Jump to content

శ్రీరంగమహత్త్వము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరంగమహత్త్వం

తృతీయాశ్వాసము

క.

శ్రీమాధవపద కోమల
తామరసార్చన విధానతత్పర! సుజన
క్షేమంకర కరుణోదయ!
చామీకరరుచిరధామ! చాగయరామా!

1


వ.

అవధరింపు మఖిలకథాకథనచాతురీజనితరోమహర్షణుం డగురోమహర్షణ
కుమారుండు, దివ్యబోధను లగు శౌనకాదితపోధనులకుఁ జెప్పిన చందంబున
నిందిరాసుందరుం డరవిందభవాది బృందారకబృందంబు ననిపి -
యనంతరంబ-

2


సీ.

పరిణాహ పరిలసత్ఫాలభాగంబున
రమ్యమై యూర్థ్వపుండ్రంబు వెలుఁగ,
నలినాక్షమాలికాకలిత వక్షంబున
ధవళ యజ్ఞోపవీతములు మెఱయ,
ముఖ్య రత్నాంకితముద్రాభిరామ హ
స్తముల నూతనపవిత్రములు దనర
సింహసంహననతా శ్రీకిని బైకాఁపు
గాఁగ నుద్గమనీయకం బెలర్పఁ


తే.

గోమలోత్పలదళకాంతి కొమరుమిగులు
మేము, గృపతోడఁ జిఱునవ్వు మెఱయఁ జూపు,
నుదయశైలోపరిస్థలి నుల్లసిల్లు
జలజబాంధపు మిగులు తేజమును గలిగి.

3


మ.

హరిలీలం బ్రణవాత్మకుం డగుటఁ దా నధ్యాపకుండై ఖగే
శ్వరచక్రాబ్జసరోజనందకగదాశార్ఙ్యాశుగంబుల్ మనో

హరభాస్వద్వటుకాకృతుల్ మెఱయ శిష్యసేతోమమై విస్ఫుట
స్వరవర్ణక్రమవేదపారనిరతిన్ సద్భక్తి నేతేరఁగన్.

4


క.

వారల జదివించుచు నిజ
చారుతరద్యుతులు నఖిలజగములకు ముదం
బారోహించుచు ద్రుహిణకు
మారుఁడు తపమున్న యాశ్రమమునకు నరిగెన్.

5


వ.

అప్పు డనన్యసాధారణంబు లగునారాయణప్రభువు గుణగణంబులచేత
వశీకృతంబులైన సకలవేదశాస్త్రంబులు తారాకారంబులు భజియించి యను
సరించె. సనకసనందనాది ప్రసిద్ధసిద్ధమునిసాధ్యవిద్యాధరకిన్నరకింపురు
షాదులు నంతరిక్షంబున నంతర్హితులై కొలిచి చనిరి, తదీయసామగానపరి
మోహితంబులై మృగంబులు ఖగంబులు తోడన తగిలిపోయె నివ్విధంబున
నప్రమేయప్రభావభాసురుండై తనయున్నయెడకు వచ్చు నాకపట
భూసురు దవ్వుదవ్వులం గని బ్రత్యుత్థానంబుఁ జేసి కృతాంజలియై కంజ
భవనందనుం డంతర్గతంబున-

6


క.

ఈ వేష మీశుభాకృతి,
యీవిశ్వద్యాప్తితేజ మీసత్కరుణా
భావము నదృష్టపూర్వము
లీవిప్రుఁడు మనుజమాత్రుఁడే తలపోయన్.

7


ఉ.

ఈవటువుల్ సరోరుహనిభేక్షణు లందఱుఁ గృష్ణసారచ
ర్మావృత నిర్మలాపఘను లంచితకుంచితనీలమూర్ధముల్,
పావనభావు లజ్జ్వలితపావకతేజు లనూనలక్షణ
శ్రీవిలసత్రయీపరవశీలు రనాహతశేముషీనిధుల్.

8


వ.

ఇమ్మహామహుం డేమినిమిత్తంబున వచ్చుచున్నవాఁడొకో యని వితర్కించుచు
విస్మయస్తిమితలోచనుండై చూచుచున్న యమ్మునికుంజరుం జేరం జని నిజస
మాగంబునఁ దన్నుఁ గృతార్థునిగా దలంచు నతనితోడ నాకమలాకళత్రుండు.

9

క.

ఓయతివర! నీ వెవ్వఁడ?
వీయెడ నిట్లుండ నీకు నే లనిన మహా
త్మా! యే సనత్కుమారుఁడ
పాయక యిన్నెలవునం దపం బొనరింతున్.

10


ఉ.

భూవిబుధాగ్రగణ్య కృతపుణ్యవిచిత్రము నీ చరిత్ర మే
ఠావుననుండి వచ్చి తెచటన్ వసియింపుదు రెట్లు గూడె ని
న్నీవటుసంచయంబు జనయిత్రియుఁ దండ్రియు నెవ్వ రిప్డు నీ
భావగతార్థ మెయ్యది, కృపాయతి నా కెఱుఁగంగఁ జెప్పవే!

11


క.

నీపుణ్యదర్శనంబునఁ
దాపము లడఁగెం, ఫలించెఁ దదభిమతంబుల్,
ప్రాపించె నెవ్వ రీ వీ
రూపున విహరించె దా హరుఁడవో? హరివో?

12


క.

అనవుఁడు నమ్మునిపుంగవుఁ
గనుఁగొని యంతఃస్మితప్రకాశితముఖుఁడై
మనచతురవచనరచనలఁ
దనతెఱఁగు మొఱంగి ధరణిధరుఁ డిట్లనియెన్.

13


సీ.

ఇందుండి వచ్చితి నిప్పుడే ననరాదు
సకలలోకైకసంచారిఁ గాన
నిది యది నెల వని యేర్పరింపఁగఁ బోల
దెందుఁ జూచిన వసియింతుఁగాన
రూపించి తల్లిదండ్రులఁ జూపి చెప్పఁగా
లేదు వా రెవ్వరు లేరుగాన
వీరు బంధువు లని వివరింపఁగూడదు
సర్వభూతములకు సముఁడగాన


తే.

పటువు లిట్టట్టు గతిఁ జేరవచ్చి రనఁగఁ
బొందు గాదు, నిమిత్తసంభూతు లగుచుఁ

జిత్తగత మైనకార్యంబు చేఁతలందు
నెఱుఁగఁ దగుఁగాక మాటల నేమి చెప్ప.

14


తే.

హరుఁడ గానే నముచిసంహరుఁడగాను,
యతివరేణ్య యధేచ్ఛావిహారపరత
వఱలు నొకపురుషుఁడని నన్ వటువు లెల్ల
శిష్యులై భక్తి శుశ్రూష సేయఁ గందు.

15


సీ.

నిగమజాతంబు నే నిల్వఁబట్టిన నిల్చు
నగములు నా చెప్పినట్లు చేయుఁ
బుడమి నాముందటఁ బోరాదు చర్చింప
శ్రీవహింతు నపూర్వసింహ మనఁగఁ
బరమపదక్రమముల బ్రహ్మమీఱుదు వాదు
లెదిరిన ఖండింతు ముదము లడఁగ
శైశవంబునన యజ్ఞవ్యాహుతుల్ దీర్తుఁ
బ్రజ్ఞమై శేషరూపము భజింతు


తే.

మును మహర్షులు సర్వజ్ఞమూర్తి యనుచు
వినతులుగ నిష్పరిగ్రహవృత్తి నుందు,
వివిధ దుష్కర్మరతులు గర్వించిరేని
నిగ్రహింపుదు సుకృతంబు నిలుపుకొఱకు.

16


ఆ.

ఇవి మదీయగుణము లిప్పుడు నీచేత
నెఱుఁగఁబడిన పిదప నేమి గలదు
నీకు నది యటుండె నిన్నొక్కమాట నే
నడుగ వచ్చితి విను మట్టిప్రశ్న.

17


చ.

ఎడపక సర్వవర్ణముల కెయ్యది కార్యము వాచ్య మెయ్య దె
ప్పుడును మనుష్యసం(త)హతికి భూతచయంబున కెద్ది చక్షు వె
య్యెడ నొకటయ్యుఁ బెక్కయిన దేమి ఘనాశ్రయమున్ మనంబునై
యడరెడు నెద్ది? యల్పతర మయ్యును వ్యాపక మెద్ది యారయన్.

18

క.

ఎయ్యవి సదసత్తులు పర
మెయ్యది దానికిఁ దలంప నెద్ది యజాతం
బయ్యును బహుప్రజాతం
బయ్యెసఁగుచునుండు భూసురాగ్రణి చెపుమా!

19


వ.

అనిన నయ్యుత్తమద్విజునకు నజునికొడు కిట్లనియె.

20


మ.

మతి నే ని న్నొకవిప్రమాత్రుఁ డని నమ్మంజాల, యుష్మత్సమ
ప్రతిభుల్ శిష్యులు నిట్టిచందము దలంపన్, మాదృశానుగ్రహాం
చితబుద్ధిన్ వసుధావతీర్ణుఁ డగులక్ష్మీభర్త వీమూర్తిసు
స్థితియుం దేజము నున్నవారలకు నేదీ యట్లు గాకుండినన్.

21


క.

నీ వడిగినప్రశ్నములకు
భావం బిది యని యెఱింగి ప్రత్యుత్తర మీ
నావశమె ఘనతరప్ర
జ్ఞావంతుల కైన నది యశక్యం బనినన్.

22


వ.

సకలవేదాంతరహస్యవేది వగు నీవు దక్కఁ దక్కినవార లిట్టిప్రశ్నలు
గావింప వానికిఁ దగిన యుత్తరంబులు చెప్ప నసమర్థులు, గావున నాదెసం
గలుగు కరుణాగుణం బేర్పడ నెంతయు నీవు దెలుపు మని ప్రార్థించిన
నమ్మహానుభావుం డిట్లనియె.

23


సీ.

ఎల్లవర్ణములకు నెప్పుడు గార్యంబు
ధర్మంబు మఱి సుకృతంబు బాయ
రనిశంబు దివ్యశక్త్యావిష్టుఁ డగుపద్మ
బంధుండు చక్షువు ప్రాణితతికిఁ
దగ నేకమయ్యుఁ బ్రధానంబు కార్యరూ
పమునఁ జూడఁగ బహుత్వమ భజించు
నాధారహీనమై యధికమైనది పర
బ్రహ్మ మల్పం బనల్పంబు వ్యాపి


తే.

పరఁగ సదసత్తు లనఁగ నక్షరము క్షరము
నన్య మీరెంటికిని బరమాత్మఁ దలఁప

భవము బొరయక యుండియు బహువిధముల
జనన మొందుచునుండు నీశ్వరుఁడు వత్స.

24


క.

చెప్పితి సంక్షేపంబున
నిప్పటి ప్రశ్నోత్తరంబు లెయ్యవి యింకన్
జెప్పవలయు నీ కనుటయు
సప్పురుషవరేణ్యుతోడ నజుఁ డిట్లనియెన్.

25


సీ.

ధర్మ మెట్లది సూనృతం బెద్ది దివ్యశ
క్యావేశ మట్లేకమైన వస్తు
వరయ నేరీతిఁ బెక్కగు, నిరాధారత
బ్రహ్మంబు కెద్ది యల్పత్వఘనత
లొక్కటి యెట్లు నెందొగిఁ బ్రసన్నబ్రహ్మ
మక్షరక్షరముల కన్యమగుచు
నెట్లు చెప్పితి పుట్టు వెన్నఁ డెఱుంగని
యీశ్వరుం డె ట్లుదయించుచుండు


తే.

మాటిమాటికి నింతయు మన్మనంబు
సంశయము నొందఁ జేసె నీశంక నెల్ల
దీర్ప నర్హుండ వీవ సుధీవరేణ్య!
యనిన, దెలిపెద విను మని యతఁడు వలికె.

26


క.

నిగమములు భూతసమితికిఁ
దగుగతి యగుటం దదితరక్రియ పరమం
బగుధర్మ మనిరి హింసలఁ
దగులని సత్యంబు సూనృతం బనఁ బఱఁగున్.

27


తే.

విష్ణుశ క్త్యభివిష్టమై విశ్వజగము
నొగిఁ బ్రవర్తించుఁ గాకున్న నుడిఁగి మడుఁగు
నాత్మ దనుఁ బాసి బోయిన యట్టి కుణక
మడరి చేష్టింపఁ జాలని యవ్విధమున.

28

మ.

పరమవ్యోమపదంబునం దవిరతోత్పన్నామితానందభా
స్వరలీలం బరమాత్ముఁ డుండుఁ, దనయాజ్ఞం బద్మగర్భాండముల్
పరివర్తింపఁగ నప్పరేశ్వరుని శుంభచ్ఛక్త్యపష్టంభవి
స్ఫురణం బెంపు వహింప వాయు హుతభు గ్భూషాజ్యసంచారముల్.

29


క.

ఏవస్తువు లత్యూర్జిత
మై వీక్షణగోచరంబు లగు మునివర నీ
వావస్తువుల నెఱుంగుము
శ్రీవిష్ణుని దివ్యశక్తి జృంభితములుగాన్.

30


వ.

మొదట నొక్కటయైన ఘటత్వపటత్వాదిజాతికి సజాతీయంబు లుద్ధాకృతి
వైషమ్యంబున బహుత్వంబు బహుత్వంబుయుక్తంబైనకరణి నేకంబైన
వస్తువునకుఁ గార్యకారణభావంబున ననేకంబు సిద్ధించుట విరుద్ధంబు
గాదు. సర్వంబునకుఁ బరబ్రహ్మ తానె యాధారంబుగానఁ దదాధారంబ
సంభవం బగుట నదినిరాధారం బని చెప్పితి, నట్టి బ్రహ్మంబునకు సంకోచ
వికాసంబునం జేసి యల్పత్వ బహుత్వంబులు ప్రసన్నం బగు మఱి సర్వ
సామాన్య యుక్తంబునను విశ్వజాతీయదర్శనంబునను అనిర్దేశ్యవిశే
షంబునను గల్యాణానంత సంశ్రయంబునను జేసి పరమాత్ము
నసత్తుకంటెఁ బరం బని యెఱుంగునది బ్రహ్మాది పరిణామంబులం
దాత్మయై తదన్యత్వంబున నవశ్యజాయమానుం డయ్యును బరమ
పురుషుండు స్వేచ్ఛావిర్భూతుం డగుట నతనికి జన్మవశ్యత్వంబులేమి,
సజాయమానుండై ప్రకాశించు - 'సజాయమానో బహుధా విజాయతే'
యని వేదంబులు మ్రోయుచుండు నిప్పటిపశ్నల కివి యుత్తరంబు
లనిన నాసర్వలోకోత్తరునకు నత్తపస్వివరుం డిట్లనియె.

31


ఆ.వె.

విబుధకులవరేణ! వేదాంత నిష్ఠితం
బగుచు వేద్య మైనయట్టియర్థ
మాదరంబు మిగుల నానతి యిచ్చితి
సరసఫణితి విగతసంశయముగ.

32


క.

భూరివిషయ గ్రహంబున,
పారాశాంభఃప్రపూరభరితము నగుసం

సారాబ్ది నిమగ్నుఁడనై
తీరముఁ జేరంగ లేక తిరుగుడు వడుచున్.

33


సీ.

ప్రతిభవంబునను, గర్భస్థితివేళఁ బు
ట్టెడువేళ, వార్థకం బడరునపుడు,
మరణావసరమున మఱి పుత్రమిత్రక
ళత్రార్థభూగృహలాభమునను
నిష్టనాశమున, ననిష్టపరిప్రాప్తి,
కవమానమున, సాధ్వసాగమమున
నాధిభౌతికముల నవిరతంబు


తే.

పొందు దుఃఖపరంపరఁ బొంది కుంది
తల్లడిల్లుచు నజ్ఞానతమముచేతఁ
దేరలి సన్మార్గ మిది యని తెలివి లేక
విసుగు నాకేది గతి చెప్పవే మహాత్మ!

34


వ.

అనిన నయ్యతిశ్రేష్ఠునకుఁ బరమేష్ఠిగురుం డిట్లనియె.

35


క.

మానసవమును నేత్రగతం
బౌనౌ నజ్ఞానతిమిర మంతయుఁ బాయున్
మానవకోటి కనూన
జ్ఞానాంజనకరణిచేత సంయమిముఖ్యా!

