శ్రీరంగమహత్త్వము/అనుబంధము

వికీసోర్స్ నుండి

అనుబంధము

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (సంపుటము 18. సంచిక 2. పుటలు 115-121) యందు భైరవకవి ప్రణీతమైన- కవిగజాంకుశమును- (మానవల్లి వారిచ్చిన ప్రతి) ప్రచురించినారు. దానినే యథాతథముగా నిందు చేర్చినాను. కవి 4 పద్యమున కవిగజాంకుశ మనియు చివరి పద్యమున కవిరాడ్గజాంకుశ మనియు- వ్రాసినాడు.

కవిగజాంకుశము

(భైరవకవి)

క. శ్రీమత్పరమసితానన
    తామరసవికాసలీలఁ దగిలి భ్రమరాం
    బామధుమత్తభ్రమరిక
    నామనసరసీరుహంబునన్ భ్రమియించున్. 1

వ. అని యిష్టదేవతాప్రార్థనంబుఁ జేసి, 2

క. నిరుపమమతివిస్ఫురణం
    బరఁగినసత్కవులఁ దొల్లి బహువిధముల న
    చ్చెరువొందఁ జెప్పవలసిన
    నరనుతసాహిత్యలక్షణగ్రంథములన్. 3

క. సందడిపడు లక్షణమును
    బొందుగ ధవళించి జాగు పోవిడిచి సుధీ
    బృందంబుమెచ్చ నేనొక
    చందమ్ముగఁ గవిగజాంకుశ మ్మనుపేరన్. 4

గీ. లక్షణగ్రంథ మొనరించిలాగుమీఱ
    దానిఁగొని యేనుగుకవిమాతంగములను
    మదముదూలంగ గీపెట్టమలపువాఁడ
    నని ప్రతాపించిపలికినపలుకువినుఁడు. 5

క. భ్రమరాంబికామహావర
    సముదితనిరవద్యహృద్యసాహిత్యకళా
    శ్రమవిమలప్రతిభాచం
    క్రమణక్రమశాలియైన గౌరవసుతుఁడన్. 6

క. భైరవుఁడ నుభయభాషా
    పారీణుఁడ లోబిభవనభవభూమివ్యా
    పారసవికారదుష్కవి
    ఘోరపిశాచులనదల్చుకొను భైరవుఁడున్. 7

క. నక్షత్రగ్రహగణభూ
    తాక్షరగుణదోషనిర్ణయం బొనరింపన్
    దక్షులుగా రిది గా దని
    శిక్షించినఁ గన్ను లెఱ్ఱఁజేతురు కుకవుల్. 8

క. కిదుకుచు లక్షణ మెఱుఁగక
    కొదుకుచు వడిఁబ్రాస యతిని గూడకమిన్నుల్
    వెదకుచుఁ బదసంధులు చెడ
    నదుకుచు నరకవిత చెప్పునతడుం గవియే. 9

క. నెఱయ గురులఘువివేకము
    లెఱుఁగని నసగూఁటులెదుర నెమ్మైఁగవిత
    ల్మొఱగెడు కుకవులఁ బద్యపుఁ
    దఱటులు గొనివ్రేయవలదె తద్జ్ఞులు సభలన్. 10

క. సేవించిన ధనపతిఁగా
    దీవింప నహంకరించి తిరిగిన భిక్షుం

    గావింప లక్షణజ్ఞుఁడ
    భావింపఁగ నన్నునెన్నఁ బనిలే దింకన్. 11

వ. లక్షణంబు లెవ్వియనిన, 12

సీ. అవనిగణాళి గణాళికి నధిదేవ
    తలు గ్రహంబులు గ్రమంబులును వాని
    కులములు ఫలములు గూడుమర్యాదలు
    చుక్కపొంతువులు నచ్చువులు నెఱిఁగి
    పిదపమహాభూతి బీజచింతనమును
    వర్ణవర్ణగ్రహనిర్ణయంబు
    లక్షరవేధయు నరిమిత్రశోధన
    క్రమముఁ దత్ఫలవిచారమును దెలిసి

ఆ. తమకు నెదురులేక దర్పించి వసుమతీ
    విభులసభల బుధులు వివిధవిధులఁ
    జెలఁగి పొగడఁ గవిత సెప్పెడివారు స
    త్కవులపేరు సాటు కవులు గలరె. 13

