శ్రీవేంకటాచలమాహాత్మ్యము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

చతుర్థాశ్వాసము

శా.

శ్రీనారాయణ మాత్మమూల మనఘం శ్రీవత్సవక్షఃస్థలం
నానాస్థావరజంగమాత్మకజగన్నాథం ప్రధానాశ్రయం
ధ్యానధ్యేయ మచింత్య మవ్యయపదం ధర్మస్వరూపం సుపూ
ర్ణానందం తఱికుండశేషకుధరాధ్యక్షం భజే౽హం సదా.

1


ఉ.

శ్రీరమణీమనోహరుని శేషశయానుని సర్వశత్రుసం
హారుని ధీరునిన్ నఖశిఖాహతరాక్షసవక్షునిన్ సహ
స్రారసరోజహంసుని సదానతదైత్యకుమారపాలకున్
గోరి భజింతు నేసు తఱికుండనృసింహుని శుభ్రచిత్తునిన్.

2


చ.

కలశపయోనిధిం బొడమి కల్ములపంటల కాటపట్టునై
జలరుహనాభువక్షమున సాంద్రవిలాసమున న్వసించి యు
జ్జ్వలతరశుభ్రతోయదనివాసతటిల్లతమాడ్కి నౌసిరిన్
వెలయఁ దలంతు మోక్షపదవిం దనరారఁగ నెప్పు డాత్మలోన్.

3


చ.

విలసితమౌక్తికప్రభల వెల్గు సితోత్పలమాలికాసము
జ్వలత వహించు నాథుమెడ సత్కనకద్యుతు లీనుమేనితో
సలలితవృత్తిమై వికచచంపకమాలికభాతి నుండు మే
ల్వెలదుక నాదిలక్ష్మి నొగి వేమఱుఁ గొల్చెద మోక్షసిద్ధికై.

4

శా.

సర్వజ్ఞుం డగు మద్గురుం గొలిచి యశ్రాంతంబు సద్భక్తిచే
నిర్వాణప్రదుఁ డౌవినాయకుని వాణి న్వేడి తొల్లింటి స
ద్గీర్వాణాంధ్రకవీంద్రులం దలచి యక్షీణాత్మబోధోల్లస
త్పూర్వాచార్యులపాదపద్మయుగముల్ పూజింతు నిష్టాప్తికిన్.

5


క.

పంకజహితశశినేత్ర క
లంకరహిత మోక్షదక్ష లక్ష్మీరమణా
శంకరవిధిసన్నుతపద
పంకజ తఱకుండనృహరి పాపవిదారీ.

6


సీ.

అని యిష్టదేవతాప్రార్థనం బొనరించి
        వేడ్కఁగొల్పెడు ఘనవేంకటాద్రి
మాహాత్మ్యమునను వరాహపురాణంబు
        ముప్పదియధ్యాయములను దొలుత
మొనసి మూఁడాశ్వాసములు చేసి యావరా
        హస్వామి కర్పించి యవల నెడఁద
రహిని భవిష్యోత్తరపురాణమున శ్రీని
        వాసువిలాసము ల్వసుధయందుఁ


తే.

బ్రజకుఁ దెలియంగఁ దేటగఁ బద్యరీతి
ధృతి రచింతును దఱికుండ నృహరికృపను
దప్పులుండినఁ దగ దిద్ది యొప్పుగాను
చదువ నెంచెద బుధులార సదయులార.

7


వ.

ఆకథాక్రమం బెట్లన్న వినుండు.

8


ఉ.

శ్రీకరనైమిశాటవిని శిష్టమును ల్పరమాద్భుతంబుగం
బ్రాకటభక్తిమై నొగి వరాహపురాణము విన్నమీఁద సు

శ్లోకుని సూతునిం బ్రియముఁ జూచుచు వేంకటశైల మిద్ధరన్
జోకుగ నేయుగంబునను శోభితమై పొగడొందుఁ జెప్పవే.

9


వ.

అనిన విని సూతుండు చూచి మీరు నన్నడిగినట్లు జనకుండు
శతానందుని నడిగిన నతఁ డతనికిఁ జెప్పిన పూర్వేతిహాసంబు
చెప్పెద వినుండని సంతసంబున నిట్లనియె.

10


సీ.

వినరయ్య మునులార వేడ్కమైఁ గ్రమముగ
        ధర్మకాలంబు త్రేతాయుగమున
జనకుండు నిర్మలస్వాంతుఁ డై శాంతుఁ డై
        యెస మిథిలాపురి నేలుచుండి
తనతమ్ముఁ డగుకుశధ్వజుఁ డనువాని కూఁ
        తులను దాఁగన్నకూఁతుకును దగిన
పతులను దనలోన భావించి వెదకుచు
        దొరుకునె తగినబంధుత్వ మనుచు


తే.

నలువురగుకన్యలకు నరనాథుసుతులు
నలుగు రొకయింటఁ బుట్టియున్నను బ్రియంబు
వారీ కీబాలికల నీయవచ్చు నంచుఁ
జిత్తమున నెంచుచుండఁగఁ జెలఁగి యపుడు.

11

భవిష్యోత్తరపురాణము

క.

చనుదెంచె శతానందుం
డనుకులగురువర్యుఁ డెలమి నాజనకుఁడు గ
న్గొని లేచి యెదురుసని పద
వనజంబుల కెఱగి దెచ్చి వరభక్తి దగన్.

12


వ.

భర్మాసనంబునఁ గూర్చుండఁజేయ నయ్యాచార్యవర్యుం డి
ట్లనియె.

13

తే.

మానవాధీశ! సీతకు మాండవికిని
యూర్మిళకు శ్రుతకీర్తికి నొగి వివాహ
యత్నమును జేయు మింక నీ వప్రయత్న
ముగను నుండుటగాదు నెమ్మిగను ధాత్రి.

14


వ.

తగినపతుల నన్వేషింపు మూరకుండకు మనిన.

15


సీ.

విని మిథిలాపురివిభుఁ డగుజనకుండు
        గని శతానందుని వినయ మెసఁగ
ననియె నోగురువర్య! మును సవనానికి
        భూమిదున్నంగ నద్భుతముగాను
ధరణి జనించెఁ గదా సీత లోకైక
        మాత యటంచు నామదికిఁ దోఁచి
యున్నది యిపు డట్టి యుర్వీతనూజను
        నరున కీఁదగునె యెన్నాళ్లకైన


తే.

సీతచిహ్నము లన్ని లక్షించి చూడ
శ్రీరమాదేవియంశజ సిద్ధ మిట్టి
సతికి హర్యంశగలవాఁడె పతిగ నమరు
గాన సిద్ధర నెందేని బూని చూడ.

16


వ.

అట్టి మహనీయుండును, పురుషోత్తముండును, గలఁడేని వచిం
పుము మఱియును.

17


క.

హరి పూర్ణాంశుండై ధర
నరపతి జనియించియున్న నామందిరమున్
బరఁగుచునుండెడు శ్రీశం
కరచాపముఁ ద్రుంచు ముజ్జగంబులు వొగడన్.

18

చ.

హరి యతఁడంచు నెంచఁదగు నంచుఁ బరీక్షకునై ముదంబునన్
సరవిని మీరలెల్లఁ గన శంకరకార్ముక మక్కజంబుగం
గరమునఁ బట్టి ద్రుంచు బలగౌరవవంతుని కిత్తు సీత నే
నరుదుగఁ బల్కితిం గనుక యట్టిమహాత్యుడు పుట్టియుండునే.

19


సీ.

అను డాశతానందుఁ డాజనకుని చూచి
        పలికె నిమ్మెయి మహీపతివరేణ్య
భూమిజ కనుగుణ్యపురుషశార్దూలుండు
        పుట్టినాఁ డీచింతఁ బెట్టవలదు
సరవిగ నీదు నల్వురకన్యలకుఁ దగి
        యొకరాజుకొమరు లీయుర్వియందు
నలువురుగానె యున్నారు వారలు నీదు
        బాలికామణులఁ జేఁబట్టుకొఱకు


తే.

వేంకటాచలమహిమంబు వినుము కోర్కె
లన్ని సఫలంబు లగుఁగాన నంబుజాస
నాదులకునైన తరమె యయ్యద్రిమహిమఁ
జెప్ప విని మేలునొందిరి క్షితితలేశ.

20


వ.

కావున నచంచలచిత్తవృత్తి నావేంకటాద్రిప్రభావంబును
వినిన సకలాభీష్టంబు లొడఁగూడు నప్పర్వతంబు కృతయుగం
బున వృషభాద్రియనం బ్రసిద్ధినొందుఁ. ద్రేతాయుగంబున
నంజనాచలం బనం బరఁగు. ద్వాపరయుగంబున శేషశైలం
బన నొప్పుఁ. గలియుగంబున వేంకటాచలం బని విఖ్యాతిఁ
గాంచు. ననఁగ నాజనకుండు విని శతానందుని జూచి, యా
శైలంబునకు నీనామంబు లెట్లుగల్గె ననియడిగిన, శతానందుం
డిట్లనియె.

21

సీ.

వృషభాసురుం డనువీరుఁ డాకొండపైఁ
        జేరి మౌనుల హింస చేయుచుండ
నట్టిబాధలు వరాహస్వామితోఁ జెప్ప
        వలె నంచు వాకిళ్ల వచ్చి మ్రొక్కి
ప్రార్థించి పల్కిరి పరమాత్మ యీశైల
        మున వృషభాసురుం డనెడువాఁడు
వచ్చి మ మ్మనయంబు బాధించుచున్నాఁడు
        నయమున మించి యారాక్షసేంద్రుఁ


తే.

ద్రుంచు డని వేఁడ నాస్వామి యెంచి దయను
బల్కె మునులార మీరు నిర్భయముగాను
దపము లొనరించుకొనుఁడు నాదైత్యు నింక
యమునిపాలికి నంపెద యశము మెఱయ.

22


వ.

ఆకిటిరూపుం డవ్వారి నప్పుడు వీడ్కొనఁగ నమ్మునులు తమ
నెలవుల కేగి భయంబు మాని తపంబు లొనరించుకొనుచుండిరి.

23


తే.

దేవరిపుఁడును దుంబురుతీర్థమునను
మూఁడుకాలంబులను స్నానములు నొనర్చి
చిత్త మలరఁ గరాళనృసింహమంత్ర
జపము చేయుచుఁ బూజలు సల్పుచుండి.

24


వ.

తత్పూజానంతరంబు నిజశీర్షంబును దనఖడ్గంబున ఖండించి
హరి కర్పితంబు సేయుచుండ నాస్వామికరుణ నాశిరంబు
గ్రమ్మఱ గంఠంబున నిలుచుచుండు నవ్విధంబునఁ బంచ
సహస్రాబ్దంబులు చేసినపూజకు మెచ్చి వరాహస్వామి కరాళ
నృసింహరూపంబున వానికిఁ బ్రసన్నుం డైనం జూచి వృష

భాసురుండు నమస్కరించి యనేకవిధంబుల నుతించిన నయ్య
మరారింజూచి నరహరి యిట్లనియె.

25


క.

విను దానవ నీతపమును
గని మెచ్చితి వరము లెవ్వి గావలె ననఁగా
విని వృషభాసురుఁ డపు డి
ట్లనె నానరహరిని గాంచి యానందమునన్.

26


సీ.

పరమాత్మ నాకంబు బ్రహ్మలోకముగాని
        యేనొల్ల నాహవం బెందుగాని
తగఁజేయవలె నవతారము ల్పది తొల్లి
        యెత్తినప్పుడు గల యెలమిబలము
నొక్కఁడవే పూని చక్కఁగ నాతోడ
        సమరంబు సేయు మోస్వామి యనిన
విని వానియవివేకమునకు నవ్వుచు విష్ణు
        వనె నిట్లు కదనంబు వలచి తీవు


తే.

గాన నిచ్చెద రమ్మన దానవుండు
గట్టు పైఁబడినట్టుగ నట్టహాస
మురుతరంబుగఁ జేయుచు నొరిమ విడచి
కదిసినం జూచి హరి వాని నదును నెంచి.

27


వ.

ఇవ్విధంబున నిర్వురు సింగంబులభంగి నింగి కెగసి నేల నిల్చి
యొండొరుల డాయుచుం బాయుచుం బలుతెఱుంగులైన
నాయుధంబులచేతఁ గొట్టుచుఁ గరికరి హరిహరి గిరిగిరి పొరి
పొరి నొరసి పోరుకరణి ననేకప్రకారంబుల విడివడి నడువం
బుడమి గడగడ వడంక వడిఁబెడగ బడలక జలంబులానం
దడవక కడువడి పిడుగులుపడువడువునం దొడరి పెనునగవుల

నొండొరులు మెండొడ్డి వెఱ్ఱిచూపుల నిక్కి వెక్కిరించు
కొంచు ధిక్కరించుచుఁ గక్కసంబడి నిక్కి హుంకారంబులు
సేయుచు నహంకారంబులు పెంచుచుం గేకలు వేయుచు
లోకభీకరంబుగ మేఘంబులవలె నుఱుముచు గండసిలలు
బెండువడి తండోపతండంబులై బెడబెడఁ బొఱలివచ్చి మెండు
బండలపైఁ బడి రెండేసిఖండంబు లగుచుండఁగఁ గొండ
కొండకుం జంగున నెగిరి లంఘించునట్లు బహువిధంబుల భండ
నంబు సేయుచుండి రంత, నవసానంబున మలఁగుదీపం బధికంబుగ
వెలుఁగుఁజూపినచందంబున వృషభాసురాంగబలంబు ప్రచం
డోద్దండంబై నిండిన నరకంఠీరవుని మించి కబళించుకైవడిం
గానవచ్చినం గని వెఱఁగుపడి యమరులు నభోమార్గంబున
నుండి నరహరివిజయంబుం గోరుచుండి రప్పు డప్పరమపురుషుం
డుప్పొంగి రక్కసునిం గనుంగొని ఱొప్పుచుఁ దెప్పున గరుడ
వాహనారూఢుండై సహస్రాయుధంబులు ధరించి దైత్యుని
పైఁబడి పట్టి కొట్టవచ్చినం జూచి రాక్షసుండు మిట్టవడి పట్టు
వడక యట్టిట్టు జుణుఁగుచు నాఖండలాదినిర్జరభ్రాంతికరంబైన
తనమాయాబలంబున ఖగవాహనారూఢుండై సహస్ర
భుజుండు సహస్రాయుధధరుండై కృత్రిమవిష్ణురూపధారిని
నిర్మించి నారసింహునిఁపైఁ బురికొల్పె నప్పు డమ్మాయావిష్ణు
రూపంబు మహావిష్ణు నెదిరించి పోరవచ్చినంగాంచి చక్రి యది
రాక్షసకృత్యం బని తలంచి నిజమాయం బెంచి యమ్మాయకృత్రి
మవిష్ణురూపధారిని మాయంబు చేసి నగుచు నిట్లనియె.

28


సీ.

చపలరాక్షస నిన్ను సరిచేసుకొని పోర
        వలసి పోరితి నింతవట్టు కీవు

ననుఁ గూర్చి జగము మున్నొనరించుటం జేసి
        యింతకుఁ జంపక యెంచితిట్లు
గడపితిఁ గాలంబు గావున నింక నో
        పను నది యేలన వినుము విష్ణు
వును సృజించి యొనర్చుచున్న కార్యంబులు
        దెలిసె వాఁ డెం దేగె బలమడంగి


తే.

యింక నీ వెందు డాఁగెదో యెఱుఁగఁజేయు
చూడు నాశక్తి నేఁడు పెచ్చగను లేని
సోనిమాటలు వల్కకుఁ బూని శత్రు
భయదచక్రాన్ని కోపుదుష్పథరతుండ.

29


వ.

మఱియు నీశీర్షంబు చక్రాగ్ని కాహుతి యీకున్న నే
గరాళనృసింహుండను గానని.

30


తే.

కరమునం గ్రాలుచుండు చక్రంబుఁ జూపఁ
జూచి వృషభాసురుఁడు పరిశుద్ధమైన
భక్తి నానారసింహుని పాదయుగళ
మునను శరణాగతుం డయి వినుతిచేసి.

31


వ.

క్రమ్మర నిట్లనియె. దేవా! భవదీయచక్ర ప్రభావం బెంతని
వర్ణింప నాబ్రహ్మాదులచే నశక్యంబు గీర్తియు నంబరీషాది
రాజప్రముఖులకు విజయంబు లిచ్చినదఁట, యదియునుం గాక
భవచ్చక్రతప్తులైననవారలకుం బునర్జన్మంబులు రావఁట, కావున
నట్టియప్పరమచక్రంబులం దెగి ముక్తినొందెద మన్నామం
బీయద్రి కిడినం జాలునని ప్రార్థింప నానృసింహుఁ డారక్కసుని
నాలింగనంబుచేసి ముక్తినిచ్చి యప్పర్వతంబున కాయమర
వైరినామం బిడియె నక్కారణంబునం గృతయుగంబునందు

వృషభాద్రియని పేరొందు. నంత మునులు తమనెలవులనుండి
వచ్చి స్వామిని సన్నుతించుటం జేసి యద్దేవుండు వారియభీ
ష్టంబు లొసంగి తిరోధానంబు పొంది, భూదేవీసహితుండై
యిచ్ఛావిహారుండై యుండెనని చెప్పిన శతానందుని జూచి
జనకుం డిట్లనియె.

32


సీ.

మునినాథ వృషభాద్రి యనుదాని కంజనా
        చల మని పే రెట్లు గలిగెఁ జెపుము
యాశతానందుఁ డిట్లనియెఁ గేసరియను
        వనచరోత్తముభార్య తనకు సుతులు
గలుగకుండుటఁ జేసి తలంచి మతంగ ఋ
        షీశుని జూచి తా నిట్టులనియె
బుత్త్రహీనుల కెందుఁ బుణ్యగతు ల్మహి
        లేదంచుఁ దొల్తను వేదములను


తే.

జెప్పియుండుటచే నాకుఁ జిత్తమునను
భయము గదురుచు నున్నది దయను నాకుఁ
బుత్త్రుఁ డెట్లు లభించునో పుణ్యరూప
చెప్పుమని వేఁడ నమ్ముని యప్పుడనియె.

33


తే.

పొలఁతి యిచ్చటికిం బూర్వపు వలనొప్పు
నుర్విఁ జనఁ జన నేఁబదియోజనాల
దవ్వునం దనరారును ధాత్రి శ్రీనృ
సింహనామాశ్రమంబు శ్వశ్రేయదంబు.

34


వ.

తదాశ్రమంబుసకు యామ్యభాగంబునం బ్రకాశించుచున్న
నారాయణాద్రి ప్రదేశంబులం బరమపావనం బై యొప్పు
స్వామిపుష్కరిణికి నుత్తరంబుగఁ గ్రోశమాత్రదూరంబునం

దాకాశగంగాప్రవాహం బున్నయది నీ వందుఁ జేరి త్రికాల
స్నానంబు లాచరించుచు ద్వాదశాబ్దంబులు తపంబొనర్చు
చుండు మంత సుతుం డుదయించు ననిన మహాప్రసాదం బని
మ్రొక్కి యమ్మునినాథు నానతిచొప్పుఁ దప్పక నారాయణా
ద్రిం జేరి స్వామిపుష్కరణిం గ్రుంకులిడి తత్తీరాశ్వత్థవృక్షంబు
నకుఁ బ్రదక్షిణంబు లొనర్చి వరాహస్వామికి మ్రొక్కి
యందుండి యాకాశగంగకు నరిగి యందుండుమునివర్యులకు
నమస్కరించి వారియాశీర్వచనపూర్వకంబుగ నత్తీర్థంబునం
ద్రికాలస్నానంబులు సేయుచు నిరాహారంబున నొకసంవత్స
రంబు తపంబు సేసిన నంత వాయుదేవుండు ప్రసన్నుండై
ప్రతిదినంబు నొక్కొక్కమధురఫలం బొసంగుచుండ నది
భక్షించుచు నత్తపస్విని ద్వాదశవర్షంబులు పూర్తిగఁ దప
మాచరించె నంత నొక్కనాఁడు వాయుదేవుండు సద్వీర్యగర్భి
తంబైన ఫలం బియ్యంగ దానిన్ భుజించి యత్తరుణి గర్భంబు
ధరియించె ననంతరంబున.

35


తే.

అంత నాదేవిగర్భమం దనిలదేవుఁ
డొక్కనాఁడు ప్రవేశించుచుండునటుల
సంయమీంద్రుల కచ్చోట స్వప్న మయ్యె
నందుచే వారు నిస్సంశయాతు లైరి.

36


తే.

దశమమాసంబు నిండారెఁ దగ ధరిత్రి
నంజనాదేవిగర్భమం దనఘుఁడైన
పుత్త్రుఁ డుదయింపఁగాఁ జూచి పుష్పవృష్టి
సురలు గుఱియించి సంతోషభరితులైరి.

37

మ.

ఘనవజ్రాంగము దీర్ఘవాలము లసత్కాంతు ల్బలస్ధైర్యముల్
మును లెల్లంగని యాంజనేయుఁడు మహాముఖ్యుం డగున్ ధాత్రిపై
నని దీవించుచు మారుతాత్మజున కత్యాసక్తితో నందఱున్
హనుమంతుం డని నామధేయ మిడి రత్యాహ్లాద ముప్పొంగఁగన్.

38


వ.

త్రేతాయుగంబునం దంజనాదేవి తపంబు జేసి పుత్రుని వడసిన
కతన నంజనాద్రి యని ప్రసిద్ధంబయ్యె మఱియును.

39


తే.

ఉరగపతి శేషుఁ డనిలున కోడి ధాత్రిఁ
గనకగిరినాథుఁ డైనవేంకటునితోడ
ద్వాపరమునందుఁ బడి శైలరూప మొందె
నందుచే నది శేషాద్రి యనఁగ నొప్పె.

40


తే.

అనిన విని జనకుం డిట్టులనియె శేషుఁ
డెందు కాపవనుని కోడె నెఱుఁగఁ జెప్పుఁ
డన శతానందుఁ డిట్లనె హరిని జూడ
ననిలుఁ డొకనాఁడు వైకుంఠమునకుఁ బోవ.

41


సీ.

హరిమందిరద్వారమందుఁ గావలియున్న
        శేషుఁ డాపవను నీక్షించి పల్కెఁ
బవనుఁడా నీవు పోవలదు లోనికి నిందె
        నిలువుమంచు వచింప నిష్ఠురముగ
ననిలుఁ డిట్లనియె నే నబ్జాక్షు నీక్షింపఁ
        బోవుచుండఁగ నన్ను నీవు పిలిచి
పోవలదని చెప్పఁగా వశమే నీకు
        నీయెచ్చు నాయెచ్చు నెఱిఁ దలంప

తే.

నెంతయంతర మహహ నే నిప్డు హరిని
జూడఁబోవలె నని లోనఁ జొచ్చుచుండ
బుసలువెట్టుచు ననిలుని బోకుమంచుఁ
ద్రోసెనీవలి కప్డు పెన్ రోషమతిని.

42


చ.

తనమెడఁ బట్టి ద్రోసినకతంబున దారుణరోషయుక్తుఁడై
యనిలుఁడు శేషునిం గని బలాధమ నీ వొకధర్మసంధుఁడే?
నను మెడఁబట్టి తోసితివి నాగకులాధమ నేను నిన్నుఁ ద్రో
సిన నిలువంగఁజాలుదువె? ఛీ యవివేకుఁడ పొమ్ము పొమ్మనన్.

43


క.

విని శేషుం డనిలుఁడ లోఁ
జనునే యన్యుండు నిన్నుఁ జయ్యనఁ బోనీ
యను నీరా కాచక్రికి
వినిపించెద నవల నన్ను వెన్నుఁడు దయతోన్.

44


సీ.

తోడ్కొనిరమ్మనం దోడ్కొనిపోయెద
        నంతియకాని ని న్నటకుఁ బంప
ననఁగ నప్పవనుఁ డిట్లనియె నంతఃపుర
        మున కేల పోవలె మూర్ఖ వినుము
మందిరంబున నెఫ్డు మార్జాల ముండును
        మదకరి వీథి నెమ్మదిగ నుండు
నందుచే నొకతక్కువగునె పిల్లికి గజ
        ములయంతరంబును దలఁచుకొనుము


తే.

లోని కరుగకు మంటివి గాన రాను
నీవ యందుండు నిచ్చట నేను నిలతు
నింతమాత్రన కొఱత నా కేమి లేదు
పోర భుజగాధమా నీవు పొంగు టేల?

45

మ.

అనుచుం దన్నుఁ దిరస్కరింప విని రోషావేశ ముప్పొంగ ని
ట్లనియెన్ శేషుఁడు మారుతా యెపుడు నా కాహారమైనట్టి నీ
వనఁగా నెంతటివాఁడు నాయెదుట నీయార్భాటముం జెల్లునే
యనఁగా నప్పపనుండు వల్కె విని కోపాటోపముం జెందుచున్.

46


క.

