శ్రీరంగమహత్త్వము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరంగమహత్త్వము

చతుర్థాశ్వాసము

క.

శ్రీరంగరాజసేవా
పారంగత! కర్ణఖచరపతి, శిబిఘన, మం
దార, సురధేను వితరణ
చారు గుణాకరసుధామచాగయరామా!

1


వ.

అవధరింపు మఖిలకథా కథన చాతురీజనిత రోమహర్షణుం డగురోమహ
ర్షణకుమారుండు దివ్యబోధను లగుశౌనకాది తపోధనులకుఁ జెప్పిన తెఱంగునఁ
బుష్కరిణీతీర్థసామర్థ్యం బాకర్ణించి-సుధీవిధేయుం డగుసాత్యవతేయునకు
నధికతపోధనవంతుం డగునాగదంతుం డిట్లనియె.

2


సీ.

అతిచిత్ర మగునీయుపాఖ్యాన మనఘాత్మ!
వింటి నీవలన, భూవిదితమైన
చంద్రపుష్కరిణీప్రశస్తియు నంచిత
క్షేత్రానుభావంబు చిత్తగతము
లయ్యెను వేదవేదాంగ పురాణేతి
హాసాది సకలవిద్యాప్రపంచ
కల్పనంటున, నీవ కర్త వీరూపున
నవతారమైన నారాయణుఁడవు


తే.

గాన, నిగమార్థనిర్ణయగతుల నీవ
యెఱుఁగు దెఱిఁగెడివారికి నెల్లమేటి
వానతిమ్ము కృపామతి నచట మఱియు
సుమహితము లైన పుణ్యతీర్థముల తెఱఁగు.

3


క.

అనుటయు, కృష్ణద్వైపా
యనుఁ డాసంయమివరేణ్యు నాదరమునఁ గ

న్గొని చెప్పె, మఱియు నయ్యెడ
జనవినుతార్థంబులైన షట్తీర్థంబుల్.

4


చ.

అన విని శౌనకాదిమును లందఱు డెందములందు సమ్మతం
బెనయఁగ సూతపుత్రునకు నిట్లని రట్టి విచిత్రసత్కధల్
విన మిట మున్ను మాకు విన వేడుక యయ్యెను శక్తిపౌత్రుఁ డా
తని కెఱిఁగించినట్టి సముదంచితతీర్థము లాఱుఁ జెప్పుమా.

5


వ.

అనిన — మునీంద్రబృందంబునకు సూతనందనుం డిట్లనియె.

6


క.

ఇప్పుడు నను మీ రడిగిన
చొప్పున, ము న్నఖిలతాపసులు గూడి ప్రియం
బొప్పారఁ దన్ను నడిగిన
నాపుణ్యాత్ములకు బాదరాయణుఁ డెలమిన్.

7


క.

వినిపించె నట్ల తగ న
మ్మునివరునకుఁ జెప్పఁ దొడఁగె మున్నసమతపో
ధనుఁ డైన భరద్వాజుఁడు
తనశిష్యులు గొలువఁ తీర్థతత్పరమతియై.

8


సీ.

తపసియుఁ జని కంచి దర్శించెఁ, గేదార
మాడె, గంగాద్వార మధిగమించె,
సింహాచలంబు నీక్షించెఁ గురుక్షేత్ర
మరిగెఁ బుష్కరముల ననుసరించెఁ,
కాశికాపురి నవగాహంబు సేసెఁ బ్ర
యాగంబునందు గయావటంబు
గదిసె, గోదావరిఁ గాంచెఁ, గృష్ణానది
భజియించె, శ్రీరంగభర్తఁ గొలిచె


తే.

సన్నుతించె నహోబలస్వామిఁ బ్రణుతి
సేసె శ్రీ వేంకటాచలవాసి నెలమి

నర్చ గావించె హస్తిశైలాధిపతిని,
దీర్చెఁ బూజ జగన్నాథదేవునకును.

9


క.

ఈవిధిఁ గని, మఱియును ధర
ణీవలయమునందు మహిమ నెగడిన బహుతీ
ర్థావలి ననుక్రమంబున
సేవించుచు వచ్చి వచ్చి చిత్తం బలరన్.

10


క.

అతఁడు గనుఁగొనియెఁ, గ్రీడా
గతవితతోదన్యవన్యకరిమదధారా
ప్లుతమైన సరసి చెంతను
నతిముద మందంగఁ జేయు నారామంబున్.

11


వ.

కని — డాయంజని.

12


సీ.

కర్ణామృతంబుగా కమలాక్షు నవతార
కథలు వర్ణించు శుకవ్రజంబు,
సామంబు లంచితస్వరముగా మునికుమా
రులఁ జదివించు కోకిలకులంబు,
హరిఁ బాడు కిన్నరవరులకు నాలాప
విధము లాసించెడి మధుకరములు,
నమరవిలాసినీసముదయంబుకు లాస్య
గతు లోజఁ గఱపు శిఖావళములు,


తే.

శ్రీమనోహరు శుభదివ్యనామవితతి
విశదముగఁ బల్మఱును బల్కు విహగచయము,
చూత, పున్నాగ, వకుళ , ఖర్జూరముఖ్య
తరుకదంబంబు గల్గు తత్తటములందు.

13


క.

ఘనుల, నసమానతేజో
ధనుం, సమీక్షించెఁ దప్తతమభూమిసుధా

శనుల, నిరంతరహరి చిం
తనుల, సనాతనుల మునులఁ దద్దయుఁ బ్రీతిన్.

14


క.

సందర్శించుచుఁ జని, కని
యెం దదనంతరమ సుజనహృద్వనహరిణిన్,
నిందాచరణ మహీరుహ
చందనమందాంధకరణి శశిపుష్కరిణిన్.

15


ఉ.

అం దవగాహనాదివిధు లర్థి నొనర్చి భజించె, దేవతా
బృంద లసత్కిరీటు వలభీ బలభిన్మణిమాలికాంకితా
మంద నఖేందుబింబరుచిమత్పదపీఠుఁ, గృపానిరూఢు, నా
నంద సమగ్ర సజ్జన మనఃప్రియదాయకు రంగనాయకున్.

16


క.

ఆదేవు నసమవైభవ,
మాదివ్యతనూవిలాస, మాసౌభాగ్యం,
బాదరహాస విలోకన
మాదరమునఁ జూచి విస్మయాన్వితుఁ డగుచున్.

17


తే.

కొంతతడ వుండి వెడలి, తదంతికమునఁ
దనగురుండైన వాల్మీకిమునివరేణ్యుఁ
డున్నవాఁ డని చని, ముద మొదవ నచటి
తాపసులచేఁ దదాశ్రమస్థలము దెలిసి.

18


వ.

ఆభరద్వాజమునివరుం డచ్చోటి కరిగి, హరిధ్యానానందలీలా సమ్మున్మీలి
యగు వాల్మీకి నవలోకించి కృతాభివందనుండైఁ దదాదరంబు వడసి యమ్మ
హాత్మున కిట్లనియె.

19


చ.

వెలసిన పుణ్యతీర్థములు వేడ్కఁ జరించుచు వచ్చి, యీశుభ
స్థలి నసమప్రభావవిదితం బగుపుష్కరిణిం, గృపాసుధా
జలనిధియైన రంగవిభుఁ జారుమతిం భజియించు చిందు—మీ
రలవడ నున్కి నిక్కముగ నారసి కంటి భవత్పదాబ్జముల్.

20

క.

వినఁబడియెఁ బెక్కుచిత్రము
లనఘా! కనుగొంటిఁ గొన్ని యాశ్చర్యము లీ
ఘనదివ్య దేశవరమున
కెనయగు తీర్థములఁ జూడ నే నెయ్యెడలన్.

21


వ.

అనిన విలసత్తపోవిభవుం డగు వల్మీకభవుం డుదారతేజుం డగు భరద్వా
జున కిట్లనియె.

22


ఉ.

భూనుతసత్యధర్మగుణభూషణుఁ డైనవిభీషణుండు దా
నీనదిక్రేవ నెన్నఁడిడె నీహరిధామము నాటనుండియున్
యే నిటనున్నవాఁడ మఱి యేమియు నొల్లక నిత్యకృత్యమై
పూని ముకుందవందనము పుష్కరిణీభజనంబు సేయుచున్.

23


ఉ.

ఆయతరంగమందిరశయాను, భుజంగమతల్పు, యోగని
ద్రాయుతు, నిందిరారమణు, దైత్యవిభేదిఁ బురాణపూరుషుం
బాయక నిల్పుటన్ విమలభావము నొందిన నామనంబులో
నీయెడ గల్గు చిత్రము లనేకము లచ్చుగఁ దోఁచు నిచ్చలున్.

24


క.

అనిన భరద్వాజుఁడు గురుఁ
గనుఁగొని, ము న్నిచట నున్నకాలంబున నీ
కనిన విశేషము లన్నియు,
వినిపింపుము నాకు భువనవినుతచరిత్రా!

25


సీ.

నావుఁడు, నమ్మునినాథుఁడు నిజశిష్యుఁ
గనుఁగొని పలికె లోకప్రసిద్ధి
నెగడు నీ పుష్కరిణీ సమీపంబున,
సురసిద్ధముని యోగివరుల భక్తి
ననిశంబు సేవింపఁ దనరుతీర్థము లాఱు,
కడిమి తత్సలిలావగాహ మెలమిఁ
గావించిరేనియు గోవిప్రహంతలు
గురుదార గమనోత్సుకులు సువర్ణ

తే.

చోరకులు, కల్లుఁ ద్రావెడివారు మఱియు
బహువిధము లైనదుస్తరపాతకములు
చేసినట్టి కుశీలురు, చిరవిశుద్ధిఁ
జెంది శుద్ధాత్ములై ప్రకాశింతు రెలమి.

26


వ.

ఇట్టి మహత్త్వంబు గలిగిన రంగధామంబునకుఁ జెంగట ద్విత్రిగవ్యూతిమాత్ర
ప్రదేశస్థితంబగు నశ్వత్థ వకుళామ్రజంబూక బిల్వతీర్థంబులం దతివి
చిత్రంబు లగు పురావృత్తంబులు గల వవి నీకెఱించెద. దత్తావధానుండవై
యాకర్ణింపుము.

27


మ.

సతతానేకమునీంద్రసేవితము, నశ్వత్థాఖ్యతీర్థంబునం,
దతిపుణ్యాధికసద్వివేకఖని సత్యజ్ఞానసంపన్న ని
ర్గతకామాదివికామ మాధవియనంగా నొక్కతన్వంగి స
న్మతి సేసెం దప మంబుమధ్యమున సమ్యగ్వర్జితాహారియై.

28


క.

ఈనెఱి బహుకాలము చనఁ
గా నొకనాఁ డంబరమునఁ గావుఁడు కావుం
డేనొచ్చితిఁ జచ్చితి నను
దీనాలాపంబు లుప్పతిలెఁ గడు దఱచై.

29


తే.

అమ్మహాక్రందనము విని యాత్మఁ గరుణ
దనుక 'వెఱవకు వెఱవకు' మనుచు వదన
వనరుహం బెత్తి యత్తన్విఁ గనియె మింట
కాలభటపీడితాంగ నంగన నొకర్తు.

30


క.

ఆలలనయుఁ దద్వచనము
లాలించె దయాళువైన యప్పుణ్యవతిం
వోలఁగఁ గనుఁగొని వెండియు
నాలోనన క్రిందుఁగాగ నాక్రోశించెన్.

31

క.

ఈ విధమున భయపరవశ
యై వడఁకుచుఁ గరుణపుట్టి యాక్రందనముం
గావించుదానితో స
ద్భావం బొనరంగ నాతపస్విని పలెకెన్.

32


క.

ఓకామిని! నీవెవ్వతె,
వేకతమున వీరిచేత నీచందమునన్
భీకరబాధలఁ బాల్పడి
పైకొని వేదనల బెండువడఁగా కలసెన్.

33


మ.

అకటా! చిత్తములం దొకింతయును సౌమ్యత్వంబుఁ బాటింప కే
టికి నీయింతిని బట్టి నిర్దయతఁ బీడింపంగ మున్నెట్టివా
రికినైనం బ్రభవించునే మగువ లార్తింజెంది కూయంగ వా
రక కాఱించువిచార మిజ్జగము నిర్దాక్షిణ్య మయ్యెంగదే!

34


క.

ఈవనితఁ గృపామతివై
ప్రోవుము జగదీశ! సకలభూతాఘహరా!
గోవింద! సుఖావహ స
ర్వావసమ ముకుంద నమ్ర నయ్యెద నీకున్.

35


వ.

అని పలికి, ధర్మవత్సల యగునమ్మాధవి నెమ్మనంబున నుమ్మలించుచు నూర
కున్న, నాసమవర్తి కింకరులు ధర్మార్థహితంబును గంభీరభావబంధురంబును
నగు తద్వాక్యంబు లాకర్ణించి, యత్తపస్విని నిఖిలధర్మవిదుషిగా నెఱింగి
ముదితహృదయులై సాదరంబున నాబ్రహ్మవాదిని కిట్లనిరి.

36


తే.

ఓతపస్విని! సుకృత సంయుత చరిత్ర!
వినుము కడు నార్త యగుదీనిఁ గనికరంబుఁ
దొఱఁగి, యే మివ్విధమున నత్యుగ్రభంగిఁ

37

గారిసంబులఁ బెట్టెడి కారణంబు.

సీ.

స్థావరజంగమాత్మక మైనభువనంబు
లన్నియుఁ బరమాత్ముఁ డాత్మవశము

గావించి, మఱి సర్వకార్యమ్ములందుఁ ద
ద్భావస్థుఁడై, వానిఁ బ్రత్యహంబు
చేష్టింపఁజేయు నశేషశభాచర
ణంబులకును దాన సాక్షి యగుచుఁ,
గర్మానురూపముల్ గా సుఖదుఃఖముల్
పరువడి ననుభవింపంగఁ బంపు


తే.

నట్టి సర్వేశ్వరుని యాజ్ఞ నఖిలభూత
తతుల శాసింపఁ బ్రభుఁడైన దండధరుని
శాసనంబున, లోకసంచయమునందుఁ
దిరుగుచుందుము నేము తత్కింకరులము.

38


క.

పలుమఱు నిది యొనరింపని
కలుషంబులు లేవు, పాపకరులకు బైఁబైఁ
దలమగు బాధలు పుణ్యా
త్ముల కతిసౌఖ్యము నొనర్పుదుము మే మెపుడున్.

39


వ.

అని శమనదూతలు చెప్పిన నప్పుణ్యవతి వారల కిట్లనియె.

40


ఉ.

తప్పదు మీరు పల్కిన విధం బఖిలంబును భూతకోటి, కి
చ్చొప్పు సనాతనంబు, విధిచోదితమై క్రియ యెట్టివారికిం
ద్రిప్ప వశంబె, యైనను మదీయసమీపముఁ జేరెఁగాన నే
నిప్పుడు దీనికైన నెగు లేగతినైనను మాన్పఁగాఁ దగున్.

41


క.

కావున నీసతి సుగతికి
నేవిధమునఁ బోవు నెట్టి యే నొనరింతున్,
నావుడు మితభాషిణియగు
నావిమలచరిత్రతోడ నని రాదూతల్.

