శ్రీవేంకటాచలమాహాత్మ్యము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

పంచమాశ్వాసము

క.

విశ్వాతీతగుణాకర
విశ్వోద్ధర విష్ణుదేవ వేదవిహారా
విశ్వేశ్వర సురపూజిత
శాశ్వత తఱికుండనృహరి జనహితకారీ.

1


ఆ.

సూత వకుళ దందశూకాద్రి దిగిపోయి
నపుడు విష్ణుదేవుఁ డద్రియందు
నుండి యేప్రయత్న మొనరఁజేయుచునుండె
చెప్పు మనఁగ సూతుఁ డప్పు డనియె.

2


తే.

వినుఁడు మునులార హరిసేయు వింతలన్ని
చెప్పెదను మీ కదెట్లన శ్రీధరుండు
వేంకటాచలమం దుండి వేడ్కగాను
దాను దనమదిలో నిట్లు దలంచె నెలమి.

3


సీ.

వకుళను నే నావివాహప్రయత్నంబు
        సేయ నంపితి వారిఁ జేరి యచట
నెళవుగ మాటాడ నేర్చునో నేరదో
        పురుషులపను లౌనె పొలఁతిచేతఁ

బడుచు గల్గినవారు పట్టుగ నామూల
        మెఱుఁగఱు గనుక నా కీయ మనుచుఁ
బొమ్మన నటుమీఁదఁ బోఁగూడ దచటికి
        మొదట సంధానమే కుదురవలయు


తే.

ననుచు యోచించి సర్వజ్ఞుఁ డయ్యు నరుని
కరణిఁ జింతించి తాను శీఘ్రముగ లేచి
యప్పఁడతిఁ జూడఁగోరి మోహంబుచేతఁ
దాళనోపక యొకవిచిత్రం బొనర్చె.

4


ఉ.

అవ్విధ మెట్టులన్న వినుఁ డబ్జదళాక్షుఁడు జీర్ణవస్త్రమున్
నివ్వటిలంగఁ గట్టుకొని నేరుపు మై నొకప్రాఁతకంచుకం
బవ్వల బాగుగాఁ దొడఁగి యవ్వవిధంబున నొంగి లేచుచున్
నవ్వుచుఁ గొండ డిగ్గి తన నాఁడెము లోకులకెల్లఁ జూపుచున్.

5


సీ.

దంతపుసొమ్ములు తగుబండి గురిగింజ
        దండ లొప్పఁగ మెడనిండఁ దాల్చి
నీరజభవు నేడునెలలబాలుని చేసి
        యాదరించుచుఁ బ్రక్క నంటఁగట్టి
సంకుటుంగరములు పొంకంబుగాఁ బెట్టి
        తగువగు నొక్కబెత్తంబు వట్టి
ముసుకొని నవధాన్యములు నించి యొకబుట్టి
        శిరమునం దిడుకొని శీఘ్రముగను


తే.

బోయి నారాయణాఖ్యసత్పురము సేరి
చెలఁగి యాయూరియమ్మలక్కలను జూచి
యెఱుక యెఱుకోయటం చెలుంగెత్తి పలుక
నిని పురస్త్రీలు దాని బల్వింతగాను.

6

తే.

మురిపమునఁ జూచి పలికిరో ముసలిదాన
గద్దె చెప్పుము మాకు నిక్కంబుగాను
బలుకగా నంతలో రాచచెలులు వచ్చి
యెఱుకతను జూచి వేడ్కమై నిట్టు లనిరి.

7


క.

దిట్టతనంబుగ నీ విపు
డెట్టిట్టు వచింపకుండ నెద నెన్నికలం
బట్టుగఁ జెప్పితె యెఱుకత
పట్టువలువ లిత్తు మెలమి వలుకుము సరవిన్.

8


క.

ఎఱుకత యిట్లనియెను నా
యెఱుకయ జీవనము జనులకెల్ల నెపుడు నా
యెఱుకయ శుభదము శాశ్వత
మెఱుకయ సకలప్రపంచ మెఱుకయ నేనున్.

9


సీ.

వినుఁడు నా యెఱు కెట్టిదని యంటిరేని యీ
        పంచభూతాలఁ బుట్టించు నెఱుక
సరసజాగ్రత్తకు స్వప్నంబునకు దుదఁ
        మొదలు తానై మూఁట గుదురు నెఱుక
దండిగ బ్రహ్మాండభాండతండములందు
        నిండి కుండలినంటి యుండు నెఱుక
మొనసి యాపోజ్యోతి నెనసి తాఁ దనయంద
        నిలిచి యానందించి వెలుఁగు నెఱుక


తే.

యిట్టి యెఱు కెవ్వ ఱెరుఁగ రాయెఱుక నిజము
నెఱుక నేర్చినవారి కాయెఱుక యేను
జెప్పెదను గాని మీకు నేఁ జెప్ప ననినఁ
జెలులు విని ధరణీదేవి చెంత కరిగి.

10

తే.

పల్కి రిట్లని తల్లి యీపట్టణమున
కొనర నెఱుకలసాని వచ్చినది దాని
నిటకు రప్పించి సుతకష్ట మేనిధమున
దీరునో తద్రహస్యంబు దెలియ నడుగు.

11


మ.

అని యాకాంతలు వల్క రాజసతి నెయ్యం బొప్పఁగా డానిఁ దో
డ్కొని రాఁ బొండని పల్కఁగా నరిగి వే కోర్కె ల్గనం దాని ర
మ్మనుచున్ గొప్పఁగ నెంచి వారు పరమాహ్లాదంబుతో నందుఁ బి
ల్చిన వేరాకయ బిడ్డఁ డేడ్చు ననుచుం జేఁదట్టి లాలించుచున్.

12


ఉ.

ఆకుఱవంజి యిట్లనియె నాటకు రమ్మని బిల్వ వచ్చి నా
రాకొనినాఁడు బిడ్డఁ డిపుఁ డమ్మల నక్కల నేడనైన నే
జోకుగఁ జేరి వారలకు సోదె నిజంబుగఁ జెప్పకుండినన్
నాకడు పెట్లు నిండునని నవ్వుచుఁ బల్కుచుఁ మూల్గి యిట్లనెన్.

13


సీ.

భాగ్యవంతులు వారు బహుపేదరాలు నే
        నెటువత్తు నచటికి నెలమి మీఱ
నాబొక్కనోరును నా తెల్లవెండ్రుకల్
        గొప్పకడుపును బెద్ద దొప్పచెపులు
గూని వీఁపును బండిగురిగింజదండలు
        దంతపుసొమ్ములు వింత దెల్పుఁ
గనుఁగొని మణుల బంగరుసొమ్ము లొగిఁ బెట్టి
        యుండువారలు నవ్వుచుంద్రు గనుక


తే.

నాకు సిగ్గగు నీరాచనగరి కేను
వచ్చుటకుఁ గార్య మేమి నావలెనె పేద

తెఱవ లైనట్టివారికీ నెఱుక చెపుచుఁ
బొట్టఁ గడుపుచు నుండుదు పొలఁతులార.

14


తే.

అనిన వా రిట్టు లనిరి మాయమ్మ కెఱుక
నిజముగా నీవు చెప్పిన నీకు రత్న
భూషణా లిచ్చి బంగరుపుట్ట మిచ్చి
పొమ్మనును నీ క విప్పింకఁ బూట మేము.

15


మ.

అని వా రాసతి కాస్తలై పలికి నెయ్యం బొప్పఁగా దాని దో
డ్కొని యంతఃపురమందుఁ జేర్చి రచటం గూర్మిన్ ధరాకాంత దా
నిని బంగారపుఁబీటపై నునిచి మన్నింపంగ నీక్షించి యి
ట్లనె నాసోదెలసాని నవ్వుచు మహాహ్లాదంబు దీపింపఁగన్.

16


తే.

వనిత నీవు భాగ్యవతి నేను గడుపేద
దానఁ గాన నాకు దనయునకును
బాలు బువ్వ బెట్టి మేలైన విడము నా
కిచ్చి యడుగు మెఱుక యెలమి గులుక.

17


క.

అప్పుడు క్షీరాన్నంబును
దెప్పున బిడ్డఁడును దానిఁ దిని లేచి ముదం
బొప్పఁగ ధరణీదేవిని
గప్పురవిడె మిమ్మటంచు గ్రక్కున నడిగెన్.

18


సీ.

ఆయెఱుకలసాని కాధరణీదేవి
        విడె మిచ్చి పల్కె నో వెలఁది మీఁది
యేదేశ మిపుడు మీయిం డ్లేడ నుండు మీ
        యూరుపే రేమి మాయూరి కేల
వచ్చితి వనఁగ నవ్వనితను జూచి సో
        దెలసాని నవ్వుచుఁ బలికె నిట్లు

తెఱవ మిన్నా! విను మెఱుకులవారికి
        నిండ్లెందుఁ గలవు భూమీశవనిత


తే.

గుడిసె లాడాడఁ గావించి కొన్నిదినము
లుండిపోయెడువారల కూరు దేశ
మేల యీయూరిదయితల కెఱుక సెప్ప
వలసి వచ్చితి వింటె మాకులగతులును.

19


సీ.

ఎఱుకవారలకెల్ల గుఱికట్టుగా నిల్వ
        నొక్కచోటున్నది నిక్కముగను
నది యేడనన్న నాల్గాఱును బదియుఁ బం
        డ్రెండుపదాఱును రెండునైన
శృంగపంక్తులుచేత నింగి కెగురుచుండు
        నాఱుకొండలకు మీ దైన కొండ
వేయు శృంగము లొప్పు వీక్షింపఁ దగుకొండ
        మూఁడేళ్లతో గూడి మొనయుకొండ


తే.

నాల్గుత్రోవలకును నట్టనడిమి కొండ
పాము తనలోన నుండఁగఁ బ్రబలు కొండ
మేటి కరువలిఁ దనరారి మెఱయు కొండ
తొంటి మా పెద్దలున్నట్టి దొడ్డకొండ.

20


క.

ఆతొండమీఁద నిక్కము
మాకాఁపుర మెపుడు చెలఁగు మఱి జీవికకై
లోకుల కెఱుకలు సెప్పుచు
జోకుగఁ బ్రదుకుదుము మేము సోదె లడుగుమా.

21


క.

చెప్పెద ముంతెడు ముత్తెము
లిప్పించుము నాకు ననుచు నెఱుకత తనతోఁ

జెప్పఁగ నానృపసతి విని
యప్పుడ ముత్యము లొసంగె యానందముగన్.

22


తే.

పసిఁడిచేటలోని పండుముత్తెంబు లా
గద్దె పొలఁతి సూచి కరము సాఁచి
ముత్తెములను బిసికి మూఁడురాసులు చేసి
మధ్యరాశియందు మనసు నిల్పి.

23


వ.

ముమ్మాఱు నారాసికిం జేనెత్తి మ్రొక్కి నోట గంగాపుణ్య
తీర్థంబులను గాశీగయాప్రయాగప్రముఖపుణ్యక్షేత్రంబు
కను, హరిహరబ్రహ్మాదిదేవతలను, బరాశక్తిప్రముఖానేక
శక్తులను వచించుచు మ్రొక్కి మఱియు నిట్లనియె.

24


క.

విను ధరణీసతి యిచటికి
నెనరున దేవుళ్లు వచ్చి నిలిసిరి నీ విం
కను దక్షిణతాంబూలం
బును గొనిరా మ్రొక్కు గద్దె బుట్టను దనరన్.

25


వ.

అనిన విని దక్షిణతాంబూలంబులు వెట్టి గద్దెబుట్టికి
మొక్కులిడి యెఱుకలసానితో ధరణీదేవి యిట్లనియె.

26


తే.

కొమ్మ నామదిలోనుండు గోర్కె నీవు
చెప్పు నీ కొడుకున కందె లొప్ప నిత్తు
దివ్యాంబరంబుల నెమ్మి నిత్తు
దబ్బరాడకు నెఱుకత తలఁచి నుడువు.

27


క.

అని పల్కఁగ రాణిం గనుఁ
గొని యెఱుకత యిట్టు లనియెఁ గొడుకా మదిలో
ననుమానింపకు మిప్పుడు
ఘనతగ నీకోర్కెఁ జెప్పఁగల నెసలారన్.

28

వ.

అని చెప్పుటం జేసి ధరణీదేవి దాని కెదురుగఁ బసిండిపీటఁ
గూర్చుండఁ దనచేతిబెత్తం బయ్యింతి కిచ్చి తా నొక
ప్రక్క పట్టుకుని ‘విఘ్నేశ్వరా వీరభద్రా మళయాళభగవతీ
మధురమీనాక్షీ యామ్నాయాక్షీ కామాక్షీ కనకదుర్గాంబ
చౌడాంబ జ్ఞానాంబ కొల్లాపురిలక్ష్మీ మీరెల్లరు వచ్చి
మంచివా కియ్యరే వా కియ్యరే యని ప్రార్థించి యిట్లనియె.

29


క.

దిక్కులు సూడక సతి నా
దిక్కున నీ విపుడు చూడు దేవరతోడే
నిక్కము సెప్పెద నీ కని
మక్కున నాయెఱుకలమ్మ మఱి యిట్లనియెన్.

30


వ.

అవ్వో యవ్వ నీతలచినతలంపు మేలౌతాదంట దేవుళ్లు
పలుకుచుండారు, తలంచినతలం పేమంటివా సెప్పెద విను
దైతమ్మ బిడ్డంటె కడుపుసూపుడు తోడఁబుట్టంటె భుజంబును
సూపుదును నీ విట్లు తోడబుట్టు కడుగలేదు. ఇట్లా బిడ్డ
కడుగుసుండావు. బిడ్డ ఆడుబి డ్డంటావా మగబి డ్డంటావా
చెప్పెద సూడు కొడకా, యాడబి డ్డంటె చెవు సూపుదును
మగబి డ్డంటె గడ్డంబు సూపుడును, ఇదిగో యిట్టి మగబిడ్డ
కడుగలేదు. ఆడబిడ్డ కడుగుసుండావే, అవ్వో యవ్వ
ఆయాఁడబిడ్డకు నొకసింత కలిగుండాది ఆసింత యేమంటావా
నిన్నటిదినము నీబిడ్డ వనాని కేగినాది ఆడ తురగారూఢుండైన
నల్లనయ్యను జూచి మోహించియుండాది యెందుండి
ఆనల్లనయ్య వచ్చినాడంటారా చెప్పెదను దల్లీ ఇదిగో యీ
మూలనుండాఁడు ఆమూల దెలియలేదంటె యీడి
వాయువ్యబాగాన బడిగెలతో మెఱయుసుండు బంగారు

కొండమీద నుండెవాఁడె కొడుకా వాఁ డెవం డంటావా
బొల్లి నామంబులు పెట్టుకొని బొల్లిగద్ద నెక్కి కొల్లకాఁడై
యెల్లదిక్కుల దిరుగు నల్లనయ్యె తల్లి, వాఁడు నిబద్దిగాను
నారాయణుండె కాని నరుండు కాఁడే యమ్మా వాఁడు నీబిడ్డను
బెండ్లాడవలె నని యుండాఁడె వాని నీబిడ పెండ్లాడనెంచి
యుండాదె, కాఁబట్టి నీపుత్త్రికను ఆసామి కిచ్చి పెండ్లి చేసి
కన్నులార సూడుము తల్లి సుకంగా నుంటాది లేకుంటే
కష్టాలు రాఁబోతుండాదె యమ్మ' యని చెప్పిన విని ధరణీ
దేవి యెఱుకతం జూచి సంతసించి యిట్లనియె.

31


క.

ఓయెఱుకత నీమాటలు
మాయఁగఁ దోచినవి మనుజ మానినులను నా
రాయణుఁడు పెండ్లియాడిన
దీయవనిం గాన మెందు నిది నిజమేనా.

32


సీ.

అని వింత పడి నవ్వి యడుగఁగ నప్పు డా
        యెఱుకలసాని తా నిట్టు లనియె
నాస్వామి మదకరి నదలించి తఱుముచు
        వచ్చి నీసుతయున్నవనము సేరి
తనకులగోత్రము ల్తనకోర్కె నీముద్దు
        చిన్నారిబిడ్డకుఁ జెప్పినాఁడు
నీపుత్రి యది విని నిష్ఠురోక్తులు వల్కి
        యతఁ డెక్కి వచ్చిన హయముమీఁద


తే.

ఱాల రువ్వింప నేల గుఱ్ఱంబు వడియె
నతఁడు మన్నించి యావేంకటాద్రిఁ జేరె

ముదిత కామీఁద మఱి కామమూర్ఛ దాఁకె
విరహతాపజ్వరంబుతో వేఁగసాఁగె.

33


తే.

ఆజ్వరము మాన్ప వేఱ లే దౌషధంబు
కమలనయనుని మోము నీకన్య కిపుడు
చూప నాలేమమిన్నకుఁ దాప మడఁగు
నూరకే నన్ను నడుగుట నొప్పుఁ గలదె?

34


తే.

అనుచుఁ బలిన కొఱవంజి యవ్వఁ జూచి
ధరణిదేవి యిదేమిపో దబ్బ రనుచు
కమలలోచనుఁ డేడ మాకన్య యేడ
నతని యిది చూచు టేడ నీ వనుట కల్ల.

35


క.

విన విన దబ్బరగాఁ దోఁ
చిన దిది యెప్పుడును లేనిచిత్రం బాహా
యన నెఱుకత విని యీవిధ
మనియెను నామాట దప్ప దవ్వో యవ్వా.

36


సీ.

ఇకఁ గొంతతడవున కిచటికిఁ బెండ్లిపె
        త్తనము సేయుటకు మోదంబు మీఱ
నావేంకటేశ్వరుం డంపఁగ నొకయింతి
        వచ్చును నానిజ మచ్చుమెచ్చు
తెలియు నీ కిపు డెంత తెలియఁ జెప్పినఁగాని
        దెలియలేదో ధరాదేవి నీకుఁ
దెలిసినప్పటికి న న్బిలిపించి బహుమాన
        మిప్పించు మిప్పు డే మియ్యవలదు


తే.

నా కిపుడు నీవు సెల విమ్ము నీకొమార్తె
పెండ్లినాఁటికి వత్తు నాబిడ్డతోడ

మగువ నే నీకుఁ జెప్పిన మాట నిజము
దబ్బ రని యెంచ కమ్మరో తనయ నడుగు.

37


వ.

అవ్వో యవ్వ కడుపుకూటికి దబ్బరాడితి నని తలంచి
యుండావే, అది కల్ల గాదు కైలాట గాదు తరకట బరకట
గాదు. తబ్బిబ్బు గాదు, తసుకు కాదు. తాటోటు మాటలు
గాదు, ఆడంబరము గాదు, ఈడెలు గాదు, ఈఱలు తాఱలు
గాదు, బొంకు గాదు, బోనకత్తెలు మాటలు గాదే యమ్మ
కూఁతును జూచి యడిగితె నిజంబు దెలస్తాదె, నామాట నా
గెద్దబుట్టతోడె నాబుడకఁడుతోడె నిజమేగాని కల్ల గాదు తల్లీ
యని దిగ్గున లేచి పోయి పరమపురుషుండైన నారాయణుండు
వేంకటాద్రియందు నిజరూపంబున నుండె నంత ధరణీదేవి
పరమాశ్చర్యంబునఁ బద్మావతికడకుం జని యిట్లనియె.

38


ఉ.

అమ్మ యిదేమి పద్మ యిపు డారటఁ బొర్లుచుఁ బవ్వళించి యీ
సొమ్మసిలంగ నేల యిఁకఁ జొప్పడ లే యిఁక నిన్ను జూచి నే
నెమ్మది నెట్టు లుండెదను నీమదిలోఁ గల మర్మ మిప్డు ని
క్కముగఁ జెప్పు నీకలికికన్నులనీ రిటు నించ నేటికే.

39


క.

నే వల దన్నను నిలువక
యావనముస కరిగి నిన్న నాటాడఁగ ని
న్భావించుచుఁ గని రెవ్వరు
నీ వెవరిం గంటి వచట నీరజనేత్రా.

40


తే.

నీవు బిడ్డవు నాకు నే నీకుఁ దల్లి
యజమఱను లేక చెప్పు నీయాత్మచింత
వింత దాఁపక యిఁకఁ జెప్పు వెఱువ నేల
యనిన నక్కన్య మాటాడ కడలసాఁగె.

41

క.

ఆకన్యక యీవిధమున
శోకింపఁగఁ జూచి కొంత చోద్యపడుచు నీ
కీకరణిగ నతిదుఃఖము
రాకకు గత మేమి దెల్పు రహి మాయమ్మా.

42


తే.

అమ్మ నిజముగ లోకాన నాప్తు లింక
నా కెవరు లేరు నాకన్న నీకు లేరు
నన్ను నఱమఱఁగాఁ జూడ కున్నమాట
దాఁపకయ చెప్పు మిపుడు నాతండ్రితోడె.

43


చ.

అని యిటు లానఁ బెట్టి సుత నప్పుడు మెల్లఁగ లేవనెత్త తా
ననుపమప్రేమతోడను నిజాంకతలంబున నుంచి శీర్షమున్
దనచెయిదమ్మిచే నివిరి తద్దయు లాలనఁ జేసి యడ్గగాఁ
దనతల వంచి పల్కనిసుతం గని యిట్లనె ధాత్రిదేవి తాన్.

44


ఆ.

పట్టి నీదు సాపఫలమును గా దిది
యరయ నేను జేసినట్టిపాప
ఫలము గాని నిన్ను బాధింప నేటికి
నంచు నీరు వెట్టె నక్షులందు.

45


సీ.

ఆరీతిఁ దనకొఱ కార్తిబొందిన తల్లి
        నాపడుంతుక చూచి తాప మొంది
కనుల బాష్పము లొల్కఁగా నిట్టు లనియె నో
        యమ్మ పుష్పవనంబునందు నేను
సఖులతో నాటాడుసమయాన నచటికి
        దివ్యపురుషుఁ డొక్కతేజిమీఁదఁ
దగ నెక్కి వచ్చిన న్నొగిఁజూచి యెక్కస
        క్కెము లాడె నేనట్టి గేలి కపుడు

తే.

ఱాల రువ్వించి తతనిపై నేల యతని
గుఱ్ఱ మొగ్గెను మఱి యతం డుఱ్ఱఁబాఱి
నెచటికో పోయె నాతని నిప్డు గన్న
యట్టు లున్నది తల్లి నాయాస పడకు.

46


క.

అని పద్మావతి వల్కఁగ
విని ధరణీదేవి సుతను వీక్షించి మనం
బున మోదము ఖేదము నెనఁ
గొనఁగా లజ్జించి ప్రేమ కూతురి కనియెన్.

47


సీ.

నాతల్లి యీచిన్ననాఁట నీ కిటువంటి
        బుద్ధి యేల జనించెఁ బుత్రి చూడ
వనమున కేగి యావనపూరుషుని జూచి
        వలచె నందుఱు నిన్ను వనజవదన
పుట్టిపుట్టక తొల్లి పురుషస్వరూపంబు
        నీ కెట్ల దెలిసెనే నీలవేణి
వానికులం బేమొ వానిపై
        మఱు లేల కల్గెనె మధురవాణి


తే.

కటకటా! మానధనుఁడు ని న్గన్నతండ్రి
నీమనోవ్యథ నిజముగ నేడు వింటి
చింతచేఁ దలయెత్తలే కింత మదిని
గుందుదును దీని కే త్రోవ గుట్టుగాదె.

48


క.

వనమున సుందరపురుషుని
గనుఁగొని మదిలో వరించెగాఁ గూఁతు రటం
చును రాజు ననరె లోకులు
వినవలయుఁ గదా మఱింక విధి కేమందున్.

49

క.

లోకం బంతయు మూయను
మూఁకుఁడు లే దతని నేల మోహించితివే
కూఁతుర మాకును నీకును
బ్రాకటఋణ మింతె కీర్తి రాఁగలదె మహిన్.

50


సీ.

అని యిట్టు వలుకఁగ నపుడు పద్మావతి
        హరి పూర్వవృత్తాంత మాత్మయందుఁ
దలఁచి యిట్లనియె నోతల్లి నీ కపకీర్తి
        వచ్చును ననుచింత వల దతండు
మనుజమాత్రుం డటంచు మదినెంచినావేమొ
        మనుజుండు గాఁడు రమావిభుండు
పురుషోత్తముండు సంపూర్ణప్రకాశుండు
        సర్వజ్ఞుఁ డాఢ్యుండు శాశ్వతుండు


తే.

గాన నాస్వామియందు నామానసంబు
కుదిరి నిలిచిన దది నాకుఁ గొదువ గాదు
నాకొఱకు భూమి నపకీర్తి మీకు లేదు
కావలసినట్టిపను లింకఁ గాక వోదు.

51


వ.

వినుము జననీమతల్లి చింతమాను మే మహామహుని దివ్య
చక్రంబు కౌరవబలంబులం ద్రుంచి కరినగరంబున ధర్మరా
జును పట్టభద్రుంజేసి తత్పురసంరక్షణంబు సేయుచుండు,
నేమహాత్ముని శంఖారావంబు దైత్యబృందంబునకు భయ .
ప్రదంబై దేవతల కానందంబు నిచ్చుచుండు నట్టి శంఖ
చక్రధరుం డైన పరమపుర్షుండు లీలామానుషవిగ్రహుండు
నై నిన్న నవ్వనంబున నాకుంగాక చెలులకుంగూడ దర్శనం
బిచ్చినవాఁడు నే నీమర్త్యలోకంబున నుండఁదగినరీతి కాతని

యందు ఱాల రువ్వించితి నయ్యపచారం బేను జేసినందుల కమ్మ
హావిష్ణుండు నన్ను రక్షించునో రక్షింపఁడో యనుసందియం
బును భయంబును బెనఁగొని కన్నీరునించుటయకాని కౌమ
వికారవ్యాపారంబు నాకింత కేల శ్రీనివాసుని దివ్యమంగళ
రూపంబు నాకు నగుపడకుండినచో నుసురులఁ దొఱంగెదఁ
బ్రత్యక్షం బైనఁ బ్రాణంబు లుంచుకొనెదనని పూలపాన్పు
నందు వ్రాలుటంచేసి చూచి ధరణీదేవి యచ్చెరువంది
యిట్లనియె.

