Jump to content

శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము/ద్వితీయ స్కంధము

వికీసోర్స్ నుండి

=శ్రీ మహాభాగవతము=

ద్వితీయ స్కంధము

క. శ్రీమద్భక్త చకోరక, సోమ ! వివేకాభిరామ ! సురవినుత గుణ

స్తోమ ! నిరలంకృతాసుర, రామా సీమంతసీమ ! రాఘవరామా ! (1)

అధ్యాయము - 1

వ. మహానీయ గుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె. అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండిట్లనియె. (2)

శుకుడు పరీక్షితునకు ముక్తి మార్గంబు దెల్పుట

సీ. క్షితిపతి ! ప్రశ్నంబు | సిద్ధంబు మంచిది యాత్మవేత్తలు మెత్తు | రఖిలశుభద

మాకర్ణనీయంబు | లయుతసంఖ్యలు గల, వందు ముఖ్యం బిది | యఖిలవరము

గృహములలోపల| గృహమేధులగు నరు, లాత్మతత్త్వము లేశ | మైన నెఱుఁగ

రంగనారతుల ని | ద్రాసక్తిఁ జను రాత్రి, పోవుఁ గుటుంబార్థ | బుద్ధి నహము

ఆ. పశు కళత్ర పుత్ర | బాంధవ దేహాది, సంఘమెల్లఁ దమకు | సత్యమనుచు

గాఁపురములు సేసి కడపటఁ జత్తురు, కనియుఁ గాన రంత్య | కాలసరణి. (3)


క. కావున సర్వాత్మకుఁడు మ, హావిభవుఁడు విష్ణుఁ డీశుఁ | డాకర్ణింపన్

సేవింపను వర్ణింపను, భావింపను భావ్యుఁ డభవ | భాజికి నధిపా ! (4)


ఆ. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని, వలన ధర్మ నిష్ఠ | వలన నైన

నంత్యకాలమందు హరిచింత సేయుట, పుట్టువునకు ఫలము | భూవరేంద్ర ! (5)


తే. అరసి నిర్గుణబ్రహ్మంబు | నాశ్రయించి, విధి నిషేధము లొల్లని | విమలమతులు

సేయుచుందురు హరిగుణ | చింతనములు, మానసంబుల నెప్పుడు | మానవేంద్ర ! (6) 86

సీ. ద్వైపాయనుండు మా | తండ్రి ద్వాపరవేళ, బ్రహ్మసమ్మితమైన | భాగవతము

పఠనంబు సేయించె | బ్రహ్మతత్పరుఁడనై, యుత్తమశ్లోక లీ | లోత్సవమున

నాకృష్ణ చిత్తుండ | నై పఠించితి నీవు, హరిపాద భక్తుండ | వగుటఁజేసి

యెఱిఁగింతు వినవయ్య ! యీ భాగవతమున. విష్ణుసేవాబుద్ధి | విస్తరిల్లు

ఆ. మోక్షకామునకు | మోక్షంబు సిద్ధించు, భవభయంబు లెల్లఁ | బాసిపోవు

యోగి సంఘమునకు | నుత్తమ వ్రతములు, వాసుదేవ నామ | వర్ణనములు. (7)


తరలము :- హరి నెఱుంగక యింటిలో బహు | హాయనంబులు మత్తుఁడై

పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ | బోవనేర్చునె ? వాఁడు సం

సరణముం బెడబాయఁ డెన్నఁడు | సత్య మా హరినామ సం

స్మరణ మొక్క ముహూర్తమాత్రము | సాలు ముక్తిదమౌ నృపా ! (8)


సీ. కౌరవేశ్వర ! తొల్లి | ఖట్వాంగుఁడును విభుం, డిల నేడుదీవుల | నేలుచుండి

శక్రాది దివిజులు | సంగ్రామ భూముల, నుగ్రదానవులకు | నోడి వచ్చి

తమకుఁ దో డడిగిన | ధరనుండి దివికేఁగి, దానవ విభుల నం | దఱ వధింప

వరమిత్తు మనుచు దే | వతలు సంభాషింప, జీవితకాలంబు | చెప్పుఁ డిదియ

ఆ. వరము నాకు నొండు వరమొల్ల ననవుఁడు, నాయువొక ముహూర్త | మంత తడవు

గల దటంచుఁ బలుక గగనయానమున న, మ్మానవేశ్వరుండు మహికి వచ్చి . (9)


క. గిరులం బోలెడి కరులను హరులం దన ప్రాణదయితలై | మనియెడి సుం

దరులను హిత నరులను బుధ, వరులను వర్జించి గాఢ | వైరాగ్యమునన్. (10)


క. గోవిందనామ కీర్తనఁ గావించి భయంబు దక్కి | ఖట్వాంగ ధరి

త్రీ విభుఁడు సూఱగొనియెను, గైవల్యము దొల్లి రెండు | గడియల లోనన్. (11)


వ. వినుము నీకు దినసంబులకుం గాని జీవితాంతంబు గాదు. తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతంబగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు. అంత్యకాలంబు

డగ్గఱిన బెగ్గడిలక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహ జాలంబు వలన మోహసాలంబు నిస్కామకరవాలంబున నిర్మూలంబు సేసి, గేహంబువెడలి పుణ్యతీర్థ జలావగాహం

బొనర్చి, యేకాంత శుచిప్రదేశంబున విధివ త్ప్రకారంబునం గుశాజిన చేలంబుల తోడం గల్పితాసనుండై, మానసంబున * ( నిఖిల జగ 87

త్పవిత్రీకరణ సమర్థంబగ ) అకారాది

త్రివర్ణ కలితంబైన ప్రణవంబు సంస్మరింపుచు, వాయువుల జయించి, విషయంబుల వెంట నంటిగెంటి పాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథియై మనో నామకంబులైన

పగ్గంబుల బిగ్గం బట్టి మ్రొగ్గఁదిగిచి, దట్టంబులైన కర్మఘట్టంబుల నిట్టట్టు మెట్టెడు మనంబును శేముషీ బలంబున నిరోధించి, భగవదాకారంబుతోడ బంధించి,

నిర్విషయంబైన మనంబున భగత్పాదాద్యవయవంబులు క్రమంబున ధ్యానంబు సేయుచు, రజస్తమోగుణంబులచేత నాక్షిప్తంబు విమూఢంబు నగు చిత్తంబునఁ

దద్గుణంబులవలన నయ్యెడి మలంబులం ధారణావశంబునఁ బో నడిచి, నిర్మల చిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను. ధారణా నియమంబు గలిగి

సుఖాత్మకంబగు విషయంబు నవలోకించు యోగికి భక్తిలక్షణంబైన యోగంబు వేగంబె సిద్ధించు ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. (12)


క. ధారణ యే క్రియ నిలుచును ? ధారణ కే రూప ? మెద్ది | ధారణ యనఁగా ?

ధారణ పురుషు మనోమల, మే రీతి హరించు ? నాకు | నెఱిఁగింపఁ గదే. (13)


వ. అనిన విని రాజునకు నవధూతవిభుం డిట్లనియె. (14)


ఆ. పవనములు జయించి | పరిహృత సంగుఁడై, యింద్రియముల గర్వ | మెల్ల మాపి

హరి విశాలరూప | మందుఁ జిత్తము సేర్చి, నిలుపవలయు బుద్ధినెఱపి | బుధుఁడు. (15)


వ. వినుము భగవంతుడైన హరి విరాడ్విగ్రహంబునందు భూత భవిష్య ద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానం బగు. ధరణీ సలిల తేజ స్పమీరణ గగనాహంకార

మహత్తత్వంబు లనియెడి సప్తావరణంబులంచేత నావృతంబగ మహాండ కోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజపురుషుండు దేజరిల్లు. అ మ్మహాత్మునికిఁ

బాదమూలంబు పాతాళంబు, పాష్ణి౯భాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు, గుల్ఫంబు మహాతలంబు, జంఘలు తలాతలంబు, జానుద్వయంబు సుతలంబు, ఊరవులు

వితలాతలంబులు, జఘనంబు మహీతలంబు నాభీవివరంబు నభస్తలంబు వక్షంబు గ్రహ తారకా ముఖర జ్యోతిస్స్మూహ సమేతంబగు నక్షత్రలోకంబు, గ్రీవము

మహర్లోకంబు, ముఖంబు జనలోకంబు, లలాటంబు తపోలోకంబు, శీర్షంబులు సత్యలోకంబు, బాహుదండంబు లింద్రాదులు, కర్ణంబులు దిశలు, శ్రవణేంద్రితంబు శబ్దంబు,

నాసాపుటంబు లశ్వనీదేవాతలు, ఘ్రాణేంద్రియంబు గంథంబు, వదరంబు వహ్ని, నేత్రంబు లంతరిక్షంబు, చక్షురింద్రితము సూర్యుండు, రేయింబగళ్ళి ఱెప్పలు, భ్రూయుగ్మ

విజృంభణంబు 88

బ్రహ్మపదంబు తాలువులు జలంబు, జిహ్వేంద్రియంబు రసంబు, భాషణంబులు సకలవేదంబులు, దంష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాది

స్నేహకళలు, నగవులు జనోన్మాద కారిణియగు మాయ, కటక్షంబులు దురంత సంసర్గంబులు, పెదవులు వ్రీడాలోభంబులు, స్తనంబులు ధర్మంబు, వెన్నధర్మమార్గంబు,

మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు విత్రావరుణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు, నాడీ నివహంబులు నదులు, తనూరుహంబులు తరువులు,

నిశ్వాసంబులు వాయువులు, * కాలంబు గమనంబు, కర్మంబులు నానావిధ జంతుసన్నివహ సంవృత సంసరణంబులు, శిరోజంబులు మేఘంబులు, కట్టు పుట్టంబులు

సంధ్యలు, హృదయంబు ప్రధానంబు సర్వవికారంబులకు నాశ్రయభూతంబైన మనము చంద్రుండు, చిత్తంబు మహత్తత్వంబు, అహంకారంబు రుద్రుండు, అశ్వాశ్వతర్యుష్ట్ర

గజంబులు నఖంబులు, కటిప్రదేశంబు పశు మృగాదులు, విచిత్రంబలె న యాలాపనైపుణ్యంబులు పక్షులు, బుధ్ది మనువు, నివాసంబు పురుషుండు, షడ్జాదులయిన

స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధాత సిద్ధ చారణాప్సర స్సమూహంబులు, స్మృతి ప్రహ్లాద ప్రముఖులు, వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు. మఱియు

నమ్మహావభునకు ముఖంబు బ్రాహ్మణులు, భుజంబులు క్షత్త్రియులు, ఊరులు వైశ్యులు, చరణంబులు శూద్రులు, నామంబులు నానావిధంబులైన వసు రుద్రాది

దేవతాభిధానంబులు, ద్రవ్యంబులు హవిర్భాగంబులు, కర్మంబులు యజ్ఞప్రయో గంబులు. ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబున ముముక్షుండైన వాఁడు

మనస్సంధానంబు సేయవలయునని చెప్పి వెండియు నిట్లనియె. (16)


క. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయను పనిలేదా

హరిమయము గానిద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన ! వింటే. (17)


సీ. కలలోన జీవుండు కౌతుహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి

యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి

నఖిలాంతరాత్మకుఁ డగు పరమేశ్వరుఁ డఖిల జంతుల హృదయములనుండి'

బుద్ధివృత్తులనెల్ల బోద్ధయై వీక్షించు బంధబద్ధుఁడు కాఁడు ప్రాభవమున.


తే. సత్యుఁ డానందబహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁ గాక యన్య సేవఁ

గలుగు నేఅవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసార బంధ మధిప ! (18) 89

అధ్యాయము - 2

మ. బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా

క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమూఢోల్లస

న్మహనీయోజ్జ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబునన్

విహరించె న్నరనాథ ! జంతునివహావిర్భావ నిర్ణేతయై. (19)


వ. విను మూఢుండు శబ్దమయ వేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్ఛయించు. మాయామయ మార్గంబున

వాసనామూలంబున ( సుఖంబని తలంచి) నిద్రించువాఁడు కలలు గను తెఱంగునం బరిభ్రమించు, నిరవద్య సుఖలాభంబును జెందఁడు. తన్నిమిత్తంబున విద్వాంసుండు

(నామ మాత్ర సారంబులగు) భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖమని నిశ్చయింపక యొండు

మార్గంబున సిద్ధి గలదని చూచి పరిశ్రమంబు నొందకుండు. (20)


సీ. కమనీయ భూమి భాగముల లేకున్నవే ? పడియుండుటకు దూది పఱుపు లేల ?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే ? భోజన భాజన పుంజ మేల ?

వల్కలాశాజినావళులు లేకున్నవే ? కట్ట దుకూల సంఘాత మేల ?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే ? ప్రాసాద సౌధాది పటల మేల ?

తే. ఫల రసాదులు గుఱియవే ? పాదపములు, స్వాదుజలములు నుండువే ? సకల నదులుఁ

బొసఁగ భిక్షయుఁ బెట్టరే ? పుణ్యసతులు, ధనమదాంధుల కొలువేల ? తాపసులకు. (21)


క. రక్షకులు లేనివారల, రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్

రక్షింపు మనుచు నొక నరు, నక్షముఁ బ్రార్థింపనేల ? యాత్మజ్ఞునకున్ (22)


వ. అని యిట్లు స్వతస్సిద్ధుండు, నాత్మయు, నిత్యండును, సత్యుండును, భగవంతుండునైన వాసుదేవుని భజియించి తదీయ సేవానుభవానందంబున సంసార హేతువగు

నవిద్యచే బుద్ధిమంతుండు విడువంబడుం గావున. (23) 90

మ. హరిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై చిక్కి వా

సరముల్ ద్రొబ్బెడు వాఁడు కింకిర గదాసంతాడితోరస్కుఁడై

ధరణీశో త్తమ ! దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వై

తరణీ వహ్ని శివా పరంపరలచే దగ్ధుండు కాకుండునే ? (24)


క. మొత్తుదురు గదల మంటల, కెత్తుదు రడ్డంబు దేహ మింతింతలుగా

నొత్తుదు రసిపత్రికలను, హత్తుదురు కృతాంతభటులు హరి విరహితులన్ (25)


వ. మఱియు హరి చరణకమల గంధ రసస్వాదనం బెఱుంగని వారలు నిజ కర్మ బంధంబున దండధర ద్వార దేహళీ సమీప జాజ్వల్యమాన వైతరణీ తరంగిణీ దహన

దారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖి శిఖావగాహంబుల నొందుచుండుదురు. మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రపన్నులెంతయు

మాయాపన్నులు గాక విన్నాణంబునం దమ తమ హృదయాంత రాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజ శుండాదండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును,

భోగైశ్వర్య ప్రదుండును, కంజాత శంకచక్ర గదాధరుండును, కందర్ప కోటి సమాన సుందరుండును, రాకా విరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య

సదనుండును, ప్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతివిరాజిత పద్మరాగ రత్నరాజి విరాజమాన కిరీటి కుండలుండును, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షో మండలుండును,

రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతర పరిమళ మిళిత వనమాలికా బంధురుండును, నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖ

లాంగుళీయక విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబమాన విమల స్నిగ్ధ నీలకుంచిత కుంతలుండును, తరుణ చంద్ర చంద్రికా ధవళ మందహాసుండును,

పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును, మహా యోగిరాజ విలసిత హృదయ కమల కర్ణికామధ్య సంస్థాపిత చరణ

కిసలయండును, సంతతానంద ( మయుండును) సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును, మహానుభావుండు నైన పరమేశ్వరుని మనోధారణా వశంబున నిలిపికొని,

తదీయ గుల్ప చరణ జాను జంఘాద్యవయవంబులు క్రమంబున నొకటి నొకటినిఁ బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు నెంత కాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చల

భక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతాతత్పరులై యుండుదురు. అని మఱియు నిట్లనియె . (26) 91

సీ. ఆసన్న మరణార్థి యైన యతీశుండు కాలదేశములను గాచికొనఁడు

తనువు విసర్జించు తలఁపు జనించిన భద్రాసనౌస్థుఁడై ప్రాణపవను

మనసుచేత జయించి మానసవేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిఁ దెచ్చి

క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞు నాత్మలోపలఁ యాత్మను బ్రహ్మమందుఁ

