శ్రీమహాభారత శ్రీమద్రామాయణ విమర్శము/శ్రీమద్రామాయణ విమర్శము

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణ.

శ్రీమద్రామాయణ విమర్శము.

1. దశరథమహారాజు.

ఈయన సూర్యవంశజుఁడు. అజమహారాజునకుఁ బుత్రుఁడు. రఘుమహారాజునకుఁ బౌత్రుఁడు. ఈయన యరువదివేలసంవత్సరములు రాజ్యపాలనము చేసినపిదప నప్పటికిని బుత్రలాభము లేనందున బుత్రకామేష్టి యను నొకక్రతువును జేసి తనయులను బడసినట్లు చెప్పఁబడి యున్నది. ఈయన యరువదివేలసంవత్సరము లేకారణముచేతనైనను జీవించి యున్నట్లు మన మొప్పినను నతనిభార్యలు, బంధువులు, మిత్రులు మొదలయినవా రతనితోఁబాటుగ నెట్లు జీవించి యుండియుందురో వింతగ నున్నది. మరియు నిక్కాలపు వారికంటె నక్కాలపువారి కాయుర్దాయము హెచ్చుగ నుండినను సంతానకాలము మించినపిదపఁ బుత్రలాభముకొరకుఁ బ్రయత్నింపక యరువది వేలసంవత్సరములవరకు నిదానించి సంతానార్ధము ప్రయత్నించుట మరియు వింతగ నున్నది. పాయస మహిమవలన భార్యలు బిడ్డలను గనియుండకూడదా యని యంటిమా ! వివాహ కాలములోగా బరిణయమైనభార్యలకు (అంతకాలము జీవించియున్నట్లు మన మొప్పికొనినను) గర్భోత్పత్తికాలము మించినపిదపఁ బాయస మహిమవలన నైనను గర్భము లెట్లు గలిగినవియో మిగుల నసంభవముగ నున్నది. కావున నరువది వేలసంవత్సరములకాలము నొప్పుటకు వీలు లేదు. మనగ్రంథములలో ననేకస్థలములయందు గాలపరిమితినిఁ జెప్పవలసిన సమయములలో సహస్ర మనుశబ్దము వాడుకజేయఁబడి యున్నది. ఆసహస్రశబ్దమునకు శతస్థానమునకు మీదిది యగు సహస్రసంఖ్య యని మన మెప్పుడును దీసికొనఁగూడదు. ఆసహస్రశబ్దమున కనేక మని యర్ధముఁ గలదు. కావున వర్షసహస్రము లనఁగా ననేకవర్షము లనియు ననఁగా సంఖ్యచే నరువది యనియు గ్రహింపవలెను. ఈవిషయము దశరథుఁడు విశ్వామిత్రునితోఁ జెప్పినట్లుమాత్రము కనిపించుచున్నది. మరి యెచ్చటను గానరాదు.

పండితసాధారణముగా నెల్లరు నరువదివేలసంవత్సరములని యభిప్రాయపడుచున్నందున నీవిషయ మింతచర్చతో వ్రాయుట యైనది. కావున నాదశరథుఁ డరువదిసంవత్సరములే ప్రభుత్వము జేసియుండును లేదా జీవించియుండును. అప్పటికాలపువారు మనకంటె దృఢమైనశరీరబలము గలవారగుటచే నాదశరథుఁ డరువదిసంవత్సరములవరకు నిదానించి పుత్రలాభముకొరకుఁ బ్రయత్నపడియుండును ఈదశరథమహారాజునకు జ్యేష్ఠ భార్యయగు కౌసల్యయందు శ్రీరాములవారును, ద్వితీయభార్యయగు సుమిత్రయందు లక్ష్మణ శత్రుఘ్నులును, తృతీయభార్యయగు కైకేయియందు భరతుఁడు ననునలువురుకుమారులు జన్మించిరి. ఈకుమారులు దినదినప్రవర్ధమానులయి విద్యల నభ్యసించుచు వచ్చిరి. అంతట విశ్వామిత్రుఁ డనుమహర్షి దశరథునికడకు వచ్చి శ్రీరాములవారిని తనయజ్ఞరక్షణముకొరకుఁ బంపు మని కోరెను. బాలుఁడగు తనతనయుని నట్లు పంపుటకు వెరచుచున్నయా రాజును వశిష్ఠమహర్షి భయములే దనియు, నాఋషివెంటఁ బంపినయెడల మేలు గలుగు ననియు సమాధానపరచెను. అపు డారాజు శ్రీరాములవారిని వారితో నత్యంతమైత్రిగల లక్ష్మణుని నాతనివెంటఁ బంపెను. ఈరామలక్ష్మణులు విశ్వామిత్రునిపనుపున నాతనికార్యములనుఁ దీర్చి యాముని వలనఁ దివ్యాస్త్రలాభమునుఁ బొంది వివాహితు లయి యయోధ్య కు వచ్చినపిదప వృద్ధుఁడగు నద్దశరథుఁడు జ్యేష్ఠుఁడగు శ్రీరామునకుఁ బట్టాభిషేకము జేయుటకు సిద్ధపడియుండఁ గాఁ దనభర్త తనకు బూర్వ మిచ్చెదనన్న వరములను మంధరయను దానిదుర్భోధవలన కైకేయి యడిగెను.

ఆవరములు :--- పదునాలుగుసంవత్సరములు శ్రీరాములవారి నరణ్యవాసముసకుఁ బంపుటయు, భరతునకు రాజ్యాభి షేకము చేయుటయు నై యున్నవి. ఇవి యాయమకు మనస్సునందుఁ బుట్టినకోర్కెలే యయియున్న యెడల వివాహకాలమునందు రాజ్యశుల్క గాఁ దనతండ్రికి బ్రతిజ్ఞచేసి యుండుటనుబట్టి యామె మూడువరము లడిగియుండవలెను. అట్లుగాక దానినిఁ గలిపి మరియొకవరము నడిగెను. ఆయడుగుటలోనును బదునాలుగు సంవత్సరముల కాలపరిమితికి మాత్రము తనకుమారునకు రాజ్యము గావలె ననునర్థ మిచ్చునట్లుగ నడిగియుండును. అట్లు గానియెడల దశరథుఁ డామెతో శ్రీరాములవారి 'నడవికిఁ బంపువరమును మాత్రము విడుచుకొనుము. నీకుమారునకే రాజ్య మిచ్చెద' నని యేల యడిగికొనును. వరమునందు గాలపరిమితియే లేక పోయినయెడల నొకసారి కాలనియమము లేక యిచ్చినదానినే తిరుగ నిచ్చుటలో నామెకు లాభమేమి ? మరియు శ్రీరాముల వారు భరతునితో 'మనతండ్రి నన్ను బదునాలుగువత్సరము లడవిఁ బొ మ్మనియు నిన్ను రాజ్య మేలు మనియు నియమించి యున్నాడు' అని యున్నారు. కాలనియమము లేక భరతునకుఁ దమతండ్రి వలన రాజ్య మీయఁబడియుండినయెడలఁ దమయరణ్యవాసానంతరము రాజ్యమును స్వీకరింతురా? చదువరులే యోచించునది. స్వలాభకరమైన కార్యమైనను యుక్తాయుక్తవిమర్శనము లేక తొందరపడి ప్రయత్నించినపుడు కైకేయికివలె గావలసినంతలాభము గలుగదు.

వరములనిర్దేశమును దెలిసికొనక యొక రడిగినవరము నిచ్చెద నని ప్రతిజ్ఞ చేయుటయం దవివేకమువలన నీవరముల నిచ్చిన యీదశరథుఁడు పట్టాభిషిక్తుఁ డగుటకు సిద్ధముగనున్న జ్యేష్ఠకుమారుని నడవికిఁ బంపుకొనెను. నలుగురుపుత్రులుండియు నొక్కఁడైన దగ్గర లేనిసమయమున మృతినొందెను. ఇట్లు మృతినొందుట కొకశాపకథ కల్పింపఁబడినది. అది కల్పిత కథయైనను నందువలన మనము గ్రహీంపవలసిననీతి యేమి యనిన :- రాజులకు వేట స్వధర్మమైనను మిగులఁ జాగ్రత్తతో వేఁటాడక పోయినయెడలఁ బ్రమాదము సంభవించునని. ఇట్లు శ్రీరాము నరణ్య వాసమునకుఁ బంపి దశరథుఁడు వా రడవికేగిన యారవనాఁటిరాత్రి పరలోకప్రాప్తుఁ డయ్యెను.

2. వశిష్ఠుఁడు.

ఈయన మనయార్యమతస్థులచే నిత్యు లని నమ్మఁబడు సప్తమహర్షులలో నొకఁడు. ఇక్ష్వాకువంశజు లందరకును గ్రమముగఁ బురోహితుఁడుగ నుండెను. ఇట్టివానిచే నుంపఁబడిన పట్టాభిషేక ముహూర్తము సహా కార్యకారి కాకపోవుటయే గాక శ్రీరాములవారి కరణ్యవాసకష్టమును గలుగఁజేసెను. కావున ముహూర్త మనునది పదిమంది చేరుటకును నాపనికి గావలసిససంభారములు జాగ్రత్త పడుటకును వీలగు కాలసదు పాయమును గలిగించునే కాని వారివారి యదృష్టములను మార్పఁజాలదు.

3. సుమంత్రుఁడు.

ఇతఁడు దశరథమహారాజుయొక్క యష్టమంత్రులలో నొకఁడు. ఇతఁడును నిక్ష్వాకునివద్దనుండి క్రమముగ నా రాజుల కొకమంత్రిగ నున్నట్లు చెప్పఁబడి యున్నది. మహర్షి యగు వసిష్ఠునితో బాటుగ నితఁ డంతకాలము జీవించుటకుఁ గారణము గానరాదు. ఇతఁడు చేయుపని యేమి యనిన : అంతఃపుర స్త్రీలయొద్దకును, బుత్రాది బంధువులయొద్దకును వార్తలు నడుపుట. వారివారి సౌఖ్యములకు భంగము లేకుండునట్లు కనిపెట్టుట. అంతఃపురస్త్రీలు బయటికి వెడలునపుడు వారి రథసారథ్యము చేయుట మొదలగుపనులుగాఁ గనఁబడుచున్న వి. అంతఃపురసంచారమునకు వృద్ధుఁడగువాఁడే కాని యితరుఁడు పనికిరాఁడు గదా? ఆవృధ్ధత్వములోను వార్ధకము వలనఁ గలిగిన బుద్ధిలోపము లేనివాఁడుగ నుండవలెను. అట్టివానిని సుమంత్రుఁడు అనఁగా (యోగ్యమైన యాలోచనగల వాఁడు) అనువానిగా నేల చెప్పఁగూడదు ? కావున నాపనిలో నేర్పఱుపఁబడిన ప్రతిమంత్రికిని సుమంత్రుఁ డని యుద్యోగనామము గలిగియుండును. అందువలన నిక్ష్వాకుని నాటినుండియును నున్నట్టు చెప్పఁబడిన యుద్యోగనాముఁడే యితఁడు. వృద్ధుఁ డగుటచే నప్పటినుండి యుండినవాఁ డని గ్రంథకర్త పొరపాటుపడి యుండును. ఇట్లనే కాలాంతరమునందేక నామమును ధరించినరాజులను సహా ఒక్కరుగానే మన గ్రంథకర్తలు తీసికొనుచున్నారు. ఇప్పటి మనచక్రవర్తిగారికి ఎడ్వర్డు అనునామము గలదు. ఈపేరు వారివంశజులలో లోగడ నార్గురికిఁ గలదు. కావున నీతఁ డేడవయెడ్వర్డు అని పిలువఁబడు చున్నాఁడు. మొదటి యెడ్వర్డు అనురాజు మొదలు ఒకటవ యెడ్వర్డు అను మొదలగు సంఖ్యానిర్దేశములతో వాడఁబడుచు వచ్చినందున మనము పూర్వులవలె నొక్కఁడే యని భ్రమయుటకుఁ బ్రసక్తి లేదు.

4. హనుమంతుఁడు.

ఇతఁడు సుగ్రీవునకు మంత్రి. అరణ్యవాసమున శ్రీరాములవారికిని సుగ్రీవునకును ఋశ్యమూక పర్వతమునందు సఖ్యము చేసెను. ఇతఁడు మిగుల బుద్ధిమంతుఁడు. వ్యాకరణశాస్త్రక్రవీణుఁడు. సమర్థుఁడు. సీతాన్వేషణముకొరకు శ్రీరాములవారిపనుపున సుగ్రీవుఁడు వానరులను బంపునపుడు దక్షిణదిక్కున కేగు వారితో నీహనుమంతునిఁ బంపెను. ఆదక్షిణదిక్కున సీతాదేవి యెచ్చటను గానరానందున రామేశ్వరమునందున్న మహేంద్ర పర్వతముసమీపమునఁ జేరి వానరులు పరితపించుచు బ్రాయోప వేశమునకు సమకట్టియుండఁగా సంపాతి యనువానివలన సీతాదేవిని రావణుడు లంకకుఁ గొనిపోయెనని తెలిసికొని వారు సముద్రలంఘనముకొరకుఁ బ్రయత్నించిరి. అప్పుడు వారిలో హనుమంతుఁడు సముద్రలంఘనము చేయఁగలనని చెప్పి యట్లు చేసి లంకకుఁ బోయి ప్రచ్ఛన్నముగ నర్ధరాత్రమందు సీతాదేవికిఁ గనబడి యామె నోదార్చి శ్రీరాములవారిచే నానవాలుగ నీయఁబడిన ముద్రికను సమర్పించి యామెకు గల సందేహములను మాన్పి ప్రతియానవాలుగ శీరోమణినిఁ దీసి కొనెను.

