శ్రీరంగమహత్త్వము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరంగమహత్త్వము

పంచమాశ్వాసము

క.

శ్రీరఘునాయక మృదుపద
వారిరుహభ్రమర, బంధువత్సల, వంశో
ద్ధారణ, సుమహితమతివి
స్తారోరగసార్వభౌమ! చాగయరామా!

1


వ.

అవధరింపు మఖిలకథాకథనచాతురీజనితరోమహర్షణుండగు రోమహర్షణ
కుమారుండు దివ్యబోధనులగు శౌనకాదితపోధనుల కిట్లనియె.

2


క.

ఈజాడ కలితపుణ్యస
మాజంబగు నామ్రతీర్థమహిమ విని భర
ద్వాజుఁడు విపులతపోవి
భ్రాజితు వాల్మీకిఁ జూచి పలికెం బ్రీతిన్.

3


చ.

ఇది యొకపాదపంబు గడు నేచినశాఖల నెల్లదిక్కులం
బొదివి, మహాతపస్విజన పూజితమై గిరిఁబోలెఁ దోచుచు
న్నది, విలసత్ప్రసూనభరనవ్యమనోహరదివ్యవాసనా
ముదితమదాలిగాఁగఁ బరిమోహితముగ్ధకురంగబృందమై.

4


క.

శ్రుతిసుకరంబై, మధుర
శ్రుతికలితస్వరవిశేషసువ్యక్తంబై,
శ్రుతిఘోషము వినఁబడె వి
శ్రుతముగ నచ్చోట నేమి చోద్యము గలదో!

5


క.

వినిపింపుము నా కత్తెఱఁ
గని, వినయం బెనయఁ దన్ను నడుగ భరద్వా

జుని ననలకల్పతేజునిఁ
గనుఁగొని వాల్మీకమునిశిఖామణి పలికెన్.

6


చ.

వినుము కదంబభూజ మది విశ్రుత మయ్యెను దాని పేర న
య్యనుపమతీర్థమందుఁ బ్రియమార నిమజ్జన మాచరించున
జ్జను లఘముక్తులై పరఁగ శాశ్వతవిష్ణుపదంబునందుఁ బెం
పున వసియింతు రక్కడికిఁ బోదము రమ్మని సమ్ముదమ్మునన్.

7


మ.

అని రూపంబు ధరించి వచ్చు హరిలీలాప్తిం దిగంతంబులం
దనదేహప్రభ లుల్లసిల్లఁగ భరద్వాజాన్వితుండై రయం
బున వాల్మీకమునీశ్వరుం డరుగఁ దత్పుణ్యస్థలావాసస
మ్మునివర్గం బెదు రేగుదెంచి పరమామోదంబు సంధిల్లగాన్.

8


ఉ.

దందడి మొక్కునప్పుడు, సుధామధురప్రియవాక్యచాతురిం
గొందఱఁ బల్లవప్రతిమకోమలపాణిపరిగ్రహంబులం
గొందఱి, నాదరంబు సమకొల్పుల సత్పరిరంభణంబులం
గొందఱ, గారవించి మునికుంజరుఁ డందఱు దన్ను గొల్వఁగాన్.

9


చ.

అంబురుహాప్తబాలకిరణారుణకోమలపల్లవప్రభా
లంబముఁ జందనానిలచలత్కుసుమస్తబకప్రబుద్ధరో
లంబము, నాలవాలపరిలాలితకేళివిలోలమత్తకా
దంబము, నగ్రసంశ్రితపతత్రికుటుంబము నాకదంబమున్.

10


క.

డాయఁ జని, మ్రొక్కి, భక్తిం
బాయక పూజించి, పరమపావనమగు త
చ్చాయాసంశీతలవిమ
లాయతసికతాతలమున నాసీనుండై.

11


తే.

ఆరయ నివృత్తయాగచిహ్నంబు లచట
గానఁబడినఁ గౌతూహలాకలితుఁ డగుచు
వారియందు వయస్తపోవైభవముల
నధికుఁ డగు గౌతమునకు నిట్లనియెఁ బ్రీతి.

12

చ.

మునివర యీప్రదేశము సమున్నతయూపచయోపశోభితం
బును, బరిపూర్ణపాత్రపరిభూషితవేదివిరాజితంబునై
గనఁబడుచున్న దేనృపశిఖామణి సమ్మతిఁ జేసెనొక్కొ భూ
వినుత మహాధ్వరంబు లతివిశ్రుతదక్షిణ లిచ్చి యిచ్చటన్.

13


క.

అనవుఁడు నాగౌతముఁ డి
ట్లనియెన్ మిథిలాధినాథుఁ డైనవిదేహుం
డొనరించెఁ బెక్కుయాగము
లనఘ మహామునిసమేతుఁడై యచ్చోటన్.

14


ఉ.

నావుఁడుఁ బుట్టచూలి సుజనప్రియు గౌతముఁ జూచి సుస్వరం
బై వినవచ్చుచున్నది నిరంతరమై యొక వేదఘోష మీ
రావున నిట్టిచిత్ర మెచటన్ మును నే నెఱుఁగన్ మునీంద్ర! నీ
వావిధ మెల్ల నాకుఁ దెలియన్ వినిపింపు సవిస్తరంబుగాన్.

15


క.

అని యడిగినఁ బ్రాచేతస
మునివరుఁ డిట్లనియె గౌతముఁడు సకలజగ
ద్వినుతప్రభావభూసుర
వినుము పురావృత్త మొకటి వినిపింతుఁ దగన్.

16


శా.

భూనాథుల్ తనపంపు సేయఁగ జగత్పూర్ణప్రతాపోదయ
శ్రీ నొప్పారు విదేహభూమిపతి భూరిద్రవ్యదానంబులం
దీనానాథుల కెంతయుం బ్రియము సంధిల్లం బ్రయోగానుసం
ధానప్రౌఢిమ నీశ్వరానుమతి జన్నం బర్థిఁ గావింపఁగాన్.

17


క.

ఒకనాటి రాత్రి ఋత్విక్
ప్రకరముఁ బరిచారకులుకు బడలిన మేనన్
సకలంబు మఱచి నిద్రా
వికలేంద్రియు లగుచునున్నవేళం బెలుచన్.

18


చ.

అలరఁగ నొక్కకుర్కుర మనావృతభూరికవాటమైన త
త్సలలితయజ్ఞవాటము వెసం జనఁ జొచ్చి, తదంతరంబునం

గలయ మలంగి వేలిమికిఁగాఁ దగుపాత్రికలందు ముందు వా
రలవడ నుంచినట్టి పృషదాజ్యము నెమ్మది గ్రోలి వెండియున్.

19


ఆ.

అచట మంత్రపూతమగు పురోడాశంబు
కొంత కొంత మెసవి యంతఁబోక
తక్కుఁగల పదార్ధతతు లెల్ల మూర్కొని
తనిసి వెడలిపోయెఁ దనకుఁ దాన.

20


క.

ఆవేళఁ దెలసి ఋత్విజు
లావిధ మేమియును నెఱుఁగక విశిష్టద్ర
వ్యావలిఁ గ్రతువు సమాప్తము
గా వేల్వఁ గడంగుటయును గడుచిత్రముగన్.

21


వ.

మంత్రతంత్రంబు లెవ్వియుం దోపకున్న విషణ్ణహృదయులై ఋత్విగ్జనంబు
లధ్వరక్రియాప్రబుద్ధుండగు వృద్ధకశ్యపున కత్తెఱం గెఱింగించిన నతండును
భయార్తచిత్తుండై వారల కిట్లనియె.

22


ఉ.

అంచితశేముషీవిభవ మందఱు మెచ్చఁగ మున్ను నేనొన
ర్పించిన యాగముల్ కొలఁదివెట్ట నశక్యము నాకు నిట్టివొ
క్కించుకయుం బ్రయోగవిధ మిప్పుడు దోఁప దిదేమి చెప్ప నూ
హించిన విస్మృతిం బొరసె నేర్పడ నేర్చిన యన్ని విద్యలున్.

23


క.

అనుటయు నట్లు సదస్యులఁ
గనుఁగొని వారడుగ బుద్ధిగలిగి ప్రయోగం
బనఁగా నెట్టిది, మంత్రము
లన నెయ్యవి, నేమెఱుంగ మని రీ రీతిన్.

24


క.

జడులై ముందఱ దోఁపక,
తడఁబడ బుడిబుళ్లువోవ ధరణీశ్వరుఁ డ
య్యెడ వారిఁ జూచి మీకీ
చిడిముడిపా టేలవచ్చెఁ జెప్పుం డనినన్.

25

ఉ.

వారు నతాస్యులై ధరణివల్లభుఁ జూచి, నరేంద్ర! దీనికిం
గారణ మేమెఱుంగ మధికంబగు మేలొడగూడుచోట దు
ర్వారములైన విఘ్నములు వచ్చు ననేకము లంచు, భూమిలో
వారలు రూఢిగాఁ బలుకువాక్యము దప్పునె వేయునేటికిన్.

26


క.

నావుడు భూవిభుఁ డిక మన
కేవిధి ప్రజ్ఞావిశేష మేపారు మఖం
బేవెఱవున సంపూర్ణం
బై వెలయునటంచు ఖిన్నుఁడై చింతింపన్.

27


సీ.

అతని కిట్లనిరి వా రందఱు నీరీతి
నవనీశ పరితాప మందనేల
యేదేవుని గుఱించి యీ యాగమును చేయఁ
గైకొంటి వట్టిలోకైకనాథు
నాదినారాయణు, నాద్యంతవిరహితు,
నామ్నాయసంవేద్యు యజ్ఞపురుషు
దేవదేవుని, వాసుదేవుని నధికారు
నచ్యుతు నఖిలభూతాంతరస్థు


తే.

నాశ్రయింపుము హృద్గతంబైన మోహ
పటల మంతయుఁ బాపు నప్పరమపురుషుఁ
డుదయభానుఁడు దిక్కులఁ బొదివికొనిన
యంధకారంబు విరియించు నవ్విధమున.

28


ఉ.

నావుడు సంతసించి నరనాథుఁడు తానును వారుఁ గూడి, స
ద్భావమునం బ్రపన్నపరిపాలనలోలుఁ గృపాలవాలు రా
జీవదళాక్షు నిల్పి పెఱచింతలఁ ద్రోచి నివాతదేశసం
భావితదీపభాతిఁ జలభావ మొకింతయు లేక యున్నెడన్.

29


క.

వారక తమతమ పనులకుఁ
జేరిక చిత్రించి కట్టి చెలువునఁ జేష్టం

గూరక పలుకం గోరక
యూరక నివ్వెఱగు నొందియుండిరి సభ్యుల్.

30


ఉ.

అత్తఱి నొక్కసంయమి పరాపరతత్వవిచారశాలి, భా
స్వత్తులితప్రభానిధి, నిజప్రతిమప్రతిభావిశేషసం
పత్తిఁ దనర్చు శిష్యులు శుభస్థితిఁ గొల్వఁగఁ జొచ్చివచ్చె, ను
ద్యత్తపనీయదీప్తసముదగ్రకవాటము యజ్ఞవాటమున్.

31


వ.

ఇట్లు చనుదెంచి సమంచితధ్యానతత్పరులగు ఋత్విజులను రాజునుం జూచి
యిట్లనియె.

32


శా.

ఏలా విఘ్నము పొందె నీ క్రతువు, మీ కిట్లేటి కేతత్క్రియా
జాలం బూరక తక్కి, బాలిశులయోజ న్నిల్పి చింతాత్ములై
కాలక్షేప మొనర్చి తారు మొదలం గైకొన్నకార్యంబు ప్ర
జ్ఞాలంకారులు గేలిఁ బుత్తురె వ్యథాధ్యానంబునన్ బుద్ధియే.

33


మ.

క్రతుకర్మంబు సమాప్తి సేయుఁ డని వల్కన్ వార లావిప్రు నా
తతతేజోనిధిఁ బ్రీతి గల్గొని మహాత్మా! మంత్రభాగంబు మా
మతులం దోపక తత్ప్రయోగవిధి సామర్థ్యంబునన్ వ్యర్ధవి
స్మృతి నొందెం గతమెద్దియో! యెఱుఁగ మీచిక్కట్లు నెక్కొంటకున్.

34


క.

అని యీవిధమున వారును
వినయము తోడుతను బల్క విప్రాగ్రణి యా
మునుల గనుంగొని జలద
స్తనితగభీరస్వరంబు సమకొనఁ బలికెన్.

35


ఉ.

కారణ మెద్దియే నొకటి గల్గక యీమఖవిఘ్న మొందఁగా
నేరదు, గావునన్ వినుము నిక్కము సర్వమయాత్ముఁడైన యం
భోరుహనాధుఁ డిమ్మహితభూరుహమంద నిరంతరంబునం
గోరి వసించియున్కి నెఱుఁగున్ దరితో నివి సర్వవృత్తమున్.

36


క.

పూజించి యడుగుఁ డీతరు
రాజము నిది చెప్పు మీకుఁ గ్రతువిఘ్నం బే

య్యోజ సమకొనిన తెఱఁగు,సు
ధీజనవరులార! విస్మృతిం బడనేలా!

37


ఉ.

నావుడు సంతసించి నరనాథుఁడు ఋత్విజులున్ సదస్యులుం
బావనగంధపుష్పఫలపాయసపూపగుడాజ్యముఖ్యనా
నావిధసత్పదార్థకలనంబున నర్చ లొనర్చి రిమ్ములన్
సేవకకామితార్థఫలసిద్ధ్యవలంబము నాకదంబమున్.

38


ఉ.

భాతిగ నాకు నిప్పు డతిభక్తి నొనర్చిన యర్చనంబులం
బ్రీతుఁడ నైతి, మీవలనఁ బెద్దయు విప్రవరేణ్యులార! మీ
కీతఱి నిష్టమైన వర మిచ్చెద వేడుఁడు, నావుడు న్మనః
కౌతుకమార వారు పులకంబులు నెక్కఁగ నుద్గతాస్యులై.

39


మ.

