Jump to content

శ్రీరంగమాహాత్మ్యము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

పంచమాశ్వాసము

      శ్రీరమణీ ధరణీ నీ
      ళారమణీయాంగరాగ లలితాలేపా
      చారునితాంతలసత్కర
      హారి విభాతరణి వేంకటాహార్యమణీ.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెరంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
సీ. అనఘ ద్వైపాయన వినవేడినవి యెల్ల వింటిని నీచే సవిస్తరముగ
      నిగమంబులుఁ బురాణనికరంబు లధ్యాత్మసారంబులు విశేషశాస్త్రములును
      నీచేతనైనవి నిగమశాస్త్రార్ధముల్ వేరు మీ మాటలు వేరు గావు
      రంగధామమున తీర్థము లెన్ని యందుల మహిమ యెట్టిది విన మనను వొడమె
      నానతిండన నాగదంతాదులకును, బాదరాయణుఁ డెఱిఁగించుభంగి మీకు
      దెలిపెదనటంచు శౌనకుఁ దేరి చూచి, యాదరంబున సూతుఁ డిట్లనుచుఁ బలికె.
క. తీర్థంబు లారుగల వవి, సార్థఫలప్రదము లనఘు లగువారల కీ
      యర్థము ధర్మాదిమ బురు, షార్థము లొనగూర్చు నెట్టులన వివరింతున్.
శా. భారద్వాజమహామునీంద్రుఁడు తపఃప్రారంభియై శిష్యు లా
      త్మారాముల్ తనవెంట రా నతులపుణ్యం బైన కావేరికా
      తీరారామ రసాలపూతపనసాదిక్ష్మారుహవ్రాతముల్
      సారెం గన్నులవిందు సేయఁగ యదృచ్ఛామార్గసంచారుఁడై.

సీ. ఉల్లోలలహరికాలోద్ధూతనిర్భిన్నశాతవిషాణాగ్రసామజాళి
      వనదేవతాంఘ్రిజీవనజనూపురరణాభ్రమదవిభ్రమరణద్భ్రమరకులము
      స్వామిభవత్ప్రాంతతసంతతాధ్వరహవ్యవహవధూవర్ధితవార్దరంబు
      నశ్రాంతనిగమపరాయణ జపనూను సచ్ఛాత్రకరహరిశ్చందనంబు
      హరిణకలభవిలంఘ్యమా నాగ్రభాగ, సరణి విస్తారితార్ద్ర కాషాయవసన
      ఖండదావానలము సహ్యకన్యకాత, టంబు పుణ్యాశ్రమములఁ జిత్తంబు బొదల.
ఉ. చూచుచుఁ జంద్రపుష్కరిణిఁ జాచి తదీయవిటంకసీమలన్
      రేచిత వల్లిత ప్లుత చరిష్ట కపోత శుకీ కల స్వన
      శ్రీచణలీకలిన్ బులుగుచిక్కములై యలరింప మెచ్చుచున్
      వేచకనీరజాకృతి నమేయుని రంగనివాసు గొల్వఁగన్.
తే. చేరి సకలప్రదాయి లక్ష్మీవిధాయి, నజహరధ్యేయి జలధికన్యానుపాయి
      నాగమస్థాయి శ్రీనివాసావిధేయి, శేషశాయిని గాంచి పూజించి పొగడి.
క. కోవిల వెలువడి తవదురు, పావన కరుణాసముద్రుఁ బరతత్వనిధిన్
      ధీవిజ్ఞానవిలాసుని, ధీవరు వాల్మీకిముని నదీతీరమునన్.
శా. చూడన్ వేడి తదాశ్రమాంతరమునిస్తోముంబు నీక్షించి యే
      జూడన్ జూచితిఁగాన మద్గురువరున్ సత్యాత్ము ప్రాచేతసున్
      వ్రీణామాత్రజితాంతరంగరిపుఁ గూర్మిం జూపుఁడ న్నంబరి
      వ్రాడాదిత్యులు వామలూరుతనయావాసంబు సూచించినన్.
క. తా వచ్చి కొండదవ్వున, కావేరీతీర మౌని కాంతారంబున్
      శ్రీవారాగారంబుల, భావుక పావన కిశోర పరివారంబున్.
సీ. చాటుఁగాఁ బొదరింట లేటి బాలింతకుఁ బురుడోయు సోకోర్చి పులిమిటారి
      యలగాడ్పు లేఱకుల చిలువబాలకు లాడ బర్హ మెండకు బూటుబట్ట కేకి
      చిలుక చూలాలి నొప్పులబిట్టకుట్ల కేమరకాచు చూపిల్లి మంత్రసాని
      కందంబు లెమ్మేనికండూతి వారింప గోకు సింగము వాడిగోరుకొనల
      తేటికొదమకు సంపెఁగతేనెయుగ్గు, బోసి పోషించుఁ జీఁకటి పులుఁగు లేమి
      జాతివైరంబు లేక నాసంయమీంద్రు, మహిమ నయ్యాశ్రమముఁ జొచ్చె మౌనివరుఁడు
క. శ్రీమద్రామాయణచరి, తామృతసంభూత వార్ధి యగువాల్మీకిన్
      రామస్మరణపరాయణ, తామరసాక్షా పరావతారుం గనియెన్.
తే. కదర్చిగోత్రాఖ్యమగు నమస్కార మతని, పాదపద్మంబున కొనర్ప నాదరించి
      యోభరద్వాజ యెచ్చోటినుండి రాక, యెచ్చ టెచ్చటి కేఁగితి విన్నినాళ్ళు.

