శ్రీరంగమాహాత్మ్యము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

చతుర్థాశ్వాసము

      శ్రీభరితకుండలకిరీ
      టాభాధగధగిత మందహాస కపోల
      శ్రీభరణ రమాకుచకల
      శాభాగవిలాస వేంకటాచలవాసా.
వ. అవధరింపుము. ఇట్లు నాగదంతమహామునికి వ్యాసు లానలిచ్చిన తెఱంగు సూతుఁ
      డుశౌనకాదుల నుద్దేశించి.
క. వినుపించెనని పరాశర, తనయుని వీక్షించి నాగదంతుఁడు శ్రీరం
      గనివాసు కథలు మఱియును, వినవేడుక బొడమి భక్తి విజ్ఞాపించెన్.
సీ. రమ్యచారిత్ర నారాయణాంశజ బాదరాయణ యొక సంశయంబు వినుము
      జాబిల్లికొలనం బక్షంబు పర్వంబుల నలినవిరోధి స్నానంబు సేయు
      వంటికి మున్నె తదర్థంబు వివరించి పలుకుమటన్న ద్వైపాయనుండు
      నుడువక నేనన్నమాట యెచ్చరికించి యడిగితిగాన నీ కనువచింతు
      మొదట దక్షుని కశ్విని మొదలుగాఁగ, తనయు లిరువదియేడ్వురు జనన మొంద
      వారిఁ జెలువంబులకు మెచ్చి వరుని తగిన, వాని కేనిత్తునని భావమున దలంచి.
ఉ. చక్కనివాని కన్నులకుఁ జల్లనివాని గులంబునందుఁ బెం
      పెక్కినవాని దానమున నెన్నిక గాంచినవాని నాజిలో
      నుక్కున బోల్చువాని నొక యుచ్చమెఱింగినవాని ప్రాయపున్
      జుక్కలరాజు చెల్వములు జాచి మనంబుల నుల్లసిల్లుచున్.
మ. వరకల్యాణమహాముహూర్తమున వశ్విన్యాదితారావళిన్
      సుర లింద్రాదిదిగీశు లబ్జభవుఁ డీశుం డాదిగా నెల్లరున్

      గురుఁడున్ శుక్రుఁడు తత్పురోహితవిధిన్ ‘కుర్వంతు తే మంగళ’
      స్ఫురణాలాపసమస్యలం జదువ సుశ్లోకంబు లుత్సాహియై.
గీ. తనయలను ధారవోసెను దక్షుఁ డపుడు, బొట్టుగట్టెను చంద్రుఁ డప్పుత్రికలకుఁ
       దగినబుద్ధులు జెప్పి నందనల కరణ, మిచ్చి తగనంపె నత్తవారింటి కతఁడు.
ఉ. పర్విన వేడ్కలన్ సురలు పల్లకు లప్పుడు తోడితేగ గం
      ధర్వులు జేరి యష్టకవితాలము లెస్సగఁబాడ చెంత రం
      భోర్వసులాదియౌ రమణు లూడిగముల్ పచరింప ముందటన్
      స్వర్విభువంతిపై జలధిజాతన నూతనభాషికంబులన్.
గీ. రాజు రాజసమున సురప్రభులు గొలువ, వచ్చె తనమండలంబు దివాణమునకు
      సంచితముహూర్తమున బ్రవేశించి దొరల, నందఱను బనిచి సుఖవృత్తి నలరుచుండె.
క. ఎవ్వరి నొల్లక రోహిణి, జవ్వనమున ముద్దుపలుకు చక్కనిమొగమున్
      నవ్వులు బేడిసచూపులు, జవ్వాడెడునడుముఁ జూచి స్వాంతము నిల్పెన్.
మ. దయవాఁడై మరుబారికిం దగిలి యాతన్వంగి కౌఁగింటిలో
      శయనాగారము వాసి వెల్వడక రాష్ట్రంబు న్విచారింప కే
      మయిరో నమ్మినవారలం దనక యేణాంకుండు వర్తిల్లఁ ద
      ద్దయు తన్ముచ్చట నిర్వదార్వురును సంతాపించి మాసోపమిన్.
గీ. అందఱును పుట్టినింటికి నరిగి తండ్రి, పాదములమీఁద వ్రాలి యప్పటివిషాద
      మేమనఁగవచ్చు బొరలుచు నేడ్చుచున్న, సుతలకరుణారసమున దక్షుండు పలికె.
ఉ. ఏమిటి కింతయార్తి కమలేక్షణలార వచింపుడన్నచో
      సోమునిమేర రోహిణికి సొమ్మయిపోవుట లీయవజ్ఞచే
      తామట వచ్చుటల్ దెలుప దక్షుఁడు దక్షుఁడుగాన నల్లుడే
      మామకు మంచిఁడైన మానిసి నంపెను చందమామకున్.
క. పిలుపించి చంద్రు కిట్లను, కులవతు లందఱును నాకుఁ గూఁతురులె కదా
      వలసిన దొక్కతె యిందుల, వలవనివా రితరులైన వశమే యోర్వన్.
ఆ. కన్నకడుపుగాన కన్నట్టిమాట ని, న్నాడవలసె వీరి యడలు జూచి
      పతియె దైవ మనుచు భావించునబలల, వేరుసేయ దోషకారి గలడె.
క. అందఱి సరిగా నేలుము, కొందఱు కన్నీరుగార కొదవయు వచ్చున్
      ముందర సరయుము దీవెన! లందుము మాచేత వలువ దపవాదంబుల్.
క. మాయన్న తిట్టు గుడుపక, నీయింతుల నీసవతుల నేలుము సరిగా
      సెయడుము వయోముదమున, నాయానతిఁ బాయు తెఱఁగు నాయానసుమీ.

క. పొమ్మనుచు తనూజలకున్, సమ్మతపడఁ జెప్పి ననుపఁ జంద్రుఁడు ననురా
      గమ్మున రోహిణిపైఁ దమి, ముమ్మరమున నింటికేఁగి మున్నిటిరీతిన్.
క. రోహిణిపై ననురాగ, స్నేహంబులు విడిచి మారు చికురాకు లిడన్
      మోహత లిరువురకును ను, త్సాహంబులునుండఁ దక్కు సవతులు వెతలన్.
గీ. తండ్రికడకేఁగి తమరు వర్తనముఁ దెలుప, నొప్పు చెడినదియయ్యె నయ్యువిదలును
      మాకు మాటాడబోయిన మఱియుఁదగిలె, నేల మిముదూర మాపుణ్య మింతె.
మ. అన నత్యాగ్రహవృత్తి దక్షుఁడు సరోజారాతి రావించి యో
      రి నిశాచార బహుప్రకారముల నీవృత్తంబు భావించితిన్
      ఘనమైనట్టి వయోమద ప్రకృతిఁ గన్గానంగలే వింత నీ
      కనుజన్మంబటె కాలకూటము కళంకాక్రాంతుఁ డౌటభ్రమే.
గీ. నీవు దోషాకరుండవు నిశిచరుండ, వాతతాయివి విరహిణీ ఘాతకుఁడవు
      పాతకుండవు కర్మానుభవముచేత, ననుభవింపుము పాండుక్షయంబు నీవు.
క. పొమ్మనవుడు కలువలచెలి, యుమ్మలికన్ మారుపలుక నోడి యపుడు మై
      సొమ్మసిలి శ్రమము నలతయుఁ, గ్రమ్ముకొన న్మహికి డిగ్గి కావేరిదరిన్.
క. పుష్కరిణీ తీర్థములో, పుష్కరములు కంఠదఘ్నముగ రంగేశుం
      బుష్కరమతి భావింపుచుఁ, బుష్కరవిద్వేషి చేసె భూరితపంబున్.
శా. నూరేండ్లు నిరాశనుం డగుచు సర్వేశాంఘ్రిపద్మద్వయీ
      ధ్యానాచంచలభావుఁడై జగము లత్యంతంబు భీతిల్లి సం
      ధానిష్ఠన్ వసియించి యవ్వెనక తత్కాసారతీరంబునన్
      తా నత్యుగ్రతపం బొనర్చెను శతాబ్దంబుల్ నిరాహారుఁడై.
క. ఈకరణినున్న చంద్రుని, భీకరతమమునకు మెచ్చి బృందారకులున్
      లేకేశుఁడు నాకేశుఁడు, నాకాశశిరోరుహుండు నండలఁ గొలువన్.
సీ. పంపుగాఁ బఱచిన ఫణిరాజభోగంబు నవరత్నసింహాసనంబు గాఁగ
      నలరూపరావంబు నాజానుదీర్ఘంబు లగుతేతు లరిశంఖయుగముఁ దాల్ప
      యభినవోన్మేషజింహ్వంబైవైన తొలుచూపు జాయమానదయారసంబుఁ గురియ
      పవళించి లేచునిబ్బరమునఁ బెనగొన్న హారము సేనాని తీరుపరుప
      జారిన--లు మహీవైరి చక్కదిద్ద, దివ్యమంగళపాఠకోద్వృత్తి మెఱయ
      చంద్రపుష్కరిణీసరస్సరిదభూమిఁ, జంద్రునకు రంగశాయి సాక్షాత్కరించె.
క. గడగడ వడుకుచు నభవుని, ముడిబువ్వు భయంబు వెలయ ముదమును మదిలో
      వెడవెడ దిందియుడు గని, బుడిబుడి మ్రొక్కు లిడి హస్తములు మొగిచి వెసన్.

