శ్రీరంగమహత్త్వము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరంగమహత్త్వము

ప్రథమాశ్వాసము

శ్రీ మన్మూర్తిరుచుల్ తటిద్ద్యుతిఘనశ్రీ నామతింపన్ గటీ
సీమన్ వామకరంబు సాఁచి వలచే శీర్షోపధానంబుగా
రామం బైన ఫణీంద్రతల్పమున శ్రీరంగంబునం దాశ్రిత
క్షేమస్థేమమతిన్ సుఖించుహరిఁ బూజింతున్ దయాంభోనిధిన్.

1


మ.

శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా
ద్వయమై మంగళపీఠమై మృదులవస్త్రంబై సమస్తోచిత
క్రియలం జక్రికి నిత్యసన్నిహితమూర్తిం బొల్చుశేషాహి న
క్షయమేధానిధిఁ గావ్యలక్షణకళాచార్యున్ బ్రశంసించెదన్.

2


ఉ.

ఆయతచండతుండనిహతాహినికాయునిఁ, దప్తహాటక
చ్ఛాయుని, సర్వవేదమయసన్నుతకాయుని, దేవదానవా
జేయుని, నప్రమేయుని, నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతించు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.

3


క.

శ్రీరమణచరణసేవా
చారనిరూధావధాను సత్కీర్తిజయ
శ్రీరాజమాను, దానవ
వీరఖగశ్యేనుఁ దలతు విష్వక్సేనున్.

4


మ.

వినుతింతున్ హరిభక్తిపెంపున జగద్విఖ్యాతులై పుణ్యకీ
ర్తను లైనట్టి పరాశరుం గపిలు వేదవ్యాసు బ్రహ్లాదు న
ర్జును, రుక్మాంగదు, నంబరీషుని, వసిష్ఠుం, బుండరీకున్, మరు
త్తనయున్, భీష్ము, విభీషణున్, సురమునిం, దాల్భ్యున్, శుకున్, శౌనకున్.

5

వ.

అని సపరిచ్ఛదంబుగా నభీష్టదేవతాభివందనం బొనర్చి.

6


తే.

అఖిలభువనైకపావనం బగుచు శ్రవణ
మంగళంబైన రఘునాధమహితచరిత
మసమవాక్ప్రౌఢి విరచించె నట్టియాద్య
సుకవిశేఖరుఁ బ్రాచేతసుని భజించి.

7


చ.

లలితకవిత్వరేఖ సఫలత్వము నొంద, నశేషకిల్బిషం
బులఁ దొలఁగించి, నిత్యసుఖమూలములై, హరిభక్తిదంబులై
వెలయు పురాణసత్కధలు వేడ్క రచించి, జగత్ప్రసిద్ధులై
పొలుచు మహాత్ములన్ సుకవిపుంగవులం బ్రణుతించి వెండియున్.

8


క.

రహి నిక్కిన కవితలఁ దహ
తహఁ జొక్కిన నృపులచేతఁ దగ సత్కృతులై
మహిఁదక్కిన కళలందును
వహి నెక్కిన కవుల నేఁటివారలఁ బ్రీతిన్.

9


క.

నుతిసేసి వారికరుణను
శతముఖములఁ బరిఢవించు సాహిత్యకళా
ప్రతిభాసంపదపెంపునఁ
జతురుఁడ నగునేను హృదయజలజములోనన్.

10


క.

సుతుఁడును గృతియును దేవా
యతనము నల్లిల్లుఁ జెఱువు నారామము నూ
ర్జితధననిక్షేపము నన
సతతము ధరఁ బరఁగు సప్తసంతతు లందున్.

11


క.

కలుగు ధన మఖిలదిశలను,
వెలుఁగు యశం, బతిశయించు విద్యలు ప్రీతిం
జెలగు సుధీతతి యెడనెడ
దలఁగు శివేతరచయంబు దగుకృతిఁ జెప్పన్.

12


వ.

అదియును.

13

సీ.

శబ్దార్థరూఢ రసస్థితి బహువిధ
        వ్యంగ్యభేదములు భావములు గతులు,
శయ్య లలంకారసరణులు రీతులుఁ
        బరిపారములు దశప్రాణములును,
వృత్తులు వస్తువివేకంబు గుణములుఁ
        గవి సమయముఁ జమత్కారములును,
వర్ణనంబులు గణవర్ణఫలంబులుఁ
        దత్కులంబులు నధిదైవతములు


తే.

గ్రహములును శత్రుమిత్రయోగములు దశలు
నంశవేధయు భూత బీజాక్షరముల
పొత్తువులుఁ దెల్పి శాంతవిస్ఫురణఁ దనరు
సత్కవీంద్రుని కృతి బుధసభల వెలయు.

14


వ.

అట్టి మహాకావ్యసముదయంబునందు.

15


క.

లోకోత్తరగుణపుణ్య
శ్లోకకథామధురిమధురశుభవాఙ్మయర
త్నాకల్పం బగుకావ్యం
బాకల్పంబగుఁ, గృతార్థుఁ డగుఁ గవివరుఁడున్.

16


వ.

కావున భువనైకకథాసంబంధబంధురంబుగా నొక్కప్రబంధంబు
రచియింపవలయునని వితర్కించుసమయంబున, నతిప్రసన్నవద
నుండును, నాకారవిజితమదనుండును, ననుపమగుణభూషణుండును,
నతిమధురప్రియభాషణుండును, నవికృతవేషుండును, నపగత
దోషుండును, సకలంకమణికుండలమరీచిమంజరీరంజితగండమండ
లుండునునై, ప్రతాపసమగ్రుఁడై, రాజశేఖరుండయ్యును గృతలక్ష్మీ
పరిగ్రహుండై, రాజీవాక్షుండయ్యును దుర్గాధీశుండై, పద్మినీవల్లభుం
డయ్యును గువలయానందకరుఁడై, కళానిధియయ్యును నిత్యప్రవర్ధ
మానుండును, వజ్రధరుఁడయ్యును గోత్రవిరోధి గాక, నసమాంబకుండయ్యు
ననంగుండు గాక, భోగీంద్రుఁడయ్యుఁ గుటిలప్రచారి గాక, భీమసేనుం

డయ్యు దుశ్శాసనాభిముఖుండు గాక, విజయుండయ్యు గర్ణకంటకుండు
గాక, నారాయణుండుఁబోలె నరప్రియుండును, నదీనాయకుండుఁబోలె ఘన
సత్వసమగ్రుండును, నాకేశశైలంబునంబోలె సువర్ణకటకోజ్వలుండునునై
యనురాగిలుచుఁ జాగయామాత్యసాగరసంపూర్ణసుధాకరుం డగురాఘవ
మంత్రిశేఖరుం డొకదివసంబున, నవసరసఘుసృణమలయజాభిసిక్తప్రదే
శంబును, సద్యస్సమర్పితబహురూపధూపధూమగంధానుబంధిగంధవహవాసి
తాశావకాశంబును విలంబితకుసుమమాలికావిసరపరిమళవిలోలరోలంబ
ఝంకారముఖరితంబును, బ్రభాతప్రభాకరబింబవిడంబితజాంబూనదశిఖర
రాజివిరాజితంబును, ముక్తాఫలముకురతలవిమలభిత్తీచిత్రితహరిలీలావ
తారవిహారంబును నై వెలయు సభాగారంబున నశేషనయవిద్యావిశేష
స్వతంత్రులగు మంత్రులును, సకలకర్మప్రయోగచాతురీమహితులగు
పురోహితులును, అవక్రబలపరాక్రమవంతు లగుసామంతులును, అసమ
సంగ్రామరంహవిహారవీరావేశసముద్వృత్తు లగుబిరుదరాహుత్తులును,
బహువిధనాటకాభినయపాటవసముద్భటు లగునటులును, శ్రుతిసంధాయక
గానవిద్యాసుసంధాయకు లగుగాయకులును, సచమత్కారకారణగుణాను
బంధబంధురప్రబంధరచనానిస్తంద్రు లగుకవీంద్రులును, నిజశేముషీ
విశేషానుకృతశేషు లగుమనీషులును, భారతరామాయణాదిక కథాకథన
చతురవచనామృతసరిద్వైణికు లగుపౌరాణికులును, నలనహుషనృగ
భగీరథాది రాజన్యధన్యగుణశ్లాఘాముఖరం బగుపారకప్రకరంబును,
సమంచితలీలాసంచితానూనవిటమానమానధనం బగువిలాసినీ
జనంబును గొలువఁ గొలువుండి సకలశాస్త్రసారంబగు హరికథామృత
పూరంబు వీను లలరం జవిఁగొనుచు నందు గారుడపురాణప్రసిద్ధంబై
సిద్ధమునిగణస్తోత్రపాత్రంబగు శ్రీరంగక్షేత్రప్రభావంబునకుఁ బ్రమో
దం బావహించిన.

17


క.

శ్రీరంగమహత్త్వము ప్రియ
మారంగఁ దెనుంగుబాస నతిమృదులవచః
శ్రీ రుచిరత్వంబుగఁ దన
పేర రచింపింప నాత్మఁ బిరిగొనువేడ్కన్.

18

ఉ.

తొల్లిఁటి సత్కవుల్ కృతులు దొంతులు పేర్చిన మాట లూఁతగా
జల్లి పదంబు లూదుకొని, సంధులు దూఁటుచు నొక్కజాదుగా
నల్లిన కబ్బముల్ సభల నార్యులు నవ్వఁ బఠించుదుష్కవుల్
మొల్లము వారిచేతఁ దుదముట్టునె భవ్యము లైనకావ్యముల్.

19


ఉ.

పుట్టకుఁ బుట్టి, కోమలికిఁ బుట్టిన ప్రాఁగవు లాదరించి, చేఁ
బట్టిన గాదె రాఘవనృపాలకధర్మజకీర్తిచంద్రికల్
నెట్టన సర్వలోకములు నిండిన విప్పుడు నిందు నందులన్
ముట్ట నఖర్వసర్వసుఖమూలము కావ్యమ వో తలంచినన్.

20


మ.

కృతవిద్యాఖురళీపరిశ్రమ కళాకేళీవిలాసుం జన
స్తుతచారిత్రుని, గౌతమాన్వయపవిత్రుం, గౌరనామాత్య స
త్సుతుఁ, గల్యాణకవిత్వలక్షణసమర్థున్, సూక్తిముక్తాఫలా
తతకాంతిస్ఫుటచంద్రికోల్లసితవిద్వత్కైరవున్ భైరవున్.

21


చ.

ననుఁ దనసమ్ముఖంబున మనం బలరం బిలిపించి, యాదరం
బెనయ, విచిత్రవస్త్రమణిహేమవిభాషణదర్పసారచం
దనహిమవాలుకాది వివిధస్తుతనిస్తులవస్తుసంపదల్
దనియఁగ నిచ్చి, వక్త్రకమలంబున లేనగ వామతింపఁగాన్.

22


క.

లలితమరుసమయసముదిత
మలయానిలచలితమధురమాకందసము
జ్వలకుసుమవిసరసౌరభ
కలితవచస్స్ఫురలు వెలయఁగా నిట్లనియెన్.

23


శా.

వ్యాసప్రోక్తమహాపురాణములు ముయ్యాఱింటియందుం జగ
ద్వాసుండైన రమామనోహరు మహత్త్వవ్యక్తిమూలంబులై
భాసిల్లుం దగు నాలు గందును బహూపాఖ్యానవిఖ్యాతమై
యా సౌపర్ణపురాణ మొప్పు బహువేదాంతార్థగంభీరమై.

24


వ.

అందుఁ బురాణసారంబై శ్రవణమంగళంబగుశ్రీరంగమహత్త్వంబు మదంకితంబుగా నాంధ్రభాషాకౌశలంబుఁ బచరించి రచియింపవలయు నని యభ్యర్థించిన నయ్యర్థిపారిజాతంబునకు నభిమతం బొదవ నిట్లంటి.

25

క.

శ్రీరంగరాజమహిమో
దారం బది కృతిదలంవఁ, దత్పతి సుగుణో
దారుఁడు రాఘవుఁడఁటె శుభ
కారణమగు నిట్టిపొందు గలదే యెందున్.

26


క.

చెప్పెదఁ గావ్యము రసములు
చిప్పిల వర్ణనల నింపు చిలుకగఁ బాకం
బుప్పతిలఁ, జిత్రరచనలు
చొప్పడ శబ్దార్థఘటన సుకవులు మెచ్చన్.

27


వ.

అని అమ్మహామంత్రి చింతామణిచేత నత్యంతబహుమానపూర్వకముగాఁ గర్పూరసమేతం బగుతాంబూలంబు గైకొని సమ్మదంబున నిమ్మహాపురాణకధ రచియింప నుపక్రమించితి నిట్టి కృతినాయకు నన్వయక్రమం బెట్టిదనిన.

28


మ.

జగముల్ మూఁడు తలంపులోపల జనించం జేయు వాగ్వల్లభున్
మిగులం గూర్మితనూజుఁగాఁ గనిన లక్ష్మీనాథుఁ డెవ్వానికిన్
బొగడొందన్ సుతుఁడయ్యె నట్టి సుమహత్పుణ్యుం బ్రశంసింపఁగాఁ
దగదే కశ్యప సన్మునీంద్రుని విశుద్ధజ్ఞాననిస్తంద్రునిన్.

29


క.

ఆ మునివంశసుధాంబుధి
సోమునికరణిం జనించె సురుచిరలక్ష్మీ
ధాముఁడు కేశవదేవ మ
హామంత్రీశ్వరుఁ డుదారయశుఁడై వసుధన్.

30


క.

అతని కతిభాగ్యలక్షణ
వతి మాదాంబికకు నుద్భవంబయ్యె జగ
న్నుతచరితుఁ డబ్జమిత్ర
ప్రతిమానుఁడు మాయిదేవపండితుఁ డెలమిన్.

31


క.

అమ్మంత్రిమణికి బొమ్మా
యమ్మకు సుతు లిరువు రుదయమై రఖిలజగ

త్సమ్మదకారు లుదారులు
సమ్మర్దితచటులకుటిలశాత్రవవీరుల్.

32


వ.

వెలయుచుండ.

33


సీ.

ఈప్రధానశ్రేష్ఠు కెనవచ్చు గనకాద్రి
        భవునిచేఁ దలవంపు పడకయున్న,
నీసచివాగ్రణితో సమం బగు వార్ధి
        యఱచేతిమాత్రలో నడఁగకున్న,
నీయమాత్యుని రహి కెక్కుఁ గల్పకశాఖి
        భూలోకమున వీటిఁబోకయున్న,
నీమంత్రిమణికి జో కౌ మీనకేతనుఁ
        డంగవైకల్యంబు నందకున్న


తే.

 ధైర్యగాంభీర్యదానసౌందర్యములను
ననఁగ నాశ్రితవిద్వదర్థార్థిబంధు
మిత్రసంతతభాగ్యలక్ష్మీవిలాస
బంధురుం డొప్పుఁ జాగయప్రభువరుండు.

34


చ.

