Jump to content

శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/శ్రీకృష్ణులవారిని గురించిన దురభిప్రాయములు

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణులవారిని గురించి మనముపడియెడి దురభిప్రాయములు

శ్రీకృష్ణులవారిని గురించి మనము సాధారణముగ నభిప్రాయపడి యుండునట్టియు నసత్యములై నట్టియు వారివారికి దోచినటుల వాడుకొనబడుచున్న విషయములను గనబరుప బోవుచున్నాఁడను. ముఖ్యముగా నార్యుల మగు మనమే కాక ప్రతిమతములవారును నందు విశేషించి నిష్పక్షపాతబుద్ధి గలవా రేది ధర్మవిరుద్ధముగను యుక్తిబాధితముగసు నుండునో దానిని సుతరాము విడిచి పెట్టవలయును. ఇది ప్రతిమనుష్యుఁడు ముఖ్యముగ మనస్సునందు నుంచికొనవలసిననీతి యయి యున్నది.

శ్రీకృష్ణులవారికాల మిది యని యేశాస్త్రజ్ఞులవలన నిదివరకు నిస్సందేహముగ నిశ్చయింపఁబడియుండ లేదు. కొందరు యూరోపుదేశపువిద్వాంసులు క్రీస్తుశకమునకు ముందు 14-వ శతాబ్ద మా శ్రీకృష్ణులవారి కాలమని యేకాభిప్రాయు లైరి. మరికొందరు క్రీస్తుశకమునకు ముందు 13 లేక 12-వ శతాబ్దములని చెప్పిరి. ఇప్పటికాలపు కలకత్తాలోనుండిన 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు శ్రీకృష్ణులవారి కాలము క్రీస్తుశకమువకు ముందు 15–16 శతాబ్దముల మధ్యకాలమై యుండు నని సమర్థించిరి. అతఁడు రచించిన శ్రీకృష్ణులవారు, వారిజీవితకాలము, వారి బోధనలు' ననుపుస్తకమును బ్రారంభముమొద లంతమువరకుఁ జదువుటకు మిమ్మును ముఖ్యముగ వేడుచున్నాఁడను.

శ్రీకృష్ణులవారికాలము ద్వాపరముయొక్క యంతమందు గాని కలియుగముయొక్క యాదియందుగాని అనఁగా 5006 సంవత్సరములక్రిందట యని మసయార్యు లు సాధారణముగ నమ్మియున్నారు. ఎటులనైన ననేకసహస్రసంవత్సరములై యుండును గదా! మరియు మనపురాణములన్నియు నేకకాలమందు గాని, యొకపురుషునివలనగాని వ్రాయఁబడినవి కావు. ఈ పురాణములలో మన మనుకొనుచుండు సృష్టికాలముమొద లతిసాహసముతో ముందు రాబోవు ననఁగా నీయుగాంతము వరకును సంగతులు వ్రాయఁబడి యున్నవి. అందుల విషయములనుబట్టి మన కవకాశ మగు నన్నివిధముల యోచించి చూచెదము. మహాభారతము భారతయుద్ధము జరిగిన పిదప ననేకశత సంవత్సరములు గతించిన పైని వ్రాయఁబడినట్లున్నది. ఇది యర్జునునికి బ్రపౌత్రుఁడగు జనమేజయ మహారాజునకును భాగవత మర్జునునికి బౌత్రుఁడగు పరీక్షిన్మహారాజునకును నప్పటిఋషులవలనఁ గథారూపముగఁ జెప్పఁబడినట్లు ప్రారంభింపఁబడి యున్నది. ఆకథలు శ్లోకరూపముగ మరి యెంతోకాలమునాఁడు చేయఁబడి యుండవచ్చును. ఆకాలమందును నటుతరువాతను ననేకభాగములు కలుపబడియుండినటులఁ గనఁబడుచున్నది.