36


క.

జ్ఞానము సుఖసిద్ధులకు ని
దానము మణి దానఁ దక్కఁ దక్కినవానిన్
భూనుత యవి సిద్ధింపవు
గానఁ బరిజ్ఞానశాలి గను సకలంబున్.

37


క.

నీవెంతయు నియతాత్ముఁడ
వై, విమల జ్ఞానపదము నధిరోహణమున్
గావింపు విస్తరించెద
నావెరవున దుఃఖకలిత మగుభవజలధిన్.

38

వ.

ఆత్మేతరంబు నందలి యాత్మజ్ఞానంబు సంసారసాలంబునకు మూలంబు, పర
మాత్మ పరిజ్ఞానం బనుకురారంబున నది మొదలిటఁ దునిమినయోగి నిర్వా
ణంబు నొందు, పరిజ్ఞానం బక్షయం బగుసత్యంబు తద్రధం బఖిలంబును
మృషాత్మకం బని యెఱుంగవలయు ననిన నాధీరునకు సనత్కుమారుం
డిట్లనియె.

39


తే.

బ్రహ్మసుజ్ఞాననిరతిఁ దపంబుఁ బూని
మున్నశించిన వృత్తిమై నున్న నాదు
జీవితంబు సనాధమై చెలువు మిగిలెఁ
జిరదయామూర్తి వైన నీచేత నేఁడు.

40


వ.

అని కొనియాడిన నవ్విప్రుండు సంతోషాంతరంగుండై చనియె.

41


సీ.

తాతలతాత, నెత్తమ్మి నెయ్యఁపుఁబట్టి
వేలుపు పెద్ద వావెలఁది మగఁడు,
తపసుల మొనగాఁడు, తపముల జెట్టికాఁ
డెల్లవిద్యల నెఱ నెఱుఁగుజాణ
ముక్కంటిసారథి ముల్లోకములఁ జేత
నంటక చేయు విన్ననువుకాఁడు
పంచాళిరాయంచఁ బఱపి యాడెడురౌతు,
కైలాటకపు మునిఁ గన్నతండ్రి,


తే.గీ.

జగతి నేరికిఁ దనవ్రాలు మిగులరాని
బిరుదులేకరి నేర్పులఁ బరఁగుప్రోడ,
నాల్గుమొగముల దేవుఁ డున్నతి దలిర్ప
నచటి కేతెంచుటయు వినయమున మ్రొక్కి.

42


ఉత్సాహ.

ఆ సనత్కుమారుఁ డనియె నఖిల లోకనాథ భూ
మీసురేంద్రుఁ డొకఁడు తెంపు మిగుల శిష్యసహితుఁడై
నాసమీపమునకు వచ్చి నాకు బ్రహ్మవిద్య సం
తోస మెసఁగఁ జెప్పి చనియెఁ దోన నేను మఱచితిన్.

43


క.

ఆనిర్మలాత్ముఁ డెవ్వం
డానతి యీవలయు ననిన నల్లన నగి సు

జ్ఞాను లగుమునులు వినఁ దన
సూనులకుం గరుణఁ దమ్మిచూ లిట్లనియెన్.

44


సీ.

ఏదేవుఁ డాదరం బెసఁగ ని న్నధ్యాత్మ
విద్యావిశేషసంవేదిఁ జేసె,
నేదయానిధి కటాక్షేక్షణామృతమున
గంటి వీవిపు డధికప్రియంబు
లెవ్వని విభవాంశ మించుకేనియుఁ గనఁ
జాల రత్యంతవిజ్ఞానులైన
నేశుభాకారుఁ డహీంద్రపర్యంకంబు
నందొప్పు శ్రీరంగమందిరమున


తే.

నట్టి నారాయణప్రభు వమ్మహాత్ముఁ,
డతని దివ్యాయుధములు శిష్యవ్రజంబు
భూత దుర్లక్ష్యుఁడైన యప్పుణ్యమూర్తి,
గాననయ్యె భవద్భాగ్యగరిమఁ జేసి.

45


ఉ.

క్రమ్మఱ నాజగద్గురునిఁ గన్గొనఁ గల్గెడు నీకు రంగగే
హమ్మున నంత దాఁక నియతాత్ముఁడవై పరమాత్మ చింతఁ గా
ర్యమ్మున నుండు మెల్లపుడు నాశశిపుష్కరిణీతటంబునం
దిమ్మహి దీనిపెంపు వచియింపఁగ శక్యమె యెట్టి వానికిన్.

46


క.

పరమంబై సకలజగ
త్పరిపావనమై సమస్తభద్రాకరమై
దురితనిరాసక మగు పు
ష్కరిణీతీర్థంబు తీర్థసారం బెందున్.

47


తే.

అమలమతులై జితేంద్రియు లైనవార
లీజలస్నానపానాదు లెలమిఁ జేసి,
యందు విహరించుచుండుదు రెల్లనాడు
మహితపరమాత్మభక్తిసమగ్రు లగుచు.

48

క.

సుమహిత పుష్కరిణీ తీ
ర్థమున గృతస్నానుడై 'జితంతే' యను మం
త్రమున హరిఁ దలఁచు నతఁ డఘ
సమితిఁ దొఱగి పోయి పొందు సాయుజ్యంబున్.

49


వ.

మఱియు నిచ్చట నొనర్చు దానవ్రతాదు లత్యల్పంబులైన నధికంబులగు
బితృసముద్ధేశంబునఁ జేయునవి యక్షయంబులై యెసంగు వేదమునఁ బాద
మాత్రంబైనఁ బఠించిన సర్వాధ్యయనఫలంబు నొందు శుక్లపక్షంబునఁ బూర్వ
దివసంబున భార్యాసహితుండై యుపవసించి పంచమియందుఁ గృతస్నానుండై
ఘృతప్లుతంబులైన తిలలును గుణపప్రస్థ పరిమాణంబులఁ బరిపూర్ణంబులైన
ఘృతపాత్రత్రయంబును దిలపాత్రత్రయంబును నొకసువర్ణంబును నుత్తమ
వర్ణుల కొసంగిన నతండు పుత్రవంతుండును బరమాయుష్మంతుండు నగు-
నొండేని కేవల తిలదానం బైనను ఘృతదానం బైనను సుతార్థు లగువారికిఁ
గర్తవ్యంబు నిష్కమాత్రంబు సువర్ణప్రదానంబు రోగనిర్ముక్తినిదానంబు.

50


ఉ.

వారని రాజయక్ష్మ కలవాఁడు తనంతియ హేమపుత్రికం
గోరి రచించి పుష్కరిణిఁ గ్రుంకి నభోదయకాతారకాత్మ వి
ద్యారతుఁ డైనవిప్రునకు దానము చేసి పునర్నిమజ్జనం
బారఁగఁ దీర్చి తద్ఘనతరామయదుఃఖముఁ బాయు పుణ్యుఁడై.

51


తే.

అచట గోదాన మొనరించునతఁడు గోవు
తనువునను నెన్నిరోమము లొనరు నన్ని
యబ్దశతములు త్రిదశసౌఖ్యముల నొందు
నిందు నసమానలక్ష్మి బెంపొందు మఱియు.

52


క.

కడునిష్ఠ నబ్దమాత్రం
బుడుగక నక్షత్రసూత్రయోగంబుల నె
వ్వఁడు తీర్థమాడు నిం దతఁ
డడరఁగ బహుళాశ్వమేధ మగుఫల మందున్.

53

తే.

పర్వతిథి నందులోన నాప్లవ మొనర్చు
నాతం డలిపాతకంబుల నపనయించు
జన్మనక్షత్రమునఁ గృతస్నానుఁ డైన
మనుజపతి యేలు నఖిలభూమండలంబు.

54


సీ.

సితపక్షపంచమిఁ గృతశుచిస్నానుఁడై
యొగి మూఁడు దివసంబు లుపవసించి
యుదకపారణఁ జేసి పదపడి మఱి దివ
సత్రితయంబు త్రిసంధ్యలందు
నంభోవగాహనం బాచరించుచు హవి
ష్యాశియు భూశయనాభిరతుఁడు
నై యుండు నేనరుఁ డట్టి పుణ్యాత్మకుఁ
డతిశీఘ్రమున నపస్మృతిఁ దొఱంగు


తే.

నెలమిమై మాసమాత్ర మీకొలఁది తీర్థ
మాడువారల మును చెందినట్టి గుల్మ
కుష్ఠశూలరుజాది దుష్కోటి యడఁగు
సలిలములలోన లవణరాసులనుబోలె.

55


క.

గురుతల్పగ శిశుఘాతక
హరినిందాపర కృతఘ్న నాస్తిక మదిరా
నిరతపతితాదులకు నీ
సరసీస్నానమునఁ బాపచయశాంతి యగున్.

56


క.

నిరవధిక దురిత కరులకు
హరికీర్తన మొకటితక్క నఘనిష్కృతికిన్
మఱి లే దుపాయ మీపు
ష్కరిణియుఁ దత్సమంబుగా నెన్నఁ దగున్.

57


వ.

ఇమ్మహాతీర్థరక్షకులై విధాతృపరికల్పితు లగు పుష్కర, పుష్కరాక్ష,
కుముద, కోల, సుప్రతీపు లనువారలుఁ గ్రమంబునఁ బూర్వాది చతుర్దిశలను

మధ్యప్రదేశంబునను వసింతురు, మొదలఁ దదీయప్రార్థనం బొనర్చి పిదప
నవగాహాదికృత్యంబు లాచరించునది, సర్వపర్వంబుల శర్వరీవిభుం డిందుఁ
గ్రుంకువెట్టుట నిందుపుష్కరిణీనామం బీ సరోవరంబునకు భువనప్రసిద్ధం
బుగా నయ్యె- నీవు సరసిఁ గృతస్నానుండవై- శ్రీరంగధామంబున కరిగి
యచట సుఖంబున నుండు, మిట్టి యుగ్రతపంబున లోకంబులు సముద్వి
గ్నంబులు సేయవలవ దీతీర్థవాసంబున నీతీరునం జేసి కృతార్థుండ
వయ్యెద వని చెప్ప యప్పద్మసంభవుం డరిగె- సనత్కుమారుండును
దదుక్తప్రకారంబునఁ బ్రవర్తించుచుండె.

58


ఉ.

ఏనరుఁ డీకథాపఠన మెప్పుడు సేయు నతండు పాపసం
తానము బాసి శాశ్వతపదంబు చనుం బితృదత్త మక్షయ
శ్రీనొనరించు నత్తఱి వసింప నృపాదులు సార్వభౌమతా
నూన ధనాఢ్యతాసుఖసమున్నతులన్ విలసింతు రెంతయున్.

59


క.

అని చెప్పి యప్పరాశర
తనయుఁడు వెండియును నాగదంతునితోడన్,
మునిముఖ్య, ముక్తికర మగు
వినుత పురావృత్త మొకటి విను మని పలికెన్.

60


చ.

ఒదవఁగ లోభయుక్తమతి నొక్కజఘన్యజుఁ డధ్వనీనులం
జదియఁగ మోది, వారిధనజాలముఁ జాలుపుగా హరించుచున్
జెదరక యివ్విధంబు నిజజీవికగా మనుచుండు నట్టి బ
ల్లిదుఁ డగువానిచే సమసె లెక్కకు మిక్కిలిగా ద్విజావళుల్.

61


క.

ఇటు బహుముఖముల మఱియా
కుటిలాత్ముఁడు తెరువుగొట్టికొని యొకనా డు
ద్భటభంగి నున్నతటి న
చ్చటగా భూదేవుఁ డొకఁడు చనుచున్ వానిన్.

62


మ.

కనియెం, గర్కశమేచకాంగు నతిరక్తక్రూరవిస్ఫారలో
చను, నుత్తీర్ణ కరాళ బర్బర కచశ్మశ్రున్, వినీలాంబరుం,

ఘనకుంజాంతరితుం గతాగతజనాకారప్రతీక్షాపరున్
హననోత్సాహుఁ గరాగ్రలోహవరియోస్యద్యస్కరున్ దస్కరున్.

63


క.

పొడగని యడరెడు భయమున
నడుగులు దడఁబడఁగ హృదయ మదరఁగ బెదవుల్
దడుపుచు నడుకుచు వడవడ
వడఁకెడు నవ్విప్రుఁ జూచి వాఁ డుద్వృత్తిన్.

64


చ.

సుడివడ బిట్టదల్చి యెటుసొచ్చెద వెక్కడబోవవచ్చు దోఁ
బడితివిగా కటంచు సిగఁ బట్టి వెసం బడనీడ్చి త్రోవసం
బడమునకైన నప్పు డొకపైకము నాతనిచేత లేమి యే
ర్పడఁ బరికించి చూచి మదిఁ బైకొని పర్వెడు నాగ్రహంబునన్.

65


క.

తల ద్రెవ్వ నడరుటయుఁ గడుఁ
గలఁగి మహీసురుఁడు వాని గనుఁగొని నన్నుం
బొలియింప నీకు నయ్యెడు
ఫల మెయ్యది రిక్తహస్తుఁ బాఱుని ననదున్.

66


తే.

ప్రాణములు గాఁచి రక్షింపు మనిన నతనిఁ
జూచి యోరి నిరర్ధక స్థూలకాయ
భూసురాధమ యెటనుండి పోవుచున్న
వాఁడ వదిచెప్పుమా వినవలయు ననిన.

67


క.

అనవుఁడు దీనాననుఁడై
తనువు సెమర్పంగ గద్గదస్వరమున ని
ట్లను వసుధావరముఖ్యుఁడు
తను నెటఁ జననీక యేఁచు తస్కరుతోడన్.

68


మ.

వసుధామండలికిం బ్రదక్షిణముగా వర్తించులోకప్రశ
స్త సరిత్తీర్థ వనాచల ప్రకరముల్ దర్శించుచున్ వచ్చి-చం

ద్రరసస్నానము రంగరాట్పద సపర్యాకృత్యముల్ భక్తి పెం
పెసగం జేసి మదీయదేశమునకై యే నేఁగెదెం దస్కరా.

69


వ.

అని చెప్పునప్పు డప్పాతకప్రచారుఁ డగణ్యప్రభావుం డగుభూదేవునితోడి
సంభాషణవిశేషంబునం జేసి యాక్షణంబ విశుద్ధమానసుండై పరహింసాత్మకం
బగు నిజవ్యాపారంబుఁ జాలించి సవినయంబుగాఁ గరంబులు మొగిచి యమ్మ
హీసురున కిట్లనియె.

70


మ.

సుమనఃశ్రేష్ఠ! శశాంకపుష్కరిణి యెచ్చో టుర్వి నాతీర్థరా
జము నేచక్కి భుజంగశాయికి నివాసంబైన శ్రీరంగమన్
విమలక్షేత్ర మతీతపాప నిరతిన్ వేఁగించు మాబోంట్లకుం
గమనీయస్థితి గోచరించెడినె నిక్కం బింతయుం జెప్పవే.

71


క.

నీ వధికపుణ్యపరుఁడవు
గావున నిత్తెఱఁగు దెల్పి కడుప్రియమున నీ
పోవలయునెడకు నరుగుము
భూవినుతచరిత్ర యేనుఁ బోయెద నెలమిన్.

72


తే.

అనిన నమ్మాటలకు ముద మలరి-మరణ
చింతఁ దప్పి యకంపితచిత్తుఁ డగుచు
విప్రుఁ డత్యుగ్రకర్మప్రవృత్తు శూద్రు
ననునయించుచు నల్లన నతని కనియె.

73


సీ.

మానవోత్తమ! నీ వనూనసౌమ్యాకృతి
స్ఫురణఁ జూపట్టె దిప్పుడు మహాత్మ!
నీయం దతిప్రియాన్విత మయ్యె నీవును
నాఁయెడఁ గడుఁబ్రసన్నత వహింపు -
మడిగితి వీవు యథార్థంబు నేనును
జెప్పెద నది విను చిత్తగించి

జగదభివర్జితం బగుశేషశయనంబు
శ్రీరంగశబ్ద ప్రసిద్ధిఁ దనరు


తే.

నందు శయనించు నెలమి శ్రీహరి తదీయ
పరిసరంబునఁ జంద్ర పుష్కరిణి మెఱయు
నట్టితీర్థావగాహనం బాచరించి
శుద్ధు లగుదురు ఘనపాపబద్ధులైన.

74


క.