42


ఆ.

సకలకర్తయయిన శార్ఙ్గిశాసన మెవ్వఁ
డతకరింపఁ జూచునట్టి జడుఁడు

తన్మహోగ్రచక్రధారానలజ్వాల
లందు, మిడుతఁబోలె మ్రందిపోవు.

43


చ.

అనవుడు, వారితోడ ననఘాత్మక మాధవి యిట్లనుం, బ్రియం
బగువచనంబ నిక్కమగునట్టిద, నిర్మల పుణ్య మించుకై
నను నొనరింపదే నిపుడు నాసుకృతం బొకయింత యిచ్చెద
జెనకక దీనిఁ వోవిడిచి చిత్తములోఁ గలయార్తిఁ బాపుడీ.

44


చ.

పొడమిన యార్తిమై, శరణుఁ బొందినవారి కృపాగుణంబు చొ
ప్పడ, నభయంబు లిచ్చి వెలయం దనప్రాణము లిచ్చియైన నె
వ్వఁడు సవరించు, నప్పురుషవర్యుఁడు పుణ్యుఁడు, తద్విధంబు చొ
ప్పడక యుపేక్షసేయు జడభావులు పొందుదు రుగ్రదుఃఖముల్.

45


క.

ధారుణిఁ ద్రిభువనపూజిత
మీరమ్యక్షేత్రరాజ, మిచ్చోటఁ బ్రియం
బార వసియించు ప్రాణులు
తోరపుదురితములఁ బాయుదురు నిమిషమునన్.

46


క.

అవిరళవిచిత్రమహిమల
భువిఁ బ్రస్తుతి కెక్కుఁ దీర్ధముల నన్నిటికిం
రవణింపఁగ నధికంబై
ప్రవిమలతీర్థంబు పరమపావనలీలన్.

47


తే.

అట్టి యీపావనక్షేత్రమందు నియతి
నా వసించినయట్టి పుణ్యంబులోన
నీలతాంగికి నిచ్చితి నేకదివస
సంచితంబైన సుకృతప్రపంచఫలము.

48


వ.

అని పలుకునంత నంతకము న్నంతకకింకరులచేత నాభీలంబు లగుకాలపాశం
బులం గట్టువడి మొఱవెట్టుచున్న యన్నాతి బంధనిర్బంధనం బెడలి
జలధరనిరోధం బెడలి భాసిల్లు సుధాకరు కళయునుంబోలెఁ జాల నొప్పారె.
నప్పు డతిదుర్గమం బగుతన్మార్గంబు మందారమంజరీమరందబిందుతుంది

లంబు లగుమందానిలంబు పెల్లునఁ జల్లనై తనువుకుఁ దనుపొసంగె మొదలం
గదిసి యదలించుచు భయంకరాకారులైన కింకరులు సంతోషకారులై
వారందఱు ప్రసన్నహృదయులై సౌహార్దంబుఁ బాటించి, సమంచితమధుర
భాషణంబుల సంతోషం బొనరించుచు ననుసరించి రనేకవిధప్రయోగంబులు
దివ్యభోగంబులై యనురాగంబు సంపాదింపఁ బటుప్రహారలక్షితక్షత
ప్రాయంబు నగుతత్కాయంబు విగతవ్రణనికాయంభై యగణ్యలావణ్య
రసభావరాజితంబై తేజితం బగు శంబరారాతి చేతికరవాలంబులీలఁ
బొలుపు దీపించె. నివ్విధంబున నసమానపుణ్యోదయభాసమానయగు
మానిని, త న్నెడనెడఁ బొడఁగని సిద్ధమునినిచయంబు లుచితవచనంబుల సంభా
వింప నమితవైభవంబున వైవస్వతసభాభవంబున కరిగి యందు.

49


క.

కనుగొనియె నప్పురంధ్రీ
జనమణి, కృతజంతువివిధచయ సంయమనున్,
వినుతాచారప్రమనున్,
ఘనకల్మషదమను మహిపగమనున్ శమనున్.

50


క.

ఆసమవర్తియు, నత్తఱి
నాసుదఁతికిఁ దండ్రిబోలె ననుమోదకరుం
డై, సముపచారపూర్వము
గా సమ్మతిఁ బలికె మధురగంభీరోక్తిన్.

51


సీ.

నెలఁత యీభవమున నీచేసినట్టి ధ
ర్మంబు లే దొకలేశమాత్రమైన,
విను మిట, క్రిందటఁ జనిన పండ్రెండవ
జన్మంబునందు నీసదనమునకు
హరిభక్తుఁ డగుసిద్ధవరుఁ డొకఁ డేతెంచి
యుండె సౌఖ్యంబున నొక్కరాత్రి
తత్సన్నిధానజాతప్రభావమున నీ
కటుగల్గె సాధుసమాగమంబు


తే.

తన్నిదానోచితసుకృతత్వమున రంగ
సీమ నశ్వత్థతీర్థవాసియును బ్రహ్మ

వాదియును నైనమాధవి సాదరమున
నొసఁగె, నొకదిన మచటఁ దా నున్నఫలము.

52


క.

చెందిన దత్పుణ్యము వసి
గం దరుణీ యుండు మింకఁ, గల్ఫక్షయమౌ
నందాక బ్రహ్మలోకము
నం దవ్యయదివ్యసుఖసమన్విత వగుచున్.

53


చ.

అని శమనుండు వీడ్కొలుప నారమణీమణి సమ్మదంబు నె
మ్మనమున నిండ నుద్యదహిమద్యుతి మండలరుగ్విడంబి నూ
తనమణిమాలికావిలసితం బగుదివ్యవిమాన మెక్కి పెం
పెనయఁగ బ్రహ్మలోకమున కేఁగె సురల్ వెఱఁగంది చూడఁగన్.

54


క.

మాధవియు నిచట ననితర
సాధారణ మైనతపము సలుపుచుఁ గరుణాం
భోధిఁ గమలాధిపతి నా
రాధించి తదీయచిరపదస్థితి నొందెన్.

55


వ.

ఇ ట్లఖిలభువనవిశ్రుతంబైన యశ్వత్థతీర్ధంబునఁ గృతస్నానుండవై దేవర్షి
పితృతర్పణంబు లొనర్పుము. ఈయితిహాసంబు వినువారికి దురితనిరా
సంబును, బుణ్యలోకశాశ్వతనివాసంబును సిద్ధించు నని పలికి వాల్మీకి
మునీంద్రుండు వెండియు నేమి వినవలతు వని యడిగిన నమ్మహాత్మునకు
భరద్వాజుం డిట్లనియె.

56


క.

ఘనదురితక్షయకరమై
చను నీయశ్వత్థతీర్థసామర్ధ్యం బిం
కను విన వేడుక యయ్యెడి
మునివర నా కెఱుఁగఁ జెప్పుము కృపామతివై.

57


వ.

అనిన నత్తపస్వివరేణ్యుం డతని కిట్లనియె.

58


తే.

వినుము వెండియు నొకపురావృత్త మనఘ!
ముందుఁ గణ్వుండు నా నొప్పు మునివరుండు

భక్తి నిండార శ్రీరంగపతి భజించు
కౌతుకంబుఁ దలిర్ప నక్కడికి నడచి.

59


శా.

ఆలోలామలచారుకోమలతరంగాహన్యమానోల్లస
త్కూలానోకహపుంజమంజుసుమనోగుచ్ఛావళీసుప్తమ
తాళివ్రాతఁ, గవేరజాతఁ, గని యం దర్థిం గృతస్నానుడై,
యాలోకించె ననంతరంబ మునిభావాసాంగమున్ రంగమున్.

60


వ.

కని తదభ్యంతరంబుఁ బ్రవేశించి యందు.

61


క.

శరదమలకమలలోచను,
దరదళితసరోజధాము ధామశ్యామున్
దరహాసవికసితాననుఁ,
గరుణానిధి, శేషశాయిఁ గామితదాయిన్.

62


క.

సందర్శించి ప్రణామము
లందంద యొనర్చి తనుఁ గృతార్థునిఁ గాఁగం
డెందంబున దలఁచుచు ద
న్మందిరము వినిర్గమించి మది ముద మొదవన్.

63


సీ.

సజలధారాధరశ్యామకోమలగాత్రుఁ
బ్రత్యూషధవళాబ్జపత్రనేత్రు,
మహనీయకురువిందమణికుండలోద్భాసు
మధురాధరోల్లసన్మందహాసు,
రత్నహారాంకితోరస్స్థలపరిణాము,
దివ్యాంగదోజ్వలదీర్ఘబాహుఁ,
గటివిస్ఫురత్పీతకౌశేయపరిధాను,
బరిపూర్ణయౌవనభ్రాజమాను,


తే.

ధీరు నఖిలైకమోహనాకారు నాత్మ
సన్నిభ ద్విత్రిభక్తానుచరసమేతుఁ,

గాంతుఁ, గాంతాసమన్వితుఁ గనియె నొక్క
దివ్యపురుషునిఁ గావేరితీరమునను.

64


మ.

కని శ్రీరంగమునన్ భుజంగమసురంగద్భోగశయ్యాతలం
బునఁ దా నప్పుడు చూచునట్టి హరి యొప్పుం దేజమున్ మూర్తి చొ
ప్పును శృంగారవిలాసభంగులు, నెపంబుల్ వేరులే కమ్మహా
త్మునియొండొక్కటఁ గానఁగాఁబడిన నుద్భూతాద్భుతస్వాంతుఁడై.

65


క.

ఇటఁ జూచితి వెడలితి, మఱి
యెటుజన కదెవచ్చి కంటి నీలోనన, తా
నెటనుండి వచ్చెనొకొ యి
చ్చటి కప్పరమేశుఁ డనుచు సంశయమతియై.

66


ఆ.

కదియఁ బోయి నిజముగా విలోకించెదఁ
గాక యనుచుఁ గౌతుకమున జేరి
పరగుఁ దత్ప్రభావపరిమోహితాత్ముఁడై
యెఱుఁగలేక మఱియు మఱియుఁ జూచి.

67


క.

కాఁ డితఁడు రంగవిభుఁడను,
వేఁడిమి మఱి యట్టివాఁడు వేఱొకఁ డనుచున్,
లేఁడను నిత్తెఱఁగున నవు
గాఁడని భావింపఁ గొలఁదిగాక జడుండై.

68


శా.

ఆందోళించుచు నివ్వెఱన్ మునిఁగి చింతాక్రాంతుఁడై నిల్చినన్,
మందస్మేరముఖారవిందుఁ డగుచున్ లక్ష్మీశ్వరుం డాతప
స్విం, దేజోమహితుం, గృపాసహితుఁడై వీక్షించి, ధారాధరా
మందధ్వానగభీరవాక్యముల సన్మానంబుగా నిట్లనున్.

69


తే.

ఏమి చింతించుచున్నాఁడవో, మునీంద్ర?
నీమనంబున నది మాకు నిజముఁ జెప్పఁ
బొసఁగు నేనియుఁ జెప్పుము పొసఁగకున్న
నుండఁగానిమ్ము నీయందు నున్నపగిది.

70

వ.

అని యాదేవుండు పలికినఁ జెవుల నమృతంబులు చిలికిన
చందంబున
నమందానందంబు నొందిన యమ్ముకుందున కందంద యభివందనం
బాచరించి, కృతాంజలియై యమ్మునికుంజరుం డిట్లనియె.

71


చ.

అనుపమభోగితల్పగతు సంచితహాసవికస్వరాననున్,
నిను నఖిలేశు నిప్పుడిటు నెమ్మిఁ గనుంగొనవచ్చి, యింతలో
నన యిచటం బ్రియానుగసనాథు నుదారవిహారశీలుఁ జ
య్యనఁ గని యీతఁ డెవ్వడొకొ యంచు మనంబున జింతనొందితిన్.

72


ఉ.

నీవె యతండ వౌదువని నిర్ణయబుద్ధి జనించె నాకుఁ బ
ద్మావర! యిప్పు డిందుఁ గడు ధన్యుఁడనైతిఁ గృతార్థ మయ్యె నా
జీవిత, మీభవంబు వెలసెన్ నిను సర్వగు వేదవేద్యు నా
ర్తావనలోలు దేవమయు నచ్చట నచ్చటఁ జూడఁ గల్గుటన్.

73


ఉ.

నావుడు నంబుజాక్షుఁ డెలనవ్వుఁ దలిర్పఁగ నమ్మునీంద్రుతో,
నీవిమలప్రదేశ మతిహృద్యము నాకు సుధాసమంబు సం
భావనమైన యీవనియుఁ బ్రాణపదం బదిగావునన్, సుఖ
శ్రీ విలసిల్ల నీతటి వసించితి మంగళరంగశాయినై.

74


ఉ.

ఇచ్చటఁ దక్కఁ దక్కునెడ లెవ్వియు నామదికిన్ రుచింపమిం
బొచ్చెము లేక యీతటినిపొంత వనాంతములందుఁ, జాలఁ గ
న్నిచ్చకు వచ్చుకందువల నిచ్చపలాక్షియు నేను నిచ్చలున్
మచ్చికమైఁ జరింతుము సమంచితసౌఖ్యవిహారలీలలన్.

75


వ.

