Jump to content

శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణ.

ఉపోద్ఘాతము.

మన యార్యమతగ్రంథములు మూడువిధములు. ప్రభు సమ్మితములు, సుహృత్సమ్మితములు, స్త్రీసమ్మితములు. అందు ప్రభుసమ్మితములు వేదములు, అనఁగా శ్రుతిస్మృతులు, సుహృత్సమ్మితములు పురాణములు. స్త్రీసమ్మితములు కావ్యములు. శ్రుతిస్మృతులు ప్రభువాజ్ఞవంటివి కావున వానిని విడిచి పామరులకొరకు బుట్టినపురాణాదులవిషయము ముందుగ గొంత చర్చ జేసి యాపిదప నాయీగ్రంధమును వ్రాయఁ బూనుచున్నాను. పురాణములు పదునెనిమిది, ఉపపురాణములు పదునెనిమి దనియు, ఇరువదియారుకంటె నెక్కుడు గల వనియు గ్రంథాంతరములవలనఁ దెలియుచున్నది. వానిలో మొదటి పురాణసంహిత లారనియే శ్రీభాగవతగ్రంథములోఁ జెప్పఁబడి యున్నది. ఎటులైనను ద్రిమతాచార్యులచేత నంగీకరింపఁబడిన పురాణములే గాని యితర మైనవి ప్రమాణములు కావు. మత పక్షపాత బుద్ధితోఁ జెప్పఁబడినవి కావున మనము వానిని విననే కూడదు. పురాణములకు మొదటి సృష్టి యనఁగా గోళములు సృష్టియు, నాపైని గలిగెడువస్తుజీవసృష్టులు, సూర్యచంద్రవంశములు, తత్తద్వంశీయుల వృత్తాంతములు మన్వాదులకాలములు నను నైదులక్షణములు గలిగియుండవలెను ధర్మార్థ కామమోక్షముల నుపదేశించు పూర్వకాలపుగథలతో నిండియున్నది యితిహాసము, వ్యంగ్యముగా నీతిని బోధించునది కావ్యము. శ్రీమద్భాగవతాదికములగు పదునెనిమిదిపురాణములకుఁ బురాణ లక్షణములుగల వనియెదరు. ఇతిహాసలక్షణము గలది మహాభారతమని చెప్పుదురు. శ్రీమద్రామాయణమును గావ్య మని నుడివెదరు. ఈ విభాగములతోఁ బని కవులకే గాని మనవంటి చదువరులకు లేదు. పైనిఁ జెప్పఁబడిన త్రివిధగ్రంథములయందును ధర్మార్థకామమోక్షములను బోధించు పూర్వరాజులచరిత్రలు, వంశానుక్రమములు సమముగనె యున్నవి. మఱియు నీ మూడువిధములయిన గ్రంథములయందును ననేకగాథలు మత సంబంధపు నమ్మకములును గలవు. కావున వానిని ముందుగఁ జెప్పవలసియున్నది. అందు గాథ లైదువిధములు. వాని నిజముగజరిగినవానిగా మనము తీసికొనఁగూడదు. అవి యెవ్వి యనిన :-1. నీతిబోధకములు, 2. ఆధిక్యమును దెచ్చుకొరకు జెప్పఁబడినవి. 3. ప్రశ్నకు సమాధానముగా నుండునవి, 4. గ్రంథకర్తలు పడినదురభిప్రాయములను బలపరుచుటకుఁ జెప్పఁబడినవి. 5. అవివేకపునమ్మకములతో నున్నవి. వీనిని మన మెంత మాత్రము నిజముగ జరిగిన వని నమ్మగూడదు. ఇంక మతసంబంధపు నమ్మికలు ప్రతిమతమందును గొన్ని గలవు. వానిని నమ్మకపోయినయెడల యేమతమును నిలువఁబడదు. అందు మన యార్యమత మాది దగుటచేత హెచ్చుగ నున్నవి. అవి యెవ్వి యనిన :- అంతరిక్ష గమనము, కామరూపము, తపోమహిమ, వరప్రభావము, ఊర్ధ్వలోకవాసుల యాగమనము, భగత్ప్రత్యక్షము, భగవత్సాహాయ్యము, అదియు ప్రత్యక్షపరోక్షకృతము, దీర్ఘకాలజీవితము, స్వచ్ఛందమరణము వీనిని మనము తప్పక నమ్మవలెను. అందు స్వచ్ఛందమరణము సరిగ జరుపఁబడక పోయినయెడల నాత్మహత్యలోనికిఁ జేరును. భీష్మునిది యటుల కాదు. ఏ మనిన; పోవుటకు సిద్ధముగ నున్నప్రాణమును నేకాదశివరకు నిలిపియుంచెను.

