శ్రీరంగమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

      శ్రీరామాజనతాశిరోమణి వరించెన్ నాథు నంకంబుపై
      నౌరా యీచనునెంతలేదనుచు తా నాముక్తమాల్యంబు చూ
      ళీరత్నోపరి బూన్చుధారుణి మనోలీలారతిం జొక్కునా
      శ్రీరంగేశుఁడు వేంకటేశ్వరుఁడు రక్షించున్ బ్రపన్నావళిన్.

సీ. సాధితాసురవీర చక్రంబు చక్రంబు దాసుల భయములఁ దరుము దరము
      నమదమరానందకము నందకంబును విదళితాశ్రితమనోగదను గదను
      శక్తినిర్జితశంభు శార్ఙ్గంబు శార్ఙ్గంబు నచ్యుతాజానేయు నాంజనేయు
      ద్వాదశసూరుల ద్వాదశశూరుల నజకృతానతిని సైన్యాధిపతిని
      నతులితైతత్పురాణసహాయు భాగ; వతగణధ్యేయు మునిగేయు వైనతేయు
      దలఁచి పూజించి పెక్కుచందములఁ బొగడి, సేవసేయుదు ననఘ వాక్సిద్ధికొఱకు.

మహాస్రగ్ధర. కృతపుణ్యుల్గాఫలింపం గృతులు కృతులుగా నీప్సితార్థంబు లొందన్
      బ్రతిభా పాండిత్యసందర్భములు నవరసప్రౌఢి వాటించి మించన్
      శతసాహస్రప్రణామస్తవము లొనరుతున్ మామకాచార్యవర్యున్
      యతిరాజస్వామి నారాయణచరణసరోజానుషం గాంతరంగున్.

ఉ. నన్నయభట్టు బ్రెగ్గడను నాచనసోముని సార్వభౌము తి
      క్కన్నను పెద్దిరాజు మొదలై తగు నాంధ్రకవీంద్ర ముఖ్యులన్
      సన్నుతిఁ జేసి వారు రచనల్ పొసఁగించిన త్రోవఁగాంచి యా
      యెన్నిక నేను గొంతరచియించుటకున్ మది నుత్సహించితిన్.

ఉ. చెప్పిన పద్యముల్ రసము చిప్పిలుచున్నవి మేలుమేలనన్
      దప్పది యింతలేదనుచు దాకొనికొంద ఱసూయనాడ నా
      యొప్పిద మంతయున్ సరియె యొచ్చెములెన్నక వేంకటప్రభుం
      డప్పుడు నిల్చి మెచ్చగలఁ డక్కరలేదు మదీయవాణికిన్.

వ. అని యిష్టదేవతాప్రార్ధనంబును, సుకవిజహూకరణంబును, కుకవితిరస్కారం
      బునుం గావించి పరమపావనంబును, సనాతనంబును, పురుషార్థప్రదంబును, జగ
      ద్విదితంబును, నగు నొక్కమహాపురాణరాజం బాంధ్రభాషావిశేషరచనాచమ
      త్కారగౌరవంబుగా రచియింప నాప్తాలోచనంబుఁజేసి యొక్కశోభనదినంబున
      సుఖసుప్తినొంద నా స్వప్నంబున బ్రభాతపూర్వముహూర్తంబున,

సీ. శ్రీపాదయుగమది సేవించుసుకృతి నా యరచేతిమణియున్న కరమువాఁడు
      తొలుకారుక్రొమ్మించు దులకురాదనమించు దులకించుమేల్మి దువ్వలువవాఁడు
      ఘనఘనాఘన సమాకలితాబ్జహితరేఖ యొఱవచ్చు డామేనిగఱితవాఁడు
      భాగ్యరేఖాయుత ప్రచురమాణిక్యకుండలనిభాయుత లోచనములవాఁడు
      రత్నకోటీరమును కప్పురంపుపూత, చవులుగలహారముల కెంపురవలయందె
      లమర నమర శిరఃకిరీటాబ్జరాగ, జాలనీరాజితాంఘ్రి సాక్షాత్కరించె.

క. నాకల నీగతి సురలల, నాకలిత విశాలచామరాఖేలిత సు
      శ్రీకరవైభవు డవ్విభుఁ, డాకర్ణింపుమని యిట్టు లానతియిచ్చెన్.

గీ. మున్ను నాపేర నంకితంబుగ నొనర్చి, తవని బొగడొంద బరమభాగవతచరిత
      మిపు డొనర్చు ప్రబంధంబు నిమ్ము నాకు, నంకితంబుగ నేవేంకటాధిపతిని.

క. నీకవిత విన్న వీనుల, కాకడఁ బెరకవుల కృతుల నరుచిజనించున్
      మాకు మఱిమఱియు యుష్మ, చ్ఛ్రీకర వాక్యంబులందుఁ జిత్తము వొడమెన్.

క. కృతి సేయును గారుడసం, హితహితమది మాకు గారుడేలా దరమూ
      ర్జిత నిజధామంబగుటం, బ్రతిపత్తివిశేషమగుచుఁ బాటిలు నందున్.

ఉ. చేయరె తొల్లి సత్కవు లశేషపురాణములుం దెనుంగులో
      నీ యితిహాస మెందురచియింపమి తావకపుణ్యమింతె యా
      మ్నాయచతుష్కసారము సనాతనగారుడసంహితాశతా
      ధ్యాయి తెనుఁగుసేయ నొకఁడర్హుఁడె నేఁటికవీంద్రకోటిలోన్.

క. అని యానతిచ్చి గరుడా, ద్రినివాసుఁ డదృశ్యుడైన దిగ్గన నే మే
      ల్కని కార్యకరణములు వెస, నొనరిచి కొలువుండి యతిశయోత్సాహమునన్.

ఉత్సాహ. చేరిరాజులుం దొరల్ బ్రసిద్దులైన సత్కవుల్
      ధీరులున్ బురోహితుల్ సుధీనిధుల్ బ్రధానులున్
      చారులున్ భటుల్ నటుల్ పొసంగికొల్వఁ గొందఱిన్
      వారినిండ్ల కనిచి యాప్తవర్గముల్ భజింపఁగన్.