క్షితిజాతోత్తమ! సర్వలోకపతి, లక్ష్మీమానసోల్లాసు, నా
శ్రితమందారు నుదారుఁ గౌస్తుభమణి శ్రీరంజితోరస్కు, న
చ్యుతునిన్ భక్తి గుఱించి యీనృపతి విధ్యుక్తంబుగాఁ జేయు స
త్క్రతురాజంబున కేము ఋత్విజులమై కర్మం బనుష్టింపఁగన్.

40


క.

ఏమంత్రము నేతంత్రము
మామతులకుఁ దెలివిపడక మానినకార్యం
బేమాయెనొ! యదిగాక మ
తేమాయెనొ! మే మెఱుంగ మేకారణమో!

41


క.

ఆవిధము దెలిసి మెఱసిన
మావిన్నదనంబు మాన్పి మంత్రనియోగ
ప్రావీణ్య మొసఁగి పూర్ణము
గావింపుము నీవు మఖ మఖండితకరుణన్.

42


చ.

అనవుడు నమ్మహావిటపియందు వసించిన రంగధాముఁ డి
ట్లను మునులార! మీ రలసి యధ్వరవాటిక నుత్కవాటబం
ధన మొనరింపఁగా మఱచి నల్గడలన్ సుఖసుప్తులైనచో
శునకము తన్మఖాలయముఁ జొచ్చి నిజేచ్ఛఁ జరించి యచ్చటన్.

43

క.

హోమద్రవ్యము లన్నియు
దా మూర్కొనిపోయె దానఁ దలకొని వేల్వం
గా మొనసిన కారణమున
నేమంత్రస్మృతియు మీకు నెసఁగక తక్కెన్.

44


క.

శుచిమద్ద్రవ్యంబుల నతి
శుచియై తద్దీక్షితుఁడు నిత్యశుచులగు ఋత్విక్
నిచయంబుఁ గూడి చేసిన
సుచిరక్రతు వొసఁగు బ్రియము శుచిషత్తునకున్.

45


వ.

కావున నపవిత్రంబులగు పాత్రానీకంబు పరిహరించి శుచిద్రవ్యంబుల నవ్య
గ్రులై యాగంబు పరిపూర్ణంబుగా నొనర్పుఁడు మీకుం బూర్వప్రకారంబున
సర్వమంత్రతంత్రంబులు ప్రయోగసులభంబులై దీపించెడి, నీమహీపాల
సత్తముండు నుత్తమగతిఁ బ్రాపింపఁగలఁ డని యానతిచ్చినఁ దత్ప్రసా
దంబున నఖిలవిద్యలు నవగతంబైన సవనంబు నిర్విఘ్నంబులైన నిర్వర్తించి
యమ్మునిసమాజంబును రాజును బరమానందంబునుం బొందిరి మున్ను
నిజసమ్మానితుండై యభిరూపంబు నొంది సకాశంబున కేతెంచి హితోప
దేశంబు చేసిన భూసురాగ్రణి యెవ్వం డని కుతూహలులై యిట్లనిరి.

46


మ.

పురుషవ్యాఘ్ర! భవత్ప్రసాదమున మాబుద్ధుల్ ప్రసన్నంబులై
పరగెం బర్విన దుర్విమోహతమముల్ పాసెన్ మనోవీథిలో
మరలం దోచె సమస్తవిద్యలును సామాన్యుండవే! సర్వది
గ్భరితస్ఫూర్తిఁ దలిర్చె నీదు శుభసాంగత్యప్రభాజాలమున్.

47


క.

ఎచ్చోట నుందు విచటికిఁ
గ్రచ్ఛఱ నరుదెంచినట్టి కత మేమి మఖం
బచ్చుపడ నిర్వహింపఁగ
విచ్చేసిన దొరవా! దివిజవిభుఁడవొ! చెపుమా!

48


వ.

అనిన నయ్యుత్తమపూరుషుండు మహర్షుల కిట్లనియె.

49


క.

వసియింతు నెల్లయెడలను
వసుధాసురులార! నాకు వాలాయంబై

యెసఁగిన పని లే దొకటియుఁ
బొసగుం జేరువయె నాకుఁ బోలిన లీలల్.

50


మ.

వినుతద్రవ్యసమృద్ధి గల్గి, త్రిజగద్విఖ్యాతచారిత్రులై
చను మీయట్టి మహాత్ము లెల్లి క్రియలం జాగింప సన్మాన్యవ
ర్తనుఁడై మించిన యీవిదేహవిభు సత్రం బంతరాయంబు నొం
దిన యాచంద మెఱింగి తత్పరిసమాప్తిప్రీతి నేతెంచితిన్.

51


తే.

క్రతువు సంపూర్ణ మయ్యె, భూపతికి మీకు
భద్ర మయ్యెడు, నేను నాభవనమునకు
బోయి వచ్చెద ననిన నప్పురుషసింహు
బాయఁజాలక యమ్మునిప్రవరు లెల్ల.

52


చ.

వెనుకొని యేఁగి, రప్పు డరవిందదళాక్షుఁడు వారి నందఱం
దనకరుణావలోకనసుధారసధారలఁ దొప్పదోఁపుచుం
దనుభవదివ్యసౌరభకదంబము దిక్కులఁ బర్వ నుర్విఁ బా
వనమగు నుల్లసచ్చరణవారిరుహంబులలీల మెట్టుచున్.

53


సీ.

ఆకదంబముఁ జేర నరుచెంచి తనకు న
మ్మును లాచరించు పూజనలు ప్రీతిఁ
గైకొని వారితో ఘనతపోధనులార
గురుతరం బగు వేదఘోష మొకటి
సకలకాలంబును శ్రవణమంగళముగా
నొదవుగా కని వరం బొకటి యొసఁగి
యంతర్హితుం డయ్యె నదియాదిగా ముని
సేవ్యమై శ్రుతినాదభవ్య మగుచుఁ


తే.

బొలుచు నేతత్ప్రదేశంబు భూరిజన్మ
సంచితోదగ్రపాపప్రపంచనక్ర
వక్రసంచారభయదభవప్రభూత
జలధిజృంభితబాడబజ్వలన మనఁగ.

54

వ.

అని గౌతమవరుండు చెప్పిన పుణ్యతీర్థప్రభావంబున కలరుచుఁ బరమతత్త్వ
వివేకి యగు వాల్మీకి యచటుఁ గదలి భరద్వాజసహితుండై మహితతపో
విరాజమానమునిసమాజపూజితంబును, బ్రసిద్ధసిద్ధచారణగీర్వాణసేవి
తంబును, సకలకాలకుసుమఫలభరితతరులతాపరివృతంబును, గ్రోశమండల
విస్తారంబును, నగు బిల్వతీర్థంబునకుం జనియె నని చెప్పి యప్పారాశర్య
వర్యుండు వెండియు నిట్లనియె.

55


సీ.

ఇంద్రు డేతరువె ము న్నెలమి నారాధించి
సురరాజ్యవైభవస్ఫురణఁ దనరె,
మైత్రేయినాఁగ బ్రాహ్మణి యేమహీజంబు
సేవించి యోగసంసిద్ధి నొందె,
వాలఖిల్యాదు లేవరపాదపచ్ఛాయ
నెల్లకాలము నాశ్రయించి యుందు,
రజనిర్మితంబైన యాగవేదిక నేఁడు
నేశాఖి క్రేవ నొప్పెసఁగి వెలయు,


తే.

విబుధమానవదైతేయవితతిలోన,
నెవ్వ రెవ్వరి కెట్టియభీష్ట మట్టి
వార లెల్లను నేధరణీరుహంబు
కొలిచి వడసిరి తమతమకోర్కు లెలమి.

56


తే.

అట్టి బిల్వంబుపేరఁ బ్రఖ్యాతమైన
యమ్మహాతీర్థరాజసామర్ధ్య మెల్లఁ
దెలుపు నితిహాస మొక్కటి గలదు వినుము
దానఁ బెడబాయుఁ బటుదురితవ్రజంబు.

57


సీ.

కలఁడు సోమకుఁ డనగా నొక్కరాజర్షి
వంశదీపకుఁడు దుర్వారబలుఁడు,
సత్యసంధుఁడు సర్వశాస్త్రతత్వజ్ఞుఁడు,
శమదమాన్వితుఁడు సజ్జనహితుండు,
జలధివేష్టితమహిచక్రేశ్వరుఁడు, నిత్య
ధర్మశీలుఁడు మహాదానశాలి

సతతయాగక్రియోత్సాహసంపన్నుండు,
సకలదిగంతవిశ్రాంతకీర్తి,


తే.

ఘనదయానిధి రూచకకల్పతరువు,
భూప్రజాలోకనోత్సుక ర్ణచంద్రుఁ
డతిజయోదారుఁ డంభోరుహాక్షదివ్య
చరణరాజీవయుగసమర్చనపరుండు.

58


క.

విగతస్పృహుఁడై తగ న
జ్జగతీనాయకుఁడు షష్టిసమములు కీర్తుల్
నెగడ ధరయేలి తనమెయి
నెగడిన జరఁ జూచి యాత్మ నెసఁగిన చింతన్.

59


మ.

జలదాకారము లింద్రజాలమహిమల్ సౌదామనీవిభ్రమం
బులు, గంధర్వపురంబు, లంబునిధిసంభూతోర్మికాజాలముల్
కలలో రాజ్యము, లెండమావులు, నటత్ఖద్యోతకీటద్యుతుల్
తలపోయంగ నసారసంసృతి సముద్యత్సౌఖ్యసంపన్నతల్.

60


క.

అదిగాన విపులభోగా
స్పదశాశ్వతపుణ్యలోకసంవాసము నా
కొదవెడునట్టి ప్రయత్నము
వదలక కావింపఁగా నవశ్యము వలయున్.

61


వ.

అని వితర్కించి.

62


చ.

విమలతపఃప్రసిద్ధులును వృద్ధులు శుద్ధులు వీతరాగులున్
శమదమయుక్తులున్ సకలశాస్త్రవిధిజ్ఞులు నైన సద్విజో
త్తములను సత్పురోహితవితానము నాప్తుల బంధుమిత్రులం
గ్రమమున గూర్చి వారి కధికంబగు పూజ లొనర్చి యిట్లునున్.

63


చ.

చదివితి నెల్ల వేదములు శాస్త్రములున్ బహుధర్మమర్మముల్
విదితముగాఁగ వింటి బహువిత్తము లిచ్చితి విప్రకోటికిన్

సదమలబుద్ధిఁ జేసితి ప్రశస్తమఖంబులు, జీవలోకసౌ
ఖ్యదములుగా వనంబులు జలాశయముల్ కడుఁ బెక్కొనర్చితిన్.

64


క.

సుకృతము లెడపక సేసియుఁ,
బ్రకటితసంపదలఁ బెంపు వడసియుఁ గులదీ
పకుఁడగు సుతుఁ గనుభాగ్యం
బొకటియ లే దనిన మనుజుఁ డొందునె శుభమున్.

65


క.

వరపుత్రవంతులకుఁ గల
దరయఁగ సద్గతిసుఖంబు, 'నాపుత్రాణాం
పరలోకస్థితి' యనఁగా
బరఁగెడు వాక్యంబు వినమె బహుశాస్త్రములన్.

66


క.

మేదిని బరఁగిన లౌకిక
వైదికధర్మంబు లెఱుఁగు వఱతలు గడుమీ
రేదిగతి చెప్పుఁ డిఁకఁ బు
త్రోదయలాభోత్సవంబు లొందని నాకున్.

67


ఉ.

నావుడు వార లమ్మనుజనాయకుఁ గన్గొని పూర్వజన్మసం
భావితపాపయుక్తి ననపత్యుఁడ వైతివి నీవు దీనికిం
గా వగ పేటికిం బటుశిఖావిసరోజ్వల మైనవహ్నిఁ గా
ష్టావలిఁబోలె గాచు నశుభాతిశయంబులఁ బుణ్యకర్మముల్.

68


వ.

తొల్లి దుందుమార సగర దిలీప దశరథాది మేదినీశులు హృషీకేశు నారాధించి
తత్ప్రసాదంబున నసాధారణబలపరాక్రమసౌభాగ్యవినయవిధేయత్వాదిగుణ
గణాదారులగు కుమారులం గనిరి, నీవును దత్ప్రకారంబునఁ గారుణ్యసింధు
వగు సింధురవరదునిం బూజింపుము, రథాంగపాణి భవన్మనోరధంబు సఫ
లంబు సేయు నెడసేయక తత్ప్రీతికరంబగు నధ్వరంబు గావింపు మనిన
సమ్మదం బంది యమ్మహీవరుండు.

69


క.

తన కనుసన్న నృపాలురు
పనిసేయు నుదారవిభవపరిణతదివిజుల్

గొనియాడ వేదవిద్యా
ఘనులగు భూసురులఁ గూడి క్రతు వొనరింపన్.

70


శా.

చండాంశుప్రతిమప్రతీకరుచు లాశాచక్రవాళంబునన్
నిండం బర్వ బ్రవాళపాటలజటానీకంబు దూలం గ్రియా
పాండిత్యప్రధమానసంయమికదంబం బర్థి సేవింప మా
ర్కండేయుం డరుదెంచెఁ దన్మఖదిదృక్షాకౌతుకోల్లాసియై.

71


తే.

అమ్మునీంద్రునిఁ గని వినయం బెలర్ప
నెదురుచని మ్రొక్కి తోడ్కొని యేఁగుదెంచి,
యర్హపీఠంబుపై నుంచి, యర్ఘ్యపాద్య
ముఖ్యసత్కారములు గ్రమంబున నొనర్చి.

72


క.

ఘనులగు తదీయశిష్యుల
మన మలరఁగఁ బూజచేసి, మనుజాధీశుం
డనురాగంబున నమ్ముని
యనుమతి ఋత్విజులుఁ దాను నాసీనుండై.

73


క.

క్షేమంబే మీకును, శిష్య
స్తోమమునకు నీతిబాధ చొప్పడక తపో
భూమి దలిర్చునె విఘ్నము
లేమియు గైకొనక జరుగునే సత్తపముల్.

74


చ.