అని చెప్పి, యప్పద్మవాసినీసహచరుం డనుచరసహితుండై యల్లనల్లన జని
ముందట సమదవిలాసభవనం బగువనంబుఁ జొచ్చి యం దరవిరుల మధుకు
లంబు పరువంబులై కదలి తరువం బొడమిన తరువు గురువంబునకు మురువుఁ
జూపుకురువకంబుల పొరువులును, దరుణారుణశ్రీకంబులై సైకంబు లగు
కేసరంబుల యానీకంబుల నఖిలలోకవిలోకనంబులకు నుత్సేకంబు నెఱుపు
నశోకంబుల జోకలను, వికసనావసరంబుల నలివిసరంబులకు సుసరంబులై
రసంబులకు మాసరంబుల లగుకేసరంబు నతిభాసురంబు లగుపరిసరీలను

కోపంబుల విరహుల నేఁపం బురికొను కుసుమచాపంబుజోడు నాటోపంబు
నకు ననురూపం బగుకలికాకలాపంబున దీపించు నీపంబుల సమీపంబులను
వలరాజు కొలువుమేడల జాడ లలితంబులై ప్రోడలఁ గ్రీడల కేవరించుచు,
నీడలె క్రీనీడలగు సారంబులగు నమృతపూరంబులచవి నిరసించు నిరాతపం
బుల తోరంబు లగునారికేళంబులచేరువులను, నాగలతాయోగంబులఁ బొదలి
దశాభోగంబుల పరాగంబు లడర నుద్వేగంబుల భోగులకు ననురాగంబు
లొసఁగు పూగంబులదెస భాగంబు లగుసుజాతంబులగు కలికాజాతంబులకు
నికేతనంబులై, కాముకవ్రాతంబులచేతంబు లుత్కళికాసమేతంబుగాఁ జేయు
పారిజాతంబుల యీతలాతలను సరసాలవాలంబులై హరినీలంబుల
బోలు ఫలజాలంబుల విశాలంబులగు జంబూసాలంబుల మూలంబు
లను వనదేవతాకేళికందుకంబులనం గేళీకందుకంబుల పొందున
సుగంధకబిందుఫలకంబుల పొందునఁ బోల్చుతిందుకంబుల కందువలను,
బసిఁడిబొమ్మల చెలువంబు గల కొమ్మల కస్తూరి చెమ్మలుగల కుచమ్ముల
తమ్ముల వెసివాసనల తెమ్మ లగుఫలమ్ముల వీఁగు కొమ్మలు గల నిమ్మల
యిమ్ములను, శుభాకారంబులు గలతీరంబుల విహారంబులకు నిజాగారంబు లగు
సహకారంబుల కనతి దూరంబులను వలపుల పెంటలయి యలరు తేనియతేట
లాని చెలఁగు తేఁటిజూటుల పాటలంబు లీనమి సయ్యాటలం గొని యాటలకుం
దగి తుంటవిల్తు నాటకశాల లన పికవిహారంబునకుఁ బాటలై యభినవారుణ
ప్రభాపాటలంబు లగుపాటలంబుల చాటులను గనకసముజ్వలంబు లగు
దలంబుల నెసఁగి దలంబు లగుపరిమళంబు లగుఫలంబున వనచర
కులంబునకు బలంబుల నొసఁగు కంటకీఫలంబుల సవిధంబులను, అంగజు
నిషంగంబు లన సురంగంబులగు కుసుమకుడుంగంబులఁ బరిమళాను
షంగంబులై యతిరాగరసోత్తరంబులుఁగాఁ జెలంగు భృంగంబులకుఁ
గ్రీడారంగంబులసంగతి, నలికంబులఁ దిలకంబులం గల కంబుకంఠుల
యలికంబుల తేటి సలకంబుల బొలుచు నలకంబులకు నలవడునలరుల
కులంబు లగు తిలకంబుల కెలఁకులను, విటజనంబుల మనంబుల ఘనంబు
లగు మానధనంబు లనుదినంబును గొనబఱచు మరునిపరిజనంబులకు నావ
టంబు లగు వటంబుల కుఱంగటలను, జరగు వలపులఁ దగిలి మరిగి
తిరుగు తెఱవల మొజంగి సరగున సురిగి యరుగఁ బ్రియులకు వెరగు
లగు సురగుల పొరుగులను, సొంపు దింపక విఱిగియు విరుల పెంపుకలిమి

చంపకమాన దనితలంపక పొలయు మధుపదంపతులకు మనఃకంపంబు
లగు చంపకంబుల, శ్రీమంతులను కళావంతుల వింతలీలలను వలవంతలం
దగిలింప వలవంతు లగునింతులచే బంతులకు వంతులు వడిన సేమంతుల
పొంతలను సజ్జకంబు లగువలవుల నిజ్జగంబుల వాసించుచుఁ గ్రొజ్జిగురు
మిగులు గొజ్జెంగల పజ్జలను, రతితంత్రవేదుల విశేషంబులకుఁ బ్రోదులై
మలయజామోదు లగు విరవాదులును, వివాదులపొదల వీథులఁ జల్ల
తెమ్మెరల నల్లలనాడు పూరెల్లులఁ దూఁగు తేఁటి పిల్లలకుఁ బల్లవులు కొల్ల
లొసఁగుచు నెల్లలకు మొల్లలవల్లుల మొల్లంబు లలర మెలఁగుచు నసమ
విలాసాభిరామ యగు నారామకు నారామసీమంతతరుసంతానంబు నంతంతం
జూపుచు నయ్యాప్రదేశంబుల.

76


క.

కురువిందరదన, తత్ప్రియ
సరవిం దలమ్రోఁగు తేఁటిజవరాలికి ముం
దరవిందని పరు వందిన
కురువిందలఁ జూపె నొక్కకురు విందఱకున్.

77


క.

మాకందము కడు నిది ర
మ్మా! కందము డాయఁ బోయి మంజీరులకున్
మాకందఁగ వెఱఁ గవిసిన
మాకందము మగువ మధురమాకంద మిలన్.

78


క.

వారములగు నతనుని పరి
వారములకు నెలవు లగుచు వారెడి సమ్య
గ్వారము వారముదన, కై
వారము లొనరింప సింధువారము లతివా!

79


క.

దవనము వనలక్ష్మి వినో
దవనము, సదవనము విరహతాపాంధులకున్
భువనము లలరఁగ మెలఁగెడి
భవనమున కపూర్వజన్మభవనము తన్వీ!

80


క.

శుకముఖరుచిగల తపనాం
శుకముల నెఱి మెఱయు నంగజునితటభవనాం

శుకములన మెఱయు నవకిం
చకములఁ గనుఁగొనుము రాజళుకమృదువాణీ!

81


క.

కావలియై మధుకరపృథు
కావలి చరియించు నీలతాగ్రంబున నీ
కావలి విరు లేటికి మద
కావలిదెస చంపకముల కరుగుద మబలా!

82


క.

కలవాణి ప్రేంఖణము మ్రోఁ
కల వాసంతికల గోయఁగా నిక్కెదు నీ
కలవాటు గాదు ప్రాఁకం
గలవా చెలువారు వాని కడకొమ్మలకున్.

83


వ.

అనుచు నీచందంబుల విహారంబులు డెందంబున కానందంబు నొందింప
నయ్యాదిమదంపతులు చరియించు సమయంబున.

84


సీ.

పరువైన కంకేళివిరుల శాఖల వ్రీలి
తొరఁగు పుప్పొడి ధూళిఁ దూలఁదోలి,
మాధవీకుసుమాళి మకరందములు గ్రోలి,
భ్రమరించు మత్తాళి రవము నేలి,
ప్రియులతో రతికేళిఁ బెనఁగి యింపుల సోలి,
యలయుపాలము నోలి దెలుపఁ జాలి,
కొనియాడఁదగు మేలికొలఁకులపై వ్రాలి,
వీచిపంక్తుల గ్రాలి వేడ్కఁ దేలి,


తే.

కలితపరిపాకభరశాలి కలమశాలి
కలశసందోహములఁ దూలి, గగనపాలి
మెలఁగె విరహాతురులపాలి మేటిజాలి
చందనపుఁ గొండఁ బుట్టిన చల్లగాలి.

85


ఉ.

ఆనునుగాలి సోకునఁ బ్రియం బెసఁగం బులకాంకురావళుల్,
మేనుల నుల్లసిల్లు మధుమేదురవంజులమంజరీచర

న్మానితచంచరీకలలనాకలనాదనవీనగానముల్
వీనుల విందు సేయ, నరవిందనివాసినియున్ ముకుందుఁడున్.

86


సీ.

నిక్కువంబై నిక్కు మక్కువఁ బ్రియురాండ్ర
నిక్కువలకు దార్చు జక్కవలను,
నంచితలీలమై నంచలువడియురా
యంచలఁ గ్రీడించు నంచగములఁ,
దమ్ముల నిమ్ములఁ గ్రమ్ముతేనెలు గ్రోలి
ఝమ్ము ఝమ్మని మ్రోయు తుమ్మెదలను,
గ్రాలుఁగంటుల నిడువాలు కన్నుల డాలు
నేలు లీలల వాలు వాలుఁగులను


తే.

జలువ వలపుల నలరుల గెలువఁ జాలు
చెలువ మసఁగిన కన్నె చెంగలువ వీరుల
మహితమై పూర్ణిమాచంద్రమండలంబు
కరణిఁ జెన్నారు చంద్రపుష్కరిణిఁ గలసి.

87


క.

సారసమంచితకోమల
సారసనాళాంకురములు చవిగొను మనుచున్
సారముగా విహరించెడు
సారసములఁ జూడు చకిత సారంగాక్షీ!

88


క.

చిత్తములు గలఁగ విరహుల
మొత్తముల గదల్చివేయ మొనయ మరునకుం
గ్రొత్తమ్ములైన తమ్ముల
నెత్తములై మెఱయు తేటినికరము గంటే?

89


క.

తోయజదళలోచన తన
తోయంబులలోనఁ దోయతోయము నెలమిం
గాయము దొలఁపెడి సుకృతని
కాయము నీసరసి సురనికాయము కనుపున్.

90

వ.

అనుచు నెమ్మనంబున జలకేళీకౌతుకంబున నా లీలావతి కేలు కేలం గీలించి
యాసరసిఁ దఱియంజొచ్చు సమయంబున.

91


చ.

జలనిధికన్య లేఁగురులు షట్పదపంక్తులు, గ్రాలుఁగన్నులుం
గలువలు నవ్వుదేరెడి మొగంబును బద్మము, బాహుయుగ్మమున్
నలికపుఁదూడు దీవలు, ఘనస్తనకుంభయుగంబుఁ జక్రవా
కలుఁ, దనలోన వీడువడి కన్నులపండు వొనర్చెఁ జక్రికిన్.

92


వ.

అప్పుడు.

93


సీ.

ఉరువడి నెదురీదు నొకచోట వెసఁ గ్రుంకి
తలచూప కొక్కింత తడ వడంగు,
నడుమను మీఁద వెల్వడు నెటనైన
మొనసి చీరఁగ మాఱుమొగము సేయు,
మేను వంచన దాఁచి మీఁదికిఁ బదమెత్తు
రాజహంసలతోడ రాయిడించు,
సుడివడి కమలముల్ వడి ద్రిప్పుబలమున
నుదకంబు తనకురా నొత్తి తిగుచు


తే.

దనరు పద్మాసనస్థుఁడై మునియుఁబోలె
నిగుడు జపమున నెక్కుడు నేర్సు చూపు,
నురగతల్పుఁడు చంద్రపుష్కరిణియందు
జలధిసుత గూడి జలకేళి సల్పునపుడు.

93


తే.

తడిసి యంటినజిలుఁగులో దళుకుచూపు
నిజనితంబంబుపైఁ జూడ్కి నిలుపు చక్రి
నేత్రమున లక్ష్మి చల్లిన నీరధార
యతని ముఖపద్మమున నాళమనఁగ వెలసె.

94


చ.

సురుచిరలీల లక్ష్మ వెసఁజూచి నభంబున మండలాకృతిం
దిరుగు మరాళపంక్తిపయ దృష్టి నిగిడ్చిన నొప్పె ధారుణీ

ధరునకు నింపు పెంపెసఁగఁ దద్దయు దేవతనీలదండమున్
దిరముగ సంఘటించి తగఁ దెచ్చిన నల్లనియొల్లెయో యనన్.

96


చ.

ఉరుతరపద్మనాళముల నొండొరు వ్రేయుచు డాసి వీడ్వడం
బొరిఁబొరి మోములన్ సలిలపూరము చిమ్ముచు నీరజంబులం
దొరలెడు పుప్పొడుల్ నెనయఁ దోయరుహంబులఁ జల్లి నవ్వుచున్
హరియును లక్ష్మియున్ జలవిహారము సల్పిరి నిండువేడ్కలన్.

97


క.

ఈరీతి లోకగురులగు
వారిరువురు నందుఁ గొంతవడి సుఖలీలన్
గూరి పదంపడి సలిలవి
హారముఁ జాలించి వెడలి రాసమయమునన్.

98


క.

ఇందిరకుంతలముల తుద
లం దొరఁగెడి జలకణంబు లమరెం భ్రమరీ
బృంద మతిపానవశమున
గ్రందుగ మకరందరసము గ్రక్కెడుమాడ్కిన్.

99


ఉ.

పెన్నెఱివేణిఁ గ్రొన్ననల పెంపున సొంపు నటించు పాపటం
జిన్నిమెఱుంగుముత్యముల చెన్నున నిద్దఁపుఁ జన్నుదోయిపైఁ
బన్నిన పచ్చకప్పురపు బన్నసరంబులలీలఁ జాల నొ
ప్పెన్నెఱిఁ దెల్పుమీఱు జలబిందువు లంబుధిరాజకన్యకున్.

100


ఉ.

అంత ననర్హరత్నరచితాభరణంబులు, దివ్యవాసనా
వంతములైన పూఁతలును వాడని మాల్యములన్ సువర్ణస
త్కాంతిఁ దలిర్చు చేలములు గైకొని యొప్పిరి విష్ణుఁడున్ రమా
కాంతయు నిత్యమంగళ జగన్నుతవేషవిశేషలీలలన్.

101


ఉ.

అత్తెఱి నచ్చటం గల మహామును లందఱు గాంచి విస్మయా
యత్తమనస్కులై ప్రమద మారఁగ నొండొరుతోడ సద్గుణో
దాత్తచరిత్రుఁడైన యితఁ డారయ నెవ్వఁడొ కాక సర్వలో
కోత్తరుఁడైన రంగవిభుఁడో మును గాంచి యెఱుంగ మీఘనున్.

102

క.

అని తలపోయఁగ జలజా
సనజనకుం డచటు వాసి చయ్యనఁ జనియెం
గనకాచలశృంగముగతి
ఘన మగు నశ్వత్థతరువు గల తీర్థముకై.

103


ఉ.

ఆ మహనీయభూజమున కర్థి నమర్త్యులు సన్మునీంద్రులున్
నేమముతోడ నొప్పెసఁగ నించిన పూజల వృత్తిఁ జూచుచుం
దామరసాక్షుఁ డిందిరయుఁ దానును దోఁ జనుదెంచు పూరుష
స్తోమముఁ దన్మహీరుహముఁ జొచ్చె మునుల్ వెఱఁగంది చూడఁగన్.

104


వ.

ఇత్తెఱంగున నత్తరురాజంబునం దారంగమందిరుం డంతర్ధానంబు నొందిన
నాదేవునిఁ గానక పరిదేవనంబు సేయుచు నితాంతసంతప్తమానసుండై
కణ్వుండు బహువత్సరంబు లాహారంబు పరిహరించి యన్నెలవుఁ బాయ
కున్నంత, ననంతరంబ యంతరిక్షంబున నొక్కవాక్యం బిట్లని
వినంబడియె.

105


ఉ.

మానుము రోదనంబు బుధమాన్యచరిత్ర; పవిత్రపావనం
బై నుతికెక్కు నీచలదళాహ్వయతీర్థజలావగాహనం
బూనిన వేడ్క సేయుజను లొక్కట మిక్కుటమైన పాప సం
తానము పాసి పొందుదు రుదారసుఖప్రదమత్పదస్థితిన్.

106


వ.

విను మఖిలపురుషార్థప్రదానసమర్థం బగు నీ తీర్థంబునందు ధేనుదానంబు
సేయు మానవుడు దురితనిరాకరిష్ణుండై విష్ణులోకంబు నొందు, నన్నదానం
బపవర్గసుఖనిదానంబు, తిలదానం బేకవింశతికులోద్ధరణంబు, సువర్ణదానం
బుత్తమవర్ణహత్యానివృత్తిహేతుభూతంబ, యేకరాత్రోపవాసం బపస్మృతి
నిరాసంబు గావున నీ విచ్చట మదర్చనంబు గావించి రంగమంది
రంబున నన్ను సందర్శింపు, మట్లయిన నక్షుద్రంబు లగుభద్రంబు లొందెద
వని యానతిచ్చి యూరకుండిన కణ్వుం డప్పుండరీకాక్షుశాసనంబున
బ్రహ్మోపాసనాపరాయణుడై చిరకాలం బుండె నని చెప్పి వెండియు
వాల్మీక మునీంద్రుండు భరద్వాజున కిట్లనియె.