గీ. ఉండి సముఖంబువారికి నొక్కస్వప్న, మఖిలకల్యాణకారణంబైన నేను
      గంటి నని సర్వమును దెల్పఁ గవులు బుధులు, బలికె రిట్లని నాతో సుభాషితములు.

సీ. అవధరింపుము దేవ యంజనాచలనాథుఁ డైన వేంకటనాథుఁ డాదరమున
      స్వప్నసాక్షాత్కార సంవిధాన మొనర్చు నది యితోధిక విభుత్వాభివృద్ధి
      కృతిసేయుమని యానతిచ్చుటితోధిక సారస్వతోద్యోత కారణంబు
      తనకంకితముగాగ నొనరించుమను టితోధికదయాకిమ్మీరితేక్షిగనుట
      గారుడపురాణము తెనుంగుగా రచింపు, మనుటితోధిక కామితార్థాభివృద్ధి
      యొకరినేమెచ్చననుటతోధికకుమార, విభవదీర్ఘాయువులచేత వెలయుమనుట

క. నీయంతరాజుచేఁ గా, కాయంజనశైలభర్తయందునె కృతులి
      చ్ఛాయుక్తిఁ జేరి వెండి మ, హాయత్నముతో నొనర్చి యర్పింపుకృతిన్.

మ. హరిదాసక్షితిపాలశేఖరుఁడు కృష్ణాంబాసతీరత్నమున్
      జిరకాలంబు రమేశుఁగూర్చి రహిబూజింపంగ బూర్వార్జిత
      స్థిరపుణ్యం బిది నీస్వరూపమయి మించెంగాక యీ భాగ్యమి
      ద్ధరపై నన్యుల కేలకల్గు వరదేంద్రా! దానచింతామణీ.

క. సాధారణరాజన్యుల, కీధర్మము నిట్టిదయయు నీదాక్షిణ్యం
      బీధైర్య మేలకలుగు కృ, పాధననీయన్వయంబు పావనమయ్యెన్.

సీ. తనదు మిత్రత్వంబు గనిపింప నెవ్వాఁడు కడనుండి తమ్ములగాసిమాన్చె
      తనజగన్నేత్రత్వ మొనరంగ నెవ్వాఁడు జనులకు లోచనోత్సవమెసంగెఁ
      దనలోకబాంధవత్వముచూడ నెవ్వాఁడు శ్రేయోభివృద్ధులు సేయనేర్చెఁ
      దనతరణిత్వవర్తనముచే నెవ్వాఁడు దనరు సంసారాబ్ది దాటఁజేసె
      తనరు నెవ్వాఁడు తాత్రయీతనుఁడుగాగ, మేనఁ జోటిచ్చె నిందిరాజాని కతఁడు
      వరలుభాస్కరుఁడే తదన్వయమునందు, హాళి విభుఁడయ్యెఁ గరికాళచోళవిభుఁడు.

క. ఆకరికాళుని కులనీ, రాకరమునఁ గల్పభూరుహాకారముతో
      రాకారమణీకార, శ్రీకారణమూర్తి బిజ్జశేఖరుఁ డలరన్.

మ. తెలుగుం బిజ్జరరాజశేఖరుని గీర్తిక్షాత్రగాథావళుల్
      దలమే యెన్నఁగఁగల్గె రంగవిభుఁడే తద్వంశవిస్తారుఁడై

     
      బలవత్సంగరరంగభీమ ధరణీపాలావళీసింహుఁడై
      లలనామంగళలక్షణా సహనఖేలత్ఖడ్గబాహోగ్రుఁడై.

క. ఆరంగవిభుని తనయుఁడు, శ్రీరంగాధీశ్వరాంశ సిద్ధాకృతియై
      శ్రీరంగద్వైభవుండై, శ్రీరంగప్రభుఁడు వెలసె స్థిరశౌర్యమునన్.

క. ఆకట్టరంగవిభునకు, నాకద్రుమపంచకం బనఁగ గుణరత్న
      శ్రీకర నీరాకర మహి, మాకరులై వెలసి రేవు రాత్మజు లందున్.

సీ. చట్రాలపైఁగాక యెట్రాయొలిచె కట్ట కట్రాజనుచు రిపుల్ గంపమొంద
      పెద్దరాజులలోన నెద్దిరా పేరెందు పెద్దిరాజునకన్న పద్దు వెలయ
      శరదాగమారూఢ శరదాభినుతకీర్తి హరిదాస రాజశేఖరుఁ డనంగ
      రఘునాథతేజో నిరఘసాధితారాతి రఘునాథరాజన్యు రవణమెసఁగ
      యిచ్చి రాకున్న బిలిపించి యిచ్చురాజు, లచ్చిరాజుని యాచకు లిచ్చఁబొగడ
      కట్టరంగేశ గర్భముక్తాఫలములు గలిగి రేవురు వారిలో నలఘుయశుఁడ.

షష్ఠ్యంతములు


క. కుంభీనస రాట్తల్పుస, కంభోరుహబంధుమండలానల్పునకున్
      శాంభవశిరోవిభూషణ, జంభత్సంభవపదాంబుజాత నటునకున్.

క. కల్పితఫణికిన్ గ్రీనా, కల్పికమణికిం గటాక్ష కరుణాకలనా
      కల్పితజగత్పతికి ప్రా, గ్జల్పితపతికి శిఖిరహిత సతతనిహృతికిన్.

క. మధ్యేసముద్రావాసున, కధ్యేతవ్యప్రభావ హరికి మునీంద్రౌ
      ఘధ్యేయవిలాసున కన, నధ్యేయప్రభవ దుర్భవదురాసునకున్.

క. దర్వీకర వరకుధరా, ఖర్వశిఖరభాగ కేళికలనాదరికిన్
      గర్వితసుపర్వ శాత్రవ, శార్వరనిర్వాపణైక చణదోరరికిన్.

క. నిత్యునకున్ నమదఖిలా, దిత్యునకు పయఃపయోనిధిసుతాకృత దాం
      పత్యున కతికమనీయా, పత్యునకు నజాండభరణపాండిత్యునకున్.

క. రంగాధ్యక్షున కలమే, ల్మంగాశ్రితవక్షునకుఁ గళాధ్యక్షునకుం
      మాంగళ్యాకృతికిం దిరు, వేంగళపతికిన్ సమస్త విశ్వాద్బతికిన్.