52


సీ.

అమ్మ పద్మానతీ హరిభక్తి నీచిత్త
        మం దింతగా నిల్పినందువలన
నీకోర్కె సిద్ధించు శోకింప వల దింక
        నాచక్రి నినుఁ బెండ్లియాడు ననుచు
దేటగ నొకధర్మదేవత వచ్చి నా
        కెఱుఁగఁజెప్పినమాట లేలదప్పు
దప్ప దిప్పుడు నీవు ధైర్యంబుతో నుండు
        మని చెప్పుచుండఁగా నంత నటకుఁ


తే.

గ్రమముగా విప్రముఖ్యు లగస్త్యు లింగ
మునకు రుద్రాభిషేకంబు దనరఁజేసి
పరఁగఁ దత్తీర్థమును బూలు పత్త్రి పండ్లు
కోరి గైకొని రాఁజూచి వారితోడ.

53


తే.

చెలులతోఁ గూడి గుడినుండి చెలిమి దనర
వకుళమాలిక పల్కుచు వచ్చె నపుడు
ద్విజులు రుద్రాభిషేకసత్తీర్థ మమరఁ
జల్లి పద్మావతిశిరంబు నుల్లసముగ.

54

తే.

పూలు మంత్రాక్షతలు పండ్లు పొలఁతి కిచ్చి
దీవన లొసంగి వోయిరి వేగ పెండ్లి
యగునటంచును వకుళను నపుడు వేఱ
వనితగానుంట గనుఁగొని మనమునందు.

55


క.

ధరణీదేవి రయంబునఁ
బెరిమను దోడ్తెచ్చి రత్నపీఠమునందుం
గరమర్థి నునిచి వకుళను
గురుతరవినయంబు నడిగెఁ గూర్మి యెసంగన్.

56


సీ.

అమ్మ నీ వెవ్వరికై వచ్చితివి యిట్టు
        లెందుండి వచ్చి విటకు నెలమి
వచియింపు మనఁగ నవ్వకుళమాలిక యిట్టు
        లనియె నోయమ్మ శేషాద్రి నుండి
వచ్చిత ననఁగ నెవ్వరిదాన వని ధర
        ణీదేవి యడుగఁగా నిక్క మేను
ధర వేంకటేశుని దాననై యుందు నా
        స్వామి పంపించఁగ వచ్చి తిచటఁ


తే.

జేరినానని వకుళ మచ్చికను బల్క
విని మహీపతిసతి యేమి పనికి నీవు
వచ్చినావని యడుగఁగ వకుళ యేను
బెండ్లిపెత్తనముగననెఁ బేర్మిఁ దనర.

57


క.

అని పల్కిన వకుళనుఁ గనుఁ
గొని ధరణీదేవి యెవరికొఱ కిప్పుడు పె
త్తన మిచటఁ జేయవచ్చితి
వని యడుగఁగ వకుళ యిట్టు లనియె ముదమునన్.

58

సీ.

విను ధరణీదేవి వేంకటేశ్వరునకు
        నల నీదుపుత్రిని నడుగ నిట్లు
వచ్చితి మీ రన్యవరుని జూడఁగ మాని
        మాట చెప్పుఁడు నాకు మనసు నెంచి
యన ధరణీదేవి యనె నిట్లు కులగోత్ర
        ములు చెప్పు దల్లిదండ్రులను నుడువు
మని ధరణీదేవి యడుగఁగ వకుళ యి
        ట్లనియెఁ గులంబు శీతాంశుకులము


తే.

వరవసిష్ఠులగోత్రంబు వార కతని
దేవకీదేవి మఱి వసుదేవుఁ డెంచఁ
దల్లిదండ్రు లటంచును దనరఁ జెప్ప
నాపె నాతనిరూపగుణాదు లెల్ల.

59


వ.

వినుపింప మనిన నవ్వకుళమాలిక యిట్లనియె.

60


సీ.

సతి నీవు మాస్వామి సౌందర్య మడిగిన
        మహిత యామన్మథమన్మథుండె
పట్టుగ నతని సౌభాగ్యంబు నడిగినఁ
        జెప్ప శక్యంబె లక్ష్మీవిభుండె
సురుచిరం బైనట్టి సుగుణంబు లడిగిన
        గురుతరకల్యాణగుణగణుండె
చెలఁగి సదాచారశీలంబు లడిగిన
        వేదోక్తసద్ధర్మవిధివశుండె


తే.

సాహసౌదార్యగాంభీర్యసంపదలకు
శాంతసౌహృద్యకరుణారసంబులకును

విష్ణు వని యెంచు రాజదేవీ భవత్హృ
దయమునందున నింక నింతకును మించి.

61


వ.

చెప్ప నాకుఁ దరంబుగాదు గావున నీకన్యకారత్నం బాత
నికిం దగినద పెక్కుయోచనలు సేయకు సత్యంబు వక్కా
ణించితిని.

62


మ.

అని యాభామిని వల్క రాజసతి నెయ్యం బారఁగా శ్రీరమా
వనితారత్నము చెంతనుండఁగను భావం బొప్ప మాకన్యకం
దమ చేఁబట్టు నటంచుఁ బల్కితివి చిత్తంబంచు నెంచంగ నా
కనుమానంబుగ నున్నదంతయు నరుల్ హాస్యంబు గావింపరే.

63


సీ.

అని ధరణీదేవి యనుమానముగఁ బల్క
        వకుళ యిట్లనియె నవ్వార్ధితనయ
కొల్లాపురము సేరి యెల్లభక్తులను ర
        క్షించుచు నున్నది చెలఁగి నచట
కమలలే దాతని కడఁ గాన నీపుత్రి
        నీక్షించి చక్రి మోహించినాఁడు
మీరు మీకన్యను నారాయణున కిచ్చి
        చెలఁగి వివాహంబు సేయుఁ డంచుఁ


తే.

జెప్పి యాసిరి యాపురిం జేరినట్టి
కారణం బంతయును జెప్పి కరము ప్రియము
వేదవతి జన్మవృత్తాంత మాదినుండి
పొసఁగ వినుపించి క్రమ్మఱఁ బొలఁతిఁ జూచి.

64


తే.

వల్క నిమ్మెయి వకుళ మీపట్టియైన
పద్మపద్మాలయాంశసంభవయగాని

వేఱ జన్మము గాదు భావింప మీకుఁ
బుత్రియై పుట్టె మీపూర్వపుణ్యమునను.

65


తే.

పెండ్లి యేర్పాట్లు గావింప వేడ్క నన్నుఁ
బంపు మేగెద నాచక్రపాణి మీకు
నల్లుఁ డగుటకు మీభాగ్య మంచు ధరణి
దేవి కలరంగఁ జెప్పి యో దేవి యింక.

66


వ.

నావచ్చినకారణం బంతయు రాజేంద్రునకు సంతసంబాఱ
వచించి నన్నుఁ బ్రయాణంబు గావింపు మనిన.

67


మ.

ధరణీదేవి ముదంబుతో నలిగి చింతం బొందుచున్నట్టి భూ
వరునిం జూచి ప్రియోక్తులార శుభసద్వార్తల్ క్రమం బొప్పఁగా
ధరఁ బుత్రీజననంబు దాని నిజవృత్తాంతంబు నాశేషభూ
ధరవాసుండు వరించినట్టి విధమున్ దార్ఢ్యంబుగాఁ జెప్పఁగన్.

68


సీ.

విని వింత నొంది వచ్చినవకుళాంగన
        జూచి మన్నింప నాసుదతి చూచి
రాజుతో ననియె నో రాజ మీయింటికి
        వచ్చి శ్రీశుభకర వార్తలన్ని
దేవేరి కెఱిఁగించితిని నిజం బిక్కార్య
        మిఁకఁ బెండ్లిలగ్నంబు నెలమిజూడుఁ
డని వల్క నానృపుం డానందమగ్నుఁడై
        హరి యేడ నే నేడ యహ యి దేమి


తే.

వింత యనుచును వకుళతోఁ జింత తలఁగె
నామనంబునఁ బట్టుకున్నట్టితాప

మింక సుకృతుండ నైతి భూమీశులందుఁ
గీర్తి వడసితి నాభాగ్యకృతము గాదె.

69


వ.

అని కొంత హరిలీలాచరిత్రంబునకు నచ్చెరువంది వకుళతో
వెండియు నిట్లనియె. నీవు మాకుఁ బరమాప్తురాలై తివి, నీవ
శంబున నాచక్రి మాకు జామాత యగుటం జేసి మేము సుకృ
తాత్ము లైతిమి. నాపుత్రి నాహరి వరించినకథ విన నాహ్లాదం
బగుచున్న యది. అని వకుళమాలికను బ్రియంబునం జూచి
గౌరవించి పద్మావతిచెంత కేగి ముద్దిడి లాలించి యిట్లనియె.

70


క.

విను పద్మావతి నీమన
మున నిఁకఁ జింతింపవలదు ముజ్జగములు పా
లనసేయు సామి కిప్పుడ
నిను నొసఁగుదు వేడ్క వెలయ నిజము కుమారీ.

71


వ.

అని పద్మావతికి నెమ్మది చెప్పి నిజగురుని ధ్యానింప నతండు
వచ్చుటం జూచి యాతని కెదురేగి యుచితార్చనలు గావించి
తోడ్తెచ్చి బంగరుపీఁట నునిచి వకుళమాలిక వేంకటాద్రి నుండి
వచ్చిన యుదంతం బెల్ల నుడువ నగ్గురువర్యుం డానంద మొంది
రాజుం గని యిట్లనియె.

72


సీ.

అరయ నీపురికి నుత్తరభాగమునఁ బంచ
        క్రోశదూరంబున గొప్పగాను
బ్రహ్మానుసంధానపరుఁ డైనశుకయోగి
        యున్నవాఁ డతని మీ రుచితులై స
వారిని బంపి యవ్వరమునిన్ రావించు
        విని రాజు వేడ్కఁ దమ్మునిని బంపి

శుకుని రప్పించి తాఁ జూచి యాతని కుచి
        తార్చనములు చేసి యమలరత్న


తే.

పీఠమునఁ జేర్చ నావలఁ బేర్మిగురుని
చూచి సంతోషచిత్తుఁడై శుకుఁడు పల్కె
నేమి యీదిన మిచ్చట నెలమి మనము
చేరుటలటంచు నృపునకుఁ జెలఁగు శుభము.

73


క.

సురగురువర న న్నిచటికి
గరుణను బిలిపించినట్టి కార్యము నాతోఁ
ద్వరగాఁ జెప్పుఁ డనంగను
గురుఁడు ముదంబొదవ నాశుకున కిట్లనియెన్.

74


సీ.

విను శుకయోగీంద్ర ఘనుఁ డైన వేంకటే
        శ్వరుఁడు పద్మావతి వలచి తాను
బెండ్లియాడెద నను బ్రేమ రెట్టింపంగ
        వకుళమాలిక యను వనిత నెసఁగ
ఘనతగఁ బెండ్లి పెత్తనము సేయుటకు నేఁ
        డంపించినాఁడు న న్నెందుకొఱకు
నృపతి రప్పింపఁగ నేను నచ్చితి నీవు
        వచ్చితి విపుడు భూవరున కేమి


తే.

చెప్పవలె నన్న గురుని వీక్షించి శుకుఁడు
పల్కె నీరాజుపుణ్యప్రభావమునన
పద్మ గల్గిన దట్టి సౌభాగ్యవతికి
దగఁడు మనుజుండు శ్రీరమాధవుఁడ గాక.

75


తే.

అని నృపాలక నీవు మహాతపంబు
చేసి యుండుటఁ జేసి లక్ష్మీసమాన

యగు సుతం గాంచితివి వివాహంబు సేయు
శ్రీహరికి నిచ్చి పొందు సుశ్రేయసంబు.

76


చ.

అని శుకయోగి వల్కఁగ ధరాధిపుఁ డెంతయు సంతసించి యి
ట్లనియె గురూత్తమా! యిఁక శుభాస్పదలగ్న మొకండు నీవు పొం
తనములఁ జూచి పెట్టుఁ డనఁ దప్పక నాశుకుఁడున్ గురుండు శ్రీ
తనరఁగఁ జూచి చూచి విధి ధర్మపథంబుల నోలి నత్తఱిన్.

77


వ.

నాడీరజ్జుగణయోనివర్ణదినమాహేంద్రదీర్ఘగ్రహమైత్ర
కూటాదులు వధూవరులకు నమరియుండుటకు మెచ్చి పుష్క
రాంశప్రకారంబునఁ దిథివారనక్షత్రయోగకరణాదులం
బాతాభావాదిదోషవిరహితంబుగం జూచి మధుమాసంబున
కెట్టి దోషంబులు లేవని వచించి పూర్వపక్షక్షపాకరసంచార
కాలంబున నిర్దోషంబుగ నొకముహూర్తంబు నిశ్చయించి
రాజు కెఱింగించి సంతసింపఁజేసిరి. అంత నాయాకాశ
రాజేంద్రుం డాబృహస్పతిం జూచి యిట్లనియె.

78


సీ.

హరికి నమస్కారమనుచు వ్రాయించెద
        నన విని ధిషణుఁ డిట్లనియె రాజ
ఆస్వామి మానవుం డై నీసుతను బెండ్లి
        యాడఁ దలంచినాఁ డందువలన
మొనసి నమస్కార మని వ్రాయఁగూడ దా
        శీర్వచనంబను శ్రేయమంచు
నమరఁ బత్రిక వ్రాసి యంపించు మని శుక
        బ్రహ్మయుఁ బల్క భూపాలకుండు

తే.

సకలబంధుజనంబులు సకలమిత్ర
జనము లెల్లరు హర్షింప మనసునందుఁ
బొంగుచును భార్యయును వేడ్కఁ బొందఁగాను
బ్రాకటంబుగ బంగరుఱేకుమీఁద.

79


వ.

వకుళమాలిక సంతసింప నివ్విధంబున వ్రాయించె.

80


సీ.

శ్రీమదఖండలక్ష్మీప్రసన్నేక్షణా
        లంకృతులై సదుల్లాసు లైన
యఖిలాండకోటిబ్రహ్మాండనాయకు లైన
        సర్వజ్ఞులైన శ్రీ స్వామివారి
కాకాశనృపుఁ డాయురారోగ్యపుత్రపౌ
        త్రాభివృద్ధులు గల్గునట్లుగాను
దీవించితిని మఱిదినమునఁ గుశలంబు
        మారు మీకుశలంబు మఱువకుండ


తే.

వ్రాయుచుండఁగవలయు నావ్యాససుతుఁడు
గురుఁడు చెప్పఁగ మీకు నాకూఁతురైన
పద్మ నిచ్చి వివాహంబు బాగుగాను
జేయనెంచితి కరుణించు శ్రీనివాస.

81


వ.

అని వ్రాయించి హరిద్రాలేపనచిహ్నంబు సేయించి గురువుచే
నొసంగె. నతం డది చూచి శుకయోగీంద్రుని కరంబున నిడె,
నతండు గని యానందించుచుండ శ్రీనివాసున కీశుభపత్రిక
గొంపోయి యిచ్చి ప్రత్యుత్తరంబు దెచ్చుటకు యోగ్యులగు
వారు తామయనిగురుండు శుకునిం గని వల్క నది విని శుకుం
డట్ల కానిమ్మని యాలేఖఁ గొని వేంకటాచలారోహణంబు సేసి
వచ్చుచుండు శుకునిం గని శ్రీనివాసుం డెదురుసని ప్రియో

క్తులం దోడ్కొనివచ్చి తింత్రిణీవృక్షమూలంబునఁ దానిర్మించి
యున్న పుష్పపీఠంబునందుఁ గూర్చుండఁబెట్టి యిట్లనియె.

82


క.

ఓ యోగీశ్వర సత్కృప
నీయెడ కిమ్మాడ్కివచ్చు టిది మేలయ్యెన్
మాయావిరహిత! నాపని
కాయో పండో నిజంబుగాఁ దెల్పుమయా.

83


క.

అనఁగను మందస్మితుఁడై
విని శుకయోగీంద్రుఁ డనియె విశ్వాత్మక నీ
ఘనచిత్తంబునఁ దలఁచిన
పని కాయని చెప్ప నేల పండై యుండన్.

84


చ.

అని శుకయోగి వల్క నపు డబ్జదళాక్షుఁడు సంతసించి య
మ్మునికి సమస్కరించి తనముచ్చటలెల్ల నొకింత చెప్పఁగా
విని ముదమంది తాపసుఁడు వేడ్కను దాఁ గొనివచ్చినట్టి శ్రీ
తనరెడు భవ్యరేఖను మదాసురవైరికరంబుఁ బెట్టఁగన్.

85


క.

అప్పుడు హరి యాపత్త్రిక
తప్పక తాఁ జదివి తెలిసి తడయక యపుడే
యొప్పుగ గేదఁగిఱేకున
గొప్పగ నిటు వ్రాసెఁ జేతిగోటం గ్రమమున్.

86


సీ.

అంత శ్రీశుకునకు నానంద మొదవంగ
        సరసిజనాభుండు చదివె నిట్లు
శ్రీపూర్ణరాజపూజితులైన ధర్మత
        త్పరసుధర్మ సుధర్మవరసుతులగు
సామ్రాజ్యకలితరాజశ్రీగగనరాజు
        వారికి శేషాద్రివల్లభుండు

వందనంబులు నేఁటివఱకు మాకు శుభంబు
        వఱలు మీకుశలంబు వ్రాయఁదలఁతుఁ


తే.

దనర వైశాఖమాసాదిదశమిశుక్ర
వారమునరాత్రి శుభలగ్న మారయంగ
నుంట దెల్పుటచేత మే ముల్లసముగ
వత్తు మానాఁడు పదివేలు వందనములు.

87


సీ.

అని తాను వ్రాసియున్నట్టియుత్తరమును
        శుకునకు వినిపించి చుట్టి దాని
తోఁ బుష్పహారంబు దొడరియొసంగి య
        మ్మునితోడఁ బర్వతంబును ముదంబు
నం దిగి పంపి తా నగమున కేగెను
        నారాయణవనాఖ్యనగరమునకు
జేరి మౌనీశుఁ డాభూరమణున కిచ్చె
        నతఁడంది భార్యకు నలరఁ జూపి


తే.

బంధుమిత్రారాదులకుఁ జూపి పరమముదము
నొందె నావల శుకముని యుర్విపతికి
హరివచించిన విస్మయం బైనపల్కు
లన్ని యెఱిఁగించె దేవేజ్యుఁ డనుముదంబు.

88


వ.

పొందెనంత నాకాశరాజేంద్రుఁ డాశుకమహర్షికిం ద్రిదశా
చార్యుకుం బ్రణమిల్లి సన్మానించుటం జేసి వారు తమస్థానంబుల
కేగిరి. నృపుండు పురం బలంకరింపజేయుఁడని చారులకు
నానతిచ్చె, నాధరణీదేవి వకుళమాలికకు దివ్యాంబరాభర
ణాదులచే సన్మానించి వీడ్కొలుప శేషాద్రికి వచ్చి శ్రీనివాసుని
వీక్షించి యిట్లనియె.

89

సీ.

నాతండ్రి వేంకట నారాయణపురంబు
        నకుఁ బోయివచ్చితి సకలశుభము
లొదవె వివాహమహోత్సవంబునకు నే
        నేమిపనుల్ సేయు దిచట నింక
విని హరి వల్కె నో జనని యీపెండ్లి పె
        త్తనము చేసితి వింక ద్రవ్య మేడ
దెచ్చెద వేనేడ దెత్తు దీని కుపాయ
        మేమి నా కెఱిఁగింపు మిప్పు డనిన


తే.

వకుళమాలిక పల్కె నవ్వనధితనయ
నిచ్చటికి బిల్వనంపిన నెచ్చుగాను
ధనము నీ కిచ్చు ననఁగ నవ్వనజనేత్రుఁ
డపుడు వకుళను గాంచి యిట్లనియెఁ బ్రీతి.

90


సీ.

వనజాలయను బాసి వచ్చి యిచ్చట పెండ్లి
        యాడెద ననిన నా కాప్తమగును
ధన మిచ్చునే సిరి యని పల్కి తల వాంచి
        చింతింప వకుళ యాశ్రీనివాసు
నీక్షించి వారితో నెంతయు నిజముగఁ
        జెప్పి వచ్చితిని నీ విప్పు డిట్ల
చింతనొందిన నేమి సేయుదు నీమాట
        లావరాహస్వామి కైనఁ జెప్పి


తే.

తప్ప కేమైన నొకప్రయత్నంబు చేసి
మానరక్షణ గావింప మంచిదరయ
వారు రమ్మన నపుడు ద్రవ్యంబు లేక
పెండ్లి కీరీతిఁ బోవఁ బ్రాపించు గేలి.

91

క.

అని యవ్వకుళ మహాభయ
మునఁ బలుకఁగ నవ్వి చక్రి ముచ్చటగా ని
ట్లనియె వరాహస్వామిని
ధన మిమ్మని యడిగిరమ్ము తల్లీ యనఁగన్.

92


వ.

అని హరి వినోదంబుగఁ జెప్పుటం జేసి వకుళాంగన వరాహ
స్వామికడ కేగి నమస్కరించి యిట్లనియె.

93


సీ.

శ్రీవరాహస్వామి శ్రీనివాసుఁడు పెండ్లి
        యాడఁదలంచినాఁ డర్థ మిచట
లేదు వివాహ మేలీల నౌ నందుల
        కేయుపాయము సేయ నెసఁగు ధనము
పడుచు నిచ్చెడువారు భాగ్యవంతులు వారి
        తో సరిగాఁ దులదూగవలయు
నదిమాట వేంకటుఁ డామహీపతిగన్న
        కన్యకు మెడబొట్టుఁ గట్టఁదలఁచి


తే.

నాఁ డతం డిట్ల చేసిన నరులు నవ్వి
పోదు రటుగాని నీవైన భూరిధనము
పొసఁగ నొడఁగూర్చు మనఁగ నాభూవరాహ
దేవుఁ డాసతి నీక్షించి ధీరుఁ డగుచు.

94


సీ.

పలికె నోవకుళ నిర్భయముగ నుండుము
        ధనము లభించు వెన్నునకు నిచట
నూరకుండుము శ్రీశుఁ డూరక నీతోడ
        మాటాడియుండు నెమ్మదిగ నుండు
నీవు చెప్పకమున్న నే నాహరిచరిత్ర
        ముల నెఱింగినవాఁడ నెలమి నీవు

హరికడ కేతెంచు మచట బ్రహ్మాదులు
        వచ్చి చేయుదురు వివాహపనులు


తే.

పొమ్మనంగను విని వింతఁ బొంది వకుళ
వచ్చి వరహావతారుఁడు పల్కినట్టి
పల్కు లెల్లను వచియించెఁ బద్మనాభు
నకు విచారంబు లేకుండ నయము మెఱసి.

95


వ.

అంత నాశ్రీకాంతుండు స్వాంతంబున నెంతయు సంతసించి
యంతరంగంబున గరుడుల స్మరింప నప్పు డుప్పొంగి యప్పన్న
గేంద్రుండును గరుడుండు నావేంకటాద్రికి వచ్చి చక్రికి
దండప్రణామంబు లాచరించినం జూచి రెండు శుభపత్త్రికలు
లిఖించి వారలచే నొసఁగి యిట్లనియె.

96


ఆ.

గరుడ నీవు వోయి కంజసంభవున కీ
లిఖిత మిమ్ము మఱియు నిఖిలబంధు
సహితముగను వచ్చి సంతసముగ నాకు
క్షిప్రముగను బెండ్లి సేయు మనుము.

97


క.

పొమ్మని యావిహగేంద్రుని
సమ్మదమునఁ బంపి శేష! శర్వుని బిలువం
బొమ్ము కుటుంబయుతంబుగ
రమ్మను నా పెండ్లి కెలమి రయమున శివునిన్.

98


మ.

అని నారాయణుఁ డంపఁగా నపుడు శేషాఖ్యుండు శ్రీకంఠుఁ బి
ల్వను బోయె న్విహగేంద్రుఁ డంత వడి నవ్వాణీశ్వరుం జేరికొ
మ్మని యాపత్త్రిక చేతి కిచ్చె నపు డయ్యంభోజగర్భుండు గ
న్గొని యచ్చో మును లెల్లరు న్వినఁగఁ దాఁ గూర్మిం బఠించెం దగన్.

99

సీ.

శ్రీరస్తు బ్రహ్మ కాశీర్వాద మహిగిరి
        మీఁద మాకు శుభంబు మీకు శుభము
వ్రాయించి పంపించవలయును దర్వాత
        సురుచిరవైశాఖశుక్లదశమి
శుక్రవారమునాఁడు శుభముహూర్తంబున
        గగనాధిపతి సుతం గ్రమముగాను
గలియుగంబునం గరగ్రహణంబు చేసెద
        మేటికుటుంబసమేతముగను


తే.

రాఁ దగిన మిత్రులనుగూడి రయముగాను
వచ్చి మెఱమెచ్చ నాకు వైవాహికంబు
సేయుమని యుండ మునులు విస్మితము నొంది
రంత నాపత్త్రికను గను లద్దికొంచు.

100


వ.