శ్రీమహాభారత విషయము.

జనమేయమహారాజు తనకు మహాభారతకథను జెప్పుమని వ్యాసులవారి నడుగ నతఁ డాకథ నామహారాజున కెఱింగింపు మని వైశంపాయనమహర్షిని నియోగించినటులను నాఋషి యీభారతకథను జెప్పినటులను గానిపించుచున్నది. వ్యాసులవారు ముందుఁ జెప్పినదానినే వైశంపాయనుఁడు చెప్పి యుండిన నుండవచ్చును. లేదా వ్యాసులవారివలన వినియున్న కథను వైశంపాయనుఁడు గ్రంథరూపముగఁ జెప్పియుండ వచ్చును. లేదా మనపురాణము లన్నియు వ్యాసప్రోక్తములుగాఁ జెప్పినటుల వ్యాసులవారివలన వినిన ట్లారోపించి వైశంపాయనులవారు చెప్పియుండవలెను. ఎవరు చెప్పియుండినను నాచర్చతో మన కేమిపని? కావున నెవ్వరు చెప్పియున్నను నాగ్రంథకర్త కౌరవపక్షపాతియు, నద్వైతియు నై యున్నాఁడు. ఇందు మొదటివిషయము చర్చించునపు డాగ్రంథములోని చాలయసందర్భములు బయలఁబడును. వానిని ముఖ్యముగ నాగ్రంథమును జదువువారును వినువారును దప్పక గమనింప వలసి యున్నది.

ఈగ్రంథ మనేకేతిహాసములు, రాజవంశముల వృత్తాంతములు, నీతులు, ధర్మములు వీనితో నిండియున్నది. అందుచే దీని నైదవవేద మని చెప్పుదురు.

ఒకరితో నొకరు సంభాషించునపు డెల్లను నీతితోఁ జేరని మాటలే తరుచుగ నుండవు. ఎదురువాదపు సమయములలో నిరుప్రక్కలవారు చెప్పెడినీతులు వినఁగనే బహుప్రశస్తముగ దోఁచును. చదువరులకును వినువారికిని నబ్బురపాటుగ నుండును. కావున నెవ్వరెవ్వరిచరిత్రములవలన మన మేమేమి గ్రహింపవలెనో దానినిఁ జూవుట కీగ్రంథమును వ్రాయఁబూనితిని గాని యన్నినీతులను ధర్మములను జెప్పుటకు గాదు. వానినిఁ దెలిసికొనుటకు శ్రీభగవద్గీతలు శాంత్యాను శాసనికములే చాలును.

శాంత్యానుశాసనికములలో భీష్ములవారు ధర్మరాజుతోఁ జెప్పినవి కొంచెము ఛాందసముగాను, పరస్పరవిరుద్ధముగాను పునరుక్తముగాను గనుపడును. వారియిరువురిమధ్యను జరిగిన సంభాషణ యొక్క నాటిది గాక యనేకదినములు జరిగినదగుట చేతను, ధర్మరాజును నడిగినప్రశ్నమునే పలుమారు వేరొక సందర్భములో వేరొకవిధముగ నడుగుటచేతను, భీష్ముఁడు తన యాదినిబట్టి మాటలుగాఁ జెప్పుటచేతనుఁ బయిని వ్రాసినట్లుండును. అంతమాత్రముచేత భీష్మునియందుఁ దప్పు నెంచఁ గూడదు.