ఆపయి నింతదూరము వచ్చిన తనను శ్రీరాములవారు రావణునిసంగతిసందర్భముల నడుగుదురని యెంచుకొని రావణునిఁ జూచుతలంపు గలిగి యతనియుద్యానమగు నశోకవనముఁ జెరుపుచుండెను. అపు డతనిమీఁదికి యుద్ధమునకుఁ బంపఁబడిన రాక్షసులను గొందరినిఁ జంపి తుదను రావణుని కుమారుఁడగు నింద్రజిత్తుచేత నతఁడు పుట్టుపడియెను. ఆ యింద్రజిత్తు హనుమంతుని రావణునియెదుటికిఁ దీసికొనిపోయెను. అప్పు డారాక్షసరాజుతో దననిజస్థితినిఁ దెలుపుచు బుద్ధులు చెప్పఁగా నతఁడు కోపించి ముందు చంపఁ బ్రయత్నించి విభీషణునిచే వారింపఁబడి తుదకు దోకకు జమురులో ముంచిన గుడ్డలు చుట్టి కాల్చుట యను శిక్షతో హనుమంతుని విడిచిపెట్టను. అంతట నతఁ డామండుచుండెడుతోకతో నూరంతయుం దగులబెట్టి తనక్షేమమును సీతకుఁ దెలిపి యామె కుశలమును విచారించి సముద్రమును దాటి తన నిమిత్తము కాచికొనియుండినకపులతోఁ గలిసి యందరి కానందమును గలిగించెను. సీతను జూచుటకుగా వచ్చి లంకాపురము నంతయు నితఁడు గాల్చినందున (చూచిరమ్మనిన కాల్చివచ్చినావా ?) అనుసామెత యప్పటినుండియు గలిగెను. ఇట్లు వానరు లందరు గలిసి శ్రీరాములవారివద్దకుం బోయినపయిని హనుమంతుఁడు శ్రీస్వామివారికిఁ జరిగినవృత్తాంతమును జెప్పి సీతాదేవియొక్కశిరోమణిని సమర్పించి యతనిహృదయతాపమును బోఁగొట్టెను. యుద్ధమునం దితఁడు జంబుమాలి, ధూమ్రాక్ష, అకంపన, దేవాంతక , త్రిశిరస్క, నికుంభ, కాలనేమి, మాల్యవంతు లను రాక్షసవీరులనుఁ జంపెను. యుద్ధానంతరమున నయోధ్యకు మరలివచ్చునప్పుడు శ్రీస్వామివారిపనుపున భరద్వాజాశ్రమమునుండి యీకపిశ్రేష్ఠుఁడు భరతునివద్దకు వెళ్లి శ్రీరాములవారిరాక నెఱింగించి సంతోషమును గలిగించెను. శ్రీరామపట్టాభిషేక సమయమున సీతాదేవి శ్రీస్వామివారిపనుపున నీహనుమంతునకు నమూల్యమైనముక్తాహారము బహు.మతి నిచ్చెను. ఇతఁడు శ్రీరామనిర్యాణానంతరము కుశలవుల యొద్ద మంత్రిగ నుండినట్టు లయోధ్యలోని శ్రీహనుమంతుని దేవాలయమువద్ద గొందరు చెప్పియుండిరి.

5. వాలి.

ఇతఁడు కిష్కింధాదేశపురాజు. మాయావి యనువానితో దీర్ఘకాలము యుద్ధముచేసి మరలిరానందున నతని తమ్ముఁడుసుగ్రీవుఁ డన్న చచ్చియుండు నని భావించి రాజ్యమును స్వీకరించెను. అప్పటి యాదేశపుబ్రజల యాచారము ప్రకారము దనయన్న భార్యయగు తారనుఁ బరిగ్రహించెను. ఇట్లు కొంతకాలము జరిగినపిదప వాలి యాదనుజుని సంహరించి కిష్కింధకు వచ్చి తమ్ముడగు సుగ్రీవునిపయిని గోపించి యతనిని బయికి వెడలఁగొట్టి రాజ్యమును భార్యను మరియు నతనిభార్యను స్వీకరించెను. శ్రీరామసుగ్రీవసఖ్యానంతరమున శ్రీరాములవారిచే నీవాలి చంపఁబడెను,

6. సుగ్రీవుడు.

ఇతఁడు తనయన్నయగు వాలి యనంతరమునఁ గిష్కింధ నేలినప్రభు వయి యున్నాఁడు శ్రీరాములవారిపనువున నలుదిక్కులకు వానరవీరులను సీతాన్వేషణముకొరకుఁ బంపెను అసహాయులయిన శ్రీరామలక్ష్మణులకు దనయావత్సేనతో సహాయుఁడై లంకకుఁ బోయి రామరావణ యుద్ధమునఁ బోరాడి ప్రభుసుఁడు, కుంభుఁడు, మహోదరుఁడు మొదలగురాక్షస వీరులనుఁ జంపెను. యుద్ధానంతరము శ్రీరాములవారితో వానరవీరులతోఁగూడ నయోధ్యకు వచ్చి శ్రీరామపట్టాభిషేక మయినపిదప వారివద్ద సెలవును బొంది కిష్కింధకుఁ బోయి రాజ్యము నేలుచుండెను.

7. అంగదుఁడు.

ఇతఁడు వాలికుమారుఁడు. సేతువు దాఁటినపిదప శ్రీరాములవారిపనుపున రావణునియొద్దకు రాయభారముకొర కేగి యనేకనీతివాక్యములను నతనితోఁ జెప్పెను. యుద్ధమున వజ్రదంష్ట్రుఁడు, నరాంతకుఁడు, కంపనుఁడు, ప్రజంఘుఁడు, మత్తుఁడు మొదలగురాక్షసవీరులనుఁ జంపెను. యుద్ధానంతరము శ్రీరాములవారివెంట నయోధ్యకు వచ్చి మరలఁ గిష్కింధకుఁ బోయెను. ఈవానరవీరులలోఁ జాంబవంతుఁడు వృద్ధు. నీలుఁడు సేనాధిపతి. నలుఁడు సేతువు గట్టినవాఁడు. సుషేణుఁడు వైద్యుడు.

ఇటుపైని రావణాదిరాక్షసులవిషయమై వ్రాయవలసి యున్నది. గనుక యీవానరు. లనువా రెవ్వరో కొంత చర్చించి వ్రాయుట సముచితము. వీరలను సాధారణముగ మనమందరము గ్రంథకర్తతోపాటుగఁ గోతు లని నమ్ముచున్నాము. కోతులే యయియుండినయెడల వారిస్త్రీలకు హస్తపాదాద్యాభరణములను ధరించుట కెట్లు వీ లగును? కోఁతినిఁ బరీక్షించి చూచినవాఁడు దీనిని నమ్మఁడు. తార మొదలగుస్త్రీలవర్ణనమునుబట్టి యోచింపఁగా వారినిఁ గోతులని యెవ్వరుసు నమ్మరు. స్త్రీపురుషులు తోకలను మూసి యా మూయకయా వస్త్రములను ధరించిరి ? గృహములయం దెట్లు నివసించిరి ? వేదశాస్త్రముల సభ్యసించుట ద్విజులు చేయుసంధ్యావందనాదికర్మలను జేయుట కోఁతు లేయాధారము పయినిఁ జరిపెను. కావున నట్టివారిని మృగములలోఁ జేరిన కోఁతు లని చెప్పుటకు వీలుపడదు. మరి యేమి యనిన : ఆదిసృష్టిలోఁ దామస, రాజస, సాత్వికు లని ప్రజలలో మూడు విభాగము లుండినటుల మనగ్రంథములన్నియు నైకకంఠ్యముగ నొప్పుకొనుచున్నవి. ఈభేద మనునది కేవలము వారివారిదేహ వర్ణమునుబట్టి యేరుపడెను. తామసు లనఁగా నల్లనివారు, లేదా? నిండుగ నవివేకులు. రాజసు లనఁగా నెఱ్ఱనివారు, లేదా ఒకరితో నొకరు కలహించువారు. సాత్వికు లనఁగా దెల్లనివారు, లేదా నెమ్మదియు నణకువయు గలవారు. పయి మూడుతెగలవారు కొంతకాలమువరకు బరస్పర వివాహములు చేసికొనిరి. అప్పుడు శరీరవర్ణమునుబట్టి యుండినభేదము మారిపోయెను. కావున మరియొకమార్పు వారిలోఁ జరగవలసివచ్చి విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, గుహ్యకులు, సిద్ధులు, భూతములు, పిశాచులు, కిన్నరులు నరులు, వానరులు మొదలగువిభాగము జరిగినది. . మరికొంత కాలముపిదప నేయేదేశములఁ బ్రజలు నివసించుచువచ్చిరో యాదేశములపేరులతో బిలువఁబడుచుండిరి. అనగా రాజపుత్రులు, బంగాళీలు, మలయాళీలు మొదలగువారు. రెండవవిభాగమందుఁ జెప్పఁబడిన వివిధనామములకు నర్థములన్నిటిని నిచ్చట విచారించుట యేల? ఇటీవల రెండవవిభాగమునఁ జెప్పఁబడిన విభాగములలోఁ గనుపడనివారిని స్వర్గాదిలోకముల లోనివారై యుండినట్టు మనగ్రంథకర్తలు తీసికొనిరి. తదితరులలోఁ గొందరిని నరులుగను, వానరులుగను, రాక్షసులుగను, దయ్యములని మనము సాధారణముగ నమ్ముచున్న భూత పిశాచములుగను దీసికొనిరి. వానరు లనఁగా నడవియందు నివసించుజను లని వాచస్పతినిఘంటువువలనను బ్రౌనుదొరవారి డిక్ష్ణరీవలనను దేఁటపడుచున్నది. కోఁతులును వనమం దుండెడివి. కావున వానికిని వానరశబ్దముఁ గలదు. గనుక గ్రంథకర్త వారినిఁ గోతు లని భ్రమసియుండును. కావున నతఁడు వానరులను గోఁతు లని నమ్మియుండుటనుబట్టి కోఁతిరూపమును జేష్టలను బ్రతిచోటను వర్ణించుచుఁ బోయెను. కపిశ వర్ణముగలవా రగుటచేత వీరినిఁ గపు లనియెదరు. కపిశవర్ణ మనఁగా నలుపు నెరుపు కలిసినరంగుకు పేరు. దీనినిఁబట్టి యోచింపఁగా నీవానరవీరులు ప్రథమవిభాగమగు తామస రాజసులమధ్య జన్మించినవారై యుండియుందురు. కేవలము నల్లనివారును నవయవసౌష్ఠవము తక్కువగలవారును రాక్షసులై యుందురు. అయితే ఈవానరులను గోఁతు లని నమ్మనివారు హనుమంతుఁడు సముద్రలంఘనము నెట్లు చేసె ననియు, తనతోఁకకు జుట్టఁబడిన చమురుగుడ్డల మంటతో లంకాదహన మెట్లు చేసె ననియు నిష్పటికిని విష్ణుదేవాలయములలోఁ దోక గల హనుమంతునిఁ నెటుల పూజించుచున్నా రనియు నాక్షేపింపక మానరు. దీనికి సమాధానము :- ప్రతిమతమునందును గొన్నిమతసంబంధమయిన నమ్మకములు గలవు. ఆనమ్మకములను విడుచుకొన్న యెడల నేమతమును నిలువఁజాలదు. అందు మనయార్యమతమున నవి హెచ్చుగ నున్నవి. కావున నట్టివాని నీకాలపువారును నమ్మవలసినదే ? ఆమతసంబంధములగు నమ్మకములలో నీమీఁదిచర్చకు సంబంధించిననమ్మకములను దీసికొనియెదము. అరుదుగఁ గొందరుమహానుభావులకు గామరూపములను ధరించుశక్తి గలిగియుండును. అటులనే హనుమంతునికిఁ గామరూపశక్తి కలిగియుండును. లంఘనమునకు యోగ్యమైన కోఁతిరూపమును ధరించి మహేంద్రగిరి నుండి సముద్రమును దాఁటియుండును. కోఁతిరూపముతో నుండినందున దోకకు జమురుగుడ్డలు చుట్టి రాక్షసులు కాల్చియుందురు. ఈహనుమంతుఁడు కోఁతిరూపముతోనే శ్రీరామ దూతకృత్యమగు సీతాన్వేషణాదికమును జరిపియుండినందున నారూపముతోనే మన మిప్పటికిని దేవాలయములలో నారాధించుచున్నాము. ఇందుకు తప్పుగాని యసందర్భముగాని యేమియు లే దని చదువరులకుఁ బోధపడఁగలదు.

8. విభీషణుఁడు.

ఇతఁడు రావణుని రెండవతమ్ముడు. సీతాదేవిని లంకకుఁ దెచ్చినపిదప ననేకపర్యాయములు రావణునితో వల దని హితోపదేశమును జేసెను. చివరకు దనయన్న యెంతమాత్రము తనమాటను వినఁ డనియుఁ, జెడు ననియుఁ దృఢముగఁ దెలిసికొని యతనివలన నవమానమును బొంది. నలువురుమంత్రులతో సముద్రమును దాఁటివచ్చి శ్రీరాములవారి సన్నిధిని శరణాగతి చేసెను. ఈశరణాగతివిషయము విష్ణుమతస్థులందరికి నిండా ముఖ్యము. ఇదియే షడంగప్రపత్తి యని చెప్పుదురు. షడంగప్రపత్తికి మోక్ష మే ఫల మై యుండవలెను. అట్లు లేదు. అయితే ఇచట లంకారాజ్యలాభమే ఫలముగ గ్రహింపవలసియున్నది. ఆపిదప శ్రీస్వామివారిసన్నిధిని జేరి రాక్షససేనల స్థితిగతులనన్నిటిని మనవిచేసెను. యుద్ధసమయమునందును రావణునికోటలోఁ జరుగుప్రతివిశేషమును మనవి చేయుచువచ్చినందున బ్రతీకారము వెంట వెంటనె చేయఁ బడుచుండెను. అంతటినుండియే 'యింటిగుట్టు లంకకుచేట'ను సామెత వాడుకలోనికి వచ్చెను. పూర్వ మాపత్కాలముల యందుఁ గనిష్ఠులగు సోదరులు సహా నీతులు చెప్పు మంచి యాచారము గలదు.

