శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/పాండవపక్షవీరుల విషయము

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణ.

ఈభాగములోఁ బాండవపక్ష వీరులవిషయము చర్చింపఁబడును.

1.ద్రుపదరాజు.

ఇతఁడు పాంచాలదేశాధిపతి. ద్రౌపదీదేవికి దండ్రి. బాల్యమునందు ద్రోణునితోఁ గలిసి యస్త్రవిద్యను నేర్చికొనునపుడు తనకు రాజ్యాధిపత్యము వచ్చినతరి దనతోఁ గలిసి సమస్తభోగముల ననుభవింప వచ్చునని యతనికిఁ జెప్పియుండెను. ఈద్రుపదుఁడు రా జయినపిదప ద్రోణుఁ డతనియెద్ద కేగి నీబాల్యసఖుఁడ నని చెప్పుకొనఁగా నీవంటిబీదబ్రాహణునికిని నాకును సఖ్య మెట్లు పొసఁగు నని నిరాకరించెను. ఆ ద్వేషమును ద్రోణుఁడు మనస్సునం దుంచుకొని రాజకుమారు లస్త్రవిద్య నభ్యసించినపిదప నాద్రుపదునిఁ బ్రాణముతోఁ బట్టి తెచ్చి తనముందు పెట్టుటయే గురుదక్షిణగ భావించెద నని వారలను గోరెను. ముందు కురుకుమారు లటుల చేయుటకుఁ బ్రయత్నించి ద్రుపదునిచేఁ బరాజితు లయిరి. అప్పు డర్జునుఁడు భీమనకులసహదేవసహితుఁడై వెడలి ద్రుపదుని గట్టి తెచ్చి గురున కొప్పగించెను. బాల్యమున దూరదృష్టి లేకపోయినను జేసినప్రతిజ్ఞను లక్ష్యము చేయక తప్పినందున ద్రుపదున కీపరాభవము సంభవించెను. ద్రోణునిచే విడువఁబడి తనపురి, కేగి తిరుగఁ బగదీర్చికొనుటకుఁ బ్రయత్నింపుచు నుండెను. ద్రోణునిఁ గెలువఁ గోరి తనకుమారుఁ డగు ధృష్టద్యుమ్నునికిఁ బాగుగ నస్త్రవిద్యను నేర్పించెను. అంతటితోఁ దృప్తినొందక గొప్పవీరుని సాహాయ్యమునుఁ గోరి యస్త్రవిద్యను నేర్చినవారికి నెల్ల గష్టతమమైన యొకమత్స్య యంత్రమును నిర్మించి, దాని నెవ్వఁడు కొట్టునో వానికి దనకుమార్తె నిచ్చి వివాహము చేసెద నని ప్రతిజ్ఞ పట్టి చాటించెను. ఎవ్వరికిని గొట్ట శక్యముగాని యామత్స్యయంత్రము నర్జునుఁడు కొట్టి తనతల్లియాజ్ఞవలన జ్యేష్ఠకనిష్ఠసోదరులతోఁ గలిసి యాకన్యను వివాహ మాడెను. భారతయుద్ధమునందు బాండవ పక్షమున సేనలతో వచ్చి యుద్ధము చేసి యీద్రుపదుఁడు తుదను ద్రోణునిచే హతుఁ డాయెను.

2. ధృష్టద్యుమ్నుడు.

ఇతఁడు ద్రుపదునికుమారుఁడు. భారతయుద్ధమునందు బాండవులకు సేనాధిపతిగా నుండి పదునెనిమిదిదినములు మిగుల నేర్పుతో యుద్ధము చేసి యానాఁటిరాత్రి నిదురసమయమున దుష్టతముఁ డగు నశ్వత్థామచేఁ బలాత్కారముగఁ జంపఁ బడెను. ద్రోణాచార్యుఁ డలిసి యుద్ధముచేయలేక ప్రాయోపవేశమునఁ బ్రాణములు విడుచుటకు గూర్చునియుండఁగా నితని కట్టిపని యెందు కనియు, తనతండ్రితలంపు నెరవేర్చుట తనపని యనియు దలఁచి యాద్రోణునితలను నఱికెను.

3. విరటరాజు.

ఇతఁడు మత్స్యదేశపురాజు. మిగుల సత్యకాలపు బెద్ద మనుష్యుఁ డని చెప్పవచ్చును. ఏల యనిన, అజ్ఞాతవాసకాలమున జీవనముకొఱకు బ్రచ్ఛన్న వేషు లై యేకదినమున దన యెదుటికి వరుసగ వచ్చిన పంచపాండవులకును ద్రౌపదికిని వీరు పాండవులా యని లేశమాత్రమును సంశయింపక యాకారములనుబట్టి విచారింపక వేషధారులవేషములను నమ్మి జీవనోపాధులను గల్పించెను. ఇతనికడ ధర్మరాజు యతివేషధారిగను, భీముఁడు వంటయింటియజమానుఁడుగను, నర్జునుఁడు రాజకన్యలకు నృత్యవిద్య నేర్పువాఁడుగను, నకులుఁ డశ్వరక్షకుఁడుగను, సహదేవుఁడు గోరక్షకుఁడుగను, ద్రౌపది విరటునిభార్యయొద్ద సైరంద్రి (అనఁగా నలంకారములు చేయునది) గాను నుండి యజ్ఞాతవాసమును గడపిరి మరియు దక్షిణోత్తరగోగ్రహణానంతర దివసమున బాండవులు ద్రౌపదీసహితముగ మారువేషములను దీసివేసికొని నుస్నాతు లయి విరటుని కంటె ముందుగ సభామంటపమున కేగిరి, ధర్మరాజు తన యనుజు లిరుప్రక్కల గొలిచియుండ విరటునిసింహాసనము పయిని ద్రౌపదీయుక్తుఁ డయి కూరుచుండెను. అటుల నున్న వారినిఁ జూచి యీవిరటుఁడు 'పాప' మెంతసత్య కాలపువాఁడో గాని వారు పాండవు లని తెలిసికొనలేక వారివలననే తెలిసికొని యానందించి యేకాకి యగు తనకుమారునితో యుద్ధమున కేగి కౌరవులను జయించి యతనిని వైరులవలన గాపాడినందున దనకుమార్తెయగు నుత్తరను నర్జునునకు సమర్పించెను. అర్జునుఁ డాయుత్తరకు నృత్యవిద్యను నేర్పినందున తాను స్వీకరింపక తనకుమారునికి జేసికొనియెద నని యా విరటు నొప్పించెను.

ఈ పాండురాజకుమారులు తమయస్త్రవిద్య సభ్యసించుటయే కాక యితరవిద్యలనుగూడ నేర్చికొనియుండినందుననే కదా యజ్ఞాతవాస వత్సరకాలమున బయలుపడక యుండిరి. కావునఁ బ్రతివారు నొకదానికంటె మించినవిద్యలను నేర్చకొని యుండవలెను. అందుఁ బ్రభువులకు గొన్నివిద్యలు వచ్చియున్నను ననేక విద్యావిషయములను దెలిసికొనియుండుట యవసరము.

ఈవిరటుఁడు - భారతయుద్ధమున బాండవులకు సేనలతో సహాయుఁడై తుదను ద్రోణునిచే సంహరింపఁబడెను. .

4. యుధిష్ఠిరుఁడు.

ఇతఁడు పాండుమహారాజు జ్యేష్ఠకుమారుఁడు. ధర్మాధర్మ వివేచనమందు మిగుల బట్టుదల గలవాఁడు కావున ధర్మరాజని ప్రసిద్ధి కెక్కెను. ఈ ధర్మాధర్మవిషయములో నితనికి గలపట్టుదల భారతగ్రంథములో బెక్కుచోటుల గనఁబడుచుండినను శాంత్యానుశాసనికపర్వములలో భీష్ముని నితఁ డడుగుప్రశ్నలనుబట్టిచూడఁగాఁ జదువరులకు స్పష్టముగ దోఁపక మానదు. మరియు ధర్మమునకు గట్టుబడుటలో నితనిని మించినవాఁడు లేఁడు. ఏల యనిన : భార్యావస్త్రాపహరణ కాలమున నితనివలె ధర్మమునకు గట్టుపడియుండినభర్త మరి యుండడు కదా? అందునుబట్టియు నాకాలమున జూదమునకు బిలువఁబడినపుడు నిరాకరించుట కూడనిపని యనుబ్రసిద్ధి ననుసరించి మొదటిద్యూతమునకు వచ్చి కపటముగ నోడింపఁబడి దానిం దెలిసియు రెండవసారి జూదమునకు బిలువఁబడి యేగి యోడి యరణ్యాజ్ఞాతవాసములలో శ్రమను బొందెను. దీనివలన నీతని నతిధర్మరా జని చెప్పవచ్చును. (అతి సర్వత్ర వర్జయేత్) ఇతనికి జూదమునం దెంత యాసక్తియో కాని యజ్ఞాతవాససమయమందు యతివేషమును దాల్చియు విరట రాజుతో నెల్లప్పుడు బాచిక లాడుచునే యుండెను. ఎవరికి గాని యెట్టివ్యసనములయందైనను నావ్యసనములకు దానులై యుండఁ దగదు. అందుఁ బ్రభువులగువారు మిగుల జాగ్రత్తగ నుండవలెను.

వారణావతమున లక్క యిండ్లలో గాల్పఁబడక తప్పించుకొనిపోయి తిరుగ దనపెదతండ్రియొద్దకుఁ బోయినను. బాహాటముగ ఒకచోట నివసించియుండిననుఁ దనకును, దనవారికి, నాపదలు కౌరవులవలన సంభవింపక మానవని ముందు యోచనకలిగి యేకచక్రపుర మను నొకబ్రాహ్మణుల పల్లెలో నుండి తననుఁ దనవారినిఁ గాపాడుకొనెను.

అర్జునుఁడు మత్స్యయంత్రమునుఁ గొట్టి ద్రౌపదిని వీర్య శుల్కనుగా స్వీకరించినపిదప దల్లియాజ్ఞను మీరలేక ధర్మరాజు తననలుగురుసోదరులతోడ నామెను వివాహమాడెను. ఇట్లు సోదరు లొకదానిని వివాహమాడుటకు ధర్మశాస్త్ర మొప్పదు. ఇందుకు మాత్రాజ్ఞయే కారణ మని తీసికొందమా యనిన నాకాలమున నట్లు చేయుట బాగుగ నుండిన నుండవచ్చును గాని యీకాలములో దూష్యమై యున్నది. పితరులయాజ్ఞను బ్రతివారును మీరకూడ దని సాధారణనీతి యుండినను నా కార్యము యొక్క మంచిచెడుగులను యోచించి మంచిపనుల యందు నడచుకొనవలెను. అందు స్త్రీలు నియమించువిషయములలో నిండుగ విచారింపవలెను. ద్రౌపదీదేవి యైదుగురు భర్తలు కలది యగుటచేతనేకదా యామెకు వస్త్రాపహరణము చేయుట తప్పు గాదని కర్ణుఁడు పలికెను. ఆయుద్దేశముతోనే దుర్యోధనుఁ డామెను సభకు రప్పించి యుండును. ఆదుష్టుల దుర్మార్గత చెప్ప నేల ! వేశ్యనైనను లేదా ఎట్టిగుడిసేటుదానినైనను సభయందుగాని నలుగు రుండుచోటఁగాని వస్త్రవిహీను రాలినిగ చేయవచ్చునా ? మరియుఁ బాండవులకు బావమరది వరుసగల సైంధవుఁడు నరణ్యవాసమం దున్నద్రౌపది నైదుగురు భర్తలుగలది యనియేకదా యీడ్చుకొనిపోయెను. ఆపిదప భీమార్జును లతనినిఁ బట్టి కట్టి తెచ్చుట యాపయిని తల గొరిగి యూర్ధ్వపుండ్రము లుంచి పాండవదాసునిగాఁ బ్రదుకుమని విడుచుట జరిగియున్నది.

ద్రౌపదీవివాహానంతరమున ధృతరాష్ట్రుడు పాండవులను బిలిపించి వారియర్ధరాజ్యమును ధర్మరాజున కిచ్చెను. ఇటుల కొంతకాలమైనవెనుక ధర్మరాజు రాజసూయమను నొక గొప్పక్రతువును జేసెను. మొదటినుండియు బాండవులయెడ మత్సరబుద్ధితో నున్న దుర్యోధనుఁ డాక్రతువుయొక్క వైభవమును, రాజులు దెచ్చినకానుకలను, ధర్మరాజునం దితర రాజులకు గలగౌరవమునుఁ, జూచి మరియు మచ్చరించెను. ఆపయిని జరిగినకపటద్యూతాదులవిషయ మిదివరకే చెప్పఁబడియున్నది.

పాండవు లరణ్యవాసమున నుండుతరి దుర్యోధనుఁడు ఘోషయాత్రకుగా వెడలి గంధర్వులచే బట్టువడి విడిపింపఁ బడెననువిషయ మిదివరకే వ్రాయఁబడి యున్నది. బంధుమిత్రుల కితరులవలన నాపదలు సంభవించినపుడు వారలను గాపాడుట నిస్సందేహముగా ధర్మమే. అయితే ఈదుర్యోధనుఁడు బాల్యమునుండియు బాండవులకుఁ గీడు గోరుచు లక్క యిండ్లలోఁ బెట్టి చంపఁబూనెను. మొదటిసారి కపట ద్యూతమున సర్ధరాజ్యమును, భార్యాసహితముగ బాండవులను, గెలుచుకొనెను. రెండవసారి మొదటివిధమున గెలిచికొనినయెడల ముసలివాఁడగు తనతండ్రిచే నర్థరాజ్యము తిరుగ నిప్పింపఁ బడుచునేయుండు నని తలఁచి యరణ్యాజ్ఞాతవాసముల నోడినవారు చేయుటకు నిర్ణయించి కపటద్యూతమునఁ బాండవులను గెలిచెను. ఇటుల చేసినచో నజ్ఞాతవాసమున దప్పక బయలు పడుదు రనియు నరణ్యవాసమునందు శ్రమచే శుష్కించి బలహీనులు కాగల రనియు నీపదుమూడు సంవత్సరములు బంధుమిత్రుల కెడ మగుదు రనియు దలఁచి గెలిచెను. కావున దుష్టబుద్ధితో నిట్లు విరోధి యై యున్న యీదుర్యోధనుని విడిపింపు మని సోదరులను బంపుట యనుచితము. అటుల నీధర్మరాజు చేయుటయే యీభారతయుద్ధమునం దనేకులు మడియుటకుఁ గారణ మైనది.