అనవుడు, నమ్ముని ప్రవరుఁ డానృపుతో భవదీయరక్షచేఁ
బనువడు మాకు సర్వమును భద్రము, నీవును నీ సుహృజ్జనం
బును సుఖమున్నవారె, గుణభూషణ! సత్సుతలాభకాంక్ష నె
క్కొన నొనరించు నీమఖము కోరి కనుంగొన నిందు వచ్చితిన్.

75


క.

దీన భవదీప్సితార్థము
గానేరదు, పూర్వజన్మకలుషం బధికం
బై నరుఁ డొనరించెడి సుకృ
తానూనఫలాగమంబు నదిపెట్టు నృపా!

76

మ.

అతివిఖ్యాతములై మహిం బరఁగు పుణ్యక్షేత్రతీర్థంబు లం
చితబుద్ధిన్ భజియింపఁ గర్మములు సంక్షీణత్వముం బొందినన్
వితతంబై భజియించుకార్యములు నిర్విఘ్నంబులౌఁ గావునన్
క్షితినాథోత్తమ! తద్విధం బిపు డనుషేయంబు నీ కెమ్మెయిన్.

77


క.

నావుడు, నమ్మునిఁ గనుఁగొని
భావం బలరంగ నానృపాలుఁడు త్రిజగ
త్పావనచరిత్ర! తత్తీ
ర్థావలి నా కెఱుఁగజెప్పు మని వేడుటయున్.

78


వ.

మార్కండేయమునీంద్రుం డన్నరేంద్రున కిట్లనియె.

79


సీ.

వసియించు నెందేని వైకుంఠనాథుండు
ఫణిరాజభోగతల్పంబునందు,
నెందేని పరమయోగీంద్రు లేప్రొద్దును
బాయకుందురు పరబ్రహ్మనిరతి,
బహుభవార్జితపాపపటలంబు లెందేని
నిమిషమాత్రంబున సమసిపోవు,
మెఱుఁగుఁగోఱలతోడి మృత్యుదేవతగర్వ
మడఁచితి వెందేని నద్భుతముగ,


తే.

నట్టి శ్రీరంగమండలాభ్యంతరమున
నఖిలలోకైకపావనమైన మహిమఁ
గరము శోభిల్లు చంద్రపుష్కరిణిసుమ్ము
సకలతీర్థంబులకు నెల్లఁ జక్రవర్తి.

80


వ.

ఆతీర్థంబునకుఁ గ్రమంబున గంధవాహన నరవాహన పురహర పురందర
వైశ్వానర వైవస్వత పలాశన పాశధర దిశాభాగంబుల భజదమరసార్ధంబు
లగు తీర్థంబులు గల, వవియును, గేసరకదంబామ్రబిల్వజంబూపలాశాశ్వత్థ
పున్నాగాహ్వయంబు లన నంహోనిరాసంబులై భాసిల్లు నందుఁ బున్నాగ

తీర్థంబున బ్రహ్మవర్ఛసోదారుండగు వర్చసుండను బ్రాహ్మణుండు బ్రహ్మ
జ్ఞాననిరతుండై సంసారవిరక్తిం బొంది నిత్యానందంబు నొందె, భార్గవ
కులవిస్తారుండైన తారకుం డను తాపసాగ్రణి కేసరతీర్థంబునఁ దపంబు సేసి
భవపాశంబులం బాసె, జితారివర్గుండై వర్గగోత్రజాతుండైన రుక్మదృష్టి
భజదభీష్టఫలకదంబం బగు కదంబంబు నుపాసించి బ్రహ్మపదప్రాప్తు డయ్యె,
నఖిలలోకోపాస్యుడగు కాశ్యపమునీశ్వరుండు విధూతపావధూమ్రం బగు
సౌమ్రంబు నాశ్రయించి యమృతత్వంబు నొందె. మఱి యనేకు లీతీర్థంబుల
నిజమనోరథంబు లవితధంబులుగాఁ బడసి రని చెప్పి యామృకండనంద
నుండు వెండియు నిట్లనియె.

81


క.

శ్రుతిపర్వమై, మహాఘ
ప్రతతిం బాపుచు నభీష్టఫలదం బగునీ
యితిహాస మొకటి చెప్పెద,
క్షితినాయకతిలక చిత్తగింపుము ప్రీతిన్.

82


సీ.

జయధరుఁడను నొక్క జననాయకుఁడు సుధా
కరవంశ్యుఁడు ధరిత్రిఁ గలఁ డతండు
క్రూరుఁడై భూసురకోటికి నెగ్గులు
గావించువారు, తద్గావలోప
పావకజ్వాలలఁ బరితప్తహృదయులై
విసివి యారాజ్యంబు విడిచి చనిన,
శూద్రభూయిష్టమై శ్రుతిఘోషరహితమై
భయరోగదుర్భిక్షబహుల మగుచు,


తే.

నాడు నాటికి రాష్ట్రంబు నాశమొంది,
కరితురంగమరథభటకాంచనాది
సంపదల సొంపు సకలంబు ముంపు దప్పి,
దీనదశ నొందె నజ్జగతీవిభుండు.

83


క.

వాని సుతశతము నొక్కట
నానామయపీడఁ జాల నవసి కృతాంత

స్థానమున కరిగి రత్తఱి
నానరపతి సతులు దాను నడలుచు నుండన్.

84


శా.

అంతం బుష్కరిణీతటంబున హరిధ్యానామృతానందిత
స్వాంతుండై వసియించియున్న గురునిన్ వాల్మీక దర్శింప న
త్యంతప్రీతి దలిర్ప నేఁగుచు భరద్వాజుండు తన్మేదినీ
కాంతుం డున్నపురంబుపై నరుగ మార్గం బౌట నచ్చోటికిన్.

85


ఆ.

వచ్చి తనకు శిష్యవరుఁ డగుతత్పురో
హితునివలన నమ్మహీశ్వరునకుఁ
దొడరినట్టి కష్టదుర్దశ లన్నియు
విని మనంబులోనఁ గనికరించి.

86


క.

తా నటఁ జని, నిజగురునకు
నానృపువర్తనముఁ జెప్పె ననుకంప మదిం
బూని, ముని వాని రాష్ట్రము
లో నుండక చనిన విప్రలోకమునెల్లన్.

87


చ.

పిలువఁగఁ బంపి వారలకుఁ బ్రీతి దలిర్పఁగ నిట్లనున్ సము
జ్వలమతులార! మీ రలిగి వచ్చినయంతటనుండి పైపయిం
దలకొనినట్టి యాపదల దందడిఁ గుందిరి భూప్రజల్ మహీ
తలపతియున్ దురంతపరితాపనిపీడితుఁ డయ్యె నెంతయున్.

88


క.

నాలుగు పురుషార్థములకు,
నాలుగు వర్ణములవారి నడవడికిని, భూ
పాలకుఁడు కారణము త
న్మూలంబున నెపుడు సర్వముం దలపోయున్.

89


చ.

అలుకలు దక్కి నాపలుకు లాదటఁ గైకొని సత్కృపాగుణం
బలపడ ముద్ధరింపుఁడు మహామహులార! నితాంతశోకవి
హ్పులుఁ డగు మేదినీశుని దురంతములైన యుపద్రపంబులన్
బెలుకుఱి నెమ్మనంబు దలపించుచునున్న మహీప్రజాలికిన్.

90

వ.

అని చెప్పిన నతనివాక్యప్రబోధితులై క్రోధంబు లుడిగి ప్రసన్నచిత్తులైన
భూసురోత్రముల పశ్చాత్తాపమానసుం డగుమానవేంద్రునిం గలసి వారలఁ
దోడ్కొనుచు నత్తపోధనసత్తముండు నఖిలకామితార్థంబగు బిల్వతీర్థంబున
కరిగె నప్పు డయ్యెడ నున్న మహామునిగణం బితనిరాక గని రాకాసుధాక
రోదయంబున నున్నిద్రంబగు సముద్రంబునుంబోలె నిబ్బరంబుగా నుబ్బి
సముచితసత్కారంబు లాచరించి సమంచితాన్యోఽన్యప్రియభాషణంబులఁ
బరితుష్టులై యున్న సమయంబున.

91


చ.

అనుపమదివ్యసౌరభసమంచితకోమలగంధవాహముల్
మునుకొని వీచె, బిల్వతరుమూలమునన్ వరపుష్పవృష్టి భో
రన గురిసెన్, బదంపడి తిరంబున మ్రోసె నశేషవాద్యని
స్వనము లనంతరంబు వినవచ్చె మనోహరనవ్యగానముల్.

92


క.

ఈరీతి నుభయసంధ్యల
నారూఢములైన మంగళాచారము లే
వారఁ గని పుట్టఁజూలియు
భూరమణుం డద్భుతమ్ము బొందుచునుండెన్.

93


ఉ.

అక్కడి కేగుదెంచి సముదంచిత దివ్యతనుప్రభాతతుల్
దిక్కులఁ బిక్కటిల్ల నతితీవ్రతపోనియమప్రసిద్ధిఁ బెం
పెక్కిన శిష్యకోటి తను నెంతయుభక్తి భజింప లోకముల్
మ్రొక్కు సనత్కుమారమునిముఖ్యుఁడు తీర్థనిషేవణార్థియై.

94


క.

అప్పుడు వల్మీకభవుం
డప్పద్మజసుతుఁడు దాను నాత్మల ముదముం
జిప్పిల నాలింగనములు
చొప్పడ గావించి యుచితసత్పీఠమునన్.

95


వ.

సుఖాసీనులై యున్న యవసరమున నవగతమనోగతవికారుం డగు
సనత్కుమారు నుపలక్షించి యక్షయజ్ఞానకురారదారితసంసారభూజుం
డగు భరద్వాజుం డిట్లనియె.

96

ఉ.

ఇచ్చటఁ బుష్పవర్షములు, నింపెసలారఁగఁ బాడుపాటలున్,
మెచ్చుల మ్రోయుతూర్యములు, మేదురనాదములున్, మనంబులం
జేచ్చెర నద్భుతం బొదవఁ జేసి, మహాత్మ యెఱుంగ మేము ము
న్నిచ్చట నిట్టిచోద్య మిదియెంతయుఁ దేటపడంగఁ జెప్పవే.

97


సీ.

నావుడుఁ బరమేష్ఠినందనుం డెలమి ని
ట్లను భరద్వాజుతో ననఘ! మున్ను
సుత్రామసఖుఁడైన చిత్రసేనుం డను
గంధర్వుఁ డతిశుభాకారుఁ డొకఁడు,
తరుణీసమేతుఁడై తనుఁజేరి యనుచరుల్
గొలువంగఁ దా నదీకూలమునను
గెందమ్మికొలఁకులఁ గ్రీడాద్రిసానుదే
శంబుల దరులనుఁ జఱులయందుఁ


తే.

గలయ విహరించి, యొకనాఁడు గగనవీథిఁ
జనుచు శ్రీరంగమందిరచ్ఛాయ దాఁట
నది గనుంగొని కనలి సప్తార్ణవములు
గడవవైచిరి తీర్థరక్షకులు వాని.

98


వ.

అత్తెఱం గెఱింగి తత్సఖుండైన శతమఖుండు చతుర్ముఖాదేశంబున
దత్పాపంబుఁ బాయు నుపాయం బాదేశించిన నా గంధర్వుండు సర్వ సర్వం
సహాచక్రంబున నేము నీ శరణ్యంబులగు నరణ్యంబుల పాపలతాలవిత్రంబు
లగు పుణ్యక్షేత్రంబుల ప్రపంచితపురుషార్థంబు లగుతీర్థంబుల నుపా
సించుచు వచ్చి వచ్చి యఖిలలోకంబులఁ బావనంబు గావించు ప్రఫుల్ల
పుష్కరామోదపుష్కరయగు పుష్కరిణి నవగాహనంబు సేసి
శుద్ధమానసుండై యతిమధురగానవిద్యావిశేషంబున శేషశాయిని
బరితోషితుం జేసి తత్ప్రసాదంబున భువనసంస్తుత్యంబగు గంధర్వా
ధిపత్యంబుఁ బడసె. నది మొదలుగా నతం డీతీర్థంబున సితపక్షపంచమి
దివసంబున సర్వకల్యాణచారణు లగునారాయణుల నారాధించుచుండు.
నేఁ డిట్టిదివసం బగుటఁ బూజాసముత్సుకంబున సపరిచ్చదుండై వచ్చు చిత్ర
సేనుకృత్యం బిదియని యెఱింగించినఁ బరమహర్షభరితుండై భరద్వాజుండు
వెండియు నిట్లనియె.

99

క.

సితపక్ష పంచమీతిథి
నితరములగు వాసరముల నీతీర్థమునం
ధృతిఁ జేయవలయు నాద
వ్రతపూజావిధులఁ జెప్పవలయు మహాత్మా!

100


చ.

అనిన సనత్కుమారుఁడు ప్రియంబున నాతనితో విహంగవా
హనునకుఁ బ్రీతిగాఁ బ్రతిపదాదిదినంబుల నాచరించు పూ
జనలును సువ్రతంబులుఁ బ్రశస్తజపంబులు నాదిగాఁగఁ గ
ల్లిన నియమంబు లెల్ల నెఱిఁగించుచు సందు యథాక్రమంబునన్.

101


క.

ఏకాదశేంద్రియంబులఁ
బైకొను పాపముల నెల్లఁ బాపుచు ముక్తి
శ్రీకారణమై వెలసిన
యేకాదశి మహిమచంద మిట్లని చెప్పెన్.

12


సీ.

పటుఘోరపాతకపటలమహారణ్య
చటులసముజ్వలజ్వలనకీల
దుర్వారదారుణదుష్కృతసంఘాత
మేఘసంవర్తసమీరణంబు
భూరిభీషణపాపపుంజసముత్తుంగ
భూమిభృన్నిశితదంభోళిధార
దుస్సహదురితసందోహనిరంతర
ధ్వాంతప్రచండమార్తాండహేతి


తే.

క్రూరకల్మషకుంభికంఠీరవంబు
బీకరాఘౌఘపవనకుంభీనసంబు
కుటిలకిల్బిషపాథోధికుంభసూతి
భాసురంబైన శ్రీ విష్ణువాసరంబు.

