శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/అవతారిక

వికీసోర్స్ నుండి

అవతారిక.

మన దేశములోనున్న మహారాజులలో బ్రజాపరిపాలన మందును లోకానుభవమందును రాజనీతియందును బండిత రంజనమందును విఖ్యాతులును బొబ్బిలి సంస్థానాధిపతులు నయిన శ్రీవేంకట శ్వేతాచలపతిరంగారాయ మహారాజావారు తాము రచించిన శ్రీమన్మహాభరత రామాయణ విమర్శనమను గ్రంథమునకు భూమికను వ్రాయుమని నాతో సెలవిచ్చిరి. సకల హిందూధర్మ ఖనులనఁదగిన యీ గ్రంథములలోనున్న యపూర్వార్థములను జూపిన శ్రీమహారాజావారికృతికిఁ బ్రస్తాననను వ్రాయుటకుఁదగిన సామర్థ్యము నాకుఁ గలదా యను విషయము సంశయాస్పద మగుటచే నొకించుక జంకియును తద్దయాసూచకమగు నియోగము నతిక్రమింపలేకుండటనుబట్టి యీ యవతారికను వ్రాయబూనితిని.

చిరకాలమునుండి ధర్మార్థ కామమోక్షములతో సంబంధించిన సర్వ విషయములందును మహాభారత రామాయణములు హిందువులచే బ్రమాణగ్రంథములుగ నంగీకరింపఁబడి యున్నవి. వీనిలో నుదహరింపఁబడిన సంగతు లీగ్రంథకర్తల కాలమునకు జాలముందు జరిగె ననుటకు సందేహము లేదు. సమకాలీనములగు విషయములఁగూర్చి వానిని జూచినవారు నట్టివారివలన వినినవారును వ్రాయునపుడుగూడ యథావృత్తముగ వ్రాయుట జరుగదు. కావున సంగతులు జరిగినపిదప జిరకాలమునకు వానినిఁగూర్చి వ్రాయువారు పొరపాటుగ వ్రాయరనుట దురూహ్యము. కనుక పురాణేతిహాసములు సత్యాసత్య మిశ్రకథాపూర్ణములై యున్నవి. చిరకాలమైన పిదప వీనిలో నేవిసత్యమో యేవియసత్యమో నిశ్చయించుట యసాధ్యమగుటచేతను గ్రమముగా నాధునికులలో సంభావ్యా సంభావ్య వివేచన సామర్థ్యము తగ్గుటవలనను నీగ్రంథములలో నున్న సర్వ విషయములను హిందువులు జరిగినవానినిగా నమ్ముచున్నారు.

పురాణములలోనున్న యనేకగాధలలోఁ గొన్ని యర్థవాదములని పూర్వగ్రంథకర్తలు సెప్పినను నేవి యర్థవాదములో యేవి యథావృత్తబోధకములో తెలుపుచుఁ మనవారిలో బూర్వు లెవరును వ్రాసినట్లగపడదు. కనుక మహారాజావారు భారతరామాయణ గ్రంథములను విమర్శించి తెలుగుభాషలో దమ యభిప్రాయమును దెలియజేయువారిలో మొదటివారుగ నున్నారు. ఈ మహాభారత రామాయణ విమర్శములో వివరింపఁబడిన కొన్ని విషయములలోఁ గొందరు మహారాజావారితో నేకీభవింపక యుండిన నుండవచ్చునుగాని యనేక ముఖ్యాంశములలో వారి యభిప్రాయమును దీసికొనక తప్పదనియును వారిచే జూపఁబడిన మార్గము బుద్ధివైశృంఖల్యమును గలుగ జేసి శుద్ధజ్ఞానమును బెంచుననుటకు సందేహములేదు