శేషా గర్వంబున దు
ర్భాషలు భాషించి నీవు పట్టుగ నాకున్
రోషము వుట్టించితి విఁక
భాషింపఁగ నేల పొమ్ము ఫలమందె దొగిన్.

47


వ.

అయినను నాబలంబునకు నీబలంబునకు గజమశకన్యాయంబై
యుండు నేను సర్వజీవాంతర్యామియునై జగత్ప్రాణుండ
నైయుందుఁ గావున నీకంటే నే నధికుండ ననిన విని యురగే
శ్వరుం డిట్లనియె.

48


సీ.

విను మనిలుఁడ నేను విపులాద్రిగణముతో
        మొనసి భూమిని శిరంబున భరింతు
బహువిధబ్రహ్మాండభాండోదరుం డైన
        నీరజాతాక్షుని నే భరింతుఁ
గాన నీకంటెను నేన గొప్పగుచుందుఁ
        జులకఁదనంబుగఁ జూడవలదు
పొమ్మని వల్కఁగ భూరికోపంబు మైఁ
        బవనుఁ డిట్లనియె నో పన్నగేంద్ర


తే.

నేను నీలోన నుండఁగ నీకు బలము
గలిగియున్నది లేకున్న ఘనతరమగు
నీబలం బేడ నిలుచును నాబలంబు
ముందటను నీవు తక్కువ యెందుఁగాని.

49

సీ.

అని యివ్విధంబున ననిలుండు వచియింపఁ
        బన్నగేంద్రుఁడు విని వల్కె నిట్లు
పననుఁడా విను వృథా వాగ్వ్రయం బేటికి
        నీవు నే నొకదిక్కు నిలిచి మించి
యెల్లువారలు సూడ మల్లయుద్ధంబును
        జేయుద మప్డు నీచేవ దెలియు
రారమ్మనఁగఁ బెద్దరభసంబు సేయంగ
        విని చక్రి యేతెంచి గనుచునుండ


తే.

నపుడు శేషుండు పవనుండు హరికి మ్రొక్కి
తమవివాదంబు సెప్పి యోదైత్యనాశ
కదనమును జేయవలయు దీర్ఘాయువులుగ
దీవనలొసంగు దయచేసి దేవదేవ.

50


మ.

అని వాతూలుఁడు శేషుఁ డాహవము సేయంబూనువాక్యంబులన్
విని యోచించి వినోదము ల్గనుట కావేళన్ రమేశుండు వా
రిని వారింపక కారణంబొకటి వేరే యుండఁగా వీర లి
ట్లనుచున్నా రిది మంచికార్య మని రోషావేశముం బెంచుచున్.

51


సీ.

కార్యార్థియె రమాకాంతుఁడు నవ్వుచుఁ
        బవనశేషులఁ జూచి పలికె నిట్లు
వినుఁడు మీరిర్వురు వీరాగ్రగణ్యులు
        గావున నొక్క రొక్కరుని గెలువ
నూరక సేయుఁడు ధీరులై వేఱ యు
        ద్ధము సేయఁగాను లోకములు మనవు
గాన నీ కొకయుక్తి నేను జెప్పెద శేష
        విను మది యెట్లనఁ గనకనగము

తే.

నందుఁ బుట్టిన యావేంకటాద్రిఁ జుట్టుఁ
జుట్టుకొని ఫణముల బిగఁబట్టి యదుము
చుండు మవ్వాయు వాపైఁడిగొండ నెగర
మీటఁగా దొడ్డవాఁడె సమీరుఁ డపుడు.

52


ఆ.

పలికి పవన నీవు పన్నగేంద్రుఁడు చుట్టి
పట్టియున్నగిరిని పట్టి పైకి
నెగవమీటగానె హెచ్చి సీ వటుమీఁద
లేకయున్న హెచ్చు లేదు నీకు.

53


వ.

అని విష్ణుం డానతిచ్చిన నిని మహాప్రసాదం బని మ్రొక్కులిడి
యాదిశేష ప్రభంజను లిద్దఱు వేంకటాద్రిం జేరి రందుఁ బన్న
గేంద్రుఁ డప్పర్వతంబుసు జుట్టుకొని సహస్రఫణంబులనడుమ
బిగంబట్టియుండె నంత వాయుదేవుండు నిజశక్తి పెంచి
యగ్గిరిపై వీఁచుచుండె నివ్విధంబున.

54


క.

తొడిఁబడక మొఱయు చనిలుఁడు
విడివడి వీవంగ నచలవితతులు వడిగా
గడగడ వడఁకుచుఁ దిరుగుచు
బెడబెడఁ బొరలాడఁ జూచి భీతాత్మకులై.

55


క.

అప్పుడు బ్రహ్మేంద్రాదులు
తప్పక గుమిఁగూడి మారుతా యని కడకుం
దప్పటడుగు లిడుచు జని
యొప్పుగ నిట్లనిరి భయము నొందుచు నపుడున్.

56


సీ.

ఓవాయుదేవ యీయుత్పాతహేతువు
        గా విసరుటవేళ గాదు వినుము

చాలించు కల్పాంతసమయమం దిటు సేయు
        టుచితంబుగాని ధీయుతుఁడ మాను
మని వారు ప్రార్థింప ననిలుఁ డారోషంబు
        విడువక మఱిమఱి విసరుచుండె
పవనుని రోషస్వభావంబు గనుగొని
        శేషాహిచెంగటం జేరి వినుతి


తే.

చేసి యిట్లని వల్కిరి శేష వినుము
నీబలం బెక్కువైనది నీరజాక్షుఁ
డెఱుంగు గౌళీమనోహరుం డెఱుఁగు మేము
నెఱుఁగుదుము నీప్రభావంబు నెన్నఁ దరమె.

57


వ.

అని బహుభంగులం బ్రార్థించిన శేషుండు పట్టినపట్టు విడుగ
కుండినం జూచి బ్రహ్మేంద్రాదులు మఱియు నిట్లనిరి.

58


క.

విను మోభుజగకులాధిప
కినిసి మహాశక్తి హేమగిరివరతనయున్
ఘనముగ బిగఁబట్టిన ని
న్ననిలుఁడు గదలింపనోపఁ డయ్య మహాత్మా.

59


క.

అనిలుఁడు నీ కోడఁడు నీ
వనిలున కోడవు జగంబు లదరి నశింపం
బనివచ్చెను గావున నీ
ఘనరోషము నడఁచి జనుల కాపాడఁగదే.

60


చ.

అనుజులు మూర్ఖులంచు విడనాడి సుసాత్వికమూర్తియైన వె
న్నునిపద మాశ్రయించితి వనూనమతుండవు నీకుఁ గోప మే
లను నిజశుద్ధసాత్వికబలంబున నీవు చలం బడంచి నీ
ఘనఫణ మెత్తి మాకొఱకు గాడ్పుకు గెల్పునొసంగ మేలగున్.

61

వ.

అని యనేకప్రకారంబులం బ్రార్థింప నాశేషుండు కరుణార్ద్ర
చిత్తుండై లోకరక్షణంబు సేయుటకై యొకఫణం బెత్త నప్పు
డప్పవనుం డుప్పొంగి తెప్పున నప్ఫణంబుసందునఁ బ్రవేశించి
నిజబలంబుకొలఁదిన్ వీఁచుచు నంగుష్ఠం బక్కొండపాతునం
గ్రుచ్చి యెత్తి పైకెగరమీటుటంజేసి యప్పుడు వేంకటాద్రి
గాలిపటంబుచందంబున నెగిరి మొఱయుచు గంగానదికి దక్షి
ణంబుగ ద్విశతయోజనదూరంబునం దూర్పులవణాబ్ధికి నైదు
యోజనంబులదూరంబునను సువర్ణముఖరీనద్యుత్తరతీరం
బునకు సార్ధక్రోశదూరంబున నొప్పుపుణ్యకాననమునందుఁ
దననుజుట్టుకొనియున్నశేషునితోడం బడియె. నివ్విధంబున
శేషుం డోడెనని సంతసించుచుం బవనుండు నిజేచ్ఛం జనియె.
జగంబులు కుదిరియుండె. నంత శేషాహి తా నోడుటకుఁ జింతిం
చుచుండఁగ బ్రహ్మేంద్రాదులు వచ్చి శేషు నాదరించి. రందు
బ్రహ్మ యిట్లనియె.

62


సీ.

విను శేష మారుతంబున కోడితి నటంచుఁ
        జింతింపవలదు నీచిత్తమునను
వేంకటగిరిని నీ వంకితంబుగఁ గూడి
        యవనిపై నుండు నీయందుఁ జక్ర
పాణి వసించి ని న్బాలించునని పల్క
        విని ఫణీంద్రుడు చాల విన్న నగుచుఁ
బలికె నిట్లని నేను పవనునితోఁ బంత
        మాడి యోడుటను నాయందుఁ దప్పు


తే.

గలిగె గర్వం బడంగె నాకర్మ మింత
చేసె నిఁక నేల నాయందు శ్రీధరుండు

నిలుచునని పల్కి చాల కన్నీరు నింపఁ
జూచి శేషునితోఁ దమ్మిచూలి పలికె.

63


క.

విను ఫణివర నీయం దా
వనజదళాక్షుండు గృపను వచ్చి వసింపం
జని నే వెదకెద నిఁక నీ
మనమునఁ జిందింపవలదు మఱి యురగేశా.

64


మ.

హరి నీయందు వసించియుండఁడని నీ కాచింత యేలా? యశో
ధరుఁ డాచక్రధరుండు వచ్చుటకు సంధానంబు గావించెదన్
గిరిరూపంబున నుండు మోడితిని నాఖేదంబు వర్జింపు పం
కరుహాక్షా యని నాత్మ నెంచుచును సౌఖ్యంబొందు నాగాధిపా.

65


క.

హరి నిచటికి రప్పించుట
కరయఁగ నేఁబూటకాపు నైతి నటంచున్
సరసిజగర్భుఁడు శేషుని
శిరములపై నివిరి నమ్మఁజెప్పెను గరుణన్.

66


వ.

అపు డాయురగేంద్రున కభయం బిచ్చి బ్రహ్మేంద్రాదులు నిజ
నివాసనంబులకుం జనిరి. యంత నాశేషుం డప్పుండరీకాక్షునకుఁ
దండప్రణామంబు లాచరించి పర్వతాకారంబు నొందె. నప్ప
ర్వతప్రమాణంబు చెప్పెద వినుము. దశయోజనవిస్తీర్ణంబై
ముప్పదియోజనంబులునిడివి గలిగియుండు నట్టిశేషాఖ్యనొందిన
మహాద్రిఫణప్రదేశంబు వేంకటాద్రియు, మధ్యప్రదేశం
బహోబలంబునుం, బుచ్ఛంబు శ్రీశైలంబును నగుచుండ, సర్వ
క్షేత్రసర్వతీర్థమయం బగుచు సకలఫలధ్రుమపుష్పలతాశోభి
తంబై నానావిచిత్రధాతుప్రకాశం బగుచుండు నయ్యద్రి
యందు సురబృందంబులు తరుబృందంబులై ఋషిసమూ

హంబులు మృగసమూహంబులై పితృగణంబులు ఖగగణం
బులై యక్షకిన్నరులు పాషాణరూపులై యుండఁగ శేషునకు
వరం బిచ్చి వోయిన పరమేష్ఠి శేషాద్రియందుఁ బ్రవేశించి
యుండుఁ డని వరాహస్వామిని ప్రార్థింప నద్దేవుండు వైకుంఠ
పురంబున నున్న క్రీడాద్రిని గరుడునివలనఁ దెప్పించి శేషాద్రి
యందుంచి తా నండు వసియించియుండఁగ నాస్వామికిఁ బూర్వ
భాగముననున్న శ్రీస్వామిపుష్కరిణి గంగాదిపుణ్యతీర్థంబు
లకు జన్మస్థానంబై మకరమత్స్యకచ్ఛపాదిజలచరావాసంబై
కమలకుముదాదిపుష్పరాజివిలాసంబై సరస్వతీసరోవరంబని
చెప్ప నొప్పుచుండె. నప్పుష్కరిణియందుఁ గ్రుంకులిడినజనులు
పాపరహితు లయ్యెద. రదియునుంగాక ధనుర్మాసంబున శుద్ధ
ద్వాదశీదినం బరుణోదయంబు మొదలుకొని యారుగడియల
పర్యంతము గంగానదు లాపావనపుష్కరిణియందుం గలసి
యుండు, నట్టిపుణ్యకాలంబున నాతీర్థంబున స్నానంబు చేసిన
వారలు ముక్తినొందెద. రదియునుంగాక, తత్తీర్థతీరంబున
శ్రాద్ధంబులు చేసిన వారిపితృదేవత లమృతపానం బొనర్చి
తృప్తినొంది స్వర్గంబున కేగి సుఖంబుండుదురు, మఱియు
నారాయణాఖ్యుండను బ్రాహ్మణుం డాతీర్థంబునం గ్రుంకు
లిడుచుండి హరిదివ్యధామంబునం బొందె. నిది శేషాద్రి
ప్రభావం బిఁక వేంకటాద్రిప్రభావంబు వచింతు.

67

మాధవుండను విప్రునిచరిత్రము

సీ.

చెప్పెద వినుమయ్య శ్రీకాళహస్తిలోఁ
        జూడఁ బురందరసోమయాజి

తనయుఁ డైనట్టి మాధవనామధేయుండు
        తనకర్మవశమునం దనకు భార్య
యగుచంద్రరేఖను బగలు రతికిఁ బిల్వ
        నయ్యింతి భీతితో నకట పెద్ద
లింటనుండఁగఁ బగ లీరతి తగదంచు
        బహువిధంబులఁ జెప్పి పట్టుపడక


తే.

తలఁగిపోవుచు నుండఁగఁ దాళఁజాల
కతఁడు ప్రార్థింపఁగాఁ బతియాజ్ఞ మీఱఁ
దగదటంచును మది నెంచి ధవునిమోము
సదయమైఁ జూచి పల్కె నాచంద్రరేఖ.

68


వ.

స్వామీ దేవతార్చనాగ్నిహోత్రాదిసత్క్రియ లాచరించు
సమయంబున నిట్లు దివాక్రీడాసక్తిఁ గడంగఁగూడునే యని
యనేకవిధంబులం జెప్పినను వినకుండు పతిం జూచి, “యైన
మీరు సమిత్కుశతులసీపుష్పార్థంబుగ సువర్ణనదీతీరవనంబు
నకుం జని యందుండుఁడు. నే నచ్చటికి నుదకంబు గొనివచ్చు
టకు ఘటంబు చేఁగొని వత్తు నచ్చట మర్మస్థానంబున భవ
త్సంకల్పపూర్తిం జేసికొనుఁ డటంచుం బతికి ముదంబు నొం
దించి యాతని పంప నతం డట్లు పోయి సువర్ణనదీతీరంబునం
బుష్పవనాంతరంబు చేరె. అచ్చటికి నంతకుమున్న వచ్చి స్వర్ణ
భూషణశ్వేతాంబరాలంకృతయై యొక్కకాలు ముడిచికొని
యొకకాలిబొటనవ్రేలి నేలఁ గ్రుత్తి యెత్తుచు మోఁకాలి
మీఁదఁ జుబుకం బుంచుకొని దీర్ఘనీలకుంతలంబులు మెఱయఁ
గూర్చునియున్న పద్మినీజాతి యగు చండాలస్త్రీనిం జూచి
యమ్మాధవాభిఖ్యవిప్రుండు మోహించియుండె. నట్టిసమయం

బునం దనభార్య యుదకార్థంబుగ ఘటంబుం జేకొనివచ్చుటం
జూచి యవ్విప్రుండు భార్యా! నీగుణంబును బరీక్షింప దివా
క్రీడకుఁ బిలిచితింగాని మఱేమియు లేదు గావున నీవు స్నానం
బొనర్చి యుదకంబు గొని గృహంబున కేగు మేను నతిశీఘ్రం
బుగ వచ్చెదనని భార్యను బంపి యాచండాలస్త్రీకడకుం బోవు
చుండ నాబ్రాహ్మణునిం జూచి యది లేచి మ్రొక్కి దూఱం బరిగి
నిలిచి యేమో చెప్పఁబోవ నవ్విప్రుం డద్దానిచెంత కేగుచుం
డఁగ నాస్త్రీ భయంపడి మాధవాభిఖ్యబ్రాహణున కిట్లనియె.

69


సీ.

ధరణీసురేంద్ర నే దవ్వునం జనుచున్న
        నేల వెంబడివత్తు వేమినీతి
న న్నెవరని యెంచినావు నీ వెఱుఁగుము
        చండాలయువతిగఁ జనుము విప్ర
యనఁగ నాబ్రాహ్మణుం డనియె నీపే రేమి
        చెప్పవే యనఁగ నాచేడె వానిఁ
గని నన్నుఁ గుంతల యని పిల్తు రిట్లు నీ
        వడుగుచు ననుఁ జేర కవలఁ బొమ్ము


తే.

నీవు నాడగ్గఱకు రాకు నీచజాతి
దాననని వోవుచుండఁగఁ దాను దాని
విడిచిపోలేక మఱిమఱి వెంబడించి
భ్రాంతితో నిట్టు లనియె నాబ్రాహ్మణుండు.

70


తే.

భామ నీవంటిసుందరి బ్రహ్మదేవుఁ
డంత్యజాతిని బుట్టించి యడవియందుఁ
గాచువెన్నెలవడుపునఁ గనుట చేసె
నింత కావిధి దూఱంగ నేల మగువ.

71

క.

లవణాబ్ధిలోనిమణులను
దివిజులు శిరమున ధరించుతెఱఁగున నే ని
న్నవని వరించి ధరింతని
వివరించి భయంబు విడచి విప్రుం డనఁగన్.

72


చ.

విని యది భీతినొందుచు వివేకము న్ద్విజుమోముఁ జూచి యి
ట్లనియెను జారకాంతను మహావిషసర్పము నంటి యెవ్వరై
నను మనినారె? ప్రేమ నిను నమ్మి భార్యను వీడి నన్నుఁ బొం
దిన నిహముం బరంబుఁ జెడు ధీరతతోఁ జను బ్రాహ్మణోత్తమా!

73


వ.

మహాత్మా స్త్రీపురుషులకు జాతిద్వయంబును నిర్మాణంబు చేసి
మఱల నందుఁ గులంబులు నాల్గింటిని యేర్పఱచి యేకులము
వారి కాకులమునందు స్త్రీని వివాహం బాడంజేసి స్వభార్య
యందు సత్సంతానంబు వడసి పరస్త్రీని యపేక్షింపక యుండ
వలెనని ధర్మశాస్త్రాదులు బోధించుచుండ, నీ వట్టిధర్మంబు
లెఱింగియుఁ గేవలము చండాలస్త్రీనిం గోరుట యధర్మంబు
గదా? మరియు బ్రాహ్మణజన్యం బత్యుత్తమోత్తంబై యుండ
నందు బుట్టి గర్భాధానాదిషోడశకర్మంబుల నాచరించి వేద
పూతం బగునీదేహంబు వృథా యకృత్యంబునకుఁ జిక్కింప
నేల, మఱియు నీశ్రోత్రనేత్రజిహ్వాఘ్రణపాణిపాదంబు
పుణ్యకథాశ్రవణభగవద్దర్శనహరిపాదార్చితపుష్పాఘ్రాణవే
దాధ్యయనదానతీర్థయాత్రాదిసత్క్రియలచేతఁ బవిత్రంబు
లైనవి. మదీయశరీరంబు దుష్క్రియలచే నపవిత్రంబైనది.
కాఁబట్టి నన్నంటరాకుము, దూరంబున నిలువుమని కోకిల
ధ్వనితోఁ జెప్పుకుంతలమాటలు విని యోపంజాలక యవ్వి
ప్రుండు దానిం గదియఁబోవ నది పాపభీతిచే రోదనంబు

సేయుచు దిగ్దేవతాదులను దలంచి, “ఈ బ్రాహ్మణుండు పాప
జాతినైన నన్నుఁ బొంది కులహీనుండై నరకంబునం బడుటకు
బ్రయత్నించి సముద్ర ముప్పొంగివచ్చునట్లు నాపైఁ బడ
వచ్చుచున్నవాఁడు, నావలన నించుకేని దోషంబు లేదు మీ
రెల్లరు నాకు సాక్ష్యమిచ్చువా రగుదురుగాక” యనుచుండ
నాభూసురుం డాయువతికడకుం జని యిట్లనియె.

74


తే.

భామ నీ విప్డు చెప్పిన పరమధర్మ
వచనముల నే నెఱుంగుదు వసుధఁ గామ
మునను నావలె నెందఱో మున్ను ధర్మ
మును దలంపక స్త్రీలను గొనిరదేల?

75


తే.

తరుణి నానోము ఫలియించెఁ బరఁగ నీదు
జవ్వనపుఁగారణంబునఁ జాలు వేయి
జన్మములు సేయఁ గల్గునే సౌఖ్య ముర్విఁ
గాన నాయిష్ట మీడేర్చు కరుణహృదయ.

76


వ.

అనిన నయ్యింతి భయభ్రాంతచిత్తయై యవ్విప్రుని కిట్లనియె.

77


చ.

కటకట! బ్రాహ్మణోత్తముఁడ కామసుఖంబును గోరి లేనిసం
కటపడ నేల నీగృహము గ్రక్కునఁ జేరి నిజాంగనామణిం
బటుముద మొప్పఁ గూడు ననుఁ బట్టిన నేమి ఫలంబు గాన న
న్నిట చని పట్టరాకు మిది యేమి యపభ్రమ నీకు మానుమా.

78


క.

చండాలస్త్రీ నెనయుట
పండితుఁడా వినుము నీకుఁ బాపము రాదే
మెండొడ్డి విప్రకులమున
టుండుము న న్నంటరాకు ముర్వీసురుఁడా.

79

క.

అని యది వెనుకకుఁ జనఁగాఁ
గని విప్రుఁడు కులము మించి కామాంధత్వం
బును గదుర వడిగఁ జని దా
నిని బట్టంబోవ నదియు నిలువక చనుచున్.

80


వ.

అప్పు డాకుంతల యతనిం జూచి, "బ్రాహ్మణోత్తమా! నీజననీ
జనకులుతోడె, గురుదైవంబులతోడె, న న్నంటకు” మను
చుండఁగ వాఁడు వినక యాయువతిం బట్టికొనియె. నంత నది
చూచి నీవు న న్నంటినకతన నంటువడితివి. సచేలస్నానం బొనర్చి
యింటి కరుగు. మూరక దురాశచేత మేటికొలం బేల వమ్ము
చేసుకొనెద వనుచుండ నవ్విప్రుం డది పాటించక యాయబల
పైఁబడి కట్టుకుని యిష్టంబు పరిపూర్తి గావించుకొనియె. ననం
తరం బాకుంతల యాభూసురునిం గని, “కటకటా! నే నబల
యగుటం జేసి నీపట్టుకు నెం దేని దవ్వు నరుగలేనైతి ననజలద
జలప్రవాహంబు క్షారోదధిం బడిననిధంబు నీవు నాసంగమం
బునఁ గులభ్రష్టుండవైతివి. నీ వింక యజ్ఞోపవీతపరిత్యాగంబు
చేసి మదీయచండాలజాత్యాహారాదులు చేసి, నాకుఁ బరిణ
యంబు లేనికతన నిఁకవేఱ నాకు వివాహంబు పని లేదు గావున
నాతోడ నుండు”మనిన నావిఫ్రుం డందులకు నంగీకరించె.
అంత నయ్యిద్దఱు గృష్ణానదీతీరంబునం జేరి ద్వాదశహాయ
నంబులు కామోపభోగంబు లనుభవించుచుండఁ గొంతకాలం .
బునకు నక్కుంతల మృతినొందుటం జేసి మాధవాభిఖ్యబ్రాహ్మ
ణుండు దుఃఖాక్రాంతచిత్తుఁడై యొంటిందిరుగుచుఁ దనమనం .
బున నిట్లు చింతించె.

81

సీ.

గురుతరం బగుబ్రహ్మకులమున జనియించి
        కుంతలయమదాని గూడి కులము
వమ్ము చేసుకుని హా యిమ్మెయిఁ గష్టంబు
        గుడుపఁగల్గెను భార్యఁ గూడనైతి
పాపంబు చేసిన పాపహరంబుగ
        శ్రీహరి యింక రక్షింపవలయు
ననుచుఁ బశ్చాత్తాపమును బొంది గొందఱు
        భక్తులౌ రాజులు పరమవేంక


తే.

టాద్రి కరుగుచునుండంగ నరసి తాను
వారివెంబడిఁ జని త్రోవ వారిభోజ
నాంతమున వారియెంగిలి యన్న మలరఁ
దినుచు హరి వేడుచును భక్తిఁ దనరుచంత.

82


వ.