పాండవులు సంధికొఱుకు ద్రుపదపురోహితునిఁ బంపఁగా దుర్యోధనాదులు సదుత్తరము చెప్పిపంపక వెంటనే సంజయుని దమదూతగా ధర్మరాజునొద్దకుఁ బంపిరి. అపుడు పాండవులు తమకు నొప్పుదలప్రకార మర్థరాజ్యము నీయనిచో రాజధర్మమగుయుద్ధమున రాజ్యము నొందుదు మని తీక్ష్ణముగాఁ బ్రత్యుత్తర మిచ్చి సంజయునిఁ బంపిరి. తిరుగ ధర్మరాజు తాను శ్రీకృష్ణులవారిని గౌరవులకడకు సంధికొఱ కనుపునపుడు చివరకు దమయైదుగురికి నైదుపల్లె లిచ్చిననుఁ జాలు నని చెప్పిపంపెను. అట్లు కురురా జైదుపల్లె లిచ్చినచో వీరిపని యేమి యగును? ఇట్టిమహావీరు లైదుపల్లెలే కాదు. కొన్ని గ్రామములు గల యొకచిన్న రాజ్యమును సంపాదించుకొనఁజాలరా? లేదా బంధువులగు ద్రుపదవిరాటులయొద్ద నీపాటి భూస్థితిని బొందలేరా! ఇది యెట్లున్న దనిన - 'రావణుఁడు వచ్చి శరణుజొచ్చినయెడల దనయయోధ్యారాజ్యము నతనికి నిచ్చెద' నని శ్రీరాములవారు విభీషణ శరణాగతిసమయమున సెలవిచ్చిన ట్లున్నది. అయితే శ్రీరాములవారు సర్వజ్ఞులు, ధర్మరాజట్టివాఁడు గాఁడు. . కావున నితఁ డట్లు చేయుట తగినపని కాదు. ఈధర్మరాజు కోరిక లె ట్లుండినను సంజయుఁడు తన యొద్దకు వచ్చినప్పుడు పట్టుదలతో నర్థరాజ్యము నడుగుటకును శ్రీకృష్ణులవారినిఁ బంపునపుడు ముందువలె గాక యెంతైనను దగ్గించి యడుగుటకును గారణ మే మని విచారింతము. ఎదుటివాఁడు సంధిని గోరినపుడు బింకముగ బలుకుటయు దాను రాయభార మంపునవుడు గొంత సుళువుగ నడుగుటయుఁ గలదు. అయితే ధర్మరా జైదుపల్లెలైన జివరకు నిమ్మని చెప్పి పంపినందుకు నాదుర్యోధనుఁ డీతని నిండుదీనత నెఱిఁగి సూదిమొన మోపినంతస్థలమైన నీయ నని నిరాకరించెను.

ఈధర్మరాజు యుద్ధమధ్యమున భీష్మునియొద్దకు బ్రచ్ఛన్నముగఁ బోయెను. ద్రోణాచార్యునివధకొఱకు ననృత మాడెననువిషయము లుపోద్ఘాతమున జర్చించి పరిష్కరింపబడి యున్నవి.

పదునెనిమిదవనాటి యుద్ధమునఁ గౌరవసేనాధిపతియగు శల్యుని నీధర్మరాజు హతునిగఁ జేసెను.

దుర్యోధనుఁడు డాగియున్న చోటి కరిగి యతనిని ద్వంద్వ యుద్ధమునకుఁ బిలిచినపుడు తమయైదుగురిలో నొకని నెంచుకొను మనియు, నతని దుర్యోధనుఁడు జయించినచో రాజ్యమును విడుచుకొనియెద ననియు, నొకపందెము వైచెను. పాండవులయదృష్టముకొలఁది నాదుర్యోధనుఁడు భీము నెంచి కొనుటయు నతనిచేఁ గూల్పఁబడుటయు జరిగెను. అట్లు పందెము వైచినందుకు శ్రీకృష్ణులవారు తిరుగ జూదమునే తెచ్చి పెట్టితివా యనియు, నిన్ను గాని నీపిన్నతమ్ము లిద్దరిలో నొకనినిగాని కోరినయెడల మీ రేమిచేయగల రనియు, దూలనాడిరి. భీమగదాహతుఁడై క్రిందఁబడియున్న యా దుర్యోధనునకు బ్రాణములు విడుచునంతవరకు నుపచారములు చేయుటకు భృత్యుల నియమింపక యీధర్మరాజు పోవుట మంచిపని కాదు. అటుల చేయుటచేతనేకదా దుర్యోధనుని యొద్ద కశ్వత్థామాదులు వచ్చుటకు వీలు కలుగుటయు, తమ రాజుయొక్కదురవస్థనుఁ జూచి వార లతికోపోద్దీపితమానసు లగుటయు, నం దశ్వత్థామ పాండవులశిబిరమునఁ జొచ్చి నిద్రించుచున్న వీరుల ననేకులను జంపుటయుఁ గలిగెను.

యుద్ధానంతరమున ధర్మరాజు పట్టాభిషిక్తుఁ డయి యశ్వమేధాదిక్రతువులను జరిగించెను. వృద్ధులగు గాంధారీధృతరాష్ట్రుల నతిగౌరవానురాగములతో నాదరించెను. అభిమన్యునిపుత్రుఁడగు పరీక్షిత్తు పెద్దవాఁ డయినపిదప నాతనిని రాజ్యమున కభిషిక్తునిగఁ జేసి ధర్మరాజు గతించినసూర్యచంద్ర వంశపురాజులమార్గము ననుసరించి తమ్ములతోను, ద్రౌపదితోను, నుత్తరాభిముఖుఁడయి యరిగెను. అచట వారలు లోకాంతరగతు లగువరకును గాలమును గడపిరి. అయితే ఒకవిధముగ వారలు లోకాంతరగతు లయి రని భారతము నందుఁ జెప్పఁబడి యున్నది. కాని వా రడవి కేగినపిదప నే విధముగ లోకాంతరగతు లైరో యెవరికి దెలియఁగలదు ?

ఈయుధిష్ఠిరుఁడు ధర్మమునం దధికదృష్టి నుంచుటను బట్టియే ధర్మరాజని పిలువఁబడెను. ధర్మయుక్తముగ బాలింపనివాఁడు రా జగునా ? అయితే రాజులకు మించినధర్మమును కొన్ని సమయములలో గనఁబరచినందున ధర్మరా జనెడు పేరును బొందెను.

5. భీముఁడు.

ఇతఁడు పాండుమహారాజు రెండవకుమారుఁడు. ఆకాలపువారిలో నధికతమమైన బలము గలవాఁ డగుటచేఁ బంచ భూతములలో మహాబలుఁ డనుపేరుగల వాయువునకు బుత్రుఁడని తలంచిరి. బలవంతుఁ డగుటచేతనే బాల్యమున దుష్ట ప్రవర్తనలు గల కురుకుమారుల నాటలయందు శ్రమపరచుచు నుండెను. అదిమొదలుగ నితనియందు గౌరవులకు, ద్వేష మభివృధి నొందుచు వచ్చెను.

లక్కయిండ్లనుండి తప్పించుకొనిపోవునపు డీభీముఁడు జననీసోదరులను నిండుగ గాపాడెను. రాజసూయయాగమునకు ముందు తనయన్నపనుపున నీతఁడు తూర్పుదిక్కున కేగి యాదేశములను జయించెను.

ద్రౌపదీవస్త్రాపహరణసమయమున భీముఁడు వస్త్రము లొలిచినందుకు రణమున దుశ్శాసనుని యురమునుజీల్చి హృదయరక్తపానమును జేసెద ననియును, ద్రౌపదిని దనతొడ మీఁద గూర్చుండు మని సంజ్ఞ చేసినందుకు దుర్యోధనుని తొడలు విరుగఁ బడవైచెద ననియుఁ, బ్రతిజ్ఞ చేసెను. దక్షిణగోగ్రహణ సమయమున సుశర్మ విరటరాజును బట్టుకొనిపోవుచుండఁగ నీభీముఁ డరిగి యతనిని విడిపించి సుశర్మను బట్టి కట్టితెచ్చి తనయన్న కొప్పగించెను. ఆధర్మరాజు ఘోషయాత్రయందు దుర్యోధనుని విడిపించినరీతి నీసుశర్మను విడిపించి పంపివేసెను. యుద్ధమునకం టె బూర్వ మప్పుడప్పుడు హిడింబ బక జరాసంధ కిమ్మీర జటాసుర కీచకాది మహావీరుల నీభీముఁడు సంహరించెను.

భారతయుద్ధమునం దీభీముఁడు సైంధవవధనాఁడు ధర్మరాజుపనుపున నర్జునునకు సహాయుఁడుగ నరుగుచు ద్రోణునిచే నడ్డగింపఁబడెను. అప్పు డతనిని లక్ష్యపెట్టక భీముఁడు రథముఁ డిగ్గి ద్రోణునిరథముయొక్క నొగలనుఁ బట్టుకొని తనభుజశక్తిచేఁ ద్రిప్పి పడద్రోసెను. అప్పుడు ద్రోణుఁడు రథమునుండి క్రిందికి దుమికి తప్పించుకొనెను.

కర్ణుని రెండవనాటియుద్ధమున భీముఁ డతనిని మూర్ఛితునిగాఁ జేసి గతప్రాణునిగాఁ దలఁచి సభయందు దులుపమాట లాడినందుకు నాలుక గోయ సమకట్టఁగా సారధియగు శల్యుఁ డిది మూర్ఛకాని చావుకా దనియు, నివుడు నాలుకఁ గోసిన యెడలఁ జచ్చుననియు, నట్లు నీచేఁ జంపఁబడినచో నీకర్ణుని జంపుదు నని చేసియున్న యర్జునుని ప్రతిజ్ఞకు భంగము గలుగుననియుఁ నేర్పుతో జెప్పఁగాఁ గ్రోధావిష్టమానసుఁడై యుండియు నాలుక గోయక మరలెను. శల్యుఁడును గర్ణుని నావిధముగఁ గాపాడెను. నాటిదినముననే దుశ్శాసనుని గ్రిందఁ బడవైచి భీముఁ డతనివక్షస్థలమునుఁ జీల్చి హృదయరక్తమునుఁ ద్రాగి ప్రతిజ్ఞ నెరవేర్చుకొనెను.

పదు నెనిమిదవనాఁడు దుర్యోధనుని గదాయుద్ధములో దొడలు విరుగగొట్టి రెండవప్రతిజ్ఞను నెరవేర్చుకొనెను . అయితే అట్లు క్రిందఁబడియున్న రారాజుతలను రెండుమారులు తన్నెను. అది సరికా దని భీముని ధర్మరాజు తూలనాడెను. సౌప్తికవధానంతరమున నశ్వత్థామను బట్టుటకు ద్రౌపదిపనుపున నేగెను. ఆపయిని జరిగినకథ యశ్వత్థామచరిత్రమున వ్రాయఁబడియున్నది. పాండవులలోనే కాక పాండవసేనలోఁగూడ నింతధైర్యశాలి యభిమన్యుఁడు తప్ప మరియెవ్వఁడును లేఁడు.

6. అర్జునుఁడు.

ఇతఁడు పాండుమహారాజునకు మూఁడవకుమారుఁడు. శ్రీకృష్ణులవారిసఖుఁడు. ద్రోణాచార్యునియొద్ద సస్త్రవిద్య నభ్యసించినవారిలో నధికుఁడు. కావున నతనికి ముఖ్యశిష్యుఁడు. దేవతలందరిలో నింద్రుఁ డెట్టు లధికుఁడో యటుల నప్పటి కాలపుబ్రసిద్ధవీరులలో నితఁ డధికుఁడుగావున నింద్రాంశ సంభూతుఁడని యెన్నిరి. గురువునాజ్ఞచొప్పున ద్రుపదపురమున కేగి యితరశిష్యులకు సాధ్యముకానియప్పు డీయర్జునుఁ డా ద్రుపదునిఁ బట్టి తెచ్చి గురువునకు దక్షిణగా సమర్పించెను.