అక్కమలాసనుండు శ్రీనివాసుని వైవాహంబునకు దిక్పాల
ప్రముఖులకు నుత్తరంబు వ్రాయించి రమ్మని వచించి మునులం
దోడ్కొని సకలదివ్యాభరణాలంకృతుండై సావిత్రి గాయత్రి
సరస్వతులంగూడి మదమరాళంబు నెక్కి వివిధమంగళవాద్యం
బులు చెలంగ ఖగేంద్రునితోడ వేకటాద్రికి వచ్చె నది
దెలిసి చక్రి లేచి బ్రహ్మ కెదురేగిన, యజుండు హంసవాహ
నంబును డిగి హరికి నమస్కరించినం జూచి విష్ణుం డజుని
మీఁది పుత్రవాత్సల్యం బగ్గలింప ముహూర్తద్వయంబు
గద్గదకంఠుండై మాటాడకుండి యుత నజుని నాలింగనంబు
చేసుకొని వచ్చి తింత్రిణీవృక్షమూలంబునఁ గూర్చుండం
జేసి వచ్చిన సన్మునిపుంగవులకుఁ దాఁ బ్రణమిల్లి వారికిం దగిన
యాసనంబుల నుండఁజేసి భృగుమునీంద్రుఁడు తన్నినకతన

లక్ష్మి కొల్లాపురిచేరిన చరిత్రంబును దాఁబడిన చిక్కుపాట్లను
నుడివి వరాహదేవుండు దనకు నుండుటకు నెడనొసంగి
నదియుం జెప్పుచుండు సమయంబున.

101


సీ.

శేషుండు కైలాసశిఖరికిం జని చంద్ర
        శేఖరునకు శుభరేఖ నిచ్చె
నది చూచి శంభుఁ డయ్యద్రికుమారిత
        ప్రమథగణంబులు బాగుగాను
వినఁగఁ బఠింపఁగ వేడ్కజెందిరి వారు
        శివుఁ డంతఁ బార్వతిం జెంతఁ బిల్చి
తమకుండు దివ్యవస్త్రాదిభూషణములు
        దాల్చు మటంచును దాను బ్రమథ


తే.

గణములను గూడి వృషతురంగంబు నెక్కి
వివిధవాద్యరవంబులు వేడ్కఁ జెలగ
విఘ్నపతి ముందు నడువ నుర్వీతలానఁ
దనరుచుండెడు శేషాద్రి దాఁపుఁ జేరి.

102


వ.

వచ్చుచుండుటం జూచి శ్రీహరి లేచి యచటి యజునితోడం
గూడి యెదురేగినం జూచి శివుండు నందిని డిగ్గి నమస్కరించె
నాహరి రుద్రు నాలింగనం బొనరిచి తోడ్కొనివచ్చి మణి
మయాసనాసీనుం జేసి తనవృత్తాంతం బంతయు నెఱింగించె
నంతఁ దమతమకళత్రపుత్రమిత్రబంధుజనసమేతులై
యింద్రాదులు సని హరిహరబ్రహ్మలకు నమస్కరింప వార
లాశీర్వదించి నంత శ్రీహరి శేషగరుడులం బిలిచి యింద్రాదు
లను నుచితాసనాసీనులం జేయుఁడని నియమింప వా రట్లు

గావించిరి, హరి వచ్చి కుశలప్రశ్నంబు లడిగి యనంతర మంద
ఱం జూచి హరి యిట్లనియె.

103


సీ.

ఇంద్రాదులార నే నీకలియుగమందు
        నాకాశపతిపుత్రి నాత్మ వలచి
యఱమఱలే కుద్వహంబాడువాఁడ మీ
        కిది యిష్ట మేగద యెలమి ననుచు
నడుగఁగ వారంద ఱబ్జాక్షు నీక్షించి
        పరమసంతోషసంభరితు లగుచు
శ్రీకాంత మిక్కార్య మీకలియుగమున
        నడుపుట యిష్టంబ గడుముదంబ


తే.

యనఁగ హరి యప్పు డింద్రుని కనియె నీవు
మయుని రావించి యిపుడు రమ్యంబు గాను
భూరిభవనము నిర్మింప పోయి గగన
రాజు గల పురియందు నిర్ణయముగాను.

104


వ.

అనిన నయ్యింద్రుండు మయునిం దోడ్కొనివోయి మణి
మయాలంకృతకుడ్యకవాటకూటంబులును శృంగాటకమందిరం
బులు, నింద్రనీలజాలకశయ్యాగృహంబులును, చంద్రకాంతో
పలసౌధంబులును, వివిధవిచిత్రరచితసభామంటపంబులును,
రమణీయకమలకల్హారషండసంకలితశీతలవారిపూరితకాసార
తీరరసాలసాలవకుళమాలూరాద్యనేకమహిజసందోహపరి
వృతవిరాజితం బై యొప్పు నవ్యపురంబును హర్మ్యంబును
నిర్మింపఁజేసి యిద్దఱు వేంకటాద్రికి విచ్చేసిరి. అనంతర
మాహరి, పిలుఁవదగినవారలం బిలుచుటకు షణ్ముఖు
నకును, బ్రత్యుత్థానాదికృత్యంబు లాచరించుటకు మన్మథు

నకు, పరిపక్వరుచిరాన్నాదులు చేయుటకుఁ బావకునకు, జలం
బులఁ దెచ్చి యిచ్చుటకు వరుణునకు, జందనపుష్పాదులొసంగు
టకు గంధవాహనునకు, ధనదానంబు సేయుటకుఁ గుబేరునకు,
దీపప్రకాశంబు సేయుటకుఁ జంద్రునకు, వలసినపాత్రలు
దెచ్చి యిచ్చుటకును దండించుటకును దండధరునకు, నియ
మించె. నంత వసిష్ఠుండు వరాహస్వామి సాన్నిధ్యంబున
యజుశ్శాఖోక్తప్రకారంబున గృహయజ్ఞప్రయత్నంబు
సేయించె. నంతం బద్మభవుఁడు వివాహపీఠి నిర్మించి యందు
బార్వతీప్రముఖసువాసినులచేత సంపెంగతైలాదిమంగళ
ద్రవ్యంబులును బంగరుపళ్ళెరంబునఁ దెప్పించి యందుంచి
హరిం జూచి యభ్యంగనస్నానాదు లొనర్చికొని పుణ్యాహ
వాచనంబును గులదేవతాప్రార్థనంబును జేయవలయు నతి
శీఘ్రంబుగ రమ్మని చెప్పిన, హరి చింతాక్రాంతుండై బ్రహ్మ
కిట్లనియె.

105


క.

విను పద్మజ కొల్లాపుర
మున శ్రీసతి యున్న దిపుడు ముచ్చటగా న
వ్వనజాలయ లేనిది నా
మనసొప్పదు స్నానమునకు మఱి చింత యగున్.

106


తే.

కారణం బిట్టు లుండఁగఁ గార్య మటులఁ
బట్ట నేటికి సిరి యల్గి పోయె నిపుడు
ప్రీతితో నట్టిసతి లేక పెండ్లియాడఁ
దగదు తగదంచు లక్ష్మిని తలఁచి తలఁచి.

107


సీ.

హరి చింతపడఁగ నయ్యబ్జగర్భాదులు
        బదులు సెప్పఁగలేక కొదుకుచుండ

నిది యేమి చోద్య మీయిందిరేశుని కని
        శివుఁ డాహరినిఁ జూచి చెప్పె నిట్లు
శుభకాలమున నీవు శోకింపఁగా రాదు
        మఱియు లౌకికహాని మాను మదియు
ప్రేమతోఁ దొల్తన పిలిపించుటను మాని
        యభ్యంగనస్నాన మంచు నిట్లు


తే.

సేయఁగా రాదు నీవ యీచింత నుండ
నెవరు నీ కెదురాడుదు రేరితరము
మదిని ఖేదంబు మాని యీమంచిలగ్న
మంద పీఁటకుఁ జేరుము సుందరాంగ.

108


క.

అని రుద్రుం డాలగ్నం
బుస హరి నభ్యంగనంబు మోదంబునఁ జే
యను హెచ్చరికగ లెమ్మన
విని శంభుని జూచి యాదివిష్ణుం డనియెన్.

109


సీ.

శంకర బాలభాషలు వల్క కిఁక వారి
        వారిదుఃఖంబులు వారి కెఱుక
పరులకుఁ దెలియవా బ్రహ్మప్రళయవేళ
        పరదేశినై వటపత్రమందు
నే నుండినపుడు నిత్యానపాయిని యౌచు
        నాహృదయంబును నంటియున్న
కమలాలయను దుష్టకాలముచేఁ బాసి
        ఏకాకినై యుంటి యిన్నినాళ్లు


తే.

నా కపుడు మది నొకచింత లేకయుండె
నిపుడు నేను వివాహేచ్ఛ నెంచఁగాను

గలిగి రందఱు నిచట శ్రీకాంత యొకతె
తక్కువైయుండుకతన ఖేదంబు గల్గె.

110


సీ.

వనధిజ రాక వివాహంబు కాఁగూడ
        దన యెవ్వరైన నా కాప్తముగను
జెప్పుదు రనియుంటిఁ జెప్పరై రిచ్చటఁ
        గావున మదికి దుఃఖంబు పుట్టె
నని హరి పల్క బ్రహ్మాదులు భీతిల్లి
        ముకుళితహస్తులై ముందు నిల్చి
పల్కి లిట్లని రమాభామ రాకయ పెండ్లి
        యిప్పుడు సేయంగ నొప్పదంచు


తే.

సిరిని బిలిపింపుఁ డని మీకుఁ జెప్ప వెఱచి
యుంటి మపచారమాయె నయ్యుదధికన్య
రాకయుండినఁ బెండ్లిగా రాదటంచు
మీకుఁ దోచినదే మాకు మేలు తండ్రి.

111


చ.

సిరి నిపుడైన నిచ్చటికీ శీఘ్రముగాఁ దగఁ బిల్వనంపు నం
దఱ కిది సమ్మతం బనఁగఁ దామరసాక్షుఁడు సంతసించి యిం
దిర నహిపర్వతంబునకుఁ దెప్పునఁ దోడ్కొనిరమ్ము పొమ్ముపో
సరసిజమిత్ర యంచనఁగ సారసమిత్రుఁడు మ్రొక్కి యిట్లనెన్.

112


సీ.

హరి యేను గరవీరపురమునందుండెడు
        శ్రీరమాసతి కేమి చెప్పవలయు
నారీతు లెఱిఁగింపు మన విని సప్తాశ్వు
        నిం జూచి హరి నవ్వి నీరజాప్త

విను మాజలధికన్యఁ గని మ్రొక్కి శ్రీహరి
        వేంకటాచలముపై వేడ్క మీఱఁ
గడు నశక్తుండయి కనులఁ జూడఁగ నిన్ను
        వాంఛించుచున్నాఁడు వార్ధిపుత్రి


తే.

మోము చూపు మటంచును బ్రేమఁ జెప్పి
తోడుకొని రమ్మటంచును నేఁడు నాకుఁ
జెప్పి పంపంగ వచ్చితిఁ జెప్పినాఁడ
ననుచుఁ జెప్పుము పోపొమ్ము మరసి లక్ష్మి.

113


వ.

వచ్చును సందియం బుండదనిన విని దివాకరుం డట్లరిగి.

114


తే.

శ్రీసతికి మ్రొక్కి పల్కె నోసింధుతనయ
చక్రి యిప్పు డశక్తుఁడై జాలిపడుచు
శేషగిరియందు నున్నాఁడు శీఘ్రముగను
నేఁడు నినుఁ జూడ నున్నాఁడు నిజము తల్లి.

115


క.

అని యాసూర్యుఁడు వల్కఁగ
విని భీతిని బొంది లక్ష్మి వేగరథముపైఁ
దనరార నెక్కి నభపథ
మునఁ జని శేషాద్రి డిగియెఁ బుర్షుని జూడన్.

116


క.

అప్పుడు బ్రహ్మేంద్రాదులు
తప్పక సిరిరాక యెఱిఁగి తమవాద్యతతుల్
తెప్పున మొఱయించుచుఁ జని
రప్పరమపవిత్ర లక్ష్మి కానందముగన్.

117


సీ.

శ్రీలక్ష్మి నీక్షించి చెలఁగి దండము లిడి
        తోడ్కొని వచ్చిరి తొడరి యపుడు

పార్వతీభారతీప్రముఖామరాంగనా
        మణు లెల్ల నామెను మహితభక్తి
మ్రొక్కిరి యంత దామోదరుం డాలక్ష్మిఁ
        జూచి డగ్గఱ కేగి సురుచిరోక్తు
లాడుచు గారవం బారఁగఁ జేసి ము
        హూర్తద్వయము లక్ష్మి కుల్ల మలరఁ


తే.

గా రహస్యపుమాటల మీరఁ బల్కి
తాను జేసినకార్యంబు పూనిచెప్పి
యొప్పిదముచేసి పీఠిపై నొనర జేర్చి
తాను గూర్చుని వెండియుం దనర ననియె.

118


క.

శ్రీవనితామణి నాపై
నీవలుగుట మొదలుగాను నేఁటివఱకు ని
న్నీవేళఁ దలఁచుచుండుదు
నీవల్మీకంబులోన నిరవుగ నుంటిన్.

119


ఆ.

గొల్లఁ డిటకు వచ్చి గొడ్డంట నడినెత్తిఁ
బగులఁగొట్టినపుడు బాధపడుచు
నుంటి నన్నుఁ జాల నూరడించుచు నిందు
వకుళ యుండెఁ దల్లివలెను గాచె.

120


సీ.

పటుకుఠారము తలపైఁ దాఁకు నప్పటి
        బాధకు నే నోర్చి బ్రదికినట్టి
మహిమ యేమనిన నీమంగళసూత్రస
        న్మహిమయగాని నామహిమగాదు
వనజాక్షి నీపతివ్రతనిష్ఠచే నేను
        జీవించితిని యది సెప్ప నేల

యది యటులుండని మ్మాకాశనృపకన్య
        నన్ను మోహించెను సన్నుతించి


తే.

గాన దానిని నేఁ బెండ్లి కరము ప్రీతి
నాడ నెంచితి నీ వాడమంటివేని
పెండ్లియాడెద లేకున్నఁ బెండ్లి వలదు
తొంటిసంగతి మది నెంచు తోయజాక్షి.

121


మ.

అని పద్మాక్షుఁడు వల్కఁగా మనమునం దాశ్చర్యముం బొందుచున్
వనజాతాలయ పల్కె. నట్లు మఱి యవ్వామాక్షి మోహించి తా
నినుఁగాఁ బిల్చెనొ దాని నీ విపుడు మన్నింపం బ్రయత్నంబు లిం
దొనరం జేయుటఁ జూచితి మనసునం దుప్పొంగితిం గేశవా.

122


సీ.

కమలాక్ష మంగళకరముగఁ బసపుజా
        బింపుగఁ దొల్తఁ బంపించ కీవు
మొగి నసక్తుఁడ నని మోము చూచుటకు ర
        మ్మని నన్నుఁ బిలిపించినందునలన
భీతిల్లి వచ్చితి ఖ్యాతిగ నేవచ్చు
        రీతి రానైతి సంప్రీతి మెఱయ
నేఁ దొల్త వచ్చిన నీ పెండ్లి కిపు డొప్ప
        నని సంశయించితి వందుచేత


తే.

నింతపని చేసితివి మంచి దీవివాహ
కారణముచేత నైన నిక్కడకు నన్ను
నేఁడు పిలిపించినందున నీముఖంబు
గంటి నా కింతయేచాలుఁ గమలనాభ.

123

తే.

వసుధపై నీవు పెండ్లి కావలయు ననిన
నేను విఘ్నము సేయను నీకు నేను
గలిగియును లేకయుండెడు కారణంబు
చే వివాహేచ్ఛ పుట్టె నీ చిత్తమునను.

124


క.

నా కిది సమ్మతి యైనది
నీ కిఁక సంశయము వలదు నెమ్మదిగా నిం
దాకన్యను జేఁబట్టుము
ప్రాకటముగ నాకు సుఖము రహి నీకదియే.

125


క.

నీవు మనుష్యునికైవడి
గా వేంకటశైల మెక్కి గాయవడిన ని
న్నీ వకుళ వచ్చి గానఁగ
జీవించితి వింతె చాలు చిన్మయరూపా.

126


ఉ.

నా కిపు డేమి గావలయు నాఁడు భృగుం డెడఁబాపె నిన్నున
న్నో కమలాక్ష నే నచట నుండిన నీమహనీయరూప మే
జోకుగ నాత్మయం దునిచి చూచి సుఖంచెదఁ గాని వేడ్కగా
నాకలికి న్విరించిముఖు లందఱు మెచ్చఁగఁ బెండ్లియాడుమా.

127


క.

అని కన్నీ రొల్కఁగ సిరి
తనశిరమును వాంచియున్న దామరసాక్షుం
డనుమానించుచు లక్ష్మిని
కనుఁగొని యిట్లనియె నపుడు కరము ప్రియమునన్.

128


సీ.

సిరి నీవు మదిలోనఁ జింతింపవలదు నీ
        కన్న నాకాప్తు లెందైన లేరు
నీవ నాదైవంబు నీవ నాప్రాణంబు
        నీవ నాభాగ్యంబు నిశ్చయముగఁ

గావున నాపెండ్లి నీ విప్పు డొప్పి చే
        సిన మేలె చేయకుండినను మేలె
నా కేమి గావలె లోకవిడంబనా
        ర్థంబుగ నీప్రయత్నంబు నేఁడు


తే.

కాలకర్మానుగుణముగఁ గల్గె ననుచుఁ
దాను గన్నీరు నించిన ధవుని జూచి
వల్కె సిరి యిట్లు దేవ యీపామరంబు
నీకుఁ దగ దని చాల మన్నించి నగుచు.

129


సీ.

హరి నాదరించి బ్రహ్మాదుల నీక్షించి
        యిది యేమి యాలస్య మెల్లవారు
లేచి మీమీపనుల్ చూచి చేయుఁడు చక్రి
        కభ్యంగనము సేయుఁ డనుచు లక్ష్మి
యానతియ్యగ నంద ఱన్ని పను ల్జేసి
        రపు డబ్జజుండు ఖగాధిపతిని
పన్నగేంద్రానిలప్రముఖులం బంపించి
        పుణ్యతీర్థముల నా భుజగగిరికిఁ


తే.

గలశముల నిండఁ దెప్పించి క్రమముగాను
గుంకుమను గల్పి నాల్గుదిక్కులను బెట్టి
సూత్రముల వానిచుట్టుసు జుట్టుఁ డనుచు
నతఁడు సెప్పఁగ గిరిజాముఖాంగనలును.

130


తే.

మంగళస్నానములు చేసి రంగు మీఱ
వస్త్రభూషణములు దాల్చి వచ్చి దీప
కలశము ల్మంగళారతు ల్కరములందుఁ
బట్టి కల్యాణపాటలు పాడు చెలమి.

131

ఉ.

పాడి తలంగకుండఁ దొలి పద్మజుఁ డాడినరీతి నల్దిశల్
పోఁడిమిఁ గుంకుమం బిడినఁ బుణ్యశుభోదకకుంభము ల్దగన్
వేడుక మీఱ నుంచి సరవి స్వరసూత్రము చుట్టి యైదువల్
జోడుగ దానిమధ్యమున శోభితసన్మణిపీఠ ముంచగన్.

132


ఆ.

అజుఁడు పెండ్లిపీఁటయందుఁ గూర్చుండుఁ డో
స్వామి యనఁగఁ జక్రి జలధికన్య
దెసను జూడ విష్ణుదేవుని మో మెట్లు
చూడ కాదిలక్ష్మి చోద్యముగను.

133


సీ.

చెక్కిట చెయిఁ జేర్చి శిర మొగి వంచి ప
        దాంగుష్టమున సున్న లవనిమీఁద
వ్రాయుచు మఱి చింత చేయుచు నెమ్మోము
        చిన్న చేసుకుని యందున్న వేడ్క
లైనఁ జూడకయుండినట్టి రమాసతిఁ
        దాఁ జూచి హరి యిట్లు దలఁచె మదిని
నేఁ బెండ్లియాడుట కీయిందిరకుఁ జింత
        గల్గుచున్నది సేయుకార్య మేమి


తే.

యనుచు యోచించి తనచింత నడచి సరవి
వాలుగన్నుల నారమావనితమోము
సారెసారెకుఁ జూచుచు జాలినొంది
పద్మసంభవు నీక్షించి వలికె నిట్లు.

134


సీ.

ధాత యీపెండ్లియత్నము చేసి యేనొప్పి
        నందుచేఁ దప్పు నాయందుఁ గల్గెఁ
గాన నా కీపెండ్లి గావలసిన దేమి
        నేనొల్ల మీరెల్ల వేడుక గని

పోయి మీమీపురంబులు సేరుఁ డెప్పటి
        పగిది వల్మీకగర్భంబునందు
నిలచెదఁ దల్లిదండ్రులు లేని పరదేశి
        వానికిఁ బెండ్లి కావలెనె యిప్పుడు


తే.

దిక్కులకు నేను దిక్కునై దిక్కు లేక
నొంటిగా నిల్చి తేఱ కామింటనుండి
మంటిపై వ్రాలి పొట్టకై మానవులను
జేరి యాచించి బ్రదుకుట సిద్ధమయ్యె.

135


తే.

ఇట్టి నాకు వివాహేచ్ఛ పుట్టఁదగదు
గనుక యభ్యంజనము నొల్ల ననఁగ బ్రహ్మ
దేవుఁ డదరుచు శ్రీస్వామిదిక్కు చూచి
పాదముల వ్రాలి యిట్లని పల్కె నపుడు.

136


వ.

దేవా మహాలక్ష్మి మీకు నిత్యానందదాయినియై పత్నియై
యుండి నేనును మన్మథుండును బుత్త్రులమై తక్కినరుద్రపవ
నేంద్రాదులు మనుమలై మునిమలై వృద్ధినొందుచుండఁగ
నందఱకు నాధారభూతమై కూటస్థబ్రహ్మంబైన నీకు విచారం
బేల యని సాభిప్రాయంబుగఁ బల్కిన విని హరి యిట్లనియె.

137


సీ.

అంబుజాససచేతఁ దాంబూల మిపు డిచ్చి
        నన్ను దీవించు మానందముగను
నా కిప్పు డభ్యంగనముచేయువార లె
        వ్వారంచుఁ జింతతో నీరు కనుల
నింపంగ సిరి హరినిం జూచుచుండఁగఁ
        దమ్మిచూలి మఱప్డు నెమ్మి సంజ్ఞఁ

జేసి రమ్మనఁగ నా శ్రీలక్ష్మి హరి చెంతఁ
        జేరి నవ్వుచు రెండుచేతు లపుడు


తే.

పట్టి లేపగఁ దనమదిఁ బుట్టియున్న
చింత విడిచి ముదమున వసిష్ఠముఖ్య
మునుల కప్పుడు మ్రొక్కి. దీవనలు నంది
యొనర పీఠంబుమీఁదఁ గూర్చుండెఁ జక్రి.

138


వ.

అప్పు డరుంధతీప్రముఖసువాసినులు శోభనపాటలు పాడు
చుండ మంగళవాద్యంబులు మ్రోయుచుండఁ బార్వతియు
సావిత్రియు సరస్వతియుఁ గుంకుమోదకంబులు పైఁడిపళ్ళె
రంబుల నించి యారతు లిచ్చి రంత రమాదేవి మంగళాక్ష
తలు లలాటశీర్షంబులం దుంచికొని కర్పూరతాంబూలం బా
స్వామిచే నిచ్చి దీర్ఘనీలకుంతలంబుల చిక్కుఁదీయుచుఁ
బైఁడిగిన్నియలోని సంపెంగతైలంబుం జేత నిండం బట్టికొని
దీర్ఘాయుష్మంతుఁడవై యష్టపుత్త్రవంతుఁడవై చతుర్దశభువ
నంబు లనేకఛత్రాధిపత్యంబున నేలువాఁడవై వృద్ధినొందు
మోయంబుజాక్ష యని యాశీర్వదించి యభ్యంగనంబు
చేయించి కర్పూరకస్తూరి హరిద్రాచూర్ణములు పునుఁగు
తైలంబునం గల్పి నలుగు పెట్టి పరిశుద్ధోదకంబున నభిషేకం
బొనరించి కృతార్థురాలైతి నని సిరి మనంబున సంతసించె
నంత పార్వతీసావిత్రీసరస్వతులు కలశంబులఁ గుంకుమోద
కాభిషేకం బొనర్చి లక్ష్మితోడఁ బుడిసిళ్ల దత్తీర్థంబు వట్టి
శ్రీరామరక్ష యని శిరంబునకుఁ జుట్టి చల్లి రంత.

139


సీ.

సావిత్రి దెచ్చి వస్త్రం బియ్యంగా సిరి
        తడియొత్తె శిరమును దనర నివిరి

చక్కనివెండ్రుకల్ చిక్కును సవరించి
        గంధపుసామ్రాణి కమ్రధూప
ము నొసంగెఁ బార్వతి ముదమునఁ బీతాంబ
        రము లియ్య హరి గట్టె రమణ మీఱ
శ్రీసరస్వతి దెచ్చి చేతి కీయఁగ లక్ష్మి
        వరరత్నభూషణావళు లమర్చె


తే.

ముకుర మటుమీఁద గాయత్రి మొనసి చూపెఁ
దిలకమును రతి రీతిగఁ దీర్చె నుదుట
రమ్యముగ శచి వింజామరమును వీచెఁ
బట్టె ఛత్రంబుఁ బవనునిపత్ని గరిమ.

140


తే.

పాదుకలు గంగ పెట్టఁగ బ్రహ్మసభకు
నడచుచును వచ్చి సింహాసనంబుమీఁద
నమరఁ గూర్చుండి మునిముఖ్యు లలరి చూడ
బ్రహ్మనుం జూచి శ్రీహరి పల్కె నిట్లు.

141


వ.