క. ఈ యెన్నినలక్షణము ల
    మేయప్రతిభన్ రచింతు మృదుతరకావ్య
    శ్రీ యెసఁగఁ బొసఁగనది బళి
    రోయనుచు న్సుకవు లాదరించి నుతింపన్. 14

క. జగతీజలానలానిల
    గగనసుధాకరపరోష్ణకరపరమాత్ముల్
    మగణాదుల కధిదేవత
    లగజావల్లభునిమూర్తులవి యెనిమిదియున్. 15

క. రవితురగరజతవిద్రుమ
    కువలయహరినీలశకలకురువిందసుధా
    నవకనకనికషరేఖా
    ప్రవిమలకాంతులఁ దనర్చుఁ బరువడిగణముల్. 16

క. రజనికరతనయభార్గవ
    కుజతరణిజదితిజరాజగురుగురుగ్రహముల్
    నిజముగ మయరసతలకును
    భజలకునెన్న న్నిజాధిపతులు గ్రహంబుల్. 17

క. నలి తయలును నగ్రజకుల
    ములు రజలవనీశసుకులములు భగణము వి
    ట్కులజము మగణము నాలవ
    కులముది సగణమ్ము హీనకులముదితలఁపన్. 18

క. సరసాన్నరుచిరభూషణ
    పరితాపస్థానచలనబహుదుఃఖరుజా
    పరమాయురచలలక్ష్మీ
    కరములు యమరసతభజనగణములు వరుసన్. 19

క. సన్నుతగణాధిదేవత
    మన్నగణగ్రహము సత్త్వమౌ బలిమిఁగదా
    మున్నుఁ గవిభానుఁ డనియెడు
    పన్న మతింగినిసి ఱాయి వగులం దిట్టెన్. 20

క. మహి వేల్పులు నెరసినశిల
    లహితహితంబుల నొనర్చు నాగతిగణముల్
    మహితశ్లోకముఖంబున
    గ్రహవశమున మేలుగీఁడుఁ గడువడిఁ జేయున్. 21

క. తొలుతగణగ్రహమైత్రులు
    తలపోయని దుడుకుఁగవుల తరమే హర్షం
    బొలసిన మన దీవింపం
    గలుషించిన బద్యవహ్నిఁ గాల్పఁగఁ దిట్టన్. 22

గీ. ఏయవస్థనుండి యేవేళ నేగ్రహం
    బేశుభాశుభంబు లిచ్చుచుండు

    నాయవస్థనుండి యావేళనాగణం
    బాశుభాశుభంబు లందఁజేయు. 23

గీ. గ్రహము ములికిగణము గరి యక్షరముపింజ
    పద్య మెసఁగు కోల చోద్యమైన
    జిహ్వవిల్లు మనసు శింజిని లక్ష్యంబు
    ధూర్తజనుఁడు సుకవివార్తజోదు. 24

క. మగణాదిగణంబులకును
    బగయును మైత్రియును నెఱుకపడు సుకవులకున్
    జగమున దత్తద్గ్రహముల
    పగయును మైత్రియును శాస్త్రపద్ధతిఁ గనినన్. 25

గీ. గ్రహము పొత్తు కలిమి గలగణసంగతి
    నుండి దుష్టగణము నొసఁగు శుభము
    గ్రహముపొత్తులేని గణముతోఁ బద్యాదిఁ
    గూడి మంచిగణముఁ గీడుసేయు. 26

వ. గ్రహమైత్రిప్రకారం బెట్టిదనిన,

క. తొలుగణము గ్రహము మిత్రులు
    దలపఁ ద్రికోణాధిపతులఁ దత్తద్గ్రహరా
    సులగణము లాదిగణముకుఁ
    గలసిన చుట్టంబు లివియె గ్రహగణమైత్రుల్. 27

క. మించు గిరిగొన్నముత్తెము
    కాంచనమునఁ గదిసినట్టిగతి నలయగణం
    బంచితముగఁ దనుగూడిన
    మంచిదియై లక్ష్మి నొసఁగు మగణము పతికిన్. 28

