శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/శ్రీమద్రామాయణము-ఉపోద్గాతము

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణ.

రెండవభాగము.

శ్రీమద్రామాయణము

ఉపోద్ఘాతము.

దీనిని వాల్మీకియనుఋషి చెప్పినటుల నున్నది. అయితే నాఋషి దీనినంతను జెప్పియుండునా. లేక సూక్ష్మముగఁ జెప్పియుండునా విచారింపవలెను. శ్రీరాములవారిసన్నిధిని గుశలవులవలన నాఋషి పాడించినటుల నున్నది. ఈయిరువదినాలుగువేల గ్రంథమును బ్రభువులకుఁ బాడించి వినుటకు వీలుండదు. కావున సూక్ష్మరూపముగనె పాడించి యుండవలెను. మరియు నీక్రిందఁ గనబరుపఁబోవు ననేకాసందర్భములతో నిండియుండిన దానిని శ్రీస్వామివారు విని యెటుల నంగీకరించి యుందురు? అందువలన నిది యిటీవలఁ జెప్పఁబడియుండవలెను. శ్రీమద్రామాయణమునకు ముందు ఛందోయుక్తముగ నేదియు లేదనియు ముందుగాఁ దనకు స్ఫురించిన, "మానిషాదప్రతిష్ఠాంత్వ మగమశ్శాశ్వతీస్సమాః | యత్క్రౌంచమిథునాదేకమవధీఃకామమోహితం" అను నీశ్లోకమునుబట్టి వాల్మీకి ఛందో యుక్తముగ నున్నదానిఁ జూచి యచ్చెరువొందె నని యున్నది. అంతకుముందు ఛందోయుక్తముగ నేదియు లేకపోయినయెడల ఛందోయుక్తముగ నుండినటుల నతని కెట్లు దెలిసెను. కవిత్వమునుఁ జెప్పునేరని మనకు ఛందోలక్షణములు దెలియునా? అయితె మరి యెందు కటులఁ జెప్పఁబడిన దనఁగా నాగ్రంథ మన్ని గ్రంధములకంటె ముందుగఁ బుట్టిన దని జనులను నమ్మించుట కటులఁ జెప్పఁబడియుండును. ఉపనిషత్తులు కొన్ని ఛందోయుక్తముగ నున్నవి. అవియుఁగూడ నీగ్రంథమునకుఁ దరువాతఁ బుట్టిన వని నమ్మవలసివచ్చును. మరియు మనగ్రంథముల వరుసనుబట్టి చూడఁగా ముందు వేదములు అనఁగా శ్రుతిస్మృతులు, నాపిదపఁ బురాణములు, తరువాత గావ్యములు పుట్టియుండుటనుబట్టియేకదా ప్రభు సుహృ త్కాంతా సమ్మితము లని నిర్ణయింపఁబడి యున్నవి. ఇంతియకాక యిది శ్రీరాములవారి కాలానంతరమునందును జాలకాలమునకు బుట్టియుండును. ఏల యనిన వనములయందు సంచరింపుచుండు జనులగు వానరులను గోతులుగను నేకశిరస్శుగలరావణుని దశ శిరస్సులుగలవానిగనుఁ దీసికొనిఁ యానమ్మకమునకుఁ దగినటుల నాయా చేష్టలను వర్ణనలను ననేకస్థలములఁ జేసెను. వానరు లనువారు నరులే గాని మర్కటములు గా రని సుగ్రీవుని కథాంతమందును రావణుని కొకశిరస్సే గల దని యాతని చరిత్రయందును విపులముగఁ జర్చించి వ్రాయఁబడి యున్నది. కావునఁ జదువరు లిచ్చటఁ దత్తరపడక యాయాకథలను జదువఁ గోరుచున్నాను. ఇందు వానరవిషయము వాచస్పత్యములో వానరశబ్దమువద్దను, బ్రౌన్‌దొరగారివలన సమకూర్పఁబడిన తెనుఁగు ఇంగ్లీషు డిక్ష్ణరీయందు వానర హనుమచ్ఛబ్దముల వివరణమందును వీరు మనుష్యలే యని చెప్పఁబడి యున్నది.

యూరోపుదేశపుబండితులు కొంద రీగ్రంథశైలినిబట్టి శ్రీరాములవారికాలమె భారతకాలమునకుఁ దరిమిలా దనిచెప్పి యున్నారు. దాని నొప్పుటకు వీలులేదు. ఏమనిన పురాణములయందును శ్రీకృష్ణచారిత్రముగల భారతభాగవతము లందును శ్రీరామకథ చెప్పఁబడియున్నది. శ్రీకృష్ణులకాలవు వాఁడగు యుధిష్ఠిరుఁ డొకఋషివలన శ్రీరామకథను వినియున్నాడు. కావున శ్రీరాములవారికాలము భారతకాలము కంటె ముందె యయి యుండవలె ననుటలో సందేహ మేమియు లేదు.