సురజ్యేష్ఠుఁడా! యిఁక లక్ష్మీదేవికి మంగళస్నానంబు సేయ
నియమింపు మనినఁ బద్మజుండు వోయి పార్వతీప్రముఖాంగ
నలం బిల్చి మజ్జననికి మంగళస్నానంబు సేయింపుఁ డని
వచించి లక్ష్మిని కనకపీఠికపైఁ గూర్చుండుమనిన శిరంబు వంచి
విరించితో సిరి యిట్లనియె.

142


క.

వనరుహభవ నే నభ్యం
గన మొల్లను మజ్జనంబు గ్రక్కున నేఁ జే
తును నని వల్కఁగ నది తా
విని సందియ మొంది యాదివిష్ణుం డనియెన్.

143

సీ.

అబ్ధిజ నీ విప్పు డభ్యంగనస్నాన
        మొప్పకుండిన వివాహోత్సవంబు
నేనొల్ల నని వల్కఁగా నవ్వికొని రమా
        సతి యూరకుండఁగ శైలకన్య
మొదలుగ నందున్న ముత్తైదువులు సీరి
        కభ్యంగనము చేసి యపుడు పసుపు
నలుగొప్పఁబెట్టి స్నానంబును జేయించి
        తడియొత్తి నవ్యవస్త్రముల నొసఁగి


తే.

కురులు విడదీసి గంటిడి విరిసరములు
చుట్టి కుంకుమతిలకంబు పెట్టి నుదుట
గనులఁ గాటుగఁ దీర్చి శ్రీగంధ మలఁది
వరుసగా రత్నభూషణావళులఁ దొడఁగి.

144


తే.

పెండ్లిపాటలు పాడి సంప్రీతి సిరిని
దోడుకొని వచ్చి యాచక్రితోడ జతగఁ
గూరుచుండఁగఁ బెట్టి రవ్వారిజాక్షు
డంత సిరిఁ జూచి తాను సంధ్యను నొనర్చె.

145


వ.

ఆసమయంబున వసిష్ఠాదిమహామునులును సనకాదయోగివరు
లును నింద్రాదిదేవతలును గరుడగంధర్వాదులును లక్ష్మీ
నారాయణుల నానందంబునం జూచుచుండఁగా నిది శుభ
లగ్నమంచు నందుండు జ్యోతిశ్శాస్త్రవేత్తలు చెప్పుటం జేసి
వకుళమాలిక విని సరగున మంగళద్రవ్యంబు లొకపైఁడి
పళ్లెరంబున నిడుకొని వచ్చి స్వామిసన్నిధానంబున నునిచి
హరికి నలంకరించుమని సిరికిం జెప్ప నారమాకాంత సంత
సంబున లేచి నిజకాంతునకు నలంకరించె నంత కుబేరుండు

దివ్యభవ్యరత్నాంబరాభరణాదులు దెచ్చి లక్ష్మి కందియిచ్చె
నవి స్వామికి నాలక్ష్మియ యలంకారంబు చేసె నంత వసిష్ఠకస్య
పాత్రిభరద్వాజశుకవత్ససాదిమహామునులకుం జక్రి లోక
విడంబనార్థంబుగ సమస్కరింప నాసమయంబున వసిష్ఠుండు.

146


తే.

ముత్యముల చతురశ్రమముగ వివాహ
వేదిక రచించి యర్థి శ్రీవేంకటాద్రి
పతిని సతియగులక్ష్మిని పరఁగ నుంచి
తత్పురోభాగమున నగ్నిఁ దనరఁజేసి.

147


వ.

అంత యజుశ్శాఖోక్తప్రకారముగ వైఖానససూత్రపద్ధతిం
బుణ్యాహవాచనాదిశుభకృత్యంబు లాచరించి వచ్చిన యశేష
జనంబులకు సవినయోచితపూర్వకంబుగఁ దాంబూలాదు
లిప్పించి తదనంతరం బాహరిం జూచి కులదేవతారాధనంబు
సేయవలయు నయ్యధిదేవత నామం బెద్ది యని యడుగ
నాహరి పాండవులకును మాకును శమీవృక్షంబ కులదేవత
యనిన విని వసిష్ఠుం డయ్యవనీరుహం బెందుఁ గల దనఁగఁ
గుంభసంభవుండు విని యది కుమారధారాతీర్థంబున నున్న
దని వచింప నయ్యెడకు మంగళవాద్యంబులతోడ హరిం
దోడ్కొనివోయి యవ్వృక్షరాజంబునకుఁ బూజ లొనరిం
పించి ప్రదక్షిణనమస్కారాదులం జేయించి తత్పాదపశాఖా
గ్రపల్లవంబు లనుగ్రహించి హరి శిరంబున నునిచి యందుండి
వచ్చి కులదేవతకలశం బెందుండవలయు ననిన విని నార
దుండు వరాహస్వామినన్నిధానంబున నుండఁజేయవలయు
ననియె నంత నచ్చోట ముక్తతండులంబుల రాశింబోసి తత్క
లశంబున కలంకరించి యందుంచి తదుపరి హరిద్రంబునఁ బద్మ

లాంఛనరచితవస్త్రయుగ్మంబును నారికేళంబును నిడి పూజింపఁ
జేయించి అఖండదీపంబు వెలుఁగఁజేసి తద్దీపంబునకు దీక్షార్చ
నలు చేయించి మ్రొక్కించిన వరాహస్వామిని హరి చూచి
యిట్లనియె.

149


సీ.

శ్రీవరాహస్వామి నీవును భూదేవి
        రావలె నిప్పుడు నావివాహ
మునకు నంచనఁగ నిట్లనియె నా దేవుఁడు
        క్షేత్రమంతయు ఫలించినది గనుక
రాఁ దీర దిపుడు నిర్ణయముగ నామాఱు
        వకుళయ పెండ్లికి వచ్చుఁ బొమ్ము
మనవుడు నటులైన నానతియ్యుఁడు పోయి
        వచ్చెద మని మెఱమెచ్చఁ బలికి


తే.

నంత బ్రహ్మను జూచి ప్రయాణభేరి
మొఱయఁజేయింపు మనఁగ నమ్ముదముఁ జూచి
బ్రహ్మ యిట్లనె నేమియో పరమపురుష
పరఁగ సంతర్పణంబు నెల్లరకుఁ జేసి.

149


వ.

రేపుదయంబు పైనం బొనరించుట శ్రేయంబు నేఁడు పైనంబు
గడుపందగదు. శుభాస్పదదినలాంఛనం బనఁగ నిదియ గదా
యనిన విరించిమాటలకు నంచితంబుగ హరి యిట్లనియె.

150


ఆ.

దేశకాలములను దెలియక యత్నంబు
నీవు సేయ నెంచినావు చూడ
నలర దొరకు నేపదార్థ మాయద్రిపై
ననినఁ జక్రి కిట్టు లనియె శివుఁడు.

151

క.

చేసినయత్నము పూర్తిగఁ
జేసిగదా మేలు నెపుడు చెందవలయు నే
డీసంతర్పణ సేయక
గాలిసి యిపు డటకుఁ బోవఁగారాదు హరీ.

152


చ.

అని గిరిజాధిపుం డనఁగ నాహరి నవ్వి పొసంగ నబ్థిపు
త్త్రిని నడుగంగఁ బూనియు నిదేమి మగండయి సిగ్గుమాలి దా
నిని బతిమాల నేల యీపనికి నెమ్మి వరాల నొసంగు మంచుఁ బో
యనుచును శూలి నయ్యజుని నర్థి మెయిం గని గూడి గ్రక్కునన్.

153


వ.

వల్మీకసమీపంబునఁ గూర్చుండి యుండు పార్వతీభారతీ
ప్రముఖవరాంగనలనడుమం గూర్చునియుండు లక్ష్మీదేవి
తోఁ జెప్పకపోయి పుష్కరిణీతోర్థతీరవరాశ్వత్థపృషఛాయం
గూర్చుండి కుబేరుని రావించుకుని యేకాంతంబున నిట్టు
లనియె.

154


సీ.

ధనదావివాహయత్నము నేను జేసితి
        నర్థంబు లేదిపు డబ్ధిసుతను
నాపెండ్లి కీవు ధనం బిమ్ము మనుటకు
        నాకు నిష్టము లేదు నయము గాదు
నీవు ద్రవ్యం బిమ్ము నెఱి నీకుఁ బత్త్రంబు
        వ్రాసియిచ్చెదను సంవత్సరమున
కొకమాఱు వడ్డి నీ కొప్పించుచుండుదు
        గలియుగాంతమున నేఁ గాసువీస


తే.

మేమి నిల్పక యొసఁగెద నెడఁద నిదియు
మోసమని యెంచవలదు నాబాస గొనుము

శంభుడును ధాతయునుగూడి సాక్ష్యములను
వేసియిత్తురు ననఁగ భావించి యతఁడు.

155


సీ.

వలికె నిట్లనుచు నోపద్మాక్ష నీకృప
        నిపుడుండు ధనము నే నెంతయైన
నిచ్చెద వడ్డియు నేటికీ వైవాహ
        మైనచోఁ జాలు మా కందఱకును
బరమసంతోషంబు భావింప నింతక
        న్నను లాభ మొక్కండు గనుటఁగలనె?
యనఁగ నాహరి యిట్టులనియె దానం బేను
        గొనుటకుఁ దగదు నీ కనువుగాను


తే.

వడ్డిపత్రంబు నొకయాకుపసరుచేత
మ్రానిపట్టను దగఁ దాను బూని వ్రాసి
యజుని శంభుని సాక్ష్యంబు లలర నిడఁగఁ
జేసి యిచ్చెను విత్తంబు చెంతలేక.

156


వ.

అంత శంభుని యజుని వీక్షించి హరి యిట్లనియె.

157


చ.

అజహరులార! యీకలియుగాంతము వచ్చెడుదాక ధన్యమౌ
భుజగగిరీంద్రమందుఁ బరిపూర్ణవిలాసము లద్భుతంబుగా
సుజనుల కెల్ల మెచ్చువడఁ జూపి వరంబు లొసంగి విత్తమున్
నిజముగ సంగ్రహించి యట నేను గుబేరున కప్పుదీర్చెదన్.

158


తే.

మీరు సాకిరు లని వల్కి భూరి ముదముఁ
దాను వ్రాసినయట్టిపత్రంబు నజుని
చదువుమన నబ్జభవుఁ డంత సరవి దాని
చదివె నీరీతి ధనదుఁ డీశ్వరుఁడు వినఁగ.

159

సీ.

శ్రీకరలీల స్వస్తీశ్రీ జయాభ్యుద
        యాష్టాదశద్వాపరాంతమందుఁ
గల కలి నాదివేంకటనాయకుఁడు ధన
        పతి కొసంగిన వడ్డిపత్ర మెట్ల
యనిన నావైవాహనమునకు నీచే నప్పు
        గొనిన టెంకీలును గోటిసంఖ్య
లలిని జతుర్దశలక్ష లందుకు వడ్డి
        ప్రతివత్సరంబును బరఁగ నిత్తు


తే.

కలియుగాంతమునండునఁ గాసువీస
ముంచ కొగిఁ దీర్చివేయుదు మొనసి దీని
కజుఁడు శంభుఁడు మఱియు హిమాంశుఁ డినుఁడు
సాక్షులు నిజంబు వృక్షరాజంబు సాక్షి.

160


తే.

ఇట్లు నాయిష్టమున వ్రాసి యిచ్చినట్టి
స్వకరలిఖితం బటంచును ననజభవుఁడు
చదివి వినిపించి పార్వతీశ్వరునిచేత
నిచ్చి చూడు మటంచును మెచ్చఁ జెప్పి.

161


వ.

ఇచ్చుటం జేసి యది చూచి యిందుకు నొకసందియం బుండదు
సఖుఁడా యని ధనదుని మెఱమెచ్చఁ బల్కి యొసంగె నప్పు డా
ధనేశ్వరుండు పత్రంబు చేకొని హరికి రయంబున యక్షులచే
స్వర్ణరామటెంకీలు కోటిని దెప్పించి యెంచి యొసంగుటం జేసి
పుచ్చుకొని క్రమ్మల నాధనం బాయక్షేశుని కడ నుంచి
పలసిన పదార్థంబులు చెప్పింపు మని చెప్పె. నాధనేశుం
డవ్వివాహంబునకు వలసిన మంగళద్రవ్యంబులును, వస్త్రభూ
షణాంబరంబులును, భోజనపదార్థంబులును, మఱి యితర

పదార్థంబులును దెప్పించె, నంత నాహరి పావకునిం జూచి
భక్ష్యభోజ్యాన్నాదు లింతకుఁ జేయకుండు టేల యని
యడుగ నతం డిట్లనియె.

162


క.

పాత్రుఁడ వన్నింటికి నీ
క్షేత్రంబునఁ బాక మలరఁజేయుటకును మృ
త్పాత్రంబు లైనలక్ష్మిక
ళత్రా లేవనఁగ లేక లలియుందు నిటన్.

163


వ.

అనిన విని షణ్ముఖునిం బిలిచి యడుగ నతం డూరకయుండుటం
జేసి బ్రహ్మాదులు వినుచుండ నగుచు నారాయణుం డిట్లనియె.

164


సీ.

పరదేశి పెండ్లికిఁ బాత్ర లెందుండును
        నమరు పుష్కరిణి దివ్యాన్నపాత్ర
పరిశోభితం బైన పాపవినాశమ
        శుద్ధోదకానికి శుద్ధపాత్ర
ఆకాశగంగయ యన్నపుపాత్ర గో
        గర్భంబ పరమాన్నకంబుపాత్ర
గురుతరంబైన తుంబురుకోన చిత్రాన్న
        పాత్ర శాకముల నేర్పఱచి సేయు


తే.

భక్ష్యముల నిడు శ్రీపరబ్రహ్మతీర్థ
పాత్ర మఱి పచ్చడులకును బాండుతీర్థ
పాత్ర ముపదంశములకు సత్పాత్ర మాకు
మారధారయ యనుచు రమావిభుండు.

165


వ.

వినోదంబుగఁ బల్కుటం జేసి యష్టవసువులు విని చిన్నవోయి
లజ్జించి సత్వరంబున నక్షయపాత్రలు చెప్పించి యొసంగుటం
జేసి వైశ్వానరుండు సంతసంబు మృష్టాన్నం బొనరించి భోజ

నంబునకు లెండని వచింప హరి విని కార్తికేయుని పిల్చి
బ్రాహ్మణభోజనంబునకు విశాలప్రదేశంబు లేకుండుటం జేసి
శంభుని నానతిచొప్పున భూతగణంబులం దోడ్కొని పాండవ
తీర్థము మొదలు శ్రీశైలముపర్యంతము నేలం జదరంబు
సేయింపు మనిన నతం డట్లు చేయించె, నంత నందఱు స్నాన
సంధ్యాద్యనుష్ఠానాదు లొనర్చుకుని బంతులుగఁ గూర్చుండ
నప్పు డజునిఁ జూచి యనర్పితాన్నంబు బ్రాహ్మణులకు యో
గ్యంబు గాదనియు నహోబలనారసింహున కర్పితంబు సేయు
మనియుఁ జెప్ప నప్పద్మజుం డట్లు చేసి వైశ్వదేవబలిహరణాది
నిత్యకర్మకలాపంబుల నంతరంబు చేసి బ్రాహ్మణులకు నుచితా
సనంబు లిచ్చె. శ్రీనివాసుండు నియమించిన రీతిం బవనుండు
కదళీపర్ణంబులు బంతులుగ వైచి ఘృతలాంఛన మిడి సకల
పదార్థంబులను వడ్డించె. బ్రహ్మ గంధపుష్పాక్షతంబుల ద్విజా
ర్చనంబు చేసి వరుణుండు బ్రాహ్మణులకును సుమంగిలీశ్రేణు
లకు నాపోశనాంబువు లిచ్చె. వసిష్ఠుండు "ఏకోవిష్ణుర్మహద్భూ
తం" బనుచు వచింప నందఱును జెప్పుచుం గృష్ణార్పణ
మ స్తని పంచప్రాణాహుతు లిడుకొనఁ బవనుండు హస్తోద
కంబు నొసంగె. మన్మథుండు నాంజనేయుండును బంతులఁ దిరు
గుచుం బ్రొద్దయ్యె నిదానంబున భుజింపుఁ డని యుపచారం
బులు చెప్పుచుండిరి. భక్ష్యభోజ్యలేహ్యపానీయంబులతో
బరితృప్తిం బొంది యజునివలన నుత్తరాపోశనంబు గైకొని
లేచి పాణిపాదప్రక్షాళనంబు నాచమనంబును జేసుకొని హరి
నియమింపఁబడిన రమ్యస్థలంబునం గూర్చుండి “తృతీయస్యామి
తోదివిసోమ ఆసీత్” అనుచుఁ జెప్పు వేదధ్వనికి హరి యానం

దంబు నొందుచుండఁగ మన్మథునిచేత నంజనీసుతునిచేత దివ్య
తాంబూలంబు లొసంగఁ జేసి బ్రహ్మ ధనదునివలన దక్షిణ లిప్పిం
చె. శ్రీహరి లేచి యాబ్రాహ్మణశ్రేణికి నమస్కారంబు సేయ
వాకు మంత్రాక్షతల నాశీర్వచనంబులు నేసిరి. అవి తాఁ గొని
పుత్రకళత్రాదులకును భటులకును శిరంబులం గరంబర్థి
వైచి తా సంతోషమగ్నుండయ్యె. అంత హరిహరబ్రహ్మేం
ద్రాదులు తమనిజభార్యాసమేతులై సంతసంబార భుజించిరి.
హవ్యవాహనపవనమన్మథకార్తికేయాంజనేయాదులు భుజించి
భూతగణాదులకును, తదితరులకును, మృష్టాన్నభోజనంబు
లం బరితృప్తి గావించిరి. పాకపాత్రంబు లందుండు చారులు
పరిశుద్ధంబు చేసి పెట్టి రంత.

166

సూర్యాస్తమయ చంద్రోదయ సూర్యోదయములవర్ణనము

తే.

హరివివాహంబునకు వచ్చినట్టి బ్రహ్మ
ముఖ్యులందఱు భోజనములను జేసి
రింక నిచ్చట నాకుండ నేమి మేరు
భూధరంబున నాదిక్కుఁ బోయి వత్తు.

167


తే.

చంద్ర నీ వింక వేంకటాచలముమీఁద
సకలసురమునిముఖ్యులు సంతసించు
కొఱకు వెన్నెల నంతట నెఱపు మనుచుఁ
జెప్పి చనినట్ల యపరాద్రిఁ జేరె నినుఁడు.

168


సీ.

అబ్జబాంధవుఁ డిట్టు లపరాబ్ధిఁ గ్రుంకఁగ
        నపు డహిగిరినుండునట్టి లక్ష్మి
మొదలైనసతులను ముచ్చటగాఁ జూడ
        హేమాంబరము ధరియించి పద్మ

రాగభూషణములు రక్తచందనమును
        బసుపుకుంకుము దాల్చి భక్తి మెఱయ
పశ్చిమాశాకాంత పైనమై వచ్చెనో
        యనఁగ సంధ్యారాగ మతిశయిల్లె


తే.

నందుచేఁ బార్వతీప్రముఖాబ్జముఖుల
మణుల భూషణముల రక్తిమములు మించెఁ
బక్షు లారత్నములు చూచి ఫలము లనుచు
మెక్కుటకుఁ బొందుగతి చెట్లమీఁద వ్రాలె.

169


తే.

విపులనీలాంబరమునిండ విమలమౌక్తి
కముల గుమిగూర్చి శేషనగంబుపైనఁ
గట్టునటువంటి [1]చందువాకరణిఁ దార
కంబు లంతంతకు నభంబుఁ గ్రాలె నపుడు.

170


సీ.

జలధి నుప్పొంగించి జలరుహపంక్తుల
        నీక్షించి నోళ్ల మూయించి మించి
కుముదసంతతులను బ్రమదంబు నొందించి
        తొలఁగక శుభ్రకాంతులను బెంచి
విరహుల నలయించి విరసము ల్గలిగించి
        చక్రవాకులవేడ్క లాక్రమించి
చీఁకటిఁ గబళించి చిగురుటాకుల దీప
        ములమాడ్కి వెల్గించి మొనసి యెంచి


తే.

చలువచీఱెలు సానుదేశముల నిండఁ
బఱచినటువలె వెన్నెలఁ బ్రబలఁజేసి

పూర్వదిక్కాంత నీక్షింపఁ బొసఁగుకరణి
సరగ వచ్చుచునుండె నాచంద్రుఁ డంత.

171


చ.

వనగిరిసానుశృంగముల వారిజసంభవుఁ డాదిగా మహా
మునులు శివుండు దిక్పతులు మోహము లొందగ నప్డు గామినీ
జనములఁ గూడి యుండఁగను జక్రి మహానియమంబుతో సిరిన్
నెనరున వక్షమం దిడక నేల రచించు చిగుళ్లపాన్పులన్.

172


ఆ.

వకుళయొద్ద లక్ష్మి వల్మీకవివరంబు
చెంతఁ జక్రియును వసించి యొక్క
రొకరి నంటకుండు టుంట రాజు గని క
లంక మొంది రోష మంకురింప.

173


క.

నాతోడఁ బుట్టి వెలసిన
శ్రీతరుణీమణిని వేఱచేసిన దనుజా
రాతికి నేఁ డుపకారము
బ్రాఁతిగ నేఁ జేయ ననుచు పగఁ గనుఁగొనుచున్.

174


తే.

చెలువుగా హరియురమున నలరి భోగ
లీల వెలయఁగ మును బవ్వళించులక్ష్మి
రాగవిరహితయై కొండరాతిమీఁద
నిపుడు శయనించియున్నది యెట్లు చూతు.

175


సీ.

మునియగు భృగుఁడు చేసినపని కలిగి కొ
        ల్లాపురమందున్న లక్ష్మి నిటకు
మొదటఁ బిల్పింపక మోసతోఁ దాను మా
        యలు పన్ని తనకుం దలంటువేళ

పిలిపించె నిఁకనైనఁ బ్రేమమై నురమునం
        దుంచును గద యని యెంచి నమ్మి
వచ్చితి శ్రీరమావనిత నాహరి తేఱఁ
        జేసినవిధము చూచితిని గనులు


తే.

చల్లనాయెను నేను నాచలము దీఱ
నేమి సేయుదు నను గ్రోధ మినుమడింప
శ్రీశునేత్రాబ్జములనిండ శీతకిరణ
జాలమును జొన్పి ముకుళింప సరగఁజేతు.

176


తే.

రెండుజాములు దనుక యీరీతి మేను
మఱచి నిదురించు మోబావమఱఁది యనుచు
హెచ్చి హిమకిరణుఁడు శాపమిచ్చెనేమొ
యనఁగ హరి నిద్రవోయె దేహంబు మఱచి.

177


తే.

తలిరుఁబానుపుపై విశ్వతైజసులను
నడచి ప్రాజ్ఞుని దాఁటి యఖండతుర్య
మం దమరఁ బొంది తదతీత మైనసుఖము
ననుభవించుచునుండెఁ బద్మాక్షుఁ డచట.

178


క.

అంతట నలరులపై శ్రీ
కాంతామణి నిదురఁ జెందఁగాఁ జూచి కడుం
జింతాక్రాంతమనంబున
సంతోషము లేక చిక్కి సగమగుపగిదిన్.

179


సీ.

శుక్లపక్షమునాఁటిసోముఁ డాలోచించి
        తలఁచె నిమ్మెయి రమాతరుణి కిచట
నలుక దీఱిచి వక్షమం దుంచికొనియుండ
        కాకాశరాజేంద్రునాత్మసుతను

దాఁ బెండ్లియాడుట దలఁచె గదా హరి
        దయ లేనివాఁ డయ్యె ధాతగూడ
నిపుడైన నురమునం దిందిర నిడుకొని
        యేలంగ మేలు మఱేల పెండ్లి


తే.

యనుచు మునులైనఁ జెప్పక యలరువారు
కాని వీరికి వనములఁ బూని పోవు
నపుడు చీకటి చేయింతు నఁనఁగఁ బశ్చి
మాబ్ధి కేగుదు నని చంద్రుఁ డరుగుచుండె.

180


చ.

తమవిభుఁ డల్గిపోవఁ గని తారలు విన్నఁదనంబు నొందుచుం
గ్రమముగఁ జంద్రుతోడుతన గ్రక్కునఁ బోవుచు నుండె సప్పుడే
కుముదవరాప్తుఁ డేగుటకు గ్రూరుఁడు వచ్చుట కార్తినొందుచున్
భ్రమయుచు నీటియం దొదుగుభావముతో ముకుళించె ఖిన్నతన్.

181


ఉ.

అప్పుడు చంద్రుఁ డేగె నిఁక నంబుజమిత్రుఁడు జాముప్రొద్దు కే
తెప్పున వచ్చువాఁడు చనుదేరక మున్నె విరించిముఖ్యులం
దప్పక చూడవచ్చును గదా యని నల్లన చీరఁగట్టి వే
యొప్పుగ మబ్బుచాన చనుచున్న దనం దగఁ గ్రమ్మెఁ గొండపై.

182


సీ.

ఆచీఁకటిని జూచి యద్రిరూపమునున్న
        పన్నగేంద్రుఁడు నిజఫణము లెత్తి
హరిహరబ్రహ్మాదు లంగనలను గూడి
        యుండఁగఁ జీఁకటి యుండఁదగునె
యని ఫణామణుల నత్యంతముగా వెల్గఁ
        జేసినాఁ డన నద్రిఁ జెన్ను మీఱ

జ్యోతిర్లతావళుల్ చూపట్టె హేమాద్రి
        కీవల నున్నట్టి [2]యిఱుల నెల్లఁ


తే.

బట్టి గొట్టెను కో యనునట్టిరీతి
నుదయగిరియందు వనజాప్తుఁ డొందె నైజ
కిరణములఁ జూపి యిఱులెల్ల నురుభయంబు
వడి వడంకుచు డాఁగె నప్పుడు కడంగి.

183


ఆ.