దండకము. శ్రీరంగరాజ ద్విమానాంతరానాస పద్మాసనా మానసోల్లాస విశ్వంభ
      రా భార ధౌరేయ పర్యంక శ్రీకారరేఖాపరాభూత మీనాంక కావేరి కావేరి
      తోర్మిచ్ఛటాజత నీతానిలాలోల నానా సుగంధ స్రగంచన్మహోరస్థలా పాద
      పద్మాంచల స్యంది మారంద బిందూప మాకాశన ద్యంబుధారా పవిత్ర కృతత్రి
      స్థలా పుష్కరణ్యాగ్రభాగ స్సురద్గోపురోద్య ధ్వజస్పర్శనా భీరకో త్కింకిణీ
      మంజుశింజానకర్ణే జపాదిత్యపద్యా విమానాగతాయాతవైమాని కాబ్జేక్షణా వీర
      పుంభావవేళా రణత్కాంచి కాంచత్కలక్వాణ దాయాద గంధర్వ వాగ్గేయకా
      రోక్తగీతప్రబంధాంక సూరాది నామావళీస్తూయమానాత్మ చారిత్ర శ్రీభూమినీ
      ళా కళత్రాభవ చ్చిత్రచారిత్రముల్ నేఁ బ్రశంసింపఁగా నెంతవాఁడన్ ద్రయీ
      వర్గముల్ నాలుగేవారువేలన్ మోములయ్యున్ నిను న్మెచ్చఁ గైవారముల్ సే
      యఁగా నేర రన్నట్టిచో జంగమస్థానరాకార మైనట్టి యీసృష్టి యుత్పత్తియున్
      వృద్ధి నాశంబు సేయన్ దయన్ డంబగుం జన్నముల్ హోతయున్గాతయూపంబు
      సృక్కున్ సృవంబున్ పశువ్రాతశాలాధికంబున్ సమస్తంబును న్నీనె చిన్మూర్తి
      నాద్యుండ వధ్యాత్మ వీశుండ వాద్యంతశూన్యుండవు న్నీవె యేకం బనేకంబు క
      ర్మక్రియాజ్ఞానకాండంబులున్ కాలచక్రస్వరూపంబు నాధారమున్ నిర్గుణంబున్
      గుణకారము న్నీన సర్వేశ సర్వాత్మవు న్నీన మీనావతారంబునన్ సోమకు
      న్ద్రుంచి నానాగమద్రాతమున్ ధాత కర్చించుటల్ దుగ్ధపాదోధినిర్మంధవేళాను
      సంధానభాగ్భోగి భోగావృతామోఘవైశాల్యధాత్రీధరం బబ్బ నెత్తంగ కూర్మంబ
      నై నిల్చుటల్ ధారుణింబట్టి తా సందిటంబెట్టి వారాశిలో డాఁగియున్నట్టి బల్
      రక్కసున్ ఘోణివై మట్టి మల్లాడి కోరన్ ధరాచక్రముల్ బూనుటల్ కొల్వు
      కూటంబుకంభంబునన్ శ్రీనృసింహాకృతిం బుట్టి ప్రహ్లాదుఁ జేపట్టి దైత్యున్ విచి
      త్రంబుగా మట్టి మర్దించుటల్ వామనత్వంబున న్మీరి పాదత్రయం బుర్వియా
      చించి దానిం బలింగ్రుంగఁగాఁ ద్రొక్కుటర్ గార్తవీర్యాదులన్ రామనామం
      బునంబుట్టి బాహాకుఠారాగ్రధారన్ విదారించుటల్ నీవు రామావతారంబునన్
      సీతకై పంక్తికంఠాదులన్ దృంచుటల్ రోహిణేయుండవై ముష్టికున్ వీరు చా
      ణూరు మర్ధించుటల్ రుక్మిణీసత్యభామాదిజాయాసమేతుండవై ద్వారకన్ గృష్ణ
      మూర్తిం బ్రకాశించి కౌంతేయులన్ గాచి కౌరవ్యులన్ ద్రుంచుటల్ రౌతువై
      కల్కిరూపంబునం గీకటాలిన్ విచారించుటల్ శిష్టసంరక్షయున్ దుష్టనిర్వాప
      ణంబున్ బ్రకాశింపఁగాఁ జేయఁ గాదా గదాశంఖచక్రాదిశాఙ్గావళిం దాల్చి
      యీలీల లీలావిభూతి న్విడంబించుటల్ కుండలానర్ఘ్యకోటీర మంజీర కేయూర

      హారాది నానామణివ్రాతరింధోళి జాజ్వల్యమానాకృతిన్ నిల్పుటల్ మీశుభాకార
      మీదృగ్విధంబంచు భావించు భక్తవ్రజంబున్ గృతార్థత్వ మొందింపఁగాతా రమా
      నాథ ధాత్రీసనాథాయ నా రంగానాథా నమస్తే నమస్తే నమః.
గీ. అనుచు వినుతించు హరిణలాంఛనునిఁ జూచి, చెంగటికిఁ జేరవచ్చి లక్ష్మీసహాయుఁ
      డిట్లనియె నీదుతపమున కిచ్చలోన, మెచ్చితిని నీస్తవము చాల మెచ్చఁజేసె.
క. నీస్తుతిరూపం బగుభువ, నస్తుత్యము దండకము నెవరు జదివిన యా
      నిస్తులపుణ్యుల కిత్తు స, మస్తశుభంబులును ధరణిమండలియందున్.
క. నీవేమి నన్ను వేడిన, నా వరము నొసంగువాఁడ నడుగుమనిన నో
      దేవ భవచ్ఛాసనమున, నావశ మగుమండలంబునన్ సుఖవృత్తిన్.
ఉ. ఉన్నెడ దక్షుశాప మిది యూరక నాకనుభూతమయ్యె నీ
      మన్నన యోషధీచయము మాయకమైన తుషారశీకరా
      భ్యున్నతి బ్రోదిసేయ నిఁకఁ బుట్టదు త్రాణకటాక్ష ముంచవే
      నన్నుఁ బరిగ్రహించి యనినన్ గరుణావరుణాలయుం డనున్.
క. ఈ పుష్కరిణీస్మరణము, పాపంబుల కెదురుచుక్క భవనాశనమై
      చూపట్టు నీకు దక్షుని, శాపంబున నీవు నెంత స్నాతవుగానన్.
క . శ్రీగావేరీపరివృత, మీకోవిలలోన నుండి యీయాకృతితో
      నీకుఁ బ్రసన్నుఁడ నైతిఁ, గైకొను మారోగ్యభాగ్యకామితఫలముల్.
మ. అమలాలాస్యనివాసమండలము నీహారాంశురేఖావృతం
      బమలాత్మించు కళాకలాపరతిరమ్యం బోషధీతర్ధనం
      బమృగప్రాయము సర్వజీవనకరం బైనట్టి నెమ్మేనితో
      రమణిన్ రోహిణిఁ గూడియుండుము దివారాత్రంబు లిచ్ఛారతిన్.
మ. కలవే పుష్కరిణీసమానసరసుల్ గంగాసమానాపగల్
      జలజావాశినిఁ బోలినట్టివి వధూజన్మంబులే దైవతం
      బులకున్ నాదుమహత్వముం గలదె నీపుణ్యాతిరేకంబుచే
      గలిగె న్నన్ను భజింపబొమ్ము సుఖివై కల్యాణశీలంబులున్.
క. ఇల నీరస మిది మొదలుగ, బొలుచున్ నీపేరఁ జంద్రపుష్కరిణియనన్
      జలజారి పర్వముల నీ, సలిలంబులఁ దీర్థమాడి చను మెల్లపుడున్.
గీ. ఇచటఁ బ్రత్యక్షముగఁ జూతు రెవ్వరై, జనులు రంగస్థలంబు దర్శన మొనర్చి
      కడమనెలవుల నేబరోక్షమునఁగాని, కానుపించుదు భక్తవర్గంబునకును.