వ. సమర్పితంబుగా నారచియింపంబూనిన గరుడపురాణశతాధ్యాయి శ్రీరంగమా
      హాత్మ్యంబను మహాప్రబంధంబునకుం గథాసంవిధానం బెట్టిననిన.

క. పుణ్యమయి విబుధమానస, గణ్యమయి మునికృత విష్ణుకథనకథాప్రా
      వీణ్యమయి నైమిశాఖ్యా, రణ్యము వెలయుం ధరణ్యరణ్యోత్తమమై.

మ. అనఘంబై తగునట్టి నైమిశసమాఖ్యారణ్యరాజంబుఁ గాం
      చనశైలాదులనుండి గాలవ వశిష్ట వ్యాఘ్రపాదాదులౌ
      మునికంఠీరవు లాత్మయోగధను లామోజాత్కు లధ్యాత్మువా
      సనలందన్ గుమిగూడి చేరిరి మనోజ్ఞానంబు లుప్పొంగఁగన్.

ఉ. గణనకు నెచ్చుగా మునినికాయము తద్వనసీమ సంక్సృదా
      రణి సమిధాదులౌ పరికరమ్ములుచేకొని ద్వారకాబ్జభా
      రణమగు సత్రయాగము కరంబొనరింపుచు నున్కి రౌమహ
      ర్షిణియు మహర్షులున్న సభ చందము కన్నులవిందు సేయఁగన్.

క. చేర న్వచ్చిన సూతు, న్వారలుగని సముచితాసనమున నునిచి యా
      త్మారాములగుచుఁ గుశలము, లారసి యూరటిల నమ్మహామును లెల్లన్.

గీ. ఓయిపౌరాణికోత్తమ! యొకపురాణ, మాత్మకలుషంబు నఁణచి సౌఖ్యంబు లొసఁగఁ
      జాలునది యానతిమ్ము మీసంప్రసాద, మహిమ నఖిలంబుఁ గరతలామలక మగును.

క. ఇందఱమును సంశయములు, చిందఱవందఱలుఁ జేసి చిత్తములకు నా
      నందము కందళితముగా, విందుము బలె వీనులలర వినుపింపు తగన్.

క. నా విని యబ్బురమున నో, పావనమతులార యిట్టి భాగ్యముగలదే
      యేవచ్చినపని యెట్టిది, మీవచనము లట్ల యగుట మెచ్చొదవించెన్.

సీ. వినుడెట్టులనిన నజ్జనకమహారాజు భూరిదక్షిణల నపూర్వమైన
      సత్రయాగ మొనర్ప మైత్రేయ నారద కణ్వ వశి ష్ఠాత్రి గౌతమాది
      మునులు పారాశర్యమునిఁ జూచి మీరు నన్నడిగినగతి వారు నడుగుటయును
      సాత్యవతేయుఁ డాసంయమీశ్వరులు వినఁగ గారుడపురాణమ్ము దెలిపి
      యెన్ని లే వితిహాసంబు లీప్సితార్థ, కేవలానందపదములు లేవుగాక
      ధరణిజనులకు కర్ణామృతంబుగాదె, తత్కథామార్గ మఘములు దలఁగుటెంత.

క. వారలు వేడినచందము, పారాశర్యమునిచేతఁ బలుకఁబడెఁ ద
      త్ప్రారంభము వినుపించెద, నేరుపడఁగనంచు సూతుఁ డిట్లనిపలికెన్.

మ. యతివర్యుల్ బహుతీర్థవాసు లతిపుణ్యశ్లోకు లాభారతా
      మృతసంభూతి వివేకసాగరుషడూర్మివ్రాతవిచ్ఛేదక
      ప్రతిభాలోకు నిరంతరాభికలిత బ్రహ్మానుసంధాను నా
      నతులై నూత్నసరోజకోరక సమానస్వాగ్ర హస్తంబులన్.

క. సన్నిధి నిల్చిన దీనుల, సన్నిధి శుకమౌని తండ్రి సాత్యవతేయుం
      డున్నత కరుణారస మొక, మున్నీరగఁ బల్ల జూపు మునులం బొదవెన్.

ఉ. చూచి యభీష్ట మెద్ది యనుచున్ గురుశేఖరుఁ డానతిచ్చినన్
      ప్రాచిరవిం గనుంగొనిన బద్మములుంబలె నుల్లసిల్లుచున్
      గోచరభాగ్యరాశి యని కోరిక లీరిక లెత్త బల్మరుం
      జూచుచు నాత్మలోఁ బరమశోధనకారణు లై మహామునుల్.
శా. ఆచక్రాచల మైనతీర్థముల నాయాసంఖ్యలం జూచి ము
      ఖ్యాచారక్రియ లెందు నేమరక మే మశ్రాంతముం జుఱ్ఱియున్
      మీచేఁ గాని మనఃకళంకవికృతుల్ మీటంగ మార్గాంతరం
      బాచార్యోత్తమ కానలేక భవదీయాంఘ్రుల్ శరణ్యంబుగన్.
గీ. వచ్చితిమి మాతలంపులు వరుస నీకు, విన్నపముఁ చేసి తగినవి వేడి మీర
      లానతియ్యంగ వినుమని యాదరమును, నాగదంతుని నియమించినార మిపుడు.
క. ఆనాగదంత మునితోఁ, బూనిక గారుడపురాణమున సందేశం
      బానతి యిండన వ్యాసులు, కానిండని వారిమీఁదఁ గరుణాపరతన్.
క. ఆనాగదంతుఁ గనుఁగొని, యే నెఱుఁగుదు వీరితలఁపులెల్ల నదైనం
      గానిమ్ము వేడు మెయ్యది, యేననవుడు గేలు మొగిచి యిట్లనిపలికెన్.
సీ. ఎవ్వాడు రక్షించు నీవిశ్వమంతయు నెవ్వఁడు రక్షించు నీప్రపంచ
      మెవ్వనిలోపల నిమిడియుఁడు జగంబు చేసె నెవ్వఁడు సర్వజీవసృష్టి
      యీపోడుములమాయ నెవ్వఁడు గల్పించె నెవ్వని నిగమంబు లెఱుఁగలేవు
      సకలశబ్దార్థవాచ్యంబు లెవ్వనిమూర్తి యంతకుఁ దా కర్త యెవ్వఁడయ్యె
      నట్టి యీశ్వరుఁ డెవ్వఁ డీయంబునిధులు, ద్వీపములు తత్ప్రమాణంబు దివ్యదేశ
      తీర్థపుణ్యవ్రతాదుల తెఱఁగు లెఱుఁగు, బెల్లఁ బేర్కొనుఁ డెందు నభిజ్ఞులగుచు.
గీ. అనిన నక్షరు నవ్యయు నాదిపురుషు, శ్రీశు నచ్యుతు హరి హృషీకేశు బరము
      సర్వమయు విష్ణు తామానసమున దలఁచి, మ్రొక్కి యిట్లనిపలికె నమ్మునివరుండు.
సీ. ధన్యమానస విను తత్పరమతితోడ గారుడసంహితఁ గలతెఱంగు
      దక్షుండు మును దేవతాసమూహము మౌనిగణములు గూడి యాగంబుసలుప
      నాయాగశాలలో నధ్వరుఁ డుద్గాతబ్రహ్మయుఁ దమతమపనులు నడప
      నందు నుద్గాతకర్ణామృతంబుగ సామగానంబు సేయ నాకాశవీథిఁ
      బుట్టె నొకమ్రోత జగము లిట్టట్టుగాఁగ, దిశలు ఘూర్ణిల్ల మౌనులు దిగులునొంద
      వేలుపులు మ్రానుపడ సభ వెఱగుఁజెంద, దక్షుఁ డిది యేమి యనుచుఁ జిత్తమున గలఁగ.
క. ఆసామగాన మప్పుడు, చేసిన నామంత్రణంబుఁ జెలువమర త్రయీ
      వాసి సనాతనుఁ డాగమ, భానురతనుఁ డింద్రముఖసుపర్వులుఁ గొలువన్.