హరిని లేపి పెండ్లి కంపించుటకు శుభ్ర
వస్త్రమును ధరించి వగఁ జెలంగఁ
దూర్పుపడతి భక్తితో వచ్చెనో యనఁ
దూర్పుఁ దెల్లగాను దుఱఁగలించె.

184


తే.

పసుపు సున్నము బంగరుపళ్లెరాన
నీటితోఁ గల్పి చక్రికి నెమ్మి యార
తీయు నొసంగుటకై ఛాయదేవి తెచ్చె
ననఁగ నరుణోదయంబయ్యె నంతకంత.

185


క.

మక్కువతో హరి పెండ్లికి
గ్రక్కునఁ బోవలయు ననెడుకైవడి నపు డా
చక్కని యుదయాచలమున
నెక్కుచు రానుండె వేడ్క నెసలారంగన్.

186


తే.

చంద్రకిరణంబులకు హరిసరవి నేత్ర
సరసిజము మూసుకొనియుండఁ జనదటంచు
నెంచి లేచినవాఁడేమొ యంచుఁ జూడ
వికసితములయ్యె ననినట్ల విష్ణుఁ డపుడు.

187

తే.

కనులు దెఱచి ముదంబునఁ గమలముఖము
చూచి శ్రీకర మగుఁగాక సొరిది నాకు
నంచు మది నెంచి లేచి బ్రహ్మాదులకడ
కెలమి రావించి పైదాని కేమి యింక.

188


వ.

అనిన విని విహగనాథుం డట్లు చేసె.

189


తే.

వసుధమిత్రుండు తముఁ గావ వచ్చినపుడు
శత్రుఁడగు చంద్రుఁ డల్కమైఁ జనుటఁ జూచి
నవ్వెను ననఁగ సరసుల నళినచయము
తనర వికసించె నానందదాయకముగ.

190


క.

సరసిజములలో రాతిరి
కరము చెఱం దనరుచుండి ఘనుఁ డినుఁడు చెఱన్
సరగ విడిపింప వెడలిన
కరణి నళు ల్దిరుగుచుండెఁ గడురుతములతోన్.

191


తే.

కలకలధ్వను లెసఁగ ఖగంబులెల్లఁ
జక్రి పెండ్లికి రమ్మంచు సరవిగాను
బొసఁగ దిగ్దేవతలఁ బిల్వఁబోవునటులఁ
జెలఁగి కూయుచు నెల్లదిక్కులకుఁ బాఱె.

192


ఉ.

పీతనిజప్రకాశమును బెంచుచు వృక్షలతాద్రి దిక్పుర
వ్రాతములందుఁ గప్పుచును వచ్చు దివాకరుఁ జూచి లేచి యా
ధాతృముఖామరార్యులును దాపసులున్ హరియున్ శివుండు వి
ఖ్యాతిగ నుండు పుష్కరిణిగట్టునఁ జేరి యథాక్రమంబుగన్.

193


శా.

స్నానార్ఘ్యాదికనిత్యకృత్యవిధులన్ సంతోషముం జేసి రం
దానారాయణుఁ డెండ మించు నిఁక లెం డంచుం బ్రయాణంబు తా
నానందంబునఁ జెప్ప వారలు ప్రియం బారంగ వెన్వెంట రాఁ

గా నాగేంద్రుఁడు చక్రపాణికిని సత్కల్యాణముం బాడుచున్.

194


శా.

ముత్తైదుల్ చనుచుండఁగా ద్విజవరుల్ మోదాన వేదంబు లె
ల్గె త్తెంతో వచియింపఁగా నెలమిమై నింద్రాణి దేవాంగనల్
ముత్తెంబు ల్విరులన్ శుభాకరకరంబు ల్పట్టి యాచక్రికిం
జిత్తంబుల్ ముదముంద సేస లొగి శ్వశ్రేయంబుగన్ శీర్షమున్.

195


వ.

చల్లి రంత.

196


ఆ.

హేమరథముమీఁద నిందిర పుష్పర
థంబుమీఁద వకుళ తార్క్ష్యవాహ
నంబుమీఁదఁ జక్రి నందిపై రుద్రుండు
హంసవాహనంబునందు బ్రహ్మ.

197


సీ.

ఎక్కిరి పురుహూతుఁ డిభమునం దగరుపై
        ననలుండు మహిషంబునందు యముఁడు
నరునిపై నిఋరుతి వరమకరంబుస
        వరుణుండు మృగమునఁ బవనుఁ డెలమి
హయముపై ధనదుండు నవలతక్కినవారు
        తమవాహనంబులం బ్రమదమారఁ
గూర్చుండి తమతమగూర్మిపత్నులతోడ
        హరికి ముందఱ ధాత నరుగ వెన్క
రుద్రుండు కుడిదట్టు రూఢిగ శ్రీసతి
        యెడమదిక్కున వెన్క నెలమి గుహుఁడు


తే.

వివిధవాద్యంబు లెంతయు వీనులలరు
చుండ మ్రోయంగ నరదంబు లోలిరాఁగ

నేములధ్వను లొప్పార నెమ్మి మాగ
ధులు ముదంబున బిరుదులు చెలఁగి వొగడ.

198


తే.

గొడుగు శేషుఁడు పట్టఁగఁ గుడియెడమల
నమర పవనుండు వరచామరములు వీవ
భక్తి మెఱయంగ సేనాధిపతి ముదమున
నాలవట్టముపట్ట శేషాద్రి డిగ్గి.

199


వ.

నేల యీనిన చందంబున నెఱసి కపిలతీర్థమార్గంబునం జని
చని శుకాశ్రమంబునకుఁ బోవుచుండఁగ నాశుకుండు స్వామి
కెదురువచ్చి తోడ్కొనివోయి సుస్థలంబునం దుంచి నిజ
యోగప్రభావంబున సకలపదార్థాకర్షంబు చేసి హరిహర
బ్రహ్మాదులకు విందు చేయించె నయ్యష్టమినాఁటిరాత్రి హరి
గంధర్వయక్షకిన్నరగానంబు లాలకించుచు రంభాద్యప్సర
స్త్రీలనృత్యంబు లీక్షించుచు సామగానంబులు విని విని
చొక్కి సుమశయ్య విశ్రమించి లేచి యమ్మరునాఁడు నారా
యణవనపురసమీపంబుసకు నాకాశరాజు పురోహితామాత్య
జనసమేతుఁడై చతురంగబలములతోడ నాచక్రి కెదురుగ
వచ్చి పూజాలింగనాదిసత్కృత్యంబు లాచరించి కడువైభ
వంబునం బురమార్గంబున వేడ్కం దోడ్కొనివచ్చి విడిది
గృహంబున నుంచి హరికి సంతోషం బొనరించి నిజమందిరం
బున కేగి తొండమానుని శౌరిసాన్నిధ్యంబునకుఁ బంప
నతండు వచ్చి హరిహరబ్రహ్మాదులకు నమస్కరించి గౌరవం
బున భోజనంబులు చేయించి తాంబూలంబు లిప్పించి గృహం
బున కేగి గురువాక్యప్రకారంబున నాకాశరాజు భార్యా
పుత్రికలతోడ సన్మంగళస్నానంబులు చేసి వివాహమండపం

బున వివిధవాద్యాదులు మ్రోయుచుండ నాందీప్రముఖవిధి
విహితకర్మకలాపంబు లాచరించె నంత.

200


సీ.

అస్తమయముగాఁగ హరితోడ విడిదిలో
        బ్రహ్మరుద్రాదులు పవ్వళించి
నిదురించి రావల నుదయపర్వతముపై
        నరుణోదయంబయ్యె నపుడ లేచి
యందఱు స్నానసంధ్యాదికృత్యంబులు
        నెఱవేర్చి రంతట హరియు స్నాన
సంధ్యాదు లొనరించి సంతోషమారంగ
        నావసిష్ఠులఁ జూచి యనియె నిట్లు


తే.

నేను లక్ష్మియు నజుఁడును నీవు వకుళ
మాలికయు భుక్తిఁ గొనక నేమమున సుండ
వలెఁ గదా కన్య నొసఁగెడివారలింట
నవ్విధంబుండవలెఁగదా యనుచు మఱియు.

201


తే.

తొండమానుండుసు బురోహితుండు నైన
సురగురుండు భుజింప కచ్చోటఁ దగిన
నియమమున నుండవలెఁగదా! నిలిచినట్టి
వారలందఱు భుజియింపవచ్చుఁ గనుక.

202


వ.

త్వరగ బ్రాహ్మణభోజనంబు సేయింపందగు ననిన విని వసి
ష్ఠుండు కుబేరుని కాయుదంతంబంతయుం జెప్పి పంప నతం
డరిగి యువాసనియమసంతర్పణప్రకారం బాకాశరాజుకుం
జెప్ప నృపాలుండు సంతసించి మధ్యాహ్నంబునకు బ్రాహ్మణ
సంతర్పణంబు సేయించి యొక్కొక్కనిష్కంబు దక్షిణ లిచ్చి
ప్రొద్దుగ్రుంకినపదమూఁడు గడియలకు ముహూర్తంబు

గావలయుఁ దగు మంగళద్రవ్యంబులు వివాహమంటపవేదిక
యందు నుంచవలయు నని పరిచారులకు నియమించి పురో
హితబంధుమిత్రకళత్రజనాదులతో ధరణీదేవి సువా
సినులం దోడ్కొని సాయంసమయంబున మంగళవాద్యం
బులతో హరియుండు విడిది మందిరంబున కేగి నక్షత్రగణ
పరివృతుండైన సుధాకరుని చందంబున నజశంకరుల నడుమ
నవరత్నపీఠంబునం గూర్చునియుండు హరిని జూచి యానం
దించి వసిష్ఠాదిమునులం జూచి స్వామివారిం దోడ్కొని
మద్గృహంబునకు రావలె నని ప్రార్థించె నపు డాస్వామిని
పసిష్ఠుండు పూజింపు మని చెప్పిన విని ధరణీదేవి సంకో
చంబున నరుంధతిని మున్నిడుకొని భయభక్తు లెసంగ
నాస్వామికి దివ్యవస్త్రాభరణచందనతాంబూలంబు లర్పించి
పుష్పహారంబు కంఠంబున నుంచి కృతార్థురా లైతి నని సంతో
షించెఁ దొండమానుఁడు సభాసదులకుం జందనపుష్పతాంబూ
లంబు లిప్పించె ననంతరంబు.

203


సీ.

ఐరావతముమీఁద హరిని శ్రీసతి నుంచి
        కొని రాజవీథులం గోరి రాఁగ
వేడ్కమై వరచతుర్వేదఘోషణములు
        ఘనయక్షగంధర్వగానములును
మిన్నంది ఘోషింప మెఱయుచు రంభాది
        వనితలు నృత్యముల్ వఱల సల్ప
ఘనతరకరదీపగగనబాణంబులు
        పెక్కుదిక్కులను దీపింపఁగాను

తే.

సకలదిక్పతులును పద్మసంభవుఁడును
గొలువఁగాఁ జక్రి సంతోషకలితుఁ డగుచు
నిర్మలుం డగునాకాశనృపతి నగరు
సేరుటకు వచ్చి మందిరద్వారమునను.

204


తే.

నిలువ మంగళవాద్యాలు నెమ్మిఁ జెలఁగఁ
దొండమానునిభార్య సంతోషముగను
నైదువులతోడఁ జేఁబట్టి హరికి సిరికి
మంగళారతు లిచ్చె శుభాంగముగను.

205


క.

తనకును సిరి కారతు లి
చ్చినవారికి వీడెములను జీనాంబరముల్
ఘనమతి వరనిష్కములను
బెనుపుగ నిప్పించె నాకుబేరునిచేతన్.

206


వ.

అంత శ్రీనివాసుం డైరావతంబు డిగ్గి లక్ష్మిని కరంబు పట్టుకుని
బ్రహరుద్రాదులుతోడ నంతగపురంబులోని కేగి కల్యాణమంట
పంబునం జతురశ్రరత్నవేదికలయందున్న హేమసింహాసనం
బుమీఁద లక్ష్మీసమేతంబుగఁ గూర్చుండగ విధ్యుక్తముగ
నాకాశరాజేంద్రుఁడు నిశ్చితార్థం బొనర్చె నంత.

207


సీ.

అమరఁ బద్మావతి కనసూయ మొదలగు
        నైదువలెల్ల సమ్మోద మెసఁగ
భాసురనూతనాభరణంబులను నవ్య
        చేల చందనపుష్పమాలికలను
గాటుక కుంకుమ క్రమముగ నిపు డలం
        కారంబు చేసి శ్రీగౌరిచెంత

నుంచి పూజలను జేయించిన ఋషులు క
        న్యావరణము చేసి రంత వేడ్క


తే.

సుతను దీవించి మంగళసూత్ర మఱుతఁ
గట్ట నాధరణీదేవి కన్యతోడఁ
గూడ నైదువలను దోడుకొని వివాహ
మంటపము చేర వచ్చి నెమ్మనము నెసఁగ.

208


తే.

తూర్పుముఖముగ సుత నుంచెఁ దోయజాక్షుఁ
డచట పశ్చిమముఖముగ నలరుచుండె
నలఘుమంగళవాద్యము ల్చెలఁగుచుండ
విప్రవర్యులు చూడంగ విధిక్రమమున.

209


క.

గడియలు కావచ్చిన దని
కడువడిఁ బురుహూతముఖ్యగంధర్వాదుల్
కడుకొని చెప్పఁగ నృపుఁ డ
క్కడ హరిసాన్నిధ్యమునకుఁ గ్రక్కునఁ జేరెన్.

210


సీ.

అచ్చట వైవాహికాంగద్రవ్యంబులు
        గని వసిష్ఠుఁడు ముదంబును దగంగ
నపుడు నూతనభర్మయజ్ఞోపవీతముల్
        ధరియించి కంకణధారణంబు
చేయించుకొని యున్న శ్రీహరిపాదప
        ద్మముల బంగరుపళ్లెరమున నుంచి
తపసులు పురుషసూక్తంబులు చెప్పంగ
        పుణ్యతీర్థమును నాభూపవరుని


ఆ.

భార్య దెచ్చి యీయఁ బరమానుముదమునం
గడిగి యమలతీర్థ మెడఁద భక్తి

శిరముఁ జల్లికొనుచు సరవి భార్యశిరంబు
నందుఁ జల్లె బంధులందుఁ జల్లె.

211


సీ.

ఆచక్రి కాచమనార్ఘ్యము మధుపర్క
        మిచ్చి పద్మావతి నెలమిఁ బిలచి
జగదీశుఁ డవల నుండఁగ నిర్వురకు మధ్య
        మున యవనికఁ బట్టి మొనసి నృపతి
యను ముదంబున నప్పు డత్రిగోత్రజసువీ
        రకభూమినాథపుత్రికను ధర్మ
రాజాత్మజుఁడ నభోరాజాఖ్యుఁడను నేను
        నాకన్య నిచ్చెద నీకు నిప్పు


తే.

డగ్నిసాక్షిగఁ జేఁబట్టు మంబుజాక్ష
యనఁగ విని చక్రి సంతోష మతిశయింప
సకలసురమునిముఖ్యులు సాక్షిగాఁగ
నావసిష్ఠానుమతి నిట్టు లనియె నపుడు.

212


వ.

వసిష్ఠగోత్రోద్ఛవ శూరసేనాత్మజ వసుదేవపుత్త్రుండనై,
వాసుదేవనామధేయంబు నొంది శ్రీవేంకటేశ్వరుండ నైన
నీయత్రిగోత్రసంజాత యగు పద్మావతిని నగ్నిసాక్షిగఁ బాణి
గ్రహణం బొనర్చెద నని పల్కిన విని నృపాలుండు హరికి వర
దక్షిణ కోటినిష్కంబులు సమర్పించి యవ్వల నమూల్యాభర
ణాంబరంబులును నవరత్నరచితశతభారకిరీటంబును దత్సం
ఖ్యాకభారసువర్ణరత్నరచితబాహుపురులును విమలరత్నాం
చితముత్యాలహారంబును నాగాభరణంబును, దివ్య
మౌక్తికకుండలంబులును ద్వాత్రింశద్భారసువర్ణకటిసూ
త్రంబును, భాగ్యప్రదపద్మరాగగోమేధికస్థగితవీరము

ద్రాద్యంగుళీయకంబును, దశభారవజ్రకవచంబును, నష్టా
దళసువర్ణభారపాదుకయుగళంబును శ్రీనివాసునకు
నలంకారంబు సేయించి ఋషులు మంగళాష్టకంబులు చదువం
గుశపుష్పహిరణ్యాక్షతోదకంబులు చేఁబట్టి కనకరత్నా
భరణాంబరభూషిత యగు కన్యకను హరి కరకమలంబుల
దారవోసి యానందపూరితబాష్పలోచనుండై ధర్మార్థకామ
మోక్షసంకల్పంబులయం దీకన్యకారత్నంబును గొని ప్రియం
బున రక్షింతువుగాత, అని సాభిప్రాయపూర్వకంబుగ స్వామిని
ప్రార్థింప నాకర్ణించి హరి మహాప్రసాదం బనుచు నాకాశ
రాజేంద్రుని వచనంబు లంగీకరించె. నంత మాంగల్యకంకణ
ధారణంబులును, అక్షతారోపణంబును, బ్రధానహోమం
బును, సప్తపదాతిక్రమణంబును, లాజహోమంబును, ప్రవేశ
హోమంబును, నరుంధతీపతివ్రతావలోకనంబును, పతివ్ర
తాంగనామణుల సందర్శనంబును, స్థాలీపాకంబును, నౌపాస
నాదులును, వృద్ధదంపత్యాశీర్వచనంబులును, మున్నగునవి
గురువసిష్ఠాత్రిప్రముఖులు నిర్వర్తించి రంత రాజేంద్రుఁడు
పోడశమహాదానంబు లిచ్చి గంధాక్షతపుష్పంబుల సభకుం
బూజచేసి ఫలదక్షిణతాంబూలంబు లొసంగి సంతుష్టులం
జేసె నంత.

213


సీ.

బ్రహ్మరుద్రాదులు పరిఢవిల్లెడు సభఁ
        బేర్మి యౌ నవరత్నపీఠ మునిచి
పటువజ్రకలితదీపస్తంభములమీఁద
        బహుళమాణిక్యదీపములఁ బెట్టి

పైడిపళ్లెర ముంచి భక్ష్యభోజ్యాదిప
        దార్థము ల్వడ్డించి రపుడు శౌరి
వనధిజ పద్మావతిని తా నుభయపా
        ర్శ్వముల నుంచుకొని ముచ్చటలు మీఱఁ


తే.

దనకుఁ జుట్టురు బంతులు దనరియున్న
బ్రహ్మరుద్రాదులుం గూడఁ బ్రమదమార
నారగించుచు నుండఁగ నంద మొదువఁ
దాను భుజియించె విభవంబు తనర నపుడు.

214


వ.

అంత నందఱు హస్తపాదప్రక్షాళనం బొనర్చుకుని దివ్యమం
దిరం బొక్కయెడ వీడెములను జేసి యించుక నిదురించిరి.

215


ఆ.

నిదురఁ జెంది సూర్యుఁ డుదయింపఁగా లేచి
వారివారిపనులు వఱలఁజేసి
రంత సిరికిఁ బద్మ కలరంగఁ జక్రికి
నల్గు లిడిరి దినదినంబు నెలమి.

216


సీ.

నలుగులు [3]నామెతనంబులు బువ్వముల్
        సంతర్పణంబులు సంతసముగ
నడుపుచు మూఁడవఁనాడు [4]పాకెన చేసి
        నయముగ నాల్గవనాఁటిరాత్రి
అందఱతో శౌరి హరిబువ్వము భుజించి
        శయనించి పిదప దా జామురాత్రి
కడ లేచి సరవి నప్పుడు శేషహోమము
        గావించి యగ్నికి భావమలర

తే.

మ్రొక్కు లిడి తనచేతికిఁ జిక్కినట్టి
కనకకలశముఁ గొని దొంగతనముగాను
బొరుగువారిల్లు సేరె నప్పుడు రయమున
నగజ మొదలగు నింతులు నగుచు లేచి.

217


తే.

కాంచి పద్మావతిని హరికడకు నెలమిఁ
దోడుకొని వోయి మోహము దొడరఁ జంద
నంబు నలఁదించి పుష్పహారంబు గంఠ
మందు నిడఁజేసి తాంబూల మలదె.

218


వ.

పట్టుకొను మని లజ్జమాని నాతోడ రమ్ము కోపం బేల యని
యడిగించి యిప్పించి రంత.

219


చ.

అన విని పెండ్లికూఁతురు మహాభయభక్తులు మానసంబునం
బెనఁగొన హాసచంద్రికలు బింబనిభాధరమందుఁ గ్రమ్మగాఁ
గనుఁగవ బెళ్కుముద్దుఁ గులుకంగ నిజేశుని మోము చూచి ల
జ్జను దలవాంచి చిల్కవలె జాణతనంబున నవ్వు చిట్లనెన్.

220


సీ.

ఆత్మేశ చోరుఁడ వై నీవు మాచెంబు
        దెచ్చినా వది యేమి చెప్పవోయి
మఱి యజ శివులముందఱఁ జిన్నపని నీవు
        చేసినదే చాలు చెప్పవోయి
అల లక్ష్మికిని నాకుఁ దలవంపుపని నీవు .
        చేసినకత మేమి చెప్పపోయి
ఘననాక బలికాలమునఁ దేఱ కీయల్కఁ
        జేసి వచ్చిన దేల చెప్పవోయి


తే.

దేవ పెండ్లికి నీ వప్పుఁ దీసినట్టి
ద్రవ్యమున కీడుగా దొంగతనము చేసి

తెచ్చితివి చెంబు దీనిచేఁ దీఱ దప్పు
రమ్ము మే మీయఁగలము వరాలు సామి.

221


ఆ.

గొల్లవారియిండ్లఁ గొల్లఁబెట్టుచుఁ బాలు
వెన్న మ్రుచ్చులించుచున్నబుద్ధి
విడున కూరివారి వేశ్మమునం దిట్లు
చెంబు దొంగిలింపఁ జెల్లదోయి.

222


వ.

అని యనేక ప్రకారంబులం బ్రియోక్తులం బ్రార్థించి పల్కినం
జూచి హరి చిఱునవ్వు నవ్వి పద్మావతి కరంబును బట్టుకుని
తొడయందుఁ గూర్చుండఁబెట్టుకొనఁగ నందుండు జను
లందఱు మందహాసంబులు చేసి రంత హరి పద్మావతి కరంబు
పట్టుకొనఁగ నందఱు వైభవంబున వివాహమందిరంబునకుఁ
దోడ్కొనివచ్చి యావలం గ్రమ్మఱ మంగళస్నానం బొనర్చి
వస్త్రభూషణాలంకృతుఁడై రమాపద్మావతులతో నవరత్న
పీఠంబునం గూర్చునియుండె.

223


సీ.

అల నాకబలి దేవతార్చనంబును నీల
        మణిధారణంబును మధురఫలము
లార్యులకొసఁగుట లైదువలకు శూర్ప
        దానముల్ సేయుట దనరగా వ
సంతోత్సవంబును సరవి దంపతులకు
        ఫలపుష్పతాంబూలములను బేళ్ల
నడిగి యిచ్చుట వార లానందముగఁ జెప్పి
        దీవించి పోవుట భావ మలర


తే.

నాంది వైసర్జనము చేసి నరధవుండు
వచ్చియుండెడు బ్రహ్మాదివర్యులకును

బంధుమిత్రాదులకును సంపత్కరముగ
మంగళస్నానములను బొసంగ నపుడు.

224


వ.

చేయించి దంపతులుగం గ్రమంబుగ నుచితాసనంబుల
గూర్చుండఁబెట్టి భార్యయుం దానును వారివారిం దగు
మర్యాదవచనోక్తులం జందనపుష్పనూతనాంబరాభర
ణాదు లొసంగి ఫలతాంబూలంబుల నిచ్చె నంత నాఁటి
సాయంకాలంబున నలంకారయుక్తంబు నగు నైరావతంబున
హరిని సిరిని పద్మావతినిం గూర్చుండఁజేసి పురవీధులయందు
సంతసంబున నుత్సవం బొనరించి నిజమందిరంబునకుఁ జేర్చి
హరితోడవచ్చిన పరిజనంబులకు సంతసం బారఁ బసదనంబు
లొసంగి యనంతరంబు కృతార్థుండ నైతి నని నెమ్మదిఁ జెందె
నమ్మఱునాఁ డరుణోదయంబున హరి ప్రయాణోన్ముఖుండై
పద్మావతిం బంపుఁ డనిన నయ్యాకాశరా జిట్లనియె.

225


సీ.

శ్రీశేషగిరివాస శ్రీసతితోడ మీ
        రొక్కమాసం జైన నుండుఁ డిచట
ననుచుఁ బ్రార్థింపఁగ హరి యిట్టు లనియె నిం
        దుండగూడదు పను లుండు నచట
ననఁగఁ బద్మావతి నంపించువిధ మెట్లు
        పసిబిడ్డ యగు గాని ప్రౌఢ గాదు
గాన నే నిపు డంపలే నన్న విని చక్రి
        సిరిఁ జూచి కనుసన్న చేసె నపుడు


తే.

చక్రిభావంబు దెలిసి యాజలధికన్య
తాను నాకాశనృపుఁ జూచి తండ్రి పద్మఁ

జక్రితోఁ బంపవచ్చును సంతసంబ
మాకు నిప్పుడ మఱి చింత మీకు వలదు.

226


సీ.

వకుళమాలిక తల్లివలె బ్రోచు నచ్చోట
        నన్యు లెవ్వారు లేరని యనేక
రీతులుగా సిరి ప్రీతిమై పల్కఁగ
        నతఁడు సమ్మోదము నప్పు డొంది
సిరికిని దనయకుం జెలువారు దివ్యాంబ
        రాభరణంబు లొప్పార నొసఁగఁ
జేసి ముత్యంబులు చెలఁగి పుత్త్రికలకు
        నొడిఁబ్రాలుఁ గట్టించి యుల్లమలర


తే.