మాక్సుముల్లరుగారి యాజమాన్యముక్రిందఁ బుట్టిన పవిత్రమైన తూర్పుదేశపుగ్రంథము లనేనామముతో నున్న గ్రంథములలో గీతలు, సనత్సుజాతీయము అనుగీతలు గల పుస్తక మొకటి గలదు. ఆమూడింటి యుపోద్ఘాతములను నింగ్లీషు నేర్చిన మనయార్యమతస్థులందరును జదువఁ గోరుచున్నాఁడను. ఆగ్రంథకర్త సనత్సుజాతీయము అద్వైతమతాభిమానిచే నిటీవలఁ జెప్పఁబడి భారతమునఁ జేర్పబడిన దని బహువిధముల సాధించెను. అటులనే యనుగీతలను నవి మరియు నిటీవల ననఁగా బౌద్ధజైనమతములు పుట్టినపిదపఁ జెప్పఁబడి యీ భారతమునఁ జేర్పఁబడినటులను సాధించెను. ఆచర్చ నిచట వ్రాయఁబూనుట యనవసరము. నేను దానినిఁ జదివి యాయా యుక్తులను, సందర్భములను బండితులతోఁ జర్చించితిని. వారును నేనును నాగ్రంథముయొక్క యుపోద్ఘాతము వ్రాసినవానియభిప్రాయముతోనే యేకీభవించితిమి.

ఇఁక మహాభారతగ్రంథకర్త కౌరవపక్షపాతి యనువిషయమును వ్రాయుచున్నాను.

1. గాంధారికి నొకమాంసపిండము పుట్టిన దనియు, దానిని నూరుశకలములుగఁ గోసి వేరువేరు పాత్రములయం దుంచి వానికిఁ గొన్నిదోహదములు చేయఁగా నవి నూర్గురు కుమారు లైనటుల జెప్పఁబడి యున్నది. మాంసపిండమే గర్భములో నుండి వచ్చినపిదప శిశువు గానేరదు. అట్టి దానిని నూరుతునకలుగాఁ గోసి కుండలలో నుంచుటయు నవి నూర్వురుబిడ్డ లగుటయుఁ గడువింతగ నున్నది. ఇట్టియసంభావితమును విచారించిచూచినవా రెవ్వరును నొప్పఁజాలరు. అయితే నటుల నెందులకుఁ జెప్పఁబడిన దన, ఆపిండము గాంధారిగర్భములోనే పెరిగి యందరుబిడ్డల తోపాటుపుట్టక పోవుటయే కాక నూరుశకలములుగా విభజింపఁబడి నూర్గురు కుమారులయినందున బలక్షీణమయి, యాకుమారులు భీముని చేత హతు లయిరి గాని లేకపోయినయెడ భీమునకే కాక యెవ్వరికిని వారినిఁ జంప వశమా యనునాధిక్యమును వ్యక్తపరచుట కీవిచిత్రసృష్టికథను గ్రంథకర్త కల్పించెను.

గాంధారి పట్టమహిషి గావున ధృతరాష్ట్రునికుమారు లందరు నామె కుమారులుగానే వాడఁబడిరి. ఆమెకు బహుశః దుర్యోధనదుశ్శాసనులు స్వకుమారు లై యుండవచ్చును. తదితరు లితరభార్యల లేదా భార్యలవలె నంతఃపురమునం దుంపఁబడినస్త్రీల కుమారు లై యుండవచ్చును. అట్టివారు గాక వివాహితభార్యల కుమారు లైనచో నాభార్యలపేరు లేల చెప్పఁబడవు. యుయుత్సుఁ డనువాఁడు ధృతరాష్ట్రునికి గోమటి దానియందుఁ బుట్టిన ట్లొక చోట స్పష్టముగఁ జెప్పఁబడియున్నది. ఇందునుబట్టిచూచినను నుంపుడు స్త్రీలు ధృతరాష్ట్రునకుఁ గలిగి యుండుట స్పష్టపడుచున్నది. లేదా గాంధారికుమారులే యని వీరినిఁ జెప్పుదుమంటిమా ; ఒకస్త్రీకి నూర్గురుకుమారులు పుట్టుట యసంభావితము. ఆకాలముననే గాక యిప్పటివరకు రాజు లుంపుడుస్త్రీల సంతఃపురమునం దుంచుటయు, నట్టిస్త్రీల కుమారులకు సముఖమునందు గూర్చుండుమర్యాద నిచ్చుటయు, కుమార్తె లైనయెడల వివాహములు చేయుటయు జరుగుచున్నది

