఠంబునం

దున్నాఁడా ! బలభద్రుఁగూడి, సుఖియై, యుత్సాహియై, ద్వారకన్. (348)


క. ఆ రామ కేశవులకును, సారామల భక్తి నీవు సలుపుదువు గదా ?

గారాములు సేయుదురా ? పోరాముల బంధు లెల్లప్రొద్దు జితారీ ! (349) 61


శా. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో

సన్నాహంబునఁ గాలకేయుల వడిం బక్కాడుచోఁ బ్రాభవ

స్కన్నుండై చనుకౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచోఁ

గన్నీ రెన్నఁ డుఁ దేవు తండ్రి ! చెపుమా ! కల్యాణమే ? చక్రికిన్. (350)


వ. అదియునుం గాక. (351)


క. ఓడితివో శత్రువులకు, నాడితివో సాధు దూష ణాలాపంబుల్

గూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్. (352)


క. తప్పితివో ? యిచ్చెద నని, చెప్పితివో ? కపటసాక్షి, చేసిన మేలుం

దెప్పితివో ? శరణార్థుల, రొప్పితివో ! ద్విజులఁ బసుల రోగుల సతులన్. (353)


క. అడిచితివో ?భూసురులనఁ గుడిచితివో ? బాల వృద్ద గురువిలు వెలిగా

విడిచితివో ? యాశ్రితులను, ముడిచితివో ? పరల విత్తములు లోభమునన్. (354)

అధ్యాయము - 15

వ. అని పలికినం గన్నీరు కరతలమునం దుడిచికొనుచు, గద్గదస్వరంబున మహానిధిఁ గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పుల నిగుడింపుచు, నర్జునుండన్న కిట్లనియె. (355)


క. మనసారథి, మన సచివుడు మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుఁడున్

మన విభుఁడు, గురువు, దేవర మనలను దిగనాడి చనియె, మనజాధీశా ! (356)


క. కంటకపు నృపులు సూడఁగ మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్

గెంటించి మనము వాలుం, గంటిం జేకొంటి మతని కరణన కాదే ! (357)


క. దండి ననేకులతో నా, ఖండలుఁ డెదురైన గెలిచి భాండవ వనముం

జండార్చికి నర్పించిన, గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుటఁ గాదే ? (358)


క. దిక్కుల రాజుల నెల్లను, మక్కించి ధ్నంబు గొనుట, మయకృతసభ ము

న్నెక్కుట, జన్నము సేయుట, నిక్కము హరి మనకు దండ నిలిచినఁగాదే ? (359 )


మ. ఇభజిద్వీర్య ! మఖాభిషిక్తమగు నీ యుల్లాలి ధమ్మిల్లమున్

సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపఁగా

నభయం బిచ్చి ప్రతిజ్ఞచేసి భవదీయారాతికాంతా శిరో

జ భరశ్రీలు హరింపఁడే ? విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్. (360) 62


శా. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా వారింప నా వల్లభుల్

రారీవేళ, ను పేక్షసేయఁ దగవే? రావే/ నివారింపవే ?

లేరే ? పత్రాతలు కృష్ణ ! యందు సభలో లీనాంగియై కుయ్యడన్

గారుణ్యంబున భూరి వస్త్రకలితంగాఁ జేయుఁడు ? ద్రౌపదిన్. (361)


సీ. దుర్వాసుఁ డొసనాఁడు దుర్యోధనుఁడు వంప పదివేల శిష్యులు భక్తిఁ గొలుపఁ

జనుదెంచి మనము పాంచాలియుఁ గిడిచిన వెనక నాహారంబు వేఁడుకొనినఁ

బెట్టద ననపుడుఁ బెట్టకున్న శపింతు ననుచుఁ దో యావగాహమున కేగఁ

గడవల నన్నశాకములు దీఱుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాల

తే. లోన వెఱచిన, విచ్చేసి లోవిలోని, శిష్ట శాకాన్న లవము ప్రాశించి, తపసి

కోప ముడిగించి, పరిపూర్ణ కుక్షిఁజేసె, నిట్టి త్రైలోక్య సంతర్పియెందుఁగలఁడు ? (362)


సీ. పందికై పోరాడి ఫాలాక్షుఁ డేవ్వని బలమున నా కిచ్చెఁ బాశుపతము !

నెవ్వని లావున నీ మేన దేవేంద్రు పీఠార్థమున నుండు పెంపుఁ గంటిఁ  !

గాలకేయ నివాత కవచాది దైత్యులఁ జంపితి నెవ్వని సంస్మరించి !

గోగ్రహణమునాఁడు కురుకులాంభోనిధిఁ గడచితి ! నెవ్వని కరుణఁ జేసి

ఆ. కర్ణ సింధురాజు కౌరవేంద్రాదుల, తలల పాగలెల్లఁ దడవి తెచ్చి

యే మహాత్ము బలిమి నిచ్చితి ! విరటుని, పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు. (363)


మ. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో

గురుశక్తిన్ రథయంతయై, నొగలపైఁ , గూర్చుండి, యా మేటి నా

శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త

త్పరతముల్ చూడ్కుల సమ్హరించె నమితోత్పాహంబు నాకిచ్చుచున్. (364)


మ. అసురేంద్రుం డొసరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె

ల్వ సమర్థంబులు గాని కైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ

ర్యసుతు ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా

దెసకున్ రాక తొలంగ మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమా ! (365)


చ. వసుమతి, దివ్యబాణముల ప్రక్కలువాపి, కొలంకుసేసి, నా

రసముల మాతాగాఁ బఱపి, రథ్యములన్ రిపులెల్లఁ ,జూడ, సా

హసమున నీట బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు నా

కసురవిరోధి భద్రగత నండయి వచ్చినఁగాదె ? భూవరా ! (366) 63


చెలికాఁడ ! రమ్మని చీరు న న్నొకవేళ మఱఁది ! యనుచు

బంధుభావంబునఁ బాటించు నొకవేళ దాతయై యుకవేళ ధనము లిచ్చు

మత్రమై యొకవేళ మంత్ర మాదేశించు బోద్దయై యొకవేళ బుద్దిసెప్పు

సారథ్య మొనరించుఁ జనివిచ్చు నొకవేళఁ గ్రీడించు నొకవేళ గేలిసేయు

తే. నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న, తండ్రికైవడిఁ చేసినత్తప్పుఁ గాఁచు

హస్తములువట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ ? మాధవు మఱవరాదు . (367)


క. విజయ ! ధనంజయ ! హనుద్ద్యజ ! ఫల్గున ! పాండురాజతనయ ! నర ! మహేం

ద్రజ ! మిత్రర్జున ! యచును, భుజములు తలకడవ రాకపోకలఁ జీరున్ (368)


క. వారిజగంధులు దమలో, వారింపఁగరాని ప్రేమ వాదము సేయున్

వారిజనేత్రుఁడు ననుఁ దగ, వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా ! (369)


క. నిచ్చలు లోపలి కాంతలు, మచ్చికఁ దనతోడ నాడు మాతలు నాకున్

మువ్వటల సెప్పు మెల్లన, విచ్చలవిడిఁ దొడలమీద విచ్చేసి నృపా ! (370)


చ. అటమటమయ్యె నాభజన మంతయు భూవర ! నేఁడు చూడుమా

యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్

బటుతర దేహలోభ్మునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక, నే

గటాకట ! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో ! (371)


శా. కాంతారంబున నొంటిఁ దోడుకొన రాఁగాఁ జూచి, గోవింద శు

ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల మద రాగాయత్తులై, తాఁకి, నా

చెంతన్ బోయలు మూఁగిపట్టికొన, సీమంతినీసంఘమున్

భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక, ధాత్రీశ్వరా ! (372)


శా. ఆ తేరా రథకుండు నా హయము లా యస్త్రాసనం బా శర

వ్రాతం బన్యలఁ దొల్లిఁ జంపును, దుదిన్ వ్యర్థంబులై పోయె మ

చ్చేతోధీశుఁడు చక్రి లేమి, భసితక్షిప్తాజ్య మాయావి మా

యాతంత్రోషరభూమి బీజముల మర్యాద న్ని మేషంబునన్. (373)


