Jump to content

శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/శ్రీమహాభారత విమర్శము

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణ.

శ్రీమహాభారత విమర్శము.


1. జనమేజయుఁడు.

ఈయన యర్జునుని ప్రపౌత్రుఁడు. తనతండ్రి యనంతరము వ్యాసునిశిష్యుఁ డగు వైశంపాయనునివలన మహాభారతకథను వినెను.

తమ పూర్వులచరిత్రమును వైశంపాయనునివలన నీతఁడు వినినందున నాకథ లోకమునఁ బ్రచురపరుపఁబడినది. అటుల లేనిచో నాచరిత్ర కాలక్రమమున మరువఁబడవలసినదియే కదా? కావునఁ బ్రసిద్ధవంశజులు వారివారి పూర్వులచరిత్రలను గ్రంథస్థము చేసియుంచుట యావశ్యకము.

2. పరీక్షిత్తు.

ఈతఁ డర్జునుని పౌత్రుఁడు. తన పెద్దతాతయగు ధర్మజునితోఁబాటు ధర్మపరిపాలనఁ జేసినవాఁడు. కుమారునికి రాజ్యము నొప్పగించి తనతాతలతోఁబాటుగ నరణ్యమున కేగి యచట నొకసర్పముచేఁ గఱచి చంపఁబడెను. ఈపాముకాటునకు శాపమని యొకకథ కల్పించి చెప్పఁబడినది. ఎంతగొప్పవా రైనను దుష్టజంతువుల విషయమున మిగుల జాగ్రత్తగా నుండునది.

3. భీష్ముడు.

ఈయన శంతను చక్రవర్తియొక్క. జ్యేష్ఠకుమారుఁడు. భారతయుద్ధములోఁ బదిదినములు యుద్ధముఁ జేసి గాయములచే యుద్ధభూమినుండి వెడలి మాఘశుద్ధేకాదశినాఁడు ప్రాణత్యాగమునుఁ జేసెను. యుద్ధానంతరము ప్రాణత్యాగ కాలములోగా ధర్మరాజునకు శాంతి, ఆనుశాసనికి, పర్వములలోని యనేకనీతులనుఁ జెప్పెను.

తండ్రియొక్క యాజ్ఞకు బద్ధుఁడయి వివాహ మాడక రాజ్యమును దనసవతితల్లికుమారునకు విడిచిపెట్టెను.

ద్రౌపదీవివాహానంతరము పాండవులు ద్రుపదునిపురమున సుఖముగ నున్నా రని విన్న కాలమున వారినిఁ దెచ్చి వారివంతు రాజ్యము వారి కిచ్చివేయు మని యీభీష్ముడు చెప్పెను. పాండవులు బాల్యమున వారణాశ్రమమున లక్క యిండ్లలోఁ బెట్టి చంపఁబడి రని యదివరకు నమ్మియున్న వాడు గాన నిపుడు వారు సుఖజీవులయి యున్నా రని విని తత్కాలమునుబట్టి స్వచ్ఛమైన హృదయముతోనే యిట్లు చెప్పె నని నమ్మవలసి యున్నది, ధర్మరాజు రాజసూయయాగము సేయునపు డగ్రపూజ చేయుతరుణమున నట్టి యగ్రపూజకు శ్రీకృష్ణుఁడే యర్హుఁడని భీష్ముడు చెప్పెను. ఈకౌరవులలో శ్రీకృష్ణులవారి మహిమ నెఱిఁగియున్న వాఁ డీయన యొక్కఁడే యని చెప్పవచ్చును.

కౌరవపాండవులు బాంధవముచే దనకు సములయి యుండుటయే కాక కౌరవులది యధర్మమైనప్పటికి దనను బోషించు ధృతరాష్ట్రున కసూయ కలుగు ననుతలంపుతోఁ భీష్ముఁడు కపటద్యూతమును మొదట వారించుటకుఁ బ్రయత్నింపక పోయెను. ఇది బాగు గాదు.

ద్రౌపదీవస్త్రాపహరణసమయమున గురువృద్ధుఁడగు నీతఁడు సమర్థుఁడయి యుండియు, నాదుష్టమైనపని నివారింపు మని ధృతరాష్ట్రునకుఁ జెప్పకపోవుట సరికాదు

అజ్ఞాతవాసములోఁ బాండవు లున్నప్పుడు వారికి దీక్షాభంగము చేయుటకయి దుర్యోధనుఁడు ప్రయత్నించునవసరమున వా రుండుదేశమునుఁ గనిపెట్టుటకుఁ గల కొన్నిగుర్తులను భీష్ముఁడు చెప్పెను. ఇది మంచిపని కాదు.

సంధిప్రయత్నములోఁ బాండవులు నీతిమంతులు సమర్ధులును గాబట్టి యట్టివారితోఁ గలహము వద్దనియు, వారిభాగ మును వారి కిచ్చివేయు మనియు, బలుమారు లొత్తి చెప్పెను. ఇట్లు చెప్పుట చిత్తశుద్ధిచేఁ గాదు. ఇష్ట ముండినను లేకపోయినను సంధికార్యములయందు సభలలోఁ దగువారు సంధి కనుకూల మగునటులఁ జెప్పక తీరదు.