ఇది మార్గ మిందుఁ జన ను
న్నది ముందట నర్ధయోజనంబునఁ జాలన్
మెదిగిన తెరవున నరుగుము
ముద మొదప నిరంతరాయముగ శీఘ్రమునన్.

75


క.

అని చెప్పి యతని వీడ్కొని
పునరుజ్జీవితుఁడ నైతిఁ బొమ్మని పలుమా
ఱును మరలి మరలి చూచుచుఁ
జనియె న్వడి విప్రుఁ డాత్మజనపదమునకున్.

76


వ.

తదనంతరంబ యాచోరుం డంతరంగంబున నంతంత కొదవు సంతాపంబున
నొక్కింతసేపు నివ్వెఱ నొంది తన్నుఁ జెందిన దోషంబులు మత్సంభాషణ
విశేషంబున నిరవశేషంబు లగుటయు, బుణ్యాచరణ పరిణతుండై దురిత
చరితంబునఁ దొలంగి - యానదీకూలంబునఁ గొంతకాలంబు సుజనాను
కూలంబుగాఁ బ్రవర్తించి సంచితాఘంబుల నిర్వర్తించి - యుదంచితప్ర
బోధితుండై - విప్రవరుండు చెప్పినచొప్పునఁ బుష్కరిణీతీర్థయాత్రా
పరాయణుండై - యల్లనల్లనఁ దదంతికంబుఁ జేరునంత కాయుఃపరిక్షీ
ణంబైన నతండు కృతాంతగోచరుం డయ్మె నప్పు డారోకనభయంకరు
లగుకాలకింకరులు తర్జనగర్జనభైరవం బైనరవంబున గదిరి యాభీలంబు లగు
కాలపాశంబులఁ గట్టి కట్టలుక నిగుడ మగుడఁ దాడనాదిపీడనం బొనర్ప
నుద్భూతయాతనాపరిభూతుండై - యాక్రోశించె - నయ్యవసరంబున.

77

శా.

ఆతీర్థంబునకుం జతుర్దిశల రక్షార్థంబుగా ద్విత్రిగ
ప్యూతిక్షేత్రమునం జరించు కృతపుణ్యుల్ - దుష్టశిక్షావిని
ష్ణాతుల్ దండధరుల్ ఘనాకృతులు - విష్వక్సేనవాక్చోదితుల్
భూతేశుల్ పటుదివ్యశక్తియుతు లంభోజాప్తతేజోధికుల్.

78


క.

గజవదనాదులు గాంచిరి
నిజరక్షితసీమఁ గాలనియమితభృత్య
వ్రజకృత బహువిధబాధల
గిజిగిజియగు శూద్రభక్తుఁ గీలితదేహున్.

79


వ.

ఇట్లు గనుంగొని గుబ్బనం బ్రబ్బు నిబ్బరంపు రోషంబునఁ జటుల సటా
సముత్పాటన పటుతరాగ్రహోదగ్రరంహంబు లగుసింహంబుల తెఱంగునఁ
బ్రతోదచోదనోద్దీపిత కోపాటోపబంధురంబు లగు సింధురంబుల చందం
బున, నకాండదండాఘాత జాతప్రతిమాభీలంబు లగు శార్దూలంబుల పోలిక
వాలాకర్షప్రభూతామర్షకరాళంబు లగు కాలవ్యాళంబుల విధంబునఁ,
బ్రళయపవన ప్రేరణ ప్రవర్ధమానంబు లగు పావకజ్వాలావితానంబుల
యచ్చు వెరిగి- యుదయమార్తాండమండల మరీచోష్ణంబు లగు దృక్కోణం
బుల నదరులు చెదర వికటభ్రుకుటీకుటిలంబు లగు నిటలంబుల ఘర్మం
బులుఁ గ్రమ్మ నతికఠోరక్రకచనిశితదశన సంఘర్షణ నిచ్ఛటచ్ఛటాత్కార
ఘోరంబుగా- దురహంకార సముద్భటు లగుశమనభటులం బొదివి మద
మదింపం దొడంగి రప్పు డమోఘనిర్దాత నిష్ఠురంబు లగు ముష్టిఘట్టనం
బుల విశంకటంబు లగు కటంబులు పగిలి జల్లునం బెల్లు దొరగు నెత్తుటం
జొత్తిల్లి- పిమ్మిటిగొని బమ్మరించువారును-జనవర్ష పాషాణ పాత ప్రకా
రంబులఁ గరోటి కర్పరంబులు చిద్రుపలై - వికీర్ణంబు లగు కర్ణరంధ్రంబుల
మెదడు గ్రమ్మిన రిమ్మగొని సొమ్మసిలువారును అక్షీణ కపోణిప్రయోగం
బుల క్రోడభాగంబులు తండసిలి గుండె లవిసి-బఱ్ఱెముకలు నెట్టు మోపఁబడి
బిట్టు మూల్గువారును బబుకరినజాను కుట్టనంబుల నుత్తానంబు లగు కంకా
లంబులు విఱిగి యొఱఁగి పొరలుచు మొరలిడువారును, ప్రకటపార్ష్ణిఘాతం
బులఁ బ్రచండంబు లగు పిచండంబులు పగిలి దిగులువొచ్చి. కళ్ళుపడి
త్రెళ్ళువారును మహాయస ముసల పరిఘ పట్టిసానుశాసనంబులం బరశు

ఘాతంబులఁ గలకలంబులై యసువులు పెకల వికలచిత్తులై యద్దెస దద్దరిలు
వారును, నుదారగదాప్రహరణంబులఁ జరణంబులు కంఠంబులు కరంబులు
శిరంబు లవలగ్నంబులు భగ్నంబులైన నుద్విగ్ను లగువారునై - బీరంబులు
దక్కి- బీఱువోయి మాఱుమొగంబు లిడి- మానంబు లెడలి- పంద్రిలి-
పికాపికలై, బెదిరి చీకాకువడి దవ్వులఁ దొఱంగి నవ్వులకు భాజనంబై
పఱచి రయ్యవసరంబున-

80


మ.

తమవెంటంబడి తోలు, విష్ణుభటబృందంబున్ విలోకించి- డెం
దములం గొందల మందుచున్ శమనదూత వ్రాతముల్- దీనవా
క్యములం బల్మఱు మీర లెవ్వ రని పల్కం గింక సాలించి- య
వ్విమలాత్ముల్ మఱి వారితోడ నని రావిర్భూతకారుణ్యులై.

81


క.

వలదు వల దింకఁ బరువిడ
నిలునిలుఁ డోదూతలార నెఱిఁ జిత్తములం
గలఁగక మా కభివందన
మెలమి నొనర్పుఁడు శుభంబు లెసఁగెడు మీకున్.

82


ఆ.

అనిన నెట్టకేల కాభయం బొకకొంత
యుడిఁగి నెమ్మనంబు లుమ్మలింప
నంత నంత నిల్చి రంతకకింకరు
లంత - వారితోడ ననిరి వారు.

83


శా.

ఈ తీర్ధంబున కేము రక్షకులమై-యే ప్రొద్దు వర్తింతు మా
భూతేశుం డిది గారణంబుగ-మముం బుట్టించినాఁ డస్మదా
జ్ఞాతుల్ గాక సురాసురాహి నరరక్ష పక్షి యక్షాది సం
ఘాతంబుల్ దమయంత నిచ్చటఁ జొరంగానేర వత్యుద్ధతిన్.

84


చ.

చల్లనితావు లెంచు వెదజల్లఁగ మవ్వపుఁ బూవు మొగ్గచా
లల్లన విప్పుచుం గిసలయావళి శ్రీవెలయంగఁ దెల్పుచున్
మెల్లన జంతుజాల మెలమిం బొదలం బరిపాటిమైఁ బ్రవ
రిల్లునుగాని-గాలి తనతీవ్రత సూపఁగ నోడు నీయెడన్.

85

క.

ఆలోకబాంధవుండును
నాలోకము నెఱపుఁ గాని యవనీజ లతా
జాలాదులఁ దనవేఁడిమిఁ
దూలింపఁగ వెఱచు వ్రేళ్లతోడుత నయినన్.

86


క.

తపనశశు లుష్ణశైత్య
వ్యపగత కిరణప్రసారులై వెలుఁగుట నీ
విపులక్షేత్రమున దిన
క్షప లివి యను భేదబుద్ధి సమకొన దెపుడున్.

87


వ.

ఇచ్చటిజనులు-నిరామయులు నిర్ద్వంద్వులునై చరింతురు. శకుంతసంతతులు
నట్ల ప్రవర్తిల్లు నెల్లవృక్షంబులు నిరాబంధంబులై సకల కాల సంపూర్ణ
ప్రసవఫలభరితంబులై యొప్పుఁ దిర్యగ్జంతువులును బుద్ధిమంతంబులై యుల్ల
సిల్లుఁ గ్రూరసర్పంబులైన నీప్రదేశప్రవేశమాత్రంబున నతిశాంతంబులగు నివి
దేవదేవుం డగుపుండరీకాక్షుని దివ్యతేజోనుభావపరిపాలితంబులై మెఱయు
చుండు-నట్టిభుజంగశాయికి నపరాంతంబులగు(?) శ్రీరంగంబు మీకుఁ గర్ణ
గోచరంబు గాదొకో యని వెండియు.

88


ఉ.

హీనమనస్కులార! యిది యెంతయు మీ రెఱుఁగంగ లేక-యి
చ్చో నఘజీవుఁ డైనపురుషుం బరుషక్రియఁ జేరి నొంపఁగా
బూనిన వార లిందుఁ జొరఁబోలునె మీకు, నుదారవైష్ణవ
జ్ఞానసమగ్రులై పరఁగు సంయమికోటికిఁ గాక యెమ్మెయిన్.

89


క.

ఈతనిపై మీచేసిన
చేతలు దలఁపంగ మమ్ముఁజేయుట యస్మ
చ్చేతఃపరితాపకుఁడై
యేతెఱఁగున బ్రదుకనేర్చు నింద్రుండైనన్.

90


ఉ.

ఎవ్వరు మీరు, మీకు నట నేలిక యెవ్వఁడు, మూఢబుద్ధులై
క్రొవ్వున నీప్రదేశమునకుం బఱతెంచిన కార్య మేమి? మా
కివ్విధ మెల్లఁ జెప్పుఁ డని యీక్షణకోణము లెఱ్ఱఁజేయుచున్,
నెవ్వగఁ బల్క నవ్వనజనేత్రుని దాసుల కోసరించుచున్.

91

వ.

ఆసమవర్తిభృత్యు లిట్లనిరి-

92


మ.

సకలప్రాణిచయాంతకారియు మహాశాభర్తయుం బుణ్యపా
తక నిర్ణేతయు-నైన దండధరునొద్దం దత్సమాదేశభా
రకవృత్తిం జరియించుచుండుదుము దుర్వారక్రియాప్రౌఢిమై
నొకచో నైనను మమ్ముఁ గీడ్వఱప నన్యుల్ చాల రెవ్వారలున్.

93


తే.

సర్వభూతాత్ముఁడైన విశ్వప్రభుండు
దృఢముగాఁ దన్మనోవృత్తిఁ దెలిసికాదే
ధర్మరా జని యాకృతాంతకుని నిలిపెఁ
గడఁగి ప్రాణ్యంతకరణాధికారిగాఁగ.

94


క.

స్వకృత శుభాశుభకర్మ
ప్రకరామితబంధనములఁ బరిబద్ధములై
సకలచరాచరచయములు
నొకయప్పుడు నతని వశము నొందుచునుండున్.

95


క.

కాలము గ్రసించు సర్వము
కాలము ప్రాణుల నశింపఁగాఁ జేయుఁ దుదిన్
గాలవశం బగునింతయుఁ
గాలము దా నన్యవశముగాదు దలంపన్.

96


వ.

కాలాత్మకుండును గాలచక్రప్రవర్తకుఁడును నగువిష్ణుదేవుం డట్టికాలక్షయంబుఁ
జెందిన - యప్పురుషాధమునిఁ గాలుని సమీపంబున నొందించుటకై నే
మిందఱ మిందువచ్చితిమి-మాచందంబు వినుండు.

97


మ.

కలుసాకారుల కెల్ల నేము భయదాకారంబునం దోచి, వి
హ్వలులై బిట్టొరలంగ మార్గమున నత్యంతంబు బాధింతు-మే
వలనం బాపము లేనివారలకు శశ్వత్సామ్యరూపక్రియం
జెలువొందం బొడచూపి త్రోవ నెలమిన్ సేవింతు మిష్టస్థితిన్.

98


చ.

అనిశము కీ డొనర్చిన దురంతమహౌఘము లెన్నఁడేనియున్
వినినవి గావు- గోవులును విప్రులు నీకఠినాత్ముచేతఁ జ

చ్చినవి యసంఖ్య లీఖలుఁడు సేసిన దుష్కృత మింత యం తనం
జన దటుగాన వీని జముసన్నిధికిం గొనిపోవఁగాఁ దగున్.

99


క.

అనిహతమహిమ నెసంగిన
దినకరసంభవుని యాజ్ఞ ధృతి నెవ్వఁడు గై
కొనక వితధంబు సేయఁగ
మొనయు దుడుకు జడుల కనయమును జే టొదవున్.

100


తే.

అప్పరేతాధిపుని యజ్ఞ నతిదురాత్ముఁ
డైన యీతనిఁ గొనిపోవు నట్టి యేము
భగ్నకార్యులమై పరిభవము నొంది
యున్నవారము మీచేత నుక్కు దక్కి.

101


క.

అలఘు సుకృతాత్ములుండెడి
నెల విది, దుర్జనుఁడు వీఁడు నిలుపంజన దీ
లలితస్థలమునఁ గావున
దలకొని మీ కడ్డగింపఁ దగ దితనికినై.

102


క.

దేవాదిచతుర్విధభూ
తావలికిని మీఁదగతి కృతాంతుఁడ కాఁదే
యావైవస్వతు నెదిరికి
రావలయును గాదె సుకృతరతులకు నైనన్.

103


వ.

అనిన దరహాసంబు సేసి వాసుదేవపారిషదు లాధర్మరాజానుజీవుల
కిట్లనిరి-

104


క.

కాలహతమైన చేతన
జాలము నియమింపఁ గర్త జముఁ డనుపలుకుల్
పోలునవి కర్మఫలములు
వాలాయం బనుభవించు వారలత్రోవల్.

105


క.

అనలము నిజసంగతి నల
కనకాదులకందుఁ జెఱచుగతి నీనెలవుం

దనుఁజేర నఘము లడఁచును
దనుజారి సమీపసీమఁ దరలక యునికిన్.

106


శా.

శ్రీవిష్ణుం బురుషోత్తమున్ వికచరాజీవాక్షు లక్ష్మీవిలా
సావిర్భూతరసాత్ము నేఘనులు సమ్యగ్భక్తిసంయుక్తులై
సేవింపం గనుచుందు రట్టిపురుషశ్రేష్ఠుల్ వినిర్ముక్తక
ర్మావష్టంభులు వారిసత్పథ మగమ్యం బెందు నెవ్వారికిన్.

107


క.

ఇచ్చోట నుండు భూతస
ముచ్చయము ప్రవేశమాత్రమున గను సుకృతం
బెచ్చోట నెన్నిజన్మము
అచ్చుగ వసియించియైన నలవియె పొందన్.

108


సీ.

అట్టి పుణ్యాత్ముల కత్యంతసులభుఁడై
మానిత శ్రీరంగమందిరమున,
ఫణిరాజ మృదుభోగ పర్యంకతలమునఁ
బద్మాసమేతుడై ప్రమదలీల
శయనించి యున్నాఁడు సర్వేశ్వరుఁడు సర్వ
భూతహృద్దేశ విస్ఫురితమూర్తి
భక్తానువర్తి యప్పరమేశుఁ డొక్కడు
పరకాల చక్రప్రవర్తకుండు,


తే.

యముని నుర్వికి నియమించి నట్టిదేవు
నకును బ్రాణపదంబ యీనదితటంబు
కాలసంస్పర్శతేశంబు గలుగ దిచట
నెట్లు వచ్చితి రట్ల పొం డింక మీరు.

109


క.

కాలుని దండధరత్వము
కాలోపహతాత్ములందుఁ గావున మీకుం
వోలినగతి వారలఁ బలు
గాలింపుఁడు జముఁడు శాస్తగాఁ డీయెడకున్.