తే. గలిపి యొక్కటి గారవమున, శాంతితోడ నిరూఢుఁడై సకలకార్య

నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము; నలయునని చూచు నటుమీఁద వసుమతీశ. (27)


వ. వినుమ ప్పరమాత్మయైన బ్రహ్మమునకుఁ దక్కకాల దేవ సత్త్వ రజ స్తమోగుణాహంకార నహత్తత్త్వ ప్రధానంబులకు సామర్థ్యంబు లేదు. కావునఁ బరమాత్మ వ్యతిరిక్తంబు

లేదు. దేహాదులం దాత్మత్వంబు విసర్జించి, యన్యసౌహృసంబు మాని, పూజ్యంబైన హరిపదంబున ( బ్రతిక్షణంనున) హృదయంబున నాలింగనంబుసేసి, వైష్ణవంబైన పరమ

పదంబు ( సర్వోత్తమం బని ) సత్పురుషులు దెలియుదురు. ఇవ్విధంబున విజ్ఞానదృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయవాస నుండై క్రమంబున నిరపేక్షత్వంబున (28)


సీ. ఆంఘ్రిమూలమున మూలధార చక్రంబుఁ బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి

నాభీతలముఁజేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి

యఈమీఁద నురమందు హత్తించి క్రమ్మఱఁదాలు మూలమునకుఁ దఱిమి నిలిపి

మమతతో భ్రూయుగ మధ్యంబుఁ జేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి

తే. యిచ్ఛలేని యోగ యొక్క ముహూర్తార్థ, మింద్రియానుషంగ మింతలేక

ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి, బ్రహ్మమందుఁ గలియుఁ కౌరవేంద్ర ! ( 29 )


వ. మఱియు దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగంబులు విడువనివాఁడు వానితోడన ( గణసముదాయ రూపంబుగు ) బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధి విహార

యోగ్యంబు నణిమాది సకలైశ్వర్య సమేతంబునైన పరమేష్టిపదంబుఁ జేరు. విద్యాతపో యోగసమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు

బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పదురు. ఏరికిని గర్మంబుల నట్టి గతిఁ బొంద శక్యంబుగాదు. యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశపథంబునం

బోవుచు సుషుమ్నానాడివెంట నగ్నియను దేవతంజేరి జ్యోత్మిర్మయంబైన తేజంబున నిర్మలుండీ 92

యెందునుందగులు వడక తారామండలంబు మీఁద సూర్యాది ధ్రవాంత

పదంబులఁ గ్రమ కక్రమంబున నతిక్రమించి, హరి సంబంధంబైన శింశుమార చక్రంబుఁ జేరి ( యొంటరి యగుచు ) పరమాణుభూతంబైన లింగశరీరంబుతోడ బ్రహ్మవిదులకు

నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి దందహ్యమానంబగు లోకత్రయంబు వీక్షించుచుఁ, ద న్నిమిత్త సంజాత దాహతాపంబు సహింపజాలక. ( 30 )


సీ. ఇల మీఁద మనువు లీ రేడ్వురుఁ జనువేళ దిపసమై యెచ్చోటఁ దిరుగుచుండు

మహనీయ సిద్ధి విమానసంఘము లెందు దినకరప్రభములై తేజరిల్లు

శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబు లెందు జనింపకుండు

విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితుల శోకంబు లెందుండి చూడవచ్చు

ఆ. పరమ సిద్ధి యోగి భాషణామృత మెందు, శ్రవణపర్వ మగుచు జరుగు చుండు

నట్టి బ్రహ్మలోకమంచు వసించును, రాజవర్య ! మఱల రాఁడు వాఁడు ( 31 )


వ. మఱియు నొక్క విశేషంబు కలదు. పుణ్యతిరేకంబున బ్రహ్మలోకగతు లైన వారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికార విశేషంబు నొందువారలగుదురు.

బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారౌ ( బ్రహ్మా జీవితకాలంబుదనుక ) బ్రమలోకంబున వసియించి ( ముక్తి లగుదురు ). నారాయణ చరణకమల భక్తి పరాయణత్వంబునఁ

జనినవారు నిజేచ్ఛా వశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. ఈశ్వరాధిష్టితంబైన ప్రకృతియంశంబున

మహత్తత్త్వమగు. మహత్తత్త్వంశంబున నహంకారంబగు. అహంకారాంశంబున శబ్దతన్మారత్రంబగు. శబ్దతన్మాత్రాంశంబున గగన మగు. గగననాంశంబున స్పర్శరన్మాత్రంబగు.

స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు. నమీరణాంశంబున రూపతన్మాత్రంబగు. రూపతన్మాత్రాంశంబు వలనఁ దేజంబగు. తేజోంశంబున రసతన్మాత్రంబగు.

రసతన్మాత్రాంశంబు వలనఁ జలశంబగు. జలాంశంబున హంధతన్మాత్రంబగు. గంధతన్మాత్రాంశంబు వలన బృథివి యగు. వాని మేళనమునం జతుర్దశ భువనాత్మకంబైన

విరాడ్రూపం బగు. ఆ రూపమునకుఁ గోటియోజన విశాలంబైన యండకటాహాంబు ప్రథమావరణంబైన పృథ్వి యగు. దీనిఁ బంచాశత్కోటి విశాలం బని కొందఱు పలుకుదురు,

అయ్యవరణంబు మీఁద సలిల తేజ స్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండుంటికి సశగుణోత్తరాధికంబలై యుండు. అట్టి

యేడింటి మీఁదఁ బ్రకృత్యావరణంబు మహావ్యాపకం బగుఇ బ్రహ్మాండంబు 93

భేదించి, వైష్ణవ పదారోహణంబు సేయువాఁడ నిర్భయుండై, మెల్లన ( లింగదేహంబున )

బృథివ్యాత్మకత్వంబు నొంది, యట్టి పృథివ్యాప్తకత్వంబున ఘ్రాణంబునం గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబున, తేజోరూపకత్వంబున దర్శనంబున

రూపంబును, సమీరణాత్మకత్వంబున డెహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును నతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన

యహంకారావరణ సంప్రాప్తుండై, యందు మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వకాహంకార గమనంబున మహత్తత్త్వంబున సొచ్చి గుణత్రయంబును లయించిన

ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబు నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాపి యానందమయుండై యానందంబునం బరమాత్మ రూపంబైన వాసుదేవ

బ్రహ్మమందుఁ గలియు నని చెప్పి వెండియు నిట్లనియె. ( 32 ).


ఆ. పరమ భాగతులు పాటించు పథ మిది, యా పథమున యోగి యరిగె నేని

మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు, కల్పశతములైన కౌరవేంద్ర ! (33 ).


వ. వినుము. నీవడిగిన సద్యోముక్తియుఁ గ్రామముక్తియు ననియెడు నీ రెండుమార్గంబులు వేదగీతంబులందు వివరింపంబడియె. వీనిం జాల్లి భగవంతుండైన వాసుదేవుండు

బ్రహచేత నారాధితుండై చెప్పె, సంపార ప్రవిష్టుండైన వానికిఁ కంటె సులభంబు లేదు. ( 34 ).

శుకుఁడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

మ. విను మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు మ

ర్మనయజ్ఞత్వము దోఁప నంతయుఁ బరామర్శించి మోక్షంబు ద

క్కిన మార్గంబులవెంట లేదనుచు భక్తిం జింతసేసెన్ జనా

ర్దను నాత్మకృతి నిర్వికారుఁ డగుచున్ దన్మార్గ నిర్ణేతయై. (35)


సీ. అఖిలభూతములందు నాత్మరూపంబున నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు

బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడు మహోసేనీయు డహర్నిశమ్ణూ

వందనీయుఁడు భక్తవాత్సల్య సంతతబు నియతబుద్ధి

నాత్మరూపకుఁ డగు హరి కథామృతములు గర్ణపుటంబుల గాంక్షదీరఁ

తే. గ్రోలుచుండెడి ధన్యులు గిటిల బహిళ, విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి

విష్ణుదేవుని చరణారవిందయుగము, కడకుఁ జనుదురు సిద్ధంబు కొరవేంద్ర. (36) 94

అధ్యాయము - 3

క. మనుషజన్మము నొందిన. మానవులకు లభ్యమానమరణులకు మహో

జ్ఞానులకుఁ జేయవలయు, విధానము నిగదొంపఁబడియె ధరణీనాథా ! (37)


వ. వినుము బ్రహ్మవర్చస కాముఁడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియపాటవ కామునికి నింద్రుండును, ప్రజాకామునకు దక్షాది ప్రజాపతులును,

భోజనకామునకు నదితియు, స్వర్గకామునికి నాదిత్యులును, రాజ్యకామకుని విశ్వదేవతలును, దేశ ప్రజా సాధనకామునికి సాధ్యులును, , శ్రీకామునికి దుర్గయు,

తేజష్కామునకు నగ్నియు, ధనకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుప్కామునకు నశ్వినీదేవతలును, పుష్ఠికామునకు

భూమియు, ప్రతిష్టాకామునుకి లోకమాతలైన గగన భూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, కామినీకామున కప్పరసయగు నూర్వశియు, సర్వాదిపత్య

కామునకు బ్రహ్మయు, కీర్తికామునకు యజ్ఞోపాధికుండగు విష్ణువును, విత్తసంచయ కామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్యప్రీతి

కామునకు నుమాదేవియు, ధర్మార్థకామునకు నుత్తమ శ్లోకుండగు విష్ణువును, సంతానకామునకుఁ బితృదేవతలును, రాక్షాకామునకు యక్షులును, బలకామునకు

మరుద్గణంబులును,రాజత్వకామునకు మనురూప దేవతలును, శత్రుమరణ కామునకుఁ గోపాలకుండైన రాక్షసుండును, భోగ కామునకుఁ జంద్రుండును భజనీయు

లగుదురు. మఱియు. (38)


క. కామింపకయును సర్వము, హామించియునైన ముక్తిఁ గామించి తగన్

లోమించి పరమపురుషిని, నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా ! (39)


మ. అమరేంద్రాదులఁ గొల్చుభంగి జనఁడా యబ్జాక్షు సేవింపఁగా

విమలజ్ఞాన విరక్తి ముక్తి లొదవున్ వేయేల భూనాథ ! త

త్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోల మాలా పరి

భ్రమ మెవ్వారికి నైనఁ గర్ణయుగళీ పర్వంబు గాకుండునే ? (40)


వ. అని రాజునకు శుకుండుసెప్పె ననిన శౌనకుండు సూతున కిట్లనియె.(41) 95

క. వర తాత్పర్యముతో నిటు, భరతాన్వయ విభుఁడు శుకుని పలుకులు విని స

త్వరతా యుతుఁడై శ్రేయ, స్కరతామతి నేమి యడిగె ? గణుతింపఁగదే ! (42)


క. ఒప్పెడి హరికథ లెయ్యవి చెప్పెడినో యనుచు మాకుఁ జిత్తోత్కంఠల్

గుప్పలు గొనుచున్నవి రుచు, లుప్పతిల న్నీమనోహరోక్తులు వినఁగన్. (43)


వ. అనిన విని సూతుం డిట్లనియె. (44)


క. తూలెడి కూఁకటితోడన, బాలురతో నాడుచుండి బాల్యమున మహీ

పాలుఁడు హరిచరణార్చన, హేలల తోడుతను నుండె నెంతయు నియతిన్. (45)


వ. అట్టి పరమ భాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుం డిట్లనియె. (46)


సీ. వాసుదేవ శ్లోక వార్త లాలింపుచుఁ గాల మే పుణ్యండు గడుపుచుండు

నతని యాయువు దక్క నన్యుల యాయువు నుదయాస్తమయముల నుగ్రకరుఁడు

వంచించి కొనిపోవువాఁ డది యెఱుఁగక జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు,

నంగనా పుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగసుఖముఁ

తే. దగిలి నర్తింపఁ గాలము తఱి యెఱింగి, దండధర కింకరుల వచ్చి తాడనములు

సేసి కొనిపోఁవు బుణ్యంబు సేయనైతిఁ, బాపరతి నైతి బిట్టుఁ బలవరించు. (47)


వ. అది గావున, (48)


సీ. అలరు జొంపములో నభ్రంకషంబులై బ్రతుకవే ? వనములఁ బాదపములు

ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు జీవింపవే ? గ్రామ సీమలంచు

నియతిమై నుచ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్ ప్రాపింపవే ? చర్మభస్త్రికలును

గ్రామసూకర శునక శ్రేణు లింటింటఁ దిరుగవే ? దుర్యోగ దీనవృత్తి

తే. నుష్ట్రఖరములు మోయవే యురుభరములు, పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు

లడవులందు నివాసములందుఁ బ్రాణ, విషయ భర వృత్తితో నుంట విఫల మధిప ! (49)


సీ. విష్ణు కీర్తనములు నినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ !

చక్రి పద్యంబులు చదవని జిహ్వలు కప్పల నాలుకల్ కౌరవేంద్ర !

శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత !

కమలాక్షు పజకుఁ గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన ! 96

ఆ. హరి పద తులసీదళ మోదరతి లేని, ముక్కు పందిముక్కు మునిచరిత్ర !

గరుడగమను భజనగతి లేని పదములు, పాదపముల పాదపటల మనఘ ! (50)


సీ. నారాయణుని దివ్య నామాక్షరములపైఁ గరఁగని మనములు గఠిన శిలలు

మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై యుండని మేను మొద్దు

చక్రికి మ్రొక్కని జడుని యౌఁదల నున్న కనక కిరీటంబు కట్టె మోఁపు

మాధవార్పితముగా మనని సిరి వన దుర్గ చంద్రికావైభవంబు

ఆ. కైటభారి భజన గలిగి యుండని వాఁడు, గాలిలోననుండి కదలు శవము

కమలనాభు పదము గనని వాని బ్రతుకు, పసిఁడికాయలోని ప్రాణిబ్రతుకు. (51).

అధ్యాయము - 4

వ. అని యిట్లు పలికిన వైయాసి వచనంబుల నౌత్తరేయుండు గందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున, (52)


ఆ. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి యి, ల్లాలి విడిచి పశు గృహాళి విడిచి

రాజు హృదయ మిడియ రాజీవనయనుపై, ధనము విడిచి జడ్డుఁదనము విడిచి. (53)


వ. ఇట్లు మృత్యుభయము నిరిసించి, ధర్మార్థకామంబులు సన్యసించి, పురుషోత్తమునందుఁ జిత్తంబు వివ్యసించి, హరిలీలా లక్షణంబు లుపన్యసింపు మను తలంపున

నరేంద్రుఁ డిట్లనియె.(54)


క. సర్వాత్ము వాసుదేవుని, సర్వజ్ఞుఁడవైన నీవు సంస్తుతిసేయన్

సర్వభ్రాంతులు వదలె మ, హోర్వీసురపర్య ! మానసోత్సవ మగుచున్.(55)


సీ. ఈశుండు హరి విష్ణుఁ డీ విశ్వమంతయుఁ బుట్టించు రక్షించు, బొలియఁజూచు

బహు శక్తియుతుఁ భగవంతుఁ డవ్యయు డాది నే శక్తుల నాశ్రయించి

బ్రహ్మ శక్రాది రూపముల వినోదించెఁ గ్రమముననో యే కాలముననొ

ప్రకృతిగుణంబులఁ బత్తి గ్రహించుత యేకత్వమున నుండు నీశ్వరుండు.