యుద్ధారంభమునకు ముం దనుజ్ఞ గొనుటకయి భీష్మద్రోణకృపులయొద్దకు ధర్మరాజు వచ్చినపుడు, తాము కౌరవులకు ధనముచే గట్టుపడియుంటి మనియు, అందుచే వారి పక్షమున యుద్ధముచేయక తప్ప దనియు, పాండవులకే మేలు కోరుచుందు మనియు, నీ మువ్వురు నేకరీతినిఁ జెప్పినటుల మహాభారతమున నున్నది. వీరిమాటలను బట్టి విచారింపఁగా, అధర్మపరు లగుకౌరవులకు సాయము సేయుట మధ్యస్థులును, వృద్ధులును, నగు తమకు ధర్మము కాదని లోకులు నిందింతురని తలఁచి తమమనశ్శాంతికొరకును, పయి మెప్పుకొరకును, వీరు ముందే యోచించుకొని బడిపిల్లలు పాఠము నొప్పగించినట్టు లేకరీతిని ని ట్లాడినట్లు తోఁచుచున్నది. కానిచో శూరులుసు, వృద్ధులును, నగు తాము రెండుపక్షములయెడ సమబుద్ధిఁ గలిగి యుండుట నిజమే యయినపక్షమున విదురబలరాములతోఁ బాటు యుద్ధమునుఁ జేయుట మానిన నెంత శ్లాఘ్యముగ నుండును? తమ్ముఁ గౌరవు లేమి చేయఁగలరు? వారు తమ్ముఁ బోషింపఁ రని యింతమాత్రమునకు భయపడవలెనా ! బాగుగ నాలోచింపఁగా నీభీష్మద్రోణకృపులకు జిరకాలమునుండి యుద్ధ కుతూహల మున్నట్టును, అందుఁ భీష్మునకు సర్వసేనాధిపత్యము చేయువేడుక యున్నట్టును, స్పష్టమగుచున్నది. తండ్రియిష్టము కొరకు రాజ్యమునే విడుచుకొన్న యితఁడు కౌరవసేనాధిపత్యమున కభిషిక్తుఁడయి యుప్పొంగెను. ఇదియే స్వచ్ఛందమరణము గల యీతనికి జావును సమకూర్చినది.

ఈయన శరతల్పగతుం డయ్యును, మాఘశుద్ధైకాదశి నాఁటివరకును బ్రాణములు ధరించియుండుట వలన నసాధారణ శక్తిగలవాఁడును, భగవదనుగ్రహమువలన శరవేదనయు క్షుత్పి పాసలును లేక బుద్ధిస్ఫూర్తి గలిగి యనేకధర్మములను ధర్మరాజున కెఱింగించినవాఁడును, నయి యున్నాఁడు. ఆధర్మములు, శాంతి, ఆనుశాసనిక , పర్వములలో ధర్మరాజుచే నడుగఁబడిన ప్రశ్నలకుఁ బ్రత్యుత్తర రూపమునఁ జెప్పియున్నాడు. ఇది యొకనాఁటిసంభాషణము కాక యనేకదినములు జరిగియుండిన దగుట చేతను, అడుగఁబడిన ప్రశ్న లే మాటిమాటికి వేరొకరూపమున నడుగఁబడుచున్నందునను నీభీష్ముఁడు చెప్పిననీతులును బునరుక్తము లైనటులను, ఛాందసము లైనటులను, స్వల్పముగ బరస్పరవిరోధములు గలిగియున్నట్లును జదువరులకు గానవచ్చును. అయినను మరణమును నిరీక్షించుచున్నట్టియు, వృద్ధుఁడయినట్టియు, నీభీష్ముడు తాను వినియున్న యావద్ధర్మములను మరువక యథాశ్రుతముగఁ జెప్పినందున నీతఁడు మిగులఁ గొనియాడఁ దగియున్నాఁడు.

4. ద్రోణాచార్యుఁడు.

ఈతఁడు బ్రాహ్మణుఁ డయ్యును ధనుర్విద్యను బాగుగ నేర్చికొని పాండవకౌరవులకే కాక యనేక రాజకుమారులకు విలువిద్య నేర్పెను. భారతయుద్ధములో భీష్మునితరువాత గౌరవ సైన్యాధిపత్యమును వహించి, యైదుదినములు యుద్ధముచేసి పాండవసేనాధిపతియగు ధృష్టద్యుమ్నునిచే దల దునిమి చంపఁబడెను. ఉభయపక్షముల వారికి గురువై యుండియు మొదటి జూదమున భీష్మునితోపాటు వల దని చెప్పియుండలేదు. అర్జునుఁడు తనకు ముఖ్యశిష్యుఁ డైనప్పటికి నరణ్య వాసమునందు శ్రమలకు జడిసియు, తనవిరోధి యగు ద్రుపదుఁడు పాండవపక్షములోనివాఁ డగుటవలన నతనితోఁ బోరాడఁ గోరియు, నీతఁడు పాండవపక్షములోఁ జేరలేదు. ధర్మరాజు యుద్ధముచేయుట కనుజ్ఞ గొనుటకయి తనయొద్దకు వచ్చినపుడు, భీష్మునితోబాటు ముందు వల్లించుకొనినమాటలనే చెప్పెను.

అర్జునునికుమారుఁ డగు నభిమన్యుఁ డేకాకి యై, పద్మ వ్యూహమును భేదించి, దానిలో యుద్ధము చేయునపుడు ధర్మ యుద్దమును మాని, పదిమందియు గలిసి యతనినిఁ జంపిరి ఆవీరులలో నితఁడు ముఖ్యుడు. ఇట్లే మఱికొన్ని సమయములలో నధర్మయుద్ధమునుఁ జేసియున్నాఁడు

బ్రాహణుఁ డైనవాఁడు స్వధర్మమును విడిచి హింసాకరమైన రాజధర్మమును వహించియుండుట చేతనే యెంత దుష్కార్యము నైనను జేయుటకుఁ దగియున్నాఁడు.