అతులధృతిం దనర్చి విబుధాశ్రయమై, క్షమఁ బూని భూమిభృ
త్తతి కతిమాన్యయై, యచలతామహిమన్ మహి కెక్కియున్, జన
స్తుతుఁడగు చాగయప్రభువుతో సరిగాదుసుమీ సుపర్వప
ర్వతమురుధర్మకార్యమున వక్రత నొందుట దక్కకుండుటన్.

35


వ.

తదనుసంధవుండు.

36


శా.

శ్రీవిభ్రాజితుఁ, డుల్లసద్గుణమణిశ్రేణీసుధాంభోధి వి
ద్యావాణీపతి, యన్యరాజసచివోద్యద్వంశ వంశాటవీ
దావజ్వాలి, ముకుందపాదకమలద్వంద్వార్చనోత్సాహి యా
గోవింద ప్రభుఁ డొప్పు బంధుజనచక్షుఃపూర్ణిమాచంద్రుఁడై.

37


ఆ.

అయ్యమాత్యమణికి నంగనారత్నంబు
మాణికాంబకును, సమగ్రబాహు

శౌర్యశాలి భాగ్యసంపన్నుఁ డుదయించె
బరఁగ విశ్వనాధపండితుండు.

38


సీ.

లక్ష్మీనృసింహలీలావైభవధ్యాన
        బద్ధానురాగప్రసిద్ధి బుద్ధి,
శుంభద్విరోధిసంరంభసంస్తంభన
        క్షమతాసముద్యుక్తి శౌర్యశక్తి
బంధువిద్వత్కవిప్రకరపారకనిత్య
        ఫలితకల్పకశాఖ భాగ్యరేఖ,
చక్రవాళోపరిస్థానరంగస్థలీ
        నర్తనోల్లాసవిస్ఫూర్తి కీర్తి


తే.

గాఁగ నేమంత్రి మెఱయు నఖండితప్ర
తాపసౌభాగ్యగాంభీర్యధైర్యమహితుఁ
డతఁడు గోవిందపండితసుతుఁడు ఘనుఁడు
విశ్వనాధుండు శుభగుణశాశ్వతుండు.

39


తే.

హరి దుర్గాంబుధికన్యఁ, జంద్రధరుఁ డయ్యద్రీంద్రపుత్రిన్, బురం
దరుఁ డింద్రాణిని, బెండ్లియైనగతి నుద్యద్వైభవం బొప్పఁగా
వరియించెం దగఁ జాగయప్రభుఁడు శశ్వద్బంధుసన్మానత
త్పరతారూఢపతివ్రతాగుణకదంబన్ బ్రేమ దేమాంబికన్.

40


ఉ.

వారలు మువ్వురం గనిరి వంశవివర్ధనులన్, మనోహరా
కారుల, నిర్వికారుల, జగన్నుతనిర్మలధర్మమార్గసం
చారుల, నప్రతీపభుజసారుల, శూరుల నర్థిలోకమం
దారుల, వైరిదుర్మదవిదారుల, ధీరుల సత్కుమారులన్.

41


వ.

అందుఁ గ్రమంబున.

42


తే.

భవ్యచరితుండు నరసింహపండితుండు
భాగ్యవంతుండు విఠ్ఠలప్రభువరుండు

రాజ్యలక్ష్మీవిలాసుండు రామదేవ
మంత్రిమణియును, నన నొప్పు మానధనులు.

43


క.

అందగ్రభవుని సురకరి
చందనమందారకుందశశధరపురభి
న్మందిరనిర్మలయశుఁ జె
ప్పం దగు నరసింహదేవపండితు నెందున్.

44


సీ.

అతులితైశ్వర్యరూపాతిశయంబుల
నసమాంబకఖ్యాతి నందమొంది,
సుమహత్ప్రతాపతేజోవిశేషంబులఁ
జిత్రభానుస్ఫూర్తిఁ జెన్ను మిగిలి,
విశ్వసంరక్షణవిపులధైర్యంబుల
నవనీధరస్థితి నతిశయించి,
యంచితదానమహాభాగ్యరేఖల
రాజరాజప్రౌఢి నోజ మెఱసి,


ఆ.

ధరణిఁ దెంపుమీఱె నరసింహపండిత
ప్రవరుఁ డమృతమధురభాషణుండు
సకలసుజనవినుతసద్గుణమణిమయ
భూషణుండు వైరిశోషణుండు.

45


క.

అతని సుతుఁ, డఖిలజనహితుఁ,
డతులబలాధికుఁడు, హరిపదాంబుజసేవా
నిరతుఁడు, మతిజితవాచ
స్పతి గోవిందార్యుఁ డెన్నఁబడు బుధసభలన్.

46


శా.

వాహారోహణచాతురీతురగరేవంతు, బ్రతివ్యూహవా
ర్వాహాటోపపటుప్రభంజనుని, శశ్వద్దానకేళీసము
త్సాహున్, సాహసవిక్రమార్కుఁ, గరిదంతక్షీరతారామరు
ద్గోహీరామలకీర్తిఁ జెప్పఁదగు నాగోవిందమంత్రీశ్వరున్.

47

క.

అతని పినతండ్రి లక్ష్మీ
పతి నిత్యకృపాకటాక్షపరిణతభాగ్యో
న్నతుఁ డుభయవంశదీపకుఁ
డతులితనయశాలి విఠ్ఠలామాత్యుఁ డిలన్.

48


శా.

దేవబ్రాహ్మణపూజనాభిరతు, ధాత్రీగోహిరణ్యాది దా
నావిర్భూతయశోవిశాలు, జగదీశాభ్యర్చనాలోలస
ద్భావున్, బావనశీలు, నాశ్రితహితప్రారంభనిత్యోర్జిత
శ్రీవిభ్రాజితు విఠ్ఠలేంద్రసచివశ్రేష్ఠున్ నుతింపందగున్.

49


మ.

పటుధాటీముఖజృంభమాణకలహప్రౌఢార్హసంసూతవి
స్ఫుటరింఖాపుటకోటిఘట్టనపరిక్షుణ్ణక్షమోద్యద్విశం
కటధూళీపటలప్రశోషితమహాకర్ణాటసేనాసము
ద్భటపాధోనిధి విఠ్ఠలేంద్రుఁ బురణింపన్ మంత్రు లేరీ ధరన్.

50


సీ.

చండదిగ్వేదండకాండధూర్వహమహీ
మండలోద్ధరణసమర్ధ మగుచు,
దుర్వారపరిపంధిసర్వసంపద్గర్వ
నిర్వాపణక్రియానిపుణ మగుచు,
వేదాదివిద్యావినోదవిద్వజ్జనా
మోదాతిశయసముత్పాది యగుచు,
జంభజిన్మదకుంభికుంభీనసాధీశ
శంభుభూభృద్ధ్యుతిస్వచ్ఛ మగుచుఁ


తే.

బరఁగు నేమంత్రి భుజబలప్రకటశౌర్య
దానసత్కీర్తు లప్రతిమానమహిమ
నాతఁ డిమ్మడిసైపఖానాధిరాజ్య
భారధుర్యుఁడు విఠ్ఠలప్రభువరుండు.

51


క.

ఆ మంత్రిచంద్రునకు రమ
ణీమణి లీలాంబకును జనించె నుదార

శ్రీమంతుఁ డమితసుగుణ
స్తోముఁడు బాబాజిపండితుఁడు ముద మొదవన్.

52


సీ.

వినుతసత్వప్రభావిభవసత్కాంతుల
భీము రుగ్ధాము సుత్రాము సోము,
నైశ్వర్యచాపవిద్యానయోదయముల
భవుని రాఘవుని భార్గవుని ధ్రువుని,
సౌందర్యసంగీతచాతుర్యజయముల
మరుని దుంబురుని వాగ్వరుని నరునిఁ,
జటులవిక్రమదానశక్తిరక్షణముల
నహివైరి సౌరిఁ గ్రౌంచారి శౌరిఁ


తే.

బోలుఁ బరిపంథిధారుణీపాలసచివ
ఫాలతలభూరితరభాగ్యమూలవర్ణ
జాలనిరసనకరణసంశీలచరణ
సరణి బాబాజి భద్రలక్షణవిరాజి.

53


ఉ.

శ్రీజయభోగభాగ్యకులశీలవివేకకృపాగుణంబులం
దీజగతిన్ ప్రధాను లెనయే! సురరాదిభరాజరాజతా
రాజతనూజరాజతధరాతులకీర్తికి విఠ్ఠలేంద్రుబా
బాజికి నాజిరంగపరిపాటితశాత్రవసైన్యరాజికిన్.

54


వ.

తత్పితృవ్యుండు.

55


సీ.

సతతప్రసన్నతాసదనంబు వదనంబు
వినుతసత్యామృతవేణి వాణి,
శరణాగతత్రాణసదయంబు హృదయంబు
ఘనదానవైభవాకరము కరము,
గురుధర్మకార్యానుకూలంబు శీలంబు
సంపాదితస్వామిజయము నయము,
హరిపదారాధనాయత్తంబు చిత్తంబు
భూరిసౌభాగ్యవిస్ఫూర్తి మూర్తి,

తే.

గాఁగ నేమంత్రి విఖ్యాతి గనియె నతఁడు
విక్రమాపాదితానేకవిమతిదుర్గ
లబ్ధసామ్రాజ్యలక్ష్మీవిలాసభాసి
చాగయామాత్య రాఘవ సచివవరుఁడు.

56


మ.

చలనం బందక, యీని యీని ప్రకటించం బోక, నల్గిక్కులం
గలఁగం బాఱక, నీరసత్వమున కాగారంబు గాకుండెనేన్
దలఁపన్ గల్పకకామధేనుఘనచింతారత్నముల్ సాటియౌ
నలఘుత్యాగగుణాభిరాముఁడగు రామామాత్యసింహంబుతోన్.

57


సీ.

ఘోరఘోణాదిమఘోణిదంష్ట్రాచలా
వాసప్రయాసంబు మోసరించి,
కమఠాధిపవ్యూఢకఠినకర్పరపీఠ
సంశ్రయక్లేశంబు జరపిపుచ్చి,
చక్రీశ్వరక్రూరవక్రస్ఫటాభాగ
నిరసమోద్యోగంబు నిస్తరించి,
శుంభదున్మదహరిత్కుంభికుంభస్థలా
వస్థానభేదంబువలనఁ బాసి,


తే.

భోగభాగినియై మించె భూమిభామ,
వర్తితానూనబహుతరవస్తుదాన
చతురముగఁ జాగదేవపండితకుమార
రాఘవామాత్యభుజశిఖరంబునందు.

58


సీ.

శ్రీభోగధైర్యప్రభాభూరిధనములఁ
జక్రీంద్రధరమిత్రసమతఁ దనరి
త్యాగశుద్ధిక్షాంతిధీగభీరతలను
ఘననదీరాజవిఖ్యాతి నెసఁగి
భూతికళాధుర్యనీతికార్యంబుల
శివభద్రసత్కవిస్థితిఁ దనర్చి

బలధర్మధైర్యశోధనమహత్త్వంబులం
గరికాలనరదేవగరిమఁ బొదలి


తే.

వెలయుఁ బటుబాహువిక్రమవిజితవిమత
నృపసమానీతమణిరమణీహయాది
బహువిధోపాయనాంచితప్రాంగణుండు
రణజయోల్లాసి చాగయరాఘవుండు.

59


సీ.

చటులసంధ్యానటత్పటిమ
ఘటితగంగాఫేనపటలిఁ దెగడి,
పూర్ణచంద్రాతపస్ఫురణసముద్ధూత
దుగ్ధాబ్ధివీచిపంక్తుల నదల్చి,
భారతీవక్షోజభారార్పితోదార
కర్పూరహారలేఖల హసించి,
చందనాచలమరుచ్చలితనిర్భరతరు
ప్రసవగుచ్ఛావలి భంగపఱచి


తే.

వెలయు నే మంత్రిశేఖరువిశదయశము
వాఁడు రణదివ్యబిరుదనిర్వాహకుండు,
ప్రకటసంగ్రామనిర్భంగఫల్గుణుండు
రమ్యవిభవుండు చాగయరాఘవుండు.

60


మ.

ఒసఁగెన్ చాగయరాఘవుండు వినయం బొప్పన్ బ్రతిద్వాదశిన్
వసుధామండలిఁ గల్గు విప్రతతికిన్ వాంఛానురూపంబుగా
రసవన్ముఖ్యపదార్థజాలపరిపూర్ణం బైన యన్నంబు ను
ల్లసితానేకవిధాంబరంబులు ననల్పస్వర్ణనిష్కంబులున్.

61


వ.

అయ్యమాత్యవరునకుఁ దగిన పత్నీరత్నంబు.

62


ఉ.

సైరణ భూమి, భాగ్యమున సాగరసంభవ, సర్వమంగళ
శ్రీరమణీయతన్ గిరిజ, శీలమునం దనసూయ, నిత్యగం

భీరత గంగ, సత్యపరిపేశలభాషల వాణి నాఁగ నొ
ప్పారె సతీలలామ లకుమాంబ సమస్తగుణావలంబయై.

63


క.

శ్రీలక్ష్మియు నబ్జాక్షుఁడు
బోలెడువారలకుఁ గలిగె బుత్రుఁడు గుణర
త్నాలంకారుఁడు భాగ్యవి
శాలుం డగు నాగనాథసచివుం డెలమిన్.

64


సీ.

సతతప్రసన్నుఁ డాచారసంపన్నుఁడు
వినయాన్వితుండు వివేకశాలి,
సుజనసేవితుఁడు భూసురకామధేనువు
వితరణఖని జగద్ధితయశుండు,
స్మితపూర్వభాషి లక్ష్మీనృసింహార్చనా
రతుఁడు సమస్తశాస్త్రప్రవీణుఁ,
డార్యసమ్మతుఁడు నిత్యైశ్వర్యకలితుండు
సంభృతగాంభీర్యశౌర్యధనుఁడు,


తే.

చండకోదండపాండిత్యసవ్యసాచి
యశ్వరేవంతుఁ డసమబాహాబలుండు
ఘనుఁడు చాగయమంత్రి రాఘవుని కూర్మి
సుతుఁడు శ్రీనాగనాథపండితవరుండు.

65


క.

ఉరుతరవితరణగుణముల
సరియగుదురు నాగనాథచివునకు, మరు
త్తరు, సురభి, ధనద, సురమణి
తరణిజ, శిబి, శరధి, సలిలధర, బలి, ఖచరుల్.

66


వ.

ఇట్టి విశుద్ధకులదుగ్ధార్ణవంబునకుఁ బూర్ణసుధాకరుం డగు రామదేవపండితమహాప్రధానరత్నంబునకును.

67


షష్ట్యంతములు

క.

శ్రీనిత్యవిభవునకు, ఘన
దానరవిప్రభవునకును, దామరసాక్ష

ధ్యానానురాగరంజిత
మానసపద్మునకు విమలమణిసద్మునకున్.

68


క.

చాతుర్యభోజునకు బహు
నూతనవిభ్రమవధూమనోజునకు, జగ
ద్గీతరణదివ్యబిరుద
ఖ్యాతునకును విఠ్ఠలేంద్రు ననుజాతునకున్.