శ్రీరాములవారిసన్నిధిలో వాల్మీకి కుశలవులచేతఁ బాడించినది సూక్ష్మరూపముగ నుండును. ఈగ్రంథమంతయు జాల కాలముపిదప నాఋషిపేరుతో నొకవిష్ణుభక్తుఁడు చెప్పియుండును. బ్రహ్మసూత్రములు చేసినవ్యాసులవారిపేరుతో నన్ని పురాణములు చెప్పఁబడియుండినటుల నిది వాల్మీకిపేరుతోనే యాధిక్యముకొరకుఁ జెప్పఁబడినది. మరియు నీగ్రంథకర్త శ్రీరాములవారినిఁ బరాత్పరుని యవతార మని యెప్పుచుఁ గొన్ని యసందర్భములం జెప్పెను. శ్రీభగవంతుఁ డీలోకములో నవతరించుట దుష్టశిక్షణ శిష్టరక్షణార్థమును దమప్రవర్తనను జూచిన వినిన వారందరు దమవలె యుక్త ప్రవర్తన గలిగియుండుటకు నై యున్నది. తనభార్య నొరుఁడు హరించినపు డామె స్థితిగతులం దెలిసికొని హరించినవానిని శిక్షించుట నీతియే. ఆదుఃఖమునకు దాళలేక యడవిలో శ్రీరాములవారు సాధారణ మనుష్యునివలె విలపించిరఁట. అరణ్యములో నిర్జనమైనచోట దమ్ముండును దానును నేల విలపింపవలెను. బాణమును ధరించిన శ్రీరాములవారికిఁ జడిసి సముద్రుఁడు ప్రత్యక్షమైనటుల నీగ్రంథకర్త చెప్పుచు రావణవధకొరకు ససమర్ధనికీవలె నగస్త్యుఁడు శ్రీస్వామివారిని సూర్యుని నారాధింపుమనినట్లును, మాతలి బ్రహ్మాస్త్రమును ప్రయోగింపుమని చెప్పినట్లును రచించెను. ఏమివింత ? తొమ్మిదిసారులు తలను గొట్టినపిదప రావణునితో నొకనాఁడు రాత్రింబగళ్లు శ్రీస్వామివారు యుద్ధమును జేసిరఁట. ఆపైని బ్రహ్మాస్త్ర మేయు మని మాతలి చెప్పినట్లున్నది. తలగొట్టిన దల మొలచుచున్న వానిని శీఘ్రముగ సంహరించుటకుఁ బ్రయత్నింపక యంతకాలమువరకు శ్రీస్వామి వా రేల సాధారణముగ యుద్ధమును జేసియుందురు ! గ్రంథకర్త చెప్పినటులఁ దీసికొనినను నంతకాలమువరకు మాతలి బ్రహ్మాస్త్ర మేయు మని యేల చెప్పలేదు ? ఈగ్రంథమునందు గాయత్రీమంత్రమునందుగల యిరువదినాలుగక్షరములకు నక్షరమొక వేయిశ్లోకములతో నింపఁబడి యిరువదినాలుగువేలశ్లోకములు గలిగి యనేకేతరనిబంధనలు తక్కిన గ్రంథములకంటె నెక్కుడుగ గలిగినందున నిది యాగ్రంథములకంటె నవీనమని చెప్పఁదగి యున్నది. అయితే కావ్యములలో నాదికావ్య మని యొప్పవచ్చును. అందుచేతనే దీని నాది కావ్య మని వాడెదరు. తక్కినగ్రంథకర్తలతోఁ బాటుగ నీతఁడును నీగ్రంథమున కాధిక్యముకొరకును ననాదిగ్రంథ మనిపించుటకును జెప్పినవిషయములను మనము గమనింపవలసినదేకాని గ్రంధకర్తయందు దోష మేమియు లేదు. మరియు శ్లోకము చదువఁగానె యర్థ మిచ్చునటులఁ బహుమృదువుగాఁ జెప్పఁబడినది. ఈగ్రంథమునకు గావ్య మని పే రుండినను నితరకావ్యములతోఁ బాటుగ వ్యంగ్యార్ధమునె బోధపరుపక పురాణేతిహాసములతోఁబాటు సకలనీతులను బోధపరచుచు శ్రీభగవంతుని యవతారమగు శ్రీరాములవారికథను గలిగియున్నందున నీకావ్యము భాగవత విష్ణుపురాణములతోఁ బాటుగ నతిపవిత్రమైనదియుఁ బూజార్హమైనదియు నిత్యపారాయణకు ముఖ్యమైనదియు నై యున్నది.