గీ. పలుకుమన పుట్టయిట్టుతాపసినిఁ జూచి, తీర్ధములు జూడవేడి ధాత్రిని జరించి
      మీరలున్నారు కావేరి తీరములను, ననుచుఁ గొందరుమునులు తెల్పిన కతమున.
క. వచ్చితిమి వేడ మునివరు, లిచ్చట లేఁ డనెడువారు నెచ్చటనుండో
      వచ్చుననువారుఁ జూచితి, మిచ్చట ననువారు నగుచు నందఱుఁ బలుకన్.
క. వినివచ్చి మిమ్ముఁ గంటిన్, జననంబుఁ గృతార్థమమ్యె సఫలంబయ్యెన్
      దనతన మాచార్యోత్తమ, మనమున నానందవార్ధిమగ్నుఁడ నైతిన్.
క. ఇచ్చటి శశిపుష్కరిణియు, యిచ్చటి రంగేశుసేన నిచ్చటి నదియున్
      వచ్చి కనుంగొను సుకృతము, వచ్చి మిముం జూపె భాగ్యవశమున నాకున్.
గీ. ఎన్ని తీర్థంబు లిచ్చోట నున్న నందు, నాశ్రయించి కృతార్థులైనట్టివార
      లెవ్వ రానతినిండన్న నిట్టులనియె, నాభరద్వాజమౌనికి నాదిసుకవి.
కి. ఏనాడు విభీషణుండను, దానవపతి నిలిపె రంగధామము నిచటన్
      యేాఁటనుండి నాయక, యీ నెలవున నున్నవాఁడ నిచ్ఛారతినిన్.
క. కలవారి పుణ్యతీర్థం, బులు రంగక్షేత్రనికటభూముల దానం
      దులలేని మహామహిమము , లలవడ నశ్వత్థతీర్థ మాద్యం బయ్యెన్.
మ. కన దశ్వత్థము చెంత మాధవియనంగా నొక్క కన్యామణీ
      తిలకం బాసరసిన్ మునిగి శుచియై తీరంబునన్ తాలి పు
      వ్వులు శృంగారవనంబులన్ నెరసితావుల్ గట్టి రంగేశు కో
      వెలకర్పించుచు నుండె దీర్థనికటోర్విబ్రహ్మచర్యంబునన్.
మ. ఉటజావాసమునం దపోనిరతమై నుత్తుంగవక్షోజలం
      పట మీక్షింపకయున్ననే తనదు మీపానీయకుంభంబుచే
      నెటు కానో యన కాసరోవరబలం బేప్రొద్దు నశ్వత్థనై
      కటికానాలమునందు నింపుచును రంగస్వామి భావింపుచున్.
క. ఉండునెడ గానరావే, దండింపకుమయ్య తాళజాల ననాథన్
      రండెవ్వరైన నడ్డము, గండను నార్తస్వనం బొకటి చెవి సోకెన్.
క. ఆకాశవీథి నేడ్చుచు, నీకరణి బలు కనాథయింతిరవముగా
      నాకర్ణింపుచు వెరవకు, మోకమలేక్షణ భయంబునొందకు మనుచున్.
క. అయ్యా యన్యాయంబును, నియ్యార్తరవంబుదాన నెవ్వతెవే నీ
      కుయ్యాలించియు బ్రోచెద, నెయ్యది నీజాడ యహితులెవ్వ రటంచున్.
క. గగనమున జూడ దానిం, బిగగట్టుకొ కొట్టి కొట్టి బెదరింపుచు నో
      సి గయాళి నీకు నోరా, వగలించిన విడిచిపుచ్చువారమె నిన్నున్.

మ. అన నోహో నిలుఁ డేల పోయెదరు మీ రాహా మహాపూరుషుల్
      కనినన్ ముగ్ధననాథపౌరుషమె యార్వంబట్టి పీడించుటల్
      చనునే కృత్య మకృత్యము దలఁప కీచందాన బాధింప నే
      మి నిమిత్తమం బది యేమి జేసె నకటా మేలే వధూద్రోహముల్.
తే. బాల యీలీల విలపింపనేల నీకు, బాల శ్రీరంగశాయి నీపాల గూడు
      మిన్నవయు యేలకొట్టెదు రన్నలార, వలదె కనికరమింత యెవ్వారికైన.
శా. మీరల్ జూచిన పుణ్యమూర్తు లిదియేమీ క్రూరకృత్యంబు లె
      వ్వారున్ జేయనివెల్లఁ జేసెదరు నావాక్యంబు వో ద్రోయకి
      న్నారీరత్నము డించి మీరు చనుఁడన్న న్మాధవీసూక్తముల్
      వారల్ వీనుల నాలకించి చన నవ్వామాక్షి వీక్షింపుచున్.
సీ. సమ్మతంబున వినవమ్మ తపస్వినీ జనులకుఁ గర్మానుసార మగుచుఁ
      బొందును సుఖదుఃఖములు కర్మమది కాలవశమగుఁ గాలప్రవర్తకుండు
     సర్వేశుఁ డట్టి యీశ్వరుని యాజ్ఞాచక్రమరయ దుర్లంఘనీయంబు గాన
      యీశ్వరాధీనుఁడై యిల కర్మవశ్యుల దండించు మాస్వామి దండధరుఁడు
      ధరణిగలయట్టి ఘోరపాతకుల నెల్లఁ, బట్టితెండన శమనునిపనుపుఁ జేసి
      నిల జరింపుచుఁ గలుషాత్మకులను వెదకి, పొలియఁ గొనిపోవునట్టి దూతలము మేము.
క. ఆమిత్రితనయుసన్నిధి, కేమూరకఁ గొంచుఁబోవ మిల పాతకులన్
     దామేనను బట్టి యీడ్చుచు, బాములు వెట్టుచును బాధపరుపఁగఁ దరుణీ.
మ. ఇల యెంతేనియు ముగ్ధగోల యని మమ్మీక్షించి వాకొంటి వీ
      సుదతిన్ జూచితిగాన నీడకలున్ జూడంగలేవైతి వె
      య్యది పాపంబని యుర్విమీఁదఁ గలదో యీరాగ యిప్పాపముల్
      కెందగానియ్యక కూడవెయ్యనివి మీకుం దెల్పరా దేమియున్.
సీ. అత్తమామల కెదురాడు దుశ్చారిణి వావివర్తనలేని వాడవదినె
      కొండేలుఁ గంపలు గూర్చు పాతకురాలు బలిభిక్షమిడని నిర్భాగ్యురాలు
      మగనితో యేవేళ జగడించు జగజంత పసిబిడ్డలను దిట్టు పాపజాతి
      దీనికై బాసలు తెగిసేయు నడిగొట్టు ఛుళ్ళకమ్ములు దెచ్చు ముళ్ళమారి
      కాము ప్రాణంబుగాఁ జూచు కష్టురాలు, బరవకూతలు కూయు దబ్బరలు రోసి
      కెలనిమేలు సవారింపని కిల్బిషంబు, దీనికై నీవు కనికర మూనఁ దగునె.
గీ. దీనిసేతలు కూతలు దీనియేడ్పు, లింతమాత్రంబుఁ జూచితి వింతె గాని
      యెంతవినపాలవిత్తని యెఱుఁగవైతి, యేము నీమాటకడ్డము వినుము నీవు.