యుద్ధానంతరము. శ్రీరాములవారివలస లంకారాజ్యమున కభిషేకింపఁబడి యీవిభీషణుఁ డాస్వామివెంట నయోధ్యకు వచ్చి సన్మానమును బొంది తిరుగ లంకకుఁ బోయి రాజ్య మేలుచుండెను.

9. కుంభకర్ణుఁడు.

ఇతఁడు రావణాదిసోదరులు ముగ్గురిలో రెండవవాఁడు. విశేషౌన్నత్యము బలము గలవాఁడు. కాని తిండిపోతు. అతినిద్ర గలవాఁడు. ఐనను యుద్ధమధ్యమున దనయన్నకు రాజనీతిని విస్తారముగఁ జెప్పెను. రావణునిపనుపున యుద్ధమున కేగి శ్రీరాములవారిచే సంహరింపఁబడెను. శారీరశాస్త్రము

నెరుగని యీగ్రంథకర్త కుంభకర్ణునిచే మ్రింగఁబడినవారు కర్ణనాసికారంధ్రములనుండి బయటికివచ్చు చుండి రని చిత్రముగ వర్ణించెను. ముక్కునకును నోటికిని రంధ్రము గలదు గాని చెవికిలోపల రంధ్రమే లేదు గదా? మ్రింగఁబడినవా రాదారి నెటుల రాఁగలరు?

10. రావణుఁడు.

ఇతఁడు లంకారాజ్యమునకు బ్రభువు. బహుపరాక్రమవంతుఁడు. మనదేశమునకు వచ్చి యనేకులగు రాజులను జయించియుండును. దిక్పాలకులను సహా జయించె నని యిఅగ్రంథకర్తచెప్పెను.

ఇట్టిపరాక్రమము గలవాఁడైనను బరస్త్రీలోలుఁ డయి చాలమంది సుందరులగుస్త్రీలను దెచ్చిపెట్టుకొనెను ఇట్లు కొంతకాలము జరిగినపిదప దనచెలియలగు శూర్పణఖవలన నరణ్యవాసమునం దున్న సీతాదేవియొక్క సౌందర్యమునుఁ దెలిసికొని యచటి కేగి ప్రచ్ఛన్న వేషమును దాల్చి శ్రీరామ లక్ష్మణులు లేనిసమయమున సీతాదేవియొద్దకు భిక్షుకునిరూపమున నేగి యామె నెత్తుకొని లంకకుఁ బోయెను. అచ్చట నాదేవి యతనికి వశ్యురాలు కానందున నామె నశోకవనమున నుంచి స్వాధీన మగుటకొరకు రాక్షసస్త్రీలచే శ్రమపరచుచు వచ్చెను. ఇట్లు సుమారు పదిమాసముల కాలము జరిగినవిదప శ్రీరాములవారు వానరసేనతో వచ్చి లంకాపట్టణమును ముట్టడించిరి. అప్పుడు రావణుఁడు శ్రీరాములవారిచే రాయభారమునకయి పంపఁబడిన యంగదుని నిరాకరించి సేనలను విభజించి నాలుగుదినములవరకు ననేకరాక్షసవీరులను యుద్ధమునకుఁ బంపెను. వారందరు హతు లైన పిదప నైదవనాఁడు రాక్షససేనాధిపతియగు ప్రహస్తుఁడు యుద్ధమునకు వచ్చెను. అతఁడును వానరసేనాధిపతియగు నీలునిచేఁ జంపఁబడెను. అందుకు రావణుఁడు కడు దుఃఖితుఁ డయి మూలబలమును దీసికొని తానే యుద్ధమునకు వచ్చి శ్రీరాములవారితో యుద్ధము చేసెను. అపుడు శ్రీరామునిబాణములదెబ్బకు జడిసి యూరకయుండఁగా నట్టివానినిఁ జంపుట తగ దని శ్రీరాముల వారు తలఁచి యతనిని శ్రమ దీర్చికొని మరుచటినాఁడు రమ్మని చెప్పి పుచ్చిరి. ఏడవనాఁటియుద్ధమున రావణుఁడు తనతమ్ముఁడగు కుంభకర్ణుని యుద్ధమునకుఁ బంపెను. అతఁ డనేక వీరులతో యుద్ధముచేసి తుదను శ్రీస్వామివారిచే సంహరింపఁ బడెను. ఎనిమిదవనాఁటియుద్ధమున లక్ష్మణస్వామి యతికాయునిఁ జంపెను. ఈయతికాయుఁడు రావణునికుమారుఁడు. నీతిమంతుఁడు. రావణునిమంత్రులలో నొకఁడు.

తొమ్మిదవనాఁ డింద్రజిత్తు మూడవసారి యుద్ధమునకు వచ్చెను. ఇతఁడు రావణుని పట్టమహిషియగు మండోదరికి జన్మించినవాడు కావున యువరాజు అప్పు డనేకులగువీరులతో నేర్పుతోను వేగముతోను యుద్ధముచేసి తుదను లక్ష్మణస్వామిచేఁ జంపఁబడెను.

రావణుఁ డింద్రజిత్తుచావునకు దుఃఖించి పదియవనాఁ డతికోపముతో రెండవసారి యుద్ధమునకు వచ్చెను. ఇట్లు వచ్చి లక్ష్మణస్వామిని మూర్ఛితునిఁ జేసెను. అపుడు శ్రీరాములవారు కోపించి తీవ్రశరములను రావణునిమీఁద వేయఁగా నతఁడు వానికి సహింపలేక యుద్ధభూమినుండి మరలిపోయెను.

పదునొకండవనాఁడు. రావణుఁడు శత్రువిజయముకొరకు బాతాళహోమమను నొకదానినిఁ జేసినట్లును, నాహెూమమునకు విఘ్నముచేయుటకయి వానరు లేగి రనియు నామీఁద రావణుఁడు మూడవసారి యుద్ధమునకు వచ్చె ననియుఁ జెప్పఁబడి యున్నది. నాఁడు రామరావణయుద్ధము కడుభయంకరముగఁ జరిగెను. తుదను శ్రీస్వామివారిచే వేయఁబడినబ్రహ్మాస్త్రముచే రావణుఁడు హత్తుఁ డాయెను.

ఈరావణునకు దశకంఠుఁ డనియు వింశతిభుజుఁ డనియు వాడుక కలదు. అట్టి యాకారముతోనే యిప్పటికిని నీశ్వరునికి వాహనముగ వేంచేయింపు జరుగుచున్నది. ఒక్కశరీరమునకు బదితలలును నిరువదిచేతులును నెట్లుండును. అట్లుండిన శరీరికి సౌఖ్యమును సదుపాయము నెట్లుకలుగును. కావున నీయసంభావిత మెట్లు కలిగినదో విచారింపవలసి యున్నది. హనుమంతుఁడు లంకలో వెదకునపుడు స్త్రీలమధ్యమున రావణుఁడు రెండుబాహువులును, నొక్కతలయును గలవాఁడయి నిద్రించుచున్నట్లు చెప్పఁబడి యున్నది, రామాయణసుందరకాండ పదియవసర్గము 21-22.

శ్లో. దదర్శసకసిస్తస్య బాహూశయనసంస్థితౌ !
    మందరస్యాంతరేసుప్తౌ మహాహీరుషి తావివ!!
    తాభ్యాంసపరిపూర్ణాభ్యాం భుజాభ్యాంరాక్షసేశ్వరః!
    శుశుభే౽ చలసంకాశః శృంగాభ్యామివమందరః!!

24-25, తస్యరాక్షససింహస్య నిశ్చక్రామమహాముఖాత్ !
         శయానస్యవినిశ్వాసా పూరయన్నివతద్గృహమ్ !!
         ముక్తామణివిచిత్రేణ కాంచనేనవిరాజితమ్ !
         మకుటేనాపవృత్తేన కుండలోజ్వలితాననమ్ !!

ఇచట వ్యాఖ్యానకర్తలు రావణుఁడు కామరూపి కావున నేకశిరస్సును ద్విబాహువులును గలిగియుండుట స్త్రీలవినోదముకొర కని సవరించిరి. సదుపాయముకొర కేకశిరస్సుండుట బాగే, అనేక స్త్రీలతో విహరించువాని కనేకములగుచేతు లుండుట, వారితో వినోదము లాడుట కుపయోగమే కదా? కావున నాసవరణను మన మొప్పఁగూడదు.

ఇందునుబట్టి రావణునకు నేకశిరస్సును ద్విబాహువులును గల వని స్పష్టపడుచున్నది. రావణునితల కొట్టఁబడినపిదప మొలచినతలను వరుసగ గొట్టినట్లు స్పష్టముగ రామాయణమున నున్నది. ఈ గ్రంథకర్త రావణునికి బదితలలు గలిగియున్నవని నమ్మియున్నందున నాపదితలలును బదిపర్యాయములు కొట్టినట్లు అనఁగా నొకనూరుతలలు కొట్టఁబడినట్లు వ్రాసియుండెను' కాని హస్తములవిషయ మేమియు నెత్తుకొనలేదు. పదితలలు గలవానికి నిరువదిచేతు లుండవా? యని తలఁచి రావణుఁడు వింశతిభుజుఁ డని గ్రంథములో నచ్చటచ్చట వ్రాసెను. ఒక్కటే శిరస్సు కల దని నమ్మియుండినయెడల దానినిఁ బది పర్యాయములే కొట్టె నని నిజముగ జరిగినది జరిగినట్టే వ్రాసి యుండవలసివచ్చును. కాని యితనికి దశకంఠుఁ డని పౌరుషనామ మేల కలిగినదో చూతము. రావణునివధనాఁడు శ్రీస్వామివారిచే వేయఁబడినబాణములవలనఁ దొమ్మిదిపర్యాయములు తలలు దెగఁగొట్టఁబడుచు దిరుగ మొలచుచుండుటనుఁ జూచి దివ్యాస్త్రమువలనఁగాని యితఁడు చావఁడని శ్రీస్వామివారు తలఁచి బ్రహ్మాస్త్రమును బ్రయోగించి సంహరించిరి. ఇట్లు తలలు మొలచుట యేదో యొకవరప్రభావమైయుండును. వరప్రభావముగూడ మతసంబంధములగు నమ్మకములలో నొకటియై యున్నది. ఇట్లనే కార్తవీర్యార్జునుని బాహువులను శ్రీపరశురాములవారును, బాణాసురుని బాహువులను శ్రీకృష్ణస్వామివారును, దెగఁగొట్టియుందురు. మరియు నీరావణునికిఁ దశకంఠుఁ డను పేరు వానిసంహారమువకు ముందే యెట్లు గ్రంథమున వాడుక చేయఁబడె నని శంక గలుగును. పౌరుష నామములన్నియు నాయాపనులు జరిగినపిదప వాడఁబడును. అట్టివారిచరిత్రలు వారియనంతరమునందు వ్రాయఁబడును. స్పచ్ఛందమరణునికి మరణానంతరమునగాని, యాపేరు రాదు కదా! అట్లనే యీరావణున కానామములు ప్రయోగింపఁబడెను.

11.శ్రీరాములవారు.

శ్రీమన్నారాయణుఁడు రావణాదిదుష్టులను సంహరించి తద్వారా శిష్టరక్షణము చేయుకొరకు దశరథమహారాజునకుఁ జ్యేష్ఠ భార్యయగు కౌసల్యయందుఁ జ్యేష్ఠకుమారుఁడై యవతరించెను. ఆయనకు పశిష్ఠమహర్షి శ్రీరామనామము నుంచెను. సుమిత్రయను రెండవభార్యయందు. లక్ష్మణశత్రుఘ్నులు కవలుగ జన్మించిరి. మూడవభార్యయగు కైకేయియందు భరతుఁడను కుమారుఁ డుదయించెను. వీరిలోఁ బాల్యము మొదలు రామలక్ష్మణులు మైత్రి గలిగి యుండిరి. అట్లనే భరతశత్రుఘ్నులు నుండిరి.

ఇట్లు వీరు దినదినప్రవర్థమానులై యుండఁగా నొకనాఁడు విశ్వామిత్రమహర్షి దశరథమహారాజుకడ కేతెంచి తానుఁ జేయు నొకగొప్పయాగమునకు రావణునిభటులగు మారీచసుబాహులను వారు పలుమారు విఘ్నములు చేయు చున్నందున నాయాగరక్షణార్థము తనవెంట శ్రీరాములవారినిఁ బంపుమని కోరి యందువలన విశేషమగుమేలు సమకూడునని పలికెను. అపు డామహారాజు జ్యేష్ఠుఁడును ధర్మప్రధానుఁడు నగు నాబాలునిఁ బంప వెఱచెను. అందుకు విశ్వామిత్రుఁడు కడుం గుపితుఁడు కాఁగా వశిష్ఠమహర్షి యామహారాజుతో భయము లే దనియు విశ్వామిత్రునివలనఁ దివ్యాస్త్రాదిలాభము గలుగు ననియు బోధించినపిదప నామహారాజు రామలక్ష్మణుల నుభయులను బిలిపించి విశ్వామిత్రునివెంటఁ బంపెను. ఇట్లు వారు మువ్వురు నేగుచుండఁగా శ్రీరాములవారు. తాటకయను దుష్టురాలిని సంహరించిరి. ఆయాడుదానిం జంపుటకు సంశయింపఁగా విశ్వామిత్రుఁడు దుష్టులగుస్త్రీలను సంహరించుటచేఁ బాపములేదని పూర్వము జరిగినకథలను జెప్పి చంపుమనఁగా నయోధ్యను విడుచునప్పుడు తమతండ్రివలన విశ్వామిత్రుఁడు చెప్పినదానినంతయు జేయు మని యాజ్ఞాపింపఁబడి యున్నందునను శ్రీరాములవా రాతాటకను సంహరించిరి. అట్లు కేవల భుజబలమువలనఁ దానిని సంహరించిన శ్రీస్వామివారిని మెచ్చుకొని వారికి దివ్యాస్త్రముల నామహర్షి యుపదేశించెను. వానిని శ్రీరాములవారు లక్ష్మణున కుపదేశించిరి. ఆపిదప యాగభంగము చేయుటకు వచ్చినమారీచసుబాహులతో శ్రీరాములవారు యుద్ధము చేసిరి. అందు మొదటి వాఁడు రామబాణములకుఁ దాళఁజాలక తప్పించుకొనిపోయెను. రెండవవాఁడు హతుఁ డయ్యెను.