6. కృపాచార్యుడు.

ఈతఁడు బ్రాహ్మణుఁడు. ద్రోణునిరాకకు ముందు నుండియు రాజకుమారుల కస్త్రవిద్య నేర్పుచుండెను. ధర్మరాజు యుద్ధమున కనుజ్ఞ గొనుటకయి యీతనియొద్దకు వచ్చినపుడు, భీష్మద్రోణులవలెనే ముందు వల్లించినమాటల నొప్పగించెను. అభిమన్యువధాదిసమయములలో నధర్మయుద్ధమునుఁ జేసినాఁడు. యుద్ధానంతరము కౌరవసేనయందు మిగిలినమువ్వురిలో నీతఁ డొక్క డయి యున్నాఁడు.

6. అశ్వత్థామ.

ఈయన ద్రోణాచార్యుని కుమారుఁడు. భారతయుద్ధానంతరము కౌరవసేనలో మిగిలిన మువ్వురిలో నీతఁ డొక్కఁడు. దుర్యోధనుఁడు భీమగదాప్రహారమున దొడలు విరిగిపడిన నాఁటిరాత్రి, పాండవ శిబిరములో దొంగవలెఁ జొచ్చి, నిద్రపోవుచున్న మిగిలిన సేనానాయకులను, నుపపాండవులను గొంతులు గోసి చంపెను. కటికివాఁ డైనను నిదురబోవుచున్న జంతువుల నీతనివలె గోసి చంపఁడు. ఇట్టి యమానుష ఘోరకృత్యము చేసిన యితని నామరుచటిదినమున నోడించి, యితనిశిరోమణినిఁ ద్రౌపది కిచ్చి, యామెదుఃఖమును పాండవు లుపశమింపఁజేసిరి.

7. శల్యుడు.

ఈయన మద్రదేశపురాజు. నకులసహదేవులకు మేనమామ. ధర్మరాజుయొక్క యాహ్వానముచే బాండవపక్షమున యుద్ధముఁజేయుటకు వచ్చుచుండునపుడు, మధ్యమార్గమునఁ దుర్యోధనుని కృత్రిమాతిథిసత్కారమునకు మెచ్చుకొని, పాండవులచేఁ జేయఁబడిన దని భ్రమసి, మోసపోయి, దుర్యోధనుని పక్షమున యుద్ధముచేయుట కియ్యకొని, యుద్ధము చేసెను. కర్ణుని యనంతరము కౌరవసేనాధిపత్యము నొక యర్థదిన మొంది ధర్మజునిచేఁ జంపఁబడెను.

ప్రభు వగువాఁ డనేక రాజభోగముల ననుభవించి యుండియు, వివేకములేక యొకనాఁటి సత్కారమునకు మోస పోయినందున, నీతఁడు తమవారిపక్షమున యుద్ధము చేయక పోవుటయే కాక, యెవ్వరివలన నాహ్వానము చేయఁబడెనో యట్టిధర్మరాజుచేఁ జంపఁబడెను.

8. ధృతరాష్ట్రుఁడు.

ఈయన విచిత్రవీర్యుని జ్యేష్ఠకుమారుఁడు. ఇతఁడు జాత్యంథుఁ డైనను, నితని సోదరుఁడు పాండురాజు దిగ్విజయము చేసి రాజ్యము నీతనియాజ్ఞకు లోఁబడి పాలించెను. అంధుఁ డగువాఁడు రాజ్యాధికారమున కసర్హుఁడై యుండినను, పాండురాజు తానే రాజ్యమునుఁ దీసికొనక యన్నయందు గల భక్తికొలఁది ప్రభుత్వమును విడిచియుంచినప్పటికి, నట్టి సోదరునికుమారులును, ధార్మికులును, నగు పాండవులకు ముం దొప్పి యిచ్చిన యర్థరాజ్యమును దనజ్యేష్ఠపుత్రుఁడగు దుర్యోధనుఁడు కపటద్యూతముచే హరించుచున్న పుడు, దాని నితఁ డుపేక్షించుటయే యీమహాభారతయుద్ధమునకు గారణమైనది. ఇందుకు నిదర్శనము :-

1. శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లి మరలి వచ్చుతరుణములో ధృతరాష్ట్రుఁడు • నాయం దేవిధమైన తప్పును లే ద'ని వారితోఁ జెప్పఁగా నచట నున్న బాహ్లికభీష్మద్రోణకృపాచార్యులవైపు చూచి యీక్రిందివిధమున నెత్తి పొడిచి సెల విచ్చిరి-

తే. గీ. "ఇప్పు డీసభఁ బుట్టిన యింతవట్టు
        మీకు దెల్లంబ కాదె! యీమేదినీవి
        భుండు దా నేమిటికిని ముఖ్యండగాను
        తప్పు తనదెస లే దని చెప్పి విడిచె."

2. పాండవులు వనవాసమున నుండుతరి నొకబ్రాహ్మణుఁడు వారిశ్రమనుఁ జూచి వచ్చి తనతోఁ జెప్పినపు డీ. ధృతరాష్ట్రుఁడే యిదియంతయు దనవలననే కలిగిన దని యొప్పుకొని యీక్రిందివిధమున జింతపడియున్నాఁడు-

క. "నా చేసినకీడునఁ గడు
   నీచుం డగు నాతనూజు నేరమి నిమ్తై
   నోచెల్లె పార్థులకు బు
   ణ్యాచారుల కెందు లేని యాపద వచ్చెన్."