దేహాభిమానంబు వదలి కపిలతీర్థంబున కేతెంచి యాపావన
తీర్థంబునకు మ్రొక్కి, తోడుగవచ్చి రాజు లాపుణ్యక్షేత్రం
బున వపనంబులు చేసుకొని స్నానంబు లాచరించి పితృలకు
శ్రాద్ధంబులు పెట్టి పిండప్రదానంబు సేయుచుండఁ దాను గనుం
గొని బ్రాహ్మణకులోద్భవుండయ్యు నూర కేల యుండవలె నని
తలంచి తనతలిదండ్రులు మృతినొందినవార్త యెఱింగినవాఁ
డగుటం జేసి తానట్లు వపనంబు చేసుకొని తీర్థంబున మునింగి
సంకల్పశ్రాద్ధంబు చేసి మృత్పిండంబులు మంత్రభక్తియుక్తంబు
గఁ బెట్టి తత్పిండంబు లెత్తి తత్తీర్ధంబున విడుచుచుండఁగఁ
బితృదేవత లాపిండంబులం బ్రియంబునఁ గరంబుల నందికొని
రనిన విని జనకుండు శతానందుని గనుంగొని యిట్లనియె.

83

క.

చండాలాంగన నొప్పుచు
నుండినకులహీనుఁ డూరకుండక నేవి
ప్రుండ నటంచుం బెట్టిన
పిండంబులఁ గొనరె వానిపిత లయ్యారె.

84


క.

అనఁగ శతానందుం డి
ట్లనె జనకా కపిలతీర్థమందున మొదటన్
మునిఁగిన పుణ్యముచేఁ గై
కొని రాపిండములు వారు కొంకక వింటే.

95


సీ.

ఆపుణ్య మటులుండె నటుగాక యాతని
        మహిమఁ జెప్పెద విసు మఱుదినంబు
పరమముదంబు నాగిరి యెక్కుచుండఁ ద
        త్పర్వతస్పర్శచేఁ బాపమెల్ల
నాతని విడి వాంతమయ్యె భయంపడి
        యప్పాపగహనంబు నప్పుడద్రి
పావకంబు దహింపఁగా వియద్వీథి మం
        టలు మించె నప్పుడు జలజభవుఁడు


తే.

వామదేవాదు లీక్షించి వచ్చి దివిజ
మార్గముననుండి యాశ్చర్యమగ్ను లగుచు
నేమి యీవింత యని మర్త్యు లెంతయు నపు
డద్రినిం గనుచుండిరి యదఱిపడుచు.

86


ఉ.

అప్పుడు వేంకటాచలమహామహిమంబు దవాగ్నిరూపమై
తప్పక విప్రుపాపమును దగ్ధముచేసె నటంచు మాధవున్
గొప్పగ నెంచి శీర్షమునఁ గొల్లఁగఁ బువ్వులవాన నించి యం
దొప్పఁగఁ జూచుచుండి రజుఁ డుర్వికి దా దిగివచ్చి నవ్వుచున్.

87

ఉ.

వానిశిరంబు మూర్కొనఁగ వాఁడు కృతార్థుఁడ నైతినంచుఁ దా
నానళినోద్భవుం బొగడి యంజలి చేసి భయంబు మీఱఁగా
దీనత నొంది యిట్లనియె దేవ వివేకము లేక పాపముం
బూని యొనర్చితిం బరమపూరుష నాగతి యెట్లు చెప్పుమా.

88


తే.

అనుచు వాఁ డార్తిఁ బొందుచు నడుగ నజుఁడు
పల్కె నిమ్మెయి నోవిప్ర! పాప మెల్ల
భస్మ మైపోయె సంశయం పడకు మింక
వేంకటాద్రికి నీవు వేవేగ నరిగి.

89


సీ.

స్వామిపుష్కరిణిలో స్నానంబుచేసి యా
        భూవరాహస్వామి పూజ సల్పి
మ్రొక్కుచు నీదేహమును విసర్జించుము
        తదనంతరంబు భూతలమునందు
ధన్యత పాండవదౌహితృవంశజూఁ
        డగుసువీరునిసుతుఁడై జనించి
నట్టి సుధర్ముని కాత్మసంభవుఁడవై
        వసుధ నారాయణవనపురమున


తే.

నిలిచి హరిభక్తి నెద నుంచి నిర్మలముగఁ
దొండమండలదేశ మఖండధర్మ
మార్గమున నేలుచుండు రమావిభుండు
పెండ్లియాడును నీపుత్త్రిఁ బ్రేమ దనర.

90


తే.

లక్ష్మియ కుమారిగా నీకు లక్షణాంగి
గల్గు శ్రీహరి కిచ్చి సౌఖ్యంబుగాను
బోయి వైకుంఠమును జేరు భూసురుండ
ననుచు మాధవునిం గని వనజభవుఁడు.

91

వ.

కారుణ్యార్ద్రచిత్తుండై వరంబు లొసంగుటం జేసి యప్పర్వతం
బునకు వేంకటాద్రి యనునామంబు సార్థకంబయ్యె. వేంకటా
ఖ్యాక్షరత్రయార్థంబు చెప్పుమనిన జనకుంజూచి శతానందుం
డిట్లనియె.

92


క.

విను వేమ్మనుపాపేంధన
మును గటయుగళాక్షరాగ్నిముఖ్యంబై కా
ల్చెను గావున వేంకటగిరి
యని పే రాయద్రి కొప్పె నవనీనాథా.

93


సీ.

మొనసి ప్రాతఃకాలమున లేచి వేంకటా
        ద్రిస్మరణము సేయుధీరు లవనిఁ
గ్రమముగ నూఱు గంగాస్నానములు మఱి
        సేతుయాత్రలు వేయి చేసినంత
పుణ్యఫలంబులం బొంది సుఖంతు రీ
        కథ మద్గురుం డగు గౌతముండు
నాకుఁ జెప్సినంత నీకుఁ జెప్పితి నిది
        వినినవారికి శుభవితతు లొదవు


తే.

వసుధ నిహపరసుఖములు వలసినట్టి
వార లీకథ వినవలె వాంఛమీఱ
నని శతానందముని చెప్పెనందువలన
జనకుఁ డావేంకటాద్రికిం జనఁదలంచి.

94


వ.

మంత్రిప్రముఖులం దోడ్కొని శతానందునితోడ వేంకటా
ద్రికి వచ్చి స్వామిపుష్కరిణియందు స్నానాదులు చేసి భూవ
రాహ శ్రీనివాసులసాన్నిధ్యంబునఁ గొన్నిదినంబు లుండి
క్రమ్మఱ మిథిలాపురంబు చేరె. నివ్విధంబు వేంకటాద్రిదర్శనంబు

చేసినపుణ్యంబువలన రామచంద్రుండు శంకరధనుర్భగ్నంబు
చేసి సీతను బరిగ్రహించె నంత సౌమిత్రి యూర్మిళను, భర
తుఁడు మాండవిని, శత్రుఘ్నుండు శ్రుతకీర్తిని బరిగ్రహిం
చిరి యనిన జనకుఁడు సంతసించె, ననిన విని శౌనకాదులు
సూతుంగని యిట్లనిరి.

95


క.

కమలాసనుఁడు రథోత్సవ
మమరఁగ శ్రీవేంకటాద్రియం దాహరికిన్
విమలుండై చేసెఁ గదా
కమలాక్షుం డచట నెంతకాలం బుండెన్.

96


క.

అన విని యాసూతుండి
ట్లనియెన్ శ్రీవేంకటాద్రియం దాఢ్యుండై
వనజాక్షుఁడు కలియుగ మడఁ
గిన దనుక యహీంద్రనామగిరిపై వేడ్కన్.

97


సీ.

ప్రాకృతజనులలోపల మెలంగుచు భూమి
        యందుండి శ్రీవేంకటాద్రివిభుఁడు
పరఘనప్రాకృతప్రభలచే దీపించు
        మిహిరాబ్జకాంతులు మెచ్చకుండు
బహురత్నగోపురప్రాకారసౌధము
        లొనయఁ జతుర్ద్వారములును గలిగి
మహనీయమరకతమణితోరణంబులం
        గొమరొందుచున్న వైకుంఠపురము


తే.

దలంచి యచ్చటి నిత్యముక్తులును దాను
జూడఁగోరుచు శేషాద్రి శుభ్రఘోణి

కొప్పుగా నేలుమని చెప్పి యొప్పగించి
మంచిమాయానిగూఢవిమాన మెక్కి.

98


వ.

శ్రీభూనీళాసమేతుండై హరి వైకుంఠపురంబుం జేరి యందుండు
నిత్యముక్తులం జూచి యాచరించి యప్రాకృతమణిమయాంతః
పుకంబున శేషతల్పంబునందు వసియించియుండె. నంత శేషాద్రి
యం దుండు వరాహస్వామి విశ్వకర్మనిర్మితపురంబును నంత
ర్ధానం బొనరించి యిచ్ఛావిహారంబుగఁ బ్రవర్తించుచుండెఁ.
బిమ్మట వృషభాసురునితో యుద్ధంబు సేయం జనియె. నివ్విధం
బునం గొన్నియబ్దంబులు జరిగినవెనుక యొక్కనాఁడు నార
దుండు వేంకటాద్రికి వచ్చి శ్రీనివాసుఁడు వైకుంఠంబు చేరిన
వృత్తాంతంబు నెఱింగి సత్యలోకంబున కేగి బ్రహ్మదేవునకు నమ
స్కరించి యిట్లనియె.

99


తే.

తండ్రి విను చక్రశేషభూధరము శుభ్ర
ఘోణి కొప్పించి తాను వైకుంఠమునకుఁ
జేరె ననఁగా నజుం డతిచింత నొంది
యేమియుం దోఁప కతనితో నిట్టు లనియె.

100


క.

విను నారద భూలోకం
బున శేషాచలమునందుఁ బురుషోత్తముఁ డుం
డినకాలంబునఁ దద్భూ
జను లతిపుణ్యాత్ము లైరి సాత్వికు లగుచున్.

101


సీ.

ఆస్వామి వైకుంఠమందుఁ గ్రమ్మఱఁ జేరి
        నందుచే శ్రీవేంకటాద్రిమీఁద
నేను సంకల్పించి నెనరునఁ గావించి
        నట్టి రథోత్సవం బావరాహ

దేవుఁ డొక్కఁడు సమర్థింపలేఁ డాశ్రీని
        వాసుఁ డం దుండంగవలయుఁ గనుక
వసుదేవదశరథవరతేజములఁ ది్త్రి
        ణీవృక్షముగ దీర్చి నిలుపుదు నట


తే.

సరవి దేవకికళను గౌసల్యగళను
బుట్టఁగాఁ దీర్చియుంతు నాపుట్టలోన
శ్రీనివాసుండు వేగమ చే రుపాయ
మీవు గావింపు మెట్లైన దేవమౌని.

102


క.

వనజాక్షుం డాగిరిఁ జే
కనపిమ్మట హరికి నాఁటిరీతిని నరదం
బువ వేడ్క జేయవలె మే
లొనరంగ జగద్ధితంబు నొందఁగ మఱలన్.

103


సీ.

క్షితిమీఁద నెప్పుడు శ్రీనివాసుఁడు లేని
        కతన మానవులు దుష్కర్ము లగుచుఁఁ
గలిమాయ నొంది సత్కర్మముల్ శ్రద్ధతో
        జేయలే రిఁకమీద శేషగిరికి
మఱల శ్రీహరి వచ్చి మనుజులనెల్ల ర
        క్షింప నుసాయంబు సేయకున్న
జనుల పాపంబును శమనుండు గని నార
        కమునందుఁ ద్రోయించుఁ గాన భూత


తే.

దయ మనంబున నుంచి మాధవుఁడు శేష
పర్వతము చేరునట్టియుపాయ మీవు
సేయుమన విని సురమునిశ్రేష్ఠుఁ డలరి
యజునిపాదంబులకు మ్రొక్కి యాదరమున.

104

సీ.

శరదభ్రశుభ్రలసత్కాంతి నిజదేహ
        మందు రప్పింపగా నరుణవర్ణ
కలితజటాజూటకళ లుప్పతిల్లఁగ
        లలిఁ బూర్ణచంద్రకళంక మనఁగ
నొఱవుఁ గృష్ణాజిన మొప్పంగఁ గటియందు
        మధ్యభాగమునందు మౌంజి వెలయ
మెఱపుఁదీవెను దాను మెచ్చక యురమునఁ
        దగిన బంగరుజన్నిదము వెలుంగ


తే.

నారదుఁడు లేచి యప్పు డానలినభవుని
యనుమతిని జాన్హవీతీరమునను జేరి
క్రతువు లచ్చట నొనరించు కశ్యపాది
సంయమీంద్రుల నీక్షించి సవినయమున.

105


తే.

వీణ మీటుచు గానధురీణుఁ డైన
వరమునీంద్రుఁడు సవనపువాటమునకు
రాఁగఁ గశ్యపముఖులు నారదుని జూచి
విహితరీతిని బూజించి వినుతి చేసి.

106


క.

ఘనతం దగ మఱి మును లా
యనిమిషమునివరుని గాంచి యని రిమ్మెయి నో
మునినాథుఁడ భవదాగమ
మున మే మెల్లరును మోద మొందితిమి కడున్.

107


తే.

అనఁగ నిని మౌనులార మీఱంద ఱిచట
యజ్ఞమును సల్పి తత్ఫలం బలర నెవరి
కర్పితంబులు గావింతు రావిధంబు
దెలుపుఁడని వల్క మునులు సందియము నొంది.

108

వ.

అప్పు డాభృగుమునీంద్రునితోడఁ దమలోఁ దాము విత
ర్కించుచు యజ్ఞఫలభోక్తయైన దేవుని వేర్పఱచి చెప్పు
టకుఁ దోచక యూరకుండ నారదుండు చూచి యిట్లనియె.

109


సీ.

మానితాష్టాక్షరీమంత్రార్థమును వీణె
        నందు బల్కించి సానందుఁ డగుచుఁ
బలికె నిట్టులు ప్రజాపతులార మీరు స
        త్క్రతువులు చేసి లోకములయందు
విలసితముగఁ బ్రజావృద్ధిఁ జేసితిరి మే
        లయ్యె మోక్షప్రదుఁ డైనదేవుఁ
డజుడొ పద్మాక్షుండొ హరుఁడొ విచారించి
        ముక్తిప్రదం బైనమూర్తియందు


తే.

సవనఫల మొగి నర్పించి సంతసింపుఁ
డనుచు హిత మొప్పఁ జెప్పి వీడ్కొనె విపంచి
తంత్రులను మీటుచును బరతత్వ మాత్మ
యందుఁ జూచుచు స్వేచ్ఛావిహారి యగుచు.

110


వ.

అమ్మునీంద్రుండు త్రిలోకసంచారంబు సేయుచునుండె.
నజుండు శేషాద్రియందు వల్మీకతింత్రిణీవృక్షంబుల నిర్మాణం
బొనరించి యుంచె. ననంతరంబున.

111


మ.

ఘనుఁడై నారదుఁ డన్నవాక్యముల నాకర్ణించి భావించి య
మ్మునులెల్లన్ గుమిఁగూడి తాము తమలో మూర్తిత్రయంబందు మిం
చిన మోక్షప్రదుఁ డైనవేల్పును పరీక్షించు ప్రకారం బదె
ట్టని యోచించి భృగుండు నేర్చుఁగన నిం కామూర్తిచందంబులన్.

112

వ.

అని నిశ్చయించి త్రిమూర్తులయందు ముక్తిప్రదుండైన
మూర్తిని విచారించుకొని రమ్మని భృగుమునీంద్రుని నంపఁగ
నమ్ముని సత్యలోకంబున కేగి తపోజనపరివృతుండై కొలువున్న
బ్రహ్మ నీక్షించి మ్రొక్కి యాబ్రహ్మ కూర్చుండు మనకమున్న
కూర్చుండినం జూచి యజునిమనంబునఁ గోపంబు వొడమిన
నాకోపం బడంచుకొని విధాత మాటాడకుండినం జూచి
యాబ్రహ్మ రజోగుణస్వరూపం బిట్టిదనియు నిట్టిరజోగుణ
ప్రధానుండైనవాఁడు మోక్షప్రదుండు గాఁడు గావున
నతనికి భూలోకంబున నాలయం బొక్కెడంగాని లేకుండు
నని నిశ్చయించి యాభృగుమునీంద్రుండు దిగ్గున లేచి కైలా
సంబునకుం బోయి పార్వతీసమేతుండై క్రీడించుచున్న శివుని
ముందు నిలిచినం గని పార్వత లజ్జించె, నప్పు డాశివుండు గాని
తఱి నిట్టిస్థానంబునకు నిమ్ముని రాఁదగునే యని క్రోధోద్రేక
రక్తాక్షుండై చూచుచు మాటాడకుండుటం జూచి యా
రుద్రుని తమోగుణస్వరూపం బిట్టిదని యెఱింగి యిట్టి
తమోగుణుండు ముక్తిప్రదుండు గాఁ. డీతనికి శరీరపూజలేక
లింగపూజ యగుం గాక యని నిశ్చయించి యందుండి
వైకుంఠంబునకు నరిగి యమ్మునీంద్రుడు శేషతల్పంబునందు
రమాసమేతుండై శయనించియున్న యా శ్రీనివాసునివక్షంబు
నందు నిజపదం బెత్తి తన్నుటం జూచి యాహరి దిగ్గున లేచి
యమ్మునికి బ్రణామంబు చేసి యర్ఘ్యపాద్యాదివిధులం
బూజించి కూర్చుండి తన్నుం దన్నిన యమ్మునిపాదంబు తన
తొడపై నిడికొని యొత్తుచు మందస్మితవదనుండై యాభృగు
నీక్షించి యిట్లనియె.

113

సీ.

పరమమునీశ మీ వచ్చుటఁ దెలియక
        యూరక పవళించి యుంటిఁ గనుక
యపచారినైతి నాయందుఁ గృపాకటా
        క్షం బుంచవలయు నోసంయమివర
నాయపచారంబునకుఁ దగుశిక్షకై
        యెఱిఁగి తన్నితిరి నా కిష్టమాయెఁ
గఠినమైన వక్షమునందుఁ దన్న మీ
        పద మెంత నొచ్చెనోగద యటంచు


తే.

నేమి సేయుదు మృదువైన దీపదంబు
చిగురుటాకులవంటి సేవ్యమైన
దిట్టిపాదము తాఁకిన నెదను నొప్పి
లేదు యోగీశ కోపము లేదు నాకు.

114


క.

వనజముఁ దాఁకినచందం
బున మీపదఘాత మెదను భూషణ మయ్యెన్
ఘనకఠినతరోరస్థల
మెనయఁగఁ దాఁకినపదాబ్జ మెట్లుండెనొకో.

115


వ.

అని వల్కి యమ్మునీంద్రుని పాదప్రక్షాళనంబు చేసి తత్తీర్థంబు
శిరంబునం జల్లికొని యిట్లనియె.

116


క.

వరవిప్రునిపదరేణువు
లిరవుగ శిరమున ధరింతు నీనాఁటికి మీ
చరణం బురమున సోఁకఁగ
ధరణీసురవర్య నేఁడు ధన్యుఁడ నైతిన్.

117


ఉ.

అని హరి పల్కఁగా భృగుమహాముని సంతసమంది మానసం
బున భయభక్తులం బొడమ పుండరీకాక్షునిమోము చూచి ల

జ్జను దలవాంచి యిట్లనియె శాశ్వతసద్గుణమూర్తి వీవు గా
వున నను బ్రోచి తిందు నిఖిలోన్నత నిన్ను నుతింప శక్యమే.

118


వ.

అని వినుతించి హరిని వీడ్కొని చని గంగానదీతటంబునం
గ్రతువు లొనరించుచున్న కశ్యపాదిమునివర్యులచెంతఁ జేరి,
అజరుద్రుల రజస్తమోగుణస్వరూపంబులను హరిశుద్ధసత్వ
గుణస్వరూపంబును దాఁ బరీక్షించి వచ్చినవృత్తాంతంబు
లమ్మునివర్యులకు వినిపింప వారు సంతసించి నారాయణుం
డొక్కఁడ ముక్తిప్రదుండని నిశ్చయించి సకలక్రతుపుణ్య
ఫలంబు లాస్వామికి నర్పించి విష్ణుధ్యానంబు సేయుచుండి
రంత.

119


సీ.

వనజాక్షు నాభృగుముని దన్ని నప్పు డా
        హరివక్షమున లక్ష్మి యలరుచుండి
తననివాసమునందుఁ దన్నినభృగునిపై
        నలుక రెట్టింపఁగ హరికి మ్రొక్కి
పలికె నిట్లని నిన్ను బ్రహ్మస్వరూపుఁడ
        వని నమ్మి నీయురంబునను నిల్చి
యిరవుగ నుంటి నేఁ డీభృగువర్యుండు
        న న్నెంచకుండఁ దాఁ దన్నెఁ గనుక


తే.

యతఁడు తన్నుట సంతోషమయ్యె నీకు
నాకుఁ గోపము పుట్టియున్నది మునీంద్రు
నేమి సేయుట కిష్ట మొక్కింత లేదు
గానఁ దప మాచరించెదఁ గమలనాభ.

120


క.

మానసమున మీపదములు
ధ్యానింపుదు నెచ్చటైనఁ దద్దయు నెపుడున్

జ్ఞానము నెపు డొసఁగుము
నే నీపదమందె నిలుతు నీరజనయనా.

121


క.

అనుచు రమాకాంత మనం
బునఁ గోపము గదుర వల్కఁ బురుషోత్తముఁ డా
వనజాలయతో నిట్లనె
గనుఁగొని ప్రియమార నయముగా వినుమనుచున్.

122


క.

సిరి నన్ను మౌని దనుట
కరమరగాఁ జూడవలవ దమ్మునిపాదం
బురమునఁ దాఁకినదే శుభ
కరమయ్యెను గోపగింపఁగాఁ దగ దింతీ.

123


చ.

అన విని లక్ష్మి యిట్లనియె నాత్మల కాత్మవు విశ్వకారణుం
డననిను బూజసేయ కిపు డక్కట యిక్కడ వచ్చి తన్నె న
మ్ముని కిఁక నేమి గల్గు నతిమూర్ఖుఁడు వానిఁ దలంప నింక నా
మనమున కింపుగాను బహుమానము చేసితి వీవు కేశవా.

124


సీ.

తనతండ్రి యైనవిధాత నీకు సుతుండు
        తా నావిధాతకుఁ దనయుఁ డయ్యె
దనకుఁ బితామహుం డని యెంచి పిన్నపె
        ద్దంతరమును జూడ కదరఁ దన్నె
నది యటులుండంగ నమ్ముని పరమాత్మ
        వని నిన్నుఁ దెలియలే కజ్ఞుఁడయ్యె
నటువంటిమునిపాద మిటు నీయురంబున
        సోఁకినంతటన యిచ్చోట నిలువఁ


తే.

దగదు సెలవైన నేను జిత్తమున నిన్ను
నిల్పి పూజించుచుండుట నీతి నాకు

సెలవొసంగుము జగదీశ చిత్ప్రకాశ
యంచు సిరి వల్క హరి యిట్టులనియె నగుచు.

125


సీ.

సుదతి విరించి నాసుతుఁ డాభృగుఁడు పౌత్రుఁ
        డని యంటి బిడ్డబిడ్డైనవాఁడు
తన్నిన నెఱుఁగఁడు పిన్నవాఁడని నేను
        గూర్మిఁ దలంపక కొట్టనగునె?
కడుపులోపలబిడ్డ కాలఁదన్నె నటంచుఁ
        దల్లి క్రమ్మఱ వాని దన్నఁదగునె
జీవకోటులను గుక్షిని నుంచుకొనిన నే
        నిట్టిదోషముల సహింపకున్న


తే.

నెవరు సైరించి గాతురు భువిని మఱియు
బ్రహపుత్త్రుఁ డతండు సద్బ్రాహ్మణుండు
తాపసోత్తముఁ డదిగాక తత్వవేది
నిజముగా భక్తి నాయంద నిలిపినాఁడు.

126


ఉ.

భక్తుఁడు నా కతిప్రియుఁడు భక్తుని కేనుఁ బ్రియుండఁ గాన నా
భక్తుడు నన్నుఁ దన్నుటకుఁ బాపియటంచును నింద సేతురే
ముక్తుఁ డతండు మౌనిజనముఖ్యుఁడు మూర్ఖుఁడు గాఁడు గాని భే
దోక్తులు మాని శాంతమతి నుండుము నాయురమందు భామినీ.

127


క.

అని విష్ణుం డనుటకు సిరి
కనుఁగవఁ గెంపెసఁగఁ గోపకలితాననయై
మనమున నసహ్యపడుచును
దనపతి కిట్లనియె వినుము దైత్యవినాశా.

128

క.

పరపురుషపదస్పర్శం
బరుదుగ నురముందు సోఁక బాగగునే నం
దురుప్రేమ నుండఁదగునే
వరపాతివ్రత్యధర్మవర్తన సెడదే?

129


సీ.