అక్కాలమునఁ జనకమహారాజుచేఁ జరపఁబడుచున్న యజ్ఞమును జూచుటకును నామహారాజుయొద్ద నున్న యీశ్వర ధనుస్సును గాంచుటకును విశ్వామిత్రునివెంట శ్రీరామలక్ష్మణులు మిథిలాపురమున కేగిరి. ఆకుమారుల నామహారాజు చూచి వీ రెవ్వ రని విశ్వామిత్రుని నడుగ 'వీరు దశరధమహారాజు కుమారులు, ధార్మికులు, ధనుర్విద్యయందు నేర్పుగలవారు, నీయింట నున్న శివధనుస్సును జూడ నభిలాషముగలవారై వచ్చి'రని యతఁడు చెప్పఁగా నామహారాజు చాల యానందించి యాధనుస్సునుఁ దెప్పించి దీనిని శ్రీరాములవా రెక్కు వెట్టిన యెడల వీర్యశుల్కగా నిచ్చుటకు శపథము చేసియున్న తనకుమార్తెయగు సీతాదేవి నిచ్చెద నని చెప్పెను. అపుడు శ్రీరాములవా రతిసులభముగ దాని నెక్కు వెట్టుతరి నది నడిమికి విరిగిపోయెను. దానిం జూచి జనకమహారాజు చాల మెచ్చుకొని సీతాదేవిని శ్రీరాముసకు సమర్పించెద నని పలికెను.

ఆపయిని దశరథునకు శుభలేఖ నంపఁగా నామహారాజు భార్యలతోను భరతశత్రుఘ్నులతోను పశిష్ఠాదిపరివారముతోను గలిసి మిథిలానగరమునకు వచ్చెను. అంతటఁ జనక మహారాజు సీతాదేవిని శ్రీరాములవారికిని, రెండవపుత్రికయగు నూర్మిళను లక్ష్మణస్వామివారికిని, దనతమ్మునికుమార్తెలగు మాండవీశ్రుతకీర్తులను వరుసగ భగతశత్రుఘ్నులకును నిచ్చి యేక కాలమున నతివిభవముతో వివాహము చేసెను.

భర్త సంచరించువిధమునకు శ్రీరాములవారును, భార్య ప్రవర్తించురీతికి సీతాదేవియు, సోదరులను వర్తించుటకు లక్ష్మణస్వామియు, భక్తికి భరతుఁడును, నిదర్శకులయి ప్రవర్తించిరి.

ఇట్లు వివాహములు జరిగినపిదప దశరథమహారాజు కుమారులతో ను గోడండ్రతోను బరివారముతోను నయోధ్యాపురము జేరి సుఖముగ నుండెను.

ఈతీరున గొన్ని సంవత్సరములు జరిగినపిదప భరతుఁడు శత్రుఘ్నుసహితుఁడై మాతామహుఁడగు కేకయరాజుపురమున కేగియుండఁగా దశరథమహారాజు తాను మున్ను కైకేయి కిచ్చినవరమును దలఁచి భరతుఁడు లేని యిదియే సమయమని యెంచి ! శ్రీరాములవారికిఁ బట్టాభిషేకము జేయఁ బూని వశిష్ఠమహర్షి చే నందుకు ముహూర్తమును నిర్ణయింపించి సంభారములు సిద్ధపరచి మరునాఁడు చేయ సమకట్టియుండెను. ఆనాఁటిరాత్రి కైకేయి తనకు ముందు భర్తచే నీయఁబడినవరముల నడుగుటవలన మరునాఁడు జరగవలసిన శ్రీరామపట్టాభిషేకము నిలిచిపోయెను. ఈవరముల విషయము దశరథమహా రాజుచరిత్రమున విపులముగ విమర్శింపఁబడి యున్నది. ఆహా ! ఏమిచిత్రమో కాని పశిష్ఠునివలన నుంపఁబడిన పట్టాభిషేక ముహూర్తముప్రకారము జరగకపోవుటయే కాక శ్రీరాములవారి కతిశ్రమకరమగునరణ్యవాసము పదునాలుగువత్సరముల కాలము సంభవించెను. సర్వజ్ఞులని మనచే సమ్మఁబడియున్న మహర్షులలో నొక్కఁడగు నీవశిష్ఠుని సర్వజ్ఞత్వవిషయము విచారింపవలసి యున్నది. సర్వజ్ఞత్వమే యతనికి గలిగి యున్నయెడలఁ బట్టాభిషేకము గానేర దని ముందే చెప్పి యుండవలెను. లేక, పురోహితుఁడని యనుకొంటిమా, కైకను దనతండ్రియింటికిఁ బంపఁబడుదానినిగాఁ జేసియుండ వలెను. కావున మహర్షులకు గల సర్వజ్ఞత్వమునకు గొంత పరిమితి గలిగియుండక తప్పదు. తా నెఱిఁగియున్నవిషయములలోను స్థలములలోను గతవర్తమానకార్యములను దెలిసికొను నట్టి దివ్యజ్ఞానము తపోమహిమవలన వారికి గలిగియుండును. అదియైనను యోగశక్తిని బట్టి వచ్చిన ధ్యానప్రభావముచే గలుగునదియే కాని యెల్లప్పుడు నుండునదియును గాదు. సమస్తగోళముల యందును సర్వకాలములయందును, సర్వ విషయములయందును వ్యాపించియుండు పరమేశ్వరుని సర్వజ్ఞత్వము తదితరులకు గలిగియుండునా ? వశిష్ఠునకు దెలియనిది యుండునా? తెలిసియు నూరకయుండె నని కొంద రను వచ్చును. శ్రీకృష్ణులవారు కాని కార్యమున కెందుకు వచ్చితిరని విదురునిచే నడుగఁబడి హితకార్యమునకుఁ బ్రతివాఁడును బ్రయత్నింపఁ బూనవలసినదనియు, నట్లు చేయనియెడల బాతిత్యము సంభవించుననియు, గార్యకారి కాకపోయినను నట్టి ప్రయత్నమునకు ముందు ఫలము గల దనియు, సెలవిచ్చి యున్నారు. జగదీశ్వరుఁడే మేలుకొరకుఁ బ్రయత్నించినపుడు వశిష్ఠుఁడుమాత్ర మేల ప్రయత్నించియుండఁగూడదు? కావునఁ బట్టాభిషేకవిఘ్నవిషయ మాఋషికి ముందుగఁ దెలియదని తేటపడఁగలదు.

మఱియు నిప్పటికాలపువారివలె గాక తారలనుమాత్రము చూచువాఁడుక గలదినముల నాటివాఁడగు వశిష్ఠుఁడు శ్రీస్వామివారికిఁ బట్టాభిషేకమునకు సంపత్తారను నిర్ణయించెను. . వారికి రాజ్యలాభసంపద పోవుటయే కాక వనవాస కష్టము, భార్యావియోగము, రావణాదివీరులవధవలని శ్రమయు, సంప్రాప్తమాయెను.

ఆమరునాఁటియుదయమున శ్రీరాములవారినిఁ బిలిపించి దశరథుఁడు దుఃఖమువలన గైకేయి కిచ్చినవరములవిషయమును జెప్పలేక యున్నపు డాదేవి శ్రీరాములవారితో 'నీవు పదునాలుగు సంవత్సరము లరణ్యవాసము చేయునటులను భరతుఁడు రాజ్య మేలునటులను నాకు నీతండ్రి వర మిచ్చె ' నని తెలి పెను. అపుడు శ్రీస్వామివా రరణ్యమున కేగెద నని తండ్రి యెదుట నొప్పుకొని తల్లియగు కౌసల్యయొద్దకు సెలవుబొందుట కరుగఁగా నచట లక్ష్మణస్వామివా రి ట్లనిరి:-

గీ. "విషయపరతంత్రుఁడై ధర్మవిధికిఁ దప్పి
    మది ననారత మిది కార్య మిదియకార్య
    మని యెఱుంగక వర్తించునతఁడు తండ్రి
    యైనఁ గడువధ్యుఁడని పల్కి రార్యు లధిప.

క. జనపతి నీదగురాజ్యముఁ
   గొనుటకు నేబలము? పిదప గుణహీనతఁ దా
   మును కొని యేకారణమున
   దనమదిఁ గైకేయి కొసఁగఁ దలచె మహాత్మా!

ఇట్లనేకవిధములఁ జెప్పఁగా నపుడు శ్రీరాములవారు సెలవిచ్చినదానిలో ముఖ్యాంశ మేమి యనిన :--

గీ. "ధరణిఁ బురుషార్ధములలోన ధర్మ మెక్కు
    డట్టిధర్మంబునందు సత్యంబు నిలిచి
    యుండు నన్నిఁటికంటె నత్యుత్తమంబు
    గురునియానతి నడచుట గురుగుణాఢ్య.

కావున నేను బితృశాసనంబునఁ గైకేయిచేతఁ బ్రచోదితండ నైతి నింకఁ దానిఁ గడవంజాల నీవ శుభం బైనక్షత్ర ధర్మంబునందు బుద్ధిఁ జొరనీక తీక్ష్ణస్వభావంబు విడిచి పరమ శ్రేయోనిష్ఠయైన మద్బుద్ధి ననుసరింపుము" అని సెల విచ్చిరి. తల్లియొద్ద సెలవుఁ గైకొని శ్రీరాములవారు తమనగరున కేగి యరణ్యవాసవిషయమును సీతాదేవితో సెలవీయఁగా నా యమ తానుఁగూడ వెంట వచ్చెద నని యతినిర్భంధము చేసినందున నందుకు దుద కోయకొనిరి. స్త్రీని వెంటఁదీసికొని వెళ్లినందుచేతనేకదా సీతావియోగాదికము శ్రీస్వామివారికి సంభవించెను. సర్వజ్ఞుఁడును సర్వేశ్వరుఁడును నగు నాయనకు దుఃఖములేకపోయినను దదితరు లట్లు భార్యను వనమునకుఁ దీసికొనిపోయినయెడల నాపదలు రాక మానవు. సమీపమున నపు డున్న లక్ష్మణుఁడు తానుగూడ వెంట వచ్చెద నని బహువిధములఁ బ్రార్థింపగా నందు కంగీకరించి సీతాలక్ష్మణ సహితులై శ్రీరాములవారు తండ్రియొద్దకుఁ బోయి సెలవు గైకొని పురజనులందఱు దుఃఖ సముద్రమున మునిఁగియుండ, నారచీరలు ధరించి యరణ్యవాసముసకుఁ బయలుదేరి వెడలిరి. సుమంత్రుఁడు గంగానదియొడ్డువరకు రథసారధిగా నరిగి గుహుఁడు వారినోడతో గంగ దాటించినపిదప మూడుదినములవరకు నానదీతీరమునఁ గాచియుండి, యయోధ్యకు రథమునుఁ దోలుకొనివచ్చి దశరథున కావృత్తాంతమును దెలిపెను.

రామవియోగవిషాదమువలన నాటిరాత్రియే యమహారాజు పరలోకగతుఁ డాయెను. సన్నిధిని గుమారు లెవ్వరును లేనందున మంత్రులు యోచించి యాకళేబరమును భద్రపరచి మాతామహుని యింటనున్న భరతునిశత్రుఘ్నునితో రప్పించిరి. అట్లు వచ్చి భరతుఁడు దహనాదిసంస్కారములు యథావిధిగ జరిపెను. అప్పటియాచారమువలననే యిక్కాలమునను యూరపుఖండపు రాజులకళేబరములను బంధువులందఱు వచ్చువరకు ఖననము చేయక యుంచుటఁ గలదు.

స్వల్పదినములక్రిందట నరణ్యవాసమున కేగిన జ్యేష్ఠకుమారులగు శ్రీస్వామివారినిమిత్తము మనుష్యులను బంపక యేడుదినముల ప్రయాణముగల మాతామహుని పురమున నున్న భరతుని నేల వశిష్ఠాదులు రావించి రని కొందఱికిఁ దోఁచును, శ్రీస్వామివారికొరకు మనుష్యుల నంపకపోవుటకు రెండుకారణములు గలవు :- 1. రాజ్యమును విడుచుకొని పదునాలుగుసంవత్సరము లరణ్యమునందే కాని యేపట్టణము నందును వసింపనని చెప్పిపోయిన శ్రీస్వామివారు రా రనియు, 2. చిత్రకూట పర్వతము దాటి యేప్రక్కకు వారు పోయిరో యామార్గమును దూతలు తెలిసికొనుట దుర్లభ మనియు వీనిని యోచించి నిర్దిష్టమైనస్థలమునం దున్న భరతశత్రుఘ్నులను బిలువనంపియుందురు.

