Jump to content

శ్రీమదుత్తరరామాయణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

శ్రీమదుత్తరరామాయణము

ద్వితీయాశ్వాసము

—: o :—

శ్రీ రాధామధురసుధా
ధారాధరలోల కామితప్రదశీలా
శారీరశ్రీజితనవ
ధారాధరజాల శ్రీమదనగోపాలా. 1

తే. అవధరింపుము కుంభసంభవమహర్షి , చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రుఁ జూచి
    జానకీనాథ సుర లిట్లు శార్ఙ్గిచేత, నభయదానంబుఁ గొని వేడ్క నరిగి రంత. 2

           §§§ మాల్యవంతుఁడు విష్ణుప్రభావమును దమ్ములకుఁ దెల్పుట §§§
  
శా. ఆవృత్తాంతము వేగరల్ దెలుపఁగా నాలించి యమాల్యవ
     ద్దేవద్వేషి, నిజానుజద్వయము నెంతేఁ గూరి రప్పించి మం
     త్రావాసంబున నుండి యి ట్లనియె నేకాంతంబుగా శేముషీ
     ప్రావీణ్యంబును గార్యతత్పరత సౌభ్రాత్రంబుఁ గాన్పింపఁగన్ . 3

ఉ. వింటిరె తములార యొకవింత వినంబడె మొన్న నేమొ ము
    క్కంటిఁ గనంగ నెల్ల తెఱగంటి దొరల్ మును లేఁగి మ్రొక్కి మీ
    బంటుల మమ్ము నొంచెదరు బాధలఁ బెట్టి సుకేశ పుత్త్రుల
    క్కంటకులన్ వధించి మముఁ గావఁ గదే శివ యంచు వేడినన్ . 4

చ. కరచలనంబు మస్తకవికంపనముం గనిపింప వారితో
    హరుఁ డపు డానతిచ్చెనఁట యాయసురేంద్రులు మా కజయ్యు లా
    హరి యగునే జయించుఁ జనుఁ డాయనయొద్ద కటంచు నట్ల సు
    స్థిరమతి వార లేఁగి రట శీఘ్రముగా నసురారియొద్దకున్ . 5

చ. హరునకుఁ దెల్పినట్ల మనయాగడముల్ హరితోడఁ దెల్ప నా
    హరి వెత లేల శాత్రవచయంబు వధించెదఁ గొంచ కింక మీ

     యిరవుల నుండుఁ డం చభయ మిచ్చి ప్రియంబున వీడుకొల్పఁగా
     నరుసముఁ జెంది వచ్చిరఁట యందఱు ముందఱిలీల గుంపు లై 6

చ. అమరులపాలివాడు హరి యాయన యిచ్చిన బాస దప్పఁ డే
     క్రమమున నైన గెల్చు మనగర్వము లింతకుఁ దెచ్చె నెఫ్టు
     నక్రమమె యొనర్తు మేబలులఁ గైకొన మెంతటివారి నాదరిం
     పము బలవద్విరోధము శుభం బొనరించునె యెంతవారికిన్. 7

క. హీనునితోఁ దగు రణము స, మానునితోఁ జేయఁ దగు సమాధానము సం
    ధానరణంబులు దగ వస,మానునితోఁ దొలఁగి కొలిచి మనుటయె యొప్పున్ . 8

మ.నడుమంత్రంబున బల్మి దెచ్చుకొని యన్యాయంబునన్ మూర్ఖు డె
    క్కుడువాన్ దొడరంగఁ బోయి మడియున్ ఘోరానలజ్వాలలో
    బడి నీఱౌ శలభంబులీల సహజభ్రాజిష్ణుశౌర్యుండు ని
    ల్కడ భావంబున నుడుఁ గయ్యమునకుఁ గాల్ద్రవ్వఁ డేపట్టునన్. 9

క. తనబలము నెదిరి బలమును, గనుఁగొనక హితోపదేశక ర్తలపలుకున్
    వినక కుజనుండు సాహస,మునఁ జెడు బలుగాడ్పుఁ దొడరు బూరుగులీలన్ 10

ఉ. కావున దేవతార్థముగఁ గయ్యము సేయఁగ వచ్చువిష్ణుపైఁ
    బోవుట పాడి గా దతఁడు పుణ్యజనప్రియుఁ డాశ్రయించినన్
    గావక పోవఁ డిప్పు డవ కార్యము కయ్యము నెయ్య మొప్ప స
    ద్భావముతో ముకుందునకె భక్తుల మైన నసాధ్య మున్న దే. 11

క. రాక్షసులు సేరినను హరి, రక్షించునె యనఁగ వలదు ప్రహ్లాదాదుల్
   రాక్షసులు గారొ వారల, రక్షింపఁడొ మీ రెఱుంగరా హరిమహిమల్, 12

సీ. ప్రళయాబ్ధి మోఁకాలిబంటిగాఁ జరియించుమధుకైటభులఁ బట్టి మట్టుపెట్టెఁ
    జాపచుట్టుగ ధరాచక్రంబుఁ జుట్టి కొంపోవుహిరణ్యాక్షుఁ బొడవడం చెఁ
    ద్రైలోక్యనాథుఁ డై తన కీడుజోడును గాంచ కున్న హిరణ్యకశిపుఁ ద్రుంచెఁ
    జదువులదొంగ యై జలరాశి డాఁగిన కపటిహయగ్రీవు కడిమిఁ జెఱిచె
తే. నముచి వధియించె సంహ్రాదనాము నొంచె, గెలిచె శుంభనిశుంభుల నలసహస్ర
    కవచుఁ దెగటార్చెఁ బరిమార్చెఁ గాలనేమిఁ, దరమె విష్ణునితోఁ బోరఁదమ్ములార.

ఉ, వారలకంటె నెక్కు డగువారమె విష్ణునితోడఁ బోర ని
    ష్కారణ మల్గఁ డాయన నిజంబుగ నేరము లేక శౌరియం
    దారయ దోస మేమి మనయందఱదోసమె తన్మనోంబుజం
    బీరస మొందఁ జేసె నిది యెంచి యొనర్పుఁడు మీఁదికార్యముల్. 14 .

తే. అని హితం బెఱిఁగించినయన్నమాట, నాసుమాలియు మాలియు నాలకించి
    నీతిఁ దెలిసియుఁ దెలియక నీతి మాలి, యిద్దఱును గూడి యతనితో నిట్టులనిరి.

శా. ఇష్టైశ్వర్యయుతంబు నీ నెలవు నీయిచ్ఛాదృశం బాయు వు
     త్కృష్ట ప్రాభవశాలి వంచితతపోధిక్యంబు నీసొమ్ము నీ

    శిష్టాచారము మేలుబంతి పలలాశిశ్రేణికిన్ శాత్రవా
    నిష్టోత్సాహనిధాన నీకుఁ దగునే నేఁ డింత చింతింపగన్ . 16

మ. విశిఖోత్తుంగతరంగఘుంఘుమరవోద్వేలంబు దుర్మారవీ
     రశతాంబూద్భటసంకులంబు సముదగ్రచ్ఛత్ర ఫేనావృతం
     బు శతాంగాద్రియుతంబు నౌసురబలాంభోరాశి నీ బాడబో
     గ్రశరజ్వాలల నింకె; నెవ్వ రెదు రింకన్ నీకు దైత్యాగ్రణీ. 17

మ. బలవంతుల్ భవదీయ పుత్త్రకులు నీభ్రాతల్ త్రిలోకైకవీ
     రులు నిన్ మృత్యువు దేఱి చూడ వెఱచున్ రుద్రాచ్యుతాంభోజగ
     ర్భులు నీపే రనినన్ దలంకుదురు భీరుత్వంబు నీ కేల నిన్
     దెలియన్ జాలక యానతిచ్చెదవు దైతేయాన్వయగ్రామణీ, 18

తే. అస్మదాదులు సేయురాయిడి సుపర్వు
     లచ్యుతునితోడఁ దెలిపినా రనియె భయముఁ
     జెందెదవుగాని మనలను జెఱుప నింత
     కెత్తుకొని రని యలుగ వదేమి యధిప, 19

మ. అరులన్ జంపు మటంచుఁ బంద లయి యయ్యాదిత్యు లార్తిన్ గణిం
     చిరి పో సర్వసమానుఁ డైనహరి ద్వేషిత్వంబుఁ దాఁ బూని యే
     కరణిన్ గయ్యము సేయ వచ్చు మనతోఁ గ్రౌర్యంబుఁ గౌటిల్య మా
     హరికిన్ గల్గిన మాదృశుం డతఁడు గా కాధిక్య మే మారయన్. 20

తే. సహజమాత్సర్యమున దేవసమితితోడ,
    మనము దొడరిన హరియేల మచ్చరించు
    నతఁడె నిష్కారణ ద్వేషి, యయ్యె నేని,
    సంధి కార్యంబు వొసఁగునే సరసగతిని.

తే. వనజనాభుండు గనుపించుకొను నటంచు
    వెఱచి పగతుర పైఁ గిన్క విడువవలెనె
    యేటియోజన బలవంతుఁ డీహరి యని
    యిపుడు శరణన్న నవ్వరే యెవ్వరైన. 22

తే, వెన్నునకు నస్మదాదుల మెన్నఁడైన, నపకృతి యొనర్ప మతఁ డెన్నఁడైన మనకుఁ
    జేయఁ డపకృతి వేల్పులు సేసి రింత, వేలుపులమీఁద నిఁక దండు వెడలవలయు.

చ. త్రిదశులతోడఁ గయ్య మొనరించి రమాపతి యస్మదాదులన్
    గదిసి రణం బొనర్చినను గా దన వచ్చునె యంత భాగ్య ము
    న్నదె యెటు లైన మంచిది రణం బొనరింతము వేదశాస్త్రముల్
    సదివితి మీవు లిచ్చితిమి జన్నము లూనితి మైహికంబునన్.

తే. అన్న నీమాట జవదాఁటి యాడితి మని
    యలుక సేయక ప్రతివాదములు క్షమించి
    యనుమతి యొసంగు మిపుడే మదాంధు లగుసు
    ధాంధుల జయించి వచ్చెద మనుచుఁ బలికి. 25

                              §§§ మాల్యవంతుఁడు మొదలగురాక్షసు లింద్రుని పై దండెత్తుట §§§
 క. సేనాధిపతుల రమ్మని, దానవపతి యమర రాజధానిపయిఁ జన్
    బూనినవాఁ డిప్పుడే మన, సేనల రప్పింపుఁ డనుచు సెల విచ్చుటయున్. 26
భుజంగ ప్రయాతము.
   దణాపెద్ద యాజ్ఞన్ సుధాభుగ్విరోధ్య, గ్రణీ సేనలన్ మించె గంభీర భేరీ
   ధణంధాణముల్ దేవధానీవసద్గ, ర్భిణిగర్భగభ్రూణభేదంబు గాఁగన్. 27

సీ. తననిర్జరాచలత్వమున కుల్కి సురాద్రి వాపోవుగతిఁ బ్రతిధ్వను లొసంగఁ
    దన కింక నెద్ది జీవన మంచు వారాశి గలఁగె నా జలము పంకిలము గాఁగఁ
    దనమేను గరుపార దమి మీఱి శశిధారి వడఁకుగుబ్బలికన్నెవడకుఁ దీర్పఁ
    దనకోర్కె లీడేఱె నను చొక్కపరువుతోఁ గలహభోజి ముకుందుకడకుఁబఱవఁ
తే. జెవులలో వ్రేళు లునిచి రాజీవగర్భు
    డిచ్చ నేమియు నన లేక ఱిచ్చపడఁగ
    మించి ప్రస్థాన భేరి వేయించి దండు
    వెడలి రసురులు జేజేలవీటిమీఁద. 28

సీ. సౌందర్యకృత మేరుమందరాచలనందనము లౌమహాస్యందనములమీఁద
    భూరిదానోదకాపూర్ణ బంధురకంధరములైన మదసింధురములమీఁద
    స్వజవమానసగంధవాహవాహస బాంధవము లైనఘన సైంధవములమీద
    ప్రతిపక్ష కుంభికుంభచ్ఛదారంభరంహము లైనఘోర సింహములమీఁద
తే. శరభచమరీమృగవ్యాఘోశల్యభల్ల, కాసరవరాహఖడ్గపుంగవఖరోష్ట్ర,
    విహగఫణికూర్మ మకరాది వివిధవాహ, వారములమీఁద దైతేయవీరు లెక్కి,

సీ, మధ్యందినాదిత్య మండలోగ్రాంశుపాణింధమాయుధదీప్తి నింగి మ్రింగ
    గాఢసర్వాంగీణకవచవజ్రచ్ఛటాచ్ఛాయ లాశాకుడ్యచర్చ లొసఁగ
    వీరపాణప్రక్రియార క్తదృగ్దృశ్యవిభఖదిరాంగారవృష్టి గురియఁ
    బ్రళయకాలాభ్రగర్జావదావదనిష్ఠురాట్టహాసముల బ్రహ్మండ మగల
తే. దేవలోకజిగీష చేఁ ద్రిపురహంతు, కామకామాంతరోద్భటాకారు లగుచు
    లంక విడిచి మనోవీధి శంక విడిచి, యసురు లుత్సాహము గ్రాల నరుగు వేళ.

శా. ఆలంకాపురిలో వినంబడె సృగాలారావముల్ భూత వే
     తాళ క్రూరతరాట్టహాసములు మిథ్యాదుర్విలాపంబు ల
     వ్వేళన్ వేలయు దాటి నల్దెసలఁ బర్వెన్ సాగరోల్లోలక
     ల్లోలశ్రేణి చలించె క్షోణి నుడుపాళుల్ రాలె వ్రీలెన్ గిరుల్. 31

శా. రక్షస్సైన్యములోఁ గబంధములు గృధంబుల్ నటించెన్ ద్రిలో
      కక్షోభంబుగ మేఘముల్ గురిసె నిర్ఘాతాస్థిమాంసాస్రముల్
      పక్షక్షేపము లొప్ప నిప్పుకలు గూబల్ చూపులన్ రాల్చెఁ బ
      ద్మాక్షుం డిప్పుడె మిము గెల్చు ననుప ల్కా కాశ భూతం బనెన్. 32

శా. ప్రీతిన్ సూరెల నశ్వినీసుతులు రాఁ బెం పొందునింద్రున్ బలెన్
     భ్రాతల్ గొల్వఁగ మాల్యవంతుఁ డపు డాభౌమాంతరిక్షో దితో
     త్పాకంబుల్ దిలకించి దైవకృతమున్ దప్పింప రా దంచు ని
     ర్భీతిన్ సైన్యముఖంబునన్ నడిచె నీరేజాక్షు వీక్షాస్పృహన్ . 33

ఉ. మాల్యవదాసురం డిటుల మాల్యవదాఖ్యనగంబులీల నై
     శ్చల్యముతో ననేకదివిషద్రిపుసంగతుఁ డై పటీరనై
     ర్మల్యలసద్యశోధనసమన్వితదాత ధనార్థికోటిలోఁ
     గల్యతఁ గన్యకైవడిఁ బ్రకాశిలె శత్రులు భీతి నొండఁగన్ . 34

ఆ. విభునిశౌర్యధైర్యవిక్రమోన్నతిసాహ, సములు సూచి సకలసైనికులును
     భయము మాలి మాలిపనుపున మృత్యువ, శాత్ము లగుచు నడచి రమర పురికి 35

చ. దనుజవరూధినీసలలితత్వరితాశ్వఖురాహతోర్వరా
     జనితపరాగ మింద్రపురిచక్కటికిన్ జను టొప్పె మీపురం
     బున కదె దాడిగా దనుజముఖ్యులు వచ్చెద రేడ కైనఁ బొం
     డనిమునుమున్నె ధాత్రి యమరాళికిఁ దెల్పఁగ నేఁగెనో యనన్ . 36

మ. సురదంతావళదానగంధలహరిన్ సొంపొందుసౌరాపగాం
     బురుహాళిందమిళిందబృందము మహామోదంబున్ బైకొనెన్
     జరనీలాచలభాసురాసురబల స్తంబేరమోద్వత్కటాం
     తరచంచన్మద మాహరింప రిపు లన్నన్ సైఁప రెవ్వారలున్ . 37

ఉ. భ్రాతలవీటి కీగతి నుపాధి విరోధు లొనర్పఁ జూడఁ బా
    లైతి నటంచు విన్ననయినట్టి క్రమంబునఁ గాంతి మాసి ఖ
    ద్యోతుఁడు వీరరాక్షసభటోద్భటపాణికృపాణదీధితి
    వ్రాతము గప్పినన్ గనె వివర్ణత యద్దపుబిల్లకైవడిన్ . 38

వ. తత్సమయంబున. 39

§§§ విష్ణువు దేవసాహాయ్యార్థము వచ్చి మాల్యవదాదులతో సమరం బొనర్చుట §§§
ఉ. ఆసురరాడ్భయానకజయానకనాదము లాలకించెనో
    వాసవదూత వోయి యిదె వచ్చిరి దైత్యులు నానెఱింగెనో
    తా సకలాత్ము డౌట విభుతన్ గనెనో తెలియంగ రాదు ల
    క్ష్మీసరసోక్తులన్ దనివిఁ జెంది ముకుందుఁడు లేచెఁ జెచ్చెరన్. 40

వ. ఈప్రకారంబున క్షీరాబ్ధికుమారితోడివిహారంబు సాలించి దనుజసంహారంబునందుడెందంబుఁ గీలించి
    సురబృందంబుమే లెంచి మహోత్సాహంబున. 41

సీ. వనజమోహమునఁ జేరినభాస్కరుఁడొ నాగ శయకుశేశయమునఁ జక్రమమరఁ గరికరంబున సితాంబురుహంబు దగులీల నొకకేల నంబుజం బొప్పు మీఱ

     నంజనాచలము పై నరుణాతపము మించు రహి మేనఁ గనకాంబరము దనర్పఁ
     దొలు వేల్పు రాప్రతిమలచెక్కడవుగండ పెండెంబు డాకాల దండిఁ జూప
తే. శార్ఙ్గతూణగదాఖడ్గసహితమహిత
    గరుడస్కంధ మెక్కి బంగరవుగట్టు
    తుదను గనుపట్టునీలతోయద మనంగ
    శాత్రవజిగీష నరుదెంచెఁ జక్రధరుఁడు. 42

వ. తత్సమయంబున. 43

సీ. తూలఖండములట్ల తునుక లై పాథోధరములు రోదోంతరాళమున నెఱసె
    సపతత్త్రములలీల శైలముల్ దివిఁ బ్రతిధ్వనులతో నొండొంటిఁ దాకులాడె
    శరనిధుల్ లోతుసూప రసాతలము దోఁపఁ జిలువరాచెలులకంటెలుచలించెఁ
    గులశైలచలనంబువలన భారము మోవ బెదిరి దిక్కరులు గీపెట్టసాగె
తే. విఱిగి పెళపెళ ధరఁగూలె విపినతరులు, గ్రహవిభునితేరిహరులపగ్గములువదలెఁ
    బ్రళయఝంఝానిలాభీలపక్షి రాజ, పక్షవిక్షేపజాత ప్రభంజనమున 44