అన్ని పురాణములలోను భాగవతము, విష్ణుపురాణము, మహాభారతము, హరివంశము శ్రీకృష్ణులవారినిగురించి చెప్పఁబడియున్న ముఖ్యములైన గ్రంథములై యున్నవి. అందు భాగవతము సాధారణముగ విష్ణుచారిత్రమునుగురించి 12 స్కంధములుగఁ బుట్టియున్నది. అందు బదియవదాని యందు నీశ్రీకృష్ణులవారిచరిత్ర వ్రాయఁబడి యున్నది. అదియు శ్రీకృష్ణులవారిపిదప ననేకశత సంవత్సరములక్రిందట వ్రాయఁబడి యుండినందున నందులో మనుష్యస్వభావశక్తికి మించిన యనేకములైన యూహలతో జేరినకథలు గలవు.

మహాభారత మనునది పాండవులతో సంబంధించిన శ్రీకృష్ణులవారిచారిత్రమునే చెప్పుచున్న యదికాని వారినిమిత్తమయి పుట్టినది కాదు. తక్కిన రెండుగ్రంథములయందును శ్రీకృష్ణచారిత్రమె ప్రధానముగ వ్రాయఁబడియున్నది. గనుక భాగవతముకంటె నీమూడుగ్రంథములయందును మనము హెచ్చు ప్రామాణ్యబుద్ధి నుంచవలయును. ఈమూడింటిలో మహాభారతము పాండవులతో సంబంధించినప్పుడు మాత్రమె శ్రీకృష్ణులవారికథను జెప్పుచున్నది. కాన నిష్పక్షపాతతరమైన గ్రంథ మని యెంచవచ్చును. ఈగ్రంథములు శ్రీకృష్ణులవారి కాలముపిదప ననేకశతసంవత్సరముల తరువాత వ్రాయఁబడినవని నందుకు రుజువుగా నే నొకటి రెండు దృష్టాంతములను జూపించు చున్నాను. వానినిఁబట్టి యీపురాణములలోఁ గల పరస్పరభేదములును, అందునుబట్టి మనమనస్సుల నాటియున్న యసత్యపుభావనలును దెలియును.

(1) శ్రీకృష్ణులవారు బాల్యమునందు, బూతనవలనఁ జంపఁబడక విడువఁబడి రని యున్నది గదా! భాగవతములోఁ బూతన ఖేచరిగా శ్రీకృష్ణులవారినిఁ జంపుటకు వచ్చి నని చెప్పఁబడి యున్నది. హరివంశములో నాపూతన కంసునిదాదీ యని చెప్పఁబడి యున్నది. భాగవతములో మరియు నది భయంకరమైనరాక్షసి యని యెన్నఁబడి యున్నది. అయితే విష్ణుపురాణములో బిల్లలను జంపునది యని మాత్రము చెప్పఁబడియున్నది. శిశుఘాతిని యనునామమునకుఁ బదులుగా గంసుని దాది యని హరివంశములోను భీతికరమైనరాక్షసియని భాగవతములోను జెప్పఁబడియుండును. ఇట్లుండగా, 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు పూతన యనునది యొకవిధమైన భయంకరమైన శిశువ్యాధి యని చెప్పుచు వైద్యవిషయమునఁ బ్రశస్తములగు గ్రంథములలో నొకటి యగు శుశ్రుత మను దానిలో నిదియొక వ్యాధి యైనటులఁ జెప్పబడిన దని గొప్పయాధారమును గనఁబరచిరి. మరియు బూతన యనుశబ్దము స్త్రీలింగము. ఆహేతువుచేత భాగవత, హరివంశకర్త లిది రాక్షసి యని, కంసునిదాది యని బహుశ: వ్యవహరించియుందురు. విష్ణుపురాణములో శిశుఘాతిని యని మాత్రము చెప్పఁబడియున్నది గాన నాగ్రంథకర్త లావ్యాధిని రాక్షసిగాను, దాదిగాను నేవిధముగ భ్రాంతి నొందిరో చూడుఁడు. తమభ్రాంతిని స్థాపించుటకుగా నసందర్భపుకథను పూతననుగురించి కల్పించిరి. ఈ పైయుదాహరణనుబట్టి శ్రీకృష్ణులవారినిగురించి వ్రాయఁబడినచరిత్ర లనేకసంవత్సరములపిదప వ్రాయఁబడిన వనునదియు, నాగ్రంథకర్త లొకవిధముగ జరిగినవానిని బొరపాటున మరియొకవిధముగ దీసికొనినదియు, వా రట్టివిరుద్ధా భిప్రాయములను స్థాపించుట కెట్టికథలను జేర్చినదియు మీకిప్పుడు విదితమే గదా!