క. నీకేమి నోరు నొచ్చునొ, యీకులటన్ విడువుమనఁగ యేమీ మాటల్
      గైకొన ధర్మవిరుద్ధము, మాకు న్నేరంబువచ్చు మాయేలికచేన్.
క. ఆజ్ఞాతిలంఘనము మే, మజ్ఞులమే సేయ నిట్టులాడితి నీకున్
      ప్రజ్ఞాహీనత వాటిలు, విజ్ఞానాత్మక యెఱుంగవే కాదనఁగన్.
శా. దీనిం జట్టలు జీరి యింగిలమునన్ ద్రెళ్ళించి పొర్లింపుచున్
      నానారౌరవఘోరరూపములలోన న్వైచి మర్దింపుచున్
      శ్యేనోలూకబకాహికాకముఖపక్షివ్రాతకాలాయసా
      నూనత్రోటుల గ్రిచ్చజేయునపు డెన్నిం దొంటి దుష్కర్మముల్.
క. ఆపర్యంతము మాకున్, గోపము దీరదుసుమమ్మ గోపింపకుమీ
      నీపలుకు మీరినామని, మాపై గరుణింపు పోదుమా యని యనినన్.
గీ. అన్నలార యిదేలసత్యంబు మీరు, పలుకు లెల్లను వినరాని పాతకములు
      జేసినట్టిది యౌ నిది జెప్పవలసి, యుండె నొకమాటఁ దెలియవినుండు మీరు.
గీ. దీనినమ్మించి వెరవకు మేను గలుగ, బ్రోతునని యంటి నాకమ మ్రోలఁబడియె
      మఱియు దీనికి నొకఖేదమా నిమేష, మాత్రలో దీని గడదేర్చుమతము నాది.
క. ఇది తిరుకావేరీనది, యిదె శశిపుష్కరిణితీర్థ మిదెయశ్వత్థం
      బిదె తత్తీర్థము రంగం, బిదె రంగబ్రహ్మవసతు లీవను లెల్లన్.
గీ. దీనియఘములు తీరనివైన నేమి, యేనిచటఁ జేయుతపమునం దేకవార
      ఫల మొసంగితి దీనికిఁ దొలఁగిపొండు, విడువుఁ డయ్యింతినని తపస్విని వచింప.
సీ. ఎవ్వతెవచ్చె ముల్లిడుముత్రోవల నట్టియలివేణికా యడుగడుగు మడుగు
      లీచెలియఘముల కాచెలి బాధించుఁ బగవారలెల్లను బంధులైరి
      యేతలోదరి మేను ఘాతలా యప్పుడే మణిమయదివ్యభూషణము లగుట
      యేరామ చనుమెట్లపై రక్తధార లాకుంకుమ మృగనాభిపంక మయ్యె
      పెదవిగదలించి పొమ్మన్న పెద్దలాది, మానికిని నీడకొత్తమసాని దాని
      మహిమ నప్పుడె దివ్యవిమాన మెక్కి, యరిగి సురభామినులు గొల్వ నవ్వెలంది.
గీ. పుణ్యపాపక్రియలు బొందఁబోవువారు, జముని యనుమతిలేక పోఁజనదు గాన
      సంయమిని లోకశమనుని సన్నిధాన, మునకుఁ జేరి నత డెదుర్కొని జెలంగె.
క. జనకుని పదమున వ్రాలిన, యనువున మ్రొక్కుటయుఁ దండ్రి యర్మిలితనయన్
      గనుఁగొన్న యట్ల గౌఁగిటఁ, బెనిచి నిజాంకముల నునిచి ప్రియవచనములన్.
గీ. అమ్మ సేమమె కల్యాణి నమ్మక్క యాత్మకింక, రాళి నెఱుఁగని నిన్ను దురాగతములు
      చేసి యలకించి రదినీదు చిత్తమునను, మరువుమీ నాదుపైఁ బ్రేమ మరువవలదు.