హరికి వస్త్రాభరణముల నలరఁజేసి
తనయ నాసిరి కొప్పించె నెనరు మించి
హరి మఱందికి వస్త్రభూషాదు లొసఁగె
వకుళ కాధరణీదేవి వఱలుగరిమ.

227


వ.

అమూల్యాభరణాంబరంబుల నలంకరింపఁజేసి ఫలపుష్పతాం
బూలాదుల నెలమి వఱలంజేసె నంత.

228


క.

గగనాధీశుం డంతట
జగదీశునిజెంతఁ జేరి సచ్చిత్తుం డై
నిగమాంతగుంభితోక్తులఁ
బొగడుచు మఱి యిట్టులనియెఁ బొలు పారంగన్.

229


సీ.

పెద్దకాలమునుండి బిడ్డలు లేకుండి
        గాంచితిఁ బద్మను గమలనయన
నీకన్య గల్గిన నెలమిచే వసుధానుఁ
        డుదయించె వానిని ముదముగాను

బాలింపవలయు మాపద్మావతీదేవి
        నిచ్చితి గనుక మీ రింకమీఁదఁ
జిరకృప నీటముంచినఁ బాలముంచిన
        భారంబు మీదంచు బాష్పములను


తే.

గన్నులను నించి మఱువల్కకున్న చక్రి
భూవరుని జూచి వల్కె గంభీరముగను
మామ మీకూఁతునకుఁ జింత యేమి వలదు
రక్షణము సేయ నే కమలాక్షినయ్య.

230


తే.

పెద్ద లైతిరి మీరు సంప్రీతి నెపుడు
చూడుఁ డొప్పుగ మాయందు సుభగయుతుఁడ
యనుచు నుండఁగ నొకగంభ మొనరఁబట్టు
కొని ప్రియోక్తుల నత్త యిట్లనియె నపుడు.

231


తే.

అయ్య మాపద్మ నేలుము నెయ్యమార
దాని కొకకష్ట మెఱుఁగదు దైత్యనాశ
బాల సుకుమారి లక్ష్మితోఁ బరఁగువాఁడ
వగుట పెక్కులు చెప్పంగ నగునె నాకు.

232


వ.

అంత రమాదేవికిని వకుళమాలికకును జెప్పఁదగిన వచనంబులు
చెప్పె నంత నాహరి ప్రయాణంబై యున్నయెడ నారాజేం
ద్రుఁడు శాలితండులంబు లిన్నూఱులక్షల భారువులును,
ముద్గధాన్యంబు ముప్పదిభారువులుసు, తింత్రిణీఫలేక్షుఫలం
బులు నలువదివేలభారువులును, సహస్రక్షీరభాండంబులును,
శతశర్కరమధుఘటంబులును, కదళీకూష్మాండకందమూలాది
శాకనిచయంబును, హింగుళీయాదిపాకపదార్థంబులును,
హయగజవృషభంబులపై నిడి శ్రీనివాసార్పితంబుగ దత్తంబు

చేసి, మఱియు దాసీజనశతంబును ద్రిశతదాసజనంబులును,
దశసహస్రగోవులును, దివ్యపర్యంకాద్యనేకోపకరణంబును,
ద్రికరణంబుగా నిచ్చి హరిసాన్నిధ్యంబునకుఁ గ్రమ్మఱ
వచ్చినం జూచి శ్రీనివాసుండు లేచి యిట్లనియె.

233


సీ.

అవనీశ మీసుత కరణంబు తగుమాత్ర
        మీవలె నింత మా కేల ననఁగ
నాకాశనృపుఁ డిట్టు లనియె లక్ష్మీశ మీ
        కేమి తక్కువగాదు హెచ్చుగాను
బూని మీ కీయను నే నెంతవాఁడను
        గలుములచెలి మాకుఁ గరుణ మెఱయ
నిచ్చిన దిచ్చితి నింతమాత్రం బైన
        గైకొనుఁ డని వల్కి కరము మోడ్చె


తే.

నపు డగస్త్యాశ్రమంబున కరుగవలయుఁ
బద్మ నిఁకఁ బంపుఁ డనఁగ నాపద్మతండ్రి
సుతనుఁ జూచి ప్రియంబార సురుచిరోక్తు
లెసఁగఁ జెప్పి మఱింక నీ విపుడు చక్రి.

234


వ.

వెనువెంట జను మనినం దల్లియు నిట్లు వచించె.

235


చ.

అన విని పద్మ సంప్రియము నంబను జేతులఁ గౌఁగిలింపఁగా
నెనరున బిడ్డ నెత్తి ధరణీవతి కన్నుల నీరు నింపుచున్
మనమునఁ బ్రేమ ముద్దులిడి మచ్చికమైఁ దగ గారవించి యి
ట్లనియె విచార మేల సిరి యంతకు నున్నది పో కుమారికా.

236


సీ.

నాకన్న నెక్కువ నళినాక్షి నిను సిరి
        మన్నించుచుండు నెమ్మనము దనర

నది గాక వకుళ ని న్నాదరించుచు భక్తి
        చేఁ గృప నచట పోషించుచుండు
హరి సిరి నిను నొక్కసరణిగ నీక్షించు
        నేల చింతించెదు బేల యగుచుఁ
బతిభక్తి గల్గి నీపతితోడ వేంకట
        గిరియందు సిరితోడఁ బరఁగుచుండు


తే.

మేము వచ్చెద మచటికిఁ బ్రేమమీఱ
నీవు వత్తువు మాతోడ నెమ్మి నిటకుఁ
జెలఁగి వొమ్మని శ్రీలక్ష్మి చేతి కిచ్చి
పరఁగ నిట్లని వల్కె నిందిరను జూచి.

237


క.

అమ్మా సిరి పద్మావతి
నిమ్మధుసూదనుని కిచ్చి తిటఁ గడు సమ్మో
దమ్మున నాసుత మఱి మీ
సొమ్మైనది గానఁ గరుణ చూడుము తల్లీ.

238


సీ.

ఆటలాడుచునుండు నబల యేపనిపాట
        లెట్టిదో తప్పొప్పు లెఱుఁగ దిపుడు
కావున మీరు చక్కగ బుద్ధు లిఁకఁ జెప్పి
        వరుసగ దిద్దుకోవలయు సరవి
నామఱంగున నిన్నినా ళ్లుండె నిపుడు మీ
        మఱఁగునఁ జేరె నెమ్మదిగఁ గనుఁడు
బిడ్డలు లేకయ పెద్దకాలం బుండి
        కాంచితి నీకన్యకను బ్రియమునఁ


తే.

బెంచి నీచేతి కిచ్చితిఁ బిన్నపడుచు
నెట్లు బ్రోచిన మీభార మింక నేను

జెప్పవలసిన మాటలు జెప్పినాఁడ
నంచుఁ గన్నీరు నింప నిట్లనియె లక్ష్మి.

239


మ.

ధరణీదేవి ముదంబుతో జనక యీతాపంబు నీ కేల నేఁ
బరఁగ న్నన్నును నీసుతం గరుణమై భావించి రక్షించు శ్రీ
హరియం దున్నది చింత సేయ కిఁక నీ వానందచిత్తంబునన్
గరుణం జూడుము మమ్ముఁ బెద్దవు సుఖఖ్యాతిం దగం బొందుమా.

240


వ.

అనుచుండఁ బద్మావతిం జూచి ధరణీదేవి యిట్లనియె.

241


తే.

వినవె నాముద్దుపట్టి వివేకముగను
హరికి సిరికిని శ్రీవేంకటాద్రియందుఁ
గీర్తి నొందుము భక్తిసంపూర్తి సేవఁ
జేయుచును దల్లి! సిరితోడఁ జేరి పొమ్ము.

242


క.

అప్పద్మావతి తల్లిని
తప్పక కని కనుల బాష్పధారలు వెడలన్
ఱెప్పల నడ్డము సేయుచు
నప్పుడు సిరితోడ విభుని కభిముఖి యయ్యెన్.

243


వ.

అంత శ్రీనివాసుండు లక్ష్మిని బద్మావతిని దోడ్కొని గరుడ
వాహనము నెక్కి బ్రహ్మాదులతోడ నగస్త్యాశ్రమంబునకుం
బోయి బ్రహ్మరుద్రాదులకుం దమ కాదినంబందు నగస్త్యులు
తన తపోబలంబున నానందంబుగ విందులు చేయించె.
నమ్మఱునాఁడు బ్రహ్మాదులుతోడ వేంకటాద్రి కేగి యచ్చట
నెల్లరకుం గ్రమ్మర విందు లొనరించి గౌరవింప వా రెల్లరు
మాధవు నాజ్ఞానుక్రమంబునం దమనివాసంబుల కేగిరి సిరి

కొల్లాపురంబునకుం బ్రయాణం బై హరిం జూచి సవినయం
బుగ నిట్లనియె.

244


తే.

దేవ కరవీరపురి కరుదేరవలయుఁ
గరుణతో సెలవిమ్ము మోకంజనయన
విని శిరము వంచి విన్ననై వెన్నుఁ డపుడు
కమలనేత్రను జూచి తాఁ గరము పట్టి.

245


వ.

ఇట్లు వక్కాణించె.

243


సీ.

ఇందిర నన్ను నీ వెడఁబాసి పోను గా
        ళ్ళాడునే నిన్నుఁ బొమ్మంచు నాకు
నోరాడునే? నీవు నూతనబంధుల
        వలె సెల విమ్మంచుఁ బలుకఁదగునె?
పద్మావతిని నీవె పాలింపవలయు నీ
        కన్యను బోషింపగలనె తగునె?
యకట నీ విందుండ కరిగినకతముచే
        ధనదుఁ డిచ్చిన యప్పు దప్పకుండ


ఆ.

నేను దీర్పఁగలనె? యియ్యెడ నాకూడ
నుండు మన్నిటకు నఖండసౌఖ్య
దాయిని వయి నన్ను ధన్యుని జేయుము
నాకు దిక్కుగలదె నీకుఁ దప్ప.

247


వ.

అనిన విని యిందిర మందహాససుందరవదనారవింద యగుచు
నరవిందదళాక్షున కిట్లనియె.

248


మ.

సకలజ్ఞత్వము డాఁచి దివ్యమహిమల్ చాలించి పద్మావతిం
బ్రకటాసక్తిని బెండ్లియాడితివి సౌభాగ్యంబు నీ కిచ్చి నే

నిఁక నెందుండిన చింత లేదు నను నీ విందుండు మంచు న్వచిం
పక పంపించుము వచ్చెద న్మఱల నోప్రాణేశ శీఘ్రంబుగన్.

249


చ.

అన విని వెన్నుఁ డిట్లనియె నంబుధికన్యక నేను రాముఁడై
జననము నొందియున్నతఱి జానకివై మఱి లంకలోన ము
న్నొనరుచు నున్న వేదనతి నొప్పి వివాహము చేసుకొమ్ము నీ
వనిన రహస్యసూక్తి హృదయంబున నున్నదొ లేదొ యెంచుమా.

250


మ.

అనలం బందుఁ జెలింపకున్నపుడు నీ కాప్తంబుగా మేలు చే
సిన యావేదవతీవధూమణియ రాజీవంబులో నుండఁగాఁ
గని యాకాశనృపాలుఁ డీసతిని తా గారాబుగాఁ బెంచె నీ
నని యున్నట్టివిధంబుఁ దప్పక వివాహం బైతిఁ బద్మావతిన్.

251


శా.

నే నీవాక్యము మీఱరా దనుచు నీ నీరేజపత్రేక్షి ని
ట్లానందంబుగఁ బెండ్లియాడితిని నిం కన్యోన్యభావంబుగా
దీనిం బాలనమాఱఁజేయుటకు నీదే భారమై యుండఁగాఁ
బైనం బైతివి తేరకత్తెవలె నాపైఁ బ్రేమ యింతేగదా.

252


ఉ.

పావనమూర్తి యైనమునిపాదము నాయురమందుఁ దాఁకఁగా
నీవపు డల్గి వోయితివి ని న్నెడబాసిన జాలిచేత నే
నావల నన్నియు న్విడిచి యార్తిని బొందుచు వచ్చి పుట్టలో
నీవఱదాఁక యుంటి నిపు డిందుముఖీ యురమందు జేరుమా.

253


చ.

నను విడనాడి దూరముగ నర్మిలి నెంచక తొంటియట్ల నే
జనెదని చెప్పు టేల పతిసన్నిధి నుండుటె ధర్మ మింతికిం
దనకును దవ్వునుండుటకు ధర్మము గాదని నీ వెఱుంగవే
గనుక యురంబునం బ్రియముగా వరభూషణరీతి నుండుమా.

254

మ.

అని నారాయణుఁ డానతీయఁగ మహాయాసంబుతో లక్ష్మి యి
ట్లనె నోనాథ భృగుండు నీయురమునం దజ్ఞానియై తన్నినం
దున నిచ్చో నిలువంగ లేక యట సంతోషంబుగా నిల్చి నే
ననిశంబు న్మదిఁ గుందుదాన నిఁక నే మందుం ద్రిలోకేశ్వరా.

255


శా.

కాలం బీగతిఁ జేసె నాభృగు ననంగా నేల నాయందు నీ
మేలైనట్టి దయారసం బిడినచో మేలొందుచు న్నుండెదన్
లీలామానుషవిగ్రహా యిఁక సదా లీలం దగంగన్య న
న్బోలె న్నామది కష్ట మియ్య వని నంభోజాక్ష మన్నింపవే.

256


క.

శ్రీ రాముఁడ వైనప్పుడు
వారక నే వేదవతిని వరకృతో నీ
వారయఁ గొనుమని చెప్పితి
వారీతం బెండ్లియాడి యైనది వేడ్కన్.

257


వ.

అని ప్రియోక్తులం బద్మావతిని గారవించి హరికి సంతసంబున
సేవఁ జేయుమని యనేకప్రకారంబులుగ బుజ్జగించి చెప్పి వకుళ
మాలిక నీక్షించి యిప్పడంతిని బోషించుచుండుమని నియమించి
హరికి మ్రొక్కి రమాదేవి కొల్లాపురంబు చేరి చక్రిని హృద
యకమలమునం దిడుకొని సుఖస్థితి నుండె నంత వేంకటేశుండు
అగస్త్యుని వీక్షించి యిట్లనియె.

258


తే.

సంయమీశ్వర వేంకటాచలము చేర
మేము వోయెద మని వల్కఁగా మునీంద్రుఁ
డనియె షాణ్మాసపర్యంత మహిగిరీంద్ర
మెక్కుదురె పెండ్లికొమరు లోయిందిరేశ.

259


క.

అనఘా షాణ్మాసంబులు
చను నంతకు నిచటనుండు సంతోషము చా

లన విని వేంకటగిరిపతి
తనసతితో నచట నుండెఁ దద్దయు వేడ్కన్.

260


వ.

అంతం గొన్నిమాసంబులకు నాకాశరాజేంద్రుండు వైకుం
ఠంబున కరిగిన వసుధానుం డుత్తరక్రియ లొనర్చి దూత
మూలకముగ నారాయణవనంబునకు నవ్నార్త వినిపోయి
తొండవానుని విచారించి దుఃఖించుచుండిన పద్మావతి నూర
డించె ననిన విని శౌనకాదు లిట్లనిరి.

261


సీ.

ఆకాశరాజు శ్రీహరిపదంబునఁ జేరి
        విమలుఁ డైవోయినవెనుక యతని
తమ్ముఁడు తనయుఁ డిద్దఱు నుండి రందుఁ బ
        ట్టార్హుఁ డెవ్వం డయ్యె నావిధంబు
చెప్పు మటన్నఁ దా నప్పుడు సూతుండు
        మునులార నృపతమ్ముఁడు ధరిత్రిఁ
దన దైన నగనృపతనయుండు తమతండ్రి
        యేలిన రాజ్య మే నేలవలయు


తే.

ననిన విని తొండవానుండు నాగ్రహించి
పలికె నిరువురమునుగూడి భండనంబు
చేయుదము నీవు మించి గెల్చినను బృథ్వి
నీది నే మించి గెల్చిన నాది ధాత్రి.

262


క.

అని యిర్వురు పౌరుషముల
నెనయుచుఁ గయ్యం బొనర్ప నేతెంచి హరిం
గని తొండవానుఁ డనె ని
ట్లని వీర్యం బారఁ జేయు మని మఱి యనియెన్.

263

సీ.

వసుదేవసుత నేను వసుథానుఁ డీక్షితి
        కొఱ కింక ఘోరాజి మెఱయఁ జేయ
వలయుఁ దోడ్పడు రమ్ము చెలఁగి నీ వన నవ్వి
        తన మది నిటు దాసు దలఁచె శౌరి
తొండవానుని కేను దోడుగఁ బోయితి
        నైనఁ బద్మావతి కలుక పుట్టు
తనతమ్ముఁ డగు వసుథానునిప్రక్క నే
        నుండిన సతి చాల నుత్సహించు


తే.

తొండవానుండు పరమభక్తుండు నాకుఁ
బరఁగ వసుథానునిం గన బావమఱఁది
గనుక యిర్వురితోను సఖ్యంబు వొసఁగఁ
జేయవలె దీని కిఁక నేమి సేయు దకట.

264


మ.

అని యోచింపుచుఁ దొండవాను నపు డయ్యబ్జాక్షుఁ డీక్షించి యి
ట్లనె నోమామ మహాజి దిపుడు తోడై నేను నీదిక్కు వ
చ్చిన పద్మావతి తోడఁబుట్టుకొఱకై చింతించుచుండు న్మదిన్
నిను వీడం దగ దెట్టులైన జయ మే నీతట్టుగా నుంచెదన్.

265


సీ.

అని రహస్యంబుగ నతని కాప్తతఁ జెప్పి
        సమ్ముదంబునఁ దనచక్ర మిచ్చి
పంపించె నటుమీఁద బావమఱఁది వచ్చి
        తనకుఁ దో డడుగఁగ విని రయమున
లేచి యావకుళమాలికకుఁ బద్మావతి
        నం దొప్పగించి నెయ్యంబు మెఱయ
బావమఱఁదితోడఁ బైనమై నారాయ
        ణాఖ్యపురంబున కరిగి యచట

తే.

భండనము చేయఁ జతురంగబలములందుఁ
గొలువఁగా బావమఱఁదిని గూడి సమర
భేరి వేయించె నప్పు డాభూరిరవము
తొండవానుండు విని మహోద్దండుఁ డగుచు.

266


క.

శరచాపంబులు గైకొని
సరవిగ ధైర్యంబు గదుర సంగరమునకున్
హరికిని వసుథానునకును
సరగున నెదురేగి నిలిచె సంరంభముతోన్.

267


వ.

అప్పుడు హరియును వసుథానుండును గనకరథంబు లెక్కి
వీర్యవీరులై నిల్చియుండుటం జూచి తొండవానుండు తన
రథముపై నుండి నిజచతురంగబలంబులం బరబలంబుపైఁ
బురికొల్పి నప్పు డుభయబలంబు లుప్పొంగి రథంబులుమీఁద
రథంబులును గజంబులమీఁద గజంబులును ఘోటకం
బులుమీఁద ఘోటకంబులును గాల్బలంబులపైఁ గాల్బ
లంబును బడి యొండొరులు కరవాలంబుల ఝళింపుచు
నఱకుచు నుఱుకుచు ధనుష్టంకారంబు చేసి బాణంబులం
బ్రయోగించుచు డాయుచుం గుదియుచు నఱచుచు బాహా
స్ఫాలనంబు చేసి ప్రతాపంబులు వల్కుచుం గుంతలంబులన్
గ్రుచ్చుచు ముద్గరంబుల నొడిసిపట్టి ద్రిప్పుచుం బొడుచుచు
శూలంబుల నాటించుచుం బూర్వపశ్చిమసముద్రంబులు
దారసిల్లినభంగి సోరుచుండిరి తొండవానునిబలంబు లరిబలం
బునంబడి పోరాడంజాలక యులుకుచున్నంజూచి నిలునిలువో
తగదని సిలచి వసుథానుండు తనరథంబు దోలించి చండకాం
డంబులం బ్రయోగింప నది యోపంజాలక తొండవానుం

డుద్దండపరాక్రమంబు పెంచుకొని వాడిశిలీముఖంటు
లొక్కుమ్మడి వృష్టివలెఁ గుఱియింప నతండు రోషభీషణా
రావంబు సేయుచు హరియొసంగిన చక్రంబు వైవ నప్పు
డాచక్రంబు ప్రళయార్కబింబంబుచందంబున వచ్చుచున్నం
జూచి హరి కఱకుకోపంబున నతనికడ్డంబుగ నిలిచె నప్పు డా
చక్రంబు శ్రీనివాసునిపైఁ బడిన నాహరి మూర్చాక్రాంతుఁడై
రథంబుపైఁ బడుటం జేసి భీతిల్లి తొండవానుండు శస్త్రాస్త్రం
బులు విడచి నిజరథంబు డిగ్గి హరిరథంబుమీఁది కరిగి
పన్నీటం దడవుచుం దాలవృంతంబుల విసరుచుండె నపు డా
వసుథానుండుసు బాష్పపూరితాక్షుండై రథంబు దిగి హరిరథం
బుపై కరిగి కప్పురంపుపలుకులు నమలి చెవినూఁదుచుండ
శ్రీనివాసుండు కొండొకతడవుకు మూర్ఛ తెలిసి లేచి
కూర్చుండినం జూచి కరకమలంబుల మోడ్చి తొండవానుం
డిట్లనియె.

268


క.

హరి నే వసుథాసునిపై
నరిభీకరచక్ర మేసి నపు డడ్డముగా
సరగున నిల్చితి వందునఁ
బొరిఁ జక్రము దాక మూర్ఛఁ బొందితి వకటా.

269


క.

నీ కపకారముచేసిన
ప్రాకటపాపంబు నన్నుఁ బాయుటకొఱకై
జోకను గాశికిఁ బోవలె
నా కిప్పుడు సెలవొసంగు నళినదళాక్షా.

270


క.

వసుథానున కొగిఁ బట్టము
పస మీఱఁగఁ గట్టి రాజ్వపరిపాలన తా

నెసలారఁ జేయని మ్మీ
వసుమతి నే నొల్ల నింక వనజదళాక్షా.

271


క.

అన విని హరి వసుథానుని
గనుగొని యిట్లనియె నిన్నుఁ గాంచిన జనకుం
డనఘుండై పరలోకం
బున కేగెను బిన్నతండ్రి పుణ్యముకొఱకై.

272


క.

ఘనగంగానది కరిగెద
ననుచున్నాఁ డిందు కిప్పు డాలోచన నిం
పొనరఁగఁ జెప్పుము నీ వన
విని వసుథానుండు పలికె వినయము దనరన్.

273


సీ.

హరి నీవు నను బ్రోవ నడ్డంబుగా రాఁగ
        నిరుపమచక్రంబు నిన్ను దాఁకె
నపుడు మూర్ఛిల్లితి వట్టిపాపము వోవ
        నింక నిందుండి రామేశ్వరమున
కరిగెద నగ్రజుఁ డైనట్టి మాతండ్రి
        పట్టంబుఁ బినతండ్రి గట్టుకొనుమ
టంచుఁ జెప్పుము మది నలరంగ ననఁగ నా
        శౌరి చూచి యగస్త్యసన్మునీశు


తే.

శుకమునీంద్రుని రావించి సకలవిషయ
ముల నెఱింగించి యెటు సేయవలయు ననిన
నవ్వి వా రిట్టు లనిరి శ్రీనాథ వీరి
కించుకేనియు నోపిక యెడఁదలేక.

274


సీ.

కాశీరామేశ్వరగతు లేల వీరికి
        నన్నదమ్ముల పాళ్లు నరసి మీరు

గగనాఖ్యనృపునిపా లొగిఁ బంచి యీవసు
        థానుని కిపు డియ్య ధర్మమగును
దొండవానుని పాలు తొండవానుని కీయు
        నట్లు సేయుట మంచిదగును వినుము
..................................................
        ..................................................


ఆ.

వేఱవిధము సేయ విధి తప్పునని మును
అపుడు వల్కఁ జక్రి యాసుధర్ము
సొమ్ము రెండుపాళ్లు చొప్పడ నొనరించి
వారి కిచ్చి మునులఁ బంపి యంత.

275


వ.

తాను వేంకటాద్రి కరిగి పద్మావతితో సంతసంబున నుండె.

276


తే.

అర్ధరాజ్యము వసుథానుఁ డలర నేలు
చుండఁగా నర్ధరాజ్యంబు తొండవాను
డేలఁగాఁ బుణ్యపరిపాకకాల మొదవ
నప్పు డానృపుఁ డాత్మ నిట్లని తలంచె.

277


ఉ.

వేంకటనాయకుండు మఱి విష్ణువ గాని నరుండు గాఁడు నే
మంకుగుణంబుచే మనుజమాత్రుఁడటంచుఁ దలంచుచుంటి నా
పంకజనేత్రుదివ్యపదపంకజముల న్మది నమ్మి భక్తిమై
నింక నిజంబుగా నతని నేర్పడఁ బూలను బూజచేసెదన్.

278


క.

ఆపరమాత్ముఁడు మనుజుం
డై పద్మావతిని గూడి యల్లునివలెఁ దాఁ
గాపట్యముతో మెలఁగుట
లీపట్లం దెలిసె నిందిరేశునిమహిమన్.

279

సీ.

అని యగస్త్యాశ్రమంబునకు వేగమ వచ్చి
        శేషాద్రిపతి మర్మవేష మమరఁ
దెలియనడ్గి మఱందు నిలువక హరిచెంతఁ
        జేరి ప్రాకటభక్తి చిత్తమందుఁ
దనరంగ నప్పుడు దండప్రణామంబు
        లం జేయ నక్కమలాక్షుఁ డెలమి
చూచి యిట్లనె నృపా యీచందమున నాకు
        మామవై మ్రొక్కుట యేమిధర్మ


తే.