2. అరణ్యవాససమయమున నింద్రునిపనువున నర్జునుఁడు స్వర్గమునకుఁ బోయి యింద్రునివలనఁ దివ్యాస్త్రలాభముఁ బడసెననియు, నింద్రాదులకు జంప శక్యముగాని నివాతకవచులను రాక్షసులను సంహరించె ననియుఁ జెప్పఁబడియున్నది. ఈకథ యెందుకు గల్పింపఁబడినదో చూతము. ఎవ్వఁడైన మనుజుఁడు తనమానవశరీరముతో స్వర్గాద్యూర్థ్వలోకములకుఁ బోవుటకు వీ లుండు నని పూర్ణముగఁ జదివినపండితు లంగీకరింతురా ? మరి యేమి యనిన , అమానుషమైన స్వర్గారోహణముఁ జేసి యింద్రాదులకుఁ జయింప శక్యముగాని యారాక్షసులను జంపి యింద్రునివలన నస్త్రలాభము నొందిన సమర్థుఁడు గావుననే కర్ణాదులను భారతయుద్ధమున నితఁడు చంపె నని కౌరవుల యాధిక్యముకొర కీకథ చెప్పఁబడినది. సాధారణముగ జదువువార లర్జునునియాధిక్యమునుఁ దీసికొనియెదరు. సఖుఁడైన సర్వేశ్వరుఁ డతనికి సారథి యై యుండఁగ మరియొకరిసాహాయ్యము గావలెనా?

3 భీష్మునిపరాక్రమమునకు జడిసి యతనినిఁ జంపఁజాలమని తలఁచి శ్రీకృష్ణులవారిపనుపునఁ బాండవులు నీచావువిధమునుఁ జెప్పు మని యతనియొద్దకు రాత్రివేళ బ్రచ్ఛన్నముగఁ బోయి చెప్పుకొని ప్రార్థించినటులఁ జెప్పఁబడి యున్నది. యుద్ధదివసములలో నట్లు వైరులశిబిరములకుఁ బోవుటకు వీలు పడునా ! ఏదియేనిఁ దెలిసికొనవలసి యుండినయెడల సర్వజ్ఞులగు శ్రీస్వామివారికిఁ దెలియనిది భూతభవిష్యద్వర్తమానములలో నేదియైన నుండునా ? ఈగ్రంథకర్త కెంతపిచ్చి ! మరియు శ్రీస్వామివారు పాండవులను రక్షింపఁ బూనుకొని యుండి వీరి కిట్టితుచ్ఛమైన పనినిఁ జేయు మని చెప్పుదురా ? ఒకవేళ ధర్మరాజు భీష్ముని యాటోపమునకు జడిసియుండినను బీమార్జును లాముసలివానికి జడియుదురా! కావున నిదియుఁ గల్పితకథయే యయి యున్నది. ఎందుకు జెప్పఁబడిన దనఁగా : శ్రీపరశురాముని జయించినవాఁడును స్వచ్ఛందమరణముగలవాఁడును నగు నీతనినిఁ జయింప నీయర్జునునకు శక్యముగాదు కావున నిట్టిప్రార్థనవలన భీష్ముడు మడిసె నని చెప్పుటకుగా కథ కల్పింపఁబడినది.

4 అర్జునుఁడు శిఖండిని ముం దిడికొని భీష్ముని గ్రిందఁ బడువరకు బాణములతో గొట్టె నని యున్నది. మహావీరుఁడగునర్జునుఁ డొకనిచాటున నుండి మృగమును గొట్టినట్లు చేయఁబూనునా ? ఈకథయు భీష్మునియాధిక్యముకొరకు గల్పింపఁ బడిన ట్లున్నది. కాని నేను వేరొక యభిప్రాయమునుఁ దీసికొని యెదను. అర్జునునియందు భీష్మున కతిప్రేమ గలదు. ఎప్పుడు వీరిరువురు నెదురుకొనినను నెదిరించి నిలువఁబడి యుద్ధము చేయక యస్త్రమునకు బ్రత్యస్త్రమునుమాత్రము వేయుచు దాటిపోవుచుందురు. శిఖండి స్వతః భీష్ముని బడఁద్రోయునంతటి వీరుఁడు గాకపోయెను. అందువలన నీభీష్మునికి బరమశత్రువగుశిఖండిప్రక్క జేరి యర్జునుఁడు యుద్ధము చేసెను. శత్రువు ప్రక్క నుండి యుద్ధముచేయు నీతనిని మునుపటివలె బ్రేమతోఁ దప్పించిపోలేక నిలువఁబడి కోపముతో రణము చేసెను. అదియేసమయముగ నర్జునుఁడు తీసికొని భీష్మునిఁ గూల్చెను. సంగతి సందర్భములనుఁ గొంచెము యోచించువారికి శిఖండిప్రక్కనుండి యర్జునుఁడు భీష్మునిఁబడఁద్రోయుట కిదియే కారణమని తోఁచక మానదు.