(2) మరియు పైఁ జెప్పఁబడిన యన్నిగ్రంథములయందును శ్రీకృష్ణులవారు కాళియనామము గల నాగాధిపతియగు నొక గొప్పసర్పముతో యుద్ధముజేసి నాగస్త్రీల యొక్క ప్రార్థనపైని బ్రాణములతో నానాగాధిపతిని విడిచిపెట్టిరని చెప్పఁబడి యున్నది. నాగ యనుశబ్దము సర్పమునకు వర్తించును. అందునుండి యాగ్రంథకర్త లాకాళియునిసర్పము క్రింద భ్రమసి తీసికొనుచు నాస్త్రీలను వర్ణించుటలో వారు మాటలాడు శక్తిగలవారనియు విలువగల కర్ణహస్తపాదాభరణములను ధరించియుండి రనియు వర్ణించిరి. పాము లైనచో వానికి గర్ణములు హస్తములు పాదములు నుండునా ! అవి యట్టియాభరణముల నెటులధరించెను. ఆయితే నా రెవరనిన యమునానదీతీరపుటడవులలో నివసించు నాగులను బేరు గల యొకజాతిప్రజలై యున్నారు. అందునుండియెకదా శ్రీకృష్ణులవారు కాళియు, నాయడవి విడిచిపోవలసిన దని యాజ్ఞాపించినటులను నాయుత్తరువుప్రకార మాతఁ డట్లు విడిచిపోయె ననియు జెప్పఁబడి యున్నది. ఈవిధముగనే యీగ్రంథ కర్త లనేక సంవత్సరములపిదప వ్రాసియుండుటంబట్టి యొకదానికి మరియొకటిగ భ్రమసియున్నారు. మరియెక చిన్న దృష్టాంతమును జెప్పుచున్నాను. కొందరుగ్రంథకర్తలు చెప్పుటలో శ్రీకృష్ణులవారు జన్మించినప్పుడు గాఢాంధకార మనియు, నపుడు విశేషవర్షము గురియుచుండిన దనియును, మరికొందరు చెప్పుటలో నారాత్రి యతిస్వచ్ఛమైనదియై యుండిన దనియుం జెప్పిరి. ఈవిధముగ బైవిషయములయందు గ్రంథకర్తలు భిన్నాభిప్రాయులై యుండుట చేత జదువరుల కేవిధమైన చెరుపును సంభవింపకపోయినను మనయార్యమతస్థులందరి దురదృష్టముకొలఁది. నాగ్రంథకర్తలు విశేషపాతిత్యకరములగు నట్టియు వచించుటకు లజ్జాకరములగు కేవలాసత్యదోషములకు బాత్రులై యున్నారు. బహుశః ఈగ్రంథకర్తలు యుక్తాయుక్త విచారసమర్థత లేనివారుగ గానవచ్చు చున్నారు.

ఈసంస్కృతపురాణములను దెనుఁగు, అరవము మొదలగు దేశీయభాషలలోనికి మార్చినకవీశ్వరులు, మరియు నవివేకులుగ గనిపించుచున్నారు. వీ రనేకవిషయములలో శ్రీకృష్ణులవారి చారిత్రములోని యొకభాగమును, ఇది యెట్టిసంగతి సందర్భములలో నెటుల జరిగినదో ముందు వెనుకల జూచి దానింగనిపెట్టుట కేవిధమైనశ్రమను బొందక క్రొత్తక్రొత్త ప్రబంధములనే కల్పించిరి. ఆకధలన్నియు నసత్యపుకథ లగుటయె కాక వారివారికిగల యభిరుచిని యుద్దేశమును శక్తినిబట్టి కేవలము స్త్రీలోలత్వమును జెప్పుకథలై యున్నవి. వారివారి మనోభిప్రాయముల ననుసరించి చెప్పఁబడినట్టియు, ససత్యములైనట్టియు, శ్రీకృష్ణులవారివిషయమై మనము దురదృష్టము కొలఁది జేయుచున్న విరుద్ధభానన లెవ్వియో యీక్రిందఁ జెప్పుచున్నాఁడను:-

(1) శ్రీకృష్ణులవా రొకనాఁటివెన్నెలకాలమందు రాసక్రీడలయం దాసక్తులయి యుండినటులను, అందు దామును యౌవనవతులగు స్త్రీలును గలిసి విహరించునటులను, నా యువతులు శ్రీకృష్ణులవారియందు మోహపరవశలైనటులను జెప్పఁబడియున్న ది. ఈరాసక్రీడవృత్తాంతము భాగవతమునందు విపులముగను, హరివంశవిష్ణుపురాణములయందు స్వల్పముగను గలదు. ఇట్టివి మరి రెండంశములు భాగవతమునందుఁ జెప్పఁబడి యున్నవి.