69


క.

సింహతలాటాంకున, కుపు
సంహృతకర్ణాటకటకజననాథచమూ
రంహునకుఁ, జారులక్షణ
సంహనునకు, నమితభాగ్యసంపన్నునకున్.

70


క.

బాహుబలభీమునకు, ను
గ్రాహవరామునకుఁ బటుజవాధికతురగా
రోహణరేవంతున, కతి
సాహసవంతునకు నమితసామంతునకున్.

71


క.

మాఘవసతులితునకు, శర
లాఘవపటుతావిశేషలక్ష్మణునకు, ధూ
తాఘవరమతికిఁ జాగయ
రాఘవసచివాగ్రణికి నిరతసద్గుణికిన్.

72


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా రచియింపం బూనినయిప్పురాణకథకు బ్రారంభం బెట్టి దనిన.

73


కథారంభము

ఆ.వె.

త్రిభువనైకపుణ్యదేశాగ్రగణ్య మూ
ర్జితపయస్సరోవరేణ్య మసమ
బహులసుకృతరత్నపణ్యము నైమిశా
రణ్య మొప్పు మునిశరణ్య మగుచు.

74

వ.

మఱియు నప్పరమపవిత్రక్షేత్రం బతివిచిత్రకిసలయకుసుమఫల పలాశ
రుచిర రుచక నిచుళ కరక కురువక వకుళ లికుచ పురఫలఫలినీతమాలకృత
మాల దేవదాళ హింతాల నారికేళ పారిభద్ర భద్ర దారుకా రంభారంభామలక
తిలక తృణరాజరాజ ధన పున్నాగనాగకేసర పాటలాఝూటలాశోకమ
ధూకకదంబాది తరుకదంబశిఖరసుఖాసీన కలకంఠకలాపికలాలాప
కలితంబై లలితమాలతీ లవంగ ఫలితావలీ వలయిత నికుంజపుంజ
పరిభ్రమద్భ్రమరమిథునమధుకఝంకారముఖరితంబై, సకలకాల
సంపుల్ల హల్లక కమల కువలయ కుముద సముదయానుమేయతోయ స్వచ్ఛ
జలాశయ శతసతతకేళీవిలోల మదకల కలహంస చక్రవాక బక బలాకాది
తానేకజలవిహగ జాల కోలాహల వాచాలిత దిక్చక్రవాళంబై, పుణ్య
జలపూర్యమాణ మాణవక కర కరకాముఖ ప్రభవ ఘుమ ఘుమ ధ్వని
మనోహరంబై, సమిత్కుశ కుసుమఫలపలాశ భారవహన పటువటు కాను
గమ్య మానాధ్యాపక పదక్రమపవిత్రతలంబై, విశాల పర్ణశాలాభ్యర్ణకీర్ణ
వన్యధాన్యచర్వణ గర్వితశాఖామృగ చంక్రమణ క్రమాలోక నాలోల
మునికన్యకాకటాక్ష కాంతి కల్పితానల్ప కువలయతోరణాలంకృతంబై,
పృధుల పీనభార మంధర రోమంధ బంధుర హోమధేను స్తన్యపాన సము
త్సుకవత్స వదన విగళిత పయః ఫేనస బిందుకశాద్వల స్థల విడంబిత
తారకాంబరతలంబై, ద్యుమణిమణి శిలాతల రక్తచందనోపలిప్త సప్తాశ్వ
మండల సమర్పితారుణ కరవీరకుసుమ విసరాభిరామంబై, యుపజాతి పరి
చయ పతత్రి పతత్ర పవన ప్రజ్జ్వలిత జ్వలన హుతాజ్యధారాదశ వితత పుణ్య
గంధానుబంధ ధూమధూపితాంతరిక్షంబై , నికటకుంజ కుటీర కుక్కుటకు
లోపయుజ్యమాన వైశ్వదేవ బలిక బళావశిష్ట పులకాంకితప్రదేశంబై, హరి
హర పూజాసమయ రణిత ఘంటాఘణఘణారవ శ్రవణ హరిణార్ధ కీలిత
గళిత ఘాసశకలంబై, ప్రతిశాఖాగ్ర లంఘన చటుల శాఖా మృగ నికరకర
పాతిత పరిపక్వఫలరస పూర్ణాలవాల తరుమూల శీతల స్ఫటిక శిలాతలా
స్తీర్ణవిస్తీర్ణమృగాజినాసీన మునిముఖ్య వ్యాఖ్యాయమాననానాశాస్త్రవిస్తరంబై,
నందనారామంబునుంబోలె సురసాలోపశోభితంబై, బృందావనంబునుంబోలెఁ
గృష్ణసారసంచారపూతంబై , నాకలోకంబునుంబోలె నమృతాహారస్థానంబై,
రాఘవసైన్యంబునుంబోలెఁ బనసనీలనలగజగవయగవాక్షోపలక్షితంబై,
గాంధర్వంబునుంబోలె శ్రుతిస్వరసంపూర్ణంబై, సముద్రంబునుంబోలె బాడబా

స్పదంబై వెలయు; నందుఁ గుసుమములయంద రజోవిజృంభణంబును,
భృంగంబులయంద మాతంగదానాభిలాషణంబులును, నదులయంద ప్రతి
కూలప్రవర్తనంబులును, గిరులయంద భోగానుపాలనంబును, శబ్దస్వరూ
పంబులయంద ధాతువిపర్యయంబును గాని యొండెడల నరయక మెఱయు;
నచట శిశిరకర కరనికర విశద కేసరికిశోరకేసరంబులు సరసబిశాంకురశంక
నొండొండ తుండంబులఁ బుడుకు శుండాలంబులును, శుండాలగండమండల
కండూనిరసనమసృణంబులగు నరాళకరాళ నఖరశిఖరంబులం గల చిత్రకా
యంబులును, జిత్రకాయకుటుంబినీతనుస్తనస్తన్యపాలపరిపుష్టాంగంబులగు
కురంగలోకంబులును, గురంగడింభంబులం గూడిచెరలాడు రేచులును, రేచు
గూనల నేచినమక్కువం బ్రక్కల డాఁచు బిడాలంబులును, బిడాలంబుల
పోరెలు సారెలం దెరలక మరగి తిరుగు గిరికలును, గిరికానికరంబుల నిజభోగం
బులం బొదవి యనురాగం బొసఁగు నాగంబులును, నాగంబుల కెండరాకుండ
విరివిగల పురులు విచ్చి చేరవచ్చు ఋషివర్ణన(?) మయూరంబులును గలిగి
యుల్లసిల్లునందు.

75


క.

ద్వాదశ వార్షిక సత్రము
మోదంబున శౌనకాదిమును లొనరింపం
గాఁ దద్విలోక నోత్సుకు
లై దివ్యక్షేత్ర వన మహాచలవాసుల్.

76


సీ.

పల్లవారుణజటాభారు, లారచిత త్రి
పుండ్రాభిరాములు, భూతిలిప్త
సర్వాంగు, లుజ్జ్వలస్ఫటికాక్షసూత్రులు,
రుద్రాక్షభూషణరుచిరు లమరఁ
బుణ్యతీర్థోదక పూర్ణకమండలు,
లజినోత్తరీయు, లత్యంతమృదుల
పరిధౌత వల్కలపరిధాను, లభినవ
దండపాణులు, దీప్తదహనతేజు


తే.

లలఘు దివ్య తపశ్శక్తికలితు లఖిల
వేదవిద్యారహస్యసంవేదు, లసమ

సదనకర్తలు సంయమీశ్వరులు వచ్చి
రెలమి శిష్య ప్రశిష్య సమేతు లగుచు.

77


చ.

వనజ భవానుభావు లగువారల నందఱఁ జూచుకోర్కి, నె
మ్మనమునఁ బిక్కటిల్ల, బుధమాన్యుఁడు సాత్యవతేయశిష్యనం
దనుఁ డగురోమహర్షణుఁడు దాఁ జనుదెంచిన, నమ్మహాత్ముల
య్యనఘునిఁ గాంచి యిట్టులని రాదరమేదురసానుభాషలన్.

78


క.

ఏకడనుండి యిపుడు నీ
రాక సుధీవర! విచిత్ర రమణీయకథా
నీక ప్రసంగ మేమే
నాకర్ణింపంగఁ గలిగె ననుదిన మింకన్.

79


చ.

అనవుడు సూతసూతి వినయంబున వారలతోడ నిట్లనుం
జనక మహీతలేశ్వరుని సత్రమహోన్నతిఁ జూచువేడుకం
జని యటనుంచి నిన్నిదివసంబులు తార్క్ష్యపురాణసత్కథా
వినుత సుధా సరిద్విపులవీచిక లుల్లము నిల్ప సాఁగినన్.

80


వ.

అమ్మహాపురాణంబునందు.

81


క.

సారంబై మోక్షపదా
ధారంబై పుండరీక దళ నయన నిజా
గారంబై మహిఁ బరఁగిన
శ్రీరంగమహత్త్వ మతివిచిత్రము దలఁపన్.

82


తే.

అనిన శ్రీహరిచరణదివ్యానుషక్తి
చిత్తజలజాతమును వికసింపఁ జేయఁ
దనుఁ దదీయ కథాంశ విస్తార మడుగఁ
జెలఁగి వారల కిట్లని చెప్పె నతఁడు.

83


చ.

అమలచరిత్రులార వినుఁ డమ్మిథిలాపురి నధ్వరోత్సవాం
తమున మునీశ్వరానుమతుఁడై తను వేఁడెడి నాగదంతసం

యమికిఁ బరాశరాత్మజుఁ డుదాత్తకథా పరిపాటిఁ బుణ్యతీ
ర్థములును బుణ్యభూములు ముదంబునఁ దెల్పఁగఁ బూని యిట్లనున్.

84


చ.

త్రిభువన ధర్మరక్షణధురీణ విచిత్రచరిత్రుఁ డిందిరా
విభుఁ డెచటన్ వసించి దగువేళల నెందుఁ జరించు నేయెడన్
శుభమతి నాదరించి నెటఁ జూచుఁ గృపాన్వితదృష్టి నేమిటం
దభిరతి గల్గియుండు నివి యన్నియుఁ బుణ్యతరప్రదేశముల్.

85


క.

హరిచరణకమలరేణువు
పరమాణువు సోఁకినంత బావనతరమై
కరము నుతికెక్కు సలిలము
తిరముగ నధికంబు సకల తీర్థంబులకున్.

86


చ.

మురహర పాదపంకజ సముధ్ధతమై పెనుపొందెఁ గాదె శం
కర విలసజ్జటాకలిత కైరవబంధు కళామరీచులన్
వరనిజవీచులన్ నెఱయ వన్నియ కెక్కి త్రిలోకపావనీ
కరణ ధురీణతం గగనగంగ తరంగిణులందు మేటియై.

87


వ.

మఱియును.

88


సీ.

కలుషపంకజ కళికాతమి గౌతమి
సకల సజ్జన మాన్య జహ్ను కన్య,
జంతు సంతత మనశ్శర్మద నర్మద
శమిత తాపత్రయ దమన యమున,
శ్రిత సాధుజనలబ్ధజీవిక దేవిక
సత్య సంవిద్యోగ చంద్రభాగ,
సతత జన్మాచ లాశని భవనాశని
దూరీకృతక్షుద్ర తుంగభద్ర,


తే.

బహుల సౌభాగ్యదాన సంపన్న పెన్న
భగ్న దుర్మోహపాశ విపాశ యనఁగ,
భువిఁ బ్రసిద్ధికి నెక్కిన పుణ్యనదులు
హరికి లీలావిహార యోగ్యములుగాదె.

89

మ.

విను మీమాటలు వేయునేటికిఁ దపస్విశ్రేష్ఠ! గోవిందశో
భనలీలా చరణక్రియాకలిత సంబంధానుసంబంధబం
ధ్యనుబంధి క్రమయోగ యోగ్యమగుభవ్య ద్రవ్య లేఖంబుతో
నెనగా వన్యపదార్ధకోటులు నసంఖ్యేయప్రభావంబునన్.

90


సీ.

హరిదివ్యనామధేయమృతం బింపారఁ
జెలఁగి యాస్వాదించు జిహ్వ జిహ్వ
గోవిందకల్యాణ గుణవిశేషంబులు
పలుమాఱుఁ దలపోయు తలఁపు తలఁపు
కమలాక్షునిత్యమంగళమూర్తి విభవంబు
సొంపార వీక్షించు చూపు చూపు
ఫణిరాజతల్పు శ్రీపాదపద్మంబులు
చేరి యర్చనసేయు సేఁత సేఁత


తే.

వాసుదేవప్రియం బైనవ్రతము వ్రతము
దైత్యభేది నుపాసించు తపము తపము
శౌరి నారాధనము సేయు జపము జపము
విష్ణుపదభక్తి సమకొల్పు వినికి వినికి.

91


సీ.

పటుతరభవరోగ పరితాపములఁ బాఁప
నబ్జాక్షుసేవ దివ్యౌషధంబు,
అంచితజ్ఞాన మహానిధానముఁ జూప
నచ్యుతభక్తి శుద్ధాంజనంబు
దుర్వార భయములు దొడరకుండఁగఁ జక్ర
పాణి సంస్తుతి వజ్రపంజరంబు,
ఇష్టార్థఫలసిద్ధు లెసఁగింప హరినామ
పరన మంగళ కల్పపాదపంబు,


తే.

విపుల దుర్మోహతిమిరంబు విరియఁజేయ
నురగశయనుని పూజ సూర్యోదయంబు
అనిమిషానందలీలల నునిచి మనుపఁ
గమలనాభుని పదతీర్థ మమృతసరము.

92

క.

కరణత్రయకృతపాపా
వరణముల హరింపఁ జేయువారికి మురభి
చ్చరణసరోరుహ సతత
స్మరణయ కాకరయ నొండుశరణము గలదే.

93


ఆ.వె.

అఖిలలోకములకు నక్షయానందసం
భూతికారణంబు పుండరీక
నయననామకీర్తనంబ, యీయర్థంబు
నిఖిలవేదశాస్త్రనిశ్చితంబు.

94


క.

కావున ఘన దురితావిల
భావుల కెందును ముకుంద పరిచిత తీర్థా
ప్లావము దక్కఁగ జక్కన
పావనత ఘటింప నొం డుపాయము గలదే.

95


ఆ. వె.

అనిన నాగదంతుఁ డనఘ తీర్థప్రభా
వమునఁ దలఁచి చూడ వాని వాని
కవియ యెక్కువైన యట్లుండు నిందెద్ది
సకల పుణ్యతీర్థ సారతరము.

96


శా.

ఏ తీర్థంబు దలంచినన్ వినిన నన్వేషించినన్ జూచినం
బ్రీతిం బేర్కొనినం దురంతదురితా పేతాత్ములై నిర్జర
వ్రాత ప్రార్ధిత నిత్య సౌఖ్యయుతులై వర్తింతు రత్యంతవి
ఖ్యాతిన్ మానవు లట్టి తీర్థ మెఱుఁగంగాఁ జెప్పవే నావుడున్.