మ. యదువీరుల్ మినినాథు శాపమునఁ గాలాధీనులై, యందఱున్

మదిరాపాన వివర్థమాన మద సమ్మర్దోగ్ర రోషాంధులై ,

కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి, న

ష్టదశం జిక్కిరి నల్గు రేవు రచటన్ సర్వంసహావల్లభా ! (374) 64


క. భూతములవలన్ నెప్పుడు భూతములకు జన్మ మరణ పోష్ణములు ని

ర్ణీతములు సేయుచుండును, భూతమయుం డిశ్వరుండు భూపవరేణ్యా ! (375)


క. బలములుగల మీనంబులు, బలవిరహిత మీనములను భక్షించుక్రియన్

బలవంతులైన యదువులు, బలరహితులఱై జంపి రహితభావముల నృపా ! (376)


మ. బలహీనాంగులకున్ బలాధీకులకుం బ్రత్యర్థి భావోద్యమం

బులు గల్పించి, వినాశము న్నెఱపి యీ భూభారముం బాపి, ని

శ్చలబుద్ధిన్ గృతకార్యుఁడై చనియె నా సర్వేశ్వరుం డచ్యుతుం

డలఘుం డేమని చెప్పుదున్ ! భగవదీ యాయత్త ముర్వీశ్వర ! (377)


వ. మఱియు దేశ కాలార్థ యుక్తంబులు, నంతఃకరణ సంతాపశమనంబులు నైన హరి వచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబై యున్నది. అని యన్నకుం జెప్పి. నిరుత్తరుండై దలంచి చరణారవింద చింతామలబుద్ధియై, శోకంబు వర్ణంచి, సదా ధ్యాన భక్తవిశేషంబులం గామక్రోధాదుల జయించి తొల్లి తన కుభయసేనా మధ్యంబున ననంతం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబుల చేత నావృత్తంబైన విజ్ఞానంబు గ్రమ్మఱ నధిగమించి, శోక హేతు వహంకార మమకారాత్మకంబైన ద్వైతభ్రమం బనియును, ద్వైత భ్రమంబులకుఁ గారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగం బనియును, లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణములకు నిదానము ప్రకృతియనియును, బ్రహ్మాహ మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు ( ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబువలనః గార్యలింగ నాశంబనియును గార్య లింగ నాశంబున నసంభవం బగు ననియును ) ప్రకృతిం బాసి క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును, నిశ్చయించి , యర్జునుండు విరక్తుండై యూరకుండె. ధర్మజుండు భగవదీయ మార్గంబు దెలిసి, యాదవుల సాశంబు విని, నారదు వచనంబు దలంచి. నిశ్చలచిత్తుండై స్వర్గగమనంబునకు యత్నంబు సేయుచుండె, ఆ సమయంబున, (378)


క. యదువుల నాశము మాధవు, పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ

త్పదచింతా తత్పరయై, ముదమున సంసార మార్గమునకుం బాసెన్. (379)

వ. ఇట్లు కంటకంబునం గంట కోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిం బరిహరించు నిన్నాణి తెఱంగున, యావరూప శరీరంబునంజేసి యీశ్వరుండు లోకకంటక 65


శరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె. సంహారమునకు నిజశరీర పరశరీరములు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున నుండుచు, రూపాంతరంబుల ధరించి క్రమ్మఱ నంతర్థానంబు నొందు నటునికైవడి లీలాపరాయణుండైన నారాయణుండు మీన కూర్మాది రూపంబులు ధరియించుం బరిహరించునని చెప్పి మఱియు నిట్లనియె. (380)


క. ఏ దినమున వైకుంఠుఁడు, మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ

డా దినమున నశుభ ప్రతి, పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్. (381)

ధర్మరాజు పరీక్షిన్మహారాజునకుఁ బట్టంబుఁ గట్టి మహాప్రస్థానంబున కరుగుట

సీ. కలవర్తనంబునఁ గ్రౌర్య హింసాసత్య దంభ కౌటిల్యా ద్యధర్మచయము

పురముల గృహముల భూములఁ దనలోనఁ దలపోసి కరిపురమున

మనుమని రాకవై మనుమని దీవించి సింధుతోయ కణాభిషిక్తుఁ జేసి

యనిరుద్ధ నందనుండైన వజ్రనిఁ దెచ్చె మథురఁ బట్టముగట్టి మమతఁ బాసి

ఆ. కరలఁ దురగములన గంకణాదికముల, మంత్రిజనుల బుధుల మానవతుల

నఖిలమై ధనము నభిమన్యుసుతునకు, నప్పగించి బుద్ధి నాశ్రయించి .(382)


వ. విరక్తండైన ధర్మనందనుండు ప్రాజాపత్య మనియెడి యిష్టి గావించి, యగ్నుల నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును నిర్దశితాశేష్ బంధనుండు నై, సకలేంద్రియంబుల మానసంబున నణంచి, ప్రాణాధీన వృత్తియగు మానసంబును బ్రాణమందుఁ, బ్రాణము నపానమునందు, నుత్సర్గ సహితంబైన యపానము మృత్యువందును, మృత్యువును బంచభూతములకు నైక్యంబైన దేహంబునందును, దేహము గుణత్రయము నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోప హేతువగు నవిద్యను జీవిని యందును, జీవుండైన తన్నునవ్యయంబైన బ్రహ్మ మందును లయింపం జేసి, బహి రంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును నై యున్మత్తపిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున . (383)


క. చిత్తంబున బ్రహ్మము నా, వృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనా

యత్తలు దొల్లి వెలింగెడి, యుత్తర దిశ కేగె నిర్మ లోద్యోగమునన్. (384) 66


సీ. అంత నాతని తమ్ము లనిన పుత్రాదులు గలిరాకచేఁ బాపకర్మ లగుచుఁ

బరియించు ప్రజల సంచారంబు లీక్షించి యఖిల ధర్మంబుల నాచరించి

వైకుంఠ చరణాబ్జ వర్తత హృదయులై తద్భక్త నిర్మలత్వమును జెంది

విషయ యుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక నిర్ధూత కల్మష నిపుణ మతులు

తే. బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్మ, లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు

ముఖ్య నారాయణ స్థానమునకుఁ జనిరి, విగతరజ మైన యాత్మల విప్రవర్య ! (385)


వ. అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోద దండధరుం డగుటంజేసి నిజాధాకార స్థానంబునకుల జనియె ద్రుపదరాజ పుత్రియు పతులవలన ననపేక్షితయై వాసుదేవునందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె. ఇట్లు, (386)


క. పాండవ కృష్ణుల యానము, పాండురమతి నెవ్వఁడైన బలికిన విన్నన్

ఖండిత భవుఁడై హరిదా, సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా ! (387)

అధ్యాయము - 16

వ. అంత నటం బరీక్షి త్కుమారుండు జాతకర్మవిదులైన భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవతుండై, ధరణీపాలనంబు సేయుచు, నుత్తరుని పుత్రిక నిరాపతియను మత్తకాశినిం బెండ్లియాడి, జనమేజయ ప్రముఖులైన నలువురు కొడుకుల నుత్పాదించి, గంగాతటంబునఁ గృపాచార్యుండు గురువై యుండ, యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షింపుచు, భూరి దక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయకాలంబున గోమిథునంబుఁ దన్నుచుబ్బ శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండు నగు కలిం బట్టి నిగ్రహించె. అని చెప్పిన శౌనకుండు పొరాణికున కిట్లనియె. (388)

పరీక్షిన్మహారాజు భూ, ధర్మదేవతల సంవాదం బాలకించుట

క. భూవరరూపుఁడు శుద్రుఁడు, గోవుం దా నేల తన్నెఁ ? గోరి పరీక్షి

ద్భూవరుఁడు దిశల గెలుచుచు, నేవిధి,ఁ హలి నిగ్రహించె ? నెఱిఁగింపఁగదే. (389)


మ. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స

త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్భుద్ధిన్ విలంఘించి దు

ర్నర వాథకథన ప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి వా

సరముల్ వ్యర్థతఁ ద్రొబ్బుచుండఁ జన దీ సంసార మోహంబునన్, (390) 67


సీ. మనువు నిత్యముగాదు మరణంబు నిజమని యెఱిఁగి మోక్షస్థితి నిశ్చయించు

నల్పాయువులము మా కన్య దుర్జన చరిత్రము లోలిఁ గర్ణ రంధ్రములఁ బెట్టి

బంగారు వంటి యీ బ్రతికెడి కాలంబు వోనాడఁగా నేల ? పుణ్యచరిత !