110

క.

విలయసమయమునఁ గలజడి
నలజడిఁ బడి భువననిషహ మడఁగెడు నపుడున్
జలశాయి నిలయ మగునీ
లలిత క్షేత్రము నిరాకులతఁ బొలుపారున్.

111


ఆ.వె.

సర్వశక్తిమయము జగతి శ్రీరంగంబు
సర్వతీర్థమయము చంద్రసరసి
సర్వపుణ్యమయము చర్చింప నీరావు
సర్వవేదమయుఁడు శార్ఙ్గపాణి.

112


వ.

ఈశూద్రుం డతిపాపకర్ముం డయ్యు నీపుణ్యప్రదేశంబున నుండి సమాధి
యోగంబునంజేసి శుద్ధాత్ముం డయ్యె, నిది గాదని బలిమిం బట్టికొనిపోవ
మీవశంబు గాదు, పనిలేని దురభిమానంబునఁ బొరలక మఱలిపొం డనిన
నొండన వెఱచి యాశమన దూత లాపని విడిచి పఱచి రనంతరంబ-

113


సీ.

నిర్మలుండును, సత్వనిధియును శుద్ధాంత
రంగుండు, నగుశూద్రపుంగవుండు,
వెస సముద్ధితుఁడైన, వెఱవకు మికనంచు
భూతేశ్వరులు గరంబులఁ గరంబు
నతుల తదీయకాయస్పర్శ గావించి
రతఁడును భక్తిమైఁ బ్రణుతి సేసి-
పుష్కరిణీతీర్థమున కేఁగి తనివోవ
నం దవగాహన మాచరించి-


తే.

తత్తటంబున నురుతపోవృత్తి నున్న
సన్మునీంద్రుల దర్శించి సమ్మదమున
వందనము చేసి తానును వారిఁ గూడి
యర్థి శ్రీరంగభవనంబు కరిగియందు.

114


సీ.

శరదిందుమండల స్వచ్ఛాహిపర్యంక
భాసురు నపసవ్యపార్శ్వశాయి,

దక్షిణబాహూపధాన పీతాంబరో
జ్వల కటివిన్యస్త సవ్యహస్తు
వైజయంతీలసద్వక్షు నాకుంచితో
త్థానిత పాదపద్మాసమేతు
యోగనిద్రాముద్రితోద్భాసిలోచన
జలజాతుఁ బశ్చిమాశాశిరస్కు


తే.

నసమ మణిమయ మకుట కర్ణావతంసు
హారకేయూర కంకణోదారపార
సన తులాకోటి ముఖ్యభూషణవిశేష
కలితు శ్రీరంగవిభు జాడఁ గాంచి మ్రొక్కె.

115


క.

అతని నురుభక్తి వినయా
నతు నానందాశ్రుపూర్ణనయనున్ ముకుళీ
కృతకరు విష్వక్సేనుం
డతికృప నాభూతవరుల కనుచరుఁ జేసెన్.

116


మ.

ఇట వైవస్వతకింకరావలియు భూతేశప్రహారస్ఫుట
స్ఫుటితాంగంబుల నెత్తు రొల్కఁ జరణంబుల్ దొట్రిలిం గంప ము
త్కటమై పర్వఁగ నూరుపుల్ పయిపయిం గ్రమ్మన్, భయభ్రాంతి మి
క్కుటమై చూపులఁ దోప నొక్కమొగి నాక్రోశించుచుం దీనులై.

117


చ.

ఇనతనుజాతు ముందటికి నేఁగి సగద్గదవాక్యవృత్తి ని
ట్లనిరి-కృతాంత ము న్నెపుడు సస్ఖలితస్థితి నిజ్జగంబులం
జను భవదాజ్ఞ విష్ణుభటసంఘముచే నిదె నేఁడు సర్వమున్
బెనుపఱె చూడ నేము పరిభూతుల మైతిమి వారిచే మదిన్.

118


వ.

అవ్విధం బవధరింపుము.

119


ఉ.

నేము భవన్నియోగసరణిం జనియించుచు నొక్కశూద్రు ను
ద్దామనికామ పాతక విధానపరాయణుఁ గాలగోచరుం
బామరు నిందుఁ దెచ్చుటకుఁ బట్ట కడంగెడునంతలోన ద
త్సీమకుఁ గావలై మెలగు ధీరులు భూరిభయంకరాకృతుల్.

120

శా.

భూతేశాహ్వయు లుగ్రదండధరు లంభోజాప్తతేజుల్ సము
ద్ధూత స్వేదలలాటభాగ వికటభ్రూభీషణుల్, మమ్ము-ని
ర్ఘాతక్రూర కరాంఘ్రిజానుహతులం గావించినం దోలి-నే
మాతుచ్ఛుం దిగనాడి వచ్చితిమి నీ కాద్యంతముం జెప్పఁగాన్.

121


క.

అనుపలుకులు దనచెవులకు
ననయంబు నసహ్య మగుచు, సనలములో గొ
బ్బున నే పోసిన విధమున
కనలి పరేతప్రభుండు కటకటపడుచున్.

122


శా.

ఏమేమీ మది నింతయున్ భయములే కెవ్వారొకో మూఢులై
యామీదం దమపా టెఱుంగక మదీయాజ్ఞానిరోధక్రియా
సామర్థ్యంబు భజించినారు త్రిజగత్సంజాతభూతావలిన్
నేమింపం దలితో హరింపఁ బ్రథులే న్నేఁదక్క నెవ్వారలున్.

123


వ.

అని యొక్కింతవడి చింతించి యంతకుం డంతకుమున్న సన్నుతాచార
భూషణుం డగువిభీషణుచేత నానీతంబైన శ్రీరంగంబునుఁ దదీయ నికటం
బునఁ గావేరీ తటంబున-నఖిలదురితహరణ సమర్ధం బగుపుష్కరిణీతీర్ధంబును
నతివిచిత్రం బగు నాపుణ్యక్షేత్రంబు మహత్త్వంబును-దద్దివ్యవిమానశయ
నుం డగుపుండరీకాక్షు మూర్తివిశేషంబును - దనమనోగోచరంబులైన నా
చరితాభివందనుండై యాభూతేశ్వరులు తీర్థరక్షకు లగుటయు-శూద్రుండు
తదనుచరుం డగుట యునికియుం దెలిసి నిజకింకరులం గని వారితో
నిట్లనియె.

124


క.

నిక్కముగ నామనంబున
నక్కడి వృత్తాంత మెల్ల నధిగత మయ్యెం
దక్కక వినిపించెద మీ
రక్కథ దత్తావధానులై వినుఁ డనుచున్.

125


సీ.

శ్రీరఘురాముఁ డాశ్రిత వజ్రపంజరుం
డఖిలకంటకుని దశాస్యుఁ దునిమి

యురువైభవమున నయోధ్యాపురికి వచ్చి
యచట సుగ్రీవాదు లైనహితుల-
కుచిత సంభావన లొనరించుతఱి నతి
ప్రియకారియైన విభీషణునకు
నాత్మకులీన కృపారాధితంబును-దన
కంటె నుత్కృష్టతరము నైన-


తే.

రంగధామంబు సదయాంతరంగుఁ డగుచు
నొసఁగుటయు నాతఁ డదిగొంచు నసమహర్ష
మెసఁగ నిజపట్టణమునకై యేఁగుచుండ
మార్గవశమునఁ గావేరి డగ్గఱుటయు,

126


వ.

అపుడు మధ్యాహ్నసమయం బగుట-నతండు తత్ప్రదేశంబున తద్దివ్యమంది
రంబు నిలిపి దేవతార్చనార్థంబు పుష్పోపహరణంబునకై వనం
బున కరిగి-యచటఁ బరమతపోనిష్ఠులఁ గని సంభాషించి వారిచేత సంభా
వితుండై -తత్సమేతంబుగా నేతెంచి శ్రీరంగరాజపూజావిధానంబుఁ దీర్చు
టయు-ననంతరంబ గమనోన్ముఖుండై యద్దశముఖానుజుం డుద్దామతేజోభి
రామం బగు రంగధామంబు వహింపం బూని తరలింపలేక శోకాకులం
డగుటయు నాదనుజపుంగవుం గరుణాతరంగితంబు లగునపాంగంబుల
నిరీక్షించి లక్ష్మీశ్వరుం డతనిపై లక్ష్యం బుడిపి, యాశశాంక పంకజాప్తంబుగా
నిరాతకం బగులంకాధిపత్యంబున కనిపి-యసమాస సంతతానందుండై -
యుండుటయు-నది కారణంబుగాఁ దత్సమీపం బఖిలపాపంబుల లోపంబు
సేయనోపుటయుఁ జెప్పి దండధరుండు వెండియు వారల కిట్లనియె.

127


క.

మీవశమె విష్ణుభూతే
శావజ్ఞయుఁ దత్పరిగ్రహ నిపీడనముం
గావింప వారితోడం
బోవం బనిలేదు కలిగెఁ బోయినఫలమున్.

128


క.

అన్నెలవున గల భూతము
లన్నియు నజ్ఞానపాత మన్నియు సుఖసం

పన్నములు శక్తిమంతము
లన్నియు నాత్మాభిమతవిహారోన్నతముల్.

129


తే.

సకలజగదేకవిభుఁ డైన చక్రపాణి
కాసరిత్కూ మతిహృద్య మగునివాస
మచటు రక్షింప ధాతసంరచితులైన
వారు-భూతేశం రిమితు లవార్యబలులు.

130


మ.

క్రమయోగంబున నెన్నఁగాఁబడు కళాకాష్ఠాదులం బేర్చుకా
లముచే భూతచయంబు లెల్ల నవలీలన్ సంక్షయం బందు, నా
కమలాక్షప్రియధామమై మెఱయు రంగక్షేత్రమం దెప్పుడుం
బ్రమదం బార వసించు ప్రాణుల హరింపంజాల దాకాలమున్.

131


వ.

దేహసంగ్రహంబునకుఁ దత్త్యాగంబునకుఁ గర్మంబు కారణం బట్టి కర్మ
వళులంబట్టి శిక్షించుకారణంబు నాయదిగాని మహానుభావులం గేవలంబు నియ
మింపు సామర్ధ్యంబు నాకులేదు, వారలకెల్ల సర్వభూతేశ్వరుండగు నప్పర
మేశ్వరుండు నియామకుండు గావున-జీవేచ్ఛగలదేని మీ రందుఁబోవలవ
దనిన, నిజస్వామియగు వైవస్వతుపలుకు లాకర్ణించి -కింకరు లహంకారం
బుడిగి తదాదేశంబున నాదేశంబునకు దవ్వులఁ దొలఁగిపోదు రని చెప్పి
యప్పారాశర్యుండు నాగదంత మునీశ్వరున కిట్లనియె.

132


క.

ఈకథఁ జదివినవారును
జేకొని వినువారు-విజితజీవత్వరులై
నాకాది పదసుఖస్థితిఁ
గైకొందురు చనరు జమునికడ కొకనాడున్.

133


ఉ.

నావుఁడు నాగదంతమునినాథుఁడు సాత్యవతేయుతో-మునీం
ద్రా వనజాతవైరి-యనురాగమునం బ్రతిపర్వమున్ జగ
త్పావనియైన పుష్కరిణిఁ దా నవగాహము సేయు నంటి వీ
వావిధుఁ డేమికార్యమునకై యటు సేయుచునుండు చేప్పుమా!

134


చ.

అనినఁ బరాశరాత్మభవుఁ డాతనితో నను మున్ను దక్షనం
దనలఁ దుషారరోచి ప్రమదం బెసఁగంగ వివాహమై (ననె)

మ్మనమున వారి నందఱ సమంబుగఁ జూడక రోహిణీసతిం
ఘనబహుమానపూర్వకముగాఁ బనిసేయుచు నుండు నెప్పుడున్.

135


క.

దానికి నశ్విన్యాదు ల
నూనవ్యధఁ జెంది తండ్రియొద్దకుఁ జని దీ
నాననలై పతిచేఁ దమ
కైన పరాభవముఁ జెప్ప నాతఁడు గినుకన్.

136


శా.

ఆరాజుం బిలిపించి యిట్లనియె-నీ వన్యాయసంచారివై
తారానీకము లెల్ల నీవలని నాథప్రాప్తి తుల్యంబుగాఁ
బ్రారంభింపక దుర్వివేకసరణిన్ బాటింపుచున్నాఁడ వీ
దౌరాత్మ్యంబుఁ దలంప మేలగునె చంద్రా! రోహిణీవల్లభా!

137


క.

ఇది మొద లందఱకునుఁ బ్రియ
మొదవఁగ సమభావవృత్తి నుండుట గడుమే
లది గాక తప్పి తిరిగినఁ
దుదిఁ గనియెదుగాక పొమ్ము దురితఫలంబున్.

138


క.

అని దక్షుఁడు తన తనయల
ననునయములఁ దనిపి, కినుక ననుప సుధాంశుం
డును జని ముందటి తెఱఁగున
దనప్రియయును దాను సమ్మదంబున నుండెన్.

139


మత్తకోకిల.

ఆతెఱంగున కాత్మలన్ పగ పగ్గలింపఁగ వెండియున్
తాత పాలికి నేఁగి వారలు తద్విధం బెఱిఁగింప న
బ్జాతసంభవపుత్రుఁ డప్పుడు చంద్రునిం బిలిపించి, ధ
ర్మేతరంబు భవచ్చరిత్ర మిదేల మానవు బేలవై.

140


వ.

ఇంక నిటమీఁద నీవర్తమానం బిట్టి దయ్యెనేనియు గొఱఁగాదు తప్ప దేఁ
జాఁటిచెప్పితి, నెప్పగిది నైనను బుద్ధిమంతుండవై యుండు పొమ్మని యుల్ల
సంబు లాడి వీడ్కొలిపిన గ్రమ్మఱ వచ్చి మామ మాటలు గీటులఁ బుచ్చి
యచ్చంద్రుండు సాంద్రానురాగంబున రోహిణీసంభోగలంపటుండై యుండె

మఱియును బెక్కుమాఱులు దక్షుండు ఋక్షాధిపతి నివ్విధంబున బోధించి
తత్కుటిల ప్రచారంబు వారింపం జాలక చాల రోపించి యతనిం గనుంగొని.

141


క.

దోషాకర! పలుమఱు-మ
ద్భాషలు గైకొనక చపలభావంబున ను
ద్వేషించితి గావునఁ ద
ద్దోషంబునఁ జెందు యక్షదుర్దశ నిన్నున్.

142


చ.

అని శపియించె నంత హరిణాంకుఁడు తత్సటురోగ ముగ్రమై
తనతనువందుఁ బొందఁ బ్రభఁ దప్పి కృశించి వినష్టబుద్ధియై
ఘనభయవిహ్వలుం డగుచు గ్రక్కున నక్కడఁ బాసి భూతలం
బునఁ గడువాసి నుల్లసిలు పుష్కరిణీతటిఁ జేర సన్మతిన్.

143


మ.

నిజశాపావధిఁ గోరి తద్విమలపానీయంబులం గ్రుంకి స
ర్వజగద్భూరితపంబు పంచదశవర్షంబుల్ ధృతిన్ సల్పి నీ
రజనాభుం బదివత్సరంబు లట నారాధించె భాస్వత్కర
వ్రజకించిద్వికసద్ధళాంచితతరస్వచ్ఛాంబుజాతంబులన్.

144


వ.

అంత.

145


క.

తద్విరచిత పూజనముల
హృద్వనజం బలర లోకహితమతి సార్ఖా
పద్విఘటనకరుఁ డగు దను
జద్విషుఁ డతికరుణ నతని సన్నిధి నిల్చెన్.

146


ఉ.

అప్పుడు కైరవప్రియుఁ డుదంచితసమ్మదవార్థివీచులం
దెప్పలఁ దేలు నెమ్మనము ద్రిప్పఁగఁ జాలక నేత్రపర్వమై
యొప్పెడు నప్పురాణపురుషోత్తము దివ్యతనూవిలాసముం
దప్పక చూచుచున్ బహువిధంబులఁ బ్రస్తుతిచేసె నమ్రుఁడై.

147


క.

ఆసంస్తవంబు-హృదయో
ల్లాసం బొనరింప మెచ్చి లక్ష్మీశ్వరుఁ డా

కాసారము డగ్గఱి యమృ
తాసారము దొరఁగుఫణితి నాతనితోడన్.