ఆ. భిన్న మూర్తి యగుచుఁ బెక్కువిధంబుల, నేల యుండు నతని కేమి వచ్చె

నుండకున్నఁ దాపసోత్తమ ! తెలుపవే ! వేడ్కతోడ నాకు వేదవేద్య ! (56)


వ. అనిన నుత్తరానందను వచంబులకు నిరుత్తరుండు గాక సదుత్తర ప్రదాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపపోత్తముండు దన మనంబున. (57) 97

మ. పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవ స్థాన సం

హరణ క్రీడనుఁడై త్రిశక్తి యుతుఁడై యంతర్గత జ్యోతియై

పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ బ్రాపింప రాకుండు దు

స్తర మార్గంబునఁ దేజఱిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.(58)


వ. మఱియు సజ్జన దురిత సంహణుండును, దుర్జన నివారకుండును, నఖిల సత్త్వ రూపకుండును, పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా

మధ్యదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును, పరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీన జన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప

బ్రహ్మ విహారుండును నౌయప్పరమేశ్వరునకు నమస్కరించెద. (59)


ఉ. ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం

బే విభు లీల లద్భుతము లెవ్వని సంశ్రవణంబు సేయ దో

షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే

నా విభు నాశ్రయించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. (60)


ఉ. ఏ పరమేశు పాదయుగ మెప్పుడుఁ గోరి భజించి నేర్పరుల్

లోపలి బుద్ధిలో న్నుభయలోకము లందుల సక్తిఁ బాసి యే

తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు రే

నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.(61)


చ. తపములు సేసియైన మఱి దానము లెన్నియుఁ జేసియైన నే

జనములు సేసియైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే

యపదములై దురంత విప దంచిత రీతిగ నొప్పుచుండు న

య్యపరిమితున్ భజించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. (62)


మ. యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం

భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా

గవత శ్రేష్ఠుల డాసి శుద్ధతనులన్ గల్యాణులై యుందు రా

యనికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్.(63) 98

మ. తపముల్ సేసిననో మనోనియతినో దానవ్రతప్రీతినో

జపమంత్రంబులనో శ్రుతిస్మృతులనో సద్భక్తినో యెట్లు ల

బ్ధపదుండౌ నని రుద్ర ముఖరుల్ భావంతు రెవ్వాని న

య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుం డౌఁ గాక నా కెప్పుడున్. (64)


క. శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర, జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్

భూపతియు యాదవ శ్రే, ణీపతియుం గతియు నైన నిపుణు భజింతున్. (65)


మ. అణువో కాక కడు న్మహావిభవుఁడో యచ్ఛిన్నుఁడో ఛిన్నుఁడో

గుణియో నిర్గుణియో యటంచు విబుధుల్ గుంఠీభవ త్తత్త్వ మా

ర్గణులై యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులన్ దత్త్వవీ

క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్. (66)


మ. జగ దుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే

భగవంతుండు సరస్వతిం బనుప నా పద్మాస్య దా నవ్విభున్

మగనింగా వరియించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా

రగుఁ జేసెన్ మును బ్రహ్మ నట్టి ఘను నారంభింతు సేవింపఁగన్. (67)


సీ. పూర్ణుఁ డయ్యును మహాభూత పంచక యోగమున మేనులను బురములు సృజించి

పురములలోనుండి పురుష భావంబున దీపించు నెవ్వఁడు ధీరవృత్తిఁ

బంచభూతములను బదునొకం డింద్రియములఁ బ్రకాశింపించి భూరిమహిమ

షోడశాత్మకుఁ డన శోభిల్లి జీవత్వనృత్య వినోదంబు నెఱుపుచుండు

తే. నట్టి భగవంతుఁ డవ్యయుఁ డచ్యుతుండు, మానసోదిత వాక్పుష్ప మాలికలను

మంజు నవరస మకరంద మహిమ లుట్ట, శిష్ట హృద్భావలీలలఁజేయుగాత. (68)

ఉ. మానధనుల్ మహాత్ములు సమాధినిరూఢులు యన్ముఖాంబుజ

ధ్యాన మరంద పానమున నాత్మభయంబులఁ బాపి ముక్తులై

లూనత నొందు రట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటా

జ్ఞాన తమో నభోమణికి సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్. (69)


వ. అని యిట్లు హరి వందనంబు సేసి శుకయోగీంద్రుం డిట్లనియె. (70) 99

మ. అవిరోధంబున నీవు న న్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా

ధవు చేతన్ విని నారదుం డడిగినన్ దథ్యంబుగాఁ జెప్పె మా

నవ లోకేశ్వర ! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె, సం

శ్రవణీయంబు మహాద్భుతంబు విను మా సందేహ విచ్ఛేదమున్. (71)

అధ్యాయము - 5

నారదుండు బ్రహ్మను బ్రపంప ప్రకారం బడుగుట

వ. నారదుండు బ్రహ్మ కిట్లనియె. ( 72 ).

మ.చతురాస్యుండపు వేల్పు పెద్దవు జగ త్సర్గానుసంధాయి వీ

శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్ధ సం

యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గదా! భారతీ

సతి యిల్లా లఁట నీకు నో జనక! నా సందేహమున్ బాపవే! ( 73 )


శా. ప్రారంభాది వివేక మెవ్వఁడొసఁగున్? బ్రారంభ సంపత్తికా

ధారం బెయ్యది? యేమి హేతువు ? యదర్ధం బే స్వరూపంబు సం

సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడున్

బారం బెన్నఁడు లేదు నీమనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా! ( 74 )


శా. నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్

నీ కంటెం ఘనుఁడొక్క రాజు గలఁడో నీ వింతకున్ రాజవో

నీ కే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె దీ చేతనా

నీకం బెందు జనించు నుండు నణఁగున్ నిక్కంబు భాషింపుమా. ( 75 )


మ.సదస త్సంగతి నామ రూప గుణ దృశ్యంబైన విశ్వంబు నీ

హృదధీనంబు గదా! ఘనుల్ సములు నీ కెవ్వారునున్ లేరు నీ

పద మత్యున్నత మిట్టి నీవు తపముల్ ప్రావీణ్య యుక్తుండవై

మది నే యీశ్వరుఁ గోరి చేసితివి త న్మార్గంబు సూచింపవే. ( 76 ) 100

శా. అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ ద త్పక్షమం

దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంభ్రాంతిచే

సంభూతంబగు వర్తమానమగు సంఛన్నంబగున్ ద ద్విభున్

సంభావింపఁగ వచ్చునే తలఁప నే చందంబు వాఁ డాకృతిన్. ( 77 )


క. తోయజ సంభవ ! నా కీ, తోయము వివరింపు చాలఁ దోఁచిన నే నా

తోయము వారికి నన్యుల, తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. ( 78 )


వ. దేవా! భూత భవిష్య ద్వర్త మానంబులగు వ్యవహారంబులకు నీవ విభుండవు. నీ వెఱుంగని యర్థం బించుకయు లేదు. విశ్వప్రకారంబు వినిపింపు మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె. ( 79 )

క. రారా? బుధులు విరక్తులు, గారా? యీరీతి నడుగంగా నేరరు వి

స్మేరావహము భవ స్మిత, మౌరా ! నా పైడి! మర్మ మడిగితి వత్సా! ( 80 )


శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి

న్నాణం బేమియు లేక తొట్రుపడఁగా నాకున్ సమస్తాను సం

ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము

న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగము ల్నిర్మింప శక్తుండనే. ( 81 )


మ. అనఘా! విశ్వమునెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?

యిన చంద్రానల తారకాగ్రహ గణం బే రీతి నా రీతి నె

వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు, దద్దీప్తిచే

ననుదీప్తం బగు నట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (82 )


మ. వినుమా యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి

గ్గున సంకోచము నొంచు మాయవలనం గుంఠీభవ త్ప్రజ్ఞచే

నను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే

ననిశంబు న్నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుతా! ( 83 )


వ.మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులను, జన్మనిమిత్తంబు లైన కర్మంబులును, కర్మక్షోభకంభైన కాలంబును, కాల పరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండుగా నెఱుంగుము. 101

వాసుదేవ వ్యత్తిరిక్తంబులేదు, సిద్ధంబు. ( నారాయణ నియమ్యంబులు లోకంబులు). దేవతలు నారాయణ శరీర సంభూతులు. వేద యాగ తపో యోగ గతి విజ్ఞానంబులు నారాయణపరంబులు. (జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణాధీనంబు). కూటస్థుండు, సర్వాత్మకుండు, సర్వద్రష్టయునైన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి, ప్రేరితుండనై, సృజ్యంబైన ప్రపంచంబు సృజింపుచుండుదు. నిర్గుణుం డైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమో గుణంబులు ప్రభూతంబులై యత్పత్తి స్థితి లయంబులకుఁ బాలుపడి, కార్యకారణ కర్తృత్వ భావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులు, జ్ఞానమూర్తులైన దేవతలు, క్రియారూపంబులైన యింద్రియంబులు, నాశ్రయంబులుగా నిత్యముక్తుండయ్యును, మాయ సమన్వితుండైన జీవుని బంధించు. జీవులకు నావరణంబులై యుపాధిభూతంబులైన మూఁడు లింగంబులంజేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబు గల యీశ్వరుం డి వ్విధంబునం గ్రీడించుచుండు. ( 84 )


క. ఆ యీశుఁ డనంతుఁడు హరి, నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్

మాయకుఁ బ్రాణివ్రాతము, కేయెడలన్ లేదు నీశ్వ రేతరము సుతా! ( 85 )


వ. వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయంజేసి దైవయాగంబునం బ్రాప్తంబులైన కాల జీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి గైకొనియె. ఈశ్వరాధిష్త్హతంబైన మహత్తత్త్వంబు వలన ( నగు కాలంబున గుణ వ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును, జీవాదృష్ట భూతంబైన కర్మంబున జన్మంబును నయ్యె. రజ స్సత్త్వంబులచే నుపబృంహితమై వికారంబు నొందిన మహాత్తత్త్వంబు వలనం) దమ:ప్రధానంబై ద్రవ్య జ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు నొంచుచు ద్రవ్య శక్తియైన తామసంబుఁ క్రియాశక్తియైన రాజసంబు, జ్ఞాన శక్తియైన స్వాతికంబును నన మూఁడు విధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నభంబునకు సూక్ష్మరూపంబుఁ ద్రష్టృ దృశ్యంబులకు బోధకం బైన శబ్ద్ంబు గుణం బగు. నభంబు వలన వాయువు గలిగె. వాయువునకుఁ బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండును. అది దేహంబునందుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మన శ్శరీరపాటవంబు లైన యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు. 102

వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబులు మూఁటి తోడఁ దేజంబు గలిగె. తేజంబు వలన రసరూప స్పర్శ శబ్దంబు లనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబు లయిదింటితోడం బృథివి కలిగె. వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్ర దైవతంబైన మనంబు గలిగె. మఱియు దిక్కులు, వాయువు, అర్కుండు, ప్రచేతస్సు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుండుఁ ప్రజాపతియు ననియెడి దశ దేవతలు గలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబు, వాయుదైవతంబైన త్వగింద్రియంబు, సూర్యదైవతంబైన నయనేంద్రియంబు, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబు, అశ్వినీదైవతంబైన జ్ఞాణేంద్రియంబు, వహ్నిదైవతంబైన వాగింద్రియంబు, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబు, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబు, మిత్రదైవతంబైన గుదేంద్రియము, ప్రజాపతిదైవతంబైన గుహ్యేంద్రియంబు, ననియెడి దశేంద్రియంబులను బోధజన కాంత:కరణైక భాగంబైన బుద్ధియుఁ, గ్రియాజన కాంత:కరణంబైన ప్రాణంబును గలిగె. ఇట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేఱుగ ( బ్రహ్మాండ శరీర నిర్మాణంబునం దసమర్ధంబులగు నపుడు భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించి సమిష్టి వ్యష్ట్యాత్మ కత్వంబు నంగీకరించి) చేతనా చేతనంబుల గల్పించె. అట్టి యడంబు వర్షాయుత సహస్రాతంబు దనుక జలంబునం దుండె. ( కాల కర్మ స్వభావంబులం దగులు వడక సమస్తమును జీవయుక్తముగఁజేయు నీశ్వరుండ చేతనంబున సచేతనంబుగ నొనర్చె.) అంతఁ గాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబైన బ్రహ్మాండంబులోను బొచ్చి సవిస్తరంబు గావించి ( యట్టి యండంబు భేదించి నిర్గమించె . ఎట్లుంటేని.) ( 86 )


క. భువనాత్మకుఁ డా యీశుఁడు, భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్

వివరముతోఁ బదునాలుగు, వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్. ( 87 )


మ. బహు పా దోరు భుజాస నేక్షణ శిర: ఫాల శ్రవో యుక్తుఁడై

విహరించున్ బహుదేహి దేహగతుఁడై విద్వాంసు లూహించి త

ద్బహురూ పావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతు రా

మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ! ( 88 ) 103

వ. వినుము చతుర్ధశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు, శ్రీ మహావిష్ణువు నకుం గటిప్రదేశంబున నుండి యూర్ధ్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబున నుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరకుండగు భగవంతుని ముఖంబు వలన బహ్మకులంబు, బాహువుల వలన క్షతృయ కులంబు, ఊరువుల వలన వైశ్యకులంబు, పాదంబు వలన శూద్ర కులంబు జనియించె నని చెప్పుదురు. భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు శిరంబు, కటిప్రదేశం బతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదాతలంబు పాతాళంబు నని (లోకమయుంగా ) భావింతురు. కొందఱు మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభివలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును గలిగె నని లోక కల్పనంబు నెన్నుదురు.

అధ్యాయము - 6

పురుషోత్తముని ముఖంబు వలన సర్వజంతు వాచాజాలంబును దదధిష్టాత యగువహ్నియు నుదయించె. చర్మ రక్త మాంస మేదశ్శల్య మజ్జా శుక్లంబులు సప్తధాతువు లందురు. పక్షాంతరంబున రోమ త్వ జ్మాం సాస్థి స్నాయు మజ్జా ప్రాణంబులను సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్ణిక్ఛందం బనియు, త్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టుప్చందం బనియు, స్నాయు వనుష్టుప్చందం బనియు, ఆస్థి జగతీఛందంబనియు, మజ్జ పంక్తిచ్చందంబనియు, ప్రాణంబులు బృహతీ చందం బనియు నాదేశింతురు. హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణు నాసికా వివరంబు నివాసంబు, సమీప దూర వ్యాపిగంధంబులకు నోషధులకు నశ్వనీదేవతలకు భగవంతుని ఘ్రానేంద్రియంబు నివాసంబు, దేవలోక సత్య లోకంబులకుఁ దేజంబునకు సూర్యునికి సకలచక్షువులకు లోక లోచను చక్షురింద్రియంబు స్థానంబు, దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబులకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మ స్థానంబు, 104

వస్తుసారంబులకు వర్ణనీయ సౌభాగ్యంబులకుం బరమపురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధంబులకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు, యూప ప్రముఖ యజ్ఞోపకరణ సాధనంబులగు తరుగుల్మ లతాందులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలా లోహంబులు సర్వమయుని నఖంబులు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు. మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు, భూర్భువ స్సువర్లోక రక్షకులైన లోక పాలకుల పరాక్రమంబులకు, భూరాది లోకంబుల క్షేమంబునకు, శరనంబునకు, నారాయణుని విక్రంబులు నికేతనంబులు. సర్వకామంబులకు నుత్తమంబు లైన వరంబులకుఁ దీర్ధపాదుని పాదారవిందంబు లాస్పదంబులు. జలంబులకు, శుక్లంబునకు, పర్జన్యునకు, ప్రజాపతి సర్గంబునకు, సర్వేశ్వరుని మేడ్రంబు సంభవ నిలయంబు. సంతానంబునకుఁ గామాది పురుపార్థంబులకుఁ జిత్త సౌఖ్యరూపంబులకు నానందంబులకు, శరీర సౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు, యమునికి, మిత్రునికి, మలవిసర్గంబునకు భగవంతుని పాయ్మింద్రియంబు భువనంబు, హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు. పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు ననంతుని పృష్ట భాగంబు సదనంబు. నద నదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందేహంబు జన్మ మందిరంబు. పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనక స్థలంబులు. ప్రధానంబునకు నన్నరసంబులకు సముద్రంబులకు భూవలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు. మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహా మహిముని హృదయంబు సర్గభూమి యగు. మఱియు. ( 89 )

ఆ. నీలకంధరునకు నీకు నాకు సనత్కు, మార ముఖ్య సుత-సమాజమునకు

ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములను నీశ్వ, రాత్మ వినుము పరమమైన నెలవు. ( 90 )


సీ. నర సురాసుర పితృ నాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తార కాప్సరోగణ విహంగ