మాధవ పదపద్మ మకరందపానంబు సేయింపవే ! యేము సేయునట్టి .

ఆ. సత్త్రయాగమునకు సన్మునీంద్రు సీర, వాఁడె దండధరుఁడు వచ్చెఁ జూడు

చంపఁ డొకనినైన జన్న మయ్యెడు దాఁక, వినుచునుండుఁ దగిలి విష్ణుకథలు. (391)


క. మందునకు మందబుద్ధికి, మందాయువునకు నిరర్థ మార్గునకును గో

విందు చరణారవింద మ, రందముఁ గొనఁ దెఱపిలేదు రాత్రిం బవలున్. (392)


వ. అని శౌనకుడు పలికిన సూతుం డిట్లనియె. పరీక్షిన్నరేంద్రుడు నిజవాహినీ సందోహి సంరక్షితంబగు ( కురుజాంగల) దేశంబునం (గలి ప్రవేశంబు నాకర్ణించి యుద్ధకుతూహలత) నంగీకరించి, యెక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని నీల నీరదనిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబునైన రథంబు నారోహణంబుచేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుంగ, రథకరి తురంగ సుభట సంఘటిత చక్రంబు నిర్వక్రంబునం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబులైన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారత వర్షంబులు,నుత్తరకురుదేశంబులును జయించి (పుష్కల ధనప్రదాన పూర్వకలగు సపర్యల నభ్యర్చితుండై) తత్తదేశ మంగళపాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణింపుచు, పాఠకపఠత పద్యంబులందుఁ బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య సఖ్య సభాపతిత్వ సాచివ్య రచన వీరాసన దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్రతేజంబు వలనఁ దను రక్షించుటయు, యాదవ పాండవుల స్నేహానుబంధబును, వారలకుం గలిగిన భగవద్భక్తివిశేషంబును విని, యాశ్చర్యంబు నొందుచు, ( వంది బృందంబులకు మహాధనంబులు, హారాంబరాభరణ సందోహంబులు నొసంగుచుఁ ) బద్మ నాభ పాదపద్మ భజన పరతంత్ర పవిత మానసుండై యొండె. అయ్యెడ వృషభ రూపంబున నేకపాదంబున సంచరించు ధర్మదేవుండు, దన సమీపంబున లేఁగ లేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు, గోరూపయై యున్నధాత్ర కిట్లనియె . (393) 68


మ. నయనాంభః కణజాల మేల విడువన్ ? నాతల్లి ! మేన సా

మయమై యున్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాలకున్

భయదుఃఖంబులు నేఁడు వొందవుగదా ? బంధించి శూద్రుల్ పద

త్రయహీనన్ ననుఁ బట్టవత్తు రనియో ? తాపంబు నీ కేటికిన్ (394)


సీ.మఖములులేమి నమర్త్యల కిటమీఁద మఖభాగములు లేక మాన ననియొ ?

రమణులు రమణుల రక్షింప రనియొ ? తత్పుత్రులఁ దండ్రులు ప్రోవరనియొ ?

భారతి గుజనులఁ బ్రాపించు ననియొ ? సద్విప్రుల నృపులు సేవింప రనియొ ?

కులిశహస్తుఁడువాన గురియింపకుండఁగ బ్రజలు దుఃఖంబునఁబడుదు రనియొ ?

ఆ. హీనవంశజాతు లేలెద రనియొ ? రా, జ్యముల పాడిగలిగి జరగ వనియొ ?

మనుజ లన్నపాన మైథున శయనాస, నాది కర్మసక్తు లగుదు రనియొ ? (395)


మ. జననీ ! నీ భరమెల్ల డింపుటకినై చక్రయుధం డిన్ని హా

యనముల్ గేళి నరాకృతిన్ మెలఁగి నిత్యానందముం జేసి పో

యిన నే ననాథనైతిఁ గుజనుం డెవ్వాఁడు శాసించునో ?

పెనుదుఃఖంబులు పొంచు ననియో ? భీతిల్లి చింతించుటల్ .(396)


క. దెప్పరమగు కాలముచే, నెప్పుడు దేనతలసెల్ల నష్టంబగు నీ

యొప్పిదముఁ గృష్ణుఁ డరిగినఁ , దెప్పఁగదా ! తల్లి ! నీవు తల్లడపదఁగన్ .(397)


వ. అనిన భూదేవి యిట్లనియె .(398)


క. ఈ లోకంబునఁ బూర్వము, నాలుగుపాదముల నీవు నడతువు నేఁ డా

శ్రీలలనేశుఁడు లేమిని, గాలముచే నీకు నొటికా లయ్యెఁగదే ! (399)


వ. మఱియు సత్య శాచ దయా క్షాంతి త్యాగ సంతోషార్జవంబును, శమ దమ తపంబులును, సామ్యంబును, పరాపరాధసహనంబును, లాభంబుగలయెడ నుదాసీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, విజ్ఞానవిరక్తులును, ఐశ్వర్య శౌర్యప్రభా దక్షత్వంబులును, స్మృతియు స్వతంత్ర్యమును, కౌశల కాంత ధైర్యమార్దవ ప్రతిభతిశయ ప్రశ్రయ శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును, సౌభాగ్య గాంభీర్యంబులును, స్థైర్య శ్రద్థా కీర్తిమాన గర్వాభావంబులు ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుగాక బహ్మణ్యతాశరణ్యతాది మహాగుణ సమూహంబును, కృష్ణదేవుని యందు వర్తించుఁ గావున. (400) 69


క.గణనాతీతములగు స, ద్గుణములు గల చక్రి సనిన ఘోరకలి ప్రే

రణమునఁ బాపసమూహ, వ్రణయుతులగు జనులఁ జూచి వగచెదఁ దండ్రీ ! (401)


క. దేవతలకు ఋషులకువ్ బితృ, దేవతలకు నాకు నీకు ధీయుతులకు నా నా వర్ణాశ్రమములకును, గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా ! (402)


సీ. బహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపములఁ

గమలాలయను మాని కమల యెవ్వని పాదకమలంబు సేవించుఁ గౌతుకమున

భవ్యచిత్తంబునఁ బరమయోగీంద్రులు నిలుపుదు రెవ్వని నియతితోడ

వేదంబు లెవ్వని విమలచారిత్రముల్ వినుతింపఁగా లేక వెగడు వడియె

ఆ. నట్టి వాసుదేవు నబ్జ వజ్రాంకుశ, చక్ర మీన శంఖ చాప కేతు

చిహ్నతంబులైన శ్రీచరణము లింక, సోఁకవనుచు వగపు సోఁకెనయ్య  ! (403)


క. హరిపాదంబులు సోఁకెడి, సిరికతమున నిఖిలభవన సేవ్యత్వముతో

స్థిరనైతి నిన్నిదినములు, హరి నా గ్ర్వంబు మాన్పి యరిగె మహాత్మా ! (404)


క. లీలకారము దాల్చెను, శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో

న్మాలనము సేయుకొఱకును, నాలుగుపాదముల నిన్ను నడిపించుటకున్. (405)


ఉ. ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం

బా మురిపెంబు లా తగవు లా హమనక్రియ లా మనోహర

ప్రేమకరావలోకనము బ్రీతిఁ గనుంగొనలేమి మాధవున్

గామిను లేల ? నిర్దశితకర్ములు యోగులు వాయనేర్తు రే ? (406)


క. మెల్లన నాపై యాదవ, వల్లభుఁ డడుగిడఁగ మోహవశనై నె రం

జిల్లఁ గ రోమాంచముక్రియ, మొల్ల ములై మొలచు సస్యములు మార్గములన్. (407)