క. మగణముతోఁ బద్యాదిని
    రగణము గదిసినను జావు రయమున వచ్చున్

    తగణము డాసినఁ గృతిపతి
    పగఱకు వెన్నిచ్చి మానభంగముఁ బొందున్. 30

క. ముందట నిలిపిన మగణము
    క్రిందట జగణంబుఁ గదియఁ గీలించిన మే
    లొందును సగణము నటువలెఁ
    బొందించిన విభుఁడు రిపులఁ బోర జయించున్. 31

క. యగణముతోఁ బద్యాదిని
    మగణము గదియింప ధరణిమండల మెల్లం
    బొగడొంద నేలుఁ గృతిపతి
    సగణము గదిసినను (గీర్తి) చదలకు నెక్కున్. 32

క. [1]ఉదకగణంబును రగణము
    నదవదవడిచెడి కృతీశుఁ డవలం దిరుగున్
    -----------------------
    --------------------------------------. 33

క. శంకింపక యగణముతోఁ
    బంకజహితగణముగూర్చి పద్యము చెప్పం
    బొంకము చెడి విభుఁ డరులకు
    లెంకెంబడి కూలి దిక్కులేక చరించున్. 34

క. ఇంగలపుగణము జగణము
    సంగతముగ నొంది తగణసంగతి నొందన్
    మంగళకరమని సుకవులు
    ముంగల నిలుపుదురు పద్యములకుం గృతులన్. 35

క. యగణము గూడిన నిష్ఫల
    మగు మగణము గదియఁ బ్రాణహాని యొనర్చున్

    రగణము సగణముఁ బొందై
    భగభగయని పతిగృహంబు భస్మము సేయున్. 36

క. మారుతగణంబు సంప
    త్కారణ మంభోగణంబు గదిసిన యపు డం
    గారకగణంబు గదిసినఁ
    జోరులచే బతిగృహంబు చూఱంబోవున్. 37

క. నేరక దుష్కవు లల్లుతు
    టారపుఁ బద్యముల మొదల డాసినఁ దనలో
    నారవిగణంబు గూడిన
    మారుతగణ మధిపుబ్రతుకు మట్టము సేయున్. 38

క. తగణము మగణము గదిసిన
    వగపగు సగణంబు గదియ వైరిభయంబు
    న్నగణము గదిసినఁ దేజము
    రగణము గదిసినను గర్తరాజ్యము సేయున్. 39

క. మొగవాత తగణ ముండఁగ
    వగపగు యగణంబు దానివడినిడి కినుకం
    దెగి తన్నుఁ జంపఁగడఁగెడు
    పగవానికినైనఁ జనునె పద్యము చెప్పన్. 40

గీ. ఆదితగణ మొప్పు నదిదేవతా ఫలం
    బరసి చూడ దాని కమరగురుఁడు
    గ్రహముగానఁ బద్యగద్యముఖంబుల
    మంచి దనుచు భీముఁ డెంచినాఁడు. 41

క. ఆరోగ్యప్రదుఁడగు నినుఁ
    డారయ జగణమున కొడయఁ డది మొదలిడఁగా

    నేరోగము గైకొన దా
    చేరువచుట్టంబు గణముఁ జేర్చినఁ జాలున్. 42

క. రవిగణమును గగనగణము
    కొని మొదలిడి పద్య మొసఁగఁ గఱచిన నేలౌ
    భువిజెదరములు (?) గతమును
    శివశివ నరులిట్టి తపము సేయరు మొదలన్. 43

క. రాజులకు జగణరగణము
    లోజం గదియించి సుకవి యొసఁగిన పద్యం
    బాజుల జయ మీఁజాలదె
    తేజులు నేనుఁగులు భటులుఁ దేరులు నేలా. 44

చ. ఉడుపతి యేగ్రహంబు పది నున్నను దానును వానివన్నెయై
    నడచి శుభాశుభంబుల నొనర్చును లోపల నేగణంబుసం
    గడి భగణంబు నిల్చు నధికంబగు నాఫల మిచ్చు నవ్విథుం
    డొడయఁడు గాన దానికది యుక్తమె యెన్న వృథోక్తు లేటికిన్. 45

గీ. శుక్రశశులు తెలుపు... వర్ణులు
    తరణికుజులు బుధుఁడు సురగురుండు
    పసిఁడివన్నెవారు భానుజరాహులు
    సజలజలధరంబుచాయవారు. 46