క. నీ కిట్టి పరమలాభము, చేకూరిన కారణంబుఁ జెప్పెద నేలా
      వాకొను నన్యాశంకయు, పాకం బగుపుణ్యఫలవిభాగం బొసఁగన్.
క. నేపదిరెండవ పుట్టువు, పాపంబులఁబుట్టి యెట్టి భాగ్యంబుననో
      ప్రాపించి యొక్కపుణ్యము, శ్రీపతికృప నీవు వలసిసేయక యున్నన్.
క. ఒక వైష్ణవుఁ డర్ధనిశా, ధీకవర్షముచేత నొదలి తీరని చలిచే
      నొకచోటఁ జేరఁగాఁ గా, నక వాకిటఁ బంచనీరునన్ వణుకుతరిన్.
ఉ. వాకిటఁ దొంగిచూచియును వైష్ణవుఁ గన్గొని యెవ్వరయ్య పైఁ
      గోకయులేక యీనిసిఁ దగుల్పడి భోరను వర్షధారలన్
      మూకవలెన్ వణంకుచును ముచ్చముడింగినవారు లేచిరం
      డీకడ యింటిలోనికని యించుకచో టొకయోర పాకలోన్.
క. ఇచ్చితి వాసుకృతంబున, వచ్చితి విచ్చటికి ధాతవసతికిఁ జన నీ
      వచ్చటఁ దత్సన్నిధి నతఁ, డిచ్చిన సిరు లభవింపు మేయేవేళన్.
క. అని పల్కి వీడుకొల్పిన, వనితామణి చనియె నజునివాసంబునకున్
      పెనుబాపకర్మురాలికి, మనిచిన వైష్ణవియుఁ దీర్థమహిమము చేతన్.
గీ. అపునరావృత్తి విష్ణులోకాధివాస, సౌఖ్యముల నొందెఁగాన యశ్వత్థతీర్థ
      మహిమ యిట్టిదివిన్న యమ్మానవులకుఁ, గలుగు నిష్టార్థములు రంగనిలయుఁ గరుణ.
క. ఇంకొకటిగలదు, రావికొ, లంకు చరిత్రంబు వీనులకు నందంబై
      యంకించి పలుకనగు ముని, శంకర వినుమనుచు నాకసంభవుఁ డనియెన్.
ఉ. కండు మహామునీశ్వరుఁ డొకండు గలం డతం డొక్కనాఁడు మా
      ర్తాండుఁడు పూర్వశైల మెగఁబ్రాకుతఱిన్ జని సహ్యకన్యలో
      నిండిన వారిపూరములు నీగము లాడి భుజంగశాయికిన్
      దండము లాచరించి ప్రమదంబునఁ గోవెల నిర్గమించుచున్.
క. చెంగటననఁ గాశ్వత్థ, ప్రాంగణతీర్థములు దరసి పావనసరసిన్
      జెంగటితోవల వీచుల, భృంగీనాదములు వినుచు నేతేరంగన్.
సీ. మరకతశ్యామాయమాన కోమలగాత్రు సంఫుల్లపద్మవిశాలనేత్రు
      చందనపంకలిప్తారవక్షస్థలు మందస్మితముఖారవిందుఁ గలితు
      నవరత్నభాసమానకిరీటకుండలు శింజానకమలమంజీరచరణు
      నంచితమాల్యదివ్యభూషణోల్లాసు శ్రీకరస్వర్ణకౌశేయవాసు
నొకమహాపుణ్యపురుషు నేత్రోత్సవముగఁ, జూచినప్పుడు యొకచల్లఁ జూపులాడి
      గిలుకుటందెలు గాజులు ననుకరింప, నగుమొగముతోడ కైదండ యగుచు నిలచె.