107


ఆ.

అనఘ వినుము కేసరాహ్వయవిఖ్యాతి
నొనరు తీర్థ మచట నొకటి గందు

కోరి విన్నఁ బేరుకొన్న విలోకింపఁ
గను దలంగు నఖిలకల్మషములు.

108


క.

నిరుపమనితాంతమహిమం
బరఁగెడి తత్తీర్ధమున, సమంచితనిష్ఠా
నిరతుఁడు కాశ్యపుఁ డనియెడు
ధరణీసురవరుఁడు మున్ను తప మొనరింపన్.

109


చ.

అరినరపాలదుర్మదమహాగజకేసరి, కాశికాపురీ
శ్వరుఁడు, సుకీర్తినాఁ బరఁగువాఁ డొకనా డట నేఁగుదెంచి చె
చ్చెర బహురోగపీడలఁ గృశించి నశించెడియాత్మసేనఁ ద
త్పరమపవిత్రతీర్ధసవిధంబునఁ గావఁగ బూని సమ్మతిన్.

110


క.

ఆ విధమున చతురంగబ
లావృతుఁడై వచ్చి తనకు నభివందనముం
గావించి యున్న యావసు
ధావరునకు నత్తపస్వి తా నిట్లనియెన్.

111


ఉ.

ఎయ్యెడనుండి వచ్చి తిట కెవ్వఁడ వీవు భవన్మనోరధం
బెయ్యది చెప్పు మిప్పు డది యిందును నందును బోల దుర్లభం
బెయ్యది యైనఁ గైకొని రయంబున నేనొనరింతు నీపయిన్
నెయ్యము మించె నాకు ధరణీవర నావుడు నమ్మునీంద్రుతోన్.

112


క.

అతనికి నిట్లను కాశీ
పతి యగుసుబలాత్మభవుఁడఁ బరమసుకీర్తిన్
నుతపుణ్యతీర్థసేవా
వ్రతనిష్ఠానిరతి నిటకు వచ్చితి ననుడున్.

113


చ.

మునివరుఁ డిట్లనుం బరమపుణ్య యెఱుంగుమ మున్ను నేను నీ
జనకు నానృపాలునకు సౌఖ్యమె రాజ్యముతో డొనర్ప కీ
వనుపమనవ్యభోగముల నందక యీగతిఁ గందమూలభో
జనములఁ గుందుతాపసుల జాడల నొంటిఁ జరింప నేటికిన్.

114

చ.

అనిన సుకీర్తి యిట్లను నుదాత్తగుణోజ్వల! నీయనుగ్రహం
బునఁ గుశలంబు మాసుబలభూపతికిన్ భవదీయపాదవం
దనమును జేసి యేను గడుధన్యుఁడ నైతి మదీప్సితంబు లె
ల్లను ఫలియించె నీకృపఁ దలంపఁగఁ జోద్యము లెవ్వి యీయెడన్.

115


క.

నానాటికి నా సేనలు
నానారోగములచేత నవసి కృశింపం
గా నది మాన్పెడుకొఱకై
యీనది చేరువకు వారి నెల్లను గొనుచున్.

116


క.

చనుదెంచి మీతపోవన
మున కలజడి యొదవు ననెడుబుద్ధిని బాహ్యం
బున వారి నునిచి వచ్చితి
మునివర! నీ చరణకమలములు దర్శింపన్.

117


ఆ.

అనిన నమ్మునీంద్రుఁ డవనీశ! నీ బుద్ధి
బలము నెఱయ నఖిలబలములకును
హితముగా నొనర్చి తీ వది కడులెస్స
చెప్పు మింక నేమి సేయవలయు.

118


చ.

అనుటయు సమ్మదం బొదవ నానృపుఁ డిట్లను నీపదాబ్దముల్
గనుఁగొనఁ గల్గినప్పుడ తలంగె మదీయబలామయవ్యథల్
పెనఁగు దురాశఁ గట్టువడి భీకరసంసృతిసాగరంబునన్
మునిగెడు నాకు నేదిగతి ముందట నట్టిహితంబుఁ జెప్పవే!

119


వ.

అనిన నానృపోత్తమున కాతపోధనసత్తముం డిట్లనియె.

120


క.

శ్రీవిభుని భక్తవత్సలు
గోవిందుని విశ్వలోకగురు నతిభక్తిన్
సేవింపని మూఢాత్ములు
భూవర! సంసారముక్తిఁ బొందంగలరే!

121

క.

కావున నప్పరమేశ్వరుఁ
బావనమతిఁ బూజ సేసి పడయుము ముక్తిన్
శ్రీవనితాసంగమసం
ధావితనిరవధికసౌఖ్యపరిణతి నధిపా!

122


ఆ.

అనినఁ బరమయోగిజనులకు నైనను
తలఁపులోన నిలుపఁ దరముగాని
యట్టిదేవు చంచలాత్ముఁడనైన నేఁ
గొలుచు టెట్లు భయము గెలుచు టెట్లు.

123


సీ.

నావుడు నన్నరనాథుతో సంయమి
శ్రేష్ఠుఁ డిట్లను నీవు చెప్పినట్లు
యెంతటివారికి నెఱుఁగ శక్యముగాక
దీపించు బ్రహ్మస్వరూపి యగుచు
వెలసిన యమ్మహావిష్ణుఁ డేకాగ్రభా
వమునఁ దన్ను భజించువారిఁ బ్రోవ
వలసి సత్కరుణమై వాసుదేవాదిక
మూర్తులు దాల్చి యంబుజభవాది


తే.

సురలు నరులును సన్మునివరులు గొలువఁ
బరఁగు తద్దివ్యభవ్యరూపంబులందు
నీమనం బెందు నిశ్చలనియతి నిలిచె
నది భజింపుము సిద్ధించు నభిమతములు.

124


క.

అదియునుంగాక.

125


తే.

దారుధాతుశిలానిర్మితంబు లైన
యట్టి హరిబింబములను ధరాధినాథ
దివ్యదేశంబు లెఱుఁగు మద్దేవుఁ డందు
నిత్యసన్నిహితాత్ముఁడై నిలుచుఁ గాన.

126


మ.

గురులీలన్ విరజోపకంఠమున వైకుంఠంబునన్ దివ్య
సురభోగంబుల నిందిరాసహితుఁడై శోభిల్లు నేభంగిఁ దా

హరి, యాభంగిన తత్కవేరతనయాభ్యర్థంబునన్ మంగళా
కరరంగన్మణిధామ ముఖ్యముగ సౌఖ్యశ్రీలఁ జెన్నారెడిన్.

127


క.

చను మచ్చోటికి ననుటయు
ననుమోద మెలర్ప నృపతి యమ్మునిపతికిన్
వినయమున మ్రొక్కి నాతో
ననఘా! చనుదేరవలయు నచటికి నీవున్.

128


వ.

అని ప్రార్థించిన నప్పార్థివుపలుకు లాకర్ణించి మేదురప్రభావభాసురుం డగు
నమ్మునిజనాగ్రేసరుండు.

129


శా.

ఛత్రంబుం జలపూర్ణపాత్రము నుదంచద్వేత్రముం బూని స
చ్ఛాత్రశ్రేణి మఘప్రయోగసరణుల్ చర్చించుచుం దోడరా,
గాత్రస్ఫూర్తులు దిక్కులం బరగ రంగస్వామి దర్శింప నా
ధాత్రీనాయకు ముందటం జనియె నుద్వత్కౌతుకోల్లాసియై.

130


క.

పటుగతి నమ్ముని పిఱుఁదం
జటులగజద్విరదతురగసంకులసేనా
పటలావృతుఁ డయి చనియెం
బటహధ్వను లెసఁగ భూమిపతియుం బ్రీతిన్.

131


వ.

ఇత్తెఱఁగునఁ జని తన్మార్గంబున నపవర్గదానసమర్థం బగు జంబూతీర్థంబు
గదిసి రప్పు డప్పరమతపోధనుండు మహీధవున కిట్లనియె.

132


క.

ఈ తీర్థము బహుదురిత
వ్రాతతమఃపటలచటులవనజవనహిత
ద్యోతము జంబూకసమా
ఖ్యాతము శుభసలిలదేవఖాతము భూపా.

133


క.

పంబినశాఖాశిఖరక
దంబముచే నంబుధరపథం బొరయుచు లో
కంబులు పొగడఁగ నిట నొక
జంబూతరు పమరు నమరసంపూజితమై.

134

ఉ.

దేవవిభుండు మున్ను గడుతెంపున వృత్రుని జంపి, బ్రహ్మహ
త్యావృజినంబుచే నిజపదస్థితిఁ జాసి వినష్టతేజుఁడై
యేవిధ మింక నీదురిత మీగుదునంచుఁ బ్రతప్తచిత్తుఁడై
వావిరి బిట్టుత్రిమ్మఱియె వార్ధిపరీతవసుంధరాస్థలిన్.

135


క.

మిగిలిన పాపభయంబునఁ
బొగులుచు నయ్యింద్రుఁ డెందుఁ బోయిననైనన్
జగతీశ బ్రహ్మహత్యయు
నిగిడెన్ వెనువెంటఁ దోడనీడయుఁ బోలెన్.

136


వ.

అది గనుంగొని తల్లడ మడరఁ బాకశాసనుండు వారిజాసను సమ్ముఖమ్మున
కేగి బ్రణమిల్లి తనతెఱం గెల్లఁ జెప్ప నప్పితామహుం డతని కిట్ల నియె.

137


చ.

పరము ననంతు నచ్యుతు నపారకృపామృతపూరసింధు, సిం
ధురవరదున్ ప్రఫుల్లనవతోయజలోచను నాశ్రయింపు త
త్పరిచితదివ్యదేశములు పావనతీర్ధములుం దదీయబం
ధురశుభనామకీర్తనము దుస్తరపాపనిదాఘమేఘముల్.

138


వ.

అని యుపదేశించిన వాసవుండు వారిజాసను శాసనంబునఁ దీర్థోపాసనం
బొనరించుచు విమలపుష్కరంబగు పుష్కరంబున నెనిమిది వత్సరంబులు
నపారమహిమోదారంబగు గంగాద్వారంబునఁ బదివత్సరంబు లుపవసించి
భువనమాన్యయగు కళిందకన్యయం దఖిలమునికీర్తితంబులగు తీర్థంబులాడి
యగణ్యపుణ్యాలవాలంబగు సాలగ్రామశైలంబున నారాయణు నారాధించి
దురితలతికావినాశియగు కాశియందుఁ గృత్తివాసు నుపాసించి సరస్వతీ
కూలంబున సరస్వతి సమర్చనం బొనర్చి, యేపగిదిం దనపాపంబుఁ బాపి
కొన నోపక యమ్మహేంద్రుండు చంద్రపుష్కరిణికి వచ్చి యచ్చటం
ద్రయోవింశతి వత్సరంబులు గడపెఁ దదనంతరంబ.

139


శా.

జంబూదుంబరబిల్వతీర్థకదళీసౌవీరభల్లాతకీ
జంబీరామ్రకపిత్థతిందుకసలేశాశోభితంబైన యీ
జంబూకాహ్వయతీర్థరాజమున కాజంభారి యేతెంచి భ
క్తిం బూజించె సరోజలోచనుఁ ద్రిలోకీపాపనిర్మోచనున్.

140

క.

ఆగతి కొండొకకాలము
సాగఁగ, హరిహయుఁ డొనర్చు సమ్యక్పూజా
యోగంబు కెంతయును నను
రాగంబునఁ బొంది పత్రరథవాహనుఁడున్.

141


ఉ.

తెల్లని తమ్మిరేకులగతిం జిగి మించు వెడందకన్నులుం
జల్లని సత్కృపారసముఁ జల్లెడు చూపులు లేఁతనవ్వు రం
జిల్లెడు నెమ్మొగంబు, వికసిల్లెడు నల్లని కల్వపూలతో
నుల్లసమాడు మైపసయు నొప్పి నిజాకృతిఁ జూపి నిల్చినన్.

142


ఉ.

పెన్నిధిఁ గన్న పేదగతిఁ బేర్చినయుబ్బున నబ్బలారిపైఁ
గన్నులవిప్పు లెల్ల విరిగాఁ దదుదారవపుర్విలాససం
పన్నతఁ జూచి మ్రొక్కి, బహుభంగుల సన్నతు లాచరించినం
బన్నగతల్పుఁ డిట్లనుఁ గృపామతి మేఘగభీరభాషలన్.

143


క.

బలశాసన! నీ వనిశము
సలిపెడు పూజనలఁ గడుఁబ్రసన్నుడ నైతిన్
వెలయఁగ నొకవర మిచ్చెద
వలసినయది వేఁడు మనిన వాసవుఁ డనియెన్.

144


తే.

పెంపుఁ దేజంబుఁ బొలివోయి పెద్దకాల
మలయుచున్నాఁడ నీ బ్రహ్మహత్యచేతఁ
గరుణ దలకొన నీపాతకములఁ బాపి
నన్ను రక్షింపు మేర్పడ నలిననయన.

145


క.

అని విన్నవించుటయు న
ద్దనుజాంతకుఁ డతనిఁ జూచి, తడయక నీ వే
ఘనతీర్థజలనిమజ్జన
మొనరింపుము దురితముక్తి నొందెదు దానన్.

146


క.

వారక భువి నేపారిన
వారిం గ్రుంకిడుదు రెట్టివా రఘచరితల్

వారించి నాకడం జను
వారై పొందుదురు తుది నవారితసుఖముల్.

147


వ.

అని యానతిచ్చి యాచతుర్భుజుండు నిజధామంబున కరిగిన సుత్రాముండు
నతిపవిత్రంబులగు నత్తీర్థోదకంబులఁ గ్రుంకి పాపపంకంబు నపనయించి
సమంచితతేజోవిరాజమానుండై శ్రీరంగరాజచరణరాజీవసందర్శనాభి
వందనం బొనరించి, తనర్చి, పెంపున నిలింపానీకంబు గొల్వ నాకంబునకుం
జని, యఖర్వవైభవంబునం బూర్వప్రకారంబున నుండె నని చెప్పి
యక్కాశ్యపమునీంద్రుఁడు వెండియు నిట్లనియె.

148


సీ.

భూనాథ! నీవు నీ పుణ్యతీర్థంబున
నవగాహనము సేయ నఘము లడఁగు,
మున్ను సిద్ధులు మునిముఖ్యులు నిచ్చోట
నిలచి రాగద్వేషములఁ దొలంగి
యధ్యాత్మవిద్యాపరాయణులై కాంచి
రాత్మాభిలషితంబు లైనగతుల,
రాజ్యవిచ్యుతుఁడైన రాజు మజ్జన మిందుఁ
గావించి మూఁడులోకములు నేలుఁ


తే.

గోరి యీవారిలోపలఁ గ్రుంకువెట్టి
వనిత సత్పుత్రుఁ గను, మూడుదినము లుపవ
సించి త్రిషవణస్నానంబు సేయునతఁడు
సప్తజన్మాఘవితతిఁ తత్క్షణమ పాయు.

149


క.