విదురసంజయులు పాండవులయరణ్యవాసాదిశ్రమకును, భారతయుద్ధమునకును నీవే కారకుఁడ వని పలుమారు లితనితోఁ జెప్పియున్నారు.

భీష్మద్రోణకర్ణశల్యులలో నొక్కొక్కరు హతు లైనపిదప, వారివారిమరణమును విని మొదట జింతించుచు, దుర్యోధనుని మేలుకొరకును బాండవుల నాశముకొరకును నాపైని యేమి చేసి రని యాతురతతో నీధృతరాష్ట్రుఁడు సంజయు నడుగుచు వచ్చెను. దీనివలన నందరును మడియువరకు దనకుమారునికి జయము గలుగునో యనునాస వదల లే దని స్పష్ట మగు చున్నది.

9. గాంధారి.

ఈయమ ధృతరాష్ట్రునిపట్టమహిషి, మహాపతివ్రత. రెండవమారు జూదమునకయి ధర్మరాజును బిలువనంపుటకు దుర్యోధనునికి వశుఁ డయి ధృతరాష్ట్రుఁడు ప్రాతి గామి యనువానినిఁ బంపఁబోవునపుడు, దుష్టుఁడైన యీదుర్యోధనుని విడిచివేయుమనియు, జూదమువలన హాని గలుగు ననియు, స్పష్టముగ ధృతరాష్ట్రునితోఁ జెప్పెను. మఱియు శ్రీకృష్ణరాయభారసమయమున నీయమ తనభర్తతో నీవిధముగఁ జెప్పినది :-

తే. గీ. "అనుఁడు నీపుత్రుఁ డవినీతుఁ డగుట యెరిఁగి
        యెరిఁగి వానివశంబున నేల పోయె?
        దీవు పాండవులకు నేమి యిచ్చితేని
        నడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప చెపుమ.”

ఈసందర్భమునను, పైని నుదహరించిన సందర్భమునను, దుర్యోధనునితోను, ధృతరాష్ట్రునితోను, నీమె చెప్పినమాటలు సంస్కృతభారతములో ననేకముగ గలవు. ఈ సమయముల యందేకాక యనేకపర్యాయము లీమె ధర్మమును విడువక పలికి యున్నది.

10. పాండురాజు.

ఈయన విచిత్రవీర్యుని రెండవకుమారుఁడు. తనయన్న యగు ధృతరాష్ట్రుఁ డందుఁ డైనను నతనియెడ గలభక్తిచే రాజ్యభారము నతనియందే యుంచి, దిగ్విజయము చేసి, యన్న యాజ్ఞకు లోబడి, రాజ్యమును బాలించి, యడవి కేగి, యచట మృతుఁ డయ్యెను,

11. కుంతీదేవి.

ఈమె పాండురాజు జ్యేష్ఠమహిషి. వసుదేవుని సహోదరి. కుంతిభోజుఁ డసంతానవంతుఁడై యీమెను బాల్యమునందే తెచ్చుకొని, యభిమానపుత్రికగాఁ బెంచి పాండురాజున కిచ్చి వివాహము చేసెను. ధర్మరాజు, భీముఁడు, నర్జునుఁడు, నను మువ్వురు నీమెకుమారులు. భర్త మరణానంతరమున దన మువ్వురుకుమారులయు, సవతికుమారు లిరువురయు, సంరక్షణముకొరకు హస్తినాపురమునకు వచ్చెను.

12. మాద్రి.

ఈయమ పాండురాజు రెండవభార్య. శల్యుని చెలియలు. నకులసహదేవు లీమెకుమారులు. భర్త మరణానంతరము సహగమనము చేసెను.

13. విదురుఁడు.

ఇతఁడు దాసీపుత్రుఁ డైనసు, బాల్యమునుండి రాజకుమారులతోఁ గలిసి విద్యాభ్యాసము చేయుచు, నస్త్రవిద్యనుగూడ నేర్చెను. బాగుగఁ జదివినవాడు. ధర్మాధర్మవివేకముగల వాఁడు. ధృతరాష్ట్రునకు మనస్తాపము గలిగినపుడెల్లను నితనినే పిలిచి తనమనోవ్యథనుఁ దెలుపుచు నితనివలన జెస్పఁబడు నీతిమార్గములను వినుచుండెను. కాని యెప్పుడు నీతఁడు చెప్పినప్రకారము లేశమాత్రము దిరుగలేదు. ఈవిదురుఁ డెవరి కేయేతరుణములలో హితవు చెప్పవలసి వచ్చునో యప్పు డంతయు భీష్మద్రోణకృపాదులవలె గాక నిష్కాపట్యముతోఁ జెప్పియున్నాఁడు. కౌరవులయొద్ద జీవనోపాధి కలిగినప్పటికి, పాండవులను వారణావతమున లక్క యిండ్లలో బెట్టి చంపుటకు గాను జేసిన దుర్యోధనుని దుష్ప్రయత్నమునుఁ దెలిసికొని, పాండవుల కెఱింగించి, వారి నట్టి యాపదనుండి కాపాడియున్నాఁడు.

శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లినపుడు ధృతరాష్ట్రునిభవనమందే కాక భీష్మాదుల గృహములయందు సహా భోజనము చేయుట మాని తమకు బ్రియుఁడైన యీవిదురునియింట భోజనము చేసిరి. ఈసందర్భములో శ్రీకృష్ణులవారు సభయందు దుర్యోధనునితో నిట్లు సెల విచ్చిరి :-

క. "పగవారియింటఁ గుడిచిన
    నగుఁ దమ కనుమాన మమృత మైనను దారుం
    బగతురకుఁ గుడువఁ బెట్టఁగఁ
    దగ దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో!"