మనఁగ నాతొండవానుండు ఘనత మెఱయఁ
గాంచి యోమాధవా మాయనుంచి నన్ను
వెఱ్ఱివానినిగాఁ జేయ వేడ్క నీకు
నహహ యిళ నిన్నుఁ బాయక యాత్మయందు.

280


వ.

ధ్యానించుచుండెద నెంతయుం గృతార్థుండ నైతి నని యనేక
విధంబులఁ బ్రార్థింప నాచక్రి విశ్వరూపంబుఁ జూపుటం జేసి
తొండవానుండు వెండియు నిట్లు నుతించె.

281


దండకము.

శ్రీమద్రమాధీశ జీమూతసంకాశ కాలత్రయాతీత
కంజాతసంజాత తాతా జగత్త్రాత వేదార్థనిర్ణేత భూతాత్మ
సీతాధిపా సద్గుణవ్రాత పూతావనీజాతనాథా శచీనాథ
దాతా మహాఘోర దైత్యాద్రిదంభోళిధారాసహస్రార
సంచార భర్మాద్రిధీరా సదాసింధుగంభీర మంథాచలోద్ధార
నారాయణానంత నీపాదముల్ చూడ పాతాళమై శీర్ష
భాగంబు నీక్షింపఁగా సత్యలోకంబునై మధ్యదేహాంగము
ల్మధ్యలోకంబులై నేత్రముల్ సూర్యశీతాంశులై శ్రోత్రము
ల్టిక్కులై నాసికాంగంబు నాసత్యయుగ్మంబునై జిహ్వ నీర

ప్రభుండై మహాకుక్షి యంభోధిబృందంబునై నాఁడులెల్లన్
బ్రవాహంబులై రోమముల్ వృక్షజాలంబులై శల్యముల్
సర్వశైలంబులై కేశపాశంబులున్ మేఘజాలంబులై ప్రాణము
ల్గంధవాహుండునై బాహు లింద్రాదులై దివ్యగుహ్యేంద్రి
యంబుం బ్రజానాథుఁడై దృష్టి సద్వీర్యమై సుస్తనం బెన్నఁగా
ధర్మమార్గంబునై వెన్ను ధర్మంబునై సారవాగింద్రియం
బగ్నియై దంష్ట్రలు దండహస్తుండునై మించె నిత్యాది
చిత్రంబు లీవేళ నీయందుఁ గన్పింపఁగా మిక్కిలిన్ వేయు
శీర్షంబులన్ వేయునేత్రంబులన్ వేయుహస్తంబులన్ వేయు
పాదంబులన్ గోటికోట్యర్కసంకాశపూర్ణ ప్రకాశంబుచే
నొప్పు నీనిశ్వరూపంబు నేఁ జూడ శక్తుండనే దేవ పూర్వస్థితి
న్నీమహాసౌమ్యరూపంబునే చూపి రక్షింపు మీశా చిదా
కాశ శేషాచలేంద్రా తరీకుండ సత్పట్టణాధీశ్వరా నారసింహ
ప్రభూ శ్రీనివాసా నమస్తే నమస్తే నమస్తే నమః.282
వ. అని యనేకవిధంబుల వినుతించిన నాహరి సంతసించి తననిశ్వ
రూపంబు మాని యెప్పటియట్ల నుండి తొండవానుని జూచి
యిట్లనియె.

283


క.

మామా నేను వినోదము
గా మనుజుఁడ నగుచు వేడ్కగా మీకన్యం
బ్రేమమునఁ బెండ్లియాడితి
నీమీఁద గృహస్థధర్మ మేను వహింతున్.

284


క.

అమరఁగ వేంకటశైలా
గ్రమునందు నయంబు మెఱయఁగాఁ గనకమయం

బమలమణిరచితభవనమ
క్రమముగ భావింపు విశ్వకర్మ కుశలతన్.

285


సీ.

దేవాలయంబుగఁ దీర్పింపు మెట్లన్నఁ
        గుదురుగ నొకరెండుగోపురములు
ద్వారసప్తకమును దగు వాస్తుశాస్త్రప్ర
        కారంబుగాను వేంకటగిరేంద్ర
మందుఁ గట్టించి న న్నందుంచి నీవు ప్ర
        కాశుని జేయు నీకలియుగమున
మును పీనగంబుమీఁదను నీవు ద్రవ్విన
        బావి గట్టడమును బాగుమీరఁ


తే.

జేయుమన నద్భుతం బంద శ్రీనివాస
బావి నే నెప్పు డాస్వర్ణపర్వతమునఁ
ద్రవ్వలేదని నృపుఁ డన నవ్వి నృపుని
గాంచి యిట్లని పల్కె శ్రీకాంతుఁ డపుడు.

286


క.

మనుజేశ్వర జన్మాంతర
మునఁ జేసిన యట్టిధర్మములు మఱచితి నే
యనుమానించెద నది నే
వినుపించెద నిచట నీవు వేడుకమీఱన్.

287


క.

విను వైఖానసవంశం
బున నుద్భవమైన విప్రముఖ్యుఁడు విమలుం
డను శాంతుఁడు సద్గుణగణుఁ
డనఘాత్ముఁడు గోపినాథుఁ డనుఘనుఁ డవనిన్.

288


తే.

కృష్ణలీలల విని చొక్కి గెంట కతని
కలియుగాదిని పూజింపఁదలఁచి చోళ

దేశమున కేగి యచ్చట ధీరుఁ డగుచుఁ
దపము చేయుటకై కుశస్థలిని నిలిచి.

289


సీ.

శ్రీకృష్ణరూపంబుఁ జిత్తమం దుంచి త
        పంబు సేయఁగను గోపాలవేష
ముల నేను బ్రత్యక్షముగ నిల్చి వర మేమి
        కావలెనని పల్కఁగా నతండు
పరమాత్మ కృష్ణరూపంబుతో మీ రుండ
        వలె నేను బూజింపవలయు నట్టి
సద్వరం బీయు మోస్వామి యంచు వచింప
        నతని కిట్లంటి శేషాద్రియందు


తే.

శ్రీనివాసుఁ డనంగఁ బ్రసిద్ధి నొంది
యుందు న న్నందుఁ బూజింపుచుండుఁ గృష్ణ
వేషమునఁ బూజగొన నిది వేళ గాదు
గాన నిఁక లేచి వేంకట[5]గ్రావమునకు.

290


చ.

జనుమని రంగదాసుఁ డనుసజ్జనుఁ డొక్కఁడు దారిలోపలన్
గసఁబడు వానిఁ దోడుకొని కాననభూముల దాఁటి వోవఁగాఁ
గనకమయాద్రి ముందటగఁ గన్పడు వేడుక మీఱ నందు నీ
వును నతఁ డేగ నే నెలమి నొందఁ బ్రసన్నుఁడ నయ్యెదం గృపన్.

291


తే.

శూద్రుఁడైనట్టి రంగదాసుండు పుష్ప
తులసికాదళములను సంతోష మెసఁగఁ
దెచ్చి నీచేతి కిచ్చు సందేహ మాత్మ
నుంచ కవి గొని పూజించుచుండు నన్ను.

292

ఉ.

అచ్చటఁ గృష్ణలీలల నొయారముగం బ్రకటింతు నీకు నే
నెచ్చుగ వింతవింతలుగ నేడ్తెఱ నావల నీకులస్థులే
వచ్చి సభక్తి నర్చనలు వారక చేయుచు నుందురంచు నే
నిచ్చితి సద్వరంబని యదృశ్యుఁడ నైతిని ధాత్రినాయకా.

293


సీ.

వరవిప్రుఁ డందుండి వచ్చుచుండఁగ రంగ
        దాసాభిధానుఁడు దారియందు
జతగూడఁగా శేషశైల మాయిర్వురు
        చేరి న న్నచట వీక్షించి మ్రొక్కి
యారంగదాసుఁడే యచ్చట నొకబావి
        ద్రొవ్వి గట్టునఁ బూలతోట వేసి
తాన శ్రీతులసిసద్దళసుమంబు లొసంగ
        భూసురుం డవి గొని పూజసేయు


తే.

నావిధంబుగఁ గొన్నియేం డ్లరిగె నవల
సకలజనమోహసం బౌ వసంతఋతువు
వచ్చె నాదాసుఁ డడవిలో వరసుమములఁ
బుట్టలో నుంచుకొని వచ్చి పుష్కరిణిని.

294


తే.

జలకమాడెడు గంధర్వసతులఁ జూచె
నపుడు చిత్తంబు గఱఁగి వీర్యంబు జారి
నందు కపవిత్రగాత్రుఁడనైతి ననుచుఁ
బుష్కరిణిలోనఁ గ్రుంకి తెప్పునను బోయి.

295


సీ.

కుసుమముల్ క్రమ్మఱఁ గోసి తెచ్చిన నందుఁ
        గోపినాథుఁడు చూచి కోపగించి
స్వామిని పూజించుసమయంబునకుఁ బూలు
        తులసి దేనైతివి దుష్టచిత్త

గర్వించి చెడితివి గావున నిందుండ
        కరిగి యధోలోకమందుఁ బుట్టు
మని శాసింపఁగను వాఁ డడరి శోకింపఁగ
        నే జాలినొంది మన్నించి పిలిచి


తే.

దోషభోగ్యుఁడనే నీవు దుఃఖపడక
రంగదాసరి నీమనోరాగ మింత
చేసే బ్రాహ్మణశాపంబు సిద్ధముగను
నే నివారింప లేనట్లు గాన నిపుడు.

296


తే.

పుష్కరిణిలోన మునిఁగి యీబొంది విడువు
మటను ధర్మమహీపతియందుఁ జేరి
నాగకన్యకగర్భంబున జనించి
ధారుణిం దొండవానాఖ్యఁ దనరి యవల.

297


సీ.

వసుధ నేలుచును నావాఁడ వయ్యెదవు సి
        ద్ధముగ నాసేవ వ్యర్థంబుగాదు
చింతింప కిపుడు నేఁ జెప్పినపని సేయు
        మన రంగదాసుఁ డం దట్లజేసె
నతఁడు నీవై పుట్టి హితము రెట్టింప నా
        భక్తుఁడ వైతివి పార్థివేంద్ర
పూర్వజన్మమున నేర్పుగ నీవు ద్రవ్విన
        బావి యిందున్నది భద్రముగను


తే.

జక్కఁజేయింపు మిఁక నది శాశ్వతముగ
నుండు నేఁ దాల్చి విడుచుచునుండు పుష్ప
ముల ధరించుట కది ధర ముఖ్యముగను
జారుశుభమూర్తి తొండవాన్ చక్రవర్తి.

298

చ.

అని హరి యానతిచ్చిన మహాద్భుతమంది ధరాధినాథుఁ డి
ట్లనియె మహాసుభావ సకలాత్ముల కాత్మవు నీవు గాన నా
జనసము పూర్వజన్మగతి సర్వము చెప్పితి వాదిదేవ నే
మనుజుఁడఁ గాన నీత్రిగుణమాయ నెఱుంగుదునే పరాత్పరా.

299


క.

అని బహువిధములుగా నిటు
వినుతులు గావించి హరిని వీడ్కొని యపు డా
జనపతి సంతోషించుచు
ఘనభక్తి చెలంగ విశ్వకర్మను గొనుచున్.

300


వ.

వేంకటాద్రిఁ జేరి తామున్నుద్రవ్వినబావిని బాగుచేయించి
స్వామివారికి దేవాలయంబు నిర్మింపు మనిన విని యావిశ్వ
కర్మ విధిచొప్పు దప్పక ప్రాకారత్రయంబును గోపురద్వయం
బును సప్తద్వారంబులును, స్వామి నిజాస్థానమంటపంబును,
గోశాలయును, ధాన్యశాలయును, వస్త్రభూషణాగారంబును,
శయ్యాగృహంబును, వైవాహికమండపంబును, తైల
ఘృతాలయంబును, అన్నశాలయుసు, భూతీర్థకూపంబును,
నిర్మించి యన్నిటకు మధ్యప్రదేశంబునం దాళవృక్ష
ప్రమాణోన్నతవిమానంబు రచించి తదుపరి శాతకుంభంబు
నుంచి విశాలవీథిత్రయంబు గావించి వేంకటాద్రికి భక్తవరులు
వచ్చుటకు యోజనమార్గసోపానంబులును, నడుమ నడుమ
మండపంబులును, నీరాగారంబులును, నిర్మించి సకలపదార్థా
కర్షణంబు సేయించి యాయాగృహంబులయం దుంచి గిరి డిగ్గి
హరిచెంతఁ జేరి మ్రొక్కి యిట్లనియె.

301


మ.

హరి మీసత్కృపచేత వేంకటగిరీంద్రాగ్రంబున న్మీకు మం
దిరముం జెల్వుగనైనదం దొగి సదా దేవి బ్రియం బారఁగాఁ

దిరమై యుండఁగ నేను గింకరుఁడనై దేవా! సభక్తిన్ భవ
ద్వరపాదంబులఁ బూజసేసెద మునివ్రాతా కృసాంభోనిధీ.

302


వ.

అని తొండవానుండు వేఁడుటం జేసి.

303


క.

ఘనవైఖానసవంశం
బున నుద్భవుఁడైన విప్రముఖ్యునితోడన్
వనజాక్షుఁడు శుకకుంభజు
లను దోడ్కొని వేంకటాచలముమార్గమునన్.

304


క.

వచ్చుట కుద్యుక్తుం డగు
టచ్చట వసుధానుఁ డెఱిఁగి యబ్జాక్షునకున్
మెచ్చుగఁ బద్మావతి కం
దిచ్చెదనని భూషణములు హేమాంబరముల్.

305


తే.

తెచ్చి వారల కర్పించి దీనవదనుఁ
డగుచు నుండఁగఁ జూచి యిట్లనియెఁ జక్రి
చింత నీకేల వసుథాన శేషగిరిని
నిలచియుండెద మని పల్కి నెమ్మి మీఱ.

306


ఆ.

మఱల నిట్టు లనియె మచ్చిక నార్యుల
నాదరింపుచుండు మబ్జవతిని
జూచుకొఱకు దందశూకాద్రి కెపుడైన
వచ్చు వోవుచుండు వసుధ నేలు.

307


వ.

అని యిష్టంబు చెప్పి సంతసింపఁజేసి వాని వీడ్కొని పద్మావతీ
సమేతుండై తొండవానుని దోడ్కొని మంగళవాద్యములు
మొఱయ వికృతినామసంవత్సరంబునఁ బాడ్యమితిథియు
నశ్వినీనక్షత్రంబును గురువాసరంబును గూడిన శుభదినంబున
సాయంసమయమునకు వేంకటాద్రిఁ జేరి వైఖానస బ్రాహ్మ

ణునివలన వైఖానసాగమోక్తప్రకారంబునం బుణ్యాహ
వాచనాదికృత్యంబు లాచరింపించి సుస్థిరలగ్నంబున
ఋషులు శుభదాశీర్వచనంబులు సేయ శ్రీనివాసుండు
మంగళకరంబగు నానందనిలయంబునం బ్రవేశించె నప్పుడు
బ్రహ్మేంద్రాదు లానందంబుగఁ బుష్పవృష్టి గురియించి శ్రీని
వాసునిచెంతఁ జేరి నుతించిరి. అందు వైఖానస సద్విజుండు
ద్వారపాలకుల నిల్పి యథాప్రకారంబుగ హరిం బూజించె
సప్పుడు హరి పద్మపీఠంబుమీఁదఁ బాదంబును నిల్పి కటి
ప్రదేశంబున వామకరంబు నుంచి దక్షిణపాదప్రదేశంబును
దక్షిణకరంబుతోఁ జూపుచు బ్రహ్మాదులం జూచి యిది పరమ
పదం బని పలికె నంతఁ బద్మజుం డాహరిసాన్నిధ్యంబున రెం
డఖండదీపంబు లుంచి యింద్రాదులతో నిట్లనియె.

308


సీ.

ఎందాక కలిధర్మ మిద్ధాత్రియం దుండు
        నందాక దీపద్వయంబు నుండు
నెంచాక దీపంబు లొందును నందాక
        మహనీయదివ్యవిమాన ముండు
కలియుగం బడఁగిన మలుఁగుదీపంబులు
        నపుడు విమాన మాయవని ద్రెళ్లు
నవ్విమానము వడినప్పు డీవేంకటే
        శ్వరుఁడు శ్రీవైకుంఠపురము చేరు


తే.

నంత కృతయుగ ముదయించు నవనియందు
ధర్మదేవత నాల్గుపాదముల నడచు
మూడుయుగములు వైకుంఠమున వసించి
కలిని శేషాద్రిఁ జేరు వేంకటవిభుండు.

309

క.

అని బ్రహ్మ పల్కుపల్కులు
విని ముదమును బొంది యాదివిష్ణుం డిచటన్
వసజజ నాకు రథోత్సవ
మనువొందఁగఁజేయు మఱల నన నజుఁ డంతన్.

310


వ.

అం దాఢ్యుండై యున్న తొండవానుం డనుచక్రవర్తిచేత
వైఖానసాగమోక్తంబుగ నుత్సవప్రయత్నంబు సేయించి
పూర్వప్రకారంబుగఁ గన్యామాసంబునం దంకురార్పణం
బును ధ్వజారోహణంబును వివిధవాహనరథోత్సవతీర్థవారి
ప్రముఖకృత్యంబు లాచరింపఁజేసి బహుభక్ష్యభోజ్యంబులు
నైవేద్యంబులు సమర్పించి సర్వంబు శ్రీనివాసార్పితంబు
గావించి మ్రొక్కి తదాజ్ఞానుసారంబుగ నింద్రాదులు నిజ
నివాసంబుల కరిగిరి. అంతఁ దొండవానుండు హరికి సకలోత్స
వంబులు నడపి నిజరాజ్యపరిపాలనంబు సేయుచుండి నం
దొక్కనాఁడు.

311


సీ.

శ్రీకరమతిని వసిష్ఠగోత్రుఁడు కూర్ముఁ
        డను బ్రాహణోత్తముఁ డటకు వచ్చి
తొండవానుని జేరి తొలుత గార్యార్థియై
        యాశీర్వదించి యిట్లనియె 'రాజ
విను భార్యతో జాన్హవీయాత్ర వోవఁగ
        భార్యకు గర్భంబు ప్రాప్త మయ్యెఁ
బంచాబ్దములవాఁడు బాలుండు తల్లిని
        వీడి నావెంట రాలేఁడు గనుక


తే.

ధర్మసంకటమైన దిత్తఱిని సతిని
సుతుని నిందుంచి వోయెద సుస్థిరముగ

నిరువురకు నన్న మిప్పించి యీస్థలమున
నీవు పాలించుచుండుమో భూవరేణ్య.

312


మ.

అని యావిప్రుఁడు వల్కఁగా నృపుఁడు నీ వారీతి నిందుంచి పొ
మ్మనఁగాఁ గూర్ముఁడు నమ్మి యాత్ర జనె నం దావిప్రుభార్యన్ సుతున్
మనుజేంద్రుం డొకమూలగేహమున నేమం బొప్పఁగా నుంచి తె
ప్పున మాసా లొగి నాఱునం దునిచె సంపూర్ణ ప్రియం బారఁగన్.

313


ఆ.

బహువిశాలమైన భవనంబులో నంత
విప్రుభార్య యుండె విధివశమున
వీధితల్పు చిలుకు వేసి యం దెవ్వఁడో
యుఱికె దాని విప్రునువిద చూచి.

314


ఉ.

వాకిలి తీయుఁ డం చవలినారిని బిల్చిన వారివీనులన్
సోకకయుండె నప్పలుకుఁ జోద్యము నొందుచు విప్రుభార్య నే
నేకరణిం దరింతు హృదయేశ్వరుఁ డిచ్చట నుంచె నంచు దా
శోకము నొందుచున్ దిశలు చూచుచు నచ్చట నుండె నయ్యెడన్.

315


ఆ.

ఆఱునెలలబత్తె మైపోయె నటుమీఁదఁ
గూడు లేక మిగులఁ గుంది కుంది
బెండువడి కృశించి బిడ్డ లిద్దఱు తాను
బ్రాణములును విడిచి పడిరి ధరను.

316


చ.

ఘనుఁ డగు తొండవానుఁ డిటు కర్మవశంబున విప్రుకాంత నం
దొనరఁగ నుంచుట న్మఱచి యుండఁగఁ గాశికిఁ బోయి బ్రాహ్మణుం
డును దను జేరి పుత్త్రి సుతుఁడు న్సతి యేడ నటంచుఁ బల్కఁగా

విని మది భీతినొంది నృపవీరుఁడు చారుల నంపె నత్తఱిన్.

317


ఉ.

చారులు వోయి విప్రుసతి సంతతితో నశియించి యుండుటన్
వారక చూచి వచ్చి నృపవర్యుని కంతయుఁ జెప్పఁగాను దా
నారట మొంది దుఃఖ మపు డాత్మను నుంచి సధైర్యచిత్తుఁడై
యూరక యుండి విప్రుఁ గని యుల్లసముం దగఁ బల్కె నిమ్మెయిన్.

318


సీ.

విను బ్రాహణోత్తమ వేంకటేశుని దర్శ
        నార్థమై మాయింటియాఁడువారు
సనఁగాఁ బతివ్రత యన నొప్పు మీభార్య
        వారితో శ్రీ శ్రీనివాసుఁ జూడఁ
బోయిన దిఁక వచ్చు భోజనకృత్యంబు
        సేయించుచుండుము చిత్తమలర
నని చెప్పి సామగ్రి నంపించి యచ్చటఁ
        బగ లంతయుం బుచ్చి పరిఢవిల్ల


తే.

రాత్రి కాఁగనె బిలము మార్గంబునందుఁ
బోయి శ్రీవేంకటేశుని పుణ్యచరణ
యుగళముల బాష్పధారలు నొల్క నిల్చి
యుండుటం జేసి హరి యనె నుర్విపతికి.

319


సీ.

రాజేంద్ర నీ వింతరాత్రికాలమున నొ
        క్కడ విందు వచ్చిన కార్య మేమి
చెప్పు మేర్పడ నన శ్రీనివాసుని కిట్టు
        లనియె నృపాలకుం డంబుజాక్ష

పాపాత్ముఁడై నేను బ్రాహ్మణస్త్రీవధ
        చేసితి నన్ను రక్షింపవలయు
ననుచుఁ దత్క్రమము దుఃఖాక్రాంతుఁ డై చెప్పఁ
        గా హరి వల్కె భూకాంత వినుము


తే.

మించి వోయిన పని కింక మిడుకుటేల
యెండి పడియుండు దట్టంబు లిచటి కిపుడ
నీవు దెప్పించు మనఁగ నానృపుఁడు భటుల
చేతఁ దెప్పించెఁ దనువుల శ్రీశుకడకు.

320


వ.

అంత శ్రీనివాసుండు తొండవానునితోడ నక్కళేబరంబులఁ
బట్టించుకొని పుష్కరిణికి బూర్వదిగ్భాగంబున నున్న దివ్య
సరోవరంబునకుఁ బోయి తత్తీర్థంబునం దాకళేబరంబులను
ముంచి యెత్తె నప్పు డమ్మువ్వురు సజీవులై లేచి రంత దేవ
తలు పుష్పవృష్టిఁ గురియించి యప్పుణ్యతీర్థంబునకు, నస్థితీర్థం
బని నామం బిడి మఱియు నమృతసరస్సని వొగడి రందుఁ
దొండవానుండు సంతసించి హరిని వినుతించె నంత శ్రీని
వాసుండు, కలియుగంబున మనుజులతో మాటాడిన పక్షం
బున నిక నిట్టి ధర్మసంకటంబులు పొసంగుచుండుఁ గావున
నీనాఁటఁ గోలె మౌనధారియై యుండవలయు నని నిశ్చ
యించె నంతఁ దొండవానుండు సజీవు లగువారిని దెచ్చి
గూర్ముం డనువిప్రున కొసగె నపు డాబ్రాహ్మణుండు
భార్యాపుత్రులం జూచి యెందుఁబోయి యుంటి రని యడుగ
నత్తరుణి యిట్లనియె.

321


సీ.

స్వామి నే నేమని చర్చించి చెప్పుదు
        మహిమాఢ్యుఁ డగువిష్ణుమాయచేతఁ

బుణ్యమార్గంబునం బోయి బ్రహ్మాదు లు
        న్నట్టి లోకంబుల నన్ని చూచి
వచ్చితి ననియె నవ్వలఁ గుమారుం డిటు
        లనియె నోతండ్రి నే నద్భుతముగ
బోయి సప్తద్వీపములను దోయధులను
        గైలాసగిరిని శంకరుని జూచి


తే.

వచ్చి తని చెప్పు బుత్త్రిక వచ్చి యిట్టు
లనియె నోతండ్రి పర్వతవనములను ని
బుధుల రాక్షసగణములఁ బుణ్యమునులఁ
జూచి వచ్చితి వేడ్కమై దాఁచ నేల.

322


క.

అని యామువ్వురు తమతమ
యనుభవములఁ జెప్పి రప్పు డావాక్యములన్
విని వెఱఁగున విప్రుం డి
ట్లనియెన్ మీపుణ్య మతిశయం బై యొప్పున్.

323


ఆ.

అనుచు వారితోడ నరుగ నుద్యుక్తుఁడై
యుండురీతిఁ దెలిసి తొండవానుఁ
డపుడు భూషణంబు లంబరంబులు వారి
కిచ్చె ద్విజుఁడు నృపుని మెచ్చి లేచి.

324


తే.

రాజు నాశీర్వదించి భూరమణ మేము
పోయివచ్చెద మని పల్కి పొగడి సతిని
బాలకులఁ దోడుకొని వోయి పరఁగ మదిని
సంతసించుచు నిజనివాసంబుఁ జేరి.