భూత తటి ద్వసు పుంజంబులను నీవు మూక్కంటియును మహామునులు నేను

సలిల నభస్స్థల చరములు మొదలైన వివిధ జీవులతోడ విశ్వమెల్ల

ఆ. విష్ణు మయము పుత్ర! వేయేల బ్రహ్మాండ, మతని జేనలోన నణఁగి యుండు

బుద్ధి నెఱుఁగరాదు భూత ద్భవ్య, లోకమెల్ల విష్ణులోన నుండు. ( 91 ) 105

క. మండలములోన భాస్కరుఁ, డుండుచు జగములకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర

హ్మాండములోపల నచ్యుతుఁ, డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్. ( 92 )

ఉ. అట్టి అనంతశ క్తి జగదాత్ముని నాభి సరోజమందు నేఁ

బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞ పదార్ధ జాతముల్

నెట్టిన గానరామికిని నిర్మలమైన తదీయ రూపమున్

గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నామనంబునన్. ( 93 )


సీ. పశు యజ్ఞవాట యూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంత కాలములను

స్నేహౌషధీ బహు ళోహ చాతుర్హోత్ర మత నామధేయ సన్మంత్రములును

సంకల్ప ఋగ్యజు స్సామ నియుక్త వషట్కార మంత్రాను చరణములును

దక్షిణల్ దేవతా ద్యనుగత తంత్ర వ్రతోద్దేశ ధరణీసురోత్త మాదు


తే. లర్పణంబులు బోధాయనాది కర్మ సరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి

యంతయును నమ్మహాత్ముని యవయవములు, గాఁగఁగల్పించి విధివత్ప్ర్ కారమునను. ( 94 )


క. యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞభోక్త యగు భగవంతున్

యజ్ఞపురుషుఁగా మానస, యజ్ఞముఁ గావించితిం ద దర్పణబుద్ధిన్. ( 95 )


క. అప్పుడు బ్రాహ్మణు లెల్లం, దప్పక ననుఁ చూచి సముచిత క్రియ లగుచో

న ప్పరమేశున కభిమత, మొప్పఁగఁ దగు సప్తతంతువును గావింపన్. ( 96 )


చ. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దా

రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజింపుచున్

ఘనతరనిష్ఠ యజ్ఞములు గైకొని చేసిరి తత్ఫలంబు ల

య్యనుపమ మూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్. ( 97 )


క. సువ్యక్త తంత్రరూపకుఁ, డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం

డవ్యయుఁడగు హరి సురగణ, సేవ్యుఁడు గ్రతుఫలదుఁడగుటఁ జేసిరి మఖముల్. ( 98 )


క. అగుణం డగు పరమేశుఁడు, జగములు గల్పించు కొఱకుఁ జతురత మాయా

సగుణుండగుఁ గావున హరి, భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా! ( 99 ) 106

క. విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత విష్ణుం డజుఁ డీ

విశ్వములోఁ దా నుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్. ( 100 )


చ. అతని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేత సృష్టి నే

వితతముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ

పతి లయ మొందఁజేయు హరి పంక రుహోదరుఁ డాదిమూర్తి య

చ్యుతుఁడు త్రిశ క్తియుక్తుఁ డగుచుండు ని టింతకుఁ దాన మూలమై. ( 101 )


క. విను వత్స! నీవు న న్నడి, గిన ప్రశ్నకు నుత్తరంబు గేవల పరమం

బును బ్రహ్మం బీ యఖిలం, బున కగు నాధార హేతు భూతము సుమ్మీ! ( 102 )


క. హరి భగవంతుఁ డనంతుఁడు, గరుణాంబుధి సృష్టికార్య కారణ హేతు

స్ఫురణుం డ వ్విభుకంటెం, బరుఁ డన్యుడు లేఁడు తండ్రీ! పరికింపగన్. ( 103 )


సీ. ఇది యంతయును నిక్కమే బొంక నుత్కంఠ మతిఁ దద్గుణ ధ్యాన మహిమఁజేసి

పరికింప నే నేమి పలికిన నది యెల్ల సత్యంబు యగు బుధస్తుత్య! వినుము

ధీయుక్త! మామ కేంద్రియములు మఱచియుఁ బొరయ వసత్య విస్ఫురణమెందు

నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు నమరేంద్ర వందనీయంబు నయ్యెఁ

తే. దవిలి య ద్దేవదేవుని భవమహాబ్ధి, తారణంబును మంగళ కారణంబు

నఖిల సంపత్కరంబునై యలరు పాద, వనజమునకే నొనర్చెద వందనములు. ( 104 )


ఉ. ఆ నలినాక్షు నందనుఁడ నయ్యుఁ బ్రజాపతినయ్యు యోగ వి

ద్యానిపుణుండ నయ్యను బదంపడి మ జ్జనన ప్రకారమే

యేను నెఱుంగ న వ్విభుని యిద్ధ మహత్త్వ మెఱుంగ నేర్తునే!

కానఁబడున్ రమేశ పరికల్పిత విశ్వము గొంతకొంతయున్. ( 105 )


మ. విను వే యేటికిఁ దాపసప్రవర! యవ్విశాత్ముఁ డీశుండు దాఁ

దన మాయా మహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబు దాఁ జాలఁ డ

నన్ను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునై

నను నిక్కం బెఱుగంగ జాలుదుమె! విజ్ఞాన క్రియాయుక్తులన్. ( 106 )


వ. ఆ మ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని, ( 107 ) 107

క. గగనము దన కడవలఁదాఁ, దగ నెఱుఁగని కరణి విభుఁడు దా నెఱుఁగఁడనన్

గగన ప్రసవము లేదన, నగునే సర్వజ్ఞతకును హాని దలింపన్. ( 108 )


చ. తలకొని య మ్మహాత్మకుఁడు దాల్చిన య య్యవతార కర్మముల్

వెలయఁగ నస్మదాదులము వేయు విధంబుల సన్ను తింతు మ

య్యలఘ ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరున్

దెలియఁగ నేర్తుమే ! తవిలి దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్. ( 109 )


మ. పరమాత్ముం డజుఁ డీ జగంబు ప్రతికల్పంబందుఁ గల్పించుఁ దాఁ

బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితున్ గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁజింతించెదన్. ( 110 )


చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్నశరీర హృషీక మానస

స్ఫురణ గలప్పు డ వ్విభుని భూరికళా కలిత స్వరూపముం

దరమిడి చూతు రెప్పడు కుతర్క తమోహతి చేత నజ్ఞతన్

బొరసిన యప్పు డ వ్విభుని మూర్తిఁగనుంగొనలేరు నారదా! ( 111 )


వ. అని వెండియు నిట్లను. అనఘా! ఇ మ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకం బగు నాది పురుషు రూపంబగు. అందుఁ గాల స్వభాషంబులను శక్తు లుదయించె. అందుఁ గార్య కారణ రూపంబైన ప్రకృతి జనించెఁ. బ్రకృతివలన మహత్తత్త్వంబును దాని వలన నహంకార త్రయంబును బుట్టె. అందు రాజసహంకారంబువలన నింద్రియంబులను, సాత్త్వికాహంకారంబువలన నింద్రియ గుణప్రధానంబు లైన యధిదేవతలును, తామసాహంకారంబువలన భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రంబులను బొడమె. పంచతన్మాత్రంబులవలన గగనానిలవహ్ని సలిల ధరాదికమైన భూత పంచకంబు గలిగె. అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వఘ్రాణంబులును, కర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థలును, మనంబును జనియించె. అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె. అతనివలన స్వయంప్రకాశుండైన స్వరాట్టు సంభవించె. అందుఁ జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన 108

జగత్తు గలిగె. అందు సత్త్వరజస్తమో ( గుణాత్మకులమైన విష్ణుండును హిరణ్య గర్భుండ నైన యేనును రుద్రుండును గలిగితిమి.) అందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖుండు పుట్ట, వానివలన దక్షాదులగు ప్రజాపతులు దొమ్మండ్రు గలిగిరి. అందు భవత్ప్రముఖులైన సనక సనందాది యోగీంద్రులును, నాగలోక నివాసులైన వాసవాదులును, ఖగలోక పాలకులగు గరుడాదులను, నృలోకపాలకు లగు మనుమాంధాతృ ప్రభ్రుతులును, రసాతలలోకపాలకు లగు ననంత వాసుకి ప్రభ్రుతులును, గంధర్వ సిద్ధ విద్యాధర చారణ సాధ్య రక్షో యక్షోరగ నాగలోక పాలురును, మఱియు ఋషులును, పితృదేవతలును, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూశ్మాండ పశు మృగాదులు నుద్భవించిరి. ఇట్టి జగ త్ప్రథమోద్భవంబు మహత్తత్త్వసృష్టి యనంబడు. ద్వితీయం బండ సంస్థితం బనం దగు. తృతీయంబు సర్వభూతస్థం బన నొప్పు. అందైశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగుము. అ ప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు, తత్కర్మంబులు లెక్కవెట్ట నెవ్వరికినలవి గాదు. ఐనను నాకుం దోఁచినంత నీ కెఱింగించెద. వినుము. ( 112 )

శ్రీమన్నారాయణుని లీలావతారముల యభివర్ణనము

ఉ. అన్య కథానులాపము లహర్నిశమున్ వినునట్టి సత్ర్కియా

శూన్యములైన కర్ణముల సూరిజన స్తుత సర్వలోక స

న్మాన్యములై తనర్చు హరి మంగళ దివ్యకథామృతంబు సౌ

జన్యతఁ గ్రోలుమయ్య ! బుధసత్తమ ! యే వివరించి చెప్పెదన్. ( 113)


వ. అరి పలికి నారదుం జూచి మఱియు నిట్లనియె. ( 114 )

అధ్యాయము - 7

మ. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్ష్మాచక్రముం జాఁపఁ జు

ట్టిన మాడ్కిన్ గొనిపోవ యజ్ఞమయ దంష్టృ స్వాకృతిం దాల్చియ

ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధినడుమన్ దంష్టృహతిం ద్రుంప ధా

త్రిని గూలిన్ గులిశాహతిం బడు మహాద్రిం బోలి యత్యుగ్రతన్. ( 115 )

వ. మఱియును యజ్ఞావతారంబు విను మని యిట్లనియె. ( 116 ) 109

సీ. ప్రకట రుచిప్రజాపతికిని స్వాయంభువుని కూఁతు రాకూతి యను లతాంగి

కర్థి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పు నతఁడు దక్షిణ యను నతివయందు

సుయమ నామామర స్తోమంబుఁ బుట్టించి యింద్రుఁడై వెలసి యుపేంద్రలీల

నఖిల లోకంబుల యార్తి హరించిన నతని మాతామహుఁ డైన మనువు


తే. దన మనంబునఁ దచ్చరిత్రమున కలరి, పరమ పుణ్యుండు హరి యని పలికెఁగాన

నంచిత జ్ఞాన నిధియై సుయజ్ఞుఁ డెలమి దాపసోత్తమ! హరి యవతార మయ్యె. ( 117 )


వ. అని చెప్పి కపిలుని యవతారంబు వినుమని యిట్లనియె. ( 118 )


చ. ధృతమతి దేవహూతికిని దివ్యవిభుం డగు కర్ధమ ప్రజా

పతికిఁ బ్రమోదమొప్ప నవభామలతోఁ గపిలుండు పుట్టి యే

గతి హరిఁ బొందు నట్టి సుభగంబగు సాంఖ్యము తల్లికిచ్చి దు

ష్కృతములు వాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్. ( 119 )

వ. మఱియు దత్తాత్రేయావతారంబు వినుము. ( 120 )


సీ. తాపసోత్తముఁ డత్రి దనయుని గోరి రమేశు వేఁడిన హరి యేను నీకు

ననఘ! దత్తుఁడ నైతి నని పల్కు కతమున నతఁడు దత్తాత్రేయుఁడై జనించె

న మ్మహాత్ముని చరణాబ్జ పరాగ సందోహంబుచేఁ బూతదేహు లగుచు

హైహయ యదువంశు లైహి కాముష్మిక ఫలరూప మగు యోగబలము వడసి


తే. సంచిత జ్ఞానఫల సుఖైశ్వర్యశక్తి, శౌర్యములు పొంది తమ కీర్తిచదల వెలుఁగ

నిందు నందును వాసికి నెక్కి రట్టి, దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె! ( 121 )


వ. వెండియు సనకా ద్యవతారంబు వినుము. ( 122 )


సీ. అనఘాత్మ! నేను గల్పాదిని విశ్వంబు సృజియింపఁ దలఁచి యంచిత తపంబు

నర్థిఁజేయుచు *'సన' యని పలుకుటయు నది గారణంబున సనాఖ్యలను గల స

నందన సనక సనత్కుమార సనత్సుజాతులు నల్వురు సంభవించి

మానసపుత్రులై మహి నుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి


తే. యట్టి యాత్మీయ తత్త్వంబు పుట్టఁజేసి, సాంప్రదాయిక భంగిని జగతినెల్ల

గలుగఁజేసిరి య వ్విష్ణుకళలఁ దనరి, నలువు రయ్యును నొక్కఁడె నయచరిత్ర! ( 123 ) 110

వ. మఱియు నరనారాయణావతారంబు వినుము. ( 124 )


క. గణుతింపఁగ నరనారా, యణులన ధర్మునకు నుదయ మందిరి దాక్షా

యణియైన మూర్తివలనం, బ్రణత గుణోత్తములు పరమ పావన మూర్తుల్. ( 125 )


క. అనఘులు బదరీ వనమున, వినుత తపోవృత్తి నుండ విబుధాధిపుఁడున్

మనమున నిజపద హానికి, ఘనముగఁ జింతించి దివిజ కాంతామణులన్. ( 126)


క. రావించి తపోవిఘ్నము, గావింపుం డనుచుఁ బలుకఁ గడువేడుకతో

భావభవానీకిను లనఁ గా వనితలు సనిరి బదరికా వనమునకున్. ( 127 )


వ. అందు ( 128 )


మ. నరనారాయణు లున్న చోటికి మరు న్నారీ సమూహంబు భా

స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ

బరిహాసోక్తుల నాట పాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్

భరిత ధ్యాన తప: ప్రభావ నిరతం బాటించి నిష్కాములై. ( 129 )


క. క్రోధము దపముల కెల్లను, బాధకమగు టెఱిఁగి దివిజభామలపై న

మ్మేధానిధు లొక యింతయుఁ, క్రోధము దేరైరి సత్త్వగుణ యుతు లగుటన్. ( 130 )


క. నారాయణుఁ డప్పుడు దన, యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను బెం

పారంగ నూర్వశీ ముఖ, నారీ జనకోటి దివిజనారులు మెచ్చన్. ( 131 )


క. ఊరువులందు జనించిన, కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్

వారల రూప విలాస వి, హారములకు నోడి రంత నమరీ జనముల్. ( 132 )


వ. అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబు గావింపం బూని సేయు విలా సంబులు (మానసిక సంకల్ప మాత్రంబున సృష్టిస్థితి సంహారంబు లొనర్పంజాలు) న మ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్ననకుం జేయు నుపకృతులుంబోలె నిష్ఫ లంబులైన సిగ్గునం గుందుచు నూర్వశిం దమకు ముఖ్యరాలిగాఁ గైగొని తమ వచ్చిన జాడనే మఱలి రంత. ( 133 )


క. కాముని దహించెఁ గ్రోధ మ, హామహిమను రుద్రుఁ డట్టి యతికోపము నా

ధీమతులు గెలిచి రనినం, గామము గెల్చుటలు చెప్పఁగా నేమిటికిన్. ( 134 ) 1 1 1

వ. అట్టి నరనారాయణావతారంబు జగత్ప్రావనంబై విలసిల్లె. వెండియు ధ్రువావ తారంబు వివరించెద వినుము. ( 135 )


సీ. మానిత చరితుఁ డుత్తానపాదుం డను భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనఁగ

నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున జనకుని కడ నుండి సవతితల్లి

తను నాడు వాక్యాస్త్ర తతిఁ గుంది మహిత తపంబు గావించి కాయంబుతోడఁ

జని మింట ధ్రువపద స్థాయియై యట మీఁద నర్ధి వర్తించు బృగ్వాది మునులు


తే. చతురగతిఁ గ్రింద వర్తించు సప్తఋషులు, పెంపు దీపింపఁ దన్ను నుతింపుచుండ

ధ్రువుఁడునానొప్పి యవ్విష్ణుతుల్యుఁడగుచు, నున్నపుణ్యాత్ముఁడిప్పుడునున్న వాడు. ( 136 )