క. ఆజవరా లారమణుఁడు, రాజసమునఁ దరులనీడ రా వెనక యథా
      రాజాతథాప్రజా యను, నోజఁ దదాకారపురుషుఁ డొక్కఁడు దక్కన్.
క. ఒకయేవురార్గు రచటికి, మకరాంకునిఁ గన్నతండ్రి మారటమూర్తుల్
      సకళాలంకారమణీ, చకచక లాకసమునున్ దిశల్ గబళింపన్.
ఉ. ఉన్నెడ నిమ్మహాపురుషుఁ డొక్కఁడు వచ్చెను వెంట జంటఁగా
      నన్నులమిన్న యొక్క కమలాసన వచ్చెను వీరు కొందఱా
      నన్నియరాజు లొక్కొకరె వచ్చిరి చేరఁగ వీర లెవ్వరో
      యెన్నఁడు గాన మీచెలువ మిట్టివిలాసము లిన్ని యందముల్.
క. ఒకకొమ్మను దీరిన క్రియ, నొకరూపున వీరలెల్ల నున్నా రొకఁడే
      యొకకొమ్మఁ గూడియున్నాఁ, డొకఁ డని వేరనియుఁ దెలియకున్నది నాకున్.
ఉ. చూచితి వీరిచందములు శోభనమూర్తిఁ దలంచుకొంటివే
      నీచెలువంబు వేరొకరి కెక్కడనున్నది రంగవాసుఁ డీ
      లేచి చరించెఁ గావలయు లే యిది యేటికిఁ జూతునంచుఁ దా
      మైచెమరింప గ్రుంకునెడ మై బరువెత్తి విమానభూమికిన్.
గీ . పోయి యటఁ జూచునెడ శేషశాయియగుచు, ముందువలె దోచి శ్రీరంగమందిరుండు
      వెనుక పరువునవచ్చి చూచిన తదీయ, వేషముల వీరునునిచి భావించె నతఁడు.
క. అటుఁ జూచి చూచి క్రమ్మర, యిటుఁ జూచుం జూచి భ్రమని యిటునటుఁ జూచున్
      దిటచెడి యిటునటుఁ దిరుగుచు, జటివరుఁ డెఱుఁగక భ్రమించు సమ్మోదమునన్.
గీ. తప్ప దేలవిచార మతండె యితఁడు, విడువ కేవేళ బవళించి వేసరిల్లి
      నుబుసుపోఁకల ననవీథి నబలఁగూడి, మెలఁగుచున్నాడు శ్రీరంగనిలయవాసి.
గీ. అనుచుఁ దానిశ్చయించి నెమ్మనములోన, పట్టఁజాలని యానందపరత చేత
      తను నెఱుంగక యాదొర ల్వినెడిపాటి, పెద్దనవ్వుగ నిల్చిన పెంపుఁ జూచి.
క. అపు డాప్రధానపురుషుం, డిపు డేటికి మమ్ముఁ జూచి యిటు నవ్వితివే
      మపహాసీయులమే నీ, కపవాదము వచ్చు తెలియనడుగక యున్నన్.
క. ఏల నకారణహాస్యం, బీలీలం జేయ నీకు నెఱిగింపుమనన్
      జాలభయంబున నిలపై, వ్రాలి నమస్కృతి యొనర్చి వరమతిననియెన్.
క. స్వామీ కోవెలలో మిము, నేమును బొడగంటి వెంటనే వెలువడుచో
      నీమేర నిన్ను నియ్యా, రామంబున జూడఁగంటి రంగశయానున్.
గీ. ఇట్టి లీలావిభూతుల పుట్టువైన, నిన్ను సేవించు సంతోషనియతి గాని
      యేలనవ్వుదు నోతండ్రి యితర మెఱుఁగ, నీదుచిత్తంబె యెఱుఁగు నా నెమ్మనంబు.

క. ఈయశ్వత్థసరోజిని, నోయీశ్వర జేరి స్నాన మొనరుచు కతనన్
      మీయడుగుదమ్ములును గను, శ్రేయోలాభంబు లిపుడు చేకురఁగంటిన్.
గీ. అనిన నట్లనెయగు సందియము లేదు, నను విభీషణుఁ డిచట నేనాఁడు నిలిపె
      నాఁడు యిచ్చోటిపై మదినాటియునికి, నతని వేడుక మనవిగా నడగుకొంటి.
క. నలసినయెడ శయనింపుచు, వలసినయెడ మెలఁగుచుండు వరకావేరీ
      మలవనాంతరముల నీ, వలనఁ బ్రసన్నుండ నగుట వలసెన్ దెలుపన్.
ఉ. చూతువుగాక రమ్మనుచుఁ జూత లవంగ మధూక మాధవీ
      జాతవనప్రదేశములు సంయముతోఁ దనవారితోడ న
      బ్జాతదశాక్షుఁడైన వనపాయిని గూడి వసించి యొక్కచో
      నూతనదివ్యగంధనుమనోనిచయాపచయ ప్రచారుఁడై.
క. వరసింధుపానషట్పద, దరశీర్ణసుగంధకమలదళమిళనవల
      వరశీకరభరశీతల, తరుసీమ నెసంగ సరసతరునిన్ జేసెన్.
ఉ. మౌనులపై ననుగ్రహము మైత్రి మనోరథుఁడై రమాయుతం
      బానలినాకరంబున సయాటల నాటల పాటలం దయా
సీనుఁడు క్రీడసల్ప నొకదివ్యచరిత్రుఁడు వచ్చె నెవ్వరో
      మానిని కూడిచూతమని మచ్చిక ముచ్చట లాడుచుండఁగన్.
గీ. కొంతవడిఁ గ్రీడసల్పి యాచెంతనున్న, వారు నందంద నెదురైనవారు వెంట
      రాగ నశ్వత్థపుణ్యతీర్థంబుఁ జేరి, యమ్మహాభూరుహంబు డాయంగ నరిగి.
క. తా నందుఁ బ్రవేశించెన్, మానినయును దనదురూపు మానసులంత
      ర్ధానము లొందిరి కండుత, పోనిధి యబ్బురము భయము బొందుచు మదిలోన్.
శా. దేవా శేషశయాన నన్ను కరుణాదృష్టిన్ విలోకింపవే
      యేవిత్తం బది నట్ల నిన్నుఁ గని కొల్చిం బాసి యెట్లోరు నే
      నేవెంటన్ దరిఁజేరువాఁడ నిఁక పై నేజాడ వర్తింపుదున్
      రావే యానతి నీయవే సుజనసంరక్షా కటాక్షేక్షణా.
గీ. అనుచుఁ గన్నీరు ధారాళమగుచు దొరుగ, ధూళిధూసరితాంగుఁడై నేలఁ బొరలి
      లేచి ననునింతసేయు నేవంకననుచుఁ, జూడ కెట్లుండు నాజాడఁ జూచుగాక.
క. అనుచు నిరాహారుండై, పెనురావిం దలఁపు నిలిపి ప్రీతిఁ దగులఁగా
      ఘనతప మొనర్పుచుండఁగ, వినవచ్చె న్వింట మధురవిరళోక్తంబుల్.
గీ. తపము చాలింపు చాలింపు తాపసేంద్ర, నీవు నన్నెఱుఁగుటకు నేను నీకు నన్ను
      యెదుఱు తెచ్చిన మఱచి నీ వెఱుఁగలేక, తపము సేయుదు నను మేమి తగవు నీకు.