103


క.

ధృతి నచ్యుతదిననిష్ఠా
శిత్రులగు రుక్మాంగదాంబరీషాదులు స

న్నుతి గనిరిగాదె మును శా
శ్వతకీర్తుల పరమభాగవతులం దెల్లన్.

104


వ.

అట్టి యేకాదశిప్రకారం బెట్టి దనిన.

105


చ.

దశమి ప్రభాతవేళ నుచితంబగు కాష్ఠముఁ బూని, మౌనియై
దశనవిశోధనంబు నుచితంబుగఁ జేసి కృతావగాహుఁడై
కుశలమతింగ్రియల్ నడపి, కోరి హరిం భజియించి యొక్కపూ
టశనము తా భుజించి శుచియై వనితారతిఁ దక్కి వేగినన్.

106


క.

మౌనమునఁ బుణ్యసలిల
స్నానం బొనరించి, సమయసముచితనిత్యా
నూనక్రియాకలాపము
మానక కావించి నియమమానసుఁ డగుచున్.

107


శ్లో.

ఏకాదశ్యా మహం కించి
దనశ్నన్ పురుషోత్తమ।
భోక్ష్యేహని పరేశ్రీమన్
పాహిమాం శరణాగతం॥


వ.

అని సంకల్పంబు చేసి.


సీ.

పరుల నిందింపక, పాషండజనగోష్ఠి
సలంపక, యనృతభాషణము లాడ,
కాగ్రహింపక శూద్రు నంట, కింటనె యుండి,
లలనతోఁ గలయ, కన్యులకు నెగ్గు
సేయక, దుర్జనశ్రేణిసంగతిఁ బోక,
క్రయవిక్రయాదుల కసనిపడక,
కోర్కులు మదిఁ బుట్టకుండ నిద్రింపక,
యనుచితకర్మము లాచరించ,


తే.

కమలమానసుఁడై యచ్యుతావతార
కథలు సద్భక్తి వినుచు భాగవతజనుల

సంగడంబునం గాలంబు జరుపవలయు
హరిదినంబున నుపవాసి యైనయతఁడు.

110


వ.

ఇట్లుపవసించి, సమంచితగోమయోపలిప్తంబును, ననేకవర్ణనియమమంగళరంగ
వల్లికాభాసురంబును, వివిధవిచిత్రవితానాభిరామంబును, బ్రవాళారుణపిప్పల
తోరణాలంకృతంబును, బరిశుద్ధవిశుద్ధఫలవిసరప్రసవమంజరీమంజులంబును,
గంధతైలప్రదీపితదీపరాజితంబును నగుపూజామండపంబున సముచితాసీ
నుండై, నలినమణిప్రభావిడంబం బగునంబరంబు లాపీతాంబరునకు సమర్పించి,
దర్పసారకర్పూరకలితగంధసారకలితకర్ధమం బాజనార్దనున కలఁది యనల్ప
మణికల్పితంబు లగునాకల్పంబు లాఫణితల్పునకు దొడివి, మరకతశ్యామా
భిరామకోమలతులసీదళదామంబు లావైకుంఠధాము కంఠంబున నునిచి,
కించిద్వికసితముకుళవకుళపున్నాగకేసరమాలతీనవమాలికారచితమాలిక
లావనమాలికిం దుఱిమి, ప్రభూతపరిమళితదిశాంగణంబు నగు దశాంగ
ధూపంబు లాదశావతారుని కొసంగి, సారఘనసారశకలసముద్దీపితంబు
లగుదీపంబు లాజగత్ప్రదీపునకు నివాళించి, హైయంగవీనపరిపక్వంబుల నానా
రూపంబులగు నపూపంబులను మధురగుణసంపన్నంబులగు పాయసాన్నం
బుల నమృతకరకళామోదనంబు లగుశాల్యోదనంబులను మరిచశర్కరా
సంప్రర్తితంబులై రుచిరపరిపాకంబు లగు శాకంబులను సకసరసాలవా
లంబులగు ఫలజాలంబులను గృతసుధాపరితోషంబు లగుపానీయవిశేషంబు
లను నతిహృద్యంబు లగునైవేద్యంబు లావేదవేద్యునకు నివేదించి, యప్పుండ
రికాక్షునకుఁ బ్రదక్షిణప్రణామంబు లాచరించి, బహువిధిస్తోత్రపాఠంబులఁ
బాటల నాటల వేగునంతకు జాగరంబు సేసి, మఱునాడు కృతస్నానుండై
కాల్యకరణీయంబులు దీర్చి, యచ్యుతారాధనానంతరంబున గురువందనం
బాచరించి, శ్రీమదష్టాక్షరానుసంధాననిష్ఠాగరిష్టులగు భాగవతశ్రేష్ఠుల నభీ
ష్టమృష్టాన్నదానంబులఁ బరితుష్టి నొందించి, వారి కంచఱకుఁ జందనమా
ల్యాంబరాభరణాదు లాదరంబునఁ దనకుఁ గలకొలంది నిచ్చి, నిజబంధుమిత్ర
సమేతంబుగాఁ బారణ యొనర్చి, పునర్భోజనదివాశయనస్త్రీసంగమాదుల
జరిగించక, వ్రతసమాప్తి సేయునతండు సప్తగోత్రంబుల నుద్ధరించి యక్ష
యానందపదంబగు వైష్ణవసదనంబు నొందు.

111

ఆ.

విష్ణువాసరమున వినుము కళామాత్ర
మైన దశమి గలసెనేని, వలవ
దుపవసింప దాన నొదవుఫలం బగ్ని
దృణము గాలినట్లు త్రుంగిపోవు.

112


ఉ.

కావున నట్టివాసరము గల్గిన నాతిథి మాని, బారసిం
బావనబుద్ధి మీరు సుపవాసము జాగరణంబు దీర్చి యా
వేవినఁ బారణంబు కడువేడుకఁ జేసిన ధన్యుఁ డొందు, నా
నావిధయజ్ఞదానకరణంబునఁ జేకుఱు పుణ్యసంపదల్.

113


చ.

ఋతువులలో వసంతము మహీధరసంతతిలో సువర్ణప
ర్వతము, గ్రహంబులందు దినరాజు, తరంగిణులందు గంగ, గో
వితతులలో మరుత్సురభి, వేల్పులలో హరిఁ బోలె, నుత్తమ
వ్రతములలోన జక్రధరవారము సువ్రత మొప్పు నెంతయున్.

114


సీ.

ఖలుఁడు, స్వామిద్రోహి, గరదుఁ, డనాచారి,
పరదూషకుఁడు, సురాపానరతుఁడు,
గృహదాహకుఁడు, సత్యరహితుఁ, డన్యాంగనా
సక్తుండు, జీవహింసాపరుండు,
గురుతల్పగుఁడు, కృతఘ్నుఁడు బ్రాహ్మణద్వేషి,
పశుఘాతకుఁడు, సాధుబాధకుండు,
వ్రతవిహీనుఁడు, సువర్ణస్తేయ, దుష్ప్రతి
హరజీవనుండు, దుష్టాన్నభోజి,


ఆ.

వేదనిందకుండు నాదిగాఁగల పాప
శీలు రెల్ల నితరచింత లుడిఁగి,
హరిదినంబు వ్రతము జరిపి శుద్ధాత్ములై
పడయఁ గాంతు రమృతపదము తుదను.

115


క.

మును దేవవ్రతుఁ డనఁగాఁ
జనుభూసురుఁ డొకఁడు యోగిజనసేవితమై

దనరెడు పుష్కర తీర్థం
బునఁ జిరకాలము వసించి పూతాత్ముండై.

116


ఆ.

లీలం జూచి చూడలేనిసంపద సుఖ
స్ఫురణఁ దలఁచి విషయనిరతిఁ గుంది,
ప్రకటతేజుఁ డగుపరాశరశిష్యు మై
త్రేయమునివరేణ్యు డాయ నరిగి.

117


చ.

వినయవినమ్రుఁడై మొగము వెల్వెలఁ బాఱఁగ నున్నయాతనిం
గనుఁగొని, యమ్మునీశ్వరుఁడు కారణ మెయ్యది? నీవు దీనతం
బొనుపడి యిట్లు డయ్యుటకు భూసురసత్తమ! నాకు జెప్పు నీ
మనసుకళంకు సర్వమును మాన్పెద నావుఁడు నాతఁ డిట్లనున్.

118


చ.

తొడరిన శోకమోహముల త్రొక్కుడులం బడి చిక్కి పైపయిం
బొడము మహోపతాపములఁ బొక్కెడు ప్రాణులపాటుఁ జూచి తా
నడరుచునున్న దుర్భవభయాకులతం గృశియించు నన్ను ని
ట్లడుగఁగనేల నిప్పుడు మహాత్మ సమస్తము నీ వెఱంగియున్.

119


క.

ధీరమతి నెచటి కరిగిన
వారలు మఱి మాతృగర్భవాసములకు రా
రారూఢముగా మోహం
బేరీతిని బాయు, నాకు నెఱిఁగింపు తగన్.

120


వ.

అనిన మైత్రేయుఁ డిట్లనియె.

121


సీ.

నిత్యుఁ, డక్షరు, డాత్మనిశ్చలుఁ డవి రి స
చ్చిదానందభాస్వత్స్వరూపి,
తతగుణాత్మకము, నిత్యము సర్వకా
రణమును, భూతకారణమును దనర్చి,
పరఁగు నీరెంటిలోపలి తారతమ్యంబు
నరసి చూచిన మహదంతరంబు

ప్రకటతేజస్తమఃపటలంబునకుఁబోలె
బరగు వీనికి పరస్పరవిరోధ


తే.

మమల మగు నాత్మప్రకృతి సంగమముఁజేసి
కర్మవశుఁడై స్వతంత్రుఁడుగాక పొందు
నమరదేహాదులందు దుఃఖమును సుఖము
గొనఁ గర్మక్షయము సేఁత కార్యఘనము.

122


చ.

శమమును దేహశోషణము శౌచము నింద్రియనిగ్రహంబు ని
ర్మమతయు నన్నహీననియమంబును మౌనము వేదశాస్త్రపా
రమును విరక్తియుం గడు దృఢంబగు సత్యమునుం దపస్వరూ
పము లని చెప్పుచుండుదురు పల్మఱు ధర్మరహస్యకోవిదుల్.

123


క.

అట్టితప మనులవిత్రము
గట్టిగఁ జేపట్టి కర్మ మనులతల మొదల్
ముట్టఁ దునుము నరునకుఁ జే
పట్టఁగఁ బోలదె విముక్తిభవబంధములన్.

124


క.

కావున నుపవాసవ్రత
పావనతీర్థావగాహపరిణతమతివై
నీవు చరింపుము నావుఁడు
దేవవ్రతుఁ డత్తపస్వితిలకున కనియెన్.

125


క.

ఏనెల యేదివసంబున
నేనేమముతోడ మనుజుఁ డేదేవునకుం
గా నుపవసింపఁదగు నీ
వానతి యావలయు నాకు నత్తెఱఁగెల్లన్.

126


వ.

అని మైత్రేయుఁ డాధాత్రీసురసత్తమునకు వ్రతోత్తమంబు హరివాసరోప
విదితంబుగా నిప్పుడు నీకుఁ జెప్పిన తెఱంగునఁ జెప్పిన, ననురాగతరంగి
తాంతరంగుండై యమ్మునిపుంగవు వీడ్కొని దేవవ్రతుండు తద్వ్రతాచరణం
బున సుదర్శనపాణిం బ్రీతునిం జేసి పరమయోగీంద్రగమ్యంబును సహస్ర

కిరణసహస్రప్రభారమ్యంబును నగువిష్ణులోకంబున ననేకకల్పంబులు సుఖం
బుండె నని సనత్కుమారుండు వెండియు నిట్లనియె.

127


చ.

కుశలుఁ డనంగ నొక్కనృపకుంజరుఁ డొప్పు సురద్రుమంజరీ
శశధరకుందకందుకవిశారదశారదచంద్రచంద్రికా
విశదయశోవిశాలుఁ డరవిందహితాన్వయదీపకుండు దో
ర్నిశితకృపాణనిర్దళితనిష్ఠురశాత్రవవీరుఁ డుర్వరన్.

128


ఉ.

అతఁడు ద్వాదశివ్రతపరాయణుఁడై, కమలాక్షుఁ గౌస్తుభ
ద్యోతితవక్షు నిండుమదితో భజియించుచు, నొక్కనాఁడు సం
జాతకుతూహలంబున నిజప్రియబాంధవుఁడైన భానుమ
త్సూతిఁ గనుగొనం జనియె సుందరహేమరథాధిరూఢుఁడై.

129


క.

సమవర్తియు నానృపవరు
బ్రమదంబున గౌఁగిలించి బహుమానముగా
రమణీయరత్నమయపీ
ఠమునం జేసేతఁ దిగిచి డగ్గఱ నునిచెన్.

130


క.

ఆతఱిఁ దత్సముఖమ్మున
యాతనలకుఁ దిగువ విహ్వలాత్మకులై త
ద్దూతలచేత దృఢగదా
ఘాతంబుల నొరయ నారకప్రకరములన్.

131


క.

కనుఁగొని భయంబు మనమున
బెనఁగొన, నంగములు వడుక, బెగ్గిలి దీనా
ననుఁడై తపించి సింహా
సనవిమతియు నొంది యరుగు జననాయకునిన్.

132


చ.

కనుఁగొని కాలుఁ డిట్లను జగన్నుతపుణ్యచరిత్ర! నేఁడు నీ
మనమున నిట్టిభీతి పొడమం గతమెద్దియొ కాకవిస్మృతిం
దనుకుట కేమికారణము? తప్పక చెప్పుము నాకు నావుఁడున్
వినయవినమ్రుఁడైన పృథివీపతి యాతనితోడ నిట్లనున్.

133

క.

నానావిధబాధలచే
మేనులు తుత్తుమురుగాఁగ, మిగిలిన వగలన్
మానక వాపోయెడి నీ
ప్రాణుల వీక్షించి భయము నందితి ననియెన్.

134


క.