తన్నినవిప్రుని దండనసేయక
        యంపిత భయపడె నంచుఁ జెప్పు
చులకఁదనంబుగఁ జూచి నిన్నెందైన
        గొల్లవాఁడైనను గొట్టఁగలఁడు
ధర నాఁడువారైన దట్టించి నీమీద
        నవ్వుచు ఱాలతో రువ్వఁగలరు
నిను మ్లేచ్ఛు లీరీతి విని సడ్డసేయరు
        మించి నీగుణ మాక్రమించఁగలరు


తే.

తొలుతఁ బుట్టిన నీశాంతి తుదకు నన్ను
నిన్ను నెడఁబాపె నెందైన నిన్నుఁ జిత్త
ముందుఁ బూజించుచుండెద నంతెగాని
నీయురంబున నే నెట్లు నిల్తు నధిప.

130


సీ.

అని పల్కి తిలకించి యనమితాననయౌచు
        మఱిమఱిఁ జూచుచు మదిని లక్ష్మి
నిజపదాంగుష్ఠంబు నేల వ్రాయుచుఁ జింత
        నెనయుచుండఁగఁ జూచి నెనరు దాఁచి
కారుణ్య మూహించి క్రమ్మఱ మాటాడ
        కున్న వెన్నుని జూచి యుదధికన్య
హరి తన్ను మన్నింప కఱమరఁజేసినాఁ
        డీజాలిమాల నా కేల యింక

తే.

నని తలంచుచు వైరాగ్య మగ్గలింపఁ
గమలనాభుని హృదయపంకజమునందుఁ
జక్కఁగా నుంచికొని మ్రొక్కి చని రయమున
రమ్యతరమగు కొల్లాపురంబు చేరె.

131


క.

ఆకొల్లాపురివాసులు
శ్రీకమలాదేవి నచట శ్రీకరభక్తిం
బ్రాకటముగఁ బూజింపఁగఁ
జేకొని యాచోటు నుండెఁ జిరకీర్తి దగన్.

132


వ.

ఈక్రమంబుగ లక్ష్మీనారాయణులకుం బొడమిన ప్రేమకలహ
వ్యాజంబున లక్ష్మి కొల్లాపురంబు చేరెననిన సూతుం జూచి
శౌనకాదిమహామును లాశ్చర్యంబంది యిట్లనిరి.

133


శా.

శ్రీనారాయణుఁ డీప్రకారముగ నాక్షీరాబ్ధిజన్ బాసి యా
భూనీళాంగనలందు మోహమును సంపూర్ణంబుగా నుంచి యం
దానందించుచునుండెనో సిరిని నెయ్యంబొప్ప భావించుచున్
దీనత్వంబును బొందుచున్ వగచెనో ధీరాత్ముఁడై యుండెనో.

134


క.

అని శౌనకుఁ డడుగఁగ దగ
విని సూతుం డిట్టు లనియె వెన్నుఁడు సిరిపై
నెనరు మనంబును బెనఁగొనఁ
దనలో నిటు తలఁచె విరహతాపము మీఱన్.

135


సీ.

ఆదేవముని వేంకటాద్రిపై నే లేని
        తప్పు విరించితోఁ జెప్ప నేల
యజుఁడు నారదు నంప నతఁడు మౌనులచెంతఁ
        జేరి మూలప్రశ్న సేయ నేల

తత్పరీక్షకు భృగుతాపసేంద్రుఁడు వచ్చి
        ధైర్యంబుతో నన్నుఁ దన్ను టేల
యది చూచి నాకు నిత్యానపాయినియైన
        భామ న న్నిపు డెడఁబాయు టేల


తే.

కటకటా యేమి సేయుదు కర్మమునకుఁ
గాల మెంతటివారైనఁ గడపలేరు
శ్రీయువతి యిప్డు న న్నెడఁబాయుకొఱకు
గలిగె నద్భుతముగ నెన్నికారణములు.

136


తే.

మంచి దిది యొకకొఱఁతగ నెంచు టేల
చంద్రబింబమునందుండు చంద్రికవలె
విమలయై లక్ష్మి నాయందు వెలయుఁగాని
పరఁగ ననువీఁడ దెందు సౌభాగ్యలక్ష్మి.

137


క.

సిరి యెదలో నే నెప్పుడు
కరము ప్రియంబార నుండి గ్రమ్మఱ నాహృ
త్సరసిజమున నిఃవసింపఁగఁ
దిరముగఁ జేసుకుని బ్రోతుఁ ద్రిజగము లలరన్.

138


సీ.

తోయధికన్యకాస్థూలదేహం బిప్పు
        డెందున్నఁగాని నాయంద సూక్ష్మ
తను వొప్పుచున్నది దానిచేఁ జింతలే
        దైన లోకవిడంబనార్థముగను
మొనయు సర్వజ్ఞత్వమును డాఁచి శ్రీరమా
        వనితను వెదుకఁగవలయు నిపుడు
నే నూరకుండినఁ బూని యోపిక లేని
        కొంద ఱందురు లేని నింద లిడుచుఁ

తే.

గొలువుఁ డని పార్షదులకు వైకుంఠపురముఁ
బాయకుండుఁడు నిరతంబు పటిమ విడక
చెప్పి భూనీళలకు వారి నొప్పగించి
మఱల నిట్లని తలఁచె నమ్మాధవుండు.

139


వ.

కొంతకాలం బట్లుండిన నయ్యిందరను ముద్వక్షంబునం దుంచు
కొందు నని నిశ్చయించి భూనీళలం జూచి బుజ్జగించి రమా
దేవిని వెదకి గ్రమ్మఱఁ దోడ్కొనివత్తునని వారితోఁ జెప్పి
వైకుంఠంబు విడిచి వేంకటాద్రికి వచ్చె ననఁగ శౌనకాదు లిట్లనిరి.

140


క.

శ్రీవనితామణి నరయుచు
శ్రీవైకుంఠంబు విడిచి క్షితిపై నుండెన్
శ్రీవేంకటగిరిఁ జేరిన
శ్రీవిష్ణుం డచట నేమి సేయుచునుండెన్.

141


సీ.

అని మును లడుగంగ నాసూతుఁ డిట్లనె
        వినుఁ డాదివిష్ణుండు వేంకటాద్రిఁ
జేరి యచ్చటనుండు శ్రీవరాహస్వామి
        కిని పుష్కరిణికి దక్షిణముగాను
విలసిల్లు తింత్రిణీవృక్షమూలమునందు
        మెఱయుచున్నట్టి వల్మీకవిరివి
యందుఁ బ్రవేశించి యయుతవత్సరములం
        దెవరికిం గన్పింప కెలమిగాను


తే.

బుట్టలో వెల్గుచుండఁగ భూతలమునఁ
దప్ప కిరువదియెనిమిది ద్వాపరాంత
మందుఁ గలియుగ ముదయించె నపుడు చోళ
రాజు భువి నేలుచుండె ధర్మంబు దనర.

142

వ.

అట్టికాలంబునఁ బర్జన్యుఁడు కాలవృష్టి గురియించుచుండ
భూమి సమృద్ధంబుగ సస్యాభివృద్ధి నొసంగుచు గోవులు బహు
క్షీరంబు లిచ్చుచుండు, పతివ్రతాంగనామణులును సతీవ్రతు
లగుపుర్షులును, మాతాపితృగురుదైవభక్తి గలపుత్త్రు
లును గల్గియుండుదు రట్టి యుగాదికాలంబునఁ గొల్లాపురిం
జేరిన లక్ష్మి, శ్రీహరి వైకుంఠంబు విడిచి శేషాచలంబునందుఁ
దింత్రిణీతరుమూలస్థలవల్మీకంబునందు వసించియుండుచందంబు
భావించి తెలిసి తనమనంబున నిట్లు వితర్కించె.

143


క.

నాకొఱ కంబుజనాభుడు
వైకుంఠము విడిచి వచ్చి వల్మీకములో
నేకాకి యగుచు నం దిపు
డాకొనినాఁ డేమి సేయు దకటా యంచున్.

144


క.

చింతించుచు నే నాహరి
చెంతం జేరినను నన్నుఁ జేకొను వైనం
బంతము విడువం దగదని
స్వాంతంబున నిశ్చయించి సరవిగ నంతన్.

145


తే.

వేగ కొల్లాపురంబును విడిచి గొల్ల
పొలఁతికైవడి నొంటిగఁ బోయి చోళ
రాజసతియున్న మణిమందిరంబుచెంతఁ
జేరి హరి కిఁక నెటు తృప్తిఁ జేతునంచు.

146


వ.

మనంబున దలంచుచున్న సమయంబున మహాలక్ష్మిభావం బజుం
డెఱింగి రుద్రుం దోడ్కొనివచ్చి యచ్చట ధేనురూపంబు
ధరించె నదెట్లనిన.

147

సీ.

కపిలవర్ణంబుతోఁ గర మొప్పుదేహంబు
        మంగళకరమైన శృంగములుసు
కాటుకకనులు సింగారంపుఁ జెవులును
        నల్లనై మెఱసెడు నాసికయును
గురుతరకంఠంబు గోపురం బుదరంబు
        తగుదీర్ఘవాలంబు తక్కుచూపు
ద్విరదతుండములట్ల దీపించుతొడలును
        పూర్ణకుంభాభమై పొసఁగుపొదుగు


తే.

బటువు లైనట్టి కదళికాఫలములట్ల
నునుపుగా నొప్పు నాల్గుచన్నులును గల్గి
క్షీరవారిధిలోఁ బుట్టి చెలఁగినట్టి
కామధేనువువలె లక్ష్మికడకు వచ్చె.

148


తే.

వత్సరూపంబుఁ దాల్చె నీశ్వరుఁడు సరవి
ధవళరూపంబు మెఱయగఁ దల్లిచెంతఁ
బాలు ద్రావుచు నెగరుచు బాల్యలీల
లరుదుగాఁ జూపఁగాఁ జూచి యాదిలక్ష్మి.

149


చ.

కమలజు శంభు లీక్రమముగా హరి కిష్టము సేయుకోర్కెతో
నమలినధేనువత్సయుతు లైనవిధంబు మనంబులోపలన్
గ్రమముగ నందుఁ దా నెఱిఁగి గ్రక్కున రెంటిని దోలి తెచ్చి పెం
పమరఁగ దూడనావు నపు డమ్మెదనంచు వచించుచుండగన్.

150


క.

విని చోళనృపాలుని సతి
తనబిడ్డకుఁ బాలు దాను ద్రాగించుట కా

వనితకుఁ గోరినవిత్తం
బనుపమగతి నిచ్చి కొనియె నావున్ దూడన్.

151


వ.

అట్లు కొని మున్ను తమకుండిన ద్విసహస్రధేనుగణం
బులలోఁ దోలి గోపకుని కొప్పించె నంత నమ్మహాలక్ష్మి యజ
హరులు ధేనువత్సరూపంబులను ధరించి వల్మీకవాసి యగు
వాసుదేవుని బోషింతు రింక నాకు నొకచింత లే దీస్వామి
యెందైన సుఖించుచుండుట చాలునని తలంచి కొల్లాపురం
బున కరిగె నంత బ్రహ్మస్వరూపం బైనధేనువు దినదినమున.

152


క.

గోవులలో మేయుచుఁ జని
శ్రీవేంకటశైల మెక్కి క్షీరంబును దా
నావల్మీకములోపలి
శ్రీవిష్ణుని కర్పణంబు సేయుచు నుండెన్.

153


క.

హరి యాక్షీరము ద్రావుచుఁ
బరమానందంబు నొంది బ్రహను రుద్రున్
మురియుచు మెచ్చుచు నుండిన
తఱిఁ జోళనృపాలుభార్య తనబిడ్డకుగాన్.

154


తే.

మున్ను తాఁగొన్నదూడతో మొదవునపుడు
సదనమున కొప్పఁ దెప్పించి సాధ్వి గోవు
దానిమేనెల్ల నివురుచుఁ దాను దాని
పిండఁబోవఁగఁ బాలులే కుండఁగాను.

155


తే.

తాను దనమదిలో నిట్లు దలఁచె నావు
పొదువు యోచించి చూచినఁ బూర్ణకలశ
మట్ల మెఱయుచు నుండియం దద్భుతముగ
బాలు లేకున్న దిది యేమి పాప మనుచు.

156

వ.

కొండొకతడవు చింతించి యా ధేనువందు లక్ష్యం బుంచి
యుండి, మఱికొన్నిదినంబులు గడచిన యొకనాఁడు పాలు
పిండగడంగినం బాలు లేకుండుటం జూచి గోపాలుని రావించి
యిట్లనియె.

157


సీ.

గోపాల యిపు డింతగొప్పావుపొదుగులోఁ
        బాలు లేకుండెడి లీల యేమి
నీ వరణ్యములోనఁ ద్రావినా వన విని
        గోపఁ డిట్లనియె నీగోవుపాలు
నేఁ ద్రావలేదమ్మ యెంచ దూడయ ద్రావి
        యుండును ననఁగఁ జాలుండు నదియు
మాయింట నున్నది పోయి పాలానునె
        దబ్బరలాడెదు దెబ్బలొదవు


తే.

ననఁగ నవ్వాఁడు భయపడి యమ్మ నేను
గనుట లే దెట్టిదుష్కార్య మనుచు నావు
దనకుఁ దాఁ బొదువునుబడి త్రావెనేమొ
యనఁగ వానిని దన్నించి యవల నంపె.

158


తే.

అపుడు వాఁ డేడ్చుచును జని యాలమంద
వెంటఁ దాఁ బోక యాగోవు వెంటనంటి
బోవఁగా నది ఫణిరాజభూధరంబు
మీఁది కెగనెక్కిపోయి వల్మీకమందు.

159


తే.

పొదుగు దిగజారవిడచి పా ల్పొలుపుగాను
బుట్ట నిండింపఁగాఁ జూచి దిట్టఁడైన
గోపఁ డప్పుడు తనచేతిగోడ్డ లెత్తి
గోవునడినెత్తిపై మించి గొట్టఁబోవ.

160

ఉ.

అప్పుడు విష్ణుదేవుఁ డహహా నిలు వావును గొట్టఁబోకుమా
దప్పక పా లొసంగినను దల్లివిధంబుసః గాచె నిత్య మా
విప్పుడు గొల్లచే మడియు టెట్లు సహింపఁగవచ్చు నంచుఁ దాఁ
దెప్పున నైజమస్తకము ధేనువుశీర్షముమీఁద నిల్పఁగన్.

161


సీ.

గొల్లవాఁ డెత్తిన గొడ్డలి హరిమస్త
        కంబులోఁ జొరఁగ రక్తంబు వెడలె
తక్క కప్పుడు సప్తతాళవృక్షప్రమా
        ణంబున నూర్ధ్వముఖంబుగాను
బొంగుచు దిగజారి భూమిపైఁ బడఁజూచి
        గోపకుం డదరుచుఁ గూలి మడిసె
నది చూచి గోవు శేషాద్రిఁ జెచ్చెర డిగ్గి
        తనచోళభూపతిసభకుఁ బోయి


తే.

నేలఁ బొఱలుచు నఱచి కన్నీరు నింప
ధేనువును గాంచి యా రాజు దిగులుపడియె
నప్పు డాపశు వందుండ కొప్పుగాను
పఱచుటం జూచి దానితో బంపెఁ జారు
లను గనుంగొని వచ్చుటకును విభుండు.

162


వ.

అప్పు డాచారు లాగోవువెంట నంటిపోవ నాగోవు వేంక
టాద్రికి వచ్చి వల్మీకంబుడగ్గఱ నిల్చె నంతఁ జారు లాపుట్టలో
నుండి రక్తం బెగురుటయును, గో వందు నిలుచుటయుసు,
గోపఁ డందుఁ బడియుండుటయును జూచి భీతిల్లి యందుండి
రాజుకడకు వచ్చి తద్వృత్తాంతం బంతయు నెఱింగింప నారాజు
విని దిగ్గున లేచి పల్యంకంబునఁ గూర్చుండి పరివారంబుతో
నగ్గిరికి వచ్చి చూచి వెఱఁగుపడి తనమంత్రిం జూచి యీవల్మీకం

బునం దిట్టిరక్తంబు ప్రవహించుటకు హేతు వేమనుచు
గోవు కన్నీరు నించుటకును గోపఁడు పడియుండుటకు
యోచించి వితర్కించుచుండు సమయంబున.

163


సీ.

వనజదళాక్షుఁ డావల్మీకమందుండి
        యపు డతిరక్తసిక్తాంగుఁ డగుచుఁ
గన్నీరు వెడల గద్గదకంఠుఁడై శంఖ
        చక్రము ల్చేపట్టి సరగ లేచి
యారాజునుం జూచి యనియె నోపాపాత్మ
        యీపుట్టలోఁ జేరి యెసఁగుచుండ
నేఁడు నీగోపాలుఁ డీడకు వచ్చి కో
        పంబున నా కెప్డు పాలనొసంగు


తే.

నావు నడినెత్తి గొడ్డఁట నవనిఁ బడఁగఁ
జంపెదని మించి పొంచి యాక్షణమ గొట్టఁ
బోయి నాశిరమునఁ గొట్ట భూమిమీఁదఁ
గూలినాఁ డతిపాపంబుఁ గూడినాఁడు.

164


సీ.

విను రాజ ది క్కెక్కడను లేక తల్లిదం
        డ్రులు లేక నాలుబిడ్డలను లేక
బాంధవులును లేక బహుపేదవాఁడనై
        పరదేశినై వచ్చి ఫణినగంబు
పైనుండు పుట్టలోపలఁ జేరి యుండఁగఁ
        దల్లిచందమగు నీధర్మసురభి
క్షీరంబు లిచ్చి రక్షించుచుండంగ నీ
        పశుపాలుఁ డేడ్తెఱఁ బశువుఁ జంప

తే.

వచ్చి నను గొట్టె దానను వచ్చినట్టి
పాప మెవ్వాఁడు మోయును వాఁడు నీకు
బంటుగావున నీవును వానివలెను
పాప మేడ్తెఱఁ బొందుము ప్రాపు చెడఁగ.

165


తే.

పొమ్ము ధాత్రిఁ బిశాచమై నెమ్మి లేక
శాప మిచ్చిన విని మదిఁ దాప మంది
తా ముహూర్తంబు మూర్ఛిల్లి ధరణి వ్రాలి
లేచి ఖేదంబు నొందుచుఁ జూచి యపుడు.

166


వ.

లీలామానుషవిగ్రహుండై నిలిచియున్న హరికి సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి ముకుళితకరకమలుండై గద్గద
స్వరంబునఁ గన్నీరు పెట్టుకొని యిట్లనియె.

167


చ.

కటకట దేవ నే నెఱిఁగి కష్టము నీ కనరింపలేదు దు
ర్ఘట మగుశాప మిచ్చితివి కష్టమునం బడఁజేసి తీవు నే
నెటువలె నోర్చియుందు జగదీశ్వర నాయెడఁ బ్రేమ నుంచి వి
స్ఫుటతర మైనశాప మిఁకఁ బోవు నుపాయము సేయు నెమ్మదిన్.

168


చ.

అని నృపుఁ డార్తుఁడై పలుక నంబుజనాభుఁడు వానిఁ జూచి తా
నెనరున నిట్లనెన్ నృపతి నీయెడ నేరము లేనిరీతి నే
నొనర నెఱుంగకుండ నిటు లూఱక శాప మొసంగితిన్ భువిం
దనరఁగ నాదువాక్య మిఁకఁ దప్పదు గావున నేమి సేయుదున్.

169


చ.

భుజగగిరీంద్రమం దొదిగి పుట్టమఱుంగున డాఁగియున్న నన్
గజిబిజి చేసి కాలగతి గష్టము నా కొనరించె నందుచే
నిజము నెఱుంగలేక యతినీచుఁడనై సుజనుండవైన నిం
గుజనునిఁగాఁ దలంచి యఘోరపుశాపము నీ కొసంగితిన్.

170

సీ.

వసుధ నీశాపంబు వారింపఁగా లేను
        విపులవాత్సల్యంబు విడువలేను
గాన నీపైనుండుకరుణ మహాదుఃఖ
        కరమయ్యెఁ బైశాచగతిని బొంద
లేక నావలెఁ దగ నీకు దుఃఖము గల్గె
        నిరువురకును ఖేద మేకమాయెఁ
గలియుగ మున్నంత కాల మీశాపంబు
        ననుభవించుచునుండు మనసుఁబట్టి


తే.

సరవి నాకాశరాజను జనవిభుండు
తనకు సుతయైనపద్మావతిని ముదమునఁ
బ్రేమ మీరఁగ నా కిచ్చి పెండ్లి సేయు
నపుడు మకుటముగా శీర్షమందు నిలువు.

171


వ.

అట్టికిరీటం బెట్టిదనిన నూఱుబారవులు కనకంబుతోఁ దీర్చి
వెలలేనిజీవమణులఁ దాఁపించియుండు ప్రతిశుక్రవారంబును
దప్పక యమ్ముకుటంబు నాఱుగడియలు శిరంబున ధరింతు
నపుడు మదీయాక్షులం దానందబాష్పంబులు ధరించు
నయ్యాఱుగడియలు నీవు సుఖింపుచుందువుగాక యని
యానతిచ్చిన విని చోళరాజు శాపగ్రస్తుఁడై చనియె. అంత
హరి వల్మీకంబునం బ్రవేశించి గొడ్డటంబడినగాయంబున
కోపంజాలక బృహస్పతిని మనంబునఁ దలంప నాగురుండు
వల్మీకంబుకడకు విచ్చేసినం జూచి దీనవదనుండై హీనస్వరం
బుతోఁ దన కందుజరిగినవృత్తాంతం బంతయుఁ జెప్పి హరి
వెండియు నిట్లనియె.

172

సీ.

ఓదేవదేశిక సాదరంబున విను
        గాలకర్మంబులు గ్రహగతులును
గూడినందునఁ గోపకుఁడు నడినెత్తిపై
        గొప్పగొడ్డంటను గొట్టినాఁడు
నొప్పి మెండైనది దెప్పున నౌషధం
        బిప్పుడ భావించి చెప్పు మనఁగ
సురగురుం డది విని శోకాకులస్వాంతుఁ
        డగుచు నిట్లనియె మహాత్మ నీకుఁ


తే.

గాలమును గర్మమును గ్రహగతులు గలవె
నీమహిమ లన్యు లెఱుఁగరు నీకుఁ దెలియు
నైన మంచిది నన్ను మున్నడిగి తీవు
గానఁ జెప్పెద నొకమందుఁ గమలనాభ.

173


తే.

పట్టుగా విను జిల్లేడిప్రత్తి నెత్తి
పాలలో నద్ది నడినెత్తి పట్టి గాయ
మం దిడిన నొప్పి శాంతమౌ ననుచుఁ జెప్పి
హరికిఁ బ్రణమిల్లి సురగురుం డరిగె నంత.

174


సీ.

హరి గురుఁ డెఱిఁగించినట్టిమం దాగాయ
        మందుఁ బెట్టుచునుండె ననఁగ నవ్వి
శౌనకాదులు విని జాలినొందుచు సూతు
        నీక్షించి వెఱగంది యిట్టులనిరి
ఘనరోమహర్షణమునిపుత్త్ర తింత్రిణీ
        భూజవృత్తాంతంబు పుట్టవిధము
మొదలగువృత్తాంతములు చెప్పు మీకథ
        విన వేడుకయ్యెడు మనసులందు

తే.

లలిని పుట్టించు రక్షించు లయ మొనర్చు
నట్టిసర్వజ్ఞునకు లేనియాపదలును
గలిగె నిది విన్న మది వెన్నకరణిఁ గఱఁగు
చున్న దని బాగుగాఁ జెప్పు సుకృతధనుఁడ.

175


క.

అని వా రడుగగ సూతుఁడు
విని యిమ్మెయిఁ బల్కె నాది వెన్నునిచరితల్
ఘన మగుగూఢార్థంబులు
గనుక విశేషముగఁ జెప్పఁగా వశమగునే?

176


వ.