క. పొమ్మని హరి యంతర్ధా, నమ్మున బొందుటయు నట్ల నలినారియు భా
      వమ్మున బ్రమోదమంది ప్రి, యమ్మున నీలోకమునకు నరిగె మునీంద్రా.
సీ. వినుము తెల్పెద నొక్కవృత్తాంత మాచంద్రపుష్కరిణీతీర్ధ పుణ్యమహిమ
      యది దశయోజనాయతమయి కృతవేళఁ బొగడొందు నందునసగము త్రేత
      నందర్ధమయ్యె ద్వాపరమున గలివేళ నందులఁగడమ నిల్చె
      నపరాహ్ణమున గమలాప్తురికిరణముల్ సమయపోలికవిన సంగతులను
      నాడునాటికిఁ గురుచతనంబు గాంచె, నందు నీరంబు నమృతతిల్యంబు లయ్యె
      పూర్వమధురంబులై రుచిపుట్టి తేట, లై కలకలై యుగంబుగ నతిశయిల్లు.
క. కావలిగా యుండిన భూ, తావళి కలివేళయందు నంతర్ధానం
      బై వరలు రాజవిజయము , లౌ వేళ గషాయితంబులై కలగలుగున్.
క. హెచ్చిన ప్రజాక్షయంబుల, పచ్చనివర్ణములవేళ పసరువిధమునన్
      గొచ్చుపడి ననావృష్టి స, ముచ్చరికమహత్వమ ద్విమోఘం బెల్లన్.
క. యోజింపగ ద్వాత్రింశ , ద్యోజనవిస్తార మగుచునుండున్ గావే
      రీజలపరివృతసికతా, రాజద్వీపంబు రంగరాజాకరమై.
చ. ప్రతియుగమునన్ దదర్ధపరిపాటిఁ గవేరితమంబు లొల్చు జీ
      ర్ణతఁ గలివేళ తేరుగడ నాశమునొందుదు రెల్లవారలీ
      క్షితి నది రంగవాసుఁడు నశించినపిమ్మట సర్వమంగళా
      యతను సమృద్ధిబొల్పెసఁగ నాద్యపరిగ్రహ మట్టిదేకదా.
సీ. ధర్మేతరులు క్రూరకర్ములు పాషండు లాగమనిస్ఠకు లార్యభయదు
      లత్యంతలోభులు కృత్యపరాయణుల్ విష్ణుదూషకులైన వైష్ణవులను
      ప్రేతకూష్మాండకభేతాళికాపిశాచాఢాకినీరాక్షసవ్రజంబు
      కలియుగాంతమున దుష్కథలు పాపాత్ములై విని రుద్రు సేవించు వీరినెల్లఁ
      గర్త పశుపతి గజముఖు కాళి గొల్చి, యుండుదురు రాజసగుణులు నుర్విలోన
      మానసులు సాత్వికులు దృఢజ్ఞానవిదులు, వైష్ణవులు లేరు నాటికి వసుధ నెచట.
గీ. రావణు హిరణ్యాక్షు హిరణ్యకశిపు, బాణు నరకాదు లద్రిజాభర్తఁ గొలిచి
      మెలఁగుకైవడిఁ దా మహాత్ములకు నట్టి, సాత్వికవినాశమును కలిసంధి వొడము.
గీ. అపరము పరంబనియనినందు నీశ, బుద్ధినిడి సత్తసత్తని బోల్చు జ్ఞాన
      మనుచు నజ్ఞాన మెంచి భూజనులు జెడఁగ, దా నుపేక్షించి యుండు పద్మావిభుండు.
గీ. మోహతామసశాస్త్రసముత్కరంబు, హరుఁడు గీలించి ధరణి జనాళిఁ జెరుప
      గడగి లింగప్రవర్తకుల్ గాఁగఁజేయు, రంగధామంబు ధరణికి రాకమునుపు.

క. ఇందుకు నొక యితిహాసము, సందేహములెల్లఁ దొలఁగు సంయమిజనతా
      బృందారకవర తెల్పెద, డెందమున ముదంబు నివ్వటిల వినుమనుచున్.
చ. కడవన్ దీరని రాజదోషనిరతం గావేరితీరంబునన్
      విడుబట్టయ్యె భయంకరంబగు ననావృష్టిప్రదోషంబు లె
      ల్లిడుముంబొంది జనాళి యట్లగుసట భోగీశుండు బల్కాకచే
      వడిగే ల్గందిన జేసి వీనుల సదృక్పారీణనేత్రావలిన్.
సీ. ఒండొంటితో గాలి నొసరి రాజకమండి భూతిరాసులరీతిఁ బోల్చె వనము
      లిఱ్ఱింకులింకి బీరెండచిన్వేటికల్ గాతంబులై తటాకములు బలసె
      తాళప్రమాణభేదములైన జొడిజొడి యిసుకదిక్కుల నదులెల్ల నింకె
      కాగినయట్టి మంగళముకైవడి సహ్య విరహితధరణిగా విరులు గప్పె
      విత్తన మొదలుకూరూరు వెదకెనేని, కుడ్యములుకానె మనుజసంకులము మాని
      దోషమున రాజనావృష్టిదోష మేమి, సేయ నేరదు తా బ్రవేశించెనేని.
క. భూముల మృత్యువు కేళీ, భూములగతిఁ బొల్చె సహ్యభూవాహినిలో
      నేమీ కొంచెపువెల్లువ, గా మూరెడుమేర నీటికాలువ నిలిచెన్.
క. ఆయాసజార మునివరు, లాయాసంబులకు నోర్చి యచ్చటి తపముల్
      సేయుచునుండిరి బలసిన, యేయీతిరిగాక లోకు లెల్లను గుమియై.
శా. కావేరీతటముల్ నివాసములుగా కాలంబు వో వ్రోయుచున్
      దేవారాధ్యుని రంగనాయకుని భక్తిం గొల్చుచున్ దారులే
      త్రోవం బోయిన బోననిమ్మనుచు నెందున్ ఖేదముల్ మాని యా
      పోవన్ దన్మహి గాచు భూతగణముల్ భూరిప్రభావంబుగన్.
గీ. ఏముగల్గగ నీయనావృష్టిదోష, మెట్లు గలిగెను కావేరి యెట్టు లింకె
      సమయ మిదియని మేఘగర్భములు చించి, వానగురియించి రతులప్రవాహములుగ.
ఉ. భోరున నక్షమాత్రజలపూరనిరర్గళధార లుర్వికిన్
      భారముగాగ ముంచి జడవెట్టిన మున్వెలివెల్లి రీతిగా
      వేరి దరుల్ వహించుకొని వెల్లువ జాపగ నోడి కుండలన్
      నీరెడలించినట్టికరణిన్ జలదంబులుఁ జేసెనో యనన్.
మ. ఒడలభ్రంకషనీలభూధరవరంబోనాగ కెంజాయ బల్
      జడ లల్లాడ మెఱుంగుకోరలు తటిత్సంగంబు నిర్మింప క
      న్గడలంగారకణంబు లీన వివృతోగ్రహ్వాప్యగంతంబుతో
      ముడిగొన్నట్టి బొమల్ నటింప నదికై మున్నాడి యాహత్యయున్.