ఉ. వారిజమిత్రసూనుఁడును వారిజమిత్రుఁడు భూమిపుత్రుఁడుం
    గ్రూరులు వారిఁ జేరునెడఁ గ్రూరుఁడు చంద్రతనూభవుండు బృం
    దారకరాజమంత్రియును దైత్యగురుండును సౌమ్య లవ్విధుం
    డారయఁ గృష్ణపక్షతిథులందు శుభప్రదుఁ డెన్ని చూచినన్. 47

గీ. శ్వేతచంద్రుఁడైన సేమంబు చేకూరు
    రక్తచంద్రుఁడైన రణము చేయుఁ

    గృష్ణచంద్రుఁడైనఁ గెడయించు భగణంబు
    పీతచంద్రుఁడైనఁ బ్రియముసేయు. 48

క. చందనతరుసంగతిఁ బిచు
    మందంబులు పరిమళించు మాడ్కినమందా
    నందము ... గణము
    పొందున దుష్టగణవర్ణములు ప్రియ మొసఁగున్. 49

క. రగణముతో రగణంబును
    సగణముతో సగణములును జగణముతోడన్
    జగణంబును దగణముతోఁ
    దగణంబును గూర్చి చెప్పఁదగ దెల్లెడలన్. 50

క. శత్రుగణంబులు నొప్పవు
    మిత్రసమగణంబులైన మేలొకజోకై
    మిత్రగణంబులు మనుపును
    శత్రుగణంబులు కృతీశుఁ జయ్యనఁ జంపున్. 51

క. శతమఖజలపావకమా
    రుత జీవాద్యమతుషారరుక్తారలు స
    న్నుతముగ మగణాదిగణ
    ప్రతతికిఁ దారకలు గ్రహము రా గణుతింపన్. 52

క. హరిణజబలిముఖమేషీ
    వరసైరిభధేనుమహిషవాతాశనముల్
    వరసమయరసతభజలకు
    నరుదుగ నక్షత్రయోనులై విలసిల్లున్. 53

క. ఉరగంబును ముంగిసయును
    హరిణంబును గుక్కుటంబు నావును బులియుం
    దరుచరమును మేషంబును
    దురగము మహిషమును జెలిమిఁ దొరయవు మఱియున్. 54

క. నరగణము లర్యమాంభో
    ధరరసతారకలు శక్రఠహనర్క్షము లా
    సురగణము లనిలగురుహిమ
    కరనక్షత్రములు దేవగణములు వరుసన్. 55

క. సురరజనీచరగణములు
    కరకరిపడుదనుజమనుజగణములు మఱియు
    న్నరసురగణములు వొరయును
    సరిఁబ్రియ మొనరించు నొక్కచందపుగణముల్. 56

క. కమలహితుఁడున్న నక్ష
    త్రము మొదలుగ నేడు దోషతమములు నడుమం
    బ్రమదప్రదములు పండ్రెం
    డమరఁగ శుభములు తొమ్మిదింటం బద్యాదిన్(?) 57

క. మొదల సజీవగణంబిడం
    గొదలేక కృతీశుబ్రదుకు కొనసాఁగు మది
    న్వెదకక నిర్జీవగణం
    బదికినయప్పుడు భయంబు నాయువు దరుగున్. 58

క. కృతిమొదలి దగ్ధతారక
    పతి నతిదారిద్ర్యుఁ జేయుఁ బ్రజ్జ్వలితము దు
    ర్మృతి నొందించును మఱి దు
    ర్మితనక్షత్రంబు రుజల మెయి నలయించున్. 59

క. పతితారకుఁ బద్యముఖ
    స్థితతారకుఁ గీడుమేలుఁ జింతింపక దు
    ర్మతిఁ గవిఁ జెప్పఁదొడఁగెడు
    నతఁడు చుమీ కవిపిశాచ మారయ నుర్విన్. 60

ఉ. వర్ణము నిర్ణయించి కృతివక్త్రమునం గదియింప నాయకుం
    డర్ణవవేష్టితావని సమస్తము నేలుఁ గవీశ్వరుండు నా

    పూర్ణమనోరథుం డగుచుఁ బొల్చు సుఖస్థితిఁ గావ్యముల్ బుధు
    ల్వర్ణన సేయనొప్పు దిశలన్వసుధేశసభాంతరంబులన్. 61