సీ. ఒకచోట దేవతాప్రకర సమోవాక్కు జయజయధ్వను లాకసంబు నిండ
      నొకమేర సామవేదోక్త సుగానంబు ఘుమ్మని రోదసీకుహర మాన
      నొకవంక దివిజవైణికనారదాదుల పాట లజాండంబు ప్రబలికొనఁగ
      నొకచాయ వివిధరంభోర్వశీమేనకాలాస్య విలాసఖేలలు జెలంగ
      నొక్కయెడ దివ్యదుందుభుల్ దిక్కటాహ, పాటన ధిమంధిమల జెవు ల్పగులఁజేయ
      నొక్కతరి చైత్యమాక్యగంధోత్కటాహ, చందనాచలపవనంబు సందడింప.
క. ఛందోమయుఁడు ముకుంద, స్యందనరాజంబు దేవసంయమి జనతా
      మందారము వినతాప్రియ, నందనుఁ డయ్యాగశాల నడుమ న్నిలిచెన్.
సీ. శ్రీమహారోహణ శిఖరోపమానమై డాలించుమణికిరీటంబుతోడ
      నతులఫణామణిద్యుతులచే నసియాడు పన్నగకుండల ప్రభలతోడ
      నాజానుదీర్ఘమహాగ్రీవమరకతకమనీయమణికంకణములతోడ
      కాంచనాచలముపై మించు బారాతపశ్రీలీను చెంగావిచేలతోడ
      చకచకలు జల్లు ముత్తెపుసరులతోడ, నాత్మమణిమేఖలావలయంబుతోడ
      కనకమంజీర చరణయుగ్మంబుతోడ, నక్షరుఁడు తార్క్ష్యుఁ డపుడు బ్రత్యక్షమయ్యె.
ఉ. ఆకరణిం బ్రసన్నమతియై బొడచూపిన వైనతేయు లో
      కైకశరణ్యు నచ్చటి మునీంద్రులు దివ్యులు జాగిమ్రొక్కి యా
      లోకనభాగధేయమయి లోపలి జీఁకటి వాయఁజూచి య
      స్తోకమనస్కులై తగునుతుల్ ప్రకటించి రనేకభంగులన్.
వ. దేవా! యే మొనర్చు నీయాగంబు సఫలంబయ్యె. యజ్ఞపురుషుండవు నీవ. నీస్వ
      రూపంబు లెట్లనిన, సర్వత్రిదివత్స్వరూపంబై ధారుణీభారావహశకహూణకిరాత
      వారసంహారకారణ మహౌన్నత్యకరంబితాగ్రనాసంబగు మీముఖమండలంబునకు
      జయమంగళంబు. విశాలవర్తులంబులై గాయత్రీస్వరూపంబులగు మీలోచనమ్ములకు
      శోభనంబు. సకలలోకసంరక్షణజాగరూకంబై సోమాత్మకంబైన మీయాత్మకు
      భద్రంబు. వామదేవ్యరూపంబై వనమాలికాలంకృతం బయిన మీగాత్రంబునకు
      స్వస్తి. యూపప్రభావంబులై రాహుగ్రస్తదృశ్యమాణపహరిణాంకపార్శ్వశకల
      రేఖాకారంబులగు మీకోరలకుఁ గుశలంబు. ఛందోమయంబులై యనురూపంబుల
      యిన మీసకలాంగకంబులకుఁ బ్రణామంబు. సామరూపంబై సకలప్రపంచనిర్వా
      హకంబయిన నీబలంబునకు నుత్తరోత్తరాభివృద్ధి. చిత్స్వరూపదర్భాంకురమయం
      బులై సంధ్యారుణారుణంబులయిన మీపొదిఱెక్కగములకు విజయంబు. యజు
      ర్వేదప్రపంచంబై వజ్రసారంబయిన మీదంతంబుల కనంతకల్యాణంబు. చతుర్వే