97


వ.

పరమజ్ఞాన పరిపాక పరిచిత పరాపరవివేక పారాయణుం డగు బాదరాయణుండు నత్తపోధనసత్తమున కిట్లనియె.

98


క.

శుభగుణనిధియగు రఘుకుల
విభుకృప ననపాయుఁ డగుచు వెలసిన దితిజ
ప్రభుచే నానీతుండై
త్రిభువన సంస్తుత్య నిత్యదివ్యస్ఫూర్తిన్.

99

శా.

రంగత్కేతు విచిత్రతోరణమణి ప్రాసాద వప్రప్రభల్
నింగిం బర్వ, భుజంగతల్పునకుఁ గేళీసద్మమై యొప్పుశ్రీ
రంగం బేతటినీతటిన్ మెఱయుఁ దా రమ్యోత్సవశ్రీనటీ
రంగంబై యదివో జగంబుల నదీరత్నంబు చర్చింపగన్.

100


సీ.

ఏయేటి నడుఁదిన్నె నేప్రొద్దుఁ జలిగొన్న
సికతాతలంబులఁ జెలఁగి చెలఁగి,
యేతరంగిణి నించుకించుక వికసించు
క్రొత్తమ్మితావులఁ గొసరి కొసరి
యేనదీక్రీడల నెసఁగు రాయంచల
కలకలంబుల కాత్మ నలరి యలరి
యేసరిత్తటమున నేచినకల్పక
మేదురచ్ఛాయల మెచ్చి మెచ్చి


తే.

నేడు నొకనాడుఁ బాయకున్నాడు శౌరి
యతిమనోహరి నిశ్రేయసానుకారి
వివిధతాపనివారి భూవినుతవారి
కలిత కావేరి భవకరికలభవైరి.

101


వ.

మఱియు నన్నదీప్రవాహరత్నంబు నాయతనప్రవర్ధమానసుధాసమానపానీయపూర
సారంబు లగునారికేరంబులును, గమలభవకామినీకపోలపాళికాసవర్ణపరిపూర్ణరాగ
కర గవల్లీవేల్లితాభోగంబు లగుపూగంబులును, మృదుముదితపరిమళపరిజ్ఞానసంకేత
కంబు లగుకేతకంబులును, జగజ్జయప్రయాణప్రవణపంచబాణప్రబలబలధూళీదూసరం
బు లగుకేసరంబులుఁ గలనాగకేసరంబులును, గువలయాకుల విలీనమదకలకలవింక
కలకలముఖరశిఖరశిరోవళనటనారంగంబు లగునారంగంబులును, ధారాధరసమయ
ధారాళమధురమధురసధారాసారకలికాకదంబంబు లగుకదంబంబులును, వనదేవ
తాచరణమణిమంజుమంజీరఝుళఝళధ్వని మర్మసూచకశ్రవణశర్మరీమర్మరస్వనసము
త్తాలంబు లగుతాళంబులును, బరిపక్వఫలరసమాధురీరమాధరీకృతసురసాలంబు లగుర
సాలంబులును, దరుణతరణి కిరణప్రసరణ భయపలాయితబంధురాంధకారసందేహమూల
బాలప్రవాళరుచినిచయరచితకృత

జీమూతమూలంబు లగుతమాలంబులును, మేదురా
మోదముదితాయమానమానసమానవనికాక్రమేయ (?) ప్రవర్ధితపులకంబులై వనీముఖతిల
కంబు లగుతిలకంబులును, బ్రచలితపరిస్ఫుఠితఫలపరిమళప్రశంసాధరాధికవాఙ్మన
సంబు లగుపనసంబులును, సుధారసపూరంబు లగుతీరంబులును, దళితసౌగంధికమణి
బంధురప్రభాపటలపాటవపాటచ్చరచటులచంచూపుట పాటితమృణాళనాళమరాళ
తరళతరగరుదుదితసమీరసమీరితంబులై రంగరమణమంగళపూజాసమయసముచితచ
తురజలదేవలాంజలిపుటసముత్క్షిప్తపుష్పావహశుభాకరంబు లగువశీకరంబులును, బరస్పర
సంపాతకంపమానసంఫుల్లహల్లకవిసరదున్మదభృంగంబు లగుభంగంబులును, సేవాప
రిణితవరుణకన్యకాకరసరోజవీజ్యమానవిసృమరచమరవాలశంకాలవాలంబు లగు కపో
లంబులును, జలకేళీలోలబాలాకుచతటీపటీరపంకప్రవర్ధమానంబు లగుఫేనంబులును,
ముహుర్ముహురున్మజ్జనప్రవణఫణిఫణాముక్తాఫలానుగుణగణనాత్యద్భుతంబు లగుబుద్బు
దంబులును, నిజాంతఃకృతావగాహపావనదేహజనసందోహనివర్తితభావిభవావర్తంబు
లగునావర్తంబులును, వారిప్రసారతీరగారుత్మతమత్తమయూరరేఖామతల్లిక లగుశై
వాలవల్లికలును, శశిశకలవిశదవిశాతవనవరాహదంష్ట్రాముఖవిఖండితపర్యస్యముస్తకోశీ
రమపరిమళప్రాయంబు లగుతోయంబులును, నిరంతరనిరంతరాయనారాయణవినీతధ్యాన
పారాయణపరమయోగీంద్రపరిచితంబులై యనల్పకర్పూరపరాగపూగనిర్మలినంబు లగు
పులినంబులును, సమీపాశ్రమనివాసితాపసకుమారపరిక్షాళితమృదులవల్కలకషాయర
సపాటలంబు లగునికటస్ఫటికశిలాతటంబులును, దంతావళకలభదంతకాంతిదంతురి
తశశికాంతసోపానసులభప్రవేశంబు లగుజలావతరణప్రదేశంబులును, గలరవానుమే
యకలహంసకులవలయంబు లగుకువలయంబులును, ఘనఘనాఘనఘనరసపానసమ
యసముద్గమఘుమఘుమధ్వనిసన్మేషంబు లగుఘోషంబులును, సంకల్పభవసుఖాను
భవసంకల్పనిలింపదంపతికల్పితకల్పకిసలయానల్పతల్పమంజులంబు లగువంజులకుంజంబు
లు గలిగి, కలశాబ్ధియునుబోలె నమృతానందకారణంబై, రణరంగంబునుంబోలె ననేక
శతపత్రవిసరంబై, సరసిజాసనాకపోలంబునుంబోలె దర్పసారమకరీకాంతంబై, కాంతా
రంబునుంబోలె నుద్దండపుండరీకభాసురంబై , సురాచలశరాసనురేఖయుంబోలె నిర్మూ
లితానేక పురసాలపలాశబలంబై, బలానుజీవిక్రమంబునుంబోలె నపనయితనరక విగ్రహంబై,
గ్రహప్రచారంబునుంబోలెఁ గృతతారకోల్లంఘనంబై, ఘనాగమంబునుంబోలె నుదంచి
తలోహితంబై, లోహితాంశుతేజంబునుంబోలె సపహృతతమోవ్యాసంబై, వ్యాసవాగ్వి
లాసంబునుంబోలె నధివ్యాప్తిసుధీవరజాలంబై, జాలపాదంబునుంబోలె నకలుషమాన
సభాసమానంబై, మానవపంచాననునాననంబునుంబోలె సహస్రదంష్ట్రోజ్వలంబై, జ్వల
నజ్వలితంబునుంబోలె సంతర్పితగోచరంబై, చరమాచలంబునుంబోలె నవిశ్రాంతవేగా
క్రాంతకటకంబై, కటకంబునుంబోలెఁ గలితసువర్ణపద్మరాగంబై, రాగంబునుంబోలె
శ్రుతిప్రసిద్ధంబై, సిద్ధరసంబునుంబోలె శమితపరోరుతాపంబై, తాపసాశ్రమంబునుంబోలె
దూరీకృతోపప్లవంబై, ప్లవాకీర్ణంబయ్యును బరమహంససేవితంబై , సముదితాబ్దంబయ్యును
ఘటితచక్రంబై, తరణిమండలమండితంబయ్యును బ్రవృద్ధకుసుమంబై, హరివిహారస్థలంబ
య్యును సమదనాగంబై, లక్ష్మణానందంబయ్యును మేఘనాదాభ్యుదయంబై, యీశాను
వర్తియయ్యును సుకృతిస్తుతిపాత్రంబై, యతులస్పర్శంబయ్యును బహువారాగతవీర
ప్రకరకలితంబై, యర్జునశరపాతభయంబయ్యును సింధురాజప్రీతికరంబై విలసిల్లు వెండియు.

102

ఉ.

ఉన్నత రంగథామ లలితోభయపార్శ్వములం బ్రసన్నయై
యన్నది యుబ్బిపాటుఁ, గలితాయత కంకణ మౌక్తికద్యుతి
చ్ఛన్న మృదుప్రవాహములు సాఁచి చిరాగతుఁ బ్రాణనాయకుం
జెన్నుగ నిండుకౌఁగిఁటికిఁ జేర్చి చెలంగు మృగాక్షి క్రైవడిన్.

103


చ.

అనుపమ దివ్యబోధమహితాత్ములు తత్తటినీతటంబులం
దనిశము నిశ్చలస్థితికినై చరరూపము లుజ్జగించి నే
ర్పున వివిధాచరాకృతులు పూనఁగఁ గోరుచు రంగధామముం
గొనకొని పుట్టుచుందురు ముకుందపదార్పితమానసాబ్జులై.

104


క.

ఈవసుమతిఁ గలతీర్థము
లావాహిని నెల్లప్రొద్దు ననుకూలమునై
సేవింపుచుండుఁ బ్రవిమల
భావంబున నంబురాశి పర్వంతముగాన్.

105


క.

సుర నర యక్షాసుర ముని
గరుడోరగ సిద్ధసాధ్య ఖచరాదులు త
డ్వర తీర్థ సార్థసేవా
పరులై కని రభిమతార్థఫలసంసిద్ధుల్.

106


సీ.

అవి విను సంయమిప్రవర, స్వర్గద్వార
మనునది దేవగణైకసేవ్య
మాప్రదేశమునఁ బిండప్రదానాదులు
పితృకోటి కక్షయప్రీతిదములు,
తిలధేనుదాన మతిప్రశస్తము హరి
సేవ కైవల్యలక్ష్మీకరంబు
తత్సరమునఁ బ్రసిద్ధము పుండరీక మ
చ్చో నొప్పు ఘనవట క్షోణిజాత


తే.

మది హృషీకేశు నావాస మాసమీప
మందుఁ బెంపొందుఁ గుశలాఖ్యమైన శైల
మచటఁ దపముండి కాదె ము న్నాకపాలి
బ్రహ్మహత్యామహాఘంబుఁ బాసి వెలిఁగె.

107

మ.

కలదయ్యద్రికిఁ దూర్పుచక్కి వకుళాఖ్యంబైన తీర్థంబు, ము
న్నల జంభారి సురాధిపత్య హరితుండై తత్ప్రతీరంబునం
బలివిధ్వంసిగుఱించి భక్తిఁ దప మొప్పంజేసి యాకల్పని
శ్చలలోకత్రయరాజ్యలక్ష్మి దనరెన్ సంప్రీతచేతస్కుఁడై.

108


ఆ.వె.

అనిన నాగదంతుఁ డనఘ! శ్రీరంగంబు
దితికులోద్భవుండు తెచ్చె నంటి
వది కవేరకన్య కాభ్యర్ణవంబున
నెచట నునిచె, నానతిమ్ము నాకు.

109


క.

అనవుడుఁ బరాశరాత్మజుఁ
డను నతనికి వకుళతీర్థ మని యిప్పుడె చె
ప్పిన యచటికి దక్షిణమున
ననఘ! కల దనంతశయన మనుతీర్థ మొగిన్.

110


సీ.

ఎయ్యెడ లక్ష్మీసమేతుఁడై వసియించు
నాదినారాయణుం డవిరతంబు
నెచటితోయస్పర్శ మింత గల్గినమాత్ర
నరులు పాపశ్రేణిఁ బరిహరింతు
రెచ్చోట నొక దివంబేని నిల్చిన వారి
కపునర్నరత్వమహత్త్వ మొదవు
నెందుఁ దపస్స్థితిఁ జెంది సిద్ధర్షులు
బహులతాగుల్మరూపముల నుందు


గీ.

రే నెలవునందు దళమాత్రమైనఁ దునుమ
బ్రహ్మహత్యసమం బగుపాప మొదవు
నేస్థలంబునఁ గీటాదిహింస సేసి
పతన మొందుదు రతిపుణ్యభావులైన.

111


మ.

సహజజ్ఞానయుతంబులై సరసభాషల్ ప్రీతిఁ జేతస్సుఖా
వహముల్ గాఁ దగఁ బల్కుచున్ మెలఁగు సత్యస్ఫూర్తి నెందేని న

య్యహిమార్జాలవృపప్లవంగ నకులవ్యావిశ్వవిద్విట్కురం
గ హరి వ్యాఘ్ర మదేభశల్య రురుఖడ్గక్రోడభేరుండముల్.

112


క.

ఎందు వసించును జేతన
బృందం బాధ్యాత్మికాదిపీడావళులం
జెందక యాపద నలజడిఁ
బొందక యాఁకటఁ గృశించిపోవక యెలమిన్.

113


సీ.

గతవర్తమానైష్యకాలవేదులు సర్వ
కామవంతులును, సంఘటితభూత
తులు, సర్వజ్ఞు, లహీనసత్వులు, దుఃఖ
రహితులు, జ్ఞానవైరాగ్యయుతులు,
బ్రహ్మజ్ఞు లధిగతబ్రహ్మతేజులు, పర
స్పరమిత్రు లతిపుణ్యపరులు, సములు,
నిత్యశుద్దాత్ములు, నిర్మలుల్, నిత్యులు
నిర్మముల్, సత్వులు, నిత్యతృప్తు


తే.

లనఘు, లవికారు, లద్వంద్వు, లనుపహతులు
సుప్రసన్నులు, సుముఖులు, శుభవచనులు
నై చరింపుదు రెందు నరామరాసు
రాదు లిచ్ఛవహాకృతు లగుచు నెపుడు.

114


మ.

విననేర్చుం జెవిటైన, మూఢుఁ డయినన్ విద్వాంసుఁడౌ, వెఱ్ఱియై
నను విజ్ఞాని యగున్, ఖలుండు నతిశాంతస్వాంతుఁడౌ, వక్రుఁడై
నను సౌమ్యాకృతిఁ దాల్చుఁ, బాపరతుఁడైనన్ దోషనిర్ముక్తుఁడౌ,
ఘనపుణ్యం బగు నే ప్రదేశము చొరంగాఁ గల్గు మాత్రంబునన్.

115


వ.

అట్టి సకలకళ్యాణకారణంబై -తీర్ధవరేణ్యం బైన పుణ్యక్షేత్రంబున దైత్యకులపవిత్రుండైన విభీషణుం డా దివ్యధామ మందు నిలిపె
నాట నుండియు.

116


క.