నేమమున నిజ్జలంబుల
లో మజ్జనమాడు మనుజలోకమునకు నా
నామయములు నవయుఁ దృణ
స్తోమము శిఖిశిఖలఁ గాలుచొప్పున ననఘా.

150


క.

కావునఁ బనుపుము నీసై
న్యావలి, నీవిమలవారి నవగాహనముం

గావింపఁ దత్ఫలంబున
భూవల్లభ సకలరోగములు పెడఁబాయున్.

151


వ.

అని చెప్పినఁ దనబలంబుల నమృతప్రాయంబులగు నత్తోయంబుల నవగాహ
నంబు సేయించె నంత నిరంతరవ్యాధిబాధానిరోధంబుఁ బాసి భాసిల్లిన
నుల్లంబున సంతసిల్లి భూవల్లభుండు కశ్యపసమేతంబుగాఁ గృతస్నానుండై
యచ్చటుం గదలి, చెచ్చెర నామ్రతీర్థంబునకుం జని యమ్మునికుంజరు
ననుమతంబున.

152


క.

సేనాసమేతముగ న
మ్మానవపతి తన్నియోగమజ్జన మెలమిం
దా నాచరించి, యఘములు
వో నొక్కనితాంతతేజమున వెలుగొందెన్.

153


క.

అత్తఱి నట విడిసిన నృప
సత్తము సైన్యములచేతఁ జాలఁగ మెఱసెం
దత్తీర్థపరిసరమ్ము వి
యత్తల ముడుగణముచేత నమరెడుకరణిన్.

154


క.

ఆనెలవున, గతకల్మషు
లై నెగడిన సమ్మునీంద్రు లాకశ్యపునిం
గానం జనుదెంచి, సముచిత
నానావిధపూజనము లొనర్చిరి ప్రీతిన్.

155


చ.

అనలసమానతేజుఁడగు నమ్మునిముఖ్యుఁడు వారి నందఱం
గనుఁగొని యాదరించి, యనఘవ్రతపారగులార యీతటం
బనుపమదివ్యగంధరుచిరాక్షతపుష్పఫలోపహారమై
పెనుపుగఁ దోచె నాకు, వినుతింపరె యిట్టివిచిత్ర మెంతయున్.

156


ఆ.

అనిన నత్తపస్వులం దెల్లఁ బెద్దయై
యనుపమానతేజమునఁ దనర్చు

భార్గవుం డనంగ బరఁగు సంయమిచంద్రుఁ
డమ్మునీంద్రుతోడ ననియె నెలమి.

157


చ.

కల దితిహాస మొక్క టది కాశ్యప! నీకెఱిఁగింతు నంతయుం
దెలియఁగ మున్ను సజ్జనవిధేయుఁడు పుష్కరనామధేయుఁ డు
జ్వలగుణశాలి విప్రకులవర్యుఁ డొకండు, సమస్తధారుణీ
తలమునఁ బొల్చుతీర్థములు తాఁ గనుగొంచుఁ జరించుసమ్మతిన్.

158


క.

ఆతఁడు, త్రిభువననుతమగు
నీతీర్థము మహిమ విని నిరీక్షించెడి సం
ప్రీతి, న్నియతాహారుం
డై తడయక వచ్చునప్పు డమ్మార్గమునన్.

159


చ.

పిడుగులఁ బోలు కోఱలును బెల్లునఁ జల్లినవిస్ఫులింగముల్
వెడెలెడు చూపులున్, నెఱయవిప్పిన నోరును గ్రాలుజిహ్వయున్
బెడిదపు గర్జితంబుగల బెబ్బులిరూపు పిశాచి వచ్చి పైఁ
బడె సతతప్రవర్తితశుభవ్రతభాసురు నమ్మహీసురున్.

160


క.

వెక్కసమున నాఘాతకుఁ
జిక్కక విడువిడువు మనుచుఁ జెచ్చెర దానిన్
స్రుక్కక యదలిచి విప్రుఁడు
చక్కన విడిపించుకొని పిశాచికి ననియెన్.

161


చ.

అతులతపఃప్రభావవిజితాఖిలకల్మషచిత్తు నుత్తమ
వ్రతనిరతాత్ము విప్రకులవర్యుని నన్ను నకారణంబ యీ
గతి నిటు చంపఁబూనితివి కష్టపిశాచమ దుష్టబుద్ధివై
యితరునిఁ బోలె నీహృదయ మెంతయుఁ గ్రూరమవో తలంపఁగన్.

162


క.

నావుఁడు బిశాచి యిట్లను
నేవెంటం దప్పులే దొకింతయు నాయం
దీవిధి ననుఁ బుట్టించిన
దైవమునకుఁ దప్పుగాని ధర్మప్రవణా.

163

వ.

అనిన బ్రాహ్మణుం డిట్లనియె.

164


ఆ.

సకల భూతములకు సాక్షియై వర్తించు
దైవమునకు నేమితప్పు చెప్పు
వరుసఁ గీడు మేలు పొరయంగ నిజకృత
కర్మఫలమ తనకుఁ గర్తగాక.

165


వ.

అనిన నప్పిశాచి యిట్లనియె.

166


చ.

తెలియవు నీవు తత్త్వగతి తెల్లముగాఁగఁ జరాచరంబునం
గలిగిన యీశ్వరుం డొకఁడ కర్తయు, భోక్తయుఁగాక కల్గ దె
వ్వలనను దద్వయుక్తమగు వస్తువు గావున మేలుగీడునుం
దలకొన భూతరాసుల కొనర్పఁగ శక్యమె కర్మకోటిచేన్.

167


ఆ.

కర్మఫలములందు కర్తయు భోక్తయు
శ్రుతులు చాఁటు నీశ్వరుండు కర్త
యయ్యెనేసి తత్క్రియాశక్తి యతనికి
నొదవుగాన నీదురుక్తు లుడుఁగు.

168


వ.

అనిన నగి యతని కిట్లనియె.

169


క.

ఆరయ నీవిశ్వమునకుఁ
బ్రేరకుఁ డీశ్వరుఁడు తద్వ్యపేతం బగుచుం
బూరియునేని చలింపఁగ
నేర దతం డొకఁడ కర్త నిఖిలంబునకున్.

170


వ.

అని యివ్విధంబున మఱియును గొండొకసేపు వివాదంబు సేసి యమ్మేదినీ
సురుం డిట్లను నిచ్చోటి కనతిదూరంబుర నామ్రతీర్ధంబు చెలువొందు,
నందు మహామునిబృందంబు గ్రందుకొనియుండు, వారిముందట మన
మందటలు చెప్పి నీవ గెలిచిన నన్ను భక్షింపు, మేన గెలిచిన నిన్ను వధియించెద,
నని ప్రతిన గావించె, నదియును సమ్మతించి యట్లొడంబడి తత్తీర్ణ
వాసుల సకాశంబునకుం జనిన మానవానుగతయైన పిశాచిం జూచి యచ్చెరు

వొంది, రప్పు డిరువురుఁ దదభివందనం బాచరించి నిటలతటంబున నంజలి
పుటంబులు వొందించి నిలిచి రందు మహీసురుం డిట్లనియె.

171


సీ.

వినుఁడు సన్మునులు నావిన్నపం బేనొక
ధరణీసురుండ, నీధాత్రిమీదఁ
గలపుణ్యతీర్థముల్ క్రమమున నాడుచు
నిటకు నేతెంచుచో నిప్పిశాచి
త్రోవఁ బెబ్బులిరూపుతో నుండి పట్టిన
బట్టీక నేఁ దన్నుఁ బదరుటయును
దప్పు నాయదికాదు దైవంబు దనియెఁ దా
నాగి శుభాశుభముల నొందుచోట


తే.

హేతువగుఁ గర్మ మంటినే, నివ్విధమున
వరుస నపుఁగా దనంగవివాద మెసఁగె,
బూని గెల్చినవానిచే హీనవాది
చచ్చు ననుచు మాలోన నిశ్చయము చేసి.

172


క.

ఇరువురమును మీసన్నిధి
కరుదెంచితి, మిందు యుక్తమగు నిది యని మీ
రరసి తగఁ జెప్పుఁ డనుటయు
మఱి పలికెఁ బిశాచి మునిసమాజముతోడన్.

173


ఉ.

ఏనొక కర్మయోగమున నిట్టి పిశాచపుజన్మ మెత్తితిం
గాని, మదీయబుద్దిబలగౌరవ మేమియుఁ దప్ప దవ్విధం
బైనను, జాతియుక్త మగునట్టిక్రియాగతి నీతఁ డొంటిమై
రా నిటఁ బట్టితిం జయపరాజయముల్ వివరింపుఁ డేర్పడన్.

174


వ.

అనిన నయ్యుభయమతంబులందుఁ బూర్వపక్షసిద్ధాంతంబుల నేర్పఱుప
నేర్పరులు గాక తమలో వితర్కించు మునులకోలాహలం బగ్గం బయ్యె
నయ్యెడ.

175


సీ.

పుండరీకాక్షుఁ డంభోధరశ్యాముఁ డా
జానుబాహుండు విశాలవక్షుఁ

డలినీలకుటిలకుంతలుఁ డంచితస్మిత
లలితకపోలమండలుఁ డనేక
హారకుండలకంకణాంగదమణిముద్రి
కాదిభూషణభూషితాంగుఁ డమల
పీతాంబరుఁ డనల్పబింబఫలాధరుం
డతులితచిరమనోహరవిలాసుఁ


తే.

డసమతేజోవిరాజితుఁ డఖిలభువన
మోహనోదారకళ్యాణమూర్తి యొక్క
పురుషసింహంబు ముగురు నల్గురు నిజోప
మానవేషులు తన్ను సమ్మతి భజింప.

176


సీ.

చెమట చిత్తడిఁ జాల జిగి నించు మృగనాభి
బొట్టుతో నలకలు పొత్తుసేయఁ
దెగగల వాలారు తెలికన్నుదమ్ముల
సుడియు చూపుల వింతసొలపు దేర
జిగి ధగద్ధగయను మొగడచన్నులమీద
జిలుగుపయ్యదకొంగు జీరువార
ముత్యాలకమ్మలఁ బురుడించు వెన్నెల
తళుకులు చెక్కుటద్దములఁ బొలయ


తే.

నంచనటనలు పచరించు నలసగతులఁ
బసిఁడియందెలు మ్రోయ నివ్వసుధ మెలఁగు
ఇందిరాదేవి యననొప్పు నింతి యొకతె
యల్లనల్లన తనతోడ నరుగుదేర.

177


చ.

మును బృందావనవీథి గోపవనితల్ మోదంబు సంధిల్లఁగా
వెనువెంటం జనుదేరఁ గేలిగతులన్ వేడ్కన్ వినోదించు కృ
ష్ణుని చందంబునఁ దద్వనాంతరసరస్స్తోమాభిరామాబ్జసం
జనితామోదసుగంధగంధవహసంచారానుషక్తాత్ముఁడై.

178


క.

ఏలాలవంగలతికా
జాలాలింగితకదంబసముదయసుమనో

హాలామదకలకిన్నర
బాలాసంగీతరవము ప్రమదం బెసగన్.

179


క.

లీలాగతి విహరించుచు
నాలాగున నమ్మునీంద్రు లందఱు రొదగా
సోలి వితర్కించు రవం
బాలించి తదంతికమున కరుదెంచుటయున్.

180


చ.

అతులితదివ్యతేజుఁ డగు నమ్మహితాత్మునిఁ గాంచి సంయమి
ప్రతతి ముదంబు సంక్రమము పైకొన డిగ్గనలేచి కోమలా
యతకుశవిష్టరంబున బ్రియంబునఁ నుంచి సుఖోపవిష్టులై
యతని ముఖేందుచంద్రికల నాత్మదృగుత్పలరాజి రాజిలన్.

181


తే.

అనఘ! నీవెవ్వ రబ్ధికన్యయునుబోని
యీవధూమణి మఱియెవ్వ రిట్లు నిన్నుఁ
బోలె సేవించు నీపుణ్యపురుషు లెవ్వ
రిటకు వచ్చిన కారణం బేమియొక్కొ!

182


చ.

అనవుఁడు, వారితోడ దరహాస మెలర్పఁగ నమ్ముకుందుఁ డి
ట్లను వినుఁ డీప్రదేశమున నర్థిం జరించెడినట్టివాఁడ ని
వ్వనరుహనేత్ర నాహృదయవల్లభ నే నిట వేఁటవచ్చి మీ
పెనురొద వార్ధిఘోషమున బేర్చుటయున్ విని యేఁగుదెంచితిన్.

183


క.

మిముఁ బొందగంటి శుభములు
సమకొనియె, మనోరథంబు సఫలం బయ్యెన్
సుమహితసాధుసమాగమ
మమితశ్రేయఃపరంపరావహముగదా!

184


వ.

అనిన గంభీరభావబంధురంబులును, మధురంబులు నగు తదీయవచస్సుధా
పాథోనిధివీచులం దేలి యమ్మునివర్యు లాశ్చర్యంబున నప్రతీపలావణ్యరూప
తారుణ్యతేజోవిరాజమానశుభలక్షణాదారం బగు తదాకారంబు డెందంబుల
కమందానందంబు నొందింప నందంద చూచి తమలో నిట్లనిరి.

185

మ.

దరదిందీవరదామధాముఁ డగు నీతారుణ్యతేజోధికుం
డరయం బన్నగరాజతల్పుఁ డగు హేమాభాంగి యీ పల్లవా
ధరి పద్మాలయ వీరు సిద్ధపురుషుల్, దా నట్లుగాకున్న నీ
ద్ధర నెవ్వారికిఁ గల్గు నిట్టి భువనోదాత్తప్రభావోన్నతుల్.

186


చ.

అని కొనియాడ నమ్మునుల కప్పురుషోత్తముఁ డిట్లనుం దపో
ధనవరులార! మీర లిటు తర్క మొనర్చుట యేమికారణం
బెనయ విరోధముల్ దొఱఁగి యేకమనస్కులు గాక కూడివ
చ్చిన కత మేమి? నా కెఱుఁగఁజెప్పఁగఁ బోలినఁ జెప్పుఁ డేర్పడన్.

187


సీ.

అనిన నప్పుండరీకాక్షున కాతపో
ధనులు వారల వివాదములతెఱఁగు,
సకలంబు జెప్పి యాజయపరాజయముల
నేమతంబుల నిర్ణయింపలేక,
సందేహమునఁ బొంది చర్చించుచున్నార
మీప్రదేశంబున నిట్లుగూడి
యనఘాత్మ! సకలలోకానన్యసామాన్య
భవ్యలక్షణసముద్భాసితుఁడవు


తే.

ప్రవిమలజ్ఞానమును, బుద్ధిబలము, నీకు
నమరు నాకారసమములై, యట్లు గాన
నొండు దలఁప నగణ్య మొకింత లేదు
నీవ యర్హుఁడ వింతయు నిశ్చయింప.

188


వ.

అనిన నమ్మునిబృందంబునకు నందకహస్తుం డిట్లనియె.

189


క.

విను, విప్రుండును, బులియును
వినుతప్రజ్ఞావిశేషవిదు లిరువురు ప
ల్కిన పల్కులు గా వనఁగా
జన వఖిలపురాణశాస్త్రసమ్మత మగుటన్.