భరతుఁడయోధ్యాపురముఁ జేరఁగనే తనతల్లివలనఁ ద్రండి మరణమును, అన్నయొక్క వనవాసగమనమును విని, తమ్ముని తోఁగూడ దుఃఖించి తల్లిని నిందించి తండ్రికి నుత్తరక్రియలను సలిపి వశిష్ఠునివాక్యప్రకారము రాజ్యమును స్వీకరింపనొల్లక యారాజ్య మేలుటకు శ్రీరాములవారే యర్హులని నిశ్చయించి వారియొద్దకుం బోయి ప్రార్థించి తీసికొనివచ్చుటకయి పరివారసహితుఁడై కదలెను. ముందు సుమంత్రునివలన జిత్రకూటాద్రివరకు శ్రీస్వామివా రేగినట్లు తెలిసికొనియున్నందున జిత్రకూటాద్రిఁ జేరెను. శ్రీరాములవారికొరకు సపరివారముగాఁ బోవుచున్న భరతునిఁ గంగానదియొడ్డున గుహుఁడు చూచి శ్రీస్వామివారియందు గల మిత్రభావముచే వారికిఁ గీడు చేయునేమో యని శంకితుఁడై భరతునిఁ గంగానది దాటుట కాటంకపరుపఁ బ్రయత్నించెను. అపు డాతనివలన నిజస్థితినిఁ దెలిసికొని పరివారసహితముగా నతనిని గంగానదిని దాటించి పంపెను. ఇట్లు పరివారసహితుఁడై వచ్చుచున్న భరతుని లక్ష్మణస్వామివారు చిత్రకూటాద్రిపయినుండి దూరమునఁ జూచి, వచ్చువాఁడు భరతుఁడని తెలిసికొని శ్రీస్వామివారి కపాయము చేయఁబూని వచ్చుచున్నాఁడని భ్రమసి శ్రీరాములవారితోఁ 'భరతుఁడు నీమీఁదికి యుద్ధమునకు వచ్చు చున్నాఁడు సిద్ధుఁడవు గమ్ము నేను ముందుగ సేనను దగిలి యుద్ధముచేసి భరతాదులను సంహరించెద' నని మనవి చేసెను. అపుడు శ్రీస్వామివారు భరతునకు నామీఁద గల భక్తిని నీవెఱుఁగ వనియు నేను నీ కారాజ్యము నిమ్మని చెప్పినయెడల భరతుఁ డిచ్చు ననియు సమాధానపరచిరి. అంతలో భరతశత్రుఘ్నులు దూరమున రథము డిగి పాదచారులై సన్నిథిఁ జేరి శ్రీస్వామివారిపాదములకు భక్తిలజ్జాశోకపరవశులై సాష్టాంగవందనము చేయ వారలను బ్రీతిపురస్సరముగ నెత్తి కౌఁగిలించుకొనిరి. అపుడు భరతునిం జూచి తండ్రియగు దశరథుని నేల యొంటరిగ విడిచి వచ్చితి వనియు, తండ్రియుఁ దల్లులు సుఖముగ సున్నారా ! యనియు వారిని నిత్యమును యథావిధిగ బూజించుచున్నావా యనియు, నని యనేక రాజ్యాంగవిషయకప్రశ్నముల సడిగిరి.

తండ్రియొక్క క్షేమమునకుగా భరతు నడిగినప్రశ్నమునకు నుత్తరమును దీసికొనక రాజధర్మములను దెలుపుప్రశ్నములను విపులముగ నేల యడిగిరో విచారింపవలసి యున్నది. ఇవుడు భరతుఁడు శ్రీస్వామివారియొద్దకు వారినిఁ బ్రార్థించిన పయిని దప్పక వారు రాజ్యమును స్వీకరింతు రనెడు నమ్మికతో వచ్చియున్నాఁడు. రాజ్యమును స్వీకరింప నని చెప్పిన పిదప నతనిమనస్సు వికలమై యుండును. అపు డీరాజధర్మ విషయములు బాగుగ మనస్సునందు బట్ట వని శ్రీస్వామివారు తలఁచియు జగదీశ్వరుఁడు గావున దండ్రివిషయము తెలిసియే యుండుటచే నావిషయమున కుత్తరమును విన్న పిదప మానవ శరీరముతోనున్న యాస్వామివారు కొంత దుఃఖింపవలసి యుండును. కావునఁ దండ్రివిషయమునకు భరతుఁ డుత్తరము చెప్పకముందే రాజధర్మములను బ్రశ్నరూపముగఁ బోధించిరని మనము నిశ్చయింపవచ్చును.

ఇట్టిసర్వజ్ఞునకు రావణవధాత్పూర్వము జయముకొరకు నగస్త్యుఁడు సూర్యు నారాధింపు మనె నఁట. మాతలి బ్రహ్మాస్త్రము నేయు మని యాది చేసినఁట ఏమివింత ?

పయివిధమున శ్రీరాములవారు రాజధర్మముల నడిగిన పిదప భరతుఁడు తండ్రిమరణమును దెలిపెను. అపుడు శ్రీస్వామివారు చేయఁదగినయుత్తరక్రియలను జరిగించిరి. పిమ్మట భరతుఁ డనేకవిధముల బలుమారు రాజ్యమును స్వీకరించి యేలు మని శ్రీస్వామివారినిఁ బ్రార్థించెను. అందుకు శ్రీస్వామివారు తండ్రిచే నియోగింపఁబడిన యరణ్యవాసము పూర్తియగువరకు నయోధ్యాపురమునకు ఖండితముగ రా ననియుఁ నంతవరకు నీవే రాజ్యము నేలు మనియు, తండ్రియగు దశరథుని నసత్యవంతునిగాఁ జేయఁగూడ దనియు, ధర్మయుక్తముగాను యుక్తియుక్తముగాను సెలవిచ్చి భరతునిఁ దుదకు నొప్పించిరి. అపు డాభరతుఁడు తాను వెంటఁ దెచ్చిన శ్రీరామపాదుకలను సింహాసనమునందు వారికి బ్రతినిధిగ నుంచుకొని తానొకమంత్రివలె బ్రజలను బాలించుట కనుజ్ఞ నిప్పింపుమని శ్రీస్వామివారినిఁ బ్రార్థించి యటుల ననుజ్ఞఁ గైకొని పరివారసహితుఁడై కదలి యయోధ్య కేగక దాని సమీపమున నుండు నందిగ్రామమున నాపాదుకలను సింహాసనమున నునిచి రాజ్యమేలుచుండెను.

అప్రయత్న సిద్ధమైన రాజ్యమును స్వీకరింపక భరతుఁడు తన యన్నయందుగల భక్తివలన నాయననే యా పదునాలుగు వత్సరములుగూడ నేలుమని ప్రార్థించుటయు, నందుకు శ్రీరాములవా రొప్పనిపిదప వారి పాదుకలను వారికి బ్రతినిధిగఁ గైకొని సింహాసనమున నునిచి యభిషేకించి తాను మంత్రివలె రాజ్యము నేలుచుండుటయు మిగుల శ్లాఘ్యము. అది మొదలుగ బాదుకల నారాధించు మతాచార మేర్పడినది.

భరతుఁ డరిగినపిమ్మట శ్రీస్వామివారు చిత్రకూటమును విడిచి యత్రిమహాముని యాశ్రమమును జేరి యచటినుండి దండకారణ్యము ప్రవేశించి ముందుగ విరాధుఁడను రాక్షసుని జంపి శరభంగ మహాముని యాశ్రమమును బ్రవేశించిరి. అచట వాలఖిల్యాది మహర్షులు తమకు రాక్షసులవలన గలుగుచున్న బాధలను వారింపుమని కోరగా నట్లు చేయుదుమని సెలవిచ్చి సుతీక్ష్ణ మహాముని యాశ్రమమును జేరిరి. అచటినుండి యనేక మునుల యాశ్రమములను జూచుచు నట్లు పదిసంవత్సరముల వరకు గాలమును గడిపి తిరుగ సుతీక్ష్ణమహాముని యాశ్రమ మునుజేరి యతనితో గలిసి యగస్త్యుని యాశ్రమమున కేగిరి అచటఁ గొన్ని దినములుండి యాయన యనుమతిని బంచవటీని జేరి యచట నొకపర్ణశాలనుఁ గట్టుకొని నివసించియుండిరి. అటులున్నతరిని రావణాసురుని చెల్లెలగు శూర్పనఖ శ్రీస్వామివారిని జూచి మోహించి యందుకు వా రంగీకరింపక పోవుటచే విముఖియై జన్మస్థానమునందున్న ఖరునియొద్దకు బోయి తాను శ్రీరాములవారివలన నవమానిత నైతినని తెలిపి వానిని యుద్ధమునకుఁ బురికొల్పెను. ఈ సందర్భమున రామలక్ష్మణులు కొంతవరకు దానితో సల్లాప మాడినట్లును, కొనను రాముల వారిచే బ్రేరితుఁడై లక్ష్మణుఁడు దాని ముక్కు సెవులుఁ గోసినట్లును, నొకకథ భ గలదు. సంగతి సందర్భములనుబట్టి దానితో సల్లాప మాడినట్లు తోచదు. స్త్రీ యగు దానిముక్కు సెవులు గోయుమని శ్రీస్వామివారు చెప్పియుందురా ? మోహపరవశయగుస్త్రీకి దాని కోరిక తీర్పఁబడనియపుడు కల్పితకారణము లనేకములు తనవిరోధమునుఁ దీర్చికొనుటకుఁ బ్రకటించుటఁ గలదు.

ఆపిదప ఖరాసురాదులు శ్రీస్వామివారిమీదికి యుద్ధమునకు వచ్చుటయుఁ జచ్చుటయుఁ జరిగెను. అంత శూర్పనఖ క్రోధముతీరక రావణునియొద్దకుబోయి పరస్త్రీ లోలుఁ డగు నతనితో సీతాదేవియొక్క సౌందర్యాదివిషయములను చెప్పి మోహపరవశునిగ జేసెను. అపు డా రావణుఁడు మాయావంతుఁడును గామరూప శక్తిగలవాఁడును నగు మారీచుని కడకేగి నే బూనుకొన్న పనికి సహాయుఁడవు గమ్మనియు నీవు చిత్రమృగరూపమును దాల్చి రాముఁడుండు పర్ణశాలకు సమీపమునఁ దిరుగుచున్నయెడల నిన్నుఁబట్టుటకు రామలక్ష్మణులు ప్రయత్నింపుదురు. అప్పుడు నేను సీతనుఁ గైకొనివచ్చెదననియు జెప్పి యొప్పించెను. అ ట్లీమారీచుఁడు చిత్రమృగ రూపమునుదాల్చి పర్ణశాలసమీపమున దిరుగుచుండగా సీతాదేవి యామృగమును జూచి దాని నెటులైనఁ బట్టుకోని తెచ్చిన యెడల దాను దానినిఁ బెంచెదనని కోరఁగా లక్ష్మణుఁడు వలదని చెప్పినను శ్రీస్వామివారు మృగమైనఁ బట్టితెచ్చెద ననియు రాక్షసుఁడైన సంహరించి వచ్చెదననియు బ్రత్యుత్తర మిచ్చి భార్యాసంరక్షణముకొరకు లక్ష్మణు నాశ్రమమున నునిచి యా మృగముకొఱ కేగిరి. అమృగము చేతికి దొరకునట్లు తిరుగుచు శ్రీస్వామివారినిఁ గడుదూరము దీసికొనిపోయెను. అంతట లక్షణుఁడు చెప్పినట్లు రాక్షసుఁడే యని నిశ్చయించి బాణముతో గొట్టిరి. తోడనె యా మారీచుఁడు హా లక్ష్మణా ! హా సీతా! యని యరచుచు జచ్చెను. ఆమాటలను సీతాదేవి విని శ్రీస్వామివారి కపాయము వచ్చియుండునని భ్రమసి వారికి సాయముకొరకు లక్ష్మణుని బొమ్మని చెప్పఁగా నతఁ డిది రాక్ష సమాయచే వేయఁబడిన యరపుగాని రాముని మాటగాదని బహువిధముల నెంతచెప్పినను వినక దూరనాడినందున విధిలేక పర్ణశాలవిడిచి లక్ష్మణుఁడు రామునికొరకు బోయెను. అపుడు రావణుఁడు భిక్షువేషమునవచ్చి యొంటరిగ నున్న సీతాదేవి నెత్తుకొనిపోయెను. ఈపర్ణశాల యుండుచోటు భద్రాచలము. ఇచట మనము తీసికొనవలసిన నీతులెవ్వి యనిన:--

శ్రీరాములవారు సర్వేశ్వరులును సర్వజ్ఞులును గాన, ముందు జరుగబోవునది యంతయు వారెఱుఁగుదురు. కాని మనవంటివారు స్త్రీల నటుల నడవికిం దీసికొనిపోగూడదు. మఱియు బ్రతివ్రతాశిరోమణి యైనను బోరానిచోటులకు దనను దీసికొనిపొమ్మని భర్త మొదలగువారిని నిర్బంధింపఁగూడదు. లక్ష్మణస్వామి భ్రాతృవాత్సల్యమును భక్తిని బట్టి యన్న వెంట శుశ్రూషకయి యరణ్యమున కేగుట మంచిపనియే. కాని తాను సీతాదేవియొక్క రక్షణమునకై శ్రీస్వామివారిచే నుంపఁ బడియు నాయమ యాడిన యసంబద్ధవు మాటల కాదేవిని విడిచి రాముఁ డున్నదిక్కున కేగుట తగదు. ఆమె యాజ్ఞను గూడ మీరక పోయెనంటిమా యాస్వామికి భయముండదని నమ్మినయట్టివాఁడు సమీపమున నొక పొదలో డాగి యామె రక్షణమును గనిపెట్టుచుండక శ్రీస్వామివారు కనఁబడునంత వరకు బోవుట తగనిపని. అందునుండియేకదా శ్రీరాములవారామెను విడిచివచ్చినందుకు లక్ష్మణుని నిందించిరి. మఱియు తల్లి, తోబుట్టువు, భార్య, కుమార్తెలయొద్దకుగాక తదితరస్త్రీ లెంత పూజనీయులయి యుండినను వారియొద్ద నొంటరిగా నెవ్వరు నుండఁగూడదు.