గీ. జెంది పోరఁగఁ గావేరి మ్రింగఁదలఁచి, మండికాలెడి యున్న దీమధ్యభూమి
      కాళరాతియనంగ నగ్గలికనున్న, వానిఁగని యేరుగాచు భూతవ్రజంబు.
మ. తనబాహాగ్రపరిభ్రమాయసిగదాదండంబులన్ హుంకృతో
      ద్ధతిఁ బోనీకుడు పోకుఁబోకు మని పంతాలాడి వెన్నాడ తా
      నతిభీతిన్ ధరణీశు పాపము గతాహంకారమై పార ద
      ర్పితులై వా రరికట్టి నిల్చుటయు తా భీతిల్లి యప్పాపముల్.
ఉ. కొట్టక తాలి నాదుపలుకుల్ వినుఁ డొక్కఁడు సోమకుండు నా
      రట్టడిరా జొకానొక ధరాద్విజుఁ గొంచెపు తప్పు సేయుచో
      బట్టి వధించె నే నతనిపాలిఁట నిల్చిన బహ్మహత్య నే
      పట్టిన నుర్వియెల్లఁ జెడపట్టుక్రమంబునఁ బాడుచేసితిన్.
ఉ. నేరముఁ జేసియుం దగిననిష్కృతి సేయఁగనేరడయ్యె ధా
      త్రీరమణుండు కాదనక తీర్పరులైన సమర్థులయ్యు తా
      రూరక యుండి వంచుకొని రుక్కివులై తమనాటఁగ్రోలి యి
      మ్మేరఁ జరింతు బల్లిదులు మీర లదెవ్వరు నన్ను నాగఁగన్.
మ. అని నిర్దేశము దివ్యమైనయది యాయబ్జారి తీర్థంబు పా
      వనమైనట్టిది యీకావేరియు జగద్వ్యాస్తన్యపాపావహం
      బనిశం బన్నియుగాచు భూతగణ మల్లాడంగ గానిత్తుమే
      విను బొ మ్మెచ్చటికైన ప్రాణములపై నీకాస వాటిల్లినన్.
గీ. ఉన్న నిఁకతాళ మనుమాట విన్నయపుడె, క్షేత్రతీర్థాపగాతి విశేషమహిమ
      పాతకము రూపుచెడి మోక్షపదము నొందె, నేమనఁగవచ్చు శ్రీరంగధామ వసతి.
క. ఈ యాఖ్యానము సజ్జను, లేయెడలన్ వినినఁ జదివి రేనియు నఘముల్
      పాముం డాయుశుభంబులు, సేయున్ శ్రీరంగశాయి శ్రీమంతులుగన్.
క. ఇంకొకకథ యుల్లములు క, లంకంబులు దీర్పఁగా వలంతియగు నిరా
      తంక కపోధన నిను మమృ, తాంకసరోవరమహత్వ మని యిట్లనియెన్.
మ. కలదాదిత్యనివాసినీకుముదరాకాచంద్రుడాకారన
      వ్యలతాస్త్రుఁడు చిత్రసేనుఁ డన ప్రఖ్యాతుండు గంధర్వుఁడు
      న్నలకాపట్టణవాసి కాంచనవిమానారూఢుఁడై ఖేచరుల్
      జెలిమి న్వెంబడి పుష్పకాంతరములున్ జేదోడువాదోడుగన్.
ఉ. గీతము తాళతుల్ తివిరి కిన్నెరలం బరికింపుచుం బద
      వ్రాతము యక్షగానములు రక్తిగఁ బాడుచు గుహ్యకన్యకా

      శీతలశీకరానిలముచే సిగజుట్టిన పారిజాతపు
      న్నూతనపుష్పమాలికల నున్ననిరేకులు సంచరింపఁగన్.
క. గగనపదంబున రాఁగా, ధిగధిగ మనునొక్క దివ్యతేజంబున బో
      లగనంబై పొడకట్టిన, బెగడి దివౌకసులు జనిరి భీతిం గడలన్.
గీ. చిత్రసేనుండు మధుపానచేష్టితుండు, గాన భోగీంద్రశయన విమానతేజ
      మిది యనియెఱుంగఁజాలక మదము పేర్మి, ఛాయగా దాటఁజూచి యచ్ఛాయ గదిసి.
శా. ఛాయాలంఘననిర్విశక్తియయి యక్షస్వాంతవృత్తంబున
      చ్ఛాయల్ రంగవిమానరక్షకులు వీక్షంజూచి తచ్ఛక్తి యి
      చ్ఛాయోగంబున స్వీకరించుటయు మూర్ఛాసక్తుఁడై యుర్విపై
      నేయత్నంబులు లేక ద్రెళ్ళి వగతో నెల్గెత్తి యాపన్నుఁడై.
ఉ. ఏటికి నన్ను డించి కడకేగి తదాప్తజనంబులార నేఁ
      డేటికి వ్యోమయానము మహాస్థలిఁగూలి మదీయశక్తి బో
      నేటికి నట్లచేతనుడ నేనయితిం గరుణించి తోడుగా
      రేటికి మీ రనన్ ఖచరు లిట్లని పల్కిరి చిత్రసేనుతోన్.
ఉ. ఏమొక దివ్యతేజ మదినేడ్తెఱ చండిమమైనఁ జూచి యా
      సీమకు నోసరిల్లి దరిఁజేరితి మీ వతిమందబుద్ధివై
      యిమ్మెయి చక్కఁజేయఁ జని యిట్టి యవస్థలఁ బొందినావు ని
      న్నేమనవచ్చు కర్మఫల మెవ్వరికిం దొలఁగింప శక్యమే.
గీ. పంచభూత పయోరాశి భాను చంద్ర, పర్వతాదులు సాక్షిగా నుర్విజనులు
      సేయుకర్మంబు లనుభవనీయ మగుట, కీడు మే లందఱకు నొనగూడ రాదు.
క. ఈయఘమునకు న్నిష్కృతి, సేయఁగరారాదు నీకు సేమం బనఁగా
      నాయత్నము నెమ్మదిలోఁ, బాయక యొనరింపు మీవు భద్రాపేక్షన్.
గీ. అనుచు ననుచరగంధర్వు లాడుమాట, విని విషాదంబుతో నిట్టివింత గలదె
      యెన్నడు పరాభవం బెందు నెఱుఁగనట్టి, వాని కిచ్చోట నీదురవస్థ వచ్చె.
ఉ. ఎవ్వనిచేత నిట్టనియె నెవ్వనిశక్తి గ్రహించునన్ను న
      న్నెవ్వనిగా దలంచెనొకొ యిప్పుడు నెయ్యెడ పాతఁ డెట్టి న
      న్నెవ్వగవిన్న శోణరుచి నిర్భరలోచనవహ్నికీలలన్
      క్రొవ్వణగింపడే శలభకోటులుగా నిటుసేయువారలన్.
క. ఈపక్షపాతి యెవ్వఁడ, కో పల్మరు నొక్కచోటఁగూడి మెలఁగఁ జూ
      పోపగ యిందఱిలో తను, దోపగబడవైచె నిట్టి దోసము గలదే.