శ్రీ మెఱయు నుభయకావే
రీమధ్యమునం దనర్చు శ్రీరంగము తే

జో మహిమ చంద్ర పుష్కరి
ణీ మహిత తటంబునందు నిగమస్తుతమై.

117


శా.

ఏ పుణ్యాయతనంబుఁ జొచ్చి నియతిన్ వీక్షించుపుణ్యుల్, మహా
పాపశ్రేణి జయించి నిర్మలమతిం జపించు సుజ్ఞానులై,
తాపంబుల్ పెడఁబాసి దండధరదూతవ్రాతముం దోలి, య
వ్యాపన్నం బగు సత్ఫథంబునఁ దుదిన్ వర్తింతు రత్యున్నతిన్.

118


క.

కృత నిష్ఠీవన పతిత
ప్రతిభాషానృత దురుక్తి పఠనాదుల స
న్మతి శ్రీరంగముఁ బేర్కొను
నతఁ డఘములఁ బాసి పొందు నచ్యుతపదమున్.

119


ఆ.వె.

అతి విదేశ వాసులైన నన్యద్వీప
నిలయులైన భక్తి నివ్వటిల్లఁ
జేతులెత్తి యొక్క శ్రీరంగమున కెదు
తై భజించి కాంతు రభిమతముల.

120


మ.

అరవిందాక్షదినోపవాసము, తులస్వాస్యాదముం, జంద్రపు
ష్కరిణీస్నానము, రంగమందిరలసత్సందర్శనానందమున్,
వరగీతాపఠనంబు గల్గునొక జన్మం బందు నెవ్వారి క
ప్పురుషుల్ ప్రాప్తసమస్తకాములు జగత్పూజ్యుల్ ముకుందాకృతుల్.

121


క.

చాతుర్మాస్యస్థితిఁ బ్ర
ఖ్యాత శ్రీరంగసీమఁ గల్గినసుకృతం,
బాతలఁ బెఱతీర్ధంబుల
నేతెఱఁగున సంభవింప వెన్నాళ్లున్నన్.

122


క.

శ్రీరంగ భవనమున ముద
మారఁగ నొకరాత్రి యున్నయట్టి ఘనులు దు
ర్వార మహాపాతక శత
పారంపర్యములవలనఁ బాయుదు రనఘా!

123

క.

గురుమతి శ్రీరంగమునకు
నరిగిన సుజనుండు, భక్తి నతనికి నన్నం
బరసి యిడునతఁడు లోకో
త్తరచరితులు దుహినబింబదళనస్ఫురితుల్.

124


క.

ప్రతిదినమును దిలపాత్ర
త్రితయము దానంబు సేసి ధృతిఁ బొందు సమం
చితసుకృతఫలము సమకొను
నతులశ్రీరంగమందిరాలోకమునన్.

125


వ.

అందు హేమదానం బతిప్రశస్తంబు, భూదానం బంతకంటె నధికంబు
గోదానవస్త్రదానంబు లత్యుత్తమంబు లివియన్నియు.

126


క.

తమతమపట్లన నిత్య
త్వమునకు మదిఁ గలిఁగి దేవతలు రంగక్షే
త్రమునందుఁ బొందుమనుజ
త్వముఁ గోరుదు రందు ముక్తిధానం బగుటన్.

127


క.

రవి కన్యాగతుఁ డగున
య్యవసరమునఁ గృష్ణపక్షమందులఁ జేతో
భవతిధిఁ బితృకృత్యమునకు
నవు ముఖ్యవ్రతము మాఘమందును జెల్లున్.

128


సీ.

తమయన్వయమున నుత్తముఁ డొకఁడైనను
జనియించి, శ్రీరంగమునకు నరిగి
యచటఁ గావేరీజలావగాహ మొనర్చి,
యగ్రజన్ములకు నాహారమైన,
నత్యల్పదక్షిణయైనఁ, దిలోదక
మైన, ధేనుగ్రాసమైనఁ దనకు
గలిగినరీతిఁ దక్కక హరిసన్నిధి
మమ్ము నుద్దేశించి నెమ్మి నొసఁగు

తే.

వాఁడు గల్గునొకో యని వారివారి
నెదురుచూచుచునుండుదు రెల్లప్రొద్దు
నమరలోకసుఖంబులహానిఁ దలఁచి
పితృసమాజంబు లక్షయస్థితులకొఱకు.

129


తే.

ఒక్కనదిఁ గ్రుంకువేళ వేఱొక్కనది ను
తించు టఘకారి శ్రీరంగ తీర్థవరము
చంద్రపుష్కరిణీ జహ్నుజలము సకల
నదులయందును దలఁపఁ బుణ్యము ఘటించు.

130


వ.

విశేషించి మాఘమాసంబుఁ జంద్రపుష్కరిణీస్నానంబును, శ్రీరంగ దర్శ
నంబును, క్షేత్రోపవాసంబును నతిదుర్లభంబులు. ఈనదీసరోవరక్షేత్ర
దేవతాప్రభావంబులయం దెవ్వరు సందేహింతు రట్టిదుష్కర్ముల ధర్మనిరతుం
డగుభూపాలుడు చండాలురసంగతి మనుపవలయునని మఱియును.

131


మ.

శ్రుతికోటిం బ్రణవంబు, వైష్ణవ వర స్తోత్రంబులం దంబికా
పతి, పెన్నేరుల గంగ, వేల్పుగమిలోఁ బద్మాక్షుఁ, డెబ్భంగి ను
న్నతకీర్తిన్ విలసింతు రట్టు మహిఁ బుణ్యక్షేత్రజాలంబులో
గరనానాఘనికాయమై వెలయు రంగక్షేత్ర మాకల్పమై.

132


క.

శ్రీరంగమునకు నరుగుఁడు,
శ్రీరంగం బనుచు జపము సేయుఁడు, మదిలో
శ్రీరంగముఁ దలఁపుఁడు, భవ
భారముల హరింపనోపుఁ బగలును రేయున్.

133


ఉ.

అంచిత రంగమండలమహత్త్వము వైష్ణవకోటి కింపురె
ట్టించ లిఖించి యిచ్చినఁ బఠించిన విన్న ధరించిన్న్ జనుల్
సంచితపుణ్యులై సకలసంపదలం బెనుపొంది కీర్తి దీ
పించి సుఖించి పొందుచురు ప్రీతి ముకుందపదస్థితిం మదిన్.

134


చ.

అనవుడు నాగదంతుఁడు ప్రియంబున సాత్యవతేయుతోడ నో
మునివర! దివ్యదేశముల ముఖ్యతరం బగు రంగమందిరం

బుగఁ గడునద్భుతంబు లగు పూర్వకథల్ విన వేడు కయ్యెడున్
ఘనదయ నట్టివెల్ల నెఱుఁగన్ రచియింపుఁడు నాకు, నావుడున్.

135


క.

నిగమవ్యాసవిశారదుఁ
డగుముని నీయడిగినట్టి యాశ్చర్యకరం
బగు నితిహాసము గల దది
తగ వినుమని పలికె నాగదంతునితోడన్.

136


చ.

కలరు సుబోధసత్త్వు లనఁగా మును లిద్ద, ఱుదారకర్మని
ర్మలచరితుల్, చతుర్ముఖసమప్రతిభుల్, బహుధర్మమర్మవే
దులు, ఘనదివ్యబోధనహితుల్, మహితుల్, రజనీముఖజ్వల
జ్వలనవిశాలనేత్రు లనివారితభూరితపోబలాధికుల్.

137


క.

వారఖిలభువనవిస్మయ
కారణదృఢఘోరనిష్ఠఁ గదలక గంగా
ద్వారమునఁ దప మొనర్ప బ
లారాతి దరాతికంపితాత్మకుఁ డగుచున్.

138


వ.

నిరంతరంబును దదంతరాయంబునకు నుపాయంబు లాచరింప
నానిలింపపతితోడ రాయిడింప నొల్లక యెడఁబాసి వాసిగల
తీర్ధంబు లాడువేడుక నిలావలయంబు గలయం జరింపుచు
వచ్చివచ్చి పురోభాగంబున.

139


మ.

సతతానేకమునీంద్రబృందకృతపూజావందనం, జందనా
గతమందానిలకందలీకృతతరంగస్యందనన్, దీరసం
గతమాకందమరందబిందుసహితార్కస్యందనం గాంచి ర
వ్యతు లింపొందఁ గవేరనందనఁ ద్రిలోకానందనానందనన్.

140


క.

కని తదవేక్షణలోలత
ననిమిషత వహించి యద్భుతానందంబుల్
మనమునఁ బిరిఁగొనఁ బులకిత
తనులై ప్రణమిల్లి భక్తితాత్పర్యములన్.

141

సీ.

గురుధర్మచరితానుకూలంబు కూలంబు
సంక్షాళితాఘకజ్జలము జలము,
ఘనముక్తివృత్తరంగములు తరంగము,
లవినీతకుజనభైరవము రవము
విహతతాపత్రయోద్వేగంబు వేగంబు
లలితభక్తానందలహరి లహరి,
కుశలప్రశంసానుగుణములు కణములు
విధ్వస్తదుర్భవవీచి వీచి,


తే.

నిరుపమజ్ఞానసంపద నెఱపు నెఱపు
భరితబహుమోహపటలిఁ బోనుఱువు నుఱువు
గాన కెరగాన మీనదితో సమాన
మహిమ వహి కెక్కు తీర్థసమాజములను.

142


క.

అని, మఱియుఁ బలుదెఱంగుల
గొనియాడి, తదీయవారిఁ గుతుకంబున ము
డ్కొని యాడి, దివ్యతేజో
ఘనులై ఘనవిళహితాపఘనులై రెలమన్.

143


క.

క్షితిఁ గల నదులందలి వి
శ్రుత యగుకావేరినీరు సోఁకిన మాత్రం
ధృతి సద్గతిఁ గనుఁదిర్య
క్తతి యయినను జెప్పనేల తక్కినవారిన్.

144


తే.

ఆవిధంబునఁ గృతకృత్యులై తదీయ
తీరవనభూము లొక కొన్నిదినము లుండి
వార లొకనాడు సంధ్యాభివందనార్థ
మై నిశావధిఁ గావేరి కరుగుటయును.

145


వ.

అమ్మహావాహినీప్రభావం బెడనెడఁ వొడవడునిసుము పిదపిదని పదనెగసి
కూలు దరులును దరులుగూడినఁ బెల్లుకొనఁ దాఁకుతళ్లున మొదళ్లు బలువదలు
వదలు మూలంబు లెఱుపుల నఱముఱి బయఃపూరంబులు దోరంబులుగా నేచి

పూచి తోచినం బెకలి తలకెడవై వడివఱద వెంబడిఁ బొరలిపోవు తరులును, దరు
తండంబుల గంది కడల నడ్డంబు దగిలి దట్టంబులై కట్టవెట్టిన లాగునఁ
జాఁగనీక వేగం బాఁగిన విఱిగి మలసి యెదురుదన్ని మిన్నుల కప్పంబులై
వచ్చు పై యేఱుల బలిమి కలిమిం దొట్టి నిట్టవొడిచిన నెట్టుకొని తమినం
డఱుము లిడి సిబ్బరంపు బిరుసునం దెరం దొబ్బిన కడకం బడఁకుల
పెల్లడరి యురులు గిరుల చఱుల ప్రచండరవంబుగా డొల్లు గండశైలంబు
లు, గండశైలంబు లొండొండ గుభులు గుభుల్లనం దొడఁగురభసంబున
నభశ్చరులు తల్లడిల్ల నెల్లెడలం బెల్లెగయు కల్లెడలును, కల్లెడల మొల్లంబేరి
మేదినీకుహరంబుల హర నటనటనపాటహ మహాభైరవ క్ష్వేడారవ ప్రతి
భటకటధ్వనిబంధురంబులై దిగంబడు కబంధంబులం బహులావర్తంబుల
క్రందునం దెగి నిగుడ మగుడ వెఱగుపడి తిరుగుడువడు జలగ్రహంబు
లును, జలగ్రహంబు లొండొండ నంటునంటుగ నారసి గెంటి కంటికొనల
ననలస్ఫులింగంబులు చెదర నడరి కలహంబునకుఁ దిమురుచు నమురు
గవిసి యప్పటప్పటికి జిఱజిఱం ద్రిప్పి వేయుచటుల వాల ఘాతంబుల
నుధ్ధూతంబులై మసరుకొని విసవిస విసరు గాడ్పుల దూలి వెడగువడఁ
జల్లు జలకణంబుల చల్లు తఱచున దఱియరాని సమీపదేశంబులును,
సమీపదేశవాసినీజనంబు భయావేశంబునం బాసిచనఁ దోడన జలంబు
వెడవెట్టి నివ్వగిలినఁ జువ్వన నెగయు మందిరంబుల పొందు దప్పక
తెప్పలగతిఁ దేలిపోవు పురనగర గ్రామ సమూహంబులును, సమూహంబులై
నింగి చెంగటం దలఁగి నివ్వెరపడి చూచు ఖేచరులు గలిగి వ్యవహార
సమర్థుం డగు సార్ధవాహునర్థసమితియుంబోలె మితుల కగ్గలంబై, బహు
ముఖంబులం గూడుచు, నతిరథపటిష్ఠనిష్ఠురబాణశ్రేణియుంబోలె ముంపు
దప్పక, యొడ్ల భేదింపుచు, మహావదాన్యుల యసామాన్యకీర్తి స్ఫూర్తియుఁ
బోలె బలువంకల నుల్లసిల్లుచు, గరాలకరవాలధారయుంబోలె నొరసిన
మేనిఁ ద్రెంపుచు, నయసంపన్నుసంపదయుంబోలె ముంపుదప్పక వసంత
సమయతరుసంతతియుంబోలె బలుమోసు లెత్తుచుఁ, ద్రివిక్రమ దివ్యదేహ
స్ఫురణయుంబోలె నడుగులకొలఁది గానంబడక, హరిమాయయుంబోలె
నావలం బెఱమతం(బు)లం గడవ నశక్యంబై, పెన్నిధిఁ గన్న పేద
యుంబోలె నంతకంత కుబ్బుచు, తగవరియగు చుట్టంబునుంబోలె
నెఱసులు దోపకుండ వర్తింపుచు, వీరభటవితతియుంబోలె మిగుల వడి

గలిగి, సన్నద్ధహయపంక్తియుంబోలెఁ బల్లంబుల నేపు దీపింపుచు, నద్భుత
వార్తయుంబోలె నతిదూరంబుగా మ్రోయుచు, నభేద్యకవంబునుంబోలె
నాటఁ జిక్కక, యధ్యాత్మవిద్యయుంబోలె నెల్లవారికి వితర్కింప నక్క
జంబై, మెఱసి పెన్నఁ జిన్నచేసి, తుంగభద్రను భంగపఱచి, కృష్ణ దూష్ణీక
రించి, సరస్వతీతరస్వినిత్యంబు దెగడి, నర్మద నిర్మదఁ గావించి, భాస్క,
రిం దిరస్కరించి, జాహ్నవి నిహ్నవించి, గౌతమి లోతమి యడంచి, సార
వంబు గౌరవం బుఱిచి, యన్న సరిన్నివహంబు నపహరించి, సంవర్త
సమయసముజ్జృంభ శుంభ దంభోధరానర్గళత్కాండప్రకాండ తాండవిత
సంఘసమున్నిద్రంబు లై సముద్రతోయంబు లుద్రేకించి లోకంబు లేకార్ణ
వంబుగా నందంద యురవడించు చందంబున చూడ్కులకు వెక్కసంబై
యుప్పతిల్లి యేపు దప్పక కనుఁగొను నంతలోన.