ఆనరపతి కిట్లను రవి
సూనుఁడు, భూనాథ! వింతచోద్యంబులు నీ
చే నెఱిఁగితి మిట్టిది గల
దే 'నియతిః కేనలంఘ్యతే' యన వినమే!

135


క.

దురితాత్ములకును, నిర్మల
చరితులకును, విపులదుఃఖసౌఖ్యము లొందం
బరమేష్ఠికల్పితము లగు
నరకస్వర్గములు నూతనములా తలఁపన్.

136


క.

మును చేసిన దురితమ్ముల
కనురూపములైన తీవ్రయాతనలఁ గడున్
వనరుచు మొఱలిడు వారలఁ
గనుకొని నీ కేల భీతిఁ గంపింప నృపా!

137


ఉ.

నావుఁడు నిట్లనున్ మనుజనాయకుఁ డాసమవర్తితోడ నా
నావిధతీవ్రబాధల ననారతముం బరితాప మంది వా
పోవుచునున్నవారు తమపూర్వభవంబున నెట్టి పాపముల్
వావిరిఁ జేసినారోొ? బలవద్విషయవ్యసనాతిసక్తులై.

138


సీ.

ఆనతి యిమ్మన్న నమ్మహీనాథుతో
ననియె వైవస్వతుం డనఘ! వినుము,
గురుల, దేవతల, భూసురులను నిందించు
దుష్టాత్ములను, మహాదురితమతులు,
నాచారహీనులు, నతినిర్దయాత్ములు,
గ్రూరకర్ములుఁ, గృతఘ్నులును, ఖలులు,

పరసతీకుచకుంభపరిరంభనిరతులు,
విష్ణుమంగళకథావిముఖమతులు,


తే.

నైన పాపాత్మకులు వీర, లట్లుగాన
వెమ్ముచున్నారు నరకాగ్ని విపులశిఖలఁ,
గరుణ భావించి నాకును గాచి పంప
రాదు, విధికల్పితంబు నిరాకరించి.

139


వ.

అనిన గృతాంతునకు నమ్మహీకాంతుం డిట్లనియె.

140


ఆ.

సకలజంతుసమితి సుకృతదుష్కృతములు
నీ వెఱుంగుదేని, నేనొనర్చు
నట్టిపుణ్య మెద్దియైనను గల్గిన
నంతవట్టు నాకు నానతిమ్ము.

141


చ.

అనుడు పరేతనాధుఁ డహిమాంశుకులోద్భవుఁడైన యవ్విభుం
గనుఁగొని నీచరిత్రము జగన్నుతిమంతము సర్వలోకపా
వన భవదీయకీర్తిసురవాహిని నీవు సమస్తపుణ్యవ
ర్తనులకు నెల్ల మేటివి, కరస్థము లారయఁ బుణ్యలోకముల్.

142


చ.

వ్రతములలోఁ బ్రశస్తము ధ్రువంబుగ మానవనాథ ద్వాదశీ
వ్రతమది నీవు నిష్ఠ నొకవత్సర మర్ధిఁ జరించినాఁడ వూ
ర్జితమగు నమ్మహత్వమునఁ జేసి భవద్భవసంచితాఘసం
తతి లయమొందెఁ దత్ఫలమితం బది యెంతని చెప్పవచ్చునే!

143


చ.

అనిన నృపాలుఁ డిట్లనియె నర్కజ! యీనరకాగ్నులందు వే
దనఁ బడువీర లిందఱు ముదంబున సద్గతి కేఁగునట్లుగా
నెనయ మదీయపుణ్యమును నిచ్చెద నేనొక కొంత నీవు చె
ప్పినగతి నంతవట్టు వినిపింపుము నావుడు ధర్ముఁ డిట్లనున్.

144


ఉ.

భానుకులావతంస! యొకపారణ నీ వుపవాసముండఁగా
నైనఫలంబు వీరికి దయామతి నిచ్చినఁ దీవ్రయాతనల్

మాని ప్రమోదసంభరితమానసులై మఱి నీవుగన్గొనం
గా నమరేంద్రలోకముకుఁ బొందుగ నేఁగెద రిప్పు డందఱున్.

145


వ.

అనిన హర్షించి యారాజర్షివరేణ్యుం డగణ్యంబగు నేకద్వాదశీవ్రతపుణ్యఫలం
బానిరయనివాసుల కొసఁగిన దత్క్షణంబ.

146


శా.

చంచత్కంకణముల్ చెలంగ సురయోషారత్నముల్ లీలమై
కుంచెల్ వేయఁగ సిద్ధచారణవరుల్ గొల్వఁగ దివ్యప్రభూ
తాంచత్కాంచనకింకిణీగణవిమానారూఢులై తేజముల్
మించం బోయిరి నారకుల్, త్రిదివకేళీలోలచేతస్కులై.

147


వ.

అప్పుడమిఱేని కారుణ్యభావంబునకు భావం బలర నతని సంభావించి
యావైవస్వతుం డిట్లనియె.

148


ఉ.

కంటె నరేశ! దైవతశిఖామణియై, నిజభక్తకోటిన
ట్టింటినిదానమై! త్రిజగదీశ్వరుఁడైన సరోజనాభు లో
నంటినభక్తి గొల్చిన సమంచితపుణ్యఫలంబు పెంపు, ని
ష్కంటకమోక్షమార్గ మని చాటుఁ గదా హరిసేవ వేదముల్!

149


క.

వెఱవకు భవతాపములకుఁ
బఱవకు పరదైవతముల భజియింపఁగ వా
చఱవకుము భోగవితతికి,
మజవకు హరి నీవు వేయుమాటలు నేలా?

150


ఆ.

అని హితోపదేశ మొనరించి, సఖ్యంబు
వెలయ నాదరించి, వీడుకొల్ప
మగిడివచ్చి కుశలమండలాధీశుండు
నిజపురంబునందు నెమ్మి నుండె.

151


సీ.

అతిభక్తి హరిదినవ్రత మాచరించిన
దురితముల్ దవ్వులఁ దూలిపోవు,
సకలపుణ్యంబులు సమకూరు, నాయువు
పెంపొందు, నెలమి సంపదలు మిగుల

విజయంబు సిద్ధించు, విద్యలు చేకూరు,
నైశ్వర్య మంతంత కతిశయిల్లు,
సంతానమందుఁ దేజము మీఱు, నారోగ్య
మొసఁగుఁ గీర్తులు దిశలెల్ల నిండు,


తే.

నమరులకునైన దుర్లభ మగుచు వెలయు
నట్టివైష్ణవకులమునఁ బుట్టఁ గలుగు
విమలవైరాగ్య మంతయు విస్తరిల్ల
నొనర నచ్యుతపదమున నుండుఁ దుదిని.

152


వ.

అని చెప్పిన, సనత్కుమారుండు సగరుండగు భరద్వాజుచేతఁ బూజి
తుండై యథేచ్ఛం జనియె, జయధరధరాధీశుండును బ్రాచేతసప్రబో
ధితుండై తద్వ్రతం బాచరించిన సకలవిపద్విముక్తుండును బరిపూర్ణ
మనోరథుండునునై విగతోపద్రవంబును వితతభద్రంబును నగు నిజ
చక్రం బవక్రవిక్రమంబున బరిపాలింపుచు బలపరాక్రమోదారులగు
కుమారుల నూర్వురం బడసి తత్పుత్రపౌత్రసమేతంబుగాఁ బెద్దకాలంబు
సంతానానందభరితుండై యుండి యొక్కనాడు.

153


మ.

అతులస్యందనగంధవారణతురంగానీకముల్ సత్పురో
హితసామంతసుతాప్తవర్గము బ్రియం బేపారఁ దన్గొల్చిరా
వితతైశ్వర్యసమేతమై నిగుడ నుర్వీనాథుఁ డేఁగెన్
జితరంగేశపదారవిందయుగళీసేవాసముల్లాసియై.

154


క.

ఈజాడ నరిగి, త్రిభువన
పూజిత మగు బిల్వతీర్థమున నెలమి భర
ద్వాజాది శిష్యయుతుఁడై
రాజిల్లెడు ఘనతపోభిరతు వాల్మీకున్.

155


చ.

కని వినయంబు సంభ్రమముఁ గౌతుకమున్ మది నెక్కొనంగ మ్రొ
క్కినఁ, గడు గారవించి, మునికేసరి యవ్వసుధాతలేశునిం
దనుఁ గదియంగ నుంచి, యుచితంబగు పూజ లొనర్చి సేమమే
మనుజవరేణ్య! నీకును గుమారులకున్ సుహృదాప్తకోటికిన్.

156

వ.

అని కుశలప్రశ్నంబు గావించె, నప్పు డాపార్థివోత్తముండు.

157


సీ.

కమనీయతీర్థావగాహనోత్సాహులై
సంతసపడు మహాసంయములును
సదమలభూరుహచ్ఛాయల హరికధల్
రాణింపఁ జెప్పు పౌరాణికులును
సలలితసైకతస్థలముల హరిపూజ
గావించు పరమభాగవతవరులు
స్ఫటికోపలములందుఁ బ్రణవమంత్రాభ్యాస
రతచిత్తులగు పరివ్రాజకులును


తే.

భయదదుర్భరఘననిదాఘప్రతప్త
జంతుచాతకజలధరసమయ మగుచు
నఖిలలోకైకపావనమై దనర్చు
బిల్వతీర్థంబుఁ జూచి సంప్రీతి నొంది.

158


శా.

స్నానం బందొనరించి, నిత్యవిధు లోజం దీర్చి యచ్చోటి స
న్మౌనిశ్రేణికి భక్తి మ్రొక్కి, పిదపన్ వారందఱుం దోడరా
భూనాథుం డటఁ బోయి గాంచె మణివిస్ఫూర్జన్మహాగోపురా
గ్రానూనధ్వజతుంగమున్ గుహరమాయాభంగమున్ రంగమున్.

159


చ.

కనుఁగొని డాసి యచ్చట నకల్మషబుద్ధులు నిత్యసిద్ధులుం
జననుతసౌమ్యమూర్తులును సన్మణిభూషణనవ్యమాల్యచం
దనఘనతాభిరాములును, దామరసాక్షసమర్చనక్రియా
జనితసముత్సుకాత్ములును, శాంతులునై విలసిల్లు పుణ్యులన్.

160


ఆ.

రత్నభూషణాంబరమ్ములు ప్రత్యగ్ర
భూరివస్తుతతులఁ బూజ సేసి,
వందనం బొనర్చి వారిసంగతి రంగ
మందిరంబుఁ జొచ్చె మనుజవిభుఁడు.

161


శా.

సేవించెం జగదేకబంధుఁ గరుణాసింధున్ సమున్నిద్రరా
జీవాక్షుం గమలాఘనస్తనయుగశ్రీఖండసంవాసిత

శ్రీవత్సాంకితవక్షు, నీలమణిసుస్నిగ్ధాంగు, రంగేశ్వరున్,
భావాతీతు మహానుభావు ఫణిరాట్పర్యంకసంశోభితున్.

162


తే.

పిదప నద్దేవుపరిచారబృందమునకు,
గొలఁది యిడరాని ధనములు వెలయ నొసఁగి
యతులవిజ్ఞానసంపన్నులైన యట్టి
సంయమీంద్రులుఁ దాను నాచక్కి వెడలి.

163


మ.

ధరణీనాథుఁడు గాంచెఁ దప్తకనకోద్యత్పక్షు శుంభద్దివా
కరబింబస్ఫురితాస్యుఁ దీవ్రనఖసంఘాతున్ బృహద్వక్షు భా
సురు నాత్మప్రమదప్రభూతు విభాగస్తోమావృతున్ నిమ్నగాం
తరచంచత్పులినాసనసుని శకుంతశ్రేష్ఠు దానొక్కరున్.

164


క.

కమలాక్ష! రంగనాయక!
కమలావల్లభ! సమస్తకారణ! పురుషో
త్తమ! యనుచు మాటిమాటికి
బ్రమదాశ్రువు లుప్పతిల్లఁ బలికెడువానిన్.

165


క.

కని విస్మయంబు మనమున
దనుకం గనుఱెప్ప లిడక, తనుఁ జూచునృపా
లునితోడఁ బక్షిపుంగవుఁ
డనియెన్ ఘనమై గభీర మగు వాక్యములన్.

166


తే.

ఎవ్వడవు నీవు? నీ కులం బెద్ది? నీకు
జనకుఁ డెవ్వఁడు? బహుసైన్యసమితితోడ
నిటకు వచ్చిన కారణం బేది చెప్పు!
మనిన నా ఖగముఖ్యున కనియె నృపతి.

167


ఉత్సాహ.

అనఘ! సోమవంశతిలకుఁడైన తీర్థధరుని నం
దనుఁడ, జయధరుం డనంగఁ దనరువాఁడ లోకపా
వన విచిత్రమహిమ గలుగువాఁడ నెసఁగు పుష్కరం
బునకుఁ దీర్థమాడ వచ్చి భోగిరాజతల్పునిన్.

168

క.

శ్రీరంగభర్తఁ గరుణాం
భోరాశి భజించి మగిడిపోవుచు నిచటం
బ్రారబ్ధకర్మఫలమున
భూరిజ్ఞాననిధి నిన్నుఁ బొడగనఁ గంటిన్.

169


ఉ.

వారనిదప్పిఁ దట్టువడువానికిఁ జల్లనినీరు నాకటం
గూరి కృశించు దీనునకుఁ గోరినయన్నముఁ జాల లేమిచే
నారటమందు పేదకు మహానిధియున్ సమకూరినట్లు వి
ద్యారతి నున్ననా కొదవెఁ దావకసంగతి పక్షిపుంగవా!

170


క.

వితతభవానలకీలా
ప్రతతి ననారతముఁ జాలఁ బరితప్తుఁడనే
కృతిమాలియున్న నాకే
గతి నిత్యసుఖావహంబు గలుగు మహాత్మా!

171


వ.

అనినఁ దద్వచనంబులకు సంతసించి శకుంతవల్లభుం డిట్లనియె.

172


ఆ.