అట్లు లక్ష్మణుఁడు పోయి యన్నను గలియఁగా వా రతని నిందించి యాశ్రమమును జేరి సీతన్ గానక విచారపడుచు దక్షిణదిక్కునుబట్టి వెదకుచు నేగిరి. పోగాబోగా గొంతదూరమున రావణునిచేతఁ గొట్టఁబడి పడియున్న జటాయు వను వానిం గాంచి యతనివలన రావణుఁడు సీతాదేవినిఁ గొనిపోయె ననివినిరి. ఈజటాయువుండు స్థల మిప్పటి జటప్రోలు అనుచోటయి యున్నది. వెంటనే యతఁడు ప్రాణములను విడిచెను. అతనికి సంస్కారములు చేసి గొంతదూరము పోయి కబంధుఁడనువానిచే బట్టువడి వాని బాహువులను ఖండించి సుగ్రీవునితో సఖ్యముచేయుమని వానిచే బోధింపఁబడి యతఁడు చెప్పినమార్గమున బోవుచు శబరిచేత సత్కృతులై సుగ్రీవ నివాసమగు ఋశ్యమూక పర్వతము సమీపమున బంపాసరోవరతీరమునుఁ జేరిరి. అపు డాపర్వతముమీద మంత్రి సహితుఁడై యున్న సుగ్రీవుఁడు శ్రీరామలక్ష్మణుల నిరువురను దూరమునుండి చూచి వారినిఁ దనయన్నయగు వాలిచే దన వధకొఱకు బంపఁబడినవారినిగా భ్రమసి కొంతదూరము పరుగెత్తి యంతట నావచ్చినవా రిరువురు నెవ్వరో తెలిసికొనిరమ్మని తన మంత్రులలో బుద్ధినధికుఁడగు హనుమంతునిఁ బంపెను. అతఁడు శ్రీరామలక్ష్మణులయొద్దకేగి వారి రూపములనుజూచి గొప్పవారని తలఁచి వందనము చేసి 'మహనీయులుగా గనఁబడుచున్న మీరిరువురు నెవ్వరని యడుగుచు దాను సుగ్రీవుని మంత్రియనియు, దనపేరు హనుమంతుఁడనియు, మీ సఖ్యమునుగోరి మాయధిపతి మీసన్నిధికి నన్నుఁ బంపెననియు మనవిచేసెను. అపుడు శ్రీస్వామివారు లక్ష్మణునివైపు తిరిగి మన మెవ్వనిసఖ్యము గోరివచ్చుచున్నామో యతనిమంత్రియే యితఁడనియు సంస్కృతభాషను బ్రశస్తముగ మాటలాడు చున్నాఁడనియు నితనితో మనవృత్తాంతమును జెప్పుమని సెలవిచ్చిరి. ఈసందర్భమును శ్రీమద్రామాయణమున జదువు వారికి గ్రంథకర్త తన నమ్మికనుబట్టి కామరూపమగు మానవ శరీరముతో వచ్చియుండెనని చెప్పియున్నను హనుమంతుఁడు కోతియని మనము నమ్ముచున్న వానరుఁడు గాడని తోపక మానదు.

ఆపిదప హనుమంతుఁడు. లక్ష్మణునివలన వారి వృత్తాంతమును సమగ్రముగా దెలిసికొని సంతసించి, వారును సుగ్రీవుని సఖ్యమును గోరుచుండుటవలన వారినిఁ దోడ్కొని ఋశ్యమూకపర్వతముమీదికేగి యచట వారి నుండుమనిచెప్పి భయముచే నింకొకచోట డాగియున్న సుగ్రీవునికడకరిగి యతనితో నారాజకుమారుల వృత్తాంతమును జెప్పఁగా నందఱును గలిసి రామలక్ష్మణులున్న చోటికి వచ్చిరి. అపుడు సుగ్రీవుఁడు శ్రీరాములవారితో 'తాము నాతో సఖ్యముచేయఁ గోరి యున్నారని హనుమంతునివలన వింటిని. మీరు భూపతులు నే నడవిలో సంచరించువాఁడను. మీతో సఖ్యము జరిగిన యెడల నాకేవిశేషలాభము సమకూడు' నని పలికి శ్రీస్వామివారితో హస్తమును బట్టి సఖ్యముచేసికొనెను. అపుడు శ్రీస్వామివారు సుగ్రీవుని కోరికప్రకారము వాలినిఁ జంపుటకు బ్రతిజ్ఞచేసిరి. సీతాదేవి యెచ్చటనున్నను వెదకిదెచ్చి సమర్పించెదనని సుగ్రీవుఁడు ప్రతిజ్ఞచేసెను. అటుతర్వాత నంతరిక్షమార్గమున రావణునిచే దీసికొనిపోవఁబడుచున్నట్టి యమ్మవారి వలస గ్రిందవేయఁబడి తనచే దాచియుంపఁబడిన యాభరణములను దెచ్చి సుగ్రీవుఁడు శ్రీస్వామివారికి గనఁబరచెను. ఆపయిని శ్రీరాములవారు వాలిని సంహరింపగలరో చాలరో యని సుగ్రీవునకు సంశయము గలిగి సప్తసాలవృక్షముల నేకబాణముతో గొట్టుమని గోరఁగా నట్లుచేసి యతని సంశయమును బాపిరి. పిమ్మట వారందరును గిష్కింధాసమీపమును జేరి శ్రీస్వామివారి పనుపున సుగ్రీవుఁడు వాలిని యుద్ధమునకై యరచి పిలిచినట్లును, అప్పుడు వాలిసుగ్రీవులకు యుద్ధము జరిగినట్లును, అందు శ్రీస్వామివా రేకరూపముతోనున్న యా యిరువురిలో వాలియెవ్వఁడో యని సంశయించి వాలినిఁ గొట్టకయున్నట్లును, మరల శ్రీస్వామివారి ప్రోత్సాహముచే సుగ్రీవుఁడు వాలినిఁబిలిచి యుద్ధము చేయుచుండఁగ శ్రీస్వామివారు చెట్టుచాటుననుండి వాలిని సంహరించినట్లును శ్రీమద్రామాయణమున గానుపించుచున్నది. మహావీరుఁడును సర్వేశ్వరుఁడును నగు శ్రీస్వామివారు సుగ్రీవునితో యుద్ధము చేయుచున్న వాలినిఁ జాటుననుండి యేవిధముగ గొట్టియుందురో బాగుగ విచారింపవలసియున్నది. ఈగ్రంథకర్త వానరులను వీరిని గోతులని నమ్మియున్నందున గోతులు మృగములను బెద్దయాధారమును దీసికొని యట్లు మృగములను జాటున నుండి చంపుట రాజులకు దగునని ముఖ్యకారణముగ శ్రీస్వామివారు వాలితో సెలవిచ్చినట్లు గ్రంథములో గనఁబరచెను. వానరులు కోతులు గారని యిదివరకే చర్చించియుంటిమి కావున నీసందర్భములో నీగ్రంథములోని యెవ్వరివాక్యమును బ్రమాణముగఁ దీసికొనక సంగతిసందర్భముల నాలోచింప వలసియున్నది. అది యెట్లుండుననఁగా ? శ్రీరాములవారు సుగ్రీవునితో 'నాకును వాలికిని బూర్వవైరములేదు. ముందుగ నీవు వాలిని యుద్ధమునకు బిలువుము. నీ వలసినపుడు నీసఖుఁ డనగు నేను నీకు సహాయుఁడనుగా వచ్చి యతనితో యుద్ధము చేసి చంపెదను' అని సెలవిచ్చి వెంటను వెళ్లియుందురు. అట్లు సుగ్రీవుఁడు వాలిని యుద్ధమునకు బిలువఁగా వారిరువురును బోరునపుడు సుగ్రీవుఁడు వాలిచే నొక్కు పడి చంపఁబడ బోవు తరుణమున జెట్టుచాటుననున్న శ్రీస్వామివారు స్నేహితుని గాపాడుటకుగా ద్వరపడి బాణమువేసి వాలినిఁ జంపి మిత్రుఁడగు సుగ్రీవునిఁ గాపాడి ప్రతిజ్ఞను నెరవేర్చుకొని యుందురు. ఇందుకొక దృష్టాంతము భారతయుద్ధమున మనకుఁ గలదు. భూరిశ్రవునిచే సాత్యకి తలఁ దునుమఁబడబోవుసమయమున నితరులతో యుద్ధము చేయుచున్న యర్జునుఁడు శ్రీకృష్ణులవారిపనుపున నదివరకు సాత్యకినిఁ జంపుటకయి యెత్త బడియున్న ఖడ్గసహితమగు భూరిశ్రవుని హస్తమును దునిమి సాత్యకిని గాపాడెను గదా! కావున బ్రాణోపద్రవకాలమున నేవిధముననైనను మిత్రునిఁ గాపాడుట పరమధర్మము.

వాలి వధానంతరము శ్రీస్వామివారు లక్ష్మణుని బురములోనికిఁ బంపి సుగ్రీవునకు బట్టాభిషేకముఁ జేయించి తాము సోదరయుక్తముగ గిష్కింధాసమీపమున నున్న ప్రస్రవణ పర్వతమునందు వర్షాకాలము వెళ్లిపోవువరకు నివసించియుండిరి. శరత్కాలము వచ్చినను సుగ్రీవుఁడు రాజ్యసుఖముల ననుభవించుచు గామోన్మత్తుఁడై యేర్పాటుప్రకారము సేనలతో రాకుండుటచే శ్రీరాములవారు కోపించి సుగ్రీవునికడకు లక్ష్మణునిఁ బంపిరి. అపుడతఁడు తెలివి తెచ్చుకొని క్షమార్పణము కోరి సేనలను దీసికొని శ్రీరాములవారిసన్నిధికివచ్చి నమ్రుఁ డయ్యెను,

అటుపయిని సుగ్రీవుని యాజ్ఞప్రకారము సీతాన్వేషణముకొఱకు వానరులు వెళ్లుటయు, హనుమంతుఁడు సముద్ర లంఘనముచేసి లంకాపట్టణములో నున్నసీతనుఁ జూచి యా వృత్తాంతమును శ్రీస్వామివారి కెఱింగించుటయు నాపిదప వారిధినిఁ గట్టి లంకాపురము ముట్టడించుటయు, సుగ్రీవహనుమంతుల చరిత్రములలోనును రావణాదివీరుల యుద్ధక్రమము వారివారి చరిత్రములలోనును వ్రాయఁబడి యుండుటచే నిచటఁ జెప్పఁబడలేదు.

రావణ వధానంతరము విభీషణుఁడు దుష్టుఁడగు నారావణునకు దాను దహనాదిసంస్కారములను జేయనని విముఖుఁడై యుండగా నపుడు మహావీరుఁడగు నీతనికి సంస్కారములు చేయుమనియు విరోధమనునది మరణాత్పరమునందుండగూడదనియు శ్రీరాములవా రానతిచ్చినందున నతఁడు యథావిధిగ సంస్కారములు జరిపెను.

ఆపిదప శ్రీరాములవారు లక్ష్మణస్వామివారినిఁ బంపి విభీషణునకు లంకారాజ్యాభిషేకముం జేయింపించిరి. హనుమం తునిచే దమవిజయమును సీతాదేవికిం దెలియజేయించిరి. విభీషణ పట్టాభిషేకానంతరము సీతాదేవివిషయమున ముందు జరగవలసినపనిని విచారించి విభీషణునితో నాదేవిని మంగళ స్నాతను గావించి నాకడకుం దీసికొనిరమ్మనిసెలవిచ్చిరి. అపుడావిభీషణుఁడు శ్రీరామాజ్ఞాప్రకారముగ నాదేవికి మంగళ స్నానము జేయించి యూయమ నొకపల్లకియందునిచి శ్రీరామునికడకుఁ దోడ్కొనివచ్చుచు ముందుగ శ్రీస్వామివారిసన్నిధికి వచ్చుచుండగా నాదేవిని దూరమునఁజూచి శ్రీస్వామివారు సంతోషము, రోషము, దీనత్వము గలవారై యామెను దమయొద్దకుం దోడ్కొ,నిరమ్మని విభీషణున కానతిచ్చి పంపిరి.

అట్లు వచ్చుచున్న శ్రీయమ్మవారినిఁ జూచుటకు వానరులు గుంపులుగూడగ విభీషణుఁడు వారినిఁ దూరముగఁ దొలఁగునట్లు చేయుచున్నందున నపుడు శ్రీస్వామివారు. విభీషణునితో వివాహ కాలమునందును, భర్తసమీపమునందును, దుఃఖసమయములయందును, నాపదలుసంభవించు నపుడును, యాగములయందును, స్వయంవరకాలమందును, యుద్ధమునందును, స్త్రీలు నలుగురికి గనఁబడుట దూష్యముగాదనియు, అందు నీదేవి యుద్ధగతయు, నాపద్గతయు, వ్యసనసంగతయు, భర్త నగునాసమీపమున నున్నదియు గావున నితరులు చూచుట కాక్షేపణము లేదని సెలవిచ్చిరి. అప్పటికాలమున నంతఃపుర స్త్రీలు శ్రీరాముల వారిచేఁ జెప్పఁబడిన సమయములయం దితరులకు గనఁబడుట యాచారమై యుండెను.

ఆపిదప నాదేవి శ్రీస్వామివారిసన్నిధికి వచ్చి నిలుచుకొని కొంతవరకు దుఃఖించి యుపశమించిన పిదప శ్రీస్వామివారు:--

చ. "సరసిజనేత్రి ? యాలమున శాత్రవునిం బరిమార్చి నిన్ను వే
     జెఱవిడిపించి పౌరుషముఁ జెల్లఁగఁజేసి యమర్ష లాభమున్
     బరువడిఁగాంచి చిత్తమున నాటినవైరి కృతానమానమున్
     వరుసవిషాదముం బెఱికివైచి కృతార్థుఁడ నైతి నెంతయున్ .

క. పౌరుషము దృష్టమయ్యెను
    జారుముఖీ శ్రమము నేడునఫలం బయ్యెన్
    వారక ప్రతిజ్ఞ దీరెను
    ధారుణిలో నేను జాల ధన్యుఁడ నైతిన్.

ఉ. ఏ నెడఁబాసియున్న యెడ నీచలచిత్తుఁడు రావణుఁడు నిన్
     గాననసీమనుండి చులుకన్ వెసముచ్చిలితెచ్చే నింతయున్
     మానిని దైవకృత్యమిది మామక పౌరుషశక్తిచే రహిన్
     వానివధించితిన్ ద్రిభువనంబుల భూరియశంబుఁ గాంచితిన్.

క. తనకొదవిన యవమానము
   ననుపమ తేజమున నవలనటుద్రోయఁగఁ జా
   లని యల్పతేజుఁ డగుపురు
   షునకుం బురుషార్థ మరసిచూచినఁ గలదే."