క. పక్షీంద్రపక్షహతదీ, ప్రక్షోణీరేణుపటలి ప్రతిపక్షచమూ
    రక్షోవీక్షల కప్ర, త్యక్షము గావించె భువన మంతయు నధిపా. 45

చ. హరిశరపంక్తికంటె మును పగ్గరుడోగ్రగరున్మరుత్పరం
    పరలు విరోధిసైన్యములపై జనఁ గూలె ధ్వజాతపత్రచా
    మరసుభటప్రకాండభుజమండలమండితమండలాగ్రముల్
    కదలు హరుల్ రథంబులును గాడ్పడెఁ జేడ్పడి రెల్ల సైనికుల్ . 46

చ. అమరులు పుష్పవృష్టి గురియన్ దివిఁ దుంబురునారదాదిగా
    నములు రహింప సేవకజనంబులు గొల్వఁగఁ జారణ స్తుతుల్
    ప్రమద మొనర్ప వచ్చి రిపుభంజనుఁ డాహరి యొత్తె రుక్సమూ
    హమథిత రాజమున్ రవధుతారిసమాజము శంఖరాజమున్ . 47

చ. అదిరి కడున్ సూరారిభటు లాజయశంఖరవంబు వీనులన్
    గదిసిన గుండియల్ వగులఁ గంపముతోఁ దల లెత్తి కాంచన
    చ్ఛదరుచి మించునగ్గరుడుఁ జక్కఁ గనుంగొన లేక భీతు లై
    యదె యిదె వాఁడె వీఁడె హరి యంచుఁ జలింపఁగ సైనికాగ్రణుల్. 48

ఉ. గర్వముతో సుపర్వులకుఁ గా నని సేయఁగ వచ్చితే యిదే
    సర్వసమానలక్షణము సాలు హరీ నిలు పోకు మం చహం
    పూర్వికతో గదాపరశుముద్ధరతోమరపాణు లై మహా
    పర్వత రాజమున్ మశకపం క్తులయ ట్లెలెదిరించి రొక్కటన్. 49

సీ. వర్షాబ్దగతి నంపవానదైత్యులు ముంప నచలుఁడై హరి యంజనాద్రిఁ దెగడె
    శలభసంహతిలీల శత్రు లొక్కట మీఱ గేదారగతి నొందెఁ గేశవుండు

    మశకపంక్తులయట్లు మార్తు రుధ్ధతిఁ జూపఁ గట్టుఁదాలుపు జెట్టిబెట్టుఁ జెందె
    మకర వైఖరి వైరినికరంబు చెలరేఁగ వనజనాభుఁడు వార్దివహి వహించెఁ
తే. బూర్వదివిజులు దివిజులపోల్కి నిగుడ
    నయ్యనంతుం డనంతాభ నతిశయిల్లె
    దొరయు మధుమక్షికలవీఁకఁ బరులు దాఁకఁ
    దేనెపెరదారి మధువైరి గానిపించె. 50

శా. రక్షోరాజధనుర్విముక్తశతధారస్ఫారహృద్వాయువే
     గాక్షీణాస్త్రపరంపరల్ నిగిడి కీలాభీలతన్ వచ్చి ప
     ద్మాక్షుం జొచ్చి యడంగె నొక్కటఁ దదీయాంగంబునన్ బద్మగ
     ర్భక్షీణావసరంబునన్ భువనముల్ ప్రాపించి లో నౌరహిన్ . 51

వ. అప్పుడు. 52

సీ. పలునగంబులు వజ్రపాణి మార్కొనులీల రథికసారథులతో రథము లడరె
    హరినీలశిఖరిఁ గోరాడఁ దార్కొనుజాడ నిజయూథపులతోడ గజము లడరెఁ
    బక్షితార్క్ష్యత సహింపనిచందమున నాశ్విక శ్రేణితోఁ దురంగమము లడరెఁ
    గదనమం దెటులైన నిదియె దిక్కనురీతి హరిపదంబున భటోత్కరము లడరె
తే. నడరినప్పుడె రథికదోరధికధన్వ, శింజినీఘోషములును హస్తిపకహుంక
    రణము లాశ్వికధిక్కాగరవము లుగ్ర, భటకహకహార్భటులు దిశాపటలి నెరసె.

శా. ఆనక్తంచర శేఖరుల్ గురియుదివ్యాస్త్ర ప్రవర్షంబులున్
     నానాశస్త్రపరంపరల్ పయిపయిన్ నారాయణున్ గ్రమ్మినన్
     దా నుచ్చ్వాసము లేనియట్లొకముహూర్తం బయ్యెడన్ గన్పడెన్
     బ్రాణాయామపరాయణుం డయినవిప్గ్రామణిన్ బోలుచున్ . 54

క. మీనసమూహము పొరల మ, హానీరధిఁ గలఁగ నట్లు హరియున్ రక్ష
    స్సేనాధిపనానాస్త్రవి, తానములకుఁ గలఁగ కుగ్రతరకోపమునన్ . 55

మ. అతిశీఘ్రంబున శార్ఙ్గ మెక్కిడి గుణం బాభీలతణ దీటుచున్
     శతధారాగ్రము లై మనోజవము లై సంవర్తకాలానలా
     ద్భుతకీలాభము లై తనర్చశరముల్ దోరంబుగా నేసినన్
     శతశఃఖండము లైరి రాక్షసవరుల్ సంగ్రామరంగంబునన్. 56

క. శ్రుతివాఁక శరము లరిఁ బో, సి తిగిచి హరి యేయ నసురసేనలఁ బడియెం
     జతురంగంబులు దిలశ, శృతశఃకణశస్సహస్రశఃఖండములై. 57

ఉ. వాయువుచేఁ బ్రభూత మగువానవలెన్ నిజశార్ఙ్గము క్త మౌ
    సాయకపాత మద్దనుజసైన్యము ముంచిన నుత్సహించి నా
    రాయణుఁ డొత్తె నప్పుడు యుగాంతపయోధరఘర్షణోదిత
    స్ఫాయదభంగురాశనినిభధ్వనిధుర్యము శంఖవర్యమున్ 58

శా. ఆనారాయణశంఖరాజరవ మి ట్లత్యుగ్ర మై విద్విష
     త్సేనాధీశులవీనులన్ దొరయ భీతిం జెంది సింహం బర
     ణ్యానిన్ గర్జిల నేనుఁగుల్ బెగడున ట్లందంద మూర్చిల్లుచున్
     దీనత్వంబునఁ ద్రెళ్లుచున్ నలుగడన్ దృష్టించుచున్ స్రుక్కఁగన్ . 59

చ. గతులకుఁ బాసె నశ్వములు గంధగజంబులు మూర్ఛిలెన్ రథ
    ప్రతతులత్రోవ గట్టువడె బన్నముఁ జెందెఁ బదాతిజాతి య
    ద్భుత విజయాంబుజధ్వనికిఁ దోడుగఁ గేశవుఁ డార్చి సంగర
    క్షితి యద్రువన్ దిశాకరులు చేడ్పడ శార్ఙ్గగుణంబు దీటినన్ . 60

వ. వెండియు నక్కుండలీశశయముండు కుండలీకృతకోదండమండితకరుం డయి గండు మిగిలి చండతరాఖండలమండలాగ్రంబులన్ గొండలవలె దండిగల చండరాక్షసులగుండెల బగిలించుచుఁ గండల నగలించుచుఁ గోదండంబుల ఖండించుచు దోర్దండంబుల౯ దుండించుచు జోళ్లన్ జించుచుఁ గాళ్లన్ ద్రుంచుచుఁ బ్రక్కలన్ గ్రొచ్చుచు డొక్కల వ్రచ్చుచు నెమ్ముల రాల్చుచుఁ గొముల జీల్చుచు ఛత్త్రంబుల ఛేదించుచు గాత్రంబుల భేదించుచు మెడలన్ ద్రెంచుచు నొడల నొంచుచుఁ జేతికత్తులన్ ద్రోయుచు భీతచిత్తులన్ జేయుచుఁ గపాలంబుల నాస్ఫోటించుచుఁ గపోలంబుల నుత్పాటించుచు నరంబుల వదలించుచు శిరంబుల విదలించుచు భూషణంబుల నులుపుచు దూషణంబుల సలుపుచు ధైర్యంబుల నెంచుచు శౌర్యంబుల నడంచుచు ధ్వజంబులన్ జెడఁగొట్టుచు గజంబుల౯ బడఁబెట్టుచు దొండంబులఁ గోయుచు గండంబుల వ్రేయుచుఁ దేరుల కరుగుచు నూరెల దిరుగుచు భీతుల వడఁదీర్చుచు సూతులఁ గడతేర్చుచు యోధలఁ గట్టుచు బాధలఁ బెట్టుచు బిరుదులన్ బాపుచుఁ గఱదలన్ జూపుచు నెక్కడఁ జూచినన్ దాన యై చుట్టుఁగైదువున్ బట్టుకయె దిట్టతనంబుతో బెట్టిదంబుఁ గనిపించునెడన్ బ్రళయోద్దండమార్తాండమండలంబుననుండి నలుగడల నిండికొనుకరమండలంబులమెండున నజాండోపరీతరంగమాలికలవలనన్ దుఱంగలించునభంగతరోత్తుంగ తరంగమాలికలతెఱంగున మహాగరుత్సరీతగిరి గుహాకుహరసరణిన్ బఱతెంచుకాలసర్పంబులదర్పంబులన్ గప్పుజిగి దలిర్ప నుప్పరంబునన్ గప్పుకొని మిగుల మెఱయుకారుమొగిళులవలన దిగునగణితజలధారలతీరునన్ దద్విశిఖంబు లసంఖ్యాతంబు లయి నిశాటులశరీరంబులు శోషింపన్ జేయుచు నమృతాశనవైరుల లోఁబఱచి ముంచుచుఁ జక్రి దూష కులమర్మంబులు నాటుచు ఘనవిపక్షులశిరంబులపయిఁ దొరఁగుచు మఱియు నరిదిగా నరిపుండరీకంబుల ఖండించుచుఁ గౌశిక ప్రతోషకరంబులై పరవాహినుల యుబ్బడంచుచు నత్యంత సంతాపకరంబు లయి యెదిరించిన

వారి కమృతపదంబుఁ జూపుచు గరుత్పరంపరాపరిణద్ధంబు లై రుధిరంబు వెడలించుచు నప్రదీప్రశిఖిశిఖా ప్రతీపంబులయి ప్రతిపక్షబలంబులపయిం బ్రవహించునప్పుడు పద్మనాభుండు భద్రేభవరదుండు మీ రతనిధర్మంబున మెలంగుచుండియు మమ్ము నొంచవచ్చుట మేరగాదని వారించుతీరున సంచలత్కరంబులయి ఘీంకరణంబు లొనర్చుచుఁ దదభిముఖంబుగా శరణాగతరీతిన్ బడుగంధసింధురంబులకు హరి సారూప్యం బొసంగెనో యన నూతనక్షతధారాపూరంబులు గెంబట్టుఁబుట్టంబులుగాఁగరాగ్రపరిసరపతద్రరథచక్రంబులు చక్రంబులుగా విమత విగతవిజయశంఖంబులు దొలిశంఖంబులుగాఁ గ్రిందఁబడిన వీరయోధబాహుకాండంబులుశయ నీకృతబిలేశయప్ర కాండంబులుగాఁ జెలువొందనందుఁ గ్రందునేయుచు భూతప్రేతవేతాళకూశ్మాండ బ్రహ్మరాక్షసపిశాచశాకినీ ఢాకినీగణంబులు దేవాసురగణంబువలె ద్వివిధంబయి యాయుధాస్థిభూషణరజస్సికతాతలంబున నిలిచి మహాసింధురబంధురకబంధమంథాచలంబునడుమ నిడుదనరంబులు నూఱాఱు లొక్కటిసేసి గట్టిగాఁ జుట్టి యిరు దెగలవా రిరుదెసం బట్టి శోణితాంబుధి మధించుచుఁ దన్మధ్యంబుననుండి శాకినీభూతంబుపొడవుగా నెత్తినము త్యాలగొడుగు గ్రొత్తగాఁ బొడమినచంద్రుం డనియును బ్రచ్ఛన్నంబుగా మునింగియుండి బయలుదేఱినమోహినీ భూతంబు లచ్చర లనియు నంగహీనంబు గానిమత్తమాతంగశవంబునకు వెండియు రెండుకొమ్ములిడి ప్రేతా వేశంబునఁ బఱతేర నదియే చతుర్దంతదంతావళం బనియును శ్వేతాశ్వశవం బుచ్చైశ్శ్రవం బనియును విచిత్రవర్ణ పతాకాకీర్ణపటచ్ఛత్త్రచామరశకలావికలరథ స్తంభజతంబు పారిజాతం బనియుఁ గమనీయసౌందర్యలీలన్ బయలుపడిన కామిని యిందిరాకామిని యనియును బ్రహరక్షో ధన్వంతరిస్థూలకపాలకలశంబునం దెచ్చినరసతైలం బమృతరసం బనియు నిబంధించి తదర్థంబుగా నిరుదెసలపెద్దలును సన్నద్ధులై పెద్దయుంబ్రొద్దు యుద్ధంబుసేయుకోలాహలంబు కౌతూహలంబుగల్పింపఁగావరించివిరించిపట్టి విపంచిపట్టి బెట్టుగా బొట్టగీతంబులం దలపెట్టె నట్టియెడ నజ్జగజెట్టి మహారణ్యంబు సొచ్చినకార్చిచ్చు పెచ్చునంబ్రళయసముద్రంబుదొరసినసంకర్షణాగ్ని బింకంబున మేఘజాలంబుపయి నడరినఝంఝానిలంబువేగంబున నంధతమసంబు పయి నొలసిన మధ్యందినసూర్యు శౌర్యంబున నవార్యక్రౌర్యంబుఁజూపినయా పురుషోత్తముదాపున నిలువనోపక కకావికలై భేరుండంబునకుం బాఱుశరభం బులరభసంబున కులుకుకొదమసింగమ్ముల భంగంబునఁ గొదమసింగంబునకుఱుకు మత్తమాతంగంబులఘటలయటుల మత్తమాతంగంబునకుం బఱచువ్యాఘ్రం బులశీఘ్రంబున వ్యాఘ్రంబునకు వెఱచుకురంగంబులతెఱంగున నిలిచినచో

     నిలువక యొండొరులఁ బిలువక తిరిగి చూడక పడినకత్తు లె త్తఁ జేతులాడక
     హతశేషు లైన దోషాచరులు విముఖులై లంకాభిముఖులయి పఱచి రయ్యెడ.
క. పాఱెడిరిపుల రణస్థలిఁ, బాఱెడిబహురుధిర నదులఁ బ్రతిబలములపై
      బాఱెడి శరములఁ గని సొం, పారెడి మతిశంఖ మొత్తె హరి యవ్వేళన్. 62

                                §§§ సుమాలి విష్ణునితో యుద్ధము చేయుట §§§
మ. హరిచే నొచ్చి సదైన్యమై పఱచు సైన్యంబున్ జయోత్సాహి నా
     హరి వీక్షించి సుమాలి రోషవివశుం డై చండకాండంబులన్
     హరిశాతాశుగవృష్టి మాన్చి రవి నీహారచ్ఛటల్ గప్పువై
     ఖరి మైఁ దూపుల ముంచి దిక్కు లద్రువంగాఁ బేర్చి పె ల్లార్చినన్ . 63

శా. ప్రావృట్కాలఘనార్భటుల్ విని శిఖివ్రాతంబు లేతెంచున
    ట్లావీరాగ్రణిసింహగర్జ విని మున్నాపన్నులై చన్నయా
    దేవద్వేషులు కమ్మఱన్ మరలి బుద్ధిస్థైర్యశౌర్యాఢ్యు లై
    గోవిందున్ వెసఁ దాఁకి మున్పటివలెన్ ఘోరంబుగాఁ బోరఁగన్. 64

చ. అపుడు సుమాలి హేమకవచావృతుడై సతటిద్ఘనంబుతో
    నుపమకు వచ్చి రత్నకటకోజ్జ్వల మౌకర మెత్తి యుత్కట
    ద్విపమువలెన్ ముకుందుఁ బఱ తెమ్మని పిల్చుచుఁ గేకవ్రేయుచున్
    విపులశతాంగమున్ మెఱయ వే చని మార్కొని విక్రమించినన్ . 65

మ. సరసీజాక్షుఁడు మందహాసము దనర్పన్ బ్రోల్లసత్కుండల
     స్ఫురితం బైనతదీయసూతుశిర మచ్చోఁ ద్రుంచి యజ్జోదుమై
     శరసంఘంబులు నించి యార్చిన రథాశ్వంబుల్ నిజక్షత్త లే
     మి రథం బీడ్చుక యేఁగెఁ దత్సమరభూమిన్ బాసి యుద్ర్భాంతిమై. 66

వ. ఈక్రమంబున. 67
           
                       §§§ విష్ణునిదరిసెసముచే సుమాలి యను రాక్షసుఁడు మడియుట §§§
ఉ. అంతము లై రథాశ్వములు వాఱ సుమాలియు నిల్వలేక యు
    ద్ర్భాంతి వహించె నింద్రియపరంపర నిల్వనిభ్రాంతచిత్తున
    ట్లంతఁ బరాఙ్ముఖుం డయినయన్నఁ గనుంగొని మాలి వచ్చి
    శ్రీ కాంతునిఁ దాఁకె యుద్ధకుతుకంబున హైమరథాధిరూఢుఁ డై. 68.

వ. ఇవ్విధంబునం బ్రతాపజితాంశుమాలి యగుమాలి వనమాలిన్ దాఁకి మహా
    సాహసంబున. 69

మ. ఘనకోదండగుణారవంబు దశదిగ్భాగంబుల౯ నిండఁ గాం
     చనపుంఖాంచితబాణముల్ దొడిగి లక్ష్యం బైనశ్రీవత్సలాం
     ఛనువక్షంబునఁ దూఱ నేయ నవి క్రౌంచఁబున్ బ్రవేశించుహాం

     సనికాయంబులలీలఁ జొచ్చి చన నిచ్చన్ గుందె దేవాఘముల్. 70

ఉ. మాలిధనుర్విముక్తశితమార్గణముల్ శతకోటికోటు ల
    వ్వేళ నిజాంగమున్ దొరసి వేదన సేయఁగ ధైర్యసంపదన్
    దాళెఁ బయోజనాభుఁడు రణంబున నింద్రియజేత యాధులన్
    దాలిమిమై సహించినవిధంబున రామనృపాల వింటివే. 71

క. ఈక్రమమున మాలిభుజా, విక్రమమున నొచ్చి మెచ్చి విష్ణుఁడు శార్ఙ్గా
    వక్ర జ్యారవ మఖిలా, శాక్రోడము లావరింపసంరంభమునన్ 72

చ. కులిశసముజ్జ్వలద్విశిఖకోటుల మాలిశరాళిఁ ద్రుంచి త
    జ్జలదనిభాంగమున్ గదియ శార్ఙ్గి మెఱుంగులఁ బోలువాలుఁదూ
    పులు నిగిడింపఁగా నవియుఁ బోయి తదీయశరీరరక్తమున్
    బలువిడిఁ గ్రోలెము న్నమృతపానము సేయుసురౌఘమున్ బలెన్ . 73

చ. మద మిటు లార్చి పేర్చి వనమాలి చలంబున మాలిమౌళి ప
    ల్చిదురుప లై ధరన్ గలయఁ జేసి శరాసముఁ ద్రుంచి టెక్కెమున్
    బ్రదరముపా లొనర్చి హయపాటవమున్ ఘటియించి సూతునిన్
    దుదిఁ గనఁ జేయ వాడు విరథుం డయి చండతరాగ్రహంబునన్. 74

మ. గదఁ గేలన్ గొని శృంగవద్గిరిరహిన్ గ్రావంబుపై నుండి యు
     న్మద మై కేసరి డిగ్గులీల రథ మంతన్ డిగ్గి పల్మాఱు న
     గ్గదఁ జక్రాకృతిఁ ద్రిప్పుచున్ గదిసి నాగద్వేషిమూర్థంబు బి
     ట్టదరన్ గొట్టె మహాద్రి వజ్రహతి వ్రయ్యన్ జేయుజిష్ణున్ బలెన్. 75

ఉ. మాలిగదాహతిన్ బిలుకుమాలి విహంగమమౌళి ధైర్యమున్
    దూలి పయోధిమున్ దిరుగుతోరపుగట్టువలెన్ జలించి య
    వ్వేళఁ బరాఙ్ముఖుం డయిన వెన్నుఁడు నివ్వెఱ నొందె నందునన్
    మే లని యార్చి రాసురులు మింట సుపర్వులు పిచ్చలింపఁగన్. 76

వ. అప్పుడు.