ద్రౌపదీస్వయంవరమునకుఁ బోవునపు డంగారపర్ణుఁ డనుగంధర్వుని యుద్ధమున నోడించెను. ఆపిదప ద్రుపదపురమునకు జేరి రాజమండలము చూచుచుండఁగా వారి కసాధ్యమయిన మత్స్యయంత్రమునుఁ గొట్టి ద్రౌపదిని వీర్యశుల్కగాఁ బడసెను. అప్పుడు తనపయి యుద్ధమునకు వచ్చిన కర్ణశల్యాది వీరులను భీమసహాయుఁడై జయించెను. ముందా సభలోఁ గూరుచుండునపుడు బ్రాహ్మణవేషధారులగు నీపాండవులను శ్రీకృష్ణులవారు మాత్రము గురుతుపట్టి బలరాములవారికిఁ దెలియఁజేసిరి. తక్కినవారు వీరి నెఱుఁగరు. అటుల దెచ్చిన ద్రౌపదిని దల్లిమాటనుబట్టి నలుగురు సోదరులతో వివాహ మాడెను. ఇట్లు వివాహ మాడి కొంతకాల ముండినపిదప దీర్థ యాత్రలకుగా నర్జునుఁడు బయలుదేరి ముందుగ గంగాద్వారమున కేగి నాగు లనుతెగవారి రాజపుత్రికయగు నులూచిని విహహ మయ్యెను. అచటినుండి దివ్యనదులలో స్నానము జేయుచుఁ గ్రమముగ బదరీనారాయణము, గయ, శ్రీజగన్నాథము, భీమేశ్వరము, శ్రీశైలము, కావీరీసాగరసంగమము సేవించి మణిపూరపురముఁ జేరెను. ఈపట్టణము మలయాళ దేశములోనిదై యున్నది. అచటి రాజకుమార్తెయగు చిత్రాం గదనువివాహమయి గోకర్ణప్రభాసతీర్థములను సేవించి యతి వేషమున ద్వారకానగరముఁ జేరి యచట శ్రీకృష్ణులవారి యనుమతిని సుభద్రను బరిగ్రహించి, స్వస్థానమగు నింద్రప్రస్థపురముఁ జేరెను. అటుతరువాత ఖాండవదహనపుగథ కలదు. చదువరులు సంగతి సందర్భములను బాగుగ నాలోచించినచో నీకథ కర్ణునిచే నర్జునునిమీఁద వేయఁబడిన సర్పముఖశరముయొక్క మహిమకొరకు గల్పింపఁబడిన దని తోఁపక మానదు. సర్వభక్షకుఁ డగు నగ్ని కజీర్ణ మెట్లు కలుగును ? అర్జునుఁ డతితీవ్రముగాఁ బాణము వేయఁగలిగియుండినను, నా బాణముల నాధారములేని యంతరిక్షమున నెట్లు పందిరివలె నిలిపెను ? ఇంద్రునకు భూలోకమునం దీవన ముండుటకుఁ బ్రయోజనమేమి ? ఇట్లింక ననేకముగా నసందర్భములు గలవు..

రాజసూయయాగపుసభను మయుఁ డనువాఁడు చిత్ర తరముగ నిర్మించె ననియు, నర్జునుఁడు ముం దెప్పుడో యితనితో సఖ్యము చేసికొనె ననియుఁ గలదు. ఇందుకు నొకగాధయు నద్భుతమైన సభావర్ణనమును గల్పింపఁబడి యున్నది. మరి యేమియై యుండు ననిన:- దక్షిణదేశ వాసియైన మయునితో నర్జునుఁడు తీర్థయాత్ర కేగినపుడు సఖ్యము చేసియుండవచ్చును. అయితే అతఁడు రాక్షసుడుగాఁడు. తంజావూరు సమీపమున నుండు పట్టణమునం దుండువాఁడై యుండును. ఇప్పటికిని నాప్రాం తమువారు కాకిబంగారము, ముచ్చరేకు మొదలగువానితో నద్భుతముగ బందిళ్లు వేయుట కలదు. నల్లగా నుండుటను బట్టి యతనిని రాక్షసుఁ డని తలంచిరి.

ధర్మరాజు రాజసూయయాగము చేయుటకుముందీ యర్జునుఁ డుత్తరదిక్కునకుఁ బోయి జయించి వచ్చెను. రెండవ జూదము ననంతరమున నరణ్యమునకుఁ బోవునపుడు యుద్ధమున గర్ణాదిదుర్జనులను జంపుదు నని ప్రతిజ్ఞ చేసెను.

అరణ్యవాసమునం దీయర్జునుఁడు శివునికొరకు దపస్సు చేసి యతనితో యుద్ధము చేసి మెప్పించి యతనివలన బాశుపతాస్త్రలాభమును బొందెను. ఆపయి నితరదిక్పాలకుల వలన మఱికొన్ని యస్త్రములనుఁ బడసెను. ఆపిమ్మట నింద్ర లోకమున కేగి యచట నివాతకవచులను సంహరించె ననుగథ గలదు. ఆవిషయ ముపోద్ఘాతమునఁ జర్చించి పరిష్కరింపఁబడి యున్నది.

దక్షిణగోగ్రహణనివారణార్థము విరటరాజుతోఁ దన సోదరులు నలుగురు నేగినపిమ్మట నుత్తరమం దున్నగోవులరక్షణముకొరకు నీయర్జునుఁ డుత్తరునకు సారధిగా నుండి యేగి కురుసేనను జూచి జడిసినయుత్తరుని దిట్ట దీర్చి తనకు సారధిగాఁజేసికొని కౌరవులతో యుద్ధముచేసి గోవులను మరల్చెను. ప్రభువుయొక్కగాని తనయన్నయొక్కగాని యాజ్ఞ లేకుండగనే యిటుల తనరూపమును బయలుపరచుట జూడఁగా నీయర్జనుఁ డజ్ఞాతవాసకాలపూర్తినిఁ దెలిసికొనియె యిట్లు చేసినట్లు స్పష్ట పడును,

సేనోద్యోగసమయమున నీయర్జునుఁడును దుర్యోధనుఁడును నించుమించుగ నేకకాలమున ద్వారకకు బోయి శ్రీకృషులవారిసాయము నిరుపక్షముల వారును గోరిరి. అపుడు శ్రీస్వామివారు నారాయణ గోపాలురను పదివేల రథికులను యుద్ధసాహాయ్యముకొరకొకవంతుగను, యుద్ధము చేయక యొకపక్షమున మేలు గోరుచు దా నుండుట యొకవంతుగను నేర్పరచి వంతులను గోరుకొనుటలో జిన్నవాఁడు ముందుగ గోరుకొనుట యాచారము గాన నర్జునుని ముందుగ గోరుకొను మని సెల విచ్చిరి. ఈయర్జునుఁడు శ్రీస్వామివారినే కోరుకొనెను. యుద్ధముచేయని యీస్వామికంటె బదివేవురు రథికులు దనకు దొరికి రని మెచ్చుకొని దుర్యోధనుఁడు సంతసించి వెడలెను. అప్పుడు శ్రీస్వామివారు యుద్ధముచేయని నన్నేల నీవు కోరికొంటి వని యర్జును నడుగఁగా నతఁ డీక్రింది విధమున మనవిచేసికొనెను:--

క. "అనుటయు నాతఁడు హరి కి
    ట్లను నేను రణంబునకు సహాయత యొల్లన్

     విను సుప్రసిద్ధుఁడవు నీ
     వని సేసినబేరు నీక యగు నెపాటన్.

వ. నీ కెదురై జయంబు గొనరాదు. అట్లగుటంజేసి విజయ మూలం బగు నీతోడును వలయు, నీవు సమరంబుసేయ కునికియ ప్రియంబు. కావున నిన్నుం గోరికొంటి నని చెప్పి మఱియు ని ట్లనియె.

క. సారథ్యం బొనరింపు మ
    పారకృపాలీల నెల్లభంగుల ననికిన్
    గౌరవమున జిరకాలము
    గోరిన యది దీని నిమ్ము గుణరత్ననిధీ”

అందుకు శ్రీస్వామివా రిట్లు సెల విచ్చిరి.

క. అనిన గిరీటికి హరి యి
   ట్లను నీదగుకోర్కె దీర్చు టది నాకు వ్రతం
   బనఘాతగ సారధ్యం
   బొనరించెద నీకు నసమయుద్ధక్రీడన్.”

ఫలములు కార్యాంతములయందు వారివారిప్రారబ్ధము కొలఁది దటస్థపడినను విరోధులుగానుండి తనయొద్దకు సాయముఁ గోరి వచ్చినయర్జునదుర్యోధనుల నీస్వామి సర్వసముఁడు కావున నే యుభయులను సంతుష్టులగువారినిగఁ జేసిపంపెను. ఉభయసేనలును గురుక్షేత్రము నందు గూడినపిదప నొకనాఁ డుభయబలములను జూచుకొనుటకు యుద్ధభూమి యందు నిలువఁబడియుండఁగా నర్జునుఁడు కౌరవసేనలోని సోదర సుత మాతులా చార్యాదులగు బంధు శిష్ట జనంబులం జూచి వారలఁ జంపుటకు మన సొప్పక నే నిట్టివారి నెటులఁ జంపుదు నని విషణ్ణుఁడయి శ్రీకృష్ణులవారితో మనవిచేయఁగా నవుడు శ్రీస్వామివారు భగవద్గీతల నుపదేశించిరి. ఈగీతలనుఁ బరమేశ్వరుఁ డొక్కఁ డని యొప్పిన యాస్తికమతస్థులందరును గొనియాడుచున్నారు. అందు మనత్రిమతస్థులు నైకకంఠ్యముగ బరమప్రమాణముగఁ దీసికొనియే యున్నారు. ఈగీతోపదేశము కేవలము యుద్ధారంభమునకు ముందుగ జరిగిన దని చదువరులు చాలమంది పొరబాటుపడియున్నారు. అట్లు కాదు.

అ ట్లయినచో యుద్ధారంభసమయమున నాయుధముల విడిచి ధర్మరాజు పాదచారియై భీష్మద్రోణాదులకడ కేగి వారి యనుమతి నేల పొందవలెను ? ఆదినము యుద్ధదినమే యయి యుండినచో వారియనుమతిలేక యుద్ధమునకు వచ్చినవాఁ డయియే యున్నాఁడు. వ్యూహములు తీర్చి సేనలు నిలువఁబడియుండినపుడు యుద్ధమున కనుజ్జు నిచ్చిన యాభీష్మాదు లొకచోట నుండరుగదా! ఆమహాసేనయందు జెదరియున్న వారి యొద్దకు గౌరవతారతమ్యానుసారముగ బోవుట కెంతకాలము పట్టును? ఇంతియకాక యిటుల ధర్మరాజు వారివారియనుజ్ఞను బొందివచ్చినపిదప యుద్ధము నారంభింపకముందు దుర్యోధనుఁడు ద్రోణాచార్యునియొద్దకు రథమును దోలించి యతనితో సేనావిషయమైన ప్రస్తావము జేసి యున్నాఁడు. అటుతరువాతనుగూడ నారంభము జరుగలేదు. ఆపయి నర్జునుఁడు తన రథము నుభయసేనలమధ్యమునకు దీసికొనిపోయి యుంచుమని శ్రీకృష్ణులవారిని గోరుటయు నపు డారథముమీఁదనుండి ప్రతిపక్షసేనలోని కావలసినవారినిఁ జంపుట కర్జునుఁడు శంకితుఁ డగుటయు, నట్టివానికి శ్రీస్వామివారు భగవద్గీతల నుపదేశించుటయు జరిగెను.

ఇందుల కెంతయోకాలము పట్టియుండవలెను గదా! అదియే యుద్ధప్రారంభదివసమైనయెడల మీఁదవ్రాసిన విషయములు జరుగుట కవకాశ ముండునా ! యోచింపుడు. అయితే మరియేమి యనిన యుద్ధారంభమునకు ముం దొకనాఁ డుభయపక్షములవారును దమతమసేనలను రణభూమియందు నిలుపుకొని యుద్ధసంబంధమైన యవకాశములను సుళువులను దూరములను జూచుకొన్నట్లు స్పష్టపడుచున్నది.

శ్రీకృష్ణులవారికిని, బాండవసేనకుబ్రభువగు యుధిష్ఠిరునకును గలుగని యీశంక తనవారినిఁ జంపుటకయి యర్జునున కేల గలిగినదో కొంచెము విచారింతము. శ్రీకృష్ణులవారు సర్వేశ్వరుడును, సృష్టికర్తయును, సర్వజ్ఞుఁడును గావున నేయే కార్యములను నీజన్మయందుఁగాని గతజన్మలయందుఁగాని చేసిన వారి కేయేఫలములు గలుగునో యది యెరుగుదురు. అట్టి కార్యాకార్యములఫలముల కొకచట్టము నేర్పరచి మనుజునకు స్వాతంత్ర్యము నిచ్చి సృష్టిచేసి యున్నారు. కావున వారి కేశంకయు గలుగుటకుఁ గారణము లేదు. సర్వజ్ఞుఁడు కాబట్టి యే భీష్మాదులు చచ్చుటకు సిద్ధముగ నున్నారు నీవు నిమిత్తమాత్ర మని చెప్పి యర్జునునకు మనఃకల్మషమునుఁ బోఁగొట్టిరి. ఇఁక ధర్మరాజువిషయము చూతము. ఇతఁడు ప్రతిజ్ఞను నెరవేర్చి తనరాజ్యభాగమును ధర్మయుక్తముగఁ గోరి యుద్ధముచేయ సమకట్టి యున్నాఁడు. ఇందుకుగా ననేకవీరులను రప్పించియున్నాఁడు. మరియు నుభయసేనలలో నెవ్వరివలన నెవ్వరు మడియుదురో తనకుఁ దెలియదు. అట్టివాని కీశంక గలుగుటకు గారణము లేదు. అర్జునుఁడు శ్రీస్వామివారివలె సర్వజ్ఞుఁడుగాఁడు. అయినను జ్ఞానము వివేకము గలవాడు. ఆకౌరవసేనలోని వీరులను జూచినపుడు భీష్మాదులనుఁ జంపుటకు దనకంటె మరియొకఁడు తమసేనలో లేఁడని యెరుగును. అట్టి వారలను జంపుటకుఁ గొంత సందేహించియుండిన నుండును. సమర్థుఁ డయినవాఁడే కార్యప్రారంభమునందు గీడుమేళ్లను గమనించుట సహజమైనపనియై యున్నది కదా? తనమీఁద నెదిరించి యుద్ధము చేయని భీష్మునితో నతనికి బరమశత్రువగు శిఖండిప్రక్కనుండి యుద్ధము చేసి కురు సేనాధిపతియగు నాభీష్ముని నేలం గూల్చెను. సైంధవవధనాఁడు కురుసేన నొంటరిగ జొచ్చి చాలసేనను జంపి చివరకు సైంధవుని తలఁ దునిమి ప్రతిజ్ఞను దీర్చికొనెను. పదునేఁడవదినమున నప్పటికురుసేనాధిపతియగు గర్ణునితోఁ ద్వంద్వయుద్ధము చేసియుభయ సేనలవారును మెచ్చుకొనునటు లతనిఁ జంపి శిబిరమునం దున్న ధర్మరాజుకడ కేగి యతనిని సంతుష్టాంతరంగుని జేసెను.