146


క.

ఇరవుగఁ దొలునాఁ డన్నది
దరి నొకచో వార లిడిన దండాజినస
త్కరణ స్నానపటాదులు
పరువడి యయ్యేటినీటఁ బడి వడినరిగెన్.

147


ఉ.

అంత ననంతధర్మమహిమాంచితకృత్యుఁడు సత్యుఁ డాసరి
త్సంతతజృంభణోదయవిచారవికారత బుద్ధిఁ బూని భా
స్వంతము, విష్ణుసంజ్ఞకము, సత్యము, సర్వశుభప్రదంబు, శ్రీ
మంతము నైన దైవము నమానుషలీలఁ దలంచుచున్నెడన్.

148


క.

కల్పాంత తీవ్ర బాడబ
కల్పసమానప్రతాపఖని యవితథసం
కల్పుఁడు సుబోధుఁ డట్టియ
నల్పక్షోభంబుఁ గని మహాద్భుతమతియై.

149


శా.

కాంలాభోధరగర్జిత ప్రతిభయోగ్రద్వాన గంభీరమున్
హేలాదర్ప విజృంభణస్ఫురణ నిట్లేలా యవేళన్ సము
ద్వేలంబైనది యీనదీమణి కడున్ వేగంబె యీవేగ ము
ల్లోలద్వీచిపరంపరల్ పొదువదే లోకంబు లేకంబుగాన్.

150

తే.

కాన దీనికిఁ బ్రత్యపకార మింక
నెద్ది గల దట్టి దిప్పు డూహించి చేయ
కొకనిమేష ముపేక్షించి యున్ననైన
బ్రతుక బోలునె విశ్వప్రపంచమునకు.

151


సీ.

చటులదిక్కరి కర్ణపుట పాటనప్రౌఢి
నొదవునిర్భర ఘోషమదము ముడుఁగ,
పాథోధిమండల పాణింధమము లైన
కల్లోలవితతుల త్రుళ్లడంగ,
మకరనక్రగ్రాహ మత్స్యకచ్ఛపకోటు
లొరలుచు నొండొంటి మఱువు కొదుఁగ
జక్రటిట్టిభ సారస క్రౌంచముఖ జల
విహగజాలము గమి విచ్చి పఱవ,


తే.

నారసాతలనిమ్నంబులైన మడువుఁ
బట్లు పంకావిలంబులై బయలుపడఁగ,
శిలలు గుల్లలు నిసుము చిప్పలును దక్క,
నెసఁగి యీతోయ మీతోయ మేగ్రహింతు.

152


క.

అని సంరంభ విజృంభణ
మునఁ దత్సలిలంబు సకలమును బాణితలం
బున నిలిపి లీల నాపో
శనముగఁ గొనఁ బూని దశదిశల్ గనుఁగొనినన్.

153


మ.

జలధుల్ పిండలివండుగాఁ గలఁగె, భూచక్రంబు క్రుంగెం, దిశా
వలయం బల్లలనాడె, గోత్రశిఖరివ్రాతంబు గంపించె, ను
ల్కలు డుల్లెం, గగనంబు బిట్టదరె, నర్కస్ఫూర్తి మాసెన్, మదిం
దలఁకెన్ వజ్రి, విరించి వంచెఁ గృతచింతన్ వక్త్రపంకేజముల్.

154


వ.

అయ్యవసరంబున.

155


తే.

వలవ దుడుగుము భూసుర వంశవర్య
యిట్టి యనుచితకృత్య మూహింప నీకుఁ

దగునె యనుచు ధారాధరధ్వానధిర
మైన వాక్యంబు వీతెంచె నంబరమున.

156


క.

ఆపలుకు తేటపడ విని
యేపున మునుఁ గ్రోలఁ గేల నిడి పూనిన త
ద్ద్వీపవతిజలము చలమునఁ
దాపసవర్యుండు వదలెఁ దత్క్షణమాత్రన్.

157


వ.

అప్పుడు మఱియు నంతరిక్షంబున నంతర్హితుం డైన దివ్యపురుషుం డతనితో
నీక కాచు కావేరకన్యక సకలభువనమాన్య దీని సామాన్యఁగా దలఁపవలవ
దమృతప్రాయంబు లగు నీతోయంబులు ప్రజాజీవనోపాయంబులై ప్రవర్తి
ల్లెడు, నదియునుంగాక పుండరీక మండల మధ్యమండనాయమానంబై
దురంతదుర్భరాతప సంతప్త జంతుసంతానంబునకు నిరంతరచ్ఛాయా
నోకహంబై సనకసనందన ప్రముఖప్రసిద్ధ సిద్ధముని శుద్ధాంతఃకరణ
సిద్ధాంతీకృత సుకృతవస్తుసారంబై రామాభిరామహేమ దామాకలిత హరి
నీలమణి కరండంబై శేషశయనంబు శ్రీరంగంబు శ్రీరంగధర్మం బను
నామంబుల భవ్యంబైనదిగా నవ్యయంబైన దివ్యధామంబై తదుభయ
ప్రవాహ పరిపాలితంబై మెఱయునది గావున నీపుణ్యతరంగిణి సరస
భాజనం బైనది గాని విరసభాజనంబుగా దనిచెప్పి యూరకుండె
వెండియు.

158


క.

అదివ్యపురుషవర్యుం
డాదరమున నితనితో మహామునివర యీ
ఖేదమును మాని మది నీ
కేది ప్రియం బదియె వేఁడు మిచ్చెద ననినన్.

159


ఉ.

అచ్చెరువంది సంయమి కులైకవిభూషణుఁ డేక్రియం బ్రియం
బిచ్చఁ దలిర్పఁ బల్కునతఁ డెవ్వఁడు తద్వచనంబ కానిరూ
పెచ్చటఁ గానఁబోల దిది యెంతయునుం గలయో యథార్థమో
చెచ్చెర నాదుపూన్కి వృధ సేయఁగ బన్నిన విష్ణుమాయయో.

160


వ.

అని యివ్విధంబున.

161

క.

చింతింప మఱియు నంతట
నంతర్హితుఁ డైనదేవుఁ డాతనితో నీ
కింత దగుదాయ మేటి క
నంతగుణా వేఁడు మిష్టమని పల్కుటయున్.

163


ఆ వె.

ఆసుబోధుఁ డలరి యఖిలేశ! నీకు నా
దెసఁ బ్రసాదబుద్ధి యెసఁగెనేని
నిన్ను నెఱుఁగ జెప్పి నీదివ్యరూపంబు
సొంపుమీఱ నాకు జూపవలయు.

164


వ.

అనిన నప్పరమేశ్వరుం డతని కిట్లనియె.

165


క.

దేవాది చతుర్విధ భూ
తావళిఁ బొడమింపఁ బెంప నడఁపం బతినై
యీ విశ్వము నాధారం
బై వెలయుదు నిత్యసుఖపరాయణ లీలన్.

166


చ.

నినుఁ జరితార్థుఁ జేయుమతి నేఁడు ప్రసన్నుఁడనై మదీయమై
యొనరిన దివ్యరూపమహిమోన్నతిఁ జూపితిఁ గాని సారసా
సన పురశాసనాదులునుఁ జాలరు గానఁ బ్రసన్నులైన స
జ్జనులకుఁ దక్క నన్యులకు శక్యమె నిక్కము నన్నెఱుంగఁగాన్.

167


వ.

అని యాక్షణంబ.

168


మహాస్రగ్ధర.

బహుభాస్వద్భాసమానప్రభలు నభమునం బర్వ, వార్వాహగర్వా
సహనీలాంగద్యుతుల్ భూషణమణితతి మించన్, లసద్వైజయంతీ
సహితోరఃకౌస్తుభాంశుల్ జడిగొనఁ గనకాచ్ఛాదనం బొప్ప, శౌర్యా
వహచంచద్దోస్సహస్రావలి మెఱయ బలిధ్వంసి ప్రత్యక్షమయ్యెన్.

169


ఉ.

అప్పుడు తన్మనోహరభయానక దివ్యవపుర్విశేషముం
దప్పక చూడ నోడి ప్రమదంబు భయంబును విస్మయంబు లో

ముప్పిరియై పెనంగొన సుబోధుఁడు దీపిత సుప్రబోధుఁడై
యప్పరమేశు నిట్లని సమంచిత భక్తి నుతించె నమ్రుఁడై.

170


సీ.

సర్వేశ! సర్వజ్ఞ! సర్వభూతప్రియ!
శరణాగతార్తి సంహరణ! నిరత
మధుదైత్యదుర్మదమధన! సమస్తక
ళ్యాణ స్వరూప! పరాపరాత్మ!
భవదీయముఖమునఁ బావకుఁడును దృష్టిఁ
జంద్రసూర్యులును భుజముల దిశలు
కళలు శోత్రంబుల గగనంబు నాభిఁ జ
రాచరాత్మక మైనయవని పదము


తే.

లందుఁ బెంపొందుచుండు ధరాదిపంచ
భూతములు, బుద్ధ్యహంకారములు మహత్తు
ప్రకృతిపురుషులు దగముక్తి పరమ మగుచు
నెగడు నాపరంజ్యోతియు నీవ దేవ.

171


చ.

నెఱవగుభక్తి నొండొకటి నేరక సర్వశరణ్య నిన్నుఁ బ
ల్మఱు వినుపించుచున్ మదిఁ దలంచుచు మ్రొక్కుచు నుందు రెవ్వరె
త్తెఱగునైన నట్టి సుకృతిప్రకరంబునకెల్ల మెట్టలుం
గిఱుతలబంటిగాదె పరికింప భవాంబుధి సత్కృపానిధీ!

172


చ.

దివసాగమవికసితసిత
నవసారసదళవిశాలనయనంబుల దా
నవసామజపంచాసన!
భవసాగరమగ్ను నన్ను బాలింపు హరీ!

173


వ.

అని ప్రస్తుతించి యప్పుండరీకాక్షుతో నతండు దేవా! నీవు నాయెడఁ బ్రస
న్నత వహించితేనియు నిబిలవిరోధంబైన మదపరాధంబు సహింపు సహింపు
మచక్రవాళాచలా చక్రవాళంబులై, సుకృతాలవాలంబులై, దురంత
దుష్కృత సంహరణ సమర్ధంబులైన తీర్థంబు లెల్లకాలంబు నీసరిత్కూలం

బుల గలసి మెలసి చరింప ననుగ్రహింపు మీధునీవారిం జేరిన యనాథునీ
వారిగఁ గలపి యనుగ్రహింపు మీప్రదేశంబున నొనర్చుజపతపోహోమ
దానంబు లక్షయసుఖనిదానంబులుగా బ్రసాదింపు మని వినయ
వినమితోత్తమాంగుండై యూరకున్న నన్నలిసోదరుండు సాదరుండై
యతనిమనోరథంబు లవితథంబులుగా నొసంగి మఱియును.

174


క.

ధరణిసుర న న్నెఱుఁగుము
పరాత్పరుఁ బ్రధానపురుషుఁ బరు నాద్యుఁ జరా
చర భూత జాత భయసం
హరు నారాయణు నమేయు నవ్యయుఁ గాఁగన్.

175


తే.

నిఖిలకర్తయు భోక్తయు నేన కాక
లేదు నాకంటెఁ బర మొక లేశమైన
నెంతవారును నాతెఱఁ గెఱుఁగలేరు
సకలలోకనియంత్రి మత్సహజశక్తి.

176


వ.

అని యఖిలభక్తమనోరధానుసంధాయకుఁ డగు శ్రీరంగనాయకుఁడు
తానగుట తేటపడుటకై యతని కాత్మావతారకథావృత్తాంతం బాద్యంతం
బును దెలియ నానతియిచ్చె నత్తెఱం గెఱింగించెద నాకర్ణింపుము.

177


క.

ఏలావన హరిచందన
జాలాభినవప్రసూన సౌరభ విలస
ద్బాలానిల మృదులీలాం
దోళిత కల్లోలమైన దుర్గాబ్ధిపయిన్.

178


మ.

అఖిలప్రాణిహితైకబుద్ధి నురగేంద్రానల్పతల్పంబునన్
సుఖలీలన్ శయనించియున్న హరిఁ దేజోమూర్తి, నాతాపసో
న్ముఖుఁ గల్యాణకరుం గుఱించి దివసంబుల్ పెక్కు భక్తిం జతు
ర్ముఖుఁ డత్యుగ్రతపం బొనర్చినఁ గృపాపూర్ణ ప్రసన్నాత్ముఁడై.

179

క.

ఆలోక పితామహునకు
నాలోకన సమధికోజ్జ్వలాకృతి పటుభూ
పాలోక మెసఁగ నవ్విభుఁ
డాలోఁ బొడచూపి వేఁడు మభిమత మనినన్.

180


తే.

లీలఁ జాఁగిలి మ్రొక్కి, కెంగేలుఁగవలు
ఫాలభాగంబునందున గీలుకొలిపి,
బహువిధంబుల వినుతించి, పద్మభవుఁడు
వేడ్కఁ దనకోర్కి యిట్లని విన్నవించె.

181


ఉ.

నేరెడుపండుచాయ రవణించెడు మేనఁ బదాఱువన్నెబం
గా రొఱఁబట్టు పట్టుఁ, బసగందని తామరరేకు మైసిరుల్,
దోరణఁగట్టి యేలు కనుదోయును, బొందుకు సుద్దియై మెఱుం
గారు సురంబు కెంపు, దయనానిన యుల్లము చల్లచూపులున్.

182


క.

అలరిన లలితాకృతి నా
తలఁపున నెలకొల్పినట్లు దైత్యాంతక యి
మ్ముల నెల్లప్పుడు కనుఁగవ
లలరఁ గనుంగొనెడి భాగ్య మంటింపఁగదే.

183


వ.

అని ప్రార్థించిన నాశ్రితవత్సలుం డగుశ్రీవత్సలక్షణుం డతనిదెస నెసఁగు
దయావిశేషంబున నట్లకాక యని యానతిచ్చి యంతర్హితుం డయ్యె
ననంతరంబ.

184


సీ.

ధ్వజగరుత్మద్దేహ ధగధగద్యుతులు లో
కాలోక చరమాంధకార మణఁప,
స్వచ్ఛముక్తాతపత్రచ్ఛాయ లసమయ
చంద్రికావిలసనోత్సవముఁ జూపఁ
బటుశాతకుంభ శుంభత్స్ఫూర్తు లంభోద
పథమునఁ గుంకుమప్రభలు నెఱప
మహనీయతోరణ మణిమయస్ఫూర్తియు
గోచరప్రతతి చూడ్కులు మరల్ప

తే.