148


క.

కువలయహిత భవదుదిత
స్తవ ముదితుఁడ నైతి నీవుఁ దలఁచెడి కార్యం
బవలంబిత ఫలసిద్ధులఁ
దవళించెడు నస్మదీయ దర్శనలబ్ధిన్.

149


చ.

అనుటయుఁ జంద్రు డిట్లను గుణాంబుధి విష్ణుఁ బురాణపూరుషున్
నిను నఖిలేశు యజ్ఞమయునిం బొడగంటి మదీయమైన జీ
వనము గృతార్థ మయ్యె నభివాంఛితముల్ సమకూరెఁ బైపయిన్
మునుపుగఁ బొందు నాపదలు మున్నె దొలంగె విహంగవాహనా!

150


చ.

అమృతమయంబులైన కిరణావళులం బచరించి యోషధీ
సమితులఁ బ్రోవు మంచుఁ బటుశక్తిఁ గృపామతి నిచ్చి నన్ను నా
క్రమమున నీవు నిల్పితిని కైటభమర్ధన నిల్చెద న్మహ
త్వము దిగే దక్షుశాపజనితక్షయపీడయు నిప్డు నాదెసన్.

151


క.

దశాగ్రహజాతమహో
గ్రక్షయమునకు క్షయంబు గావింపంగా
దక్షు లొరు లేరి యిట నలి
నేక్షణ! నీ వొకఁడు దక్క నీ విశ్వమునన్.

152


సీ.

అనుటయుఁ బుండరీకాక్షుఁ డాతనితోడ
నిట్లను గైరవహిత! మదీయ
దర్శనామృతవారి ధారాభిషిక్తులై
రేనియుఁ బాపాత్ము లైనవార
లతిశుద్ధతను లౌదు రనిన ని న్నెన్నఁగా
నేల నా కెంతయు హితుఁడ వీవు,
గావున యక్షరోగవ్యధఁ బెడఁవాసి
పోషింపు మోషధీ పురజనులను

తే.

యుష్మదుదయంబు లోకనేత్రోత్సవంబుఁ
జేయుచుండెడిఁ గల్యాణదాయి యగుచుఁ
దపము నీపొందుఁ జేసినదానఁ జంద్ర
పుష్కరిణి నాఁగ వెలయు నీపుణ్యసరసి.

153


ఆ.వె.

పురుషులందుఁ బుణ్యపురుషుండు-సతులలో
నబ్ధితనయ - నదులయందుఁ గంగ-
యెవ్విధమున వెలయు నవ్విధమునఁ దీర్థ
రాజి నీసరోవరంబు మెఱయు.

154


వ.

అనిన నప్పద్మలోచనునకు సుధారోచి యిట్లనియె-

155


చ.

జిగిఁ దళుకొత్తు క్రొత్త వికసించిన తెల్లని తమ్మిరేకులం
దెగడెడి కన్నులు న్నగవు దేరెడి చూపులు గుండలద్యుతి
స్థగీతములై మెఱుం గెసఁగు చక్కని చెక్కులుఁ బల్లవారుణం
బగునధరంబుఁ గల్గు భవదాస్యవిలాసము నిల్పు నామదిన్.

156


క.

ఆ చొప్పునను మదీయ వి
లోచనములు చూచుఁ గాక లోలత నెపుడున్
నీచారుమూర్తి ననవుఁడు
నాచంద్రునితోడ దనుజహరుఁ డిట్లనియెన్.

157


ఆ.వె.

అఖిలదోషరహితులై నిర్మలజ్ఞాన
వంతులైన యట్టివారి కైనఁ
గాని గోచరంబు గాదు నానిజమూర్తి
కూడ దట్టిపలుకు కుముదమిత్ర!

158


మ.

అనినం జంద్రుఁడు వల్కు, నట్లయిన నత్యల్పాల్పసత్కర్మటో
ధనులై ద్రిమ్మరు లోకు లెప్పగిది నార్తత్రాణధుర్యున్-రమా
సనపద్మార్యము ని న్నవార్యగతి సందర్శించి ధన్యాత్ములై
ఘనతం బొందుదు రట్టిపొందు వెలయంగా నిల్పు మిచ్చోటికిన్.

159

క.

నావుఁడు నా యుడుపతి కను
నావిభుఁ డిది పొసఁగు నిచటి యనఘులుఁ గానం
గా వలతురు నను నితరప
దావాసుల కలవిగా దుదారుల కైనన్.

160


వ.

ఇటమీఁద లంకాధిపతి యగు విభీషణుకతంబున నీసరిత్తీరంబున నెల్లవారికిఁ
బ్రత్యక్షంబై యుండెద నది కారణంబుగా ధారుణీవలయంబు నిరుపద్రవంబై
మెఱయు, నపుడెపు డిప్పరిసరంబున మదీయదివ్యధామంబు నిలిపి నిజపురం
బున కరుగునది-కారణంబుగా ధారుణివలయంబు రంగమందిరం బైనభుజంగ
భోగతల్పంబున ననల్పభోగంబునఁ గల్పాంతపర్యంతంబు లోకాను
గ్రహార్థంబుగా వసియించెద-నా వేళన నీవు నన్ను దర్శించెద వింకఁ బ్రతి
పర్వంబును బుష్కరిణీతీర్థసేవార్థం బిచటి కేతెమ్ము-పొమ్ము-నీ నిండు
వెన్నెల యఖిలజగత్పావనం బయ్యెడుమని యాదేవదేవుం డంతర్ధానంబు
నొందెఁ జంద్రుండును దద్వచఃప్రకారం బాసరోవరభజనాపరాయణుండై
యున్నవాఁ డని చెప్పి యప్పారాశర్యుండు మఱియు నాగదంతున
కిట్లనియె.

161


క.

పదియోజనములు నైదుం
దదర్ధమును నందు సగము తగు పఱపై-యిం
పొదవుఁ గృతాదియుగమ్మున
సదమల సలిలములఁ జంద్రసరసియు బెడఁగై.

162


క.

అంతట కలియుగమున నం
తంతకుఁ బ్రతిదినము నల్పమగు సస్తనగ
ప్రాంతముఁ జేర్చిన యర్చి
ష్మంతుని కిరణోత్కరప్రసారముకరణిన్.

163


ఆ.వె.

కలఁక యింత లేక కడుచల్లనై నల్పు
లొలయు చంద్రసరసి సలిలపూర
మనఘ! కలియుగాంత మగువేళ దుర్గంధ
యుక్తమై కలంగి యుండు నపుడు.

164

సీ.

మండలాధిపులకు మరణ మెప్పుడు గల్గు
నపుడు రక్తచ్ఛాయ నగలించు
మాన కెన్నఁడు రాజ్యహాని పాటిలునాఁడు
నెఱయంగఁ బసరువన్నియ వహించు
నఖిల ప్రజాసంక్షయం బగు నేవేళ
నాతఱి క్రిమిమయం బగుచునుండుఁ
జొప్పెడు వేళ విక్షోభ మేసమయమం
దయ్యెడ ఫేనంబులై కలంగుఁ


తే.

బేర్చు నాకాలమున ననావృష్టిదోష
మట్టి పట్టునఁ జువ్వన వట్టిపోవు
నింకఁ బెక్కెన్న నేల యీ యిందుసరసి
దోచు విపరీతములు-విపత్సూచకములు.

165


మ.

నృపులుం బోరక భావికాలమున శాంతిం జెందుచో- దుగ్ధస
చ్ఛవియున్ విప్రులు సౌఖ్యమందునెడలం జంద్రోపలచ్ఛాయయుం
భువి నెందుం ఘనవృష్టి గల్గుతఱి నుద్భూతోర్మిజాలంబునై
సువిశేషస్థితిఁ దత్సరోవరము పొల్చున్ మంగళావాసియై.

166


తే.

ఎన్న ముప్పదిరెండు యోజనము లంత
మేరయై యొప్పు దేశవిస్తారమెల్లఁ
గాలవశమునఁ బొడవఱి కలియుగాంత
వేళ నత్యల్ప మయ్యెడి విప్రవర్య!

167


వ.

సకల భూతక్షయకరంబుగా నాయుగంబున నఖిల వర్ణంబులకు నుపప్లవం
బగ్గలం బయ్యెడు- నప్పు డాప్రదేశంబు నిర్మనుష్యం బగుట దేవతాసంచా
రంబ కాని యొండు లేకుండుట -ననాచారులు నన్యాయకారులు-నామ్నాయ
దూషకులు- నార్యజన భయంకరులు-నల్పాయువులునై యెల్లవారును బరమ
కల్యాణకారకు లగువారినామోచ్చారణంబు విన్నంతన విద్వేషించుచుఁ దమః
ప్రవర్తకుం డగురుద్రుండు తమకు దైవంబుగా నుపాసించెద-రమ్మహా
దేవుండు జగద్విమోహార్థంబుగాఁ దాను దైవం బని కల్పించిన తామస

శాస్త్రంబు లెల్లెడలం జెల్లుబడియై ప్రవర్తిల్లెడు- నాసమయంబునందు వాసు
దేవపరాయణు లగునమ్మహాత్ము లైనవైష్ణవులు తమోనిరాసం బాచరించి
యచ్యుతపదంబు నొందుదురు.

168


సీ.

సాత్వికంబులు రాజసములు దామసములు
నన మూఁడువిధముల నవనిఁ బరగు
శాస్త్రంబులందు విశ్వప్రభు సర్వాత్ము
హరిఁ జెప్పునవి సాత్వికాహ్వయములు,
జలజగర్భుని సరస్వతి హవ్యవాహనుఁ
బ్రణుతించునట్టివి రాజసములు
ప్రకట తమఃప్రవర్తకు నుమానాథుఁ గీ
ర్తనసేయు నవియెల్లఁ దామసములు,


తే.

వానిఁ గొనియాడి యతఁడె దైవంబుగాఁగ
గొలిచి సంపన్ను లగుచుఁ గోర్కులు ఫలించి
బలియులై సాత్వికుల బాధపఱచి నగుచు
నెడల విడుతురు హరిసేవ నెల్లవారు.

169


క.

హరిహరుల సమముజేసిన
హరుఁడే పరతత్వ మనిన యాశాస్త్రములుం
ధర సత్య మనిన దుర్గతి
దొరకునె హరిసమముపలుక దోషము గాదే!

170


క.

ఈపగిదిఁ గలియుగంబున
నేపారు నుపద్రవంబు లెల్లను భద్రం
బై పరగు చంద్రపుష్కరి
ణీపరిసర మందలేవు నెఱి నొకనాడున్.

171


క.

జగదుద్భవ పరిపాలన
విగమంబులు లీలగాఁగ వెలిసిన హరికిన్
ఒగి నుపసంహృతి నపు డిం
పగు నప్పుడు గల్గుఁ గలిసమాగమ ముర్విన్.

172

ఉ.

మేదినిపై విభీషణునిమిత్తమునం గరుణామయాత్ముఁడై
యాదట రంగమందిరమునందు భుజంగమరాజశాయి-ప
ద్మాదయితుం డజస్రమును దా వసియించుటఁజేసి కాందో
పాదుల నేయుప్రదవము నందవు నా సరసీసరిత్స్థలుల్.

173


క.

అని మఱియు నప్పరాశర
తనయుఁడు సునయుఁడగు నాగదంతునితో ని
ట్లను మునిజనములచేమును
వినఁబడు కథయొకటి నీకు వినిపింతుఁ దగన్.

174


తే.

ఏల నీచోళమండల మెల్ల నేలు
రాజదోషంబు కతన ధరాజనంబు
వనరి వసియింపఁ బండ్రెండు వత్సరములు -
పెచ్చు పెఱిగె ననావృష్టిపీడనంబు-

175


సీ.

కడుఁ బేర్చి మిటమిటఁ గాయు కట్టెండచే
భువనముల్ పొరపొరఁ బొక్కిపడియె,
వేఁడియై బిసబిస విసరుగాడ్పులఁ బ్రాణి
తతు లెల్లఁ దటతటఁ దాఁక దొణఁగె,
నొండెడ భగభగ మండు కార్చిచ్చుల
బెనుగిరుల్ పెటపెటఁ బ్రేలఁజొచ్చెఁ
బంకమై జవజవ నింకు శాదంబుల
మలమల మకరాళి మాడిపోయె


తే.

నెండ చొఱకుండఁ గడు నేఁచి యిరులు గొనుచు
వఱలు కాంతారపంక్తులు వళ్లుపోయె,
నట్టనడువేసవులను గాల్నడలు గాక
జరగు నేఱులు నిర్జనస్థలము లయ్యె.

176


శా.

క్షుత్తృష్ణాదిక వేగతా పరిగతానుప్రాణ శల్యావళీ
భిత్తాకీర్ణమహార్ణవాంతిక మహీభృత్కందరారణ్య శు
ష్యత్తోయాశయ తీర చైత్య మరుదేవాగార రథ్యాదులన్
నృత్తం బాడుచు మృత్యుదేవత సమున్మేషించె హేలాగతిన్.

177

క.

ఆవేళ మునులు సిద్ధులు
కావేరీ తీర్థమంద కాపుండెడి భూ
తావలికి నచటు శరణం
బై వెలసెను రంగవిభు సమాశ్రయ మహిమన్.

178


ఉ.

ఆగతిఁ గొంతగాలము సమంచితభక్తిఁ జనంగ నానదీ
వేగము నాఁడునాటి కతివేగము దొంకిలినం దటస్థు లు
ద్వేగము నొంది యందఱకు దిక్కగుటేఁదిన మాకునుం దను
త్యాగము గార్య మంచు విగతాన్యదిశావిజిగీష నున్నెడన్.

179


ఉ.

అత్తెఱఁ గెల్లఁ గన్గొని మహాబలవంతులు తీర్థరక్షకుల్
చిత్తములం గృపారసము చిప్పిల వారలఁ గావఁబూని యు
ద్వృత్తి మెయిం బయోధర తతిన్ రభసంబున నాక్రమించి యు
వ్వెత్తునఁ దద్ఘనోదకము లెల్లను జిల్లులువోవఁ బుచ్ఛినన్.

180


ఉ.

పన్నవు మేఘముల్, గగనపాలిక వాలిక క్రొమ్మెఱుంగు-లు
త్పన్నము గావు, లేవు మహతస్తనితధ్వను లిట్టి చిత్రమే
మెన్నఁడుఁ జూడమంచు జను లెల్లఁ బ్రమోదకుతూహలంబులం
జెన్ను వహింపఁ బెల్లుగురిసెం జలధారలు ధారుణీస్థలిన్.

181


క.

తోరములై కరటికరా
కారములై సకలదిశలఁ గడుఁ దొఱఁగు తదా
సారమున నుబ్బి పఱచెను
వారక కావేరి నీరు వారిధిఁ బొదువన్.

182


వ.

అమ్మహానదీజలపానంబునఁ బ్రాణిసంతానంబు సంతాపరహితంబై సుఖం
బుండెనంత నారాజకృతం బైన బ్రహ్మహత్య పిశాచీస్వరూపంబుఁ గైకొని
తత్తోయం బెల్ల నొక్కతోయంబునం గ్రోలిన తత్క్షణంబ కావేరి వారిహీ
నయై ముందటిచందంబున నున్న దన్నిమిత్తం బన్వేషించుచు వచ్చి పురో
భాగంబున,

183


మహాస్రగ్ధర.

కనిరా భూతేశు లత్యుత్కటశకటమశూరప్రతీకాశకేళిం
జనితోదన్వోపదాప శ్లఛమలినవపుర్జాత మాంసాస్రగ్రంధిన్

ఘనకావేరీ జలౌఘగ్రసన వివృతవక్త్ర స్ఫురద్భూరిదంష్ట్రా
శనిసంఘర్షప్రభూతజ్వల దనలశిఖాజాల శాచిం బిశాచిన్.

184


క.

కని కనలు నిగుడ నురువడిఁ
జనుకుటిలభ్రుకుటితల విశంకట భయదా
నను లగువారల దవ్వులఁ
గనుఁగొని మది బెగడి మేను గజగజ వడఁకన్.

185


ఉ.

ఆసలిల ప్రవాహమున కడ్డము నిల్చియు వక్త్రగహ్వరం
బోసరిలంగఁ జేసికొని యొయ్యఁ దొలంగెఁ బిశాచి-యప్పుడో
సోసి దురాత్మురాలి యిపు డోడకు మేడకుఁ బోయెదంచుఁ జి
త్రాసులు విష్ణుదాసులు కరంబు రయంబునఁ బట్ట డాసినన్.