వ. అని యిట్లు పూర్వవాహినియైన సరస్వతితీరంబున ధర్మదేవుండును భూమియు వృషభ ధేను రూపంబుల భాషింప రాజఋషియైన పరీక్షి ద్భూవరుండు డగ్గఱియె, ఆ సమయంబున, (408) 70

అధ్యాయము - 17

కలిపురుషుండు ధర్మదేవతను దన్నుట

శా. కైలాసాచల సనీభంబగు మహాగంభీర గోరాజమున్

గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు గ్రూరుండు జం

ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁడై

నేలం గూలఁగదన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్ . (409)


శా. ఆలోలాంగక, నశ్రుతోయకణ జాలాక్షిన్, మహాంభారవన్

బాలారూఢ తృణవళీకబళ లోభవ్యాప్త జిహ్వాగ్ర, నాం

దోళస్వాంత సజీవవత్స, నుదయ ద్దుఃఖాన్వితన్, ఘర్మ కీ

లాలాపూర్ణ శరీర నా మొదవు నులంఘించి తన్నెన్ వడిన్ .(410)


వ. ఇట్లా ధేనువృషభంబుల రెంటినిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండైన శూద్రునిం జూచి, సువర్ణ పరికర స్యందనారూఢుం డగ నభిమన్యునంద నుండు గోదండంబు సగుణంబు శేసి మేఘగంభీర వచనంబుల నిట్లనియె. (411)


శా. నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో ? నిర్భీతివై గోవులం

దన్నం గారణమేమి ? మ ద్భుజ సనాథ క్షోణి నే వేళలం

దు న్నేరంబులు శెయురా దెఱుఁగవా ? ధూర్తత్వమున్ భూమిభృ

త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు ? నిన్ శాపించెదన్ దుర్మతీ ! (412)


క. గాండీవియుఁ జక్ర్రియు భూ, మండలి నెడఁబాసి చనిన మదమత్తుఁడవై

దండింపఁ దగనివారల, దండించెదు నీవ తగదు దండనమునకున్. (413)


వ. అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె . (414)


మ. కురుధాత్రీశ్వర బాహు వప్రతుగళీ గుప్త క్షమామండలిన్

బరికింపన్ భవదీయ నేత్రజనితాంభః శ్రేణి దక్కన్ జనల్

దొరుఁగం జూడ రధర్మసంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్

గురుభక్తిన్ విసళింతుఁ జూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమా ! (415)


క. జాలిఁ బడనేల ? నాశర,జాలంబుపాలు సేసి చంఓద వీనిన్

భూలోకంబున నిను నే, నాలుగుపాదముల నిపుడ నడిపింఁతు జుమీ ! (416) 71


ఉ. వాచవియైన గడ్డి దిని వాహినులందు జలంబుఁ ద్రావఁగా

నీచరణంబు లెవ్వఁ నిర్దశితంబుగఁజేసె, వాఁడు దా

ఖేచరుఁడై న వాని మణి కిఇలిత భూషణయుక్త బాహులన్

వేచని త్రుంచివైతు వినువీథికి నేఁగిన నేల డాఁగినన్ . (417)


వ. అని మఱియు గోరూపయైన బూదేవితో నిట్లనియె . (418)


చ. అగణిత వైభవుండగు మురాంతకుఁ డెక్కడఁ బోయె ? నంచు నె

వ్వగల నశించి నేత్రముల వారికణంబులు దేకుమమ్మ ! లో

బెగడకుమమ్మ ! మద్విశిఖబృందమునన్ వృషలున్ వధింతునా

మగఁటిమిఁ జూడు నీ వెఱపు మానఁగదమ్మ ! శుభప్రదాయినీ ! (419)


క. సాధువులగ జంతువులకు, బాధలు గావించు ఖలుల భంజింపని రా

జాధము నాయు స్స్వర్గ, శ్రీ ధనములు వీటివోవు సిద్ధము తల్లీ ! (420)


క. దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్

స్రష్ట విదించెఁ బురాణ, ద్రష్టలు సెప్పుదురు వరమధర్మము సాధ్వీ ! (421)


వ. అనిన ధర్మనందనపౌత్రునకు వృషధమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె .( 422)


ఉ. క్రూరులఁ జంపి సాధువులకున్ విజయం బొనరించునట్టి యా

పౌరదవంశ జాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ

వా రిటువంటివా రవుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్య సం

చారము సేసెఁ గాదె ! నృపసత్తమ ! భక్తి లతానుబద్ధుడై . (423)


వ. నరేంద్రా ! మేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము. మావలన దుఃఖంబు నొందెడు పురుశుండులేఁడు. వాదివాక్యభేదంబుల యోగీశ్వరులు మోహితులై, భేదంబు నాచ్చాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకుఁ భభుత్వంబు సంపాదింతురు. ఇందెవ్వరికి సుఖదుఃఖప్రదానంబు సేయ విభుత్వంబు లేదు. పరులవలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు చేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వము నగుచుండు. అనిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుఁ డిట్లనియె. (424) 72


ఆ. ధర్మమూర్తి నయ్య ! ధర్మజ్ఞ ! వృషరూప ! పరమధర్ము వీవు పలుకు త్రోవ

పాపకర్మి సేయు పాపంబు సూచింపఁ, బాపకర్ముఁ డేగు పథకము వచ్చు. (425)


వ. మఱియు దేవమాయవలన భూతంబుల వాజ్మనంబులకు పథ్యఘాతుక లక్షణ వృత్తి సులభంబునం దెలియరాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగమునం దపశ్శౌచదయా సత్యంబులు నాలుగును నీకుం పాదంబు లని చెప్పుదురు. ( త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబునఁ గ్రామంబునం దప శ్శౌచ దయా సత్యంబులం దురీయపాదంబు క్షీణంబయ్యె. ద్వాపరంబునం బాదద్వయంబు నశించె. కలి యుగంబునందు నివ్వడువునన యిప్పుడు నీకుఁ ) బాదద్వయంబు భగ్నంబయ్యె. అవశిష్టంబుగు భగదీయ చతుర్థపాదంబు నధర్మంబు గల్యంతమున నిగ్రహింప గమనించుచున్నది విను మదియునుంగాక . (426)


మ. ధర్మముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం ద్రొక్కఁగా

స్థిరమై వేడుక నింతకాలము సుఖశ్రీ నొంది భూదేవి త

చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచు న్నిరం

తర శోకంబున నీరు గన్నుల నిడెన్ ధర్మజ్ఞ ! వీక్షించితే ? (427)

పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపరిపాలనంబు సేయుట

వ. అని యిట్లు ధర్మ భూదేవతల బుజ్జగించి మహారథుండైన విజయపౌత్రుండు గ్రొక్కాఱు మెఱుంగు చక్కఁదనంబు ధిక్కరించి, దిక్కులకు వెక్కసంబైన యడిదంబు బెడిదంబు ఝళిపించి, పాపహేతువైన కలి రూపమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపం బుడిగి, వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబుసాఁచి తత్పాదమూల విన్యస్తమస్తకుండై ప్రణామంబు సేసి, (428)


క. కంపించె దేహమెల్లం, జంపకు మో రాజితిలక ! శరణాగతు ర

క్షింపు మని తనకు మ్రొక్కినఁ, జంపక కలిఁ జూచి నగుచు జనపతి పలికెన్ (429)


క. అర్జునకీర్తి సమేతుం డర్జునపౌత్రుండు భయరసావృతజనులన్

నిర్జతులఁ జంప నొల్లఁడు, దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా ! (430)


వ. నీవు పాపబంధుండవు. మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువ వలదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య లోభ చౌర్య దౌర్జన్య 73


దురాచారమాయా కలహ కపట కలుషాలక్ష్మాదు లాశ్రయుంచు. ( సత్య ధర్మంబులకు ) నిహసంబగు బ్రహ్మావర్తదేశంబున యజ్ఞవిస్తారనిపుణులైనవారు యజ్ఞేశ్వరుండైన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు. యజించువారలకు సుఖప్రదానంబు సేయుచు, సకల భూతాంతర్యామియై భగవంతుండైన జంగమస్థావరంబులకు నంతరంగ బహిరంగంబుల సంచరించు వాయువుచందంబున, నాత్మరూపంబున మనోరథంబు నిచ్చుఁ గావున నిం దుండవలవదనుచు దండహస్తుండైన జమునికైవడి మండలాగ్రంబు సాఁచిన రాజునకుం గలి యిట్లనియె . (431)