నుదధి నావిర్భవించె సముద్యదధిక
దివ్యతేజోవిశేష దేదీప్యమాన
పద్మ గర్భాండ భాండ ప్రచండ మగుచు
మంగళం బైన శ్రీరంగమందిరంబు.

185


శా.

ఆదివ్యాయత నోపజీవు లయి దుగ్ధాంభోధి మధ్యంబునం
బ్రాదుర్భావము నొంది రచ్యుతదయాపాత్రత్వమిత్రుల్ భవ
చ్చేదావాప్తసదాసుఖోదయులు రాజీవప్రభూతేంద్రము
ఖ్యాదిత్యప్రకరార్చనీయు లగు నందాదుల్ మనోజ్ఞాకృతుల్.

186


తే.

వారితోడనె వైకుంఠవాసులై ప్ర
సిద్ధులైన సనందాది సిద్ధమునులు
నమరగంధర్వ కింపురు షాహియక్ష
గరుడ విద్యాధరాదులు గానఁ బడిరి.

187


వ.

అయ్యవసరంబున.

188


సీ.

రావించె నిరవద్య రావ నారచవాద్య
కలిత తుంబురు హృద్యగానవిద్య,
మెఱసెఁ గింకిణిరావమిళితమై దివి దేవ
సతులనర్తన భావగతుల రేవ,
బలసె దివ్యానేక భవ్య స్తవశ్లోక
ముఖరమై యెడలేక మునులమూఁక,
తొరఁగెఁ బై పైఁ బెల్లు తొలువాసనలఁ జల్లు
పరువమై వికసిల్లు విరులజల్లు


తే.

పొరసె నమృతాంబునిధిఁ దేలి పుష్పశాలి
దైవతోద్యానవనకేళిఁ దనరు గాలి
యఖిలకల్యాణమూల మోక్షాలవాల
రంగజననాతి వేల సంరంభవేళ.

189


వ.

అప్పుడు.

190

సీ.

భరియించెఁ దద్దివ్యభవనంబు ఖగరాజు
కఠిన బంధురతర స్కంధపీఠిఁ
బట్టె దర్వీకర ప్రభుఁడు శ్వేతచ్ఛత్ర
మురుఫణామండల స్ఫురణ మెఱయ,
నిడిరి వింజామర లిరుగెలంకుల జోక
యై సుధాకరుఁడు సహస్రకరుఁడు,
బకలంబు సేసె హాటక వేత్రపాణియై
తఱమి విష్వక్సేన దండనాథుఁ


తే.

డలిక ఘటితహస్తాబ్జులై యంతనంత
బలసి కొలిచిరి సకలదిక్పాలవరులు
వచ్చె శ్రీరంగధామంబు వచ్చెననుచుఁ
జదలఁ గొదలేక కాహళస్వనము లెసఁగె.

191


వ.

ఇవ్విధంబున స్వయంవ్యక్తంబును దేజోమయంబును, బ్రణవస్వరూపంబును,
బ్రభూతవైభవాభిరామంబును, నగు శ్రీరంగధామంబు దృగ్గోచరం బగు
టయు దిగ్గున గ్రమ్ము సమ్మదామృతరసంబునఁ బులకాంకురంబులు దలఁ
కొనఁ గనకనికషసుషమావిశేషంబున కుపమేయం బగుఛాయం బొలుచు
కాయంబు భూభాగంబునఁ జాగిల్లఁ బ్రణమిల్లి శారదావల్లభుండు యుగప
దుల్లసితచతుశ్శ్రుతిప్రయుక్తంబులగు సూక్తంబుల నభినుతించె, నంత
నఖిలగుణగణప్రశస్తుండును వేత్రహస్తుండును నగుచు నందుం డాశతా
నందునకు నమ్మహనీయమందిరంబుఁ జూపి యిట్లనియె.

192


మ.

అరవిందాసన నీతపంబు ఫలితంబై తోఁచె, లక్ష్మీమనో
హరు గేహం బిదె చూడు, లోచనము లింపారంగ నీరంగమం
దిర మయ్యిందిరతోడఁ గూడి యనురక్తిన్ యోగనిద్రాళుఁడై
హరి యున్నాడు జగత్కుటుంబ పరిరక్షాయత్త చిత్తంబునన్.

193


వ.

అని నిర్దేశించినఁ గనకగర్భుండు నిర్భరానందంబునఁ దత్ప్రదేశంబు డాయం
జనునప్పు డూర్ధ్వాధస్స్థలంబులఁ గనకమహిమండలంబులును, మధ్యభాగం
బున శ్రీదేవియు, నభ్యంతరంబున ననంతభోగియుఁ, బ్రతిహారాంతికంబున

జయవిజయులుఁ, బార్శ్వంబుల దుర్గాహేరంబులును, శిఖరంబున బ్రణవ
స్వరూపిణి యగు భారతియును, గనకకలశంబుల నామ్నాయసముదాయం
బును, నాసాముఖంబున రహస్యజాతంబును, బాదతలంబులఁ గ్రతుప్రతతియు,
నంగుళీసంచయంబుల యజనంబును, నుదరంబున వావిర్జలంబును, మఱియు
నెడనెడఁ బాకశాసన పరేతరాజ పలలాశన పాశపాణి పవమాన పౌలస్త్య
పాశుపతులును నాదిత్యరుద్రమరుదశ్విని విశ్వదేవ సిద్ధసాధ్యులును, సప్త
ర్షులు నక్షత్రగ్రహతారకంబులు - నాదిగాఁ గల చరాచరభూతజాలంబు
లెల్లను దోచినఁ బరమాద్భుతసంభ్రమంబులు డెందంబున సందడింప నద్దివ్య
మందిరంబునకుఁ బ్రదక్షిణాభివందనంబు లొనర్చి యభ్యంతరంబుఁ
బ్రవేశించి యందు.

194


సీ.

తలగడగా నిడి తలమూఁది వలచెంపఁ
గుడిహస్త మెత్తుగా నిడినవాని,
మేలిచేఁ దొడవుల మెఱుఁగు దాపలు మించు
పెలుకేలు కటిఁజూచి మెఱయువాని
సిరిమేనిపొందునఁ జిత్తంబు సొగయింప
నరమోడ్పుఁగన్నుల నమరువాని,
నాకుంచితోన్నతం బగు వామపదమున
బిరుదు నూపురము శోభిల్లువాని,


తే.

మొలక నగవులఁ దెలివొందు మోమువాని
మెఱపు గల మేఘరుచిఁ బొల్చు మేనివాని
నురగశయ్యపై నొదికిలి యున్నవాని
సకలశుభదాయి శ్రీరంగశాయిఁ గనియె.

195


వ.

కని యప్పరమేశ్వరు నిత్యనిరతిశయ నిరుపమ నిరవధిక లావణ్య సౌందర్య
సౌకుమార్య చాతుర్య స్థైర్యగాంభీర్య సౌశీల్య వాత్సల్య తేజః ప్రభావ
సౌభాగ్యసౌహార్ద దయాద్యనంత కల్యాణ గుణామృత సాగరాంతర్నిమజ్జ
దఖిలావయవ సుఖానుభవ సముత్కటానంద పరిపూర్ణ మానసుండై, పునః
పునఃప్రణామంబు లాచరించి నితాంతభక్తి వినయ వినమ్ర దేహుండై యిట్లని
స్తుతించె.

196

దండకము.

జయజయ జగదేకకల్యాణ భావానిశత్రాణపారీణ నిష్కారణా పారణారుణ్య
రత్నాకరా! శ్రీకరామ్నాయసారాభిధానామృతాసార శాంతాఘసంతాపయన్
తాపసౌఘాస్తపోభిర్భజంతే యజంతేచ నిశ్రేయసోద్యోగినోఽష్టాంగ
యోగాంచిత జ్ఞానయజ్ఞై! ప్రశంసంతివేదాగమాస్తావకాభూయ భూయః
ప్రసాదాభిలాషీ సదాసేవతే దేవతానాంగణస్తం సమస్తప్రతీతం గుణాతీత
మాధారభూతం ప్రకృత్యాః సమానాధికో పేత మాధ్యంతమేకం భవన్తం
భజేఽహం, ప్రసన్నః సువర్ణధ్వజః ప్రత్యుషశ్చిత్రభానుప్రభాజాల జాజ్వల్య
వచ్చక్రధారాలి భిన్నారివక్షః శిరఃకుల్యకైవల్య సామ్రాజ్యలక్ష్మీ సమర్ధైక
మూర్థాభిషిక్త ప్రణామ త్పదాబ్జావహం విశ్వమావర్తతే! శాశ్వతం జ్యోతి
రాకారలోకోత్కరం తత్త్వసంకల్పమాత్ర ప్రభూతాలి సంభూత
భూతావకాశ్యం దిశానాథ తేజోముఖం మిత్రరాత్రీశ్వరౌ నేత్రయుగ్మం
దిశశ్రోత్ర మేషా ధరిత్రీపదౌ మాతరిశ్వాస నిశ్వాసభూతో నభోనాభి
రావాసభూర్మస్తకం శ్రీఃకళత్రం మనోర్ఫూర్మనోఽహశ్చ రాత్రిశ్చ
పార్శ్వేనిలింపాః ప్రతీకా స్వమేవాంతరాత్మాషడంగాని వేదాళ్ళ ధర్మాణి
శాస్త్రాణి సర్వాగమాః పాంచరాత్రం తథా సాంఖ్యయోగం తవాజ్ఞాహి
వేదాస్తవేద్య స్వమేక ప్రసాదోఽహ ముగ్రస్వదీయాతిరోష స్వదన్య
త్పరం నాస్తి నీహారభానూబృహధ్భానురంభోజినీ బాంధవో గంధవాహః
ప్రమత్తాభవన్తే ప్రభీతాః ప్రయాన్తి ప్రజాస్వన్వహం మృత్యురభ్యేతి
మర్త్యేషు కాలేజనిష్వత్వమేవాఖిలం వాభవంతం భవచ్చాస్య బాహూరుపాద
ప్రభూతం మహీదైవతక్షత్ర విట్ఛూద్రజాతం సవర్ణాశ్రమాచార ధర్మస్త్వ
మేవ త్వమేవక్రతు ర్విశ్వమూర్తే సుధీనాథమీనాకరాధీన హీనా సురాధీన
మానాధికానూన నానాగమాదానసూరాయ మత్స్యావతారాయ ధీరామృతాహార
వీరార్ణవక్షీర పూరార్పితోదార భారాచలా ధారరూపాయ కూర్మస్వరూపాయ
సర్వం సహాఖర్వదుర్వార దోర్గర్వ నిర్వాహవత్పూర్వ గీర్వాణ భూతోర్వ
రోద్ధార లోలాయ లీలాధికోలాయ కాలానలాలోల కీలాసముత్తాల ఫాలాక్షదోః
స్థూల శూలాధికాభీల భాస్వన్నఖాలీఢతారాతి దేహాయ లక్ష్మీనృసింహాయ
ధీమన్మునిస్తోమసామస్తుతవ్యోమభూ మర్త్య భుగ్ధామసీమక్రమస్థేమరాజత్పదా

బ్జాయ మాయావికుబ్జాయ పుత్రాప్తసన్మిత్ర గోత్రా నిత్వక్షత్రగావలిచ్ఛేతృ
పత్రావలీ చిత్రబాహాకురారాతి భీమాయ రామాయ చండాభ్రవేదండ శుండాభదో
ర్దండకాండాసనాఖం కాండాహృతోద్దండ పౌలస్తకంఠప్రకాండాయ, కాకుత్ స్థ
వంశ ప్రకాండాయ కోపావమానాపతే పామర క్షేపతాసారి కృత్పాపరూపావలీ
తాపకేళీ సతృష్ణాయ కృష్ణాయ వైహాయసవ్యూహ గోహారిసన్నాహబాహాబలో
త్సాహనీహారరుగ్వాహదుర్లక్ష్య రక్షః పుర క్షోభకర్మప్రబుద్ధాయ, బుద్ధాయ,
రోషాగ మద్వేషభాషాతి దుర్వేషయోషావధాతోషమేషాది దుర్దోష శీలస్థలద్ధర్మ
సంస్థాపనోల్కాయ కల్క్యైహయా యాప్రమేయాయ కించామితానంత లీలా
వతారాయ తుభ్యంనమో దేవతుభ్యం నమః, కలశ జలధిమధ్యచంచత్సిత ద్వీప
రత్నాగ్ర వైకుంఠపూరుజ్వల దివ్యసౌధాతికాంతే సభాన్తేభవనం, నిశారంభ
సంఫుల్ల నీలోత్పలశ్రీ విశాలాంగ లావణ్య విభ్రాజమానం నతామర్త్య
దైతేయ నాగావతంస ప్రతాన స్ఫురత్పీన భాగోచితాభ్యాం సరోజధ్వజచ్ఛత్రి
చక్రాదిచిహ్నైః పదైరంకితాభ్యాం ప్రభాసంపదాభ్యాం పదాభ్యాం మనోజ్ఞం
స్వరామ్నాయ మంజీర పాళిక సత్పద్మరాగ ప్రకాశావృతాంసం తటిన్నూతన
ద్యోతి ధౌతాంబరాంచత్కటీ మండలాబద్ధ కాంచీకలాపం సుధావర్త గంభీర
సుస్నిగ్ధ నాభిప్రభూతాయత శ్వేతపద్మాభిరామం, లసత్కౌస్తుభ్య శ్యామల
శ్రీతులస్యామిళద్వైజయన్తీసమేలోరువక్షఃస్థళీకం, వరానర్ఘకేయూరవజ్రోర్మి
కాద్యైః పరిభ్రాజితాజానుబాహుప్రకాండం రమాలింగ నోత్కీర్ణరత్నాం
గదాంక క్రమైరుల్లసత్కంబుకంఠప్రదేశం, శరశ్చంద్రబింబప్రసన్నస్మితాస్య
లసత్కుండ లాలోకచంచత్కపోలం, పరంపశ్య బింబప్రభా పాటలోష్ఠం
దరద్యోతిత స్వచ్ఛదంతాంశుజాలం, నవామోదినిశ్వాసనాసావిలాసం,
దివాజృంభితాంభోజదీర్ఘావలోకం, సలీలానతభ్రూవిలాసం, సుఫాలం
చలత్కుంచితానీల సత్కుంతలాంతం, సముద్భాసికోటీరచారూత్తమాంగం,
సమస్తైకసౌందర్య సంపన్నిధానం, మహాభోగినో భోగమధ్యేనిపణ్ణం
సహైవశ్రియా సర్వసౌభాగ్యవత్యా సువర్ణాదిభిర్నిత్యశుద్ధై రనంతై రుపాస్యం,
సనందాదియోగీంద్ర బృందైశ్శరణ్యం, సదా సత్య సంకల్ప
మీశం పురాణం విభుం, విశ్వభూతాంతరస్థం వినాన్యాశ్రయం వేద
విద్భావయిత్వా మనస్యర్చయేద్భక్తి మాన్యం ప్రశంసంతి సంతస్తమేనో
హరం, తేన తస్మై శుభం జాయతే కింబహూక్తైశ్శతస్తేన భావానువర్తీ