మ. క్షితిబీజంబులు సంపదల్పొదలఁ బోషించుం బయోబీజముల్
    సతతంబు బ్రమదం బొనర్చు శిఖిబీజంబుల్ మృతింజేయు మా
    రుతబీజంబులు శోకవారిధిఁ బడంద్రోచు న్నభోబీజముల్
    పతి నత్యంతదరిద్రుఁ జేయు వరుసం బద్యాది నొందించినన్. 62

వ. తత్ప్రకారం బెట్టిదనిన, 63

సీ. అఇఉఋలేనును నాదీర్ఘవర్ణంబు
    లైదు నేకారంబు నైదునవల
    వరుసం గవర్ణాది వర్గపంచకమును
    యాదులైదును షాదు లైదుఁగూడఁ
    బదివర్గములు వర్ణపంక్తులు నొండొంటి
    క్రిందఁ బొందుగ నిల్ప నందులోనఁ
    ప్రథమాక్షరంబులు పవనబీజంబులు
    నవలిని దహనబీజాక్షరములు

గీ. అవనిబీజాక్షరంబులగుఁ దృతీయాక్షరములు
    వారిబీజంబు లాతరవాతిలిపులు
    గగనబీజంబు లైదవకడలవెల్ల
    వాని మేలును గీడును వలయుఁ దెలియ. 64

క. పొందొంద నంశచక్రము
    నందలి తారాపదాక్షరావలి వెడలం
    బొందుగనుండఁ గవీంద్రులు
    ముందట నిడవలయుఁ బద్యముఖమున నిలువన్. 65

గీ. అక్షరంబు మంచిదైనఁ గ్రూరగ్రహ
    వేధఁ బొంది గుణము విడిచి చెఱచు

    నక్షరంబు దుష్టమైన సౌమ్యగ్రహ
    వీక్షణమునఁ గీడు విడిచి మనుచు. 66

వ. అది యెట్టిదనిన, 67

సీ. అశ్విని పాదాక్షరాదిగా నఖిలతా
    రాపదాక్షరములు క్రమముతోడ
    నింద్రునిదెసనుండి యిరువదియైదేసి
    నలుదిక్కులందును నిలిపి వాని
    నవపంచరాశివర్ణములతో నాల్గేసి
    నాల్గేసి రేఖలం దగు లొనర్చి
    నడుముల మిగులువర్ణములకు ...
    నేడింట రేఖలు గూడఁదీసి

తే. అర్కుఁ డాదిగాఁగ వంశచక్రంబుల
    రాసులందు సుస్థిరముగ నిలిపి
    వేధ దెలిసి చూపు వివరించి వర్ణంబు
    వలయు నిలుపఁ బద్యవక్త్రములను. 68

చ. ఉరుతరసిద్ధకాష్ఠముల నున్న సమంచితవర్ణసంకులం
    బరుగును సిద్ధకాష్ఠములఁ బ్రస్తుతికెక్కిన యక్కరంబులుం
    గరికరిలేకకూడి కవికర్తల కభ్యుదయం బొనర్చు నే
    వెరవుననైన శత్రువిధి బృందముఁ జంపక తక్క దెక్కడన్. 69

వ. మిత్రారివర్ణశోధనక్రమం బెట్టిదనిన, 70

సీ. చదుములై పదియాఱు చౌకపిండ్లంగల
    యదియ షోడశచక్ర మందులోన
    మొదలింట మూఁటను బదునొకంటను తొమ్మి
    దింట రెంటను నాలుగింటఁ బదియు
    రెంటను బదియు నాఱింట నెనిమిదింట

    నలిఁబదాఱింటఁ బద్నాలుగింట
    నేనవఠావున నేడవింటను బది
    యేనింటఁ బదుమూఁట నిట్లుగలయ
    నక్షరంబులు గలయంగ నైదుపదులు
    నిలిపి నడికాష్ఠముననుండి వలయముగను
    సిద్ధసాధ్యసుసిద్ధాది చింత వెలయఁ
    గాంచి లిపులోలి నడువంగ నెంచవలయు 71

వ. మఱియును, 72

క. ఇలనకచటతపమాఖ్యలఁ
    గలిగిన లిపివర్గసప్తకమున కధీశుల్
    జలజహితభౌమబుధకవి
    కులిశాయుధసచివసౌరికువలయమిత్రుల్. 73