      దాకారములై యమృతోత్సాదనసహాయ గజకచ్ఛపచ్ఛేదన బిరుదాంకంబులగు
      మీచరణంబులకు మేలువార్త. త్రయీవిద్యాస్వరూపంబైన సప్తజిహ్వాతులితంబగు
      మీజిహ్వారంగంబునకు సాధువాదంబు. సామాంగంబులమర్యాదయై విక్షేపమా
      దురతులాయమాన మేరుమంధరాచల ఘళఘళాయమాన సప్తసాగరకల్లోల సము
      త్పాటకోన్మూలాయమాన మహామహీరుహంబులై కుపితాఖండల దంభోళిధారా
      ప్రధాన పరిపాలనార్థ ప్రతిపాదిత నిజైకదేశాగ్రపక్షంబయిన మీపక్షద్వ
      యంబునకు నిరంతర క్షేమంబు. ధర్మవిధానంబై దివ్యమందారదామహరిచంద
      నపరమాభరణ ముక్తామాలికాద్యలంకృతంబయిన మీహృదయంబునకు నేమంబు.
      అథర్వణాత్మకంబై హిరణ్యబ్రహ్మాండకటాహబహిరావరణపావకవికాసంబయి
      న మీచెంద్రకావిదుకూలంబునకు భావుకంబు. మహనీయోపనిషణ్మయంబై విల
      యావసరసకలతోకగ్రసనన్యసనానపాయ క్షుధాధురీణంబయిన మీకుక్షికి సర్వ
      రక్ష. సామగానాత్మకంబై సర్వజ్ఞప్రకటంబయిన మీబుద్ధికి శుభంబు. అక్షరా
      త్మకావయవంబై ఱెక్కలతోటి మేరునగంబోయనం బరగు మీతిరుమేనికి శుభం
      బు. నారాయణశరణారవిందాఘాతకిణాంకితంబై కుంకుమకస్తూరికాపంకాలంకా
      రంబగు మీపరిణద్ధకంధరంబునకు నిత్యోత్సవంబు. విష్ణుశక్తియంతయినం జాలు
      మీయనంతశక్తి కి నిరంతరసంతోషంబులు. వేదాత్ముండవు. వేదమయుండవు.
      నీవు గానవేదవేద్యుండవు. విశ్వభావనుండును నగు పరమపురుషుండు పుండరీకా
      క్షుండు నీయండ నుండుననుటకు నితరప్రమాణంబు లేల? అట్టి నీకు సాష్టాంగన
      మస్కారశతసహస్రంబులు. నాగాంతక, సుపర్ణ మాకు నీచరణంబులే శరణం
      బులు. నీవే దిక్కు. జగంబు తావకాధీనంబు. క్రతుమూర్తివి. త్రయీమయుం
      డవు. భగవంతుండవు నైన నీకు దాసానుదాసులము. నీవీ దివ్యమంగళాకారంబున
      బ్రసన్నుండవైతివి. నీయనంతకల్యాణగుణంబు లెఱుంగ మే మెంతవారము. కరు
      ణింపుమని భయభక్తిపరవశులై కైవారంబుఁ జేసిన.
మ. ఉరగారాతి దయామతిం పఠిత సామోద్గాకవర్లించు నీ
      శ్వరదిగ్భాగము వేదిపై సననరక్షాబుద్ధిచే దక్షుఁ డా
      దరణన్ నిల్పఁగఁ జూచి రత్నఖచితోద్యత్పీఠికాసీనుఁడై
      సురమౌనీంద్రులఁ జూచి యిట్లనియె దక్షుం డెంతధన్యుండొకో.
మ. విను మేనిచ్చితి మీకు నొక్కవరమున్ వేడంగరాదంచు లో
      ననుమానింపక యెద్దియేనియును నన్నర్థించి గైకొండు కో

      రినకోర్కుల్ సమకూర్తునన్న సభవారే కొంకుచున్ కొంతసే
      పునకున్ నిశ్చితకామితార్థులయి యుద్యుక్తప్రమోదంబునన్.
గీ. అందఱును జాగి మ్రొక్కి కరాంబుజములు, ఫాలతలమున గీలించి పలికిరిట్లు
      సర్వతత్వమయుండవు సామలోల, చక్రపాణికి నాధారశక్తి వీవ.
క. తొలుక చతుర్దశవిద్యలు, నెలకొన్నవి నీదుమదిని నిగమంబులతో
      నలశౌరి జగము దాల్పఁగ, జలజాక్షుని దాల్చితీవు సామాన్యుఁడవే.
ఉ. కోరితి మేము వాఙ్మనసగోచరమై పరతత్వవాచ్యమై
      కారణదూరమై సకలకారణమై శరణార్థభూమియై
      దూరితకర్మబంధభవదుఃఖజరామరణాదిఖేదమై
      కారణజన్మ బ్రహ్మమనగా నవి యెట్టిది యానతీయవే.
క. నావిని సుపర్ణుఁ డిట్లను, నావేలుపుమునులఁ జూచి యనురాగముతోఁ
      బ్రానృణ్జలధరగర్జా, ప్రావీణ్య శరణ్య వచనభంగి జెలంగన్.
చ. తగిన తెఱంగు వేడితిరి తత్వవిచారవివేకదక్షులై
      నిగమరహస్యసార మతినిర్మల మాశ్రయణీయ మీహితం
      బగుణము నిర్వికల్పము నిరంజన మవ్యయ మేను దెల్పఁగాఁ
      దగునని యానతిచ్చి విదితంబుగ సర్వము నానుపూర్విగన్.
మ. సగుణబ్రాహ్మమయుండు సద్గుణమహైశ్వర్యుండు చిన్మూర్తియున్
      భగవంతుండును నైన విష్ణురథరూపస్వామి యాదిత్య ప
      న్నగగంధర్వముఖస్తుతుల్ సొలయ నంతర్థానముం బొందఁగా
      జగదాశ్చర్యమహానుభావము మదిం జర్చించి రమ్మౌనులున్.
క. ఈగరుడనిర్మితంబగు, భాగవతారాధ్యమైన పరమపురాణం
      బాగుణనిధులెల్లను మది, లో గురుతుగ నిల్పి రంతలో వినువీథిన్.
సీ. ఆకారమునఁ జతురామ్నాయములు మ్రోయ వందిబృందమ్ము భావములుఁ బొగడ
      పాణిస్థితంబైన వీణయు నొసపరిపాటల భాషావధూటి గొలువ
      స్తుతులు నారదవశిష్ఠులు వెంటరా వారిపజ్జల దేవతాప్రభులు రాఁగ
      గరుడ గంధర్వ కింపురుష నానావృత్తగీతవాద్యములు దిగ్వితతినిండ
      మూర్తివంతంబు లా యాగమములుఁ బురాణ, ములును ధర్మంబులును గెలంకుల భజింప
      హంసవాహనుఁడై సరోజాసనుండు, దక్షుఁ డలరంగ ధాత ప్రత్యక్షమయ్యె.
చ. ఎదురుగ వచ్చి మౌనులు సమీహితభక్తి నమస్కరించి హ
      ర్షదయగు నర్ఘ్యపాద్యముఖసత్క్రియచేఁ బరిణామ మొంద నా