నేను పగతుండనే యంటేని,

క. “అలుగుదు పాండవులకు వా
    రలు నాకుం బ్రాణములు ధరావల్లభ యి

    ట్టలముగఁ దమప్రాణములకు
    నలుగు జనులు పగతు రనుట యనుమానంబే"

ఆ. వె. "కారణంబులేక కౌంతేయులకు బాల్య
         మాది గాగఁ గీడె యాచరింతు
         పుణ్యపరులుఁ దోడఁబుట్టువు లార్యులు
         వైర మెత్తఁ దగునె వారితోడ."

మఱియు నీతఁడు శ్రీకృష్ణుల వారిమహిమను బూర్తిగ నెఱిఁగినవాఁడు. శూద్రుఁ డైనను విద్యాబుద్ధులు గలవాఁ డగుటచే నింతగౌరవమునకుఁ బాత్రుఁ డయ్యెను.

14. సంజయుడు.

ఇతఁడు కౌరవపక్షమున బాండవులయొద్దకు సంధిమాటలలో దూతగ వచ్చినవాఁడు. ఇతనియందు ధృతరాష్ట్రునకు గడుననురాగము గలదు. అతఁడు తనమనోవ్యధను నితనితోను జెప్పుట గలదు. ఆవృద్ధరాజునకు భారతయుద్ధకథ నితఁ డెఱింగించుచు వచ్చినటుల చెప్పఁబడి యున్నది. ఒక్కొక సేనాధిపతి హతుఁ డైనపిదప నతఁడు యుద్ధము చేసినదినములు కథను నాసేనాధిపతి మరణమును నొక్కసారిగఁ జెప్పినటుల నున్నది. ఏనాటియుద్ధకథ నానాఁటిరాత్రి యేల యతనితోఁ జెప్పకపోయెనో తెలియరాదు. ఈసంజయుఁడు సభలయందును, ఒంటరిగ ధృతరాష్ట్రునితోను ననేకపర్యాయములు జంకక ధారాళముగను యుక్తి యుక్తముగను జెప్పియున్నాఁడు. ఇట్టివాఁ డగుటవలననేకదా, ధర్మరాజు యుద్ధానంతరము తనరాజ్యకాలములో నితని నొక మంత్రిగ నుంచుకొని యుండెను.

15. దుర్యోధనుఁడు.

ఇతఁడు ధృతరాష్ట్రుని జ్యేష్ఠకుమారుఁడు ఈభారతయుద్ధమున కీతనితండ్రి యెంత ప్రధానుఁడో యితఁడును నంతకు నెక్కుడు ముఖ్యుఁడై యున్నాఁడు. మరియు మత్సరబుద్ధితో ననేక దుష్కార్యములు చేసెను. సంకల్పసూర్యోదయ మనుగ్రంథమున గామక్రోధాదిగుణములను బురుషులనుగా దీసికొనినట్లు భావించినచో నీతఁడు మత్సరస్వరూపుఁ డనియే చెప్పవచ్చును. ఇతనికి బాల్యమునుండి భీమునియందు ద్వేషము హెచ్చుగ గలిగియుండెను. అతనినిఁ జంపుకొరకు నీళ్లలోఁ ద్రోయించెను. విషము బెట్టించెను. ఈవిధముగ బగఁ దీర్చికొనుట బహుదుష్టబుద్ధి గలవాఁడే కాని తదితరుఁడు చేయఁబూనఁడు. తనతండ్రి ధర్మరాజును యౌవరాజ్యమున నభిషేకించినపిదప నతని యందును దక్కినపాండవులయందును నితనికి నసూయ హెచ్చెను. అదిమొదలు పాండవులను రూపు మాపుటకు నా జన్మాంతము బ్రయత్నింపుచునె వచ్చెను. ధర్మరాజు యువరా జయినపిదప దనకంటె నతఁ డధికుఁ డగు నని తలఁచి, తండ్రితో ననేకమాయోపాయములు చెప్పుకొని యొప్పించి, పాండవులను వారణావతమునకుఁ బంపి యచట వారలను లక్క గృహములో నుంచి కాల్పింపఁ బ్రయత్నించెను. ఆమోసపు గార్యమును విదురుఁడు పాండవులకు రహస్యముగఁ దెలిపి నందున వార లటుల కాక తప్పించుకొని బ్రదికిపోయిరి. ధర్మరాజు తనకు యువరాజ్యాభిషేకము జేసిన ధృతరాష్ట్రుఁడు దురాత్ముఁ డగు నీదుర్యోధనునిప్రార్థనకు లోఁబడి వారణావతమునకుఁ బంపించుటవలన నిట్టియాపద కలుగఁబోయినందున నాయాపదనుండి తప్పించుకొనినపిదప, దమపెదతండ్రి యగు ధృతరాష్ట్రునియొద్దకుం బోవుట సరికా దని తలఁచి, యేకచక్రపురమున కేగి యచట బ్రచ్ఛన్నముగ ద్రౌపదీస్వయంవరము వరకు సోదరులతోను దల్లితోను నుండెను. వారలపోక దెలియక హతులయి రని నమ్మి సంతోషముతో దుర్యోధనాదులు విఱ్ఱ వీగుచుండిరి. ఇండ్లలోఁబెట్టి కాల్చిచంపఁబోవుట, నీటద్రోయుట విషాన్నము బెట్టుట వీనికంటె దుష్టతరమైన పనియై యున్నది. ఇట్టిపని నెంతదుర్మార్గుఁ డైనను చేయఁబూనఁడు. ద్రౌపదీవివాహానంతరము ద్రుపదపురమున బాండవు లుండుటను చారులవలనఁ దెలిసికొని సంగతి సందర్భములనుఁబట్టి విధిలేక తనసోదరునికుమారులగు, వారినిఁ బిలిపించి ధృతరాష్ట్రుఁ డర్థ రాజ్య మిచ్చెను. అటులఁ బాండవులకు నీయఁబడినయర్థరాజ్యమునకు మొదటినుండి దుర్యోధనుఁ డసూయ గలవాఁడై పాండవులభాగమును స్వీకరింపఁ గోరి, యనేకమాయోపాయములను యోచించి, చివరకు మాయాద్యూతమున వారలరాజ్యమునుఁ దీసికొనెను. అంతటితో దృప్తినొందక కార్పణ్యమే ప్రధానముగ గల యితఁడు బహిష్ఠ యై యుండిన పాండవపత్ని యగు ద్రౌపదిని దుశ్శాసనునివలన బలాత్కారముగ సభకు నీడ్చి తెప్పించి సభాసదులయెదుట వస్త్రవిహీనురాలినిగ జేయింపఁ బూనెను. ఈమహాఘోరకృత్యమువలననే రాజాధిరాజగు నీతనితల తుదను భీమునిచే దన్నఁబడెను. ప్రథమద్యూతా నంతరమున ధృతరాష్ట్రునివలనఁ బాండవులకు వారిరాజ్యము తిరుగ నిప్పింపఁ బడుటనుఁ జూచి యారాజ్యమునే కపటద్యూతమువలన మరల నెన్నిమారులు గెలిచినను వృద్ధుఁడగు తనతండ్రి లోకమునకు జడిసి యిచ్చివేయుచునే యుండు నని తలఁచి దుర్యోధనుఁడు రెండవసారి కపటద్యూతమునకుఁ బిలిచి యెవ్వరోడిన వారు పండ్రెండుసంవత్సరములు వనవాసము చేయుటకును బదుమూడవ సంవత్సరమున నజ్ఞాతవాసము చేయుటకును నట్టియజ్ఞాతవాసములోఁ బయలుపడినయెడల దిరుగ బయి విధమున నరణ్యాజ్ఞాతవాసములు చేయుటకును నొడ్డుగా, బెట్టుకొని యాడించెను. అట్లాడిన యాశకునియొక్క కపటద్యూతమువ ధర్మరా జోడి యరణ్యాజ్ఞాతవాసములు చేయుటకు ద్రౌపదితోను సోదరులతోను గలిసిపోయెను.