అయిన నాకుఁ దోఁచినంతవఱకుఁ జెప్పెద వినుండు. దశరథుం
డును గౌసల్యయు దేహముక్తు లగుకాలంబున నారామ
చంద్రునియం దత్యంతమోహం బుంచి చనినకారణంబులఁ
బద్మసంభవుండు భావించి దృణానుబంధానుసారంబుగ రామ
కృష్ణరూపంబులకుఁ గారణంబు నైనహరికి నిరవుగ నుండు
టకై దశరథుని తేజంబు తింత్రిణీవృక్షంబుగఁ గౌసల్యాదేవి
తేజంబు వల్మీకంబుగ వేంకటాద్రియందు నిర్మించె. తత్క్ర
మంబుగ వసుదేవదేవకులును దేహవిము క్తికాలంబులం
గృష్ణునియందు వాత్సల్యతకుఁ దింత్రిణీమహిజరూపదశర
థునితేజంబున వసుదేవునితేజంబును, గౌసల్యారూపం బగు
వల్మీకంబున దేవకీదేవితేజంబు నుంచె. నారామకృష్ణాభిధాన
కలితుఁ డైనవిష్ణుం డాకాలంబున మాతృగర్భంబునం దున్న
శిశువుకరణి పదివేలవత్సరంబు లాపుట్టయందు వసియించి
యుండెఁ గావున దశరథుండు తింత్రిణీపాదపంబు, కౌసల్యయ
వల్మీకంబు, లక్ష్మణుండ శేషపర్వతంబు, అయోధ్యయ తద్భూ
ధరపుణ్యకాననంబు, సరయువ స్వామిపుష్కరిణి, రామ

చంద్రుఁడ వల్మీకవాసియగు శ్రీనివాసుఁడు, తదనంతరంబు
వసుదేవుండ తింత్రిణీతరువు, దేవకిదేవియ వల్మీకంబు, బల
భద్రుండ పన్నగాచలంబు, మధురానగరంబె వేంకటగిరి,
యమునానదియ స్వామిపుష్కరిణి, యాదవులె మృగంబులు,
గోపికలె ఖగంబులు, కృష్ణుండె వల్మీకవాసి యగువేంక
టేశుండు, మఱియు వైకుంఠంబ నిగమమయం జగు శేషా
చలంబు, విరజానదియ సువర్ణముఖరి, నారాయణుండ లీలా
మానుషవిగ్రహుం డైన శ్రీనివాసుఁడు, అచ్చట ననేక
ముక్తబ్రహ్మ లనేకఖగంబులై యనేకముక్తరుద్రులు మృగం
బులై సనకసనందనాదులు వనచరులై వర్తించుచుండఁగఁ
బరమపుర్షుండైన వేంకటేశ్వరుం డందు విచిత్రలీలావినోదం
బులం గ్రీడించుచుండియుఁ దనకు శరీరబాధ గల్గినట్ల మాయగా
నటించినాఁ డింతియగాని యమ్మహానుభావున కాబాధ లేదు.
మీరలు నెమ్మదిగ వినుండు, ఆస్వామిని దర్శింప వచ్చినవారు
సకలసత్కర్మసిద్ధులం బొందుదు రని చెప్పి సూతుండు
వెండియు శౌనకాదుల కిట్లనియె.

177


శా.

వైకుంఠంబును వీడి శేషగిరిపై వల్మీకగర్భంబులో
శ్రీకాంతుండు వసించి చేసిన మహాచిత్రంబుల న్వింటి రిం
కాకంజాక్షుఁడు మర్త్యుఁడై నరులలో నాటాడె నాచందమున్
మీకుం గొంచె మెఱుంగఁజేసెదను నెమ్మి న్వీనులం బట్టఁగన్.

178


మ.

వినుఁ డానిర్జరదేశికుండు హరికిన్ వే నొప్పి వారింపఁ జె
ప్పినపాల్దూదియఁ దెచ్చి గాయముపయిం బెట్టెన్ హితుం డొక్కఁడై
నను లేకుండఁగ నేమి సేతు నని శ్రీ నారాయణుం డార్తుఁడై

తనమం దప్పుడు తాన దెచ్చుటకుఁ బ్రాతఃకాలమం దొక్కఁడే.

179


సీ.

అరుగునప్పుడు వరాహస్వామి వృషభాసు
        రునితోడఁ బోరాడి దునిమివైచి
యవల భూదేవితో నఖిలపర్వతగుహ
        సానుశృంగములందు సంచరెంచి
బహువత్సరములకుఁ బన్నగాద్రిఁ దలంచి
        మఱలివచ్చుచు నున్నమార్గమునను
నరునిచందమున శ్రీహరి నిల్చియుండఁగఁ
        గని నరుంబోలి రక్కసుఁ డొకండు


తే.

క్రచ్చరం జూచి పోరాడ వచ్చినాఁ డ
టంచుఁ గడునట్టహాసంబు మించి చేసి
దిగ్గజంబులు మూర్ఛిల్ల దృఢముగాను
ఘుర్ఘురారావ మొనరించె ఘోరముగను.

180


క.

ఆరభసంబున కులుకుచు
నారాయణుఁ డదిరి చూచి సనపొదలోనన్
దూఱుకొనంగాఁ గని యా
దారిని గిటిదేవుఁ డరిగి దర్పము మీఱన్.

181


క.

ఘోరాకారుం డగుచును
గోరులు గీటించి యంత గొబ్బునఁ బొదలో
చూఱున ఘోణిం గని యపు
డూరక యొకమూల విష్ణు వొదుకుచు నుండెన్.

182


వ.

అట్లుండి కన్నీళ్లు నించుచుండ నతనిదీనదశం జూచి దనుజుండు
గాఁడు దనుజాంతకుం డని తెలిసి నిష్కారణంబుగ నితని

యందుఁ గోపంబు చేసితినని మనంబున వగచి బాష్పపూరిత
లోచనుండై యందుండు లీలామానుషవిగ్రహుని చెంతఁ జేరి
యోడకు మని యిట్లనియె.

183


సీ.

వైకుంఠ మెడఁబాసి వచ్చినగతి యేమి
        సిరి యురంబున లేనిచిత్ర మేమి
మానవాకృతి నిందుఁ బూనియుండుట యేమి
        తలమీఁద గాయంబు దగులు టేమి
యుడిగినబలముతో నొదుగుచుండు టిదేమి
        గన్నుల బాష్పముల్ గారు టేమి
నేను వచ్చినయప్డు నిల్చి పల్కక నాకు
        లోగిన ట్లడవిలో డాఁగు టేమి


తే.

వింతగాఁ దోఁచుచున్న దీవిధము నాకుఁ
దెలుపు నిక్కంబుగా నంచుఁ గలఁత నొంది
యడుగ నఱమఱలేక దీనాస్యుఁ డగుచు
నిమ్మెయిం బల్కె నాతని కిమ్ము మెఱసి.

184


సీ.

విను ఘోణిరూప నావృత్తాంతమంతయు
        వైకుంఠమున నుండ శ్రీకలితుఁడయి
యప్పు డాభృగుమౌని యక్కునఁ దన్నె నా
        యందు నుండినలక్ష్మి యపుడు చూచి
పరపుర్షుఁ డేతెంచి పాదంబునం దన్ని
        నట్టియెడంబాసి యరుగుదాన
నంచుఁ గొల్లాపురం బందుఁ జేరినయంత
        వైరాగ్యమును బొంది వచ్చి తిటకుఁ

తే.

గాన సంసారసౌఖ్యంబు నేను రోసి
నీకడకు వచ్చి విపులవల్మీకమునను
గుదిరియుండఁగ నందొక్క గొల్లవాఁడు
గొడ్డటం గొట్టె నడినెత్తి యెడ్డెఁ డగుచు.

185


క.

ఆగాయము మానెడుకొఱ
కాగీష్పతి మందు చెప్పె నయ్యౌషధమే
యీగిరిమీద న్వెదకుచు
రాఁగా నినుగంటి నోవరాహవరేణ్యా.

186


క.

తలగాయము నొప్పింపఁగ
బలహీనుఁడ నైతిఁ గాన బలవంతుఁడవై
చెలఁగుచు నాపై రొప్పిన
నలుకుచుఁ బొదఁ జేరి తిట్టు లనుపమధైర్యా.

187


ఆ.

కరుణమీర నీవు గలసి మాటాడితి
వందువలన డెందమందుఁ బూర్వ
మున్న చింత దీరె నన్ను నీవానిగఁ
జెంత నుంచుకొనుము శ్రీవరాహ.

188


క.

ఆవైకుంఠము నొల్లక
నీవే నేనంచుఁ జాల నెన రెనయఁగ నీ
తావున నుండితి నెక్కడ
నీ వుంటివి చూడలేదు నే నిం దనుచున్.

189


సీ.

హరి యపు డడుగఁగ నావరాహస్వామి
        పలికె నిట్లంచు నీపర్వతమున
వృషభాసురుఁడు చేరి విడివడి శ్యామాక
        ధాన్య మెందుండినఁ దా గ్రహించి

గనివోవు గనుక యాక్రూరాసురునితోడ
        బహుదినంబుల ఘోరభండనంబు
సేయుచునుంటి నమ్మాయరాక్షసుఁ డెందుఁ
        జిక్కకయుండియుఁ జిక్కెఁ గనుక


తే.

వాని శిక్షించి యిచటికి వచ్చి నిన్ను
నేను జూచితి నన్నును నీవు నిపుడు
గాంచితివి నాకు నీవును మంచినేస్త
కుండ వైతివి సంతస మొందినాఁడ.

190


ఆ.

అని వరాహదేవుఁ డప్పుడు వల్కఁగ
విని ముదంబు నొంది విష్ణుఁ డనియె
నవనిఁ గలియుగాంత మందాక తగినచో
టొండు చూపు నాకు నుండుటకును.

191


సీ.

అని చక్రి వల్కఁగ విని వరాహస్వామి
        యిది యేమి యని సంశయించి పల్కె
హరి విను పేదల నాశ పెట్టఁగరాదు
        చెంత నెప్పుడు బలవంతులకును
దావీయరా దైన ద్రవ్య మిచ్చితి వేని
        కొలచి నూఱడుగులు కుతల మిచట
నీ కిత్తు నని పల్క నాకంజలోచనుం
        డిట లక్ష్మి నాతోడ నెనసియున్న


తే.

ధనము నీ కిత్తు నిపుడు శ్రీతరుణి యలిగి
తాము గొల్లాపురము సేరెఁ గాన ధరణిఁ
గొనుటకై రూక లెవరి నేఁ గొలిచి తెత్తు
ప్రబల యాచించితిని యిందు బ్రదుకవలయు.

192

చ.

అని హరి వల్కఁగా విని మహామహుఁ డైనవరాహదేవుఁ డి
ట్లనియె నిదేటిమాట లిపు డర్థ మొసంగక భూమి నియ్య న
న్నను గిటిఁ జూచి మాధవుఁడు నవ్వుచు నిట్లనియెన్ ధరాతలం
బొనరఁగ నీయధీన మగుచున్నది కొంచెము నాకొసంగుమా.

193


సీ.

ఎంత నీ విచ్చిన యంతలో నే నుండి
        జీవనోపాయంబు సేయుకొఱకు
నరునిచందంబున నటియించి యిచటికి
        నరుల రావించి నీ కిరవుగాను
పంచామృతస్నాన మంచితంబుగ దిన
        దినము సేయింతు నీతీర్థమందు
మునిఁగి ముందుగ నీకు మ్రొక్కి కాన్కలొసంగుఁ
        డని నియమింతు నాజనులకెల్ల


తే.

నదియుఁ గాక దినం బన్న మరల మొదట
నిచ్చి యావల భుజియింతు నెలమి వినుము
నిజ మిది యనంగ నాకిటి నెయ్యమారఁ
గొలిచి యిచ్చెను నూఱడుగులధరిత్రి.

194


వ.

ఇవ్విధంబున వరాహస్వామి హరి నాదరించి శేషాద్రియందు
నిలిచె నప్పుడ యిద్దఱశీర్షంబుల దేవతలు పుష్పవృష్టి గురి
యించిరి, వరాహదేవుండు తనచెంతఁ బరిచారికయై యుండు
వకుళమాలిక నాహరిచెంత నుంచె, నావకుళమాలిక హరికి
శ్యామాకాన్నంబును దేనెయున్ భోజనంబు సేయించుచు
గొడ్డఁటి గాయంబునకు నౌషధం బిడుచు నుండఁగ, మున్ను
ధేనువత్సరూపంబులు ధరించిన బ్రహ్మరుద్రు లంతర్ధానంబు
నొందిరి, అంత శ్రీనివాసుం డాపర్వతంబున సకలవినోదంబు

సేయుచు రాక్షసులకు భయప్రదుండై భక్తులకు ముక్తి
ప్రదుండై గొడ్డఁటిగాయంబు మాయంబైపోవ దివ్యసుందర
లీలామానుషవిగ్రహుండై తల్లిచెంత ముద్దులు చూపు
చుండునట్లు వకుళమాలికయొద్ద నటింపుచుండె ననిన మును
లిట్లనిరి.

195


సీ.

వకుళమాలిక యెవ్వ రకళంకచరిత మా
        కెఱిఁగింపు మన సూతుఁ డిట్టులనియె
శ్రీయశోదాదేవి చిన్నికృష్ణునియందుఁ
        బుత్త్రవాత్సల్యంబు పొసఁగనుంచి
కాలగతిని నొందఁగా హేమగర్భుండు
        గని యట్లచేయుట గాదటంచు
వకుళమాలిక యన వనుధను బుట్టించి
        భూవరాహస్వామిపొంత నిలిపె


తే.

నప్పు డాకిటిదేవుఁ డాయతివఁ జూచి
చక్రధరుఁజెంతనుండఁగఁ జెప్పు నాపె
జననివలెఁ గాచుచుండె సుస్వాంత యగుచు
నాయశోద మఱొక్కతె యనఁగఁబడదు.

196


ఉ.

శ్రీరమణీవిభుం డవల శేషగిరీంద్రముమీఁద నిల్చి వి
స్తారముగా వినోదములు సల్పుచునుండి యశోవిహారుఁడై
గారవ మొప్పు నొక్కనృపకన్యను బెండిలియాడె మెచ్చి స
చ్చారిత నెల్లనిర్జరులు సంతసమందఁగ వింటిరే యనన్.

197


సీ.

విని మౌను లాసూతుఁ గనుఁగొని విస్మయం
        బంది యిట్లనిరి యాహరికిఁ దగిన

కన్యకామణియందుఁ గల్గె దానికిఁ జూడ
        దలిదండ్రు లన్నను దమ్ము లెవరు
సావధానుండవై యావిధంబంతయు
        విశదీకరించుము వినఁగవలయు
నడుగఁగ సూతుఁ డిట్లనియె నిర్వదియెన్మి
        ది ద్వాపరాంతానఁ దెలియ నవని


తే.

వెలయు కలియుగమం దొప్పు విక్రమార్క
ముఖ్యరాజులు జనియించి ముదము మీఱ
భూమిఁ జక్కఁగఁ బాలించి పోయి స్వర్గ
లోకమునఁ జేరి రిపుడు భూలోకమణులు.

198


వ.

తదనంతరంబు చంద్రకులపాండవదౌహితృవంశంబున సువీరుం
డనురా జుదయించి భూమి నేలుచుండె. నాతనికి సుధర్ముం
డనుపుత్త్రుం డుదయించె. మాధవుండనువానిచరిత్ర మిది
వఱక విని యుండువారలుగదా! యాతఁడ, యాసుధర్మునకు
జ్యేష్ఠపుత్రుఁడై పుట్టి యాకాశరా జనుపేరం బ్రసిద్ధుఁ
డై యుండె. ఆమాధవాఖ్యునిభార్యయగు చంద్రరేఖ పతి
స్మరణంబు సేయుచు దేహంబు చాలించుటం జేసి యామె
యొక రాజింట ధరణీదేవినామంబున జనించియుండ నాధరణీ
దేని యాసుధర్ముండు తనకుమారుం డగునాకాశరాజు కిచ్చి
వివాహం బొనరించిరని వెండియు నిట్లనియె.

199


సీ.

తలఁపఁగ వినుఁ డాసుధర్మాధిపుఁ డొకనాఁ
        డడవిలోపల వేఁట యాడి బడలి
యచ్చట నొకపంకజాకరంబున కేగి
        సుకుమార నాగకన్యకను జూచి

మోహించి పలువిధముల దానిఁ బ్రార్థింప
        నది యొడంబడక యిట్లనియె రాజు
నీవు మానవుఁడవు నే నాగకన్యక
        దాంపత్య మేకరణి నమరు


తే.

పొమ్ము నీత్రోవ ననివల్క పోక దాని
వీడఁజాలక మఱిమఱి వెంట నంటి
చాల వేఁడఁగ నాకన్నె జాలినొంది
యవలఁ బోలేక నీ వెవ్వఁ డనఁగ నృపతి.

200


క.

తనకులమును గోత్రము పే
రును దాఁ బ్రభువగుటయును నిరూఢిగఁ దెలుపన్
విని యానాగకులాంగన
మనుజేశుని మోముఁ జూచి మఱి యిట్లనియెన్.

201


సీ.

భూనాథ నను నీవు పొందిన పుత్త్రకుం
        డురగలోకంబున గరిమ నెసఁగు
తనతండ్రి యెవఁడని యనఁగ నే నప్పు డే
        మని చెప్పనగు వీను జనవరేణ్య
అనఁగ సుధర్ముఁ డిట్లనియె నీకు సుతుండు
        గల్గి నన్నడిగినకాలమునను
నాపేరు చెప్పి నిర్ణయముగ నంపుము
        తగ నర్ధరాజ్యంబు తడయక గొను


తే.

మనుచుఁ దనముద్దుటుంగరం బానవాలు
గా ముదంబున నానాగకన్య కిచ్చి
డెంద మారంగ నాకన్యయందుఁ జొక్కె
నవల నాకన్య యేగెఁ దా నలరవచ్చె.

202

తే.

పరఁగ నానాగకన్య గర్భంబుఁ దాల్చి
నాగలోకంబునకుఁ బోవ భోగినాథుఁ
డావిధంబు నెఱింగి యేమనక కార
ణంబు నూహించి మది సంతసంబు నొందె.

203


క.

ఆకన్యక కందఱు దగఁ
జేకొని రక్షించుచుండ శ్రీకరుఁ డనఁగాఁ
బ్రాకటశుభలగ్నమున సు
ధాకరునింబోలెఁ గల్గెఁ దనయుం డెలమిన్.

204


తే.

అంతకంతకు నభివృద్ధి యగుచు బాలుఁ
డమ్మ నాతండ్రి యెవ్వఁడటంచు నడుగ
నాగకన్యక వినుచును నగుచుఁ దనయు
నెత్తి ముద్దాడి లాలించి యిట్టు లనియె.

205


తే.

తనయ నీజనకుండు సుధర్మరాజు
ధారుణీతలమును బ్రసిద్ధంబుగాను
బాలనము సేయు నటకు నిర్భయుఁడ వగుచుఁ
బోవలసియున్న సుఖముగఁ బొమ్ము తనయ.

206


ఉ.

అచ్చట నర్ధరాజ్యము మహాముద మందఁగ నాఘనుండు నీ
కిచ్చు సుధర్మపద్ధతిగ నేలుము నన్నుఁ దలంచుచుండు మిం
కిచ్చట కార్య మేమి యట కేగి సుఖంబుగ నుండుమంచుఁ దా
మచ్చికమీరఁ జెప్పి చనుమార్గము తేటఁగఁ జూపెఁ బ్రీతితోన్.

207


వ.

అప్పు డబ్బాలుండు మాతామహుం డగునాగరాజేంద్రునకు
నమస్కరించి దీవనలంది తల్లికి నమస్కరించి దీవనలంది పాతాళ
బిలమార్గంబున నిర్గమించి వచ్చుచుండఁ దల్లియు వెంటనంటి
భూమిపైకిం దెచ్చి విడిచి తనభర్త యొసంగినయుంగరం బక్కు

మారున కిచ్చి, హరిభక్తుఁడ వై చక్రవర్తి వై సత్యవ్రతుండ
వై యుండుమని చెప్పి ముద్దిడి నాగలోకంబునకుం జనియె.
నబ్బాలకుండు నారాయణవనపురంబుం జేరి సుధర్మరాజు సమీ
పంబున కేగి మ్రొక్కఁగ నయ్యర్భకశ్రేష్ఠుని జూచి నృపాలు
డట్లనియె.

208


సీ.

ముద్దుబాలక నాకు మ్రొక్కి నిల్చితివి నీ
        వెవఁడవు తలిదండ్ర లెవరు చెపుమ
యుగ నాడింభకుం డళుకింత లేకుండ
        నరనాథ నాతల్లి నాగకన్య
తండ్రి సుధర్మభూధవుఁడు శ్రీకీర్తివి
        ఖ్యాతుఁ డటంచు నుంగర మొసంగ
నాముద్రికను జూచి యతఁడు మంత్రిపురోహి
        తాత్మబంధుజనమిత్రాదులకును


తే.

నందనుని జూపి మును దాను నాగకన్యఁ
గలసి యుంగర మిచ్చినకారణంబు
పరఁగఁ జెప్ప కుమారుని బట్టి తొడల
మీఁదఁ గూర్చుండ నిడుకొని మెచ్చికొనుచు.

209


వ.

తొండమానుండని నామం బిడి యుపనయనవివాహాదులం జేసె.
నంత నాసుధర్మరాజేంద్రుండు పుత్త్రు లగునాకాశరాజుకుఁ
బట్టంబు గట్టి నాగకన్యకయందుఁగనిన తొండమానుని యువ
రాజుం జేసె. నంత కొంతకాలంబునకు నాసుధర్ముండు దివంబునకు
నేగె. కుమారు లాతండ్రి మరణంబునకు దుఃఖసాగరంబున
నోలలాడుచుఁ గ్రియలు నిర్వర్తించి యిర్వు రేకోదరులచందం
బున నత్యంతమైత్రి గలవారై నారాయణనామపారాయణ

యుక్తులై యుండి. రందు నాకాశరాజేంద్రునకు సంతానంబు
లేమిం జేసి చింతించుచు బృహస్పతికి నమస్కరించి యిట్లనియె.

210


సీ.

సద్గురువర నాకు సంతానభాగ్యంబు
        గలుగకుండుట కేమి కారణంబు
చెప్ప వేఁడె దటంచు నొప్పుగఁ గొనియాడ
        నతఁ డిట్టులనియె నాక్షతిభవునకు
నీవు పాపము లెన్ని గావించియుండిన
        పరిహారమగుట కుపాయ మొండు
చెప్పెద నెట్లన్నఁ జెలఁగ భక్తిని బుత్త్ర
        కామేష్టి గావింపు క్రమము మెఱసి


తే.

సుతులు పుట్టెదరని ధర్మహితము దనరఁ
బల్కఁగా విని మ్రొక్కి భూపాలుఁ డచటఁ
జెలఁగి యజ్ఞప్రయత్నము ల్జేసి దనరఁ
హలమున న్భూమి దున్నించె నతిముదమున.

211


చ.

అటు ధర నప్డు దున్నఁగ సహస్రదళంబులు గల్గి యొప్పువి
స్ఫుటతరపద్మ మందుఁ బొడసూపినఁ జూచి నృపాలకుండు నేఁ
డిటువలె నబ్జ మీధరణి నెట్లు జనించె నటంచుఁ జూడఁ ద
త్పటుతరకంజమధ్యమున బాలిక గన్పడె నద్భుతంబుగన్.

212


ఉ.

అప్పుడు దానిఁ జూచి నృపుఁ డార్యుల నెల్లరఁ బిల్చి భక్తిమై
నొప్పుగఁ బద్మమధ్యమున నుండెడుకన్యను మెచ్చి వారికిం
దప్పక చూపుచుండఁగ ముదంబున నం దశరీరి యిట్లనెన్
మెప్పుగ దీని బెంపు మిఁక మేలు ఘటించును నీకు భూవరా.

213


చ.

అని యశరీరి వల్కఁ గని యచ్చెరువంది నృపాలకుండు మె
ల్లనఁ గమలస్థకన్యకను లాలనఁ జేయుచు గారవించుచున్

జని తనమందిరంబునకు సంతస మారఁగఁ బోయి భార్యచే
నొనరఁగ నిచ్చి చెప్పి బహుళోత్సవము ల్నడిపించి యిట్లనెన్.

214


తే.

విను మయోనిజ యైనట్టితనయ నపుడు
నీకు దేవుఁడు దయనిచ్చె నెమ్మి నెగడ
బాగుగం బోషణము సేయు పడఁతి నీవు
పుత్త్రచింత యిఁ కేల పో భూతలమున.

215


క.

తద్దయు నాతలిదండ్రులు
ముద్దాఱఁగఁ బెంచుచున్న మురిపెము దనరన్
ముద్దులు సూపుచు జిలిబిలి
సుద్దులు చెప్పుచును వేడ్కఁ జూపుచునుండెన్.

216


సీ.

ఆకన్య తమయింటి కరుదుగ వచ్చిన
        ఘనలక్షణమున నాకాశరాజు
భార్య గర్భము దాల్చెఁ బరమముదంబున
        నైదవనెలను శుభావహముగ
సీమంత మారాజు సేయించె నటుమీఁదఁ
        బొలుపొంద నవమాసములు నెసంగె
దశమమాసంబునఁ దరణి కన్యారాశి
        యందుఁ బ్రవేశించినపుడు శుక్ల


తే.

పక్షదశమియు రోహిణి భార్గవాస
రంబు సాయంసమయమున రాజుగారి
కెలమి పుత్త్రుండు పుట్టె భూతలమునందు
జనులు వొగడంగ నానాఁడు సౌఖ్యముగను.

217


వ.