190


సీ.

అఖిలరూపములఁ గర్మానుభూతశరీర
ధారులగా నాది తా సృజించి,

వానియందుండి సర్వప్రవర్తకుఁ డయ్యు
నప్పయోరుహదళశ్యాముఁ డరయఁ,
గర్మప్రసక్తుండు గాక విశ్వమునకు
సాక్షియై యేపారి సంతతమును
సచ్చిదానందభాస్వద్రూపియై యొప్పు,
పరమాత్మ మఱి కర్మబంధుఁ డగుచుఁ


తే.

బుణ్యపాపము లొనరించి, పూని జీవుఁ
డోలి మేలును గీడును నొందుచుండు
నిట్లు గాకుండెనేనియు నెసఁగు సకల
మైన శాస్త్రంబులకును వైయర్థశక్తి.

191


వ.

కావున నీ వివాదంబు ప్రాగల్భ్యం బగుట నిక్కం బగు, జయం బొక్కనికి
జొప్పడ , దిప్పిశాచియు విప్రుండును సుఖంబగు నిశ్రేయసపదంబు నొందెద
రనిచెప్పిన నప్పరమతపోధనసందోహంబు సందేహంబు బాసి యాజగన్ని
వాసు నందఱు నన్నిచందంబులఁ గొనియాడి పదంపడి.

192


ఉ.

సమ్మదమార భూసురుఁ, బిశాచిని గన్గొని, మాకు మీ నిమి
త్తమ్మున నీయుదాత్తగుణధాముని దర్శనమున్ సహానులా
పమ్ములు గల్లె సందియము మాని సుఖించెద రింక, నీ శరీ
రమ్ములతోడ మీరు నమరత్వముఁ జెంది యనేకకాలముల్.

193


మ.

అని సంభావనచేసి రంతఁ బ్రమదం బారంగ నయ్యిద్దఱుం
జని తత్తీర్థమునన్ మునింగి, మును లాశ్చర్యంబునం బొంది క
న్గొన దివ్యాకృతులం దనర్చి దివిజుల్ గొల్వంగ నాకంబుకై
ఘనతేజం బెసఁగంగ నేఁగిరి సురేంద్రవ్యోమయానంబులన్.

194


ఉ.

అప్పు డనంతతల్పుఁడు నిజానుచరుల్ గొలువన్ వనంబులో
నెప్పటియట్ల కేలిగతు లింపుచరింప దరింప నాత్మలం
దప్పని తద్వియోగపరితాపము సైఁపఁగలేక వారు నా
చొప్పున నేఁగి రచ్చటిఋషుల్ ప్రమదం బెసఁగంగ సంగడిన్.

195

క.

ఆలోన, వారి చిత్తము
లాలోకింపం దలంచి యవ్విపినములో,
నాలోక గోచరుఁడు గా
కా లోకగురుండు చనియె ననుచరయుతుఁడై.

196


క.

అమ్మునివరులును, ద్రిభువన
సమ్మోహన మగు తదీయచతురాకృతిఁ దా
రిమ్ములఁ గనుగొనలేమికి
నుమ్మలికము నెమ్మనముల నుప్పతిలంగన్.

197


సీ.

రాచిలుకలజోక రంతులుగాఁగఁ జ
రించు లేమావుల క్రేవలందుఁ
బరిపరిగతుల షట్పదములు భ్రమరించుఁ
బువ్వారు నెలఁదీవపొదలతుదల
మగకోవెలలు పంచమస్వరంబున నింపు
పుట్టించుమరుగుల పొరుగులందుఁ
గవకవపలుకు జక్కవకవ లిమ్ములఁ
గ్రీడించుకొలఁకుల కెలఁకులందుఁ


తే.

గలయ మెలఁగుచుఁ బలుమఱుఁ బిలిచి పిలిచి
చొలవకెల్లందుఁ బరికించి చూచి చూచి
యలఁత దలఁకొన మనముల నలసి యలసి
కానలే రైరి యెబ్బంగిఁ గమలనేత్రు.

198


క.

ఆహారనిద్ర లెఱుఁగక
యాహరి సందర్శనోత్సవాకులమతిఁ ద
ద్వాహినిపొంత ననాదృత
దేహవ్యాపారు లగుచుఁ ద్రిమ్మఱుచుండన్.

199


వ.

కొండొకకాలంబు చన నొక్కనాఁడు నభోమండలంబున నొక్కవాక్యం
బిట్లని వినంబడియె.

200

ఉ.

తాపసులార మీకుఁ బరితాపము లేటికి, లోకరక్షణ
వ్యాపితబుద్ధి రంగనిలయంబునఁ బన్నగశాయినైన ల
క్ష్మీపతి నేను సన్మతి భజింపుడు న న్నచటన్ సమస్తవాం
భాపరిపూర్తి మీ కొదవుఁ జయ్యన నయ్యెడ కేఁగుఁ డందఱున్.

201


క.

అనువాక్యము కర్ణరసా
యన మగుటయు నమ్మునీంద్రు లతిహర్షమునం
జని కాంచి బహువిధంబుల
వినుతించిరి రంగధాము విబుధలలామున్.

202


ఉ.

ఆపరమేశ్వరుండును దయామృతపూరతరంగితంబులౌ
చూపుల నత్తపోధనులఁ జూచి సముజ్వలదంతమౌక్తికో
ద్దీపితకాంతు, లాస్యహిమదీధితిఁ బ్రోవఁ బయోదనిస్వనా
టోపగభీరభాషలఁ గడుం బ్రియ మారఁగ వారి కిట్లనున్.

203


క.

భావమున నొండు దలఁపును
పోవిడిచి, మదేకబుద్ధిఁ బూజలు ప్రీతిన్
గావింపుఁడు నా కనిశము
కైవల్యపదంబు మీకుఁ గలిగెడు దానన్.

204


వ.

అని యానతిచ్చిన నమందానందంబు నొంది యమ్మునిబృందంబు ముకుందున
కభివందనంబు లందందం గావించి, మరల వచ్చి యచ్చట
నిచ్చలు చతుర్భుజుని ద్రికాలంబు నర్చించుచుండిరి, తత్ప్రసవగంధాక్షతాదు
లివి యని చెప్పిన నప్పుణ్యతీర్థంబునఁ బార్ధివపుంగవుండు చతురంగబలసహి
తుండై యవగాహనం బొనర్చి తనర్చిన తేజోబలవిశేషంబుల రాజిల్లు నిజ
సైన్యపద్మంబు వికసింపఁ గాశ్యపమునీంద్రున కిట్లనియె.

205


క.

నీకరుణాలోకనమునఁ
జేకుఱె సౌఖ్యము మదీయసేనల కిచటన్
నా కొనరింపఁగ వలసిన
యాకృత్యము లెవ్వియనిన నమ్ముని బలికెన్.

206

క.

గోదానంబు కుటుంబికి,
నోదనమాత్రంబు దివ్యయోగీంద్రునకుం,
బేదకు భూమి, సువర్ణము
నాదీక్షితునకు, నృపాల యర్హం బొసఁగన్.

207


క.

దానము సేయఁగ నర్హము
గానఁ బ్రతిగ్రహ మొనర్పఁగా దట్టియెడన్
భూనాథున కిటు సేయమి
నానృపుఁ డరుగున్ సగోత్రుఁడై దుర్గతికిన్.

208


ఆ.

భవ్యదేశకాలపాత్రంబు లొడఁగూడి
నపుడు సేయుదాన మక్షయంబు,
దాన నడఁగిపోవు దాతకుఁ గోటి జ
న్మార్జితంబు లైనయఘము లనఘ!

209


క.

ఈయనిన వన్ని నీయం
దీయెడ సమకూరి యున్న విపు డోధరణీ
నాయక, తద్దానము లెడ
సేయక కావింపు మనినఁ జిత్తం బలరన్.

210


సీ.

భాసురమణిమయప్రాసాదపంక్తులఁ
దరళపతాకావితానములను,
గాంచనస్తంభసంగతమంటపంబుల
విమలచంద్రోపలవేదికలను,
బహువస్తుసంపన్నపణ్యమార్గంబుల
మహనీయతోరణమాలికలను,
అమృతోపమానంబు లగుజలాశయముల
రామంబులైన యారామములను,


తే.

శాలివనముల సరసరసాలవితతిఁ
జాల నొప్పారు తోటలఁ జప్పరములఁ,

దవిలి భూలోకసారమై తనరు నగ్ర
హార మొకఁటిని దన పేర నారచించి.

211


క.

అలఘుతపస్వులు నుత్తమ
కులజులు నాచారపరులు గురుశుశ్రూషా
కలితులు, నానాధ్వరక
ర్తలు విద్యావిదులునైన ధాత్రీసురులన్.

212


ఆ.

మూఁడువేల నేర్చి, మొదవుల వారికి
వేయునేసి యొసఁగి, వెలయురత్న
భూషణాంబరములఁ, బొలుపారు కన్యల
దాసదాసికాన్వితముగ నిచ్చి.

213


వ.

ఒక్కశుభముహూర్తంబునఁ గార్తస్వరోపకరణరమ్యంబు లగుహర్మ్యంబుల
నాయాప్రదేశంబుల నతిధిజనంబులకు మనంబు లలర నభిమతపదార్థ
సంపన్నంబు లగునన్నంబులను శీతలఘనసారప్రముఖనిఖిలసురభి
ద్రవ్యసంవాసితానేకపానీయపరిపూర్ణకలశంబులం గలిగి యహిమకరనికరం
బులకుం జొరువ యీక మిగుల నిగతాళించు చలిపందిరులను
గల్పించి, కల్పోక్తవిధానంబునం బొసంగించి యచ్చటం గదలి ముక్తి
సీమంతినీసీమంతముక్తాఫలధామం బగు రంగధామంబున కరిగె. నయ్యవసరంబున.

214


ఉ.

జ్ఞానవిధూతకల్మషులు, శాశ్వతధర్మవిధిజ్ఞు, లచ్యుత
ధ్యానపరాయణుల్, ఘనదయాకలితుల్, సకలక్రియానుసం
ధానవిశారదుల్, పరహితవ్రతచిత్తు, లుదాత్తదివ్యతే
జోనిధు, లార్యసన్నుతవిశుద్ధచరిత్రులు తత్పదస్థితుల్.

216


క.

తనకు నెదు రరుగుదెంచినఁ
గని సంభ్రమవినయకౌతుకంబులు మది నె
క్కొన మ్రొక్కి విమలమణిగణ
కనకాదు లుపాయనములుగా నిచ్చి తగన్.

217

క.

ఆనరపాలుఁడు వారల
చే నుచితప్రియవచోవిశేషంబుల స
న్మానితుఁడై యట కడచి ప్ర
ధానపురోహితసమన్వితముగా నెలమిన్.

217


వ.

చని పురోభాగంబునఁ బరమభాగవతసేవ్యంబగు నద్దివ్యనగరంబు పట్టునకుఁ
జుట్టును గావలియైయున్న పన్నగేంద్రునిఫణామండలంబు పరిపాటిం బాటిల
నొరయు మేటికొమ్మల నుదారంబగుప్రాకారంబునకు నలంకారంబై , ధగద్ధ
గీయమానంబు లగుమయూఖప్రతానంబుల నహర్పతికిరణంబులకు
నెదుర్పడు మణులు దీపించినం బొలుపు దీపించు తలాఁపులం దనరి, నిశిత
కలిశపాతనిపాతంబునకుం దప్పి యొప్పు మేరుపర్వతంబునుంబోలె సర్వో
న్నతంబై విలాసాంజనరేఖారంజితంబు లగునగరలక్ష్మీకటాక్షంబులచందంబు
న లోకానందకారణం బగుకువలయతోరణంబుల నభిరామంబై, మలయపవనసం
చలితంబులై యుదంచితంబు లగుకాంచనకింకిణీగణఝణాత్కారంబులఁ
బతంగతురంగంబులకలన, ఫల్గువల్గన వల్గుశిక్షావిశేషంబుల నలవరింపం జాలి
చాలనూతనంబు లగుకేతనంబులం బొలిచి, మహేంద్రనీలమణికీలితంబు
లగు జాలకాంతరంబుల నిరంతరంబును వెడలి కడలుకొను కాలాగరుధూమ
స్తోమంబు లంబరంబున నంబుదాగమనసముత్కందంబులైన రుచిరరుచి
విజితతాపింఛంబు లగుపింఛంబుల విప్పి యాడు క్రీడామయూరంబులకు
సుకరంబులగు మణిశిఖరంబుల మెఱసి శరదభ్రశుభ్రచంద్రోపలవిమల
చంద్రశాలాంతరపరిస్ఫురన్నటనవిలాసవిలాసినీచరణరచితమణినూ
పురంబై నిజవిభవవిజితగోపురంబగు గోపురంబుఁ బ్రవేశించి.

218


క.

ప్రతిహారానుమతంబున
నతిముదమున నా నృపాలుఁ డతులావరణ
త్రితయము నోలిఁ బ్రదక్షిణ
గతి నవనతపూర్వకంబుగాఁ జొచ్చి యటన్.

219


తే.

దొరల మంత్రుల హితుల బంధులను గూడి
యష్టదిక్కులఁ గుముదాదులైన తీర్థ

రక్షకులకును, మఱి చతుర్ద్వారపాల
సమితికిని మ్రొక్కి యభ్యంతరమున కరిగి.

220


క.

స్రుతకనకకషణసుషమా
ప్రతిమానమనోజ్ఞపీతపరిధాను, విభా
జితబాలభానుఁ ద్రిభువన
వితతేంధనచిత్రభాను విష్వక్సేనున్.

221


చ.

కనుఁగొని భక్తిపూర్వకముగా వినయానతుఁడై తదీయశా
సనమున విష్ణుపారిషదసత్తము లాదర మొప్పఁ దన్నుఁ దో
డ్కొని చనఁజొచ్చె దివ్యమణికుట్టిమకుడ్యకపాటవేదికా
వినుతవిటంకసంజనితవిస్ఫుటధామము రంగధామమున్.

222


వ.