మహాభారత రామాయణములలో నున్న విషయముల నాలోచించుటకు ముందీగ్రంథములనుఁ గూర్చిన రెండుసంగతులు విచారణీయములయి యున్నవి. మొదటిది ఈ కథలలో నేది పూర్వ మేది పరము ? రెండవది, ఈ గ్రంథములలో నేది ప్రాచీన మేది నవీనము ? సామాన్యముగ హిందూ గ్రంథకర్తలు రామకథ ప్రాచీనమనియును గురుపాండవకథ నవీనమనియు నభిప్రాయపడుచున్నారు. పాశ్చాత్యపండితుల యభిప్రాయము వీనికి గేవలము విరుద్ధముగానున్నది. మన వేదములలో నర్జున జనమేజయ కురు పాంచాలాది శబ్దములుండుటనుబట్టియు నామ బోధకములగు రామ లక్ష్మణ సుగ్రీవాదిపదములు లేకుండుటను బట్టియు రామకథ భారతకథకింటె నవీనమని కొందరభిప్రాయ పడుచున్నారు. మఱికొందరు రామాయణములో నుదహరింపఁబడిన ధూమ్రాక్ష విరూపాక్ష దేవాంతక నరాంతక వజ్రదంష్ట్రాతికాయ మహాకాయాది శబ్దములు కల్పితములుగ నగపడుటవలనను నితర కారణములవలనను రామకథయంతయును గవికల్పితముగాని యథాభూతార్థమును దెలియఁజేయు నదికాదనియు నిది యార్యులుత్తర హిందూస్థానమునుండి దక్షిణ హిందూస్థానమునకు వచ్చి దానినిఁ జయించి సింహళద్వీపము వరకును బోవుటను దెలియఁజేయుచున్నదనియు నభిప్రాయపడు చున్నారు. రామాయణములో గల్పితకథ లనేకములుండిన నుండుగాని రామకథ సర్వమన్యార్థ వ్యంజకంబనుట రామాయణ కథనుగూర్చి వ్రాసిన హిందూ పండితుల యభిప్రాయమునకు గేవలవిరుద్ధమయి యున్నది.

ఏ తర్గ్రంథ రచనా పౌర్వాపర్యమును గూర్చివిచారించుటలో భాషాస్వరూపమును, శైలినిఁ బరీక్షింపగా భారతములో గొన్ని భాగములు రామాయణముకంటె స్పష్టముగ బ్రాచీనముగ నగపడుచున్నవి.

మహాభారతములోఁ గురు పాండవచరిత్రము ముఖ్యాంశము గనుక దీనిలోఁ బ్రధానపురుషులను గూర్చి మహారాజావారు తమ యభిప్రాయమును దెలియఁజేసియున్నారు. గ్రంథవిస్తర భయముచే విమర్శితంబులయిన వానిలో గొన్ని విషయములనుఁగూర్చిమాత్రము నాకుఁదోచిన రీతిని వ్రాయుచున్నాను,

కురువృద్ధని పేరు నొందిన భీషుఁడనేక మహాగుణశాలి ఈయన తనతండ్రి సంతోషమునకై రాజ్యమును సుఖమును వదలి బ్రహ్మచారియై పరుల నాశ్రయించి జీవితకాలమును గడ పెను. "ఈ కురువృద్ధు డస్త్రవిద్యయందును లోకానుభవమందును, ధర్మాధర్మనేత్తృత్త్వమందును, దత్త్వజ్ఞానమందును బ్రసిద్ధి జెందిన మహానుభావుఁడు. ఇట్టివాడును మహారాజావారు చెప్పిన రీతిని గొన్ని సమయములందు దుర్యోధన ముఖోల్లాసమునకై స్వానురూపమగు మార్గమున నడువని వా డాయెను. కపటద్యూత కాలమునను, ద్రౌపదీ వాస్త్రాపహరణ సమయమునను గౌరవులను వారింపక భీష్ముఁడూరకుండుట సరికాదని వారు చెప్పిన దాని నందరు నొప్పుకొనవలసియున్న ది.

అస్త్ర విద్యాచార్యుఁడని కురుపాండవులచేతనే కాక యితర క్షత్రియ వంశజులచేత గూడ గౌరవింపఁబడిన ద్రోణాచార్యుఁ డభిమన్యుని విషయమై ధర్మ విరుద్ధమగురీతిని నడచెనని మహారాజా వారు చెప్పినదానికి విరుద్ధముగ నెవరు చెప్పగలరు ?