5. భగదత్తునిచే నర్జునునిమీఁద వేయఁబడినవైష్ణవాస్త్రమును శ్రీకృష్ణులవారు రధముపైని నర్జునునకు నడ్డముగ నిలువఁబడి పూలదండనుగాఁ జేసికొని రని యొక చోటఁ జెప్పఁబడి యున్నది. ఆభగదత్తుఁ డెంతయవివేకి విష్ణుసంబంధమైన యస్త్రమును విష్ణుఁడు ముందు గల యర్జునునిమీఁద విడువఁ దగునా ! ఆ యస్త్రమే శ్రీకృష్ణులవారిమెడను బూలదండగాఁ బరిణమించి యుండును గాని శ్రీకృష్ణులవా రడ్డముగ నిలిచి యుందురా! ఆభగదత్తుని యవివేకము నుభయపక్షముల వీరులకుఁ జూపుటకుఁ బూలదండగ నైనపిదప రథముపయి నిలువఁబడి యుందురు. లేదా అటుల స్వామివారు చేయక పోయినయెడల నర్జునుఁ డాయస్త్రము చేతనే మడిసియుండు నని చెప్పుటకు గల్పింపఁబడినకథగా నుండును.

6. సైంధవవధ నాఁటిముందురాత్రి స్వప్నమునం దర్జునుఁడు కైలాసమునకుఁ బోయి యీశ్వరునివలనఁ బాశుపతాస్త్ర ప్రయోగవిధమును నేర్చుకొనివచ్చెనని యున్నది. ఆయస్త్రము నర్జునుఁడు పూర్వ మీశ్వరునివలనఁ బొందియే యున్నాఁడు గదా! తిరుగ నెందుకు వెళ్లవలెను. మహావీరుఁ డగునర్జునుఁడనేకాస్త్ర ప్రయోగములను దెలిసి యీయస్త్రప్రయోగవిధానమునుమాత్రము మరచునా? స్వప్న మందు గైలాసమున కేగుట యెటుల నగును ? కావున నీకథనుఁ గల్పితకథగాఁ దీసికొనవలెను. ఈకథకుఁడు వ్యాసాదిమహర్షులయొక్కయు, బీష్మాదుల యొక్కయు స్తవములచే శ్రీకృష్ణులవారిని బరాత్పరుఁడని తెలిసికొని యుండెను. ఇదిగాక గీతలలో “నాకంటె వేరుదైవము లేదు, ఆయాదేవతల నారాధించుట కంటె నన్నే యారాధింపుమనియు, నాదేవతలద్వారా ఫలమునిచ్చువాఁడను నేనే " యనియు శ్రీకృష్ణులవారు సెల విచ్చియుండుటచేత నద్వైతి యగు నీగ్రంథకర్త మత్సరబుద్ధిచే నాఁటిరాత్రి శ్రీకృష్ణులవారి పాదములయందుఁ బూజింపఁబడినపుష్పములే కైలాసమునం దీశ్వరునిపాదముల యం దుండుట సర్జునుఁడు చూచినట్లు తెలియుట కీకథనుఁ జేర్చెను. దీనివలన శివకేశవుల కభేదమని తోఁచగల దని తలఁచెను. అటుల నభేద ముండిన నుండును గాక. ఇట్టి మత్సరబుద్ధితో నీయసందర్భపుగథను గల్పించుట సరికాదు.

7. సైంధవవధనాఁ డతనినిఁ జంపుట కర్జునునకు శక్యము గాకపోవునవుడు శ్రీస్వామివా రొకమాయాతిమిరమును సూ ర్యునివైపు కల్పించినటులను, దానివలన సూర్యుఁ డస్తమించెనని తలఁచి తల యెత్తి చూచుచుండ నతనితల నర్జునుఁడు ఖండిచిన ట్లున్నది. ఈకథ యర్జునునకుఁ బ్రతిజ్ఞాభంగమైనదనియు, కౌరవవీరులు సైంధవుని జంపుటకు వీలులేనియట్లు కాపాడి రనియు నాధిక్యముకొరకుఁ జెప్పఁబడినది. కాని శ్రీస్వామివారు తిమిరమును గల్పించి మోసము చేసియుందురా! ఒకప్పుడు మేఘ మడ్డమై యుండుటయే నిజ మైనయెడల సాయంకాలసమయమున న ట్లుండుట తరుచుగ గలదు.