అప్పు డారాజేంద్రుడు సంతోషమగ్నుండై స్నానం బాచ
రించి బ్రాహ్మణులకు నవధాన్యాదులు దానంబు లొసంగి నిజ

గురుపూజచేసి సుతునకు వసుధానుం డని నామకరణం
బొనర్చి సుతకు బద్మావతి యని పేరెడి యందఱకు మృష్టా
న్నంబు పెట్టించి పుత్రీపుత్త్రకుల నత్యంతప్రియంబునఁ బెంచు
చుండఁగ దినదిన ప్రవృద్ధమానులై క్షీరసాగరాజమందిర
మధ్యంబునం లక్ష్మియుఁ జంద్రు లుండినయట్ల రాజుగారి
సుందరమందిరంబునం బ్రకాశించుచుండి రంత నారాజు
కొన్నాళ్ల కయ్యిద్దఱకు విద్యాభ్యాసం బొనరించి యనంతరము
పుత్త్రునకు నుపనయనంబు చేసి పద్మావతికిం దగినవరుని వెద
కుచు గురువుకు సమస్కరించి యిట్లనియె.

218


సీ.

పుణ్యాత్మ గురుచంద్ర పుత్రకామేష్టి మీ
        యనుమతిఁ జేసెద మనుచు నేను
భూమి దున్నింపగ భూమియం దొకపద్మ
        ము లభించె నందున లలిత మెఱుపు
బాలిక దొరకఁగఁ బద్మావతీ యని
        పేరు శాస్త్రమురీతిఁ బెట్టి యిపుడు
పెంచుచున్నాము తా మంచితగుణవర్యు
        నాకన్యకకుఁ దగినట్టి వరుని


తే.

గని వివాహంబు సేయంగ మనమునందు
నెంచియున్నాఁడ నెందైన నెఱిఁగియున్న
జెప్పుఁ డన నాగురుండు నీకొప్పుగాను
దగినయల్లుఁడ వచ్చు సిద్ధం బటంచు.

219


మ.

అని యాదేశికుఁ డానలిచ్చి చనె నం దారాజు పద్మావతిం
గని సంతోషనిమగ్నుఁడై మురియుచున్ గారాబుగాఁ బల్కుచున్

ఘనదివ్యాంబరభూషణావళులు శృంగారించి ముద్దిచ్చి తాన్
దనయన్ సూనుని జూచి చూచి మదిలో ధన్యుండ నేనైతిగా.

220


వ.

అని యానందించుచునుండె.

221


సీ.

అపుడు పద్మావతి నానందముగఁ బెండ్లి
        యాడెద నని వేంకటాద్రివిభుఁడు
భావించుచుండఁగఁ బద్మావతికి నవ
        యౌవనకాలంబు నవతరించె
నంతలోపలన వసంతకాలము వచ్చె
        శృంగారములు లలిఁ జిగురు లెత్తె
గోరకంబులుతోడఁ గుసుమము ల్వికసించెఁ
        దగిన [1]శలాటువు ల్దనరె మించి


తే.

యంతకంతకు ఫలియింప నచ్చటచట
గుములుగాఁ గూడి కోయిల ల్గూయసాగె
నతముదంబుగ నళులు ఝంకృతు లొనర్చెఁ
గలికి చిలుకలు కలరవంబులను మించె.

222


సీ.

చిగురుటాకులు మెక్కి చెలరేఁగుపికములు
        మేలు పూఁదేనియ ల్గ్రోలు నళులు
పరిపక్వఫలములఁ గొఱకుశారిక లబ్జ
        నాళము ల్మెక్కుమరాళములును
సందడింపఁగ సదానందకరంబులై
        తనరారు శృంగారవనము లన్ని
మెఱయఁ బద్మావతి మేడపైనుండి యా
        సుమవనంబుల నెల్లఁ జూచి చూచి

తే.

వనవిహారము తాఁ జేయవలయునంచుఁ
జెలులతో ముచ్చటాడి మచ్చికలు చేసి
మేడ దిగివచ్చి తల్లిసమీపమందు
జేరి యిట్లని పల్కె నాచిగురుఁబోఁడి.

223


తే.

జనని శృంగారవనము విస్మయముగాను
గనకసౌధంబుమీఁదికి గానుపించెఁ
గానఁ జెలులును నేను నక్కడికి బోయి
తెచ్చెదము నీకుఁ బుష్పము లెచ్చుగాను.

224


చ.

ఆన విని తల్లి యిట్లనియె నమ్మ సుమంబుల కీవు వోయినం
గని జను లెల్ల నవ్వెదరు గాన వనంబున కేను నిన్నుఁ బం
పను జెలికత్తెల న్బనుపు భాసురపుష్పము లింటి కిప్పుడే
ఘనముగఁ దెచ్చియిచ్చెదరు గావునఁ బోకుము బిడ్డ యంచనన్.

225


క.

రంతులు సేయుచు నప్పుడు
గంతు లిడుచు నన్న మెంచకయ పానుపుపైఁ
జింతించుచుఁ బవళింపఁగ
నంతటఁ దనసుతను బిలిచి యాదర మొప్పన్.

226


వ.

అక్కుం జేర్చి మందస్మితసుందరవదనారవింద యగుచు బుజ్జ
గించి యిట్లనియె.

227


సీ.

వనమున కీవు వోవల దన నలిగితి
        నైన మంచిది లెమ్మ యనుచుఁ జెప్పి
చెలులను బ్రాహ్మణస్త్రీలను బిలిపించి
        సుతతోడ వారల జతగఁ జేర్చి
తినుపదార్థంబులఁ గొని చెలికత్తెల
        చే నిచ్చి పల్లకిఁ జేర్చి యపుడు

పంపఁగఁ జెలులతోఁ బరమముదంబున
        మాట లాడుచు నట్టి దోఁట కరిగి


తే.

రమ్యతరమగు కమలాకరంబుచెంతఁ
నందలము డిగ్గి లేచి యందందఁ దిరిగి
విరులు గోసెద నని చాల వేడ్కనొంది
వనవిహారము సేసె నెమ్మనము మెఱయ.

228


సీ.

చెలఁగి పువ్వులఁ గోసి చెలులపైఁ బడవేసి
        కిలకిల నవ్వు నాకీరవాణి
మధురఫలంబులు మాటిమాటికిఁ గోసి
        చెలుల కందిచ్చు నాచిగురుఁబోఁడి
లాలించి బేలించి నీలకంఠములతో
        మేలంబు లాడు నానీలవేణి
రాయంచగతివలె నాయెడ నటియించి
        సారెకు సోలు నాజలజవదన


తే.

కోరి కోవెలలట్ల తాఁ గూజితంబు
చేసి చొక్కుచుఁ బలుమాఱు చిలుకగముల
సరణిఁ బల్కుచు భృంగినిస్వనమురీతి
గాన మొనరించు సొంపుగఁ బూని యచట.

229


క.

మొల్లలు పొన్నలు వొగడలు
మల్లెలు సంపెంగవిరులు మందారములన్
గొల్లగఁ గరములఁ గోసి మ
ఱుల్లాసము మీఱఁ బుడమి నొక్కెడఁ బెట్టున్.

230


క.

ఒయ్యారంబున నడుచుచు
బుయ్యారంబుగ నెసంగుబొదరింటను దా

నుయ్యెల లూఁగును జెలులను
నెయ్యంబుగఁ బిలిచి యందు నెమ్మది తనరన్.

231


క.

వింతఁగ మోదుగపూల వ
సంతము చేయించి చెలులు సంతస మందన్
దంతపుఁజిమ్మనగ్రోవులఁ
బంతంబులఁ జిమ్మి చిమ్మి పకపక నవ్వున్.

232


క.

తెప్పున నేలను రాలిన
పుప్పొడి చేనంది మించి పొలఁతులపై
లొప్పఁగఁ జల్లుచు సుద్దులు
చెప్పుచుఁ గమలాకరంబు చేరుచు వేడ్కన్.

233


తే.

చెలఁగుచును విప్రవనితల చెలులతోడ
వేఁడుకలు మీఱఁగా జలక్రీడఁ గొంత
తడవు సల్పుచుఁ దీరంబుఁ గడక చేరఁ
దడిసిస శరీరమెల్లను దడయ కపుడు.

234


సీ.

తరుణికి మృదులవస్త్రంబుతోఁ దడి యొత్తి
        పట్టుపావడ మొలఁ గట్టె నొకతె
చలువగు వలిపెపుసరిగదువ్వలువ నా
        పట్టుపావడమీఁదఁ గట్టె నొకతె
మొలనూలు నొడ్డాణమును దనుమధ్యము
        నం దుంచె నొకతె మఱందముగను
జిలిబిలితళుకొత్తు చెంగావిఱవికను
        బొందుగ నమరించెఁ బొలఁతి యొకతె


తే.

భాసురం బగు నూతనాభరణములను
బొసఁగ నంగాంగములయందుఁ బొందుగాను

బెట్టె నొక్కతె మఱి పూలఁ జుట్టె నొకతె
నెమ్మొగంబును వలువచేఁ జెమ్మఁ దుడిచి.

235


సీ.

తిలకంబు నిడె యోర్తు లలిఁ గన్నులకు నోర్తు
        గాటుక నీటుగఁ గ్రాలఁ దీర్చె
పరిమళగంధ మాబాలికామణిమేన
        నలరంగఁ జల్లఁగ నలఁదె నొకతె
చల్లనిగాడ్పులు మెల్లఁగ నొడలపై
        నొలయంగ విసరెఁ బూవులను నొకతె
నెమ్మోము గనుఁగొన నమ్ముద్దియకుఁ బట్టె
        నిలువుటద్దము దెచ్చి పొలఁతి యొకతె


తే.

రాజనందన కీమాడ్కిఁ బ్రమద మారఁ
జెలులు సేయంగ బ్రాహణస్త్రీలకెల్లఁ
బసుపు కుంకుము విరిసరు ల్ఫలము లలరఁ
గన్యకామణి యొసఁగె సద్ఘనత మ్రొక్కి.

236


వ.

అప్పు డవ్విప్రాంగనాశిరోమణు లాపద్మావతిని దీవించి రంతఁ
దెచ్చిన భక్ష్యభోజ్యంబు లచ్చోటఁ గుడిచి చెలులు రచించిన
పూఁబాన్పునఁ గూర్చుండఁ జేసి సుగంధోపేత మగువిడి
యంబు లిప్పించి తాను విడియంబు సేయుచున్న సమయం
బున.

237

పద్మావతితో నారదుండు సంభాషించుట

క.

ఆవనమునకుం జయ్యన
దేవమునీంద్రుండు వచ్చెఁ దిలకించి చెలుల్
భావించి యీతఁ డెవఁ డని
యావరముని నడుగ నాతఁ డనెఁ గని యెలమిన్.

238

క.

పరుఁడను గా దీనృపతికి
గురుఁడను నన లేచి భక్తి గూర్మి యెసంగన్
సరగునఁ బద్మావతి [2]యా
స్తరణము ముని కిచ్చి మ్రొక్కెఁ దాపసుఁ డంతన్.

239


తే.

వనజలోచన నీకు వివాహసిద్ధి
వేగ యగుఁగాత మంచు దీవించె రాజ
కన్యకామణి సంతోషకలిత యగుచు
నొదిగి సిగ్గున మాటాడకున్నఁ జూచి.

240


సీ.

ఆముని పల్కె నోయమ నామీఁద నీ
        కఱమఱ వలదు రమ్మనుచుఁ బిలిచి
కూర్చుండ నియమించి కూర్మిమాటలను హ
        స్తంబు చూపు మనంగ నంబుజాస్య
పల్కె నిట్లని మునిప్రవర నాతండ్రివి
        యనుచు హస్తంబు నాతనికి సాచి
చూపఁగఁ జిఱునవ్వుఁ జూపు చాతాపసుం
        డనియె నీహస్తాబ్జమును గనంగ


తే.

శ్రీకరాంచితమైనట్టి రేఖ లలరి
యమ్మహాలక్ష్మిలక్షణా లన్ని చేతి
యందుఁ గన్పట్టుచున్నవి యైన నవియు
నమ్మరో విను చెప్పెద నవియు నిపుడు.

241


తే.

స్వస్తికము పద్మమును ఛత్రచామరాలు
యవకులిశమత్స్యశంఖరేఖాదిలాంఛ

నంబు లలరారుచున్నవి యఖలశుభము
లొనరు నివి చేతఁ గలకాల ముర్వి నీకు.

242


తే.

మఱియు నిట్లనెఁ గిసలయమార్దవంబు
గలిగియుండెడు నీవామకరమునందుఁ
గాంతి నొప్పుచు నిత్యమాంగళ్యరేఖ
వఱలుచున్నది చూడు భూవరకుమారి.

243


క.

ఈ రేఖ లుండుబలమున
నారాయణుఁ డెలమి నీకు నాథుం డగు నీ
గోరిక ఫలియించును పో
శ్రీరామామణిగ నుండు చెలఁగుచు నమ్మా.

244


సీ.

అనుచుఁ బద్మావతి కమ్ముని సర్వాంగ
        సౌందర్యకలితలక్షణములన్ని
బాగుగఁ జెప్పి తా నేగె నాదినమున
        నంబుజాక్షుఁడు వేంకటాద్రిమీఁద
నుదయకాలంబునం దొనరంగ భుజియించి
        కడు వేడ్కఁ బసిఁడిచల్లడము దొడిగి
కొనలందు ముత్యాలకుచ్చు లొప్పినదట్టి
        తవరంగ తననడుమున బిగించి


తే.

కురులు సవరించి విరులతోఁ గొండెఁ గట్టి
మేలు చందురుగావిరుమాలఁ జుట్టి
సరిగెజిగివల్వ మేన మెచ్చంగఁ దాల్చి
మెఱయుభూషలు నొడలపై మెఱయఁజేసి.

245


క.

తిరుమణిఁ దిరుచూర్ణము శ్రీ
కరము లలాటమునఁ దీర్చి గంద మలఁది బం

గరుజన్నిదంబు భుజమునఁ
గరము ప్రకాశింపఁజేసి కమలాక్షుఁ డొగిన్.

246


తే.

కనకమయ మగుసున్నపుఁగాయ వక్క
లాకులును వస్త్రమున సొబ గలరఁ గట్టి
కక్షమం దుంచి కోదండకాండములను
బరఁగఁ జేబట్టె నప్పుడు హరి ముదమున.

247

శ్రీనివాసుఁడు వేఁటాడుట

సీ.

దైవయోగంబునం దనసమీపమునకు
        నురుతరజవనాశ్వ మొకటి వచ్చి
నిలువఁగ దానిపై నీరజాక్షుం డెక్కి
        చని వనగిరులందు సంచరించి
సారంగభల్లూకచమరీశరభసింహ
        శార్దూలముఖమృగసంఘములను
వేఁటాడుచుండె నావేళ నందొకమద
        కరి చక్రి నెదిరించె గహనమందు


తే.

దాని సమయింప సమకట్టి దానివెంట
నరుగ నది పర్వతము డిగి యరిగెఁ జక్రి
తఱిమె వెంబడి యోజనార్ధంబు వోయి
చేరెఁ బద్మావతిగలశృంగారవనము.

248


తే.

చెంగటం జేరి ఘీంకృతిఁ జేయ గజముఁ
జూచి పద్మావతీదేవి చొప్పరయుచుఁ
జెట్లచాటునఁ జేరఁగఁ జెలులు నట్ల
చేరి యిట్లని పల్కిరి చిత్రపడుచు.

249

సీ.

అతివలారా చూడుఁ డబ్బురంబుగ నాము
        టేనుంగు వచ్చె నింకెట్టులమ్మ
కన్నులు దెఱచి చక్కంగ దానిఁ జూడక
        తలకు నేలకు వంచి తలఁగ మేలు
నడుమ బద్మావతి నిడికొని చుట్టును
        మన ముండఁబోదము మంచిదమ్మ
మన మెట్టులైనఁ బద్మావతిం దనరార
        రక్షింతమమ్మ ధైర్యంబు మించి


తే.

యనుచు నొండొరు లిమ్మెయి నంచునుండ
ఘనతరం బైనగుఱ్ఱంబు గానవచ్చె
దానిపై నొక్కపుర్షుండు దఱుముకొనుచు
వచ్చుచున్నాఁడు గూర్చుని వనితలార.

250


వ.

అట్లు చెప్పుకొనుచుండు సమయంబున నగ్గజంబు తన్నుఁ దఱు
ముచు వెంబడివచ్చుహరిం జూచి భీతిల్లి తనకరంబు పై కెత్తి
దండంబు వెట్టినం జూచి హరి కరుణించి తఱుమక నిలిచె నంత.

251


క.

హరి తన్నుఁ గరుణ విడువఁగఁ
గరివరుఁ డటువోయి పెద్దకాననమందుం
జొరఁబడె నావల నచ్చట
సరసిజనాభుండు పొదలచాటున డాఁగెన్.

252


వ.

అంత నందున్న కాంత లాదంతిని తురంగంబును బుర్షుని గానక
వెఱఁగంది యిట్లనికొనిరి.

253


సీ.

అమ్మలారా చూడుఁ డచ్చట గజతురం
        గంబులఁ బురుషుని గాన మిపుడు

మాయగ నున్నది మహిమ యేమనువారు
        నది వట్టి కల్లపో యనెడువారు
భ్రాంతిఁ బొందిదిమంచుఁ బకపక నగువారు
        కలఁగంటిమో యని పలుకువారు
సొలసి నిద్దురవోక గలగా దనెడివారు
        నహహ యేమిచిత్ర మనెడువారు


తే.

నంద ఱన్నివిధంబుల ననఁగ నవ్వి
చెలులఁ గన్గొని డగ్గఱఁ జేరఁ బిలిచి
యనియెఁ బద్మావతీదేవి మనక దేల
యెట్లువోయినఁ బోనిండు నిపుడు మనము.

254


వ.

అని తొల్లియెడం గూర్చుండి చదరంగము సంతసంబార
నాడుచుండె.

255


సీ.

శృంగారవని నిట్లు చెలులతోఁ జదరంగ
        మాడుపద్మావతి యంద మలరఁ
గాంచి తద్రూపరేఖావిలాసము లన్ని
        పొదలమాటునఁ జూచి పొసఁగఁ జక్రి
తనమదిలోఁ దాన తలఁచె నిట్టుల నహా!
        యీరాజకన్యక యెలమిప్రాయ
మును జూడ రతికన్న ముదిత భారతికన్న
        వరగౌరికన్న శ్రీవనితకన్న


తే.

నతిశయంబైన యందంబు నలరియున్న
దెట్లు ననుఁ జూచి మోహించు నిపు డటంచుఁ
దలఁచి యాయింతి నెమ్మోముదళుకుఁ జూచి
యిట్లు వర్ణించె ముదమార నెట్లు సనక.

256

సీ.

పాదజంఘోరువు ల్పల్లవకాహళ
        కరికరంబుల భంగపఱచి మించుఁ
గటిమధ్యకుచయుగ్మగౌరవంబులు చక్ర
        మృగపకంచుకముల నొగి హసించు
హస్తకంఠమనోహరాననంబులు కంజ
        కంబుసోములను జక్కఁగ జయించు
భాసురాధరదంతనాసికీలాదులు
        ఫలకుందతిలపుష్పములను గెల్చు


తే.

నింతచక్కనిలలితాంగి యెచటగాని
చూడలే దీవనంబునం జూచినాఁడ
నిట్టిసుందరి నానజుం డెట్లు దీర్చె
ననుచు మెచ్చుచు మఱి యిట్టులనియె మెచ్చి.

257


సీ.

కర్ణనేత్రభ్రూయుగములు శ్రీకారాబ్జ
        పత్రకందర్పచాపముల గెల్చు
గాంతిసౌరభనీలకుంతలంబులు హేమ
        పాటలబంభరప్రభల నడఁచు
గమనభాషణనిరీక్షణములు గలహంస
        కలకంఠమదనాస్త్రముల నదల్చు
క్షాంతిసుస్మితగానసరణులు ధరకౌము
        దీవీణలను జాల ధిక్కరించు


తే.

నహహ యీకాంతరూపంబు నవనియందు
హాటకము మెత్తగా నూఱి యమృతరసము
పోసి మెదిచి మహాచిత్రముగ నజుండు
నేను మెచ్చుటకై చేసి నిల్పినాఁడొ.

259

క.

అటు గాకుండిన నిజముగ
నిటువంటిశరీరకాంతు లింతులకు మహిం
బటిమగ నుండునె? యిమ్మెయి
నిటలాక్షుఁడు దీనిఁ బొగడనేరఁడు చూడన్.

259


సీ.

కమలాసనుఁడు సర్వకాంతిసంచయమున
        నతులితసౌందర్యవతిని దీర్చి
కమలమునం దిడఁగాఁ జూచి యాకాశ
        నరపతి గైకొనె నా కటంచుఁ
గావున దీని శీఘ్రంబుగ నేఁ బెండ్లి
        యాడెదనని మోహ మగ్గలింప
నంతఁ బద్మావతిచెంతకు మెల్లఁగఁ
        బోవుచు నందందుఁ బూలఁ గోసి


తే.

పొలఁతి నీకిటు తలఁ బ్రాలిఁ బోతుననెడి
సైగగాఁ బుష్పములఁ గొని చల్లు చొరిమ
సేయుచును మించి రా చూచి చెంతఁ జేర
నపుడు దిగ్గున నాలేమ యతని జూచి.

260


తే.

పసిఁడిచెఱుంగులరవసెల్ల పైన వేగ
పొదువుగాఁ గప్పుకొని పూలపొదమఱుఁగున
నిలిచి యళుకుచు బెళుకుచుఁ జెలులఁ జూచి
చిలుకవలె ముద్దుపల్కులఁ బల్కె నిట్లు.

261


చ.

అరమఱ లేక రాజసుత లాడుచునుండెడుచోటు కీగతిం
బరపురుషుండు రాఁదగదు భామినులార భయంబు నొంది తొం
దరపడ నేల రావలదు దవ్వుగ నేగు మటంచుఁ జెప్పు మ

త్తరుణి వచింపఁగా నపుడు ధైర్యముతో హరి గాంచి నవ్వుచున్.

262


క.

ఆపద్మావతి కడ్డుగ
నాపొలఁతులు నిలిచి హరికి నగుపడకుండం
భ్రాపించి కోపమున నా
శ్రీపతి నీక్షించి చాలఁ జిడిముడి వడుచున్.

263


సీ.

పలికి రిట్లని రాచపట్టి యిందుండఁగఁ
        బరుఁడ వొక్కింతను భయము లేక
వచ్చితి విప్పు డావల కేగుమంచును
        దఱుముచు రాగ నాదైత్యరిపుఁడు
నగవుతో నిట్లనె నలినాక్షులార మీ
        రాజపుత్త్రిని జూచి రహిఁ జెలంగ
మాటాడ వచ్చితి మాటలాడక మీరు
        పొండన నా రాజపుత్త్రిఁ గాంచి


తే.

చెలులతో ననె నతఁడు మిమ్ములికిపడఁగఁ
బలుకుచున్నాఁడు శబరుండు పాపమేమి
వీనిబందువు లెవ్వరో వీఁ డెవండొ
వీనికులగోత్రములు నేవొ విశదముగను.

264


తే.

అడుగుఁడని రాజసుత పల్క నపుడు చెలులు
చక్రధరుదిక్కుఁ దిరిగి యోశబర నీకుఁ
దల్లిదండ్రులు పేళ్లేమి దగ కులంబు
గోత్రమును చెప్పుమనఁగ వైకుంఠుఁ డపుడు.

265


ఉ.

వారిని జూచి యిట్లనియె వారిజలోచనలార యిచ్చటం
గూరిమిమీర నాకులము గోత్రము లెల్లను జెప్పు దేను మీ

భూరమణాత్మపుత్త్రి ననుఁ బొందఁగఁ జేసితిరేని మీకు నేఁ
గూరిమి నిచ్చెదన్ ముదము గోరినవన్నియు నిశ్చయంబుగన్.

266


సీ.

అని చక్రి మఱల నిట్లనియె మాకులము శీ
        తాంశుకులంబు వసిష్ఠగోత్ర
మగు తండ్రి వసుదేవుఁ డాదేవకే తల్లి
        యగు హలపాణి మాయన్నగారు
లలితురా లైనచెల్లెలు సుభద్రాదేవి
        పావనుం డైనగాండీవి మఱఁది
ధర్మరాజాదులు దగు బంధుజను లన్న
        తెఱవలు నగుచు నీ దేహమెల్ల


తే.

నలుపిదే మన్న వెన్నుండు నగుచుఁ బలికె
గృష్ణపక్షము నడిరేయి గినిసి కూడి
నపుడు పుట్టితి గనుక దేహంబు నీల
మయ్యె నందున ననుఁ గృష్ణుఁ డనిరి బుధులు.

267


క.

నాకులగోత్రము లిప్పుడు
మీ కెఱిఁగించితిని గనుక మెండొడ్డక మీ
రీకన్య కులము గోత్రము
నా కొనరఁగఁ జెప్పుడనఁగ నగి చెలు లెల్లన్.

268


తే.

అనిరి చంద్రకులంబును నత్రిగోత్ర
జనితుఁ డాకాశరాజను జనవిభునకుఁ
బుత్త్రికామణియై పుట్టి భూతలానఁ
బెరిగి పద్మావతీ యనం బరఁగె వినుము.