(2) శ్రీకృష్ణులవా రొకసరస్సునందు వస్త్రవిహీనలై జలక్రీడ లాడుచుండుయువతుల వస్త్రముల నపహరించినటులను ;

(3) కొందరు బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణులవారిం జూచి మోహించినటులను గలదు.

ఇట్టి గ్రంథకర్తలయొక్క యసందర్భపు టూహలతో నిండియున్న యీకథలను గొంచెమైన దెలివి గలిగి యుక్తాయుక్త వివేచనముం జేయువారి కెవ్వరికిని నమ్ముటకు వీ లుండునా ? ఒకవేళ నాకథలు గ్రంథకర్తలయొక్క కేవలామాయికములైన పొరబాటులై బహుశః ఉండియుండవచ్చును. ఈ పైమూడు విషయములు జరుగునప్పటికి శ్రీకృష్ణులవారికి 11 సంవత్సరముల వయస్సు గలిగి యుండెను. అట్టిబాల్యావస్థలో నుండువారికి సంభోగవాంఛ గలిగియుండునా ! అయితే వారు సాధారణమైన బాలురు కా రనియు విష్ణు, లేక, మూలవిరాట్టుయొక్కయవతార మని కొందరు చెప్పవచ్చును. గాని యీవిధమైనయుత్తర మాకథలకు బలహీనతనే కలుగఁజేయుచున్న యది. మూలవిరాట్టుని యవతారమునుధరించినవారును, మనకు సృష్టికర్తయు, రక్షకుఁడును, సన్మార్గప్రదర్శకుండును, నింద్రియా తీతుండును, దోషశూన్యుండును, అనవధికాతిశయకల్యాణ గుణగణుండును, సర్వజ్ఞుండును, జితేంద్రియుండు నని ప్రసిద్ధిని వహించిన శ్రీకృష్ణులవారు పాపకరమైనట్టియు, మోహూద్రేకమును గలిగించునట్టియు నిట్టికార్యములను జరిగించియుందురా విచారింపుడు! అది నిజము కాదు. మరి యే మనిన నప్పటికాలములోను, నరుదుగ నిప్పుడును , పర్వతవనవాసులలో స్త్రీపురుషులు కలిసి యాడుట, పాడుట, మనదేశమందు మామూలయియే యున్నది. ఇంతియెకాక నాగరికతగల యూరపుదేశస్థులకు సహా యటుల నాడుట మామూలు మర్యాదయయి యున్నది. ఈగ్రంథకర్త లట్టిప్రజలయొక్క మామూలుమర్యాదలను దెలియనివారై యారాసక్రీడకు విపరీతార్థమును దీసికొనిరి.

ఇక స్త్రీలయొక్కవస్త్రముల సపహరించిన విషయము శ్రీకృష్ణులవారు బాల్యావస్థ ననుసరించి వినోదార్థముగ జరిగించి యుండవచ్చును. లేదా స్త్రీలు వస్త్రవిహీనలై సరస్సులందును, నదులందును, స్నానములు చేయుఁగూడదని యుపదేశము జేయుకొరకు బహుశః అటుల జేసియుండ వచ్చును.

ఈవిధమగు నభిప్రాయముచేతనే బ్రాహ్మణస్త్రీలుకూడ నా గోపబాలురలో నాహ్లాదకరమగు, సౌకుమార్యముగల యా పిల్లవానినిఁ జూచి యతిప్రేమ గలవారై యుండవచ్చును. మగవారికంటె స్త్రీలు పిల్లలను జూచునపుడు హెచ్చుగ బ్రేమించుట స్వభావగుణమైయున్నది. ఇంక నాభగవంతుని విషయమున జెప్పనేల !