8. ద్రోణాచార్యునివధకొరకు ధర్మరాజుచేత శ్రీస్వామివా రబద్ధ మాడించినటుల నొకకథ గలదు. ఇదియు భీష్ముని శిబిరమునకు బ్రచ్ఛన్నముగఁ బోయి రనుకథవంటిదే. ఈ ముసలిబ్రాహ్మణుని చావుకొరకు శ్రీస్వామివారు మోసము చేయుట కబద్ధ మాడు మని నియమింతురా ! అస్త్రగురు చావునకు ధర్మరా జనృత మాడునా ? ఏమివింత ? అట్లు కానిచోఁ ద్రోణుఁడు యుద్ధమునందు మడియునా యను నతిశయోక్తి కొరకు గల్పింపఁబడినకథ గాని వేరు కాదు. యుద్ధానంతరము శ్రీకృష్ణులవారు తమద్వారకకుఁ బోయి వనుదేవునితోఁ జెప్పుటలో నీద్రోణుఁడు ముసలివాఁ డగుటచేత నలసిపోయి హతుఁడయ్యె నని యున్నది కాని ధర్మరా జబద్ధ మాడిన ప్రస్తావనయే లేదు. 9. ప్రాణములు వదలిన ద్రోణునిశిరస్సును ధృష్టద్యుమ్నుఁడు నరికినటుల నున్నది. ప్రాణములు వదిలిన కళేబరము క్రిందఁ బడక కూర్చొని యుండునా ! కావున నిది యసంభావితము. అలసిన యీముసలివాఁడు ప్రాయోపవేశముచేఁ బ్రాణములను విడుచుటకొరకు గూర్చొని యుండును. ఇతని కాపని యెందు కని ధృష్టద్యుమ్నుఁ డోర్వలేక తలఁ దునిమి యుండును.

10. అశ్వత్థామచే వేయఁబడిన నారాయణాస్త్రమును శ్రీస్వామివారు వ్యర్థముచేసినట్టు లొకచోటఁ జెప్పఁబడియున్న ది. వాహనములను దిగిన వారి నది యేమియుఁ జేయదని యెరిఁగినవారు కావున నట్లు సెల విచ్చి యుందురు. అట్లు చేయుట తప్పుగ గానరాదు. ఈయస్త్రమును సేన మొత్తముమీఁదఁ బ్రయోగించెను. అటుల లేక యర్జునునిమీఁదనే వేసియుండిన యెడల భగదత్తునిచే వేయఁబడిన వైష్ణవాస్త్రమువలె నిదియు శ్రీస్వామివారియం దేదో యొక యలంకారముగఁ బరిణమించి యుండును. వృధాగా దానివలన మడియుటకంటె బ్రాణములను సులభసాధనమువలనఁ దప్పించుకొనుట వీరధర్మము నై యున్నది. ప్రత్యస్త్ర ప్రయోగమువలన నలసినపుడును, మూర్ఛఁ జెందినపుడును సారధి తననేర్పువలన రథికుని యుద్ధభూమి నుండి వేరొకచోటికిఁ దొలగించుట మొదలగు ననేకమైన, పనులు యుద్ధములోఁ జరుగుటఁ గలదు. ఇందు మనము తీసికొన వలసిన మంచినీతి కలదు. అది యేది యనిన : జడమైన యీ నారాయణాస్త్రమే నమ్రు లైనవారిని నేమియుఁ జేయక దానియంత నదియే యుపశమించినపుడు తదధిష్ఠానదేవత యగు శ్రీమన్నారాయణుఁడు శరణాగతవత్సలుఁ డౌట నిస్సందేహము, అట్టిదైవము నారాధించి భక్తిచేతగాని, ప్రపత్తిచేతగాని శాశ్వత విష్ణులోకమునుఁ బడయవలెను. అట్లు చేయక, ఆహా ! పాపము స్వల్పసుఖముకొర కశాశ్వతలోక ప్రాప్తినిఁ గోరి యితరదైవముల నేల యారాధింపఁ బూనవలెను