269


తే.

మేటియై మము నొగిఁ జిన్ననాఁటనుండి
యొరియ మాతోడ నాటాడుచుండు మాకు

సకలవస్తువు లిప్పించు సఖ్య మెసఁగ
నెపుడు నీయమ్మ సదయ మమ్మేలుచుండు.

270


చ.

అన విని వెన్నుఁ డిట్లనియె నంబుజలోచనలార మిమ్ము నె
ల్లను గృప నేలుచున్న కమలాక్షిని సఖ్యము సేయ వచ్చితిన్
ఘనముగ నన్నుఁ గూడుమని గన్గొని మీదొరపట్టి కిప్పుడే
మన మలరంగఁ జెప్పుఁ డనుమానము లేక యటంచుఁ బల్కఁగన్.

271


క.

విని పద్మావతి కోపం
బునఁ జెలులం బిలిచి దిట్టి పొమ్మను వానిన్
ఘనత నెఱుంగక యున్నాఁ
డని తాఁ బొమ్మనియె దూర మరుగు మటంచున్.

272


సీ.

అనిన వెన్నుం డిట్టు లనియె నోలలితాంగి
        నిష్ఠురం బేలనే నీకు నాకు
మార్దవంబుగ మేటిమాటల నాడుము
        చెలఁగి కన్యాపేక్ష గలిగి యిటకు
వచ్చితి నను నీవు వరియించుటకుఁ దగు
        పాత్రుఁడనేగాని బరుఁడఁ గాను
బాత్రదానము సేయు ప్రభువుకు నిహపర
        సౌఖ్యము ల్గల్గు నీజనకుఁ డెలమి


తే.

నన్నుఁ గాంచినయప్పుడ నిన్ను నాకు
నీయఁగోరును సందియం బేమి లేదు
చంద్రకులజుండ వేఱవంశజుఁడఁ గాను
నన్నుఁ జేరుము సరవి ననంగ నపుడు.

273


క.

నీవు నిషాదుఁడ వయ్యును
వావిరి ఘనచంద్రకులమువాఁడ నటంచున్

గావలసి పల్కినా విపు
డావలఁ బొ మ్మెదుటనుండ కల్పుఁడ మఱియున్.

274


సీ.

తగ నెఱుంగక తప్పుదారిసుద్దులు చెప్ప
        కరుగు మాతండ్రి నీవన్నమాట
విన్నను సంకెళ్లు వేయించుఁ గొట్టించు
        నంతకుమున్ను నీ వరుగు మెచట
హరి యిట్టు లనియె నాయం దధర్మం బేమి
        బ్రహ్మచారిని నీవు కన్య
వగుటచే నీవివాహము చేసుకొనుట ధ
        ర్మముగాని యది యధర్మంబు గాదు


తే.

నీవు నాయందు దయయుంచి నిష్ఠురోక్తు
లాడ కింపుగ ననుఁ బెండ్లియాడు మనినఁ
గనుబొమలు ముడివెట్టుచుఁ గన్ను లెఱ్ఱ
చేసి యాయింతి చక్రి నీక్షించి పలికె.

275


క.

ఓరి నిషాదుఁడ నీ వీ
క్రూరపుమాటంటి వైనఁ గొట్టింపను బో
నూరక నీత్రోవం జును
మూరక మాటాడనేల నొప్పమి గలుగున్.

276


వ.

అనిన విని హరి యిట్లనియె.

277


క.

చుట్టపుదాన వటంచున్
గుట్టుగ నే నిన్ను వేఁడికొన్నందున నం
గొట్టింపకు మన్యునిచే
గొట్టింపఁగ నేల నీవ గొట్టుము తరుణీ.

278

సీ.

అని చక్రి వలుకఁగ నతివ యిట్లనియె నీ
        వీలీల మోదుగుపూలు వేసి
పలుమాఱు నాకుఁ గోపంబు పుట్టించెద
        విఁక జీవితెఱువు లేదేమొ నీకు
ఛీ పొమ్మనఁగ హరి చిఱునవ్వు నవ్వుచు
        ననె జనించినవారు చనుట నిజము
గనుక చిం తెక్కడఁ గలసినపిమ్మట
        జగతి నుండిన మేలె చనుట మేలె


తే.

రమణి నా కందుకై విచారంబు గలదె?
వినుము తలఁచిపని యైనవెనుక నీవు
పట్టి కొట్టిన దిట్టిన భయము లేదు
వేఱమాటలు వల్కకు వెలఁది నీవు.

279


వ.

అనిన విని పద్మావతి యిట్లనియె.

280


క.

నాకడ నీ విటు ప్రేలుట
యాకాశనృపాలుఁ డెఱుఁగ నంతట ని న్నీ
లోకంబున మననీయఁడు
పో కష్టం బేల దూరముగ మేలొందన్.

281


వ.

అనిన విని హరి నగుచుఁ బద్మావతి కిట్లనియె.

292


సీ.

పుట్టినవారెల్లఁ బోవుట నిజమైన
        దెఱుఁగుదు నేను ని న్నెట్టులైన
విడువను నీతండ్రి విమలధర్మాత్ముండు
        గాన న న్బాధింపఁ డైనఁగాని
బాధింపఁ జూచెద భయము లేదు మఱేమి
        ప్రియముగ నా కిచ్చి పెండ్లి సేయ

నావల నేమగు ననఁగ నాపద్మాక్షి
        యిట్లనె నావేంకటేశుఁ డుండ


తే.

కంచి శ్రీవరదుఁడు రంగఁ డంచితులయి
యుండఁగా నీకు నాతండ్రి యొప్పి దాన
మిచ్చునే పొమ్ము నీకేల యిట్టి భ్రాంతి
కానికార్యంబునకు నీవు పూన నేల.

283


వ.

అనిన విని చక్రి యిట్లనియె.

284


క.

పోపొ మ్మని మొగమాటం
బీపట్లను నీకు లేక హెచ్చుగ నాపైఁ
గోపము చేసితి వని నిను
బ్రాపించక నేను బోను పద్మదళాక్షీ.

285


క.

అనఁగాఁ బద్మావతి యి
ట్లనెఁ దలిదండ్రులను విడచి యకటా నీ వి
ట్లనుట యసంభావితమై
చను మూరక లేనిభ్రాంతి సమకొన నేలా.

286


వ.

అనిన నాదైత్యారి మందస్మితవదనారవిందుండై యిట్లనియె.

287


చ.

విను సతి నీవు నా కిటు వివేకము చెప్పితి వెంత చెప్పినన్
వనజభవుండు నానుదుట వ్రాసినవ్రాఁతఫలంబు దప్పునే
నిను వరియించి పిమ్మటను నే నెటు వోయినఁ గాని సేమమే
గనుక నిజంబుగాను నినుఁ గౌఁగిటఁ జేర్పకపోను జేడియా.

288

పద్మావతి హరిపై ఱాలను రువ్వించుట

వ.

అని పల్కుచు డగ్గఱకు వచ్చుటం జూచి పద్మావతి కోపో
ద్రేకియై చెలులం బిలిచి యీదుష్టుని ఱాలం గొట్టి దూరం
బుగఁ దఱుముఁడనిన వార లప్పుడు తెప్పున ఱాల నందికొని

యొప్పమి గల్గునట్లు తప్పక గుఱిమీఱి గొట్ట నాహరిమీఁద
శిలావృష్టి గురిసె. నప్పు డప్పద్మాక్షుండు కార్యము తప్పెనని
తలంచె. నప్పు డప్పొలంతులు పాటవంబున మీటు ఱాల
పోటులు నాట ఘోటకంబును దాఁటి పోనేరక నేలంబడియె.
నంత శ్రీకాంతుండు హయంబును డిగి యూతక వారిం
జూచుచుండ నాబోటులు వాటంబుగ ఱాలనంది మఱి మఱి
రువ్వుచుండిరి. ఆఱాలవ్రేటులు దప్పించుకొనుచు నిలువనేరక
యుత్తరాభిముఖుఁడై వేంకటాచలంబునకు నెగనెక్కుచుం
దనకు నివాసంబైన వల్మీకంబునం బ్రవేశించి వకుళమాలిక
నిర్మించిన విరులపాన్పుపైఁ బ్రళయకాలంబున మహాబ్ధి
యందు వటపత్రంబునఁ బరుండిన పరమపుర్షునిచందంబున
శయనించియుండె. అంత నిక్కడ వనమధ్యంబునందుఁ జెలులం
జూచి పద్మావతి యిట్లనియె.

289


సీ.

చెలులార మాతల్లి చెప్పినమాటలు
        వినకుండ వచ్చి యీవిధముగాను
అనుభవించితిఁ గష్ట మమ్మమ్మ నేఁ జెల్ల
        నీ పుష్పవనమున కింక రాను
జాలు నిచ్చోటను శబరుఁ డాడినమాట
        లప్పు డమ్మకు మీరు చెప్పవలదు
చెప్పిన మన కెల్ల సిగ్గుపా ట్లగునని
        పలికి యందల మెక్కి చెలులతోడఁ


తే.

గుసుమఫలములఁ గొన్ని చేఁగొనుఁడటంచుఁ
బోయి మణిమందిరము చేరి పూలఁబండ్లఁ

దల్లికి నొసంగి యంతటఁ దాను బోయి
పాన్సుపైఁ జేరె హాయిగఁ బల్కకుండ.

290


వ.

అని చెప్పి హరి యొనర్చిన కార్యంబులు విని సంతసించి హరి
యావల నేమి చేసెనని యడుగ మునులకు సూతుం డిట్లనియె.

291


చ.

మునివరులార మీ కిపుడు ముచ్చట మీఱఁగ నేను జెప్పెదన్
వినుఁడు పరాత్పరుండు హరి విష్ణుఁడు మర్త్యునిరీతిఁ గాముకుం
డనఁదగి మోహతాపమున నారట నొందుచుఁ బవ్వళించి యే
మనక ముసుంగువెట్టుకుని యార్తునికైవడిఁ జింత సేయుచున్.

292


తే.

వేఁడినిట్టూర్పు విడిచి తా విమలపాన్పు
పైని బొరలుచు దీనునిపగిది నున్న
వకుళమాలిక యచటికి వచ్చి హరిని
గాంచి యిట్లని పల్కె సత్కరుణ మెఱసి.

293


శా.

అన్నా వేంకట లెము లెమ్మిపుడు నీ వాకొంటి వాలస్య మే
మన్నంబుం బరమాన్నభక్ష్యములు నీ కర్పింప నేఁ దెచ్చితిం
జెన్నొందన్ భుజియించు నీ వనఁగ నాశ్రీస్వామి మాటాడలే
కున్నం జూచి మనంబునన్ భయము పెంపొందంగ నాఁ డెంతయున్.

294


సీ.

వికలత్వమును బొంది వకుళమాలిక యిట్టు
        లనియె నాతండ్రి నీ వార్తినొంది
కనుల నీ రిటు నింపఁ గారణం బేమి నీ
        వీవిధంబునఁ జింత యేల పడెదు
పగలు నిద్దురపోవఁ దగదని తెలిసి నీ
        విప్పు డీమాడ్కి నిద్రించు టేల
విపులధైర్యస్థైర్యవీర్యంబులను వీడి
        పోఁ జేసి దీనతఁ బొందు టేల

తే.

లేచి కూర్చుండి నాదెస లెస్స చూచి
నీమనంబునఁ గలచింత నిశ్చయముగఁ
జెప్పుమని బుజ్జగింపఁగ శ్రీధరుండు
మాఱువల్కక యుండె సమ్మదము లేక.

295


వ.

అంత వకుళమాలిక భేతాత్మయై దగ్గఱఁ గూర్చుండి వెండియు
నిట్లనియె.

296


చ.

అడవికి వేఁటఁబోయి మఱి యచ్చటి క్రూరమృగవ్రజంబునం
బొడగని భీతినొందితివొ భూతము సోఁకెనొ లేక ఱాలపై
వడి చెడి జాఱి నేలపడి వాఁగులఁ జేరితొ యేమి చెప్పుమా
కొడుక నిజంబు నాకు నొగి గొబ్బున నిప్డు చికిత్సఁ జేసెదన్.

297


సీ.

పడి లేచియుండినఁ బరఁగ మేనఁ బొసంగఁ
        దైలంబుచేత రుద్దంగవలయుఁ
జట్రాతిమీఁదఁ గ్రచ్చర జారి మ్రొగ్గినఁ
        బొసఁగ వేఁడిజలంబు బోయవలయు
మృగభీతి హృదయాన నొగి నాటినట్టైన
        నెట్టన నడివీఁపుఁ దట్టవలయు
నదిగాక భూత మెందైన సోఁకిన భూతి
        దెప్పునఁ బట్టి మంత్రించవలయు


తే.

నిట్టి నాల్గుచికిత్సలం దేచికిత్స
చేయు దది నీవు నిజముగఁ జెప్పుమనినఁ
దెలియునే నామనంబున దిగులుదీర
నున్న దున్నట్లు చెప్పు నాకన్నతండ్రి.

298


తే.

అనుచు నాపాదశీర్షపర్యంత మప్పు
డొనర నివురుచుఁ జెమటచే నుష్ణమైన

దేహమందున్న బలుఱాలదెబ్బ లుబ్బి
యుండుటం జూచి భీతిల్లి యూరకుండి.

299


వ.

ఎట్టకేలకు నవ్వకుళమాలిక హరి కిట్లనియె.

300


సీ.

ఓతండ్రి నీమేన నుష్ణపుస్వేదంబు
        పొంగుచు నీరీతిఁ బుట్టు టేమి
మృదుశరీరమునందు మెండుగ ఱాలదె
        బ్బలు దాఁకియున్న దీపాప మేమి
ధీరుండ వయ్యును దీనదశను బొంది
        నీ విట్లు కన్నీరు నించు టేమి
కల్గినరీతి నిక్కముగఁ దెల్పుమటన్న
        మాటాడ విపు డింతమౌన మేమి


తే.

యనుచుఁ గప్పినవస్త్రంబు నవలఁ దీసి
యొప్పుగా లేవనెత్తి గూర్చుండఁజేసి
వేగ గదుములు తాఁ ద్రోమి వేఱవస్త్ర
మొకటి పైఁగప్పి చందనం బొడలనలఁది.

301


క.

చల్లనిజలములఁ గన్నులు
మెల్లఁగఁ దా నివిరి నినిరి మేల్కొల్పుచు మే
ల్మొల్లలు గ్రుచ్చినమృదుతర
పల్లవముల విసరి విసరి బడలికఁ దీర్చెన్.

302


క.

హరి కిటు బడలిక దీరిన
సరవిగ వళుళాఖ్య యింతి సదయహృదయ యై
పరమాన్నము భుజియింపుము
వరసుత యని పిలువ శిరము వంచినవాఁడై.

303

క.

పంకజలోచనుఁ డుండఁగ
సంకటపడి వళుళ చాల జాలిని బల్కెన్
మంకుతనము చేసెదవా
వెంకట నీమదిని యేమొ వింత జనించెన్.

304


మ.

అని యాకాంత మఱిట్లు వల్కె విను నీ వాకాన నెందేనియై
నను సౌందర్యవిలాసవిభ్రమకళానైపుణ్యము ల్గల్గుకాం
తను మోహంబునఁ జూచి వచ్చితివె? చిత్తంబందుఁ దద్రూపమున్
ఘనమై నిల్చెనొ నీయురఃస్థలమునన్ గామాస్త్రము ల్నాటెనో.

305


సీ.

నాతండ్రి నీవు గన్నది కిన్నరాంగనో
        గీర్వాణకాంతయో గిరులయందు
గమనింపఁ జెంచితో గంధర్వకాంతయో
        వనదేవతయొ లేక వగలుగుల్కు
నూర్వశియో మేనకో సర్వగుణములఁ
        దగినరంభయొ తిలోత్తమ ఘృతాచొ
పూని యీపదుగురలో నెవ్వరిం జూచి
        నీవు వచ్చితి వది నిక్కముగను


తే.

జెప్పుమని వల్కఁ దల వంచి శ్రీధరుండు
పలుక కూరక కనుల బాష్పంబు లొల్క
దిగులువడియుండుచక్రిని తగ మఱొక్క
సారి వీక్షించి పల్కె నో సత్కుమార.

306


తే.

మోహినీభూత మేమైన ముందు నిలిచి
కనులఁ బొడఁగట్టి పోయెనో గహనమందుఁ

గామినీభూత మెందేని గదసి నిన్నుఁ
బట్టెనో తెల్పు కొడుక మఱెట్టివిధము.

307


క.

అటు గాకుండిన నాతో
నిటు మాటాడకయ యుండ నేవిధమున సం
కటపడ వెన్నఁడు దీనికిఁ
గటగట నే నేచికిత్సఁ గావింతునయా.

308


క.

ఒకమాట నాకుఁ జెప్పక
వికలాత్ముఁడ వగుచు ఘనవివేకముగాఁ బ
ల్కక నీ వుండఁగ నామది
కకవిక లొందినది నాకు గతియే మింకన్.

309


సీ.

మౌనివై నీ విటు మాటలాడకయున్న
        నిక్కడ మనకు దిక్కెవ్వ రింక
నావరాహస్వామికైన నీవృత్తాంత
        మెఱుఁగఁ జెప్పఁగఁ దీర దింకమీద
నంత ఱట్టేల నా కాప్తంబుగా నీమ
        దిని గలిగినచింత దెల్పు మిఫ్డు
నానావిధంబుల నేను విచారించి
        నీచింత దీర్చెద నిశ్చయముగ


తే.

నన్ను నఱమఱగాఁ జూడ కన్న నీవు
బ్రదికియుండిన నే నిందు బ్రదుకఁగలను
లేకయుండిన దేహంబు నాకు వలదు
నేను నీవున్నచోటన నిల్చియుందు.

310


సీ.

కన్యకాదీక్ష నిక్కంబుగఁ బూని నే
        గురునిష్ఠ నుండఁగఁ బరమగురుఁడు

పుణ్యాత్మ నీయట్టిపుత్త్రరత్నంబును
        గనక పెంచక నిచ్చె ననుచు నిన్ను
నెఱ నమ్మియుండఁగ నేడు నీ విచ్చట
        శోకించువిధ మేను జూడలేను
నాయందు దయను మనంబునఁ గలయిష్ట
        మెఱిఁగించుఁ జేసెద నేదియైనఁ


తే.

జేతిలోఁ జేయిఁ బెట్టి మచ్చిక శిరంబు
నివిరి యాచక్రధరుని కన్నీరు దుడచి
తాను గన్నీరు నింపఁగఁ బూనినాపె
కివ్విధంబుగ ననియె నయ్యీశ్వరుండు.

311


చ.

కనుఁగవ మెల్లఁగాఁ దెఱచి కామవికారము మానసంబునం
బెనఁగొనఁ దల్లి నీ విపుడు ప్రేమను జెప్పిన దంతె చాలు నీ
విను మొకవారణేంద్ర మటవిం బొడసూపఁగ దానివెంబడిం
జని గిరి డిగ్గఁగా నెదుటఁ జల్లఁగఁ బుష్పవనంబు గన్పడెన్.

312


క.

ఆవనమున నొకసుందరి
లావణ్యవిలాసకలిశలక్షణవతియై
భావజుబాణముకైవడి
గా విద్యుల్లతికరీతిఁ గన్పడె నెదుటన్.

313


సీ.

ఆకాంతపాదంబు లమలపల్లవములు
        జంఘిక ల్కాహళుల్ సఖియతొడలు
కదళికాస్తంభము ల్కటి సైకతంబు మ
        ధ్యము గగనంబు హస్తములు శోణ
కమము ల్మెఱుంగునూఁగారు చీమలబాఱు
        కలికి కుచములు బంగారుగిండ్లు

గళము శంఖంబు చక్కనిచెక్కు లద్దముల్
        తేటైనకెమ్మోవి తేనెబావి


తే.

దంతములు మొల్లమొగ్గలు తళ్కుచెవులు
శ్రీలు నాసిక తిలపుష్ప మాలతాంగి
కనులు కలుగండుమీలను గదియు బొమలు
కళలచే సొగసైనసింగాణు లనఁగ.

314


వ.

తనరారుచుండు నదియుంగాక.

315


తే.

చంద్రబింబసమానంబు సతిముఖంబు
మెఱుపుతుమ్మెదఱెక్క లమ్మెలఁతకురులు
జనని యాకామినీమణిచక్కఁదనము
చెప్పలేఁ డజుఁడైన నేఁ జెప్పఁగలనె.

316


చ.

తలఁపు నిజంబుగా వినుము దానికి నాకుఁ బ్రియానుబంధ మిం
కెలమిని గల్గెనేని యొగి నేలుచునుండెద దాని లేనిచో
నిలువఁగ నోప నిందు జననీ తలగాయము మాన్పినట్టిని
న్నిల నెడఁబాసివోవుటకు హేతువు గల్గునటంచు నాత్మలోన్.

317


వ.

చింతించువాఁడ నప్పద్మనేత్ర ను జొప్పడ నీవిడకుఁ దోడ్తెచ్చు
త్రోవ యెఱింగి మాటాడి తెమ్ము మద్దాని నిడుకొని యయ్యెడ
నెయ్యంబార నుండెద.

318


చ.

అని హరి వల్కఁగా వకుళ యాతని నెమ్మొగమారఁ జూచి యి
ట్లనియెఁ గుమార నీవు గనినట్టి లతాంగకులంబు గోత్రమున్
వినవలెఁ దల్లిదండ్రులను వేడ్క నెఱుంగఁగఁ జెప్పు దానినిం
గనవలెఁ బెండ్లియాడఁ దగుకన్యకయైన వరింపఁగాదగున్.

319

తే.

దానిపే రేమి యుండెడుతా వదేది
చెప్పు మేర్పడ నేఁ బెండ్లి సేయు దిప్పు
డంచు వకుళాడ నాచక్రి యనియె జనని
వినుము చెస్పెదనని యప్డు వివర మెల్ల.

320


సీ.

జనని యాక్రమము నిశ్చయముగ విను సుధా
        కరునికులజుఁడు నాకాశరాజు
తనకు సంతతి లేక ఘనపుత్త్రకామేష్ఠి
        దనరఁ గావింప నద్ధరణితలము
దున్నింప నవనిలోఁ దోయజం బుదయించె
        నాతోయజంబునం దామృగాక్షి
గనుపింపఁగాఁ దెచ్చి గగనాధిపుఁడు పెంచె
        ధరను బద్మావతి దానిపేరు


తే.

పరఁగ దానికి నాకు దాంపత్య మజుఁడు
నిశ్చయము చేసి యుండెనా నేను బ్రదుక
గలను లేకున్న నిచ్చోట నిలువలేను
వనిత వైకుంఠపురిఁ జేరవలయుఁగాక.

321


వ.

అమ్మా! విను మక్కన్యకామణి లక్ష్మీసమాన యగుంగావున
జన్మాంతరపుణ్యంబును గలపుర్షునకు లభించుంగాని పెఱవారి
కేల లభించు. మత్పుణ్యపరిపాకంబున నక్కన్య నీక్షించి
సంభాషింషఁగలిగె. నట్టిసుందరిం జూచి విడిచివచ్చితి. నిఁక
నాకన్నోదకంబు లభిలషింప సప్పద్మావతి నాయందు ననురక్తి
లేమి చెలులం బురికొల్పి శిలావృష్టిం గుఱియించె. నావృష్టి
కోపంజాలక తురంగంబుపైఁ బడి తెప్పున నిప్పర్వతం బారో
హించి పునర్జీవితుండైతి. నజుం డట్టిసుందరిం బుట్టించి కట్టిఁడి

బుద్ధి నిచ్చి నా కింతకష్టంబు వెట్టె మత్పాతకం బింతకుఁ దెచ్చె
బ్రహ్మయు నక్కాంతకును నా కప్పుడ సంధింపఁజేయకపోయె,
నైన నీవు తత్కన్యకారత్నంబును నాకు నొడఁగూర్పు
బ్రహ్మతంత్రంబును దోడ్పడ నెంచెద, నట్లు చేసితివేని మజ్జననీ
జనకసహోదరాదిబాంధవులును, మద్భక్తులగు ప్రహ్లాదనార
దాదిపరమభాగవతోత్తములును, నీవ యని నిశ్చయింతు,
ననేకగోభూహిరణ్యాన్నదానాదులఫలంబు చేకుఱు, నాచేఁ
బద్మావతికంఠంబున మాంగల్యం బిడంజేయు మంతియ చాలు
నని మఱియు నిట్లనియె.

322


తే.

తగిన శుభలగ్నమున నాకు దాని కీవు
పెండ్లి చేయించినంతకుఁ బ్రీతి నాకుఁ
గలుగ దేలోక మెందైనఁ గనుక వేగ
నాకుఁ బెండిలి సేయించు నయనిధాన.

323


మ.