క. బహుసంశోధితవర్ణ
    గ్రహమునకుఁ బ్రసిద్ధపద్యగద్యాదిగణ
    గ్రహమునకుఁ గర్త రాశి
    గ్రహమునకును మైత్రి మెఱయఁ గలుగఁగవలయున్. 74

వ. గ్రహంబు లెట్టివనిన, 75

సీ. విభుఁడు మేషమునకు వృశ్చికరాశికిఁ
    గ్రూరస్వభావుఁ డంగారకుండు
    నాథుండు మిథునకన్యారాసులకు జనా
    నందవర్తనుఁ డిందునందనుండు
    అధిపతిమీనబాణాసనరాసుల
    కతులప్రభావుఁ డ య్యమరగురుఁడు
    రాజు తులావృషరాసులు రెంటికిఁ
    బరమతపోనిధి భార్గవుండు

    మకరకుంభములకు మార్తాండసూనుఁడు
    పతి త్రివేదమూర్తి భాస్కరుండు
    కర్త సింహమునకుఁ గర్కటరాశికి
    నఖిలలోకవంద్యుఁ డమృతకరుఁడు. 76

వ. అని యివ్విధంబున, 77

మ. గణవర్ణాదుల మేలుఁ గీడు వెలయంగాఁ జెప్పె సాహిత్యల
    క్షణదీక్షాగురుఁడైన గౌరనసుధీసత్పుత్రుఁ డత్యుల్లస
    ద్గుణరత్నాభరణుండు [2]భైరవకవీంద్రుం డెందుఁ దద్జ్ఞుల్ దనుం
    బ్రణుతింపం గవిరాడ్గజాంకుశము భూప్రఖ్యాతమై మించఁగన్. 78

{ఇంతవరకు పరిషత్ వారు పైన పేర్కొనిన పత్రికలో ముద్రించిరి, మధ్య మధ్య పద్యములలోని అసమగ్ర భాగాలు (... ఈ గుర్తులు) పత్రిక యందే గలవు, మరియు 78 పద్యానికి ఫుట్ నోట్సు కూడా - వారుంచినదే)

కవి గజాంకుశమున లేనివని రెండు పద్యములను చాగంటి శేషయ్యగారు
ఆంధ్ర కవితరంగిణియందు (1980 ముద్రణ 5 భాగము 244 పుటలో) ప్రకటించిరి - ఆ పద్యము లివి,

క. పతి మృతుఁ డగుఁ బద్యాదిని
    మృతనక్షత్రంబు లిడిన మేదురసౌఖ్యా
    న్వితుఁ డగు నమృతము వలన న
    ప్రతిమములగు తారకములఁ బద్యాది నిడన్.

సీ. అవనిగణాలి గణావలి కధిదేవ
    తలును వన్నెలు గ్రహంబులును వాని

    కులములు ఫలములు కూర్ములు పగలును
    చుక్క పొత్తువులు నచ్చుగ నెఱింగి
    పిదప మహాభూత బీజచింతనమును
    వర్ణ వర్గగ్రహనిర్ణయంబు
    నక్షత్రవేధయు నరిమిత్రశోధన
    క్రమముఁ దత్ఫలవిచారమును దెలిసి

తే. తమకు నెదురులేక తప్పించి ధారుణీ
    విభులసభల బుధులు వివిధగతులఁ
    జెలఁగి పొగడఁ గవిత చెప్పెడువారు స
    త్కవుల గాక యితరకవులు కవులె? 5


3–5 సంఖ్యలు కవితరంగిణిలోని పద్యసంఖ్యలు, పై పద్యములందు 31 సంఖ్యగల పద్యము. ఈ 5 సంఖ్యగల పద్యము కొద్ది భేదముగా-సమానములే, చాగంటివారి కీ పద్యము లెచట లభించెనో? తెలుపలేదు.

  1. ఈ 33 నెం పద్యము, పరిషత్ పత్రిక యందును పూర్తిగాలేదు.
  2. రత్నపరీక్షను, శ్రీరంగమాహాత్మ్యమును రచించినకవి, ప్రతికి మూలము మానవల్లి రామకృష్ణకవిగా రిచ్చినది. (పత్రిక. 121 పుట)