325


క.

తోషించి సతిని బిడ్డలఁ
బోషించుచుఁ దాను ముక్తి బొందెడుకొఱకై

శేషాచలపతి మహిమ వి
శేషముగాఁ బ్రజల కెఱుఁగఁ జెప్పుచు నుండెన్.

326


సీ.

అన విని మును లెల్ల నాశ్చర్యమును బొంది
        యిట్లని పలికి రిదేమి వింత
యీకళేబరముల నెఱి నేలఁ బడవైచి
        పోయి లోకాంతరంబులఁ జరించి
క్రమ్మఱ వచ్చి తద్ఘటములలోఁ జొచ్చి
        యాకూర్మునకు వార లచటఁ గనిన
వింతలు చెప్పిన విధము తేటగఁ జెప్పు
        మన విని సూతుఁ డిట్లనియె వారు


తే.

స్థూలములను విసర్జించి సూక్ష్మతనువు
లందు వెల్గుచు నుండి లోకాంతరముల
స్వప్నములఁ గన్న వింతలచందముగను
గూర్మునకు వారు చెప్పి రాగుఱుతు లెఱిఁగి.

327


ఆ.

బ్రహ్మముందు జీవపఙ్క్తులు కర్మసం
స్కారలింగదేహకలితు లగుచు
నంబరమునఁ దిరుగునట్టి పక్షులరీతి
సకలలోకములను సంచరించి.

328


వ.

అవ్వలం దమఋణానుబంధంబుగఁ గర్మసంస్కారంబులతోడం
గూడి యరుణరూపులై గగనాంతర్గతవాయుపథంబునం బడి
సూర్యకిరణోదితమేఘబృందంబులం బొంది వృష్టిమార్గం
బున సకలౌషధీజాలంబులం జొచ్చి యన్నరూపంబు నొంది
పురుషవీర్యరూపంపై శ్రీగర్భంబులయందుఁ బ్రవేశించి స్థూల
దేహంబుల ధరించి నవమాసంబు లందుండి వెడలి బాల్య

యౌవనకౌమారవార్ధకదశల ననుభవించి కాలపరిపాకంబున
మృతినొంది క్రమ్మఱం బుట్టినవారలు లోకాంతరంబులం
దనుభవించిన కష్టసుఖంబుల మఱలం జెప్ప మఱచివోదు
రటు గావున నీమువ్వురు కాలపరిపాకంబు గాకయ యన్నంబు
లేకయ నశించిన స్థూలదేహంబులం దుండక సూక్ష్మదేహం
బుల నవలంబించికొని లోకాంతరంబులం జరించి హరికటా
క్షంబువలన నప్పుణ్యతీర్థంబునం బ్రవేశించి పరిపూర్తినొందిన
పూర్వస్థూలదేహంబులంద మఱలం జేరినందున వారి
కాలోకాంతరవ్యాపారంబును హృదయంబులం దుండి నిద్ర
జెంది కలలం గని మేల్కాంచి పరుల కాకలలు చెప్పిన
చందంబున వారాకూర్మునకుం దమవిహారంబులు చెప్పి రిది
యంతయు విష్ణుమాయ యని యెఱుంగవలయు. నీయితి
హాసంబు విన్నవారి పాపంబు నశించి ధన్యు లగుదురని
చెప్పిన విని శౌనకాదులు సూక్ష్మజ్ఞానదృష్టిచేత జీవతత్వాను
భవప్రకారంబు తెలిసి సూతుం జూచి వెండియు నిట్లనిరి.

329


సీ.

నీవు చెప్పిన సూక్ష్మనిర్మలభావంబు
        తెలిసెనో సూత సందియము తీరె
నది యటులుండని మ్మాకూర్ముఁ డరిగిన
        వెనుక నృపాలుండు వేంకటాద్రి
పతి నెవ్విధంబున భక్తుఁడై పూజించె
        నారీతిఁ జెప్పు మిం కనిన మునులఁ
గని సూతుఁ డిట్లనె జననాయకుఁడు భూమి
        నేలుచు శ్రీవేంకటేశ్వరునకు

తే.

దాసుఁడై నిత్యమును హోమభాసురాబ్జ
ములను గొంపోయి బిలమునఁ జెలఁగి హరిప
దారవిందంబులకుఁ బూజ భూరిభక్తి
చిత్తమున నిడికొని యొగిఁ జేసె నపుడు.

330


ఆ.

అవల మఱల పోవునపుడు కుమ్మరవాఁడు
మంటిపూలుఁ దులసి నింటఁ దీర్చి
దారుమూర్తియందుఁ దా సమర్పింపగ
నట్టిమంటిపూలు హరిని చేరె.

331


క.

వనజాక్షుం డాసుమములఁ
దనయందే డాఁచుచుండు ధరణీంద్రునకున్
గనఁబడనీక కులాలుని
తనమదిలో మెచ్చుచుండుఁ దద్దయుఁ బ్రేమన్.

332


సీ.

రాజుచేసినపూజ రాజసం బని మెచ్చ
        గుండి మృత్కుసుమంబు లొక్కనాఁడు
భూనాయకుఁడు తన్ను పూజ చేసెడువేళఁ
        జూపె నాఁ డామృత్ప్రసూనములును
గాంచి నేనితని బంగరుపూలఁ బూజింతు
        నీమట్టిపూపు లిం దెవ్వఁ డుంచె
సని సంశయించుచు నబ్జాక్షునకు మ్రొక్కి
        పలికె నిట్లనుచు నోపరమపురుష


తే.

నే సమర్పించుసుమముల నేలఁ ద్రోసి
మట్టిపూ లిందుఁ బెట్టిన మనుజుఁ డెవఁడు?
దెల్పు మని నృపుఁ డడుగ నద్దేవుఁ డపుడు
నృపుని కిమ్మెయి ననియెను నీతి యెసఁగ.

333

తే.

అనఘ యిచటికిఁ గ్రోశద్వయార్ధదూర
మం దొకఁడు కుర్వకగ్రామమందఁ గలఁడు
ధరఁ గులాలుడు భీమాభిదాసుఁ డధిక
భక్తుఁ డొగిఁ బేదవాఁ డందుఁ బ్రతిదినమున.

334


ఉ.

కుండలు చేసిచేసి యొకగూటను బెట్టుచు నప్పుడప్పుడున్
రెండుకరంబులం బులిమి రేగినమట్టిని చిత్రపుష్పముల్
దండిగఁ జేసి నావలనె చారుకరూపము నేర్పరించి తా
నిండినభక్తి మీఱఁగను నిత్యము నర్చనఁ జేయుచుండఁగన్.

335


సీ.

ఆపుష్పములను నే నంగీకరింతు ని
        ట్లనుదినం బని వల్కె నపుడు నృపతి
వెఱగు నొందుచు హరి వేవేగ పూజించి
        బిలము వెల్వడిపోయి భీముచెంతఁ
జేరిన రాజు నీక్షించి కులాలుఁ డి
        ట్లనె మహారాజ నీ వద్భుతముగ
శూద్రగృహమునకుఁ జొచ్చి వచ్చుట కేమి
        పని యానతిం డన జనవిభుండు


తే.

పల్కె నిట్లని భీమ నీభక్తి శేష
శైలపతి మెచ్చినాఁడు నిశ్చయముగాను
నీవు చేసిన సద్భక్తి భావరీతిఁ
దేటగా నా కిపుడు నీవు దెల్పు మనఘ.

336


చ.

అనినఁ గులాలుఁ డిట్లనియె నయ్య నృపాలక శూద్రజాతివాఁ
డను బహునీచకర్ముఁడ జడత్వమనస్కుఁడ నేను విష్ణుభా
వనఁ గని నీకుఁ జెప్పఁగలవాఁడనె భూపవరేణ్య యంచు న
య్యనఘుఁడు పల్కుచున్నతఱి నంబరమార్గమునందు ధీరుఁడై.

337

తే.

గరుడవాహన మెక్కి వేంకటవిభుండు
భీముఁ డున్నట్టిచోటుకుఁ బ్రేమఁ బోయి
పరమపావనచరితుఁడా భక్తవరుఁడ
రమ్ము సాయుజ్య మిచ్చెద నెమ్మి నేఁడు.

338


క.

సరసిజనాభుఁడు వల్కఁగ
సరగున భీముండు మ్రొక్కి సతితో సపుడే
హరి సాయుజ్యపదంబున
కరుగఁగఁ గని తొండవానుఁ డారటపడుచున్.

339


సీ.

హరి కిట్టు లనియె నోయబ్జాక్ష నీభక్తుఁ
        డగుభీముఁ జూచి నే నాప్తముగను
భాషించుచుండఁగఁ బరమపదము వాని
        కిచ్చి పంపించితి వింతలోన
నాకు సాయుజ్య మెన్నటి కీయఁదలఁచియు
        న్నా వన విష్ణుండు నగుచుఁ బల్కె
నితనిసాత్వికభక్తి కిష్టంబు నొందితి
        సాయుజ్య మిచ్చితి సజ్జనుండు


తే.

పూర్వమే మోక్ష మడుగ నీపూజ పరుల
కెఱుకయై చక్రవర్తి నీయింటి కెపుడు
వచ్చు నప్పుడు నీకు నీవనిత కేను
మోక్ష మిచ్చెద నని యంటి నీక్షణమున.

340


క.

వానికి మోక్షం బిచ్చితి
దీనికి జింతింప నేల ధీరుఁడ వగుచున్
నీనందనునకుఁ బట్టము
మానితముగఁ గట్టియుంచు మానవనాథా.

341

సీ.

పట్టి విజ్ఞాన సద్భక్తివై రాగ్యము
        ల్గలవాఁడ వగుచు దుష్కామములను
నిడిచి నిర్మలుఁడవై విజనస్థలము చేరి
        నన్ను ధ్యానించు నిర్ణయము మెఱసి
సారూప్యపదని నిశ్చయముగ నిచ్చెద
        నని యతనికిఁ జెప్సి పంపెఁ జక్రి
నిజనివాసము చేరి నెఱిఁ దప్పకయ తొండ
        వానుండు సుతునకు శ్రీనివాసుఁ


తే.

జేరి వేడ్కను రాజ్యాభిషిక్తుఁ జేసి
వేంకటేశుని చరణారవిందములను
గ్రమముగాఁ గొల్చి నిత్యోత్సవములు సేయు
మనుచు సుతునకు నియమించె ననఘుఁ డచట.

342


ఆ.

తొండవానుఁ డంతఁ దుర్యభక్తిజ్ఞాన
యుక్తుఁ డై మహావిరక్తుఁ డగుచు
వేంకటాద్రిఁ జేరి విజనస్థలమునండు
నిలిచి ధ్యానయోగనిష్ఠ నొందె.

343


ఉ.

అంతటఁ గొంతకాలమున కంబుజలోచనుఁ డానృపాలకున్
స్వాంతమునందు మెచ్చుచును సత్కృపతో నట కేగి నవ్వుచున్
వింతగఁ జెంత నిల్చె నటవి న్వసియించిన భూవిభుండు శ్రీ
కాంతుని జూచి లేచి కరకంజములన్ ముకుళించి నమ్రుఁడై.

344


ఉ.

సద్గుణ మొప్పగా మది నచంచలభ క్తిరసంబు నిండఁగా
గద్గదకంఠుఁడై నృపుఁడు కన్నులు బాష్పములొల్క మ్రొక్కుచున్
మద్గురుచంద్ర న న్నిచట మానసమందుఁ దలంచి వచ్చితే
చిద్గగనాత్మ నీమహిమ శేషుఁడు సన్నుతి సేయ నేర్చునే.

345

శా.

నేనా మానవమాత్రుఁడం జపలుఁడన్ నీచాత్ముఁడం గాముఁడన్
నే నిన్నేమి నుతింపనేర్తు నను మన్నింపన్ స్వభావంబుచే
నే నిర్హేతుకజాయమానకరుణ న్నేఁ డిందు వేంచేసినా
వానందం బొదవెన్ గృతార్థుఁ డొగి నే నైతిన్ జగన్నాయకా.

346


మ.

మును నేఁ జేసిన నేరము ల్మఱచి నామూర్ఖత్వమున్ గర్వమె
ల్లను బోఁగొట్టుచుఁ దండ్రిచందమున నన్ లాలించి విజ్ఞాన మి
చ్చిన నీదొడ్డఋణంబుఁ దీర్చగలనే శ్రీస్వామి నీసత్కృపా
ఘనతం గాచిత విన్నినా ళ్లిపుడు మోక్షం బిచ్చి రక్షింపవే.

347


చ.

మతి సెడ విప్రుభార్యను గుమారుని కూఁతును దేఱ కేను జం
పితి నటువంటిపాప మిల భీకరవృత్తిని ముంచు నంచు నన్
హితముగఁ గావ వారలకు హెచ్చుట దేహము లిచ్చినట్టి నీ
యతిశయ మెంచ శంభునకు హాటకగర్భునకైన శక్యమే.

348


చ.

సతి పతి యేకమైనపుడు సారవివేకము లేక రాత్రి వ
చ్చితి నలనాఁడు నే నిటులఁ జేసిన ద్రోహము నెంచ కింత బ్రో
చితి యటువంటిసైరణయుఁ జిక్కునె యెంతటివారికైన శ్రీ
పతి నినుఁ బోలు వేల్పులు ప్రపంచమునం గలరే రమేశ్వరా.

349


వ.

అని యనేకప్రకారంబుల వినుతించిన నృపాలకు న్మెచ్చి
హరి దయార్ద్రహృదయుఁ డైయిట్లనియె.

350


చ.

విను నృప నీకు సాత్వికవివేకము పుట్టుటకై తపంబు సే
యను నియమించి తప్పుడు మహాపురుషోత్తమభక్తి నిష్ఠ
మనమున నిల్చెఁ గాన ననుమానము లేదిఁక మోక్ష మిచ్చెదన్
నను బరమాత్ముఁ డంచు నెఱ నమ్మిననమ్మిక ఱిత్తవోవునే.

351


చ.

జనవర యింకఁ గొన్నిదివసంబులు భూతలమందు నిల్చెదో
ఘనభుజ మోక్ష మీక్షణమ కావలెనో నిజ మీవు చెప్పుమా

యన హరిఁ జూచి నవ్వి నృపుఁ డర్థిని మోక్షమ నా కొసంగవే
యని శరణాగతుం డగుచు నంచున రాఁ గని చక్రి నవ్వుచున్.

352


సీ.

కరుణారసము సృపాగ్రణిమీఁద నిండించు
        చుండఁగ గగనమందుండి దివ్య
పుష్పకం బచటి కద్భుతముగ వచ్చె న
        ప్పుడు తొండవాను నాపుష్పకంబు
నందుంచి సారూప్య మతనికిఁ దా నిచ్చి
        వైకుంఠపురికిని వఱల నంపి
తననివాసము చేరెఁ దదనంతరమున నా
        చక్రవర్తిసుతుండు సాంగముగను


తే.

వేగ తండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
శ్రీనివాసుని పాదరాజీవయుగళ
మందు భూభాగ ముంచుచు నచలుఁ డగుచుఁ
దాను వసుథానుఁడును రమాధవుని కచట.

353


సీ.

ప్రథితనిత్యోత్సవపక్షోత్సవములు మా
        సోత్సవసంవత్సరోత్సవములు
నడిపించుచుండగ నారాయణుఁడు శిలా
        విగ్రహుఁ డై మహావిభవములను
సొంపుగ నంగీకరింపుచు వసుథాను
        నాశ్రీనివాసుండు నాదరమునం
బాలన సేయుచు భక్తి భావించుచు
        సకలకార్యములను స్వప్నములను


తే.

దాన చెప్పుచు మౌనముద్రను ధరించి
కుదిరి పద్మావతిని గృపఁ గూడి వివిధ

వరము లందఱ కిచ్చుచు వారిధనము
లాదరించుచు శ్రీపన్నగాద్రియందు.

354


ఉ.

వేంకటనాయకుం డనఁగ విశ్వమునందుఁ బ్రసిద్ధి నొందుచున్
గొంకక భక్తి విత్తమును గూరిమితోఁ గొని కోర్కు లిచ్చుచున్
సంకరజాతి మర్త్యులకుఁ జానుగ విత్తము నొప్పగించుచున్
బింకము చూపుచు న్ధర కుబేరుని వడ్డికి రూక లిచ్చుచున్.

355


క.

లీలామానుషచర్యలు
జాలం జూపుచు సమస్తజనులకు హితుఁ డై
మేలు నొసంగుచు నీకలి
కాలము ఫణిశైలమునను గనుపడుచుందున్.

356


ఆ.

కలియుగాంతమునను గ్రమ్మఱ వైకుంఠ
మందుఁ జేరి కలియుగాదికాల
మవల వచ్చినప్పు డావేంకటాద్రిపై
మఱలఁ జేరుచుండు మాధవుండు.

357


క.

అని సూతుఁడు వేంకటపతి
ఘనచరితము లొప్పఁ జెప్పఁగా మును లెల్లన్
విని సంతోషము నొందుచు
నని రిట్లని సూతుఁ జూచి యద్భుతపడుచున్.

358


మ.

అహహా సూతపరాత్పరుండు జలజాతాక్షుఁడు నిత్యుండు శ్రీ
యహిరాట్పర్వతనాథుఁ డవ్యయుఁడు సర్వాత్ముండు లీలార్థ మై
మహి మర్త్యాకృతి నొంది పిమ్మట మహామాహాత్మ్యపాషాణవి
గ్రహుఁ డై లోకుల బ్రోచు సత్కథల మాకర్ణప్రమోదంబుగన్.

359

క.

చెప్పితి విచ్చట వరుసగఁ
దప్పక వింటిమి మహాముదం బొదవెను నీ
గొప్పతనం బింతంతని
యప్పప్పా పొగడ శక్య మగునె మహాత్మా.

360


చ.

అని ఘనశౌనకాదిమును లందఱు గౌరవ మొప్పఁ బ్రస్తుతిం
చిన విని సూతుఁ డిట్లనియె సింధుసుతాధిపుఁ డైనపద్మలో
చనునిచరిత్రము ల్వొగడ శక్యముగాదు విధాత కైన నే
నొనరఁగ మీకటాక్షమున నూహకుఁ దోఁచినయట్ల చెప్పితిన్.

361


సీ.

అనుచుఁ బల్కిన రోమహర్షణుసుతుఁ జూచి
        మును లిట్టు లని రాదిమూల మైన
విష్ణుఁడ పాషాణవిగ్రహ మై యుండు
        హేతువే మన సూతుఁ డిట్టు లనియె
ననఘాత్ములార శ్రీహరి స్వస్వరూపంబు
        నందఱకును జూపఁ డందువలన
దనచిహ్నములు సర్వజనులు చూచి తరించు
        టకుఁ గృప లోకవిడంబనముగఁ


తే.

దాము పాషాణమృత్తికదారుమూర్తు
లందు దీపించి భూలోకమందు వివిధ
పుణ్యనామంబులను దాల్చి పూజగొనుచు
వారి కిష్టార్థముల నిచ్చు భూరికృపను.

362


వ.

ఇవ్విధంబున నొప్పు నర్చావిగ్రహచిహ్నంబుల నీక్షించి హరి
చిహ్నంబు లిట్టివని తెలిసి యీచర్మచక్షుస్సులతోఁ జూచిన
విగ్రహంబులు మనోదృష్టికిఁ బ్రత్యక్షంబు లగుచుండఁగ
హరి వారిమనోమాలిన్యనివారణంబు సేయుచుండుం గావునఁ

బ్రతిమార్చనంబులు చేసి తర్వాత హరి సర్వాంతర్యామి
యగుటం జేసి రామకృష్ణాదివిభవావతారధ్యానగుణాను
భవంబు చేయుచుండి దాన యనిరుద్ధప్రద్యుమ్నసంకర్షణ
వాసుదేవవ్యూహప్రభావంబు లెఱింగి ధ్యానించి తన్నామ
జపంబులు చేసి పరమగతిం బొందుట కర్చారూపంబులు
హేతువు లగు నందు సకలజనసంరక్షణంబు సేయుకొఱకు
శ్రీనివాసుండు స్వయంవ్యక్తార్చావిగ్రహుం డయ్యెనని చెప్పి
సూతుండు వెండియు నిట్లనియె.

363


క.

శృంగారాంగునకుం జయ
మంగళ మహిరాజశైలమందరునకు శ్రీ
మంగాపతి కతిశయశుభ
మంగళ మొనఁగూడవలయు మహియం దెపుడున్.

364


క.

అని సూతుఁడు వచియింపఁగ
విని శౌనకముఖ్యమునులు వేంకటపతినేఁ
గొనియాడుచు సూతునితో
ననువొందఁగ గోష్టి నుండి రచ్చట వేడ్కన్.

365


క.

భావజజనక శుభాకర
భావజరిపుమిత్ర భూతభావనవిలస
ద్భావాతీతజగన్మయ
శ్రీవేంకటగిరినివేశ చిదచిదధీశా.

366


తురంగవృత్తము.

వికటసురరిపుహరణ గురుతరవిశ్వరక్షణకారణా
సకలమునిజనహృదయకమలవిచారణాఘనివారణా

మకుటకలితవిలసితమణిఘృణీమస్తకాఖిలపూరణా
ప్రకటకనకరుచిరశిఖరయుతపన్నగాద్రివిహారణా.

367


మాలినీవృత్తభేదము.

కర్మవిధాయక కర్మవినాశక కర్మఫలాశ్రితకాంతియుతా
ధర్మవివేచన ధర్మసుఖార్జన ధర్మయుతవ్రత ధర్మరతా
మర్మసుఖాస్పద మర్మఫలప్రద మర్మవిలక్షణ మర్మహితా
భర్మనగాత్మజ భర్మగిరీశ్వర భర్మమయాంబర బ్రహ్మమతా.

368


విభూతిమయవృత్తము.

జ్ఞానమార్గదీపకా జ్ఞానదివ్యరూపకా
జ్ఞానయోగరక్షకా జ్ఞానవిజ్ఞశిక్షకా
జ్ఞానసద్విధాయకా జ్ఞానశక్తినాయకా
జ్ఞాసకర్మసాధకా జ్ఞాసపూర్ణబోధకా.

369


మాలిని.

సురహృదయవికాసా క్షుద్రరక్షోవినాశా
గురుతరసువిలాసా కోటిసూర్యప్రకాశా
పరమపదనివాసా పాలితాచార్యదాసా
సురుచిరదరహాసా సుందరా శ్రీనివాసా.

370


గద్యము.

ఇది శ్రీతఱికుండ లక్ష్మీనృసింహ కరుణాకటాక్ష కలిత
కవితావిలాస వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్య తనూ
భవ వేంకమాంబాప్రణీతం బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యం
బనుభవిష్యోత్తరపురాణంబునం దెఱుక కథయును, హరి
ధరణీదేవి కెఱుక చెప్పుటయుసు, ధరణీదేవి పద్మావతి నాద
రించుటయును, పద్మావతి తల్లికి హరివృత్తాంతంబు చెప్పుట
యును, వకుళ వచ్చి ధరణీదేవితో సంభాషించుటయు,
నాకాశరాజు హరికి శుభరేఖ పంపించుటయు, హరి యాకా

శరాజునకుఁ బ్రత్యుత్తరలిఖిత మంపించుటయు, వకుళ శేషా
ద్రికి వచ్చి హరికి శుభవార్త లెఱింగించుటయు, వివా
హంబున కర్థంబు లేదని వకుళ వరాహస్వామితో జెప్పు
టయు, హరిచేత శుభరేఖ గైకొని గరుడుండు సత్య
లోకంబునకు నరుగుటయు, శౌరిచే శుభపత్త్రిక కొని సని
శేషుండు శంకరుస కిచ్చుటయు, శ్రీనివాసుఁ డింద్రాదులతో
సంభాషించుటయు, సిరిం దలంచి హరి చింతించుటయు,
కొల్లాపురివాసి యైనలక్ష్మిని సూర్యుండు దోడ్కొని వచ్చి
హరిచెంత నిల్పుటయు, సిరితో హరి తనకష్టంబు చెప్పుటయు,
హరితో లక్ష్మి సంభాషించుటయఁ, గులదేవతార్చనంబును,
హరి కుబేరున కప్పుపత్రంబు వ్రాసియిచ్చుటయు, సాయం
కాలవర్ణనంబును, సూర్యోదయవర్ణనంబును, బ్రహ్మాదులతో
శ్రీనివాసుండు వివాహంబునకుఁ దరలివోవుటయు, స్వామి
కాకాశరాజు కన్యాదానంబు చేయుటయు, వివాహానంత
రంబునం జక్రి యగస్త్యాశ్రమంబునకుఁ బోయి బ్రహ్మాదుల
వీడ్కొల్పుటయు, శ్రీలక్ష్మి క్రమ్మఱఁ గొల్లాపురంబున కరుగు
టయు, వసుథాతొండవానులు యుద్ధసన్నద్ధులై యుద్ధము
సేయుటయుఁ, దొండవానునకు హరి విశ్వరూపంబుఁ జూపు
టయు, శ్రీనివాసునకు విశ్వకర్మ దివ్యాలయంబు నిర్మించు
టయుఁ, బద్మావతీసమేతంబుగ హరి శేషాద్రి చేరుటయుఁ ,
గూర్మునిచరిత్రంబుసు, శ్రీనివాసుండు భీమునకు సాయుజ్య
మిచ్చుటయును, దొండవానునకుఁ జక్రి సారూప్య మిచ్చు
టయు ననుకథలం గల పంచమాశ్వాసము.

  1. చందువ = మేలుకట్టు, సోసానము
  2. ఇఱులు = చీఁకటి
  3. ఆమెత = విందు
  4. పాకెన = సదస్సునాఁటి మహదాశీర్వచనము
  5. గ్రావము = కొండ