      రదముఖులం భజించి నవరత్నమయాసనకోటి నింపుమీ
      రిఁ దురితదూరులం దరతరంబు వసింపఁగఁజేసి భక్తితో.
ఉ. పన్నగబోటి వచ్చిన ప్రభావము తారు మనోభిలాషముల్
      విన్నపమాచరించుటయు వీనులువిందులుగా రచించి యా
      పన్నశరణ్యుఁ డవ్విభుఁడు వల్కిన తార్క్ష్యపురాణవర్తనం
      బెన్నికమీఱఁ దెల్పుటకు నెంతయు సంతసమందె ధాతయున్.
సీ. ఆనందపరుఁడై శతానందుఁ డప్పుడుఁ బలికె సత్యంబె మీపలుకులెల్ల
      నకలంకవిజ్ఞానులై సూక్ష్మసూక్ష్మావలోకనులై యతిలోకులైన
      పరమమయోగులకు నేర్పడ దెట్టియర్థంబు వేదంబు లెట్టెట్ల వేదమూర్తి.
      యైనట్టి వైనతేయకృతేతిహాసంబు సంహితాశ్రేష్ఠంబు సమ్మతంబు
      కాన నాగదంతమౌ నంతరంగంబు, లోననరసి సకలలోకహితము
      సేయునట్టి తలఁపుచే నభిమానించి, వచ్చినాఁడ నిత్తు వరము మీకు.
క. గారుడము మీరువిన్నది, కారణముగ నన్నుఁ జూడఁగలిగెన్ మీరల్
      కోరుఁ డభీష్టము లనవుఁడు, వారందఱు కేలు మొగిచి వనజజుతోడన్.
క. దేవా కాలము గెలువఁగ, దేవాదులు నేరరట్టి తెఱఁగిడి కాలం
      బేవెరవున గెలువఁగనగు, నేవేలుపు నాశ్రయింతు మెఱిఁగింపుమనన్.
గీ. ధాత యిట్లను మీరెంత దలఁచినారు, మాటలో నిది చిక్కులమాట గాదె
      మిగుల మెచ్చితి వివరింతు మీరలెల్ల , హెచ్చరికెగాఁగ వినుమని యిట్టులనియె.
సీ. నిత్యంబు సత్యంబు నిరవద్యమాద్యంబు నిర్వికల్పముఁ జిత్తనిర్గుణంబు
      నిర్మలంబును సాక్షి నిర్హేతుకంబు నానందకందముఁ గరుణామయంబు
      నపరిచ్ఛదంబు బహ్మంబనా విలసిల్లు నారాయణసరూపనామకముల
      తద్దేవు దివ్యావతారంబు లమలినభూతిహేతువు లట్టిపుణ్యనామ
      వాచ్యుఁడే కాలచక్రప్రవర్తకుండు, కాలమయుఁ డట్టికాలంబు కర్మవశ్యు
      లైనవారికిఁ గర్తయౌగాని తాను, కాల మీశ్వరునకు నెందుఁ గర్తకాదు.
క. కాలమునకుఁ గర్తయనని, జాలు విరాట్పురుషుఁ డఁతడు సమయాశాంక
      శ్రీల దనయోగమున నే, వేళల ధరియించునట్టి విశ్వము నెల్లన్.
చ. జగదుపకారియై హరి రసావలయంబున దేవమానుషా
      దిగఁగల సర్వజీవవితతిం జనియించును బద్మవాస లో
      నగుతరుణుల్ విహంగవరుఁ డాదిగ పార్శ్వచరుల్ సుదర్శనా
      దిగణితసాధనంబులు మతించిరిగా జనియింతు రందులన్.