అవతారములవిషయమై ఆనిబిసెంటుదొరసాని యిచ్చిన యుపన్యాసములలో శ్రీకృష్ణులవారి విషయమై యాయువతులకు గల నిష్కల్మషమైనట్టియు, భక్తియుక్త మైనట్టియు, బ్రేమను వ్యక్తపరచుట కింతకంటె జెప్పుట కెక్కువమాటలు లేవని చెప్పుచు నీవిషయములలో విశేషపరిశీలనజేసినచో సంభోగ వాంఛతో గలీసినయుద్దేశ మేమియు లేనటుల స్పష్టపడగలదని చెప్పెను.

పై మూడువిషయములు, 'ధీరేంద్రనాద్ ' గారు కూడ నిరుత్తరమగువిధమున నాక్షేపించిరి. వారు చెప్పిన దే మనిన ఈయంశములలో నేమాత్రము నిజ ముండినను మహాభారతమునందు సభాపర్వమున శిశుపాలుఁడు శ్రీకృష్ణులవారిని నోటికి వచ్చినటులఁ దూషించునపుడు వారియొక్క యిట్టివ్యభిచారములనుగురించి ధూషింపక యుండునా యని నుడివెను. మరియు నాగ్రంథమునం దెచ్చటను శ్రీకృష్ణులవారు స్త్రీలోలు లని చెప్పఁబడియుండలే దనియు, అంతకు నవీసగ్రంథమగు విష్ణుపురాణములోఁగూడ నాప్రశంస యేమియు లే దనియుఁ జెప్పెను.

మరియు రాథవిషయమున మిగులనవమానకరమగు నొకగొప్పతప్పుటభిప్రాయము గలదు చూడుఁడు. రాథ యను నామము భారత, భాగవత, హరిపంశ , విష్ణుపురాణములయం డెచ్చటను గానరాకపోయినను బ్రహ్మవైవర్తపురాణమునందు రాథ యనునాపెతో శ్రీకృష్ణులవారి కొకసంబంధము గలదని గొప్పతప్పుకథ వ్రాయఁబడెను. ఈక్రొత్తపురాణ మసందర్భములగు మనుష్యులయొక్క యూహలకు మించినవ్యవస్థలతో నిండియున్నది. ఆయమ శ్రీకృష్ణులవారికి మేనమామభార్య యనియును శ్రీకృష్ణులవారియందు విశేషమోహపరవశయై యుండెననియును జెప్పఁబడియున్నది. అమెవిషయమై 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు కవులయొక్క కల్పనావ్య క్తి దప్ప మరి, యొకటి కా దని చెప్పుచున్నారు. అయితే ఆమెవిషయము కవులయొక్క పెద్దతప్పయియే యుండవలెను. గాని యామె కేపల కవికల్పిత కా దని నాయభిప్రాయము. ఏలనంటే ఆమెవిగ్రహము శ్రీకృష్ణవిగ్రహమునకు బ్రక్క నుంపఁబడి యిండియాదేశమునందంతట నారాధింపఁబడుచున్నయది. కవి కల్పిత యైనచో నటుల నారాధింపఁబడునా ! నే నామెను శ్రీకృష్ణులవారియొక్క ముఖ్యభార్యయగు రుక్మిణీయే యని . దృఢముగను, నిస్సంశయముగను జెప్పఁగలను. మరికొన్ని దేవాలయముల యం దిరుపార్శ్వముల యందును రుక్మిణీసత్యభామలు గల శ్రీకృష్ణులవా రారాధింపఁబడుచున్నారు. గాని నాకు దెలియవచ్చినస్థలములలో నెచ్చటను రుక్మిణీదేవిమాత్రము గల శ్రీకృష్ణులవా రారాధింపఁబడలేదు. రుక్మిణి యనఁగా లక్ష్మీదేవియొక్కయవతారమే యని మనకందరికిం దెలిసినదియేకదా? అట్టిలక్ష్మితో మాత్రము వారి నారాధించుటకుఁగా నీరెండువిగ్రహములు గల యాలయములం గట్టించి ప్రజలు పూజింపగోరి యుండవచ్చును. ఈవిధముగ స్త్రీపురుషద్వంద్వనామములనుచ్చరించునపుడు స్త్రీనామమును ముందుగాను బురుషనామమును వెనుకగాను నుంచి చెప్పుట కలదు. అనఁగా సీతారామ, లక్ష్మీనారాయణ, పార్వతీపరమేశ్వర, అనువిధములు గలవు. అట్టిద్వంద్వనామములు చెప్పునపు డతిసులభముగఁ నుచ్చరింపఁబడుచున్నవి. అయితే రుక్మిణి యను నామము శ్రీకృష్ణనామముతోఁ బయినామములవలె సులభముగఁ బలుకఁబడదు. మరియు బూర్వనిపాతశాస్త్ర విరోధ మనియుం జెప్పుదురు.