క. నినుఁ బ్రోచి విలాసముగాఁ, గనుపించినలీల నిజముగా నిల్చునె నీ
      వనజాకరతీరము నా, యునికికి నిజపుట్ట యిట్టి యోజం గంటిన్.
క. సామాన్యమె యీతీర్థము, భూమిజనం బిచటఁ జేయు పుణ్యపదములున్
      నోములు పితృకర్మంబులు, కామతదానంబుకోటిగా ఫల మందున్.
క. కావున నీతీర్థము దఱి, రావిఁ బ్రవేశించినాఁడ రమ్మని దీలో
      కోవెలలోఁ బవళించి జ, నావళి రక్షింప పూటనై యున్నాడన్.
వ. అనియురకున్న రంగరమణా సహియింపుము తప్పు చేసితిన్
      మనమున నింత హెచ్చరిక మానిన మత్తుఁడ నగుచుఁ జేతులున్
      దనదు కపోలభాగములు తానె మెయింపుచు లేచి రంగధా
      మునిఁ గని మ్రొక్కి యిట్లు దినముల్ క్రమియించుచునుండె గావునన్.
క. ఈకథ వినియెడివారికి, నేకార్యము లాల్మదలఁప వడేరి యతి
      శ్రీకరులై శాత్రవకుల, భీకరులై యుందు నెపుడు పృథివీస్థలిపై.
గీ. మఱలి యొకతీర్థరాజంబు మహిమ వినుము, దివ్యమైయొప్పు కేసరితీర్థమహిమ
      నచట కాశ్యపమౌనిశిఖావతంసు, దురుతపోనిష్ఠ వసియించియున్న యతఁడు.
సీ. శ్రీకరం బైన కాశీపట్టణం బేలు జననుతుండు సుకీర్తి యనెడు రాజు
      ధార్మికుండై సర్వధారుణీచక్రంబు పాలింప కర్మానుభవముచేత
      తనకును బరివారమునకు సామజతురగములకు రుజలు యగ్గలము గాఁగ
      పీడింప నొగిలి యీబెడద మీదోషంబు తీర్థసేవలఁ గాక తీరదనుచు
      దలఁచి హరికీర్తినామ మేధానిధాను, కాశ్యపును గాంచి ప్రణమిల్లి కరయుగములు
      మొగిచి నిలిచిఁన గనువిచ్చి మ్రోలనున్న, రాజు నీక్షించి యమ్మౌనిరాజు బలికె.
ఉ. ఎచ్చటనుండి వచ్చితివి యెయ్యది పే రిపు డేమి గోరినా
      వెచ్చటి కేఁగఁగావలయు నేర్పడఁబల్కుము నిన్నుఁ జూచి నే
      మెచ్చితి నామదిం గరుణ మిక్కుటమయ్యె నభీష్ట మెద్ది యే
      నిచ్చితి నిందునందుఁగల దేటికి నీకు మహావికారముల్.
సీ. అనినఁ గృతార్థుఁడనైతి నోమునినాథ యేను కాశీపురం బేలువాఁడ
      లోకాననుఁడు సుబలుండు మజ్జనకుండు కృతపుణ్య నన్ను సుకీర్తి యండ్రు
      బలవంతర వ్యాధిబాధలచేత నే సపరివారులుగా జాల నొగిలి
      యాఢ్యులైనట్టి మావైద్యులు తమచేత దీరదీపని యని దిగులుపడిన
      మఘములు సుశాంతివిధులు హోమములు సకల, దానములును జపంబులు దైవతములు
      ప్రార్థనము మంత్రరక్షానిబంధనములు, చేతనైనట్టుఁ జేసితి ఖ్యాతిగాను.