చ. గరుడుపరాఙ్ముఖత్వముసు గర్వితు లై రిపు లార్చుపేర్నియున్
    సురలభయాకులస్థితియుఁ జూచి యి దేమి ఖగేంద్ర యంచు శ్రీ
    హరి దనహస్తపద్మమున నాతనిమస్తము సంస్పృశించి యా
    తురత హరించి శాత్రవు నెదుర్కొనఁ జేసి పరాక్రమంబునన్ . 78

ఉ. కేలి సుదర్శనాయుధముఁ గేశవుఁ డంప యుగాంత పావకా
    భీలమహాస్ఫులింగచయభీషణకీలక రాళ మై లయో
    ద్వేలఘనాఘనోద్గళితదీర్ఘతరాశనిభూరిఘోషమై
    మాలిశిరంబుఁ ద్రుంచె క్షణమాత్రములో దివి వేల్పు లుబ్బఁగన్ 79

క. చక్రాహతి నీక్రమమున, నాక్రవ్యాదో త్తమోత్తమాంగము దెగి భూ

     చక్రము గ్రక్కదలన్ బడె, శక్రశతారచ్ఛితోగ్ర శైలము లీలన్ . 80

శా. ఈలీల హరి మాలిఁ ద్రుంచుటయు దేవేంద్రాదిది క్పాలకుల్
     చాలన్ సంతస మంది దివ్యసుమవర్షంబుల్ ప్రవర్తించి ర
     వ్వేళన్ వానివిధంబుఁ గన్ను లెదుటన్ వీక్షించి శోకానల
     జ్వాలల్ గ్రాలఁ దదగ్రజుల్ వగచుచున్ సైన్యంబుతోఁ బాఱఁగన్ . 81

శా. లంకామార్గము వట్టినట్టిరిపుల లక్షించి తర్క్ష్యుండు సా
     హంకార స్థితి వెంబడిన్ బడి స్వపక్షాభీలవాతంబు న
     ల్వంకల్ దార్కొనఁ జేయఁ దూలములలీలన్ వార లుద్విగ్ను లై
     బింకం బేది చనంగఁ గేశవుఁడు గంభీరాట్టహాసంబునన్. 82

మహాస్రగ్ధర. బెదరించున్ బెట్టుమించున్ బెనుశరములచే భీకరస్పూర్తి ముంచున్
     గుదియించున్ గోపగించున్ గురుముసలములన్ గొట్టి బాధించు వంచున్
     గదనొంచున్ గండడంచున్ ఘనపరిఘములన్ ఖడ్గమున్ గైధరించున్
     విదళించున్ వెంబడించున్ విసువ కసురులన్ విష్ణుఁడీరీతిఁద్రుంచున్. 83

వ. అప్పుడు. 84

మ. జహదస్త్రంబు లుఠత్తురంగముఁ బతచ్ఛత్త్రధ్వజంబున్ క్షిప
     ద్బహుశీర్షంబు నటత్కబంధము గళద్రక్తంబు ధావద్భటం
     బుహసద్భూతము విస్రవచ్ఛ్రమపయఃపూరంబు నై యిందిరా
     గృహిచే శత్రుబలంబు పెంపు సెడి పాఱెన్ దక్షిణాశాగతిన్ . 85

క. హరివెనువెంటన్ దగిలిన,కరినివహముచందమునఁ గకావిక లగుచున్
    హారి వెనుతగిలిసఁ బఱచిరి, కరినివహాముతోడ రివులు కాకుత్స్థమణీ. 86

తే. ప్రళయఝంఝా సమీరంబువలనఁ జెదరి
    పఱచు కాలాభ్రములలీలఁ బద్మనాభ
    శార్ఙ్గకోదండ నిర్ముక్తసాయకోగ్ర
    పవనహతి దైత్యసంఘముల్ పఱచె నపుడు 87

చ. గరుడతురంగనందకవిఖండితదానవరాట్తనుచ్యతా
    భరణరుచుల్ దిగంతములఁ బర్వె ఘనాఘనకోటినుండి భా
    సురగతి మించుమించు లన క్షోణిపయిన్ హరి కుంకుమాంబువుల్
    గురియు తెఱంగునం దొఱఁగెఁ గ్రొత్తగ నెత్తురుటేఱులత్తఱిన్. 88

మ. ఘనదైతేయఘనాఘనప్రచయ మాకాశంబునం దాజనా
      ర్దనపర్జన్యనియుక్తిఁ జెంది రణవర్షావేళ వర్షించె నూ
      తనకీలాలము హారమౌక్తిక లసద్వర్షోపలవ్యాప్తి భూ
      తనికాయం బనుచాతక ప్రతతి కుత్సాహంబుఁ గల్పింపుచున్ 89
వ. ఈ క్రమంబున. 90

మ. గమకంబుల్ సెడి కైదువుల్ విడిచి యంగంబుల్ సెమర్పన్ నిరూ
      ఢ మహాప్రాణ భయంబునన్ దలలు వీడన్ రక్తముల్ గ్రక్కుచున్
      విముఖత్వంబునఁ బాఱురాత్రి చరులన్ వెన్నాడి మున్నాడి వి
      క్రమముఁన్ జూపుత్రివిక్రమున్ మరలి చక్కన్ జూచి రోషంబునన్ . 91

                                 §§§ మాల్యవదాదులు యుద్ధమునుండి తొలఁగుట §§§
చ. రణనయ వేది యద్భుతపరాక్రమవంతుఁడు మాల్యవంతుఁ డా
     క్షణమున వేల దాఁటి చనుసంద్రములీల స్వకీయవాహినీ
     గణముఁ గ్రమించి యాహరిముఖాముఖికిన్ జని ప్రజ్వలత్క్రుధా
     రుణ నయనంబుల౯ మిడుఁగుఱుల్ సెదరన్ దలయూఁచి యిట్లనున్ 92

ఉ. ఒప్పునె నీకు మాధవ యయో రణధర్మము వీరధర్మమున్
     దప్పి భయార్తు లై పఱచు దైత్యులవెన్కొని హింస సేయఁగా
     నిప్పని హీనుఁ డైన ఘటియించు నె భీతులఁ ద్రుంచువానికిం
     జెప్పెడి దేమి కీర్తియును సేమము స్వర్గముఁ గల్గ నేర్చునే. 93

చ. సమరపరాఙ్ముఖుఁ దొడరి చంపిన వాఁ డెటువంటి మంచిపు
    ణ్యము లొనరించినన్ బొరయఁ డండ్రు దివం బది యట్టు లుండెఁ
    గయ్యము ఘటియింప నంత ప్రియ మైనను నే నిదె యున్న వాఁడఁ జూ
    పుము భుజశౌర్య మీవెఱచిపోయెడిదైత్యులఁ దాఁక నేఁటికిన్ . 94

క. అని పలికి మాల్యవంతం, బను శైలములీల నిశ్చలాత్ముం డై ని
    ల్చినమాల్యవంతుఁ గను గొని, కనుఁగొనఁ గెంజాయ దొలుకఁగా హరి పలికెన్ .

ఉ. ఓయినిశాచరప్రవర యొప్పుగ నిప్పుడు వల్కునీరణ
    న్యాయము లెందుఁ బోయె సురనాథులఁ దోలెడుచోటఁ జాలుఁ బో
    న్యాయముచేతఁ గాదె జయ మందుట మీరు జగం బెఱుంగదే
    న్యాయము మేము దప్ప మొకనాఁటి కి దెట్లన విన్ము తెల్పెదన్ . 96

ఉ. మున్ను విధాత మీకు వరముల్ కరుణించుటఁ జేసి త్రోయ రా
    కిన్నిదినంబు లేను క్షమియించితి వేల్పులు మాకుఁ బ్రాణముల్
    విన్నదనంబువారి కొదవించినమిమ్ము రసాతలంబునన్
    మిన్నక తూఱినన్ వెఱచి, మి న్నిఁక బ్రాకినఁ బట్టి చంపుదున్ 97

మ. అమరుల్ మీవలనన్ భయార్తు లయి న న్నర్ధించినన్ దైత్యులన్
     సమరక్షోణి జయింతుఁ బొండని ప్రతిజ్ఞాపూర్వకాభీతిదా
     సము ము న్నిచ్చితి భీతి నున్న శరణన్నన్ వందిన్ వ్రాలినన్
     మిము ఖండింపఁక బోవ నన్న నతఁడున్ మే లంచుఁ బెల్లార్చుచున్ . 98

చ. కనుఁగవ గొప్పనిప్పు లొలుకన్ బటురోషరసారుణాబ్జలో
     చనుఁ డగువిష్ణుమీఁద నొకశక్తి మహాభుజశక్తిఁ బూన్చి వై

       చిన నది ఘంటికల్ రొదలు చేయఁగి మంటలు మింట నంటఁగాఁ
       జని హరిఱొమ్మునన్ మెఱసెఁ జారుఘనస్థితచంచలాద్యుతిన్ . 99

మ. దనుజారాతియు నంతఁ బేరురమునం దళ్కొత్తుతద్ఘోరసా
      ధనమున్ గ్రమ్మఱఁ బూని శాత్రవునిమీదన్ వైవ సేనాని పం
      చినశక్తిన్ బలె మాల్యవంతునెదఁ జొచ్చెన్ వ్రచ్చి దానన్ మహా
      శనిపాతంబునఁ గూలునీలగిరి యోజన్ వ్రాలె వాఁ డుర్వరన్ 100

చ. తొడిగినజోడు వ్రయ్యలుగఁ దోరఫునెత్తుటఁ దోగి యాగతిం
      బడి మఱికొంతసేపునకుఁ బైకొనుశ్రాంతి దొఱంగి స్వస్థుఁ డై
      యడరి నిశాచరాగ్రణి మహాగిరిపోలిక సుస్థిరాకృతిన్
      దడఁబడ కేగు దెంచి హరి దార్కొని మార్కొని విక్రమంబునన్. 101

మ. రటదత్యుజ్జ్వలకింకిణీశతసహస్రస్ఫార కార్ష్ణాయస
     స్ఫుట శాతోత్కటకంటక ప్రకట మై పొల్పొందుశూలంబు మి
     క్కుటపుందెంపునఁ బూని కేశవునివక్షోదేశమున్ గ్రుమ్మి యం
     తటఁ బో కద్దివిజారి ముష్టినిహతిన్ దాటించె రోషంబునన్ . 102

ఉ. ఆతనిసాహసంబునకు నచ్చెరువందె వియచ్చర వ్రజం
    బాదఱి మేలు మే లనుచు నార్చిరి దైత్యులు మాల్యవంతుఁ డీ
    రీతి ముకుందు నొంచి యరరే నిలు మంచు ఖగేంద్రుమోము ని
    ర్ఘాతముఁ బోలుముష్టి హతి ఘట్టన సేసి పరాక్రమించినన్ . 103

ఉ, పక్షికులేంద్రుఁ డల్గి నిజపక్ష పరంపరఁ బుట్టుగాడ్పునన్
    రాక్షసరాజసైనికుల రాయిడిఁ జేసిన పండుటాకుల
    ట్లక్షమతన్ క్షణం బయిస నచ్చట నిల్వఁగ లేక బెండు లై
    దక్షిణవార్ధిలోఁ బడిరి దైవవశంబున లంక త్రోవగన్. 104

వ. అంత. 105

మ. వినతానందనపక్షమారుతహతిన్ విభ్రాంతుఁడై మాల్యవ
     ద్దనుజేంద్రుం డట నిల్వఁ గూడకయ సోదర్యాప్తమిత్రంబుగాఁ
     జనియెన్ లంకకు సిగ్గుతో నిటుల కంజా తాక్షుచేఁ బెక్కుమా
     ర్లనిలో నొచ్చి రసాతలస్థు లయి రయ్యా దానవుల్ రాఘవా. 106

తే. వెలయసాలకటంకటకులమువార, లధికు లమ్మాల్యవన్ముఖ్యు లాహవమున
     రామ నీచేత హతు లైన రావణాది, దనుజవరులు పులస్త్యగోత్రంబువారు. 107

తే. రావణాదులకంటె నిర్వక్రవిక్ర, మక్రమంబున ఘనులైనమాల్యవన్ము.
     ఖాసుర గ్రామణుల గెల్వ హరికిఁ దక్క, నలవియె తదన్యులకు భానుకులవరేణ్య.

చ. హరి హరి యంచు మే మనఁగ నన్యువలెన్ విన వేల నీవె శ్రీ
    హరి వివుఁ డాలకించినమహత్త్వము నీయదె శంఖచక్రముల్

      కరములఁ బూన కిద్దివిజకంటకులంబొలియింప మానుష
      స్పురణ జనించినాఁడవు ప్రబోధనిధుల్ నినుఁ గందు రాత్మలన్ . 109

ఉ. దుర్మతు లెచ్చి సాధులకు దోహము సేయు నెడన్ జగంబునన్
     ధర్మము దప్పునప్పు డవతారము లెత్తి విశిష్టరక్షణల్
     గూర్మి నొనర్చి దుష్ట జనకోటి హరింతువు రావణాదిదు
     ష్కర్మపరామరారిగిరిశంబకరా రఘువంశ శేఖరా. 110

మ. అలపౌలస్త్యులకంటె వీరు లగుపూర్యాదిత్యులన్ లంక వా
     రలు ప్రాపించుట శౌరి వైరమున వీరత్వంబు దీఱన్ రసా
     తల మాభీరులు సేరుటం దెలిపితిన్ దర్వాతివృత్తాంతమున్
     దెలియన్ జెప్పెద నాలకింపుము కథాధీనావధానుండ వై. 111

వ. అని కలశజుండు మున్ను తన్ను కఘువీరుం డడిగిన ప్రశ్నంబునకు నిటుల సదుత్తరం బొసంగినవాఁ డై . మఱియు ని ట్లనియె. 112

                      §§§ సుమాలినిర్దేశముచేఁ గైకసి విశ్రవునాశ్రమంబు సేరి యతని వరించుట §§§
సీ. అమరలోకముజోక నాలోకనీయ మై యేలోకము సమృద్ధి నింపొనర్చుఁ
    గమలా ప్తకమలారి కాంతు లొందకయ యేస్థలము రత్న ప్రకాశముల వెలుఁగు
    బలినిశాచర సార్వభౌమునాజ్ఞావిశేషమున నేభువనంబు సౌఖ్యముఁ గను
    భోగవత్యాపగాంభోజగంధానిలవ్యాప్తి నేనెలవు పావనత జెందు

తే. హాటకేశ్వర సేవాగతాగతాహి,కన్యకాసూవురార్భటిఁ గర్ణసుఖ మొ
    సంగు నేపద మట్టిరసాతలమున, నుండి యంత సుమాలి తానొక్కనాఁడు. 113

మ. ధరణీలోకవిలోకనోత్సవ మెదన్ దార్కొ న్న స్వర్ణాద్రితుం
     గరథస్థుం డయి పుత్త్రి కై కసి నిజాంకం బెక్కి రాఁ జంచలా
     స్ఫురితం బై తగునీల మేఘమువలెన్గ్ భూపాలసద్గాత్రుడై
     సరదంభోధివనప్రదేశముల సంచారంబు గావింపఁగన్ . 114
లయగ్రాహి.
    చారుపదనూపురము లారభటి మీఱమణిహారములు చన్గవలఁ దాళిసిల మెలొ
    య్యారముల నచ్చరలు పేరణినటింప వరచారణులు దేవ యవధారనిజతై కై
    వారముఘటింపఁబలుమాఱువెలిచామరము సూరెలవియచ్చరకుమారికలువీవ
    న్బేరుగల పుష్పకముపైరుచిరలీల గురుజేరఁ జనుధీరునిఁ గుబేరుఁ బొడగాంచెన్

ఉ. కాంచి సుమాలి వెండియు నెగాదిగఁ జూచి కళానిరూఢి నూ
     హించఁగ వీనిఁ బోలఁ గలఁడే యలరేదొర యిట్టిపుత్త్రునిన్
     గాంచినవిశ్రవోమునిది గా మఱి భాగ్య మయారె రాక్షసుల్
     గాంచరె సౌఖ్య మీదృశునిఁ గైకసి విశ్రవుఁ జేరి కాంచినన్ . 116

మ. అని రక్షోహిత కార్య కాంక్షి యగునయ్యాదిత్యవిద్వేషి, యో

      జనఁ గావించి విముక్త పద్మ యగు శ్రీచందాన నింపొందునం
      దనమో మాదర వూరితేక్షణములన్ దర్శించి వంశంబు మ
      న్చునుపాయం బొకటే గణింతు వినుమంచు గూర్మితో నిట్లనున్ 117

ఉ. మానిని యీమణీమయవిమానముపై జనువాడు విశ్రవో
      మౌనికుమారుఁ డీశ్వరసమానుఁ డుదగ్దిశ యేలు నెప్పుడున్
      వీని జయించుపాటిరణవీరులు గల్గుదు రమ్మహామునీ
      శానుని భార్య వై యతని సాధుమతిన్ భజియించి తేనియున్ . 118

సీ. దౌహిత్రకులముచేఁ దమకు మేలగునంచుఁ బితృ దేవతలు మనఃప్రియముఁగందు
     రాఁడుబిడ్డయు నల్లుఁడని వేడుకలు సేయఁ,గలిగెఁగా యని తల్లి యెలమిఁబొందుఁ
     గన్యకాదానాభిగణ్యఫలంబు దనకుఁ జేకుఱు నంచు జనకుఁ డలరు
     వరుసతో భోగించి వరములీయఁ దలంచి యనలేందుగంధర్వు లాశ్రయింతు