హరి వేడ్కన్ వచియింప నవ్వకుళ నెయ్యం బారఁగాఁ బుత్త్రకా
పరమాశ్చర్యముగా ధరాతలములోఁ బద్మంబునం దట్టిసుం
దరి బుట్టం దగు హేతు వే మిపుడు మోదం బొప్పఁగా నాకు నీ
వొరిమం జెప్పుమటన్నఁ జూచి హరి యి ట్లిప్పారఁగాఁ బల్కె దాన్.

324

హరి వకుళకు రాములకథ చెప్పుట

సీ.

వినవమ్మ తొలికాలమున నప్డు త్రేతాయు
        గంబును జరుగ శ్రీకరుఁడు ఘనుఁడు
దశరథేశ్వరునకుఁ దనయుండనై పుట్టి
        గాధేయుసవనంబు గాచి శివుని
చాపంబుఁ ద్రుంచి యాజనకాత్మజను బెండ్లి
        యాడి సాకేతాఖ్య నగుపురంబు

చేరి మజ్జనకాజ్ఞ శిరసావహించి సీ
        తను లక్ష్మణుని దోడుకొని వనముల


తే.

కరిగి యందుండ నొక్కమాయామృగంబు
నచట జానకి చూచి నెయ్యమున దాని
దెచ్చి యిమ్మని యడుగ మే మచ్చటుండి
పోవ దశకంధరుఁడు వచ్చి పొలఁతిఁ జూచి.

325


సీ.

ధరణిజ నెత్తి రథంబుపై నిడుకొని
        జనఁగ రామా యని జనకపుత్త్రి
విలపింప నెసవరందు విడిపింపలేకున్న
        నపు డగ్నిదేవుఁ డయ్యనిమిషారిఁ
జేరి దశగ్రీవ సీత గా దీకాంత
        మఱి యెవ్వరన్న నెమ్మదిగ వినుము
చెప్పెద రాముఁ డాసీతను నాచెంతఁ
        జేర్చి విప్రాంగన న్సీతవలెను


తే.

జేసి యందుంచి చనియె నీస్నేహ మేను
గోగి చెప్పితి నీరీతి గుట్టటంచు
శాంతముగఁ జెప్పి సీతవేషంబు వేద
వతికిఁ గల్పించి తెచ్చి రావణుని కిచ్చె.

326


క.

ఆమూఢుం డగు రావణుఁ
డామైథిలి నచట విడచి యావేదవతిం
గామించి తోడుకొని చనె
నేమఱక యశోకవనిని యెలమిగ నుంచెన్.

327


క.

రామా యని పేర్కొంచును
దా మైథిలిరీతి నచటఁ దల్లడఁబడుచున్

నేమ మొకించుక దప్పక
యామానిని చెఱను నిల్చి యడలుచు నుండెన్.

328


క.

అనలుఁడు తనసతిచెంగట
నొనరఁగ జనకజను డాఁచియుండఁగ నే నా
యనిమిషవైరిని దునుముట
కనిమిషపతి సుతుని ద్రుంచి యాసుగ్రీవున్.

329


సీ.

చేబట్టి లవణాబ్ధి చెచ్చెర బంధించి
        కదసి రావణకుంభకర్ణముఖ్యు
లగురాక్షసులం ద్రుంచి యందఱు మెచ్చుట
        కై యందుఁ జెరనుండునట్టిసతిని
గాంచి నీవగ్నిలోఁగాఁ బ్రవేశించి వ
        చ్చినఁ గాని నిన్నుఁ జేకొన నటంచుఁ
బల్కితి నయ్యింతి పావకజ్వాలల
        యందుఁ బ్రవేశించె నందఱు గన


తే.

నప్పు డిద్దఱు సీతలై యగ్నియందు
నిలిచియుండఁగ జనకజ నేను చిలిచి
చేడె నీవలెఁ జెంతను జేరియున్న
కమలలోచన యెవతె నిక్కముగఁ దెల్పు.

330


సీ.

అన విని సీత యిట్లనె దశాస్యుఁడు నన్ను
        దెచ్చునప్పుడు నేను దిగులునొంది
పరఁగ ని న్బేర్కొని పలువిధంబుల నేడ్వ
        ననలుండు దనచెంత నప్పుడున్న
వేదవతిని దెచ్చి విబుధాహితున కిచ్చి
        నను దనలో డాఁచికొనియె వేద

వతి లంక చేరి రావణునిచే హింసలు
        వడియె నాకొఱ కిది భాగ్యవతియు


తే.

నిన్నుఁ గోరి తపంబున్న కన్నె మిన్న
గనుక నీభావమందు సత్కరుణనుంచి
ప్రేమ మీరఁగ నిద్దానిఁ బెండ్లియాడు
మనఁగ నే నందు కొల్ల కిట్లంటి నపుడు.

331


తే.

పడఁతి విను మేకపత్నీవ్రతుఁడను గనుక
యిపుడు నేఁ బెండ్లియాడ నియ్యిందుముఖిని
రహిఁ జెలంగఁగ దేహాంతరమున దీని
పెండ్లియాడుదు వేడుక పెచ్చుపెరుఁగ.

332


వ.

అదెట్లనిన నిరువైయెనిమిదవద్వాపరాంతకలియుగంబున
ననేకభక్తరక్షణార్థంబు వేంకటాద్రియందు నవతరింతు నపు
డీకన్యకను బెండ్లియాడుదు. నంతపర్యంతంబు నీకాంత సత్య
లోకంబున వసియించి యుండవలయు, వేంకటాద్రియం దుద
యించిన నపు డియ్యింతి భూమియందు నుద్భవించు. నపు
డేను పరిగ్రహింతు.

333


క.

అని పల్కితి నీగోప్యం
బనలునకును నాకుఁ దెలియు నదిగా కిది యా
జనకజకును వేదవతికిఁ
దసరారఁగఁ దెలియు మర్మధర్మం బిదియున్.

334


సీ.

పరు లెందు వినని నీపరమరహస్యంబు
        నీకుఁ జెప్పితి నేఁడు నెనరు మీఱి
మది నుంచు మటుమీఁద మహిమ మీరఁగ నేను:
        వహ్నియం దావేదవతిని నిల్పి

చిరతరకరుణ నాసీతను మెచ్చి చేఁ
        బట్టి విభీషణుపట్ట మచటఁ
గట్టి సౌమిత్రితోఁ గపులతో సాకేత
        పట్టణంబును జేరి ప్రజలనెల్లఁ


తే.

బాలనము చేయుచుంటి నక్కాల మట్ల
జరిగె నటమీఁద నేను ద్వాపరమునందు
మొనసి వసుదేవునకుఁ గృష్ణుఁడన జనించి
యుంటి వల్మీకమున నిందు నున్నవాఁడ.

335


తే.

అనుచు వకుళకుఁ బూర్వవృత్తాంతమెల్ల
చక్రి వినిపింప నయ్యింతి సంతసించి
వేదవతి పూర్వవృత్తాంతవిధము దెల్పు
మనఁగ నాచక్రి యిమ్మాడ్కి ననియె నపుడు.

336


సీ.

విను వకుళాదేవి ఘనపూర్వకథ నీకు
        విశదీకరించెద విప్రకన్య
యగు వేదవతి నన్ను మగనిగ భావించి
        తపము సేయుచునుండ దనుజవిభుఁడు
తా దాని గామింపఁగా దేహమం దాశ
        విడిచి యాలలితాంగి విశ్రవసుని
తనయుని గాంచి సిద్ధంబుగ హరిచేత
        నిన్ను నేఁ జంపింతు నెఱిఁ దలంచు


తే.

నంచుఁ బంతంబొనర్చి తా నగ్నిఁ జొచ్చె
బావకుఁడు దాని డాఁచి తప్పక దశాస్యుఁ
డెలమి సీతను గొంపోవ నెఱిఁగి వాని
కిచ్చె వేదవతిని సీత నీయకుండ.

337

వ.

అంత నాదశాస్యుని జంపి వేదవతియనుసీత నగ్నిం బ్రవేశించె
నంత వేదవతి పద్మంబుననుండి యాకాశరాజేంద్రునికి
లభించె, నే నద్దానిం గని మరులెసంగి తల్లడంబడువాఁడ
నయ్యది నను మఱచివోయె నంత.

338


మ.

అని యమ్మాధవుఁ డాప్తతం దనదువృత్తాంతంబు పద్మావతీ
జననంబు న్వినుపింపఁగా వకుళ శ్రీస్వామి న్విలోకించి యి
ట్లనె నోదేవ మహానుభావ మును నే నజ్ఞాననై మానవుం
డని బాలుండని యుండి తేను నిను బ్రహ్మం బంచు సేవించెదన్.

339


శా.

నీవే బ్రహ్మను గన్నతండ్రిని మహానిర్వాణసంధాత వీ
వే విష్ణుండవు రామచంద్రుఁడవు నీవే కృష్ణదేవుండు వీ
వే వేదాత్మవు సర్వతోముఖుఁడ వీవే కర్త వాభోక్త వీ
వే విశ్వంబు వరాహదేవుఁడవు నీవే శేషశైలాధిపా.

340


క.

తోయజలోచన నే నీ
మాయను గనలేక నాకుమారుఁడ వంచున్
నీయందుఁ బ్రేమ ముంచితి
నాయీశుఁడ వంచుఁ దెలియ నైతి మహాత్మా.

341


సీ.

అన విని విష్ణుఁ డిట్లనియె నిచ్చట నీవు
        తలగాయమును మాన్పి తల్లివలెను
బోషింప నీఋణంబును దీర్చు టెట్లుకో
        యని నేను జింతింతు ననుచు వకుళ
మాలికపై విష్ణుమాయఁ దెప్పునఁ గప్పి
        పుత్రవాత్సల్యసద్బుద్ది నిల్పి
మఱల నిట్లనియె నమ్మా వివాహము నాకుఁ
        జేయు మీవంచు మచ్చికలు వల్కి

తే.

తప్ప కిప్పుడ పెండ్లి పెత్తనము చేయఁ
బోయి రమ్మని పల్క నాపొలఁతి హరిని
గాంచి పుత్రక యిప్పు డాకన్యయున్న
దివ్యపుర మెట్టిదో దారి డెల్పుమయ్య.

342


తే.

అనఁగ హరి యిట్టులనియె నీయద్రిదిగువ
నమరు నమరావతీపురం బనఁగఁ బుడమి
నున్నతంబై ప్రకాశించు నొక్కనగర
మట్టి పట్టణ మిపుడు నీ వెట్టి దనిన.

343


సీ.

వేదవేదాంగప్రవీణులై వేదాంత
        వేత్తలై వెలసిన విప్రవరులు
ప్రవరబాహాశౌర్యపటిమజితారాతి
        వారంబు గల భూమివరమణులును
మణికాంచనోజ్జ్వలమందిరాంగణసట
        ధ్వజమందిరులు నైన వైశ్యవరులు
ధరనిర్జరులపాదసరసిజసేవ్యైక
        శుభధురంధరు లైన శూద్రఘనులు


తే.

గలిగి విలసిల్లు గోపురకలితలలిత
రత్నకాంతపరిభ్రాంతి రాజహంస
పథనిరోధకసాలవిభ్రాజమాన
మై ప్రకాశించు నారాయణాఖ్యపురము.

344


ఉ.

అప్పురమేలువాఁడు గగనాఖ్యధరాపతిచంద్రుఁ డుత్తముం
డెప్పుడు ధార్మికుం డతఁ డభీష్టసుఖప్రదుఁ డంచు సజ్జనుల్
మెప్పుగ నెన్నుచంద్రు కడుమేలుగ భక్తి విరక్తి యుక్తులం
దొప్పినవాఁడు దేవతచయోన్నతి సన్నుతిఁ జేయ నొప్పెడున్.

345

సీ.

సప్తాంగములవెలి సవరించి యాత్మయం
        దష్టాంగసరణిపై నాసఁ బెంచి
బైటశాత్రవకోటపటిమంబు నిర్జించి
        యంతర్విరోధుల నడఁగఁజేసి
బాహ్యపుణ్యనదీప్రభావంబు నీక్షించి
        యాంతరనదులపై నాత్మ నుంచి
వెలుపలిచక్రము ల్వేడ్కతోఁ బాలించి
        సొరిదిలో చక్రముల్ చూడ నెంచి


తే.

దీనజనమానసాధీనధీరు విష్ణు
చరణకంజాతసంజాతసారమధుక
రాయమానమనస్కుఁడై రహిని వెలయు
నెమ్మి మీరంగ నాకాశనృపవరుండు.

346


తే.

తొండమానుండు ముద్దుతమ్ముండు పరమ
భక్తియుక్తుండు శాంతుండు పరఁగఁ బుత్త్ర
కుండు వసుధానుఁ డని భార్య యోగ్యశీల
ధరణిదేవీయనంగ పద్మావతి సుత.

347


చ.

అని గగనక్షితీశ్వరుని యభ్యుదయంబును జక్రి చెప్ఁపగా
విని వకుళాంగనామణి వివేకము మీరఁగ నద్రి డిగ్గి యో
వనజదళాక్ష మార్గమిఁక వారకచూపుమటంచుఁ బల్క నే
మ్మనమునఁ జూపు దేను వినుమాత కృపాన్విత ధర్మపాలితా.

348


వ.

ఇప్పర్వతంబు డిగివోవ నచ్చట పావనకపిలతీర్థం బొండు
గలదు. అద్దానియందు మునింగి కపిలమునివలనఁ బూజ
లందఁబడిన శివలింగంబునకు నమస్కారంబు లిడి శ్రీనివాసు
నకు నతిశీఘ్రంబుగ వివాహలగ్నము సమకూర్చు మని విను

తించి యవ్వలంబోయి శుకాశ్రమంబు చేరి యం దాశుక
యోగీంద్రులకు మ్రొక్కి అగస్త్యాశ్రమంబున కరిగి యం
దమ్మునివలన నిర్మింపఁబడిన శివునకు నమస్కరించి తదాలయ
సన్నికృష్ణగ్రామనివాసు లగు బ్రాహ్మణులకు మ్రొక్కి వారి
నారీమణులను గూడి మైత్రి యొనరించుకొని నారాయణవన
పురంబునకుఁ బోయి తద్రాజపత్ని కడకేగి యయ్యంగనామణిం
జూచి ప్రియోక్తులాడుచు నావలఁ బద్మావతిసంగతి నించుక
దెల్పించుము. జరుగు కార్యం బావల జరుగుననిన వకుళ
మాలిక విని యిట్లనియె.

349


సీ.

విను దేవ! వారు నీవృత్తాంత మడిగిన
        నప్పు డే నేమేమి చెప్పవలయు
నని పల్క నాయంబుజాక్షుండు గనుఁగొని
        యనియె నోయమ్మ వా రడిగిరేని
వరచంద్రకులజులౌ వసుదేవకులు ధాత్రి
        తలమున నాతల్లిదండ్రు లనుము
బలభద్రుఁ డన్న సుభద్ర సోదరియును
        గోత్ర మడ్గ వసిష్ఠగోత్ర మనుము


తే.

రహిని నక్షత్ర మడిగిన శ్రవణ మనుము
లలితయౌవనసౌందర్యకలితుఁ డనుము
మానధనుఁ డను భవ్యనిధానుఁ డనుము
భువిని బద్మావతికిఁ దగు పుర్షుఁ డనుము.

350

వకుళమాలిక నారాయణవనపురమున కేగుట

వ.

అని చెప్పుచుండఁగ దేవమాయానిర్మితం బగుతురంగంబు
కయంబున హరికడకు వచ్చి నిలుచుటం జేసి వకుళమాలిక

సంతసించె నాచక్రి తురంగంబునకుఁ దగునాజ్ఞ యిచ్చి వకుళ
నాతురంగంబున నారోహింపఁజేసె. అంత నావకుళ చక్రి చెప్పి
నట్ల కపిలేశ్వరునకు నమస్కరించి ప్రార్థించి శుకునకు నగస్త్యు
లకు మ్రొక్కు లిడి శివలింగంబులకుం బ్రణమిల్లి యొక్కయెడఁ
గూర్చుండి తద్దేవాలయంబులో నిలిచియున్న కన్యకలయం
దొక్కకన్యను జేరఁ బిల్చి ప్రియోక్తుల నిట్లనియె.

351


క.

చెలి నీ వెవ్వరిదానవు
చెలువారఁగఁ జెప్పుమనినఁ జింతించుచు నా
చెలిమిన్న దాఁప కిట్లనె
జెలువారఁగ వకుళతోడఁ జిత్తం బలరన్.

352


సీ.

ఆకాశరాజేంద్రు నాత్మజచెలికత్తె
        ననఁగ నవ్వకుళ దానిని బ్రియంబుఁ
జూచి యమ్మా! మోము సొక్కినట్లున్నది
        యేమి చెప్పు మటన్న నా మెలంత
గని యమ్మ నాచింత కడుకష్టమైనదే
        నెట్లు చెప్పుదు నీకు నెల్ల మగువ
వకుళ యిట్లనెను దాఁపక చెప్పు మంతయు
        ననఁగ నాచెలికత్తె యనియె నిట్లు


తే.

వనవిహారంబు సేయంగ వాంఛ యెసంగి
మనుజనాథునిపుత్త్రి పద్మావతియును
మేము నట కేగి విహరింపఁ మేటిగజము
వచ్చెఁ బరుగిడి వెనువెంట వచ్చె నొకఁడు.

353

సీ.

వాఁ డెట్టివాఁ డన్న [3]వనదాభవర్ణుండు
        లలితసద్భూషణాలంకృతుండు
నాజానుబాహుండు నబ్జపత్రాక్షుండు
        పర్వేందువదనుండు భాగ్యయుతుఁడు
గంభీరవక్షుండు కరుణార్ద్రహృదయుండు
        మహితశ్రీమన్మథమన్మథుండు
కమనీయతురగంబు గలవాఁడు శరచాప
        ములు పూని విక్రమంబును గడంగి


తే.

రాఁగ నాయాముటేనుఁగ నేగె నంతఁ
దురగమును డిగ్గి వచ్చిన పురుషుఁ డపుడు
పరఁగఁ బద్మావతిం జూచి పల్కులాడు
చుండె నేమేమొ బహువింత లొప్ప నచట.

354


వ.

అంత నారాజకన్యక వచ్చిన శబరునియందుఁ గోపించి ఱాలను
రువ్వించె. నతఁ డెక్కినతురంగంబు నేలం బడియె. నతం డుత్త
రాభిముఖుండై మఱల నాహయంబును దట్టి దానియందలి
గూర్చుని నేగె. నప్పద్మావతి నిజమందిరంబున కేగి యక్కిరాత
విభుని మఱలఁ దలంచుటం జేసి, యేమో యొకవిచారంబు
మనంబునం బొడమి మాటాడక తాపజ్వరంబునఁ దలిదండ్రు
లతోడ మాటాడకుండుటం జేసి జననీజనకులు తజ్జ్వరతాపంబు
నివారణంబు సేయుటకు బృహస్పతిని రావించి యమ్మహాతునికిం
బద్మావతిం జూపి కన్నీరు నించుచు నానృపాలుం డిట్లనియె.

355


సీ.

దేశికా పద్మావతికి నిట్లు తాపజ్వ
        రంబు రాఁగా బిడ్డ రాత్రి నిదుర

పోక తాపంబుచేఁ బొరలుచు నుండె మీ
        రిది మాన్ప నౌషధం బియ్యవలయు
నన విని గురుఁ డిట్టు లనియె నృపాల యీ
        బాలామణికిఁ బ్రాణభయము లేదు
చింతంపవలదు చెచ్చెరను రుద్రాభిషే
        కంబు సేయింపుఁడు కల్గు సుఖము


తే.

నీవు చేయింపుమని వల్క భూవిభుండు
బ్రాహ్మణుల నిచ్చటికిఁ బంపి ఫలసుమములు
గొనుచు పొమ్మని నాచేతఁ గోవెలకును
జెప్ప వచ్చితి నవి గొని చింత నిదియ
నింక నీ వెందు వచ్చితో నెఱుఁగఁ జెపుమ.

356


వ.

అనిన విని వకుళ మనంబునఁ దలంచిన కార్యం బనుకూలము
నకు వచ్చినదని సంతసించుచు సవ్వెలఁది కిట్లనియె.

357


సీ.

విను మోలతాంగి నే వేంకటేశునిదాసి
        యొకకార్యమునకు ని ట్లుదయమునన
పైనమైవచ్చితిఁ బట్టణం బిఁకఁ జేరి
        యంతరంగంబున కరిగి యచట
నాధరణీదేవి కాప్తవాక్యము చెప్ప
        వచ్చితి ననఁగ నవ్వనిత పల్
నభవుని కభిషేకమగునంత కిచ్చోట
        నిల్చియుండితివేని నేను నిన్ను


తే.

దోడుకొనిపోదు నన దానితోడుకొఱకు
వకుళ యచ్చటనుండె నవ్వల ఫణీంద్ర

శైలపతి యప్పడఁతిమీఁదిబాళిచేత
ధీరుఁ డయ్యును మదిని చింతించుచుండె.

358


వ.

అని చెప్పిన సూతుం జూచి శౌనకాదు లావలిచరిత్ర మేమన
నతం డిట్లనియె.

359


క.

సోమదివాకరలోచన
దామోదర శంఖచక్రధర భవహరసు
త్రామోద్ధారక గురువర
శ్రీమద్వేంకటగిరీంద్ర జితదనుజేంద్రా!

360


మాలిని.

సురుచిరగుణధామా శుభ్రసత్కీర్తికామా
మురదనుజవిరామా మోక్షకల్యాణసీమా
గురుతరశుభనామా ఘోరసంగ్రామభీమా
ద్విరదకుముదసోమా దేవతాసార్వభౌమా!

361


గద్య.

ఇది శ్రీతఱికుండ లక్ష్మీనృసింహకరుణాకటాక్షకలితకవితా
విలాస వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్యతనూభవ వేంక
మాంబా'ప్రణీతం బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యం బను
భవిష్యోత్తరపురాణంబునం దిష్టదేవతాప్రార్థనంబును, శౌన
కాదులు ప్రశ్నయు, జనకశతానందసంభాషణంబును, శేష
మారుతసంవాదంబును, శేషాద్రిప్రమాణభావంబులును,
మాధవాఖ్యవిప్రునిచరిత్రయు, వేంకటేశ్వరుఁడు వైకుంఠం .
బును జేరుటయు, నారదుండు బ్రహ్మకు వేంకటేశ్వరుఁడు
వైకుంఠమునకుఁ బోయినట్లు చెప్పుటయు, నారదుఁడు
త్రిమూర్తులం బరీక్ష చేయించుటయు, భృగుండు త్రిమూ
ర్తులగుణంబులు గనుటయు, హరితోడ లక్ష్మీదేవి ప్రేమకల

హంబు పూని కొల్లాపురంబు సేరుటయు, హరి వైకుంఠము
విడిచి శేషాచలంబున వల్మీకంబునం జేరుటయు, బ్రహ్మరుద్రులు
ధేనువత్సరూపంబులం జని హరికి నాహారంబు నొసంగుటయు,
చోళరాజాంగన గోపకుని దండించుటయు, హరిశిరంబున గో
పకుడు గొడ్డంట నఱుకుటయు, చోళరాజుకు చక్రి శాపం
బిడుటయు, గీష్పతి హరికి నౌషధంబు చెప్పి పోవుటయు, శౌన
కాదులు హరిచరిత్రకుఁ బశ్చాత్తాప మొందుటయు, వల్మీకతిం
త్రిణీప్రభావంబును, శేషపర్వతమహిమంబును, వరాహ
శ్రీనివాసుల సంవాదంబును, హరికి వరాహస్వామి చోటిచ్చు
టయు, వకుళమాలికావృత్తాంతంబును, శ్రీమదాకాశరాజు
వృత్తాంతంబును, పద్మావతి భూమియం దుదయించుటయు,
వసంతఋతువర్ణనంబును, పద్మావతి వనవిహారంబు సేయుటయు,
నారదుండు పద్మావతితో సంభాషించి పోవుటయును, శ్రీని
వాసుండు వేఁటాడుటయు, హరి కరిని రక్షించుటయు, వన
మధ్యంబునఁ బద్మావతిని హరి చూచి తనయుదంతం బంతయుఁ
జెప్పుటయు, పద్మావతి కలహించి చెలులచేత హరిపై ఱాల
రువ్వించుటను, హరి గిరి కేగి వల్మీకంబునఁ జొచ్చుటయు,
వకుళమాలిక హరిని ప్రియంబున మాటాడించుటయు, హరి
యెట్టకేలకు వకుళకుం దననిజంబు వక్కాణించుటయు,
రామకథయు, వేదవతీవృత్తాంతంబును, నారాయణవనపుర
వర్ణనంబును, పద్మావతి గృహంబున కరిగి హరిం దలంచుకొని
తాపజ్వరం బనుభవించుటయు, వకుళ నాకాయణవనపురి
కేగి పద్మావతి చెలికత్తెం జూచి మాటాడుటయు ననుకథలంగల
చతుర్థాశ్వాసము.

  1. శలాటువు = పచ్చికాయ
  2. ఆస్తరణము = ఆసనము - ఎఱ్ఱకంబళి
  3. వనద = మేఘము