వ. పృథుని యవతారంబు వినుము. ( 137 )


ఉ. వేనుఁడు విప్రభాషణ పవి ప్రహర చ్యుత భాగ్య పౌరుషుం

డై నిరయంబునం బడిన నాత్మతనూభవుఁడై పృథుండు నా

బూని జనించి త జ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్

ధేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై. ( 138 )


వ. అని మఱియు వృషభావతఅరంబు నెఱిఁగింతు వినుము. ఆగ్నీధ్రుండను వానికి సుదేవివలన నాభి యను వాఁ డుదయించె. అతనికి మేరుదేవియందు హరి వృష భావతారంబు నొంది, జడస్వభావం బైన యోగంబు దాల్చి ప్రశాంతాంత: కరణుండును విముక్త సంగుండునై, పరమ హంసాభిగమ్యంబైన పదం బిది యని మహర్షులు పలుకుచుండం జరించె, మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము. ( 139 )


చ. అనఘచరిత్ర! మ న్మఖమునందు జనించె హయాన నాఖ్యతన్

వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డభి లాంతరాత్మకుం

డనుపమ యజ్ఞపూరుషుఁడు నై భగవంతుడు ద త్సమస్త పా

వనమగు నాసికా శ్వసన వర్గములం దుదయించె వేదముల్. ( 140 )


వ. మరియు మత్స్యావతారంబు వినుము. ( 141 ) 112

సీ. ఘనుడు వైవస్వత మనువుకు దృష్టమై యరుదెంచినట్టి యుగాంత సమయ

మందు విచిత్ర మత్స్యావతారము దాల్చి యఖిలావనీ మయం బగుచుఁజాల

సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే కార్ణవం బైన తోయముల నడుమ

మ న్ముఖశ్లథ వేద మార్గంబులను జిక్కు వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి


తే. దివ్యు లర్ధింప నా కర్థిఁ దెచ్చియిచ్చి, మనువు నెక్కించి పెన్నా వ వనధి నడుమ

మునుఁగ కుండఁగ నరసిన యనిమిషావ, తార మేరికి నుతియింపఁదరమె? వత్స! ( 142 )


వ. మఱియుఁ గూర్మావతారంబు వినుము. ( 143 )


మ. అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్ మందరా

గము గవ్వంబుగఁ జేసి యబ్ధి దఱువంగాఁ గవ్వపుం గొండ వా

ర్ధి మునుంగన్ హరి గూర్మ రూపమున నద్రిం దాల్చెఁద త్పర్వత

భ్రమణ వ్యాజత వీఁపు తీట శమియింప జేయఁగా నారదా! ( 144 )


వ. వెండియు నృసింహావతారంబు వినుము. ( 145 )


మ. సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్య ద్గదా

ధరుఁడై వచ్చు నిశాచరుం గని కన ద్దంష్ట్రాకరాళాస్య వి

స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ

కర భాస్వ న్నఖరాజిఁ ద్రుంచెఁ ద్రిజగ త్కల్యాణ సంధాయియై. ( 146 )


వ. ఆదిమూలావతారంబు సెప్పెద వినుము. ( 147 )


మ. కరినాథుండు జలగ్రహ గ్రహణ దు:ఖాక్రాంతుఁడై వేయి వ

త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్

హరి నీవే శరణంబు నా కనిన కు య్యాలించి వేవేగ వా

శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా! ( 148 )


వ. మఱియును వామనావతారంబు వినుము. ( 149 )


సీ. యజ్ఞేశ్వరుం డగు హరి విష్ణుఁ డదితి సంతానంబునకు నెల్లఁదమ్ముఁడయ్యుఁ

బెంపారు గుణములఁ బెద్దయె వామన మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి

త ద్భూమి మూఁడు పాదమ్ముల నడిగి పద త్రయంబునను జగత్త్రయంబు

వంచించి కొనియెను వాసవునకు రాజ్య మందింప నీశ్వరుఁ దయ్యు మొఱఁగి 113

తే. యర్థి రూపంబు గైకొని యడుగవలసె, ధార్మికుల సొమ్ము వినయోచితమునఁ గాని

వెడఁగుఁదనమున నూరక విగ్రహించి, చలన మందింపరాదు నిశ్చయము పుత్ర! ( 150 )


చ. బలి నిజమౌళి న వ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము

త్కలిక ధరించి తన్నును జగత్తృయమున్ హరి కిచ్చి కీర్తులన్

నిలిపె వసుంధరాస్థలిని నిర్భరలోక విభుత్వ హానికిన్

దలఁకక శుక్రు మాటలకుఁ దారక భూరి వదాన్య శీలుఁడై ( 151 )


వ. మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తి యోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణం బుపదేశించె. మన్వతారంబు నొంది స్వకీయ తేజ:ప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండింపుచు, శిష్ట పరిపాలనంబు సేయుచు, నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలిగించె. మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబులకు సకల రోగ నివారణము సేయుచు నాయుర్వేదంబు గల్పించె. వెండియు పరశురామావతఅరంబు వినుము. ( 152 )


మ. ధరణీకంటకు లైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి

స్ఫురి తోదార కుఠార ధారఁ గలనన్ ముయ్యేడుమాఱుల్ పొరిం

బొరి మర్ధించి సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ

జిరకీర్తిన్ జమదగ్ని రాముఁ డన మించెన్ దాపసేంద్రోత్తమా ! ( 153 )


వ. మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము. ( 154 )


సీ. తోయజహిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు

గమనీయ కోసల క్ష్మాభృ త్సుతాగర్భ శుక్తి సంపుట లస న్మౌక్తికంబు

నిజపాద సేవక వ్రజ దు:ఖ నిబిడాంధకార విస్ఫురిత పంక రుహ సఖుఁడు

దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగ ణాకర దేవతానోకహంబు


తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు

నగచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు ( 155 ) 114

క. చిత్రముగ భరత లక్ష్మణ, శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్

ధాత్రిన్ రాముఁడు వెలసెఁబ, విత్రుఁడు దుర్భవలతా లవిత్రుండగుచున్ ( 156 )


వ. అంత ( 157 )


సీ. కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ పద ఫాల భుజరద పాణి నేత్రఁ

గాహళ కరభ చక్ర వియ త్పులిన శంఖ జంఘేరు కుచ మధ్య జఘన కంఠ

ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండ గంధోష్ఠ వా గ్గమన కర్ణఁ

జంప కేందు స్వర్ణ శంపా ధను ర్నీల నాసికాస్యాంగ దృక్ భ్రూ శిరోజ


తే. నలి సుధావర్త కుంతల హాసనాభి, కలిత జనకావనీపాల కన్యకా ల

లామఁ బరిణయమయ్యె లలాటనేత్ర, కార్ముక ధ్వంస ముంకువ గాఁగ నతఁడు. ( 158 )


వ. అంత ( 159 )


క. రామున్ మేచక జలద, శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు

త్రామున్ దుష్ట నిశాట వి, రాముం బొమ్మనియెఁ బం క్తిరథుఁ డడవులకున్. ( 160 )


వ. ఇట్లు పంచిన, ( 161 )


చ. అరుదుగ లక్ష్మణుండు జనకాత్మ జయుం దనతోడ నేగుదే

నరిగి రఘూత్తముండు ముద మారఁగఁ జొచ్చెఁ దరక్షు సింహ సూ

కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా

సర ముఖ వస్యసత్వచయ చండతరాటవి దండకాటవిన్. ( 162 )


క. ఆ వనమున వసియించి నృ, పావన నయశాలి యిచ్చెనభయములు జగ

త్పావన మునిసంతతికిఁ గృ, పావన నిధియైన రామభద్రుం డెలమిన్. ( 163 )


క. ఖర కర కుల జలనిధి హిమ, కరుఁడగు రఘురామ విభుఁడు గఱకఱితోడన్

ఖరుని వధించెను ఘన భీ, కర శరముల నిఖిల జనులు గర మరు దనఁగాన్. ( 164 )


క. హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని, హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్

హరి విభునకు హరిమధ్యను, హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై ( 165 )


వ. అంత సీతానిమిత్తంబునం ద్రిలోకకంటకుఁడగు దశకంఠుం దునుమాడుటకునై

కపిసేనా సమేతుండై చని దుర్గమంబైన సముద్రంబు తెరువు సూపకున్న నలిగి. ( 166 ) 115

మ. వికట భ్రూకుటి ఫాలభాగుఁ డగుచున్ వీరుండు గ్రోధారుణాం

బకుఁడై చూచినయంత మాత్రమున న ప్పాథోధి సంతప్త తో

యకణ గ్రాహ తిమింగిల ప్లవ ఢులీ వ్యాళ ప్రవాళోర్మి కా

బక కారండవ చక్రముఖ్య జలసత్వ శ్రేణితో నింకినన్. ( 167 )


వ. అ య్యవసరంబున సముద్రుండు గరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటియట్లు నిలిపి, నలునిచే సేతువు బంధింపించి, త న్మార్గంబునం జని. ( 168 )


మ. పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం

కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధ గో

పుర శాలాంగంణ హర్మ్య రాజభవన ప్రోద్య త్ప్రతోళీ కవా

ట రథాశ్వ ద్విప శస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. ( 169 )


క. రావణు నఖిలజగ ద్వి, ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁ గా

రావణు ననుజన్ముని నై, రావణ సితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్. ( 170 )


సీ. ధర్మసంరక్షకత్వ ప్రభావుం డయ్యు ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి

ఖర దండ నాభిముఖ్యము పొంద కుండియు ఖరదండ నాభిముఖ్యమున మెఱసి

పుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ బుణ్యజనాంతక స్ఫురణఁ దనరి

సంత తాశ్రిత విభీషణుఁడు గాకుండియు సంతతాశ్రిత విభీషణత నొప్పి


తే. మించి తనకీర్తిచేత వాసించె దిశలు, తరమె? నుతియింప రాము నెవ్వరికినైనఁ

జారుతరమూర్తినవనీశ చక్రవర్తిఁ, బ్రకట గుణసాంద్రు దశరధ రామచంద్రు. ( 171 )


వ. అట్టి రామావతారంబు జగత్పావనంబు నస్మ త్ప్రసాదకారణంబునై నుతికెక్కె. ఇంక కృష్ణావతారంబు వివరించెద వినుము. ( 172 )


సీ. తాపసోత్తమ! విను దైత్యాంసములఁ బుట్టి నరనాథు లతుల సేనాసమేతు

లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బాధల నలంచుటఁ జేసి! ధరణి వగలఁ

బొందుచు వాపోవ భూభార ముడుపుటకై హరి పరుఁడు నారాయణుండు

చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున బలరామ కృష్ణ రూపములఁ దనరి


తే. యదుకులంబున లీనమై నుదయ మయ్యె, భవ్యయశుఁడగు వసుదేవు ధార్యలైన

రోహిణియు దేవకియునను రూపవతుల, యందు నున్మ త్త దైత్యసంహారియగుచు. ( 173 ) 116

వ. ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయందన మేని కేశద్వయంబు చాలునని యాత్మప్రభావంబు దెలుపు కొఱకు నిజకళా సంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేత కృష్ణంబు లని నిర్దేశించు కొఱకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామ కృష్ణాఖ్యల నవతరించె. అందు భగవంతుడును సాక్షా ద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యు నతిమానుష కర్మంబు లాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె. అ మ్మహాత్ముండాచరించు కార్యంబులు లెక్కవెట్ట నెవ్వరికి నలవిగాదు. అయినను నాకు గోచరించి నంతయు నెఱింగించెద వినుము. ( 174 )


క. నూతన గరళ స్తని యగు, పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై

చేతనముల హరియించి ప, రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్. ( 175 )


క. వికటముగ నిజపదాహతిఁ, బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా

శకట నిశాటుని నంతక, నికటస్థునిఁ జేసెభక్త నికరావనుఁడై. ( 176 )


క. ముద్దుల కొమరుని వ్రేతల, రద్దులకై తల్లి ఱోల రజ్జునఁ గట్టన్

బద్దులకు మిన్ను ముట్టిన, మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్. ( 177 )


మ. మదిఁ గృష్ణుండు యశోద బిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర ! త

ద్వదనాంభోజములోఁ జరాచర సమస్త ప్రాణిజా తాటవీ

నది నద్యద్రి పయోధి యుక్తమగు నానాలోక జాలంబు భా

స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగఁన్. ( 178 )


చ. వర యమునానది హ్రద నివాసకుఁడై నిజవక్తృ నిర్గత

స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁజేయు భీ

కర గరళ ద్విజిహ్వుఁ డగు కాళీయ పన్నగు నా హ్రదంబుఁ జె

చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపక గోగణంబులన్. ( 179 )


మ. తనయా! గోపకు లొక్కరాతిరిని నిద్రంజెందఁ గార్చిచ్చు వ

చ్చినఁ గృష్ణా! మము నగ్ని పీడితుల రక్షింపం దగు గావవే!

యనినం గన్నులు మీరు మోడ్పుఁ డిదె దావాగ్నిన్ వెస న్నార్తు నే

నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలాగతిన్. ( 180 ) 117

క. మందుని గతి యమునాంబువు, లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా

నందుని వరుణుని బంధన, మందు నివృత్తునిఁగఁ జేసె హరి సదయుండై. ( 181 )


మ. మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృ ద్గుహ

శ్రయులంగా నొనరించి తత్ఫథము నీరంధ్రంబు గావించినన్

రయ మొప్పన్ గుటిలాసురాధమునిఁ బోరన్ ద్రుంచి గోపావళిన్

దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేత న్మాత్రమే? తాపసా! ( 182 )


క. దివిజేంద్ర ప్రీతిగ వ, ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో

త్సవమున్ హరి మాన్చిన గో, పవరులు గావింపకున్నబలరిపుఁడలుకన్. ( 183 )


తే. మంద గొందలమంద నమందవృష్టి, గ్రందుకొనుఁడంచు నింద్రుండు మంద కంపె

జండ పవన సముద్ధూత చటులవిలయ, సమయ సంవర్తకాభీల జలధరములు. ( 184 )


శా. సప్తస్కంధ శిఖాకలాప రుచిమ త్సౌదామినీ వల్లికా

దీప్తదగ్ర ముహు ర్ముహుస్స్తనిత ధాత్రీభాగ నీరంధ్రమై

సప్తాశ్వస్ఫుర దిందుమండల నభ స్సంఛాది తాశాంతర

వ్యాప్తాంభోద నిరర్గళ స్ఫుట శిలా వా:పూర ధారాళమై. ( 185 )


వ. కురియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్మలువోయి గోప గోకులం బాకులంబు నొంది కృష్ణ! కృష్ణ! రక్షింపు; రక్షింపు మని యార్తిం బొందికుయ్యిడన య్యఖండ కరుణారస సముద్రుండు భక్తజన సురద్రుముండు నగు పుండరీ కాక్షుండు. ( 186 )


శా. సప్తాబ్దంబుల బాలుఁడై నిజ భుజా స్తంభంబునన్ లీలతో

సప్తాహంబులు శైల రాజ మచల చ్చత్రంబుగాఁదాల్చి సం

గుప్త ప్రాణులఁ జేసె మాధవుఁడు గో గోపాలక వ్రాతమున్

సప్తాంభోధి పరీత భూధరున కాశ్చర్యంబె! చింతింపఁగన్. ( 187 ) 118

సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన వీథియందు

రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల జలజాక్షుఁ డొక నిశాసమయమునను

దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు దళుకొత్త రాగ భేదములఁ దనరి

ధైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమస్వరము లోలిఁ


తే. గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు, నాళ వివరాంగుళీ న్యాస లాలనమున

మహితగతిఁ బాడె నవ్యక్త మధురముగను, బంక జాక్షుండు దారువు లంకురింప. ( 188 )


మ. హరి వంశోద్గత మంజుల స్వర నినా దాహూతలై గోపసుం

దరు లేతేర ధనాధిపానుచర గంధర్వుండు గొంపోవఁ ద

త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ

బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్. ( 189 )


చ. నరక ముర ప్రలంబ యవన ద్విప ముష్టిక మల్ల కంస శం

బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్తృ వా

నర ఖర సాల్వ వత్స బక నాగ విడూరథ రుక్మి కేశి ద

ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. ( 190 )