యుద్ధానంతరమున నశ్వత్థామ నోడించుటయు నతని శిరోమణినిఁ దెచ్చి ద్రౌపది కిచ్చుటయు నిదివరకే వ్రాయఁబడి యున్నది

అనంతరము ధర్మరాజుచేఁ జరుపఁబడిన యశ్వమేధయాగమునకుగా నశ్వమువెంటఁ దిరిగి నలుదిక్కులు జయించివచ్చెను.

ఈ యర్జునుఁడు తనపౌత్రుఁడగు పరీక్షిత్తుయొక్క పట్టాభిషేకానంతరము తనయన్నతోఁ గలిసి యడవి కేగి యచట గాలముఁ గడపుచుఁ బరలోకప్రాప్తి నొందెను.

7. నకులుఁడు.

ఇతఁడు పాండుమహారాజు నాలుగవకుమారుఁడు. అతని రెండవభార్యయగు మాద్రీదేవికిం దొలిపట్టి. ఆదేవి చాల యందకత్తె గావున నితఁడును నితనితమ్ముఁడగు సహదేవుఁడును మిగుల సౌందర్యముగలవారు. ఈనకులున కశ్వశిక్షయందును రక్షణవిద్యయందును గడునేర్పు గలదు. ఈవిద్యవలననే యజ్ఞాతవాసమున దననుఁ దాచికొనెను. ఈతఁడు యుద్ధము నందు గర్ణునికొడుకులగు, సత్యసేన చిత్రసేన సుశర్ము లనువారినిఁ జంపెను. ధర్మరాజు రాజసూయయాగముఁ జేయునపుడు పశ్చిమదిక్కున కేగి యాదేశపురాజులనుఁ జయించెను. చివరకు ధర్మరాజుతోగూడ నడవికిఁ జని క్రమముగ గాలము గడపుచుఁ బరలోకము నొందెను.

8. సహదేవుఁడు.

ఇతఁడు పాండుమహారాజు కనిష్ఠపుత్రుఁడు, నకులునివలె సౌందర్యముగలవాఁడు. నీతిమంతుఁడు. ధర్మాధర్మముల నెఱిఁగినవాడు. గోరక్షణవిద్యయందు నేర్పరి. అవిద్యవలననే యజ్ఞాతవాసమున గాలమును గడపెను. రాజసూయయాగమునకుముందు దక్షిణదిక్కున కరిగి యాదేశపురాజులను గెలిచి ధనముం గొని తెచ్చెను.

రాజసూయానంతరమున నగ్రపూజ కెవ్వఁ డర్హుఁడో యని చూచుతరి భీష్ముడు "స్నాతకుఁడును, ఋత్విజుఁడును, సద్గురుఁడును, ఇష్టుఁడును, భూతలేశుఁడును, సంయతుండును నను వీరు పూజనీయులు. వీరిలో నెవ్వఁడు సద్గుణము లెక్కుడుగ గలవాఁడో యట్టివానిఁ బూజింపు " మని చెప్పుచు.

సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁజేసి
          యర్కుండు వెలిఁగించు నట్టులమృత
    సందోహనిష్యందచంద్రికఁ జేసిశీ
          తాంశుఁ డానందించునట్లు సకల
    జనులకుఁ దనదైన సదమల ద్యుతిఁజేసి
          తనరంగతేజంబు తనకుఁ దాన
    చేయుచునున్న సత్సేవ్యుండు వుండరీ
          కాక్షుండు కృష్ణుఁడనాదిని ధనుఁ
    డబ్జనాభుఁడుండ నర్ఘ్యంబునకు నిందు
          నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు
    నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు
          మధిప యదియ చూవె యజ్ఞఫలము."

ఇట్టు లనినపిదప సహదేవునిచే దీసికొనిరాఁబడినయర్ఘ్యమును ధర్మరాజు శ్రీస్వామివారికి సమర్పించెను. అపయిని శిశుపాలుఁ డనువాఁ డగ్రపూజకు శ్రీస్వామివా రర్హులు కారని విచ్చలవిడిగ నాక్షేపింపఁగా భీష్ముడు శిశుపాలునితో నిట్లనెను:

చ. "అవినయబుద్ధివైహరికినర్ఘ్యమయోగ్యమయంటివీవు మూ
    ర్ఖవుశిశుపాల యింకఁబలుకన్ వలయున్‌సభలోననున్నయీ
    యవనిపు లెల్లనాతనిదయన్ బరిముక్తులువానిచేతనా
    హవజితులుందదీయశరణార్థులుగాకొరులయ్యచెప్పుమా.

తే. గీ. ఉత్తమజ్ఞానవృద్ధు నా నుండు నేని
         బాలుఁ డయ్యునుఁ బూజ్యుండు బ్రాహ్మణుండు
         క్షత్రియుఁడు పూజ్యుఁ డమితవిక్రమసమృధి
         నుర్విపతులలో నధికుఁడై యుండెనేని,

క. ఈ రెండుకారణముల ము
    రారాతియ యర్ఘ్యమునకు నిర్హుఁడు జగధా
    ధారుండు మాకకాదు స
    దారాధ్యుఁడు విష్టపత్రయావాసులకున్.

క. వృద్ధు లొకలక్ష యున్నను
   బుద్ధియె యెవ్వరికి వారి బూజింపంగా
   నిద్ధరణీశులలో గుణ
   వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్.

క. పూజితులు తృప్తు లగుదురు
   భూజను లొరు లచ్యుతుండు పూజితుఁ డగుడున్.
   దేజమున జగత్త్రితయము
   బూజితమయి తృప్తిఁ బొందు బుణ్యసమృద్ధిన్."

ఆపిదప నీక్రిందివిధమున సహదేవుఁడు సభవారిం గూర్చి పలికెను:-

శ్లో. "కేశవం కేశిహంతార మప్రమేయపరాక్రమం!
    పూజ్యమానంమయాయోపః కృష్ణంససహతేనృపః!
    సర్వేషాంబలినాంమూర్థ్ని మయేదంనిహితంపదం!
    ఏవముక్తేమయాసమ్య గుత్తరంప్రబ్రవీతు సః!
    మతిమంతశ్చయేకేచిదాచార్యంపితరంగురుం |
    అర్చ్యమర్చితమర్ఘ్యార్హ మనుజానంతుతేనృపాః!! "

అనఁగా అపరిమితపరాక్రమసంపన్నుఁడయిన శ్రీకృష్ణుని ధర్మరాజు ననుమతిచే నేను బూజింపుచుండఁగా మీలో నే రాజు సహింపఁడో యట్టిబలవంతులగు నందరితలలమీఁదను నే నీపాదమును మోవుచున్నాను. ఇట్లు నేఁ బలుకుచుండ నట్టియగ్రపూజను సహింపనియారా జుత్తరము చెప్పునుగాత.

ఈసభయందు బుద్ధిమంతులయిన యేరాజులు కలరో వారు ఆచార్యుఁడును, తండ్రియును, గురువును, పూజార్హుఁడును నగు నీ శ్రీకృష్ణులవారిని బూజించుటకొర కంగీకరింతురు గాక?"

అప్పు డతనిమీఁద బుష్పవృష్టిఁ గురిసెను. మునులు మెచ్చుకొనిరి. శ్రీకృష్ణులవారు పూజార్హు లని చెప్పినయుభయులలో భీష్మునిమీఁద బుష్పవృష్టి యేల కురియలేదు ? మును లతని నేల మెచ్చలేదో చూతము. వీ రుభయులును శ్రీస్వామివారిని దైవముగాని, మనుష్యమాత్రుఁడుగాఁ డని యెరుగుటలో సములే అయితే యాభగవంతునియందు సాధ్యభక్తిగలవాఁడు భీష్ముడు కరణత్రయప్రపత్తియేకాక తాత్కాలికపూర్ణప్రపత్తి గలనాఁడు సహదేవుఁడు. అందువలన నితఁ డధికుఁ డాయెను.

శ్రీకృష్ణులవారు రాయభారమున కరుగునపుడు తననలుగురుసోదరులు చెప్పినపిదప నీసహదేవుఁడు వారితో "ఈధర్మరాజును దక్కినసోదరులును సంధి పొసఁగునని యాసతోఁ బలికిరి. మీరును మారు చెప్పకయుండుట చిత్రము. ఆహా ? వీరిప్రార్థనాప్రకారము మీరు పోయినను సుయోధనుఁ డేమి ? భూమిలో సగపా లిచ్చు టేమి? ఎప్పటికైన జరుగునా ! ఇట్టి దైన్యమునకు వీరులగు మావారు లోబడవలయునా ? పయి రాజు లీదీనతను మెత్తురా ? బంధువులును మిత్రులును నిందింపరా ? ఇది యేమిపని ? ధర్మరాజు వేడుకొను టేమి? శ్రీకృష్ణుల వారడుగబోవుట యేమి? బహుబాగుగ నున్నది. ఎప్పటికైనఁ ధృతరాష్ట్రపుత్రులు రాజ్యభాగము నిత్తురా! వీరికోరిన ప్రకారము వా రొప్పినను నాసంధి యెంతకాలము నిలుచును? యుద్ధమే తప్పక జరగవలసినది. నేను వంకమాట లాడలేను. యుద్ధము తప్పక జరగునని కౌరవసభలో నేను జెప్పినటుల చెప్పుము" అని పలికెను. కపటద్యూత మాడి తమ్ము నోడించినశకునిని యుద్ధమునందు జంపెను. తుదను దనయన్నలతోఁ గలిసి మహాప్రస్థానము చేసి పరలోకగతుఁ డాయెను.

9. ద్రౌపది.

ఈయమ ద్రుపదమహారాజు ముద్దులపట్టి. కుంతీదేవి వచనమువలన బాండవు లైదుగురికిని భార్య యయ్యెను. కౌరవసభయందు దనవస్త్రాపహరణసమయమున భర్త లుండియు దా ననాధురాలివలె నయినందున ద్వారకలో నుండు శ్రీకృష్ణులవారినిఁ బ్రార్థింపఁగా నాతనిమహిమవలన విప్పఁ

బడినవస్త్రమునకు బ్రతివస్త్ర మమర్పఁ బడుచు వచ్చెను. ఈ యద్భుతకార్యమునకు సభ్యు లచ్చెరువంది యామెకు మానభంగము కానందుకు సంతసించిరి. అరణ్యవాసమున నీమె పాండవులకును వారిపరివారమునకును భోజనాదికృత్యములు జరుపుటలో నతిజాగ్రత్తగ గనిపెట్టుచుండెను. శ్రీకృష్ణులవారు సత్యభామాసమేతులయి యరణ్యమునందున్న పాండవులను జూచుకొఱకు వచ్చినపుడు సత్యభామకును ద్రౌపదికిని జరిగిన సంవాదము స్త్రీలు ముఖ్యముగ దెలిసికొనవలసిన విషయమయినందున యథామాతృకముగ నీక్రిందఁ బొందుపరుపఁబడెను:

సీ. "నీప్రియభర్తల నిర్మలవృత్తులఁ
         బ్రకటతేజుల లోకపాలనిభులఁ
    బార్థుల నీవొకభంగిన వదలక
         చెలువ యెబ్భంగి భజింతు దగిలి
    యొక్కఁ డొక్కనికంటె నువిదనీకేవురు
         ననురక్తు లగుట యత్యద్భుతంబు
    నగుమొగంబులకాని నాతి నీదెస నెప్డు
         బతులకు గిన్క యెప్పాట లేదు
    వ్రతము పెంపొ మంత్రౌషథవైభవంబొ
         సరస నేపథ్యకర్మకౌశలమొ చతుర
    విభ్రమోల్లాసరేఖయొ వెలది నీవి
         శేషసౌభాగ్యహేతువు చెపుమనాకు.

క. ఏనును నీవలన నిజము
    గా నిదియంతయును నెఱిఁగి కమలదళాక్షున్
    బూని వశగతునిఁ జేసి య
    నూనంస్నేహానుభోగయుక్తిఁ దలిర్తున్.

క. అని యడిగిన మది నించుక
   గినుక వొడమ నడచుకొనుచు గృష్ణ మృదులహా

   సిని యగుచు గృష్ణభామిని
   గనుఁగొని యిట్లనియె నిర్వికారాకృతియై.

క. నను నిట్లు దుష్టవనితా
   జనము నటులుగా దలంపఁ జనునే నీకున్
   మన సొప్పదు పురుషోత్తము
   వనితవుగా దగవు నీవు వనరుహనయనా?

అని మేలంపుఁజందంబున దాని వివేకహీనత యెఱుక పడ నాడి పాంచాలి మఱియు ని ట్లనియె.

చ. అలయకమంత్రతంత్రవివిధౌషధభంగులఁజేసియెంతయున్
    వలతురునాధులంటమగువాకడుబేలతనంబు దాన మున్
    గలిగినప్రేమయుంబొలియుఁగానియొకండునుసిద్ధిఁబొందద
    ప్పొలతులతోడిమన్కియహిపొత్తుగజూచువిభుండెఱింగినన్.