యుధిష్టిరుఁ డీభూమండలంబున జన్మించిన మహాపురుషులలో నొకఁడని చెప్పవచ్చును. భూతదయ యందును, ధర్మాధర్మవిచారంబు నందును, సత్యపరాయణత్వమందును, పరార్థము స్వసుఖము నపేక్షింపక యుండుటయందును నీతనితో సమానులగు పృధ్వీపతులు మృగ్యులు, ఇట్టి మహాపురుషుఁ డొక సమయమున నబద్ధమాడినట్లు భారతములో జెప్పఁబడియున్న ది. ఈ యన యనృతమాడి యుండడని మహారాజావారి యభిప్రాయము. ఇట్టి యభిప్రాయము మహాగుణశాలియగు యుధి ష్ఠిరుని చరిత్రము వినినవారికందరికిని న్యాయ్యంబని తోచును. ఆ జన్మాంతము పరమోత్తమధర్మ చారియగు నీయన స్వచారిత్రము నంతయును గళింకితముగ జేయునట్లొకమా రాకస్మికముగ ననృతమాడునా ! ఒకవేళ యుద్ధవి జయార్థము తద్ద్వారా రాజ్యప్రాప్తికి నిట్టులాడిన నాడియుండ వచ్చునని యూహించుట కీయన రాజ్యభోగ వైరస్యము సుప్రసిద్ధమేగదా! కావున నీ విషయమున మహారాజావారి యభిప్రాయము సయుక్తికముగ నున్నది. మఱియు మహాభారత గ్రంథకర్త కౌరవ పక్షపాతి యగుటచే నిష్కళంకుఁడగు ధర్మరాజునకుఁగూడ నొక కళంకమున్నదని చెప్పుటకైన నీ కథను గల్పించియుండిన నుండవచ్చును.

కర్ణుని శౌర్యౌత్కృష్ట్యమును జూపుటకై మహాభారత కవి కొన్ని గాధలను గల్పించినాడు గాని యవి సత్యములని మనము తీసికొనగూడదని మహారాజావారి యభిప్రాయము. దాతృత్వముతప్ప మహాభారతమునందెల్ల నితని దుర్గుణము లే యగపడుచున్నవి. ఇట్టి దుర్గుణరాశి నిజమైన దాతయా యని విచారింపవలసియున్నది. ఈయన దాతయై యుండిన నుండవచ్చును. కాని యీ దాతృత్వమునకుఁ గారణము పరులచే శ్లాఘింపఁబడుట యందలి యభిలాషయేయని తోచుచున్నది. ఏమన, నిజమైన భూతదయలేనివాఁడు దాత కానేరడు. అట్టి భూతదయయే యుండినయెడల గర్ణకృతంబులని భారతములో నుదాహరింపఁబడినకార్యముల నాయన చేసియుండడు. కావున కర్ణుని దాతృత్వముగూడ నిర్వ్యాజౌదార్య సూచకముకాదు.

శ్రీమన్నారాయణావతారంబని హిందూమతస్థులందరునమ్మిన శ్రీ కృష్ణుడు పరాత్పరుని యవతారంబు లన్నిటిలోఁ బరమాద్భుతమయిన యవతారమని చెప్పుటలో సందేహ మేమియు లేదు. ఇట్టి యవతారపురుషుఁడు సామాన్యముగ మనుష్య నింద్యములయిన కొన్ని కృత్యములను జేసినటుల భారతములోను భాగవతాది పురాణములలోను నున్నది. లోకరక్షణార్థము మనుష్య రూపమునొందిన హరి యిట్టిపనులను జేయునా యని విచారించుటలోనీ పనులను గూర్చినగాధలు శ్రీకృష్ణ నిరసనంబునకై. కల్పితంబులైన గావలెను. కానిచో మనము వాని నన్యార్థ వ్యంజకంబులుగానైనఁ దీసికొనవలయును. ఈ గాధలకు వ్యంగార్థమిచ్చుట సందర్భము గాదనియు నివి కేవల కృష్ణనిరసన బుద్ధితో గ్రంథకర్తచే గల్పింపఁబడినవియనియు మహారాజావారి యభిప్రాయము. సామాన్యముగ నీ గాధలలో గొన్నిటికి వేదాంతులగు వ్యాఖ్యాతలిచ్చిన వ్యంగ్యార్థము నంగీకరించుటకు జాల బాధలున్నవి. కనుక వానిని వ్యంగ్యార్థమున గ్రహింప వీలులేదు. శ్రీ కృష్ణులు నారాయణావతారంబని నమ్మినవా రందరును గర్హ్యక్రియారోపకములైన యీ గాధలను యథావృత్తబోధకములుగా నంగీకరింపఁ జాలరు. మఱియుఁ గొన్ని సందర్భంబుల శ్రీకృష్ణుల విషయమై మన దేశములో వ్యాపించియున్న పురాతన కథలను నవీనులైన పౌరాణికులు సరిగా గ్రహింపఁజాలక పరిహసనీయమగు విధమున వానినిఁ బెంచిరి. మహారాజావారు కాళియమర్దన కథను దీని కుదాహరణముగ నిచ్చియున్నారు. నాగులను నొక జాతి వా రున్నట్లు తెలియకపోవుటచేతగదా నాగశబ్దమును సర్పపరముగా దీసికొని చిత్రమైనకథ నొకదానిని బౌరాణికులు కల్పించిరి. ఇటులనే గాంధారిగర్భము నూరు శకలములైనదనియుఁ, బ్రతిశకలము గొంతకాలము పెంపఁబడిన వెనుక నొక మగశిశువాయె ననియును భారతములో నున్నది. ఈ కథకు మహారాజావారు చేసిన యర్థము సయుక్తికముగ నున్నది