తిరుగ బాండవులు ప్రతినఁ దీర్చికొని వత్తు రేమో యను భయముచేత నితఁ డనేకమాయావిద్యలను నేర్చుటయే కాక యుద్ధనైపుణ్యము నభివృద్ధిపరచుచునే వచ్చెను.

పాండవు లరణ్యవాసమునం దుండుతఱి దుర్యోధనుఁడు తనవిభవమును వారలకు గనఁబరచుటకుగాను ఘోషయాత్ర యను నెపమున సేనాబలయుక్తుఁ డయి వెళ్లి పాండవు లుండు ద్వైతవనంబునఁ గంధర్వులను నొక తెగవారి యాజమాన్యము క్రింద నున్న యొకసరస్సు నొడ్డున సేనలతోఁ బస చేసెను. తమయనుమతిలేక యటుల విడిసియున్న దుర్యోధనాదులతోఁ గంధర్వులు యుద్ధముచేసి యందరువీరులనోడించి దుర్యోధనుని భార్యాప్రభృతిస్త్రీలతో బంధించి తమ నగరమునకుఁ దీసికొని పోవుచుండిరి. అంత నీదుర్యోధనునిపరిచారకులలోఁ గొందరు దిక్కు తోఁచక సమీపమున నుండు ధర్మరాజుకడ కేగి తమ ప్రభువునకు సంభవించినయాపదనుఁ జెప్పుకొనిరి. 'మన మిట్టి దురవస్థలో నుండునపుడు మనకు దనవిభవమునుఁ జూపుటకు వచ్చిన వానికి గాగలపని గంధర్వులే చేసిరి. మన మేల యతనికి సహాయులమై విడిపింపపలె' నని భీమునిచే నివారింపఁబడినను యుధిష్ఠిరుఁ డతిధర్మరాజు గావున వినక తమ్ముల నంపి యాదుర్యో ధనుని స్త్రీసహితముగ విడిపింపఁజేసెను. పాప మీదురాత్ముఁ డాకృతజ్ఞత యేమియు లేనివాఁ డయియే పిదప సంచరించెను.