తే. రాత్మజామణి జనియించె నన్నమాత్ర,
      నట్టికన్య యసామాన్య యని యెఱింగి
      కులవయోరూపశీలభంగులకు దగిన
      విభు వెదకి పెండ్లి గావించి వెలయు గురుఁడు. 119

మ. తనుజామాత్రవు గావు వంశమున సౌందర్యంబునన్ సద్గుణం
      బున శ్రీదేవికి సాటి సేయఁ దగు నిన్ బూఁబోఁడి మావాని కి
      మ్మని యేబంధుఁడు వేఁడఁగా వెఱచుఁ బ్ర త్యాఖ్యానశంకాప్తి జ
      వ్వని వైనన్ దినముల్ గ్రమింపఁబడె నుద్వాహార్హునిన్ గానమిన్ 120

చ. కమలదళాక్షి కూతు నిలఁ గాంచుట మేలగు నైననొక్కప
      క్షమున విచార హేతు పని కాంచెద నెట్లగు నన్నఁ దల్లి వం
      శము గురునన్వయంబు పతిసంతతి కన్య దురాత్మయైన నొ
      ప్పమి యపకీర్తియున్ సకల బాంధవనిందయు నొందుఁ గావునన్ 121

ఉ. దీని వరించు వీఁ డనుచు దేవుఁ డెఱుంగునో లే కెఱుంగఁడో
      కాని తదన్యుఁ డె ట్లెఱుఁగుఁ గాన యెఱుంగ నితండు నీవిభుం
      డౌ నని తల్లి నీవలన నన్వయ మొప్పు బ్రసిద్దిఁ గాంచు నం
      చేనును నెల్లబాంధవులు నెన్నుదు మిప్పనిఁ దీర్పవే యనన్ 122

ఉ. కమ్మలడాలు చెక్కుల ధగద్ధగ లీన మొగంబు వాంచి కా
     నిమ్మని లేచి సిగ్గు మది నెక్కొన మ్రొక్కినఁ దండ్రి యెత్తి మా
     యమ్మ సుపుత్త్రులన్ గని శుభాన్విత వై మను మిమ్మహామునిన్
     సమ్మతిఁ గొల్చి నీ వని ప్రసన్నత దీవన లిచ్చి పంచినన్. 123

సీ. నఖరుచుల్ చరణారుణచ్చాయలను గూడి యలరుకుంకుమగంధ మవనికొసఁగ
    రమణీయమణి నూపుర ధ్వనుల్ శుచిపక్షు లగుద్విజాతులపల్కు లనుసరింప
    సొగసువాలుమెఱుంగుఁజూపు లాశావీథి కలఁ గల్వవిరిమేలుక ట్లర్ప

     గరిపల్లవశ్రీలు కంకణరవముచేఁ గోయిలయెలనాఁగగుంపుఁ బిలువఁ
తే. గాంచికాఘంటికలుమ్రోయనంచితోరు, కదళికలు మీఱ ఘనకుచకనకకలశ
    యుగనిగన్నిగలొలుక నయ్యువిద శో, భనాకృతిని జేరెఁ బౌలస్త్యునాశ్రమంబు.

క. కాంచన పాంచాలికవలె, మించినయక్కాంచనాంగి మెయిజిగిపయి వ్యా
    పించం గాంచిన తరువులు, గాంచనతరువుల తెఱంగు గైకొనె నచటన్ . 125

క. సాయమున మరుని కెందొగ, నాయక మన రమణి యిటుల చని హోమంబుం
    జేయుచు రెండవస్వాహా, నాయకుఁ డనఁ దగువుల స్త్యనందనుఁ జేరెన్ 126

ఉ. చూచి మరీచి మాలిరుచిఁ జొక్కెడు పద్మినిలీల రక్తితో
     నాచెలి యిచ్చ మెచ్చుకొని యాతనిమ్రోలనతాననాబ్జ సం
     సూచితలజ్జ యై నిలిచి క్షోణిఁ బదాగ్రమునక్ లిఖించుచున్
     వేచినయంత హోమవిధి విశ్రవుఁడున్ నెఱవేర్చి ముందటన్ . 127

సీ. తెలివి యౌచేరలం తేసికన్నులదాని మొలక నవ్వులముద్దుమోము దాని
     వెలయ సందెఁడుతల వెండ్రుకల్ గలదానిఁ బసమించు నెలవంకనొసలిదానిఁ
     గమ్మఁడా లొరయుబంగారుఁజెక్కులదానిఁ దావివీడెవుఁగావిమోవిదాని
     నుబ్బుసిబ్బెపుగబ్బిగుబ్బచన్ను లదానిఁ బిడికిట నడఁగు నెన్నడుము దాని
తే. మెఱుఁగువలెఁ దళ్కు తళుకనుమేనిదానిఁ
     గన్నె ప్రాయంబుచే వన్నెఁ గన్నదానిఁ
     దోరపుఁబిఱుందుదానిఁ బెందొడలదాని
     సొగసునడదాని నక్కన్నెఁ జూచె నతఁడు. 128

ఉ. చూచి సవిస్మ యాత్ము డగుచున్ ముని యెవ్వతె వేమి నీదు పే
    రేచెలి లేక యొంటి యిట కేటికి వచ్చితి నెవ్వ రైనఁ బ్రే
    రేచిరొ నీవె వేడ్కకుఁ జరించెదొ కల్గినమాట గల్గిన
    ట్లోచెలి తెల్పుమన్న నదియుం గరముల్ ముకుళించి యిట్లనున్ . 129

మ. కరుణసాగర నే సుమాలి యనురక్షస్స్వామిగారాముఁగూఁ
     తురఁ బుష్పోత్కట చెల్లెలన్ రహి వహింతుం గై కసీసంజ్ఞ చే
     గురునిర్దేశమునన్ భవచ్చరణముల్ గొల్వం గదా వచ్చితిం
     బరికింపం దగు నామనోరథము మీభవ్యప్రభావంబునన్ . 130

వ. అని పలికినయచ్చిలుకల కొలికిపలుకులు విని తనమనోదృష్టి నది వచ్చినరాక
యెఱింగి సుగుణాభినందనుం డగునప్పుల స్త్యనందనుం డి ట్లనియె. 131

మ. కలకంఠీమణి నీమనోరథము నేఁ గంటిన్ సుతాపేక్ష నిం
     దులకున్ వచ్చితి వైన సంజకడ నన్నుం జేరి మాటాడటన్
     ఖలు లౌ రాక్షసు లుద్బవించెడరు నీగర్భంబునన్ నావుడుం
     జెలి భీతిల్లి వినీతి మ్రొక్కి వచియించెన్ విశ్రవో బ్రహ్మతోన్ . 132.

మ. అనఘా మూఁడవ బ్రహ్మ వై విబుధలోకారాధ్యశీలుండ వై
     మనునీ తేజమునక్ జనించినసుతుల్ మాంసాశు లై దుష్టవ
     ర్తనులై సాధువిరోధు లై మెలఁగు టర్హంబే గుణస్ఫూర్తిచే
     నినుఁ బోల్పం దగుసత్కుమారకుల మన్నింపంగ దే నావుడున్ . 133

మ. అలపౌలస్త్యుఁడు గ్రమ్మరం బలికెఁ గన్యం గాలదోషంబు పె
     ద్దలకే కాదు విధాత కైన వశ మే తప్పింప నిం కేల చిం
     తిల నీ పుత్రులయందు మేటి యనగా దీపించు విద్యాగరి
     ష్ఠులలో శ్రేష్ఠుఁడు బ్రహనిష్ఠుఁడు గనిష్ఠుం డిందుబింబాననా, 134.

క. ననుఁ బోలు బ్రహనిష్ఠల, నినుఁ బోలుఁ బ్రతాపరుచుల నెసయువినీతిన్
    నినుఁ బోలు నక్కుమారుఁడు, మను నాతనివలనఁ గులము మనికిత మేలా, 135

వ. అని భవిష్యదర్థంబు వివరించి విరించి పౌత్త్రుండు పుత్రకాంక్ష లాచరించి తను
    వరించి మరులునం దీవరించినయక్కన్యకు గర్భాధానంబుం బ్రసాదించిన. 136

సీ. మేరుశృంగముల పై మేఘముల్ దిగురీతి నాతిచూచుకములు నల్లనయ్యె
    దౌహృదశ్రీ నిల్చుధవళాంబుజముపోల్కిఁ దెలిగంటి నెమ్మోము దెల్ల నయ్యెఁ
    గృతదైత్యజాతి వర్ధిలు నిటు లనురీతిఁ గలకంఠిలేఁగౌను బలితమయ్యె
    గర్భగార్భకతనూకాంతి బైలగులీల విమలాంగినూఁగారు విపుల మయ్యె

తే. నలరుబోడికి నొకయడు గామడయ్యెఁ , గీరవాణికిఁ జిట్టుముల్ దోరమయ్యె
    నబ్జపాణికి మంటి పై నాసయయ్యె, సైకత శ్రోణికిఁ బ్రసూతిసమయమయ్యె. 137

                           §§§ రావణ కుంభకర్ణ విభీషణులజననము §§§
క. భువనములు దలక మునులును, దివిజు లడల ధనదుగుండె దిగ్గు మనఁగ రా
    హువు శని మొదలగుదుర్గ్రహ, నివహము నికటస్థలమున నిలిచిన వేళన్ . 138.

సీ. పిడుగుఁజప్పుడుతోడ జెడఁగుజేగురునిండుచాయ దేఱెడుదశాస్యములతోడ
    నిడుదకోరలతోడ నెరయఁ గాటుక రాశి యైనట్టు గనుపట్టు మేనితోడఁ
   జుఱుకుఁజూపులతోడ జ్యోతిర్లతారుణారుణములౌకఱకు వెండ్రుకలతోడఁ
   దామ్రోష్ఠ ములతోడ దారుణాహులలీల వెలయు వింశతిభుజార్గళులతోడ

తే. భయము బీభత్స మొలయురూపంబుతోడఁ, గైకసీభామినీమణిగర్భమున మ
    హోగ్రుఁడగురాక్షసుండొకఁడుదయమయ్యె, గాలకూటంబువారాశిగనినయటుల.

శా. ఆరక్షోవరుఁ డుద్భవించునెడ గృధ్రారావముల్ మించె మే
    దోరక్తంబులు మేఘముల్ గురిసె నాందోళించె భూతావళుల్
    భీరుత్వం బెనసెన్ సురౌఘములు గంపించెన్ సృగాలచ్ఛటల్
    భూరిజ్వాలలు వాంతిసేసె రవిదీప్తుల్ మ్రోసెన్ దిశల్. 140

క. ఆవేళ, బుత్త్రజన్మము, భావించి పులస్త్యసుతుఁడు పఱతెంచి దశ
   గ్రీవుం డనుపే రతనికిఁ, గావించి యథోచితంబుగా నున్న యెడన్. 141

ఉ. వెండియు విశ్రవస్ఖలితవీర్యమునన్ బలుచూలు దాల్చి బ్ర
    హ్మాండవిఖండనోద్భటతరార్భటి మీఱెడువానిఁ గుంభక
    ర్ణుండను పుత్రుని సురవరుల్ బెగడందఁగఁ గాంచె నంతన
    య్యండజయాన శూర్పణఖ యన్ తనయం గనియెం గ్రమంబునన్ 142

వ. తదనంతరంబున. 143

మ. గుణరత్నాకరుఁ డింద్రియార్థ మరుదంకూరాహివన్యాశుశు
     క్షణి విద్యానిధి విశ్రవఃకులహితాచారాశ్రయుం డార్యపో
     షణచింతామణి సర్వభూతకరుణాసంగాత్మకుం డౌవిభీ
     పణుఁడుం గై కసి గర్భవార్ధిఁబొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్. 144

తే. ఆకుమార త్రయంబున కాగమోక్త, మార్గమునఁ దండ్రి, జాతకర్మంబు నామ
    కరణములు మున్నుగాఁగలకర్మతతులు, క్రమమున నొనర్చయుపనయనము జేసె.

వ. ఇత్తెఱంగున నవ్విశ్రవస్తనూజాతు లుపనీతు లయి తండి వలన నఖిలవిద్యావిశేషంబు
    లెఱింగి చిత్ర భానుత్రయసమానులు దినదిన ప్రవర్ధమానులునై వెలయుచుండి
    రయ్యనసరంబున. 146

                                 §§§ దశగ్రీవకుంభకర్ణవిభీషణుల బాల్యక్రీడలు §§§
సీ. అలఁతిగట్టులు భుజార్గళనిరర్గళత నుత్పాటించి కందుక ప్రౌఢిఁ జూపు
    నుడువీథి నారసి పోయెడువిమానము లందుకొని బిట్టు నేలతోఁ గొట్టి యార్చు
    నాశమోన్నతభూరుహములుదాఁ బడఁద్రోచి పఱచుమౌనులడాసి పరిహసించు
    శరభసింహమదేభసమితి నీడిచి తెచ్చి గట్టిగా దామెనఁ గట్టి వైచు
తే. గరుడగంధర్వపన్న గాగ్రణుల నెచటఁ
    గనిన మీతో భుజాభుజిఁ బెనఁగ వలయు
    నిలువుఁడను వార లుఱక వెన్వెంటఁ దగులు
    బాల్య లీలావిలోలుఁడై పంక్తిముఖుఁడు. 147

సీ. గిరిదిశాకరిభోగికిటికూర్మములు వ్రాల నం ఘ్రిఘట్టన నుర్వి నడఁగఁద్రొక్కు
    నరుణచోదితరథం బట్టిట్టుగాఁబట్టినలినాప్తు బింబంబు నాఁకి విడుచు
    బాల సాఁచి దిగీశ పట్టణాభ్యంతరోద్యానపక్వఫలాగతతులఁ గూల్చుఁ.
    గనుఁగొన్న వైమానిక శ్రేణి వివృతాస్య బిలగతంబుగ నొక్క పెట్ట మ్రింగు
తే. నెదుటఁబడకున్న మునికోటి వెదకి వెదకి
    పట్టి భక్షించుఁ గ్రొవ్వెగఁ దొట్టి గుఱుక
    విడిచి నిదురించు లేచు నల్లడలఁ దిరుగుఁ
    కుంభకర్ణుండు నడయాడుకొండకరణి. 148

చ. అతనిసహోదరుండు సుజనావనశాలి విభీషణుండు సు
    వ్రతములు సల్పుచు శ్రుతిపరంపరయర్థముఁ దండ్రి దెల్పఁగా

    హితమతి నాలకింపుచు జితేంద్రియుఁ డై యుపకారశీలతం
    బ్రతిదినముం జరించు మృదుభావముతోఁ గులధర పద్దతిన్ 149

ఉ. అన్నలు సేయురాయిడి భయాతురు లై బరునెత్తుమౌనులం
    గన్నులఁ జూచె నేనిఁ దనుకంపము మానిచి నానిమిత్త మా
    పన్నుల వీరిఁ బ్రోవుఁ డని ప్రార్థన సేయు నతండు వారలం
    చిన్నతనాననుండియు విభీషణుఁ డెంత పరోపకారియో. 150.

క. క్రూరుఁ డగుకుంభకర్ణునిఁ, బారిఁ బడి విభీషణో క్తిబ్రదికి మునులు త
    త్కారుణికుని దీవింపుదు, రారవితారముగ బ్రతుకు మన్నా యనుచున్ . 151

ఉ. అంతట నొక్కనాడు దమయయ్యఁ గనుంగొన రత్న ఘంటికా
     క్రాంతవిమానమెక్కుకొని కన్నలపండువుగా ధనేశ్వరుం
     డెంతయు వేడ్క వచ్చు చెలువెల్లను తప్పక చూచి కై కసీ
     శాంత స్వభావసిద్ధ మగుక్రౌర్యమునన్ దశకంఠుతో ననున్ 152

మ. కనుగొంటే భవదగ్రజుం డయినయక్షస్వామిసౌభాగ్య మీ
     తనిచందంబున నీవు నిట్టిసిరు లొందం జూడఁ గాంక్షించెదం
     దనయా యెందున నీదృశస్పురణఁ జెందన్ వచ్చు నానేర్పుఁగై
     కొను శీఘ్రంబున నేటి కూరక యశక్తుం బోలి వర్తింపఁగన్ . 153

వ. అని ప్రబోధించిన. 154

మ. జననీవాగ్వ్యజనానిలజ్వలితరోషజ్వాలుఁ డై యద్దశా
     ననుఁ డి ట్లంచుఁ బ్రతిజ్ఞఁజేసె జననీ నామాట తథ్యంబు గా
     విను మే ఘోరతపస్వి నై ధనదుఠీవిన్ మించెదన్ లేనిచో
     దనతేజంబున నీదృశం బగు ప్రభుత్వం బైనఁ బ్రాపించెదన్ 155.

క. పెక్కువకు సాటియును గా, కెక్కువయుం గాక జోక నీతనికంటెం
     దక్కువయైనా నిఁక నను, మక్కువ. వీడ్కొలుపు మని సమగ్రవినీతిన్ 156

మ. వినతుల్ సే సె దశాననుండు మమతన్ వేమాఱు దీవించున
     జ్జననిన్ వీడ్కొని కుంభకర్లుఁడుఁ గనిష్ఠ భ్రాతయున్ వెంట రాఁ
     జని గోకర్ణసమాహ్వాయాశ్రమము విశ్వాసంబుతోఁ జేరి కాం
     చనగర్భున్ మది నుంచి యుగ్రతపముల్ సల్పంగ నుద్యు క్తుఁడై . 157

వ. తమ్ములతో ని ట్లనియె. 158.

                       §§§ రావణ కుంభకర్ణ విభీషణులు బ్రహ్మనుగూర్చితపంబు సేయుట §§§
సీ. కమలగర్భుఁడు భ క్తికామధేనువు నిక్కువంబుగా వత్సలత్వంబుఁ జూపు
     బరమేష్టి, యాశ్రితపారిజాతము శ్రాంతిం బాసి కావలసినఫలము లొసఁగు
     భారతీనాథుండు ప్రణతచింతామణి రాతనం బూనియు రక్తి నెరపు
    చతురాననుండు దాససమీపమేరువు కర్బురడాతృత్వగరిమ మించుఁ

తే. దాత తాపసజనకామిత ప్రదాత.
    పెద్ద వేల్పు ముని శ్రేణిఁ బ్రీతి నిల్పు
    నలువ యతివీక్షణాళులు నిలుచుకలువ
    యతని భజియింప మనకోర్కు లబ్బు టరుదె. 159

మ. అని వాణీరమణీమనోహరునిమాహాత్యంబు వర్ణించి, య
     య్యనుఁగుందముల నిర్వురన్ ఘనతపన్యాసక్తచేతః ప్రవ
     ర్తనధౌరేయులఁ జేసి వారి సవిధారణ్యంబుల౯ నిల్పి తా
     నును బ్రత్యేకవనాంతరంబునఁ బ్రశాంతుం డై తపం బున్నెడన్, 160

సీ. వనజకాననశోషకున కెంత కువలయ పరితాపకృతి నాఁగఁ బ్రబలుతపను
    కరములు సోఁక భగ్గన మండురవిరత్నములతనుజ్వాలిక లొలసినపుడె
    చురచురఁ గాలెడిశుష్కతృణశ్రేణిసరణిఁ గన్పడునికుంజములఁ దగులు
    మంటలు వెదురుజొంపములఁ బ్రాఁకి మహోగ్రమైతదంతికభూరుహములనెగసి
తే. దరికొని వహించునక్కాఁకఁ దాళలేక
    తెరలిమృగములు మృగతృష్ణ కరిగి సొరుగు
    మండు వేసవిఁ బంచాగ్నిమధ్యమునను
    గుంభకర్ణుండు గావించె ఘోరతపము. 161

క. ఇటు లెండకు వానకు ను,త్కటతర మగుచలికి వెఱక కంపింపక వే
    సటఁ బడ కుంభకర్లుఁడు, పటునిష్ఠ ఘటించెఁ దపము పదివే లేఁడుల్. 162

సీ. కంటిచూపు జగంబుకంటిరూపు సజాతికద్యుతికతన నైక్యంబు సేసి
    సర్వభూతదయాప్రసన్న భావంబుతోఁ దరలనినియమంబుఁదగులుపఱిచి
    యించుకించుక సందడించుకోరికలతో వివిధేంద్రియవికారవితతు లడఁచి
    ద్వంద్వముల్ సహియించు తాల్మికంబంబుతోఁ గడిఁదిచిత్తేభంబుఁ గట్టివైచి
తే. కమలషట్కంబు శోధించి కమలభవుని, కమలపదములు దలఁచుచు గాఢశక్తిఁ
    దగ విభీషణుఁ డేక పాదమున నిలిచి, యైదు వేలేండ్లు కావించె నతులతపము.