మున్ను మునులు యోగముఖ్యులు నిగమాబ్ధి
తలఁపుఁ గవ్వములను దఱచి తఱచి
తనరఁ దెచ్చినట్టి తత్త్వామృతంబు నీ
కే నుపన్యసింతు మానవేంద్ర!

173


చ.

అవిరళకర్మపాశనిచయంబులచేఁ బ్రతిబద్ధుఁడై భవా
ర్ణవమున మున్గుచున్ భయమునందెడు కష్టపుదేహికిన్ నృప
ప్రవర! ముకుందపాదయుగపంకజసంస్మరణంబు దక్క నె
య్యవియు సముద్ధరింప నసమర్థము లన్ని దురుక్తులేటికిన్.

174


క.

కనుమూసి తెఱచినంతన
మునుకొని కాలంబు భూతముల ప్రాణంబుల్
గొనుఁగాన, మోక్షయత్నం
బనఘా! తడయక నొనర్పనగుఁ బ్రాజ్ఞులకున్.

175

క.

క్రీడారతుఁడై, పిన్నట
నాఁ డెఱుఁగఁడు, యౌవనంబునం గాముకుఁడై
యాడుకొను, ముదిమి నామయ
పీడలఁ బడి చిక్కి మొదలు వెట్టుచునుండున్.

176


వ.

కావున.

177


క.

త్రాడువడి యింద్రియంబులు
పోఁడిమి చెడిపోనినాఁడు, పుణ్యము సేయన్
లేడేని వాని కొదవునె
మూఁడేండ్లకు లేని బుద్ధి ముప్పదియేండ్లన్.

178


క.

ఒక్కెడ నఖిలజగంబుల,
నొక్కెడను విరక్తు నునిచి యొగిఁ దులదూఁగన్
మిక్కిలి శక్తి విరక్తుఁడ
తక్కక ములుసూపె నద్భుతంబుగ నధిపా.

179


క.

కలితసరసాన్నలలనా
కలనాదవినోదమధురగానంబులపై
పలుదెసలఁ బాఱు మనసుకు
గలుగునె వైరాగ్య మెంతకాలముకైనన్.

180


క.

పుట్టును జావును వెస నివి
కట్టడి వైరాగ్యమునకుఁ గనుమఱువై, యి
ట్టట్టు చలింపని యఘముల
పట్టడపఁగ జాలుఁ తీర్థభజనంబు నృపా!

181


మ.

నరనాథోత్తమ! పుణ్యతీర్థములలోనం బెద్ద, యాచంద్రపు
ష్కరిణీతీర్థము, దివ్యదేశముల శస్తంబైన శ్రీరంగ మా
హరికిన్ నిత్యనివాసమై యునికి, నట్లౌటం బ్రియంబార నీ
సరి దభ్యర్ణమునన్ వసించితి మనస్తాపాపనోదార్థినై.

182

క.

సకలకలికార్షకల్మష
నికరనిరాకరణమహిమ నెగడి మునీంద్ర
ప్రకటిత మగు నితిహాసం
బొకటి గలదు చిత్తగింపు ముర్వీనాథా!

183


సీ.

మును ప్రభాకరుఁ డనుముని, గర్గగోత్రసం
జాతుండు గలఁడు, ప్రశాంతచిత్తుఁ,
డవిరతబ్రహ్మచర్యాన్వితుండు నసమ
ప్రతిభావిశేషసంపన్నుఁ డతఁడు
పటు తపశ్శక్తిమై పరమాయు వేపారఁ
బడసి విశ్వంబరాభార మెల్లఁ
గలయఁ జరించుచుఁ గలకాల మెల్లను
వినుత వేదాభ్యాస మొనరఁ జేసి


ఆ.

పాఠ మొప్ప దానిఁ బఠియింప శక్రుండు
నాకవిపులపాకకలితుఁ డగుచు
చిన్నబోయి యాత్మఁ జింతించి తపమున
నిజమనోరథంబు నెరపఁ బూని.

184


క.

నాలుఁగుదెసల నుదగ్ర
జ్వాలాభీలంబులైన వహ్నుల నడుమం
గాలియ తన కశనముగాఁ
గ్రోలుచు బదియేండ్లు నడచెఁ గొంచక మఱియున్.

185


క.

కొంచెపుటూర్పును బుచ్చక
పంచాబ్దంబులు చరించి పాదాంగుష్ఠం
బించుక ధరపై నూఁది, య
చంచలుఁడై తపము మూఁడుసమముల్ సలిపెన్.

186


ఉ.

ఆయెడ వేదముల్ కడుభయంబున బొందుచుఁ బెక్కువిఘ్నముల్
పాయక చేసినం దరలఁ బారక వాణిఁ దృణీకరించి య

న్యాయత యోగశక్తి హృదయంబుఁ దిరంబుగఁ జేసి చిత్రరూ
పో యనఁగా శిలాప్రతిమయో! యన నుండె నతండు ధీరతన్.

187


ఉ.

వానిమహాతపోజనితవహ్ని భయంకరలీలఁ బేర్చి ది
గ్భూనభమున్ సముజ్వలితభూరితరార్చులఁ గాల్బఁ జొచ్చినన్
మానసముల్ గలంగి శతమన్యుని ము న్నిడికొంచుఁ బద్మజుం
గానఁగ నేఁగి నిర్జరనికాయము లోలిఁ గృతప్రణాములై.

188


తరల.

అవధరింపుము లోకనాథ! ప్రభాకరుండను భూసుర
ప్రవరుఁ డిప్పు డొకండు తీవ్రతపం బొనర్చుచు నున్నవాఁ
డవిరళంబగు తత్తపఃప్రభవాగ్నికీలలవేఁడిమిన్
భువనముల్ పరితాపవేదనఁ బొందియున్నవి గావునన్.

189


క.

ఏ పగిదినైన నిఁక నీ
యాపద మానింపు మనుచుఁ బ్రార్థించిన వా
ణీపతి వారుకు దానును
నా పరమతపస్వికడకు నరుదెంచి తగన్.

190


క.

భూదేవకులోత్తమ నీ
మేదురతపమునకుఁ
జాల మెచ్చితి నిదె నీ
కేది ప్రియ మడుగు మనుటయు
నాదివిజశ్రేష్ఠుతోడ నతఁ డిట్లనియెన్.

191


క.

ఎడపక వేదము లన్నియుఁ
గడముట్టం జదువుకాంక్షఁ గమలాసన! యీ
బెడిదమగు తపము సేయం
గడఁగితి నటువంటి వరము గరుణింపు తగన్.

192


వ.

అనినఁ బరమేష్ఠి భూసురశ్రేష్ఠున కిట్లనియె.

193


చ.

అతులతపంబు భూతనివహంబున, కుద్భటఘోరపాతక
ప్రతతి నడంపఁగా దగు నుపాయ మభీష్టఫలప్రదాయకం
బతిశయసౌఖ్యమూల మటు లౌటఁ జిరాయువు భూరిశక్తియున్
వితతతపోబలంబునన విశ్వపితామహ నాకుఁ గల్గెడిన్.

194

చ.

అనిన విరించి యిట్లను మహాద్భుతమైన భవత్తపంబు పెం
పున సులభంబు లైనవి సమున్నతశాశ్వతపుణ్యలోకముల్
జననుత నీకు నం దమితసౌఖ్యము లొందుచునుందుఁ గాక యీ
యనువున నందరానిఫల మందఁగ జేతులు జాఁచ నేటికిన్.

195


వ.

అనిన నతం డిట్లనియె.

196


క.

మది కింపుగాని మాటలు
పదివేలును జెప్పనేల భాషాధిప! యిం
పొదవెడి నాదివిజాధిప
పదమైనను నొల్ల వేదపాఠముదక్కన్.

197


వ.

అనిన నామాటలు సమ్మతింపక భారతీకాంతుం డంతర్హితుం డయ్యె, నాప్రభా
కరుండును దృఢనిశ్చయుండై వెండియు నతిఘోరతపంబు గావింప నిలింప
ప్రబోధితుండై చతుర్ముఖుండు మఱియు రెండువరుసల నాతపోధనసత్తము
పాలికిం జనుదెంచి యతని పూనిక వదలింపలేక నిజలోకంబున కరిగె నంత.

198


శా.

పాదం బొక్కటి నేలనూఁది శుచియై పంచాగ్నిమధ్యస్థితుం
డై, దృష్టుల్ దివిఁ జేర్చి, యమ్మునివరుం డస్వీకృతాహారుఁడై
వేదాత్మున్ విధివిష్ణుశంకరమయున్ విశ్వేశు సంపూజ్యు న
య్యాదిత్యున్ మది నిల్పి చేసెఁ దప మత్యంతస్థిరస్వాంతుఁడై.

199


చ.

అరుదుఁగఁ దత్తపంబు మహిమాతిశయంబున కిచ్చ మెచ్చి బం
ధురమణిభూషణప్రతతితోఁ బరితప్తసువర్ణవర్ణవి
స్ఫురణ దలిర్ప మేనిజిగి పొత్తొసగూడి ప్రవాళపాటలాం
బరకుసుమానులేపనవిభాసురుఁడై యతఁ డున్నచోటికిన్.

200


సీ.

తొవలవాకట్టు చందురుతోడి పెన్నుద్ది,
తమ్ములవిందు వేదములప్రోవు,
వెన్నెలపులుగుల వెఱ గొంగ జక్కవ,
కవల మోహపుమందు కైటభారి,

కుడికన్ను పచ్చని గుఱ్ఱాలధీరుండు,
మూఁడుమూర్తుల గట్టి వేఁడివేల్పు,
కైవల్యముకుఁ ద్రోవ గ్రహముల మొగదంబు
మునిమిడి చీకటి మాకవిప్పు


తే.

జనుల మ్రొక్కులజంట తేజముల నెలవు
వరుసఁ బండ్రెండు నామముల్ పరఁగుమేటి
గగనరత్నంబు త్రిభువనకర్మసాక్షి
భానుఁ డేతెంచె దేదీప్యమానుఁ డగుచు.

201


తే.

అత్తెఱంగున నరుదెంచినట్టి లోక
బాంధవునిఁ జూచి, నిజమనఃపద్మ మలర
ధరణిఁ జాఁగిలి మ్రొక్కి, హస్తములు మొగిచి,
యాప్రభాకరుఁ డిట్లని యభినుతించె.

202


లయగ్రాహి.

జయజయ సకలదివిజచయమకుట
        ఘటిత మణిచయ రుచిరపదయుగళయకలపద్మ
ద్వయ నిబిడతర తిమిరలయకరణ చణ, హరిత
        హయవినుత సుజనభవభయశమన, నానా
మయవిపిన హదన ఫణిళయన వరచరణ వృత
        నియమ మునినుత నిగమమయ సరసిజాతి
ప్రియదురితహర నిరతిశయమహిమ వితత రధరయ
        విహగ విభవకువలయవన దినేశా.

203


క.

శ్రీకరములు, సుమహితశో
భాకరములు, భవవిషోపహరజంతుసుధా
శీకరము, లబ్జబాంధవ
నీకరములు దనుజకుముదినీభీకరముల్.

204


క.

అని వినుతించి ప్రభాకరుఁ
గనుఁగొని రవి నీ తపంబుఁ గడు మెచ్చితి నీ
మనమున కెద్ది యభీష్టం
బనఘా! వినిపింపు మనిన నతఁ డిట్లనియెన్.

205

ఉ.

పారమునందఁగా నిగమపాఠ మొనర్పఁగఁ బూని యీగతిన్
ఘోరతపంబు సేసి కనుగొంటిని వేదమయాత్ము భక్తమం
దారుఁ, ద్రిమూర్తి, శక్తియుతు, దారుణదుర్భవవైరి, నిన్ను నా
కోరిక జాగు సేయ కొడఁగూడఁగ జేయుము సత్కృపామతిన్.

206


వ.

అనినఁ బ్రభాకరునకు విభాకరుం డిట్లనియె.

207


క.

పురుషుని పురుషార్థంబుల
నరికట్టు, ననేకవిధభవార్జితదురితో
త్కరముల వినాశ మొందఁగఁ
బరిపూర్ణముగా నభీష్టఫలసంసిద్ధుల్.

208


క.

కావున బాపక్షయమగు
నావెర వెఱిఁగింతు నీకు నబ్జోదరని
త్యావాసమై త్రిలోకీ
పావనమగు రంగధామ పరిసరభూమిన్.

209


వ.

సకలతీర్థోత్తమం బగు పుష్కరిణీతీర్థంబు గల దచటికిఁ జని తపంబు
గావింపు మానెపంబున నశేషదోషఘ్నంబులగుఁ గావునం దత్సంకల్పంబు
ఫలియించు. నింక నొక్క విశేషంబు వినుము.

210


సీ.

కలఁడు సునేత్రవిఖ్యాతుఁ డచ్చట నొక్క
పక్షీంద్రుఁ డతఁడు దపంబు పేర్మి
నజునిచే వేదంబు లన్నియుఁ దుదముట్ట
నెఱుఁగు నట్లుగ వరం బెలమి వడసి
యఖిలవిద్వత్జ్ఞానియై నిర్మలజ్ఞాన
పరుఁడయి భోగైకనిరతుఁ డగుచు
నాత్మసమానసాచారసంపన్ను
లగు విహంగములు తన్నర్థిఁ గొల్వ


ఆ.

రంగనాథు దివ్యమంగళవిగ్రహ
ధ్యానసౌఖ్యలీలఁ బూని పెద్ద

గాల మెసఁగి పొల్చు కావేరితటమున
నొక్కదినముఁ బాయకున్న వాడు.

211


క.

నీ వచటికిఁ దడయక చని
యావిద్వత్ప్రవరు చిత్త మలరఁగ భక్తిన్
సేవించి యడుగు మెఱుఁగుము
కావలసిన వెల్ల నతఁడు క్రమమునఁ దెలుపున్.

212


తే.

అనిన నాతాపసోత్తముఁ డబ్జమిత్ర!
యతులితజ్ఞాననిధియైన యమ్మహాత్ముం
డేమి కతమునఁ దానొందె నీఖగత్వ
మానతిమ్మన్న నతని కిట్లనియె నినుఁడు.