మ. అని తా మెల్లన లేచిపోదునని యాయాసంబునం బొంది కే
      లును కాలాడక ప్రాణముల్ జెదర నాలోకింపఁగాలేక మె
      ల్లన యొక్కింత ముహూర్తమాత్రమున నుల్లం బూరటిల్లంగఁ బా
      వను జేసెం బరమేశు శంకరు జగద్వంద్యున్ గృపాంభోనిధిన్.
సీ. వనరాశి బొడమువాఁడని తలపువ్వుతో జడలుగట్టిన గంగమడువుతోడ
      మినుకు లీనెడుకన్ను నినకరిమోముతో పూసిన మదనవిభూతితోడ
      చెలఁగి రంకెలువైచు వెలిగిబ్బమావుతో డావంక నొరసౌ మిఠారితోడ
      వెట్టిద్రావుడుగాముచట్టదువ్వలువతో చేరూపు పుణెకెలపేరుతోడ
      మంటవిడిచిన మిక్కిలి కంటితోక, సంకువన్నియ నెమ్మేని చాయతోడ
      ప్రమథవర్గంబుపాలిఁటి భాగ్యరాశి, యక్షునకు మ్రోల హరుఁడు ప్రత్యక్షమయ్యె.
గీ. భక్తసులభుండు సంతతాపన్న రక్ష, ణైకకరుణాకటాక్షావలోకుఁ డపుడు
      సంస్మరించినమాత్ర సాక్షాత్కరించి, యేల దలఁచితి వేవరంబిత్తు ననిన.
క. వివరమునొల్ల దేవా, దేవరకరుణాకటాక్షదృష్టి యునిచి నా
      కావరముచేత వచ్చిన, యీవరపా టుడిపి బ్రోవవే యని పలుకన్.
ఉ. ఏమిటి గొప్పశక్తియది యీఖచరేంద్రధరిత్రివారె నీ
      వ్యోమచరైకయానమున నుండి తలంచెదగాక యంచు నౌ
      రా మధుపానమత్తత నెఱుంగమి రంగము చేరఁబోయి యీ
      భాములు నొందఁగావలసె బాపుదు వీని మనోవిచారముల్.
క. అని యెంచి వీనిఁ గొనితెం, డని ప్రమథుల కానతిచ్చి యపరిమితంబౌ
      తనభూతకోటిఁ బనిచిన, వనములు గ్రోలంగ రంగవాసముఁ జేరన్.
మ. గుములై పుష్కరిణీకవేరిజలపై కుంభాండకుండోదర
      ప్రముఖుల్ సంవినృతాశ్యగర్త లగుచున్ బారల్ నెపంజాచి దా
      హముదీరన్ జఠరాగ్ని యారనివిగా నంభోనిధుల్ జాలునే
      తమకంచుం దమకించుచుం గళగళధ్వానం బనూనంబుగన్.
ఉ. గ్రోలఁగఁ జూచి బిట్టలిగి కొట్టుడు పట్టుడు కట్టుడంచు న
      వ్వేలము భూతకోటిఁగని వేగమె భీమగదాసిపాణులై
      యాలముగాఁగ మోదుటయు నాలము సేయఁగ నీరుగ్రోలకా
      కాలుబలంబు వారుటయుఁ గాంచి కుమారుఁడు దర్ప మేర్పడన్.
ఉ. శక్తులు భూతవర్గము పిశాచగణంబును బ్రహ్మరాక్షసుల్
      భక్తులు భృంగి నంది గణపాలక ముఖ్యులు మున్నుమున్నుగా

      శక్తులు భిండివాలములు శస్త్రములు న్నిగుడించి భీమదో
      శ్శక్తులబారి కొంతవడి శక్తులు మేయని వీఁగి బోయినన్.
క. పోవక కుమారుఁ డప్పుడు, లావును జేనయును నగ్గలంబుగ శ్రీరం
      గావరణ రక్షకావళి, యావళికావలయుమాన్తు నని హళహళికన్.
గీ. చేతనైనట్టి తా నని చేసి యలసి, చిత్రసేనుని బడనేసి జెదిరి పఱచె
      నజ్జ వేనుకు తనవారి ననునయించి, పోయెఁ గనుపించుకొనక శంభుఁడును మరలి.
క. ఇంతయును జిత్రసేనుని, చెంతన్ గంధర్వవరులు చెప్పిన నింద్రుం
      డెంతపని వచ్చెనోయని, చింతామణిపీఠి డిగ్గి చిడిముడితోడన్.
సీ. ఐరావతము తెమ్మటని యమరేంద్రుండు నదిని బొట్టీడిపై నవ్యవహుఁడు
      లాయంబులోని లులాయంబులే కాలు డెక్కుడు నరునిపై రక్కసుండు
      కైజాయమర్చు వక్త్రంబుపై వరుణుండు మృగముల గైచేసి మృగవహుండు
      హరినిబల్లించి కిన్నరసార్వభౌముండు మిన్నంది నందినమీఁద హరుఁడు
      దివ్యరథములు భాస్కరాదిగ్రహంబు, లమరగంధర్వయక్షవిద్యాధరాదు
      లాత్మపద్మములను తూర్యములు మొరయ, సంగరమొనర్పఁ దిరిగె శ్రీరంగమునకు.
శా. బారుల్ దీరఁగ దేవతాగణము పైపై ముప్పదిన్మూడుగో
      ట్లారూఢస్థిరశౌర్యదర్పములు డాయన్ రా విలోకించి లో
      నారంభంబున శౌర్యశాలి కుముదాఖ్యన్ మీరు నారక్షుఁ డ
      బ్ధీరావాసమహోగ్రభూతములు భక్తిం గొల్వఁ బార్శ్వంబులన్.
గీ. ఆంకమున కేగు నావిష్ణుకింకరులకు, నమరకోటికి నైనయాహవముఁ జూచి
      రామరావణకృతసమరంబు దీని, నంటి దనజాలదని నభోవాణి పలికె.
మ. తెరలెం దేరులు కూలె భద్రగజముల్ ద్రెళ్ళెం దురంగంబు లొ
      ప్పరియన్ సైన్యము లట్టలాడె రణభూతానందనాట్యంబు లు
      ర్వరనిండెన్ బ్రవహించె రక్తనదు లభ్రస్యందనాదిత్య భీ
      కర శస్త్రాస్త్రపరంపరాహతిని రంగక్షోణి రక్షావళిన్.
ఉ. ఆతరి విష్ణుకింకరసహస్రముతో కుముదుండు దేవతా
      వ్రాతము దాఁకి సాయకపరంపరలన్ దిగధీశముఖ్యులన్
      చేతులు తీటదీర ననిఁజేసిన పింఛండింగి పాఱినన్
      భీతిలి లంకకాదివిజబ్బందముతో తన మాననుల్ మొనన్.
క. తమతమ మాయాబలములు, సమకట్టగ కట్టు కుముదసైన్యముమీఁదన్
      సమకాలంబులు బోరిరి, యమరులకు నసాధ్యమైన యర్థము గలదే.

సీ. కురియించి భోరున వరపుష్కలావర్తజలధరంబులు రాలు శతమఖుండు
      విసరె సప్తస్కంధ లసమానయుగపట్టి సారితజంఝాసమీరణములు
      కాసె గండపుటెండ లీసున ద్వాదశచండమార్తాండుల మండలములు
      దహియించె త్రిభువనగ్రహయాళుపటుతిగ్మహేతిసంతతులును వహ్నిత్రయంబు
      ముంచె మంచుల మించుల మంచువేల్పు, కవిసె వికృదాకృతులను రాక్షసచయంబు
      తత్తదధికారదేవతాయత్తమహిమ, సరకుగొనరైరి విష్ణుకింకరులు జూచి.
మ. పటుజిహ్వాతలలార్చి ఘోరవిషసర్పంబుల్ పయిన్ రాగ ను
      త్కటకాలాబ్దములెల్ల గప్పుకొన గృధ్రశ్యేనమూకాది సం
      కటముల్ పైకొని వృశ్చికాదులొదునన్ గల్పోద్ధతిం జూచుచున్
      డు............కలంగడయ్యె నొకరుండున్ విష్ణుభక్తాళితోన్.
క. కుముదుం డప్పుడు దివిజులఁ, దమతమశక్తులను బోరి తమలో మాయా
      సముదయముఁ జూపఁ బ్రతిగా, సమకట్టెన్ మాయదివిజశక్తులు మాయన్.
ఉ. ఆతతమైన వైష్ణవమహాంతరఘోరసమీరపాతని
      ర్దూతములై సమీరముఖదుర్జయమాయ లడంగి గౌతమం
      బై తగు క్రోధపావకశిఖావళి ఖేచరమాయ లన్నియుం
      బాతకశీలుయత్నముల భంగి నడంగె నిమేషమాత్రలోన్.
చ. అది గని యింద్రుఁ డాగ్రహసమాకులితాత్మకుఁడై జగత్రయం
      బదరఁగఁ జేతివజ్రము రయంబున ద్రిప్పి దిశల్ గలంగ బె
      ట్టిదముగ వైచినంతనె పడిం గులిశం బరుదేర చేతన
      న్వొలయ మొగంబునం గుముదుఁ డుద్ధతిఁ బట్టె కరాంచలంబునన్.
క. పట్టిన నాహాకారం, బుట్టి దిశావీథులందు నొక్కొక తృణమై
      గట్టులయెరకలు మును తెగ, గొట్టెడు జగజెట్టియెలుఁగు కుంఠితమయ్యెన్.
క. కుముదుని హంకారంబున, నమరేంద్రుఁడు మున్నుగాగ నాదిత్యులకున్
      సమసె నిజశక్తు లప్పుడు, భ్రమసెన్ సురసైన్యమెల్ల బవరము దీరన్.
గీ. ప్రాణభయమున నొక్కఁడుపట్టు త్రోవ, నొకఁడు వారక దిక్కున కొకఁడు గాక
      బరవ నింద్రుఁడు పద్మజుపాలి కరిగి, యతనియడుగుల కప్పు డానతి యొనర్చి.
క. దండమిడి లెమ్ము లె మ్మా, ఖండల నీవచ్చినట్టి కత మెట్టిది యే
      దుండగము లేక నాక మ, ఖండితమహిమానుభూతి కరమొప్పుఁ గదా.
గీ . విన్ననైయున్న దిపుడేల విబుధనాథ, నీదువదనంబు కైదువ లేదు, చేత
      కిటుకు లెందైన బుట్టిన యటులుదోచె, కలుగగా కేమి వివరించి పలుకు మనిన.