లక్ష్మీ సహస్రనామములలో రాథ యనుపేరు లక్ష్మికిం గలదు. ఆసహస్రనామములలో శ్రీకృష్ణనామముతో రాథయను పేరుతప్ప దదితరనామము లంతసులభముగ గలిపి పలుకఁబడవు. గనుక మనకు బూర్ణమైనసంతుష్టి గులుగునటుల నారాథాకృష్ణులు లక్ష్మీనారాయణులయవతారము లని పూజింపఁబడుచున్నారు. ఈవిధముగ నాదిని రుక్మిణియు శ్రీకృష్ణులవారును బ్రజలచేఁ బూజింపఁబడుచుండిరి. భాగవతాదిగ్రంథముల యందు శ్రీకృష్ణులవారు రుక్మిణీయుక్తముగనో లేక యష్టభార్యలనువారితోఁ గలిసియో, లేక మరియేవిధముగ బూజింపఁబడవలెనో చెప్పఁబడి యుండలేదు. ఆగ్రంథములు పుట్టిన యనేక శతసంవత్సరములపిదపనే కాక రాధాకృష్ణులవారి ప్రతిష్ఠకు బిదప మరికొన్ని వందలసంవత్సరములకు బ్రహ్మవైవర్తపురాణ కర్త కా నాలుగుపుస్తకములలో రాధ యనుపేరు కానరానందున దనబుద్ధికొలఁది నీరాథ యెవ రని యోచించుటకు స్వల్పబుద్ధితోఁ బ్రయత్నించి యుండవచ్చును. అటుల నతఁడు పరిశీలించునపుడు ప్రారబ్ధముకొలఁది శ్రీకృష్ణులవారి మేనమామ యగు 'రాయన' యను నతని భార్యకు రాథ యనుబేరు గలిగి యుండినట్లు కనిపెట్టఁబడెను. అప్పటికి భాగవతములోఁ జెప్పఁబడిన రాసక్రీడ మొదలగువ్యభిచార కార్యముల నొప్పించుటకుఁ దగినట్టియు ససత్యములైనట్టియు వారివారికిఁ దోచినట్టికథలతో నతనిమసస్సు నిండియుండవచ్చును. అందు నుండి యతఁడు రాయన యనువానిభార్యయగు రాథను శ్రీకృష్ణులవారితోఁ గలిసి పూజింపఁబడుచుండిన లక్ష్మికిమారుగ బొరపాటుపడి యుండవచ్చును. తననమ్మకమును దృఢపరచుటకుగా బై నాలుగు పురాణముల యందుఁ జెప్పఁబడిన రుక్మిణీ శ్రీకృష్ణులకంటె రాధాగోపాలకృష్ణు లధికులని చెప్పునంతవరకు గథను బోనిచ్చెను. రుక్మిణీదేవియే రాథయని చెప్పుటకు మీ కేమి యాధారము గల దని సభ్యులగు మీరు న న్నడుగ వచ్చును. అనేకశతసంవత్సరములు గడచినపిదప నిప్పటివలె బ్రజలయొక్క యు, దేశముయొక్కయు, చారిత్రము లుంపఁబడకుండినకాలములో ననేకసంగతులు సుతరాము మరచిపోవుటయు జాలవరకు మరచినవిషయములలో నందుకుబదులు క్రొత్తసంగతులు చేర్పఁబడుటయు వాడుకలోఁ గలదు. ఇందుకు దృష్టాంత మే మనిన : మనలోఁ గొంతమంది తప్ప శ్రీజగన్నాధమనఁగ నేమియు దెలియనివారు కలరు. ఆక్షేత్రమునందు శ్రీజగన్నాధుఁడు, సుభద్ర, బలరాముఁడు నను మూడు విగ్రహములు గలవు. మధురలోఁ బుట్టిపెరిగిన శ్రీకృష్ణబలరామ సుభద్రలయొక్క విగ్రహములే యివి యని సాధారణముగ నవివేకవునమ్ముకము గలదు. ఇచ్చట మధురలో సుభద్ర, శ్రీకృష్ణ బలరాములకు జెలియలై యున్నది. జగన్నాధునికి నామె భార్యయై యున్నది. ఇంక మూర్ఖపునమ్మక మే మనిన శ్రీకృష్ణులవారు చెలియలినే జగన్నాధములోఁ భార్యగాఁ బొందెనని యున్నది. ఈకథ మేనమామభార్యయగు రాథకథకంటె మిక్కిలి యసంగతము గదా! అయితే నటుల కాదు. శ్రీకృష్ణులవారు జన్మించుటకు బూర్వమే యీజగన్నాధక్షేత్రము గలదు. ఇప్పుడు జగన్నాధములోఁ బూజింపఁబడుచుండినవిగ్రహములనే బలరాముఁడు, సర్జనుడుఁను దీర్థయాత్రలకు వెళ్లినప్పు డచ్చోటునకుం బోయి పూజించి రనుసంగతి మనమిప్పుడు చదివి తెలిసికొనఁగలము. అయితే, ఈపొరపాటెటుల సంభవించినదో విచారింతము. తమసంతానములో బిల్లవానికి బురుషదైవనామమును, నాడుపిల్లకు స్త్రీదేవతానామము నుంచుట మనలో నాచారమై యున్నది. ఇందుకు నిదర్శన మే మనిన : శ్రీసీతారామనామములలో నొకని కుమారునికి రామనామమును, గుమార్తెకు సీతానామము నుంచుట గలదు గదా! ఆ మొదటి సీతారాములు భార్యాభర్తలై యుండినను వారిపేళ్లను ధరించిన యీబిడ్డలిద్దరు సోదరీసోదరులయి యున్నారు. ఈవిధముగనె వారిజననీజనకులు తమబిడ్డలకు జగన్నాథములోఁ బూజింపఁ బడుచుండు శ్రీకృష్ణబలరామసుభద్రలయొక్క నామముల నుంచియుందురు. శ్రీకృష్ణులవారు తన చెలియలను భార్యనుగాఁ జేసికొనె ననునమ్మక మెంత లజ్జాకరమైనటువంటియు, బావహేతువై నటువంటి తప్పై యున్నదో మీకే విదిత మగుమ. ఈవిధముగనె బ్రహ్మవైవర్తపురాణకర్త రాథ యనునామము గల మరియొకస్త్రీని లక్ష్మీ యనురాథకు బదులుగ దురదృష్టముకొలఁది. బొరపాటుపడి మన మిప్పు డాగ్రంథములోఁ జూచురీతి ససత్యమైనట్టియు, దుష్టమైనట్టి యభిప్రాయమును బొందుటకుఁ గారణమైనది.