186


క.

ఆగతి యెఱింగి యది గడు
వేగంబున బరువుఁబాఱె వెనుకొని చన నీ
కాఁగి యదలించి యెవ్వతె
వేగతి వచ్చితివి వెఱవ కిచటికి ననినన్.

187


సీ.

ఆపుణ్యపరులతో నప్పిశాచిక యనె
నేను బాపంబుల కెల్ల నెక్కుఁ
డగుదాన ననుఁ జంపఁ దగదు-మదుత్పత్తి
విధ మెఱింగించెద వినుఁడు మీర
లీజనపద మేలురాజు సోముకనాముఁ
రపరాధివేఱొకఁ డవలనుండ
నేపాపమును లేక యితరమహీసురుఁ
దేరి చంపించె శ్రోత్రియుని వినతు-


తే.

నప్పు డాతని సచివులం దాప్తులందుఁ
జారులందును, జనపదాస్పదులయందుఁ,
దద్బహిర్దేశజనులందుఁ,దలఁప నొక్కఁ
డైన నిది గూడ డని విడనాడరైరి.

188

క.

ఎదురెదుర నొకఁడు దురితము
వదలక కావింపఁ జూచి వారింపనివా
రొదవిన దత్పాపఫలా
స్పదు లగుదురు సమధికారబలములకొలఁదిన్.

189


వ.

కావున నీదేశం బంతయుఁ బాపదూషితం బగుట ననావృష్టిదోషంబు సంభ
వించె, నారాజకృతంబైన బ్రహ్మహత్యాస్వరూపిణియైన నాచేతఁ జరాచరాత్మ
కంబై న జగం బిట్టియుపద్రవంబు నొందె. నేను తటాకసరోవరాదులం గల
వారిపూరంబు నిరవశేషంబుగాఁ గ్రోలితి - నతిక్రూరదర్శను లగుమీ రెవ్వ
రెంతవారును మదంతంబు గావింప నసమరిథు లీనిరర్ధకప్రయాసం బేల
యని పల్కి యప్పిశాచి పరువుబెట్టినం గట్టలుక చట్టించి యాదిట్ట
లిట్లనిరి.

180


ఉ.

సార మెఱుంగనేరక, పిశాచమ నీచమనీష! లోకసా
ధారణదృష్టిఁ జూచెద వుదారతరం బగునీప్రదేశ మీ
చేరువ సంచరింపను వసింపమ శక్యమె నీకు- నీవునున్
వారక వచ్చితేనియు నవశ్యము నాశముఁబొందె దీయెడన్.

181


మ.

క్షితి నీచక్కటి దివ్యదేశ మమితశ్రీవిష్ణుభూతేశర
క్షిత, మీపుణ్యనదీప్రవాహము జగత్సేవ్యంబు భవ్యంబు సం
స్మృతిమాత్రాఘనివారణంబు మహితశ్రీరంగధామాంతికా
గత, మారూఢసమస్తతీర్థమయ మగ్ర్యం బాపగాకోటికిన్.

192


ఆ.వె.

ఎట్టి పాపులైన నీజలంబులు మేను
సోకినంతమాత్ర శుద్ధు లగుదు,
రేతదంబుపానపూతమై జగము నీ
వలన ముక్తి బొంది వెలయుచుండు.

193


క.

కావున నెవ్వరితెరవునఁ
బోవక వేగంబ వెడలిపొ మ్మటుగాకీ
ఠావున నున్న వధింపక
పోవిడువము నిన్ను బాపపుంజమ వగుటన్.

194

వ.

అని పలికి రపు డాబ్రహ్మహత్య తద్దేశంబున సద్యోనాశంబు నొందె,
నవ్విష్ణుభూతేశ్వరులు తమతమనిలయంబులకుం జనిరి, తదనంతరంబ జగత్
సృష్టికారణంబైన మహావృష్టి గురిసి కఱవు దీఱి యెల్లవారు తమతమ నెల
పుల సుఖంబుండిరి, యీయుపాఖ్యానంబున నిఖిలపాపహరణంబగు నిహపర
సుఖదం చెప్పి యప్పారాశర్యుండు నాగదంతమునివరున
కిట్లనియె.

195


క.

ఈ కథ వినియెడి మనుజు ల
నేకమహాపాతకంబు లెడలియు, ముక్తి
శ్రీకాంతు లగుదు, రట్టిది
నీకొకకథ యోగివర్య నే నెఱిఁగింతున్.

196


మ.

ఒక గంధర్వుఁడు చిత్రసేనుఁ డనువాఁ డుద్దామదర్పోదయా
ధికుఁ, డస్వప్నవరేణ్యమిత్రుఁ డుడువీధిం దోడిగంధర్వగా
యకులుం దానును బాడుకొంచు నట రంగాభ్యర్ణముం జేరి, కొం
జక యామీఁదటగా వెసం జనియెఁ దచ్ఛాయాసముల్లంఘియై.

197


ఆ.వె.

వానితోడ నేఁగువారు తచ్ఛాయ న
తిక్రమింపరామి దెలిసి, నిలిచి,
రంతతీర్థరక్షు లాదుర్మదాంధుని
సాగి పోవనీక సంభ్రమమున.

198


క.

కడకాలఁ బట్టి, కడు నురు
వడి బిఱబిఱ ద్రిప్పివైవ వననిధి కవలం
బడియె రఘునాథు శరహతి
సుడిఁబడి మారీచరాక్షసుఁడు పడినగతిన్.

199


వ.

అప్పుడతనితోడఁ గూడివచ్చిన గంధర్వు లావిధంబెల్లఁ దెల్లంబుగాఁ
గనుగొని బెదరి మగిడి నిజాధిపతియగు చిత్రసేనుండు తేజోహీనుండునై
పడినయెడకుం జని, యచట నచేతనుండై యున్న యతనిఁ
బ్రబోధించిన—

200

తే.

తెలిసి నలుదిక్కులను జూచి, ధృతిఁ గలంగి
యిక్కడెక్కడ నన్నెవ్వ రివ్విధమ్ము
జేసి రని పల్కు నాచిత్రసేనుతోడ,
వారుఁ జెప్పిరి తద్విపత్కారణంబు–

201


క.

చెప్పిన విని, బెడగుచు మదిఁ
గప్పిన మోహమున మీఁదుగానక పోదం
డప్పగిది నుండ నేలని
యప్పాఱుం డరుగఁజూచె ననుచరయుతుఁడై.

202


వ.

ఇట్లు చన మొక్కలించి ఱెక్కలు విఱిఁగిన పులుగులంబోలె–నాకసంబున
కెగయలేక, చీకాకుపడి యార్తుం డగుచు, మర్త్యుకైవడి పుడమిం బడి
పొరలి యాక్రోశించుచు.

203


మ.

అకటా యే నతిమూఢభావమున నీయత్యంతసంతాపహే
తుకకర్మం బొనరించినాఁడ, నిఁక నీదోషం బశేషంబు, నూ
రక యెబ్భంగిఁ దొఱంగు, దీనికి విచారం బెద్ది యన్యాయకా
రికి నేలోకమునందు నాపదలు వర్తిల్లున్ దురంతంబులై.

204


వ.

అని యొక్కింత చింతించి మఱియును.

205


మ.

దివి మీముందట వచ్చు నన్నిటు బహిర్ద్వీపంబునం దేవదా
నవమర్త్యాదులలోన నెవ్వరోకొ ప్రాణత్రాణ నిష్పాశులై
యవిచారంబున వైచి రాజడుల నింద్రాఖర్వరోషాగ్నిను
ద్దవిడిన్ వేలిచి తత్ఫలంబున హవిర్భాగంబు భాగించెదన్.

206


క.

అదిగాక వానిఁ జెప్పిన
నొదవెడు భద్రంబు మీకు నుద్దీపితమై,
యిది యటుపోనిం డిపు డు
న్నది యిఁక నొకసంశయంబు నామదిలోనన్.

207


ఉ.

అప్పుడు మీకు నాకును వియద్గమనంబు సమంబ-యిట్టిచో
నిప్పుడు నాకు నొక్కనికి నిత్తెఱఁగై మఱి మీగతిక్రమం

బెప్పటి యట్ల యునికి యిట నె ట్లదిగావున పక్షపాత మీ
చొప్పునఁ గానవచ్చెఁ గడుఁ జోద్యముకాదె తరించి చూచినన్.

208


క.

అని తనపడుటకు మనమునఁ
గన లొదవఁగ నదరి పల్కుగంధర్వవిభుం
గనుఁగొని గగనస్థితు లగు
ననుచరు లిట్లనిరి మఱియు నాతనితోడన్.

209


ఆ.వె.

మానుమాను మిట్టిమాట లెవ్వరిదెసఁ
గీడు గలుగ దొకని కిల్బిషంబు
లొకని నేల పొందు, నూరక నిజకర్మ
ఫలము తనకుఁ బొరయవలయుఁగాక.

210


క.

అమృతాశన మనుజ పశు
ప్రముఖం బగుసకలజంతుపటలంబునకుం
దమలోని తారతమ్యము
క్రమమున నిజకర్మఫలముగాదే తలఁపన్.

211


వ.

నీవు తామసంబున దివ్యధామచ్ఛాయా సముల్లంఘనం బాచరించిన పాపంబున
నీయాపదఁ దెచ్చుకొంటివి నెమ్మది మహాపాతకం బని యతిక్రమింప కునికిం
జేసి మాకు గగనగతిక్రమం బవక్రంబై యున్న దిత్తటి నీచిత్తంబు క్రోధా
యత్తంబు గానీక దోషనివృత్తి యగునుపాయంబుఁ జేయు మట్లైన నతిపవిత్రుం
డయ్యెదు, గానినాఁడు దుర్జనునకు సుగతియుంబోలె నీ కాకాశగమనంబు
సిద్ధింపదు, భవత్పతనకారు లగువారల నేమెఱుంగనేర-మీమేరకు నంతరిక్షా
దిభూతంబులు సాక్షి వానినడిగి చూడు, మింక నీవృత్తాంతం బంతయు
బలాంతకునకుం జెప్పబోయెద, మిపుడు నీవడిగిన చక్కటికి నద్రిద్వీప
సముద్రంబు లెడసి - యంతరంబులై యున్న వింతదూరంబు పాదప్రచా
రంబునఁ జన ననేకవర్షశతంబులనైన నశక్యం, బదియుఁ గాక నుదగ్ర
గ్రాహంబు లగునంబుధులు దురవగాహంబు లిట్లౌట దురితనిష్కృతి గల్గు
నంత నీ విందయుండు — మఖిలంబు భద్రం బయ్యెడుమని వార లరిగి
రనంతరంబ-

212

క.

తలకొనిన శోకభయమున.
నలమరుగుచుఁ జిత్రసేనుఁ డతికరుణముగా,
బలుమఱు విలపించె నెగుల్
దలఁగునుపాయములు గొన్ని తలపోసి ధృతిన్.

213


క.

శంభుని-నాశ్రితరక్షా
రంభుని ఫణిరాజకటకరాజితఘనదో
స్స్తంభుని నపహృతదానవ
దంభుని నిట్లని నుతించెఁ దత్పరమతియై.

214


గద్యము.

జయ జయ జలజభవముఖ నిఖిలసుకనికర మకుటతటఘటిత
మణిరుచిరుచిరచరణయుగళ, గళవిచరదవిరళ గరళకబళ బలవదఘనివహ
బాణపటలవిఘటన చటుల దివసకరకమలదమృతకరణ మధురమధు
రసభరిత శశికుసుమ, సుమహితశుచివిభవవిలయరహిత, హితవివిధ విహ
రణకుతుక చరణఖచరమిథున శతసతతపరిచితవితతశిఖర మణికిరణశక
లిత సకలకకుబంతతిమిర భరశుభరజదరణధరనిలయ, లయసమయ వివృత
వికటనిటలతటనయనపుట నటదనలకణ కణకబళితసకలభువన, వనధివలయ
వలయితధరణీభరవహనసహన ఫణభర పరివృఢదృఢవలయ విలసదురుభు
జపరిఘపరిచితకనకకుధర పృథులధనురచితమదనధనవిశిఖముఖ శిఖిహుత
దితిజనిగదిత నిగమశతనుత నిజనిరుపమనిరవధికగుణవిసర, సరసిజవిపులతర
వనవనపవనసవనకృతవని దహన గగనమయ తను మహిత,
హితజనభవనఫలిత సురనగనగదుహితృ వదనకమల సమదమధుకర,
కరటిరదశరదరవిసలబిస రజతభుజగవదసురసరిదమృతకరదరవాసిత, సిత
కమలరుహతుహిన నగనిభశుభరుచిమదపఘన, ఘనభుజబలపరుషరిపు పరిష
దతనుజయ వితతధనురతినిబిడ నిహతిముదిత, దితిజనృభుజగజవ సనస
సనకశుకముఖమునిజన హృదయకమలసదన వరదసమవననిరత, నిరతిశయ
శయకలిత లలితహరిప్పధు పృధుకరినకుదపహసిత గిరిజశిఖరవర వృషభ
గమన, మనసిజమదధవళ దహనజలదసమయ ముఖరఖరవచన దురధిగమ
మహిమహిమ, హిమకరహుతవహరవినయన వినయనతకరిలపనవిపులకటక
విగళితమదసలిల విచందతికులనినద ముదితమృదునటదురుపద కటకఫణిఫణ

మణిరు గరుణితహరిదుదర దరవికచనఖకమల పరిమళపరిమిళిత నురుసరి
దతులసలిలకణగణకలిత బలకచభరరుచినిచయ ఖచితగగనగతిరహిత
మహితనిపతిత మఘమలితచలితమతిదయ వివశమశరణభువభవ పాహిమాం!
పాహిమాం!

215


వ.

అని సన్నుతించినఁ బ్రసన్నుండై విపన్నగాశని యగుపన్నగాభరణుం
డతనిపైఁ గృపాతరంగితం బగునపాంగంబు నిగిడించి నీ తలం పెయ్యది
చెప్పుమనిన నప్పశుపతికి నందంద వందనం బాచరించి కృతాంజ
లియై యాచిత్రసేనుండు తనవృత్తాంతం బంతయు విన్నవించినఁ దత్పతన
కారుల నిరూపించి విరూపాక్షం డాక్షణంబున నిజకింకరగణంబుల రణంబున
కాజ్ఞాపించిన—

216


శా.

బాహాకంపితహేతిదీప్తులు వియద్భాగంబు గప్పన్ సము
త్సాహోదంచితసింహనాదముల దిక్చక్రంబు భేదిల్లఁ గా
సాహంకారభయంకరాకృతులతో సాయోధనోదగ్ర-స
న్నాహం బద్భుత మావహింప వెడలెన్ మాహేశభూతావళుల్.

217


శా.

చంచద్వాహనకేకిపింఛరుచు లాశామండలం బెల్లఁ జి
త్రించెన్, రోహణశృంగరాజములభాతిన్ రత్నకోటీరముల్
మించెం బాశశరాదిసాధనము లోలిం బూచి దర్పంబునం
గ్రౌంచారాతియు బల్వడిన్ వెడలె సంగ్రామక్రియాలోలతన్.

218


వ.

ఇ ట్లరిగి సకలదురితలతాలవిత్రం బగుశ్రీరంగక్షేత్రంబుఁ బ్రవేశించి
యందు నిరర్గళాపవర్గకరవారి యగుకావేరిం జేరి యాభూతజాలంబు నానా
ముఖంబులఁ దజ్జలంబు చలంబునఁ గ్రోలం దొడంగిన-

219


సీ.

అంత నిర్మగ్నంబు లైనమహీధర
ప్రతతి శృంగంబులు బయలువడియె,
నీరం దేలెడి తీరభూరుహప్రసవంబు
లంతరిక్షమున దూఁగాడఁ దొడఁగె
నవ్యంబులైన నిమ్నప్రదేశంబులు
రయమేది నమ్రతరంబు లయ్యె,

బొడవులై పొలుపారు పులినస్థలంబులు
క్రందుగా నందందఁ గానవచ్చె


తే.

నదరుచూడ్కికి వెక్కసం బైనపఱపు
తెల్లముగఁ దోన జువ్వనఁ దీసిపోయె
నల్పజలజంతు నికరంబు లచట నచట
నదరె శైవాలపంక్తుల నాక్షణంబ.