11. భారతయుద్ధానంతరము శ్రీస్వామివారు శిబిరమునకు వచ్చి యర్జునునిముందు దిగు మని పిదప దాము రథావతరణముచేసి రనియు, వెంటనే యారథము కాలిపోయిన దనియు, భీష్మద్రోణకర్ణాది వీరులయస్త్రముల వేడిమివలన నది యట్లు కాలిన దనియు, నంతవరకు శ్రీస్వామివారె తమమహిమవలన దానిని గాలనీయక యుంచి రనియుఁ జెప్పఁబడి యున్నది. ఇది యంతయుఁ జచ్చిన యధర్మవీరులయాధిక్యముకొరకుఁ గల్పింపఁ బడినది. ఇందుఁ గల యసందర్భము లెవ్వి యనఁగా : ఎప్పుడుగాని రథికుఁడు రథావతరణము చేసినపిదవ సారధి రథము డిగ్గును. అట్టిస్థితిలో ముందుగ నర్జునుని దిగు మని శ్రీకృష్ణుల వా రేల సెల వీయ వలెను ? మరియు శ్రీస్వామివా రనేక పర్యాయములోక్కొక్క నాఁటియుద్ధానంతరము రథమును దిగి యుండలేదా! అప్పు డేల యారథము కాలిపోలేదు. అప్పు డంతయు శ్రీస్వామివారు దానినిఁ గాలనీయక రక్షించి రని యంటిమా, యట్టిశక్తి గలవాఁ డిప్పుడుమాత్రము దానిని గాలకుండ రక్షింపలేక పోవునా! ఏమివింత ? కావున నిదియుఁ గ్రంథకర్తయొక్క కల్పిత కథయే; యయి యున్నది.

కర్ణునినే నమ్ముకొని దుర్యోధనుఁ డిట్టియధర్మము జేసి ప్రజానాశనము జేయుటయే కాక వృద్ధబంధుమిత్రు లగువారిని హతులనుగాఁ జేసియున్నందున నట్టికర్ణునివిషయముఁ జెప్పుటకు జివరకు నిలిపి యుంచితిని గావున నతనివిషయము నింకఁ జెప్పఁబోవుచున్నాను.

1. ఈకర్ణుడు జనించుటలో నభేద్యకవచకుండలములతోఁ బుట్టెనఁట. ఇది యపూర్వసృష్టి. అవి యుండినయెడల నర్జునుఁ డితనినిఁ జయింపఁజాలఁ డని యింద్రుఁడు వీనినిఁ దన కిమ్మనుటయుఁ నీకర్ణుఁడు దానముకంటె వెరొకసుకృతము లే దని శరీరమునుగోసి యాకవచమును గుండలములను నిచ్చిన ట్లొకగాథ కలదు. చర్మమును దీసిన బ్రదుకుట యెట్లు ? ఈ యసంభావిత విషయమునుఁ దెలిసికొనలేక కవులు వెఱ్ఱులైయొక నిదానవిషయము పొగడవలసి వచ్చినప్పుడు దాన కర్ణుఁ డని వర్ణించెదరు

2. కుంతిదేవి కిచ్చినవరమున నర్జునుఁడు గా తక్కిన నలుగురుపాండవులను నీకర్ణుఁడు చంపక విడిచెనఁట. మరియు ధర్మరాజు రాజ్యముచేయుటకుఁ దగినవాఁడు గాని నే నందుకుఁ దగ నని కుంతితోఁ జెప్పెనఁట. సూతజాతి గలిగి దుర్యోధనుని వలన నొకస్వల్పరాజ్యమునకు సధిపతి యయి విఱ్ఱవీగుచు ననేకాధ్మకార్యములనుఁ జేసి యధర్మయుద్ధముచే ననేకులఁ జంపిన యీదురాత్ముఁడు కుంతితో నట్లు పలికి యుండునా ? ఏమివింత ! తక్కిననలుగురుపాండవులను నొక్కొక్కసమయమునందు జంపక విడిచె నని కుంతీవరకథను బ్రతిష్టించుటకుఁ జెప్పఁబడి యున్నది. అనఁగా నీవరమే లేకపోయిన యెడల నా నలుగురినిఁ జంపియే యుండు ననియతిశయోక్తికొరకు నీగాథ కల్పింపబడినది.