క. కొందఱు పెద్దలు ధారుణి, యందుల తీర్థములు దిరుగ నఘములు దొరుగున్
      బొందవు శరీరరోగము, లందు సుఖమందు రనిన నగుఁగా కనుచున్.
ఉ. ఎయ్యవి పుణ్యభూములని రెయ్యవి తీర్థములంచుఁ బల్కినా
      రెయ్యవి దేవతాస్థలము లెయ్యవి ముఖ్యనదీనదంబు లే
      నయ్యెడలందుఁ జేరి చతురంగబలంబులతోడఁ జేయఁగా
      నెయ్యది కృత్య మత్తెఱఁగు లెల్ల నొనర్పుచు వచ్చి యిచ్చటన్.
క. తీరని కర్మంబులు మది, చేరుగడకు నీదుమరుఁగుఁ జేరితినను మా
      వారిని గడతేర్పుమనన్, యేరీ మీవార లొకఁడ వచ్చితి వనినన్.
గీ. అయ్య నీవు వసించు పుణ్యాశ్రమంబు, సేనతోఁ గూడి రారాదు గాన వెఱచి
      వారి నొకకడ నుంచి నే వచ్చినాఁడ, నన్ను రక్షించుమార్గ మెన్నంగవలయు.
సీ. అనవిని సుబలుని తనయుఁడవా మాకుఁ బరమాప్తుఁ డతడెట్టి పలుకులేల
      రాజేంద్ర యీశ్వరారాధనం బొనరింపఁ దాపత్రయంబులు దగెలుదనియె
      యెట్టివాఁ డీశ్వరుం డెట్టు లారాధింతు నెందుండు బ్రహ్మాదు లెఱుఁగరండ్రు
      గోచరించునె నాకు చూచెద నన్ను మీకరుణపెం పెట్టిదో కాక యనిన
      నవనినాథ యనంతకల్యాణమూర్తి, పూర్ణుఁ డతఁ డిచ్చనుండు ప్రభుండు నిత్యుఁ
      డతఁడు లోకోపకారార్థ మవతరించు, దేవతిర్యఙ్మమనుష్యాది దేహములను.
క. ఆదేవుఁడు దివ్యాధిక, భేదములఁ బ్రతిష్ఠ బొంది పృథివీస్థలిపై
      బాదుకొను నెల్లెడలఁ గన, కాదిమధాతువుల సేవ్యుఁడై యెల్లరచేన్.
గీ. నిర్గుణుఁడు దోషరహితుండు నిష్ప్రమాణుఁ, డతఁడు సగుణుండు మితగాత్రుఁ డగుట యెట్టు
      లన నతఁడు సర్వశక్తిమయస్వరూపుఁ, డును స్వతంత్రుఁడు పూర్ణుఁడై యునికిఁకేని.
క. భక్తాధీనుఁడు గావున, సక్తధ్యానులకు తనదు సరణాకృతి సం
      యుక్తుఁడయి వారు దలఁచిన, వ్యక్తాకృతి దోఁచుకొఱకు వరములు నిచ్చున్.
గీ. స్తంభదారుశిలాలోహకుంభములును, దివ్యనైధపదాది ప్రతిష్ఠ లొంది
      జనుల రక్షింప నుర్విపై దనరియుండు, రూపనామాదిభేదప్రదీప్తుఁ డగుచు.
క. అందులలో నాద్యంబౌ, నందము దీవ్యమును శుభ మనంతము సేవ్యం
      బందమును స్వయంవ్యక్తం, బిందున శ్రీరంగ మితర మేలా పలుకన్.
క. భావింపుము సేవింపుము, కావింపుము పూజ లొదవుఁగామిత మనుచున్
      దీవింపఁ గాశ్యపునిఁ గని, భూవిభుఁ డిట్లనియె విరచితాంజలికరుఁడై.
శా. ఆవిర్భావము నొంది భీతిగల సైన్యం బెల్ల దోడ్కొంచు నే
      నీ వెట్టన్ భవదంఘ్రిసేవకుఁడనై నీతేజిపత్రేక్షణున్

      సేవింతున్ గరుణింపుమన్న నతఁడు శిష్యాళితో ముందఱన్
      బోవన్ భూపతి వెంబడింజనియె నాప్తుల్ సేవకుల్ గొల్వఁగన్.
శా. నింబాలోకమధూకపూగనకుశానీకామ్రనీరంధ్రమౌ
      జంబూతీర్థము మ్రోలఁగాంచి మునిభూజాని న్విలోకించి ది
      వ్యంబైనట్టిది యీసరోవరము జంభారాతి తా బ్రహ్మహ
      త్యంబాసె న్మను వృత్రుఁ జంపి యది యాద్యంతంబు సూచించెదన్.
గీ. పెద్దపాపంబుచే వేల్పు పెద్ద కడకుఁ, బోయి మొరవెట్టునెడ నాత్మభూతివగచి
      కటకటా యింతవారికిఁ గాలకర్మ, మనుభవింపంగ వలసెఁగా యనుచుఁ బలికె.
క. ఓ పాకవైరి నీకీ, పాపము భూమండలమున బాయును లీలా
      రూప హరిసన్నిధాన, మ, హాపుణ్యమువలన వేగ మరుగు మటన్నన్.
ఉ. వారినిఁ జంపఁ జుట్టుకొని పాపమె వెంటనె తోడునీడయై
      దారము సూదితోఁ జనువిధంబున రాగ బృహస్పతిన్ నునా
      సీరుఁడు దేశికుండగుట చెంగట రమ్మని యప్పు డంబుద
      ద్వారము డిగ్గి ధారుణికి వచ్చె వియచ్చరు లిచ్చఁ గుందఁగన్.
గీ. ఇంద్రుపాపంబు వారింప యిం.....న, నూహగని రాజపాపం బురోహితో య
      నంగ వినలేదె గావున నాంగిరసుని, పట్టియును హత్యయును రాగ పార్శ్వములను.
నీ. అఘపంకపరిహార మైన గంగాద్వార మాది పుష్కరిణీభవాబ్ధితరణి
      కమలజవిహత యావిమల సన్మునిబృందవాస రణావాసి వారణాళి
      శ్రీరామకృత కర్మసిద్ధి భాగయు గయ అమితదోషాటవీ దహన యమున
      వలమాన బహుసరస్వతి యౌ సరస్వతి విశ్రుతపుణ్య యా కృష్ణవేణి
      ప్రతిదినస్నాత సకలప్రపన్న పెన్న, వీతభవరోగ గతియైన వేగవతియు
      కమలనిధి కాంచి కాదివ్యకలితకాంచి, జలధి దేవేరి కావేరి యలయఁ జూచి.
ఉ. ఎందున నేక్రియన్ మనుజులెల్ల నొనర్పుదు రందు నందు సం
      క్రందనుఁ డట్టి కర్మనికరంబులుఁ దీర్పులు వచ్చి వచ్చి తన్
      జెందినపాతకంబు కరజిమ్మఁగ నేరక రంగమందిరా
      లింగముఁ జేరవచ్చి తరళీకృతపావనుఁడై మనోవ్యధన్.
గీ. ముంచుకొను వాదునీరుల మునిఁగి మునిగి, గుళ్లగుళ్లకు వేల్పులఁ గొలిచి కొలిచి
      ధాతమాటలుఁ బట్టి ఛందసముఁ బట్టి, యలయుటే కాని పాపంబు వదలదయ్యె.
క. పదియేడు లిరువదేండ్లున్, బదియేడులు ఘోరమగు తపం బొక్కొకచో
      వదలకఁ జేసిన పాపము , వదలక వెంటాడ నెట్లు వారింపుదునో.