220


తే.

అంతఁ దత్తీర్థసంరక్షణార్థ మచట
మెలఁగు శ్రీవిష్ణుభూతేశు లలఘుమతులు
మున్ను దఱులకు మిగిలి యుప్పొంగి పాఱు
నమ్మహానది యల్పాంబు వగుటఁ జూచి-

221


క.

సరభసగతిఁ దత్కారణ
మరయుచు నటపోయి బాడబానలశిఖలం
బొరి నదుకు జలధిరవమునఁ
బరగెడు నొకమ్రోఁత వినిరి పడమటివంకన్.

222


చ.

విని యిది యేమియో యనుచు విస్మితులై చని యమ్మహాతరం
గిణి యుభయప్రతీరములఁ గ్రిక్కిఱియంబడి యానతాస్యులై
ఘనరసపూరముల్ బహుముఖంబులఁ గ్రోలెడివారి నుగ్రని
స్వన బధిరీకృతాశుల బిశాచగణంబుల ఘోరమూర్తులన్.

223


చ.

కని-కడునల్గి బిట్టదఱి కన్నుల దిట్టఁపుకెంపు బర్వఁ ద
ర్జనములు-గర్జనంబులు విశంకటభంగిఁ జెలంగఁ దాఁకి క
న్కనిఁ బరిఘాసి చక్రశరఖడ్గగదాముసలాది ఘోరసా
ధనముల బిట్టు నొంపఁ గడు దల్లడ మందుచుఁ బాఱి రందఱున్.

224


క.

వారలతోడన తెరలి- కు
మారుండును బఱచె నీక్రమంబున భయముం
గూరిన వచ్చెడి తనపరి
వారము నీక్షించి వృషభవాహనుఁ డాత్మన్.

225

తే.

సంభ్రమించుచు, వీరి నీజాడఁ బరపి
నట్టి బలియుఁడు నెవ్వడో యనఁ దదంతి
కమున కేతెంచి వినయుఁడై క్రౌంచభేది
చేప్పెఁ దా రేఁగి విఱిఁగి వచ్చినతెఱంగు.

226


వ.

అంత నంతయు విని యుమాకాంతుం డఖిలభూతజాతం బాకర్ణింప బలవం
తులతోడి విరోధంబు గాదనిపల్కి యాగంధర్వునిం జూచి-నీ వెందైనను
బొందైన కందువ కరుగుమని యంతరార్థంబున నుండెఁ, దదనంతరంబ నిజ
మిత్రుం డగుఖేచరత్వంబు చెడి పుడమిఁ బడి యడలుచునీకి తదనుచరుల
వలనఁ రిలిసి యాశతమన్యుండు ధృతమన్యుండు నయ్యె, నయ్యెడ-

227


క.

లోచనసహస్రలోహిత
రోచులు మెయినిండ - నామరుత్సాలుఁడు లో
నేచిన రోషాసలకీ
లాచయములు వెలిఁ దలిర్చులాగున నుండెన్.

228


వ.

అంత.

229


ఆ.వె.

దంతి, మేష,మహిష, దానవ,మకర, సా
రంగ, తురగ,శాక్వరముల నెక్కి
కులిశ శక్తి దండ ఘోరాసి పాశ-తో
మర గదాత్రిశూలధరులు నగుచు.

230


ఉ.

ఆహవశూరులై వెడలి రప్పుడు తక్కును గల్గు దేవసం
దోహము లాత్మచిహ్నములతో వివిధాయుధపంక్తితో, నట
ద్వాహనకోటితో, సుభటవర్గముతో వెస నిర్గమించి-ర
వ్యాహత సింహనాదముల నంబరభాగము పూరటిల్లఁగాన్.

231


క.

ఆ దివిజగణము తమతమ
కైదువుల మెఱుంగు లెల్లకడలం బర్వం
గా దనరెఁ దఱుచుమెఱపుల
తో దివిఁ బన్నిన యుగాంతతోయదము లనన్.

232

ఉ.

ఆయెడ వాయువుల్ పరుసనై వెస వీచె, నినుండు వేఁడియై
కాయ దొడంగె భీకరముగాఁ బెనుమంటలు నెల్లదిక్కులన్
వాయుసఖుండుఁ గప్పెఁ బటువారిదపంక్తులు మిన్ను ఘూర్ణిలన్
మ్రోయుచు భోరనం గురిసె ముంపఁగ శోణితధార లెల్లెడన్.

233


క.

చదలం గనలుచు ముదమునఁ
బొదలెడి సురవరులు విష్ణుభూతేశులు దా
రిదియేటి దనుచు నచ్చెరు
వొదవఁగ వీక్షంచునంత నుద్ధతవృత్తిన్.

234


క.

సురగణవిభుపనుపునఁ, గడు
నురువడిఁ జండానిలంబు లొక్కట విసరన్
బురిగొని వైష్ణవవాయువు
లరుదారఁగఁ బేర్చి వాని నన్నిటిఁ దోలెన్.

235


క.

ఆలో నాలోలఘన
జ్వాలాజాలములఁ గప్పి చను నాయజ్ఞిన్
గాలుపుచు వైష్ణవానల
మాలోకనభయద నిష్ఠురాకృతి మెలఁగెన్.

236


వ.

అట్టియెడ-సమరసముత్సాహదోహలంబులై-సురసందోహంబు లుదగ్ర
మండలాగ్రపరిఘ పట్టిసప్రాసపాశముఖప్రహరణ బాణపాణులై-
మఱిముందఱం దఱిమి నిజప్రతాపాతపాహతారికుముదుం డగు, దత్
క్షేత్రరక్షకుండు కింక రెట్టింప హరికింకరులం బంపిన, నానిలింప
సైన్యంబులపైఁ గవిసి నిశితపవి నిష్ఠురంబు లగుశరంబుల నురంబులు
గాఁడనేసియుఁ బ్రళయావలకరాళంబు లగు కరవాలంబులఁ గంఠనాళంబులు-
దెగవ్రేసియుఁ గాలోరగాభీలంబు లగుశూలంబుల ఫాలంబుల నొంచియు,
నుదంచితప్రభాపిహితవియత్తలంబు లగునత్తళంబులఁ గత్తళంబులఁ జించియుఁ
గరంబు భయకరంబు లగుముద్గరంబుల శిరంబులు నొంచియు,
బ్రచండంబు లగుగదాదండంబులఁ బిచండంబులఁ బగిల్చియుఁ, గనకపుంఖ
మండితశిఖండజాలంబు లగుభిండివాలమ్ముల నాడించియుఁ దఱము

గాటమ్మునకు నోహటించి - విముక్తరణపాండిత్యు లగునాదిత్యులు,—
విస్మృత హరిత్తు లగుమరుత్తులును, విగళితగంధర్వు లగుగంధర్వులు,
విఘూర్ణితాతు లగుయక్షులు, వితతశతవేదనాసాధ్యు లగుసాధ్యులును,
వికంపితాసువు లగువసువులునునై, రివ్విధంబున నిజబలంబులు దక్కి
నలుదిక్కులకుం బఱచిన సురపతి తా నొక్కరుండ చిక్కి మిక్కుటం
బగుకోపాటోపంబున.

237


శా.

శుంభద్రోషమునం దిశల్ పగుల నక్షుద్రజ్వలజ్జ్వాలికా
సంభూతస్ఫుట విస్ఫురద్విసృమరస్ఫాయత్స్ఫులింగవ్రజం
బంఖోవాహపదంబు గప్పికొన జంభారాతి వైచెన్ రణా
రంభోజ్జృంభితమైన వైష్ణవభటవ్రతంబుపై వజ్రమున్.

238


క.

ఆరీతి భూతభయదం
బై రయమున వచ్చు వజ్ర మతులితబరిదు
ర్వారుఁ డగుకుముదుఁ డచ్చెరు
వారఁగ డాకేలఁ బట్టె ననుచరు లార్వన్.

239


ఉ.

ఆతఱి సర్వపర్వతచయాతతపక్షవిభేదనక్రియా
హేతుకమై దనర్చు నిజహేతి-వికుంఠితమై యరాతికిం
జేతికి నగ్గ మౌటఁ గని సిగ్గఱి శక్రుఁడు వాఱె- దైత్యజి
ద్దూతలు వెంటవెంటఁ బడి తోలుచుఁ గేలిఁ గొనంగ మౌనియై.

240


చ.

హరిహయుఁ డాదిగా గల సురావలి నాగతి గెల్చి-విష్ణుకిం
కరులు జయోత్సవం బెసఁగ, గ్రమ్మఱి వచ్చినఁ దన్మహోగ్రసం
గర ఘనఘోష మచ్చట సుఖస్థితి నున్నమహాత్ము లాలకిం
పరు పరమాత్మచింతనముఁ బాయక యన్య మెఱుంగ కుండుటన్.

241


వ.

అంత నక్కడఁ బరాభవజాతమన్యుండై వచ్చుశతమన్యుదైన్యం బాలోకించి
లోకపితామహుం డతని డాయంజని.

242


క.

ఎవ్వరిచే నేనెపమున
నివ్విధి వాటిల్లెఁ జెప్పు మేర్పడ ననినన్

నెవ్వగఁ జిత్తం బెరియఁగ
నవ్వనరుహగర్భుతోడ నతఁ డిట్లనియెన్.

243


క.

ఏమని చెప్పుదు లోకపి
తామహ! మత్సరము మానధనమును బాసెం
దామరసాక్షుని దూతల
చే ముల్లోకములు గేలి సేయుచు నవ్వన్.

244


వ.

అనినఁ జతుర్ముఖుండు శతమన్యున కిట్లనియె.

245


చ.

మెఱసిన మృత్యుదేవతకు మృత్యువులైన ముకుందదాసులం
దరలక మారుకొం టరయఁ దాఁ గొఱవిం దలఁగ్రోఁకుకొంట యి
ట్లెఱిఁగియు వజ్రమంది యిది యేటికి వైచితి వారిమీఁద నె
త్తెఱఁగుననైన నాపదలుఁ దెచ్చుఁగదా బలవద్విరోధముల్.

246


క.

అనిమిష విను నీకులిశం
బనఁగా నిది యెంత? మామకాస్త్రవరంబై
నను హరునిపాశుపతమై
నను వమ్మగు విష్ణుభూతనాధులచేతన్.

247


ఆ.వె.

కాలచక్రమైన గరుడధ్వజునిచేతి
చక్రమైన వారిఁ జేర కంత
దలఁగునట్టి మహిమ గలమహాత్ములతోడ
వైర మగుట నేమికారణంబు-

248


క.

అనిన పితామహుపలుకులు
విని యనిమిషనాయకుండు వినమితముఖుఁడై
మునుకనసిగ్గున దమ్ముం
గనుఁగొనుటయు, నతని తలఁపు గని గంధర్వుల్.

249


వ.

ఆచతుర్ముఖున కభిముఖులై కరపుటంబులు నిటలతలంబునఁ గదియించి
యిట్లనిరి-

250

సీ.

అవధరింపుము పంకజాసన, సురరాజు
చెలిమికాఁ డగుచిత్రసేనుఁ డనెడి
గంధర్వనాథుఁడు, కాదంబరీపాన
మత్తుఁడై సోలుచు, మధురఫణితిఁ
బాడుచు, నాకాశపథమున నరుగుచో,
రుచిరమచ్ఛాయాస్వరూపమైన
శ్రీరంగధామంబు జెచ్చెర లంఘించె,
బలసి యాతనివెంటఁ గొలిచి వచ్చు


ఆ.వె.

నేము దాని దాఁటరామి ము న్నెఱుఁగుట
గడచిపోక నిలువఁబడితి మంత
కింక మీఱ విష్ణుకింకరు లాతని
వొడిచి పాఱవైచి రుర్విఁ గూల.

251


క.

అటువ్రేసిన జలధులకడ
పఁట, ముక్కును మోముఁ జదియఁబడి గగనమునం
బటుగతిఁ జనుసామర్థ్యము
మటుమాయము నొంది దీనమానసుఁ డగుచున్.

252


లయగ్రాహి.

సింధురనిశాట మదసింధుఘటజన్ము సుర
సింధు కనకాంబురుహగంధ విచలత్పు
ష్పంధయవితీర్ణ సితబంధుర జటాపటల
బంధవిలసత్కుముదబంధుఁ బ్రమదాస
బంధ లలితాంగు ననుసంధిత జగత్కుశలుఁ
గంధర వినీలతరకంధరు నుదార
స్కంధవృషవాహనుఁ గబంధమథనప్రియు జ
లంధరహుఁ గొల్చె నతఁ డంధకవిరోధిన్.

253


క.

ఆతనిదెసఁ బ్రీతుండై
శీతాంశుధరుండు పనుపఁ జెచ్చెరఁ జని త
ద్భూతములు విష్ణుదాసుల
చేతం బరిభూతి నొంది చేడ్వడి రంతన్.

254

చ.

హితుఁ డగుచిత్రసేనునకు నిట్టివిధంబున వచ్చినట్టి దు
స్స్థితి విని యల్కమై నమరసేనల నెల్లను గూర్చి యాశత
క్రతుఁడు ముకుందకింకరనికాయముపైఁ జని-పోరి వారిచే
హతబలులై నిలింపులు భయంబున కన్కనిఁ బాఱిిపోయినన్.

245


క.

ధట్టించి నిలిచి వజ్రము
కట్టలుకం బూని వైవఁ గైకొన కది చే
పట్టుకొని కుముదుఁడును నతఁ
డిట్టాలం బనుచుఁ జెప్పునెద నచ్చటికిన్.

246


వ.

మున్ను చిత్రసేనునిచేతను బరిభూతం బగురాజశేఖరుం డరుదెంచిన విరించి
యత్యాదరంబున నమ్మహాదేవుతో నీవేమి కార్యంబున కిచ్చటికి వచ్చితనిన
నచ్చతురాననుం గనుంగొని.

257


క.

క్షితి చిత్రసేనపతనము
నతనికినై తనబలంబు నని కనుపుటయుం
ధృతి చెడి వారలు-హరిభట
తతిచే నొచ్చినవిధంబు తడయక చెప్పెన్.

258


క.

చెప్పిన విని గంధర్వుం
డొప్పని పని సేసెఁ దెలివి మానక నీవుం
దప్పితివి బుద్ధి సురపతి
చెప్పెడి దేమున్న దిట్టి సెగ్గెము నొందెన్.

259


చ.

అని జలజాసనుండు దివిజాధిపుఁ గన్గొని దైవకృత్య మె
వ్వనికి నతిక్రమించి చన వచ్చునె పుణ్యపరుల్ శుభంబులం,
ఘనదురితాత్ము లాపదలు, గైకొనుచుండుదు రట్టికర్మముల్
దనవశమే యొనర్పఁగ విధాతృనియోగమె కాక సర్వమున్.

260


క.

జీవుల శుభాశుభస్థితు
లేవిశ్వాత్మకుఁ డెఱుంగు నెల్లప్పుడు నా

దేవునిశక్తికి హీనం
బై వెసఁ జలియించునే తృణాగ్రంబైనన్.

261


ఉ.

ఆపరమేశ్వరుం డరయ నాగమవేద్యుఁడు వేదచోదితం
బై పెను పొందు ధర్మ మఖిలాశ్రయ మాసరణిం జరించువా
రాపదఁ జెంద కెందుసుఖమందుదు రుత్పధవర్తులై తదా
క్షేప మొనర్చు నీచులు నశింతురు దుస్తరనారకాగ్నులన్.

262


తే.

ఆది పరమాత్మసంకల్ప మైనయట్టి
ధర్మమార్గంబు దప్పి గంధర్వవిభుఁడు
చక్రి దివ్యాలయచ్ఛాయ నాక్రమించి
కనియెఁ దత్పాపమున నిట్టి కష్టదశలు.

263


వ.

అనినఁ బాకశాసనుఁడు జలజాసనుఁ గనుంగొని.

264


క.

తోయజభవ! హరిభవన
చ్ఛాయాలంఘనము సేయ సమకొనుపాపం
బేయది తుది నది పాయు ను
పాయం బేతెఱఁగు తేఁటపఱపుము నాకున్.

265


సీ.