రామాయణ మాదికావ్యమని వాడఁబడుచున్నది. తనకు ముందెవ్వరును సంస్కృతభాషను ఛందోబద్ధముగ రచింపలేదని వాల్మీకి చెప్పియున్నాడు. సంస్కృతభాషా రచితంబులగు సమస్త గ్రంథములలో వేదములు మొదటివను సంగతి యందరు నొప్పు కొనినదే. ఈ వేదములకు ఛందస్సులను నామమున్న సంగతియు నందరికిఁ దెలిసినదియే కదా? వేదములలోనున్న వృత్తములు పురాణకావ్యనాటకాది గ్రంథములలోనున్న వృత్తములకంటె వేరుగానున్న నవి వృత్తములు కావని ఛందోజ్ఞు లెవ్వరైన నన గలరా! కనుక స్పష్టమయిన యిట్టి సంగతిలో వాల్మీకి తానే మొట్టమొదట సంస్కృతభాషను ఛందోబద్ధముగ జేసె ననుటకు గారణ మగపడదు. ఇట్టి యభిప్రాయమును స్థాపించుచు మహారాజా వా రిచ్చిన హేతువులు బాగుగ నున్నవి.

మహారాజావా రభిప్రాయపడినట్లు శ్రీరామ నిర్యాణమునకు జాలకాలము పిదప రామాయణకవి యీ కావ్యమును వ్రాసి యుండవలెను. ఈయన శ్రీరామ సహాయులైన సుగ్రీవాదుల నందరిని గోతులుగ వర్ణించియున్నాడు. వీరు నిజముగ గోతులయి యుందురా? కోతులయినయెడల హనుమదాదులు చేసినట్లు రామాయణకవిచెప్పిన పనులను వానరులు చేసియుందురా ? అట్టిపనులను వానరులు చేసి యుందురని చెప్పుట యసంభావ్యము. గనుక సుగ్రీవాదులు ప్రస్తుత మరణ్యప్రదేశములందున్న మనుష్యజాతులవారై యుండవచ్చును. కనుక సుగ్రీవాదులందరు మనుష్యులేయనిచెప్పిన మహారాజా వారి యభిప్రాయము నందరు నంగీకరింపక తప్పదు.

సామాన్యముగ హిందువులకు జాతకముహూర్త విషయములలో నమ్మకమున్నది. ఇట్టి నమ్మకము పరప్రచారకులగు ననేకులకు జీవనోపాధిఁ గల్పించుటయే గాక కొన్ని సమయములందు దాదృశ విశ్వాసానుసారముగ నడచువారికి హానిని జేయుచున్నది. వసిష్ఠకథా సందర్భములో "నీయనచే నుంప బడిన పట్టాభిషేక ముహూర్తము కార్యకారి గాకపోవుటయే గాక శ్రీరాములవారి కరణ్యవాస కష్టమును గలుగజేసెను. కావున ముహూర్త మనునది పదిమంది చేరుటకును నా పనికి గావలసిన సంభారములు జాగ్రత్తపడుటకును వీలగు కాలసదు పాయమును గలిగించునేకాని వారివారి యదృష్టములను మార్పజాలద”ని మహారాజావారు వ్రాసియున్నారు. ముహూర్త విషయమున హిందువులందరును వీరి యభిప్రాయము కలవారై యున్నయెడల బ్రస్తుతము ముహూర్తవిశ్వాసమువలన గలుగు ననేక విపత్తులకు లోబడక సుఖ మనుభవింతురు.