వ. మఱియును, ( 191 )


మ. బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతం గ్రూరులన్

ఖలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో

ర్బల కేళీం దునుమాడి సర్వధరణీ భారంబు మాయించి సా

ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. ( 192 )


వ. అట్టి లోకోత్కష్డుం డైన కృష్ణుని యవతార మహాత్మ్యం బెఱింగించితి. ఇంక వ్యాసావతారంబు వినుము. ( 193 )


ఉ. ప్రత్యుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదౌ

ర్గత్యగులైన మర్త్యుల కగమ్యములై స్వకృతంబు నిత్యముల్

సత్యము నైన వేద తరుశాఖల దా విభజించి నట్టి యా

సాత్యవతేయ మూర్తియయిజాతము నొందె హరి ప్రసన్నుఁడై. ( 194 )


వ. మఱియు బుద్ధావతారంబు వినుము. ( 195 ) 119

మ. అతిలోలాత్ము ల సూనృతోక్తులును వేదాచార సంశీలు రు

ద్థత పాషాండ మతౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా

దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం

హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్దాకృతిన్ ( 196 )


వ. మఱియుం గల్క్యవతారంబు వినుము. ( 197 )


మ. వనజాక్ష స్తవ శూన్యులున్ వషడితి స్వాహాస్వధా వాక్య శో

భన రాహిత్యులు సూనృ తేతరులునుం బాషండులు న్నైన వి

ప్రనికాయంబును శూద్ర భూవిభులున్ బాటిల్లినన్ గల్కియై

జననం బంది యధర్మము న్నడఁచి సంస్థాపించు ధర్మం బిలన్. ( 198 )

వ. అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె. మునీంద్ర! పుండరీకాక్షుండంగీకరించు లీలావతార కథావృత్తాంతంబులు నే నీకు నెఱింగించు నింతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులు దీర్చె. మన్వంతరావతారంబులు నంగీకరించినవియు, నంగీకరింపం గలయవియునై యున్నవి. వర్తమానంబున ధన్వంతరి పరుశరామావతారంబులు దాల్చి యున్నవాఁడు. భావికాలంబున శ్రీరామా ద్యవతారంబుల నంగీకరింపం గలవాఁడు. అ మ్మహాత్ముండు సృష్ట్యాది కార్య భేదంబుల కొఱకు మాయా గుణావతారంబు నొందు. బహుశక్తి ధారణుండైన భగవంతుడు సర్గంబునం దపంబును, ఏనును, ఋషి గణంబులును, నవప్రజాపతులును నై యవతరించి విశ్వోత్పాదనంబు గావించు. ధర్మంబును , విష్ణుడును, యజ్ఞంబులును, మనువులును, ఇంద్రాది దేవగణంబును ధాత్రీపతులునై యవతరించి జగంబుల రక్షింపుచుండు. అధర్మంబును రుద్రుండును, మహోరగంబులును, రాక్షాసానీకంబులు నై విలయంబు నొందించు. ఇత్తెఱంగునం బరమేశ్వరుండును, సర్వాత్మకుండు నైన హరి విశ్వోత్పత్తిస్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. ధరణీరేణువులైన గణుతింప నలవియగుం గాని యమ్మహాత్ముని లీలావతారాద్భుత కర్మంబులు లెక్క వెట్ట నెవ్వనికి నశక్యంబై యుండు. నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి. సవిస్తరంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదు. అన్యులం జెప్పనేల? వినుము. 199 120

చ. అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన య మ్మహితాత్ము పాద వే

గమున హతంబులైన త్రిజగంబుల కావల నొప్పు సత్యలో

కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప

ద్మము తుదినున్న యప్రతిహతంబగు శక్తి గణింప శక్యమే! ( 200 )


మ. హరి మాయాబల మే నెఱుంగ నఁట శక్యంబే! సనందాది స

త్పురుష వ్రాతము కైన బుద్ధి నిరతంబున్ మాని సేవాధిక

స్ఫురణం ద చ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుం

దరతన్ బొల్పగు శేషుఁడు న్నెఱుఁగ డన్నన్ జెప్పలే రొండొరుల్. ( 201 )


చ. ఇతరము మాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా

శ్రిత జన సేవితాంఘ్ర సరసీరుహుఁ డైన సరోజనాభుఁ డం

చిత దయతోడ నిష్కపట చిత్తమునం గరుణించు నట్టి వా

రతుల దురంతమై తనరు న వ్విభు మాయఁ దరింతు రెప్పుడున్. (202 )


వ. మఱియును సంసారమగ్నులై దివసంబులు ద్రొబ్బి యంతంబున శునక సృగాల భక్ష్యంబు లైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములు గొందఱు గలరు, ఎఱింగింతు వినుము. ఏను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి య మ్మహాత్ము పారారవిందంబుల భక్తి నిష్ఠుండనై, శరణాగతత్వంబున భజించు నప్పుడు దెలియదు. రాజసగుణుండనై తెలియఁజాల. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తి జ్ఞానయోగంబున సేవింతు. మఱియు (సనకాదులగు) మీరును, భగవంతుడైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువ మనువును, అతని పత్ని యగు శతరూపయు, దత్పుత్రులగు (ప్రియవ్రతోత్తానపాదులను) వారలును, దత్పుత్రికలు, ప్రాచీనబర్హియు ఋభువును, వేనజనకుండగు నంగుండును, ధ్రువుండును గడవం జాలుదురు వెండియు. ( 203)


సీ. గాధి గయాదు లిక్ష్వాకు దిలీప మాం ధాతలు భీష్మ యయాతి సగర

రము ముచుకుం దైళ రంతిదే వోద్ధవ సారస్వ తోదంక భూరిషేణ

శ్రుతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శిబి పార్ధ విదురు

లంబరీష పరాశ రాలర్క దేవల సౌభరి మిథిలేశ్వ రాభిమన్యు 121

తే. లాష్ణిషేణాదు లైన మహాత్ము లెలమిఁ, దవిలి య ద్దేవు భక్తిఁ జిత్తముల నిలిపి

తత్పరాయణ భక్తి దుర్దాంతమైన, విష్ణుమాయఁ దరింతురు విమలమతులు. ( 204 )


మ. అనఘా వీరల నెన్న నేమిటికిఁ? దిర్య గ్జంతు సంతాన ప

క్షి నిశాటాటవి కాఘజీవ నివహ స్త్రీ శూద్ర హూణాదులై

నను నారాయణ భక్తియోగ మహితానందాత్ములై రేని వా

రనయంబున్ దరియింతు రవ్విభుని మాయావైభ వాంభోనిధిన్. ( 205 )


వ. కావున. ( 206 )


క. శశ్వ త్ప్రశాంతు నభయుని, విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్

శాశ్వతుసము సదసత్పరు, నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్ర! ( 207 )


వ. అట్లైన న ప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందం

జాలక వైముఖ్యంబునం దవ్వుదవ్వులఁ దలంగిపోవు మఱియు. ( 208 )


చ. హరిఁబరమాత్ము న చ్యుతు ననంతునిఁ జిత్తములోఁ దలంచి సు

స్థిరత విశోక సౌఖ్యముల జెందిన ధీనిధు లన్య కృత్యముల్

మఱచియుఁ జేయ నొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుఁడుం

బరువడి నుయ్యి ద్రవ్వుచు నిపాన ఖనిత్రము మానుకై వడిన్. ( 209 )


ఉ. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుఁడు సర్వశక్తుఁడున్

సర్వ జగ త్పృసిద్ధుఁడును సర్వగతుం డగు చక్రపాణి యీ

సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై

పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. (210)


ఉ. కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె

వ్వారును లేరు తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (211) 122

మ.నిగమార్ధ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్ర్తరా

జి గరిష్ఠంబగు నీ పురాణకధ సంక్షేపంబుగాఁ జెప్పితిన్

జగతి న్నీవు రచించు దీని నతివిస్తారంబుగాఁ బుత్రకా! (212)


చ.పురుషభవంబు నొందుట యపూర్వము జన్మములందు నందు భూ

సురకులమందుఁ బుట్టు టతిచోద్యమ యి ట్లగుటన్ మనుష్యుల

స్థిరమగు కార్యదుర్ధశల చేత నశింపక విష్ణుసేవనా

పరతఁ దనర్ఛి నిత్యమగు భవ్యపదంబును నొందు టొప్పదే! (213)


మ.ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా

జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర ద

చ్చపు భక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా

ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతని నర్ధిం గొల్వలేకుండినన్ (214)


క.వనజాక్షు మహిమ నిత్యము, వినుతింపుచు నొరులు వొగడ వినుచు న్మదిలో

ననుమోదింపుచు నుండెడి, జనములు ద న్మోహవశతఁ జనరు మునీంద్రా! (215)


క.అని వాణీశుఁడు నారద, మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకధా సూ

చన మతి భక్తిఁ బరీక్షి, జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు సెప్పెన్. (216)

అధ్యాయము - 8

పరీక్షిత్తుఁడు శుకునిఁ బ్రపంచోద్భవాదికం బడుగుట

సీ. విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను మునినాధ! దేవదర్శనము గలుగఁ

నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱింగించిన తెఱఁగు సత్కృప దలిర్ప

గణుతింప సత్త్వాది గుణశూన్యుఁ డగు హరి కమలాక్షు లోకమంగళము లైన


కధలు నా కెఱింగింపఁ గైకొని నిస్సంగ మైన నా హృదయాబ్జమందుఁ గృష్ణు


తే.భవ్యచరితుని నాద్యంత భావశూన్యూఁ, జిన్మయాకారు ననఘు లక్మ్షీసమేతు

నిలిపి యస్థిర విభవంబు నిఖిల హేయ భాజనం బైన యీ కళేబరము విడుతు. (217) 123

వ.అదియునుంగాక యెవ్వండు శ్రద్ధా భక్తి యుక్తుండై కృష్ణు గుణకీర్తనంబులు వినుంచు బలుకుచుండునట్టివాని హృదయపద్మంబుసందుఁ గర్ణ రంధ్రమార్గంబునఁ బ్రవేశించి, కృష్ణుండు విశ్రమించి,సలిలగతం బైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబయిన మాలిన్యంబు నపకర్షించుఁ గావున. (218)


మ.భరితోదగ్ర నిదాఘతప్తుఁ డగు న ప్పాంధుం డరణ్యాది సం

చరణ క్లేశ సముద్బవం బగు పిపాసం జెంది యాత్మీయ మం

దిరముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనం బోని భం

గి రమాధీశు పదారవింద యుగ సంగీభూతుఁడై మానునే! (219)


వ.అదియునుం గాక సకల భూతసంసర్గ శూన్యంబైన యాత్మకు భూతసంగమం

బే ప్రకారంబునం గలిగె? అది నిర్ణి మిత్తంబునం జేసియో, కర్మంబునం జేసియో యా క్రమంబు నా కెఱిఁగింపుము. (220)


సీ.ఎవ్వని నాభియం దెల్ల లోకాంగ సంస్దాన కారణ పంకజంబు వొడమె

నం దుదయించి సర్వావయవ స్పూర్తిఁ దనరారునట్టి పితామహుండు

గణఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూతముల సృజించె నుత్కంఠతోడ

నట్టి విధాత యే యనువున సర్వేశు రూపంబు గనుఁగొనె రుచిర భంగి


తే.నా పరంజ్యోతియైన పద్మాక్షునకును, నళినజునకుఁ బ్రతీక విన్యాస భావ

గతులవలనను భేదంబు గలదె చపుమ?, యతి దయాసాంద్ర! యోగికు లాబ్ధిచంద్ర! (221)


వ.మఱియును భూతేశ్వరుం డైన సర్వేశ్వరుం డుత్పత్తిస్దితి లయ కారణం బైన తన మాయను విడిచి మాయా నియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె (నదియునుం గాక

పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు గల్పితంబులయ్యె ననియు లోకంబులు పురుషావయవంబు లనియుఁ జెప్పం బడియె). అదియునుంగాక

మహాకల్పంబులును నవాంతర కల్పంబులును *భూత భవిష్య ద్వర్తమాన కాలంబులును) స్ధూల దేహాభిమానులై జనియించిన దేవ పితృ మనుష్యాదులకుం గలుగు నాయుః ప్రమాణంబును,

(బృహత్సూక్ష్మ) కాలానువర్తనంబును నే యే కర్మంబులం జేసి జీవు లే యే లోకంబుల నొందుదురు? మఱియు నే యే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతురు? అట్టి కర్మమార్గ

ప్రకారంబున, 124

(సత్త్వాది గుణంబుల) పరిణామంబులగు దేవాది రూపంబులఁగోరు జీవులకు నేయే కర్మసముదాయం బేట్టు సేయందగు? ఎవ్వనికి నర్పింపం దగు? అవి యెవ్వనిచేత గ్రహింపంబడు?

భూ పాతాళ కకు బ్వ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులను,సరి త్సముద్ర ద్వీపంబులను, నే ప్రకారంబున సంభవించె? ఆ యా స్థానంబులం గల వారి సంభవంబు లేలాటివి? బాహ్యాభ్యంతరంబులం గలుగు

బ్రహ్మాండ ప్రమాణం బెంత? మహాత్ముల చరిత్రంబులెట్టివి? వర్ణాశ్రమ వినిశ్చయంబులును, యుగంబులును, యుగప్రమాణంబులును, యుగధర్మంబులును, ప్రతియుగమందును మనుష్యుల కే యే

ధర్మంబు లాచరణీయంబు (లగు నట్టి) సాధారణ ధర్మంబులునుఁ, జాతివిశేష ధర్మంబులును, రాజర్షి ధర్మంబులును ఆపత్కాల జీవన ఆధ్న భూతంబు లగు ధర్మంబులును, మహదాది తత్వంబుల

సంఖ్యయును, సంఖ్యా లక్షణంబును, ఆ తత్వంబులకు హేతుభూత లక్షణంబులును, భగవ త్సమారాధన విధంబును, అష్టాంగ యోగ క్రమంబును, యోగీశ్వరుల యణిమా ద్యైశ్వర్య ప్రకారంబును,

వారల యర్చిరాది గతులును, లింగ శరీర విలయంబును, ఋ గ్యజు స్సామాధర్వ వేదంబులును, ఉపవేదంబు లయిన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును, నితిహాస పురాణంబుల

సంభవంబును, సర్వభూతంబుల యవాంతర ప్రళయంబును, స్థితి మహాప్రళయంబులును, నిష్టాపూర్తంబు లను యాగాది వైదిక కర్మజాలంబును, వాపీకూప తటాక దేవాలయాది నిర్మాణంబు

లన్నదానం బారామప్రతిష్ఠ మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్ని హోత్రంబుల యనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియను, ధర్మార్ధకామంబులనియెడు త్రివర్గాచరణ ప్రకారంబును,

మలినోపాధికపాషండ సంభవంబును, జీవాత్మ బంధ మోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వ స్వతంత్రుండైన యీశ్వరుం డాత్మమాయం జేసి సర్వ కర్మ సాక్షి యై క్రీడించుటయును,

మఱియు మాయ నెడఁబాసి యుదాసీనగతి విభుండై క్రీడించు తెఱంగు మొదలగు సమస్తము క్రమంబున నాపన్నుండ నైన నాకు నెఱింగింపుము. బ్రాహ్మణ శాపంబున జేసి, శోక వ్యాకులిత

చిత్తుండవై యనశనవ్రతుండ వైన నీవు వినుట యెట్లని సందేహింప వలవదు. త్వదీయ ముఖారవింద వినిస్స్రుతనారాయణ కథామృతపాన కుతూహలి నైన నాకు నింద్రియంబులు వశంబులైయుండు.