నావుఁడు నజుఁడును దేవేంద్ర! వినుము చె
ప్పెదఁ బరప్రత్యక్షభేదములును
ద్వివిధమై దాను వర్తించుభూతావలి
యందు స్వచ్ఛాయ ప్రత్యక్ష మనఁగ
నమరు నాయుఃక్షయం బైనవారల కది
దునుకబోయిన రీతిఁ దోఁచు నొండెఁ
బొడగానఁగా రాక పోవు నీజాడ న
ది విను స్వచ్ఛాయయ దృష్ట మనఁగ


తే.

భువిఁ బరచ్ఛాయఁ దాజ్యేష్ఠమునుగనీయ
సంబు నన రెండువిధములు జరుగుచుండుఁ

బిన్నవాఁ డెట్టియెడలను బెద్దవారి
నీడ దాటించుచుం జనఁగూడ దెపుడు.

266


క.

గురుసముచితశయనాసన
వరవాద్యప్రముఖగేహవర్గము జడుఁడై
చరణమున నాక్రమించిన
నరుఁ డరుగు ననేక ఘోర నారకములకున్.

267


వ.

సకల ధర్మంబు లందును సాత్వికంబు పరమధర్మం, బిది యవలంబించి చరి
యించు నిర్మలాత్ములు-మనోవాక్కాయకర్మంబులఁ బరాత్ము లగునెల్లవారికి
గురువు, లట్టిపుణ్యపురుషులయందు సదా సన్నిహితుండై యుండుఁగావునఁ
దచ్ఛాయఁ ద్రొక్కిచను దుష్కృతచిత్తులకు నిష్కృతి గలుగనేర దని చెప్పి
యప్పితామహుండు వెండియు నిట్లనియె.

268


తే.

కుష్ఠరోగాత్ము లగువారుఁ గుంటివారు
నంఘ్రిహీనులు గల రెవ్వ రట్టివారు
గతభవంబున శ్రీహరిప్రతిమనీడ
లంఘనము చేసి చనినపాలసులు శుక్ర.

269


చ.

నిగిడిన విష్ణుమందిరమునీడయు విష్ణునినీడయట్ల దా
టఁగఁ దగ దట్టిపాపము జడత్వము మైనొనరించు దుర్జనుల్
తెగి యమబాధలం బడి తుదం ధరపై జనియించి పలగులై
వగలఁ గృశించుచుండుదు రవారిత ఘోర రుజాదిపీడలన్.

270


తే.

తత్ప్రదక్షిణ మొనరించుతఱి నరుండు
కడఁగి తచ్ఛాయ మూఁడుభాగములు చేసి
యందుఁ బూర్వాంశమునఁ జను టర్హ మిట్లు
గాక, తక్కినయది దోషకారియండ్రు.

271


క.

వనజోదరుశుభగుణములు
గొనకొని కీర్తింప గేలిఁ గొనుచు నవజ్ఞం

జను జనులు బధిరులై, మహి
జనియింతు రనేకజన్మజన్మములందున్.

272


క.

హరిబింబమైనఁ దత్పరి
కరమైన, ధ్వజంబునైనఁ గని మ్రొక్కక నా
దరబుద్ధిగడచిచనునా
పురుషులు జాత్యంధు లగుచుఁ బుట్టుదు రుర్విన్.

273


క.

హరినగరి కప్రదక్షిణ
సరణిం జనుదుర్వివేకి సంచితపుణ్య
స్ఫురణఁ బెడఁబాసి సంప
ద్విరహితుఁడై పిదప నరకవితతులఁ గూలున్.

274


క.

ద్వారమున జనక విష్ణున
గారము-మఱియొకడు వెంటఁగాఁ జొచ్చు దురా
చారమున జేసి నరుల కు
దారం బగుపుణ్యవితతి దలగు సురేంద్రా!

275


క.

ఈగతి మెలఁగక, దుర్మదుఁ
డై గంధర్వుఁడు విపద్దశాకులుఁ డయ్యెన్
వేగపడి విష్ణుదాసుల
తోఁ గరకరినొంది యశము దొలఁగితి వీవున్.

276


వ.

అని పలికి వారిజాసనుం డూరకయున్న నాశతమన్యుండు లజ్జావనత
ముఖుండై యిట్లనియె.

277


క.

చతురానన! నా కెంతయు
హితుఁడీ గంధర్వుఁ డెగ్గు లెన్నక కరుణా
మతిఁ జెప్పుము నాకొఱకై
యతనికిఁ గల్మషనివృత్తి యగుతెఱఁ గింకన్.

278


చ.

అనినఁ బితామహుండు దివిజాధిపుఁ గన్గొని, యిట్టిపాప మే
యనువునఁ దీఱనేర్చును సమర్చనవందనసంస్తవాదులం

దను భజియింప నావికచతామరసేక్షణుఁ డాసమాశ్రితా
వననిరతుండు శ్రీహరి ధ్రువంబున మాన్పెడిఁ దాన యాతనిన్.

279


క.

అని చెప్పి యబ్జగర్భుఁడు
చనియె న్నిజధామమునకు శంభుఁడుఁ బోయెన్
వినుతమణిశృంగసంగత
ఘనపటలవిలాసమునకు గైలాసముకున్.

280


చ.

హరిహయుఁ డంత నిష్టసఖుఁడై పెనుపొందెను జిత్రసేనుఁ డం
బరగతి పాటవం బెడలి పడ్డప్రదేశము కేగి వానికిన్
సరసిజసూతి వాక్యములచందము పొందుపడంగఁ జెప్పి-తా
నరిగె నిజాగమోత్సుకసుధాశనకోటికి వేల్పువీటికిన్.

281


వ.

ఆగంధర్వరాజును నిజవ్యతిక్రమంబునకు నిర్వేదించి యచ్చోటు వాసె, కాశ్యప
నామధేయుండు నగుమునీశ్వరుఁ బొడగని యభివందనం బాచరించి
వినయవినమితమస్తకుండై హస్తకమలంబులు మొగిచి యిట్లనియె.

282


క.

దురితానలకీలావలి
నెఱిఁ జెడి నా కేదికృత్య మెయ్యది వాచ్యం
బిరవుగ నేమిట సౌఖ్యముఁ
బొరయుదు నెఱిఁగింపవే తపోధనముఖ్యా!

283


వ.

అనిన నయ్యతివరుండు గంధర్వవరున కిట్లనియె.

284


మ.

పరమేశుం బురుషోత్తం బరుఁ, గృపాపాథోధి, నారాయణున్
హరిఁ జిత్తంబున నిల్పి-నిత్యము ప్రణామాభ్యర్చనాదిక్రియా
పరతం గార్యము దీర్పు, మట్లయినఁ బాపశ్రేణిఁ బోఁదోలి-త
త్పరమస్థానముఁ బొందె దెంతయును గోప్యం బే నెఱింగించితిన్.

285


క.

నావుఁడు నప్పరమేశ్వరు
నేవెరవున నెఱుఁగబోలు - నేచందము, వాఁ

డేవంక నుండు ననుటయు
నావాచంయమివరేణ్యుఁ డతనికి ననియెన్.

286


క.

అతివిమలం బగుమానస
గతులను సుకృతప్రసక్తి గలకర్మములన్
వితతప్రసన్నభాషలఁ
జతురుఁడవై యెఱిఁగె దీవు సర్వాత్ము హరిన్.

287


క.

కలఁ డఖిలనాయకుం డగు
జలశాయి, సమస్తభూతచయములలోనన్
వెలుపటి సకలావస్థలఁ
గలకాలము పూర్ణుఁడై జగన్నివహములన్.

288


క.

అనుటయు నాగంధర్వుఁడు
మునివర్యుని విష్ణు డఖిలభూతావలియం
దును బాయకుండునేనియుఁ
గనరామి యదేమి యనినఁ గాశ్యపుఁ డనియెన్.

289


సీ.

గంధర్వనాథ! జగత్ప్రపంచంబునఁ
గలవస్తుతతి తన్నుఁ గదిసియున్న
నైన, పురోగతం బైన, భాగమకారఁ
గనవచ్చునేలోన వెనుకదెసయు-
నదిగాన నీమాడ్కి నఖిలభూతాత్ముఁడై
తనరు నవ్విభుగానఁ దరముగాదు
బాహ్యంతరంబుల ప్రతిహతంబై ప్రవ
ర్తించు పరిజ్ఞానదృష్టి గాని


తే.

యట్టి సుజ్ఞానమునకు మాటగుచు దేహి
కర్మబంధంబు నిగుడుఁ దద్ఘననిరోధ
మురిదిఁబోఁ జేసి నిజహృత్పయోజమధ్య
గతునిఁ బరమాత్ముఁ గనువాఁడ కనెడివాఁడు.

290

చ.

అరుగుము నీవు, దుస్తరమహాఘనివారిణియైన చంద్రపు
ష్కరిణికి, నందు భక్తి నవగాహ మొనర్పుము - దాన నీకగున్
బరమశుచిత్వ, మంత భవబంధవిమోచనుఁ బద్మలోచనున్
హరిఁ బరమాత్ము గాంచెద వుదంచితధాముని రంగధామునిన్.

291


క.

ఆదేవుని, నాశ్రితర
క్షాదక్షునిఁ గొలిచి, తత్ప్రసాదంబున నీ
ఖేదంబుఁ బాసి చనియెదు
మోదంబున నిజనివాసమున కుడువీథిన్.

292


క.

అని యెఱిఁగించిన, వినయం
బెనయఁగ గంధర్వుఁ డమ్మునీంద్రున కభివం
దన మాచరించి వీడ్కొని
చని గంధర్వుఁడు విరక్తిసంపన్నుండై.

293


మ.

పరమోత్కంఠ నకుంఠితస్థితి పురోభాగంబునం గాంచెఁ బు
ష్కరిణీతీర్థము - నాత్మతత్పరభజద్గంధర్వగీర్వాణకి
న్నరసంపాదితకామితార్థము, ననూనస్ఫారనీరేజకే
సరనిర్మన్మకరందతుందిలపయోజాతోర్మికాసారమున్.

294


వ.

కని విస్మయంబు నొంది - నిజస్మరణమాత్రగళితకలుషకజ్జలంబు లగు
తజ్జలంబుల మజ్జనం బాచరించి, విశుద్ధశరీరుండై, కవేరకన్యకాతీరసహకార
కోరకమోదమేదురమలయమారుతావతారరజతగరుడకేతనాభిరామం
బగుశ్రీరంగధామంబుఁ జేరి, యచ్చట నభంగసంగతప్రసంగంబున
నారమామనోహరు చిత్తంబు ప్రసన్నతాయత్తంబు సేయం బూని, మొదల
నాదసముద్భవంబులై మంద్రమధ్యమతాళభేదంబులఁ దమవలన నేక
వింశద్విధంబులైన శ్రుతులకు నాధారంబులై మయూరాదిరుతంబులచేత
సంకేతం బగుషడ్జాదిసప్తస్వరంబుల పరస్పరమేళనంబున నభిరామం
బగుగ్రామత్రయంబు నవలంబించి మతంగతుంబురునారదకోలాహ
లోదితంబు లగుమతంబుల ననేకప్రకారంబు లైనమూర్ఛనల నింపు
గడలొత్తు చతురుత్తరాశీతితానంబుల ననూనంబులై, సంపూర్ణషాడబ

సమేతంబు లగుపంచదళజాత్యవయవంబులఁ బరిశీలించి - స్థాయి సంచారి
ప్రముఖు లగుచతుర్వర్ణంబులు నాశ్రయంబుగా నెన్నఁబడిన ప్రసన్నాది
ప్రభృతికాలంకారంబులు పదుమూడును బరిస్ఫురింపఁ గంపితస్ఫురితాహతాం
దోళితంబులు లోనుగాఁ గల సప్తగమకంబులు మెఱయ నష్టాదశజాతి ప్రభూ
తంబులై శుద్ధభిన్న గౌళదేసరి సాదారి తోపరాగసంజ్ఞలఁ బ్రసిద్ధంబులైన
శుద్ధరాగంబులు ముప్పదియాఱును, రాగాంగంబు లిరువదియును, భాషాం
గంబులు నలువదియేడును, నుపాంగంబులు ముప్పదియొక్కటి,
త్రయాంగంబులు మూఁడునుగాఁ బదిదెఱంగుల నూటముప్పదియే డగురా
గంబులు వేళావిభాగంబుల నాలాపంబు సేసి సమతాళపదక్రమబంధురంబు
లగు నాసింధురవరదు బిరుదాంకితంబు లైన ప్రబంధంబులు పాడఁ దొడంగె -
నపుడు కర్ణామృతాయమానం బగుగంధర్వరాగంబు నాకర్ణించి—

295


సీ.

సెలవు లంబులు రాలఁజెవు లొగ్గి మృగములు
తరలక మేపులు దలఁగి నిలిచె,
గగనవీధులఁ బాఱు ఖగము లుపాంతభూ
జములపై వ్రాలి నిశ్చలత నొందె,
మంజులప్రాసాదమణికుట్టిమంబులు
గరిఁగి నీరై జాలుగట్టి పాఱెఁ
దరులతాపంక్తులు మరలఁ బ్రాయము వచ్చి
చిగురు గెమ్మోసులఁ జెలువు మిగులె


తే.

నచటి జనులెల్ల నితరకార్యములు దక్కి
సంతతానందపరవశస్వాంతు లగుచుఁ
జిత్రరూపులకైవడిఁ జేష్ట లుడిఁగి
యున్నవా రున్నచోటనె యుండి రపుడు.

296


మ.

కరుణాంభోనిధి రంగనాయకులు దగ్గంధర్వగాంధర్వవై
ఖరి చిత్తంబున కౌతుకంబు నెఱయంగా సుప్రసన్నాత్ముఁడై,
సరసోదారకటాక్షవీక్షణసుధాసారప్రసారంబునం
బరితాపం బడఁగించి వారి కొసఁగెన్ భవ్యార్జితైశ్వర్యముల్.

297

మ.

అతిమోదంబున నప్పు డుజ్వలవిమానారూఢుఁడై యుజ్జ్వల
ద్యుతుల నించి, తనుప్రభల్ దెసల నెందుం బర్వ, గంధర్వు ల
ప్రతిమప్రౌఢి ననేకభంగుల నుతింపం, జిత్రసేనుండు ది
రతమై నేఁగె నిజాలయంబున కపూర్వశ్రీసముల్లాసియై.

298


వ.

తదనంతరంబ.

299


క.

వితతశ్రీమహిమలఁ దన
ప్రతి యగుసఖుఁ జూచి దేవపతి యతివి
స్మితుఁ డయ్యె నతనిసంగతి
నతఁడును సుఖముండెఁ ద్రిదివమం దనురక్తిన్.

300


క.

ఈకథ వినునరుఁ డఘముల
సోఁకక యధికారనిరతి స్రుక్కక శుభముల్
గైకొనుచు నుండు నిచ్చట
శ్రీకరగంధర్వపదముఁ జెందుదు రచటన్.

301


వ.

అని పారాశరుండు నాగదంతమునివర్యునకు నెఱంగించిన తెఱంగు.

302


ఆశ్వాసాంతము

శా.

ధాటీసంభ్రముజృంభమాణనిజయోధవ్యూహ! బాహాధను
ర్జ్యాటంకారవిశంకటధ్వనివిశేషధ్వస్త! నిస్తంద్రక
ర్ణాటోదీర్ఘబలార్ణవార్భటితురంగారోహణోదారణ! లీ
లాటోపార్కతనూజ! చాగవిభురామామాత్యచూడామణీ!

303


క.

నిరుపమ శుభగుణనిభనుత
వరభుజ బలమహిత హితవివర్ధననిరతా
చరణరణ 'దివ్యరాహుత'
బిరుదపదోన్నతనతారిబృందాభయదా!

304

మాలిని.

సుకవిశుకరసాలా! సూనృతాలోలశిలా!
వికచకమలనేత్రా! విద్వదంభోజమిత్రా!
ప్రకటితనిజశౌర్యా! ఛద్మశైలేంద్రధైర్యా!
సకలసుగుణధామా! బాగయామాత్యరామా!

305

గద్యము
ఇది
శ్రీ మద్భ్రమరాంబా
వరప్రసాదలబ్ధసారస్వత
విలాస గౌరనామాత్యపుత్ర సు
ధీవిధేయ భైరవనామధేయప్ర
ణీతంబైన శ్రీరంగమహత్త్వం బను
పురాణకథయందుఁ దృతీయాశ్వాసము.