క. మఱి యైదు వేలయేఁడులు, దెఱచిన కనుమాయ కినునిదెసఁ జూచుచు నే
    డ్తెఱనూర్ధ్వబాహుఁడైమతి, దఱుమక శ్రుతినొడివికొనుచుఁ దపమొనరించెన్.

మ. ఎలుకల్ పిల్లులు నీలకంఠములు భోగీంద్రంబు లేణచ్ఛటల్
     పులులున్ సింహము లేనుఁగుల్ శరభపాళుల్ గండభేరుండముల్
     చెలిమిం జెంది విభీషణాశ్రమమునం జెల్వొందు భూనాథ యం
     దుల కుప్పొంగి నటింతు రచ్చర లమర్త్యుల్ పూలు వర్షింపఁగన్ . 165

వ. అని పలికి లోపాముద్రాధిపతి వెండియు రామభద్రున కిట్లనియె.. 166
                                §§§ దశముఖుఁడు వీరహోమంబు సల్పుట §§§
సీ. అఖిలలోకాతీత మగుమహామహిమంబుఁ బడయంగ నూహించి పంక్తిముఖుఁడు
    విధిదేవతాక మై విలసిల్లు మంత్రంబు జపియించుచును నిరశనతఁ దాల్చి

     యొక కాలిపెను వ్రేలి నుర్విఁ జక్కఁగ నిల్పి సూర్యావలోకనధుర్యుఁ డగుచుఁ
     దనహృదయాకాశమునఁ బితామహు నుంచి ధ్యానించి వేయేఁడు లైన వెనుక
తే. నగ్రమున మండునుగ్రతరాగ్నిలోన, మునుకొని కరాసిఁ దలఁద్రుంచికొనిసభక్తి
     కముగ బ్రహార్పణంబుఁగాక యంచు,వీరహోమంబుఁ గావించె విస్మయముగ.

మ. వికటాచారుఁ డతండు నిశ్చలమతిన్ వేయేండ్ల కొక్కొక్కమ
     స్తకమున్ ఛేద మొనర్చి వేల్చు దమునస్సంభాసితార్చిం దదీ
     యకరోటిప్రతతుల్ పటిల్లు మని వ్రయ్యం బుట్టుఘోషం బజాం
     డకబాహస్ఫుటనా ప్రచండతర మై నానాదిశల్ నిండఁగన్ . 168

శా. పౌలస్త్యార్చితకీకసాస్రపలశుంభన్మస్తకప్లోషణ
     స్థూలాభీలకరాళ పావకశిఖాస్తోమంబు ధూమంబుతో
     బౌలోమీపతి ప్రోలు చుట్టికొనియెన్ భావిప్రవృద్ధాసురో
     ద్వేలాస్త్రార్చులు తద్బలంబు లిటు లుద్దీపించునన్ పోలికన్. 169

మ. ఉరునిష్ఠోగ్రదశాస్యనిర్మితహోమక్రియాదగ్ధమే
     దుర మేదఃపలలాస్థికై శికమిళద్దుర్వాసనల్ భూనభోం
     తరముల్ నిండఁగ సైఁప నోప కిఁక నెన్నం డిచ్చునో వీనికిన్
     వర మబ్జాసనుఁ డంచు నెంచు వినుత్రోవం బోవు దేవౌఘముల్ 170


క. కైకసికొడు కిటువలె ని, ర్వ్యా కులమతి దశసహసవర్షము లరుగన్
   భీకరగతిఁ బదియవతల, వీఁకం దెగఁ గోసి వహ్ని వేల్వఁగఁ దలఁచెన్ . 171

వ. అప్పుడు. 172

చ. గగనముమ్రోసె వీచే సుడిగాలి సముద్రము లింకె మేరువుల్
    దిగఁబడె భూమి చక్రముగతిం దిరిగెన్ రవి త్రోవఁ దప్పె న
    మ్మగలమగండు వీఁక దశమం బగుమస్తక ముత్తరించి వే
    ల్వఁ గడఁగి హోమవహ్ని చటులంబుగఁ బ్రజ్వరిలంగఁ జేసినన్, 173

శా. ఆపౌలస్త్యవివర్ధమానఘనహోమాగ్నిజ్వలజ్జ్వాలికల్
     పై పైఁ బ్రాకిన దిక్పతుల్ యతులు విభ్రాంతాత్ములై సర్వలో
     కాపూర్ణాధిపతిత్వసౌఖ్యనిధి బ్రహ్మం జేరి సేవించి స్వా
     మీ పద్మాసన యార్తులన్ మముఁ గృపాదృష్టిన్ విలోకింపవే. 174

మ. దశకంఠాసురుఁ డగ్నిఁ దొమ్మిదితలల్ దా వేల్చియున్ నేటిఁ క
     ద్దశమం బై నశిరంబు వేల్వఁ గడగం దద్ధోమధూమచ్ఛటల్
     దశదిగ్భాగము లావరించె నికఁ బ్రత్యక్షంబు గా కుండి తే
     ని శిఖిజ్వాలలఁ గ్రాగు ముజ్జగములున్ నిక్కంబు వాణీశ్వరా. 175

ఉ. ఒప్పిద మైననీకరుణ నున్నతుఁ డై మఱి మీఁదుగా జగం
    బప్పిశితాశి యేఁచు హవనానిల మిప్పుడె యేఁచ బూనెడిం



     జెప్పెడి దేమి యింక నెడ చేసినఁ దప్పగు మీఁది బాధ కే
     మొప్పితి ముగ్ర మవ్వికృతహోమము మాన్పఁ గదయ్య చయ్యనన్. 176

వ. అని భయోత్పాతవిధూతచేతస్కులై చేతులు ముకుళించి ప్రార్థించువేల్పు దొరల దరహాసవదనంబు
     దెరలం గనుంగొని మంచి దని సమ్మతించి విరించి కాంచనమయకమలాసనంబు
     డిగ్గ నుఱికి యతిసత్వరంబుగ 177

                        §§§ రావణకుంభకర్ణ విభీషణులకు బ్రహ్మ ప్రత్యక్షమై వరంబు లిచ్చుట §§§
సీ. శ్వేతకేతుఁడు జోకసేసి తెచ్చినపదార్వన్నెయంచహుమాయి వడిగ నెక్కి
    వెనువెంట వచ్చు సావిత్రీముఖస్త్రీలప్రణయభాషలమీఁది బాళి మాని
    ప్రాఁబల్కు తుదలతోఁ బ్రణుతించుసంయమిప్రవరులనుతిఁ బెడచెవులఁ బెట్టి
    సృష్టి క్రమముఁ దెల్పఁ జేరికై నడచు బ్రహదిక్కుగని మాటలాడ మఱచి
తే. గునుకుపరువునఁ బఱతెంచుకొడుకువీణ
    వినెడుర క్తియుఁ బూనక వేల్పుఁ జెలువ
    లాడఁ బాడంగ నెడ యీక యాక్షణమున
    దశముఖున కబ్జభవుఁడు ప్రత్యక్ష మయ్యె. 178

శా. ఈచందంబునఁ బంక్తికంఠునకు వాణీశుండు గాన్పించి వీ
     రాచారుం డతఁ డున్న యొక్క త పై హస్తాసిఁ బూన్పంగ నో
     హో చాలింపు దశాస్య యీ తెగువ కుద్యోగింతు రే మెచ్చితిన్
     నీచిత్రాధ్వరకరనైష్ఠికతకున్ నీకోర్కు లీ వచ్చితిన్. 179

వ. అని వారించి హితోక్తులు వివరించిన విరించనుపలుకు లాలించి సాహసోద్యోగంబు సాలించి లేచి తలయెత్తి
     యతనిం బొడగాంచి పులకాంచితశరీరం డయి యవ్విశ్రవఃకుమారుం డనేక నమస్కారంబు
     లాచరించి యిరువదికరంబులు ముకుళించి హర్ష గాద్గద్యంబు వహించి యి ట్లనియె. 180

సీ. ప్రకృతిదురాపమై పరిపూర్ణ రూప మై యెసఁగుసత్తామాత్ర మీవె కావె
    సత్త్వప్రధాన మై సాక్షితాధీన మై యెసఁగునీశ్వరతత్త్వ మీవె కావె
    సృష్టినిర్మాత వై యిష్టార్థదాత వై యెసఁగుసర్వనియంత వీవె కావె
    పురుషాహ్వయుండ వై బోధమయుండ వై యెసఁగుమహాత్ముండ వీవె కావె
తే. నిన్ను సృజియించుకొన్నది నీవె కావె
    నిన్ను నీయందుఁ గనుఁగొందు వీవె కావె
    యెల్ల శ్రుతు లెంచ మను వేల్ప వీవె కావె
    యెల్ల శ్రుతులకు నావాస మీవె కావె. 181

మ. తనుబుద్ధీంద్రియముల్ వికారములు నాత్మ జెందఁగాఁ జేసి వా
     నిని ద త్తద్బహుకరముల్ సలుపఁగా నీవే నియోగించి యం
     దున దారిద్ర్యము వైభవంబు సుఖమున్ దుఃఖంబుఁ గాలంబు వెం
     టనె కల్పించి సమ స్తముం గను నినున్ ధ్యానింతు నశ్రాంతమున్ . 182

ఉ. దేవ శుభాశుభస్థితులు దేవన రాసురముఖ్యు లొందఁ గా
      నీవె యొనర్తు వాఢ్యుడవు నీ కొకవిన్నప మాచరించెదన్
      జీవులు మృత్యు వన్న వెఱసెందుదు రుగ్ర విరోధి మృత్యువే
      కావునఁ దద్భయంబు వెలిగా బ్రదుక వర మీయ వే కృపన్ . 183

మ. గరుడాదిత్యనభశ్చరాసురమరుద్గంధర్వసిద్ధర్షి భా
      స్వరవిద్యాధరయక్షకిన్నరపిశాచ ప్రేతరక్షఃఫణా
      ధరభూత గ్రహవిశ్వసాధ్యవసురుద్ర శ్రేణిచేఁ బోరులన్
      మరణం బొందనిమన్కి యిము గణియింపన్ దక్కుమర్త్యాదులన్ 184

మ. అని ప్రార్థించినఁ బద్మగర్బుఁడు తదీయాశాస్య మీడేర్చి తెం
      పున ము న్నాతఁడు వహ్ని వేల్చినశిరంబుల్ గ్రమ్మఱన్ మొల్చి చె
      ల్వెనయన్ గట్టడ సేసి సౌఖ్యనిధి వై యీరేడులోకంబులం
      దు నజయ్యుం డనుకీర్తిఁ గాంచు మని సంతుష్టాత్మున్ గావించుచున్ . 185

చ. అతనిసపర్యలన్ బ్రముదితాత్మకుఁడై పర మేష్ఠి యోగరం
      జితమతి యావిభీషణునిఁ జేరి తపంబున ధర్మమార్గసు
      స్థితి ననివార్యభూతహితశీలత నీప్రతిఁ గాన నేను మే
      చ్చితి విను వత్స నీవలచుచింతితముల్ వచియింపు నావుడున్ 186

శా. అంతర్నాదము విన్నయోగివరున ట్లామాట లాలించుచున్
      సంతోషించి విభీషణుండు విమలస్వానం భవన్తం దయా
      వంతం శాన్త మనన్తరూపిణ మహంవన్దే"యటంచు? వచః
      కాంతున్ జేరి నమస్కరించి పలికెన్ గంభీర వాచార్బటిన్. 187

చ. ఇనుఁడు కరంబులన్ గళల నిందుఁడు కీలల వహ్ని వన్నె గాం
      చినక్రియ సద్గుణంబులఁ ప్రసిద్ధి వహించినలోకకర్త వీ
      వెనసినకూర్మి వచ్చి నను నెంతయు మెచ్చితి నంటి వింతకం
      టెను వర మున్న దే యిపుడు నేఁ గృతకృత్యుఁడ నైతి నీశ్వరా. 188

ఉ. ఐన నమోఘదర్శనుఁడ వైనజగత్పతి వీవె మెచ్చి యిం
      పైనవరంబు వేఁడు మని యానతి యియ్యఁగ నూర కుండ రా
      దే నుతి సేసి వేఁడెద సహింపఁగఁ గూడనియట్టియాపదన్
      మానితధర్మమార్గమున మామకచిత్తము నిల్వఁ జేయవే. 189

క. ఏయాశ్రమంబు జెందిన, నాయాశ్రమధర్మమునకు ననుకూలముగాఁ
      జేయుము హృదయము ధార్మికుఁ, డేయెడ నవిజయ్యుఁడనఁగనే వినియుందున్ .

తే. శిక్షితముగాకయె మదీయచిత్తవృత్తి, కనుగుణంబుగ నిమ్ము బ్రహాస్త్ర మనిన
     నావరము లిచ్చి తద్బుద్ధి కజుఁడు మెచ్చి, యిచ్చననుకంపజనియింప నిట్టులనియె.

ఉ, ఆసురయోనిఁ బుట్టియును నాసురవృత్తి యొకింత లేదు నీ

    కీసుర లైన దీ టగుదురే భవదుక్తులు నన్నుఁబ్రీతునిన్
    జేసె నమర్త్య భావము సుశీల యొసంగితి నింక నీవు దే
    వాసురకోటిలో ఘనుఁడ వై మను మంచు ననుగ్రహించినన్ . 192

క. కొనియాడి రమరు లజుఁ గనుఁ, గొని యాడిరి వేల్పుముద్దు గుమ్మలు వెత వీ
    డ్కొని పాడిరి గంధర్వులు, పెను పగునమరత్వ మవ్విభీషణుఁ డొందన్. 193

చ, పరహితుఁ డైనవానికి శుభంబు లభించిన నెల్ల వారలున్
    హరుసమె కండ్రు దుర్జనున కాయువు శ్రీయును వృద్ధిఁబొందినన్
    బరమభయంబుఁ జెందుదురు భానుకులేశ్వర కావునన్ దయా
    పరుఁడు విభీషణుం డమరభావము నొందిన నుబ్బి రందఱున్ . 194

                     §§§ దేవతలు కుంభకర్ణునకు వరంబు లీయవల దని బ్రహ్మను వేఁడుట §§§
చ. బిసరుహగర్భుఁ డిట్టుల విభీషణు గోర్కు లొసంగి ప్రాభవం
    బెసఁగఁగఁ గుంభకర్లుకడ కేగెడునప్పుడు వేల్పు లాడి ర
    య్యసుర కభీష్ట మియ్యఁ దగ దయ్య పరాకు సరస్వతీశ వాఁ
    డసదృశకాయుఁ డీభువన మంతయు మ్రింగఁగ నోపు నొక్కటన్. 195

సీ. గట్టిగాఁ బద ముర్విఁ బెట్టె నేనియు సప్తపాతాళలోకముల్ భగ్నము లగు
    నొక్కమా టటు నిల్చె నిక్కె నేనియు శిరః ప్రహతి చేనూర్ధ్వకర్పరములగలు
    నుత్సాహ మొదవ మై నుబ్బించెనేనియుఁ బచ్చిగోడలజాడ విచ్చు దిశలు
    లేచి నీల్గుచు బార సాఁచెనేనియుఁ జక్రవాళాచలేంద్ర మవ్వలికి వీఁగుఁ
తే. గేరి నవ్విన మాబోఁటివారి కెల్ల
    గుండెదిగు లగు మమ్ముఁబేర్కొనఁగ నేటి
    కీవఱకు వాడు సేసిన హింస లెంచఁ
    గూడ దటువంటిఖలు దయఁ జూడ నేల. 196

ఆ. తనువుఁజూత మన్నఁ గన రాదు తుద మొద, లాత్మఁ జాతమన్న నతికఠినము
    నడకఁ జూత మన్నఁ గడుహింస వాఁడేల, ధాత వానితపము దయ్య మెఱుఁగు.