అది గావున నే నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు 125

సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్ధునిఁ జేయఁ బరమేష్ఠితుల్యుండ వగు నీవపూర్వ సంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని

విష్ణురాతుండైన పరీక్షిన్నరేంద్రుడు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మ నారద సంవాదంబును, నేక సంప్రదాయానుగతంబును, గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు

బ్రహ్మకల్పంబున బ్రహ్మ కుపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను మని చెప్పెనని సూతుండు శౌనకాది మునులకుంజెప్పినట్లు శుక యోగీంద్రుండు పరీక్షి నారేంద్రున

కిట్లనియె. ( 222 )

అధ్యాయము - 9

సీ. భూపాళకోత్తమ! భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుం డైన యట్టి

ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వర మాయలేక

కలుగదు, నిద్రవోఁ గలలోనఁ దోఁచిన దేహబంధంబుల తెఱఁగు వలెను

హరి యోగమాయా మహత్త్వంబునం బాంచభౌతిక దేహ సంభంధుఁ డగుచు


తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవన భావములనుఁ

నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను, నాయ దిది యను సంసార మాయదగిలి. (223)

వ. వర్తింపు చిట్లున్న జీవునికి భగవ ద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీత మయిన బ్రహ్మస్వరూపంబు నందు మహిత ధ్యాననిష్టుం డగు నప్పుడు

విగత మోహుండై యహంకార మమకారాత్మ కంబైన సంసరణంబు దొఱంగి ముక్తుండై యుండు. మఱియు జీవేశ్వరులకు దేహసంబంధంబులు గానంబడుచుండు. అట్టి దేహధారియైన

భగవంతునందు భక్తిం జేసి జీవుని ముక్తి యే తఱంగునం గలుగు నని యడిగితివి. జీవుం డవిద్యా మహిమంజేసి కర్మానుగతం బైన మిధ్యారూప దేహసంబంధుండు. భగవంతుండు నిజ

యోగమాయా మహిమంజేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్ఘన లీలా విగ్రహుండు. కావున భగవంతుండైన యీశ్వరుండు స్వ భజనంబు ముక్తిసాధన జ్ఞానార్దంబు కల్పితం బని చతుర్ముఖునకుఁ దదీయ

నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజజ్ఞానానందఘనమైన స్వరూపంబు సూపుచు నానతిచ్చె. అది గావున జీవునికి భగవద్భక్తి మోక్ష ప్రదాయకం బగు. ఇందుల కొక యితిహాసంబు గల దెఱింగింతు.

ఆకర్ణింపుము. దాన భవదీయ సంశయ నివృత్తి యయ్యెడు నని శుకయోగీంద్రుడు రాజేంద్రున కిట్లనియె. (224) 126

బ్రహ్మ తపంబునకు మెచ్చి శ్రీమన్నారాయణుఁడు వరంబిచ్చుట

సీ. హరి పాదభక్తి రహస్యోపదేష్టయు నఖిల దేవతలకు నదివిభుండు

నైన విధాత గల్పాదియుందును నిజాశ్రయ పద్మమున కధిష్టాన మర య

నర్థించి జలముల నన్వేషణము సేసి నళినంబు మొదలు గానంగలేక

విసివి క్రమ్మఱను ద ద్బిసరుహాసీనుఁడై సృష్టి నిర్మాణేచ్ఛఁ జిత్తమందుఁ


తే. జాల నూహించి తత్పరిజ్ఞాన మహిమ, సరణి మనమునఁ దోఁపక జడను పడుచు

లోకజాలంబు పుట్టింపలేక మోహి, తాత్ముఁడై చింతనొందు న య్యవసరమున. (225)


వ. జలమధ్యంబుననుండి యక్షర సమామ్నా యంబున స్పర్శంబులందు షోడశాక్షరంబు మఱియు నేక వింశాక్షరంబు నైన నీ యక్షర ద్వయంబు వలన నగుచు, మహాముని జన ధనంబైన తప యను

శబ్దంబు రెండు మాఱు లుచ్చరింపంబడి వినంబడిన,నట్టి శబ్దంబు వలికిన పురుషుని వీక్షింపం గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలి నిజస్ఠానం బైన పద్మంబునం దాసీనుండై

యొక్కించుక చింతించి యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలఁచి, ప్రాణాయామ పరాయణుండై, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్ర చిత్తుండె, సకలలోక

సంతాప హేతువైన తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడచూపిన, నా కమలసంభవుండు దత్క్షణంబు రాజస, తామస మిశ్ర సత్త్వగుణాతీతంబును, శుద్ధ

సత్త్వగుణావాసంబును, అకాల విక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహ భయవిరహితంబును, అపునరావృత్తి మార్గంబును, అనంత తేజో విరాజితంబును నైన

వైకుంఠపురంబుఁ బొడగని యందు. (226)


సీ. సూర్య చంద్రానల స్ఫురణలఁ జొరనీక నిజ దీధితి స్ఫూర్తి నివ్వటిల్ల

దివ్య మణిప్రభా దీపిత సౌధ విమాన గూపుర హర్మ్య మండపములు

ప్రసవ గుచ్ఛ స్వచ్ఛ భరిత కామిత ఫలసంతాన పాదప సముదయములు

కాంచన దండ సంగత మారు తోద్ధూత తరళ విచిత్ర కేతన చయములు

తే. వికచ కైరవ దర దరవింద గత మ, రందరస పాన మోది తేందిందిర ప్రభూత

మంజుల ని సద ప్రబుద్ధ రాజ, హంస శోభిత వర కమలాకరములు. (227) 127

సీ. వలనొప్పఁగా "నదైవం కేశవా త్పరం" బని పల్కు రాజ కీరావళియును

మహిమ "సర్వం విష్ణుమయము జగత్త"ని చదివెడు శారికా సముదయంబు

నేపారఁగా "జితం తే పుండరీకాక్ష!" యని లీలఁ బాడు పికావళియును

లలి మీఱఁగా "మంగళం మధుసూదన" యని పల్కు కేకు లనారతంబు


తే. తవిలి శ్రౌషడ్వష ట్స్వధేత్యాది శబ్ద, కలితముగ మ్రోయు మధుప నికాయములను

గలిగి యఖిలైక దివ్యమంగళ విలాస, మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు. (228)


వ. మఱియుం బయోధరావళీ విభాసిత నభంబుం బోలె వెలుంగుచున్న య ద్దివ్య ధామంబునందు. (229)


సీ. సలలి తేందీవర శ్యామాయమాణోజ్జ్వలాంగులు నవ్య పీతాంబరులును

ధవ ళారవింద సుందర పత్రనేత్రులు సుకుమార తనులు భాసుర వినూత్న

రత్న విభూషణ గైవేయ కంకణహార కేయూర మంజీర ధరులు

నిత్య యౌవనులు వినిర్మల చరితులు రోచిష్ణులును హరిరూప ధరులు


తే. నగు సునందుండు నందుండు నర్హణుండు, ప్రబలుఁడును మొదలగు నిజపార్శ్వచరులు

మఱియు వైడూర్యవిద్రుమామలమృణాళ తుల్యగాత్రులుఁదను భక్తితోభజింప. (230)


సీ. క్షాళి తాఖిల కల్మషవ్ర జామరనదీజనక కోమల పదాబ్జములవాని

నఖిల సంప త్కారుణాపాంగ లక్ష్మీ విలాసిత వక్షస్ధ్సలంబు వానిఁ

బద్మమిత్రామిత్ర భాసిత కరుణా తరంగిత చారు నేత్రములవాని

భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభి పంకజము వాని


తే. నహిహితాహిత శయన వాహములవాని, సేవి తామర తాపస శ్రేణివాని

నఖిల లోకంబులకు గురుండైన వానిఁ గాంచెఁ బరమేష్ఠి కన్నుల కఱవు దీఱ. (231)


క. కమనీయ రూప రేఖా, రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య

క్కమలాలయ దన మృదు కర, కమలంబుల విభుని పాదకమలము లొత్తన్. (232) 128

వ. వెండియు. (233)

శా. శ్రీ కాంతాతిలకంబు రత్న రుచి రాజి ప్రేంఖిత స్వర్ణ డో

లాకేళిన్ విలసిల్లిత త్కచ భరాలం కార స్రగ్గంధ లో

భాకీర్ణ ప్రచర న్మధువ్రత మనో జ్ఞాలోల నాదంబు ల

స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. (234)


వ. అట్టి నిత్యవిభూతియందు. (235)


మ. సతత జ్ఞాన రమా యశో బల మహైశ్వర్యాది యుక్తుం జగ

త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళ త్పంకేరుహాక్షుం శ్రియః

పతి నాద్యంత వికార దూరుఁ గరుణా పాథోనిధిన్ సాత్త్వతాం

పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్. (236)


మ. దరహా సామృత పూరితాస్యు నిజభక్త త్రాణ పారాయణు

న్న రుణాంభోరుహ పత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం

దరు మంజీర కిరీట కుండల ముఖోద్య ద్భూషు యోగీశ్వరే

శ్వరు లక్ష్మీయుత వక్షుఁ జిన్మయు దయాసాంద్రున్ చతుర్బాహునిన్. (237)


వ. మఱియు (ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండు సునంద నంద కుముదాది సేవితుండు) ప్రకృతి పురుష మహా దహంకారంబులను చతుశ్శక్తులును, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశ శక్తులును, పంచన్మాత్రలును, పరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయండును, (స్వ స్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండు నైన) పరమపురుషుం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానంద కందళిత హృదయారవిందుండు, రోమాంచ కంచుకిత శరీరుండు, నానంద బాష్పధారాసిక్త కపోలుండు నగుచు. (238)


క. వర పరమహంస గమ్య, స్ఫురణం దనరారు పరమ పురుషుని పద పం

కరుహములకు నజుఁడు చతు, శ్శిరముల సోఁకంగ నతులు సేసిన హరియున్. (239) 129

చ. ప్రియుడగు బొడ్డుతమ్మి తొలి బిడ్డని, వేలుపు పెద్ద, భూత సం

చయములఁ బుట్టఁజేయు నిజ శాసనపాత్రు, నుపస్థితున్, మదిన్

దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమద స్మిత చారు ముఖారవిందుఁడై

నయమునఁ బాణింపక జమునన్ హరి యాతని దేహ మంటుచున్. (240)


ఆ. కపట మునుల కెంత కాలంబునకు నైన, సంతసింప నేను జలగర్భ!

చిర తప స్సమాధిఁ జెంది విసర్గేచ్చ మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని. (241)


తే. భద్ర మగుఁ గాక నీకు నో పద్మగర్భ! వరము నిపుడిత్తు నెఱిఁగింపు వాంఛితంబు

దేవదేవుఁడ నగు నస్మదీయ పాద, దర్శనం బవధి విపత్తి దశల కనషు! (242)


చ. సరసిజగర్భ ! నీయెడఁ బ్రసన్నత నొంది మదీయ లోక మే

నిరవుగఁ జూపు టెల్లను సహేతుక భూరి దయాకటాక్ష వి

స్ఫురణను గాని నీదగు తపో విభవంబునఁ గాదు నీ తప

శ్చరణము నాదు వాక్యముల సంగతిఁ గాదె ! పయోరుహాసనా ! (243)


క. తప మనఁగ నాదుహృదయము, దప మను తరువునకు ఫల వితానము నే నా

తపముననే జననస్థి, త్యుపసంహారణము లొనర్చుచుండుదుఁ దనయా ! (244)


క. కావున మ ద్భక్తికిఁ దప, మే విధమున మూలధనమొ యిది నీ మది రా

జీవభవ ! యెఱిఁగి తప మిటు, కావించుట విగత మోహకర్ముఁడ వింకన్. (245)


క. అని యానతిచ్చి కమలజ, యెనయఁగ భవదీయ మాన సేప్సిత మే మై

నను నిత్తు వేఁడు మనినను, వనరుహసంభవుఁడు వికచవదనుం డగుచున్. (246)

చ. హరి వచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁడో

పరమ పదేశ ! యోగిజన భావన ! యీ నిఖి లోర్వియందు నీ

వరయనియట్టి యర్థ మొక టైనను గల్గునె ? యైన నా మదిన్

బెరసిన కోర్కె దేవ ! వినుపింతు దయామతి చిత్తగింపవే. (247) 130

వ. దేవా! సర్వ భూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద నవధరింపుము. అవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష రూపంబులును, నానా

శక్త్యుపబృంహితంబు లైన బ్రహ్మాదిరూపంబులును, నీయంత నీవే ధరియించి జగ దుత్పత్తి స్థితి లయంబులం దంతుకీటంబునుం బోలెం గావింపుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు

మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృపసేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహ దహంకారంబులు నా మదిం

బొడముం గావునం దత్పరిహారార్ధంబు వేఁడెద. నన్నుం గృపాదృష్టి విలోకించి దయసేయు మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. (248)


క. వారిజభవ ! శాస్తార్ధవి, చారజ్ఞానమును, భక్తి, సమధిక సాక్షాత్కారము

లను నీ మూఁడు ను, దాతర నీ మనమునందు ధరియింప నగున్. (249)


సీ. పరికింప మత్స్వరూప స్వభావములును మహి తావతార కర్మములుఁ దెలియు

తత్త్వవిజ్ఞానంబు దలకొని మత్ర్పసాదమునఁ గల్గెడి నీకుఁ గమలగర్భ!

సృష్టి పూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ గలిగియుండుదు వీతకర్మి నగుచు

సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములుఁ దత్కారణ ప్రకృతియుఁ దగ మ దంశ


ఆ. మందు లీనమైన నద్వితీయుండనై, యుండు నాకు నన్య మొకటి లేదు

సృష్టికాలమందు సృష్టినాశంబున, జగము మత్స్యరూప మగును వత్స! (250)


క. అరయఁగఁ గల్ప ప్రళాయం. తరము ననాద్యంత విరహిత క్రియతోడన్

బరిపూర్ణ నిత్య మహిమం, బరమాత్ముఁడనై సరోజభవ ! యే నుందున్. (251)


వ. అదియునుంగాక నీవు న న్నడిగిన యీ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు. లేని యర్థంబు శుక్తి రజత భ్రాంతియుం బోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱం దోఁచక మాను నిదియె నా మాయా విశేషం బని యెఱుంగుము. ఇదియునుం గాక లేని యర్థంబు దృశ్యం బగుటకుం, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును, తమః ప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియుము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబు 131

లైన సర్వకార్యంబులందు, సత్త్వాది రూపంబులం బ్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులయందుఁ గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొందిన నాయందు నభివ్యక్తంబులై యుండవు. సర్వ దేసంబులయందు సర్వకాలంబులయందు నేది భోధితంబై యుండు, నట్టిదే పరబ్రహ్మ స్వరూపంబు, తత్త్వం బెఱుంగ నిచ్ఛయించిన మిముఁ బోఁటి వారలీ చెప్పినది మదీయ తత్త్వత్మకంబైన యర్థంబని యెఱుంగదురు. ఈ యర్థం బుత్కృష్టం బైనయది. ఏకాగ్రచిత్తుండవై యాకర్ణించి భవదీయ చిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబులయందు మోహంబు చెందకుండెడి. అని భగవంతుండైన పరమేశ్వరుండు చతుర్ముఖున కాజ్ఞాపించి నిజలోకంబుతో నంతర్ధానంబు నొందె. అని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. (252)


సీ. అవనీశ బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ బుండరీకాక్షుని బుద్ధి నిలిపి

యానందమును బొంది యంజలి గావింవి తత్పరిగ్రహమునఁ దనదు బుద్ధి

గైకొని పూర్వప్రకారంబునను సమస్తప్రపంచం బెల్లఁదగ సృజించి

మఱియొకనాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు నఖిల ప్రజాపతి యైన కమల


తే. గర్భుఁ డాహితార్థమైకాక సకల, భువనహిత బుద్ధి నున్నత స్ఫురణ మెఱసి

మానితంబైన యమ నియమముల రెంటి, నాచరించెను సమ్మోదితాత్ముఁడగుచు. (253)


వ. అ య్యవసరంబున, (254)


క. ఆ నళినాసననందను, లైన సనందాది మునుల కగ్రేసరుండున్

మానుగఁ బ్రియతముఁడును నగు, నా నారదుం డేఁగుదెంచె నబ్జజు కడుకున్. (255)


క. చనుదెంచి తండ్రికిం బ్రియ, మొనరఁగ శుశ్రూషణంబు లొనరిఁచి యతుఁడున్

దనదెసఁ బ్రసన్నుఁడగుటయుఁ, గని భగవ న్మాయఁ దెలియఁగా నుత్సుకుఁడై. (256)