చ. మగువయొనర్చువశ్యవిధిమందులుమాయలునొండు చందమై
    మగనికిఁదెచ్చురోగములు మానకమూకజడాదిభావముల్
    మొగినొనరించునద్దురితముల్ తనచేసినచేతలైతుదిన్
    జగమునకెక్కినిందయును సద్గతిహానియువచ్చునింతికిన్.

క. కావున నెప్పుడు మగనికి
   గావింపం దగదు కపటకర్మంబులు ద

    ద్భావ మెఱిఁగి వశవర్తిని
    వై వనిత చరింప నదియ యగునెల్లవియున్.

వ. పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టిసౌభాగ్యంబు నందితి నెఱింగించెద నేర్పడ వినుము.

సీ. పతులాత్మ నొండొకపడతుల గలిసిన
         నలుగ నెయ్యెడల నహంకరింప
    మదము ప్రమాదంబు మాని వారికి జిత్త
         మేకముఖంబుగ నెల్లప్రొద్దు
    భక్తి సేయుదుఁ జూపుఁ బలుకులుఁ గోర్కియుఁ
         జెయ్వులు వింతగాఁ జేయ నెపుడు
    నమర గంధర్వయక్షాదులందైనను
        బురుషు నన్యునిఁ దృణంబుగ దలంతు
    స్నానభోజనశయనాది సంప్రయోగ
        మర్థిఁ బతులకు నెందు ము న్నాచరింపఁ
    బతులు వచ్చిన నాసనపాద్యవిధుల
        భక్తితోనేన కావింతుఁ బనుప నొరుల.

చ. తగియెడువేళలందునియతంబుగమజ్జనభోజనక్రియల్
    దగనొడఁగూర్తుభర్తలకు ధాన్యధనంబులురిత్తమైవ్యయం
    బగుటకునోర్వనెప్పుడు గృహస్థలభాండవిశోధనంబులి
    మ్ముగనొకనాడు నేమఱఁబ్రమోదముసల్పుదుబంధుకోటికిన్.

క. పలుమాఱుం దలవాకిట
   మెలఁగుట యసతీజనైకమిత్రత కలహం
   బుల కెలయుట నగుఁబలుకులఁ
   బెలుచ నగుట నాకుఁగాని పేరివి మగువా.

క. పతు లిచ్చ మెయిఁ బ్రవాస
   స్థితులైనం బుష్పగంధదీప్తాభరణ
   ప్రతతి ధరియింపఁ దద్గత
   మతి నగుచుఁ దదాగమంబ మది గాంక్షింతున్.

ఉ. అత్తకుభక్తిగల్గిమదినాయమసెప్పినమాడ్కి జేటికా
    వృత్తములాచరింతు గురువిప్రసురాతిధిపూజనంబుల
    త్యుత్తమభక్తినేనతగనోపియొనర్తుఁ బ్రియంబు దాల్మియున్
    మెత్తదనంబు సంతతముమేలుగఁదాల్తుసమస్తభంగులన్.

క. కడుమృదువు లనుచుఁ దేకువ
   సెడి యెపుడుఁ జరింప భరతసింహులు కోపం
   బడరిన నాశీవిషముల
   పడువునఁ గ్రూరులని వెఱపు వదలక కొలుతున్.

అజ్ఞాతవాసమున నీమె సైరంద్రీవేషమున గాలము గడపెను. తన్ను మోహించి పాతివ్రత్యభంగమును జేయఁ దలఁచిన విరటుని మరదియగు సింహబలునివిషయము భీమునకెఱింగించి యతనిచే నతనిఁ జంపించెను. శ్రీకృష్ణులవారు రాయభారమున కరుగునపుడు వారితోఁ బాండవులు వారువారు చెప్పవలసినవి చెప్పినపిదప నదివరకు ధర్మరాజు చెప్పినమాటలు తనకు హృదయతాపము గలిగింప గోపముతో నిట్లు పలికెను.

"మాకు నేనకము లగుకీడులు చేసి యడవికిఁ బోదోలి యిప్పుడు మాయందు బ్రేమ మున్నటుల సంజయునిఁ బంపఁగా నంతమాత్రమున కీధర్మరా జూప్పొంగెను. ఈపొంగు జూచి యన్నదమ్ముల యందుఁ బ్రీతి గలిగి సుయోధనుఁ డైదూళ్లనైన నియ్యకపోవునా యని పాపము ధర్మరాజు నమ్మియున్నాఁడు. పూర్వము తనపడినపాటులను దలఁపక యీధర్మరాజు దుర్యోధనుని భ్రాతృవాత్సల్యముతోఁ జూచును గాఁబోలు? అది బాగా ? రాజ్యభాగమునుఁ దీసికొననియెడల లోకులు నిందింపరా! చేతగానివారని యనరా ! తమయాధిక్యమును బోఁగొట్టుకొని యీవిధముగ లోఁబడి తక్కువమాట లేల యాడవలెను ? నిజముగ నీసంధివలన గౌరవులకే మేలు. సోదరులని కనికరింతు రేమో కాని యుద్ధమునందు వారినిఁ జయించుట కింత కావలెనా? తప్పుచేసినపుడు మన్నించుటకు వారు బ్రాహ్మణులా! దుర్యోధనునకు సంకోచ మేమియు లేదు. నీవు చెప్పు తీపుమాటలకు దుర్యోధనునకు దురభిమానమే హెచ్చును. వారు యుద్ధముచేయుదు మన్నపు డీపాండవులు నిలువఁబడి యుద్ధము చేయుదురో లేక యడవికిఁ బోయెదరో యేమి చెప్పఁగలను. నే నిటు లంటినని మీ రేమియు ననుకొనవలదు. నీకును బాండవులకును గౌరవము చెడకుండ సంధికార్య మెటుల జరుగునో యటులఁ జేయుఁడు." అటుమీఁద దనవస్త్రాపహరణవిషయమునుఁ జెప్పుకొనెను.

యుద్ధానంతరమున నశ్వత్థామ నిద్రాసమయమున దన యైదుగురుకుమారులను సోదరులను దక్కనపాండవవీరులతో పాటుగ గొంతులుగోసి చంపినందున నీమే శోకావేశముగలది యై యాఘాతుకునిమీఁదికి భీమునిఁ బంపుట మొదలగు విషయము లశ్వత్థామార్జునచరిత్రములలో వ్రాయఁబడి యున్నవి. తుద కీమె భర్తలతోఁ గలిసి యడవి కేగి స్వర్గస్థురాలయ్యెను.

10. అభిమన్యుఁడు

ఇతఁడు సుభద్రార్జునుల కుమారుఁడు. తనతండ్రివలన నస్త్రవిద్య నేర్చికొని యతనివలెఁ బ్రసిద్ధిలోనికి వచ్చుచుండెను. ఈతని యుద్ధపునేర్పునుఁ జూచి భీష్మాదులును మెచ్చుకొని యున్నారు. మరియు నితఁడు పాండవులందరకు బ్రియతముఁడగు నందనుఁడు. విరటరాజుకూతురగు నుత్తరను వివాహ మయ్యెను. ఆమెయందు బరీక్ష న్మహారాజును గనెను. పదుమూడవనాఁటియుద్ధమున దనతండ్రియగు నర్జునుఁడు సంశప్త కులతో ఘోరయుద్ధము చేయుచుండఁగా గౌరవులచే బన్నఁ బడిన పద్మవ్యూహముఁ జొచ్చుటకు ధర్మరాజాదివీరుల కశక్య మయ్యెను. అప్పుడు ధర్మరాజుచే బ్రేరితుఁడై పడుచుఁదనమున నొంటరిగా నావ్యూహమునుఁ జొచ్చి మధ్యభాగమున కరిగెను. అంతట నితఁ డర్జునునివంటివీరుఁడైనందుననే ద్రోణాదు లనేకులు చుట్టువారుకొని యధర్మయుద్ధమున విరధునిఁ జేసి ఖడ్గము తప్ప తదితరాయుధముల నొక్కొక్కరు కొట్టి పారవైచిరి. అప్పు డితఁడు ఖడ్గహస్తుఁడై దుశ్శాసనుని కుమారుఁడగు లక్ష్మణునితో శరీరమున బ్రాణములుండువరకు ద్వంద్వయుద్ధమునుఁ జేసెను. ఆపిదప నుభయవీరులు నేక కాలమున సమసిరి.

11. సాత్యకి.

ఇతఁడు సత్యకుఁడను యాదవునికుమారుఁడు. శ్రీకృష్ణుల వారికి జ్ఞాతివరుసను దమ్ముఁడు. అర్జునునియొద్ద ధనుర్విద్య నేర్చి యతనితో సముఁ డనిపించుకొనెను. యుద్ధమునందు బాండవుల

పక్షమున నుండెను. శ్రీకృష్ణులవారు రాయభారమున కేగినపుడు దుర్యోధనాదులు వారిని బంధింప బ్రయత్నింపఁగా సభలో నున్నవారలకు నేను జూలుదు నని యీసాత్యకి నిలువఁబడి యుండెను. పయినుండి వచ్చువారల నడ్డవరచుటకు గృతవర్మ యుండెను. యుద్ధమునం దితఁడు భూరిశ్రవుఁడు, సోమదత్తుడు, జలసంధుఁడు మొదలగురాజులను, జంపెను.

12. శ్రీకృష్ణులవారు.

పరమేశ్వరుఁడగు నారాయణుఁడు భూలోకమున దుష్టుల శిక్షించి తద్ద్వారా సజ్జనులను రక్షించుకొరకు మధురానగరమునఁ దేవకీవసుదేవులకుఁ గుమారుఁడయి జన్మించెను. దేవకీదేవి మధురానగరపు రాజగు నుగ్రసేనుని తమ్మునికుమార్తె. ఆ యుగ్రసేనునికుమారుఁడగు కంసుఁడు మిగుల దుష్టప్రవర్తన గలవాఁడు. ఇతఁడు తండ్రిని బందీకృతునిగా జేసి రాజ్యమును స్వీకరించెను. తనపినతండ్రి కుమార్తెయగు దేవకిని నామె భర్తయగు వసుదేవునితోగూడ బందీకృతురాలినిగఁ జేసెను. అట్టిస్థితిలో శ్రీకృష్ణులవారు దేవకీదేవిగర్భమునఁ జన్మించిరి. సర్వశక్తిగల యాబాలుని యనుమతిప్రకారము తండ్రియగు వసుదేవుఁడాబిడ్డ నర్థరాత్రమునందు వ్రేపల్లెకుఁ దీసికొనిపోయి యందు నందునిభార్యయగు యశోదాదేవియొక్క ప్రక్కను రహస్యముగ నుంచి యామెప్రక్కలో నున్న యాడుబిడ్డ నెత్తుకొని వచ్చి తనభార్యప్రక్క నుంచెను. ఆమెకుఁ బుట్టిన మగశిశువులనందరినిఁ జంపుటకు నిశ్చయించుకొనియున్న కంసుడీపిల్ల రోదనమునుఁ దెలిసికొనివచ్చి యాడుబిడ్డయైనను జంపుటకుఁ బ్రయత్నించెను. ఆబిడ్డ శక్తియంశము గలది యగుటచే వధకు దొరకక తప్పించుకొనిపోయెను. అచట వ్రేపల్లెయందు యశోదాదేవి ప్రక్కలో నున్నశిశువునుఁ దనబిడ్డగానే భావించి పెంచుచుండెను. ఆవ్రేపల్లెలో రోహిణీదేవికి బలరాముఁడు వీరికి ముందే జన్మించియుండెను. ఇట్లు వీరిరువురు బాలక్రీడలు సలుపుచు వ్రేపల్లెలో నుండుతరి గొన్ని దుర్నిమిత్తములు నాపదలు గలుగుచు వచ్చినందున నందాదు లాస్థలమును విడిచి కుటుంబపరివార సహితముగా బృందావనమునఁ బ్రవేశించిరి. అచ్చట రామకృష్ణులు గోవత్సములనుఁ దీసికొని గోపబాలురతోఁ గలిసి వెళ్లిమేపుచు వచ్చుచుండిరి. అట్టిసమయములలో శ్రీకృష్ణులవారు వత్సాసుర బకాసుర అఘాసుర శంఖచూడ వృషభాసుర కేశి వ్యోమాసురు లనురాక్షసులనుఁ జంపిరి. బలభద్రుఁడును ధేనుకాసురుని ప్రలంబాసురుని సంహరించెను. పూతనా కాళియమర్దన గోపీవస్త్రాపహరణ రాసక్రీడాది విషయము లీక్రిందఁ బొందుపరుపఁబడిన శ్రీకృష్ణవిషయోపన్యాసము నందు జర్చించి పరిష్కరింపఁబడి యున్నవి.

బ్రహ్మదేవుఁడు భూలోకమునకు వచ్చి శ్రీస్వామివారి మహిమను దెలిసికొనుటకు గోవత్సములను దాచిన ట్లొకకథ గలదు. త్రిమూర్తులలో నొకఁడైనట్టియు శ్రీమన్నారాయణుని వలన సృజింపఁబడి నట్టియు నీబ్రహ్మకు స్వామివారిమహిమను దెలిసికొనవలసినప్రసక్తి లేదు. కావున నీకథను గల్పితగాధగా దీసికొనవలెను. అయితే గోవర్థనోద్ధారణకథను నమ్మినను నమ్మవచ్చును. ఏల యనిన దిక్పాలకులలో నొకఁడగు నింద్రుఁడు తనకు బ్రజలు చేయుపూజ నాటంకపరచిన మనుజ రూపముతో నున్న యీస్వామివారి నిజస్థితిని సాధారణముగ దెలియక కోపించి శిలావృష్టిని గురిపించియుండిన నుండ వచ్చును. అప్పు డాసర్వశక్తి గోవర్ధనగిరి యెత్తి గోవులను గోపకులను రక్షించుట యాశ్చర్యమా?