క. నందనవనవాసినులఁ బు, రందరసహచరల నచ్చరల బెక్కండ్రన్
    మ్రందించె మ్రింగె నరముని, బృందంబుల ఖలుఁడు వీఁడు పిన్న తనమునన్. 198

శ. ఏవరము లేకయే బలు, కావరమున జగము లేఁచుఖలునకు వరముల్
    దేవర యొసఁగుట మండెడు, పావకులో నేయి వోయు భంగిన కాదే. 199

ఉ. కావునఁ గుంభకర్ణుపయిఁ గారుణికత్వము మాని నీవు మా
    యావివశాత్ముఁ జేసి వర మం చొకదాని నొసంగిన౯ శుభం
    బావహిలున్ జగంబులకు నంచు సురల్ వివరింప భారతీ
    దేవిముఖంబుఁ జూచెఁ దొలిదేవర సాదరవీక్షణంబునన్ . 200

వ. ఇటువలెఁ దనమొగంబు గనిననలుమొగంబుల వేలుపుదొరయింగిత మెఱింగి
    మెఱుంగుల తెఱంగునఁ దుఱంగలించు మెఱుంగుజూవులఁ దొంగలిఱెప్పలనప్ప

       ళించుచు విప్పుగలకప్పుఁగొప్పవిరుల సరులకై కప్పుకొనునళిపరంపరల
       కళుకుసంపాదించునవతంసచాంపేయ ప్రభాసంపదలకు లంకెలగుచుఁగనత్కనకతాటంకదీప్తులు విద్దెంబుఁ
       జూవుకోవున నందంపుఁ జెక్కుటద్దములపై ముద్దుగురియంగరంబులఁ బుస్తకాక్షమాలికావిపంచికలు మెఱయఁ
       గొదమరాయంచవలె నచ్చదువులజవరాలు పతియెదుటి కరుదెంచి యుదంచితాంజలి యొనరించి
       వినయలజ్జాట్రాభరానతివిలోకనంబులన్ దద్వదనంబు లలంకరించి యల్లన యేమి పని యాచరింతు నాన
       తిం డనిన నజుండు నద్దేవి నాదరించి యిట్లనియె. 201

మ. సరసీజేక్షణ యెల్ల జీవులరసజ్ఞల్ సేరి క్రీడించునే
       ర్పరి వీవే కద కుంభకర్ణరసనాభాగంబునన్ నిల్చి నే
       వర మీవచ్చిన వేళ నయ్యసురచే వ్యర్థోకులాడింపు మేల్
       వరమున్ గోరఁగ నీకు సొమ్మనిన నవ్వాగ్దేవి య ట్లుండినన్. 202

               §§§ సరస్వతితోడ్పాటుచే బ్రహ్మ కుంభకర్ణునకు నిద్ర వరంబుగా నిచ్చుట §§§
మ. అమరజ్యేష్ఠుఁడు నంత నయ్యసుర డాయం బోయి లేకుంభక
       ర్ణ మహా భాగ భవత్తపంబు గల నానందంబు వర్ధిల్లె వేఁ
       డు మభీష్టం బొడఁగూర్తు నిప్పుడన వాఁడున్ మ్రొక్కికి షణ్మాసముల్
       తమి నిద్రింపఁగ నొక్కనాఁ డశన మొందన్ జేయవే నావుడున్ . 203

చ. వనజజుఁ డట్ల యౌ నది యవశ్యము మేలు సుఖాన నిద్ర పొ
       మ్మని సురకోటితోఁ జనియె నంత సరస్వతియున్ దదాస్యవ
       ర్తనముడిగెన్ నిజప్రతిభఁ దాలిచి యప్పుడు కుంభకర్ణుఁడున్
       దననుడువుల్ దలంచుకొని తా నిటు లంచుఁ దలంచె నెంతయున్ . 284

మ. అకటా పద్మజునంత వాఁడు వర మియ్వన్ మంచికో
       రిక లర్థింపక నిద్ర, యి మ్మనెడివెఱ్ఱిన్ గంటిమే యిట్టి దే
       టికి నానోటికి వచ్చె హా తెలిసికొంటిన్ వేల్పులే చేసి రీ
       వికలత్వం బిఁక నేల యైనపనికిన్ విభ్రాంతి వాటింపఁగన్ . 205

క. పౌరుషమునకును దైవం, బారయ ఫలకారి యందు రాదైవంబే
       వైరస్యము వహియించిన, నేరూవునఁ బురుషుఁడొందు నిష్టార్థంబుల్ . 206

క. దైవోపహతుఁడు సుకృతపుఁ, ద్రోవ వెదకి పోవ నదియె దుర్గతి యగు మేల్
       గావలయునన్నఁ గీ డగుఁ, గావున నిఁక జాలిఁ జెందఁగా దనుచున్నన్. 207

ఉ. అన్నయుఁ దమ్ముఁ డచ్చటికి నంతటిలోఁ గడువేడ్క వచ్చి తా
       నున్నవిధంబుఁ జూచి యదియున్ విని దైవమె యిట్లు సేసినన్
       విన్నఁదనంబుఁ జెందఁ దగునే వగపేటికిఁ బామరుండవే,
       యన్నఁ గలంకదేఱె నతఁ డర్కకులేశ్వర వారిమాటలన్. 208.

క. ఈ తెఱఁగున దశకంఠుఁడు, ధాతవరంబునను గామితము లొనఁగూడన్

      భ్రాతృసమేతంబుగ శ్లే, ష్మాతకననమునకుఁ జనియె సంతోషమునన్. 209

వ. అని యెఱింగించి రఘుకులగ్రామణితో మఱియు నగ స్త్యమునిశిఖామణి యిట్లనియె. 210
§§§ సుమాలిపాతాళమునుండి ప్రహస్తాదిపుత్రులతోఁగూడ రావణునియొద్దకు వచ్చుట §§§
చ. దశముఖుఁ డీప్రకారమునఁ దమ్ములతోఁ జని తల్లికిన్ బ్రతీ
       ప్రశమధి యైనతండ్రికిని భక్తిఁ బ్రణామము లాచరించి దై
       త్యశతము గొల్వఁ బాయక తదాశ్రమభూమి వసించు టంతయున్
       విశదముగా నెఱింగి కడువేడుకఁ బొంగి సుమాలి యయ్యెడన్. 211

చ. చిలువలగుంపు వెల్వడిన చెల్వున రాక్షససైనికుల్ రసా
      తలమున నుండియున్ వెడలి తన్ భజియింప బ్రహస్తముఖ్యపు
      త్రులు సహితా ప్తబంధు లయి తోడన రా దుహితృప్రియాత్మజా
      తులఁ దిలకించునుత్సవము దోరము గా నరుదెంచుచున్నెడన్. 212

శా. ఆమాతామహురాక మున్నె వినిభ్రాత్రన్వీతుఁ డై కైకసీ
      కామిన్య గ్రసుతుం డెదుర్కొని నమస్కారంబుల౯ బూజలన్
      క్షేమప్రశ్నములన్ వినీతియును భక్తిస్నేహముల్ సూప న
      త్యామోదంబు వహించి యాతఁడును నుద్వత్ప్రౌఢవాగ్జృంభణన్. 213

సీ. చిలువమేపరిపుల్గుబలుచట్టుపలఁ బుట్టుగాడ్పుచే నొదవినకాళ్ల వడకు
     గొంటుబంగరుఁగంటికంటువేలుపువింటిగుణరవంబున నంటుగుండెదిగులుఁ
     దొలివేల్పుఁ జిందంపుఁదోరంపురవళిచేఁ గర్ణరంధ్రములందుఁ గవియుచెవుడు
     వేయియంచులవాలు మ్రోయు చుద్ధతి డాయునపుడు పైకొనిన భయజ్వర్యంబు

తే. నేటితోఁ బాసె రాక్షసానీకమునకు, వీరహోమంబుచే నీవు వేల్పుఁ బెద్ద
     వెఱఁగుపడఁ జేసి లోకైకవిజయహేతు, వరములొందుటఁ బౌలస్త్యవరకుమార.
మ. పరిపూర్ణ్వోజ్జ్వలకా ర్తికీకుముదినీప్రాణేశ్వరజ్యోత్స్నవై
     ఖరి నీకీర్తిరమావిలాసము పొసంగన్ సొంపుఁ గాంచెన్ నిశా
     చరవంశాబ్ధి మదీయహృత్సరసిజోత్సాహైకసంపాదన
     స్ఫురణన్ మించె భవత్ప్రతాపరవి రక్షో నాథ నిక్కంబుగన్. 215

మ. పరమాన్నాజ్యసమిన్ముఖాహుతులచే బ్రహ్మార్పణం బంచు న
     ధ్వరముల్ సేయుదు రందఱున్ వసుమతిన్ ధైర్యోన్నతిన్ నీగతిన్
     శిరముల్ పాణిఁ గృపాణిఁ జేర్చి యనలార్చిన్ వేల్చి నీయద్భుతా
     ధ్వరకర్మం బొనరింప రెవ్వరును సత్యం బాసుర గ్రామణీ. 216

తే. మిగులఁ గోపించి తన్నిన భృగుమహర్షి , యడుగుపట్టిన వేల్పురాయిడికి వెఱచి
    యడుగుపట్టినదైత్యులయాపదబ్ధి కధిప యుష్మత్ప్రతాప మౌర్వాగ్ని యయ్యె.

క. బలియుఁడ వన్వయక ర్తవు, కలిగితి విఁక నేల డాఁపఁగా మనకొఱకే

      తొలుతన్ మత్ప్రేరితుఁ డై , లలిత స్థితి విశ్వకర్త లంక యొనర్చెన్. 218

వ. అట్టిపట్టణం బిటు లేల విడిచి పెట్టితి రందు వేని వినిపిం చెద నాకర్ణింపుము. 219.

మ. త్రిజగద్ద్రోహ మొనర్చుచున్ సమదవృత్తిన్ గూడి క్రీడించుమా
     భుజగర్వంబు సహింప లేక చని వేల్పుల్ దెల్పికొన్నన్ జతు
     ర్భుజుఁ డభ్రంకషశంఖరాజనినదంబుల్ మీఱ సంగ్రామ కే
     ళిజయోత్పాదన శాలి మాలి మును కూల్బెన్ గెల్చె మ మ్మందఱన్. 220

ఉ. అడ్డము వచ్చి వేల్పుపురి యాఁగెడుమ మ్మిటు లావరించి మా
    యొడ్డనముల్ దెరల్చి హరి యుద్దతిఁ జూపిన గొల్ల వెల్చినన్
    దొడ్డికిఁ బాఱునాపనులతో సరియై పురిఁ బాసి యాండ్రనున్
    బిడ్డలం వెంటఁ బెట్టుకొని భీతిని చేరితి ముర్విక్రిందటన్ . 221

తే. అది మొదలు లంక పాడైన నసుర నాథ
    యంత మీయన్న నడుమఁ దా నాక్రమించె
    దానమున నైన సామ భేదముల నైన
    బలిమి నైన గ్రహింపు మప్పట్టణంబు. 222

తే. ఒరులపాలైనతమసొమ్ము మరలఁ గొనుట
    యార్తిఁ జెందినచుట్టాల నరసికొనుట
    నిజకులో చితధర్మంబు నిలిపికొనుట
    బలియుఁ డగుటకు ఫల మండ్రు పంక్తి వదన. 223

తే. కరముచేఁ గంకణమ్ము గంకణమువలన, గరముఁ గరమొప్పుకరణీ లంకాపురాధి
    పత్యమున నీవు వెలయు దప్పట్టణంబు, వెలయునీ చేతనని తాత దెలుపుటయును.

మ.దశకంఠుం డనుఁ దాత నీనుడి యథార్థం బైనచో నెంతబా
    లిశుఁ డైనన్ సయ మేది యగ్రజుని బల్మిన్ ద్రోచి దుర్వృత్తిఁ ద
    ద్వశ మౌని ల్లెటు లాక్రమించు మఱి లేవా యిండ్లు పెద్దల్ భవా
    దృశులే యి ట్లన నస్మదాదులకు బుద్ధి స్థైర్యముల్ గల్గునే. 225

క. అని తాత బోధ సేసిన, పనికిన్ సమ్మతిల కతఁడు ప్రత్యాఖ్యానం
    బొనరించె నంత నొకనాఁ, డనువగుసమయంబుఁ గని ప్రహస్తుం డనియెన్ .

శా. పౌలస్త్యాన్వయచంద్రశూరులకు సౌభ్రాత్రంబు బాంధవ్యమున్
     వాలాయం బన వచ్చునే బలిమి యెవ్వాఁ డొందు వాడే కదా
     త్రైలోక్యంబున మేటి యానడతయే ధర్మంబు యక్షేశుపై
     నేలా యీమొగమాట మాతనిపురంబే లంక శంకింపఁగన్. 227

ఉ. ఏల బహూక్తు లప్పురి మహిన్ సృజియించినయట్టివారు వీ
     రేలినవారు వీ రతని కే డది గా దతఁ డేలి కంటివా
     యేలఁడె యింతకాల మిఁక నేలఁగ నీ కగుఁ బాలివంతునన్
     బాలికి లంకె లెయ్యెడల భ్రాతలు గారె పులస్త్యనందనా. 228

ఉ. అన్నను ద్రోచి యెంత చెడు గైన దదీయగృహంబుఁ జేరునే
     యన్నది వింటి మీవలన నారయఁ గశ్యపునాండ్రు దైత్యులన్
     గన్న నెలంత వేలుపులఁ గన్న నెలంతయుఁ దత్సుత వ్రజం
     బున్న తెఱంగు వారల సహోదర మైత్రి జగం బెఱుంగదే. 229

ఉ. ఎక్కువ లాడఁగా వెఱతు నింద్రుఁడు భ్రాత లటంచుఁ గాచెనే
     యెక్కడనై న దైత్యుల మహోద్ధతి గల్గిన నొంచుఁ దక్కినన్
     దిక్కయి కావు మంచు హరిఁ దెచ్చి వధింపగఁ బంపుఁ జూడమే
     యెక్కడి యన్న లేటి తగ వేటి విచారము శూరకోటికిన్ . 230

మ. దయయున్ ధర్మము సత్య మార్జవము శాంతం బెప్పుడుం బూని స
     త్ర్కియలన్ సౌఖ్యము లొందువేలుపులె దైతేయచ్ఛటన్ ద్రుంపఁగా
     భయ మేలా మనవంటివారలకుఁ దద్భంగిన్ బ్రవర్తింప నె
     ట్లయినన్ మేలగు దాయ గెల్వు మసురేంద్రా యంచు బోధించినన్. 231

                §§§ దశగ్రీవుఁడు లంకఁ దన కిమ్మని ధనేశునితోఁ జెప్పఁ బ్రహస్తునిఁ బంపుట §§§
శా. ఆకర్ణించి యతండు రెండు గడియల్ ధ్యానించి మీభాషితం
    బేకర్తవ్య మటంచుఁ దాతవదనం బీక్షించుచుఁన్ లేచి బా
    హాకాయకు లై యమాత్యులు ప్రహస్తాదుల్ భటుల్ గొల్వ లం
    కాకాంక్షన్ జని నిల్చె దండధర దిగ్రాజత్త్రికూటంబునన్ . 232

వ. నిలిచి యచ్చట. 233

చ. అతులవచఃప్రశ స్తునిఁ బ్రహస్తునిఁ జూచి దశాస్యుఁ డీ విఁకన్
    బితృసము నస్త దగ్రజుఁ గుబేరుని శీఘ్రమ చేరి నాయభీ
    ప్సితమును లంక ము న్నసుర శేఖరు లేచిన కార్యభంగియున్
    జతురతఁ జెప్పి యప్పుర మొసఁగఁగ వే చని యాడి రమ్మనన్ 234

చ. అతఁడు హసా దటం చతిరయంబున లంకకు బోయి కిన్నరీ
    శతమణికంకణక్వణనచారుకరోదరచామరానిల
    ప్రతిహతకుంతలుం డయి సభాస్థలి నోలగ మున్న దేవతా
    పతినిభునిన్ ధనప్రభుని భక్తిఁ గనుగొని మ్రొక్కి యిట్లనున్ . 235

ఉ. దానదయాదిసద్గుణనిధాన పరాకు భవత్ప్రియానుజుం
    డైన దశాననుండు వినయంబున మీ దగుసేమ మారయం
    గా ననుఁ బంచె మీపదయుగంబునకు?నతు లాచరించి మీ
    తో నొక మాటఁ దెల్పు మనె దోరపు వేడ్క వినుండు తెల్పెదన్ , 236

 మ. మనమాతామహు లాది కాలమున నిర్మాణంబు సేయించి యుం
      డిన గేహాంబఁట లంక యెవ్వరచటన్ లేకుండిన్ మీరు గై
      కొని పాలించితి రిప్పు డద్దడనుజముఖ్యుల్ వచ్చినా రందఱున్

     ననుఁ గొల్వన్ బుర మేను మీవలెనె కొన్నాళ్లేలఁ గాంక్షించితిన్. 237

మ. అని మీకూరిమితమ్ము డాడు మనినాఁ డామాట యట్లుండే యో
     జనయున్ దెల్పెదఁ బంక్తి కంధరుఁడు భాషానాథ దీవ్యద్వరం
     బునఁ దేజంబున మేటి నెయ్యమె తగున్ మూర్ఖుల్ విరోధంబు సే
     యన యున్నా రమితంబుగా నచట నయ్యా నీదుచి త్తం బనన్. 238

శా. ఆయక్షేశుఁడు పంక్తికంధరునమాత్యగ్రామణిన్ జూచి యే
     మో యం చుండితి నింతమాత్రమునకోహో యింతసంకోచ మే
     లా యీ ప్రో లొకఁ డెంత నాధనము నాయెశ్వర్యమున్ బోవఁ దా
     నే యర్హుం డగు టేమీ మీ రెఱుఁగరే యి మ్మేది భేదోక్తికిన్. 239

క. నేనై చేయఁగ వలసిన, దాని నెఱింగించె మేలు తమ్ముుడు నెమ్మిం
    దా నిప్పట్టణ మేలుట, నే నేలుటకంటె వేడ్క యిబ్బడి గాదే? 240

వ. అని కలయం బలికి, 241

క. కాపురము సేయ కిఁక లఁ, కాపుర మెడఁ బాయ వలసెఁ గా యనుబలు వౌ
    తాపము దోఁపఁగ నిక ప్ర, తాపము గలయనుజుఁ దలఁచి ధనదుడు మరలన్ .

క. రమ్మను మా తమ్మునిఁ దన, సొ మ్మనుమా లంక రాక్షసులతో మేల్ గై
    కొమ్మనుమా వల దనుమా, న మ్మనుమా యనుచు దండనాథునిఁ బని చెన్ . 243

వ. ఇవ్విధంబున మనుష్యధర్ముండు దుర్మదుం డగుదశకంధరుసకుఁ బ్రత్యుత్తరంబు వచియింప దూతన్ బంచి
    తత్క్షణంబ, 244

§§§ విశ్రవునిర్దేశంబువలన ధనేశుండు కై లాసంబు సేరుట §§§

మ. నవరత్నోజ్వలదివ్యపుష్పక విమానం బెక్కి వేవేగ
     విశ్రవసున్ జేరి నమస్కరించి యనుజప్రారంభ మాద్యంతమున్
     సవిశేషంబుగఁ దెల్పి యెయ్యది నివాసం బెందు వర్తింతు మీఁ
     దివిచారం బిఁక నేమి తండ్రి కృప నిర్దేశింపవే నావుడున్ 245

మ. ధనదున్ గన్గొని దండ్రి, యిట్లనియెఁ బుత్త్రా నేఁడు గా దద్దురా
     త్ముని దౌసప్పని యల్లనాఁడె విని యీదుర్బుద్ధి యేమూర్టు దె
     ల్పె నయో యగ్రజుప్రోలు గావలెనె బల్మిన్ గైకొనన్ జోటు లే
     దె నయం బేల పరిత్యజించె దని సూక్న్తి నీతి నేఁ జెప్పినన్. 246

శ. చిలువకు బదనికఁ జూపిన, చెలువున నాపలుకు వాఁడు సేకొన కలుకన్
     బలుకక మొగముల జేగుఱు, లొలుకఁగ వడి లేచి యిచట నుండక చనియెన్ .

ఉ. వాడు మదాంధుఁ డార్యు లగువారలు వల్కినవాక్యపద్ధతిన్
    రాఁడు పయోజగర్భునివరంబున లోకవిభుండుఁ దాన యై
    నాఁడు దురాత్ము లైనదితినందనులన్ బలుమందిఁ గూడుకొ
    న్నాఁడు శపించినన్ గినిసినన్ బని సేయదు వానిపై నికన్ . 248

చ. తగనికుమారుఁ డైన మమతారహిత స్థితి యొప్పుఁ దండ్రికిన్
    దగనిసహోదరుం డయినఁ దానును బాయుట యొప్పు నన్నకున్
    దగ దని నిగ్రహించినను దాదృశు లౌదురు గాన వానితో
    దగ దికఁ బొత్తు నీ కొక హితం బెఱిఁగించెద విన్ము పుత్త్రకా. 249

శా. లీలోద్యానలతాకుడుంగవిహర ల్లేఖాంగనాహాసరు
     గ్జాలప్రసవదిందుకాంతలహరీసంబంధమందాకినీ
     నాళీకోత్పలవాసనాజనిత కాంతాయుగ్బలోల్లాస మౌ
     కైలాసంబు వసింప నీకుఁ దగు నింకన్ జేరు మచ్చోటికిన్ 250 .