శా. అయ్యా నాచెలి చిత్రసేనుఁ డనువాఁ డాకాశమార్గంబునన్
      నీయాస్థానికి వచ్చుతో తెరవులో నిష్కారణం బేలనో
      చేయిం గాలు గదల్పలేకిటలు మూర్ఛిల్లం దదీయార్తికై
      నెయ్యుండౌట హితార్థినై చనితి వానిం దేవదేవాళితోన్.
ఉ. పోయిన నెవ్వరో ధరణి భూతగణంబులు కయ్యమిచ్చినన్
      మాయమరాళి నొక్కఁడును మార్పడఁజూలక నెన్కతీసిరే
      నాయెడఁ జేతివజ్రము రయంబున బంపిన నెవ్వఁడో యొకం
      డాయతశక్తిఁ బట్టుకొనినం తటిదీరె మదీయశౌర్యముల్.
గీ. అనిన నమ్మాటలో కుముదానుచరుఁడు, ధాతకును గేలుమొగిచి యే ధరణినుంచి
      వచ్చినాఁడను స్వామి వజ్రహేతి, మీవశంబున నొసఁగి రమ్మీయటంచు.
క. కుముదుని వేగులవాఁడని, కమలాసన వచ్చె నింద్రుకైదువు భాండా
      రమునం బగిలము సేయిం, పుము సెలవా నాకు మరలి పుడమిం బోవన్.
క. అని చారుఁ డేగుటయును నిం, ద్రునిఁ గనుఁగొని పొమ్ము నీశ్వరునిపుణ్యము చే
      సినకతన మగుడవచ్చెం, కననిది సింగంబు నాతికండ తెఱంగై.
శా. శృంగారోపవనాదిశోభనము లక్ష్మీనిత్యవాసంబు శ్రీ
      రంగబ్రహ్మము సహ్యజాంతరమహారమ్యప్రదేశంబునన్
      రంగద్వైభవ మొప్ప నుండునటె యారాజ్యంబుపై నల్గి యా
      భంగి న్వచ్చుట క్రమ్మరం బొడముటల్ భాగ్యాతిరేకంబునన్.
గీ. వెఱ్ఱివాఁడవుగాక వివేకివైన, రంగధామంబు నీవు చేరంగఁజనునె
      చాలు మనవంటివార మాస్వామియాజ్ఞ, మీరువారల నొకని నిమిత్తముగను.
క. నీశస్త్రము నాయస్త్రము, పాశుపతం బపరదివ్యబాణంబులు రం
      గేశుని సేవకులందుఁ బ్ర, వేశించునె నాకమునకు విచ్చేయుఁ డనన్.
మ. కడకున్ సిగ్గున నోసరిల్లి హితులం గంధర్వుల బిల్చి తా
      నడిగింపం జెవిచెంతకుం జని త్రిలోకాధీశు రంగస్థలిం
బడియున్నాఁడటె చిత్రసేనుఁ డతనిన్ బాలించి రక్షింపుమీ
      యెడకుం జేర్పునుపాయ మెట్టిదయొ మీ రీక్షింపు డుల్లంబునన్.
క. రంగవిమానచ్ఛాయా, సంగతినిన్ వ్రాలె తదనుచర శిక్షితుఁడై
      సంగతి నేగుచు నేము దొ, రంగి చనినకతన ప్రాణలాభము కలిగెన్.
క. ఇందునకై గిరికన్యా, మందిరుఁడు వహించుకొని ప్రమాదము నొందెన్
      ముందెఱుఁగక తా బోయి పు, రందరుఁడును కత్తియిబ్బి రాఁగా వలసెన్.

క. కలతెఱఁగు సమ్ముఖంబున, తెలిపితి మును నంతలోన ద్రిపురారియు న
      జ్జలజాసను సముఖంబున, నిలిచి తదన్యంబు పలుకనేరక యుండెన్.
క. అందఱి నీక్షించి శతా, నందుఁడు మీకేల యిట్లనఁగఁ గర్మఫలం
      బందక యెంతటివారల, కుం దరమే చిత్రసేను గుణదోషంబే.
గీ. అందఱము నీశ్వరాధీను లైనవార, మతనియాజ్ఞ దురాపదంబగుట తానె
      కర్మవశ్యలు యందుండి కర్మఫలము, లనుభవింపఁగఁజేయు సర్యాత్ముఁ డగుట.
గీ. ఇలకుఁ బతిలేమి వర్ణసంకులత నొంది, చెడుట నట్టులు నెందు నీశ్వరులు లేని
      యెడ సకలలోకములు నశ్చరము లొందు, కర్త శ్రీరంగభర్త యొక్కరుఁడును సుమ్ము.
క. ఆయీశు దివ్యతేజము, చాయారూపమున నుండు సత్యంబని యా
      మ్నాయంబు లెపుడు మొఱలిడ , నీయర్థ మొఱుంగకున్న నిటుగావలసెన్.
గీ. నిగమశృంగంబు రంగంబు గగనవీథి, నేగుచో ఛాయ యందమై యాగి యున్న,
      మత్తుఁడై దాటఁబోయి యమ్మధ్య ..., పడియె కొల్చిన వాడేల చెడకయుండు.
క. దివ్యచ్ఛాయామర్దిత, నవ్యోమచరున్ బునీతుఁ డగుచందము నా
      దివ్యాధు లుడిపి బ్రోవుము, భవ్యాత్మక యనుఁడు కమలభవుఁ డిట్లనియెన్.
గీ. అనఘ శ్రీపతిమూర్తు లయ్యవనిమీఁద, తానె మొలచిన దివ్యావతార మండ్రు
      సిద్ధుఁడు ప్రతిష్ఠఁజేసిన సిద్ధమయ్యె , జనులునిల్పినయవి పౌరుషంబు లండ్రు.
గీ. సరణి సరిసన్నిధానవైషమ్యములను, ............................
      .............................., సేయ కైంకర్యముఖసమార్పితఫలంబు.
క. ఇహపరములందు నయ్యా, వహిగా నందుంచు జేయువారల యఘముల్
      విహితగతి ననుభవంబగు, నహిసంచాయ లుభయలుభమై వరిల్లున్.
క. ఛాయా నిజఛాయా యుప, ఛాయయు నన నుభయమై.......
      ఛాయల నవియె జనావళి, యీయక్షయకాలమునకు నగు విషమంబుల్.
క. తలిదండ్రులు గురువులు నీ, డలు దాటగరాదు కలువడంబులు శయనం
      బులు నాననంబు లట్లన, తలఁపక కడనుండు టదియె ధర్మం బెందున్.
గీ. అది యెఱింగియు మెలఁగిన హానిలేదు, వీని నెఱుఁగక నడచినవాని కెందు
      నిష్కృతియు లేదు పెద్దలు నీరజాక్షు, వాసములుగాఁగ నిది సాధువర్తనములు.
గీ. పాదహీనుఁడు కుంటియు పంగు డెఱ్ఱి, యెఱుఁగములుఁ జేసి పట్టిన దురితమతులు
      దివ్యభవనంబులను గురుద్విజుల నెదుర, నణకువ బ్రదక్షిణంబుగా నరుగవలయు.
క. అట్టి ప్రదక్షిణములలో, మెట్టిరి నీశంకలెల్ల మెయికొనునేనిన్
      జుట్టతదధీచిఛాయలు, నట్టి చరింపుఁడని మతులు బలుకుచు నుండన్.