213


క.

ఖగవిహగప్రముఖాకృతు
లొగిఁ బూని మహాత్ము లుందు రొక్కొకయెడలన్
జగమున దమతమ తలఁపులు
నిగిడిన సంప్రీతి నదియె నెపము దలంపన్.

214


మ.

క్షితిపైఁ జిక్లిత కాఖ్యకద్విజుఁడు లక్ష్మీనాయకున్ మున్ను స
న్మతి నత్యుగ్రతపంబు పెంపునఁ బ్రసన్నస్వాంతుఁ గావింప నా
శ్రితరక్షామణియైన యవ్విభుఁ డతిప్రీతిం దదీయాంతికా
గతుఁడై వేఁడు వరంబు నీ వనిన నుద్గాడప్రమోదాత్ముఁడై.

215


క.

ధర జాఁగి మ్రొక్కి భక్తిం
గరములు ముకుళించి నుదుటఁ గదియించి శ్రుతి
స్ఫురితములగు సూక్తంబులఁ
బరువడి వినుతించి విన్నపం బొనరించెన్.

216


క.

వారిజదళలోచన నేఁ
బారము నొందంగ వేదపఠనము సేయం
గోరెద నవ్వర మొసఁగుము
కారుణ్యము నివ్వటిల్లఁగా నిపు డనినన్.

217

ఉ.

శ్రీతరుణీవిభుం డతనిచిత్తవిశుద్ధికి నెమ్మనంబునం
బ్రీతి దలిర్ప భూసురవరేణ్య! శ్రుతుల్ గలయంతవట్టుఁ బ్ర
ఖ్యాతముగాఁగ నీవెఱుఁగునట్లుగ నిచ్చితి నస్మదంఘ్రిసం
జాతనిబద్ధశక్తిని నజస్రము నీమదిఁ బాయకుండెడిన్.

218


మ.

క్షితిదేవోత్తమ! సేయు మింకొకటి భక్తిన్ సర్వవిద్యాధిదే
వత నంభోరుహగర్భుదేవిఁ ద్రిజగద్వంద్యన్ శరశ్చంద్రికాం
చితవర్ణోజ్వల నర్థి భారతిఁ దగన్ సేవింప నీ కాసర
స్వతి యిచ్చున్ నిగమాదివిద్యలు సమస్తంబున్ బ్రసన్మాత్మయై.

219


వ.

అని యానతిచ్చి యచ్యుతుం డంతర్హితుం డయ్యె. నయ్యగ్రజన్ముండును
సమగ్రంబగు పూజావిశేషంబుల నాదేవి నారాధించి యిట్లని బ్రస్తుతించె.

220


గద్య.

శ్రీమదఖిలభువన చరాచర ప్రచురరచనామనోహర చతురానన
మానస మానసాంతర్నిరంతర కేళివిలోల మరాళబాలికా, మనల్పకల్ప
ప్రసూనాకల్పితచూలికా మరాళవిహార రమణీ రమణీయ మణికంకణ ఝణ
ఝణారావముఖర కరతామరస సమంచితా చంచలాచంచల చంచరీక నీలాల
కాంతకాంతాం. సేవాయత్త దిక్పాలకాంతా, మష్టమీ శశాంకాహంకారధిః
కార పటునిటలతల తిలకాయమాన తృతీయనేత్రాం, కరకలితలలితాక్ష
సూత్రా, మసమ శరశరాసన విలాసాపహాసభాసురానత భ్రూలతా విభ్ర
మారుణాంత సీమా, మగణ్యలావణ్య సరోవరవిహారహారి శఫరాయమాన
కర్ణాంత విశ్రాంతలోచనాం, కృతకృపణ కృపారస సేచనాం, మదీయ్య
వికసితాగ్రలంబమానహిమబిందు సుందరతిలకుసుమ సముల్లాస మౌక్తిక
నాసికోద్భాసితాం, యోగిజనశాంత స్వాత సంవాసితా, మిందుకాంత
దర్పణ విదగ్ధ స్నిగ్ధకపోల మాలికాభ్యర్ణ వికీర్ణవాలుకాసక్త ముక్తాఫలకాంతా
గళిత మందస్మితసాంద్ర చంద్రికాసదన వదన చంద్రమండలా, మమల
ప్రకర్పూరకుండలా, మధరీకృతానేక మణిభంగ మంగళ సుషమావిశేషా
ధరబింబా, మఖిలజగదంబా, మతివిమలకంబు ప్రతిబింబ శోభాబంధు
బంధుర కంధరాం, వివిధవిలాసమంధరా, మారూఢ బాలప్రవాళ లలిత
పారిజాత లతాగర్వ నిర్వాపణ క్రియాచతురచతుర్బాహాం, భజమాన దాన
వారి సమూహా, మభ్రముకరికుంభ శుంభత్కూట పాటవాభిషంగ ప్రసంగ

సముత్తుంగ శృంగార రసతరంగిణీ రథాంగ మిథునాయత పృథుస్తన
విన్యస్తకాంచన విపంచికా పంచమస్వర సుధారసాస్వాదనాదర మేదురా
మోదజనిత రోమాంచ కంచుకితకోమలాంగీం, నిగమవనసంచార సారంగీ,
మమర్త్యసరిదావర్త నివృత్తప్రవర్త గంభీర నాభిసరః కూల తమాలలతా
యత శ్యామసాధ్య మధ్యభాగాం, మహాభాగా, మధ్యుషిత నిశితపయోరుహ
భోగపరాగాను రాగానూదితమదవ దళిమదవతీ వినీల నీలమణిఘృణి సారస
రశనా నితంబబింబాం, హృద్యాధరవిద్యాధర మానినీ జేగీయమాన గుణ
కదంబా, మంబుదావసానసమయ సముదిత సంపూర్ణ పూర్ణిమాచంద్ర
చంద్రికా పటలానుకూల దుకూలాంతర తరత్ప్రభారంభరంభాస్తంభ శోభా
విజృంభణ స్తంభనోదీర్ణ వర్ణనీయోరుయుగళాం, విమోచిత సంసారనిగళా,
మృజురచిత కావాళోదారచారుతా సముల్లంఘన జంఘాల జంఘావిలాసా,
మఖిల సుమనోమనోనివాసా, ముదయ దహిమకర కరనికర దరదరుణతర
తరుణసరసిరుహ విలసన పరిహసన పరికరణ పరిణత జతురస కలిత
మృదుపదయుగళయుగప దవనతచతుర ఖచరయువతివిసర లసదలికతల
తిలకమృగమద జలకణ జనితకళంక శంకాకర నఖరశశంకాభిరామా, మస
మానభాగ్యసీమా మవిరళతరళ తారకాతివృత్త ముక్తాఫలహార కేయూరవలయ
భద్రముద్రికా మంజు మంజీరప్రముఖ నవ్యాభరణ కిరణస్ఫురణ పరిణాహ
దేదీప్యమాన దివ్యదేహాం, కమలభవవదనగేహా, మీహానురూప వరప్రదాన
కరువారసతరంగి తాపాంగవిలోకాం, పరిపాలిత సకలలోకా, మిందుకుంద
చందనమందారక బృందారకవాహినీ నీహార హార హర హీరాదిసమస్త
గౌరవస్తుతివైకల్య కరకల్యాణ కల్యాఘనాపఘననీకాంతి విశద విశదీకృత
దశదిశావకాశాం, విముక్త భక్తమోహపాశా, మారూఢ వేదాంగాద్యశేష
విద్యావిశేష పరిపదున్మీలిత విశ్వదృశ్వ ప్రపంచ వైభవాం, దూరీకృతభవా,
మభిధానభేదాపాదితానేక దేవతాశక్తిభా వానుభావైకభా స్వరూపాం, కలకంఠ
కలాపా, మభినవశరద నేహారంభ విస్రంభ విజృంభమాణ రోహిణిరమణ
కిరణనిరుద్ధ సమృద్ధ దుగ్ధార్ణవ నవోద్భూతబహుల లహరీ ఘుమఘుమధ్వాన
సంరంభ సాహిత్య సుకవిశుకనికర ఫలభరిత మధుర మాకందశాఖాం,
శేఖరీకృత శీతాంశురేఖా, మమిత సౌభాగ్యసారదాం, శారదాం, మన్మహే
మన్మహే.

221

వ.

అని వినుతించి.

222


ఆ.

మౌక్తికాక్షసూత్ర మాణిక్య వల్లకీ
కలితపాణిఁ బద్మగర్భురాణి
వాక్య రాజకీర వరనీలవేణికా
కలితయైన వాణి గారవించి.

223


క.

తడయక ప్రత్యక్షంబై
యడుగుమ మమ్మనిన నాతఁ డామ్నాయంబుల్
గడముట్ట నెఱుఁగువైఖరి
గడనొత్తఁగ నొసఁగు మనినఁ గరుణ దలిర్పన్.

224


వ.

ఆవాగ్దేవి భూదేవున కిట్లనియె.

225


క.

నాముందట విహరించెడి
నీ మహిత పతగచతుష్క మిప్పు డుమిసిన యా
యామిషము నమలు మిఁక నీ
యామిషమున నొదవు నీకు నభిమతసిద్ధుల్.

226


చ.

అనుటయు నట్ల కాకని రయంబునఁ దానును బక్షిరూప మిం
పెసయ ధరించి, తత్పలల మించుకయేనియుఁ జిక్కనీక, చ
క్కన భుజియించి యున్న నధికంబగ శాఖల గల్గు వేదముల్,
తనమదిఁ బ్రస్ఫురింప వసుధామరముఖ్యుఁడు నాటినుండియున్.

227


క.

ఆ విహగవిమలరూపము
తా వదలకయున్నవాఁడు తత్సన్నిధికిన్
నీ వరుగు మనిన నా భూ
దేవుఁడు వెండియును దిగ్మదీధితితోడన్.

228


క.

ఆ విహగము లెవ్వియు శుచి
భావుండగు విప్రుఁ డెట్లు పతగోచ్ఛిష్టం

బేవలనను శంకింపక
తా వేడ్క భుజించె ననుచుఁ దపనుఁడు పలికెన్.

229


చ.

వెలసిన తద్విహంగములు వేదము లాపలలంబు సర్వవి
ద్యలు నొకటైనముద్ద పతగావళి కామిషవాంఛ యెంతయుం
గలుగుటఁ జేసి, యమ్మునిశిఖామణియున్ వలనొప్పఁ బక్షిరూ
పలర ధరించె నంచుఁ దెలియన్ వినిపించి దినేశుఁ డేఁగినన్.

230


వ.

ఆ ప్రభాకరుండును, బ్రభాకరోపదిష్టక్రమంబున సునేత్రుండును, బతత్రి
వరుం డున్న యచ్చటికిం జని, యభివందనంబు చేసి నిజవృత్తాంతం బంతయు
నెఱింగించిన నాదరించి యిట్లనియె.

231


శా.

ఆరాధింపుము నీవు సన్మతిఁ ద్రిలోకాధారు నారాయణుం
గారుణ్యాంబుధి నిందిరాకుచతటీకస్తూరికాసౌరభ
శ్రీరమ్యోరుభుజాంతరాళు నిగమశ్రేణీసదాసన్నుతున్
శ్రీరంగేశునిఁ బీతవస్త్రు విలసజ్జీమూతసంకాశునిన్.

232


క.

ఆనలినాక్షుఁడు వరదుం
డై నిలచినఁ బడయరాని యవియుం గలవే?
వాని యఱచేతిలోనివి
వో నలినజ రుద్రపద సుఖోన్నతు లెల్లన్.

233


చ.

అని యెఱిఁగించినం బ్రమదమారఁ బ్రభాకరుఁ డేకచిత్తుఁడై
యనుపమలీల నంబుజదళాక్షు గురించి త్రిలోకసేవ్యమై
యొనరిన చంద్రపుష్కరిణియొద్ద సురల్ వెఱఁగంది కన్గొనం
ఘనతప మాచరించిన మనంబున నాహరి మెచ్చి వేడుకన్.

234


సీ.

కలువ పుష్పముచాయ గమకించు మెయిమించు
పసిఁడి నిగ్గుల నొరపట్టు పట్టు,
విరిదమ్మిరేకుల సిరి మీఱు కనుఁదీరు
భవపరితాపంబుఁ బాపు రూపు,

నిలువఁ దీర్చిన ఫాలపలకంబు తిలకంబు
చిఱునవ్వు వెన్నెల చిలుకుతళుకు
కల్పమంజరులచేఁ గడునొప్పు నునుగొప్పు
సొంపారు నురముపై కెంపుసొంపు


తే.

బాలమార్తాండబింబంబు ప్రభలడంబు
నంబరంబున నెఱపుచక్రంబు నొఱపు
గలిగి జగదేకకల్యాణలలితమూర్తి
వెలయ నమ్మునియెదుట నావిర్భవించె.

235


చ.

అతఁడు నభూతపూర్వమగు సప్పరమేశుని దివ్యవిగ్రహం
బతులితభక్తిఁ జూచి వినయంబును హర్షము సంభ్రమంబు న
ద్భుతమును నంతరంగమునఁ దొట్రుకొనన్ మహిఁ జాగి మ్రొక్కి, యూ
ర్జితబహువేదసూక్తములచే వినుతించె ననేకభంగులన్.

236


క.

అప్పుడు మదిఁ గృప చిప్పిల
నప్పరమేశ్వరుఁడు ప్రీతుఁడై భవదిష్టం
బిప్పుడు ఫలింపఁ జేసెద
చెప్పుము నీవనిన నతఁడు చిత్రం బలరన్.

236


తే.

కదియ మోడ్చిన చేతులు నుదుటఁ జేర్చి
పంకజోదర! నావిన్నపంబు వినుచు
యెల్లవేదంబులను బార మెల్లఁ జదువ
నోపు విజ్ఞానశక్తి నా కొసఁగవలయు.

237


చ.

అనుటయు నవ్వరం బొసఁగి యాతని కిట్లను బుండరీకలో
చనుఁడు గణింప నెవ్వరికి శక్యముగాని శ్రుతుల్ పఠింప నే
యనువున దీరుఁ గొంచెమగు నాయువునుం గలయట్టిదేహకిన్
విను మటుగాక పాపములు వీడినగాని ఫలింప వేమియున్.