ఇట్లు శ్రీరామకృష్ణులు బృందావనమున విహరింపుచు బాలురయ్యును దుష్టులను సంహరించుచుండుటను విని కంసుఁ డక్రూరుని బృందావనమునకుఁ బంపెను. అతనిపనుపున రామకృష్ణులు మధురానగరమునకుఁ బోవుచుండునపుడు శ్రీకృష్ణమూర్తి యక్రూరునకు నిజరూపమును జూపించెను. ఆ పిదప నన్నదమ్ములిద్దరును మధురానగరమున బ్రవేశించి కంసుని సభకు బోవుటకు ముందు కంసుని చాకలివానినిఁ జంపి వస్త్రంబులు గొనిరఁట. మరియు విల్లువిరిచి యాయుధశాల కావలి వారిని జంపిరఁట. ఏమివింత ? పీతాంబరధారి దుష్టుఁడగు కంసుఁడు కట్టెడివస్త్రములను గట్ట గోరునా ? అందుకుగాను, పాపము చాకలవానినిఁ జంవునా ! ఇపుడు స్వామివారు కంస సభలో నుచితాసనమునఁ గూర్చుండుటకు బోవుట లేదు. మల్ల యుద్ధము చేయువానికి విలువగలవస్త్రములతో బని యేమి ? మరియు నాయుధశాల కావలివారి నేల చంపవలెను ? మల్ల యుద్ధమునం దాయుధములతో బని యేమి ! కావున నీ రెండును గల్పితకథలు.

ఇట్లు కంససభకు బోయిన శ్రీకృష్ణులవారు తనమీఁదికి వచ్చిన కువలయాపీడమను మదగజమును జంపిరి. చాణూర ముష్టికులను మల్లురను శ్రీకృష్ణబలరాములు మల్లయుద్ధమున జంపిరి. అటుమీఁద శ్రీకృష్ణమూర్తివారు కంసుని, బలరామస్వామివారు కంసునితమ్ములను వధించి, చెరలో నున్న తల్లి దండ్రులగు దేవకీవసుదేవులను నుగ్రసేనుని విడిపించి యతనికి బట్టముఁ గట్టిరి.

అచటనుండి బలరామకృష్ణులు కాశీపట్టణమున కేగి యచట సాందీపునియొద్ద విద్యల నభ్యసించి మధురానగరము జేరిరి. కొంతకాల మచట నుండఁగా గంసుని మామయగు జరాసంధుఁడు మధురాపురిని ముట్టడించి శ్రీరామకృష్ణులతోఁ బోరాడి యందు బలరామునిచే బట్టువడి శ్రీకృష్ణులవారిపనుపున విడువఁబడెను. అటుపిమ్మట నాజరాసంధుఁ డనేకపర్యాయములు మధురానగరమును ముట్టడించుటయు, శ్రీకృష్ణాదు లాపట్టణమును విడిచి ద్వారకకు బోవుటయు సంభవించెను. జరాసంధునిబాధల కోర్వక తరువాత శ్రీబలరామకృష్ణులు మధురను విడిచి ద్వారకానగరమును స్వస్థానముగ జేసికొనిరి. శిశుపాలున కిచ్చుటకు నిశ్చయింపఁబడిన భీష్మకమహారాజు పుత్రికయగు రుక్మిణీదేవి తనప్రేమను శ్రీకృష్ణులవారి కెఱింగింపఁగా నాస్వామివారు కుండినపట్టణమున కేగి శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని రాక్షసవివాహమున, గొనిపోయి ద్వారకానగరమున యథావిధిగ వివాహ మాడిరి. అటు మీఁద మరికొందరిని వివాహ మాడి రని యున్నది. ఆ విషయ మిందుతో జతపరుపఁబడిన శ్రీకృష్ణోపన్యాసమునందు గొంత చెప్పఁబడి యున్నది. అమీఁద శ్రీస్వామివారు మురాసురుని నరకాసురుని వధించిరి. అందు నరకాసురునియొద్ద నున్న పదియారువేలమందికన్యలకు శ్రీకృష్ణులవారు భర్తయైనట్లు చెప్పఁబడి యున్నది. ఆవిషయ మిందుతో జతపరుపఁ బడియున్న శ్రీకృష్ణవిషయోపన్యాసమున బరిష్కరింపఁబడి యున్నది. శ్రీకృష్ణులవారు బాణాసురుఁడను వాని నొక యుద్ధమునందు జయించిరి. అపుడు బాణునికి సహాయముగా వచ్చిన శివునితో శ్రీస్వామివారు యుద్ధము చేసి యతనిని జయించి యతనివలన బాణుని గాపాడుటకయి స్తుతి చేయఁబడినట్లు చెప్పఁబడియున్నది. భారతగ్రంథకర్త యెట్లు కౌరవపక్షపాతియో అట్లు భాగవత గ్రంథకర్త విష్ణుపక్షపాతియైనట్లు కానవచ్చును. కాని , నిజముగ . శ్రీకృష్ణులవారియాధిక్యమునే చెప్పువాఁడు గాఁడు. ఈవిషయము ముందు విచారింతము . అంతియకాని శివకేశవులు యుద్ధము చేయుదురా! అందు నొకరక్కసుని కొరకు యుద్ధము చేసి రఁట, ఏమివింత ! చదువరులే యీ విషయము విచారింపుడు.

పిమ్మట, బౌండ్రకవాసుదేవుని శ్రీకృష్ణులవారు చంపిరి.

ఈమీఁద వ్రాసినకథయంతయు భాగవతదశమస్కంధములోనిదై యున్నది.

ఇంద్రప్రస్థపురంబునధర్మరాజు రాజసూయయాగము జేయఁబూని శ్రీకృష్ణులవారిని రావించెను. అపుడు దిగ్విజయమునకు ముందు జరాసంధునిఁ జంపవలయు ననియు, నతఁ డితరరాజులతోఁ గలిసినయెడల నజేయుఁడై యుండు ననియు శ్రీస్వామివారు ధర్మరాజుతోఁ జెప్పఁగా నతఁడు శ్రీకృష్ణభీమార్జునులను జరాసంధవిజయముకొరకు బంపెను. వారిలో భీముఁడు ద్వంద్వయుద్ధమున నతని సంహరించెను. ఆపయిని ధర్మరాజు రాజసూయయాగము చేయునవసరమున నగ్రపూజను శ్రీకృష్ణులవారు గయికొని నోటికివచ్చినట్లు తమ్మును దిట్టిన శిశుపాలుని వధించి ద్వారకానగరమును జేరిరి. ఆపిదప సర్వజ్ఞులగు శ్రీకృష్ణులవారు కుదరనిరాయభారముకొరకు ధర్మరాజు పనుపున గౌరవులయొద్ద కేల యరిగిరో యోచింతము.

శ్రీస్వామివారు రాయభారమునకు బోబోవుముం దర్జునునితో నిట్లు పలికిరి:

శ్లో. "అహంహితత్కరిష్యామి పరంపురుషకారతః!
    దైవంతునమయాశక్యం కర్మకర్తుంకథంచన|| "

అనఁగా బౌరుషమువలన మీకు జేయఁదగినహితమును జేయుదును. దైవము చేయుకర్మను నే నెట్లు చేయఁగలను ? అని,

మరియు శ్రీస్వామివారు విదురునిచే నడుగఁబడి తమ రాకనుగూర్చి యిట్లు ప్రత్యుత్తర మిచ్చిరి:--

క. "ఎఱుగుదు నేను సుయోధను
   కొఱగామియు నతనితోడఁ గూడిననృపులం
   దఱుఁ బగ మనమున నిడికాని
   యఱుముటయును సంధి పొసఁగదనియు మహాత్మా.

ఆ. వె. పుడమియెల్ల నొడ్డ గెడవయి గజవాజి
         యుతముగా నడంగి యుగ్రమృత్యు
         ముఖము సొరఁగ దివురుమూర్ఖత మాన్చుట
         యధికమైనవుణ్య మనఘచరిత.

వ. మానుపవచ్చునే యంటివేని.

క. దొరకొని పుణ్యముఁ బాపము
   నరుఁ డర్థిం జేయుచుండ నడుమ నొకంటన్
   వెర వెడలి తప్పినను ద
   త్పరిణతి ఫల మొందు నండ్రు ధర్మవిధిజ్ఞుల్.

వ. అట్లుంగాక.

తే. గీ. చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
        డడ్డపడి వారితోఁడఁ బోరాడియైన
        బూని యుడుసంగఁ జొరకున్న వానిఁ గ్రూర
        కర్ముఁడని చెప్పుదురు కర్మకాండవిదులు.

వ. కావున నీ రెండుదెఱంగులవారికి శాంతిఁ గావింపం బ్రయత్నంబు సేసెద. ధర్మార్థ సంగతంబులైన మాటలు మంత్రిజన సహితుండైనసుయోధనునకుం జెప్పెదఁ దనకుం బాండు నందనులకు లోకంబులకు హితంబయినవిధంబు వంచనలేక చెప్పెడు నన్నుఁ బాండవులవాఁడని శంకించి యతండు నామాట వినం డయ్యెనేనియు మేల కాకఁ యిట్లు సొచ్చి చెప్పకున్న నన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించెఁ దనచేతఁ జక్కంబడదా యని యజ్ఞులైనజను లాడుదు రెల్లభంగులఁ గార్యం బార్యు లియ్యకొనం జెప్పుదు. ధార్తరాష్ట్రులుం దమకుఁ బ్రదుకుఁ దెరువైన నాపలుకులు పట్టుదురు. పట్టక నీతలంచినచందంబునందులువలై కలంగఁబారిన వారు నాముందర నిలువంజాలుదురే" యని పలికి విదురుని సమ్మతింపం జేసిరి.

అర్జునునకు విదురునకు శ్రీస్వామివా రొసఁగినయుత్తరములనుబట్టి విమర్శింపఁగా దైవ మె ట్లుండినను బౌరుషము ముఖ్యమైనట్లును నాపురుషప్రయత్నము మంచిదైనపు డీజన్మ యందు గార్యకారి కాకపోయినను ముందుజన్మమున నైన నందలిఫలమును గలిగింపకపోదనియు గ్రహింపవలెను. అట్టిపౌరుషమును సర్వేశ్వరుఁడే చేయఁబూనినపుడు మనుజమాత్రుల కది యావశ్యకము గాకపోవునా ? కొంద రవివేకులు దైవమే ప్రధానమని పౌరుషమును జేయక యాజన్మను వ్యర్థముజేయుటయేకాక చెడుదురు. ముక్తికిని పౌరుషమే క్రమక్రమముగా నభివృద్ధియగుసాధనమయి యుండఁగా దైవమే ప్రధాన మనుట యెంత పిచ్చితనము ?

ఇట్లు సంధివాక్యములను శ్రీస్వామివారు సభలోఁ గౌరవులకుఁ జెప్పి బోధపరుచుచుండఁగా నపుడు శ్రీస్వామివారినిఁ బట్టి కట్టుటకు దుర్యోధనాదిదుష్టచతుష్టయము యత్నించుట దెలిసికొని వారు తమవిశ్వరూపమును జూపించిన ట్లున్నది. ఈ విషయమును ముందు చర్చింతుము. అచ్చటినుండి వచ్చి శ్రీస్వామివారు ధర్మరాజుతో సంధి పొసఁగలే దనియు యుద్ధము చేయక తప్పదనియు సెల విచ్చిరి.

యుద్ధభూమియందు బితృపితామహాచార్య భ్రాతృపుత్ర మిత్రాదులను జూచి వారినిఁ జంపుటకు శంకితుఁడై యున్న యర్జునునకు శ్రీస్వామివారు భగవద్గీతలను బోధించిరి. అందుల సంగ్రహము:ఓయర్జునా ! నీ విపుడు జ్ఞానులు చెప్పుమాటలను జెప్పచు దుఃఖింపఁదగనివారిని గూర్చి దుఃఖించుచున్నావు. జ్ఞానులగు వారు చచ్చినవారినిగూర్చిగాని జీవించియున్నవారినిగూర్చి గాని విచారింపరు

నేనును నీవును నిచ్చట గనిపించుచున్న యీరాజులును బూర్వము లేనివారము కాము. శరీరములు పోయినను నాత్మలు నిత్యమైనందున ముందుగూడ నుండువారమే.

ప్రతివారికిని దమశరీరములయందు బాల్యము, యౌవనము, వార్ధకము, నను నవస్థ లెట్లు మారుచున్నవో యటులనే యీశరీరము పోయినపిమ్మట గ్రొత్తశరీరములు గలుగుచున్నవి. కావున దెలిసినవారీశరీరము పోవునని దుఃఖింపరు.

ఇంద్రియములు తమతమవిషయములయందుఁ బ్రవర్తించునప్పు డావిషయభేదములనుబట్టి సుఖదుఃఖములు గలుగుచుండును గాని స్వతస్సిద్ధముగ నాత్మకు లేవు. అవి యొకప్పుడు వచ్చు, నొకప్పుడు పోవును. కావున నాసుఖదుఃఖములు శాశ్వతములు కావు. వానిని సహింపుము.