శా. ఛాయాధారుణి మూడుభాగములుగాఁ జర్పించి వాఁ డాదిమం
      దాయీశున్ భజియించువాఁడగుచు సేయంబోలుగా కూరకే
      సేయంజెల్లను స్వప్రయోజనములు శ్రీ విష్ణుసంకీర్తనల్
      సేయన్ గేరడమాడినన్ జెవిటియై జీవించు భూమండలిన్.
సీ. దేవాలయముఁ జూచి తావేగ మ్రొకని యట్టినాస్తికుఁడు జాత్యంధుఁ డగును
      హరిదివ్యభజనంబునకుఁ బ్రదక్షిణముగా జనకున్న బుణ్యములే జబ్బువదలు
      నాద్వారమున నమరావాసములు జేరువారలు దుర్మార్గవర్తు లైరి
      హరిని సంస్తుతి లేక యాత్మస్తుతుశులు సేయు నల్పుండు మూగవాఁడై జనించు
      దివ్యసిద్ధమనుష్యప్రతిష్ట లందు, దివ్యమధ్యంబు నిగమకీర్తితచరిత్ర
      మవ్యయము సర్వకారణ మచ్యుతంబు, రంగధామంబు లోకైకమంగళంబు.
ఉ. ఘోరతపంబుకేసి గయికొంటిని రంగవిమాన మేను త
      ద్ద్వారమునన్ మనుప్రభుఁడు ధాత్రికిఁ దెచ్చి నతం డొసంగి తా
      కూరిమిపట్టె సల్పెనర గొన్నిదినంబులకున్ విభీషణుం
      జేరఁగఁ బిల్చి రాఘవుఁడు చేతికి నిచ్చెను రంగధామమున్.
క. ఆయన పూజార్థంబుగ, శ్రీయుతుఁ డగురంగశాయిఁ జేర్చెను గావే
      ర్యాయతపులినంబున త, చ్ఛాయాలంఘనము వీఁడు జనునే సేయన్.
ఆ. యుక్తమై యనంతశక్తియుక్త స్వయం, వ్యక్తరంగరాజు వరవిమాన
      ధామమైననీడ దాట తత్కింకర, భూతకోటి యేల బోవనిచ్చు.
క. వారలతోటి విరోధము, కారడవుల వహ్ని జెణకుకైవడి గాదే
      మీరెఱుఁగక వగవడసితి, రారంగము దేరిచూడ నగునే మనకున్.
క. అనవిని యెటులైనను మీ, మనమున గంధర్వుఁ బ్రోచుమార్గము నాకున్
      మనవి యిదిచూడు మనవుఁడు, వనజాజనుఁ డిట్టులనియె వాసవుతోడన్.
ఉ. రంగవిమానదర్శనము రంగనివాసు సమర్చనంబు శ్రీ
      రంగనివాస పావనసరస్సలిలాద్యుతి సహ్యకన్యకా
      మంగళతీర్థసేవత సమగ్రత గల్గ దదన్యనిష్కృతిన్
      వెంగలులై చరింపుదురె వేఁజను మిట్టు లొనర్పఁ జేయఁగన్.
క. అని కొలువుదీర శంకరుఁ, డును జనియె దివిజనాథుఁడు శ్రీరంగం
      బునకు డిగి చిత్రసేనున, కొనరంగా నీహితంబు నుపదేశించెన్.
క. అతఁ డట్లచేసి రంగా, యతనస్మరణమున లేచి యవయవముల నూ
      ర్జితపూర్వశక్తిఁ గైకొని, శతమఖునిం బిలిచి తాఁ బ్రసన్నాత్మకుఁడై.

శా. శ్రీమద్రంగవిమానదర్శనశుభశ్రీ లొంది ప్రాంతస్థలా
      రామంబుం గనుఁగొంచు వచ్చునెడ నగ్రక్షోణి కారుణ్యని
      స్సీమన్ నిర్జితకాము కాశ్యపమునిన్ సేవించి యేమౌని పౌ
      లోమీనాయన పాపతప్పువను నాలోకించి రక్షింపవే.
సీ. మౌనీంద్రసుజును లేమర కేమిచేతురు పలుకంగ తగునెద్ది తెలివియెద్ది
      జేరఁ జో టెద్ది యేమేరవాఁ డీశ్వరుం డెయ్యది విడుతు రహీనమతులు
      బ్రహ్మ మెచ్చటనుండు బరమం బనఁగ నెద్ది యేరికిఁ గనిపిచు నెద్ది యొసఁగు
      విజ్ఞాన మన నెద్ది యజ్ఞాన మెట్టిది సత్య మేరూపు నసత్య మెద్ది
      ఇన్నియును వరుసనానతియిచ్చి నన్ను, బ్రోవు మొకయార్తుఁగాచిన పుణ్యమునకు
      యశ్వమేధసహస్రంబు లైన దొరయు, ననిన గంధర్వుఁ జూచి కాశ్యపుఁడు పలికె.
సీ. సేయునాగగనిశ్చితమైన ధర్మంబు హరిని బేర్కొనుట సత్యమును బలుకు
      హరిచరణాబ్జంబు లందఁజేరుట బ్రోచి రక్షించువాఁడు నారాయణుండు
      పరుషవాక్యములు దబ్బరయుచు విడుచుబ యెల్లనోటులనుండు యీశ్వరుండు
      సౌఖ్యంబు పరమంబు జ్ఞానాధికులందున్ దరించు మోక్షము దీనినెఱుఁగ నదియు
      జ్ఞానమగు తెల్విలేని యజ్ఞానమయ్యె, నిలుచునయ్యది యది సత్తు బొలిచియుండు
      నట్టిని యసత్తు బరికింపుమనినఁ జూచి, ఖచరుఁ డిట్లను మఱియు నక్కాశ్యపునకు.
ఉ. ఎందుల నందఱందుఁ గలఁడీశ్వరుఁ డంటిరి యట్టివాఁడ దీ
      నెందును జూచి కాన మిదియేమియనన్ విని సూక్ష్మదృష్టిచే
      గందురుగాక చూపులను కందురె జూచుచునుండి కానరే
      మందురు మందుకైవడిగ దాకొను జీఁకటి యల్లవారికిన్.
గీ. ఎన్నఁడు దురాన్నములమాని యింతులందు, కామకుఁడు గాక పరిశుద్ధగాత్రుఁడైన
      హృదయసిద్ధిని గల్గు నభ్యుదయ మొందు, దాన విజ్ఞానమపుడు శ్రీజాని గాంచు.
క. నాయందు నందఱందును, నీయందునుగలడు మనము నిలుపలేనిచో
      నీయర్థమైన నెఱుఁగనె, యీయక్షులు ముఖవిలాసహితవు లరయఁగన్.
క. అంతఃకరణసమేతా, కాంతాలోకనమె దృష్టిఁగని తెలియుము ని
      శ్చింతుడవై పరిశుద్ధ, స్వాంతంబున జూడ విష్ణుసాన్నిధ్యముగన్.
మ. ఇదియే రాజగుజోలిమాటలు కృపాహీరాకనీరాకరం
      బదుగో రంగము సహ్యకన్యక యిదే యబ్జారిదౌతీర్థ మ
      ల్లదె సేవింపుము తీర్థమాడుము పిపాసార్తె న్నివారింపు నీ
      కొదవున్ సర్వశుభంబులు న్మునుము పొ మ్ముద్యద్వనాంతంబుకున్.