భవాన్, పరమపురుషస్త్వాం నజానాతి కశ్చిత్కథం విస్తరేణస్తుతిం కర్తు
మీశో భవిష్యత్యుచంచన్మనీషః సహస్రాన్ముఖేభ్యోపి పుంఖానుపుంఖా
గతాశేష భాషావిశేష స్సశేషశ్చ శేషత్వమాపద్యతే శేషిణస్తే వచోగమ్య
భావం విచార్యాసనచ్ఛత్రశయ్యా రూపేణవాచాలతా పంచవక్త్రాంచితోఽ
నాతతైస్తర్కహారైః ప్రభిన్న ప్రమాణైః ప్రకారైః పరిభ్రాన్తిమూలై
ర్వికల్పాలవాలైః పరాభూత సంపాదితాతీతఖేదై ర్మహాశాస్త్రసిద్ధాన్తవాదై
రలంకించు తాపత్రయోర్మిచమఛటానంకురే శోకమోహాదిదుష్టగ్రహాధిష్ఠితే!
మోహకామాది లోభాదికావర్తజాతే మహాదుర్భవాంభోనిధౌ మజ్జతాం
సారిలైకాగతిస్త్వత్పదాంభోరుహైకాంత భక్తిర్నకర్మప్రసక్తిం పరస్యా
విరక్తిం ఖలూత్పాదయత్యేకనిష్ఠా గరిష్ఠాహిమాయాంతి రంతిద్వితీయ్యా
మలంఘ్యా సదాస్యాభిరేషా హృషీకేశ విశ్వాతిశాయిన్ క్షణంపశ్యమా
ముల్లసత్కుంభజాతోదయారంభ సంభూత వైమల్య గంభీరనీర స్ఫుర
త్పుండరీకచ్ఛదాకార సౌభాగ్యశోభావహా గర్వసర్వస్వచోరైరుదార ర్నతా
రూఢ రాగానుబంధై రివోపాంతర క్లైర్దయాసంప్రయుక్తైర్మరున్మానినీమంగళా
కల్పరక్షాధికారైకపుణ్యాతిదూరై రపాంగై ర్మమత్వం పితాత్వం త్వంగురు
స్వంసఖా త్వంసమస్తం జితంతే ముకుంద ప్రసన్నార్తిహంత్రే జితంతే
జగన్నాధ! గోవింద! విష్ణో! జితంతే శ్రియః కాంతరంగాధిశాయిన్
జితంతే హరే వాసుదేవాదిదేవప్రసిద్ధ ప్రభో పాహిమాం పాహిమాం
పాహిమాం.

197


శ్లో.

శ్రీరంగేరుచిరాయస్య, శ్రీరంగేరుచిరాయతా
సదైవతః శరణ్యోనః సదైవత ముపాస్మహే॥

198


చ.

అని వినుతించినన్ సదయుఁడై మురవైరి దయామృతంబు నిం
డిన కడకంటిచూపు నిగిడించి విరించి భవద్వచః సమ
ర్చనమునఁ జాల నీదెసఁ బ్రసన్నుఁడనైతి వరంబు లెవ్వియై
నను నను వేఁడు మిత్తు ననినం బ్రమదంబున నాతఁ డిట్లనున్.

199


తే.

అవధరింపుము, నీ విప్పు డవధరించి
నట్టి యీ విగ్రహంబు నే నహరహంబు

నెలమిఁ బూజింపఁ గోరెద, నిట్ల యొసఁగి
మఱుఁగులే కానతిమ్మనె తెఱఁగు నాకు.

200


క.

నావుఁడు హరి యిట్లను నీ
భావమ్ము నెఱింగికాదె పద్మాసన యి
ట్లావిర్భవించితిని ది
వ్యావసధముతోన కొలువు మభిమతభంగిన్.

201


క.

ఏనరుఁడు పంచకాలని
ధానంబున నన్ను శాశ్వతముఁ బూజించున్
వానికి నొసఁగుదు నమృత
స్థాన మనిన నెన్న నేల తక్కినపదముల్.

202


క.

ఈ నాళీకభవాండము
పై నావరణములమీఁదఁ బరమవ్యోమ
స్థానంబున నుండుదు నెపు
డే నప్రాకృతశరీర హితవిస్ఫురణన్.

203


సీ.

దేవతిర్యగ్జన స్థావరాత్మకభువ
నావలి లీలార్థమై రచింతు
నవి చేత నించుటకై సమస్తమునందు
జీవరూపమున వసించియుందుఁ
గర్మంబులకు లోనుగాక భూతావలిఁ
బ్రసరింపఁ జేయుదు బహువిధములఁ
చదను గ్రహార్థ మాత్మగతుండనై యుండి
జ్ఞానరూపమున విజ్ఞాన మడఁతుఁ
దల్లిగతి హితకారినై తనరి తిలలఁ
దైలమునుబోలె వ్యాపించి తమ్ముఁ గూడి
యున్ననైనను సురలు నాయోజ యిట్టి
దని యెఱుంగరు విపులమోహాంధు లగుచు.

204

క.

దివి నౌపేంద్రస్థానము
రవి మండలమును సుధాంబురాశియు నన నే
నివసించు కందువలు మూఁ
డవుటఁ ద్రిధామాఖ్య ముఖ్య మయ్యెను నాకున్.

205


వ.

తత్ప్రదేశంబులందును రాజసతామసాత్ములకు దుర్విభావ్యుండనై యుండుదు
వెండియు లోకానుగ్రహార్థం బొక్కొక్కయెడల నావిర్భవించియు నొక్కొక్క
విభావంబునం దావేశించియు నొక్కొక్కఠావుల జన్మప్రసంగంబు
లంగీకరించియుఁ బ్రతికల్పంబున నవతారసహస్రంబులు గైకొందు సత్వా
యత్తులై మదేకచిత్తులయిన యుత్తములయెడఁ దద్గుణకర్మాభివృద్ధ్యర్థం
బత్యంతరాగాసక్తుండనపోలె సకలంబు ననుసంధింతు, బితృపుత్రవాత్స
ల్యంబుల నైనను మిత్రామిత్రంబుల నొదవు రాగాపరాగంబులనైనఁ బ్రాణి
స్తోమంబు నామీఁదఁ దలంపు గలిగి యేవిధంబున వర్తించు నావిధంబున
కనురూపంబులు ధరియింతు, నవియునుంగాక ద్వీపవర్షతీర్ధాయతనంబులందు
బ్రతిగ్రామగృహంబుల ప్రతివర్షంబుల దారులోహశిలామయంబు లగు
నర్చాభేదంబుల నుల్లసిల్లుదు నట్టియర్చావతారంబులు స్వయంవ్యక్త దివ్య
సైద్ధమానుషంబులనఁ జతుర్విధంబుల మెఱయు నందు శ్రీరంగ శ్రీముష్ణ
శ్రీవేంకటాచల సాలగ్రామ నైమిశ తోతాద్రి పుష్కర నారాయణాశ్రమంబులను
నీయెనిమిదిస్థలంబులం గల మదీయమూర్తులు స్వయంవ్యక్తంబులు హస్తిగిరి
వృషపర్వత చక్రతీర్థాది ప్రశస్తదేశంబులు భవధర్మ శతముఖ ప్రముఖ
దేవప్రతిష్ఠితంబులైనయవి దివ్యంబులు, భృగుతీర్థ మందరక్షేత్ర చిత్రకూట
ప్రభృతి పుణ్యస్థలంబులు, భృగుమరీచి మతంగజముని సిద్ధసంస్థాపి
తంబులైనయవి సైద్ధవంబులు, విశిష్టాగమోక్త ప్రకృష్ట శుభలక్షణలక్షితంబు
లయి శుచిద్రవ్యరచితంబు లయినయవి మనుష్యస్థాపితంబులై యున్నయవి
మానుషంబులు, వీనిలో స్వయంవ్యక్తంబులై యున్నయవి వికృతిమయంబు
లైనను బూజాతిశయంబునను బింబాభిరూప్యంబునను బ్రసన్నుండనై
సాన్నిధ్యంబు వహింతు. మత్ప్రభావంబున నీస్వయంవ్యక్తాదులకుఁ గ్రమం
బున ద్వేతౌర్థ(?)పాదయోజనమాత్రక్షేత్రంబు పరమపవిత్రంబునై
యతిశయిల్లు.

206


క.

శ్రీమెఱయ నెచట సాల
గ్రామశిలార్చనము గల్గుఁ గల్యాణకరం

బై మహి నచ్చోటికి మూఁ
డామడ పుణ్యప్రదేశమై విలసిల్లున్.

207


తే.

తక్కు గలుగు గృహాళికిఁ దద్గృహంబు
పావనము విను పురి వల్లె పదియు రెండు
నొక్కటన మద్విమానము లుండెనేని
సాటి యచటు సాలగ్రామ శైలమునకు.

208


క.

ఇల నేచ్చోటు మదర్చన
విలసితపూజోత్సవాదివిరహిత మగునా
నెలవు వెలివాడఁబోలెం
దలఁపఁ గనుఁగొనఁగ ననుచితము సుజనులకున్.

209


మ.

ఇపు డేఁజెప్పిన యీ స్వయంభువులయం దెల్లం గడు న్మేటియై
క్షపితాశేష దురంత దోషచయమై కల్పాంతర స్థాయియై
యపవర్గప్రద యోజనద్వయయుతంబై భవ్యమై, దివ్యమై
విపులశ్రీకర రంగధామ మమరున్ వేదాంతవిఖ్యాతమై.

210


మ.

నరులైనన్ సురలైన దైత్యవరులైనన్ సన్నుతద్వాదశా
క్షరమంత్రైక పరాయణత్వమున నన్ సద్భక్తి సేవించినం
బరమైశ్వర్య సమగ్రభోగ వితతిం బ్రాపించి సర్వోత్తర
స్థిరవైకుంఠపదంబుఁ జెందుదురు ప్రీతిం గర్మనిర్ముక్తులై.

211


క.

పరమ మిది యొకరహస్యం
బరవిందజ వినుము మత్పరాయణు లెందుం
దురితములు పెక్కొనర్చియు
నరుగరు పటుఘోర నారకాధోగతులన్.

212


క.

గోవధ మాదిగఁ గల నా
నావిధ పాతకము లనుదినము మద్భక్తుల్
గావింపుచుందు రేనియు
నీవలఁ దద్దోషచయము నే హరియింతున్.

213

ఆ.వె.

తుది మదీయభక్తి వదలని జనుల నా
చారులైన హీనజన్ములైన
వారి నితరబుద్ధి వారక నిందించు
వార లట నికృష్ణవర్ణసములు.

214


మ.

ధరఁ బెంపొందిన మత్ప్రపన్నుల మదుక్తంబైన శాస్త్రంబు మ
త్పరమార్థంబగు మంత్రరత్నమును, మత్ప్రాణప్రతీకాశమై
నిరపాయం బగురంగధామమును దుర్నీతిన్ విచారించి యె
వ్వరు దూషించుచు నుందు రాఖలులు జిహ్వాచ్ఛేద్యు లుద్యద్గతిన్.

215


క.

మఱచియు శ్రీరంగంబున
నెఱుఁగని యజ్ఞాన మూఢు లెవ్వరు గల రా
మొఱకుల కిడు నశనాదులఁ
దఱికొని శునకమున కొసఁగదగు ననిశంబున్.

216


క.

వారక సకలజనంబులు
శ్రీరంగంబనుచు సంస్మరింపుదురేనిన్
నారక నాకము లనియెడు
నా రెండును ఖిలముగావె యరవిందభవా!

217


తే.

మర్త్యలోకంబునందు నంబరమునందు
నెప్పు డెచ్చోట శ్రీరంగ మొప్పియుండు
నప్పు డాదిక్కునకు భక్తి నభిముఖంబు
గాఁగ నిలిచి నమస్క్రియాకారి వగుము.

218


వ.

అని యానతిచ్చి యాశ్రితనిస్తారకుం డూరకుండెఁ దచ్ఛాసనంబున వారిజాస నుండును నిశ్రేయసనిదానం బగు నద్దివ్యవిమానంబు గొని సత్యలోక సీమాంతంబున విరజానది ప్రాంతంబున విశ్వకర్మ నిర్దేశంబున బ్రతిష్టాపించి,
నిరంతరానురక్తదివ్యోపచారవిరాజిత పూజావిధానంబున నద్దేవుని నారాధించుచు నారాయణనక్షత్రంబునం బరమహర్షంబున బ్రహ్మర్షి సహాయుండై మహోత్సవం బొనర్చి, యవభృధానంతరంబున నింద్రాది బృందారకబృంద పరివృతుండై వందారు మందారం బగు నానందకపాణి సందర్శనంబు గావించి, యావేళ నుదారస్వాంతుం డగు వివస్వంతునకుఁ

బాంచరాత్రంబు సమంత్రంబుగా నుపదేశించె నతం డౌరసుం డను వైవస్వత మనువున కొసఁగె, నాఘనుండు తనతనయుం డగునిక్ష్వాకున కెఱింగించె, నాభూభుజుండు చతుర్భుజునిఁ దపోవిశేషంబున మెచ్చించి కమలభవ
భువనసీమామందిరం బైన రంగమందిరంబు గొనివచ్చె, నివ్విధంబున
నిజాన్వయ పరంపరాప్రాప్తంబైన యాదివ్యధామంబు రామభద్రుండు
గుణసముద్రుం డగు విభీషణున కిచ్చె, నతనిచేత నది కావేరీతీరంబున
నునుపం బడియె నని పారాశర్యుండు నాగదంతమునివరున కెఱింగించిన
తెఱంగు.

219


ఆశ్వాసాంతము

శా.

బంధుప్రాంగణ కల్పపాదప! ధనుఃపాండిత్య కౌంతేయ! ద
ర్పాంధారాతి వసుంధరారమణ దుష్టామాత్య నీతిక్రియా
సంధాన ప్రబలాంధకారపటలీ సప్తాశ్వ! శశ్వన్నభ
స్సింధుక్షీర పటీర నిర్మలయశః శ్రీవాసి తాశాంతరా!

220


క.

పన్నగశయనవర ప్రతి
పన్న గజప్రకర తురగ బహుధన మణిసం
పన్న గతకలుష సుజన వి
పన్నగ సుత్రామ! సుజనపావననామా!

221


మాలిని.

నమ దవనవిలోలా! నవ్యశృంగారజాలా!
ప్రమదకరవిలాసా! భాగ్యలక్ష్మీనివాసా!
శమ దమ యుతభవ్యా! చారువిద్వన్నిషేవ్యా!
సమదరిపువిరామా! చాగయామాత్యరామా!

222

గద్యము.
ఇది
శ్రీ మద్భ్రమరాంబా
వరప్రసాద లబ్ధ సిద్ధసారస్వత
విలాసగౌరవ, గౌరనామాత్యపుత్ర
సుధీవిధేయ భైరవనామధేయ
ప్రణీతంబైన శ్రీరంగమహత్వం
బను పురాణకథయందుఁ
బ్రథమాశ్వాసము.