ఓపురుషశ్రేష్ఠుఁడా ! సుఖముఃఖములయందు సమబుద్ధిగల యేవివేకిని విషయేంద్రియ సంయోగములు బోధింపలేవో యతఁడే మోక్షమున కర్హుఁ డగుచున్నాఁడు. అశాశ్వతమైనవస్తు వెప్పటికిని లేనిదే యగును. శాశ్వతమైనవస్తువున కెన్నఁడును నాశ ముండదు. తెలివిగలవా రీ రెండువస్తువులయాధార్థ్యము నిట్లు తెలిసికొనుచున్నారు.

ఏయాత్మవస్తు వీసర్వ ప్రాణులయందును వ్యాపించినదో యట్టియాత్మవస్తువును నాశము లేనిదానినిగా దెలిసికొనుము. వృద్ధిక్షయములు లేని యీయాత్మస్వరూపము నెవ్వఁడును నశింపజేయఁజాలఁడు.

ఓయర్జునా ! పెరుగుట తరుగుట మొదలగు వికారములు లేనట్టియు దేహాద్యుపాధులు నశించినను దాను నశింపనట్టియు నింద్రియగోచరుఁడు కానట్టియు నీజీవాత్మ నిత్యుఁడు. ఉపాధులయిన యీశరీరములు నాశము పొందుచుండును. కావున యుద్ధము చేయుము.

ఆత్మ చంపు ననియు జంపఁబడు ననియు నను కొనువారు తెలివిలేనివారు. ఈయాత్మ యెవనిని జంపువాఁడు కాఁడు. ఎవ్వనిచేతను జంపఁబడువాఁడును గాఁడు.

ఈయాత్మయెప్పుడును బుట్టువాఁడుగాఁడు. ఎప్పుడునుజచ్చువాఁడు గాఁడు. మొదటినుండియు లేకుండి క్రొత్తఁగా గలుగువాఁడును గాఁడు. కొంతకాల ముండి మరల లేకుండువాఁడును గాఁడు. మరి యేమి యనిన జన్మ లేనివాఁడును, నాశము లేనివాఁడును, వృద్ధిక్షయములు లేక యెప్పుడు నొక్కరీతిగ నుండు వాఁడును, మొదలు లేనివాఁడును, దనకుపాధియైన శరీరము మరలమరల మారుచుండినను దా నెన్నటికిని మారనివాఁడు.

ఓయర్జునా ! ఎవ్వ డీయాత్మను బుట్టువు లేనివానిగాను, శాశ్వతునిగాను, నాశరహితునిగాను, మారుపు లేనివానిగాను దెలిసికొనుచున్నాడో యాపురుషుడు తా నొకని జంపింతు ననియుఁ జంపుదు ననియు నెట్లుతలంచును?

నరుఁడు శిధిలవస్త్రములను విడిచి క్రొత్తవస్త్రముల నెట్లు ధరించుచున్నాఁడో యటులనే దేహాభిమానము గలయాత్మ శిధిలము లగుచున్నశరీరములను విడిచి నూతనశరీరములను ధరించుచున్నాఁడు.

ఈయాత్మ నాయుధములు భేదింపఁజాలవు. అగ్ని కాల్పఁ జాలదు. ఉదకములు తడుపలేవు. గాలి యెండింపను జూలదు.

ఈయాత్మ భేదింపఁదగనివాఁడు. దహింపఁదగనివాఁడు. తడుపఁదగనివాఁడు. ఎండింపఁదగనివాఁడు. ఎల్లప్పుడు నొక్కరీతిగా నుండువాఁడు. సర్వప్రాణులయందు వ్యాపించియుండువాఁడు. స్థిరుఁడు, చలనములేనివాఁడు. మొదలు లేనివాఁడు.

ఈయాత్మ కన్నులు మొదలయిన బహిరింద్రియములచే గ్రహింపఁబడువాఁడు గాడు. అంతరింద్రియమైన మనస్సుచే సాధారణముగఁ దెలియబడఁదగినవాఁడు గాఁడు. పెరుగుట తరుగుట మొదలగువికారములను పొందింపఁబడదగినవాఁడు కాఁడు. కావున నీప్రకారముగా నాత్మను దెలిసికొని నీవు దుఃఖించుటకు దగవు.

దీర్ఘములగు బాహువులుగల యోయర్జునుఁడా ! నీ వొకప్పుడీయాత్మను నెల్లపుడు బుట్టుచున్న వానిగాను నెప్పుడును జచ్చుచున్న వానిగాను దలంతువేమో అట్లయినను నీయాత్మను గూర్చి దుఃఖించుటకు దగవు.

పుట్టినవానికి జావును జచ్చినవానికి మరల బుట్టుటయును నిశ్చితమై యుండఁగాఁ దప్పింప శక్యముగాని యీజనన మరణములవిషయమున నీవు విచారింపఁ దగదు.

ఓయర్జునా ! మనుష్యాది శరీరములు ప్రకృతినుండి కలుగుచు బుట్టినవెనుక గొంతకాలమువరకు నహంకార మమకారముల కాధారములై కనుపించుచు. మరణానంతరమున దిరుగ నాప్రకృతిలో జేరుచున్న వి. అట్టియీశరీరములవివయమున దుఃఖ మేమి?

ఒక్కఁ డీయాత్మ నద్భుతపస్తువువలె జూచుచున్నాఁడు. మరియొకఁ డద్భుతవస్తువునువలె జెప్పుచున్నాఁడు. ఇతరుఁ డద్భుతవస్తువును వినునట్టు లీయాత్మను వినుచున్నాఁడు. అట్లు వినియు జూచియు జెప్పియును సాధారణముగ నెవ్వఁడును నీయాత్మయొక్క యాధార్థ్యము నెరుంగ లేఁడు. సర్వశరీరములయందును వ్యాపించియున్న యీయాత్మ యెప్పుడుసు జంపఁబడదగనివాఁడే. అందువలన నీవు (భీష్మాది) సమస్తజనులనుఁగూర్చియు దుఃఖింపఁ దగవు.

ఇంతియ కాదు. క్షత్రియుఁడవగు నీయొక్క వర్ణధర్మము నాలోచించినను నీవు చలింపఁ దగవు. క్షత్రియునకు ధర్మయుద్ధమునకంటె నితరమైనమేలు లేదుకదా?

ఓయర్జునా ! కోరకయే సంభవించినట్టియు, దెరువఁబడిన స్వర్గద్వారమైనట్టియు యుద్ధము నేరాజులు పొందుచున్నారో వారిహపరసుఖములు గలవా రగుచున్నారు.

నీవు ధర్మయుక్తమైన యీయుద్ధమును జేయవేని నందువలన వర్ణధర్మమును, గొప్పధనుర్ధరుఁడ వనుగీర్తిని, జెడగొట్టుకొని వర్ణధర్మమును విడుచుటవలన గలిగిన పాపమును బొందుదువు.

ఇంతియకాక నీయపకీర్తిని జనులు శాశ్వతముగఁ జెప్పుకొందురు. గౌరవము గలవాని కపకీర్తి వచ్చిన నది మరణమున కంటెను గొప్పది యగుచున్నది.

ఓపార్థుఁడా ! నీవిదివరలో నెవ్వరిచే గొప్ప వీరుఁడవని కొనియాడబడుచుంటివో యట్టి మహారథులయిన రాజులు ని న్నిపుడు భయమువలన యుధ్ధమునుండి మరలినవానిగా దలంతంరు. అందువల్ల నిన్ను గౌరవించిన వారే చులకగ జూతురు. శత్రువులు నీశక్తిని నిందించుచు ననేకములైన యాడరానిమాటల నాడుదురు. అంతకంటె నధికమైనదుఃఖమును గలిగించునది మరి యేది గలదు?

ఓ కుంతీపుత్రుఁడవైనయర్జునా ! నీవు యుద్ధమునందు జంపఁబడినయెడల స్వర్గమును బొందుదువు. శత్రువులను జయించితివేని రాజ్యము సనుభవింతువు. కావున యుద్ధము చేయ నిశ్చయము గలవాఁడవు కమ్ము.

సుఖదుఃఖములను లాభాలాభములను జయాపజయములను సమానములనుగాఁ దలంచి పిమ్మట యుధ్ధముకొరకు దల పడుము. ఇట్లు గీతోపదేశము జేసినపిదప నర్జునునకు విశ్వరూపమును జూపించినట్లు చెప్పఁబడి యున్నది. దీనితో శ్రీస్వామివారు కనబరచినవి రెండు విశ్వరూపములై యున్నవి. ఇందుకు వ్రాయఁబడు నీక్రిందివిషయమును జదువరులు ముఖ్యముగా గమనింపవలెను,

విశ్వరూపము లేదా విరాడ్రూపము శ్రీస్వామివారు కనబరచియుండినయెడల నది యేకవిధముగనే యుండవలెను. 1 కౌరవసభలో గనఁబరుపఁబడినదనిన విశ్వరూపములో నాస్వామిని బాండవాదులు పరివేష్టించియున్నట్లు చెప్పఁబడి యున్నది. 2. అర్జునునకు గనఁబరచిన విశ్వరూపములో శ్రీస్వామియొక్క విస్తృతాకారముఖములోనికి జావబోవు కౌరవ వీరులందరును ప్రవేశించునట్లు చెప్పఁబడి యున్నది. రెండుమారులు రెండువిధములుగ వర్ణింపఁబడినందున నిది విశ్వరూపము కాదని స్పష్టపడును. లేదా స్వరూపవిమర్శముతో మనకు బని యేమి ? ఏకారణమున విశ్వరూప మను రూపమును గనఁబరచిరో విచారింతము. కౌరవసభయందు విశ్వరూపమును గనఁబరచుటవలన గౌరవులు యుద్ధమును మానలేదు. తాత్కాలికదివ్యదృష్టిచే దర్శించినట్లు చెప్పఁబడినధృతరాష్ట్రుడుకూడ దనకుమారునకు యుద్ధమును మానుమని హితము చెప్పలేదు. అర్జునునకు విశ్వరూపమును జూపుటచే మాత్రము విముఖుఁ డయిన యర్జునుఁడు యుద్ధమున కభిముఖుఁ డయ్యెను. కావున నర్జునునకు శ్రీస్వామివారు తమ స్వరూపమును జూపి యుందురు. కాని యద్వైతియగు భారత గ్రంథకర్త వర్ణించిన రూపము కానే కాదు. యద్వైతి పంచదేవతారాధనపరుఁడు గావున శక్తికిని స్వామికిని నభేదముగా భావించి యాముఖములో జాపబోవువారు చొచ్చుచున్నట్లు వర్ణించెను. పరమభక్తుఁడును సఖుఁడును నగు సర్జునునకు గనఁబరచినరూప మితరులకు దెలిసికొన నలవి యగునా? కావున నర్జునునకు శ్రీస్వామివారు స్వస్వరూపమును జూపియుండిన నుండవచ్చును. ఈయంశము వినియున్న కౌరవపక్షపాతి యగు నీగ్రంథకర్త యీయర్జునునకే గాదు. రాయభారమున కేగినపుడు కౌరవసభలోఁగూడ గొందరికి తత్రాపి అంధుఁడగు ధృతరాష్ట్రున కిదివరకే యొక విశ్వరూపమును జూపించెనను నతిశయోక్తికయి యచ్చట విశ్వరూపమును గల్పించి తనకు దోచినట్లు వర్ణించెను. మరియొకచోట నుతంకుఁడను నొక ఋషికి విశ్వరూపమును గనఁబరచిన ట్లున్నది. అపుడు పూర్వ మర్జునునకు జూపిన విశ్వరూపమునే చూపె నని చెప్పుచు విరాట్స్వరూపమును వర్ణించెను. గాని చావబోవుకౌరవులు శక్తిముఖమున జొచ్చునట్లు లేదు. అర్జునునకు నుతంకునకును గనఁబరచినరూప మేకవిధ మని చెప్పుచు గ్రంథకర్త భిన్నముగ వర్ణించెను. కావున నుతంకునికథ బ్రాహ్మణప్రభావముకొరకు నొకయతివలనఁ గల్పింపఁబడియుండును.

అర్జునునకు సారధ్యము జేయుచు నొకనాఁడు మునికోలను మరియొకనాఁడు చక్రమును బట్టుకొని శ్రీస్వామివారు భీష్మునిఁ జంపుటకు బోయినటులను నర్జునునివలన బ్రార్థితు లై తిరుగ నొగ లెక్కినటులను జెప్పఁబడి యున్నది. భారతగ్రంథకర్త కౌరవపక్షపాతి యని యుపోద్ఘాతమునఁ జెప్పఁబడియే యున్నది. ఆయావిషయము లన్నియు నచ్చటనే చర్చించి పరిష్కరింపఁబడి యున్నవి.

ప్రతిపక్షమువారగు పాండవులపక్షమున నున్న యీ శ్రీకృష్ణమూర్తిని నీగ్రంథకర్త తూలనాడక యుండునా? సర్వేశ్వరుఁ డయినవాఁడు యుద్ధము చేయనని ప్రతిజ్ఞచేసి భీష్మునిమీఁదికి మునికోలను జక్రమును బట్టికొని వెళ్లునా? చదువరులే యోచింపుడు ?