క. జగతీశ్వరా ! నీ యడిదము, ధగధగిత ప్రభలతోడఁ దఱచుగ మెఱయన్

బెగడెం జిత్తము గుండెలు, వగిలెడి నిఁక నెందుఁ జౌత్తు ధావింపఁగదే ! (432)


వ. నరేంద్రా ! నిను (నారోపిత శరశరాసునిఁగ ) సర్వప్రదేశంబులందును విలోకింపుచు నున్నవాఁడా నే నెక్కడనుండుదు నాన తిమ్మనిన రాజన్యశేఖరుండు ప్రాణివధ స్త్రీ ద్యూత పానంబు లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చు, మఱియు నడిగిన సువర్ణ మూలంబగు నసత్య మద కామ హింసా వైరంబు లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితర స్థలంబుల స్పృశియింపకుండ నియమించె. ఇట్లు కలి నిగ్రహంబుచేసి, హీనంబులైన తపశ్శౌచ దయ లనియెడు మూఁడు పాదంబులు వృషభమూర్తియైన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరంబైన సంతోషంబు సంపాదించి . (433)


క. గజనామధేయ పురమున, గజరిపుపీఠమున ఘనుఁడు గలిమర్దనుఁడున్

గజవైరి పరాక్రముఁడై, గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవరలకక్ష్మిన్ .(434)

అధ్యాయము - 18

వ.ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబువలన బ్రతికి పరీక్షిన్న రేంద్రుండు బ్రాహ్మణశాప ప్రాప్త తక్షకధయంబువలనఁ బ్రాణంబులు వోవునని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి, శుకునకు శిష్యుండీ, విజ్ఞానంబు గలిగి గంగాతరంగిణీ తీరంబునం గళేబరము విడిచె వినుఁడు. (435)


క. హరివార్త లెఱఁగువారికి, హరిపదములు దలఁచువారి కనవరతంబున్

హరికథలు వినెడివారికి, మరణాగత మోహసంభ్రమము లే దనఘా ! (436)


క. శుభచరితుఁడు హరి యరిగినఁ బ్రభవించి ధరిత్రినెల్లఁ బ్రబ్బియుఁ గలి దా

నభిమన్యుసుతుని వేళను, బభవింపక యణఁగియుండె భార్గవముఖ్యా ! (437) 74


వ. ఇవ్వధంబునఁ జతుస్సముద్ర ముద్రితాల్హిల ,అహీమండల సామ్రాజ్యంబు పుజ్యంబుగాఁ జేయుచు నభిమన్యుపుత్రుండు. (438)


ఉ. చేసినఁగాని పాపములు సెందవు చేయఁదలచి  ! నంతటన్

జేసెద నన్నమాత్రమునఁ జెండుఁగదా ! కలివేళ పుణ్యముల్

మోసము లేదటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము

ల్లాసముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్. (439)


వ. మఱియుం బ్రమత్తులై యధీరులగు వారలయంచు వృకంబుచందంబున నొదిగి లాచుకొనియుండి చేష్టించుఁ గాని, ధీరులైనవారికిం గలివలని భయమ్బులేదని కలి నంతంబు నొందింపఁడయ్యె. అనిన విని సూతున కిట్లనిరి. (440)


సీ. పౌరాణికోత్తమ ! బ్రదుకుము పెక్కేండ్లు తామరసాక్షుని ధవళయశము

మరణశీలురమమైన మా కెఱింగించితి కల్పతంబగు క్రతుకర్మమందు

బొగలచే బొగలి యబుద్ధచిత్తులమైన మము హరిపదపద్మ మధురసంబు

ద్రావించితివి నీవు ధన్యుల మైతిమి స్వర్గమేనియు నపసర్గమేని

తే. భాగవత సంగలవభఅగ్య ఫలముకిఇడె ? ప్రకృతిగుణహీనుఁడగు చక్రిభద్రగుణము

లీశ కమలాసనాదులు నెఱుఁగలేరు, వినియు వినఁజాలననియెడి వెఱ్ఱిగలఁడె ? (441)


క. శ్రీపంబులు ఖండిత సం, తాపంబులు గల్మషాంధతమస మహూద్య

ద్దీపంబులు పాషండ దు, రాపంబులు విష్ణువందనాలాపంబుల్ . (442)


క. పాపనములు దిరితలతా, లావనములు నిత్యమంగళ ప్రాభవ సం

జీవనములు లక్ష్మీసం, భావనములు వాసుదేవ పదసేవనముల్. (443)


ఆ. పరమభాగవతుఁడు పాండవపౌత్రుండు, శుకుని భాషణముల శుద్ధబుద్ధి

యై విరాజమనుఁడై మిక్తియగు విష్ణు పాదమూల మెట్ల పడసె ? ననఘ ! (444)


వ. మహీత్మా ! విశిష్టయోగనిష్ఠాకలితంబు, విష్ణుచరిత లలితంబు, పరమపున్యాంబు, సకలకల్యాణగుణ గణ్యంబు, భాగవతజనా పేక్షితంబు నైన పారీక్షితంబగు భాగవతాఖ్యానంబు వినిపింపు మనిన సూతుం డిట్లనియె .(445)


క. మిముబోఁటీ పెద్దవారలి, కమలాక్షుని చరిత మడుగఁగా జెప్పెడి భా

గ్యము గలిగె నేఁడు మా జ, న్మము సఫలంబయ్యె వృద్ధమాన్యుల మగుటన్. (446)


క. కులహీనుడు నారాయణ, విలస త్కథనములు దగిలి వినిపించినఁ ద

త్కులహీనతఁ బాసి మహో, జ్జ్వల కులజత్వమున బొందు సన్మునులారా ! (447) 75


సీ. ఎవ్వని గుణజాల మెన్న జుహ్వలులేక నళినగర్భదు లనంతుఁ డుండ్రు

కోరెడు విబుధేంద్రకోతి నొల్లక లక్ష్మి ప్రార్థంచె నెవ్వని పాదరజము

బ్రమ్హ యెవ్వని పాదపద్మంబు గడిగిన జలము ధన్యత నిచ్చె నుల కెల్ల

భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు నెవ్వఁ డర్థకతి నేపుమిగులు

ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది, సంగకోటినెల్ల సంహరించి

ప్రాభవమున మునుల పారమహంస్యంబు, నొంది తిరిగి రాకయుందు రెలమి. (448)


చ. క్రమమున మింటికై యెగయుఁ గాక విహంగము మింటిదైన పా

రము గననేర్చునే ? హరిపరాక్రమ మోపినయంత గాఁగ స

ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁ డర్యములార ! నారు చి

త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్. (449)

పరీక్షిన్మహారాజు శృంగి వలన శాపంబు నొందుట

క. వేదండ పురాధీశుఁడు, కోదండము చేతఁబట్టికొని గహనములో

వేదండదుల నొకనాఁ , డే దండలఁ బోవనీక యెగదెన్ బలిమిన్. (450)


క. ఒగ్గములు ద్రవ్వి పడుమని, యొగ్గెడు పెనుదెరల పలల నుగ్రమృగమ్ముల్

డగ్గఱినఁ జంపువేడుక, వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్. (451)


క. కోలముల గవయ వృక శా, ర్దూలములఁ దరక్షు ఖడ్గ రోహిష హరి శుం

డాలముల శరభ చమర, వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్. (452)


క. మృగయుల మెచ్చ నరేంద్రుఁడు మృగరాజపరాక్రమమున మెఱసి హరించెన్

మృగధరమండలమునఁ గల, మృగ మొక్కటిఁ దక్క నన్యమృగముల నెల్లన్. (453)