3. కర్ణునిచేత వేయఁబడినసర్పముఖశరము శ్రీస్వామివారర్జునునిరథమును గ్రిందికి నణగునట్లు చేయుటచేత నర్జునుని శిరస్సును దునుమక కిరీటమును హరించె నని యున్నది. ఇది కల్పితకథ కాకపోవునని మనము నమ్మవచ్చును. దీని నాధారముగఁ జేసికొని కర్ణుడు తనరథచక్రము భూమిలో గ్రుంగగానే దిగి యాచక్రము నెత్తఁగా భూమియంతయు మీఁదికి లేచినదని యొకకథ కల్పింపబడినది. ఎవ్వఁ డీబ్రహ్మాండము లన్నిటికి నాధారుఁడో యట్టివాఁడు రథముపయి నుండి దానినిఁ భూమిలోఁ గ్రుంగునట్లు చేయఁగలఁడు. ఆమహానుభావునితో నీకర్ణుఁడు సముఁ డని తెలుపుటకు గర్ణుడు చక్ర మెత్తనకథను గల్పించెను. ఇట్లు వానిరథచక్రము గ్రుంగుటకు బ్రాహ్మణ శాపము గల దని వేరొకకథ కల్పింపఁబడినది. మఱియు రథస్థుఁడగునర్జునుఁడు భూమీస్థుఁ డగుకర్ణుని దునిమె నని చెప్పఁబడినది. ఏనుఁగుమీఁద నున్న భగదత్తునితో నర్జునుఁడు యుద్ధము చేయలేదా? ఉభయపక్షవీరులును ననేకపర్యాయములు విరథులయి రథస్థులమీఁద దలపడలేదా? నలుప్రక్కలను గ్రిందు మీఁదు తలఁపక ప్రయోగము చేయువాఁడే వేటుకాఁడు కాని యితరుఁడగునా? ఈగ్రంథకర్తకు యుద్ధసంప్రదాయమే తెలియదు.

4 శల్యుఁ డెప్పుడో యొకనాఁడు కర్ణుని సారథ్యము చేయునని తెలిసికొని ధర్మరాజాశల్యునితో 'నీకు గర్ణుని సారథ్యము తటస్థ మగును. అప్పుడు కర్ణునికి మనోవైకల్యముఁ గలిగించి యర్జునుని గాపాడు, మని కోరినటుల నున్నది. అటుల మోసముఁజేయు మని ధర్మరా జట్లు ప్రార్థించునా ! రా జగుశల్యుఁ డట్టిపని జేయఁ బ్రతిన యిచ్చునా ? కావునఁ దీనిని నమ్మఁగూడదు. మఱియు, తనను దక్కిన సోదరులను గాపాడు మని ధర్మరా జేల కోరరాదు. మరి యేమి యనిన : అటుల మనో వైకల్యముచేత గర్ణుఁ డర్జునునిఁ జంపలేకపోయెను గాని లేకపోయిన జంపియే యుండు నని సూచించుటకు నీగాథ కల్పింపబడినది.

కౌరవపక్షపాతబుద్ధితో నీగ్రంథకర్త కల్పించినగాథల ననేకముల నిట్లెత్తి చెప్పితిని, మఱికొన్ని నిలిచియుండిన నుండ వచ్చును. వానివిషయములోనును జదువరులు మీఁద వ్రాసిన కారణ సంప్రదాయములనుఁబట్టి యోచించినచో నిటులనే కల్పితగాథ లని తోఁచక మానదు.

మఱియు నీగ్రంథకర్తకు యుద్ధసంప్రదాయమే, తెలియదు. యుద్ధవిషయములో ననేకపర్యాయముల సంభావితములను జెప్పియున్నాఁడు. వాని నిచ్చట వివరించుట కవసరము లేదు. చదువరులు కొంచెము విచారించినయెడల బోధపడగలదు. అయితే బ్రాహ్మణులకు యుద్ధముయొక్క వేటలయొక్క సంప్రదాయములు తెలియనివారలకు నిట్టివి మనస్సులకు వచ్చుట గష్టముగ నుండు నని తలఁచెద.

ఈగ్రంథకర్త కౌరవపక్షపాతీయే కాక యద్వైతి యనియు ముందుఁ చెప్పియుంటిని, అద్వైతి యనఁగా జీవేశ్వరాభేద బుద్ధిముదిరిన వెఱ్ఱి యద్వైతి కాఁడు. మఱి యేమి యనిన శివ

ఇంక నెవ్వరెవ్వరిచరిత్రములవలన నేమేమి మంచిచెడుగులనుఁ గ్రహింపవలెనో యావిషయమును వ్రాయుట కుపక్రమించెదను,