సీ. అవనీశ! నీవు నన్నడిగినపగిది నతఁడు దండ్రి నడుగఁ బితామహుండు

భగవంతుఁ డాశ్రిత పారిజాతము హరి గృపతోడఁ దన కెఱిఁగించినట్టి

లోకమంగళ చతుః శ్లోక రూపంబును దశ లక్షణంబులఁ దనరు భాగవతము

నారదున కున్నతిఁ జెప్పె నాతఁడు చారు సరస్వతీ తీరమునను 132

తే. హరిపద ధ్యాన పారీణుఁ డాత్మవేది, ప్రకట తేజస్వి యగు బాదరాయణునకుఁ

గోరి యెఱిఁగించె నమ్మహోదారుఁడెలిమి, నాకు నెఱిఁగించె నెఱిఁగింతు నీకు నేను. (257)


వ. అదియుంగాక యిపుడు విరాట్పురుఘనివలన నీ జగంబు లే విధంబున జనియించె, ననియెడి మొదలైన కొన్ని ప్రశ్నలు నన్నడిగితివి. ఏను నన్నింటికి నుత్తరం బగునట్లుగా నమ్మహాభాగవతం

బుపన్యసించెద. ఆకర్ణింపుము. (258)

అధ్యాయము - 10

వ. అ మ్మహాపురాణంబు చతుఃశ్లోక రూపంబున దశ లక్షణంబుల సంకుచిత మార్గంబుల నొప్పు. అందు దశ లక్షణంబు లెయ్యవి? యనిన సర్గంబును, విసర్గంబును, స్ధానంబును,

పోషణంబును, ఊతులను, మన్వంతరంబులును, ఈశానుచరితంబును, ముక్తియు, నాశ్రయంబు ననం బది తెఱంగులయ్యె. దశమవిశుద్ధ్యర్ధంబు తక్కిన తొమ్మిది లక్షణంబులు

సెప్పంబడె అవి యెట్టి వనిన, (259)


తే. మహ దహంకార పంచ తన్మాత్ర గగన, పవన శిఖ తోయ భూ భూతపంచకేంద్రియ

ప్రపంచంబు భగవంతునందు నగుట, సరమందురు దీనిని జనవరేణ్య! (260)


క. సరసిజగర్భుండు విరా, ట్పురుషునివలనం జనించి భూరితర చరా

చర భూతసృష్టిఁ జేయుట, పరువడిని విసర్గ మండ్రు భరతకులేశా ! (261)


క. లోకద్రోహి నరేంద్రా, నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా

వైకుంఠ నాథు విజయం, బాకల్పస్థాన మయ్యె నవనీనాథా! (262)


క. హరి సర్వేశుఁ డనంతుడు, నిరుపము శుభమూర్తి చేయు నిజభక్తజనో

ద్ధరణము పోషణ మవనీ, వర ! యూతు లనంగ గర్మవాసన లరయన్. (263)


తే. జలజనాభ దయాకటాక్ష ప్రసాద, లబ్ధి నిఖిలైక లోకపాలన విభూతి

మహిమఁబొందిన వారి ధర్మములు విస్తరమునఁ బలుకుట మన్వంతరములుభూప! (264)


క. వనజోదరు నవతార క, థనము దదీ యాను వర్తి తతి చారిత్రం

బును విస్తరించి పలుకం, జను నవి యీశాను కథలు సౌజన్యనిధీ ! (265) 133

సీ. వసుమతీనాథ! సర్వస్వామియైన గో, విందుండు చిదచి దానందమూర్తి

సలలిత స్వోపాధి శక్తిసమేతుఁడై తనరారు నాత్మీయ ధామమందు

ఫణిరాజు మృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి నున్న వేళ

నఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబు లురలుకొనగఁ


తే. జరగు నయ్యవస్థా విశేషంబు లెల్ల, విదిత మగునట్లు వలుకుట యది నిరోధ

మన నిది యవాంతరప్రళయం బనంగఁ, బరఁగునిఁక ముక్తిగతి విను పార్థివేంద్ర. (266)


సీ. జీవుండు భగవత్కృపా వశంబునఁ జేసి దేహ ధర్మంబులై ధృతి ననేక

జన్మానుచరిత దృశ్యము లైన య జ్జరా మరణంబు లాత్మధర్మంబు లైన

ఘన పుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వసంచితము లైన

యపహత పాప్మవత్త్వా ద్యష్టతద్గుణ వంతుఁడై తగ భగవ చ్ఛరీర


తే. భూతుఁడై పారతంత్య్రాత్మ బుద్ధి నొప్పి, దివ్యమా ల్యానులేపన భవ్యగంధ

కలిత మంగళ దివ్యవిగ్రహవిశిష్టుఁ, డగుచు హరిరూపమొందుటే యనుఘ! ముక్తి. (267)


వ. మఱియు నుత్పత్తి స్థితి లయంబు లెందు నగుచుఁ బ్రకాశింపఁబడు నది యాశ్రయంబనంబడు. అదియ పరమాత్మ. బ్రహ్మశబ్ద వాచ్యంబు నదియ. ప్రత్యక్షాను భవంబున విదితంబు

సేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె. అది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులఁ ద్రివధంబయ్యె. అందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళ

కాంతర్వర్తియై యెఱుంగంబడు. చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుండనం దగు. చక్షురాద్యధిష్ఠా నాభిమాన దేవతయు, సూర్యాది తేజోవిగ్రహుండు న్గుచు నెవ్వని

యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండు, విరాడ్వి గ్రహుండు నగుం గావున, ద్రష్టము దృక్కు దృశ్యంబు ననందగు మూఁటి యందు నొకటి లేకున్న నొకటి

గానరాదు. ఈ త్రితయంబు నెవ్వఁ డెఱుంగునతండు సర్వలోకాశ్రయుండై యుండు. అతండె పరమాత్మయు. అ మ్మహాత్ముండు లీలర్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు

నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వ సృష్టం బగు నేకార్ణ వాకారం బైన జలరాశి యందు శయనంబు

సేయుటం జేసి. 134

శ్లోకము. ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః

తా య ద స్యాయనం పూర్వం తేన నారాయణ స్స్మృతః.

అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు. ఉపాదానభూతంబైన ద్రవ్యంబును, ద్రివిధంబైన కర్మంబును, గళా కాష్ఠా ద్యుపాధి

భిన్నంబైన కాలంబును, జ్ఞానాధికంబగు జీవస్వభావంబును, భోక్తయగు జీవుండును, నెవ్వని యనుగ్రహంబునంజేసి వర్తింపుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల

సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబు గాఁదలంచి యోగతల్పంబునం బ్రబుద్ధుండై యుండు. అట మీఁద స్వ సంకల్పంబునం జేసి తన హిరణ్మయంబైన విగ్రహంబు నధిదైవంబు

నధ్యాత్మకంబు నధిభూతంబు నను సంజ్ఞాయుతంబైన త్రివిధంబుగా సృజియించె. (268)


సీ.అట్టి విరా డ్వీగ్రహాంత రాకాశంబు వలన నోజ స్సహోబలము లయ్యెఁ

బ్రాణంబు సూక్ష్మరూప క్రియాశక్తిచే జనియించి ముఖ్యాసు వనఁగఁ బరఁగె

వెలుపడి చను జీవి వెనుకొని ప్రాణముల్ చనుచుండు నిజనాథు ననుసరించు

భటుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మఱి ముఖము వలనఁ


తే. దాలుజిహ్వాదికంబు లుద్భవము నొందె, నందు నుదయించె జిహ్వయునందు రసము

లెల్లనుదయించె జిహ్వచే నెఱుఁగఁబడును,మొనసిపలుకనపేక్షించుముఖమువలన. (269)


వ. (మఱియు) వాగింద్రియంబు పుట్టె.దానికి దేవత యగ్ని. (ఆ రెంటివలన భాషణంబు వొడమె. ఆ యగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధంబు గలుగుటంజేసి యా జలంబె

ప్రతిబంధకం బయ్యె) దోదూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెం గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థం బయ్యె. (నిరాలోకం బగు నాత్మ నాత్మ

యందుఁ జూదంగోరి) తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షి యుగళంబు పుట్టె. ఋషిగణంబుచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును

నైన శ్రోత్రేంద్రియంబు పుట్టించె. సర్జనంబు సేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులు, లఘుత్వ గురుత్వంబులు, నుష్ణత్వ 135

శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రి యాదిష్ఠానంబగు చర్మంబు

పుట్టె. దానివలన రోమంబు లుదయించె. వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె. అందు నధిగత స్పర్శ గుణుండును అంతర్బహిఃప్రదేశంబుల నావృతుండును నగు వాయువు వలన

(బలవంతంబులు నింద్రదేవతాకంబులు నాదాన సమర్థంబులు నానాకర్మ కరణ దక్షంబులు నగు హస్తంబు లుదయించె.) స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు నీశ్వరునివలన విష్ణుదేవతాకంబులగు

పాదంబు లుదయించె. ప్రజానందామృతార్థి యగు భగవంతుని వలనఁ బ్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె. మిత్రుండధిదైవ

తంబుగాఁ గలిగి భుక్తాన్న ద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె. దాని కృత్యం బుభయ మల మోచనంబు, దేహంబున నుండి దేహాంతరంబు జేరంగోరి

పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభి ద్వారంబు సంభవించె. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడు. తద్బంధ విశ్లేషంబె మృత్యు వగు. అదియు యూర్థ్వాధో దేహ భేదకం

బనియుం జెప్పంబడు. అన్న పానాది ధారణార్థంబుగ నాంత్ర కుక్షి నాడీనిచయంబులు గల్పింపఁబడియె. వానికి నదులు సముద్రంబులు నధిదేవతలయ్యె. (వాని వలనఁ) దుష్టిపుష్టులను నుదర

భరణ రస పరిణామంబులును గలిగియుండు. ఆత్మీయ మాయా చింతనం బొనర్చు నపుడుకామ సంకల్పాది స్థానంబగు హృదయంబు గలిగె. దానివలన మనంబును, చంద్రుండును,

కాముండును, సంకల్పంబును నుదయించె. అంత మీఁద జగత్సర్జనంబు సేయు విరా డ్విగ్రహంబు వలన సప్తధాతువులును, పృథివ్యప్తేజోమయంబులైన సప్తప్రాణంబులును,వ్యోమాంబు

వాయువులచే నుత్పన్నంబు లయి గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబులైన గుణంబులును, సర్వవికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియుఁ

బుట్టు. వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు, మఱియును, (270)


క. వరుస బృథివ్యా ద్యష్టా, వరణావృతమై సమగ్ర వైభవములఁ బం

కరుహభవాండాతీత, స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. (271)


క. పొలుపగు సకల విలక్షణ, ములు గలి గాద్యంత శూన్యమును నిత్యమునై

లలి సూక్ష్మమై మనో వా, క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. (272) 136

సీ. అలఘు తేజోమయంబైన రూపం బిది క్షితినాథ నాచేతఁ జెప్పఁబడియె

మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవ త్స్వరూప

మ మ్మహాత్మకుని మాయా బలంబునఁ జేసి దివ్యమునీంద్రులు దెలియలేరు.

వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ గ్రియలును రూఢిఁ దాల్చి


ఆ. యుండునట్టి యీశ్వరుండు నారాయణుం, డఖిలధృతి జగ న్నియంతయైన

చిన్నయాత్మకుండు సృజియించు నీ ప్రజా, పతుల ఋషులను బితృతతుల నపుడు. (273)


వ. మఱియును, (274)


సీ. సుర సిద్ధ సాధ్య కిన్నరవర చారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ

భూత భేతాళ కింపురుష కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాతుధాన

విద్యాధ రాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరి ఘృష్టి ఖగ మృగాళి

భల్లూక రోహిత పశి వృక్ష యోనుల, వివిధ కర్మంబులు వెలయఁబుట్టి


తే. జల నభో భూతలంబుల సంచరించు, జంతుచయముల సత్వ రజస్తమోగు

ణములఁ దిర్య క్సురాసుర నర ధరాధి, భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర! (275)


మ. ఇరవొందన్ ద్రుహిణాత్మకుం డయి రమాధీశుండు విశ్వంబు సు

స్థిరతం జేసి హరిస్వరూపుఁ డయి రక్షించున్ సమస్త ప్రజో

త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్

హరియించున్ బవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. (276)


క. ఈ పగిదిని విశ్వము సం, స్థాపించును మనుచు నణఁచు ధర్మాత్మకుఁడై

దీపిత తిర్య జ్నర సుర, రూపంబు లా దానె తాల్చి రూఢి దలిర్పన్. (277)


సీ. హరియందు నాకాశ మాకాశమున వాయు వనిలంబు వలన హుతాశనుండు

హవ్యవాహనునందు నంబువు లుదకంబు వలన వసుంధర గలిగె ధాత్రి

వలన బహు ప్రజావళి యుద్భవం బయ్యె నింతకు మూలమై యెసఁగునట్టి

నారాయణుఁడు చిదానంద స్వరూపకుం డవ్యయుఁ, డజరుఁ డనంతుఁ డాఢ్యుఁ


తే. డాది మధ్యాంత శూన్యం డనాదినిధనుఁ, డతనివలనను సంధూత మైన యట్టి

సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! (278)


వ. అదియునుం గాక, (279) 137

మ. ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా

హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితంజేసి తా

నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్

నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్. (280)


వ. బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతర కల్పంబుతోడి సంకుచిత ప్రకారంబున నెఱింగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులును, తత్పరిమాణంబులును

కాల కల్ప లక్షణంబులును, నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును, నతివిస్తారంబుగ ముందు నెఱింగింతు వినుము. అదియును బద్మకల్పం బనందగు.అని భగవంతుం

డయిన శుకుండు పరీక్షిత్తునకుఁ జెప్పె. అని సూతుండు మహర్షులకు నెఱింగించిన, (281)


క. విని శౌనకుండు సూతం గనుఁగొని యిట్లనియె సూత! కరుణోపేతా!

జననుత గుణసంఘాతా! ఘన పుణ్యసమేత! విగతకలుషవ్రాతా! (282)


వ. పరమ భాగవ తోత్తముండైన విదురుండు బంధు మిత్ర జాలంబుల విడిచి, సకల భువన పావనంబులును కీర్తనీయంబులును నైన తీర్ధంబులు నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులును దర్శించి,

క్రమ్మఱ వచ్చి, కొపారవియగు మైత్రేయుంగని, యతని వలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు. అది యంతయు నెఱింగింపు మనిన నతం డిట్లనియె. (283)


క. విను మిపుడు మీరు న న్నడి, గిన తెఱఁగున శుకు మునీంద్రగేయుఁ బరీక్షి

జ్జనపతి యడిగిన నతఁడా, తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్. (284)


వ. సావధానులై వినుండు, (285)


ఉ. రామ! గుణాభిరామ! దినరాజ కులాంబుధి సోమ! తోయద

శ్యామ! దశానన ప్రబల సైస్య విరామ! సురారి గోత్ర సు

త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని

ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా! (286)


క. అమరేంద్రసుత విదారణ! కమలాప్త తనూజ రాజ్యకారణ!భవ సం

తమస దినేశ్వర! రాజో, త్తమ! దైవత సార్వభౌమ! దశరథరామా! (287)


మాలిని. నిరుపమ గుణజాలా ! నిర్మలానంద లోలా !

దురిత ఘన సమీరా ! దుష్ట దైత్య ప్రహారా !

శరధి మద విశోషా ! చారు స ద్భక్త పోషా !

సరసిజ దళనేత్రా ! సజ్జన స్తోత్ర పాత్రా !. (288) 138

గద్య. ఇది పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేసన మంత్రి పుత్ర, సహజ పాండిత్య,పోతానామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను పురాణంబునం బరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవత పురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్షప్రకారంబును, ధారణా యోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదా ద్యవయవంబుల సర్వలోకంబు లున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫలప్రద దేవతా భజన ప్రకారంబును, మోక్ష ప్రదుండు శ్రీహరి యునుటయు, హరి భజన విరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరివలన బ్రహ్మ రుద్రాది లోక ప్రపంచంబు పుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును, భాగవత వైభవంబును, పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నలును, అందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడఁ బ్రసన్నుండైన, స్తోత్రంబు సేసి త త్ర్పసాదంబునం ద న్మహిమవినుటయు, వాసుదేవుండానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబును, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతు నడుగుటయు, నను కథలు గల ద్వితీయ స్కంధము సంపూర్ణము. (289)