ఉ. అచ్చటి కేళికావనము లచ్చటి కల్పిత భూధరోచ్చయం
    బచ్చటియచ్చపుంగొలఁకు లచ్చటి బంగరుఁజయతమ్మి పూ
    లచ్చటిరత్నమందిరము లాత్మకు మె ప్పొనగూర్చునే కదా
    యచ్చటికాఁపురంబునఁ బురారి సఖుం డగుఁ బొమ్ము నావుడున్ 251

చ. జనకునియాజ్ఞ మౌళి నిడి సమ్మద మొప్ప ధనేశుఁ డప్పుడే
    ధనమణివస్తువాహనకదంబము సేకొని యాశ్రితుల్ హితుల్
    దనయులు సైనికుల్ గొలువఁ దక్కక లంకఁ బరిత్యజించి శం
    భుని శరణంబుఁ జేరి ప్రియ పూర్వముగా శరణంబు వేఁడినన్ . 252

క. శరణాగతసులభుం డగు, హరుఁ డాతని నాదరించి యలకాహ్వయ మౌ
    పుర మిచ్చి మెచ్చి మచ్చికఁ, బరమాప్తునిఁగా నొనర్చి పరిపాలించెన్. 253

క. అనయము వినయము నయమును, దనసొమ్ముగ మెలఁగుకీర్తిధనుఁ డెచ్చటి కే
    గిన నిష్టార్థముఁ జేకొనుఁ, గన రామ ధనేశుఁ డిటుల కాంక్షిత మొందెన్ .254

                §§§ రావణుఁడు మొదలగు రాక్షసులు లంకలోఁ బ్రవేశించుట §§§
మ. జనలోకేంద్ర కుబేరుఁ డి ట్లరుగఁ ద్రింశద్యోజనీదీర్ఘయై .
     కనకోద్భాసితసౌధ యై సుగృహ యై కన్పట్టునాలంక ని
     ర్జన యయ్యున్ జెలువొందె నొక్క విభుఁడాసన్ గూడి వీడ్కొన్నఁ జ
     య్యన వేఱొక్కనిరాకకున్ దనరు వేశ్యాకాంత చందంబునన్ 255

ఉ. అంతఁ బ్రహస్తుడున్ జని దశాస్యున కెంతయు వేడ్క నంతవృ
    త్తాంతము విన్నవింప దరహాసముతో సభవారిఁ జూచినన్
    వింతయె నీభుజామహిమ వీఱిడి యై పగఁ బూన రాజరా
    జింతకు గాసి గాఁడె పుర మీయక యుండిన నంచు వారనన్. 256

శ. అది నిజ మౌనని పలుకుచు, మదిలోన ముదంబు వొదల మంచి ముహూర్తం
    బిది యని భార్గవనందను, లదురుగడన్ వచ్చి తెలుప నద్దశముఖుఁడున్. 257

సీ. తనపురోవీథి మాతామహుల్ మదమత్తమాతంగములమీఁదఁ బ్రీతిఁ జనఁగఁ
    దనతల్లి కైకసీధవళాక్షి ముత్యాలపల్లకిపై వారిపజ్జ నరుగఁ

     దనయిరుదెసల నిద్దఱుతమ్ము లపరిమి తానీకినీయు క్తు లగుచుఁ గొలువ
     దన వెంబడినె ప్రహస్తమహోదరసుపార్శ్వమారీచముఖమంత్రిమణులు నడువ
తే. దివ్యరథ మెక్కి శంఖవాది త్ర వేణు, కాహళాదులరవము లాకాశ మొరయ
     ఛత్త్రచామరకేతనచ్ఛాయ లొలయ, వింశతిభుజుండు లంకఁ బ్ర వేశమయ్యె. 258

మ. అరుసం బొందుచు మాల్యవత్ప్రముఖ వూర్వాదిత్యు లవ్వేళ బం
     గరుపీఠంబునఁ బంక్తికంఠు నిడి లంకాపట్టణాధ్యాసి వై
     పరిపాలింపుము దైత్యపాళి ననుచున్ బట్టాభిషేకం బొన
     ర్చిరి శుక్రాత్మజదత్తలగ్నమున భేరీశంఖముల్ మ్రోయఁగన్ . 259

శా. ఆపౌలస్త్యకులేశ్వరుం డిటుల లంకాధీశ్వరుం డై హిత
      వ్యాపారజ్ఞుల బంధులన్ సఖుల మిత్రామాత్యులన్ మాన్యభా
      షాపూర్వంబుగఁ దత్తదర్హ పదవీ సంభావ్యులన్ జేసి వి
      ద్యాపాండిత్యతపోబలాన్వయవయోహంకారముల్ మీఱగన్ . 260

                           §§§ శూర్పణఖను విద్యుజ్జిహ్వున కిచ్చి పెండ్లి సేయుట §§§
మ. అనవద్యస్థితి నుల్లసిల్లు చొకనాఁ డాత్తానుజ నిండుజ
      వ్వని నాశూర్పణఖాఖ్యఁ గన్యఁ గని యుద్వాహంబు గావింప బం
      ధునికాయాన్వితుఁ డై తలంచి యలవిద్యుజ్జిహ్వుఁడన్ కాలకే
      యునకున్ బెండ్లి యొనర్చెఁ దల్లిహృదయం బుత్సాహమగ్నంబుగన్. 261

వ. ఈప్రకారంబున శూర్పణఖకు వివాహం బాచరించి యావిరించిపౌత్రజుఁ డొక శరత్సమయంబున మృగయావినోదం
      బొనరింపన్ దలంచి సమంచితమణిమయస్యందనారోహణంబు గావించి ధనుర్బాణంబులు ధరియించి
      యొక్కరుండ పోయి యమితాగమసమన్వితం బయి పులస్త్యజనకాననంబునుం బోలె నున్న యొక్క నిర్జన
      కాననఁబుఁ బ్రవేశించి యచ్చట. 262
                        §§§ రావణుఁడు మయుకూఁతురగు మందోదరిని బెండ్లియాడుట §§§
క. సురమృగముల నిక నిటువలె, హరియింతు నటంచుఁ దెలువుననువున నయ్యా
      సురశార్దూలుఁడు వనభా, సురమృగముల వేఁటలాడుచున్ జని యెదుటన్ 263

క. మయునిఁ బ్రశాంతకృపారస,మయుని హఠాభ్యాసనియమమహిమాపహృతా
    మయుని గుణముదితినరసుర మయునిఁ దొలుతఁ గైకసీకుమారుఁడు సూచెన్.

వ. చూచి తదనంతరంబ. 265

 సీ. హరినీలములకప్పు నళిజాలములయొప్పుఁ గలకొప్పురహి మెప్పు గులుకు దానిఁ
     గలువ ఱేకులయేపు ఖంజనంబులరూపు నిరసించువాల్ చూపునీటు దానిఁ
     దళుకుబంగరుగిండ్లు దులకించువిరిచెండ్లు నడఁగించుపాలిండ్ల నమరుదానిఁ
     గండచక్కెరదీవి దండకెంపులఠీవి మొలపించుచెంగావిమోవిదానిఁ

తే. దళుకుఁజక్కులదాని సి గ్గొలుకుదాని
     నొఱపు గలదానిఁ దొలు కారు మెఱుపుఁ జాయ
     హెచ్చు జిగిదాని మయువెంట వచ్చుదాని
     బాల నొక్క తెఁ జూచె నప్పంక్తిముఖుఁడు. 266

క. చూచి తలలూఁచి యెటు లని, యేచినతమిఁ దలఁచె! నౌర యీయొయ్యారం
     బీచిన్నిపాయ మీచెలు, వేచెలువలయందుఁ గంటిమే లోకమునన్ 267

సీ. ఈనాతికౌనుతో నెన గాక కాఁబోలు సింగముల్ గుహలలోఁ జిక్కు టెల్ల
    నీబాలనడలతో నెన గాక కాఁటోలు నేనుంగు లడవిలో నీఁగుటెల్ల
    నీచెల్వచూడ్కితో నెన గాక కాఁబోలు సారంగములు పొదల్ దూఱు టెల్ల
    నీకన్యఘనవేణి కెన గాక గాఁబోలు నహులు పుట్టలు సొచ్చి యడఁగు టెల్ల
తే. నీనెలఁతఁ జేరి కాఁబోలు నించువింటి, చెం చతనుఁడయ్యు జగముజయించు టెల్ల
    నీలలన సృష్టి నేసి కాఁబోలుఁ బంక, జాసనుడు విశ్వమున స్రష్ట యగుట యెల్ల

సీ. ఎలదేటి విహరణం బెపుడు వొందనిఫుల్ల కమలంబు దొరసె నిక్కలికిమోము
    రాచిల్క ముక్కుఁ జేర్పనిపక్వబింబంబు ప్రతిబింబ మెనసె నిప్పఁడతిమోవి
    గండుఁగోయిలకు దక్కనిమావిచిగురుల ట్లెసఁగె నీలతకూనమృదుకరములు
    నవభుజంగాలింగనమ్ము సేకొననిగేదఁగితావిఁ దెలి పె నీతరుణివలపు
తే. వన్నెగలక్రొన్ననకటారిమన్నెవాడు, చిన్న వాడు వహించిన చికిలికలువ
    తూపులన మించె నీచెల్వచూపు లవుర, పెండ్లి లేనట్టు లున్న దిబ్బిసరుహాక్షి.

శా. ఈపద్మేక్షణజాతి యెయ్యదియొ పే రే మందురో యీఘనుం
    డీపూఁబోఁడికి నేమిగా వలయునో యే నర్థి నిమ్మన్నచో
    నీపూర్ణేందునిభాస్య నియ్యఁడొ కదా యీకున్న నిం తేల సం
    తాపం బప్పటి కీతనిన్ గెలిచి యైనన్ దీనిఁ బెండ్లాడెదన్ . 270

క. అను సాహసంబు మది నిడి, వినయము గలవాఁడపోలె వింశతి భుజుఁ డా
    యన పోవు త్రోవ కడ్డము, చని వినతి యొనర్చి పలికెఁ జతురత్వమునన్ . 271

ఉ. ఓమహితాత్మ యీవిపిన ముగ్రమృగాకుల మిప్పు డిందు మీ
    రేమిటి కేగుదెంచితిరొ యెప్పుడు నెచ్చట నుందు రేమి మీ
    నామము లానుపూర్విగ వినక్ వలతున్ వినిపింపుఁ డన్న వీ
    తామయుఁ డామయుం డను దశాస్యునితోఁ గలరూప మేర్పడన్ 272

క. దానవశిల్పాచార్యుఁడ, నేను మయుం డనెడువాఁడ నిందువదన యి
    మ్మానిని మందోదరి యనఁ, గా నొప్పు మదీయపుత్త్రి గాంభీర్యనిధీ. 273

ఉ. నామహనీయశిల్పమును నాసుగుణంబులు మెచ్చి దేవతల్
    హేమ యనన్ బ్రసిద్ధి వహియించిన యచ్చర లేమ నిచ్చి రా
    హేమకుఁగా మనోజ్ఞమగు హేమపురంబు సృజించి యచ్చటన్

 
     హేమను గూడి యేను సుఖియించితి పంచశతాబ్దముల్ రహిన్. 274,

శా. ఏమో యీశ్వరమాయ యే నెఱుఁగ తండ్రీ హేమతో నున్న చో
    వ్యామోహంబునఁ బెద్ద కాలము క్షణంబై తోచు నా చెల్వనె
    మ్మో మొక్కించుక చూడకున్న నిమిషంబున్ గల్పమౌ వేయు నే
    లా మే లెట్టిదొ దాని యిల్లు పెడఁబాయన్ లే నహోరాత్రముల్. 275

శా. ఆయెన్ బోయెను నాటిజోలి యిఁక నేలా యీవలన్ వింటివే
     యోయయ్యా యిటు గొన్నినాళ్లు సన నాయోగంబునన్ దౌహృద
     శ్రీ యప్పద్మపలాశలోచన ధరించెన్ గాంచె మాయావి యౌ
     మాయావిన్ మఱి దుందుభిన్ బిదప నిమ్మందోదరీకన్యకన్. 276

చ. అనిమిషు లంతటన్ బిలువ నంపిన న న్నెడఁబాసి హేమ వో
    యిన నది లేని చోట వసియింప సహింపక సంసృతి ప్రవ
    ర్తనము జుగుప్ప గాఁ గని విరాగుఁడ నై తప మాచరింపఁ బో
    వనె సమకట్టి యీసుత వివాహము సేయఁ దలంచి యిమ్మెయిన్ 277

క. తగువాని నెందుఁగానక , జగతిన్ గ్రుమ్మరెద రాత్రిచరశేఖర నీ
    దగుకులము నామ మే వినఁ, దగుదు ననుచుఁ దోఁచె నేనిఁ దగు వివరింపన్ .

ఉ. నా విని పంక్తికంఠుఁడు మనంబున సంతస మంది యో మహా
    త్మా విను నాకు బ్రహ్మ ప్రపితామహుఁడేను బులస్త్యపౌత్రుఁడన్ ్రే
    బావనమూర్తి విశ్రవుఁడు మజ్జనకుండు జగంబునన్ దశ
    గ్రీవుఁడు నా బ్రసిద్ధుఁడ నరీణపరాక్రమ ధైర్య ధుర్యుడన్. 279

మ. లవణాంభోధిగభీరఖేయవృత మౌలంకాపురం బేలుదున్
     స్వవయోరూపకులానురూప యగుకన్యన్ గోరుచున్నాఁడ లే
     దు వివాహం బని పల్కిన మయుఁడు సంతోషించి యర్హుం డితం
     డవు మత్పుత్త్రిఁ బరిగ్రహించుటకు నూహాపోహ లింకేటికిన్ 280

క. అని కృతనిశ్చయుఁడై య, ద్దనుజమణికి దారవోసెఁ దనపుత్రి, మయుం
      డనలునిసన్నిధి నతడున్ , దనరుచుఁ బాణిగ్రహణముఁ దగ నొనరించెన్ 281.

శా. మాణిక్యోజ్జ్వలకంకణస్ఫురిత మౌమందోదరీకన్యకా
      పాణిన్ బట్టిన సాత్త్వికోదయము సూపట్టెన్ దశగ్రీవుమై
      క్షోణీనాయక యెంతతామసగుణస్థుం డైనచో సద్గుణ
      శ్రేణిన్ మించినవారిపొం దొలసినఁన్ జేకూరుఁ దద్భావమున్ . 282

ఉ. రాక్షసరాజ్యలక్ష్మి యన రంగు వహించిన యప్పయోజప
      త్త్రేక్షణనిట్లుపెండ్లి యయి యెంతయు వేడ్క దశాస్వరాక్షసా
      ధ్యక్షుఁడు మామకు బహువిధార్చన లిచ్చిన నాతఁడు లలా
      టాక్షుని నైన నొంచునొక యద్భుతశ క్తి యొసంగి ప్రేముడిస్ . 283.

క. ఇది పరమఘోర సాధన, మెదిరించిన నెట్టిపగతు నేనిఁ జెఱుచు బె
     ట్టిదుమీఁదఁ గాని వైవకు, మద రొందెడువారిమీఁద నని వీడ్కొనియెన్

తే. రామయాశక్తిఁగొనికాదెరావణుండు,మున్నమనలక్ష్మణునినొంచిమూర్చవుచ్చె
    నదియుఁ బెనులోభిఁ బ్రార్థించునర్థియాశ, వలె నిరర్థక యై చన్న వగలఁ బోగిలె.

                                §§§ కుంభకర్ణ విభీషణుల వివాహము §§§
మ. అవి యెల్లన్ రఘువీర నీవెఱుఁగవే యాగాథ లిట్లుండె ని
     ట్లు వివాహోత్సవ మాచరించి దశకంఠుండంత సౌదామనీ
     చ్ఛవిమీటౌబలిపుత్త్రికాదుహిత వజ్రజ్వాల యన్ దాని బాం
     ధవు లౌరా యనఁ గుంభకర్ణునకు నుద్వాహం బొనర్చెన్ రహిన్. 286

మ. సరమన్ గేసరమంజుసౌరభవతిన్ సౌందర్యలీలావిలా
     సరమన్ భాసురమన్మథాస్త్రతులితన్ శైలూషగంధర్వశే
     ఖరుకన్యామణిఁ జిన్న తమ్మునకు వేడ్కన్ బెండ్లి సేసెన్ నిశా
     చరవంశాగ్రణి యద్దశాననుఁ డెదన్ సౌభ్రాత్త్ర ముప్పొంగగన్. 287

                                   §§§ మేఘనాదుని జననము §§§
ఉ. ఆదటఁ గొన్నినాళ్లకు దశాస్యునిపట్టపుదేవి యైనమం
    దోదరి గాంచె నొక్కసుతు నుద్ధతు నాతఁడు పుట్టినప్పుడే
    రోదసి భేదిలన్ సురవరుల్ బెగదన్ ఘనలీల మ్రోయఁగా
    నాదృతి మేఘనాదుఁ డనునాఖ్య యిడెన్ జనకుండు వేడుకన్ . 288

చ. చిదుగుల వృద్ధిఁ బొందుశిఖిచెల్వున నద్దశకంఠుపుత్త్రుఁ డ
   భ్యుదయముఁ జెందుచుండెఁ బితృపోషణ పెంపున నక్కుమారుఁడే
   కద మఱి యింద్రజిత్తనఁ బ్ర కాశిలె నత్తెఱఁ గెల్ల జానకీ
   హృదయసరోజమిత్ర వివరించెద మీఁద గథాక్రమంబునన్ 289
.
                       §§§ కుంభకర్ణునకు నిద్రింప దశగ్రీవుం డొకయిల్లు గట్టించుట §§§
చ. విను మటమీఁద బ్రహ్మ యొదవించిననిద్దురమబ్బు కుంభక
    ర్ణుని మొగ మాని జాగ్రదవరోధ మొనర్చినఁ బవ్వళింపఁగాఁ
    దనకొకయిల్లు గావలయు దానవనాయక యంచు నన్నతో
    ననుటయు నాతఁ డప్పనికి నప్పుడ పంచె ననేక శిల్పులన్ . 290

వ. వారును దదాజ్ఞ శిరంబున ధరియించి తత్క్షణంబ. 291

సీ. చిలికిప్రాఁగెంపుటిట్టికలగోడలు వెట్టి వజ్రంపుగారలపను లొనర్చి
    మూలఱారాకంబములు పెక్కుజతసేసి జాళువా ప్రతిమలచా లమర్చి
    తులకించుపవడంపుదూలముల్ పయి నుండి పచ్చఱాపలకలు పాదుకొలపి
    పులుదిండిరామొత్తములలోవ లమరించి స్ఫటిక సోపానముల్ సంఘటించి