ఇట్లు ప్రవేశించి – ముందటఁ గుందచందనచంద్రికాపాండురం బగు కుండలి
రాజపర్యంకంబునఁ బవ్వళించి సమంచితమణిశిఖరవిరాజితరాజతాచల
సంగతిఁ గనుపట్టు నీలమేఘంబు చందంబున నందంబై - కెందమ్మి విరుల
సిరుల గరువంపుఁ జెన్నునకు వన్నెయొసంగు కెంజాయలఁ జాల రంజిల్లుచుఁ
జక్రచామరతామరసకులిశపద్మఝషచాపకలశాదిరేఖలం గల తలంబుల
మెఱసి మెఱుంగుజుక్కల చందంబునకు నూరుపునెఱుపు నఖమణిరమ
ణీయంబులై నమదమరేంద్రబృందమందారమాలికాపరిమళపరంపరా
వాసితంబులై వాసవధనుర్లీలావిలాసంబునకు వాసి మిగిలి, వివిధమణి
ద్యుతివ్యతికరమంజులంబు లగు మంజీరంబులఁ బొలుపు మీటి శుకసన
కాది యోగీంద్రధ్యానగమ్యంబులై - రమ్యంబు లగు చరణంబులును,
వృత్తానుపూర్వంబులు నపూర్వసౌభాగ్యయోగ్యంబులై నిగనిగ
నిగుడుభంగి నెగడుకొను చిఱుతొడలును, గ్రొత్తమెఱుఁగుమొత్తంబులు
చిత్తగింపం (?) బొరలెత్తిన నునుఁబస నెసంగు నసితకదళికాకాండంబు
ననుకారం బగు నూరువులును, నవకర్ణికారకుసుమసుషమావిశేషంబు
నభినయించు నభినవపీతపరిధానపరీవృతంబై , కనత్కనకకింకిణీకలిత
లలితమేఖలావలయం బగు నితంబంబును, మిన్నేటిదోటియగు నేటిసుడివడు
వున శోభిల్లు నాభాసరోవరంబునఁ దిరంబగు వెలి దమ్మిఁబోని ముఖసరోజ
సౌరభంబు గ్రోలఁ జాగి తేఁటితెగ వాగున నభిరామం బగు రోమావళిం
దనరి వళిత్రయసుందరమైన కరతలగ్రహణసాధ్యం బగు మధ్యంబును,

సరసశృంగారలీలావిలాససముల్లాసిని యగు వనజవాసినికి నప్రయత్న
రత్నదర్పణంబనఁ బ్రశస్తంబగు కౌస్తుభంబునకు నుచితస్థలంబై సంతాన
లతాంతసంతానదంతురితాంతరతరుణతులసీదళదామసురభితంబై , కుంకుమ
కర్పూరదర్పసారసుగంధిగంధసారానులేపితంపై, శ్రీవత్సలక్షణోపలక్షి
తంబు లగు వక్షఃపరిణాహంబును, సముజ్వలవజ్రకంకణాంగదభద్ర
ముద్రికాశోభితంబులై, కటికిరీటపార్శ్వవిన్యస్తంబు లగు హస్తంబులును,
సారానురాగసాగరకన్యకాకరకంకణపదాంకితంబై జిగి దొలంకు శంఖం
బుల పొంకంబునకు బింకంబు దలకొలుపుచు నప్రయత్నరత్నగ్రైవేయక
బంధుర మగు కంధరంబును, దళతలఁ బొలయు తళుకులు గలతళుకులం
దాపించిన దీపించుకెంపులఁ బెంపారు మండలంబు లొరియు గండమండ
లంబులును, బరిపక్వబింబశోభాసౌభాగ్యంబు నతకరించు మధురాధరంబును
సుధారసంబునఁ బదనుగొని తలలెత్తు ముత్యంపుమొలకలపొలుపునఁ దెలు
పెసఁగు దశనకాంతులు గలసి వెలయు నెలనవ్వు వెన్నెలలఁ జెలువు మిగిలి
సతతప్రసన్నతాసదనం బగు వదనచంద్రబింబంబును, సమున్మీలిత
నీలతిలకుసుమసముల్లాసంబు నుల్లసించుచు సురభినిశ్వాసమారుతంబున
దిశలు వాసించునాసికయును, వాసరావసరసముల్లసితసితారవిందదళ
విశాలంబులై తొంగలి ఱెప్పల కప్పున నొప్పారి కరుణారసపాత్రంబు
లగు నేత్రంబులును నిజవిక్షేపమాత్రవిలాససంపాదితాశేషనిలింపమంగళం
బగు నానతభ్రూలతాయుగళంబును, లలితలావణ్యరసలవంబులన నమరు
చెమటచిత్తడిఁ గరంగు హరినీలగిరిశిఖరంబునుంబోలెఁ బద్మరాగప్రభా
టోపవిశంకటముకుటసంగతం బగు నుత్తమాంగంబును గలిగి యంగీకృత
భక్తజనానుగ్రహంబగు శ్రీరంగరాజ్య దివ్యమంగళవిగ్రహం బాపాదమస్త
కంబును విస్మయస్మితనయనారవిందుండై సందర్శించుచుఁ బరమానంద
సుధావీచుల నోలలాడుచు, హర్షగద్గదకంఠుం డగుచు, నారాజకంఠీరవుండు.

223


సీ.

బాపురే! మృదుపాదపల్లవంబుల యొప్పు
మాయురే! యూరుల సోయగంబు
భళిరె! నితంబబింబంబు సౌందర్యంబు
మమ్మా! కృశావలగ్నమ్ము చెలువు

ఆరరే! యొప్పారు నూరుల భాగంబు
చాగురే! బాహుల చక్కఁదనము
ఔర! లేనగవారు నాననాబ్జము పొల్పు
నోహో! కనుంగవ యొఱపు మెఱపు.


తే.

మేలు! మే లలకంబుల మెఱయు కప్పు
ఆహహ! నునుపారు నొసలఁ దట్టాడు తళుకు
లనుచుఁ ద్రిభువనమోహనం బగుతదీయ
మూర్తివైభవ మందంద పొగడి పొగడి.

224


క.

అక్కజపు భక్తిఁ జాఁగిలి
మ్రొక్కి లలాటమునఁ గదియ మోడ్చిన చేతుల్
నెక్కొలిపి ప్రమద లహరిం
జొక్కుచుఁ దద్వైభవంబుఁ జూచుచు నుండెన్.

225


క.

అప్పుడు కరుణామృతరస
ముప్పొంగు కటాక్షదృష్టి నుర్వీవిభునిం
దప్పక కనుఁగొని మధురిమ
చిప్పిల నాసకలలోకసేవితుఁ డనియెన్.

226


తే.

పార్థివోత్తమ! నీమహాభాగవతులు
సంతతంబును మత్పదార్చనమునంద
యెనసి యుండుట నత్యంతహితుఁడ వీవు
తలఁపు నీమీఁద నాకును దగిలియుండు.

227


చ.

నను మది నిల్పి, మున్ను నలినప్రభవుండు తపంబు సేసినన్
మనమున మెచ్చి తత్ప్రియ మొనర్చుట కీగతి రంగమందిరం
బున మణిసత్ఫణాన్వితసమున్నపన్నగరాజశయ్యపై
డనరెడు దివ్యమూర్తి నవతారమునొందితి సత్కృపామతిన్.

228


చ.

వనజభవుండు భక్తి గొలువం జిరకాలము సత్యలోకమం
దొనర వసించి పుణ్యమహిమోన్నతి నొప్పునయోధ్య కొక్కచొ

ప్పునఁ జనుదెంచి యందు గుణభూషణులైన భవత్కులీను లె
ల్లను వివిధోపచారగతులం బరిపూజ లొనర్ప నుండితిన్.

229


ఉ.

ఆగతి నందు నాలుగుమహాయుగముల్ చనునంతఁ జాపదీ
క్షాగురుఁ, డాశ్రితావనవిశారదుఁ డద్భుతబాహువిక్రమో
ద్యోగుఁడు, జానకీదృగసితోత్పలచంద్రుఁడు, రామచంద్రుఁ డా
భాగవతాగ్రగణ్యుఁ డన బ్రస్తుతి కెక్కిన దానవేంద్రునిన్.

230


క.

నిజచరణకమలసంతత
భజనపరాయణునిఁ బరమపావనచరితున్
సుజనప్రియుని విభీషణు
రజనీచరవంశజలధిరాకాచంద్రున్.

231


ఆ.

ఆదరించి తనకుఁ బ్రాణంబుకంటె వి
శేషమైన యావిచిత్రభవన
మిచ్చి యనుప నాతఁ డెలమిమై లంకకుఁ
జనుచు నిచట నున్న సమయమునను.

232


చ.

అమృతప్రాయములైన తోయముల లోకానందముం జేయు నీ
కమనీయాపగనీతటద్రుమసమగ్రచ్ఛాయలం జాల శీ
తములై మించిన సైకతంబులను మోదంబార నీక్షించి ని
త్యము నిచ్చోట వసించుకౌతుకము డెందం బందు సంధిల్లఁగన్.

233


క.

అయ్యసురనాథు నొకగతిఁ
జయ్యన నొడఁబఱచి పంచి సన్నుతఫణిరాట్
శయ్యాతలమున సుఖినై
యియ్యెడ నున్నాఁడ లోకహితనిరతమతిన్.

234


క.

మెచ్చితి నీభక్తికి మది
నిచ్చెద నే వేఁడు మింక నేవరమైనం
జెచ్చెఱ నీమనమున గృప
పిచ్చగిలం బల్కుటయును బ్రీతాత్ముండై.

235

చ.

మనుజవరేణ్యుఁ డిట్లను రమావరదేవకిరీటకోటినూ
తనమణిదీప్తివిస్ఫురితతావకదివ్యపదాంబుజాతముం
గనుగొనునట్టి భాగ్యమునకంటె విశేషవరంబు లెవ్వి నా
జని సఫలత్వమొందెఁ గలుషంబు లడంగెఁ గడంగె పుణ్యముల్.

236


వ.

అని పలికి యారాజపంచాననుండు పాంచరాత్రాగమప్రపంచితవిధానంబున
సావధానమానసుండై యాభోగితల్పు ననల్పభవ్యదివ్యోపచారంబులఁ బూజించి
పునఃపునఃప్రణామంబు లాచరించి, తన్ముఖారవిందలావణ్యమధువిలోలంబు
లైన నిజలోచనమధుపంబుల నెట్టకేలకు మగుడ దిగిచికొని యనంతవైభ
వాభిరామంబగు నారంగధామంబు వెడలి ప్రతిహరపాలకులగు దివ్యపురుషుల
నవ్యమణిభూషణాంబరాదిసమర్పణంబుల సంతర్పితులఁ గావించి విమతవిహగ
శ్యేనుండగు విష్వక్సేనునికడ కరిగి, ససేనుండై, తదీయపార్శ్వభాగంబులఁ
గొలిచి గగనమండలంబున నాఖండలుని నీలగిరిశిఖరంబునుబోలె నుద్దామం
బగు తద్దామంబు వీక్షించి సకలసాధుజనోపాస్యుండగు కశ్యపుఁ గనుంగొని.

237


క.

సన్నుతమేచకజలధర
సన్నిభరుచి గలిగి గగనచరపధమున స
ర్వోన్నతమై యొకధామం
బున్నది యది యెట్టిదనుచు నుత్సుకమతియై.

238


చ.

అడిగిన నన్నరేంద్రునకు నమ్మునిపుంగవుఁ డిట్లనున్ ముదం
బడగ ననంతశక్తియుతుఁడై జగదాత్మకుఁడైన చక్రి యె
ప్పుడు వసియింప నిమ్మగుచుఁ బోల్చిన యమ్మహనీయధామముం
బుడమి ఫణాగ్రభాగమునఁ బూనినశేషునిగా నెఱుంగుమీ.

239


మ.

అతిరమ్యంబగు తల్పమై, సతతలీలావాసమై, రత్నసం
గతసింహాసనమై. పరిస్ఫురితముక్తాఛత్రమై, సత్ర్పభా
తతదివ్యాశుగమై, మనోహరపదత్రాణంబులై, చక్రి నం
చితలీలం భజియించికాదె కనియెన్ శేషుండు శేషత్వమున్.

240


తే.

జ్ఞానశక్తిబలామితైశ్వర్యవీర్య
తేజములు వొల్చు నతనికి నైజ మగుచు,

బహుగుణానంత్యమునఁ గర్ణభావమునను
వెలయు నాతఁ డనంతాఖ్య గలిగి యధిప.

241


క.

లోకములు జన్మవిలయ
వ్యాకులములు పొందువేళలందును వికృతుల్
పైకొనక శాశ్వతస్థితిఁ
జేకొని యీధామ ముల్లసిల్లుచునుండున్.

242


క.

ఇది తచ్ఛాయ నృపోత్తమ
సదమల భవదీయపూర్వజన్మార్జితమై
యొదవిన సుకృతఫలంబున
విదితంబై నీకు గగనవీథిం దోచెన్.

243


క.

ఈవిధమున బ్రతియుగమున
భూవల్లభ వర్ణభేదములు వెలుఁగొందున్
శ్రీవిభుఁ డీధామము దా
నావేళల నట్టివర్ణమై కానఁబడున్.

244


క.

పెరుగుచుఁ దఱుగుచునుండును
నరనాయక, కాలవశమునం దివ్యరుచి
స్ఫురితము నహీనమహిమో
త్తరమును నగు నీమనోజ్ఞధామము వసుధన్.

245


సీ.

ధరణీశ కలియుగోదయవేళ విపరీత
రీతి నిన్నియుఁ బ్రవర్తిల్లుచుండుఁ
గల్ల నిజఁ బగుఁ గష్టుఁడు దుష్టుఁడై
నెగడు ననిత్యంబు నిత్యమగుచు
హేయ మహేయమై యెసఁగు, ననాచార
మాచారమై చెల్లు నవనిసురులు
మతిచెడి శూద్రులగతిఁ జరింతురు శూద్రు
లావిప్రధర్మంబు లాచరింతు

ఆ.

రాలు మగని విడుచు, నాచార్యు నిందించు
శిష్యుఁ, డఖిలదేవసేవ్యుఁడైన
హరి భజింప నొల్ల కన్యదైవంబుల
నెపుడు కోరి కొల్తు రెల్లవారు.

246


తే.

జలజనాభున కాధారశక్తి యగుచు
దనకు శేషాఖ్య నొప్పునీధామ మధిప
తెలియ కెప్పుడు సామాన్యదృష్టిఁ జూచు
వారు పోదురు నిరయనివాసమునకు.

247


మ.

అమృతానందనిధానమై సకలకల్యాణావహంబై రమా
రమణప్రేమనివాసమై మెఱయు శ్రీరంగప్రభావంబు ని
క్కముగా నాత్మ నెఱింగి కొల్చుసుజనుల్ కర్మంబులం బాసి ని
ష్క్రమణన్ శాశ్వతవిష్ణులోకసుఖమున్ బ్రాపింతు రుర్వీశ్వరా.

248


క.

అని చెప్పిన నాకాశ్యప
మునివరుఁ గొనియాడి, రాజముఖ్యుఁడు ప్రమదం
బొనరఁగ దద్ధామమునకు
వినతుండై యచటు వాసి వెలువడి యెదుటన్.

249


సీ.

శిఖరాగ్రగతి హరి ప్రఖరాశనికూర్ర
నఖరాభిహతనవ్యనాగకులము
శబరీపరిప్రస్థకబరీకలాపవి
క్లబరీణఘనభుజంగ్వరజంబు,
రహితదోషాటోపమహితరత్నప్రభా
పిహితబృందారకబృందసరణి,
వితతసానుస్వానసతతనిర్ఝరజల
ఫ్లుతతరుప్రత్యంతభూమికులము


తే.

బహుళగైరికమయదృషత్ప్రభవరాగ
కల్పితాలీకదివసావగమనికామ

విపులవార్వహసందోహవిభ్రమంబు
రుంద్రకటకంబు ధరణిధరేంద్ర మొకటి.

250


క.

అన్నెలవుకు దక్షిణమున
విన్నులతో రాయుచుండ వీక్షించి సము
త్పన్నకుతూహలమతియై
సన్నద్ధసమస్తసైన్యసహితుం డగుచున్.

251


శా.