క. అని దీనిం గనుఁగొంటిన్, వినఁగంటిన్ మంచిత్రోవ విజ్ఞానకళా
      జనకము లగునీశోక్తము, లని మౌనికి మ్రొక్కి యతని యనుమతి బడసెన్.
శా. కావేరీనదిఁ గ్రుంకి పుష్కరిణిలో కర్మావళిం దీర్చి రం
      గావాసుం బరవాసుదేవుని స్వయంవ్యక్తస్వరూపున్ రమా
      దేవీనల్లభు శేషశాయిఁ గని భక్తిన్ మ్రొక్కి కీర్తించి య
      ద్దేవారాధ్యుని సన్నిధిన్ ఖచరు లాదిత్యుల్ తను న్మెచ్చఁగన్.
ఉ. మేళము ఘుమ్మనన్ శ్రుతసమేతమునన్ జతగూర్చి మద్దెలన్
      దాళము లోవజంబులును దండెలు చంగులు నొక్కమ్రోఁతగా
      నాళత జేసి దృష్టిపరిహారతక్త మును తుంబురుడు తా
      గౌళవరాళి నాటలను గాయనరూఢికి నాటి చూపినన్.
క. గాంధర్వవేళ సంగతి, గంధర్వవరుండు వీణఁ గైకొని దివిష
      ద్గందేభగామినీమణి సంధించిన మసకతిత్తి జతరాణింపన్.
సీ. ఒక రాగమునకన్న నొకరాగ మందమై లయకారులను సిగ్గుపఱచుచుండ
      ఒకస్థానమునకన్న నొకస్థాన మొరపులు వెదచల్లి వీనులవిందు సేయ
      నొకగీతమునకన్న నొకగీత మతిచిత్రరచనల విమతిశల్ రంగుమీఱ
      నొకరాయమునకన్న నొకరాయము విశుద్ధభరతవేత్తల కుదాహరణములుగ
      నొక్కతాళంబుమీరఁగ నొక్కతాళ, మొకప్రబంధంబునకు మించు నొకప్రబంధ
      మొక్కనామావళికిమీర నొకటిగాఁగ, వీణెవాయించు నొకవేల్పుజాణ యపుడు
క. ఆవీణ నొకనిచేతికి, నావల యందిచ్చి దండి యెందుకు పాడెన్
      రావణ శంకర నారద, పావనముఖ్యులకు నోజి బంతి యనంగన్.
క. ఘను దేశి శుద్ధవైఖరి, వినుపించిన చిత్రిసేను వీణానాదం
      బున మూర్ఛనలము నింగిన, జనుల నచేతనులగా నిజంబున బాడెన్.
సీ. ఘనవిధంబునబాడ గారూఢస్తంభంబు తొగరుఁజాయల క్రొత్తజిగురు లొత్త
      తంతుమార్గంబున దళుకొత్త బాడిన మణిపుత్రికలకు జెమ్మటలు బొడమ
      దేశ వైఖరిఁ బాడుచో శిరోమాలిక లెత్తి జయ్యన భోగి యొ త్తిగిలగ
      తగహిరంగములు వింతగ బాణకాంచనకలశాంబుపూరముల్ కరడుగట్ట
      పదము బారెడుచో రూపపదము వాడు, చోటనాళ్వారులకు చొక్కు జూపఁబడియె
      మాపు నెమ్మోముబయకాఢు మధురగాన, రీతి రంగేశుఁ బాడ సంగీతసరణి.
క. రంగముఖమంటపంబున, బంగారపు బొమ్మలన సుపర్వువధూటీ
      శృంగారరస నిధానము, లంగంబులు తళ్కుతళ్కు మని రాణింపన్.

క. నోములకు నాళములకు, భాషలకు నుదంతరుచితపరికర నానా
      భూషణములకును దుర్గా, న్వేషణుఁడై కొల్చియుండ విద్యాధరుఁడున్.
మ. ఎకతాళంబున వీరమద్దెలరవం బేకంబుగా నట్టు దాల్
      ధికతోతోత్తకఝంకుఝంకుకిణతాంధిత్తాంగినాలోధికం
      ధికతత్తెయ్యదిధిక్కుధిక్కుధికతాధిత్తాది తాళంబులున్
      కకుబంతంబులు మారుబల్కుకొన గోల్గశ్యందమున్నాడఁగన్.
ఉ. దేశిలిధంలురట్టణము దివ్యకళాసియు గోలచారికై
      లాసకి పేరిణీవిధము లాగులు జక్కిణిచిందుకొల్వణుల్
      బాసలుకోపుఁ జూపులును బాట పదాభినయంబులేకయున్
      వాసికమీర నాట్యకలనం బ్రకటించెను హావభావముల్.
క. పాడినకైవడిఁ బాడుచు, నాడిన యటు లాడుచుండు నలరంగములో
      క్రీడామృగశారీపిక, నీడజముఖ తిర్యగాత్మనిచయం బెల్లన్.
మ. కవితాగారణి యక్షగానరచనల్ గంధర్వ గాంధర్వమై
      హవళింపన్ గనకప్రసూనముల కుత్సాహోదసంపర్కమై
      మివుల న్మెచ్చగఁజేసె ఖేచరుల భూమిన్ సత్కళావంతులన్
      భువనంబెల్లను ముంచె నద్భుతరసాంభోరాశి నుల్లాసియై.
మ. భటబాణౌక్తులనా సుచిత్రమధుకప్రౌఢంబుకా పద్యముల్
      నటనప్రాయజటాటవీగ్రహిళవల్గర్వ్యోమకల్లోలినీ
      సటువీచీరభసార్భటిం బొగడ నాపన్నప్రసన్నుండవై
      కటికానంతశయానుఁడై యలరి రంగస్వామి గంధర్వుతోన్.
గీ. మెచ్చితిని జిత్రసేన నీయిచ్చగోరు, వరము లిదియెంత నాదువితరణమునకు
      నీదు విద్యలకును వేడనేర వీవు, కొమ్ము సారూప్యపదవి నాసొమ్ము నీవు.
క. ఎచ్చటికి వలయుచోటికి, వచ్చుచుఁ బోవుచు విమానవర్యంబులపై
      నచ్చరులఁగూడి మెలఁగుచు, నిచ్చలవిడి భోగభాగ్యవిభవోన్నతులన్.
క. పొమ్మనిపనిచిన శ్రీరం, గమ్మునకుఁ బ్రదక్షిణంబుగావచ్చి ప్రణా
      మ మ్మొనరిచి యింద్రునిసము, ఖమ్మునకుం జనియె దివిజకాంతలు గొలువన్.
క. ప్రఖ్యాతము గంధర్వో, పాఖ్యానము విన్నవార లట్లనె మహిపై
      సౌఖ్యములఁ బొదలి యింద్రుని, సఖ్యమువాటింతు రెల్లజాతులవారున్.
శా. కంఠేకాలజటావిటంకవిలుఠద్గంగాజనుఃకారణో
      త్కంఠాణాత్మకపాదపద్మనఖరుత్పర్ణేందుసాంద్రప్రకా

సంఠీభూతనతోఘశార్వరమరుత్కోటీరహింద్రాననో
      త్కంఠాబిందురశింధురాడ్దుహితృముగ్ధస్నిగ్ధచింతామణీ.
క. కోమలసజలపయోధర
      శ్యామలపక్షాంతరాళ శంపాలతికా
      శ్రీమహిత వినూతన కమ
      లామహిళవిలాస నాతి లాలిత హృదయా.
మాలిని. జగదవనవిహారీ సర్వలోకోపకారీ
      నిగమభువనచారీ నిర్మలాకారదారీ
      సగుణమయవిదారీ సర్వధర్మానువాదీ
      ఖగవరహయసాదీ కంధికన్యావినోదీ.

గద్య
ఇది శ్రీవేంకటేశ్వర వరప్రసాదాసాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్ట హరిదాదరాజగర్భాబ్ధి
చంద్ర వరదరాజేంద్రప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యంబను మహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.