వ. ఇట్లు వాటంబైన వేఁట తమకంబున మృగంబుల వెంటం దగిలి బుభుక్షా పిపాసలఁ బరిశ్రాంతుండై ధరణీకాంతుండు చల్లన నీటికొలంకులు గానక కలంగెడు చిత్తం బుతోఁ జనిచన యొక్క తపోవనంబు గని యంచు. (454)


సీ. మెలఁగుటఁ జాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడతలేక

ప్రాణ మనో బుద్ధి పంచేంద్రియంబుల, బహిరంగవీథులఁ బాఱనీక

జాగరణాదిక స్థానత్రయము దాఁటి పదమమై యొండెడి పదము దెలిసి

బ్రహ్మభూతత్వ సంప్రా ప్త్యవిక్రియుఁ డయి యతిదీర్ఘ జటలు ద న్నావరింప 76


తే. నలఘు రురుచర్మధారియై యలడుచున్న, తపసిఁ బొడగని శోషిత తాలుఁడగుచు

నెండి తడిలేని కుత్తుక నెలుఁగు డింద, మందభాషల డగ్గఱి మనుజవిభుఁడు. (455)


క. తోయములు దెమ్మ మా కిఇ, తోయము వేఁటాడువేళఁ దిల్లి పొడమ దీ

తోయముక్రియ జలదాఅహము, తోయమువారలును లేరు దుస్సహ మనఘా !(456)


వ. అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠుండును హరిచింతాపరుండునై యుండుట విచారింపక. (457)


ఉ. కన్నులుమూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్నవాఁ డు చే

సన్నలనైన రమ్మనఁడు సాజలంబులు దెచ్చె పోయఁ డే

మన్ననలైనఁ జేయఁడు సమగ్రఫలంబులు వెట్టఁ డింత సం

పన్నత నొందెనే ? తన తపశ్చర ణాప్రతిమ ప్రభావముల్. (458)


ఆ. వారిఁ గోరుచున్నవారికి శీతల, వారి నిడుట యెట్టివారికైన

వారితంబు గాని వలసిన ధర్మంబు, వారి యిడఁడు దాహవారి గాఁదు. (459)


చ. అని మనుజేశ్వరుండు మృగయావనరాయత తోయదాహ సం

జనిత దురంతరోషనున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ

జనముల సేయఁ డంచు మృతసర్పము నొక్కటి వింటికోపునన్

బనివడి తెచ్చి వైచె నట బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్. (460)


వ. ఇట్లు వృథా రోషదర్పంబున మునిమూఁపున గతానువైన సర్పంబు నిడి, నరేశ్వరుండు దన పురంబున జనియె. అంత సమీపవర్తులైన మినికుమారులు సూచి శమీకనందనుండైన శృంగికడకుం జని. (461)


క. నర గంధగజ స్యందన, తురగంబుల నేల రాజు తోయాతురుఁడై

పరగ న్నీ జనకునిమెడ, నురగముఁ దగిలించి పోయె నోడక తండ్రీ ! (462)


వ. అని పలికిన సమాన రూప మునికుమార లీలసంగియైన శృంగి శృంగంబులతోడి మూర్తి ధరియించినట విజృంభించి రోషసంరంభంబున నదరిపడి ( బల్యన్నంబుల భుజించి పుష్టంబులగు నరిష్టంబులం బోలె బలిసియు, ద్వారంబులం గాచికొనియుండు సారమేయంబులపగిది దాసభాతులగు క్షత్రియాభాసు లెట్ల బహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులైరి ? అట్టివారి లెట్లు తద్గృహంబుల భాండసహితంబగు నన్నంబు భుజింప నర్హులగుదురు ? తత్కృతంబులైన ద్రోహంబు లెట్లు నిజస్వామిం జెందు నని మఱియు ) నిట్లనియె. (463) 77


ఉ. ఆడఁడు దన్ను దూషణము, లాశ్రమవాసులఁహాని వైరులం

గూడఁడు, కందమూలములు కూడుగఁ దించు సమాధి చిత్తుఁడై

వీడఁడు లోనిచూడ్కులను, విష్ణుని దక్కఁ బరప్రపంచముం

జూడఁడు మద్గురుండు ఫణిఁ జుట్టఁగనేటికి ? రాచవానికిన్ . (464)


ఉ. పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ, ధనంబు లేమియుం

దేము, నవంచనంబులుగ దీవెన లిచ్చుచు వేసరింపఁగా

రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ జెల్లరే !

పామును, వైవఁగాఁదగునె ? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్ .(465)


క. పుడమిఁగల జనులు వొగడఁగఁ. గుడుతురు గట్టుదురుకాక కువలయపతులై

యడవుల నిడుమలఁ బడియెడి, బడుగుల మెడ నిడఁగ దగునె ? పన్నగశవమున్ .(466)


క. భగవంతుఁడు గోవిందుఁడు, జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ

దగువరులు లేమి దుర్జను, లెగసి మహాధునుల నేఁచెద రకటా ! (467)


క. బాలకులార ! ధరిత్రీ. పాలకు శపియింతు ననుచు బలువిడిని విలో

లాలకుఁడగు మునికుంకర, బాలకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్ . (468)


వ. ఇట్లు రోషించి కౌశికిఇనదికిం జని కలోపస్పర్శనంబు సేసి . (469)


ఉ. ఓడక వింటికోపున మృతోరగముం గొనివచ్చి మాఱు మా

టాడకయున్న మజ్జనకు సంసతలంబునఁ బెట్టి దుర్మద

క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిననైనఁ జచ్చుఁబో

యేడవనాఁడ తక్షక ఫణీంద్ర విషానల హేతిసంహతిన్ . (470)


వ. అని శమీకమహామునికుమారుండైన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుఁ జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండై న తండ్రిం జూచి . (471)


క. ఇయ్యెడ నీ కంఠమునకు, నియ్యురగశవంబు దెచ్చి యిటు చేర్చిన యా

యయ్య నిఁక నేమి సేయుదు ? నెయ్యంబులు లేవు సుమ్ము నపులకుఁ దండ్రీ ! (472)


శా. ప్రారంభంబున వేఁటవచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై

నేరం బేముయు లేదు సర్పశవను న్నేఁడుగ్రుఁడై వైచినాఁ

డీరీతిన్న్ ఫణి క్రమ్మఱన్ బ్రతుకునో ! హంసించునో ! కోఱలన్

రారే ! తాపసులార ! దీనిఁ దివరే ! రక్షింపరే ! మ్రొక్కెదన్ . (473) 78


వ. అని సర్పంబుఁ దిగిచు నేర్పులేక యెలుంగెత్తి విలపించుచున్న కుమారకు రోదన ధ్వని విని, యాంగిరసుఁడైన శమీకుండు సమాధిఁ జాలించి, మెల్లన గన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు వీక్షించి తీసి పాఱవైచి కుమారకుం జూచి . (474)


క. ఏకీడు నాచరింపము, లోకులకున్ మనము సర్వలోక సములమున్

శోకింపనేల ? పుత్రక ! కాకోదర మేల వచ్చె ? గంఠంబునకున్ . (475)


వ. అని యడిగిన తండ్రికిఁ గిడుకు రాకువచ్చి సర్పంబు వైచుటయుందాను శపించుటయును వినిపించినఁ దండ్రి కొడుకు వలన సంతసింపక యిట్లనియె . (476)


క. బెట్టిదమగు శాపమునకు, దట్టపు ద్రోహంబు గాదు ధరణీకాంతుం

గట్టా ! యేల శపించితి ?, పట్టీ ! తక్షక విషాగ్ని పాలగు మనుచున్. (477)


ఆ. తల్లికడులోన దగ్ధుఁడై క్రమ్మఱఁ, గమలనాభు కరుణవ్ గలిగిఁనాడు

బలిమి గలిగి ప్రజలఁ బాలింపుచున్నాఁడు, దిట్ట వడుగ ! రాజుఁ దిట్టఁ దగునె ?


ఉ. కాపరిలేని గొఱ్ఱియలకై వడిఁ గంటక చోరకోటిచే

నేపఱియున్న దీ భువన మీశుఁడు కృష్ణుఁడు లేమి నిట్టిచో

భూ పరిపాలనంబు సమముద్ధి నితమ్ డొనరింపఁ జెల్లరే !

యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగనేల ? బాలకా ! (479)


సీ. పాపంబు నీ చేతఁ బ్రాపించె మన కింక రాజు నశించిన రాజ్యమణ్దు

బలవంతఁ డగవాఁడు బలహీను పశు దార హయ సువర్ణాదుల వపహరించు

జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు లతిశయిల్లు

వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు

ఆ. నంతమీఁద లోక లర్థ కామంబులఁ , దగిలి సంచరింప ధరణి నెల్ల

వర్ణ సంకరములు వచ్చును మర్కట, సారమేయ కులము మేరఁ బుత్ర ! (480)


ఉ. భారతవంశజుం బరమభాగవతున్ హయమేధయాజి నా

చారపరున్ మహానయ విశారదు రాజకులైకభుఉషణున్

నీరము గోరి నేఁడు మన నేలకువచ్చిన భక్తి నర్థిస

త్కారము శెసి పంపఁ జనుఁ గాక ! శపింపఁగ నీకు ధర్మమే ! (481)


క. భూపతికి నిరపరాధమ, శాపము దా నిచ్చె బుద్ధిచాపలమున మా

పాపఁడు మీఁ డొనరించిన, పాపము దొలఁగించు కృష్ణ ! పరమేశ ! హరీ ! (482) 79


క. పొడిచినఁ దిట్టినఁ గిట్టినఁ బడుచుందురు గాని పరమ భాగవతులు దా

రొడఁబడరు మాఱు సేయఁగఁ గొడుకా ! విభుఁ డెగ్గుసేయఁ గోరఁడు నీకున్ . (483)


క. చలఁగరు కలఁగరు సాధులు, మిశితములై పరులవలన మేలుం గీడున్

నె;అకొనిననైన నాత్మకు, నొలయవు సుఖ దుఃఖ చయము లుగ్రము లగుచున్.(484)


వ. అని యిట్లు శమీక మహామునీంద్రుండు కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొందుచుండె. (485)

అధ్యాయము - 19

వ. అంత* (శమీక ప్రేషితుం డగు శిష్యుని వలన ) నా మునికుమారకు శాపంబు విని యా యభిమన్యు పుత్రుండు ( కామ క్రోధాది విషయాసక్తుఁడగు ) తనకు ( తక్షక విషాగ్ని ) విర క్తిబీజం బగు ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున. (486)

పరీక్షి న్మహారాజు విప్రళాపంబు నెఱింగి ప్రాయోపవిష్ణుం డగుట

ఉ. ఏటికి వేఁటఁ బోయితి ? మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా

నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి ? నే

డేటికిఁ బాపసాహసము లీక్రియఁ జేసితి ? దైవయోగమున్

దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. (487)


ఉ. పాము విషాగ్ని కీలలను లేఁగిన నేఁగుఁ గాక యీ

భూమియు రాజ్యమున్ సతులు లోగముఁ బోయినఁ బోపుఁ గాక సౌ

దామినిఁ బోలు జీవనముఁ తథ్యముఁ దలపోసి యింక నే

నేమని మాఱు దిట్టుదు ? మునీంద్రకుమారకు దుర్నివారకున్ . (488)


ఆ. రాజు ననుచుఁ బోయి రాజ్యగర్వంబున, వనము కొఱకు వారి వనము సొచ్చి

దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ, బొలియఁ దిట్ట కేల పోవు ? సుతుఁడు. (489)


క. గోవులకున్ బ్రాహ్మణులకు, దేవతలకు నెల్లప్రొద్దుఁ దెంపునఁ గీడుం

గావించు పాప మానస, మే విధమునఁ, బుట్టకుండ నే వారింతున్. (490)


వ. అని వితర్కించె. (491) 80


క. దామోదర పదభక్తిం, గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్

భూమీశుఁ డలుగఁ డయ్యెను, సామర్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్ (492)


వ. అంత మునికుమారుండు శపించిన వృత్తాంత మంతయు నిట్లు వితర్కించి, తక్షక వ్యాళ విషానల జ్వాలా జాలంబునం దనక సప్తమ దినంబున మరణం బమి యెఱింగి, భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించికొని. (493)


మ. తులసీ సంయుత దైత్యజి త్పదరజ స్త్సోమంబు సంటెన్ మహో

జ్జ్వలమై దిక్పతిసంఘ సంయుత జన త్సౌభాగ్య సంధాయియై

కలిదోషావళి నెల్లఁ బాపు దివిష ద్గంగా ప్రవాహంబు లో

పలికిం బోయి మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్ . (494)


క. చిత్తము గోవింద పదా, యత్తముఁ గావించి మౌనియై తనలో నే

తత్తఱము లేక భావర, సత్తముఁడు వసించె ముక్త సంగత్వమునన్ . (495)


వ. ఇట్లు పాండవ పౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద సందాయమాన మానసుండై విష్ణుపదీ తీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని ( సకలలోక పావన మూర్తులు మహానుభావిలు నగుచుఁ దీర్థంబునకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులై యత్రి, విశ్వామిత్ర , భృగు , వసిష్ఠ , పరాశర , (వ్యాస) భరద్వాజ , పరశురామ , దేవల , గౌతమ , మైత్రేయ , కణ్వ , కలశసంభవ , నారద , పర్వతాదు లైన బ్రహ్మర్షి , దేవర్షి , రాజర్షి , పుంగవులు , కాండఋషులైన యరుణాదులు, మఱియు నానాగోత్ర సంజాతులైన ఋషులును * ( శిష్య ప్రశిష్యసమేతులై ) యేతెంచిన వారలకు దండ ప్రణామంముల సేసి కూర్చుండ నియోగించి . (496)


క. క్రమ్మఱ నమ్మునివరులకు, నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్

గ్రమ్మఁగ ముకుళితకరుఁడై, సమ్మతముగఁ జెప్పె నాత్మ సంచారంబున్ . (497)


ఉ. ఓపిక లేక చచ్చిన మహోరగముం గొనివచ్చి కోపినై

తాపసు మూఁపుపై నిడిన దారుణచిత్తుఁడ మత్తుఁడన్ మహా

పాపుఁడ మీరు పాపతృణ పావకు లుత్తము లయ్యలార ! నా

పాపము వాయు మార్గముఁ గృపాపరులార ! విధించి 1చెప్పరే ! (498) 81


ఉ. భూసురపాద దేణువులు పుణ్యులఁ నరేంద్రులన్ భరి

త్రీసురులార ! మీ చరణరేణు కణంబులు మేనుసోక నా

చేసిన పాప పంతయు నశించెఁ గృతార్థుఁడనైతి నెద్ది నేఁ

జేసిన ముక్తి పద్ధతికిఁ జెచ్చెర బోవఁగవచ్చుఁ జెప్పరే . (499)


క. భీకరతర సంసార, వ్యాకులతన్ విసిగి దేహవర్ణనగతి నా

లోకించు నాకుఁ దక్షక, కాకోదర విషము ముక్తికారణ మయ్యెన్ . (500)


క. ఏపార నహంకార, వ్యాపారమునందు మునిఁగి వర్తింపంగా

నాపాలిటి హరి భూసుర, శాప వ్యాజమున ముక్తిసంగునిఁ జేసెన్ . (501)


మ. ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ

శ్వర సంకల్పము నేఁడు మానదు భవిష్య జ్జన్మ జన్మంబులన్

హరి చింతా రతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్

హరి పాదాంబుజ సేవయున్ గలుగ మీ రర్థిన్ బ్రసాదింపరే . (502)


క. చూడఁడు నా కల్యాణము, పాడుఁడు గూవిందు మీఁది పాటలు దయతో

నాడుఁడు హరి భక్తిల కథ, లే డహములలోన ముక్తి కేఁగఁగ నిచటన్. (503)


క. అమ్మా ! నినుఁ జూచిన నరుఁ , బొమ్మాయని ముక్తికడకుఁ బుత్తువఁట కృపన్

లెమ్మా నీ రూపముతో, రమ్మా నా సెదురు గంగ ! రమ్యతరంగా ! (504)