పాండవు లజ్ఞాతవాసములో నుండుకాలము పూర్తి యగుటకు ముందు వారిని భగ్నప్రతిజ్ఞలుగ జేయుటకుఁ గోరి భీష్నినిచేఁ జెప్పఁబడిన గురుతులవలన విరటరాజుపురమున బాండవు లుండియుండవచ్చునని యూహించి యచటి కేగి దుర్యోధనుఁడు తనసేనను రెండుభాగములుగ విభజించి ముందునాఁ డం దొక భాగమును విరటునిపురమునకు దక్షిణభాగమునం దున్నగోవులను బట్టుటకు నియోగించెను. తన్నివారణముకొరకు విరటరాజు సేనలతో వెళ్లెను. అతనివెంట నర్జునుఁడు తప్ప దక్కిన నలువురు పాండవులును వెళ్లిరి. అట్టిసమయమును జూచి మరునాఁ డుత్తరభాగమున నున్న గోశాలలోనిపశువులను దస్కరించుట కీదుర్యోధనుఁడు భీష్మకర్ణాదివీరులతో వెడలి ముట్ట డించెను. అపుడు విరటునికుమారుఁ డగు నుత్తరునితోఁ గలిసి యర్జునుఁడు పోయి సేనపయిఁ దాఁకి గోవులను మరిలించుకొని పచ్చెను. అప్పు డాతనియుద్ధాటోపమునుఁ జూచి యర్జునునిగాఁ దెలిసికొని యజ్ఞాతవాసకాలము మించినదిగా దలఁచి లెక్క పెట్టి చూచుకొని యెరిగి చిన్నబోయి దుర్యోధనుఁడు హస్తినాపురమునకుఁ బోయెను. ఆ దక్షిణగోగ్రహణమునిమిత్తము వెడలిన సేనాభాగము విరటరాజు మొదలగువారిచే నోడింపఁబడెను. పాండవు లరణ్యాజ్ఞాతవాసప్రతిజ్ఞలనుఁ దీర్చికొని యుపప్లావ్యమున విడిది చేసికొని తమరాజ్యభాగమును దమకిప్పింపు మని కౌరవులయొద్దకు దూత నంపిరి. అందుకు దుర్యోధనుఁడు నిరాకరించెను. తుదకు శ్రీకృష్ణులవారే రాయభారమున కేగిరి. దూతగా వచ్చిన యాతనినిఁ దుర్యోధనాదులు పట్టి కట్టుటకు సమకట్టిరి, సర్వవ్యాపియగు నాభగవంతుఁ డిట్టిదుష్టులచే గట్టఁ బడునా ? ఏమివింత ! సేనానాయకులగు భీష్మద్రోణకర్ణశల్యు లొక్కొకరు వరుసగా మడియుటను జూచుచు దుర్యోధనుఁడు రాజ్యకాంక్షనుబట్టి తనమంచిని విచారింపక చివరకు దాను పడువరకు యుద్ధముచేసి పదునొకం డక్షౌహిణులవారిని హతులగువారినిగాఁ జేసెను. అందరు మడిసిన పైని పారిపోయి యొకమడుగులోఁజొచ్చి యుండెను. పాండవు లాసంగతిఁ దెలిసికొని యచటికిఁ బోయిరి. అపుడు ధర్మరాజు తమయైదుగురిలో నెవ్వనినైన నెంచికొని ద్వంద్వయుద్ధము చేసి గెలుపుగొను మని చెప్పఁగా భీముని నెంచికొని యాతనితో గదాయుద్ధము చేసి యతనిచే దొడలు విరుగఁగొట్టబడి నేలఁ గూలెను.

పాండవు లైదుగురిలో భీమునినే ద్వంద్వయుద్ధమున కేల యెంచె ననఁగా తనను రణములో జయించి తనతలనుఁ దన్నుటకు శపథముఁ జేసిన యీభీముఁడు బ్రదికియుండినచో నెప్పటికైనను నాశపథమును నెరవేర్చు ననియు, తక్కిననలుగురు పాండవులు తనవథకొరకు శపథమును జేసినవారు కా రనియు లిసినవాఁ డగుటచేతను, తనకు గదాయుద్ధమె యభిమాన విద్య యగుటచేతను, భీముని దప్పక యాయుద్ధములోఁ జంపెద నని నమ్మిక గలిగి యెంచికొని హతుఁ డాయెను.

ఈ దుర్యోధనుని విషయములోనే కదా తల్లియగు గాంధారియు నాప్తుఁ డగువిదురుఁడు నతిదురాత్ముఁ డగు వీనిని విడిచి కులమును రక్షించికొను మని చెప్పి యుండిరి. అతిపుత్రప్రేమచేత ధృతరాష్ట్రుఁ డితనిని విడిచికొనలేక పోవుటయే కాక యావద్రాజ్యభారమును నితనియందే యుంచి యితనికి వశ్యుఁడై యుండుటచేతనె యింతయుపద్రవము పుట్టినది. రాజ్యద్రోహులను గులనాశకులను నెట్టివారి నైనను బ్రభువులు రాజ్యములోనుండి వెడలఁగొట్టుట రాజనీతి యై యున్నది. ఈనీతి పూర్వకాలమందె కాక యిప్పటికిని జరుగు చున్నది.

16. దుశ్శాసనుడు

ఇతఁడు ధృతరాష్ట్రుని రెండవకుమారుఁడు. దుర్యోధనునికిఁ దమ్ముఁడు. “అతనితమ్ముఁడె యితఁడు గాడా " యనునట్లు తనయన్నవలె నితఁడును దుష్టుఁ డయియె యుండెను. పాండవులనాశము కొరకు దుర్యోధనునిచేఁ జేయఁబడిన ప్రతికార్యమునకు ముఖ్యప్రోత్సాహకులలో నితఁడొకఁడై యున్నాడు. ద్రౌపదీదేవి నేకవస్త్రయై యుండఁగా సభలోని కీడ్చికొని వచ్చినవాఁ డితఁడే. ఆపిదప నామెను వస్త్రవిహీనురాలినిగ చేయ నుపక్రమించినవాఁడును నితఁడే. ఈదుష్కార్యమును జేసినందుకు భీముఁ డితనిని దుదను రణభూమియందు నుభయసేనలవారు నచ్చెరు వంది చూచుచు నుండఁగా వక్షస్స్థలమునుఁ జీల్చి గుండెరక్తమును ద్రాగెను అంత హతుఁడాయెను.

17. కర్ణుడు.

ఇతఁడు కుంతీదేవికి వివాహము కాక ముందు బుట్టినవాఁడు. ఇతఁడు జన్మించుటకు నొకవరము గల దఁట. అటుల జన్మించిన వాని నంతఃపురమునందుంచక బహిర్గతుని జేసెను. ఆశిశు వొకసూతకులజాతునికి దొరకగా నతనివలన బెంపఁబడెను. కావున నితఁడు సూతకులస్థుఁ డాయెను. క్షత్రియయోనిజుఁడగుటచేత నస్త్రవిద్యాభ్యాసము దభిరుచిగలవాఁడై మొదట ద్రోణాచార్యునికడ కేగి తన కావిద్యను జెప్పు మనఁగా నా యస్త్రగురుడు సూతకులఁజాతుఁ డని నిరాకరించెను. పిదప బ్రాహ్మణవేషము వేసికొని పరశురాముఁ డనువానియొద్ద కేగి యతనివలన సస్త్రవిద్య నభ్యసించెను. చివరకు వేషధారిగా నుండుట నాగురువు తెలిసికొని కోపించి యావిద్యవలననే యితనికిఁ గీడు గలుగునని వాక్రుచ్చెను. విద్యలను నేర్చికొనువారు తగినగురునివద్ద నేర్చికొనకపోవుటయు, తనస్వరూపస్వభావములను మరుగుపరచి తగినగురునివద్ద నేర్చికొనుటయు నొక్కటియే. అట్టివిద్యలు వృద్ధికిరావు.

ఈకర్ణుఁడు క్రమముగ దుర్యోధనునియొద్ద బ్రవేశించి యా రాజకుమారునికి బాండవులయందు గలద్వేషమును సభివృద్ధి చేయుచు వారియెడల జేయఁబడు దుష్కార్యములకు బ్రోత్సాహపరచుచు నతసన్మాని యాయెను. ఇటులనె చాలమంది ప్రభువులయొద్ద సన్మాను లగుచుందురు. అస్త్రవిద్యయందు గల నేర్పునుబట్టి పాండవుల నెదుర్కొనుటకు నితఁ డొక ప్రధాన వీరుఁడుగ నెన్నఁబడి దుర్యోధనునివలన నొక స్వల్పరాజ్యమున కభిషేకింపఁబడెను. అటుపయి యీతనిచర్య యీగ్రంథము యొక్క యుపోద్ఘాతములో వివరించి చెప్పఁబడియున్నది. ఇతఁడు భారతయుద్ధములో రెండుదినములు సేనాధిపతిగా నుండి యర్జునునిచే సంహరింపఁబడెను.

17. శకుని.

ఇతఁడు గాంధారదేశపురాజు, గాంధారిదేవికి సోదరుఁడు అందుచే దుర్యోధనదుశ్శాసనులకు మేనమామయై యున్నాఁడు. గొప్ప జూదరి. మిగుల మోసగాడు. ఇతనిచే నాడఁబడిన కపట ద్యూతమునందే రెండుసారులు ధర్మరా జోడెను. భారతములోఁ జెప్పఁబడిన దుష్టచతుష్టయములో నితఁ డొకఁడు. తక్కినమువ్వురు దుర్యోధనదుశ్శాసనకర్ణులై యున్నారు. లోకములో మేనమామగుణము లొకనికి సంప్రాప్త మగునపు డామేనమామయొక్క మంచిగుణములు రాక చెడుగుణము లబ్బుటయే తరుచు,

ఇచట దండ్రినిబట్టిచూచినను మేనమామనుబట్టిచూచినను దుర్యోధనదుశ్శాసనులు దుష్టాత్ములు కాకపోవుదురా ! మేనల్లుర మేలుకోరి మొదటినుండి యితఁడు తుదవరకు బాండవులకు గీడు గోరుచు జేయుచువచ్చెను. తుదను యుద్ధమునం దితఁడు సహదేవునిచేఁ జంపఁబడెను.

19. కృతవర్మ.

ఇతఁడు యాదవులలోనివాఁడు. ఒక యక్షౌహిణి సేనతో వచ్చి కౌరవులకు సాయపడెను. శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లినప్పుడు దుర్యోధనాదులు వారినిఁ బట్టుకొన సమకట్టగా వారివెంట వెళ్లిన సాత్యకి తోపాటుగ నితఁడు కౌరవ పక్షమునం దుండియు నాస్వామివారికి సహాయపడుటకు సిద్ధ మయ్యెను.

దుర్యోధనుఁడు పడినపిదప నాఁటిరాత్రి యశ్వత్థామ చేయఁబోవుఘోరకృత్యమునుగూర్చి కృపాచార్యునితోపాటు వల దని యితఁడును జెప్పెను. కాని పాండవులకు ద్రోణుని కంటె బూర్వము గురువగు కృపాచార్యుఁడు పాండవుల క్షేమముకొఱకుగాని, యితఁడు యాదవులలోనివారగు శ్రీకృష్ణసాత్యకుల క్షేమముకొఱకుగాని, విదురునివలె ముందు చెప్పి పంపకపోవుటయేకాక యీసమయమున శిబిరమునుండి తప్పించుకొని పోవువారినిఁ జంపుచుండిరి. విదురుఁ డట్లు చెప్పి పంపి యుండబట్టియేకదా పాండవులు లక్కయిండ్లలో మడియక బ్రదికిరి. యుద్ధానంతరమున గౌరవవీరులలో నిలిచియుండిన మువ్వురు వీరులలో నీతఁ డొక్కఁడై యున్నాఁడు.




__________