238


క.

కావున బహుజన్మార్జిత
మై వెనుకం దగులు దారుణాఘప్రతతిం

బోవ నడిచి చెప్పం బయి
పై విశ్రుతికెక్కు నమ్మహాతీర్థమునన్.

240


క.

అతఁ డెఱిఁగించెడి నఖిల
శ్రుతితతియు మదీయశక్తిచోదితుఁడై నీ
కతిముదమున నని లక్ష్మీ
సతీయుతుఁడు నరిగె నంత సంచితలీలన్.

241


వ.

పరమపవిత్రుం డగు సునేత్రుకడకుం జని కుంజరవరదు వరప్రకారంబుఁ
జెప్పి యప్పతత్రివరు ననుమతంబున సమంత్రకంబుగాఁ దత్తీర్థస్నానంబుఁ
జేసి చరితార్థం బొంది గురుభజనానురూపంబుగాఁ దానును విహగ
రూపంబుఁ బూనిన నాసమ్మదంబున బతత్రివరుండు తద్విప్రముఖ్యునకు
నఖిలవేదంబు లుపన్యసించె. నతండును బుండరీకాక్ష ప్రసాదసాధిత ప్రభా
వంబున సకృదుచ్చారణమాత్రంబున సకలనిగమపారగుండై యచ్చట
జిరకాలంబు వసించి విష్ణుపదప్రాప్తుం డయ్యె. సునేత్రుండు నిరర్గ
ళంబగు నపవర్గంబు నొందె. నాప్రభాకరమునీంద్రునకు శిష్యులు
నలువురు గలిగి రందు సుదర్శనాఖ్యుండ నగునేనును సువర్ణబిందుండు
సుతామ్రచూడుండును బృహన్మయుండును గ్రమంబున ఋగ్యజుస్సామా
ధర్వణంబులు తత్తచ్ఛాఖాసమేతంబుగా ఖగాకారధరులమై యభ్యసించితిమి.
నీడోద్భవంబులు నాతోడం జదువు మునికుమారు లనిచెప్పి జయధరునకు
నయ్యండజశ్రేష్ఠుండు వెండియు నిట్లనియె.

242


క.

పరమంబగు తప మనినం,
బరమపదం బనిన దానిఁ బరికించుచు నీ
పరదేశము నాదేశము
మఱి యితరము లెఱుఁగ నేను మనుజాధీశా.

243


క.

ఈతరువులు నీలతలును
నీతృణగుల్మాదివనమహిస్థలి పుణ్యో
పేతాత్ము లగుమహర్షి
వ్రాతముగా నెఱుఁగు మాత్మ వసుధాధీశా.

244

మ.

ధరణీనాయక నీకులం బతిపవిత్రంబయ్యె, నీ విమ్ములం
బరిపాలించు మహీతలంబు నతిధన్యంబయ్యె, నీపుత్రులుం
బరలోకోన్నతసౌఖ్య మొందిరి, దిశాపాలిన్ భవత్కీర్తులం
జరగెం బుష్కరిణీనిమజ్జనము నిష్ఠ న్నీవు గావించుటన్.

245


ఉ.

నావుఁడు సంతసించి జననాథుఁడు తన్నుఁ గృతార్థుఁగా మదిం
భావన సేయుచున్ విహగనాథునకున్ ధరఁ జాగి మ్రొక్కి సం
భావన జేసి యాతఁ డనుపన్ బహుమంగళతూర్యమంజులా
రావము లుల్లసిల్లఁగఁ బురంబున కేఁగెఁ జమూసమేతుఁడై.

246


క.

అతనికిఁ గలిగిరి నూర్వురు
సుతు లందఱు రూపవిభవసుస్వరమతు ల
చ్యుతసువ్రతనిష్టాపర
రతులును నగువారు సుజనరంజితచరితుల్.

247


క.

వారు తనపంపు సేయఁగ
నారాజవరుం డొనర్చె నమితాధ్వరముల్
నేరుపున సుజను లౌనన
వారక దక్షిణలతోడ వైభవ మెసఁగన్.

248


క.

ఈలీల నతఁడు ధరణీ
పాలన మొనరించి రాజ్యపదముకుఁ దనయుం
జాలించి యితరసుఖములఁ
దేలియుఁ దపమాచరించి త్రిదివము కేఁగెన్.

249


వ.

అని చెప్పి మార్కండేయుం డన్నరేంద్రున కిట్లనియె.

250


చ.

జనవర! నీవు సోమకులసంజనితుం డనివార్యధైర్యస
ద్వినయవివేకబాహుబలవిక్రమశాలివి, భూప్రజానురం
జనచతురుండ వట్లగుటఁ జాల గృతార్ధుఁడ వయ్యు భక్తి నె
క్కొనఁ జని చంద్రపుష్కరిణిఁ గ్రుంకిడి యచ్చటి విప్రకోటికిన్.

251

చ.

ధనకనకాదివస్తువులు దాన మొనర్పుము, దానఁజేసి చ
య్యనఁ బెడఁడాయు నీయఘము లన్నియు, నంత ననంతకీర్తియున్
ఘనతరరాజ్యవైభవసుఖంబుఁ బవిత్రచరిత్రులైన నం
దనులు ననామయత్వము ఘనంబగు నాయుపు నీకుఁ గల్గెడిన్.

252


వ.

అని యుపదేశించి యారాజుచేతఁ బూజితుండై నిజాశ్రమంబునకుఁ
జనియె, సోమకుండును బ్రహృష్టమానసుండై తదుపదిష్టప్రకారంబున
కళత్రమిత్రాప్తబంధుసమేతంబుగాఁ బుష్కరిణీతీర్థంబున కరిగి కృతస్నా
నుండై యచ్చట హిరణ్యాదినానావిధదానంబుల విప్రుల నతితృప్తులఁ
గావించి నిత్యమంగళాభిరామంబగు శ్రీరంగధామంబునకుం బోయి తద
భ్యంతరంబున.

253


సీ.

పుండరీకాక్షుఁ బ్రస్ఫురితకౌస్తుభవక్షు
నాజానుబాహు నీలాభ్రదేహు,
మకరకుండలకర్ణు మహితకృపాపూర్ణు,
నవపీతకౌశేయు నతవిధేయు,
లక్ష్మీసముల్లాసు లలితకోమలహాసు
నానావిధాకల్పు నాగతల్పు,
బహువేదసంవేద్యు భవమహామయవైద్యు
వరతులసీదాము సురలలాముఁ


తే.

గలితశృంగారుఁ, ద్రిగుణవికారదూరు,
శోభనాకారు భువనసంస్తుతవిహారు,
యోగిహృద్గేయు నిజభక్తిభాగధేయు,
సకలఫలదాయి శ్రీరంగశాయి గనియె.

254


క.

ధరఁ జాగి మ్రొక్కి రత్నా
ధరణసువర్ణాంబరాది బహువస్తుతతుల్,
పరువడిఁ గానుక లిడి సు
స్థిరమతి తత్పూజనంబుఁ జేసినపిదపన్.

255

చ.

అవిరళ విష్ణుచింతనపరాయణులై యచట న్వసించు భా
గవతవరేణ్యులం బరమగాత్రులఁ జూతుగదయ్య యంచు ద
త్పరమపవిత్రులౌ మునులఁ బల్మఱు సువ్రతనిష్ఠచారులన్
వివిధవిశేషసత్కృతుల వేమఱుఁ బ్రీతులఁ జేసి సన్మతిన్.

256


వ.

అప్పార్థివోత్తముండు గృతార్థుండై మరలి తరలపతాకాభి శోభితారా
మాతపత్ర భాసురంబును, సముల్లసిత పల్లవతోరణాలంకృతంబును,
బ్రాలంబిత ప్రసూనదామాభిరామంబును, సరస శృంగార పురాంగనాకీర్ణ
సువర్ణసౌధవీథి(థీ) విరాజితంబును, నీరాజనక్రియా సంభ్రమసముల్లాస
విలాసినీచరణ మంజీర శింజితమంజులంబును, వివిధమంగళవాద్యహృ
ద్యంబును, బ్రతిహార సంకులప్రదేశ నియంత్రిత సముత్తుంగ మదముదిత
మధుకరఝంకార ముఖరిత గోపురంబును నగు నిజపురంబుఁ బ్రవేశించి,
సమంచిత సామ్రాజ్య భోగంబు లనుభవింపుచుఁ జతురుదధివలయ వలయిత
వసుమతీభాగం బనురాగంబునఁ బాలించుచుండె. నప్పుడు.

257


ఉ.

ఆతని రాజ్య మొప్పె నిగమాయతజానపదప్రకీర్ణమై,
యాతతవేదశాస్త్రపఠనారవశోభితమై, యుపద్రవ
వ్రాతవిదూరమై, సకలవృత్తవిశేషసమృద్ధిమంతమై,
వీతకళంకమై సతతవిష్ణుమహోత్సవరమ్యదేశమై.

258


క.

శ్రీరమణసుచరితామృత
సారంబై, బహుపురాణసమ్మతమై, సం
సారాబ్ధితారకంబగు
శ్రీరంగక్షేత్ర మొప్పె సిరి పెంపాఱన్.

259


సీ.

గ్రహణకాలంబునఁ గపిలాసహస్రంబు
నవనీసురుల కిచ్చినట్టిఫలము,
భూరియాగములు సంపూర్ణదక్షిణ లిచ్చి
కావించునట్టి సత్కర్మగరిమ,
పసిఁడిపుష్పముల సద్భక్తి సాలగ్రామ
పూజనం బొనరించు పుణ్యమహిమ,

సంతతజపతపస్వాధ్యాయనోపాస
సువ్రతంబుల వచ్చు సుకృతచయము


తే.

నవనియంతయు సత్పాత్రమైనయతని
కొసఁగ నెసఁగెడి పుణ్యధర్మోన్నతియును
గలుగు శ్రీరంగమాహాత్మ్య మెలమిఁ జదువు
నలఘుమతులకు విను విమలాత్ములకును.

260


క.

ఈయాఖ్యానరతిన్ (స్ర)నచి
రాయువు నారోగ్యమును, గులాభ్యున్నతియున్
శ్రీయు బహుపుత్రలాభముఁ
బాయని సౌఖ్యములు విష్ణుభక్తియుఁ గలుగున్.

261


ఆశ్వాసాంతము

చ.

అని మును లంచితంబుగను నందఱు సమ్మదమాఱ నాగదం
తునకుఁ బరాశరప్రియసుతుం డెఱిఁగించిన యీకథాంశ మిం
పెనయఁ దెనుంగుబాస రచియించితి, నాయువు శ్రీయుఁ గీర్తియుం
ఘనవిజయంబు నీకెపుడు గల్గఁగ జాగయమంత్రిరాఘవా!

262

[1]చక్రబంధము

శా.

నవ్యశ్రీకపరాతి భైరవచరన్నాకద్రుమా! వర్ణభా
గ్భవ్యారంభకఘస్మరస్తవశుచి స్వాంతప్రపూర్ణ ప్రభా
భవ్యాంగప్రసవాంక వాసవతతః ప్రాముఖ్యనందేందు భా
వ్యాళీన సురాదిశో విభవశోభాభద్రభాస్వన్నిభా!

263

నాగబంధము

చ.

వరగుణరత్నవిశ్రుత సువర్ణవతంస, సబాలతత్పర
స్ఫురితమరాళ, శ్రీ గురువచోవశచిత్తవిలాస, వాసవా
వరజ, సమాంగవైరి కరివారిధరానిల ధీరమాంచితో
త్తర సశుభానురక్తతత తత్పరచాగయమంత్రి రాఘవా!

264

గోమూత్రికాబంధము

క.

హరిపదసరసిజమధుకర
మురభిదసితమూర్తిరామభోగసుదామా!
కరిరద సురకుజ విధుకర
శరదు దసితకీర్తి ధామ చాగయరామా!

265


మాలిని.

కమలనయనసేవా! కౌతుకాధీశభావా!
విమతభయదకోపా! వీతిహోత్రప్రతాపా!
సుమహితభుజసారా! సుందరీమానచోరా!
సమరపరశురామా! చాగయామాత్యరామా!

266

గద్యము
ఇది శ్రీమద్భ్రమరాంబావరప్రసాదలబ్ధ సిద్ధసారస్వతగౌరవ
గౌరనామాత్య పుత్ర సుధీవిధేయ భైరవ నామధేయ
ప్రణీతంబైన శ్రీరంగమహత్త్వం బను
పురాణకధయందు సర్వంబును
పంచమాశ్వాసము

చక్రబంధము

శా.

నవ్యశ్రీకపరాతిభైరవచరన్నాకద్రుమా! వర్ణభా
గ్భవ్యారంభకఘస్మరస్తవ శుచిస్వాంతప్రపూర్ణప్రభా
భవ్యాంగప్రసవాంకవాసవతతః ప్రాముఖ్యనందేందు భా
భావ్యాళీన సురాభవాగ్విభవశోభాభద్రభాస్వన్నిభా.

5-263


నాగబంధము

చ.

వరగుణరత్నవిశ్రుత సువర్ణవతంస, సబాల తత్పర
స్ఫురితమరాళ! శ్రీగురువచోవశచిత్తవిలాస, వాసవా
వరజ, సమాంగ వైరికరవారిధరానిలధీరమాంచితో
త్తరసశుభానురక్తతత తత్పర చాగయమంత్రి రాఘవా!

5-264

గోమూత్రికాబంధము

క.

హరిపద సరసిజ మధుకర
మురదభిసితమూర్తి రామభోగసురామా!
కరిరద సురకుజ విధుకర
శరదుదసితకీర్తిధామ చాగయరామా!

5-265


  1. చక్ర నాగ గోమూత్రికాబంధ పద్యములలో పొరపాట్లు గలవు. సచిత్రములుగా బంధముల నిచ్చి, వానియందు దోషములు సవరింపనైనవి. ప్రక్కపుటలో సరియగు పాఠములు గల పద్యముల నిచ్చినాను.