గీ. ఇచ్చవచ్చినప్పు డేవేళ నెయ్యెడ, నేమి సేయవలయు నీశ్వరునకుఁ
      దలఁచినపుడుఁ బుట్టి తానట్లు గావించు, పాయ డెపుడు వైనతేయుఁ డతని.
ఉ. తాబుధరక్షణార్థమయి దానవభేదినినుండు జాయమా
      నోబహుధాయనన్ శ్రుతివినుం డటుగావున తార్క్ష్యుఁ డిద్ధ తే
      జోబలశాలియై పొడముచున్ హరియట్ల మలంగు నట్టివాఁ
      డే బహుపుణ్యసంహిత మహిన్ వెలయన్ రచియించెఁ గంటివే.
వ. అన నమ్మౌనులు దేవ! పద్మభవ! మీ రవ్వైనతేయు న్నుతించిన మావీనులు
      చల్లనయ్యెను. జగన్నిర్మాణతం కాశ్యపేత్వ నిరూఢం నినుబోల నాతఁడు త్ర
      యీవర్గంబు మీరిర్వురందును పూర్ణంబులుగాగ నిల్చినవి యెన్నున్నిమ్ము త్రై
      యంత్రములు.
గీ. వైనతేయుని శ్రీపాదవనరుహములు, భక్తి సేవించి తత్కృతి ప్రౌఢిమంబు
      విని కృతార్థుల మగుట యవిద్యమాసె, మిమ్ము భజియింపఁగలిగినఁ బుణ్యమ్ము గాదె.
క. అని వినుతించిన వారిం, గని దీవనలిచ్చి ధాత కలహంసముపై
      జనియె న్వేల్పులు గొల్వఁగ, మునులయ్యధ్వరము సాంగముగఁ గల్గుటయున్.
క. అచ్చోట వాసి నలసిన, యిచ్చలఁ జనిరందునుండి యేనిచ్చటికిన్
      వచ్చితి నీకథ దెల్పెద, ముచ్చటమీఱంగ వినుము మునివర యనుచున్.
క. కరయుగముఁ గన్నుఁదమ్ములు, నర ముగిచి రమేశు నీశు నచ్యుతుని మదిం
      స్మరణ మొనరించి గారుడ, పరమపురాణంబు శక్తిపాత్రుఁడు తెల్పెన్.
మ. విను మీప్రశ్నకు నాగదంత యపుడీవిశ్వంబు బ్రహ్మంబునం
      దునె యుత్పత్తియు వృద్ధియున్ లయము నొందున్ బ్రహ్మ మాధారమై
      దనరున్ సర్వచరాచరాత్మకును నిత్యంబైన లోకాళికె
      ల్లను జన్యంబులఁ దారతమ్యవిధు లెల్లం గర్మతద్రూపముల్.
గీ. అట్టిబ్రహ్మంబు భగవంతుఁ డనఁగ విష్ణు, డనఁగ నారాయణుండన నతిశయిల్లి
      ఇది బహుళరూపకత్వాభయంబుగాన, బ్రహ్మ మనుపరిదాత్యమై పరిణమించె.
క. ఘృతకోశాతకి నుదుటకుఁ, బ్రతిమంబై యితరులకును బ్రహ్మత్వంబుల్
      బ్రతిపాద్యమయ్యు నీశ్వరుఁ, డతంఁ డొక్కఁడ బ్రహ్మమనఁగ నభినుతిఁగాంచున్.
శా. ఆయీశుండు బ్రపంచనిర్మతికిఁ దా నాది న్మహాపూరుషున్
      ధీయుక్తిన్ సృజియించె భూతబహుధానిర్మాణశక్తిప్రభా
      వాయత్తప్రకృతిన్ సృజించె నతఁ డందావిర్భవించన్ దమం
      బాయం దజ్జనితంబహూకరణమం దయ్యెన్ గుణవ్రాతముల్.

గీ. అవియ వైకారికమున భూతాదితైజ, సంబన సగుణభేదత్రయంబు వాని
      వివర మెట్లన్న భూతాదివికృతివలన, బెరసె నాకాశతన్మాత్ర బీజసరణి.
సీ. గగనంబు మొదట శబ్దగుణాత్మకము దానస్పర్శతన్మాత్రతో పవనుఁ డుదయ
      మయ్యె నందున బుట్టె ననలుండు రూపతన్మాత్రచేత రసతన్మాత్రవలన
      గలుగు నంబువు దాన గంధకన్మాత్రలయ్యె నేతన్మయంబరయగా న
      జాండము.............................బ్రహ్మం బనంతనామ
      కళిత మైయుండు బ్రహ్మను గలుగజేసి, బ్రహ్మచేఁ గల్గి రిట ననబ్రహ్మలనఁగఁ
      బడియు నలువురు మనువు లాబ్రహ్మలకును, మనువులకు మానవులు బుట్టి రనఘచరిత.
క. స్థావర మానవ తిర్య, గ్దేవాదుల జీవకోటి తీరనికర్మం
      బే విత్తు మొదలుగా యం, దావిర్భవ మొందుదురు క్రియాపరవశులై.
క. యుగములు వేవరుసల నా, లుగుగడచిన బ్రహ్మకుఁ బగలుగడచుఁ బదునా
      లుగు మన్వంతరములు నపు, డగు నింద్రాదులు నశింతు రాదిత్యులతోన్.
గీ. నలువ మరునాఁడు లేచి మున్నట్టియమల, సృష్టి కుద్యుక్తులైన విరించులెల్లఁ
      దమదు బ్రహ్మత్వశక్తిచేఁ దత్తదుచిత, జీవకర్మానుగతి సృష్టిఁ జేతురపుడు.
క. దేవాదియోను లందున, నావిర్భవమొంది కర్మమను సారిగతిం
      మావరియించిన సుఖదుః, ఖావని నొందుదురు త్రోయనగునే తమకున్.
క. విత్తు మొదలి చెరచినగతి, నుత్తమధర్మమున శ్రీశు నుల్లమునందున్
      హత్తించి కర్మఫల మతఁ, డెత్తుకుచనఁ దారు ముక్తి కేగుదు రధిపా.
శా. అన్యోపాస్థులు నన్యదైవభజనం బన్యక్రియాలోకనం
      బన్యాసక్తిఁ దదన్యమంత్రజపపూజారాధనాదుల్ వృథా
      యన్యాయంబుగఁ జేయ నేమిఫలమో హా! యర్హులే వారలే
      మాన్యుల్ ఖేదములేని మంచియెడ....................
గీ. తనరజస్తామసగుణాళి ననుసరించి, యెందుఁ గడలేనిజన్మంబు లెత్తవలదు
      సత్యమిది శ్రీనివాసుని శరణ మొంది, మనుట లెస్సయు నాబుద్ధి వినుట లెస్స.
క. వైకారికగుణములు రెం, డైకనుపడు రాజసౌఖ్య మే తేజసమై
      ప్రాకట వైకారిక ధ, ర్మాకలితచిదింద్రియంబులై జనియించెన్.
సీ. అనఘ వీనులు మేను నక్షులు జిహ్వ నాసాఖ్యలు జ్ఞానేంద్రియంబు లండ్రు
      పనివడి వాక్పాణి పాదయూపస్థ లైదును కర్మేంద్రియంబులండ్రు
      సంకల్పభువనముల్ జనులు కర్మాధీనమైయుండు బుద్ధికర్మాదు లెల్ల
      కాలవశంబులు కాలంబు నీశ్వరాధీన మీశ్వరుఁడు శ్రీజానిసుమ్ము