క. ఈజిఁబూతీర్థము తఱి, నీజలధిశయానుగూర్చి యేఁ జేయుదు ని
      ర్వ్యాజతపం బని యింద్రుఁడు, యోజించి తదగ్రసరణి నున్నట్టి యెడన్.
సీ. ఇల్లు కేలనుదాల్చు యింతికి నీలంపుబలిమియై యురముడాపలఁ జెలంగ
క రతమ్మిహంసంబు గ్రహరాజు ధాల్పు వాకరముల శంఖచక్రములు మెరయ
      సాత్వికజ్ఞాన మచ్చట దోఁచెనన వార్థిఁబుట్టుగూనికెమెడఁ బొలుపుఁ దెలుప
      నీలాచలముమీఁద వ్రాలు రోహితరేఖకరణిఁ గాంచనకోటి కటిఁదనర్ప
      తనకు నర్పించు మునుల చిత్తముల రీతి, మేన ముత్యాలసరములు మెరయుచుండ
      గుండలకిరీటరుచుల నా ఖండలుండు, స్వామి శ్రీరంగశాయి సాక్షాత్కరించె.
గీ. తపము చేసెద ననిమదిఁ దలచినపుడె, చెంగటకు వచ్చినిలిచె శ్రీరంగధాము
      డట్టి నేరేడు కోనేటి పట్టుబడికి, నింద్రు సంతోష మేమని యెంచవచ్చు.
మత్తకోకిల. పాపమా యట తెల్లవారఁగఁ బాయ నంతకమున్నుఁగాఁ
      దాపమంతయుఁ దీర నొజ్జయుఁ దాను సాగిలి మ్రొక్కి యా
      శ్రీపతిం గరుణాపయోనిధిఁ జేరి చేతులు మోడ్చి తా
      నాపులోమనుతామనోహరుఁ డాచరించె బహుస్తుతుల్.
సీ. శ్రీరంగధామ లక్ష్మీనికేతనధామ రక్షోవిరామ శ్రీరంగధామ
      శీతలానిల కోమలాతిశయారామ రవికోటిధామ శ్రీరంగధామ
      నవరత్న హేమదివ్యవిభూషుణోద్ధామ మాంగళ్యసీమ శ్రీరంగధామ
      సేవకరఘురామ పావనాన్వయభూము రాజలలామ శ్రీరంగధామ
      ప్రాపితవిరించిసీమ శ్రీరంగధామ, రక్షణగుణాభిరామ శ్రీరంగధామ
      సంగతమునిప్రణామ శ్రీరంగధామ, ........................
క. అని వినుతించిన నింద్రునిఁ, గని రంగస్వామి వలయు కామితఫలముల్
      యొనఁగూర్తు వేడు మనవుఁడు, మనమున భయభక్తు లొదవ మఘవుం డనియెన్.
మ. హత్యాదోషము మాన్పి బ్రోచితివి నీవాధార నస్మత్తనూ
      భృత్యామాత్యా వధూనుతాశ్వ సురనారీముఖ్యసంపత్తి కి
      ట్టత్యాపన్నుని నన్నుఁ బ్రోచి తిఁక నేలా కోరికల్ చాలదే
      సత్యాధీశ సమర్చితాంఘ్రియుళా సర్వేశ రంగాధిపా.
క. నీవానిఁ గాఁగ నన్నున్, భావంబున నునిచినదియె పాలించు వరం
      బేవరము నొల్ల ననవిని, శ్రీవరుఁడును రంగధామసీమకుఁ జనియెన్.
మ. గురుఁడున్ దాను మహీధరాదిదివిషత్కుంభేంద్రసంరూఢుఁడై
      సురలోకంబున కేఁగి నచ్చరల వీ చొప్పుల్ విచారింపఁగా

      పురుడెందేనియుఁ దీర్థముల్ గలవె జంబూతీర్థరాజంబుతో
      నరపాలోత్తమ దీనిఁ గ్రుంకిడుము దానన్ జాల మేలయ్యెడున్.
క. ఈయింద్రోపాఖ్యానం, బేయనఘులు వినినవార లెల్ల దురితముల్
      మాయించి సకలసౌఖ్య, శ్రేయంబులు నొందు నది ప్రసిద్ధం బెందున్.
శా. ప్రాగ్గీరంత పరిష్క్రియాకలన కృత్పాదాబ్జలక్ష్మీమృగీ
      దృగ్గాడశ్రితబాహుమధ్య కరుణాప్రేంఖ మ్మనోంభోరుహా
      వాగ్గౌరీవర వాసవప్రముఖ దేవస్తుత్య సత్యప్రదా
      యగ్గాథాశ్రవణావధూతజనతాత్యుగ్రౌఘుసద్భాననా.
క. యమనియ మాధీనమయా, క్రమ విమలాకార మౌనికంఠీరవ హృ
      త్కమలసరోరుహ విశద, భ్రమరాయతవేష శేషపర్వతగేహా.
మనోజ్ఞ. ప్రసాద గుణభాసురా ప్రణమదేవతా భానురా
      రసాతిభర వారణా ప్రశామితాత్వరుగ్వారణా
      లసత్పృథులకంధరా లలితగాత్రభాకంధరా
      యశుకృవిభవాసనా యజహరేకభిద్వాసనా.

గద్య
ఇది శ్రీవేంకటేశ్వర వరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంద్ర వరదరాజేంద్రప్రణీతం బైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందుఁ
బంచమాశ్వాసము