శ్రీకృష్ణులవారినిగురించి మరియొకస్వల్పాంశమును మీకు జెప్పవలసి యున్నది. వా రెనమండ్రుస్త్రీలను వివాహమాడిన ట్లున్నది. ఇందుకు నే నాక్షేపింపను గాని రుక్మిణీసత్యభామాజాంబవతులకు వినాగా మరికొందరు భార్య లుండినటుల మహాభారతమునందుఁ జెప్పఁబడి యుండలేదు. రుక్మిణీదేవికంటె నొకరిద్దరు స్త్రీలను వారు వివాహ మాడియుండినను నెనమండ్రుభార్య లుండినటులఁ దగినయుపపత్తి లేదు. అయినప్పటికి నొక భార్యకంటె నెక్కుడుమందిని వివాహమాడినటుల మన మొప్పక తప్పదు. కాన నేల నటుల జేసికొనిరో చూచెదము. ఆకాలములో నిరాకరింపఁబడదగని రెండాచారములు గలవు,

(1) ప్రతిరాజును వివాహమైనవాఁడు గాని, కానివాఁడు గాని, యొకరిచేఁ గోరఁబడినపుడు స్వయంవరమునకు దప్పక బోవలసిన దనియు, స్వయంవరమం దాచిన్నదానిచే వరింపఁ బడినచో నామెను దప్పక వివాహ మాడవలసిన దనియు నాచారము గలదు. (2) ఒకరాజు తనను జయించినరాజునకు దనకుమార్తెనుగాని, చెలియలనుగాని వివాహముకొరకు సమర్పించుట గలదు. అటుల సమర్పించుట, జయింపఁబడినవాని కిష్టముమీఁద నున్నదిగాని, జయించినవానికి మాత్ర మాచిన్నదానిని సంగతిసందర్భములనుబట్టి తనకుగాని తనకుమారునికి గాని వివాహము జేసికొనుట విధివిహితమైన యాచారమై యున్నది.

ఇట్టి యాచార సందర్భములవలన నొక భార్యకంటె నెక్కుడుమందిని వివాహ మాడి యుండవచ్చును. గాని స్త్రీలోలత్వముచేత గాదు. లేదా, మీఁద గనఁబరుపఁబడిన విషయములలోవలె గ్రంథకర్తల పొరబాటులుగ నైన నుండవచ్చును.

మరియొకచిన్నగాథ కలదు. శ్రీకృష్ణులవారు గొప్ప రాజగు నరకాసురుని సంహరించి యాతనియధీనమై యుండు యువతుల నందరిని వివాహ మాడిన ట్లున్నయది. ఈసంఖ్య బహుశః అతిశయోక్తికొరకు గ్రంథకర్తలచే బదియారువేలు మొదలు పదియారువేల నూటివరకు జెప్పఁబడి యున్నది. ఈపొరపా టెటుల జరిగినదో చూచెదము. ఆస్త్రీలందరికి నానరకాసురుఁడు పతి లేక పోషకుఁడై యుండెను. అతఁడు సంహరింపఁబడగానే స్వభావముచేతనే శ్రీకృష్ణులవారియం దాపోషకత్వము వ్యాపించినది. సంస్కృతమునందు బతిశబ్దమునకు 'ప్రభువు' 'పోషకుఁడు' 'భర్త' యనునర్థములు గలవు. 'భూపతి' 'గృహపతి' 'జనపతి' ఇత్యాదులు. గనుక మితిలేని శృంగారకథలతో నిండియుండిన మనస్సులు గల గ్రంథకర్త లాపతిశబ్దమునకు బోషకుఁడను నర్థముం జేయక భర్తయను నర్థముం జేసియుందురు.

ఇంక పశ్చిమదేశపువిద్వాంసు లగు 'మాక్సుముల్లరు' మొదలగువారిచే నెవరియొక్క యుపదేశము లైకకంఠ్యముగ మెచ్చుకొనఁబడి యుండినవో యట్టి శ్రీకృష్ణులవారివిషయమై మన కిదివరలో గలిగియున్నట్టియు, లజ్జాకరములైనట్టియు, వారివారికిఁ దోచినటులఁ జెప్పఁబడినట్టియు, వారివారి యిష్టము కొలఁది విరివి జేయఁబడినట్టి విపరీతభావనలను మీకు సాధ్యమైనంతవరకు బోధపడు నటులుగ వ్యక్తపరిచితి నని తలంచుచున్నాఁడను, అట్టి యసత్యపునమ్మకమునుబట్టియేకదా మన వారిలో ననేకులు అనఁగా గతవర్తమానకాలములయం దుండువారు. పాపభూయిష్టములైనట్టియు బైని చెప్పఁబడినట్టియు, నసత్యములైనట్టియు ననేకములగుతప్పులను జేసియుండునటుల గనిపెట్టుట మిగుల లజ్జాకరమై యున్నది.

ఓస్నేహితులారా! పైఁ జెప్పఁబడినయుక్తులను బ్రమాణములను మసస్సునం దుంచి మన కిదివరకు శ్రీకృష్ణులవారి విషయమై గలిగియున్న యట్టివిపరీతభావనల నొకవైపు త్రోసివేసి సత్యమైనట్టియు బూజ్యమైనట్టియు నడవడిని మనమందర మవలంబింపవలసినవారమై యున్నారము.