      కలరె మఱియన్యదైవములు ప్రపంచ, సృష్టియెట్లయ్యె నెట్టివాంఛితమనుండు
      భూమ్యచలసాగరద్వీపములు తెఱంగు, లానతిండన మఱియు నిట్లనియె నతఁడు.
చ. అడిగెడి దీశ్వరావయవమైన ప్రపంచములో తెఱంగు దా
      నొడువుదునంచు నెంతటిఘనుల్ వచియింపసమర్థులే తలం
      పడుగుటఁ జేసి శౌరికృప నాత్మకు లోనగునంతమాత్ర మే
      ర్పడు వివరింతునంచు నిరపాయవివేకనిధాన మిట్లనున్.
గీ. పృథివి తొమ్మిదియగు నర్షభేదములను, ద్వీపభేదంబులను సప్తవిధము లయ్యె
      భూమిపరిణామవిధముఁ దన్నామములును, లోకములచంద మెఱిఁగింతు నీకు నిపుడు.
సీ. వర్షభారతము కింపురుషంబు హరీవర్షంబనంగ నిలావృతంబనంగ
      కెలనభద్రాశ్వంబు కేతుమాలాహిరణ్మయము నాగ వర్షనామములు దాన
      నొకపేరు వర్షంబునకు వేరువేర తొమ్మిదిఖండములు సౌంజ్ఞ లొదవు మొదటి
      భారతవర్షంబు నీరీతి నవఖండములనొప్పు నిందు దీవులు వచింతు
      జంబువును ప్లక్షనామంబు శాల్మలియు గు, శంబు క్రౌంచంబు శాక పుష్కరము లనఁగ
      లక్షయోజనముల నొప్పు ప్లక్ష మిటుల, యొక్కటొక్కటి ద్విగుణించి యొప్పుచుండు.
గీ. ఇట్లు ధారుణి యేఁబదికోట్లయోజ, నాలివర్తించు డెబ్బదివేలఁ గోట్లు
      పొడవుమీఁదటిలోకముల్ బుడమిగ్రిందు, నుండు యొండొండఁ బదివేలయోజనములు.
క. ఇంతయు బ్రహ్మాండంబగు, నంతయు దా బ్రహ్మశక్తి నౌదలనిడి ని
      శ్చితుండై శేషభోగి య, నంతుఁడు వర్తిల్ల జగము లారాధింపన్.
గీ. సూర్యచంద్రులదీప్తి యచ్చోటనుండు, నంతమాత్రంబె భూమియు నాకసంబు
      దిక్కులునుగాని యామీఁదనోక్కటియును, గానమిక వొందు బ్రహ్మాండకర్పరంబు.
సీ. జగతికి లక్షయోజనములపై సూర్యుఁడుండు నిన్మడిఁ జంద్రమండలంబు
      తద్విగుణంబు బుధగ్రహమండలం బలవడ శుక్రమండలము నట్ల
      యామీఁద భౌమ బృహస్పతి శనిమండలంబులు తద్విగుణంబు వాని
      పై లక్షయోజనపరిమాణనసతి సప్తర్షిమండల మొప్పు దానిమీఁద
      గాలచక్రప్రమాణశిఖాముఖమున, నమరు ధృవుడటు మూడులోకములు నయ్యె
      దానిపైఁ గోటియోజనస్థలమునందు, నమరుచుండు మహాలోక మనఘచరిత.
క. యోజనకోటిద్వయమిత, మై జనలోకంబుమీఁద నగుతద్విగుణం
      బాజగతి తపోలోకం, బాజమిలిన్ సత్యలోక మభినుతిఁ గాంచున్.
క. సత్యాదిలోకషట్కము, ప్రత్యేకము వాయు పాశబద్ధములై సా
      తత్యము ధృవమరుదు ధృవా, దిత్యులకు న్నడుమనిడి ప్రదీపితుఁ డయ్యెన్.

క. ఈలోకములకుఁ బదియును, నాలుగుకోటులకు యోజనమ్ము లజాండం
     బాలెక్క విస్తరిల్లుం, బైలెక్కయుఁ గలదు కొంత పరికింపంగన్.
సీ. అందుమీఁదటను తోయావరణంబు బ్రహ్మాండమునకుఁ బదియంతలయ్యె
     నన్నియు వాయువు నాకాశము మహత్తహంకారమును ప్రకృత్యాదులైన
     యవరణంబును నట్ల యొండొంటికి దశగుణోత్తరవృద్ధి దనరి యట్టి
     యాద్యంతమును మహత్తనఁదగు తత్వంబు ప్రకృతరూపకుఁడైన బరమపురుషు
     చేత నావృతమయ్యె నీసృష్టియందు, మీఁదఁ గాలంబు నవధియు మీఁదగ్రిందు
     దిక్కులును నాకసము లేదు తెలియ నక్ష, రుండు చిన్మూర్తి నిండుకయుండు నందు.
గీ. అట్టి యీశ్వరుఁడైన బ్రహ్మంబు శక్తి, యంద నేకీభవించి పాయడు తదీయ
     మహిమమున కధితంబు సామ్యంబు లేదు, సగుణుఁడై తానె సృజియించు జగములెల్ల.
మ. ఇవి నానామరచూళికాతటమణీప్రేంఖన్మయూఖోల్లస
     త్పదపంకేరుహయుగ్ముఁడైన గరుణాపారీణు లక్ష్మీయుతుం
     మదిఁ జింతింపుచుఁ దత్ప్రసాదమహిమన్ వాకొంటి నట్లుండెఁ దె
     ల్పెద నారాయణమంగళాయతనముల్ క్షేత్రంబులున్ దీర్ఘముల్.
శా. లక్ష్మీపక్ష్మలదృక్పదాబ్జయుగళీలాక్షారసాక్లిష్టతా
     లక్ష్మీపంచితపక్షరాక్షసభుజశ్లాఘాహరప్రాభవా
     సూక్ష్మప్రేక్షజితాక్షమౌనివిదితజ్యోతిర్మయాకార శే
     పక్ష్మాభృత్తటకోటకస్థలరిరంసాసక్తచిత్తాంబుజా.
క. ప్రాభాతికాబ్జశోకా, సౌభాగ్యధురీణనయన సరసమధురవీ
     క్షాభంగకిశోరావళి, కాభూషితజలధికన్యకాముఖకమలా.
స్వగ్విణి. మంజరీపుంజ సద్భ్రాంతి భృంగాంగనా
     మంజుసంగీత సంపద్విశేషోల్లస
     త్కుంజ నానాలతాదృక్సురత్పానుభా
     గంజనాహార్యశృంగాగ్రనీలాంబుదా.

గద్య
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకలవిద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంద్ర వరదరాజేందప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యంబను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.