తే. పుష్యరాగవితర్గికల్ భూరిచంద్ర, కాంతజగతులు గోమేధికపుఁదలుపులు
     కళుకుముత్యాలసోరణగండ్లు వేడ్క, సేయఁ బడకిల్లు గట్టి రాశిల్పివరులు. 292

క. ఆమడనర వెడలుపు మూఁ, డామడ నిడివియును గలిగి యతిరమ్యం బై
    రామ ఘటకర్ణుపటుని, ద్రామందిర మలరు మృదులతల్పతతులతోన్. 293

వ. అటుల ధవళ ప్రభాపహసితకై లాసం బగుతన్ని వాసంబున. 294

సీ. కిన్నరాదులఁ గిట్టి గెలుచునాందోళంబు మించఁ బల్మఱుఁ గల్వరించుకొనుచు
    దిక్కరుల్ సెవు డొంద దేవతల్ వెఱ సెంద బెట్టుగా గుఱకలు పెట్టుకొనుచుఁ
    గలలోన దిక్పాలకులమీఁదఁ జని మాఱుకొనువారిఁగని పండ్లు గొఱికికొనుచు
    నెలవుల లాల చిప్పిల నప్పటప్పటి కించుకించుక చప్పరించుకొనుచు
తే. మరలుచును బొర్లుచును మేను మఱచి మిగులఁ
    జెమటలఁ దొప్పదోఁగుచు నిమ్మళించు
    నిబిడ తామససుఖ మిచ్చు నిద్ర గలిసి
    కాలముఁ గ్రమించె నక్కుంభకర్ణుఁ డధిప. 295

                             §§§ దశగ్రీవుండు గరుడ ప్రముఖుల బాధించుట §§§
క. క్రూరుఁడు దశముఖుఁ డంతఁ బ, యోరుహభవదత్తవరమదోద్రేకమునన్
   మేర దలంపక దుష్ట, ప్రారంభమునందె బుద్ధి యలవిచె నృపా. 296

వ, అది యెట్లనిస. 297

సీ. గరడుల గరుడులకంబంబుల నె కట్టి గంధర్వగంధర్వగతు లడంచి
    యక్షులఁ బక్షులయటుల పాఱఁగఁదోలి ఖచరులఁ గుచరులఁ గా నదల్చి
    కిన్నరు లెన్నరు తన్నని నొప్పించి సిద్ధులఁ బద్దులఁ జేసి కలఁచి
    సాధ్యులు సాధ్యులై శరణుఁ బొందఁగఁ జేసి యమరులఁ జమరులయండ కనిచి
తే. భోగుల విభోగుల నొనర్చి యోగితతి వి, యోగితతివలె బలువెత నొందఁ జేసి
    చారణానిలతుషితభాస్వరుల నొడిచి, యుద్దతేజంబుఁ జూపె లంకేశ్వరుండు.298

మ. హవనంబుల్" భువనంబులున్ జెఱుచు మాయన్ దాల్చుఁ గూల్చున్ సుధా
     శివనంబుల్ పవనంబులీల ద్విజులన్ ఛేదించి భేదించుఁద
     ద్భవనంబుల్ భువనంబు లున్నతటినుల్ బంధించి మ్రందించు స
     త్సవసంబుల్ ప్లవనంబుఁ జెండ గిరు లుద్యన్ముష్టి నొంచున్ వడిన్. 299

                         §§§ ధనాధిపుఁడు దశగ్రీవునకు నీతిం దెల్ప దూతను బంపుట §§§
 ఉ. ఆతఱిఁ గొన్ని నాళ్లకు ధనాధిపుఁ డంతయు నాలకించి దు
     ర్నీతి వహించుతమ్మునికి నీతియు ధర్మువుఁ దెల్పుకూరిమిన్
     దూత నతిత్వరన్ బనుప దుశ్శకునంబులతోడ లంకకున్
     భీతిల కేగి వాఁడును విభీషణు ముందఱ కాంచెఁ గాంచినన్ , 300
  
ఉ, అన్నయశాలి వానిహృదయం బలరంగ బహూకరించి మా

      యన్నకు సేమమే వదిన హర్షముఁ గాంచునె పుత్త్రు లెల్ల సౌ
      ఖ్యోన్నతు లే కదా కుశలయు క్తులె యాప్తులు మంత్రు లాశ్రితుల్
      నిన్నిట కేల యం పెఁ బతి నేఁ డన నంతయు వాఁడు దెల్పినన్ . 301

తే. కొంత చింతించి మనహితోక్తులు సగౌర,వముగ విన నేర్చునే పంక్తి వదనుఁ డేల
      యన్న యిప్పనిఁ దలపెట్టె నైన నేమి, వచ్చితివికద రమ్మని వానిఁ గొనుచు. 302

మ. గణనాతీతనిశాచర స్తవము లాకర్ణించుచున్ గంకణ ,
     క్వణనంబుల్ దగఁ జామరంబు లమరీవారంబు వీవన్ సభాం
     గణసమ్మర్దము వేత్ర హస్తు లుడుపంగా నిండుకొల్వున్నరా
     వణునిన్ జేరి విభీషణుం డెఱఁగి క్రేవన్ దూతఁ గాన్పించినన్ . 303

క. ధనదునిదూతయు వినయం, బున నించుక చేరి మొక్కి ముకుళితకరుఁ డై
     దనుజులబహుసమ్మర్దం, బున నొదుఁగుచు నిలిచి బంక్తిముఖుతో ననియెన్ . 304

ఉ. స్వామి పరాకు దైత్యకులచంద్ర త్వదగ్రజుఁ డై నకిన్నర
     గ్రామణి వంశవిత్తగుణగౌరవయుక్తి సమానుఁ డౌట మీ
     సేమము వేఁడి మీకొకవిశేషహితం బెఱిఁగింపు మంచు న
     న్నీ మెయిఁ బంచె నెయ్యము వహించి వినుం డది విన్నవించెదన్ . 305

చ. సమతఁ బరోపకారకృతి సల్పుటయే సుకృతంబు ఘోరపా
     పము పరపీడ సేయుటయె బ్రహ్మకులంబునఁ బుట్టి దేవతా
     ప్రముఖవిరోధముల్ నెరపఁ బడియె ధర్మముచేతఁ గాదె యీ
     సమధికసంపదల్ దొరసి సంతత మందఱమున్ సుఖించుటల్ . 306

ఉ. నాస్తికుఁడున్ శఠుండుఁ గులనాశకుఁడున్ గను దుష్టవర్తనం
     బాస్తికతాధురంధరున కర్హమె యద్భుతనిష్ఠ చే నజో
     పాస్తి ఘటించినాఁడవు కృపాగుణశూన్యుఁడ వై భుజబల
     ధ్వస్తులఁ జేయ నేల సురవర్యుల నార్యుల ధర్మధుర్యులన్ . 307

ఉ. నందన మాది యౌసురవనంబులఁ గూల్చితి వప్సరోవధూ
     బృందము బల్మిఁ బట్టి చెఱఁ బెట్టితి వార్యులు నేయుయాగముల్
     మ్రందఁగఁ జేసి తార్తు లగుమౌనులఁ జంపితి వస్మదాదు లే
     మందురొ యన్ భయం బెఱుఁగ వైతివి తెల్పెడి చెట్టు నీ కిఁకన్, 308

ఉ. గొట్టుతనానఁ దన్ వెడలఁ గొట్టినఁ దిట్టను ర ట్టడంచుఁదోఁ
     బుట్టువనౌట నొం డనక పోయితిఁ బల్మఱు బెట్టు సూపినన్
     జుట్టము లైనఁ దాళుదురె శూరతయే జడదారి పెద్దలన్
     బట్టి వధించుటల్ వెడఁగుభావము మానఁ గదయ్య తమ్ముడా. 309

మ. హిమవత్పర్వతతుంగశృంగమున నే నిన్నాళ్లు శైవవ్రతం
     బమిత శ్రద్ధ నొనర్చి వచ్చి భవదీయౌద్ధత్య మాలించి ధ
     ర్మము గా దంచుఁ బ్రబోధ నేసితి ననున్ బాటించి వంశోచిత

     క్రమమున్ గైకొను మంచుఁ దెల్పు మనె యక్షస్వామి రక్షోధిపా. 310

మ. అదిగా కన్యులకల్మిఁ గన్గొని యసూయామగ్నుఁ డౌవాని కా
     పద సేకూరు నవశ్య మట్టియశమున్ బ్రాపించె మీయన్న యే
     యది తార్కాణగ విన్నవింతు వినుఁ డం చద్దూత కేల్దోయి నే
     న్నుదుటన్ జేరిచి పల్కె గ్రమ్మఱ మదాంధుండౌ దశగ్రీవుతోన్ . 311

మ. దితిజాధీశ్వర యొక్కనాఁడు తుహినాద్రిన్ జేరి మీయన్న యం
     దతి సౌభాగ్యనిరూఢి శంకరునియర్ధాంగంబునన్ మించుప
     ర్వతరాట్కన్యక నట్టె చూచి నెటు సంప్రాప్తించె నీభాగ్య మీ
     సతి కంచున్ దపసవ్య నేత్రమున నీర్ష్యరోషమగ్నాత్ముడై. 312

ఆ. ఇటుల కుటిలబుద్ది నీక్షించుయక్షేశు, సవ్యలోచనంబు క్షణములోన
     దివ్యయోగమహిమ దేవి దగ్ధము సేయ, నేమి సేయువాఁడ నింక ననుచు, 313

క. విత్తవిభుఁ డడిలి యగ్గిరి, యుత్తరశృంగమున నియమయుక్తి నిలిచి య
      ష్టోత్తరదశశతవర్షము, లుత్తమశైవవ్రతంబు లొనరించునెడన్ . 314

ఉ. భూరిజటల్ ప్రవాళములపొల్పుఁ గనన్ ఘన బాహుశాఖలన్
      మీఱి యపర్ణ పర్ణరుచి మేకొనఁ గ్రొన్నెలరేక కోరకా
      కారముఁ బూన నీలగళ కాంతులు తేఁటులనీటుఁ జెంద మం
      దారములీల శూలి ధననాథునకున్ గనుపించి యి ట్లనున్ . 315

ఉ. మెచ్చితి నీతపంబునకు మీ టగునిష్ఠకు నిమ్మహావృతం
      బచ్చవుబత్తి నెవ్వరుఁ బ్రయత్నముతో నిటు సంఘటింప లే
      రచ్చుగ మున్ను నే సలిపినట్టులె సల్పితి వీ వొకండవే
      యిచ్చితి నాసఖిత్వము వహింపుము మత్తులిత ప్రభావమున్ . 316

తే దేవి నేదృష్టి గంటి వాదృష్టి యొకటి
      యును ధరారేణుపరివృతజ్యోతిగతిఁ బి
      శంగరుచిఁ గాంచు నేకపిశంగనయనుఁ
      డనఁగ నందున వెలయుదు వనఘ నీవు, 317

చ. అని వర మిచ్చి శూలి రజతాద్రికి నెచ్చెలికాని వెంటఁ దో
      డ్కొని చనుదెంచె న ట్లగుటఁ గోప మసూయయుఁ గీడు ధర్మ వ
      ర్తనము సమ స్తబాంధవహితం బగునగ్రజుబుద్ధిమాటఁ జే
      కొనుము శుభంబు మాన్చు చెడుగుందన మేలనీ దూత దెల్పినన్. 318

                      §§§ దశగ్రీవుఁడు ధనేశ్వరునిదూతం జంపి యలకాపురిపై దండెత్తుట §§§
మ. పది మోముల్ ప్రళయార్కబింబములరూపం బూనఁ గోపంబునన్
      రదసంఘట్టన మాచరించుచు నదభ్రభ్రూకుటుల్ మీఱ ని
      ర్వదికన్నుల్ జ్వలితాగ్నికుండములయు గ్రత్వంబు సూచింప మూ
      ర్ఖు దశాస్యుం డలదూతఁ జూచి మిగులన్ గ్రూరాత్ముడై యిట్లనున్. 319

తే. మంచితనమున నీతి బోధించువాడ, పోలెఁ దనయుగ్రతపమును శూలితోడి
      చెలిమియును గల్మి బలిమియుఁ దెలుపఁబంచి, నాడె మీదొర నా చెంత నాన లేక .

ఉ. రొక్కము గన్న కల్మియును రుద్రుని చెల్మియు నమ్మి కొన్నిదు
      ర్వాక్కుల వాడు డెల్పి యిటు రమ్మన నీ వెటు లాడవచ్చితే
      యిక్కడ మూర్ఖ యం చడిదమెత్త వధింపకుఁ డంచుఁ దమ్ముఁడున్
      మ్రొక్క నదల్చి దూతశిరమున్ దెగవ్రేసె వివేకశూన్యుఁ డై. 321

మ. అలకాధీశునిదూత నిట్లతఁడు ప్రాణాంతంబు నొందించి యా
      తలయున్ మొండెముఁ గొల్వులో మెలఁగుభృత్య శ్రేణిపాల్ సేసెఁ బ్ర
      జ్వలితాత్యుగ్రదవాగ్ని నే విడిచినం జల్లారునే నీతివా
      క్కుల మూర్ఖుండు శమించునే కినుకఁ గాకుత్ స్థాన్వయగ్రామణీ. 322

శ. చెనటి యని దశముఖుని ననఁ, బనిలే దతనికి హితోక్తిఁ బ్రకటింపఁ దలం
     చినధననాయకు ననవలె, జనవర విను మంత నద్దశ గ్రీవుండున్. 323

తే. తనయమాత్యులఁ గనుఁగొని ధనదుమాట, వింటిరే యిప్పుడెంత గర్వించినాఁడు
     మాకుఁ దనకున్న పాటివివేక మున్న, దే ప్రబోధింపఁ దాఁగాక యెవ్వ రింక . 324

ఉ. పట్టణ మాక్రమించి దనుఁ బాఱఁగఁ దోలిన నోర్చి తానుఁ దోఁ
    బుట్టవు గాన పోయె నఁట పోవక నిల్చిన నేమి సేయునో
    గట్టిగఁ జూత మిప్పు డలకాపురి ముట్టడి చేసి గట్టువిల్
    పట్టిన దిట్టఁ గూడి మనపై భుజశౌర్యముఁ జూపుఁ గా కిఁకన్ . 325

ఉ. మాన్యుఁ డటంచు నెంచు బహుమాన మెఱుంగక యక్షుఁడే యసా
     మాన్యవిరోధకృద్వచనమార్గణపంక్తుల నొంచె నింద్రము
     ఖ్యాన్యులు నన్ను గెల్వఁగఁ బ్రయత్నము సేయుట యుగడించె నీ
     హైన్యము దీఱ నింక ధనదాదిదిగీశుల గెల్వఁ బోఁ దగున్ . 326

ఉ. లెమ్ము ప్రహస్త తొల్త నవలీల ధనేశుని గెల్వఁ బోయెదన్
     బొమ్ము బలంబుఁ గూర్ప మన ప్రోలను గల్గినవీర దైత్యులన్
     దెమ్ము భయాన కార్భటులు దిక్కులఁ బిక్కటిలంగ నాబడిన్
     రమ్ము రయముతో నన భరంపడి యాతఁడు నట్ల చేసినన్ 327

సీ. శాతమన్యవశిలాచక్ర ఘర్ఘరదీర్ఘ రావంబు దిక్కుల వ్రక్కలింప
     గారుత్మతద్యుతిస్ఫార సైంధపఖురోద్ధురసముద్ధతుల నిద్ధం చలింప
     సారనారసరాగచారుకేతనకాంతు లాకాసమణిదీప్తి సపహరింప
     ఘనఘంటికాఘణంఘణనాదమున ధరాధరగుహాళులు ప్రతిధ్వనులొసంగ
తే. శరశరాసనముసలముద్గర కృపాణ, తోమరగదాదిసాధనస్తోమపూర్తి
    మిక్కుటంబైనయొక్క తేరెక్కి వెడలె, విశతిభుజుండు త్రైలోక్యవిజయకాంక్ష.

క. మారీచమహోదర శుక, సారణధూమ్రాక్షముఖ్యసచివులలోఁ బెం.
    పారఁ బ్రహస్తుఁడు ముంగలి, యై రాక్షససేన నడపె నపుడు నృపాలా. 329

శ. మల లూలాడ నదీనద,ములు గలఁగఁగఁ జండవిపినములు గూలఁ బురం
      బులు బెదర ముహూర్తంబునఁ, బలలాదబలంబు లలకపజ్జకుఁ జనియెన్ . 330

సీ. చరనీలగిరిశంక సవరించుమదమత్తకరులదంతురడంతకాండరుచులుఁ
      దనువు లొందినగాడ్పు లననొప్పునుత్తమాశ్వములముత్యాలకళ్ళములరుచులు
      బలుమేరువులతీరు గలతేరులను మీఱుకళుకువజ్రపుబండికండ్లరుచులుఁ
      గలనైన భయమెఱుంగనిభటోత్కర మెత్తువిచ్చుకత్తుల నిచ్చ హెచ్చురుచులు
తే. ధవళకేతనరుచులు ఛత్త్రములరుచులుఁ జామరంబులరుచు లొక్కసారి నిగిడి
      మెండుకొని వెండికొండపై నిండ నాప్ర, చండభుజదండుఁడాతండుదండువిడిసె.

క. అని కుంభజుఁ డెఱిఁగించిన, విని నవ్వుచు రాముఁ డవల వింశతి భుజుఁడున్
      ధనవిభుఁడును బోరినవిధ, మనఘా విన వలతుఁ దెల్పు మని యడుగుటయున్ ,

                                               §§§ ఆశ్వాసాంతము §§§
ఉ. నందకుమార మారద సనందననారదమానసాంతరా
     ళిందవిహారి హారిమురళీమృదుగానవిలోలగోపికా
     నందనిదాన దానవఘనాఘనభిన్మరుదుల్ల లద్గరు
     ద్బృందతురంగ రంగదమరీజనరంజన రాసఖేలనా. 333

క. వనదారుణశిఖివారణ, వనదా మదవారణేంద్రవరద జగత్పా
     వనదాసజననిరూఢా, వనదాక్షిణ్యాదిసుగుణవర రత్ననిధీ. 334

పంచచామరము.
     సనాతన ప్రసిద్ధిపూరుషత్వవకీర్తిభాజనా
     జనాదిలోకసంగిమౌనిసంఘసౌఖ్యసాధనా
     ధనాధినాథ నందనాత్మ తాపహృత్కృపాఘనా
     ఘనాత్మ రూపదర్శనోత్సుకత్సరోరుహాసనా. 335

గద్యము. ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదితచతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణవితీర్ణివైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధరధరాధిప సభాంతరస్తవనీయ నయకళాయుగంధర బంధురమనీషావిశేషమంధానవసుంధరాధర శోధితాగణిత
గణితశాస్త్రరత్నాకర వినయాదికగుణరత్నాకరకంకంటివంశపయఃపారావార పరిపూర్ణసుధాకరాప్పయామాత్య
సంక్రందననందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధానయక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధాన ప్రణీతం బైన శ్రీమదుత్తరరామా యణం బనుమహాకావ్యంబునందుఁ ద్వితీయాశ్వాసము.

________________