అని సెలవీయఁగా నాదేవి తనను శ్రీరాములవారు పరిగ్రహింపరేమోయని దుః:ఖించెను. అపుడు శ్రీస్వామివారికిఁ గోపముహెచ్చి 'నాకువచ్చిన యవమానమును బాపుకొనుటకు రావణవథాది కార్యములను దీర్చి ధన్యుఁడ నైతిని. అదియంతయు నీకొఱకుగాదు. కావున నాత్మభరణార్థము నీ

కిష్టమైనచోటికిఁ బోవలసినదేకాని నాయొద్ద నుండఁదగవ ' ని సెలవిచ్చిరి. ఆమాటకు సీతాదేవి దుఃఖించి శ్రీస్వామివారితో 'సర్వేశ్వరులయ్యు మీ రిట్లు సాధారణ మనుష్యునివలె శంకించుట తగ 'దని మనవిచేసి తన నిర్మల్యమును జూపుటకై యగ్నిప్రవేశము చేసెదనని ప్రతిజ్ఞచేసి యందుకై చితిపేర్చు మని లక్ష్మణునిఁ గోరఁగా నతఁడొకింత సందియ మొంది యన్న మొగముఁజూచి యాతని యంగీకారమును ముఖభావమువలనఁ దెలిసికొని చితినిఁ జేర్చెను. అపుడాదేవి,

సీ. "అనిశంబు మచ్చిత్త మాత్మనాథునియందుఁ
           దవిలివర్తించుట దథ్యమేని
     వితతదుష్టత్వ శంకితనైన యే నుర్వి
           నతిశుద్ధచారిత్ర నైతినేని
     కరమువాజ్ఞ్మానసకర్మంబుచే మనో
           ధిపుమాట మీఱి వర్తింపనేని

     రవిచంద్ర దిగ్వాయు రాత్రిసంధ్యాదిన
          భూనభంబులు సర్వభూతములును
     సకలదిక్పాలకులు సాదు సచ్చరితము
          సర్వము నెఱింగి యుండుట సత్యమేని
     సవనహేతువు లోకైకసాక్షి యైన
          చిత్రభానుండు నన్ను రక్షించుఁగాక."

అని యిట్లుపల్కి యగ్నిప్రవేశముకాగా నామె పాతివ్రత్యమును బ్రహ్మరుద్రాదిదేవతలు మెచ్చునట్లగ్ని యామెనుఁ దహింపక యుండెను. అపుడు శ్రీరాములవారు సంతుష్టులై సీతాదేవినిఁ బరిగ్రహించిరి. ఆపిదప విభీషణసుగ్రీవాది పరివారసహితులై పుష్పక మను విమానము నధిష్ఠించి కదలి కిష్కింధయొద్ద గొంతతడవాగి తారాది వానరస్త్రీల నెక్కించుకొనిపోవుచు మార్గమున భరద్వాజునిం జూడఁగోరి యాయన యాశ్రమమునొద్ద దిగి యతనిచేఁ బ్రార్థితులై యతని యాతిథ్యమును నాటిదినమున నంగీకరించిరి

ఆ మునియాశ్రమమున నాడుండుటచేత నొప్పుదలప్రకారము నందిగ్రామము నాడు చేరుటకు వీలు లేనందున దామొక దిన మాలస్యముగఁ జేరుటకు గారణమును దెలుపుటకు హనుమంతుని భరతునికడ కంపిరి. అటు లతఁడుపోయి శ్రీరామా గమనమునుజెప్పి భరతు నానందభరితునిఁ జేసెను. మరునాటి యుదయమున శ్రీస్వామివారి నెదుర్కొనుటకు భరతశత్రుఘ్నులు హనుమదాది పరివార సహితులై వెళ్లఁగా నింతలో బుష్పకవిమానమునుఁ డాసి చేరెను. అపుడు భరతుఁ డన్నగారి పాదములు పట్టుకొని నమస్కరించి కుశల ప్రశ్నానంతరము, రాజ్యభోగములవలన సుగ్రీవునివలె శ్రీరామకార్యమును మరచియుండక తనచే నదివరకు భక్తితోఁ బూజింపఁబడుచున్న పాదుకలను దన యన్నగారి పాదములకు సమర్పించెను. అపు డందఱును గలిసికొని నందిగ్రామముఁ జేరిరి. శ్రీరాములవారు రాజలంకారయుక్తులై యచటి నుండి బయలుదేరి పరివారముతో నయోధ్యా పట్టణముఁ జేరి యచట బట్టాభిషిక్తు లయిరి. ఆసమయమున శత్రుఘ్నుఁడు శ్రీస్వామివారికి శ్వేతచ్ఛత్రమును బట్టెను. సుగ్రీవ విభీషణలు చామరములను వీచిరి. ఇచట భరతలక్ష్మణులు చామరములను ధరింపక సుగ్రీవవిభీషణు లేలవీచిరో విచారింపుఁడు. వారిరువురిలో నెవ్వఁడు యువరాజుగ నభిషిక్తుఁ డగనో యది పట్టాభిషేకాత్పూర్వము నిర్ణయింపఁబడుటకు వీలులేక యుండెను.

పట్టాభిషేకానంతరము విభీషణసుగ్రీవాదులకు యథార్హముగ సత్కారములు చేసిరి. అందు సీతాన్వేషణాది కార్యములయందు ముఖ్యుఁ డగుహనుమంతునకు శ్రీసీతాదేవిచే నొకముక్తాహారము నిప్పించి గౌరవించి ఆపిదప నంద ఱును శ్రీరాములవారియొద్ద సెలవుఁగైకొని వారివారి స్థానములం జేరిరి. భరతుఁడు యువరాజైయుండఁగ ననేకసంవత్సరములు శ్రీరాములవారు కృతయుగధర్మములను నడపుచు నశ్వమేథాది యాగములం చేయుచు రాజ్యమునుఁ బాలించిరి.

ఇక మనము తీసికొనవలసిన నీతి యేమియనిన:-

పితృవాక్య పరిపాలనమునకును, సత్య ప్రతిజ్ఞతకును, శరణాగత రక్షణమునకును, భర్తృ ప్రవర్తనమునకును, సోదర వాత్సల్యమునకును, రాజ్యపాలనమునకును శ్రీరాములవారు నిదర్శకు లయియున్నారు. పాతివ్రత్యమహిమకు శ్రీసీతాదేవియు, జ్యేష్ఠభ్రాతయొక్క. యనుసరణమునకును శుశ్రూషకును లక్ష్మణస్వామివారును, జ్యేష్ఠభ్రాతయందలి భక్తికిని దద్ద్వారా అప్రయత్నసిద్ధము లగురాజ్యభోగములయందు విముఖతకును భరతుఁడును, జ్యేష్ఠభ్రాత లేనిసమయమున నతనిస్థానమందున్న భరతుని ననువర్తించుటకు శత్రుఘ్నుఁడును బ్రదర్శకు లై యుండిరి.

మఱియు విశిష్టాద్వైతులు రాములవారు పితృవాక్య పరిపాలనాది సామాన్యధర్మములకును, లక్ష్మణస్వామివారు భగవచ్ఛేషత్వమునకును, భరతుఁడు భగవత్పారతంత్ర్యమునకును, శత్రుఘ్నుఁడు భాగవతశేషత్వమునకును నిదర్శకులని చెప్పుదురు. ఉత్తర రామాయణము లేదా ఉత్తరకాండ యనునది యీ పూర్వరామాయణకాండలు పుట్టిన యనేకసంవత్సరముల పిదప బుట్టినందున బూర్వభాగమున నున్న దానికంటె ననేకము లగుసందర్భములతో నిండియున్నది. కావున నే భాగమును దానిలోనుండి ప్రమాణముగఁ దీసికొనక యొకటి రెండు విషయములనుఁజూపి శ్రీరామకథను ముగింపజేసెదను.

శ్రీస్వామివారి ప్రభుత్వకాలము చాలవరకు భుక్తియైనపిదప బౌరులలో గొంద రనుకొనుచున్న మాటను దెలిసికొని గర్భవతియగు తనభార్యయైన సీతాదేవిని వాల్మీకి యాశ్రమమున విడిచిపెట్టిరమ్మని శ్రీస్వామివారు లక్ష్మణున కాజ్ఞయిచ్చుటచే నతఁ డట్లు విడిచివచ్చినట్లును, పిమ్మట గుశలవులకు సూక్ష్మరూపముగ వాల్మీకిప్రోక్త మగురామాయణమును శ్రీస్వామివారి సన్నిధిని గానము చేయఁదగినంత వయసువచ్చువరకు సీతావిషయమును శ్రీస్వామివారు విచారింపక యున్నట్టును, అపుడు తిరుగ నామెను దెప్పించి యామె పాతివ్రత్యమును గూర్చి శపథము చేయుమన్నట్టును నందుఁ జెప్పఁబడి యున్న ది. లంకలో సమస్తజనులు చూచుచుండఁగ నగ్నిప్రవేశమయి యందువలన దహింపబడక పవిత్రురాలుగ నేర్పడినభార్యను బరిగ్రహించిన శ్రీరాములవారు పయివారిమాటను బురస్కరించుకొని య ట్లామె నరణ్యమునకుఁ బంపి యుందురా? ఏకారణముచేతఁ బంపియున్నను గుమారులకు రామాయణమును గానముచేయదగినంత వయసువచ్చువరకు నామె యొక్కయు నామె గర్భముయొక్కయు స్థితిని విచారింపక యుందురా? కావున నిది యసంభావితము. గర్భవతిగా నుండినభార్యను నామెకోరికఁ దీర్చుటకు వాల్మీకిమునియాశ్రమమునకుఁ గొన్నిదినములు పంపియుండిన నుండవచ్చును. అపు డచట నామెకుమారులను గనియుండవచ్చును. ఆయాశ్రమమున నాబిడ్డలు జన్మించినందున నాఋషి యిటీవల వారలకుఁ జదువు చెప్పియుండును. సంగతి సందర్భములనుబట్టి యిట్లు జరిగి యుండవచ్చునుగాని యాగ్రంథములో జెప్పఁబడిన ట్లుండనే యుండదుకదా! కావున దానిని మనము ప్రమాణముగఁ దీసికొనఁగూడదు. మఱియును జదువనేకూడదు.

ఇట్లు శ్రీమన్నారాయణుఁడు శ్రీరామరూపమున సవతరించి తాను జేయవలసిన పనులనుదీర్చి కుమారులకు బ్రాజ్ఞత వచ్చినపిదప వారికిఁ బట్టాభిషేకముచేసి శ్రీవైకుంఠమునకు విజయము చేసెను.

నా యీగ్రంథమున నెవ్వరిచరిత్రములు వ్రాసితినో వారిలో శ్రీరామకృష్ణులు శ్రీమన్నారాయణుని యవతారములని చెప్పియున్నందున భగవంతునియొక్క యవతారములుగ మన మతగ్రంథములయందుఁ జెప్పఁబడినవానిలో నేవి ముఖ్యములో వానిని మనము తప్పక విచారింపవలసియున్నది.

భాగవతమున సూతుఁడు శౌనకాదిమునులకు జెప్పుటలో నిరువదియొక్క యవతారములుగ గనఁబడుచున్నది. అవి యెవ్వియనిన:-

1. బ్రహ్మ, 2. యజ్ఞవరాహము, 3. నారదుఁడు, 4. నర నారాయణులు, 5. కపిలుఁడు, 6. దత్తాత్రేయుఁడు, 7. సుయజ్ఞుఁడు, 8. ఋషభుఁడు, 9. పృథుచక్రవర్తి, 10. మత్స్యావతారము, 11. కూర్మము, 12. ధన్వంతరి, 13. మోహిని, 14. నృసింహావతారము, 15. వామనుఁడు, 16. పరశురాముఁడు, 17. వ్యాసులు, 18. శ్రీరాములవారు, 19. బలరాములవారు, 20. శ్రీకృష్ణులవారు, 21. బుద్ధుఁడు.

మరియు నాగ్రంథముననే నారదునకు బ్రహ్మచెప్పినట్లున్న కథలో నిరువదినాలుగవతారములుగఁ జెప్పఁబడియున్నది. అవి యెవ్వియనిన :-

1. యజ్ఞవరాహము, 2 సుయజ్ఞుఁడు, 3. కపిలుఁడు, 4. దత్తాత్రేయుఁడు, 5. కుమారావతారము, 6. నరనారాయణులు, 7. ధ్రువుఁడు, 8. పృథుచక్రవర్తి, 9. ఋషభుఁడు, 10. హయగ్రీవుఁడు, 11. మత్స్యము, 12. కూర్మము, 13. నృసింహావతారము, 14. హరియవతారము, 15. వామనుఁడు, 16. హంసావతారము, 17. మన్వంతరావతారము, 18. ధన్వంతరి, 19. పరశురాముఁడు, 20. శ్రీరాములవారు, 21. శ్రీకృష్ణులవారు, 22. వ్యాసులు, 23. బుద్ధుడు, 24 కలికి.

ఈ పయి రెండవతారకథలలో సంఖ్యా భేదము, వరుసభేదము, వ్యక్తి భేదమునుగలవు. సర్వసాధారణముగ ననేక గ్రంథములలో మత్స్యకూర్మాది దశావతారములే యొప్పుకొనఁబడి యున్నవి భగవద్గీతలలో నప్పటికాలపు బ్రజలవలన దేవతిర్యఙ్మనుష్య స్థావరములలో నేవేవి పూజనొందుచు గౌరవింపఁ బడుచుండెనో యవియన్నియు జెప్పుచు నేదియేది మహిమయు సంపదయు గౌరవమును గలిగియుండునో దానియందెల్లను నాయంశము గలదని యెంచుకొనుమని శ్రీకృష్ణులవా రర్జునున కానతిచ్చియున్నారు.

శ్లో. "యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జిత మేవవా!
    తత్తదేవావగచ్ఛత్వంమమతేజోంశసంభవమ్ !!"