ఆరాజేంద్రవరుండు తత్కుధరశృంగారూఢుఁడై చేరువన్
ధీరోదంచితనారికేరకదళీతిల్కామ్రఖర్జూరసౌ
వీరాశోకవనావలీకలితకావేరీప్రవాహాంతర
శ్రీరమ్యంబగు రంగమందిరము నర్ధిం జేరి సద్భక్తిమై.

252


క.

తనదృష్టికి నలుదిక్కుల
గనఁబడు దేశముల నమితకనకాంబరగో
ధనరత్నదాసదాసీ
జనముల నర్పించె శేషశాయికి నెలమిన్.

253


క.

భూనాయకుఁ డద్దివ్య
స్థానము మఱిఁ బాసి పోవజాలక యచటం
దా నుండ దలంచి భూసుత
మై నెగడు తదద్రి పశ్చిమాంచితసీమన్.

254


క.

సారసగరుదనిలాహత
సారససంవాసితాంబు సారంబగు కా
వేరీతీరంబునఁ దన
పేరుగ నొకపురి రచించెఁ బ్రీతి దలిర్పన్.

255


క.

ఏపట్టణంబుకంటెను
నాపురవర మమరు విభ్రమాలసలలనా
నూపురరవమంజులమణి
గోపురమై విభవవిజితగోపుర మగుచున్.

256

క.

నలినజుఁడను రససిద్ధుం
డల వేలుపుఁగొండ శుద్దహాటకమయమై
వెలుఁగఁ బుటమిడిన పరుసునఁ
బొలుపగు నప్పురముకోట భూవినుతంబై.

255


క.

కొమ్మలగెడ మానికపుం
గమ్మల క్రొమ్మెఱుఁగు లడరఁగా, నలవేల్పుం
గొమ్మలు మలతురు పుత్తడి
బొమ్మలగతి వేఱ కోటఁ బొగడఁగ నేలా!

256


చ.

లలనల కేళిసంభ్రమములం దెగి రాలిన హారరత్నముల్,
జలధరవేళఁ బెంజినుకులం జని తత్పరిఖాతలంబులన్
వెలుఁగఁగ గాంచి వానిఁ గడువేడుకతోడుత సంస్తుతించి మే
నొలయఁగ బల్మఱున్ మురియుచుందురు పన్నగరాజకన్యకల్.

257


సీ.

తెరల వ్రాసినవ్రాత దీపించు పులులకు
మది లోఁగుఁ జందురు మచ్చయిఱ్ఱి,
తూలాడుపడగల తుదలతాఁకున నుల్కి
హరితేరిహయము లుప్పరము చాఁటు,
గేళాకుళులయందుఁ గెందమ్మితూఁడులు
వింతగా నజు నెక్కిరింత నంజు,
రమణఁ బెంచిన మయూరమ్ములు వేలుపు
కన్నెల కరతాళగతుల నాడు,


తే.

ననిన నందుల ననిచెప్ప నమరులైన
సవడి గ్రహరాజుమేడల సవరణలను
మేటితొడవులు నిట్టిట్టిపాటి వనుచు
జగములోపల మఱి వేఱ పొగడనేల.

258


క.

పురసౌధశిఖరనికర
స్ఫురదురుమరకతమయూరపుంజములఁ గళా

ధరబింబమధ్యహరిణము
తరుణతృణభ్రాంతి దవ్వుదవ్వులఁ గముచున్.

259


చ.

హరిణ మటండ్రు, కాదు వట మందురు, భూప్రతిబింబ మండ్రు, సా
గరతలపంక మండ్రు, శశికం దని యందురు, లోకు లందఱున్,
సరసిజవైరి మైకఱ నిజంబులు గా వవి యప్పురంబు గో
పురశిఖరాశితో నొరయఁ బుట్టినకం దని చెప్పఁ బొందగున్.

260


క.

నీలమణిచంద్రశాలా
పాలిక లీలావిలోలబాలాలీలా
వాలపాంగాలి నట
త్కాలాభ్రాంతరతటిల్లతాగతిఁ బొలుచున్.

261


క.

నీడలు మణిముకురంబులఁ
జూడరు, పట్టణములోని సుగుణులు, సురత
క్రీడాసంభ్రమగళిత
వ్రీడాబ్జముఖీకపోలవీథులఁ దక్కన్.

262


చ.

పురిశృంగారవనంబులన్ మెఱయుచుం బూర్ణేందుబింబాననల్
విరులం గొప్పులు దీర్ప వేణి యెలమిన్ వేడ్క న్వెసం గప్పు బం
ధురనీలప్రబలాంధకారముక్రియం దోపం భ్రమం జక్కవల్
విరహార్తిం దురపిల్లుఁ బట్టపగలున్ లీలాసరశ్శ్రేణులన్.

263


క.

సరసీరుహములు తత్పుర
వరవనితావదనవైభవము గోరి, సరో
వరమధ్యమముల నెప్పుడు
చిరలీలం దపము సేయు చెలువున మెఱయున్.

264


క.

అతనుఁడు సమ్మోహనశర
మతివల కల్గొనల నిలిపి, యతులోద్యాన
ప్రతతుల నప్పురి నెప్పుడు,
చతురత రతిఁ గూడి క్రీడ సలుపుచు నుండున్.

265

చ.

ఉపరిరతిప్రయాసముల నుబ్బిన ఘర్మజలోర్మిశీకర
వ్యపనయబుద్ధి నంగనలు, వారిరుహాకరవారి నుల్లస
ద్విపులకుచద్వయీలిఖితవిస్ఫురితాగరుపత్రవల్లికా
స్నపన మొనర్చి కల్మషము సౌరభముం గలిగింతు రప్పురిన్.

266


సీ.

మెఱచి పోవని తీవమెఱపులు రతికేళి
కలికి రాచిలుకలు పలుక నేర్చు,
బంగారు ప్రతిమలు ప్రాణంబు లెసఁగిన
చిత్రరూపంబులు, చిత్తభవుని
మోహనాస్త్రంబులు, ముదితలై చరియించు
చంద్రరేఖలు, మహీస్థలి నటించు
కల్పవల్లులు, పులుకడిగిన ముత్తెంపు
తళుకులు, శృంగారకళల చెలులు,


తే.

కన్ను లార్చెడు వేలుపుకన్య, లొఱపు
దెలుపు మెత్తని మణిశలాకలు, విలాస
సీమ లనఁ గామకేళి పిచిత్రగతుల
వాసి కెక్కుదు రప్పురి వారసతులు.

267


చ.

తనపగవారిలోఁ గొనిన తప్పున కప్పుర (?) నాథుఁ డాద్యులం
బెనుపగు కింక సంకెలలఁ బెట్టిన భీతిగఁ గన్కనిం గనీ
కనముల ముట్టి గిట్టెడునుగైవడి నెందు నమందబృంహిత
ధ్వనులు దలిర్ప నొప్పు మదవారణమల్ జయకారణంబులై.

268


చ.

వెసఁ గదలించి హో! యనిన వ్రేల్మిడిలోనన నిల్చుఁ గంధరం
బుసుమక బిట్టదల్చినను భోరన సాగరమైన దాఁటు బ
ల్వసమున ఱాఁగలం దఱిమి వాగె వదల్చినఁ జువ్వనం జవం
బెసఁగఁగ గాలి మీఱు భువి నెన్నిక కెక్కిన ఖర్తులాణముల్.

269


సీ.

సంతతభువనప్రశస్తసంచారులు
సత్కులగోత్రవిస్తారశీలు,

లవనీసతీపరిగ్రహార్థసమర్థులు,
పరిచరప్రహ్లాదనిరతగుణులు,
ప్రకటపదక్రమప్రాగల్భ్యనిరతులు
పరపక్షఖండనప్రౌఢమతులు,
ఖరదూషణక్షయంకరశక్తియుక్తులు,
కృష్ణవర్త్మాధికకృత్యపరులు,


తే.

కలితసర్వజ్ఞవిగ్రహుల్, కలిమలాప
కర్షణోదీర్ఘసద్ధర్మకర్మవరులు,
నగుచు శ్రీవిష్ణుమూర్తుల ననుకరించి
వెలయుచుందురు తత్పురి విప్రవరులు.

270


ఉ.

ధీరులు దోషదూరులు సుధీజనసంస్తవనీయసద్గుణా
దారు లుదారు లాహవజితప్రతివీరు లపూర్వనిత్యశృం
గారులు శూరు లుజ్ఝితవికారులు వార్ధిగభీరు లంగనా
మారులు శక్తినిర్జితకుమారులు రాజకుమారు లప్పురిన్.

271


క.

ధనదులు పుణ్యజనేశులు
ననవరతశివాభినందితాత్ములు నరవా
హనులు నిధిపతు లుదారు ల
య్యును గారు కుబేరు లచట నుండెడివైశ్యుల్.

272


సీ.

మధుషట్పదంబుల మధుపానభూములు
రాజకీరంబుల రచ్చపట్లు
పుంస్కోకిలంబుల భోజనశాలలు
మలయానిలంబులు మలయు నెడలు,
నవమయూరంబుల నాట్యరంగంబులు,
మకరకేతను సభామండపములు
విటవిటీజనముల విరుల చప్పరములు
మధులక్ష్మి నైపధ్యమందిరములు,


తే.

అల వసంతుని లీలావిహారసీమ
లిట్టలం బగు వలపుల పుట్టినిండ్లు

చిరపరిశ్రాంతపధికసంజీవనములు
పావనము లప్పురంబున బాహ్యవనులు.

273


చ.

పరిణతగంధశాలివనపంక్తులు గంధవహానుభూతబం
ధురకణిశంబులై, వెలుపుదూకొనఁ జాలు నిజాలవాలసుం
దరవికచారుణోత్పలవితాననవప్రమదాలిమాలికా
సురుచిరగీతమాధురికిఁ జొక్కి తలల్ కదలించెనో యనన్.

274


సీ.

పరిపాండుకేసరపరిణాహకేసర
ప్రసవపరాగంబు కొసరి కొసరి
వర్ణితకాసారవరవీచికాసార
శిశిరశీకరములఁ జెలఁగి చెలఁగి
గుణవతీఘనసారకుచలిప్తఘనసార
బహుళసౌరభముల బలసి బలసి
కమనీయమణిజాలఖచితసద్గృహజాల
మాలికాంతరముల మలసి మలసి


తే.

సమదకరికటతటమదసలిలపాన
ముదితకలరవమధుకరమృదులచలిత
లలితవిపరీతగరుదంచలములఁ బొదలి
మలయపవనుండు పురిలోనఁ గలయఁ బొలయు.

275


వ.

మఱియు రిపుహృదయపుటభేదనం బగునప్పుటభేదనం బమరావతీపురంబు
నుంబోలె ననిమిషానందకరంబై, యలకాపట్టణంబునుంబోలె ధనదనివాసంబై,
మధురాపురంబునుంబోలె నుల్లసత్పుండరీకంబై, పుండరీకంబునుంబోలెఁ
బురుషోత్తమావాసంబై, పురుషోత్తమావాసం బయ్యును వీరభద్రవిహార
స్థలంబై, వీరభద్రవిహారస్థలం బయ్యును దక్షయాగమహోత్సవంబై, దక్ష
యాగమహోత్సవం బయ్యును సర్వమంగళాభిరామంబై యమరు. నందు
సుందరుల నయనంబులయంద శ్రుతిసీమాలంఘనోద్యోగంబును, పంగులయంద
పదహీనతయుఁ, గరులయంద మదోద్రేకంబును, దరులయంద శాఖాచలనం
బును, బ్రబంధంబులయంద వర్ణబంధంబులును, శుకశారికాదులయంద పక్ష

పాతంబులును, గోకులంబులయంద భంగంబులును, భృంగంబులయంద
మధుపానప్రసంగంబులును, వృద్ధదౌవారికాదులయంద దండగ్రహణంబులును
దక్కఁ దక్కెడల లేక యొప్పు నందు.

276


ఉ.

భూజనదృక్చకోరపరిపూర్ణసుధాంశుఁడు కీర్తిచంద్రికా
రాజితలోకుఁ డానతధరాతలనాధకిరీటరత్ననీ
రాజితపాదపీఠుఁ డరిరాజకులాచలవజ్రపాణి పం
కేజకులాన్వయాగ్రణి సుకీర్తినరేంద్రుఁడు సమ్మదంబునన్.

277


క.

హితబంధుమిత్రసేనా
పతిసామంతప్రధానపరివారపురో
హితసహితముగ వసించెను
సతతమహీరాజ్యవిభవసౌఖ్యాన్వితుఁడై.

278


ఆ.

అట్ల పెద్దకాల మందుండి యాశ్రిత
పారిజాతు సత్కృపాసమేతుఁ
బ్రతిదినంబుఁ గౌరి భజియించె శ్రీరంగ
ధాము నింద్రనీలధామదాము.

279


ఉ.

అంతనిజాత్మజాతు దళితారినృపాలుఁ బ్రజానుపాలనా
త్యంతవిచక్షణున్, సుగుణధాముని సన్నుతనాము, బంధుసా
మంతజనైకసమ్మతిని మంజులమంగళతూర్యసంగతుల్
రంతుగ మ్రోయఁ బ్రాజ్యనిజరాజ్యపదస్థుని జేసి నెమ్మదిన్.

280


క.

తగు లొండు లేక, మఱి యా
జగతీనాథుఁడు విరక్తి సమకొన, మదిఁ బ
న్నగతల్పు నిలిపి నియతిం
దగఁ దప మొనరించి తత్పదస్థితి నొందెన్.

281


క.

అని ప్రాచేతసుఁ డాదర
మెనయ భరద్వాజమునికి నెఱిఁగించిన యీ

వినుతేతిహాసపఠనం
బున నరులకు నుభయలోకములు పెంపొందున్.

282


వ.

అని పారాశర్యుండు నాగదంతమునివర్యున కెఱింగించిన తెఱంగు.

283


ఆశ్వాసాంతము

శా. చోళీచంచదురోజకుంకుమవనక్షోదస్ఫురద్వక్ష! నే
పాళీచారుకపోలచిత్రరచనాపారీణహస్తాబ్జ! బం
గాళీకేళికలాప! మత్తకరిశిక్షానవ్యపాంచాల! పాం
చాలీభావవికాసకృచ్చతురవాచామాధురీవైభవా!

284


క.

కమలాంకకాంతిశోభిత,
కమలాకరనిభగభీర, కమనీయదర
త్కమలాయతదళలోచన,
కమలాకలితాత్మసదన కమలామదనా!

285


మాలిని.

దినకరసమతేజా! దీనమందారభూజా!
వనధినిభగభీరా! వర్జనీయప్రచారా!
వినయనయవిశాలా! వేదమార్గానుకూలా!
జనకువలయసోమా! చాగయామాత్యరామా!

286

గద్యము
ఇది
శ్రీమద్భ్రమరాం
బావరప్రసాదలబ్ధ
సిద్ధసారస్వతవిలాసగౌరవ
గౌరనామాత్యపుత్ర సుకవిజనమిత్ర
సుధీవిధేయ భైరవనామధేయప్రణీ
తంబైన శ్రీరంగమహత్త్వం
బనుపురాణకథయందుఁ
జతుర్థాశ్వాసము