పదియేఁడవనాఁటియుద్ధమున ధర్మరాజు యుద్ధమునం దలసి శిబిరమున కేగెను. అట్లేగిన యన్నయొక్క క్షేమమును దెలిసికొనుటకు నర్జునుఁడు కోరఁగా 'ఇతఁడు కొంత యలయిక దీర్చికొనుట కిదియె సమయ' మని తలఁచి శ్రీస్వామివారు రథమును బాండవశిభిరమునకు బోనిచ్చిరి. అప్పు డీ కృష్ణార్జును లిద్దరును గర్ణునిఁ జంపి యావార్త తనకు దెలుపుటకయి వచ్చి రని తలఁచి ధర్మరా జుప్పొంగెను. పిదప నిజమైన కారణము దెలిసికొని 'కర్ణుని జంపక యుద్ధభూమినుండి వచ్చితివా ' యని యతికోపముతో నర్జునుని దూలనాడుచు 'నీచేత గాకపోయినయెడల నీధనుస్సుగుగాండివ మును శ్రీకృష్ణులవారి చేతి కి 'మ్మని కోపముతోఁ బలికెను. ఈయర్జునుఁడు తనగాండివము నితరుల కిమ్మని యెవ్వఁడు చెప్పునో వానితలఁ దునుముటకు మానసికశపథముఁ జేసికొని యున్నాఁడు. అందునుబట్టి ధర్మరాజుతలఁ దునుముటకు యత్నించెను. అపుడు శ్రీస్వామివారట్లు గాకుండజేసి యందుకు బ్రతిగా ధర్మరాజును దూలనాఁడుమని సమాధానపరచిరి. అ ట్లన్నను దూలనాడి యందుకుగాను దనవథకు బ్రయత్నింపఁగా నట్లు జరుగకుండ శ్రీస్వామివా రాటంకపరచి యాత్మవథకు మారుగా నాత్మస్తుతినిఁ జేసికొమ్మని బోధపరచిరి. అంతట నట్లు తూలనాడఁబడి ధర్మరా జరణ్యమునకుఁ బోవ సమకట్టగా శ్రీకృష్ణులవారు కొన్నిహితవాక్యములనుఁ జెప్పి మరలించిరి. అప్పుడు ధర్మరా జిట్లు పలికెను :--

క. "ఇది యట్టిద మోసంబున
   బదిలుఁడగా కేను మున్ను పదిరినకతనన్
   హృదయము గలఁగిన నా కె
   య్యదియును దోసమి నికారి నైతి మహాత్మా.

అ. ఇట్టి నన్ను ననునయించి బోధించితి
    కరుణ సేర్మిజేసి గారవమున
    నజ్ఞులైన మమ్ము నాపత్సయోనిధి
    మునుఁగుకుండఁ గాచి తనఘమూర్తి."

ఆపయిని గృష్ణార్జును లుభయులును ధర్మరాజునొద్ద సెలవును బొంది కర్ణునిఁ జంపుటకు యుద్ధభూమికి మరలఁ జేరిరి.

ఈపయికథలో గ్రహింపవలసిన విషయములు మూడు కలవు :-

1. ఎవఁడుగాని మనస్సునందు శపథము చేయఁగూడదు. అది రహస్యమైనది యైనందున గురుపితృభ్రాతృమిత్రాదులకు సహా బాధ కలుగును. అట్లనే యీయర్జునునిప్రతిజ్ఞవలన ధర్మరాజునకు బ్రాణోపద్రవము సంభవింపబోయెను. అయితే శ్రీస్వామివారి యనుగ్రహమువలన నట్లు కాక తప్పిపోయెను.

2. జ్యేష్ఠభ్రాతను దూలనాడుట యతనిని వధించుటతో సమమని శ్రీస్వామివారు సెల వచ్చిరి. పూజ్యులగువారిని నిందించు నలవాటు అందలిదోషమును దెలియక జనులకు వాడుక గాగలదు. సాధారణముగ నితరులనుగూడ నిందించుట తప్పు, అది మర్యాద కాదు.

3. ఆత్మస్తవ మాత్మహత్యవంటిదే యని శ్రీస్వామివారు సెల విచ్చిరి. ఆత్మ స్తుతి యనఁగా దనవిషయము తెలియనివారియెదుట దాను నేర్చినవిద్యను జెప్పుకొనుట కాదు. ఒకఁడు తాను చేసినదానిని నీతిబోధకముగాఁ జెప్పుకొనుటయు గాదు. అట్లు గాక విద్యయందుగాని బుద్ధియందు గాని దేహబలమునందుగాని శౌర్యమునందుగాని, ధనము, దానము, తపస్సు, కీర్తి, నేర్పు మొదలగు వానియందుగాని తనకంటె నధికులు లేరని గొప్పకొరకు జెప్పుకొనుట యాత్మస్తుతి.

శ్రీస్వామివారిచే జేయఁబడిన సంజ్ఞవలన భీముఁడు దుర్యోధనునితొడలు విరుగఁగొట్టె నని చెప్పఁబడి యున్నది. దుర్యోధనునితొడలు విరుగఁగొట్టుదు నని కౌరవసభలోఁ బ్రతిజ్ఞ చేసియుండిన భీమున కొకరు సంజ్ఞ చేయవలెనా ? దుశ్శాసనునిఁ జంపినరోజున సహా రెండవప్రతిజ్ఞయగు దీని నెరవేర్ప వలసియున్నదని భీముఁడు చెప్పియే యున్నాఁడు. బలరాముల వారికి శ్రీస్వామివా రిచ్చినయుత్తరములో సమయ మెఱిఁగి ప్రతిజ్ఞ నెరవేర్చుకొనె నని యున్నది. కావునఁ బాండవపక్షమున నున్న సర్వేశ్వరునకు మచ్చ దెచ్చుట కీవిషయమును గ్రంథకర్త కల్పించి యుండును.

నాటిరాత్రి పాండవులను శిబిరమున నుండనీయక యోఘవతీనదీతీరమునకు రథములతోఁగూడ శ్రీస్వామివారు పిలుచుకొనిపోయి రనియు, అందుచే బాండవు లశ్వత్థామచేఁ జంపఁబడక తప్పిపోయి రనియు నున్నది. అశ్వత్థామ చేయఁబోవు ఘోరకృత్యము నదీతీరమునకు జేరుటకుముందు శ్రీస్వామివారికిఁ దెలిసియున్న యెడల బాండవసేననంతను రక్షించి యుందురు. సర్వజ్ఞునకు దెలియదా యని యంటిరేని, అశ్వత్థామ రాత్రి మించినపైని దుర్యోధనునియొద్ద కేగి యతని దురవస్థను జూచి యర్థరాత్రా నంతరమున నీదుష్కార్యమును జేసెను. కావున బాండవు లానదీతీరమునకు బోవకముం దీవిషయము శ్రీస్వామివారికిఁ దెలియవచ్చుటకుఁ బ్రసక్తిలేదు. అశ్వత్థామ యీదుష్కార్యమును జేయఁ బూనినప్పుడెకదాహస్తినాపురమున ధృతరాష్ట్రునియొద్దనున్న శ్రీస్వామి కావిషయము హృదయగోచర మైనది ? మరి యేమి యనిన : యుద్ధము సమాప్త మైనపిదప బాడుపడిన యాస్థలమునందు నాటిరాత్రి యుండఁగూడదని నిర్మలమైన నదీతీరమునకు పాండవులను దీసికొనిపోయి యుందురు. ఆపిదప యుద్ధానంతరకథ యశ్వత్థామాదులచరిత్రములలో వ్రాయఁబడి యున్న ది.

పిమ్మట శ్రీస్వామివారు ధర్మరాజునకు స్వయముగ రాజ్యాభిషేకమును జేసిరి. ఇట్లు పట్టాభిషిక్తుఁ డయ్యును ననేకులగు తనవారు యుద్ధమునందు మృతు లయినందుకు వగచుచున్నందున శ్రీస్వామివారు సోదరయుక్తముగ నతనిని భీష్ముని పాలికిం బిలుచుకొనిపోయి యాకురువృద్ధువలన ననేకధర్మములను జెప్పించి మనఃకల్మషమును బోవునట్లు చేసిరి. అయితే సర్వము దెలిసిన శ్రీస్వామివారు తాము స్వయముగ ధర్మోపదేశము జేయక భీష్మునిచే ధర్మరాజునకు ధర్మాధర్మముల నేల చెప్పించిరో విచారింపవలసి యున్నది

శ్రీస్వామివారే వానినివివరింపవలసివచ్చినయెడల నాయా విషయములయొక్క నిజస్వరూపములను జెప్పవలసి వచ్చును. అప్పుడు ధర్మరా జతనిస్వభావమునుబట్టి రాజ్యమును విడుచుకొని తపస్సు జేయుటకు బోవును. వ్యాసాదిఋషులచేఁ జెప్పించినను నించుమించుగ నిది యేఫల మగును. కావున నీధర్మరాజు ముందు ప్రజలను శిష్టాచారముచొప్పున వర్ణాశ్రమమత విషయములకు లోబడి పరిపాలనము జేయవలసినవాఁడయి యున్నాఁడు. మరియు జ్ఞానులుగాని ప్రజ లనేకమత సంబంధపు నీతివిషయకగాధలను నిజములగు వానిగ నమ్మియున్నవారు. కావున భీష్ముం డక్కాలపువారిలో వాడుకలో నుండు ననేక ధర్మములను నీతులను గాధలను మతసంప్రదాయములు మొదలగువానినిఁ జక్కగ నేఱిఁగినవాఁ డగుటచేత నతనివలననే ధర్మరాజుయొక్క మనఃకల్మషమును శ్రీస్వామివారు తీర్పించిరి. ఆపిదప గొన్నిదినములవరకు హస్తినాపురముననుండి మరల ద్వారక కేగి ధర్మరాజు చేయునశ్వమేధయాగమునకు గుటుంబసహితముగ వచ్చి యాగానంతరమున దిరుగ ద్వారకకు దయచేసిరి. శ్రీస్వామివారు ద్వారకలో ననేకసంవత్సరములు విజయముచేసి తమవలన నీలోకమునకు గావలసినపనులను నెరవేర్చి తుద నుధ్ధవునకు బరమార్థోపదేశము జేసి బలరామసహితులయి వైకుంఠలోకమునకు దయచేసిరి.

ఈస్వామివారి యనుమతిని బురస్కరించుకొని వ్యాసులవా రప్పటికి ఖలమై సంకీర్ణములయి యున్న వేదములను వేరు పరచి రనియు బ్రహ్మసూత్రములను జేసి రనియు నిప్పటిగ్రంథకర్తలు కొందరు చెప్పుచున్నారు.

వ్యాసుఁడు శ్రీకృష్ణులవారికాలమునాటివాఁడే కదా? శ్రీస్వామివా రవతరించుటకు దుష్టనిగ్రహమే గాక యిట్టి కార్యములు చేయుపనియుఁగూడఁ గలదు. వారు క్షత్రియులు గావున బ్రాహ్మణుడును ఋషియు నగు నీవ్యాసునిచే నిట్లు చేయించి రనుదానిని మనము నమ్ముటకు సందియ మేమి ? అందునుండియే కదా! 'వ్యాసోనారాయణోహరిః ' అని వ్యాసులవారికిఁ బ్రసిద్ధి కలదు.

ఈభాగవతగ్రంథకర్తయగు మొదటివాఁడు. విష్ణుభక్తుఁడును నతనిబరాత్పరుఁ డని నమ్మినవాఁడును నయి యున్నాఁడు. అచ్చులేనికాలములో నిట్టిగ్రంథములు తాటియాకుపుస్తకములలో వ్రాయఁబడియుండుటనుబట్టి మతాభిమానులు వారిమతమును బుష్టిచేయుకొరకు గొన్ని గాధలను, మతాంతరులు మనమతసంప్రదాయములయందును మనచే నమ్మఁబడినత్రిమూర్తులయందును లోపములను వ్యంగ్యముగ వ్యక్తపరచు దురుద్దేశముతో గొన్ని కొన్ని కథలను గల్పించిరి. అందు నీభాగవతమున బోపదేవుఁడను బౌద్ధమతాభిమాని ప్రచ్ఛన్నముగ మన మతస్థులతోఁ గలిసి, మన మెవ్వని బరాత్పరునిగ నమ్ముచున్నామో యట్టిశ్రీకృష్ణునియం దయుక్త ప్రవర్తనను గనబరచు దురుద్దేశముతో జలక్రీడ, రాసక్రీడ, పోడశ సహస్ర కన్యాపరిగ్రహము మొదలగుగాధలను నేర్పుతోఁ గల్పించి చేర్చెను. ఆగాధల ససందర్భము లని యోచింపక యసందర్భములకు మరికొన్ని యసందర్భములను గల్పించెడి స్వభావము గల మనపండితులు శరీరిశరీరన్యాయమును దెచ్చిపెట్టికొని పైగాధలవిషయమున సమాధానపడి యితరులకు బోధపరచు చున్నారు. ఇట్లు విమర్శనము లేని మనపండితులవలన మనయార్యమత మన్యమతస్థుల కాక్షేపణీయ మగుచున్నది. ఈబోపదేవుఁడను వానికాలమునాటికి శ్రీకృష్ణులవారే పరాత్పరులని నమ్మినవారు హెచ్చుమంది యుండి యుందురు. అది బౌద్ధమతమునందు యుక్తప్రవర్తనవలననే ముక్తి కలదు గాని జపతపోహోమార్చనాదులవలన ముక్తి లేదనుసిద్ధాంత మగుటచే నెవ్వని నప్పటి ప్రజలు పరాత్పరునిగ నమ్మియున్నారో యట్టి వానిప్రవర్తనము మంచిది కాదని చెప్పి బోధపడచుటచేత శ్రీకృష్ణులవారియందు బరాత్పరుఁడనునమ్మకము కొందరికి బోయి బౌద్ధమతములో సులభముగ జేయుండి యుందురు. ఇక్కాలవువివేకముగల కొందరుపండితులు రాసక్రీడాదిగాధల గ్రంథశైలినిబట్టి యోచింపఁగా దదితర భాగములశైలి ననుసరించి యుండలేదని చెప్పుచున్నారు.

ఇటులనే కేవలమతగ్రంథములయందు శంకరరామానుజ మధ్వాచార్యులశిష్యపరంపరవారు వారివారి మతముల పుష్టికయి కొన్ని కొన్ని గాధలను గల్పించియున్నారు.



__________