ఈవాక్యము నాధారముచేసికొని భాగవతగ్రంథకర్త భగవదంశ కలదని తాను నమ్మియున్న యిరువది యొక్కరిని ముందుగ జెప్పి పిదప మఱికొందరిని జ్ఞప్తికి దెచ్చుకొని కేశవాది చతుర్వింశతి నామములకు సరిపడున ట్లిరువదినలుగురిని భగవదవతారములని రెండవసారి చెప్పెను. కాని ముందు చెప్పిన పేరులను గమనించియున్నట్లు కనబడదు. ఇప్పటికిని గొప్పప్రభువులను గొప్పవిద్వాంసులను భగవదంశము గలవారని వాడుచున్నాము. ఇంక దశావతారవిషయము చర్చింప వలసియున్నది. మీద జెప్పఁబడిన యిరువదియొక్క యవతారములలో దశావతారములలోని చివరది యగుకల్క్యవతారములేదు. తిరుగ నిరువదినాలు గవతారములుగ జెప్పుటలో నాగ్రంథకర్తముందుచెప్పిన బలరాముని విడిచెను. ఇందునుఁ బట్టిచూచినను దశావతారవిషయములో బాగుగ జర్చింపవలసినట్లున్న ది. వీనిలో మత్స్యావతారము ముందుగ గలిగినదని చెప్పుదురు. మత్స్యమనునది కేవలము నీటిలో నుండఁదగినది యైయున్నది. కావున నీయవతారము సృష్ట్యాదియందావిర్భవింపవలసి యుండును. ముందుగ జలగోళములసృష్టి జరుపఁబడినది. ఆపిదప బంకాదులు పుట్టెను. అటుతర్వాత నడవులు, కొండలు, మృగములు, వృక్షపక్ష్యాదు లుత్పన్నము లయ్యెను. అటుపిమ్మట దామస రాజసుల సృష్టి, జుగుపఁబడినది. ఇందునుబట్టి కొంత విచారింపగ నరసృష్టికి బూర్వము భగవంతుఁ డవతరించుటకు బ్రసక్తి కనఁబడదు. అయితే మరి యెందువలన నిట్లు నమ్మియుండిరన, గీతలలో శ్రీకృష్ణులవారు :

శ్లో. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్ !
    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!"

అని చెప్పియున్నందున సృష్ట్యాదివివిధకాలములయందు భగవంతు డవతరించియుండునని నమ్మి ముందుగ జలరూపముతో నుండు గోళములో మత్స్యరూపముతో నవతరించెననియు, నందు బంకాదులు పుట్టినపిదప బంకములోను నీటియందును నివసించుట కర్హమైన కూర్మరూపముతో నవతరెంచెననియు, పిదప గొండలు నడవులు నేర్చడినందున వానియందును బురద యందును నుండదగిన వరాహరూపము ధరించెననియు, నటుమీద దామస రాజసులు సృజింపఁబడిరి కావున వారి దుష్టత్వమును వారించుటకు సృసింహరూపమును ధరించెననియు, సాత్వికసృష్ట్యనంతరము వామనరూపమును ధరించి యుందురనియు ఋషులును గ్రంథకర్తలును దలఁచియుందురు. ఈ

వామనమూర్తి కురుచవిగ్రహము గలవాఁడని చెప్పెదరు. అనగా దామసరాజసులకంటె సాత్వికులు కురుచవారు. మఱియు వీరు సత్వగుణప్రధాను లయి తమమంచిప్రవర్తనలచే తనే క్రూరులగు తామసరాజసులను లోబరచుకొనిరి. అందుకు నిదర్శనముగ వామనమూర్తి బలిచక్రవర్తిని మంచిమాటలతో సాధించినట్లుగ గథ కల్పింపఁబడినది. ఇక నృసింహావతారవిషయము చెప్పవలసియున్నది. నృసింహశబ్దమునకు నరులలో గొప్పవీరుఁడని యర్థము. కొందరానామమును బట్టియే నరరూపమును సింహరూపమునుగల మిశ్రశరీరము గలిగియుండు నని నమ్మి యతఁడు హిరణ్యకశిపుఁ డనురాక్షసుని నారూపముతో సంహరించినట్లును, బ్రహ్లాదుని రక్షించినట్లును గథను గల్పించిరి. ఈ హిరణ్యకశిపుడుండుచో టెచ్చటనులేదు. ఇతఁడే యట్టి గొప్పప్రసిద్ధి గలప్రభువై యుండినచో నాస్థల మిప్పటికిని నిర్దేశ్యము గాదగి యుండవలసియుండును. ఈ ప్రహ్లాదచరిత్రము కల్పితకథయై యుండును అయినను నిందు గ్రహింపఁదగినయంశములు మూడుగలవు : 1. భక్తికి బ్రహ్లాదుని చారిత్రమును, 2. ఎంతతపస్సుచేసి యెన్నివిధముల బ్రాణసంరక్షణముకొరకు వరములను బొందియున్నను యుక్తప్రవర్తనము లేనివాఁడు హానిని జెందునను నీతికి నితనితండ్రి చరిత్రమును, 3. సర్వశక్తికిని భక్తులను రక్షించుటకును నృసింహ వృత్తాంతమును మనము ముఖ్యముగ గ్రహింపవలెను. ఈకథను నిజముగ జరిగినదానినిగ నమ్మియుండుటచే మనదేశమున ననేక దేవాలయములయందు సింహముఖముగల విగ్రహము లారాధింపం బడుచున్నవి.

మఱియు శంకరరామానుజాచార్యులు కార్యసిద్ధికొఱకును, శత్రుక్షయముకొఱకును నృసింహమూర్తిని గొలిచినట్లున్నది. నరసింహశబ్దమున కర్థము నరుఁడుగ నవతరించి పరాక్రమముఁ జూపిన భగవంతుఁడని కదా? నరరూపమునుఁ దాల్చిన రామకృష్ణులు పరాక్రమవంతు లయియేకదా రావ ణాదిశత్రువులను సంహరించిరి. కావున నట్టికార్యమునకు బరాక్రమావస్థతిలోనుండు రామకృష్ణులయారాధనమే నృసింహారాధనముగ నిప్పు డేర్చడుచున్నది.

సాలగ్రామములలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామనమూర్తులను మనము గొలుచుచున్నామే ? ఆయవతారములే లేనిచే వీని నేల యారాధింపవలెనని కొందఱికిఁ దోచును. సాలగ్రామమే శ్రీవిష్ణుస్వరూపమని మనము నమ్ముచున్నపు డాకారభేదముచే గలిగిననామముల విషయమున సంశయింపఁ బనిలేదు.

ఈపిదప దదితరావతారములను వ్రాయఁబోవుచున్నాను. అవతారములలోఁ గొన్ని యావేశావతారము లనియు, గొన్ని యంశావతారములనియు మన మతగ్రంథములలో నున్నది. అనఁగా నొక గొప్పకార్యము కొఱకు దాత్కాలికముగ భగవంతునిశక్తి యొక నరునియందు గలుగుట యావేశావతారమని చెప్పుదురు. ఇట్టిదియే పరశురామావతారము. ఇట్టి యావేశములను మనపూర్వులు నమ్ముట కలదు. జన్మమాదిగ వైకుంఠమున కేగువరకు భగవదంశముగలది యంశావతారము. ఇట్టివియే రామకృష్ణుల యవతారములు.

ఇఁక బుద్ధావతారవిషయము :ఈబుద్ధుఁ డొకానొకసమయమునుబట్టి బౌద్ధమతము నుపదేశించినట్లు మనగ్రంథములలో నున్నది. అతనియనంతరమున నామతస్థులందఱు నతని నఖరోమాదులను నతని యాభరణాదులను నతిభక్తితో నారాధించుచు నుండఁగా శ్రీశంకరాచార్యులవా రతఁడే మావిష్ణువుయొక్క, యవతారమని చెప్పి చాలమందిని మనమతములోనికి దిరుగవచ్చునట్లు చేసిరని పశ్చిమఖండపు నవీనగ్రంథకర్తలు కొందఱు వ్రాసియున్నారు. బహుశః ఇదియే నిజమైయుండును. ఏమియనిన, జగదీశ్వరుఁడు సంహరించునూహతో వంచనచేసి నాస్తికమతము నుపదేశించి యుండునా ! ఏమియాశ్చర్యము ?

శంకరాచార్యులవారు నాస్తికమతఖండనముకొఱకు బౌద్ధమతాచార్యుని మావిష్ణువుయొక్క యవతారమని బోధించుటయేగాక యప్పటికి వేరువేరుగ బంచదేవతల నారాధించు చుండునట్టి మనమతస్థుల నందఱిని నేకీభవింపఁజేయుటకయి పంచదేవతారాధనము నుపదేశించి యతియగు తానును నట్లారాధించియుండెను.

ఈ బుద్ధుఁడును దేవుఁడు కలఁడా! లేఁడా? యనువిషయమును జర్చింపక యప్పటిప్రజలు యజ్ఞాదికర్మములవలననే తమకు సమస్తము లభించునని నిండునమ్మికతోనుండి తమప్రవర్తనల విషయమున నజాగ్రత్త గలిగియుండుటచే యుక్తప్రవర్తనమే ముక్తికి బ్రధానమని యెంచి యట్లు బోధించుచు నది యెనిమిది విధములని వివరించెను. అవి యెవ్వియనిన :-

1. సత్యసంకల్పము, 2. సత్యనిశ్చయము, 3. సత్యవాక్కు, 4. సత్యప్రవర్తనము, 5. సత్యజీవనము, 6. సత్యప్రయత్నము, 7. సత్యగ్రహణము, 8. సత్యపర్యాలోచనము ఈయంశములను బుద్ధుఁడు బోధించినను బ్రతిమనుష్యుఁడును ముఖ్యముగ బరిగ్రహింపవలెను. యుక్తప్రవర్తనములేని యారాధనాదు లెందుకును బనికిరావుకదా!

రేపు జరుగునదియె తెలియరాని మనకు ముందు కొబోవునని యూహించి గ్రంథకర్తలచే జెప్పఁబడిన కల్క్యవతారముతో బనియేమి ? కావున భగవదవతారములని చెప్పఁబడిన యన్నిటిలో శ్రీరామకృష్ణావతారములే నిజమైన యవతారములని నమ్మవలయును. శ్రీరామకృష్ణుల యవతారముల యనంతరము వారివారి విగ్రహములను బ్రతిష్ఠించి పూజించుచున్నాము. నరశరీరములను దాల్చిన వారిమూర్తులేల పూజనీయము లయ్యెననగా ? శ్రీకృష్ణులవారు వైకుంఠమునకు విజయము చేయుటకుముందు వారిని విడిచియుండజాలనని మొఱ్ఱపెట్టుకొన్న తనసఖుఁ డగునుధ్ధవునకు దమయవతారానంతరమున దమ రూపమువంటి యాకారము గలవిగ్రహములను జేయించుకొని యథావిధిగ నారాధించుచుండినయెడల నిహముపరము గలదని యానతిచ్చియున్నారు. కావున నిట్లనే శ్రీరాములవారి నిష్టదైవముగ నారాధించువారు వారివిగ్రహములను గొల్చుచున్నారు.

విగ్రహారాధనము లేనియెడల బండితపామర సాధారణముగ మనసునిలిపి భగవంతుని ధ్యానించుట యసాధ్యము కావున మనము విగ్రహారాధనము చేయుదుమని యితరమతస్థులు మనల నాక్షేపించుట సరికాదు. బౌద్ధమతస్థుల తోబాటుగ మహమ్మదీయులు ముహమ్మదుయొక్క నఖరోమాదులను బూజించుచున్నారు.

క్రైస్తవు లామతాచార్యుని మేకుబందీచేసిన త్రిభుజాకారము (క్రాన్) గలకఱ్ఱను వారి దేవళములమీఁద నుంచుకొనుచున్నారు. కేవల శైవులు లింగమును గట్టుకొన్నట్లు పాదిరులు త్రిభుజాకారముగల లోహపుదునుకను ధరించుచున్నారు. మఱియు పాదిరిగుడులలో నద్దపుతనాబీలయందు క్రైస్టుయొక్కయు నతనితల్లి యొక్కయు రూపము లమర్పఁబడి యున్నవి.

లోహసంబంధమైన త్రిభుజాకారముగల కఱ్ఱలను గురువులుపదేశించుచోట నుంచియున్నారు. వీరిలో విగ్రహారాధనము నంగీకరించిన రోమన్ కాతలిక్ పాదిరు లించుమించు మనతో బాటుగనే విగ్రహారాధనమే చేయుచున్నారు. తక్కినమతస్థు లందఱు నేదో యొకదానినిఁ గురుతుగ నుంచుకొని యారాధించుచున్నారు. కావున బ్రతిమతము నందును విగ్రహారాధన మేదో యొకవిధముగ నుండనే యున్నది.

మన విగ్రహారాధనములలో స్వయంవ్యక్తము దేవతలచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము సిద్ధులచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము మనుష్యులచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము సంతములనియు, నందు దనచే (గాని తసపూర్వులచేగాని) ప్రతిష్ఠింపబడిన విగ్రహము శ్రేష్ఠమనియు, మనమత గ్రంథములలోఁ జెప్పఁబడియున్నది. కావున రామకృష్ణాది విగ్రహములు మనుష్యులచేఁ బ్రతిష్ఠింపఁబడినందున శ్రేష్ఠములు. ఇటులనే శివార్చన చేయువారునుగూడ నర్చాభేదమును గ్రహింపవలెను.

ఏవిగ్రహమును బూజించుచుండినను యుక్త ప్రవర్తన గలవాఁడయి నిండుభక్తితో నారాధింపనివానికి నందలి ఫలము లేదు.

దైవము లేడనువారును, దైవము నేనే యనువారును గాక, దైవము కలఁడు, అతఁడు రక్షకుఁడు, అని నమ్మి కొల్చుచున్న మతస్థులందఱు నించుమించుగ సమానులే యని చెప్పి యీగ్రంథమును ముగించుచున్నాను.



__________