వ. అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరబులందైన సర్వజంతు సౌజన్యంబు సంధిల్లుంగాక యని, గంగా తరంగిణీ దక్షిణ కూలంబునన్ బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి రాజ్యధారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునకుఁ దప్పించి, చిత్తంబు హరికి నిప్పించి, పరమ భాగవతుండైన పాండవ పౌత్రుండు ప్రాయోపవిష్ణుండైయున్న సమయంబున. (505)


క. ఒత్తిలి పొగడుచు సురలు వి, యత్తలమున నుండి మెచ్చి యలరుల వానల్

మొత్తములై కురిసిరి నృప, సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్ . (506)


వ. ఆ సమయంబున సభాసీనులైన ఋషు లిట్లనిరి. (507)


మ. క్షితినాథోత్తమ ! నీ చరిత్రము మహాచిత్రంబు మీ తాత లు

గ్ర తపోధన్యులు విష్ణూపార్శ్వ పదవిన్ గావించి రాజన్య శో

భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు

న్నతులై నీపు మహోన్నతుండవుగదా ! నారాయణధ్యాయివై. (508) 82


మ. వసుధాధీశ్వర ! నీవు మర్త్యతనువున్ వెర్జించి నిశ్శోకమై

వ్యసన చ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు స

ర్వసమత్వంబునఁ జేరు నంతకు భవద్వాక్యంబులన్ వించు నే

దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్. (509)


వ. అని యిట్లు పక్షపాత శూన్యంబులును మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు మూఁడులోకంబులకు నవ్వలి దైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునన్ దేజరిల్లుచున్న ఋషులం జూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుండై నమస్కరించి యిట్లనియె . (510)


క. ఏడుదినంబుల ముక్తిం, గూడఁగ నేరీతి వచ్చు గురు సంసార

క్రీడన మేక్రియ నెడతెగుఁ జూడుఁడు మా తండ్రులార ! శ్రుతివచనములన్. (511)


శా. ప్రాప్తానందులు బ్రహ్మబోభన కళాపారీణు లాత్మప్రభా

లిప్తాజ్ఞానులు మీరు లార్యులు దయాశుత్వాభిరాముల్ మనో

గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా !

సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిన్ జర్చించి భాషింపరే. (512)


వ. అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ ప్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున. (513)

శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

సీ. ప్రతినిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిఁ జుక్క వెలుపల మఱుచువాఁడు

కమలంబుమీఁది భృంగములకైవడి మోముపైన నెఱపిన కేశపటలివాఁడు

గిఱివ్రాసి మాయ నంగీకరించనిభంగి వసనంబు గట్టక వచ్చువాఁడు

సంగిగాఁడని వెంటఁ జాటు భూతములు నా బాలుర హాసశబ్దములవాఁడు

తే. మహిత పద జాన జంఘోరు మధ్య హస్త, బాహు వక్షో హళానన ఫాల కర్ణ

నాసిగా గండమస్తక నయనయుగళుఁడైన యవధూతమూర్తి వాఁడరుగుదెంచె. ( 514)


ఉ. ఈరసలోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు గోరికల్

గోరనివాఁడు గూటువలఁ గూడనివాఁడు వృథాప్రపంచమున్

జేఱనివాఁడు దైవగతఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై

నేఱనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు వెండియున్. (515) 83


ఆ. అమ్మహాత్ము షోడశాబ్ద వయో రూప, గమన గుణ విలాస కౌశలములు

ముక్తికాంత సూచి మోహిత యగు నన, నితర కాంతలెల్ల నేమి చెప్ప ! (516)


ఆ. వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై, బ్రహ్మభావమునను బర్యటింప

వెఱ్ఱియనుచు శుకుని వెంట నేతెంతురు, వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు . (517)


వ. ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లా మహానుభావుని ప్రభావంబు తెఱం గెఱుంగుదురు గావున నిజాసనంబులు విడిచి ప్రత్యుత్థానంబు సేసిరి. పాండవపౌత్రుండు నా యోగిజన శిఖామణికి నతిథిత్కారంబు గావించి దండప్రణామంబు సేసి పూజించె. మఱియు గ్రహ నక్షత్రతారకా మధ్యంబునం దేజఱిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి మధ్యంబునం గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రం గనుంగొని. (518)


ఉ. ఫాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూ

పాలకులోత్తముండు కరపద్మములన్ ముకళించి నేఁడు నా

పాలిటి భాగ్య మెట్టిదియొ ! పావనమూర్తివి పుణ్యకీర్తి వీ

వేళకు నీవువచ్చితి వివేక విభూషణ ! దివ్యభాషణా ! (519)


మ. అవనిభూతోత్తమ ! మంటి నేఁడు నిను డాయం గంటి నీవంటి వి

ప్రవరున్ బేర్కొను నంతటన్ భసితమౌ పాపంబు నా బోఁటికిన్

భవదాలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనా

ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపగ నాశ్చర్యమే ? (520)


క. హరిచేతను దనుజేంద్రులు, ధర మ్రగ్గెడుభంగి నీ పదస్పర్శముచే

గురు పాతకసంఘంబులు, పొఱిమాలుఁగదయ్య యోగిభూషణ ! వింటే . (521)


మ. ఎలమిన్ మేనమఱందియై సచిపుఁడై యే మేటి మా తాతలన్

బలిమిన్ గావి సముద్రముద్రిత ధరం బట్టంబు గట్టించె న

య్యలఘం డీశుఁడు చక్రి రక్షకుఁడు నా కన్యుల్ విపద్రక్షకుల్

గలరే ? వేఁడెదా భక్తి నా గుణనిధిం గారుణ్య వారాన్నిధిన్. (522)


సీ. అవ్యక్త మార్గుఁడు వైన నీ దర్శన మాఱడిఁ బోనేర దభిమతార్థ

సిద్ధి గావించుట సిద్ధంబు నేఁడెల్లి దేహంబు వర్జించు నేమి వినిన

కేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన

నేమి సేవించిన నెన్నఁడు సంసార పద్ధతిఁ దాసిన పదవి గలుగు 84


తే. నుండుమనరాదు గురుఁడవు యోగివిభుఁడ, వరయ మొదవున బిదికిన యంత

తడవుగాని దెస నుండవు కరణతోఁడ, జెప్పవే తండ్రి ముక్తికిఁజేరుతెరువు. (523)


వ. అని పరీక్షిన్న రేంద్రుండు బాదరాయణి నడిగె నని చెప్పి. (524)


క. రాజీవపత్ర లోచన ! రాజేంద్ర కిరీటఘటిత రత్న మరీచి

భాజిత పాదాంభోరుహ ! భూజనమందార ! నిత్య పుణ్యవిచారా ! (525)


మాలిని. అనుపమ గుణహారా ! హన్యమానారివీరా !

జన వినుత విహారా ! జానకిఇ చిత్త చోరా !

దనుజ ఘనసమీరా ! దానవ శ్రీ విదారా !

ఘన కలుషకఠోరా ! కంధి గర్వాపహారా ! (526)


గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర, కేసనమంత్రి పుత్త్ర, సహజపాండిత్య, పోతనామాత్య ప్రణీతంబైన, శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు, నైమిశారణ్య వర్ణనంబున, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణావతార సూచనంబు సేయుటయు, వ్యాసచింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును, పుత్రశోకాతురయైన ద్రుపద రాజనందన కర్ణునుం డశ్వత్థామను దెచ్చి యొప్పగించి విడిపించుటయు, భీష్మ నిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ పీడ్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబువలనం బాసి విష్ణుండు రక్షించుటయు, పరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదుర నిర్గమంబును, నారదుండు ధర్మజునికిఁ గాలసూచనంబు సేయుటయు, కృష్ణావతార విసార్జనంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, దిగ్విజయంబు సేయుచు నభిమన్యుపుత్రుండు శూద్రరాజ లక్షణుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గో వృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకదర్శనంబు సేసి మోక్షోపాయం బడుగుట నను కథలగల ప్రథమస్కంధము సంపూర్ణము. (527)

ప్రథమస్కంధము సమాప్తము

                               హరిః ఓమ్ తత్సత్