శ్రీమన్నారాయణావతారములలో శ్రీరాములవారు స్వకీయ ప్రవర్తనముచే వివిధావస్థలయందు జనుల కుత్తమ ధర్మాచరణ రీతిని గనబరచియున్నారు. శ్రీరామచారిత్రమువలనఁ బితృవాక్య పరిపాలనము, భ్రాతృస్నేహము, మిత్రప్రీతి, ఏకపత్నీవ్రతము, సత్యసంగరత్వము మొదలయిన గుణములను, సీతాచరిత్రము వలన మహా పతివ్రతాలక్షణమును, లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రమువలన స్వసుఖ నిరపేక్షముగ జ్యేష్ఠసోదరానువృత్తి మొదలయిన గుణములను జదువరులు నేర్చుకొనవలసి యున్నదని శ్రీ మహారాజావారు వ్రాసినది సర్వాంగీకార్యముగ నున్నది. రావణునికి దశముఖ దశకంఠాద్యపరనామములు కలవు. ఇందువలన హిందువులు నిజముగ నతనికి బదితల లున్నట్లు భ్రమపడుచున్నారు గాని రావణుఁడు నితర మనుజులవలె నేక ముఖఁడుగాని యనేక ముఖుఁడుగాడని మహారాజావారు వ్రాసియున్నారు. సయుక్తికముగ నాలోచించు శక్తిగలవారెవరు నీయభిప్రాయమునకు విరుద్ధముగ జెప్పలేరు. కార్తవీర్యార్జునునకు సహస్రబాహుఁడని పేరుగలదు. ఈయన దుష్టశిక్షణమందతి సమర్థుఁడని మన పురాణములలో నున్నది. కనుక దుష్టనిగ్రహమందు వేయిభుజములు గలవానివలె నుండెనని సహస్ర బాహుశబ్దమున కర్థము కావచ్చును. ఇటులనే దశముఖ దశకంఠాదిశబ్దములును వ్యంజనావృత్తి ప్రయుక్తము లనవలెగాని సర్వలోకానుభవ విరుద్ధమగు విచిత్రసృష్టి యితని విషయమై జరిగెనని యనుట యసమంజసము.

బహుకాలమునుండియు శ్రీరామకృష్ణులు భగవదవతారంబులని హిందూమతస్థులు పూర్ణముగా నమ్ముటచేత వారిచర్యలను వారి యుపదేశములను జెప్పుచున్న రామాయణ మహాభారత గ్రంథములు సకల విషయముల నుత్తమధర్మబోధకములుగ నెన్నఁబడి వానిలోనున్న ముఖ్యాంశములేగాక యముఖ్యాంశములు నసంగతములయిన కథలుగూడ విశ్వసనీయములని తలంపబడుచున్నది. మరియు నీ కారణముచేతనే పండి తులుగూడ నీ కథలలో గొన్నిటిని నమ్మనిచో బ్రత్యవాయమగునను భీతిచే నా గ్రంథస్థములైన సమస్తవిషయములు గ్రాహ్యములే యనుచున్నారు.

మహారాజావారు పండితంమన్యులకువెరువక తమకు న్యాయ్యమని తోచినరీతి నందరిచేతను బ్రమాణగ్రంథములని యొప్పుకొనఁబడిన వానినిగూడ విమర్శించి సోపపత్తికముగ వీనిలోనిదిగ్రాహ్య మిది యగ్రాహ్యమని తెలుపుటకై యాంధ్రభాషలో మహాభారత రామాయణ విమర్శమను నీ గ్రంధమును జేసియున్నారు. ఈ గ్రంథ మాంధ్రభాషాభిజ్ఞులకు భారతరామాయణగ్రంథ తాత్పర్యమును సహేతుకముగ బ్రకటన చేయుటయేగాక పూర్వగ్రంథములను బరిశీలించుట కపూర్వమార్గమును జూపుచు గృతికర్తయుక్క వివిధభాషా గ్రంథావలోడన జనిత సంభావ్యా సంభావ్యవివేచన సామర్థ్యము నార్యమతాభి నివేశమును దెలుపుచున్న ది.

కడాంబి - రామానుజాచార్యులు,

( ప్రిన్సిపల్, మహారాజాస్ కాలేజి,)

విజయనగరం,

విజయనగరము

1907.


___________